అబ్రాహాము విశ్వాసయాత్ర

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝


అబ్రాహాము

(మొదటి భాగము)
♻ 1. ఉపోద్ఘాతము ♻
దేవుడు సృష్టిలో అత్యున్నత సృష్టముగా మనిషిని సృష్టించాడు. అతని పట్ల దేవుడు ఎంతటి అత్యున్నత ప్రణాళికను కలిగియున్నాడంటే? సృష్టి అంతటిని ముందుగా సృష్టించి, ఆ తర్వాత మనిషిని నిర్మించాడు. అంటే, మనిషిని నిర్మించకముందే ఆ మనిషికి కావలసిన అవసరతలన్నింటిని దేవుడు సిద్దంచేసాడు. అంతేకాదు, సృష్టియంతటిని తన మాటద్వారా సృష్టించిన దేవుడు, మనిషిని మాత్రం ఆయన స్వహస్తాలతో, ఆయన రూపములో నిర్మించి, ఆయన ఊపిరిని ఊదాడు. దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చు, మనిషిపట్ల దేవుని యొక్క అత్యున్నత ప్రణాళిక ఎట్లాంటిదో.

🔅 దేవుడు మనిషిని నిర్మించడంలో ఆయనకున్న ఉద్దేశ్యమేమిటి?
దేవుడు తాను నిర్మించిన మనిషితో సహవాసం చెయ్యాలని ఆశ పడ్డాడు. అందుచే దేవుడు ఎంతటి పరిశుద్దుడో. అంతే పరిశుద్దంగా మనిషిని నిర్మించాడు. అవును, పాపము చెయ్యనంతవరకూ ఆదాము, హవ్వలు పరిశుద్దులే. సందేహం లేదు. దేవుని ఉద్దేశ్యం నెరవేరింది. ప్రతీ చల్లపూట (బహుశా ఉదయం, సాయంకాలం కూడా కావచ్చు) దేవుడు ఏదేను తోటకు వచ్చి, తాను నిర్మించిన నరులతో ఆనందంగా గడపుచున్నాడు. అయితే, దేవుని ఉద్దేశ్యం పరిపూర్ణం కాలేదు. దేవునిచే నిర్మించబడిన ఆ నరులు సాతాను వలలో చిక్కారు. ఆజ్ఞాతిక్రమము ద్వారా దేవుని ఉద్దేశ్యాన్ని తలక్రిందులు చేసి, పాపమును, తద్వారా మరణమును కొనితెచ్చుకున్నారు. ఏదేనులో నుండి గెంటివేయబడ్డారు. లోకం సాతాను చేతుల్లోకి వచ్చింది. ఆదిమ పితరుల అవిధేయత, అపరాధం తరతరాలకు ప్రాకింది. శాపం మనిషిని ఏలుబడి చేస్తుంది. మృత్యుకోరల్లో మనిషి మ్రగ్గిపోతున్నాడు. సృష్టి మొత్తం రోధిస్తుంది. వారిని విడిపించేదెవరు? కోడెల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం ఏదికూడా మనషి పాపాన్ని పావన పరచలేకపోయాయి. ఇక, నిత్యమరణమే శరణ్యం. అట్లాంటి పరిస్థితులలో కృపగలిగిన దేవుడు, తన ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపడానికి, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, సర్వమానవాళి పాపమును పరిహరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే, ఆత్మయైయున్న దేవుడు శరీరధారిగా ఈ భూమికి ఏతెంచాలి. దానికి రక్త మాంసములు గలిగిన మనిషి కావాలి. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చే విషయంలో భాగంగా ఒక మనిషిని ఎన్నుకున్నాడు. అతడే "అబ్రాహాము".

🔅 అబ్రాహాము నివాస స్థలము:
కల్దీయుల దేశములో “ఊరు” అను పట్టణము (ఆది 11:31) పరిశుద్ధ గ్రంథములోఅతి ఎక్కువసార్లు పేర్కొనబడిన దేశము "ఇశ్రాయేలు". రెండవ స్థానము "కల్దీయుల దేశము". అన్ని చోట్లా కల్దీయుల దేశము అని వాడబడలేదు గాని, కల్దీయుల దేశమునకు ఇతరమైన పేర్లువాడబడ్డాయి. అవేవనగా, బబులోను, మెసపటోమియా, షీనారు. నేటి దినాలలో కల్దీయుల దేశమునే ఇరాక్ అని పిలచుచున్నారు. మెసపటోమియా అనగా "రెండునదుల మధ్యగల ప్రాంతము" అని అర్ధము. అవును ఇరాక్ అనే దేశము యూఫ్రటిస్, టైగ్రీస్ అనే రెండునదుల మద్యన వుంది. ఈ దేశము రెండు నదుల మద్యన వుందంటే, అదెంతటి సస్యశ్యామలమైన దేశమో ఊహించగలము. అది రమ్యమైన పట్టణము. చక్కని పద్దతిలో రాళ్ళతో నిర్మించబడిన ఇండ్లు వుండేవి. ప్రతీ గృహములోనూ ఒక జలాశయము కలిగి, మంచి పరిశుభ్రతను కలిగి యుండేవారు. మిద్దెమీద చక్కని మొక్కలను పెంచేవారు. ఆ ప్రాంతమంతటికీ "ఊరు" రాజధానిగా వుండడం వలన "ఊరు" మరింత అభివృద్ధి పథంలో వుండేది. ఆనాటి సంస్కృతికి, వ్యాపారమునకు కేంద్రముగా వుండేది. ప్రాచీనకాలంలో నౌకాశ్రయ స్థావరముగా ఎంతో అభివృద్ధి చెందిన పట్టణమని నేటి పురావస్తు శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అచ్చట పాఠశాలలు, ఆలయాలు, గ్రంథాలయాలు, పద నిఘంటువులు, పదకోశాలు, మతగ్రంథాలు, రాజకీయ శాస్త్రములు, గణితశాస్త్ర గ్రంథాలు వుండేవి. ఎంతో అభివృద్ధి చెందిన నాగరికత అచ్చటవుండినట్లు ఆధారములున్నవి.
ఇన్ని ఉన్నప్పటికీ అదొక అన్యజనుల పట్టణమే. సూర్య చంద్ర నక్షత్రాలతోపాటు అనేక విగ్రహాలను వారు ఆరాధించేవారు. అబ్రాహాము కుటుంబము పూర్తిగా విగ్రహారాధన చేసే కుటుంబము. అబ్రాహాము కూడా విగ్రహారాధికుడే ( యెహోషువా 24:2) అబ్రాహాము యొక్క తండ్రియైన తెరహు విగ్రహములను తయారుచేసేవాడని, అబ్రాహాము తండ్రిపనిలో సహాయకారిగా వుంటూ, వ్యవసాయం చేసేవాడని చరిత్ర వలన గ్రహించగలము.

🔅 అబ్రాహామును దేవుడు ఎన్నుకొనుటకు అతనికి గల అర్హతలేమిటి?
ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక్క మాటలో చెప్పాలంటే, అబ్రహామును దేవుడు ఎన్నుకొనుటకు అతనికి ఎట్లాంటి అర్హతలు లేవు. దేవునికృప తప్ప.
ఒకానొక దినాన్న యాకోబు అన్నను, తండ్రిని మోసంచేసి, బేయెర్షేబా నుండి హారానుకు పారిపోతున్నాడు. లూజు అనే ప్రాంతానికి వచ్చేసరికి ప్రొద్దు గుంకిపోయింది. భీకరమైన అరణ్యములో ఒంటరిగా నుండిపోయాడు. అయితే, కృపగలిగిన దేవుడు అతనిని ఆవరించి, వాగ్ధాన్నాన్నిచ్చి బలపరిచాడు. నీకు తోడుంటాను, వాగ్ధాన భూమికి మరళా తీసుకు వస్తానని అభయమిచ్చాడు. దానిని నెరవేర్చాడు. అయితే, మోసగాడైన యాకోబుపట్ల దేవుడు అట్లా వ్యవహరించవలసిన అవసరమేముంది? యాకోబుకున్న అర్హతలేమిటి? ఏమీ లేవు. ఆయన కృప తప్ప.

నీపట్ల, నా పట్ల కూడా దేవుడు అట్లాంటి ప్రణాళికనే కలిగియున్నాడు. జగత్తు పునాది వేయబడకముందే మనలను ఏర్పరచుకున్నాడు. తన కుమారుని ఈ లోకానికి పంపి రక్త ప్రోక్షణ ద్వారా మనలను పావనపరిచాడు. పరిశుద్దాత్మను పంపించి లోకమునుండి ప్రత్యేకపరిచాడు. ఆయన సొత్తుగా మనలను చేసుకున్నాడు. దేవుడు మన పట్ల ఇట్లా వ్యవహరించడానికి మనకున్న అర్హత ఏమిటి? ఆయన కృప మాత్రమే. ఈ లోకంలో దేవుడు ఎవ్వరిని ప్రత్యేకపరచుకున్నా, వారి పరిశుద్ధత, వారి నీతి, వారి అర్హతనుబట్టి కాదు గాని, కేవలం ఆయన కృపనుబట్టి మాత్రమే. కృప అనగా? అర్హతలేనివాడు అర్హునిగా ఎంచబడడమే కృప. అవును! ఎట్లాంటి అర్హతాలేని అబ్రాహాము దేవుని స్నేహితుడయ్యాడు (2 దిన. 20:7; యెషయా 41:8; యాకోబు 2:23). విశ్వాసులకు తండ్రి అయ్యాడు (రోమా4:11), యేసు క్రీస్తు అబ్రాహాము సంతతి ద్వారా శరీరధారిగా ఈ లోకానికి రావడమువలన, సకల వంశములు అతనియందు అశీర్వదించబడెను.

🔅 అబ్రాహాము అంతటి అత్యున్నత స్థితికి చేరడానికి గల కారణమేమిటి?

మొదటిది దేవుని కృప అయితే, రెండవది దేవుని చిత్తానికి లోబడే తత్వం. అబ్రాహాము దేవుని విశ్వసించడమే కాదు, విధేయత చూపినవాడు. దేవుడు తనతో చెప్పినదానిని విశ్వసించడమే కాదు, ఆయన చెప్పిన దానిని చేసాడు. విశ్వాసము, క్రియలు కలిస్తేనే విప్లవాత్మకమైన విజయాలు సాధించగలము. కాని, మన జీవితాలు దీనికి పూర్తి వ్యతిరేకం. నమ్మకూడనివాటిని సులభంగా నమ్మేస్తాము. నమ్మవలసిన వాటిని మాత్రము ఎట్టిపరిస్థితులలోనూ నమ్మము. ఒకవేళ నమ్మినా, లోబడేతత్వం కరువయ్యింది. అబ్రాహాము జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప సవాలు.

దేవుని చిత్తానికి లోబడదాం! ఆయన మాటను విశ్వసించి, విధేయతచూపి, ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాం!

అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(రెండవ భాగము)

♻ 2. అబ్రాహామునకు దేవుని పిలుపు ♻

“అబ్రాహాము” తెరహు కుమారుడు (ఆది 11:26) అసలు పేరు “అబ్రాము” ( హీబ్రు భాషలో “అవ్రాము”) ఈ పేరును తర్వాత కాలంలో “అనేక జనములకు తండ్రి” అను అర్ధమిచ్చే “అబ్రాహాము”గా దేవుడు మార్చారు (ఆది 17:5). దేవుడు అబ్రాహామును పిలవడం పరిశుద్ధ గ్రంధములో మరొక గొప్ప ప్రారంభం(అపో.కార్యములు 7:2-4) . క్రీస్తుకు పూర్వం సుమారు 1900 సంవత్సరాల క్రిందట ఇది జరిగింది. ఇక్కడ ప్రారంభమైన అబ్రాహాము ప్రస్తావన, అపోస్తలుల కార్యముల గ్రంధమువరకు వారి సంతాన చరిత్ర కనిపిస్తుంది. నోవహు కాలంలో భూమి బలాత్కారముతో నిండియున్నందున నోవహు కుటుంబం మరియు ఓడలోకి ప్రవేశించిన జీవులు తప్ప, మిగిలినవన్నీ జలప్రళయంతో సజీవ జలసమాధి అయ్యాయి. జలప్రళయము తర్వాత, దేవుడు తన ప్రజలను రక్షించడానికి అబ్రాహామును, పిలచి ప్రత్యేకపరచుకున్నాడు.

నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వధించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించువాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. (ఆది 12:1-3).

మొట్టమొదటగా మహిమగల దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై నీవు నాలుగు షరతులకు ఒప్పుకుంటే, ఏడు ఆశీర్వాదాలను యిస్తానంటున్నారు.

🔅 దేవుడు అబ్రాహామునకు విధించిన షరతులు:
1. నీ దేశమును విడచిపెట్టు
2. నీ బంధువులను విడచిపెట్టు
3. నీ తండ్రి యింటిని విడచిపెట్టు
4. నేను చూపించే దేశమునకు వెళ్లుము



🔅 దేవుడు అబ్రాహామునకు చేసిన వాగ్దానములు:
1, నిన్ను గొప్ప జనముగా చేసెదను
2. నిన్ను ఆశీర్వదించెదను
3. నీ నామమును గొప్ప చేస్తాను
4. నీవు ఆశీర్వాదముగా వుంటావు
5. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదిస్తాను.
6. నిన్ను దూషించేవారిని శపిస్తాను
7. భూమి యొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడును.

పరిశుద్ధ గ్రంధములో 7 అనే సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది. దేవుడు ఏడు ఆశీర్వాదపు వాగ్దానములు చేయడంద్వారా, దేవుడిచ్చే ఏ ఆశీర్వాదమైనా సంపూర్ణమైనదని గ్రహించగలము. అబ్రాహాము యొక్క విశ్వాసము, విధేయత వాటన్నింటిని స్వతంత్రించుకోగలిగింది. తద్వారా, అబ్రాహాము యూదా జాతికి తండ్రి అయ్యాడు. దేవునిలో అతనికున్నగొప్ప విశ్వాసము, దేవునిని విశ్వసించిన వారందరికీ అతనిని తండ్రిని చేసింది (రోమా 4:11) అబ్రాహాము దేవుని సేవకుడు (ఆది 26:24), ప్రవక్త (ఆది 20:7), ఇశ్రాయేలీయులకు మూలపురుషుడు (రోమా 4:1) అన్నింటికంటే సర్వోత్తమమైన పేరు "దేవుని స్నేహితుడు" ఈ విషయం పరిశుద్ధ గ్రంధములో మూడుసార్లు ప్రస్తావించబడింది. (2దిన 20; ; యెషయ 48:1; యాకోబు 2:23).
ఇదెట్లా సాధ్యమయ్యిందంటే? దేవుని పిలుపుపట్ల సామాన్యమైన విశ్వాసం, విధేయతతోనే సాధ్యమయ్యింది.

🔅 విశ్వాసం అంటే?
బ్లాండిన్ అనే వ్యక్తి నయాగర జలపాతం మీద తాడుపై నడుస్తున్న సందర్భమది. ఆయన నడచుకుంటూ వస్తుంటే ప్రజలంతా జేజేలు పలికారు. బ్లాండిన్ అంటున్నాడు నేను తిరిగి అవతలకు వెళ్లి పోగలను నమ్ముతున్నారా? అంతా అవును! నీవు వెళ్లి పోగలవు అంటున్నారు. బ్లాండిన్ మరళా అంటున్నాడు నా భుజాల మీద ఒకరిని తీసుకొనిపోగలను నమ్ముతున్నారా? ప్రజలంతా ... అవును! మేము నమ్ముతున్నాం! అయితే, మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి. అంతా నిశ్శబ్దం!!! ఎవ్వరూ ముందుకు రావట్లే. కారణం? చూచిన దానిని నమ్మగలిగారు. అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించ లేకపోయారు.

విశ్వాసం అంటే? చీకటిలోనికి దూకడం కాదు. గాలిలో మేడలు కట్టడం కాదు. దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి వుంది. నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుష్యులు చెప్పే ప్రతీ మాటను నమ్మదు.
దేవుడు వెల్లడించాడు అని మనుష్యులు అనుకునే ప్రతీదానినీ స్వీకరించదు. పరిశుద్ధ గ్రంధంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది. విశ్వాసం అంటే? పూర్తిగా ఆధారపడడం! నమ్మిక, విశ్వాసం ఒక్కటి కాదు. నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం. నమ్మిక అనేది విశ్వాసంలోనికి నడిపించాలి. విశ్వాసము అంటే?
నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు. (హెబ్రీ 11:1)

🔅 విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది.
1. దేనికొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో? దానిని ఒక దినాన్న చూస్తాను అనే నమ్మకము.
2. కంటికి కనిపించనిది ఒకదినాన్న ప్రత్యక్ష మవుతుంది అనే నమ్మకం.

అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకులోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను (హెబ్రీ 11:8,9). అబ్రాహాము జీవములేని విగ్రహాలను ఆరాధించేవాడు. వాటియందే భక్తికలిగిన కుటుంబములో పుట్టినవాడు. తాను పుట్టిపెరిగిన దేశము అక్కడనున్న పరిస్థితులుకూడా అట్లాంటివే. అట్లాంటి సందర్భములో తన జీవితంలోఎన్నడూ వినని స్వరమొకటి మాట్లాడడం వింటున్నాడు. వినడమేతప్ప వాటిని ప్రశ్నించినవాడుకాదు. అతడు వినిన మాటలు సాధారణమైనవికాదు. సమస్తమును విడచిపెట్టాల్సిన పరిస్థితి. మాట్లాడింది ఎవరో ఆయనకు తెలియదు. ఎక్కడకి వెళ్ళాలో తెలియదు. మాట్లాడింది దేవుడో కాదో ప్రశ్నించే ప్రయత్నమూ చెయ్యలేదు. వినిన మాటలను విశ్వసించాడు, విధేయుడయ్యాడు. వాగ్ధానాలను స్వతంత్రించుకున్నాడు.

దేవుని చిత్తానికి లోబడదాం! ఆయన మాటను విశ్వసించి, విధేయతచూపి, ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాం!

అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(మూడవ భాగము)

♻ విధేయత ♻

అబ్రాహాము విశ్వాసయాత్రలో, ప్రాముఖ్యమైన రెండు అంశాలలో “విశ్వాసము” ఒకటైతే, “విధేయత” మరొకటి. అబ్రాహాము దేవుని మాటలను విశ్వసించి, విధేయుడు కాకుండా, కల్దీయులదేశములోనే కూర్చొనివుంటే, నేటి దినాన్న మనము అబ్రాహాము గురించి చెప్పుకోవడానికంటూ ఏమిలేదు. విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును (యాకోబు 2:17) క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనది (యాకోబు 2:20) విశ్వాసమునకు విధేయత తోడైతేనే విప్లవాత్మకమైన విజయాలు సాధ్యమవుతాయి. దానికి అబ్రాహాము జీవితమే మంచి ఉదాహరణ.

విధేయత అంటే?
ప్రశ్నించకుండా లోబడడం.

LTTE అధినేత ప్రభాకరన్ ను అమెరికన్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు.
జర్నలిస్ట్: ఇంత తక్కువ సైన్యంతో దేశమునే వణికిస్తున్నారు ఎట్లా సాధ్యము?
ప్రభాకరన్: 'విధేయత'
జర్నలిస్ట్ : మా సైన్యం కూడా విధేయతతోనే వుంటుంది. మీ విధేయతలో ప్రత్యేకత ఏమిటి?
ప్రభాకరన్: అతనికి తన సైన్యం పేర్లున్న బుక్ ఒకటిచ్చి, ఇద్దరు పేర్లు పిలవమన్నాడు. పిలవగా, ఆ ఇద్దరూ పరుగులెత్తుకొంటూ వచ్చారు. వారితో చెప్పాడు ప్రభాకరన్ మీ ఇద్దరూ చచ్చిపొండి. వెంటనే వారేమి ప్రశ్నించ లేదు. తమ మెడలో నున్న పోటాషిం సైనైడ్ ప్యాకెట్స్ నోటిలో వేసుకొని గిలగిలా తన్నుకొంటూ చచ్చిపోయారు.
మరొక ఇద్దరి పేర్లు పిలవమన్నాడు. జర్నలిస్ట్ భయపడుతూ మరొక ఇద్దరి పేర్లు పిలిచాడు. వారూ పరుగులెత్తుకొంటూ వచ్చారు. వారితో చెప్పాడు ప్రభాకరన్ వీళ్ళను తీసుకొనివెళ్లి సమాధి చెయ్యండని. వారు ఏమి జరిగిందని ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా తీసుకొని వెళ్లి సమాధిచేసారట. ప్రభాకరన్ చెప్పాడు 'విధేయత' అంటే ఇది.

అవును! విధేయత 'ప్రశ్నించదు'. యొప్తా కుమార్తె విధేయత దేవునికి అర్పణముగా మారగలిగింది (న్యాయాధి 11:29-39), మరియ విధేయత లోక రక్షకుని తల్లిని చేసింది (లూకా 1:38). యేసు క్రీస్తు విధేయత లోకానికి రక్షణ నిచ్చింది (రోమా 5:19 ;ఫిలిప్పి 2:8) నోవహు విధేయత తనకుటుంబాన్ని రక్షించగలిగింది (ఆది 6:22). యోసేపు విధేయత బానిసగా బ్రతకాల్సిన వానిని దేశానికి ప్రధానిని చేసింది (ఆది 39:2; 41:46), యెహోషువ విధేయత ఇశ్రాయేలీయులకు నాయకుని చేసి, వాగ్ధాన భూమికి చేర్చింది. (యెహోషువా 11:15). పౌలు విధేయత నీతికిరీటాన్ని సంపాదించగలిగింది. (అపో. కా. 26:19 ; 2 తిమోతికి 4:7,8), పేతురు విధేయత చేపల రాశిని చూచి విస్మయమొందెలా చేసింది. (లూకా 5:5-9) అబ్రాహాము విధేయత విశ్వాసులకు తండ్రిని చేసింది(ఆది 12:4). ఇంతకీ, మనమెవరికి విధేయులవుతున్నాం? అయితే, ఒక్క విషయం? ఒక మనిషి, ప్రాణంతీసే మరో మనిషికి అంత విధేయత చూపగలిగితే? ప్రాణం పెట్టిన ప్రియరక్షకునికి ఇంకెంత విధేయత చూపగలగాలి? విధేయత విప్లవాత్మకమైన విజయాలు సాధిస్తుంది. అదే అబ్రాహాము విజయరహస్యం.

కాకులు దేవుని మాటకు లోబడి ఏలియాను పోషించాయి (1రాజులు 17:6). సింహాలు దేవుని మాటకు లోబడి దానియేలును రక్షించాయి (దానియేలు 6:22). అగ్నిగుండం దేవుని మాటకు లోబడి దాని సహజ ధర్మాన్ని కోల్పోయి షడ్రకు, మేషాకు, అబేద్నగో అను హెబ్రీ యువకులకు ఎట్లాంటి హాని చెయ్యలేదు. (దానియేలు 3:27). మత్స్యము దేవుని మాటకు లోబడి యోనాను రక్షించింది(యోనా 1:17). గాలి తుఫాను దేవుని మాటకు లోబడ్డాయి (మత్తయి8:26). సూర్య చంద్రులు దేవుని మాటకు లోబడ్డాయి (యెహోషువ 10:12). సముద్రము దేవుని మాటకు లోబడింది. ఇట్లా చెప్పుకొంటూపోతే లెక్కలేనన్ని. సృష్టియావత్తు దేవునికి విధేయత చూపుతుంది. ఈ సృష్టిలో అంత్యంత విలువైన సృష్టముగా సృష్టింపబడిన నీవూ, నేనూ తప్ప.

దేవుడు ఒక్కసారి మాట్లాడితేనే అబ్రాహాము విధేయుడయ్యాడు (ఆది 12:1-4), ఒక్కసారి చెప్పిన దూత వర్తమానమునకు గొల్లలు విధేయులయ్యారు (లూకా 2:10-17). మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకోగలిగితే? సంవత్సరాల తరబడి దేవుడు తన వాక్కు ద్వారా, దేవుని సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూనే వున్నాడు. ఆయన మాటలు విని, విశ్వసించి, విధేయులమైన అనుభవం మనకుందా? వుంటే ధన్యులమే. లేకుంటే, అబ్రహాము జీవితంద్వారా అట్టి అనుభవంలోనికి ప్రవేశించగలగాలి. అబ్రాహాముతో దేవుడు చెప్పిన మాటలు చాల కఠినముగా వున్నాయి. దేశాన్ని, తండ్రి ఇంటిని, బంధువులను విడచిపెట్టాలి. అందరినీ విడచిపెట్టేస్తే ఇక అబ్రాహాముకంటూ ఎవరున్నారు? ఎవ్వరూ వుండకూడదనే. ఎవ్వరూ లేనప్పుడే సంపూర్ణంగా దేవునిపైన అధారపడగలము. కాని, ఒక్క విషయం, అత్యంత నాగరికత, సకల సౌఖ్యాలను కలిగిన పట్టణమును విడచి అడ్రస్ లేని ప్రయాణాన్ని సాగించడానికి ఏవ్యక్తియైనా సాహసించగలడా? పిచ్చోడు అయితే తప్ప, అబ్రాహాము విశ్వాసము అతనిని పిచ్చివానినిగానే చేసింది. తన భార్య అయిన శారాయి (శారా) ఎన్ని ప్రశ్నలు అడిగివుంటుందో కదా? తన తండ్రి, సహోదరులు ఎన్నిన్ని ప్రశ్నలడిగి వుంటారు?
దేవుని మాటకు లోబడి ప్రయాణం చేస్తుంటే, ఊరు ప్రజలంతా అడుగుతున్నారు. అబ్రాహామా ఎక్కడికి వెళ్తున్నావ్? ఏమని చెప్పగలడు? ఎక్కడకి వెళ్తున్నాడో అతనికి తెలిస్తేకదా చెప్పడానికి? అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను (హెబ్రీ 11:8) అబ్రాహాము విశ్వాసయాత్ర అవమానములతోనే ఆరంభమయ్యింది. కష్టాలతోనే కొనసాగింది. అంతము మాత్రం చెప్పలేనంత ఆశీర్వాదకరంగా ముగిసింది. విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము. (యాకోబు 2:22)

దేవుని చిత్తానికి లోబడదాం! ఆయన మాటను విశ్వసించి, విధేయతచూపి, ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాం!

అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(నాలుగవ భాగము)
♻ దేవుడు మనలను దేనికొరకు పిలిచాడు? ♻ (పార్ట్-1 )

అబ్రాహాముకువలెనే మనకునూ దేవుని పిలుపుంది. వాగ్ధానపు ఆశీర్వాదాలున్నాయి. ఆయన పిలుపుకు ఒక ప్రత్యేకత వుంది. పిలువబడినవారు ఎవరనేది ఆయన ముందుగానే నిర్ణయించుకున్నారు. పిలువబడిన పిలుపులో నీవూ, నేనూ వున్నామంటే, అది అప్పటికప్పుడు జరిగిందికాదు. జగత్తు పునాది వేయబడకముందే ఆయన ప్రణాళికలో మనమున్నాము. “మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను”. (రోమా 8:30). అబ్రాహాము జీవితంలో ఇదే జరిగింది. మన జీవితాల్లోకూడా ఇట్లానే జరిగించాలని ప్రభువు ఆశిస్తున్నారు. ఇదెప్పుడు సాధ్యమంటే? ఆయన పిలుపుకు మనము లోబడినప్పుడు మాత్రమే సాధ్యం.

1. 🔅పరిశుద్ధులగుటకు మనము పిలువబడ్డాము. 🔅
పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. (1 థెస్స 4:7)

ఆయన ఎట్లా వున్నాడో, ఆయన పిల్లలముగా మనమునూ అట్లానే వుండాలని కోరుతున్నాడు. దేవుడు కలిగియున్న లక్షణాలను గురించి మనము ధ్యానించాల్సివస్తే, మొట్టమొదటిది “పరిశుద్ధత”. దేవుడే తన పరిశుద్ధతను గూర్చి ప్రకటిస్తున్నారు: నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. (లేవీ 11:44,45) యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును (యెషయా 43:15). ప్రభువు తన పరిశుద్ధత విషయంలో లోకానికే సవాలు విసిరారు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? (యోహాను 8:46)
దూతలు దేవుని పరిశుద్ధతను గానం చేస్తున్నారు. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. (యెషయా 6:3) ఆయన పరిశుద్ధుడని ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు.
అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. (యెషయా 53:9) ఆయన పాపముచేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. (1పేతురు 2:22)ఆయన పరిశుద్ధుడని అపోస్తలులు సాక్ష్యమిస్తున్నారు: పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. (హెబ్రీ 7:26)
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను. (2 కొరింథీ 5:21) ఇట్లా, చెప్పుకుంటూపొతే, లెక్కలేనన్ని. మనుష్యులే కాదు, చివరికి దయ్యాలు సహితం ఆయన పరిశుద్ధుడని సాక్ష్యమిచ్చాయి. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి (1 పేతురు 1:14)‬ ఆయన పరిశుద్ధుడు కాబట్టే, ఆయన పిల్లలముగా మనమునూ పరిశుద్ధులుగా వుండడానికే ఆయన పిలిచారు. ఆయనవలే, పరిశుద్ధులముగా జీవించడం మనకు సాధ్యమవుతుందా? సాధ్యంకాకపోతే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథములో ఈ విషయాన్ని వ్రాయించియుండేవాడు కాదు. మనకు అసాధ్యమైన భారమేది మనమీద పెట్టేవాడు కాదు మన ప్రభువు. పాపము చేయకముందు ఆదాము హవ్వలు, దేవుడంతటి పరిశుద్ధంగానే వున్నారు. ఇప్పుడు అట్లాంటి పరిశుద్ధులముగా నుండడానికి ప్రభువు మనలను పిలిచారుగాని, అపవిత్రులుగా వుండడానికి పిలువలేదు. అయితే, మనము జీవించే లోకం అపవిత్రమైనదయినప్పటికీ, ప్రభువు మనము పవిత్రులముగా జీవించాలని కోరుతున్నారు. అదెట్లా సాధ్యం? ఆయన పాపుల కోసమే ఈ లోకానికి వచ్చికూడా, పాపులలో చేరినవాడు కాదు. (హెబ్రీ 7:26) అట్లానే పాపపు లోకంలో జీవిస్తున్న మనము, లోకము నుండి ప్రత్యేకించబడాలి. ఎట్లా అంటే? తామరాకు తన జీవితాంతం నీటిలోనే ఉన్నప్పటికీ, ఒక్క నీటిబొట్టు కూడా దాని మీద ఉండనివ్వదు. అట్లాంటి జీవితం జీవించగలగాలి. పాపపులోకంలో వున్నాముకాబట్టి, ఒకవేళ పాపము అంటినా, దానిలో స్థిరంగా నిలచియుండడానికి వీల్లేదు. పావురమువలే అనుక్షణము మనలను పరిశుద్ధపరచుకొంటూ వుండాలి. కానీ, దేవుని పిల్లలముగా మన జీవితాలు ఎట్లా వున్నాయంటే? పాపము చూయింగ్ గమ్ లా అంటుకొంది. ఎంతలాగినా, ఎంతోకొంత అట్లానే వుండిపోతుంది. దేవునికి కావలసింది 99.99 శాతము పరిశుద్ధత కాదు. 100 శాతము పరిశుద్ధత. పాపులమైన మనలను ఆయన ప్రేమిస్తాడు గాని, మనము చేసే పాపాన్ని ఎంతమాత్రం కాదు. అదెట్లా అంటే, రోగంతోనున్నవారిని ప్రేమిస్తాము. కానీ, వారికొచ్చిన రోగాన్ని ప్రేమించము. అట్లానే మన పాపంతో ఆయన రాజీపడేవాడేంత మాత్రమూ కాదు. ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది (హబక్కూకు 1:13) ఆయన పిల్లలముగా అట్లాంటి పవిత్ర జీవించాలని ఆయన కోరుతున్నాడు. అందుకోసమే మనలను పిలచి ప్రతేకపరచుకున్నాడు. ఆయన పిలుపుకు అబ్రాహామువలే మనమునూ లోబడగలిగితే, అబ్రాహామువలే మనమునూ ప్రభువిచ్చే వాగ్ధానపు ఆశీర్వాదాలను పొందగలము. ఆయన పిలుపుకు లోబడలేక అపవిత్రులుగానే నేటికిని జీవిస్తున్నామంటే? ఆయన పిలుపును వ్యర్ధంచేసి, మన పట్ల ఆయన ప్రణాళిక నెరవేరకుండా మనమే అడ్డుబండలముగా మారేమేమో? పరిశీలన చేసుకొని, పరిశుద్ధ జీవితం జీవించగలిగితే, జీవితం ధన్యమవుతుంది. ‬‬‬‬

అట్టిరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందాము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(ఐదవ భాగము)
♻ దేవుడు మనలను దేనికొరకు పిలిచాడు? ♻ (పార్ట్-2 )

2. 🔅 స్వతంత్రులుగా నుండుటకు పిలువ బడ్డాము:
సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. ( గలతీ 5:13)

మనము స్వతంత్రులముగా కాకుండా, ఏవో బంధకాల్లో బంధించబడియున్నామని అర్ధమవుతుంది. దేనిచేత మనము బంధించబడి యున్నాము? అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను 8:34) అంటే, పాపపు బంధకాల్లోనున్నాము. పాపము మనపైన ఏలుబడి చేస్తుంది. అది మనపైన యజమానిగాను, దానికి మనము దాసులముగాను వున్నాము. అయితే, ఆ బంధకాలనుండి మనలను స్వతంత్రులను చేసేదెవరు? కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. (యోహాను 8:36) కుమారునియొక్క రక్తప్రోక్షణ మన పాపములను పావనపరచి, బంధకాలనుండి విడిపించి, స్వతంత్రులను చేసింది. స్వతంత్రులైనమనము దానికి అనుగుణముగా జీవించాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొను చున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. (రోమా 12:1,2) సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకోవడం అంటే? మన శరీర అవయవాలను ప్రభువు కొరకు సమర్పించుకోవడం. సమర్పణ అంటే? “చనిపోవడం కొరకు బ్రతకడం”. మన శరీరేచ్ఛలను చంపుకొని ప్రభువుకొరకు జీవించడమే సమర్పణ. సజీవయాగముగా మన శరీరాలను సమర్పించినప్పుడు, మనకాళ్లు పాపం చెయ్యడానికి పరుగులు తీయవు. చేతులు పాపపు పనులు చెయ్యవు. మన కళ్ళు అపవిత్రమైన వాటిని చూడవు. మన నోరు చెడ్డవాటిని పలుకవు. మన తలంపులు మలినం కావు. మనమేమి చేసినా ప్రభువు మహిమార్థమే చేస్తాము. లోకమర్యాదను అనుసరించలేము. లోకంలో ఏముందంటే? లోకములో ఉన్నదంతయు, అనగా శరీ రాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
(1 యోహాను 2:16) క్రీస్తు మనకు విడుదల నిచ్చింది పాపం చెయ్యడానికి కాదు. పాపం చెయ్యడం స్వేచ్ఛ కాదు. అది అన్నింటికంటే చెడ్డ దాస్యం. క్రీస్తు మనలను విడుదల చేసింది మనము ఇష్టపూర్వకంగా దేవునికిని, ఒకరికొకరు ప్రేమకలిగి సేవకులము కావాలనే. (రోమా 6:15-23) అంతేగాని, ప్రభువు మనకిచ్చిన స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనకూడదు. ఎందుకంటే? శరీరమందు మంచిది ఏది నివసింపదు. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. (రోమా 7:18) శరీరానుసారులు శరీరవిషయ ములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయ ములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము; (రోమా 8:5) శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు(రోమా 8:8). అందుచే, ప్రేమకలిగి స్వతంత్రతలో నిలచియుండాలి. దానికోసమే మనము పిలువబడ్డాము. అయితే, ప్రభువుమనకిచ్చిన స్వతంత్రతను శరీర కార్యములను నెరవేర్చడానికే వాడుకొంటూ తిరిగి పాపమనే దాస్యపు కాడిక్రిందకు వెళ్ళిపోతున్నాము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనక (గలతీ 5:1) ఆయన పిలుపుకు లోబడగలిగితే, వాగ్ధానపు ఆశీర్వాదాలు పొందగలము.

3. 🔅 మేలు చేసి, శ్రమ అనుభవించడానికి పిలువబడ్డాము:
తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను. (1 పేతురు 2:20,21)
దేవుడు మనలను తన ప్రత్యేకమైన ప్రజగా వుండుటకు పిలిచినప్పుడు, మంచి చేసి బాధలు అనుభవించడం కూడా పిలుపులో ఒక భాగమే. ఈ విధంగా బాధలు అనుభవించినవారిలో క్రీస్తే గొప్ప ఉదాహరణ. ఆయన మంచితప్ప మరేదీ చెయ్యలేదుగాని, మనందరికంటే ఎక్కువ బాధలు అనుభవించి, మనము తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మనకు మాదిరి యుంచి పోయెను. శ్రమలో ఓర్పు అనేది విధేయత ద్వారా రావాలి. తప్పిదాలు చేసినందుచేత దెబ్బలు తిని ఓర్చుకొంటే అది గొప్ప కాదు గాని మంచి చేసి శ్రమలకు బాధలకు గురి అయి ఓర్చుకోవాలంటే దానికి ఎంతో విధేయత దీనత్వం కావాలి. యోబు భక్తుడు ఏ తప్పు చేయకపోయినా శ్రమల పాలైనాడు కాని ఎంతో ఓర్పుగా ఉండి ఒక్క మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడక తన విధేయతను యదార్ధతను చూపించాడు. అదే దేవుని దృష్టిలో మెచ్చుకోతగినదిగా మారినది. అదేవిధంగా ఏతప్పు చేయక పోయినా యోసేపు 13 సంవత్సరాలు తీవ్రమైన శ్రమల పాలైనాడు కాని ఎంతో ఓర్పుగా ఉండి ఒక్క మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడక దేవుని బలిష్టమైన చేతి క్రింద దీనుడిగా నిలిచి తన విధేయతను యదార్ధతను చూపించాడు. అందునుబట్టి యోబును యోసేపును దేవుడు బహుగా విస్తారంగా ఆశీర్వదించాడు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ((1 పేతురు 4:15,16)
క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించడం అదొక గొప్ప ధన్యత. నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది (మత్తయి 5:10). ప్రభువు తన శిష్యులతో చెప్తున్నమాట. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. (మత్తయి 16:24) అనేకులు ఆత్మీయంగా కాకుండా అక్షరార్ధంగా ఈ మాటలు అర్ధము చేసుకొని, కొయ్య సిలువను భుజాలమీద మోస్తున్నారు. మరికొందరైతే సిలువ వేయించుకొంటున్నారు. నీవు సిలువను మోసినా, సిలువవేయించుకున్నా నీకు గాని, ఈ లోకంలో మరెవ్వరికీ గాని ఎంతమాత్రమూ ప్రయోజనం లేదు. ఇక్కడ సిలువ శ్రమకు సాదృశ్యముగా చెప్పబడింది. సిలువనెత్తుకోవడం అంటే, ఆయన కొరకు శ్రమ పడుతూ (శ్రమలలోనైనా సరే) ఆయనను వెంబడించగలగాలి. అపొస్తలుడైన పౌలు చెప్తున్నమాట “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి”. (1 కొరింథీ 11:1)
పౌలు క్రీస్తునిపోలి నడచుచున్నాడట, తనవలే మనము కూడా క్రీస్తునిపోలి నడవాలని తెలియజేస్తున్నారు. అనగా క్రీస్తు మాదిరిగా వుంచివెళ్లిన శ్రమలు అనే అడుగుజాడలలో ఆయన నడుస్తున్నాడు. అవును, అందుకొరకే మనము పిలువబడ్డాము. అంతమువరకు సహించగలిగితే నిత్యమైన ఆనందాన్ని అనుభవించగలము.

అట్టిరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(ఆరవ భాగము)
♻ దేవుడు మనలను దేనికొరకు పిలిచాడు? ♻ (పార్ట్-3)

4. 🔅 దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనుటకు పిలువబడ్డాము. 🔅
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. (ఎఫెసీ 4:2,3)

అపొస్తలుడైన పౌలు ఎఫెస్సీయులకు వ్రాసిన పత్రికలో దేవుని పిల్లలముగా, ఆయన వారసత్వముగా, ఆయన ఆలయముగా, క్రీస్తు శరీరముగా, ఇల్లుగా ఉండేందుకు ప్రభువు మనలను పిలిచాడని తెలియజేస్తూ. ఆపిలుపుకు తగినరీతిలో ఎట్లా జీవించాలో పౌలుగారు మనలను ప్రోత్సహిస్తున్నారు.
ఆత్మఫలములోని రెండు అంశముల ప్రస్తావన చేస్తున్నారు.
1. దీర్ఘశాంతము,
2. సాత్వీకము.

1. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయము:
దీర్ఘశాంతము అనగా సహనము లేదా ఓర్పు అనికూడా చెప్పవచ్చు. సహించడం ఎట్లా సాధ్యమవుతుందంటే? ప్రేమ కలిగియుండడం ద్వారానే. ఎదుటివారిలో మనము సహించలేనివాటిని సహితం సహించేటట్లు చేయగలిగేది ప్రేమ. “ప్రేమ దీర్ఘకాలము సహించును”(1 కొరింథీ 13:4). దేవుని పిల్లలముగా మనము సంపూర్ణ వినయము కలిగియుండాలి. అది దీర్ఘశాంతముతో కూడినదైయుండాలి. దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారు “వినయమును” ధరించుకొనాలి (కొలస్సి 3:12) వినయము, దీన మనసు గలవారియొద్ద ఆయన నివసించును. మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను. (యెషయా 57:15 ) వినయము గలవారు ఉగ్రతదినమందు తప్పించబడుదురు. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహో వాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. (జెఫన్యా 2:3)


2. సాత్వీకము.
(దీనమనస్సు, సహించే మనసు)
థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రికల్ బల్బ్ ను కనుగొనే ప్రక్రియలో భాగంగా, వెయ్యవసారి విజయవంతంగా బల్బ్ ను తయారు చేస్తాడు. దానిని ఒక పనివానికిచ్చి మేడ గదిలో పెట్టమనగా, అతడు మెట్లెక్కుతుండగా బల్బ్ చేతిలోనుండి జారిపోతుంది. ఇక ఏమిజరిగి ఉంటుందో నేను చెప్పనవసరంలేదు. ప్రపంచములో మొట్టమొదటిగా తయారుచేసిన బల్బ్ అది. మ్యూజియంలో శాశ్వతంగా భద్రపరచాల్సిన బల్బ్ అది. అయితే, ఎడిసన్ అతనిని ఒక్కమాట కూడా అనకుండా మరొక 24 గంటలు కష్టపడి మరొక బల్బ్ తయారుచేసి, అదే పనివానిని పిలిచి, మేడగదిలో పెట్టమన్నాడట. ఇదే సాత్వీకమంటే.

మోషే చాలా కోపిష్టి. అతనికెంత కోపం అంటే? ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతిపెట్టేసాడు. అంత కోపిష్టి నలభై సంవత్సరాలు మిద్యాను అరణ్య అనుభవంలో సాత్వీకుడుగా మారిపోయాడు. సాత్వీకుడుగాకాదు “మిక్కిలి సాత్వీకుడు”గా మారిపోయాడు. ఎంత సాత్వీకుడు అంటే, భూమి మీద అంత సాత్వీకము గలిగినవారెవ్వరూ లేనంత సాత్వీకము గలవాడుగా మారిపోయాడు. దానిని గురించి దేవుడే సాక్ష్యమిచ్చాడు. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. (సంఖ్యా 12:3). ఇట్లాంటి సాత్వీకము మనకెట్లా వస్తుంది? మనకెవరు నేర్పిస్తారు? ప్రభువు పాదాలచెంత చేరగలిగితే, ఆయనే నేర్పిస్తారు. ఆయన మోషేకంటే సాత్వీకుడు. మోషేగారికి సహితం సాత్వీకమును నేర్పినవాడాయన. ఆయన వంటి సాత్వీకుడు సృష్టిలో మరెవ్వరూలేరు. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి(మత్తయి 11:29). ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి (యాకోబు 1:21). దేవుని చేతే ఏర్పరచబడినవారు, పరిశుద్ధులును ధరించుకోవలసిన వాటిలో ఒకటి సాత్వీకము (కొలస్సి 3:12).


ఎందుకంటే? ఆయన సాత్వీకమే మనలను గొప్పచేస్తుంది. (2సమూయేలు 22:36; కీర్తనలు 18:35). సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. (మత్తయి 5:5) సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము (సామెతలు 14:30) సాత్వికమైన నాలుక జీవవృక్షము(సామెతలు 15:4) సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును (సామెతలు 25:1). మన నిరీక్షణనుగూర్చి కారణం అడిగేవారికి సమాధానం చెప్పాలంటే, సాత్వీకము కావాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; (1పేతురు 3:15) ఆయన పిలుపుకు తగినట్లుగా, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనుచూ వాగ్ధాన ఫలాలను అనుభవించుదము.

అట్టిరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝
(ఏడవ భాగము)

♻ దేవుడు మనలను దేనికొరకు పిలిచాడు? ♻ (పార్ట్-4)

5. 🔅 ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డాము.
ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. (1 పేతురు 3:9,10)

“అనేకులకు ఆశీర్వాదకరంగా వుండడమే నిజమైన ఆశీర్వాదం”. అది ఆత్మ సంబంధమైనదేగాని, భౌతిక సంబంధమైనది కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. (ఎఫెసీ 1:3). అట్టి ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి, లేదా వాటికి వారసులుకావడానికే మనము పిలువబడ్డాము. ఇట్టి ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే? కొన్ని షరతులున్నాయి.

1.కీడుకు ప్రతికీడు చెయ్యవద్దు: నీకు కీడు జరిగినా, కీడుకు ప్రతికీడు చెయ్యవద్దు.
2.దూషణకు ప్రతి దూషణచెయ్యవద్దు: నిన్ను దూషించే వారిని తిరిగి దూషింపక వారిని దీవించుడి.
3.చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.
కపటపు మాటలు అంటే? హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును (లూకా 6:45) అట్లా కాకుండా, హృదయంలోనున్నదొకటి పైకి మాట్లాడేవి మరొకటి ఇవే కపటపు మాటలు. దీనాను చెరిపిన షెకెముతోను, అతని తండ్రియైన హామోరుతోను దీనా సహోదరులు ఇట్లానే మాట్లాడారు. (ఆది 34:13) అట్లా అని మనమేమి తక్కువకాదులెండి. హృదయంలో కక్షలు, కార్పణ్యాలు పైకి మాత్రం షేక్ హ్యాండ్ లు, ప్రయిజ్ ది లార్డ్ లు. ఇట్లాంటి కపటపు మాటలు ప్రభువు మనలను పిలిచిన పిలుపుకు తగిన బహుమానాలు పొందకుండా ఆటంక పరుస్తాయి. యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము. (కీర్తనలు 120:2) అంటూ దావీదు దేవునికి ప్రార్ధిస్తున్నాడు. తన నాలుకను తాను స్వాధీనపరచుకొనలేడా? దీనిని బట్టి అర్ధమవుతుంది కదా, అది ఆయనకు సాధ్యం కాదని. అవును అది అత్యంత ప్రమాదకరమైనది. నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతిచేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును. (యాకోబు 3:5-10). అయితే, ప్రభువిచ్చే వాగ్ధానపు ఆశీర్వాదాలు పొందాలంటే, మనమాటలు ఎట్లా వుండాలంటే? నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు. అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి (సామెతలు 8:6-9). కీడుకు ప్రతికీడు చేయకుండా, దూషణకు ప్రతిదూషణ చేయకుండా, కపటపు మాటలు మాట్లాడకుండా, సత్యమైన, యదార్ధమైన మాటలే పలుకుచు, ఆశీర్వాదమునకు వారసులవుదము.

6. 🔅 బహుమానము పొందుటకు పిలువబడ్డాము:🔅
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. (ఫిలిప్పీ 3:14).

జీవితం అంటే పరుగుపందెము. ఆలయక, గమ్యం చేరి, బహుమానం పొందేవిధంగా పరుగెత్తాలి. ఆయన ఉన్నతమైన పిలుపుకు లోబడినవారికి ఆయనిచ్చే బహుమానం ఏమిటో ఇక్కడ ప్రస్తావించబడలేదు గాని, అది అత్యంత శ్రేష్ఠమైనదనియు, అక్షయమైనదనియు పౌలుగారి మాటలనుబట్టి గ్రహించగలము.
(1 కొరింథీ 9:24-27). మోషే గారు ఐగుప్తు ధనాన్ని గాని, అల్పకాల సుఖభోగాలను గాని, ఫరో కుమార్తెయొక్క కుమారుడనని అనిపించుకోవడానికి గాని, ఆయన ఇష్టపడినవాడుకాదుగాని, ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను. (హెబ్రీ 11:26) నేటి విశ్వాసుల జీవితాలు దీనికి పూర్తిగా భిన్నంగా వున్నాయి, ధనము, అల్పకాల సుఖభోగాలు, హోదా, అధికారం మోజులోపడి, ఆయన ఉన్నతమైన పిలుపును నిర్లక్ష్యంచేసి, అక్షయమైన, శాశ్వతమైన బహుమానానికి దూరమైపోతున్నారు. అయితే, పౌలుగారు చెప్పినమాటలు విశ్వాస పరుగుపందెములో పరుగెత్తడానికి మనకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తాయి. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. (2 తిమోతికి 4:7,8) ప్రభువురాకడ రాకముందే, మన ప్రాణం పోకముందే గమ్యాన్ని చేరగలగాలి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది (ప్రకటన 22:12). ఆయన ఉన్నతమైన పిలుపుకులోబడి, ఆయనిచ్చే శ్రేష్టమైన బహుమానము పొందుటకు గురియొద్దకే పరిగెత్తుటకు హృదయాలను సిద్ధపరచుకొందము.

ఇంతవరకు “ప్రభువు మనలను దేనికొరకు పిలిచారు?” అనే కొన్ని విషయాలను ధ్యానం చేయగలిగాము. ఇవన్నీ దేవుడు అబ్రాహామును పిలిచిన ఒక్క పిలుపులోనే నివిడీకృతమైయున్నవని గ్రహించగలము. అబ్రాహాము దేవుని పిలుపుకు లోబడినప్పుడు ఎట్లాంటి ఆశీర్వాదపు వాగ్ధానాలను పొందగలిగారో, ప్రభువు పిలిచిన పిలుపుకు మనము లోబడగలిగితే, అట్టి వాగ్ధానపు ఆశీర్వాదాలు మనమునూ పొందగలము.

అట్టిరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(ఎనిమిదవ భాగము)
♻ దేవుడు అబ్రాహాముకు విధించిన షరతులు ♻

యెహోవా - నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము (ఆది 12:1).

🔅 నీ దేశమును విడచి పెట్టు:
లోకమునునుండి లేదా గతమునుండి వేరుపడాలన్నది దేవుని ఉద్దేశ్యం. ఎందుకనగా, అబ్రాహాము పుట్టిపెరిగిన దేశముగాని, తన తండ్రి ఇంటివారుగాని, అతని బంధువులుగాని అందరూ విగ్రహారాధికులే. వాళ్ళంతా లోకమర్యాదను అనుసరించేవారే. దేవునితో కలసి ప్రయాణం చెయ్యాలనుకున్నప్పుడు లోకమునుండి ప్రత్యేకించబడి తీరాల్సిందే. అటు దేవునితోనూ, ఇటు లోకంతోనూ కలసి ప్రయాణం చెయ్యడం సాధ్యం కానేకాదు. అట్లాంటివాని గమ్యం రెండుపడవల మీద కాలువేసినవారివలే వుంటుంది. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా? (యాకోబు 4:4), లోకాన్ని స్నేహిస్తే దేవుడు నీకు శత్రువుగా మారతాడు. ఆయనే నీకు శత్రువుగా మారితే, ఆయన చేతిలోనుండి నిన్ను విడిపించేదెవరు? ఎవడు ఇద్దరు యజమానులను సేవింపలేరు. మీరు సిరిని, దేవునిని వెంబడించలేరు ( మత్తయి 6:24) ఒక ఒరలో రెండు కత్తులకు స్థానం లేదు. దేవుని ఆశీర్వాదాలను పొందాలనుకున్నవారెవరైనా సరే, లోకమునుండి, లోక ఆశలనుండి వేరుపడాలి. ఎందుకంటే? ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. (1 యోహాను 2: 15-17). దేమా ఈలోకమును స్నేహించాడు (2 తిమోతి 4:10) అతడు లోకాన్ని విడచిపెట్టలేదు. కీస్తుని వెంబడిస్తున్నానని ప్రకటించాడు. లోకాన్ని విడచిపెట్టకుండా క్రీస్తుని వెంబడించడం ఎట్లా సాధ్యం? కానేకాదు. పైకి అపోస్తలుడైన పౌలును వెంబడిస్తున్నప్పటికి, హృదయంలో మాత్రం లోకం మీద ప్రేమవుంది. మనుష్యుల దగ్గర నటించగలమేమోగాని, దేవుని దగ్గర సాధ్యమవుతుందా? ఎవరినో మోసంచేస్తున్నానని సంబరపడిపోయే నీవు, నిన్నునీవే మోసం చేసుకొంటున్నావని గుర్తుంచుకో! మరళా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క శాశ్వతమైన ఆశీర్వాదాలను పొందాలని నీవు ఆశిస్తే, లోకమునుండి ప్రత్యేకబడాలి. ఆయన చిత్తానికి లోబడాలి.

🔅 నీ తండ్రిని ఇంటిని విడచిపెట్టు:
దేవుని పిలుపు అబ్రాహామును అతని కుటుంబమునుండి వేరుపడాలని ఆదేశిస్తుంది. అసలు ఆ ఎడబాటును ఊహించగలమా? కని, పెంచి, పెద్దచేసిన తండ్రి కుటుంబానికి దూరమైతే, వృద్ధాప్యంలోనున్న తలిదండ్రులకు ఆశ్రయమెవరు? తనకేదైనా సమస్యవస్తే ఆదరించేదెవరు? అవును, కాని నీతండ్రి ఇంటితో నీకుండేసంబంధాలకంటే, నీ పరమతండ్రితో నీకుండే సంబంధమే ప్రధానమైనదిగా వుండాలి. అప్పుడు నీముందున్న ప్రశ్నలంటికి ఆయనే సమాధానమవుతాడు. నీ ప్రతీ సమస్యకు పరిష్కారమవుతాడు. నీ తండ్రి ఇల్లు నిన్ను దేవునిని నుండి దూరంచేసేదిగా వుందా, దానిని విడచిపెట్టడం శ్రేయష్కరం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు (లూకా 14:26). అట్లా అని, తలిదండ్రులను పట్టించుకోనవసరంలేదు అనేది దీని భావం ఎంతమాత్రమూ కాదు. పరిశుద్ధ గ్రంథము తలిదండ్రులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పది ఆజ్ఞలలో ఒకటి తలిదండ్రులను సన్మానింపుము (నిర్గమ 20:12) తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును (సామెతలు 20:20). నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను (సామెతలు 23:25). పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధే యులైయుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు
నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. (ఎఫెస్సి 6:1-3) అయితే, ద్వేషించడం అంటే, తలిదండ్రులకంటే ప్రధమస్థానం దేవునికివ్వాలని. తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు(మత్తయి 10:37). దేవునికంటే, దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత యిస్తే అదే మన జీవితంలో విగ్రహమవుతుంది. మనము విగ్రహారాధికుల మవుతాము. విగ్రహారాధకులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. (ప్రకటన 21:8)

🔅 నీ బంధువులను విడచిపెట్టు:
నేటి దినాలలో క్రీస్తుని అంగీకరించి కూడా దేవుని మందిరానికి రావాలంటే భయం. వాక్యానుసారమైనరీతిగా కార్యక్రమాలు చెయ్యాలంటే భయం. ఆరీతిగా చేస్తే బంధువులు దూరమైపోతారు. ఇట్లా చెప్పేవాళ్ళు లెక్కలేనంతమంది. అంటే, బంధువులకోసం క్రీస్తుని వదులుకోవడానికైనా సిద్దమే అన్నట్లుగా వున్నాయి కొందరి జీవితాలు. కాని ఒక్కవిషయం, బంధువులతో నీకుండే సంబంధాలకంటే నీ పరమ తండ్రితో నీకుండే సంబంధాలే ప్రధానమైనవిగా వుండాలి. నీ బంధువులతో నీ సంబంధాలు నీవు బ్రతికియున్నంతవరకే. కాని, పరమతండ్రితో సంబంధం శాశ్వతకాలం. బంధువులతో మనము కలిగియున్న సంబంధాలు దేవునినుండి మనలను దూరం చేసేవిగావుంటే, ఆ సంబంధాలకు దూరంగా వుండడం మన ఆత్మీయ జీవితాలకు శ్రేయస్కరం. అబ్రహాము బంధువులంతా విగ్రహారాధికులే అందుకే వారినుండి ప్రత్యేకింపబడాలని దేవుడు కోరుతున్నాడు.

🔅 నేను చూపించే దేశానికి వెళ్ళు:
అబ్రాహాముతో దేవుడు మూడింటిని విడచిపెట్టమన్నాడు. నీ స్వదేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడచిపెట్టి, "నేను చూపించే దేశానికి వెళ్ళు" అని చెప్పారు. కాని, ఎక్కడకి వెళ్ళాలో చూపించలేదు, చెప్పలేదు. అబ్రాహాము విశ్వాసమంతా దీనిలోనే ఇమిడి వుంది. అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను (హెబ్రీ 11:8). యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. (ఆది 12:4)

అయినప్పటికీ, అబ్రాహాము జీవితంలో దేవుని చిత్తము నెరవేర్పు ఆలస్యం కావడానికి గల కారణాలేమిటి? దేవుడు అబ్రాహాముతో దేవుడు స్పష్టంగా చెప్పారు. నీ దేశాన్ని విడచిపెట్టమని, అబ్రాహాము ఆరీతిగానే తన దేశమును విడచిపెట్టాడు. నీ తండ్రి ఇంటిని విడచిపెట్టు అని దేవుడు చెబితే తన తండ్రిని వెంటతీసుకొని వెళ్ళాడు. నీ బంధువుల ఇంటిని విడచిపెట్టమంటే తన బంధువైన లోతును వెంటతీసుకొని వెళ్ళాడు. నేను చూపించు దేశమునకు వెళ్ళమని చెబితే, హారానులోనే ఆగిపోయాడు. దేవుడు చెప్పినదానికి అబ్రాహాము చూపించిన విధేయత 25శాతము మాత్రేమే. అబ్రాహాము ఉద్దేశ్యము మంచిదేకావొచ్చు. తన తండ్రి భాద్యతలను తీసుకోవడం, తండ్రిని కోల్పోయిన లోతును చేరదీయడం. కాని, దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చెయ్యగలగాలితప్ప, మన స్వంత ఉద్దేశ్యాలను చొప్పించే ప్రయత్నం చెయ్యకూడదు. మన జీవితంలో కూడా అనేక సందర్భాలలో మనము చేసేది దేవుని చిత్తము కాకపోయినా, వాక్యానుసారము కాకపోయినా ఎదుటవారికి మేలు చేస్తున్నాముకదా అంటూ మనలను మనము సర్దిచేప్పుకొనే ప్రయత్నం చేస్తాము. కాని అట్లాంటి వాటివలన ఆధ్యాత్మిక జీవితంలో భారీ మూల్యం చెల్లించాల్సివస్తుంది.
అబ్రాహాము కొన్ని సందర్భాలలో దారి తొలగినాగాని, మరళా సరిచేసుకోగలిగాడు. దేవుడు వాగ్ధానము చేసిన ప్రతీవిధమైన ఆశీర్వాధాన్ని స్వతంత్రించుకోగలిగాడు.

అట్టిరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(తొమ్మిదవ భాగము)
♻ దేవుడు అబ్రాహామునకు చేసిన వాగ్ధానపు ఆశీర్వాదములు ♻ (part-1)

నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. (ఆది 12:2,3)

🔅 దేవుడు అబ్రాహామునకు చేసిన వాగ్దానములు:
1, నిన్ను గొప్ప జనముగా చేసెదను
2. నిన్ను ఆశీర్వదించెదను
3. నీ నామమును గొప్ప చేస్తాను
4. నీవు ఆశీర్వాదముగా వుంటావు
5. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదిస్తాను.
6. నిన్ను దూషించేవారిని శపిస్తాను
7. భూమి యొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడును.

దేవుడు అబ్రహాముకు ఏడు ఆశీర్వాదాలను వాగ్ధానము చేసారు. పరిశుద్ధ గ్రంధములో ఏడు అనే సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది. అంటే, ఏడు ఆశీర్వాదాలను వాగ్దానం చేయడం ద్వారా, దేవుడిచ్చే ఆశీర్వాదము సంపూర్ణమైనదని గ్రహించగలము.

🔅 1. నిన్ను గొప్ప జనముగా చేసెదను:
దేవుని మాటకు విధేయత చూపే వారిపట్ల ఆయన ఎంత శ్రద్ధ గలిగివుంటారో మనం ఈ మాటలనుబట్టి అర్ధం చేసుకోగలం. సంతానములేక కృంగిన స్థితిలోనున్న అబ్రాహాము హృదయాన్ని ఎరిగిన దేవుడు మొట్టమెదటగా అట్టి వాగ్ధానాన్నే చేస్తున్నారు. అసలు ఒక్కబిడ్డ కూడా లేడే అంటే, ఆయనేమో నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప జనము అంటే, ఒక దేశముమీద యుద్ధం చేసి, ఆ దేశాన్ని వశపరచుకోగలిగేటంత జనముగా నిన్ను చేస్తాను. ఈ వాగ్ధానము పలుమార్లు అనుగ్రహించబడింది. అబ్రాహాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి – ఇదిగో నేను నియమించిన నిబంధన నీతో చేసియున్నాను. నీవు అనేక జనములకు తండ్రివగుదువు.
మరియు ఇకమీదట నీపేరు “అబ్రాము” అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు “అబ్రాహాము” అన బడును. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను (ఆది 17:4-8). అబ్రహాము అంటే "అనేక జనములకు తండ్రి" అనేక జనములు అంటే? ఇష్మాయేలు, ఇస్సాకు, కెతూరా కుమారులందరి సంతానమువారు. (ఆది 16:10; 17:19; 25:1-4). యూదులకు, ముస్లింలకు, క్రైస్తవులకు కూడా తండ్రిగానే పిలువబడుతున్నాడు. అంతేకాకుండా అబ్రాహాము సంతతిలోనుండి అనేకమంది రాజులు వచ్చారు. ఇశ్రాయేలు, ఇతర పాలకులూ వీరిలోవున్నారు. రాజులకు రారాజైన యేసు ప్రభువు వారుకూడా శరీరాధారిగా అబ్రాహాము సంతానమునుండే వచ్చారు (మత్తయి 1:1). ఇదంతా ఎట్లా సాధ్యమయ్యింది అంటే, ఆయన మాటలను విశ్వసించడం, విధేయత చూపడం ద్వారానే సాధ్యమయ్యింది. అట్టి జీవితాన్ని మనమునూ జీవించగలిగితే, అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు మనలనూ ఆశీర్వదించగలడు.

🔅 2. నిన్ను ఆశీర్వదిస్తాను:
ఆశీర్వాదము అంటే ఏమిటి?
పూర్వకాలంలో, విస్తారమైన పశుసంపద, ఎక్కువ మంది సంతానముంటే. ఆశీర్వదింపబడినవారు అనేవారు. నేటి దినాలలో ఆస్థులు, అంతస్థులు, కార్లు, బ్యాంకు బ్యాలెన్స్, విలాసవంతమైన జీవితం జీవిస్తుంటే, వారిని ఆశీర్వదించబడినవారుగా తలంచుచున్నాము. అదేనా ఆశీర్వాదామంటే? ఒకవేళ అదే ఆశీర్వాదం అనుకుంటే, విస్తారమైన పశుసంపద, దాసదాసీలు, పదకొండుమంది పిల్లలు (అప్పటికింకా బెన్యామీను పుట్టలేదు) కలిగియున్న యాకోబు, యబ్బేకు రేవు దగ్గర దేవునితో పోరాడుతున్నాడు. దేనికోసం? “ఆశీర్వాదం కోసం” అంటే, తనకున్న విస్తారమైన పశుసంపద, పిల్లలు అతనికి ఆశీర్వాదంలా అనిపించలేదు. “Second fonder of Christianity” గా పిలువబడే వ్యక్తి అపొస్తలుడైన పౌలు. డేరాలు కుట్టుకొంటూ డేరాలలోనే బ్రతికాడు. క్రీస్తుఖైదీగా మారినతర్వాత, సంతృప్తిగా ఆహారం భుజించిన సందర్భంలేదేమో? ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి వణకుతూనే ఆయన సువార్త ప్రయాణాన్ని కొనసాగించారు. చెరసాల జీవితం, కొరడా దెబ్బలే అయన పొందుకున్న సన్మానం. మనము కలిగియున్న అభిప్రాయం ప్రకారం, అతడు ఆశీర్వదించబడినవాడు కాదు అందామా? వీరిద్దరి జీవితాలను పరిశీలన చేస్తే, మనకొక విషయం అర్ధమవుతుంది., మనమనుకున్నవేమి ఆశీర్వాదాలు కావని. అయితే, నిజమైన ఆశీర్వాదము ఏమిటి? “అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండటమే నిజమైన ఆశీర్వాదము” దేవుడు ఇస్తే ఇలాంటి ఆశీర్వధాలు మాత్రమే ఎక్కువ ఇస్తారు. పరిశుద్ధ గ్రంధములో వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు అత్యల్పం. దేవుని అభిషేకం, ఆశీర్వాదము ఒక్క వ్యక్తి దగ్గరే ఆగిపోవటాన్ని దేవుడు ఎప్పుడు సమర్ధించడు. ప్రభువు ఆశీర్వాదపు నిధి. ఆయన ఆశీర్వదించువాడు. నిన్ను ఆశీర్వాదిస్తానని అబ్రాహామునకు వాగ్ధానమిస్తున్నాడు. ఆ ఆశీర్వాదాలు పరసంబంధమైనవి కావొచ్చు, లేదా భూసంబంధమైనవి కావొచ్చు, లేదా రెండూ కావొచ్చు. ఒక్కటిమాత్రం వాస్తవం. భౌతికమైన ఆశీర్వాధాలకంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే ఎన్నోరెట్లు అత్యంత ప్రాముఖ్యమైనవి (మత్తయి 5:3-12; లూకా 6:20-26 ). ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతమైనవి (మత్తయి 6:19,20). ఆయన మాటలను విశ్వసించి, విధేయత చూపగలిగితే అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు మనలనుకూడా భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించగలడు.

🔅 3. నీ నామమును గొప్ప చేయుదును:
కల్దీయుల దేశములో విగ్రహాలను అమ్ముకుంటూ, వ్యవసాయం చేసుకునే అబ్రాహాముతో దేవుడంటున్నమాట, “నేను చెప్పినట్లు చెయ్యి. నీ నామమును గొప్ప చేస్తాను”. అబ్రాహాము అట్లానే చేసాడు. ఆయన నామమును దేవుడు గొప్ప చేసాడు.
అబ్రాహాము అనే పేరుకు “ఘనతగల తండ్రి” అనే మరొక అర్ధం కూడా వుంది. ఆ రీతిగానే తండ్రి, అబ్రాహాము నామమును ఘనపరిచారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను (కీర్తనలు 91:14). అబ్రాహాము నామమును దేవుడు ఎంత గొప్పచేసారంటే? రక్షించబడిన పిల్లలంతా, అబ్రాహాము కుమారులుగా పిలువబడ్డారు. పాపియైన జక్కయ్య ప్రభువును తన హృదయంలో చేర్చుకున్నప్పుడు, ప్రభువంటున్నమాట. అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. (లూకా 19:9) అనేక సందర్భాలలో దేవుడే తన్నుతాను పరిచయం చేసుకున్నాడు. నేను అబ్రాహాము దేవుడనని. ఆ రీతిగానే పిలవబడ్డాడు. (మత్తయి 22:31, అపో. కార్యములు 3:13; నిర్గమ 4:5; 3:15,16) మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు (గలతి 3:29). అంతే కాదు, దేవుడు అబ్రాహాము నామమును ఎంత గొప్ప చేసాడంటే, అబ్రాహాము నా స్నేహితుడంటూ దేవుడే తెలియజేసారు. ఇదంతా ఎట్లా సాధ్యమయ్యింది అంటే, ఆయన మాటలను విశ్వసించడం, విధేయత చూపడం ద్వారానే సాధ్యమయ్యింది.

అయితే, అబ్రాహాము జీవితానికి మన జీవితాలు పూర్తి విరుద్ధం. అబ్రాహాము దేవుడు చెప్పినట్లు చేసి, దేవునిచేత గొప్పచేయబడ్డాడు. కానీ, మనమైతే, ఆయన మాటకు లోబడకుండా మనలను మనమే గొప్పచేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నాము. పేరుకు ముందూ వెనుక ఏవేవో తగిలించుకొని, సువార్త కంటే, పబ్లిసిటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, దేవునికంటే మనలను మనమే ఘనపరచుకొనే దయనీయమైన స్థితికి దిగజారిపోయాము. అయితే, నీకొక విషయం అర్ధం కావాలి. దేవుడు నిన్ను గొప్ప చేస్తేనేగాని నీవు గొప్పవాడివికాలేవు. ఆయన నిన్ను గొప్పచేయ్యాలంటే, ఆయనకు లోబడి జీవించగలగాలి. అదే అబ్రాహాముగారి విజయ రహస్యం.
అట్టిరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(పదియవ భాగము)
♻ దేవుడు అబ్రాహాముకు వాగ్ధానము చేసిన ఆశీర్వాదములు ♻ (part-2)

🔅 4. నీవు ఆశీర్వాదముగా నుందువు:
అనేకులకు ఆశీర్వాదముగా నుండుటయే నిజమైన ఆశీర్వాదము. అబ్రాహాముకు ఇవ్వబడిన ఆశీర్వాదము ఇస్సాకు, ఇతని ద్వారా సర్వజనములు ఆశీర్వధించబడ్డాయి. (అది 22:18) దేవుడిచ్చే ఆశీర్వాదాలలో వ్యక్తిగతమైన ఆశీర్వాదాలకంటే ఇట్లాంటి ఆశీర్వాదాలే ఎక్కువ. ఆదాముకి ఇవ్వబడిన ఆశీర్వాదము సృష్టిని ఏలుటకు(అది 1:28)
నోవహుకి ఇవ్వబడిన ఆశీర్వాదము భూమిని నిండించింది(అది 9వ అద్యా) యాకోబుకు ఇవ్వబడిన ఆశీర్వాదము, ఇశ్రాయేలు జనంగానికి కనాను దేశం ఇచ్చింది(అది 28 అద్యా) యోసేపుకు ఇవ్వబడిన ఆశీర్వాదము, ఐగుప్తును, తన కుటుంబాన్ని కరువు నుండి కాపాడింది ( అది 50:20). మోషేకి ఇవ్వబడిన ఆశీర్వాదము, ఇశ్రాయేలు జనంగానికి విమోచన అందించింది ( నిర్గమా 4:12). యెహోషువాకు ఇవ్వబడిన ఆశీర్వాదము, మోషే లేమిని కొట్టివేసి ఇశ్రాయేలు జనంగానికి ధైర్యం ఇచ్చుటకును (యెహో 1వ అద్యా) గిద్యోనుకు, సంసోనుకి ఇవ్వబడిన ఆశీర్వాదము, దేవుని జనాంగ పరిరక్షణకు (న్యాయ 6,7,13 అద్యా) దావీదుకు ఇవ్వబడిన ఆశీర్వాదము, అవిధేయులకు గుణపాఠం, ఇశ్రాయేలు ప్రజలకు నీతిగల రాజుని ఇచ్చుటకు (1 సమూ 13:14) సోలోమోను కు ఇవ్వబడిన ఆశీర్వాదము, ప్రజలను న్యాయంగా పరిపాలించుటకును (1 రాజు 3:7) నెహేమ్యాకు ఇవ్వబడిన ఆశీర్వాదము, పడిపోయిన యెరూషలేము గోడలు కట్టబడుటకును( నెహేమ్యా 1వ అద్యా) ఎస్తేరు కు ఇవ్వబడిన ఆశీర్వాదము, యూదుల పరిరక్షణకును (ఎస్తేరు 4:12-16)
యోబుకు ఇవ్వబడిన ఆశీర్వాదము, అనేకులకు బుద్ది చెప్పుటకును, అనేకులను లేవనెత్తుటకును (యోబు 4:3) దానియేలుకు ఇవ్వబడిన ఆశీర్వాదము, అన్య దేశాలలో దేవుని నామమును ఘనపరచుటకును (దానియేలు గ్రంధం) అంతేనా? కుమారుడికి ఇవ్వబడిన అభిషేక ఆశీర్వాదము, సర్వలోక పాపమును కొట్టివేయుటకును, పేతురుకు ఇవ్వబడిన ఆశీర్వాదము, చెదరగొట్టబడిన ఇశ్రాయేలీయులను కట్టుటకును, పౌలుకు ఇవ్వబడిన ఆశీర్వాదము, అన్య జనులను నిలబెట్టుటకును, ఇప్పుడు సర్వజనులపై కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ అభిషేకం అనే ఆశీర్వాదము, భూదిగంతములవరకు సువార్తను ప్రకటించుటకును. (యోవేలు 2:28)(అపో.కా 2:17,18). నీవూ నేనూ కూడా ఒక ఆశీర్వాదములా వుండాలని ప్రభువు కోరుతున్నాడు. అదే ధన్యకరమైన జీవితం. అది మన జీవితంలో నెరవేరాలంటే, ఆయన మాటలు విశ్వసించడం, వాటికి లోబడడం. అదిచేస్తే చాలు. నీవే అనేకులకు ఆశీర్వాదకరంగా మారగలవు.

🔅5. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను:
సమస్తాన్ని విడచి, ఎక్కడకి వెళ్ళాలో తెలియక ప్రయాణం చేయనున్న అబ్రాహాముకు నాకంటూ ఎవరూలేరనే భావన కలుగకుండా, నిన్ను ఆశీర్వదించేవారు, నీ స్నేహాన్ని కోరేవారు అనేకులుగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నారు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను. అంటే ఆబ్రాహాముకు మనుష్యుల ఆశీర్వాదము కావాలా? యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లు చుండెను (లూకా 2:52). ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనుష్యుల దయాకూడా అవసరమే. మనుష్యులు మనయెడల దయచూపుతున్నారంటే, ఆ దయచూపే మనసును వారికి అనుగ్రహించువాడు దేవుడే అనే విషయం మాత్రం మరచిపోకూడదు. అబ్రాహాము మనుష్యులవలన ఆశీర్వదించబడాలని ఎదురుచూచినవాడు కాదు (ఆది 14:22,23). నిన్ను ఆశీర్వదించువారు అంటే, అబ్రాహాముతో కలసి జీవించడానికి ఇష్టపడేవారుగా కూడా మనము అర్ధము చేసుకోవచ్చు. దానికి ప్రత్యక్ష సాక్షి లోతు. అతడు అబ్రాహాముతో కలసి జీవించినప్పుడు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. అబ్రాహాము నుండి వేరైన తర్వాత అతడు ఎదుర్కొన్న పరిస్థితులు మనకు విదితమే. అయితే, నీతిమంతులతో సాంగత్యం మన జీవితాలకు ఆశీర్వాదకరము.


🔅 6. నిన్ను దూషించేవారిని శపిస్తాను:
సమస్తాన్ని విడచి, ఎక్కడకి వెళ్ళాలో తెలియక ప్రయాణం చేయనున్న అబ్రాహాముకు, శత్రుభయము కలగవచ్చు. నాకేదైనా జరిగితే సహాయం చేసేవారెవ్వరు అనే సందేహం తప్పక కలుగవచ్చు. దానికిగాను నీకు శత్రుభయము కలుగదు. నీకు శత్రువులుగా మారినవారికి నేను శత్రువుగా మారతాను అంటూ ఈ వాగ్ధానమిస్తున్నారు. దేవుడు ఎన్నుకొనిన వానినిగురించి చెడుగా మాట్లాడడం అంటే, అతనిని ఎన్నుకున్న దేవునిని, ఆ మనిషిద్వారా దేవుడు నెరవేర్చదలచిన ప్రయోజనాలను తిరస్కరించడమే అవుతుంది. దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని దూషించడం ద్వారా అది వారికి శాపాన్ని తెస్తుంది. కొన్ని ప్రధానమైన విషయాల్లో మనుష్యులు ఇతరులకు ఏవిధముగా చేస్తారో, దేవుడు తన లోపరహితమైన న్యాయవిధి చొప్పున వారికి అట్లానే జరిగిస్తాడు. దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు. సద్భావము గలవారియెడల నీవు సద్భావముచూపుదువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు (కీర్తనలు 18:25,26) అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును (సామెతలు 3:34) కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు (మత్తయి 5:7) మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.( మత్తయి 6:14, 15) మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును(గలతీ 6:7) అట్లా అని వేరు వేరు వ్యక్తులతో దేవుడు వ్యవహరించేటప్పుడు ఆయన స్వభావాన్ని మార్చుకోవడం జరగదుగాని, సందర్భానికి తగినట్లుగా ఆయన ఒక్కొక్క లక్షణాన్ని వెల్లడిపరచుచూ వుంటారు. ఎందుకంటే, పవిత్ర హృదయులు, యదార్ధ హృదయులు, దేవుని పవిత్రతను, యధార్ధతను మరింత ఎక్కువగా తెలుసుకోవాలని ఆయన అట్లా చేస్తారు. వద్దు! దేవుడు ఏర్పరచుకున్నవారి జోలికిపోవద్దు. మిర్యాము, తన సహోదరుడైన మోషే విషయంలో కలుగజేసుకొంటే, దేవుడేమో మిర్యాము విషయంలో కలుగజేసుకున్నాడు (సంఖ్యా 12:1-10) ఆయన కలుగజేసుకోవడం అత్యంత భయానకం.

7. భూమి యొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడును:
ఒక వ్యక్తి దేవునిమాటకు విధేయత చూపగలిగితే, దేవుడతనిని ఎంత ఉన్నతంగా ఆశీర్వదిస్తాడంటే, భూమి మీదనున్న సకల వంశాలు అతనియందు ఆశీర్వదించబడతాయట. ఇంతటి అత్యున్నతమైన ఆశీర్వాదం అబ్రాహాము మాత్రమే స్వంతం చేసుకోగలిగారు. అబ్రాహాము యూదులకు, ముస్లింలకు, క్రైస్తవులకు తండ్రిగా పిలవబడ్డాడు. ఆయనను బట్టి, వీరి వంశములు ఆశీర్వధించబడ్డాయి అనుకుందాము. అయితే, భూమిమీద వీరే కాకుండా అనేక వంశాలున్నాయి కదా, అబ్రాహామును బట్టి వారెట్లా ఆశీర్వదించబడ్డారు? ఎట్లా అంటే, అబ్రాహాము వంశములోనుండి ప్రభువైన యేసు క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి ఏతెంచడం, సిలువ, మరణ, పునరుత్తానం ద్వారా, సర్వమానవాళి పాపమును పరిహరించడం ద్వారా భూమిమీదనున్న సమస్త వంశములు ఆశీర్వధించబడ్డాయి. ఆ ఆశీర్వాదం కూడా అబ్రాహాముకే చెందినట్లయ్యింది. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు. (గలతీ 3:8,9) రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది (యోహాను 4:22) వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. (రోమా 9:4,5)

ఇదంతా అబ్రాహాము జీవితంలో ఎట్లా సాధ్యమయ్యింది అంటే, దేవుని మాటలను విశ్వసించడం, విధేయత చూపడం ద్వారానే సాధ్యమయ్యింది.

అట్టిరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. ఆయనిచ్చే వాగ్ధానపు ఆశీర్వాదాలు పొందుకుందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(పదకొండవ భాగము)
♻ అబ్రాహాము వాగ్ధాన భూమిలో ప్రవేశం ♻

అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన
సమస్తమైనవారిని తీసికొని కనానను దేశమునకు వచ్చిరి (ఆది 12:5,6).

కల్దీయుల దేశములోని “ఊరు” అను పట్టణమునుండి ప్రారంభమైన అబ్రాహాము ప్రయాణం హారానులో నిలచిపోయింది. హారానులో ఎంతో ఆస్తిని ఆర్జించుటనుబట్టి, బహుశా కొన్ని సంవత్సరాలు ఆయన హారానులో నిశించినట్లుగా మనం అర్ధం చేసుకోవచ్చు. అబ్రాహాము తండ్రియైన “తెరహు” హారానులో మరణించిన తర్వాత దేవుడు చూపించే వాగ్ధాన దేశమునకు బయలుదేరుతున్నాడు. తన భార్యను, లోతును తనకు కలిగిన యావదాస్థిని, ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా తనతోపాటు తీసుకొనివెళ్తున్నాడు. హారానులో ఇక తనకంటూ ఏమిలేదు. అవును వుండడానికి వీల్లేదు. వుంటే, దానికోసం మరలా హారాను రావాలనిపిస్తుంది. మనుష్యులు వెళ్లినా, మనసులు మాత్రం ఇక్కడే ఉంటాయి. ఇశ్రాయేలీయులను 430 సంవత్సరాల ఐగుప్తు దాస్యంలోనుండి దేవుడు విడిపిస్తే, మనుష్యులైతే వెళ్ళారుగాని వారి మనసులు మాత్రం మాంసము, కీరకాయలు, దోసకాయలు చుట్టూ తిరుగుతున్నాయి. లోకాశాలను నీవెనుక విడిచిపెడితే, అనుకూలసమయంలో వాటివైపు తిరిగే అవకాశం ఉంటుంది. ఆత్మీయ యాత్రలో సాగిపోతున్న మనము తిరిగి వెనకకు చూడడానికి వీల్లేదు. అబ్రాహాము తనకు కలిగినవాటిలో ఏ ఒక్కటి విడచి పెట్టకుండా వాగ్ధాన భూమికి పయనంసాగించి, వాగ్ధానభూమిని చేరుకోగలిగాడు.

🔅 “కనాను దేశము” అని పిలువబడడానికి గల కారణం?
నోవహు మనుమడును, హాము కుమారుడైన “కనాను” సంతతివారే దీనిలోని మొట్టమొదటి పౌరులు. అందుచే ఈ దేశమునకు “కనాను దేశము” అని పేరు వచ్చింది. (ఆది 10:6,18; 24:37).

🔅 కనాను దేశమునకు ఇతరమైన పేర్లు
▪హేబ్రీయుల దేశము: హేబ్రీయుడు అనగా నది అవతల నుండి వచ్చినవాడని అర్ధము
హేబ్రీయులైన అబ్రాహాము, లోతు గొప్ప మందలతోను, దాస జనముతోను ప్రభువులుగా ఇక్కడ జీవించుటచేత 'హేబ్రీయుల దేశము' అని పిలువ బడింది.
(ఆది 40:15)
▪వాగ్ధాన దేశము: అబ్రాహాముకు వాగ్ధానము చేయబడిన స్థలమగుటచే 'వాగ్ధాన దేశము' లేదా 'వాగ్ధాన భూమి' అని పిలువ బడింది. (హెబ్రీ 11:9)
▪యూదా దేశము: యూదా రాజులచే పరిపాలించబడుటచే 'యూదా దేశము' అని పిలువ బడింది. (ఎజ్రా 1:3)
▪పరిశుద్ధ దేశము (హోలీ ల్యాండ్): పరిశుద్ధ నగరమైన యెరూషలేము గల దేశము అగుటచే 'పరిశుద్ధ దేశము' అని పిలువ బడింది. (మత్తయి 27:53)
▪బ్యులా దేశము (యెష 62:4)
▪ఇమ్మానియేలు దేశము
(యెష 8:8)
▪శృంగార దేశము ( దాని 8:9)
▪దేవుని దేశము (9:3)
▪పాలు తేనెలు ప్రవహించు దేశము ( నిర్గమ 3:8)
▪పాలస్తీనా దేశము: పిలుష్తీయుల పాలన ఎక్కువ కాలము ఇక్కడ నున్నందున పాలస్తీనా గా పిలువబడింది.
▪ఇశ్రాయేలు దేశము: ప్రస్తుతము ఇశ్రాయేలీయులు జీవిస్తున్న కారణముగా “ఇశ్రాయేలు దేశము” అని పిలువబడుతుంది. (1 సమూ 11:3) అంటే, అప్పటి కనాను దేశమే, నేటి ఇశ్రాయేలు దేశము. (ఇశ్రాయేల్, పాలస్తీనా, లెబనాన్, జోర్డాన్, సిరియా ఇవన్నీ కలసి అప్పట్లో కనాను దేశముగా పిలువబడేవి. ఇప్పుడు వేరు వేరు దేశాలుగా విడిపోయాయి.)

🔅 కనాను ఫలవంతమైన దేశము:
పాలు తేనెలు ప్రవహించు దేశము ( నిర్గమ 3:8 ; సంఖ్యా 13:27; ద్వితీ 11:9) ఆ దినాలలో విస్తారమైన పశుసంపద వుండడం వలన పాలు తీసేవారులేక పశువులు నడుస్తూవెళ్తుంటే పాలు వాటంతట అవి కారుతుండేవట. విస్తారమైన ఖర్జూర వృక్షాలవలన పండ్లు పక్వానికివచ్చి, వాటంతటవే విచ్చుకొని తేనెలా కారుతుండేవని చెప్తారు. ఇక్కడ దొరికే తేనే కూడా ప్రపంచప్రసిద్ధి గాంచినది. ఏదిఏమైనా ఈదేశ పశుసంపద, ఫల వృక్షాలకు అత్యంత ప్రసిద్ధి. “అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లును గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము” (ద్వితీ 8:8) ఇక్కడ వ్రాయబడిన ప్రతీవిషయం ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించినవారెవరికైనా ఇది అతిశయోక్తి కాదని ఇట్టే అర్ధమవుతుంది. ఇక్కడ ఫలవృక్షాల తోటలనుగమనిస్తే ఆకులకంటే పండ్లే ఎక్కువ అన్నట్లుగా అనిపించకమానదు. ఇక్కడ వర్షపాతం చాలాతక్కువ. అయినప్పటికీ రాళ్ళల్లో సహితం వీరు పంటలు పండిస్తున్నట్లుంటుంది. వేసవి ఆరు నెలల కాలముంటుంది. ఈ ఈకాలంలో వర్షంపడిన సందర్భాలు వుండనేవుండవు. వరదలు, తుఫానులు వంటివాటికి ఆస్కారం లేదు. అయితే విచిత్రమేమిటంటే వేసవిలోసహితం చెట్లు చిగురిస్తాయి. కారులో ఆరుగంటలు ప్రయాణించి ఇశ్రాయేలు దేశాన్ని చుట్టిరావొచ్చు. అయితే, ఇటీవల కాలంలో ఆదేశం ప్రకటించిన విషయమేమిటంటే, “మేము ప్రపంచానికి సరిపడే ఆహారాన్ని పండించగలమని.” ఇది వారి గొప్పకాదుగాని, దేవుని ఆశీర్వాదం ఈ దేశముమీద వుంది. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. (సంఖ్యా13:23) ఒక్క ద్రాక్ష గెలను ఇద్దరు మోస్తూవున్నారంటే అదెంతటి సారవంతమైన దేశమో, ఫలవంతమైన దేశమో మనము ఒక అంచనాకు రావొచ్చు.

🔅 కనాను దేశము అబ్రాహామునకు ఎందుకు వాగ్ధానము చేయబడింది?
కనానులో అనేకమంది ప్రజలు నివసిస్తున్నారు, అట్లాంటి దేశాన్ని వారినికాదని దేవుడు అబ్రాహామునకు వాగ్ధానం చేస్తున్నాడంటే ఆయన అన్యాయస్థుడా? కానేకాదు. కనానులో నివసించిన ప్రజలు ఆదేశాన్ని పూర్తిగా అపవిత్రం చేసేసారు. విచ్చలవిడిగా వ్యభిచారాన్ని కొనసాగించారు. రక్త సంబంధీకులతో, స్త్రీలు స్త్రీలతో, పురుషుల పురుషులతో, చివరకు జంతువులతో సహితం వారి లైంగిక వాంఛలను తీర్చుకున్నారు( లేవి 18వ ఆధ్యా). అందుచే, దేవుని ఉగ్రత వారిమీద రగులుకొంది. ఆ ప్రజలను వెళ్లగొట్టినుద్దేశించి, ఆ పాలుతేనెలు ప్రవహించు దేశాన్ని తనకు విధేయుడైన అబ్రాహామునకు వాగ్ధానము చేసాడు దేవుడు. వాగ్ధాన భూమిని అబ్రాహాము సంతతి స్వాధీనం చేసుకున్న తర్వాత, వారు అపవిత్రమైన క్రియలు జరిగిస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోలేదు. వారిని చెరకు అప్పగించాడు. దీనిద్వారా దేవుడు అన్యాయస్థుడుకాదని, పాపమును ఎంతమాత్రమూ సహించేవాడుకాదని అర్ధం చేసుకోగలం.

🔅 కనానులో నివసించిన వివిధ జాతుల సమూహములు:
కనానీయులు, ఫిలిష్తీయులు, కేనీయులు, కనిజ్జీయులు, కద్మొనీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు, ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, సమరయులు.

కనానుయొక్క మూడవ పుత్రుడు యెబూసీయుడు (ఆది 10:16) ఈజాతి ప్రజలు కనాను దేశమందు నివసించిరి (ఆది 15:21) వీరిని యెహోషువా ఓడించెను ( యెహో 12:8) దావీదు కాలమందు యెబూసీయుడైన అరౌనా కళ్లమును కొని అక్కడ బలిపీఠము కట్టించెను ( 2సమూ 24:18) తర్వాత కాలములో అక్కడ సొలోమోను దేవుని మందిరం కట్టించెను( 2దిన 3:1) ఆ రీతిగా అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్ధానభూమిని, ఆయన సంతతివారు స్వాధీనపరుచుకున్నారు.

అబ్రాహాము కనానులో ప్రవేశించారు. మనము పరమ కనానులో ప్రవేశించుటకు మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(పండ్రెండవ భాగము)
♻ అబ్రాహాము జీవిత విధానము ♻

అబ్రాహాము జీవిత విధానములో గమనించదగిన అంశాలు మూడు:
1. గుడారము
2. బలిపీఠము
3. ప్రార్ధన

యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి, యెహోవా నామమున ప్రార్ధన చేసెను. (ఆది 12:7,8)

1. గుడారము :
చాలా కాలము క్రిందట ఒక రక్షించబడిన వజ్రాల వ్యాపారి, ఒంటెమీద వజ్రాలమూటలను వేసుకొని, ఊరూరా తిరిగి అమ్ముతూ, రాత్రివేళల్లో ఒక గుడారం వేసుకొని దానిలో నిద్రపోయేవాడు. అతనిని చంపి వజ్రాలను దొంగిలించాలని పధకం ప్రకారం వెళ్లిన దొంగలముఠా, ఆ గుడారాన్ని సమీపించగానే ఆ గుడారంచుట్టూ సైనికులు కావలి కాయడాన్ని చూచి పారిపోయి, ఉదయం వచ్చిచూస్తే ఆయన ఒంటరిగానే వున్నాడట. పలుమార్లు ఇట్లా జరిగిన తర్వాత, వీళ్లంతా వెళ్లి, భయంతో ఆయన కాళ్ళమీదపడి జరిగిన విషయం చెబితే, నా దేవుడే తన దూతలను పంపించి నన్ను సంరక్షిస్తుంటాడని ఆ వజ్రాల వ్యాపారి వారికి తెలియజేసి, వారందరిని ప్రభువులోని నడిపించాడు. అవును, గుడార జీవితం తాత్కాలికమైనది, అస్థిరమైనది, సంపూర్ణ భద్రతలేనిది. గుడారజీవితాలకు భద్రత వారు నివసించే గుడారాలను బట్టికాదుగాని, ఆ గుడారములలో నివసింపజేయుచున్న దేవునిని బట్టే వారి జీవితాలకు భద్రత.

a) “శరీరము” నివసించే గుడారము:
అబ్రాహామును దేవుడు వాగ్ధాన భూమికి చేర్చినప్పటికీ, అతడు స్థిరనివాసం ఏర్పరచుకోకుండా గుడారములలోనే నివసించడడానికే ఇష్టపడ్డాడు. ఇది దేవునిపైనే పూర్తిగా ఆధారపడే స్థితి. ఎందుకంటే, అతడు నిర్మించే పక్కా గృహాలు అతనిని రక్షించవుగాని, అతని దేవుడే అతనిని రక్షిస్తాడనేది ఆయన విశ్వాసం. అబ్రాహాము మాత్రమే కాదు, అతని సమవారసులైన ఇస్సాకు, యాకోబులు కూడా గుడారములలోనే నివసించారు. విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి (హెబ్రీ 11:9). వీరి జీవితాలనుండి ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించవచ్చు. గుడారము అనేది తాత్కాలిక నివాసము. అంటే వీరు నివసించే ఈ భూమి శాశ్వతమైనదికాదని, వీరు కేవలము, యాత్రికులను, పరదేశులునుగా వుంటూ, వారి నిత్యస్వాస్థ్యమైన పరలోకమువైపు ప్రయాణించే యాత్రికులుగానే వారున్నారు.

దైవజనుడైన మోషేగారి జీవితంలోకూడా ఇట్లాంటి అనుభవమునే చూడగలము. మోషే, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఎడారిలో తిరుగుతూ, గుడారాలలో నివసిస్తూ, తమది కాని ఐగుప్తు దేశం నుండి, తమకు దేవుడు వాగ్దానం చేసిన కనానుకు ప్రయాణం సాగిస్తున్నారు.
భూమి మీద బాటసారుల వలే, పరదేశులవలే, యాత్రికులవలే వారి పయనం సాగుతుంది. అయితే వారికి స్థిరమైన, శాశ్వతమైన నివాస స్థలం ఒకటుంది. అది సాక్షాత్తు "యెహోవా దేవుడే". అందుకే మోషే చెప్పగలుగుతున్నాడు."ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే (కీర్తనలు 90:1)." మోషే చెప్తున్న ఈ మాట మన జీవితాలకు గొప్ప ఆధ్యాత్మిక పాఠం. ఎందుకంటే, క్షయమైన నివాసముల కోసమే, మన ఆరాటం, పోరాటం. అక్షయమైన, శాశ్వత మైన నివాసం గూర్చిన తలంపే మనకు లేదు. ఒక్క విషయం! కోట్లు క్రుమ్మరించి కట్టినా ఈ నివాసం ఒక దినాన్న నేలకూలి మట్టిలో కలియాల్సిందే.
అందుచే, నీవు మిద్దె మీద జీవించినా, పూరి గుడిసెలో జీవించినా, కొండ గుహలలో నివాసమున్నా? నీ శాశ్వత నివాసం "నీ సజీవమైన దేవుడే" అనే విషయం మరచిపోవద్దు. ఈ విషయాన్ని నీవు నమ్మగలిగితే? ధనవంతుల భవనాలను చూసి అసూయ చెందాల్సిన పని లేదు. అంతే కాకుండా, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఆ "నిత్యనివాసం" కోసం ఎదురు చూడగలవు.
దానిని స్వతంత్రించుకో గలవు.

b) “ఆత్మ” నివసించే గుడారము:
అపొస్తలుడైన పేతురుగారు శరీరమును గుడారముతో పోల్చి మాట్లాడుతున్నారు. అవును, శరీరము అనబడే గుడారము తాత్కాలికమైనదే. ఆ గుడారములో నివసించే ఆత్మ శాశ్వతమైనది. కానీ మనమేమో క్షయమైన ఈ గుడారం కోసమే ప్రాకులాడతాముగాని, అక్షయమైన ఆత్మను గురించిన తలంపే లేనివారముగా జీవిస్తున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.

(2పేతురు 1:13,14) ఈ శరీరమునే “దేవుని మందిరము” గా అపొస్తలుడైన పౌలుగారు ప్రస్తావించడం జరిగింది. మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు. (1 కొరింథీ 3:16,17) కావున ప్రభువు ఆత్మ నివసించే శరీరమనే ఈ గుడారమును పరిశుద్ధముగా కాపాడుకొందము. మన భౌతికమైన శరీరము నివసించే గుడారము, ఆత్మ నివసించే గుడారమైన శరీరము రెండునూ అశాశ్వతమైనవే. ఈ రెండింటిని ఎదో ఒకక్షణాన్న తప్పక విడువాల్సిందే. అయితే, ఈ గుడారాల్లో మనము జీవించిన జీవితమే మన నిత్యమైన గమ్యాన్ని నిర్ణయించగలవు అనే విషయాన్ని మాత్రం మరువకూడదు.

అబ్రాహాము బేతేలునకును, హాయికిని మధ్యను గుడారము వేసికొనెను. (ఆది 12:8)
బేతేలు అనగా “దేవుని మందిరం”, హాయి అనగా “నాశనము” అంటే అబ్రాహాము దేవునిసన్నిధికి, నాశనమునకు మధ్యలో తన గుడారాన్ని వేసికొనెను. అంటే, అతని పయనం నిత్యజీవమునకా, నిత్యనాశనమునకా ఎటు వెళ్ళాలో తేల్చుకోవలసింది అబ్రహామే. అయితే. ఆయన మాత్రం నాశనకరమైన లోకాన్ని విడచి, దేవుని సన్నిధి అననబడే పరలోకంవైపే ఆయన పయనం సాగించారు. నేటిదినాన్న నీవూ, నేనూ ఈ రెండు గమ్యాల మధ్యలోనే నిలబడియున్నాము. ఎటు వెళ్ళాలో తేల్చుకోవలసింది మనమే. ఎదో ఒక గమ్యంవైపు పయనించాలి. మధ్యలోనే నిలబడి వుండడానికి వీల్లేదు. దేవుడా, లోకమా ఎదో ఒకటి తేల్చుకోవాలి. ఇద్దరినీ సంతృప్తి పరచడం సాధ్యం కానేకాదు. మోషేకు ఒక ప్రక్క ఐగుప్తు ధనము, అల్పకాల సుఖభోగములు, అధికారం. మరొకప్రక్క క్రీస్తుకొరకు నిందలు, శ్రమలు, అవమానం ఈరెండింటి మధ్యలో ఆయన నిలబడియున్నాడు. ఎదోఒకటి తేల్చుకోవాలి. సరియైన నిర్ణయం చేయగలిగారు, జీవితం ధన్యమయ్యింది. (హెబ్రీ 11:24-26) ప్రియ విశ్వాసి! ఏది నీ గమ్యం? నీ గమ్యమేమిటో ఇంకా నీవొక నిర్ణయానికి రాలేదా? ఒక నిర్ణయానికి రావడానికి నీకున్న ధనము, బలము, బలగము అడ్డుగా ఉన్నాయా? లోకమంతా అనుభవించిన తర్వాత, మరొక గమ్యం వైపు పయనిద్దామనుకొంటున్నావా? నీవు వాడే ప్రతీవస్తువుకూ ఎంతోకొంత గ్యారంటీ వుంది. కానీ నీకున్న గ్యారంటీ ఎంత? అంతలోకనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగవంటిది, నీటి ఆవిరివంటిది, గడ్డిపువ్వు వంటిది నీ జీవితం. ఎప్పుడు కోయబడతావో, ఎప్పుడు వాడిపోతావో, మరెప్పుడు రాలిపోతావో నీకేమి తెలుసు?

హాయి అనబడే ఆ నిత్యనాశనము నుండి తప్పించబడి బేతేలు అనబడే దేవునిసన్నిధియైన నిత్యజీవంవైపు నీవు ఎక్కిపోవాలంటే? నిన్ను నిత్యనాశనమునకు నడిపించే లోకాశాలను విడిచిపెట్టాలి. ఆయన చిత్తాన్ని జరిగించడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి
(1 యోహాను 2 :15-17.

ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(పదమూడవ భాగము)
♻అబ్రాహాము జీవిత విధానము ♻ (Part-2)

2. బలిపీఠము:
అబ్రాహాముతో దేవుడు నేను చూపించు దేశానికి వెళ్ళమని చెప్పారు (ఆది 12:1) దేవుని మాటను విశ్వసించి, విధేయుడై ఎక్కడకి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరాడు (హెబ్రీ 11:8) కల్దీయుల దేశములో ప్రారంభమైన అబ్రాహాము విశ్వాసయాత్ర చిట్ట చివరకు కనాను చేరింది. షెకెము అనే ప్రాంతానికి వచ్చి, మోరేదగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరాడు. అబ్రాహాము ఆ దేశము చేరేసరికి అక్కడ కనానీయులు నివసిస్తున్నారు. (షెకెము అనేది మనషే గోత్రానికి చెందిన ప్రాంతము. ఇదే ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజధానిగా వుండేది.) ఇప్పుడు దేవుడు తన వాగ్ధానాన్ని స్థిరపరుస్తూ, ఈ దేశమును నీ సంతానానికి ఇస్తానని చెప్పారు ( (ఆది 12:7) కల్దీయుల దేశములోనున్నప్పుడు అబ్రాహామునకు వాగ్ధానము చేసిన దేవుడు, కనాను వచ్చేసరికి నీ సంతానమునకు యిస్తానంటున్నారు. అంటే, దేవుడు మాట మార్చేశారా? కానేకాదు. సంతానములేదని కృంగిన స్థితిలోనున్న అబ్రాహామునకు ఈ వాగ్ధానము ద్వారా నీకు సంతానమును అనుగ్రహించ బోవుచున్నాననే విషయాన్ని మరొకసారి తెలియజేసినట్లయ్యింది.

బలిపీఠము అనేది “ఆరాధించే స్థలము”. దేవునిని ఎప్పుడు ఆరాధించగలమంటే? ఆయన ఏమైయున్నాడో మనకు అర్ధమైనప్పుడు మాత్రమే ఆయనను ఆరాధించగలము. అబ్రాహాము నాలుగు బలిపీఠములను కట్టినట్లుగా పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది.

1. ఆరాధనా బలిపీఠము: (ఆది 12:7)
దేవునిని అబ్రాహాము ఎట్లా అర్ధం చేసుకొనియుండవచ్చు అంటే, కల్దీయుల దేశములో ప్రత్యక్షమైన దేవుడు, కనానులో కూడా ప్రత్యక్షమయ్యాడు. తద్వారా దేవుడు నాకు తోడైయున్నాడు అనే సంపూర్ణమైన నిర్ణయానికి వచ్చియుండవచ్చు. కల్దీయుల దేశములో వాగ్ధానమిచ్చిన దేవుడు, కనానులో దానిని నెరవేర్చాడు. దీనినిబట్టి ఆయనను మాటతప్పని దేవునినిగా, సర్వశక్తిమంతుడైన దేవునినిగా అబ్రాహాము అర్ధం చేసుకొనియుండవచ్చు. అందుచే ఆయన హృదయం కృతజ్ఞతతో, ఆరాధనతో నిండిపోయినప్పుడు బలిపీఠముకట్టి దేవునిని ఆరాధిస్తున్నాడు.

2. ప్రార్ధనా బలిపీఠము: (ఆది 12:8)
హాయి (నాశనము), బేతేలు( దేవుని మందిరము) ఈ రెండింటికి మధ్య బలిపీఠము కట్టడం ద్వారా, నేను సజీవుడైన దేవుని పక్షపువాడనని అన్యులైన కనానీయులకు తెలియజేస్తూ దేవునిని ఆరాధిస్తున్నాడు. ఈ బలిపీఠము కట్టినప్పుడు ఆరాధనతోపాటు, ప్రార్ధన చేయుచున్నాడు. ఐగుప్తునుండి తిరిగి వచ్చినతరువాత కూడా యిదే స్థలానికి వచ్చాడు ( ఆది 13:4)

3. సహవాస బలిపీఠము: (ఆది 13:18)
హెబ్రోను అనగా “సహవాసము”, మమ్రే అనగా “పుష్టికరము”. అనగా హెబ్రోనులో దేవుని సహవాసములోనున్న అబ్రాహాము జయకరమైన జీవితాన్ని జీవించగలిగాడు ( ఆది 14:1-17 ) వాగ్ధానములు పొందాడు(ఆది 15వ ఆధ్యా ) దేవునితో నిత్యనిబంధన చేసుకున్నాడు (ఆది 17వ ఆధ్యా ) దేవుని దూతలకు ఆతిధ్యమిచ్చి, దేవునిని ఆరాధించాడు. (ఆది 18:1-13 ) నశించుచున్నవారిని గూర్చి విజ్ఞాపన చేయగల దేవుని స్నేహితుడునున్నాడు. (ఆది 18:23-33)

4. సమర్పణా బలిపీఠము: ( ఆది 22:9)
సమర్పణ అంటే, చనిపోవడం కోసం బ్రతకడం. అబ్రాహాము దేవుని కోసం దేనికైనా సిద్దమే. తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికేకాదు, తాను అర్పణగా మారాల్సివచ్చినా సిద్దమే. అది ఆయన సమర్పణా జీవితం. తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించే సంఘటనను గూర్చి చదువుతుంటే మన శరీరం జలదరించకమానదు. ఆ సన్నివేశమే ఆయనను విశ్వాసులకు తండ్రిని చేసింది.

క్రీస్తురక్తములో కడుగబడి అబ్రాహాము కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడిన మన జీవితంలో కూడా ఇట్లాంటి ఆత్మీయమైన అనుభవాలు మనకుండాలి.
ఆయన ప్రేమ మనకర్థమైతే ఆరాధనా బలిపీఠాన్ని కట్టకుండా వుండలేము.
ఆయన జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధ వుంది. కాని, సర్వమానవాళి పాపం నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా క్రయదనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి కొనిపోబడుతున్నాడు. సిలువతో సాగిన ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ, గొల్గొతాలో ముగియనుంది. 39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు. వీపు మీద భారమైన సిలువ, భరించరాని అవమానం
ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు గేళి చేయబడుతూ, హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆయాత్ర. కాళ్ళు, చేతులలో సీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం. ఆరు అంగుళాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతుంది. ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది. ఇదంతా ఎవరికోసం? ఎవరికోసమే నీకర్థమైతే ఆరాధనా బలిపీఠం కట్టకుండా నీవుండలేవు.

యేసు ప్రభువు బాధలను గురించిన ఆక్సఫర్డ్ యూనివర్సిటీ అధ్యయన పండితులు, అధ్యయనము చేసి రూపొందించిన సమాచారం. ఇట్లాంటి సమాచారం బైబిల్ లో పొందుపరచ బడలేదు. అట్లా అని ఇవి బైబిల్ కు ప్రత్యామ్నాయము కాదు. ఆయన శ్రమలను అవగాహన చేసుకోవడం కోసమే క్రింది తెలియజేయడం జరుగుతుంది. 350 మంది సైనికులు, 50 మంది గుర్రపు రౌతులు ఆయనను లాగుతూ, కొట్టుచూ ఆయనను వెంబడించారు. యేసు ప్రభువు తన సిలువను మోస్తూ గొల్గొతాకు వెళ్ళు మార్గములో మూడు సార్లు క్రిందపడిపోయారు. కనీసం నీరు కూడా లేకుండా 17 గంటలు బాధలు అనుభవించారు. ఆయన శరీరంలో 5480 గాయాలు అయ్యాయి. ఆయన వెనుక భాగంలో 150 బలమైన గాయాలయ్యాయి.
ముండ్ల కిరీటం ద్వారా ఆయన తలలో 17 గాయాలయ్యాయి.
ఆయన మనకోసం 6.5 లీటర్ల రక్తాన్ని చిందించాడు. ఇంత త్యాగం ఎవరి కోసం? నీ కోసమే.
ఎందుకోసం? నిన్ను నిత్యమరణము నుండి తప్పించి, నిత్య జీవములోనికి చేర్చడానికి. ఆయన త్యాగం అర్ధమైతే ఆరాధనా బలిపీఠం కట్టగలము, ప్రార్ధనా బలిపీఠంద్వారా ఆయనతో సంబాషించగలము, సహవాస బలిపీఠంద్వారా ఆయనతోకలసి నడువగలము, సమర్పణా బలిపీఠముద్వారా శరీరేచ్ఛలను చంపుకొని, ఆయనకొరకు అర్పణగా మారగలము. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయ్యారు. కనీసం నీవు ఒక విశ్వాసిగా నీ జీవితాన్ని ప్రభువుకొరకు జీవించగలవా?

పాతనిబంధనా గ్రంధములో బలిపీఠము అత్యంత ప్రధానమైనది. ప్రత్యక్ష గుడారంలో వుండాల్సిన ఏడు వస్తువులలో బలిపీఠం ఒకటి. బలిపీఠము తయారు చేయబడానికి వాడబడిన పదార్ధములు 1. మట్టి, 2. రాళ్ళు, 3.చెక్క , 4. లోహము (రాగి, బంగారము)

పరిశుద్ధ గ్రంథమందు 20 మంది బలిపీఠములను నిర్మించారు.
నోవహు( ఆది 8:20) అబ్రాహాము (ఆది 12:7,8 ; 13:18; 22:2,9) ఇస్సాకు (ఆది 26:25 ) యాకోబు (ఆది 33:20; 35:1-7) మోషే( నిర్గమ 17:15) బాలాకు ( సంఖ్యా 23:1,4,14) యెహోషువా (యెహో 8:30 ) రూబేనీయులును గాదీయులును మనష్షే అర్థ గోత్రపువారును యొర్దాను దగ్గర ఒక బలిపీఠ మును కట్టిరి. ( యెహో 22:10) గిద్యోను (న్యాయాధి 6 :24 ) మానోహ (న్యాయాధి 13:20) సమూయేలు (1 సమూ 7: 15 ,17) సౌలు (1 సమూ 14 :35) దావీదు ( 2 సమూ 24 :25 ) యెరోబాము ( 1 రాజులు 12 : 32 33 ) అహాబు ( 1 రాజులు 16 : 32 ) ఏలియా
(1 రాజులు 18 : 31 , 32) ఊరియా
(2 రాజులు 16 : 11 ) మనషే
(2 రాజులు 21 :3 ) జెరుబ్బాబెలు ( ఎజ్రా 3 : 2 )

నూతననిబంధనలో బలిపీఠము కట్టాల్సిన అవసరత లేదు. ఎందుకంటే, కల్వరిగిరిలో మనకుకొరకు పరిశుద్ధ గొర్రెపిల్ల వధించబడింది. ఇక మనకు బలిపీఠముతోగాని, బలితోగాని పనిలేదు. అయితే, మనమే ఒక బలిపీఠముగా మారి, ఆత్మీయబలులను అర్పించగలగాలి. అదెట్లా సాధ్యమంటే? మన శరీరములను సజీవయాగముగా ప్రభువునకు సమర్పించుటద్వారా ఆత్మీయ బలులను అర్పించగలము. ఇట్టి సేవ యుక్తమైనది. (రోమా 12:1) ఇట్టి రీతిగా ప్రభువును ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధపరచుకొందము.

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(పదునాలుగవ భాగము)
♻ అబ్రాహాము జీవిత విధానము ♻ (Part-3)

🔅3. ప్రార్ధన:
ప్రార్ధన అనగా, దేవుని సహాయమును అభ్యర్ధించడం.

అబ్రాహాము ప్రార్ధనాపరుడు. అనునిత్యమూ దేవునితో సన్నిహితమైన సంబంధాలను కలిగియున్నవాడు. ఎంత సన్నిహితుడంటే, దేవుడే అబ్రాహామును నా స్నేహితుడని చెప్పుకొనేటంత సన్నిహితుడు. అంతటి సన్నిహితత్వం
ప్రార్ధన ద్వారానే సాధ్యమయ్యుంటుందేమో? ఎందుకంటే, ప్రార్ధించడం మానేసాము అంటే, దేవునితో మాట్లాడడం మానివేసినట్లే. దేవునితో మాట్లాడలేక పోతున్నామంటే పాపంలో కొనసాగుతున్నట్లే కదా? అబ్రాహాము దేవునితో స్నేహాన్ని కొనసాగించ గలుగుతున్నాడంటే దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే, ప్రార్ధిస్తున్నాడు.

అబ్రాహాము ప్రార్ధనా విధానం అత్యంత శ్రేష్టమైనది. మొదట బలిపీఠము కట్టడము, తరువాత ప్రార్ధించడము. అంటే, మొదట ఆరాధన, ఆ తరువాత ప్రార్ధన. ఇప్పుడు చెవులు దద్దరిల్లే సౌండ్ సిస్టం, హద్దులుమీరిన సంగీతంతో, అన్నిపాటలు కలిపి పాడిస్తే ఆరాధన అంటున్నారు. ఆరాధన అంటే? హృదయమంతా దేవుని ప్రేమతో నిండిపోయినప్పుడు, మన నోటినుండి వెలువడే ఒక చిన్న మూలుగుకూడా ఆరాధనే. ఆయన ఏమైయున్నాడో దానినిబట్టి ఆయనను గొప్ప చేయడమే ఆరాధన. ఎప్పుడు ఆరాధించగలమంటే, మొదట ఆయన ఏమైయున్నాడో మనకు అర్ధం కావాలి. అబ్రాహాము అర్ధంచేసుకోగలిగారు. అత్యున్నత దేవుని నామమును ఆరాధించిన తర్వాత, ప్రార్ధించగలిగితే, ఆ గొప్పదేవుని ముందు, మనము గొప్ప సమస్యలుగా భావిస్తున్న సమస్యలు సహితం చిన్నవిగా మారిపోతాయి. మన ప్రార్థనలకు ప్రతిఫలాన్ని తెస్తాయి. అబ్రాహాము ప్రార్ధనా రహస్యమదే. అందుకే అబ్రాహాము చేసిన ఏఒక్క ప్రార్ధనకు కూడా ప్రతిఫలం రాకుండా ఆగిపోలేదు. అబ్రాహాము ప్రార్ధనాజీవితానికి మన జీవితాలు పూర్తి విరుద్ధము. ఆయన ఏమైయున్నాడో గుర్తెరిగి ఆయనను ఆరాధించలేము. ఆయన చేసినదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము. ఎంతసేపు మనకు తెలిసింది ఒక్కటే, మనమేదో ఒక బాస్ లాగా, ఆయనొక సర్వెంట్ లాగా, ఆయనను సూపర్ మార్కెట్ కి పంపింపుతున్నట్లు అది కావాలి, ఇది కావాలి అంటూ పెద్ద లిస్ట్ చెప్తాము. ఆ లిస్ట్ కూడా కేవలం మన కుటుంబ అవసరతలకే పరిమితమై ఉంటుంది. ఆత్మీయ అవసరాలకు దానిలో చోటే వుండదు. అందుకే మన ప్రార్ధనలు దేవునిచేత అంగీకరించబడి, వాటికి ప్రతిఫలం తీసుకొని రాలేకపోతున్నాయేమో?

అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి, యెహోవా నామమున ప్రార్ధన చేసెను.
(ఆది 12: 8)

🔹 యెహోవా నామమున ప్రార్ధించుట:
షేతునకు కుమారుపుట్టినప్పుడు అతనికి ఎనోషు అనే పేరుపెట్టారు. అప్పటినుండి యెహోవా నామమున ప్రార్ధించుట ఆరంభమైనది (ఆది 4:26). ఇప్పుడు అబ్రాహాము కూడా యెహోవా నామమున ప్రార్ధన చేస్తున్నాడు. ఐగుప్తునుండి తిరిగివచ్చిన తర్వాత కూడా ఇదే స్థలములో యెహోవా నామమున ప్రార్ధన చేసాడు (ఆది 13:4) వారసుని కొరకు ప్రార్ధించెను (ఆది 15:2-6) ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అంటూ అతనికొరకు ప్రార్ధించాడు (ఆది 17:18) అబీమెలెకు కుటుంబము కొరకు ప్రార్ధించాడు (ఆది 20:1 7) సొదొమ, గొమొర్రా పట్టణాలలోని నీతిమంతులకొరకు విజ్ఞాపన చేసాడు (ఆది 18:23) సొదొమ గొమొర్రా విషయంలో, అబ్రాహాము అడిగినట్లు పదిమంది నీతిమంతులుకూడా ఎక్కడలేని కారణంచేత ఆ పట్టణాలు నాశనం చేయబడ్డాయిగాని, లోతు కుటుంబం మాత్రం తప్పించబడింది.

ప్రియావిశ్వాసి! మన జీవితాలెట్లా వున్నాయి? ప్రభువుతో ఏకాంతంగా గడిపే అనుభవముందా? సమాధానం తీసుకొచ్చేవిధంగా మన ప్రార్ధనా జీవితముందా? ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది కదా? ప్రసంగీకులు, సింగర్స్, మ్యుజీసియన్స్ కు లోటేలేదు. కానీ, ప్రార్ధించే ప్రార్ధనా యోధులు కరువయ్యారు. ఇప్పుడు దేశంలో పావుర స్వరం వినబడాలి. దేవుని సన్నిధిలో మూలిగే ప్రార్ధనాపరులు లేవాలి. వారిలో నీవొకరివి కావాలి.

🔹 ప్రార్ధనా సమయం ప్రశస్తమైనది. అది ఎట్లాంటిదంటే?
దేవుని సహాయమును అభ్యర్దించే సమయం. దేవునితో సంభాషించే సమయం. మనము మాట్లాడుతున్నప్పుడు ఆయన వినే సమయం. దేవుని కృపను బట్టి ఆయనను స్తుతించే సమయం. ఆయన ఏమైయున్నాడో? గుర్తెరిగి ఆరాధించే సమయం. మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించే సమయం. దేవుని మార్గ దర్శత్వం కోసం ఎదురు చూచే సమయం. మన పాపముల నిమిత్తం క్షమాపణ అడిగే సమయం. మన అవసరతలను దేవునికి తెలియజేసే సమయం. ఇతరుల అక్కరుల నిమిత్తం విజ్ఞాపన చేసే సమయం. దేవునితో నిబంధన చేసే సమయం. దేవుని చిత్తం కోసం ఎదురు చూచే సమయం. దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించే సమయం. సాతాను వాడిగల బాణాలను ఎదుర్కోవడానికి శక్తిని పొందే సమయం.

🔹 ప్రార్ధన ఎంత శక్తివంతమైనదంటే?
🔸పరలోక సింహాసన గదిని చేరుకొనేశక్తి.
🔸సాతానును ఎదిరించి ఓడించేశక్తి
🔸దేవదూతల సహాయాన్ని పొందేశక్తి.

🔹 ప్రార్ధనా విజయాలు:
ప్రార్ధన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. జ్ఞానమునిచ్చి, దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని, సహవాసాన్నినెలకొల్పుతుంది.
పాపపు బంధకాలనుండి విడిపిస్తుంది. శత్రువులను సహితం మిత్రులునుగా చేస్తుంది. బలహీనులకు బలాన్నిస్తుంది. నెమ్మది లేనివారికి, నెమ్మది నిస్తుంది. కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది.
సింహాల నోళ్లను మూయిస్తుంది.
అగ్ని గుండాలను ఆహ్లాదంగా మార్చుతుంది. సృష్టిని సహితం శాశించ గలుగుతుంది. సంకెళ్లను తెంపేస్తుంది. చట్టాలను మార్చేస్తుంది. ప్రశ్నకు సమాధానమవుతుంది. సమస్యకు పరిష్కారాన్నిస్తుంది. కన్నీటి ప్రార్ధన కన్నీటిని తుడిచేస్తుంది. పాపపు గోడలను పగలగొడుతుంది. పరిశుద్ధత లోనికి నడిపిస్తుంది. నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది.

'ప్రార్ధన' పాపం చెయ్యకుండా ఆపుతుంది. అట్లానే, 'పాపం' ప్రార్ధన చెయ్యకుండా ఆపుతుంది అంటారు దైవజనుడైన జాన్ బన్యన్. అందుచే, పాపానికి దూరంగా వుంటూ "ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉంటూ " (కొలస్సి 4:2), యెడతెగక ప్రార్థన చేయుదము(1థెస్స 5:15).

ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(పదిహేనవ భాగము)
♻ కనానులో కరవు - ఐగుప్తుకు పయనం ♻ (part-1)

అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను. (ఆది 12:10)

కనానులో కరవు సంభవించింది. అది భారమయ్యింది. ఎంత భారమంటే, ఇక ఆ దేశములో నివసించలేనంతటి భారమయ్యింది. ఇట్లాంటి పరిస్థితులలో కల్దీయుల దేశమునుండి కనానుకు నడిపించి, వాగ్ధాన దేశములో ప్రవేశపెట్టిన దేవునిని ప్రక్కనబెట్టి, అబ్రాహాము స్వంత నిర్ణయంచేసి ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు. అబ్రాహాము తలంచిన సుఖమయమైన జీవితాన్ని అక్కడ జీవించివుంటే, ఇప్పుడు మనము చెప్పుకోవలసింది ఏమిలేదు. కనానులో కరవు దేవుడు, అబ్రాహాము విశ్వాసమును పరీక్షించి, అతని సుగుణాలను అభివృద్ధిపరచే సమయం. ( కీర్తనలు 66:10-12; యాకోబు 1: 2-4,12; 1పేతురు 1:6,7) అయితే, అబ్రాహాము ఆ పరీక్షను తప్పించుకొనేటందుకు ఐగుప్తుకు వెళ్లడంద్వారా, తాను ఇబ్బందులకు గురికావడమే కాకుండా అనేకులను ఇబ్బందులకు గురిచేసాడు.

🔅 స్వంత నిర్ణయం:
అబ్రాహామునకు దేవుడు కనాను దేశాన్ని వాగ్ధానం చేసాడు. కరవు సమయంలో ఐగుప్తుకు వెళ్ళమని చెప్పలేదు. స్వంత నిర్ణయంతో వెళ్ళాడు. విశ్వాస పరీక్షలో తేలిపోయాడు. ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. రాజును సహితం ఇబ్బందులకు గురిచేశాడు. (ఆది 12: 10-17) బేత్లెహేములో కరువు వచ్చిందని ఎలీమెలెకు స్వంత నిర్ణయముతో తన కుటుంబముతోకలసి మోయాబుదేశానికి వెళ్ళాడు. మధురమైన జీవితాలు మారాగా మారాయి. (రూతు 1:1-2) యోనాను దేవుడు నినెవేకు వెళ్ళమంటే, స్వంత నిర్ణయం చేసి తర్షీషు కు వెళ్ళడానికి ప్రయత్నించి, అనేక ఇబ్బందులు పడ్డాడు, ఓడలోనివారందరిని ఇబ్బంది పెట్టాడు. ( యోనా 1ఆధ్యా) లోతును, దేవుని దూత పర్వతానికి పారిపొమ్మంటే, కాదు సోయరుకు వెళ్తానని స్వంత నిర్ణయం చేసాడు. పరిశుద్ధ గ్రంథములోనే భయంకరమైన అవమానాన్ని మూటగట్టుకున్నాడు. (ఆది 19:17-21) సమూయేలు రాక ఆలస్యమయ్యిందని రాజైన సౌలు స్వంత నిర్ణయం చేసి, దహనబలిని అర్పించడం ద్వారా రాజ్యాన్ని కోల్పోయాడు (1 సమూ 13:9) చిన్న కుమారుడు స్వంత నిర్ణయం చేసి, తండ్రికి దూరమై, దుర్వ్యాపారముచేసి పందులపొట్టు తినే స్థితికి చేరుకున్నాడు (లూకా 15:16).

🔅 ఐగుప్తు లోకమునకు లేదా పాపమునకు సాదృశ్యం:
ఐగుప్తు చూపులకు అందమైన దేశము. ఎందుకంటే? ఐగుప్తు నీళ్లుపారు దేశము (ఆది 13:10) అది అనేకులను ఆకర్షిస్తుంది. ఐగుప్తు అందమైన పెయ్య (యిర్మియా 46:20) అది అపవిత్రమైన దేశము. రక్త సంబంధీకులతో లైంగిక సంబంధాలు కలిగియున్నారు, హోమో సెక్స్ (పురుషులు పురుషులతో చేసే లైంగిక పాపము) లెస్బినిజం ( స్త్రీ స్త్రీలతో చేసే లైంగిక పాపము) అనే తుచ్ఛమైన కోరికలకు వారు కలిగియున్నారు. చివరకు జంతువులతో సహితం వికృతమైన లైంగిక కార్యకలాపాలు కొనసాగించారు. (లేవి 18వ ఆధ్యా) రెండవసారి కరవు వచ్చినప్పుడు ఇస్సాకు దేవునితో చెప్తున్నమాట. యెహోవా అతనికి ప్రత్యక్షమైనీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. (ఆది 26:2) ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును. (యెషయా 30:3) ఐగుప్తును ఆధారం చేసుకొని, వారిని ఆశ్రయించువారికి శ్రమ (యెషయా 31:1) ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను ( యెహేజ్కేలు 29:6)

🔅 ఐగుప్తులో అబ్రాహాము ఎదుర్కొనిన సమస్యలు:
🔹 1. భయము:
అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితోఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుక నిచ్చెదరు. (ఆది 12:11,12)

అబ్రాహాము కల్దీయుల దేశమునుండి కనాను దేశానికి రావడానికి సుమారు వెయ్యి మైళ్ళు ( సుమారు 1500 కి.మీ. లు) ప్రయాణించాడు. ఆ కాలంలో పశువుల మందలతో వెయ్యిమైళ్ళ ప్రయాణమంటే అది సామాన్య విషయమేమికాదు. ఒక మనిషి రోజుకు 30 కి. మీ.లు ప్రయాణించగలడు. మందలతో అంత దూరంకూడా సాధ్యం కాదు. అంటే, అబ్రాహాము ప్రయాణము కొన్ని నెలలపాటు సాగింది. ఆ ప్రయాణంలో అబ్రాహాము అనేక పరిస్థితులగుండా, అనేక రకాలైన మనుష్యులను దాటుకొంటూ, అరణ్యాలగుండా అతని ప్రయాణం కొనసాగింది. అయితే, ఆయన వాటికి భయపడిన సందర్భముగాని, ఇతరులు అబ్రాహాము మీద దాడికి ప్రయత్నించిన సందర్భముగాని మనకెక్కడా కనిపించదు. మొట్టమొదటగా ఐగుప్తులోనున్న మనుష్యులకు భయపడుతున్నాడు. అబ్రాహామును భయమెందుకు ఆవరించింది? దేవుని మాట తీసుకోకుండా ఐగుప్తుకు బయలుదేరినందుకేనా? తప్పకుండా కారణం అదే అయ్యుంటుంది. దేవునికి దూరమైతే, అభద్రతాభావానికి దగ్గరవుతాము. భయపడుటవలన మనుష్యులకు ఉరివచ్చును యెహోవాయందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. (సామె 29:25) యెహోవా మాటను విశ్వసించి సమస్తాన్ని విడచివచ్చిన అబ్రాహాము, ఇప్పుడు సమస్యను పరిష్కరించే దేవునివైపు కాకుండా, కరవు అనే సమస్య వైపు చూడడం వలన ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చిందేమో? పేతురు కూడా యేసు ప్రభువు వారి వైపు చూచినంతవరకూ నీటిమీద బానే నడువగలిగాడు. గాలివైపు చూచినప్పుడు మాత్రం మునిగిపోసాగాడు.

నేటి మన జీవితాలు ఇట్లానే వున్నాయికదా? పరిశుద్ధ గ్రంధములో “భయపడకుడి” అనే వాగ్ధానము 366 సార్లు వ్రాయబడివుందని చెప్తూవుంటారు. అంటే, లీపు సంవత్సరంతో సరిచూచుకున్నా, ప్రతీ రోజు మనకు ఆ వాగ్ధానముందన్నమాట. అయితే, పరిస్థితులకు భయపడవద్దని ఆయన చెప్తుంటే, మనమేమో ప్రభువుకు భయపడడం మానేసాము. అందుకే పరిస్థితులు మనలను భయపెడుతున్నాయి.
ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయ గలవానికి మిక్కిలి భయపడుడి. (మత్తయి 10:28)

ప్రియా విశ్వాసి! దేవుని చిత్తంకాకుండా మనము తీసుకొనే నిర్ణయాలు, మనకు భయాన్ని పుట్టిస్తాయి. ఆ భయమునుండి విడుదలపొందాలంటే, ప్రభువును హత్తుకోవడమే శరణ్యం. ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(పదహారవ భాగము)
♻ కనానులో కరవు - ఐగుప్తుకు పయనం ♻ (part-2)

భయమునకు కారణం:
అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుక నిచ్చెదరు. నీవలన నాకు మేలుకలుగు నట్లును నిన్నుబట్టి నేను బ్రదుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను.(ఆది 12:11-13)

అబ్రాహాము ఐగుప్తీయులకు ఎందుకు భయపడుతున్నాడంటే, తన ప్రాణమునకు సెక్యూరిటీ లేదన్న అభద్రతాభావం. ఇంతవరకు అందమైన భార్యవున్నందుకు సంతోషపడి వుంటాడు. ఇప్పుడు ఆమె అందమే తన ప్రాణమునకు ముప్పు అన్నట్లుగా భావిస్తున్నాడు. అబ్రాహాము హారానులో బయలుదేరేనాటికి అతని వయస్సు 75 సంవత్సరములు (ఆది 12:4 ) అంటే శారయి వయస్సు 65 సంవత్సరములు. ఈ వయస్సులోకూడా ఆమె చాలా అందమైనది. ఆమె అందాన్ని ఫరోయొక్క అధిపతులు ఫరోదగ్గర పొగిడారు( ఆది 12:15) ఫరో దగ్గర పొగడడం అంటే, సామాన్య మైన విషయం కాదు. ఎందుకంటే, వారు పొగిడినట్లుగా ఆమె అందం లేకపోతే వారి ప్రాణాలకే ముప్పువాటిల్లుతుంది. 65 సంవత్సరాల వయస్సులోనే ఆమె అంత అందముగా వుండివుంటే, యవ్వనప్రాయంలో ఇంకెంత అందముగా వుండి ఉండేదో కదా? కానీ, ఇంతకు ముందెన్నడూ ఇట్లాంటి భయము అతనిలో కలుగలేదు. ఇప్పుడెందుకు? దేవుని మాట చొప్పునకాకుండా, స్వంత నిర్ణయంతో ఐగుప్తుకు బయలుదేరాను కాబట్టి, దేవుడు నా చేయి విడచిపెట్టేస్తాడేమోనన్న ఆందోళన అంతర్గతంగా అబ్రాహాములో భయాన్ని కలిగిస్తుందేమో?

2. అబద్ధములు:
అబ్రాహాములో చెలరేగిన ఆందోళన అతనికి భయాన్ని పుట్టించింది. ఆ భయము అబద్ధములాడుటకు ప్రేరేపించింది. మొట్టమొదటిగా తన భార్యను తన సహోదరిగా ఐగుప్తీయులకు పరిచయం చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి ఒకప్పుడు శారాయి అతని సహోదరియే. ఎట్లా అంటే, తన తండ్రియైన తెరహుకు ఇద్దరు భార్యలు వుంటే ఒకామెకు అబ్రాహాము, మరొకామెకు శారాయి జన్మించారు. తండ్రి ఒక్కడే. తల్లులు మాత్రం వేరు. (ఆది 20:12) ఈ రీతిగా చూస్తే శారాయి అబ్రాహాముకు సహోదరియే అవుతుంది. ఆ దినాలలో దేవుడు ఇట్టి సంబంధాలను అనుమతించారు. ధర్మ శాస్త్రము వచ్చిన తర్వాత, రక్థసంబంధీకుల మధ్య వివాహాలు నిషేధించబడ్డాయి. ఒకప్పుడు శారాయి అతనికి చెల్లులే కావొచ్చు. కానీ ఇప్పుడు కాదు. కల్దీయుల దేశములో ఊరులో వున్నప్పుడే వారి వివాహం జరిగింది. అంటే ఇప్పుడు అబ్రాహాము అబద్ధం చెప్పడానికి, చెప్పించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడన్నమాట. తన భార్యను కూడా అట్టిరీతిగానే అబద్ధమాడుటకు ప్రేరేపించాడు. లోతు, తన పనివారితోకూడా అట్టిరీతిగానే తప్పక చెప్పియుండవచ్చు. అంటే తాను తీసుకున్న స్వంత నిర్ణయం ఎన్ని తప్పులుచేయడడానికి కారణమవుతుందో చూడండి?
యజమాని మీద ఎంతో నమ్మకంతో వెంబడిస్తున్న భార్య, లోతు, పనివారితో అబ్రాహాము అబద్దం చెప్పించే ప్రయత్నము చేస్తుండడంతో తన యజమానిమీద గల గౌరవాన్ని అతడు తప్పక కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అబ్రాహాము తీసుకున్న స్వంత నిర్ణయం తమపనివారు సహితం అబ్రాహాము వ్యక్తిత్వాన్ని శంకించే స్థితికి చేర్చింది. అబ్రాహాము అబద్ధమాడుట ద్వారా పూర్తిగా దేవుని చేతిని విడచిపెట్టి అపవాదియైన సాతాను చెయ్యిపట్టుకున్నట్లయ్యింది. ఎందుకంటే, అబద్ధమునకు తండ్రి వాడే. అబద్ధమాడేవాడు వాని కుమారుడు. అంటే అబ్రాహాము స్వంత నిర్ణయం ఇంతటి దయనీయమైన స్థితికి చేర్చిందా? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు. (యోహాను 8:44)

అవును! మనము తీసుకున్న స్వంత నిర్ణయాలు, వాటిని కప్పిపుచ్చుకొని, మనలను మనము కాపాడుకోవడానికి మనము చెప్పే అబద్ధాలు మన వ్యక్తిత్వాన్ని ఎంతగా దిగజార్చేస్తాయోకదా? ఎంతగా అంటే దేవుని పిల్లలను సహితం, సాతాను పిల్లలుగా మార్చేస్తాయి. అయితే ఈ విషయం మనకు అర్ధంకాక, అబద్దాలు చెప్పి ఇతరులను నమ్మించే ప్రయత్నం చేసి, నాయంతటి జ్ఞానవంతుడు మరొకడులేడు అంటూ మనకు మనమే సర్టిఫికెట్ యిచ్చుకొంటున్నాము. విజయ గర్వంతో పొంగిపోతున్నాము. అబద్ధాలు చెప్పడం ఎంతగా అలవాటు అయ్యిందంటే, మనము అబద్ధం చెప్తున్నామనే విషయం కూడా మనకు తెలియడంలేదు. అంతగా అలవాటుపడ్డాము. అయితే, వాటి పర్యవసానం మాత్రం చాలా భయంకరంగా వుండబోతుందని గ్రహించగలగాలి. అబద్ధమునకు దూరముగా నుండుము. (నిర్గమ 23:7) కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు. (సామె 19:5) కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును(సామె 19:5) కావున, కీర్తనాకారునివలే అబద్ధమును అసహ్యించుకోవాలి (కీర్తనలు 119:163)మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను. ( మత్తయి 5:37 :;యాకోబు 5:12).
ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(పదిహేడవ భాగము)
♻ కనానులో కరవు - ఐగుప్తుకు పయనం ♻ (part-3)
🔅3. *మనుషులపై ఆధారపడే తత్వం:*


నీవలన నాకు మేలు కలుగునట్లును నిన్నుబట్టి నేను బ్రదుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. (ఆది 12:13)

కల్దీయుల దేశములోనున్నప్పుడు దేవుని మాటను విశ్వసించి, విధేయుడై, మనుషులెన్ని చెప్పినా ఎవ్వరిని లెక్కచేయకుండా, దేవునిపైనే పూర్తిగా ఆధారపడి, అడ్రస్ తెలియని స్థలానికి పయనమయ్యాడు. అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను. (హెబ్రీ 11:8)
చివరకు, సురక్షితముగా ఆ అడ్రస్ (కనాను)ను చేరగలిగాడు. కానీ, తన స్వంత నిర్ణయంతో అడ్రస్ తెలిసిన ఐగుప్తుకు పయనమయ్యాడు. అడ్రస్ లేని పయనం ఆనందంగానే సాగింది గాని, అడ్రస్ తెలిసిన పయనం మాత్రం అంతా ఆందోళనే. కారణం? ఆ పయనంలో దేవుని ప్రసన్నత తోడుగావుంది. ఇప్పుడైతే అది లోపించిందేమోననే భయం. అప్పుడు దేవునిపైనే పూర్తిగా ఆధారపడ్డాడు. ఇప్పుడైతే, దేవుని ప్రస్తావన లేనేలేదు. అప్పుడైతే మనుషులను, వారి సలహాలను పట్టించుకోలేదు. ఇప్పుడైతే వారిపైనే పూర్తిగా ఆధారపడుతున్నాడు. ఎంత విచిత్రం? అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు కనుచూపుమేరల్లో కూడా కానరాదేమిటి? ఐగుప్తు పొలిమేరల్లో అడుగుపెట్టడమేనా దీనికి కారణం? అవుననే చెప్పాలి. విశ్వాసి లోకమనే ఐగుప్తులోనికి ప్రవేశిస్తే, లోకం అతనిని బ్రష్టునినిగా మార్చేస్తుంది. దానికి బ్రాహాము జీవితమే మనకొక ఆధ్యాత్మిక పాఠం. ఇంతవరకూ చెయ్యిపట్టుకొని నడిపించిన దేవుని చేతిని విదుల్చుకొని, తన భార్య చేయిపట్టుకున్నట్లుగా వుంది. నీ వలన మేలుకలగాలి. నిన్ను బట్టి నేను బ్రతకాలి అంటున్నాడంటే, తన భార్యపై ఎంతగా ఆధారపడ్డాడో అర్థంచేసుకోవచ్చు. వాస్తవానికి మేలుచేసేవాడు, జీవింపజేసేవాడు దేవుడే. కానీ, అబ్రాహాము ఐగుప్తు అనే లోకంలో ప్రవేశించడంతో దేవుని ప్రస్తావన లేకుండాపోయింది. స్వంత ప్రయత్నాలు చేసుకొంటూ, దేవుని స్థానంలో మనుషులపై ఆధారపడుతున్నాడు.

అంతా అబ్రాహాము అనుకున్నట్లుగా జరిగింది. ఫరో అధిపతులు ఆమె అందమును గురించి ఫరో ఎదుట ఆమెను పొగిడారు. ఫరో ఇంటికి ఆమెను తీసుకొని పోయారు. తన భార్యను బట్టి, అబ్రాహామునకు మేలుజరిగింది. అతనికి గొఱ్ఱలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను (ఆది 12:14-16). అయితే, అబ్రాహాము తన భార్యనుబట్టి ఆశించిన మేలు యిదేనా? ఏ భర్తాకూడా ఇటాంటి మేలును ఆశించడు.

🔅 *4. మోసం:*
అబ్రాహాము చేసిన ఒక స్వంత నిర్ణయం, దాని పర్యవసానం ఎంత భయానకంగా వుందో చూడండి. అతని భయము అబద్ధములాడుటకు ప్రేరేపించగా, ఆ అబద్ధము ఐగుప్తీయులను, ఫరోను మోసిగించుటకు కారణమయ్యింది. (ఫరో అనేది ఐగుప్తు రాజు పేరు కాదుగాని, అది బిరుదు. ఐగుప్తు రాజులందరూ ఫరోలుగా పిలువబడతారు). అబ్రాహాము ఐగుప్తు రాజును మోసం చెయ్యాలని చూసాడు. ఇది పాపము. పరిశుద్ధ గ్రంధము ఏ వ్యక్తి పాపము చేసినా దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చెయ్యనే చెయ్యదు. దేవుని హృదయానుసారుడైన దావీదు బత్షెబతో పాపం చేసిన సందర్భంలో ప్రవక్త నాతాను వచ్చి "ఆ మనుష్యుడవు నీవే" అంటూ దావీదు పాపం బయటపెట్టాడు. (2సమూ 11వఆధ్యా ) అప్పట్లో న్యూస్ పేపర్స్ , టి.వి చానల్స్ , పేస్ బుక్, వ్వాట్సాప్ లు లేవు కాబట్టి దావీదు బ్రతికిపోయాడు అనుకొంటున్నావేమో? దావీదు పాపాన్ని దేవుడు బట్టబయలు చేసి, 2000 భాషల్లోకి తర్జుమా చేయించాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషే విషయంలోనూ అదే జరిగింది. దేవుని స్నేహితుడైన అబ్రాహాము చేసిన మోసం విషయంలోనూ అదే జరిగింది. ఇంతటి గొప్ప వ్యక్తులు ఎందుకిట్లా తప్పిపోయారు? కారణం ఒక్కటే. మనిషి స్వభావమే పాపపు స్వభావం. అందరూ పాపము చేసినవారే. (రోమా 3:23 ; 1యోహాను1:8,10 ) అయితే, ఇంతటి గొప్ప వ్యక్తులే తప్పిపోతే నేనెంత అంటూ సర్దిచెప్పుకొనే ప్రయత్నం కాదుగాని, వారు సరిచేసుకొని అనుసరించిన మార్గాన్ని మనమునూ అనుసరించగలగాలి.

అబ్రాహాము చేసిన మోసం అతని జీవితంలో సమాధానం లేకుండా చేసింది. భార్యను తీసుకొనిపోతుంటే నిశ్చేష్ఠుడుగా చూడాల్సివచ్చింది. తాను చెప్పిన అబద్దం, తను ఒక్కమాటకూడా మాట్లాడకుండా చేసింది. తన భార్యచేత చెప్పించిన అబద్దం, భర్తమాటకు విధేయురాలై, తలవంచేటట్లు చేసింది. వారిని ఎదిరించే ధైర్యం వుందా అంటే లేదు. ఆమెను తీసుకొనివెళ్తున్నది రాజ భటులు. ఇప్పుడు ఆమె నా భార్య అని చెప్పినాగాని, అబద్ధంచెప్పి, వారిని మోసగించినందుకు అదికూడా అబ్రాహాము ప్రాణానికే ముప్పువాటిల్లే ప్రమాదముంది. తన భయము నిజమవుతుంది. ఇక చేసేదేమి లేదు బహుమతులు తీసుకొని భార్యను అప్పగించడంతప్ప. ఒక్కమాటలో చెప్పాలంటే బహుమతులకు భార్యను అమ్మేసినట్లయ్యింది. అబ్రాహాము ఆశించిన మేలు ఇదేనంటారా? ఇక్కడ అబ్రాహాము, అంతఃపురంలో శారాయి ఎంత క్ష్యోభ అనుభవించియుంటారు. మనము చేసే స్వంత నిర్ణయ పర్యవసానం యింత దారుణంగా వుండబోతుందా? యింతజరిగినా అబ్రాహాము బలిపీఠము కట్టలేదు, ప్రార్ధించలేదు, అసలు దేవుని ప్రస్తావన లేనేలేదు. కారణం? లోకంలో మనముంటే, లోకం మనలను దేవునినుండి దూరం చేసి, దేవుని చెంతకు వెళ్ళడానికి సిగ్గుపడేలా చేసి, దాని లక్ష్యాన్ని నెరవేర్చుకొంటుంది.

ప్రియావిశ్వాసి! స్వంత నిర్ణయంచేసి, దేవునికి దూరమై, లోకంలో కొట్టుమిట్టాడుతూ, క్ష్యోభను అనుభవిస్తున్నావేమో? అబ్రాహాము జీవితాన్ని ముందుపెట్టుకుని నీ జీవితాన్ని ఒక్కాసారి పరిశీలనచేసుకొని, సరిచేసుకోగలిగితే, జీవితం ధన్యమవుతుంది.

ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(పద్దెనిమిదవ భాగము)
♻ కనానులో కరవు - ఐగుప్తుకు పయనం ♻(part-4)
🔅 అబ్రాహాముకు తోడుగానున్న దేవుని కృప:
యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను. (ఆది 12:17)

ఐగుప్తులోనున్న అబ్రాహాముకు కేవలం తన ప్రాణమును రక్షించుకోవాలనే స్వార్ధముతప్ప, తన భార్య యొక్క క్షేమమును గూర్చిగాని, ఆమె పవిత్రతను గురించిగాని ఆలోచించినవాడు కాదు. ఎందుకు అబ్రాహాము ఈస్థితికి చేరుకున్నాడంటే కారణం ఒక్కటే. దేవుని చేయి విడచిపెట్టేసి, స్వంత ప్రయత్నాలు చేసుకొంటున్నాడు. అయితే, అబ్రాహాము దేవునిని విడచిపెట్టేసినాగాని కృపగలిగిన దేవుడు మాత్రం అబ్రాహామును విడిచిపెట్టలేదు. అబ్రాహాము తప్పుచేసినాగాని, దేవుడు మాత్రం వారి వివాహ భద్రతను కాపాడి, తర్వాతకాలంలో వారిద్వారా తన ఉద్దేశ్యాలను నెరవేర్చేందుకు ఇష్టపడ్డాడు. అబ్రాహాము దారితప్పినాగాని, దేవుడు మాత్రం ఆయనిచ్చిన వాగ్ధానంలో మాత్రం తప్పిపోయేవాడుకాదని ఆయన రుజువు చేసుకున్నాడు. శారాయి యొక్క పవిత్రతను దేవుడు కాపాడేందుకుగాను, ఫరోను, అతని యింటివారిని మహావేదనలచేత బాధించడం మొదలు పెట్టాడు. శారాయి అంతః పురంలో అడుగుపెట్టగానే, వారందరికీ బాధలు ప్రారంభమయ్యాయి. ఆ బాధల్లోపడి రాజు సహితం ఆమె అందమును గూర్చి పట్టించుకొనే పరిస్థితిలేకపోయింది. ఈమె అడుగుపెట్టగానే నా యింటిలో ఏమిటీ పరిస్థితి అనేదే ఫరో మదిలో తిరుగుతుంది తప్ప, మరొక ఆలోచన లేకుండాపోయింది.

🔅 దేవుని న్యాయమైన తీర్పులు:


మనుష్యులు దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు దేవుడు తన న్యాయమైన తీర్పులు వెల్లడిచేసేవాటిలో భాగంగా అనేక సందర్భాలలో వారిని రోగాలతో మోత్తాడు. అట్లా అని వ్యాధులన్నీ దేవుడు పంపించేవి కాదు (యోబు 2:7). మిర్యాము, తన సహోదరుడైన మోషేకు వ్యతిరేకముగా మాట్లాడడం వలన, దేవుడు ఆమెను కుష్టుతో మొత్తెను. (సంఖ్యా 12:10) నయమాను నుండి, గేహాజి ధనాన్ని ఆశించి దేవుని ఆజ్ఞను మీరడం ద్వారా దేవుడతనిని కుష్టుతో మొత్తెను. (2 రాజులు 5: 27) యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా, తండ్రివలెనే యెహోవా దృష్టికి నీతిగలవాడుగా ప్రవర్తించినప్పటికీ, ఉన్నత స్థలాలను మాత్రం కొట్టివేయలేదు. దానితో ప్రజలు దేవతలకు బలులు అర్పించుటకు అవకాశం కల్పించినవాడయ్యాడు. అందుచే దేవుడతనిని కుష్ఠిరోగముతో మొత్తెను( 2రాజులు 15:1-5). ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల బానిసత్వంనుండి విడిపించాల్సి వచ్చినప్పుడు కూడా, దేవుడు ఐగుప్తీయులను 10 రకాల తెగుళ్లతో వారిని మొత్తెను. అయితే, ఫరోను అతని యింటివారిని దేవుడు ఏ రీతిగా బాధించాడో తెలియదుగాని, వేదనలచేతకాదు, “మహావేదన”లచేత వారిని బాధించాడు. ఇప్పుడు ఇక్కడ అబ్రాహాముకు సమాధానం లేదు. అక్కడ అంతఃపురంలో నున్న శారాయిగాని, ఫరో కుటుంబానికిగాని సమాధానం లేదు. అబ్రాహాము చేసిన స్వంత నిర్ణయం అతనితోపాటు అనేకులను ఇబ్బందులకు గురిచేసింది.

ఫరో, శారాయిని అడిగియుండవచ్చు నీవు ఇంట్లో అడుగుపెట్టినప్పటినుండి ఈ పరిస్థితికి కారణమేమిటని, శారాయి అసలు విషయం చెప్పియుండవచ్చు.


🔅 ఫరో, అబ్రాహామును గద్దించుట:

అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? (ఆది 12:18). అన్యుడైన ఫరో, దేవుని బిడ్డయిన అబ్రాహామును గద్దించడం దేవునికి అవమానకరం. అంటే, అబ్రాహాము చేసిన తప్పు తనకు మాత్రమేకాకుండా, తాను సేవించే దేవునికి కూడా అవమానమును తెచ్చిపెట్టింది. దేవుని ప్రవక్తయైన యోనా ఓడ అడుగుభాగములో నిద్రపోతుంటే, అన్యుడైన ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్రబోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము (యోనా 1:6). అంటూ గద్దించడం ఎంత అవమానకరం? నీకు నచ్చినట్లుగా అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుని బిడ్డగా పిలువబడే నీవలన ఆయనకు ఘనతయా? అవమానమా? నిన్నుబట్టి సంఘము వెలుపటివారు ఇచ్చే సాక్ష్యమేమిటి? అట్లా అని సంఘములో ఎదో సాక్ష్యముందని కాదులెండి. సంఘాలలో జరిగే అల్లరికారణంగా పోలీస్ స్టేషన్లు, అన్యుల చుట్టూ తిరిగే దయనీయమైన స్థితికి క్రైస్తవ్యం చేరుకుందంటే, ఇంతకు మించిన అవమానం దేవునికి మరొకటుంటుందా?
అవును, అందుకే వాక్యం సెలవిస్తోంది. మిమ్మును బట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడు చున్నది? (రోమా 2:24). నేటి మన జీవితాలు ఇట్లానే కొనసాగుతున్నాయి కదా? నీవలన దేవుని నామము ఘనపరచబడకపోయినా ఫర్వాలేదుగానీ, ఆయన నామమునకు అవమానము తెచ్చే జీవితాన్నిమాత్రం జీవించకు.

🔅 అబ్రాహాము కనానుకు తిరుగు ప్రయాణం:

ఆదాము హవ్వలను, దేవుడు ఏదేను తోటలోనుండి పంపివేసినట్లుగా ( ఆది 3:23), అబ్రాహామును అతనికి కలిగిన సమస్తమును, ఫరో ఐగుప్తునుండి పంపివేసాడు (ఆది 12:20). వీరిలో, ఫరో అబ్రాహామునకు బహుమానముగానిచ్చిన పనికత్తెలు (ఆది 12:16) కూడా వున్నారు. ఆ పనికత్తెలలో ఒకతె “హాగరు” అని గమనించాలి. తర్వాత కాలంలో శారా, అబ్రాహాములు కలసి చేసిన మరొక స్వంత నిర్ణయం కారణముగా దేవునికి వ్యతిరేకమైన ఒక జనాంగము భూమిమీదికి రావడానికి హాగరు కారణమయ్యింది. నేటికిని వారు దేవుని పిల్లలను చిత్రవధ చేస్తూనే వున్నారు. అబ్రాహాము దేవునికి వ్యతిరేకంగా చేసిన ఒక స్వంత నిర్ణయం, దాని పర్యవసానం ఎంత ఘోరంగావుందో దీనినిబట్టి అర్థంచేసుకోవచ్చు.

🔅 దేవునితో తిరిగి నెలకొల్పబడిన సహవాసము:

అబ్రాహాము తిరుగు ప్రయాణంలో నెగెబు ( దక్షిణ పాలస్తీనా) మీదుగా, కనానుకు అనగా ముందు ఎక్కడైతే, బలిపీఠము కట్టి, యెహోవా నామమున ప్రార్ధన చేసాడో అక్కడకి చేరుకొని. అక్కడ యెహోవా నామమున ప్రార్ధన చేసెను (ఆది 13:4). చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, ఎక్కడ తప్పిపోయాడో తిరిగి అక్కడకే వెళ్లినట్లు ( లూకా 15:19 ) అబ్రాహాము ఎక్కడైతే దేవుని చేయి విడచిపెట్టేశాడో, తిరిగి అక్కడికే వెళ్లి ఆయనను కలుసుకోగలిగాడు. దేవుని నామమునకే మహిమ కలుగును! ఆమెన్!

ప్రియవిశ్వాసి! దేవుని చెయ్యి విడచి, స్వంత నిర్ణయం చేసి, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొకతప్పును చేస్తూ, నీవల్ల నీ ఇంటివారు కూడా సమాధానం కోల్పోయి, తీరంలోని పయనం చేస్తున్నావేమో? ఎక్కడ? ఏ స్థితిలో? ఏ సందర్భంలో? ఆయన చేయి విడచిపెట్టాశావో? తిరిగి నీవు అక్కడే వెళ్లి ఆయనను కలుసుకోగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది.

ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(పంతొమ్మిదవ భాగము)
♻ అబ్రాహాము లోతులు వేరగుట ♻

వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను. (ఆది 13:6)
అబ్రాహాము, లోతుల వారియొక్క ఆస్తులు కలసి నివసించలేనంత విస్తారముగా వున్నాయి. ఏశావు, యాకోబులు కూడా విస్తారమైన ఆస్తివలన కలసి నివసింప లేకపోయారు (ఆది 36:7) అవును, ఆస్తులు విస్తరిస్తే కలసి నివసించలేము. రక్త సంబంధీకులు కలసి నివసించలేక కొట్లాడుకొని, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందంటే ఆస్తులు విస్తరించడం, విస్తరింప జేసుకోవాలనే ప్రయత్నమే కారణం.

🔅 అబ్రాహాము లోతుతో చేసిన సమాధానకరమైన ప్రతిపాదన:
మనము బంధువులము మనమధ్య కలహముండకూడదు. మన మందలు విస్తారమగుట వలన నీ కాపరులు, నా కాపరులు కలహించుకొంటున్నారు. అది మంచిది కాదు. ఈ దేశము నీ ఎదుట నున్నది దయచేసి, నీకు నచ్చిన స్థలానికి వెళ్లి నివసించు. నీవు ఎడమతట్టుకెళ్లితే, నేను కుడి తట్టుకెళ్తాను (ఆది 13:8,9) అంటూ మొదట నిర్ణయం తీసుకొనే అవకాశాన్ని లోతుకే ఇచ్చాడు. కనాను దేశములో తన చుట్టూ కనానీయులు, పెరిజ్జీయులు నివసిస్తున్నారు. వారు అన్యులు. అయితే, వారిలాకాకుండా ప్రత్యేకంగావుండాలని, బంధువులమధ్య కలహాలవలన వారికి చులకనకాకూడదనే తలంపు అబ్రాహాములో వున్నట్లుండి. ఐగుప్తులో నున్నప్పుడు మాత్రం ఇట్లాంటి తలంపు లేదు. ఇప్పుడు అబ్రాహాము, ప్రత్యేకతను, సమాధానమును కోరుకొంటున్నాడు. తిరిగి దేవునిని కలుసుకోవడం ద్వారానే ఇది సాధ్యమయ్యింది. అబ్రాహాము ముందున్న సమస్యను ఎంత సమాధానంతో పరిష్కరిస్తున్నాడో చూడండి. మనమైతే, గోటితో తియ్యాల్సినదానిని గొడ్డలివరకు తీసుకెళ్తాము. చివరకు నీవెంతంటే నీవెంత అనే పరిస్థితికి చేరతాము తద్వారా సమాధానాన్ని కోల్పోవడమేకాకుండా, మన చుట్టూవున్న అన్యులమధ్య నవ్వులపాలవుతున్నాము.

🔅 లోతు చేసిన నిర్ణయం:
లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణముచేసెను. (ఆది 13:11) కారణం? అది యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను (ఆది 13:10).

లోతు చేసిన నిర్ణయం అతని పతనానికి తొలిమెట్టు. అబ్రాహాము ప్రతిపాదన వినినవెంటనే, ఇంతకాలం దీనికోసమే ఎదురుచూస్తున్న అన్నట్లు, కన్నులెత్తి ఎటువెళ్ళాలో వెతుక్కున్నాడుతప్ప, కృతజ్ఞత లేనివాడిగా ఒక్క మంచి మాట కూడా మాట్లాడలేకపోయాడు. నా తండ్రి మరణించినప్పటినుండి నీవే తండ్రిగావుండి ఆదరించావు. ఇకమీదట నీతోనే వుంటాను. మన కాపరులు మనమాట వారు వినాలిగాని, వారికోసం మనము విడిపోవడమేమిటి? అనే ఒక్కమాటకూడా అనలేకపోయాడు. విడిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, నేను ఎక్కడ వుండాలో నీవే నిర్ణయించమని అబ్రాహామును అడిగియుంటే బాగుండేది. లోతు అట్లాను చెయ్యలేదు. సొదొమ అందాలను చూచి మోసపోయి, నీతిమంతుడైన అబ్రాహాము సహవాసమునుండి వైదొలగడం ద్వారా లోతు పెద్ద తప్పుచేసాడు. ఇకనుండి లోకంవైపు తన పయనాన్ని సాగించాడు. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను (ఆది 13:10) తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొనెను(ఆది 13:11) సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను (ఆది 13:12) లోతు సొదొమలో కాపుర ముండెను (ఆది 14:12) లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. (ఆది 19:1) సొదొమ వారితో తన కుమార్తెలకు వివాహము నిశ్చయించెను. (ఆది 14:19)ఇట్లా లోకానికి మరింత దగ్గరయ్యాడు. నోవహు నీతి తన కుటుంబాన్ని రక్షించగలిగింది గాని, లోతు నీతి ( 2పేతురు2:7,8) తన కుటుంబాన్ని రక్షించలేకపోయింది.

🔅 అబ్రాహాము నూతన ప్రత్యేకత
అబ్రాహాము వాగ్ధానభూమి యైన కనానులో నివసించెను. లోతునుండి వేరు పడడం ద్వారా, కల్దీయుల దేశములోనున్నప్పుడు దేవుడు అబ్రాహాము ముందుంచిన అన్ని షరతులను (ఆది 12:1) నెరవేర్చినట్లయ్యింది. దేవుడు అబ్రాహామునకు విధించిన షరతులు: 4
1. నీ దేశమును విడచిపెట్టు 2. నీ బంధువులను విడచిపెట్టు 3. నీ తండ్రి యింటిని విడచిపెట్టు 4. నేను చూపించే దేశమునకు వెళ్లుము.

అబ్రాహామునకు దేవుడు చేసిన ఏడు వాగ్ధానపు ఆశీర్వాదాలు (ఆది 12:2,3) తన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా ఈ నాలుగు పనులు చెయ్యాలి. అయితే ఇప్పటికి అబ్రాహాము మూడు పనులు చేసినట్లయింది. 1. దేశాన్ని విడిచిపెట్టాడు. 2. హారానులో తండ్రి చనిపోవడంతో తండ్రి ఇంటిని విడచిపెట్టినట్లయ్యింది. 3. దేవుడు చూపించిన కనానుకు వచ్చాడు. ఇక నాలుగవది బంధువుల ఇంటిని విడిచిపెట్టాలి. అది ఇంతవరకూ జరుగలేదు. లోకాశాలు వీడని తన బంధువైన లోతు తనతోనే వున్నాడు. అదికూడా జరిగితేనేగాని, దేవుడు అబ్రాహామును ఆశీర్వదించడం మొదలు పెట్టడు. ఇప్పుడు లోతునుండి వేరుకావడంతో దేవుని షరతులన్నీ నెరవేర్చినవాడయ్యాడు.

🔅 నూతన ఆశీర్వాదం:
ఎప్పుడైతే అబ్రాహాము లోతునుండి వేరయ్యాడో, అప్పుడు మరొక సంపూర్ణ ఆశీర్వాదపు వాగ్ధానముతోపాటు, దేవుని సహవాసాన్ని పొందుకోగలిగాడు. లోతు అబ్రామును విడిచి పోయినతరువాత యెహోవాఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పు తట్టు పడమరతట్టును చూడుము; ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమిమీద నుండు రేణు వులవలె విస్తరింప చేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమునుకూడ లెక్కింపవచ్చును. నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను (ఆది 13:14-17). అప్పుడు అబ్రాహాము హెబ్రోను (అనగా సహవాసం) లో సహవాస బలిపీఠముకట్టి దేవునిని ఆరాధించి, ఆయనతో సహవాసం చేయగలిగాడు. ఇదెప్పుడు సాధ్యమయ్యిందంటే, దేవుడు తనకు విధించిన షరతులన్నీ తన జీవితంలో నెరవేర్చినప్పుడే మాత్రమే సాధ్యమయ్యింది.

ప్రియ విశ్వాసి! ఆయనిచ్చే ఆశీర్వాదపు వాగ్ధానములను స్వతంత్రించుకోవాలంటే, ఆయనతో సహవాసం చెయ్యాలంటే, ప్రభువుకు ఆయాసకరమైన జీవితం నీలో ఏముందో,ఇంకనూ నిన్ను వెంబడిస్తున్నదేమిటో, దానిని విడచిపెట్టగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.
ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(ఇరువదియవ భాగము)
♻ నలుగురు రాజులపై విజయం ♻


పరిశుద్ధ గ్రంధములో ప్రస్తావించబడిన మొదటి యుద్ధమిది. సొదొమ దాని చుట్టూనున్న రాజ్యాలమీద నలుగురు రాజులు యుద్ధం ప్రకటించారు. వారిని తట్టుకోలేక సొదొమ గొమొఱ్ఱా రాజులు పారిపోయి మట్టికీలు గుంటల్లో పడ్డారు. మిగిలినవారు కొండలకు పారిపోయారు. విజయం సాధించిన రాజులు సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నియు పట్టుకొని పోయిరి.(14:11) అయితే, మొదట్లో లోతు సొదొమకు సమీపంలో గుడారం వేసుకున్నాడు (ఆది 13:12) ఇప్పుడైతే నేరుగా సొదొమలోనే కాపురమున్నాడు (ఆది 14:12) అందుకే, లోతుకుటుంబం కూడా చెరపట్టబడింది. ఈ విషయం హెబ్రీయుడైన అబ్రాహామునకు తెలియజేయబడింది. హెబ్రీయుడు అనగా “నది దాటి వచ్చినవాడు” అని అర్ధము.

ఐగుప్తులో స్వంతభార్యను తీసుకొనిపోతుంటే చేతకానివాడిలా అప్పగించిన అబ్రాహాము ఇప్పుడేమి చెయ్యగలడు? అతడేమైనా యుద్ధవిద్యలు నేర్చినవాడా? లేదే, అతడొక సామాన్య వ్యవసాయకుడు. లోతును విడిపించాలంటే యుద్దంచేయుటలో ఆరితేరిన నలుగురు రాజులమీద యుద్ధంచేసి విజయంసాదిస్తేనేగాని లోతును విడిపించలేడు. అది అబ్రాహామునకు సాధ్యమా? కానేకాదు సరికదా అది అతని ప్రాణానికే ముప్పు. అయినప్పటికీ, విశ్వాస పోరాటయోధుడైన అబ్రాహాము తన దగ్గర అలవరచబడిన మూడువందల పద్దెనిమిది మందిని మరియు అబ్రాహాముతో నిబంధన చేసికొనిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనువారిని వెంటబెట్టుకొని ఆ నలుగురు రాజులను వెంటాడడం ప్రారంభించాడు. ఐగుప్తులో నున్నప్పుడు స్వంత భార్యను తీసుకొని వెళ్లిపోతుంటే చేతకానివాడిలా అప్పగించిన అబ్రాహాముకు ఇప్పుడింత ధైర్యం ఎట్లా వచ్చింది? అప్పుడైతే దేవుని చేయి విడిచిపెట్టేసి లోకంలో వున్నాడు. ఇప్పుడైతే ఆయన చెయ్యిపట్టుకోని ఆయనతో సహవాసం చేస్తున్నాడు. అతడు హెబ్రోనులో నివసిస్తున్నాడు. హెబ్రోను అనగా “సహవాసము” అంటే అబ్రాహాము దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవునితో సహవాసం విప్లవాత్మకమైన విజయాలు సాధిస్తుంది. అతడు తన శారీరక బలముపైన, బలగముపైన ఆధారపడినవాడు కాదుగాని, బలవంతుడైన దేవునిపైన ఆధారపడినవాడు. దావీదువలే, యుద్ధము యెహోవాదే అంటూ బయలుదేరాడు. విజయం సాధించి, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను.(ఆది 14:16)

దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన అనుగ్రహించే విజయాలు మన ఊహలకు సహితం అందవు. గిద్యోను పిలవగానే 32000మంది ఆయనతో చేరారు. ఇంతమందితో నీవు యుద్దానికి వెళ్లకూడదని దేవుడు వారికి పరీక్ష పెట్టి, భయపడేవారందరిని వెళ్లిపోవచ్చు అనగానే 22000మంది వెళ్లిపోయారు. వారి సంఖ్యకూడా ఎక్కువగానే వుందని మరలా వారిని పరీక్షించగా 300మంది మాత్రమే మిగిలారు. వారితోనే యుద్ధానికివెళ్ళి గిద్యోను యుద్ధానికివెళ్ళి విజయం సాధించగలిగాడు. (న్యాయాధి 7వ ఆధ్యా) మంది మార్బలం కంటే, దేవునిపై మనమెంతగా ఆధారపడగలుగుతామో అదే మన బలమవుతుంది.

లోతును గురించిన భారము, బాధ్యత, చింత అబ్రాహాముకున్నది. లోతు యెడల అతడు కలిగియున్న శ్రద్ధ లోతుపక్షంగా అతడు విశ్వాసపోరాటంలో ప్రవేశించేలా చేసింది. అయితే, సాతాను బంధీలుగా చెరగొనిపోవుచున్న అనేక ఆత్మలను గూర్చిన భారముగాని, చింతగాని, శ్రద్ధగానీ నీకుందా? వారినిమిత్తము ప్రార్ధించే భారము నీకుందా? అబ్రాహాము, అతడు కోరుకున్న స్థలానికి వెళ్ళాడు కదా, అతనికేమైతే నాకెందుకు అనుకొనివుంటే, లోతు రక్షించబడి వుండేవాడుకాదు. అబ్రాహామును గురించి మనము మాట్లాడుకోవలసిన అవసరతకూడా లేదు. నశించిపోతున్న ఆత్మల పక్షముగా మనము పోరాడాలి. వారెక్కడ, ఎట్లా జీవిస్తున్నాసరే వారిని గురించి ప్రార్ధించి, పాపపు బంధకాలనుండి విడిపించాల్సిన బాధ్యత మనమీదుంది.

క్రైస్తవ విశ్వాస జీవితం ఒక పోరాటమే. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఈ విధంగా వ్రాస్తున్నాడు. విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము (1తిమోతి 6:12) క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె పోరాడుము (2 తిమోతి 2:3) పౌలు గారు ప్రయోగించినమాటలు ఒక యుద్ధాన్నే తలపిస్తున్నాయి. అవును క్రైస్తవపోరాటము ఒక యుద్ధమే. మన పోరాటం ఎవరితోనంటే, మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము (ఎఫెసి 6:12) మనము ధరించాల్సిన ఆయుధాలుకూడా భౌతికపరమైనవి కావు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి (ఎఫెసి 6:13-17) సర్వాంగ కవచమును మనము పరిశీలన చేసినట్లయితే వెనుక భాగములో ఎట్లాంటి కవచమునూ ఇవ్వబడలేదు. కారణమేమిటంటే? మంచి సైనికుడు శత్రు సైన్యానికి ఎన్నడూ వెన్ను చూపడు. వెన్ను చూపితే ఓటమిని అంగీకరించినట్లే. మనముకూడా మన శత్రువైన సాతానుకు వెన్నుచూపక, పోరాటంలో వాడిపై విజయం సాధించాలి. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. (2 తిమోతి 4:7,8) పౌలు గారు చెప్పిన ఈ మాటలు మన విశ్వాసపోరాటంలో గొప్ప స్ఫూర్తిని రగిలిస్తాయి.

ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(21వ భాగము)
♻ మెల్కీసెదకు అబ్రాహామును ఆశీర్వదించుట ♻


షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వ దింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను. ( ఆది 14: 18-20)

షాలేము అనగా యెరూషలేము. యెరూషలేము యొక్క మొట్టమొదటి ప్రస్తావన ఇది. షాలేము అనగా “సమాధానము” అనే మరొక అర్ధమువుంది. షాలేము రాజు అనగా సమాధానపు రాజు.
షాలేము రాజైన మెల్కీసెదెకు దేవునియొక్క మర్మయుక్తమైన ప్రతినిధిగా వున్నాడు. ఈయన యేసు క్రీస్తుకు ముంగుర్తుగా వున్నారు. హెబ్రీ 5 ,7 అధ్యాయాలలో ఈయన ప్రస్తావన వుంది. ఆయన ఒకరాజుగా, యాజకునిగా కనిపిస్తారు. ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఆయన రాజులకు రాజుగా, మన ప్రధానయాజకునిగా మనకు పరిచయమే. మెల్కీసెదెకు అబ్రాహాము దగ్గరకు వచ్చి, దేవుడతనికిచ్చిన ఆశీర్వాదములను బట్టి, అబ్రాహామును దీవించాడు. ఇందునిమిత్తమై రొట్టెను, ద్రాక్షారసమును అబ్రాహాము యొద్దకు తెచ్చాడు. మెల్కీసెదెకుయొక్క ప్రాముఖ్యతను అబ్రాహాము గుర్తించాడు. అతనిని దేవుని ప్రతినిధిగా భావించి, తనకున్న సమస్తములోనుండి పదియవంతు ఆయనకు చెల్లించాడు.

మెల్కీసెదెకు ఎవరు? అనేది పరిశుద్ధ గ్రంధములో ఒక వివాదాస్పాదమైన అంశముగా వుంది. మెల్కిసెదెకును, యేసు క్రీస్తుతో పోల్చినప్పుడు చాలా పోలికలు కనిపిస్తాయి. దీనినిబట్టి యేసు క్రీస్తే మెల్కీసెదకుగా అబ్రాహాము దగ్గరకు వచ్చారు అనే, అభిప్రాయం చాలా ఎక్కువమందిలో వుంది. దానికిగల కారణాలను కొన్నింటిని పరిశీలన చేద్దాము.

రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థ మిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్ఠమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చెను. (హెబ్రీ 7:1-4)

మెల్కీసెదెకునకు 3 లక్షణాలు కలవు. అతని పేరుకు 1)నీతికి రాజనియు 2) సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజు
3) జీవితకాలమునకు ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడు ((హెబ్రీ 7:2) ఈ మూడు లక్షణాలను ప్రభువులో మనము చూడగలము. 1) యేసు నీతికి రాజు అపో 3:14; లూకా 23:47, మత్త 27:4, మత్త 25:31-37, యిర్మి 23:5.
2) సమాధానపు రాజు: 1 తిమో 2:5; రోమా 5:1; రోమా 5:8-11; ఎఫె 2:13-18.
3) ఆది అంతమూ లేని వాడు
(ప్రక 22:12-యోహాను 18: 37) సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు “వచ్చితిని”.

యేసు క్రీస్తు తలిదండ్రులు, వంశావళి కలిగినవారుగా వున్నారు. కానీ, మెల్కీసెదెకుకు లేదే? అప్పటికప్పుడు ప్రత్యక్షమైన వానికి తలిదండ్రులు, వంశావళి వుండడం సాధ్యం కాదు. ఆయన అవసరాన్ని బట్టి ఆయాకాలాలలో ప్రత్యక్షమగుచున్నాడనీ, పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను(మీకా 5: 2) అని అర్దమవువుతుంది.

అట్లా అయితే, ఇప్పుడు మనము ఎదురు చూడాల్సింది ప్రభువు మూడవ రాకడకొరకునా? అట్లా కాదు. ఆ రీతిగా చూస్తే నోవహు కాలములో కూడా ఆత్మరూపిగా వచ్చారు (1 పేతురు 3 : 20 ) పునరుత్తానమైన తర్వాతకూడా భూమిమీదకు వచ్చారు. ఇవన్నీ ఆయన రాకడగా లెక్కించలేముగాని ఒక బలీయమైన కారణముచే ఆయన ఈలోకానికి ఏతెంచినదే రాకడగా అర్ధముచేసుకోగలము. ఆ రీతిగా చూస్తే మనము ఎదురు చూడాల్సింది యేసు ప్రభువు రెండవ రాకడ కోసమే.

మెల్కీసెదెకు అబ్రహాము వద్దకు ఎందుకు రావలసి వచ్చింది? మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను. (యోహాను 8: 56) అబ్రాహాము ప్రభువును చూచాడు. దీనినిబట్టి యేసు ప్రభువే మెల్కీసెదెకుగా అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడు అనే అభిప్రాయం అనేకులలోవుంది.

ఇక్కడ ప్రభువే మెల్కీసెదకుగా ప్రత్యక్షమయ్యారు అనుకున్నా, లేదా మెల్కీసెదకు దేవుని ప్రతినిధిగా ప్రత్యక్షమయ్యారు అనుకున్నా, ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థంచేసుకోవచ్చు. ప్రభువు సహవాసంలో ఎవరుంటారో వారిని ఆశీర్వాదాలు వెతుక్కొంటూ వస్తాయి. వారు ఆశీర్వాదాలకొరకు పరుగులెత్తనవసరంలేదు. దానికి అబ్రాహాము జీవితమే గొప్ప ఉదాహరణ. దేవుని సహవాసములో అడుగుపెట్టిన అబ్రాహాము నలుగురు రాజులపైన విజయం సాధించాడు. ఇప్పుడేమో సర్వోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదకుచేత ఆశీర్వాదాలను పొందాడు. అబ్రాహాము తనకు కలిగిన వాటిలో పదియవంతు సర్వోన్నతుని యాజకుడైన మెల్కీసెదనుకు చెల్లించినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు దశమ భాగము అనేది ధర్మశాస్త్ర సంబంధమైనది, పాతనిబంధన ఆచారమని వాదించేవారు లేకపోలేదు. ధర్మశాస్త్రం రాకముందే అబ్రాహాము పదియవ భాగాన్ని చెల్లించాడు. నూతన నిబంధనా విశ్వాసులు ప్రభువు కొరకు, శక్తి కొలది ఇచ్చారు, శక్తికిమించి ఇచ్చారు, పేద విధవరాలు తన జీవనమంతా ఇచ్చింది. ప్రభుపరిచర్యలో నమ్మకముగా సాగిపోతున్న సేవకులను ప్రోత్సహించాల్సిన అవసరతను అబ్రాహాము జీవితమునుండి అలవరచుకోవడం మన ఆత్మీయ జీవితాలకు మేలుకరము.

ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(22వ భాగము)
♻ సమృద్ధి ద్వారా అబ్రాహాము పరీక్షింపబడుట ♻


సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసికొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీవాటిలో ఏదైనను తీసికొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను. (ఆది 14:21-23)

నలుగురు రాజులను జయించి, వారు కొల్లగొట్టి తీసుకెళ్తున్న ఆస్థినంతా తిరిగి తీసుకువచ్చిన అబ్రాహాముతో సొదొమ రాజు, నా ప్రజలను మాత్రమే నాకప్పగించు. మిగిలిన ఆస్ధినంతటిని నీవేతీసుకోమని చెప్తున్నాడు. దేవుడు ఐగుప్తులో కరవుతో అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు అతడు తేలిపోయాడు. ఇప్పుడు సమృద్ధిలో అతన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు, దేవుని సహవాసములోనున్న అబ్రాహాము దానిని జయించగలిగాడు.

ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. కొల్లగొట్టిన సొమ్మంతా ఇప్పుడు అబ్రాహాము స్వాధీనంలోనే వున్నది. అదంతా అతడే తీసుకోవచ్చు. సొదొమ రాజు దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడనవసరం లేదు. ఇంకా కావాలంటే సొదొమ పట్టణాన్ని సహితం తాను వశపరచుగోగలడు. విజయవంతమైన రాజులను సహితం ఓటమిపాలు చేసాడు. ఓటమితో కృంగిన స్థితిలోనున్న సొదొమ రాజు అసలు అబ్రాహాము ముందు నిలువగలడా? ఇక్కడ ఆస్తి, అధికారం అబ్రాహాము చుట్టూ నిలబడివున్నాయి. అయితే దేనిని లెక్కచేసినవాడు కాదు.

ఐగుప్తులో గొర్రె మేక మందలకు తన భార్యనే ఇచ్చేసినవాడు, హెబ్రోనులో దేవుని సహవాసంలోనున్న అబ్రాహాము, సొదొమ రాజు తీసుకోమన్న వాటిలోనుండికూడా ఒక్క నూలుపోగైననూ నాకు అక్కరలేదంటున్నాడు. దీనికిగల కారణమేమిటి? దైవ భక్తిలేని వారిదగ్గరనుండి ఏది తీసుకోవడానికి అబ్రాహాము సిద్ధముగా లేడు. అప్పుడు ఐగుప్తులో వున్నాడు కాబట్టి తీసుకున్నాడు. కానీ, ఇప్పుడు హెబ్రోనులో దేవుని సహవాసంలో వున్నాడు. అయితే, ప్రవక్తయైన బిలాము దీనికి పూర్తి విరుద్ధం. బిలాము దుర్నీతివలన కలుగు బహు మానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను. (2 పేతురు 2:16). నేటి దినాలలో కూడా దేవుని పిల్లలు ధనము ఎక్కడ నుండి వస్తుంది? ఏ రీతిగా వస్తుంది? అది న్యాయమైన రీతిలోనే వస్తుందా? లేక అక్రమార్గంలో వస్తుందా అని చూడకుండా ధనార్జనకోసమే ప్రాకులాడుతున్నారు. అబ్రాహాము అట్లాంటివాడు కాదు. ఒక అన్యుని ద్వారా అబ్రాహాము ధనవంతుడౌ అతనికి ఘనతను, తన దేవునికి అవమానమును తీసుకొని రావడానికి ఇష్టపడినవాడు కాదు.
“నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీవాటిలో ఏదైనను తీసికొనను” (ఆది 14:22). ఈలోక ధనముతో తాను ఐశ్వర్యవంతుడు కావాలని ఆశించడంలేదు గాని, అతడు తన ఐశ్వర్యాన్ని దేవునిలోనే కనుగొనాలని కోరుతున్నాడు. అబ్రాహాము, సర్వోన్నతుడైన దేవుని యాజకుడగు మెల్కీసెదకు ముందు ఆశీర్వాదం కొరకు మోకరిల్లాడు. సొదొమ రాజు ఇవ్వజూపిన ఆస్థినేమో తిరస్కరించాడు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. అబ్రాహాము ఆశించే ఆశీర్వాదాలు శాశ్వతమైన ఆశీర్వాదాలు మాత్రమేనని.

🔅 దేవునితో చేసిన ప్రమాణమునకు అబ్రాహాము కట్టుబడియుండుట:
నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీవాటిలో ఏదైనను తీసికొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను. (ఆది 14:22,23) అతడు ఎదుర్కొనబోవు పరీక్షను గురించి ముందుగానే అబ్రాహాము గ్రహింపులోనికి వచ్చినట్లున్నాడు. శోధన రాకముందే దేవునితో ఒక ప్రమాణం చేసాడు. నీ యెడల భయభక్తులు నిలపనివారినుండి నేనేది ఆశించనని. ఇప్పుడు దాని విషయమై అతడు పరీక్షించబడుతున్నాడు. విస్తారమైన ఆస్థిని చూచి, తన మనసు మార్చుకుంటాడా? లేక తాను చేసిన ప్రమాణమునకు కట్టుబడివుంటాడా ? అబ్రాహాము దేవుని సన్నిధిలో తాను చేసిన ప్రమాణానికి కట్టుబడివున్నాడు. అబ్రాహాము ఐగుప్తులో జీవించిన జీవితానికి, ఇంతవరకు హెబ్రోనులో జీవించిన జీవితానికి ఎక్కడా పొంతనలేదు. విశ్వాసయాత్రలో ఒక్కొక్కమెట్టు ఎక్కుచూ గమ్యంవైపు అడుగులు వేస్తున్నాడాయన. మన జీవితాలెట్లా వున్నాయి? రక్షించబడక ముందు జీవించిన జీవితానికి, రక్షించబడిన తర్వాత జీవితానికి ఏమైనా మార్పుందా? మన వేషం మారింది, భాషమారింది, పేరు మారింది, పలకరింపులు మారాయి. మన అంతరంగ స్థితి ఎట్లా వుంది? లోకం నుండి ప్రత్యేకంగా జీవించగలుగుతున్నామా? లోకంవెంట పరుగులు తీస్తున్నామా? అబ్రాహాము జీవితము మనకొక ఆధ్యాత్మిక పాఠం కావాలి.

ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(23వ భాగము)
♻ హెబ్రోనులోనున్న అబ్రాహాముకు దేవుని వాగ్ధానములు ♻


యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.(ఆది 15:1)

పరిశుద్ధ గ్రంధములో “దర్శనం” అనే మాట ఇక్కడ ప్రప్రధమంగా ప్రస్తావించబడింది. ఈమాట లేఖనాల్లో సుమారు వందసార్లు ప్రస్తావించబడింది. హిబ్రూ భాషలో ఈ మాటకు “చూడడం”, “తేరిచూడడం” అనే అర్ధాలున్నాయి. దేవుడు తన ప్రవక్తలకు అనేకసార్లు దర్శనములద్వారా సంగతులను తెలియజేసారు. కొన్నిసార్లు కలలద్వారా, మరికొన్నిసార్లు మేల్కొనియుండగానే పరవశమైన స్థితిలోనికి వెళ్లడంద్వారా ఈ దర్శనాలు కలిగాయి. వీరు కొన్నిసార్లు సంకేత రూపకాలైన ఆకారాలను పోలికలను చూస్తూ దేవుడు తన సంకల్పాన్ని వెల్లడిస్తూ మాట్లాడితే వినేవారు. అయితే, ఇక్కడ అబ్రాహామునకు కలిగిన దర్శనం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే “యెహోవా వాక్యము” అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యింది.
“యెహోవా వాక్యము” అనే మాటను “యెహోవామాట” అని సామాన్యముగా అర్ధముచేసుకుంటాము. కానీ “వాక్యము” అనే మాట ఈ సందర్భములోమాత్రమే వాడబడింది. దీనినిబట్టి “వాక్యము” అనే మాటకు ఒక ప్రత్యేకత వున్నదని గ్రహించగలము. “వాక్యము” అనగా “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.” .... ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను (యోహాను 1:1, 14). యేసుక్రీస్తు శరీరాన్ని ధరించకముందు “వాక్యమై” యుండెను. అబ్రాహాము దినాలలో ఆయన శరీరాన్ని ధరించియుండలేదు. వాక్యముగానే యున్నారు. ఇప్పుడు అబ్రాహామునకు వాక్యము దర్శనమందు ప్రత్యక్షమయ్యింది. అంటే, అబ్రాహాము ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షతను అనుభవించెను అని అర్ధము చేసుకోగలము. యేసు ప్రభువు మాటలు కూడా దీనిని రుజువు చేస్తున్నాయి. యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. (యోహాను 8:58).

🔹 అబ్రాహామునకు దేవుడిచ్చిన వాగ్ధానములు:

🔅భయపడకుము:
ప్రభువు అబ్రాహామునకు “భయపడకు” అనే వాగ్ధానాన్నిస్తున్నారంటే అబ్రాహాము భయపడుతున్నాడని అర్ధమవుతుంది. అబ్రాహామునకు కలిగిన భయమేమయ్యుండొచ్చు? నలుగురు రాజులపై యుద్ధముచేసి ఓడించాడు. ఓటమిపాలైన ఆ రాజులు మరికొంతమంది రాజులను వెంటబెట్టుకొని తనమీద దాడిచేస్తారనే భయమేమైనా వుందేమో? మరొకటేమిటంటే వయస్సుమీరి పోతుంది వారసుడులేడనే నిరాశ అతనిలో ఆందోళననూ, భయాన్ని కలిగిస్తుందేమో? అబ్రాహాము భయము ఏదైనా కావొచ్చు. “నీవు భయపడకు” అనే గొప్ప వాగ్ధానాన్ని ప్రభువిస్తున్నారు. ఆయన వాగ్ధానమిచ్చి తప్పిపోయేవాడెన్నడూ కాదు. హాగరు తన కుమారునితో అరణ్యములో దిక్కుతోచని స్థితిలోనున్నప్పుడు “భయపడకుము” అనే వాగ్ధానాన్ని పొందింది (ఆది 21:17). ఐగుప్తుకు వెళ్ళడానికి యాకోబు భయపడుతున్నప్పుడు “భయపడకుము” అనే వాగ్ధానాన్ని పొందాడు (ఆది 26:24). రక్షకుడు జన్మించినప్పుడు గొల్లలకు తెలియజేసిన దూతవర్తమానం “భయపడకుడి” ( లూకా
2:10) “భయపడకుడి” అనే వాగ్ధానము పరిశుద్ధ గ్రంధములో 366 సార్లు వ్రాయబడిందని చెప్తూవుంటారు. అంటే మామూలు సంవత్సరమే కాకుండా, లీపు సంవత్సరంతో పోల్చుకున్నా రోజుకొక్కసారి చొప్పున “భయపడకుడి” అనే వాగ్ధానమిచ్చి ప్రభువు మనలను ధైర్యపరుస్తున్నారు. అయితే, ఈ వాగ్ధానఫలాన్ని ఎవరు అనుభవించగలరంటే? ఆయన సహవాసంలోనున్నవారు మాత్రమే.

🔅నేను నీకు కేడెము:

కేడెము అంటే “డాలు”. శత్రు దాడుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగించేది “కేడెము” (డాలు). శత్రువు మన మీద దాడి చెయ్యాలంటే? మొట్టమొదటగా డాలును చీల్చాలి. శత్రువు విసిరే బాణాలు డాలును చీల్చడం సాధ్యం కాదు. అబ్రాహాముతో దేవుడు చెప్తున్నారు. నేను నీకు కేడెము (డాలు) గా వుంటాను. ఆయనే అబ్రాహాముకు డాలుగా వుంటే, అతనిమీద దాడిచేసే ఏ పరిస్థితియైనా మొదట దేవునిని చీల్చుకొని వెళ్లి, అప్పుడు అబ్రాహాము మీద దాడి చెయ్యాలి. దేవునిని ఛేదించుకొని వెళ్లడం ఏ పరిస్థితికైనా సాధ్యమా? కానేకాదు. రక్షించబడి, దేవుని సహవాసంలోనున్న వారెవరికైనా అట్టికాపుదలను ప్రభువు అనుగ్రహిస్తారు. ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు (ద్వితీ 33:29). ఆయన కాపుదలను అనుభవించిన కీర్తనాకారుడు ఈ రీతిగా పాడగలుగుతున్నాడు. “యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను”
(కీర్తనలు 28:7). ఇట్లాంటి అనుభవాలు మనకెప్పుడు సాధ్యమంటే ఆయన సహవాసములోనున్నప్పుడు మాత్రమే సాధ్యము.

🔅 నీ బహుమానము అత్యధికమగును.
ఈ వాగ్ధానాన్ని అబ్రాహాము ఎప్పుడు పొందుకొంటున్నాడంటే, దైవ భక్తిలేని సొదొమ రాజు ఇవ్వజూపిన బహుమానములను తిరస్కరించినప్పుడు, దేవుడిస్తున్న వాగ్ధానం “నీ బహుమానము అత్యధికమగును.” ఒకవేళ ఆ దినాన్న ఆ క్షయమైన బహుమానములను అబ్రాహాము ఆశించియుంటే, ఇప్పుడు దేవుని యొక్క శాశ్వతమైన ఆశీర్వాదములకు దూరమైయుండేవాడేమో? దేవుడే అబ్రాహామునకు ఒక గొప్ప బహుమానం. అతనియొక్క గొప్ప నిధి నిక్షేపాలు దేవుడే. మన సంపద దేవునిలో వుంటే, అది దేవుడే అయితే, ఎవ్వరూ దానిని దొంగిలించలేరు (మత్తయి 6:19-21). ఆయన ఎంత గొప్ప ధననిధి అంటే? యెహోవా అహరోనుతో ఇట్లనెను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారి మధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్యను “నీ పాలు నీ స్వాస్థ్యము నేనే” (సంఖ్యా 18:20) దేవుడే స్వాస్థ్యమైతే అంతకుమించిన ధన్యత మరొకటుంటుందా? ఆసాపు కూడా భక్తిహీనులు వర్ధిల్లుతుండడం, దేవుని పిల్లలు శ్రమలనుభవించడం గురించి దేవుని సన్నిధిలో ధ్యానించి, దేవుడే తన స్వాస్థ్యము అనే గ్రహింపులోనికి వచ్చినప్పుడు ఆనందముతో ఈ రీతిగా చెప్పగలుగుతున్నాడు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు. (కీర్తనలు 73:26) ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను (ఎఫెసీ 1:3) క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను (ఎఫెసీ 2:7). ఆయన సహవాసములో నున్నవారికి ఆయనిచ్చే బహుమానములు ఇంత ఉన్నతంగా ఉంటాయి. అబ్రాహాము అట్టి సహవాసంలో కొనసాగుతున్నాడు. మన జీవితాలు ఎట్లా వున్నాయి? మనలను మనమే పరిశీలన చేసుకొని, సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం!

ప్రభువు సహవాసంలో కొనసాగుదాం!
ఆయనిచ్చే దివ్యమైన వాగ్ధానములను స్వతంత్రించుకొందాం!
ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(24వ భాగము)
♻ హెబ్రోనులోనున్న అబ్రాహాముకు దేవుని వాగ్ధానములు ♻ (part -2)

🔅నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగును:


యెహోవా వాక్యము అబ్రాహామునకు ప్రత్యక్షమై నీవు భయపడకు, నేను నీకు కేడెముగా వుంటాను, నీ బహుమానమును అత్యధికం చేస్తానని వాగ్ధాన మిచ్చినప్పుడు ప్రభువైన యెహోవా నీవు నాకిచ్చినయేమి? సంతానమియ్యలేదు గదా? అంటూ తన మనస్సులోని బాధను తెలియజేస్తూ, ఇక ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా అంటూ ప్రభువుతో సంభాషిస్తున్న సందర్భములో లేదు, అతడు నీ వారసుడు కాడు. నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడవుతాడని వాగ్ధానము పొందిన సందర్భమిది (ఆది 15: 1-4).

అబ్రాహాము దేవునితో సంభాషిస్తున్న విధానము, అతని సంబోధననుబట్టి దేవునిని అతడు ఏరీతిగా భావిస్తున్నాడో మనకర్ధమవుతుంది. “యెహోవా ప్రభువా!” “ప్రభువు” హెబ్రీ భాషలో “ఆదోనాయ్”. ఈ పేరు పాతనిబంధనా గ్రంధములో 400 సార్లకు పైగా వాడబడింది. ప్రభువు అనగా యజమాని, పరిపాలకుడు అని అర్ధం. ఆదోనాయ్ భూమి అంతటికి ప్రభువు (యెహో 3:11), ప్రభువులకు ప్రభువు (ద్వితీ 10:17). దీనికి గ్రీకు పదం “కురియోస్” నూతన నిబంధనలో యేసు క్రీస్తుకు వాడిన నామము లేదా బిరుదు. అబ్రాహాము యెహోవాను “ప్రభువైన యెహోవా”గా సంబోధిస్తున్నాడంటే, యెహోవాను “ప్రభువుగా” అంటే తన యజమానిగా, అన్నిటికి ప్రభువుగా గుర్తిస్తున్నాడు. తనకు వారసునిని అనుగ్రహించగల శక్తిమంతునినిగా ఆయనను గుర్తిస్తున్నాడు. విశ్వాసజీవితంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. మొదట ఆయన ఎంత శక్తిమంతుడో మనము గుర్తించగలిగితే, మనము గొప్పగా భావించే ఏ సమస్యయైనా ఆయనముందు శక్తిహీనమవుతాయి. ఇదెప్పుడు సాధ్యమంటే, మొట్టమొదట ఆయన మన హృదయరాజుగా వుండాలి. ఆయనను మన యజమానిగా, ప్రభువుగా ప్రతిష్టించుకోవాలి. ఆయన కాపరత్వములో మనముండగలగాలి.

అబ్రాహాము ప్రభువుతో మాట్లాడుతూ “నీవు నాకు సంతానమియ్యలేదు” అంటున్నాడు. అప్పటికింకా పరిశుద్ధ గ్రంధము అందుబాటులో లేదు. దేవుని వాక్య ప్రత్యక్షత పరిపూర్ణం కాలేదు. అట్లాంటి పరిస్థితుల్లోసహితం నీవు నాకు సంతానమియ్యలేదు అంటున్నాడంటే, సంతానము అనుగ్రహించేది దేవుడే అనే గొప్ప గ్రహింపును గలిగియున్నాడు. అబ్రాహాము భార్య గొడ్రాలుగా వుంది (ఆది 11:30) పైగా పిల్లలను కనే వయసు దాటిపోయింది(హెబ్రీ 11:11 ) దేవుడు అబ్రాహామును వారసునిని అనుగ్రహిస్తానని వాగ్ధానం చేసారు. ఆమె శరీర ధర్మం నిలచిపోయింది. శరీరం మృతతుల్యమయ్యింది. మానవపరంగా పిల్లలుకలిగే అవకాశం లేనేలేదు. కానీ అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగినవాడు దేవుడు. అసాధ్యమైనవి ఆయనకసలు లెక్కేలేదు. (ఆది 18:14 , యిర్మీయా 32:17,27, లూకా 1:37). నాకు గర్భఫలమివ్వమని రాహేలు యాకోబును అడిగినప్పుడు, యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడునేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను. (ఆది 30:1,2) యాకోబుకూడా గర్భఫలమిచ్చేది దేవుడే అని గ్రహింపు కలిగియున్నాడు. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను ((ఆది 30:22) ఇప్పుడు ఆమెకూ అర్ధమయ్యింది గర్భమును తెరువగలిగేవాడు దేవుడేనని. “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే” (కీర్తనలు 127:3). “కుమారులు” అనే దానికి ఇంగ్లిష్ అనువాదంలో children (పిల్లలు) అని వాడబడింది. అంటే కుమారులు మాత్రమేకాదు, కుమార్తెలుకూడా.

అయితే, వాక్య ప్రత్యక్షత పరిపూర్ణమైన ఈ దినాలలో సహితం, సంతానం కలగకపోవడానికి నీవు కారణమంటే, నీవు కారణమంటూ భార్యాభర్తలు తగవులాడుకొని కుటుంబాలు విచ్చిన్నమయ్యే స్థితికి చేరుకొంటున్నారు. అట్లాంటివారికి అబ్రాహాము జీవితము ఒక ఆధ్యాత్మిక పాఠం. వైద్యులు చెప్పే మనలోని శారీరిక లోపాలనుబట్టి కృంగిపోవాల్సిన పనిలేదు, మనలను సృష్టించిన సృష్టికర్త పరమ వైద్యుడు. నీలోనున్న ప్రతీలోపాన్ని సరిచేయగలడు. ఇదెప్పుడు సాధ్యమంటే? సంతానమీయగలిగేది ఆయన మాత్రమే అనే పరిపూర్ణ గ్రహింపులోనికి నీవొచ్చినప్పుడు. నాకు వివాహమైన రెండవ సంవత్సరంలో మేమిద్దరమూ హాస్పిటల్ కి వెళ్ళాము పిల్లలకోసమని. డాక్టర్ ఆరు నెలలు మెడిసిన్ వాడి రండని మెడిసిన్ యిచ్చి పంపించారు. ఇంటికి వచ్చాక ఒక ఆలోచన వచ్చింది, ఒకవేళ ఈ మెడిసిన్ వాడిన తర్వాత పిల్లలు పుడితే, దానికి కారణం డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ మాత్రమే కారణమనే నమ్మకం మనలో స్థిరపడిపోతుంది. తీసుకొచ్చిన మెడిసిన్ డస్ట్ బిన్ లో వేసేసి వారమునకు ఒకరోజు ఉపవాసముండి ఇద్దరమూ మోకరించి ప్రార్ధించాము. మూడు నెలల్లోనే దేవుడు మమ్ములను జ్ఞాపకము చేసుకున్నారు. మొదటగా బాబును, తర్వాత పాపను దేవుడు మాకనుగ్రహించారు. ఇప్పుడు నేను చెప్పగలను సంతానమిచ్చువాడు దేవుడు మాత్రమేనని. సమస్త ఘనత మహిమ ఆయనకే చెల్లునుగాక! ఆమెన్!

అబ్రాహాము దేవుని వాగ్ధానము కోసము ఎదురుచూస్తున్నప్పటికీ, తన శరీరరీత్యా అది సాధ్యం కాకపోవచ్చని, ఇక తన ఆస్తికి వారసుడు ఎలియాజరే అనే ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నాడు. అవును అనేక సందర్భాలలో మనచుట్టూనున్న పరిస్థితులు విశ్వాసములోనుండి మనలను వెనుకకులాగే ప్రయత్నం చేస్తాయి. అయితే, దేవుడు అబ్రాహామునకు స్పష్టం చేస్తున్నాడు. నీవనుకున్నట్లుగా కాదు. “నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు వారసుడవుతాడు”. అంతే కాకుండా ఆయన అబ్రాహామునకు ఆకాశ నక్షత్రముల ద్వారా ఒక సూచన చేస్తున్నారు. ఇంత విస్తారముగా నీ సంతానమును వృద్ధిపరుస్తానని (ఆది 15:5) ఇక నక్షత్రాలను చూచినప్పుడెల్లా అబ్రాహామునకు దేవుని వాగ్ధానం జ్ఞాపకంలోనికొస్తుంది. అతని నిరీక్షణ మరింత బలపడుతుంది. ఇంతకీ వాగ్ధాన పుత్రుని ఇవ్వడానికి దేవుడెందుకు ఆలస్యం చేస్తున్నాడు? అబ్రాహాము విశ్వాసములో ఒక్కొక్కమెట్టు ఎక్కుతున్నాడు. ఇంకా పరిపూర్ణతలోనికి చేరలేదు. పరిపూర్ణతలోనికి చేరకుండా కుమారునిని అనుగ్రహిస్తే అతనిని విశ్వాసంలో పెంచలేరు. వయస్సు మీరిపోతున్నాగాని అబ్రాహాము విశ్వాసములో పరిపూర్ణత సాధించినతర్వాతనే దేవుడు అతని గర్భవాసమున కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని విశ్వాసంలో పెంచగలిగాడు అబ్రాహాము. అట్లా పెంచడాన్నిబట్టే కాళ్ళు చేతులుకట్టి బలిపీఠం మీద పెట్టినాగాని ఆ కుమారుడు, దేవునికి అర్పణగా మారడానికే సిద్దపడ్డాడుతప్ప, ఎదురుతిరిగినవాడు కాదు.

ప్రియ విశ్వాసి! ఆయన ఆలస్యం చేస్తాడేమోగాని అలక్ష్యం మాత్రం చెయ్యడు. ఆ ఆలస్యంలోకూడా తప్పక ఏదోమేలును దాచియుంచుతాడు. అది పొందేవరకు మన ఊహలకు సహితం అందదు. ప్రభువు సహవాసములో వుంటూ, మన జీవితాలను సరిచేసుకొంటూ, ప్రభువు అనుగ్రహించబోయే వాగ్ధానఫలాలకొరకు నిరీక్షణ కలిగియుందము.

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(25వ భాగము)
♻అబ్రాహాము నీతి♻


అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. (ఆది 15:6)

పరిశుద్ధ గ్రంథములోని మూల వాక్యాలలో ఇదొకటి. నూతన నిబంధనలో మూడు పుస్తకాలలో ఈమాట తిరిగి వ్రాయబడింది. ( రోమా 4: 3,9,22; గలతీ 3:6; యాకోబు 2:23). “నమ్మెను” అనేమాట “ఆమెన్” అనేమాట ఒకే మూలపదమునుండి వచ్చింది. అంటే పరిశుద్ధ గ్రంధములో ప్రస్తావించబడిన “ఆమెన్” అనే మాట మొట్టమొదటిగా ఇక్కడ వాడబడింది.

అయితే, మనకొక సందేహం కలుగవచ్చు. కల్దీయుల దేశములోనున్నప్పుడు దేవుని మాటలు నమ్మకుండానే ఆయన యింతదూరం వచ్చాడా? అవును. తప్పకుండా నమ్మే వచ్చాడు. అయితే, ఆ నమ్మిక ఇక్కడ దృఢనిశ్చయం లేదా పరిపూర్ణం చేయబడింది. ఎట్లా అంటే? కల్దీయుల దేశములోనున్నప్పుడు వారి శరీరం సంతానం కలగడానికి అనుకూలంగానే వుంది. పరిస్థితులన్నీ అనుకూలముగా నున్నప్పుడు, నమ్మడం గొప్పవిషయమేమి కాదు. అయితే, ఇప్పుడట్లా లేదు. శరీరం మృతతుల్యమయ్యింది. శారాకు స్త్రీ ధర్మం నిలచిపోయింది. ఇక వారసుని కొరకు నిరీక్షించడానికంటూ ఏ ఆధారం వారికి లేదు. అట్లాంటి పరిస్థితులలో, “నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. (రోమా 4:18-21). ఈ రీతిగా అబ్రాహాము నమ్మిక స్థిరపరచబడింది. అయితే ఇప్పుడు ఆకాశ నక్షత్రములవలే నీ సంతానమును విస్తరింపచేస్తాను అని దేవుడు చెబితే, అందుకు అతని శరీరం సహకరించే పరిస్థితి లేకపోయినా గాని, అబ్రాహాము “ఆమెన్” అంటున్నాడు. అనగా “అట్లానే జరుగును గాక!” దేవునిని నమ్మడం అంటే ఇదే. ఈ నమ్మకాన్నే దేవుడు అతనికి నీతిగా ఎంచాడు. మరొకమాటలో చెప్పాలంటే అబ్రాహామును దేవుడు అంగీకరించాడు. అబ్రాహాము దేవునితో సరియైన సంబంధముతో జీవించగలిగాడు.

🔅 పాపియైన మనిషి నీతిమంతునిగా ఎట్లా తీర్చబడగలడు?
పాపపు స్వభావము కలిగిన మనుష్యులు తమనుతాము పవిత్రులుగా మార్చుకొనలేరు. తమలో నీతివంతమైన స్వభావాన్ని సృష్టించుకోలేరు. తమ సత్కార్యాలు మీద ఆధారపడి దేవుని దగ్గర నిర్దోషులుగా నిలవలేరు. అందుకే యోబు ఈ రీతిగా ప్రశ్నిస్తున్నారు. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? (యోబు 9:2) నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు? (యోబు 25:4)
దేవుని యందలి విశ్వాసము ద్వారానే నీతిమంతుడు కాగలడు. దేవుని యందలి సంపూర్ణ విశ్వాసములో అనుమానము, సంశయమునకు తావుండదు. ధర్మక్రియలకు విశ్వాసములో స్థానము లేదు. నిజమైన విశ్వాసము స్వశక్తిపై ఆధారపడక, సంపూర్ణముగా దేవునిపైనే ఆధారపడుతుంది. దేవుడిచ్చిన శక్తి, జ్ఞానము, అభిషేకము ద్వారానే నిజమైన క్రైస్తవులముగా జీవించగలము. మన నీతి క్రియలు, స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డతో సమానము. “ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు ( రోమా 3:10-12). దానికిగల కారణమేమిటి? “తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు” (యెషయా 64:4).

అబ్రాహాము అతని భక్తిని బట్టిగాని, దేవుని మాటకు అతడు చూపిన విధేయతనుబట్టి గాని అతడు నీతిమంతుడుగా తీర్చబడలేదుగాని, “ఆయనను నమ్మడము ద్వారా” మాత్రమే ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మనందరివలెనే అబ్రాహాము కూడా పాపపు స్వభావము కలిగినవాడే. అయితే, దేవునిపైన గల అతని నమ్మకము అతనిని నీతిమంతునిగా తీర్చింది.
“విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము”(రోమా 5:1). ధర్మ శాస్త్రము మూలముగా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడలేడుగాని, ఆయనను విశ్వసించడము మూలముగా నీతిమంతునిగా తీర్చబడగలడు (అపొ. కార్యములు 13:39). ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.(రోమా 10:10) నోవహు, లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. దానికి కారణము అతని “విశ్వాసమే” (హెబ్రీ 11:7).

ఆయనను మనము విశ్వసించగలిగితే ఆయన తన లోపరహితమైన నీతి న్యాయములు మనకు ధరింపజేస్తాడు.
శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది (యెషయా 61:10) ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.( 2 కొరింథీ 5:21) మనము పాపులమని, కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము, మన పాపములను పావన పరచలేకపోయాయని, మన పాపములకు బదులుగా, ఏ పాపమెరుగని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనకు బదులుగా సిలువలో యాగమయ్యాడని, తద్వారా మన పాపములు క్షమించబడి, క్రీస్తుద్వారా దేవుడు మనలను అంగీకరించాడని నమ్మాలి. ఈ మాటలు విశ్వసించిన వారెవరైనాసరే నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుడు అబ్రాహామును చేసినట్లు మనలను కూడా తన సన్నిధికి తగినవారిగా చేస్తాడు. అది ఒక్క “నమ్మడం” ద్వారానే సాధ్యం.

ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(26వ భాగము)
♻ అబ్రాహాముతో దేవుని నిబంధన స్థిరపడుట ♻


అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియును? (ఆది 15:8)

అబ్రాహాముతో దేవుడు, నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు వారసుడవుతాడు. ఆకాశ నక్షత్రములవలే నీ సంతానము విస్తారమగునని చెప్పినప్పుడు దేవుని మాటలను అబ్రాహాము నమ్మాడు. అది అతనికి నీతిగా యెంచబడింది. ఇప్పడు వాగ్ధాన భూమిని స్వతంత్రించుకొనే విషయంలో మాత్రం అతడొక సూచనను అడుగుతున్నాడు. దీనినిబట్టి అబ్రాహాము దేవుని మాటను నమ్మలేదని, ఆయన శక్తి సామర్ధ్యాలను శంకిస్తున్నాడని అర్ధము కాదుగాని, ఈ విషయాన్ని కూడా అబ్రాహాము పూర్తిగా నమ్మాడు. అయితే, వాగ్ధాన భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆధారము ఎట్లా అనే విషయంలో అబ్రాహామునకు సందేహమున్నట్లుంది. ఎందుకంటే, నేటిదినాలలో కొంత భూమికి హక్కుదారులం కావాలంటే, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్టర్ చేయించుకుంటాము. వారు మనకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ యిస్తారు. కానీ ఆ దినాలలో ఇట్లాంటివేమీ లేవు. అందుకే దాని విషయంలో దేవునిని ఒక సూచన అడుగుతున్నాడు అబ్రాహాము. దేవుడు కూడా ఈవిషయంలో అబ్రాహామును మందలించక అతడు అడిగినట్లు చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆదినాలలో సంపూర్ణ వాక్య ప్రత్యక్ష లేనికారణముగా అనేకులు దేవునిని సూచన అడిగినప్పుడు, వారు కోరిన విధంగా దేవుడు వారికి చేసారు. (గిద్యోను - న్యాయాధి 6:17,36-40; హిజ్కియా - 2రాజులు 20:8-11; జెకర్యా -లూకా 1:18) అయితే, నేటి దినాలలో ఇట్లా సూచనలు కోరడం దేవుని శక్తిని శంకించినట్లే అవుతుంది. కారణమేమిటంటే? నేటి దినాన్న సంపూర్ణ వాక్య ప్రత్యక్షత జరిగింది, పరిశుద్ధ లేఖనాలు మన చేతిలోవున్నాయి, ఆదరణకర్త (పరిశుద్ధాత్ముడు)ను దేవుడు మనకు అనుగ్రహించియున్నాడు.

అబ్రాహాముతో దేవుడు నీ సంతానము అత్యధికముగా విస్తరిస్తుందని చెప్పడానికి ఆకాశ నక్షత్రాలను సూచనగా చూపించారు. అయితే, వాగ్ధానభూమిని స్వతంత్రించుకొనుటకు సూచనను అడిగితే, దానికి సూచనగా జంతువులను సిద్ధపరచమంటున్నారు.

అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను...... మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. (ఆది 15: 8-11,17)

పురాతన కాలములో ఇద్దరు వ్యక్తుల మధ్య నిబంధన ఏరీతిగా జరిగేదంటే? జంతువును ఖండించి ఆ రెండు ఖండాల మధ్య ఆ ఇద్దరు వ్యక్తులు నడచిపోవుట ద్వారాను (యిర్మియా 34:18,19), లేదా జంతువులను ఇచ్చి, పుచ్చుకొనుట ద్వారాను నిబంధన జరిగేది. అయితే, ఇక్కడ దేవుడు సూచించిన జంతువులుగాని, పక్షులుగాని పవిత్రములైనవి (లేవి 11వ ఆధ్యా ). తర్వాత కాలంలో 500 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ జాతి జంతువులనే, ఈ జాతిపక్షులనే ప్రత్యక్ష గుడారములో పాపపరిహారార్ధ బలిగాను, దహనబలిగాను అర్పించడం జరిగింది. జంతువులతో పాటు పక్షులు కూడా దేనికి? జంతువులను బలి అర్పించుటకు ఆర్ధిక స్థోమతలేనివారు పక్షులను బలిగా అర్పించుటకొరకు దేవుడు ఈరీతిగా ఏర్పాటు చేసారు (లేవి 5:7). అయితే, దేవుడు అబ్రాహాముతో చేయబోతున్న నిబంధనలో ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యము దాగివున్నది. అబ్రాహాము వాగ్ధాన భూమిని స్వతంత్రుంచుకోవాలంటే బలి జరగాలి. నీవూ నేను నిత్యమైన వాగ్ధాన భూమిని స్వతంత్రించుకోవాలంటే కూడా ఒక బలి జరగాలి. అది పరిశుద్ధ గొర్రెపిల్లయైన ప్రభువైన యేసు క్రీస్తు మనకు బదులుగా వధించబడాలి. అది రెండువేల సంవత్సరాల క్రితమే జరిగిపోయింది కూడా. అబ్రాహాముతో దేవుడు చేస్తున్న నిబంధన, తరువాత దినాలలో జరుగవలసిన బలికి ఒక ఛాయాలా వుండగా, క్రీస్తుయేసులో అది నిజరూపం దాల్చింది.

అబ్రాహాము మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును తీసుకొని వచ్చి వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పరిశుద్ధ గ్రంధములో 3 మరియు 7 అనే సంఖ్యలు సంపూర్ణతను సూచిస్తాయి. జంతువులను మాత్రమే ఖండించాడు. పక్షులను అతడు ఖండింపలేదు. తర్వాత దినాలలో ధర్మశాస్త్రకాలములోకూడా ఈ రీతిగానే బల్యర్పణా విధానం జరగడం గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించేవిషయం. పక్షులను ఖండించకూడదు. వాటి తలను త్రుంచాలి. ( లేవి 1;15)

జంతువులను నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. అనగా మధ్య భాగములో ఖండించాడు. నిబంధన ఎవరెవరి మధ్య జరగబోతుందో వారిద్దరి పాత్ర చెరొక సగముండాలి. లేకపోతే, నిబంధన ఫలవంతముకాదు. ఇప్పుడు ఈ నిబంధన అబ్రాహామునకునూ, దేవునికిని మధ్య జరగాలి. అంటే, దేవుని పాత్ర సగముంటే, అబ్రాహాము పాత్ర సగముండాలి. అయితే, అబ్రాహాము పాత్ర ఏమిటి? గ్రద్దలు వచ్చి ఆ కళేబరములమీద వ్రాలుతున్నాయి. గ్రద్ద అపవిత్రమైన పక్షి (లేవి 11:4). అవి వాటి మీద వ్రాలడం వలన బలి అపవిత్రమవుతుంది. నిబంధన నిలిచిపోతుంది. అందుచే ఆ దినమంతా ఆ గ్రద్దలను తోలుతున్నాడు. అబ్రాహాము, ఆకాశమునుండి అగ్ని దిగివస్తుందని ఎదురు చూస్తుంటే, గ్రద్దలు దిగిరావడం ఇదొక విశ్వాస పరీక్షే. అబ్రాహాములో అనేక సందేహాలు రేకెత్తియుండవచ్చు. బలిని సిద్ధం చేయడంలో నేనేమైనా తప్పుచేసానా? దేవుడు నాతో నిబంధన చెయ్యాలంటే నాలో ఇంకా సరిచేసుకోవలసిందేమైనా వుందా? అసలీ బలిని ఆయన అంగీకరిస్తాడా? మరొకవైపు ఈ గ్రద్దలేమిటి? ఇన్ని సందేహాలమధ్య తన విశ్వాసాన్ని కోల్పోకుండా ఎన్నిసార్లు ఆ గ్రద్దలొచ్చినా వాటిని వెళ్ళగొట్టాడు. గ్రద్దలు వెళ్లిపోయాయి. ప్రొద్దుగుంకి, చీకటిపడింది. రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాయి. అగ్ని దేవుని సన్నిధికి గుర్తు (నిర్గమ 3:2) అబ్రాహాముతో దేవుని యొక్క నిత్యనిబంధన స్థిరపడింది. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను “నీ సంతానమున కిచ్చియున్నానని” అబ్రాముతో నిబంధన చేసెను. (ఆది 15:18-21) ఇదెప్పుడు జరుగబోతుందంటే అబ్రాహాము సంతానము 400 సంవత్సరాల బానిసత్వము తరువాత (ఆది 15:14), అతనియొక్క నాలుగవ తరము వారు వాగ్ధాన భూమిని స్వతంత్రించుకొంటారు (ఆది 15:16). అబ్రాహాము మాత్రము దాస్యములోనికి వెళ్ళడు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడును (ఆది 15:15). చివరకు దేవుడు చెప్పినట్లుగానే తన నిబంధనను నెరవేర్చుకున్నారు. (యెహో 21:43-45; 1రాజులు 4:20,21).

ప్రియ విశ్వాసి! దేవుడు మనతో నిబంధన చేసే సమయంలో, దానిని ఆపడానికి సాతాను సాయశక్తులా పనిచేస్తాడు. ఆకాశంలో తిరిగే గ్రద్దల్లా, వాయుమండలంలో తిరిగే దురాత్మల సమూహాలు మనమీద విరుచుకు పడతాయి. మనలను విశ్వాసమునుండి తప్పించడానికి చివరిక్షణం వరకూ చేయని ప్రయత్నమంటూ వుండదు. కుటుంబ, ఆర్ధిక, ఆరోగ్య, మానసిక సమస్యలు, శోధనలు, నిందలు, చెడుతలంపులు, అవిశ్వాసము, అసహనం ఇట్లాంటివి అనేకమైనవి గ్రద్దల్లా మనపైన వ్రాలే ప్రయత్నం చేస్తాయి. మనలో గూడుకట్టుకొనియున్న ప్రతీవిధమైన పాపమును త్రోలివేయాలి. అప్పుడుగాని దేవుని సన్నిధి మనమీదకు రాదు. మనలను మనమే పరిశీలన చేసుకొని, సరిచేసుకొని, దేవునితో నిత్యనిబంధన చేసి, ఆ నిత్యరాజాన్ని స్వతంత్రించుకొందము.

ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(27వ భాగము)
♻ విషాదకరమైన మలుపు ♻


అబ్రాము శారయి మాట వినెను. (ఆది 16:2)

అబ్రాహాము విశ్వాస యాత్రలో స్వంత నిర్ణయముతో ఐగుప్తునకు వెళ్లి చాలా ఇబ్బందిపడినప్పటికీ, హెబ్రోనులో మాత్రం అతని విశ్వాసము పటిష్ఠమైన స్థితిలోనే కొనసాగుతుంది. లోతుతో సమాధానముగా వేరవడము, నలుగురు రాజులను జయించడము, తన గర్భవాసమున కుమారుడు జన్మిస్తాడని, అతని సంతానము ఆకాశ నక్షత్రాలవలే విస్తరిస్తుందని దేవుని నుండి వాగ్ధానము పొందడము, వాగ్ధాన భూమిని స్వతంత్రించుకొనే విషయంలో దేవునితో నిబంధన స్థిరపడడం. ఈ పరిణామాలన్నీ విశ్వాసయాత్రలో అబ్రాహామును ఒక్కొక్క మెట్టును అధిగమించేటట్లు చేస్తున్నాయి. ఇట్లాంటి సందర్భములో అబ్రాహాము విశ్వాసాన్ని అస్థిరపరచడానికి సాతాను తన భార్యయైన శారాను వాడుకొంటున్నాడు. విశ్వాస యాత్రలో ఎవరినుండి అయితే మనకు ప్రమాదం లేదనుకుంటామో, వారి దగ్గరకే సాతాను చేరి, వారినుండి వాడు ఆశించిన కార్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు యుక్తిపరుడు కాబట్టి, కుయుక్తితో వాడు పనిచేస్తాడు. విశ్వాసములో పటిష్ఠముగానున్న వారి దగ్గరకు నేరుగా వెళ్లకుండా, వేరే వారిని ప్రేరేపించి వారి విశ్వాసాన్ని దెబ్బతీయడంలో వాడు సిద్ధహస్తుడు. సృష్టి ఆరంభములో ఏదెను తోటలో దేవుని సహవాసంలో సాగిపోతున్న ఆదామును నేల కూల్చడానికి సాతానుడు ఏ బాణమునైతే ఎక్కుపెట్టాడో, విశ్వాసవీరుడైన అబ్రాహాము మీద కూడా అదే బాణాన్ని ఎక్కుపెట్టాడు. హవ్వమ్మ ద్వారా ఆదాము మీద ఎక్కుపెట్టిన బాణము, దాని ప్రతిఫలము సృష్టియావత్తూ నేటికిని అనుభవిస్తుంటే, శారాయి ద్వారా అబ్రాహాము మీద ఎక్కుపెట్టిన బాణము, దాని ప్రతిఫలము గత నాలుగువేల సంవత్సరాలుగా అరబ్బులు, ఇశ్రాయేలీయులు మధ్య నిర్విరామపోరాటమే.

అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు (ఆది16:1). ఇప్పటికి శారాకు సుమారుగా 75 సంవత్సరాలు వుండొచ్చు. అంటే, ఇక శరీరరీత్యా పుట్టే పిల్లలు అవకాశంలేదు. అన్యుల మధ్యలో జీవిస్తుంది కాబట్టి, ఇక సూటిపోటిమాటలు తప్పనిసరి. పిల్లలు కలగడానికి వారికున్న అవకాశం ఏదైనా వుందంటే, అది దేవుడిచ్చిన వాగ్ధానము ఒక్కటే. అదొక్కటిచాలు. ఆయన వాగ్ధానము చేసి పది సంవత్సరాలయిపోయింది. తన హృదయమంతా నిరాశ అలముకొంది. నిరాశలోనున్నప్పుడు దేవునిమీద ఆధారపడలేకపొతే, అతి సులభముగా సాతాను మనలో ప్రవేశించి, మనలను వశపరచుకొంటాడు. శారా విషయంలోనూ అదే జరిగింది. ద్వారాలన్నీ మూసుకుపోయాయి, నీ స్వంత ప్రయత్నం నీవుచేసుకో అంటూ సాతాను సలహానిచ్చినట్లున్నాడు. ఆ ప్రయత్నాలలో భాగంగా ఒక నిర్ణయానికి ఆమె వచ్చింది. ప్రాచీన అషూరు వైవాహిక చట్టము ప్రకారము దాసికి పుట్టిన పిల్లలు సహితము యజమానురాలి పిల్లలుగానే పరిగణింపబడతారు. ఒకవేళ తర్వాత కాలములో యజమానురాలికి పిల్లలుపుడితే ఆమెపిల్లలు అసలైన వారసులవుతారు. అయితే, ఇప్పుడు అనేకమంది దాసీలలో ఏ దాసిని అబ్రాహామునకు భార్యగా ఇవ్వాలి? ఈ విషయంలో ఆమె “హాగరును” ఎంపిక చేసింది. అంటే, హాగరు ఆమెకు చాలా విధేయురాలై యుండవచ్చు. ఆమె దాసీలలో హాగరు ప్రత్యేకమైనది కావొచ్చు. శారా ఎక్కువగా ఇష్టపడే దాసి కావచ్చు. ఇంతకీ ఈ హాగరు ఎవరు? ఐగుప్తీయురాలు (ఆది 16:1). ఐగుప్తీయురాలు ఈమెకు ఎట్లా దాసిగా వచ్చింది? కనానులో కరువొచ్చిందని స్వంత నిర్ణయం చేసి అబ్రాహాము ఐగుప్తునకు వెళ్ళినప్పుడు, ఐగుప్తు ఫరో శారాను తీసుకొని, అబ్రాహామునకు కొన్ని బహుమతులిచ్చాడు. వాటిలో “పనికత్తెలు” కూడా వున్నారు (ఆది 12:16) ఫరో, అబ్రాహామును, తనకు కలిగినదంతటిని పంపించివేసినప్పుడు, తాను అబ్రాహామునకిచ్చిన వాటిని తిరిగి తీసుకోలేదు. ఆ పనికత్తెలలో ఒకతె “హాగరు”.

ఇప్పుడు అబ్రాహాముతో ఎట్లా మాట్లాడాలి? విశ్వాసవీరుడు దానికి సమ్మతిస్తాడా? అందుకే, శారా తెలివిగా మాట్లాడుతుంది. నేను పిల్లలు కనకుండ యెహోవా చేసి యున్నాడు (ఆది 16:2) అంటుంది. రాహేలువలే నాకు గర్భఫలమివ్వు అని అడగకుండా, గర్భఫలమిచ్చేవాడు యెహోవాయే అని ఒప్పుకుంటూనే, ఆయనే నన్ను పిల్లల్ని కనకుండా చేసాడు. అంటూ దేవునిపైన ఆమెకుగల విరోధభావాన్ని పరోక్షంగా భర్తకు తెలియజేస్తూ, నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను (ఆది 16:2)

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే? శారా చేసిన ప్రతిపాదనకు అబ్రాహాము ఎదురు చెప్పలేదు. అబ్రాము శారయి మాట వినెను (ఆది 16:2). అబ్రాహామునకు స్పష్టమైన వాగ్ధానముంది. అబ్రాహాము సూచన అడిగినప్పుడు దేవుడు దానిని స్థిరపరిచాడు కూడా, నీ సంతానము యొక్క నాలుగవ తరమువారు దానిని స్వతంత్రించుకొంటారని దేవుడు స్పష్టంగా తెలియజేసారు. వారసుడు లేకుండా ఈ నిబంధనకు అసలు అర్ధమే లేదు కదా? నీ గర్భవాసమున వారసుడు జన్మిస్తాడని చెప్పిన మాటను నమ్మడం ద్వారానేకదా అబ్రాహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఇవేమి ఒక్క క్షణం ఆలోచించినట్లుగా అబ్రాహాము కనిపించుటలేదు. ఒకవేళ, నీ గర్భవాసమున వారసుడు పుడతాడంటే, అది శారాయి ద్వారా కాకుండా, వేరే స్త్రీ ద్వారా నాకు వారసుడు పుడతాడని తలంచియున్నాడా? లేక వాగ్ధాన పుత్రుడు తర్వాత పుడతాడులే, వృద్ధాప్యంలో మమ్మల్ని సాకడానికి ఒక కుమారుడుంటే బాగుంటుందనుకున్నాడా? లేక తన భార్య మాటవినకపోతే వారి మధ్య సంబంధాలేమైనా దెబ్బతింటాయనుకున్నాడా? ఏది ఏమైనా అప్పుడు ఐగుప్తులో అబ్రాహాము మాట శారా విన్నది. ఇప్పుడు హెబ్రోనులో శారా మాట అబ్రాహాము వింటున్నాడు. ఈ రెండింటి పరిణామాలు అత్యంత బాధాకరం. అట్లా అని భార్యభర్తలు ఒకరిమాట మరొకరు వినకూడదా అంటే? తప్పక వినాలి. ఇట్లాంటి సందర్భాలలో మాత్రం “ఇద్దరూ కలసి దేవుని మాట వినడం అత్యంత శ్రేయస్కరం”. ఈ రెండు సందర్భాలలోకూడా అదే లోపించింది. వారి స్వంత నిర్ణయాలు దేవుని ప్రణాళిక నెరవేర్పుకు ఆటంకంగా మారాయి. బలిపీఠము మీద సహితం విధేయత చూపగలిగిన కుమారుని ఇవ్వాలని దేవుడు ఆశిస్తే, వీరి స్వంత నిర్ణయం అడవి గాడిద వంటి మనుష్యుని భూమిమీదకు తీసుకొనివచ్చింది.

ప్రియ విశ్వాసి! దేవునిని కాదని నీవుచేసే స్వంత నిర్ణయమేదైనా సరే, ఆధ్యాత్మిక భారీమూల్యాన్ని చెల్లించక తప్పదు. ఆయన మాట వింటూ, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు మన జీవితాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(28వ భాగము)
♻ విషాదకరమైన మలుపు ♻
(Part-2)


తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దానిదృష్టికి నీచమైనదాయెను. (ఆది 16:4)

🔅 శారాయి ప్రవర్తించిన తీరు:
ఐగుప్తులో స్వంత నిర్ణయంచేసిన అబ్రాహాము దాని పర్యవసానాన్ని ఏరీతిగా అనుభవించాడో, ఇప్పుడు స్వంత నిర్ణయం చేసిన శారాయి, అదే పరిస్థితిని అనుభవించాల్సి వచ్చింది. హాగరు గర్భవతి కాగానే తన యజమానురాలును నీచంగా చూడడం మొదలు పెట్టిందట. తక్కువచేసి చూడడం కాదు, నీచముగా చూస్తుందట.
ఇప్పుడు అనిపిస్తుందామెకు నేనెంత తప్పుచేశానని. జరగలాల్సిందంతా జరిగిపోయాక ఇప్పుడేమి ప్రయోజనం? తాను తీసుకున్న నిర్ణయం, తనకు మిక్కిలి దుఃఖాన్ని కలిగించింది. తన దాసీచేత నీచముగా ఎంచబడడం అంటే తనకెంత మనోవేదనను కలిగించివుంటుంది? ఇంతవరకు హాగరును ఎంతగానో ప్రేమించి తన భర్తకే, భార్యగా వుండడానికి ఆమెనిచ్చింది. ఇప్పుడేమి చేస్తుందంటే ఆమెను శ్రమపెడుతుంది (ఆది 16:6). తన హృదయంలో ప్రేమ స్థానంలో ద్వేషము నింపుకుంది. తద్వారా ఆమె సమాధానాన్ని కోల్పోయింది. ఇంతవరకూ అబ్రాహాము ఇంట్లో పనిచేసే పనివారంతా ప్రేమగలిగిన యజమానురాలిని చూడగలిగారు. ఇప్పుడు వారందరి దృష్టిలో ఈమె కఠినాత్మురాలిగా మారింది. ఎందుకంటే శారాయి, హాగరును ఎంతగా శ్రమపెట్టింది అంటే, ఆమె దాడి తట్టుకోలేక హాగరు ఇంట్లోనుండి పారిపోయేటంతగా శ్రమ పెట్టింది. గర్భవతిగానున్న హాగరు ఏమైపోతుందో, గర్భములోనున్న బిడ్డ ఏమైపోతాడో ఇట్లాటివేమీ ఆలోచించినదికాదు. అసలు ఇంత ప్రణాళిక రచించడానికిగల కారణం ఆ బిడ్డకోసమే కదా! ఇప్పుడేమో ఆ బిడ్డఏమైపోయినా తాను పట్టించుకొనే స్థితిలోలేదు. అసలు హాగరును దీనిలోనికి లాగింది శారాయే. కనీసం ఆ విషయంకూడా ఆలోచించే స్థితిలోలేదు. శారాయి అనగా గయ్యాళి. ఈ విషయంలో ఆమె సార్ధక నామధేయురాలయ్యింది. శారాయి అన్నీతానై స్వంత ప్రణాళికను రచించుకొంది. తన ప్రణాళికను అమలుచేసే వాటిలో భాగంగా భర్తతో ఒక ప్రతిపాదన చేసింది. తన భర్త తన మాట విన్నాడు. ఆమె చెప్పినట్లు చేసాడు. దేవుని ప్రణాళికను ప్రక్కనబెట్టి, తన భార్యతో చేతులుకలపడం తప్ప, తనభార్యకు వ్యతిరేకంగా ప్రవర్తించినవాడు కాదు. తన భర్తను నిందించడానికి కారణమేమియూ లేదు. అయితే ఈమెకు ఒక అనుమానమున్నది. హాగరు గర్భవతికావడం వలన అబ్రాహాము నాకంటే ఎక్కువగా తనను ప్రేమిస్తున్నాడేమో, లేకపోతే నన్ను నీచంగా చూచేటంత ధైర్యం ఆమెకెట్లా వచ్చిందని తనలోతాను ఊహించుకొంటుంది. దానినిబట్టి, “నా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటి కిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దానిదృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక” (ఆది 16:5) అంటూ భర్తను నిందిస్తుంది. తాను నిర్ణయం తీసుకున్నప్పుడు దేవునిదగ్గర విచారణ చెయ్యలేదుగాని, తనకు బాధకలిగినప్పుడు మాత్రం మద్యలోనికి దేవునిని తీసుకొనివస్తుంది. మనము కూడా దీనికి అతీతమేమి కాదు. స్వంత ప్రణాళికలు రచిస్తాము. మనము చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసేస్తాము. అన్నీ వికటించి, ఆవేదన మిగిల్చినప్పుడు మాత్రం దేవునిని జ్ఞాపకం చేసుకుంటాము. ఆయన కలుగజేసుకోవాలని ప్రాధేయపడతాము. దేవుని చిత్తములో మన కార్యాలు జరిగించడానికి మనమిష్టపడితే, ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరత ఉండదు. ఐగుప్తులో అబ్రాహాము చేసిన స్వంత నిర్ణయం తనతోపాటు, తన భార్యను, ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే, ఇప్పుడు హెబ్రోనులో శారా చేసిన స్వంత నిర్ణయం తనతోపాటు, తన భర్తను, ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తుంది. తన సమస్యను తనకుతానే పరిష్కరించుకున్నా అనుకుంది శారాయి. కానీ తన సమస్య రెట్టింపయిందనే విషయం ఇప్పుడర్ధమయ్యింది తనకు.

🔅హాగరు ప్రవర్తించిన తీరు:
భూమిని వణకించునవి మూడు కలవు.... వాటిలో ఒకటి “యజమానురాలికి హక్కు దారురాలైన దాసి” (సామె 30:21-23). ఇది హాగరు ప్రవర్తించిన తీరుకు అతికినట్లుగా సరిపోతుంది. హాగరు ఒక దాసీ. తన జీవితం ఎట్లాంటిదంటే యజమానులయొక్క దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉంటుంది. వారు ప్రేమిస్తే వారిప్రేమను పొందడం, బాధిస్తే భాధలనుభవించడం తప్ప, ప్రశ్నించే ఎట్లాంటి హక్కూ లేదు. అయితే, హాగరు యజమానుల ప్రేమను పొందుకున్నది. వారి దృష్టిలో ప్రత్యేకమైన స్థానమును సంపాదించుకోగలిగింది. అంటే దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆమె విధేయురాలుగా, మంచి ప్రవర్తన గలిగిన స్త్రీగా ఆమె జీవించియుండవచ్చు. ఆమె జీవితమే ఆమెను యజమానురాలికి హక్కుదారుని చేసియుండవచ్చు. అయితే, ఆమె గర్భవతి అయ్యాక, అణకువ, విధేయత స్థానములో గర్వము, అహంకారము వచ్చి చేరాయి, దేవుని పరిశుద్ధ ప్రణాళికలో నేనే వున్నాననుకుందేమో? అబ్రాహామునకు వారసునిని యివ్వబోతున్నాను కాబట్టి, ఇక వృద్ధాప్యములోకి చేరిన శారాను అతడు పట్టించుకొనడు అని తలంచిందేమో? ఇక తానే యజమానురాలన్నట్లు ఊహించుకుందేమో? దాసిగా బ్రతకాల్సినదానికి ఇంత ఉన్నతమైన స్థితినిచ్చిన తన యజమానురాలైన శారాయిపట్ల కృతజ్ఞతా భావముతో, మరింత విధేయురాలుగా జీవించాల్సిందిపోయి, ఆమెను నీచంగా చూసిందట. నీచముగా అంటే, తన యజమానురాలైన శారాయిని అసహ్యించుకునే స్థితి. “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును” (సామె 16:18). ఆమె గర్వము, అహంకారము శారాయి చేత శ్రమపెట్టడానికి కారణమయ్యింది. అబ్రాహాము ఆ పరిస్థితినుండి తప్పిస్తాడని ఆమె ఆశించియుండవచ్చు. కానీ అతడు “ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను” (ఆది 16:6). అబ్రాహాము ఐగుప్తులో శారాయికి ఏమి జరిగినా పట్టనట్లు ప్రవర్తించగా, ఇక్కడ శారాయికి ఏమి జరిగినా పట్టనట్లు ప్రవర్తించాడు. ఇక హాగరుకు ఇంటి నుండి పారిపోవడం తప్ప, వేరే గత్యంతరం లేకపోయింది.

🔅అబ్రాహాము ప్రవర్తించిన తీరు:
శారాయి, హాగరు విషయంలో కూడా అబ్రాహాము భాద్యతారహితంగా వ్యవహరించినట్లుగానే అనిపిస్తుంది. స్పష్టమైన వాగ్ధానముండగా భార్య చేసిన ప్రతిపాదన విషయంలో ఎదురు చెప్పలేకపోయాడు. తద్వారా వారు ఎదుర్కోబోయే సమస్యలో పరోక్షంగా తానూ పాలిభాగస్తుడయ్యాడు. హాగరు గర్భవతి అయ్యాక శారాయి, హాగరు మధ్య సంభవించిన పరిణామాలలో వారి మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నమేమి చెయ్యలేదు. ఏ ఒక్కరిని గద్దించినట్లుగా చూడము. ఇది అతని మంచితనముగా పరిగణించలేము. హాగరును నీ మనస్సుకు వచ్చినట్లు చేయమనడం ద్వారా, నేను నీ పక్షానేవున్నానని భార్యను బలపరచినట్లయ్యింది. బహుశా వాగ్ధాన పుత్రుడు జన్మించడానికి వారి మధ్య సంబంధబాంధవ్యాలు పటిష్ఠముగా నుండాలనుకున్నాడేమో తెలియదు. ఏబిడ్డకోసమైతే భార్య ప్రణాళికలో భాగమయ్యాడో, ఆ బిడ్డను గురించిన శ్రద్ధగానీ, ఆ బిడ్డకు జన్మనివ్వబోతున్న హాగరునుగూర్చిన శ్రద్ధగానీ ఏ కోశానా అతనిలో కనిపించదు. ఈ పరిస్థితులన్నింటికీ కారణం ఒక్కటే. వారి ప్రణాళికలో దేవునికిగాని, దేవుని ఉద్దేశ్యాలకుగాని, దేవుని చిత్తానికిగాని స్థానం లేనేలేదు. ప్రభువు కలుగుజేసుకొనేవరకు వీటికి పరిష్కారముండదు.

ప్రియ విశ్వాసి! నీవు తలపెట్టే ఏ కార్యమైనా ఆయన చిత్తానుసారంగా వుందా? లేక నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించి ప్రమాదంలో పడియున్నావా? నిన్నునీవే పరిశీలన చేసుకొని, ప్రభువు పాదాల చెంత చేరు. ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(29వ భాగము)
♻ హాగరు పారిపోవుట ♻


హాగరు తాను గర్భవతినయ్యాననే గర్వముతో యజమానురాలైన శారాయిను నీచపరచడం, ఆమెచేత శ్రమ పరచబడడం, యజమానుడైన అబ్రాహాము ఆమెను పట్టించుకోకపోవడం వెరసి, దిక్కులేని స్థితిలో యింటనుండి పారిపోయి అరణ్య బాట పట్టింది. షూరు అరణ్య మార్గముగుండా తాను ప్రయాణము చేస్తుంది. బహుశా ఆమె ఎక్కడనుండి వచ్చిందో అక్కడకే పయనమయ్యుంటుంది. ఐగుప్తు దాస్యమునుండి దేవునిచేత విడిపింపబడిన ఇశ్రాయేలీయులు ఎఱ్ఱసముద్రమును దాటిన తర్వాత షూరు అరణ్యములో ప్రవేశించారు. ఇదే మార్గముగుండా ఆమె ఐగుప్తుకు పయనమయినట్లుంది. అస్తవ్యస్తమైన తన జీవితానికి అరణ్య అనుభవం మరింత కృంగుబాటు. అరణ్య పయనం, దానికితోడు ఒంటరిగా, గర్భవతిగా మరింత భారం. నీళ్లుండవు, ఆహారం దొరకదు, భయంకరమైన వేడిమి, విష సర్పాలు, క్రూర మృగాలు, ఇసుక తుఫానులు, ఇట్లా ఎన్నో ప్రతికూలాంశాలు. ఇశ్రాయేలీయులకైతే మేఘ స్తంభము, అగ్ని స్తంభము తోడుగా వున్నాయి. ఈమెకైతే ఏ ఆధరణ, ఆశ్రయము లేదు. దిక్కులేని స్థితిలో ఒక నీటిబుగ్గ యొద్దకు చేరినవేళ, “యెహోవా దూత” ఆమెను కలుసుకొంటున్నాడు.

🔅 హాగరును కలుసుకొన్న “యెహోవా దూత” ఎవరు?

పరిశుద్ధ లేఖనాలలో 300 సార్లకుపైగా దూతల ప్రస్తావన కనిపిస్తుంది. దూత అనగా “వార్తాహరుడు” లేదా “పంపబడినవాడు” అని అర్ధము. వీరు దేవుని సేవకై ఏర్పాటు చేయబడిన జీవులు. వీరు సాధారణముగా మనుష్యులకు కనిపించని ఆత్మస్వరూపులు. కాని, అవసరతను బట్టి, కొన్ని సందర్భాలలో మానవరూపంలో కనిపించవచ్చు. వీరిలో సెరాపులు, కెరూబులు, ప్రధాన దూతలు, దూతలు మొదలగు తరగతులను కూడా పరిశుద్ధ గ్రంధములో మనము గమనించవచ్చు. రెండు రెక్కలు గలిగినవారు, నాలుగు రెక్కలు కలిగినవారుగా, ఆరు రెక్కలు కలిగినవారుగా దూతలు కనిపిస్తారు. అయితే, షూరు అరణ్యములో హాగరును కలిసికొనిన “యెహోవా దూత” అందరిలో ప్రత్యేకమైన వాడుగా కనిపిస్తాడు. పాత నిబంధన గ్రంధములో అనేకమైనసార్లు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. దూతలందరివలే కాకుండా, సర్వాధికారమున్నవాడిలా మాట్లాడుతుంటాడు. ఈయనను గురించిన కొన్ని లేఖనాలను అధ్యయనము చేద్దాము.

▪యెహోవా దూత తానే దేవుడైనట్లు మాట్లాడతాడు : (ఆది 31:11-33; నిర్గమ 3:2-6)
▪దేవునికి వున్న గుణాలు ఈయనలోనున్నాయి: (ఆది 16:10; 48:16)
▪ఈయనే యెహోవా దేవుడుగా గుర్తించడం జరిగింది: (న్యాయాధి 2:1-3; 6:12,14,16,23)
▪ఈయన కొన్నిసార్లు మానవరూపములో దర్శనమిచ్చాడు: (న్యాయాధి 13:3,6,10,11,13)
▪ఈయనపేరు అద్భుతము, ఆశ్చర్యకరుడు: (న్యాయాధి 13:18; యెషయా 9:6)
“ఆశ్చర్యకరుడు” అనేపేరు లేఖనాలలో ఎవరికుంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. “ఆశ్చర్యకరుడు” ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
(యెషయా 9:6). ఈ ప్రవచనం ఏ శిశువు గురించి ప్రవచించబడింది? ప్రభువైన యేసు క్రీస్తును గురించి. అంటే, హాగరును కలుసుకొనిన ఆ యెహోవా దూత యెవరయ్యుండవచ్చు? ప్రభువైన యేసుక్రీస్తే. అంటే, ఆయన శరీరధారిగా ఈలోకానికి రాకముందు “యెహోవా దూతగా” ఆయన పరిచర్య చేసినట్లు గ్రహించగలము.

అబ్రాహాము ఐగుప్తులోనున్నప్పుడు శారాయిని పట్టించుకొనక పోయినాగాని దేవుడు శ్రద్ధతీసుకున్నాడు. ఇప్పుడు హాగరును అతడు పట్టించుకొనక పోయినాగాని కృపగలిగిన దేవుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకొంటున్నారు. ప్రాముఖ్యముగా మూడు విషయాలను ఆయన తెలియజేస్తున్నారు.

▪1. హాగరు యొక్క స్థితి:

శారయి దాసివైన హాగరూ (ఆది 16:8 ) అనే పిలుపులోనే ఆమె స్థితి ఏమిటో ప్రభువు అర్థమయ్యేటట్లు చేశారు. హాగరు తానే ఏదో యజమానురాలిగా చాలా ఊహించుకొని, చాలా సమస్యలను కొనితెచ్చుకొంది. అయితే, నీ ఊహలన్నీ వ్యర్ధమైనవని, నీవు శారాయి యొక్క దాసివి మాత్రమేనని ప్రభువు స్పష్టం చేస్తున్నారు.

▪2. హాగరు యొక్క కర్తవ్యం:

హాగరు తనను తానే ఘనపరచుకొని, తన యజమానురాలిని నీచపరచింది. ఇప్పుడు ప్రభువు తన కర్తవ్యాన్ని తెలియజేస్తున్నారు. “నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండు” (ఆది 16:9 ). మరలా తిరిగివెళ్ళడం అంటే, అది సామాన్యమైన విషయమా? మొట్టమెదట తన అహాన్ని చంపుకోవాలి. శారాయి మరింత శ్రమపెట్టే అవకాశముంది, వాటన్నింటికి తలవంచాలి. తోటి పనికెత్తెలు చాలా చులకనగా చూస్తారు వాటన్నింటిని భరించాలి. అయితే, తనతో మాట్లాడుచున్నది దేవుడేనని గుర్తెరిగి ఆయన చెప్పినట్లుగా చెయ్యడానికే సిద్దపడింది.

▪ 3. హాగరు పొందిన వాగ్ధానం:

నీ సంతానమును నిశ్చయముగా విస్త రింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను (ఆది 16:10) ఏతల్లి అయినా తానెన్ని బాధలనుభవించినాగాని వారిబిడ్డలు సంతోషముగా వుండబోతున్నారని తెలిస్తే ఆమె ఆనందానికి అవధులుండవు. హాగరు కూడా ప్రభువిచ్చిన వాగ్ధానముతో తన హృదయమంతా సంతోషముతో నిండిపోయింది.

🔅అరణ్య అనుభవంలో హాగరుయొక్క ఆత్మీయ పరిణితి :
▪దేవునిని ప్రార్ధించింది.
▪ఆయనమాటకు లోబడింది.
▪ఆయనను అనుభవించింది. “చూచుచున్న దేవుడవు నీవే” అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టింది.
▪ప్రభువును కలుసుకొన్న నీటిబుగ్గకు “బెయేర్ లహాయిరోయి” అనగా “నన్ను చూచుచున్న సజీవుని బావి” అని పేరు పెట్టింది. ఆమె విగ్రహారాధికురాలు. అయితే, అబ్రాహాము కుటుంబ సహవాసములో సజీవుడైన దేవునిని తెలుసుకోగలిగింది. అరణ్యములో ఆయన ప్రత్యక్షతను అనుభవించగలిగింది.

హాగరు ప్రభువుమాటకు లోబడి, అబ్రాహాము ఇంటికి తిరిగివచ్చింది, కుమారునికన్నది. ప్రభువు మాట చొప్పున అబ్రాహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టాడు. ఇష్మాయేలు అనగా “దేవుడు వినును” అని అర్ధము. అవును, బాధలో హాగరు పెట్టిన మొరను దేవుడు విన్నాడు. ఆయన ఆలకించి, సమాధానమిచ్చేదేవుడు. శోధనలు, వేదనలు, శ్రమలు అనే అరణ్యముగుండా నీవు పయనిస్తుంటే, నీవు మొరపెట్టగలిగితే, నీ మొర వినడానికి, నీకు సమాధానమివ్వడానికి ఆయనెప్పుడూ సిద్ధమే.

అబ్రాహాము శారాయి మాట వినెను(ఆది 16:2), దాని ఫలితముగా అడవిగాడిద వంటి మనుషుడు భూమిమీదికి వచ్చెను (ఆది 16:12). అతడు పండ్రెండు అరబ్బుతెగల వంశకర్త. అతడే ఇష్మాయేలు. (ఆది 16:11; 17:20; 25:12-18). ఇతడు పుట్టబోయే వాగ్ధాన పుత్రునికి పెనుసవాలుగా మారబోతున్నాడు. మారాడు. మారణహోమం సృష్టిస్తున్నాడు. యుగాంతమువరకూ అరబ్బులు, ఇశ్రాయేలీయుల మధ్య ఈ పోరాటం కొనసాగితీరుతుంది. శారాయి, అబ్రాహాములు కలసిచేసిన ఒక స్వంత నిర్ణయం ఇంతటి ప్రళయాన్ని సృష్టించబోతుందని వారెన్నడూ ఊహించియుండరు.

ప్రియ విశ్వాసి! దేవుని చిత్తానికి లోబడకుండా నీవు చేసే స్వంతనిర్ణయం ఏదైనాసరే, దాని ప్రతిఫలం ఇట్లానే వుండబోతోంది. ఎంతగా అంటే, నీ ఊహలకు సహితం అందనంతగా వుండబోతోంది. వద్దు!
ఆయన చిత్తానుసారముగా జీవితాలు జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(30వ భాగము)
♻ అబ్రాహాముతో నిబంధనను నూతన పరచుట ♻ (part-1)


అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. (ఆది 17:1)

🔅దేవునితో ఎడబాటు:
పరిశుద్ధ గ్రంథములోని ఆదికాండము 16,17 అధ్యాయముల మధ్య కాలవ్యవధి సుమారు 13 సంవత్సరములు. ఈ మధ్య కాలములో దేవుడు అబ్రాహాముతో మాట్లాడినట్లుగాని, లేదా అబ్రాహాము దేవునికి బలిపీఠముకట్టి, ప్రార్ధించిన సందర్భాలుగాని మనకు పరిశుద్ధ గ్రంధములో కనిపించవు. కారణం ఏమయ్యుంటుంది? అబ్రాహాము ఇష్మాయేలుతో ఆడుకుంటూ దేవునిని మరచిపోయాడా? అట్లా ఎంతమాత్రమూ జరిగే అవకాశంలేదుగాని, దేవుడు స్పష్టమైన వాగ్ధానమిచ్చినప్పటికీ, దేవునితో విచారణ చెయ్యకుండా తన భార్యతో ఏకీభవించి ఇష్మాయేలుకు జన్మనిచ్చినందుకు, ఇప్పుడు అబ్రాహాము దేవునిని ఎదుర్కొనే ధైర్యం లేక మిన్నకుండిపోయాడు. అతడు చేసింది పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన కార్యమని అతనికి అర్ధమయ్యింది. షూరు అరణ్యములో దేవుడు హాగరుకు ప్రత్యక్షమై, ఏ రీతిగా తన కుమారుని ఆశీర్వదించబోతున్నాడో, అతనికి ఏమి పేరు పెట్టాలో కూడా, తెలియజేశాడు. అందుచే హాగరు పక్షముననే దేవుడున్నాడని తాను నిశ్చయముగా తప్పుచేసాననే విషయం అతనికి నిర్ధారణ అయ్యింది. మొదటగా హాగరును భార్యగా చేసికొనుటలోనూ, తర్వాత ఆమెపట్ల కఠిన వైఖరి అవలంబించుటలోనూకూడా తప్పు చేసాడు. ఇది అనుకోకుండా జరిగిన తప్పు కాదు. ఇది ఉద్దేశ్యపూర్వకంగానే అతడు చేసిన తప్పు. అందుకే అది పాపము. వారు స్వంతనిర్ణయంతో దేవునిని నమ్మడములో విఫలమయ్యారు. తద్వారా దేవునికి దూరమయ్యారు. ఇప్పుడు దేవునికిని అబ్రాహామునకునూ మధ్యలో పాపము వచ్చిచేరింది. తాను పాపము చేశాననే గ్రహింపులోనికి వచ్చినవెంటనే పశ్చాత్తాపపడితే బాగుండేదేమో, అబ్రాహాము దేవుని సమీపించడానికిని ధైర్యంచాలక సిగ్గుతో దానిని వాయిదావేసి వుండవచ్చు. అందుకే అతడు బలిపీఠము కట్టలేదు ప్రార్ధన చెయ్యలేదు. దానిఫలితం దేవునితో ఎడబాటు. పాపము మనలను దేవుని సహవాసమునుండి వేరు చేస్తుంది. అబ్రాహాము చేసిన పాపమునకు ప్రతిఫలము “పదమూడు సంవత్సరాలు దేవునితో ఆత్మీయ ఎడబాటు”. అబ్రాహాము దేవునితో సంబంధం కలిగియున్నాడు గాని, సహవాసం లోపించింది. సంబంధం పటిష్ఠపరచబడాలంటే సహవాసం తప్పనిసరి. సంబంధమునకు, సహవాసమునకునున్న తేడా ఏమిటంటే? మనము మన తండ్రితో గొడవ పెట్టుకొని ఆయనతో మాట్లాడడం లేదు. ఎవరైనా మీ నాన్నగారిపేరేమిటి అని అడిగితే, వేరొకరిపేరు చెప్పముకదా? అంటే తండ్రి కొడుకుల సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. కానీ మాట్లాడుకోకపోవడం వలన సహవాసం కోల్పోయాము. సహవాసము లేకపోవడం వలన సమాధానాన్ని కోల్పోతాము.
దేవునితో సహవాసం ఎంతటి ప్రాధాన్యమైనదో ప్రభువు సిలువలో పలికినమాటద్వారా అర్థంచేసుకోవచ్చు. “ఏలి ఏలి లామా సబక్తా” ( దేవా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి.) అంటూ బిగ్గరగా కేకవేస్తున్నారు. అంటే తండ్రి కొన్నిగంటలపాటు నీకోసం నాకోసం ఆయన చెయ్యి విడచిపెట్టేసారు. ఆ కొన్ని గంటల ఎడబాటును కూడా ప్రభువు తట్టుకోలేకపోతున్నారు. అయితే, అబ్రాహాము దేవునితో ఎడబాటు పదమూడు సంవత్సరాలు. ఎంత క్షోభ అనుభవించియుంటాడో కదా? మన జీవితాలెట్లా వున్నాయి? ఆయనతో సహవాసం తెగిపోయి ఎంతకాలమయ్యింది? అసలు ఎప్పుడైనా ఆయనతో సహవాసం చేసిన అనుభవముందా? ఆయనతో మనకున్న సహవాసము తెగిపోవడానికి, లేదా ఆయనతో మన సహవాసం నెలకొల్పబడక పోవడానికి దేవునికిని మనకును మధ్యలో అడ్డుగా నిలచిన మన పాపములేమిటి? మనలను మనమే పరిశీలన చేసుకొని, సరిచేసుకొని, ఆయనతో సహవాసం కొనసాగించగలగాలి. ఆయనతో సహవాసంలేని జీవితాలు ఎట్లాంటివంటే? బ్రతికియుండియూ మృతమైన జీవితాలు.

🔅సర్వశక్తిగల దేవుని ప్రత్యక్షత:
సుదీర్ఘ విరామము తర్వాత కృపగలిగిన దేవుడే అబ్రాహాము దగ్గరకు వస్తున్నాడు. అబ్రాహాము దేవునిదగ్గరకు వెళ్ళలేదు. దీనినిబట్టి నీవూ నేనూ తప్పిపోయినాగాని, వాగ్ధాన నెరవేర్పు విషయంలో గాని, ఆయన చేసిన నిబంధన విషయంలోగాని ఆయన తప్పిపోయేవాడుకాదని అర్ధము చేసుకోగలము. అబ్రాహామునకు ప్రత్యక్షమైన దేవుడు “నేను సర్వశక్తిగల దేవుడను” (ఆది 17:1) అంటూ తెలియజేస్తున్నాడు. ఇట్లా చెప్పడం ద్వారా , పరోక్షంగా అబ్రాహామునకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేమిటంటే, ఫరో చేతిలోనుండి విడిపించినప్పటికీ, నలుగురు రాజులపై విజయాన్నిచ్చినప్పటికీ నా శక్తిని అర్ధంచేసుకోలేక, 85 సంవత్సరాల వయస్సులో పిల్లలుకలగడం అసాధ్యమని స్వంతనిర్ణయం తీసుకున్నావు. అయితే నేను సర్వశక్తిగల దేవుడను, 85 సంవత్సరాల వయస్సులోనేకాదు 99 సంవత్సరాల వయస్సులోసహితం నేను నీకు పిల్లలను అనుగ్రహించగల సర్వశక్తి మంతుడను అనే భావము ఆయన మాటలలో నిక్షిప్తమైయున్నది. ఆయన సర్వశక్తిగల దేవుడను అని చెప్పడంలో మరొక ఉద్దేశ్యం కూడా వుండవచ్చు. అబ్రాహాము విగ్రహారాధికులమధ్య జీవిస్తున్నాడు. కనానీయులు, పెరిజ్జీయులు వీరంతా విగ్రహారాధికులే. విగ్రహారాధికులు “విగ్రహాన్ని” కాకుండా “విగ్రహాలను” పూజిస్తుంటారు. అంటే వారి ఉద్దేశ్యం ఒక్కదేవుడు అన్నింటిని చెయ్యలేడు అందుచే గర్భఫలము కొరకు ఒక దేవతను, పంటలు పండుటకొరకు మరొకదేవతను ఇట్లా... వారు కొలుస్తూ వుంటారు. అందునిమిత్తము, నేను వారివంటి వాడనుకాదు. సమస్తమూ నాకు సాధ్యమే. నేను అన్నింటిని చేయగల సామర్ధ్యమున్నవాడను, నేను “సర్వశక్తిగల దేవుడను” అనే విషయాన్ని దేవుడు అబ్రాహామునకు స్పష్టంచేసి యుండవచ్చు. “సర్వశక్తిగల దేవుడు” అనేదానికి హీబ్రూ పదం “ “ఎల్ షద్దాయ్” ఈ నామము పాతనిబంధనా గ్రంధములో 48 సార్లు కనిపిస్తుంది. ఎల్ షద్దాయ్ అనగా అసాధ్యాలను సుసాధ్యము చేయగలదేవుడు (మత్తయి 19:26; ఆది 18:14) ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడు ( రోమా 4:21) అన్నిటికి చాలిన దేవుడు. తనవారికి ఏమి చెయ్యాలనుకొంటున్నాడో వాటన్నింటిని చేయగలిగినవాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నున్నవాడు. అబ్రాహాము దినాలలో ఆయన ఎంతటి శక్తిమంతుడో, నేటి దినాన్న కూడా ఆయన అంతే సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిని గుర్తించి, ఆయనపై ఆధారపడగలిగితే ఆయనకు అసాధ్యమైనదేదియూ లేదు. నీ ప్రతీవిధమైన పరిస్థితిని ఆయన చక్కబరచగలడు.
ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(31వ భాగము)
♻ అబ్రాహాముతో నిబంధనను నూతన పరచుట ♻ (part-2)


అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. (ఆది 17:1)

🔅అబ్రాహాము హెచ్చరింపబడుట:

🎆a) నా సన్నిధిలో నడవాలి:

ఆయన సన్నిధిలో నడవడం అంటే, ఆయన అడుగుజాడల్లో నడిచే అనుభవం. ఆయన అడుగులో అడుగు వేసుకొంటూ పయనించగలిగితే, ఇక మనము దారితప్పే అవకాశం లేనేలేదు అది తప్పక గమ్యం చేర్చగలుగుతుంది. సందేహం లేనేలేదు. అయితే, గమ్యంవైపు మనము సాగిపోతున్నప్పుడు చుట్టూనున్న లోకం తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అవిశ్వాసం అడ్డుపడి ఇది నీవల్ల కాదంటూ, నీకు మరొక దగ్గర మార్గం సూచిస్తానంటుంది. కొన్ని సందర్భాలలో ఇట్లాంటి తలంపులు మనకు లేనప్పటికీ, మన స్నేహితులు, ఆత్మీయులుగా భావించేవారి ద్వారా అవిశ్వాస బీజాలు విత్తబడతాయి. వారు మన క్షేమాన్ని కోరేవారేతప్ప, మనకు కీడు కల్పించేవారేమీకాదని మనకు వారిమీద పూర్తినమ్మకం ఉంటుంది. కానీ, వారి ద్వారానే సాతాను తన ప్రణాళికను అమలుచేస్తున్నాడని మనకర్ధం కాదు. మన చుట్టూనున్న పరిస్థితులు చూచినప్పుడు వారు చెప్పేదే వాస్తవమనిపిస్తుంది. ఇక మన అడుగులు తడబడతాయి ఆయన అడుగులు దూరమవుతాయి, మన స్వంతమార్గం సజావుగానే సాగిపోతుంది. కానీ అదెంతో కాలం కాదు. అప్పుడర్ధమవుతుంది ఆయన సన్నిధికి దూరమైన మనము చెల్లించాల్సిన మూల్యమెంతో? అబ్రాహాము దేవుని అడుగుజాడల్లో, ఆయన సహవాసంలో, ఆయన సన్నిధిలో ఆయన అడుగులో అడుగులో అడుగువేసుకొంటూ సాగిపోతున్న తరుణంలో, అవిశ్వాసం అడ్డుగావచ్చి, పిల్లలు కలగడానికి నీ శరీరము సహకరించదుగాని నీ ప్రయత్నాలు నీవు చేసుకో అంటూ భార్యచేత ప్రేరేపించబడ్డాడు. ఆయన సన్నిధిని విడచి, స్వంతమార్గాన్ని ఎన్నుకున్నాడు. తన కుటుంబంలో చెలరేగిన అల్లకల్లోలం అతనికి అర్ధమయ్యేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. దాని ఫలితం పదమూడు సంవత్సరాలు దేవునితో ఆత్మీయ ఎడబాటు. అయినప్పటికీ, కృపగలిగిన దేవుడు మరలా ప్రత్యక్షతనిచ్చి అబ్రాహాము యొక్క కర్తవ్యాన్ని తెలియజేస్తున్నారు. నీవు చేసిన స్వంత నిర్ణయం ద్వారా, నా సన్నిధికి నీవు దూరమయ్యావు. అయితే, తిగిరి నా సన్నిధిలో నడవాలి. నాతో సహవాసం చెయ్యాలి. కల్దీయుల దేశము నుండి నిన్ను ప్రత్యేకపరచుకొని వాగ్ధానభూమికి నడిపించింది దీనికోసమేతప్ప, నీకు నచ్చినట్లుగా జీవించడానికి కాదు అంటూ హెచ్చరిస్తూనే, తిరిగి ఆయన సన్నిధికి ఆహ్వానిస్తున్నారు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మరణం చూడకుండా కొనిపోబడ్డాడు (ఆది 5:24). నోవహు దేవునితో నడిచాడు(ఆది 6:9). జలప్రళయం నుండి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. హిజ్కియా దేవునితో నడిచాడు. (2 రాజులు 20:3). మరణకరమైన రోగమునుండి తప్పించబడి పదిహేను సంవత్సరాలు ఆయుష్షును పొందాడు. అబ్రాహాము దేవునిచేత హెచ్చరికపొందాడు. తిరిగి ఆయనతో ఆయన సన్నిధిలో నడవడం ప్రారంభించాడు. మన జీవితాలు ఎట్లా వున్నాయి? ఆయన సన్నిధికి దూరమయ్యి ఎంతకాలమయ్యింది? ఎంతకాలమునుండి ఆయన మనలను పిలుస్తున్నాడు? (ప్రకటన 3:20) ఎప్పుడయినా ఆలోచించే ప్రయత్నంగాని, ఆలకించేప్రయత్నం చేసావా? నీ మార్గమే సరైనదనుకొంటే జీవితం అగమ్యగోచరమవుతుంది. ఒకవేళ ఆదివారము ఆరాధనకు వెళ్తున్నాను కదా, ఆయన సన్నిధిలో నేనున్నట్లేకదా అంటూ నీకు నీవే సర్దిచెప్పుకొనే ప్రయత్నం చెయ్యొద్దు. సమయం సందర్భం ఏదైనాసరే నీవు ఆయన సన్నిధిలోనే వుండగలగాలి. అది ఆఫీస్ అయినా,కాలేజ్ అయినా, వ్యాపార స్థలమైనా, నీ ఇల్లయినా ఎక్కడైనాసరే నీవు ఆయన సన్నిధిలో నడచినట్లుగానే నడవాలి. చాలా మంది దేవునిమందిరంలో వారు నటించే భక్తి చూచి, దయ్యాలు సహితం ఓ మై గాడ్! అంటూ ఆశ్చర్యపోతాయి. ఆ రెండుగంటలు దాటిందంటే వారు లోకంలో జీవించేతీరు, వారు నడిచేనడత అన్య జనులమధ్య దేవుని నామం దూషణ పాలుకావడానికి కారణమవుతుంది. . అది దేవుని మందిరమైనా, అది లోకమైనా నీవెక్కడవున్నాసరే దేవుని సన్నిధిలో నడచినట్లుగానే నీ జీవితం ఉండాలి. నటించిన జీవితానికి గతించినకాలమే చాలు. పశ్చాత్తాపముతో
తిరిగి ఆయన సన్నిధిలోచేరి ఆయనతో నడవగలిగితే దాని గమ్యం నిత్యత్వానికి చేర్చ గలుగుతుంది.

🎆b) నిందారహితుడవై యుండాలి:

నిందారహితమైన జీవితం అంటే? దేవుని సముఖంలో మెలగడం. ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయన బలముపైనే ఆధారపడుతూ, ఆయన కొరకే ఎదురు చూడడం.

నిందారహితుడై యుండుమని దేవుడు అబ్రాహామును హెచ్చరించడానికిగల కారణమేమిటి? హాగరు ద్వారా బిడ్డను కనడం అతని బలహీనత. తద్వారా ఆ విషయంలో నేటికిని నిందించబడుతున్నాడు. అందుచే ఇట్లాంటి జీవితం వుండకూడదని ప్రభువు అబ్రాహామును హెచ్చరించడం జరిగింది. ఇతరులుకాని, తోటివిశ్వాసులుకాని, మనలోపములనుబట్టి మనలను నిందించుటకు అవకాశం ఇవ్వకూడదు. దేవునిపై నమ్మకముంచిన వారంతా నిందారహితమైన జీవితం జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను (ద్వితీ 18:13). అయితే, నిందారహితులుగా మనమెట్లా జీవించగలము? అది మనకు మనముగా సాధ్యంకాదుగాని, దేవుని సహాయానికై అభ్యర్ధించినప్పుడు, మనము దురభిమాన పాపములో పడకుండా, ఆ పాపము మనలను ఏలుబడి చెయ్యకుండా ఆయన అడ్డగిస్తాడు. తద్వారా మనము యదార్ధముగా, నిందారహితమైన జీవితాన్ని జీవించగలము (కీర్తనలు 19:13) యోబు యదార్ధవంతుడుగా జీవించాడు(యోబు 1:1). నోవహు నీతిపరుడుగాను, నిందారహితుడుగాను వున్నాడు (ఆది 6:9) యదార్ధమైన ప్రవర్తన గలిగినవాడు, యెహోవా గుడారములో అతిథిగా ఉంటూ ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తారు. (కీర్తనలు 15:1,2) ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు. (సామె 2:7). అందుచే, ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. (2 పేతురు 3:14). సణుగులు, సంశయాలు నిందారహితమైన జీవితం జీవించడానికి ఆటంకములుగా మారతాయి (ఫిలిప్పీ 2:14). వాటిని జయించగలగాలి. సంతృప్తి లోపించినప్పుడు సణుగుడు ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు వాగ్ధానభూమికి చేరే ప్రయాణంలో, దేవుడు వారికి అన్నింటిని సమకూర్చినప్పటికీ, సణిగి అరణ్యములో వారి శవాలు పిట్టల్లా రాలిపోయాయి. సంశయము అనేది దేవుని శక్తిని తక్కువగా అంచనావేయడానికి కారణమయ్యి, ఆయనపైన ఆధారపడకుండా, స్వంత ప్రయత్నాలు చెయ్యడానికి కారణమవుతుంది. తద్వారా అనింద్యులుగా జీవించలేము.
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. (1 థెస్స 5:23)

ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!




✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(32వ భాగము)
♻ అబ్రాహాముతో నిబంధనను నూతన పరచుట ♻ (part-3)


అబ్రాహాము కల్దీయుల దేశములోనున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై నాలుగు షరతులు విధించి, ఏడు వాగ్ధానపు ఆశీర్వాదాలను ఇచ్చారు. (ఆది 12:1,2) హెబ్రోనులోనున్నప్పుడు ఆయన తిరిగి ప్రత్యక్షమై రెండు షరతులు విధించి, ఏడు వాగ్ధానపు ఆశీర్వాదాలను ఇస్తున్నారు (ఆది 17:1-16). ఏడు అనే సంఖ్య పరిపూర్ణమైనదనియూ, ఆయనిచ్చే ఆశీర్వాదం ఎప్పుడైనా సంపూర్ణమైనదనియు గ్రహించగలము:

🔅అబ్రాహామునకు దేవుడు విధించిన షరతులు:

1. నా సన్నిధిలో నడవాలి
2. నిందారహితముగా జీవించాలి.

🔅వాగ్ధానపు ఆశీర్వాదాలు:

1. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను (ఆది 17:2)
2. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును. (ఆది 17:6)
3. నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. (ఆది 17:7)
4. నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదను (ఆది 17:8)
5. ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను. (ఆది 17:16)
6. నేనామెను ఆశీర్వదించెదను (ఆది 17:16)
7. ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలుగుదురు. (ఆది 17:16)

▪1. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను (ఆది 17:2)
🔅 నిబంధన వ్యక్తిగతమైనది:
నాకును నీకును మధ్య నా నిబంధనను నియమిస్తాను.
దేవుడు చేసే నిబంధన ఏదైనా నేరుగా, వ్యక్తిగతంగా ఉంటుంది. ఆ నిబంధనలో దేవునికిని, ఆయన ఎవరితో నిబంధన చేస్తున్నారో వారికి తప్ప, మూడవ వ్యక్తికి జోక్యం వుండకూడదు. అందుకే అబ్రాహాముతో “నాకును నీకును మధ్య” అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆదాముతో జరిగిన నిబంధనలో సర్పము మధ్యలో జోక్యము చేసుకుంది. అబ్రాహాముతో జరిగిన నిబంధనలో శారాయి జోక్యం చేసుకుంది. తద్వారా దేవుని ప్రణాళికా నెరవేర్పుకు ఆటంకంగా మారారు. దేవుడు ఎప్పుడూ మధ్యవర్తిత్వాన్ని ఇష్టపడడు. నేరుగా ఆయనతో తత్సబంధాన్ని, సహవాసాన్ని కలిగియుండడానికి మాత్రమే ఇష్టపడతాడు. మధ్యవర్తిత్వం అనేది, లేదా మూడవ వ్యక్తి జోక్యం అనేది అన్నివేళలా మంచి ఫలితాలనివ్వదు సరికదా, అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. దేవుని విషయంలో మధ్యవర్తిత్వం అనేది అసలు మంచిది కాదు. అయితే, నేటి దినాలలో దీనికి పూర్తి భిన్నముగా వున్నాయి మన జీవితాలు. మన భారమంతా ప్రేయర్ టవర్స్ కు, ప్రార్ధించేవారికి అప్పగించి మనము మాత్రము హాయిగా నిద్రపోతున్నాము. భవిషత్ లో ఏమి జరగబోతుందో ముందేతెలుసుకుందామని క్యూ కడుతున్నాము. కానీ, మనము ఆయనతో మాట్లాడే ప్రయత్నం (ప్రార్ధన) గాని, ఆయన మనతో నేరుగా మాట్లాడాలనే (వాక్య ధ్యానం) ఆశలేకుండా, మధ్యవర్తులతో కాలక్షేపం చేస్తున్నాము. పెళ్లి అయ్యేంతవరుకూనే మధ్యవర్తి. తర్వాత అతని జోక్యం ఎంత మాత్రం వుండకూడదు.
అట్లానే ప్రభువును తెలుసుకొనేటంతవరకూనే మధ్యవర్తి, తర్వాత నేరుగా నీవే ఆయనతో సహవాసం కలిగియుండాలి. నాకు తెలిసి ఈ వర్తమానం చదివేవారిలో తొంబై శాతముపైబడి క్రైస్తవ గృహాలలో పుట్టినవారే. మనకు ప్రభువును వేరే వ్యక్తులు పరిచయం చెయ్యాల్సిన అవసరం లేనేలేదు. కానీ, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, మరణానికి దగ్గరవుతున్నాము. నేటికిని ఆయనతో వ్యక్తిగత సంబంధాలు లేవంటే, ఆధ్యాత్మికంగా మన స్థాయి ఏమిటో మనమే పరిశీలన చేసుకోవాలి. నీవు ప్రభువుతో మాట్లాడాలంటే అదేదో కష్టతరమైన విషయమేమి కాదు. దానికొక ప్రత్యేకమైన టెర్మినాలజీ అవసరంలేదు. నీ తండ్రితో మాట్లాడినట్లుగా, నీ స్నేహితునితో మాట్లాడినట్లుగా నీ మనస్సు విప్పి, నీ హృదయమంతా క్రుమ్మరించి ప్రభువుతో మాట్లాడు. ఫోన్ పట్టుకున్నావంటే గడియారంలో గంటలు మారినా వదలవు కదా? ప్రభువుతో మాట్లాడడానికి ఏమయ్యింది? ఫోన్ ఎంగేజ్ వచ్చినా, సిగ్నల్ లేకపోయినా, కనెక్ట్ అయ్యివరకూ కొడుతూనే ఉంటావు. నీవు ప్రభువుతో మాట్లాడాలంటే? ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడూ నీకెదురవ్వదు. సిగ్నల్ సమస్యగాని, కాల్ వెయిటింగ్ గాని, బ్యాలెన్స్ ప్రాబ్లెమ్ గాని, కాల్ ఎక్స్టెన్షన్ సమస్యగాని ఇట్లాంటివేమీ వుండవు. నేరుగా ప్రభువుతో మాట్లాడవచ్చు. ప్రభువు సిలువలో తన ఆత్మను తండ్రికి అప్పగించిన వెంటనే దేవాలయపుతెర పైనుండి క్రిందికి చినిగిపోయింది. తద్వారా నేరుగా ప్రభుసన్నిధిని సమీపించే అవకాశాన్ని, అర్హతను ఆయన మనకిచ్చారు. ఇక మూడవవ్యక్తితో మనకు సంబంధము లేదు.
నీవే ఆయనతో నేరుగా మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నారు. అబ్రాహాముతో చేసినట్లు నీతో నిబంధన చెయ్యాలని ఆశపడుతున్నారు. దానికి అబ్రాహాము సిద్ధపడ్డాడు. మరి నీవు సిద్దమేనా?

🔅 నిబంధన కృపాసహితమైనది:

నిబంధన అనేది ఇద్దరి వ్యక్తులమధ్య జరిగేది. ఆ నిబంధనలో ఇరుపక్షాల భాగస్వామ్యం వుండితీరాలి. అందుకే పురాతన కాలములో జంతువును వధించి, ఎవరి మధ్య నిబంధన జరగాలో వారిద్దరూ ఆ ఖండముల మధ్యలో నడచిపోయేవారు (యిర్మియా 34:18,19). అయితే, అబ్రాహాము దేవునితో నిబంధన చేసేసమయంలో రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను(ఆది 15: 8-11,17) ఆ ఖండములమధ్యలో అబ్రాహాము నడచిపోలేదు. అంటే దేవుడే ఇక్కడ ఏకపక్షంగా అబ్రాహాముతో నిబంధన చేసాడు. ఇది కృపాసహితమైన నిబంధన. ప్రభువు అక్కడ చేసిన నిబంధననే ఇక్కడ నూతన పరచుచున్నారు. కృపగలిగిన దేవుడు కృపాసహితమైన నిబంధనను అబ్రాహాముతో చేస్తున్నాడు. నీవు కొన్ని స్వంత ప్రయత్నాలు చేసావు. దానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించావు. ఇక నీవు నా సన్నిధిలో నడచుచూ, నిందారహితముగా జీవించు చాలు. ఇక నీవేమి చెయ్యాల్సినపని లేదు. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. అంటూ అబ్రాహాముకు అభయమిస్తున్నారు. అట్టి జీవితాన్ని మనమునూ జీవించగలిగితే, అబ్రాహాముతో నిబంధనచేసి, నెరవేర్చిన దేవుడు, అబ్రాహాము ఆత్మీయ పిల్లలముగా అట్టి నిబంధనకు మనమునూ వారసులము కాగలము.
ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(33వ భాగము)
♻ అబ్రాహాముతో నిబంధనను నూతన పరచుట ♻ (part-4)



అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుదువు. (ఆది 17:3,4)

పదమూడు సంవత్సరాల ఆత్మీయ యెడబాటు అనంతరము కృపగలిగిన దేవుడు తిరిగి అబ్రాహామునకు ప్రత్యక్షతనిచ్చినప్పుడు అతడు సాగిలపడుతున్నాడు. ఇంతకుముందు బలిపీఠము కట్టాడు, ప్రార్ధించాడు. కానీ సాగిలపడే అనుభవం మొట్టమొదటిగా ఇక్కడే చూడగలుగుతున్నాము. ఇప్పుడు అబ్రాహాముగారి వయస్సెంతో తెలుసా? 99 సంవత్సరాలు. సాగిలపడడానికి శరీరం సహకరించే పరిస్థితి ఉండదు. అయినప్పటికీ, దేవుడు యిచ్చిన వాగ్ధాననెరవేర్పులో ఎంత శ్రద్ధగలిగినవాడో ఆయనకు అర్ధమయినప్పుడు సాగిలపడకుండా వుండలేకపోయాడు. అబ్రాహాము సాగిలపడుటలో అనేక ఆత్మీయ సత్యాలను గమనించవచ్చు.

🔅పశ్చాత్తాపము:
దేవుని ప్రత్యక్షత అనుభవించగానే, పదమూడు సంవత్సరాల ఆత్మీయ ఎడబాటుకు కారణం ఏమిటో గుర్తొచ్చింది. ఆయనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక పశ్చాత్తాపముతో సాగిలపడ్డాడు. దేవుడు తన కృప, ప్రేమ, కనికరములతో ప్రత్యక్షమైనప్పుడు అబ్రాహాము పశ్చాత్తాపములోనికి నడిపించబడ్డాడు. తన పాపముపట్ల అసహ్యతనుకలిగి దేవుని కనికరమును తలంచుకొని సాగిలపడుతున్నాడు. ఇట్టి అనుభవం మన జీవితాల్లో వుందా? “దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా?” (రోమా 2:4)

🔅కృతజ్ఞత:
దేవుని ప్రత్యక్షతను అనుభవించి సుదీర్ఘకాలమయ్యింది. ఇతడే వారసుడు అయ్యుండొచ్చేమో అనే తలంపుతో ఇష్మాయేలుతో ఆడుకొంటూ గడిపేశాడుతప్ప, ఆయనకు బలిపీఠం కట్టలేదు. ప్రార్ధించనూలేదు. అయినప్పటికీ, కృపగలిగిన దేవుడు అబ్రాహామును వెతుక్కొంటూ వచ్చాడు. ఇక మాటలు పెగలక కృతజ్ఞతతో ఆయన ఎదుట సాగిలపడ్డాడు. ప్రభువును మనము వెదకలేదు గాని, ఆయనే వెదుక్కొంటూ మనకోసం వచ్చారాయన. “నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను. (లూకా 19:10). కనీసం కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో మోకరించగలవా?

🔅దీనత్వము:
ఆయన ఎంతటి ఉన్నతుడో అబ్రాహామునకు అర్ధమయినప్పుడు, ఈయన ఎంతటి అల్పుడో అర్ధం చేసుకోగలిగాడు తద్వారా ఆయన సన్నిధిలో సాగిలపడుతున్నాడు. తన స్వంత మార్గములో వెళ్లిపోవడం పాపమని గ్రహించి, తన్నుతాను తగ్గించుకొంటున్నాడు. అట్టి దీనత్వం నీలోవుందా? “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.” (మత్తయి 5:3).

🔅ఆరాధన:
పదమూడు సంవత్సరాల క్రితం ఆయన చేసిన నిబంధనను తిరిగి నూతన పరచినప్పుడు, ఆయన ఏమైయున్నాడో అబ్రాహాముకు అర్ధమయ్యింది. ఆయన ఏమైయున్నాడో మనకర్ధమైతే హృదయంలోనుండి ఆరాధన పెల్లుబికి వస్తుంది. దేవుని నిబంధననుండి నేను తొలగిపోయినాగాని, ఆయన చేసిన నిబంధన విషయంలో మాత్రం ఆయన మార్పులేనివాడుగానే వున్నాడు. ఇక అబ్రాహాము ఒక్క మాటకూడా
మాట్లాడలేకపోయాడు. ఆయన ఎంతటి అత్యున్నతుడో అబ్రాహామునకు అర్ధమయినప్పుడు, ఆరాధనతో నిండిన హృదయంతో సాగిలపడుతున్నాడు. ఇట్టి అనుభవం నీకుందా? అసలు ఆయన ఏమైయున్నాడో నీకర్థమయ్యిందా? అర్ధమైతే ఆరాధించకుండా ఉండాలేవు. అర్ధంకాకపొతే జీవితమే వ్యర్ధమవుతుంది.

🔅సిద్ధపాటు:
దేవుడు అబ్రాహామును నూతన సంబంధ బాంధవ్యములోనికి పిలిచినప్పుడు దానికి అబ్రాహాము స్పందనేమిటంటే దానికి సిద్ధముగా ఉండడమే. సాగిలపడి యుండుట దేవుని పిలుపునకు ప్రతిస్పందన. నా సన్నిధిలో నడచుచూ నిందారహితముగా జీవుంచు అనే పిలుపుకు, అబ్రాహాము దానికి ప్రతిస్పందనగా దానికి నేను సిద్దమే అంటూ సాగిలపడుతున్నాడు. ఆయన పిలుపుకు ప్రతిస్పందించగలవా? ఆయన చిత్తానికి తలవంచగలవా? ఆయన సన్నిధిలో నడచుచూ నిందారహితమైన జీవితాన్ని జీవించడానికి నీవు సిద్దమేనా? అయితే, నిత్యమైన ఆశీర్వాదాలు నిన్నే వెతుక్కొంటూ వస్తాయి.

దేవుడు మాట్లాడుతుంటే ఆయనచెప్పే దానిని సాగిలపడి శ్రద్ధగా వింటున్నాడుతప్ప, ఒక్క మాట మాట్లాడలేదు. నీవు అనేక జనములకు తండ్రివగుదువు. (ఆది 17: 4) అని దేవుడు చెప్పినప్పుడు తప్పకుండా అబ్రాహాము దేవునిని ప్రశ్నించాలి. గతకాలంలో కనానును నీ సంతానానికి వాగ్ధానముగా యివ్వబోతున్నాను అన్నప్పుడు, అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియును? (ఆది 15:8) అంటూ సూచనను అడిగాడు. అట్లాంటప్పుడు 99 సంవత్సరాల వయస్సులో నేనెట్లా అనేక జనములకు తండ్రి కాగలను? అని ప్రశ్నించాలి కదా? కానీ, అబ్రాహాముగారు ప్రశ్నించలేదు. ప్రభువు తననుతాను పరిచయం చేసుకొంటూనే నేను సర్వశక్తిగల దేవుడను (ఎల్ షద్దాయ్) అంటూ పరిచయం చేసుకున్నారు. ఇక ఆయన శక్తిని శంకించేప్రయత్నం అబ్రాహాము చెయ్యలేదు. పదమూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత దేవుని ప్రత్యక్షతను అనుభవించడంతో హృదయమంతా తన్మయంతో నిండిపోయి, ఆరాధనా భావంతో మిన్నకుండిపోయాడు అబ్రాహాము.

అబ్రాహాము ఒక్క కుమారుని కొరకు దేవుని నిబంధననుండి తొలగిపోయాడు. దేవుడేమో అనేక జనములకు తండ్రిని చేస్తానంటున్నారు. మనిషి యొక్క తలంపులకు, దేవుని యొక్క తలంపులకు ఎంతటి వ్యత్యాసం? నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి (యెషయా 55:8,9) అవును మనమెప్పుడూ ఆయన ఎంతటి అత్యున్నతుడో మనకు అర్ధంకాక, ఏవో అశాశ్వతమైన, చిన్న చిన్న వాటికోసం ప్రాకులాడాతాము తప్ప, దేవుని అత్యున్నత ప్రణాళికను అర్ధం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాము. మనము కోరుకున్న వాటికొరకు కాదుగాని, ఆయన మనకు ఏమివ్వబోతున్నాడో ఎదురు చూచే జీవితాలను మనము కలిగియుండాలి. “తన షాప్ కి వచ్చిన ఒక బాబుని చూచిన షాప్ ఓనర్ నీకెన్ని చాకోలెట్స్ కావాలో తీసుకో అంటే, ఆ బాబు మీరే ఇవ్వండి అంకుల్ అంటాడు. బాబు విధేయతకు అతనికి ముద్దొచ్చి అతని చేతికి వచ్చినన్ని చాకోలెట్స్ తీసి ఇస్తాడు. ప్రక్కవాళ్ళు నీవే తీసుకోవచ్చు కదా? ఆయననే ఎందుకిమ్మన్నావ్? అని అడిగితే, వివేకము కలిగిన అబ్బాయి నాది చిన్న చేయికదా నేను తీసుకుంటే రెండో మూడో వస్తాయి. ఆయనది పెద్ద చెయ్యి, అదే ఆయనే ఇస్తే చాలా వస్థాయికదా అందుకు అన్నాడట.” ఇట్లాంటి వివేకాన్ని మనమునూ కలిగియుంటే, ప్రభువునుండి పట్టజాలని ఆశీర్వాదాలను అనుభవించగలము.

అబ్రాహాముగారు దేవుని శక్తిని అర్ధం చేసుకోవడంలో పూర్తిగా సఫలీకృతుడయ్యారు. ఇకనుండి దేవునికి వ్యతిరేకంగా ఒక్క తప్పిదము చేసినట్లు కూడా కనబడదు. అంచెలంచెలుగా విశ్వాసంలో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ గమ్యం వైపు సాగిపోతున్నాడాయన. దేవుడు “నీవు అనేక జనములకు తండ్రివగుదువు” అని వాగ్ధానము చేసినట్లుగానే, ఆ వాగ్ధాన ఫలమును అబ్రాహాము అనుభవించారు. అనేక జనములు అనగా ఇష్మాయేలు, ఇస్సాకు, కెతూరా కుమారుల సంతానమువారికి ( ఆది 16:10; 17:19; 25:1-4). యూదులకు, ముస్లింలకు, క్రైస్తవులకు కూడా తండ్రిగానే ఆయన పిలువబడుతున్నాడు. అట్టి ధన్యత అబ్రాహాముగారికి మాత్రమే సాధ్యమయ్యింది. అది ఆయన గొప్పతనం అనడం కన్నా, దేవుడు ఆయనను ఆరీతిగా గొప్పచేసాడు అనడం సమంజసం. ఇదంతా మార్పులేని సర్వశక్తుడైన దేవుని వాగ్ధాన నెరవేర్పు. మన విషయంలో కూడా ఆయన వాగ్ధాన నెరవేర్పులో ఎప్పుడూ తప్పిపోయేవాడు కాదు. అయితే, నిందారహితమైన జీవితాన్ని జీవిస్తూ, వాగ్ధాన ఫలాలను స్వతంత్రించుకొనుటకు ప్రయాసపడదాం!
ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(34వ భాగము)
♻ అబ్రాహాముతో నిబంధనను నూతన పరచుట ♻ (part-5)


🔅 అబ్రాహాము, శారాయిల పేర్లను మార్చిన దేవుడు:
మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. (ఆది 17:5) మరియు దేవుడునీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా (ఆది 17:15).

దేవుని ప్రత్యక్షతను అనుభవించిన అబ్రాహాము, తన్ను తాను దేవునికి అప్పగించుకొని, ఆయనకు సాగిలపడ్డాడు. హృదయాంతరంగమును యెరిగిన దేవుడు, అబ్రాహాముతో చేసిన నిబంధనను నూతన పరిచేదానిలో భాగముగా వారికి నూతనమైన పేర్లను పెట్టుచున్నారు. తలిదండ్రులు వారికి పెట్టినపేర్లు, అబ్రాము అనగా “ఘనత పొందిన తండ్రి” అనియూ, శారాయి అనగా “గయ్యాళి లేదా జగడగొండి” అనియూ అర్ధము. అబ్రాహామునకు సంతానమే లేరు. అట్లాంటప్పుడు “ఘనత పొందిన తండ్రి” ఎట్లా కాగలడు? దానికి అర్ధమే లేదు. శారాయి వాస్తవానికి విధేయురాలిగానే తన జీవితాన్ని కొనసాగించింది. హాగరు విషయంలో మాత్రం సార్ధక నామధేయురాలయ్యింది. అయితే, దేవుడు వారి పేర్లను నూతన పరచుచున్నాడు. అబ్రాహాముతో నీవు ఘనత పొందిన తండ్రివిగానే కాకుండా, అనేక జనములకు తండ్రివిగా ఉంటావని, శారాయి రాజకుమారిగా వుండబోతుందని వారి పేర్లను స్థిరపరచుచున్నారు. . అబ్రాహాము అనగా “అనేక జనములకు తండ్రి” అనియు, శారాయి అనగా “రాజకుమారి” అనియు అర్ధము. అయితే, దేవుడు వారి పేర్లను మార్చారు కాబట్టి, వారి జీవితాలు మారాయా? అట్లా కానేకాదు. వారి జీవితాలు మారాయి కాబట్టి వారి పేర్లు మార్చబడ్డాయి.

🔅అబ్రాహాము, శారాయిల జీవితాలలో మార్పుకు నిదర్శనమేమిటి?

అబ్రాహాము తాను ప్రత్యక్షమైన దేవునికి లోబడి, ఆయన సన్నిధిలో నడచుచూ, నిందారహితుడుగా జీవించడానికి సిద్దపడుచూ సాగిలపడ్డాడు. గతకాలములో తాను చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడ్డాడు. ప్రత్యక్షమైన దేవునికి కృతజ్ఞత చూపాడు. ఆయన ఏమైయున్నాడో గుర్తెరిగి ఆయనను ఆరాధించాడు. తన్నుతాను తగ్గించుకొని, ఆయన చిత్తానుసారముగా జీవించడానికి సిద్ధపడ్డాడు.

శారాయి అనే పేరుకు తగినట్లు హాగరు విషయంలో గయ్యాళిగానే ప్రవర్తించింది. ఆమె హాగరును ఎంతగా శ్రమపెట్టిందంటే, ఇంట్లోనుండి పారిపోయేటంతగా శ్రమపెట్టింది. ఇంతటితో చరిత్ర ముగిసిపోలేదు. హాగరు పారిపోవడం, యెహోవా దూత ప్రత్యక్షతకులోబడి, యజమానురాలిదగ్గరకు తిరిగి రావడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో హాగరు అంటే శారాయి మరీ లోకువ. అయితే, తిరిగి వచ్చిన హాగరును శ్రమపెట్టడం కాదుకదా, కనీసం ఆమెను బాధించే ఒక్కమాటకూడా అనినట్లు పరిశుద్ధ గ్రంధములో మనకు కనబడదు. ఇష్మాయేలు జన్మించినతర్వాత కూడా వారంతా కలసి, అబ్రాహాము గుడారములోనే జీవించారు. దానికి శారాయి ఒప్పుకొనకపోతే, అసలు అట్లా జీవించే అవకాశమేలేదు. ఇది మార్పునొందిన శారాయి జీవితానికి గొప్ప నిదర్శనం. ఇట్లా మార్పునొందిన వారి జీవితాలను బట్టియే, వారి పేర్లు మార్చబడ్డాయిగాని, దేవుడు వారి పేర్లను మార్చడం వలన వారిజీవితాల్లో మార్పురాలేదని గమనించగలము.

నేటి దినాలలో మనంకూడా బాప్తీస్మం అనంతరం పేర్లు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాము గాని, మన తీరు మార్చుకోవడానికి మాత్రం ఇష్టపడడంలేదు. తీరు మారకుండా పేరు మారినంతమాత్రాన ఫలితం శూన్యం. అంతేకాకుండా అది దేవుని ఘనమైన నామమునకు అవమానకరముగాని, మహిమకరమెంతమాత్రమూ కాదు. మా ఇంటి ప్రక్కనే బ్రాందీషాపు వుంది. పరిశుద్ధ గ్రంథములోని భక్తులంతా అనునిత్యమూ అక్కడే దర్శనమిస్తుంటారు. అదెంతటి అవమానం? ఒకవేళ అంతటి గొప్ప భక్తులు కావాలనే ఉద్దేశ్యంతో తలిదండ్రులు ఆ పేరు పెట్టారేమో? నీ తీరు మార్చుకొని, ఆ పేరుకు సార్ధకత నీవెందుకు చేకూర్చకూడదు? యోసేపు అనే పేరు పెట్టుకొని వ్యభిచార గృహాలచుట్టూ తిరిగితే అదేనా ఆ పేరుకు నీవు చేకూర్చే ఘనత? ఒకరోజు పేపర్ చదువుతున్నాను. నేరం చేసి పట్టబడిన వ్యక్తిని బేడీలు బిగించి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అతని చేతిమీద జాన్ అని పెద్ద అక్ష రాలతో పచ్చాబొట్టు వుంది, దానిని జూమ్ చేసి మరీవేసారు. ఇట్లాంటి సంఘటనలు కోకొల్లలు. పేరు మారకున్నా తీరు మార్చుకుంటే ధన్యకరము.

లోక చరిత్రను పరిశీలన చేస్తే, ఎంతో మంది గొప్ప వ్యక్తులు పుట్టారు. సామ్రాజ్యాలను స్థాపించి చక్రవర్తులుగా చలామణి అయ్యారు. వారి రాజ్యాలు వారితోపాటే కాలగర్భంలో కలసిపోయాయి. అబ్రాహాము శారాల కీర్తి మాత్రం పతాకస్థాయికి చేరింది. వారి సంతానం దినదినమూ విస్తరిస్తూనే వుంది. దానికి అంతం లేదు. ఈలోకం ఉనికిలో నున్నంతవరకూ వారి కీర్తి అట్లానే నిలచియుంటుంది. కారణం? అబ్రాహాము పేరు మాత్రమేకాదు. ఆయన తీరు మారింది. అనేక జనములకు తండ్రిని చేస్తానన్నాడని ఆ ఘనతకు ఎదురుచూచినవాడు కాదుగాని, “ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను” (హెబ్రీ 11:10). దానితో ఆయన స్థాయి మారింది. “నీవు మా మధ్యను మహారాజవై యున్నావు”; (ఆది 23:5) అంటున్నారు హేతు కుమారులు.

ప్రియవిశ్వాసి! నీ నూతనమైన పేర్లనుకాదుగాని, నీ నూతన జీవితాన్ని చూడాలని ఆయన ఆశపడుతున్నారు. నూతనమైన పేరు పెట్టుకోవడం తప్పేమికాదుగాని, పేరుకుతగిన పరిశుద్ధ జీవితం జీవించకపోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే. సరిచేసుకుందాం! జీవితానికి సార్ధకత చేకూర్చుకుందాం!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(35వ భాగము)
♻ అబ్రాహాముతో నిబంధనను నూతన పరచుట ♻ (part-6)


🔅దేవుడు తన నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచుట:

సంతాన విషయంలో ముందుగానే దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసాడు. మరలా దానిని నూతనముగా, నిత్యనిబంధనగా స్థిరపరచుచున్నారు. నిబంధన అబ్రాహామునకు మాత్రమే పరిమితం కావొచ్చేమోగాని, నిత్యనిబంధన ఆయన సంతానమునకు కూడా తరతరములూ చెందుతుంది. ఈ ఒక్క అధ్యాయములోనే (ఆది 17వ ఆధ్యా) నిబంధన అనే పదము పదిసార్లు (ఆది 17: 2,3,7,9,10,11
,13,14,19,21) ప్రస్తావించబడగా, నిత్యనిబంధన అనే పదము మూడుసార్లు (ఆది 17:7,13,19 ) ప్రస్తావించబడింది. దీనిని బట్టి నిబంధన, నిత్యనింబంధన విషయంలో ఇవి ఎంతటి ప్రాముఖ్యమైన మాటలో గ్రహించగలము.

నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.(ఆది 17:6-8)

ఈ నిబంధన చేసేటప్పటికి అబ్రాహాము వయస్సు 99 సంవత్సరాలు. అప్పటికి ఇంకా వాగ్ధాన పుత్రుడు జన్మించలేదు. అయితే, దేవుడు నీ సంతానమును అత్యధికముగా వృద్ధిచేస్తాను. జనములు, రాజులు నీలోనుండి వస్తారని నిబంధన చేస్తున్నారు. అంటే అబ్రాహాము సంతానమునుండి జనములు వస్తారు. ఎందుకంటే అబ్రాహాము అనే మాటకు “అనేక జనములకు తండ్రి” అని అర్ధము. ఆ జనములను పరిపాలించే రాజులుకూడా నీలోనుండే వస్తారు. దానికి కారణమేమిటంటే, అబ్రాహాము మూలాలు వారిలో తప్పక ఉంటాయి, అబ్రాహామువలే వారుకూడా దేవునిపట్ల విధేయత కలిగి, దేవుని క్రమము చొప్పున రాజ్యపాలన చేస్తారని. అట్టిరీతిగానే, అనేకమంది రాజులు వచ్చారు. వీరు దేవునికి విధేయత చూపనప్పుడు అన్యరాజులచేత పరిపాలించబడ్డారు, వారి చెరలోనికి వెళ్లారు కూడా. ఇశ్రాయేలు రాజులేకాకుండా, ఇష్మాయేలు ద్వారా పండ్రెండుమంది రాజులు ఉద్భవించారు. అన్నింటికంటే ముఖ్యముగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసు క్రీస్తు శరీరధారిగా అబ్రాహాము సంతానము ద్వారానే ఈలోకానికి ఏతెంచారు. (మత్తయి 1:1; గలతి 3:16)

“నీకు దేవుడనై వుంటాను” అనే వాగ్ధానము ఈ నిబంధనలో అత్యంత ప్రాముఖ్యమైన అంశము. ఇది కనానును నిత్య స్వాస్థ్యముగా యిస్తాను అనే వాగ్ధానముకంటే ఎన్నోరెట్లు గొప్పది. ఎంతో ఆస్థి సంపాదించడం కంటేకూడా, నిజదేవుడు మన దేవుడుగా కలిగియుండడమే గొప్ప సంగతి. దేవుడు ఇదే విషయాన్ని మరొకసారి పునరుద్గాటిస్తున్నారు. “ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే” (యిర్మియా 31:31-33)

అబ్రాహామునకు ఇవ్వబడిన వాగ్ధానము, ఆయన ఆత్మీయ పిల్లలముగా మనకునూ ఇవ్వబడింది. అయితే, నేటి మన దయనీయమైన స్థితి ఏరీతిగావుందంటే అన్ని వున్నాయి “ఆయన తప్ప”. అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. (2 కొరింథీ 6:16) ఇదెప్పుడు సాధ్యమంటే? అవిశ్వాసులతో జోడిగా వుండకుండా, లోకమునుండి ప్రత్యేకింపబడినప్పుడు మాత్రమే. అట్లాఅని అవిశ్వాసులతో మాట్లాడకూడదని కాదుగాని వారి తలంపులలోగాని క్రియలలోగాని చేరకూడదని. ఎందుకంటే? పౌలుగారు ఐదు ప్రశ్నలను సంధిస్తున్నారు. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? క్రీస్తునకు బెలియాలు(సాతాను) తో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? (2 కొరింథీ 6:14-16) అందుచే వారినుండి ప్రత్యేకింపబడితే, ఆయన మనకు దేవుడుగా ఉంటాడు. మనము ఆయనకు ప్రజలముగా ఉంటాము. తద్వారా నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవించగలము. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.( కీర్తనలు 33:12). లోకంతో స్నేహం దేవునితో వైరం. తద్వారా ఆయన మనకిచ్చిన శ్రేష్టమైన శాశ్వతమైన వాగ్ధానాలకు పూర్తిగా దూరమైపోతాము.

పరిశుద్ధ గ్రంధము చివరిలో కనిపించే అతి శ్రేష్టమైన అంశాలలో ఇదొకటి. “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు” (ప్రకటన 21:3,4). ఈ మాటలు చదువుతుంటేనే కృంగిన మన హృదయాలకు ఎంతటి నెమ్మది? హృదయం తన్మయంతో నిండిపోతుంది. వర్ణించడానికి బాషచాలని అనుభూతి కలుగుతుంది. ఇక అది మన అనుభవంలోనికివస్తే? జీవితం ధన్యమే కదా? ఇశ్రాయేలు ప్రజలకు కనాను నిత్యస్వాస్థ్యముగా వాగ్ధానము చేయబడిందిగాని, మనకైతే పరమకనాను అనబడే పరలోకపట్టణము నిత్యస్వాస్థ్యముగా వాగ్ధానము చేయబడింది. ఇదెప్పుడు స్వతంత్రించుకోగలమంటే సజీవుడైన నిజ దేవుని మాత్రమే మనము దేవునిగా కలిగియున్నప్పుడు. ఇదే జరిగితే, ఇహమందునూ పరమందునూకూడా అన్నింటికంటే శ్రేష్టమైన, శాశ్వతమైన మేలు పొందినవారము కాగలము.

ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(36వ భాగము)
♻ అబ్రాహాముతో నిబంధనను నూతన పరచుట ♻ (part-7)


🔅సున్నతి 🔅
సున్నతి అనేది శరీరమందు నిత్యనిబంధనగా వుండేందుకు దేవుడు విధించిన నిత్యమైన కట్టడ. ఈ నిబంధన అబ్రాహాముతోనే ప్రారంభమయ్యింది. అబ్రాహాము ఇంటపుట్టిన ప్రతీ మగవాడు, వెండిపెట్టి కొనబడిన ప్రతీదాసుడూ విధిగా ఈ నిబంధన ఆచరించాలి. దాసుడు సహితం, ఈ కట్టడను ఆచరించుటద్వారా అబ్రాహామునకు వారసుడవుతాడు.

నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టి వేయ బడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను. (ఆది 17: 10-14) దేవుడు ఆజ్ఞాపించిన రీతిగానే, అబ్రాహామును, ఇష్మాయేలును, తన ఇంటనుండిన దాసులలో ప్రతీవాడును ఒకే దినమందు సున్నతి చేయబడెను. అప్పటికి అబ్రాహాము వయస్సు 99 సంవత్సరాలుకాగా, ఇష్మాయేలు వయస్సు 13 సంవత్సరాలు. పాతనిబంధనా కాలంలో “సున్నతిని” అత్యంత ప్రాముఖ్యమైన కట్టడగా దేవుడు యెంచాడు. సున్నతిని నిర్లక్ష్యం చేసినవాడు జనములలోనుండి కొట్టివేయబడతాడు. అంటే మరణమునకు పాత్రుడు. ఒకానొక దినాన్న దేవుడు మోషేను చంపజూచాడట (నిర్గమ 4:24). ఎందుకు మోషేమీద దేవునికి అంతటికోపం రగులుకొంది? అతడు అతని కుమారునికి సున్నతి చేయించలేదు. తద్వారా తన భార్యయైన సిప్పోరా కుమారునికి సున్నతి చేసి, మోషే ప్రాణమును కాపాడగలిగింది. దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చు దేవుడు ఈ నిబంధనకిచ్చిన ప్రాముఖ్యత ఎంతో?

🔅 “సున్నతి” ద్వారా అవమానము దొరలింపబడెను.
ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడిన ఇశ్రాయేలీయులు వాగ్ధానభూమికి తిరిగివస్తూ, యొర్దాను దాటి గిల్గాలులో ప్రవేశించారు. అయితే వీరి అరణ్య యాత్రలో సున్నతి జరుగలేదు. కావున దేవుడు యెహోషువాకు ఆజ్ఞాపిస్తున్నారు వారందరికీ సున్నతి జరిగించమని. వారందరూ ఆ దినాన్న సున్నతి చేయబడ్డారు. తద్వారా ఐగుప్తు అవమానం వారి మీదనుండకుండా దేవుడు దొరిలించివేసారు. అంటే వారు ఎత్తైన (ఉన్నత) స్థలములోనున్నారు. వారి అవమానము దొరలుకొంటూ క్రిందికి వెళ్ళిపోయింది. గిల్గాలు అనగా “దొరలింపబడుట” అని అర్ధము.
“అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహోషువతోననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గాలను పేరు.” (యెహోషువ 5:9)

🔅దేవుడు సున్నతి ఎనిమిదవ దినముననే చేయించమని ఎందుకు చెప్పారు?

ఆయన ఎనిమిదవ దినముననే చేయించమని ఎందుకు చెప్పారో తెలియదుగాని, ఇటీవల కాలంలో దానికొక శాస్త్రీయమైన కారణాన్ని కనుగొన్నారు. మనిషికి గాయమైనప్పుడు రక్తం బయటకి పోకుండా, రక్తం గడ్డకట్టడానికి “K విటమిన్” తోడ్పడుతుంది. ఆ విటమిన్ లోపిస్తే గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టక ప్రాణాన్ని కోల్పోతారు. అయితే, శిశువు జన్మించిన ఎనిమిదవ రోజునుండే ఈ
K విటమిన్ ఉత్పత్తికావడం ప్రారంభిస్తుందట. తద్వారా, సున్నతి చేసినప్పటికీ రక్త స్రావం జరుగదు. సైన్సు అంతా పరిశుద్ధ గ్రంధములో దాగివుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.


🔅యేసు క్రీస్తు సున్నతి పొందారు కదా, అయితే క్రైస్తవులెందుకు పొందరు?
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను (మత్తయి 5:17,18). యేసు క్రీస్తు ధర్మశాస్త్రమును నెరవేర్చేవాటిలో భాగంగా ఆయన సున్నతి పొందారు. సిలువ మరణము ద్వారా సంపూర్తిగా ధర్మశాస్త్రము నెరవేర్చబడింది. ధర్మశాస్త్రము పాపము అంటే ఏమిటో చెప్పింది. నీవు పాపివని శిక్షను ఖరారు చేసింది. కానీ, ఆ శిక్షనుండి విడిపించలేకపోయింది. క్రీస్తు కృప సిలువ మరణము ద్వారా ఆయన రక్తాన్ని విమోచనా క్రయధనముగా చెల్లించుటద్వారా ధర్మశాస్త్రము విధించే శిక్షనుండి మనలను విమోచించింది. ఇప్పుడు క్రైస్తవులు ధర్మశాస్త్రము క్రింద లేరు. క్రీస్తు కృప క్రిందనే జీవిస్తున్నారు. కావున ధర్మశాస్త్ర క్రియలు అనుసరించాల్సిన అవసరత ఎంతమాత్రమూ లేదు. అట్లా చెయ్యడంద్వారా క్రీస్తు కృపనుండి తొలగిపోతారు. అందుచే క్రైస్తవులు సున్నతి కట్టడను అనుసరించరు. అనుసరించాల్సినపనిలేదు. క్రైస్తవులు అనుసరించాల్సినది హృదయ సున్నతి తప్ప, శారీరిక సున్నతి కాదు.

🔅హృదయ సున్నతి:
సున్నతి అంటే ఒక నూతన మైన వ్యక్తిగా మార్చబడుట (గలతి 6:15). సున్నతి అనేది అక్షరార్ధము కాదు. అది హృదయసంబంధమై, ఆత్మయందు జరిగేదిగా ఉండాలి. హృదయ సున్నతి అనగా “మారుమనస్సు”. బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు. (రోమా 2:28,29). పాతనిబంధన కూడా సున్నతి హృదయ సంబంధమైనదేనని స్పష్టం చేస్తుంది. కాబట్టి మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని యికమీదట ముష్కరులు కాకుండుడి (ద్వితీ 10:16). ముష్కరత్వం అనగా, దేవుని వాక్యానికి విధేయత చూపని మూర్కత్వం.

🔅 క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన యూదుడు:
అక్షరార్ధముగా, శారీరికంగా మనము యూదులు కాకపోవచ్చుగాని, జన్మమువలన మనము ఆత్మ సంబంధమైన యూదులమయ్యాము. అదెట్లా? మారుమనసు, పాప క్షమాపణ, బాప్తీస్మము ద్వారా తిరిగి నూతనముగా జన్మించుటద్వారా నిజమైన, ఆత్మీయమైన యూదులమయ్యాము. “మనము జన్మమువలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మ శాస్త్రసంబంధ మైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము; ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా”. ( గలతీ 2:15,16).

🔅చేతులతో చేయబడని సున్నతి గలవాడు క్రైస్తవుడు:
యూదుడు చేతులతో చేయబడిన సున్నతి గలవాడు. కానీ క్రైస్తవుడు అట్లాంటి వాడు కాదు. శరీర కార్యములను విసర్జించాలి (గలతీ 5;19-21) బాప్తీస్మము ద్వారా ఆయనతో పాతిపెట్టబడాలి. ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడ లేపబడాలి. “మీరును, క్రీస్తు సున్నతియందు, శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి”. (కొలస్సి 2:11,12). దీనా కొరకు ఊరంతా సున్నతి చేయించుకున్నట్లు (ఆది 34వ ఆధ్యా ) మనుషులకోసం సున్నతినిని ఆచరించకూడదు. దాని ఫలితం అందరూ కత్తివాత మరణించారు. అట్లానే ఆత్మీయ సున్నతి కూడా ఆస్థులు అంతస్థులకోసం, భౌతికమైన ఆశీర్వాదాలకొరకైనదిగా వుండడానికి వీల్లేదు. పరలోక సంబంధమైన నిత్యమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకొనేదిగా వుండాలి.
ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(37వ భాగము)
♻ అబ్రాహాముతో నిబంధనను నూతన పరచుట ♻ (part-8)


🔅ఇస్సాకు పుట్టుకను గురించిన వాగ్ధానము స్థిరపరచుట: 🔅

శారా అంటే రాజకుమారి అని అర్ధము. అబ్రాహాముతో నీ గర్భవాసమున వారసుడు జన్మిస్తాడని దేవుడు చెప్పారు. అది హాగరు ద్వారానేమో అనే సందేహం అబ్రాహాములో ఇంతవరకూ వుంది. ఇప్పుడు అతని సందేహాన్ని నివృత్తి చేస్తూ దేవుడు స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. “నీ భార్యయైన శారా ద్వారానే నీకు కుమారుడు జన్మిస్తాడు”. ఆమె జనములకు తల్లియై యుండును. జనములు, రాజులు ఆమె వలన కలుగుతారు. పుట్టబోయే బిడ్డకు పెట్టాల్సిన పేరు, అతడు ఎప్పుడు జన్మించబోయేది కూడా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇస్సాకు అనుపేరుకు “నవ్వు” అనిఅర్ధము. నిజంగా వృద్ధ్యాప్యంలోనున్న వారి తలిదండ్రులకు నవ్వు కలుగజేసినవాడిగానే ఇస్సాకు వున్నాడు. ఇస్సాకు పుట్టుకను సంవత్సర కాలము ముందే వారికి తెలియజేయబడడం ద్వారా, ఇస్సాకును ఏరీతిగా పెంచాలి అనే విషయాన్ని నిర్ణయించుకోవడానికి వారికి తగినంత సమయమివ్వబడింది. ఎందుకంటే, ఇప్పుడు అడవి గాడిద వంటి స్వభావము కలిగిన ఇష్మాయేలును పెంచుతున్నారు. వారి పెంపకంలో పెరుగుతున్నప్పటికీ, వారు ఆశించిన రీతిగా పెరగడం లేదు. ఎందుకంటే అతని స్వభావమే అడవి గాడిదవంటి స్వభావము. అతని పెంపకం ద్వారా అనేకమైన పాఠాలు తప్పక నేర్చుకొని వుంటారు. అయితే, వాగ్ధాన పుత్రుని దేవుని కొరకు ఏరీతిగా పెంచాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఈ సంవత్సర కాలము వారికి సరిపోతుంది.

🔅 అబ్రాహాము తాత్కాలిక తడబాటు:

అబ్రాహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అను కొనెను. (ఆది 17:17)
విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము విశ్వాసం తాత్కాళిక తడబాటు చెందింది. బహుశా ఆనందం కారణముగా నమ్మలేకపోయి వుండవచ్చు. యేసు క్రీస్తు పునరుత్తానం చెంది, శిష్యులకు కనబడినప్పుడు, వారు సంతోషముచేత నమ్మలేకపోయారు (లూకా 24: 41). అదేసమయంలో దేవునిపై విశ్వాసముంచిన వారందరిలో నమ్మకంతో పాటు, అపనమ్మకం కూడా కలసివుంటుంది. మూగ దయ్యం పట్టినవాని తండ్రిని, యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను. దానికతడు నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను. ( మార్కు 9:24) అంటే నమ్ముతున్నాడు. అదే సమయంలో ఆ నమ్మకంతో అపనమ్మకమూ కలసివుంది.

🔅నిబంధన గొప్పదా? ఆశీర్వాదము గొప్పదా?

అబ్రాహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము (ఆది 17:18)‬. అని ప్రార్ధించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుని దగ్గరనుండి సమాధానమును పొందుకున్నాడు. అయితే ఇష్మాయేలును గురించి ప్రార్ధిస్తే, దానికి సమాధానముగా మొదట ఇస్సాకుతో నిబంధన చేస్తానని చెప్పి, ఆ తర్వాత ఇష్మాయేలును ఆశీర్వదిస్తానని చెప్పారు. ఇస్సాకుతో నిబంధన. ఇష్మాయేలుకు ఆశీర్వాదం. ఏమిటీ నిబంధనకును, ఆశీర్వాదమునకును వున్న వ్యత్యాసం? నిబంధన అనేది ఇద్దరిమధ్య జరిగేది. ఇస్సాకుతో దేవుడు నిబంధన చేస్తున్నారంటే, ఒక ప్రత్యేకమైన పనిలో ఇస్సాకు, దేవుడు ఇద్దరూ భాగస్వాములుగానున్నారు. అంటే, వారిద్దరిమధ్య సహవాసం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అంతేకాకుండా, ఇస్సాకు ఆ నిబంధన నెరవేర్చగలిగితే తప్పకుండా ఆశీర్వదించబడతాడు. సందేహం లేనే లేదు. అయితే ఆశీర్వాదము అనేది ఏకపక్షంగా దేవుడిచ్చేది. ఇక్కడ ఆశీర్వదించబడిన వ్యక్తి నిబంధలో తప్పక వుండే అవకాశంలేదు. అందుచే ఆశీర్వాదము కంటే, దేవునితో సహవాసం కలిగియుండే నిబంధనే ఎంతో గొప్పది. అట్టి నిబంధనకు ఇస్సాకు పాత్రుడయ్యాడు. ‬‬

మన జీవితాలెట్లా వున్నాయి? ప్రభువుతో నిబంధనలో వుండడానికి యిష్టపడుతున్నామా? లేక ఆశీర్వాదాల కొరకుమాత్రమే ప్రాకులాడుతున్నామా? ఆశీర్వాదాల కొరకేకదా? అవును. మన బోధకులు బోధించే బోధకూడా ఆశీర్వాదాలకే పరిమితమవుతుంది. చివరికి కోర్ట్ కేసులు కొట్టివేయబడాలంటే ప్రభువును నమ్ముకోండి అంటూ ప్రకటించే దయనీయమైన స్థితికి చేరింది మన బోధ. Prosperity gospel పేరుతో వారి property ని పెంచుకొంటున్నారు. దాని కొరకే మనము కూడా ఎదురుచూస్తున్నాము తప్ప “పాపము, పశ్చాత్తాపము” అని బోధిస్తే మనకు పడదు. అయితే, పాపమంటే ఏమిటో తెలియాలి, దానికి పశ్చాత్తాప పడాలి. అప్పుడు మాత్రమే ప్రభువు యొక్క నిబంధనలోనికి నీవు ప్రవేశిస్తావు. ఆయనతో సహవాసం చేయగలుగుతావు. ఎప్పుడైతే ఆయన నిబంధనలో వుంటూ ఆయనతో సహవాసం చెయ్యడం ప్రారంభిస్తావో, ఇక ఆశీర్వాదాలకొరకు వెంటపడాల్సిన పనిలేదు. ఆశీర్వాదాలే నీవెంటపడి నిన్ను తరుముతాయి.

🔅 అబ్రాహాము విధేయత:
దేవుడు అబ్రాహాముతో నిబంధనను నూతన పరచి పరమునకు వెళ్లిన దినముననే, అబ్రాహాము సున్నతి కట్టడను ఆచరించడంద్వారా దేవుని మాటకు ఆయన ఎంతటి విధేయుడో అర్ధం చేసుకోవచ్చు. సున్నతి అనేది సరికొత్త విధానం. అది ఎవరితో చెప్పడానికైనా సిగ్గుపడే పరిస్థితి, అది బాధతో కూడినది, ప్రాణహాని జరిగినా జరుగవచ్చు. పురుషులందరూ ఒకే దినాన్న సున్నతి చేయించుకొనుటద్వారా అబ్రాహామునకు శత్రువులు ఎవరైనా వుంటే, వారు దాడి చేసి సులభముగా వీరిని వశపరచుకోవచ్చు. దీనా అన్నలు ఇట్లానే చేశారు. అయితే, అబ్రాహాము మదిలో ఇట్లాంటి ప్రశ్నలేమీలేవు. దేవుడు చెప్పినది చెప్పినట్లు చెయ్యడం తప్ప. యాకోబులా స్వంత పద్ధతులు ఉపయోగించే ప్రయత్నం చెయ్యలేదు. అన్నయైన ఏశావు ఎదుర్కొన వస్తున్నాడని తెలిసి, యబ్బోకు రేవు దాటిన తర్వాత మొదటగా దాసీలను వారిపిల్లలను, కొంచెం ఎడమ వుంచి తన భార్యయైన లేయాను వారిపిల్లలను, చివరిగా తాను ఎక్కువగా ప్రేమించిన రాహేలును ఆమె పిల్లలను వుంచుతాడు. అంటే అందరిని తన అన్ని చంపేసినా చివరిగానున్న రాహేలు తన కుమారుడు ఎదో విధంగా తప్పించుకుంటారనే అభిప్రాయం కావొచ్చు. అబ్రాహాము ఇట్లా తలంచలేదు. మొదట దాసులకు సున్నతి చేపించి వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో గమనించాక, అప్పుడు తాను తన కుమారుడు సున్నతి చేపించుకోవచ్చని. అబ్రాహాము చేసిందేమిటంటే తనతో ప్రారంభించాడు. తర్వాత తన కుమారుడైన ఇష్మాయేలుకు, తర్వాత తన ఇంతపుట్టిన కుమారులకు అనగా దాసులకు, వారి కుమారులకు, చివరిగా వెండితో కొనబడిన దాసులకు. వీరందరూ ఒకే దినమున సున్నతి పొందారు. ఇక్కడ అబ్రాహాముగారి జీవితమునుండి ఒక విలువైన ఆధ్యాత్మికమైన పాఠాన్ని మనము నేర్చుకోవాలి అదేమిటంటే, అబ్రాహాము మొదటగా దేవుని కట్టడలను, ఆజ్ఞలను అతను గైకొంటున్నాడు. తర్వాత అతని ఇంటివారికి, తర్వాత బయటివారికి వాటిని వర్తింపజేస్తున్నాడు. దీనికి పూర్తి విరుద్ధంగా వున్నాయి మన జీవితాలు, మనము, మన కుటుంబాలు ఆయన ఆజ్ఞలు అనుసరింపము. ఇతరులకు మాత్రం బోధిస్తాము. సువార్త శక్తిని మొదటగా మనము అనుభవించాలి, తర్వాత మన కుటుంబానికి అన్వయింపజేయాలి, చివరిగా లోకములోనికి వెళ్ళాలి. మనమేమో లోకంతో ప్రారంభిస్తున్నాము మొదట రెండింటిని గాలికొదిలేశాము. తద్వారా మనకొక సాక్ష్యం లేదు. మన సువార్తకు ప్రతిఫలంలేదు. అబ్రాహాము తనతోనే ప్రారంభించాడు. నేడు మనము కూడా మనతోనే ప్రారంభిద్దాము. రాబోయేదినాల్లో విస్తారమైన పంటను కోద్దాము!
ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(38వ భాగము)
♻ అబ్రాహాము దేవదూతలకు ఆతిధ్యమిచ్చుట ♻ (part-1)


సాధారణముగా మనము వేరే పనిమీద వెళ్తున్నప్పటికీ, మధ్యలో మనకు అత్యంత సన్నిహితులైనవారి గృహాలమీదుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు వారిని పరామర్శించి వెళ్లడమనేది సహజం. అట్లానే, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చెయ్యాలని బయలుదేరిన సందర్భంలో దారిలోనున్న అబ్రాహామును పలకరించి వెల్దామన్నట్లుగా అబ్రాహాము దగ్గరకు వచ్చిన సందర్భమిది. దేవుడే అబ్రాహామును పలకరించి వెళ్లాలనుకున్నారంటే దేవునికి, అబ్రాహాము ఎంతటి సన్నిహితుడయ్యాడో అర్ధం చేసుకోవచ్చు. ఆ సాన్నిహిత్యమే దేవునికి, అబ్రాహాము స్నేహితుడయ్యేటట్లు చేసింది.

దేవుడు అబ్రాహామును దర్శించిన సమయం “ఎండవేళ”
(మధ్యాహ్నం) (ఆది 18:1). అది వృద్ధాప్యములోనున్న అబ్రాహాము విశ్రాంతి తీసుకొనే సమయం. కానీ, అబ్రాహాము నిద్రపోవడంలేదుగాని గుడారపు ద్వారమందు కూర్చొనివున్నాడట. మధ్యతూర్పు దేశాలలో మధ్యాహ్నసమయంలో ప్రయాణ బడలికచేత అసలి సొలసి దారిని వెళ్తున్న బాటసారులను వారింటికి పిలచి, త్రాగడానికి నీళ్లు, తినడానికి ఆహారము పెట్టడము ఆనవాయితీగా వుండేదట. అందుచే అబ్రాహాము అట్లాంటి వారికోసం ఎండవేళ తన గుడారమందు కూర్చొని ఎదురుచూస్తున్నాడు. అయితే, అబ్రాహాము ఏ దాసునికో ఆ పనిని అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవచ్చుకదా? లేదు అబ్రాహాము తన భాద్యతను విస్మరించేవాడు కాదు. ఇట్లా ఎదురుచూస్తున్న సందర్భములో అతడు ఊహించని అతిధి తనవైపు వస్తున్నట్లుగా చూచి, ఆయనెవరో గుర్తుపట్టి, తన గుడారమునుండి పరిగెత్తుకుని వెళ్లి ఆయనను(వారిని) ఎదుర్కొని, నేలమట్టుకు వంగి (సాష్టాంగపడి) తన ఆతిధ్యము స్వీకరించుటకొరకు వారిని బ్రతిమలాడుతున్నాడు. ఆయనెవరంటే “యెహోవా” (మొత్తము ముగ్గురు అయినప్పటికీ ఒకే పేరుతో పిలువబడడం ద్వారా త్రిత్వమును గమనించవచ్చు). 99 సంవత్సరాల వయస్సులో ఆయన దూరముననుండే గుర్తుపట్టగలిగాడు, ఆయనను ఎదుర్కోవడానికి పరిగెత్తుతున్నాడు, సాష్టాంగపడుతున్నాడు. దీనినిబట్టి దేవునికి అతడెంతటి విధేయుడో అర్ధం చేసుకోగలం. ఇట్టి అనుభవం మనకుందా?

🔅1. అబ్రాహాము ప్రభువును చూచాడు:
ప్రభువును చూచే కన్నులు మనకున్నాయా? జక్కయ్య ఆయనెవరో చూడగోరి పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కెను( లూకా 19:3 ) ప్రభువును చూడకుండా అడ్డుపడే మనలోనున్న ఆ పొట్టితనము (పాపము) ఏమిటో సరిచేసుకోవాలి.

🔅2. ప్రభువును గుర్తుపట్టాడు:
చూచిన వెంటనే ఆయనను గుర్తుపట్టగలిగాడంటే, దేవునితో అబ్రాహాము కలిగియున్న సంబంధ బాంధవ్యాలను అర్ధం చేసుకోగలం. సంవత్సరాల తరబడి, క్రైస్తవులముగానే చలామణి అవుతున్నాము. ప్రభువు స్వరాన్ని గుర్తుపట్టగలిగే అనుభవం మనలోవుందా? సంవత్సరాల తరబడి నీ హృదయమనే తలుపునొద్దనుండి తట్టుతూనే వున్నాడు (ప్రకటన 3:20) ఆయన మెల్లనైన స్వరముతో నిన్ను పిలచుచూనే వున్నాడు. రోదే అను చిన్నది పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది (అపో. 12:14). మరి నీవు ప్రభువు స్వరాన్ని గుర్తుపట్టావా?

🔅3. ప్రభువును కలుసుకొనేందుకు పరిగెత్తుతున్నాడు:
ఆయన నావైపే వస్తున్నాడు కదా, వృద్ధాప్యంలోనున్న నేనెక్కడికి పోగలను అనుకోలేదు. తన వయస్సు తనకు గుర్తురాలేదు, శరీరం సహకరిస్తుందో లేదో పట్టించుకోలేదు. ప్రభువును చూచిన వెంటనే ఆనందముతో పరుగులు తీస్తున్నాడు. ఆయనను ఎదుర్కొంటున్నాడు. ఆదాము హవ్వలు ఏదెనులో ప్రభువును ఎదుర్కొనడానికి ధైర్యముచాలక, పారిపోయి చెట్లమధ్య దాగుకొంటున్నారు(ఆది 3:8) . ప్రభువును ఎదుర్కొనే ధైర్యం, అట్టి జీవితం మనకుందా? మధ్యాకాశములోనికి ప్రభువు మేఘారూరుడై రాబోవుచున్న వేళ, ఆయనను ఎదుర్కొనే సిద్దబాటు మనకుందా?

🔅4. సాష్టాంగ పడుతున్నాడు:
అబ్రాహాము ఎంతగా తగ్గించుకొంటున్నాడంటే నీముందు నిలబడే అర్హతకూడా నాకు లేదంటూ సాష్టాంగ పడుతున్నాడు. సాష్టాంగపడుట ఆరాధనకు సాదృశ్యముగా వుంది. ఆయన ఏమైయున్నాడో అబ్రాహాముకు అర్ధమైనప్పుడు ఆయనను ఆరాధించకుండా వుండలేకపోయాడు. తన్నుతాను తగ్గించుకొంటూ దేవుని నామమును హెచ్చిస్తున్నాడు. మనమేమో దీనికి పూర్తి విరుద్దంగా, దేవునికంటే ఉన్నతంగా మనలను హెచ్చించుకునే ప్రయత్నం చేస్తున్నాము. లూసిఫర్ అట్లానే చేసాడు అదఃపాతాళానికి త్రోసివేయబడ్డాడు. మనలను మనము సరిచేసుకునే ప్రయత్నం చెయ్యాలి.

🔅5. దేవుని హృదయాన్ని గ్రహించాడు:
కొంచెం నీళ్లు తెప్పించెదను కాళ్ళు కడుగుకొని చెట్టు నీడన అలసట తీర్చుకొనండి. కొంచెం ఆహారం తీసుకువస్తాను భుజించి మీ ప్రాణములను బలపరచుకొనండి. ఇందునిమిత్తమే కదా నా దగ్గరకు వచ్చారు?(ఆది 18:4,5) వారు కూడా అబ్రాహాము మాటలను గద్దించకుండా ఇందునిమిత్తమే అన్నట్లుగా, సరే నీవు చెప్పినట్లుగానే చెయ్యి అన్నారు. ఇక్కడ వారు చెప్పకుండా వారి హృదయాన్ని ఎరిగినవాడుగా అబ్రాహాము వున్నాడు. ఆయనతో సాన్నిహిత్యం వలన ఆయన హృదయాన్ని, ఆయన మనసును అర్ధంచేసుకోగలమనే విషయం అబ్రాహాము జీవితమునుండి నేర్చుకోగలము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము గ్రహించగలగాలి. అబ్రాహామునకు జరిగింది కేవలం శారీరిక సున్నతి మాత్రమేకాదు. అంతకు మించి గొప్పదైన హృదయ సున్నతికూడా జరిగిందని. లేనిపక్షంలో అతడు దేవుని హృదయాన్ని అర్ధం చేసుకొనివుండేవాడు కాదు.

మన ఇంటికి అతిధులు వచ్చినప్పుడు మనము చేయగలిగినంతలో ఎక్కువ మర్యాద చేస్తాము. కానీ, అబ్రాహాము దేవునిని చెట్టునీడను కూర్చోబెడుతున్నాడు. అంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడేమిటి? అవును మరి ఆయనింట్లో సోఫాసెట్స్, తివాచీలు, పట్టు పరుపులు ఇట్లాంటివేమీలేవు. ఆయనకంటూ ఒక శాశ్వతమైన గృహాన్ని కట్టించుకోలేదు. ఎందుకంటే ఈ లోకముగాని, ఆయన జీవితంగాని శాశ్వతం కాదని ఆయనకు తెలుసు. గుడారాల్లోనే నిరాడంబర జీవితాన్ని ఆయన జీవించాడు. చెట్టునీడనే ఆయనకు విశ్రమస్థానము ఏర్పాటు చెయ్యడం మంచిదనుకున్నాడు. నేటి మన బోధకులు ఏసీ కార్లు, ఏసీ రూమ్స్ వుంటేనే సువార్తకు వెళ్లే పరిస్థితి. మనము కూడా మన ఇండ్లను ప్రక్కనబెడితే, ఏసీ లేకపోతే దేవుని మందిరానికి వెళ్లలేని దయనీయమైన స్థితికి చేరుకున్నాము. మధ్యలో ఐదు నిమిషాలు కరెంటుపోతే, కాస్త ఫ్యాన్ ఆగిపోతే ఇక ఏదో ప్రళయమొచ్చినంత ఇబ్బంది పడిపోతాము. దేవుని మందిరంలో క్రింద కూర్చొని ఆరాధించే పరిస్థితులు లేవనే చెప్పాలి. పూర్తిగా విలాసాలకు అలవాటుపడ్డాము. మనకు మనముగా బ్రతికితే, అప్పులూ లేవు, తిప్పలూలేవు. గాని మనము మరొకరిలా విలాసవంతంగా జీవించాలను కొంటున్నాము. అనవసరమైనవన్నీ కొనుక్కొంటూపోయి, చివరికి అవసరమైనవన్నీ అమ్ముకోవాల్సిన స్థితికి చేరుతున్నాము. సంతృప్తిలేని జీవితాలు జీవిస్తున్నాము. కానీ, అత్యంత ధనికుడైన అబ్రాహాము నిరాడంబరముగానే జీవించాడు. ఆయన జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు ఒక గొప్ప సవాలు.

ప్రభువు నోటి మాట ద్వారా సృష్టించబడిన ఆ చెట్టు ప్రభువుకు నీడనిచ్చి, విశ్రమస్థానముగా ప్రభువుకు సేవచేసింది. అయితే, ఆయన చేతులతో, ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున నిర్మించబడిన నీవూ, నేనూ ఆయనకొరకు ఏమి చేయగలుగుతున్నాము? సృష్టినంతటిని మనకోసం సృష్టించి, మనలను మాత్రం ఆయన కోసం సృష్టించుకున్నాడు. మనమేమో సృష్టికర్తను విడచి సృష్టినే పూజించే దయనీయమైన స్థితికి దిగజారిపోయాము. 99 సంవత్సరాల వృద్ధుడు సాష్టాంగ పడుతున్నాడు. కనీసం ప్రభువు పాదాల చెంత మోకరిల్లే అనుభవమైనా మనకుందా? ఒక్కసారి మనలను మనమే పరిశీలన చేసుకొని, సరిచేసుకొని ఆత్మతో ఆరాధించే ఆరాధికులుగా జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకొందము.

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(39వ భాగము)
♻ అబ్రాహాము దేవదూతలకు ఆతిధ్యమిచ్చుట ♻ (part-2)


అబ్రాహాము, దేవునిని అలసట తీర్చుకోమని చెప్పి, భోజనం సిద్ధంచేసే పనిలోపడ్డారు. ఇక్కడ మనకొక సందేహం తప్పక రావొచ్చు. దేవుడు అలసట తీర్చుకోవడమేమిటి? భోజనం చెయ్యడమేమిటి? అవును. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందు, అదృశ్యునిగాను, వాక్యముగాను ఆయన ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడైతే మానవునిగా ప్రత్యక్షమయ్యారు అనే విషయం తప్పక జ్ఞాపకం పెట్టుకోవాలి. శరీరంతో నున్నప్పుడు ఇవన్నీ సహజం కదా? ఒక వేళ అబ్రాహాము నన్నెంతగా గౌరవిస్తాడో చూద్దామని ప్రభువు ఆ రీతిగా ప్రత్యక్షమయ్యారేమో?

అబ్రాహాము గుడారములో నున్న శారాయొద్దకు త్వరగావెళ్లి నీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. (ఆది 18:6-8) అబ్రాహాము విందును సిద్ధంచేసే క్రమంలో వాడబడిన మాటలు చూస్తే, అతడెంత వేగముగా సిద్ధం చేసాడో అర్ధమవుతుంది. “త్వరగా వెళ్లి, నీవు త్వరపడి, మందకు పరిగెత్తి, త్వరగా సిద్ధపరచెను” ఆలస్యమునకు ఎక్కడా తావులేదు.

🔅అబ్రాహాము త్వరగా శారా దగ్గరకు వెళ్లి:

అబ్రాహాము గుడారములోనున్న తన భార్యయైన శారా దగ్గరకు త్వరగా వెళ్లి, మెత్తని పిండితో రొట్టెలను త్వరగా సిద్దముచెయ్యమని చెప్పాడు. తెలుగులో మెత్తని పిండి అని వ్రాయబడిందిగాని, ఇంగ్లీష్ బైబిల్ లో finest flour అని వ్రాయబడింది. అనగా “శ్రేష్ఠమైన పిండి” మన దగ్గర ఉన్నదానితో శ్రేష్ఠమైన పిండితో రొట్టెలు సిద్ధంచెయ్యమని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము అబ్రాహాము ఇంటిలో 1200 మంది పనివారు ఉండేవారట. 90 సంవత్సరాల వృద్ధ్యాప్యములోనున్న శారా కంటే, యౌవనప్రాయంలోనున్న అనేకమంది దాసీలు వున్నారుకదా, రొట్టెలు చేసే పని వారికి అప్పగించవచ్చుకదా? లేదు. అతిధులకు విందును సిద్ధంచేసే భాద్యతను వారిద్దరే తీసుకున్నారు. వారి చేతులతో పెట్టడమే వారికి సంతృప్తి. శారా కూడా సంతోషంతో సిద్ధపరచడానికి వేగిరపడిందిగాని, సణిగినట్లుగాని, సాకులు చెప్పినట్లుగాని మనకు కనబడదు. నేటిదినాల్లో కొందరు యౌవనప్రాయంలోనున్న స్త్రీలు సహితం ఒక సేవకునికి ఒకపూట ఆహారం సిద్ధపరచడానికి ఎంత బాధపడిపోతారో? అందరూ కాదులెండి కొందరు, ఆ కొందరిలో నీవుండకూడదు. ఆతిథ్యము చేయ మరవకుడి దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి (హెబ్రీ 13:1). బహుశా ఈ మాటలు అబ్రాహాము, శారాలను దృష్టిలోపెట్టుకొనే వ్రాయబడ్డాయేమో?


🔅 అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి:

అబ్రాహాము, పశువుల మందకు వెళ్లి దూడను తెచ్చే భాద్యతను పనివానికి అప్పగించే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకంటే, ఒకవేళ వారు ఏ జబ్బుదో, మచ్చ, డాగు కలిగినదో తీసుకొని వస్తారేమోనన్నది అబ్రాహాము భయం. అందుచే, 99 సంవత్సరాల వయస్సులో తానే పశువుల మందకు పరిగెత్తుతున్నాడు. మందకు వెళ్ళాక రా! వచ్చి నన్నుపట్టుకో అంటుందా ఆ దూడపిల్ల? మరలా దాని వెంట పరుగుతీసాడు. ఒక మంచి లేత దూడను తెచ్చి, పనివానికప్పగించాడు. తర్వాత దినాలలో దేవునికి బల్యర్పణగా లేత దూడలనే అర్పించినట్లు లేఖనాల ద్వారా గ్రహించుచున్నాము. అబ్రాహాము యొక్క హడావిడి చూచి, అతడెంత తొందరపడుతున్నాడో గుర్తెరిగి, అతడునూ దానిని త్వరగా సిద్ధం చేసాడు. తద్వారా విందు సిద్ధం చేయబడింది. అవును దేవునికిచ్చేది ఏదైనా శ్రేష్ఠమైనదే ఇవ్వాలి. అబ్రాహాము దాని విషయంలో ఎక్కడా రాజీ పడినవాడు కాదు. మేము చర్చ్ లో చివర్లో కానుకలు లెక్కించేటప్పుడు, దానిలో కొన్ని నోట్స్ కనిపించేవి. అవి భారతదేశంలో ఎక్కడా చెల్లవన్నమాట. అట్లాంటి నోట్స్ తీసికొనివచ్చి కానుక సంచిలో వేసేవారు. ఎంతటి విచారకరం? దేవునికిచ్చేది ఏదైనాసరే శ్రేష్ఠమైనదే ఇవ్వాలి. అన్నింటికంటే ముఖ్యంగా నీ పవిత్రమైన హృదయాన్ని ప్రభువుకివ్వాలి. అంతకంటే ఆయన ఇష్టపడే కానుక మరొకటిలేదు.

🔅 అతిధులు విందారగిస్తున్నప్పుడు వారిని కనిపెట్టుకొని వున్నాడు:

తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనము చేయు చుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను (ఆది 18:8). వారి ప్రాణములను బలపరచుకొని, ప్రయాణమై వెళ్ళాలి కాబట్టి వారికి శ్రేష్ఠమైన పౌష్టికాహారాన్ని సిద్దము చేయించాడు. అబ్రాహాము గుడారములో డైనింగ్ టేబుల్స్ లేవు. ఆ చెట్టు నీడనే వారు భోజనం చెయ్యడానికి ఏర్పాటు చేసాడు. వారు భోజనము చేయుచున్నప్పుడు అబ్రాహాము ఆ చెట్టు క్రింద నిలచియున్నాడు. అప్పటికే అబ్రాహాము పూర్తిగా అలసిపోయాడు. ఆ చెట్టుక్రిందనే కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా? లేదు. వారికి ఏమి కావాలో వాటిని వడ్డించడానికి కనిపెట్టుకొని వున్నాడు. ఇంతకు మించిన ఆతిధ్యం ఇంకెవరివ్వగలరు? అబ్రాహాము కుటుంబ ఆతిధ్యం మన క్రైస్తవ కుటుంబాలకొక మాదిరి అని చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేనేలేదు.

వారు ఆహారాన్ని భుజించి వారిదారిన వెళ్లిపోయే ప్రయత్నం చెయ్యలేదు, ప్రభువుకు, సువార్త చెప్పడానికి పేతురు దోనెలో కొంచెం స్థలమిచ్చినందుకే ఆ దోనేనంతటిని చేపలతో నింపేశారు ప్రభువు. మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను. (మార్కు 9:41) అట్లాంటప్పుడు యింత అద్భుతమైన ఆతిధ్యమిచ్చిన అబ్రాహాము, శారాలను వట్టి చేతులతో విడచిపెట్టి వెళ్ళిపోతారా? సంవత్సరాల తరబడి వారు ఎదురుచూస్తున్న బహుమానం ఏదైతే వుందో, ఆ శ్రేష్టమైన బహుమానమును గూర్చిన మరింత స్పష్టత ఇవ్వడానికి వారు సిద్దపడుతున్నారు. దానిలో భాగంగా, శారా ఎక్కడుందని అడుగుతున్నారు? దానికి అబ్రాహాము సమాధానం “అదిగో గుడారములో నున్నదని చెప్పెను”. (ఆది 18:9). భర్తచేప్పినట్లుగానే గుడారంలోనే తనపని చేసుకొంటుందిగాని, తననుతాను కనపరచుకొనే ప్రయత్నమేమి చెయ్యలేదు. ఇది ఉత్తమ ఇల్లాలు యొక్క అత్యుత్తమ లక్షణం. నేటి పరిస్థితి మారింది భర్త ఇంట్లో వుంటే, భార్య వీధిలో వుండే పరిస్థితి. మేము భర్తతోపాటు సంపాదించడం లేదా? మేమెందుకు లోబడాలి అంటూ రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. భర్తతోపాటు కాదు, భర్తకంటే ఎక్కువ సంపాధించినాసరే, కుటుంబంలోగాని, సంఘములోగాని, సమాజములోగాని నీవు గుడారంలో వుండే అనుభవం కలిగివుండడమే నీ ఆధ్యాత్మిక జీవితానికి శ్రేయస్కరం. “ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను” (లూకా 1:28) దూత లోపలి వచ్చాడంటే, మరియ ఎక్కడుంది? ఇంటిలో వుంది. శారా గుడారములో ఉండడానికి ఇష్టపడింది కాబట్టే, అనేక జనములకు తల్లి అయ్యింది. మరియ ఇంటిలో ఉండడానికి ఇష్టపడింది కాబట్టే రక్షకునికి తల్లి అయ్యింది. ఒక క్రైస్తవ స్త్రీగా నీవెక్కడుండాలో వాక్యపు వెలుగులో నీవే తేల్చుకో. శారా మాత్రం గుడారములో వుండే అనుభవాన్ని కలిగివుందని మాత్రం గుర్తుపెట్టుకో.
ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(40వ భాగము)
🔅 దేవుడు శారాను గద్దించుట


శారా గుడారంలోనే ఉన్నప్పటికీ, వాళ్ళు మాట్లాడుకొనేవన్నీ, వింటూనే వుంది. సాధారణముగా స్త్రీలు ఇట్లా వినడానికి ఇష్టపడతారు. విన్నదానిని ఊరంతా చెప్పేవరకు నిద్రపోరు. వచ్చే సంవత్సరం తప్పకుండా మరలా నీ దగ్గరకు వస్తాము. అప్పుడు నీ భార్యయైన శారాకు కుమారుడు జన్మిస్తాడు అని చెబుతున్నప్పుడు ఆ మాటలు విని తనలోతాను నవ్వుకొంది. కారణం అప్పటికే స్త్రీ ధర్మం నిలచిపోయింది. శరీరం మృతతుల్యమయ్యింది. ఆ నవ్వులో అవిశ్వాసం చోటుచేసుకొంది. తద్వారా ఆ మాటలు ఎవరైతే చెబుతున్నారో వారియొక్క శక్తిని శంకించినట్లయ్యింది. శారా నవ్వు ఎవ్వరూ వినలేదు గాని, దేవుడు విన్నాడు. “అంతట యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల? యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను”. (ఆది 18:13,14)

యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? ఇట్లా ఆయన ప్రశ్నించడం ద్వారా నేను సర్వశక్తిగల దేవుడను (ఎల్ షద్దాయ్) అనే విషయాన్ని జ్ఞాపకంలోనికి తీసుకొనివస్తున్నారు. శారాచుట్టూనున్న పరిస్థితులన్నీ అననుకూలమైనవే, ఒక్కటికూడా అనుకూలంగాలేదు. అన్నీ అనుకూలంగా వున్నప్పుడు కార్యం నెరవేర్చడంలో దేవుని గొప్పతనమేముంది? దానిని దేవుని కార్యముగా మనము గుర్తించలేము కూడా.

మేము ప్రార్ధించగా దేవుడు మాకనుగ్రహించిన కుమారుడు “ఎడ్విన్ సార్డోనిక్స్”. 17 నవంబర్, 2010న మిషన్ హాస్పిటల్, నరసాపూర్ లో జన్మించాడు. ఆరోజు మా ఆనందానికి అవధుల్లేవు. అయితే అది కొన్నిగంటలకే పరిమితమయ్యింది. ఆ రోజు రాత్రి సుమారు 12 గంటలకు డాక్టర్ నన్ను పిలచి, వింటేనే భయము పుట్టించే విషయాలు చెప్పారు. మీబాబు బ్రతికే అవకాశం లేదు. బ్రతికినా, లేచి నిలబడలేడు, మాట్లాడలేడు, ఏమి గుర్తుండదు. బ్రతికినంత కాలం జీవచ్ఛవంలా వుండాల్సిందేగాని తనకు తానుగా ఏమి చెయ్యలేడు. మీ సంతృప్తి కొరకు, మీరు తీసుకొని వెళ్తామంటే రాజమండ్రి హాస్పిటల్ కి తీసుకొనివెళ్ళి చూపించండని చెప్పారు. ఈ విషయాలన్నీ స్వయంగా నాతోనే చెప్పారు . దానినిబట్టి మీరు ఊహించొచ్చు నా పరిస్థితి ఎట్లా వుండి ఉంటుందో? మేము మెడిసిన్ కూడా డస్ట్ బిన్ లో వేసేసి ప్రార్ధించి పొందుకున్న బిడ్డ కదా? ఎందుకిలా? అంటూ సమాధానం లేని లెక్కలేనన్ని ప్రశ్నలు నా ముందు నిలబడ్డాయి. వాటన్నింటికి సమాధానంమాత్రం ఒక్కటే “నా దేవుడు సర్వశక్తి మంతుడు”. అదే నా నిరీక్షణ.

అర్ధరాత్రి రాజమండ్రి వెళ్ళడానికి అంబులెన్సు సిద్ధం చేసాము. నా భార్య సౌజన్య కి సిజేరియన్ అయ్యింది. అసలేమి జరుగుతుందో తనకి తెలియదు. బాబును ఒక్కసారి తనకి చూపించి తీసుకెళ్లాలనిపించింది. ఎందుకంటే డాక్టర్ చెప్పినదానినిబట్టి ఆ బిడ్డ తిరిగిరాడు. ఒక్కనిమిషం బాబును తన ప్రక్కలో పండుకోబెట్టి, అబ్రాహాము అతని పనివారితో చెప్పినట్లుగా, ఒక్కసారి బాబును రాజమండ్రి హాస్పిటల్ లో చూపించి తీసుకువస్తాము అని చెప్పి, అప్పట్లో నాతో కలసి భాష్యంలో పనిచేస్తున్న బ్రదర్. రాజేష్ తో కలసి రాజమండ్రి తీసుకెళ్ళాము. ఆ డాక్టర్ నుండికూడా అవేమాటలు. లేదంటే నా ప్రయత్నం నేను చేస్తానన్నారు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. నేను ప్రార్ధన చేస్తానని చెప్పాను.

ట్రీట్ మెంట్ ప్రారంభించారు. రాజమండ్రిలో బాబు, నర్సాపూర్ లో తల్లి. అంతా దయనీయమైన పరిస్థితి. తెల్లవారాక రాజేష్ ను, ఆంటీ వాళ్ళను నర్సాపూర్ పంపించేసి, ఒంటరిగా 14 రోజులు బాబుతోవుండి, యాకోబు యబ్బోకురేవులో దేవునితో పోరాడినట్లుగా, ఆయనతో పోరాడుతూనే వున్నాను. అనేకమంది ప్రార్ధనాపరులు బిడ్డనిమిత్తం ప్రార్ధిస్తూనే వున్నారు. అయినప్పటికీ ప్రతీగంటకు బాబు పరిస్థితి మారుతూనే వుంది. ఏమాత్రం నిలకడలేని పరిస్థితి. 14 రోజుల్లో 80 సార్లు RBS చెక్ చేశారు. వాడి శరీరమంతా సూదులే. 10 రోజుల తర్వాత బాబు ఆరోగ్యపరిస్ధితి నిలకడలోనికి వచ్చింది. 14వ రోజున డాక్టర్ చెప్పారు. ఈరోజు CT స్కాన్ చేసి, బిడ్డ భవిష్యత్ ఏరీతిగా వుండబోతుందో చెప్తాను అన్నారు. బాబును CT స్కాన్ మీద పండుకోబెట్టి, ఆ మిషన్ ప్రక్కనే మోకరిల్లాను. అన్యులైన ఆ డాక్టర్స్ నావైపు విచిత్రంగా చూచారు. వారు స్కానింగ్ చేస్తున్నంతసేపూ నేను ప్రార్ధిస్తూ వున్నాను. నా దేవుడు సర్వశక్తిమంతుడు అనే సంపూర్ణమైన విశ్వాసమున్నప్పటికీ, ఆ దినాన్న డాక్టర్ చెప్పినమాటలే మదిలో తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ డాక్టర్ ఏమి చెప్పబోతున్నాడో? మరలా లెక్కలేనన్ని సమాధానం లేని ప్రశ్నలు నాముందు నిలబడ్డాయి. రెండుగంటల తర్వాత డాక్టర్ పిలిచారు. ఆ క్షణంలో నేనెదుర్కొన్న సంఘర్షణ ఎప్పటికి మరచిపోలేను. ఈ లోపు డాక్టర్ నవ్వుతూ మీ బాబు కింగ్. వాడికెట్లాంటి సమస్యలూ లేవు. ఇంటికి తీసుకెళ్లండని చెప్పారు. ఆ క్షణంలో నా కళ్ళల్లో తిరిగిన కన్నీరే నా సర్వశక్తిమంతుడైన దేవునిని ఆరాధించగలిగాయి. డాక్టర్ చెప్పిన ఏ ఒక్కలోపం కూడా నా బిడ్డలోలేదుసరికదా, వారు చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా ఆయన జరిగిస్తూ వున్నారు. నాకు అసాధ్యమైనది ఏదియో లేదు. నేను సర్వశక్తిగల దేవుడనని రుజువుపరిచారాయన. మరణశయ్య మీదనుండి నా బిడ్డను సజీవునిగా లేపి, జీవింపజేయుచున్న సజీవుడును, సర్వ శక్తిమంతుడైన నా యేసునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక! ఆమెన్!

అవును! అనేక సందర్భాలలో మన ముందున్న సమస్యలు, మన బలహీనమైన విశ్వాసముముందు అవి అత్యంత బలీయమైనవిగా కనిపిస్తాయి, కానీ బలవంతుడైన దేవునిపైన ఆధారపడినప్పుడు అవి బలహీనమైపోతాయి. శారాకు కూడా ఇదే సందేహం. మృతతుల్యమైన శరీరమే తనముందున్న పెద్ద సమస్యగా నిలబడింది. ఆ శరీరాన్ని నిర్మించిన సృష్టికర్తయైన దేవుడు దానిని నూతన పరచగలడని, కోల్పోయిన శక్తిని తిరిగి అనుగ్రహించగలడని విశ్వసించినప్పటికీ, ఆమె నవ్వులో కొన్ని అనుమానపు ఛాయలు కనిపిస్తున్నాయి. అందుకే ఆమె దేవునిచేత గద్దించబడింది (ఆది 18:14). గత దినాలలో అబ్రాహాము కూడా ఇదే విషయంలో నవ్వాడు. (ఆది 17:17) దానిలో సంతోషం దాగివుంది. అందుకే ఆయన దేవునిచేత గద్దించబడలేదు. అయితే, శారా అంతటితో ఊరుకోకుండా నేను నవ్వలేదని బొంకే ప్రయత్నం చేస్తుంది. ఆమె అట్లా చెయ్యడానికిగల కారణం, నేను నవ్వడం వలన కుమారుని పొందుకోలేనేమోననే భయం. ఆమె భయమే, ఆమెను అబద్ధమాడేటట్లు చేసింది. చాలాసార్లు అనవసరమైన భయంవలన మంచివాళ్ళు కూడా పాపముచేయడానికి కారణమవుతుంది. అయితే, దేవునిపట్ల సవ్యమైన భయం మనిషిని పాపంచేయకుండేలా కాపాడుతుంది. ( ఆది 20:11; నిర్గమ 20:20 ) అందుకే సాధారణముగా మనుష్యులు దేనికి భయపడతారో వాటికి భయపడవద్దని (ఆది 15:1) తనకే భయభక్తులు చూపాలని దేవుడు తన ప్రజలకు తెలియజేస్తున్నారు (ద్వితీ 10:20; మత్తయి 10:28; హెబ్రీ 12:28). శారా అబద్ధమాడినప్పటికీ కృపగలిగిన దేవుడు ఆయనిచ్చిన వాగ్ధాన విషయంలో తప్పిపోలేదు.

ప్రియ విశ్వాసి! నీ సమస్యను కాదు నీవు చూడాల్సింది. ఆ సమస్యను పరిష్కరించగలిగే సర్వశక్తిమంతుడైన దేవునివైపు చూడు. ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు. విశ్వసిద్దాం! ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు అనుభవిద్దాం!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(41వ భాగము)
♻ అతిధులకు అబ్రాహాము వీడ్కోలు ♻


అబ్రాహాము అతిధులను తన ఇంట చేర్చుకున్నప్పటినుండి, వారు తిరిగివెళ్ళేవరకు శక్తివంచనలేకుండా, శ్రమించి, తనకు కలిగిన దానిలో గొప్పదైన విందుచేసి, ఆతిధ్యమిచ్చి, చివరిగా వారిని సాగనంపుతున్నాడు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. నోవహు కూడా దేవునితో నడిచాడు. హిజ్కియా కూడా నీ సన్నిధిలో నడిచానని ప్రార్ధిస్తున్నాడు. కానీ, నేననుకుంటాను అబ్రాహాము నడచినట్లుగా దేవుని అడుగులో అడుగువేసుకొంటూ నడిచిన అనుభవవం మరెవ్వరికీ లేదేమోనని? ఒకవేళ దేవుడు అబ్రాహామును దగ్గరకు తీసుకొని, అతని భుజాలమీద చేతులువేసి మాట్లాడుకొంటూ వెళ్తున్నారేమో? ఎందుకంటే దేవుడే చెప్పారు అబ్రాహాము నా స్నేహితుడని. అబ్రాహాము కుటుంబమువలే ఆతిధ్యమిచ్చే కుటుంబాలుగా మన గృహాలు వుండగలగాలి. దేవుని సేవకులకు ఆతిధ్యమివ్వడం, పేదలకు సహాయపడడం ఇవన్నీ దేవునికి ఆతిధ్యమిచ్చినట్లే. అట్లా అని, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అనేకులుగా మన మధ్యలోనున్నారు, వారిని చేర్చుకోవద్దు, సహకరించవద్దు, వారితో శుభమని చెప్పవద్దు. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? (ఆది18:17) అంటూ తానువచ్చిన పనిని అనగా సొదొమ, గొమొర్రా పట్టణములకు తాను విధించబోవు శిక్షను గురించి అబ్రాహామునకు తెలియజేస్తున్నారు. దీనినిబట్టి అబ్రాహాము దేవునికి ఎంతటి సన్నిహితుడయ్యాడో అర్ధం చేసుకోవచ్చు. దేవునిలోనున్న మరొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే, దేవుడు ఏదిచేసినా చెప్పకుండా చెయ్యరు. చెప్పినదానిని చెయ్యకుండా వుండరు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు (ఆమోసు 3:7) అసలు దేవుడు తాను చేయబోయే కార్యాన్ని అబ్రాహాముతోనే ఎందుకుచెప్పాలి? ఎందుకంటే? కనాను దేశాన్ని దేవుడు అబ్రాహాముకు వాగ్ధానము చేశారు. ఇప్పుడు దేవుడు అగ్ని గంధకములతో నాశనం చేయబోయే సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా కనానులోనే వున్నాయి. అందుకే అబ్రాహాముతో ఒకమాట చెబుదామని కాబోలు. నిజంగా దేవుడు మనుష్యులతో వ్యవహరించేతీరు ఎంత అద్భుతంగా ఉంటుంది? ఈ సందర్భంలోనే అబ్రాహాము కల్దీయుల దేశములోనున్నప్పుడు ఇవ్వబడిన వాగ్ధానమునే (ఆది 12:3) మరొకసారి ఈ సందర్భములో స్థిరపరచుచున్నారు. అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును. (ఆది 18:18) అబ్రాహాము దేవుని మాటకు విధేయుడై తన ఏకైక కుమారుని సహితం, బలిగా అర్పించడానికి సిద్దపడినప్పుడు మరలా ఇదే విషయాన్ని దేవుడు స్పష్టం చేసారు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను (ఆది 22:18). భవిష్యత్ జ్ఞానమును యెరిగిన దేవుడు, అబ్రాహాము చేయబోయే కార్యమును ముందుగానే తెలియజేస్తున్నారు (ఆది 18:19) తన పిల్లలను, తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపిస్తాడు. యాజకుడైన ఏలీ కుమారులు పాపము చేస్తున్నప్పుడు, “నేను విన్నది మంచికాదు” అని బుజ్జగించేటట్లుగా మాట్లాడినాడు గాని, అబ్రాహాము అట్లా కాదట. తన సంతతివారికి ఆజ్ఞాపిస్తాడట. ఆజ్ఞ అనగా “చేసి తీరాల్సిందే”. దేవుని నీతి న్యాయములను జరిగించి తీరాలని తన తరువాత తరములవారికి అబ్రాహాము ఆజ్ఞాపిస్తాడని దేవుడు ముందుగానే యెరిగియున్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెప్పాడు కాబట్టి అబ్రాహాము అట్లాచేస్తాడని తలంచకూడదు. అబ్రాహాము అట్లా చేస్తాడుకాబట్టే దేవుడు చెప్పారు అనే విషయాన్ని గమనించాలి.

🔅 సొదొమ గొమొఱ్ఱా పట్టణముల మొర:

సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను. (ఆది 18:20,21)

ఇది మనుష్యులు చేసిన ప్రార్ధన కాదు. ఆ మనుష్యులు చేస్తున్న అకృత్యాలు చూడలేక, వీరి పాపాన్ని మేము చూడలేము. వీరిని నాశనం చేసెయ్యి అంటూ సొదొమ గొమొఱ్ఱా పట్టాణాలే దేవునికి చేస్తున్న ప్రార్ధన. అదేంటి? భూమి ప్రార్ధించడానికి, దానికి నోరుందా? నోరే కాదు. నీ మాటలు వినడానికి చెవులు కూడా వున్నాయి. ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము (యెషయా 1:2) హేబేలు చంపబడినా, అతని రక్తం మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు(ఆది 4:10). భూమి, పశువులు మొఱ్ఱను కూడా దేవుడువిన్నాడు (యోవేలు 1:10,20) నీ పాదధూళి సహితం మొర పెట్టినా, తప్పక ఆయన వింటాడు. Oh my God! అవునా? ఇంతకీ, సొదొమ గొమొఱ్ఱా పట్టణ ప్రజలు చేసిన పాపం ఏమిటో? సమృద్ధియైన ఆహారం కలిగి వుండడం వలన, విచ్చలవిడి సుఖానికి అలవాటుపడి, హృదయాలు గర్వించి, దేవుడంటే లెక్కలేకుండా వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు. (యెహెజ్కేలు 16:49) సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి (ఆది 13:13). ఇంతకీ వారు చేసిన పాపమేమిటో?
'హోమో సెక్స్' మగవారు మగవారితో కలసి చేసే లైంగిక పాపం, “లెస్బీనిజం” స్త్రీలు స్త్రీలతో కలసిచేసే లైంగిక పాపం. ఆనాడు అక్కడ పుట్టిన పాపమే, ఈనాడు మహా వృక్షమై విచ్చలవిడిగా ప్రపంచమంతా వ్యాపించింది. నూరంతలుగా ఇంకా వర్ధిల్లుతూనే వుంది. ఆ భయంకరమైన పరిస్థితిని చూచి ఆ పట్టణాలు తట్టుకోలేక దేవునికి మొర పెడుతున్నాయి. సొదొమ, గొమొఱ్ఱా అనే రెండు పట్టణాలేనా? ఇంకేమైనా ఉన్నాయా? యూదా పత్రిక ఏడవ వచనం ప్రకారం ఇంకాఉన్నాయి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును “వాటి చుట్టుపట్లనున్న పట్టణములును” వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. (యూదా 1:7) ఏమిటీ ఆ ఆచుట్టుపట్లనున్న పట్టణాలు? సొదొమ గొమొఱ్ఱాలతోపాటు, అద్మా, సెబోయీము అనే పట్టణాలు ( ద్వితీ 29:23). ఈ నాలుగు పట్టణాలను దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకాలను కురిపించి నాశనము చేసారు. ఇది ఎప్పుడో, ఎక్కడో వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయం కదా అని, తేలికగా తీసిపారెయ్యొద్దు. నేడు విచ్చలవిడి అయ్యింది. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు కలిగిన మన భారత దేశంలోకూడా చట్టబద్ధమయ్యింది. పాపమే చట్టబద్దమైతే? ఇక ప్రశ్నించేదెవరు? దానికి అడ్డుకట్టవేసేదెవరు? లవర్స్ డే రోజున జంటలు కనిపిస్తే పెళ్లి చేసేస్తాం అని విరుచుకుపడేవారు, తుచ్ఛమైన అభిలాషలు చట్టబద్దమైతే, మాట్లాడరెందుకో అర్ధం కాదు. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను (2 కొరింథీ 4:4) కావున వారికి ఇట్లాంటివి కనిపించవు, వినిపించవు. లోకచట్టం లోకంలో చట్టబద్దమైనాగాని, అంతిమ తీర్పుమాత్రం దేవుని చట్టానికే లోబడి ఉంటుందని మాత్రం మరచిపోవద్దు. నాలుగు గోడల మధ్య జరిగిస్తున్న పాపం ఎవ్వరికీ తెలియదులే అని నీవనుకోవచ్చు. ఆ గోడలే, నిన్ను గూర్చి దేవునికి మొరపెడితే? ఆ పట్టణాల ప్రార్ధన విన్న దేవుడు, ఆ గోడల ప్రార్ధన వినడా? తప్పక వింటాడు. ప్రతిఫలాన్నిస్తాడు. జాగ్రత్త!
సరిచేసుకుందాం!
ఆయన అడుగు జాడల్లో నడుస్తూ నిత్యమైన గమ్యాన్ని చేరుదాం!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(42వ భాగము)
♻ అబ్రాహాము సొదొమను గూర్చిన విజ్ఞాపన ♻


దేవుడు సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను నాశనం చేయబోతున్న విషయాన్ని అబ్రాహామునకు తెలియజేసారు. తన అన్న కొడుకైన లోతు అదే పట్టణంలో నివసిస్తున్నాడు. అట్లాఅని ఒక్క అతని కుటుంబాన్ని రక్షించే ఆలోచనే అబ్రాహాము కలిగియుంటే, నేరుగా లోతుకుటుంబాన్ని రక్షించమని అడిగేవాడు. కానీ అబ్రాహాము నీతిమంతుల రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడే నా యింటికొస్తే నాయంతటి గొప్పవాడెవడు? నేను అడిగినది కాదంటాడా? అనే ఉద్దేశ్యముతో కాకుండా నేను ధూళివంటివాడను అని తనను తాను తగ్గించుకొంటూ దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు. దేవుని సన్నిధిలో వినయపూర్వకంగా ప్రార్ధిస్తూ ఇతరుల నిమిత్తం ప్రాధేయపడుతూవుంటే ఆయన కోపించరు. 50 మందితో మొదలుపెట్టి 10 మందివరకు వచ్చాడు. పదిమంది నీతిమంతులున్ననూ ఆ పట్టణాలను నాశనము చెయ్యనని దేవుడు అబ్రాహాముకు మాట ఇచ్చారు (ఆది 18: 22-33). అక్కడ లోతు పదిమందినైనా రక్షించియుండకపోతాడా అనే ఉద్దేశ్యంతో పదిమంది దగ్గర అబ్రాహాము ఆపేసాడేమో? లేక పాపము దాని ప్రతిఫలాన్ని తప్పక అనుభవించి తీరాలి అనే ఉద్దేశ్యంతో అక్కడ ఆపేసాడో తెలియదుగాని, అక్కడ మాత్రం లోతుతప్ప ఇంకెవ్వరూ నీతిమంతులు లేరు (2పేతురు 2:6-8) లోతు తప్పించబడడానికి కూడా అబ్రాహాము ప్రార్ధన అవసరమైంది. (ఆది 19:29)

ప్రార్ధన వ్యక్తిగతమైనది, విజ్ఞాపన ఇతరులగురించి చేసేది. ప్రార్ధనా అనుభవంలేకుండా, విజ్ఞాపన సాధ్యం కాదు. విజ్ఞాపన అనుభవం లేకపోతే, మన ప్రార్ధన స్వార్ధపూరితమౌతుంది. ప్రార్ధన అనేది దేవునితో మన వ్యక్తిగత సంబంధాన్ని, సహవాసాన్ని పెంపొందించే సాధనం. ఒక మనిషికి మరొక మనిషికి మధ్యనున్న సంబంధం ఎంత వాస్తవమైనదో దేవునికిని మనిషికిని మధ్య నున్న సంబంధం కూడా అంతే వాస్తవమైనది. ఒక వ్యక్తిని గూర్చి తెలుసుకోవాలంటే అతనితో సంభాషించుట ద్వారానే తెలుసుకోగలం. అది వ్రాయుట ద్వారాగాని, మాట్లాడుట ద్వారాగాని అయ్యుండొచ్చు. ఇద్దరూ పరస్పరం సంభాషించాలి, వినాలి. ఇది మనస్సులు మరియు హృదయాల కలయిక. ఇది జరగకపోతే సంబంధములో ఎదుగుదల ఉండదు. దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుంటే, ప్రార్ధన ద్వారా మనము దేవునితో మాట్లాడుతుంటాము. ఇట్లా అనునిత్యము దేవునికి మనకు మధ్య సంబంధం కొనసాగాలి. దేవునితో సంబంధము ఏర్పడాలంటే ఎక్కువగా ప్రార్ధనలోగడపాలి. ఇది ఒకటి రెండురోజుల్లో జరిగేపనికాదు. దీనికి కొంత సమయం పడుతుంది. దేవునితో సంబంధమేర్పరచుకొనిన తర్వాత, నీవు ఏది అడిగినా అది వినడానికి, అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతారు. ఎందుకంటే, దేవునితో సంబంధం ఏర్పడినతర్వాత వ్యర్ధమైనవాటిని అడగలేవు. దేవుడు తాను చేయబోయేకార్యాన్ని అబ్రాహాముకు తెలియజేస్తున్నారంటే, అబ్రాహాము ఒక మనిషితో మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడ గలుగుతున్నాడంటే, దేవునికిని అబ్రాహామునకును మధ్యగల సంబంధం అట్లాంటిది.

🔅అబ్రాహాము ప్రార్ధనలోని దీనత్వం:

ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను (ఆది 18:27). అబ్రాహాము మాటలలో అతడు ఎంత దీనుడుగా మాట్లాడుచున్నాడో అర్ధం చేసుకోగలం. దేవునికి మనము ఎంత దగ్గరగా వెళ్తామో అంత ఎక్కువగా మన అయోగ్యతను తెలుసుకోగలుగుతాము. అబ్రాహాము దేవునితో నేను “ధూళియు, బూడిదెయునై” యున్నాను. అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అతని ప్రార్ధన ఆలకించాలని ఏమిలేదు. పరలోక దూతగణములు దేవుని యెదుట తమ్మును తాము తగ్గించుకొనుచుండగా మనమింకా ఎక్కువగా మనలను మనము తగ్గించుకోవాలి. మనము మన బలహీనతను, అయోగ్యతను, అసమర్ధతను తెలుసుకొంటే అది మనము దేవుని సమీపించడానికి దారితీస్తుంది. మనము ఇటువంటి వైఖరితోను, ధైర్యముతోను, లేక సిగ్గుపడని విశ్వాసముతోను వచ్చినట్లయితే అది దేవునికి అంగీకారయోగ్యముగా ఉంటుంది. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను (యెషయా 66:2) అబ్రాహాము దీన స్వభావముకలిగి దేవునికి ప్రార్ధన చేయుచున్నాడు. మన ప్రార్ధన ఎట్లా వుంది? కొందరు అరుపులు, కేకలతోచేసే ప్రార్ధన దేవునినే భయపెడుతున్నారా అన్నట్లనిపిస్తుంది. అబ్రాహాము ఉపయోగించిన మాటలు ఎంత దీనంగా ఉన్నాయోచూడండి?

🔅 పట్టుదల, గోజాడే తత్వం:

అబ్రాహాము ఇక్కడ దేవుని దగ్గర ఎట్లాంటి హక్కునూ చూపించలేదు. దేవుడు న్యాయవంతుడని, న్యాయమే జరిగిస్తాడని అబ్రాహామునకు తెలుసు. అబ్రాహాము దేవుని ఘనత కొరకు రోషముగలిగి యున్నాడు. దేవుడు సొదొమ గొమొఱ్ఱాలను సమూలంగా నాశనము చేసినట్లయితే, అందులో కొంతమంది నీతిమంతులుండుట వలన అది దేవుని గుణాతిశయములకు మచ్చ తెస్తుంది. దుష్టులతోపాటు, నీతిమంతులను కూడా దేవుడు నాశనము చేసాడని ప్రజలు చెప్పుకొంటారు. కావున దేవుని గుణాతిశయమునకు మొరపెడుతున్నాడు. దేవుడు నీతిమంతుడు. తన స్వభావమునకు వ్యతిరేకముగా ఏమి చెయ్యడు. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? (ఆది 18:25) ఇక్కడ అబ్రాహాము ఒకవైపు దేవుని నీతిమంతమైన న్యాయతీర్పులు, మరొకవైపు పాపము, దుర్మార్గత. ఈ రెండింటికి మధ్యలో అబ్రాహాము నిలబడియున్నాడు. అటు కృపగల దేవునిని, ఇటు పాపులైన ప్రజలను ఏకం చెయ్యాలనేది అబ్రాహాము హృదయవాంఛగా కనబడుతుంది. దేవుడు పాపులపట్ల కనికరం చూపాలని ఆయన ఆశ పడుతున్నాడు. లోకము నిత్య నాశనమువైపు దూసుకొనిపోవుచుండగా, రక్షించబడిన మనము వారినిమిత్తము ఏ రీతిగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చెయ్యగలుగుతున్నాము. రక్షించబడ్డాము అని చెప్పుకొంటున్నమనకు దేవునితో తత్సంబంధాలున్నాయా? మన కుటుంబంలోనే రక్షణలేనివారున్నారు. వారికిని, దేవునికిని మధ్యలో మనము నిలబడగలుగుతున్నామా? వారినిగూర్చి విజ్ఞాపన చేసే అనుభవం మనకుందా?

🔅 ఎడతెగని ప్రార్ధన:

అబ్రాహాము నీతిమంతుల సంఖ్య యాభై నుండి ప్రారంభించి, ఆరుసార్లు ప్రార్ధించాడు. యాభై మందితో ప్రారంభించి, అందులో ఐదుగురిని తగ్గించాడు. దేవుడు దానికి అంగీకరించాడు. అబ్రాహాము హృదయంలో చెప్పలేనంత ఆనందం. వెంటనే మరొక ఐదుగురిని తగ్గించాడు. దానికి కూడా దేవుడు తన అంగీకారాన్ని తెలియజేసారు. ఇప్పుడు అబ్రాహాము విశ్వాసము రెట్టింపయ్యింది. దేవుని హృదయంలోకి మరింతగా చొచ్చుకొనిపోతున్నాడు. ఇట్లా ఐదుగురిని ఐదుగురిని తగ్గిస్తే దేవునికి కోపంవస్తుందేమో? తక్కువసార్లు ప్రార్ధించాలి, నీతిమంతుల సంఖ్యను బాగా తగ్గించాలని, ఇప్పుడు ఒకేసారి పదిమందిని తగ్గించాడు. అంటే నలభై నుండి ముప్పై కు తగ్గించాడు. ఇక అట్లా పదిమందికి చేర్చాడు. ఇక దేవుని నీతి న్యాయములు నెరవేర్చడం ముఖ్యమనుకున్నాడో, పదిమంది నీతిమంతులు తప్పక అక్కడ వుండివుంటారు అనుకున్నాడేమోమరి. అంతటితో వదిలేసాడు. కృపగలిగిన దేవుడు అబ్రాహాము అడిగినదేదియో కాదనలేదు. దీనినిబట్టి అర్థంచేసుకోవచ్చు వారి మధ్యనున్న తత్సంబంధము ఎట్లాంటిదో?

అబ్రాహాము ఐగుప్తులో నున్నప్పుడు, భార్య ఆపదలోనున్నప్పుడుకూడా దేవుని సన్నిధిని సమీపించలేకపోయాడు. ఇప్పుడెట్లా వచ్చింది ఈ ధైర్యం? ఎట్లా అంటే, తాను దేవుని యెదుట ధూళియు బూడిదెయునై యున్నాడని గ్రహింపులోనికి వచ్చాడు. మనము మన బలహీనతను, అయోగ్యతను, అసమర్ధతను తెలుసుకొంటే అది మనము దేవుని సమీపించడానికి దారితీస్తుంది. మనము ఇటువంటి వైఖరితోను, ధైర్యముతోను, లేక సిగ్గుపడని విశ్వాసముతోను వచ్చినట్లయితే అది దేవునికి అంగీకారయోగ్యముగా ఉంటుంది. సొదొమ దేవుని యెదుట ధూళియు బూడిద కాకముందే, అబ్రాహాము దేవుని యెదుట ధూళియు, బూడిదగా మారాడు. ఈ రీతిగా ప్రార్ధించే అనుభవం మనకుండాలి. క్రమములేని ప్రార్థనలతో కాలం వెళ్ళబుచ్చకుండా, దేవునితో పటిష్ఠమైన సంబంధాన్ని కలిగి, విజ్ఞాపన చేసే అనుభవాన్ని కలిగియుందము. అగ్నిలోనుండి లాగినట్లు కొందరినైనా రక్షించడానికి మనవంతు కృషి చేద్దాము!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(43వ భాగము)
♻లోతుయొక్క ఆధ్యాత్మిక లోతు♻ (Part-1)


ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. (ఆది 19:1)

దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నప్పుడే ఇద్దరు దేవదూతలు సొదొమవైపు పయనం సాగించి, సాయంకాలమునకు సొదొమ గవినికి చేరుకున్నారు. అక్కడ లోతు కూర్చొనియున్నాడు. నీతిమంతుడైన అబ్రాహాముతోవేరై లోతు పెద్ద తప్పుచేసాడు. లోతుయొక్క ఆధ్యాత్మిక పతనం ఒకసారి గమనించినట్లయితే?

🔅1. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను (ఆది 13:10)
లోతుకన్నులు యొర్దాను ప్రాంతమంతటిని చూచాయి. అది యెహోవాతోటవలే, ఐగుప్తువలే నీళ్లుపారే దేశముగా వుంది. అది కన్నులకు రమ్యముగా, సస్యశ్యామలంగా వుంది. దావీదు చూపుల్లో (బత్షెబవిషయంలో) పరిశుద్ధతను కోల్పోయాడు. సమ్సోను చూపుల్లో (దెలీలా విషయంలో) పరిశుద్ధతను కోల్పోయాడు. ఆకాను శపితమైన వస్తువులను చూచాడు. సొలొమోను అతని కన్నులు ఆశించినవాటిలో దేనికి చూడకుండా అభ్యంతరం చెప్పలేదట. ఏదేనుతోటలో మంచిచెడ్డలు తెలివినిచ్చే ఆ పండుకూడా చూపుపలకు రమ్యముగానే కనబడింది.

🔅2. తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొనెను(ఆది 13:11):

లోక అందాలను చూచి మోసపోయిన లోతు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకున్నాడు. యొర్దాను ప్రాంతమంతటిని చూచాడు. అతని చూపు లోకాన్ని ఆకర్షించింది. లోతును పతనపు లోతుల్లోనికి దించేస్తుంది. దావీదు చూపుల్లో (బత్షెబ విషయంలో)
పరిశుద్ధతను కోల్పోయాడు. కొడుకు తరుముతుంటుంటే కనీసం చెప్పులుకూడా లేకుండా కొండలకు పారిపోవలసి వచ్చింది. సమ్సోను చూపుల్లో (దెలీలా విషయంలో) పరిశుద్ధతను కోల్పోయాడు. కండ్లు పెరికివేయబడి, దాగోను దేవతకు బలిగామారాడు. ఆకాను శపితమైన వస్తువులను చూచాడు. తన వంశమంతా ఆకోరులోయలో అంతమైపోయింది. సొలొమోను అతని కన్నులు ఆశించినవాటిలో దేనికి చూడకుండా అభ్యంతరం చెప్పలేదట. చివరికి రాజ్యాన్ని కోల్పోయాడు. ఏదేనుతోటలో మంచిచెడ్డలు తెలివినిచ్చే ఆ పండుకూడా చూపుపలకు రమ్యముగానే కనబడింది. దాని ఫలితం నేటికిని అనుభవిస్తూనే వున్నాము. చూపులలో పరిశుద్ధతను కోల్పోతే, తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాము, తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే క్రియలలో పరిశుద్ధతను కోల్పోతాము. తద్వారా అదఃపాతాళానికి దిగిపోతాము. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును (మత్తయి 6:22,23). కావుని ఈ రీతిగా ప్రార్ధించెదము. “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.” (కీర్తనలు 119:37)

🔅3. సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను (ఆది 13:12):

సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. ఇంకా సొదొమలో ప్రవేశించలేదు. ఇప్పటికే అక్కడి ప్రజలు, వారి జీవిత విధానం, వారి అలవాట్లు, దైవభీతి ఇవన్నీ లోతుకు పూర్తిగా అర్ధమయ్యుంటాయి. అక్కడనుండి ముందుకు వెళ్లకుండా వుంటే బాగుండేదేమో? పాపము (పోతీఫరు భార్య) ఇంట్లో ఉందని, యోసేపు ఇంటబయట వున్నాడట. పాపమునకు అందనంత దూరంలోనున్నాడు. లోతు అయితే, పాపము ఏలుబడి చేసే స్థలానికి దగ్గరగా వెళ్ళాడు. మన జీవితాలు ఇట్లానే వున్నాయికదా?


🔅4. లోతు సొదొమలో కాపుర ముండెను (ఆది 14:12):

లోతు లోకం లోతుల్లోనికి మరొక ముందడుగు వేసాడు. సొదొమలో ప్రవేశించాడు. బహుశా ఆ పట్టణపు స్త్రీనే వివాహము చేసుకొని, అక్కడే కాపరం మొదలుపెట్టాడు. ఇద్దరు కుమార్తెలు కలిగారు. కుమార్తెలు వివాహం చేసే వయస్సుకు వచ్చారు. అంటే అప్పటికే సుమారు 20 సంవత్సరముల నుండి సొదొమలోనే కాపురం చేస్తున్నాడు. అక్కడ పరిస్థితులన్నీ సంపూర్తిగా అతనికి తెలుసు. అయినప్పటికీ అక్కడ జీవించడానికే ఇష్టపడ్డాడు. అదేమీ సంతోషకరమైన జీవితం కాదు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడ్డాడు. (2 పేతురు 2:7)తన్నుతాను కాపాడుకోగలిగినా గాని, కనీసం తన కుటుంబాన్ని కూడా రక్షించుకోలేకపోయాడు.

🔅5. సొదొమ వారితో తన కుమార్తెలకు వివాహము నిశ్చయించెను: (ఆది 19:14)

సొదొమ పట్టణస్థులకు దేవుని భయము లేదని, తుచ్ఛమైన, వికృతమైన లైంగిక వాంఛలు కలిగిన జనాంగము అని తెలిసికూడా, వారితోనే వియ్యమొండడానికి సిద్దపడి, కుమార్తెలకు వారితోనే వివాహాలను నిశ్చయించాడు. కాబోయే అల్లుళ్ళు మంచివారే అనుకోవడానికి లేదు. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, ఊరి విడచి వెల్దామన్నపుడు వాళ్ళు ఇతనికి యెగతాళి చేశారు. అబ్రాహాము అట్లా చెయ్యలేదు. కనానీయులతో వియ్యమొందక, తన కుమారుని కొరకు స్వజనులలోనుండి తీసుకువచ్చిన అమ్మాయితోనే వివాహం చేసాడు.
🔅6. లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. (ఆది 19:1):

దేవదూతలు సొదొమను నాశనము చెయ్యడానికి వెళ్ళేటప్పటికి, లోతు సొదొమ గవినియొద్ద కూర్చొని వున్నాడు. గవిని యొద్ద ఎవరు కూర్చొని వుంటారంటే, న్యాయాధిపతులు, రాజకీయనాయకులు, అధికారులు, మొదలగువారు. అంటే లోతు ఆ దేశరాజకీయాల్లో కొనసాగుతున్నాడేమో తెలియదు. అబ్రాహాము నలుగురు రాజులను జయించి, కొల్లగొట్టినవన్నీ తీసుకొచ్చి అప్పగించినందుకు, లోతుకు ముఖ్యమైన పదవి ఏదైనా సొదొమలో యిచ్చారేమో తెలియదు. ఏదిఏమైనా లోతు లోకం లోతుల్లోనికి ప్రవేశిస్తూ చివరికి సొదొమ గవిని యొద్దకు చేరుకున్నాడు. నీ పలుకుబడి నిన్నెక్కడకి నడిపిస్తుందో ఒక్కసారి యోచన చెయ్యి.

లోతు లోకం లోతుల్లోనికి దిగిపోతున్నాగాని, అతన విషయంలోమాత్రం నీతిని కాపాడుకున్నవానిగానే జీవించగలుగుతున్నాడు. దేవదూతలు ఆ పట్టణంలో ప్రవేశించగానే, అబ్రాహామువలెనే లోతుకూడా వారిని గుర్తుపట్టి ఎదుర్కొనడానికి వెళ్లి, సాష్టాంగపడ్డాడు. వారిని మిక్కిలిబలవంతం చేసి మరీ తన ఇంటికి తీసుకొనివెళ్ళాడు. అంటే లోతు ఇంట్లో పరిస్థితులు బానేవున్నాయన్నమాట. పొంగని రొట్టెలతో ఆతిధ్యమిచ్చాడు. అతిధి మర్యాదలు బానే చేసాడు. అతిధులను రక్షించడానికి తన కుమార్తెలను సహితం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు (ఇదెంతమాత్రమూ హర్షించే విషయం కాదు). ఆతిధ్యమివ్వడానికి భార్య, కుమార్తెలుకూడా బానే సహకరించారు. పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు అతనికి వున్నారంటే, ఇప్పటివరకు వారి క్రమశిక్షణ బానే వున్నట్లనిపిస్తుంది. పాపపులోకంలో లోతుకుటుంబం ప్రత్యేకమైనదిగానే జీవిస్తున్నట్లనిపిస్తుంది.

🔅 సొదొమ పాపము:

సమృద్ధియైన ఆహారం కలిగి వుండడం వలన, విచ్చలవిడి సుఖానికి అలవాటుపడి, హృదయాలు గర్వించి, దేవుడంటే లెక్కలేకుండా వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు. (యెహెజ్కేలు 16:49) సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి (ఆది 13:13). ఇంతకీ వారు చేసిన పాపమేమిటో? 'హోమో సెక్స్' మగవారు మగవారితో కలసి చేసే లైంగిక పాపం. లోతు ఇంటికి వచ్చిన మనుష్యులతో లైంగిక వాంఛ తీర్చుకునేందుకు పట్టణము నలుదిశలనుండి వచ్చారట. వచ్చినవారంతా యవ్వనులు మాత్రమేకాదు. బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసిరి. (ఆది 19:4) బాలురను గద్దించేవారు ఎవ్వరూ లేరన్నమాట, తర్వాత తరాలకు ఈ పాపం విస్తృతపరచడానికి, ఈ వృద్ధులే పిల్లలను వెంటబెట్టుకొని తీసుకువచ్చారేమో? వినడానికే ఎంత అసహ్యంగా వున్నాయి వారి జీవితాలు? లోతు తన కుమార్తెలను పంపిస్తానంటే, లేదు నీ ఇంటికి వచ్చిన మనుషులే మాకు కావాలంటున్నారు. తుచ్ఛమైన అభిలాష, పురుషులతో పురుషులు లైంగిక వాంఛలు తీర్చుకొనే దౌర్భాగ్యస్థితిలో వారు కొనసాగుతున్నారు. లోతు ఇట్లాంటివారి మధ్యలోనే కాలం వెళ్లబుచ్చుతున్నాడుగాని, వారినుండి దూరమయ్యే ప్రయత్నం చెయ్యలేదు. ఒకవేళ అక్కడే పుట్టిపెరిగిన తన భార్య, పిల్లలు అందుకు సమ్మతించలేదేమో? లేక అక్కడ అతనికున్న ఆస్థిని, పలుకుబడిని విడచి రాలేకపోయాడేమో? చివరకు తాను సంపాధించినదానిలో దేనిని తన వెంట తీసుకొనివెళ్లలేక పోయాడు.

ప్రియ విశ్వాసి! నీవు జీవిస్తున్న పరిస్థితులు సంఘములోగాని, సమాజములోగాని దేవునికి వ్యతిరేకమైనవని తెలిసికూడా, నీ పలుకుబడి కోసం, సంపాదనకు, నీ మనస్సాక్షిని చంపుకొని కొనసాగిస్తున్నావేమో? దాని ఫలితం అత్యంత చేదుగా వుండబోతోంది. నీవాశించినదేది నీతోరాదు. పరిశుద్ధుడైన ప్రభువుయొక్క అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన పిల్లలతో సహవాసం చేస్తూ, నిత్యమైన గమ్యమువైపు సాగిపోవుదము.

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(44వ భాగము)
🔅లోతుయొక్క ఆధ్యాత్మిక లోతు🔅 (Part-2)


దేవదూతలు సొదొమను దర్శించడానికిగల కారణమును లోతుకి తెలియజేస్తున్నారు. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితివిు; వారినిగూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పెను(ఆది 19 : 13 ) దేవునియొక్క న్యాయమైన తీర్పు ఆసన్నమయింది. దేవుని ఉగ్రత ఆ పట్టణములమీద (సొదొమ, గొమొఱ్ఱా, అద్మా, సెబోయీము) క్రుమ్మరించబోతున్నాడు. అది ముమ్మాటికిని న్యాయమైనదే. కారణం? వృద్ధులు మొదలుకొని బాలురవరకు, స్వలింగ సంపర్కం అనే పాపములో కొనసాగుతున్నారు (ఆది 19:4,5). ఇది ఘోరమైన పాపం. దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో, ఇది మరణమునకు తగిన పాపమని చెప్పబడింది (లేవి 18:22; 20:13 ) నూతన నిబంధన కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ( రోమా 1:26,27; 1కొరింథీ 6:9; 1తిమోతి1:10; యూదా7 )

లోతు, కాబోయే అల్లుళ్లతో మాట్లాడాడు. వాళ్ళతనిని యెగతాళి చేసారు. బహుశా అతని భార్య, కుమార్తెలుకూడా ఆ పట్టణం విడచిపెట్టి రావడానికి ఒప్పుకోలేదేమో? ఇక ఎవ్వరూ రానప్పుడు నేనుమాత్రం వెళ్లడం ఎందుకు? వీరితోనే వుండిపోదామనే నిర్ణయంతో బహుశా లోతు తడవు చేస్తున్నాడేమో? లేక తాను సంపాదించిన ఆస్థిపాస్తులను విడచి రాలేకపోతున్నాడేమో తెలియదు. అయినప్పటికీ లోతు నశించిపోకుండా తప్పించుకున్నది దేవునియొక్క కృపా, కనికరములను బట్టియేతప్ప, లోతు నీతినిబట్టి కాదు (ఎఫెసి 2:4,8; 2పేతురు 3:9)

🔅లోతు చేసిన ప్రార్ధన:

ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా
"నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదు నేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా, నేను బ్రదుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని;" (ఆది 19: 19-21). దేవుని కనికరము, అబ్రాహాము ప్రార్ధన సొదొమ గొమొర్రా పట్టణాలతోపాటు, లోతు కుటుంబం నాశనం కాకుండా రక్షించ గలిగినప్పటికి, లోతు మరొకతప్పు చేస్తున్నాడు. దేవుడు వెళ్ళమనిన ప్రాంతానికి వెళ్ళకుండా దేవునికే సలహాలిస్తున్నాడు. దేవుడు చూపించిన పర్వతానికి వెళ్ళనంటున్నాడు. తాను నిర్ణయించుకున్న ప్రాంతానికే వెళ్ళడం కోసం ఆతురత పడుతున్నాడు. అంతేకాదు, 'ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో?' అంటున్నాడు. అంటే? ఆ కీడు సంభవించకుండా, ఒకవేళ, సంభవించినప్పటికీ ఆ కీడునుండి దేవుడు రక్షించలేడా? తప్పకుండా రక్షించగలడు. దేవుని మాట లోతు విననప్పటికీ, దేవుడు మాత్రం లోతు ప్రార్ధనను అంగీకరించాడు. నీవు చెప్పినట్లే చెయ్యమన్నాడు. దేవుడు కొన్ని సందర్భాలలో మనము అడిగినది కాదనకుండా ఇచ్చేస్తాడు. అయితే, దాని ప్రతిఫలం ఏమిటో తర్వాత తెలుస్తుంది. లోతు జీవితమే దానికొక గొప్ప ఉదాహరణ.
దేవుడు చూపించిన పర్వతానికి వెళ్లి జీవిస్తే? అతని కుమార్తెలకు అటువంటి దుష్టతలంపులు రాకుండా, దేవుడు వారి తలంపులకు కావలి వుండేవాడేమో? వారి పట్ల దేవుని ప్రణాళిక వేరే విధంగా వుండేదేమో? దేవుడు చూపించిన పర్వతానికి వెళ్ళాడు ఎప్పుడు? తాను ఎంపిక చేసుకున్న సోయరు నచ్చనప్పుడు. కనీసం అప్పుడైనా లోతు, అబ్రాహాము దగ్గరకు వెళ్లిప్రయత్నం చేసివుంటే బాగుండేదేమో? దేవుని చిత్తాన్ని ప్రక్కనబెట్టి, దేవునికే సలహాలిచ్చి, స్వంత చిత్తం నెరవేర్చుకొని మాయని మచ్చని తెచ్చుకొని, శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించారు. లోతు నీతిమంతుడుగా పేర్కొనబడినప్పటికీ (2 పేతురు 2:7), అతని నీతి కనీసం తన కుటుంబాన్ని కూడా రక్షించలేకపోయింది. కారణం? అతని ఆలోచన, దేవుని ఆలోచనతో సరితూగ లేదు. లోతు దేవునికే సలహాలిచ్చి, ఆ త్రాసులో తేలిపోయాడు. యిక్కడితో అతని చరిత్ర అర్ధాంతరంగా ముగిసిపోయింది. అతడు ఏమయ్యాడో ఇక పరిశుద్ధ గ్రంధం అతని గురించి ఎక్కడా మాట్లాడలేదు.

🔅లోతుభార్య ఉప్పు స్తంభముగా మారుట: (ఆది 19:26)
లోతు భార్యకు సొదొమ విడచి బయటకు రావడం మొదటినుండి ఇష్టంలేనట్లున్నది. లోతు తడవు చేయడానికి కూడా ఈమె ఒక కారణం కావొచ్చు. అయితే దేవుని కృపా కనికరం, దానికితోడు అబ్రాహాము ప్రార్దననుబట్టి దూతలు వారిని బలవంతముగా చేతులుపట్టుకొని బయటకు తీసుకొనివచ్చారు. వెనుక తిరిగి చూడకుండా, మైదానము విడచి పారిపొమ్మని చెప్పారు. వారు మనుషులనైతే తీసుకొచ్చారుగాని లోతుభార్య మనసు మాత్రం అక్కడే ఉండిపొయింది. దేవుడు చెప్పింది జరుగుతుందో లేదో చూద్దామనుకుందో? లేక తాను కూడబెట్టుకున్న నగలు, వస్త్రాలు ఏమైపోతున్నాయో అనుకుందో తెలియదుగాని, ఒక్క క్షణంపాటు వెనుకతిరిగి చూచింది. చూచిన వెంటనే ఎట్లావున్నది అట్లానే బిగుసుకుపోయింది. గాలి వీచి, గంధకపుమైనము ఆమెను చుట్టి, ఉప్పు స్తంభముగా మారిపోయింది. తన హృదయంలో సొదొమ గూర్చిన ఆలోచనలే వుండడంవలన, సొదొమకు పట్టిన గతే ఆమెకు కూడా పట్టింది. ఈమె అవిధేయత ఎంతటి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటే, తన ప్రాణాన్ని కోల్పోవడమే కాదుగాని, కుమార్తెలు దౌర్భాగ్యమైన స్థితికి దిగజారడానికి ఈమె కారణమయ్యింది. ఆమె జీవించివుంటే, కుమార్తెలు ఆ పని చెయ్యడానికి అవకాశమే లేదు. ఒక తల్లిగా నీవు వేసే తప్పుటడుగు నీ బిడ్డలపైన పూర్తిగా ప్రభావం చూపబోతుందని గుర్తుపెట్టుకో. నీ బిడ్డలు ధన్యకరమైన జీవితాన్ని జీవించాలంటే మొట్టమొదటగా నీ జీవితాన్ని సరిచేసుకో.

🔅లోతు కుమార్తెలు:
పురుషుని కూడని కుమార్తెలని తండ్రి సాక్ష్యమిస్తున్నాడు. దీనినిబట్టి వీరి ప్రవర్తన బానే ఉన్నట్లుంది. సొదొమ నుండి పారిపోతున్న సమయంలో కొంత దూరం వెళ్లేసరికి, తల్లి మాటలుగాని, వారితోవస్తున్న అలికిడిగానిలేదు. అయినప్పటికీ, వెనుకకు తిరగకుండా దేవుని మాటకే లోబడి ముందుకు ప్రయాణించినట్లు అర్ధమవుతుంది. మొదట తన తండ్రి మాటచొప్పున సోయరకు, తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్ధించకుండానే తండ్రి స్వంత నిర్ణయంతో మొదటగా దేవుడు తప్పించుకుపొమ్మని చెప్పిన ఆ పర్వతానికివెళ్ళి, ఒక గుహలో నివసించారు. అప్పుడు వీరికొక పిచ్చి ఆలోచన వచ్చింది. అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలి వాడు; సర్వ లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు (ఆది 19:31). అందుచే వీరొక నిర్ణయానికి వచ్చారు. ఈ లోకంలో మేమే నీతిమంతులం. సర్వలోకప్రజలు నాశనమయ్యారు. జల ప్రళయం తర్వాత నోవహు కుమారులతో సంతానము భూమిమీద ఎట్లా ప్రబలిందో? ఇప్పుడు మాతోనే లోకం నిండించబడాలి అనుకున్నారేమో? తండ్రికి ద్రాక్షారసము పట్టించి, వారి ప్రణాళికను నెరవేర్చారు. అయితే, భూమి మీద ఏ మనుష్యుడూ లేనప్పుడు వీరికి ద్రాక్షారసం ఎట్లా వచ్చింది? బహుశా సొదొమనుండి వచ్చినప్పుడే వారివెంట ద్రాక్షారసాన్ని తెచ్చుకున్నారేమో? సొదొమలో వీరికి త్రాగే అలవాటుందేమో తెలియదు. ఏదిఏమైనా వీరి పిచ్చి ఆలోచన, సృష్టిలోనే మాయని మచ్చను తెచ్చింది. దేవునికి అత్యంత విరోధులైన మోయాబీయులు, అమ్మోనీయులు ఈ భూమిమీదకు రావడానికి ఈ అక్కాచెల్లెళ్ళిద్దరూ కారణమయ్యారు.

🔅Note:
బైబిల్ వ్యతిరేకులైన అనేకులు ఈ వృత్తాంతమును తీసుకొని, బైబిల్ ఎట్లా పరిశుద్ధ గ్రంధమయ్యింది అంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే కొందరు డాక్టర్లు “లోతుకు తెలియకుండా, అతని కుమార్తెలు అతనితో కలిసే అవకాశం లేనేలేదంటూ”, దీనిని సైన్సు ఒప్పుకోదంటూ నివేదికలిస్తున్నారు. అయితే, శరీరం మృతతుల్యమై, స్త్రీ ధర్మం నిలిచిపోయిన 90 సంవత్సరాల ముసలమ్మకు, 100 సంవత్సరాల ముసలాయన ద్వారా గర్భం ధరించడాన్ని సైన్సు ఒప్పుకొంటుందా? వారే చెప్పాలి. అదికూడా వాస్తవం కాదంటారా? అయితే, ఇశ్రాయేలీయుల జనాంగము భూమిమీదకు ఎట్లా వచ్చారు? లోతును పరిశుద్ధునిగా చూపించే ప్రయత్నం ఎంతమాత్రమూ పరిశుద్ధ గ్రంధము చెయ్యదు. అట్లా చెయ్యాలనుకుంటే, ఈ వృత్తాంతాన్ని వ్రాయించకుండానే దేవుడు జాగ్రత్తపడేవాడు. వున్నది ఉన్నట్లు చెప్పడమే పరిశుద్ధ గ్రంథ ప్రత్యేకత. ఇది మనకు దృష్టాంతముగా నుండునట్లు దేవుడే వ్రాయించాడు. తన కుమార్తెలు గర్భం ధరించింది అతని ద్వారానే అనే విషయం తర్వాత రోజుల్లోకూడా లోతుకు తెలిసియుండక పోవచ్చు. ఎందుకంటే, సొదొమలో నున్నప్పుడే వారికి వివాహాలు నిశ్చయమయ్యాయి. కాబట్టి, తన కుమార్తెలు వారితోపోయి గర్భవతులయ్యుంటారని తలంచే అవకాశం కూడా లోతుకువుంది. ఈ చుట్టుపట్లనున్న ప్రాంతాలన్నింటిలో నేటికీ ఆ సంస్కృతి కొనసాగుతూనే వుంది. (అబ్బాయిలకు 13 సంవత్సరాల వయస్సులో “బర్మీజ్వా”, అమ్మాయిలకు 12 సంవత్సరాల వయస్సులో “బత్మిజ్వా” అనే ఫంక్షన్స్ చేసి, స్వేచ్ఛగా వారి ఇష్టానికి వారిని విడచిపెట్టేస్తారు). లోతు చరిత్రను తీసుకొని క్రైస్తవ్యాన్ని హేళన చేయాలనుకోవడం అవివేకం. ఎందుకంటే? లోతు ఒక ప్రవక్తేమికాదు. అతనిని అనుసరించేవాళ్ళు గాని, అతనిని అనుసరించాలని బోధించేవాళ్ళుగాని, వారు చేసినపనిని అభినదించేవారుగాని, ప్రోత్సహించేవారుగాని క్రైస్తవులలో ఎవ్వరూలేరు. దేవుని హృదయానుసారుడైన దావీదు పాపమైనా, దేవుని యిల్లంతటిలో నమ్మకస్తుడైన మోషేచేసిన పాపమైనా, అది లోతుచేసిన పాపమైనా సరే, పరిశుద్ధ గ్రంధం బట్టబయలుచేసి, వారి పాపాన్ని రెండువేల భాషల్లోనికి తర్జుమా చేసింది. పరిశుద్ధ గ్రంధం పాపమును దాచిపెట్టే ప్రయత్నం చెయ్యనే చెయ్యదు అది పరిశుద్ధ గ్రంథ ప్రాశస్త్యం.

లోకముచేత ఆకర్షించబడిన లోతు, నీతిమంతుడైన అబ్రాహాము సహవాసాన్ని విడచి, దేవుని చిత్తానికిలోబడలేక జీవించిన అస్తవ్యస్తమైన కుటుంబజీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు సరికొత్తపాఠం.
సరిచేసుకుందాం! గమ్యంవైపు సాగిపోదాం!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(45వ భాగము)
♻ పునరావృతమైన అబ్రాహాము పాపము ♻


ఐగుప్తు విషాదకరమైన మలుపు తర్వాత, అబ్రాహాము హెబ్రోనులో దేవునితో సహవాసం చేస్తూ, దేవునిచేత నిబంధనను నూతనపరచబడినవాడై, విశ్వాసయాత్రలో పరిపూర్ణమైన స్థితికి చేరుకొంటున్నట్లనిపిస్తున్న తరుణములో, హెబ్రోనును విడచి గెరారునకు వెళ్లి అక్కడ నివసించాడు. గత కాలములో కనానులో కరవు వచ్చినందువల్ల ఐగుప్తునకు వెళ్ళాడు. ఇప్పుడు హెబ్రోనును విడచి ఏకారణము చేత గెరారునకు వెళ్ళాడో తెలియదు. బహుశా, సొదొమ గొమొఱ్ఱా పట్టణాలు నాశనంలో లోతుకూడా చనిపోయివుంటాడని అబ్రాహాము భావించియుండవచ్చు. నశించిన పట్టణాలు అబ్రాహాము నివసించేప్రాంతానికి కనుచూపుమేరల్లోనే వుండడంతో, అతని జ్ఞాపకాలతో అబ్రాహాము కలతచెంది ఇక ఆ ప్రాంతములో నివసించలేక గెరారుకు వెళ్లియుండవచ్చు.
“గెరారు” అనేది మధ్యధరా సముద్రతీరాన ఫిలిష్తీయుల స్వాధీనములోనున్న ప్రాంతము. అబ్రాహాము అక్కడకి వెళ్లి, కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను (ఆది 20:1). కాదేషు అనగా “పరిశుద్ధత”, షూరు అనగా “గోడ” అని అర్ధము. పరిశుద్ధతకు, ఆధ్యాత్మిక అడ్డుగోడకు మధ్యలో నివాసం చేస్తున్నాడు. కనానులోకూడా ఇట్లాంటి జీవితమే కనిపిస్తుంది. బేతేలుకు, హాయికిని మధ్య గుడారం వేసుకున్నాడు. అనగా దేవుని సన్నిధికిని, లోకానికి మధ్య. ఇప్పుడుకూడా అట్లాంటి పరిస్థితులే కనబడుతున్నాయి.

ఐగుప్తు వెళ్ళినప్పుడు ఫరోతో ఏ అబద్దమైతే చెప్పాడో, గెరారుకు వెళ్ళినప్పుడు అబీమెలెకుతో కూడా అదే అబద్దం చెబుతున్నాడు. ( ఫరో, అబీమెలెకు అనేవి వారిపేర్లు కాదుగాని, ఐగుప్తు రాజులను “ఫరోలని” ఫిలిష్తీయ రాజులను “ అబీమెలెకు” అని పీలుస్తారు. అవి వారియొక్క బిరుదులు). అక్కడ ఎవరికైనా అందమైన భార్య వుంటే, భర్తను చంపి అతని భార్యను వారి భార్యగా చేసుకొనే పరిస్థితులున్నాయి. అయితే, ఇప్పుడు శారా వయస్సు సుమారు ఎనభై సంవత్సరాలు. అంటే మనలెక్క ప్రకారం ఆమె వృద్ధురాలు. తన గురించి అబ్రాహాము భయపడాల్సిందేముంది? అయినప్పటికీ, అక్కడకూడా శారా నా చెల్లెలు అని చెప్తున్నాడు. శారాను కూడా తనను నా అన్న అని చెప్పమన్నాడు? అంటే, ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా శారా అంత అందమైనదేమో? అంటే ఇప్పుడు అబ్రాహాము మరొకసారి, తన భార్యను ఎవరుతీసుకెళ్లినా యిచ్చెయ్యడానికి సిద్ధపడ్డాడు. ఐగుప్తులోవలే, గెరారులో కూడా నీకంటే నా ప్రాణమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నాడు. దీనికంతటికి కారణం? హెబ్రోనును విడచిపెట్టడం ద్వారా, దేవుని సహవాసానికి దూరమైపోయాడేమో?

ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మన బలహీనత ఏమిటో సాతానుకు తెలిస్తే, మనలను అదే విషమ పరీక్షకు పదేపదే గురిచేస్తాడు. అబ్రాహాము బలహీనత ఏమిటో ఐగుప్తులో సాతాను పసిగట్టాడు. గెరారులో తిరిగి ప్రయోగించాడు. మనలో అనేకులు ఒక్కసారి శోధనను జయించాక ఇక మేము పరిశుద్ధులమే అని సంబరపడిపోతాము. అయితే, ఒక విషయం మనకు తెలియాలి. మన బలహీనత ఏమిటో సాతానుకు తెలుసు, అందుచే విశ్వాసములో నీవెంతటి పటిష్ఠమైన స్థితిలోనున్నప్పటికీ, సమయంచూచి వాడి పంజా విసురుతాడు. దేవుని సహవాసంలో అత్యంత పటిష్టమైన స్థితిలోనున్న అబ్రాహాముమీదకు వాడి పంజావిసిరాడు. ఒక్కదెబ్బకు అబ్రాహాము క్రిందపడ్డాడు. దేవుని సహవాసంలో తన అన్నకొడుకు కోసం, నలుగురు రాజులపై యుద్ధముచేసి విజయంసాధించి, విడిపించుకొచ్చాడు. ఇప్పుడేమో తన భార్యను కూడా కాపాడుకోలేని స్థితిలోనున్నాడు. నోవహు ఎప్పుడు తప్పిపోయాడు? భయంకరమైన దినాలను సహించిన తర్వాతనేగదా! మోషే ఎప్పుడు తప్పిపోయాడు? అనేక సంవత్సరాలు నమ్మకమైన నాయకుడుగా కొనసాగిన తర్వాతనేగదా! ఏలియా విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోయాడు? కర్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తలపై విజయాన్ని సాధించిన తర్వాతనేకదా! నేను పరిశుద్ధుడను, నేను ఎప్పటికి పాపం చెయ్యను అనే ధీమాలో నీవుంటే, సరైన సమయంలో సాతానుగాడు పంజా విసురుతాడు. ఆ పరిస్థితినుండి నీవూ నేనూ తప్పింపబడడానికే వీటన్నిటిని దృష్టాంతములుగా దేవుడు వ్రాయించి పెట్టాడని గుర్తుంచుకో.

అంతా అబ్రాహాము అనుకున్నట్లే జరిగింది. శారాను అబీమెలెకు తీసుకుపోయాడు. అబ్రాహాము మిన్నకుండిపోయాడు. ఐగుప్తులో ఇదే పని చేసావు. అక్కడ నీ భార్యను రక్షించాను. ఇప్పుడు మరలా ఇదే పనిచేసావు ఇక నిన్ను క్షమించేదిలేదంటూ కృపగలిగిన దేవుడు అబ్రాహామును గద్దించే ప్రయత్నం చెయ్యకుండా, ఆయన కలుగజేసుకున్నాడు. 1. దేవుడు అబీమెలెకును వ్యాధితో మొత్తాడు. 2. అబీమెలెకు యింటిలోని స్త్రీల గర్భములు తాత్కాలికంగా మూసివేశారు (ఆది 20:17).
అబీమెలెకును హెచ్చరించి ఆమె గృహస్థ జీవితాన్ని కాపాడాడు. అట్లాఅని నీవు తప్పులు చేస్తూవుంటే నేను కాపాడతానని దేవుడు అబ్రాహామును ప్రోత్సహించినట్లుకాదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని అబ్రాహాము పరిపూర్ణముగా గ్రహించడానికిని, అదే సమయంలో దేవుడు వారికిచ్చిన వాగ్ధానము వారి జీవితాల్లో నెరవేరుటకుగాను దేవుడు తన కృపను వారికి అనుగ్రహిస్తున్నారు. అనేక సందర్భాలలో మనము తప్పుచేసినా కృపగలిగిన దేవుడు తన యొక్క కనికరముతో మనలను కాపాడుతూవుంటే, మనమేమో నేను చేస్తున్నది సరియైనదే, అందుకే దేవుడు నాకు తోడుగానుండి నడిపిస్తున్నాడనే భ్రమలో, మరిన్నితప్పులు చెయ్యడానికి సిద్దపడుతున్నాము. మనము పొందిన ఫలితాన్ని బట్టికాదుగాని, వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవలసిన అవసరతవుంది.

దేవుని మాటకు లోబడి, అబీమెలెకు, శారాతో పోలేదు. అతడు నాచెల్లి అనిచెప్పాడు. ఈమెకూడా నా అన్న అనిచెప్పింది. అందుకే నేను ఆమెను నా యింట చేర్చుకున్నాను. యదార్ధ హృదయంతోనే ఈ పనిచేశానన్నప్పుడు, అతని చెప్పినదానిని దేవుడు కూడా అంగీకరించి యదార్ధహృదయంతో నీవు చేసావుకాబట్టే “నీవు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా” నిన్నునేను అడ్డగించాను అంటున్నారు దేవుడు. అంటే పాపము చెయ్యకుండా దేవుడు మనలను అడ్డగించకపోతే, పాపము చెయ్యకుండా మనలను మనము నియంత్రించుకోలేము
(1సమూ 25:26,34; యూదా 24) ఇక్కడ అబీమెలెకు తననుతాను నీతిమంతునిగా కనపరచుకొనే ప్రయత్నం చేస్తున్నప్పుడు. దేవుడు అంటున్నమాట, నీవు నాకు విరోధముగా పాపము చెయ్యకుండా నేనే నిన్ను అడ్డగించాను. అబీమెలెకు దేవునికి వ్యతిరేకంగా ఏమి పాపము చేసాడు? అబ్రాహాముకు, శారాకు వ్యతిరేకంగా అనాలికదా? పరిశుద్ధ గ్రంధము ప్రకారము మనము ఏ పాపము చేసినా అది మొట్ట మొదట దేవునికి వ్యతిరేకంగా చేసినట్లు గ్రహించాలి. దావీదు పాపము చేసినప్పుడు, బత్షెబకు, ఊరియాకు విరోధముగా పాపము చేసాను అనకుండా, అది దేవునికే విరోధముగా పాపము చేశానని ఒప్పుకొంటున్నాడు. “నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను (కీర్తనలు 51:4). ఒక వ్యక్తికి కీడు తలపెట్టినా అది దేవునికి చేసినట్లే. "సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించు చున్న యేసును" (అపో. కా. 9:4,5) సౌలు (ఇంకా పౌలుగా మారలేదు). యేసు ప్రభువును ఎప్పుడూ ప్రత్యక్షంగా హింసించలేదు. యేసు ప్రభువు అంటున్నారు "నన్నెందుకు హింసించు చున్నావు?" "నీవు హింసించుచున్న యేసును" అని. ఇప్పుడు అర్ధమయ్యింది కదా? ఆయన పిల్లలను హింసిస్తే ఆయనను హింసించినట్లే.

ప్రియ విశ్వాసి! నీవు చేసే ఏ పాపమైనాసరే, మొట్టమొదటిగా అది కేవలం దేవునికే వ్యతిరేకంగా చేస్తున్నాననే గ్రహింపును కలిగియుండి, పాపము చెయ్యకుండా తప్పించుటకు ప్రభువును ప్రార్ధించుదము!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(46వ భాగము)
♻ పునరావృతమైన అబ్రాహాము పాపము ♻ (part-2)


దేవుడు పాపము చెయ్యకుండా అబీమెలెకును అడ్డగించడమే కాకుండా, ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను (ఆది 20:7). ఇంతవరకు నీవు యదార్ధముగానే చేసావు. అంతే యదార్ధముగా అబ్రాహాము భార్యను అతనికి అప్పగించు. లేనియెడల నీవునూ, నీవారందరునూ నిశ్చయముగా మరణిస్తారని హెచ్చరిక చేస్తూ, అబ్రాహాము ఒక ప్రవక్తయని, అతడు ప్రార్ధిస్తే నీవు బ్రతుకుతావు అని దేవుడు అబీమెలెకునను తెలియజేశాడు. అతడు అన్యుడైనప్పటికీ అబ్రాహాము ప్రవక్తయని తెలియగానే, అతనికిని, అతని దేవునికిని మిక్కిలి భయపడ్డాడు. ప్రవక్త అంటే “ఆత్మవశుడై పలికేవాడు” అని అర్ధము. నిజమైన ప్రవక్త దేవుని ఆత్మ ప్రేరణవలన దైవసందేశాలు వినిపిస్తాడు. అబద్ద ప్రవక్తలు కూడా వున్నారు, అప్పట్లోనూ వున్నారు, ఇప్పుడూ వున్నారు. అబ్రాహాము ప్రవక్తయని దేవుడే స్వయంగా తెలియజేస్తున్నారు.

అబ్రాహాము ఐగుప్తులో అన్యుడైన ఫరోచేత గద్దించబడినట్లుగానే, గెరారులో అన్యుడైన అబీమెలెకుచేత గద్దించబడడం అత్యంత విచారకరం. దానినుండి తప్పించుకోవడానికి, అబ్రాహాము కొన్నిసాకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కల్దీయుల దేశములో అబ్రాహాము తండ్రి ఇంట బయలుదేరినప్పుడే ఒక ఒప్పందం చేసుకున్నారట. మనము ఎక్కడకి వెళ్లినా ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము (ఆది 20:13 ) అని తన భార్యయైన శారాతో చెప్పాడట. ఈ పన్నాగం ఐగుప్తులో విఫలమై, తనతోపాటు, తన భార్య, ఫరో ఇంటివారు సహితం ఎంతటి ఇబ్బందులకు గురి అయ్యారో అబ్రాహాము ప్రత్యక్షంగా చూచాడు. అయినప్పటికీ కల్దీయుల దేశములో వారు చేసుకున్న ఒప్పందానికి కట్టిబడివుండడం నిజంగా చాలా ఆశ్చర్యకరం, విచారకరం. ఐగుప్తులో శారా ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నదో ఆమె ఎప్పటికీ మరచిపోలేదు. కనీసం తనయైనా చెప్పవచ్చుకదా? ఆ దినాలలో భార్తమాటకు ఎదురుచెప్పే సంస్కృతిలేదు. మరణకరమైన పరిస్థితులైనాసరే భర్తమాటకు శిరసావహించాలి. దానిలో భాగంగా తాను చేసిన ఒప్పందానికే కట్టుబడివుంది, దానినే అబ్రాహాము అతని బలముగా తీసుకొని, తన స్వంత ఉద్దేశ్యాలన్నీ ఆమెపై రుద్దేప్రయత్నం చేసాడు. కానీ పరిశుద్ధ గ్రంధం పురుషుడు స్త్రీ పై పెత్తనం చెయ్యడానికి అంగీకరించదు. యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు (గలతీ 3:26-28) భర్త, భార్యను ప్రేమించాలి. భార్య, భర్తకు లోబడివుండాలి. భర్తముందు ప్రేమించాలా? భార్యముందు లోబడాలా అంటే? రెండూ ఏకకాలంలో జరగాలి. ఎవరి భాధ్యతను వారు నిర్వహించాలి. రక్షణ విషయంలో స్త్రీపురుషులు ఒక్కటే గాని, సంఘములోమాత్రం వారు నిర్వహించేపాత్ర మాత్రం తప్పక, పరిశుద్ధ లేఖనాలకు కట్టుబడివుండాలి.

అబ్రాహాము మరొకసాకు చెప్తున్నాడు. అంతేకాక ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది (ఆది 20:12) తెరహుకు ఇద్దరు భార్యలు. వారిలో ఒకామెకు అబ్రాహాము జన్మించగా, మరొకామెకు శారా జన్మించింది. ఆరీతిగా ఇద్దరూ అన్నాచెల్లెళ్ళే. ఇదెప్పటిమాట సుమారు 30 సంవత్సరాల మాట. కల్దీయుల దేశములోనున్నప్పుడే వారి వివాహం జరిగిపోయింది. ఇప్పుడు ఆమె తనకు భార్య. ఆ విషయం చెప్పకుండా తాను చేసినపనిని సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. సాకులు చెప్పి తప్పించుకోవాలి అనుకొనేకంటే, దేవుని కృపపైనే ఆధారపడడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అబ్రాహాము తన పాప స్వభావాన్ని ఎల్లప్పుడూ నమ్ముకొనే స్థితినుండి అబ్రాహాము పాఠము నేర్చుకోలేదు. గెరారులో వచ్చిన సమస్యను తానే పరిష్కరించుకోగలనని అబ్రాహాము తలంచాడు. గాని, అతని అంచనా తలక్రిందులయ్యింది. అబీమెలెకు అతనిని ప్రశ్నించినప్పుడు “అబ్రాహాముఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని” ( ఆది 20:11) అని చెప్పాడు. గెరారులో దైవ భయమున్నదని అబీమెలెకు చూపించాడు. ఇప్పుడు అబ్రాహాము సత్యమునుండి దూరముగా తొలగినట్లయ్యింది.

దేవుని సహనము, దీర్ఘశాంతము ఎంత గొప్పది? ఓడిపోవడం అబ్రాహామునకు అలవాటయ్యింది. అయితే, వాటివల్ల వచ్చే పర్యవసానాలకు దేవుడు అబ్రాహామును భాద్యుని చేయకుండా, ఆయనే కలుగజేసుకొంటున్నాడు. ఒకవేళ అట్లా జరుగకవుంటే అబ్రాహాము ద్వారా దేవుని ఉద్దేశ్యాలు నెరవేరియుండేవికాదు. అయితే అతని యెడల తన సంకల్పాన్ని ఉద్దేశ్యాన్ని నెరవేర్చాలని అబ్రాహామును దేవుడెంతో వెన్నంటియున్నాడు. “మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు”
(2 తిమోతికి 2:13). అవును! ఇట్లాంటి అద్భుతమైన దేవుడు మనకున్నాడు. ఆయన దీర్ఘశాంతం, సహనం ఎంతో ఆశ్చర్యము. తన పిల్లల యెడల దేవుడు యదార్ధవంతుడు, నమ్మకస్థుడు. మనమాయనను అనుమానించినప్పుడు కూడా ఆయన నమ్మకంగానే ఉంటాడు. ఆయనను దుఃఖపరచినప్పుడు కూడా ఆయన నమ్మకముగానే ఉంటాడు. దేవుని కనికరము ఎంత గొప్పదో, ఆయన నిన్నెంతగా ప్రేమించుచున్నాడో నీవెరిగియుంటే పాపము చేయుటద్వారా ఆయనను దుఃఖపరచాలని నీవెన్నడూ కోరవు.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(47వ భాగము)
♻ ఇస్సాకు జననం - ఇష్మాయేలు పయనం ♻ (part-1)


అబ్రాహాము, శారాల 25 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. గెరారులో వారు నివసిస్తున్న గుడారంలో నవ్వులు విరిసాయి. దానికి కారణం వారింట్లో “స్మైలీ” పుట్టాడు. “ఇస్సాకు” అను పేరుకు “నవ్వు” అని అర్ధము. ఒకప్పుడు శారా దేవుని మాటలకు అనుమానంతో నవ్వింది. ఆ అనుమానమే నిజమయ్యింది. ఇప్పుడేమో ఊరంతా తన గురించి నవ్వుతున్నారు. ఇది ఎట్లా జరిగింది? ఎప్పుడు సాధ్యమయ్యింది? అంటే, ఇస్సాకు జననం “యెహోవామాట చొప్పున”జరిగింది ,అది దేవుని “నిర్ణయకాలంలో” జరిగింది. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను (ఆది 21:1-2).

కల్దీయుల దేశములోనున్నప్పుడే అబ్రాహామునకు దేవుడిచ్చిన వాగ్ధానమిది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు(ఆది 12:2). తర్వాత భూమిపైనున్న ఇసుక రేణువులవలే నీ సంతానమును అభివృద్ధిచేస్తానని దేవుడు అబ్రాహామునకు వాగ్ధానం చేసాడు. సంవత్సరాలు దొరలిపోతున్నాయితప్ప అబ్రాహామునకు సంతానం కలుగలేదు. బిడ్డలు కలిగే వయస్సు మించిపోతుంది, ఇక మనమే స్వంత ప్రయత్నాలు చేసుకుందామనే ఉద్దేశ్యముతో శారా చెప్పినట్లు అబ్రాహాము విన్నాడు. హాగరుతో బిడ్డను కన్నాడు. అయితే దేవునికి వ్యతిరేకంగా జరిగించిన ఈ వ్యవహారమంతా వారికి మరింత బాధను, దుఃఖాన్ని కలుగజేసింది. 13 సంవత్సరాలు గడిచాక దేవుడు తాను చేసిన నిబంధనను నూతనపరిచాడు (ఆది 17: 15-19) మరికొద్దికాలంలోనే, దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై తన వాగ్ధానములను స్థిరపరిచాడు. గుడారములోనుండి ఆ సంభాషణ వినుచుండిన శారా తనలో తాను నవ్వుకొంది. యెహోవాకు అసాధ్యమైనదేదైనా వున్నదా? అంటూ, శారాను గద్దించాడు. ఎట్టకేలకు యెహోవా మాట చొప్పుననే, నిర్ణయకాలంలో వారికి వాగ్దాన పుత్రుడు జన్మించాడు.

🔅 “యెహోవామాట చొప్పున” అబ్రాహామునకు కుమారుడు జన్మించాడు:

దేవుడు మాటయిస్తే ఎన్నటెన్నటికిని తప్పిపోయేవాడుకాదు. ఆయన తన మాట నెరవేర్పుకోసం ఎంతో సహనం, దీర్ఘశాంతమును కలిగియుంటాడు. దేవుడుమాట తప్పిపోయేవాడైతే అబ్రాహామును ఎప్పుడో విడచిపెట్టెయ్యాలి. అబ్రాహాము కల్దీయుల దేశములోనున్నపుడు దేవుడు నీ తండ్రి ఇంటిని విడచిపెట్టు అంటే తండ్రియైన తెరహును వెంటతీసుకొని బయలుదేరాడు. బంధువుల యింటిని విడచిపెట్టమంటే బంధువైన లోతును వెంటతీసుకెళ్ళాడు. నేను చూపించే దేశానికి వెళ్ళమంటే మధ్యలో హారానులో ఆగిపోయాడు. దేవుడు అబ్రాహామును కనానులో ప్రవేశపెట్టి, అతని సంతానానికి వాగ్ధానం చేస్తే, కనానులో కరువొచ్చిందని, స్వంత నిర్ణయం చేసి, ఐగుప్తుకు వెళ్లి, దేవునినే మరచిపోయి, తాను ఇబ్బందిపడి, ఇతరులను ఇబ్బందిపెట్టి, ఫరోచేత గద్దించబడి, తిరిగివచ్చి, భార్యతోకలసి స్వంత ప్రణాళికతో హాగరుతో బిడ్డను కన్నాడు. హెబ్రోనును విడచి గెరారుకు వెళ్లి, భార్యాభర్తల నిబంధన ప్రకారం అబద్ధమాడి, అన్యుడైన అబీమెలెకుచేత గద్దించబడ్డాడు. ఇట్లా అబ్రాహాము ఎన్నిసార్లు తప్పిపోయాడో చూడండి? అతడెన్నిసార్లు తప్పిపోయినాగాని, అబ్రాహాముకు మాట యిచ్చిన దేవుడు మాత్రం తప్పిపోలేదు. ఆయన తప్పిపోయేవాడు కాదు. అది కేవలం అబ్రాహామునకు, అబ్రాహాము కాలమునకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానున్న దేవుడు. మనపట్ల ఆయన చేసిన వాగ్ధానాలలో దేని విషయంలోకూడా ఆయన తప్పిపోయేవాడు కాదు.

🔅యెహోవా నిర్ణయకాలములో అబ్రాహామునకు కుమారుడు జన్మించెను.

దావీదు తెలియజేస్తున్నట్లుగా, మనము పుట్టకముందే, మనము భూమిమీద జీవించవలసిన దినాలలో ఒక్కటి కూడా గడవకముందే మనము జీవించవలసిన దినములు, మనపట్ల దేవునియొక్క ప్రణాళిక అంతా ఆయన గ్రంధములో వ్రాసేసారు. అవి వాటి నిర్ణయకాలము చొప్పున తప్పక జరిగితీరుతాయి. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను (కీర్తనలు 139:11). మనకు ఒక విషయం అర్ధం కావాలి. మన కలవర పాటు దేవుని ప్రణాళికను కాస్త ముందుకుగాను, వెనుకకుగాను నెట్టలేదు. అది దేవుడు నిర్ణయించిన “నిర్ణయంకాలమందే” అది జరిగితీరుతుంది. దేవుని ప్రణాళికను ముందుకు నెట్టేప్రయత్నం చేస్తే, ప్రతిఫలాలు అత్యంత చేదుగా ఉంటాయి. అబ్రాహాము, శారాలు అట్లాంటి ప్రయత్నంలో భాగంగానే ఇష్మాయేలు జన్మించాడు. అది వారి జీవితానికి దుఃఖకరంగా మారింది. నీవు నీ జీవితంలో దేనికొరకు ఎదురు చూస్తున్నావో, దానికొరకు ఆయన బలిష్టమైన చేతిక్రింద, దీనమనస్సుతో, సణగకుండా, స్వంత ప్రయత్నాలు చేసుకోకుండా, నిర్ణయకాలం కొరకు ఎదురుచూడడం నీ జీవితానికి అత్యంత శ్రేయస్కరం. నాతలరాత ఇట్లానే వ్రాసేసాడు దేవుడు అంటూ, ఆయనను నిష్ఠూరపరిచే ప్రయత్నం చెయ్యొద్దు. దేవుడు నీపట్ల సమాధానకరమైన ఉద్దేశ్యములే కలిగియున్నాడు తప్ప, హానికరమైనవి ఎంతమాత్రమూ కాదు (యిర్మియా 29:11). దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము (కీర్తనలు 18:30). దేవుడు నీకేమైనా వాగ్ధానం చేశాడా? అట్లా అయితే, ఆయన దానిని నిశ్చయముగా నెరవేర్చుతాడని విశ్వసించు. నీవు నమ్మకాన్ని కోల్పోయినాగాని, ఆయనమాత్రం నమ్మకస్థుడుగానే వుంటాడు. వివాహం కోసమా? బిడ్డలకోసమా? ఉద్యోగం కోసమా? దేనికొరకు నీవెదురుచూస్తున్నావ్? దానికో నిర్ణయకాలముంది. దేవుని కొరకును, ఆయనిచ్చే శ్రేష్టమైన ఈవుల కొరకునూ, నీ జీవితం యెడల దేవుని సంకల్పము కొరకునూ కనిపెట్టుము. దేవునికంటే ముందు పరుగెత్తడానికి ప్రయత్నించవద్దు. నిర్ణయకాలము కొరకు కనిపెట్టు. శ్రేష్ఠమైన దానికొరకు ఆశించు, అంతకంటే తక్కువ వాటిని కోరవద్దు. ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ, నిర్ణయకాలము కొరకు నిరీక్షించు. కలవరపడొద్దు. విశ్వసించువాడు కలవరపడడు (యెషయా 28:16).


🔅 సర్వశక్తిమంతుడైన దేవుని అనంతమైన శక్తి:

శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను(ఆది 21:2) అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టి నప్పుడు అతడు నూరేండ్లవాడు. (ఆది 21:5). వంద సంవత్సరాల వృద్ధునికి, తొంబై సంవత్సరాల వృద్ధురాలికి పిల్లలు కలగడం మానవరీత్యా పూర్తిగా అసాధ్యం. అయితే, ఎట్లా సాధ్యమయ్యిందంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు, తన అనంతమైన శక్తిని ప్రదర్శించాడు. దేవుడు వారిని నూతన పరచి, సహజమైన శారీరిక సామర్ధ్యాన్ని వృద్దిచేసాడు. మనుష్యులకు అసాధ్యమైనవి ఆయనకు సాధ్యమే. ఆయన సర్వాధికారియైన దేవుడు. ఆయన తనకిష్టమొచ్చినట్లుగా కార్యాన్ని నెరవేర్చగల సమర్ధుడు. ఆ విషయాన్ని అబ్రాహాము శారాలు సంపూర్ణముగా గ్రహించగలిగారు. నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూడాలనుకొంటుంటే, నీ వయస్సును గురించిగాని, నీకు వివాహం జరిగి ఎంతో కాలమయ్యిందనిగాని ఇట్లాటి వంటివాటి వైపుకాదుగాని, నీవెట్లాంటి పరిస్థితిలోనున్నాసరే దేవునివైపు నీ దృష్టిసారించు. దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టే సమయం వృధా సమయమని సాతాను చెప్తూ, నీవు మరొకమార్గం చూచుకో అంటూ వాడు సలహాలిస్తాడు. కానీ, దేవుని సన్నిధిలో కనిపెట్టే సమయం వృధా సమయం ఎప్పటికి కాదు. అది దేవుని దగ్గరనుండి శ్రేష్టమైన ఆశీర్వాదాలను కొల్లగొట్టుకొనే సమయం. నా వయస్సు మీరిపోయింది ఇక దేవుని పనికి నేను పనికిరాని అనే నిర్ణయానికి నీవొచ్చేసి, చేతులు కట్టుకొని కూర్చునే ప్రయత్నం చెయ్యొద్దు. ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి బయటకు నడిపించడానికి ఆరంభించే సమయానికి మోషే వయస్సు 80 సంవత్సరాలు. మరో 40 సంవత్సరాలు దేవుడు తనకు అప్పగించినపనిని నమ్మకముగా నిర్వహించాడు. నాకు శక్తిచాలదని చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు. ఆయన నిన్ను పిలిస్తే శక్తిని, సామర్ధ్యాన్ని, పనిచేసే సమయాన్ని ఆయనే నీకనుగ్రహిస్తాడు. ఆ సర్వశక్తుని నీడలో విశ్రమించడానికి మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(48వ భాగము)
♻ ఇస్సాకు జననం - ఇష్మాయేలు పయనం ♻ (part-2)


🔅 ఇస్సాకునకు సున్నతి చేయుట:
దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. (ఆది 21:4). వాగ్ధాన పుత్రుడు జన్మించడముతో, ఆ ఆనందంలో దేవుని ఆజ్ఞను మరచినవాడుకాదు అబ్రాహాము. దేవుడు తనతో నిబంధన చేసిన రీతిగా ఇస్సాకు ఎనిమిది దినములవాడైనప్పుడు అతనికి సున్నతి చేసెను. అబ్రాహాము స్వహస్తాలతోనే ఈ పని చేసాడు. అప్పటికి ధర్మశాస్త్రము లేదు. కుటుంబ యజమాని అతడేకాబట్టి, అతడే ఆ పనిజరిగించాలి. ఇస్సాకునకు సున్నతి చేయడం ద్వారా, ఆబిడ్డ దేవుని నిబంధనలో చేరాడు. అబ్రాహాము దేవుని విధిని నెరవేర్చినవాడయ్యాడు. అనేకులు బిడ్డలకొరకు ఎదురుచూస్తారు. కృపగలిగిన దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని, బిడ్డలను అనుగ్రహించినప్పుడు, ఆ ఆనందంలో మందు పార్టీలతో విందులు చేస్తారు. బిడ్డనిచ్చిన దేవునిని ప్రక్కనబెడతారు. మరికొంతమందైతే స్తుతికూడిక అనంతరం, మందుపార్టీలు పెడతారు. బహుశా వీరి ఉద్దేశ్యం మొదటి ప్రాధాన్యత దేవునికే ఇచ్చామన్నది కాబోలు. ఇవి దేవుని పిల్లలముగా సిగ్గుపడాల్సిన విషయాలు. అబ్రాహాము అయితే, దేవుని నిబంధనకు కట్టుబడి వున్నాడు.

🔅 అబ్రాహాము విందు చేయుట:
ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందుచేసెను (ఆది 21:8). అబ్రాహాము జీవితంలో గొప్ప విందుచేసిన సందర్భం ఇదొక్కటే కనిపిస్తుంది. తన గృహములో పుట్టిన మొట్టమొదటి బిడ్డ ఇష్మాయేలు. అయితే అప్పుడుకూడా అబ్రాహాము విందు చేసిన సందర్భం కనిపించదు. వాగ్ధాన పుత్రుడు జన్మించిన వెంటనే కూడా విందు చేయలేదుగాని, పిల్లవాడు పెరిగి పాలు విడిచిన తరువాత గొప్ప విందుచేసాడు. పిల్లవాడు పాలు విడిచాడు అంటే, తన జీవితంలో ఒకమెట్టు పైకెక్కినట్లే. పాలు మాని ఘనాహారం తినే స్థితికి చేరాడు. ఇది మన ఆధ్యాత్మిక స్థితిని సరిచూచుకోవడానికొక సరికొత్తపాఠం. మన జీవితంలో సంవత్సరాలు దొరలిపోతున్నాయి. గడచిన ప్రతీక్షణం మరణానికి మరింత దగ్గర చేస్తుంది. అయినప్పటికీ ఇంకా పాలు త్రాగే దశలోనే మన జీవితాలు కొనసాగుతున్నాయి. ఇక ఎప్పుడూ ఊయలకే పరిమితమైతే, పాకేదెప్పుడు, కూర్చునేదెప్పుడు, నడచేదెప్పుడు, పరిగెత్తేదెప్పుడు? ఇవన్నీ చెయ్యాలంటే, పాలుమాని ఘనమైన ఆహారం తీసుకోవాలి, దినదినమూ బలాన్ని పుంజుకోగలగాలి. జీవితాంతం పాలుకే పరిమితమైతే మరగుజ్జులుగానే మిగిలిపోతాము. ఆధ్యాత్మిక మరగుజ్జుతనం విశ్వాస పరుగుపందెమునకు ఆటంకంగామారి ఓటమితో ఎదురు చూడాల్సివస్తోంది. ఇస్సాకు ఒక మెట్టెక్కాడు కాబట్టే, అబ్రాహాము సంతోషముతో గొప్ప విందు చేసాడు. మనంకూడా ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టెక్కుతూ వున్నప్పుడే, పరలోకపు తండ్రి మనయందు ఆనందించేవాడిగా వున్నారు.

🔅హాగరును, ఇష్మాయేలును పంపివేయుట:
ఇష్మాయేలుకు పదహారు సంవత్సరాలు. ఇస్సాకుకు రెండు లేదా మూడు సంవత్సరాల వయస్సు. బహుశా ఇష్మాయేలు వీడు గొప్ప జనాంగమునకు తండ్రి అవుతాడట అని ఇస్సాకును ఆటపట్టిస్తున్నాడేమో? అది చూచిన శారాకు కోపం కట్టలు త్రెంచుకున్నది. అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు, ఇస్సాకును పరిహసించుట శారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో చెప్పింది.( ఆది 21:9,10) అపొస్తలుడైన పౌలు దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ రీతిగా మాట్లాడుచున్నారు. అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మనుబట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది?దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితోపాటు వారసుడై యుండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులముకాము.(గలతీ 4:29-31)

శారా చెప్పినమాట, అతని కుమారునిబట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను (ఆది 21:11). కారణమేమిటంటే? అతడు అబ్రాహాము గర్భవాసమున పుట్టిన పెద్దకుమారుడు. మొట్టమెదటిగా డాడీ అని పిలిచింది అతడే. అతనితో ఆడుకొంటూ పదమూడు సంవత్సరాలు దేవునినే మరచిపోయాడేమో అనిపిస్తుంటుంది. ఆ బిడ్డను నీ సన్నిధిలో బ్రతకనిమ్మని, దేవుని ప్రార్ధించి, వాగ్ధానం కూడా పొందాడు అబ్రాహాము. ఇప్పుడు అట్లాంటి బిడ్డను పంపించివేయవలసిన పరిస్థితి, అట్లా అని అతడు హాగరును కూడా వదులుకోలేని పరిస్థితి ఆమెతో సంసార జీవితాన్ని పంచుకున్న అనుభవం అబ్రాహాముకున్నది. శారాకు ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేద్దామన్నా, దేవుడు కూడా శారా మాట వినమనే చెప్తున్నాడు (ఆది 21:12). అట్లాంటి దుఃఖకరమైన పరిస్థితులలో సహితం అబ్రాహాము దేవునిమాటకే విధేయుడయ్యాడు. ఇక ఆలస్యం చెయ్యలేదు. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. హాగరు విషయంలో అబ్రాహాము చేసినతప్పు (ఆది 16:1,2) ఇప్పుడు అతనికి మిక్కిలి దుఃఖాన్ని పుట్టించింది. మనము మన స్వంతదారి పడితే, మామూలుగా అది మనకు శోకం తెచ్చిపెడుతుంది. దేవుని సంకల్పం ఒక్కటే మంచిది. అది ఇంపైనది, ఏ లోపమూ లేనిది ( రోమా12:2). మన భారమేదైనాసరే ఆయనమీద మోపి ఆయన చిత్తానికి తలవంచి, ఆయన అడుగుజాడల్లో సాగిపోవుదము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(49వ భాగము)
♻ ఇస్సాకు జననం - ఇష్మాయేలు పయనం ♻ (part-3)


🔅 ఇష్మాయేలు మొరను వినిన దేవుడు:

హాగరు, తన కుమారుడైన ఇష్మాయేలుతో బెయేర్షెబా అరణ్యములో తిరుగుతుంది. తినడానికి ఆహారము, త్రాగడానికి నీళ్లు అయిపోయాయి. అతడేమో చిన్న పిల్లవాడు వారున్నది అరణ్యము ఇక త్రాగడానికి నీరు లేదు. ఇకవారి పరిస్థితి ఎట్లా వుండివుంటుందో మనమూహించగలము. ఒక తల్లిగా ఆమె హృదయం ఎంతగా ద్రవించిపోయివుంటుందో కదా? వారు హృదయమున గర్వించడం ద్వారా ఇంత భయంకరమైన పరిస్థితిని కొనితెచ్చుకున్నారు.
యిక ఈ పిల్లవాని చావును నేను చూడలేనంటూ, వాడిని ఒక పొదక్రింద పడవేసి, కొంచెముదూరంగా వెళ్లి అతనికి ఎదురుగా కూర్చొని, యెలుగెత్తి యేడుస్తుంది. ఇక్కడ ఒకవిషయాన్ని గమనించినట్లయితే, మనకు అన్ని సమృద్ధిగా వున్నప్పుడు ఒకవేళ దేవుడు గుర్తురాకుండాపోయినా, కష్టకాలంలో మాత్రం ఆయన తప్పక జ్ఞాపకం వస్తారు. కానీ, హాగరుకు ఈ పరిస్థితిలోకూడా దేవుడు గుర్తురాకపోవడం అత్యంత విచారకరం. ఎందుకంటే, దేవుని ప్రత్యక్షతను అనుభవించిన అనుభవం హాగరుకు వుంది. దేవునికి “చూచుచున్న దేవుడు” అని పేరుపెట్టింది. పుట్టబోవు బిడ్డనుగురించి వాగ్ధానము పొందింది. ఆయన మాటకు విధేయతచూపి తిరిగి తన యజమానురాలైన శారా దగ్గరకు తిరిగివెళ్ళింది. అయితే, నేటి దినాన్న ఆ షూరు అరణ్యములో ప్రత్యక్షమైన దేవునిని కనీసం జ్ఞాపపకం చేసుకొనే ప్రయత్నం చెయ్యలేదు. కానీ, ఆ చిన్నవాడు ప్రార్ధించగా ఆ ప్రార్ధన దేవుని సన్నిధిని చేరింది. కృపగలిగిన దేవుడు తాను యిచ్చినమాట విషయంలో తప్పిపోయేవాడు కాదు కాబట్టి, తిరిగి హాగరును భయపడకుమని ధైర్యపరచి, నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను. (ఆది 21:18) అప్పుడామెకు ఒక ఊట కనబడేలా దేవుడు చేసాడు. ఆమె వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి పిల్లవానికి త్రాగించింది. కొన్ని సార్లు దేవుడు తన ప్రజల పోషణకోసం క్రొత్త సంగతులను, కొత్త మార్గాలను సృష్టిస్తాడు. కొన్ని సార్లయితే అప్పటికే అక్కడనున్న వాటిని చూడగలిగేలా వారి కన్నులు తెరుస్తాడు. బిలామునకు ఎదురుగానున్న దూత కనబడడం లేదు. అయితే, యెహోవా బిలాము కన్నులు తెరిచినప్పుడు దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియుండుట చూచెను (సంఖ్యా 22:31). గెహాజీ సిరియా సైన్యమును, రథములను, గుఱ్ఱములను చూచి భయకంపితుడైనప్పుడు, ఎలీషా ప్రార్ధించగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథ ములచేతను నిండియుండుట చూచెను
(2 రాజులు 6:17)

వాగ్ధానమిచ్చిన దేవుడు, ఇష్మాయేలును విడిచిపెట్టలేదు. దేవుడు అతనికి తోడైయున్నాడు. దేవుడే అతనికి తోడుగావుంటే అరణ్యమైతేనేమి, అగ్నిగుండమైతేనేమి? అరణ్యములోని పెరిగిపెద్దవాడయ్యాడు. అతని అడవిగాడిద వంటి స్వభావానికి, అతడు పెరిగిన అరణ్య పరిస్థితులకు చక్కగా సరిపోయాయి, అతడు విల్లును ప్రయోగించి, వేటాడడంలో నేర్పు కలిగినవాడు. అతడు పెరిగి పెద్దవాడైనప్పుడు తనతల్లి హాగరు ఐగుప్తు దేశమునుండి ఒక స్త్రీని తీసికొనివచ్చి వివాహము చేసింది. ఇక్కడ ఇష్మాయేలులోనున్న మంచి లక్షణం ఏమిటంటే, తల్లి తీసుకొని వచ్చిన అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. సంసోనులా తనకు నచ్చిన అమ్మాయే కావాలని పట్టుబట్టలేదు. ఇక్కడ ఐగుప్తు దేశమునుండి అమ్మాయిని తీసికొనివచ్చి వివాహం చెయ్యడం ద్వారా హాగరు మరొక తప్పు చేసినట్లయింది.

🔅 అబీమెలెకు అబ్రాహాముతో నిబంధన:

అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో నివసిస్తున్నప్పుడు, అబ్రాహాము చేయుపనులన్నింటిలో దేవుడు అతనికి తోడుగానున్నట్లు అబీమెలెకు గ్రహించగలిగాడు. అది అతనికి భయాన్ని కలిగించింది. ఇతనివలన నాకుగాని, నా బిడ్డలకు గాని, నా మనుమలకుగాని ఏదైనా ప్రమాదం సంభవింపవచ్చు అనే సందేహముతో, రాబోయే కాలములో అబ్రాహాము వలన తన ఇంటివారికి ఎట్లాంటి అపాయము వాటిల్లకుండా అతనితో నిబంధన చేసుకొనుటకుగాను అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాము దగ్గరకు వచ్చారు. ఇక్కడ గమనించదగిన విషయమేమిటంటే, అబ్రాహాము ఆ దేశములో పరదేశిగానున్నాడు. అబీమెలెకు ఆ దేశానికి రాజు. అయితే, రాజైనవాడే అబ్రాహాము దగ్గరకు రావడమంటే అబ్రాహామునకు కలిగిన కీర్తిని అర్ధంచేసుకోగలము. అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకును యివ్వడం ద్వారా వారిమధ్య నిబంధన జరిగెను. పురాతన కాలములో ఇట్లా పశువులను యిచ్చి పుచ్చుకోవడం ద్వారా, లేదా పశువును వధించి ఖండముల మధ్య నడచిపోవుటద్వారా నిబంధన జరిగేది. అబ్రాహాము త్రవ్వించినబావిని అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకున్నారు. దాని విషయమై అబ్రాహామే ఆ బావి త్రవ్వించెననుటకు సాక్ష్యార్థముగా అబ్రాహాము అతనికి ఏడు గొర్రెపిల్లలనిచ్చెను. అక్కడ ఆ రీతిగా అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబా అనగా సాక్ష్యార్థమైన బావి, ఏడు బావులు అని అర్ధము. అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థనచేసెను(ఆది 21:33) అబ్రాహామునకు ప్రత్యక్షమైన దేవుడు సర్వశక్తిమంతుడు (ఎల్ షద్దాయ్)గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు అబ్రాహాము నిత్యుడైన దేవుని ( ఎల్ ఓలామ్) గా ఆయనను అర్ధంచేసుకుని ప్రార్ధన చేస్తున్నాడు. అన్యుడైన రాజు అబ్రాహాముకు దేవుడు తోడైయున్నాడనే విషయాన్ని అర్ధం చేసుకోగలిగాడు. అన్యుల మధ్యలో జీవిస్తున్న మన జీవితాలు ఎట్లా వున్నాయి? వారెట్లా మనలను అర్ధంచేసుకోగలుగుతున్నారు?
దేవుని పిల్లలముగా మనకంటూ ఏదైనా ప్రత్యేకత ఉన్నదా?
మన జీవితాలను బట్టి, మనము ఆరాధించే దేవుడు ఘనపరచబడుతున్నారా?
మనలను మనమే పరిశీలన చేసుకొని సరిచేసుకునే ప్రయత్నం చేయుదము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(50వ భాగము)
♻అబ్రాహాముకు చివరి పరీక్ష ♻ (part-1)


నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను. (ఆది 22:2).

🔅అబ్రాహాము పరిశోధించబడుట:

పైతరగతిలోనికి లేదా ఉద్యోగంలోనికి ప్రవేశించాలంటే పరీక్షలు ఎదుర్కొనాల్సిందే.
కంసాలి చేతిలో బంగారం పరిశుద్ద పరచాబడాలంటే అది నిప్పులకొలిమిలో మండాల్సిందే! కుమ్మరివాని చేతిలోని బంకమన్నుకు ఒక రూపం రావాలంటే అది కుమ్మబడాల్సిందే, కాల్చబడాల్సిందే! కొయ్యకు ఒక రూపం రావాలంటే రంపంతో కోయబడాల్సిందే, ఉలితో చెక్కబడాల్సిందే! వజ్రం ప్రకాశించాలంటే అది నూరబడాల్సిందే! రాయి శిల్పంగా మారాలి అంటే అది సుత్తి దెబ్బలు తినాల్సిందే! ఇక్కడ మనకు సుత్తి, రంపం, ఉలి, నిప్పుల కొలిమి ఇవన్నీ అత్యంత కఠినంగా కనిపించినప్పటికీ అవి మాత్రమే వస్తువుకు ఒకరూపాన్నిచ్చి, వాటి విలువను పెంచగలుగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అవి సమస్యా పరిష్కారాలు. మన జీవితంలో మనమెదుర్కొంటున్న పరీక్షలే లేదా శోధనలే మనలను మరింత ఉన్నతమైన స్థితికి చేర్చగలవనే సత్యమును అర్ధముచేసుకొని, ఆయనపై ఆధారపడగలిగితే, శోధనయందునూ ఆయనలో నిజముగా ఆనందించగలము. మనమెదుర్కొంటున్న పరీక్షలు లేదా శోధనలు అనేక సందర్భాలలో మనలను భౌతికంగా, శారీరికంగా, ఆర్ధికంగా, మానసికంగా క్రుంగదీసినప్పటికీ “ఆత్మీయంగా మాత్రం” ఉన్నతమైన స్థితిలో వుంచుతాయని చెప్పడానికి నాకెట్లాంటి సందేహం లేనేలేదు. నా జీవితంలో ఒక పదిహేను సంవత్సరాల వ్యవధిలో తాతయ్య - నానమ్మ, తాతయ్య - అమ్మమ్మ, అమ్మగారు - నాన్నగారు అందరిని కోల్పోయాను. నన్ను అమితముగా ప్రేమించి, అనునిత్యం నాకోసం ప్రార్ధించే నా తల్లిని నా యవ్వన ప్రాయంలోనే కోల్పోయాను. పరిస్థితులన్నీ నన్ను రంపంతో కోసి, ఉలితో చెక్కుతూ, సుత్తెతో బాదుతూ, కొలిమిలోవేసి మండించినట్లయ్యింది. ఆర్ధికంగా, మానసికంగా నేను కృంగిపోయినప్పటికీ, శోధన వెంబడి శోధన నన్ను వెంటాడుతూవుంటే, ఆయన కృప వెంబడి కృప నన్ను వెంటాడింది. నా శోధన కాలంలో ఆయనపై నేను ఆధారపడినప్పుడు, ఆయన నా చెయ్యిపట్టుకొని నడిపించారు. నేను నడవలేనప్పుడు ఆయన భుజాలపై నన్ను మోసారు. పరీక్షా సమయంలో ఆయనయందు ఎట్లా ఆనందించాలో నేర్పించారు. నేనెదుర్కున్న ఆ పరీక్షలే నేటి దినాన్న నా ప్రియ రక్షకుని ప్రేమను గూర్చి, ఆయన కృపను గూర్చి నాలుగు మాటలు వ్రాయగలిగే ధన్యతనిచ్చాయి. అవును! యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నీవుండాలంటే? శోధనలను సహించి తీరాల్సిందే. అబ్రాహాము అనేకమార్లు పరీక్షింపబడుతూ వచ్చాడు. ప్రతీసారి కొన్ని మలినాలు బయటపడుతూ, కరిగిపోతూ వచ్చాయి. ఇప్పుడు చివరిగా అత్యంత క్లిష్టమైన పరీక్షను ఎదుర్కొనబోతున్నాడు. దానిలో విజయం సాధిస్తే ఆయన శుద్ధమైన సువర్ణముగా మారబోతున్నాడు.

🔅 అబ్రాహాము ఎదుర్కొన్న క్లిష్టమైన పరీక్షలు:3
1. తన దేశాన్ని, బంధువులను విడిచిపెట్టమన్నాడు (ఆది 12:1)
2. ఇష్మాయేలును గూర్చిన ఆశలను వదిలెయ్యమన్నాడు (ఆది 17:17,18)
3. నీవు ప్రేమించు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును కూడా వదలిపెట్టమన్నాడు. (దహనబలిగా అర్పించు) (ఆది 22:2)

ప్రభువుకోసం మనము కూడా సమస్తాన్ని విడిచిపెట్టాలి.(మత్తయి 10:37-39; మార్కు 10:21,29-31; లూకా 9:57-62, 14:33 )దేవుడు తనపట్ల తన ప్రజల ప్రేమను నమ్మకత్వాన్ని , విధేయతను పరీక్షిస్తుంటాడు. ఈ పరీక్షలు కష్టతరంగా, బాధాకరంగా నున్నప్పటికీ వాటిని సహించేవారికి ఆశీర్వాదాలు తీసుకొనివస్తాయి. వారి విశ్వాసాన్ని వృద్ధిచేసి అనేకమైన ముఖ్య పాఠాలను నేర్పిస్తాయి ( ద్వితీ 8:2,16; 13:3; కీర్తనలు 66:10-12; యాకోబు 1:2-4,12; పేతురు 1:6-7; 4:10,13)

ఈ మూడవ పరీక్ష చివరిది, అత్యంత క్లిష్టమైనది. పరిశుద్ధ గ్రంధములో మొదటిగా ఈ విషయమును చదివినవారెవరికైనాసరే, బైబిల్లోచెప్పబడిన దేవుడు యింతటి కఠినాత్ముడా అనిపిస్తుంది. దేవుడు మనిషిని బలిగాకోరిన సందర్భం ఇదొక్కటే. దేవుడు నిజంగా నరబలి కోరతాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ కోరడు. నిజంగా దేవుడు నరబలిని కోరేవాడైతే, అబ్రాహామును అడ్డగించేవాడే కాదుకదా? నాకు ప్రాధాన్యతనిస్తాడా లేక నేనిచ్చిన బిడ్డకు ప్రాధాన్యతనిస్తాడా అనే విషయం తేల్చుకోవడానికి అబ్రాహామునకు దేవుడు పెట్టిన పరీక్షమాత్రమే ఇది. అయితే, అబ్రాహాము దేవునికి ఒక్కమాట కూడా ఎదురు చెప్పలేదు. అబ్రాహాము స్థానంలో నేనే వుండివుంటే? కల్దీయుల దేశములో సంతోషంగా జీవిస్తున్ననన్ను అన్ని విడచిపెట్టుకొని రమ్మన్నావు. వచ్చినతరువాత, ఆ దేశాన్ని నా సంతానానికి యిస్తానన్నావు. నీవు సంతానమివ్వలేదని మేమే స్వంతంగా ఒక మార్గాన్ని ఏర్పాటుచేసుకుని, పిల్లవానిని కంటే, వాడినేమో ఇంటినుండి పంపించివేయమన్నావు. 25 సంవత్సరాల తర్వాత బిడ్డనిచ్చావు. నా సమస్యతీరిపోయిందని అనుకొంటున్నప్పుడు, నా బిడ్డను నేనే ముక్కలుగా నరికి, బూడిద చేయమంటున్నావు. అసలు నీవు దేవుడివేనా అంటూ తిరగబడేవాడినేమో? అయితే, అబ్రాహాము నోటనుండి ఒక్కమాటకూడా బయటకు రాలేదు. కారణం? విధేయత ప్రశ్నించదు. చివరకు అది మరణమైనాసరే ఆయన మాటకే తలవంచుతుంది.

🔅అబ్రాహాము విధేయతకు కారణం?

అబ్రాహాములోనున్న పరిపూర్ణమైన విశ్వాసమే, విధేయత చూపడానికి కారణమయ్యింది. ఏమిటా విశ్వాసము అంటే? అబ్రాహాము సంతానము భూమిమీదనున్న ఇసుక రేణువులవలే విస్తరిస్తుందనే వాగ్ధానముంది. ఇష్మాయేలు నీకు వారసుడు కాదని, ఇస్సాకు మాత్రమే వారసుడనే స్పష్టతను దేవుడిచ్చాడు. ఇప్పుడు అబ్రాహాము సంతానం విస్తరించాలంటే, ఇస్సాకు ద్వారానే తప్ప మరొక అవకాశం లేనేలేదు. అంటే ఇప్పుడు ఇస్సాకు తప్పకుండా బ్రతికియుండాలి. అందుచే దేవుడు ఎట్టి పరిస్థితులలోనూ నా కుమారుని చావనివ్వడు. ఒకవేళ నేను నా కుమారుని నరికి, బూడిద చేసినాగాని, ఆ బూడిదలోనుండి సహితం నా కుమారుని సజీవంగా ఆయన లేపగలడనేది అబ్రాహాముయొక్క అచంచలమైన విశ్వాసం. ఆయొక్క విశ్వాసమే అతనిని దేవుని ముందు విధేయుణ్ణి చేసింది. అబ్బా! అబ్రాహాము ఎంతటి పరిపూర్ణతలోనికి చేరాడు. తలంచుకొంటుంటేనే శరీరం జలదరిస్తుంది కదా? అబ్రాహాము పిల్లలమని చెప్పుకొంటున్న మన జీవితాల్లో అట్లాంటి విశ్వాసముగాని, విధేయతగాని కనీసం కనుచూపుమేరల్లోకూడా కనిపించడంలేదు కదా? కారణం, దేవునిని వ్యక్తిగతంగా అనుభవించిన అనుభవాలు మన జీవితంలో లేకుండాపోతున్నాయి. వ్యక్తిగతంగా ఆయనతో సహవాసంచేస్తూ, ఆయన మాటయిచ్చి తప్పిపోయేవాడుకాదని గ్రహించి, ఆయన పాదాలచెంత ప్రణమిల్లుదాం!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(51వ భాగము)
♻అబ్రాహాముకు చివరి పరీక్ష ♻ (part-2)


🔅దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమని అడగడానికిగల కారణములేమిటి?
నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను. (ఆది 22:2).

పరిశుద్ధ గ్రంథమంతటిలో దేవుడు ఒక మనిషిని దేవుడు బలిగా కోరిన సందర్భం ఇదొక్కటే. ఇందులో దేవునికి రెండు ఉద్దేశ్యాలున్నట్లు అర్ధం చేసుకోగలం. మొదటిగా అబ్రాహాము భక్తి, నిష్ఠ, విశ్వాసమును పరీక్షించుటకును, రెండవదిగా లోకపాపములకోసం తన కుమారుడైన యేసుక్రీస్తును అర్పించబోతున్న తనచర్యకు ముందుగా ఒక సూచనను చూపడం. ఇస్సాకు అబ్రాహామునకు ఏకైక కుమారుడని, అతడే వారసుడనీ, దేవుని నిబంధన అతని మూలముగా స్థిరపడుతుందని దేవుడే అబ్రాహాముతో చెప్పాడు (ఆది 15:4; 17:16,19; 21:12; 22:2) అయితే దేవుడు ఇస్సాకును బలి అడగడంద్వారా ఆయనమాటకు ఆయనే వ్యతిరేకమన్నట్లు కనిపిస్తుంది. అయితే, దేవుని ఆజ్ఞ ఎదురైతే అబ్రాహాము దేవునిమాటపై ఇంకా విశ్వాసాన్ని నిలుపుకుంటాడా? దేవుడు ఎలాంటి తప్పిదం చేయడని, తన మాట మీరడని నమ్ముతాడా? అనేది దేవుని ఉద్దేశ్యమే యున్నది. అబ్రాహాము ఈ పరీక్షకు నిలిచాడు. దేవుడు తానొక పనిచెయ్యమన్నాడంటే దాని వెనుక సరైన కారణం తప్పక ఉంటుందనీ, దేవుడు ఎదో విధంగా తన వాగ్ధానాన్ని నెరవేరుస్తాడని విశ్వసించాడు (రోమా 4:21). ఇస్సాకును హతముచేయ్యాల్సివచ్చినా దహనమైన బూడిదలోనుండి సహితం తన కుమారుని సజీవునిగా లేపగలడని అతడు నమ్మాడు (హెబ్రీ 11:17-19). ఇదంతా తండ్రియైన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు విషయంలో ఏమి చేసాడో దానికిది దృష్టాంతం. ఇస్సాకువలెనే యేసుక్రీస్తు కూడా తండ్రికి ఏకైక కుమారుడు (యోహాను 3:16)
ఇస్సాకు అబ్రాహామునకు వారసుడైతే, యేసుక్రీస్తు ఈ లోకానికి వారసుడు (హెబ్రీ 1:2) దేవుడు నూతన నిబంధనను ఆయన ద్వారానే చేశారు (హెబ్రీ 9:15) అబ్రాహాముకు మాట ఇచ్చి లోకమంతటికి దీవెనలు కలుగుతాయని చెప్పినది నెరవేరేది ఈయన మూలంగానే (అపో. కా.3:26; గలతి 3:14; ఎఫెసు 1:3) దేవుడు మానవాళిని ప్రేమిస్తూ పాపులకోసం ఆయనను బలి చేశారు ( రోమా 5:8; హెబ్రీ 9:28; 1పేతురు3:18; యోహాను 4:9) తరువాత ఈ వాగ్ధానములన్నీ నెరవేర్చడానికి ఆయన యేసుక్రీస్తును మరలా బ్రతికించారు (అపో. కా.2:24, 32-36; 1కొరింథీ 15:3,4). ఇస్సాకును మోరియా పర్వతమునకు తీసుకొనివెళ్ళమని దేవుడు అబ్రాహాముతో చెప్పారు. యెరూషలేము వున్నది కూడా ఈ ప్రదేశంలోనే (2దిన 3:1). యేసుక్రీస్తు సిలువ మరణంపొంది, తిరిగిలేచింది కూడా యెరూషలేములోనే. అంటే, ఇస్సాకు యేసుక్రీస్తువారికి ముంగుర్తుగా వున్నాడు.

🔅 దేవుని మాటకు విధేయత చూపడానికై అబ్రాహాము ఏర్పాట్లు:

తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలికొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను (ఆది 22:3).

దేవుడు చెప్పిన పనిని వాయిదా వేసినప్పటికీ అది లోబడకపోవడమే అవుతుంది. అబ్రాహాముతో నీ కుమారుని బలిగా అర్పించమని దేవుడు చెప్పాడుగాని, అది వెంటనే చేసితీరాలనేమి చెప్పలేదు. అట్లా అని కొద్దిరోజులు ఆగితే దేవుడేమైనా మనసు మార్చుకుంటాడేమో చూద్దామనే తలంపు కూడా అబ్రాహామునకు రాలేదు. దేవుడు చెప్పినపనిని వెంటనే చేయడం అబ్రాహాము యొక్క విధేయతకు తార్కాణం. ఒక దినాన్న దేవుడు ప్రత్యక్షమై శరీరమందు నిబంధనగా నీవు, నీ యింటపుట్టినవారు, దాసులు, వెండితో కొనబడినవారంతా సున్నతి చేయించుకోవాలని చెప్పి, ఆయన పరమునకు వెళ్లినవెంటనే, దేవుడు చెప్పినరీతిగా అబ్రాహాము చేసాడు. (ఆది 17:23 ). ఇష్మాయేలు విషయంలో నీవు శారామాట వినుమని దేవుడు అబ్రాహాముతో చెప్పినప్పుడు, వాయిదావేయకుండా, తెల్లవారగానే వారిని ఇంటినుండి పంపించేశాడు (ఆది 21:14). తాను ప్రేమించే ఏకైక కుమారుని బలిగా ఇవ్వమన్నప్పుడుకూడా వాయిదా వేసే ప్రయత్నం చెయ్యలేదు. రాత్రి దేవుడు మాట్లాడితే, తెల్లవారినప్పుడు దేవుడు తాను చెప్పినదానిని చెయ్యడానికి ప్రారంభించాడు. ఆ రాత్రి ఆబ్రాహాముకు ఇక నిద్రపట్టే అవకాశంలేదు. ఇంటినుండి పంపివేయబడిన ఇష్మాయేలు ఎక్కడో ఒకచోట జీవముతోనే ఉంటాడు. కానీ ఇస్సాకు ఇక ఎప్పటికీ కనబడే అవకాశంలేదు. నిండు వృధ్యాప్యమందు జన్మించి, నవ్వు కలుగజేసి, ఇప్పుడు దుఃఖంలో ముంచెత్తబోతున్నాడు. ఇస్సాకుతో ఏ రీతిగా ఇంతవరకూ కలిసి తిరిగాడో, ఆడుకున్నాడో ఇవన్నీ అతని కళ్ళముందు తిరుగాడుచున్న పరిస్థితి. తాను ప్రేమించే కుమారుని తన చేతులతో నరికి, బూడిదగా మార్చడం ఎంత కసాయివాడికైతేమాత్రం సాధ్యం? శరీరంతో వున్నాడు కాబట్టి, తప్పకుండా ఇట్లాంటి తలంపులు అతనికి నిద్రలేకుండా చేసియుండవచ్చు. మరొకవైపు, ఈ విషయాన్ని శారాతో చెప్పాలా? వద్దా? ఇష్మాయేలు తన కుమారుని యెగతాళి చేస్తేనే భరించలేకపోయింది,ఇక ఇప్పుడు దేవునిని దూషించే స్థితికి చేరుకొంటుందేమో? ఇక తనతో చెప్పకపోవడమే మంచిదనుకున్నట్లున్నాడు. అదే సమయంలో దేవుడు చెప్పినపనిని ఎంత తొందరగా చేద్దామానని వేగిరపడుతున్నాడు. వృద్దాప్యంలోనున్న అబ్రాహాము ఈ రెండు పరిస్థితుల మధ్య అతడు ఎదుర్కున్న సంఘర్షణ వర్ణనాతీతం. బలి పశువు ఎవరో అబ్రాహాము ఒక్కడికి మాత్రమే తెలుసు. దహనబలికి కట్టెలు కావాలి మోరియా పర్వతానికి చేరాలంటే మూడు రోజుల ప్రయాణం. కట్టెలు ఇక్కడనుండి తీసుకొని వెళ్లడం ఎందుకులే నా వెంట పనివారు వుంటారు కాబట్టి, అక్కడకు చేరినతర్వాత కట్టెలు సమకూర్చుకోవచ్చు అనుకోలేదు. ఇంటివద్దనే కట్టెలు చీల్చి, కత్తి, నిప్పును సిద్ధం చేసుకొని, ఇస్సాకుతో పాటు, మరొకరిద్దరి పనివారిని తీసుకొని విశ్వాసవీరుడు మోరియా పర్వతానికి వెళ్ళాడు.

మనమెంతగా దేవునికి లోబడుతున్నాము? జీవితంలో సంవత్సరాలు దొర్లిపోతున్నాయి రక్షణ పొందడానికి ఎంతకాలం నుండి వాయిదా వేస్తున్నావు? రక్షింపబడిన నీవు బాప్తీస్మం తీసుకోవడానికి ఎంతకాలం నుండి వాయిదా వేస్తున్నావు? బాప్తీస్మం తీసుకున్ననీవు ప్రభురాత్రి భోజనంలో చెయ్యివేయడానికి ఎంతకాలం నుండి వాయిదా వేస్తున్నావు? మరలా చెప్తున్నాను. నీవు వాయిదా వేస్తున్నావంటే ఇంకా దేవునికి లోబడడానికి ఇష్టపడడం లేదన్నమాట. దేవునికి లోబడడం ఇష్టం లేదంటే, నీ పాపాన్ని విడచి పెట్టడానికి నీకిష్టం లేదన్నమాట. ఎంత కాలం ఇట్లా వాయిదాలేస్తావు? దేవుడు ఈ క్షణాన్న నిన్ను పిలిస్తే, దానిని వాయిదావేయలేవని నీకు స్పష్టముగా తెలుసు. అయినప్పటికీ, మార్పులేని జీవితాన్ని జీవించి, ఆయనిచ్చే గొప్ప రక్షణను నిర్లక్ష్యంచేసి, ఉగ్రతనుండి ఎట్లా తప్పించుకోగలవు?

వద్దు, లోబడదాము! ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలకు పాత్రులవుదాము!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(52వ భాగము)
♻అబ్రాహాముకు చివరి పరీక్ష ♻ (part-3)


🔅అడ్డంకులను అధిగమించిన అబ్రాహాము:
తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పెను. (ఆది 22:5)
అబ్రాహాము మూడవ దినాన్న దేవుడు చెప్పిన మోరియా దేశము చేరుకున్నాడు. కన్నులెత్తి దేవుడు చెప్పిన ఆ స్థలాన్ని చూచాడు. ఈ మూడు దినాల ప్రయాణంలో విశ్వాసవీరుని విశ్వాసమునుండి తప్పించి దేవునినుండి దూరం చెయ్యడానికి సాతాను గాడు చెయ్యని ప్రయత్నమంటూ వుండదు. అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని గమ్యంవైపు సాగిపోతున్నాడు. ఇక మోరియా పర్వతము కనుచూపుమేరల్లోనే వుంది. ఆ పర్వతానికి జీవముంటే అబ్రాహామును చూచి, తాను చేయబోయే కార్యాన్ని తలంచుకొని గజగజ వణికిపోయేదేమో? విశ్వాసవీరుడైన అబ్రాహాము మాత్రం ఆ స్థలముమీద తాను చేయబోయే కార్యాన్నే దృష్టించాడు. ఆయన గురి ఒక్కటే, దేవుని మాటకు విధేయత చూపాలి, అది ఎంత త్వరగా చెయ్యగలిగితే అంత త్వరగా చెయ్యాలి. ఈ లోపు అబ్రాహామునకు ఒక సందేహం వచ్చింది. నా పనివారిని నాతోపాటు బలి స్ధలానికి తీసుకొనివెళ్తే, బలి అర్పించేసమయానికి వృద్ధుడనైన నన్ను త్రోసేసి, ఇస్సాకును విడిపించుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే, చిన్ననాటినుండి ఇస్సాకు వారిచేతుల్లోనే పెరుగుతున్నాడు. వృద్ధాప్యంలో పుట్టినవాడు, దానికి తోడు వాగ్ధానపుత్రుడు కాబట్టి, ఇస్సాకు అంటే అందరికి చాలా ఇష్టం. ఇష్మాయేలుదైతే గాడిదవంటి స్వభావం. కానీ ఇస్సాకు అత్యంత సౌమ్యుడు. దానికారణముగా అతనిని అందరూ ప్రేమించేవారు. అట్లాంటి పిల్లవానిని ఒక్కవేటుతో రెండుముక్కలుగా నరుకుతుంటే వారుచూస్తూ తట్టుకోవడం సాధ్యం కానేకాదు. యజమానుని మాటవినడంకంటే, పిల్లవానిని రక్షించడానికే ప్రాధాన్యత ఇస్తారు. తద్వారా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అబ్రాహాము ఎదుర్కొనవలసి వస్తుంది. ఆ పరిస్థితిరాకుండా పనివారిని బలి ప్రదేశానికి తీసుకొని వెళ్లకుండా వారిని దూరముగా వుంచడమే మంచిదనుకున్నాడు. మొదటి అడ్డంకిగా కన్నకుమారుడు బలిగా మారబోతున్నాడంటే, కన్నతల్లి ప్రేమ తట్టుకోలేల అడ్డుకుంటుందేమోనని శారాతో చెప్పకుండానే బలికి బయలుదేరాడు. రెండవ అడ్డంకిగా పనివారిని బలి స్థలానికి దూరముగా వుంచడం ద్వారా ఆ అడ్డంకినికూడా అధిగమించాడు. వాస్తవానికి ఇస్సాకును రక్షించుకోవడానికి ఇదిమంచి అవకాశం. బలియిచ్చే సమయంలో వారు అడ్డగించి ఇస్సాకును విడిపించుకొని తీసుకొనివెళ్ళిపోతే, ప్రభువా దీనిలో నాతప్పేమీలేదు. నీవు చెప్పినట్లే అంతా చేసానుకదా? పనివారు అడ్డగించినప్పుడు వృద్ధుడనైన నేనేమి చెయ్యలేకపోయాను. దీనిలో నాతప్పేమీలేదని చక్కగా తప్పించుకోవచ్చు. మన తెలివి అయితే ఇట్లానే ఉంటుంది కదా, ఇట్లాంటి తెలివేకేమి తక్కువలేదు. ఆయన చెప్పినది చెయ్యలేముగాని, తప్పించుకోవడానికి మాత్రం లెక్కలేనన్ని మార్గాలను సృష్టిస్తాము. కానీ, అబ్రాహాము అట్లాంటివాడు కాదు. దేవుని కొరకు తాను చేయబోయే పనిని కృతనిశ్చయతతో, ఎట్లాంటి లోపంలేకుండా జరిగిస్తున్నాడు. దీనికి కారణం తన సమస్యను దేవునికే విడిచిపెట్టాడు. ఇదే నిజమైన విశ్వాసం. పనివారితో అబ్రాహాము అంటున్నమాట నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పెను (ఆది 22:5). మోరియా కొండమీదకు వెళ్తున్నవారు అబ్రాహాము, ఇస్సాకులు మాత్రమే. అక్కడ ఇస్సాకు బలి అర్పించబడి, బూడిదగా మారబోతున్నాడు. ఇక వెనుకకు తిరిగివచ్చేది అబ్రాహాము ఒక్కడే కదా? అయితే అబ్రాహాము అంటున్నమాట “మరలా తిరిగి వచ్చెదము”. అంటే ఇస్సాకు కూడా నాతోనే తిరిగివస్తాడు. అబ్బా! ఈ మాటలు చదివితేనే శరీరం జలదరిస్తుంది కదా? ఇంతకు మించిన పరిపూర్ణమైన విశ్వాసం మరొకటుంటుందా?

ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం ఎక్కుతున్నాడు అబ్రాహాము. కట్టెలమోపును ఇస్సాకు మీద పెట్టాడు. ఇస్సాకు కట్టెలమోపుతో మోరియా పర్వతాన్ని ఎక్కుతున్నాడంటే, ఇస్సాకు చిన్న పిల్లాడుకాదనే విషయం సుస్పష్టం. తాను మాత్రం కత్తెను, నిప్పును పట్టుకున్నాడు. వారి ప్రయాణంలో, డాడి! బలికి కట్టెలు, నిప్పు వున్నాయిగాని బలిపశువెక్కడ? అంటూ ఇస్సాకు నోటనుండి సూటిగా దూసుకువచ్చిన బాణం అబ్రాహాము గుండెల్లో దిగబడింది. దానికి అతడు తట్టుకొని ఎట్లా నిలబడ్డాడో నాకైతే అర్ధంకాదు. గుండెల్లోనుండి పెల్లుబుకుతున్న దుఃఖాన్ని తన పంటిన ఎట్లా నొక్కిపెట్టాడో తెలియదు. కనీసం తడబడకుండా, ఒక్క నిమిషం ఆలోచించే ప్రయత్నంకూడా చెయ్యకుండా, ఇస్సాకు ఎంత సూటిగా అడిగాడో, అంతే స్పష్టముగా చెప్పాడు.
నాకుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱపిల్లను చూచుకొంటాడు. (ఆది 22: 8). అట్లాకాకుండా, అక్కడకి వెళ్ళాక చూద్దాములే నాయనా అని చెప్పొచ్చుకదా? లేదు. అతడు చూచేది, చేసేది ఏదీలేదని అతనికి తెలుసు. సమస్య తలెత్తినప్పుడే ఆ సమస్యను పరిష్కరించే దేవునికి అప్పగించేసాడు. ఇకదానిలో తలదూర్చే ప్రయత్నం అబ్రాహాము చెయ్యడు. తాను స్వంత ప్రయత్నాలుచేసి కొనితెచ్చుకున్న ఇబ్బందులను ఆయనెప్పటికీ మరచిపోడు. ఇక అట్లాంటి ప్రయత్నమూ అతడు చెయ్యడు. బలి పశువును సిద్దపరిచే బాధ్యత ఆయనకే అప్పగించేసాడు. అది ఇస్సాకు అయినాసరే తాను సిద్దంగానే వున్నాడు. దేవుడు చెప్పిన బలి స్ధలానికి అబ్రాహాము చేరుకున్నాడు. విశ్వాసవీరునియొక్క అంతిమపోరాటానికి మోరియా పర్వతం వేదికయ్యింది. అబ్రాహాము బలిపీఠము కడుతూవుంటే, ఇస్సాకు తండ్రికి సహాయం చేస్తున్నాడు. అబ్రాహాము కట్టెలు పేర్చుతూవుంటే ఇస్సాకు వాటిని అబ్రాహాముకు అందిస్తూవున్నాడు. ఏదో మ్రొక్కుబడిగా ఆపని చెయ్యట్లేదు. బలిపీఠమును కట్టి, కట్టెలు చక్కగా పేర్చి( ఆది 22:9) శ్రద్దగా, లోపరహితమైన బలి అర్పించడానికి అబ్రాహాము సన్నాహాలు చేస్తున్నాడు. బలిపశువును బలిపీఠముమీద పెట్టడమే ఇక ఆలస్యం. ఇంతవరకూ ఇస్సాకు ఆ చిన్ని హృదయంలో చెప్పలేనన్ని ఆలోచనలు. బలి పశువులేకుండానే నాతండ్రి బలిపీఠాన్ని కడుతున్నాడేమిటి? అయినా మరొకసారి తండ్రిని అడిగే ప్రయత్నం చెయ్యలేదు. ఏమి జరగబోతుందో చూద్దామనుకున్నంతలోపే తండ్రి ఇస్సాకును సమీపించాడు. అతనిని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టడం ప్రారంభించాడు. ఇస్సాకు ఆలోచనలకు తెరపడింది. ఆ బలిపశువెవరో నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు ఇస్సాకు దిగ్గునలేచి అబ్రాహాము మీద పడొచ్చు. ఎందుకంటే ఇస్సాకు చిన్న పిల్లవాడేమి కాదు. కట్టెలమోపుతో మోరియా పర్వతాన్నెక్కినవాడు. అట్లాకాకుంటే అతడు గట్టిగా అరచినాగాని, మోరియా పర్వతం ప్రతిధ్వనించి ఆ అరుపులు పనివారి చెవినిచేరి, వారొచ్చి ఇస్సాకును విడిపించే అవకాశం వుంది. అయితే, ఇస్సాకు తండ్రిమీద పడే ప్రయత్నంగాని, అరచే ప్రయత్నంగాని ఇస్సాకు చెయ్యలేదు. దేవునికే అర్పణగా మారాల్సివస్తే అంతకుమించిన ధన్యతలేదనుకున్నాడు. తండ్రి అతనిని బంధించి బలిపీఠముమీద పెట్టినప్పుడు ఇస్సాకు కండ్లుమూసుకొని ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాడు. అంతలో విశ్వాసవీరుడు తనకత్తి చేతపట్టాడు, పైకెత్తాడు. నేననుకొంటుంటాను ఈ సన్నివేశము చూడడానికి పరలోకమంతా నిశ్శబ్దమై, వారంతా ఊపిరిబిగబట్టుకొని, రెప్పవాల్చకుండా చూస్తున్నారేమోనని. విశ్వాసవీరుడు ఎత్తినకత్తి మరికొద్ది క్షణాల్లో ఇస్సాకు పీకమీదకు దిగి, తలను మొండెమును వేరుచేయబోతుంది. ఇంతవరకూ దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఒకవేళ అబ్రాహామును కత్తి ఎత్తినప్పుడైనా, కన్నప్రేమను తట్టుకోలేల కత్తివిసిరేసి, ఇస్సాకును విడిపించుకోపోతాడేమో అనుకున్నాడు. కానీ, నాకుమారుని కంటే, ఆ కుమారుడును ఇచ్చిన నీవే నాకు ముఖ్యమని చాటిచెప్పాడు. ఇంతలో పరలోకమునుండి పిలుపు. ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను (ఆది 22:12). అబ్రాహాము చెప్పినట్లుగా దేవుడే దహనబలి గొర్రెపిల్లను చూచుకున్నాడు. అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. విశ్వాసవీరుడు మోరియా పర్వతము మీద విజయపతాకం ఎగురవేశాడు. శోధించబడిన తర్వాత సువర్ణముగా మారాడు. అబ్రాహాము ఆ చోటికి “యెహోవా యీరే” అను పేరు పెట్టెను. యెహోవా యీరే అనగా యెహోవా చూచుకొనును. విశ్వాసవీరుడైన అబ్రాహాము జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప సవాలు.

ప్రియవిశ్వాసి! నీ పరిస్థితులు ఎట్లావున్నాసరే, నీ సమస్యను ఆయనకు అప్పగించి, ఆయనపై ఆధారపడగలిగితే కత్తి ఎత్తేవరకూ ఎదురుచూచినాగాని, కత్తినిమాత్రం నీమీదకు దిగనివ్వడు. యెహోవా యీరేగా వుండి, నీ జీవితంలో జరగాల్సినదేముందో ఆయనే చూచుకుంటాడు. ఆయనపై ఆధారపడదాం! ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు అనుభవిద్దాం!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(53వ భాగము)
♻అబ్రాహాముకు చివరి పరీక్ష ♻ (part-4)



🔅 తండ్రి త్యాగం కుమారుని విధేయత:
మోరియా పర్వతము మీద ఇస్సాకుబలి సన్నివేశము, తర్వాత కాలములో యేసు ప్రభువు బలికి అద్దం పడుతుంది. ఇస్సాకు బలిలోనున్న పరమార్ధం అదే. అబ్రాహాము తాను ప్రేమించు ఏకైకకుమారుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దానిలో తండ్రి త్యాగం వుంది. ఇస్సాకు బలిపీఠముపై అర్పణగా మారడానికే సిద్దపడ్డాడుతప్ప, తిరుగుబాటు చేసినట్లుగానీ, కనీసం ఒక్కమాట మాట్లాడినట్లుగాని చూడము. దీనిలో కుమారుని విధేయత వుంది. రెండువేల సంవత్సరాల క్రితము ఆ మోరియా పర్వతమున్న ప్రదేశమైన యెరూషలేములోనే పరమతండ్రి త్యాగము, కుమారుని విధేయత ప్రస్ఫుటంగా ప్రత్యక్ష మయ్యింది. సర్వమానవాళి నిత్యనాశనం వైపు దూసుకొనిపోతున్న సమయంలో, కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము మనలను పావన పరచలేనప్పుడు, లోకమును ఎంతగానో ప్రేమించిన దేవుడు తన అద్వితీయ (ఏకైక) కుమారుని ఈ లోకానికి పంపించి, మనకు బదులుగా బలియాగము చెయ్యడానికి ఆయన ఇష్టపడ్డాడు (యోహాను 3:16). దీనిలో తండ్రి త్యాగముంది. అబ్రాహాము కట్టెలమోపు ఇస్సాకు మీద పెట్టినట్లుగా, తండ్రియైన దేవుడు మన పాపభారమంతా తన కుమారుడైన యేసుక్రీస్తుమీద పెట్టారు. అందుకే యోహాను ఈరీతిగా చెప్తున్నాడు. “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల”. (యోహాను 1:29). ఇస్సాకు బలిపీఠము మీద అర్పణగా అర్పించబడడానికే, లేదా తండ్రి ఇష్టానికే తలవంచినట్లుగా, ప్రభువైన యేసు క్రీస్తూకూడా “అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. ( యెషయా 53:7). మోరియా పర్వతముమీద ఇస్సాకు బలి అది ఒక ఛాయ (నీడ) అయితే, నిజరూపం మాత్రం క్రీస్తులో నెరవేరబడింది. దానిని బట్టే, ఇస్సాకుకు బదులుగా పొట్టేలు వధించబడింది. గాని, మన పాపములకు బదులుగా ప్రియరక్షకుడైన యేసుప్రభువే వధించబడ్డాడు. ఆయన రక్తమునే విమోచన క్రయధనముగా చెల్లించి, మనలను విడిపించి నిత్యమరణం నుండి నిత్యజీవములోనికి దాటించారు. అయితే, కల్వరిలో ప్రభువు చిందించిన రుధిరధారాల్లో నీ పాపములు కడుగుకొని రక్షింపబడిన అనుభవం నీకుందా? లేకుంటే నిత్యజీవంలోనికి అడుగుపెట్టలేవు.
🔅 రక్తము మరియు దేవుని ప్రమాణముతో స్థిరపరచబడిన నిబంధన:
యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను. (ఆది 22:15-18) అబ్రాహాము కల్దీయుల దేశములో నున్నప్పటినుండి దేవుడతనికి వాగ్ధానపు ఆశీర్వాదాలు యిస్తూనే వున్నాడు. నిబంధన చేసాడు, తర్వాత ఆ నిబంధనను నూతన పరిచాడు. ఇప్పుడు మోరియా పర్వతము మీద పొట్టేలును వధించగానే, నూతన పరచబడిన నిబంధన మరలా చెప్పబడింది. అంటే ఈ నిబంధన రక్తముతో స్థిరపరచబడడమే కాకుండా, దేవునితోడని ప్రమాణమున్నది (ఆది 22: 15-18). దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక తనతోడు అని ప్రమాణముచేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. (హెబ్రీ 6:13,14) ఇది వధించబడిన గొర్రెపిల్ల రక్తము ద్వారా, దేవుడే స్ధిరపరచిన నిబంధన. దీనిద్వారా మన విశ్వాసము స్థిరపరచబడుతుంది. యేసు క్రీస్తు అనే గొర్రెపిల్ల నీకు బదులుగా వధించబడ్డాడు అని నీవు విశ్వసించినట్లయితే “నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించెదను” అనే దేవుని ప్రమాణములో నీవూ వున్నట్లే. మనయందు ఇది ఎట్లా పనిచేస్తుందంటే? తన సొంతకుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు? (రోమా 8:32) తన స్వంత కుమారుని ఇవ్వడానికి కూడా వెనుకతీయలేదు. ఆయన ప్రియమైన కుమారుని మనకిచ్చాడు. ఆయన ప్రియమైన కుమారుని మనకు ఇవ్వడం ద్వారా, సమస్తాన్ని ఆయన మనకిచ్చినట్లే. ఆయన ప్రాయశ్చిత్తబలిలోనే మిగిలిన చిన్న చిన్న దీవెనలన్నీ దాగివున్నాయి.
నేను ఒక రోజు విజిట్ కు దుబాయ్ వెళ్తున్నాను. ఫ్లైట్ లో ప్రయాణించడం అదే ప్రప్రధమం. కాస్త భయంగాను, కాస్త త్రిల్ గాను వుంది. అదొక సరిక్రొత్త అనుభవం. కొంత సమయం గడిచాక, ఎయిర్ హోస్టెస్ లంచ్ తీసుకొచ్చారు. దానితో పాటు ఒక పింగాణీ కప్ కూడా ఇచ్చారు. అదెందుకు ఇచ్చారో నాకర్ధం కాలేదు. కారణం? లంచ్ అయ్యాక, టీ త్రాగే అలవాటు నాకు లేదు. అట్లా త్రాగుతారు అనే విషయం కూడా నాకు తెలియదు. లంచ్ అయ్యాక, ఎయిర్ హోస్టెస్ కాఫీ, టీ అంటుంటే? అప్పుడు అర్ధమయ్యింది. సరే ఫ్లైట్ లో టీ ఎట్లా ఉంటుందో చూద్దామని, త్రాగితే? చెప్పలేనంత చేదు. అది RTC బస్సు కాదు కదా? బయటకి విసిరెయ్యడానికి. ఆ ఫ్లైట్ వాళ్ళని తిట్టుకుంటూనే, పూర్తి చేసాను.
అయితే, ఆ ఎయిర్ హోస్టెస్ తీసుకొచ్చిన లంచ్ ప్లేట్ లోని ఒక ప్యాకెట్ కి నేను ఓపెన్ చెయ్యలేదు. చివర్లో అదేంటో చూద్దామని ఓపెన్ చేస్తే? చెప్పలేనంత నవ్వొచ్చింది, సిగ్గనిపించింది. ఆ ప్యాకెట్ లో ఒక మిల్క్ ప్యాకెట్, షుగర్ ప్యాకెట్, వాటన్నిటిని కలుపుకోవడానికి స్పూన్ కూడా వుంది. వాళ్ళ లోపమేమి లేదు. ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. వాటిని ఉపయోగించడం చేత కాక, వారిని తిట్టుకొంటున్నాను. అవును!
ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. తన స్వంత కుమారుని మనకిచ్చుటలో అత్యంత గొప్పదానిని దేవుడు మనకిచ్చినప్పుడు అంతకంటే తక్కువవాటిని మనకివ్వడానికి నిరాకరిస్తాడా? ఆయన కుమారునితోపాటుగా అన్నీ మనకిచ్చేసాడు. అయితేవాటిని వెతుక్కోవడంరాక, ఎట్లా వాడుకోవాలో తెలియక ఆయనపైనే సణుగుతున్నాము.

దేవుని పట్ల విధేయత ఎప్పుడూ దీవెనలను తీసుకొని వస్తుంది. (ఆది 12:2,3; సంఖ్యా 6:22-27; ద్వితీ 28:1-14; అపో. కా 3:25,26; గలతి 3:16.) నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను అని చెప్పడం ద్వారా, ఇసుకరేణువులు భూసంబంధమైన మనుష్యులు అనగా ఇష్మాయేలు సంతానం, ఆకాశ నక్షత్రములు పరసంబంధమైన మనుష్యులు అనగా ఇశ్రాయేలీయులకు సాదృశ్యముగా వుండివుండొచ్చు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యత్వము అనంతరము వారు శత్రువుల గవినిని స్వాధీనము చేసుకున్నారు. అబ్రాహాము వంశములోనుండే ప్రభువైన యేసు క్రీస్తు శరీరధారిగా ఈలోకమునకు రావడంద్వారా, ఆయన సిలువ మరణము ద్వారా, సమస్తవంశములు ఆశీర్వదించబడ్డాయి. తద్వారా ఆ ఘనతకూడా అబ్రాహామునకే దక్కింది. ఇదంతా విశ్వాసము, విధేయత ద్వారానే సాధ్యమయ్యింది. అబ్రాహాముతోపాటు విశ్వాసజీవితాన్ని జీవించడానికి ఆరంభిద్దాం! మన ప్రతీ అవసరతను ఆయన తీర్చగలడని విశ్వసిద్దాం!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(54వ భాగము)
♻ శారా జీవితం - మరణము - సమాధి♻ (Part-1)


శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికినయేండ్లు నూట ఇరువది యేడు. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చు టకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను (ఆది 23:1,2)
శారా ఒక ప్రత్యేకమైన స్త్రీ. వాగ్ధాన దేశములో మృతిపొంది (ఆది 23:2 ) వాగ్ధాన దేశములో అబ్రాహామునకు కలిగిన ఏకైక స్వాస్థ్యమైన “మక్పేలా గుహ” లో పాతిపెట్టబడిన (ఆది 23:20) మొట్టమొదటి విశ్వాసి. ఎంత వయస్సులో మరణించిందనేది ఒక్క శారా విషయంలోతప్ప, మరే స్త్రీ విషయంలోనూ పరిశుద్ధ గ్రంధములో ప్రస్తావించబడలేదు. శారా 127సంవత్సరాలు జీవించింది. అంటే, ఇస్సాకు జన్మించిన తర్వాత 37సంవత్సరాలు జీవించింది. శారా మరణించేసమయానికి అబ్రాహాము శారాలు ఒకే ఊరిలోలేరు. శారా హెబ్రోనను కిర్యతర్బాలోను, అబ్రాహాము బెయేర్షెబాలోను వున్నారు. శారా మరణ వార్తను తెలుసుకొని అబ్రాహాము హెబ్రోనుకు వచ్చాడు.

♻ శారా జీవితంలోని అపశ్రుతులు:
అబ్రాహాము కల్దీయుల దేశములోనున్నప్పుడు దేవుడతనిని పిలిచాడు. అప్పటికే అబ్రాహాముకు శారాతో వివాహమయ్యింది. అందుచే అబ్రాహాముతోపాటు ఇతరదేశములో పరదేశిగా, యాత్రికురాలిగా ఉండడానికి యిష్టపడింది. అయితే, తన విశ్వాస జీవితంలో శారా ఎంతో ఘోరంగా విఫలమైన సందర్భాలున్నాయి. అబ్రాహాము చెల్లెలనని అబద్దం చెప్పడానికి యిష్టపడింది. అది భర్తకు లోబడినట్లుండినాగాని దేవునికి విరుద్ధము. సంతానం కోసం హాగరు భార్యగా తీసుకొమ్మని సలహా ఇవ్వడం ద్వారా, అబ్రాహాము విశ్వాసయాత్రలో తప్పటడుగు వేయడానికి కారణంకావడమే కాకుండా, దేవుని శక్తిని శంకించినట్లయ్యింది. తద్వారా అనేక దుష్పరిణామాలు చోటుచేసుకోవడం విదితమే. హాగరును శ్రమ పెట్టడం ద్వారా శారాయి అనేపేరుకు జగడగొండి అని అర్ధం కాబట్టి, సార్ధక నామధేయురాలయ్యింది. దేవుడు ఆమె కుమారుని కంటుందని అబ్రాహాముతో మాట్లాడుతున్నప్పుడు, అవిశ్వాసపు నవ్వునవ్వి, అబద్దం చెప్పి దేవునిచే గద్దించబడింది.

అబ్రాహాము తాను ప్రేమించే ఏకైక కుమారుని బలి యివ్వాల్సిన సందర్భములోకూడా కన్నీరు కార్చలేదుగాని, మొట్టమొదటిగా తన భార్యయైన శారా మృతిచెందినప్పుడు మాత్రం ఆయన అంగలార్చాడు. వివాహమైన నాటినుండి అతనివెంటే అడుగులో అడుగేసి నడిచిందేతప్ప, ఏనాడు అతనికి ఎదురుచెప్పిన సందర్భంలేదు. ఎంతటి భయంకరమైన పరిస్థితులైనాసరే, అబ్రాహాముతో చేసిన నిబంధనకే కట్టుబడివుంది తప్ప, వాటినెప్పుడూ మీరలేదు. భౌతికంగా ఆమె దూరంకావడాన్ని అబ్రాహాము తట్టుకోలేకపోయాడు. శారా వ్యక్తిత్వం గురించి ధ్యానంచేసి, అనుసరించడం మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరం.

♻ ఆదర్శప్రాయమైన శారా జీవితం:
🔅1. శారా ఒక గుణవతియైన భార్యగా దర్శనమిస్తుంది. స్వంతదేశాన్ని, తండ్రి కుటుంబాన్ని, బంధువులను అందరిని విడచిపెట్టి భర్తతోనే ప్రయాణం కొనసాగించింది. అబ్రాహాము తన భార్యను మందలించిన సందర్భం ఎప్పుడూ కనబడదు. అంటే, ఆమె జీవితవిధానం ఎట్లా వుండివుంటుందో అర్ధం చేసుకోగలం.
🔹గుణవతియైన భార్య యొక్క గుణములు గూర్చి సామెతలు 31:10-31లో చెప్పబడింది. అందులో ఆమె హృదయము, చేతులు మరియు నాలుకను గూర్చి చక్కగా వివరించబడినది. ఆమె సొగసు గూర్చి ఏమీ చెప్పబడలేదు, పైపెచ్చు అవి వ్యర్థమైనవియు మరియు మోసకరమైనవని చెప్పబడెను (సామె 31:30). అందులో చెప్పబడిన “గుణవతికి దేవునికి భయపడే హృదయమున్నది” (సామె 31:30). ఇదే ఆమె జీవితమంతటికి పునాదిగా నున్నది. ఆమె తన చేతులను బట్టలుతుకుతూ, వంట చేస్తూ, మొక్కలు నాటుతూ మరియు బీదలకు సహాయపడుతూ ఉపయోగించేది (సామె 31:13-22). ఆమె అందముగా లేకపోయినా దేవుని భయము కలిగి, కష్టపడి పని చేయుచు దయకలిగియుండేది. ఒక భార్యగా ఇట్టి అనుభవం నీకుందా?

🔅2. తన భర్తను పేరుపెట్టి పిలిచేసాహసం కూడా ఎప్పుడూ చేయలేకపోయింది. తన భర్తను “యజమానుడు” అని సంబోధించింది. (ఆది 18:12)
🔹నీ భర్తను “యజమానుడు” అని పిలవవద్దులేగాని, వాడు, వీడు, ఒరేయ్ అని పిలవకుండా మర్యాదగా పిలిస్తేచాలు. నీభర్త ఎట్లాంటివాడైనా, నీవెంత సంపాదించినాసరే నీకు శిరస్సు నీ భర్త . నీ భర్తకు శిరస్సు ప్రభువు. అంటే నీ భర్తను గౌరవించడంలేదంటే, నీ భర్తకే కాకుండా, నీ భర్తకు శిరస్సైయున్న ప్రభువుకు కూడా నీవు అవమానమును తీసుకొచ్చేదానవని జ్ఞాపకముంచుకో. శిరస్సుయైన నీభర్తను గౌరవించలేకపోతే నీవు మొండెముగానే మిగిలిపోవలసివస్తుందనే విషయం గుర్తుపెట్టుకో. నీ భర్తను రాజునుచేసి అతనికి నీవు రాణిగా వుండు. “ఒక భార్య తన భర్తకు లోబడినప్పుడు, నిజానికి ఆ విధముగా చేయమని చెప్పిన దేవుని వాక్యపు అధికారానికి లోబడుచున్నది. మరియు ఆ విధముగా ఆమె చేయుటకు లోకములో నుండిన అతిగొప్ప శక్తి ఆమెపై ప్రభావము చేయుట చేత క్రీస్తు నెరుగని భర్తలు కూడా ఆ శక్తిచేత జయింపబడుదురు”. (1పేతురు 2:1,2)

🔅 3. గుడారములోపలవుండే అనుభవాన్ని కలిగివుందిగాని, భర్తమీద పెత్తనంచేసే సాహసం చెయ్యలేదు. (ఆది 18:9)
🔹గుడారములో నుండే అనుభవం నీకుందా? పరిశుద్ధాత్ముడు ఎలాగు కనబడకుండా, మౌనముగా నుండినా శక్తివంతముగా విశ్వానికి ఎలా సహాయము చేయునో, నీవు కూడా నీ భర్తకు అలా సహాయము చేయుటకు సృష్టింపబడిన దానవనే గ్రహింపు నీ ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత శ్రేయస్కరం. అట్లాకాకుండా వీధిలో నీవుంటే, ఒక తిరుగుబాటుచేసే భార్య తన ఇంటిని పనికిరాని ఏ ఎడారి కంటే కూడా భయంకరముగా తయారు చేయును. “ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు”. ( సామె 21:19)

🔅4. దీర్గకాళికంగా బిడ్డలులేకపోయినప్పటికీ దానికి భర్తనే భాధ్యుడను చేసి వేధించిన సందర్భం మనకెక్కడా కనబడదు.
🔹నీకు వివాహమై, గర్భఫలము ఆలస్యమైతే, రాహేలువలే భర్తను మానసికంగా హింసించే ప్రయత్నం చెయ్యొద్దు. గర్భఫలమిచ్చేది దేవుడే తప్ప, నీభర్త కాదనే విషయం మరచిపోవద్దు. నీ భర్తను నీతోకలసి ప్రార్ధించడానికి ప్రోత్సహించి, నిర్ణయకాలము వరకు నిరీక్షణతో కనిపెట్టు. యవ్వన కాలంలోపుట్టిన బిడ్డలే ఆరోగ్యవంతులనే అపోహలొద్దు. వంద సంవత్సరాల వయస్సులో అబ్రాహాము కనిన కుమారుడు కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతుడే. దేవుడిచ్చేది ఏదైనా, ఎప్పుడైనా అది శ్రేష్ఠమైనదే అనేవిషయం గుర్తుపెట్టుకో.

🔅5. ఆమె చాలా సౌందర్యవతి అయినప్పటికీ తన అందముద్వారా అందలమెక్కాలని ఎన్నడూ యోచించినది కాదు. ఫరో, అబీమెలెకు వంటి రాజులు ఆమెను కోరుకున్నప్పటి, ఆ రాజ్యాలకు రాణిని కావొచ్చని ఎన్నడూ ఆశించినదికాదు. అబీమెలెకు శారాను అతని ఇంట చేర్చుకొనే సమయానికి ఆమె వయస్సు 80 సంవత్సరాలు. అప్పటికికూడా ఆమె సౌందర్యవంతురాలే. ఆమె అందాన్ని అందలమెక్కడానికిగాని, పాపం చెయ్యడానికిగాని ఖర్చుచేసినదికాదు. ఆమె శారీరికంగానే కాదు. ఆమె అంతరగమందునూ సౌందర్యవంతురాలే.
🔹దేవుడు నీకిచ్చిన అందాన్నిబట్టి, నీ భర్తచాటున పరాయి పురుషునితో పాపం చేస్తున్నావా? లేక నీభర్తచేత, నీ దేవునిచేత కొనియాడబడిన జీవితాన్ని జీవిస్తున్నావా? లేక నిన్నుబట్టి నీభర్తకు, నీదేవునికి అవమానం తెచ్చేజీవితాన్ని జీవిస్తున్నావా? నిన్ను నీవే పరిశీలన చేసుకో.

🔅6. ఆమెది ఆతిధ్యమిచ్చుటలో అందెవేసిన చెయ్యి అనుటకు సందేహంలేనేలేదు. (ఆది 18:6)
🔹ఆతిథ్యము విషయములో ఇంటిలో భార్యదే ముఖ్యమైన బాధ్యత.ఆమె ఒక ప్రవక్తకాకుండానే, ఒక ప్రవక్తను కేవలము తన ఇంటిలోనికి ఆహ్వానించుట ద్వారా ఆమె ఒక ప్రవక్త ఫలమును పొందును (మత్తయి 10:41). అలాగే యేసు క్రీస్తు శిష్యులలో అతిచిన్న వానికి ఆతిథ్యమిచ్చుటచేత ఆమె తగిన ప్రతిఫలము పొందును (మత్తయి 10:41). ఒక అపొస్తలునికి ఇంటిలో ఆతిథ్యమిచ్చుట యేసు ప్రభువును చేర్చుకొనుటతో సమానమైనది*
(మత్తయి 18:5). గొప్ప భోజనము పెడితేనే ఆతిథ్యమను కోకుండునట్లు, బీద విధవరాండ్రు కూడా పరిశుద్ధులకు ఉపచారము చేసిరి. (1తిమోతి 5:10)

🔅 7. కల్దీయుల దేశములో తన భర్తతో కలసిచేసిన ఒప్పందం ప్రకారం తన భర్తను తన సహోదరుడని చెప్పింది. తద్వారా అనేక సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ, భర్తకు తానిచ్చినమాటకు కట్టుబడివుంది.
🔹ఒక భార్య స్థానంలో నీవుండివుంటే ఇట్లాంటి అనుభవాలు నీకున్నాయా? భర్త అబద్దం చెప్పమంటే దానికి బద్దురాలివైయుండు అనేది నా ఉద్దేశ్యం కాదు. అబ్రాహాము జీవించన దినాలలోనున్న పరిస్థితి అట్లాంటిది. అందమైన భార్యకలిగియుంటే భర్తను చంపి భార్యను లాక్కొనే పరిస్థితి ఆదినాలలో ఉండేది. దానికితోడు పరదేశిగా పయనం. ఇప్పటిజీవితానికి, ఈ కాలానికి దానిని వర్తింపజేయడానికి వీల్లేదు. సప్పీరా తనభర్తయైన అననీయతో కలసి అబద్ధమాడితే జరిగిన పరిణామాలేమిటో తెలుసుకదా? వివాహసమయంలో నీవు చేసిన ప్రమాణము చొప్పున నీ భర్తకు లోబడిన జీవితముందా? అసలు ఆ ప్రమాణాలే గుర్తులేకుండాపోయాయా? శారాకు వివాహమయ్యేటప్పటికీ నిజదేవుడెవరో తెలియదు. అయిననూ ఆ ప్రమాణాలకు కట్టుబడివుంది. నిజదేవుని సమక్షంలో నీవు చేసిన ప్రమాణములను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో.

🔅8. శారాయి (జగడగొండి), శారా (రాజ కుమారి)గా మార్చబడింది. హాగరుని శ్రమపెట్టినప్పటికీ, తిరిగివచ్చిన హాగరును చేర్చుకొని ఆదరించింది. అట్టిరీతిగానే ఆమె కొనియాడబడింది.
🔹ఒకవేళ బాప్తీస్మం తీసుకున్నప్పుడు నీ పేరు మారిందేమో? కానీ, నీ బ్రతుకు మారిందా? పేరు మారకపోయినా పర్వాలేదు జీవితం మారితే, జీవితం మారకుండా పేరు మార్చుకుంటేమాత్రం ప్రయోజనం శూన్యం. నిన్ను నీవే పరిశీలన చేసుకో! సరిచేసుకో!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(55వ భాగము)
♻ శారా జీవితం - మరణము - సమాధి♻ (Part-2)


అబ్రాహాము దేవునికిని, దూతలకును ఆతిధ్యమిచ్చిన తర్వాత ఆయన, ఈ కాలమున నీయొద్దకు నిశ్చ యముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. (ఆది 18:10) ఆ మాటలు గుడారములోనుండి వినిన శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. ఆ నవ్వులో అవిశ్వాసము దాగియుండెను. అందుకాయన, యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను (ఆది 18:14). శారాకు దేవునితో కలిగిన వ్యక్తిగత అనుభవంలో ఆమె విశ్వాసం నూతనముగా బలపరచబడినది. గతంలో ఆమె అబ్రాహాము విశ్వాసంలో పాలిభాగస్థురాలిగా నుండినది. దేవుడు తనకిచ్చిన వాగ్ధానములను ఆమె నమ్మినది. అయితే ఇప్పుడు దేవుని మాటవలన ఆమె హృదయంలోని విశ్వాసం ఉద్భవించినది. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను. “విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను” (హెబ్రీ 11:11). కాబట్టి, ఇస్సాకు జన్మించాడంటే, అబ్రాహాము, శారాల ఇరువురి విశ్వాసమువలననే జన్మించాడు. తన ఆత్మలోనికి వెలుగునుతెచ్చి, తాను పడిపోయినప్పుడు లేవనెత్తి జీవితంలో తనను నడిపించిన కృపకై ఆమె దేవునిని స్తుతించగలిగింది.

🔅శారా మరణ దుఃఖం:
శారా 127 సంవత్సరాల జీవితయాత్రకు ముగింపుపలికి, తన బహుమానం కొరకు వెళ్ళిపోయింది. భౌతికమైన ఎడబాటును తట్టుకోలేక అబ్రాహాము అంగలార్చాడు. అబ్రాహాము కన్నీరు కార్చిన సందర్భం ఇదొక్కటే. ఏడ్వడమనేది పురుషులకు తగదని అనుకోనవసరం లేదు. లాజరు మరణించినప్పుడు ప్రభువు కూడా కన్నీళ్లు విడిచారు. దుఃఖపడడంలో తప్పులేదు. కన్నీళ్లు గాయాన్ని మాన్పుతాయి. ప్రియమైన వారికొరకు దుఃఖిస్తున్నప్పుడు వారెంతటి ఆప్తులో తెలియజేస్తుంది. ఆ మరణం మన శత్రువు. పాపమే విషాదకరమైన శిక్షను మానవాళికి తెచ్చిపెట్టింది. దుఃఖపడడంలో తప్పులేదుగాని నిరీక్షణలేని ఇతరులవలే మాత్రం దుఃఖపడకూడదు (1థెస్స 4:13).
అవిశ్వాసులవలే దుఃఖపడకూడదు. ఎందుకంటే వారికంటూ ఒక నిరీక్షణలేదు. మనకు సజీవమైన నిరీక్షణ వుంది. మరణపు ముల్లును విరచి, మృత్యుంజయునిగా తిరిగిలేచిన ప్రభువు, మరణించిన మనలను ఒకదినాన్న లేపుతాడని. అదే క్రైస్తవ నిరీక్షణ.

దైవజనుడైన ఫిలిప్ బ్రూక్స్ జబ్బుపడగా హాస్పిటల్ లో చేర్చారు. అవి అతని చివరిదినాలు. అనేకమంది ఆప్తులు ఆయనను పరామర్శించడానికి వచ్చారుగాని, ఆయనెవ్వరికి ఆయనను కలిసే అవకాశం ఇవ్వలేదు. ఆరీతిగానే నాస్తికుడైన బాబ్ ఇంగరసాల్ కూడా పరామర్శించడానికి వచ్చినప్పుడు హాస్పిటల్ సిబ్బంది ఆ విషయం బ్రూక్స్ గారికి తెలియజేయగా, అతనిని కలిసే అవకాశమిచ్చారట. దానికి ఆ నాస్తికుడు సంతోషంతో బ్రూక్స్ గారితో, అయ్యా అనేకమంది మిమ్ముల్ని పరామర్శించడానికి వచ్చినప్పటికీ ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా నాకిచ్చినందు చాలా సంతోషం. కానీ, నాకు మాత్రమే ఆ అవకాశం ఇవ్వడానికిగల కారణమేమిటని అడిగినప్పుడు, దానికి సమాధానముగా బ్రూక్స్ గారు ఇట్లా చెప్పారట. “ వారిని ఒకానొకదినాన్న తప్పచూస్తాను. నిన్ను మాత్రం మరెన్నడూ చూడలేను గనుక”. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఆప్తులను కోల్పోయి సంవత్సరాల తరబడి దుఃఖంలో మునిగిపోయి వున్నావేమో? గతాన్ని తలంచుకొని, వర్తమానాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. మనకొక శుభప్రదమైన నిరీక్షణ వుంది. అట్టి నిరీక్షణనే అబ్రాహాము కలిగియుండి, తన భార్యయైన శారా యొక్క భౌతికకాయాన్ని పూడ్చిపెట్టుటకు ఏర్పాట్లను చేస్తున్నాడు.

🔅 అబ్రాహాము స్మశానముకొరకు భూమిని స్వాస్థ్యముగా కొనుట:
దేవుడు అబ్రాహామునకూ, అతని సంతతికిని ఆదేశమంతటిని ఇచ్చినప్పటికీ అప్పటికింకా కొంచెము భూమి కూడా అతని స్వాధీనం కాలేదు. సమాధికొరకు కొంచెము భూమి కొనుక్కోవలసి వచ్చింది. ఇదే విధంగా వాగ్ధాన పూర్వకంగా ఈలోకమంతా క్రీస్తులో విశ్వాసముంచినవారిదే (రోమా 4:13; 8:17; 1కొరింథీ 3:21,22; గలతి 4:7). కానీ, ప్రస్తుతం వీరిలో అనేకులు కొంచెము ఆస్తి కలిగియుండి, మరికొందరైతే అస్సలు లేకుండా వున్నారు. అయితే, దేవుడు లోకానికి తీర్పుతీర్చేందుకు బయలుదేరేటప్పుడు, లోకరాజ్యాలన్నీ దేవునికీ క్రీస్తుకూ చెందిన రాజ్యాలయ్యేవరకు దేవుని ఈ వాగ్ధానాల నెరవేర్పుకొరకు ఎదురుచూస్తున్నాయి (ప్రకటన 2:26,27; 11:15; 19:15 ).

అబ్రాహామునకు శారాను సమాధిచేయడానికి స్థలమును ఉచితంగా యివ్వజూపారు. నీవు మా మధ్య మహారాజువై యున్నావు అన్నారు (ఆది 23:6) బహుశా వీరికి అబ్రాహాము చేసిన కొన్ని పనులు తెలిసి ఉంటాయి. నలుగురు రాజులపై విజయము (ఆది 14:14-16 ), అబ్రాహాము ప్రార్ధించగా అబీమెలెకు ఇంటిలోని స్త్రీల గర్భములు తెరువబడుట (ఆది 20:17 ). అబ్రాహాము మాత్రం ఉచితంగా తీసుకొనుటకు ఒప్పక, మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండువెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను (ఆది 23:8,9). చివరకు, ఎఫ్రోను చెప్పినంత వెల 400 తులముల వెండికి ( సుమారు 4 లేదా 5 కిలోగ్రాముల వెండి కావొచ్చు) అబ్రాహాము కాలంలో ఆ పొలానికి ఆ ధర చాలా ఎక్కువే. అయినప్పయిటీకి, అబ్రాహాము మారు మాట్లాడకుండా నిండువెలను చెల్లించి, ఆ పొలమును దానిలోనున్న మక్పేలా గుహను, హేతు కుమారులవద్ద శ్మశానముకొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. వాగ్ధాన దేశములో అబ్రాహామునకు కలిగిన స్వాస్థ్యము యిదొక్కటే. “స్వాస్థ్యము” అనగా వాటిని అమ్ముకొనే అధికారం వుండదుగాని, దానిని వారి జీవితాంతం అనుభవించి, తర్వాత తరాలకు విడిచిపెట్టాలి.

అబ్రాహాము తన భార్యయైన శారాను మక్పేలా గుహలో పాతిపెట్టెను. వాగ్ధాన భూమిలో మరణించి, స్వాస్థ్యములో పాతిపెట్టబడిన మొట్టమొదటి విశ్వాసి శారా. తర్వాత కాలంలో అబ్రాహాము (ఆది 25:9 ) ఇస్సాకు, రిబ్కా, లేయాలు (ఆది 49: 29-31) యాకోబు (ఆది 50:13)లను ఇదే గుహలో పాతిపెట్టబడిరి. (గుహ, సమాధులు అంటే మనము భయంకరంగా ఊహించుకుంటాము. కానీ, అక్కడ అతి పరిశుభ్రముగా వాటిని కాపాడుతున్నారు. ఆ స్థలాన్ని నేను సందర్శించడానికి ప్రభువు కృపచూపారు. పురుషులకైతే దానిలోనికి ప్రవేశించేముందు లాల్చీ వంటి వస్త్రము ధరించాలి. స్త్రీలైతే అట్లాంటి వస్త్రముతో పాటు తల వెంట్రుకలకు కప్పుకోవడానికి మరొక వస్త్రాన్నిస్తారు. వాటిని ధరించి లోనికి ప్రవేశించాలి.)

ప్రియ విశ్వాసి! శారా విశ్వాసమునుబట్టి తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను. మనచుట్టూనున్న పరిస్థితులనుబట్టి కాదుగాని, ఆయనపై ఆధారపడుటవలన ఫలవంతమైన జీవితాలు జీవించగలము. శారా జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప పాఠం. సరిచేసుకొంటూ విశ్వాసయాత్రలో ముందుకుసాగిపోదాం!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(56వ భాగము)
♻ ఇస్సాకు యొక్క వివాహము ♻ (Part-1)


అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము; నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడు నైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయిం చెదననెను (ఆది 24:2-4) లోతు జీవితాన్ని పరిశీలన చేయగలిగినట్లయితే, అతడు ఏ దేశములో నివసించాడో అదే ప్రజలతో వియ్యమొందడానికి యిష్టపడ్డాడు. అబ్రాహాము అట్లా కాదు. కనాను దేశములో నివసిస్తూ కూడా తన కుమారునికి కనాను స్త్రీతో వివాహం చెయ్యడానికి యిష్టపడినవాడు కాదు. కారణం వారు విగ్రహారాధికులు. తన కుమారుని విగ్రహాలవైపుకు త్రిప్పెస్తారేమోనని తలంచినాడు. (ద్వితీ 7:3,4; ఎజ్రా 9:1-4; 1రాజులు 11:1-6; 1కొరింథీ7:39; 2 కొరింథీ 6:14-18)

ఇష్మాయేలుది అడవి గాడిదవంటి స్వభావమైనప్పటికీ తన తల్లి తెచ్చిన అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. ఇస్సాకు అయితే, తన ఇంట్లో పనిమనిషి తెచ్చే, అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇస్సాకు తండ్రి మాటకు ఎదురు చెప్పలేదు. నాకు కావలసిన అమ్మాయిని నేనే తెచ్చుకుంటాననిగాని, కనానులోనున్న అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకొంటానని పట్టుబట్టలేదు. ఇస్సాకుకు ఒక విషయం తెలుసు నాకెట్లాంటి అమ్మాయికావాలో నాకంటే నా తండ్రికే బాగా తెలుసని. నేటి యవ్వన బిడ్డలలో ఈ పరిస్థితి లోపించింది. నిజదేవుని ఎరుగని వారితో, రక్షించబడని వారితో సహవాసము వద్దు అంటే, మావలే వారిని కూడా మార్చేస్తాము అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పి, మార్చేసారో, మారిపోయారో మనకు తెలియని విషయమేమి కాదు. నాకొక అమర్ అనే స్నేహితుడున్నాడు. మంచి శరీర దారుఢ్యము కలిగి ఉండేవాడు. ప్రతీ శుక్రవారం ఉపవాసంతో ప్రార్ధించేవాడు. అంతా బానే ఉండేది. స్టడీ పూర్తి అయ్యాక, విడిపోయాము. లెటర్స్ వ్రాసుకొనేవాళ్ళము. తర్వాత అదీ లేదు. అప్పటికి మా దగ్గర సెల్ ఫోన్స్ లేవు. 15 సంవత్సరాలు గడచిపోయింది. ఎవరము ఎక్కడున్నామో, ఏమి చేస్తున్నామో ఎట్లాంటి సమాచారం లేదు. ఒక రోజు నేను పనిచేస్తున్న స్కూల్ దగ్గరకు ఒకతను నవ్వుతూ నా నావైపే వస్తున్నాడు. కానీ, అతనెవరో నేను గుర్తుపట్టలేదు. బక్కచిక్కిపోయి, గెడ్డం పెంచుకొని వున్నాడు. నా దగ్గరకు వచ్చాక తనని చూచి షాక్ అయ్యాను. అరేయ్ నీ పేరు, ఊరు గుర్తుందిరా చూడాలనిపించి వచ్చాను అన్నాడు. వాడిని చూచేసరికి చెప్పలేనంత బాధనిపించింది. ఏంటి ఇట్లా వున్నావు? ఏమయిందిరా అనడిగితే, జరగకూడనిదంతా జరిగిందిరా అని చెప్పాడు. విగ్రహారాధన చేసే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడట, ఆమెకోసం ఒక టెంపుల్ ని కట్టించాడట, ప్రతీ ఉదయం ఇద్దరూ దానిలో పూజలు చేసేవారట, ఇద్దరు పిల్లలు పుట్టినవెంటనే తను చనిపోయిందట. చివరిగా ఒకమాటన్నాడు నిజదేవుని విడచిపెట్టి, చేయకూడనివి చేసాను దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాను. అవును! ఇట్లాంటి అబ్బాయిలు, అమ్మాయిలు ఎంతమంది లేరు? వారి చేసిన తప్పులను ఎవ్వరితోనూ చెప్పుకోలేక, మనస్సాక్షిని చంపుకొని విగ్రహారాధనను చేస్తూ, క్షణక్షణం చచ్చి బ్రతుకుతూ, కుటుంబాలతో సరియైన సంబంధాలు లేక క్షోభననుభవించే జీవితాలెన్నోకదా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయ మునకు విగ్రహములతో ఏమిపొందిక? ...... కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి(2 కొరింథీ 6:14-17) అబ్రాహాము విగ్రహారాధికుడుగానే పుట్టి, పెరిగాడు. ఇప్పుడైతే ఆయన ప్రత్యేకింపబడినవాడు. అందుకొరకే దేవుడతనిని తన దేశాన్ని, తన బంధువులను విడచిపెట్టమన్నాడు. కారణం వారంతా విగ్రహారాధికులు కాబట్టే. అతడు ప్రత్యేకింపబడ్డాడు, తన బిడ్డను కూడా ప్రత్యేకమైన రీతిలోనే పెంచాడు. అందుకేగదా, బలిపీఠం మీద సహితం అంత విధేయత చూపాడు. ఇప్పుడు తన బిడ్డకు కనానీయులతో వివాహం జరిపించే ఆలోచనే అతనికి లేదు. తద్వారా ఏకైక నిజదేవునిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించినవాడయ్యాడు. స్వజనులలోనుండి అతని కొరకు ఒక అమ్మాయిని తీసుకొనిరావడానికి తన యింటి పెద్దదాసుడైన ఏలియెజెరు తొడక్రింద చేయిపెట్టి ప్రమాణం చేయించాడు. పురాతన కాలంలో గంభీరమైన శపథం చెయ్యాల్సి వచ్చినప్పుడు ఇట్టి విధానాన్ని అవలంభించేవారు.


🔅ఇస్సాకు వివాహము పరలోకంలోనే నిశ్చయమయ్యింది
అబ్రాహాము తన దాసునితో, నా కుమారుడైన ఇస్సాకును నా స్వజనుల యొద్దకు నీవు తీసుకొని పోవడానికి వీల్లేదు. అక్కడ నుండి అమ్మాయిని మాత్రం తీసుకొని రావాలి. అంటే, ఏలియెజెరు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని తీసుకొని రావొచ్చన్నమాట. అట్లా ఏమీకాదు. “నా తండ్రి యింటనుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడినీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు”. (ఆది 24:7). అంటే, యెహోవా అతని దూతను ఏలియెజెరు కంటే ముందుగా పంపిస్తాడట, అక్కడ సిద్ధపరచాల్సిన అమ్మాయిని దేవుని దూతే సిద్దపరుస్తాడట. కేవలం ఏలియెజెరు ఆమెను తీసుకొని రావడానికే వెళ్లినట్లున్నది. కార్యము సఫలము చేసేవాడు దేవుడే. కనీసం అతనికి కాబోయే కోడలిని తానేవెళ్ళి తెచ్చుకోవాలనుకోలేదు. దీనినిబట్టి అబ్రాహాము ఎంతగా దేవునిపై ఆధారపడ్డాడో మనము అర్ధము చేసుకోగలం. బిడ్డల వివాహాల కోసం ప్రార్ధించే తలిదండ్రులెందరో వున్నారు. కానీ, కట్నం నచ్చితే దేవుని చిత్తమని, కట్నం నచ్చకపోతే ఇది దేవుని చిత్తంకాదని, వారి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రాధాన్యతయిస్తున్నారు. కొందరైతే కట్నానికి “బహుమతి” అని ముద్దుపేరు పెట్టుకొంటున్నారు. అట్లా పిలచినంతమాత్రానా అది కట్నం కాకుండాపోతుందేమోమరి. వారిలో మీరున్నారా? మీ బిడ్డల జీవితాలను దేవుని చిత్తానికి అప్పగిస్తే, మీరు కోరుకున్నవాటికంటే అత్యధికమైన దీవెనలతో నింపుతాడాయన. అబ్రాహాము గాని, ఇస్సాకు గాని తన ఇంటికి రాబోయే అమ్మాయి ఆమె రంగు, అందం, వాటిగురించి ఆలోచనే వారికిలేదు. దేవుని చిత్తం వారి జీవితాల్లో జరగాలని తప్ప, అయితే, ఇస్సాకునకు దేవుడు సిద్ధపరచిన అమ్మాయి ఎట్లాంటిది అంటే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు (ఆది 24:16) ప్రియ తలిదండ్రులారా! యవ్వన బిడ్డలారా! మీ జీవితాలు ప్రభువునకు అప్పగించండి. ఆయన చిత్తానికి తలవంచండి. ఊహించని మేలులతో మిమ్ములను, మీ కుటుంబాలను ప్రభువు తప్పక నింపుతాడు.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(57వ భాగము)
♻ఇస్సాకు యొక్క వివాహము ♻ (Part-2)


🔅 ఎలీయెజెరు ప్రార్ధించుట :
అబ్రాహాము బహుకాలము గడచిని వృద్ధాప్యంలో నున్నాడు. తన పెద్ద దాసుడైన ఏలియెజెరు పిలచి, ఇప్పుడు నేను కాపురమున్న కనానీయుల కుమార్తెలలో ఎవ్వరినీ నా కుమారునికిచ్చి వివాహం చెయ్యను. నా స్వదేశానికి వెళ్లి, నా కుమారుని కొరకు ఒక అమ్మాయిని తీసుకురమ్మని ప్రమాణం చేయించాడు. కనానీయుల కుమార్తెను వివాహం చెయ్యకపోవడానికి కారణం? తర్వాత దినాలలో కూడా దేవుడు ఇట్లాంటి కట్టడాన్ని నియమించాడు. అది దేవుడు నియమించిన కట్టడ. వారు విగ్రాహారాధికులు (ద్వితి 7: 3,4 ;
2 కొరింది 6: 14-16). అందుచే, ఎలీయెజెరును స్వదేశానికి పంపిస్తున్నాడు అబ్రాహాము. ఏలియెజెరు విధేయుడు, ప్రార్ధనా పరుడు, కార్యం నిర్వహించే నేర్పు గలవాడు, నమ్మకస్తుడు, దేవుడు మార్గం చూపేవరకు ఎదురుచూచే వాడు, తన యజమానుకి ప్రతిష్ఠ కలిగేలా నడచుకొనేవాడు.
అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమా నుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము ( మెసపొతోమియా) లోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోక రింపచేసి యిట్లనెను. “నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. చిత్త గించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచు చున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగానీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు ననెను” (ఆది 24:12-14). ఎలీయెజెరు ప్రార్ధిస్తూ ఒక సూచనను అడుగుతున్నాడు. పాతనిబంధన కాలంలో వాక్య ప్రత్యక్షత సంపూర్ణముగాలేని కారణం చేత, తరచుగా ఇట్లా సూచనలు అడిగేవారు. దేవుడు కూడా వాటిని అనుగ్రహించే వాడు. ఇట్లాంటి వారిలో అబ్రాహాము, గిద్యోను మొదలగు వారు కూడా వున్నారు. ఏది ఏమయినా ఎలీయెజెరు అనుకున్నట్లే జరిగింది. అట్లా అని, ఎలీయెజెరు అనుకున్నాడు కాబట్టి, అట్లా జరగలేదు. అది దేవుని చిత్తం కాబట్టి అట్లా జరిగింది. కొన్ని సందర్భాలలో మనం ప్రార్ధించినట్లే జరుగవచ్చు. అయితే, మరి కొన్ని సందర్భాలలో జరుగక పోవచ్చు.

🔅 రిబ్కా:
బెతూయేలు కుమార్తె. ఆమె మిక్కిలి చక్కనిది (ఆది 24:16) కన్యక. అనగా వివాహము కానిది అని అర్ధం కాదుగాని, ఏ పురుషుడును కూడనిది అని అర్ధం.
ఆమె పనిచేయుటలో ఉత్సాహము గలది (ఆది24:19) విధేయురాలు ( ఆది24:65) అతిధులకు ఆతిధ్యమిచ్చినది (ఆది24:25)

ఎలీయెజెరు రిబ్కా ఇంటికి వెళ్లి, తండ్రియైన బెతూయేలుతోను, సహోదరుడైన లాబానుతోను మాట్లాడగా, వారు ఇది యెహోవావలన కలిగిన కార్యమని గ్రహించిరి. ( ఆది 24:50). ఎలీయెజెరు రిబ్కాకునూ, అతని సహోదరునికిని, అతని తల్లికిని విలువగల వస్తువులనిచ్చాడు. రిబ్కా అంగీకారంతో వారు, దాదినిని యిచ్చి ఆమెతో పంపిస్తూ ఇట్టిరీతిగా దీవించారు. “నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక!” ( ఆది 24:60). రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడివెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇస్సాకును చూచిన రిబ్కా ముసుగువేసుకొంది. నేటి దినాలలో ముసుగును గూర్చి పరిశుద్ధ గ్రంధం స్పష్టముగా తెలియజేస్తున్నప్పటికీ, సంఘములో సహితం ముసుగు వేసుకోవడానికి యిష్టపడని స్త్రీలెందరో. బోధకురాళ్లు అని చెప్పుకొనేవారు సహితం ముసుగువేసుకోరు. అదేమిటంటే? వాక్యాన్ని వారిని అనుకూలముగా మలచుకునే ప్రయత్నం చేస్తారుతప్ప, వాక్యానుసారంగా వారిజీవితాలు మార్చుకొనే ప్రయత్నం మాత్రం చెయ్యరు. అట్లాంటివారికి రిబ్కా జీవితం ఒక ఆధ్యాత్మిక పాఠం.

అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. ( ఆది 24:67) మొదట “వివాహము”, తర్వాత “ప్రేమించడం” ఇది బైబిల్ క్రమము. ప్రేమించి పెళ్లిచేసుకొనుట బైబిల్ క్రమముకాదు. క్రమమైన దానిని అనుసరించలేక పోతున్నాము కాబట్టే, కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. సమాధానములేని జీవితాలను జీవిస్తున్నాము. వివాహము తర్వాత నీ భార్యను ప్రేమించగలిగే ప్రేమయే నిజమైన ప్రేమ. అట్టి జీవితం నీకుందా?

🔅 ఇస్సాకు భక్తి జీవితము:
ఇస్సాకు ధ్యానించుట (ఆది 24:63) ఇస్సాకు రిబ్కాను పరిగ్రహించుట, ప్రేమించుట (ఆది24:67) ప్రార్ధించుట (ఆది 25:21; 26:25) దీవించుట (ఆది 27:4,27-33; 28:3-4) బలిపీఠం- ఆరాధన (ఆది 26:25) ఇస్సాకునకు దైవ ప్రత్యక్షతలు (ఆది 26:2,24).

🔅 ఆత్మీయ దృక్పధంలో ఇస్సాకు వివాహం:
పాతనిబంధనలో జరిగిన సంభవాలు, తరచుగా తర్వాత నూతన నిబంధనలో కనిపించే ఆధ్యాత్మిక సత్యాలకు సాదృశ్యాలుగా ఉంటాయి. తన కుమారుని వివాహం జరిగించిన రాజును గురించిన యేసు ప్రభువు చెప్పిన ఉదాహరణ ( మత్తయి 22:2 ) ఈ అధ్యాయం దృష్టాంతరూపకంగా నున్నదని కొందరి అభిప్రాయం. ఇదే నిజమైతే, అబ్రాహాము తన కుమారుని పెళ్లి నిర్ణయించిన తండ్రియైన దేవునికి గుర్తుగానున్నాడు. వధువును వెదకి సిద్ధపరచి ఆమెకు క్రీస్తును వెల్లడించే సేవకునిగా పరిశుద్ధాత్మ కనిపిస్తున్నాడు( యోహాను 16:13,14).రిబ్కా క్రీస్తు వధువుకు అంటే ఆయన సంఘానికి గుర్తుగావుంది ( కొరింథీ 11:2; ఎఫెసు 5:25-32; ప్రకటన 19:7,8) ఎదురు వెళ్లి ఆమెను కలుసుకొనిన ఇస్సాకు, ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యముగా నున్నాడు (యోహాను14:3; 1థెస్స 4:16,17 ).మధ్యాకాశంలో జరుగు గొర్రెపిల్ల వివాహమహోత్సవములో మనమంతా వుండులాగున సిద్ధపడాలి. ఈ వివాహం ఎత్తబడే సంఘమునకు, యేసు ప్రభువుతో జరిగేది. వివాహం అంటే “శాశ్వతమైన సంబంధం” అని అర్ధం. సంఘమునకు, క్రీస్తుతో వివాహం అంటే, సంఘము క్రీస్తుతో కలిగియుండే “శాశ్వతమైన సంబంధం” అని అర్ధం. ఆ ఎత్తబడే సంఘములో మనమునూ వుండులాగున, ప్రభువుతో శాశ్వతమైన సహవాసాన్ని కలిగియుండగలందులకు మన జీవితాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝ అబ్రాహాము విశ్వాసయాత్ర ✝

(58వ భాగము)
🔅కెతూరాతో వివాహం - అబ్రాహాము మృతి🔅


అబ్రాహామును దేవుడు అత్యధికముగా ఆశీర్వదించినప్పటికీ, క్రమమైన కుటుంబజీవితాన్ని కలిగియున్నాడు.
శారా అతని భార్య. కల్దీయుల దేశములోనున్నప్పుడే వారి తలిదండ్రులే అబ్రాహాము వివాహాన్ని జరిగించారు. వయస్సుమీరి పోతుంది సంతానం లేదు. మరొక స్త్రీని వివాహం చేసుకోవాలనే తలంపు అతనికెప్పుడూ రాలేదు. తన భార్యయైన శారాయొక్క ప్రోద్బలంతోనే హాగరును భార్యగా స్వీకరించాడు తప్ప, తనకుతానుగా ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నవాడు కాదు. హాగరు ఇంటినుండి పంపించబడింది. శారా మరణించింది. ఇస్సాకుకు రిబ్కాతో వివాహమయ్యింది. అతడు తన భార్యతో వేరొకచోట నివాసముంటున్నాడు. ఇప్పుడు అబ్రాహాము ఒంటరిగానున్నాడు. అతనితో కలసి జీవించడానికి కెతూరాను వివాహం చేసుకున్నాడు.

నేటి దినాల్లో కుటుంబాలు విచ్చిన్నం కావడానికి కారణం? భర్తను విడచి భార్య పరాయి పురుషులతో సంబంధాలు. భార్యను విడచి భర్త పరాయి స్త్రీలతో సంబంధాలు. ఇవి కుటుంబాల్లో భార్యా భర్తల మధ్య సమాధానము లేకుండా చెయ్యడమే కాకుండా, కుటుంబ వ్యవస్థను నరకప్రాయం చేస్తున్నాయి. వీరు జీవించే జీవితాలవలన వారి యవ్వన బిడ్డలు కూడా వారికి నచ్చినట్లు జీవించడానికి అవకాశం కల్పించినవారవుతున్నారు. నేటి అక్రమ సంబంధాలు, కట్టుకున్న భర్తనుకూడా కడతేర్చే స్థితికి చేరుకున్నాయి. డబ్బుంటే మరొక భర్త వస్తాడు, మరొక భార్య వస్తుందన్నట్లుగా ప్రవర్తించే వారెందరోవున్నారు. విలువలు కోల్పోయిన జీవితాన్ని జీవించొద్దు. ఒకవేళ నీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులవలన కొంతకాలం నీభర్తకు లేదా నీభార్యకు దూరముగానున్నప్పటికీ, యదార్ధమైన జీవితాన్ని జీవించగలగాలి. వివాహ జీవితం పరిశుద్ధమైనది. దానిని జీవితాంతం పరిశుద్ధంగానే కాపాడుకోవలసిన భాద్యత మనమీదుంది. నీవు నీభర్తతో/ నీభార్యతో మాత్రమే కలసి జీవించడం దైవనిర్ణయం. వేరొకరుండుట అది అక్రమజీవితం. దేవుడు ఆదాము కొరకు ఒక్క హవ్వనే ఎందుకు చేసాడు? ఒక పురుషునికి ఒక స్త్రీ మాత్రమే. ఒక స్త్రీ కి ఒక పురుషుడు మాత్రమే వుండాలని. అట్లా కాకుంటే, ఆదాము కొరకు నలుగురైదుగురు స్త్రీలను దేవుడు నిర్మించేవాడు. క్రమమైన కుటుంబ జీవిత విధానం మన కుటుంబ జీవితాలకు మరియు ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత శ్రేయస్కరం.

అబ్రాహాము తన భార్యయైన శారా మరణించిన తర్వాత 38 సంవత్సరాలు జీవించాడు. ఈ కాలంలో కెతూరా ద్వారా ఆరుగురు కుమారులను కన్నాడు. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. (ఆది 25:2) అబ్రాహాము కెతూరాతో పిల్లలను కనే సమయానికి అతని వయస్సు 140 సంవత్సరాలు దాటిపోయింది. ఆ వయస్సులో పిల్లలను కనడం ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ అది సాధ్యమే. కారణం? మెతూషెల 969 సంవత్సరాలు జీవించాడు. రానురాను మనిషి చేసిన పాపం ఆయుష్షును తగ్గించుకొంటూ వచ్చింది. అబ్రాహాము దినాలలో ఆ వయస్సులో పిల్లలను కనడం సాధ్యమే. మోషే అయితే తన కీర్తనలో “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును” ( కీర్తనలు 90:10) అని వ్రాసారు. మన జీవిత విధానం, మనము తీసుకొనే ఆహారం కూడా వయస్సుమీద ప్రభావం చూపుతున్నట్లుంది.
మన దేశంలో 60 లేదా 70 సంవత్సరాలకే వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్నారు. అదే ఇశ్రాయేలు వంటి దేశాలలో 90 సంవత్సరాల వయస్సులోకూడా కార్ డ్రైవ్ చెయ్యడం, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. ఎందుకు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానంటే, కొన్ని సందర్భాలలో మన పరిసరాలలో మనము జీవిస్తున్న జీవితాన్ని ప్రమాణముగా తీసుకోవడానికి వీల్లేదు.

🔅అబ్రాహాము తన కుమారులకు బహుమానములిచ్చుట:

అబ్రాహాము అత్యంత దూర దృష్టి కలిగినవాడుగా మనకు అర్ధమవుతుంది. అబ్రాహాము ప్రతీ పరిస్థితిని ఎంతచక్కగా నిర్వర్తించాడో ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యం కలుగక మానదు. ఒకవేళ ఇష్మాయేలు మరియు కెతూరా కుమారులు ఆస్థికోసం ఇస్సాకు మీద దాడి చేస్తారేమో అనుకున్నాడేమో, అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను.(ఆది 25:5) మిగిలినవారందరికి బహుమానములనిచ్చి తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పుతట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను (ఆది 25:6)

నేటి దినాలలో ఈ పరిస్థితిలేకుండా పోయిందికదా? మేము పోతున్నాము మీరు కొట్టుకొని చావండ్రా అన్నట్లు పెద్దలు వెళ్ళిపోయాక, కుమారులు, కుమార్తెలు ఆస్తుల తగాదాలతో కోర్టులచుట్టూ తిరగాల్సివస్తుంది. ఒక్కసారి ఆలోచన చెయ్యగలిగితే, అన్నదమ్ములు, ఆడపడుచుల మధ్య తగాదాలకు కారణం? ఆస్థులేకదా? అట్లా అని నేను తలిదండ్రులను తప్పుపట్టడం లేదు. వారి భయం వారికుంది. అన్ని వున్నప్పుడే తీసుకొనివెళ్ళి వృద్ధాశ్రమాలలో వేసేస్తున్నారు. అది కూడాలేకపోతే ఎట్లా అనేది వారి భయం. ఏది ఏమైనప్పటికి అబ్రాహాము మాత్రం తాను జీవించియుండగానే ఎవరికి ఇవ్వాల్సిన బహుమానములను వారికి ఇచ్చివేశాడు.

🔅 అబ్రాహాము పితరుల యొద్దకు చేర్చబడుట :

అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను. ( ఆది 25:8) పితరులయొద్దకు చేర్చబడ్డాడు అని వ్రాయబడడం ద్వారా ఆ మాటల్లో మరణం తరువాతి జీవితాన్ని సూచించే అర్ధం ఉండవచ్చు. పితరుల యొద్దకు చేర్చబడినవారు 1. అబ్రాహాము (ఆది 25:8) 2. ఇష్మాయేలు(ఆది 25:17) 3. ఇస్సాకు ( ఆది 35:29) 4. యాకోబు (ఆది 49:33) 5. అహరోను (సంఖ్యా 20:24 ) 6. మోషే (ద్వితీ 32:50).

అబ్రాహాము ఈలోకములో 175 సంవత్సరాలు జీవించి, తన జీవితమంతా దేనికోసం పోరాటం చేసాడో, ఆ బహుమానాన్ని పొందడానికి వెడలిపోయాడు. తద్వారా ఈ సృష్టి ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయినట్లయ్యింది. ఆయనను కోల్పోయి వేల సంవత్సరాలు గతించిపోయినాగాని, ఆయనవేసిన ప్రతీ అడుగు మనలను ప్రోత్సహిస్తూనే వుంది. ఆయన ప్రతీ మాట మనలను పురికొల్పోతూనే వుంది. ప్రతీ విశ్వాసిని చెయ్యిపట్టుకొని నడిపిస్తూనే వుంది. విశ్వాసానికి అర్ధాన్ని చెప్పాడాయన విశ్వాసులందరికి ఆదర్శప్రాయుడయ్యాడు. తండ్రి అయ్యాడు. అయితే, విశ్వాసయాత్ర పూలపాన్పు కాదని, అది ఒక ముండ్లబాట అనేది సుస్పష్టం. కొండలెక్కుతూ లోయల్లోదిగుతూ తన జీవిత అంతానికి మాత్రం గమ్యం చేరగలిగాడాయన. అయితే, ఆయన పిల్లలముగా విశ్వాస యాత్రలో మనమెక్కడ వున్నాము? ఆగిపోయామా, సాగిపోతున్నామా? పురోగమనమా, తిరోగమనమా? మనలను మనమే పరిశీలన చేసుకుందాము. అబ్రాహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణకలిగి నమ్మెను. ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు. అట్టి నిరీక్షణతో ఆయన అడుగుజాడల్లో నడచిన జీవితం ధన్యకరం.

🔅సమాధి:

అబ్రాహాము వాగ్ధానభూమిలో కలిగియున్న ఏకైక స్వాస్థ్యము “మక్పేలా గుహ” దానిలోనే అతని భార్యయైన శారాను పాతిపెట్టాడు. అదే స్థలములో అబ్రాహాము కుమారులైన ఇస్సాకు, ఇష్మాయేలు అతనిని పాతిపెట్టిరి. మనవారైతే కీ.శే..... (కీర్తి శేషులు) అనగా, కీర్తిని శేషించిన వారు ( కీర్తిని గడించి వెళ్లిపోయినవారు) ఎంతటి దుర్మార్గపు జీవితాన్ని జీవించినాగాని, కీ.శే... అనే వ్రాస్తారు. ఎవరుపెట్టారో తెలియదుగాని, పుట్టిని ప్రతీ ఒక్కరూ ఏదో కీర్తిని, అది కీర్తి కావొచ్చు, అపకీర్తి కావొచ్చు ఏదో కీర్తిని సాధించే వెళ్తారుకదా? అబ్రాహాము సమాధిమీద వారు ఏమివ్రాశారో నాకైతే తెలియదుగాని, ఆయన కీర్తి మాత్రం సృష్టివున్నంత వరకూ శ్లాఘనీయం. మా ఆత్మీయ తండ్రివైన అబ్రాహామా! నీకు శిరస్సువంచి గౌరవ వందనం చేస్తున్నాను. నీ జీవితం మాకు అత్యంత ఆదర్శప్రాయం! నీ బాటలో నడవడాని నా ప్రియ రక్షకుని కృప మా అందరికి తోడైయుండి నడిపించునుగాక! ఆమెన్!


🔅అబ్రాహాము విశ్వాసయాత్ర” సమాప్తం🔅

🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹

ప్రభువునందు ప్రియులైన వారికి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో శుభములు!

అల్పుడనైన నాద్వారా అబ్రాహాముగారి జీవితమునుండి కొన్ని విషయాలు వ్రాయడానికి ప్రభువు కృపజూపారు. అందులనుబట్టి ఆయనను ఎంతగానో స్తుతించుచున్నాను. “అబ్రాహాము విశ్వాసయాత్ర” ద్వారా ప్రభువు నన్ను వ్యక్తిగతంగా ఎంతో బలపరిచారు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీలో అనేకులు ఈ వర్తమానములు చదివియుండవచ్చని తలంచుచున్నాను. అబ్రాహాముగారి జీవిత ధ్యానము ద్వారా మీరు నూతన జీవితాన్ని ప్రారంభించాలని ప్రార్ధించుచున్నాను. ప్రభువు చిత్తమైతే, ఈ వర్తమానములను పుస్తకరూపంలో ముద్రించాలనే తలంపువుంది. తప్పక మీ అనుదిన ప్రార్ధనలో ఎత్తిపట్టుకోగలరు.

ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా నుండును గాక! ఆమెన్!

ప్రేమతో.....
మీ సహోదరుడు
సుధాకర్ బాబు. కోన

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరీర కార్యములు

క్రిస్మస్

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

విశ్వాసము

పాపము

సమరయ స్త్రీ

విగ్రహారాధన