యేసుక్రీస్తు చేసిన అద్భుతములు
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
—————————————*తుఫానును నిమ్మలపరచుట*
(Calming a Storm)
🔲🔳▪—————————-
*ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి. అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చిప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన అల్పవిశ్వాసు లారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టి వాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడు చున్నవని చెప్పుకొనిరి. * మత్తయి 8:23-27
(దీనితో పాటు మరొక రెండు సువార్తలలో కూడా, యేసు ప్రభువు చేసిన ఈ అద్భుతము వ్రాయబడింది.
మార్కు 4:35-41; లూకా 8:22-25)
*ఉపోద్ఘాతము: *
———————
ప్రభువు తన శిష్యులతోపాటు దోనెలో ప్రయాణం, ఆయన నిద్రపోవడం, పెద్ద తుఫానురావడం, శిష్యులంతా భయపడి ప్రభవును వేడుకోవడం, ఆయన గాలిని, అలలను గద్దించి నిమ్మల పరచడం.
*ఆత్మీయపాఠములు: *
————————
*1. దోనెలో ప్రభువు ఉన్నప్పటికీ తుఫాను సంభవించింది. *
Prosperity పేరుతో వారి prosperity ని పెంచుకోవడం కోసం, ప్రభువును అంగీకరిస్తే, నీ జీవితమంతా పూలబాటే, నీ రోగాలు పోతాయ్, ఆర్ధిక సమస్యలు తీరిపోతాయ్, చివరికి నీ కోర్టు కేసులు కూడా కొట్టివేయబడతాయ్ అంటూ బోధించే బోధకులు కోకొల్లలు. కానీ, ఒక్క విషయం! ప్రభువు లో నీవున్నప్పటికీ శోధనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నిజానికి, లోకంలో నున్నవారికంటే, ప్రభువులోనున్నవారికే శోధనలు ఎక్కువ. కానీ, ప్రభువుతోనున్నప్పుడు శోధనలలో సహితం ఆదరణ, ఆనందం ఉంటుంది.
*2. దోనెలో ప్రభువు నిద్రపోవుట: *
భీకరమైన తుఫాను దోనెను ముంచివేసే పరిస్థితులున్నప్పటికీ ప్రభువు మాత్రం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. అంటే, ఏ పరిస్థితి, ఏ ఉపద్రవం కూడా ఆయనను భయపెట్టలేదు. అట్లా అని, తన బిడ్డలు శోధనలో నున్నప్పుడు ఆయన నిద్రపోయేవాడు కాదు. అసలు ఆయన కునుకడు నిద్రపోడు. నీవు నిద్రపోయినా, ఆయన మాత్రం మేల్కొని నిన్ను కావలికాస్తాడు. శోధన సమయంలో శిష్యుల ప్రతిస్పందనును, విశ్వాస్యతను పరీక్షించుటకుగాను ఆయనను నిద్రపోయారు. అనేక సందర్భాలలో శోధన సమయంలో, మన విశ్వాస్యత పరీక్షించే సమయంలో, ప్రభువు కలుగజేసుకోనట్లుగా వుంటారు. అది తాత్కాలికమే తప్ప, శాశ్వతకాలం కాదు.
*3. శిష్యులు ప్రార్ధించుట: *
భీకరమైన తుఫానుకు శిష్యులు భీతిల్లినప్పటికీ, వారు నాశనము కాకుండా రక్షించగల సమర్ధుడు ప్రభువని గ్రహించగలిగారు. విశ్వసించారు. ఆయన ఎట్లా రక్షిస్తాడో వారికి తెలియదుగాని, రక్షిస్తాడని మాత్రం వారు విశ్వసించారు. మన పరిస్థితులు మనకు ఎంత భయము పుట్టించేవైనప్పటికీ, ఆయనను ప్రార్ధించి, విశ్వసించి, ఆయనపైనే ఆధారపడగలిగితే, ప్రతీ పరిస్థితినుండి విడిపించగల సమర్ధుడు.
*4. ప్రార్థనకు ప్రతిఫలం: *
శిష్యుల ప్రార్ధనను ఆలకించిన ప్రభువు, మొదటగా వారిలోనున్న అవిశ్వాసాన్ని గద్దించి, ఆ తరువాత గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మళమాయెను. మనము ఏ పరిస్థిలో నుండియైనాసరే ఆయన శరణుజొచ్చితే, తప్పక రక్షిస్తాడాయన. గాలి, సముద్రం కూడా ఆయనమాటకు లోబడుతున్నాయంటే, ఆయన ఎంతటి అత్యున్నతుడో మనము అర్ధము చేసుకోగలగాలి. వాటి సృష్టికర్త ఆయనే కాబట్టి, అవన్నీ ఆయన మాటకు లోబడుతున్నాయి. దేవుని మాటకు లోబడనివారెవరంటే, ఈ సృష్టిలో అత్యంత ఉన్నతంగా సృష్టించబడిన నీవూ, నేను.
*5. వారి దోనెలో యేసు ప్రభువు వున్నారు కాబట్టే, వారు రక్షించ బడ్డారు. *
తుఫానులో చిక్కుకున్న నావలో యేసు ప్రభువు తప్ప, యింకెవరున్నాగాని, కోట్లాది రూపాయలు ఆ దోనెలోనున్నాగాని, ఫలితం మాత్రం శూన్యం. పేతురు రాత్రంతా కష్టపడినప్పటికీ ఫలితం శూన్యం. కానీ, ప్రభువు ఆ దోనెలోనున్నప్పుడు వల పిగిలిపోయేటంతటి ఆశీర్వాదాలు. అవును! ఆయనమాత్రమే మన జీవిత దోనెలో వుండి తీరాలి. మన జీవిత దోనె చుక్కానిని ఆయన చేతికి అప్పగించాలి. మనలను విడిపించగలిగేవాడు, నడిపించగలిగేవాడు ప్రభువు మాత్రమే.
*6. ఈయన ఎట్టి వాడో?*
ప్రభువు మాటచే గాలి, సముద్రమును నిమ్మళమగుట చూచిన శిష్యులు, ఆశ్చర్యపడి ఈయన ఎట్టి వాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడు చున్నవని చెప్పుకొనిరి. ఆయనతోనున్నవారికే ఆయన ఎట్టివాడో అర్ధం కాలేదు. నేటికిని అదే సమస్య ఆయన ఎట్టివాడో అనేకులకు అర్ధం కాలేదు. సమయం గతించిపోయాక ఆయన ఎట్టివాడో అర్థమైనా ప్రయోజనం శూన్యం.
యింతకీ, ఆయన ఎట్టివాడు?
▪సృష్టికర్తయైన దేవుడు:
సమస్తమును ఆయన మూలముగా కలిగెను... లోక మాయన మూలముగా కలిగెను (యోహాను 1:2,10)
ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
(కొలస్సి 1:15-17) దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది; (కొలస్సి 2:9)
▪తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించేవాడు.
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను. (హెబ్రీ 1:3,4)
ప్రభువు ఎట్టివాడో మనము అర్ధము చేసుకొని, ఆయనను విశ్వసించి, ప్రార్ధించగలిగితే, మన జీవితంలో చెలరేగే ఎట్లాంటి తుఫానులనైనా (శోధనలు) వాటినుండి ఆయన మనలను రక్షించగల సమర్ధుడు. విశ్వసిద్దాం! ప్రార్ధిద్దాం! పొందుకుందాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( రెండవ భాగము)—-ఐదు రొట్టెలు, రెండు చేపలను ఐదువేలమందికి పంచుట:
(Feeding 5000 with 5 loaves & 2 Fishes)
—————————————
యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులాయన యొద్దకు వచ్చిఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసువారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి. అందుకాయనవాటిని నాయొద్దకు తెండని చెప్పి పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరు తిని తృప్తిపొందిన తరు వాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి. స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.
మత్తయి 14 : 13-21
ఈ అద్భుతము యొక్క ప్రత్యేకత:
————————————-
ఈ ఒక్క అద్భుతము మాత్రమే 4 సువార్తలలోనూ వ్రాయబడింది. మార్కు 6:32-44; లూకా9:10-17; యోహాను 6:1-14
ఉపోద్ఘాతము:
▪—————
బాప్తీస్మమిచ్చు యోహాను చంపబడిన వార్తను ప్రభువువిని, అరణ్యమునకు ఏకాంతముగా వెళ్ళినప్పుడు, ఆయన అరణ్యములోనున్నాడనే వార్త ప్రజలు తెలుసుకొని, ఆయనదగ్గరకు వెళ్ళినప్పుడు, వారికి వాక్యమును బోధించి, కొందరిని స్వస్థ పరచెను. ఆసందర్భములో వచ్చిన ప్రజలను ఆకలితో పంపించడం ప్రభువుకు ఇష్టం లేక, ఒక బాలుని దగ్గరనున్న ఐదు రొట్టెలను, రెండు చిన్న చేపలను తీసుకొని, ఆశీర్వదించి వాటిని ఐదువేల మందికి సమృద్ధిగా పంచిపెట్టి, మిగిలిన ముక్కలను పండ్రెండు గంపలు ఎత్తిన సందర్భములోనిది.
ఆత్మీయ పాఠములు:
▪————————
ప్రభువును వెంబడించిన ప్రజలు:
—————————————
అరణ్యంలో సహితం ప్రభువును వెంబడించిన అనుభవం వీరిది. అందుకే, కొందరు స్వస్థ పరచబడగా, అనేకులు ఆత్మీయంగా బలపరచబడ్డారు, శారీరకమైన ఆహారంతో తృప్తిపరచబడ్డారు. అన్నింటికంటే ముఖ్యముగా ఆ అద్భుతాన్ని కళ్లారా చూచే ధన్యతను పొందగలిగారు. అరణ్యంలో ప్రభువు ఏకాంతముగానున్న సమయమది. ప్రజలంతా ఆయనను వెంబడించి, ఆయన ఏకాంతతను పాడు చేశారు. అట్లా అని, వారిమీద చిరాకుపడలేదు. నాకు దూరముగా పొండని అసలే చెప్పలేదు. వారిమీద కనికరపడ్డాడు. ఆయన చెంతకు వచ్చేవారిని ఎంతమాత్రమూ త్రోసివేసేవాడు కాదాయన. మన జీవితంలో ప్రభవునుండి అనేక మేళ్లను ఆశిస్తున్నాము. కానీ, వాటిని పొందుకోలేకపోతున్నాము. కారణం? ఆయనను వెంబడించలేకపోతున్నాము. తద్వారా ఆయనిచ్చే ఆశీర్వాదాలను అందుకోలేకపోతున్నాము. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును. (మత్తయి 6:33)
ప్రజల అక్కర ఎరిగిన ప్రభువు:
—————————-
▪గొప్ప సమూహముగా ప్రజలున్నారు.
▪వారు అలసిపోయి, ఆకలితో వున్నారు.
▪అది సాయంకాల సమయం
▪వారున్నది అరణ్య ప్రదేశం
అననుకూలమైన పరిస్థితులు. శిష్యులేమో వారిని పంపించివేయాలని తొందరపడుతున్నారు. ప్రభువేమో వారి *అవసరతను గుర్తెరిగి* (ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును .మత్తయి 6:32 ) మీరే వారికి ఆహారం పెట్టండి అంటున్నారు. రొట్టెలు కొనడానికి అది అరణ్య ప్రదేశం, అంత గొప్ప జనసమూహానికి సరిపడే రొట్టెలుకొనగలిగే సొమ్ము వారిదగ్గర లేదు. వారిదగ్గర అందుబాటులోనున్న ఆహారం ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు. ఆ కొంచెం ఆహారం ఎంతమందికి సరిపోతుంది? అన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలే.
శిష్యులకు ఆయన అద్భుతాలు చేయగలడని వారికి తెలుసు. అయితే, ఆయన అద్భుతాలు రోగులను స్వస్థపరచుట వంటివాటికే పరిమితం అనుకున్నారేమో? యింతమంది జనసమూహానికి ఆహారము పెట్టగలిగే సామర్ధ్యము ఆయనకు లేదనుకున్నారేమో? అందుకే, వారిదగ్గరున్న ఐదు రొట్టెలు, రెండు చేపలను, గొప్ప జన సమూహంతో బేరీజు వేస్తున్నారు. సాయంకాల సమయం, అరణ్యప్రదేశం అవన్నీ కూడా ప్రతికూలంగానే వారికి కనిపిస్తున్నాయి. మన జీవితాల్లో సహితం ప్రభువు అనుగ్రహించే ఆశీర్వాదాలు మన దరిచేరకపోవడానికి గలకారణం యిదే. మన సమస్యను, మన చుట్టూవుండే పరిస్థితులను చూస్తాము తప్ప, మన సమస్యను పరిష్కరించగలిగే ప్రభువుపై ఆధారపడలేకపోతున్నాము. మన బలమైన సమస్యలు, అత్యంత బలవంతుడైన ప్రభువుముందు పెట్టగలిగితే, మన బలమైన సమస్యలు అత్యంత బలహీనంగా కనబడతాయి.
అవసరత తీర్చిన ప్రభువు:
————————————-
ప్రభువు తన ప్రజల అవసరాలు తీర్చేందుకు ఆయన ఎప్పుడూ సిద్దమే. ఊహించని రీతుల్లో ఆయన అద్భుతాలు జరిగిస్తుంటారు. ఆయన ఏలియాను కాకులతో పోషిస్తారని ఎవరు ఊహించగలరు? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీ 4:19) వారి దగ్గరున్న కొద్దిపాటి ఆహారం ఆయన చెంతకు తీసుకొచ్చినప్పుడు, అద్భుతం జరిగించి, వారికి ఆహారం పెట్టారు.
వడ్డించే కొలదీ, రొట్టెలు, చేపలు వస్తూనే వున్నాయి. వారి కళ్ళను వారే నమ్మలేని స్థితి.
ఇట్లా జరుగుతుందని శిష్యులు మాత్రం ఎట్లా ఊహించగలరు? అవును! మనకున్నదేదైనాసరే నీకున్న ధనం, నీకున్న తలాంతులు మనఃపూర్వకముగా ప్రభువుకు సమర్పించగలిగితే, మన ఊహలకు సహితం అందని రీతిలో ప్రభువు వాటిని నూరంతలుగా ఆశీర్వదిస్తారు. నాకనిపిస్తుంది, ఆ చిన్న పిల్లవాడు తీసుకొచ్చిన ఐదు రొట్టెలు, రెండు చిన్ని చేపలు ప్రభువుకు సమర్పించినప్పుడు, మిగిలిన పండ్రెండు గంపలు వారింటికే ప్రభువు పంపించేసారేమో?
ముగింపు:
—————
అరణ్యములో ఐదు రొట్టెలను, రెండు చిన్న చేపలను ఐదువేల మందికి పంచిపెట్టారు ప్రభువు. అరణ్యములో బండను చీల్చి సుమారు 30 లక్షలమంది దాహాన్ని తీర్చారు. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను (కీర్తనలు 78:15). నీ జీవితం అరణ్యములా మోడుబారిందా? ఎండిన ఎడారిగా మారిన నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలిగితే, నీవూహించని సమృద్ధితో నీజీవితాన్ని ప్రభువు నింపగలరు. శ్రమగల ఆకోరులోయను నిరీక్షణ ద్వారముగా ప్రభువు మార్చగలరు. ఎండిన ఎముకలను జీవింప చేయగలరు. వాడ బారిన షారోనును చిగురింపజేయగలరు. నీవేస్థితిలోనున్నాసరే, నీవున్నపాటున ప్రభువు పాదాలచెంతకురా! నిత్యమైన ఆశీర్వాదములను, సమాధానమును తప్పక పొందగలవు.
ఆరీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( మూడవ భాగము)—-—————————————-
సీమోను పేతురు విస్తారమైన చేపలు పట్టుట:
🔳▪——————————
జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి, ఆ సరస్సుతీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరును విస్మయ మొందిరి. ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. (లూకా 5:1-11)
Note: గెన్నేసరెతునే గలిలయ, తిబెరయ అని కూడా పిలుస్తారు.
ఉపోద్ఘాతము:
▫———————
చేపల వేటలో అత్యంత అనుభవజ్ఞుడైన సీమోను పేతురు రాత్రంతా కష్టపడ్డాడు. కానీ, ఒక్క చేపకూడా దొరకలేదు. అతని దోనెలో కూర్చోవడానికి ప్రభువుకు స్థానమిచ్చాడు. ఆయన మాటలు విన్నాడు. ఆయన చెప్పినట్లుగా చేసాడు. విస్తారమైన చేపలుపట్టాడు. వాటన్నింటిని విడచి ప్రభువును వెంబడించాడు.
ఆత్మీయ పాఠములు:
▫————————-
వలలు కడుగుకొంటున్న పేతురు
🔹————————————-
ప్రభువు పని చేసేవారితో పనిచేస్తారు. సాగిపోయేవారితో సాగిపోతారు. కానీ, పనీ, పాటు లేకుండా సోమరిగా కూర్చుండేవారితో కూర్చోడాయన. మోషే మందలు మేపుతున్నప్పుడు ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు ( నిర్గమ 3:1 ) గిద్యోను గానుగ చాటున గోధుమలు దుళ్లగొట్టుచుండగా ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు ( న్యాయాధి 6:11 ) ఎలీషా తన పొలాన్ని దున్నుతున్నప్పుడు ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు (1రాజులు 19:19) పేతురును కూడా తన వలలు కడుగుకొనుచుండగా ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు. ప్రభువు నీ చేతికిచ్చిన పనిఏదైనా నమ్మకముగా చేయగలిగితే, ఆయన పనికి నిన్ను వాడుకుంటారు.
తన దోనెలో ప్రభువుకు స్థానమిచ్చిన పేతురు
🔹————————————
అప్పటికే రాత్రంతా వేటాడి అలసిపోయాడు. చేపలేమి పట్టలేకపోయాడు దానితో చెప్పలేనంత నిరుత్సాహం. అంతలో ప్రభువు వచ్చి ఆయన దోనె ఎక్కి, కొంచెంలోనికి త్రోయమంటున్నారు. ఒకవేళ అంత జనసమూహం ఆయనను వెంబడిస్తుంటే కాదనలేకపోయాడేమో? అంతటి గొప్ప వ్యక్తి తన దోనె ఎక్కడం అతనికి ఒకింత గర్వంగా అనిపించిందేమో? ఏదియేమైనా ఆయన చెప్పినట్లు చేసాడు. తన దోనెలో ప్రభువు వుండడానికి యిష్టపడ్డాడు. దోనెను లోతునకు నడిపించాడు. యిదే, పేతురు జీవితంలో అద్భుతాన్ని చూడడానికి కారణమయ్యింది. నీ జీవిత దోనెలో యేసయ్యకు స్థానముందా? అది ఆధ్యాత్మిక లోతుల్లోనికి వెళ్లగలుగుతుందా? ఆయనకు స్థానం లేకపోతే, నీ జీవితమంతా ప్రయాసే. నిరుత్సాహమే. పేతురు దోనెలో ప్రభువులేనప్పుడు, అతని ప్రయాస అంతా వ్యర్ధమయ్యింది. తన దోనెలో ప్రభువును చేర్చుకొనినప్పుడు అదొక దీవెనగా మారింది. నేడైనా ప్రభువును నీ హృదయంలో చేర్చుకోవడానికి నీవిష్టపడితే, నీ హృదయమనే తలుపునొద్దనే ఆయన నిలచియున్నాడు ( ప్రకటన 3:20)
ప్రభువు మాటకు విధేయత చూపిన పేతురు
🔹————————————
ప్రభువు పేతురు నావను తన పరిచర్యకు వాడుకున్నారు. అందుచే, దానికి అద్దె చెల్లించాలనుకున్నారేమో, దోనెను మరింత లోనికి నడిపించి వల వేయమని చెప్పారు. దానికి సమాధానముగా పేతురు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. (లూకా 5:5) పేతురు అంటున్నాడు. రాత్రంతా నా ప్రయత్నం నేను చేసాను. ఫలితం శూన్యం. "అయినప్పటికీ", నీవు చెప్పినట్లే చేస్తాను. ప్రభువు మాటపై యింతటి విశ్వాసము ఎట్లా సాధ్యమయ్యింది? బహుశా, ఆ దోనెలో యేసయ్య ప్రకటిస్తున్న మాటలు, అతనిని విశ్వాసములోనికి నడిపించాయేమో? ఆ విశ్వాసమే విధేయత చూపడానికి కారణమయ్యుంటుంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును (రోమా 10:17) నిజానికి, యేసు ప్రభువు మాట పేతురు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే? యేసు ప్రభువు వారు వడ్రంగి కుటుంబములో పెరిగారు. పేతురు మత్స్యకారుల కుటుంబములో పెరిగిన వాడు. చేపలు ఎక్కడ ఉంటాయో? పేతురుకే బాగా తెలుసు. కాని, యేసు ప్రభువు వారు సమస్తమూ ఎరిగినవాడు అని పేతురు గ్రహించగలిగాడు. ఆ గ్రహింపే విధేయతకు కారణమయ్యింది. ఆ విధేయతే (విశ్వాసమే) అద్భుతాన్ని చూడగలిగింది. అట్టి గ్రహింపులోనికి నీవూ, నేనూ రాగలగాలి.
పేతురు విధేయత, వేరొకరికి ఆశీర్వాదం:
🔹————————————
పేతురు, ప్రభువు మాటకు విధేయుడయ్యాడు. విస్తారమైన చేపలు పట్టాడు. ఎంత విస్తారమంటే, వల పిగిలిపోయేటంత. తన జీవితంలో మునుపెన్నడూ చూడనంత విస్తారమైన చేపలు. అతని దోనెతోపాటు ప్రక్క దోనె కూడా చేపలతో నిండిపోయింది. అవును! నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటో తెలుసా? నీవే ఒక ఆశీర్వాదముగా వుండడం. నిన్ను బట్టి వేరొకరు ఆశీర్వదించబడడం. ఈ రీతిగానే దేవుని స్నేహితుడునూ, విశ్వాసులకు తండ్రియైన అబ్రాహామును దేవుడు ఆశీర్వదించారు ( ఆది 12:2). నిన్నుబట్టి నీ బిడ్డలు, నిన్నుబట్టి నీ కుటుంబం, నిన్నుబట్టి నీ సంఘం, నిన్నుబట్టి నీ పొరుగువారు ఆశీర్వదించబడాలంటే, నీవే ఒక ఆశీర్వాదముగా వుండాలంటే, ప్రభువుమాటకు విధేయత చూపడం ఒక్కటే మార్గం.
ప్రభువును వెంబడించిన పేతురు
🔹————————————
రాత్రంతా దేనికోసం కష్టపడ్డాడో అవి విస్తారంగా దొరికాయి. ఇప్పుడు వాటిని తీసుకొనివెళ్లి అమ్ముకోవాలి. కాని, వాటన్నింటిని విడచిపెట్టి ఆయనను వెంబడిస్తున్నాడు. కారణం? ఆశీర్వాదాలకుకర్త తనతోవుంటే? ఇక ఆశీర్వాదాలతో పనేముంది? మన జీవితాలు దీనికి విరుద్ధముగానున్నాయి కదా? ఆశీర్వాదాలంటే చెప్పలేనంత యిష్టం. ఆశీర్వాదాలకు కర్తయైన ప్రభువుకు విధేయత చూపడమంటేమాత్రం చెప్పలేనంత కష్టం. అందుకే మన జీవితాల్లో అద్భుతాలు చూడలేకపోతున్నాం. ఆశీర్వాదాలను అందుకోలేకపోతున్నాం. మనమొక ఆశీర్వాదముగా నుండలేకపోతున్నాం.
ముగింపు:
🔹—————-
నీ జీవిత దోనెలో యేసు ప్రభువుకు స్థానం లేకుండా నీ ప్రయత్నాలు నీవు చేసేసి, అలసిపోయావేమో? ఓడిపోయావేమో? నేడైనా ఆయన శక్తిని గ్రహించి, నీ హృదయంలో చేర్చుకొని, ఆయన మాటకు విధేయత చూపగలిగితే? నీవే కాదు నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్నుబట్టి నీ పొరుగువారు కూడా ఆశీర్వదించబడతారు. అట్లా అని, కేవలం ఆశీర్వాదాలను స్వంతం చేసుకొనే ప్రయత్నం కాదుగాని, ఆశీర్వాదాలకుకర్త అయిన ఆయనను స్వంతం చేసుకోగలగాలి. అప్పుడు నీవే ఒక ఆశీర్వాదపునిధిగా మార్చబడతావు. ఆ నిత్య రాజ్యానికి వారసునివవుతావు. మనస్పూర్తిగా ఒక మాట చెబుదాము. ప్రభువా! నా జీవితమంతా నీవు లేకుండా, నిన్ను కాదని ప్రయాసపడ్డాను. ఏమి సాధించలేకపోయాను, సమాధానాన్ని కోల్పోయాను. ఇప్పుడు నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. అంగీకరించు! ఆశీర్వదించు! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( నాలుగవ భాగము)—-—————————————-
పదిమంది కుష్ఠురోగులను స్వస్థపరచుట:
🔳▪—————————
ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్లుచుండెను. ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచిమీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు. అందుకు యేసు పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచిపొమ్ము, నీ విశ్వా సము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.
లూకా 17:11-19
ఉపోద్ఘాతము:
▫———————
యేసుప్రభువు యెరూషలేమునకు వెళ్తున్నప్పుడు, పదిమంది కుష్టురోగులు తమను స్వస్థపరచాలని ప్రార్ధించారు. పదిమంది స్వస్థపరచబడ్డారు. కానీ, వారిలో కృతజ్ఞత కలిగినవాడు మాత్రం ఒక్కడే. ఆ సందర్భము గురించి తెలియజేసే మాటలివి.
కుష్ఠము:
——————
మొదట్లో ఒక చిన్న మచ్చలా కనిపిస్తుంది, వెంటవెంటనే మార్పులేమీ చోటుచేసుకోవు. అదొక సమస్యలా మనకు అనిపించదు. రానురాను ఆ భాగంలో స్పర్శ కోల్పోతుంది. తర్వాత ఆ భాగాన్ని తినివేస్తుంది. చివరికి మరణంవరకు తీసుకువెళ్తుంది. పాపము కూడా అంతే, మొదట్లో అట్లానే ఉంటుంది. చివరకు మరణానికి అప్పగించేస్తుంది.
🔸కుష్ఠు పాపమునకు సాదృశ్యము
🔸కుష్ఠు సోకిన వారు, పాలెం వెలుపల జీవించాలి.
🔸వారినెవరూ తాక కూడదు.
🔸ఒకవేళ వారు బాగుపడితే, యాజకులకు తమ దేహాలను కనుపరచుకొని, మోషే నిర్ణయించిన కానుక సమర్పించి, ఆ తరువాత సమాజములో చేరాలి.
🔸మిర్యాము, గెహాజి వంటి వారు కుష్టుతో మొత్తబడ్డారు.
ఆత్మీయ పాఠములు
—————————-
1. దూరముగా నిలచిన కుష్ఠు రోగులు:
దూరముగా ఎందుకు నిలవాలి? దగ్గరకు రావచ్చుకదా? లేదు. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. (లేవీ 13:45,46) కుష్ఠము ప్రభువును సమీపించడానికి అడ్డుగా నిలచింది. పాపము కూడా అంతే. ప్రభువును సమీపించనీయదు. మన పాపములే ఆయన ముఖమును మనకు మరుగుచేయుచున్నవి. ( యెషయా 59:2)
2. ప్రార్ధించిన కుష్టురోగులు:
వారి జీవితం ఎట్లాంటిదో వారికి తెలుసు. ఊరికి వెలుపల జీవించాల్సిన దుర్భరమైన జీవితం. వారికి కలిగిన వ్యాధి నయం కాదని, నయం చేయగలిగే వైద్యుడు కూడా లేడని వారికి తెలుసు. అయితే, ప్రభువు ఎట్లాంటివాడో, ఆయన శక్తిసామర్ధ్యాలేమిటో వారు అర్ధం చేసుకోగలిగారు. వారి జీవితంలో వారికొచ్చిన గొప్ప అవకాశాన్ని చేజార్చుకోకూడదని, యేసు ప్రభువా, మమ్ము కరుణించమంటూ కేకలువేశారు. మన పాపములను కూడా పరిహరించగలిగినవారు ప్రభువు మాత్రమే. అట్టి గ్రహింపులోనికి వచ్చి, ప్రభువు పాదాలచెంతచేరి ఆయన శరణువేడాలి.
3. స్వస్థత పొందిన కుష్ఠురోగులు
యేసు ప్రభువును సహాయము అడిగినప్పుడు ఆయన కాదనిన సందర్భాలుగాని, ఆయన చెంతకు వచ్చినవారిని త్రోసివేసిన సందర్భాలుగాని లేనేలేవు. ఆయన వారిని చూచి, మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లు చుండగా, శుద్ధులైరి. (లూకా 17:14) అయితే, వారు అడిగిన దానికి సమాధానముగా ఆయన వారిని ముట్టలేదు. స్వస్థ పరచలేదు. యాజకుల దగ్గరకు వెళ్లి, మీ దేహాలను వారికి చూపించుకోండి అని చెప్పారు. అయితే, వారు ప్రశ్నించాలి కదా? ఇట్లాంటి దేహాలతో యాజకుల దగ్గరకు ఎట్లా వెళ్ళగలమని? వారికి ఎట్లాంటి సందేహం రాలేదు. పూర్తిగా ప్రభువువారి మాటలను విశ్వసించారు. ఏమి మాట్లాడకుండా యాజకుల దగ్గరకు బయలుదేరారు. అంటే? వారికున్న విశ్వాసం స్పష్టం అవుతుంది. వారు ఇంకా యాజకుల దగ్గరకు చేరకముందే, మధ్యలోనే స్వస్థపరచబడ్డారు. అందుకే, ప్రభువువారు కూడా, తిరిగి వచ్చిన ఆ సమరయునితో
"నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచింది" అంటున్నారు. మన జీవితాలలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోలేక పోవడానికి కారణం? విశ్వసించలేకపోవడం, తద్వారా ఆయన చెప్పినట్లు చెయ్యలేకపోవడమే.
4. కృతజ్ఞతగలిగిన సమరయుడు.
▪పదిమందీ కరుణించమని ప్రార్ధించారు.
▪పదిమందీ విశ్వసించారు.
▪పదిమందీ బయలుదేరి వెళ్ళారు.
▪పదిమందీ స్వస్థపరచ బడ్డారు.
కాని, కృతజ్ఞత కలిగి, తిరిగివచ్చి, ఆయనను ఆరాధించిన వాడు ఒక్కడే. అతడు సమరయుడు (అన్యుడు) పదిమంది యాజకుని దగ్గరకు బయలుదేరారు. మార్గమధ్యలో అందరూ స్వస్థతచెందారు. వారిలో సమరయుడు ( అన్యుడు) ఒకడున్నాడు. తాను స్వస్థత పొందానని తెలుసుకున్న వెంటనే, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, కృతజ్ఞతతో ప్రభువు పాదాలచెంతచేరి, ఆయనను ఆరాధించగలిగాడు. మన పరిశుద్ధత, నీతిని బట్టికాకుండా ఆయన కృపలో మన ప్రతీ అవసరతను తీర్చుచున్న ప్రభువుపట్ల ఎట్లాంటి కృతజ్ఞతను కలిగియుండగలుగుతున్నాము?
5. కృజ్ఞతలేని తొమ్మిదిమంది
ఆ తొమ్మిదిమంది ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం కదా? కరుణించమని పాలెం మొత్తం వినబడేలా అరచిన అరుపులు, స్వస్థత పొందేసరికి, స్తుతించడానికి మాత్రం వారి నోర్లు మూగబోయాయేమో? వారి పిల్లలను, కుటుంబాలను చూచుకోవడానికి పరుగులెత్తారేమో? ఒకవేళ, యాజకుని కలసుకోవడానికే వెళ్లారనుకుంటే, ఆ యాజకుడు ఎప్పుడూ అక్కడే వుంటాడు. కానీ, ఈ ప్రధానయాజకుడు దాటిపోతాడు కదా? వారి నిర్లక్ష్య స్వభావం, కృతజ్ఞత లేని జీవితం ఎట్లాంటిదో ప్రభువు మాటల్లోనే అర్ధం చేసుకోగలం. “యేసు పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా?” నిజంగా వారు ప్రవర్తించిన తీరు అత్యంత బాధాకరం.
6. ముగింపు
కృతజ్ఞతలేని ఆ తొమ్మిదిమంది ప్రవర్తించినతీరు మనకు అసహ్యత పుట్టించింది. ఇట్లాంటి మనుష్యులుకూడా వుంటారా అన్నట్లనిపించింది.
అవును! ఇంతకీ, మన సంగతేమిటి? పాపపు కుష్ఠుచేత నిత్య మరణమునకు తప్ప, దేనికీ యోగ్యతలేని మనలను ఆయన ప్రాణమునే బలిగా అర్పించి, ఆ నిత్య మరణము నుండి తప్పించినందులకు మనమెట్లాంటి కృతజ్ఞత కలిగియున్నాము? దేవుని మేలులు అనుభవిస్తూ, కృతజ్ఞతలేని ఆ తొమ్మిదిమందివలే మన జీవితాలున్నాయేమో? సరిచూచుకుందాం!
సరిచేసుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( ఐదవ భాగము)—-—————————————-
*గ్రుడ్డి భిక్షకుని స్వస్థపరచుట*
▪——————————
వారు యెరికోపట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అ నేకులు వానిని గద్దించిరిగాని వాడు దావీదు కుమారుడా, నన్ను కరు ణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను. అప్పుడు యేసు నిలిచివానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచిధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసునేను నీకేమి చేయ గోరుచున్నావని వాని నడుగగా, ఆ గ్రుడ్డివాడుబోధకుడా, నాకు దృష్టి కలుగ జేయుమని ఆయనతో అనెను. అందుకు యేసునీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొంది వెళ్లెను.
మార్కు 10:46-52
*ఉపోద్ఘాతము: *
▫———————
యెరికో పట్టణములో త్రోవప్రక్కన ఒక గ్రుడ్డి భిక్షకుడు భిక్షాటన చేస్తున్నాడు. ఆ మార్గం గుండా పెద్ద జనసందోహం కదలి వస్తున్నట్లుగా శబ్దాన్నిబట్టి గ్రహించి, ఆ మార్గం గుండా 'నజరేయుడైన యేసు' వస్తున్నట్లుగా సమాచారం తెలుసు కున్నాడు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలోనూ చేజార్చుకోకూడదని కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఆ కేకలకు దావీదు కుమారుడు దాటిపోలేదు. ఆయనను స్వస్థపరిచాడు.
*1. ప్రభువు గురించి విన్నాడు: *
సంవత్సరాల తరబడి ఆ త్రోవప్రక్కనే భిక్షాటన చేస్తున్నాడు. కళ్లుకనబడక పోయినా చెవులు బానే వినబడుతున్నాయి. వచ్చి పోయేవారు అంతా యేసు ప్రభువును గురించి మాట్లాడుకుంటే విన్నాడు. విశ్వసించాడు. అవును! కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.( రోమా 10:17) ఆధ్యాత్మిక అంధకారంలో కొట్టుమిట్టాడుతూ, కన్నులుండి ఆత్మీయ అంధులుగా జీవిస్తున్న మన జీవితాలు వెలుగుమయం కావాలంటే, ప్రభవు మాటలు ( దేవుని వాక్యం) వినాలి, విశ్వసించాలి.
*2. ప్రార్ధించిన గ్రుడ్డి భిక్షకుడు: *
ఆ మార్గం గుండా పెద్ద జనసందోహం కదలి వస్తున్నట్లుగా శబ్దాన్నిబట్టి గ్రహించి, ఆ మార్గం గుండా 'నజరేయుడైన యేసు' వస్తున్నట్లుగా సమాచారం తెలుసు కున్నాడు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలోనూ చేజార్చుకోకూడదని కేకలు వేయడం మొదలు పెట్టాడు. కేకలు వేయడం అతనికి క్రొత్తేమి కాదు. రోజూ చేసేపని అదే. కాని, ఈరోజు కేకలు అట్లాంటివి కావు. రోజూ వేసే కేకలు పైసలను ఆశించి వేసేవి. కాని, ఈరోజు కేకలు పైసలు కోసం కాదు. ఎందుకంటే? అతనికి తెలుసు. ఆయన తన జీవనం కోసం పైసలిచ్చేవాడు కాదని, తన జీవితాన్నే మార్చి జీవింప చేయగలవాడని. తన శక్తినంతా కూడదీసుకుని కేకలు వేస్తున్నాడు.
*3. నిరుత్సాహ పరచిన ప్రజలు*
గ్రుడ్డి భిక్షకుడు ప్రభువును కరుణించమని కేకలు వేస్తుంటే, ప్రజలంతా అతనిని గద్దిస్తున్నారు. నీ మాటలు ఎవరు పట్టించుకోరు. ఊరుకో అంటూ ఆటంకపరిచారు. నిరుత్సాహపరిచారు. అయితే, వారి మాటలను అతడు పట్టించుకోలేదు. ఇట్లాంటి అవకాశం మరెన్నడూరాదని, వారు గద్దించినకొలదీ మరీ ఎక్కువగా కేకలువేయడం ప్రారంభించాడు. అతను తెలుసుకున్న సమాచారం 'నజరేయుడైన యేసు' వస్తున్నాడని. కాని అతను ఎట్లా కేకలు వేస్తున్నాడో చూడండి.
*యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా*,
లూకా 18:38
'దావీదు కుమారుడా' అనేది పాత నిబంధన ప్రస్తావన. 'యేసు' అనేది నూతన నిబంధనా ప్రస్తావని. అంటే? ఇతనికి రెండూ తెలుసు. అదే సమయంలో ఈయన రక్షించేవాడని, స్వస్థపరచేవాడనీ తెలుసు. అందుకే ప్రజలు ఊరకుండుమని చెప్పేకొలదీ మరింత బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఆ విశ్వాస సహితమైన కేకలు యేసయ్యను నిలబెట్టేసాయి.
*4. ప్రార్ధన ఆలకించిన ప్రభువు*
అంతమంది జనసమూహములో సహితం నేరుగా వాని కేకలు ప్రభువును చేరాయి. ఆయనను ఒక్క అడుగుకూడా ముందుకు వేయకుండా చేశాయి. అవును విశ్వాసముతో ప్రార్ధిస్తే, దావీదు కుమారుడు దాటిపోయేవాడెంత మాత్రమూ కాదు. *యేసు చూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను*; వెంటనే చూపు పొందాడు.
*5. గ్రుడ్డి భిక్షకుని అచంచలమైన విశ్వాసము:*
అతడు త్రోవ ప్రక్కనే బట్ట పరచుకొని కూర్చుంటాడు. త్రోవను పోయేవారు దానిమీద పైసలు వేస్తారు. ఆ బట్ట ఎప్పుడూ అతనితోనే ఉంటుంది. యేసు ప్రభువు ఎప్పుడైతే అతనిని పిలిచారో, వెంటనే తన బట్టను విసిరేసాడు. అంటే, ప్రభువు నన్ను స్వస్థపరుస్తారు. ఇక నాకు ఈ భిక్షాటనతోగాని, ఈ బట్టతోగాని పనిలేదనేది అతని విశ్వాసం.
*6. ప్రభువును వెంబడించిన బర్తిమయ*
స్వస్థపరచబడ్డాడు. అందమైన లోకం అతని ముందుంది. వాటిని చూస్తూ కూర్చోలేదు. తన ఇంటివైపు పరుగులు తీయలేదు.
ఆయనను మహిమపరస్తూ ఆయనను వెంబడించాడు. దానిని బట్టి అనేకులు దేవుని స్తుతించారు. ప్రభువును స్తుతించాడు. అనేకులు స్తుతించడానికి కారకుడయ్యాడు.
*7. ముగింపు *
*కన్నులుండియూ ఆత్మీయ అందత్వంలో జీవిస్తున్నామేమో? ఆయన సమీపముగా నుండగానే, దావీదు కుమారుడు దాటిపోకమునుపే, ఆయన పాదాల చెంత చేరుదాం*! ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( ఆరవ భాగము)—-—————————————-
*యాయీరు కుమార్తెను బ్రతికించుట*
ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నాకుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి. అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి ..... స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. (మత్తయి 9:18 - 26; లూకా 8:40-56)
*1. యాయీరు అధికారి: *
యాయీరు ఒక అధికారి అయినప్పటికీ, ప్రభువుకున్న అధికారం తనవంటిదికాదని గ్రహించగలిగాడు. ఆయన అధికారమునకు ఒప్పుకొని, ప్రభువును బ్రతిమాలాడుతున్నాడు.
*2. యాయీరు యొక్క అచంచలమైన విశ్వాసం: *
నా కుమార్తె చనిపోయింది. అయిననూ, నీవు వచ్చి, నాకుమార్తె మీద చేయి వేస్తే? ఆమె బ్రతుకుతుంది. అని ప్రార్ధిస్తున్నాడు.
ఈ మాటలు చూస్తుంటేనే అర్ధమవుతుంది. అతని విశ్వాసమెంతటి పరిపూర్ణమైనదో?
తన కుమార్తె కొరప్రాణంతో లేదు. తను చనిపోయిందని అతనికి పూర్తిగా తెలుసు. అతనే ఆ విషయం చెప్తున్నాడు కూడా. గొల్లు చేయువారు వచ్చి ఏడ్వడం ప్రారంభించేసారు. అతని పనివారు అయ్యా, ఆయనను యిబ్బంది పెట్టవద్దు పాప చనిపోయిందికదా? చనిపోయిన ఆమెను ఈయనేమి చేయగలడు? అంటూ సలహాలిస్తున్నారు. “అయిననూ”, నీవు వచ్చి నా కుమార్తెను తాకితే తను బ్రతుక వచ్చేమో? ఒకసారి ప్రయత్నించి చూడు. అనడం లేదు. "బ్రతుకుతుంది". ఇది పరిపూర్ణమైన విశ్వాసం. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు ఫలితం శూన్యం. “అయిననూ” నీమాట చొప్పున వల వేస్తాను. ఇదే విధేయత. విశ్వాసానికి విధేయత తోడైతే, విప్లవాత్మకమైన విజయాలు సాధ్యమవుతాయి.
*3. యాయీరు కోరికను మన్నించిన ప్రభువు*
నీవు పిలిస్తే దాటిపోయేవాడు కాదు నీ ప్రభువు. చనిపోయిందికదా? వెళ్లి పాతిపెట్టుకో అని ఉచిత సలహా యివ్వలేదు. అతనిని ధైర్యపరిచారు. యేసు ప్రభువు వారు తన శిష్యులతో కలసి ఆ అధికారి ఇంటికి వెళ్లారు. అప్పటికి, పిల్లనగ్రోవులు వాయించేవారు, యేడ్చేవారు వారి పని వారు చేస్తున్నారు. ( ఆ కాలంలో వీరిని డబ్బులిచ్చి పిలిపించుకునే వారు) ప్రభువురాకతో కొందరైతే ఏమిజరుగబోతుందోనని ఆసక్తితో చూస్తుంటే, మరికొందరైతే చనిపోయిన ఆమెను ఇతడేమిచేయగలడని హేళనగా మాట్లాడుతున్నారు “ఈమె చనిపోలేదు నిద్రపోతుంది” అనే ప్రభువు మాటలు మరింత అపహాస్యం చేసేటట్లు చేశాయి.
బైబిల్ గ్రంధములో మరణమును నిద్రతో పోల్చడం జరిగింది. నిద్రించిన వాడు తప్పక తిరిగి లేస్తాడు. ఒక వేళ మరణించినా ఆయన మధ్యాకాశములో నుండి, బూర ఊదినప్పుడు, ప్రభువు నందు మృతులైన మృతులు తప్పక లేస్తారు. వారికి ఆ మాటలు అర్ధం కాలేదు.
*4. స్థలమియ్యుడి*
ఆయన మర్యాదస్తుడు. త్రోసుకొని వెళ్ళేవాడుకాదు. స్థలమిస్తేనే ఆయన ప్రవేశిస్తారు. ఆయన ప్రవేశిస్తేనే అద్భుతకార్యం జరుగుతుంది. అక్కడ అదే జరిగింది కూడా. మన జీవితాల్లో ప్రభువుయొక్క ఆశ్చర్యకార్యాలను ఎందుకు చూడలేకపోతున్నాము? పేతురు దోనెలో ఆయనకు స్థలముంది. మన హృదయంలో ఆయనకు స్థలముందా? *ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము*. (ప్రకటన 3 :20) నీ హృదయమనే తలుపు తీసి ఆయనకు స్థలమిస్తే? నీ జీవితమంతా సమాధానమే.
ఆయన మహిమను నీవు కళ్లారా చూస్తావు. అనుభవిస్తావు.
*5. చనిపోయిన బిడ్డను బ్రతికించిన ప్రభువు: *
యేసు ప్రభువు వారందరిని బయటకు పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి, ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచింది.
వారిని బయటకు పంపించడం దేనికి? వారి మధ్యనే ఆ చిన్నదానిని బ్రతికించవచ్చు కదా?
ఎందుకంటే? ఆయనను ఎగతాళి చేసినవారు, ఆయన కార్యంలోని మహిమను చూచే అర్హతను కోల్పోతారేమో? సమస్యను చూచి, ఆయన శక్తిని శంకించి, మన జీవితాల్లోకూడా ఆయన ఆశ్చర్య కార్యాలను అనుభవించే ధన్యతను కోల్పోతున్నామేమో? మనలను మనమే పరిశీలన చేసుకోవాలి.
*6. ముగింపు *
మన ప్రార్ధన దేవుని నుండి సమాధానాన్ని తీసుకొని రాలేకపోతుందంటే? మన హృదయంలో ఆయనకు స్థలము లేదేమో? విశ్వాసం కొరవడిందేమో? ఆయనను ఇంకనూ అపహాస్యం చేసే సమూహంలోనే వున్నానేమో? అట్లా అయితే! నీ జీవితంలో ఆయన కార్యాలు చూడడం సాధ్యం కాదు. నీ హృదయమనే తలుపు తీసి ఆయనకు స్థలమిస్తే? నీ జీవితమంతా సమాధానమే.
ఆయన మహిమను నీవు కళ్లారా చూస్తావు. అనుభవిస్తావు.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( ఏడవ భాగము)—-—————————————-
రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ స్వస్థతనొందుట
▫————————————-
పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకట పడెను. ఆమె యేసునుగూర్చి వినెను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆబాధ నివారణయైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగినా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను. అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపర చెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. మార్కు 5:25-34 (మత్తయి 9:20-22; లూకా 8:43-48)
ఉపోద్ఘాతము:
▫———————
సమాజమందిరపు అధికారియైన యాయీరు యొక్క కుమార్తె చనిపోయినప్పుడు, ప్రభువు వారింటికి వెళ్లుచున్న సందర్భములో, మార్గమధ్యలో పండ్రెండు సంవత్సరాలనుండి రక్త స్రావంతో బాధపడుతున్న స్త్రీ, ప్రభవుయొక్క వస్త్రము తాకగానే స్వస్థపరచబడిన సందర్భం.
రక్తస్రావ రోగము
పాతనిబంధనా కాలంలో రక్తస్రావం “పాపమునకు” సాదృశ్యం. రక్తస్రావం స్త్రీని అపవిత్రురాలిగా చేస్తుంది.
ఒక స్త్రీ కడగా ఉండుకాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేకదినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావదినములన్నియు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలె ఉండ వలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రతవలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. లేవీ 15:25-27
1. రక్తస్రావ రోగంతో సంకట పడింది.
▪రక్తస్రావ రోగంతో పండ్రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలం బాధపడింది.
▪వైద్యానికి ధనమంతా ఖర్చుచేసింది
▪శక్తినంతా కోల్పోయింది.
▪ఒకవైపు శారీరకమైన బాధ
▪మరొకవైపు ఎవ్వరితోనూ చెప్పుకోలేని మానసిక క్షోభ. కారణం? తనకి కలిగిన రోగం అట్లాంటిది.
▪తాను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసి, నిరాశా నిస్పృహలతో చావలేక, బ్రతుకుతున్న పరిస్థితి.
2. యేసుని గురించి విని, విశ్వసించింది
ఈ లోకంలో ఏ చక్రవర్తి గురించి విన్నప్పటికి తనకి ప్రయోజనం లేదుగాని, యేసుని గురించి విన్నది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని తెలుసుకున్నది. దానిని విశ్వసించింది. అవును! వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. (రోమా 10:17 ) తన జీవితంలో అదే జరిగింది. ఆమె జీవితంలో అచంచలమైన విశ్వాసం, ఆయన వస్త్రాలను తాకినా చాలు. నేను బాగుపడతాను. ఇట్లా తలంచినవారుగాని, ప్రభువు వస్త్రాలను తాకి స్వస్థపరచబడిన వారుగాని, యింకెవ్వరూ లేరు. ఈమె తప్ప. మన జీవితాల్లో యిదే లోపిస్తుంది. పనికిరాని మాటలు గంటలు తరబడి వింటాము గాని, ఆయన మాటలు వినడానికి ఆసక్తిచూపము. ఒకవేళ వినినప్పటికీ వాటిని విశ్వసించలేని పరిస్థితి. తద్వారా మన జీవితాలలో అద్భుతాలను చూడలేకపోతున్నాము.
3. తన విశ్వాసాన్ని అమలు చేసింది
జన సందోహం ఆయనను వెంబడించుటనుబట్టి, ఆయనను కలవడానికి అవకాశం ఉండదు అనుకున్నదేమో? లేకపోతే, తనకి కలిగిన వ్యాధిని గురించి బహిరంగంగా చెప్పడానికి సాహసించలేకపోయిందేమో? తాను తీసుకున్న తీర్మానం ప్రకారం, జన సందోహాన్ని ఛేదించుకొని వెళ్లి, ఆయన వస్త్రపు చెంగును తాకింది. ప్రభువులోనుండి ప్రభావం బయలువెడలింది. ఆ స్త్రీ స్వస్థపరచబడింది. ఆయనను, ఆయన వస్త్రాలను తాకిన వారందరూ స్వస్థత చెందారా? లేదు. కారణం అట్టి విశ్వాసం ఆమెలో మాత్రమే వుంది కాబట్టి, ఆమె స్వస్థపరచబడింది. అవును! ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు ( 1 పేతురు 2:6) పండ్రెండు సంవత్సరాల బాధ, ప్రభువు దగ్గర నివారణ అయ్యింది. ఆమె విశ్వాసానికి గొప్ప ప్రతిఫలం దొరికింది. స్వస్థతోపాటు సమాధానం దొరికింది. సమాధానముగలదానవై వెళ్ళు అని ప్రభవు చెప్తున్నారు. ఒకవేళ నీ జీవితంలో కూడా చెప్పుకోలేని సమస్యలతో, సమాధానంలేని పరిస్థితులను నీవనుభవిస్తూవుంటే ఆయనయందు విశ్వాసముంచి, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించగలిగితే, కొండలా అనిపించే ప్రతీ సమస్యా కూడా నీముందు మోకరిల్లుతుంది.
4. ప్రభువును ఆరాధించింది:
నాలోనుండి ప్రభావం బయలువెడలింది. నన్ను తాకినవారెవరని ప్రభువు అడుగుచుంటే, శిష్యులేమో, అదేంటి ప్రభువా! అనేకమంది నీ మీద పడుతూవుంటే నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావేమిటి అంటున్నారు. అవును! ప్రభవునకు మరియు స్వస్థపరచబడిన ఆ స్త్రీకి మాత్రమే ఏమిజరిగిందనే విషయం తెలుసు. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను. అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను. ఆమె భయపడుతుంది, వణుకుతుంది. కారణం? ఆమె అపవిత్రమైన వ్యాధి కలిగియుంది, పవిత్రుడైన ప్రభువును తాకినందుకు ఆయన ఏమంటారో అనే భయం ఆమెలో వుండివుండవచ్చు. కానీ, కొంచెం తేరుకొంది. అందరి ఎదుటనే ప్రభువుకు సాగిలపడింది. సాగిలపడుట ఆరాధనను సూచిస్తుంది. ఎప్పుడు ప్రభువును ఆరాధించగలమంటే? ఆయన ఏమైయున్నాడో మనకు అర్ధమైనప్పుడు మాత్రమే ఆయనను ఆరాధించగలము. ఆయన స్వస్థపరచు దేవుడు, సమాధానమిచ్చే దేవుడుగా ఆయనను అర్ధం చేసుకొని, ఆరాధించగలిగింది. ప్రభువును ఆరాధించే అనుభవం మనకుందా? లేదంటే, ఆయన ఏమైయున్నాడో నేటికిని మనకు అర్ధం కాలేదన్నమాట. యింతకీ, మనమెందుకు ఆయనను ఆరాధించాలి? ఆయన పొందిన దెబ్బలద్వారా మనకు స్వస్థత నిచ్చారు, సమాధానమిచ్చారు. కాబట్టి, సజీవయాగముగా మన శరీరములను ప్రభువుకు సమర్పించి ఆరాధించే జీవితాలను మనము కలిగియుండగలగాలి.
5. ముగింపు
చెప్పుకోలేని సమస్యలచేత, సమాధానాన్ని కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుందా? అయితే, నీ ప్రతీ సమస్యకు ఒక పరిష్కారముంది. అది యేసయ్యలోనే. విశ్వసించు! నీ జీవితాన్ని , నీకున్న ప్రతీ సమస్యను ప్రభువుకు అప్పగించు! గొప్ప సమాధానాన్ని అనుభవించగలవు! ప్రయత్నించి చూడు! విజయం నీదే! ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( ఎనిమిదవ భాగము)—-—————————————-
*38 ఏండ్లనుండి వ్యాధిగలిగినవాడు స్వస్థపరచబడుట *
◽———————————
యెరూషలేములో గొఱ్ఱల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు. ఆ యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగిస్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా ఆ రోగి అయ్యా, నీళ్లు కదలింపబడి నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
యోహాను 5 : 2-9
*ఉపోద్ఘాతము: *
▫———————
బేతెస్థ అనగా “కరుణా గృహం” అనే అర్ధం కావొచ్చు. ఈ కోనేటిలోని నీటిని దేవదూత కదిలించే సమయంలో, ఎవరైతే ముందుగా ఆ నీటిలోకి దిగుతారో వారు ఎట్లాంటి వ్యాధితో బాధపడుతున్నప్పటికీ స్వస్థత పొందుతారు. అక్కడ ఒక వ్యక్తి బహుశా పక్షవాతమో లేదా కుంటితనముతో బాధపడుతున్న వ్యక్తి 38 సంవత్సరాలనుండి ఒక అవకాశం కొరకు ఎదురుచూస్తున్నాడు. అట్లాంటి అవకాశం అతనికి రాలేదు. అయితే, ప్రభువు అతనిని ప్రేమించి, తాను అడగకపోయినా, ప్రభువే అతనిని అడిగి, స్వస్థపరచిన సందర్భమిది.
*ఆత్మీయ పాఠములు: *
▪————————
1. *38 సంవత్సరాల సుదీర్ఘమైన నిరీక్షణ *
ఇతడు నన్ను కోనేటిలోనికి దించేవారెవ్వరూ లేరు అంటున్నాడు. అంటే తనకుతానుగా దానిలోనికి దిగలేని స్థితి. బహుశా ఇతడు పక్షవాతంతోగాని , కుంటితనంతోగాని బాధపడుతూ వుండవచ్చు. 38 సంవత్సరాల సుదీర్ఘమైన నిరీక్షణ. ఎదో ఒకరోజు తప్పక బాగుపడతాననే నిరీక్షణ కలిగియున్నాడో, లేకపోతే అక్కడికి వచ్చేవారు ఏవో పైసలు వేస్తుంటే యిక్కడే బాగుందని వుండిపోయాడో తెలియదు. సుమారుగా తన జీవితకాలమంతా ఆ మంటపములోనే పడిగాపులు. ఇక అదే అతని స్థిరనివాసమయ్యింది. ఒకానొకప్పుడు మన జీవితాలుకూడా అంతే. సుదీర్ఘకాలం పాపముచేత బంధించబడి, విడిపించేవారులేక మృత్యుకోరల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి.
2. *యేసు, వాడు పడియుండుట చూచినవాడు: *
మన ప్రభువు మన స్థితిని చూచేవాడు. ఆయన జీవము గలిగిన దేవుడు. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను (కీర్తనలు 139:16) అని దావీదు మాట్లాడు తున్నాడు. అరణ్యములో హాగరుయొక్క శ్రమను చూచి, ప్రత్యక్షత నిచ్చి, వాగ్ధానమిచ్చి బలపరచిన దేవునికి ఆమె పెట్టిన పేరు “చూచుచున్న దేవుడు” అవును, మంటపములో సుదీర్ఘకాలం ఆవ్యక్తి యొక్క శ్రమను చూచారు. నేటి దినాన్న మన స్థితిని కూడా చూచేవాడాయన. నిన్న నేడు నిరంతరము మార్పులేనివాడు మన ప్రభువు. ఆయన కృపగలిగిన దేవుడు.
3. *యేసు అతని స్థితిని యెరిగినవాడు. *
యేసు ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన సంవత్సరాలు ముప్పై మూడున్నర. అయితే, ఇతని యొక్క “వ్యాధి వయస్సు” 38 సంవత్సరాలు. అంటే, ప్రభువు వయస్సు కంటే, ఇతని వ్యాధి వయస్సు ఎక్కువ. అయినప్పటికీ, అతడు 38 సంవత్సరాలనుండి అక్కడ పడియున్నట్లు, అతడు చెప్పకముందే ప్రభువు ఎరిగియున్నవాడు. దీనినిబట్టి ఆయన దైవత్వాన్ని అర్ధము చేసుకోవచ్చు. ఆయన సృష్టికర్తయైన దేవుడు. నిన్నూ నన్నూ సృష్టించినవాడు, మన ప్రతీ పరిస్థితిని ఎరిగియున్న దేవుడు.
4. *కృపగలిగిన దేవుడు*
38 సంవత్సరాలుగా అతని స్థితిని చూచిన ప్రభువు, అతని స్థితిని ఎరిగిన ప్రభువు ఆయనే అతని దగ్గరకు వచ్చి, ఆయనే అడిగి, ఉచితంగా, సంపూర్ణమైన స్వస్థతను ప్రసాదించారు. మన విషయంలో కూడా ఇదే జరిగింది. నశించిపోతున్న మనలను రక్షించడానికి ఆయనే మనలను వెతుక్కొంటూ వచ్చారు. ఆయన ప్రేమ అద్వితీయమైన ప్రేమ. తన ప్రాణమునే మనకొరకు ఫణముగా పెట్టి, పాపపు బంధకాలనుండి విమోచించి, ఉచితమైన సంపూర్ణమైన స్వస్థతను, రక్షణను మనకు అనుగ్రహించారు.
5. *యేసు మాటలో స్వస్థత*
రోగాలను నయంచేసే ప్రభావం యేసుమాటలో వుంది. నిస్సత్తువుగానున్నవాడు తన పరుపు ఎత్తుకొని నడవడం అసాధ్యం. కానీ, యేసు అట్లా చేయమని అతనిని ఆజ్ఞాపించినప్పుడు అట్లా చేయగలిగే శక్తిని కూడా ప్రభువే యిస్తారు.
▪యేసు మాటలో స్వస్థతవుందని గ్రహించిన శతాధిపతి ఇట్టిరీతిగా ప్రార్ధిస్తున్నాడు. ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. (మత్తయి 8:8)
▪ఊచ చెయ్యి గలవానితో...... నీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. (మార్కు 3:5)
▪పదిమంది కుష్టురోగులతో ...... ఆయన వారిని చూచిమీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి. (లూకా 17:14)
6. *ముగింపు*
ప్రభువిచ్చిన రక్షణను నిర్లక్ష్యము చెయ్యొద్దు. ఆయన కృప, ఉగ్రతగా మారితే? అది ఊహలకే భయంకరం. ఆయన పాదాల చెంత ప్రణమిల్లుదాం! ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకొందము. ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( తొమ్మిదవ భాగము)—-—————————————-
నీటిని ద్రాక్షారసముగ మార్చుట
▪——————————
గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లివారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. యేసు--ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. అప్పుడాయన వారితోమీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.
యోహాను 2:1-11
ఉపోద్ఘాతము:
▫———————
యేసు ప్రభువు చేసిన మొట్టమొదటి అద్భుతమిది. కానా అనే ఊరిలో జరుగు వివాహానికి పిలువబడ్డారాయన. అక్కడ ద్రాక్షారసము లోటు వచ్చింది. యజమాని కంగారుపడుతున్న పరిస్థితులలో నీటినే ద్రాక్షారసముగా మార్చి, వారి లోటును తీర్చిన సందర్భమిది.
ఆత్మీయ పాఠములు:
▪————————
1. ఆరు రాతిబానలు:
ఆరు అనే సంఖ్యలోనే సంపూర్ణతలేదు. ఆరు మానవుని సంఖ్య. అది అసంపూర్ణమైనది. ఏడు దేవుని సంఖ్య. అది పరిపూర్ణమైనది. ఆరు రాతిబానలు అంచులమట్టుకు నింపబడినప్పటికీ ప్రయోజనం లేదు. ఆ నీటికి ఎట్లాంటి రుచిగాని, విలువగాని లేదు. అయితే, ఏడవదిగా దేవుని మహిమ దానికి తోడైనప్పుడు మాత్రం అద్భుతం జరిగింది. మన జీవితాలలోనూ అంతే, మనకు దేవుని మహిమ తోడైతేనే, మన హృదయంలో ప్రభువు నివసిస్తేనే, మన జీవితాలకు సార్ధకత. ఆయనలేకుండా మనలోటు తీర్చబడదు.
2. వివాహానికి యేసయ్య పిలువబడ్డారు
వివాహములో ద్రాక్షారసం ఆయిపోయింది. అది విందు యజమానికి అవమానం. ఆ వివాహంలో యేసు ప్రభువు తప్ప, యింకెవరున్నప్పటికీ వారి లోటు భర్తీ చెయ్యలేరు. ఆయన వున్నారు కాబట్టే, వారికి కలుగబోయే అవమానం, ప్రశంసగా మార్చబడింది. మొదట మంచి ద్రాక్షారసము పోసి, ప్రజలు మత్తుగా నున్నప్పుడు జబ్బు ద్రాక్షారసము పోస్తారు. నీవైతే మంచి ద్రాక్షారసము పోస్తున్నావని అతనిని ప్రశంసిస్తున్నారు. మన జీవితంలోనున్న ఏ లోటైనా తీర్చబడాలంటే, ఆయన మాత్రమే మన హృదయంలో ఉండాలి. అన్ని కలిగియుండి ఆయనలేకుంటే అంతా సున్నా. యింతకీ, ఆయనను ఆహ్వానించిన అనుభవముందా? లేకుంటే, నేడైనా ఆయనను చేర్చుకో. నీ కన్నీరు నాట్యముగా మారబోతుంది. క్రీస్తుయేసు నందు మహిమలో నీ ప్రతీ అవసరం తీర్చబడబోతుంది. నీ హృదయంలో ప్రభువు తప్ప, ఇంకెవరున్నప్పటికీ నీ జీవితానికి సమాధానాన్ని చేకూర్చలేరు. ఒకవేళ యింకనూ నీ జీవితంలోనికి ప్రభువును ఆహ్వానించకుంటే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము (2 కొరింధీ 6:2) ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
(ప్రకటన 3:20,21) మన జీవితాల్లో ఆయనకు స్థానం లేకుంటే, నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవించలేము. మన జీవితంలోనున్న లోటు భర్తీ చేయబడదు. మన జీవితంలో అద్భుతాలు చూడాలంటే, యేసయ్య మాత్రమే మన హృదయరారాజై యుండితీరాలి.
3. అంచులమట్టుకు నింపిరి (విధేయత)
యేసు--ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. మన జీవితంలో అద్భుతాలు చూడాలంటే, మొదటిగా మన హృదయంలో యేసయ్యకు ప్రధమస్థానం వుండితీరాలి. రెండవదిగా ఆయన మాటకు విధేయత చూపగలగాలి. విధేయత ప్రశ్నించదు. ప్రభువు చెప్పినట్లే చేస్తుంది. ప్రభువు రాతిబానలను నీటితో నింపమన్నారు. వారు ఏమాత్రం ప్రశ్నించకుండా అంచులమట్టుకు నింపారు. అది సంపూర్ణమైన విధేయత. అట్లా కాకుండా, కొంచెం నీటితోనే నింపితే కొంచెమే ద్రాక్షారసం పొందియుండేవారు. సంపూర్ణమైన విధేయత చూపారుకాబట్టి సమృద్ధిగా పొందారు. విధేయత క్రీస్తులో విప్లవాత్మకమైన విజయాలు సాధిస్తుంది. ప్రభువుకు మాటకు లోబకుండా, ప్రభువునుండి నిత్యమైన ఆశీర్వాదాలు పొందడం సాధ్యం కాదు. అబ్రాహాము విశ్వాసం ఒక్కటిమాత్రమే కలిగియుండి, విధేయత లోపిస్తే, నేటి దినాన్న ఆయన గురించి చెప్పుకోవడానికి ఏమిలేదు. నీజీవితంలోనున్న ఏ లోటైనాసరే తీర్చబడాలన్నా, నీవు ఆశీర్వదించబడాలన్నా, నీవే ఒక ఆశీర్వాదముగా నుండాలన్నా ప్రభువుకు విధేయత చూపగలగడం ఒక్కటే మార్గం.
4. పరిచారకులకు మాత్రమే తెలిసింది
ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను. ఇక్కడ ప్రభువు తన్నుతాను ఘనపరచుకొనే ప్రయత్నమేదీ లేదు. నేటి దినాల్లో క్రైస్తవ్యం ఏరీతిగా వుందంటే, దేవునికి చెందాల్సిన మహిమనుకూడా వారికే చెందేలా ప్రాకులాడేవారు కోకొల్లలు. ఒక సువార్త సభకు లక్షమంది వస్తుంటే, తొంభై తొమ్మిదివేల తొమ్మిదివందల తొంభై తొమ్మిదిమంది వట్టి చేతులతో తిరిగివెళ్లిపోతుంటే, ఆ సేవకులైనవారికి ఎట్లాంటి బాధ, భారం లేదుగాని, మిగిలిన ఆ పదిమంది చేతికి మౌత్ లిచ్చి, వారు సృష్టించే హంగామా హృదయ విదారకంగా ఉంటుంది. దేవుడు నీకిచ్చిన కృపావరాలను, తలాంతులను నమ్మకంగా నీవు వాడగలిగితే, తగినకాలమందు ప్రభువే నిన్ను గొప్పచేస్తారు. మనలను మనము ఘనపరచుకోకుండా ప్రభువే మనలను హెచ్చిస్తే అది మన జీవితాలకు ఆశీర్వాదకరం. మనము తగ్గాలి, ప్రభువును హెచ్చించాలి.
5. ముగింపు
కానా వివాహములో కలిగిన లోటును తీర్చిన ప్రభువు, నీటిని ద్రాక్షారసముగ మార్చిన ప్రభువు, నీ జీవితంలోకలిగియున్న ప్రతీవిధమైన లోటును భర్తీచేయగల సమర్ధుడు. నీ ప్రతీ విధమైన పరిస్థితిని మార్చగల సమర్ధుడు.ఇదెప్పుడు సాధ్యమంటే, నీ హృదయంలో ప్రప్రథమమైన స్థానం ప్రభువునకిచ్చి, ఆయనమాటకు లోబడినప్పుడే. ప్రభువును చేర్చుకొని, ఆయనమాటకు లోబడి నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( పదియవ భాగము)—-—————————————-
*దయ్యము పట్టిన స్త్రీ విడుదల పొందుట *
▪———————————
విశ్రాంతి దినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్లనుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి ఆమెమీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.
లూకా 13 : 10-13
*ఆత్మీయ పాఠములు*
▫————————-
1. *చక్కగా నిలబడలేని స్థితి: *
మిగిలిన జీవులతో పోల్చుకుంటే, నిటారుగా నిలబడే స్థితి మనుష్యులు కలిగియున్న ప్రత్యేకతలతో ఒకటి. అయితే, ఈమె బలహీనపరచు దయ్యముతో బాధించబడుటవలన, గత పద్దెనిమిది సంవత్సరములుగా నిలబడలేని స్థితి, తన కన్నులు పైకెత్తి ఆకాశమువైపు చూడలేని స్థితి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. మనలో కూడా అనేకమంది ఆత్మీయంగా నడుమువంగి పోయిన స్థితిలో, ప్రభువులో నిలబడలేని స్థితిలో, పరలోకసంబంధమైన వాటివైపు కన్నులెత్తలేని స్థితిలో, నడుము వంగిపోయి భూసంబంధమైన వాటివైపు కన్నులుంచి జీవితయాత్రను కొనసాగిస్తున్నాము. ఆమె అయితే, పద్దెనిమిది సంవత్సరాలనుండి గాని, మనమెంతకాలమునుండి ప్రభువులో, విశ్వాసములో నిలబడలేక సాతాను బంధకాలలో జీవిస్తున్నామో మనకు మనమే పరిశీలన చేసుకోవడం మన జీవితాలకు శ్రేయస్కరం.
2. *ఆమె సమాజమందిరములో వుంది*
పద్దెనిమిది సంవత్సరాలనుండి నడుము వంగిపోయినస్థితి, నడవలేని స్థితి. అయినప్పటికీ ఆమె సమాజమందిరమునకు వచ్చింది. అంటే, దేవునిని ఆరాధించాలనే ఆశను కలిగివుంది. అదే ఆమె జీవితంలో అద్భుతాన్ని చూడడానికి కారణమయ్యింది. మన జీవితాలు దీనికి పూర్తి భిన్నముగా ఉంటున్నాయి. అంతా సవ్యముగానున్నప్పటికీ, పరిపూర్ణమైన ఆరోగ్యము కలిగియున్నప్పటికీ దేవునిమందిరమంటే మనకెంత నిర్లక్ష్యమో? దేవుని సన్నిధిలో గడపాల్సిన దినాన్నే, అనేకమైన పనులుపెట్టుకొని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారు కోకొల్లలు. ఇట్లాంటి వారందరికీ ఈమె జీవితం ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం.
3. *ఆత్మీయ మేలును పొందడానికి వెళ్ళింది *
ఆమె దేవునిని ఆరాధించడానికి, ఆత్మీయ మేలును పొందడానికి సమాజమందిరానికి వెళ్ళింది. ఆత్మీయ మేలుతోపాటు, శారీరిక స్వస్థతనూ పొందుకుంది. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. (మత్తయి 6:33) అవును! ఆయన నీతిని, రాజ్యమును వెదికితే, భౌతికమైన ఆశీర్వాదాలన్నీ వాటివెంటే పరుగులు తీస్తాయి. మనమూ, మన ప్రార్ధనలైతే కేవలం భౌతికమైన ఆశీర్వాదాలచుట్టూ తిరుగుతున్నాయి తప్ప, ఆత్మీయ విషయాలను దృష్టించలేకపోతున్నాము. అందుకే, ఆత్మీయంగా పతనమవుతున్నాము. ఆశీర్వాదాలను అనుభవించలేకపోతున్నాము.
4. *ప్రభువు పిలుపుకు లోబడింది *
సమాజమందిరంలో ప్రభువు బోధిస్తుండగా ఆయన మాటలు వింటూ వుంది, ప్రభువు ఆమె స్థితిని ఎరిగి రమ్మని పిలచినప్పుడు, ఆయన మాటకు విధేయత చూపింది. ఆయన దగ్గరకు వెళ్ళింది. నిజానికి తన జీవితకాలంలో మరెప్పుడూ తిరిగి తాను నిలబడగలనని తలంచియుండదు. ప్రభువుమాట విని, ఆయనకు ఎప్పుడైతే విధేయురాలయ్యిందో, పద్దెనిమిది సంవత్సరాల నుండి అనుభవిస్తున్న బాధనుండు ఒక్క క్షణంలో సంపూర్ణమైన విడుదల పొందింది. నేటికిని ప్రభువు చాచినచేతులతో దినమెల్లా నిన్ను పిలుస్తూనే వున్నారు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ( మత్తయి 11:28) నీవే స్థితిలోనున్న సరే, ఆయన పిలుపుకు లోబడి, ఆయన చెంతకు రాగలిగితే, నీ జీవితంలో అద్భుతాన్ని తప్పక చూడగలవు.
5. *ప్రభువును మహిమ పరచింది:*
ప్రభువు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి ఆయనను మహిమ పరచింది. తాను అడగకుండానే తన ఊహకుమించి ప్రభువు చేసిన మేలునుబట్టి ఆమె కృతజ్ఞతతో దేవునిని మహిమపరచింది. అట్లాగే మనము కూడా ప్రభువు ద్వారా పొందిన మేళ్ళనుబట్టి ఆయనను మహిమపరచాలి. దావీదు తన జీవితంలో ఇట్లాంటి అనుభవాన్ని కలిగియుంటున్నాడు. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ( కీర్తనలు 103:1,2) ఇట్లాంటి అనుభవాలు మన జీవితంలోనూ వుండగలగాలి. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచు కుందాము. ఆయనిచ్చే ఆశీర్వాదాలు అనుభవిద్దాము.
అట్టి కృప, ధన్యత
ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( పదకొండవ భాగము)—-—————————————
“సేన” అపవిత్రాత్మ పట్టినవాడు విడుదలపొందుట
▫—————————-
వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశ మునకు వచ్చిరి. ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింప లేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయనఅపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయననీ పేరేమని వాని నడుగగా వాడునా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండదగ్గర పందుల పెద్దమంద మేయుచుండెను. గనుకఆ పందులలో ప్రవే శించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను.
యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారి పోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించు కొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియ జేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి.
మార్కు 5:1-17
అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు
—————————————
▫సమాధులలో వాసము చేసెడివాడు
▫రాత్రింబగళ్లు కేకలు వేసేవాడు
▫తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనేవాడు.
▫అతనిని ఎవ్వరూ బంధించలేకపోయారు
▫ఎవ్వరూ అతనిని సాధుపరచలేకపోయారు
అంటే,
——————-
▫అతని జీవితంలో సమాధానంలేదు. ▫అతని కుటుంబంలో సమాధానం లేదు. ▫ఆ ఊర్లో వారికి సమాధానం లేదు. ▫అతడంటే అందరికీ భయమే.
▫అటువైపు వెళ్లడానికికూడా ఎవ్వరూ సాహసించలేని పరిస్థితి.
▫అతడు ఎవ్వరిని లెక్కచెయ్యడు.
▫ఎవ్వరి మాటా వినడు
▫ఎవ్వరిని గౌరవించడు.
▫అతనికి మనుష్యులు అంటేనే అసహ్యం
▫దయ్యాలతోనే సహవాసం.
ఇట్లాంటి వ్యక్తి దూరమునుండి
————————————-
▫ప్రభువును చూచాడు
▫గుర్తుపట్టాడు
▫పరుగెత్తుకొని ప్రభువు దగ్గరకు వచ్చాడు
▫సాగిలపడ్డాడు
▫యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా అంటూ సంబోధించాడు.
▫నన్ను బాధ పెట్టవద్దంటూ బ్రతిమాలాడాడు
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే?
—————————————
▫ఇతనిని చూచి ప్రజలంతా పరుగులు తీస్తుంటే, యితడేమో ప్రభువు దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు.
▫యితడేమో అందరిని బాధపెడుతున్నాడు. నన్ను బాధపెట్టవద్దని ప్రభువును బ్రతిమలాడుతున్నాడు.
▫యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా అంటూ సంబోధిస్తున్నాడు. ఇతనికెట్లా తెలుసు? అతనికి తెలియదుగాని, అతనిలోనున్న “సేన” అనబడే అపవిత్రాత్మలకు తెలుసు. ఎందుకంటే? లూసిఫర్ తోపాటు క్రిందకి త్రోసివేయబడకముందు ఈ అపవిత్రాత్మలు లేదా దయ్యాలన్నీ, దేవదూతలుగా పరలోకంలో సేవచేసినవారే.
దయ్యాలు సహితం యేసు, సర్వోన్నతుని దేవుని కుమారుడని వణకుచూ సాక్ష్యమిస్తుంటే? మనిషి మాత్రం మా నాన్న కోతి, మా తాత కొండముచ్చు అంటూ ఆయన యొక్క దైవత్వాన్ని గుర్తించలేని దయనీయమైన స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన దైవత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు. అదెన్నటికి మనజీవితాలకు క్షేమకరం కాదు.
అపవిత్రాత్మ పట్టిన వానిని ప్రభువు స్వస్థపరిచారు :
—————————————-
మనుష్యులు చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ, ఎవ్వరూ అతనిని సాధుపరచలేకపోయారు. తనను తాను రాళ్లతో గాయపరచుకునేవానిని ప్రభువు స్వస్థపరిచారు. మన జీవితాల్లో కూడా సాతాను మనలను మనమే గాయపరచుకొనేలా చేస్తాడు. అదెట్లా అంటే? త్రాగుడు, వ్యభిచారం, జూదం మొదలగు దుర్వ్యసనాలనే రాళ్లతో మనలను మనమే గాయపరచుకొనేలా చేస్తాడు. తద్వారా ఆరోగ్యం, గౌరవం, ఆర్ధికంగా పతనం ఇట్లా అనేకమైన పరిస్థితులకు బలైపోతున్నాము. వీటినుండి మనలను మనమే విడిపింపబడలేము గాని, ప్రభువు పాదాలచెంత చేరడమే శరణ్యం. మన ప్రతీవిధమైన పాపపు గాయాలు ఆయన పొందిన దెబ్బల చేతనే స్వస్థపరచబడతాయి.
వస్త్రములను ధరింపజేశారు
———————————-
అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి దిగంబరిగా ఉండేవాడు. ప్రభువు అతనికి వస్త్రాలను ధరింపజేశారు. ఒకానొకప్పుడు పాపపు డాగులచేత మన వస్త్రాలు మలినమైయున్నప్పుడు, రక్షణ, నీతి వస్త్రాలులేక దిగంబరులముగా నున్నప్పుడు, క్రీస్తు పవిత్ర రక్తం ద్వారా మన పాపపు డాగులను శుద్ధీకరించారు. శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది ( యెషయా 61:10)
ముగింపు
———————-
అపవిత్రాత్మ పట్టినవానిని స్వస్థపరచి, నూతనమైన వ్యక్తిగా తీర్చిదిద్దితే, వారంతా ప్రభువా మా ప్రాంతాలను విడచి వెళ్ళిపో అని బ్రతిమాలాడుతున్నారు. కారణం? ప్రభువు కంటే ఆ పందులే వారికి ముఖ్యమనిపించింది. మన జీవితాలు అంతే కదా? ఆయన మన కొరకు సమస్తాన్ని ధారపోస్తే, మనమేమో అందముంది, బలముంది, ధనముంది ఇంకా మేము ఈ లోకంలో అనుభవించాల్సింది చాలా వుంది. నీవు మా దగ్గరకు రావొద్దు. మా హృదయంలో నీవుండొద్దు. మాకు నచ్చినట్లుగా బ్రతకనివ్వు. నీవు వెళ్ళిపో అంటూ త్రోసేసే స్థితికి చేరుకున్నాము. హృదయమనే తలుపునొద్ద ఆయన తట్టుచున్నప్పటికీ, ఆయన లోనికి ప్రవేశించకుండా గడియలు భిగించి మనకు నచ్చినట్లుగా జీవిస్తున్నామేమో? ఆయన దాటివెళ్ళిపోతే, మన జీవితాలకు సార్ధకతలేదు. వద్దు! నేడైనా ప్రభువును చేర్చుకొని, నిత్యమైన ఆశీర్వాదాలు అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( పండ్రెండవ భాగము)—-—————————————
ప్రధాని కుమారుని స్వస్థపరచుట
—————————————
కపెర్నహూములో ఒక ప్రధానికుమారుడు రోగియైయుండెను. యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను. యేసుసూచక క్రియలను మహత్కార్యములను చూడ కుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకా ప్రధాని ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లి పోయెను. అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి, అతని కుమారుడు బ్రదికి యున్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారునిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.
యోహాను 4:46-54
*ఆత్మీయ పాఠములు*
▫————————-
*ప్రార్ధించిన ప్రధాని*
———————-
ప్రధాని కుమారుడు తీవ్రమైన జ్వరముతో బాధపడుతున్నాడు. ఒకరకంగా మరణశయ్య మీద వున్నాడు. ఒకవేళ అతనిని స్వస్థపరచుట వైద్యులవల్ల కాలేదేమో? పరమవైద్యుడైన ప్రభువుదగ్గరకు వచ్చి నా ఇంటికి వచ్చి, నా కుమారుని స్వస్థపరుచుమని ఆయనను బ్రతిమాలాడుతున్నాడు.
అవును! ఆయనకున్న మరొకపేరు “యెహోవా రాఫా” ( “రొఫే” అనగా హీబ్రులో “డాక్టర్”) ఆయన వైద్యులకే వైద్యుడు “పరమ వైద్యుడు” ఆయన స్వస్థపరిచేవాడు. అట్లా అని కేవలం శారీరిక రోగాలను మాత్రమే కాదు. వీటికంటే ముఖ్యముగా ఆత్మీయ రోగాలను స్వస్థపరచేవాడు. శారీరిక రోగ స్వస్థత కొరకు మాత్రమే ప్రభువు దగ్గరకు వస్తే, నిత్యమూ జీవించే ఆత్మ స్వస్థపడకపోవచ్చు. ఆత్మీయరోగం కోసం ప్రభువు దగ్గరకువస్తే, ఆత్మీయ స్వస్థతతో పాటు, శారీరిక రోగం స్వస్థపడవచ్చు. ఒకవేళ శరీరక రోగం స్వస్థపడకపోయినాగాని, ఆత్మీయ స్వస్థతను పొందుకోగలిగితే, శాశ్వతకాలము ప్రభువుతో నిత్యవాసము చేయగలము.
*విశ్వసించిన ప్రధాని*
————————-
ప్రభువు తన యింటికివచ్చి, తన కుమారుని తాకితే స్వస్థపరచబడతాడు అనే తలంపుకలిగియున్నాడు. అట్లానే జరగాలని ఆశించాడు. కానీ, ప్రభువైతే నీ కుమారుడు బ్రతికియున్నాడు ( స్వస్థపరచబడ్డాడు) అని చెప్పారు. ఇక అతడు మారు మాట్లాడకుండా, ప్రభువు మాటలను విశ్వసించి వెళ్ళిపోయాడు. అనేక సందర్భాలలో మనము అనుకున్నట్లుగానే జరగాలని ఆశించి, ఆయన చిత్తానికి తలవంచలేక అనేకమైన ఆశీర్వాదాలను అనుభవించలేకపోతున్నాము.
*స్వస్థత పొందిన ప్రధాని కుమారుడు: *
—————————————-
ప్రభువు మాటలను విశ్వసించి అతడు తన యింటికి పోవుచుండగా, అతని ఇంటినుండి బయలుదేరి వచ్చిన మనుష్యులు మార్గమధ్యలో అతనిని కలుసుకొని, నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని చెప్పినప్పుడు,ఏ సమయానికి నా కుమారుడు బాగుపడ్డాడని అని అడిగినప్పుడు, వారు చెప్పిన సమయం, ప్రభువు అతనితో చెప్పిన సమయం ఒక్కటే.
ప్రభువు మాటను విని, విశ్వసించగలిగితే, మన జీవితాల్లోకూడా అద్భుతాలు చూడగలము.
*ప్రభువును విశ్వసించిన ప్రధాని కుటుంబం:*
—————————————
మనకుటంబములో మనము అనుభవిస్తున్న మేళ్లు, కుటుంబమంతా ప్రభువును విశ్వసించడానికి కారణం కావాలి. విశ్వాసం వ్యక్తిగతమైనప్పటికీ, కుటుంబమంతా రక్షించబడడం అత్యవసరం. ఇంట్లో ఒక్కరే ఆహారం తీసుకొంటూ కుటుంబమంతా జీవించలేము కదా? అట్లానే కుటుంబమంతా రక్షించబడడం అత్యంత ప్రాముఖ్యం. లూదియా మరియు చెరసాల నాయకుడు వారికుటుంబమంతా రక్షించబడ్డారు. నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము (యెహోషువ 24:15) అని యెహోషువ చెప్పగలుగుతున్నాడు. ఇట్లాంటి అనుభవం మనకుందా?
*ముగింపు *
————-
ప్రార్ధించి, విశ్వసించి పొందుకొనే అనుభవాలు మనకున్నాయా? మన చిత్తమే నెరవేరాలనికాకుండా, ప్రభువు చిత్తానికి తలవంచే జీవితం మనకుందా? రక్షించబడిన కుటుంబాలుగా మన కుటుంబాలున్నాయా? లేకపోతే, కుటుంబ రక్షణ కొరకు ప్రార్ధించే భారంగాని, భాద్యతగాని మనకుందా? మనకు మనమే మన జీవితాలను సరిచూచుకొని, సరిచేసుకొని, పరలోకంలోకూడా కుటుంబాలుగా మనమంతా కలసియుండే గొప్ప భాగ్యాన్ని పొందుకుందాం!
అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( పదమూడవ భాగము)—-—————————————-
*మల్కు చెవిని బాగుచేయుట*
———————————
ఆయన ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. పండ్రెండుమందిలో యూదా అన బడినవాడు వారికంటె ముందుగా నడిచి, యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయనయొద్దకు రాగా యేసు యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించు చున్నావా అని వానితో అనగా ఆయన చుట్టుఉన్న వారు జరుగబోవు దానిని చూచిప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని కుడి చెవి తెగనరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను.
లూకా 22: 48-52
*ఉపోద్ఘాతము: *
▫———————
మరికొద్ది సేపట్లో మనుష్యకుమారుడు అప్పగింపబడబోతున్నారు. గెత్సేమనే తోటలో ప్రభువు, తండ్రిని ప్రార్ధించే సమయమది. తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించారు. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను. శిష్యులేమో నిద్రపోతున్నారు. ఈలోగా ప్రభువును అప్పగించడానికి ఒప్పందం కుదుర్చుకున్న ఇస్కరియోతు యూదా, రోమా సైనికులతో పాటు ఆ వనములో ప్రవేశించినప్పుడు, ప్రభువును రక్షించాలనే ఉద్దేశ్యంతో పేతురు తన కత్తి దూసి మల్కు అనే వ్యక్తి కుడిచెవిని నరికిన సందర్భములో, ప్రభువు తిరిగి అతని చెవిని బాగుచేసిన సందర్భమిది.
*పేతురు, మల్కు చెవిని తెగనరకుట*
—————————————
పేతురు ఒక సాహసోపేతమైన చర్యకు తెరతీశాడు. చుట్టూ వందలాదిమంది రోమా సైనికుల మధ్య ఆ సైనికులలో ఒకని చెవినరకడం అంటే? తన ప్రాణాన్ని కూడా అతడు లెక్కచెయ్యలేదన్నమాట. అతని ధ్యేయం ఒక్కటే, ప్రభువును వారి చేతుల్లోనుండి విడిపించాలి. అది అతని దృష్టిలో అతనికి న్యాయముగానే అనిపించినా, ప్రభువు విధానం అదికాదు. పేతురును ప్రభువు సమర్ధించలేదు సరికదా, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశించిపోతాడని. ఆయనను గద్దించారు. శత్రువును కూడా క్షమించడమే ప్రభువు విధానం. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాలలో నేను చేసేపని న్యాయసమ్మతముగానే వుందికదా అని మనకు అనిపించవచ్చు. అనేక సందర్భాలలో దేవుని పేరుతో మనలను మనమే ఘనపరచుకొని, మన చిత్తాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంటాము. కానీ అట్లా చెయ్యడం ప్రభువుకు ఇష్టంకాదేమో? అది ఆలోచించగలగాలి. మన స్వంత విధానములకు తావులేకుండా, వాక్యవిధానములే మనము అనుసరించగలగాలి. ప్రభువును ప్రేమిస్తున్నామని చెప్పి, ఆయన వాక్యమును ధిక్కరించడం మనకు దూరమగును గాక! ఆమెన్!
*ప్రభువు మల్కు చెవిని బాగు చేయుట *
———————————
పేతురు కత్తిదూసి, మల్కు కుడిచెవిని తెగనరికాడు. ప్రభవువైతే ఆ చెవిని తిరిగి బాగుచేసారు. ఈ దృశ్యాన్ని సైనికులందరూ చూస్తూనే వున్నారు. కానీ, నేటికిని నన్ను ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, వారిలో ఒక్కడు కూడా, కనీసం బాగుపడిన ఆ వ్యక్తి సహితం, ఆయనను సిలువవేయడానికే తొందరపడ్డారు తప్ప, ఆయన శక్తిని గుర్తించలేకపోయారు. ఆయనను ప్రభువుగా అంగీకరించలేకపోయారు. ఇది వినడానికే ఆశ్చర్యకరంగా అనిపించినాగాని, మన జీవితాలుకూడా ఆ మల్కుకు ఏమాత్రం తీసిపోలేదు. ప్రభువు మేలును అనుభవించిన ఆ మల్కు ఒక్కసారే ఆయనను సిలువవేసాడేమో గాని, మనమైతే క్షణక్షణం ఆయనను సిలువ వేస్తూనే వున్నాము. ప్రతీ క్షణం ఆయన గాయాలను రేపుతూనే వున్నాము. ఆయన నాకేమి చేసాడని ఎదురు ప్రశ్నించే ప్రయత్నం చెయ్యొద్దు. ఆ ప్రశ్న అడగడానికి నీవు బ్రతికియున్నావంటే ఆయన కృపమాత్రమే. ఆయన రక్తాన్ని విమోచన క్రయధనముగా నీ కొరకు చెల్లించి, నిత్యమరణం నుండి నిత్య జీవములోనికి దాటించారాయన. ఆయన పొందిన గాయములే మనకు స్వస్థతనిచ్చాయి.
*ప్రభువు యొక్క కృప:*
————————————
కృప అనగా అర్హతలేనివాడు అర్హునిగా ఎంచబడడమే కృప. మల్కు అనేవాడు ప్రధానయాజకుని బంట్రోతు. అతడు కూడా ప్రభువుకు హానిచేయ్యడానికే వచ్చినవాడు. అయినప్పటికీ ప్రభువు చూపిన కృప వర్ణనాతీతం. అతడు అడుగకపోయినప్పటికీ అతని చెవిని బాగుచేసారు ప్రభువు. మన జీవితాలు అంతే కదా? మనమింకనూ పాపులమై యుంటుండగా, బలహీనులమైయుండగా, శత్రువులమైయుండగా ప్రభువు మనలను ప్రేమించారు. క్షమించారు. ఆయన కృపతో విమోచించారు. ప్రభువా అని పిలిచే యోగ్యతకూడాలేని మనకు తండ్రీ అని పిలిచే యోగ్యతనిచ్చింది ఆయన కృప.
ముగింపు
—————-
ప్రభువు యొక్క మేళ్లను అనుభవిస్తూనే ఆయనను విశ్వసించలేని జీవితాలు జీవిస్తున్నామా? ప్రభువును ప్రేమిస్తున్నానని చెప్పుకొంటూనే, ఆయన వాక్యమునకు విధేయత జూపని జీవితాలను జీవిస్తున్నామా? ఆయన కృపవలననే జీవిస్తున్నామని గ్రహింపులేక, ఆ నిత్యమైన కృపను నిర్లక్ష్యము చేసేవారముగా మనమున్నామా? సరిచేసుకొని, సరిచూచుకుందాం! ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( పదునాలుగవ భాగము)——————————————
*అర షెకెలు పన్ను*
——————-
వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని యడుగగా చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునుపే యేసు ఆ సంగతియెత్తి , సీమోనూ నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా, అన్యుల యొద్దనా? అని అడిగెను. అతడు అన్యులయొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండు నట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచిన యెడల ఒక షెకెలు దొరుకును. దానిని తీసికొని నా కొరకును, నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను.
మత్తయి 17: 24-27
Note: ఇశ్రాయేలు దేశములోని కరెన్సీ పేరు “షెకెలు”
*హృదయ రహస్యాలు యెరిగిన ప్రభువు *
—————————————
1. పన్ను వసూలుచేసేవారు ఇంటిబడయట పేతురుతో మాట్లాడారు. పేతురు ఇంటిలోనికివచ్చి మాటలాడకమునుపే ప్రభువు ఆ సంగతి యెత్తి మాట్లాడారు. పేతురు మాట్లాడకముందే అతడు ఏమి మాట్లాడబోవుచున్నాడో ముందుగానే ప్రభువు ఎరిగియున్నారు. ఆయనకు మన హృదయ రహస్యాలు తెలుసు. అందుకే దావీదు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.
కీర్తనలు 139: 1-4
2. కేవలం మనుష్యుల హృదయ రహస్యాలను గురించి మాత్రమే కాదు. సముద్రంలో కోటానుకోట్ల చేపలుంటాయి. వాటిలో ఏ చేప నోటిలో షెకెలు వుందోకూడా ప్రభువుకు తెలుసు.
3. సృష్టియావత్తూ ఆయన ఆజ్ఞకు లోబడే జీవించాలి. పేతురు గాలం వేసినప్పుడు ఏ చేప నోటిలో అయితే, షెకెలు వుందో, ఆ చేపమాత్రమే మొదటిగా పట్టబడాలి.
*విశ్వసించిన పేతురు*
————————-
గాలం వేయగా వచ్చిన మొదటి చేప నోటిలో షెకెలు ఉంటుందని ప్రభువు చెబితే, మనమైతే ఎన్ని ప్రశ్నలడిగే వాళ్ళమో కదా? పేతురు వెంటనే ప్రశ్నించాలి కదా? ప్రభువా నా వృత్తి చేపల వేట. ఎన్నో సంవత్సరాలు వేటాడాను. ఎన్నో చేపలు పట్టాను. కానీ, ఏ ఒక్క చేపనోటిలో కూడా ఒక నాణెంను నేను చూడలేదు. నీవేంటి ఇట్లా చెబుతున్నావు? కానీ, ఇట్లాంటి ప్రశ్నలేవీ లేవు. గాలము తీసుకొని సముద్రానికి పరిగెత్తాడు. గాలం వేయగా మొదటి చేప నోటిని తెరచి చూస్తే, అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ చేప నోట్లో షెకెలు వుంది. ప్రభువును స్తుతించకుండా ఎట్లా వుండగలడు? విశ్వసిస్తే చాలదు. విధేయత చూపాలి. క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనబరచలేము (యాకోబు 2:18) పేతురు విశ్వసించాడు, విధేయత చూపాడు. ప్రతిఫలంగా అద్భుతాన్ని చూడగలిగాడు.
*పేతురు విశ్వసించి, విధేయత చూపడం వలన అతనికి కలిగిన ప్రయోజనం ఏమిటి ?*
—————————————
మనము ప్రభువు పనిచేస్తే, మన పనులు ఆగిపోతాయి అనుకొంటూవుంటాము. కానీ, అదెన్నటికి వాస్తవం కాదు. మనము ప్రభువు పనిచేస్తే, ఆయన మన పని చేస్తారు అనేది ముమ్మాటికీ వాస్తవం. పేతురు ప్రభువు చెప్పిన పని చేయడంద్వారా పేతురు కట్టాల్సిన అర షెకెలు పన్ను కూడా ప్రభువే కట్టారు. ( ప్రభువు కొరకు “అర షెకెలు”, పేతురు కొరకు “అర షెకెలు” మొత్తము “షెకెలు”) ప్రభువుకు లోబడితే, క్రీస్తుయేసునందు మహిమలో మన ప్రతీ అవసరం తీర్చబడుతుంది. సందేహం లేనేలేదు.
Note: యేసు ప్రభువు దేవుడు గనుక ఆయన పన్ను చెల్లించాల్సిన పనిలేదు. అయినప్పటికీ వారికి అభ్యంతరం కలుగజేయకుండేలా పన్ను చెల్లించారు. చాలా మంది హక్కులకోసం పోరాడుతుంటారు. విశ్వాసులమైన మనం ఇతరులకు అభ్యంతరం కలుగజేయకుండేలా మన హక్కులను త్యాగం చెయ్యాల్సిన పరిస్థితులేర్పడితే, త్యాగం చెయ్యడానికే సిద్ధపడాలి.
*ముగింపు*
—————
*ప్రభువు సృష్టికర్తయైన దేవుడు: *
సమస్తమును ఆయన మూలముగా కలిగెను... లోక మాయన మూలముగా కలిగెను (యోహాను 1:2,10) ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.(కొలస్సి 1:15-17) దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది; (కొలస్సి 2:9)
*తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించేవాడు. *
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను. (హెబ్రీ 1:3,4) అట్టి ప్రభువును విశ్వసించి, విధేయత చూపగలిగితే, నిత్యమైన ఆశీర్వాదపు పంటను కోయగలము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( పదిహేనవ భాగము)—-—————————————
*కుష్ఠరోగి శుద్ధియగుట*
————————
ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధియాయెను. అప్పుడు యేసు ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను.
మత్తయి 8:1-4
*ఆత్మీయ పాఠములు:*
▫————————-
1. *కుష్ఠరోగి, ప్రభువును వెంబడించే వారిలో వున్నాడు*
బహు జన సమూహములు ప్రభువును వెంబడిస్తున్నారు. వారిలో స్వస్థత పొందిన కుష్ఠిరోగి కూడా వున్నాడు. అతని జీవితంలో అద్భుతాన్ని చూడగలిగాడు అంటే, దానికి కారణం ప్రభువును వెంబడించే వారిలో వున్నాడు. మనమే గుంపులో వున్నాము? ప్రభువు నామమును అవమానపరిచే గుంపులోనా? లేక ప్రభువు నామమునకు మహిమను తెచ్చే గుంపులోనా? ఒకవేళ ప్రభువును వెంబడిస్తూ వుంటే, దేనికొరకు వెంబడిస్తున్నాము? కేవలం భౌతికమైన ఆశీర్వాదాలు పొందుటకొరకేనా? లేక ఆత్మీయ కుష్టు యైన పాపరోగమునుండి విడిపించబడడానికా? మనలను మనమే స్వపరిశీలన చేసుకోగలగాలి.
2. *ప్రభువు దగ్గరకు వచ్చాడు.*
క్రైస్తవులు అని చెప్పుకొంటున్నాము. కానీ, మన హృదయం మాత్రం క్రీస్తుకు దూరంగానే ఉంటుంది. క్రీస్తుకు దగ్గరగా రాకుండా, ఆయన సమరూపంలోనికి మార్చబడకుండా నిజ క్రైస్తవులము కాలేము. అంటే, నామకార్ధ క్రైస్తవులముగానే జీవితాన్ని చాలించాల్సి వస్తుందేమో? అది అత్యంత భయంకరం. నేటికిని ప్రభువు పిలుస్తూనే వున్నారు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. (మత్తయి 11:28) ప్రభువు దగ్గరకు రాగలిగితే, అద్భుతాన్ని అనుభవించగలవు. నిత్యమైన ఆశీర్వాదాన్ని పొందగలవు.
3. *ప్రభువును ఆరాధించాడు.*
ఒక వ్యక్తి ప్రభువును ఎప్పుడు ఆరాధించగలడంటే? ఆయన ఏమై యున్నాడో అర్ధం చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఆరాధించగలడు. మనుష్యులు గాని, దేవదూతలుగాని ఆరాధనకు యోగ్యులు కారు. ప్రభువే ఆరాధనీయుడు. అంటే, ఈ కుష్టు రోగి యేసుక్రీస్తును ప్రభువుగా అర్ధం చేసుకోగలిగాడు. తనకు కలిగిన వ్యాధిని ఆయనతప్ప ఇంకెవ్వరూ స్వస్థపరచలేరనికూడా గ్రహించగలిగాడు. అందుకే ప్రభువుకు మ్రొక్కుతున్నాడు. ఇట్టి అనుభవాలు మన జీవితంలో లేవంటే, ఆయన ఏమైయున్నాడో నేటికీ మనకు అర్ధం కాలేదేమో? అర్ధం కాకపొతే ఆరాధించలేము. ఆరాధించలేకపోతే, నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవించలేము.
4. *ప్రభువును ప్రార్ధించాడు.*
ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగాచెయ్యి. అతని ప్రార్ధనను అర్ధం చేసుకోగలిగితే, నీకు యిష్టమైతే నన్ను స్వస్థపరచు. లేదు, నేను యిట్లా వుండడమే నీకిష్టమైతే, ఇట్లానే వుండనివ్వు. నీ చిత్తమే నా జీవితంలో జరగనివ్వు. తన ప్రార్ధనలో తననుతాను దేవునికి అప్పగించుకొంటున్నాడు. యేసుప్రభువు గెత్సేమనే వనములో కూడా ఇట్లాంటి ప్రార్ధనే చేశారు. తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. (లూకా 22:43) దేవుని చిత్తానికి అప్పగించి చేసే ప్రార్ధనే, సరియైన ప్రార్ధన. అది సత్వరమైన సమాధానాన్ని, నిత్యమైన ఆశీర్వాదాలను తీసుకొచ్చేప్రార్ధన.
అయితే, మన ప్రార్థనలకు సమాధానం రావడంలేదంటే, ప్రార్ధించే మనలో లోపముందో? లేక మనము చేసే ప్రార్ధనలో లోపముందో? సరిచేసుకొని ప్రార్ధించగలిగితే, ప్రార్ధనా ఫలాలు తప్పక అనుభవించగలము.
5. *స్వస్థత పొందాడు*
తన జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే, ఆయన స్వస్థపరచకుండా ఎట్లా వుండగలరు?కొన్ని సందర్భాలలో ఇదే నాకు కావాలని పట్టుబడితే, ప్రభువు దానిని మనకు అనుగ్రహిస్తారు. అదే, ఆయన చిత్తానికి అప్పగిస్తే, మనము కోరుకున్నదానికంటే, శ్రేష్ఠమైనదానిని ప్రభువు మనకు అనుగ్రహిస్తారు. చెయ్యి చాపి వాని ముట్టినాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధియాయెను.
6. *ముగింపు *
————-
ప్రభువును వెంబడించే గుంపులో మనమున్నామా? అట్టివారితోనేనా మన సహవాసం? సంవత్సరాల తరబడి క్రైస్తవులముగానే పిలువబడుతున్నప్పటికీ, ప్రభువు దగ్గరకు వచ్చిన అనుభవంగాని, హృదయంలో ఆయనను చేర్చుకున్న అనుభవంగాని మనకుందా? ఆయన ఏమైయున్నాడో అర్ధం చేసుకొని, ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించే అనుభవాలు మనకున్నాయా? ప్రార్ధనలో మన చిత్తమే నెరవేర్చుకోవడానికే పట్టుబడుతున్నామా? లేక ఆయన చిత్తానికే మన జీవితాలను అప్పగించి ప్రార్ధించగలుగుతున్నామా? మన ఆత్మీయ జీవితం ఏరీతిగా కొనసాగుతుందో, స్వపరిశీలన చేసుకొని సరిచేసుకోగలిగితే, జీవితం ధన్యమవుతుంది.
అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( పదహారవ భాగము)—-—————————————
*దయ్యం పట్టిన చిన్నవానిని విడిపించుట *
🔲◼◾————————
జనసమూహములో ఒకడుబోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని; అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్చిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా వారాయనయొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడ గానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడాయన ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు బాల్యమునుండియే; అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రినమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతటవాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులువాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులుమే మెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి. అందుకాయన ప్రార్థనవలననేగాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను
మార్కు 9 : 17-29
*అపవాది లేదా సాతాను దేవునిచేతనే సృష్టించబడ్డాడా? *
—————————————
పరలోకంలో వుండే ప్రధాన దూతలలో లూసిఫర్ ఒకడు. ( లూసిఫర్ అనేపేరు తెలుగు బైబిల్ లో లేదు గాని, ఇంగ్లీషు బైబిల్ (kjv) యెషయా 14:12 లో వుంది.) దేవుడు అతనిని అధికముగా హెచ్చించాడు. తద్వారా గర్వముతో నిండుకొని తానే దేవునిగా ఆరాధించబడాలి అనుకున్నాడు. అనేకమంది దేవదూతలు తనవైపుకు త్రిప్పుకొని, దేవునిమీద తిరుగుబాటు చేసి, వాడు, వానియొక్క అనుచరగణం భూమిమీదకు త్రోసివేయబడ్డారు. అప్పటినుండి వాడు సాతాను, అపవాది వంటి పేర్లతో పిలువబడుతున్నాడు. దేవుడు మంచి ఉద్దేశ్యముతో అతనిని సృష్టించారు. అపవాదిలా వుండడంకోసం సృష్టించలేదు. కానీ, భ్రష్టుడయ్యాడు.
దయ్యలుము లేదా అపవిత్రాత్మలు ఎవరు?
————————————
లూసిఫర్ తో పాటుగా వాడియొక్క అనుచరగణమంతా భూమిమీదకు త్రోసివేయబడ్డారు. వారినే దయ్యములు, లేదా అపవిత్రాత్మలు లేదా దురాత్మలు వంటి పేర్లతో పిలుస్తున్నాము.
*మరణించినవారు దయ్యములు లేదా అపవిత్రాత్మలుగా మారతారా? *
—————————————-
అట్లా జరుగదు. పరిశుద్ధ జీవితం జీవించినవారు పరదైసులోనూ, భ్రష్టమైన జీవితం జీవించినవారు పాతాళంలోనూ తీర్పుకొరకు వేచివుంటారు. అంతేతప్ప, వారెవ్వరూ దయ్యాలుగా మారరు. కొన్ని సందర్భాలలో దయ్యం పట్టుకున్నవారు మరణించినవారి పేర్లు చెప్తూ వుంటారు. నిజానికి వారి ఆత్మలు కాదు. ఈ దురాత్మల సమూహమే వారిలా భ్రమింపజేసే ప్రయత్నం చేస్తుంటాయి. తీర్పువరకు ఈ దురాత్మల సమూహము మరణించదు. క్రొత్తవి పుట్టవు. దయచేసి అపార్థము చేసుకొని, చనిపోయినవారి కుటుంబము మీద కక్ష సాధించే ప్రయత్నం ఎంతమాత్రమూ చెయ్యొద్దు.
*మూగ దయ్యాలు, కుంటి దయ్యాలు, గ్రుడ్డి దయ్యాలు ఉంటాయా? *
—————————————
అట్లా ఏమి వుండవు. దయ్యము ఒక వ్యక్తిని మాట్లాడకుండా, తన ఆధీనంలోకి తీసుకొంటే, వానికి మూగ దయ్యం పట్టింది అంటాము.
*దయ్యానికి, దేవునికి ఉన్న వ్యత్యాసమేమిటి? *
—————————————
జీవించియున్న మనిషిని, మరణానికి అప్పగించేది దయ్యం. మరణానికి దగ్గరవుతున్న మనిషిని, విడిపించి జీవింపజేసేవారు దేవుడు.
*దయ్యములపై దేవునిదే సంపూర్ణమైన ఆధిపత్యము:*
————————————
మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. సేన అనే దయ్యం పట్టినవాడు కూడా, వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ప్రభువును చూస్తే దయ్యాలు సహితం వణుకుతాయి. కానీ, సృష్టిలోనే అత్యున్నతమైన సృష్టముగా సృష్టించబడిన మనము మాత్రం, ఆయనకే ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నాము. ప్రభువును స్తుతించకుండా, ప్రభువును గురించి మాట్లాడకుండా, ప్రార్ధించకుండా ఏ మూగదయ్యము మనలను బంధించిందో? మనకు మనముగా విడుదల పొందలేముగాని, మన జీవితాలను ప్రభువుకు అప్పగించినప్పుడు మాత్రమే సాధ్యం.
*రోగాలమీద సంపూర్ణమైన అధికారం: *
—————————————
మాట్లాడలేకపోయేవాడు, నుగురుకార్చుకొని, పండ్లుకొరుకుతూ మూర్ఛిలిపోయేవాడు. ఇప్పుడు వాటన్నిటినుండి సంపూర్ణమైన విడుదల ప్రభువు అనుగ్రహించారు. విశ్వసించగలిగితే, అది శారీరిక రోగమైనా, ఆత్మీయరోగమైనా, ఏదైనాసరే విడుదలపొందగలము.
*ముగింపు*
—————
ఎట్లాంటి అంధకార శక్తులతో పీడింపబడుతున్నప్పటికీ, ప్రార్ధన ద్వారా మాత్రమే విడుదల సాధ్యమని ప్రభువు చెప్పారు. అయితే, ప్రార్థనకు మనమిచ్చే ప్రాధాన్యత ఎంత? “పాపము ప్రార్ధన చెయ్యకుండా ఆపుతుంది. ప్రార్ధన పాపము చెయ్యకుండా ఆపుతుందని” జాన్ బన్యన్ అనే దైవజనుడు తెలియజేసారు. అవును! ప్రార్ధించలేకపోతున్నామంటే, పాపములో నిలచియున్నట్లే. ప్రార్ధిద్దాం! విడిపించబడదాం! సాగిపోదాం ప్రభువుతో! ఆగిపోకుండా అంతమువరకు! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( పదిహేడవ భాగము)—-—————————————
*ఊచ చెయ్యిగలవానిని స్వస్థపరచుట *
🔲◼———————————
ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి గలవాడొకడు కనబడెను. వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి. అందుకాయనమీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా? గొఱ్ఱకంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యు నితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను.
మత్తయి 12:9-13
*శాస్త్రుల, పరిసయ్యుల వైఖరి*
———————————
పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని అక్షరార్ధముగానే అర్ధముచేసుకోగలిగారు తప్ప, దానిలోని ఆత్మీయతను అర్ధం చేసుకోలేకపోయారు. ధర్మశాస్త్రాన్ని కలిపి, చెరిపి వారి స్వంత భాష్యాన్ని చెప్పేవారు. ఒక వ్యక్తి బాగుపడడం కంటే, విశ్రాంతి దినాన్ని ఆచరించడమే వారికి ప్రాముఖ్యమైన అంశముగా వుండేది. అందుచే ప్రభువు వారినిగూర్చి ఈరీతిగా మాట్లాడారు. అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను. శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు. గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యముకాని భారమైన బరువులుకట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు. (మత్తయి 23:1-4)
ధర్మశాస్త్రానికి శాస్త్రులు, పరిసయ్యులు, మనుష్యులు కల్పించిన పద్దతులను కలిపి వాటిని దైవోపదేశాలుగా బోధించేవారు. అందుచే ప్రభువు వారిని ఈరీతిగా ప్రశ్నించారు. అందుకాయన మీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్ర మించుచున్నారు? మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.(మత్తయి 15:3,6) పరిసయ్యులు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా? అని ఆయనను ప్రశ్నించారు. యూదుల ఆచారము ప్రకారం (ప్రాణాపాయస్థితి అయితే తప్ప) అది తప్పుగానే పరిగణించబడేది. వాస్తవానికి ఇతరులకు సహాయం చెయ్యడం, మేలు చెయ్యడం తప్పేమి కాదు. మేలు చెయ్యడం ఎప్పుడూ వాక్యానుసారమే.
నేటికిని విశ్రాంతి దినాన్ని ఆచరించాలని, శనివారం మాత్రమే ఆరాధించాలని ప్రకటించేవారు కోకొల్లలు. యేసు ప్రభువు సిలువవేయబడక ముందు సున్నతి, బలి అర్పణ, విశ్రాంతి దినాచారము ఇవన్నీ అవసరమై యుండేవి. సిలువమరణం ద్వారా ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా, ఇక ధర్మశాస్త్రక్రియలు నెరవేర్చనవసరం లేదు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయ వచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. (మత్తయి 5:17,18) అంటే, ధర్మశాస్త్రమంతా నెరవేరిన తరువాత తప్పిపోతుందని అర్ధం. ప్రభువు సిలువ మరణం ద్వారా ధర్మశాస్త్రమంతా సంపూర్తిగా నెరవేర్చబడింది. తద్వారా ధర్మశాస్త్రమునుండి విడుదలపొంది, కృపలోనికి ప్రవేశించాము. ధర్మశాస్త్రమును మూడు భాగాలుగా విభజింపవచ్చు 1. ఆచారబద్ధమైన ధర్మశాస్త్రము, 2. సాంఘక ధర్మశాస్త్రము, 3. నైతిక ధర్మ శాస్త్రము. ఈ మూడింటిలో “నైతిక ధర్మశాస్త్రము” అన్నియుగాలకు వర్తిస్తుంది గనుక, వాటిని గైకొనవలసిందే.
*ఊచ చెయ్యిగలవానికి స్వస్థత*
————————————
సమాజ మందిరంలో ఊచ చెయ్యిగలవానిని ప్రభువు చూచారు. ఆ చేతితో అతడేమి చెయ్యలేడు. కృపగలిగిన ప్రభువు అతనిమీద కనికరపడ్డాడు. అతడు అడగకుండానే అతనిని స్వస్థపరిచారు. మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును. (యాకోబు 4 : 17) అది విశ్రాంతి దినమైనాసరే, ఆయన స్వస్థపరచ గలిగియుండియూ, స్వస్థపరచకపోతే దోషము. అందుకే ప్రభువు అతనిని స్వస్థపరచలేకుండా వుండలేకపోయారు. కనీసం ఆ అద్భుతాన్ని చూచైనా ఆయనయొక్క శక్తిని గ్రహించలేకపోయారు. వారి హృదయాన్ని కాఠిన్యంచేసుకొని, ఆయనను శిక్షించడానికి అవకాశం కోసం ఎదురుచూచారు. మన జీవితాలుకూడా వీరికంటే గొప్పగా ఏమీలేవు. ఆయన మేళ్లను అనుభవిస్తూనే, హృదయ కాఠిన్యముతో మార్పునొందని జీవితాలు జీవిస్తున్నాము. అవి మన జీవితాలకు శ్రేయస్కరము కాదు. సరిచేసుకుందాం! ఆయన పాదాలచెంత ప్రణమిల్లుదాం! ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( పద్దెనిమిదవ భాగము)—-—————————————
*విధవరాలి కుమారుని బ్రతికించుట *
▫————————————-
ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లు చుండగా, ఆయన శిష్యులును బహు జనసమూహమును ఆయనతో కూడ వెళ్లుచుండిరి. ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరు భయాక్రాంతులైమనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి. ఆయనను గూర్చిన యీ సమాచారము యూదయ యందంత టను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను.
లూకా 7:11-17
*ప్రభువుకు గల మితిలేని కనికరం*:
—————————————
ఆమె విధవరాలు. ఒక్కడే కుమారుడు. భర్తలేడు, తన అవసాన దశలో తన బాగోగులు చూస్తాడనుకొనే కుమారుడేమో చనిపోయాడు. ఆమె బాధ వర్ణనాతీతం, శవం వెంట వెళ్తూ రోదిస్తూవుంది. ఏ ఒక్కరూ కూడా ఆమెకు ఆదరణను కలిగించలేరు. అట్లాంటి పరిస్థితుల్లో ఆమె హృదయ భారాన్ని యెరిగిన ప్రభువు తట్టుకోలేకపోయారు.
అవును! మన ప్రభువు కనికర సంపన్నుడు. లాజరు చనిపోయిన సందర్భములో కన్నీళ్లు విడిచారు. యేసు కన్నీళ్లు విడిచెను (యోహాను 11:35) యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను (యోహాను 11:38) ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి (మత్తయి 9:36) ఆ గొప్ప సమూహ మును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను (మత్తయి 14:14) యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను ( మత్తయి 15:32) అదేరీతిగా విధవరాలి స్థితిని యెరిగిన ప్రభువు, ఆమెమీద కనికరపడ్డారు. ఈలోకంలో ఎవ్వరికి సాధ్యంకాని ఒక అద్భుతాన్ని ఆమె జీవితంలో ప్రభువు జరిగించారు. ఆమె దుఃఖం, ఆనందముగాను, ఆమె కన్నీరు, నాట్యముగాను మార్చబడింది.
నేటి దినాన్న నీవు ఏ స్థితిలోనున్నప్పటికీ, అది కరువైనా, ఖడ్గమైనా, వేదనైనా, దుఃఖమైనా మరేదైనా సరే, ప్రభువును నీవు కలుసుకోగలిగితే నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి. చెప్పలేనంత సమాధానంతో నీ హృదయం నింపబడుతుంది. క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతీ అవసరం తీర్చబడుతుంది.
*ప్రభువుకు మరణం మీద సంపూర్ణమైన అధికారముంది*
———————————-
ఈలోకంలో ఎన్ని అర్హతలున్నప్పటికీ, పుట్టిన ప్రతీమనిషి మరణానికి తలవంచాల్సిందే. మనిషి యొక్క ప్రాణం తన స్వాధీనంలో లేదు. అందుకే చిన్న వయస్సులోనే ప్రపంచాన్ని జయించిన *అలెగ్జాన్డర్ ది గ్రేట్* తాను మరణ పడకమీదనున్నప్పుడు, తాను మరణించిన తర్వాత, తన శవపేటికను తనకు వైద్యం చేసిన వైద్యులే మోయాలని చెప్పాడట. తద్వారా ప్రపంచానికి ఒక పాఠాన్ని తెలియజేశాడు. వైద్యులు వైద్యం చేయగలరు తప్ప, ప్రాణం పోకుండా ఆపడం వీరి చేతుల్లోలేదని. అవును! అయితే, ప్రభువుకు మరణం మీద పూర్తి అధికారముంది. ఈలోకంలో ప్రభువు శరీరధారిగానున్నప్పుడు ఒక్క సమాధి కార్యక్రమానికి కూడా ఆయన హాజరైనట్లు చూడము. ఆయన వుంటే. మరణానికి తావేలేదు. ఆయన లాజరు సమాధి దగ్గరకు వెళ్తే, లాజరు జీవంతో బయటకు వచ్చాడు. అదే విధంగా, మరణించిన వ్యక్తి శవాన్ని పూడ్చి పెట్టడానికి తీసుకెళ్తున్న సమయంలో, ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను.
అవును! మరణం మీద ప్రభువుకు సంపూర్ణమైన అధికారముంది. మరణించినవారిని ప్రభువు లేపారు. సమాజమందిరపు అధికారియొక్క కుమార్తెను బ్రతికించారు ( లూకా 8: 53-55 ) చనిపోయి సమాధి చేయబడిన లాజరును కూడా బ్రతికించారు (యోహాను 11: 43,44 )
అంతేకాదు, ఆయనే మృతులలోనుండి సజీవునిగా లేచారు. మరణించినప్పటికీ మనలనూ ఒక దినాన్న లేపబోతున్నారు.
ముగింపు
————-
పరిశుద్ధతా, నీతి ఏ కోశానా లేని మనలను, ఈ క్షణం వరకూ జీవింపజేయగలిగింది ఆయన కృపాకనికరములే, మనము ప్రార్ధించుకున్ననూ, మన అవసరతలు యెరిగియున్న ప్రభువు తగినకాలమందు సమకూర్చుతున్నారంటే, అది కేవలం ఆయన విస్తారమైన కృపా కనికరములే. ఆయనకు మరణము మీద పూర్తి అధికారమున్నప్పటికీ, నేటికిని మనము నిర్మూలము కాకుండా వున్నామంటే, ఆయన అత్యధికమైన కృపమాత్రమే. అయితే, ఎంత కాలం ఆయన కృపను నిర్లక్ష్యం చేద్దాం? ఆయన కృప ఉగ్రతగా మారితే తట్టుకోవడం సాధ్యం కానేకాదు. నాయీను ఊరి ప్రజలు, ఆయనను స్తుతించి, మహిమపరిచినట్లుగా, మనమునూ ఆయన నామమును స్తుతించి, మహిమపరచుటకు మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( పంతొమ్మిదవ భాగము)—-—————————————
*గ్రుడ్డివారి కన్నులు తెరువబడుట*
————————————-
యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలువేసిరి. ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను.
మత్తయి 9:27-29
*1. ప్రభువును వెంబడించారు *
ఆ ఊరిలో చాలామంది గ్రుడ్డివారు వుండొచ్చు. కానీ, స్వస్థత పొందింది మాత్రం ప్రభువును వెంబడించినవారే. మొదట ప్రభువు వారికి సమాధానమివ్వనప్పటికీ, ఆయన ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు, అక్కడకి కూడా వెళ్లారు. చాలా మంది మొండిగా వాదిస్తూవుంటారు అందరి మీదా వర్షం పడుతుంది. ఎండకాస్తుంది కదా? అని. ఆయన కృపచొప్పున నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షం పడడం వాస్తవమే అయినప్పటికీ, నిత్యమైన ఆశీర్వాదపు జల్లులు మాత్రం, ఆయనను వెంబడించే వారిమీదనే వర్షిస్తాయి. భౌతికమైన ఆశీర్వాదాలకొరకు మాత్రమే కాదుగాని, ఆయన ఏమైయున్నాడో అర్ధం చేసుకొని వెంబడించాలి.
*2. ఏకీభవించి ప్రార్ధించారు*
ఆయనను వెంబడించడం ద్వారా, ఆయన ఏమైయున్నాడో వీరికి పూర్తిగా అర్ధమయినట్లుంది. ఆయన దావీదు కుమారుడని, వారి బలహీనతలనుండి విడిపించగల సమర్ధుడు ఆయన మాత్రమేనని వారికర్ధమయ్యింది. అందుకే ప్రభువును ప్రార్థిస్తున్నారు. మమ్ములను కనికరించుమని బ్రతిమాలాడుతున్నారు.
మీలో ఇద్దరు తాము వేడుకొను
దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. (మత్తయి 18:19)
మనుష్యలు ఎంతమంది అయినా కావొచ్చు. మనసు మాత్రం ఒక్కటే కావాలి. సంఘ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇతర సమస్యలు ప్రార్ధించ వలసివచ్చినప్పుడు, ఏకీభవించు చేయు ప్రార్ధన ద్వారా ఊహించని సమయంలో, పరలోకమందున్న దేవుని వలన జవాబు దొరుకుతుంది.
దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒకరు ప్రార్ధిస్తూవుంటే కొందరు ఏకీభవించరు, ప్రక్కవారిని ఏకీభవించనివ్వరు. ప్రార్ధన ముగించాక మాత్రం అందరూ ఆమెన్ అంటారు. ఆమెన్ అంటే? 'అట్లా జరుగును గాక' అని అర్ధం. ఎట్లా జరుగును గాక? అసలు ఏమి ప్రార్ధించారో మనము వింటే కదా తెలియడానికి. ఆమెన్ అనడం అలవాటయ్యింది. ప్రార్ధన కూడా అలవాటుగానే చేస్తున్నాముతప్ప, హృదయపూర్వకంగా చెయ్యలేకపోతున్నాము. అందుకే పొందుకోలేకపోతున్నాము
దక్షిణ కొరియాలో "పాల్ యాంగి చొ" అనే దేవుని సేవకుడు ముగ్గిరితో కలసి ఏకీభవిస్తూ ప్రార్ధిస్తూ సంఘమును ప్రారంభించారు. నేటికి అది ప్రపంచములోనే అతి పెద్ద సంఘం అయ్యింది. ప్రతీ ఆదివారము ఇరవై ఐదు లక్షల మంది ఆ సంఘములో దేవునిని ఆరాధిస్తున్నారు. ఏకీభవించి ప్రార్ధించ గలిగితే విప్లవాత్మకమైన విజయాలు సాధించగలము. మన కుటుంబాలుగాని, సంఘాలు గాని, అభివృద్ధి చెందాలంటే? ఏకీభవించి ప్రార్ధించే అనుభవం మన జీవితంలో తప్పక వుండాలి.
*3. విశ్వసించారు *
యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు. ప్రభువు ఇక్కడ వారి విశ్వాసాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే, ప్రభువు చేసిన అద్భుతకార్యాలు వీరెన్నడూ చూడలేదు. చూడడానికి వీరు గ్రుడ్డివారు. అయినప్పటికీ, ప్రభువు చేసిన కార్యాలను చూడలేకపోయినప్పటికీ, ప్రభువు శక్తిని మాత్రం విశ్వసించగలిగారు. కానీ, మన జీవితాలు వీరికి భిన్నముగానున్నాయి. పైకి భక్తి గలవారముగా నుండి, ఆయన శక్తిని ఆశ్రయించలేని జీవితాలను జీవిస్తున్నాము.
విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. (హెబ్రీ 11:6) మన ప్రార్ధన కూడా “ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు. (యాకోబు 1:6-8)
మన విశ్వాస జీవితం ఈరీతిగానే వుందేమో? అందుకే ప్రభువునుడి ఏమి పొందుకోలేకపోతున్నాము.
*4. పొందుకున్నారు *
అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను. వారి విశ్వాసమే వారు స్వస్థపడడానికి కారణమయ్యింది. జీవితంలో వారనుభవించిన గాఢాంధకారమంతా ఒక్క క్షణంలో వెలుగుతో నింపబడింది. నూతనమైన జీవితం ప్రారంభించడానికి వారి విశ్వాసమే కారణమయ్యింది.
ప్రభువును వెంబడిస్తే ఆయన ఏమై యున్నాడో అర్ధమవుతుంది. అది మన జీవితాల్లో విశ్వాసాన్ని నింపుతుంది. ఆయనను అర్ధంచేసుకుని విశ్వాసంతో ప్రార్ధిస్తే, ప్రార్ధనా ఫలాలు మన స్వంతమవుతాయి. ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( ఇరువదియవ భాగము)—-—————————————
యేసు నీళ్ల మీద నడచుట,
పేతురును నడిపించుట
———————————
వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాల మైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్ట బడుచుండెను. రాత్రి నాలుగవ జామున ఆయన సము ద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను. ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. వెంటనే యేసుధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురుప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.
మత్తయి 14: 22-33
*మనిషి నీటిమీద నడవడం సాధ్యమా? *
—————————————
రక్త మాంసములు గల మనుష్యులు నీటి మీద నడవడం సాధ్యం కాదు. గురుత్వాకర్షణ ప్రభావం వలన, మానవ శరీరం నీటిమీద నడవడానికి సహకరించదు. నేటి దినాలలో నీటి మీద నడిచేవారిని యూట్యూబ్ లో చూస్తున్నాము. వారు నీటి ఉపరితలానికి కొన్ని సెంటీ మీటర్ల లోపల పారదర్శకమైన గ్లాస్ ను అమర్చుతారు. దాని మీద నడుస్తూ వుంటే? మనకు నీటి మీద నడచినట్లు అనిపిస్తుంది. అట్లా అయితే, ప్రభువు దేవుడు కాబట్టి నీటిమీద నడిచారు. పేతురు నీటిమీద నడవడం ఎట్లా సాధ్యమయ్యింది? ఆయన మనంతట మనము చెయ్యలేని పనులను మన చేత చేయించ గలరు. మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది. (2 కొరింధీ 3:5) పేతురుకు నీటిమీద నడవగలిగే సామర్ధ్యము ప్రభువువలననే కలిగింది.
*అలలచేత కొట్టబడిన దోనె:*
——————————-
ప్రభువు మాట చొప్పుననే శిష్యులు బయలుదేరి వెళ్లినప్పటికీ, సముద్రములో తుఫాను చెలరేగింది. వారి దోనె అలలచేత కొట్టబడింది. ప్రభువు మాట చొప్పున వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, శోధనలు, శ్రమలు మనలను వెంటాడుతూనే ఉంటాయి. అయితే, ఆ శ్రమలలో సహితం సమాధానముంటుంది. షడ్రకు, మేషేక్, అబేద్నగో, దానియేలు వీరంతా దేవుని మాటకు లోబడి జీవించేవారే. అయినప్పటికీ వారికి శ్రమలు రాకుండా పోలేదు. శ్రమలు వచ్చినప్పటికీ శ్రమలలో ప్రభువు వారికి తోడైయున్నారు. వాటినుండి వారికి విడిపించి, గొప్పచేసారు. వాక్యానుసారంగా జీవిస్తున్నప్పటికీ నాకీ శ్రమలెందుకు అని కృంగిపోతున్నావేమో? ప్రభువు నీతోనున్నారనే విషయం మాత్రం విస్మరించొద్దు. తగినకాలమందు తప్పక విడిపిస్తారు. లోకంలోనున్నవారికంటే, లోకం నుండి ప్రత్యేకించబడినవారికే శ్రమలెక్కువ.
*శోధన సమయంలో ప్రత్యక్షమైన ప్రభువు*
—————————————
అది నాలుగవ జాము. అంటే? తెల్లవారు జాము 3 నుండి 6 గంటల మధ్య సమయం. యేసు ప్రభువు శిష్యులు నావలో ప్రయాణిస్తున్నప్పుడు అది గాలిచేత కొట్టుకొని వెళ్ళిపోతుంది. వారిని రక్షించేవారెవ్వరూ లేరు. వారి కేకలు అరణ్య రోధన తప్ప, వారిని విడిపించేవారెవ్వరూ లేరు. అప్పటికే ప్రాణ భయంతో వణికిపోతుంటే, ఆ సమయంలో ఎవరో నీటి మీద నడచుకొంటూ వారి వైపే వస్తున్నారు. వారు భయముతో వణికిపోతూ కేకలు వేసేకొలదీ, ఆయన వారికి ఇంకా సమీపముగా వచ్చేస్తున్నాడు. రక్త మాంసములు గల మనుష్యులు నీటి మీద నడవడం సాధ్యం కాదు. అంటే? ఇక తప్పకుండా భూతమే అయ్యుండాలి. అవును! వాళ్ళు కూడా అదే నిర్ణయానికి వచ్చేసారు.
మనచుట్టూ అంధకారం అలముకున్నప్పుడు. అన్ని మార్గాలు మూసుకుపోయాయి అనుకున్నప్పుడు, మనమూహించని రీతిలో ప్రభువు ప్రత్యక్షతను తప్పక అనుభవిస్తాము. అది ఏదిశ నుండి వస్తుందో కనీసం మన ఊహలకు కూడా అందదు. తన పిల్లలను ఆదుకోవడానికి నీటిమీదనే నడచుకొంటూ వచ్చిన సందర్భమది. అది మానవాతీతమైన శక్తి. అది దేవునికి మాత్రమే సాధ్యమైన దివ్యమైన శక్తి. ఆయన దైవకుమారుడు అనుటకు ఇక ఇంతకు మించిన, రుజువు మరొకటి అవసరం లేదు
*పేతురు నీటిమీద నడచుట*
————————————
భూతము అనుకొని భయపడుతున్న శిష్యులను చూచి, “భయపడవద్దు” నేనే అని యేసు ప్రభువు చెప్పారు. పేతురు ఆ మాటకు వెంటనే ప్రతిస్పందించాడు. పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. (మత్తయి 14:28) యేసు ప్రభువు వారు రమ్మన్నప్పుడు, ఆయన మీద విశ్వాసముంచాడు. కాని అది పరిపూర్ణమైనది కాదు. అంటే? కొంచెం విశ్వాసమున్నా అసాధ్యమైన పనులు మనచేత దేవుడు చేయిస్తాడు.
పేతురు నీటి మీద నడుస్తున్నాడు కాని, ఆయన దృష్టి మాత్రం యేసయ్యమీదే వుంది. కాబట్టి యేసయ్యవలెనే నడవ గలుగుతున్నాడు. ఈ లోపు గాలి వీచడం మొదలయ్యింది. పేతురు దృష్టి గాలివైపుకు మళ్ళింది. నీటిలో మునిగిపోతూ రక్షించు ప్రభువా అంటూ కేకలు వేస్తున్నాడు.
'గాలి' లోకానికి సూచనగా వుంది. నీ దృష్టి ఆయన వైపు నిలిపి నడవ గలిగితే? నీ చుట్టూ నున్న గాలి (లోకం) నిన్నేమి చెయ్యలేవు. నీ దృష్టి లోకంవైపు మళ్లినదంటే? పాపంలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోవలసిందే. ఒకవేళ ఇప్పటికే పాపములో మునిగిపోతూ వుంటే? 'ప్రభువా నన్ను రక్షించు' అని నేడే ప్రార్ధించు. ఆయన తప్పక రక్షిస్తాడు.
మునిగిపోతున్న పేతురును ప్రభువు తన చెయ్యిచాచి లేవనెత్తారు. దోనెలో ప్రవేశించగానే, గాలి అణిగిపోయింది. సమస్యల సుడిగుండాలలోపడి తిరుగుతున్నప్పటికీ, ఆయన శరణు వేడితే, ఆయన మనలను దాటిపోయేవాడు కాదు. ప్రార్ధిద్దాం! విశ్వసిద్దాం! పొందుకుందాం!
అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( 21వ భాగము)—-—————————————
*చనిపోయి సమాధిచేయబడిన లాజరును బ్రతికించుట *
▪——————————
మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను. యేసు నీ సహో దరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను. అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.
అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా, వారు ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరుఆ గ్రుడ్డి వాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి. యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్తప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.
యోహాను 11: 1-44
*ఉపోద్ఘాతము: *
———————
బేతనియలో యేసు ప్రేమించే కుటుంబం ఒకటి ఉండేది. మరియ, మార్త, వారి సహోదరుడు లాజరు అచ్చటనుండేవారు. ఒకరోజు లాజరు రోగియై మరణించి. సమాధి చేయబడ్డాడు. నాలుగు రోజుల తర్వాత ప్రభువు వచ్చి, చనిపోయిన లాజరును బ్రతికించిన సందర్భమిది.
*మార్త: *
——————
మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. ఇంతవరకు మార్త మాటలు బానే వున్నాయిగాని, తర్వాత ప్రభువుతో సాగిన సంభాషణలో, ప్రభువుకే బోధించేటట్లు, వేదాంత ధోరణిలో ఆమె సమాధానమిస్తూ వచ్చింది. సమాధి దగ్గరకు వచ్చేసరికి, యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్తప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. తద్వారా నీవు చేస్తున్నపని వ్యర్ధమైనదనే భావన ఆమె మాటలలో ప్రతిబింబిస్తున్నాయి.
*మరియ*
——————
ప్రభువు పాదాల మీద పడింది.
మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను. ఇవే మాటలు మార్తకూడా పలికింది. కానీ, మరియ ప్రభువు పాదాల దగ్గరుంది. అంటే, దీనురాలై తన్నుతాను తగ్గించుకొంటూ ప్రభువును హెచ్చిస్తుంది. సంపూర్ణముగా ప్రభువు మీద ఆధారపడగలిగింది. అవును! ప్రభువు పాదాలచెంత ప్రణమిల్లే అనుభవాలు మన జీవితాల్లో తప్పక వుండితీరాలి.
*ప్రభువు ప్రతిస్పందన: *
—————————-
A) *ప్రభువు కన్నీళ్లు విడిచారు *
మార్త పలికిన మాటలనే, మరియ పలికినప్పటికీ, మార్త మాటలకు ప్రభువు ప్రతిస్పందించలేదుగాని, ఎప్పుడైతే మరియ ప్రభువు పాదాలమీద పడిందో, ఆమె ఏడుస్తూ వుంటే, ప్రభువు తట్టుకోలేకపోయారు. ఆత్మలో కలవరపడ్డారు. ఆయన కన్నీళ్లు విడిచారు. ఆయన సంపూర్ణ దేవుడే కాదు, సంపూర్ణ మానవుడు అని చెప్పడానికి ఇదొక రుజువు. తన బిడ్డలు ఏడుస్తూవుంటే, ఆనందించేవాడు కాదు మన ప్రభువు.
B) *లాజరు సమాధి దగ్గరకు వచ్చారు *
అంటే, మరియ ఎందుకు ఏడుస్తుందో, ఆమెకు సంభవించిన సమస్య ఏమిటో, *ఆ సమస్య దగ్గరకు ప్రభువు వచ్చారు*. ప్రభువు పాదాలమీద పడితే, ఆయన ప్రశాంతముగా కూర్చోలేరు. మన జీవితాల్లో, ప్రభువు నుండి ఏమి పొందలేకపోతున్నామంటే? ఇట్లాంటి అనుభవాలు మన జీవితాల్లో లేవేమో?
C) *సమస్యను పరిష్కరించారు *
యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.
సమాధిచేయబడి నాలుగు రోజులయ్యింది వాసన కొడుతుంది అనుకున్న శవము. ప్రభువు, తండ్రిని స్తుతించినవెంటనే నిర్జీవమైన దేహములోనికి, జీవము ప్రవేశించింది. సజీవులలో అతనిని నిలిపింది. నీకున్న సమస్యలు ఏమైనా కావొచ్చు, వాటి పరిష్కారాలు నీ ఊహలకు కూడా అందకపోవచ్చు. నీ చుట్టూనున్న పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగానే ఉండొచ్చు. నిరీక్షణాధారమంటూ లేకుండాపోవచ్చు. అయినప్పటికీ, ప్రభువుయందు నమ్మికయుంచి ఆయన పాదాలమీద పడగలిగితే? నీ ప్రతీ సమస్యకు ఒక పరిష్కారముంటుంది. నీ ప్రతీ ప్రశ్నకు ఒక సమాధానముంటుంది. అది యేసయ్యతోనే సాధ్యం. ఆయన పాదాల చెంతచేరి ప్రభువు అనుగ్రహించే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకుందాం!
ఆరీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( 22వ భాగము)—-—————————————
అంజూరపు చెట్టు ఎండిపోవుట
▪———————————
ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను.
శిష్యులదిచూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి.
అందుకు యేసుమీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పిన యెడల ఆలాగు జరుగునని. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
మత్తయి 21: 18-22
అంజూరపు చెట్టు
————————-
ఇశ్రాయేలు జాతికి సూచనగా వుంది. “అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రా యేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి”. ( హోషేయా 9:10)
అది పండ్ల కాలము కాదు
మార్కు 11:13
▫————————————
పండ్ల కాలము కానప్పుడు ప్రభువు పండ్లను ఎందుకు ఆశించారు? పండ్లకాలం కాని కాలంలో, కాయలు లేనందుకు, ఆ చెట్టును శపించడమెందుకు? అంటూ క్రీస్తు వ్యతిరేకులు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటారు. ఆయన జ్ఞానం లేనివాడు కాదు. వాక్యభాగాన్ని అర్ధం చేసుకోలేకపోయినవారే జ్ఞానం లేనివారు. దీనికి రెండు కారణాలను చెప్తాను.
1. అంజూరపు చెట్టు ఫలించే విధానం, మిగిలిన చెట్లు ఫలించే విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంజూరపు చెట్టు మొదట కాయలు కాస్తుంది. ఆ తర్వాత ఆ కాయలను రక్షిస్తూ వాటి చుట్టూ ఆకులు పెరుగుతాయి. అంజూరపు చెట్టు ఆకులతో నిండి వుంది అంటే, ఆ చెట్టునుండి కాయలను ఆశించడం తప్పులేదు. ప్రభువు చూచిన ఆ చెట్టుకూడా ఆకులతోనే నిండివుందనే విషయాన్ని విస్మరించకూడదు.
2. సువార్తలు వ్రాయబడిన బాషామూలాలు పరిశీలించగలిగితే “అది పండ్ల కాలము కాదు” అనే అర్ధము కాకుండా, “అది పండ్ల కోతకాలము కాదు” అనే అర్ధాన్నిస్తున్నాయి. ఒకవేళ అది పండ్ల కోతకాలము అయితే, ఎవరోవచ్చి కోసుకొని వెళ్లిపోయారు అనుకోవచ్చు. అయితే, ఇంతకీ ఏమి జరిగిందంటే, అది అసలు కాయలే కాయలేదు. ఫలాలు లేకుండా ఆకులతో మాత్రం పచ్చగా వుంది.
అంజూరపు చెట్టు అనబడే ఇశ్రాయేలు జాతి, “ఆకులతో” అనగా ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలతో పచ్చగా వుందిగాని, ఆత్మీయ ఫలాలు వారిజీవితాల్లో లోపించాయి. ఆత్మ ఫలాలు లేకుంటే, ఆ చెట్టువలెనే దేవుని ఉగ్రతకు గురికావలసి వస్తుందనే ఒక ఆత్మీయమైన పాఠాన్ని ఆ చెట్టు ద్వారా ప్రభువు వారికి నేర్పించారు.
మనము శారీరిక ఇశ్రాయేలీయులము కాకున్ననూ, ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మననుండి కూడా ప్రభవు ఆశించేది ఆకులను కాదు, ఆత్మీయ జీవితాలను. లేకుంటే, “మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును”. (మత్తయి 7:19) నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును. నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీ రిప్పుడు పవిత్రులై యున్నారు. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలిం పరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయ బడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును. (యోహాను 15:1-6)
ప్రభువుకు అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్తేనే గాని, ఆ చెట్టుకు ఫలములులేవని తెలియలేదా?
▫————————————
తెలుసు. అయితే, ఆ చెట్టు ద్వారా ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పించి, వారిని విశ్వాసంలో బలపరచాలనేది ప్రభువు ఉద్దేశ్యం. ఆయన ఒక మాట మాట్లాడినాగాని, లేదా ఒక క్రియచేసినాగాని వాటిలో అనేకమైన ఆత్మీయమైన మేలులు దాగివుంటాయి. అక్షరార్ధముగా వాటిని అర్ధం చేసుకుంటే, అవి మనలను ఆత్మీయ లోతుల్లోనికి నడిపించలేవు.
దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులదిచూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. అందుకు యేసుమీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పిన యెడల ఆలాగు జరుగునని. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
విశ్వాసముతో ప్రార్ధించినప్పుడు, అసాధ్యాలు సుసాధ్యమౌతాయని ప్రభువు శిష్యులను బలపరచుచున్నారు. అట్లా అని, మనము చూస్తుండగానే కొండ ఎగిరి సముద్రములో పడిపోతుంది అని తలంచకూడదుగాని,
ఒక చిన్నపాప రోజూ స్కూల్ కి వెళ్ళాలి అంటే? ఒక కొండను దాటి వెళ్లాల్సి వచ్చేది. అది తనకు చాలా కష్టం అనిపించేది. ఆ అమ్మాయి కూడా ఈ రీతిగానే విశ్వాసముతో ప్రార్ధించింది. ప్రభువా! ఈ కొండ వెళ్లి సముద్రంలో పడాలని.
కొన్ని రోజులకు అటువైపుగా ONGC వారు రోడ్ వెయ్యాలి అనుకున్నప్పుడు వారికి కొండ అడ్డుగా వుంది. దానిని వారు చదును భూమిగా మార్చేసారు. ఆ రీతిగా తన ప్రార్థనకు ప్రతి ఫలాన్ని పొందుకున్నది.
అవును! విశ్వాసముతో ప్రార్ధించినప్పుడు, ఏ దిక్కునుండి ప్రభువు సహాయం చేస్తారో మనకు తెలియదుగాని, ప్రార్ధనాఫలాన్ని మాత్రం తప్పక పొందగలము.
ముగింపు
—————-
మన ఆత్మీయ జీవితాలు ఎట్లా వున్నాయి? ఆకులకే పరిమితమా? చర్చికి వెళ్తున్నాను, కానుకలిస్తున్నాను, ఇది చాలులే అని సరిపెట్టుకొంటున్నామా? ప్రభువు ఆశించే “ఆత్మ ఫలాలు” ఫలించగలుగుతున్నామా? ఫలించకపోతే ఉగ్రతనుండి తప్పించుకోలేము. అది అత్యంత భయంకరం. వద్దు! సరిచేసుకుందాం! ప్రభువు ఆశించే ఆత్మఫలాలను ఫలించి, ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకొందము.
ఆరీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( 23వ భాగము)—-—————————————
*పుట్టు గ్రుడ్డివానిని బాగుచేయుట*
◽//———————————
ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. యోహాను 9:1-7
యేసు ప్రభువు శరీరధారిగా ఈలోకానికి రాకముందే, కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ఆయనను గురించి ప్రవక్తయైన యెషయా ప్రవచించారు. ఈ ప్రవచన నెరవేర్పే ఆయన దేవుడని రుజువు పరచుచున్నది.
“ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలె గంతులువేయును”.
యెషయా 35: 4-6
▫ *వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా?*
—————————————
పూర్వజన్మలో జీవించిన జీవితాన్ని బట్టి, తర్వాత జన్మలో వారి జీవితం ఉంటుందని నేటి దినాల్లో సహితం మన దేశములో కొందరు ఎట్లా నమ్ముతున్నారో, అట్లానే ఆ దినాలలో సహితం అట్లాంటి నమ్మకాలు ఉండేవి. తలిదండ్రుల చేసిన పాపములు పిల్లలమీదకి వస్తాయని, గత జన్మలో చేసిన పాపములవలన కూడా తర్వాత జన్మలో గ్రుడ్డివారిగా జన్మించవచ్చనే నమ్మకం వారిలో ఉండడం వలననే వీడు పుట్టి గ్రుడ్డివానిగా పుట్టడానికి “వీడు చేసిన పాపమా? అని శిష్యులు, ప్రభువును అడుగుతున్నారు. యోబు స్నేహితులలో యిదే మనస్తత్వం కనిపిస్తుంది. (యోబు 4:7-9; 8:3; 18:5-21)
అయితే, శిష్యులలోనున్న దురభిప్రాయాన్ని ప్రభువు కొట్టివేసి. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెనని ప్రభువు చెప్పారు. శ్రమలకు, రోగములకు కారణం పాపమే? అట్లా అని, ప్రతీ శ్రమకూ పాపమే కారణం కాదు. యోబుకు కలిగిన శ్రమలు, పౌలు శరీరంలోనున్న ముల్లుకు ( 2కొరింథీ 12:7) కు కారణం పాపము కాదు. కొన్నిసందర్భాలలో ప్రభువు మహిమ పరచబడుటకు కొన్ని శ్రమలు సంభవిస్తాయి. మన వాక్యభాగములోని గ్రుడ్డివాని గ్రుడ్డితనం ప్రభువు మహిమకొరకే వచ్చింది. అతనిని స్వస్థపరచడం ద్వారా ప్రభువు మహిమపరచబడ్డారు. కొన్ని సందర్భాలలో మన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, శోధనలు, నిందలు, దేవుని కార్యాలు మనలో జరగడానికి కారణమవుతాయి. తద్వారా ప్రభువు మహిమపరచ బడతారని గ్రహించగలము. కొన్ని సందర్భాలలో వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నవారికి కలిగే శ్రమలు, వ్యాధులను బట్టి, భక్తిపరులుకదా వీరికే ఎందుకు ఇట్లా కలగాలి అంటూ కాస్త హేళనగా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. అయితే మనము ఒక్క విషయాన్ని అర్ధం చేసుకోవాలి. వారిని శోధనలు ద్వారా ప్రభువునకు మరింతదగ్గరగా చేర్చుకొంటున్నారని, తద్వారా ప్రభువుకు మహిమకలుగుతుందనే గ్రహింపును మనము కలిగియుండాలి.
▫ *ప్రభువు స్వస్థపరచిన విధానం:*
—————————————
నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. ప్రభువు స్వస్థపరచిన విధానము, ఒక్కొక్కచోట ఒక్కొక్కవిధముగా వుంటూవుంది. అంటే, కేవలం ఈవిధంగా మాత్రమే ప్రభువు స్వస్థపరచగలడు అని చెప్పడానికి ఏమి లేదు. ఆయన ఏ విధంగానైనా స్వస్థపరచగలరు. ఆయన వస్త్రపు చెంగులోనే కాదు, మాటలోనే కాదు, స్పర్శలోనే కాదు, చివరకు ఆయన ఉమ్మిలో సహితం స్వస్థత వుందని తెలియజేయడానికి ఈ విధానాన్ని ఇక్కడ అనుసరించారేమో?
అయితే, కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలను గురించి పట్టుపడతాము. ఆపరేషన్ కాకుండానే, స్వస్థపరచబడాలి, ఆపరేషన్ లేకుండానే డెలివరీ కావాలి. ఇట్లా... ప్రభువుకు ఏ రీతిగా స్వస్థపరచాలో మనము సలహాలు యివ్వాల్సినపనిలేదు. ఆయనకు మహిమ కలిగే విధానాలు ఆయనకు ఉంటాయి. అందుచే ఆయన చిత్తానికి అప్పగించితేచాలు. ఆరీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( 24వ భాగము)—-————————————
ప్రభువు రూపాంతరము చెందుట
▫//———————————
ఆరు దినములైన తరువాత యేసు పేతురును... యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట లాడుచుండిరి. అప్పుడు పేతురు ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమాన మైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టిలెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరి తోను చెప్పకుడని యేసు వారి కాజ్ఞాపించెను. మత్తయి 17: 1-9
🔹ప్రభువు, శిష్యుల ఎదుట రూపాంతరం చెందుట
మానవునిగా పుట్టిన ప్రభువు, సామాన్య మానవుడు కాదు. ఆయన మానవ ఆకారం దాల్చిన దేవుడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,3 ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునై యున్నాడు. (హెబ్రీ 1:3) ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ( కొలస్సి 1:15) దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది (కొలస్సి 2:9) ఈ విషయాన్ని గ్రహించాలనే ఆయన వారి ఎదుట రూపాంతరం చెందారు.
🔹ఆయన ముఖము సూర్యునివలే ప్రకాశించుట
ఆయన నిజంగానే నీతిసూర్యుడు. ఆయన పుట్టుకకు 400 సంవత్సరాలకు పూర్వమే మలాకీ ప్రవక్త ప్రవచించారు. నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును (మలాకీ 4:2) సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. (1 తిమోతి 6:16)
🔹ప్రభువు రూపాంతరం పొందేసమయంలో ముగ్గురు శిష్యులనే ఎందుకు తీసుకు వెళ్లారు?
పేతురు, యాకోబు, యోహాను అను ముగ్గురు శిష్యులు ప్రభువుకు అత్యంత సన్నిహితంగా వుండడానికి యిష్టపడేవారు. ఈ సందర్భములోనే కాదు, యాయీరు కుమార్తెను బ్రతికించినప్పుడు కూడా, ప్రభువుతోపాటు ఈ ముగ్గురినే గదిలోనికి తీసుకువెళ్లారు. గెత్సేమనే తోటలోకూడా ఈ ముగ్గురు శిష్యులనే వెంటబెట్టుకొని వెళ్లి, చింతాక్రాంతుడవడానికి మొదలుపెట్టారు. ఇట్లాంటి అనుభవాలన్నీ వారికెట్లా సాధ్యమయ్యాయి అంటే, ప్రభువుకి వారికిని గల మధ్యగల సన్నిహితమైన సంబంధమే. మనము కూడా పాపపు గోడను ఛేదించి, ప్రభువుతో సన్నిహితంగా జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకో గలగాలి.
🔹ఎత్తైన కొండమీద ప్రభువు మహిమను చూచిన శిష్యులు:
ఆధ్యాత్మిక పర్వతానుభవాలు మన జీవితంలో వుండగలగాలి. అవి మనలను లోకాశాలకు దూరంగాను, ప్రభువుకు సమీపముగాను చేర్చగలుగుతాయి. ప్రభువుతో గడపగలిగే ఏకాంతపు అనుభవాలు మనలను ఆయనయొక్క సమరూపములోనికి మార్చగలుగుతాయి.
లోకాశాలకు, భ్రమలకు, ఆకర్షణలకు దూరముగా వుంటూ పరలోకసంబంధమైన వాటివైపు దృష్టిసారించగలిగితేనే, ఆయనకు సమీపముగా చేరి, ప్రభువు యొక్క మహిమను చూడగలము.
🔹ప్రభువు రూపాంతరము పొందు సమయంలో మోషే, ఏలీయాలు రావడానికి గల కారణం?
మోషే ధర్మ శాస్త్రానికిని, ఏలీయాలు ప్రవక్తలకును ప్రతినిధులుగానున్నారు. వారిరువురు ప్రభువును గురించి ముందుగానే ప్రవచించారు. యూదులైతే ధర్మశాస్త్రం, ప్రవక్తలు ప్రవచించిన “మెస్సియా” యేసు క్రీస్తు కాదని, ఆయన ధర్మ శాస్త్రానికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారని, ఆయనను నిరాకరించారు. అందుచే, యూదులకు గ్రహింపు కలుగులాగున, ప్రభువు రూపాంతరం పొందుసమయంలో వారే వచ్చి, ప్రభువుతో మాట్లాడారు.
🔹పేతురు చేసిన మరొక పొరపాటు
పేతురు ” ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను”. మోషే, ఏలీయాలను ప్రభువుతో సమానముగా ఎంచుతున్నాడు. వారిరువురు మనుష్యులు. దేవునికి చెందాల్సిన మహిమను, మనుష్యులకు ఆపాధించకూడదు. నేటిదినాల్లో కూడా యిదే పరిస్థితి కొనసాగుతుంది. రెండవదిగా, మనము ఈ కొండపైనే వుండి పోదాము అంటున్నాడు. ప్రభువు కొరకు ఎంతోమంది ఎదురు చూస్తుండగా, పరిచర్య ఎంతో మిగిలియుండగా యిక్కడే వుండిపోదాము అనడం, భాద్యతలను, కర్తవ్యాలను మరచినట్లే అవుతుంది. అట్లా జరగడానికి వీల్లేదు.
🔹ఈయన మాట వినుడి:
పేతురు ఈ కొండమీదే వుండిపోదామంటూ, ప్రభువుకు సలహాలిస్తున్న సమయంలో, అతనిమాటలు ఇంకా ముగించకముందే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. అవును! మనము కూడా, అనేక సందర్భాలలో పేతురువలే దేవునికే సలహాలిచ్చే ప్రయత్నం చేస్తుంటాము. ప్రార్ధిస్తున్నప్పుడు కూడా ఇట్లా జరగాలి ప్రభువా అంటూ, ఎట్లా జరగాలోకూడా మనమే నిర్ణయించేస్తుంటాము. అది మన జీవితాలకు శ్రేయస్కరము కాదు. ఆయన చిత్తానికి అప్పగించి, ఆయన మాట వినాలి. ఆయన మాటకు లోబడాలి. మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి. (యాకోబు 1:22) ఆరీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( 25వ భాగము)—-—————————————
కనాను స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరచుట
🔹/———————————-
యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చిఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా ఆయనఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకాయన పిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తముకాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.
మత్తయి 15: 21-28
కనాను స్త్రీలో గమనించదగిన విషయాలు:
🔸/———————————
🔹 ప్రార్ధించింది
🔹పొందుకొనే వరకు పట్టువిడువక వెంబడించింది.
🔹 అచంచలమైన విశ్వాసము గలది.
🔹 కుమార్తె పట్ల బాధ్యత గలిగిన తల్లి.
🔹 దీనురాలు. కుక్కపిల్లతో పోల్చారు అనికాకుండా, చిన్న రొట్టెముక్కవంటి కృపకొరకు ఎదురుచూచింది.
🔹ప్రార్ధనా ఫలాలను పొందుకుంది.
🔹ప్రభువుచేత ప్రసంశించబడింది.
కనాను స్త్రీ యొకతె వచ్చిప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.
మత్తయి 15:22
ఆమె ప్రార్థనకు ఎట్లాంటి సమాధానం యేసు ప్రభువు వారు ఇవ్వలేదు. అయినా, ఆయనను వెంబడిస్తూ సహాయానికై అర్థిస్తూ ఉంది. అది కాస్త శిష్యులకు అసహనం కలిగించి, ఈమెను పంపించెయ్యి ప్రభువా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, అనేకమంది అపార్ధం చేసుకున్నారు. ఆమె కుమార్తెను స్వస్థత పరచిన విషయాన్ని ప్రక్కనబెట్టి, ఆయన ఇశ్రాయేలీయులకే దేవుడు తప్ప, మిగిలిన వారికి కాదంటూ ప్రచారం మొదలు పెట్టారు.
ఇంతకీ ఆయన అన్నమాట ఏమిటి? ఎందుకు అట్లా మాట్లాడవలసి వచ్చింది?
ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను. మత్తయి 15:24
యేసు ప్రభువు వారు 'కేవలం ఇశ్రాయేలీయులను' రక్షించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చారా?
🔸—————————-
అట్లా తలంచడానికి వీలులేదు. ఎందుకంటే ఆయన దేవుడు. దేవుడు ఒక జాతికి, ఒక కాలానికి, ఒక యుగానికి సంబంధించిన వాడు కాదు. సర్వ మానవాళికి, అన్ని కాలాలకు, అన్ని యుగాలకు సంబంధించిన వాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాప ములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు. (1యోహాను 2:2)
అయితే, ఆయన ఎందుకలా మాట్లాడవలసి వచ్చింది? లేఖనాల నేరవేర్పులో భాగముగా ఆయన ఇశ్రాయేలీయులను రక్షించడానికే వచ్చాడు. అట్లాఅని, ఆ రక్షణ వారికే పరిమితం కాలేదు.
ఎందుకు యూదుల పట్ల దేవుడు అట్లాంటి ప్రణాళికను కలిగి యున్నాడు?
🔸——————————-
🔹1. అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన వాగ్ధానమే కారణం. భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడును. (ఆది 12:3)
అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు. (గలతీ 3:16)
అంటే? క్రీస్తు ద్వారానే సమస్తమైన జాతులు ఆశీర్వధించబడాలి.
ఈ వాగ్ధానము నెరవేరాలంటే? మొదట యూదులు ఆశీర్వధించబడాలి. వారి ద్వారా మిగిలిన వంశములన్నియూ ఆశీర్వధించబడాలి. అందుచే ఈ రక్షణ కార్యము యూదులనుండే ప్రారంభమయ్యింది.
🔹2. ఇశ్రాయేలు వంశము ధర్మ శాస్త్రము క్రింద జీవిస్తుంది. ధర్మశాస్త్రము పాపమునకు శిక్ష విధిస్తుంది గాని, పాపము నుండి విడిపించలేక పోయింది. అందుచే వారిని ధర్మశాస్త్రము నుండి విమోచించడానికి మొదటిగా వారి దగ్గరకే రావలసివచ్చింది.
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. (గలతీ 4:4)
🔹3. ఎందుకు ఆయన మొదటగా ఇశ్రాయేలీయుల యొద్దకే పంపబడ్డాడు అంటే? ఆదరణ కర్త (మెస్సియా) కోసం ఎదురు చూస్తున్నాది వారే కాబట్టి. యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతి మంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను. (లూకా 2:25)
🔹4. సువార్త కూడా ముందుగా యూదులకే ఎందుకు తెలియజేయ బడింది?
సువార్తను ముందుగా యూదులకే తెలియజేయమన్నారు. కారణం? అప్పటికి ఆయన ధర్మ శాస్త్రము అమలులోనున్న కాలంలోనే వున్నారు. అప్పటికి ఆయన ఇంకా సిలువ వేయబడలేదు. మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం జరుగలేదు. అందుచే ధర్మ శాస్త్రము క్రింద జీవిస్తున్న యూదులకే మొదట సువార్తను తెలియ జేయమన్నారు. ఆయన పునరుద్ధానము చెందిన తర్వాత సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు.
యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయులయే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱల యొద్దకే వెళ్లుడి. (మత్తయి 10:5,6) ఎందుకు అట్లా చెప్పవలసి వచ్చింది అంటే? వారు కాపరిలేని గొఱ్ఱల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికర పడ్డాడు. (మత్తయి 9:36)
మొదట సువార్త యూదులకు తెలియజేయబడిన తర్వాత స్వయంగా యేసు ప్రభువు వారే సమరయలో ప్రవేశించి, సమరయ స్త్రీని రక్షించారు అనే విషయాన్ని మరచిపోకూడదు. యోహాను సువార్త 4వ అధ్యాయములో స్పష్టమైన వివరణ చూడవచ్చు. యేసు ప్రభువు వారు శిష్యులు కూడా సమరయ ప్రాంతములో సువార్తను ప్రకటించి నట్లు అపోస్తలుల కార్యములు 8: 5-25 భాగములో చూడవచ్చు.
ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదని చెప్తూనే, తన విశ్వాసమును పరీక్షించిన మీదట తన కుమార్తెను స్వస్తపరిచారు. విశ్వసించిన జక్కయ్య అన్యుడైనప్పటికీ, అబ్రాహాము కుమారుడుగానే (యూదుడు, ఇశ్రాయేలీయుడు) పిలువబడ్డాడు. అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే. (లూకా 19:9)
🔹ఇంతకీ నిజమైన యూదుడెవరు?
బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు. (రోమా 2:28,29)
యేసు ప్రభువు వారు కేవలం ఒక్క యూదులకోసమే ఆయన రాలేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు. అదే సమయంలో జక్కయ్య, సమరయ స్త్రీ వంటి అన్యులను రక్షించారు, అన్యుడైన శతాధిపతి యొక్క దాసుడను స్వస్థపరిచారు. పేతురు అన్యులకు సువార్తను ప్రకటించడానికి అభ్యంతరపడినప్పుడు, ఆయన దర్శనమిచ్చి మాట్లాడి, కోర్నేలి ఇంటికి పంపినప్పుడు అక్కడ వాక్యము వినడానికి సమకూడిన అన్యులు పరిశుద్ధాత్మను పొందుకొనిరి. యూదుడని, అన్యుడని ఆయనకు ఏ భేదములేదు. అందరి మీద ఆయన కృప మెండుగా వుంది. అందరి పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తము చేసారు. ఆయన అందరికీ ప్రభువు. ఆయన ద్వారా కాకుండా నిత్య రాజ్యాన్ని చేరడానికి వేరే మార్గం లేనేలేదు.
ఆయననే ఆరాధిద్దాం! ఆ నిత్యరాజ్యం చేరుదాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( 26వ భాగము)—-—————————————
పక్షవాయువు గలవానిని స్వస్థపరచుట
🔹/———————————
కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను. ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయన యొద్దకు తీసికొని వచ్చిరి. చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. వారుఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువుగలవానితో నీ పాపములు క్షమింప బడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి పక్ష వాయువు గలవానిని చూచి నీవులేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొంది మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.
మార్కు 2 : 1-12
🔸1. భాద్యత గలిగిన వ్యక్తులు:
a) శారీరికంగా తీవ్రమైన పక్షవాయువుగల వ్యక్తి, నడవలేడు, ఏ పని చెయ్యలేడు. ప్రతీపనికి ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి. అందుచే భాద్యతగలిగిన వ్యక్తులు ప్రభువు దగ్గరకు మోసికొనివచ్చారు. ఇంటిలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదని, వెనుతిరిగే ప్రయత్నం వారు చెయ్యలేదుగాని, ప్రభువుచెంతకు నడిపించడానికి గొప్ప సాహసమే చేశారు. అట్లానే పాప రోగముచేత పీడింపబడుతున్న అనేకులను ప్రభువు చెంతకు నడిపించాల్సిన భాద్యత మనమీదుంది.
b) వ్యాధి గ్రస్తుని మంచముతోపాటు ఇంటికప్పుమీదకి ఎక్కించి, ఇంటికప్పును ఊడబెరకుతుంటే, ఆ ఇంటి యజమాని వారిని ఆటంకపరచినవాడు కాదు. తనకు నష్టం వాటిల్లుతున్నప్పటికీ, ఆ వ్యాధిగ్రస్తుడు బాగుపడుటకు తనవంతు సహాయం చేసినవాడుగానున్నాడు. ప్రభువు పరిచర్యలో భౌతికపరమైన లేదా ఆర్ధికపరమైన నష్టాలు సంభవించినప్పటికీ, సంతోషముతో భరించడానికి ఈ గృహయజమాని మనకొక గొప్ప మాదిరి.
c) వారు ఇంటి కప్పును ఊడబెరుకుతుంటే, ఇంటిలోనున్న ప్రభువుతోపాటు, మిగిలిన వారందరిమీద, పెంకుముక్కలు, చెత్త, చెదారం అట్లాంటివి వారిమీద పడుతూనే వున్నాయి. అయినప్పటికీ ఎవ్వరూ అసౌకర్యముగా భావించక, వ్యాధి గ్రస్తుని ప్రభువు ముందుకు దించడానికి వారివంతుగా సహకారాన్ని అందించారు. ప్రభువు పరిచర్యలో అసౌకర్యంగా పరిస్థితుల్లో ఎన్నో ఉంటాయి. ఆత్మల రక్షణే ధ్యేయంగా ముందుకు సాగిపోవాలి.
d) అంత వరకూ ప్రభువు వున్న గదిలో ఒక్క మనిషి ప్రవేశించడానికి సహితం స్థలములేదు. అట్లాంటి పరిస్థితుల్లో, పైకప్పు నుండి మంచము దిగుతుంటే, ఆ గదిలోనున్న వారంతా సర్దుకొని, మంచం లేదా పరుపు పట్టేటంత స్థలమిచ్చారు. అట్లానే ఒక వ్యక్తిని ప్రభువు చెంతకు నడిపించడానికి, మన వలన జరిగే ఏకార్యమైనా, అది మనకు నష్టం కలిగించేదైనాసరే మనవంతు సహకారం తప్పక అందించాలి. అట్లాంటి భారము, భాద్యతను కలిగియుండాలి.
🔸2. బాధ్యత గలిగిన వ్యక్తుల విశ్వాసమును చూచిన ప్రభువు:
వ్యాధిగ్రస్తుని విశ్వాసము కాదుగాని, అతనిని ప్రభువు దగ్గరకు తీసుకొనివచ్చినవారి విశ్వాసాన్ని ప్రభువు చూస్తున్నారు. అంటే, వారి విశ్వాసమే అతని స్వస్థతకు కారణమయ్యింది. మనము అనేక సందర్భాలలో కొంతమంది గురించి ప్రార్దిస్తుంటాము. అయినప్పటికీ, వారి ప్రవర్తనలో ఎట్లాంటి మార్పు చూడలేము. విసుగుపుట్టి ఇక వీడెప్పటికీ మారడని, విడచిపెట్టెస్తాము. అట్లాకాకుండా విశ్వాససహితమైన మన ప్రార్ధన, ఇతరులను రక్షణలోనికి నడిపించగలదని ఈ పాఠము ద్వారా నేర్చుకొనగలము.
🔸3. వ్యాధిగ్రస్తునికి స్వస్థత
యేసు వారి విశ్వాసము చూచికుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను..... పక్ష వాయువు గలవానిని చూచి నీవులేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను
a) ఆత్మీయ స్వస్థత:
శారీరిక స్వస్థతకంటే, అతని పాపములు క్షమించడం ద్వారా ఆత్మీయ స్వస్థతనిచ్చారు.
నేటి దినాల్లో శారీరిక స్వస్థత కొరకే ప్రాకులాడుతున్నాము గాని, ఆత్మీయ స్వస్థతను గూర్చిన గ్రహింపులేకుండా జీవిస్తున్నాము. శారీరిక స్వస్థత ఈ లోకానికి మాత్రమే సంబంధించినదైతే, ఆత్మీయ స్వస్థత మాత్రం పరలోకానికి చేర్చగలిగేది. ఆత్మీయ స్వస్థతను కలిగియుండి, శారీరిక స్వస్థతలేకుంటే, కొంతకాలం బాధలు అనుభవించినప్పటికీ, శాశ్వతకాలం నెమ్మది అనుభవించగలం. అది నిత్య జీవం. కానీ, శారీరిక స్వస్థతను కలిగియుండి, ఆత్మీయ స్వస్థతలేకుంటే దాని ఫలితం శాశ్వతకాలం. అది నిత్యమరణం.
b) శారీరిక స్వస్థత:
పాపములు క్షమించిన పిమ్మట, నీవు నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు అని చెప్పినంతలో, మోసికొచ్చిన వాడు, తన పరుపును మోసికొని, వారందరి ఎదుట నడచిపోయెను. ఇతనినిబట్టి అనేకులు దేవునిని మహిమ పరిచారు.
🔸4. ముగింపు
దేవుని పిల్లలముగా ఎట్లాంటి భాద్యతను కలిగియున్నాము? నీకన్నీటి ప్రార్ధన అనేకుల కన్నీరును తుడవగలదు. ప్రతీ మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి. ప్రతీ నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలి. ఆధ్యాత్మిక లోయలన్ని పూడ్చబడాలి. వక్రమార్గాలన్నీ సక్రమం చేయబడాలి. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలోచేరి ఆయనను ఆరాధించే విధంగా ప్రతీ కుటుంబము వుండగలగాలి. శారీరకమైన స్వస్థతలకంటే, ఆత్మీయ స్వస్థతలకే ప్రాధాన్యతనిద్దాము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. (మత్తయి 6:33) కావున, అగ్నిలోనుండి లాగినట్లు కొందరినైనా రక్షించే బాధ్యత కలిగియుందాం నశించిపోతున్న ఆత్మలపట్ల భారం కలిగి ప్రార్ధన చేద్దాము. ఆరీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( 27వ భాగము)—-—————————————
*అపవిత్రాత్మ విడచిపోవుట*
🔅/——————————
అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను. వాడు నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా . ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను. అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.
మార్కు 1 : 21-28
1. *అపవిత్రాత్మపట్టినవాడు సమాజమందిరములో నున్నాడు*:
▫——————————
దయ్యాలుకూడా దేవుని మందిరానికి వస్తాయా? వాడు మనకంటే, ముందే వెళ్లి కూర్చుంటాడు. లూసిఫర్, పరలోకంలో దేవునిని ఆరాధనచేసే దేవదూతలలో ప్రధానుడు. వాడుకూడా అట్టి ఆరాధననే పొందాలనే దురుద్దేశ్యంతో దేవునిపైనే ఎదురుతిరిగి, అదఃపాతాళానికి త్రోసివేయబడ్డాడు. పరలోకంలో ఎట్లాగూ అట్లాంటి అవకాశం దక్కలేదుగనుక, వీడు దేవుని మందిరాలలోనికి చొరబడి, దేవునికి చెందాల్సిన ఆరాధనను చెందనీయకుండా వాడు చెయ్యగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తాడు. వాటిలో భాగంగానే .....
🔹వాక్యానికి టైమ్ ఎక్కువలేకుండా ప్రయత్నం చేస్తాడు.
🔹అనేకులు మనుష్యులు మాత్రమే మందిరాలలో వుంటారు. మనసులు మాత్రం ఊరంతా తిరుగుతూనే ఉంటాయి.
🔹సెల్ ఫోన్స్ తో గేమ్స్ ఆడుకొనేవారు కొందరు.
🔹మధ్యలో ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయేవారు కొందరు.
🔹కొందరు వాక్యం వినరు, ప్రక్కవారిని విననివ్వరు.
🔹మరికొందరైతే, కేవలం తప్పులు పట్టుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు.
🔹ఎవరైనా ప్రార్ధన చేస్తుంటే, వినరు. కానీ అలవాటుగా ఆమెన్ అంటారు.
🔹ముసుగు జారిపోయినా సర్దుకోకుండా, తెలియనట్లు నటిస్తుంటారు.
🔹చిన్ని బిడ్డలు అల్లరి చేస్తున్నా కంట్రోల్ చేసే ప్రయత్నం చెయ్యరు.
..... ఇట్లా చెప్పుకొంటూపోతే లెక్కలేనన్ని, వీటన్నింటికి కారకుడు అపవాదే. దేవుని మందిరంలో చేరి, వాడు సృష్టించే అల్లరి అంతా యింతా కాదు. అందుకే వాడు ముందుగా వస్తాడు. వాడిబారిన పడకుండా వుండాలంటే, మనము ఇంటిదగ్గర బయలుదేరినప్పుడే, మనలను మనము దేవునికి సమర్పించుకొని, ప్రార్ధించి, ఆరాధనకు సిద్ధపాటుగలిగి దేవుని మందిరంలో ప్రవేశించగలగాలి.
2. *దయ్యముల ప్రతిస్పందన:*
▫———————————
a) *ప్రభువును గుర్తుపట్టాయి*
ప్రభువును గుర్తుపట్టడమే కాదు. ఆయన పేరు కూడా వాటికి తెలుసు. అందుకే నజరేయుడగు యేసూ అంటూ, అడ్రస్ తో సహా సంభోదిస్తున్నాయి. కానీ విచారమేమిటంటే, మనకొరకై ప్రాణము పెట్టిన ప్రభువును, ఆయనెవరో నేటికిని ఎరుగకున్నవారముగా జీవించుచున్నాము.
b) *మాతో నీకేమి?*
మమ్ములను నాశనం చెయ్యడానికే వచ్చావా?
మాజోలికి రావద్దయ్యా! మాపని మమ్ములను చేసుకోనివ్వు. ఈలోకంలో అపవిత్రాత్మలను పుట్టింప గలిగినవాడుగాని, నాశనము చేయగలిగినవాడు గాని, మరెవ్వరూ లేరు. వాటిని నాశనం చెయ్యగలిగే శక్తిమంతుడు ప్రభువు ఒక్కరే. దానికి దయ్యాలే సాక్షమిస్తున్నాయి.
c) *నీవు పరిశుద్ధుడవు.*
ఆయన జన్మ లో పరిశుద్ధత వుంది. జీవితంలో పరిశుద్ధత వుంది. దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. (లూకా 1:35) నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? (యోహాను 8:46) మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను. (2 కొరింథీ 5:21) మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ( హెబ్రీ 4:15) ఇట్లా అనేకమైన విధాలుగా పరిశుద్ధ గ్రంధమే కాదు, దయ్యాలు సహితం ఆయన పరిశుద్ధుడని సాక్ష్యమిచ్చు చున్నాయి.
3. *ప్రభువు మాటకు లోబడిన అపవిత్రాత్మలు *
▫——————————
ఊరకుండుము అంటే, ఊరకున్నాయి. విడిచిపొమ్మంటే, విడచిపోయాయి. దయ్యాలు సహితం దేవుని మాటకు లోబడ్డాయి. సృష్టియావత్తూ ప్రభువుకు లోబడుతుంది. సృష్టిలో ప్రత్యేకమైన రీతిలో సృష్టించబడిన సృష్టమైన నీవూ నేనూ తప్ప. దేవునిని చూచి దయ్యాలు సహితం వణుకుతుంటే, దేవుని స్వరూపంలో నిర్మించబడిన నీవూ నేను మాత్రం ఆయనకు ఎదురాడే దయనీయమైన జీవితాలు జీవిస్తున్నాము. మనము జరిగించే కార్యాలు చూచి, దయ్యాలు సహితం “ఓ మై గాడ్” అంటూ ఆశ్చర్యపోతున్నాయి. మనకు నచ్చినట్లుగా జీవించి, తప్పంతా సాతానుగాడి మీదకి త్రోసేస్తున్నాము. వాడేమో, నేను వెళ్లెవరకూ ఎక్కడ ఆగుతున్నారు వీళ్ళు. నేను వెళ్లకముందే పాపములో పడిపోయి, ఆ నిందలన్నీ నా మీద మోపుతున్నారు. నాకేమి సంబంధంలేదు అంటాడు వాడు. వాడు చెప్పినదానిలోకూడా తప్పేమిలేదెమో అనిపిస్తుంది.
వద్దు! అది మన ఆత్మీయ జీవితాలకు ఎంతమాత్రమూ శ్రేయస్కరము కాదు. సరిచేసుకుందాం! ప్రభువు మాటకు లోబడదాం! సాతాను అంధకార శక్తులను జయించి, ప్రభువు అనుగ్రహించే నిత్యమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకొందము. ఆరీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( 28వ భాగము)—-యేసుక్రీస్తు పునరుత్థానము
విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయ పడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచిమీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొనిమీకు శుభమని చెప్పెను. వారు ఆయనయొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను.
మత్తయి 28 : 1-10
యేసు క్రీస్తు మరణమును జయించి, మృత్యుంజయునిగా లేచుట ద్వారా అనేకులను పట్టిపీడిస్తున్న రెండు ప్రశ్నలకు సమాధానం లభించినట్లయింది.
1. దేవుడున్నాడా?
అని ప్రశ్నించేవారికి, ఆయన దేవుడు కాబట్టే మరణమునుండి సజీవునిగా లేచాడు అనేది తిరుగులేని రుజువు. ఆయన సమాధిని గెలవకపోతే, ఆయనను దేవునిగా ఆరాధించాల్సిన పనిలేదు.
2. మరణం తరువాత జీవమున్నదా?
క్రీస్తు మరణాన్ని జయించడం ద్వారా, శరీరమే మరణిస్తుంది, ఆత్మకు ఎప్పటికి మరణం లేదనే విషయం రుజువయ్యింది. అదే సమయంలో ఆయన పునరుత్తానం జీవముతో కూడిన నిరీక్షణనిచ్చింది.
ఒక సూచక క్రియ చేయమని పరిసయ్యులు ఆయనను శోధిస్తూ అడిగినప్పుడు ప్రభువు ఈ రీతిగా మాట్లాడారు. వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగు చున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును. (మత్తయి 12:39,40) అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవువాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్య జనుల కప్పగించెదరు. వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమి్మవేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. (మార్కు 10:32-34) ఆయన చెప్పినరీతిగానే లేచారు.
సమాధిని చూడడానికి వచ్చిన స్త్రీలతో దూత మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు. అవును! అద్భుతమైన జీవితాన్ని జీవించి, ఎన్నెన్నో అద్భుతాలను చేసి, అద్భుతమైన రీతిలో తానే మరణాన్ని జయించడం అద్భుతమే. అసలు ఇదే జరుగకుంటే, క్రీస్తు సువార్త అసలు సువార్తే కాకపోవును. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన యెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము. (1 కొరింథీ 15 : 17-19)
ప్రభువు సమాధి ఖాళీగా ఉండడమే క్రైస్తవ్యం యొక్క గొప్ప అతిశయ కారణం. యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగిలేచాడు. ఆయన సమాధి ఖాళీగా వుంది. అయితే, యేసు క్రీస్తు చనిపోయిలేవలేదని, శవాన్ని వారి శిష్యులు ఎత్తుకెళ్ళి ఎక్కడో పాతిపెట్టేశారని, ప్రధానయాజకులు, సమాధిని కావలికాసే సైనికులకు పెద్ద మొత్తంలో డబ్బుచెల్లించి అబద్ధం చెప్పించారు. నేటికిని అనేకులు ఆ మాటలనే నమ్ముతున్నారు. అసలు నిజంగా అట్లా జరిగే అవకాశం ఉంటుందా? ప్రభువును పట్టుకున్న వెంటనే, రోమా సైన్యానికి భయపడి శిష్యులు పారిపోయారు. ప్రభువు బ్రతికున్నప్పుడే పారిపోయిన శిష్యులు, ఆయన చనిపోయాక ఆయన శవాన్ని ఎత్తుకెళ్లే సాహసం చేయగలరా? అదీ, రోమా సైనికుల కావలిలోనుండి. అదే జరిగింది అనుకొంటే, అందరూ ఒకేసారి నిద్రపోతారా? ఒకవేళ నిద్రపోయారు అనుకుందాము. సమాధికి కట్టిన గొలుసులు విప్పుతున్నప్పుడు, రాయి పొర్లిస్తున్నప్పుడూ కనీసం ఒక్కడికీ మెలకువ రాలేదా? ఒకవేళ మెళకువ రాలేదు అనుకుందాం, అయితే, యేసు ప్రభువు శిష్యులే ఆయన శవాన్ని ఎత్తుకెళ్లినట్లు నిద్రపోయినవారికి ఎట్లా తెలిసింది? అదంతా అబద్దమని అర్ధమవుతుంది కదా? అవును! ప్రభువు మరణాన్ని జయించిన మృత్యుంజయుడు.
యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్మకపోతే రక్షణ లేనట్లే. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. (రోమా 10:9) రక్షించబడకపోతే, తీర్పునుండి తప్పించుకోలేము. ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. వద్దు! ఆ తీర్పు అత్యంత భయంకరం. ప్రభువును విశ్వసించి, ఆయనిచ్చే నిత్యరాజ్యములో ప్రవేశిద్దాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( 29వ భాగము)—-—————————————
ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు నాలుగువేల మందికి ఆహారం
🔅/——————————
అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్చ పోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా! ఆయన శిష్యులు - ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారినడుగగా వారు ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి. అప్పుడాయన నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి. స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేల మంది పురుషులు.
మత్తయి 15 : 32-38
🔹అక్కర ఎరిగిన ప్రభువు
వారున్నది అరణ్య ప్రదేశం. వారిలో పురుషులతోపాటు స్త్రీలు, చిన్నపిల్లలు కూడా వున్నారు. అప్పటికే మూడు రోజులనుండి ప్రభువును వెంబడిస్తున్నారు. వారితోపాటు కొంచెం ఆహారం తెచ్చుకొనినా అది అయిపోయి వుండవచ్చు. రొట్టెలు కొనుక్కోవడానికేమో అది అరణ్య ప్రదేశం. ప్రభువుయొక్క జీవముతో కూడిన మాటలు వారి ఆత్మీయ ఆకలితోపాటు, శారీరిక ఆకలినికూడా తీర్చేసాయేమో? ఒకవేళ ఆకలివేస్తున్నాగాని, ఆ దివ్యమైన వాక్కులు మరలా ఇక మనకు దొరకవని, ఆకలితోనే వుంటూ, ఆత్మీయ సంతృప్తిని అనుభవిస్తున్నారేమో? ఏది ఏమైనా ఒక్కరుకూడా వచ్చి, మాకు ఆహారం పెట్టమని అడిగినవారు లేరు. అయినప్పటికీ, వారి ఆకలిని ఎరిగిన ప్రభువు, వారికి ఆహారం పెట్టాలనే తలంపును కలిగియున్నారు. ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. (మత్తయి 6 : 31-33)
🔹సమస్యపైనే దృష్టించిన శిష్యులు
ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి.
శిష్యులకు ఆయన అద్భుతాలు చేయగలడని వారికి తెలుసు. అయితే, ఆయన అద్భుతాలు రోగులను స్వస్థపరచుట వంటివాటికే పరిమితం అనుకున్నారేమో? యింతమంది జనసమూహానికి ఆహారము పెట్టగలిగే సామర్ధ్యము ఆయనకు లేదనుకున్నారేమో? అందుకే, వారిదగ్గరున్న ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలను, గొప్ప జన సమూహంతో బేరీజు వేస్తున్నారు. అరణ్యప్రదేశం కూడా వారికి ప్రతికూలంగానే వారికి కనిపిస్తుంది. వారి దృష్టంతా, వారిముందున్న సమస్య (జనసమూహం) పైన, ఆ చుట్టూనున్న పరిస్థితులమీద మాత్రమే కేంద్రీకరించారు. మన జీవితాల్లో సహితం ప్రభువు అనుగ్రహించే ఆశీర్వాదాలు మన దరిచేరకపోవడానికి గలకారణం యిదే. మన సమస్యను, మన చుట్టూవుండే పరిస్థితులను చూస్తాము తప్ప, మన సమస్యను పరిష్కరించగలిగే ప్రభువుపై ఆధారపడలేకపోతున్నాము. మన బలమైన సమస్యలు, అత్యంత బలవంతుడైన ప్రభువుముందు పెట్టగలిగితే, మన బలమైన సమస్యలు అత్యంత బలహీనంగా కనబడతాయి.
🔹అక్కర తీర్చిన ప్రభువు
ప్రభువు తన ప్రజల అవసరాలు తీర్చేందుకు ఆయన ఎప్పుడూ సిద్దమే. ఊహించని రీతుల్లో ఆయన అద్భుతాలు జరిగిస్తుంటారు. ఆయన ఏలియాను కాకులతో పోషిస్తారని ఎవరు ఊహించగలరు? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీ 4:19) వారి దగ్గరున్న కొద్దిపాటి ఆహారం ఆయన చెంతకు తీసుకొచ్చినప్పుడు, అద్భుతం జరిగించి, వారికి ఆహారం పెట్టారు.
వడ్డించే కొలదీ, రొట్టెలు, చేపలు వస్తూనే వున్నాయి. వారి కళ్ళను వారే నమ్మలేని స్థితి. ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు నాలుగువేల మందికి సంవృద్ధిగా వడ్డించగా, వారంతా తిని తృప్తి పొందగా, మిగిలిన ముక్కలు ఏడు గంపలు ఎత్తారు. తట్టలుకాదు, బుట్టలుకాదు, గంపలు ఎత్తారు. అవును! ప్రభువిచ్చేదేదైనా సంవృద్ధిగానే గానే ఉంటుంది. “పిల్లలును గాక తినినవారు నాలుగువేల మంది పురుషులు”. నేటి మన మందిరాలను బట్టి చూస్తే, పురుషుల కంటే, స్త్రీలు రెట్టింపు సంఖ్యలో వుంటారు. బహుశా, ఆ దినాల్లో కూడా వారి సంఖ్యయే ఎక్కువగా వుండి యుండవచ్చు. వారికితోడు పిల్లలు. అంటే, వారంతాకలసి ఒకవేళ సుమారుగా పదివేలమంది వుండొచ్చేమో? ఇట్లా జరుగుతుందని శిష్యులు మాత్రం ఎట్లా ఊహించగలరు? అవును! మనకున్నదేదైనాసరే నీకున్న ధనం, నీకున్న తలాంతులు మనఃపూర్వకముగా ప్రభువుకు సమర్పించగలిగితే, మన ఊహలకు సహితం అందని రీతిలో ప్రభువు వాటిని నూరంతలుగా ఆశీర్వదిస్తారు.
🔹ముగింపు
అరణ్యములో ఏడు రొట్టెలను, కొన్ని చిన్న చేపలను నాలుగువేల మందికి పంచిపెట్టారు ప్రభువు. అరణ్యములో బండను చీల్చి సుమారు 30 లక్షలమంది దాహాన్ని తీర్చారు. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను (కీర్తనలు 78:15). నీ జీవితం అరణ్యములా మోడుబారిందా? ఎండిన ఎడారిగా మారిన నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలిగితే, నీవూహించని సమృద్ధితో నీజీవితాన్ని ప్రభువు నింపగలరు. శ్రమగల ఆకోరులోయను నిరీక్షణ ద్వారముగా ప్రభువు మార్చగలరు. ఎండిన ఎముకలను జీవింప చేయగలరు. వాడ బారిన షారోనును చిగురింపజేయగలరు. నీవేస్థితిలోనున్నాసరే, నీవున్నపాటున ప్రభువు పాదాలచెంతకురా! నిత్యమైన ఆశీర్వాదములను, సమాధానమును తప్పక పొందగలవు.
ఆరీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు క్రీస్తు చేసిన అద్భుతములు
-—( 30వ భాగము)—-————————————
సైనికులు నేలమీద పడుట
🔅/——————————-
యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధముల తోను అక్కడికివచ్చెను. యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లిమీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను. ఆయననేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి.
యోహాను 18:3-6
యేసు ప్రభువు తన ముగ్గురు శిష్యులతో గెత్సేమనే తోటలో నున్నప్పుడు, ఇస్కరియోతు యూదా తాను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, యేసు ప్రభువును అప్పగించడానికి, యూదా సైన్యముతోపాటు వచ్చిన సందర్భమది. దివిటీలతోనూ, ఆయుధములతోనూ ప్రభువును వెతుక్కొంటూ వస్తుంటే, ప్రభువే వారికి ఎదురుగావెళ్లి ఎవరికోసం వెదకుతున్నారని ప్రశ్నించినప్పుడు, వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ప్రభువు మాటనుండి వెలువడిన ప్రభావానికి తట్టుకోలేక అక్కడనున్న యూదా సైనికులందరూ క్రిందపడ్డారు.
అనేకులు ఈ సందర్భాన్ని ఎత్తి, వ్యంగ్యముగా మాట్లాడతారు. అట్లా అయితే, సిలువ మరణం నుండి ఆయన ఎట్లా తప్పించుకోలేకపోయాడు? ఒక్క మాట మాట్లాడితే, అక్కడున్నవారంతా క్రిందపడేవారు కదా అంటూ? అవును! ప్రభువు తలచుకొంటే ఖచ్చితంగా అట్లా జరిగితీరుతుంది. అట్లాగే జరిగితే? శరీరధారిగా ఈలోకానికి రావడం వ్యర్ధమే. ఆయన సిలువ మరణం నుండి తప్పించుకొంటే, సర్వమానవాళికి విమోచన ఎప్పటికీ వుండేది కాదు.
పేతురు అత్త జ్వరమును స్వస్థపరచుట
🔅/ ————————————
ఆయన సమాజమందిరము లోనుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను.
లూకా 4 :38,39
సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో బాధపడుతుంది. ఆవిషయాన్ని ప్రభువుకు తెలియజేసారు. ఇది విజ్ఞాపన అనుభవము. ఇతరుల పక్షముగా, ఇతరుల అవసరతల నిమిత్తం ప్రార్ధించే అనుభవం. ఇట్లాంటి ప్రార్ధన అంటే, ప్రభువుకు ఎంతో యిష్టం. కారణమేమిటంటే? ఎప్పుడు ఇతరుల కొరకు ప్రార్ధించగలమంటే, ఇతరులను ప్రేమించినప్పుడే. ఇతరులను ఎప్పుడు ప్రేమించగలమంటే, వారిని క్షమించినప్పుడు మాత్రమే. పరిశుద్ధ గ్రంధములో విజ్ఞాపన చేసిన భక్తులను అనేకులను చూడగలము. వారిలో యోబు, అబ్రాహాము, మోషే, దానియేలు వంటివారూ వున్నారు. యేసు ప్రభువు కూడా సిలువలో మనకొరకు విజ్ఞాపన చేసారు. మన జీవితాల్లో కూడా విజ్ఞాపన అనుభవం తప్పుకున్నా వుండితీరాలి. ప్రభువు జ్వరమును గద్దించగానే, ప్రభువు మాటలోనుండి ప్రభావము వెడలి, ఆమె జ్వరం ఆమెను విడచిపోయింది. వెంటనే, ఆమె వారందరికీ ఉపచారము చేయగలిగింది.
ఇట్లా మనము ప్రభువు చేసిన అద్భుతకార్యాలను గురించి ధ్యానించగలిగితే, ఆయన మాటలోనూ, స్పర్శలోనూ, వస్త్రపు చెంగులోనూ, ఉమ్మిలోనూ, ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్కరీతిగా ఆయన మహిమను కనబరిచారు. అంటే, ఈ రీతిగానే ఆయన స్వస్థపరచగలడు అని చెప్పడానికంటూ ఏమిలేదు. మన ఊహలకు సహితం అందనంతగా మనపట్ల కార్యాలను జరిగించగలరు.
ఆశీర్వాదాలను కాదు గాని, ఆశీర్వాదాలకు కర్తయైన ప్రభువును వెంబడించగలిగితే, మన జీవితమంతా అద్భుతాలే. ఆరీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
——— 🔅సమాప్తం 🔅————
డియర్ బ్రదర్స్ & సిస్టర్స్ .....
గత కొన్ని రోజులుగా *యేసుక్రీస్తు చేసిన అద్భుతములు* గురించి ధ్యానించడానికి ప్రభువు కృపజూపారు. అందులనుబట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను.
ఒకని పరిశుద్ధత, నీతినిబట్టి వాని జీవితంలో అద్భుతం జరుగలేదుగాని, ప్రభువు కృపకు, మనుష్యుల విశ్వాసం తోడైనప్పుడు అద్భుతాలు జరిగాయి. అనే విషయం స్పష్టముగా గ్రహించగలిగాము.
పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు (యెషయా 54:10) నేటికిని ఆయన కృప మనలను వెంటాడుతూనే వుంది. ఆ కృపకు మన విశ్వాసం తోడైతే? మన జీవితమంతా అద్భుతాలే. ఆయన కృప మనకు నిత్యమూ తోడుగానుండును గాక! ఆమెన్!
ప్రభువు పరిచర్యలో
—- మీ సహోదరుడు
Chala chala bagunnayi. Praise the lord
రిప్లయితొలగించండి