యోనా -The Backslider

*యోనా- The Backslider*

*ఉపోద్ఘాతం*

 

   అది సుమారు క్రీ. పూ. 786 సంవత్సరం! రాజైన యరోబాము -2 పరిపాలిస్తున్నాడు! అది ఇశ్రాయేలు రాజ్యము అనగా యూదా రాజ్యము నుండి విడిపోయింది! ఇశ్రాయేలు ప్రజలు దేవుడంటే భయములేకుండా జీవిస్తున్న రోజులు! స్త్రీలు పురుషులు అక్రమంగా బలాత్కారంగా జీవిస్తున్న రోజులు! ఆ రోజుల కోసం దైవజనుడైన ఆమోసు గారు ఇలా రాస్తున్నారు:  

ఆమోసు 4:13

1. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా

2. ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతను, మీలో శేషించినవారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు.

3. ఇటు అటు తొలగకుండ మీరందరు ప్రాకారపు గండ్లద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలి వేయబడుదురు; ఇదే యెహోవా వాక్కు.

 

  ప్రియులారా! మనం ఇశ్రాయేలు చేసిన పాపాల చిట్టా/ లిస్టు చూస్తున్నాం.  ప్రియ దైవజనమా!   ఇశ్రాయేలు దేశంలో  పేదలను అణగద్రొక్కేవారు, పేదలను మ్రింగేవారు, పేదలను దోచుకునేవారు. అయితే వారు ఎవరు? వారు పురుషులు మాత్రమే అనుకుంటే మీరు తప్పులోను, పప్పులోనూ కాలు వేసినట్టే! పై వచనాలలో ఎవరో అంత స్పష్టముగా లేదు గాని, చాలా ప్రతులలో దిక్కులేనివారిని బాధిస్తూ, బీదలను అణగద్రొక్కే స్త్రీలారా! అని వ్రాయబడింది. ఉదాహరణ ఒక తర్జుమా చూసుకుందాం! . .. .

 

షోమ్రోను కొండమీద ఉన్న బాషాను ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ బీదలను అణగద్రొక్కుతూ ఉన్న స్త్రీలారా! మద్యపానం తీసుకురాఅని మీ భర్తలతో చెప్పేవారలారా!. . .

 

 పై వచనాలు చూసుకుంటే పురుషులను మించి- పేదలపై దౌర్జన్యం చేసేది ఆరోజులలో స్త్రీలే!  నేనుకాదు చెప్పేదిబైబిల్ గ్రంధము మరియు ప్రవక్తలు! వారు ఎంతఘోరముగా ఉన్నారో ఒకసారి ప్రవక్తల మాటలలో చూసుకుందాం.

 

    మొదటి వచనం చూడండి: షోమ్రోను కొండమీద ఉన్న భాషాను ఆవులారా! బాషాను ఆవులు బొద్దుగా ఉంటాయి. ఇశ్రాయేలు పచ్చిక మైదానాలలో మేస్తుంటాయి. బాగా పాలు ఇస్తాయి. అయితే ఇక్కడ ప్రవక్త భాషాను ఆవులు అని ఎవరిని గూర్చి అన్నారంటే: ఇశ్రాయేలు దేశంలో గల ధనిక స్త్రీలు కోసం ఈమాట అంటున్నారు. భాషాను ఆవులను-- ధనిక స్త్రీలతో పోలుస్తున్నారు . వీరు ఏమిచేస్తున్నారుదిక్కులేని వారిని భాదిస్తూ, బీదలను అణగద్రొక్కుతూ ఉన్న స్త్రీలారా! చూసారాఇక్కడ దిక్కులేని వారిని భాదించేది, బీదలను అణగద్రొక్కేది స్త్రీలే అట! ఒకసారి మరలా మనం 2:67 చూసుకుందాం ఇక్కడ నిర్దోషులను అమ్మేసేవారు , బీదలను ఫారిన్ పాదరక్షలకోసం అమ్మేసింది, నేలమట్టిని త్రొక్కినట్లు దిక్కులేనివారి తలలను త్రొక్కింది ఎవరుస్త్రీలే! పురుషులు కంటే ఎక్కువగా పేదలను భాదించినది స్త్రీలే! ఎంత ఘోరమండి!! స్త్రీలలో సహజముగా జాలి, దయ కరుణ, ఓర్పు అనేది దేవుడు పెట్టారు. అయితే వీరు వాటిని త్రొక్కేసి- పేదలను త్రొక్కేస్తున్నారు. ఆమోసుగారికి స్త్రీలంటే పడదా? ఇలా చెప్పటానికి? కాదు కాదు! ఆయన కంటితో చూసినదే వ్రాస్తున్నారు. దేవుడు చెప్పమన్నదే చెబుతున్నారు. ఆమోసుగారికి మీరు అనుకున్నట్లు స్త్రీలు అంటే ఈర్ష అందుకే ఇలా వ్రాసారు అనుకుంటే మరి మిగతా ప్రవక్తలు ఏమన్నారో చూద్దాంఆకాలంలో ఉన్న ప్రవక్తలు: యెషయా, యిర్మియా, యేహెజ్కేలు వీరంతా వీరికోసం/ స్త్రీలకోసం వ్రాసారు. అప్పటి స్త్రీలు ఎలా ఉండేవారో ఆమోసుగారి తర్వాత వచ్చిన యేహెజ్కేలుగారి మాటలలో విందాము:

 

 Ezekiel(యెహెజ్కేలు) 13:17,18,19,20

17. మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెలమీద కఠినదృష్టియుంచి వారికి విరోధముగా ఈలాగు ప్రవచింపుము

18. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మనుష్యులను వేటాడ వలెనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలుకుట్టి, యెవరి యెత్తు చొప్పున వారి తలలకు ముసుకులు చేయు స్త్రీలారా, మీకు శ్రమ; మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు.

19. అబద్ధపు మాటల నంగీకరించు నా జనులతో అబద్ధఫు మాటలు చెప్పుచు, చేరెడు యవలకును రొట్టెముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు, బ్రదుకుటకు అపాత్రులైన వారిని బ్రదికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు.

20. కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధములచేత మీరు దుఃఖింపజేయుదురు, దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించు కొనకుండ మీరు వారిని ధైర్యపరతురు గనుక . . .

 

చూసారా ఎంతఘోరంగా ఉన్నారో!!

 

మరో విషయం: ఇశ్రాయేలు ప్రజలకు సోలోమోను గారి తర్వాత ఆర్ధికంగా బలపడ్డ కాలము ఇదే! ఆ రోజులలో యరోబాము రాజు ప్రక్కనున్న చాలారాజ్యాలు జయించి సామంతరాజ్యాలుగా చేశారు! సిరియాను, మోయాబు దేశాన్ని అనేక దేశాలు‌ జయించి, ఇంకా ఎన్నో దేశాలతో వ్యాపార సంబంధాలు పెట్టుకుని వారితో వ్యాపారం చేసి అత్యధికమైన ధనవంతమైన రాజ్యముగా మారిపోయింది! ఒకవేళ ఆ రాజ్యముతో వ్యాపారానికి అన్యదేవతలను పాటిస్తేనే లేక మ్రొక్కితేనే గాని మేము మీతో వ్యాపారం చెయ్యను అంటే వ్యాపార లాభం కోసం అన్యదేవతలను పూజిస్తూ, భయంకరమైన వ్యభిచారం కూడా చేస్తూ ఏవిధముగానైనా ఆర్ధికంగా బలపడాలి అనే తపనతో పాపములో పడిపోతూ ఆర్ధికంగా అభివృద్ధిలో దూసుకుపోతుంది! దానికోసం దేశంలో ఉన్న పేదలను దరిద్రులను ఎంతో బాధిస్తూ బలము బలగము ధనము లేనివారిని దోచుకుంటూ వారిని బలవంతంగా వారి ఆస్తిని దోచుకుంటూ అవసరమైతే పేదలను ఫారిన్ చెప్పులకోసం ఫారిన్ మధ్యపానం కోసం అమ్మేస్తున్న రోజులు! సరే, ఇలాంటి పరిస్థితులు ఇశ్రాయేలు దేశంలో ఉన్నాయి!

 

   ఇలాంటి పరిస్తితులలో దేవుడు ఒక యవ్వనస్తునితో మాట్లాడటం మొదలుపెట్టారు! మీరు చేస్తున్న అన్యాయాలు మానమని చెబుతూ దేవుని మార్గాలు బోధించడం మొదలుపెట్టారు ఈ యవ్వనస్తుడైన ప్రవక్త!! ఆ రోజులలోనే ప్రవక్త ఆమోసుగారు యూదా రాజ్యము నుండి ఇశ్రాయేలు రాజ్యము వచ్చి బోధించడం మొదలుపెట్టారు!  ఇక ఈ యవ్వనస్తుడు కూడా మీ చెడుమార్గాలు వదలమని బోధించడం మొదలుపెట్టారు! గాని ఆ ప్రజలు వినలేదు సరికదా అనేకసార్లు తిట్టారు అపహసించారు! చివరికి కొట్టి ఊరిబయటకు త్రోసి వేశారు!

 

    ఆ రాత్రి ఈ యవ్వనస్తుడు చాలా బాధపడ్డాడు! తన తండ్రి అన్నాడు: ఎన్ని బాధలు వచ్చినా ఎటువంటి పరిస్తితి ఎదురైనా నీవు మాత్రం దేవునికోసం చెప్పడం మానకు! ఎందుకంటే దేవుడు మన ఇశ్రాయేలు రాజ్యంలో అనేకసంవత్సరాలు నుండి ప్రవక్త అన్నవాడు లేడు, దేవునికోసం బోధిస్తే కొట్టి పంపేస్తున్నారు నీవు మాత్రం దేవుని వదిలివేయకు అన్నాడు తండ్రి! తన ఇద్దరు తమ్ముళ్ళు, తన ముద్దుల చెల్లి ఎంతగానో సపోర్ట్ చేశారు! చెల్లి యోహన్నా అన్నా నీవు ఈ కాలపు ఏలీయావు! దేవుడు నిన్ను వాడుకుంటున్నారు! ఎవడేమన్నా నీవు మాత్రం దేవుని వదలకు అని ధైర్యం చెబుతూ ఉండేది!

 

ఈ ప్రవక్త పేరు యోనా! యోనా అనగా తెలుగులో అర్ధం గువ్వ!!  ఇంటికి పెద్ద కుమారుడు! తండ్రిపేరు అమిత్తయి! ఇదే మనకు యోనా గ్రంధంలో వ్రాయబడి ఉంది: యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

 

గాని 2 రాజులు 14:25 ప్రకారం దేవుడు యరోబాముకి చెప్పమన్న మాటలు చెప్పినట్లు, ఇంకా యోనా గారి ఊరు గాత్ పహేరు అని కూడా రాసి ఉంది

25. గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్తద్వారా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకుపోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలువారి సరి హద్దును మరల స్వాధీనము చేసికొనెను.

 

అనగా రాజైన యరోబాము-2 కాలంలో ఉన్నవాడు అనీయు, గాత్ పహేరు అనే గ్రామానికి చెందిన వాడు అని అర్ధం అవుతుంది. ఈ గాత్ పహర్ అనేది గలిలియ సముద్రపు (కిన్నెరెతు సరస్సు) ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లెటూరు అని అర్ధం అవుతుంది! తండ్రి వృత్తి ఏమిటి, గోత్రం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు! అయితే కొందరు లేవీ గోత్రానికి చెందిన వాడు అంటారు! గాని యరోబాము-1 కాలంలో చాలావరకు లేవీయులు యాజకులు ఇశ్రాయేలు దేశం వదిలి యూదా రాజ్యం వచ్చినట్లు మనం చూడగలము గనుక బహుశా మరో గోత్రానికి చెందిన వాడు అని నా ఉద్దేశం!!!

 

యోనా ప్రవక్త కోసం మరో కధ కూడా వాడుకలో ఉంది! రబ్బానిక్ స్క్రిప్ట్చర్ ప్రకారం  ఈ యోనా ఎవరో కాదు సారెపతు విధవరాలి కుమారుడు! చనిపోతే ఏలీయా గారి ప్రార్ధించి బ్రతికించిన కుర్రవాడు ఈ యోనా అంటారు! అంతేకాకుండా ఆ తర్వాత విధవరాలు మరియు ఈ యవ్వనస్తుడు దేవుణ్ణి అంగీకరిస్తారు! ఏలీయా గారు మరలా ప్రవక్తల శిష్యుల పాటశాల ప్రారంభించినప్పుడు ఏలీయా గారి దగ్గర, ఎలీషా గారి దగ్గర ట్రయనింగ్ అయ్యాడు! చివరకు యెహూకు అభిషేకం చెయ్యడానికి ఎలీషా గారు పంపించిన ప్రవక్తల శిష్యులలో ఒకడు ఎవరో కాదు, ఈ యోనా అంటారు! మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు!!

 

 సరేఇలా కాలం సాగుతూ ఉండగా ఒకరోజు హటాత్తుగా తండ్రియైన దేవుడు ప్రత్యక్షమై యోనా నీవు నీనేవే పట్టణానికి వెళ్ళి దానిమీదికి దుర్గతి వస్తుంది, 2. నీనెవెపట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. 40 రోజులలో దానిని నాశనం చేస్తానని దుర్వార్త చెప్పిరా అన్నారు దేవుడు! మరోసారి రెట్టించాడు యవ్వనస్తుడైన యోనా! అస్సీరియా రాజధాని నీనేవే కు వెళ్ళి ఈ వార్త చెప్పమని చెప్పారు దేవుడు! దేవునితో ఏమీ సమాధానం చెప్పలేక పోయాడు! ఆ స్వరము తనకు సుపరిచమైనదే! తన దేవుడు యెహోవా దేవుని స్వరమును తాను బాల్యం నుండి వింటున్నాడు అందుకే ఇక ఏమీ మాట్లాడడం లేదు! ఉదయమైంది తన తండ్రిని తన తమ్ముళ్లను చెల్లిని పిలిచి చెప్పాడు విషయం!! పెద్ద తమ్ముడు వెళ్లొద్దు అన్నాడు! ఎందుకంటే దానికి అలాంటి శిక్షయే పడాలి! ఎందుకంటే దానికోసం అనేకమైన విషయాలు విన్నాడు తాను! ఒక్కమాట చెప్పాలంటే అది ఒక బలాత్కారుల దేశం! రాజు దగ్గరనుండి మామూలు పౌరుడు వరకు బలాత్కారమే వారి వృత్తి! ధనము బలము బలగము లేకుండా ఏ స్త్రీ పురుషుడు కనబడినా వారిని దోచుకోవడం హింస పెట్టడం అలవాటు! దేశంలో శాంతి అనేది ఎక్కడా కనబడదు! భయంకరమైన వ్యభిచారం చేస్తున్న రాజ్యం! దారి దోపిడీలు, మధ్యాహ్నమే పేదలను బలవంతంగా దోచుకుని వారి ఆస్తిని కాజేస్తారు! దేవుని భయం అసలు లేనేలేదు! అది అస్సీరియా సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం లేక రాజధాని! అందుకే పెద్ద తమ్ముడు వెళ్లొద్దు అంటున్నాడు! చిన్న తమ్ముడు అంటున్నాడు: నీవు నీనేవే అనే పేరు పొరబాటున  విన్నావేమో! ఎందుకంటే దేవుడు ఇంతవరకు ఏ ప్రవక్తనూ పరాయి దేశం, ముఖ్యంగా శతృదేశం వెళ్ళి ప్రవచించమని చెప్పలేదు అన్నాడు! గాని తనకు తెలుసు- అది దేవుని మాట అని! నీనేవే వెళ్ళమని దేవుడు చెప్పడం సరిగానే విన్నాడు! చెళ్లి చెప్పింది: దేవుడు నిన్ను ఏలీయా వలె వాడుకుంటున్నారు! బహుశా దేవుడు నీనేవే పట్టణాన్ని నీ ద్వారా రక్షించాలని అనుకుంటున్నారేమో! నీ పిలుపు నీ పట్ల దేవుని ప్రణాళిక ఏర్పాటు బహుశా ఆదేనేమో! కాబట్టి నీవు తప్పకుండా వెళ్ళాలి! దారిలో నీకు బోలెడు రొట్టెలు అవసరమవుతాయి, కారణం నీవు 650 మైళ్ళు వెళ్ళాలి, కనీసం 20 రోజుల ప్రయాణం! అందుకే రొట్టెలు చెయ్యడం మొదలుపెడతాను. అంతేకాదు అన్నయ్యలు చెబుతున్నట్లు నీనేవా వారు దుర్మార్గులు కావచ్చు, బలాత్కారులు కావచ్చు గాని వారినుండి కూడా దేవుడు నిన్ను తప్పిస్తారు! ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు ఎదురైనా నీవు మాత్రం నీనెవేకి వెళ్ళు! వారికి దుర్గతి కోసం చెప్పు! అప్పుడు దేవుడు ఇంకా అధికముగా నిన్ను వాడుకుంటారు అని చెప్పింది! తండ్రి అన్నాడు: నీతో మాట్లాడుతున్నవాడు దేవుడు! ఆయన మాటకి లోబడు! దేవుడే నీ సంగతి చూసుకుంటాడు!

 

   ఆ రాత్రి ఎవరితోనూ మాట్లాడలేదు యోనా! ఉదయం నాలుగు గంటలకు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతున్నాడు! ఏదో శబ్ధాలు వస్తున్నాయి అని చెల్లి లేచి చూస్తే యోనా ఒక్కడే వెళ్లిపోతున్నాడు! చెల్లి చాలా దూరం పరుగెత్తి అన్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ! తర్షీసు ,

 దేవుడు నిన్ను నీనేవే  కదా వెల్లమంది మరినీవు తర్షీసు ఎందుకు పోతున్నావు?

అది నా ఇష్టం! నేను నీనేవే  వెళ్లను!

మరి నీవు వెళ్లకపోతే ఆ విషయం వారికి ఎవరు చెబుతారు? ఎవరూ చెప్పకపోతే వారు నశించి పోతారు కదా! అడిగింది చెల్లి!

పోతే పోనెయ్ నాకేం? అన్నాడు!

అది తప్పుకదా దేవుని ఆజ్నను మీరినట్లే కదా! ఏమీ చెప్పలేదు యోనా! వెళ్లిపోతున్నాడు ఒంటరిగా-

మరి ఎప్పుడు మరలా వస్తావు?

నేను రాను ఇక గాత్ పహేర్ కి! నాకోసం ఎదురు చూడవద్దు! తర్షీసు లో ఏదో పనిచేసుకుని బ్రతుకుతాను బై అన్నాడు!

 

చెల్లికి ఎంతో దుఖం వచ్చింది! మొదటిది దేవుడు తన అన్నను ప్రవక్తగా వాడుకుంటూ ఉంటే దేవునికి దూరంగా పోవడమే కాదు దేవుని మీద తిరగబడుతున్నాడు అన్నయ్య! ఇప్పుడు దేవుడు కోపపడితే అన్న పరిస్థితి ఏమిటి?

 

రెండు: తన తల్లి చనిపోతే తల్లీ కంటే ముద్దుగా గొప్పగా ప్రేమతో చూసుకుంటున్నాడు- తాను ప్రేమించిన అన్నయ్య! ఇప్పుడు ఎప్పటికీ రాను అని చెప్పి వెళ్లిపోతున్నాడు! అందుకే గుండెలు బాదుకుని ఏడుస్తుంది చెల్లి! ఈ ఏడుపుకి తండ్రి లేచి వచ్చి సంగతి విని తాను కూడా బాధపడ్డాడు!

 

ప్రియ సహోదరి సహోదారుడా! ఈ యవ్వనస్తుడు దేవుడు తనకి చెప్పమన్న వార్తని చెప్పకుండా వెనుకడుగు వేసి దేవుని నుండి దూరంగా పోతున్నాడు! దేవుడు నీనేవే వెల్లమంటే తర్షీసు వెళ్లిపోతున్నాడు! నీనేవేలో తనకోసం ఎన్నో విమర్శలు, అవమానాలు దెబ్బలు అవసరమైతే ఖడ్గము తనకోసం ఎదురుచూస్తుంది అనుకున్నాడు! అందుకే కంఫర్ట్ కోసం తర్షీసు వెళ్లిపోతున్నాడు! ఈరోజు ప్రియ యవ్వనస్తుడా! ప్రియ  దైవజనుడా నీవు కూడా అనుకూల సదుపాయాలు కోసం, లగ్జరీ లైఫ్ కోసం దేవుడు చెప్పమన్న సువార్తను వదిలి కాలహరణం చేస్తున్నావా?

 

దేవుడు యోనాకు నీనెవే వెళ్ళి దుర్గతి వస్తుంది అని చెప్పమంటే సదుపాయాలు ఉండవు అని మరో దేశం పారిపోయాడు! ఈ రోజు నీవు కూడా సంఘములో దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, సంఘములో గల పనిని వదిలివేసి- సినిమాల వెనుక, క్రికెట్ మాచ్ లు అంటూ, ఫ్రెండ్స్ అంటూ దేవునికి దేవుని పరిచర్యకు దూరంగా పోతున్నావా?

 

1,20,000 మందికి దుర్వార్తతో కూడిన సువార్త చెప్పమంటే తన స్వంత వ్యాపారం కోసం దేవుని మార్గం వదిలి లోకమార్గంలోకి పోయాడు ఈ యవ్వనస్తుడు! మరి నీవు ఏం చేస్తున్నావు?

జాగ్రత్త! యోనా దెబ్బతిన్నట్లే నీవు దెబ్బతింటావు!

 

ఒకని ఎదుట  సరియైనదిగా కనబడిన మార్గం తనకు ఎంతో తిన్నగా కనబడినా చివరికి అది నాశనానికి కొనిపోతుంది అని సామెతల గ్రంధంలో వ్రాయబడింది! కాబట్టి నీ స్వంత యిష్టము, నీ స్వంత నిర్ణయాలు నిన్ను నాశనానికి, నరకానికి కొనిపోతాయి కాబట్టి దేవుని మాటకు లోబడు! ఆయన నిన్ను కాపాడువాడు! ఆయన కునుకడు నిద్రపోడు!

 

నేడే నీ మార్గమును సరిచూసుకోమని మనివి చేస్తున్నాను!

దైవాశీస్సులు!  

*యోనా- The Backslider*

*రెండవ భాగం*

 

యోనా 1:310

3. అయితే యెహోవా సన్నిధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.

4. అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.

5. కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను

6. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను.

7. అంతలో ఓడ వారు ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.

8. కాబట్టి వారు అతని చూచి యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా

9. అతడు వారితో ఇట్లనెను నేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులుగల వాడనై యున్నాను.

10. తాను యెహోవా సన్నిధిలోనుండి పారి పోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి యుండెను గనుక వారా సంగతి తెలిసికొని మరింత భయ పడినీవు చేసిన పని ఏమని అతని నడిగిరి.

 

   ప్రియులారా! మనం యోనా కోసం ధ్యానం చేస్తున్నాము! దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియులారా! ఆధ్యాత్మిక సందేశాలు-10 సిరీస్ లో భాగంగా మరోసారి దైవజనుడైన యోనా గారి యొక్క జీవిత చరిత్రతో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది! అట్టి కృప నిచ్చిన దేవాదిదేవునికి నిండు వందనాలు!!

 

   గతభాగంలో యోనా గారు పుట్టబోయేసరికి ఇశ్రాయేలు రాజ్యం ఏ రకమైన పరిస్తితులలో ఉందో చూసుకున్నాము! దేవుడు యోనా అనే యవ్వనస్తుని నీనేవే అనగా అస్సీరియా సామ్రాజ్యం ముఖ్య పట్టణానికి వెళ్ళి దుర్గతి వస్తుంది అని ప్రకటించమంటే భయపడి తర్శీసు వెళ్ళడానికి బయలుదేరాడు! గమనించాలి ఆ కాలంలో ఇశ్రాయేలు దేశంలో ఏకైక పెద్ద ఓడరేవు   యొప్పేకి ప్రయాణమై పోయాడు! ప్రస్తుతం జోఫ్ఫా! యొప్పే ఇస్రాయేల్‌ దేశంలో మధ్యధరా తీరాన ఉంది.

 

నీనెవెకోసం ఆదికాండము 10:11; 2 రాజులు 19:36; నహూము 13 అధ్యాయాలు; జెఫన్యా 2:13; మత్తయి 12:41. నీనెవె అష్షూరువారి ప్రధాన నగరం, ఆ రోజుల్లో ప్రపంచంలోకెల్లా గొప్ప నగరం. ఒక పురాతన వృత్తాంతం ప్రకారం ఆ నగరం, దాని శివార్లు, అనుబంధ పట్టణాల చుట్టుకొలత దాదాపు 100 కి.మీ. ఉండేది. ఇస్రాయేల్‌లో యోనా స్వగ్రామం నుంచి నీనెవె దాదాపు 650 మైళ్ళు అనగా 1046  కి.మీ. దూరాన ఉంది. దానిలో ఉన్న చెడుతనం నహూము గారి రోజుల్లో నీనెవె మదించి, హింసాత్మకంగా, క్రూరంగా, పూర్తిగా చెడిపోయి ఉంది (నహూము 1:11; నహూము 2:12-13; నహూము 3:1, నహూము 3:4, నహూము 3:16, నహూము 3:19).

యోనాగారి  కాలంలో కూడా ఇలాగే  ఉంది  3:8. అది ఇస్రాయేల్‌ దేశానికి బద్దవిరోధి యోనా కాలం తరువాత అది ఉత్తర రాజ్యాన్ని చితగ్గొట్టి దాని ప్రజను బందీలుగా తీసుకుపోయింది. 2 రాజులు 17:3-6 చూడండి. దేవుడు కొన్ని సార్లు తన సేవకులకు అతి కష్టమైన, చెయ్యడానికి ఏమాత్రం ఇష్టంలేని పనులను అప్పగిస్తుంటాడు. ఆ పనులను చెయ్యవలసిన అవసరం వారికి కనిపించకపోవచ్చు కూడా. కానీ యోనాకి నీనేవే వెళ్ళడానికి ససేమిరా ఇష్టం లేదు! అందుకే తర్షీసు వెళ్దాము అనుకున్నాడు ఈయన!

 

తర్‌షీషు  నేటి స్పెయిన్ దేశం దక్షిణ కొనలో ఉన్నాది. ఇది నీనెవెకు వ్యతిరేక దిశలో ఉంది. అతడు ఇంతకంటే దూరంగా పారిపోగల నగరమేదీ లేదు.  ఇది ఇశ్రాయేలు దేశానికి 2250 మైళ్ళు అనగా 3500 కి. మీ  దూరంలో ఉంది!

 

గమనించాలి గలలియ నుండి నీనేవే నార్త్ ఈస్ట్ లో ఉంది, గలలియ నుండి తర్శీసు నార్త్ వెస్ట్ లో ఉంది! ఇప్పుడు యోనా యొప్పే 67 మైళ్ళు దూరం రెండు రోజులు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సిద్ధంగా ఉన్న తర్శీసుకి పోయే సరకుల ఓడలోనికి ఎక్కాడు! రెండు రోజులు బాగా నడిచి వచ్చాడేమో, వారు పెట్టిన అన్నం తిని ఓడ దిగువ భాగమునకు పోయి మత్తుగా నిద్రపోయాడు! ఓడ యొప్పే రేవు దాటిపోయింది నెమ్మదిగా బయలుదేరింది మధ్యధరా సముద్రం లో (మెడీటెరీయన్ సీ )!

 

ఇప్పుడు దేవుని కార్యం మొదలైంది! దేవుని మాట వినకుండా తర్శీసుకి  పారిపోతున్నాడు దేవుడు నన్ను చూడటం లేదు అనుకున్నాడు ఈ ప్రవక్త! గాని దేవునికి కనబడనివి ఏవీ లేవు! ఇదేకదా భక్తుడు రాస్తున్నాడు: ఆయనకి కనబడని సృష్ఠము ఏదీ లేదు హెబ్రీ 4:13

హెబ్రీయులకు 4: 13

మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.

 

అందుకే దావీదు గారు అంటున్నారు: యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలిసికొని యున్నావు అంటూ నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసు, నేను సముద్ర దిగంతాలలో పయనించినా నీవు చూస్తున్నావు అంటున్నారు..

Psalms(కీర్తనల గ్రంథము) 139:1,2,3,4,5,7,8,9,10,11,12,13,14,15,16

1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు

2. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

3. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.

4. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.

5. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నా మీద ఉంచియున్నావు.

7. నీ ఆత్మయొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును?

8. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు

9. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను

10. అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును

11. అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల

12. చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి

13. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.

14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

15. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండ లేదు

16. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.

 

5 వ వచనం ప్రకారం యోనా అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను.. 

 

4 వ  వచనం చూసుకుంటే 4. అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.

 

ఓడ బద్దలై పోయే స్తితి వచ్చింది తుఫాను దెబ్బకి! నన్ను ఎవరూ చూడటం లేదు, నా బతుకు నేను బ్రతుకుతాను అనుకున్నాడు ప్రవక్త, గాని దేవుడు తన పని తాను చేయించుకోడానికి ఏదైనా చేయడానికి దేవుడు సిద్ధమే!!!

 

చాలామంది ఏమని అనుకుంటారు అంటే నేను తప్పించుకుంటే దేవుడు ఆ పని మరొకరికి అప్పగించేస్తారు, నేను తప్పించుకుంటాను అని! కాదండీ- మోషే గారు ఎన్నో సాకులు చెప్పి తప్పించుకుందాము అనుకున్నారు గాని ఆయన వల్ల కాలేదు! యోనా గారు కూడా తప్పించుకుందామని మరో దేశం పారిపోతుంటే ఇప్పుడు గొప్ప తుఫాను పంపించారు! మా నాన్నగారు నాకు చెబుతూ ఉండేవారు- తాను కూడా దేవుడు సేవకు పిలిస్తే 5 సంవత్సరాలు వెళ్లలేదు ఆట! నేను ఇలాగే విశ్వాసిగా ఉంటూ నీ సేవ చేస్తాను, నా కులవృత్తి చేపలు పట్టుకోవడం నేను చేసుకుంటూ నీ సువార్త ప్రకటిస్తాను అన్నారట! ఎన్నో సాకులు చెప్పారు- నాకు చదువురాదు అంటే దేవుడే చదువు నేర్పించారు, నాకు పాటలు పాడటం రాదు అంటే  దేవుడు నేర్పించారు! నాకు వాక్యం చెప్పడం రాదు అంటే ఏ వాక్యం చెప్పినప్పుడు ఏ రిఫరెన్సు చూపించాలి అనేది కూడా నేర్పించారు!  ఇలా ఎన్నెన్నో సాకులు చెప్పి, హమ్మబాబోయ్ నేను నీ సేవ చేయలేను అంటే నిన్ను చంపేస్తాను అన్నారు దేవుడు! నీవు కరుణామయుడవు కదా నీ బిడ్డలని నీవు చంపేస్తావు అంటే- నీవు ఉండి నాకేమీ ఉపయోగం అన్నారట దేవుడు, నన్ను చంపితే నీకేం వస్తుంది, నేను బ్రతికుంటే కనీసం ఎవరికైనా నీవు గొప్ప వాడివి అని చెబుతాను కదా అంటే అలా చెప్పేవారు చాలామంది ఉన్నారు, నాకు నీవే కావాలి! నా సేవకు వస్తావా చస్తావా అన్నారు 5 సంవత్సరాలు తర్వాత!!!  చివరికి సేవకు వచ్చారు మా తండ్రి గారు! కాబట్టి దేవుడు తన సేవకోసం ఎవరినైనా వాడుకోవాలి అనుకుంటే తప్పకుండా అతనినే వాడుకుంటారు! వారు ఎన్నిసాకులు చెప్పినా దేవుడు ఎలాగైనా తన సేవను చేయించుకుంటారు! ఓ యవ్వనస్తుడా నీవు కూడా ఇలాంటి స్థితిలో ఉంటే నీవు దేవునినుండి తప్పించుకోలేవు అని తెలుసుకో!!

 

యోనా నీనేవే వెళ్ళకుండా తర్శీసు పోదామని ఓడ ఎక్కినా తుఫాను పంపించి అనగా ఉగ్రత పంపించి తన దారిలోకి తెప్పించుకుంటున్నారు! యోనా మొదట్లోనే దేవుని మాటను విని నీనేవే కు వెళ్తే ఈ చెడ్డపేరు వచ్చేది కాదు! గాని మొదట దేవునిమీద తిరుగబడ్డాడు, అందుకే దేవుడు ఉగ్రత పంపించారు!

 

గమనించాలి-  ఈ యవ్వనస్తుడు ప్రవక్త చేసిన పనికిమాలిన పనివలన కేవలం యోనా మాత్రమే కాకుండా ఓడ లోని మొత్తం స్టాఫ్ కష్టాలు పడుతున్నారు!  సామెతల గ్రంధంలో ఒకమాట ఉంటుంది- మూర్ఖుడు తన ఇంటివారిని భాధించును . ఇప్పుడు యోనా మూర్ఖత్వం వలన అందరూ బాధపడుతున్నారు ! దేవుడు గొప్ప తుఫాను పంపిస్తే ఇప్పుడు ఓడ బ్రద్దలై పోయినంత గాలి అలలు వచ్చి ప్రాణాపాయంలో పడిపోయారు !

నిజానికి ఓడ బయలుదేరే ముందు ఓడ నాయకుడు వాతావరణం గమనించి బయలుదేరుతాడు! నేను ఓడ నాయకుణ్ణి కాబట్టి నాకు బాగా తెలుసు! వాతావరణం బాగోలేక పోతే ఎట్టి పరిస్థితులలో కూడా ఓడను బయటకి తీయము! తుఫాను మా రేవునే తాకుతుంది అంటే మరోచోటికి పారిపోతాము తప్ప లేకపోతే తుఫాను వస్తుంది అంటే బయలు దేరము ! ఈ ఓడ నాయకుడు కూడా చూశాడు, వాతావరణం చాలా బాగుంది అనగా Fair Weather ! గాని దేవుడు Fair Weather ని అనగా మంచి వాతావరణాన్ని Foul Weather  అనగా రఫ్ వాతావరణంగా మార్చేశారు!

 

5. కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను.

6. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను.

7. అంతలో ఓడ వారు ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.

8. కాబట్టి వారు అతని చూచి యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా

 

చూడండి ఓడ కేఫ్టేన్ ఒక గొప్ప ప్రవక్తనూ ఏమని పిలుస్తున్నాడో- ఓయీ నిద్రపోతా!! ఒరేయ్ నిద్రబోతోడా మనం మునిగిపోయేలా ఉంటే ఎందుకు ఎలా పడుకుని ఉండగలుగు తున్నావు అని అడుగుతున్నాడు! చివరికి చీటీలు వేస్తే చీటి యోనా పేరున వచ్చింది. అప్పుడు అందరూ అడుగుతున్నారు- నీవు ఎవరివి అంటే బడాయి మాటలు చెబుతున్నారు 9. అతడు వారితో ఇట్లనెను నేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులుగల వాడనై యున్నాను.

10. తాను యెహోవా సన్నిధిలోనుండి పారి పోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి యుండెను గనుక వారా సంగతి తెలిసికొని మరింత భయ పడినీవు చేసిన పని ఏమని అతని నడిగిరి.

 

చూడండి సముద్రాన్ని సర్వభూమిని సర్వ సృష్టిని చేసిన నిజమైన దేవుని యొక్క ప్రవక్తనూ, అయితే ఇప్పుడు ఆయన దగ్గరనుండి పారిపోతున్నాను అని నిజం చెబుతున్నాడు ఈ ప్రవక్త!! యోనా స్వయంగా ఇందుకు కారణం చెప్పాడు. నీనెవె పశ్చాత్తాపపడడం, దేవునినుంచి క్షమాపణ పొందడం యోనాకు ఇష్టం లేదు. ఆ నగరాన్ని దేవుడు ధ్వంసం చెయ్యాలని అతనికి ఉంది. దేవుని నుంచి ఎవరూ పారిపోలేరని అతనికి అర్థం అయినట్టు లేదు కీర్తనల గ్రంథము 139:7-12. అంతేగాక, ఇస్రాయేల్‌లో తానొక్కడే ప్రవక్త అనీ, దేవుడు వేరెవరినీ నీనెవెకు పంపలేడనీ యోనా ఊహించి నట్టున్నాడు.

 

అయితే ఎప్పుడైతే తాను గొప్పదేవుని నిజమైన దేవుని ప్రవక్త అని చెప్పాడో వారంతా భయపడ్డారు మహా భయం యోనా ఆరాధించే దేవుడు ఏదో చిన్న కుల దైవం కాదనీ, లేదా అనేకమంది ఆరాధించే చిల్లర దేవుళ్ళలాంటి వాడు కాదనీ వారికి అర్థమైంది. కానీ ఇక్కడ యోనాలో నిజాన్ని ఒప్పుకునే స్వభావం కనిపిస్తుంది మనకు! యోనా వారితో ఏమీ దాచకుండా ఉన్నది ఉన్నట్టు అన్నీ చెప్పేశాడు (వ 12). 11. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుపాను అధికమౌచున్నది, సముద్రము మామీదికి రాకుండ నిమ్మళించునట్లు మేము నీ కేమి చేయవలెనని అతని నడుగగా యోనా

12. నన్నుబట్టియే యీ గొప్పతుపాను మీమీదికివచ్చెనని నాకు తెలిసియున్నది; నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండ నిమ్మళించునని అతడు వారితో చెప్పినను

 

ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మరణాన్ని కోరుకొనే మనఃస్థితిలో యోనా ఉన్నట్టున్నాడు 5. దేవుని నుంచి తాను పారిపోలేనని గుర్తించి నీనెవె వెళ్ళడం కంటే చనిపోవడమే మంచిదనుకున్నాడు. ఇక 13. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుపాను బలముచేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. పరలోక దేవుడైన యెహోవా పేరు వినడంతోనే వారు హడలిపోయారు 10. ఆయన సేవకుల్లో ఒకడికి హాని చెయ్యడం ద్వారా ఆయనకు కోపం తెప్పించడం వారికి ఇష్టం లేదు. అందుకే చాలా కష్టపడ్డారు! చివరికి ఏమీ చేసేది లేక, తమ ప్రాణాలు రక్షించుకోడానికి యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు ! వెంటనే ధబాలున పెద్ద చేప అనగా బహుశా తిమింగలం గాని వేల్ గాని మ్రింగేసింది గుటుక్కున యోనాని! వెంటనే సముద్రం నిమ్మలమై పోయింది!

 

బైబిల్ రాసి ఉన్నట్లు జరిగినది ఇప్పుడు యోనాకి- ఒకడు సింహాన్ని తప్పించుకోడానికి ఇంటిలోకి పరుగెడితే పాము కరచినట్లు..ఆమోసు 5: 19

ఒకడు సింహమునొద్దనుండి తప్పించుకొనగా ఎలుగుబంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.

 ఇప్పుడు యోనా నీనేవే లో జరగబోయే అవమానం, దెబ్బలు తప్పించుకుందామని తర్శీసుకి పోతుంటే దేవుడు తుఫానుని పంపారు! ఇప్పుడు తుఫానులో పడి చనిపోదామంటే మరింత పెద్ద ఉపద్రవం చేప మ్రింగివేసింది!

 

బ్రహ్మాండమైన చేప ఇది తిమింగలం అని ఇక్కడ రాసిలేదు. ఈ ఒక్క పనికోసం దేవుడు సిద్ధపరచిన ఒక ప్రత్యేకమైన చేప కావచ్చు. యోనా సముద్రంలో మునిగిపోకుండా దేవుడు ఇలా చేశాడు. మూడు రోజులు మత్తయి 12:40; {Mat,16,4]. “కడుపులో యోనాను, ఆ బ్రహ్మాండమైన చేపను చేసిన దేవుడు తన ఇష్టం వచ్చినంత కాలం అతణ్ణి చేప కడుపులో ప్రాణాలతో ఉంచగలిగాడు.

 

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరుడా! నీవు దేవుని నుండి తప్పించుకుని పారిపోవాలి అని ప్రయత్నిస్తే ఎక్కడికి పోలేవు అని తెలుసుకుని దేవుడు చెప్పిన మాటలకు లోబడి ఆయన చెప్పినట్లు చేస్తే దేవుని దీవెన కాపుదల ఉంటుంది! అలా కాకపోతే అవమానాలు దెబ్బలు ఆపదలు తప్పవు!

 

దైవాశీస్సులు!

*యోనా- The Backslider*

*మూడవ భాగం*

 

యోనా 2:110

1. ఆ మత్స్యము కడుపులోనుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను.

2. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.

3. నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి యున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.

4. నీ సన్నిధిలోనుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయముతట్టు మరల చూచెదననుకొంటిని.

5. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టు కొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపునాచు నా తలకుచుట్టుకొని యున్నది.

6. నేను మరెన్న టికిని ఎక్కిరాకుండ భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను, నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములోనుండి పైకి రప్పించియున్నావు.

7. కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసి కొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను.

8. అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు.

9. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను.

10. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కివేసెను.   ప్రియులారా! మనం యోనా కోసం ధ్యానం చేస్తున్నాము!     

 

          ప్రియులారా! మనం యోనా గారి గురించి ధ్యానం చేస్తున్నాము! యోనా చేప కడుపులో మూడు రోజులు ఉన్నట్లు గత అధ్యాయం చివరలో చూసుకున్నాం! ఈ అధ్యాయంలో చేప కడుపులో ఉండి కన్నీటి ప్రార్థన చేస్తున్నట్లు కనిపిస్తుంది! నిజానికి ఇలాంటి ప్రార్థన మనుష్యులు ఎవరూ చేయలేనటువంటి ప్రార్థన! ఇది భూమిమీద చేసిన ప్రార్థన కాదు, ఆకాశంలో చేసిన ప్రార్థన కాదు! ఒక చేప కడుపులోనుండి మరణపు టంచులలోనుండి చేసిన ప్రార్థన! అయితే మనం ఎక్కడున్నా, మన కష్టం ఎంత విపరీతమైనదైనా, మనం ఎలాంటి అత్యవసర స్థితిలో ఉన్నా ఏకైక నిజ దేవుడు మన ప్రార్థన వినగలడు. మనం చదవబోతున్న ఈ ప్రార్థనలో యోనా తనను చేప కడుపులో నుంచి విడిపించమని దేవుణ్ణి ప్రార్థించలేదు. ఇది గమనించదగ్గ విషయం. తాను దేవుని వైపుకు మళ్ళీ తిరుగుతున్నాడు కాబట్టి దేవుడు తనను విడిపిస్తాడని అతనికి నమ్మకం ఉంది సముద్రంలో పడి చావకుండా తనను కాపాడేందుకు దేవుడు ఎన్నుకున్న సాధనమే ఆ చేప అని కూడా అతడు గ్రహించి ఉండవచ్చు.

 

2. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళ గర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.

3. నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి యున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.

 

గమనించాలి ఇదే విధంగా దావీదు గారు కూడా ప్రార్థన చేశారు

 

కీర్తనల గ్రంథము  18

5. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను

6. నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.

 

కీర్తనల గ్రంథము  30:3. యెహోవా, పాతాళములోనుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండ నీవు నన్ను బ్రదికించితివి.

 

కీర్తనల గ్రంథము  50

15. ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరచెదవు.

 

జాగ్రత్తగా గమనిస్తే తొణక్కుండా మృత్యువును ఎదుర్కొనేందుకు ప్రశాంతంగా సిద్ధమయ్యాడు. చనిపోవడం తనకు మంచిదను కున్నాడు కూడా యోనా 1:12. అయితే మృత్యువును ఎదుర్కోవడం, నిజంగా మరణించడం ఈ రెంటికీ ఎంతో తేడా ఉంది. ఏమీ చలించకుండా సముద్రంలోకి వెళ్ళాడు గాని సముద్రం అతనిలోకి రావడం ఆరంభిస్తే అతనికి కంగారు పుట్టింది. (మృత్యు లోకంలో చనిపోయినవారు ఉండే అదృశ్య లోకం) (ఆదికాండము 37:35). యోనాకు తాను చనిపోయినట్టే అనిపించింది.  అంగీకరించావు అనగా అవిధేయుడైన ప్రవక్త పట్ల కూడా దేవుని అనుగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఆయనకు లోబడేవారి ప్రార్థనలను దేవుడు మరింకెంత శ్రద్ధగా వింటాడో కదా!

 

 ఇక మూడో వచనంలో ఎలుగెత్తి అరుస్తున్నాడు ! నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి యున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.

4. నీ సన్నిధిలోనుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయముతట్టు మరల చూచెదననుకొంటిని.

5. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టు కొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపునాచు నా తలకుచుట్టుకొని యున్నది.

6. నేను మరెన్న టికిని ఎక్కిరాకుండ భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను, నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములోనుండి పైకి రప్పించియున్నావు.

 

చూడండి ఈ 4 వ వచనంలో ఒక అబద్దం చెబుతున్నాడు: నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను.. నిజానికి దేవుని సన్నిధిని నుండి పారిపోతున్నవాడు యోనా గాని అంటున్నాడు నేను నీ సన్నిధిలోనుండి వెలివేయ బడ్డాను! మనం కూడా చాలాసార్లు అలాగే అనుకుంటాము నిజానికి మనమే మన క్రియల ద్వారా దేవునినుండి దూరంగా పోతూ దేవుడు నన్ను వదిలేశాడు నా ప్రార్థన వినడం లేదు అనుకుంటావు! ముందు నీ తప్పులు నీవు సరిదిద్దుకొ!

 

కీర్తనల గ్రంథము  31

22. భీతిచెందినవాడనై నీకు కనబడకుండ నేను నాశనమైతి ననుకొంటిని అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా విజ్ఞాపనలధ్వని నాలకించితివి.

 

కీర్తనల గ్రంథము  73

22. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని.

23. అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు.

 

దేవునికి సహాయంకోసం ప్రార్థన చేస్తే ఆయన సహాయానికి అందనంత దూరంగా మనల్ని ఉంచగల ప్రమాదం, కష్టం ఏమీ లేవు. మనకు ఈ ఆలోచనే నిబ్బరాన్నీ ధైర్యాన్నీ కలిగించాలి. పవిత్రాలయం 7. అంటే బహుశా పరలోకంలో దేవుని ఆలయం అని అర్థం!

 

ఇక 5,6 వచనాలలో కీర్తనాకారుడు మొర్రపెట్టినట్లు అరుస్తున్నాడు ఈ భక్తుడు కీర్తనల గ్రంథము  69

1. దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.

2. నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి.

15. నీటివరదలు నన్ను ముంచనియ్యకుము అగాధసముద్రము నన్ను మింగనియ్యకుము గుంట నన్ను మింగనియ్యకుము. అంటూ మొరలిడుతున్నాడు భక్తుడు!

 

మనలో చాలామంది ఇలాగే చేస్తాము! ఆపద రానంత వరకు మనంత హీరోలు లేరు అంటూ విర్రవీగుతాము! ఆపద వచ్చాక కష్టం వచ్చాక యేసుబాబు నీవు తప్ప నాకు దిక్కులేదు అంటాము! యోనా కూడా చావు ఎదురైనప్పుడు ఎలుగెత్తి మొర్రపెడుతున్నాడు

 

7. కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసి కొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను.

8. అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు.

9. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను.

 

తొమ్మిదవ వచనం చూడండి అతడింకా చేప కడుపులోనే ఉన్నప్పటికీ (వ 1), దేవుడు తనను విడిపిస్తాడనీ, పాడుతూ అర్పణలు చెల్లించేలా చేస్తాడనీ అతనికి విశ్వాసం ఉంది. మొక్కుకున్న దాన్ని కీర్తనల గ్రంథము 50:14; కీర్తనల గ్రంథము 56:12; కీర్తనల గ్రంథము 61:8; కీర్తనల గ్రంథము 65:1; కీర్తనల గ్రంథము 66:13-14; కీర్తనల గ్రంథము 116:12-19. “చెల్లిస్తాను లేవీయకాండము 7:12-13; ఎజ్రా 3:11; కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 50:14-15; కీర్తనల గ్రంథము 56:12; ఎఫెసీయులకు 5:20; 1 థెస్సలొనీకయులకు 5:18. “రక్షణ యెహోవాదే కీర్తనల గ్రంథము 3:8; యెషయా 43:11; యెషయా 64:4; ఎఫెసీయులకు 2:8-9.

 

ఇక పదవ వచనంలో దేవుడు సెలవియ్యగా చేప అతనిని ఎండిన నేలపై కక్కివేసినట్లు చూడగలం !

 

చూడండి ప్రవక్త చేసిన పనికిమాలిన పని వలన మొదట ఓడలో ఉన్నవారికి కష్టాలు ప్రాణాపాయం సంభవించింది! అదే ప్రవక్తవలన ఒక చేప మూడు రోజులు బోజనం చేయలేదు నీరు త్రాగకుండా ఉపవాసం చేయవలసి వచ్చింది! నీరు తాగుదామని గుటక వేసినా, ఆకలికి మిగిలిన చేపలను తిందామని అనుకున్నా మన ప్రవక్తని మొదటగా ఆ చేప గుటుక్కున మింగేయాలి! గాని దేవుడు చెప్పారు కాబట్టి మూడు రోజులు తిండి తిప్పలు మానేసి తిప్పలు పడింది ఈ చేప!

చేపలు ప్రకృతి దేవుని మాట విన్నాయి గాని ఈ మనిషి మాత్రం దేవుని మాట వినలేదు! ఈ పుస్తకంలో ఒక్క యోనా తప్ప ప్రతీదీ, ప్రతి ఒక్కరూ, దేవుని సంకల్పానికి తల వంచుతున్నారు. యోనా అవిధేయత తరువాత దేవుడు అతణ్ణి కూడా దేవుడు విధేయుణ్ణిగా చేశాడు.  మరి ఈ చేప ఆయనని ఏ దేశంలో కక్కేసిందో మనకు తెలియదు! బహుశా లెబనాన్ మీద కావచ్చు అని నా ఉద్దేశం! ఎందుకంటే ఒక వేల్ గాని తిమింగిలం గాని రోజుకి 100 మైళ్ళు ప్రయాణం చేస్తుంది. మూడు రోజులకి 300 నుండి 450 మైళ్ళు ప్రయాణం చేసి ఉండవచ్చు! ఇప్పుడు అక్కడ కక్కేసింది ఈ చేప!

 

అయితే దేవునికి మొర్రపెట్టి తప్పు ఒప్పుకున్న తర్వాత యోనా గారు తిన్నగా 1000 కి.మీ ప్రయాణం చేసి నీనేవే వెళ్ళి సువార్త ప్రకటించారు! అయితే మరొకకధ కూడా వాడుకలో ఉంది! ఏమిటంటే చేప కక్కిన తర్వాత మరలా యోనా గారు తన ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులను క్షమించమని వేడుకుంటాడు! దేవుడు నన్ను ఛీ కొట్టి వడిలేశాడు అనుకుంటాడు! చెల్లి ఎంతో సంతోషిస్తుంది!

 

అయితే ఆ రాత్రి మరలా దేవుడు పిలిచి నీనేవే వెళ్ళి దుర్గతి కలుగుతుంది అని చెప్పమని రెండోసారి చెబుతారు దేవుడు! వెంటనే అప్పుడే బయలుదేరి నీనేవే పట్టణం చేరుకుంటాడు యోనా!

 

ప్రియ స్నేహితుడా! దేవుడు నిన్ను తన పనికోసం వాడుకోవాలి అనుకుంటే ఎలాగైనా తన పనికి వాడుకుంటారు! అంతేకాకుండా నీవు నిజంగా మొర్రపెడితే తప్పకుండా నిన్ను క్షమించి నీకు జవాబు ఇస్తారు దేవుడు!

దైవాశీస్సులు!

*యోనా- The Backslider*

*4వ భాగం*

యోనా 3 :110

1. అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

2. నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము.

3. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను. నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము.

4. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణ మంతదూరము సంచరించుచు ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచేయగా

5. నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి.

6. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడి నప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను.

7. మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా

8. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొన కూడదు, పశువులు గాని యెద్దులుగాని గొఱ్ఱెలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు,

9. మనుష్యు లందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వ కముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.

10. ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.

          ప్రియులారా! మనం యోనా గారి గురించి ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా మొదటి వచనంలో దేవుడు రెండోసారి యోనాకి ప్రత్యక్షమై నీనేవే కి వెళ్ళి దానికి దుర్గతి వస్తుంది అని చెప్పమని చెప్పారు!

 

ఇప్పుడు మనకు ఒక అనుమానం రావచ్చు   దేవుడు యోనాను  పక్కన పెట్టి వేరొక ప్రవక్తను ఎందుకు పంపలేదు? తన సేవకులను దేవుడు అంత తేలిగ్గా వదులుకోడు మత్తయి 26:34-35; మార్కు 16:7; లూకా 22:31-32, లూకా 23:61-62; నిర్గమకాండము 3:11; నిర్గమకాండము 4:10, నిర్గమకాండము 4:13; యిర్మియా 1:6. దేవుడు ఏ విధమైన సాకుల్ని అంగీకరించడు. తన సేవకులు విధేయత చూపేలా ఎలా చేయాలో ఆయనకు తెలుసు. యోనా విషయంలో ఆయన ఉపయోగించినంత బాధకరమైన విధానాలనే ఆయన ఎల్లప్పుడూ ఉపయోగించడు అందుకు మనం సంతోషించాలి.

 

 సరే, యోనా ఇప్పుడు వెయ్యి మైళ్ళు దూరం నడిచివెళ్ళి నీనేవే పట్టణం మరో 40 రోజులలో దేవునిచేత నాశనం అయిపోతుంది అని చెప్పాడు ఈ భక్తుడు! మూడో వచనం ప్రకారం నీనేవే పట్టణం మూడు రోజుల ప్రయాణం అంతా పెద్దది అనగా ఒక మూలనుండి పరుగెత్తడం మొదలుపెడితే రెండో చివరకి వెళ్ళడానికి మూడురోజులు పడుతుంది! కొంతమంది లెక్క ప్రకారం 100 కి. మీ పొడవైనది! నాల్గవ అధ్యాయం ప్రకారం ఆ రోజులలోనే అనగా క్రీ. పూ 786 లోనే 120000 మంది జనాబా గలది!! ఈ రోజు బహుశా 20 కోట్లు ఉండవచ్చు!! ఆ పట్టణానికి వెళ్ళి ఒకరోజు ఎంతదూరం ప్రయాణం చేయగలడో అంతదూరం ప్రయాణం చేస్తూ ఇంకో 40 రోజులలో నీనేవే పట్టణం నాశనమైపోబోతుంది అని చెప్పాడు! ఇలా పట్టణమంతా చెప్పడం జరిగినది!

అయితే చరిత్రకారులు ఏమంటారు అంటే: పట్టణమంతా ఈ దుర్వార్త చెప్పాక రాజా ప్రసాదం దగ్గరలో ఒక దగ్గర ఉండి మరో 37 రోజులలో నీనేవే నాశనమై పోబోతుంది, మరో 30 రోజులలో నాశనం కాబోతుంది మరో 25 రోజులలో మరో 10 రోజులలో మరో వారం రోజులలో నాశనం కాబోతుంది అంటూ ప్రతీరోజు అనగా 40 రోజులు కూడా యోనా సువార్త ప్రకటించాడు!

దేవుని సందేశం సూక్ష్మంగా సూటిగా ఉంది. ప్రజలు పశ్చాత్తాప పడినా, పడకపోయినా నీనెవె నాశనం అవుతుందని దేవుని ఉద్దేశం కాదు (యిర్మియా 18:7-8; యెహెఙ్కేలు 18:21-23; యెహెఙ్కేలు 33:10-11, యెహెఙ్కేలు 33:14-16). యోనా దేవుణ్ణి గురించి ఏమనుకున్నాడో సరిగ్గా అవే లక్షణాలు ఆయనవి జాలి, కరుణ (యోనా 4:2). ఈ  వార్తవీని  మొదట కొంతమంది అపహాస్యం చేశారు! మరికొంత మంది నీవు ఎవరవు ? ఎందుకు మాకు వ్యతిరేఖంగా ఇలా ప్రకటిస్తున్నావు అని అడిగితే నేను హెబ్రీయుడను , హెబ్రీయుల దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షమై దీనికి దుర్గతి వస్తుంది అని ప్రకటించమని చెబితే నేను వచ్చాను అని చెప్పాడు ఈ ప్రవక్త!! చాలామంది పశ్చాత్తాప పడటం మొదలుపెట్టారు! ఇంకా మరికొంత మందికి తాను దేవుని సన్నిధిలో తిరుగబడినట్లు తాను తర్శీషు వెళ్ళే ఓడ ఎక్కినట్లు అక్కడ తుఫాను వచ్చినట్లు, ఆ తర్వాత తనను పెద్ద చేప మ్రింగినట్లు మూడు రోజుల తర్వాత తాను వేడుకొంటే  దేవుడు చేపకు చెప్పి తనను అక్కడ కక్కినట్లు మొత్తం కధ అంతా చెప్పాడు! దీనిని అనేకమంది నమ్మారు!  ఈ విషయం చివరికి రాజుకి చేరుకుంది! రాజు అన్నాడు మొదట ఎవడో ఇశ్రాయేలు దేవుడుకి మనమెందుకు లోబడాలి? హెబ్రీయుల దేవుడు మనమీదికి ఎందుకు ఉగ్రత పంపిస్తాడు అంటూ తిరస్కరించినట్లు, అప్పుడు ఆ ప్రధాన మంత్రి ఈజిఫ్టు వారు కూడా ఇలా తిరుగబడితే మొత్తం ఈజిప్టు దేశం మొత్తం నాశనం చేసినట్లు వివరించి చెబుతాడు ప్రధానమంత్రి!  అప్పుడు రాజు అడుగుతాడు మరి ఇప్పుడు ఆ ఉగ్రత నుండి తప్పించుకోడానికి ఏమి చేయాలి? పశ్చాత్తాప పడటమే మార్గం అని చెబుతాడు!

 

5. నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి.

6. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను.

7. మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా

8. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొన కూడదు, పశువులు గాని యెద్దులుగాని గొఱ్ఱెలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు,

9. మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వ కముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.

 

చూడండి 5 వ వచనం: నీనేవే వారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాసముండి ప్రార్ధించడం మొదలుపెట్టారు! ఇది అద్భుతమైన విషయం. మనకు తెలిసినంతవరకు పాత నిబంధన  కాలమంతట్లోనూ ఇలాంటిది జరగలేదు. అనేకమంది తమదేవుళ్ళను పూజిస్తూ, నిజ దేవుణ్ణి గురించి సరిగా తెలియని అన్యజనులు నివసిస్తున్న నగరం అది. ఆ ప్రజల లక్షణాల గురించి యోనా 1:2 ఉన్నాది. అయినా యోనా బోధలు విని దేవుని వైపు తిరిగారు. సాక్షాత్తూ యేసుప్రభువే బోధించినప్పటికీ గలలీయ , యూదాలోని పట్టణాలు ఈ విధంగా చెయ్యలేదు (మత్తయి 11:20-24; మత్తయి 12:41). “గోనెపట్ట 1 రాజులు 21:27; నెహెమ్యా 9:1; దానియేలు 9:3. అనగా తమనుతాము తగ్గించుకోవడానికి గుర్తుగా ఉంది!

 

ఇక రాజు గారు కూడా తన సింహాసనం దిగి బూడెదలో కూర్చుని తగ్గించుకున్నాడు! నీనెవెను పాలిస్తున్నది మహా శక్తిమంతుడైన అష్షూరు రాజు. బూడిద తనను తాను పూర్తిగా దీనుడిగా చేసివేసుకున్న దానికి సూచన. ప్రజలు పశ్చాత్తాపంలో దేవుణ్ణి వేడుకోవడంలో పూర్తిగా నిమగ్నులైపోవాలి. తమ దైనందిన వ్యవహారాలు కొనసాగించుకోకూడదు అని ప్రకటించారు! ఇక్కడ రాజు ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొన కూడదు, పశువులు గాని యెద్దులుగాని గొఱ్ఱెలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, అని చెప్పడం అంటే  తన ప్రజల భయంకరమైన ఆధ్యాత్మిక స్థితిని అతడు ఒప్పుకుంటున్నాడు. అందుకు ఎలాంటి సాకూ చెప్పడం లేదు, వారి పాపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చెయ్యడం లేదు !

 

ఇప్పుడు చూడండి 9 వ వచనం 9. మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వ కముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. 10 ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.

దేవుడు అన్యులు చేసిన కన్నీటి ప్రార్థన, నిజమైన మారుమనస్సు పశ్చాత్తాపముతో నిండిన ప్రార్ధనకు కరిగిపోయి తాను చేద్దామనుకున్నా నాశనం చేయలేదు! హల్లెలూయ! అన్యులు పశ్చాత్తాప పడితేనే కీడు చేయడం మానేసిన దేవుడు, నీవు నిజంగా పశ్చాత్తాప పడితే నిన్ను నన్ను క్షమించరా!!! కాబట్టి ఇప్పుడు నిజమైన మారుమనస్సు నిజమైన పశ్చాత్తాపముతో దేవుని వేడుకో ఆయన నిన్ను తప్పకుండా హక్కున చేర్చుకుంటారు! యోవేలు  2

14. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?

 

ఆమోసు  5

15. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి; ఒకవేళ దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును.

 

ఇది దేవుని స్వభావానికీ, ఆయన వాక్కులకూ అనుగుణంగానే ఉంది నిర్గమకాండము 34:6-7; యోవేలు 2:13. దీనికి చాలా కాలం తరువాత రాయబడిన యిర్మియా 18:7-8 లో నగరాలు, దేశాల విషయంలో దేవుడు అవలంబించే విధానాలు వెల్లడి అయ్యాయి. చేస్తానన్న కీడు నిర్గమకాండము 32:14. కరుణ చూపడం అంటే దేవునికి ఎంతో ఇష్టం (మీకా 7:18). శిక్షించడం, నాశనం చేయడం అంటే ఆయనకు ఇష్టం లేదు

 

దేవుడు అన్యులు చేసిన కన్నీటి ప్రార్థన, నిజమైన మారుమనస్సు పశ్చాత్తాపముతో నిండిన ప్రార్ధనకు కరిగిపోయి తాను చేద్దామనుకున్నా నాశనం చేయలేదు! హల్లెలూయ! అన్యులు పశ్చాత్తాప పడితేనే కీడు చేయడం మానేసిన దేవుడు నీవు నిజంగా పశ్చాత్తాప పడితే నిన్ను నన్ను క్షమించరా!!!

 

దైవాశీస్సులు!

*యోనా- The Backslider*

*5వ భాగం*

యోనా 4  :111

1. యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని

2. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందు వలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని.

3. నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను.

4. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.

5. అప్పుడు యోనా ఆ పట్టణములోనుండి పోయి దాని తూర్పుతట్టున బసచేసి అచ్చట పందిలి యొకటి వేసికొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని యుండగా

6. దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకుపైగా నీడ యిచ్చునట్లు చేసెను; ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను.

7. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను.

8. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పిం చెను. యోనాతలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.

9. అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.

10. అందుకు యెహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడి పోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడు చున్నావే;

11. అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను.

 

        ప్రియులారా! మనం యోనా గారి గురించి ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా ఈ నాలుగో అధ్యాయంలో ప్రపంచంలో ఏ ప్రవక్త, ఏ దేవుడు మనిషి కోపగించుకోలేని విధంగా ఈ ప్రవక్త కోపగించుకొన్నాడు దేవుని మీద అలిగాడు! ఎందుకు అలిగాడు అంటే దేవుడు నీనేవే పట్టణాన్ని నాశనం చేస్తాను అన్నారు గాని వారు పశ్చాత్తాప పడి ఏడిస్తే దేవుడు కరిగిపోయి వారిని క్షమించి తాను చేస్తానని చెప్పిన కీడు చేయడం మానేశారు! ఇది మంచిదే కదా! గాని దీనికి వ్యతిరేఖంగా జరుగుతుంది ఇక్కడ! ఇంత గొప్ప ఫలితం చూశాక చరిత్రలో ఏ బోధకుడు ఇలా మండిపడలేదు  యోనాకు ఎందుకు కోపం వచ్చింది? నీనెవె ఇస్రాయేల్‌కు బద్ధ విరోధి. దేవుడు దానిపై జాలి చూపరాదని యోనాకు అనిపించింది. ఎవరిమీదైనా కరుణ చూపదలచుకుంటే అది కేవలం ఇస్రాయేల్‌పైనే చూపాలి గాని ఇస్రాయేల్‌వారి శత్రువులైన అన్యజనులపై కాదనుకొన్నాడు. యోనా నిజ దేవుని ప్రవక్త అయినప్పటికీ ఈ విషయాల్లో అతని హృదయం దేవుని హృదయంతో ఏకీభవించడం లేదు. దేవుడు కోరినది అతడు కోరడం లేదు. దేవునికి ఇష్టమైనది అతనికి ఇష్టం కాలేదు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ప్రవక్త కూడా దేవునిమీద తిరుగబడి తప్పుచేశాడు! గాని అయ్యో దేవా నేను మూర్ఖున్ని తప్పుచేశాను క్షమించని అడిగితే దేవుడు క్షమించారు, తిరిగి తన ప్రవక్తగా చేసుకున్నారు! మరి ఇక్కడ ప్రవక్త ఏ పాటము నేర్చుకోలేదు అని అర్ధం అవుతుంది! దేవుని ప్రవక్తలకు ఉండవలనసిన కనీస జాలి కరుణ దయ అనేది లేకుండా పోయింది ఈ ప్రవక్తకు !!

 

అందుకే రెండవ వచనంలో అలుగుతున్నాడు  యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని.

ఏమయ్యా తర్శీసుకి పారిపోవడం ఎందుకు? దేవుడు జాలిగలవాడు ప్రేమగలవాడు అని తెలుసు కదా, వారు మారుమనస్సు పొందితే ఆ క్రెడిట్ లో కొంత క్రెడిట్ యోనా కి కూడా చెందుతుంది కదా! వెయ్యి మైళ్ళు నడిచివచ్చి ప్రకటించినందు వలనే కదా నీనేవే వారు రక్షించ బడ్డారు ! గాని ఈ ప్రవక్తకకు శత్రువులంటే కోపం ద్వేషం మాత్రమే ఉంది గాని ప్రవక్తకు ఉండవలసిన కనీస జాలి దైవిక ప్రేమ ఏమాత్రం కనిపించడం లేదు! తద్వారా ప్రవక్తగా ఉండటానికి అర్హత కోల్పోయాడు అని నా ఉద్దేశం మాత్రమే! మరోసారి దేవునికి దూరమై పోయాడు ఈ ప్రవక్త! ఏ విషయంలో దూరమై పోయాడు అంటే దేవుని బిడ్డలకు ఉండవలసిన కనీస దైవిక ప్రేమ క్షమాపణ అనేవి ఈ వ్యక్తిలో లేనేలేవు!

 

దేవుడు ఎందుకయ్యా యోనా అలా కోపగించుకున్నావు అని కూడా అడిగినా బుద్ధి లేదు ఇతనికి!!

అందుకే ఈ వ్యక్తి ఒక పాఠం నేర్పించాలి అనుకున్నారు దేవుడు!

 

6. దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకుపైగా నీడ యిచ్చునట్లు చేసెను; ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను.

7. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను.

8. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పిం చెను. యోనాతలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.

9. అప్పుడు దేవుడుఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.

10. అందుకు యెహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడి పోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడు చున్నావే;

11. అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను.

 

ఈ భాగంలో దేవుడు అతనికి తెలియకుండానే ఒక సొరచెట్టుని పుట్టించి అతనికి నీడ చల్లదనం కలిగించి, మరలా దానిని ఒక పురుగుని పంపించి నాశనం చేయించి మాడు మండిపోయేలా చేశారు! వెంటనే మరోసారి అలిగి- నన్ను చంపేయ్ అంటున్నాడు! ఇలాంటి పనికిమాలిన ప్రార్ధనలను దేవుడు వినరు! ఎందుకు చంపేయాలి దేవుడు? ఏలీయా కూడా ఇలాగే పనికిమాలిన ప్రార్థన చేశారు! దేవుడు ఆ ప్రార్థన కూడా వినలేదు! నేను కూడా చేశాను! నా పనికిమాలిన ప్రార్ధనకు కూడా దేవుడు జవాబు ఇవ్వలేదు! నేనేకాదు ఎవరు చేసినా ఇలాంటి పనికిమాలిన ప్రార్ధనలకు దేవుడు జవాబివ్వరు!

 

యోనా వ్యక్తిగత సౌకర్యాల వంటి అల్ప విషయాల గురించి యోనా పట్టించుకుంటున్నాడు గాని తనవారు కాని  అన్యజనుల రక్షణ గురించి అతనికి చీమ కుట్టినట్టయినా లేదు. అనేక క్రైస్తవ సంఘాలలో చాలామంది ఇతనిలాగే నేడు ఉండడం చాలా విచారకరమైన సంగతి. తమ సుఖాలు సౌకర్యాల విషయం ఆనందిస్తారు గాని మనుషుల ఆత్మల గురించి పట్టించుకోరు.

 

నేటి దినాలలో అనేకమంది ఆత్మల రక్షణ అనే చింత లేకుండా బ్రతికేస్తున్నారు! పేరుకే క్రైస్తవులు! సువార్త ప్రకటన, ఇరుగుపొరుగు వారి రక్షణ కోసమైన చింత ఏమాత్రం లేదు!! దేవుని పని అలా ఉండిపోతుంది ఎవరూ చేయడం లేదు, నేను నా వంతు సహాయం చేస్తాను అనే కనీస చింత లేదు విశ్వాసులలో కొంతమందికి!

 

ఇక ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే దేవుడు మనకు ఎంత సునాయాసంగా సౌకర్యాలు ఏర్పరచగలడో అంతే తేలిగ్గా వాటిని తొలగించగలడు కూడా. ఒక వేళ మనకు గుణపాఠం నేర్పేందుకు ఇలా చెయ్యవచ్చు. నీవు అడిగావు కదా అని దేవుడు నీకు బ్రతుకు తెరువు ఏర్పరచి, సమాజంలో నీకు మంచి స్థానం ఇచ్చి, నీకు కావలసిన ఈవులు అన్నీ నీకిచ్చిన తర్వాత నీవు దేవుణ్ణి వదిలి నీ బందువుల పట్ల నీ స్వంత ఇష్టాలు చొప్పున తిరిగితే, నీకు కలుగజేసిన ఈ సదుపాయాలు, ac కారులు బంగాళాలు తదితర అన్నీ తీసేయ గలడు జాగ్రత్త! దేవుడు నీకిచ్చిన్న తలాంతులతో దేవుని పని చేయాలి తప్ప నీ పేరుకోసం నీ ఆస్తి పెంచుకోవడం కోసం వాటిని వాడుకోవడం మొదలుపెడితే ఒకరోజు నీ తలాంతులు కూడా పోతాయి జాగ్రత్త! యోనా నుండి నేర్చుకోవలసిన పాఠం ఇది. మనం కూడా నేర్చుకుందాం.

 

 యోనాకు నీడకోసం మొలిచిన సొరచెట్టులాగే లోకంలోనివన్నీ గతించిపోయేవే (1 యోహాను 2:17). దేవుడు వేటిపై శ్రద్ధ కలిగి ఉన్నాడో వాటి పైనే మన హృదయం ఉండాలని నేర్చుకుందాం. దేవునికి ఈ లోకంలోని మనుషులందరి పట్ల శ్రద్ధ ఉంది. మనమైతే మన గురించి, మన సౌకర్యాల గురించే అస్తమానం చూచుకుంటున్నామా?

 

దేవుడు ఈ ప్రవక్తకు బుద్ధిచెప్పారు! కాబట్టి నేడు అనే సమయముండగానే పశ్చాత్తాప పడి ప్రభుపాదాలు పట్టుకో!!

 

దేవుడు 120000 మంది రక్షణ పొంది మారుమనస్సు పొంది రక్షించబడాలి అనే ఉద్దేశంతో దేవుడు యోనాను పంపితే వారు చచ్చిపోవాలి నాశనమై పోవాలి అని యోనా అనుకున్నాడు!

 

దేవుడు నీనేవే వెళ్ళి దేవునిపని చేయమంటే తన సదుపాయాలు కోసం, తన యొక్క డ్రీమ్స్ కోసం , తనకు కలుగబోయే హింసలు కోసం భయపడి దేవుని నుండి దూరంగా పోవాలి అనుకున్నాడు! దేవునిమీద తిరుగబడ్డాడు! నేటిరోజులలో అనేకమంది యవ్వనస్తులు దేవుడు తనచేతికి ఇచ్చిన పని చేయడం మానేసి- నాకు ఫలానా పని కావాలి-ఫలాని పోస్ట్ కావాలి అని కోరుకోవడం మొదలుపెట్టారు! దేవుడు ఇచ్చిన చిన్నపని అయినా నమ్మకంగా చేస్తే దేవుడు పెద్ద పోస్ట్ పెద్ద పని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు! నీవు ఒక రోజులోనే చర్చికి ప్రెసిడెంట్ వి సెక్రటరీ వి కాలేవు!  సంఘంలో స్థిరంగా జీవిస్తే ఒక్కో పదవి దానికదే నెమ్మదిగా వస్తుంది! బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీవు అపోస్టలుడివి ప్రవక్తవు కాలేవు! నెమ్మది నెమ్మదిగా దేవుని పని చేసుకుంటూ పోతే ఒకరోజు దేవుడు నిన్ను అత్యుత్తమ స్థానంలో పెడతారు!

 

కాబట్టి దేవుని మీద తిరుగబడవద్దు!

 

ఆయన ఏ పని ఇచ్చినా చేసి దేవునిచేత భళా నమ్మకమైన మంచిదాసుడా అని పించుకో!

ప్రభువా నన్ను వాడుకొండి! మీరు ఏమి చెప్పినా చేస్తాను! చివరికి మందిరంలో మరుగుదొడ్డులు కడగటానికి కూడా నేను సిద్దమే! దయచేసి నన్ను వాడుకో అని ప్రార్ధించు! దేవునికి డైరెక్షన్ లు ఇవ్వవద్దు! ఇలాంటి తగ్గింపు ప్రార్ధన చేస్తే దేవుడు తప్పకుండా వాడుకుంటారు!

 

అయితే ఎప్పుడైతే దేవుడు 10. అందుకు యెహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడి పోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడు చున్నావే;

11. అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను.

 

చరిత్ర చెబుతుంది వెంటనే యోనా పశ్చాత్తాప పడి నీనేవే పట్టణం వెళ్లి వారికి దేవుని ప్రేమ కోసం చెప్పారు! ప్రజలు ఎంతగానో యోనాని ప్రేమించారు. వారి దుర్మార్గాలను వదలివేశారు ఆ రాజు బ్రతికినంత కాలము!

ఈవిధంగా ఈ ప్రవక్త దేవుని సేవలో కడవరకు సాగారు!

 

ప్రియ యవ్వనస్తుడా! దైవజనుడా! విశ్వాసి! నీవుకూడా దేవునిలో దేవునిపనిలో వెనుకంజ వేస్తున్నావా! నీవుకూడా యోనావలే తిప్పలు పడక తప్పదు! నీవుకూడా అన్యజనులంటే ప్రేమ జాలి లేకుండా ఉన్నావా, గమనించాలి దేవుని దృష్టిలో మానవులంతా సమానమే! అంతటా అందరూ మారుమనస్సు పొందాలని దేవుడు ఆశిస్తున్నారు! నేడే పశ్చాత్తాప పడి దేవుడు చెప్పిన పని చేయు!!

 

దైవాశీస్సులు!

 

(సమాప్తం)

 

 

 

ప్రియులారా! ఈ యోనా చరిత్ర ద్వారా దేవుడు మిమ్మును వెలిగించారు అని నమ్మి విశ్వసిస్తూ మరో శీర్షిక ద్వారా మరలా కలుసుకుందాం!

 

ఇట్లు

 

ప్రభువునందు మీ ఆత్మీయ సహోదరుడు

డేవిడ్ రాజ కుమార్ దోనే

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పాపము

అబ్రాహాము విశ్వాసయాత్ర

పక్షిరాజు

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

శరీర కార్యములు

విశ్వాసము

సమరయ స్త్రీ

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు