ఫలించేడి కొమ్మ


 

*ఫలించెడి కొమ్మ*

*మొదటిభాగం- ఉపోద్ఘాతం*

 

         అన్నల్లారా! దయచేసి కొట్టకండి! చాలా నొప్పిగా ఉంది! నాన్నతో చెప్పను! దయచేసి నన్ను వదలండి! ప్లీజ్- కొట్టొద్దు- పెద్దన్నయ్యా నీవైనా చెప్పుఅరుస్తున్నాడు ఒక కుర్రవాడు. గాని వారు ఆపకుండా కొడుతున్నారు, రక్తాలు కారిపోతున్నాయి, రూపం మారిపోతుంది, నామరూపాలు లేకుండా పోయింది, ఒళ్ళంతా రక్తపు ముద్దగా మారింది.

పెద్దవానికి జాలివేసింది. “ఒరేయ్ ఆపండిరా లేకపోతే వాడు చనిపోతాడు!” అన్నాడు పెద్ద అన్న!

చావాలనే కొడుతున్నాం కదా అన్నాడురెండో అన్న!

 వాడిని చంపాలనే కదా అనుకుంటున్నాముఅన్నారు 5,6,7,8 అన్నలు.

తప్పురా, మన తమ్ముడి రక్తం మనం చిందించకూడదు! నాన్నకు ఏమి చెబుతాము?” అన్నాడు పెద్దోడు!

"లేదు చంపాలి అంతే" అన్నారు 2,3,5,6,7,8 అన్నలు!

ఇక వీరు చంపేసేలాగ ఉన్నారు. ఏవిధముగానైన తప్పించాలి అనుకుని- "అయితే ఒకపని చెయ్యండి- ఈ నీరులేని గోతిలో తోసేద్దాం, అప్పుడు వాడే నీరులేక ఆహారం లేక చస్తాడుఅన్నాడు పెద్దన్నయ్య, ఎలాగైనా ఇప్పుడు వారు చంపకుండా అడ్డుపడితే తర్వాత ఎవరూ చూడకుండా గోతిలోనుండి తీసి ఇంటికి పంపాలనే ఉద్దేశంతో అన్నాడు! "సరే" అన్నారు అందరూ! రెండో అన్నయ్య- బలవంతంగా బట్టలు అన్నీ విప్పేసి ఎత్తి గోతిలో పడేశాడు! చాలా లోతుగా ఉంది ఆ గొయ్యి- నీరు లేదు, చీకటి, కొద్ది కొద్దిగా వెలుతురూ వస్తూ ఉంది! అకస్మాత్తుగా పాములు బయటికి వచ్చాయి, తేళ్ళు ఎక్కడ చూసినా- "అన్నల్లారా! పాములు- తేళ్ళు ఉన్నాయి, దయచేసి నన్ను ఈ గోతిలోనుండి బయటకు తీయండిఅరుస్తున్నాడు తమ్ముడు! ఎవరూ రావడం లేదు! ఎన్నో పాములు- లెక్కపెట్టడానికి వీలు లేదు! అప్పుడు అరుస్తున్నాడు- "నా తండ్రి పూజిస్తున్న దేవుడా! నా తండ్రితో మాట్లాడిన దేవుడా! నా కలలో కనిపించిన దేవుడా! దయచేసి నన్ను కాపాడు!" హృదయవిధారకంగా అరిచాడు గట్టిగా!!!

వెంటనే ఒక వెలుగు, ఆ వెలుగునుండి ఒక స్వరం, అంతే- పాములన్నీ వాటివాటి కన్నాలలోకి వెళ్ళిపోయాయి! తేళ్ళు అన్నీ పారిపోయాయి! ఒక్కడే మిగిలిపోయాడు! "దేవుడా నీకు ధన్యవాదాలు" అని గట్టిగా చెప్పాడు!

 

"అన్నల్లారా! దయచేసి నన్ను కాపాడండి! దయచేసి నన్ను క్షమించండి! ఇంకా ఎప్పుడు మీకోసం ఏది తండ్రితో చెప్పను! ఈసారికి నన్ను వదిలెయ్యండిఅరుస్తూనే ఉన్నాడు! 1,4 అన్నలకు ఏదైనా చెయ్యాలని ఉంది! గాని "ఎవరైనా వాడిని బయటికి తీసేరా, నేనే వాడిని చంపేస్తాను" అంటున్నాడు రెండో అన్నయ్య! పెద్దన్నయ్య ఆ అరుపులు వినలేక తన మంద దగ్గరకు చూడటానికి వెళ్ళాడు! దూరంగా కొంతమంది వర్తకులు గాడిదల మీద తమ సామానులు వేసుకుని వెల్తున్నారు, నాలుగో అన్నయ్యకు ఏరకంగానైనా వాడిని చంపకుండా రక్షించాలి అని ఉంది! 

"ఒరేయ్ అన్నలు తమ్ముళ్ళు- ఒకపని చేద్దాం! వాడిని చంపేస్తే మనకు ఏమి వస్తుంది- వాడిని ఆ వ్యాపారులకు బానిసగా అమ్మివేద్దాం! అప్పుడు మనకు డబ్బు వస్తుంది, వాడి పీడా విరుగుడు అయిపోతుంది" అన్నాడు! ఇది బాగుంది అనుకున్నారు! "అయితే ఆ పెద్దోడు రాకుండానే తొందరగా అమ్మేద్దాం" అన్నారు!

తాడు వేశారు, "ఒరేయ్ కలలు కనేవాడా, ఈ తాడు పట్టుకో" అన్నారు,

తాడు పట్టుకుని మీదకి వచ్చాడు తమ్ముడు! "ధన్యవాదాలు అన్నయ్యలు, నన్ను క్షమించండి" అన్నాడు. గాని రెండో అన్నయ్య చేతులు వెనుకకు త్రిప్పి కట్టేసి ఆ వ్యాపారస్తులకు అమ్మేశాడు. వారు 20 వెండి నాణేలు ఇచ్చారు! "అన్నల్లారా దయచేసి నన్ను అమ్మకండి, నాన్నను చూడకుండా ఉండలేను! దయచేసి అమ్మవద్దు! కాపాడండి" అరుస్తున్నాడు తమ్ముడు! గాని ఆ వ్యాపారస్తులు కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ లాగుకుపోయారు తమ్మున్ని!

 

"ఒరేయ్ తమ్ముడు ఎక్కడరా, చనిపోయాడా" అన్నాడు పెద్దోడు!

"ఏమో మాకేం తెలుసు! ఉదయం చూద్దాం లే" అన్నారు అన్నలు!

"పెద్దోడు ఏడుస్తున్నాడు- అయ్యో నాన్నకు ఏమని సమాధానం చెప్పను!" ఆ గోతిలో వాడు చనిపోయాడు అంటూ ఎంతో బాధపడుతున్నాడు!

"ఒరేయ్ పెద్ద అన్నయ్య! ఇదిగో ఆ అంగీకి రక్తం అంటించి- ఇది మన తమ్ముడిదేమో చూడమని నాన్నకు చెబుదాం! ఇప్పుడే బయలుదేరుదాం పదండి పదండి" అన్నారు 2,5,6,7,8 అన్నలు!

వచ్చి తండ్రికిచెప్పారు!

తండ్రి ఏడుస్తున్నాడు!" అయ్యో నా కుమారుడా" అంటూ!

ఏడ్చి ఏడ్చి- ఒక్కసారే లేచాడు- "ఒరేయ్ మీరందరూ మీ ఆయుధాలు తీసుకుని వాడిని ఏ క్రూరమృగం తినేసిందో దానిని తీసుకుని రండి" అన్నాడు తండ్రి!

వీరికి ఏమి చెయ్యాలో తెలియలేదు! అన్నలందరూ బయలుదేరారు! రోజంతా తిరిగితే ఒక పెద్ద తోడేలు కనిపించింది! కష్టపడి దానిని పట్టుకుని తీసుకుని వచ్చారు! దాని మూతినిండా రక్తం అంటుకుని ఉంది!

"నాన్నగారు! ఇదే తమ్మున్ని తిన్న మృగం" అన్నారు!

వెంటనే దానిని కొట్టడం ప్రారంబించాడు తండ్రి! భయంకరంగా కొడుతున్నాడు, దానిని చంపాలని అతని ఉద్దేశం! అయితే ఆశ్చర్యంగా ఆ పెద్ద తోడేలు మాట్లాడటం మొదలుపెట్టింది-

"ఓ పెద్దాయనా! నన్ను ఎందుకు కొడుతున్నావు?" అడిగింది మానవ స్వరంతో!

"నాకొడుకుని ఎందుకు చంపి తిన్నావు?"

"నేను తిన్నానని ఎవరు చెప్పారు నీకు!"

"ఇదిగో నా కొడుకులు!"

"వారు అబద్దం చెబుతున్నారు! నా పిల్ల కనబడటం లేదని నేను మూడు రోజుల నుండి తిరుగుతున్నాను! నా పిల్లపోయి నేను ఏడుస్తుంటే నీ కొడుకుని ఎలా తినగలను అడిగింది" ఆ పెద్ద తోడేలు!!

వెంటనే కొట్టడం ఆపేసి- "దయచేసి నన్ను క్షమించు" అని అడిగాడు ఆ పెద్దాయన!!!

 

ఇది రబ్బానిక్ స్క్రిప్చర్ లో Targ. Pseudo Jonathan అనే చరిత్రకారుడు తన పుస్తకంలో రాసుకున్నాడు! సోటా అనే పుస్తకం కూడా దీనిని నిర్దారిస్తుంది!

 

ఆ పెద్దాయన పేరు: *యాకోబు*

ఆ తమ్ముడి పేరు: *యోసేపు*

పెద్ద అన్నయ్య: *రూబేను*

ఎక్కువగా కొట్టి గుంటలో పడేసిన రెండో అన్నయ్య: *షిమ్యోను*

కొన్నవారు: ఇష్మాయేలు వర్తకులు

ఎప్పుడు జరిగింది? క్రీ.పూ. 1716 లో

 

ఇది ఈ పుస్తకంలో రాసినట్లు గోతిలో దేవునిదూత పాములను తేళ్లను త్రోలడం, తోడేలు మానవ స్వరంతో మాట్లాడటం నిజంగా జరిగిందో లేదో మనకు తెలియదు, బైబిల్ లో ఆధారం లేదు గాని దీనిని చరిత్ర కూడా ఎక్కువ భాగాన్ని చూపిస్తుంది అని చెప్పడానికి మరియు యోసేపు అనే ఫలించేడి కొమ్మ దైవభక్తి దైవభయము కలవాడని చెప్పడానికి ఇది ఉదాహరించడం జరిగింది!

దైవాశీస్సులు!

*ఫలించెడి కొమ్మ*

*రెండవ భాగం- ఉపోద్ఘాతం-2*

 

ఆదికాండం 49:2226

22. యోసేపు ఫలించెడి కొమ్మ! ఊట యొద్ద ఫలించెడి కొమ్మ! దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.

23. విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.

24. యాకోబు కొలుచు పరాక్రమశాలియైన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవునివలనను పైనుండి మింటి దీవెనలతోను

25. క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును

26. నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును.

 

        దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక! ప్రియదైవజనమా  ఆధ్యాత్మిక సందేశాలు- సిరీస్-10 లో భాగంగా ఫలించెడి కొమ్మ అనబడే యోసేపు గారి యొక్క జీవిత ధ్యానాల ద్వారా మరలా మిమ్మును కలుసుకోవడానికి కృప నిచ్చిన దేవునికి నిండు వందనాలు! ఇలా మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది!

 

పేరు: యోసేపు (తెలుగులో), జోసెఫ్ (ఇంగ్లీస్ లో), యూసఫ్ (అరబిక్), యోసేప్ (హెబ్రీ)

ఇతర పేర్లు: జఫ్నేత్ పన్నెహ్ (రహస్యాలు వెల్లడించేవాడు)

పేరుకు అర్ధము: యెహోవా మరొకరిని ఇచ్చును గాక!

జననం: క్రీ.పూ. 1733

పుట్టిన స్థలం: పద్దన్ ఆరామ్ లేక హారాను  (సిరియా)

తండ్రి: యాకోబు

తల్లి: రాహేలు (లాబాను రెండవ కుమార్తె)

తాత: ఇస్సాకు

ముత్తాత: అబ్రాహాము

బంధువులు: అన్నయ్యలు- 10 మంది: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇష్సాఖారు, జెబూలూను,

 అక్క: దీనా, తమ్ముడు: బెన్యామీను

నాన్నమ్మ: రిబ్కా,

పెద్దమ్మ: లేయా

బార్య: ఆసెనతు

మామ: పోతీఫరు, హెలియోఫిలిస్ దేవత యొక్క యాజకుడు.

కుమారులు: మనస్శే , ఎఫ్రాయిము

తిరిగిన ప్రాంతాలు: సిరియా, కనాను (17 సంవత్సరాలు వరకు), ఐగుప్తు (చనిపోయే వరకు)

వృత్తి:

బాల్యంలో: గొర్రెల కాపరి

యవ్వనంలో : సగభాగం బానిస, సగభాగం ప్రధానమంత్రి లేదా visor (రాజుకి ముఖ్య సలహాదారుడు)

ఐగుప్తులో ఉన్న కాలము: 93 సంవత్సరాలు

జీవించిన కాలం: 110 సంవత్సరాలు

మరణం: క్రీ. పూ. 1623

మరణించిన ప్రాంతం: ఐగుప్తు

సమాధి: నాబ్లుస్ (ప్రస్తుత పేరు) , షెకెము (పాత పేరు)

 

    ప్రియులారా! ఇక మనము యోసేపు గారి జీవితాన్ని పరిశీలిద్దాం! యోసేపు యాకోబు గారి పదకొండవ కుమారుడు! యాకోబు గారి ముద్దుల భార్య రాహేలు యొక్క మొదటి కుమారుడు! మీకు తెలుసు రెండవ కుమారుని కంటూ ఆమె చనిపోయింది! ముద్దుల భార్య కుమారుడు కాబట్టి యోసేపుని ఎక్కువగా ప్రేమించేవారు యాకోబు గారు! ఇంకా 37 అధ్యాయం ప్రకారం యోసేపు ఇశ్రాయేలు అనగా యాకోబు గారి వృద్ధాప్యమందు పుట్టిన వాడు కనుక తన కుమారులందరి కంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించెను అనియు ఇంకా అతని కొరకు విచిత్రమైన నిలువుటంగీ  కుట్టించి ఇచ్చినట్లు చూడగలం! మన తెలుగులో విచిత్రమైన నిలువుటంగీ అని తర్జుమా చేశారు గాని మిగిలిన అన్ని భాషలలోను రంగురంగుల అంగీ లేక కోటు తయారుచేసి ఇచ్చినట్లు వ్రాయబడింది.  ఇది మిగిలిన అన్నలకు కోపం పుట్టించింది!

అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలనందరినీ ఒకే విధంగా చూడాలి గాని ఒకరిని ఒకవిధంగా మరొకరిని మరో విధంగా చూస్తే ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి! చివరికి ఈ తారతమ్యత యోసేపుని హత్య చేసేటందుకు కారణమైంది! దయచేసి ఇలాంటివి మానుకొనమని దేవుని పేరిట మనవి చేస్తున్నాను!

దైవాశీస్సులు!

 

*ఫలించెడి కొమ్మ*

*మూడవ భాగం*

ఆదికాండం 37:14

1. యాకోబు తన తండ్రి పరదేశవాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.

2. యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.

3. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.

4. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

ప్రియులారా! ఇక 37వ అధ్యాయంనుండి  మనకు యోసేపు గారి బయోగ్రఫీ కనిపిస్తుంది. యాకోబు గారి జీవితంలో మరో వైఫల్యము  ఈ అధ్యాయంలో కనిపిస్తుంది.

 

యాకోబు గారు కనానులో పరదేశిగా ఉన్నారు! యోసేపు గారికి 17 సంవత్సరాలు వచ్చేశాయి. అనగా లేయా కుమారులకు 35+ అన్నమాట! ఇక జిల్హా కుమారులు బిల్హా కుమారులు 25+ అన్నమాట! యోసేపు గారు కూడా తన అన్నలైన జిల్ఫా కుమారులతో అనగా గాదు ఆషేరుతో, ఇంకా బిల్హా కుమారులతో అనగా దాను నఫ్తాలి తో కలిసి మందలు కాస్తున్నారు అన్నమాట! అప్పుడు నలుగురు నడిచే చెడు ప్రవర్తన కోసం నాన్నకి ఎప్పుడూ వర్తమానం చెబుతుంటే నాన్న వీరికి వీపు విమానం మోత చేసేవారు. అందుకే నలుగురు అన్నలు యోసేపు మీద పగపట్టడమే కాకుండా మిగిలిన అన్నలకు లేనిపోనివి కలిపించి చెప్పారు! అందువలన మొత్తం పదిమంది అన్నలు కోపంగా ఉన్నారు! అయితే ఇదే సమయంలో విచిత్రమైన నిలువుటంగీ ఒకటి కుట్టించి యోసేపుకి ఇచ్చారు యాకోబు గారు! ఇప్పుడు మొత్తం పదిమంది అన్నలకి కోపం వచ్చింది!

 

బైబిల్ జాగ్రత్తగా పరిశీలిస్తే దాసీలకు పుట్టిన పిల్లలు నలుగురు చెడు ప్రవర్తన గలవారు అని బైబిల్ చెబుతుంది. బైబిల్ వ్రాయించింది పరిశుద్ధాత్ముడు! అబద్దమాడడు! ఇస్సాకుగారు యాకోబు గారికి మీ మామయ్య పిల్లలలో ఒకరిని పెళ్లి చేసుకో అన్నారు! గాని ఇద్దరినీ చేసుకున్నారు! ఇక బార్యల మాటలను ఆలకించి వారి దాసీలను కూడా చేసుకున్నారు. మొత్తం నలుగురు భార్యలు అయ్యారు! అయితే దాసీల తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు గాని వారి నడవడిక మంచిది కాదు కాబట్టి పిల్లలు చెడిపోయారు! దీనిలో యాకోబు గారి తప్పు కూడా ఉందని మనము యాకోబు- ఇశ్రాయేలుగా అనే శీర్షికలో చూసుకున్నాము!

 

ఇలా పదిమంది అన్నలు కోపపడటానికి కారణం మొదటిది నలుగురు అన్నదమ్ముల చెడు ప్రవర్తనకు యోసేపు గారి చాడీల బుద్ధి అయితే, దానికన్నా ముఖ్యమైనది యాకోబు గారి పార్షియాలిటీ! ఒకరిని ఒకలాగా, మరొకరిని మరొక లాగ ప్రేమించడం వలన ఈర్ష్య కోప ద్వేషాలకు తావిచ్చింది. ఎంతవరకు వచ్చింది అంటే తన తమ్ముడు తన ప్రక్కన మందలు కాస్తున్నా మాట్లాడేవారు కాదు! ఇంటిదగ్గరనుండి వారికి భోజనం తీసుకుని వచ్చినా అన్నయ్య ఎలా ఉన్నావు అంటే ఎవడూ మాట్లాడేవాడు కాదు, యోసేపుకి దెబ్బ తగిలినా పట్టించుకునే వారు కాదు! ఇంతటి పగ పెట్టుకున్నారు!

 

 యాకోబు గారు రంగురంగుల విచిత్రమైన నిలువుటంగీ ఇస్తే అందరికీ ఇవ్వాలి! కేవలం యోసేపు గారికే ఎందుకు ఇవ్వాలి? అవును యోసేపు గారు తండ్రి దగ్గర ఉండి భక్తి నేర్చుకుంటున్నారు, ప్రార్ధన విశ్వాసము నేర్చుకుంటున్నారు బాగుంది! మిగిలిన వారు వినకపోవడానికి కారణం యాకోబు గారే కదా! వారు చిన్నప్పుడు ఆయన పట్టించుకోకుండా ధన సంపాదన కోసం తిరగడం వలన పిల్లలు చెడు ప్రవర్తన కలవారు అయిపోయారు! ఒక కొడుకు తన ఉపపత్నితోనే శయనించే స్తితికి వచ్చేశాడు! మిగిలిన వారు కూడా చెడిపోయారు! ఇప్పుడు నా కొడుకు నా మాట వింటున్నాడు భక్తిగా ఉంటున్నాడు అని అతని మీదనే ప్రత్యేక ప్రేమ చూపిస్తే మిగిలిన అన్నలకు కోపం వచ్చింది!

తల్లిదండ్రులారా! దయచేసి ఇలాంటి పార్షియాలిటీ మీ పిల్లలమీద చూపించవద్దు! ఇదే కదా చివరికి యోసేపు గారిని హత్య చెయ్యాలి అనే ఆలోచన తెప్పించింది అన్నలకు! బానిసగా అమ్మారు దీనివలననే కదా! మీ వైఫల్యాలు వలన దయచేసి పిల్లలను బాదించవద్దు! ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలాగా ప్రేమిస్తే ఇలాంటి పరిస్తితులే ఏర్పడతాయి! దయచేసి అందరినీ ఒకేలాగా ప్రేమించండి! మీ పిల్లలను భక్తిలోను వాక్యములోను ప్రార్ధన లోను పెంచండి! మందిరానికి క్రమం తప్పకుండా తీసుకుని రండి! చిన్న పిల్లలను సండేస్కూల్ కి తప్పకుండా పంపండి! అప్పుడు వారు భక్తిలో పెరుగుతారు!

దైవాశీస్సులు!

 

*ఫలించెడి కొమ్మ*

*4 భాగం*

ఆదికాండం 37:511

5. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరి పగపట్టిరి.

6. అతడు వారిని చూచి నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి.

7. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను.

8. అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మామీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగపట్టిరి

9. అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను.

10. అతడు తన తండ్రితోను తన సహోదరుల తోను అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమూ అని అతని గద్దించెను.

11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

ఇక 510  వచనాలలో యోసేపుకి దేవుడు చూపించిన రెండు కలలు చెప్పబడ్డాయి! ఈ రెంటి అర్ధము ఒక్కటే! ఈ రెండు కలలతో తన అన్నలు యోసేపు మీద  మరింత పగబట్టడం జరిగింది!

 

మొదటిది: మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలబడగా మీ పనలు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగనమస్కారం చేశాయి, దీని అర్ధం ఏమిటంటే ఒకరోజు మీరంతా నాకు నమస్కారాలు చేస్తారు! యోసేపు వారిమీద నాయకుడు అవుతాడు! వెంటనే అన్నలు మండిపడ్డారు! నీవు రాజువు అవుతావా, మేము నీకు సాష్టాంగనమస్కారం చేస్తామా అని! మరి దర్శనం ఎప్పుడు నెరవేరింది? 22 సంవత్సరాల తర్వాత యోసేపు ముందు వీరంతా తలవంచి నమస్కారాలు చేశారు ఒకసారి, తర్వాత యోసేపు ఇంటిలో అన్నలు తమ్ముడు సాష్టాంగనమస్కారం చేశారు! ..ఆది 42:6; 43:26, 44:14;

 

రెండవ కల: సూర్యచంద్రులు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగ నమస్కారం చేశాయి! గమనించాలి- కలలు భావ గర్భితముగా లేకుండా చాలా స్పష్టంగా ఉన్నాయి! మొదటి కలలో అన్నలంతా యోసేపుగారికి సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. ఇక రెండవ కలలో అన్నలతో పాటుగా పదకొండు నక్షత్రాలు అనగా పదకొండు మంది అన్నదమ్ములు కూడా తనకు నమస్కారాలు చేస్తారు! వెంటనే అన్నలంతా చూశారా మీ ముద్దులు కొడుకు ఎలాంటి కలలు కంటున్నాడో, మొదట మేమంతా వాడికి సాష్టాంగనమస్కారం చేస్తామని కల కన్నాడు! ఇప్పుడు మాతోపాటుగా మీరు అమ్మ కూడా సాష్టాంగనమస్కారం చేస్తారంట చూడండి అని నాన్నతో కంప్లైంట్ చేశారు! వెంటనే 10 వచనం ప్రకారం కల విన్న తర్వాత బయటికి యాకోబు గారు కూడా గద్దించారు! గాని 11 వచనం ప్రకారం యాకోబు గారు కలను జ్ఞాపకం ఉంచుకున్నారు, అనగా ఏమని అర్ధమయ్యింది అంటే దేవుడు యోసేపుని ఒక గొప్ప అధికారిగా గొప్ప రాజుగా చెయ్యబోతున్నారు!

 

సరే, కల ఎప్పుడు నెరవేరింది? మనకు తెలిసినంతవరకు యాకోబుగారు యోసేపుకి ఎప్పుడు సాగిలపడి నమస్కరించలేదు. అయితే యాకోబుతో పాటుగా వారు ఫరో దగ్గరకి ఐగుప్తు వెళ్ళినప్పుడు కూడా యాకోబు ఫరోకి సాష్టాంగనమస్కారం చేసినట్లు లేదు! అయితే ఒక్కటి మాత్రం అర్ధమవుతుంది ఏమిటంటే- యాకోబుతో పాటుగా అన్నలు, తమ్ముడు, అక్క తన పిన్నులు ఐగుప్తు దేశం వెళ్ళారు. అక్కడ వారు నివశించిన రోజులలో యోసేపు ఒక గొప్ప ప్రధానమంత్రిగా ఒక ముఖ్య ఆలోచనకర్తగా ఐగుప్తు మొత్తాన్ని పాలించే అధికారిగా ఉన్నాడు! రకంగా మొత్తం కుటుంబమంతా యోసేపు పాలనలో ఉంది కాబట్టి ఆయనకు లోబడినట్టు అని అర్ధమవుతుంది!

 

అయితే మరొకటి అర్ధం చేసుకోవాలి ఏమిటంటే: కనాను లోనే యాకోబుగారి చిన్న బార్య రాహేలు చనిపోయింది! అయితే ఐగుప్తు దేశం వెళ్లబోయేసరికి లేయా కూడా చనిపోయినట్లు అర్ధమవుతుంది! ఎందుకంటే యాకోబుతో పాటుగా ఐగుప్తు దేశం వెళ్ళిన వారి లిస్టులో లేయా పేరు లేదు .... 46:5;

మరి ఇప్పుడు సూర్యచంద్రులు అనగా తల్లిదండ్రులు అనికదా కల యొక్క భావం మరి కల ఏవిధంగా నెరవేరింది? రాహేలు లేయా లేకపోయినా ఉపపత్నులు ఉన్నారు కదా, వారు కూడా యాకోబుగారి బార్యలే కదా! వారుకూడా యోసేపు పాలనలో ఉన్నారు!

 

సరే, అన్నలు మండిపడినా, యాకోబు గారు పైకి గద్దించినా మాటలన్నీ అనగా కలలు యాకోబు గారు జ్ఞాపకం ఉంచుకున్నారు. ఇదేవిధంగా జ్ఞాపకం ఉంచుకున్నవారు మరో వ్యక్తి ఉన్నారు. ఆమె యేసుక్రీస్తు ప్రభువుల వారి భూలోకంలో తల్లి గారు మరియమ్మ గారు కూడా లూకా 2:9, 2:51 ప్రకారం యేసుక్రీస్తుప్రభులవారి కోసం ఆరోజు వారు ప్రవచించిన ప్రతీమాట ఆమె జ్ఞాపకం ఉంచుకున్నట్లు చూడగలం!

 

ఒక విషయం చెప్పనీయండి! యోసేపు గారు తన చిన్నతనంలో కలలు కావాలని కలలు కన్నాడా? లేదు కదా! దేవుడు కొంతమందికి జరుగబోయే సంగతులు ముందుగానే చెబుతారు యోబు గ్రంధం ప్రకారం...33:14-18;

ఆమోసు 3: 7

తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.

  అంతేకాదు ముందుగా జరుగబోయే సంఘటనలు ముందుగానే చెప్పేవారిని దీర్గదర్శి అనేవారు ఆ రోజులలో! దేవుడు యోసేపు గారిని దీర్గదర్షిగా ఎన్నుకొన్నారు! అందుకే మొదటగా కలల ద్వారా మాట్లాడారు! ఆ తర్వాత మరొకరి కలల యొక్క అర్ధాలు చెప్పడమే కాకుండా ముందుగానే ఏమి జరుగబోతుందో చెబుతూ దీర్ఘదర్శిగా దేవుడు నిర్ధారించారు ఐగుప్తు దేశంలో- పానదాయకుడు భక్షకారుల అధిపతుల కలల ద్వారా మరియు ఫరో కల ద్వారా!  బైబిల్ గ్రంధంలో యోసేపు గారి తర్వాత దీర్ఘదర్శి సమూయేలు గారు!

 

ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే తనకి వచ్చిన కలలకు యోసేపు ఎలా బాధ్యుడు? దేవుడు చూపించారు, వచ్చిన కలలను చిన్నతనం కాబట్టి కలొచ్చింది కలొచ్చింది అంటూ చెప్పేశారు ఆయన చిన్నతనంలో! దానికి అందరూ కోపపడ్డారు!

 

సరే, మొత్తానికి యోసేపు కలలు మరియు అన్నలు చేస్తున్న చెడుపనులు చూసి తన తండ్రితో చెప్పే చాడీలు యోసేపు మీద అన్నలు పగపట్టడానికి కారణం అయ్యాయి! చరిత్ర ప్రకారం మొదటగా పగబట్టిన వారు గాదు నఫ్తాలి ఆషేరు  గాని వారు ఇవీ అవీ కలిపి చెప్పి అన్నలందరూ యోసేపుని ద్వేషించే స్తితికి తీసుకుని వచ్చారు! షిమ్యోను పీకలలోతు కోపంలో ఉన్నాడు, ఎలాగైనా యోసేపుని హతమార్చాలి అనుకున్నాడు! దీనా చెప్పినా విని ఉండడు బహుశా (చరిత్ర ప్రకారం దీనా చెరపబడిన తర్వాత ఆమె మరియు యాకోబు దీనా జీవితం కోసం కన్నీరు కార్చుతూ ఉంటే అన్న షిమ్యోను ఆమెను పెళ్లి చేసుకుని ఆమెను జీవితాంతం పోషించాడు. గమనించాలి- కాలంలో దేశాలలో చెల్లెళ్ళను పెళ్లి చేసుకునే వారు, అబ్రాహాము గారి బార్య శారమ్మ కూడా ఆయనకు చెల్లెలు). షిమ్యోను మరో కనాను దేశపు స్త్రీని కూడా పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. అయితే షిమ్యోను అన్నలందరి కంటే ఎక్కువగా యోసేపు మీద కోపం పగ పెంచుకున్నాడు! అందుకే ఎక్కువగా కొట్టి గోతిలోకి త్రోసినట్లు అర్ధమవుతుంది.

(సశేషం)

*ఫలించెడి కొమ్మ*

*5 భాగం*

ఆదికాండం 37:1220

12. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి.

13. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారియొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను.

14. అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతినితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను.

15. అతడు పొలములో ఇటు అటు తిరుగు చుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి నీవేమి వెదకుచున్నావని అతని నడిగెను.

16. అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను.

17. అందుకు ఆ మనుష్యుడు ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను.

18. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.

19. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు;

20. వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

ఇక 1220  వచనాలను చూసుకుంటే అన్నలు షెకెములో తమ మందలను మేపడానికి వెళ్ళారు! ఇక్కడ ఒక అనుమానం రావచ్చు. ఏమండి కొంతకాలం క్రితం వారు షెకెములో ఉండగానే షెకెము యొక్క రాజ కుమారుడు హమోరు కుమారుడైన షెకెము దీనాను పాడుచేసినట్లు, ఆ తర్వాత షిమ్యోను లేవీలు ఆ ఊరిని షెకెముని హమోరుని పురుషులను చంపినట్లు ఆ తర్వాత హివ్వీయులు పగపట్టి యాకోబుగారిని షిమ్యోను లేవీని చంపుదామని అనుకుంటూ ఉండగా వారు ఆ ప్రాంతం కాళీ చేసి దేవుడు చెప్పినట్లు బేతేలు వెళ్ళినట్లు చదువు కున్నాము కదా యాకోబు ఇశ్రాయేలుగా అనే శీర్షికలో! మరి మరలా ఇప్పుడు షెకెము ఎందుకు వెళ్లారు యోసేపు అన్నలు!

 

మూడు కారణాలు:

మొదటిది: సంఘటన జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది! యోసేపు గారు అమ్మబడినప్పుడు 17 లేక 18 సంవత్సరాలు. యోసేపుకి కలలు వచ్చినప్పుడు ఆయన వయస్సు 17 సంవత్సరాలు అని వ్రాయబడింది. యోసేపు పుట్టిన తర్వాత యాకోబు గారు సిరియా వదిలేసి కనాను వచ్చారు! కాబట్టి సంఘటన జరిగి చాలా రోజులు అయ్యింది!

 

రెండు: అయితే మనము 35:5  చూసుకుంటే దేవుని భయము వలన హివ్వీయులు షిమ్యోను లేవీలను తరుమలేదు అని వ్రాయబడింది. కాబట్టి షిమ్యోను లేవీలు ప్రాంతం వెళ్ళినా  దేవునికి భయపడి ఏమీ అనేవారు కాదు!

 

మూడు: ౩౩:1819  ప్రకారం అక్కడ కొంతభూమిని వెల ఇచ్చి కొన్నారు యాకోబు గారు! అంతేకాకుండా వారికి అక్కడ సొంత ఇల్లు కూడా ఉంది! కాబట్టి తమ సొంతభూమికి ఇంటికి వెళ్ళేవారు అన్నమాట అన్నలు!!!

 

సరే, 13--14 వచనాలలో యాకోబు గారు అంటున్నారు యోసేపుతో మీ అన్నలు మన పాత ఇంటికి మన భూమికి షెకెము వెళ్లారు, కాబట్టి వారి దగ్గరికి వెళ్లి వారు ఎలా ఉన్నారో చూసి రా అన్నారు, ఇంకా మన మందలు ఎలా ఉన్నాయో చూడు అన్నారు! దీనిని బట్టిరెండు విషయాలు అర్దమవుతున్నాయి!

 

మొదటిది: అన్నలు మందలు మేపడానికి వెళ్ళినా యోసేపు వెళ్ళలేదు అన్నలతో! ఎందుకంటే అన్నలు యోసేపు మీద పగపట్టినట్లు యాకోబు గారికి తెలిసింది అన్నమాట! అంతేకాకుండా యోసేపు యాకోబుగారి వృద్ధాప్యమందు పుట్టినవాడు కాబట్టి అతనిని ఎక్కువగా ప్రేమించడం వలన యోసేపుని షెకెముకి మందలను మేపడానికి తన కుమారులతో పాటుగా పంపలేదు అని అర్ధమవుతుంది!

 

రెండవది: వారు షెకెము వెళ్లి చాలా రోజులు అయి ఉంటుంది, అందుకే నీవు షెకెము వెళ్లి మీ అన్నల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని చెబుతున్నారు యాకోబుగారు యోసేపుతో!!!

 

మూడవది: సంఘటన జరుగబోయే సరికి యాకోబుగారు తన కుటుంబంతో హెబ్ర్రోనులో ఉంటున్నారు. అనగా షెకెము హెబ్రోనుకి 80  కి.మీ దూరంలో ఉంది! అది ఒక్కరోజు ప్రయాణం మాత్రం కాదు! రోజులలో నడిచి గాని, గాడిద మీద గాని ఒంటెలమీద గాని వెళ్ళేవారు! ఇంకా ప్రాంతమంతా మనలాగా సమానంగా ఉన్న పీఠభూమి కాదు, కొండలు మెట్టలు అరణ్యాలు గల దేశం!

మొదట షెకెము చేరుకున్నారు యోసేపు గారు. షెకెము అనేది మైదానప్రాంతం! షెకెము చేరుకొని అన్నలకోసం తిరగటం ప్రారంభించాడు! అక్కడ అలా ఇటూఅటూ తిరుగుతూ ఉండగా వారు కనిపించక పోతే కంగారు పడుతుండగా ఒక వ్యక్తి కనిపిస్తాడు 15 వచనంలో, వెంటనే  వ్యక్తి అడుగుతున్నాడు- అబ్బాయి ఏమి వెదుకుతున్నావు ఎవరిని వెదుకుతున్నావు అని, వెంటనే యోసేపు చెప్పడం జరిగింది- మా అన్నలను వెదుకుతున్నాను, నీకు తెలుసు కదా, మేము యాకోబు గారి పిల్లలం, భూమి మాది. మీ అన్నలు మందలతో పాటుగా దోతాను వెళ్దాం అని మాట్లాడుకున్నారు, కాబట్టి బహుశా దోతాను వెళ్లి ఉండవచ్చు అని చెప్పాడు వ్యక్తి!

 

అయితే రబ్బానిక్ స్క్రిప్చర్ ప్రకారం- మీ అన్నలు దోతానుకి వెళ్లారు, దోతానుకి వెళ్ళు అని చెప్పిన వ్యక్తి దేవదూత అంటారు! మరి ఎంతవరకు సత్యమో మనకు తెలియదు! రకంగా దేవదూతలు కూడా యోసేపుకి సహాయం చేసేవారు అంటారు!

 

సరే, అక్కడనుండి దోతాను వెళ్తారు యోసేపు గారు! దోతాను అనేది షెకెముకి ఉత్తరంగా 20 కి.మీ. దూరంలో ఉంది అనగా హెబ్రోనుకి 100 కి.మీ. దూరంలో ఉంది అన్నమాట!

సరే, దోతాను వెళ్ళిన తర్వాత అన్నలు కనిపించారు!

 

అన్నల్లారా ఎలాగున్నారు అంటూ అరుచుకుంటూ వస్తున్నాడు యోసేపు! అయితే 18—20 వచనాలు చూసుకుంటే యోసేపుని దూరంగా చూసిన అన్నలు యోసేపుని చంపాలని ఆలోచన చేశారు. అయితే రూబేను అనగా పెద్దన్నయ్య వద్దురా తప్పు అని ముందుగానే చెప్పాడు! ఇక్కడ నిజానికి యాకోబు తర్వాత పెద్దవాడు పెద్ద అన్న రూబేను కాబట్టి అతనిని కాపాడవలసిన భాద్యత తనది అని రూబేను గ్రహించాడు అని మనకు అర్ధమవుతుంది. అందుకే తప్పురా తమ్ముల్లారా మన తమ్ముడ్ని మనం చంపకూడదు అన్నాడు!

 

సరే యోసేపు వచ్చాడు, అన్నల్లారా ఎలా ఉన్నారు అన్నాడు, ఒరేయ్ కలలు కనేవాడా, నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎలాగు మామీద చాడీలు చెప్పి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయలేదు నీవు, ఇక్కడ మా భార్యలను పిల్లలను వదిలేసి ప్రశాంతంగా ఇక్కడ మందలు కాసుకుంటూ ఉండగా ఇక్కడకి కూడా దాపురించావా? ముందు నీ విచిత్రమైన నిలువుటంగీ తీయరా అన్నారు! ఇక కొట్టడం మొదలుపెట్టారు.

 

"అన్నల్లారా! దయచేసి కొట్టకండి! చాలా నొప్పిగా ఉంది! నాన్నతో చెప్పను! దయచేసి నన్ను వదలండి! ప్లీజ్- కొట్టొద్దు- పెద్దన్నయ్యా నీవైనా చెప్పు అరుస్తున్నాడు యోసేపు. గాని వారు ఆపకుండా కొడుతున్నారు, రక్తాలు కారిపోతున్నాయి, రూపం మారిపోతుంది, నామరూపాలు లేకుండా పోయింది, ఒళ్ళంతా రక్తపు ముద్దగా మారింది.

పెద్దవానికి జాలివేసింది. “ఒరేయ్ ఆపండిరా లేకపోతే వాడు చనిపోతాడు!” అన్నాడు పెద్ద అన్న!

చావాలనే కొడుతున్నాం కదా అన్నాడురెండో అన్న షిమ్యోను.

 వాడిని చంపాలనే కదా అనుకుంటున్నాముఅన్నారు 5,6,7,8 అన్నలు.

తప్పురా, మన తమ్ముడి రక్తం మనం చిందించకూడదు! నాన్నకు ఏమి చెబుతాము?” అన్నాడు రూబేను!

"లేదు చంపాలి అంతే" అన్నారు 2,3,5,6,7,8 అన్నలు!

ఇక వీరు చంపేసేలాగ ఉన్నారు. ఏవిధముగానైన తప్పించాలి అనుకుని- "అయితే ఒకపని చెయ్యండి- ఈ నీరులేని గోతిలో తోసేద్దాం, అప్పుడు వాడే నీరులేక ఆహారం లేక చస్తాడుఅన్నాడు పెద్దన్నయ్య, ఎలాగైనా ఇప్పుడు వారు చంపకుండా అడ్డుపడితే తర్వాత ఎవరూ చూడకుండా గోతిలోనుండి తీసి ఇంటికి పంపాలనే ఉద్దేశంతో అన్నాడు! "సరే" అన్నారు అందరూ!

22వ వచనం ప్రకారం రూబేను వారిని చంపకుండా అడ్డుపడ్డాడు.

 

రెండో అన్నయ్య- బలవంతంగా బట్టలు అన్నీ విప్పేసి ఎత్తి గోతిలో పడేశాడు!

 

గమనించండి గుంటలో బలవంతంగా విసిరివేసిన వాడు షిమ్యోను! అంతగా పగపట్టాడు షిమ్యోను! 5,6,7,8 అన్నలు అంతగా లేనిపోనివి తమ్ముడి మీద చెబితే షిమ్యోను అందరికంటే ఎక్కువగా పగపట్టాడు!

 

చాలా లోతుగా ఉంది గొయ్యి- నీరు లేదు, చీకటి, కొద్ది కొద్దిగా వెలుతురూ వస్తూ ఉంది! అకస్మాత్తుగా పాములు బయటికి వచ్చాయి, తేళ్ళు ఎక్కడ చూసినా- "అన్నల్లారా! పాములు- తేళ్ళు ఉన్నాయి, దయచేసి నన్ను గోతిలోనుండి బయటకు తీయండిఅరుస్తున్నాడు తమ్ముడు! ఎవరూ రావడం లేదు! ఎన్నో పాములు- లెక్కపెట్టడానికి వీలు లేదు! అప్పుడు అరుస్తున్నాడు- "నా తండ్రి పూజిస్తున్న దేవుడా! నా తండ్రితో మాట్లాడిన దేవుడా! నా కలలో కనిపించిన దేవుడా! దయచేసి నన్ను కాపాడు!" హృదయవిధారకంగా అరిచాడు గట్టిగా!!!

వెంటనే ఒక వెలుగు, వెలుగునుండి ఒక స్వరం, అంతే- పాములన్నీ వాటివాటి కన్నాలలోకి వెళ్ళిపోయాయి! తేళ్ళు అన్నీ పారిపోయాయి! ఒక్కడే మిగిలిపోయాడు! "దేవుడా నీకు ధన్యవాదాలు" అని గట్టిగా చెప్పాడు!

 

"అన్నల్లారా! దయచేసి నన్ను కాపాడండి! దయచేసి నన్ను క్షమించండి! ఇంకా ఎప్పుడు మీకోసం ఏది తండ్రితో చెప్పను! ఈసారికి నన్ను వదిలెయ్యండి అరుస్తూనే ఉన్నాడు! 1, 4 అన్నలకు ఏదైనా చెయ్యాలని ఉంది! గాని "ఎవరైనా వాడిని బయటికి తీసేరా, నేనే వాడిని చంపేస్తాను" అంటున్నాడు రెండో అన్నయ్య! పెద్దన్నయ్య అరుపులు వినలేక తన మంద దగ్గరకు చూడటానికి వెళ్ళాడు! దూరంగా కొంతమంది వర్తకులు గాడిదల మీద తమ సామానులు వేసుకుని వెల్తున్నారు, నాలుగో అన్నయ్యకు ఏరకంగానైనా వాడిని చంపకుండా రక్షించాలి అని ఉంది! 

"ఒరేయ్ అన్నలు తమ్ముళ్ళు- ఒకపని చేద్దాం! వాడిని చంపేస్తే మనకు ఏమి వస్తుంది- వాడిని వ్యాపారులకు బానిసగా అమ్మివేద్దాం! అప్పుడు మనకు డబ్బు వస్తుంది, వాడి పీడా విరుగుడు అయిపోతుంది" అన్నాడు! ఇది బాగుంది అనుకున్నారు! "అయితే పెద్దోడు రాకుండానే తొందరగా అమ్మేద్దాం" అన్నారు!

తాడు వేశారు, "ఒరేయ్ కలలు కనేవాడా, ఈ తాడు పట్టుకో" అన్నారు,

తాడు పట్టుకుని మీదకి వచ్చాడు తమ్ముడు! "ధన్యవాదాలు అన్నయ్యలు, నన్ను క్షమించండి" అన్నాడు. గాని రెండో అన్నయ్య చేతులు వెనుకకు త్రిప్పి కట్టేసి ఆ వ్యాపారస్తులకు అమ్మేశాడు. వారు 20 వెండి నాణేలు ఇచ్చారు!

 

Genesis(ఆదికాండము) 37:25,26,27,28

25. వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.

26. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము?

27. ఇష్మాయేలీయులకు వానిని అమ్మి వేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.

28. మిద్యానీయులైన వర్తకులు మీదుగా వెళ్లుచుండగా, వారు గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.

 

"అన్నల్లారా దయచేసి నన్ను అమ్మకండి, నాన్నను చూడకుండా ఉండలేను! దయచేసి అమ్మవద్దు! కాపాడండి" అరుస్తున్నాడు తమ్ముడు! గాని వ్యాపారస్తులు కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ లాగుకుపోయారు తమ్మున్ని!

"ఒరేయ్ తమ్ముడు ఎక్కడరా, చనిపోయాడా" అన్నాడు పెద్దోడు!

"ఏమో మాకేం తెలుసు! ఉదయం చూద్దాం లే" అన్నారు అన్నలు!

"పెద్దోడు ఏడుస్తున్నాడు- అయ్యో నాన్నకు ఏమని సమాధానం చెప్పను!" గోతిలో వాడు చనిపోయాడు అంటూ ఎంతో బాధపడుతున్నాడు!

"ఒరేయ్ పెద్ద అన్నయ్య! ఇదిగో అంగీకి రక్తం అంటించి- ఇది మన తమ్ముడిదేమో చూడమని నాన్నకు చెబుదాం! ఇప్పుడే బయలుదేరుదాం పదండి పదండి" అన్నారు 2,5,6,7,8 అన్నలు!

వచ్చి తండ్రికిచెప్పారు!

 

3135  

31. వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో అంగీముంచి

32. విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతు పట్టుమని చెప్పిరి

33. అతడు దానిని గురుతుపట్టి అంగీ నా కుమారునిదే; దుష్ట మృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను.

34. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చు చుండగా

35. అతని కుమారులందరును అతని కుమార్తె లందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లకనేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను.

 

ఏడ్చి ఏడ్చి- ఒక్కసారే లేచాడు- "ఒరేయ్ మీరందరూ మీ ఆయుధాలు తీసుకుని వాడిని క్రూరమృగం తినేసిందో దానిని తీసుకుని రండి" అన్నాడు తండ్రి!

వీరికి ఏమి చెయ్యాలో తెలియలేదు! అన్నలందరూ బయలుదేరారు! రోజంతా తిరిగితే ఒక పెద్ద తోడేలు కనిపించింది! కష్టపడి దానిని పట్టుకుని తీసుకుని వచ్చారు! దాని మూతినిండా రక్తం అంటుకుని ఉంది!

"నాన్నగారు! ఇదే తమ్మున్ని తిన్న మృగం" అన్నారు!

వెంటనే దానిని కొట్టడం ప్రారంబించాడు తండ్రి! భయంకరంగా కొడుతున్నాడు, దానిని చంపాలని అతని ఉద్దేశం! అయితే ఆశ్చర్యంగా ఆ పెద్ద తోడేలు మాట్లాడటం మొదలుపెట్టింది-

"ఓ పెద్దాయనా! నన్ను ఎందుకు కొడుతున్నావు?" అడిగింది మానవ స్వరంతో!

"నాకొడుకుని ఎందుకు చంపి తిన్నావు?"

"నేను తిన్నానని ఎవరు చెప్పారు నీకు!"

"ఇదిగో నా కొడుకులు!"

"వారు అబద్దం చెబుతున్నారు! నా పిల్ల కనబడటం లేదని నేను మూడు రోజుల నుండి తిరుగుతున్నాను! నా పిల్లపోయి నేను ఏడుస్తుంటే నీ కొడుకుని ఎలా తినగలను అడిగింది" ఆ పెద్ద తోడేలు!!

వెంటనే కొట్టడం ఆపేసి- "దయచేసి నన్ను క్షమించు" అని అడిగాడు ఆ పెద్దాయన!!!

 

ఇది రబ్బానిక్ స్క్రిప్చర్ లో Targ. Pseudo Jonathan అనే చరిత్రకారుడు తన పుస్తకంలో రాసుకున్నాడు! సోటా అనే పుస్తకం కూడా దీనిని నిర్దారిస్తుంది! ఇది పుస్తకంలో రాసినట్లు గోతిలో దేవునిదూత పాములను తేళ్లను త్రోలడం, తోడేలు మానవ స్వరంతో మాట్లాడటం నిజంగా జరిగిందో లేదో మనకు తెలియదు, బైబిల్ లో ఆధారం లేదు!

 

రకంగా యాకోబు గారు తన కుమారుని కోసం ఏడుస్తున్నారు, యోసేపు అన్నలతో రకంగా ద్వేషించబడి ఐగుప్తు దేశం బానిసగా అమ్మబడ్డాడు!

 

విధంగా జరగటానికి వారిమధ్య ప్రేమలేదు, ఈర్ష మాత్రమే ఉంది! ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాలమంతా కటోరమైనది అని బైబిల్ సెలవిస్తుంది! పరమ గీతం 8:6;

(సశేషం)

*ఫలించెడి కొమ్మ*

*6 భాగం*

ఆదికాండం 39:16

1. యోసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను.

2. *యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు* తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను.

3. *యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు*

4. *యోసేపుమీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతి కప్పగించెను.*

5. అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణ కర్తగా నియమించినకాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలో నేమి పొలములో నేమి అతనికి కలిగిన సమస్తముమీదను ఉండెను.

6. అతడు తనకు కలిగిన దంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను.

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

ఇక 1--6 వచనాలను చూసుకుంటే ఇష్మాయేలు వర్తకులు యోసేపుని ఐగుప్తు దేశము తీసుకుని వెళ్లి అక్కడ రాజదేహ సంరక్షక సేనాధిపతికి బానిసగా అమ్మేశారు! ఒక రాజ కుమారుడిలా పెరిగిన యోసేపు ఇప్పుడు బానిసగా పరాయి దేశములో పనిచేయాల్సివచ్చింది!

 

ఇక రెండవ వచనము చాలా ప్రాముఖ్యమైన విషయం: *యెహోవా యోసేపుకి తోడైయుండెను గనుక అతడు వర్దిల్లుచూ* తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంత ఉండెను.. దీనిని జాగ్రత్తగా పరిశీలించండి!

యోసేపు తన తండ్రి వద్దనుండి తన బంధువుల యొద్దనుండి అమ్మబడినా తరుమబడినా అన్నలు వదిలేసినా గాని దేవుడు యోసేపుని వదలలేదు! యోసేపుకి తోడుగా ఉన్నాడు గనుక అతడు వర్దిల్లుచూ.. మాట గమనించాలి! దేవుడు అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి అక్కడ వర్దిల్లుచూ ఉన్నాడు అని వ్రాయబడింది.  ఇదేమాట ఇదే అధ్యాయంలో ఇంకా మూడుసార్లు వ్రాయబడింది. మూడో వచనంలో వ్రాయబడింది. ఫోతీఫర్ ఇంట్లోను దేవుడు తోడుగాఉన్నారు, ఇక 21 వచనంలో చూసుకుంటే అక్కడ కూడా చెబుతున్నారు- యెహోవా అతనికి తోడుగా ఉన్నారు! 23 వచనంలో కూడా యెహోవా అతనికి తోడుగా ఉన్నారు! హల్లెలూయ!!! ఎంత ధన్యతో కదా!

 

 తల్లి తండ్రి అన్నదమ్ములు బంధువులు ఎవరూ తోడుగా లేకపోయినా పరాయి దేశంలో బానిసగా ఉన్నా గాని దేవుడు మాత్రం యోసేపు చేయి వదలలేదు! అవును మన దేవుడు మన చేయి వదిలివేసే దేవుడు కానేకాదు! దావీదుని చెయ్యి వదలకుండా కాపాడారు! దానియేలు గారిని సింహపు బోనులో చేయి విడువక కాపాడారు! అందుకే కదా షడ్రక్ మేషాక్ అబెద్నేగోలు రాజా మా దేవుడు మండుచున్న అగ్ని గుండమునుండి రక్షించి తప్పించుటకు సమర్ధుడు! ఒకవేళ ఆయన రక్షించక పోతే చావనైనా చస్తాము గాని నీ బంగారమ్మ బొమ్మను మ్రొక్కమని తెలుసుకో అన్నారు చక్రవర్తితో! అలాగే మండుచున్న అగ్నిగుండములోనికి తన భక్తులతో పాటుగా తానుకూడా దూకేసి వారిని అగ్నివాసన కూడా అంటకుండా తోడుగా ఉంది కాచి కాపాడారు దేవుడు...దానియేలు 3

 

ప్రియ దేవుని బిడ్డా! నీకు తోడుగా దేవుడు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళినా నీ మొబైల్ ని మర్చిపోకుండా తీసుకుని పోతావుకదా మరి నీతోపాటుగా నీ దేవుణ్ణి తీసుకుని పోతున్నావా? నీకు తోడుగా దేవుడు ఉన్నారా? ఆయన నీతో మాట్లాడుచున్నారా?

 

ఒకవేళ నీవు కష్టాలలో ఉన్నావా? బాధలలో ఇబ్బందులలో ఇరుకులలో కన్నీటిలో ఉన్నావా?!! బాధపడకు.. నీతో ఉండువాడు నీ దేవుడైన యెహోవా అని మర్చిపోకు! నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానంచేశారు దేవుడు.... యెహో 1:6; హెబ్రీ‌ 13:5

 

దేవుడు నీకు తోడుగా ఉన్నాను అని బైబిల్ 66 సార్లు చెప్పారు! అనగా  ప్రతీరోజు నీకు తోడుగా ఉన్నాను అంటున్నారు. సంవత్సరములో ప్రతీరోజు అనగా 365 సార్లు భయపడకుము అని వాగ్దానం చేశారు!

కాబట్టి ప్రియ స్నేహితుడా! దైర్యముగా ఉండు! యోసేపుకి పోతీఫర్ గృహంలో తోడుగా ఉన్నారు, 21 వచనంలో చెరసాలలో తోడుగా ఉన్నారు. నీతో కూడా దేవుడు తోడుగా ఉన్నారని నమ్మి ముందుకు సాగిపో!

 

ఆయన అబ్రాహము గారితో అన్నారు నేను నీకుతోడుగా ఉన్నాను అని చెప్పి అబ్రాహము గారితో ఉన్నారు.

 

ఆయన ఇస్సాకు గారితో అన్నారు నేను నీకుతోడుగా ఉన్నాను అని చెప్పి ఇస్సాకు గారితో ఉన్నారు.

 

ఆయన యాకోబు గారితో అన్నారు నేను నీకుతోడుగా ఉన్నాను అని చెప్పి యాకోబు గారితో ఉన్నారు. 28:15; 31:15; 32:12...

 

యోసేపు తో తోడుగా ఉన్నారు!

నిర్గమకాండము 3:12, 4:15 లో మోషే గారితో అంటున్నారు నేను నీకు తోడై ఉన్నాను!...

 

ఇశ్రాయేలు ప్రజలతో నేను మీకు తోడైయున్నాను అన్నారు సంఖ్యా 14:9,  ద్వితీ 2:7 , 31:8,23

 

యెహోషువా తో అంటున్నారు నేను మోషేకి తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉంటాను 1:5, 6:27,

 

ఇలా బైబిలో అనేకమంది భక్తులతో తోడుగా ఉన్నదేవుడు ఈరోజు నీతో కూడా తోడుగా అయన ఉన్నారని మర్చిపోవద్దు!

 

ఇక యోసేపు గారికి దొరికిన అత్యధికమైన దీవెన ఏమిటంటే దేవుడే తనకు తోడుగా ఉన్నారు! కాబట్టి అతని పనులన్నీ అనగా యోసేపు చేసే పనులన్నీ దేవుడే సఫలము చేస్తున్నారని అతని యజమాని చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక ఇప్పుడు బానిస నుండి యజమాని యొద్ద పనిచేయు వాడయ్యాడు! ఒకసారి కీర్తన 1:3 చూద్దాం!

కీర్తనలు 1: 3

అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.

 అతడు చేయు పనులన్నీ యెహోవా సఫలం చేయును అంటే ఇదే!!!

 

తర్వాత  సెక్రటరీ లేక పర్సనల్ సెక్రటరీ అయ్యారు! ఇంకా దేవుడు అతనితో తోడుగా ఉన్నారు అని చూసి అతని ఇంటిమీద విచారణ కర్తగా చేసేసాడు యజమాని. బానిస నుండి మొదట యజమాని దగ్గర పనిచేసేవాడు, తర్వాత సెక్రటరీ తర్వాత సూపర్వైజర్ తర్వాత ఇంటిమొత్తముమీద సూపరింటెండెంట్ అయ్యారు! ఇది నమ్మకత్వానికి దొరికే ప్రతిఫలం! యోసేపు కి యజమాని చెప్పిన ప్రతీ పనిని నమ్మకముగా పనిచేసినందున అతనిని నమ్మి తన ఇంటిమీద విచారణ కర్తగా నియమించి తనకి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను.

చూడండి- ఐగుప్తు దేశంలో రాజు దగ్గర పనిచేసే ఒక గొప్ప ఉద్యోగి ఇంటిలో అనేకమంది బానిసలు ఇంకా ఐగుప్తు దేశపు ఉద్యోగులు ఉన్నారు! గాని వీరెవరికీ భాద్యత అప్పగించకుండా ఒక బానిసగా అమ్మబడిన యోసేపుకే ఇంత పెద్ద భాద్యత అప్పగించారు అంటే నిజంగా యోసేపు ఎంతో నమ్మకమైన వాడు తర్వాత నిపుణత గలవాడు అని అర్ధమవుతుంది!

అందుకే సామెతల గ్రంధంలో వ్రాయబడింది

సామెతలు 13: 17

దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.

 

సామెతలు 25: 13

నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనమువంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల జేయును.

 

సామెతలు 22: 29

తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.

 

మరినీకు అట్టి నమ్మకత్వము నిపుణత ఉన్నదా?!!!

దైవాశీస్సులు!

 

                *ఫలించెడి కొమ్మ*

         *7 భాగం- యోసేపు పరీక్ష-1*

 

ఆదికాండం 39:613

6. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను.

7. అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను

8. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెను గదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు.

9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను.

10. దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడుకాడు.

11. అట్లుండగా ఒకనాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు.

12. అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.

13. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించు కొనిపోవుట ఆమె చూచినప్పుడు ....

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

ఇక 6--13 వచనాలను చూసుకుంటే యోసేపు ఉన్నాడు కదా అనుకుని యజమాని తాను తినే ఆహారం తప్ప మిగతా విషయాలు ఏమీ చూసుకోకుండా అంతా యోసేపుకే వదిలేశాడు! అనగా ఒక ఆస్తిగలవాడు తన దాసుడు తన ఆస్తిని ఇంటిని మొత్తం వ్యవహారం బాగా చూసుకోగలడు అని నమ్మి అతని సర్వస్వము యోసేపు వశము చేసేటంత నమ్మకత్వము నమ్మకమైన వ్యక్తిగా యోసేపు ఋజువుచేశారు అన్నమాట!

 

గమనించాలి!

మొట్టమొదట ఫోతీఫర్ తన ఇంటిమీద విచారణ కర్తగా చేసి ఇంటిమీద అధికారం ఇచ్చాడు!

ఇదే అధ్యాయం చివరలో జైలు అధికారి మొత్తం చెరసాల మీద విచారణ కర్తగా చేసి అధికారం ఇచ్చాడు!

చివరికి మనం 41:41 చూస్తే ఐగుప్తు రాజైన ఫరో అక్కడ దేశం మొత్తం మీద విచారణ కర్తగా చేసి మొత్తం దేశం మొత్తం మీద అధికారం ఇచ్చాడు! ఇదీ నమ్మకత్వానికి దొరికే ప్రతిఫలం!

 

ఈరోజు మన భారతదేశంలో మన క్రైస్తవ సంఘాలలో గల నాయకులకు లోపించినది ఇదే! దేశంలో నమ్మకమైన వారిని దేవుడు వెదుకుతూ ఉన్నారు.

అయితే తీరా దేవుడు నియమించాక అతిశయం పెరిగిపోయి కొందరు, ధనాశ పెరిగిపోయి కొందరు, పొగడ్తలలో మునిగిపోయి కొందరు, Prosperity గోస్పెల్ పేరుతో Property ని పెంచుకునే వారు కొందరూ బయలుదేరి నేడు మన దేశంలో సువార్త వ్యాప్తికి విచ్చిన్నం చేసేసారు! దేవునికి ఇలాంటి సరుకు అవసరం లేదు! యోసేపు లాంటి నమ్మకమైన వ్యక్తి కావాలి! ప్రియ చదువరీ! నమ్మకమైన వ్యక్తివి నీవు కాగలవా!!!!!

 

దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయడానికి నిన్ను పిలిచి అప్పగిస్తే నీవు సంఘాన్ని దోచుకుంటూ , ఇంకా గుంటనక్కలు సంఘాన్ని పాడుచేస్తుంటే నీవు నీసొంత పనిలో ఉంటావా నాయకుడా! మరి దేవుడు నిన్ను ఒకరోజు విచారణ చేయరా!!! ఆరోజు నీవు దేవుని త్రాసులో తూసినప్పుడు బెల్శస్సర్ తేలిపోయినట్లు తేలిపోవా!! దేవుని న్యాయమైన తీర్పుకి నీవు పాత్రుడవు కావా!!! ఒకసారి ఆలోచించుకో ప్రియ దైవజనుడా!! సంఘపెద్డా!!!

 

ఇక తర్వాత విషయం : యోసేపు యొక్క గుణశీలం లేక కారెక్టర్: యోసేపు గారు తన శీలాన్ని ఎలా కాపాడుకున్నారో ఇక్కడ మనకు కనిపిస్తుంది! శీలము అనేది కేవలం స్త్రీలకే కాదు పురుషులు కూడా దానిని కాపాడుకోవాలి! అవకాశాలు లేకపోతే కాపాడుకోవడం గొప్ప కాదు! పాడైపోయే అవకాశాలు ఉన్నాగాని సత్యం కోసం, నీతికోసం, తల్లిదండ్రుల పరువు కోసం, దేవునికోసం శీలాన్ని కాపాడుకొనేవాడే మగాడు! నిజమైన నారి! ప్రతివ్రత!!!

 

యోసేపు రూపవంతుడు, యోసేపు యొక్క యజమాని బార్య యోసేపు మీద కన్నువేసింది. అనగా అతనితో అక్రమ సంభంధం పెట్టుకోవాలని చూసింది! అయితే అతడు ఒప్పుకోలేదు! చూడండి ఒకసారి 8, 9 వచనాలు.....

8. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెను గదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు.

9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను.

 

చూడండి యోసేపు గారి మాటలు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపమును కట్టుకొందును! యోసేపు గారు తన తండ్రినుండి నేర్చుకున్నారు అన్నమాట! ఇలా పరుల భార్యతో సంభంధం పెట్టుకోవడం దేవునికి విరోధమైన దుష్కార్యం అని! దేవునికి భయపడి నేను పాపం చెయ్యను అని నిర్మొహమాటంగా చెబుతున్నారు! ఆమె దినదినము మాట్లాడుతున్నా యోసేపు భయంకరమైన పాపం చెయ్యలేదు!

లేవీయకాండము 20: 10

పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.

చూడండి. ధర్మశాస్త్రము రాకుండానే తన మనస్సాక్షి ధర్మశాస్త్రముగా పనిచేస్తుంది ఇక్కడ యోసేపు గారికి!!

 

యజమానురాలు లాంటి స్త్రీలకోసం సామెతల గ్రంధంలో వ్రాయబడింది:

 

Proverbs(సామెతలు) 5:3,4,5,6

3. జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి

4. దానివలన కలుగు ఫలము ముసిణి పండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదును గలది,

5. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును

6. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును.

 

మరి శ్రమను ఎలా తప్పించుకోవాలి?

అదికూడా సామెతల గ్రంధం లోనే వ్రాసి ఉంచారు!

సామెతలు 5: 8

జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.

 

6:2025

20. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.

21. వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.

22. నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.

23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.

24. చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.

25. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము.

 

Proverbs(సామెతలు) 7:1,2,4,5,24,25,26,27

1. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము.

2. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.

4. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.

5. అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును.

24. నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి

25. జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.

26. అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది

27. దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము మార్గము మరణశాలలకు దిగిపోవును.

 

4:2527

25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.

26. నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.

27. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.

 

2తిమోతికి 2: 22

నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము (విడిచి పారిపొమ్ము), పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.

 

మరి అలా చేద్దామా!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

             *ఫలించెడి కొమ్మ*

      *8 భాగం- యోసేపు పరీక్ష-2*

 

ఆదికాండం 39:613

6. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను.

7. అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను

8. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెను గదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు.

9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను.

10. దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడుకాడు.

11. అట్లుండగా ఒకనాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు.

12. అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.

13. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించు కొనిపోవుట ఆమె చూచినప్పుడు ....

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

 

         (గతభాగం తరువాయి)

 

 అయితే ఒకరోజు వచ్చింది ఇంట్లో పనివారు ఎవరూ లేరు, యజమాని పనిమీద వెళ్ళిపోయాడు! కేవలం యోసేపు గారు మరియు యజమాని బార్య ఉన్నారు. ఆరోజు ఎవరూ లేకపోవడం చూసి యజమాని భార్య బలవంతంగా అడుగుతుంది నాతో పాపం చెయ్యు! గాని అతడు ఒప్పుకోలేదు! తన షర్ట్ లేక పై వస్త్రాన్ని గట్టిగా పట్టుకుంది పారిపోకుండా! పై వస్త్రాన్ని వదిలివేసి బయటకి పారిపోయాడు యోసేపు!

 

విషయంలో రబ్బానిక్ స్క్రిప్చర్ లో కూడా వ్రాయబడింది! కధ కూడా ఒకసారి చూద్దాం! యోసేపుకి సూపరింటెండెంట్ పోస్ట్ యజమాని ఎప్పుడు ఇచ్చాడు అంటే:

 బానిసలు మొత్తం వారం చివర్లో ఒకరోజు కూర్చుని ద్రాక్షారసం (మత్తు పానీయం) త్రాగేవారట! గాని ఎప్పుడూ యోసేపు గారు దాని జోలికి పోలేదు! ఎన్నో రకాలుగా ప్రయత్నించారు గాని ఏ చెడు అలవాటుకి లోబడలేదు! అప్పుడు బానిసలలో కొందరు ఆలోచించి బానిసలలో స్త్రీలలో అందమైన స్త్రీని యోసేపు దగ్గరికి పంపారట రాత్రి సమయంలో! గాని ఆమెనుండి దూరంగా పోయారట! ఇంకా మరింత అందమైన అమ్మాయిని స్త్రీలను పంపి చూశారు గాని ఏ అమ్మాయితోనూ ఏ స్త్రీతోను పాపం చెయ్యలేదు! ఇక తర్వాత అందరూ యోసేపుని ఒక పిచ్చివాడిని చూసినట్లు చూశారట! తర్వాత ఒక నపుంశకుడుని చూసినట్లు హేళన చేసేవారట! అప్పుడు ప్రార్ధిస్తూ ఉండగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది- అమ్మాయిలను అక్కా అని పిలవడం, పెద్దలను అమ్మా పిన్ని ఇలా పిలవడం మొదలెట్టారు యోసేపు గారు! ఇక శోధన ఆగిపోయి అందరూ యోసేపుని గౌరవించడం మొదలుపెట్టారు! ఇవన్నీ పరిశీలించిన మీదటనే ఆయనకు విచారణ కర్తగా చేశారట యజమాని!

 

అయితే యజమాని భార్య కోసం కూడా రబ్బానిక్ స్క్రిప్చర్ లో రాశారు! రోజు ఎవరూ లేరు! యజమాని భార్య తన గదికి వచ్చింది! యోసేపు గారు ఏదో లెక్కలు రాసుకుంటున్నారు! వచ్చి తనతో శయనించమని ఇంట్లో ఎవరూ లేరని అడిగింది! ఎప్పటిలా అమ్మా నీవు నాకు తల్లిలాంటి దానివి ఇది తప్పు నేను చెయ్యను అన్నారు! వెంటనే ఆమె తనముందు తన వస్త్రాలను తొలిగించడం మొదలుపెట్టింది అట! యోసేపులో సారికి పాపం చేసేద్దాం అని ఆలోచన వచ్చింది అట కొన్ని క్షణాలు! వెంటనే ఆయన ముందు తండ్రి యాకోబు గారు కనబడి దీనంగా చూస్తున్నారు అట! వెంటనే ఎవరో కొరడాతో చెళ్ళుమని కొట్టినట్లుగా అనిపించి- వెంటనే తన బట్టలు ఆమె చేతిలో వదిలేసి పారిపోయారు! (Sotah 36b, zeb118, gen87.3 & 87.9)

 

ఇదీ అక్కడ వ్రాయబడింది! మరి నిజంగా తన తండ్రి కనబడ్డారో లేదో మనకు తెలియదు! అయితే కధ చెప్పడానికి కారణం   యోసేపుగారు బానిసగా ఉన్నప్పుడు కూడా తన శీలాన్ని కోల్పోలేదు! ఇంటికి అధికారిగా ఉన్నప్పుడు శీలం కోల్పోలేదు! సూపరింటిండెంట్ అయ్యాక కూడా స్త్రీతోను సంబందం పెట్టుకోలేదు! చివరికి యజమాని భార్యయే కావాలని వచ్చినా తన బట్టలు వదిలేసి పారిపోయాడు! ఇది సచ్చీలత! శీలం కాపాడుకోవడం! సాక్ష్యం కాపాడుకోవడం! ఇహలోక మాలిన్యం తన ఘటముకు అంటకుండా కాపాడుకోవడం!!!

యాకోబు 1: 27

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

   మాటిమాటికి నేను గుర్తుచేస్తూ ఉంటాను ముగ్గురు పురుషులను!

 

ఒక వ్యక్తి పాపము కౌగలిస్తే పాపమును వదిలి పారిపోయాడు!

మరోవ్యక్తి పాపమును వెదికి పాపము దగ్గర ఆగిపోయాడు!

మరోవ్యక్తి పాపమును పిలిపించుకుని పాపములో పడిపోయాడు!

 

పాపమునుండి పారిపోయిన వ్యక్తి, యవ్వనస్తుడు రూపవంతుడు Mr. Perfect యోసేపు గారు! అలా పారిపోయినందుకు 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది! అయినా బాధపడలేదు! దేవునిమీద అలగలేదు! చివరికి ఐగుప్తు దేశానికే అధికారి అయ్యాడు!

 

పాపము దగ్గర ఆగిపోయిన వ్యక్తి సంసోను గారు! 40 సంవత్సరాలు భక్తిని సాక్ష్యాన్ని కాపాడుకుని చివరికి వేశ్య దగ్గరకి వెళ్లి పట్టబడి కళ్ళు పీకించుకుని బాధపడి ఘోరమైన మరణం చెందాడు! చివరకు పశ్చాత్తాపపడి నీతిమంతుల పట్టీలో పేరు సంపాదించుకున్నా గాని సాక్ష్యాన్ని శీలాన్ని పోగొట్టుకున్నారు!

 

మరో వ్యక్తి పాపములో పడిపోయిన వ్యక్తి దావీదు గారు! ప్రార్ధనా కాలంలో ప్రార్ధన చెయ్యకుండా, రాజులు యుద్ధము చేసే రోజులలో యుద్ధం చెయ్యకుండా మేడమీద షికార్లు కొడుతూ చూడరాని దృశ్యం చూసి ఆమెను రప్పించుకుని ఆమెతో పాపం చేశారు, పాపాన్ని భర్తమీద తొయ్యాలని అనుకున్నా తనకంటే ఆమె భర్త నీతిమంతుడుగా కనబడితే అతనిని చంపించారు. మరణపాత్రుడు అయిపోతే దేవుడు కరుణించి క్షమించాడు! గాని జీవితాంతం ఇంత భక్తిపరుడు గాని మచ్చ పోలేదు! దేవుడు ఎందుకు కరుణించారు అంటే  ఎంతగా పశ్చాత్తాప పడ్డారంటే ఆయన కన్నీటితో తన పడక కొట్టుకు పోయేతంటగా ఏడ్చారు, పశ్చాత్తాప పడ్డారు!

 

ప్రియ స్నేహితుడా! చదువరీ! నీవు ఎవరిని ఆదర్శం తీసుకుంటావు?

పాపమునుండి పారిపోయిన యోసేపు గారినా?!!

లేక పాపము దగ్గర ఆగిపోయి కళ్ళు పీకించుకున్న సంసోను గారినా?

లేక పాపములో పడిపోయిన దావీదు గారినా?!!!

 

ఒక్కమాట చెప్పనీయండి: దేవుడు దావీదు గారిని క్షమించడానికి మొదటగా దావీదు దేవుని ఇష్టానుసారమైన మనుష్యుడు అని దేవునితో పిలిపించుకున్నారు! బైబిల్ సర్టిఫై చేస్తుంది- దావీదు ఊరియా విషయంలో తప్ప మరే పాపము తప్పు చెయ్యలేదు అని!!  1రాజులు 15:4

  దావీదుగారు లేస్తే దేవుడా! పడుకుంటే దేవుడా! నోటినుండి స్తుతి స్తుతి స్తుతి! కష్టమొచ్చినా దేవునికి స్తుతి, బాధ కలిగినా దేవునికి స్తుతి, ఆనందం కలిగిన స్తుతి! ఎల్లప్పుడూ పాటలు, దేవునికి ప్రార్ధన! రోజుకు ఏడుసార్లు ప్రార్ధించే వ్యక్తి!

 

మరి మనమో- చూపులో పాపం! తలంపులో పాపం! చేతలలో పాపం! మాటలలో పాపం! కార్యములలో పాపం! అన్నీ పాపాలే పాపాలే! మరి అటువంటి దావీదు గారిని  దేవుడు క్షమించడంలో తప్పులేదు కదా! మరి మనమైతే పాపులం! మరి నిన్ను అలాంటి పనులు రక్షణ పొందాక చేస్తే క్షమిస్తారో లేదో తెలియదు! దేవుని ప్రణాళికలో ఉంటే ఒకవేళ కరుణించవచ్చు! అదికూడా ఒక్కసారి రెండుసార్లు! గాని ఎన్నిసార్లు గద్దించినా వినని వాడు మరి తిరుగులేకుండా హటాత్తుగా నాశనమగును అని బైబిల్ చెబుతుంది! సామెతలు 29:1

 

మరి నీవు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటావో నేడే నిర్ణయించుకో!

దైవాశీస్సులు! 

*ఫలించెడి కొమ్మ*

*9 భాగం-యోసేపు చెరసాల అనుభవం-1*

ఆదికాండం 39:1423

14. తన యింటి మనుష్యులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మనయొద్దకు తెచ్చియున్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకురాగా నేను పెద్దకేక వేసితిని.

15. నేను బిగ్గరగా కేకవేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెనని వారితో చెప్పి

16. అతని యజమానుడు ఇంటికి వచ్చువరకు అతని వస్త్రము తనదగ్గర ఉంచుకొనెను.

17. అప్పుడామె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను నీవు మనయొద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నాయొద్దకు వచ్చెను.

18. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారి పోయెననెను

19. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పినమాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి

20. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.

21. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతని యందు కనికరపడి అతనిమీద ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుచేసెను.

22. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీల నందరిని యోసేపు చేతి కప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు.

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

 

         (గతభాగం తరువాయి)

 

 ఇక 14--23 వరకు చూసుకుంటే ఎప్పుడైతే యోసేపు గారు తన వస్త్రాన్ని వదిలి యజమాని భార్య దగ్గరనుండి పారిపోయారో వెంటనే అవమానం తట్టుకోలేక తప్పును నేరాన్ని యోసేపుమీద నెట్టివేస్తుంది. అదిగో ఆహెబ్రీ దాసుడు నన్ను పాడుచెయ్యబోయాడు నేను కేకలు వేస్తే పారిపోయాడు అంటూ! భర్త దీనిని విని యోసేపుని రాజ ఖైదీలు ఉండే చెరశాలలో వేసినట్లు చూడగలం!

 

గమనించాలి: ఇలాంటి చేయని నేరానికి బైబిల్ గ్రంధంలో అనేకమంది చెరశాలలో వేయబడ్డారు! యిర్మియా గారు చేయని నేరానికి చెరశాలలో వేయబడ్డారు! యిర్మియా 37:15--16;

అలాగే దానియేలు గారిని సింహపు బోనులో వేశారు. దానియేలు 6:16.. యేసుక్రీస్తుప్రభులవారిని కూడా బంధించి మొదట అన్న తర్వాత కయప తర్వాత పిలాతునొద్దకు తీసుకుని వెళ్లి చివరికి ఆయనను సిలువ వేసి చంపారు!

స్తెఫన్ గారిని రాళ్ళతో కొట్టి చంపారు! పౌలుగారిని సీలగారిని చేయని నేరానికి చెరసాలలో వేసి గుండగా తన్నేశారు! ఇలా ఆదినుండి దేవుని భక్తులకు చేయని నేరానికి చెరసాల అనుభవించడం జరిగింది! అయితే మీద చెప్పిన భక్తుడూ కృంగిపోలేదు! దేవునిమీద నిరీక్షణ ఉంచి సాగిపోయారు! తర్వాత విడుదల పొందిన వారు ఘనమైన కార్యాలు చేశారు!

ఈరోజు నీవు చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్నావా? అది కూడా క్రీస్తు నామము కొరకు!!!

భయపడవద్దు!  ఒకరోజు దేవుడు నిన్ను వాడుకుని మహా గొప్ప కార్యాలు చేయబోవుచున్నారు! అత్యధికమైన విజయం దేవుడు నీకు ఇవ్వబోతున్నారు!

 

 ఒకసారి కీర్తనాకారుడు యోసేపు కోసం ఏమని చెప్పారో చూద్దాం!

105:1719

17. వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను.

18. వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను.

19. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను.

 

స్తెఫన్ భక్తుడు ఏమంటున్నారో చూద్దాం! అపో 7:910

9. ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి

10. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అను గ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.

 

   ఇక చెరసాలలో ఏమి జరిగిందో చూసుకుందాం! రాజ ఖైదీలు ఉండే చెరశాల అనగా- ఎవరైతే రాజద్రోహము దేశద్రోహము చేస్తారో వారిని ఉంచే చెరసాల అన్నమాట! దీనిలో అప్పుడప్పుడు ఎవరైనా గవర్నమెంట్ అధికారులు లంచగొండి తనము, అవినీతి లాంటి తప్పులు చేసినా కొన్నిరోజుల కోసం విచారణకు ముందుగా ఉంచుతూ ఉంటారు! ఇప్పుడు పోతీఫర్ గవర్నమెంట్ లో పెద్ద అధిపతి కాబట్టి నేరము గవర్నమెంట్ గృహంలో జరిగింది కాబట్టి ఇప్పుడు యోసేపు గారిని కూడా చెరశాలలో ఉంచారు!

 

  అయితే జరిగిన అధ్బుతం ఏమిటంటే యెహోవా యోసేపుకి తోడుగా ఉన్నారు కాబట్టి చెరసాల అధిపతి యోసేపుమీద కనికరపడి అతనిమీద కటాక్షము కలుగునట్లు చేశారు దేవుడు! వెంటనే చెరసాల నాయకుడు అప్పటికే యోసేపు కోసం విని యున్నాడు కాబట్టి చెరసాలలో ఉన్న ఖైదీలనందరిని చూసుకునే భాద్యత చెరసాల నాయకుడు యోసేపుకి ఇచ్చాడు!

 

ఇక్కడ గమనించవలసిన రెండు విషయాలు: మొదటిది యెహోవా అతనికి తోడుగా ఉన్నారు! దీనికోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము!

 

రెండవది: యోసేపు యొక్క నమ్మకత్వము వలన దేవుని కటాక్షం వలన అక్కడ పోతీఫర్ మొత్తం తన గృహాన్ని ఆస్తిని యోసేపు చేతిలో పెడితే- ఇక్కడ చెరసాల నాయకుడు- ఒక ఖైదీ చేతికి మిగిలిన ఖైదీలను అప్పగించేశారు! నీవే వీరిని చూసుకో అని! ఇప్పుడు చెరసాలలో శిక్షను అనుభవించేవాడు కాకుండా శిక్షను అమలుచేసేవానిగా అయిపోయాడు యోసేపు! హల్లెలూయ! మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు!

 

ఇక్కడ ఒకసారి మరలా చరిత్రకు వద్దాం! చరిత్ర ప్రకారం- పోతీఫర్- యోసేపు తప్పుచేశాడు అంటే నమ్మలేదు అని చెబుతుంది! మొదట కోపం కలిగినా తర్వాత యోసేపుని సావధానంగా అడిగాడట పోతీఫర్- నీవు నాకు ఒక కొడుకులా ఉన్నావు! ఎంతో యదార్ధంగా పనిచేశావు. అందుకే నా గృహాన్ని, నా ఆస్తి మొత్తం నీ చేతిలో పెట్టాను! మరి నాభార్యతో ఇలాంటి పాపం చెయ్యాలని ఎలా అనుకున్నావు? దానికి యోసేపు జవాబు: నేను కూడా మిమ్మును తండ్రిలా భావించాను! నేను ఇలాంటి కార్యం మీకు ఎలా చెయ్యగలను, అలా చేస్తే దేవుని దృష్టిలో దోషిని అవుతాను కదా- నిజంగా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నాకు జవాబు చెప్పండి- నేను తప్పు చేశానని ఇలాంటి కార్యం మీకు నేను ఎలా చెయ్యగలనని అనుకుంటున్నారు? నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా?

వెంటనే అన్నాడు- నేను నమ్మడం లేదు- విషయం నీవు కూడా బయటకి చెప్పకు అని చెప్పి తన స్నేహితుడైన చెరసాల నాయకునితో  మాట్లాడి చెరసాలలో ఖైదీగా కాకుండా విచారణ చేసేవానిలా పెట్టాడు పోతీఫర్ అని చరిత్రకారులు! ఇలా జరగటానికి తప్పకుండా దేవుని అనుగ్రహం కావాలి!

పోతీఫర్ ఇంటి దగ్గర దేవుడు వదలలేదు!

అలాగే చెరసాలలో కూడా దేవుడు యోసేపు చెయ్యి విడువలేదు!

 

ఇప్పుడు కూడా యోసేపు దేవునిమీద నింద మోపడం లేదు! ఇంతన్నావ్ అంతన్నావ్- నన్ను అధికారిని రాజుని చేస్తాను అని కలలు దర్శనాలు చూపించావు! నీకోసం నీతిగా భక్తిగా ఉండటం వలన నీవు నాకు ఇచ్చే బహుమానం ఇదా దేవుడా అని దేవుణ్ణి నిందించలేదు! మౌనంగా భరిస్తూ నన్ను పరీక్షిస్తున్నావా నాయనా అని దేవునికి విధేయత చూపించారు! నేడు మనకు కూడా ఇలా శోధనలలో నిరీక్షణ ఉంచే మనస్సు ఓర్పు కావాలి!

అందుకే పేతురు భక్తుడు అంటున్నారు తగినకాలమందు ఆయన మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన కాడిక్రింద దీన మనష్కులై ఉండుది!..1పేతురు 5: 6

దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.

 

యోసేపు గారు అలా దీన మనష్కులై ఉన్నారు! ఒకరోజు దేశానికే ప్రధాన మంత్రి కాగలిగారు! మరి నీకు అలాంటి దీన మనస్సు ఓర్పు సహనం ఉందా!

దైవాశీస్సులు!

*ఫలించెడి కొమ్మ*

*10వ భాగం-యోసేపు చెరసాల అనుభవం-2*

ఆదికాండం 40:15

1. అటుపిమ్మట ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పుచేసిరి

2. గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థుల మీద కోపపడి

3. వారిని చెరసాలలో నుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము.

4. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్నిదినములు కావలిలో నుండిన తరువాత

5. వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను.

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

 

         (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా ఇక 40 అధ్యాయం చూసుకుంటే దేవుడు యోసేపుని ఎలా వాడుకున్నారో చూడవచ్చు! ఇలా చెరసాలలో కొన్ని రోజులు గడిచాయి! చరిత్ర ప్రకారం యోసేపు గారు చెరసాలలో 4 సంవత్సరాలు ఉన్నారు. రెండు సంవత్సరాలు గడిచాక పానదాయకుల అధిపతి భక్షకారుల అధిపతి చెరసాలలో వేయబడ్డారు. వారు వెళ్ళిపోయాక మరో రెండు సంవత్సరాలు యోసేపుగారు చెరసాలలో ఉన్నారు!

 

పానదాయకుడు అనగా రాజు త్రాగే ద్రాక్షారసం లాంటివి తయారుచేసిన తర్వాత టేస్ట్ చూసి అది మంచిగా ఉందో లేదో , అది ప్రమాదకరమైనది లేనిది నిర్ధారించి రాజుకి పంపించే అధికారి అన్నమాట! ఇంకా రాజుకి ఎటువంటి పానీయం సమయంలో ఇవ్వాలి అనేది నిర్దారించి తానే స్వయముగా ఇచ్చేవాడు! భక్షకారుడు అనగా రాజు తినే ఆహారాల మీద అధిపతి, ఎటువంటి ఆహరం తయారుచెయ్యాలి, అది మంచిదా చెడ్డదా పరీక్షించి రాజుకి పెట్టేవాడు!

 

 సరే, యోసేపు గారు చెరసాలలో ఉన్న రెండు సంవత్సరాలకు రాజుగారిని అనుమానం వచ్చి రాజద్రోహం క్రింద ఇద్దరు అధిపతులను చెరసాలలో వేయించాడు. అది యోసేపుని ఉంచిన చెరసాల అన్నమాట! ఇప్పుడు ఇద్దరికీ ఉపచారం చెయ్యవలసిన భాధ్యత యోసేపుది! చూడండి- మన దేశంలో నాయకులను గాని గొప్ప ధనవంతులను గాని ఏదైనా నేరం క్రింద అరెస్ట్ చేస్తే వారిని మామాలు చెరసాలలో వేసినా గాని వారికి ప్రత్యేకమైన గది, ప్రత్యేకమైన ఏర్పాట్లు కొన్నిసార్లు ACలు అన్నిరకాల మంచి ఏర్పాట్లు చేస్తారు! అంతేకాకుండా ఘరానా నాయకుల కుటుంబస్తులు చెరసాల వారితో మాట్లాడి మంచి మంచి బోజనవసతులు వీరికి సమకూరుస్తూ ఉంటారు! అలాంటి చెరసాల అన్నమాట ఇది! ఇప్పుడు ఈఘరానా మోసగాళ్ళకు ఉపచారం చేసే భాద్యత యోసేపు గారిమీద పడింది!

మరి  తానూ కూడా ఖైదీయే కదా, వీరికి ఉపచారం చేస్తున్నారు యోసేపుగారు!

ఒక్కసారి ఆగి జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇలా ఇద్దరినీ ఇదే చెరసాలలో ఉంచడంలో తప్పకుండా దేవుని హస్తము ఉంది! ఇది తప్పకుండా యోసేపుని జైలునుండి విడుదల చేయడానికి రాజు దగ్గరకి చేరడానికి దేవుడు ముందుగానే మార్గదర్శం చేశారు అని అర్ధమవుతుంది! తర్వాత పానదాయకుల అధిపతి దీనిని ఒప్పుకుంటాడు 41:9--14 లో!

 

సరే,  5--7 వచనాలలో వీరిద్దరికీ ఒకే రకమైన కలలు వచ్చి వీరి ముఖాలు మాడిపోయాయి! కలల యొక్క భావము ఏమిటో తెలియడం లేదు! గమనించాలి- ఆదికాండం ప్రకారం- నిర్గమకాండము ప్రకారం  ఐగుప్తు దేశంలో ఇలాంటి కలలు, ఎదుర్లు, జాతకాలు, శకునాలు చెడుపులు చిల్లంగులు రోజులలో విస్తారంగా ఉపయోగించేవారు నమ్మేవారు! అందుకే వీరిద్దరూ ఎంతో కంగారుపడుతున్నారు! యోసేపు గారు చూసి అడిగారు ఏమయ్యా ఏమయ్యింది? ఎందుకు మీ ముఖాలు వాడిపోయి ఉన్నాయి అంటే- మా ఇద్దరికీ కలలు వచ్చాయి అన్నారు! ఇప్పుడు వాటి భావం చెప్పేవారు ఎవరూ మాకు లేరు! మేము అడిగినా చెప్పరు ఎందుకంటే ఇప్పుడు మేము నేరస్తులము మరియు ఖైదీలము కదా అన్నారు!

 

ఇక్కడ మరో విషయం గమనించాలి- వీరిద్దరికీ ఇలా కలలు చూపించినది దేవుడే అని గ్రహించాలి! అంతేకాకుండా యోసేపుకి కలలు చూపించిన దేవుడే ఇప్పుడు ఇద్దరి అధికారులకు కూడా చూపించారు అన్నమాట! ఇది దేవుని ప్రణాళిక!!

 

ఇప్పుడు  యోసేపు గారి సమాధానం చూద్దాం! 8 వచనం...

భావములు చెప్పుట దేవుని ఆదీనమే కదా మీరు దయచేసి వాటిని నాతో చెప్పండి అంటున్నారు!

 

ఓస్ కలలా! అదెంత! నేను ఇట్టే చెప్పేస్తాను అనడం లేదు! నిజానికి దేవుడు అప్పటికే ఇలాంటి కలలకు దర్శనాలకు భావం చెప్పే వరము, వివేచన దేవుడు యోసేపు గారికి ఇచ్చారు! అయినా విర్రవీగకుండా భావములు చెప్పుట దేవుని వశము అని దేవుణ్ణి ముందు పెడుతున్నారు! తననుతాను తగ్గించుకుంటున్నారు! ఇదీ వరములు ఫలములు పొందుకున్న భక్తుడు విశ్వాసి దైవసేవకుడు తగ్గించుకొనే విధానం! రెండు ప్రసంగాలు మూడు అద్భుతాలు చేసి విర్రవీగకూడదు!

 

ఇప్పుడు పానదాయకుల అధిపతి కలను చూద్దాం!

911

9. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను;

10. ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను; దాని పువ్వులు వికసించెను; దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను.

11. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను.

 

దానికి భావము యోసేపు ఎలా చెబుతున్నారో చూద్దాం

1213

12. అప్పుడు యోసేపు: దాని భావమిదే; ఆ మూడు తీగెలు మూడు దినములు;

13. ఇంక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పాన దాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికప్పగించెదవు

 

చూశారా భావము ఎలా సరిపోయేలా చెబుతున్నారో! గమనించాలి- యోసేపు గారు అనేక విషయాలలో దానియేలు గారికి పోలికలు ఉన్నాయి! దీనికోసం ప్రభువు చిత్తమైతే చివర్లో పోలికలు మొత్తం చూసుకుందాం! యోసేపు గారు కలలకు అర్ధాలు చెప్పారు! అలాగే దానియేలు గారు కూడా క్లిష్టమైన కలలకు అర్ధాలు భావాలు చెప్పారు!

దానియేలు 2:36, 4:18--19

 

ఇక భక్షకారుల అధిపతికి వచ్చిన కలను చూద్దాం!

16--17

16. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలు గల మూడు గంపలు నా తలమీద ఉండెను.

17. మీదిగంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలోనుండి వాటిని తీసికొని తినుచుండెను.

 

యోసేపు చెప్పిన భావము: 18--19

18. అందుకు యోసేపుదాని భావమిదే; ఆ మూడు గంపలు మూడు దినములు

19. ఇంక మూడు దినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను.

 

చూశారా దేవుడిచ్చిన వరాలతో వివేచనతో రెండు కలలకు సరియైన భావము చెప్పారు యోసేపు గారు!

 

20-22 లో చూసుకుంటే యోసేపు చెప్పిన భావము ప్రకారం పానదాయకుని పోస్ట్ మరలా ఇవ్వడం జరిగింది, భక్షకారుని ఉరితీయడం జరిగింది!

 

అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే: యోసేపు గారు భక్షకారుల అధిపతితో ఏమీ చెప్పలేదు కారణం యితడు ఎలాను చంపబడబోయేవాడు అని తెలిసిపోయింది కాబట్టి! అయితే పానదాయకుల అధిపతితో యోసేపు మనవి చేస్తున్నాడు- చూద్దాం 14--15 వచనాలు!

14. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.

15. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.

 

చూడండి యోసేపు గారు ఏమంటున్నారో- ఏమండి నేను ఇక్కడ నేరము చేయకుండా చెరసాలలో వేయబడటం జరిగింది. ఐగుప్తు దేశము కూడా నేను దొంగిలించబడి అమ్మబడ్డాను! దయచేసి మీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మనవిచేస్తే చివరి వచనం చూద్దాం- అయితే పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసికొనక అతని మర్చిపోయెను!

 

ఈరోజు మనం కూడా మనకు క్షేమము కలిగాక, క్షేమమును నెమ్మదిని స్వస్తతను ఆరోగ్యాన్ని ఐశ్వర్యమును ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకోకుండా, మన దేవుణ్ణి నీకోసం నాకోసం ప్రాణం పెట్టిన మన రక్షకుని మర్చిపోతున్నాము! అవునా!!!

ప్రజలందరూ మనలని వదిలివేసినప్పుడు, వీడి దగ్గర ధనము లేదని నీవు అనేవాడవు ఒకడివి ఉన్నావని వదిలేసి, ఇంట్లో కధ కార్యం జరిగినా పిలవడం మానేసిన వారు, రోజు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, పిల్లలను ఆస్తిని ఇచ్చి సమాజంలో గౌరవం ఇచ్చాక నేడు నీవు దేవుణ్ణి వదిలేస్తున్నావు కదా! ఎవరైతే నిన్ను ఆరోజు వదిలేశారో, నీవు పనికిమాలిన వాడవు అని నిన్ను చీదరించుకున్నారో, నీవు రోగిస్టివి అని నిన్ను వదిలేశారో ఇప్పుడు వారివెంట తిరుగుతున్నావు కదా! ఆదివారం నాడే ఫంక్షన్ లు ఆదివారం నాడే పెళ్లుల్లు పేరంటాలు, ఏమంటే ఆదివారం నాడు అందరికీ సెలవు కదా, అందుకే పెట్టుకొంటున్నాము అందుకే వెళ్తున్నాము! మరి రోజులలో నీవు బాగోలేనప్పుడు ఎందుకు వెళ్ళలేదు??? జాగ్రత్త! దేవుడు చూస్తున్నాడు అని మర్చిపోకు! నీకు క్షేమము కలిగాక నీకు క్షేమమును ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే వదిలివేస్తే నీవు దేవుని దృష్టికి నేరస్తుడవు! అప్పుడు నిన్ను తప్పకుండా ఒకరోజు తీర్పులో నిలదీస్తారు అని మర్చిపోకు!

దైవాశీస్సులు!

*ఫలించెడి కొమ్మ*

*11 భాగం-యోసేపు చెరనుండి విడుదల*

ఆదికాండం 41:17

1. రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా

2. చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను.

3. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కి పోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవులదగ్గర నిలుచుండెను.

4. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను.

5. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను.

6. మరియు తూర్పు గాలిచేత చెడి పోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను.

7. అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను.

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

 

         (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా అధ్యాయంలో దేవుడు చేసిన అత్యధ్బుతమైన కార్యం మనకు కనిపిస్తుంది!

1--7 వచనాలు చూసుకుంటే ఫరో రాజుకి ఒక కల వచ్చింది!

గమనించాలి- ఫరో అనేది రాజు పేరు కాదు! బిరుదు! రాజుని ఐగుప్తు దేశంలో ఫరో అనేవారు! ఇశ్రాయేలు మరియు రోమా సామ్రాజ్యంలో చతుర్దాధిపతులను హేరోదు అనేవారు! ఇవి వారి బిరుదులూ- పేర్లు కావు!

 

సరే, ఇక్కడ ఐగుప్తు రాజుకి కల వచ్చింది! ఎప్పుడు వచ్చింది? పానదాయకుల అధిపతికి తిరిగి ఉద్యోగం వచ్చిన రెండు సంవత్సరాలకు!అనగా యోసేపు చెరసాలలో ఉన్న నాలుగు సంవత్సరాలకు!! అనగా యోసేపు బానిసగా అమ్మబడి ఐగుప్తు దేశం వచ్చిన 13 సంవత్సరాలకు!!!

 

గమనించాలి- యోసేపుకి కలను చూపించిన దేవుడే- పానదాయకుల అధిపతికి భక్షకారుల అధిపతికి కలను చూపించారు! అదే దేవుడు మరలా ఐగుప్తు రాజైన ఫరోకు కలలను చూపిస్తున్నారు! రెండు కలలురెండింటి అర్ధము ఒకటే!!!

 

ఒకసారి కలను చూద్దాం! 1--7 వచనాలు. మొదటి కలలో రాజు నైలునది ఒడ్డున నిల్చుని ఉన్నాడు, అప్పుడు చూపునకు అందమైన బలిసిన ఏడు ఆవులు జమ్ములో మేత మేస్తుంటే చూపునకు వికారంగా బక్కచిక్కిపోయిన ఏడు ఆవులు వచ్చి బలిసిన ఆవులను అమాంతంగా మింగేశాయి! మొదటి కల!

 

రెండవ కల- మంచి పుష్టుకలిగిన ఏడు వెన్నులు ఒక మొక్కలో మొలిచి ఫలిస్తున్నాయి, అప్పుడు తూర్పుగాలిచేత చెడిపోయిన ఏడు వెన్నులు మరో మొక్కలో ఉన్నాయి. చెడిపోయిన వెన్నులు పుష్టుగలిగిన వెన్నులను మ్రింగేశాయిఇవీ కలలు! రెండు కలలు!

 

ఇప్పుడు ఎనిమిదో వచనంలో కలవరపడిన రాజు ఐగుప్తులో దేశంలో ఉన్న శకునాలు చెప్పేవారిని విద్వాంసులను పిలిపించి కల చెప్పాడు, గాని ఎవరూ దాని భావం చెప్పలేక పోయారు!

 

మనకి ఒక విషయం జాగ్రత్తగా పరిశీలిస్తే కనిపిస్తుంది! దానియేలు గ్రంధంలో కూడా నెబుకద్నెజర్ రాజు ఇలాంటి వాటిని అలవాటు చేయించడం వాటిని నమ్మడం వాడుకలో ఉన్నట్లు కనిపిస్తుంది,. అనగా ఏమని అర్ధమవుతుంది అంటే ఐగుప్తు దేశంలో వాడుతున్న మంత్రవిద్యలు తార్కిక విద్యలు 400 తర్వాత కూడా అన్ని దేశాలలో వాడుతున్నారు, వాటిని ఇంకా విస్తారంగా వాడుతున్నారు అని అర్ధమవుతుంది! అయితే మంత్రగాళ్ళు శకునగాల్లు జ్యోతిష్యులు తాము ఏదేదో చేసేయ్యగలమని అనుకుంటూ ఉంటారు గాని వారు చేయగలిగేది కొంచెమే! కొంతమంది వీరిమంత్రశక్తులే దైవశక్తి అని బ్రమిస్తారు. అయితే ఇలాంటి మంత్ర విద్యలు ద్వితీ 18:10--13 ప్రకారం నిషేధం దేవుని ప్రజలకు!!

 

సరే, ఇప్పుడు పానదాయకుల అధిపతి రాజు సన్నిధిలో తన తప్పు ఒప్పుకుంటున్నాడు! యోసేపు గారిని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు! అనగా నిజం చెప్పాలంటే 40 అధ్యాయం చివర్లో చూసుకున్నాము- అయితే పానదాయకుల అధిపతి యోసేపుని మర్చిపోయెను అని, నిజానికి అతను మర్చిపోవడం అనుమతించిన వాడు దేవుడే! ఒకవేళ అప్పుడు పానదాయకుల అధిపతి రాజుతో యోసేపుతో విషయం చెప్పి ఉంటే మహా అయితే చెరసాల నుండి విడుదల పొంది ఉండేవాడు! గాని అప్పుడు మర్చిపోవడానికి అనుమతించిన దేవుడే ఇప్పుడు మరలా అతను జ్ఞాపకం చేసుకొనేలాగా చేస్తున్నారు! యోసేపు ఎలాగైనా రాజప్రసాదంలోనికి రావాలి, అధిపతి కావాలి, ఇదీ దేవుని ప్రణాళిక! దేవుని ప్రణాళిక ప్రకారమే పానదాయకుల అధిపతికి కల వచ్చింది! అలాగే అదే దేవుని ప్రణాళిక ప్రకారమే ఇప్పుడు ఫరోకి కలలు వచ్చాయి, ఇప్పుడు దేవుని ప్రణాళిక ప్రకారమే పానదాయకుల అధిపతి సరియైన సమయంలో తన తప్పును జ్ఞాపకం చేసుకుని రాజుతో మనవిచేస్తున్నాడు!

 

నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను: దేవుని పని దేవుని విధానంలో  దేవుని సమయంలో జరుగుతుంది! మనము ఎంత ప్రయత్నించినా అవి జరుగవు! ఇప్పుడు సరియైన సమయం ఆసన్నమైంది! చూడండి పానదాయకుల అధిపతి రాజులో ఏమని చెబుతున్నాడో..

9--13

9. అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను.

10. ఫరో తన దాసులమీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి యింట కావలిలో ఉంచెను.

11. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములు గల కలలు చెరి యొకటి కంటిమి.

12. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతో కూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెపెను. ఒక్కొకని కల చొప్పున దాని దాని భావమును తెలిపెను.

13. అతడు మాకు ఏ యే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా ...

 

వెంటనే రాజు యోసేపు గారిని పిలిపించాడు! ఎక్కడనుండిచెరసాల నుండి!!!

ఇప్పుడు దేవుని సమయము వచ్చింది. ఒకసారి ప్రకటన 2:10 చూసుకుందాం..

ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది (అనగా-సాతాను) మీలో కొందరిని చెరలో వేయింప బోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు (లేక- ప్రాణాపాయము వచ్చినను) నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.

 

ప్రసంగీ చెప్పేది వినండి

ప్రసంగి 4: 14

అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలోనుండి బయలువెళ్లును.

 

సరే, ఇప్పుడు యోసేపు గారు ఫరోదగ్గరకు వచ్చారు- ఫరో అంటున్నాడు- నేను కల కన్నాను, దాని భావం చెప్పగలిగేవారు ఎవరూ మా దేశంలో లేరు, నీవు చెప్పగలవా భావము అని! వెంటనే యోసేపు గారి జవాబు చూడండి- 16 వచనం: అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చును!!!

 

గమనించాలి : తగ్గించుకున్న నిజమైన దైవభక్తుల యొక్క సమాధానాలు ఇలాగే ఉంటాయి! ఈరోజు రెండు మూడు ప్రత్యక్షతలను అర్ధం చేసుకోగలిగితే రెండు ప్రవచనాలు మూడు అద్భుతాలు చేసి మేము ఎంతో గొప్ప అని మురిసిపోతూ గర్వపడుతున్నారు కొందరు దేవుని భక్తులు నేటిదినాలలో! అయితే ఒకసారి యోసేపు గారి జవాబు చూడండి, నేనెవడిని? దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం చెబుతారు! దానియేలు గారి జవాబు చూడండి

Daniel(దానియేలు) 2:27,28,29,30

 

27. దానియేలు రాజుసముఖములో ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను రాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకున గాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు.

28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా

29. రాజా, ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనో చింతగలవారై యుండగా మర్మములను బయలు పరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను.

30. ఇతర మనుష్యులకందరికంటె నాకు విశేష జ్ఞానముండుటవలన మర్మము నాకు బయలుపరచ బడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును, తమరి మనస్సుయొక్క ఆలోచనలు తాము తెలిసికొను నిమిత్తమును అది బయలుపరచబడెను.

 

పేతురు గారి సమాధానం చూడండి: కొన్ని వేలమందిలో గొప్ప అధ్బుతకార్యం చేశారు పేతురు గారు యోహాను గారు- వెంటనే ప్రజలు ఆశ్చర్యపడుతుంటే పేతురు గారి సమాధానం .....

అపో.కార్యములు 3: 12

పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మాసొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?

 

ఇలాంటి తగ్గించుకొనే హృదయాలనే దేవుడు కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభులవారే స్వయంగా అంటున్నారు- మీరు మీపని చేసిన తర్వాత మేము చేయగలిగినదే మేము చేశాము అల్పులమైన దాసులను అని చెప్పమన్నారు...

లూకా 17: 10

అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.

 

మరి నీవు తగ్గించుకుంటావా!!!!

(ఇంకాఉంది)

*ఫలించెడి కొమ్మ*

*12వ భాగం-యోసేపు చెరనుండి విడుదల-2*

ఆదికాండము 41:17--24

17. అందుకు ఫరో నా కలలో నేను ఏటియొడ్డున నిలుచుంటిని.

18. బలిసినవియు, చూపున కందమైనవియు నైన, యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను.

19. మరియు నీరసమై బహు వికారరూపము కలిగి చిక్కి పోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు.

20. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను.

21. అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపు నకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని.

22. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను.

23. మరియు తూర్పు గాలిచేత చెడి పోయి యెండిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను.

24. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పితిని గాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పెను.

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

       

 (గతభాగం తరువాయి)

ఇక పైవచనాలలో ఫరో యోసేపుకి తన కలలను వివరించి చెప్పాడు!

వెంటనే యోసేపుగారు ఆ కలలకు భావం చెబుతున్నారు- భావము చెప్పేముందు చూడండి ఏమంటున్నారో దేవుడే తాను జరిగించబోయేది ఫరోకు చూపించారు. మరల చెబుతున్నాను అనేక విషయాలలో యోసేపుగారికి- దానియేలు గారికి ఎన్నో పోలికలున్నాయి! అక్కడ దానియేలు గారు చక్రవర్తితో తన కల కోసం ఏమని చెబుతున్నారో చూద్దాం..

దానియేలు 2:2829,45

28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా

29. రాజా, ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనో చింతగలవారై యుండగా మర్మములను బయలు పరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను.

45. చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహాదేవుడు ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.

సరే, ఇప్పుడు భావము చూద్దాం 2532

చూడండి

Genesis(ఆదికాండము) 41:25,26,27,28,29,30,31,32

25. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ యేడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు

26. ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు.

27. కల ఒక్కటే. వాటి తరువాత, చిక్కిపోయి వికారమై పైకివచ్చిన యేడు ఆవులును ఏడు సంవత్సరములు; తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కరవుగల యేడు సంవత్సరములు.

28. నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను.

29. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.

30. మరియు కరవు గల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశమును పాడుచేయును.

31. దాని తరువాత కలుగు కరవుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును; ఆ కరవు మిక్కిలి భారముగా నుండును.

32. ఈ కార్యము దేవునివలన నిర్ణయింపబడి యున్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింప బడెను.

 

ఇక్కడ యోసేపుగారు కలల యొక్క భావాన్ని అర్ధమయ్యేలా వివరంగా చెప్పారు! అంతేకాదు ఇది తప్పకుండా జరుగుతుంది అందుకే ఇది రెండుసార్లు వచ్చింది అని నొక్కివక్కానించి చెబుతున్నారు!

 

తర్వాత భాగంలోకి వెళ్లేముందు ఒకసారి కరువుకోసం చూసుకుందాం! కరువు అనేది దేవుడు మనుష్యులు చేసిన పాపాలకు వారిని శిక్షించి మరలా తన దారిలోనికి రప్పించుకోవడానికి ఒక సాధనం! దీనిని లేవీ 26:1820 దృవీకరిస్తుంది...

18. ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.

19. మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.

20. మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫలమియ్యకుండును.

 

2సమూయేలు 21: 1

దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువ కుండ కరవుకలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను- సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనిని బట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.

 

సోలోమోను చేస్తున్న ప్రార్ధన చూద్దాం.

1 Kings(మొదటి రాజులు) 8:35,36,37,38

 

35. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేక పోగా, నీవు వారిని ఈలాగున శ్రమపెట్టుటవలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి యీ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసిన యెడల

36. నీవు ఆకాశమందు విని, నీ దాసులైన ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన సన్మార్గమును వారికి చూపించి, నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము.

37. దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చీడపురుగు గాని కలిగినను, వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను,

38. ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా; ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల....

 

సరే, ఇక్కడ యోసేపు గారు కలల యొక్క భావము మాత్రము చెప్పి వదిలెయ్యడం లేదు! ఆ కరువునుండి ఎలా విడుదల పొందాలో సలహా కూడా ఇస్తున్నారు. ఈ వివేచనా సలహా కేవలం దేవుడిచ్చిన జ్ఞానం మేరకే, దేవుని ప్రణాళిక మేరకే దీనిని చెబుతున్నారు. నిజానికి రాజు సలహా అడగలేదు, గాని యోసేపు గారు దేవుడిచ్చిన జ్ఞానముతో సలహా చెబుతున్నారు.

 

 చూద్దాం

Genesis(ఆదికాండము) 41:33,34,35,36

33.  కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను.

34. ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను అయిదవ భాగము తీసికొనవలెను.

35. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహార మంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను.

36. కరవుచేత ఈ దేశము నశించి పోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను.

 

చూశారా ఎంతటి చక్కటి ఆలోచన!!!  చూడండి ఈ జ్ఞానము ఆలోచన ఇచ్చింది దేవుడే! అయితే మరో విషయం గమనించాలి- ఆ కాలంలో ఫరో దేవునితో సమానుడు, రాజుకి సలహా ఇవ్వకూడదు అడిగితేనే తప్ప! అలాంటిది రాజుకే నీవు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెబితే రాజు చెప్పొచ్చు- ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు, నీవు అర్ధం చెప్పినందుకు ధన్యవాదాలు, ఈ కానుక తీసుకుని వెళ్ళిపో, ధర్మ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అనవచ్చు! అలాకాకుండా ఆ సలహాను రాజు పాటించేలా చేసింది కేవలం దేవుడే! దేవుని ప్రణాళికే!

 

ఇప్పుడు రాజు ఏమంటున్నాడో చూద్దాం:

 3741

37. ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక

38. అతడు తన సేవకులను చూచి: ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను.

39. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు.

40. నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.

41. మరియు ఫరో  చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను.

 

హల్లెలూయఇప్పుడు యోసేపు బానిస కాదు, ఖైదీ కాదు, రాజుకి ముఖ్య సలహాదారుడు , ఒకరకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి హోదా అన్నమాట!!

 

ఇంకా చూడండి 4244..

Genesis(ఆదికాండము) 41:42,43,44

42. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి

43. తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.

44. మరియు ఫరో యోసేపుతో  ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.

 

అంతేకాదు యోసేపుకి ఒక క్రొత్త పేరుపెట్టాడు రాజు, జఫ్నత్ పన్నెహ్ అనగా రహస్యాలు వెల్లడించేవాడు!! ఇంకా ఓను అనే పట్టణంలో  హేలియోఫెలిస్ అనే దేవత యొక్క యాజకుడు పోతీఫర్ యొక్క కుమార్తె ఆసెనతును రాజు చూసి యోసేపు గారికి దగ్గరుండి వివాహం చేశాడు!

 

అయితే ఈ విషయంలో రబ్బానిక్ స్క్రిప్చర్ లో కూడా ఒక కధ వ్రాయబడి ఉంది- యోసేపు కలలకు భావం చెప్పిన వెంటనే రాజు అడిగాడట, నీవు చెప్పింది తప్పకుండా జరుగుతుంది అని ఎలా నమ్మవచ్చు! వెంటనే యోసేపు చెప్పాడు- నీ భార్య ఇప్పుడు గర్భవతి కదా, చూడు ఆమెకు ఇప్పుడు కొడుకు పుడతాడు అనిఅంతేకాదు నీ మరో భార్యకు రెండేళ్ళ కొడుకు జ్వరంతో ఉన్నాడు కదా, ఇప్పుడు చనిపోతున్నాడు చూడుఫరో ఇద్దరి దగ్గరకు ఇద్దరు దూతలను పంపించాడు. యోసేపు చెప్పినట్లే జరిగింది అట! అప్పుడు నమ్మి ఈ ప్రధానమంత్రి పదవి ఇచ్చి జీవితాంతం గౌరవించాడు అంటారు రబ్బానిక్ స్క్రిప్చర్ రాసిన పండితులు!!  ఏమో మనకు తెలియదు!

 

అయితే ఈ రకంగా దేవుడు యోసేపు యొక్క 17 సంవత్సరాల వయస్సులో చూపించిన కలలు తనకు ౩౦ సంవత్సరాలు వచ్చాక  నెరవేరాయి! దేవుడు యోసేపుగారిని అధిపతిగా దేశానికే అధికారిగా నియమించారు! దీనిని పొందుకోవడానికి యోసేపుకి 13 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది! కొట్టబడ వలసి వచ్చింది. అమ్మబడ వలసి వచ్చింది. బానిసగా బ్రకతవలసి వచ్చింది. చెరసాలలో ఖైదీగా భాదలను అనుభవించవలసి వచ్చింది ఇవన్నీ జరిగాకనే ఐగుప్తు దేశానికి అధికారి అయ్యాడు యోసేపు!

అలాగే మోషేగారు నాయకుడు కావడానికి 40 సంవత్సరాలు ఒకలాంటి ట్రైనింగ్, మరో 40 సంవత్సరాలు పశువుల మధ్య ట్రైనింగ్ జరిగాక 40 లక్షలమందికి నాయకుడు అయ్యారు! దేవుని ప్రణాళిక ఎంతో గూఢమైనది, అర్ధం చేసుకోవడం కష్టం! దానిని పొందుకోవడానికి సమయం పడుతుంది. అంతవరకూ ఓపికతో నిరీక్షణతో దేవునిమీద విశ్వాసంతో బ్రతకాలి! పరీక్షలు ఎదుర్కోవాలి! శ్రమలు శోధనలు భాధలు నిందలు హింసలు భరించాలి! అప్పుడే నీకు కిరీటం! ప్రసంగీలో చెప్పినట్లు నీవు కిరీటం పొందుకోవడానికి చెరసాల నుండి బయలుదేరుతావు! మరి నీకు అటువంటి ఓర్పు సహనం నిరీక్షణ తగ్గింపు ఉన్నదా?!!!

దైవాశీస్సులు!

*ఫలించెడి కొమ్మ*

*13వ భాగం*

ఆదికాండం 41:4652

46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను.

47. సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను.

48. ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆయా పట్టణములలో దాని నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను.

49. యోసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్యమాయెను గనుక కొలుచుట మానివేసెను.

50. కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను.

51. అప్పుడు యోసేపు  దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.

52. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

ఇక 46వ వచనం నుండి చూసుకుంటే యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రి కాబోయేసరికి ౩౦ సంవత్సరాలు. అనగా 17వ ఏట కలలు వచ్చాయి, ఆ సంవత్సరంలోనే కొట్టబడి బానిసగా అమ్మబడ్డాడు. పోతీఫర్ ఇంట్లో 9 సంవత్సరాలు, జైలులో నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు ౩౦ సంవత్సరాలు. వెంటనే ఐగుప్తు దేశం మొత్తం అధికారిగా సంచరించి గిడ్డంకులు కట్టించాడు!

 

47 వ వచనం ప్రకారం ఫరో కల- యోసేపు భావం ప్రకారం సమృద్ధిగా ఏడు సంవత్సరాలు పంటలు పండాయి.

 4849 ప్రకారం పంట మొత్తం సమకూర్చి ఏ ప్రాంతంలో పంట ఆ ప్రాంతంలో నిలువచేశారు! సముద్రపు ఇసుకవలె అతి విస్తారంగా ధాన్యం పోగుచేశారు.

 

ఇక 5052 వచనాలు చూసుకుంటే కరువు రాకముందు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టారు! ఓను అనే పట్టణంలో హెలియోఫిలాస్ అనే దేవతకు యాజకుడైన పోతీఫర్ యొక్క కుమార్తె అయిన ఆసెనతు యోసేపుకి ఇద్దరు కుమారులను కన్నది.  .....

Genesis(ఆదికాండము) 41:50,51,52

50. కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను.

51. అప్పుడు యోసేపు  దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.

52. తరువాత అతడు  నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.

 

చూడండి మొదట దేవుడు అంటున్నారు: దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటివారిని మర్చిపోవునట్లు చేశారు అని మనస్శే అని పేరు పెట్టారు.

అవును బాధలను మర్చిపోవడం అనేది నిజమైన రిలీఫ్ మనుష్యులకు! దేవుడు ఇప్పుడు తన భాధలను మర్చిపోయేలా చేశారు అంటూ పెద్ద కుమారునికి మనస్శే అని పేరు పెట్టారు.

నేను ఏ దేశంలో బాధ పడ్డానో అక్కడే దేవుడు  నన్ను అభివృద్ధి చెందేలా చేశారు అంటూ ఎఫ్రాయిము అనే పేరు చిన్నవానికి పెట్టారు! అవును దేవుడుమనలను ఎక్కడైతే అవమాన పరచబడతామో ఎక్కడైతే బాధలు కష్టాలు పడతామో అక్కడే దేవుడు మనలను చిగురింప జేసి మనలను అభివృద్ధి చెందేలా చేస్తారు. ఎంతగాచేస్తారు అంటే ఇతరులు కుళ్లుపోయేటంతగా దేవుడు మనలను ఆశీర్వదిస్తారు! కష్టాలపడే ప్రాంతం నుండి దేవుడు మనలను దూరంగా తీసుకుని పోరు!అక్కడే శోధనలను జయించే శక్తి ఇచ్చి- జయమునిచ్చి అప్పుడు అక్కడే ఆశీర్వదించబడేలా చేస్తారు!

 

మా తండ్రి గారి విషయంలో కూడా దేవుడు అదే చేశారు! మా యస్.రాయవరం గ్రామమే కాకుండా చుట్టుప్రక్కల 13 గ్రామాల వారు నాన్నగారు అక్కడ సేవ చెయ్యకుండా చెయ్యాలని క్రైస్తవ్యం అక్కడ ఉండకుండా చెయ్యాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఎన్నో హింసలు పెట్టారు, 13 సంవత్సరాలు మందురాసి మతంలో కలిపేస్తున్నాడు అని కేసుపెట్టి కోర్టుల చుట్టూ త్రిప్పారు. గాని ఎవరూ ఏమీ చెయ్యలేక పోయారు ఎందుకంటే దేవుడు నాన్నగారితో ఉన్నారు! కొన్నిరోజులు గడిచేసరికి దేవుడు మమ్మల్ని ఆశ్చర్యంగా ఆశీర్వదించడం మొదలుపెట్టారు! మా ఏరియాలో ఎక్కువగా చదువుకున్న ఫేమిలీ మాదే! మా అందరికి మంచి చదువులు ఉద్యోగాలు ఇచ్చి ఒక హోదాలు ఇచ్చారు! ముఖ్యంగా అందరికీ మాదిరికరంగా మమ్మల్ని చేశారు! తల్లిదండ్రులను బాగా చూడటం అనేది ఆ ఫేమిలీని చూసి నేర్చుకోవాలి, పిల్లల్ని పెంచడం, తల్లిదండ్రులకు విధేయత భక్తి, క్రమము, పద్దతి  అనేది ఆ ఫేమిలీని చూసి నేర్చుకోవాలి అనేటంతగా దేవుడు మా కుటుంబాలను చేశారు! ఎక్కడైతే మేము హింస పడ్డామో అక్కడే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు! అదీ దేవుని పద్దతి! అదే యోసేపు గారు పేరు పెట్టారు ఎఫ్రాయిము అని!!

 

ఇక 54 నుండి చివరి వచనాల వరకు చూసుకుంటే సమృద్ధి గల ఏడు సంవత్సరాలు తర్వాత కరువు గల ఏడు సంవత్సరాలు ప్రారంభమయ్యాయి ఫరో కల- యోసేపు భావముల ప్రకారం!

మొదటి సంవత్సరం ఫరోతో అన్నారు ఐగుప్తు ప్రజలు- పంటలు పండలేదు ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి అంటే యోసేపుని అడగండి అన్నాడు రాజు! ఆ సంవత్సరం డబ్బులిచ్చి ధాన్యం కొనుక్కున్నారు ఐగుప్తు ప్రజలు!

 

ఇక చివరి వచనం ప్రకారం ఐగుప్తు దేశస్తులే కాకుండా సమస్త దేశస్తులు అంటున్నారు అనగా ఐగుప్తు దేశమునకు చుట్టుప్రక్కల ఉన్న దేశాల వారు కూడా కరువు భారముగా ఉన్నందున ఐగుప్తు దేశము వచ్చి అక్కడ ధాన్యము కొనుక్కుంటున్నారు అన్నమాట!

 

చూడండి- యోసేపు ఏమని చెప్పారు భావము- ఇంత విస్తారమైన పంట కూడా కరువులో ఏమీ లేకుండా పోతుంది, అనగా పుష్టిగల ఆవులను బక్కచిక్కిన ఆవులు మ్రింగి వేసినట్లు సమృద్ధిగల పంటను కరువు మ్రిగేస్తుంది ఇప్పుడు! ఇప్పుడు అలాగే జరిగింది.

 

ఇక 42వ అధ్యాయంలో యాకోబు గారు కూడా తన కుమారులను కనాను దేశం నుండి ఐగుప్తు దేశమునకు పంపిస్తున్నారు ధాన్యం కొనుక్కుని రమ్మని! వెంటనే యోసేపు గారి పదిమంది అన్నలు ఐగుప్తు దేశము వెళ్లి ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి!  6వ వచనం ప్రకారం యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనం చేశారు. అక్కడికి ధాన్యము కొనడానికి వచ్చారు!

42:68...

Genesis(ఆదికాండము) 42:6,7,8

6. అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి.

7. యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.

8. యోసేపు తన సహోదరులను గురుతు పట్టెను గాని వారతని గురుతు పట్టలేదు.

 

ఇప్పుడు దేవుడు యోసేపుకి చూపించిన కలల యొక్క నెరవేర్పు ప్రారంభమయ్యింది.

(ఇంకా ఉంది)

*ఫలించెడి కొమ్మ*

*14వ భాగం*

ఆదికాండం 42:68...

6. అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి.

7. యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితిమనిరి.

8. యోసేపు తన సహోదరులను గురుతు పట్టెను గాని వారతని గురుతు పట్టలేదు.

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

ఒకసారి ఆగుదాం! 41వ అధ్యాయం ప్రకారం- ఏ ప్రాంతంలో పండితే ఆ ప్రాంతంలో పంటలు సేకరించి గిడ్డంకులు కట్టి భద్రము చేసినట్లు చూసుకున్నాము! ఐగుప్తులో అన్ని పట్టణాలలో గిడ్డంకులు ధాన్యము అమ్మే కొట్లు ఉన్నాయి కదా మరి వీరు యోసేపు ఉండే పట్టణంలోనే ఎందుకు కొంటున్నారు?

 

దీనికి చరిత్రకారులు మరియు రబ్బానిక్ స్క్రిప్చర్ లో ఏమంటారు అంటే- ఎలాగు కరువు వస్తుంది, తన సహోదరులు కూడా తప్పకుండా ఐగుప్తు దేశం వస్తారు, అప్పుడు తన సహోదరులు తన దగ్గరకే వచ్చేలా ఒక రూల్ పాస్ చేసాడంట యోసేపు! అది ఏమిటంటే ఐగుప్తీయులకు దేశంలో ఎక్కడైనా ఆహారం అమ్మవచ్చును! గాని ఐగుప్తీయులు కాని విదేశీయులు ఎవరైనా సరే, ఓను పట్టణం రావలసిందే! వారు తమయొక్క వివరాలు తండ్రిపేరుతో సహా చెప్పి అక్కడ నమోదు చేయించుకున్న తర్వాత యోసేపు వివరాలను పరిశీలించాకనే ధాన్యం అమ్మాలి! ఇదీ రూల్! దానిని రాజు మరియు మిగిలిన ఐగుప్తు అధికారులు ఇది దేశభద్రతా కోసం ఆలోచిస్తున్నాడు యోసేపు అనుకుని సెహభాస్ అన్నారు! గాని ముఖ్య ఉద్దేశం- తన అన్నలు ఎలాగు వస్తారు, అప్పుడు వారిని తన తండ్రికోసం కనుక్కోవాలి అనే ఉద్దేశంతో అలా ఏర్పాటుచేశారు!

 

  ఇప్పుడు యోసేపు యొక్క పదిమంది అన్నలు ఐగుప్తు దేశం వచ్చారు. మీరు ఓను అనే పట్టణంలో మాత్రమే ధాన్యం కొనుక్కోవాలి అంటే యోసేపు ఉండే పట్టణం వచ్చి వివరాలు ఇచ్చారు. వెంటనే యోసేపు వారిని రప్పించాడు తన దగ్గరకి! అన్నలు వచ్చి   యోసేపుకి ముఖములు నేలకు మోపి వందనం చేశారు! ఇప్పుడు యోసేపు యొక్క మొదటి కల నెరవేరిపోయింది! చూడండి 37వ అధ్యాయంలో మొదటి కల- నా పన లేచి నిలబడింది. నా పనకు మీ పనలు నమస్కారం చేసాయి.

 

 ఇప్పుడు పదిమంది అన్నలను అడుగుతున్నాడు ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఎక్కడనుండి వచ్చారు? గమనించాలి అక్కడ కటినముగా మాట్లాడెను అని ఉంది!

 

 మొదటిది: యోసేపు అన్నలను గుర్తుపట్టారు గాని వారు యోసేపుని ఎందుకు గుర్తుపట్టలేక పోయారు!

ఎందుకంటే ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశపు వేషదారణలో ఉన్నాడు,

 

రెండు: ఇంకా అధికారిగా ఉన్నాడు! వారు ఊహించలేనంత గొప్ప హోదాలో ఉన్నాడు కాబట్టి అన్నలు గుర్తు పట్టలేక పోయారు!

మూడు: అప్పటికి అనగా ధాన్యం కొనుక్కోవడానికి ఐగుప్తు దేశం రాబోయేసరికి 20 సుధీర్గ సంవత్సరాలు గడిచిపోయాయి! అంతేకాదు వారు అతనిని అమ్మేశారు, ఆ ఇష్మాయేలు వర్తకులు అతనిని ఎక్కడ అమ్మారో ఏ దేశంలో అమ్మారో తెలియదు, ఇంకా చనిపోయాడు అనుకున్నారు యోసేపుని!

 

ఇక ఎందుకు కటినముగా మాట్లాడారు? నిజానికి యోసేపుకి క్షమాగుణం లేక కాదు గాని తనకు వ్యతిరేఖంగా వారు చేసిన పాపానికి నిజానికి వారు పశ్చాత్తాప పడుతున్నారో లేదో తెలుసుకుందామని ఆ రకంగా కటినముగా మాట్లాడారు అక్కడ వారితో!!

 

ఇక 9వ వచనంలో  దేవుడు తనకు చూపించిన కలలు గుర్తుకు వచ్చాయి ఎప్పుడైతే వారు తనకి వందనం చేశారో- అప్పుడు అంటున్నాడు: మీరు వేగులవారు ఈ దేశపు గుట్టు, రహస్యాలు తెలుసుకోవడానికి ఆహారం కొనే నెపంతో వచ్చారు అంటున్నాడు.916.....

 

9. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని; మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితో ననగా

10. వారు: లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి;

11. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి.

12. అయితే అతడు: లేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను.

13. అందుకు వారు: నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములో నున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి.

14. అయితే యోసేపు: మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే.

15. దీనివలన మీ నిజము తెలియబడును; ఫరో జీవముతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడనుండి వెళ్లకూడదు.

16. మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి; అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును; లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగుల వారని చెప్పి ...

 

ఇక్కడ ఇలా మాట్లాడానికి కారణం మొత్తం గుట్టు లాగడానికి, తర్వాత వారు పశ్చాత్తాప పడుతున్నారో లేదో తెలుసుకోవడానికి!

ఇక 17వ వచనంలో అన్నలందరినీ మూడు రోజులు చెరసాలలో ఉంచారు. ఎందుకు చెరసాలలో ఉంచారు అంటే పగ తీర్చుకోవడానికి ఎంతమాత్రం కాదు అని మనకు తర్వాత వచనం ద్వారా అర్ధమవుతుంది. కేవలం వారి స్వభావము ఏమైనా మారిందా లేక దేవుడంటే భయభక్తులు ఉన్నాయా లేదా, వారు తనకు చేసిన అన్యాయానికి పశ్చాత్తాప పడుతున్నారా లేదా అని తెల్సుకోవడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు.

1820....

Genesis(ఆదికాండము) 42:18,19,20

18. మూడవ దినమున యోసేపు వారిని చూచి: నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.

19. మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి.

20. మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.

 

ఇప్పుడు నిజంగా పశ్చాత్తాప పడుతున్నారు 2122 వచనాలలో...

Genesis(ఆదికాండము) 42:21,22

21. అప్పుడు వారు: నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.

22. మరియు రూబేను ఈ చిన్నవాని యెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారి కుత్తరమిచ్చెను.

నిజానికి యోసేపు గారు తన అన్నలలో ఇదే చూడాలి అనుకున్నారు. అదే పొందారు. గమనించాలి- దేవుడు కూడా మనలనుండి ఇదే కోరుకుంటున్నారు- మానవులుగా మనము తప్పిపోతున్నాము- అప్పుడు పశ్చాత్తాప పడి నిజమైన మనస్సుతో నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకి వచ్చి క్షమాపణ కోరుకోవాలి! అప్పుడే దేవుడు తన అక్కున చేర్చుకుంటారు!

Jeremiah(యిర్మీయా) 3:12,13,14

12. నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు.

13. నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు.

14. భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.

 

యిర్మియా 4: 1

ఇదే యెహోవా వాక్కు: ఇశ్రాయేలూ, నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలెను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధినుండి తొలగించి...

 

హొషేయ) 5:15

వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును; తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు.

 

మనము పాపాన్ని కప్పిపుచ్చుకోకూడదు, ఒప్పుకుని విడిచిపెట్టాలిఅతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు గాని దానిని ఒప్పుకుని విడిచిపెట్టు వాడు కనికరం పొందును అని బైబిల్ సెలవిస్తుంది... సామెతలు‌ 28:13

 

24వచనంలో యోసేపు వారు పశ్చాత్తాప పడటం చూసి బయటకి పోయి ఏడ్చాడు! అయితే ఇంకా ఎందుకు వారికీ తాను ఎవరో చెప్పలేదు అంటే ఇంకా వారి పశ్చాత్తాపం సంపూర్ణం కాలేదు అని గ్రహించాడు ఆయన!

ఇక షిమ్యోనుని బంధించి చెరసాలలో వేసాడు! ఎందుకు షిమ్యోనునే చెరసాలలో వేశాడు అంటే తనని ఎక్కువగా కొట్టిన వ్యక్తి, తనను గుంటలో త్రోసిన అన్న అతనే కాబట్టి! మరి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నాడా యోసేపు?? కానేకాదండి! నేను దేవునికి భయపడే వ్యకిని అంటున్నాడు కదా! మరి ఎందుకు అలా చేశాడు అంటే:

ఎక్కువగా భాధపెట్టిన అన్నయ్య న్యాయంగా ఎక్కువగా పశ్చాత్తాప పడాలి, గాని పూర్తి పశ్చాత్తాపం షిమ్యోనులో రాలేదు కాబట్టి అది రావడానికే ఇలా చేసి ఉంటాడు యోసేపు!!

 

ఇక 2526  వచనాలలో ఎవరి మూటలలో వారికి ధాన్యం ఇచ్చాడు ఉచితముగా!

ఇక తర్వాత వచనాలలో జరిగినదంతా తండ్రికి వివరించి చెప్పారు! ఇక్కడ తన కుటుంభాన్ని ఉచితంగా పోషిస్తున్నాడు యోసేపు! చేసిన అన్యాయాన్ని క్షమించి వారిని పోషిస్తున్నాడు! ఇదీ నిజమైన విశ్వాసి చేయవలసినది!

మనము మన శత్రువులను క్షమించాలి! తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని యేసయ్య చెప్పారు!

స్తెఫను భక్తుడు తు.. తప్పకుండా చేశారు! మనము కూడా అలా క్షమించవలసిన అవసరం ఉంది!

 

దైవాశీస్సులు!

 

(ఇంకాఉంది)

 

 

*ఫలించెడి కొమ్మ*

*15వ భాగం*

ఆదికాండం 45:14...

1. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్నుతాను అణచుకొనజాలక నా యొద్దనుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్నుతాను తెలియచేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు.

2. అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారును వినిరి.

3. అప్పుడు యోసేపు: నేను యోసేపును; నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయిరి.

4. అంతట యోసేపు: నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే.

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము! యోసేపు అన్నలు ఐగుప్తు నుండి ఆహారం కొనుక్కుని వచ్చినట్లు చూసుకున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

ఇక యోసేపు అన్నలు తమ తండ్రితో చెప్పారు- అక్కడ ఒక ఐగుప్తీయుడు ఇలా అన్నాడు అలా అన్నాడు, షిమ్యోనుని పట్టి చెరశాలలో వేసేసాడు. మీ తమ్మున్ని తీసుకుని వస్తేనే గాని మీ అన్నను వదలను అన్నాడు, ఇవన్నీ చెప్పాక 35 వ వచనంలో వారి ధాన్యం సంచులు వంపారు. అప్పుడు ధాన్యముతో పాటుగా వారు అక్కడ చెల్లించిన డబ్బులు లేక నాణేల మూటలు ఎవరి సంచులలో వారి డబ్బు మూట ఉంది. అప్పుడు యోసేపు అన్నలు మరియు తండ్రి యాకోబు గారు కూడా బిత్తరపోయారు!

 

   ఎపుడైతే ఎవరి డబ్బులు వారి మూటలలో ఉన్నాయో యాకోబుగారు అంటున్నారు: మీరు నాకు సంతానం లేకుండా చేస్తున్నారు అంటున్నారు!

గమనించాలి- ఈ మాట అనడానికి బహుశా మూడు కారణాలున్నాయి!

మొదటిది: యోసేపు మరణానికి తన కుమారులే కారణం అని నమ్ముతున్నాడు!

రెండు: ఎవరి సంచులలో వారి డబ్బు మూటలు ఉండటానికి కూడా తన కుమారులే కారణం అని నమ్ముతున్నాడు!

మూడు: ఇప్పుడు షిమ్యోను కూడా ఐగుప్తు చెరసాలలో ఉన్నాడు! నిజానికి షిమ్యోనుమీద యాకోబు గారికి కోపం ఉంది గాని అతను కూడా తన కుమారుడే కాబట్టి కుమారుని మీద ప్రేమ జాలి కలిగి అంటున్నారు మీరు నాకు పుత్రశోకం మిగిలిస్తున్నారుయోసేపు లేడు, ఇప్పుడు షిమ్యోను కూడా లేడు! ఇంకా ఇప్పుడు బెన్యామీనుని తీసుకుని పోతాము అంటున్నారు! నేను బెన్యామీనుని పంపనంటే పంపను అన్నారు యాకోబు గారు! రూబేను అన్నాడు ఒకవేళ నేను చిన్న తమ్మున్ని తీసుకురాని పక్షంలో నా ఇద్దరు కొడుకులను చంపేసేయ్ అంటున్నాడు!

 

  ఇక తర్వాత అధ్యాయంలో మరలా ఐగుప్తు దేశం పోయి ధాన్యం కొనుక్కుని రమ్మని చెబుతున్నారు యాకోబు గారు! గమనించాలి- 42వ అధ్యాయంలో వారు ధాన్యము కొనుక్కుని వచ్చారు, 43 అధ్యాయంలో మరలా వెంటనే వెల్లమంటున్నారు, 45:6 ప్రకారం చూసుకుంటే ఇంకా ఐదు సంవత్సరాల కరువు మిగిలి ఉంది అంటున్నారు కాబట్టి అదే సంవత్సరంలో అనగా కరువు రెండో సంవత్సరంలోనే మరలా వెళ్లి ఆహారం కొనుక్కుని రమ్మని చెబుతున్నారు యాకోబు గారు! ఏమండి యాకోబు గారి కుటుంభం ఇంత తొందరగా తెచ్చిన ధాన్యం తినేశారా???

 

జాగ్రత్తగా పరిశీలిస్తే- కరువు ఐగుప్తు దేశము లోను కనాను దేశములోను బహు ఘోరంగా ఉంది! ఎక్కడా పంటలు లేవు వర్షాలు లేవు! గడ్డి లేదు! ఇప్పుడు ఐగుప్తు నుండి తెచ్చిన ఆహారపు గింజలు యాకోబు గారి సర్వ కుటుంభం, వారి దాసులు దాసీలు వారి పిల్లలు, వారితోపాటుగా యాకోబుగారి సర్వ మందలు అవే తినాలి! కారణం ఎక్కడా గడ్డిలేదు, చెట్లు ఎండిపోయాయి కాబట్టి వారు తినేవే పశువులకు కూడా ఏదో రకంగా కడుగో గంజో కాసి పెట్టుచున్నారు అన్నమాట! అందుకే అంత తొందరగా ఆహరం అయిపోయింది! అందుకే యాకోబు గారు మరలా వెళ్లి రమ్మంటున్నారు!

 

   ఇక ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనకు తెలుసు! యూదా తమ్మున్ని పంపితేనే గాని వెళ్ళమంటాడు, చాలా తర్జన బర్జన జరిగాక యాకోబుగారు చిన్న కుమారుని బెన్యామీనుని వారితో పంపారు. పంపుతూ కనాను దేశంలో పండే సుగంధద్రవ్యాలు, తేనె, భోళం, పిస్తా, బాదం అన్నీ తీసుకుని పోయి ఆ ఐగుప్తీయునికి కానుక ఇవ్వండి. అంతేకాకుండా పోయినసారి కొన్న ధాన్యం డబ్బు, ఇప్పుడు కొనబోయే ధాన్యం డబ్బు తీసుకుని వెళ్ళండి, దేవుడు మీకు తోడుగా ఉండి మీ అన్నను మరియు మీ తమ్మున్ని కూడా తీసుకుని వచ్చును గాక అని ఆశీర్వదించి పంపుతున్నారు!

 

  ఇక తమ్మున్ని తీసుకుని ఐగుప్తు దేశం వెళ్లారు, యోసేపు ముందు నిలబడ్డారు! తన పనివాడిని పిలిచి వారిని ఇంటికి తీసుకుని పొమ్మన్నారు. యోసేపు ఇంటిలో వారికి విందు సిద్దం చేయబడింది. షిమ్యోనుని చెరలో నుండి తాను వాగ్దానం చేసిన విధంగా బయటకు తీసుకుని వచ్చారు! అయితే ఎప్పుడైతే వారిని ఇంటికి తీసుకుని వచ్చారో వెంటనే అన్నలందరూ చాలా భయపడిపోయారు! గృహనిర్వాహకునితో మనవిచేస్తున్నారు- పోయినసారి మేము డబ్బులు ఇచ్చాము గాని ఇంటికిపోయి చూసేసరికి ఎవరి డబ్బులు వారి మూటలలో ఉన్నాయి, ఇప్పుడు రెండింతలు సొమ్ము తీసుకుని వచ్చాము అన్నారు!

భయపడకండి మీ తండ్రి దేవుడు మీకు డబ్బు ఇచ్చి ఉంటాడు, మీ డబ్బులు మాకు ముట్టాయి అన్నాడు.

 

ఇక వారు ఆశ్చర్యపడే మరో కార్యం జరిగింది. యోసేపు వారితో కలసి భోజనం చేశాడు, ఇంకా వారిని ఎవరి వయసు చొప్పున వారిని వరుసలో కూర్చోబెట్టారు! వారికి ఆశ్చర్యం ఏమిటంటే మన వయస్సు వీరికి ఎలా తెలిసింది! యోసేపు తమ్మున్ని చూశాడు, లోపలి పోయి ఏడ్చి వచ్చి మరలా మాట్లాడి వారికి ధాన్యం ఇప్పించి బెన్యామీను ధాన్యపు మూటలో తన బోజనపు గిన్నె ఉంచి నాటకం ఆడారు! గమనించాలి ఈ డ్రామా కేవలం వారు సంపూర్ణ పశ్చాత్తాపం పొందాలని మాత్రమే!!

 

  (గమనించాలి ఈ చరిత్ర మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి తొందరగా ముందుకు పోతున్నాను!) అక్కడ 44వ అధ్యాయం చూసుకుంటే ఎప్పుడైతే బెన్యామీను సంచిలో యోసేపు బోజనపు గిన్నె దొరికిందో అన్నలందరూ తమ బట్టలు చింపుకుని ఏడుస్తున్నారు! ఎందుకంటే యోసేపుని వారు బానిసగా అమ్మి- యోసేపు చనిపోయాడు అని చెప్పినప్పుడు తండ్రి ఎన్ని సంవత్సరాలు ఎంతగా ఏడ్చాడో తెలుసు వారికి! ఇప్పుడు బెన్యామీను సంచిలో ఆ గిన్నె దొరికింది, ఇప్పుడు బెన్యామీనుని గాని తమ తండ్రివద్దకు వారు తీసుకుని పోలేదో- వెంటనే అక్కడే గుండాగి చనిపోతాడు తమ తండ్రి! అందుకే వారంతా బట్టలు చింపుకుని ఏడుస్తున్నారు! నిజమైన పశ్చాత్తాపం పడుతున్నారు! అప్పుడు యూదా కనాను దేశంలో జరిగిన స్టోరీ మొత్తం చెబుతున్నప్పుడు యోసేపు కన్నీరు దాచుకోలేక బిగ్గరగా ఏడ్చాడు! తను ఎవరో వారికి తెలియజేస్తున్నాడు! తాను యోసేపు అని వారికి బహిర్గతం చేసుకున్నాడు! ఎప్పుడు? వారిలో నిజమైన పశ్చాత్తాపం చూసినప్పుడు!!

45:14

1. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్నుతాను అణచుకొనజాలక నా యొద్దనుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్నుతాను తెలియచేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు.

2. అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారును వినిరి.

3. అప్పుడు యోసేపు: నేను యోసేపును; నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయిరి.

4. అంతట యోసేపు: నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే.

 

     అన్నలు ఇప్పుడు కూడా గుర్తుపట్టలేదు. యోసేపు తన ఐగుప్తు దేశపు బట్టలు తీసి తన నిజమైన ముఖం  చూపించాడుఅన్నలు నిజంగా భయపడిపోయారు ఇప్పుడు! యోసేపు ఇప్పుడు ఐగుప్తు దేశానికే అధిపతి! వారు యోసేపుని మహా ఘోరంగా కొట్టి హింసించి అవమానించి బానిసగా అమ్మేశారు! తమ్ముడు ఇప్పుడు ఏం చేసేస్తాడో అని హడలిపోయారు! గాని యోసేపు దయగల మాటలు మాట్లాడి వారిని భయపడవద్దు! బాధపడవద్దు అని వారిని ఓదారుస్తున్నారు! కోపం చూపించ లేదు! దయతో మాట్లాడుచున్నాడు! దైవ భక్తిగల మనిషి ఎలా ప్రవర్తించాలో ఎలా దయ చూపాలో ఎలా ప్రేమించాలో ఎలా క్షమించాలో మనము యోసేపుని చూసి నేర్చుకోవాలి!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

          

*ఫలించెడి కొమ్మ*

*16వ భాగం*

ఆదికాండం 45:413...

4. అంతట యోసేపు: నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే.

5. అయినను నేనిక్కడికి వచ్చు నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.

6. రెండు సంవత్సరములనుండి కరవు దేశములో నున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును

7. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.

8. కాబట్టి దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటివారి కందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను.

9. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు;

10. నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెలమందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును.

11. ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.

12. ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి.

13. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి ....

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము! యోసేపు తాను ఎవరో అన్నలకు బహిర్గతం చేసుకున్నాడు అని గతభాగంలో చూసుకున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

ఇక ఇప్పుడు యోసేపు పలుకుచున్న దయగల మాటలు వినండి, కారణం వారు యోసేపుని మహా ఘోరంగా కొట్టి హింసించి అవమానించి బానిసగా అమ్మేశారు! తమ్ముడు ఇప్పుడు ఏం చేసేస్తాడో అని హడలిపోయారు! గాని యోసేపు దయతో మాట్లాడి వారిని భయపడవద్దు! బాధపడవద్దు అని వారిని ఓదారుస్తున్నారు! కోపం చూపించ లేదు! దయతో మాట్లాడుచున్నాడు! దైవ భక్తిగల మనిషి ఎలా ప్రవర్తించాలో ఎలా దయ చూపాలో ఎలా ప్రేమించాలో ఎలా క్షమించాలో మనము యోసేపుని చూసి నేర్చుకోవాలి!

మీరు బానిసగా అమ్మివేసిన తమ్ముడ్ని నేనే, అయినా మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడవద్దు! మీ అందరి లేదా మన కుటుంబ అందరి ప్రాణ రక్షణ కొరకై దేవుడే మీకు ముందుగా నన్ను పంపించెను అంటున్నారు!

 

 చూడండి! యోసేపు మాటలు! దేవుని ప్రణాళికను దేవుని ఉద్దేశాన్ని నిజంగా అర్ధం చేసుకున్న ఒక దైవభక్తుడు పలికే మాటలు ఇవి! వారిమీద ఎటువంటి కోపం చూపలేదు! దేవుని ప్రణాళికను పూర్తిగా అర్ధం చేసుకుని, దేవుడా ఇదా నీ ప్రణాళిక! అందుకేనా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి ఆశ్చర్యరీతిగా నన్ను అధికారిని చేశావు అని గ్రహించి అన్నలతో ప్రేమతో మాట్లాడుతూ దేవుని ప్రణాళిక కోసం వారితో వివరిస్తున్నాడు! గమనించాలి- ఇలా దేవుని ప్రణాళికను అర్ధం చేసుకోవడానికి యాకోబు గారు తన తాతతో దేవుడు చేసిన వాగ్దానాలు, తన తండ్రితో దేవుడు చేసిన వాగ్దానాలు, తనతో దేవుడు మాట్లాడిన విధానం చేసిన వాగ్దానాలు కుమారుడు యోసేపుతో ఎన్నోసార్లు చెప్పి ఉండాలి! అందుకే ఇప్పుడు దేవుని ప్రణాళికను దేవుని ఉద్దేశాన్ని అర్ధం చేసుకుని మాట్లాడుచున్నారు! దేవుడు అబ్రాహము గారికి తమది కాని దేశంలో నీ సంతానం 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు ఆ తర్వాత నేను వారిని మరలా ఈ దేశానికి తీసుకుని వస్తాను అని వాగ్దానం చేశారు ఆదికాండం 15వ అధ్యాయంలో! ఇప్పుడు దానిని దేవుడు నెరవేర్చాలి! అది నేరవేరడానికే దేవుడు యోసేపుని ఐగుప్తు దేశం తీసుకుని వచ్చినట్లు యోసేపు సంపూర్ణంగా గ్రహించాడు. అందుకే మీరు సంతాప పడవద్దు! దేవుడే మీకు ముందుగా నన్ను పంపించారు!

 

ఇంకా అంటున్నారు: ఇంకా 5 సంవత్సరాల భయంకరమైన కరువు రాబోతుంది. మిమ్మల్నందరినీ ఆశ్చర్యంగా రక్షించి దేశములో మిమ్మును నిలబెట్టడానికి, ప్రాణముతో కాపాడటానికి దేవుడు నన్ను మీకు ముందుగా పంపించారు! కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు! ఇది యోసేపుకి చాలా స్పష్టముగా అర్ధమైంది!

 

ఇంకా అంటున్నాడు యోసేపు: దేవుడు నన్ను ఐగుప్తు దేశానికి ప్రభువుగా నియమించారు కాబట్టి నా తండ్రిని పిలుచుకుని రండి అంటూ తండ్రికి వర్తమానం పంపారు! ఆ తర్వాత తమ్ముడు మెడమీద పడి భోరున ఏడ్చాడు! ఈ ఆదికాండంలో చాలాసార్లు యోసేపు ఏడ్చినట్లు కనిపిస్తుంది! అనగా యోసేపు చాలా సెన్సిటివ్ అని అర్ధమవుతుంది!

 

తండ్రికి కబురు పంపాడు యోసేపు నీవు ఐగుప్తు దేశంలో గోషేను ప్రదేశంలో నివాసం చేస్తావు! గోషేను అనేది ఐగుప్తు దేశంలో సారవంతమైన ప్రాంతం! విస్తారమైన గడ్డి ఉంటుంది. అనగా తమ తండ్రి వస్తారు, తమ కుటుంభం వస్తుంది, వారికి మందలు ఉన్నాయి, అవి బాగా ఉండాలి అంటే సారవంతమైన ప్రదేశంలో ఉండాలి అని ముందుగానే ఆలోచించి తండ్రికి వర్తమానం పంపుతున్నాడు!

 

15వ వచనంలో అన్నలందరినీ కౌగలించుకుని ఏడ్చినట్లు చూడగలం! ఒక మనిషిలో ఉన్న ప్రేమ గాని ఆసక్తి గాని శ్రద్ధ గాని అభిమానం గాని తన యొక్క కన్నీటితో చాలా బాగా తెలియజేయవచ్చు! ఇప్పుడు యోసేపు కన్నీరు కార్చితే వారు కూడా అతనితో కన్నీరు కార్చారు! ద్వేషం- కోపం- భయం అన్నీ పోయాయి ఇప్పుడు!

 

Genesis(ఆదికాండము) 45:17,18,19,20

17. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరీలాగు చేయుడి, మీ పశువులమీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి

18. మీ తండ్రిని మీ యింటివారిని వెంట బెట్టుకొని నా యొద్దకు రండి; ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకెచ్చెదను, ఈ దేశముయొక్క సారమును మీరు అనుభవించెదరు.

19. నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లలకొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి.

20. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా ...

 

ఇక 1620 వచనాలలో యోసేపు తన అన్నలను రాజుకి పరిచయం చేశాడు, రాజు వారితో మీరు మా దేశం వచ్చెయ్యండి. మీకున్నవి అన్నీ తీసుకుని వచ్చెయ్యండి స్తిరాస్తులు వదిలెయ్యండి. ఇక్కడ సారవంతమైన భూమిని మీకిస్తాను అన్నాడు!

 

గమనించాలి- అన్నలు ద్వేషించి బానిసగా పంపి మరణానికి అప్పగిస్తే యోసేపు వారిని క్షమించి వారికి దేశంలో అతి సారవంతమైన భూమి వారు అనుభవించేలా చేస్తున్నాడు! నిజంగా యోసేపు ఎంతో ఆదర్శవంతమైన వాడు!! ప్రేమ గలవాడు!

ఒకసారి యేసుక్రీస్తుప్రభులవారు అన్నమాటలు జ్ఞాపకం చేసుకుందాం!

 

మత్తయి సువార్త 5:43--48

43. నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;

44. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

45. ఆయన చెడ్డవారిమీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.

46. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా.

47. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారుగదా.

48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.

 

మత్తయి 7: 12

కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము నైయున్నది.

 

1పేతురు 2: 1924

19. ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును.

20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును;

21. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.

22. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

23. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.

24. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.

 

దేవుడు చెప్పినట్లే చేస్తున్నాడు యోసేపు! ఇప్పుడు అన్నలలో నిజమైన పశ్చాత్తాపం, ఆనందం, అవమానం ఆశ్చర్యం కలిగి తిరిగి కనాను దేశం బయలుదేరారు తండ్రి వద్దకు!

యోసేపులా నిజమైన ప్రేమానురాగాలు శత్రువులను ప్రేమించే క్షమాగుణం తప్పకుండా మనము కూడా నేర్చుకుందాం!

దైవాశీస్సులు!

*ఫలించెడి కొమ్మ*

*17వ భాగం*

ఆదికాండం 45:2628...

26. యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.

27. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పినమాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపినబండ్లు చూచినప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను.

28. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను చావకమునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను.

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

 

ఇక యోసేపు అన్నలు తమ్ముడు తిరిగి కనాను దేశం వచ్చి 45:2628  వచనాలలో చెబుతున్నారు: యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశమంతటిని పాలిస్తున్నాడు అని చెబితే యాకోబుగారు నమ్మలేక పోయారు! గాని యోసేపు పంపించిన ఐగుప్తు బళ్ళు చూసి నమ్మి అంటున్నారు: ఇక చాలు- నా కొడుకు యోసేపు బ్రతికే ఉన్నాడు. నేను చనిపోయేముందుగా అతనిని చూడటానికి వెళ్తాను అంటున్నారు!

 

   ఇక 46 వ అధ్యాయంలో యాకోబు గారు తనకున్న ఆస్తి మొత్తం తీసుకుని మొదట బెయేర్షేబా చేరుకున్నారు! ఎందుకు అక్కడికి వెళ్ళారు అంటే తన తండ్రితోపాటుగా యాకోబు గారు ఎన్నోసార్లు అక్కడికి వెళ్లి దేవునికి బలులు ఇస్తుండేవారు! కాబట్టి మొదట దేవునికి బలి అర్పించడానికి బెయేర్షేబా వెళ్లి దేవునికి బలి అర్పించారు! అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు యాకోబు అనెడి ఇశ్రాయేలుతో: నేను నీ దేవుణ్ణి నీ తండ్రియొక్క దేవుణ్ణి, నేను నిన్ను ఐగుప్తు దేశంలో గొప్ప జనంగా చేస్తాను, కాబట్టి ఐగుప్తు వెళ్ళడానికి భయపడకు! నిన్ను నేను తప్పకుండా తిరిగి ఇక్కడికి తీసుకుని వస్తాను! నీవు యోసేపు సమక్షంలోనే కళ్ళుమూస్తావు అని దేవుడు మాట్లాడి ధైర్యపరిచారు!

 

  ఇక ఆ తర్వాత యాకోబు గారు అతని సర్వస్వము ఐగుప్తు దేశం వెళ్ళారు! ఇక 527 వచనాలు చూసుకుంటే యాకోబు గారి భార్యలు లేయా రాహేలు ఇద్దరు కనాను దేశంలోనే చనిపోయినట్లు మనకు అర్ధమవుతుంది. కారణం అక్కడున్న లిస్టు చూస్తే తన కొడుకులూ మనమలు మనమరాళ్ళు కూతుళ్ళు కూతురు పిల్లలు అంటూ ఉంది, ఇంకా తన కోడళ్ళు అని కూడా ఉంది గాని తన భార్యలు అనే మాట లేదు! కాబట్టి కనాను దేశంలోనే తప్పకుండా చనిపోయి ఉండాలి! ఇక్కడ మరో విషయం గమనించాలి : యాకోబు గారు తన తల్లిదండ్రులతో మొదట 40 సంవత్సరాలు ఉన్నారు! సిరియాలో 40 సంవత్సరాలు ఉన్నారు! సిరియా నుండి వచ్చాక 50 సంవత్సరాలు కనాను లో ఉన్నారు. ఎందుకంటే యాకోబుగారు ఐగుప్తు ఫరో ముందుకు వెళ్లి ఫరోను దీవించినప్పటికీ ఆయన వయస్సు 130. కాబట్టి కనానులో 50 సంవత్సరాలు ఉన్నారు!

ఇక తర్వాత వచనాలలో యాకోబు గారు ఐగుప్తు వెళ్లారు! యోసేపు తండ్రిని పట్టుకుని ఏడ్చాడునీ ముఖం చూస్తాను అనుకోలేదు, ఇప్పుడు చూశాను గనుక ఇక నేను సంతోషంతో మనశ్శాంతితో చనిపోతాను అన్నారు!

 

  తర్వాత యోసేపు గారు ఫరో దగ్గరికి తన తండ్రిని తీసుకుని వెళ్లి పరిచయం చేశారు! అక్కడ యాకోబు గారు ఫరోను దీవించారు! ఇక వారికోసం గోషేను ప్రాంతంలో ఉంచడానికి యోసేపు గారు ఏర్పాట్లు చేశారు! అయితే గోషేను ప్రాంతాన్నే ఎందుకు ఎన్నుకున్నారు అంటే బహుశా రెండు కారణాలు!

మొదటిది: ఐగుప్తు దేశం మొత్తం మీద గోషేను అనేది చాలా సారవంతమైన ప్రాంతం! వారి మందలకు సరిపడే గడ్డి ఆహారం విరివిగా దొరుకుతుంది అక్కడ!

 

రెండు: తనతోపాటుగా తన తండ్రి ముఖ్యంగా తన అన్నలు తమ్ముడు ఉంటే వారు ఐగుప్తు దేశపు అలవాట్లు నేర్చుకొని ఐగుప్తు వారితో కలిసిపోతారు! ఎందుకంటే దేవుని ప్రణాళిక ప్రకారం వారు 400 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి, అనగా అన్ని సుదీర్ఘ సంవత్సరాలు అక్కడ ఉంటే తప్పకుండా అక్కడ ఉన్న వారి అలవాట్లు తప్పకుండా ఇశ్రాయేలు జాతి నేర్చుకుంటుంది. అందుకనే అలా జరగకూడదని యోసేపు ఆలోచించారు, అలాగే దేవుడు కూడా ఉద్దేశించారు!

 

ఇక మరో విషయం ఏమిటంటే 47:1112 వచనాలు చూసుకుంటే మొదట గోషేను ప్రాంతంలో రామశేసు అనే ఊరిలో వారికి స్వాస్త్యముగా ఇచ్చారు! స్వాస్థ్యము అనగా వారికి ఆస్తిగా రాసి ఇచ్చేశారు! ఇక వారిని వారివారి పిల్లల లెక్క చొప్పున ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆహారమిచ్చి సంరక్షించెను! చాలామంది వాగ్దానం చేసి దానిని నిలబెట్టుకోరు! గొప్ప కోసం వాగ్దానం చేసేస్తారు! ఇంకా కొంతమంది మన రాజకీయ నాయకుల వలే ఓట్లు కోసం వాగ్దానాలు చేస్తారు గాని నిలబెట్టు కోరు! గాని యోసేపు గారు వాగ్దానం చేసి దానిని ఆయన బ్రతికి ఉన్నంతకాలం ఇంకా తండ్రి ఉన్నప్పుడే కాకుండా తండ్రి చనిపోయిన తర్వాత కూడా తన కుటుంభాన్ని అనగా తన అన్నలను వారి పిల్లలను అందరినీ పోషించారు యోసేపు గారు!

ఈ రకంగా మరలా తన తండ్రితోను తన కుటుంభం తోనూ కలసి జీవించారు యోసేపుగారు!

 

   ఇంకా ముందుకు పోతే ఐగుప్తు దేశం కరువులో ఐగుప్తు రాజ ఖజానాను నింపినట్లు చూస్తున్నాము యోసేపు గారు! మొదట వారి డబ్బుతో ధాన్యం కొన్నుక్కున్నారు! డబ్బులు అయిపోయాక వారి  పశువులు కొన్నారు! పశువులకు బదులుగా వారికి ధాన్యం ఇచ్చి దేశాన్ని పోషించారు! ఆ తర్వాత సంవత్సరంలో వారి భూములు కొన్నారు! భూమికి బదులుగా ధాన్యం ఇచ్చి పోషించారు! ఇలా ఐగుప్తు దేశపు భూమి మొత్తం రాజు పేరు మీద అయిపోయింది! ఇలా ఎన్నెన్నో చేసి ఐగుప్తు దేశాన్ని కాపాడి రాజ ఖజానాని నింపేశారు యోసేపు గారు!

 

ముగించేముందు రెండు విషయాలు:47:1315 వచనాలు చూసుకుంటే ఆహారం అమ్మిన డబ్బులు ఐగుప్తు దేశంలోనూ కనాను దేశంలోనూ ధాన్యం అమ్మిన డబ్బును చక్రవర్తి భవనంలోకి తెప్పించారు అని ఉంది! అయితే చరిత్ర చూసుకున్నా ఇక రబ్బానిక్ స్క్రిప్చర్ ప్రకారం కూడా అలా వచ్చిన డబ్బులు బంగారం నాణెములు అన్నీ రాజు భవనం నిండిపోయి వాటిని ఉంచడానికి స్థలం లేకుండా పోయింది! అప్పుడు యోసేపు ఎక్కడపడితే అక్కడ అండర్ గ్రౌండ్లో ఈ ధనమును దాచడం మొదలుపెట్టారు! ఇంకా రాజు ఖజానా వివిధ ప్రాంతాలలో కూడా ఇలాంటి డబ్బులు దాచే ఖజానా కట్టారు! ఎందుకంటే వాటిని మోయడానికి కూడా వీలు లేనంతగా ధనమును యోసేపు సమకూర్చారు అని ఉంది! అయితే ఇలా అండర్ గ్రౌండ్ లో దాచిన ఖజానాలు కొన్ని అన్నలకు చెప్పారు అట యోసేపు గారు! దేవుడు ఒకరోజు మనలను తిరిగి కనాను దేశం తీసుకుని వెళ్తారు ఆయన వాగ్ధానం చేసినట్లు! అయితే అప్పుడు ఈ ఖజానా లో డబ్బులు ఎవరికీ చెప్పకుండా తీసుకుని వెళ్ళండి. దీనిని అంతవరకూ రహస్యంగా ఉండనీయండి అన్నారట! చాలా సంవత్సరాలు జరిగాక ఇప్పటికీ కూడా ఐగుప్తులో ఈ ఖజానాలు బయటపడుతున్నాయి!

 

రెండు: అయితే ముఖ్య విషయం ఏమిటంటే మనము సంఖ్యాకాండంలో కోరహు, దాతాను అబీరాములు మోషే గారిమీద తిరగబడటానికి ముఖ్య కారణం మరొకటుంది అంటారు ఈ బైబిల్ పండితులు! అది ఏమిటంటే మోషేగారు దేవుడు తన ప్రజలను విడిపించి కనాను దేశమునకు తీసుకుని వెళ్ళడానికి నన్ను పంపించారు అన్నప్పుడు- జరిగే అద్భుతాలు చూసి తప్పకుండా మనము వెళ్లిపోతాము గనుక ఈ ఖజానా వెదుకుదాము అని వెదికి దానిని కనుగొనిఇశ్రాయేలు ప్రజలు  అందరూ బయలుదేరి వెళ్ళినప్పుడు వీరు ఒక ఖజానాను కొల్లగొట్టారు కోరహు అండ్ కో! దానితో కోరహు రోజు మధ్యాహ్నంలో కోటీశ్వరుడు అయిపోయాడు! ఆ వచ్చిన ధన గర్వంతోనే మోషేగారిమీద తిరుగబడ్డాడు అంటారు!

 

  చివరగా ఐగుప్తు దేశం కోసం యోసేపు చేసిన మరో సంగతి: కరువు చివరలో ఎవరైతే భూములు ఫరోకు అమ్మారో మరలా వారి భూమిని అమ్మినవారికే తిరిగి ఇచ్చి, ఇంకా విత్తనాలు ఇచ్చి, మీరు ఈ విత్తనాలతో మీ భూమిలో పంటలు పండించి వచ్చిన ధాన్యమును ఫలమును ఐదు భాగాలు చెయ్యండి! భూమి ఎలాగు రాజుది! అయితే మీరు బ్రతకాలి కాబట్టి ఐదు భాగాలలో 4 బాగాలు మీరు తీసుకుని మీరు మీ పిల్లలు బ్రతకండి! ఐదవ భాగం మాత్రం రాజుకి పన్నుగా ఇవ్వండి అని శాసనం చేశాడు! మనకు అర్ధమయ్యేవిధంగా చెప్పాలంటే వచ్చిన పంటలో 20% రాజుకి పన్ను కట్టాలి! ఈ రకంగా శాసనాలు చేసి ఐగుప్తు ఖజానా ను ఫలవంతం చేశాడు, ఐగుప్తు ప్రజలను కూడా పోషించాడు!

 

దేవుడు యోసేపుని అ విధంగా ఆశీర్వదించి వాడుకున్నారు!

దైవాశీస్సులు!

*ఫలించెడి కొమ్మ*

*18వ భాగం*

ఆదికాండం 48:1121.....

11. ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచియున్నాడనగా

12. యోసేపు అతని మోకాళ్ల మధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను.

13. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి తట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి తట్టున తన యెడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసికొనివచ్చెను.

14. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను.

15. అతడు యోసేపును దీవించి : నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,

16. అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.

17. యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతని కిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీదనుండి యెత్తి

18. నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను.

19. అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను.

20. ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను.

21. మరియు ఇశ్రాయేలు ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొని పోవును.

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

 

ఇక 48 వ అధ్యాయంలో యోసేపుకి కబురు వస్తుంది మీ తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు అంటే తన కుమారులను ఇద్దరినీ తీసుకుని వెళ్తారు! అక్కడ యోసేపుతో యాకోబు గారి అప్పగింతలు చూడవచ్చు ౩7 వచనాలుఅక్కడ చెబుతున్నారు నీ సంతానం నా సంతానం గానే పరిగణించబడాలి! మరి ఎందుకు అలా అన్నారో గాని అలాగే నేటివరకు మనస్శే ఎఫ్రాయిముల సంతానం యాకోబు కుమారుల లాగ పరిగణించబడుతుంది! ఇక తర్వాత నన్ను నా తల్లిదండ్రులు నా తాత నాన్నమ్మలను పాతిపెట్టిన స్థలంలో పాతిపెట్టు అని ప్రమాణం చేయించుకుంటారు!

 

ఇక 11వ వచనం నుండి చూసుకుంటే యోసేపు గారి పిల్లలను ఆశీర్వదించినట్లు చూస్తాము! నిన్ను చూస్తాను అనుకోలేదు గాని నీ పిల్లలను చూడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు అని సంతోషించారు! ఎఫ్రాయిము మీద కుడిచేతిని మనస్శే మీద ఎడమచేతిని ఉంచి ఆశీర్వదించారు. ఆలాగు వద్దు పెద్దవానిమీద కుడిచేయి పెట్టమంటే పెట్టలేదు!

 

ఒకసారి ఏమని ఆశీర్వదించారో చూద్దాం!...

15. అతడు యోసేపును దీవించి : నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,

16. అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.

 

యాకోబు గారి మాటలు ఒకసారి చూద్దామా! నన్ను ఇంతవరకు కాపాడిన దేవుడు నాకు కాపరిగా ఉన్న దేవుడు నిన్ను నీ పిల్లలను దీవిస్తారు అంటున్నారు! ప్రాచీన ప్రతులలో నాకు కాపరియై పోషించిన దేవుడు అని ఉంది.

అందుకే కీర్తన 23:1 లో యెహోవా నాకాపరి నాకు లేమి కలుగదు అంటున్నారుఈ విషయం యాకోబుగారికి బాగా అర్ధమయ్యింది! సిరియాలో కాపాడిన దేవుడు, కనానులో కాపాడిన దేవుడు ఐగుప్తులో కూడా కాపాడుచున్నారు కాబట్టి అదే దేవుడు నిన్ను నీ పిల్లలను కాపాడుతారు అని దీవించారు!

కీర్తన 80:1

ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.

 

కీర్తనలు 95: 6

ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.

 

కీర్తనలు 100: 3

యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.

 

యోహాను 10:1116

11. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.

14. నేను గొఱ్ఱెల మంచి కాపరిని.

15. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.

16. ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.

 

  దేవుడు యాకోబు గారికి, యోసేపు గారికి, దావీదు గారికి కాపరిగా ఉన్నారు, కాపరిగా వారు చేసుకున్నారు!! మరి దేవుడు నీకు కాపరిగా ఉన్నాడా?

ఇక చనిపోయే ముందు యోసేపుని ఏమని దీవిస్తున్నారో చూద్దాం..

ఆదికాండం 49:2226

22. యోసేపు ఫలించెడి కొమ్మ! ఊట యొద్ద ఫలించెడి కొమ్మ! దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.

23. విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.

24. యాకోబు కొలుచు పరాక్రమశాలియైన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవునివలనను పైనుండి మింటి దీవెనలతోను

25. క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును

26. నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును.

 

ఇక యాకోబు గారు చనిపోయినప్పుడు 40 రోజులు సుగంధ ద్రవ్యాలతో సిద్దపరచి 70 రోజులు సంతాపం ప్రకటించి, చివరికి రాజ లాంచనాలతో కనాను దేశం తీసుకుని వెళ్లి అక్కడ హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలో అనగా అబ్రాహాము గారు వెల పెట్టి కొన్న పొలంలో పాతిపెట్టారు!

 

ఇక యాకోబు చనిపోయాక అన్నలు కబురు పెడుతున్నారు

Genesis(ఆదికాండము) 50:15,16,17,18

15. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతిపొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మన మతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని

16. యోసేపునకు ఈలాగు వర్తమాన మంపిరి

17. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిన దేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి.వారు యెసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను.

18. మరియు అతని సహోదరులు పోయి అతని యెదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా ....

 

ఇది వారు పంపిన సందేశం గాని యోసేపు ఇంకా ప్రేమగా ఆదరంగా జవాబు చెబుతున్నారు

Genesis(ఆదికాండము) 50:19,20,21

19. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా?

20. మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.

21. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను.

 

ఈ రకంగా ఒక నిజమైన విశ్వాసి, దైవజనుడు ఏ రకంగా ప్రేమించాలి క్షమించాలో అలాగే ప్రవర్తించి ఆదర్శవంతమైన దైవజనునిగా, ఒక దీర్ఘదర్షిగా, ఒక నమ్మకమైన నాయకునిగా, మాట నిలబెట్టుకునే వాడుగా, దేవునియందు విశ్వాస వీరునిగా జీవించి తన 110 వ ఏట ఐగుప్తు దేశంలో కన్ను మూశారు! అనగా క్రీ. పూర్వం. 1623 లో చనిపోయారు! తన పిల్లల పిల్లలను కూడా చూశారు యోసేపు అనే ఫలించెడి కొమ్మ!

 

అటువంటి దైవభక్తి, స్థిర భక్తి, శ్రమలు శోధనలు తట్టుకునే ధైర్యం, అచంచల విశ్వాసం, పెద్దల యెడల గౌరవం దేవుడు మనందరికీ మెండుగా దయచేయును గాక!

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

 

*ఫలించెడి కొమ్మ*

*19వ భాగం*

*యోసేపు- దానియేలు పోలికలు*

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

ప్రియులారా! యోసేపు గారికి దానియేలు గారికి ఎన్నో దగ్గర పోలికలున్నాయి! అలాగే యోసేపుకి యేసుక్రీస్తుప్రభులవారికి కూడా ఎన్నో పోలికలున్నాయి!!! ఈ రోజు యోసేపు గారికి దానియేలు గారికి గల పోలికలు చూసుకుందాం!

యోసేపు

దానియేలు

1). చిన్నతనము లోనే చెరలోనికి పోయారు!

తన 17వ ఏట BC 1716లో  అన్నలతో హింసించబడి ఇష్మాయేలు వర్తకులకు బానిసగా అమ్మబడి, పోతీఫర్ ద్వారా బానిసగా కొనబడి ఐగుప్తులో నివాసం చేశాడు!

2)  చెరనుండి చనిపోయేవరకు స్వదేశం రాలేదు!

93 సంవత్సరాలు ఐగుప్తులో నివశించి 110వ ఏట ఐగుప్తులోనే చనిపోయారు!

) చదువు , భక్తి :

తన భక్తి చదువు అన్నీ తండ్రి దగ్గర నేర్చుకున్నారు!

 

 

 

4) దర్శనాలు చూసే అనుభవం ఉంది! ఇంకా దర్శనాలకు కలలకు అర్ధం చెప్పే వరము ఉంది!

17వ ఏట కలలు కన్నారు! 28వ ఏట చెరసాలలో కలలకు భావము చెప్పారు! ౩౦వ ఏట రాజు కలలకు భావము చెప్పారు!

5) దేవుని యందు భక్తికలిగి క్రమశిక్షణ కలవారు:

దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధమైన చెడు అలవాట్లకు లోనుకాని వాడు, అంతేకాకుండా పోతీఫర్ భార్య తనతో పాపం చెయ్యమని అడిగితే అలా పాపం చేసి దేవుని దృష్టికి దోషిని కాకూడదు, యజమానికి ద్రోహము చెయ్యను అని చెప్పారు!

6) చెరలో కూడా చెరసాలలో ఉన్నారు!

చేయని నేరానికి చెరసాలలో నాలుగు సంవత్సరాలు ఉన్నారు!

 

 

7) గోతిలో త్రోయబడ్డారు

అన్నలు కొట్టి నీరులేని గోతిలోకి పడేశారు!

8) గొప్ప పదవులు- అనగా ప్రధానమంత్రి పదవులు చేశారు అన్యుల దేశంలో:

ఐగుప్తు దేశంలో దేశానికి రాజుయొక్క  ముఖ్య సలహాదారుడుగా- ప్రధానమంత్రిగా పనిచేశారు!

9) నమ్మకమైన వారు!

పోతీఫర్ కు నమ్మకమైన వాడు, అందుకే గృహనిర్వాహకుని పోస్ట్ ఇచ్చారు. చెరసాల నాయకునికి నమ్మకమైన వాడు అందుకే చెరసాల నిర్వాహకుని పోస్ట్ ఇచ్చారు. రాజుకి నమ్మకమైన వాడు- అందుకే మొత్తం ఐగుప్తు దేశానికే ప్రధాన మంత్రిగా చేశారు!

10) ఇద్దరు సౌదర్యవంతులు:

సౌందర్యవంతుడు- అందుకే పోతీఫర్ భార్య అతనితో పాపం చెయ్యాలని అనుకుంది. ....

ఆదికాండము 39: 6

అతడు తనకు కలిగిన దంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. *యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను*.

 

11) పరిశుద్ధులు-నీతిమంతులు

పరిశుద్ధుడు నీతిమంతుడు- అందుకే ఎటువంటి చెడు అలవాట్లు లేనివాడుగాను, యజమానురాలు పాపము చెయ్యడానికి రమ్మని పిలిచినా వెళ్ళలేదు!

 

 

 

 

 

12) మనుష్యకుమారుడైన యేసయ్యకి పోలిక:

తన జీవితంలో రాబోయే మనుష్యకుమారుడైన యేసయ్య  యొక్క నీడ !

1) తన 15వ ఏట BC 605లో  నెబుకద్నెజర్ ద్వారా చెరలోనికి పోయారు! బబులోను అనగా దక్షిణ ఇరాక్ లో నివాసం చేశారు!

 

 

2) సుమారు 95 సంవత్సరాలు బబులోనులో నివాసం చేసి బబులోనులోనే సుమారుగా 110వ ఏట చనిపోయారు!

 

3)  యేరూషలేములో యాజకుల పాటశాలలో నేర్చుకుని, 14 సంవత్సరాలకే ఫిలాసఫీలో పట్టబద్రులయ్యారు! (ఈయన యాజకుడు కాదు, యూదా గోత్రము, రాజ వంశము, రాజైన యెహోయాకీమునకు బంధువు, అందుకే చిన్నతనంలోనే తల్లిదండ్రులను తన కల్ల ఎదుట చంపేశారు)

4)  దానియేలు గ్రంధంలో 5 దర్శనాలు చూశారు! నెబుకద్నెజర్ యొక్క కల కూడా దర్శనముగా చూసి దానికి భావము చెప్పారు! బెల్శస్సర్ కి దేవుడిచ్చిన తీర్పు రాతకు అర్ధం చెప్పారు!

 

5) క్రమశిక్షణ కలిగిన వాడు, తానూ తన స్నేహితులు రాజు భుజించే బోజనము మరియు పానము చేసి తాము అపవిత్రులు కాకూడదు అని నిర్ణయించుకుని ట్రైనింగ్ పూర్తి అయ్యేవరకు కాయగూరలు- నీరు మాత్రమే త్రాగారు! తర్వాత మంచి పదవిలో ఉన్నా తమ క్రమశిక్షణ మానలేదు, ముమ్మారు ప్రార్ధన చెయ్యడం మానలేదు!

6) దేవునికి ప్రార్ధించినందుకు సింహాల బోనులో వేసేశారు! ఇంకా ట్రైనింగ్ మొత్తం కాన్సంట్రేషన్ కాంపులో ఉన్నారు. ఇది రాజభోగాలున్న హాస్టల్ కానేకాదు! బలవంతంగా రాజు పనిచేయించే ఒక చెరసాల! మాట వినకపోతే అక్కడే చంపేస్తారు!

7)  సింహపు బోనులోనికి పడేశారు!

 

8)  బబులోను దేశంలో ఏడుగురు రాజులకు ముఖ్య సలహాదారుడుగా- ముగ్గురు చక్రవర్తుల కాలంలో ప్రధానమంత్రిగా పనిచేశారు!

 

 

9)  ఏడుగురు రాజులకు నమ్మకమైన వాడు! అందుకే ఏడుగురు రాజుల  దగ్గర ఉన్నతమైన పదవులు చేశారు! బబులోను సామ్రాజ్యం లోను, మాదీయ- పారశీక అలయన్స్ సామ్రాజ్యంలోనూ ప్రదానమంత్రిగాచేశారు!

 

10)  నెబుకద్నేజర్ రాజు విద్యావంతులను సౌదర్యవంతులను మాత్రమే చెరలోనికి తీసుకుని పోయాడు, మిగిలిన వారిని అక్కడే చంపేశాడు! కాబట్టి దానియేలు సౌదర్యవంతుడు!

దానియేలు 1: 3

రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను: *ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి*,...

11)  పరిశుద్ధుడు-నీతిమంతుడు- అందుకే రాజు ఎన్నో పదవులు ఇచ్చారు! అందుకే శత్రువులు దానియేలులో తప్పులు దొరకక ప్రార్ధన చెయ్యడమే నేరంగా చేయించి సింహాల బోనులో వేశారు!

దానియేలు 6: 4

అందుకా ప్రధానులును అధిపతులును రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయినను లోపమైనను కనుగొనలేకపోయిరి.

12)  తన గ్రంధంలో దేవుడు మనుష్యకుమారునిగా ప్రత్యక్షపరచుకున్నారు! మనుష్యకుమారుడు ఎలా ఉంటారో గ్రంధంలో చెప్పారు!

 

ఇవీ యోసేపు- దానియేలు గారి పోలికలు!

దైవాశీస్సులు!

 

*ఫలించెడి కొమ్మ*

*20వ భాగం*

*యోసేపు- యేసుక్రీస్తుప్రభులవారి పోలికలు*

 

   ప్రియ దైవజనమా! మనము యోసేపు గారి జీవిత విధానమును ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! గతభాగంలో యోసేపు గారికి దానియేలు గారికి ఎన్నో దగ్గర పోలికలు చూసుకున్నాము!! ఈరోజు  యోసేపుకి యేసుక్రీస్తుప్రభులవారికి కూడా ఎన్నో పోలికలున్నాయి!!! బైబిల్ పండితులు 100 పోలికలు చెబుతారు. గాని కొన్నింటిని మాత్రమే  ధ్యానం  చేసుకుందాం!

 

యోసేపు

యేసుక్రీస్తుప్రభులవారు

1).  *విమోచకుడు మరియు పోషకుడు*

యోసేపు: యాకోబు మరియు అతని కుమారుల విమోచకుడు మరియు కరువులో పోషించిన వాడు!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

2) *తండ్రికి ప్రియమైన పుత్రుడు*:

యోసేపు: ఆదికాండం 37:4 ప్రకారం యాకోబు- యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు అందుకే విచిత్రమైన నిలువుటంగీ కుట్టించి ఇచ్చాడు!..

ఆదికాండము 37: 3

మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువుటంగీ కుట్టించెను.

 

 

) *ఎండిన భూమిలో మొలిచిన మొక్క*:

యోసేపు: యాకోబు యొక్క ముసలితనములో పుట్టిన వాడుఅనగా ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాంటి వాడు...

ఆదికాండము 37: 3

మరియు *యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు* గనుక తన కుమారులందరికంటె ఎక్కు వగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.

4) *ద్వేషించబడ్డారు, అవమానపరచబడ్డారు*

యోసేపు: అన్నలతో ద్వేషించబడి, ఎన్నో అవమానాలు పొంది, చివరకు హింసించబడ్డాడు ఆదికాండం 37:2327

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

5) *తాను అధికారం పొందబోతున్నట్లు సింహాసనం అధిరోహించబోతున్నట్లు ముందుగానే చెప్పారు*:

యోసేపు: తన కలల ద్వారా త్వరలో అధికారం పొందబోతున్నట్లు సింహాసనం అధిరోహించబోతున్నట్లు చెప్పారు

ఆదికాండము 37: 7

అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను.

 

 

 

6) *పిచ్చోడు అని పిలిపించు కున్నారు*

యోసేపు: వచ్చిన కలలు చెబితే అన్నలు పిచ్చోడు అన్నారు, గేలిచేశారు

 

 

 

 

 

 

 

7) *సొంత వారితోనే వెండి నాణెములకు అమ్మబడ్డారు*:

యోసేపు: సొంత అన్నలతో 20 వెండి  నాణెములకు అమ్మబడ్డాడు 

ఆదికాండము 37: 28

మిద్యానీయు లైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.

8) *గోతినుండి లేక మరణం నుండి లేపబడ్డారు/తీయబడ్డారు*

యోసేపు: గోతిలోనుండి తీయబడి ఇష్మాయేలీయులకు అమ్మబడ్డాడు 37:28

ఆదికాండము 37: 28

మిద్యానీయు లైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.

9) *బానిసగా/ పరిచారకునిగా పనిచేశారు*

యోసేపు: ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడి పోతీఫర్ నకు పరిచారకుడిగా పనిచేశారు 39:12

 

 

 

 

 

 

10) *శ్రమలు శోధనలు పరీక్షలు తట్టుకున్నారు*

యోసేపు: పోతీఫర్ భార్య తనతో పాపం చెయ్యమని అడిగితే అలా పాపం చేసి దేవుని దృష్టికి దోషిని కాకూడదు, యజమానికి ద్రోహము చెయ్యను అని చెప్పారు! అందుకు గాను చెరసాల కూడా అనుభవించారు!

 

 

 

 

11) *పాపమునకు లొంగలేదు, శీలాన్ని కోల్పోలేదు*

యోసేపు: పోతీఫర్ భార్య తనతో పాపం చెయ్యమని అడిగితే అలా పాపం చేసి దేవుని దృష్టికి దోషిని కాకూడదు, యజమానికి ద్రోహము చెయ్యను అని చెప్పారు!

 

 

12) *జరుగబోయే సంగతులు ముందుగానే చెప్పారు*

యోసేపు: పానదాయకుల అధిపతి కలల విషయంలోనూ, భక్షకారుల అధిపతి కలల విషయంలోనూ ఇంకా ఫరో కల విషయంలోనూ ముందుగానే జరుగబోయే సంగతులు వివరించి చెప్పారు 41:913

 

 

13) *ఆలోచన కర్త- తద్వారా హెచ్చించబడుట*

యోసేపు: ఫరో కల వివరించాక  రాబోయే విపత్తుని ఎలా ఎదుర్కోవచ్చునో ఫరోకి సలహా చెప్పిన ఆలోచన కర్త

Genesis(ఆదికాండము) 41:33,34,35,36,39,40

33. కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను.

34. ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను అయిదవ భాగము తీసికొనవలెను.

35. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను.

36. కరవుచేత ఈ దేశము నశించిపోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను.

39. మరియు ఫరో: దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు.

40. నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.

14) *మొదట తృణీకరించబడ్డారు- చివరికి వారే దిక్కయ్యారు*

యోసేపు: మొదట అన్నలతో తృణీకరించబడ్డాడు, చివరికి ఐగుప్తులో తానే దిక్కై కుటుంభాన్ని మొత్తం పోషించారు, విమోచించారు

 

15) *తండ్రి ప్రేమించి వస్త్రాలు కొనిచ్చారు*

యోసేపు: ఆదికాండము 37: 3

మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

16) *మెస్సయ్య*!

యోసేపు: యోసేపు మనుష్యకుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారికి నీడ మాత్రమే!

1). యేసుక్రీస్తు ప్రభులవారు: ఆయన పేరే రక్షకుడు, పాపములనుండి విమోచించిన వాడు!.

మత్తయి 1: 21

తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు (యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.

యెషయా 53: 4

నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

యెషయా 53: 5

మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

ఇంకా ఒకసారి 5000 మందికి మరోసారి 4000 మందిని రొట్టెలు చేపలతో పోషించారు. ఇంకా యోహాను 6:35 లో  నేనే జీవాహారం అన్నారు ...

యోహాను 6: 35

అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,

2) యేసుక్రీస్తు ప్రభులవారు: బాప్తిస్మం పొంది బయటకు వస్తున్నప్పుడు దేవుడు పరవశించి పోయి పలుకుతున్నాడు:

మత్తయి 3: 17

మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

మత్తయి 17: 5

అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్ధము ఆ మేఘములోనుండి పుట్టెను.

౩) యేసుక్రీస్తు ప్రభులవారు: యెషయా 53:2 లో యెషయా ప్రవచిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభులవారికోసంలేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను...

 

 

 

 

4) యేసుక్రీస్తు ప్రభులవారు: ఏ నేరము చేయకుండానే  పరిసయ్యులతో సద్దూకయులతో ద్వేషించబడ్డాడు, అవమానాలు పొందారు, చివరకు హేరోదు పిలాతు బంటులతో అవమానాలు పొందారు, ఉమ్మి వేయించుకున్నారు.

Matthew(మత్తయి సువార్త) 27:29,30,31

29. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని: యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి

30. ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.

31.ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొని పోయిరి.

యోహాను 15: 25

అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగెను.

5) యేసుక్రీస్తు ప్రభులవారు: సిలువ వేయబడక మునుపు ప్రధాన యాజకుడు అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభులవారు జవాబు చెప్పారు: ఇది మొదలుకొని మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటారు అన్నారు ....

మత్తయి 26:6364

63. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి: నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు: నీవన్నట్టే

64. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా

6) యేసుక్రీస్తు ప్రభులవారు: ఆయనను అస్తమాను ప్రజలు పిచ్చివాడు అని గేలిచేశారు.

మత్తయి 27:29 ..

ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని: యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి

మార్కు 3: 21

ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.

7) యేసుక్రీస్తు ప్రభులవారు: తన సొంత శిష్యుడు ఇష్కరియోతు యూదా ద్వారా ౩౦ వెండి నాణెములకు అమ్మబడ్డారు

మత్తయి 26: 15

నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.

 

 

8) యేసుక్రీస్తు ప్రభులవారు: సిలువ మరణం తర్వాత పునరుత్తానుడై లేచారు

1కోరింథీయులకు 15: 4

లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.

 

 

 

 

9) యేసుక్రీస్తు ప్రభులవారు:  ఆయన మాటలు వినండి: నేను పరిచర్య చేయడానికి ప్రాణం పెట్టడానికి వచ్చాను,

మార్కు 10: 45

మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.

ఫిలిప్పీ 2:7

మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

10) యేసుక్రీస్తు ప్రభులవారు: మనలాగే ఆకలిదప్పులు అనుభవించారు, పరిసయ్యుల సద్దూకయుల, సైనికుల  శ్రమలను సహించారు , చివరికి పరిచర్య ప్రారంబించే ముందు సాతాను ద్వారా శోధించబడ్డారు మత్తయి 4:111

హెబ్రీ 4:15

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

11) యేసుక్రీస్తు ప్రభులవారు: పరిశుద్దునిగా జీవించి నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించగలడు అంటూ సవాలు విసిరినా పరిశుద్ధుడు!

యోహాను 8: 46

నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?

12) యేసుక్రీస్తు ప్రభులవారు: మత్తయి 24 లోను లూకా సువార్త లోను ఆయన రాకడ విషయంలోనూ, ఇంకా జరుగబోయే విషయాలు ముందుగానే చెప్పారు, ప్రకటన గ్రంధం వ్రాయించుకున్నారు.

యోహాను 13: 19

జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను.

13) యేసుక్రీస్తు ప్రభులవారు: ఆయన పేరే ఆలోచన కర్త

యెషయా 9: 6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. *ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త* *బలవంతుడైన దేవుడు* నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

Philippians(ఫిలిప్పీయులకు) 2:9,10,11

9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

 

 

 

 

 

14) యేసుక్రీస్తు ప్రభులవారు: మొదట అందరూ తృణీకరించారు, ఇప్పుడు ఆయన ద్వారానే తప్ప మోక్షానికి  మరో మార్గం లేనేలేదు .. నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై యున్నాను, నాద్వారా తప్ప ఎవడును తండ్రియొద్దకు చేరలేడు అని చెప్పారు.. యోహాను 14:6

15) యేసుక్రీస్తు ప్రభులవారు: తండ్రియైన దేవుడు మహిమా ప్రభావముతో కప్పారు.

మత్తయి 16: 27

*మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై* తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.

హెబ్రీయులకు 1: 3

*ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి*, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక

Philippians(ఫిలిప్పీయులకు) 2:6,7,8,9,10,11

6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

9. *అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని*,

10. *భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును*,

11. *ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును*, *దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను*.

Revelation(ప్రకటన గ్రంథము) 1:13,14,15,16

13. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. *ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను*.

14. *ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను*;

15. *ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను*.

16. *ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను*.

16) యేసుక్రీస్తు ప్రభులవారు: ఆయనే మెస్సయ్య, ఆయనే మనుష్యకుమారుడు.. ఆయనే విమోచకుడు, ఆయనే రాబోవుచున్నవాడు, మన ప్రభువు, మన దేవుడు...

ఆమెన్! హల్లెలూయ!

 

అట్టి ప్రభువును కలిగి ఉన్నందుకు సంతోషిద్దాం! ఒకవేళ ఇంకా ప్రభువుగా రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే రక్షణ దినము!

 నేడే అనుకూల దినము! ఆయనను హృదయం లోనికి ఆహ్వానించి నేడే రక్షణ పొందు!

దైవాశీస్సులు!

**********************************************************************

ప్రియ దైవజనమా! ఫలించెడి కొమ్మ అనే శీర్షిక ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నమ్ముచున్నాను! ప్రభువు చిత్తమైతే మరో శీర్షికతో మరలా కలుసుకుందాం! దయచేసి మాకోసం, మా పరిచర్యల కోసం, సంఘాల కోసం, వెబ్సైట్ కోసం, పేజీల కోసం , సోషల్ మీడియా పరిచర్య కోసం, చేస్తున్న ఉద్యోగం కోసం ప్రార్ధన చెయ్యండి!

ఇట్లు

ప్రభువునందు

మీ ఆత్మీయ సహోదరుడు

                                                                                                                                                                                                                                                                    *రాజకుమార్ దోనె*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పాపము

అబ్రాహాము విశ్వాసయాత్ర

పక్షిరాజు

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

శరీర కార్యములు

విశ్వాసము

సమరయ స్త్రీ

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు