నీచూపు దేనివైపు?
*నీచూపు
దేనివైపు??!!!*
ఆ వ్యక్తి రెండుసార్లు దేవునిచే వారించబడ్డాడు- ఇశ్రాయేలు ప్రజలను
శపించకూడదు అని! గాని ధనము మీద ఆశతో వెళ్ళాడు! దారిలో దేవునిదూత ద్వారా చంపబడబోయినా, గాడిద అతనిని తప్పించింది, గాడిద ద్వారా
బుద్ధిచెప్పించుకున్నాడు! మూడుసార్లు శాపవచనాన్ని దేవుడు దీవెనగా మార్చివేశారు!
చివరికి నీతిమంతులకు కలుగు మరణము వంటి మరణము నాకు కలుగును గాక అని కోరుకున్నాడు!
(సంఖ్యా 23:10) గాని మూడుసార్లు బైబిల్ లో వ్రాయబడి ఉంది –చంపబడిన ఇతరులు కాక మిద్యాను
ఐదుగురు రాజులను..... చంపిరి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి! సంఖ్యా 31:8; యెహో 13:22;
చూడండి బైబిల్ గ్రంధములోనే మొదటగా ప్రవక్త అని పిలువబడిన అన్యజనులలో
దేవుని గొప్ప ప్రవక్త, కేవలం ధనము మీద ఆశతో దేవుడు వారించినా
విననందున తాను నీతిమంతులకు కలిగే మరణము కావాలనుకుని తననుతాను దీవించుకున్నా గాని
దేవుని ప్రవక్త కుక్కచావు చచ్చాడు! *బిలాము
గారి చూపు ధనము మీద!!!*
ఆ వ్యక్తి దేవుని పరిచర్యకోసం ప్రత్యేకించబడి ఏర్పరచబడి పౌలుగారితోను ఇతర
అపోస్తలుల తోనూ కలిసి సేవా పరిచర్య చేశాడు! కొన్ని రోజులు ఫిలిప్పీ పట్టణంలో సేవ
చేశాడు! ఈలోగా వినబడింది థెస్సలోనికయ పట్టణమునకు దగ్గరలో ఒక వెండి గని ఉంది.
అక్కడకు వెళ్ళిన వారందరికీ వెండి ముద్దలు దొరుకుతున్నాయి! వెల్లినవారందరూ
ధనవంతులవుతున్నారు అని విన్నాడు!పరిచర్య తీసి ఉట్టుమీద పెట్టాడు! ధనము కోసం వెండి
గనికోసం పరుగెత్తాడు! చరిత్ర చెబుతుంది- ఆ వెండి గనిలో జారిపడ్డాడు! పేగులు బయటకు
వచ్చి అక్కడే చచ్చాడు! ఆ వ్యక్తి పేరు దేమా! అందుకే పౌలుగారు చెబుతున్నారు దేమా
ఇహలోకమును ఆశించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నారు! (2తిమోతి 4:10)వెళ్ళాడు చచ్చాడు! *దేమా చూపు వెండి గని అనగా ధనము మీద!!!*
ఆ వ్యక్తి స్వతంత్రం కావాలి-
రోమా బానిసత్వ సంకెళ్ళు ఇశ్రాయేలు ప్రజల మీద తెగిపోవాలి అని విప్లవ వీరులతో
తిరిగాడు. గాని ప్రభుత్వ అణిచివేత వలన సాధించలేక పోయాడు! చివరికి
యేసుక్రీస్తుప్రభులవారు మాటలతో,
అద్భుతాలతో ప్రజలను మారుస్తున్నారు అని విన్నాడు! ఈయన తప్పకుండా
యూదుల రాజు అవుతాడు, నేను ప్రధానమంత్రిని అవుతాను అనుకుని
యేసయ్య దగ్గర చేరాడు! యేసయ్య సొమ్ము సంచి చేతికి ఇచ్చి కోశాధికారిని చేస్తే యోహాను
గ్రంధములో వ్రాయబడింది వాడు దొంగయై దేవుని డబ్బును తినడం దోచుకోవడం
నేర్చుకున్నాడు! (యోహాను 12:6). రెండుసార్లు యేసుక్రీస్తుప్రభులవారిని
యూదులకు రాజుగా అభిషేకించబోయాడు! చివరకి అదే డబ్బుకోసం ముప్పై వెండి నాణేలకు మన
ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారిని అమ్మివేశాడు! పశ్చాత్తాపంతో ఉరి
వేసుకుని ఉరితాడు తెగిపోయి పేగులు బయటికి వచ్చి చచ్చాడు! అపో.కార్యములు 1:
18
ఈ
యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి
నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.
*ఇష్కరియోతు యూదా కన్నులు అధికారం కోసం,
ధనము కోసం చూశాయి!*
ఆ వ్యక్తి
దేవునికోసం ఎన్నుకోబడిన వాడు! దేవునికోసం నాజీరు చేయబడిన వాడు! ఇశ్రాయేలు ప్రజలలో
ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలు ఉన్నా గాని ఫిలిష్తీయుల అమ్మాయిలు అందంగా
ముస్తాబవుతున్నారని- ముక్కుకి రంగు మూతికిరంగు పెదాలకు రంగు వేసుకుంటూ అంగాంగ
ప్రదర్శనలు (exposing) చేస్తున్నారని
నేత్రాసకు లోబడి ఫిలిష్తీయుల అమ్మాయిని తల్లిదండ్రులు వద్దన్నా బలవంతంగా
పెళ్ళిచేసుకున్నాడు! మూన్నాల్లకు పెళ్లి పెటాకులయ్యాయి! చివరకు కొన్నాళ్ళు
గుణపడినా తర్వాత అదే ఫిలిష్తీయ వేశ్యలకు అలవాటు పడ్డాడు! పట్టబడ్డాడు! కళ్ళు
పీకించుకున్నాడు! అవమానాలు పడ్డాడు! చివరకు దిక్కులేని చావు చచ్చాడు! దేవునికోసం
ఘనమైన బలమైన కార్యాలు చేసిన భక్తుడు, న్యాయాధిపతి- అమ్మాయిల
పిచ్చి వలన కుక్కచావు చచ్చాడు! *సంసోను చూపులు
అందమైన అమ్మాయిల వైపు!!!*
భక్తుడు, హెచ్చరిక పుత్రుడు, ఆదరణ
పుత్రుడు అని ఆది అపోస్తలుల ద్వారా బిరుదులు పొందిన బర్నబా గారు సంఘము యొక్క
అవసరాలు తెలిసికొని తనకున్న ఆస్తినంతా అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు!
అప్పుడు ఆయనకు కోరుకోకుండా గొప్ప పేరు వచ్చింది! మాకు కూడా అలాంటి పేరు
కావాలనుకుని గొప్పకు చెప్పేశారు అననీయ సప్పీరాలు! మేము కూడా భూమిని అమ్మేసి
అపోస్తలుల పాదాలు దగ్గర పెట్టేస్తాము! సంఘము చప్పట్లు కొట్టింది! వెళ్ళారు భూమిని
అమ్మేశారు! గాని భార్యాభర్తలు ఇద్దరు సగం దాచుకుని సగం తీసుకుని ఇచ్చారు! దేవుణ్ణి
మోసగిద్దామనుకున్నారు! దేవాలయాయంలోనే చచ్చారు! *వీరి
చూపులు పేరు ప్రఖ్యాతులు మీద*—గాని ధనాశ దేవుణ్ణి మోసం చెయ్యమన్నాది! చేశారు చచ్చారు!
ఈయన బైబిల్ గ్రంధం మొత్తం మీద
మహా భక్తుడు! రోజుకి ఏడుసార్లు ప్రార్ధించే ప్రార్ధనావీరుడు! అస్తమాను దేవుడు
దేవుడు అని తిరిగే దేవుడు పిచ్చోడు! గాని రాజులంతా యుద్దానికి వెళ్తే యుద్దకాలంలో
ఇంటి దగ్గర ఉన్నాడు! ప్రార్ధనా కాలంలో ఎప్పుడు ప్రార్ధనలో ఉండే ఈయన ఆరోజు ప్రార్ధన
చెయ్యకుండా మేడమీద షికార్లు కొట్టాడు! చూడరాని దృశ్యం చూశాడు! ఆ పరస్త్రీని ఇంటికి
రప్పించుకుని కడుపు చేసేశాడు! తప్పు కప్పిపుచ్చుకోడానికి హత్య చేయించాడు! దేవునిచేత ఛీ
అనిపించుకున్నాడు! గాని ప్రార్ధనాపరుడు భక్తుడు కాబట్టి కన్నీటితో తన పడక కొట్టుకు
పోయేటంతగా ఏడ్చాడు! తనని క్షమించమని కాదు- నీ పరిశుద్ధాత్మను నానుండి
తీసివేయవద్దని! క్షమించబడ్డాడు గాని శాపం తెచ్చుకున్నాడు! *దావీదు గారి కన్నులు స్నానం చేస్తున్న పరస్త్రీ మీద!!!*
యేసుక్రీస్తుప్రభులవారు నాలుగో
జామున నీటిమీద నడుచుకుంటూ వస్తున్నారు! శిష్యులు భయపడ్డారు! పిల్లలారా నేనే, భయపడొద్దు అన్నారు!
ప్రభువా నీవు నీవే అయితే నేను కూడా నీలాగే నీటిమీద నడిచే శక్తిని ఇవ్వండి అన్నాడు!
ఆయన సరే అన్నారు! పేతురు గారు యేసయ్యను చూస్తున్నంత సేపు నీటిమీద నడిచారు! గాని
యేసుమీద కన్నులు లోకం మీదకు, అలల వైపుకి, గాలిమీదకు మళ్ళిన వెంటనే మునిగిపోసాగారు! వెంటనే అరుస్తున్నారు- కేకలు
వేస్తున్నారు పేతురు గారు ప్రభువా కరుణించవా నేను మునిగి పోతున్నాను అంటున్నారు
పేతురు గారు! ఒకసారి ఆగుదాం! రెండు విషయాలు చూసుకోవాలి మనము! ఒకటి- పేతురు గారు
ఎవరు? చేపలు పట్టే జాలరి! గజ ఈతగాడు! ఇది బైబిలే
స్పష్టంచేసింది! ఒకసారి దిగంబరిగా పేతురు గారు ఉంటే అది యేసయ్య అని తెలుసుకుని
సముద్రం మధ్యలో దూకేసి, పైబట్ట వేసుకుని ఈదుకుంటూ ఒడ్డుకు
వచ్చారు పేతురు గారు! (యోహాను 21:7) అంత గజ ఈతగాడు తాను
ఈతగాడినని మర్చిపోయి ప్రభువా కరుణించు అని కేకలు వేస్తున్నారు! తననుతాను
మర్చిపోయాడు! యేసుక్రీస్తుప్రభులవారు మీద చూపు ఉన్నంతసేపు నీటిమీద నడిచారు గాని,
ప్రక్కకి చూసి మునిగిపోయారు!
రెండు
:ఎప్పుడు ప్రార్ధనలో ఉండే దావీదు గారు తన చూపు ఒక్కసారి లోకం మీదన, పరస్త్రీ మీదన
మరల్చుకొన్నందున చెడ్డపేరు తెచ్చుకుని నరకానికి పోయేటంతగా శాపం తెచ్చుకున్నారు!
గాని దేవుని ఇష్టమైన వ్యక్తి కాబట్టి శాపంతో సరిపెట్టుకుని పరలోకాన్ని
చేజిక్కుంచుకున్నారు!
మరి నీచూపు దేనివైపు ఉంది ప్రియ
స్నేహితుడా!! లోకం మీదనా? ధనం మీదనా? ఆధికారం మీదనా? పేరు ప్రఖ్యాతుల మీదనా? అందమైన అమ్మాయిల మీదనా? బూతు సినిమాలు బూతు బొమ్మల
మీదనా? టీవీ సీరియళ్ళ మీదనా? సినిమాల
మీదనా? మరి దేనిమీద???
మర్చిపోవద్దు-
దావీదు గారు, పేతురు గారు గొప్ప దైవజనులే గాని చిన్న అశ్రద్ధ, చిన్న
పరాకు, కొద్దిసేపు ఏమి పరవాలేదులే అనే భావము వారిని పతనానికి
తీసుకెళ్ళింది. గాని వీరిద్దరి మీద దేవుని అత్యంత కృప ఉంది కాబట్టి ఇద్దరు రక్షించబడ్డారు!
నీవిషయంలో ఆ అవకాశం లేదేమో జాగ్రత్త!
(ఇంకాఉంది)
*నీచూపు
దేనివైపు??!!!-2*
*దేనిపై ఉండాలి?*
(గతభాగం
తరువాయి)
మరి అయితే మన
చూపులు, ఆసక్తి దేనిమీద ఉండాలి?
అపోస్తలుడైన పౌలు
మహాశయుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మన చూపులు దేనిమీద ఉండాలో చాలా స్పష్టంగా
రాశారు 4:8 లో:...
మెట్టుకు
సహోదరులారా,
యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి
సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి
న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి
రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద
ధ్యాన ముంచుకొనుడి.
చూశారా
ఏవి సత్యమైనవో- ఏవి మాన్యమైనవో- ఏవి న్యాయమైనవో- ఏవి పవిత్రమైనవో – ఏవి
రమ్యమైనవో- ఏవి ఖ్యాతి గలవో చూసుకుని, అవి మనకు యోగ్యతను
మెప్పును కలిగిస్తాయా లేదా అని చూసుకుని అప్పుడు వాటిమీద మనస్సు నిలపమంటున్నారు!
చివరికి
నీ మాటలు, నీ
చూపులు, నీ ప్రవర్తన అన్నీ అవి *సమాన్యాపరఖ్యా* అని
ఆలోచించి చెయ్యాలి! కంగారు పడకండి *సమాన్యాపరఖ్యా* అంటే
సత్యమైనవా, మాన్యమైనవా, న్యాయమైనవా, పవిత్రమైనవా, రమ్యమైనవా, ఖ్యాతిగలవా అని ఆలోచించి చెయ్యాలి!
ఒకసారి జ్ఞానియైన
ప్రసంగియైన సోలోమోను గారు చెప్పేది కూడా చూద్దాం: ప్రసంగి 11: 9
యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము,
నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము;
అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని
జ్ఞాపక ముంచుకొనుము;
ఇప్పుడు ఈ రెండు
రిఫరెన్సులు కలిపి చదువుకుంటే మనకు అర్ధమయ్యేది ఏమిటంటే విశ్వాసి- నీవు నీకు
నచ్చినది మెచ్చినది ఏదైనా చేసేయ్, మాట్లాడేయ్, చూసేయ్ గాని దేవుడు నిన్ను వాటి గూర్చి
తీర్పు తీర్చకుండా ఉండాలి అంటే అవి *సమాన్యాపరఖ్యా*
అంటే
సత్యమైనవా, మాన్యమైనవా, న్యాయమైనవా, పవిత్రమైనవా, రమ్యమైనవా, ఖ్యాతిగలవా అని ఆలోచించి చెయ్యాలి!
ఎందుకు ఇలా
అంటున్నారు అంటే విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితంలో మన ఆలోచనలు, చూపులు ఎంతో ప్రభావితం చేస్తాయి! అవి చాలా
వరకు మనం చేసే పనులను మన attitude ని కంట్రోల్ చేస్తాయి! కాబట్టి వీటిని
స్వాధీనంలో ఉంచుకుంటూ దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా క్రొత్త మనస్సును
పొందుకుని పవిత్రంగా సాగిపోవాలి రోమా 12:2 ప్రకారం....
మీరు
ఈ లోక (లేక,
ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును,
అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని
చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము
పొందుడి.
ఇంకా పౌలుగారు
కొలస్సీ ౩:2 లో చెప్పిన
విధంగా మన చూపులు దృష్టి మనస్సు పరలోక సంభంధమైన విషయాల మీద ఉండాలి గాని భూలోక
సంభంధమైన విషయాల మీద కానేకాదు!
కొలస్సీయులకు 3: 2
పైనున్న
వాటిమీదనేగాని,
భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;
ఇంకా కీర్తన మొదటి
అధ్యాయంలో చెప్పినట్లు దుష్టుల ఆలోచన చొప్పున చెయ్యకుండా పాపుల మార్గంలో నడవకుండా, అపహాసకులు కూర్చొనే చోటున కూర్చోకుండా
యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానముంచుకుంటూ దివారాత్రం ధ్యానిస్తూ ఉండాలి!
గమనించాలి పాప
సంభందమైనవి లోక సంభందమైనవి అనగా గలతీ 5:19,20,21
లో చెప్పిన శరీరకార్యాలు మనకు ఎంతో ఇంపుగా సొంపుగా ఆనందంగా
ఆహ్లాదంగా ఉంటాయి! గాని వాటి అంతము ఏదో తర్వాత వచనంలో చెబుతున్నారు..... గలతీ 5:21
వీటిని గూర్చి నేను మునుపు
చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో
స్పష్టముగా చెప్పుచున్నాను.
ఇంకా ఏమి
చెబుతున్నారంటే మనకు మనంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండలేము కాబట్టి గలతీ 5:16—17లో అంటున్నారు....
16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు
మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.
17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి
యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.
ఆత్మానుసారంగా
నడిస్తే శరీర కార్యాలు చెయ్యనే లేరు అందుకే ఇలా చెబుతున్నారు! ఆత్మ మనలను కంట్రోల్
చేస్తూ ఉంటాడు!
ఒక్క విషయం మీకు చెప్పాలను కొంటున్నాను:
ఈ గలతీ 5:16—17 లో ఉన్నవి మరియు ఫిలిప్పీ 4:8 లో ఉన్నవాటి ప్రకారం
చేస్తే ఒకరక్షించబడిన విశ్వాసి నూటికి నూరు పాళ్ళు పరలోకం చేరి తీరుతాడు! ఇది
నాచాలెంజ్!!!
కారణం వీటి ప్రకారం
చేస్తే ఇలాంటి పాపిష్టి వాటిమీదికి మన ఆలోచనలు కోరికలు చూపులు ఎప్పుడైతే కలుగుతాయో
వెంటనే అవు పవిత్రమైనవో కాదో ఆలోచించుకుని అవి *సమాన్యాపరఖ్యా* అని
ఆలోచించు కుంటూ పోతే ఈ పాపిష్టి ఆలోచనలు జయించగలము పవిత్రంగా జీవించగలం, పరలోకం పట్టేయ్యగలం!!! కాబట్టి విశ్వాసులు
వారికి తగని విషయాల మీద కాకుండా, ఆధ్యాత్మిక విషయాలమీద పరలోక
సంభంధమైన విషయాల మీద ధ్యాస పెట్టుకోవాలి! తేజోవాసుల స్వాస్త్యము,పరిశుద్ధుల సమూహము సహవాసం, ఏడేండ్ల పెండ్లి విందు,
కోట్లాది దూతల సమూహము, పరిశుద్ధులు పొందబోయే
స్వాస్త్యాలు, వెయ్యేండ్ల పాలనలో పొందబోయే
శ్రేష్టమైన తలాంతులు ఇవన్నీ తలపోస్తూ వాటిని పొందడానికి ఏమేమి చెయ్యాలో
ఆలోచించుకుని ఆ ఆధ్యాత్మిక సంగతుల మీదనే విశ్వాసి తన ధ్యాస, ఆలోచన చూపులు పెట్టుకోవాలి!
ప్రియ సహోదరి సహోదరుడా! మరి నీ చూపు నీ ధ్యాస
దేనిమీద?
సరే,
ఇప్పుడు మన పాఠంలోకి వచ్చేద్దాం!
ఏవి
సత్యమైనవో- ఏవి మాన్యమైనవో- ఏవి న్యాయమైనవో- ఏవి పవిత్రమైనవి – ఏవి రమ్యమైనవో- ఏవి
ఖ్యాతి గలవో చూసుకుని అవి మనకు యోగ్యతను మెప్పును కలిగిస్తాయా లేదా అని చూసుకుని
అప్పుడు వాటిమీద మనస్సు నిలపమంటున్నారు!
మొదటిది: *ఏవి సత్యమైనవో వాటిమీద మనస్సు
నిలపాలి!*
మరి సత్యమనవి
ఏమిటి?
ముందుగా మనము ఏవి
అసత్యమైనవి అనగా ఏవి గతించిపోయేవి, ఏవి నాశనమైపోయేవో చూసుకుని అప్పుడు సత్యమైనవి ఏమిటో చూసుకుందాం!
అసత్యమైనవి
ఏమిటంటే యోనా 2:8 ప్రకారం
వ్యర్ధ దేవతలు అసత్యమైనవి.
గతించిపోయేవి:
లోకము-లోకాశలు గతించిపోతాయి 1యోహాను 2:15—17
15. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును
ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.
16. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు
జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
17. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని
చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
ఈ ప్రజలు కూడా
గతించి పోతారు- తరము వెంబడి తరము గతించిపోతుంది! మానవ జీవితం శాశ్వతం కాదు ప్రసంగి
1:4,
యాకోబు 1:
10
ఏలయనగా
ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
చివరికి ఈ ఆకాశము భూమి
ఉంటాయా అంటే అవికూడా కాలిపోతాయి అంటున్నారు పేతురు గారు
2పేతురు ౩:10
అయితే
ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి
పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు
దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.
2పేతురు 3: 11
ఇవన్నియు
ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,
ఇంకా ధనము ఉంటుందా అంటే ధనము కూడా
శాశ్వతం కాదు అని బైబిల్ చెబుతుంది. సామెతలు 27: 24
ధనము
శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?
ఈరోజు మనచేతిలో మన
బాంకులో ఉంది, రేపు కిరాణా
కొట్టులో ఉంటుంది, ఎల్లుండి మరో బాంకులోనే లేక షాప్ లోనో
ఉంటుంది.
అలాగే అధికారం కూడా
శాశ్వతం కాదు!
అయితే
యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు భూమిమీద అసలు మీరు ధనమును కూర్చుకోవద్దు
అంటున్నారు, ఎందుకు
కూర్చుకోవద్దు అనేది మత్తయి 6:19 లో చెబుతున్నారు....మత్తయి 6:
19
భూమిమీద
మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును
తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.
మరి ఎక్కడ
కూర్చుకోమంటున్నారు అంటే పరలోకంలో కూర్చుకోమంటున్నారు ఎలా కూర్చుకోవాలి
మత్తయి
6: 20
పరలోకమందు
మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను
దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.
మత్తయి 6: 21
నీ
ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
మార్కు 10:21; లూకా 18:22
మరొక ధనముంది అదేదో
పౌలుగారు తిమోతి కి చెబుతున్నారు 1తిమోతి 6:19
1తిమోతికి 6:
19
సత్‌క్రియలు
అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో
ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.
బిలాము, దేమా ధనం మీద ఆశపడి ఏమయ్యారో మొదటి
భాగంలో చూసుకున్నాము!
ఇక అందము మీద
కూడా ఆశ పడొద్దు, మీ
చూపులు ధ్యాస అందము మీద వద్దు ఎందుకంటే అందము మోసకరం సౌందర్యము వ్యర్ధము అని
సామెతలు గ్రంధంలో
వ్రాయబడింది 31:౩౦
రాణియైన వస్తి
అందానికే ప్రాధాన్యత ఇచ్చింది గాని రాజాజ్ఞను తృణీకరించి రాణి వైభోగం
పోగొట్టుకుంది!
ఇక పేరు
ప్రఖ్యాతులు మీద కూడా ఆశపడొద్దు అలా ఆశపడి అననీయ సప్పీరాలు దేవుని మందిరంలో చచ్చినట్లు
చూశాము!
ఇక ద్రాక్షారసం అనగా
మత్తు పానీయాలు మాదక ద్రవ్యాల మీద ఆశ నిలపవద్దు
హబక్కూకు
2: 5
మరియు
ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా
ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను
సమకూర్చుకొనును.
సామెతలు
23:29,30,31,32,33,34,35
29. ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి
జగడములు? ఎవరికి చింత? ఎవరికి
హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?
30. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ
చేరువారికే గదా.
31. ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు
రుచిగా నుండగను దానివైపు చూడకుము.
32. పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.
33. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు
34. నీవు నడిసముద్రమున పండుకొనువానివలె నుందువు ఓడకొయ్య చివరను
పండుకొనువానివలె నుందువు.
35. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు
తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును
అని నీవనుకొందువు.
చివరగా
సోలోమోను గారు ప్రసంగి గ్రంధంలో తన వృద్ధాప్యమందు అనుభవంతో రాస్తున్నారు నేను ధనం
మీద మనస్సు నిలిపాను, ఎంతో ధనము బంగారం సంపాదించాను అది వ్యర్ధమని తేలింది! ఎన్నో బంగాళాలు
కట్టాను, చివరికి కొన్నిరోజులు పోయాక దానిలో నేనుండను
ఎవడుంటాడో తెలియదు! అందుకే అమ్మాయిల మీద, కామ విలాప కార్యాల
మీద మనసు నిలిపాను అది కూడా వ్యర్ధమే ఆయాసమే అన్నారు! పేరు ప్రఖ్యాతుల మీద మనస్సు
నిలిపాను జ్ఞానం మీద మనస్సు నిలిపాను అవికూడా వ్యర్ధమే అంటున్నారు..
సరే, ఇంతకీ
సత్యమైనది ఏమిటి అంటే దేవుని వాక్యము సత్యము. యోహాను 17:17
అయన
సత్యము- కేడెము మరియు డాలు కీర్తన 91:4
ఆయన
సత్యము తరతరములుండును కీర్తన 100:5
మేఘములంత
ఎత్తు గలది కీర్తనలు 108:4
వాక్య
సారాంశము సత్యము: సామెతలు 21:28
స్వతంత్రులుగా
చేస్తుంది యోహాను 8:32
ఆత్మ
సత్యము 1యోహాను 5:6
చివరగా
మార్గము సత్యము జీవముఅయిన యేసుక్రీస్తుప్రభులవారు సత్యము. యోహాను 14:6
కాబట్టి ప్రియ దైవజనమా! మనం
మాట్లాడే మాటలు సత్యమైనవా? మనం చూసే చూపు సత్యమైనదా కాదా అని చూసుకోవాలి, మన
తలంపులు సత్యమైనవా కావా? మనం టీవీలో మొబైల్ ఫోనులో చూసేవి
చేసే విషయాలు సత్యమైనవా కాదా ఆలోచించుకుని సత్యమైనవైతే వాటివలన మనకు మెప్పు
యోగ్యతా కలుగుతుంది అంటే అప్పుడు చూడండి!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*నీచూపు
దేనివైపు??!!!-౩*
*దేనిపై ఉండాలి?*
(గతభాగం తరువాయి)
ఇక తర్వాత *ఏవి
మాన్యమైనవో* వాటిని దృష్టించమంటున్నారు! మాన్యమైనవి
అనగా..గుర్తింపు గలవి,
లేక పేరు గలవి! మరలా రెండు రకాలు మంచి పేరు లేక మంచి గుర్తింపు
మరియు చెడ్డ పేరు చెడ్డ గుర్తింపు గలవి కూడా ఉన్నాయి! ఉదాహరణకు వ్యాపారంలో మంచి
వ్యాపారాలు ఉన్నాయి దుర్వ్యాపారాలు ఉన్నాయి! దుర్వ్యాపారం అనగా మన చిన్న కుమారుడు
అనగా తప్పిపోయి దొరికిన కుమారుడు చేసినది దుర్వ్యాపారం. బార్లు, వేశ్యావాటికలు లాంటివి దుర్వ్యాపారాలు అన్నమాట! కాబట్టి ఇక్కడ మనము
చూడవలసినది ఏమిటంటే మనం లక్ష్యముంచేది ఏదయినా అది మాన్యమైనదా కాదా అనేది చూడాలి
అనగా అది మనకు మంచిపేరు తెస్తుందా లేక చెడ్డపేరు తెస్తుందా లేదా మనము దేనిమీద
లక్ష్యముంచామో దానికి మంచి పేరు లేక మంచి గుర్తింపు ఉందా అనేది చూడాలి!
చివరికి
మనం మాట్లాడే మాట మనకు మంచిపేరు తెస్తుందా లేక చెడ్డపేరు తెస్తుందా? మనం చూసే చూపు మనకు
మంచిపేరు తెస్తుందా లేక చెడ్డపేరు తెస్తుందా? మన ఆలోచనలు
మనకు మంచిపేరు తెస్తాయా లేదా? మన ప్రవర్తన మనకు మంచిపేరు
తెస్తుందా లేక చెడ్డపేరు తెస్తుందా? మనం చేసే వ్యాపారము మనకు
మంచిపేరు తెస్తుందా లేక చెడ్డ పేరు తెస్తుందా అనేది పరిశీలించి అవి నిజంగా
మాన్యమైనవియితే అప్పుడు చెయ్యాలి ఆ పని లేక అప్పుడు మాట్లాడాలి ఆ మాటలు!!!
సరే, ఒకసారి నిజంగా
మాన్యమైనవి ఈలోకంలో ఏవి ఉన్నాయి అంటే ఏవీ లేవు! మాన్యమైనవి రెండే రెండు! ఒకటి
పరలోకం! రెండు నరకం! మనం ఈ భూలోకంలో ప్రవర్తించే విధానం మీద, మాట్లాడే విధానం మీద, చూసే విధానం మీద, ఎంచుకున్న గమ్యం మీద, మన గమ్యస్థానం నిర్ణయం
అవుతుంది! భూలోక సంబంధమైన విషయాల మీద లక్ష్యముంచితే అనగా శరీరకార్యాలు మీద ఆశపడి
వారిని చేస్తే గమ్యం నరకం!!! ఆధ్యాత్మికమైన, పరలోక సంబంధమైన విషయాల మీద
దృష్టిపెట్టి, పవిత్రమైన జీవితం జీవిస్తూ, ఆత్మానుసారమైన జీవితం, సాక్ష్యార్ధమైన జీవితం,
వాక్యానుసారమైన జీవితం జీవితే గమ్యం- పరలోకం! కాబట్టి మాన్యమైనవి
పొందుకోవాలంటే బ్రతికుండగా జరుగదు! అయితే బ్రతికుండగానే సంపాదించుకోవాలి గాని
నిత్యత్వం అనే మాన్యమైనవి ప్రాణం పోయాకనే సంపాదించుకుంటాము! కాబట్టి నేడు అనే
దినముండగానే , రక్షణ మనకు సమీపంగా ఉండగానే దేవుడు అనేవాడు
ఒకాయన ఉన్నారని, ఆయన దగ్గరకు వెళ్ళాలంటే
యేసుక్రీస్తుప్రభులవారు మాత్రమే మార్గమని ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించి ఆ మార్గంలో
సాగిపోదాం!
ఇక
తర్వాత అంశం: *ఏవి న్యాయమైనవో* అవి మాత్రం చెయ్యాలి! వాటినే వెంబడించాలి! మరలా మనం చిన్న
కుమారుడి దగ్గరకు వెళ్దాం! అతను చేసిన వ్యాపారం న్యాయమైనదా అన్యాయమైనదా? అది
అన్యాయమైనది! కాపురాలు కూల్చేది! కాబట్టి అలాంటివి మనం చెయ్యకూడదు! క్రైస్తవుడు న్యాయము
మరియు మాన్యము కానిది ఏదీ చెయ్యకూడదు! బ్రాంది లాంటి మందులు గాని, కల్లు, సారా లాంటివి అమ్మకూడదు, ఆ షాప్ లలో పనిచెయ్యకూడదు! వాటి లాభాన్ని ఆశించకూడదు! అలాంటి డబ్బులు
దేవునికి ఇవ్వకూడదు ఇదే మనకు పాత నిబంధనలో కనిపిస్తుంది!
చాలామంది
అన్యాయమైన మాటలు మాట్లాడి పళ్ళు రాల గొట్టించుకుంటారు! మన మాటలు అన్యాయమైనవి అయితే
ఎవరికీ ఇష్టం ఉండదు! దేవునికి అసలు ఇష్టం ఉండదు! అందుకే భక్తుడైన యాకోబు గారు
అనుభవంతో రాస్తున్నారు వినుటకు వేగిర పడాలి- మాట్లాడుటకు నిదానించాలి- ఇంకా
కోపించుటకు ఇంకా నిదానించాలి అంటూ దానికి కారణం కూడా చెబుతున్నారు- ఎందుకంటే
నరునికోపం దేవుని చిత్తాన్ని నెరవేర్చదు! 1:19
కాబట్టి
మన మాటలు న్యాయమైనవా కావా,
మన చూపులు న్యాయమైనవా కావా, మన ప్రవర్తన
న్యాయంగా ఉంటుందా లేక అన్యాయంగా ఉంటుందా , మన ఆలోచనలు
న్యాయమైనవా కావా అనేది ఆలోచించుకుని అవి న్యాయమనవైతే చేసేయ్, చూసేయ్, మాట్లాడేయ్!!!
సరే, ఇప్పుడు ఏవి న్యాయమైనవో
చూద్దాం! బైబిల్ గ్రంధం చెబుతుంది ఆయన వాక్యము, ఆయన కట్టడలు,
ఆయన శాసనాలు, ఆయన మాటలు మాత్రమే సత్యమైనవి
న్యాయమైనవి, పవిత్రమైనవి, కాబట్టి వాటి
మీదనే మన ఆశ, ధ్యాస పెట్టుకుందాం!
కీర్తనలు
19: 9
యెహోవాయందైన
భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు
సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.
కీర్తనలు 111: 7
ఆయన
చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి.
ఇక తర్వాత అంశము: *ఏవి పవిత్రమైనవో* అవే చెయ్యాలి, వాటి మీదనే ధ్యాస పెట్టుకోవాలి! వాటినే
చూడాలి! ఒకసారి మనలను మనం పరిశీలించుకుందాం! మన మాటలు పవిత్రంగా ఉంటున్నాయా లేక
అపవితమైన మాటలా? డబుల్
మీనింగ్ మాటలా? పౌలుగారు చెబుతున్నారు
ఎఫెసీయులకు 5: 4
కృతజ్ఞతావచనమే
మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను (లేక,
వెఱ్ఱి మాటలైనను), సరసోక్తులైనను
ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
ఎఫెసీయులకు
4: 29
వినువారికి
మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని
దుర్భాష యేదైనను మీనోట రానియ్యకుడి.
కొలస్సీయులకు
3: 8
ఇప్పుడైతే
మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము,
దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని
విసర్జించుడి.
ఇంకా తిమోతి గారికి ఆజ్ఞాపించమని చెబుతున్నారు
అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు సంఘము విసర్జించాలి!!1తిమోతికి 4: 7
అపవిత్రములైన
ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.
మన చూపులు
పవిత్రంగా ఉంటున్నాయా లేక మోహపు చూపులా? ఆ చూపులు నీలో కామం రేపుతున్నాయా? జాగ్రత్త యేసుక్రీస్తుప్రభులవారు చెప్పారు ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తేనే
కాదు తప్పు కాదు గాని కనీసం ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే కూడా అపుడే ఆస్త్రీతో వ్యభిచరించినట్లే అని
చెప్పారు!
మత్తయి 5: 28
నేను
మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు
ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
మన ఆలోచనలకు ఆరంభం చూపులతోనే ప్రారంభం
అవుతుంది. అందుకే నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే దానిని పీకి పారెయ్ మంటున్నారు
యేసుక్రీస్తుప్రభులవారు! కారణం అది నిన్ను నరకానికి లాక్కుపోతుంది!...
మత్తయి
5: 29
నీ
కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో
పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.
కాబట్టి మన చూపులు ఎలా ఉన్నాయో మనం
పరిశీలించుకుందాం! మనం చూసే టీవీ సీరియల్లు పవిత్రంగా ఉంటున్నాయా? ఒక్కొక్కడికి ఇద్దరు
ముగ్గురు భార్యలతో ఉండటం, ఓ స్త్రీకి పరాయి పురుషులతో సంబంధం
ఉండటం, కుటుంబాన్ని మోసం చెయ్యటం చూపించే సీరియల్లు
పవిత్రమైనవా? కామవికార కార్యాలు చూపించే డబుల్ మీనింగ్
అర్ధాలు పలికే సినిమాలు, టీవీ ప్రోగ్రాం లు పవిత్రమైనవా?
నీ సెల్ ఫోన్లో నీవు చూసేవి పవిత్రంగా ఉంటున్నాయా? మరలా ప్రసంగి 11:9 కి పోదాము! నీకిష్టమైన ప్రోగ్రాం
లు సీరియల్లు సినిమాలు నీవు చూసేయ్ గాని అవి పవిత్రమైనవి కాకపోతే నీవు
తీర్పులోనికి వస్తావు అని మర్చిపోవద్దు!
ఇక మన
ప్రవర్తన మరియు ఆలోచనలు పవిత్రంగా ఉంటున్నాయా లేదా అనేది పరిశీలించుకోవాలి!
ఈలోకంలో పవిత్రమైనవి
ఏవి అంటే యెహోవా మాటలు పవిత్రములు అని బైబిల్ సెలవిస్తుంది
కీర్తన
12:6
యెహోవా
మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు.
కీర్తనలు
19: 9
యెహోవాయందైన
భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు
సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.
చివరికి
యేసుక్రీస్తు ప్రభులవారు పవిత్రుడు మరియు పరిశుద్ధుడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు
స్థాపించగలరు అని సవాలు విసిరారు. యోహాను 8:46. ఇంకా నేను పరిశుద్ధుడను గనుక మీరును
పరిశుద్ధులై యుండమని చెప్పాడు దేవుడు!
ఇంకా
యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ దూతకోటి భక్తకోటి నిరంతరం చెబుతున్నారు.
చివరికి
ఆయన ఆత్మ పరిశుద్ధమైనది. పేరే పరిశుద్ధాత్ముడు.
గనుక
మనము కూడా పరిశుద్ధులుగా ఉండటమే కాకుండా మన మాటలు చూపులు తలంపులు చేతలు అన్నీ
పవిత్రంగా ఉండాలి.
ఇక తర్వాత అంశము: *ఏవి రమ్యమైనవో* వాటిమీద
దృష్టి పెట్టాలి, వాటినే చెయ్యాలి! వాటినే పలకాలి! రమ్యమైనవి అనగా మొదటి అర్ధము-అందమైనవి!
రెండవ అర్ధము-మహిమగలవి!
కాబట్టి
మరలా మనం పరిశీలించుకోవాలి- మన మాటలు అందమైనవా? మన తలంపులు అందమైనవా, మహిమ గలవాటి మీదనా? మన చూపులు అందాన్ని
వెదుకుతున్నాయా? అయితే అవి పవిత్రంగా ఉంటున్నాయా? అందమైన స్త్రీల మీద, అందమైన బిల్డింగ్ ల మీద,
అందమైన బంగారు నగలమీద, మన దృష్టి ఉందా లేక
తేజోవాసుల స్వాస్థ్యము మీద, పొందబోయే మహిమ మీద ఉందా మన ఆశలు
చూపులు?
గమనించాలి-
ముందు భాగంలో చెప్పినట్లు అందము మోసకరం సౌందర్యం వ్యర్ధము! ఈరోజు ఉన్న అందము పది
సంవత్సరాలు తర్వాత ఉండదు! ఒకనాడు ఐశ్వ్యర్యరాయ్ చాలా అందమైనది, ఈరోజు ఆమె అందము ఉందా?
లేదు కదా!
ఆదికాండం మొదట్లోనే
అవ్వమ్మ రమ్యమైనది అని మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు ఫలాలు వద్దన్నా తిన్నది
మనకు ఇంత పాతకం తెచ్చిపెట్టింది! అది ఇప్పటికీ మనం తప్పించుకోలేక పోతున్నాము.
ఆదికాండము 3: 6
స్త్రీ
ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు
*రమ్యమైనది* యునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని
తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;
కొంతమందికి
బంగారం మీద, బంగారు
వస్తువులు ఆభరణాల మీద పిచ్చి ప్రేమ పెంచుకుంటారు! అవి రమ్యంగా కనిపిస్తాయి వారికి!
అదేపరిశుద్ధులకు అయితే తాము పొందబోయే మహిమ, రమ్యంగా
కనిపిస్తుంది! పనికిమాలిన బంగారం మీద పరిశుద్ధులకు ఆశ ఉండదు ఎందుకంటే ఒకరోజు వారు
బంగారు వీధులలో నడుస్తూ బంగారాన్ని కాళ్ళతో త్రొక్కుతారు! అలాంటి బంగారాన్ని
పరిశుద్ధులు ముక్కుల్లో, చెవుల్లో, మెడలో
వేసుకోడానికి ఇష్టపడరు!!!
మరికొంతమందికి
అందమైన రంగురంగుల బట్టలు అంటే పిచ్చి! వెళ్ళే ప్రతీ బట్టలమూటను ఆపేస్తుంటారు.
అప్పు పెట్టేస్తుంటారు! వాయిదా కట్టమంటే దాక్కుంటూ ఉంటారు! ఇదేం బ్రతుకో అర్ధం
కాదు!
ఒకసారి
యేసుక్రీస్తుప్రభులవారు దగ్గరకు వెళ్దాం! మత్తయి సువార్త నాల్గవ అధ్యాయంలో ఆయన సేవ
ప్రారంభించబోయే ముందు ఆయనకు సాతాను గాడు చాలా ప్రలోభపెట్టాడు! ఆయన లొంగలేదు! కారణం
తనకు తెలుసు తాను పొందబోయే మహిమ ముందు ఈ భూలోక రమ్యమైన వస్తువులు, అందమైనవి, లాభకరమైనవి, ఖరీదుగలవి కూడా ఎందుకు పనిచెయ్యవు అని
ఆయనకు తెలుసు! వెంటనే సాతాను గాడ్ని జయించారు ప్రభువు!
ఇంతకీ
రమ్యమైనవి ఏమిటి అని ఆలోచిస్తే దేవుని గుడారాలు రమ్యమైనవి, ఆయన మందిరాలు రమ్యమైనవి
సంఖ్యా 24:5
ఇక
సంఘము మహిమ గలది కీర్తన 45:13
ఇంకా
సీయోను రమ్యమైనది కీర్తనలు
48:2
ఇక్కడ
సీయోను అనగా పరమ సీయోను అని అర్థం చేసుకోవాలి.
ఇక చివరగా ఖ్యాతిగలవి: *ఏవి ఖ్యాతిగలవో*
వాటిమీద దృష్టి పెట్టాలి! ఖ్యాతి గలవి అనగా ఇప్పటికే మంచి పేరు గొప్ప పేరు ఘనమైన పేరు
గాంచినవి అన్నమాట! అందుకు గాను చాలామంది ఎన్నెన్నో చెయ్యాలి అనుకుంటారు.
చేస్తున్నారు! బైబిల్ కూడా సుగంధ ద్రవ్యము అనగా సెంటు కంటే మంచిపేరు మిన్న అని
సెలవిస్తుంది! కొంతమంది మంచి మంచి గొప్ప బిల్దింగ్లు కట్టి ఖ్యాతి తెచ్చుకోవాలి
అనుకుంటారు! కొందరు అధికారం సంపాదించి ఖ్యాతి తెచ్చుకోవాలనుకుంటారు! కొందరు అందంగా
తయారై అందర్నీ ఆకర్షిస్తూ పేరు తెచ్చుకోవాలి అనుకుంటారు! అయితే ముందు భాగాలలో
చూసుకున్నాము- ఇవన్నీ ఒకరోజు గతించిపోయేవే! వీరికంటే ఎన్నో సంవత్సరాల క్రితమే
సోలోమోను గారు అవి ప్రయత్నం చేసి అది వ్యర్ధమని ప్రసంగి గ్రంధం రాశారు! పౌలుగారు పేతురు గారు ఇద్దరు ఓ
స్త్రీలారా మీరు జడలు అల్లుకోవడం బంగారు నగలు పెట్టుకోవడం మీద ఆశ పెట్టుకోవద్దు
అవి చెయ్యకూడదు అంటూ సాదువైనట్టి మృదువైనట్టి స్వభావాన్ని అక్షయ అలంకారంగా
ధరించుకొని వాటినే అలంకారాలుగా పెట్టుకోండి. అదే విలువైనది అన్నారు. దైవభక్తి
గలవారమని చెప్పుకునే స్త్రీలకూ తగినట్లుగా ఉండండి! పేతురు గారు ఇంకా డీప్ గా
చెబుతున్నారు. తర్వాత మీకు మరో మంచి అలంకారముంది అదేమిటంటే మీ స్వపురుషులకు లోబడి
ఉండటమే మీకు నిజమైన అలంకారం అంటున్నారు. 1పేతురు ౩:౩—5; 1తిమోతి 2:9—10
ఇంతకీ
ఖ్యాతి గలవి ఏమిటంటే మనం పొందుకొనబోయే మహిమ కిరీటం లాంటి కిరీటాలు! సీయోనుపై మరియు నూతన యేరూషలేముపై కాలు పెట్టడం, పరిశుద్దుల విందులో
పాల్గొనడం, తేజోవాసుల స్వాస్థ్యమును పొందుకోవడం లాంటి పరలోక
విషయాలే నిజమైన ఖ్యాతి గలవి. కాబట్టి వీటిమీదనే మన ఆశ ధ్యాస పెట్టుకోవాలి.
సరే, ఒకమాట చెప్పనీయండి. మనము ఆత్మపూర్ణులుగా
ఉంటే ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపిస్తూ, పవిత్రమైన
జీవితం జీవించడానికి మనకు సహాయం చేస్తూ, మనం చేసే పనులు,
చూసే చూపులు, మాట్లాడే మాటలు, ఆలోచనలు సత్యమైనవా, మాన్యమైనవా, న్యాయమైనవా, పవిత్రమైనవా, రమ్యమైనవా, ఖ్యాతి
గలవా కాదో మనకు చెబుతూ సర్వము మనకు వివరంగా చెబుతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ
పూర్ణులు కావలసిన అవసరం ఎంతైనా ఉంది.
కాబట్టి
మనం
*చూసే చూపులు*,
*చేసే పనులు*,
*తలంచే తలంపులు*,
*మాట్లాడే మాటలు*,
*టీవీలో సెల్ఫోన్లో చూసే ప్రోగ్రామ్లు*, *సినిమాలు
సీరియల్లు*
*సమాన్యాపరఖ్యా* అంటే
*సత్యమైనవా,
*మాన్యమైనవా,
*న్యాయమైనవా,
*పవిత్రమైనవా,
*రమ్యమైనవా,
*ఖ్యాతిగలవా
అని
ఒకటికి పదిసార్లు ఆలోచించి చెయ్యాలి!
చివరగా
మనకంటే ముందుగా ఉన్న సాక్షి సమూహము ఇంతవరకు చెప్పిన వాటినే చేసి మనకు
దృష్టాంతాలుగా ఉండిపోయారు! వారు వీటిని చేసి ఖచ్చితంగా పరలోకానికి అర్హులు అయ్యారు. మనం కూడా వారినే అనుసరించి మనము
కూడా పరలోకానికి పోదాము! ఒకసారి హెబ్రీ పత్రిక 11:10, 13 వచనాలు
చూసుకుంటే జీవిత సారాంశము, క్రైస్తవ విశ్వాసి యొక్క విశ్వాస
జీవిత సారాంశం మనకు కనిపిస్తుంది. ....
10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.
13. వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి
చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై
యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
చూశారా
అబ్రాహాము గారి చూపు దేనిమీద నిలిపారో- కోటీశ్వరుడు ఆయన! గాని ధనము మీద, అమ్మాయిల మీద, బంగారం మీద మనస్సు పెట్టక, దేవుడు దేనికి శిల్పి
మరియు నిర్మాణకుడై ఉన్నారో ఆ పునాదులు గల పట్టణము మీద తన ఆశ పెట్టుకున్నారు! మరి నీ ఆశ ధ్యాస,
చూపులు ఆలోచనలు దేనిమీద ఉన్నాయి?
చివరకు ఈ సాక్షి సమూహము ఆ పునాదుల గల పట్టణాన్ని ఇంతవరకు స్వాధీనం
చేసుకోలేక పోయినా గాని తాము భూమిమీద పరదేశులం, యాత్రికులం అని నిజం
తెలుసుకుని దూరమునుండి ఆ పునాదులు గల పట్టణాన్ని చూసి వందనం చేసి విశ్వాసంతో
మృతిబొందారు! మనం కూడా అలాగే భూమిమీద యాత్రికులం పరదేశులం అని గ్రహించి మనము కూడా
ఆ పునాదులు గల పట్టణం కోసం, పొందబోయే మహిమ కోసం, తేజోవాసుల స్వాస్త్యము కోసం, ఏడేండ్ల పెండ్లి
విందుకోసం, వెయ్యేండ్ల పాలనకోసం, మరీ
ముఖ్యంగా మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారు ప్రత్యక్షత కోసం ఎదురు
చూద్దాం!
ఆమెన్! ఆమెన్!
ఆమెన్!
ప్రియ దైవజనమా!
ఆధ్యాత్మిక్క సందేశాలు సిరీస్ -8 లో భాగంగా ఒక చిన్న సందేశంతో మిమ్మల్ని రేపుదామని పరిశుద్దాత్ముని
ప్రేరేపణతో చిన్న ప్రయత్నం చేశాను! ఇది మిమ్మల్ని రేపిందని, హృదయాలు
వెలిగించింది అని తలస్తూ ఆ దేవాది దేవునికి నిండు వందనాలు చెబుతున్నాను! దయచేసి
మాకోసం ప్రార్ధించండి!
ఇట్లు
మీ సహోదరుడు
*రాజకుమార్.దోనె*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి