విశ్వాసము

విశ్వాసము

(మొదటి భాగము)

విశ్వాసము అంటే?
నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు. హెబ్రీ 11:1
*విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది.
1. దేనికొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో? దానిని ఒక దినాన్న చూస్తాను అనే నమ్మకము.
2. కంటికి కనిపించనిది ఒకదినాన్న ప్రత్యక్ష మవుతుంది అనే నమ్మకం.
విశ్వాసం అంటే?
• చీకటిలోనికి దూకడం కాదు.
• గాలిలో మేడలు కట్టడం కాదు.
• దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి వుంది.
• నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుష్యులు చెప్పే ప్రతీ మాటను నమ్మదు.
• దేవుడు వెల్లడించాడు అని మనుష్యులు అనుకునే ప్రతీదానినీ స్వీకరించదు.
• పరిశుద్ధ గ్రంధంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది.
*నమ్మిక, విశ్వాసం ఒక్కటి కాదు.
•నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం.
•నమ్మిక అనేది విశ్వాసంలోనికి నడిపించాలి.
బ్లాండిన్ అనే వ్యక్తి నయాగర జలపాతం మీద తాడుపై నడుస్తున్న సందర్భమది. ఆయన నడచుకుంటూ వస్తుంటే ప్రజలంతా జేజేలు పలికారు. బ్లాండిన్ అంటున్నాడు నేను తిరిగి అవతలకు వెళ్లి పోగలను నమ్ముతున్నారా? అంతా అవును! నీవు వెళ్లి పోగలవు అంటున్నారు. బ్లాండిన్ మరళా అంటున్నాడు నా భుజాల మీద ఒకరిని ఉంచుకొని వెళ్లి పోగలను నమ్ముతున్నారా? ప్రజలంతా ... అవును! మేము నమ్ముతున్నాం!
అయితే, మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి. అంతా నిశ్శబ్దం!!! ఎవ్వరూ ముందుకు రావట్లే.
కారణం?
చూచిన దానిని నమ్మగలిగారు. అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించ లేకపోయారు.
విశ్వాసం అంటే?
పూర్తిగా ఆధారపడడం!
దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసాడని నమ్ముతాము. కాని, మన జీవితంలో ఎదురుపడే ఎర్ర సముద్రమువంటి ఆటంకాలను దేవుడు చీల్చి, దానిగుండా మన గమ్యానికి నడిపించగలడని విశ్వసించ లేకపోతున్నాం.
కారణం?
సమస్యను చూచి భయపడుతున్నాము తప్ప, ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవునిపైన ఆధారపడలేక పోతున్నాం! ఆయన శక్తిని అర్ధం చేసుకోలేక పోతున్నాం!
అవిశ్వాసులుగానే ఉంటూ, ఆశీర్వాధాలు జార విడుస్తున్నాం!

వద్దు! ప్రతీ పరిస్థితియందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడదాం! ఆశీర్వాధాలు అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విశ్వాసము

(రెండవ భాగము)

విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను. హెబ్రీ 11:7
*విశ్వాసము అంటే? కంటికి కనిపించనివి వున్నాయి అని నమ్మడమే.
మనకయితే అన్నీ సందేహాలే. అనుమానం ముందుపుట్టి, తర్వాత మనము పుట్టినట్లు ఉంటంది మన పరిస్థితి.
విచిత్రమేమిటంటే?
అనుమానించవలసిన వాటిని మాత్రం గుడ్డిగా నమ్మేస్తాం! నమ్మవలసిన వాటిని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నమ్మము.
అయితే, నోవాహు జీవితంలో అట్లాంటి వాటిని చూడలేము.
•నోవాహు అప్పటి వరకు తన జీవితంలో భూమి మీద ఒక్క వర్షపు చినుకుపడడం చూడలేదు.
అయితే, దేవుడు అంటున్నాడు. ఏకరీతిగా నలభై రాత్రులు, పగళ్ళు ఆకాశం నుండివర్షం కురుస్తుందని.
కాని, నోవాహు అదెట్లా సాధ్యమని దేవుని ప్రశ్నించలేదు.
•ఓడను సిద్ధం చేసుకో అని కొలతలు కూడా దేవుడు ఇచ్చేసాడు.
అయితే నోవాహు, ఆ ఓడను నిర్మించడానికి నాకంత డబ్బెక్కడిది? అని దేవునిని ప్రశ్నించలేదు.తన పని తానూ చేసుకుంటాడని దేవునియందే విశ్వాసముంచాడు. (కాబట్టే! జలప్రళయం తర్వాత యావత్ భూమి నోవాహు స్వంతమయ్యింది)
• ఓడను ఏదో ఒక నదిప్రక్కన నిర్మించాలి. కాని దేవుడు చెప్పిన స్థలం అట్లాలేదు.
అయితే, ప్రజలందరికి, ఆ ఓడను నిర్మిస్తున్న వారికీ అదే సందేహం. కాని అట్టి సందేహం నోవాహుకు లేదు.
120 సంవత్సరాలు జల ప్రళయం గురించి నోవాహు ప్రకటిస్తూవుంటే?
ఆ రాతి హృదయాలు స్పందించనే స్పందించలేదు. అంతేకాదు, అతని విశ్వాసం అతనిని పిచ్చోడినిగా చేసింది.
చిన్న పిల్లల మొదలుకొని, వృద్ధుల వరకూ అంతా అతనిని గేళి చేసేవారు. అప్పుడు కూడా అతని విశ్వాసం పట్ల అతనికి ఎట్లాంటి సందేహము రాలేదు.
కారణం?
దేవుడు చేయబోయేది ముందే చెప్తాడు. చెప్పింది తప్పక చేసితీరతాడు. తన కుటుంబాన్ని రక్షిస్తాడు. అదే నోవాహు విశ్వాసం.
ఆ విశ్వాసమే,
•అతని కుటుంబాన్ని రక్షించ గలిగింది.
•లోకం మీద నేరస్థాపన చెయ్యగలిగింది.
•అతనిని నీతిమంతుల జాబితాలో చేర్చగలిగింది.
ఒక్క మాట!!
నోవాహు విశ్వాసం తన కుటుంబాన్ని రక్షించగలిగింది. మన విశ్వాసం కనీసం మనలను రక్షించగలుగుతుందా?
అవిశ్వాసులుగానే ఉంటూ, ఆశీర్వాధాలు అనుభవించ లేకపోతున్నామా?

వద్దు! ప్రతీ పరిస్థితియందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడదాం! ఆశీర్వాధాలు అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విశ్వాసము

(మూడవ భాగము)


అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.
హెబ్రీ 11:8

అబ్రాహాము పేరు అప్పటికి 'అబ్రాము'. అతని తండ్రి పేరు తెరహు. తండ్రి విగ్రహాలను తయారు చేస్తుంటే? అబ్రాహాము వాటిని అమ్మేవాడు. అట్లా వారి జీవనం సాగుతుండేది.

ఒకరోజు దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను ఆశీర్వధిస్తాను అని చెప్పాడు.

విగ్రహాలు అమ్ముకునే అబ్రాహాముకు
•ప్రత్యక్షమైన ఆదేవుడెవరో?తెలియదు.
•ఎక్కడకి వెళ్ళమంటున్నాడో?తెలియదు.

అబ్రాహాముకు దేవుడు అడ్రస్ చెప్పలేదు. చెప్పివుంటే? ఆ ప్రాంత పరిస్థితులు తెలుసుకోవడానికి అవకాశం వుండేది. బయలుదేరమన్నాడు తప్ప, ఎక్కడకి వెళ్ళాలో చెప్పలేదు.

మనమయితే దేవునిని ఎన్ని ప్రశ్నలు అడిగేవాళ్ళమో?
కాని, అబ్రాహాము మారు మాట్లాడలేదు.
ఆయన దేవుడో? కాదో? పరీక్షించే ప్రయత్నమూ చెయ్యలేదు.

దేవుని పిలుపుకు లోబడి బయలుదేరాడు.
దారిలో అంతా అడుగుతున్నారు.
అబ్రాహాము ఎక్కడకి వెళ్తున్నావు?

ఎక్కడకి వెళ్తున్నాడో తనకి తెలిస్తేకదా చెప్పడానికి?
దానికి అబ్రాహాము సమాధానం 'ఏమో?'

ఎక్కడకి వెళ్తున్నాడో తెలియని వాడిని పిచ్చోడు అంటాము.
ఇప్పుడు అబ్రాహాము విశ్వాసము అతనిని పిచ్చోడిని చేసింది. అయినా, అతని ప్రయాణం ఆగలేదు.

ఆ దినాన్న ప్రారంభమయిన ఆయన విశ్వాస ప్రయాణం అతనిని ఎంత ఎత్తుకు చేర్చింది అంటే?

భూమియొక్క సమస్త వంశములు ఆయనయందు ఆశీర్వధించబడ్డాయి.

•మీ తండ్రి ఎవరని యూదులను అడిగితే వారు చెప్పే సమాధానం 'అబ్రాహాము'
•మీ తండ్రి ఎవరని ముస్లింలను అడిగితే వారు చెప్పే సమాధానం 'అబ్రాహాము'
•మీ తండ్రి ఎవరని క్రైస్తవులను అడిగితే వారు చెప్పే సమాధానం 'అబ్రాహాము'

అంతేకాదు ఆయన వంశములో నుండి వచ్చిన యేసు ప్రభువు వారి ద్వారా మిగిలిన వంశములన్నియూ ఆశీర్వధించబడ్డాయి.

దీనికంతటికీ కారణము?
అబ్రాహాము విశ్వాసమే.
అతని విశ్వాసము అతనిని 'విశ్వాసులకు తండ్రి'గా చేసింది.

మన జీవితాలు ఎట్లా వున్నాయి?
అను నిత్యమూ వాక్యము ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నప్పటికీ లోబడలేక పోతున్నాం! విశ్వసించ లేకపోతున్నాం! ఆయనపై ఆధార పడలేకపోతున్నాం!

అవిశ్వాసులుగానే ఉంటూ, ఆశీర్వాధాలు అనుభవించ లేకపోతున్నాం!

ఆయన మాటకు విధేయులం కాలేక అవిధేయులుగానే జీవిస్తున్నాం!

వద్దు!
ప్రతీ పరిస్థితియందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడదాం!
ఆయన చిత్తానికి లోబడదాం!
ఆశీర్వాధాలు అనుభవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విశ్వాసము

(నాలుగవ భాగము)


అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను.
ఆది 22:2

పరిశుద్ధ గ్రంధములో దేవుడు ఒక మనిషిని బలిగా కోరిన సందర్భం ఇదొక్కటే.
దేవునిని గురించి తెలియని వాళ్ళు ఇది చదివితే? క్రైస్తవులు ఆరాధించే దేవుడు ఇట్లాంటి వాడా? అనుకుంటారు.

ఆయన బలిని కోరేవాడు కానేకాదు. బలి ఆయనకు ఇష్టమైతే అబ్రాహామును అడ్డగించే వాడుకాదు.

వృద్ధాప్యమందు నేనిచ్చిన కుమారునికి ప్రాధాన్యత ఇస్తాడా? ఆ కుమారుని ఇచ్చిన నాకు ప్రాధాన్యత ఇస్తాడా? అని అబ్రాహాము విశ్వాసానికి దేవుడు పెట్టిన పరీక్ష మాత్రమే.

దేవుడు అడుగుతున్నాడు.
'నీవు ప్రేమించు ఇస్సాకును దహనబలిగా నర్పించు'
దహన బలి అంటే?
నరికి, బూడిదగా చెయ్యడం.
ఎవరిని?
కన్న కొడుకుని (తాను ప్రేమించే కొడుకుని)

అబ్రాహాము ఒక్క మాటకూడా మాట్లాడలేదు. విధేయత ప్రశ్నించదు.

ఇంతటి విశ్వాసమునకు కారణమేమిటి?
ఒక్కటే! దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే? ఇస్సాకు తప్పక బ్రతికివుండి తీరాలి. అందుచే దేవుడు ఇస్సాకును చంపడు. చంపినా తిరిగి బ్రతికించగలడు.

దహన బలికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. చివరి చూపుగా నీ కొడుకుని చూచుకో అనే చిన్న మాట కూడా శారాతో చెప్పలేదు.

పనివారిని తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళాడు. దహన బలి అర్పించే స్థలానికి కాస్త దూరంలో పనివారితో అంటున్న మాట. మీరు ఇక్కడే వుండండి 'మేము' దహనబలి అర్పించి "తిరిగి వస్తాము".

అదేంటి? వస్తాము అంటున్నాడు? వస్తాను అనాలి కదా? బైబిల్ లో ప్రింట్ తప్పు పడిందా? కాదు! ఆయన మాటల్లోని విశ్వాసము మనకు అంతుపట్టదు. కనీసం మన ఊహలకు కూడా అందదు.

కట్టెల మోపు ఇస్సాకు మీద ఉంచాడు. అంటే? కట్టెల మోపు ఎత్తుకొని ఇస్సాకు మోరియా పర్వతం ఎక్కుతున్నాడంటే? అతడు చిన్నపిల్లాడు కాదు.

ఇస్సాకు అడుగుతున్నాడు. డాడీ! దహనబలికి కట్టెలు, నిప్పు వున్నాయిగాని, గొర్రెపిల్ల ఏది?
ఆ ప్రశ్నకు అబ్రాహాము గుండె ఆగిపోవాలి.

కాని, అబ్రాహాము అంటున్నాడు. "దేవుడే చూచుకుంటాడు"
అబ్బా! అబ్రాహాము విశ్వాసం చూస్తుంటే? శరీరం జలదరిస్తుంది కదా?

అబ్రాహాము బలిపీఠము కట్టాడు. కట్టెలు పేర్చాడు,ఇస్సాకును బంధించి దాని మీద వుంచి, కత్తి పైకెత్తాడు. కొద్ది క్షణాల్లో ఆ కత్తి ఇస్సాకు మెడను రెండుగా చీల్చబోతుంది.


కత్తి పైకెత్తే వరకు అబ్రాహామును పరీక్షించాడు గాని, ఆ కత్తి ఇస్సాకు మీదికి దిగనియ్యలేదు. అబ్రాహాము చెప్పినట్లే దహనబలికి బలిపశువును దేవుడే చూచుకున్నాడు.
విశ్వాసవీరుడు విజయం సాధించాడు. మరిన్ని వాగ్దానాలు స్వతంత్రించు కున్నాడు.

మనమయితే, ఆయన మాటకు విధేయులం కాలేక, అవిశ్వాసులుగానే ఉంటూ, ఆశీర్వాధాలు అనుభవించ లేకపోతున్నాం!

వద్దు!
ప్రతీ పరిస్థితియందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడదాం!
ఆయన చిత్తానికి లోబడదాం!
ఆశీర్వాధాలు అనుభవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విశ్వాసము

(ఐదవ భాగము)

విశ్వాసము అంటే?
నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపము

నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
రోమా 4:18

'అబ్రాహాము' అనుమాటకు
'అనేక జనములకు తండ్రి' అని అర్ధం.

అనేక జనములకు తండ్రి కావాలంటే? కనీసం ఒక్క కుమారుడైనా వుండాలి కదా? లేడే? (ఇష్మాయేలు వాగ్ధాన పుత్రుడు కాదు)

అప్పటికే అబ్రాహాముకు నూరేళ్ళు, శారమ్మకు తొంబై ఏళ్ళు. ఆయనొక ముసలోడు, ఈమె ఒక ముసలమ్మ.

సృష్టి ధర్మము ప్రకారముగా వారి శరీరధర్మం నిలిచిపోయింది. శరీరం మృతతుల్య మయ్యింది.

ఇక బిడ్డలకోసం నిరిక్షించడానికి వారికున్న ఆధారమేదీలేదు.

అయితే,
నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

కారణం?
•సృష్టికర్తే తన దేవుడైనప్పుడు, ఇక సృష్టి ధర్మంతో పనేముంది?
•వడ్డించే వాడు మనవాడయినప్పుడు ఎక్కడ కూర్చుంటే ఏమయ్యింది?

మాట ఇచ్చిన దేవుడు శక్తి మంతుడు, సమర్ధుడు అని విశ్వసించ గలిగాడు అబ్రాహాము. . ఆయనపైనే పూర్తిగా ఆధారపడగలిగాడు.

దేవుడు తనకిచ్చిన వాగ్దానంతప్ప మరే ఇతర అననుకూల పరిస్థితులు ఆయన కళ్ళముందు కదలాడట్లేదు.

నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆ నిరీక్షణ అతనిని సిగ్గు పరచలేదు.

అన్ని పరిస్థితులూ నీకు అనుకూలముగా వుండి, అన్నీ నీవు అనుకున్నట్లే జరిగితే అది'సహజం'. అద్భుతమేమి కాదు.

కాని, అన్ని దారులూ మూసుకుపోయి ఇక ఏ అవకాశమూ లేని పరిస్థితులలో నీవు ఆశించినదానికంటే అత్యధిక మేలులతో నీ జీవితం నింపబడితే? అది 'అధ్బుతం'.

దేవుడు అద్భుతమే నీ జీవితంలో చెయ్యాలని ఎదురు చూస్తున్నాడు.
కాని, అట్లాంటి పరిస్థితులు నీవు కల్పించడం లేదేమో? ఆయనపై ఇంకా పూర్తిగా ఆధారపడలేక పోతున్నావేమో?
నీవున్న పరిస్థితులు ఆయన శక్తిని, సామర్ధ్యమును గుర్తించకుండా అడ్డగిస్తున్నాయేమో?

నీవు విశ్వసించ గలిగితే?
ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు. సమస్తమూ సాధ్యమే.

•రాళ్ళ వలన పిల్లలను పుట్టించగలడు.
•కాకులతో సహితం నిన్ను పోషించగలడు.
•బండను చీల్చి నీ దాహాన్ని తీర్చగలడు.

ఆయన యందు నమ్మిక మాత్రం వుంచు. అదెన్నటికీ నిన్ను సిగ్గు పరచదు.

విశ్వసించి చూడు!
విజయం నీదే!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విశ్వాసము

(ఆరవ భాగము)


మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,
ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.
హెబ్రీ 11:24-26

మోషే:
•ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించిన వాడు. •మాటలయందును కార్యములయందును ప్రవీణుడు.
అపో 7:22

అంతటి ప్రావీణ్యం పొందిన మోషే అరణ్యంలో తన మామ మందలను మేపుతున్నాడు. నిర్గమ 3:1

కారణం?
మోషే తేల్చుకోవలసిన రెండు విషయాలు ఆయన ముందు నిలబడ్డాయి.

• దేవుడా? ----లోకమా?
•ఐగుప్తు ధనమా?---క్రీస్తువిషయమైన నిందా?
•అల్పకాల పాపభోగమా?---దేవుని ప్రజలతో శ్రమా?
•ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకోవడమా? ----అధికారాన్ని త్రోసివేయడమా?

*ఆలోచించడం మొదలు పెట్టాడు.

*ఐగుప్తు ధనమా?
నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.మత్తయి 6:21
ధనము దేవుని నుండి దూరం చేస్తుంది. అది వద్దు అనుకున్నాడు.
*అల్పకాల పాపభోగమా?
పాప భోగము కొంత శారీరికమైన సంతోషాన్ని ఇవ్వొచ్చు. కాని అది అల్పకాలమే. దాని గమ్యం మాత్రం నిత్య
మరణం. అదీ వద్దు అనుకున్నాడు.

*ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకోవడమా?
'హోదాను బట్టి' అతిశయించడం అతనికి ఇష్టం లేదు. కారణం?

అతిశయం ఏదైనా వుంది అంటే?
భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించు చున్న దేవుని బట్టియే.
యిర్మియా 9:23,24

*ఇప్పుడు మోషే ముందు మిగిలియున్న అంశాలు:
•క్రీస్తువిషయమైన నింద
•దేవుని ప్రజలతో శ్రమ
• అధికారాన్ని త్రోసివేయడం.

అవును! వీటిని సంతోషముతో స్వీకరించాడు.
•నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవించడానికి సిద్ధ పడ్డాడు.
•అంతఃపురాన్ని విడచి అరణ్యానికి చేరాడు.
•యువరాజు మంద కాపరిగా మారాడు.

కారణం?
విశ్వాసమునుబట్టి అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.

•దేవునిని ప్రక్కనబెట్టి ధనం కోసం ప్రాకులాడే మన జీవితాలకు,
•అల్పకాల సుఖ భోగాలతో దేవుని ఆలయమైన మన శరీరాలను పాడు చేసుకుంటూ, నిత్య మరణానికి దగ్గరవుతున్న మన జీవితాలకు,
•హోదా, అధికారం కోసం అడ్డ దారులు తొక్కుతూ, వాటితో మనలను మనమే ఘన పరచుకోవాలని ఆరాటపడుతున్న మన జీవితాలకు,
మోషే జీవితం గొప్ప ఆధ్యాత్మిక పాటం.

మన జీవితాలు సరిచేసుకుందాం!
ఆ పరమ కనానుకు చేరుదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విశ్వాసము

(ఏడవ భాగము)

విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.
హెబ్రీ 11:30

దేవుడు అవలంభించే విధానాలు కనీసం మన ఊహలకు కూడా అందనే అందవు.
పని జరిగించడంలో దేవుడు అనుసరించే నియమాలు మనుష్యుల నియమాలకు పూర్తి భిన్నంగా వుంటాయి.

*అందుకే ఆయన అంటున్నాడు.

నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు
ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి. యెషయా 55:8,9

యెరికో గోడలు ఎంత బలమైనవి అంటే? వాటిని కూల్చడానికి వారి దగ్గరున్న ఆయుధాలు సహితం చాలవు.

కాని దేవుడు చెప్తున్న మాటలు? 'కేకలు వెయ్యండి' కూలిపోతాయి.

మనమయితే చెప్పిన పని చెయ్యలేము గాని, ప్రశ్నించడంలోనూ, సలహాలివ్వడంలో మనకు మించిన వారెవ్వరూ వుండరు.

దేవునినే ప్రశ్నిస్తాము.
అదేంటి ప్రభువా?
సమ్మెటలతో కొట్టినా కూలవుకదా? కేకలు వేస్తే ఎట్లా కూలిపోతాయని?

కాని, యెహోషువా దేవునిని ప్రశ్నించలేదు.
కారణం?
'విధేయత' ప్రశ్నించదు.

యెహోషువా దేవుడు చెప్పిన దానిని ప్రజలతో చెప్పాడు. వారూ ప్రశ్నించలేదు.

ప్రదక్షిణలు, బూరలు, కేకలు ఎట్టి పరిస్థితులలోనూ యెరికో గోడలు కూల్చలేవు.

*అట్లా అయితే? దేవుడు ఎందుకు అట్లా చెయ్యమన్నాడు?

నేను చెప్పినదానిని
విశ్వసిస్తారా? లేదా?
నేను చెప్పినట్లు చేస్తారా? లేదా?
అని వారిని పరీక్షించ డానికి మాత్రమే.

యెరికో గోడలు కూల్చగలిగేవి వారి కేకలు ఎంత మాత్రమూ కాదు గాని, వారి యొక్క విశ్వాసము మాత్రమే.

•దేవుని మాటలు విన్నారు. •విశ్వసించారు.
•విధేయులయ్యారు.
•విజయం సాధించారు.
యెరికోను స్వాధీన పరచుకోగలిగారు.

అయితే ఒక్క విషయం!
దేవునికి, మనకు అడ్డుగానున్న యెరికో అనే పాపపుగోడ చేధించబడకుండా, పరిశుద్ధత లోనికి ప్రవేశించలేము. పరమ కనానును స్వతంత్రించుకొనలేము.

అయితే అదెట్లా సాధ్యం?
•ఆయన మాట వినాలి.
•విశ్వసించాలి.
•విధేయత చూపాలి.

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులవుదాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విశ్వాసము

(ఎనిమిదవ భాగము)

విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.
హెబ్రీ 11:31

'రాహాబు' తన శరీరాన్ని అమ్ముకొని, దేవునికి అసహ్యకరమైన జీవితాన్ని జీవించే స్త్రీ.

అట్లాంటి స్త్రీ, దేవుని గురించి తానిస్తున్న సాక్ష్యం, దేవుని పట్ల ఆమెకున్న అచంచలమైన విశ్వాసమును రుజువు చేస్తుంది.

*యెరికోను వేగు చూడడానికి వెళ్ళిన మనుష్యులు ఆమె ఇంటికి వెళ్ళారు.

అదేంటి? వారు వేశ్య ఇంటికి వెళ్ళడం?
• ఆదినాలలో వేశ్యా గృహాలలో హోటల్స్ , రాత్రి బస చేయడానికి గదులు ఉండేవి. అందు నిమిత్తం వెళ్లివుండ వచ్చు.
• లేదా అనేక మంది అక్కడకి వస్తూ పోతూ వుంటారు కాబట్టి వారికి కావలసిన సమాచారం దొరుకుతుందని వెళ్లియుండ వచ్చు.
•లేదా ఆమె కుటుంబాన్ని రక్షించడానికి దేవుడే వారిని అక్కడకి పంపి యుండవచ్చు.

*ఏది ఏమయినా? రాహాబు మాత్రం తన ఇంటికి వచ్చిన వేగువారిని ఆ దేశ సైనికుల కంటబడకుండా దాచిపెట్టి, ఆతర్వాత ఆ వేగువారితో ఈ రీతిగా మాట్లాడుతుంది.

యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును.

మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి.

మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశ మందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.
యెహోషువా 2: 9-11

ఎంతటి అచంచలమైన విశ్వాసము రాహాబు మాటల్లో కనిపిస్తుంది?

సంవత్సరాలు తరబడి దేవుని మాటలు వింటూనేవున్నాం! కాని,
దేవుని పట్ల అటువంటి భయముగాని, అటువంటి విశ్వాసము గాని మన జీవితాల్లో ఏకోశానా లేదే?

వేశ్యగా సమాజములో అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, ఆమె విశ్వాసం తనతో పాటు, తన కుటుంబమంతటిని రక్షించ గలిగింది.

అంతేకాదు, ఆమె విశ్వాసం ఆమెకు 'పరిశుద్దుడును, మన ప్రియ రక్షకుడునునైన' యేసు క్రీస్తు వంశావళిలో ఒక ప్రత్యేకమైన స్థాన్నాన్నిచ్చింది.

ఇంత గొప్ప ధన్యతకు కారణం? ఆమె పరిశుద్ధత, నీతి ఎంతమాత్రమూ కారణం
కాదుగాని, 'ఆమె విశ్వాసమే'.

మనమయితే,
అవిశ్వాసులుగానే ఉంటూ, ఆశీర్వాధాలు అనుభవించ లేకపోతున్నామా?

వద్దు!
ప్రతీ పరిస్థితియందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడదాం!
ధన్యకరమైన జీవితాన్ని జీవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విశ్వాసము

(తొమ్మిదవ భాగము)

మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దానియేలు 3:17

రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమయొకటి చేయించి, బబులోనుదేశములోని దూరాయను మైదానములో దాని నిలువబెట్టించెను. సకల వాయిద్యములు వినిపించుచుండగా, ఆ దేశములో నివసించు ప్రజలంతా ఆ ప్రతిమకు సాగిలపడి నమస్కరించాలి. సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఇది తిరుగులేని రాజాజ్ఞ.
కాని, షద్రకూ, మేషాకూ, అబేద్నెగో అనే హెబ్రీ యువకులు రాజాజ్ఞను లెక్క చేయలేదు. అయినప్పటికీ, రాజు వారికి మరొక అవకాశం ఇచ్చాడు.

దానికి వారంటున్న మాట.
"మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;
మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను
రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టిం చిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. దానియేలు 3:17,18

*వారు ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా?
రాజ్యాధికారాన్ని శాసించే రాజుతో మాట్లాడుతున్నారు.

*ఇంతకీ, షద్రకూ, మేషాకూ, అబేద్నెగో ఎవరో తెలుసా?
చెరపట్టబడిన బానిసలు.

వారిని విడిపించే వారు ఈలోకంలో ఎవ్వరూ లేరు. అయినా వారి కెందుకంత ధైర్యం?
ఒకాయన వున్నాడు. ఆయన రాజులకు రాజు. రాజుల చేతిలోనుండి విడిపించగల సమర్ధుడు. అదే వారి విశ్వాసం.

*అందుకే, రాజుతో తెగేసి చెప్పేశారు.
•ఆరోజు నీవు తినే ఆహారంతో మా శరీరాలను అపవిత్రం చేసుకోలేదు.
•ఈరోజు ఈ ప్రతిమకు నమష్కరించి మా హృదయాలను అపవిత్రం చేసుకోలేమని.

•రాజాగ్రహం రెట్టింపయ్యింది.
•అగ్ని గుండం ఏడంతలయ్యింది.
•మంటల్లోకి విసిరినవారే మాడిపోయారు.
•ఇక మంటల్లో పడినవారి సంగతేంటి?
ఊహించలేము కదా?

అవును! ఎట్లా ఊహించగలము?
ముగ్గురిని విసిరితే నలుగురుంటారని.

•రాజు మైండ్ బ్లాక్ అయ్యింది.
•వారి దేవుడు ఎంత సమర్థుడో అర్ధమయ్యింది.
•అతని ప్రయత్నమంతా వ్యర్ధమయ్యింది.
అబ్బా! ఎంత అద్భుతం?
ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదే?
కనీసం అగ్నివాసన కూడా వారికంటలేదే?
*రాజు పిలుపు మారిపోయింది . "మహోన్నతుడగు దేవుని సేవకులారా!"
*రాజు శాసనం మారిపోయింది.
•వీరి దేవుడు రక్షించగల సమర్ధుడు, పూజార్హుడు. ఎవడైననూ వీరి దేవుని దూషించిన యెడల వాడు తుత్తునీయలుగా చేయబడును. వాని ఇల్లు పెంటకుప్పగా ఉండును.
అవును!
•ముగ్గురు యవ్వనుల విశ్వాసం రాజశాసనాన్ని సహితం మార్చగలిగింది.
• చెరపట్టబడిన వారిని సంస్తానాధిపతులను చేసింది.
మన విశ్వాసం ఎట్లావుంది?
అవిశ్వాసులుగానే ఉంటూ, ఆశీర్వాధాలు అనుభవించ లేకపోతున్నామా?
వద్దు!
ప్రతీ పరిస్థితియందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడదాం!
ధన్యకరమైన జీవితాన్ని జీవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


విశ్వాసము

(పదియవ భాగము)

దానియేలు:
•చెరపట్టబడిన యూదుడు
•అతిశ్రేష్ఠమైన బుద్ధి గలవాడు.
•దేవుని దృష్టికి నిర్దోషి.
•దేవతలవంటి ఆత్మ గలవాడు.
•దినమునకు మూడుసార్లు ప్రార్ధించే యోధుడు.
•తన పనిలో నమ్మకస్థుడు.
•దేవుని దృష్టిలో శ్రేష్టుడు.

దర్యావేషు తన రాజ్యమంతటిపైన నూట ఇరువదిమంది యధిపతులను, వారిపైన ముగ్గురు ప్రధానులను నియమించెను. వారిలో దానియేలు ముఖ్యుడు.
కావున, వీళ్ళంతా రాజ్యములో జరిగే విషయాలకు ఈయనకు లెక్క చెప్పవలసి వచ్చేది.

దానియేలు అక్రమాలు చెయ్యడానికి వారితో చేతులు కలిపినవాడు కాదు. అందుచే అధికారం వారి చేతిలో ఉన్నప్పటికీ వారి ఆటలు సాగేవి కాదు.

అట్లా అని, దానియేలును తప్పుపట్టే అవకాశం ఎవ్వరికీ లేనేలేదు. కారణం? అతడు తప్పు చెయ్యడు.

దేవునికి ప్రార్ధించే విషయంలో తప్ప, ఇక దేనిలోనూ అతనిని పట్టుకోలేమని యోచించి,

వీళ్ళంతా కలసి దానియేలును భూమి మీద లేకుండా చేసెయ్యాలని ఒక ప్రణాళిక రచించారు. కాని, వాళ్ళే లేకుండా పోతారనే విషయం వారికి తెలియదు.

రాజుపట్ల ప్రేమను నటించి నీవే మాకు సర్వస్వం అంటూ...
"ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును."
దానియేలు 6:7
అని చెప్పి ఒక శాసనాన్ని చేయించారు.

రోజుకు ముమ్మారు దేవునికి ప్రార్ధించే దానియేలు వారికి దొరికిపోయాడు.

ఎవరిని మ్రింగుదునా అని గర్జించే సింహంలా తిరుగుతున్నా సాతాను పన్నాగానికి అతడు తల వంచినవాడు కాదు.
యూదా గోత్రపు సింహము వైపు చూస్తూ ,ఆయనపైనే విశ్వాసముంచి సింహాల బోనుకే సిద్ధపడ్డాడు.

రాజు అతనిని తప్పించడానికి సూర్యు డస్తమించువరకు ప్రయత్నము చేసినాగాని, తాను చేసిన శాసనానికే తలవంచవలసి వచ్చింది. ఇక చేసేది ఏమి లేక, సింహాల బోనుకే అప్పగించవలసి వచ్చింది.

రాజు రక్షించలేక పోవచ్చు. కాని తాను విశ్వసించే రాజుల రాజుకు అసాధ్యమైనది లేదుకదా? సింహాల నోళ్లను మూయించి, దానియేలును రక్షించి, ఆయన మీద నిందమోపిన వారిని, వారి కుటుంబాలను ఆ సింహాలకు అప్పగించెను.

దానియేలు యొక్క విశ్వాసము తాను ప్రార్ధించే దేవుడు, ఎంతటి శక్తిమంతుడో రాజుకు, తద్వారా ఆ రాజ్యానికి అర్ధమయ్యేలా చేసింది.

అందుకే దర్యావేషు ఇట్లా వ్రాయిస్తున్నాడు.

దానియేలుయొక్క దేవునికి భయ పడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను.
ఆయనే జీవముగల దేవుడు,
ఆయనే యుగయుగములుండువాడు,
ఆయన రాజ్యము నాశనముకానేరదు,
ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును.
ఆయన విడిపించువాడును రక్షించు వాడునైయుండి,
పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు.
ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను.
దానియేలు 6:26,27

మనమునూ శోధనలవైపు కాకుండా.. శోధనలనుండి తప్పించే దేవునిపై విశ్వాసముంచి సాగిపోదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విశ్వాసము

(పదకొండవ భాగము)

కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
సంఖ్యా 13:30

వాగ్ధాన భూమిని స్వతంత్రించు కొనుటకుగాను, ఆ దేశ పరిస్థితులు తెలిసుకొనుటకుగాను, పండ్రెండు గోత్రములలో నుండి, పండ్రెండుగురిని మోషే కనానుకు పంపించాడు.

వారిలో కాలేబు, యెహోషువా తప్ప మిగిలిన పది మంది తెచ్చిన సమాచారం ఏమిటంటే?

•అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే
•ఆ దేశములో నివసించు
జనులు బలవంతులు;
మనము వారితో యుద్ధం చెయ్యలేము.
•వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి.
•మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము.
•మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.
•మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.

*అయితే, వారిలో కాలేబు, యెహోషువా తెచ్చిన సమాచారం ఏమిటంటే?

•మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము.
•అది పాలు తేనెలు ప్రవహించుదేశము.
•యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును
•యెహోవా మనకు తోడైయున్నాడు. గనుక, వారికి భయపడవలసిన పనిలేదు.
•దాని జయించుటకు మన శక్తి చాలును.

*ఎందుకు? వారికి, వీరికి మధ్య ఇంత వ్యత్యాసము?

•వారు ఉన్నత దేహులను చూస్తున్నారు.
•వీరు ఉన్నత దేవునిని చూస్తున్నారు.

•వారు బలవంతులైన మనుష్యులను చూస్తున్నారు.
•వీరు బలవంతుడైన దేవునిని చూస్తున్నారు.

•వారు సమస్యను చూస్తున్నారు.
•వీరు సమస్యను పరిష్కరించగల దేవునిని చూస్తున్నారు.

•వారు ఆ దేశ ప్రాకారాలను చూస్తున్నారు.
•వీరు దేవునినే ప్రాకారముగా కలిగియున్నారు.

•వారు మిడతలము ఆనుకొని వారిని వారు బలహీన పరచుకొంటున్నారు.
•వీరు మిడతల దండుచే ఐగుప్తీయులను భయపెట్టిన దేవుని బలాన్ని చూచి, బలాన్ని పొందుకొంటున్నారు.

•అక్కడనున్న భయంకరమైన పరిస్థితులు తప్ప, వారికేమి కనిపించట్లేదు.
•దేవుని వాగ్దానం తప్ప వీరికేమి కనిపించట్లేదు.

అందుకే, సుమారు 30లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరితే? బయలు దేరిన వారిలో కేవలం వీరిద్దరు మాత్రమే వాగ్ధాన భూమికి చేరగాలిగారు.

విశ్వాసం ఎప్పుడూ పరిస్థితులను చూడదు. వాటిని పరిష్కరించగలిగే దేవునివైపు మాత్రమే చూస్తుంది.

మనమునూ శోధనలవైపు కాకుండా, శోధనలనుండి తప్పించే దేవునిపై విశ్వాసముంచి సాగిపోదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విశ్వాసము

(పండ్రెండవ భాగము)

ఒకవేళ పాస్ పోర్ట్, వీసా లేకపోయినా ఏదో సముద్ర మార్గం గుండా వేరే దేశానికి వెళ్లిపోగలవేమో గాని, యేసు క్రీస్తు లేకుండా, నిత్యరాజ్యం చేరడానికి నీకు వేరే మార్గము లేనేలేదు.

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
యోహాను 14:6

నిత్యజీవాన్ని నీవు చేరాలంటే? దాని 'మార్గమైన' యేసు ప్రభువును నీవు చేరాలి. 'విశ్వాసమే' నిన్ను ఆయన యొద్దకు చేర్చగలదు.

1. 'విశ్వాసమే' రక్షణకు మార్గము.
మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు.
ఎఫెస్సి 2:8

నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును
మార్కు 16:16

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
రోమా 10:9

2. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే ఆయన పిల్లలు.
తన్ను ఎందరంగీకరించితిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
యోహాను 1:12

3. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే ఎత్తబడే సంఘములో వుంటారు.

కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.
యోహాను 6:47


4. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు తీర్పులోనికి రారు.
ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు.
యోహాను 3:36

5. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే
నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
యోహాను 3:16

దేవుని రాకడ సమీపం కానుంది. అబద్దబోధకులు యేసు క్రీస్తు దేవుడు కాదని అసత్య ప్రకటనలు ముమ్మరం చేస్తున్నారు. వారిని పరిశుద్ధ గ్రంధము 'సాతాను సమాజము' అని పిలుస్తుంది.

*అయితే ఒక్క విషయం ఆలోచించు!!!
యేసు క్రీస్తును దేవునినిగా, అంగీకరించనివారు, విశ్వసించనివారు
•ఎట్లా రక్షించ బడతారు?
•ఎట్లా ఆయన పిల్లలుగా పిలువబడతారు?
•ఎట్లా ఎత్తబడే సంఘములో వుంటారు?
•ఎట్లా తీర్పు నుండి తప్పించ బడతారు?
•ఎట్లా నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు?

•సాధ్యం కానేకాదు.
•నిత్య మరణమే వారి గమ్యం.

వద్దు!
యేసే దేవుడని విశ్వసిద్దాం!
ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

సమరయ స్త్రీ

పేతురు వ్రాసిన పత్రికలు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

అబ్రాహాము విశ్వాసయాత్ర

యేసు క్రీస్తు రెండవ రాకడ

పక్షిరాజు

శరీర కార్యములు

పాపము