పాపము

పాపము

(మొదటి భాగము)

ఆజ్ఞాతిక్రమమే పాపము. 1యొహాను 3:4

పాపము అంటే?
దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం. చెయ్యవద్దన్నది చెయ్యడం.
దేవుని మాటను, ఆయన చట్టాన్ని అతిక్రమించడమే 'పాపము'.

దేవుడు చేయ్యమన్నదేదో?
చెయ్యవద్దన్నదేదో? మనకెట్లా తెలుస్తుంది?
పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే తెలుస్తుంది.

అయితే,పాపములో నిలిచియున్నవాడు పరిశుద్ధగ్రంధాన్ని ధ్యానించలేడు.పరిశుద్ధగ్రంధాన్ని ధ్యానించేవాడు పాపములో
నిలచియుండలేడు.

దేవుడు మానవుని సృష్టించినప్పుడు 'దేవుడు ఎంతటి పరిశుద్ధుడో?' మానవుని కూడా అంతే పరిశుద్ధునిగా సృష్టించాడు.
కాని, చెయ్యవద్దని చెప్పినపని చెయ్యడం ద్వారా పాపమును భూమిమీదకు తీసుకొచ్చారు.
ఆ పాపమే వారికి శాపాన్ని తెచ్చి పెట్టింది.ఆ శాపాన్నే వారి పిల్లలమైన మనందరికీ పంచిపెట్టారు.

పాపము పరిపక్వమై మరణాన్ని కన్నదితప్ప, మానవుని సృష్టించినప్పుడు కొంతకాలం జీవించిన తర్వాత మరణించాలనే నిబంధన ఏది దేవుడు పెట్టలేదు.

మానవుని సృష్టించిన దేవుడే, తన ప్రియకుమారుడైన యేసు ప్రభువును భూమి మీదకు పంపించి, సిలువమరణం ద్వారా, ఆయన రక్తాన్ని విమోచనా క్రయదనము చెల్లించి, నిత్యమరణం నుండి మనలను విడిపించి ఆయన కుమారులుగా చేసుకున్నాడు.

మనను తిరిగి పాపంలోనికి ప్రవేశించకుండా నియంత్రించడానికి దేవుడు మనకోసం సిద్ధపరచినవే 'ఆజ్ఞలు' లేదా 'చట్టం'.

ఆయన చట్టాన్ని అతిక్రమించి మరలా పాపములోనే కొనసాగితే? పాపములోనే నిలిచియుంటే?
ఆ రెండవ మరణం నుండి తప్పించేవారెవ్వరూలేరు.

వద్దు!
ఆయన చిత్తానికి తలవంచుదాం! ఆయన బాటలో సాగిపోదాం! ఆ గమ్యం చేరేవరకు!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


పాపము

(రెండవ భాగము)


మూర్ఖుని యోచన పాపము. సామెతలు 24:9
'మూర్ఖుని యోచన పాపము'
అంటే?
'చెడ్డ తలంపు పాపము'
ఎందుకంటే?
•హృదయం నిండిన దానినిబట్టే, నోరు మాట్లాడుతుంది.
•హృదయం నిండిన దానినిబట్టే మన క్రియలు వుంటాయి.

అంటే?
చెడ్డ తలంపే లేకపోతే? చెడుమాట్లాడే అవకాశంలేదు. చెడుచేసే అవకాశం లేనేలేదు.
భూమి మీద మన ప్రతీకదలిక హృదయంలో పుట్టే, తలంపులనుబట్టే వుంటుంది.

దురాలోచనలు నరహత్యలు వ్యభి చారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. మత్తయి 15:19
మన తలంపులు పరిశుద్ధ పరచుకోగలిగితే? పాపంమీద విజయం సాధించగలిగినట్లే.

ఇదెప్పుడు సాధ్యం?
మన హృదయంలో నుండి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తొలగించి, ప్రియరక్షకుడైన యేసు ప్రభువును చేర్చుకున్నప్పుడే.

నీ హృదయంలో యేసయ్యకు స్థానం వుంటే? లోకాశలకు స్థానం లేదు.
లోకాశలతో నిండిపోతే యేసయ్యకు స్థానంలేదు.

మన హృదయంలో యేసయ్య లేకపోతే?
మన తలంపులు మలినమైపోతాయి.

తలంపులు మలినమైపోతే?
మనము చేసే క్రియలు నిత్య నాశనం వైపు నడిపిస్తాయి.

వద్దు!
మన హృదయంలో యేసయ్యను చేర్చుకుందాం! మన తలంపులు పరిశుద్ధ పరచుకుందాం! నిత్య రాజ్యానికి వారసులవుదాం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


పాపము

(మూడవ భాగము)


సకల దుర్ణీతియు పాపము. 1యోహాను 5:17

నీతి కానిది ఏదయినా? అది దుర్నీతే.
దుర్నీతి ఏదయినా? అది పాపమే.

నీతి అంటే? ఆయనను నమ్మడమే.

ఆయనను నమ్మకుండా, ఆయన వున్నాడు, మనలను చూస్తున్నాడు,
మన క్రియలకు ప్రతి ఫలమిస్తాడు అనే ఆలోచన లేకుండా మనము జరిగించే ప్రతీవిధమైన క్రియ 'దుర్నీతే'
నీవు చేసే ఏ పని అయినా, ఆయన చెప్పినట్లే చెయ్యాలి. ఏదయినా కలిపినా, తీసేసినా అది దుర్నీతే.

నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు. ద్వితి 12:32
కాని, మనకున్న అలవాటు ఆయన చెయ్యమన్నది చెయ్యం. చెయ్యొద్దన్నది తప్పకుండా చేస్తాము.
తద్వారా నీతి మనలో నివసింపక, దుర్నీతిపరులముగా మారిపోయాము.

ఆ దుర్నీతి దేవునికి మనకు మధ్య వివాదాన్ని తెచ్చిపెట్టింది.
దేవునితో సహవాసం కోల్పోయేటట్లు చేసింది.

ఆ నిత్య రాజ్యాన్ని చేరాలంటే?
దేవునితో సహవాసం కలిగియుండాలి.
దేవునితో సహవాసం కలిగియుండాలి అంటే?
దుర్నీతిని విడచిపెట్టాలి.

ప్రియ రక్షకుడు పిలుస్తున్నాడు!!
రండి! మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును.యెషయా 1:18

ఆయన పిలుపుకు లోబడదాం!
సకల దుర్నీతి అయిన పాపమును కడుగుకుందాం! పరిశుద్ధ పరచబడదాం!ఆ నిత్య రాజ్యానికి వారసులమవుదాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


పాపము

(నాలుగవ భాగము)


విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. రోమా 14:23
విశ్వాసము కానిది అంటే?
'అవిశ్వాసం'
అవిశ్వాసము పాపము.

విశ్వాస యాత్రలో మనము పరుగెత్తు తున్నప్పుడు, అనుక్షణము మనలను ఆటంకపరిచేది 'అవిశ్వాసమే'.

అవిశ్వాసము ఎప్పుడూ వ్యతిరేఖమైన ధోరణినే కలిగియుంటుంది.
•నీవల్ల కాదు. •నీవు చెయ్యలేవు. •నీకు శక్తి చాలదు. అంటూ... వెనక్కి లాగుతుంటుంది.

అనేక విషయాలు ప్రార్దిస్తుంటాము. కాని పొందుకోలేము.
కారణం?అవిశ్వాసమే

ప్రార్ధించే విషయాలు మన జీవితంలో జరుగుతాయి. అని నమ్మక పోవడం అవిశ్వాసం. విశ్వాసమూలము కానిది ఏదో
అది పాపము.

అంటే? మనము పార్ధించే ప్రార్ధనలోనే పాపం ఉందన్న మాట.
ఇక, అట్లాంటప్పుడు ప్రతిఫలం ఎట్లా వస్తుంది?

విశ్వసించ లేకపోతున్నాం అంటే?
దేవుని శక్తిని నమ్మలేక, ఆయనను చులకనచేస్తున్నట్లే.

విశ్వాసం లేకపోవడంవల్ల, పాపము చేసిన వారగుచున్నాము. అదే సమయంలో దేవుని నుండి ఆశీర్వాదములు పొందలేకపోవు చున్నాము.

ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడు. నీ ప్రతీ అవసరం తీర్చగలిగినవాడు.
ఇదెప్పుడు సాధ్యం?
నీవు విశ్వసించ గలిగినప్పుడే.

విశ్వసిద్దాం! ఆయన శక్తిని ఆశ్రయిద్దాం! ఆశీర్వధించబడదాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


పాపము

(ఐదవ భాగము)



"మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము"
యాకోబు 4:17
..........................

కీడు చేస్తేనే పాపం అనుకుంటాము.
కాని, మేలు చెయ్యకపోవడమూ పాపమే.

మేలు అంటే?
ఇతరులు అవసరతలో వున్నప్పుడు వారి అవసరాన్ని తీర్చగలిగే శక్తి, అనుకూల పరిస్థితులు మనకున్నప్పుడు, తప్పించుకుపోకుండా వారిని ఆదుకోగలగడం.

కొన్ని సందర్భాలలో మనం మాట్లాడే 'చిన్న మాట' కూడా ఇతరులకు మేలు కలిగించవచ్చు. కొందరైతే ఆ పని చెయ్యడానికి ఇష్టపడరు.

అట్లాంటి వారిని గురించి యేసుప్రభువు వారు చెప్తున్నమాట.
శపించబడిన వారలారా?
అపవాదికిని వాని అనుచరులకును సిద్ధపరచబడిన నరకాగ్నిలోనికి పొండి అంటూ...

*నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు;
*దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు;
*పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు;
*దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు;
*రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును.

ప్రభువా!
నీవెప్పుడు ఆకలిగొన్నావు?
నీవెప్పుడు దప్పికగొన్నావు?
అంటూ... ఒక్కొక్కదాని గురించి అడుగుతుంటే?

అందుకాయనమిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.

మనము మన పొరుగు వానికి సహాయం చేస్తే?
ఒకవేళ వారు తిరిగి మనకు సహాయం చేయలేకపోవచ్చు.

మన పొరుగు వానికి సహాయం చేస్తే? అది దేవునికి చేసినట్లే కాబట్టి, వారిపక్షంగా దేవుడే మనకు సహాయకుడవుతాడు.

ఇతరులకు మేలు చెయ్యడంవల్ల మనము పాపుల జాబితాలో చేర్చబడం. అదే సమయంలో దేవుని నుండి దీవెనలు పొందగలం.

మనము చెయ్యగలిగినంతలో ఇతరులకు సహాయం చెయ్యడానికి ప్రయత్నిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్



పాపము

(ఆరవ భాగము)


"నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును."
1 సమూయేలు 12:23
"ఇతరులను గురించి ప్రార్ధించకపోవడం పాపము"

మన తలంపులు ఎట్లా వుంటాయి అంటే?
నేనేమి వ్యభిచారంగాని, దొంగతనంగాని, నరహత్యలుగాని చెయ్యడంలేదు కదా?
నేనేమి పాపం చెయ్యడంలేదు అనుకుంటాము.

అదే సమయంలో సాతాను వేరేవాళ్ళను నీకుచూపించి వారికంటే నీవే పరిశుద్ధుడవు అనిచెప్పి నిన్ను ఇంకా పాపంలోనే కొనసాగేటట్లు ప్రయత్నం చేస్తాడు.
మనము పాపము అని తెలిసికూడా చేసేపనులు కొన్ని అయితే, పాపము అంటే ఏమిటో తెలియక చేసే పనులు మరికొన్ని. అట్లాంటి వాటిలో ఇతరులను గూర్చి ప్రార్ధించకపోవడం ఒకటి.

మనము ప్రార్ధించేటప్పుడు మనప్రార్ధన మనమూ, మనకుటుంబం అంటూ మన చుట్టూనే తిరుగుతుంది.
మన ప్రార్ధనలో ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వం.
కాని, 'ఇతరులను గురించి ప్రార్ధించకపోవడం పాపము.'
నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్నువలే నీ పొరుగువారిని గూర్చి ప్రార్ధించాలి.
మన ప్రార్ధనలో ప్రధమ స్థానం మనకంటేముందు మన పొరుగు వారికే ఇవ్వాలి. వారి అవసరతలను గూర్చి ప్రార్ధించిన తర్వాతనే మన అవసరతల గురించి ప్రార్ధించాలి.

మన పొరుగు వారిని గురించి ప్రార్ధించలేక పోతున్నాం అంటే? వారిని ప్రేమించ లేకపోతున్నామనే కదా అర్ధం.
నశించిపోతున్న ఆత్మలపట్ల మనకు భారం లేకపోతే? వారి నాశనానికి మనము కూడా ఒక కారణం కాదా?
మనము సువార్త ప్రకటింప లేకపోవచ్చు. కాని ఆ ప్రకటించే సేవకులను గురించి ప్రార్ధించాల్సిన భారం మనకు లేదా?

ప్రార్ధించే భారం మనకు లేకపోతే?
మనము పాపము చేసినవారమే.
పాపము చేసినవారమైతే?
పరలోకానికి ప్రవేశంలేదు.

వద్దు!
నేడే ఒక తీర్మానం తీసుకుందాం!భారం కలిగి ప్రార్దిద్దాం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


పాపము

(ఏడవ భాగము)


తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. సామెతలు 14:21

మన ఆర్ధిక పరిస్థితులు, సమాజంలో మనకు గల పలుకుబడిని చూసి ఇతరులను హీనముగా చూస్తాము.

అయితే, ఒక్క విషయం మనకు గుర్తురాదు.
వారు, మనము దేవుని పోలికలోనే ఉన్నామని, వారిని తిరస్కరిస్తే? దేవునినే తిరస్కరిస్తున్నామని.

గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.
యోబు 31:15

ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే.
సామెతలు 22:2

మన సహోదరులను తిరస్కరించే మనము, దేవునిని ప్రేమించలేము.

ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును? 1 యోహాను 3:17

గనుక, మన సహోదరులను ప్రేమించ లేకపోతే? .
పాపము చేసిన వారమవుతాము.
పాపము చేసినవారమైతే?
పరలోకానికి ప్రవేశంలేదు.

వద్దు!
మన సహోదరులను ప్రేమిద్దాం!
నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


పాపము

(ఎనిమిదవ భాగము)


"పాపమువలన వచ్చు జీతము మరణము" రోమా 6:23
దేవుడు మనిషిని నిర్మించినప్పుడు మరణాన్ని కూడా నిర్ణయించలేదు.

కాని, ఆ మనిషి చేసిన పనియే అతనికి జీతాన్ని తీసుకొచ్చింది. అదే 'మరణం'.

మరణం అంటే?
ఎడబాటు, దేవునితో కోల్పోయిన సహవాసం.

అయ్యో! చేపలు ఎప్పుడూ నీటిలోనే ఉంటున్నాయి. చలి పెడుతుందేమోనని తీసుకొచ్చి ఎండలో పెడితే? ఏమవుతుంది?
చచ్చిపోతాయి.

కారణం? వాటిని నీటిలోనే ఉండడానికి దేవుడు నిర్ణయించాడు. అవి అక్కడే వుండాలి.

అదే విధంగా,
దేవునితో కలసి సహవాసం చెయ్యడానికి నిర్మించబడిన మనిషి దేవునితోనే వుండాలి. కాని, దేవునికి దూరమై, దయ్యం ప్రక్కలో చేరాడు.

ఉండాల్సిన చోట ఉండకపోవడం వల్లనే, మరణం సంప్రాప్తమయ్యింది.

ఏలయనగా 'పాపమువలన వచ్చు జీతము మరణము.'
ఆ మరణం నుండి మనిషి జీవంలోనికి ప్రవేశించాలి.

అదెట్లా సాధ్యం?
ప్రభువైన క్రీస్తు యేసు సిలువ మరణం ద్వారానే సాధ్యమయ్యింది.

ఆయన మరణం,మనకు జీవాన్నిచ్చింది.
తండ్రితో సహవాసాన్ని పునరుద్ధరించింది.

కోల్పోయిన సహవాసాన్ని, తిరిగి ప్రారంభిద్దాం!
ముందుకు సాగిపోదాం! ఆ గమ్యం చేరువరకు.

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


పాపము

(తొమ్మిదవ భాగము)


పాపము మనిషిని ఏమి చేస్తుంది అంటే?

•పాపం తరమడం మొదలుపెడుతుంది,
•ఎక్కడున్నా పట్టుకొంటుంది,
•పట్టుకొని ఎటూ కదలకుండా బంధించేస్తుంది.
•దేవునితో సంబంధం లేకుండా చేస్తుంది.
•చివరికి సమాధానం లేకుండా చేసేస్తుంది.

1. పాపము తరుముతుంది:
"కీడు పాపులను తరుమును"
సామెతలు 13:21

2. పాపము పట్టుకొంటుంది:
"మీ పాపము మిమ్మును
పట్టుకొనును"
సంఖ్యా 32:23

3. పాపము బంధిస్తుంది:
"దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును."
సామెతలు 5:22

4. దేవుని నుండి వేరు చేస్తుంది:
"మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను"
యెషయా 59:2

5. సమాధానం లేకుండా చేస్తుంది:
"దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
యెషయా 48:22


ఏ స్థితిలో మనమున్నాము?
•దాని చేత తరమ బడుతున్నామా?
•దానికి దొరికిపోయామా?
•దాని చేతుల్లో బంధీగా మారిపోయామా?
•దేవునిని నుండి వేరై పోయామా?
•సమాధానం కోల్పోయామా?

నీవు ఏ స్థితిలోనున్నా సరే!
•నీకునీవుగా దాని చేతుల్లోనుండి తప్పించుకోలేవు.
•నీకునీవుగా పాపంతో పోరాటం చెయ్యడం సాధ్యం కానేకాదు

మరెట్లా సాధ్యం?
పాపము మీద విజయం సాధించి,
నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని లోకానికి సవాలు విసరిన యేసయ్య పాదాల చెంతచేరాలి.
ఆయనతోనే పాపముపై విజయం సాధ్యం.

నేడైనా ఆయన చెంత చేరుదాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


పాపము

(పదియవ భాగము)


పాపము:
*చూడడానికి అందముగా వుంటుంది.
*చేస్తున్నప్పుడుఆనందాన్నిస్తుంది.
*చేసాక ఆవేదన మిగుల్చుతుంది.

ఏదేనులో హవ్వకు ....
*పండు అందముగా కనిపించింది.
*తింటున్నప్పుడు ఆనందాన్నిచ్చింది.
*తిన్నాక ఆవేదన మిగిల్చింది.
అది సృష్టి ఆరంభములో మొదలై ఆ వేదన నేటికి కొనసాగుతుంది.

దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది.

ఆవేదన:
*పుట్టిన బిడ్డ చనిపోయాడు.
*పిల్లలు వ్యభిచారులయ్యారు.
*పిల్లలు హంతకులయ్యారు.
*కన్నకొడుకే దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు.
*కనీసం చెప్పులు లేకుండా రాజైన దావీదు కొండలకు పారిపోవలసి వచ్చింది.
*కుక్క వంటి "షిమి " ఓ దుర్మార్గుడా, నరహంతకుడా! ఛీ! ఫో ...అంటూ దూషిస్తూ, శపిస్తూ వుంటే, మౌనముగా తల వంచాల్సి వచ్చింది.
*దేవుని పక్షంగా యుద్దాలు చెయ్యడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్దాలు చెయ్యొద్దని ప్రమాణం చేయించారు.
ఇట్లా... ఎన్నో! ఎన్నెన్నో!

కారణం:
1.పొరుగు వాని భార్యను ఆశించడం ద్వారా 10వ ఆజ్ఞను మీరి,వ్యభిచారిగా మారాడు.
2.ఆమె భర్తను చంపించడం ద్వారా నరహంతకుడయ్యాడు.

*ఇంతకీ ఎవరీ దావీదు?
దేవుని చేత
"నా హృదయానుసారుడు" అని సాక్ష్యము పొందినవాడు.

*గోల్యాతుపై విజయం దావీదుకీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళితే,
బత్సేబతో పాపం దావీదును పతనం అంచులకు తీసుకొని వచ్చింది.

దేవుడు పాపివైన నిన్ను ప్రేమిస్తాడు గాని, నీ పాపాన్ని ఎప్పటికి ప్రేమించడు,
సహించడు.

అదెట్లా సాధ్యం?
మన ఇంట్లో ఎవరయినా కాన్సర్ తో బాధపడుతుంటే, ఆ రోగిని ప్రేమిస్తాం, కాని ఆ కాన్సర్ ని ప్రేమించం. అట్లా ....

ఏ పాపం నిన్ను దేవుని నుండి దూరం చేస్తుందో?
ఏ పాపం నిన్ను పట్టి పీడిస్తుందో?
ఏ పాపం నీకు ఆవేదన మిగిల్చిందో?
ఆ పాపాన్ని కప్పుకోక, సిలువ చెంత ఒప్పుకో!
నీ జీవితంలో ఎన్నాడులేని శాంతిని, సమాధానాన్ని అనుభవించు.

అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక !
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


పాపము

(పదకొండవ భాగము)


పాపము ఏమి చేస్తుంది అంటే?
'దేవుని క్రమము' నుండి దూరం చేస్తుంది.

దేవుని క్రమాన్ని అతిక్రమించడం ద్వారా, మనము దేవుని నుండి దూరమై సాతానుకు దగ్గరై, వాడి బంధకాలలో చేరిపోతాం.

వాడి బంధకాలలో బంధించబడిన మనం వాటినుండి విడిపించబడి, ప్రియ రక్షకుని చెంతకు చేరాలంటే?

విరిగి నలిగిన హృదయంతో దావీదు చేసిన ఈ చిన్ని ప్రార్ధన చెయ్యగలగాలి.

"దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము."
కీర్తనలు 51:1

పాపముతో నిండిన లోకములో, పాపపు శరీరంతో జీవిస్తున్నాం. పాపంలోపడడం అత్యంత సులభం.

అట్లా అని, పాపపు శరీరంతో ఉన్నాము కాబట్టి పాపము చెయ్యడం సహజం. అని, నీకు నీవే సర్ది చెప్పుకొనే ప్రయత్నం చెయ్యొద్దు. ఆ పాపంలోనే నిలచియుండే ప్రయత్నం చెయ్యొద్దు.

హృదయానుసారుడైన దావీదే పాపం చేస్తే నేనెంత? అని ఆ పాపాన్ని ఆదర్శంగా తీసుకొనే ప్రయత్నం చెయ్యొద్దు. దాని ఫలితం భయంకరం.

హృదయానుసారుడైన దావీదే పశ్చాత్తాపపడితే, ఆ పశ్చాత్తాపం నాలో ఎందుకు ఉండకూడదు? అని దానిని ఆదర్శంగా తీసుకో. దాని ఫలితం "సమాధానం".

దావీదు ఎంతగా ఏడ్చాడు అంటే, తన కన్నీటితో తన పరుపు తెలిపోయిందట.
ఇది సాధ్యమా? కాదు.
"పరుపు" అంటే "సుఖం" .... అంటే తన వేదన, కన్నీళ్లు ముందు సుఖం తేలిపోయింది.

తాను చేసిన ఘోరమైన పాపాలకు ఏమంచి కార్యముగాని, తాను అర్పించే ఏవిధమైన బలిఅర్పణ గాని తన పాపాన్ని పావనం చెయ్యలేదు.

పాప క్షమాపణ కలిగేందుకు మిగిలియున్న ఒకే ఒక్క మార్గం ఆయన కృప, కరుణా వాత్సల్యం.
ఇక ఏది ఆయన పాపాన్ని పరిహరించలేదు.
అందుకే ఆయన కృపకై అర్ధిస్తున్నాడు. రోధిస్తున్నాడు.

ఏ పాపం నిన్ను తరుముతుందో?
ఏ పాపం నిన్ను వెంటాడుతుందో?
ఏ పాపం నిన్ను బంధించిందో?

అది ఎంతటి ఘోరపాపమైనా!
ఎవ్వరితో చెప్పుకోలేనిది
అయినా సరే !

ఆయన పాదాల చెంత చేరుదాం!
ఆయన కృపకై అర్ధిద్దాం!

"దేవా, పాపినైన నన్ను కరుణించు"
లూకా 18:13
సుంకరి చేసిన చిన్న ప్రార్ధన అతనిని నీతిమంతుల జాబితాలో చేర్చింది.

ఈ చిన్న ప్రార్ధన, నీ అతిక్రమములను తుడిచివేయ గలదు. నీవు కోల్పోయిన సమాధానాన్ని తిరిగి నీజీవితంలో ప్రతిష్టించ గలదు.

విరిగిన మనస్సుతో ప్రార్ధిద్దాం!
పొందుకుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


పాపము

(పన్నెండవ భాగము)


పాపము ఏమి చేస్తుంది అంటే?
•హృదయాన్ని మలినం చేస్తుంది.
•మనసును అస్థిరం చేస్తుంది.

హృదయమే మలినమైపోతే?
మన జీవితమంతా మలినమైనట్లే కదా!

మనసు చంచలమైనదైతే?
దేవునిలో స్థిరత్వం లేనట్లేకదా?

ఇట్లాంటి పరిస్థితులలో మనము కొట్టుమిట్టాడుతుంటే?

విరిగి నలిగిన హృదయంతో దావీదు చేసిన ఈ చిన్ని ప్రార్ధన చెయ్యగలగాలి.

దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.
కీర్తనలు 51:10

*దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము. అంటే?
హృదయం మలినమయ్యింది.

*అంతరంగంలో స్థిరమైన మనస్సు పుట్టించు. అంటే ?
మనస్సు అస్థిరమయ్యింది.

* స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. అంటే?
గతకాలంలో వుండేది ఇప్పుడు అస్థిరమయ్యింది. నూతనమైన మనస్సు అనుగ్రహించు.

*హృదయం ఎందుకు మలినం అయ్యింది?
*మనస్సు ఎందుకు అస్థిరమయ్యింది?
కారణం ఒక్కటే "పాపం"

దావీదు పట్టించుకొనేది తాను మనుష్యులకు ఎట్లా కనిపిస్తున్నాడో?అనికాదు. తన అంతరంగ స్థితి ఎట్లా వుందో ? అని మాత్రమే.
ఎందుకంటే, అంతరంగంలో యదార్ధతను, పరిశుద్దతను కలుగజేయు వాడు దేవుడు ఒక్కడే అని అతనికి తెలుసు.

ఇప్పుడు దావీదుకు కావలసింది.
*పవిత్ర ఉద్దేశాలు గల యదార్ధ హృదయం.
*నిర్మలమైన కోరికలతో నిండిన హృదయం.
*పాపానికి ఎదురు తిరిగే హృదయం.
*దేవుని పరిశుద్దాత్మ అదుపులో వుండే హృదయం.
ఇట్లాంటి హృదయం దేవుడే అనుగ్రహించాలి. అందుకే దావీదు అంటున్నాడు 'శుద్ద హృదయం కలుగజేయుము.'

హృదయ శుద్ధి నిలిచి ఉండాలంటే, స్థిరమైన గట్టి మనస్సు,
పాపాన్ని వ్యతిరేకించే అచంచలమైన గుణం వుండాలి.
ఇది ఇంతకు ముందు దావీదులో వుండేది. అయితే పాపం చేసి దాన్ని జార విడచుకున్నాడు.

అందుకే దేవుని అర్ధిస్తున్నాడు.
కోల్పోయిన అట్లాంటి స్థిరమైన మనస్సు నూతనముగా అనుగ్రహించమని.

పశ్చాత్తాప హృదయంతో ఈ చిన్ని ప్రార్ధన మనమూ చెయ్యగలగాలి.
"దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము."

ప్రార్ధిద్దాం!
పవిత్ర పరచ బడదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!



పాపము

(పదమూడవ భాగము)


పాపము ఏమి చేస్తుంది అంటే?
•సంతోషం లేకుండా చేస్తుంది.
•బాధను కలిగిస్తుంది.

నీవునూ పాపంలో మునిగిపోయి,సంతోషాన్ని కోల్పోయి, బాధలు అనుభవిస్తున్నావా?

ఒక్కటే శరణ్యం!
విరిగి నలిగిన హృదయంతో దావీదు చేసిన ఈ చిన్ని ప్రార్ధన చెయ్యగలగడం.

"ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును."
కీర్తనలు 51:8

దావీదు తన పశ్చాత్తాప
ప్రార్ధనలో ...
దేవునితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు.

"ఆనందం, సంతోషం, కలిగించే మాటలు నాకు వినిపించు. విరిగిన ఎముకలు తిరిగి ఆనందించనియ్యి."

ఇంతకీ,
*ఉత్సాహము, సంతోషము ఎందుకు కోల్పోవలసి వచ్చింది?
అంతరంగములో సత్యం లేదు గనుక.

*అంతరంగములో సత్యము లేకపోతే?
దాని స్థానంలో పాపం వచ్చి కూర్చుంటుంది.

పాపం వచ్చి కూర్చుంటే ?
*ఉత్సాహము ఉండదు.
*సంతోషము ఉండదు.
*నవ్వుతూనే వుంటాం. కాని అది పెదవులకు మాత్రమే పరిమితం.
*అందరిలో వుంటాం. కాని ఒంటరి తనాన్ని అనుభవిస్తాం.
*విరిగిన ఎముక శరీరాన్ని ఎంతగా నొప్పిస్తుందో? పాపము కూడా హృదయాన్ని అంతగా నొప్పిస్తుంది.
*నొప్పింపబడిన హృదయం వేధనతో నిండిపోయి కృంగిపోతుంది.

అందుకే దావీదు తన వ్యక్తిగత అనుభవంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు.

నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించు చున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి.
కీర్తనలు 31:10

నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.
కీర్తనలు 32:3

మన జీవితంలో పాప ఫలితంగా కోల్పోయిన ఆనందం, సంతోషం, శాంతి, సమాధానం తిరిగి పొందాలంటే?
ఒక్కటే మార్గం. పాప క్షమాపణ, హృదయ శుద్ధి, అంతరంగములో సత్యం. ఇవి మాత్రమే ఉత్సాహాన్ని, సంతోషాన్ని తీసుకురాగలవు.

ఆయన పాదాలచెంత చేరుదాం!
పశ్చాత్తాప పడదాం!
శాశ్వతానందాన్ని అనుభవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


పాపము

(పద్గ్నాల్గవ భాగము)


పాపము ఏమి చేస్తుంది అంటే?
•మనము ఇతరులపట్ల జరిగించే క్రియలు, దేవునికి ఏమి సంబంధం లేదనిచెప్పి, మన ఇష్టాన్ని ఇతరుల పట్ల జరిగించడానికి ప్రేరేపిస్తుంది.

మనము చేసే తప్పులలో తొంబై తొమ్మిది శాతం అవి తప్పు అని తెలిసే చేస్తాం. మన పాపం ఎప్పుడూ మన కళ్ళముందే వుంటుంది.

నీవు తప్పు చేస్తున్నావ్? అంటూ మనఃసాక్షి గద్దిస్తున్నా, పీక నొక్కి దాన్ని చంపేసి. మన పని మనం కొనసాగిస్తున్నాం!

కాని,ఒక్కటి మాత్రం నిజం. సమాధానం కోల్పోయామని మనకు స్పష్టంగా తెలుసు.
దేవుని సన్నిధిలో ఒప్పుకొని, వాటిని మానుకుంటేనేగాని సమాధానం తిరిగిరాదనీ తెలుసు.
కాని, ఆపని మాత్రం చెయ్యం.

దావీదు ఆపని చెయ్యగలుగు తున్నాడు.
దొరికిపోయానని, గత్యంతరం లేక నోటితో పైపై మాటలు కాదు దావీదు చెప్తున్నది. హృదయాంత రంగంలో నుండి పెల్లుబికే పశ్చాత్తాపం అది.

నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.
నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.
కీర్తనలు 51:3,4

"నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను." అంటున్నాడు.
బత్షేబకు, ఊరియకు వ్యతిరేకముగా పాపం చేసాను అని చెప్పట్లే. ఎందుకంటే వారును దేవుని పోలికలో సృస్టించబడిన వారే, వారు సృష్టిలో భాగమే. అందుచే వారికి చేస్తే దేవునికి చేసినట్లే. అనే, అద్భుతమైన సత్యాన్ని గ్రహించగలిగాడు దావీదు.

దావీదు మాటలతో ఒక విషయం స్పష్టం.
*ఒకరిని బాధించామంటే, దేవునిని భాధించినట్లు.
*ఒకరికి సహాయం చేశామంటే దేవునికి చేసినట్లు.

"అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించు చున్న యేసును;"
అపో. కా. 9:4,5

యేసును ప్రత్యక్షముగా సౌలు హింసించిన సందర్భంలేదు. కాని దేవుని పిల్లలను హింసించడం ద్వారా దేవుని హింసించిన వాడయ్యాడు.

"సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు"
1 కొరింది 8:12

అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరు లలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.
మత్తయి 25:40

ఒక తప్పు చెయ్యడానికి మనం సిద్దపడుతున్నప్పుడు, "నేను దేవునికే విరోధముగా ఈ పని చేస్తున్నాను" అనే తలంపు ఆ తప్పు చెయ్యకుండా కాపాడగలదేమో?

అందుచే, మన ప్రతీ కదలికలోను ఆయన్ని ముందుపెట్టుకొని జీవించగలిగినట్లయితే మన పాదములు తొట్రీల్లె అవకాశాలు చాల తక్కువ.

అట్లా కాని పక్షంలో, పాపం ఎంత తేటగా, ఎంత ఘోరంగా కనిపిస్తుందంటే, దేవుడు దానికి తీర్పు తీర్చేటప్పుడు ఆయన మీద ఆరోపణ చెయ్యడానికి కూడా ఏమి మిగలదు.

అందుచే మన నడతను సరిచేసుకొని ఆయనకోసం జీవిద్దాం.

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


పాపము

(పదిహేనవ భాగము)


•పుట్టుకతోనే పాపం ప్రతీ మనిషిని వెంటాడుతుంది.
"నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నాతల్లి నన్ను గర్భమున ధరించెను." కీర్తనలు 51:5

దావీదు తన పాపముల గురించి మాట్లాడుతూ, ఇక్కడ తన పాపమంతటికి గల ప్రధాన కారణమను ఎత్తి చూపుతున్నాడు.
తన తల్లి గర్భంలో తాను రూపు దిద్దుకొంటున్నప్పటినుండి తన స్వభావం చెడ్డదని అతను ఒప్పుకొంటున్నాడు.

యేసు ప్రభువు తప్ప, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతీ వ్యక్తి విషయంలోనూ ఇది నిజం.

ఆదాము, హవ్వ పాపంలో పడినప్పటినుండి స్త్రీ, పురుషులందరికీ భ్రష్ట స్వభావం వుంది. దానిని వారు వారి సంతానానికి అందజేసారు.

ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
ఆదికాండము 5:3

ఆదాము తన పోలికలో, తన స్వరూపమున కుమారుని కన్నాడట.
పోలిక: రూపు రేఖలు.
స్వరూపము: అంతరంగ స్థితి.
దీనిని బట్టి వారి పాప స్వభావం కూడా తర్వాత తరాలకు అందజేయబడుతుంది.

నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. ఆదికాండము 8:21
తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. కీర్తనలు 58:3

పై విషయాలనుబట్టి మన పుట్టుకతోనే పాపం మనలను వెంటాడుతుంది. మన నుండి దానిని వేరు పరచకపోతే, మనతోపాటే పెద్దదై, పరిపక్వత చెంది, నిత్యమరణంనకు తీసుకుపోతుంది.

సిల్వలో ఆయన కార్చిన రక్తం మాత్రమే ఆ పాపం నుండి మనలను పవిత్ర పరచుతుంది.

సిలువ చెంత చేరుదాం!
విడుదల పొందుదాం!
నిత్య మరణం నుండి తప్పించ బడదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


పాపము

(పదహారవ భాగము)


పాపము ఏమి చేస్తుంది అంటే?
•రక్షణానందము పోగొట్టేస్తుంది.
•దేవునికి అవిధేయునిగా మార్చేస్తుంది.
•బలహీనుని చేసేస్తుంది

ఇట్లాంటి పరిస్థితిలోనేనున్న దావీదు దేవుని సన్నిధిలో ఈరీతిగా ప్రాధేయపడుతున్నాడు.

"నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము."
కీర్తనలు 51:12

*కోల్పోయిన రక్షణానందం మరళా అనుగ్రహించు.
*సమ్మతించే మనస్సు దయచెయ్యి.
*నన్ను ధృడపరచు.

1.రక్షణానందం మరళా అనుగ్రహించు:
ఈలోకంలో ఎన్ని ఆనందాలున్న అవి రక్షణానందానికి సాటిరావు. ఆ ఆనందం యొక్క రుచి రక్షించబడి, అనుభవించిన వారికే తెలుసు.

దావీదు ఈలోకంలో నున్న ఆనందం కోసం, శాస్వతానందాన్ని కోల్పోయాడు.

దావీదును పరిశుద్దాత్మ విడచిపెట్టలేదు గాని ఆనందం తొలగిపోయింది.

పాపం, ఆధ్యాత్మిక ఆనందం రెండూ కలసి వుండడం అసాధ్యం.
క్షమాపణ, పరిశుద్దతల వెంట ఆనందం వస్తుంది. వాటిని ఇవ్వగలిగేది దేవుడొక్కడే.

కోల్పోయిన ఆ ఆనందం యొక్క విలువ ఏంటో, దావీదుకి ఇప్పుడు అర్ధమయ్యింది. అందుకే మరల తిరిగి పొందడానికి దేవుని సన్నిధిలో రోధిస్తున్నాడు.

2.సమ్మతించే మనస్సు దయచెయ్యి.
"సమ్మతిగల మనసు" విధేయత గలిగి, ఇష్టపూర్వకంగా, సంతోషంతో తనకు తాను దేవునిని ఆరాధించడానికి కావలసిన మనస్సు.

పాపము చేసి ఇట్లాంటి మనస్సును కోల్పోయాడు. మరళా అట్లాంటి మనస్సును అనుగ్రహించు అని దావీదు ప్రార్దిస్తున్నాడు.

3.నన్ను ధృడపరచు.
పాపము మనిషిని బలహీనుని చేస్తుంది. మరణం వరకు తీసుకెళుతుంది.
గొల్యాతును సహితము కూల్చిన దావీదు నేడు బలహీనుడయ్యాడు. అందుకే అంటున్నాడు నన్ను ధృడ పరచు.

చూపులు,తలంపులు,
క్రియల ద్వారా...పాపం చేసి
దేవునికి దూరమై,శాంతి, సమాధానం, రక్షణానందం కోల్పోయిన మనము

విరిగినలిగిన మనస్సుతో,
పశ్చాత్తాపంతో ఈ చిన్ని ప్రార్ధన చేద్దాం!
"తండ్రీ! నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము." ఆమెన్!

విశ్వసిద్దాం!
ప్రార్ధనాఫలాన్ని అనుభవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


పాపము

(పదిహేడవ భాగము)


•పాపము ఏమి చేస్తుంది అంటే?
మనలను అపవిత్రులనుగా మార్చేస్తుంది.

దావీదు తన రక్తాపరాధామును, రక్తపు డాగులను శుద్ధి చెయ్యమని, అవి మంచు కంటే తెల్లగా వుండాలని, అట్లాంటి పరిశుద్దత లోనికి నడిపించమని ప్రార్దిస్తున్నాడు.
నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.కీర్తనలు 51:7

"హిస్సోపు" అనేది ఒక చిన్న చెట్టు పేరు. పాతనిబంధన కాలంలో జంతుబలి రక్తాన్ని చిలుకరించేందుకు ఈ హిస్సోపు మొక్కను వాడేవారట.
యాజకుడు పవిత్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సో పును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. లేవీకాండము 14:4

ఆ హిస్సోపుతో చిలుకరించబడే జంతు రక్తం, పాపమును శుద్ధిచేసే క్రీస్తు రక్తానికి సూచన.
"అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును." 1 యోహాను 1:7

దావీదు తన రక్తాపరాధామును, రక్తపు డాగులను శుద్ధి చెయ్యమని, అవి మంచు కంటే తెల్లగా వుండాలని, అట్లాంటి పరిశుద్దత లోనికి నడిపించమని ప్రార్దిస్తున్నాడు.

"యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును." యెషయ 1:18

ఆ కల్వరి గొల్గోతలో నీ ప్రియ రక్షకుడైన యేసయ్య చిందించిన రుధిర ధారలే నీ పాపాన్ని హిమము కంటే తెల్లగా శుద్దీకరించ గలదు.

దావీదు చేరిన ఆ పశ్చాత్తాప అనుభవంలోనికి మనము చేరాలి. విరిగి నలిగిన దీన మనస్సుతో ఈ చిన్న ప్రార్ధన చేయ గలగాలి.
"నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము."
ప్రార్ధిద్దాం!పవిత్ర పరచబడదాం!ఆయన సాక్షిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


పాపము

(పద్దెనిమిదవ భాగము)


పాపము ఏమి చేస్తుంది అంటే?
•దేవుని చట్టం అతిక్రమించేటట్లు చేస్తుంది.
• దోషిగా నిన్ను నిలబెడుతుంది.

దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము

నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.
కీర్తనలు 51:1,2

దావీదు చేస్తున్న ఈ పాప ప్రక్షాళనా ప్రార్ధనలో 3 అంశాలు ప్రస్తావిస్తున్నాడు.

1. నా అతిక్రమములను తుడచివెయ్యి (అతిక్రమములు అంటే దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం.)

2. నా దోషమును కడుగు
(దోషములు లేదా అపరాధములు అంటే " తప్పు అని తెలిసినా మనము చేసిన పనులు.)

3. నా పాపమును పవిత్రపరచు.
(పాపము మన పుట్టుకతోనే మనలను వెంటాడేది.)

ఈ 3 అంశాలు దావీదు ఒప్పుకోవడం ద్వారా తన మొత్తం జీవితాన్నే దేవుని పాదాల చెంత అప్పగించి నట్లయింది.

ఇదే ప్రార్ధన మనము చెయ్యగలగాలి.
ఎందుకంటే? మన అతిక్రమములు, దోషములు, పాపములు మనపై పేరుకుపోయి వున్నాయి. అవి అసహ్యకరమైన మచ్చలులా వున్నాయి.

అవి తుడవబడాలి,
కడుగబడాలి,
పవిత్ర పరచాబడాలి అంటే, ఈలోకంలోవున్న సబ్బులు గాని, ఆయింట్ మెంట్స్ గాని ఏవి పనికిరావు. "యేసయ్య ఆ కల్వరిలో కార్చిన ఆ పరిశుద్ద రక్తం ఒక్కటి మాత్రమే" ఆ పని చెయ్యగలదు.

"మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును."
1యోహాను 1:9

1.నీ అతిక్రమములు, అపరాధములు, పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, వాటిని క్షమించి, తుడచివేస్తాడట. అవి ఎప్పటికి జ్ఞాపకము చేసుకొనబడవు.

"నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను."
యెషయ 43:25

2.నీ అతిక్రమములు, అపరాధములు, పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే పరిహారము నొందుతావు. తద్వారా ధన్యత లభిస్తుంది.
ధన్యుడు అంటే ఆశీర్వధించబడిన వాడు.

"తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు"
కీర్తనలు 32:1,2

*విరిగి నలిగిన మనస్సుతో ఈ రీతిగా ప్రార్ధిద్దాం!
"నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము."
*ఈ ప్రార్ధనా ఫలాన్ని అనుభవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


పాపము

(పంతొమ్మిదవ భాగము)


పాపము ఏమి చేస్తుంది అంటే?
•దేవునిని స్తుతించ కుండా అడ్డగిస్తుంది.
•ఒకవేళ పాపంలోనిలిచియుండి ఆయనను స్తుతించినా, ఆ స్తుతి ఆయనను చేరదు.

అందుకే దావీదు దేవునిని బ్రతిమలాడు తున్నాడు.
తండ్రీ! నేను నిన్ను స్తుతించాలని వుంది, కాని నా పెదవులు తెరచుకోవడం లేదు. దానికి కారణం 'నా పాపమే'.
ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.
నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు. కీర్తనలు 51:15,16

దేవుని స్తుతించడం కోసం మన పెదవులు విప్పడం కూడా ఆయన ఉచితమైన కృప.
1.నీవు బలిని కోరువాడవుకావు:
పాతనిబందనా కాలంలో బలులు ప్రవేశ పెట్టింది దేవుడే. కాని,
దావీదు అంటున్నాడు "నీవు బలిని కోరువాడవు కావు."
ఏది నిజం?
రెండూ నిజమే.

*బలులు ప్రవేశ పెట్టింది దేవుడే. కాని, ఆ బలులు ఆయన కోసం కాదు. మన పాప ప్రాయశ్చిత్తం కోసమే.
అదే సమయంలో ఆ బలులు యేసయ్య బలియాగానికి సూచనగా ముందుగ ప్రవేశపెట్టబడ్డాయి.

2.దహనబలి నీకిష్టమైనది కాదు:
దేవుడే చెప్పాడు అబ్రహాముతో..
"నీ ఏకైక కుమారుని నాకు దహన బలిగా అర్పించు" అని.
దహనబలి నీకిష్ట మైనది కాదని. దావీదు అంటున్నాడు.
ఏది నిజం?
రెండూ నిజమే.

దేవుడు దహనబలి కోరింది అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించడం కోసం మాత్రమే. ఒకవేళ దహనబలి ఆయనకు ఇష్టం అయితే, అబ్రాహామును దేవుడు అడ్డగించేవాడు కాదు కదా?
అందుచే,
నీవర్పించే బలులు, దహన బలులు ఆయనకు అక్కరలేదు. నీ కోసం ఆయనే బలిపశువుగా మారాడు. ఆయన నీకోసం చిందించిన రుధిర ధారల్లో నీ పాపమును కడుక్కో!
శుద్దీకరించబడి, ఆయనకోసం జీవించు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


పాపము

(ఇరువయ్యో భాగము)


మన పాపము పరిహరింపబడడానికి వేరే మార్గమేది లేదు.
ఉన్నది ఒక్కటే! అదే విరిగి నలిగిన మనస్సుతో ఆయన సిలువ చెంతచేరడం.

విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తనలు 51:17

మనము చేసిన పాపముల నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం పొందితేనే , దేవుడు క్షమిస్తాడు. స్వీకరిస్తాడు. పశ్చాత్తాపం లేకుండా ఏ బలిఅర్పణ వల్ల ప్రయోజనం లేదు.

"మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి." యోవేలు 2:13

మన దేవుడు:
*కరుణా వాత్సల్యం గలవాడు.
*శాంతమూర్తి
*అత్యంత కృపగలవాడు.

మన పాపములకు ప్రతిఫలముగా మన మీదకి రావలసిన కీడును రానీయకుండా ఆయన మనస్సు మార్చుకొని కీడుకు బదులుగా మేలు చేస్తాడు.

ఇదెప్పుడు?
మనం హృదయాన్ని చింపుకొని పశ్చాత్తాప పడినప్పుడు.

పాత నిబంధనా కాలంలో వస్త్రాలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిదేలో కూర్చొని పశ్చాత్తాప పడేవారు.
కాని ఇప్పుడు మనం చెయ్యాల్సింది హృదయాన్ని చింపి, హృదయంలో టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్తను యేసయ్య పాదాల చెంత కుమ్మరించి,
పశ్చాత్తాప పడాలి.

విరిగినలిగిన హృదయంతో సిలువ చెంత చేరుదాం!
స్తుతి బలిపీటం కడదాం!
ఆత్మీయ బలులు అర్పిందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

పక్షిరాజు

యేసు క్రీస్తు రెండవ రాకడ

శరీర కార్యములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

సమరయ స్త్రీ

అబ్రాహాము విశ్వాసయాత్ర

విశ్వాసము