వాగ్ధాన పుత్రుడు

*వాగ్ధాన పుత్రుడు-మొదటి భాగం*

ఆదికాండం 12:13

1. యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

3. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ...

 

      దేవుని అతిపరిశుద్ధ నామమునకు నిత్యమూ మహిమ ఘనత ప్రభావము ఎల్లవేళలా కలుగును గాక! ప్రియ దైవజనమా! ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ లో భాగంగా పదో సంవత్సరం- పదో సిరీస్ కి మరియు పదో సిరీస్ వరకూ తీసుకుని వచ్చిన దేవాదిదేవునికి వందనాలు మరియు మహిమ కలుగును గాక! మరోసారి మరో భక్తుని జీవితంలో జరిగిన సంఘటనలు- తద్వారా మనము నేర్చుకోదగిన పాటములను ధ్యానించడానికి మరోసారి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం ఆనందంగా ఉంది! ఈ సారి నూరంతలుగా ఆశీర్వదించబడిన వ్యక్తి బైబిల్ లో ఒకే ఒక ఉత్తమ బాలుడు- ఉత్తమ పురుషుడు ఉన్నారు. ఆయన వాగ్ధానపుత్రుడు! ఆయన పేరు ఇస్సాకు! ఆయన జీవితంలో కలిగిన ప్రతీ అంశాన్ని పుట్టకముందు, పుట్టిన తర్వాత, తండ్రి ఉన్నప్పుడు, తండ్రి లేనప్పుడు ఎలా జీవించారు, దేవునితో ఎలా సాంగత్యము కొనసాగించారు అనేది, మరీ ముఖ్యంగా అబ్రాహాము గారే అపరకోటీశ్వరుడు అయితే దేవుడు అబ్రాహాము గారి తర్వాత ఇస్సాకు గారిని నూరంతలుగా దీవించారు, అనగా అబ్రాహాము గారికంటే నూరంతల ధనవంతుడు అయిపోయినా ఇస్సాకుగారు దేవుని సన్నిధిలో మాత్రమే ఉంటూ దేవుని మాటలు మాత్రమే పాటిస్తూ ధనమును అధికారమును ఏమాత్రము చూపని తగ్గించుకున్న (Down To Earth) *మహామనీషి*గా ఎలా మారగలిగారో ధ్యానం చేసుకుందాం!

 

మొదటగా వాగ్ధాన పుత్రుడు అని చెప్పుకున్నాము గనుక ఇస్సాకు గారి కోసరమైన దేవుని వాగ్దానాలను అన్నీ క్రమ ప్రకారం చూసుకుందాం!

 

పైన చెప్పిన రిఫరెన్సు ప్రకారం అబ్రాహాము గారు తాను, తన తండ్రి కుటుంభం అందరూ *ఊరు* అనే ఊరులో నివశిస్తున్నప్పుడు దేవుడు అబ్రాహముగారిని పిలిచారు.

గమనించాలి: ఆదికాండం 11:28 ప్రకారం ఊరు అనేది కల్దీయుల ప్రాంతం అనగా ప్రస్తుతం దక్షిణ ఇరాక్.  దీనినే మెసపటోమియా అనేవారు. మెసపటోమియా నాగరికత ఇక్కడే విస్తరించింది.   ఇక హారాను అని ఎందుకు అంటున్నారు అంటే: పూర్వకాలంలో ఎక్కువగా జనాబా లేనప్పుడు వారి ఆస్తి విస్తరించేటప్పుడు పెద్దలు, ధనవంతులు ఊరు విడిచి మరో ప్రాంతం పోయి అక్కడ పట్టణం లేక ఇల్లు కట్టించి దానికి వారిపేరు గాని తమ కుమారుల పేర్లు గాని పెట్టుకునే వారు! ఈ రకంగా అబ్రాహాము గారి తమ్ముడైన హారాను తన తండ్రియైన తెరహు గారిని, అన్నలైన అబ్రాహాము గారిని, నాహోరు గారిని వదిలి దూరం 700 మైళ్లు వెళ్లి  అక్కడ హారాను అనే పట్టణం కట్టించారు. ఇది ప్రస్తుతం సిరియాలో ఉంది. అనగా సిరియా ఇరాక్ బోర్డర్. ఈ పట్టణం కట్టించాక హారాను గారు తన తండ్రియైన తెరహుగారి కంటే ముందుగా చనిపోయారు. 11:28; అప్పుడు  తెరహు గారికి పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి తెరహుగారు తన పెద్ద కుమారుడైన అబ్రాహాము గారిని చిన్న కొడుకుయొక్క  కొడుకు లోతు ఒక్కడే ఉన్నాడని లోతు దగ్గరకు అదే హారానుకి (సిరియా) వచ్చారు. అక్కడ చిన్న ఊరు కట్టుకుని అందరూ కలిసి నివసించేవారు దేవుడు పిలిచేవరకు!

 

అయితే ఒక విషయం గమనించాలి: అబ్రాహాము గారు తన తండ్రియైన తెరహుతో జీవించిన కాలము బహు తక్కువ! మీరు చరిత్ర చూసినా, యాషారు గ్రంధం చూసుకున్నా తెరహు గారు భయంకరమైన విగ్రహారాధికుడు!  మరి తండ్రి ఇంత భయంకరమైన విగ్రహారాధికుడు అయితే మరి కుమారునికి అనగా అబ్రాహాము గారికి దేవుడంటే అంతటి భక్తి ఎలా వచ్చింది?  దీనికోసం అనేకసార్లు చెప్పడం జరిగింది.  అబ్రాహాము గారు తెరహు గారికి పుట్టినా గాని ఆయన తండ్రి వద్ద పెరగకుండా ఎందుకో నోవాహు గారి దగ్గర పెరిగారు! నోవహుగారు తన సంతానానికి, సంతానం యొక్క సంతానానికి హనోకుగారి వలె దేవునికోసం చెబుతూ ఉండేవారు. అనగా ఒక దేవునికోసమైన గురుకుల పాటశాల నడిపిస్తూ దేవుని పద్దతులను నేర్పించేవారు!  అబ్రాహాము గారు పుట్టేటప్పటికి నోవాహు గారి వయస్సు 890 సంవత్సరాలు అనగా జలప్రళయం జరిగిన 290 సంవత్సరాలకు అబ్రాహాము గారు పుట్టారు. అప్పటినుండి నోవాహు గారు చనిపోయేవరకు   సుమారు అరవై సంవత్సరాలు అబ్రాహాము గారు నోవహుగారి దగ్గర భక్తి మరియు విశ్వాసం నేర్చుకున్నారు!

యాషారు గ్రంధం ప్రకారం ఎన్ని సంవత్సరాలు నోవహుగారి దగ్గర ఉన్నారో స్పష్టంగా లేదుగాని మనము ఆదికాండం 9:28,29 మరియు 11:10--29 వచనాలు చూసుకుంటే జలప్రళయం వచ్చిన 290 సంవత్సరాలకు అబ్రహాము గారు పుట్టినట్లు, ఆ తర్వాత 60 సంవత్సరాల తర్వాత నోవహుగారు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ కాలమంతా నోవహుగారి దగ్గరే ఉన్నారు.

మధ్యలో అప్పుడప్పుడు తండ్రివద్దకు వెళ్తూ తండ్రి మరియు ఊరు అనే ఊరువారు చేస్తున్న విగ్రహారాధనను ఖండిస్తూ వారితో తగవులు పడుతూ ఉండేవారు. ఆ గ్రామస్తులు రెండు సార్లు అబ్రాహము గారిని విగ్రహారాధనను ఖండించినందువలన చంపాలని చూశారు! నోవాహు గారు చనిపోయిన తర్వాత అబ్రాహము గారు తన తండ్రివద్దకు వచ్చేశారు గాని గ్రామస్తులు మరలా చంపడానికి చూశారు. చివరకు గ్రామానికి పెద్ద కాబట్టి తెరహు గారు- అబ్రాహము గారిని గ్రామ బహిష్కరణ చేశారు. కొడుకు అంటే చాలా ఇష్టం కాబట్టి అప్పటికే ఒక కుమారుడు చనిపోయాడు- ఈ కుమారుడు దగ్గర ఉండటం లేదు అని తెరహు గారు ఊరు అనే గ్రామము వదిలి దూరంగా ఉంటున్న కుమారుడు అబ్రాహాము గారి దగ్గరకు ఆస్తిమొత్తం తీసుకుని వచ్చేశారు. అప్పుడు దేవుడు 12వ అధ్యాయంలో పిలిచి వాగ్దానం చేస్తున్నారు నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. అప్పటికి ఇస్సాకు గారు పుట్టలేదు! ఆపాటికి నాల్గవ వచనం ప్రకారం అబ్రాహముగారికి 75 సంవత్సరాలు అనగా నోవాహు గారు చనిపోయిన 15 సంవత్సరాలకు దేవుడు అబ్రాహము గారితో మాట్లాడారు! ఇది పూర్వ చరిత్ర!

 (గమనించాలి దీనిని చెప్పడంలో నా ఉద్దేశం నాకు చరిత్ర తెలుసు- చాలా గ్రంధాల మీద నాకు పట్టు ఉంది అని చెప్పడం ఏమాత్రం కానేకాదు! మీద ఉన్న వాగ్ధానం ఏ నేపధ్యంలో చెప్పారో అర్ధమవడానికి మరియు అబ్రాహము గారిని ఇస్సాకు గారిని అర్ధం చేసుకోవడానికి ఇది పనికొస్తుంది అని, ఇంకా అబ్రాహాము గారికి ఇంతటి పటిష్టమైన విశ్వాసం ఎక్కడనుండి వచ్చింది అని చెప్పడానికి మాత్రం ఈ చరిత్ర చెప్పడం జరిగింది)

 

ప్రియ దైవజనమా! అమ్మలారా! అమ్మమ్మలారా! నాన్నమ్మలారా! తాతయ్యలారా! నోవహుగారు తన పిల్లలకు, మనవలకు, మునిమనవలకు, మనవల మనవలకు , అబ్రాహాము గారికి భక్తి నేర్పించారు. ఆ భక్తి అబ్రాహాము గారిని విశ్వాసులకు తండ్రిగా చేసింది. అబ్రాహాము గారు ఇస్సాకుగారికి భక్తివిశ్వాసాలు నూరిపోశారు. ఇస్సాకుగారు, రిబ్కాగారు యాకోబుగారికి భక్తి మరియు ప్రార్ధనా విధానం నేర్పించారు. యాకోబు గారు యోసేపుగారికి నేర్పించారు. ఇలా వారంతా తమ పిల్లలకు మనవలకు భక్తి నేర్పించారు. అదే వారిని గొప్ప విశ్వాసవీరులుగా తీర్చిదిద్దింది. మీరు కూడా మీ పిల్లలకు, మనవలకు మనవరాళ్లకు భక్తిని నేర్పండి. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు! సామెతలు22:6;

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-రెండవ భాగం*

*వాగ్దానాలు-1*

ఆదికాండం 12:13

1. యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

3. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ...

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇస్సాకుగారు పుట్టకముందు ఇస్సాకు కోసం దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశారో చూసుకుంటున్నాము!

 

ప్రియులారా! 12:1౩ లో మొట్టమొదట సారిగా దేవుడు అబ్రాహాము గారితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది మనకు బైబిల్ లో! అనగా క్రీస్తుపూర్వం 1900 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రాహాము గారిని పిలిచి తనకొరకు స్వాస్త్యముగా ఏర్పరచుకొన్నారు! అప్పటికి అబ్రాహాము గారి వయస్సు ఈ 12:4 ప్రకారం 75 సంవత్సరాలు!!!  ఈ వాగ్దానం చేసిన 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకుగారు పుట్టారు!

 

చూడండి:  దేవుడు అంటున్నారు: నీవు నీ దేశము నుండియు నీ బందువుల యొద్దనుండియు నీ తండ్రి ఇంటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అలా చేస్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును!  నీవు ఆశీర్వాదముగా ఉందువు! నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువారిని శపిస్తాను. భూమియొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును ఇదీ వాగ్ధానము!  ఈ వాగ్ధానము విని నమ్మి తండ్రికి చెప్పి కనాను దేశం బయలుదేరి పోయారు అబ్రాహాము గారు! ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉండాలి, వెళ్తే నాకేమిటి ఇలాంటి ప్రశ్నలు లేకుండా దేవుడు చెప్పారు- నేను వెళ్ళాలి అని నమ్మి విశ్వసించి వెళ్ళిపోయారు సమస్త ఆస్తిపాస్తులు తీసుకుని! ఈ నమ్మిక విశ్వాసము, భక్తి నోవాహు గారి దగ్గర నేర్చుకున్నారు అబ్రాహాము గారు! నోవహుగారు దేవునితో నడిచే విధానం నేర్పించారు అబ్రాహము గారికి! దానినుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకుండా సాగిపోయారు అబ్రాహాము గారు! అందుకే చిన్నప్పటి నుండి దేవునియందలి భయభక్తులు పిల్లలకు నేర్పించాలి అని చెప్పేది!!!

 

నా ఉద్దేశం ప్రకారం- నోవాహు గారి దగ్గర అబ్రాహము గారే కాదు బహుశా శారమ్మగారు కూడా భక్తిని నేర్చుకుని ఉంటారు!  ఆకాలంలో ఆసియాలోనే కాకుండా యూరోప్ ఆఫ్రికా దేశాలలో తమ చెల్లెలను పెళ్లిచేసుకునే ఆచారం ఉంది. కొందరు తన సొంత చెల్లిని లేక తన తండ్రియొక్క మరో భార్య కుమార్తెను గాని పెద నాన్న చిన్నాన్న కుమార్తెను గాని వివాహం చేసుకునే ఆచారం ఉంది! ఎందుకంటే మొదటగా స్త్రీలు దొరకడం కష్టం, రెండవది: ఒక అపోహ ఉండేది ఆ రోజులలో- రక్తం మారితే అవతలు వారు ఎలాంటి బుద్దులు గలవారో తెలియదు కాబట్టి సొంత రక్తసంబంధులనే పెళ్ళిచేసుకోవాలి అనేది! అందుకే అబ్రాహము గారు తన తండ్రియొక్క మరో భార్యకు పుట్టిన శారమ్మగారిని  పెళ్ళిచేసుకున్నారు! మరి అబ్రాహాము గారు చిన్నప్పటి నుండి నోవాహు గారి దగ్గరే ఉండేవారు అని గతభాగంలో చెప్పడం జరిగింది కాబట్టి శారమ్మగారు బహుశా అబ్రాహాము గారి వయస్సు అరవై సంవత్సరాలు వరకు నోవహు గారి దగ్గర ఉన్నారు కాబట్టి సుమారు నలబై సంవత్సరాలు ఆమె కూడా నోవాహు గారి దగ్గరే ఉండి ఉండవచ్చు! ఆమె కూడా అక్కడే భక్తిని నేర్చుకుని ఉండవచ్చు!(గమనించాలి: బైబిల్ ప్రకారం ఆదికాండం 17:17 ప్రకారం శారమ్మ గారు అబ్రాహము గారి కంటే తొమ్మిదేళ్ళు చిన్న వయస్సులో). కాబట్టి భార్యాభర్తలకు నోవాహు గారి దగ్గరే దేవునియందలి భయభక్తులు అలవడ్డాయి అని నా ఉద్దేశం!

 

సరే, 75 సంవత్సరాల వయస్సులో దేవుడు అబ్రాహము గారితో చెబితే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు దక్షిణ ఇరాక్ నుండి ప్రస్తుతం కనాను దేశం అనగా నేడు ఇశ్రాయేలు దేశము  వచ్చారు!

 

ఇక రెండోసారి వాగ్దానం చేశారు ఎప్పుడంటే వాగ్ధాన దేశములో అడుగుపెట్టిన వెంటనే దేవుడు చెప్పారు అబ్రాహాము గారితో నేను నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అన్నారు!

ఆదికాండము 12: 7

యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.

 

 గమనించాలి నీకు ఈ దేశాన్ని ఇస్తాను అనలేదు: నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేస్తే అక్కడ యెహోవా దేవునికి ఒక బలిపీటం కట్టారు అబ్రాహము గారు! అబ్రాహము గారు కట్టిన మొదటి బలిపీటం ఇది!

 

 గమనించాలి: మనం ఇప్పుడు ఈ శీర్షికలో అబ్రాహము గారికోసం- ఆయన విశ్వాసం కోసం ధ్యానం చెయ్యడం లేదు కాబట్టి త్వరత్వరగా ముందుకుపోతున్నాను!

 

సరే, ఇక్కడ నేను నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అని రెండోసారి వాగ్దానం చేశారు దేవుడు అబ్రాహాము గారితో! పూర్వకాలంలో ఇప్పటిలా వాహనాలు లేవు కాబట్టి కాలినడక మరియు గాడిదల మీద ఒంటెల మీద ఆరోజులలో ప్రయాణం చేసేవారు, మరియు విస్తారమైన ఆస్తి- పశువులు ఒంటెలు గలవారు కాబట్టి ఎన్నిరోజులు లేక నెలలు లేక సంవత్సరాలు పట్టిందో మనకు తెలియదు కారణం దక్షిణ ఇరాక్ నుండి ఇశ్రాయేలు దేశం సుమారుగా 1120 మైళ్లు లేక 1800కిమీ. అంతేకాదు వారు ఇరాక్ నుండి టర్కీ, టర్కీ నుండి సిరియా, సిరియా నుండి లెబనాన్, లెబనాన్ నుండి ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ నుండి జోర్డాన్ వచ్చారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం సుమారు 76వ సంవత్సరంలో మరలా దేవుడు అబ్రాహము గారితో మాట్లాడి ఈ వాగ్దానం చేస్తున్నారు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని!

 

ఈ రకంగా ఆయన దేశమంతా ప్రయాణం చేస్తూ అనేక బలిపీటాలు కట్టుకుంటూ పోతున్నారు! మధ్యలో కనాను దేశంలో కరువు వస్తే దేవున్ని అడుగకుండా ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు! బహుశా దేవుడు అబ్రాహము గారికి మొదటి పరీక్ష పెట్టారు గాని దీనిని తెలుసుకోకుండా దేవుని పరీక్షను తప్పించుకోడానికి ఐగుప్తు దేశం దేవుని అనుమతి లేకుండా వెళ్ళారు! ఇది ఆయనకు ఆయనతో పాటు ఉన్నవారికి కష్టాలు తీసుకుని వచ్చాయి!  ఇది అబ్రాహము గారు చేసిన మొదటి తప్పు!

 

ఈరకంగా అబ్రాహము గారు దేవుడు చెప్పిన మాటలను వాగ్దానాలను ఎట్టిపరిస్తితులలో కూడా అనుమానించకుండా నమ్మి ముందుకు పోయారు! అందుకే బైబిల్ చెబుతుంది: ఎందుకంటే వాగ్దానం చేసినవాడు దానిని నెరవేర్చుటకు శక్తిగలవాడు అని అబ్రాహము గారు నమ్మారు అని!

రోమీయులకు 4: 21

దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

 అలాంటి విశ్వాసము నమ్మకము ప్రతీ విశ్వాసికి ఉండాలి! ఆ విశ్వాసమే అబ్రాహము గారిని విశ్వాసులకు తండ్రిగా చేసింది!

దైవాశీస్సులు!

(సశేషం)

*వాగ్ధాన పుత్రుడు-మూడవ భాగం*

*వాగ్దానాలు-2*

 

ఆదికాండం 13:1417

14. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పు తట్టు పడమరతట్టును చూడుము;

15. ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.

16. మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణువులవలె విస్తరింప చేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమునుకూడ లెక్కింపవచ్చును.

17. నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇస్సాకుగారు పుట్టకముందు ఇస్సాకు కోసం దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశారో చూసుకుంటున్నాము!

 

  ప్రియులారా! ఇక పదమూడో అధ్యాయంలో ఐగుప్తు దేశం నుండి బయలుదేరి మరలా కనాను దేశంలో ఒక ఎడారికి వచ్చినట్లు చూస్తాము! వారి పశువులు విస్తారం కాబట్టి అక్కడినుండి మరలా మొదట బలిపీటం కట్టిన బేతెలు కి వచ్చినట్లు చూడగలం! పశువులు ఎక్కువ ఎందుకు అంటే అబ్రాహాము గారి పశువులు మరియు లోతుగారి పశువులు! కాబట్టి పశువుల మేతకు ఆ ప్రదేశం చాలలేదు! అందుకే ఈ పదమూడో అధ్యాయంలో లోతుగారు అబ్రాహము గారు విడిపోయారు! లోతుగారు పచ్చగా ఉంది అని సోదోమ వెళ్ళిపోతే అరణ్యమైనా సరే దేవుడు చెప్పిన ప్రాంతం అని కనాను దేశంలోనే ఉండిపోయారు అబ్రాహము గారు!

 

ఇక లోతుగారు వెళ్ళిపోయినా తర్వాత దేవుడు మరలా అబ్రాహాముగారితో మాట్లాడుచున్నారు: 1417 వరకు. నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోటునుండి ఉత్తరం తట్టు దక్షిణం తట్టు తూర్పు తట్టు పడమటి తట్టు చూడు అంటున్నారు. అనగా నాలుగువైపులా కన్నులెత్తి చూడు, ఎందుకు చూడమంటున్నాను అంటే ఈ దేశమంతటినీ నీకును నీ సంతానమునకు సదాకాలం ఇస్తాను అంటున్నారు! ఇక్కడ నీకును నీ సంతానమునకు అని వాగ్దానం చేస్తున్నారు!

గమనించాలి ఈ మూడోసారి వాగ్దానం చేసినప్పుడు బహుశా సుమారుగా ఎనబై సంవత్సరాలు ఉండవచ్చునేమో అని నా ఉద్దేశం! అలా అనుకోవడానికి కారణం 16:౩ ప్రకారం శారమ్మగారు కనాను దేశంలో పది సంవత్సరాలు గడిచిన తర్వాత  తన దాసియైన హాగరును అబ్రాహముగారికి బార్యగా ఉండటానికి ఇచ్చెను  అని ఉంది అనగా సుమారుగా 85- 86 సంవత్సరాల వయస్సులో హాగరు అబ్రాహముగారికి శారమ్మ గారిద్వారా బార్య అయ్యింది! కాబట్టి దీనికి ముందుగానే దేవుడు ఈ మూడోసారి అబ్రాహము గారితో మాట్లాడుచున్నారు కాబట్టి బహుశా మూడోసారి వాగ్దానం చేయబోయేసరికి అబ్రాహము గారి వయస్సు సుమారుగా ఎనబై సంవత్సరాలు ఉండవచ్చు! గమనించాలి- ఈసారి వాగ్దానం చేయబోయేసరికి కూడా అబ్రాహము గారికి వాగ్ధాన పుత్రులు గాని శారీరక పుత్రులు గాని సంతానం అనేది ఎవరూ లేరు! గాని దేవుడు చెప్పిన వాగ్దానాలను తలపోస్తూ విశ్వాసంతో ముందుకుపోతున్నారు!

 

ఇక్కడ ఏమని వాగ్దానం చేస్తున్నారు అంటే: నీవు తల ఎత్తి నాలుగువైపులా చూడు, ఈ దేశాన్ని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇస్తాను, నీ సంతానమును భూమిమీద నున్న రేణువుల వలే విస్తరిస్తాను. అనగా ఇసుక రేణువులు కావచ్చు! భూమిమీద ఉన్న ఇసుకరేణువులను ఎవడైనా లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కించవచ్చు అని వాగ్దానం చేశారు! ఎప్పుడు సంతానం లేనప్పుడు!

 

ఒకసారి ఆగుదాం! ఈ వాగ్ధానంచేసి ఇప్పటికి సుమారుగా 3900 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ వాగ్దానం నెరవేరిందా?

అవును సార్ నెరవేరింది!

మీరు ముస్లిం సోదరులను అడగండి: మీ తండ్రి ఎవరూ అంటే- అబ్రాహాము గారు అంటున్నారు!

ఇశ్రాయేలు ప్రజలను అడగండి: మీ తండ్రి ఎవరూ అంటే- అబ్రాహాము గారు అంటారు.

క్రైస్తవులను అడగండి : మీ తండ్రి ఎవరూ అంటే- అబ్రాహము గారు!! వీరంతా ఇప్పుడు భూమిని కప్పెయ్యలేదా!!! ప్రస్తుతం ఉన్న గల్ఫ్ దేశాలు గాని, ఆఫ్రికా ప్రాంతం గాని ఆసియాలో చాలా భాగాలు అబ్రాహాము గారి నిజమైన వారసులు కారా!!!

 

కాబట్టి అబ్రాహము గారు దేవుని వాగ్దానాలు నమ్మారు! అది అతనికి నీతిగా ఎంచబడింది అని నాలుగుసార్లు బైబిల్ చెబుతుంది!!

నీవుకూడా దేవుని వాగ్దానాలను నమ్మి ముందుకు సాగిపో!

దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి గొప్ప చేస్తారు!

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-నాల్గవ భాగం*

*వాగ్దానాలు-3*

 

ఆదికాండం 15:19

1. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.

2. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా

3. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా

4. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.

5. మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.

6. అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.

7. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు

8 .అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా

9. ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇస్సాకుగారు పుట్టకముందు ఇస్సాకు కోసం దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశారో చూసుకుంటున్నాము!

 

  ప్రియులారా! ఇక పద్నాలుగవ అధ్యాయంలో సోదొమ గొమోర్రా యుద్ధము- తన తమ్ముడు కుమారుడైన లోతును అబ్రాహాము గారు యుద్ధము చేసి  రక్షించడం, షాలేము రాజు అనగా బహుశా యేరూషలేమును పాలించే రాజు అబ్రాహాము గారిని దీవించడం- అబ్రాహాము గారు ఆయనకు దశమభాగం ఇవ్వడం జరుగుతుంది!

 

ఇక పదిహేనవ అధ్యాయం మొత్తమంతా దేవుడు అబ్రాహాము గారితో మాట్లాడటం, అబ్రాహము గారు దానికి జవాబివ్వడం ఉంటుంది. ఇంతవరకు దేవుని స్వరము వినడం- దాని ప్రకారం చేయడమే జరిగేది గాని ఈ అధ్యాయంలో దేవునితో మాట్లాడి జవాబులు పొందుకోవడం చూడవచ్చు! మరొకటి: ఇంతవరకు అనగా 12, 13 అధ్యాయాలలో దేవుని స్వరమును వినేవారు అబ్రాహము గారు గాని ఈ 15వ అధ్యాయం అబ్రాహము గారు బహుశా ప్రార్ధిస్తూ ఉండగా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నారు! బైబిల్ గ్రంధంలో దర్శనమిచ్చి మాట్లాడటం ఇదే మొదటసారి!!! ఇది కూడా వాగ్ధాన పుత్రుడైన ఇస్సాకు కోసమే ఈ వాగ్ధానము!

 

చూద్దాం! దేవుడు అంటున్నారు: అబ్రామా (ఇది అబ్రాహాము గారి పాతపేరు- అర్ధం: ఘనతనొందిన తండ్రి).  భయపడకుము, నేనే నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగును అన్నారు మొదట!  మొదటమాట అబ్రామా భయపడకుము! మరి అబ్రాహాము గారు దేనికోసం భయపడుతున్నారో మనకు తెలియదు గాని బహుశా పిల్లలు లేరని దిగులు ఉంది. దేవుడు బైబిల్ లో 365 సార్లు భయపడకు అని చెబుతున్నారు! ఏ విషయంలో కూడా రక్షించబడిన విశ్వాసి భయపడవలసిన అవసరం లేదు! మనం భయపడవలసినది కేవలం దేవునికే! సరే, ఇప్పుడు మనం దర్శన వివరాన్ని చూడటం లేదు- కేవలం ఇస్సాకు కోసమైన వాగ్దానం చూసుకుందాం! ఇంకా అంటున్నారు: భయపడకు నేనే నీకు కేడెము అనగా షీల్డ్, కవచము. అనగా యుద్ధం జరిగేటప్పుడు మనిషి అవయవాలను ముఖ్యంగా తలనుండి తొడల వరకు కాపాడే కవచము అంటున్నారు. అవును దేవుడే మన కవచము మరియు డాలు!! నీ బహుమానం అత్యధికమగును అని దేవుడు చెబితే అబ్రాహము గారు అన్నారు: దేవుడా మీరు ఎన్నిస్తే ఎందుకు? నాకు పిల్లలు లేరు కదా, సిరియాకు చెందిన దమస్కు వాడైన ఎలియాజరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా అన్నారు! దీనికోసం లోతుగా ఆలోచిస్తే ఒకవేళ నాకు సంతానం పుట్టకపోతే దమస్కు ఎలియాజరును తన వారసుడిగా చెయ్యాలని ఇంతకుముందు అబ్రాహము గారు అనుకుని ఉంటారు. అందుకే తనకు పిల్లలు పుట్టకపోతే నా ఆస్తిమొత్తం వారసుడు ఎలియాజరే అవుతాడుకదా అని దేవునితో చెప్పారు!

వెంటనే దేవుడు అంటున్నారు అతడు అనగా ఎలియాజరు నీకు వారసుడు కాదు! నీ గర్భవాసమున పుట్టబోయేవాడే నీ వారసుడు అంటున్నారు! నీ కడుపున ఒకడు పుడతాడు అతడే నీకు వారసుడు అంటున్నారు. మరోసారి ఇస్సాకు కోసరమైన వాగ్దానం దేవుడు చేస్తున్నారు! ఇంకా అంటున్నారు: నీ గుడారం నుండి బయటకు రా అంటే అబ్రాహము గారు బయటకు వచ్చారు, అప్పుడు ఆ రాత్రి ఆకాశము వైపు చూపించి చూశావా ఆ ఆకాశ నక్షత్రాలను నీ చేతనైతే లెక్కించు. నీ సంతానం కూడా లెక్కించలేనంతగా ఆకాశనక్షత్రాల లాగ చేస్తాను అని మరో వాగ్దానం చేశారు!

13వ అధ్యాయంలో భూమిమీద ఉన్న ఇసుక రేణువులవలే నీ సంతానాన్ని చేస్తాను అని వాగ్దానం చేస్తే ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో ఆకాశ నక్షత్రాల వలే నీ సంతానం చేస్తాను అని మరోసారి వాగ్దానం చేస్తున్నారు. ఇది నాల్గవసారి వాగ్దానం చెయ్యడం!

 

ఇక ఆరవ వచనంలో మహత్తరమైన మాట వ్రాయబడింది: అతడు అనగా అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను!  దేవుని మాటను మనసా వాచా కర్మేనా నమ్మారు అబ్రహాము గారు! నమ్మడమే కాదు విశ్వసించారు. అదే అనగా అలా నమ్మి విశ్వసించడమే నీతిగా ఎంచబడింది దేవుని దృష్టిలో! ఈరోజు వాగ్దానాలు మనము చదువుతున్నాము గాని అది మన జీవితంలో తప్పకుండా జరుగుతాయి అనే విశ్వాసము లేనందువలన మనము ఏమీ పొందుకోలేక పోతున్నాము! అబ్రాహము గారు నమ్మారు అది ఆయనకు నీతిగా దేవుని దృష్టిలో ఎంచబడింది!  బైబిల్ గ్రంధంలో ఇదే రిఫరెన్సు క్రొత్త నిబంధనలో నాలుగు సార్లు వాడటం జరిగింది విశ్వాసం కోసం చెబుతూ: రోమా 4:3, 9, 22; గలతీ ౩:6;యాకోబు 2:23.ఎంత ధన్యతో కదా!

 

అబ్రాహము గారు మనలాగే జన్మతహా పాపి! కాని దేవుని నమ్మినందువలన దేవుడు చెప్పింది చేస్తారు అనే అచంచల విశ్వాసం దేవునిమీద చూపించినందువలన ఆయన పాపాలు క్షమించబడి నీతిమంతుడిగా తీర్చబడ్డారు!  మనము కూడా దేవునిమీద అలాంటి ప్రగాఢమైన విశ్వాసం చూపించవలసి ఉంది! ఇంకా ఎలా నమ్మారు అనేది మనకు రోమా 4వ అధ్యాయంలో చాలా వివరంగా వ్రాయబడింది దయచేసి నాల్గవ అధ్యాయం చదవమని మనవిచేస్తున్నాను! ముఖ్యంగా 1722 లో ఇలా ఉంది....

 

17. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.

18. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, *నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను*.

19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

21. దేవుని మహిమపరచి, *ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను*.

22. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

 

అందుకే అబ్రాహము గారు విశ్వాసులకు తండ్రి అని ఎంచబడ్డారు!!!  ఒకవేళ నీవు అబ్రాహము గారిలాంటి విశ్వాసం కలిగి ఉంటే నీవు అబ్రాహము సంతానం అవుతావు! మరినీవు అలాంటి విశ్వాసం కలిగి ఉంటావా?

దైవాశీస్సులు!

(సశేషం)

      

 

 

 

*వాగ్ధాన పుత్రుడు-ఐదవ భాగం*

*వాగ్దానాలు-4*

ఆదికాండం 15:19

1. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.

2. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా

3. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా

4. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.

5. మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను.

6. అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.

7. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు

8 .అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా

9. ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇస్సాకుగారు పుట్టకముందు ఇస్సాకు కోసం దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశారో చూసుకుంటున్నాము!

 

   (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! మనము ఇస్సాకు గారి కోసమైన నాల్గవ వాగ్దానం ధ్యానం చేస్తున్నాము!

 

ఆరవ వచనంలో అబ్రాహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని చూసుకున్నాము! ఇంకా ముందుకు వెళ్లకముందు ఎందుకు నీతిగా ఎంచబడిందో మరో కోణంలో చరిత్ర నుండి చూసుకుందాం!

 

అబ్రాహము గారి కాలంలో అబ్రాహము గారు పుట్టి పెరిగిన ప్రాంతంలో- ఇంకా సిరియా ఇరాక్ ఇరాన్ ప్రాంతాలలో, అదేకాకుండా యూరోప్ ఆసియా ఆఫ్రికాలలో అనేక దేశాలలో ఆ కాలంలో స్త్రీకి ఎటువంటి హక్కులు గాని విలువ గాని ఉండేది కాదు! ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఉన్నందువలన స్త్రీకి కొంచెము విలువ ఉండేది గాని మిగిలిన ప్రాంతాలలో స్త్రీకి ఎటువంటి విలువ ఉండేది కాదు! అప్పుడే కాదు సుమారు 500 సంవత్సరాల క్రితం వరకు ఈ దేశాలలో స్త్రీకి ఎటువంటి విలువ లేనేలేదు మన భారతదేశంలో తప్పించి!!! స్త్రీని ఏ రకంగా చూసేవారంటే ఆ రోజులలో:

మొదటిది: ఇంట్లో పనిచేసే పనిమనిషి (ఆమె భార్య గాని, దాసీ గాని)

రెండు: పిల్లలను లేక తమకు వారసులను  పుట్టించే యంత్రము;

మూడు: కామ కోరికలు తీర్చుకునే ఒక సాధనం (పచ్చి భాషలో చెప్పాలంటే Sex Doll)

 

చూడండి: మనం సోదొమ గోమోర్రాలు ప్రక్కనున్న ప్రాంతాలు ఎలా ఉండేవో మనకు 14వ అధ్యాయంలో తెలుస్తుంది.

ఇలాంటి ప్రాంతంలో పుట్టిపెరిగారు అబ్రాహము గారు! ఇప్పుడు ఆయన అపర కోటీశ్వరుడు! తన చేతిక్రింద అనేకమంది దాసులు దాసీలు ఉన్నారు! గాని ఎప్పుడూ మరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడం గాని, పిల్లలు పుట్టలేదు అని తన భార్య కాకుండా మరో స్త్రీ వద్దకు వెళ్ళడం గాని అబ్రాహము గారు చేయనేలేదు. దేవుడంటే భయం భక్తి ఉన్నందువలన! కారణం నోవాహు గారు ఆయనకు చెప్పారు నేర్పించారు- మీ పితరులు ఇంకా అనేక జనాలు ఇలా వావి వరుస లేకుండా, స్త్రీలతో పరస్త్రీలతో జంతువులతో పాపం చేస్తూ,  స్త్రీలు- స్త్రీలు, పురుషులు- పురుషులు పాపం చేస్తున్నందువలన దేవుడు జలప్రళయం పంపించి కేవలం నా కుటుంబాన్ని రక్షించి మిగిలిన వారిని చంపేశారు అని చెబుతుండే వారు. కాబట్టే నోవాహు గారి దగ్గర నేర్చుకున్న భక్తి విశ్వాసం ఆయనకు దేవుడంటే భయభక్తులు నేర్పి- అదే ధర్మశాస్త్రముగా ఆయన హృదయంలో పనిచేసి పరస్త్రీలను పట్టించుకోకుండా చేసింది. నీతిమంతునిగా మార్చింది! ఒక రాజులా వెలుగుతున్న అబ్రాహము గారు, అనేకమంది స్త్రీలు అక్కడున్నా ఎవరిని పట్టించుకోకుండా  తన భార్య గొడ్రాలు అయినా భార్యమీద ప్రేమను చూపించారు. నీవు గొడ్రాలివి పో అని తగిలేసి మరో స్త్రీని కూడా తెచ్చుకోలేదు! ఆరోజులలో అది జరిగేది! అన్నింటికంటే  మిన్నగా దేవుడు తనకు సంతానం ఇస్తాను అన్నారు! ఆయన తప్పకుండా ఇస్తారు అని నమ్మారు! అదే అతనికి నీతిగా ఎంచబడింది!

 

ప్రియమైన స్నేహితుడా! నీ భార్యను కాకుండా దయచేసి మరో స్త్రీని ప్రేమించవద్దు! చాలామంది పురుషులకు లోకంలో ఉన్న స్త్రీలంతా అందంగానే కనిపిస్తారు కేవలం తన భార్య తప్పించి! గాని అబ్రాహము గారికి తన భార్యనే అందంగా కనిపించింది. నీవు నేను కూడా దీనిని అబ్రాహము గారి దగ్గరనుండి నేర్చుకోవాలి!

 

సరే, ఇక తర్వాత వచనాలలో అనగా 15:7 నుండి చివరి వరకు చూసుకుంటే అబ్రాహముగారు ఈ దేశాన్ని నేను స్వతంత్రించు కొంటాను అంటున్నారు కదా మరి దానికి ఋజువు ఏమిటి అని అడిగారు దేవునితో!

అందుకు దేవుడు 9వ వచనంలో మూడేండ్ల పెయ్య అనగా దూడపెయ్య, మూడేండ్ల మేకను, మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లని గువ్వను ఒక పావురం పిల్లను నా దగ్గరకు తీసుకుని రా అని చెప్పారు! మూడేళ్ళ పెయ్య మేక పొట్టేలు , పావురం గువ్వ ఎందుకు తెమ్మన్నారో ప్రతీదానికి ఆధ్యాత్మిక మర్మం ఉంది గాని ప్రస్తుతం అది మన పాఠము కాదు కాబట్టి ముందుకు పోదాం, అయితే లేవీకాండం మొదటి అధ్యాయం ప్రకారం, సంఖ్యాకాండం 19వ అధ్యాయం ప్రకారం దేవునికి బలి అర్పించాలి అన్నా, హోమం అర్పించాలి అంటే పైన చెప్పబడిన వాటితోనే హోమార్పణ, బల్యర్పణ  చేస్తారు!

అబ్రాహము గారు వెంటనే ఉదయాన్నే మూడేళ్ళ పెయ్య, మూడేళ్ళ మేక  మూడేళ్ళ పొట్టేలు, ఒక పావురం ఒక గువ్వను తీసుకుని వచ్చి వాటిని నడుము దగ్గర రెండు బాగాలుగా ఖండించి అక్కడ పెట్టారు. పక్షులు చిన్నవి కాబట్టి వాటిని రెండుగా కోయలేదు!

 

ఒకసారి ఆగి ఆలోచిద్దాం!  అబ్రాహాము గారు ఆ విధంగా నడుముకి రెండు భాగాలుగా ఖండించారు! అబ్రాహము గారికి బలి అర్పించే విధానం తెలుసు! అనేక బలిపీటాలు అప్పటికే కట్టి అనేక బలులు అర్పించారు! మరి నడుముకి ఎందుకు ఖండించారు అంటే ఆ కాలంలో ఏదైనా ముఖ్యమైన ప్రమాణం గాని ఒడంబడిక గాని చేసేటప్పుడు ఇలా పశువులను రెండు ఖండాలుగా/ భాగాలుగా ఖంఢించి వాటిమధ్యలో నుండి ఇరువర్గాలు నడిచి వెళ్ళాలి! నడిచివెళ్ళి చేతిలో ప్రమాణం చేసేవారు . ఇదీ ఆ రోజులలో ప్రమాణం చేసి ఋజువుచేసుకునే విధానం! అందుకే ఇప్పుడు దేవుడు చెబితే  అబ్రాహము గారు వీటిని తీసుకుని వచ్చి నాతో ప్రమాణం చెయ్యండి అంటున్నారు! ఉదయం నుండి సాయంత్రం వరకు అబ్రాహము గారు దేవుని కోసం ఎదురుచూశారు ప్రమాణం చేస్తారు అని.  సాయంత్రం దేవుడు 17వ వచనంలో ఖండముల మధ్య నడిచి వెళ్లి ప్రమాణం చేశారు.....

ఆదికాండము 15: 17

మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.

 

ఇక్కడ రెండు విషయాలు గమనించాలి! దేవుడే అబ్రాహము గారితో మానవుల పద్దతిలో ప్రమాణం చేశారు. అది ఏమని అనేది మనకు 1316 వచనాలలో ఉంది. ఏవిధంగా తన సంతానం ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారో వివరిస్తున్నారు!

 

ఇక రెండవది ఏమిటంటే దేవుడు రాత్రి దర్శనంలో చెప్పారు- పశువులు తెచ్చి ఇలా చెయ్యు అని- అబ్రాహము గారు ఉదయాన్నే దేవుడు చెప్పినట్లు చేసేశారు. ఉదయమంతా మధ్యాహ్నమంతా ఎదురుచూశారు దేవుడు వస్తారు- తనతో ప్రమాణం చేస్తారు అని! గాని రాలేదు. మధ్యలో పక్షులు వచ్చి ఆ కళేభరముల మీద వాలుతూ ఉంటే తగులుతూ ఉన్నారు అబ్రాహము గారు! ఇంతటి గొప్ప కోటీశ్వరుడు గాని అందరిని వదిలేసి ఒక్కడే తన దేవుని కోసం దేవుడు చెప్పిన మాటకోసం తిండి తిప్పలు లేకుండా ఎదురుచూస్తున్నారు దేవుని కోసం! ఇదీ విశ్వాసం! ఇదీ భక్తి! ఇది నమ్మకం!

 

ఈ రోజులలో అనేకమంది ప్రార్ధన చేసి దేవుడా నాతో మాట్లాడు, జవాబివ్వు అంటారు! గాని ఆయన జవాబు ఇచ్చేవరకు ప్రార్ధనలో కనిపెట్టరు. ఎన్నెన్నో పనులు! మనం అప్లికేషన్ పెట్టేశాం కదా, ఆయనే జవాబిస్తాడులే! ఎక్కడికి పోతాడేమిటి ఈరోజు కాకపొతే రేపు అయినా ఇవ్వడం మానడు కదా అని నిర్లక్షం! కొంతమందికి హా దేవుడికి నాలాగ కాలీ ఏమిటి, ఎంతో బిజీగా ఉంటాడు, నా ప్రార్ధనకు జవాబిస్తాడా ఏమిటి! అదిగో ఆమె అంటేనే లేక అతనంటేనే దేవునికి ఇష్టం నా ప్రార్ధనకు జవాబు ఇవ్వడు దేవుడు! నేనంటే దేవునికి ఇష్టం లేదు అనుకుంటారు! అయ్యా అమ్మా ! నీవు దేవుడు ఎవరికైతే జవాబిస్తున్నాడు అని అనుకుంటున్నావో అతడు/ఆమె దేవుడు ప్రార్ధనకు జవాబిచ్చేవరకు వారికీ ఎన్ని పనులున్నా మానుకుని దేవుని నుండి జవాబు వచ్చేవరకు కనిపెడుతూ ఉంటున్నారు సమాధానం వచ్చిన తర్వాతే మరో పని చేస్తున్నారు. అందుకే దేవుడు వారికి జవాబిస్తున్నారు! నీవు కనిపెట్టడం లేదు ఆయన జవాబివ్వడం లేదు!

 

అబ్రాహాము గారు సాయంత్రం వరకు కనిపెట్టారు ఎదురుచూశారు! సాయంత్రం రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలగా ఆ ఖండముల మధ్య నడిచివెళ్ళి నిత్యనిబంధన చేశారు అబ్రాహము గారితో! కాబట్టి ప్రియ దైవజనమా! దేవుని సన్నిధిలో ప్రార్ధించడమే కాదు దేవుని నుండి జవాబు వచ్చేవరకు కనిపెట్టడం కూడా నేర్చుకోవాలి మనము!

 

ఇక ఏమని చెబుతున్నారు అంటే 13వ వచనం నుండి : నీ సంతతి వారు తమదికాని పరదేశమందు నివశిస్తారు, అక్కడ వారికి దాసులుగా బానిసలుగా ఉంటారు. ఇలా నాలుగు వందల సంవత్సరాలు ఆ దేశపు వారు నీ సంతానాన్ని శ్రమ పెడతారు. ఆ తర్వాత నీ సంతానం వారిని శ్రమ పెట్టిన వారికి నేను తీర్పు తీరుస్తాను. చివరకు వారు మిక్కిలి ఆస్తితో తిరిగి ఈ దేశం తిరిగి వచ్చి ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. నీవైతే మిక్కిలి మంచి వృద్ధాప్యము కలిగి పాతిపెట్టబడతావు ఇదే దేశం లో అని చెప్పారు! ముందు జరుగబోయేది ముందుగానే అబ్రాహము గారికి చెప్పారు దేవుడు!  నీవుకాదు నీ సంతానం స్వతంత్రించుకుంటారు. వారు పరాయి దేశంలో 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు. అలాగే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు వారికి! ఆ తర్వాత వారికి తీర్పు తీర్చి తీసుకుని వస్తాను ఈ దేశానికి అన్నారు! అప్పటికి ఇంకా ఇస్సాకు గారు పుట్టలేదు. అయినా దేవుడు వాగ్దానం చేశారు. అబ్రాహము గారు నమ్మారు! అదేవిధంగా మోషేగారి నాయకత్వంలో పది రకాలైన తెగుళ్ళు తీర్పులు ఐగుప్తీయులకు కలిగించి గొప్ప విజయోత్సవముతో ఐగుప్తు నుండి కనాను దేశం తీసుకుని వచ్చారు దేవుడు! యెహోషువా గారి నాయకత్వంలో వాగ్దానం చేసిన వాగ్ధాన భూమిని అబ్రాహము గారి సంతానం అయిన ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు!

 

 ఇంకా వాగ్దానం పూర్తికాలేదు ఆరోజే ఇశ్రాయేలు దేశానికి ఎల్లలు కూడా దేవుడు చెప్పారు

 Genesis(ఆదికాండము) 15:18,19,20,21

 

18. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా

19. కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను

20. హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను

21. అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతాన మున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.

 

ఇదీ వాగ్దానములు నమ్మడం వలన వచ్చే దీవెనలు! మనము కూడా అబ్రాహము గారిలా వాగ్దానాలు నమ్ముదాం! దేవుని వరములను ముఖ్యంగా ఆయన రాజ్యమును స్వతంత్రించుకుందాం!

దైవాశీస్సులు! 

(సశేషం)

*వాగ్ధాన పుత్రుడు-6వ భాగం*

*శరీర పుత్రుడు*

ఆదికాండం 16:712

7. యెహోవా దూత అరణ్యములో నీటిబుగ్గయొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని

8. శారయి దాసివైన హాగరూ, ఎక్కడనుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగి నందుకు అది నా యజమానురాలైన శారయియొద్దనుండి పారిపోవుచున్నాననెను.

9. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను.

10. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.

11. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;

12. అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా

13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇస్సాకుగారు పుట్టకముందు ఇస్సాకు కోసం దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశారో చూసుకుంటున్నాము!

 

   ప్రియులారా! ఇంతవరకు ఇస్సాకు కోసరమైన నాలుగు వాగ్దానాలు చూసుకున్నాము! ఇక ఐదవది మనకు 17వ అధ్యాయంలో కనిపిస్తుంది! అయితే దానికిముందు 16వ అధ్యాయంలో మనకు శరీరపుత్రునికోసం వ్రాయబడింది! శరీరపుత్రుడు అని ఎందుకు అనడం జరుగుతుంది అంటే దేవున్ని అడుగకుండా శారమ్మగారు చెప్పినట్లు చేసినందువలన మరో సంతానం కలిగింది.

శారమ్మ గారు అన్నారు : నేనుపిల్లలు కనకుండా యెహోవా చేశారు కాబట్టి నా దాసియైన హాగరుతో నీవు సంసారం చేయు, ఒకవేళ ఆమెద్వారా నాకు సంతానం కలుగవచ్చు అని చెప్పారు ఆవిడ!

 

ఒకసారి ఆగి దీనికోసం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది! ఇలా దాసితో సంసారం చేస్తే శారమ్మ గారికి ఎలా సంతానం కలుగుతుంది??? 

కారణం దాసీలు, దాసులు ఆ రోజులలో యజమానుల సొత్తు! యజమానులు వీరిని ఏమైనా చేసుకోవడానికి అధికారం ఉంది ఆరోజులలో! వారిని కొట్టవచ్చు, అమ్మవచ్చు! చివరికి చంపేసినా పర్వాలేదు! ఎందుకంటే వారిసొత్తు, వారు ఏమైనా చేసుకుంటారు!

కాబట్టి ఇప్పుడు అబ్రాహము గారు ఒకవేళ శారమ్మ గారి దాసియైన హాగరు ద్వారా పిల్లలు కంటే ఆ సంతానం ఎవరికీ చెందుతుంది? శారమ్మ హక్కుదారు కాబట్టి ఆ సంతానం శారమ్మగారిదే అవుతుంది గాని హాగరుది కానేకాదు! అందుకే దాసితో సంసారం చేయమని చెప్పారు ఆమె! ఎంతవరకు శారమ్మ గారి ఆస్తి ఆమె? యజమానురాలి ఇంట్లో ఉన్నంతవరకు! అందుకే తర్వాత అధ్యాయాలలో  శారమ్మ గారు  హాగరుని వెళ్ళగొట్టారు. ఎందుకంటే ఇష్మాయేలు గాని తన తండ్రితో ఉంటే తప్పకుండా ఆస్తికి హక్కుదారుడు అవుతాడు కాబట్టి ఆమెను ఇష్మాయేలు ని వెళ్ళగొట్టినట్లు చూడగలము!

 

శారమ్మ చెప్పారు వెంటనే అబ్రాహము గారు ఆమెతో సంసారం చేశారు! గమనించాలి:  16:3 చూసుకుంటే శారమ్మ గారు హాగరుని ఉంచుకోడానికి ఇవ్వలేదు, అక్కడ చూస్తే భార్యగా ఇచ్చెను అని వ్రాయబడింది అనగా శారమ్మ గారే దగ్గరుండి హాగరుని పెళ్ళిచేశారు అని అర్ధమవుతుంది! ఇక్కడ హాగరు కూడా ఇప్పుడు పెళ్ళిచేసుకున్న భార్య అవుతుంది గాని ఉంచుకున్న భార్య కాదు!  అయితే అబ్రాహము గారు దీని ఖండించవలసినది పోయి భార్య చెప్పినట్లు చేశారు! కనీసం దేవుణ్ణి అడగనే లేదు! నా భార్య ఇలా అంటుంది దేవుడా, నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అడగనే లేదు! ఇది అబ్రాహము గారు చేసిన రెండో తప్పు! దీనికి ప్రతిఫలంగా ఇప్పటికీ అనగా 3900 సంవత్సరాలు జరిగినా గాని ఇంకా ఇష్లామీయులకు ఇశ్రాయేలీప్రజలకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి!

 

ఇక హాగరు ఎవరు? ఆమె హెబ్రీయురాలు కాదు, చరిత్ర చూసుకుంటే 14వ అధ్యాయంలో కరువు వస్తే అబ్రాహము గారు ఐగుప్తు వెళ్ళినప్పుడు ఆ దేశపు రాజు ఫరో శారమ్మగారిని ఎత్తుకుపోతాడు. దేవుడు బుద్ధిచెబితే తిరిగి అప్పజెప్పినప్పుడు రాజప్రసాదంలో శారమ్మ గారికి పరిచర్య చేసిన దాసిని ఆమెకు కానుకగా ఇచ్చాడు ఫరో! ఆమెను ఇప్పుడు శారమ్మ గారు భార్యగా చేశారు అబ్రాహము గారికి! అనగా పాముని పూజించే ఒక అన్యస్త్రీని భార్యగా ఇచ్చారు శారమ్మ! ఇది కూడా మరో పెద్ద తప్పు!

 

అయితే ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే శారమ్మ గారు సంతానం పుట్టలేదు అనే డిప్రెషన్ తో అబ్రాహము గారికి ఆమెను భార్యగా ఇచ్చారు గాని అబ్రాహాము గారు కోరనేలేదు! యవ్వనురాలు అందగత్తె అని ఆశపడలేదు! భార్య మాట కాదనక ఆమెను పెండ్లి చేసుకుని అప్పుడు ఆమెతో సంసారం చేశారు! ఇదీ నీతిమంతుని పని!  కేవలం దేవునితో సంప్రదించకుండా తొందరపది చేసిన తప్పు ఇది!

 

ఇక ఆమెతో సంసారం చేసిన వెంటనే యవ్వనురాలైన హాగరు గర్భవతి అయ్యింది. ఇక మిగిలిన సంఘటన మనకు అనవసరం! తర్వాత ఆమెను శారమ్మ గారు కష్టపెడ్డటం ఆమె పారిపోవడం దేవుని దూత హాగరుతో మరలా నీవు నీ యజమానిరాలి దగ్గర అణిగి ఉండు దేవుడు ఆ బిడ్డను దీవిస్తున్నారు అని చెప్పడం జరిగింది! మీదన వచనాలలో దీనిని మనం చూడవచ్చు.

 

అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే ఇష్మాయేలు వాగ్ధాన పుత్రుడు కాదు! తొందరపాటు వలన కలిగిన శారీరక పుత్రుడు మాత్రమే! అది కూడా దాసీ సంతానం!

అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఇష్మాయేలుని దేవుడు ఎందుకు ఆశీర్వదించవలసి వచ్చింది అంటే 12వ అధ్యాయం నుండి ఈ అధ్యాయం వరకు నీ సంతానమును నేను దీవిస్తాను, ఈ ప్రాంతమును మీకు ఇస్తాను అని వాగ్దానం చేశారు కాబట్టి- ఇష్మాయేలు కూడా అబ్రాహము గారికే పుట్టారు కాబట్టి అతనిని కూడా దీవించవలసి వచ్చింది దేవునికి! గాని దేవుడు వాగ్దానంచేసిన భూమిని మాత్రం ఇతనికి ఇవ్వలేదు! ఈరకంగా అబ్రాహము గారికి తొలిచూలి కుమారుడు పుట్టాడు యితడు  శారీరక పుత్రుడు! మనము కూడా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు దేవుణ్ణి సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటే దేవునికి దూరమై పోతాము!

Galatians(గలతీయులకు) 4:22,23,24,25

 

22. దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా?

23. అయినను దాసివలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను.

24. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలైయున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.

25. ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది.

 

మరో విషయం ఏమిటంటే ఇష్మాయేలుని దీవించేటప్పుడు దేవుడు 12వ వచనములో అతడు సహోదరుల ఎదుట జీవించును అంటున్నారు. ఈ వాగ్ధానం చేసినప్పటికి ఇస్సాకు గారు పుట్టలేదు. అతని సహోదరుని ఎదుట అనడం లేదు, సహోదరుల ఎదుట అన్నారు. అనగా ఇస్సాకు మాత్రమే కాకుండా కెతూర వలన రాబోవుదినములలో పుట్టబోయేవారు అన్నమాట. ఈ రకంగా ఇష్మాయేలుని దీవించేటప్పుడు కూడా ఇస్సాకు పుడతాడు అని చెప్పడం జరిగింది.

 

ఒకమాట గ్రహించాలి! సుమారు 83 , 85 సంవత్సరాల మధ్యలో దేవుడు అబ్రాహము గారితో మాట్లాడారు 15వ అధ్యాయంలో,  86 సంవత్సరాలకు ఇష్మాయేలు పుట్టాడు 16వ అధ్యాయం ప్రకారం! మరలా 17వ అధ్యాయంలో మాట్లాడారు దేవుడు. అనగా సుమారు 13  సంవత్సరాలు దేవుడు అబ్రాహాము గారితో మాట్లాడటం మానేశారు! ఎందుకంటే దేవుడు చెప్పని పని చేసినందువలన!  కాబట్టి అలాంటి తొందరపాటు పనులు మనము చెయ్యకుండా జాగ్రత్తపడదాం!

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-7వ భాగం*

*వాగ్దానాలు-5*

 

ఆదికాండం 17:18

1. అబ్రాము తొంబది తొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.

2. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను.

3. అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను;

4. నీవు అనేక జనములకు తండ్రివగుదువు.

5. మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అన బడును.

6. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు.

7. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.

8. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇస్సాకుగారు పుట్టకముందు ఇస్సాకు కోసం దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశారో చూసుకుంటున్నాము!

 

  ప్రియులారా మొదటి వచనంలో అబ్రాహము తొంబది తొమ్మిదియేండ్ల వాడైనప్పుడు మరలా దేవుడు మాట్లాడుతున్నట్లు చూస్తున్నాము! గతభాగంలో చూసుకున్నాము! అబ్రాహము గారు చేసిన తొందరపాటు పనివలన, దేవుడు చెప్పని పెళ్లి చేసుకుని సంతానం కనినందున దేవుడు 13 సుదీర్ఘ సంవత్సరాలు అబ్రాహము గారితో మాట్లాడలేదు! ఇది అబ్రాహము గారి జీవితంలో చీకటి కాలం! ఈ కాలంలో దేవుడు తనతో మాట్లాడటం మానేసినందువలన బహుశా అబ్రాము గారు ఎంతో బాధపడి ఉంటారు! దేవుణ్ణి వేడుకుని ఉంటారు! అప్పుడు దేవుడు మరలా 17వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు!

 

  ఏమంటున్నారు: నేను సర్వశక్తిగల దేవుడను! ఇది మొదటి మాట! రెండవది నా సన్నిధిలో నిందారహితముగా ఉండు! మూడవ మాటకు వెళ్లకముందు ఈ రెండు మాటలు ఎందుకు అన్నారో ఒకసారి చూసుకుందాం!

 

అబ్రాహామా! నేను సర్వశక్తిగల దేవుడను! నీవు నేను ముసలివాడను అయిపోయాను. నా భార్య ముసలిది అయిపోయింది, ఇక మాకు పిల్లలు ఎలా కలుగుతారు అని సంశయములో ఉన్నావు గాని నేను సర్వశక్తిగల దేవుడను! నాకు అసాధ్యమైనది ఏమీ లేదు! అని చెబుతున్నారు! నీకు నేను సంతానం ఇస్తాను అని నాల్గో వచనంలో మరోసారి అనగా ఐదవ సారి వాగ్దానం చేస్తున్నారు!

 

ఇక రెండవ మాట: నా సన్నిధిలో నిందారహితుడవై ఉండాలి అంటున్నారు! 99 సంవత్సరాల ముసలివాడికి దేవుడు చెబుతున్నారు నీవు నిందారహితము గా ఉండాలి! కారణం దేవుడు చెప్పని పని, దేవుని ఆమోదం లేని పెళ్లి చేసుకున్నారు కాబట్టి దేవుడు నీవు నిందారహితముగా ఉండాలి అంటున్నారు!

 

 ప్రియ సంఘమా! ఈ రోజు దేవుడు నీతో నాతో అంటున్నారు నీవు నా సన్నిధిలో నిందారహితముగా ఉండాలి! మచ్చలేని నిందలేని జీవితం, మన దేవుని దృష్టిలో జీవించాలి!

 

ఇక ఈ అధ్యాయంలో ఏమని దీవిస్తున్నారు అంటే: నీకును నాకును మధ్య నా నిబంధనను నియమించాను, నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను అంటున్నారు! ఆ నిబంధన ఆ కాలంలో సున్నతి పొందడం! అది ఫైయిల్ అయ్యింది కాబట్టే యేసుక్రీస్తుప్రభువుల వారిని పంపించి మరో నూతన నిబంధన యేసు రక్తముద్వారా చేశారు! ఆ నిబంధన తనను ఎందరంగీకరింతురో వారినందరినీ ఆయన బిడ్డలుగా చేసుకున్నారు! యేసు ప్రభువు అని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారిని తన బిడ్డలుగా వారసులుగా చేసుకున్నారు...

యోహాను 1: 12

తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

 

రోమీయులకు 10: 9

అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

 

మార్కు 16: 16

నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

 

ఇక నాలుగో వచనంలో నీవు అనేక జనములకు తండ్రివి అవుతావు కాబట్టి నీ పేరు ఇక అబ్రాము అనబడదు అనగా గొప్ప ఘనతగల తండ్రి అనబడదు గాని అబ్రాహాము అనగా అనేక జనములకు తండ్రివి అన్నారు!  అందుకే ఇప్పుడు

మీరు ముస్లిం సోదరులను అడగండి: మీ తండ్రి ఎవరూ అంటే- అబ్రాహాము గారు అంటున్నారు!

ఇశ్రాయేలు ప్రజలను అడగండి: మీ తండ్రి ఎవరూ అంటే- అబ్రాహాము గారు అంటారు.

క్రైస్తవులను అడగండి : మీ తండ్రి ఎవరూ అంటే- అబ్రాహము గారు!... అందరికీ తండ్రి అయ్యారు అబ్రాహాము గారు.

 

ఇక తర్వాత వచనాలలో నీలో నుండి జనములు రాజులు వస్తారు అంటున్నారు!

ఇక 8వ వచనంలో నీకు నీ సంతానమునకు నిత్య స్వాస్త్యముగా కనాను దేశాన్ని ఇచ్చి వారికి అనగా నీ సంతానమునకు నేనే దేవుడనై ఉంటాను అని వాగ్దానం చేస్తున్నారు!

 

నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.

 

నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావు గాని నేను నీకు సంతానం కలిగిస్తారు నీవు అనేక జనాలకు తండ్రివి అవుతావు, నీలోనుండి జనములు రాజులు వస్తారు అంటున్నారు! నీవు సున్నతి పొందాలి అన్నారు!

 

ఇంకా శారమ్మ గారి కోసం అంటున్నారు:  నీవు నీ భార్య అయిన శారాయిని శారాయి అనగా జగడగొండి అని పిలువవద్దు, ఆమె పేరు ఇప్పుడు శారా అనగా రాజకుమారి,

చూశారా, దేవుని మాటలు వింటే దేవుడు ఎంతగా ఒకవ్యక్తి జీవితాన్ని మారుస్తారో! ఒక గొడ్రాలు, ఒక జగడగొండి ఇప్పుడు రాజకుమారిగా మారబోతుంది. తన భర్త అనేక జనములకు తండ్రి అయితే తానూ కూడా అనేక జనములకు తల్లి అవుతుంది కదా!

 

16వ వచనంలో అంటున్నారు...ఆదికాండము 17: 16

నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను.

 

ఇక 17వ వచనంలో నవ్వుకుని అనుకుంటున్నారు అబ్రాహము గారు నూరేండ్ల వానికి సంతానం కలుగుతుందా? 90 సంవత్సరాల శారా పిల్లలు కంటుందా అనుకున్నారు! అలా అనుకుని అయ్యా నా కుమారుడైన ఇష్మాయేలు ని దీవించండి అన్నారు! అయితే దేవుడు అంటున్నారు  నీ భార్య అయిన శారా తప్పకుండా నీకు కుమారున్ని కనును అతనికి నీవు ఇస్సాకు అని పేరు పెట్టాలి. అయితే నా నిబంధనను నేను ఇస్సాకు తోనే స్థిరపరుస్తాను. ఇది నిత్య నిబంధన అంటున్నారు 19, 21 వచనాలలో...

ఆదికాండము 17: 19

దేవుడు నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపర చెదను.

ఆదికాండము 17: 21

అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.

 

ఇక్కడ మరోసారి స్పష్టమైన వాగ్దానం చేస్తున్నారు ఇస్సాకు కోసం!!!  నేనునీకు సంతానం ఇస్తాను, ఆ సంతానం పేరు ఇస్సాకు!  అనగా నవ్వు లేక నవ్వేవాడు! ఆయనతో/ ఆయనద్వారా నా నిబంధన స్తిరపరుస్తాను అంటున్నారు!

 

అయితే 17వ వచనంలో నూరేండ్ల నాకు సంతానం కలుగుతుందా, 90 సంవత్సరాల శారా పిల్లలు కంటుందా అని మనస్సులో నవ్వుకున్నారు గాని అబ్రాహాము గారు ఎప్పుడైతే దేవుడు తన కుమారుని పేరు ఇస్సాకు అని చెప్పారో వెంటనే ఆత్మలో బలపడి ఏరకంగా విశ్వసించారో మనకు రోమా 4 లో కనబడుతుంది...

Romans(రోమీయులకు) 4:17,18,19,20,21,22

17. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.

18. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

22. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

 

కాబట్టి మనము కూడా అదేవిధముగా విశ్వసిద్దాం!

 

దేవుని వాగ్దానాలు పొందుకుని ఆయన రాజ్యానికి వారసులమవుదాం!

 

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-8వ భాగం*

*వాగ్దానాలు-6*

 

ఆదికాండం 18:13,  814

1. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.

2. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి

3. ప్రభువా, నీ కటాక్షము నామీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు.

8. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.

9. వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను.

10. అందుకాయన మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చ యముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను.

11. అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక

12. శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.

13. అంతట యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల?

14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇస్సాకుగారు పుట్టకముందు ఇస్సాకు కోసం దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశారో చూసుకుంటున్నాము!

 

  ప్రియులారా! ఇంతవరకు ఇస్సాకు కోసమైన ఐదు వాగ్దానాలు ధ్యానం చేసుకున్నాము! ఇక ఈ 18వ అధ్యాయంలో చివరి వాగ్దానం అనగా ఆరవ వాగ్దానం ఉంది. ఆరు అనగా పనిని పూర్తిచెయ్యడం! ఇక ఇదే చివరి వాగ్దానం! వాగ్ధాన క్రమం ఏమిటంటే : అబ్రాహాము గారు మమ్రే దగ్గర సింధూర వనము ఉంది అక్కడ చాలా ఎండగా ఉంటే ఆ వనములో చెట్ల నీడలో గుడారములో కూర్చుని ఉన్నారు, అప్పుడు తండ్రియైన యెహోవా దేవుడు మొట్టమొదటసారి మానవుని రూపంలో అబ్రాహము గారికి కనబడ్డారు!

 

 గమనించాలి- దేవుడైన యెహోవా ఏదేను తోటలో ఆదాము హవ్వలతో మానవరూపంలో కనబడి వారితో ఆటలాడేవారు, ఆ తర్వాత హనోకు గారితో మానవరూపంలో కనబడ్డారు! నోవాహు గారు కేవలం ఆయన స్వరమును మాత్రము వినేవారు! గాని చాలా సంవత్సరాలకు మరోసారి దేవుడు మానవుని రూపంలో కనబడి  అబ్రాహము గారితో మాట్లాడుతున్నారు:

రెండోవచనంలో ముగ్గురు మనుష్యులు కనబడ్డారు వెంటనే అబ్రహాము గారు గుడారము బయటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి నమస్కారం చేశారు! చూశారా, 99 సంవత్సరాల వృద్ధుడు దేవుడు కనబడిన వెంటనే నిజముగా ఆయన ఎవరో ఎరిగి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు! నేడు మనము దేవుడు గొప్పవాడు సర్వశక్తిమంతుడు అని తెలిసినా దేవునికి భయభక్తులు చూపించడం లేదు, ఆయన సాష్టాంగనమస్కారం చేశారు!

 

ఇక్కడ మనకు ముగ్గురు మనుష్యులు కనబడ్డారు కాబట్టి బహుశా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అనుకుంటారు. నా ఉద్దేశంలో అది కాదు! ఒకరు తండ్రియైన దేవుడైన యెహోవా! మరో ఇద్దరు దేవదూతలు! ఎందుకంటే 16వ వచనంలో ఆ మనుష్యులు మాట్లాడటం మాని వెళ్ళిపోయారు అనియు, 22వ వచనంలో ఆ మనుష్యులు సోదొమ వైపుగా వెళ్లారు అనియు, 19:1 లో సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సోదొమ చేరునప్పటికి అని ఉంది, అనగా అబ్రాహము గారి దగ్గర నుండి ఇద్దరు దేవదూతలు సోదొమ వచ్చారు అయితే దేవుడు అబ్రాహము గారితో మాట్లాడినట్లు అర్ధమవుతుంది. కాబట్టి తండ్రియైన దేవుడు, ఇంకా ఇద్దరు దేవదూతలు అబ్రాహము గారికి కనబడ్డారు అని స్పష్టముగా అర్ధమవుతుంది!

 

ఇక మూడవ వచనంలో ప్రభువా నీ కటాక్షము నా మీద చూపించి భోజనం చెయ్యకుండా వెళ్ళిపోవద్దు అంటూ బ్రతిమిలాడుతున్నారు దేవునితో! ఇది పల్లెటూళ్ళలో సాంప్రదాయం! మధ్యాహ్నం ఎవరైనా వస్తే భోజనం పెట్టకుండా పంపరు! ఇది పూర్వకాలం నుండి అన్ని దేశాలలో ఉన్న సంప్రదాయం! అందుకే దయచేసి నేను మీకు భోజనం తెస్తాను, అంతవరకూ ఉండండి అంటూ బ్రతిమిలాడుతున్నారు! దేవుడు కూడా సరే అన్నారు!

 

వెంటనే అబ్రాహము గారు పరుగెత్తుకుని పోయి శారమ్మతో మూడు మానికలు మెత్తని పిండి, అనగా కేజిన్నర పిండి త్వరగా పిసికి రొట్టెలు చెయ్యమన్నారు, అలాగే పనివాడికి మంచి లేగదూడను ఇచ్చి దీనిని త్వరగా వండమని చెప్పారు! గమనించాలి- నిజానికి రొట్టెలు తయారుచెయ్యడానికి, లేగదూడను కోసి వండబోయేసరికి కనీసం గంటకు పైగా ఎక్కువ సమయం పడుతుంది. అనగా అంతసేపు దేవుడు మరియు దేవదూతలు ఓపికగా కూర్చుని ఉన్నారు! ఇక్కడ దేవుడు మానవుల భోజనం కోసం ఓపికగా కూర్చున్నారు అని కాదు గాని దేవుడంటే అబ్రాహము గారికి ఎంత ఇష్టమో, ఎంత గౌరవమో చూసి మురిసిపోయి- మానవుల కోర్కెను మన్నించడానికి దేవుడు అంతసేపు ఓపికగా కూర్చుని ఉన్నారు. అబ్రాహము గారు దేవునితో అంతసేపు మాట్లాడుతూ ఉన్నారు! ఇలాగే న్యాయాధిపతులు 6:18 లో కూడా సంసోను తండ్రియైన మనోహ గారు దేవదూతలను భోజనం చెయ్యమని బ్రతిమిలాడితే వారు కూడా ఓపికగా ఉన్నారు.

 

 ఇక  భోజనం సిద్ధమైన వెంటనే వారిముందు పెట్టారు, వారు అనగా దేవుడు మరియు దేవదూతలు తింటూ ఉంటే, అబ్రాహము గారు దండ కట్టుకుని నిలబడి ఉన్నారు, భోజనం  చేసిన వెంటనే దేవుడు అడుగుచున్నారు- నీ భార్యయైన శారా ఎక్కడ? వెంటనే అయ్యా ఆమె గుడారం లో ఉంది అని చెప్పారు! 

 

పదో వచనంలో ఆరోసారి వాగ్దానం చేస్తున్నారు: నేను మరలా వచ్చే సంవత్సరం ఇదే కాలానికి ఇదే రోజున మరలా వస్తాను    అప్పుటికీ  నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పారు! మరోసారి వాగ్ధాన పుత్రుని కోసం దేవుడే ప్రత్యక్షమై అబ్రాహముగారి ఇంట్లో ఆతిధ్యం స్వీకరించిన తర్వాత దీవించి వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఇది!!

అందుకే పౌలుగారు అంటున్నారు ఆతిధ్యము చేయ మరువకుడి. కొంతమంది తెలియకనే ఆతిథ్యము చేసి ఈవులు పొందుకున్నారు అంటున్నారు.

హెబ్రీయులకు 13: 2

ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.

1పేతురు 4: 9

సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.

అబ్రాహాము గారు చేసి మేలులు పొందుకున్నారు.

 

అయితే తర్వాత వచనాలలో చూసుకుంటే శారమ్మ గారు ఈ దేవుని మాటను విని నాకు బలము ఉడిగి పోయింది. స్త్రీ ధర్మమూ నాకు ఆగిపోయింది అనగా పీరియడ్స్ ఆగిపోయాయి, కానుపు ఉడిగిపోయింది నాకు, నా భర్తకూడా ముసలివాడు, మాకు పిల్లలు పుడతారా అని అనుకుని తనలోతాను నవ్వుకుంది 17వ అధ్యాయంలో అబ్రాహము గారు నవ్వుకున్నట్లు. వెంటనే దేవుడు అంటున్నారు ముసలిదాననైన నాకు నిజంగా పిల్లలు పుడతారా అని శారా ఎందుకు నవ్వుకుంటుంది, యెహోవాకు అసాధ్యమైనది లేక యెహోవా చేయలేనిది ఏదైనా ఉందా అని అడుగుతున్నారు!! వచ్చే సంవత్సరం ఇదేకాలానికి నిశ్చయంగా శారాకు కుమారుడు పుడతాడు అని మరోసారి నొక్కివక్కానించి మాట్లాడుతున్నారు. వెంటనే ఆమె బెదిరిపోయి నేను నవ్వలేదు బాబు అంటే నీవు నవ్వావు అని దేవుడు చెప్పారు!

 సాధారణంగా  ఇది అనగా అబద్దమాడటం మానవుల బ్రష్ట స్వభావానికి నిదర్శనం! అయ్యా నాలో నేను నవ్వుకున్నాను- దయచేసి క్షమించు అనాల్సింది పోయి నేను నవ్వలేదని అబద్దమాడుతుంది. మనము కూడా ఇలా చాలాసార్లు అబద్దాలు ఆడుతుంటాము. ఇది మనలో ఉన్న బ్రష్ట స్వభావం! అది మంచిది కాదు! తద్వారా మనము పాపము చేస్తున్నాము! అబద్దమాడకూడదు అని బైబిల్  చెబుతుంది.

 

ఈ రకంగా దేవుడు అబ్రాహము గారితో ఇంకా శారమ్మతో వచ్చే సంవత్సరం ఇదే కాలానికి నీకు ఇస్సాకు పుడతాడు అని చెప్పారు! ఇద్దరికీ వాగ్దానం చేశారు! అయితే శారమ్మ ఆ తర్వాత అనుమానించలేదు దేవుడు తనకు పిల్లలు ఇస్తారు అని నమ్మి విశ్వసించినది అని మనకు హెబ్రీ పత్రికలో కనబడుతుంది. 11:1112...

11. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.

12. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.

 

దేవుణ్ణి చూడకముందు తాను బహుశా అనుమానించింది, తన భర్త ఏదో దేవుడు దేవుడు అంటున్నాడు అనుకుంది, అయితే తానూ తన భర్త దేవుణ్ణి ముఖాముకిగా చూశాక ఇక ఆమె అనుమానించక పరిపూర్ణ విశ్వాసం ఉంచి పిల్లలు కనడానికి ధైర్యము మరియు బలము తెచ్చుకుని కుమారుని కన్నది! ఇదీ విశ్వాసం! నీలో నిజమైన విశ్వాసముంటే నీ కుటంబస్తులు కూడా ఒకరోజు దేవుణ్ణి విశ్వసిస్తారు నమ్ముతారు!

 

ఇక్కడ ఒకే సంవత్సరంలో రెండుసార్లు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నేను అనుకుంటాను బహుశా శారమ్మ గారికి విశ్వాసం కలిగించడానికే దేవుడు రెండోసారి వారికి కనబడి వాగ్దానాన్ని పునరుద్ఘ్తాటిస్తున్నారు.

 

ప్రియమైన దైవజనమా! మనము కూడా అబ్రాహము గారికున్న విశ్వాసాన్ని, శారమ్మ గారికున్న విశ్వాసాన్ని పొందుకుని అసాధారణమైన కార్యాలు చెయ్యాలి!

 

అట్టి కృప ధన్యత విశ్వాసము దేవుడు మనకు దయచేయును గాక!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-9వ భాగం*

ఆదికాండం 21:16

1. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.

2. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను.

3. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరుపెట్టెను.

4. మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.

5. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు.

6. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇస్సాకుగారు పుట్టకముందు ఇస్సాకు కోసం దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశారో చూసుకున్నాము!

 

  ప్రియులారా! ఇంతవరకు ఇస్సాకు కోసమైన ఆరు వాగ్దానాలు ధ్యానం చేసుకున్నాము!

 

ఇక 19వ అధ్యాయంలో సోదోమ గొమోర్రా చుట్టుప్రకల ఉన్న పట్టణాలను గ్రామాలను దేవుడు అగ్ని గంధకాలతో నాశనం చెయ్యడం చూస్తాము!

 

20వ అధ్యాయంలో గెరారు అనే ప్రాంతం రావడం అక్కడ నివశించడం జరుగుతుంది. గెరారు అనగా ఇది ఫిలిస్తీయుల ప్రాంతం! అనగా ప్రస్తుతం పాలస్తీనా దేశం! ఇక్కడ కూడా శారమ్మను ఈమె నా చెల్లెలు అని అబద్దమాడారు. గమనించాలి ఒక పాపాన్ని కప్పుకోడానికి ఎలా మరో పాపం చేయాల్సి వస్తుందో అలాగే ఒకసారి ఒక అబద్దాన్ని కప్పుకోడానికి మరో అబద్దమాడవలసి వస్తుంది. ఒక్కసారి అబద్దాలు అలవాటు అయితే అబద్దాలు వాటికవే పుట్టకొక్కుల్లా పుట్టుకొస్తాయి. 12వ అధ్యాయంలో చెప్పినట్లు ఇక్కడ కూడా అబద్దం ఆడారు,

 

ఇక 21వ అధ్యాయంలో శారమ్మ గారు గర్భవతి అయినట్లు రెండో వచనంలో ఇస్సాకు పుట్టినట్లు చూడగలం!!!

 

మొదటి వచనంలో అంటున్నారు దేవుడు తాను చెప్పినట్లు శారాను దర్శించెను! యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాకోసం చేశారు అని ఉంది. రెండో వచనంలో నిర్ణయ కాలంలో శారా గర్భవతియై అతని ముసలి తనంలో అబ్రాహాముకి కుమారుని కన్నది!

దేవుడు తానూ చెప్పిన మాటను నెరవేర్చే దేవుడు! అందుకే తీతు పత్రికలో ఆయన అబద్దమాడనేరని దేవుడు అని వ్రాయబడింది.

తీతుకు 1: 3

నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును *అబద్ధమాడనేరని దేవుడు* అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను

 

హేబ్రీలో అంటున్నారు

హెబ్రీయులకు 6: 18

మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.

 

అందుకే పౌలుగారు అంటున్నారు అబ్రాహము గారు ఎలా నమ్మారంటే: వాగ్దానం చేసినవాడు దానిని నెరవేర్చుటకు సమర్ధుడు శక్తిగలవాడు.  ....

Romans(రోమీయులకు) 4:17,18,19,20,21

 

17. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.

18. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

 

మనము కూడా దేవుని వాగ్దానాలను నమ్మి దేవుడు వాటిని జరిగించడానికి సమర్ధుడు శక్తిగలవాడు అని నమ్మవలసి ఉంది!

అబ్రాహాము గారి 75 సంవత్సరాల వయస్సులో దేవుడు నీ తండ్రి ఇంటిని నీ బంధువులను వదిలి నేను చూపించే దేశానికి రా అంటే అబ్రాహము గారు ఉప్పు సప్పు అడుగకుండా వెళ్లిపోయారు! నమ్మి విశ్వసించారు. ఆ వాగ్దానం అబ్రాహము గారి 100 సంవత్సరాల వయస్సులో నెరవేరింది. అనగా 25 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది అబ్రాహాము గారికి! మధ్యలో పరీక్షలు వచ్చాయి! కరువు అనే పరీక్ష వచ్చింది- దారి తప్పి ఐగుప్తు పారిపోయారు, గాని విశ్వాసం సడలలేదు! అది తప్పు అని ఆయనకు తెలియలేదు! శారమ్మ గారిద్వారా హాగరు అనే మరో పరీక్ష వచ్చింది. 13 సంవత్సరాలు దేవునితో సాంగత్యం కోల్పోయారు! మరలా దేవుని సాంగత్యము దొరికాక ఇక వదలలేదు సడలలేదు! వాగ్ధాన పుత్రుని పొందుకున్నారు 25 సంవత్సరాల తర్వాత! మనము కూడా వాగ్దానాలను సొంతం చేసుకోవడానికి కొన్ని రోజులు లేక నెలలు లేక సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో ఎదురుదూడక తప్పదు!

 

ఒకసారి యోసేపు గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన 13/14వ ఏట దర్శనాలు చూశారు- తాను రాజు లేక అధికారి అవుతాడు, తన అన్నదమ్ములు తన తల్లిదండ్రులు తనకు నమస్కరిస్తారు అని! గాని అది నెరవేరడానికి 17 సంవత్సరాలు పట్టాయి! ఆ దర్శనం కోసమే అన్నలతో ద్వేషించబడి కొట్టబడి అమ్మబడ్డాడు! అయినా విశ్వాసము నిరీక్షణ భక్తి వదలలేదు! ఆతర్వాత బానిసగా అమ్మబడ్డాడు! ఆ తర్వాత చెరసాలలో ఉంచబడ్డాడు చేయని నేరానికి! అయినా దేవుడా ఇంతన్నావ్ అంతన్నావ్ నేను రాజును అవుతాను అన్నావ్! ఏది? ఏది? ఏది? అని అడగలేదు! అలుగలేదు! నిరీక్షణతో కనిపెట్టారు ఆయన! ఒకరోజు చెరసాల నుండి తిన్నగా రాజ మందిరానికి వెళ్ళడమే కాదు ఐగుప్తు దేశం మీద అధికారిగా అయ్యారు! దీనికోసం అనేక రకాలైన పరీక్షలు ఎదురైనా ఓర్చుకున్నారు!

 

నీవు నేను కూడా అలాగే ఓర్చుకుంటూ నిరీక్షించవలసిన అవసరం ఉంది!

దేవుడు మోషేగారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దాస్యము నుండి విడిపించాలి అనేది దేవుని ప్రణాళిక! అందుకోసం ఎనబై సంవత్సరాలు ఆయనకు రెండు రకాలైన ట్రైనింగ్ మరియు పరీక్షలు పెట్టి అప్పుడు ఆయనను తిరుగులేని నాయకునిగా చేశారు! ఇలాగే దేవుడు మనలను కూడా పరీక్షలు పెట్టి నిరీక్షణ గలవారో కాదో తేల్చుకుని అప్పుడు ఇస్తారు దేవుడు!

అడిగిన వెంటనే ఇస్తే దాని విలువ తెలియదు మనకు! అందుకే దేవుడు ఆలస్యము చేస్తారు! ఇది గుర్తెరిగావా వాగ్దానాలు అన్నీ నీ సొత్తే! వరాలు ఫలాలు నీ సొత్తే!

ఈ రకంగా అబ్రాహము గారు శారమ్మ గారు వాగ్ధాన పుత్రుని పొందుకున్నారు! ఎనిమిదవ రోజున సున్నతిని చేశారు దేవుడు చెప్పినట్లు!  అప్పుడు దేవుడు చెప్పినట్లు ఇస్సాకు అనే పేరుపెట్టారు! అప్పటికి అబ్రాహము గారికి 100 సంవత్సరాలు! శారమ్మ గారికి 91 సంవత్సరాలు!

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-10వ భాగం*

ఆదికాండం 21:814

8. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.

9. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి

10. ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.

11. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.

12. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును.

13. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతా నమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.

14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

67 వచనాలలో శారమ్మ గారు ఏవిధంగా అనుభూతి చెందారో మనం చూస్తాము.  ఇస్సాకు జననము వలన శారా జీవితంలో నవ్వు వచ్చినట్లు చూస్తాము! కేవలం శారమ్మగారికే కాదు అబ్రాహము గారి జీవితంలో కూడా ఎంతో నవ్వు ఆనందం ఉల్లాసం లభించాయి ఇస్సాకు జననము వలన!

 

ఇక ఎనిమిదవ వచనంలో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. అనగా బహుశా ౩5 సంవత్సరాల మధ్యలో బహుశా పాలు విడిచి ఉంటారు. గమనించాలి పూర్వకాలంలో తల్లులు ఎక్కువ రోజులు పాలు ఇస్తూ ఉండేవారు.  ఒక్క పిల్లవాడు పుట్టాక రెండో సంతానం పాలకు సిద్ధమైనంతవరకు ఇచ్చేవారని నా చిన్నప్పుడు తాతలు అమ్మమ్మలు చెప్పారు. కాబట్టి ఇస్సాకు గారు ఎన్ని సంవత్సరాలు పాలు త్రాగారో మనకు తెలియదు.  కారణం ఇస్సాకు తర్వాత శారమ్మ గారు పిల్లలు కన్నట్లు బైబిల్ లో గాని చరిత్రలో గాని లేదు!

 

సరే, పాలు విడిచిన రోజున అబ్రాహము గారు పెద్ద విందుచేశారు! ఆరోజున ఇష్మాయేలు- ఇస్సాకును చూసి ఎగతాళి చేశాడు లేదా వెక్కిరించాడు! ఇది శారమ్మగారు చూసి ఇష్మాయేలుని వెళ్ళగొట్టమంటుంది. ఈ దాసీ కుమారుడు నా కుమారునితో పాటుగా వారసుడుగా ఉండడు అని అబ్రాహాము గారితో అంటున్నారు ఆవిడ! ఇది అబ్రాహము గారికి ఎంతో దుఃఖము పుట్టించినట్లు 11వ వచనంలో చూస్తున్నాము!

 

ఏమండి! నా దాసితో సంసారం చేసి పిల్లలను కనమని హాగరుని పెళ్లిచేసింది శారమ్మ గారే కదా, ఇప్పుడు వెళ్ళగొట్టమంటుంది కూడా శారమ్మ గారే! ఈ స్త్రీలు ఎవరికీ అర్ధం కారు!!! అందుకే బైబిల్ భార్యలతో  జ్ఞానముతో కాపురం చెయ్యమన్నారు!

 

ఇంతవరకు అనగా బాలుడైన ఇస్సాకు పుట్టకముందు వరకు ఇష్మాయేలుని చూసి అతనితో ఆడుకుంటూ ఎంతో సంతోషించారు అబ్రాహము గారు! ఇష్మాయేలుతో కూడా ఎంతో అనుభంధం పెంచుకున్నారు ఆయన! అబ్రహాము గారే కాదు శారమ్మ కూడా అనుభంధం పెంచుకుని ఉంటారు. గాని ఎప్పుడైతే తన సొంత కుమారున్ని వెక్కిరించాడో వెంటనే కోపం ఈర్ష్య, మత్సరం పెరిగిపోయింది శారమ్మ గారిలో! ఇప్పుడు ఇంత అనుభంధం పెంచుకున్న కుమారున్ని వెళ్ళగొట్టమంటే అబ్రాహము గారికి ఎంతో దుఃఖము పుట్టింది! కారణం అప్పటికి ఇష్మాయేలు వయస్సు సుమారుగా 16 సంవత్సరాలు! 16 సంవత్సరాల అనుభందాన్ని తెంచుకోవలసి వస్తుంది ఇప్పుడు!

చూశారా దేవుడు చెప్పకుండా చేసిన పని ఎంత దుఃఖము ఎంత వేదన ఎంత ద్వేషపూరితముగా మారిపోతాయో!

 

గలతీ పత్రికలో ఇలా వ్రాయబడింది...4:2223,

22. దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా?

23. అయినను దాసివలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను.

 

 2931 

29. అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది.

30. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది?దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడైయుండడు.

31. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము.

 

హాగరు విషయంలో అబ్రాహము గారు చేసిన తప్పుకి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారు. మనం మన సొంత దారిలో పయనిస్తే ఇలాగే దుఃఖము శోకము కొనితెస్తుంది. అందుకే సామెతలు గ్రంధంలో రెండు సార్లు వ్రాయబడింది: ఒకనికి తాను నడిచేమార్గం ఎంతో సరాళంగా కనిపిస్తుంది గాని అది చివరికి నాశనానికి తెస్తుంది. సామెతలు 14: 12

ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.

మనం చేసేది మన కంటికి ఎంతో ఒప్పుగా సరిగా అనిపిస్తుంది. అయితే ఈ తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్ లో ఎన్నో ఇబ్బందులు తెస్తాయి. యవ్వనస్తులు కూడా ఎన్నెన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుని తమ జీవితాలు పాడుచేసుకుంటున్నారు. ముఖ్యంగా వివాహ విషయంలో! ఆ తర్వాత పెళ్లి పెడాకులు అయ్యాక బోరున ఏడుస్తున్నారు! కాబట్టి తప్పకుండా నీవు చేసే పని సరియైనదా కాదా  దేవుని సన్నిధిలో అడగాలి, కనిపెట్టాలి!  ఎందుకంటే దేవుని సంకల్పం- దేవుని నిర్ణయం ఎంతో ప్రీతికరమైనది అని బైబిల్ చెబుతుంది రోమా 12:2...

రోమీయులకు 12: 2

మీరు ఈ లోక (లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి.

 

కాబట్టి మన నిర్ణయాలు వాక్యముతో పోల్చుకుని సరిచేసుకోవాలి! నేను చేసే పని వాక్యానుసారంగా ఉందా లేక వ్యతిరేఖంగా ఉందా అని సరిచూసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి! అబ్రాహము గారు దేవుణ్ణి అడగకుండా హాగరుని వివాహం చేసుకుని ఇష్మాయేలుని కనినందుకు జీవితంలో ఎంతో శోకము అనుభవించారు!

 

సరే, ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్ధం కాక అప్పుడు దేవుణ్ణి సంప్రదిస్తున్నారు అబ్రాహాము గారు అనగా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్నమాట!

దేవుడు చెప్పారు- ఆ కుర్రవాని విషయంలో నీ దాసీ విషయంలో కూడా నీవు బాధపడవద్దు అంటున్నారు. పిల్లవాని విషయంలో బాధపడటం అంటే 16 సంవత్సరాల కుమారుని పోగొట్టుకోవడం నిజంగా దుఃఖకరమే! మరి దాసీ విషయంలో కూడా బాధపడవద్దు అని దేవుడు అంటున్నారు అంటే బహుశా కుమారున్ని కన్న తర్వాత హాగరుని ప్రేమించి ఉంటారు అబ్రాహము గారు! ఎందుకంటే ఆమెతో కూడా సంసారం చేశారు కదా! ఆమెను కూడా పెళ్లి చేసుకున్నారు కదా! గతభాగాలులో చెప్పడం జరిగింది, భార్య బలవంతం మీద హాగరుని పెళ్లి చేసుకున్నారు గాని కోరికతో చేసుకోలేదు! ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక ప్రేమను చూపించాలి కాబట్టి ప్రేమించారు అన్నమాట! గమనించాలి: అబ్రాహము గారు పిల్లలు పుట్టేవరకు కాపురం చేసి- పిల్లోడు పుట్టాక, కోరిక తీరాక ఆమెను వదిలెయ్యలేదు అని దీనిని బట్టి అర్ధం అవుతుంది! అందుకే ఎంతో బాధపడుతున్నారు. ఒకప్రక్కన క్రొత్త భార్య, తన కుమారుడు, మరో ప్రక్క వీరు నివసిస్తుంది ఎడారులలో/అరణ్యాలలో! ఈ ఎడారులలో వీరు ఎక్కడ జీవిస్తారు, ఎలా జీవిస్తారు అనేది మరో బాధించే సమస్య అబ్రాహము గారికి! అందుకే దేవుణ్ణి సలహా అడిగారు!

 

దేవుడు చెప్పారు: ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు! శారా నీతో చెప్పు ప్రతీ విషయంలో ఆమె మాట వినుము! ఎందుకంటే ఇస్సాకు ద్వారా పుట్టేవారు నీ సంతానం!!!  ఇదీ దేవుని ఆజ్ఞ!

 

ఒకసారి ఆగుదామా! భార్య ఏమి చెప్పినా వినమని దేవుడు చెబుతున్నారు!  కొందరు అడిగారు- అయ్యా నాభార్య నా తండ్రిని తల్లిని చూడొద్దు వెళ్లగొట్టే మంటుంది ఏమి చెయ్యాలి? ఇక్కడ భార్య చెప్పింది వినమని బైబిల్ చెబుతుంది. ఈ విషయంలో తల్లిని తండ్రిని అశ్రద్ధ చెయ్యవద్దు వారి ముదిమియందు వదలవద్దు అనికూడా చెబుతుంది. కాబట్టి భార్య చెప్పిన మాట వినాలి గాని ఆ మాటను కూడా లేక ఆ విషయం కూడా బైబిల్ ని లేక లేఖనముతో పోల్చుకుని భార్య చెప్పినది వాక్యానుసారమా కాదా అని ఆలోచించుకుని భార్య మాట వినాలని మనవిచేస్తున్నాను. భార్య నీ తల్లిదండ్రులను చూడొద్దు అంటే భార్య మోజులోపడి తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో చూడకపోతే ఎంత తప్పు కదా, పాపము కదా! దీనిని బైబిల్ సమర్ధించదు! కాబట్టి వాక్యానుసారమైన మాటలు వినాలి గాని సత్యానికి వాక్యానికి వ్యతిరేఖమైన మాటలు వినకూడదు! ఆహాబు రాజు అందంగా ఎర్రగా బుర్రగా సినిమా యాక్టర్ లాగ ఉంది అని యెజెబెలుని పెళ్ళిచేసుకుంటే అది ఇశ్రాయేలు దేశమంతటా విగ్రహారాధన చేస్తూ నిరపరాధులను చంపేస్తూ, ఘోరమైన వ్యభిచార చిల్లంగితనాలు తానూ చేస్తూ అందరికీ అలవాటు చేసింది. గాని ఆమె మోజులో పడి మంచి చెడ్డ ఎరుగకుండా పోతే చివరికి ఘోర మరణం చెందాల్సి వచ్చింది ఆహాబుకి!

 

సరే, ఇక్కడ దేవుడు చెప్పారు: నీ భార్య చెప్పే ప్రతీమాట వినమని చెప్పారు అబ్రాహము గారికి!

ఆ తర్వాత మాటలో ఇంతవరకు చేస్తున్న వాగ్దానాలు ఎవరికోసం చేశారో ఖచ్చితంగా చాలా స్పష్టంగా చెబుతున్నారు: నీవు శారా చెప్పినమాట విను ఎందుకంటే ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును! అంటే ఇప్పుడు ఏమని అర్ధమవుతుంది అంటే దేవుడు ఇంతవరకు చేసిన వాగ్దానాలు అన్నీ ఇస్సాకు కోసం- ఇస్సాకు ద్వారా కలిగే సంతానం కోసమే వ్రాయబడింది గాని నీవు శరీరపరంగా కన్న ఇష్మాయేలు కోసం కానేకాదు! వాగ్ధాన దేశం స్వతంత్రించుకొనేది ఇస్సాకు సంతానమే గాని ఇష్మాయేలు సంతానం కానేకాదు అని అర్ధం! కారణం ఇస్సాకు గారు యేసుక్రీస్తుప్రభువుల వారికి సాదృశ్యముగా ఉన్నారు. దీనికోసం మనం చివరి బాగాలలో చూసుకుందాం! ఇస్సాకు సంతానం ద్వారానే లోక రక్షకుడైన యేసయ్య రావాలి! ఆయన ద్వారానే ప్రపంచానికి దీవెన ఆశీర్వాదం రావాలి!

 

పౌలుగారు అంటున్నారు:

రోమీయులకు 9: 7

అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును,

 

దేవుడు ఆదికాండం 12:1౩ లో చేసిన వాగ్దానం ఇస్సాకుతో స్తిరపడింది అన్నమాట! మనము బైబిల్ లో పాత నిబంధనలో అధిక భాగం, క్రొత్త నిబంధనలో కొంత భాగం ఇస్సాకు గారి కుమారుడైన యాకోబు సంతానం కోసమే అనగా వాగ్ధానపు సంతానం కోసమే వ్రాయబడింది. వారి చరిత్ర వ్రాయబడింది. ఆ సంతానం నుండే యేసుక్రీస్తుప్రభువుల వారు వచ్చారు! అబ్రాహముతో దేవుడు చేసిన నిబంధన ఇస్సాకుతోనే గాని ఇష్మాయేలుతో స్తిరపరచలేదు గాని ఇష్మాయేలు కూడా అబ్రాహము గారి సంతానం కాబట్టి అంటున్నారు దేవుడు: దాసీ కుమారుడు కూడా నీ సంతానమే గనుక అతనికూడా ఒక జనముగా చేస్తాను అని మాత్రం చెప్పారు! ఈ రకంగా మరోసారి దేవుడు ఇస్సాకు పుట్టిన తర్వాత కూడా వాగ్దానం చేస్తున్నారు- ఇస్సాకు ద్వారానే నా నిబంధన స్తిరపరుస్తాను అని!

 

అలాగే  మనము కూడా తొందరపాటు నిర్ణయాలు దేవుణ్ణి అడగని దేవుని సెలవులేని నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ లో బాధపడవద్దు!

 

దైవాశీస్సులు!

 

*వాగ్ధాన పుత్రుడు-11వ భాగం*

*అబ్రాహము విషమపరీక్ష- ఇస్సాకు విధేయత*

ఆదికాండం 22:112

1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా, అని పిలువగా అతడుచిత్తము ప్రభువా అనెను.

2. అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను.

3. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.

5. తన పని వారితోమీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి

7. ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రీ అని పిలిచెను; అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా

8. అబ్రాహాము నాకుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.

9. ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.

10. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా

11. యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

12. అప్పుడు ఆయన ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందవలన నాకు కనబడుచున్నదనెను.

13. అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను.

14. అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.

15. యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను

16. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున

17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.

18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

ప్రియులారా! ఈ అధ్యాయం బైబిల్ గ్రంధంలో అతిప్రాముఖ్యమైన అధ్యాయం! ఇందులో అబ్రాహము గారి విశ్వాసము- పరీక్ష కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇస్సాకు గారి విధేయత కనిపిస్తుంది. అంతేకాకుండా ఇస్సాకు బదులుగా బలియైపోయిన యేసుక్రీస్తుప్రభులవారు కనిపిస్తారు!

 

పై వచనాలలో దేవుడు అబ్రాహము గారిని పరీక్షించినట్లు కనిపిస్తుంది మనకు! అదే సమయంలో ఇస్సాకు గారి విధేయత మనకు ఆలోచించడం వలన అర్ధమవుతుంది. ఎందుకంటే ఈ సన్నివేశం జరిగేటప్పటికీ ఇస్సాకు గారి వయస్సు బైబిల్ పండితుల లెక్కల ప్రకారం సుమారుగా 1425 సంవత్సరాలు!! అయితే దైవజనులు ఆరార్కే మూర్తిగారి లెక్క ప్రకారం 33 సంవత్సరాలు!!!  అనగా బాలుడు కాకుండా యవ్వనుడుగా మారినట్లు అర్ధమవుతుంది. ఒక యవ్వనుడు తండ్రి తనను బలి అర్పించబోతున్నాడు అని అర్ధమైనా దేవునికి మరియు తండ్రికి లోబడ్డాడు కదా! ఆ లోబడుతత్వమే ఇస్సాకు గారిని నూరంతలుగా ఆశీర్వదించబడటానికి దోహదమయ్యింది!

 

ఈ అధ్యాయం లేక సన్నివేశం ద్వారా విశ్వాసులకు కలుగు అగ్ని పరీక్షలు/శోధనలు   విశ్వాసుల మేలుకే శోధనలు/ శ్రమలు/ విషమ పరీక్షలు పని చేస్తాయి అని తేటతెల్లం చేస్తుంది.  అందుకే మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి అంటున్నారు యాకోబు గారు! అయితే అలాంటి వారికి దేవుడిచ్చే బహుమానం అనే జీవ కిరీటం పొందుకుంటారు అంటున్నారు ఎవడైతే శ్రమలను శోధనలను ఈ విషమపరీక్షలను తట్టుకుని క్రీస్తుకోసం నిలిచి జయిస్తాడో వాడు మాత్రం జీవకిరీటం పొందుకుంటాడు అన్నమాట! అక్కడ కూడా పరీక్షలో నమ్మకంగా నిలిచినవారికి జీవ కిరీటాన్నిస్తానని ప్రభువు వాగ్దానం చేశారు. దానికి యోగ్యులైన వారికి మాత్రమే దేవుడిచ్చే బహుమానం అది.  ప్రేమించేవారికి విషమ పరీక్షల్లో ఉన్న విశ్వాసులను పడిపోకుండా నిలిపి ఉంచేలా తోడ్పడే మానసిక శక్తి ఇదే!. ఇలా నిలిచి ఉండడం వారి ప్రేమకు నిదర్శనం.

 

  దేవుడు అబ్రాహాము గారిని పిలిచి అబ్రాహామా! నీవు నీ తండ్రి ఇంటివారిని నీ స్వజనాన్ని విడిచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని చెబితే- ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్నలు వేయకుండా తిన్నగా తనకు కలిగిన సమస్తము తీసుకుని వెళ్ళిపోయారు! గొప్ప ధనవంతుడు- తన కున్న ఆస్తి బంగళాలు అన్ని వదిలేసి- టెంట్ లలో ఉన్నారు, ఎండకు వానకు ప్రయాణం చేసి- దేవుడా ఇంతన్నావ్ అంతన్నావ్ అని ఎప్పుడు అనలేదు! కొన్ని సంవత్సరాలకు ఊహించలేనంత ఆస్తి ఐశ్వర్యము ఇచ్చి, నూరేళ్ళ వయస్సులో వాగ్ధాన పురుషుడైన కుమారున్ని అనగా ఇస్సాకుని ఇచ్చి, ఒకరోజు హటాత్తుగా అబ్రాహామా నీవు అధికంగా ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని మోరియా కొండమీద బలి ఇచ్చేయ్ అన్నారు! ఇంతవరకు వచ్చిన పరీక్షలు కంటే గొప్ప పరీక్ష ఎదురైంది అబ్రాహాము గారికి! వెంటనే తన హృదయం బద్దలై పోయింది, గాని ఏమాత్రము దేవుణ్ణి నిందించలేదు దేవుని వాగ్దానాలను అనుమానించలేదు. కుమారుడైన ఇస్సాకుని ఉదయాన్నే తీసుకుని మోరియా కొండకు వెళ్ళిపోయారు! ఒకసారి మూడో వచనం చూసుకుంటే తెల్లవారినప్పుడు అబ్రాహము లేచి గాదడకు గంతకట్టి తన పనివారిలో ఇద్దరినీ తన కుమారుడగు ఇస్సాకుని వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను!  తన భార్యయైన శారాతో పొరపాటున కూడా చెప్పలేదు దేవుడు ఇలా తమ కుమారుని బలి ఇవ్వమని చెప్పారని! కేవలం శారాయే కాదు నిజానికి ఏ తల్లి కూడా తన బిడ్డను బలిగా ఇవ్వడానికి ఒప్పుకోదు- అందుకే అబ్రాహము గారు చెప్పలేదు! ఇంకా చూసుకుంటే అబ్రాహము గారే దహనబలి కోసం కట్టెలు చీల్చినట్లు చూడగలం! చేతిక్రింద బోలెడుమంది పనివారున్నా గానే ఇది దేవుని కోసం దేవుని పని కాబట్టి తానే కట్టెలు చీల్చి కట్టుకుని బయలుదేరారు! అందరికీ చెప్పారు బలి ఇచ్చి వస్తాము! ఇది నిజమైన దృఢమైన విశ్వాసం.

 

ప్రయాణంలో ఎన్ని సార్లు తన మనస్సు అడిగిందో , దేవుడు నీ సంతానాన్ని ఇలా చేస్తాను అలా చేస్తాను అన్నారు, ఇస్సాకు వలననైనదే నీ సంతానం అన్నారు. ఇప్పుడు నీ కొడుకుని బలి ఇచ్చెయ్యమంటారా దేవుడు! మనుషులను బలికోరే దేవుడా నీ దేవుడు అని, గాని తన మనస్సుతో చెప్పి ఉండాలి- దేవుడు ఒకవేళ తన కుమారున్ని బలికోరితే దహనమైపోయిన తర్వాత మిగిలే ఆ భష్మము లేక బుగ్గిలోనుండి   దేవుడు ఇస్సాకుని లేపగలరు, బుగ్గిలోనుండి  నాకు సంతానం అభివృద్ధి చేయగలరు అని నమ్మి విశ్వసించి తన మనస్సుతో చెప్పి ఉంటారు! కొండ ఎక్కేటప్పుడు ఎన్ని కన్నీళ్లు రాలాయో కదా! చివరికి తండ్రీ- దహన బలికి కట్టెలు, నిప్పు ఉన్నాయి గాని మరి ఇంతకీ గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన గుండె ముక్కలుగా విడిపోయి ఉంటుంది, ఇది మరీ పెద్ద పరీక్ష!  గాని ఆయన చెప్పిన సమాధానం- నా కుమారుడా దహనబలికి పశువును దేవుడే చూసుకుంటాడు! జాగ్రత్తగా పరిశీలిస్తే తన హృదయంలో రేగే అలజడిని వెనుకకు పంపించి దృఢమైన విశ్వాసంతో అంటున్నారు: నాకుమారుడా దహనబలికి గొర్రెను కొండమీద దేవుడే చూసుకుంటారు!

 

ఒకసారి ఆగి ఆలోచిస్తే- దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే అబ్రాహాము గారు దేవునికి బలి ఇచ్చినప్పుడు గాని బలిపీటాలు కట్టేటప్పుడు గాని ప్రతీసారి తన కుమారుడైన ఇస్సాకుని వెంటబెట్టుకుని వెళ్ళేవారు అని అర్ధమవుతుంది. అందుకే కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగారు ఇస్సాకు! మరొకమాట కూడా అర్ధమవుతుంది ఏమిటంటే చిన్నప్పటినుండి ఏ రకంగా నోవాహు గారు తనకు భక్తిని నేర్పించారో, అలాగే ఇప్పుడు అబ్రాహముగారు తన కుమారుడైన ఇస్సాకుకి భక్తిని క్రమాన్ని నేర్పిస్తున్నారు! బాలుడు నడువ వలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలిగిపోడు! సామెతలు 22:6; అబ్రాహాము గారు క్రమాన్ని నేర్పించారు! అందుకే తండ్రిని అలా అడుగుతున్నారు!

 

బలిపీటం కట్టారు, గుండె రాయి చేసుకుని తన కుమారుడైన ఇస్సాకుని ఎన్నో మ్రొక్కులు మ్రొక్కుకుని పొందుకున్న వరపుత్రుని రెండు చేతులు కట్టేసి తన చేతులతో ఆ బలిపీటం మీద పెట్టినప్పుడు ఎంతగా మౌనంగా రోధించారో అబ్రాహాము గారు మనకు తెలియదు!

 

మరలా ఆగుదాం! ఎప్పుడైతే ఇస్సాకు గారి చేతులు వెనుకకు త్రిప్పి కడుతున్నారో ఇస్సాకుగారికి అర్ధమైపోయింది తన తండ్రి బలిని ఇవ్వబోయేది తననే! తానే గొర్రెపిల్లకు బదులుగా ఈ బలిపీటం మీద చనిపోయి కాలిపోబోతున్నది అని అర్ధమైపోయింది! ఇప్పుడు మీదన చెప్పినట్లు 14 నుండి 33 సంవత్సరాల యవ్వనుడు- 114 నుండి 125 సంవత్సరాల వృద్ధుడిని కొండమీద ఒక్క తోపు తోస్తే అబ్రాహాము గారు కొండమీద నుండి క్రిందపడి ముక్కలైపోతారు గాని ఇక్కడ కనిపిస్తుంది ఇస్సాకుగారి విధేయత! తాను నేర్చుకున్న భక్తి విధేయత, తన తండ్రికి లోబడేటట్లు చేసింది. ఓహో దేవుడు బలి ఇవ్వమన్నది నన్నా! బహుశా అనుకుని ఉంటారు- అయ్యా నీకోసం బలియైపోయే అవకాశం నాకిచ్చావా తండ్రి అని దేవునికి స్తుతించి ఉంటారు. చివరిసారిగా తండ్రి ముఖాన్ని చూసి ఉంటారు! వెంటనే నేను అనుకుంటాను- ఆముఖంలోకి చూడలేక తండ్రి ముఖం తండ్రి హృదయం బ్రద్దలైపోయి ఉంటుంది గాని వెంటనే దేవుడు అడిగారు నేను బలి ఇవ్వాలి అనుకుని గుండెను రాయి చేసుకుని కత్తి ఎత్తారు!

 

అయ్యా అమ్మా! అబ్రాహాము గారు ఎలా చేశారో నాకైతే అర్ధం కావడం లేదు ఆ త్యాగం, ఆ సమర్పణ! వేరేవారికోసం నేను చెప్పలేను గాని అదే నా కొడుకుని దేవుడు బలి ఇచ్చేయ్ అని నన్ను గాని అడిగితే నేను నా చేతులతో ఇవ్వలేనండి, నేను ఒప్పుకోలేనండి- దేవుని సేవకు ఇచ్చెయ్యమంటే ఇవ్వగలను గాని, నా ఆస్తి మొత్తం ఇవ్వమంటే ఇచ్చెయ్యగలను గాని నా చేతులతో నా కుమారుని బలి ఇవ్వమంటే నేను ఇవ్వలేను! గాని ఈయన సిద్ధమైపోయి కత్తి ఎత్తారు!! ఈ దృశ్యాన్ని చూడటానికి బహుశా పరలోకం మొత్తం వంగి చూస్తుంది అని నా ఉద్దేశం!!! ఎప్పుడైతే కత్తిఎత్తి ఇస్సాకుని బలి ఇవ్వబోతున్నారో చివరి క్షణంలో దేవుడే కరిగిపోయి అబ్రాహామా అబ్రాహామా అని కంగారుగా పిలిచేశారు, లేకపోతే నిజంగా బలి ఇచ్చేస్తారు అబ్రాహాము గారు! అందుకే అబ్రాహామా అబ్రాహామా! ఆ చిన్నవాని మీద కత్తి వేయవద్దు! ఇందును బట్టి నాకు అర్ధమయ్యింది ఏమిటంటే ఈలోకంలో ఉన్నవారికంటే చివరికి నీ ముద్దుల కొడుకు కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని నాకర్ధమయ్యింది. అన్నికంటే దేవునికే ఎక్కువగా భయపడుతున్నావు! అదిగో ఆ పొదలలో చిక్కుకున్న పొట్టేలుని బలి ఇచ్చేయ్ అంటూ గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నారు దేవుడు! ఈ పరీక్షలో విజయుడై నిలిచినందుకు ప్రతిఫలం చూశారా ఎంత గొప్ప దీవెనో...

 

బలి ఇవ్వకముందు తన కుమారుని రక్షించుకున్నారు, ఆ గొర్రెపిల్ల/పోట్టేలుని బలి ఇచ్చాక మరింత దీవెన ఇస్తున్నారు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు లాగ చేస్తాను, సముద్ర తీరంలో ఉన్న ఇసుక ఎంత ఉంటుందో అంతగా చేస్తాను అబ్బో ఎంత దీవెనో కదా!

 

ఇప్పుడు చూడండి ఇశ్రాయేలు వారిని అడగండి మీ తండ్రి ఎవరు? అబ్రాహాము!

ఇస్లామీయులను అడగండి మీ త్రండి ఎవరు? అబ్రాహాము!

క్రైస్తవులను అడగండి మీ తండ్రి ఎవరు? అబ్రాహాము!!!!

 

ఇన్ని పరీక్షలు తట్టుకున్నారు కనుకనే అంతగా ఆశీర్వాదం కలిగింది! అబ్రాహాము గారికి కలిగిన శోధనలో/ పరీక్షలో విధేయత మరియు విశ్వాసం ద్వారా జయించగలిగారు!

 

అదేవిధంగా ఇక్కడ ఒక గొప్ప పాటం నేర్చుకున్నారు ఇస్సాకు గారు- దేవుడు మనుష్యులను పరీక్షిస్తారు, కేవలం దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నాడో అని తెలుసుకోవడానికి మాత్రమే! దేవుడు ఎంతమాత్రము నరులను బలి కోరేవాడు కాదు! మనము విధేయత చూపిస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తారు అవసరమైతే తన దూతలను పంపి గొప్పకార్యాలు చేస్తారు అని తనకు అర్ధమయ్యింది. అబ్రాహము గారితో పాటుగా దేవుని స్వరాన్ని ఇస్సాకు గారు కూడా విన్నారు. అంతవరకూ కనిపించని గొర్రెపిల్ల హటాత్తుగా ఇప్పుడు పొదలలో కనిపిస్తుంది. తాను చనిపోవలసిన వాడు బ్రతికాడు! తన బదులుగా గొర్రెపిల్ల  బలియై పోయింది! ఆశ్చర్యం మీద ఆశ్చర్యం! అద్భుతం మీద అద్భుతం! అప్పుడు అనుకున్నాడు తన ప్రాణమున్నంతవరకు దేవుని కి విధేయత చూపించాలి అని!

 

 అదే కదా రాస్తున్నారు యాకోబు గారు ఆత్మావేశుడై- శోధన సహించువాడు ధన్యుడు, అతడు దేవునిచేత ప్రేమించబడి జీవ కిరీటం పొందుకుంటాడు! మరి ఇది నిజమే కదా!

 

కాబట్టి ప్రియ దైవజనమా! మనము కూడా శోధనలలో శ్రమలలో జారిపోకుండా పారిపోకుండా నిలకడగా నిలబడదాం! దైవాశీర్వాదాలు ముఖ్యంగా జీవ కిరీటం పొందుదాం!

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-12వ భాగం*

ఆదికాండం 24:14

1. అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను.

2. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము;

3. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక

4. నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

ప్రియులారా!  23వ అధ్యాయంలో శారమ్మగారు చనిపోయినట్లు కనిపిస్తుంది. ఇక 24వ అధ్యాయంలో అబ్రాహము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అంటున్నారు అనగా అబ్రాహాము గారి 136 సంవత్సరాల వయస్సులో శారమ్మ గారు 127 వయస్సు కలిగి చనిపోయారు.  అనగా ఇస్సాకు గారి 36 సంవత్సరాల వయస్సులో శారమ్మ గారు చనిపోయారు అని తెలుస్తుంది. అందుకోసం ఆయన చాలా దుఃఖాక్రాంతుడు అయ్యారు. ఇక 24వ అధ్యాయంలో బహుకాలం గడిచిన వ్రుద్దుడైనప్పుడు తన కుమారుడైన ఇస్సాకుకి వివాహం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి ఇస్సాకు గారి వయస్సు 40 సంవత్సరాలు! ఇది మనకు 25:20 లో ఉంది. అప్పుడు తనకుమారుడైన ఇస్సాకుకి వివాహం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు!

 

ఒకసారి మనం ఆదికాండం 4 నుండి 11 వరకు చూసుకుంటే ఇస్సాకు కంటే తక్కువ వయస్సు గలవారు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కన్నట్లు మనకు కనిపిస్తుంది. మరి 40సంవత్సరాల వరకు ఇస్సాకు గారు పెళ్లి కోసం అడుగలేదు- అబ్రాహము గారు చెయ్యలేదు! మా పల్లెటూళ్ళలో వారి పిల్లలు ఎవడైనా తప్పుడు మార్గాలు- అమ్మాయిల వెంట తిరగడాలు చేస్తూ ఉంటె వాడి వయస్సు పెరుగకపోయినా వాడికి పెళ్లి చేసేస్తూ ఉంటారు. అలాగే మా ఇంటిప్రక్కన ఒక కుర్రవాడికి 16 సంవత్సరాల వయస్సులో పెళ్లి అయిపోయింది. అతడు 32 సంవత్సరాలకు చనిపోయాడు అనుకోండి!

 

అయితే 40 సంవత్సరాలు వచ్చిన తొందరపడలేదు ఇస్సాకు గారు! ఈ కాలంలో కొంచెం లేటు అయితే చాలు నాకు పెళ్లి చేస్తావా లేదా అని కొంతమంది మంచి పిల్లలు అడుగుతున్నారు. మంచిపిల్లలు అని ఎందుకన్నాను అంటే వారి నిర్ణయం వారు తీసుకోకుండా తొందరగా చెయ్యమని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెస్తున్నారు అందుకే!  మరి ఇస్సాకు గారి పరిస్తితి ఏమిటి? ఒక రాజకుమారుడిలా పెరిగాడు అతను! తన చుట్టూ ఎంతోమంది అమ్మాయిలు తిరుగుతున్నారు. ఎందుకంటే అబ్రహాము గారి ఆస్తి దినదినము అభివృద్ధి చెందుతూ ఆయన సేవకులు దాసులు దాసీలు కూడా పిల్లలను పిల్లల పిల్లలను కనేశారు! ఎంతోమంది అమ్మాయిలూ దాసీలు ఉన్నాగాని తండ్రియైన అబ్రాహము గారిలా నీతిగా భక్తిగా యధార్ధముగా ఉంటూ ఉన్నారు ఆయన! కనీసం నాకు పెళ్లి చేయమని అని కూడా అడుగలేదు. గాని తన తల్లికోసం దుఃఖాక్రాంతుడుగా ఉంటున్నాడు అని తెలిసి తండ్రి కుమారుని కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వివాహ విషయంలో కూడా తండ్రికి విధేయత చూపిస్తున్నట్లు కనిపిస్తుంది!

 

నేటి రోజులలో ఏ విషయంలో నైనా పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నారు గాని పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులకు విధేయత చూపడం లేదు, దేవునికి విధేయత చూపడం లేదు. తమ జీవిత భాగస్వామిని తామే ఎంచుకుంటున్నారు సినిమాల ప్రభావం వలన! కాలేజీలలో, పిక్నిక్ లలో చూసి, లేక ఫేస్బుక్ పరిచయం పెంచుకుని వారు ఎలాంటివారో తెలుసుకోకుండా రెండుమూడు సినిమా డైలాగులు చెబితే నిజమని చెప్పి తల్లిదండ్రులను కూడా ఎదిరించి పెళ్లి చేసుకుని మోసపోయి లబోదిబోమని ఏడుస్తున్నారు. మీరు ఏమిచెప్పినా చేస్తాను గాని నా పెళ్లివిషయంలో దయచేసి మీరే నా మాట వినండి అంటున్నారు- దేవునితోను ఇంకా తల్లిదండ్రులతోను!

 

గాని ఇస్సాకుగారు తన వివాహం తన తండ్రి నిర్ణయానికే వదిలేశారు! దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు! అందుకే మంచి భార్య దొరికింది రిబ్కా రూపంలో! బైబిల్ గ్రంధం చాలా కొద్దిమందికోసమే ఆమె కన్యక అనిచెప్పింది! వ్రాయించినది పరిశుద్ధాత్ముడు పరిశుద్దాత్ముడు అబద్దమాడడు! కనుక ఒక నిర్దోషమైన కన్యక తల్లిదండ్రులకు పెద్దలకు విదేయత చూపించే అమ్మాయి దొరికింది!  ప్రియ యవ్వనుడా! యవ్వనురాలా! నీవు కూడా నీ వివాహ విషయంలో నీ తల్లిదండ్రులకే అధికారం ఇవ్వాలి. వారి ఇష్టానికి నీవు లోబడాలి! ఇదే బైబిల్ సంప్రదాయం!  నీకు నీవు జ్ఞానివి అనుకోవద్దు! సామెతలు గ్రంధంకూడా అదే చెబుతుంది....సామెతలు 3: 6

నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

సామెతలు 3: 7

నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము

 

ఇక ఈ అధ్యాయంలో మనకు ఇస్సాకు- రిబ్కాల పెళ్లి విషయంలో దేవుడు చేసిన కార్యాలు కనిపిస్తాయి. అవి మొత్తం చూసుకోవద్దు గాని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు క్లుప్తంగా చూసుకుని ముందుకుపోదాం!

మొదటిది: ఇస్సాకు గారు తన చుట్టూ ఎంతమంది ఆడపిల్లలు దాసులు ఉన్నా వారిని పట్టించుకోకుండా తండ్రికి లోబడి దేవునియందలి భయభక్తులు కలిగి ఉన్నారు! దీనికోసం మీదన మనం చూసుకున్నాము!

 

రెండవది: అబ్రాహాము గారు తన స్వజనుల పిల్లలనే అనగా తన బంధువుల పిల్లనే తన కుమారునికి వివాహం చెయ్యాలనుకున్నారు గాని వారు నివసించే అన్యుల అమ్మాయిని పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు! ఆ విధంగానే క్రైస్తవవిశ్వాస బిడ్డలు కూడా తప్పకుండా రక్షణ పొందుకున్న వారినే అనగా క్రైస్తవులు క్రైస్తవులనే వివాహం చేసుకోవాలి గాని అన్యుల అమ్మాయిలను/అబ్బాయిలను పెళ్లి చేసుకోకూడదు! ఇది బైబిల్ కూడా చెబుతుంది.... ద్వితియోపదేశకాండము 7: 3

నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.

ద్వితియోపదేశకాండము 7: 4

నన్ను అనుసరింప కుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.

ఇస్సాకు గారు ధర్మశాస్త్రం లేకపోయినా తండ్రిమాటను పాటించారు!

 

మూడవది: ఈ అధ్యాయం మొత్తం చూసుకుంటే తన దాసుడు మంచి భక్తిపరుడు ప్రార్ధనాపరుడు అని తెలుస్తుంది. అనగా అబ్రాహము గారు తానే కాకుండా తన పనివారికి దాసులకు దాసీలకు కూడా దేవునియందు భయభక్తులుగా ఉండాలని చెప్పడమే కాదు, ప్రార్ధనా విధానం నేర్పించారు అని అర్ధమయ్యింది! అందుకే ఎలియాజరు అంత భక్తిగా ప్రార్ధన చేస్తున్నారు! 

ప్రియమైన తల్లిదండ్రులారా! మీరే కాదు మీ పిల్లలు మీ ఇంట్లో పనిచేసేవారు కూడా భక్తిగా ఉంటున్నారా? వారికి ప్రార్ధన విశ్వాసము భక్తి నేర్పుతున్నారా?

దైవాశీస్సులు!

(సశేషం)

*వాగ్ధాన పుత్రుడు-13వ భాగం*

ఆదికాండం 24:14

1. అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను.

2. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము;

3. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక

4. నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము!  24వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేస్తున్నాము!

 

           (గతభాగం తరువాయి)

 

ఇక నాల్గవది: ఎలియాజర్, గమనించాలి- ఈ దాసుడు ఎలియాజరు అని బైబిల్ లో లేదు గాని ముందు అధ్యాయాలలో నమ్మకమైన వాడు, తన పెద్దదాసునికి అనగా ఎలియాజరుకి ఆస్తిని అప్పగించాలని అనుకున్నారు పిల్లలు పుట్టకముందు అబ్రాహాము గారు, కనుక ఎలియాజరు అని భావించడం జరుగుతుంది.  : దేవుణ్ణి సేవించాలి పూజించాలి అని అనుకునే వారందరికీ యితడు ఆదర్శంగా ఉన్నాడు!

 

 యితడు యజమానికి విధేయుడు! నమ్మకమైన వాడు! ప్రార్ధనాపరుడు! కార్యం నిర్వహించే నేర్పు గలవాడు! అంతేకాకుండా దేవుడు దారిచూపే వరకు నమ్మకంగా ఎదురుచూసే వాడు అనగా నిరీక్షణ గలవాడు! అందుకే  అబ్రాహము గారు ఈ ఎలియాజరునే పంపించారు! అతడు కూడా యజమానికి ప్రతిష్ట కలిగే పనులు చేయాలనుకున్నాడు! చేశాడు! మనము కూడా మన యజమానుడైన రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారికి ఘనత తెచ్చే పనులు చెయ్యాలి అని మర్చిపోవద్దు!

 

ఈ అధ్యాయం మొత్తం చూసుకుంటే అబ్రాహము గారు తన కుమారుని విషయంలో తొడక్రింద చెయ్యిపెట్టి ప్రమాణం చెయ్యమని చెప్పారు. తొడక్రింద చెయ్యిపెట్టి ప్రమాణం చెయ్యడమంటే ఆ రోజులలో ఆ దేశాలలో ఏదైనా గంభీరమైన విషయంలో శాశ్వత ప్రమాణం చెయ్యడానికి ఇలా తొడక్రింద చెయ్యిపెట్టి ప్రమాణం చేసేవారు! ఇక్కడ ఎలియాజరు ప్రమాణం చేశాడు. అలాగే యోసేపు గారు తన తండ్రియైన యాకోబు గారితో యాకోబు చనిపోక ముందు తన శవాన్ని తన తల్లిదండ్రుల సమాధుల యెద్ద పూడ్చమని తొడక్రింద చేయి వేయించుకుని ప్రమాణం చేశారు! 

 

తన స్వజనుల యొద్దకు అనగా ఊరు అనే కల్దీయ ప్రాంతం కాదు- హారాను అనగా సిరియా దేశం వచ్చేశారు అనుకున్నాము కదా, అక్కడికి వెళ్లి తన కుమారుడైన ఇస్సాకుకి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి వివాహం చెయ్యమన్నారు. భాద్యత మొత్తం తన పెద్దదాసునికి అప్పగించారు. ఆయన అడిగాడు- ఒకవేళ ఆ అమ్మాయి నేను అక్కడికి రాను, మీ యజమాని కుమారున్నే ఇక్కడకు తీసుకురా అంటే ఏమిచెయ్యాలి- నా కుమారుడు అక్కడకు రాడు, దేవుడు ఈ దేశాలు నాకిస్తాను అని ప్రమాణం చేశారు కాబట్టి ఆమెనే ఇక్కడకు తీసుకుని రావాలి అనిచెప్పారు!

 

ఎలియాజర్ పద్దనరాము కి వెళ్ళాడు. అనగా సిరియా దేశం వెళ్లి పద్దనరాము పొలిమేరలో ప్రార్ధన చేశాడు. ఈ ఊరిలో ఇంతమంది అమ్మాయిలూ ఉన్నారు, గాని నా యజమాని కుమారుడైన ఇస్సాకుకి మీరు ఏ అమ్మాయిని సిద్ధము చేశారో- ఆమెనే దయచేసి ఇక్కడకు తీసుకుని రండి అని ప్రార్ధన చేశాడు! రిబ్కా వచ్చింది- తనకు తన ఒంటెలకు నీళ్ళు పెట్టింది. వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది- ఎలియాజరుతో వెళ్ళడానికి ఇష్టపడింది. ఇస్సాకుకి భార్య అయ్యింది. ఇక్కడ ఆమెకూడా తల్లిదండ్రులకు విదేయురాలుగా ఉంది!  ఆమెకోసం మనం తర్వాత భాగంలో చూసుకుందాం! ఈ రకంగా ఒక నమ్మకమైన సేవకుడు- ప్రార్ధనా జీవితంతో ప్రార్ధించి ఇస్సాకుకి భార్యను తీసుకుని వచ్చినట్లు చూడగలం!

 ప్రతీ దైవజనుడు- అనగా సేవ చేస్తున్న వారు సేవకు రావాలనుకునే వారు కూడా ఎలియాజరును తప్పకుండా ఆదర్శంగాతీసుకోవాలి. మనమంతా మన యజమాని కుమారుడైన యేసయ్యకు భార్యగా వధువు సంఘముగా విశ్వాసులను తయారుచేసే టప్పుడు తప్పకుండా ప్రతీ విషయంలో దేవునికి ప్రార్ధనచేయాలి, నమ్మకముగా ఉండాలి,  విధేయత కలిగి ఉండాలి, కార్యం నిర్వహించే నేర్పు కలిగి ఉండాలి! దేవుడు చెప్పిన మాట నెరవేరేవరకు నిరీక్షణ కలిగి ఉండాలి! విశ్వాసం కలిగి ఉండాలి!

 

ఐదవది: రిబ్కా- ఈమె కోసం తర్వాత భాగంలో చూసుకుందాం!

 

ఆరవది: ఇస్సాకు ప్రార్ధనాజీవితం! దీనికోసం మనం 626౩ వచనాలలో కనిపిస్తుంది! ఇస్సాకు బెహేర్ లహాయిరోయి మార్గంలో దక్షిణ దేశంలో కాపురముండెను అంటున్నారు. ఇక్కడ జరిగింది ఏమిటంటే తమకున్న ఆస్తి అంత విస్తారం కాబట్టి అబ్రహాము గారు ఒక దగ్గర కొంత ఆస్తితో పశువులతో ఉన్నారు, కొంచెం దూరంగా ఇస్సాకుగారు తమకున్న ఆస్తిని పశువులను దాసులను దాసీలను తీసుకుని మరోదగ్గర నివశిస్తున్నారు అన్నమాట! అనగా ఇప్పుడు తల్లిలేదు, తండ్రినుండి దూరంగా ఉన్నారు! అయితే అతనికి తెలుసు- తనకోసం తన పెద్దదాసుడు తమ సొంత దేశం వెళ్ళాడని తెలుసు! అయినా సాయంత్రం పొలములో ధ్యానం చేసుకోవడానికి వెళ్ళారు ఇస్సాకు గారు!

 

 దీనికోసం ఆలోచిస్తే ఇస్సాకు గారు తండ్రినుండి ప్రార్ధనా జీవితాన్ని దేవుని వాగ్దానాలను ప్రమాణాలను ధ్యానించడం, తమ పితరులకోసం దేవుడు చేసిన గొప్ప కార్యాలు ధ్యానించడం అలవాటు చేసుకున్నారు అని అర్ధం అవుతుంది. ఇప్పుడు ఇస్సాకు గారి పని ఆస్తి వ్యవహారాలూ చూసుకోవడం, పొలము పనులు నిర్వహించడం, పశువులకోసం ఆలోచించడం- సాయంత్రమైతే ప్రార్ధనలోను ధ్యానములోను గడపడం చేస్తున్నారు! లోకస్తులు చేస్తున్నట్లు లోకపుటాశలు ఏమీ లేవు ఆయన దగ్గర! అల్లరిచిల్లరగా తిరగటం, మద్యపానం సేవించడం, అమ్మాయిలతో గడపడం లాంటివి ఏవీలేవు అని అర్ధమవుతుంది. ప్రార్ధనలో దేవునితో సమయాన్ని గడపడాన్ని ఇష్టపడుతూ ఉన్నారు.

గమనించండి గతంలో చెప్పడం జరిగింది- ఇస్సాకుని యేసుక్రీస్తుప్రభులవారికి సాదృశ్యముగా పోలుస్తారు- దానిలో ఇదొకటి- ప్రార్ధనాజీవితం! సాయంత్రం అయితే ఇస్సాకు గారు ప్రార్ధనలో గడుపుతున్నారు- అక్కడ యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఉదయమంతా సువార్త ప్రకటించి రాత్రంతా ప్రార్ధించడములో గడిపినట్లు క్రొత్తనిబందనలో వ్రాయబడింది!

 

అంతేకాకుండా రిబ్కా వస్తుంది అని తెలుసు గాని ఆమెను ఎదుర్కొందాము, ఆమె ఎలా ఉందో అని పగటికలలు రాత్రి కలలు కనలేదు! ఈరోజులలో అనేకులు పెళ్లి కాకుండానే అమ్మాయితో మాట్లాడటం, కలుసుకోవడం, వీడియో కాలింగ్ లు అంటూ ఏవేవో చేస్తున్నారు. ఇంకా పనికిమాలిన పని నిశ్చిత్తార్ధం అంటూ పెళ్లి కాకుండానే పెళ్లి ప్రమాణాలు చేసెయ్యడం, ఉంగరాలు తొడగడం, చేతులు కలపడం లాంటి పనికిమాలిన పనులు జరిగిపోతున్నాయి. ఇదే కాకుండా భయంకరమైన బ్రష్టమైన ఆచారం వీడియో షూట్ /ఫోటో షూట్  అట! ఇవన్నీ పాశ్చాత్య దేశాల బ్రష్ఠమైన దుష్ట ఒరవడి! అక్కడ పెళ్లి కాకుండానే పిల్లలు కనేసి- బాగుంది అనుకుంటే పది సంవత్సరాలకు 20 సంవత్సరాలకు నీతో ఉంటాను అని కాంట్రాక్టు పెళ్ళిళ్ళు వ్యవస్థ ఉంది.  వారి బ్రష్టమైన దుష్ట వ్యభిచార  ఒరవడి మన భారతదేశం లోకి వచ్చి క్రైస్తవ వ్యవహారాలలో కూడా ఇలాంటి పనికిమాలిన బ్రష్ట ఆచారాలు వచ్చేశాయి. బైబిల్ ఆచారం సంప్రదాయం- పెళ్ళికి ముందు అమ్మాయితో అబ్బాయి, అబ్బాయితో- అమ్మాయి  మాట్లాడటం చూడటం లేనేలేదు! ప్రధానమే తప్ప నిశ్చితార్ధం లేదు. ఇక వీడియో షూట్ లు ఫోటో షూట్  లు లేనేలేవు! ఇవి పనికిమాలిన దుష్ట బ్రష్ట పాశ్చాత్య దేశాల ఆచారాలు!

 

ఇస్సాకుగారు సాయంత్రాలు ప్రార్ధనలో గడపడం మొదలుపెట్టారు! అంతేకాకుండా తనకు మంచి భార్యను ఇమ్మని దేవుణ్ణి అడిగారు. అందుకే రిబ్కా లాంటి అందగత్తె, ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకొనని కన్యక, పనిలో చురుకైన అమ్మాయి, పెద్దలకు లోబడే స్త్రీ, కుటుంభగౌరవం నిలిపే ఇల్లాలు దొరికింది! నీకు కూడా అలాంటి అమ్మాయి కావాలంటే పగటి కలలు కనకు, ఫేష్భుక్ లో వెదకకు! ప్రార్ధనలో కనిపెట్టు! నీకు కూడా అలాంటి భార్య దొరుకుతుంది.

 

నా ఇంటర్మీడియట్ అయిన తర్వాత అనకాపల్లి లో మీటింగ్స్ లో దైవజనులు రాజశేఖర్ గారు ఒకమాట చెప్పారు- యవ్వనస్తులారా మీకు ఇలాంటి భార్య అలాంటి భార్య కావాలని అడగవద్దు. గుణవతియైన భార్య కావాలని అడగండి ఇప్పటినుండే. దేవుడు ఒకరోజు మీకు మంచి గుణవతి యైన భార్య ఇస్తారు . అమ్మాయిలారా! మీరు ఎర్రగా బుర్రగా మంచి ఉద్యోగం ఉన్నవాడు కావాలని ప్రార్ధన చెయ్యకండి. మోకాళ్ళ అనుభవం ఉన్నవాడు కావాలని ప్రార్ధన చెయ్యండి  అని చెబితే అప్పటినుండి ప్రార్ధన చేస్తే 14 సంవత్సరాలకు నాకు గుణవతియైన భార్య, సేవలో సహకరించే భార్య తల్లిదండ్రులను సంఘమును చూసుకునే భార్యను ప్రార్ధనా పరురాలైన భార్యను దేవుడు నాకిచ్చారు. నేను షిప్ లో దూరంగా ఉన్నా సంఘానికి సహకరిస్తూ కుటుంభానికి సహకరిస్తూ నాకు ఎంతో తోడుగా ఉంటాది. నాకు మంచి భార్యను గుణవతి యైన భార్యను దయచేసిన దేవుడు, ఇస్సాకు గారికి రిబ్కా లాంటి చక్కటి గుణవతియైన భార్యను దయచేసిన దేవుడు- నీవుకూడా ప్రార్ధన చేస్తే నీకు కూడా తప్పకుండా అలంటి భార్యను/భర్తను ఇస్తారు!

 

కాబట్టి ప్రార్ధించి పొందుకుందాం!

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-14వ భాగం*

*ఇస్సాకు భార్య రిబ్కా-1*

ఆదికాండం 24:1520

15. అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను.

16.ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొనియెక్కి రాగా

17. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను.

18. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.

19. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి

20. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తు కొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము!  24వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేస్తున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

 ఐదవది: ఈ రోజు ఇస్సాకు భార్య రిబ్కా యొక్క గుణగణాలు కోసం ధ్యానం చేసుకుందాం!

ఎలియాజరు తండ్రియైన దేవునికి ప్రార్ధన చేశారు- నా యజమాని కుమారునికోసం మీరు సిద్దపరచిన అమ్మాయి ఈభావి దగ్గరకు రావాలి- నేను నాకు కొంచెం నీళ్ళుపోయమని చెబితే నాకే కాదు నా ఒంటెలకు కూడా ఏ అమ్మాయి నీరుతోడి పోస్తుందో ఆమె నా యజమాని కుమారునికి భార్య అని ప్రార్ధన చేసి ఇంకా ఆమెన్ అనకముందే రిబ్కా కడవ అనగా కుండ తీసుకుని నూతిలోనుండి నీరు నింపుకున్నది. పూర్వకాలంలో మట్టి కుండలే ఉండేవి. ఈ రోజులలో స్టీల్ బిందెలు, ప్లాస్టిక్ బిందెలు వచ్చాయి. ఇంకా ఆ రోజులలో నేలనుయ్యిలు ఉండేవి, నూతిలోనికి వెళ్ళడానికి మెట్లు ఉండేవి. కడవలు డైరెక్టుగా ముంచుకుని భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోయేవారు! మన ఉత్తర భారతదేశంలో ఇంకా ఇలాంటి నూతులు ఉన్నాయి. ఇంకా మన ఆంద్రప్రదేశ్ లో పొలాల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఎప్పుడైతే ఆమె కుండలో నీరు తీసుకుని వెళ్తుందో ఎలియాజరు ఆమె దగ్గరకు వెళ్లి నీ కడవలో నీరు నన్ను కొంచెము త్రాగనీయమని అడిగాడు! ఇక్కడ ఒకసారి ఆగుదాం!

 

17వ వచనమునకు ముందుగా 16వ వచనంలో ఆమె కోసం కొన్ని లక్షణాలు వ్రాయబడ్డాయి!

 

మొదటిది: ఆ చిన్నది మిక్కిలి చక్కనిది! అనగా చూడటానికి చాలా అందంగా ఉంది!  నా ఉద్దేశం అందం అనేది కేవలం శరీరంలోనే కాకుండా హావభావాలులో కూడా వ్యక్తమవుతుంది. కొంతమంది అందంగా ఉన్నా ఎంతో పొగరుబోతుగా ఉంటారు. అయితే ఆమె చాలా చక్కనిది అని బైబిల్ సెలవిస్తుంది.

క్రీస్తుయేసు వధువుగా సిద్దమవుతున్న సంఘము కూడా ఎంతో అందముగా కట్టబడుతూ ముస్తాబవుతుంది అని బైబిల్ సెలవిస్తుంది.

ఇంకా మచ్చ ముడత లేనిదానిగా దేవుడు చేశారు అంటున్నారు.

ఎఫెసీ 5:2527

25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,

26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

27. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

 

ప్రకటన 21:2, 10

2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.

10. ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.

 

రెండవది: ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు! ఇది బైబిల్ రిబ్కా కోసం ఇస్తున్న సర్టిఫికేట్!!! ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు! ఇలాంటి సర్టిఫికేట్ బైబిల్ లో యేసుక్రీస్తుప్రభులవారిని కన్న మరియమ్మగారికి కూడా ఉంది! అయితే నేటిదినాలలో చూసుకుంటే పెళ్ళికి ముందు అనగా పెళ్లిరోజు వరకు కన్యకగా ఉండే అమ్మాయిలూ చాలా కరువుగా ఉన్నారు. ఐదో తరగతి లోనే ఐ లవ్ యు చెప్పుకుని తొమ్మిదో తరగతిలో లేచిపోతున్నారు.  పెళ్లి కాకుండానే హైస్కూల్ చదువుతుండగానే అనేకమంది అమ్మాయిలూ గర్భవతులు అవుతున్నారు! ఇది తల్లిదండ్రుల తప్పుకాదు, పెంపకం తప్పుకూడా కాదని నా ఉద్దేశం! కేవలం సమాజానిది, ముఖ్యంగా సినిమాలు సీరియళ్ళ వలన నేటికాలపు పిల్లలు పాడైపోతున్నారు. సినిమాలలో ఇదే పనికిమాలిన విషయాలు చూపిస్తే అదే నిజమని అమాయక పిల్లలు అదే చేస్తున్నారు!  అయితే రిబ్కా పెళ్లివరకు కన్యక గానే ఉంది!

 

మరి నేటి రోజులలో రిబ్కా లాగ మన ఆడబిడ్డలను పెంచలేమా అంటే అది సాధ్యమే! ఎలా అంటే మొదటిది: తల్లిదండ్రులు పిల్లలకోసం ప్రతీరోజు ప్రార్ధించాలి. వారు పడుకున్న తర్వాత వారి తలల దగ్గర మొకాళ్ళూని ప్రార్ధించవలసిన అవసరం ఉంది!

 

రెండవది: ముఖ్యమైనది: వారిని క్రమం తప్పకుండా దేవుని మందిరానికి నడిపించాలి, ఆదివారం నాడు స్పెషల్ క్లాసులు ఉన్నాయి, ప్రైవేట్ క్లాస్ లు ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఉన్నాయి అంటూ వాటికి పంపనే కూడదు! మందిరంలో ఆరాధనలో ఉండగా వారు వాక్యము ద్వారా ప్రసంగాల ద్వారా దేవుని వాక్యమును సత్యమును నేర్చుకుంటే అది చెడిపోకుండా ఆ వాక్యము వారిని హెచ్చరించి కాపాడుతుంది.

 

 మూడవది: ప్రతీరోజు కుటుంభ ప్రార్ధనలో వారిని పాలుపొందమని చెప్పి వాక్యమును చదివించాలి. హోమ వర్క్ అవ్వలేదు అని నీవు హోమ వర్క్ చేసుకో మేము ప్రార్ధన చేసుకుంటాము అని వదలకూడదు! వారిని కూడా ప్రార్ధనలో భాగస్వాములను చేసి వారితో ప్రార్ధన చేయించాలి! అప్పుడు వారు చెడిపోరు. గమనించండి మన పిల్లలు మంచివారే గాని లోకము మంచిది కాదు! అందుకే మన పిల్లలకు భక్తిమార్గము సత్యమార్గము నేర్పిస్తే వాక్యము వారికి నేర్పిస్తే దైవభయము వలన వారు ఇలాంటి వాటినుండి తప్పించుకోగలారు!

 

ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను.  మా నాన్నగారు ఎప్పుడూ రాత్రుళ్ళు ఇంట్లో ఉండి చదువుకోనిచ్చేవారు కాదు! రేపు ఉదయం పరీక్షలున్నా చివరికి ఫైనల్ పరీక్షలు ఉన్నా నన్ను నా అన్నయ్యలను నా అక్కలను మా ఐదుగురిని తనతోపాటుగా గృహకూటాలకు తీసుకుని పోయేవారు.  నేనెప్పుడు ఇంట్లో ఉండి రాత్రుళ్ళు చదువుకోలేదు! అయినా నాకు అన్నింటిలో క్లాస్  ఫస్ట్, స్కూల్ ఫస్ట్ వచ్చేది! నేను దేవుని పనిలో అలా సాగటం వలన దేవుడు నాకు గ్రహించే శక్తిని ఇచ్చారు. స్కూల్ లో పాటం చెబుతున్నప్పుడే అది నా మైండ్ లో రికార్డ్ అయిపోయేది. ఇంకా దానితోపాటుగా జ్ఞాపక శక్తి కూడా ఇచ్చారు. అదే పరీక్షలలో రాసే వాడిని.  మా అయిదుగురు పిల్లలము ఎప్పుడూ ఆదివారం నాడు ప్రైవేట్ క్లాస్ లకు, ప్రాక్టికల్స్ కి వెళ్ళలేదు!  మా నాన్నగారు పంపలేదు! మా తల్లిదండ్రులు  మాకు భక్తి ప్రార్ధన విశ్వాసాలు నేర్పించారు. అందుకే అందరమూ దేవుని సేవలో పరిచర్యలో ఉంటున్నాము!

ఈ విధముగా మీ పిల్లలు దేవుని సన్నిధిలో కుటుంభ ప్రార్ధనలో గడిపితే లోకములో పిల్లలు చెడిపోయినట్లు వారు చెడిపోరు అని చెబుతున్నాను!

 

ఇక సంఘముతో పోల్చుకుంటే: సంఘము కూడా వరుడైన యేసుక్రీస్తుప్రభులవారినే వరించాలి గాని లోకముతో పొత్తు పెట్టుకోకూడదు! లోకాశలు కలిగి లోకాశలు నెరవేర్చకూడదు! అందుకే పౌలుగారు అంటున్నారు: మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని మీకు తెలియదా అంటూ క్రీస్తుకు బెలియాలుకి పాలేక్కడిది అంటున్నారు...2 Corinthians(రెండవ కొరింథీయులకు) 6

14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?

15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?

16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.

17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. 

సంఘము అనగా సార్వత్రిక సంఘములో అంగమైన ప్రతీ రక్షించబడిన విశ్వాసి కూడా ఎట్టిపరిస్తితులలో కూడా లోక ఆశలు లోకాచారాలు చెయ్యకూడదు! లోకము ప్రవర్తించినట్లు లోకస్తులు మాట్లాడినట్లు లోకస్తులు ఆశించినట్లు చేయకూడదు! మూర్కులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందవలసిన అవసరం ఉంది! లోకము పాపము పాపభోగములు మనకు అంటకుండా మన ఘటములను కాపాడుకుని ఒక్కడే పురుషునికి ప్రధానం చేయబడ్డాము కాబట్టి ఆయన వచ్చేవరకు కన్యకలాగ బ్రతకాలి! 2కోరింథీయులకు 11: 2

దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగియున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని గాని,

మన ఘటమను మన శీలము అనగా మన సాక్ష్యమును కాపాడుకోవాలి!

యాకోబు 1: 27

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

మూడు: చురుకైనది: ఇక మిగతా వచనాలలో మనకు అర్ధమవుతుంది ఏమిటంటే ఆమె చురుకైనది! ఆమె కడవ ఎత్తుకుని వచ్చేటప్పుడు అమ్మా నాకు కొంచెం నీరు ఇమ్మని అడిగితే ఆమె వెంటనే తాగండి అంటూ ఎలియాజరుకు నీరు త్రాగనిచ్చింది, ఇంకా నీ ఒంటెలకు కూడా నీరుపోస్తాను అని పది ఒంటెలకు కూడా నీరు తోడి పోసింది!

 

ఒక్కసారి ఆగుదాం! నేను చదువుకున్నది ఏమిటంటే ఒక ఒంటె నీరు త్రాగితే సుమారుగా 20 కుండలు నీరు త్రాగుతుంది, అనగా సుమారుగా 400  లీటర్ల నీరు త్రాగుతుంది. అందుకే ఎడారులలో సంచరించే వారు ఒకవేళ నీరు దొరక్కపోతే వారు చివరి క్షణంలో ప్రాణం పోకుండా తాము ప్రయాణం చేస్తున్న ఒంటెను చంపి- కడుపు చీల్చి ఆమె కడుపులో ఉన్న నీటిని వారి నీతి తిత్తులలో నింపుకునే వారు అని చదివాను! అంతటి నీటిని ఒంటె స్టోర్ చేసుకోగలదట! మరి ఇప్పుడు మన రిబ్కా 10 ఒంటెలకు నీరు తోడి పోసింది. అనగా 4000 లీటర్లు. నాలుగు టన్నులు నీరు ఒక్క రిబ్కా చకచకా తోడి పెట్టింది. అనగా ఎన్నిసార్లు భావిలోకి వెళ్లి కడవ ముంచుకుని వచ్చి నీరు పోసింది? సుమారుగా 200 సార్లు. అనగా చాలా చురుకైనది అని అర్ధమవుతుంది.

 

అలాగే సంఘములో ప్రతీ సభ్యుడు సభ్యురాలు కూడా దేవుని పనిలో ఎంతో చురుకుగా ఉండాలి! సువార్త ప్రకటించడంలో గాని, మందిర పరిచర్యలో గాని, పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడంలో గాని, సాక్ష్యము చెప్పడం లో గాని ముందుగా చురుకుగా ఉండాలి. త్వరగా వ్రాయువాని కలము వలే సంఘములో ప్రతీ సభ్యుడు ఉండాలి! దేవునికి ఇవ్వడంలో ముందుకు ఉండాలి! దేవుని పని విషయంలో అలయక సొలయక పనిచేస్తుండాలి!

 

నాల్గవది: ఇంట్లో పనులు చేసే గుణము ఉంది! ఇన్నిసార్లు నీరు తోడి పోసింది అంటే ఇంకా ఇంటికి నీరు తీసుకుని పోవడానికి నూతి దగ్గరకు వచ్చింది అంటే చాలా చురుకుగా ఇంటిపనులు వంటపనులు చేసేది అని అర్ధమవుతుంది. అందుకే కదా యాకోబు ఇస్సాకుగారిని మోసగించేటప్పుడు ఎంతో తొందరగా మాంసం రుచికరంగా తయారుచేసి యాకోబుతో పంపించింది.  అనగా ఎంతో చురుకైనది!

 

ఈ రోజులలో ఆడపిల్లలకు తల్లి పనులు నేర్పించడం లేదు! ఇది ముమ్మాటికి తల్లి తప్పే! నా కూతురు చదువుకుంటుంది అని కిచెన్ లోకి రానివ్వడం లేదు! మమ్మీ టీ, అమ్మీ ఇది అంటే వెంటనే చేసి పెడుతున్నారు గాని ఇంట్లో ముందు ఈ బట్టలు ఉతుకు, ఇల్లు తుడువు, ఈ వంటలు నేర్చుకో అని చెప్పడం లేదు! ఆ తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళాక వంటలు రాక, పనులు రాక అత్తమామలతో సూటిపోటు మాటలు పడవలసి వస్తుంది. వెంటనే ఈ తల్లి కలుగజేసుకుని ఆ పెళ్లిని విడాకులు వరకు ఇదే తల్లి తీసుకుని వెళ్తుంది వారి కాపురంలో కలుగజేసుకుని! ఇదే ముమ్మాటికి తల్లి తప్పే! ఆడ పిల్ల అది ఏ దేశమైనా ఇంట్లో పని వంటపని పిల్లలను కనడం వారిని పెద్దచేసే పని అమ్మాయిలదే! స్త్రీలదే!ఇదేబైబిల్ చెబుతుంది! నీవు ఎంత చదువుకున్నా కలెక్టర్ వి అయినా ఇంటిపని వంటపని పిల్లల పని తప్పకుండా చెయ్యాలి! అలా కాకుండా పిల్లలకు పనిపాటులు నేర్పించక పోతే తర్వాత బాధపడతారు! అమ్మాయిలు ఇంటిపని వంటపని చేస్తే, అబ్బాయిలు తమ తండ్రికి సహకరిస్తూ మార్కెట్ కి వెళ్తూ అన్ని పనులు నేర్చుకోవాలి!   మన రిబ్కా అన్ని పనులు నేర్చుకుంది అని అర్ధమవుతుంది!

 

సంఘము విషయము కొస్తే సంఘము కూడా మీదన చెప్పినట్లు దేవుని పనిలో ఎంతో ఉత్సాహముగా పని చెయ్యాలి! కష్టాలలో సుఖాలలో అన్నింటిలో సంఘమునకు సహకరిస్తూ సంఘకాపరికి సహకరిస్తూ ముందుకు పోవాలి! పరిచర్యలో సహకరించాలి!

దైవాశీస్సులు!

(సశేషం)

*వాగ్ధాన పుత్రుడు-15వ భాగం*

*ఇస్సాకు భార్య రిబ్కా-2*

ఆదికాండం 24:1520

15. అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను.

16.ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొనియెక్కి రాగా

17. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను.

18. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.

19. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి

20. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తు కొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము!  24వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేస్తున్నాము!  రిబ్కా జీవితములో గల తొమ్మిది ప్రాముఖ్యమైన గుణగణాలు ధ్యానం చేస్తున్నాం!

 

    (గతభాగం తరువాయి)

 

ఐదవది: మర్యాదగలది! ఆతిధులను/ పరదేశులను  గౌరవించేది! మరలా ఇదే వచనాలు చూసుకుంటే అమ్మా నీ కడవలో నీరు దయచేసి నన్ను త్రాగనిస్తావా అని ఎలియాజరు అడిగితే అయ్యా త్రాగండి అని అతనికి నీరుపోసి నీ ఒంటెలకు కూడా నీరు పోస్తాను అని వాటికి నీరు పోసి, మీ ఇంట్లో ఉండటానికి మాకు స్థలము ఉందా అంటే వివరాలు చెప్పింది! ఎవడవు రా నీవ అదేపోనీలో అని నీరు పోస్తే ఒంటెలకు కూడా నీరు పోయ్యాలా? మా ఇంట్లో రాత్రి ఉంటావా అని చీదరించుకోలేదు! ఎంతో ప్రేమగా రమ్మని చెబుతుంది. అక్కడ ఎలియాజరుకు ఎంతో గౌరవము ఇచ్చింది! ఎలియాజరు పరాయి దేశస్తుడు అయినా ప్రేమగా మాట్లాడుతుంది. ఇదీ నేటి పిల్లలకు సంఘమునకు ఉండవలసిన లక్షణం!

 

నేటి పిల్లలకు ఇంటికి వచ్చిన అతిధులను, బంధువులను గౌరవించడం తల్లిదండ్రులు నేర్పించడం లేదు! అమ్మా తాతయ్య వచ్చారు అంటే తాతయ్య- ఓహో, రానీయ్ నాకేంటి, వస్తాడు పోతాడు, అని పట్టించుకోకుండా, మాట్లాడకుండా లోపలి పోయి సెల్ ఫోన్ లో ఆడుకుంటున్నారు. ఇది తల్లిదండ్రుల తప్పే! పూర్వకాలంలో ఉమ్మడి కుటుంభాలు ఉండేవి కాబట్టి తాతలు అమ్మమ్మలు మావయ్యలు వారికీ నేర్పిస్తే బంధువులంటే ఎంతో ప్రేమతో మాట్లాడేవారు! ఈరోజులలో అవి లేవు! పెద్ద కుటుంభమా నేను నా కూతురిని ఇవ్వను! వారి ఇంటిల్లిపాదికి చాకిరి చెయ్యాలి నా కూతురు అంటున్నారు! అందుకే ఒకరోజు నీ తండ్రి ఇంటికి వచ్చినా నీ అన్నదమ్ములు ఇంటికి వచ్చినా పట్టించుకోవడం లేదు పిల్లలు! అయ్యా అమ్మా పిల్లలకు మంచిచెడ్డలు నేర్పించాలి. బంధుత్వాలు తెలియాలి! ఇంటికి వచ్చిన అతిధులతో ఎలా పలకరించాలి అనేది తల్లిదండ్రుల నేర్పించాలి! రిబ్కా కు ఆమె తల్లిదండ్రులు అన్నయ్య నేర్పించారు! అదే ఆమెను అబ్రహాము గారి కోడలును చేసింది!

 

సంఘము విషయం కొస్తే- ప్రతీ విశ్వాసి కూడా ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడాలి! మీ సంఘస్తులతోనే కాదు, ఇతర సంఘస్తులతో కూడా ఎంతో మర్యాదగా మాట్లాడాలి! ఉప్పు వేసినట్లు ఆశీర్వచనము మాట్లాడుతూ అందరికీ ఆశీర్వాద కరంగా ఉండాలి! అందరితోను సఖ్యమైతే సమస్తజనులతో సమాధానంగా ఉండమని బైబిల్ సెలవిస్తుంది. సంఘములో జగడాలు పెట్టుకోకూడదు! కులసంఘాలు పెట్టుకోగూడదు! అందరితోనూ సమాధానంగా ఉండాలి! అంతే సంఘమునకు వెలుపటి వారినుండి కూడా మంచిపేరు ఉండాలి.

కొలస్సీయులకు 4: 5

సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి.

1తిమోతికి 3: 7

మరియు అతడు నిందపాలై అపవాది (సాతానుకు) ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను.

తీతుకు 2: 7

పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము.

 

ఆరవది: తల్లిదండ్రుల మాట వినేది: మనం ఇదే అధ్యాయం 34 నుండి 60 వచనం వరకు చూసుకుంటే ఎలియాజరు రిబ్కా ఇంటికి వెళ్ళాడు, మొత్తం సంగతంతా మొదట నుండి వివరంగా చెప్పిన తర్వాత లాబాను బెతూయేలు అన్నారు ఇది యెహోవా వలన కలిగిన కార్యము! మేము అవునని గాని కాదని గాని చెప్పలేము! రిబ్కాను తీసుకుని వెళ్ళు అంటే ఆ రాత్రి భోజనం చేసి ఉదయాన్నే నేను మా యజమాని దగ్గరకు మీ అమ్మాయిని తీసుకుని పోతాను అంటే రిబ్కాని అడిగితే సరే అని చెప్పింది. అనగా తల్లిదండ్రుల మాటకు విలువను ఇచ్చింది. ఈ రోజులలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఫలితాన్ని అనుభవిస్తున్నారు. రిబ్కా పెద్దలమాట విన్నది కాబట్టి గొప్ప ఇంటికి కోడలు అయ్యింది.

 

సంఘము కూడా మొదట దేవునికి తర్వాత మీ కాపరికి లోబడి ఉండాలి. సంఘ పాష్టరేట్ కమిటీకి లోబడి ఉండాలి గాని ఇక్కడికి అక్కడికి పరుగెత్తకూడదు! రిబ్కా లోబడినట్లు సంఘానికి ప్రతీ విశ్వాసి లోబడునప్పుడే పరిశుద్ధాత్ముడు పనిచెయ్యగలడు సంఘములో!

 

ఏడవది: సిద్ధపాటు స్వభావము!  ఇక రిబ్కాను తీసుకుని వెళ్ళు అంటే ఆ రాత్రి భోజనం చేసి ఉదయాన్నే నేను మా యజమాని దగ్గరకు మీ అమ్మాయిని తీసుకుని పోతాను అంటే వారు అన్నారు పదిరోజులు ఆగి వెళ్ళమన్నారు అయితే ఎలియాజరు: కాదు వెంటనే వెళ్లిపోవాలి దయచేసి నన్ను మా యజమాని దగ్గరకు మీఅమ్మాయితో పంపించండి అని చెబితే సరే, రిబ్కాను అడుగుదాం, వెంటనే వెళ్ళిపోతుందో లేదో అంటే 57-58 వచనాలలో నీవు ఈ మనుష్యునితో వెళ్లి ఇస్సాకుని వివాహం చేసుకుంటావా అంటే నేను వెళ్తాను అని చెప్పి వెంటనే సిద్దమైపోయి ఎలియాజరు వెనుక వెళ్ళిపోయింది! అనగా సిద్దపాటు స్వభావం ఆమెకుంది!

 

సంఘము కూడా నేడో రేపో ప్రభువు ఆకాశ మేఘాలలో కడబూర స్వరముతో వేవేల దూతలతో రాబోవుచున్నాడు కాబట్టి వధువు సంఘముగా సిద్దమౌతున్న ప్రతీ విశ్వాసి ఆయన రాకడకు సిద్దపాటు కలిగి ఉండాలి! సిద్దపాటు అనగా బుద్ధిలేని కన్యకల వలే కాకుండా బుద్ధిగల కన్యకల వలే సిద్దేలలో నూనెతో సిద్దంగా ఉండాలి! బుద్ధిలేని వారు తమ సిద్దెలలో నూనెను తమతోపాటుగా తీసుకుని వెళ్ళలేదు! వారు ఉండిపోయారు! సిద్దపడిన వారిని పెండ్లి కుమారుడు తీసుకుని పోయాడు! ఆ తర్వాత అడ్రస్ కనుక్కుని బుద్ధిలేని కన్యకలు వచ్చి తలుపు తట్టినా అక్రమము చేయువారలారా నా యొద్దనుండి తొలిగిపొండి అన్నారు! కాబట్టి సంపూర్ణ సిద్దపాటు కలిగి అనగా సిద్దెలలో నూనె అనగా పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి, ఆత్మానుసారమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, సాక్ష్య జీవితాన్ని కాపాడుకుని పవిత్రమైన జీవితం జీవిస్తూ లోకంలో కళంకం ముడత లేకుండా మన ఘటములను కాపాడుకుంటూ సిద్ధముగా ఉండవలసిన అవసరం ఉంది!

 

ఎనిమిది: ప్రార్ధనా జీవితం గలది: ఇది మనకు ఈ అధ్యాయంలో కనబడదు గాని 25:2123 వచనాలలో మనకు కనిపిస్తుంది....

21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య యైన రిబ్కా గర్భవతి ఆయెను.

22. ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను

23. రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

 

ఇక్కడ రిబ్కా తన అత్తగారిలా గొడ్రాలు అయిపోతే ఇస్సాకు ఆమెకోసం ప్రార్ధన చేశారు! ఎప్పుడు చేశారు? వివాహం జరిగిన 20 సంవత్సరాల వరకు ఎదురుచూసి ఒకే ఒకసారి ప్రార్ధన చేశారు! అబ్రాహాముగారిలా మాటిమాటికి అడగలేదు కుమారుని కోసం! ఒకే ప్రార్ధన వెంటనే జవాబు అదే సంవత్సరంలో రిబ్కా గర్భవతి అయ్యింది! ఇది మొదటగా ఇస్సాకు గారి ప్రార్ధనా జీవితమునకు నిదర్శనం! విశ్వాసము కలిగి ఒక్కసారి ప్రార్ధిస్తే దేవుడు వెంటనే జవాబిచ్చారు!

 

 ఇక రిబ్కా గర్భములో ఇద్దరు కవల పిల్లలు ఉన్నట్లు వారు తల్లి గర్భములోనే తన్నుకుంటున్నట్లు మనం చూడగలం! ఇక ఆ నొప్పులకు ఆమె తాళలేక ఈ సంగతేమిటో నేను దేవునితోనే తేల్చుకుంటాను అని దేవుని సన్నిధికి వెళ్లి దేవుణ్ణి అడుగుతుంది- ఇంతకూ నా గర్భములో ఏమి జరుగుతుందో నాకు చెప్పండి దేవుడా అని!

ఇక్కడ మనకు రెండు విషయాలు అర్దమవుతున్నాయి. రిబ్కా ప్రార్ధనా జీవితం గలది అని ఒకటి, రెండు దేవునితో మాట్లాడే జీవితం అనుభవం గలది అని స్పష్టముగా అర్ధమవుతుంది.

 

ఒక్కసారి ఆగి ఆలోచిస్తే రిబ్కా తల్లిదండ్రులు మరియు అన్న లాబాను యెహోవా దేవుని భక్తులా? కానేకాదు! ఇది మనకు ముందు అధ్యాయాలలో చూస్తే రిబ్కా అన్న కుమార్తె రాహేలు అనే తన చిన్నకోడలు గృహదేవతను దొంగిలించినట్లు చూడగలం! అనగా వీరు పక్కా విగ్రహారాదికులు అని అర్ధమయ్యింది! మరి విగ్రహారాధనకు చెందిన రిబ్కా ఎప్పుడు ఇంత ప్రార్ధనాపరురాలు అయ్యింది? ఎప్పుడు దేవునితో మాట్లాడే అనుభవం, దేవుణ్ణి అడిగి జవాబులు పొందుకునే అనుభవం పొందుకుంది?

 ఇస్సాకు గారిని వివాహం చేసుకున్న తర్వాతనే!  ఇస్సాకు గారి ప్రార్ధనా జీవితం, దేవునితో మాట్లాడే అనుభవం చూసి వెంటనే ఈ దేవుడు మాట్లాడే దేవుడు, విగ్రహాల లాగ మౌనంగా ఉండే దేవుడు కాదు అని గ్రహించి, వ్యర్ధమైన విగ్రహాలు వదిలి నిజదేవున్ని ఆరాధించడం మొదలుపెట్టింది. భర్తయైన ఇస్సాకు గారు దేవునికి ప్రార్ధించడం నేర్పించారు. తన తండ్రి ఇస్సాకుకి  ప్రార్ధన నేర్పిస్తే తానూ తన భార్యకు నేర్పించారు. ఇంకా తన తండ్రి తనకు నోవాహు గారినుండి నేర్చుకున్న దేవుని సత్యాలను వివరిస్తే ఇస్సాకుగారు తన భార్య రిబ్కాకు వివరించారు! మధ్యలో తాను దేవుణ్ణి చూసిన విధానం, తన బలియాగం జరిగినప్పుడు జరిగిన సంఘటన, దేవుని స్వరమును వినడం, దేవుడు తన తండ్రితోను తనతోనూ చేసిన వాగ్దానాలు అన్నీ విడమరచి చెప్పినప్పుడు నమ్మి విశ్వసించి ప్రార్ధించడం, దేవునితో మాట్లాడటం నేర్చుకుంది!ఇది ప్రతీ పురుషుడు ఇస్సాకు గారినుండి నేర్చుకోవాలి! నీ భార్యకు పనికిమాలిన విషయాలు చెప్పడం మానేసి దేవునికోసం చెబితే ఆమె మారి, నీ పిల్లలకు భక్తి ప్రార్ధన విశ్వాసం దేవునితో మాట్లాడే అనుభవం నేర్పిస్తుంది. ఇస్సాకు గారు అదే చేశారు, రిబ్కా ఇదే ప్రార్ధనా జీవితం దేవునితో మాట్లాడే అనుభవం యాకోబు గారికి నేర్పించింది.

 

మరి ప్రియమైన తల్లి నీ బిడ్డలకు ప్రార్ధనా జీవితం నేర్పిస్తున్నావా? ప్రియమైన భర్తా! నీ భార్యకు ప్రార్దించడం నేర్పిస్తున్నావా? అసలు నీకు ప్రార్ధనా జీవితం ఉందా? దేవునితో మాట్లాడే అనుభవం నీకుందా? ఇది సంఘము ఇస్సాకు నుండి, రిబ్కా నుండి నేర్చుకోవాలి! సంఘములో ప్రతీ విశ్వాసి ప్రార్ధనా జీవితం కలిగి ఉండటమే కాకుండా దేవునితో మాట్లాడే అనుభవం కూడా పొందుకోవాలి!

 

చివరిది: దేవునితో మాట్లాడి సమాధానం పొందుకునే అనుభవం! రిబ్కా దేవుని సన్నిధిలో మోకరించింది అయ్యా ఏమి జరుగుతుంది నాకు చెప్పండి, చెప్పేవరకు నేను కదలను అని మొండి పట్టు పట్టింది- వెంటనే దేవుడు చెబుతున్నారు 23 వ వచనంలో రిబ్కా నీ గర్భములో రెండు జనాలు ఉన్నారు. రెండు జనపదములు నీ గర్భమునుండి ప్రత్యేకముగా వస్తున్నాయి. ఒక జనము కంటే మరో జనము బలిష్టమై ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడై ఉంటాడు అని దేవుడు స్పష్టముగా సినిమారీలు చూపించినట్లు వివరించి చెప్పారు! రిబ్కా దేవుణ్ణి అడిగింది, జవాబు పొందుకుంది! ఎక్కువ సార్లు ప్రార్ధించలేదు ఈ విషయంలో! మోకరించింది! దేవుడా జవాబివ్వండి అని అడిగింది- వెంటనే దేవుడు జవాబిచ్చారు!

 

అలాగే సంఘము కూడా ఇలాంటి ప్రార్ధనా జీవితం దేవునితో మాట్లాడే అనుభవం పొందుకోవాలి! అలా జరగాలి అంటే నీకు ప్రార్ధనా జీవితం కలిగి  పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి, ఆత్మానుసారమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, సాక్ష్య జీవితాన్ని కాపాడుకుని పవిత్రమైన జీవితం జీవిస్తూ లోకంలో కళంకం ముడత లేకుండా మన ఘటములను కాపాడుకుంటూ సిద్ధముగా ఉండవలసిన అవసరం ఉంది!

 

మరి నీవు ఇస్సాకు వలే రిబ్కా వలే జీవించడానికి సిద్దమవుతావా?

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-16వ భాగం*

ఆదికాండం 25:11

అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బేయేర్లహాయిరోయి దగ్గర కాపురముండెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

ఇక 25వ అధ్యాయంలో అబ్రాహము గారు చనిపోతారు అనగా శారమ్మ గారు చనిపోయిన 38 సంవత్సరాల తర్వాత అబ్రాహము గారు చనిపోయారు. అప్పుడు ఇస్సాకు మరియు ఇష్మాయేలు ఇద్దరు కలిసి అబ్రాహము గారిని పాతిపెట్టారు.

 

11వ వచనంలో అంటున్నారు: అబ్రహాము చనిపోయిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకుని ఆశీర్వదించెను.  అబ్రహాము గారి మరణం తర్వాత దేవుడు ఇస్సాకు గారిని క్రమక్రమంగా ఆశీర్వదించడం మొదలుపెట్టారు!

 

ఇక ఇంకా క్రిందికి ఈ అధ్యాయంలో వెళ్తే గతభాగంలో చెప్పుకున్న విధంగా రిబ్కా గొడ్రాలు కావడం, ఇస్సాకు గారు కేవలం ఒకే ఒకసారి ప్రార్ధన చెయ్యడం , వెంటనే దేవుడు ఆమె గర్భము తెరవడం చూడగలం! రిబ్కా ప్రార్ధనా జీవితం, దేవునితో మాట్లాడే అనుభవం చూడగలం! ఇస్సాకు రిబ్కాలను ప్రేమించి దేవుడు యాశావు యాకోబు అనే ఇద్దరు కవల పిల్లలను ఇచ్చారు.

 

27వ వచనంలో ఏశావు ఎదిగి వేటాడటంలో నేర్పరితనం సాధించి అరణ్యంలో జీవిస్తూ ఉంటే యాకోబు సాధువై గుడారంలో నివసిస్తూ తన తల్లితో ఉంటున్నాడు.  28. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసం తింటూ ఉండేవారు కాబట్టి ఇస్సాకు ఏశావు ని ప్రేమించెను అని వ్రాయబడింది. అనగా ఈ కవల పిల్లలలో పెద్దవాడిని ఇస్సాకు/ తండ్రి ప్రేమించగా చిన్నవాడు తల్లికి సహాయం చేస్తూ తల్లికి ఫేవరేట్ గా మారిపోయాడు!  గమనించాలి తల్లిదండ్రులు పిల్లలు అందరినీ ఒకేలా ప్రేమించాలి లేకపోతే వారిమధ్యలో అపోహలు అపార్ధాలు వచ్చి కుటుంభ కలహాలకు తావు తీస్తాయి. ఈ తల్లిదండ్రులు చెరొకరిని ప్రేమించడం వలన తర్వాత వచనాలలో చూసుకుంటే చిన్నవాడు పెద్దవాడిని కేవలం చిక్కుడు కాయల కూరకోసం, చిక్కుడు కాయల కూరతో జ్యేష్టత్వాన్ని కొని అన్నను మోసగించాడు. అన్న అంటే మహా అయితే ఒక నిమిషం గాని పది నిమిషాల పెద్ద అంతే కదా! తల్లిదండ్రులారా దయచేసి ఈ విషయాన్ని గమనించమని మనవిచేస్తున్నాను!

 

ఇక 26వ అధ్యాయంలో అబ్రాహము గారి సమయంలో వచ్చిన కరువు కాక మరో కరువు వచ్చినట్లు మనం చూడగలం! అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయి లోనే నివాసం చేస్తున్నాడు, ఎప్పుడైతే కరవు వచ్చిందో తన తండ్రి స్నేహితుడు అయిన ఫిలిస్తీయుల రాజు దగ్గరకు అనగా అబీమేలేకు దగ్గరకు, గెరారు కి వెళ్ళినట్లు చూడగలం! గమనించాలి- అబీమెలెకు అన్నది ఆ రాజు పేరు కాదు! పూర్వకాలంలో ఐగుప్తు దేశపు రాజుకి ఫరో అనే పేరు/బిరుదు ఎలా ఉందో, ఈ ఫిలిస్తీయులను పాలించే రాజుకి ఆ రోజులలో అబీమేలేకు అనే పేరుండేది.

 

అప్పుడు దేవుడు ప్రత్యక్షమై మొట్టమొదటగా ఇస్సాకుగారితో మాట్లాడుతున్నారు...26:16

1. అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.

2. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.

3. ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను;

4. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.

5. ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞ లను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.

6. ఇస్సాకు గెరారులో నివసించెను.

 

ఇస్సాకు- నీవు ఐగుప్తు వెళ్ళవద్దు. ఈదేశములోనే ఉండు అంటున్నారు. గమనించాలి- బెయేర్ లహాయిరోయి అనగా  ఫిలిస్తీయుల దేశానికి దూరమేమి కాదు. ఇది పాలస్తీనా ఇశ్రాయేలు బోర్డర్ లో ఉంది. అనగా కేవలం ఒక 20 కిమీ దూరంలో ఉంది గెరారు. మరి కరవు వస్తే దేవుడు ఎక్కడకు వెళ్ళకు, ఇక్కడే ఉండు అంటున్నారు ఏమిటి? ఇంకా నీ తండ్రి వెళ్ళినట్లు నీవు ఐగుప్తు దేశం వెళ్ళవద్దు! అంటున్నారు. అబ్రాహము గారు దేవుణ్ణి అడగకుండా కరవు వస్తే ఐగుప్తు దేశం వెళ్లి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నారు ఇస్సాకు నీవు నీ తండ్రి చేసినట్లు చేయవద్దు. ఐగుప్తుకి వెళ్ళవద్దు! ఆ విగ్రహాల దేశానికి వెళ్లొద్దు అంటున్నారు. గమనించాలి ముందటి అధ్యాయాలు చదువుకుంటే అబీమెలేకు దైవభక్తి గలవాడని , ఆ జనము కూడా చాలా నీతిగల జనము అని చూడవచ్చు 20:16 లో. అతడు దేవునితో మాట్లాడే అనుభవం కూడాఉంది. అందుకే మొదటగా గెరారు అనగా ఫిలిస్తీయుల దేశం వచ్చారు ఇస్సాకు గారు! అంతేకాకుండా  అబ్రహాము గారు ఇంతవరకు ఈ జనాంగానికి భక్తి నేర్పించారు. మరలా వీరు ఐగుప్తు వెళ్తే విగ్రహారాదికులుగా మారిపోతారని ఏమో వెళ్ళవద్దు అని ఉంటారు. ఇంకా  నేను ఈ దేశాన్నే మీకిస్తాను కాబట్టి ఈ దేశమును వదిలి వెల్లవద్దు అంటున్నారు. దేవుడు వాగ్దానం చేసింది కనాను దేశము. గాని దేవుడు అంటున్నారు; నీకు ఈ దేశమును ఇస్తాను. అనగా ఇప్పుడు కనాను దేశము మరియు ఫిలిస్తీయుల దేశం కూడా వస్తుంది అన్నమాట!

 

ఇంకా అంటున్నారు- ఈ దేశములన్నియు నీ సంతానము నకు ఇస్తాను అని నీ తండ్రితో వాగ్దానం చేశాను నేను, ఆ వాగ్ధానమును నేను నెరవేరుస్తాను. నీవు భయపడకు అంటున్నారు. అబ్రాహము గారితో కూడా దేవుడు అన్నారు అబ్రహామా భయపడకు అన్నారు! ఇప్పుడు ఇస్సాకుతో కూడా భయపడకు అంటున్నారు.

ఇంకా అంటున్నారు: నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలే చేస్తాను అంటున్నారు. ఇంకా నీ సంతానము వలన సమస్త జనులు ఆశీర్వదించబడుదురు అంటున్నారు.  ఈ వాగ్దానాలు అన్నీ దేవుడు అబ్రాహము గారితో చెప్పారు. మరలా అదే వాగ్దానాలు ఇస్సాకుతో కూడా చెబుతున్నారు!

 

ఇక ఐదో వచనంలో అంటున్నారు: ఎందుకంటే నీ తండ్రియైన అబ్రాహము నా మాట విని నేను విధించిన నా కట్టడలు నా ఆజ్ఞలు నా నియమాలు గైకొన్నాడు, పాటించెను. గైకొనుట అనే మాట వాడబడింది. అనగా దేవుడు చెప్పిన మాటలు వినడమే కాకుండా వాటిని పాటించి నెరవేర్చారు అన్నమాట! అబ్రాహమా ఈ దేశం వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే వెళ్ళిపోయారు. నీవు నీ సంతతి నీ పనివారు సున్నతి పొందాలి అంటే సున్నతి పొందారు. నీ కొడుకుని బలి అర్పించేయ్ నాకు అంటే వెళ్ళిపోయారు. మరి ఇలాంటి సమర్పణ కలిగిన అబ్రహాముని దేవుడు దీవించారు. నా కట్టడలు, నా ఆజ్ఞలు నా నియమాలు నీ తండ్రి పాటించాడు కాబట్టి నేను నిన్ను కూడా నీ తండ్రిని బట్టి దీవిస్తాను అంటున్నారు!

 

అబ్రాహము గారు దేవుని మాటలు కట్టడలు ఆజ్ఞలు పాటించారు- ఆశీర్వదించబడ్డారు! మరి నీవు దేవుని పద్దతులు దేవుని కట్టడలు దేవుని ఆజ్ఞలు దేవుని నియమాలు పాటిస్తున్నావా? ఆదివారం పరిశుద్ధ దినంగా పాటిస్తూ ఆయన మందిరానికి వస్తున్నావా? లేక అదే రోజు సెలవు రోజు అని ఫంక్షన్ లకు పార్టీలకు బందువుల ఇంటికి వెళ్తున్నావా? ఇక నీకు ఆశీర్వాదం ఎందుకు వస్తుంది? నీ దశమ భాగాలు ప్రధమ ఫలాలు దేవునికి ఇవ్వమని ఉంది. మరి నీవు ఇస్తున్నావా? నీ పొరుగువారితో ప్రేమతో ఉండమని బైబిల్ ఆజ్ఞ! నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించమని! మరి నీవు ప్రేమిస్తున్నావా? శ్రమలలో సహనం కలిగి ఉండమని సెలవిస్తుంది బైబిల్! మరి సహనం ఉందా నీకు!!! లోకస్తులు చేసినట్లు వారి ఆచారాలు చెయ్యవద్దు అంటే నీకు ఇంకా ఎందుకు లోకాచారాలు??!!!

ఒకసారి ఆలోచించు! సరిచేసుకో!

 

దేవుడు ఇస్సాకుని దీవించి నీ తండ్రిచేసినట్లు నీవు ఐగుప్తు కి వెళ్ళవద్దు నేను నీకు తోడై ఉంటాను నీవు భయపడకు అంటే కరవులో కూడా ఐగుప్తుకి వెళ్ళకుండా ఉండిపోయారు ఇస్సాకుగారు. అందుకే దేవుడు ఇస్సాకుని దీవించారు ఆశీర్వదించారు!

 

మరినీకు ఆ ఆశీర్వాదాలు కావాలంటే నీవు కూడా దేవుని పద్దతులు కట్టడ్డలు ఆజ్ఞలు పాటించాలి!

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-17వ భాగం*

 

ఆదికాండం 26:1214

12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.

13. అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.

14. అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

ప్రియులారా! ఇంకా క్రిందికి చదువుకుని వెళ్తే ఇస్సాకు దేవుడు చెప్పినట్లు ఐగుప్తు వెళ్ళక గెరారు లోనే నివాసం చేశారు. అనగా రాజ దర్భార్ ప్రక్కనే గుడారం వేసుకుని జీవించే వారు ఇస్సాకు! అయితే అక్కడ మనుష్యులు ఇస్సాకు భార్యయైన రిబ్కా ను చూసి ఈమె ఎవరు అంటే ఇస్సాకు భయపడి ఈమె నా చెల్లి అని చెప్పినట్లు చూడగలం! తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు అన్నమాట! తండ్రి అలాగే అబద్దమాడాడు శారమ్మ నా చెల్లి అని. ఇక్కడ ఇస్సాకు కూడా ఇదే అబద్దమాడుతున్నారు. ఇది మానవులలో ఉండే బ్రష్ట స్వభావం!  గాని ఒకరోజు రాజైన అబీమేలేకు కిటీకీలోనుండి చూస్తుంటే ఇస్సాకుగారు రిబ్కాతో సరసాలు ఆడటం కనబడింది. తన స్నేహితుడు కుమారుడు కాబట్టి ఏమయ్యా ఇస్సాకు- నీవు ఎందుకు అబద్దమాడతున్నావు, నీవు ఆమెతో సరసాలు ఆడుతున్నావు, నీ భక్తిగలవాడవు కాబట్టి ఖచ్చితంగా ఆమె నీ భార్య అయి ఉంటుంది నిజం చెప్పు అంటే, ఈమె నా భార్యయే, ఈమె అందంగా ఉంది కాబట్టి మీ ఊరువారు నన్ను చంపి నాభార్యను ఎత్తుకు పోతారేమో అని అలాచెప్పాను అని చెప్పారు. ఒకవేళ ఆమె నీ చెళ్లి చెప్పి అని చెప్పావు కాబట్టి ఎవడైనా ఆమెతో పాపం చేస్తే ఏమగును, ఎంతపని చేశావు అని ఆ గ్రామస్తులను పిలిచి ఎంతమాత్రము ఈ ఇస్సాకు జోలికి గాని ఆమె భార్య జోలికి గాని వెళ్ళవద్దని అందరికీ ఆజ్ఞాపించారు!

 

  ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే మానవుల యొక్క బ్రష్ట స్వభావం మనకు అర్ధమవుతుంది- అబ్రాహమా భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని అబ్రాహాము గారితోనూ, ఇస్సాకు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అని ఇస్సాకుగారి తోనూ దేవుడు వాగ్దానం చేసి భరోశా ఇచ్చాక కూడా ఈ ఇద్దరు ఎందుకు అబద్దమాడారో నాకర్ధమవడం లేదు! యెహోవా మన పక్షముండగా మన విరోధి ఎవడు? ఎవడూ వారిని ముట్టలేరు కదా! ఇది కేవలం మనిషిలో ఉన్న బ్రష్ట స్వభావం అన్నమాట!

 

 ఇక 12వ వచనం ఎంతో శ్రేష్టమైన వచనం- ఇస్సాకు ఆదేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతలుగా ఫలము పొందెను!!! బైబిల్ గ్రంధములో వందశాతం ఎవరైనా ఆశీర్వాదం ఫలము పొందారా అంటే అది కేవలం ఇస్సాకు గారు మాత్రమే! అదికూడా ఎక్కడ? పరాయి దేశంలో! అక్కడ భూమిని కౌలికి తీసుకుని పంటపండిస్తే అది నూరంతలుగా ఫలించింది! హల్లెలూయ!

 

ఇంకా 13వ వచనం: అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను! ఇది తప్పకుండా గమనించ వలసిన విషయం!

దేవుడు మనలను దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు! అయితే దేవుడే ఒకేసారి మనలను దీవించరు, ఇచ్చే ఆశీర్వాదాలు కూడా ఒకేసారి వచ్చేయ్యవు! అవి క్రమక్రమంగా వస్తాయి. అదికూడా దేవుడు నీ కష్టార్జితాన్నే ఆశీర్వదిస్తారు గాని పరాయి సొమ్ము అప్పనంగా దేవుడు నీకియ్యరు! ఒక్కరాత్రిలోనే కోటీశ్వరుడుగా ఎట్టిపరిస్తితులలోను చెయ్యరు దేవుడు! నీ కష్టార్జితం ద్వారానే నిన్ను దీవిస్తారు! దేవుని బిడ్డలకు లాటరీలు తగలవు!  పనికిమాలిన సినిమాలలో చూపించినట్లు పాటకు ముందు ఎంతో బీదవాడు పేదరికంగా ఉంటాడు గాని పాట మొదలై పూర్తి కాబోయేసరికి పెద్ద కంపెనీకి ఓనర్ అయిపోతాడు, కార్లు బంగళాలు, నౌకర్లు అబ్బో... ఇవన్నీ అబద్దాలు అబద్దమును ప్రేమించి జరిగించేవి ఇవే! నిజానికి ఎవడూ పాట పూర్తికాబోయే సరికి అడ్డంగా అప్పనంగా కోటీశ్వరుడు అవ్వడు!

 

గాని దేవుడు నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తారు! ఇస్సాకుని ఆశీర్వదించారు దేవుడు ఆ విధముగానే! ఎంతగా ఆశీర్వదించారు అంటే 1416 వచనాలు చూసుకుంటే ఫిలిస్తీయుల అతనియందు అనగా ఇస్సాకు మీద అసూయపడ్డారు! దేవుడు అంతగా ఆశీర్వదించారు ఇస్సాకుని! ఎలా అంటే కేవలం- ఇస్సాకు దేవుని మాటను వినినందువలన!

Genesis(ఆదికాండము) 26:14,15,16

 

14. అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.

15. అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి.

16. అబీమెలెకునీవు మాకంటె బహు బలము గలవాడవు గనుక మాయొద్దనుండి వెళ్లిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా ....

 

చూడండి-16వ వచనంలో ఆ దేశపు రాజైన అబీమెలెకు అంటున్నాడు: నీవు మాకంటే బలవంతుడవు అయిపోయావు కాబట్టి దయచేసి మా దగ్గరనుండి వెళ్ళిపో అని బ్రతిమిలాడుతున్నాడు! దేశాన్నేలే రాజుకూడా అసూయపడేటంతగా దేవుడు అతనిని ఆశీర్వదించారు. ఎందుకంటే రాజు కంటే ఎక్కువ ధనవంతుడు, రాజుకంటే ఎక్కువ పనివారు ఇస్సాకు దగ్గర ఉన్నారు ఇప్పుడు! అందుకే దయచేసి మా దగ్గరనుండి వెళ్ళిపో మహాప్రభో అన్నంతగా దేవుడు ఇస్సాకుగారిని దీవించారు! ఇదీ దేవుని ఆశీర్వాదం!

 

అందుకే బైబిల్ చెబుతుంది: యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టార్జితము వలన అది ఎక్కువ కాదు! నరులు ఎంత కష్టపడినా వారి ఆస్తిని విస్తరించుకోలేరు. కేవలం దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యం కలుగుజేస్తుంది.

సామెతలు 10: 22

యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.

 

ఇంకా అంటున్నారు: మీరు వేకువనే లేచి ప్రోద్దుపోయే వరకు కష్టపడటం వ్యర్ధమే! తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికిచ్చిచున్నాడు అని...

కీర్తనలు 127: 2

మీరు వేకువనే లేచి చాలా రాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చుచున్నాడు.

 

కొంతమంది ఎంతెంతో కష్టపడుతుంటారు- ఉద్యోగం తో పాటుగా సైడు బిజినెస్ లుచేస్తారు. ఇంకా LIC ఏజెంట్ గా, ఇంకా ఈ స్కీము ఆ స్కీము, ప్లాట్లు ఉన్నాయి అంటూ తమ ఉద్యోగం చేసుకుంటూనే నిద్రహారాలులేకుండా తిరుగుతూ ఉంటారు. భార్య ఒక ఉద్యోగం, భర్త ఒక ఉద్యోగం, ఇంకా ఇలా కష్టపడుతూ ఉంటారు. ప్లాట్లు కొంటారు వాటి EMI కట్టలేక ఏడుస్తుంటారు. అయితే దేవుడు అంటున్నారు: తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చు చున్నాడు- దీనిని బట్టి మీరనవచ్చు అలా అయితే ఉద్యోగాలు పనిపాటులు చేయక్కరలేదా? దేవుడు ఎలా తన ప్రియులు నిద్రించుచుండగా ఇస్తున్నాడు కదా! కేవలం ప్రార్ధన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఆరాధనలలో పాల్గొంటే దేవుడు ఆశీర్వాదం కూడుగుడ్డా ఇచ్చేస్తాడా అని!

కానేకాదండి!

పౌలుగారు రాసిన రెండు థెస్సలోనికయుల పత్రికలలో కూడా చాలా స్పష్టంగా రాసారు! ఎవడూ పనిచేయకుండా భోజనం చెయ్యకూడదు! మనవారు- అనగా సేవచేసే వారు కూడా ఏదో ఒకపనిచెయ్యాలి, పనిచేసి తన కష్టార్జితం లేక సొంతచేతులతో కష్టపడినందువలన వచ్చిన డబ్బుతో ఆహారం కొని తినాలి అని రాశారు! అనగా చదువుకున్న యవ్వనస్తులూ కూడా తమకు నచ్చిన మెచ్చిన ఉద్యోగం వచ్చేవరకు ఇంట్లో కూర్చొని తినకుండా మంచి ఉంద్యోగం వచ్చేవరకు ఏదో ఒక చిన్నపని చేస్తూ ఉండాలి. తన బోజనానికి సరిపోయిన ఉద్యోగమైనా చెయ్యాలి. అయితే ఇక్కడ కీర్తనాకారుడు చెప్పిన వాక్యభావము, ఏమిటంటే- మీరు చేసేపనులు మీరు చెయ్యండి, అంతేకాని ఈపని ఆపని చేసి స్ట్రెస్ పెంచుకుని బీపీ షుగర్లు పెంచుకోవద్దు- తర్వాత గుండెజబ్బులు తెచ్చుకోవద్దు! ఏ పని చేస్తున్నారో ఆ పని శక్తివంచన లేకుండా చేస్తూ, మిగిలిన సమయాలలో ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతూ దానికోసం పాటుపడుతూ ఉంటే అప్పుడు యెహోవా ఐశ్వర్యం మీకు ఐశ్వర్యమిస్తుంది. నరుల కష్టము వలన అది ఎక్కువ కాదు అంటున్నారు!

 

కాబట్టి దేవుడు ఆశీర్వదించాలి అంటే మనము దేవుని మాట వినాలి! ఒక్కమాట చెప్పనీయండి- ఆశీర్వాదము అనగా చాలామంది మెటీరియల్ బ్లెస్సింగ్ అనుకుంటారు. అనగా మేడలు మిద్దెలు కార్లు బంగళాలు పొలాలు అనుకుంటారు! అది కానేకాదు- ఆశీర్వాదం అంటే దేవునిలో ముందుకు సాగుతూ ఆధ్యాత్మిక ఫలాలు ఫలిస్తూ ఆయన వరాలు ఫలాలు ఫలించడం- ఆయన సేవలో పరిచర్యలో సాగిపోతూ ఉంటే అప్పుడు దేవుడు నీకు ఈ మెటీరియల్ బ్లెస్సింగ్స్ వాటికవే నీకు చేరేలా చేస్తారు! నీకు ముఖ్యంగా మనశ్శాంతి సమాధానం సంతోషం ఇరుగుపోరుగుతో సమాధానం ఉంటుంది. ఇదే నిజమైన ఆశీర్వాదం!

ఇంకా నీ పిల్లలు నీమాట వింటారు. ఆరోగ్యంగా ఉంటారు. నీపిల్లలు, పిల్లల పిల్లలు అందరూ నీతో కలసి మందిరానికి పచ్చని ఒలీవల మొక్కల వలే వస్తారు. ఇది నిజమైన ఆశీర్వాదము. కుటుంబమంతా నీతోపాటుగా దేవుని సన్నధిలో ఉంటారు.

 

కాబట్టి మనము కూడా దేవుని మాట విని ఆయన కట్టడలు ఆజ్ఞలు పాటించి ఆయన రాజ్యమును నీతిని వెదకుతూ ఆశీర్వాదాలు పొందుకుందాము!

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-18వ భాగం*

ఆదికాండం 26:1622

16. అబీమెలెకునీవు మాకంటె బహు బలము గలవాడవు గనుక మాయొద్దనుండి వెళ్లిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా

17. ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను.

18. అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను.

19. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను.

20. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను.

21. వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను.

22. అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

ప్రియులారా! ఇక 16వ వచనంలో రాజు వచ్చి అంటున్నాడు: నీవు మాకంటే బలము గలవాడవు గనుక మాయొద్దనుండి దూరంగా వెళ్ళిపొండి అంటున్నారు. మర్యాదగా బ్రతిమిలాడుతూ పంపించేశారు కాబట్టి ఇస్సాకు గారు కూడా రాజ ప్రసాదం దగ్గర ఉండకుండా తిరిగి తన తండ్రి ఉండే ప్రాంతానికి వచ్చేశారు! గమనించాలి అప్పటికి కరువు బహుశా తీరిపోయి ఉండవచ్చు!

 

ఇక ఇస్సాకు గారు గెరారు వచ్చిన వెంటనే తన తండ్రి తవ్వించిన బావులను తిరిగి తవ్వించారు. ఎందుకంటే అబ్రాహము గారు చనిపోయిన వెంటనే గెరారు కాపరులు ప్రజలు అసూయపడి ఆయన త్రవ్విన బావులను మట్టివేసి పూడ్చివేశారు. అబ్రాహము గారు ఉన్నప్పుడు ఎవడికీ ధైర్యం చాలలేదు. ఎందుకంటే అబ్రాహాము గారు- రాజైన అబీమెలేకు ఇద్దరు మంచి స్నేహితులు! ఇక ఇస్సాకు గారు కూడా తన తండ్రి త్రవ్విన బావులకు తన తండ్రి పెట్టిన పేర్లే తిరిగి పెట్టారు!

 

ఇక 19వ వచనంలో వారికి మంచి జెలలు గల నీల్లబావి దొరికింది. ఇది ఇస్సాకు గారు త్రవ్వించిన మొట్టమొదటి బావి అన్నమాట! ఇంతవరకు తండ్రి త్రవ్విన బావులనే తిరిగి త్రవ్వించారు గాని ఇది తానూ సొంతంగా త్రవ్వించిన బావి!

 

ఒకమాట చెప్పనీయండి: ఎక్కడపడితే అక్కడ త్రవ్వితే మంచినీరు రావు. అంతేకాకుండా ముందుబాగాలలో చెప్పడం జరిగింది అబ్రాహము గారు ఎడారులలో/అరణ్యాలలో నివాసం చేశారు. ఆ ప్రాంతాలలో ఎక్కడ పడితే అకడ నీరు ఉండదు! నీరు కనుక్కోడానికి ఒక టెక్నిక్ ఉంటుంది. అది అబ్రాహాము గారికి తెలుసు! ఇప్పుడు ఆ టెక్నిక్ ఇస్సాకు గారు కూడా తెలుసుకుని బావి త్రవ్వితే మంచినీరు దొరికింది. వెంటనే ఆ ప్రాంతం వారు వచ్చి- ఈభూమి మాది, ఈ నేలమాది, కాబట్టి ఈ బావి కూడా మాదే అవుతుంది అని భయంకరంగా గొడవలాడారు అందుకు దానిని ఏశెకు అని పేరుపెట్టారు. ఏశెకు అనగా జగడం అని అర్ధం!

 

ఇక ముందుకు వెళ్లి మరో బావి త్రవ్వారు- దానికోసం కూడా వారు మరలా తగవులాడారు. అందుకే దానికి శిత్నా అని పేరు పెట్టారు. శిత్నా అంటే ఎదిరింపు లేదా ప్రతిఘటన అని అర్ధం!

 

ఇక 22వ వచనంలో మరో బావి త్రవ్వారు మరో ప్రాంతంలో! అక్కడ ఆ ప్రాంతం వారు ఇస్సాకు గారితో గాని ఇస్సాకు పనివారితో గాని తగవులాడలేదు! అందుకే దేవుడు వారికి మాకు ఎడమ కలిగించారు లేదా యెహోవా మనకు తావు కలిగించారు లేదా తగవాడే వారికి మాకు దూరం కలిగించారు కాబట్టి ఇక మనము ఈ దేశములో అభివృద్ధి పొందుతాము అని దానికి రహెబోతు అనే పేరుపెట్టారు. అనగా ప్రతిఘటనల నుండి శోధన ఎదిరింపుల నుండి దేవుడు వాటిని దూరం చేసి ఎడబాటు కలిగించి శాంతి ఇచ్చారు! రహెబోతు అనగా శ్రమల నుండి- ఎదురాడే పరిస్తితులనుండి విశ్రాంతి!

 

ఒక విషయం చెప్పనీయండి: ఈ సక్సెస్ లేక విజయం ఇస్సాకు గారికి ఎప్పుడు ఎలా వచ్చింది? గెరారు కాపరులు తన తండ్రి త్రవ్విన బావులను పూడ్చేశారు. తానూ తవ్విన బావులకోసం రెండుసార్లు గొడవాడారు అయినా నేనెందుకు ఈ దేశంలో ఉండాలి, వీరు కేవలం జగడాలు ఆడేవారు, నేను ఎక్కడికో పోతాను అని వెళ్ళిపోలేదు! అక్కడే సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నారు! ఇక్కడ కాకపొతే మరో దగ్గర అని ఆ ప్రాంతంలోనే మరోదగ్గర ప్రయత్నించారు! ప్రయత్నాలు ఆపలేదు! ఏవో రెండు మూడు శోధనలు వచ్చాయి అని దేవుడు చేసిన వాగ్దానం మర్చిపోలేదు! దేవుడు ఇక్కడే ఉండమన్నారు కాబట్టి ఇక్కడే ఉండి ప్రయత్నం చేద్దామని అక్కడే ఉండి ప్రయత్నం చేసి ఫలితం సాధించారు!

 

మనము కూడా మన ప్రయత్నాలలో మొదట్లో ఏవో చిన్న ఆటంకాలు వచ్చాయని, సేవకు ప్రతికూలంగా ఉన్న ప్రాంతమని మరో ప్రాంతానికి వెళ్ళిపోవడం లేక సేవ మానెయ్యడం లాంటివి చెయ్యకూడదు!  ఈ వృత్తికి ఆ వృత్తికి తిరుగకూడదు! ప్రయత్నం చేస్తూ ఉండాలి! నిలకడగా ఉండాలి నీవు చేసే ప్రయత్నంలో! ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని వెళ్లి మోసపోకూడదు! దేవుడిచ్చిన పనిని మన శక్తివంచన లేకుండా చేస్తే- ఫలితం దేవుడిస్తారు! ఇస్సాకు గారు కూడా ప్రయత్నాలు ఆపలేదు! అందుకే గొప్పవిజయాలు పొందుకున్నారు!

 

ఇక అక్కడనుండి బెయేర్షెబా కు వెళ్ళారు. అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమై అంటున్నారు: గమనించాలి ఇది రెండోసారి మాట్లాడటం ఇస్సాకు గారితో! నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకుతోడుగా ఉంటాను కాబట్టి నీవు భయపడకుము అంటున్నారు. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరిస్తాను అని మరోసారి వాగ్దానం చేస్తున్నారు! వెంటనే అక్కడ ఒక బలిపీటం కట్టారు!

 

గమనించాలి- శ్రమలు శోధనలు ప్రతిఘటనలు తీరిన వెంటనే దేవుడు ఇస్సాకు గారితో మాట్లాడారు! అవును ఇది దేవుడు మనతో మాట్లాడే విధానం- మొదట నిన్ను పరీక్షిస్తారు- దానిలో జయం పొందితే, జయజీవితం జీవిస్తే నీకు మరో ఆశీర్వాదం! ఇస్సాకు గారు శోధన శ్రమలు పరీక్షలు తట్టుకుని ముందుకు పోతుంటే దేవుడే ప్రత్యక్షమై నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ తండ్రిని బట్టి అంటూ మరోసారి వాగ్ధానం చేసి దీవించారు! నీవు నేను కూడా అలా శ్రమలను శోధనలను ప్రతిఘటనలను సహించి జయిస్తే వెంటనే దేవుడు నీతో కూడా మాట్లాడతారు!

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-19వ భాగం*

ఆదికాండం 26:2631

26. అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారునుండి అతనియొద్దకు వచ్చిరి.

27. ఇస్సాకు మీరు నామీద పగపట్టి మీయొద్దనుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా

28. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలెననియు

29. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడుచేయకుండునట్లు నీతో నిబంధన చేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి.

30. అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చు కొనిరి.

31. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

ప్రియులారా! ఇక తర్వాత వచనాలలో అబీమెలేకు రాజు గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నారు.  రాజు -రాజు స్నేహితులు సైన్యాధిపతి అందరూ ఇస్సాకు గారి దగ్గరకు వచ్చారు!

28వ వచనంలో రాజు వచ్చి అంటున్నాడు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట మేము చూశాము గనుక మనకు అనగా మాకును నీకును మద్య ఒక ప్రమాణం చేసుకుందాం లేక ట్రీటీ- ఒప్పందం చేసుకుందాము! ఎందుకంటే మేము నిన్ను సమాధానముగానే పంపివేశాము గాని నిన్ను బలవంతంగా కీడుచేసి పంపలేదు కాబట్టి ఇప్పుడు దేవుడు నీతో తోడుగా ఉన్నారని మాకు అర్ధమయ్యింది, ఇప్పుడు మేము నీకు వ్యతిరేఖంగా ఉంటే దేవుడే మాకు వ్యతిరేఖమై పోతారు కాబట్టి దయచేసి మాతో ఒక ప్రమాణం చెయ్యు! నీవు కూడా నీ జనాంగము ఎంతో విస్తరిస్తుంది. నీ పంటలు నీ దాసులు నీ ఐశ్వర్యం ఆస్తులు గొడ్డ్లు అన్ని విస్తరిస్తున్నాయి కాబట్టి మాతో ప్రమాణం చెయ్యు- ఏమిటంటే మేమునీకు ఎలా అపకారం చెయ్యలేదో అలాగే నీవుకూడా మాకు అపకారం లేక కీడు చెయ్యకూడదు! దానికి ఇస్సాకు గారు సమ్మతించి విందుచేసి ఉదయాన్నే ప్రమాణం చేశారు!

గమనించాలి ఇదే రకమైన ప్రమాణం అబ్రాహాము గారు కూడా ఇదే ఫిలిష్తీయుల రాజుతో చేశారు. అక్కడ కూడా యెహోవానీకు తోడైయున్నాడు అని నాకు తెలుసు అంటున్నారు. 21:22-24

 

మొదట శోధన, తర్వాత దేవుని దీవెన ఆ తర్వాత శత్రువులు మిత్రులుగా మారడం! అబ్బా ఎంత ఆశీర్వాదం! వారు అంటున్నారు: అయ్యా దేవుడు నీతో తోడుగా ఉన్నారు అని మాకు అర్ధమైపోయింది అంటున్నారు!

దేవుడు నీతో ఉన్నట్లు ఎవరికైనా తెలుస్తుందా ప్రియ సహోదరీ సహోదరుడా! నీ మాటలు నీ ప్రవర్తన దానిని చూపిస్తుందా? నిజం చెప్పాలంటే ఇస్సాకుగారు రాజైన అబీమెలెకు తో యుద్ధము చేసి గెలిచి వారి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేటంత కెపాసిటీ ఆయనకుంది! గాని అది మంచిపని కాదు కాబట్టి దేవుడు ఇప్పుడు కాదు 400 సంవత్సరాలు తర్వాతనే మీకు ఇస్తాను అన్నారు కాబట్టి ఇది సమయం కాదు అని బలము బలగము ఉన్నా గొడవులాడకుండా మరో ప్రాంతానికి సమాధానంగా వచ్చేశారు! ఆ ప్రాంతం వారు గొడవులాడినా కోపపడలేదు! దేవుని చిత్తానికి తననుతాను అప్పగించుకున్నారు! అందుకే దేవుడు ఇప్పుడు శత్రువులను మిత్రులుగా చేస్తున్నారు!

అందుకే భక్తుడు అంటున్నారు: ఒకని ప్రవర్తన యెహోవాకు అనుకూలమైనప్పుడు వాని శత్రువులను కూడా మిత్రులనుగా చేయును! సామెతలు 16: 7

ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.

 దీనితో ఇస్సాకు గారికి శత్రువులు అనే వారు లేకుండా పోయింది! అజాతశత్రువుగా మారిపోయారు!

ఇదీ నిజమైన ఆశీర్వాదం! నిజమైన దీవెన! శత్రువులు మిత్రులుగా మారి శాంతి సమాధానాలు విస్తరిస్తే ఆ మజానే వేరు! ఇది పూర్తిగా అనుభవించారు ఇస్సాకుగారు! అందుకే సహనము కలిగి ఉండమంటున్నారు. ఓర్పు తన కార్యమును జరుగనీయండి అనికూడా అంటున్నారు...

James(యాకోబు) 1:2,3,4

2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,

3. మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.

4. మీరు సంపూర్ణులును, అనూనాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 13:4,7

4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

7. అన్నిటికి తాళుకొనును (లేక, అన్నిటిని కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

 

ఫిలిప్పీయులకు 4: 5

మీ సహనమును (లేక, మృదుత్వమును) సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.

 

2పేతురు 1: 6

జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని,

 

ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉండమంటున్నారు!

సామెతలు 19: 11

ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.

 

సక్యమైతే సమస్త జనులతో సమాధానంగా ఉండమంటున్నారు...

రోమీయులకు 12: 18

శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

 

హెబ్రీయులకు 12: 14

అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.

 

శత్రువుల కోసం ప్రార్ధించమంటున్నారు!శత్రువులను కూడా ప్రేమించమన్నారు!...

మత్తయి 5: 44

నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

 

లూకా 6: 27

వినుచున్న మీతో నేను చెప్పునదేమనగామీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి,

లూకా 6: 28

మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి.

 

మరి నీవు అలా ఉంటావా?

అలాగైతే నీవు కూడా సమాధాన కారకంగా ఉంటావు! నీలో దేవుడుకనిపిస్తారు అందరికీ!

మరినీవు అందుకు సిద్దమా?

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-20వ భాగం*

ఆదికాండం 27:14

1. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననెను.

2. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు.

3. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము.

4. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

ప్రియులారా! ఇక 27వ అధ్యాయం నిజంగా ఇస్సాకు గారి జీవితంలో దేవుని ఉద్దేశానికి వ్యతిరేఖంగా జరిగిన ఒక సంఘటన! తద్వారా అన్నదమ్ముల మధ్య గొడవలకు కారణం- జీవితాంతం వారు అనగా అన్నదమ్ములు మరియు ఇంతవరకు వారి సంతానం మధ్య వైరముతో ఉండవలసిన పరిస్తితి కనిపిస్తుంది.

 

గమనించాలి- దేవుడు రిబ్కా తో వారి కొడుకులు పుట్టకముందే చెప్పారు- పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. నేను యాకోబుని ప్రేమించాను యాశావుని ద్వేషించాను అని దేవుడు చెప్పడం, రిబ్కా తన భర్తకు చెప్పడం జరిగింది. అయితే ఈ అధ్యాయంలో దేవుని ఉద్దేశానికి వ్యతిరేఖంగా ఇస్సాకు గారు యాశావుని దీవించాలి, జన్మ స్వాతంత్ర్యం, జ్యేష్టత్వం యాశావుకే ఇవ్వాలని అనుకున్నారు. ఇది ఎంతటి వాగ్ధాన పుత్రుడైన గాని తన వృద్ధాప్యంలో ఇస్సాకు గారు చేసిన తప్పుడు ఆలోచన! దేవుడు దానిని జరుగనీయలేదు గాని యాకోబు యాశావుల మధ్య తరతరాల వైరమునకు కారణమైంది! మొదటి తప్పు ఇస్సాకు గారిది అని గమనించాలి! ఇస్సాకు గారిలో కూడా మనుష్యులందరిలోను పనిచేసే పాత స్వభావం పనిచేసింది.

 

 ముందు బాగాలలో చూసుకున్నాము- యాశావును ఇస్సాకు గారు ప్రేమించారు ఎందుకంటే వేటగాడు వేటకు వెళ్లి మంచి వేట మాంసం తెచ్చి పెడితే తినేవారు ఇస్సాకు గారు! కాబట్టి కుమారుడా నీవు వెళ్లి వేటాడి మాంసం తెచ్చి నా దగ్గరకు వండి తీసుకుని రా! నేను ముసలోడ్ని అయిపోయాను కదా,  నేను పోయేముందు నిన్ను దీవిస్తాను అన్నారు! ఇది రిబ్కా విన్నది! వెంటనే చిన్నకొడుకుని అనగా యాకోబుని రిబ్కా ఎంతో ప్రేమించేది అని చూసుకున్నాము కదా, ఇప్పుడు రిబ్కా యాకోబుతో అంటుంది- నీ తండ్రి నీకు బదులుగా నీ అన్నను దీవించాలని అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్పినట్లు చేసి మోసంతో ఆ ఆశీర్వాదం దీవెనలు కొట్టెయ్యమంటుంది! ఎలా అంటే నీవు మంచి మేకపిల్లలను తీసుకుని రా, నేను మీ డాడీకి నచ్చినట్లు వండి నీకు ఇస్తాను. నీవు తండ్రి దగ్గరకు మీ అన్న బట్టలు వేసుకుని వెళ్ళిపో అంటూ తప్పుడు సలహా ఇస్తుంది. ఇది రిబ్కా గారి తప్పు అనగా తల్లి యొక్క తప్పు!

 

ఒకసారి ఆలోచించండి: దేవుడు యాకోబునే ప్రేమించి దీవిస్తాను- యాకోబు సంతానం ద్వారా దేవుడు అబ్రాహము గారికి చేసిన వాగ్దానాలు, ఇస్సాకు గారికి చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను అని పిల్లలు పుట్టకముందే అంత స్పష్టంగా చెప్పి ఉంటే యాశావుని దీవించాలి అనేది తండ్రి తప్పు అయితే, దీవెనను మోసంతో కొట్టెయ్యాలి అనేది తల్లి తప్పు! రిబ్కా ఇస్సాకుగారి దగ్గరకు వచ్చి- ఏమండి మన దేవుడు యాశావుని కాకుండా యాకోబుని దీవిస్తాను అని చెప్పారు కదా, ఇదేమిటి! యాశావుని దీవించండి గాని దేవుడు చెప్పినట్లుగా మీ జ్యేష్టులకు చెందవలసిన ఆశీర్వాదాలు యాకోబుకే ఇవ్వండి అని చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా మోసంతో కొట్టెయ్యాలి అనే ఆలోచన తప్పు, దానికి ఎలా మోసం చెయ్యాలో ట్రైనింగ్ ఇచ్చి పంపడం మరో తప్పు! ఈ విషయంలో యాకోబు గారు చేసినది అంత తప్పు కాదు అని నా ఉద్దేశ్యం! ప్రతీ విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినమని, లోబడి ఉండమని దేవుడు చెప్పారు. ఇప్పుడు తల్లి మాట వినడం న్యాయము కదా!

 

అయితే ఒకరకంగా యాకోబు గారిది కూడా తప్పే! ఎలా అంటే ఈ సంఘటన జరిగేసరికి యాశావు గారికి 40 సంవత్సరాలు, యాకోబు గారికి కూడా 40 సంవత్సరాలే! అనగా వీరు ఇంకా బాలురు కాదు, ఇద్దరూ యవ్వనస్తులే! కాబట్టి ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకునే వయస్సు! కాబట్టి తల్లి చెప్పినప్పుడు అలా చెయ్యకూడదు అని అతనికి తెలుసు, తల్లికి వద్దని చెప్పారు, గాని తండ్రిని మోసం చెయ్యకూడదని ఆలోచించి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను యాశావుని అని చెప్పకుండా నేను యాకోబుని, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని వాగ్దానాలు నాకు రావాలి కాబట్టి నాన్నగారు నన్ను దీవించండి అని చెప్పి ఉంటే బాగుణ్ణు! ఇది యధార్ధత! యాకోబు గారి దగ్గర ఇది లోపించింది!

 

మొత్తానికి యాకోబు గారు తండ్రి దగ్గరకు వెళ్లి మోసపూరితముగా ఆశీర్వాదాలు దీవెనలు కొట్టేశారు!

 

28వ వచనంలో దీవిస్తున్నారు ఇస్సాకు గారు యాకోబుని యాశావు అనుకుని: ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక!

ఆగుదాం! ఆకాశపు మంచు అంటున్నారు ఏమండి? మొదటగా దేవుడు అబ్రాహాముని ఆశీర్వదించిన పదాలనే మార్చి ఇక్కడ దీవిస్తున్నారు అని గ్రహించాలి! ఆకాశపు మంచు అని ఎందుకు అంటున్నారు అంటే: గతభాగాలలో చెప్పడం జరిగింది- అబ్రాహము గారు ఇస్సాకు గారు నివాసం చేసింది ఎడారులలో/అరణ్యాలలో! ఎడారులు ఎందుకు అయ్యాయి? వర్షాలులేక! అక్కడ వర్షాలు పడవు! ఎప్పుడో తుఫాను వస్తే అప్పుడప్పుడు వర్షాలు పడతాయి! ఇసుక తుఫానులు ఉంటాయి! మరి అక్కడ ఏదైనా జీవం ఉంది అంటే అది కేవలం ఆకాశపు మంచు మాత్రమే! అందుకే సమృద్ధిగల ఆకాశపు మంచు దేవుడు నీకు అనుగ్రహించును గాక అని దీవిస్తున్నారు!

                                     

ఇక విస్తారమైన ధాన్యము- ఎందుకంటే తనకు తన దాసులకు గొడ్లకు అన్నింటికీ సరిపోయిన ధాన్యము అన్నమాట! ఇక విస్తారమైన ద్రాక్షారసము! ఆరోజులలో అన్ని దేశాలవారు ఈ ద్రాక్షారసము వాడేవారు కనుక, వీరు త్రాగటానికి మరియు అందరికీ అమ్మడానికి! ద్రాక్షారసం ఎన్నో దేశాలకు సరఫరా అయ్యేది! తద్వారా వ్యాపారం చేసేవారు! ఈ రకంగా సమృద్ధిగా ఆశీర్వదించబడతావు అని దీవిస్తున్నారు!

 

ఇంకా జనములు నీకు దాసులవుతారు, జనములు నీకు సాగిలపడతారు, నీ బంధువులకు కూడా నీవు ఏలికయై ఉంటావు! నీ తల్లిపుత్రులు నీకు సాగిల పడతారు! గమనించాలి- ఇది దేవుడు రిబ్కాతో చెప్పిన మాటయే! నిన్ను దీవించిన వారిని దీవించబడతారు, నిన్ను శపించిన వారు శపించబడతారు! గమనించాలి- ఇది దేవుడు అబ్రాహము గారితో చేసిన వాగ్దానం!

 

ఈరకంగా ఇస్సాకు గారు యాకోబు దీవించారు! మోసపూరితముగా యాకోబు తండ్రి యొద్దనుండి దీవెనలు కొట్టేశారు!

 

ఇక యాకోబుగారు తండ్రి వద్దనుండి కాబట్టి వెళ్ళిపోయిన వెంటనే యాశావు రావడం, ఆశీర్వాదాలు కోసం అడగటం, ఇస్సాకు గారి కోపం రేపటం జరుగుతుంది. ఈ సంగతి మనకు తెలుసు ముందుకు పోదాం! 

చివరికి యాశావుకి శాపముతో కూడిన దీవెన ఇచ్చినట్లు చూడగలం! మొదట యాశావు నివాసం భూసారము అనేది లేకుండా ఎడారిగానే మిగిలిపోతుంది- గమనించాలి మొత్తం గల్ఫ్ దేశాలు యాశావు సంతానమే! అక్కడ భూమిపంటలు పండవు! ఖర్జూరాలు మాత్రమే పండుతాయి! పైనుండి పడు ఆకాశపు మంచు నీకు రాదు! ఎందుకంటే ఆకాశపు మంచు యాకోబు గారికి ఇచ్చేశారు కదా!

అదే ఇశ్రాయేలు దేశంలో పంటలు సమృద్ధిగా పండుతాయి!

నీవు బ్రతికికంత కాలము నీ కత్తిచేతనే బ్రతుకుతావు! అనగా నీ జీవితాంతం కష్టపడి బ్రతుకుతావు, అదికూడా సుఖశాంతులు అనేవి లేకుండా! నీ తమ్ముడికి నీవు దాసుడవు అవుతారు

అలా నీవు నీ కత్తితో బ్రతుకుతూ ఉండగా నీవు నీ తమ్ముడి కాడిని విరిచేస్తావు ! ఇదీ శాపముతో కూడిన దీవెన!

 

ఈరకంగా దీవెన మరియు శాపములు కలిగాయి! దేవుడు యాకోబుని దీవించారు, అయితే ఇస్సాకు గారు యాశావుని దీవించాలి అనుకున్నారు, గాని దేవుని ఉద్దేశమే స్తిరమైంది గాని ఇస్సాకుగారి ఆలోచన నెరవేరలేదు! అందుకే బైబిల్ చెబుతుంది యెహోవా ఆలోచనలే స్తిరము!

సామెతలు 19: 21

నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.

 

కాబట్టి మనము కూడా దేవుని చిత్తానుసారముగా దేవుని వాగ్దానాలు నమ్మి ఆయన చెప్పినట్లే చేద్దాం!

లేకపోతే యాశావు- యాకోబుల మధ్య జరిగిన జరుగుతున్న సంభవాలే మనము కూడా ఎదుర్కోవలసి వస్తుంది!

కాబట్టి మనలను మనం సరిచేసుకుందాం!

 

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-21వ భాగం*

ఆదికాండం 28:14

1. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.

2. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి

3. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు

4. ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి ...

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

    ప్రియులారా! ఇక 27వ అధ్యాయం చివరలో యాశావు యాకోబు మీద పగబడతాడు ఎందుకంటే మోసపూరితముగా ఆశీర్వాదాలు మరియు జ్యేష్టత్వం కొట్టేసినందుకు! అయితే ఏమనుకున్నాడు అంటే నేను నా తమ్మున్ని చంపేస్తాను. అయితే ఇప్పుడే చంపితే నాన్న వెంటనే చనిపోతాడు. నాన్న వృద్ధుడు అయిపోయాడు కాబట్టి నాన్న చనిపోయిన వెంటనే తమ్ముడ్ని లేపేస్తాను అని అనుకుని తన భార్యలతో చెప్పడం జరగడం, అది రిబ్కా వరకు ఆ మాట రావడం జరిగింది. ఈమాట తెలుసుకున్న రిబ్కా మీ అన్నయ్య నీమీద పగపట్టాడు, నిన్ను చంపుతాను అంటున్నాడు కాబట్టి నీవు హారానుకి వెళ్ళిపో, అక్కడ మా అన్నయ్య లాబాను ఉన్నాడు, అక్కడ ఉండు, మీ అన్న కోపం తీరిన తర్వాత నేనే కబురుపెడతాను అప్పుడు మరలా ఇక్కడికి వద్దువు అని చెప్పింది. లేకపోతే ఒకేరోజున నేను మీ ఇద్దరినీ కోల్పోతాను అని చెప్పింది!

 

చూడండి- మోసపూరితముగా ఆశీర్వాదాలు కొట్టెయ్యాలి అని ఆలోచన చెప్పింది ఎవరు? తల్లి!!! ఇప్పుడు ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు? కుమారుడు! అందుకే ఏమి చేసినా ఆలోచించి చెయ్యాలి! బహుశా ఇలా అవుతుంది అని ఎరిగి ఉంటే యాకోబు అలా చేసి ఉండేవారు కాదు, రిబ్కా కూడా అలా చెప్పి ఉండేది కాదు! ఇప్పుడు చేతులు కాలాక ఆకులు కాలిన చందముగా చిన్న కొడుకుని తన అన్నయ్య దగ్గరకు సిరియా పంపించి వేస్తుంది. తల్లిదండ్రులారా! దయచేసి దీనిని ఆలోచించమని మనవిచేస్తున్నాను! పిల్లలను అందరినీ మీరు సమానంగా చూస్తూ అందరికీ ఒకేవిధమైన ప్రేమనుచూపిస్తే ఈ తగాదాలు రావు! హత్యలు జరుగవు!

 

ఇక కొసమెరుపులా చివరలో అంటున్నారు ఆవిడ: నీవుకూడా మీ అన్న లాగ ఇక్కడున్న హేతు కుమార్తెలు లాంటివారిని పెళ్లాడితే నేను బ్రతకడం కంటే చావడం మేలు అంటుంది. అనగా ఆ స్త్రీలు అనగా ఆమె కోడళ్ళు  ఆమెకు అంతగా విసికించి  దుఃఖం కలిగించారు అన్నమాట!

 

ఇక 28వ అధ్యాయంలో ఈ స్టోరీ మొత్తం నిజాలు ఇస్సాకు గారికి తెలిసిపోయి దీవించి హారాను పంపివేస్తున్నారు! బహుశా అప్పుడు ఇస్సాకు గారికి తప్పు అర్ధమై ఉంటుంది. దేవుని ప్రణాళికకు వ్యతిరేఖంగా నేను ఆలోచించినందువలననే ఇలా జరుగుతుంది అని తెలుస్కుని ఉంటారు! అందుకే చిన్నకుమారుని పిలిచి ఎందుకురా మోసపూరితముగా ఇలా ఆశీర్వాదాలు కొట్టేశావు అనిగాని, ఎందుకురా నన్ను మోసగించావు అని గాని అడగలేదు! యితడు దీవించబడినవాడు కాబట్టి నిండుమనస్సుతో మరోసారి దీవించి పంపుతున్నారు తన బావమరిది దగ్గరికి! అయితే ఒక ముఖ్యమైన కండిషన్ పెట్టారు! నీవు ఈ కనాను స్త్రీలలో ఎవరిని పెండ్లి చేసుకోకూడదు!

ఒకసారి ఆగుదాం! దీనినుండే మనకు ధర్మశాస్త్రంలో మీరు అన్య స్త్రీలను మీ కుమారులకు పెండ్లి చెయ్యకూడదు, మీ కుమార్తెలను అన్యులకు ఇవ్వకూడదు అనే ఆజ్ఞ వచ్చింది. పాత నిబంధన మరియు కొత్త నిబంధన లో కూడా ఇదే వ్రాయబడింది! ఇశ్రాయేలు ప్రజలు అన్యులను వివాహం చేసుకోకూడదు! అలాగే రక్షణ పొందిన విశ్వాసులు రక్షణ పొందినవారినే వివాహం చేసుకోవాలి గాని అన్యులను వివాహం చేసుకోకూడదు! వారి అందం చూసి, వారిచ్చే కట్నకానుకలకు ఆశించి, లేక మరో దానిని ఇష్టపడి అన్యులతో వివాహం చేసుకోకూడదు!! ఇదే బైబిల్ చెబుతుంది! ఈ విషయం మహా ఘనత వహించిన సోలోమోను గారికోసం బైబిల్ చెబుతూ దీనిని బైబిల్ ఎత్తి చెబుతుంది! అతడు కామాతురత గలవాడై అన్య స్త్రీలను పెండ్లిచేసుకున్నాడు అని! రాజ కుమార్తెలను పెండ్లి చేసుకున్నాడు, రాజకుమార్తెలు కాకుండా అనగా రాజ వంశం కాకుండా మామూలు స్త్రీలు అందంగా ఉంటే వారిని ఉంచుకుంటూ వచ్చాడు! వారు సోలోమోను మనస్సును దేవుడైన యెహోవా మీదనుండి విగ్రహాల తట్టు త్రిప్పివేయగా సోలోమోను రాజు విగ్రహారాధన చేశాడు!!!

1రాజులు 11: 1

మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి

1రాజులు 11: 2

కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.

 

ఇది మీ/మన కుమారులు కుమార్తెలు కూడా చెయ్యకూడదు అంటే వారితో మీరు వియ్యమొంద కూడదు!

మేము మార్చేసుకుంటామండి అంటున్నారు కొందరు- అయ్యా అమ్మా మీరు ఆ అమ్మాయిని/ అబ్బాయిని మార్చలేరు! ఆ అబ్బాయే /అమ్మాయే మీ అమ్మాయిని/అబ్బాయిని మార్చేస్తారు. అప్పుడు ఘోరమైన విగ్రహారాదికులు అయిపోయి మీ ఇంటికి వారి ఇంటికి శాపమును తెచ్చుకుంటారు! ఇది మా సంఘంలో నేను చూస్తున్నాను!

Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 7:2,3,4

2. నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింప కూడదు,

3. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.

4. నన్ను అనుసరింప కుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.

 

సరే, మొదటి కండిషన్: నీవు కనాను కుమార్తెలలో ఎవరినీ వివాహం చేసుకోకూడదు!

రెండు: మీ మావయ్య కుమార్తెలలో ఒక దానిని పెళ్లి చేసుకో! ఈ మాట గ్రహించాలి! మీ మావయ్యకు ఎంతమంది ఉంటె అంతమందిని చేసుకోమని చెప్పలేదు! ఒకదానిని పెళ్ళిచేసుకోమంటున్నారు! గమనించాలి-  ఈ సంఘటన జరిగేసరికి అన్ని దేశాలలోను బహు భార్యత్వం అమలులో ఉంది!  ఆస్తి మరియు బలము ఉన్న మగాడు ఎందరినైనా పెళ్లి చేసుకోవచ్చు! గాని ఇస్సాకు గారికి ఈ ఆప్షన్ ఉన్నా దేవునికి భయపడి దానిని ఉపయోగించుకోలేదు! కుమారునికి దీవించి పంపేటప్పుడు ఒక స్త్రీని మాత్రమే పెండ్లి చేసుకో అంటున్నారు! అయితే యాకోబు దీనిని పాటించకుండా నలుగురిని చేసుకున్నాడు! అది వేరే విషయం!

 

ఇక దీవెనలు: సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింప జేసి నీవు పరవాసియైన దేశమును అనగా దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్త్యముగా చేసుకోనునట్లు ఆయన నీకు అనగా నీకు నీతో కూడా నీ సంతానమునకు కూడా అబ్రాహాము నకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయును గాక! చూడండి ఎంత దీవెనో! ఈ దీవెనలో అబ్రాహము గారికి దేవుడు ఇచ్చిన వాగ్ధానము కేవలం యాకోబు గారిద్వారా మాత్రమే  నెరవేరుతుంది!

 

గమనించాలి- దీవించే ముందు దేవుడు యాకోబుని కోరుకొన్నాడు కాబట్టి దానికి అనుగుణంగా దీవిస్తున్నారు ఇస్సాకు గారు!

సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు! ఎలాగంటే నీవు అనేక జనాలు అయ్యేలా నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవుపరవాసియైన దేశమును నీకు స్వాస్త్యముగా ఇస్తారు అంటున్నారు!

 

నిజానికి ఈ ఆశీర్వాదం/ దీవెన నెరవేరిందా అవును కదా, దేవుడు యాకోబు గారికి ప్రేమించి ఆశీర్వదించి 12మంది కుమారులను, ఒక్క కుమార్తెను ఇచ్చారు! డెబ్బై మందిగా ఐగుప్తు వెళ్ళిన వారు  వారిద్వారా లక్షలమందిగా తిరిగి వాగ్ధాన దేశమునకు వచ్చి దానిని స్వతత్రించుకున్నారు! ఇదీ నిజమైన దీవెనకు ప్రతిఫలం!

 

ఇంకా చూడండి: దేవుడు అబ్రాహామునకు చేసిన వాగ్దానాలు నీవు నీతో కూడా నీ సంతానమునకు అబ్రహాము నకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు వాగ్దానాలు నేరవేర్చును గాక అంటున్నారు!

అబ్రాహాము గారికి ఏఏ వాగ్దానాలు ఇచ్చారు?

Genesis(ఆదికాండము) 12:1,2,3

1. యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

3. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా

 

Genesis(ఆదికాండము) 15:18,19,20,21

18. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా

19. కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను

20. హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను

21. అమోరీయులను కనా నీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.

ఈ వాగ్దానాలు అన్నీ నిజానికి యాకోబు గారి సంతానం ద్వారానే నెరవేరాయి!

 

ఈ విధంగా ఇస్సాకు గారు యాకోబుని దీవించి పంపించేశారు సిరియాకు! ఇక దీనితో మనకు ఇస్సాకు గారికోసం వ్రాయబడిన విషయాలు ముగిసిపోతాయి!

 

అయితే యితడు వాగ్ధాన పుత్రుడు! వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేశారు! దేవుడు చెప్పినట్లు ప్రవర్తించారు! కేవలం రెండు విషయాలలో దేవుని ప్రమేయం లేకుండా సాధించాలి అనుకున్నారు! 

మొదట తన భార్యను చెల్లి అని చెప్పారు తండ్రిలా! రెండు: దేవుడు యాకోబుని దీవించారు కోరుకున్నారు అని తెలిసినా యాశావుని దీవించాలని అనుకుని ఇద్దరి కుమారుల మధ్య ఘోరమైన తగాదాలు సృష్టికి కారణభూతుడైనవాడుగా మిగిలిపోయారు!

అయితే దేవునిచేత దీవించబడ్డవాడు అదికూడా నూటికి నూరుశాతం దీవెనలతో! చనిపోయే వరకు భక్తిని యధార్ధతను వదలకుండా విశ్వాసాన్ని కాపాడుకుని క్రీ.పూ 1716 లో చనిపోయారు. పుట్టుక క్రీ.పూ 1896! అనగా 18౦ సంవత్సరాలు జీవించి మంచి వృద్ధాప్యములో చనిపోతే కుమారులైన యాశావు యాకోబులు తాతగారి సమాధిలో పాతిపెట్టారు!

దైవాశీస్సులు!

*వాగ్ధాన పుత్రుడు-22వ భాగం*

*ఇస్సాకు- యేసుక్రీస్తుప్రభులవారు*

 

ఆదికాండము 17: 19

దేవుడు నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను.

 

లూకా 1: 31

ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;

లూకా 1: 32

ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.

మత్తయి 1: 20

అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకకు భయపడకుము, ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును;

మత్తయి 1: 21

తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు (యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.

 

      ప్రియదైవజనమా! మనము వాగ్ధానపుత్రుడైన ఇస్సాకు గారికోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

  ప్రియులారా! ఇంతవరకు మనము వాగ్ధాన పుత్రుడైన ఇస్సాకు కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక ముగించేముందు ఇస్సాకు మరియు యేసుక్రీస్తు ప్రభులవారి మధ్యగల పోలికలు చూసుకుందాం! ఇస్సాకు గారికి యేసయ్యతో చాలా పోలికలున్నాయి.

 

*మొదటిది: ఇద్దరూ వాగ్ధాన పుత్రులే!*

ఆదికాండం 15: 4  లో దేవుడు నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పారు 25 సంవత్సరాల ముందు! అలాగే 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకు వాగ్ధాన పుత్రుడుగా జన్మించారు!

 

ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కంటుంది అని కొన్ని తరాలుముందుగా దేవుడు వాగ్దానంచేశారు యేసుక్రీస్తుప్రభులవారికోసం! యెషయా 7: 14

కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

 

ఇంకా ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి సమాధానపతియగు అధిపతి! అని కూడా చెప్పారు  740 సంవత్సరాల క్రితం!

యెషయా 9: 6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

*రెండు: ఇద్దరిదీ అసాధారణమైన జన్మాలే*

ఇస్సాకుని గర్భం ధరించబోయేసరికి శారమ్మగారికి 90 సంవత్సరాలు!  ఆడ ఋతువులు ఆగిపోయాక కుమారుని కనడం అసాధ్యం!

 

కన్యక వివాహం కాకుండా గర్భం ధరించడం అసాధ్యం! మరియ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె కన్య! యోసేపుగారితో ఆమెకు ఎటువంటి శారీరక సంబంధం లేదు!

 

*మూడు: తల్లులు ఇద్దరూ తమ కుమారుల జననము గూర్చి ప్రశ్నించారు*

 

శారమ్మ: తొంబై సంవత్సరాలు వృద్దురాలను నేను గర్భవతిని అవుతానా అని నవ్వింది!  వెంటనే దేవుడు శారా నవ్వనేల అని అడిగారు!

ఆదికాండము 18: 12

శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.

ఆదికాండము 18: 13

అంతట యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల?

 

మరియ: నేను పురుషుని ఎరుగని దానినే ఇదేలాగు జరుగును అని గబ్రియేలు దేవదూతను ప్రశ్నించింది!

లూకా 1: 34

అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా

 

శారమ్మతో దేవుని జవాబు: దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా?

ఆదికాండము 18: 14

యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.

 

మరియతో గబ్రియేలు సమాధానం: పరిశుద్దాత్ముని శక్తి నిన్ను కమ్ముకునును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును!

లూకా 1: 35

దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.

 

*నాలుగు: పుట్టకముందే ఇద్దరికీ దేవుడే పేరు నిర్ణయించి పెట్టారు*

ఆదికాండం 17 లో నీకుమారునికి ఇస్సాకు అని పేరు పెడతావు అని పుట్టకముందే దేవుడు పేరు పెట్టారు!

ఆదికాండము 17: 19

దేవుడునీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపర చెదను.

 

లూకాసువార్త 1:31  లో మరియకు, మత్తయి 1: 21 లో యోసేపుకి పుట్టకముందే పుట్టబోయే శిశువుకోసం యేసు అనే పెట్టాలి అని చెప్పారు!

 

*ఐదు: ఇద్దరు కాలము పరిపూర్ణమైనప్పుడు పుట్టారు*

ఆదికాండం 18:10,14 లో మరుసటి సంవత్సరం ఇదే రోజుకి మరలా వస్తాను అప్పటికి శారా ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అని దేవుడు చెప్పిన విధముగా అదే చెప్పిన గడువులో ఇస్సాకు పుట్టాడు!

ఆదికాండము 18: 14

యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున *నిర్ణయకాలమందు* నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.

 

అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు...

గలతియులకు 4: 4

అయితే కాలము *పరిపూర్ణమైనప్పుడు* దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,

 

*ఆరు: ఈ ఇద్దరి జననములు తండ్రులకు ఆనందం కలుగజేశాయి*

శారమ్మ నాకు నవ్వు కలుగజేశాడు అని ఇస్సాకు జననము ద్వారా అన్నది, అలాగే ఇస్సాకు జననం ద్వారా అబ్రాహాము గారికి ఎంతో ఆనందం సంతోషం నవ్వు కలిగాయి!

 

తండ్రియైన దేవుడు పరవశుడై: ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నన్నాదింపజేయు నా ప్రియుడు అని పరమునుండి పలికారు!

మత్తయి 3: 17

మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

 

*ఏడు:ఇద్దరు అభిషక్తులే*

ఇస్సాకు- తనకోసరం దేవుడు ఏర్పాటుచేసుకున్న సంతానం కోసం/ ప్రజ కోసం అభిషేకించ బడినవాడు!

 

యేసుక్రీస్తు అనే పేరులోనే రక్షకుడు అనియు, అభిషక్తుడు అనగా అభిషక్తుడైన రక్షకుడు అని ఆయన పేరు! పేదలకు సువార్త ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించి పంపించారు అన్నారు దేవుడు!

లూకా 4: 18

ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

 

*ఎనిమిది: ఇద్దరూ పట్టణము వెలుపల బలి అర్పించబడ్డారు*

ఇస్సాకు వారు నివాసం చేసే ప్రదేశానికి దూరంగా మోరియా కొండమీద బలి అర్పణ కావించడం జరిగింది!

యేరూషలేము పట్టణం వెలుపల గొల్గొతా కొండమీద యేసుక్రీస్తుప్రభులవారి బలియర్పణ జరిగింది!

 

*తొమ్మిది: ఇద్దరు పునరుత్థానం పొందిన వారే*

ఇస్సాకు ఉపమాన రూపంగా బలి అర్పించబడి- ఉపమాన రూపంగా మృతులలో నుండి లేచారు....

హెబ్రీయులకు 11: 17

అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.

యాకోబు 2: 21

మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?

హెబ్రీయులకు 11: 18

ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,

హెబ్రీయులకు 11: 19

తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.

 

యేసుక్రీస్తుప్రభులవారు మత్తయి 28 ప్రకారం, లూకా 24 ప్రకారం,మార్కు 16 ప్రకారం, యోహాను 20 ప్రకారం మృతులలో నుండి సజీవుడై తిరిగి లేచారు!

 

*పది: ఇద్దరు తండ్రికి విధేయులే*

ఇస్సాకుని బలి అర్పించేసరికి బైబిల్పండితుల లెక్కల ప్రకారం ఇస్సాకుగారికి 1433 సంవత్సరాలు! దైవజనులు ఆరార్కే మూర్తి గారి లెక్క ప్రకారం 33 సంవత్సరాలు!  ఆ వయస్సులో కూడా తండ్రి తనను బలి అర్పించబోతున్నారు అని తెలిసినా తండ్రిని ఏమి అనకుండా విధేయత చూపించారు ఇస్సాకు గారు! అందుకే వాగ్దానాలు రెట్టింపు అయ్యాయి!

 

యేసుక్రీస్తు ప్రభులవారు సువార్త ప్రారంభించినప్పుడు ౩౦ సంవత్సరాలు,  మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసి 33 సంవత్సరాల వయస్సులో మానవులకోసం బలియాగం అయిపోయారు!  అందుకే భూలోకమందును పాతాలమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని ఆయన చెబితే, పరిశుద్ధాత్ముడు అందరూ యేసునామంలో అందరిమోకాల్లు ఆయన నామంలో వంగునట్లు దేవుడు చేశాడు అన్నాడు! అన్నినామముల కంటే పైనామము దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఇచ్చారు!

ఫిలిప్పీయులకు 2: 9

అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని,

ఫిలిప్పీయులకు 2: 10

భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

ఫిలిప్పీయులకు 2: 11

ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

 

*పదకొండు: ఇద్దరూ ప్రార్ధనా పరులే*

ఇస్సాకుకి ప్రతీ సాయంత్రం ప్రార్ధిస్తూ దేవుని ధ్యానించే అలవాటు ఉంది. అదే తన భార్యకు నేర్పించారు. ఆది 24:63;

యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఉదయమంతా సువార్త ప్రకటించి రాత్రంతా ప్రార్ధించడములో గడిపినట్లు క్రొత్తనిబందనలో వ్రాయబడింది!

 

*పన్నెండు: ఇస్సాకు కోసం- ఇస్సాకు కి బదులుగా యేసుక్రీస్తుప్రభువుల వారు గొర్రెపిల్లగా బలి అయిపోయారు!

 

మానవుల అందరి పాప విముక్తి కోసం తనకు తానుగా గొల్గొతా కొండమీద బలి అయిపోయి తన సొంత రక్తాన్ని చేతపట్టుకుని పరలోకంలో ఉన్న నిజమైన బలిపీటం మీద తన రక్తాన్ని ప్రోక్షించి అర్పించి మానవులకోసం ఒక్కసారే ప్రాయశ్చిత్తం చేశారు!

 

ఇస్సాకు- యేసుక్రీస్తు ప్రభులవారి ఛాయ మాత్రమే! యేసుక్రీస్తు ప్రభులవారు తండ్రి నిజమైన వాగ్ధాన కుమారుడు, విధేయుడు, చివరికి మానవులను విమోచించిన నిజ రక్షకుడు!

 

మరి ఆ నిజరక్షకుని నీ హృదయములో చోటునిస్తావా?

 

దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్!

(సమాప్తం)

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ప్రియ దైవజనమా ఈ వాగ్ధాన పుత్రుడు అనే శీర్షిక ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నమ్ముతున్నాను! యాకోబు గారి జీవిత విశేషాల ద్వారా మరల కలుసుకుందాం! దయచేసి మాకోసం ప్రార్దించండి!

దైవాశీస్సులు!

 

ఇట్లు

ప్రభువునందు

మీ ఆత్మీయ సహోదరుడు

*రాజకుమార్ దోనె*

 

 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అబ్రాహాము విశ్వాసయాత్ర

పాపము

పక్షిరాజు

పొట్టి జక్కయ్య

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

విశ్వాసము

సమరయ స్త్రీ

శరీర కార్యములు

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు