సమరయ స్త్రీ
సమరయ స్త్రీ
మొదటి బాగము.దేవుని నామమునకు మహిమ కలుగును గాక! యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభుల వారు సువార్త ప్రకటిస్తూ మార్గమధ్యంలో సమరయ అనే ప్రాంతం వస్తారు. అక్కడ సుఖారు అనే గ్రామ శివారులో యాకోబుగారు యోసేపుకిచ్చిన బావి దగ్గర అలసినరీతినే కూర్చొన్నారు. అప్పుడు ఇంచుమించు పండ్రెండు గంటలయ్యింది అని వ్రాయబడింది.(4,6 వచనాలు)
ఏసుప్రభువు యూదుడు. వెళ్ళిన ప్రాంతం సమరయ. ఇశ్రాయేలు దేశం ప్రాముఖ్యంగా యూదయ, సమరయ, గలలియ అనే మూడు ప్రాంతాలుగా విభజింపబడింది. యూదయ గలలియ ప్రాంతాలకి మధ్యలో ఈ సమరయ ప్రాంతం ఉంది. అయితే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయుల నీరు త్రాగరు, మాట్లాడరు, భోజనం చేయరు. సమరయులను యూదులు పాపులుగా, వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, *అంటరానివారుగా* పరిగనిస్తారు. చివరకి యూదయనుండి గలలియకు సమరయ మీదుగా దగ్గరదారి అయినా సరే చుట్టూ తిరిగివెల్తారు తప్ప సమరయలో అడుగుపెట్టరు. ఎందుకు అంటే మనం చరిత్ర తెలుసుకోవాలి.
సమరయ అనగా Watch Tower (కాపలా కోట). అది ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉంది. ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ, షెమెరు అనే వ్యక్తిదగ్గర రెండు తలాంతులకు ఆ కొండను కొని అక్కడ పట్టణం కట్టించి దానికి షోమ్రోను(సమరయ) అని పేరు పెట్టినట్టు చూస్తాం 1 రాజులు 16వ అధ్యాయం. కాలక్రమేనా ఈ పట్టణం అనేకసార్లు దాడికి గురిచేయబడ్డాది. (1,2వ రాజులు). సమరయులు అనే పేరు ఎలా వచ్చిందంటే క్రీ.పూ. 677- 721 మధ్యలో ఏషర్హద్దోన్ అనే అస్సూరు రాజు ఆప్రాంతాన్ని జయించి ఇశ్రాయేలీయులను చెరపట్టి, అస్సూరు రాజ్యానికి తీసుకోనిపోయాడు. ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఈ సమరయ ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ పెడతాడు. ఈ రకంగా వచ్చిన మిశ్రమ జాతి వారే సమరయులు.(2రాజులు 17: 24-41). ఇది దేవునికి ఇష్టంలేని పని. అందువల్ల దేవుడు సింహాలను పంపుతారు. తర్వాత వారు తమ విగ్రహాలను విడచిపెట్టి క్రమక్రమంగా యూదుల ఆచారాలను, యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెడతారు. (ఎజ్రా 4:2,9,10; లూకా 17:18). అయితే యూదులు/ఇశ్రాయేలీయులు చెర విముక్తి పొందిన తర్వాత దైవాజ్న మేరకు మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ సమరయులు మేము కూడా మీ దేవున్నే ప్రార్దిస్తున్నాం. మేము కూడా మీతోపాటు మందిరాన్ని కడతాం అంటే జెరుబ్బాబెలు, యేశూవ అనే పెద్దలు దానికి అంగీకరించరు. నెహేమ్యా గారైతే ఏకంగా మీకు మాలో పాలైనను, స్వాస్త్యమైనను లేదని ఖరాఖండిగా చెబుతారు.అప్పటినుండి యూదులకు/ఇశ్రాయేలీయులుకు మధ్య వైరం మొదలైంది. చివరకు సమరయులు గెరీజీము కొండమీద ఒక మందిరాన్ని కట్టుకొంటే క్రీ.పూ. 139 లో ఒక యూదురాజు దానిని పడగొట్టినట్లు చరిత్ర చెబుతుంది. అప్పుడు వారు సమరయ అనగా షెకెము కొండమీద ఒకమందిరాన్ని కట్టుకొని ఆరాదించడం మొదలు పెట్టారు. ఈ రకంగా ఈ రెండుజాతులకు మధ్య వైరం యేసయ్య వచ్చేవరకూ కూడా కొనసాగింది. ఇప్పటికి కూడా 160 సమరయ కుటుంబాలు ఈప్రాంతంలో నివాసం చేస్తున్నారు.
అయితే ఇటువంటి అంటరానిప్రాంతంగా, పాపపు ప్రాంతంగా,దొంగలతో నింపబడిన ప్రాంతంగా, ప్రజలందరితోను వెలివేయబడిన ప్రాంతానికి, ఏ ప్రవక్త, బోధకుడు కూడా వెళ్ళని, వెళ్ళడానికి భయపడే ప్రాంతానికి లోకరక్షకుడైన యేసయ్య తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించారు. ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదట దర్శించిన స్త్రీ మామూలు వ్యక్తికాదు. ఏ మాత్రం మంచిసాక్ష్యం లేని ఒక వ్యక్తిని ఎన్నుకొని, ఆ ప్రాంతాన్ని మార్చిన వైనం నిజంగా అధ్బుతం! ఆయన ఆశ్చర్యకరుడు! ఆలోచనకర్త! నిత్యుడగు తండ్రి! సమాధాన కర్త!
ఈరోజు నీవు కూడా ప్రజలందరితోను వెలివేయబడ్డావా? అందరూ నిన్ను ఎందుకూ పనికిరానివాడు/పనికిరానిది అని హేలనచేస్తున్నారా? నీవు అంటరానికులంలో పుట్టావు అని హేలనచేస్తున్నారా? నీ భర్త, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ నిన్ను విడచిపోయారా? భయపడొద్దు! పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈలోకానికి వచ్చారు. ఎవరైతే పాపులో, వెలివేయబడ్డారో, అంటరానివారిగా ఎంచబడ్డారో వాళ్ళ దగ్గరికే యేసయ్య వచ్చారు. ఈలోకంలో ఘనులైన వారిని వ్యర్ధం చేయడానికి ఎన్నికలేనివారిని ఆయన ఎన్నుకొన్నారు.
ఆయనకి నీవుకావాలి! ప్రయాసబడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి అని పిలుస్తున్నారు. ఆయన వద్దకు వస్తావా? వస్తే ఆయన నీపాపాన్ని కడిగి నిన్ను శుద్ధిచేసి పరలోకవారసునిగా చేస్తారు. విలువలేని నీకు విలువ నిస్తారు. అట్టి కృప మనందరికీ కలుగును గాక!
ఆమెన్!
(సశేషం)
సమరయ స్త్రీ
రెండవ బాగముప్రియ సహోదరీ/సహోదరులారా! మధ్యాహ్నం ఇంచుమించు 12గంటల సమయంలో యేసుప్రభులవారు సమరయ ప్రాంతంలో సుఖారు గ్రామ పొలిమేరల్లో గల యాకోబు బావి దగ్గర అలసియున్న రీతినే కూర్చోన్నట్లు చదువుకొన్నాం. యోహాను 4: 6,7 వచనాలు. అప్పుడు సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు రాగా యేసు- దాహమునకిమ్మని ఆమెనడిగెను.
ఇక్కడ మనం చూస్తే మధ్యాహ్నం పూట ఈ సమరయస్త్రీ నీరుకోసం బావిదగ్గరకు వచ్చింది. పల్లెటూర్లలో (పూర్వకాలం) స్త్రీలు వేకువఝామున లేచి మంచినీరుకోసం బావి దగ్గరకు వెళ్ళడం సర్వసాధారణం. అయితే ఉదయం 7గంటల తర్వాత ఎవరు బావికి రారు. ఆ సమయానికి ఆ రోజుకి సరిపడే నీళ్ళు తెచ్చేసుకొని వంట కార్యక్రమాలు కొనసాగించేవారు. కాని ఇక్కడ ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నం రావడానికి కారణం ఏమిటి?
1.తెచ్చుకొన్న నీరు అయిపోయిందా? తర్వాత వచనాలు ప్రకారం ఎంతమాత్రము కాదు.
2. Privacy కోసమా? ఒంటరితనం కోసమా? ఏమో తెలియదు. ఒకవేళ ఒంటరితనం ఆశిస్తే ఏ కారణాల వలన?
3. ఆ సమయంలో ఎవరూ బావి దగ్గర ఉండరని తెలిసా? ఏం ఎందువల్ల?
4. తన పాపపు జీవితం కొనసాగించడానికి అదే మంచి సమయమనా? ఏమో! మనకి తెలియదు.
5. *లేక తనజీవితాన్ని ఎరిగియున్న ఊరిజనం తనని సూటిపోటి మాటలతో భాదిస్తున్నందువలన వారిని తప్పించుకోడానికి ఆ సమయంలో వచ్చిందా?* మనకి తెలియదు.
పూర్వకాలంలో ఒక విషయం ఊరంతా తెలియాలంటే నీలాటిరేవు(బావి)దగ్గర చెబితే కొంతసేపటకి ఊరంతా ప్రాకిపోతుంది, ఉన్నదానికి ఇంకొంచెం కలిపి చెప్పేవారు!! ఈమె గూర్చి కూడా అలా చెప్పుకోన్నారేమో!!
6. లేక ప్రజలకి తన జీవితం ఎలాంటిదో తెలియక పోయినా తన అంతరాత్మ గద్దింపుతో ప్రజలకి తన ముఖం చూపించలేక మధ్యాహ్నం వచ్చిందేమో!!
ఒకవేళ ప్రియ చదువరీ! నీవుకూడా అదే పరిస్తితిలో నున్నావా? చింతపడకు! ఇలాంటి స్తితిలో నున్న ఒక స్త్రీని రక్షించడానికి యేసయ్య అలసిపోయినా సరే ఆ బావి దగ్గర ఆగి ఆస్త్రీతో మాట్లాడారు. ఈలోకంలో ఎవరికీ మనజీవిత రహష్యాలు తెలియకపోయినా నిన్ను నన్ను పుట్టించిన ఆ సృష్టికర్తకు తెలుసు.
ఆ సమరయ స్త్రీ ఆ సమయంలో అక్కడకు వస్తుందని తెలిసే యేసయ్య అక్కడికి వెళ్లి రక్షణను అందించారు.
నాయీను గ్రామంలో విధవరాలి ఏకైక కుమారుడు చనిపోయాడని ఎరిగి ఒక రాత్రంతా నడచి (కపెర్నహూము నుండి నాయీను కి సుమారు 32 కి.మీ.) ఉదయాన్నే ఆ గ్రామం చేరుకొని ఆ విధవరాలి కుమారున్ని బ్రతికించి ఇచ్చారు.
యేసయ్యని చూడాలని ఎప్పటినుంచో ఆశిస్తున్న పొట్టి జక్కయ్య కోసం ఆ ఊరు వచ్చి మేడిచెట్టు ఎక్కి కూర్చొన్న జక్కయ్యను పేరుపెట్టి మరీ పిలచి అంటున్నారు – జక్కయా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట బసచేయవలసి ఉంది.
మనం చేసే ప్రతీ ఆక్రందన ప్రతీ ప్రార్ధన ఆయనకు వినబడుతుంది. నశించినదాని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈలోకానికి వచ్చెను. నశించిపోయే స్తితిలో ఉన్న సమరయ స్త్రీ ని రక్షించిన యేసయ్య, నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య, జక్కయ్యను పలకరించి రక్షించిన యేసయ్య నిన్నుకూడా సరియైన సమయంలో దర్శించబోతున్నారు.
అయితే గమనించ వలసినది ఏమిటంటే “దేవుని పని, దేవుని సమయంలో, దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది.” దురదృష్టవశాత్తూ మనం అడిగిన వెంటనే పని జరిగిపోవాలి అని ఆశిస్తాము. కాని దేవుడు తన సమయంలో కార్యం చేస్తారు. మన ప్రణాళిక ప్రకారం పని జరిగితే ఆ సమస్య అప్పటికి తీరినా మరల వస్తుంది. అయితే దేవుని ప్రణాళిక ప్రకారం జరిగితే అది శాశ్వత పరిష్కారం.
కాబట్టి బెదరిపోకు! అలసిపోకు! సోలసిపోకు! దేవుడు నిన్ను త్వరలో దర్శించబోతున్నారు.
సమరయ స్త్రీని రక్షించడానికి మధ్యాహ్నం వేల కలసిన దేవుడు నిన్ను కూడా దర్శించబోతున్నారు.
ఆమెన్!
దైవాశీస్సులు!!
(సశేషం)
సమరయ స్త్రీ
మూడవ బాగముసమరయ స్త్రీ ఒకతె నీల్లుచేదుకొనుటకు అక్కడికి రాగా యేసు- నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను. యోహాను 4:7
ఇక్కడ మనకు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు కనబడతాయి.
1.*యేసుప్రభులవారు దైవమానవుడు*. ఆయన సశరీరుడుగాఈలోకంలో జన్మించినందువలన రెండుసార్లు ఆయన దప్పిగొనినట్లు బైబిల్ గ్రంధంలో చూస్తాం. ఒకసారి యాకోబు బావి దగ్గర, రెండవసారి సిలువలో వ్రేలాడుచున్నప్పుడు లేఖనం నేరవేర్పుకై. ఆయన నీలా నాలా దప్పిగొన్నారు.
మనం నిజంగా పరిశీలిస్తే ఆయన నిజమైన దాహం ఆకలి ఏమిటి?
ఇదే అధ్యాయంలో వ్రాయబడింది నశించిపోయే ఆత్మలను వెదకి రక్షించడమే ఆయన దాహం, ఆకలి!!!
క్రీస్తులో రక్షించబడి వెలిగించబడిన ప్రియ చదువరీ! నీకు ఆ దాహముందా??! లేకపోతె ఇప్పుడే పొందుకో!
2. *సమరయ స్త్రీ యొక్క ఇతరులను గౌరవించే/ మర్యాద నిచ్చే లక్షణం*:
క్రింది వచనాలు చూసుకొంటే ఎప్పుడైతే యేసయ్య దాహమునకిమ్మని ఆమెనడిగారో, వెంటనే ఆమె అశ్చ్యర్యపోయింది. మొదటి బాగంలో చెప్పిన విధముగా అనేక వందలాది సంవత్సరాలునుండి యూదులకు, సమరయులకు వైరం, శత్రుత్వం. అయితే ఇక్కడ శత్రువు మొట్టమొదటగా కనబడి ఏమైనా సహాయం అడిగితే- శత్రువు మీద ప్రతీకారం చేయకుండా, సూటిపోటి మాటలాడకుండా ఎంతో నమ్రతతో అడుగుతుంది యేసయ్యను- యూదుడవైన నీవు సమరయ స్త్రీ నైన నన్ను దాహనమునకిమ్మని ఎలాగు అడుగుచున్నావు? ఎందుకంటే మనం యూదులు తాము గొప్పవారమని- సమరయులు పాపులని, అంటరానివారని పరిగనిస్తున్నట్లుగా చదువుకొన్నాం కదా! అందుకే ఆమె అలా అడిగింది.
మరో ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఈ సంభాషణ అంతటిలో ఆమె యేసయ్యని – అయ్యా! అని సంభోదిస్తుంది. యేసయ్య జాతిప్రకారం ఆమెకు శత్రువైనా ఎంతో గౌరవం ఇస్తుంది.
ప్రియ చదువరీ! నీలో నాలో అటువంటి మంచి లక్షణం ఉందా? ఇక్కడ ఈ సమరయ స్త్రీ యేసయ్య కి నీరు/దాహమునకివ్వడానికి సిద్దపడింది. అయితే ఇక్కడ మరో చిక్కు. సమరయుల నీటిని ఆహారాన్ని యూదులు సేవించరు! సరికదా వారి వస్తువులను కూడా తాకరు. అందుకే మరోసారి అడుగుతుంది అయ్యా! మీరు మా వస్తువులు ముట్టుకోరు కదా! మీకు నీరు చేదుకోడానికి చేద/బొక్కెన లేదు కదా! మరి నాకు ఎలా జీవజలం ఇస్తారు అని! ఇక్కడ ఆమెకు యేసయ్య జవాబిచ్చారు తన నిజమైన దాహం ప్రజలకు నిత్యజీవం ఇవ్వడం, నిత్యరక్షణ, నిత్యరాజ్యం ఇవ్వడమే తన దాహం అని చెప్పారు!
3. *సమరయ స్త్రీకున్న లేఖనాల మీద అవగాహన- చరిత్రమీద అవగాహన*:
ఈ 4వ అధ్యాయం పూర్తిగా చదివితే ఈ సమరయస్త్రీ కి లేఖనాలమీద ఎటువంటి పట్టు ఉందొ తెలుస్తుంది.
a)12వ వచనం ప్రకారం ఆబావి తానును తనకుమాల్లును ఈ బావి నీళ్ళు త్రాగి, మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటే నీవు గొప్పవాడివా? అని అడిగింది.
ఇక్కడ అది యాకోబు బావి అని మొత్తమందరికీ తెలుసు. అయితే ఆమె యేసయ్యతో ఏమంటుంది? మనతండ్రియైన యాకోబు. అంటే యూదులకు సమరయులకు అందరికీ తండ్రి యాకోబు. పరోక్షంగా చెబుతుంది నీవు నేను అందరం ఒకే తండ్రి బిడ్డలం. ఒకే దేవుని బిడ్డలం. అయితే మీరు మమ్మల్ని అంటరానివారుగా చూస్తున్నారు.
ప్రియ చదువరీ! *ఇదేమాట సమరయస్త్రీ నిన్ను నన్ను అడుగుతుంది నీలో నాలో కూడా ఇంకా అంటరానితనం అనే దుర్ఘుణంఉందా?* ఈలోకంలో ఎవరూ అంటరానివారు లేరు! అందరినీ దేవుడు ఒకేలాగా ప్రేమిస్తున్నారు. చెడ్డవారిని చూసి వ్యసనపడకుము అని లేఖనం సెలవిస్తుంది కీర్తనలు 37:1 లో.
b) 20వ వచనం ప్రకారం తనకు చరిత్ర తెలుసు. ఇంతకముందు చెప్పినట్లుగా సమరయులు మొదట గెరీజీము కొండపై ఒక మందిరాన్ని కట్టుకొంటే ఒక యూదు రాజు దానిని పడగొట్టేశాడు. అప్పుడు సమరయులు షెకెము కొండమీద మందిరం కట్టుకొని ఆరాధిస్తున్నారు, అదే విషయం ఆమె చెబుతుంది. యేసయ్య అన్నారు. కొండమీద కాదు , ఆయనని ఆరాదించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాదించాలి అని.
c) 25వ వచనం ప్రకారం క్రీస్తు అనబడే మెస్సీయ వచ్చునని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు సమస్తమును మాకు తెలియజేయును. ఈవచనం ప్రకారం మనకు క్షుణ్ణంగా అర్ధమయ్యేదేమిటంటే తన జీవితం ఎలాంటిదైనా గాని ఆమెకు దైవభక్తి, లేఖనాలు చదివే అలవాటుంది. మెస్సీయా వస్తాడనే నిరీక్షణ ఉంది. అందుకే మొట్టమొదటగా బైబిల్ లో ఆమెతోనే చెప్పారు యేసయ్య – ఆ మెస్సీయను నేనే అని!!!
ఇంతవరకు సమరయస్త్రీ ఒక వ్యభిచారని, కేరెక్టర్ లేని వ్యక్తి అని విని ఉండొచ్చు! ప్రియ చదువరీ! ఆమెలో ఉన్న మంచి లక్షణాలను చూడు. ఆ మంచి లక్షణాలు నీకున్నాయా? శత్రువుని ప్రేమించే లక్షణం, గౌరవం ఇచ్చే లక్షణం, ప్రతీకారం చేయకుండా క్షమించే లక్షణం, లేఖనాలు చదివే లక్షణం నీకున్నాయా? పరీక్షించుకో! లేకపోతె ఇప్పుడే అలవరుచుకో!!!!
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
సమరయ స్త్రీ
నాల్గవ బాగముప్రియ సహోదరీ!సహోదరులారా! యేసుప్రభులవారు సమరయస్త్రీని రక్షించిన విధానం మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో జరిగిన సమరయస్త్రీ- యేసయ్య యొక్క సంభాషణ ధ్యానిద్దాం.
1.సమరయస్త్రీ: నీవు యూదుడవు, మేము సమరయులం. నీవు గొప్ప జాతివాడవు-మేము తక్కువ జాతివాళ్ళం.
యేసయ్య: దేవుని వరమును దాహమునకిమ్మని అడిగినవారు ఎవరో తెలిస్తే నీవు తిరిగి ఆయనను అడుగుతావు. ఆయన నీకు
జీవ జలమిచ్చును. దేవునివరం అనగా దేవుడిచ్చు రక్షణ అందరికీ సమానం. యూదుడనిలేదు, సమరయులనిలేదు.
గొప్పవారని లేదు తక్కువ వారనిలేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ దేవుడే! అని ఆమెకు తెలియజేసారు.
2. సమరయస్త్రీ: అయ్యా! ఈబావి లోతైనది. నీవు చేదుకొని నాకివ్వడానికి నీదగ్గర ఏమి లేదు.
యేసయ్య: ఈనీళ్ళు త్రాగువారు మరల దప్పిగొంటారు. గాని నేనిచ్చు నీరు జీవజలము. నిత్యజీవము.
3. సమరయస్త్రీ: ఇంతదూరం నేను ప్రతీరోజు నీరుకోసం రాకుండా ఆనీరు నాకివ్వండి. అప్పుడు నేను దప్పిగొనను.
యేసయ్య: నీ పెనిమిటిని పిలచుకొని రమ్ము!
సమరయస్త్రీ: నాకు పెనిమిటి లేదు.
యేసయ్య: నీవు చెప్పింది నిజమే! నీకు సొంతభర్త లేడు కాని నీకు 5గురు భర్తలున్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా
నీపెనిమిటి కాడు!(అనగా అక్రమ సంభంధం)
సమరయస్త్రీ: అయ్యా! నీవు ప్రవక్తవు. ఆరాధించే స్థలం యెరూషలేములో ఉంది అని చెబుతారు మీరు. అక్కడికి వెళ్లి
ఆరాదించాలా?
యేసయ్య: దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాదించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాదించవలెను.
సమరయస్త్రీ: క్రీస్తు అనబడే మెస్సీయ వచ్చినప్పుడు ఆయన మాకు సమస్తమును తెలియజేయును.
యేసయ్య: నేనే మెస్సీయను!!!
ఈ సంభాషణ అంతా మనం చూసుకొంటే దేవుడు ఎన్నో ఆత్మీయమర్మాలు తెలియజేసారు ఆమెకు. దేవుని దృష్టిలో అందరూ సమానమని, యేసయ్య నిత్యజీవం ఇవ్వగలరని చెప్పారు. అంతేకాకుండా సమరయస్త్రీ యొక్క పాపపు జీవితాన్ని బయలుపరిచారు. ఎవరికీ తెలియకుండా 5గురు పురుషులతో అక్రమసంభందం కొనసాగించి, ఆరోవ్యక్తితో అక్రమసంభందం పెట్టుకొని ఏమీ తెలియనట్లు నటిస్తుంది. హృదయ రహస్యాలు తెలిసినవారు మనయేసయ్య! కాని ఎవరిని తృణీకరించరు. హెబ్రీ 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏమిలేదు. మనమెవనికి లెక్క అప్పగించవలేనో ఆదేవునికి సమస్తమును తేటగా కనబడు చున్నవి! మన క్రియలు ఆయనకీ మురికిగుడ్డ లా కనబడుచున్నవి!!
ఎవరూ చూడటం లేదని, ఎవరికీ తెలియదని విచ్చలవిడి జీవితం జీవిస్తున్నావా?చీకటిలో చేస్తున్నావా? దేవుడు చూడలేనిది ఏమి లేదని గుర్తుంచుకో! సమరయస్త్రీ పాపాన్ని బట్టబయలు చేసిన దేవుడు ఈరోజు ఈవాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నారు, నేడే నీపాపాలు ఒప్పుకో!అతిక్రమము చేయువాడు వర్దిల్లడు కాని దానిని ఒప్పుకొని విడచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 28:13. ఇక్కడ సమరయస్త్రీ నీవెంత నన్ను అనేటంత గొప్పవాడివా నీవు అనకుండా నీవు ప్రవక్తవు అని చెప్పింది. ఇక తర్వాత వచనాలలో తన పాపపు జీవితాన్ని ప్రజలందరి ఎదుట ఒప్పుకొని యేసయ్య కోసం సాక్ష్యం చెప్పింది. అందుకే కనికరం పొందింది. గ్రామరక్షణకు కారణం అయ్యింది.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇంతటి పాపపు స్తితిలో ఉన్న స్త్రీనికూడా యేసయ్యా అమ్మా! అని సంభోధించారు. 4:21 లో. నీవు అలా సంభోదించగలవా? వ్యభిచారిని, వేశ్యను నీవు అలా పిలువగలవా?? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యూదులు యేసయ్య తీర్పుకోసం ఆయనయొద్దకు తెచ్చినప్పుడు ఆయన ఆమెను అమ్మా! అని పిలిచారు. అమ్మా అన్న పిలుపు, ఆస్త్రీ జీవితాన్ని మార్చేసింది. ఎవరూ ఇంతవరకూ పిలువని పిలుపు విని తనపాపపు జీవితాన్ని మార్చేసుకొని జీవితాంతం యేసయ్యకోసం సాక్షిగా జీవించి హతస్సాక్షిగా మారింది.
ఈరోజు నీజీవితం ఎలాంటిదైనా సరే యేసయ్య నిన్ను పిలుస్తున్నారు. యేసయ్య దగ్గరికి రా! నీపాపాలు ఒప్పుకొని విడచిపెట్టి పాపాలు కడిగివేసుకో!!!
ఇక సమరయస్త్రీకి 5+1=6గురు భర్తలున్నారు. నేను అంత పాపిని కాదు అని అనుకొంటున్నావా? భర్త అంటే భరించేవాడు అనియు, అధికారం చేసేవాడు అని అర్ధాలు వస్తాయి. ఏదైతే నిన్ను కంట్రోల్ చేస్తుందో, నిన్ను శాసిస్తుందో, నీమీద అధికారం చేస్తుందో అదే నీభర్త!!! సమరయస్తీ కి ఆరుగురు భర్తలు. మరి నీకో???!!!
నీకోపం- నీభర్త!
ధనకాంక్ష- నీ భర్త!
నీపాపపు తలంపులు,పాపపుకోరికలు- నీభర్త!
అధికార వ్యామోహం- నీభర్త!
బంగారం మీద మోజు- నీభర్త!
నీ త్రాగుడు,వ్యసనాలు- నీభర్త!
టీవీ సీరియల్లమీద వ్యామోహం- టీవీకి బానిసై పోయి నీమీద శాసిస్తుందా- నీభర్త!
ఇలా నీకు ఎంతమంది భర్తలున్నారో ఆలోచించు!
అవన్నీ వదలివేసి యేసయ్య పాదాలు దగ్గరికి రా!
ఆయనదగ్గర సంపూర్ణ విడుదల, రక్షణ, శాంతి, సమాధానం దొరుకుతుంది.
అట్టి దీవెన మనందరం పొందుకొందము గాక! ఆమెన్!
దైవాశీస్సులు!!
(సశేషం)
సమరయ స్త్రీ
ఐదవ బాగముఆస్త్రీ తనకుండను విడచిపెట్టి ఉరులోనికి వెళ్లి- మీరువచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా? అని ఆఊరివారితో చెప్పగా ------ యోహాను 4: 28,29
ఒక పరివర్తన చెందిన నిజవిశ్వాసి జీవితంలో జరిగే మార్పులు గమనించండి! ఎప్పుడైతే తను మాట్లాడుతుంది లోకరక్షుకుడైన మెస్సీయ అని తెలిసిందో, ఎప్పుడైతే తన పాపపు జీవితాన్ని విడమరచి చెప్పారో యేసయ్య, ఈ సమరయస్త్రీ మొదటగా తనకుండని విడచిపెట్టింది.
కుండ మానవహృదయానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఈ కుండలో అంతా పాపమే, మలినమే, వ్యభిచార లక్షణాలే!! లేఖనాలు చదివి మార్పుపొందుదామని అనుకొన్నా సరే ఇహలోక కోరికలు వల్లనో, లేక తన కుటుంభ పరిస్తితులవల్లనో, తను ఇంతవరకు మనస్సు చంపుకొని ఆ రకంగా మలినమైన జీవితం జీవించింది. ఎప్పుడైతే పరిశుద్ధుని వాక్యంతో తన హృదయం కడుగబడిందో, తన మలినమైన పాపపు కుండను వదలి, పరుగులు పెడుతుంది.
ఎక్కడికీ?
సువార్త ప్రకటించడానికి!
ఎవరు చెప్పారు సువార్త ప్రకటించమని?
ఎవరూ చెప్పలేదు!
ఎక్కడ ట్రైనింగ్ పొందింది?
ఎక్కడా లేదు?
మరి ఏమని చెబుతుంది? ఏం చెబుతుంది? ఎలా చెబుతుంది?
నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడండి! ఈయన క్రీస్తు! మనం ఎదురు చూస్తున్న మెస్సీయ! ఆహా ఎంత చిన్నదైన గొప్ప సాక్ష్యం!!!
అప్పుడు బహుశా, నేను అనుకొంటాను ఆ ఊరివారు నీవు ఏమి చేశావు? ఆయన ఏం చెప్పాడు?అని అడిగి ఉంటారు.(తెలిసినా సరే). అప్పుడు ఆ సమరయస్త్రీ కప్పుకోకుండా ఒప్పుకొని చెప్పి ఉండాలి తనపాపపు జీవితంకోసం. అందుకే వారు నమ్మి 30వ వచనం ప్రకారం యేసయ్యని చూడటానికి తండోపతండాలుగా ప్రజలు తరలివస్తున్నారు. ఎప్పటినుంచో అణచివేయబడి, వెలివేయబడి, హేలనచేయబడిన సమరయులు మెస్సీయా వస్తాడు, తమను విమోచిస్తాడు అని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడైతే ఆమె తనసాక్ష్యం ఆధారంగా ఈయనే మెస్సీయా అని చెప్పిందో ఆయనను చూడటానికి జనులు పరుగులు తీస్తున్నారు.
ప్రియ చదువరీ! సాక్ష్యం చెప్పడానికి నీకు డిగ్రీలు అవుసరం లేదు, ట్రైనింగ్ అవుసరం లేదు.
“సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే,
సాక్ష్యమిచ్చుటందుకు స్వామి రక్షించినాడు,
సాక్ష్యమిచ్చెద!!!!”
నీ జీవితంలో యేసయ్య చేసిన మేలులు గొప్పకార్యాలు ప్రజలకి, ఇరుగుపొరుగు వారికి చెప్పటమే సాక్ష్యం!
ఒక విషయం చెప్పనా : 100 ప్రసంగాల కన్నా ఒక సాక్ష్యార్ధమైన జీవితం జీవిస్తున్న ఒక విశ్వాసి యొక్క సాక్ష్యమే ఎక్కువ ఆత్మలను సంపాదించగలదు!!
నీవుచెప్పిన సాక్ష్యం ఇప్పుడు కాకపోయినా తర్వాత పట్టుకొట్టుంది, ఆ వ్యక్తి బాదలలో ఉన్నప్పుడు తప్పకుండా నీ సాక్ష్యం గుర్తుకొస్తుంది. సాక్ష్యం చెప్పడానికి నీవు ప్రసంగాలు చెయ్యక్కర్లేదు, వాక్యాన్ని కంటోపాటంగా చెప్పాల్సిన పనిలేదు. యేసయ్య నీకు చేసినవి చెబితే చాలు! యేసయ్య నీజీవితంలో లేనప్పుడు ఎలా ఉండేవాడవో/ఉండేదానవో , యేసయ్య నీ జీవితంలోనికి వచ్చాక ఇప్పటి నీ జీవితం ఎలాఉందో చెబితే చాలు! సాక్ష్యం చెప్పడమే నీ వంతు. కార్యం చేయడం ఆయన పని. మరి నీవు నీపని అనగా సాక్ష్యం చెబుతున్నావా??? మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న యేసయ్య చివరిఆజ్న గుర్తుందా? (మార్కు 16:15-18).
ఇక్కడ సమరయస్త్రీ నేను క్రీస్తును చూసాను రండి అంటే నమ్మేవారు కాదేమో!! గాని నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి. ఈయన క్రీస్తు కాడా? ఎంత గొప్ప సాక్ష్యం!!!
ప్రియ చదువరీ! నీకు అలాంటి సాక్ష్యం ఉందా? అయన నీజీవితంలో చేసిన మేలులు ఎవరికైనా చెప్పావా? నేను క్రైస్తవుడిని అని చెబితే ఎవరైనా ఏమనుకొంటారో అని సిగ్గుపడుచున్నావా? యేసయ్య చెప్పినది గుర్తోందా ఎవరైతే నన్ను గూర్చి నాబోద గూర్చి సిగ్గు పడతారో వారిని దూతలముందు నేను ఒప్పుకోను. మీరెవరో నాకు తెలియదు. అంటారు. ఒకవేళ ఇంతవరకూ చెప్పలేదా? నేటినుండైనా సాక్ష్యమివ్వడం మొదలుపెట్టు!!
చివరకు సమరయస్త్రీ చెప్పిన సాక్ష్యం విన్న సమరయులు యేసయ్యను వేడుకొన్నారు: అయ్యా! కొన్ని రోజులు మాతో ఉండండి అని, యేసయ్య వారిని ఛీ కొట్టలేదు, ప్రేమతో ఆదరించారు. వారితోపాటు రెండురోజులున్నారు.( 40వ వచనం). యూదయ ప్రాంతానికి చెందిన యూదుడు యేసయ్య, గలలియ ప్రాంతానికి చెందిన యూదులు, ఇశ్రాయెలీయులు వందలాది సంవత్సరాలు తర్వాత సమరయ ప్రాంతంలో రెండురోజులు ఉన్నారు, వారి నీరు త్రాగారు, వారు పెట్టినవి తిన్నారు!
ఆయన నీ ఇంట/హృదయ వాకిట నిలిచి తట్టుచున్నారు, ఆయన స్వరము విని తలుపు తీస్తావా ? అయితే ఆయన నీఇంట ప్రవేశించి నీతో కలసి ఉండటానికి ఇష్టపడుచున్నారు!
రెండురోజులు గడచిన తర్వాత సమరయులు ఆ సమరయ స్త్రీతో అంటున్నారు- ఇకమీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మామట్టుకు మేము ఈయనే మెస్సీయ అని నమ్ముచున్నాము! హల్లెలూయ!
ఒక పాపపు స్త్రీ రక్షించబడి, కడుగబడి ఇచ్చిన చిన్న సాక్ష్యం ఆ ఊరినంతటిని మార్చగలిగింది. మరి నీవు రక్షించబడి ఎన్నిరోజులైంది? ఎంతమందిని నీవు యేసయ్య దగ్గరికి నడిపించావు? ఎంతమందికి యేసయ్యను నీసాక్ష్యం ద్వారా, నీప్రవర్తన ద్వారా పరిచయం చేసావు? నీ ప్రవర్తనే ఒక కరపత్రంగా మారిపోవాలి.అప్పుడు ప్రజలు ఆకర్షించబడతారు. నేటి దినాలలో అనేకమంది క్రైస్తవులు సాక్ష్యార్ధమైన జీవితం జీవించకుండా యేసయ్యకి, క్రైస్తవ్యానికి చెడ్డపేరు తెస్తున్నారు!
ఒకవేళ ప్రియ విశ్వాసి! నీవు అదే స్తితిలో ఉంటె నేడే నీజీవితాన్ని మార్చుకో!
సమరయస్త్రీని చూసి నేర్చుకో!
విశ్వాసిగా, యేసయ్యకి సాక్షిగా జీవించు!
దైవాశీస్సులు!
ఆమెన్!
(సశేషం)
సమరయ స్త్రీ
ఆరవ బాగముసమరయస్త్రీ-గొంగళిపురుగు
మనం కొన్నిరోజులనుండి సమరయస్త్రీ గురించి ధ్యానం చేస్తున్నాం. సమరయస్త్రీని బైబిల్ పండితులు గొంగళిపురుగుతో పోలుస్తారు. గొంగళిపురుగులాగానే మార్చబడిన జీవితం సమరయస్త్రీది.
మొదటగా మనం గొంగళిపురుగు పురుగుకోసం చూద్దాం!
ఇది ఎవరికీ ఇష్టం లేని ఒక అసహ్యమైన పురుగు. ఒంటినిండా ముళ్ళు, ముట్టుకొంటే చాలు గుచ్చుకోపోతాయి. చూస్తేనేచాలు చంపాలి అనిపిస్తుంది. పిల్లలు దానిని చూస్తే జడుసుకొంటారు. చివరకి పక్షులుకూడా వాటిని తినడానికి ఇష్టపడవు.
అవి పుట్టిన తర్వాత పచ్చని ఆకులు తిని, త్వరత్వరగా ఎదుగుతాయి. అలుపులేకుండా ఆహారం కోసం తిరిగి పచ్చదనాన్ని ఖాళీచేస్తాయి. కొంచెం ఎదిగిన తర్వాత తనలాంటి పురుగులతో కలసి చెట్టు కాండానికి పట్టి, మొదటగా చెట్టుబెరడును, తర్వాత మొక్కలో ఉన్న జీవాన్ని పీల్చివేస్తాయి. ఈరకంగా మొక్కలను పాడుచేసే ఒకరకమైన చీడపురుగు! ఇంతవరకూ వీటిని చంపడానికి మందు కనిపెట్టలేదు!
అయితే గొంగళిపురుగు పెద్దదైన తర్వాత దానికి ఒకరకమైన భయంకరమైన నిద్రముంచుకొస్తుంది. దానికోసం అనువైన ప్రాంతంకోసం ఎత్తైన,ఎవరూ తన నిద్రను భంగం కలిగించని ప్రాంతాన్ని ఎన్నుకొని, అక్కడ తన నోటినుండి లాలాజలంతో తనచుట్టూ ఒక గూడు కట్టుకొంటుంది. ఒకసారి గూడులోనికి వెళ్ళిన తర్వాత ఆహారం, లోకాన్ని మరచిపోయి సుదీర్ఘమైన నిద్రపోతుంది. ఆ నిద్రలో తనకి రూపాంతరం జరుగుతుంది. నవజీవనం కలుగుతుంది. గొంగళిపురుగుగా చనిపోయి అందమైన సీతాకోకచిలుకగా బయటికి వస్తుంది. నేలమీద, చెట్లుమీద ప్రాకే పురుగు ఇప్పుడు ఆకాశంలో రెక్కలతో ఎగురుతుంది. ఒకరోజు అందరూ తనని చూసి అసహ్యించుకొన్న గొంగళిపురుగు, మరల మరల చూడాలనిపించేటట్లుగా మారిపోతుంది. పిల్లలు చూసి జడుసుకొనే పురుగు, పిల్లలు తన వెంటపడే విధంగా మారిపోయింది. అయితే అది అలా మారడానికి చాలాశ్రమ పడింది.
ఇక సమరయస్త్రీ జీవితంలో కూడా ఇదే జరిగింది. ఒకరోజు ప్రజలతో వ్యభిచారిగా, కేరెక్టర్ లేని స్త్రీగా, బజారుమనిషిగా, అంటరానిదానిగా, వెలివేయబడిన దానిగా ఎంచబడ్డ సమరయస్త్రీ- బావిదగ్గర యేసయ్య దగ్గర రక్షణ పొందింది. తనపాపపు కుండను అక్కడే వదలివేసింది. భయంకరమైన వ్యభిచారం, అబద్దాలు, ఎందరినో తన కంటిచూపుతో ఆకర్షించిన తన మొహపుచూపు అన్నీ వదలివేసింది. గొంగళిపురుగుకుండే ముళ్ళు పోయి రెక్కలు వచ్చి ఎగరడం ఎలా ప్రారంభించిదో, అలానే పాపపు జీవితాన్ని విడచిన సమరయస్త్రీ- సాక్ష్యార్ధమైన బ్రతుకు కలిగింది. అందరూ చీదరించుకొన్న సమరయస్త్రీని ఇప్పుడు అందరూ కావాలని కోరుకోనేలా మారిపోయింది. గ్రామానికి ఒక Role Model గా, ఒక వెన్నెముకుగా మారిపోయింది. ఎప్పుడూ?
యేసయ్యని ఆహ్వానిచినప్పుడు!
పాపాన్ని విడచిపెట్టినప్పుడు!
తన పాపపుజీవితాన్ని సిగ్గువిడచి అందరికీ చెప్పినప్పుడు!
సమరయస్త్రీని మార్చిన దేవుడు నిన్నుకూడా మార్చగలరు. నీ జీవితంలో కూడా గొప్ప అధ్బుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయనకీ నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి! గొంగళిపురుగులా ఆ గూడులో సమాధి అయిపోవాలి. నీ పాపపు జీవితాన్ని ఒప్పుకొని, దానిని భాప్తిస్మం ద్వారా సమాదిచేయాలి! అప్పుడు క్రీస్తులోనికి భాప్తిస్మం పొందిన నీవు క్రీస్తుతో కూడా బ్రతికింపబడతావు! పునరుత్థానం పొందుతావు. (రోమా 6:3-9)
అప్పుడు నీజీవితం సీతాకోకచిలుకలా మారిపోతుంది. నీభాష, నీ ప్రవర్తన, నీ అలవాట్లు అన్నీ మారిపోతాయి. ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయ౦త్నిచిన సమరయస్త్రీ రక్షించబడి, ఎలా ప్రజలకి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టిందో, అలాగే నీ జీవితంలో కూడా పాపం, అబద్దాలు, త్రాగుడు, చెడు అలవాట్లు అన్నీ పోయి గొంగళిపురుగు- సీతాకోకచిలుకలా పరివర్తన చెందినట్లు, పాపివైన నీవు కూడా నూతనసృష్టిగా మారిపోతావు!
ఆమార్పు నీకు కావాలా? అయితే నేడే యేసునొద్దకు రా! నీ జీవితాన్ని ప్రభుకివ్వు! ఆయన చేతులకు సంపూర్ణంగా సమర్పించుకో! దేవుడు నీ జీవితంలో అధ్బుతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు!
ఈ సమరయస్త్రీ జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడారని ఆశిస్తున్నాను.
సమరయస్త్రీ పొందుకొన్న భాగ్యం మనందరికీ మెండుగా కలుగును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
(సమాప్తం)
సూపర్ ప్రైస్ ది లార్డ్ వాక్యం అందించిన దైవ జనులకు వందనాలు
రిప్లయితొలగించండి