యేసుప్రభువు చెప్పిన ఉపమానాల ధ్యానములు

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి

(మొదటి భాగము)

 

యేసు ప్రభువు బోధనా శైలిలో "ఉపమానం" అనేది ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధం.

 

1. ఉపమానం అంటే ఏమిటి?(What is a Parable?)

️"ఉపమానం" అనే పదానికి గ్రీకు భాషలో "Parabole" అని అర్థం. అంటే "ఒకదాని పక్కన మరొకటి ఉంచి పోల్చడం"

సాధారణంగా చెప్పాలంటే: "పరలోక సంబంధమైన సత్యాన్ని వివరించడానికి భూలోక సంబంధమైన ఉదాహరణను వాడటం."

ఇది ఒక నీతి కథ లాంటిది, కానీ ఇందులో కేవలం నీతి మాత్రమే కాదు, పరలోక రాజ్య మర్మాలు దాగి ఉంటాయి.

 

2. యేసు ప్రభువు ఉపమానాల ద్వారా ఎందుకు బోధించారు?

 

దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి:

️ A) మర్మాలను బయలుపరచడానికి:

️"పరలోకరాజ్య మర్మములు తెలిసికొనుట మీకు అనుగ్రహింపబడియున్నది" (మత్తయి 13:11).

దేవుని రాజ్యం గురించి నేరుగా చెబితే అర్థం చేసుకోవడం కష్టం. అందుకే విత్తనం, గొర్రెలు, నాణేలు వంటి దైనందిన జీవితంలోని వస్తువులను ఉదాహరణగా తీసుకుని, పరలోక సత్యాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పారు.

 

️ B) సత్యమును దాచడానికి:

️"చూచుచుండియు చూడకయు, వినుచుండియు వినకయు..." (మత్తయి 13:13)

ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ యేసు ప్రభువు స్వయంగా చెప్పారు: "చూచుచుండియు చూడకపోవుటకు, వినుచుండియు గ్రహింపకపోవుటకు" నేను ఉపమానాలలో మాట్లాడుతున్నాను అని. అంటే, ఎవరికైతే నిజంగా దేవుని మీద ఆకలి, దప్పిక ఉంటాయో వారు మాత్రమే ఆ మర్మాన్ని వెతుకుతారు. కేవలం విమర్శించడానికే వచ్చేవారికి ఆ అర్థం అందదు.

 

️ C) మనస్సులో ముద్ర వేయడానికి:

సిద్ధాంతాల కంటే కథలు మనకు బాగా గుర్తుంటాయి. ఒక సమరయుడి కథ గానీ, తప్పిపోయిన కుమారుని కథ గానీ విన్నప్పుడు అది మన హృదయంలో ఒక చిత్రంలా (Image) ఉండిపోతుంది. అది కాలక్రమేణా మన ప్రవర్తనను మారుస్తుంది.

 

️ D) వినేవారిని తీర్పులోకి నెట్టడానికి:

ఉపమానాలు వినేవారిని ఒక నిర్ణయం తీసుకునేలా చేస్తాయి. ఉదాహరణకు, 'అపరాధియైన దాసుని' ఉపమానం విన్నప్పుడు, మనల్ని మనం పరీక్షించుకుని "నేను కూడా ఇతరులను క్షమించాలన్నమాట" అనే నిర్ణయానికి వచ్చేలా చేస్తాయి.

 

️ E) ప్రవచన నెరవేర్పు:

️ "నోరు తెరచి ఉపమానము చెప్పెదను..." అన్న కీర్తన 78:2 ప్రవచనము యేసు ప్రభువు ద్వారా నెరవేరినట్లు మత్తయి 13:35 లో చూడగలము.

అవును! బైబిల్ గొప్పతనమే ప్రవచనానుసారము. ప్రతీ ప్రవచనం ప్రభువులో తప్పక నెరవేరుతుంది.

 

మనం నేర్చుకోవాల్సిన పాఠం:

ఉపమానం అనేది ఒక "అద్దం" లాంటిది. అది మన అసలు రూపాన్ని మనకు చూపిస్తుంది. అందుకే యేసు ప్రభువు తరచుగా "వినదగిన చెవిగలవాడు వినును గాక" అని ముగించేవారు.

 

యేసుప్రభువు చెప్పిన ఉపమానాల జాబితా (Main List)

🍃/—————

 

️1. విత్తేవాడు (మత్తయి 13:3-9)

️2. గోధుమలు - గురుగులు (మత్తయి 13:24-30)

️3. ఆవగింజ (మత్తయి 13:31-32)

️4. పులిసిన పిండి (మత్తయి 13:33)

️5. దాచబడిన ధనము (మత్తయి 13:44)

️6. అమూల్యమైన ముత్యము (మత్తయి 13:45-46)

️7. వల (మత్తయి 13:47-50)

️8. కనికరము లేని దాసుడు (మత్తయి 18:23-35)

️9. ద్రాక్షాతోట పనివారు (మత్తయి 20:1-16)

️10. ఇద్దరు కుమారులు (మత్తయి 21:28-32)

️11. దుష్టులైన కాపులు (మత్తయి 21:33-46)

️12. రాజకుమారుని పెండ్లి విందు (మత్తయి 22:1-14)

️13. పదిమంది కన్యకలు (మత్తయి 25:1-13)

️14. తలాంతులు (మత్తయి 25:14-30)

️15. గొర్రెలు - మేకలు (మత్తయి 25:31-46

️16. ఎదిగే విత్తనం (మార్కు 4:26-29)

️17. ఇద్దరు అప్పులవారు (లూకా 7:41-43)

️18. మంచి సమరయుడు (లూకా 10:25-37)

️19. అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడు (లూకా 11:5-8)

️20. ధనవంతుడైన మూర్ఖుడు (లూకా 12:16-21)

️21. మెలకువగా ఉన్న దాసులు (లూకా 12:35-40)

️22. ఫలించని అంజూరపు చెట్టు (లూకా 13:6-9)

️23. గొప్ప విందు (లూకా 14:15-24)

️24. గోపురము కట్టువాడు - యుద్ధానికి వెళ్లే రాజు (లూకా 14:28-33)

️25. తప్పిపోయిన గొర్రె (లూకా 15:3-7)

️26. తప్పిపోయిన నాణెము (లూకా 15:8-10)

️27. తప్పిపోయిన కుమారుడు (లూకా 15:11-32)

️28. అన్యాయస్థుడైన గృహనిర్వాహకుడు (లూకా 16:1-13)

️29. ధనవంతుడు - లాజరు (లూకా 16:19-31)

️30. అన్యాయస్థుడైన న్యాయాధిపతి (లూకా 18:1-8)

️31. పరిసయ్యుడు - సుంకరి (లూకా 18:9-14)

️32. పదివరహాలు (Minas) (లూకా 19:11-27)

 

ప్రియులారా దేవుని చిత్తమైతే ఉపమానములను ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆయన జ్ఞానం ఎట్లాంటిదో మన ఊహలకు సహితం అందదు. పరిశుద్ధాత్ముని సహాయంతో కొంత ధ్యానించే ప్రయత్నం చేద్దాం!

 

నేటి వర్తమానాలలో 45 నిమిషాల వర్తమానం లో ఒక 5 నిమిషాలు ఉపమానములకు ఉపయోగించడం తప్పులేదు. కానీ, అనేకమంది సేవకులు 5 నిమిషాలు వాక్యానికి, మిగిలిన సమయమంతా లోక సంబంధమైన విషయాలతో కాలక్షేపం చేస్తూ దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నారు. దానికి దేవునికి లెక్క అప్పగించాలి జాగ్రత్త!

 

ప్రియ స్నేహితా!

ఉపమానంల ధ్యానం ద్వారా ఆత్మీయ లోతులను స్పృశిస్తూ, వాక్యానుసారముగా మన జీవితాలను మలచుకోవడానికి ప్రయాసపడదాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(రెండవ భాగము)

 

విత్తువానిని గూర్చిన ఉపమానము

 

బహు జనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మింగివేసెను. మరి కొన్ని రాతినేలనుపడి, మొలిచి, చెమ్మలేనందున ఎండి పోయెను. మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను. మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను. లూకా 8 : 4-8

 

విత్తనము అంటే?

🌾విత్తనము దేవుని వాక్యము.                   లూకా 8:11

ఆత్మీయ లోతు (Spiritual Insights):

నేల రకాలు - హృదయ స్థితి:

️"త్రోవ ప్రక్క" అంటే కఠినమైన హృదయం,

️"రాతి నేల" అంటే లోతులేని హృదయం,

️"ముండ్ల పొదలు" అంటే సందడి గల (busy) హృదయం,

️ "మంచి నేల" అంటే లోబడే హృదయం

 

🌾త్రోవ ప్రక్కనబడిన విత్తనాలు:

త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తి కొని పోవును. లూకా 8:12

 

👉నేటి దినాలలో వాక్యము వినే వారిలో 90 శాతము పైగా ఈ కోవకు చెందిన వారే. చూడండి! లెక్కలేనన్ని దేవుని మందిరాలు. దేవునిని ఆరాధించడానికి స్థలము చాలక, కొన్ని మందిరాలలో రెండు నుండి ఐదు ఆరాధనలు వరకూ జరుగుతున్నాయి. ఇక బహిరంగ సభలంటే? ఇసుకవేస్తే? రాలనంత జనసందోహం.

వీరంతా వాక్యం విన్నవారే. వీరిలో వాక్యం విని రక్షణ పొందినవారు ఎంత మంది? అంటే, అది సమాధానం లేని ప్రశ్న గానే మిగిలిపోతుంది. మిగిలిన వారి సంగతి ఎట్లా వున్నా, కనీసం క్రైస్తవులు అని చెప్పుకొంటున్న వారైనా, క్రీస్తును కలిగి యుండేవారు కదా? కానీ, నేటి దినాలలో ఆపరిస్థితి వుందా?

కారణం ఏమిటి? చెవుల ద్వారా ప్రవేశించిన వాక్యం హృదయంలోకి చొచ్చుకుపోవాలి. కానీ,

అట్లా జరగకుండా... ఒక చెవితో విన్న వాక్యం మరొక చెవి ద్వారా బయటకి వెళ్ళిపోతుంది. (అంటే? వాక్యం వినడానికి రెండు చెవులను కూడా అప్పగించలేంత అశ్రధ్ధతో వాక్యం వింటున్నాము).

అనేక మంది దేవుని మందిరానికి వెళ్లడమే భక్తి అనే తలంపుతో వస్తారు గాని, వాక్యం విని, జీవితాన్ని సరిచేసుకోవాలని తలంపు ఏ కోశానా వారిలో కనిపించదు. అందుకే, వారు వాక్యం విన్నా, సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు. ఆ గుంపులో నీవూ వున్నవా? చూడండి, గత 50 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నా, రక్షణ లేదు కదా, కనీసం రక్షణ అంటే ఏమిటోకూడా తెలియని వారు కోకొల్లలు. కారణం? విత్తనంలో లోపమా? విత్తేవానిలో లోపమా? కొన్ని సందర్భాలలో విత్తేవానిలో లోపమున్నా, విత్తబడిన విత్తనం మాత్రం సజీవమైనది, బలమైనది. మరి లోపమెక్కడ? నీ హృదయం దున్నబడలేదు. ప్రార్ధనతో నీ హృదయం దున్నబడితే? ఆ విత్తనం నీ హృదయంలోపడి, తప్పక నూరంతలుగా ఫలిస్తుంది.

 

🌾రాతినేలను పడిన విత్తనాలు:

విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా కొన్ని రాతినేలనుపడి, మొలిచి, చెమ్మలేనందున ఎండి పోయెను. రాతినేలనుండు వారెవరనగా, విను నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి  శోధనకాలమున తొలగిపోవుదురు. లూకా 8: 5,6,13

👉వాక్యం అనే విత్తనం వారి హృదయంలో పడి మొలకలేస్తుంది. కానీ, అది రాతి హృదయం. వేరు లోనికి చొచ్చుకొనిపోయే అవకాశం లేదు. తద్వారా నీరు (పరిశుద్ధాత్మ) అందక మొలకలు ఎండిపోతాయి. వాక్యం విత్తబడుతున్నప్పుడు, వింటున్న కొందరి హృదయాలు పశ్చత్తాపముతో కృంగిపోతాయి, కన్నీరు ఏరులై ప్రవహిస్తుంది.

సంతోషం తో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. చిన్న శోధనలు వచ్చేసరికి ఆ మార్గం నుండి తొలగిపోతారు.

కారణం ఏమిటి? హృదయాలు దున్న బడలేదు. ప్రార్ధన ద్వారా మన హృదయాలు వాక్యమును అంగీకరించడానికి సిద్ధపరచి బడాలి. వాక్యాన్ని వినడానికి ముందు, ప్రభువా ఈ దినం నీవు నాతో మాట్లాడు, నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా వుంటే నాకు తెలియజేయి అంటూ సిద్ధపాటు కలిగిన హృదయంతో వాక్యాన్ని వినడానికి సిద్ధపడాలి. అట్లా సిద్ధపాటు లేకుండా, వాక్యం వింటే? కొన్ని సందర్భాలలో ఉద్రేకం కలుగుతుంది. ఆ ఉద్రేకంలో ఏవో తీర్మానాలు తీసుకుంటాము. ఆ ఉద్రేకంలానే మనం తీసుకున్న తీర్మానాలు కూడా చల్లారిపోతున్నాయి. ఉద్రేకం కాదు రావలసింది, ఉజ్జీవం. ఉజ్జీవమైతే అయితే అది స్థిరముగా నిలిచి ఉంటుంది. విస్తారంగా ఫలిస్తుంది.

 

🌾ముండ్ల పొదలలో పడిన విత్తనాలు

విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను. ముండ్ల పొద లలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. (లూకా 8: 5,7,14)

👉ఈ విత్తనం పడిన స్థలము ఫలించడానికి అనుకూలమైనదే. కానీ, చుట్టూ ముండ్ల పొదలున్నాయి. ఫలించాల్సిన మొక్క కంటే ఇవి మరింత ఏపుగా పెరిగి, ఫలించాల్సిన మొక్కను అణచి వేస్తున్నాయి. ముండ్ల పొదలు దానిపైన వ్యాపించడం వలన సూర్యరశ్మి తగులక, పరిపక్వతకు చేరుకోలేక, మరగుజ్జు గానే వుండిపోతూ నిష్ప్రయోజనమైన చెట్టుగానే మిగిలిపోతుంది. ముండ్ల పొదలు, గచ్ఛ పొదలు సృష్టి ఆరంభములో వున్నట్లు కనిపించవు. అవి పాపము యొక్క ప్రతిఫలాలు. ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు; (ఆది  3:17,18)

యేసు ప్రభువు సిలువ మీద "ముండ్ల కిరీటం" ధరించారు. అంటే మన హృదయాలలో ఉన్న లోక సంబంధమైన విచారాలనే ముండ్లను ఆయన తన తల మీద భరించారు

ఇంతకీ, నీ హృదయంలో పడిన విత్తనాలు ఫలించకుండా అడ్డు పడుతున్న ఆ ముండ్ల పొదలేంటి? నీతి సూర్యుని వెలుగు నీకు సోకకుండా అడ్డు తగులుతున్న ఆ గచ్ఛ పొదలేంటి? శరీరాశా? నేత్రాశా? జీవపు డంబమా? నీలో నున్న ఆ ముండ్లపొదలేంటో నీకన్నా బాగా ఇంకెవ్వరికీ తెలియదు. నీ హృదయమనే పొలము ఫలించడానికి అనుకూలముగా వున్నా, ముండ్ల పొదలు, గచ్ఛ పొదలు కూకటి వేళ్ళతో పెరికి వేయకపోతే, నీవు ఫలించనే ఫలించవు. ఒక వేళ నీవు ఫలిస్తున్నాను అని భ్రమ పడుతున్నా, అవి కారు ద్రాక్షలే తప్ప, ఆత్మ ఫలాలు కావు.

 

🌾మంచి నేలను పడిన విత్తనాలు:

విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. (లూకా 8: 5,8,15)

👉మంచి నేలను పడిన విత్తనాలు నూరంతలుగా ఫలిస్తూ వున్నాయి. కారణం? వీరు విని, విడిచిపెట్టేవారు  కాదు. వినిన వాటిని గైకొనేవారు. చూడండి! ప్రకటన గ్రంధం మొదటి అధ్యాయములో వాక్యమును చదివే వారికి, వినే వారికి, గైకొనేవారికి ధన్యతను ఆపాదిస్తే? చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి కేవలం గైకొనే వారికి మాత్రమే ఆ ధన్యత పరిమితం చేయబడింది. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. (ప్రకటన 1:3) ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. (ప్రకటన 22:7)

 

ప్రియ స్నేహితా!

మన జీవితాలెట్లా వున్నాయి? కేవలం పరిశుద్ధ గ్రంధాన్ని, చదివేవారము గాను, వినేవారము గాను మాత్రమే వుంటే? ఫలాలు ఫలించలేము. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించ గలగాలి.

అంజూరపు చెట్టు చూడడానికి విస్తారమైన ఆకులతో నిండివుంది గాని, ఫలాలు లేక, శపించబడింది. మనము కూడా క్రైస్తవులము అని చెప్పు కొంటూ, క్రీస్తుని కలిగిలేని జీవితాలు జీవిస్తున్నామేమో? ఆ అంజూరపు చెట్టుకు పట్టిన గతే పడుతుందేమో? వద్దు! సరి చేసుకుందాం! ప్రభువులో ఫలించుదాం! ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్!

 

ముగింపు ప్రార్థన (Closing Prayer):

ప్రార్థన: "ప్రభువా! నా హృదయమును మంచి నేలగా మార్చుము. నీ వాక్యమనే విత్తనము నాలో నూరంతలుగా ఫలించుటకు, నాలో ఉన్న లోక సంబంధమైన ముండ్ల పొదలను తొలగించుము. కేవలము వినేవాడనుగా కాక, నీ వాక్యమును గైకొనే ధన్యతను నాకు ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి! ఆమెన్!"

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(మూడవ భాగము)

 

గోధుమలు - గురుగులు

ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా,అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. అందుకతడు వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. కోతకాలమువరకు  రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా  కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.....అందుకాయన ఇట్లనెను మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు”  గురుగులు దుష్టుని సంబంధులువాటిని విత్తిన శత్రువు అపవాదికోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును. మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక. (మత్తయి 13: 24-30; 37-43)

 

పొలం అంటే, ఈ లోకానికి గుర్తుగా వుంది. లోకం దేవునిది. దానంతటిపైనా నలుమూలలా తన రాజ్య స్థాపన జరగాలని దేవుని ఉద్దేశ్యం. విత్తనం విత్తేవాని ఉపమానములో వలే, ఇక్కడ విత్తనం అంటే దేవుని వాక్యంఅనికాదుగాని, దేవుని ఆత్మ మూలముగా తన రాజ్యములోనికి జన్మించిన ఆయన సంతానం.

 

తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు. (యోహాను 1:12,13)

 

ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పినప్పుడునీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? అని ప్రశ్నించినప్పుడు, దానికి సమాధానముగా ప్రభువు, ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది అని చెప్పారు. (యోహాను 3:3-8)

 

🌾గురుగులు

గురుగులు అంటే కలుపు మొక్కలు. ఇవి, మొలకెత్తే దశలో గోధుమపైరులానే ఉంటుంది. ఏది గోధుమో? ఏది గురుగో? అర్ధం కాదు. అంతా గోధుమను పోలివుంటుంది.

ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారికంతము కలుగును.

          2 కొరింథీ 11 : 13-15

 

ఆత్మీయ విశ్లేషణ (Spiritual Insight):

గోధుమలకు, గురుగులకు మధ్య ఉన్న ఒక ఆసక్తికరమైన తేడా ఏమిటంటే?

గురుగులు (Darnel): ఇవి పెరిగేటప్పుడు గోధుమల్లాగే నిటారుగా (తల ఎత్తుకుని) ఉంటాయి.

గోధుమలు: గింజ పట్టిన తర్వాత బరువుకు గోధుమ కంకి వంగి ఉంటుంది (వినయం/దీనత్వం).

👉 నిజమైన దేవుని బిడ్డలు ఫలిస్తున్న కొద్దీ దేవుని ఎదుట వినయంగా వంగుతారు, కానీ గురుగులు (వేషధారులు) గర్వంతో తల ఎత్తుకుని తిరుగుతారు.

 

🌾గురుగులు సాతాను సంతతికి సాదృశ్యం:

మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు. (యోహాను 8:44)

 

ప్రస్తుతం ఈ లోకంలో మంచీ చెడ్డలు రెండూ కలిసే వున్నాయి. దేవుని శత్రువు ఈ లోకంలో చెడ్డవాళ్లను వెదజల్లిపోయే సాతాను. దేవుడు శ్రేష్టమైన విత్తనాలనే విత్తాడు. అందరిపట్ల ఉన్నతమైన ఉద్దేశ్యాలనే కలిగియున్నారు.  నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు (యిర్మియా 29 : 11) కానీ, అపవాది వారిలో వక్రమైన బీజాలు విత్తడం ద్వారా, వాడి రాజ్యాన్ని విస్తరింపజేసుకొనే పనిలో వున్నాడు. లోకం నుండి దుర్మార్గులను ఏరివేసే సమయంలో, కొందరు మంచివారిని కూడా నాశనం చెయ్యకుండా ఆ విధంగా చేయగలగడం దేవుని సేవకులకు అసాధ్యం. ఇందుకు ఒక కారణం ఏమిటంటే? గురుగునకూ, గోధుమకూ మధ్యగల తేడాను ఆరంభ దశలో గుర్తించడం అంత తేలికకాదు. అట్లాంటి పరిస్థితుల్లో, గురులను వేరుపరిచే క్రమంలో శ్రేష్టమైన గోధుమలను కూడా పెల్లగించవచ్చు. అయినా, అట్లా చెయ్యడానికి దేవునికి తప్ప, చాలినంత జ్ఞానం, బల ప్రభావాలు మరెవరికి వున్నాయి?

 

విశ్వాసులు ఆత్మీయంగా నిద్రపోతున్నప్పుడు (ప్రార్థనలో, వాక్యంలో అశ్రద్ధగా ఉన్నప్పుడు) సాతాను వచ్చి మన హృదయాలలో లేదా సంఘంలో అపవిత్రమైన ఆలోచనలను, కలహాలను విత్తుతాడు. జాగ్రత్త! 

అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే?

తగిన కాలంలో సాతాను పిల్లలు దేవుని పిల్లలుగా పశ్చాత్తాపం ద్వారామార్పు చెందే  అవకాశముంది. ఎఫెసీ 2:1-4

 

🌾ఈ యుగాంతంలో జరుగబోయే గొప్ప పంటకోత సమయాన దేవుడు, సాతాను సంతానమునుండి తన సంతానమంతటిని వేరు చేస్తారు (మత్తయి 25 : 31-46)

 

🌾పంట కోతలో మొదట పోగుచేయబడేది సాతాను సంతానమే.

ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. మత్తయి 3:12

 

వద్దు! న్యాయాధిపతిగా ఆయన నిలబడితే? గురుగులుగా మన జీవితాలుంటే, ఆ దినం అత్యంత భయంకరం. సరి చేసుకుందాం! ప్రభువు కొరకు ఫలించుదాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్!

 

ప్రార్థన: "ప్రభువా! లోకమనే పొలములో మేము నీ రాజ్య సంబంధులుగా, శ్రేష్టమైన గోధుమలుగా ఉండుటకు సహాయము చేయుము. మాలో ఎక్కడైనా వేషధారణ అనే గురుగుల స్వభావముంటే నీ కృపతో మమ్మల్ని సరిచేయుము. యుగాంతమందు నీవు కోతకోయునప్పుడు, నీ కొట్టులో చేర్చబడే ధన్యులముగా మమ్మల్ని తీర్చిదిద్దుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి! ఆమెన్!"

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(నాలుగవ భాగము)            

🍃🍃ఆవగింజ ఉపమానం:🍃🍃

అల్పమైన ఆరంభం - అద్భుతమైన ముగింపు

 

వాక్య భాగం:

"పరలోకరాజ్యము, ఒక మనుష్యుడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది అన్ని విత్తనములకంటె చిన్నది గాని పెరిగినప్పుడు అన్ని కూర మొక్కలకంటె పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగునని వారితో చెప్పెను." (మత్తయి 13:31-32)

🍃సాధారణ, ఆత్మీయ తలంపుల మేళవింపే ఉపమానసారం:

1. ఆత్మీయ విశ్లేషణ (Spiritual Insights - Deep Truths):

 

A. ఆవగింజ ఆకారం (shape)

ఆవగింజ గోళాకారంగా (Round) ఉంటుంది. ఇలాంటి ఆకారం ఉన్న విత్తనం నేల మీద పడగానే ఒకే చోట ఆగిపోకుండా "దొర్లుకుంటూ" (Roll) వెళ్తుంది.

మన విశ్వాసం కూడా ఒకే చోట ఆగిపోయేదిగా (Stagnant) ఉండకూడదు. ఆవగింజ ఎలాగైతే దొర్లుకుంటూ దూరం వెళ్తుందో, మన విశ్వాసం కూడా నిరంతరం కదులుతూ, విస్తరిస్తూ అనేకులకు చేరువవ్వాలి.

గాలి వీచినప్పుడు ఆవగింజ సులభంగా వేరొక చోటికి వెళ్ళి అక్కడ మొలకెత్తుతుంది. అలాగే పరిశుద్ధాత్మ గాలి మన జీవితాల్లో వీచినప్పుడు, మన విశ్వాసం కొత్త ప్రాంతాలకు సువార్తను తీసుకెళ్లేలా ఉండాలి.

మన ఆత్మీయ జీవితం కూడా ఒంకరటింకరగా కాకుండా. లోపములేనిదిగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి.

 

B. పరిమాణం:

🍃ఆవగింజ పాలస్తీనా ప్రాంతంలో అత్యంత చిన్న విత్తనాలలో ఒకటిగా పరిగణించబడేది.

ఆవగింజ పరిమాణం చిన్నదైనా, అది భూమిలో పడి మరణించి ఎలా వృక్షంగా మారుతుందో, మన విశ్వాసం కూడా క్రియలతో కూడినదై ఎదగాలి. (మత్తయి 13:32)

 

C. పెరుగుదల:

🍃ఆవగింజ సాధారణంగా ఒక మొక్కగా పెరుగుతుంది, కానీ గలిలయ ప్రాంతంలో అది 10 నుండి 12 అడుగుల ఎత్తు వరకు పెరిగి, ఒక చిన్న చెట్టులా కనిపిస్తుంది.

ఒక చిన్న గింజ తన చుట్టూ ఉన్న నేలను ఎలా ప్రభావితం చేస్తుందో, ఒక క్రైస్తవుడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని  ప్రభావితం చేయాలి

 

D. ఆకర్షణ:

🍃దీని పసుపు రంగు పూలు మరియు విత్తనాల కోసం పక్షులు (ముఖ్యంగా Goldfinches) ఎక్కువగా ఈ చెట్టు వద్దకు వస్తుంటాయి.

️ “మన జీవితమే ఒక సువార్తగాఅనేకులను ప్రభువు కొరకు ఆకర్షించగలగాలి. సిలువ చెంతకు నడిపించగలగాలి.

 

E. ఆవగింజలు మరియు జీర్ణక్రియ:

గట్టి పొర (Fiber Shell): ఆవగింజ పైన ఉండే పొర చాలా గట్టిగా మరియు సెల్యులోజ్ (Cellulose) అనే పీచు పదార్థంతో నిర్మితమై ఉంటుంది. మనం వాటిని నమలకుండా నేరుగా మింగేస్తే, మన కడుపులోని జీర్ణరసాలు (Digestive enzymes) ఆ గట్టి పొరను ఛేదించి లోపల ఉన్న పదార్థాన్ని పూర్తిగా జీర్ణం చేయడం కష్టమవుతుంది.

విసర్జన: అందుకే నమలకుండా మింగిన ఆవగింజలు ఒక్కోసారి అవి ఉన్నవి ఉన్నట్లుగానే విసర్జించబడతాయి.

ప్రయోజనం పొందాలంటే: ఆవగింజల్లో ఉన్న పూర్తి పోషకాలు లేదా ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందాలంటే, వాటిని నలిపి (Crushed) లేదా పొడి చేసి (Powdered) వాడటం ఉత్తమం.

👉 అలాగే, దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు, మనలోని అహం అనే గట్టి పొర పగిలితేనే అది మన జీవితంలో ఫలించి, అనేకులకు ఆశ్రయమిచ్చేలా మారుతుంది.

కాబట్టి ఆరోగ్య పరంగా చూసినా, ఆత్మీయంగా చూసినా ఆవగింజ "నలగడం" లేదా "పగలడం" అనేది దానిలోని శక్తి బయటకు రావడానికి చాలా ముఖ్యం!

 

F. అల్పమైన ఆరంభం (Small Beginning):

🍃దేవుని రాజ్యం ఈ లోకంలో చాలా అల్పంగా, అంటే కేవలం 12 మంది శిష్యులతో ప్రారంభమైంది. లోకం దృష్టిలో అది చిన్నదిగా కనిపించినా, నేడు అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

నీ సేవ లేదా నీ భక్తి జీవితం చిన్నదిగా ప్రారంభమైనా అధైర్యపడకు. ఎవరెస్టు శిఖరం అధిరోహించాలన్నా ఒక్క అడుగుతోనే ప్రారంభించాలి కదా? యేసువైపు మాత్రమేచూస్తూ ముందుకు సాగిపో (హెబ్రీ 12:2)

 

G. అంతర్గత శక్తి (Inherent Power):

🍃ఆవగింజ పైకి చిన్నదిగా ఉన్నా, దాని లోపల ఒక పెద్ద చెట్టుగా మారే "జీవం" దాగి ఉంది. దేవుని వాక్యం కూడా అంతే, అది హృదయంలో పడితే మనిషి జీవితాన్నే మార్చేస్తుంది.

పశ్చాత్తాపముతో నీ హృదయం దున్నబడినప్పుడు మాత్రమే ఇది సాధ్యం.

 

H. ఆశ్రయం ఇచ్చే స్వభావం (Shelter & Growth):

🍃ఆవగింజ మొక్క చెట్టుగా మారి పక్షులకు ఎలా ఆశ్రయాన్ని ఇస్తుందో, దేవుని రాజ్యం (సంఘం) కూడా అలసిపోయిన ఆత్మలకు, దిక్కులేని వారికి ఆశ్రయముగా ఉండాలి.  (మత్తయి 13:32)

️ “ప్రార్ధించే పెదవులకన్నా, సాయం చేసే చేతులు మిన్నఅన్నట్లుగా, ఒక్క ప్రార్ధనతోనే సరిపెట్టుకోకుండా ఆత్మీయతతో పాటు, చేయగలిగితే ఆర్ధికంగా కూడా  చేయూతనివ్వగలగాలి.

 

2.  ఆత్మీయ సూచనలు:

🍃నిరంతర పెరుగుదల: సంఘం కేవలం సంఖ్యాపరంగానే కాదు, ఆత్మీయంగా కూడా ఎదగాలి. (ఎఫెసీ 4:15 - "ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, క్రీస్తు వలె ఎదుగుదుము").

🍃విశ్వాసానికి కొలమానం: "మీకు ఆవగింజంత విశ్వాసముంటే..." అని ప్రభువు చెప్పారు (మత్తయి 17:20). విశ్వాసం ఎంత ఉంది అనేదాని కంటే, అది "సజీవంగా" ఉందా లేదా అన్నదే ముఖ్యం.

🍃ప్రభావం: ఒక చిన్న విత్తనం నేలను చీల్చుకుని బయటకు వచ్చినట్లుగా, సువార్త అడ్డంకులను అధిగమించి విస్తరిస్తుంది. (అపొస్తలుల కార్యములు 6:7 - "దేవుని వాక్యము ప్రబలమగుచుండెను"). అడ్డంకులు రాకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగదు. ఆ అడ్డంకులను చీల్చు కొంటూ సాగిపోతుంది.

 

3. ఆత్మీయ హెచ్చరిక (A Unique Warning):

బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం, ఆకాశ పక్షులు కొన్నిసార్లు శత్రువుకు (సాతానుకు) సాదృశ్యంగా ఉంటాయి (విత్తువాని ఉపమానంలో వలే).

👉హెచ్చరిక: సంఘం పెద్దగా విస్తరిస్తున్నప్పుడు, అందులోకి అపవిత్రమైన సిద్ధాంతాలు లేదా వ్యక్తులు (పక్షులు) వచ్చి చేరే అవకాశం ఉంది. కాబట్టి సేవకులు సంఘం యొక్క పవిత్రతను కాపాడాలి.

సంఘము వెలుపల నున్నవారికంటే, సంఘములోనున్న దియొత్రెఫే (3 యోహాను 1:9 ) వంటి వారితోనే అత్యంత ప్రమాదం. సంఘము విశాలమవుతున్న కొలదీ అప్రమత్తత కూడా అవసరం

 

ప్రియ స్నేహితా!

 "ఆవగింజంత విశ్వాసముంటే చాలు.. కొండలనైనా కదిలించవచ్చు! కానీ ఆ విశ్వాసం ఆవగింజ వలె 'సజీవమై' ఉండాలి." నీ విశ్వాసం నేడు ఆవగింజ అంత చిన్నదిగా ఉండవచ్చు. కానీ దానిని ప్రార్థన, వాక్యం అనే నీటితో తడిపితే, అది అనేకులకు ఆశ్రయమిచ్చే మహా వృక్షంగా మారుతుంది. నీ చిన్న ఆరంభాన్ని చూసి దిగులు పడకు, దేవుడు దానిని గొప్పగా ఫలించజేస్తారు! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్!

ప్రార్థన:

"ప్రభువా! మాలో ఉన్న విశ్వాసాన్ని ఆవగింజ వలె సజీవంగా ఉంచుము. మేము ఆత్మీయంగా ఎదిగి, అనేకులకు ఆశ్రయమిచ్చే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దుము. ఆమెన్!"

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(ఐదవ  భాగము)

 పులిసిన పిండి

అల్పమైనది - అపారమైన మార్పుకు కారణం

 

పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. మత్తయి సువార్త 13:33

 

1. ఉపమానములోని సారాంశం:

యేసుప్రభువు పరలోకరాజ్యమును ఒక స్త్రీ మూడు కుంచముల పిండిలో కలిపిన పులిసిన పిండితో పోల్చారు. ఆ కొద్దిపాటి పిండి మొత్తం పిండినంతటినీ పులియజేసింది.

 

"మూడు కుంచముల పిండి" - ఆంతర్యం ఏమిటి?

 

సాధారణంగా ఒక కుంచము (Seah) అంటే సుమారు 7.3 లీటర్ల పరిమాణం. మూడు కుంచములు అంటే దాదాపు 22 లీటర్ల పిండి (సుమారు 14-15 కేజీలు). ఒక సామాన్య స్త్రీ తన కుటుంబం కోసం అంత పెద్ద మొత్తంలో పిండిని ఒక్కసారిగా కలపడం అసాధారణం. దీని వెనుక ఉన్న కారణాలు ఇవే:

 

1. సమృద్ధికి సాదృశ్యం (Abundance):

మూడు కుంచముల పిండితో దాదాపు 100 మందికి సరిపడా రొట్టెలు చేయవచ్చు.

దేవుని రాజ్యం అనేది కొద్దిమందికి మాత్రమే పరిమితం కాదు, అది "అందరికీ సరిపడా సమృద్ధిని" ఇచ్చేదని ఇది సూచిస్తుంది.

 

2. అబ్రాహాము ఆతిథ్యంతో సంబంధం:

ఆదికాండము 18:6లో, ముగ్గురు దేవదూతలు అబ్రాహాము దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన శారాతో "మూడు కుంచముల సన్నని పిండి" తెచ్చి రొట్టెలు చేయమని చెబుతాడు.

ఇక్కడ యేసుప్రభువు అదే కొలతను వాడటం ద్వారా, దేవుని రాజ్యం అనేది దైవికమైన ఆతిథ్యానికి మరియు ఆశీర్వాదానికి గుర్తు అని సూచిస్తున్నారు.

 

3. సంపూర్ణ మార్పు (Total Transformation):

శాస్త్రీయంగా మనం చర్చించినట్లు, అంత పెద్ద మొత్తంలో ఉన్న పిండిని (22 లీటర్లు) కేవలం కొద్దిపాటి పులిసిన పిండి (Bacteria/Yeast) సంపూర్ణంగా మార్చివేసింది.

అంటే, లోకమనే పెద్ద పిండి ముద్దలో క్రైస్తవులు కొద్దిమందిగా ఉన్నా, వారు లోకాన్ని మార్చగలిగే "ప్రభావశీలురు" (Influencers) గా ఉండాలని దీని ఆంతర్యం.

 

4. మానవుని త్రివిధ స్వభావం:

కొందరు వేదాంతుల అభిప్రాయం ప్రకారం, ఈ "మూడు కుంచములు" మనిషిలోని ఆత్మ, ప్రాణము, శరీరములను సూచిస్తాయి. దేవుని రాజ్యం మన జీవితంలోని ఈ మూడు భాగాలను సంపూర్ణంగా ప్రభావితం చేయాలి. (1 థెస్స 5:23 )

 

👉ఆ స్త్రీ పిండిలో పులిసిన పిండిని "దాచిపెట్టింది" (Hidden). అంటే దేవుని రాజ్యం బయటికి ఆడంబరంగా కనిపించకపోయినా, లోపల నిశ్శబ్దంగా ఒక పెద్ద మార్పును (Silent Revolution) తీసుకొస్తుంది. అది ఒక వ్యక్తిని మార్చడమే కాదు, ఒక సమాజాన్నే మార్చగలదు!

 

2. ఆత్మీయ విశ్లేషణ (Spiritual Insight):

 

అంతర్గత ప్రభావం (Internal Influence):

ఆవగింజ ఉపమానం రాజ్యము యొక్క "బాహ్య విస్తరణ"ను (External Growth) సూచిస్తే, పులిసిన పిండి ఉపమానం రాజ్యము యొక్క "అంతర్గత ప్రభావాన్ని" (Internal Influence) సూచిస్తుంది. దేవుని వాక్యం ఒక వ్యక్తి హృదయంలోకి వెళ్ళినప్పుడు, అది బయటికి కనిపించకుండానే లోపల నుండి మనిషి స్వభావాన్ని పూర్తిగా మార్చివేస్తుంది.

 

నిశ్శబ్ద విప్లవం (Silent Transformation):

పులిసిన పిండి పిండిలో కలిసినప్పుడు ఏ శబ్దము చేయదు, కానీ తన పనిని తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతుంది. అలాగే దేవుని రాజ్యం కూడా లోకంలో నిశ్శబ్దంగా విస్తరిస్తూ, అనేకమంది జీవితాలను మారుస్తుంది.

మొత్తం పిండిని మార్చడం (Total Impact):

ఆ స్త్రీ పిండిలో వేసిన పులిసిన పిండి కొంచెమే అయినా, అది "మొత్తం పిండి" పులిసేవరకు పని చేసింది. అంటే దేవుని కృప మన జీవితంలోని ఒక భాగాన్ని మాత్రమే కాదు, మన ఆలోచనలు, ప్రవర్తన, మాటలుసమస్తాన్ని మార్చివేస్తుంది.

 

3. హెచ్చరిక కోణం (A Note of Caution):

బైబిల్‌లో కొన్ని చోట్ల "పులిసిన పిండి"ని పాపమునకు లేదా చెడు బోధలకు (పరిసయ్యుల పులిసిన పిండి) సాదృశ్యంగా వాడారు. కానీ ఈ ఉపమానంలో (మత్తయి 13:33), యేసుప్రభువు దానిని పరలోకరాజ్యపు శక్తికి ఉదాహరణగా వాడారు. అంటే మంచి మార్పు ఎలా వేగంగా వ్యాపిస్తుందో వివరించారు.

 

 🧪🍞  పులిసిన పిండి: ఒక శాస్త్రీయ మరియు ఆత్మీయ విశ్లేషణ

 

యేసుప్రభువు చెప్పిన ఈ ఉపమానంలో ఒక అద్భుతమైన శాస్త్రీయ సత్యం దాగి ఉంది. పిండి పులవడానికి కారణం కంటికి కనిపించని ఈస్ట్ (Yeast - ఒక రకమైన శిలీంధ్రం) మరియు కొన్ని రకాల లాక్టోబాసిల్లస్ (Lactobacillus) బ్యాక్టీరియా.

 

1. వ్యాప్తి చెందే తత్వం (Rapid Multiplication):

సైన్స్: పిండిలో కొంచెం పులిసిన పిండిని కలిపినప్పుడు, అందులోని బ్యాక్టీరియా మరియు ఈస్ట్ కణాలు చాలా వేగంగా విభజన చెందుతాయి. అవి పిండిలోని చక్కెరను (Sugars) ఆహారంగా తీసుకుని, కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి.

ఆత్మీయ పాఠం: దేవుని వాక్యం కూడా మన హృదయంలోకి చేరినప్పుడు, అది నిశ్శబ్దంగా మన ఆలోచనలను, స్వభావాన్ని వేగంగా మారుస్తుంది. అది కంటికి కనిపించదు కానీ దాని ప్రభావం మాత్రం స్పష్టంగా ఉంటుంది.

 

2. లోపలి నుండి మార్పు (Internal Transformation):

సైన్స్: పులిసిన పిండి పిండిని బయట నుండి మార్చదు; అది లోపల ఉండి మొత్తం ముద్ద యొక్క నిర్మాణాన్ని (Structure) మారుస్తుంది. ఆ వాయు బుడగలు పిండిని మెత్తగా, ఉబ్బేలా చేస్తాయి.

ఆత్మీయ పాఠం: మతం మనిషిని బయట నుండి మారుస్తుంది (వేషధారణ), కానీ దేవుని రాజ్యం మనిషిని లోపలి నుండి (Inside Out) మారుస్తుంది.

 

3. స్వల్ప పరిమాణం - గొప్ప ఫలితం (Small Quantity, Large Impact):

సైన్స్: ఒక కిలో పిండిని పులియజేయడానికి కేవలం కొన్ని గ్రాముల ఈస్ట్ ఉంటే సరిపోతుంది. ఆ కొద్దిపాటి సూక్ష్మజీవులే మొత్తం పిండిని మార్చగలవు.

ఆత్మీయ పాఠం: మనలోని చిన్న విశ్వాసం లేదా దేవుని వాక్యపు ఒక చిన్న వాగ్దానం మన మొత్తం జీవితాన్ని, మన కుటుంబాన్ని మార్చడానికి సరిపోతుంది.

 

ముగింపు:

శాస్త్రీయంగా పులిసిన పిండి ఎలాగైతే ఒక "నిశ్శబ్ద శక్తి"గా పనిచేస్తుందో, పరలోకరాజ్యపు సువార్త కూడా లోకంలో అలానే పనిచేస్తుంది. కంటికి కనిపించని బ్యాక్టీరియా పిండినంతటినీ ఎలా మారుస్తుందో, కంటికి కనిపించని దేవుని ఆత్మ మనల్ని అలానే నూతన సృష్టిగా మారుస్తుంది.

నీవు చేసే చిన్న ప్రార్థన, నీవు చూపించే చిన్న ప్రేమ లేదా ఒక చిన్న సాక్ష్యం ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు. పులిసిన పిండిలా నీవు ఉన్న చోట దైవిక ప్రభావాన్ని చూపిస్తున్నావా? ఆ ఆరీతిగా మన జీవితాలను మలచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్!

ముఖ్యమైన రిఫరెన్స్‌లు:

* మత్తయి 13:33 (ప్రధాన వాక్యం)

* గలతీయులకు 5:9 (కొంచెము పులిసిన పిండి ముద్దంతయు పులియజేయును)

* 2 కొరింథీయులకు 5:17 (నూతన సృష్టి)

ప్రార్థన:

"ప్రభువా, నీ పరలోకరాజ్యపు ప్రభావం మా హృదయాలలో పులిసిన పిండిలా పనిచేయనివ్వు. మా పాత స్వభావం పూర్తిగా మారిపోయి, నీ స్వభావం మాలో ప్రకాశించేలా చేయుము. మేము ఉన్న సమాజంలో నీ సాక్షులుగా, ఇతరులను మార్చగలిగే ప్రభావశీలురుగా మమ్మల్ని వాడుకొనుము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రీ! ఆమెన్!"

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(ఆరవ భాగము)

 

దాచబడిన ధనము

 

పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొనును. మత్తయి 13:44

                 

రాజయ్య, రమణయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఊరిలో జీవనం చేస్తున్నారు. ఒకరోజు రాజయ్య, రమణయ్య దగ్గరకి వెళ్లి, నా ఆరోగ్యము బాలేదు, పనిచేయలేకపోతున్న, నా పొలాన్నిఅమ్మివేస్తాను నీవు తీసుకో అని అడిగితే, అతడు నా వల్ల కాదు అంటాడు రమణయ్య. అయితే కనీసం నా పొలాన్ని కాస్త దున్నిపెట్టు, అని అడిగితే, సరే రేపు నీపని చేస్తానని చెప్పి, తర్వాత రోజు ఉదయం నాగలి, ఎద్దులతో అతని పొలానికి వెళ్లి పని చేస్తుండగా, పెద్ద పెట్టె ఒకటి అతని నాగలికి తగిలింది. అది తెరచి చూస్తే, దానినిండా చాలా విలువైన వస్తువులతో నిండివుంది. దానిని మూసివేసి,మట్టితో కప్పివేసి, రాజయ్య దగ్గరకు వెళ్లి, రాజయ్య నీ పొలాన్ని అమ్మేస్తాను అన్నావు కదా? సరే, నా దగ్గర డబ్బులేదుగాని, నా పొలం అంతా అమ్మేసి, నీ పొలాన్ని కొంటాను అని చెప్తాడు.

 

పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనముతో పోల్చబడింది.

 

📍 మొదటి వ్యాఖ్యానం

పొలము అంటే లోకమని, దాచబడిన ధనము సంఘమని, ఆ మనుష్యుడు యేసు ప్రభువు అని, లోకములో దాచబడి, సాతాను చేతిలో బంధీగా నున్న సంఘాన్ని, తనకు కలిగినదంతయూ అమ్మి అంటే, చివరి రక్తపుబొట్టు వరకు కార్చి, విమోచన క్రయధనముగా చెల్లించి, సంఘాన్ని ప్రభువు కొన్నారని వివరణ ఇచ్చేవారు అనేకులున్నారు. అయితే, ఇది సరియైన  అన్వయముగా భావించలేము. ఈ ఉపమానంలో దాచబడిన ధనము హఠాత్తుగా కనిపించింది. ప్రభువు ఎదో పనిమీద ఈలోకానికి వస్తే, హఠాత్తుగా సంఘము కనబడడం కాదు. సంఘాన్ని రక్షించడానికే, అదే పని మీద ఆయన నశించినదానిని వెదుకుతూ ఈ లోకానికి వచ్చారు. కావున, ఈ వివరణ సమంజసముగా అనిపించడం లేదు.

 

📍 రెండవ వ్యాఖ్యానం

ఇక్కడ కావాలని వెదకకపోయినా, దానిని కనుగొన్నాడు. యెషయా తెగించి నన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నారు. రోమా 10:20 (యెషయా 65:1)

 

నీతిని వెంటాడని అన్య జనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడి నను ఆ నియమమును అందుకొనలేదు, ( రోమా 9:30,31)

          

దేవుని రాజ్యం ఈలోకంలో వుందిగానీ, కళ్ళకు కట్టినట్లు బయటకు కనిపించడం లేదు. మనుష్యులలో అనేకమంది చూపుకు అందకుండా  మరుగై వుంది. అయితే, మనుష్యులకు తెలియని రీతిలో ఆయన నడిపిస్తారు. తెలియకుండానే హఠాత్తుగా ఈ గొప్పనిధి వారి కంటబడుతుంది.

 

📍 దేవుని రాజ్యాన్ని డబ్బిచ్చి కొనుక్కోవచ్చా?

అట్లా సాధ్యం కాదు.

అందుకు పేతురునీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక. (అపో. కా. 8:20) ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. (రోమా 6:23) మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. ఎఫెసి 2:8,9

 

📍 అయినా, కొనుక్కోదగినదిగా దానిని వర్ణించడం జరిగింది.

దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే  ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనియ్యుడి. (యెషయా 55:1,2)

నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్ను లకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. (ప్రకటన 3:18)

 

📍 అంటే, అది కావాలనుకున్నవారు చెల్లించవలసిన వెల ఒకటుంది. తనకున్నదంతా ఇచ్చివేయడమే. ఆ వెల

 

తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. (మత్తయి 10:37-39)

పేతురు ఇదిగోమేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. (మార్కు 10:28) ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. (లూకా 14: 26,27,33)

 

📍 ఆ రాజ్యం విలువ, సౌందర్యం చూచినవారికెవరికైనా దాని వెల ఎక్కువగా ఉన్నట్లు అనిపించదు.

 

ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.

నిశ్చ యముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. (ఫిలిప్పి 3:7,8)

ఇట్టి అనుభవములోనికి మనమునూ చేరగలగాలి. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!

 

🙏 ముగింపు ప్రార్థన:

"ప్రేమగల మా పరలోకపు తండ్రీ, ఈ ఉపమానం ద్వారా పరలోక రాజ్యపు విలువను మాకు గుర్తు చేసినందుకు వందనాలు. ప్రభువా, లోకసంబంధమైన తాత్కాలిక సంతోషాల కంటే, నీ రాజ్యము అనే అమూల్యమైన నిధిని మేము ఎక్కువగా ప్రేమించేలా మా హృదయాలను సిద్ధపరచండి. నీ కొరకు సమస్తాన్ని నష్టముగా ఎంచుకోగలిగే పౌలు వంటి మనసును మాకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రీ, ఆమేన్!"

 

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(ఏడవ భాగము)

💎 అమూల్యమైన ముత్యము (The Pearl of Great Price)

 

పరలోకరాజ్యము, మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను." (మత్తయి 13:45-46)

 

ముత్యం (Pearl) అనేది ప్రకృతిలో లభించే అత్యంత అద్భుతమైన మరియు విలువైన రత్నం. ఇది ఇతర రత్నాలలాగా భూమిలో దొరకదు, ఒక సజీవ ప్రాణి లోపల తయారవుతుంది.

 

1. ముత్యం ఏరీతిగా తయారవుతుంది? (The Biological Process)

 

ముత్యం తయారయ్యే విధానం నిజానికి ఒక "రక్షణాత్మక చర్య".

ప్రవేశం: సముద్రపు ముత్యపు చిప్ప  (pearl Oyster) లోపలికి ఏదైనా ఇసుక రేణువు, పరాన్నజీవి లేదా చిన్న చిన్న వ్యర్థాలు ప్రవేశించినప్పుడు, అది ఆ జీవికి అసౌకర్యాన్ని కలిగిస్తుందిదాని నుండి తనను తాను రక్షించుకోవడానికి, ఆ జీవి 'నక్రీ' (Nacre) అనే మెరిసే పదార్థాన్ని (దీనినే మదర్ ఆఫ్ పెర్ల్ అంటారు) ఆ రేణువు చుట్టూ పొరలు పొరలుగా విడుదల చేస్తుంది. సంవత్సరాల తరబడి వేలకొద్దీ ఈ నక్రీ పొరలు పేరుకుపోవడం వల్ల చివరకు అది ఒక అందమైన, గట్టి ముత్యంగా మారుతుంది.

 

NOTE: గాయం నుండి పుట్టిన అద్భుతం: ఓయిస్టర్ (Oyster) పడిన వేదన, అది స్రవించిన 'నక్రీ' పొరలే ఒక అందమైన ముత్యంగా మారినట్లు, క్రీస్తు పొందిన గాయాలే మనకు రక్షణ అనే ముత్యాన్ని ఇచ్చాయి.

 

ముత్యపు చిప్ప, నక్రి, ఇసుక రేణువు వేరు వేరుగా ఉంటే, వాటిని గూర్చి మాట్లాడుకోవడానికి ఏమి లేదు. అయితే ఆ మూడూ కలిస్తే?

ముత్యమయ్యింది.

వాటికి గట్టిదనమొచ్చింది ( బలము)

ప్రకాశమానమై ప్రజ్వరిల్లింది ( వెలుగు)

వాటికి విలువ వచ్చింది ( విలువ )

👉సంఘము కూడా అందరూ కలిస్తేనే అది ముత్యమై విరాజిల్లుతుంది.

 

అమూల్యమైన ముత్యము ఉపమాన ధ్యానం:

📍 కొందరి వేద పండితుల వ్యాఖ్యానం:

వర్తకుడు: యేసు క్రీస్తు.

💎 ముత్యం: సంఘము (విశ్వాసులు).

 

యేసు క్రీస్తు మన కోసం (ముత్యం కోసం) పరలోక భాగ్యాన్ని వదులుకొని, తన ప్రాణాన్ని (సమస్తాన్ని) అమ్మి మనల్ని కొనుగోలు చేశారు. మనం ఆయన దృష్టిలో అంత అమూల్యమైన ముత్యాలము. ఇది సరియైన వివరణ అయ్యే అవకాశం స్వల్పం.

📍 ఎందుకంటే? ముత్యాల వ్యాపారస్తుడు అనేకమైన ముత్యాలకోసం వెదకుతున్నాడు. అయితే, క్రీస్తు విషయం అట్లా కాదు. ఆయనకు ఏమి కావాలో ఆయనకు బాగా తెలుసు. ఒకే ఒక శ్రేష్టమైన దానికోసం, అంటే సంఘము కోసంఆయన వచ్చారు. తన సమయాన్నంతా వెచ్చించారు.

 

📍 మరింత అనుకూలవంతమైన వివరణ:

ముత్యాలను వెదకేవాడు ఆలోచనాశక్తి గలవాడు. వస్తువుల విలువలు అతనికి కొంతవరకైనా తెలుసు. దేవుడు అతనిని సత్యం, న్యాయం, పాపక్షమాపణ, జ్ఞానం, సౌందర్యం గురించి వెదికేలా చేశారు. దేవుని రాజ్యం గురించి అతనికి తెలిసినప్పుడు, జ్ఞానప్రకాశాలు గలిగిన నేత్రాలతో దానినతడు చూచినప్పుడు, దానితో సరిపోల్చదగినది లేనేలేదని గ్రహిస్తాడు.

 

1. వెదకుట మరియు కనుగొనుట (The Search and Discovery)

వర్తకుడు: ఈ వర్తకుడు కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు, అతను "మంచి ముత్యముల" కోసం వెతుకుతున్న నిపుణుడు. ఇది దేవుని సత్యం కోసం, నిజమైన శాంతి కోసం ఆకలి దప్పికలు గల వ్యక్తిని సూచిస్తుంది.

కనుగొనుట: వెతికే వాడు తప్పక కనుగొంటాడు. లోకంలో ఎన్నో 'ముత్యాలు' (మతాలు, తత్వాలు, సుఖాలు) ఉండవచ్చు, కానీ క్రీస్తు అనే "అమూల్యమైన ముత్యము" దొరికినప్పుడు మిగిలినవన్నీ చిన్నవిగా కనిపిస్తాయి.

 

2. ముత్యం యొక్క ప్రత్యేకత (Specialty of the Pearl)

సజీవ ప్రక్రియ: బంగారం లేదా వెండి గనుల్లో దొరుకుతాయి, కానీ ముత్యం ఒక సజీవ ప్రాణి (Oyster) లోపల పుడుతుంది. అది ఒక గాయం ద్వారా, బాధ ద్వారా తయారవుతుంది.

క్రీస్తు త్యాగం: అలాగే మన రక్షణ అనే ముత్యం, యేసు క్రీస్తు పొందిన గాయాల ద్వారా, ఆయన అనుభవించిన సిలువ వేదన ద్వారా మనకు లభించింది. ఆయన విరువబడిన శరీరమే మనల్ని అమూల్యమైన ముత్యాలుగా మార్చింది.

 

3. సమస్తాన్ని అమ్మివేయుట (Total Surrender)

విలువ గుర్తించుట: వర్తకుడు ఆ ముత్యం విలువ తెలియగానే "వెళ్లి తనకు కలిగినదంతయు" అమ్మివేశాడు. ఇది దేవుని రాజ్యము కోసం మనం చేసే సంపూర్ణ సమర్పణను సూచిస్తుంది.

సంతోషకరమైన త్యాగం: దాచబడిన ధనాన్ని కనుగొన్న వ్యక్తి వలె, ఈ వర్తకుడు కూడా ఆ ముత్యాన్ని పొందుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధపడ్డాడు. క్రీస్తును పొందుకున్న వాడు లోకంలోని వేటికీ ప్రాధాన్యత ఇవ్వడు.

 

📍 దేవుని రాజ్యాన్ని డబ్బిచ్చి కొనుక్కోవచ్చా?

అట్లా సాధ్యం కాదు.

 

అందుకు పేతురునీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక. (అపో. కా. 8:20)

ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. (రోమా 6:23) మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. (ఎఫెసి 2:8,9)

 

📍 అయినా, కొనుక్కోదగినదిగా దానిని వర్ణించడం జరిగింది.

దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే  ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణముసారమైనదానియందు సుఖింపనియ్యుడి. (యెషయా 55:1,2) నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు    తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్ను లకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. (ప్రకటన 3:18)

 

📍 అంటే, అది కావాలనుకున్నవారు చెల్లించవలసిన వెల ఒకటుంది. తనకున్నదంతా ఇచ్చివేయడమే ఆ వెల.

 

తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. (మత్తయి 10:37-39) పేతురు ఇదిగోమేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. (మార్కు 10:28) ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. లూకా 14: 26,27,33

 

ఇట్టి అనుభవములోనికి మనమునూ చేరగలగాలి. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!

 

🙏 ముగింపు ప్రార్థన

"ప్రేమగల మా తండ్రీ, అమూల్యమైన ముత్యమైన నీ కుమారుని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఏ అర్హత లేని మమ్మల్ని నీ రక్తముతో కొని, నీ దృష్టిలో అమూల్యమైన వారిగా మార్చావు. లోక ఆశల కంటే నీ రాజ్యాన్నే గొప్ప నిధిగా ఎంచుకొనే మనస్సు మాకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రీ, ఆమేన్!"

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(ఎనిమిదవ  భాగము)

 

🕸️ పరలోక రాజ్యము: వల ఉపమానము (The Parable of the Net)

 

పాఠ్యాంశము: మత్తయి 13:47-50

పరలోక రాజ్యము సముద్రములో వేయబడి, అన్ని రకములైన చేపలను పోగుచేసిన వలను పోలియున్నది.

 

ఈ ఉపమానము మనకు మూడు ప్రాముఖ్యమైన సత్యాలను బోధిస్తుంది:

 

1. సువార్త అనే వల (The Universal Call)

 

సముద్రము: ఇది ఈ లోకానికి సాదృశ్యము.

వల: ఇది దేవుని సువార్తకు సాదృశ్యము. వల ఏ విధంగానైతే రకరకాల చేపలను ఆకర్షిస్తుందో, సువార్త కూడా జాతి, కుల, మత భేదం లేకుండా అందరినీ దేవుని రాజ్యములోనికి ఆహ్వానిస్తుంది.

పరిచర్య బాధ్యత: జాలరి పని వల వేయడమే. ఫలితం గురించి చింతించకుండా సర్వలోకమునకు వెళ్లి సువార్త ప్రకటించడమే మన బాధ్యత.

 

2. యుగ సమాప్తి - విభజన కాలము (The Time of Separation)

ఒడ్డుకు లాగుట: వల నిండినప్పుడు జాలరులు దానిని ఒడ్డుకు లాగుతారు. ఇది యుగ సమాప్తిని సూచిస్తుంది.

విభజన: వలలో ఉన్నంత మాత్రాన అన్ని చేపలూ 'మంచివి' కావు. అలాగే సంఘములోనికి వచ్చిన వారందరూ సిద్ధపడిన వారు కాకపోవచ్చు.

దేవదూతల పాత్ర: మనుష్యులు తీర్పు తీర్చలేరు కానీ, అంతిమ దినమున దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరు చేస్తారు.

 

3. అంతిమ తీర్పు - పర్యవసానము (The Final Destiny)

మంచి చేపలు: ఇవి గంపలలో ఉంచబడతాయి (పరలోక నిత్యజీవము).

చెడ్డ చేపలు: ఇవి బయట పారవేయబడతాయి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును (నిత్య నరకాగ్ని).

హెచ్చరిక: దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఆయన నీతి మరియు తీర్పు కూడా అంత ఖచ్చితమైనది.

 

📍 ఆత్మీయ అన్వయింపు:

 

1. క్వాంటిటీ vs క్వాలిటీ: వలలో ఎన్ని చేపలు పడ్డాయన్నది కాదు, అందులో ఎన్ని 'మంచి చేపలు'గా మారుతున్నాయి అన్నదే మన పరిచర్య లక్ష్యం కావాలి.

2. ఆత్మపరీక్ష: మనం దేవుని రాజ్యమనే వలలో ఉన్నామా లేదా అన్నది కాదు ప్రశ్న.. ఆ వలను ఒడ్డుకు లాగినప్పుడు మనం 'గంపలో' చేర్చబడే యోగ్యత కలిగి ఉన్నామా?.

3. మెలకువ: యుగ సమాప్తి సమీపముగా ఉన్నది, కాబట్టి మనం మరియు మన సంఘము మొదటి ప్రేమను కలిగి ఉండి సిద్ధపడాలి.

 

🙏 ముగింపు ప్రార్థన

"పరలోకపు తండ్రీ, నీ సువార్త ద్వారా మమ్మల్ని నీ రాజ్యములోనికి చేర్చుకున్నందుకు వందనాలు. యుగ సమాప్తి యందు మేము విడిచిపెట్టబడకుండా, నీతిమంతులుగా నీ చెంత చేరే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా పరిచర్య ద్వారా అనేకులను 'మంచి చేపలు'గా నీ కొరకు సిద్ధపరచుటకు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రీ, ఆమేన్!"

 

ప్రియ స్నేహితా! నీవు వలలోనున్న మాట వాస్తవమే. కానీ, ఆ వలను ఒడ్డుకు లాగితే? నీ స్థానమెక్కడ? ఉపమానంల ధ్యానం ద్వారా ఆత్మీయ లోతులను స్పృశిస్తూ, వాక్యానుసారముగా మన జీవితాలను మలచుకోవడానికి ప్రయాసపడదాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్!

 

ముఖ్యమైన మూలాలు (References)

* [1] మత్తయి 13:47-50 వల ఉపమానము మరియు దాని వివరణ.

* [2] మార్కు 16:15 సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి.

* [3] 2 కొరింథీయులకు 13:5 మిమ్మును మీరే పరీక్షించుకొనుడి.

* [4] ప్రకటన 20:12-15 అంతిమ తీర్పు మరియు జీవగ్రంథము.

* [5] మత్తయి 24:13 అంతము వరకు సహించినవాడు రక్షించబడును.

దైవాశీస్సులు!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(తొమ్మిదవ   భాగము)

 

"కనికరము లేని దాసుడు" ఉపమానం దేవుని క్షమాపణను మరియు మన బాధ్యతను వివరించే అత్యంత శక్తివంతమైన పాఠం. పేతురు గారు "ప్రభువా, నా సహోదరుడు నా యెడల అపరాధము చేసినయెడల నేను ఎన్నిసార్లు క్షమింపవలెను? ఏడు మారుల వరకునా?" అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా యేసుప్రభువు ఈ కథను చెప్పారు.

 

కనికరము లేని దాసుడు

(The Unforgiving Servant)

️/————-

(మత్తయి 18:23-35)

                    

ఈ ఉపమానంలో మనం ముగ్గురు వ్యక్తులను, మూడు ముఖ్యమైన ఘట్టాలను చూడవచ్చు:

 

1. తీర్చలేని అప్పు - అపారమైన కనికరం

ఒక రాజు తన దాసుల యొద్ద లెక్క చూడనారంభించినప్పుడు, పదివేల తలాంతుల అప్పున్న ఒక దాసుడు తీసుకురాబడ్డాడు.

లెక్క: పదివేల తలాంతులు అంటే ఈనాటి లెక్కలో కొన్ని వేల కోట్ల రూపాయలు. ఒక సామాన్య దాసుడు తన జీవితకాలంలో తీర్చలేని అప్పు అది.

విన్నపం: "నన్ను ఓర్చుకొనుము, నీకు అంతా చెల్లింతును" అని అతడు సాగిలపడ్డాడు. నిజానికి అతడు ఎప్పటికీ చెల్లించలేడు.

క్షమాపణ: ఆ రాజు కనికరపడి, అతడిని విడిచిపెట్టి, ఆ అప్పు అంతటినీ క్షమించాడు.

👉ఆత్మీయ పాఠం: మన పాపపు అప్పు కూడా మనం తీర్చలేనిది. కానీ దేవుడు తన కృప చేత దానిని ఉచితంగా క్షమించాడు.

 

2. స్వల్పమైన అప్పు - కఠినమైన హృదయం

క్షమింపబడిన ఆ దాసుడు బయటకు వెళ్లి, తనకు నూరు దేనారముల అప్పున్న తన తోటి దాసుడిని చూశాడు.

తారతమ్యం: నూరు దేనారములు అంటే కేవలం కొన్ని వందల రూపాయలు. పదివేల తలాంతులతో పోలిస్తే ఇది చాలా స్వల్పం.

కఠినత్వం: తోటి దాసుడు బ్రతిమిలాడినా వినకుండా, అతడిని పట్టుకొని గొంతు పిసికి చెరసాలలో వేయించాడు.

👉ఆత్మీయ పాఠం: దేవుడు మన వేల కొలది పాపాలను క్షమించినప్పుడు, మన తోటివారు మన యెడల చేసే చిన్న తప్పులను మనం క్షమించకపోవడం దేవుని దృష్టిలో ఘోరమైన పాపం.

 

3. రాజాజ్ఞ - కఠిన తీర్పు

ఈ సంగతి రాజుకు తెలిసినప్పుడు, ఆయన ఆ దాసుడిని పిలిచి, "దుష్టుడా, నీవు నన్ను బ్రతిమిలాడుకున్నావు గనుక ఆ అప్పంతయు క్షమించితిని. నేను నీపై కనికరపడినట్లు నీవును నీ తోటిదాసునిపై కనికరపడవలెను గదా" అని గద్దించాడు.

శిక్ష: రాజు కోపపడి, ఆ దాసుడు తన అప్పు అంతా తీర్చేవరకు అతడిని బాధించువారికి అప్పగించాడు.

హెచ్చరిక: "మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు మీ యెడల ఆ ప్రకారమే చేయును".

 

📍 ముఖ్య అంశాలు (Sermon Points):

1. క్షమించబడిన వారు క్షమించాలి: మనకు జరిగిన అన్యాయం కంటే, మనం దేవునికి చేసిన అన్యాయం పెద్దది. ఆయన మనల్ని క్షమించినప్పుడు, మనం ఇతరులను క్షమించక తప్పదు.

2. క్షమించకపోవడం ఒక బంధకం: మనం ఇతరులను క్షమించనప్పుడు, మనమే ఆత్మీయ చెరసాలలో చిక్కుకుంటాము. మన ప్రార్థనలకు అడ్డు వస్తుంది.

3. కనికరమే దేవుని స్వభావం: కనికరము లేనివాడు కనికరము లేని తీర్పునే పొందుతాడు.

 

🙏 ముగింపు ప్రార్థన

"ప్రేమగల తండ్రీ, మా తీర్చలేని పాపపు అప్పును నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా క్షమించినందుకు వందనాలు. ప్రభువా, ఇతరులు మా యెడల చేసిన చిన్న అపరాధాలను మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి. కఠినత్వము, పగ మా హృదయాలలో ఉండకుండా నీ కనికరముతో మమ్మును నింపండి. నిన్ను వెంబడించే బిడ్డలుగా క్షమాగుణము కలిగి ఉండునట్లు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రీ, ఆమేన్!"

 

- References:

* [1] మత్తయి 18:23-35 కనికరము లేని దాసుని ఉపమానము.

* [2] ఎఫెసీయులకు 4:32 ఒకరినొకరు క్షమించుడి.

* [3] మత్తయి 6:14-15 మీరు మనుష్యుల అపరాధములను క్షమించినయెడల మీ తండ్రియు మిమ్మును క్షమించును.

* [4] కొలస్సయులకు 3:13 ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.

దైవాశీస్సులు!

 

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(పదియవ భాగము)

 

🍇 ద్రాక్షతోట పనివారి ఉపమానం (మత్తయి 20:1-16)

 

1. యజమాని ఆరాటం (The Owner's Passion)

ఈ ఉపమానంలో యజమాని (దేవుడు) మొత్తం 5 సార్లు పనివారి కోసం బయలుదేరాడు:

తెల్లవారుజామున (6 AM), 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు మరియు సాయంత్రం 5 గంటలకు. [మత్తయి 20:1-6] [1]

మర్మం: ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని, ప్రతి ఒక్కరికీ తన పరిచర్యలో అవకాశం ఇవ్వాలని దేవుడు నిరంతరం వెతుకుతూనే ఉంటాడు. ఆయన "సందేశం" పంపలేదు, ఆయనే "స్వయంగా" వెళ్ళాడు.

 

2. "పనిలేక నిలిచియున్నారు" ఎవరి తప్పు?

యజమాని 11వ గంటన వెళ్ళినప్పుడు, "మీరెందుకు ఇక్కడ పనిలేక నిలిచియున్నారు?" అని అడిగితే, వారు "ఎవడును మమ్మును కూలికి పిలువలేదు" అన్నారు. [మత్తయి 20:7] [1]

👉సేవకులకు పాఠం: లోకంలో ఇంకా రక్షించబడని వారు, పరిచర్యలోకి రాని వారు చాలామంది ఉన్నారు. వారికి అవకాశం లభించలేదేమో కానీ, వారిలో పని చేసే ఆసక్తి ఉంది. మనం వారిని తక్కువ అంచనా వేయకూడదు.

 

3. ప్రతిఫలములోని క్రమ శిక్షణ:

యజమాని "కడపటి వారి మొదలుకొని మొదటి వారి వరకు" కూలి ఇవ్వమని తన గృహనిర్వాహకుడికి చెప్పాడు. [మత్తయి 20:8]

దేవుడు చివర వచ్చిన వారికి ముందుగా ఇచ్చి, మొదట వచ్చిన వారి హృదయ స్థితిని పరీక్షించాడు. మనం ఎంత సేవ చేశామన్నది కాదు, ఇతరులు దీవించబడినప్పుడు మన స్పందన ఏమిటి అన్నది దేవునికి ముఖ్యం.

 

4. శ్రమ vs కృప (Labor vs Grace)

మొదట వచ్చిన వారు తమ "పగటి భారమును ఎండను" సహించామని చెప్పుకున్నారు. [మత్తయి 20:12] [1]

హెచ్చరిక: సేవలో మన కష్టాన్ని మనం లెక్కపెట్టుకోవడం మొదలుపెడితే, దేవుని కృపను మర్చిపోతాము. మనకు లభించిన అవకాశం గొప్పది కానీ, మన శ్రమ కాదు. [ఎఫెసీయులకు 2:8-9]

 

5. దేనారము ఒక పవిత్రమైన దేనారము

యజమాని మొదట వచ్చిన వారితో "ఒక దేనారమునకు" ఒప్పందం చేసుకున్నాడు. అంటే ఆయన తన మాట తప్పలేదు.

మర్మం: దేవుడు అన్యాయస్థుడు కాదు. ఆయన మనకు వాగ్దానం చేసిన నిత్యజీవాన్ని మరియు బహుమానాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అయితే, ఆయన ఉదారతను ప్రశ్నించే హక్కు మనకు లేదు. [రోమీయులకు 9:14-15] [3]

 

🌟 ముఖ్యాంశములు: (Summary Points):

 

1. సమయము కంటే సమర్పణ ముఖ్యం (Quality over Quantity)

యజమాని 11వ గంటన వచ్చిన వారికి కూడా పూర్తి జీతం ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశ్యంవారు అప్పటి వరకు పని దొరకక ఎదురుచూస్తూ ఉన్నారు. పిలుపు రాగానే వెనుకాడకుండా వెళ్లారు.

ఒక వ్యక్తి 50 ఏళ్లు సేవ చేసి గర్వంతో ఉండటం కంటే, చివరి 5 ఏళ్లు దేవుని మీద పూర్తి ప్రేమతో, వినయంతో సేవ చేయడం దేవునికి ఇష్టం కావచ్చు.

👉దేవుడు మన 'సర్వీస్ రిజిస్టర్' ను కాదు, మన 'హృదయ వైఖరి'ని చూస్తాడు [1 సమూయేలు 16:7].

 

2. సేవకుల మధ్య పోటీ తగదు (No Room for Competition)

మొదట వచ్చిన వారు తమ పనిని ఇతరుల పనితో పోల్చుకున్నారు. పరిచర్యలో ఇది ప్రమాదకరం.

ఒక పెద్ద చర్చి నడిపే సేవకుడు, చిన్న గ్రామంలో సేవ చేసే వ్యక్తిని తక్కువగా చూడకూడదు. యజమాని దృష్టిలో అందరూ సమానమే.

👉మనకు ఇవ్వబడిన తలాంతులకు మనం లెక్క అప్పగించాలి కానీ, పక్కన ఉన్నవారితో పోటీ పడకూడదు [మత్తయి 25:21].

 

1. పిలుపు (The Invitation): అది యజమాని చొరవ.

2. పని (The Labor): అది యజమాని తోటలో, మన స్వంత తోటలో కాదు.

3. ప్రతిఫలం (The Reward): అది యజమాని ఉదారత (Generosity).

4. వైఖరి (The Attitude): మొదటి వారు 'హక్కు' (Right) అని భావించారు, చివరి వారు 'కృప' (Grace) అని భావించారు.

 

దేవుని పిలుపు: మీరు ఏ సమయంలో సేవలోకి వచ్చినా, ఆయన తోటలో మీకు చోటు ఉంది [మత్తయి 20:7].

దేవుని ఉదారత: ఆయన న్యాయవంతుడు మాత్రమే కాదు, అంతకంటే మిన్నగా కృపామయుడు [మత్తయి 20:15].

మన వైఖరి: ఇతరుల దీవెనలను చూసి అసూయపడక, మనకు ఇచ్చిన పిలుపును బట్టి కృతజ్ఞతతో ఉందాం.

👉గుర్తుంచుకోండి: దేవుని రాజ్యంలో పోటీ లేదు, కేవలం కృప మాత్రమే ఉంది!

 

🙏 ముగింపు ప్రార్థన (Concluding Prayer)

"పరిశుద్ధుడైన తండ్రీ, ఈ రోజు మీరు మాకు అందించిన 'ద్రాక్షాతోట పనివారి ఉపమానం' ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, మేము చేసే సేవ మా శక్తి సామర్థ్యాల మీద కాకుండా, కేవలం నీ కృప మీద ఆధారపడి ఉందని గుర్తించేలా చేయండి.

మొదట వచ్చిన పనివారిలాగా సణుగుడు హృదయంతో కాకుండా, పిలుపు పొందినందుకు కృతజ్ఞత గల మనసుతో పరిచర్య చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. సేవలో ఉన్న మా తోటి సహోదరులు దీవించబడినప్పుడు వారితో కలిసి సంతోషించే హృదయాన్ని మాకు దయచేయండి. 11వ గంట వరకు నిరీక్షణతో కనిపెట్టిన వారిలా, మేము కూడా నీ రాకడ వరకు నమ్మకమైన పనివారిగా ఉండేలా బలపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్!"

 

 

 

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(పదకొండవ భాగము)

 

👬 ఇద్దరు కుమారులు:

(మాట మరియు క్రియ)

 

ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చికుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా వాడుపోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవవానియొద్దకు వచ్చి ప్రకారమే చెప్పగా వాడుఅయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని వారి నడి గెను. అందుకు  వారుమొదటివాడే అనిరి. యేసు సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (మత్తయి 21:28-31)

 

పరిచయం: ఈ ఉపమానం మన ఆత్మీయ స్థితిని పరీక్షించే అద్దం వంటిది. ఇక్కడ తండ్రి దేవునికి సాదృశ్యం, ద్రాక్షతోట ఈ లోకంలో దేవుని పరిచర్యకు సాదృశ్యం.

 

1. తండ్రి పిలుపు వ్యక్తిగత బాధ్యత (The Father's Call):

పిలుపు స్వభావం: తండ్రి ప్రతి కుమారుని దగ్గరకు వ్యక్తిగతంగా వెళ్ళాడు. "కుమారుడా, పోయి ఈ దినము నా ద్రాక్షతోటలో పని చేయుము" అన్నాడు [మత్తయి 21:28].

అన్వయం: దేవుడు నిన్ను వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు. సేవ చేయడానికి ఇది "తగిన సమయము" [2 కొరింథీయులకు 6:2]. రేపటి కోసం వాయిదా వేయడానికి ఇది మన సొంత తోట కాదు, ఆయన ద్రాక్షతోట.

 

2. మొదటి కుమారుడు: కఠినత్వం నుండి మారుమనస్సు వరకు (The Penitent Rebel):

ప్రతిస్పందన: అతను మొదట "నేను వెళ్లను" అని ముఖం మీదే చెప్పాడు. ఇది పచ్చి తిరుగుబాటుకు నిదర్శనం [మత్తయి 21:29].

మార్పు: అయితే తరువాత అతను తన తప్పు తెలుసుకొని, పశ్చాత్తాపపడి (మారుమనస్సు పొంది) పనిలోకి వెళ్ళాడు [మత్తయి 21:29].

👉బైబిల్ చరిత్రలో సుంకరులు మరియు పాపులు ఇలాంటి వారే. వారు మొదట దేవుని నియమాలను అతిక్రమించినా, యోహాను బాప్తిస్మమిచ్చువాని మాటలు విని మారుమనస్సు పొందారు [మత్తయి 21:32].

 

3. రెండవ కుమారుడు: వేషధారణతో కూడిన విధేయత (The Hypocritical Servant):

ప్రతిస్పందన: "అయ్యా, వెళ్తాను" అని చాలా గౌరవంగా, వెంటనే జవాబిచ్చాడు [మత్తయి 21:30].

వైఫల్యం: కానీ అతను వెళ్ళలేదు. అతని గౌరవం కేవలం మాటలకే పరిమితమైంది [మత్తయి 21:30].

👉పరిసయ్యులు మరియు శాస్త్రులు ఇలాంటి వారే. వారు దేవుని గురించి చాలా భక్తిగా మాట్లాడుతారు కానీ, హృదయంలో ఆయనను అంగీకరించరు [మత్తయి 15:8].

 

4. ముఖ్య అంశములు  (Sermon Nuggets):

మారుమనస్సు యొక్క ప్రాధాన్యత: మాటలు చెప్పి వెళ్లని వాని కంటే, మొదట వెళ్లనని చెప్పి మారుమనస్సు పొంది వెళ్ళిన వాడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు [మత్తయి 21:31].

వేషధారణ ప్రమాదం: పైకి "అయ్యా" అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశముండదు; తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును [మత్తయి 7:21].

తీర్పు: మారుమనస్సు పొందిన పాపులు, శాస్త్రులకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు [మత్తయి 21:31].

 

🙏 ముగింపు ప్రార్థన (Closing Prayer):

"పరిశుద్ధుడవైన తండ్రి, నీ పిలుపుకు మేము కేవలం పెదవులతో కాకుండా, క్రియలతో స్పందించేలా చేయుము. వేషధారణను విడిచిపెట్టి, హృదయపూర్వకమైన మారుమనస్సుతో నీ పరిచర్యలో పాలుపంచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మాటలు చెప్పే వారముగా కాకుండా, నీ చిత్తాన్ని నెరవేర్చే కుమారులుగా మమ్మును నడిపించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్!"

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(పండ్రెండవ  భాగము)

 

🔪🪓దుష్టులైన కాపులు

(మత్తయి 21:33-46)

🗡️————

 

1. యజమాని ఏర్పాటు - దేవుని సంపూర్ణ సంరక్షణ:

యజమాని తోట చుట్టూ "కంచె" వేశాడు. ఇది కేవలం భౌతికమైన కంచె కాదు, దేవుడు తన ప్రజలకు ఇచ్చే ఆత్మీయ రక్షణకు సూచన. కీర్తనలు 125:2 లో దేవుడు తన ప్రజల చుట్టూ ఉన్నాడని చెప్పబడింది.

గానుగ: ఆనందానికి మరియు ఫలించడానికి గుర్తు. దేవుడు మనకు ఆత్మ ఫలాలను ఇచ్చే కృపను ఇచ్చాడు. [గలతీయులకు 5:22].

 

👉దేవుడు మనల్ని లోకపు శోధనల నుండి కాపాడటానికి తన వాక్యాన్ని, తన ఆత్మను కంచెగా ఉంచాడు. మనం ఆ కంచెను దాటి బయటకు వెళ్తున్నామా?

 

2. "బురుజు" - ఆత్మీయ అప్రమత్తత:

తోటలో బురుజు కట్టడం అంటే శత్రువు రాకను కనిపెట్టడానికి, ప్రార్థన మరియు అప్రమత్తతకు సూచన. శత్రువు రాకను కనిపెట్టే ఆత్మీయ కావలి. [మత్తయి 26:41].

👉మన ఆత్మీయ జీవితంలో 'ప్రార్థన' అనేది ఒక బురుజు వంటిది. మనం ప్రార్థనలో కనిపెట్టకపోతే, అపవాది మన తోటలోని ఫలాలను దొంగిలిస్తాడు.

 

3. కాపుల భ్రమ - వారసత్వం నాదే అనుకోవడం:

కుమారుని చంపితే "వారసత్వం మనదవుతుంది" అని కాపులు అనుకున్నారు (వచనం 38). ఇది మనుష్యుల అహంకారానికి గుర్తు. దేవుడు ఇచ్చిన కృపను మన సొంత శక్తి అనుకోవడం, దేవునికే లెక్క అప్పజెప్పనక్కర్లేదు అనుకోవడం పెద్ద పొరపాటు.

👉పరిచర్యలో ఉన్నా, వ్యక్తిగత జీవితంలో ఉన్నా మనం కేవలం 'పనివారము' (Stewards) మాత్రమే, యజమానులము కాదు.

 

4. దేవుని దీర్ఘశాంతం - పదే పదే పంపబడిన దాసులు:

యజమాని ఒక్కసారి దాసులను పంపి ఊరుకోలేదు, మళ్ళీ మళ్ళీ పంపాడు. ఇది ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చూపిన అపారమైన దీర్ఘశాంతానికి గుర్తు. మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని సరిదిద్దడానికి పదే పదే హెచ్చరికలు పంపిస్తుంటారు. దేవుడు ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. [2 దినవృత్తాంతములు 36:15].

నిర్లక్ష్యం: ఆ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం అంటే దేవుని కృపను తృణీకరించడమే. [రోమీయులకు 2:4].

👉దేవుని దీర్ఘశాంతాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు.

 

4. రాజ్యాధికారం మార్చబడటం:

ఫలించని వారి నుండి ద్రాక్షతోట తీసివేయబడి, ఫలించే జనానికి ఇవ్వబడుతుంది.

బాధ్యత: దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం వాడుకోకపోతే, ఆయన దానిని వేరొకరికి అప్పగిస్తాడు. [మత్తయి 21:43].

👉మనం దేవునికి తగిన కాలంలో ఫలాలను (నీతి, ప్రేమ) అప్పగించాలి.

 

5. రాయి యొక్క రెండు స్వభావాలు (వచనం 44):

యేసుక్రీస్తు అనే రాయికి రెండు పనులు ఉన్నాయి:

1. ఆ రాయి మీద పడేవాడు నలిగిపోతాడు (అంటే పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయంతో రక్షించబడటం).

2. ఆ రాయి ఎవరి మీద పడుతుందో వారు ధూళి అయిపోతారు (అంటే కఠిన హృదయంతో ఉంటే తీర్పులో నాశనమవ్వడం). అంటే యేసును అంగీకరించని వారికి ఆయనే తీర్పు తీరుస్తారు. [1 పేతురు 2:7-8].

 

ప్రియ నేస్తమా!

యేసు నీ జీవితాన్ని నిర్మించే రాయిగా ఉన్నారాలేక నిన్ను నలిపివేసే తీర్పు రాయిగా ఉన్నారా? నీలోనికి నీవు చూచుకో! సరిచేసుకో! ఉపమానంల ధ్యానం ద్వారా ఆత్మీయ లోతులను స్పృశిస్తూ, వాక్యానుసారముగా మన జీవితాలను మలచుకోవడానికి ప్రయాసపడదాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్!

 

References:

మత్తయి 21:33-46 దుష్టులైన కాపుల ఉపమానం.

కీర్తనలు 125:2 యెహోవా తన ప్రజల చుట్టూ ఉన్నాడు.

రోమీయులకు 2:4 దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను పురికొల్పుచున్నది.

1 కోరింథీయులకు 4:2 గృహనిర్వాహకులలో నమ్మకస్థుడై యుండుట అవసరము.

దైవాశీస్సులు!!

 

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(పదమూడవ  భాగము)

 

రాజకుమారుని పెండ్లి విందు

             (మత్తయి 22:1-14)

👑🍷/——————

 

ఒక గొప్ప రాజు తన ప్రియ కుమారుని పెండ్లి నిమిత్తం భారీ విందు సిద్ధం చేశాడు. దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపాడు. విందు సమయమవగానే తన దాసులను పంపి, "అంతా సిద్ధమైంది, రండి" అని పిలిపించాడు. కానీ విచిత్రంగా, పిలవబడిన వారెవరూ రాలేదు! పైగా రాజు పంపిన దాసులను కొట్టి చంపారు.

రాజు ఆగ్రహించి, ఆ హంతకులను శిక్షించి, తన దాసులతో ఇలా అన్నాడు: "విందు సిద్ధంగా ఉంది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు. మీరు రాజమార్గములకు వెళ్లి, మీకు కనిపించిన వారందరినీ భిక్షగాళ్లనైనా, అంధులనైనా ఈ పెండ్లికి పిలుచుకురండి." అలా విందుశాల నిండిపోయింది. అయితే రాజు అతిథులను చూడటానికి వచ్చినప్పుడు, అక్కడ ఒక వ్యక్తి రాజు ఇచ్చిన 'పెండ్లి వస్త్రము' ధరించకుండా కూర్చుని ఉన్నాడు. రాజు అతడిని బయట చీకటిలోకి త్రోసివేయమని ఆజ్ఞాపించాడు.

 

ఈ ఉపమానాన్ని మూడు ప్రధాన భాగాలుగా అర్థం చేసుకోవచ్చు:

 

1. మొదటి ఆహ్వానం - నిరాకరణ (యూదుల సందర్భం):

రాజు (దేవుడు) తన కుమారుని (యేసుక్రీస్తు) కోసం పెండ్లి విందు సిద్ధం చేసి, ముందుగా ఆహ్వానించబడిన వారిని (యూదులను) పిలిచాడు. కానీ వారు దానిని లక్ష్యపెట్టలేదు.

👉కారణాలు: ఒకడు తన పొలానికి, మరొకడు తన వర్తకానికి వెళ్ళిపోయారు. అంటే లోకసంబంధమైన పనులు, ఆస్తులు దేవుని ఆహ్వానం కంటే ముఖ్యమని వారు భావించారు. [మత్తయి 22:5]

హింస: మరికొందరు రాజు పంపిన దాసులను (ప్రవక్తలను) అవమానించి చంపారు. దీనివల్ల రాజు కోపగించి ఆ పట్టణాన్ని తగులబెట్టించాడు (ఇది క్రీ.. 70లో యెరూషలేము నాశనానికి సూచన). [మత్తయి 22:7]

 

2. రెండో ఆహ్వానం - అందరికీ అవకాశం (అన్యజనుల సందర్భం):

ముందుగా పిలవబడిన వారు పాత్రులు కాకపోయినందున, రాజు తన దాసులను రాజమార్గములలోకి వెళ్లి కనిపించిన వారందరినీ (చెడ్డవారినేమి మంచివారినేమి) పిలవమన్నాడు.

వివరణ: సువార్త ఇప్పుడు కేవలం యూదులకే కాదు, లోకమంతటా ఉన్న అన్యజనులందరికీ (మనకు కూడా) అందుబాటులోకి వచ్చింది. విందుశాల అతిథులతో నిండిపోయింది. [మత్తయి 22:10]

 

3. పెండ్లి వస్త్రము లేని మనుష్యుడు (పరిశుద్ధతకు పరీక్ష):

విందులో కూర్చున్న వారిని చూడటానికి రాజు వచ్చినప్పుడు, అక్కడ ఒకడు "పెండ్లి వస్త్రము" ధరించకుండా ఉండటం చూశాడు. రాజు అతడిని బయట చీకటిలోకి త్రోసివేయమని ఆజ్ఞాపించాడు.

పెండ్లి వస్త్రము అంటే ఏమిటి? కాలంలో విందు ఇచ్చే రాజులే అతిథులకు ప్రత్యేక వస్త్రాలను ఇచ్చేవారు. ఆ వస్త్రం ధరించలేదంటే, రాజు ఇచ్చిన ఉచిత కృపను వాడు తిరస్కరించాడని అర్థం.

ఆత్మీయ అర్థం: యేసుక్రీస్తు రక్తము ద్వారా లభించే నీతి వస్త్రము (Righteousness) లేకుండా ఎవరూ పరలోక రాజ్యంలో ఉండలేరు. కేవలం చర్చికి వెళ్లడం లేదా క్రైస్తవులమని చెప్పుకోవడం చాలదు, క్రీస్తు నీతిని ధరించుకోవాలి. [ప్రకటన 19:8]

 

ముగింపు హెచ్చరిక:

"పిలవబడినవారు అనేకులు, అయితే ఏర్పరచబడినవారు కొందరే." [మత్తయి 22:14] సువార్త ఆహ్వానం అందరికీ అందుతుంది, కానీ ఆ ఆహ్వానాన్ని గౌరవించి, లోకాన్ని విడిచి, క్రీస్తు నీతిని ధరించుకున్న వారు మాత్రమే పరలోక విందులో పాలుపంచుకుంటారు.

 

References

మత్తయి 22:1-14 రాజకుమారుని పెండ్లి విందు ఉపమానం.

ప్రకటన 19:8 "ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను; అవి పరిశుద్ధుల నీతి క్రియలు."

యెషయా 61:10 "ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు, నీతి అను అంగీని నాకు తొడిగించియున్నాడు."

లూకా 14:15-24 ఇదే తరహాలో ఉన్న "గొప్ప విందు" ఉపమానం.

దైవాశీస్సులు!!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(పదునాలుగవ  భాగము)

 

పదిమంది కన్యకలు ————-

👰🏻👰🏻👰🏻👰🏻👰🏻👰🏻👰🏻👰🏻👰🏻👰🏻

పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది. వీరిలో అయిదుగురు బుద్ధిలేనివారు, అయిదుగురు బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి. పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలుమాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; అంతట తలుపు వేయబడెను. ఆ తరు వాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా అతడుమిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఆ దినమై   నను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మత్తయి 25:1-13

 

పురాతనకాలంలో యూదుల వివాహా ఆచారం

 

ఆ కాలంలో యూదుల వివాహాలు ఎట్లా జరిగేవి అంటే? వివాహ వ్యవధిని 15 రోజులుగా నిర్ణయించే వారు. ఉదా: జనవరి 1 నుండి 15వ తేదీ లోపు వివాహం జరగాలని. అందుచే ఈ పదిహేను రోజులు  పెండ్లి కుమార్తెతో పాటు కొంత మంది కన్యకలు విడిది గృహంలో ఎదురు చూస్తూ వుండాలి. పెండ్లి కుమారుడే స్వయంగా అక్కడకి వచ్చి, పెండ్లి కుమార్తెను వివాహం జరిగే స్థలానికి తీసుకొని వెళ్తాడు. (నేటి దినాలలో కూడా పెండ్లి కుమార్తె వస్తుంటే? పెండ్లి కుమారుడు ఎదురు వెళ్లి, తీసుకొని వస్తాడు.) అతడు ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదు. పగలు కావచ్చ, అర్ధరాత్రి కావొచ్చు, తెల్లవారు జాము కావొచ్చు. 15 రోజులలో ఎప్పుడైనా రావొచ్చువచ్చే ముందు ఒక వ్యక్తి పెద్దగా  పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేకలు వేస్తూ ముందుగా వస్తాడు. ఆ కేకలు విని ఈ కన్యకలు పెండ్లి కుమార్తెను సిద్ధ పరచి, వారునూ సిద్ధ పడాలి. కొందరు కన్యకలు దివిటీలు పట్టుకుంటారు, కొందరు పాటలు పాడుతూ నాట్యం చేస్తారు, మరి కొందరు కంజెరలు వాయిస్తారు. ఇక్కడ దివిటీలు పట్టుకొనే పదిమంది కన్యకల కోసం వ్రాయబడింది.

 

సాదృశ్యాలు

🔹పెండ్లి కుమారుడు: యేసు క్రీస్తు

🔹పెండ్లి కుమార్తె: సంఘము

🔹కన్యకలు: పెండ్లి కుమార్తె అనబడే సంఘమును  రెండవ రాకడకై సిద్ధపరచే సేవకులు కావొచ్చు.

🔹వివాహం : గొర్రెపిల్ల వివాహ మహోత్సవము

🔹పెండ్లి విందు: ఏడేండ్ల పరిశుద్ధుల విందు

 

కన్యకలలోని పోలికలు, వ్యత్యాసాలు

🔹పదిమందీ కన్యకలే.

🔹పదిమందీ వివాహానికి పిలువ బడ్డారు.

🔹పదిమందీ సిద్ధెలను కలిగి యున్నారు.

🔹పదిమందీ విడిది గృహానికి చేరుకున్నారు.

🔹పది మందీ నిద్రపోయారు.

(పెండ్లి కుమారుని రాక ఆలస్యం కావడం వలన)

🔹పదిమందీ పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే కేక విన్నారు.

🔹పదిమందీ నిద్ర లేచారు.

🔹పదిమందీ సిద్ధెలు వెలిగించారు.

🔹పదిమంది సిద్ధెలూ వెలిగాయి.

కాని, ఐదుగురు సిద్ధెలు ఆరిపోయాయి.

కారణం? ఆ సిద్దెలలో నూనె లేదు.

 

మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడి.

నూనె (పరిశుద్ధాత్మ) ను అమ్మేవారుంటారా? కొనగలమా? నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగానున్నది. (నిర్గమ 27:20) కొన్ని సందర్భాలలో అక్షరాలకు ఆత్మీయతను ఆపాదించలేము. ఈ సందర్భములో అలంకారిక భాషలో ఈ మాటలు వ్రాయబడ్డాయని గ్రహించగలము. ఏ వ్యక్తికికూడా మోతాదుమించి దేవుని శక్తి ప్రభావాలు వుండవు. అంతేగాక, ఎవ్వరూ కూడా దేవుని ఆత్మను అప్పుగా ఇవ్వలేరు, తీసుకోలేరు, అమ్మలేరు, కొనలేరు. అది దేవుని దగ్గరనుండి మాత్రమే రావలసిన వ్యక్తిగత అనుభవం. ప్రతీ వ్యక్తి దేవుని దగ్గరకువెళ్లి కొనుక్కోవలసిందే. (యెషయా 55:1-3; సామెతలు 23:23; లూకా 11:13; ప్రకటన  3:18) దేవుని ఆత్మను ఎవరూ డబ్బులతో కొనలేరు. ( అపో. కా 8: 18-21 ) ఈ నూనెను కొనడానికి ఖర్చు చెయ్యాల్సింది డబ్బు కాదు. మనలను మనమే ( మత్తయి 16:24-26; లూకా 14:33)

 

పెండ్లి కుమారుని ఆలస్యానికిగల కారణం?

ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. 2పేతురు 3 : 8-12

 

పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. ( ప్రభువు కూడా తప్పక రాబోతున్నారు) ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. (1 థెస్స 4:16,17)

 

విందుశాల గడియ వేయబడింది. తర్వాత వచ్చి, అయ్యాఅయ్యా! అంటూ తలుపు తడుతూవున్నారు. లోపలి నుండి సమాధానం " మీరెవరో నాకు తెలియదు". ఎంత రోధించినా అది ఎన్నటికీ తెరువబడదు. అవును! మన జీవితాలూ అంతే కదా? ఆరాధనకు వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యం వింటున్నాము, అంతే బానేవుంది. క్రీస్తు బిడ్డలవలెనే చలామణి అయిపోతున్నాము. కాని నూనె అనెడి "పరిశుద్దాత్మ" లోపించింది. రక్షించబడి, బాప్తీస్మం పొందుకున్న మనము ఆ ఆత్మను కలిగి యున్నాము. కాని మన శరీర కార్యములు ఆత్మను పనిచెయ్యనివ్వ కుండా అడ్డుగా వచ్చేస్తున్నాయి. తద్వారా వెలిగి ప్రజ్వలించ వలసిన జీవితాలు ఆరిపోతున్నాయి. ఒకవేళ ఈదినమే, పెండ్లి కుమారుడైన యేసు ప్రభువు వారు పెండ్లి కుమార్తె (సంఘము) అయిన నిన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తే? ఎత్త బడతావా? ఆ గొర్రె పిల్ల మహోత్సవపు విందులో పాల్గొంటాను అనే నిరీక్షణ నీకుందా? ఒకవేళ విడువబడితే? రొమ్ము కొట్టుకొని రోదించినా? అది అరణ్య రోధనే తప్ప, ఫలితం శూన్యం. ఆయన చెప్పే మాట అదే. "నీవెవరో నాకు తెలియదు". నీ ప్రార్ధన నేను వినను. శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. (మత్తయి 25: 41 ) అంటాడేమో? వద్దు అది భయంకరం. దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకుందాం! ప్రభువు రాకడకై సిద్ధ పడదాం! ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(పదిహేనవ  భాగము)

 

💰 తలాంతుల ఉపమానం: నీవు నమ్మకమైన దాసుడివేనా? (మత్తయి 25:14-30)

 

ఈ ఉపమానంలో ఒక యజమాని తన దాసులకు వారి శక్తి సామర్థ్యాల ప్రకారం తలాంతులను ఇచ్చి దేశాంతరము వెళ్తాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు వారి లెక్క అడుగుతాడు. దీని వెనుక ఉన్న ఆత్మీయ రహస్యాలు ఇవే:

 

1. తలాంతులు - దేవుని కృపావరాలు

సామర్థ్యం మేరకు పంపిణీ: యజమాని ప్రతివాని సామర్థ్యం (Ability) ప్రకారమే ఇచ్చాడు. దేవుడు మనకు భరించలేనంత భారం ఇవ్వడు, మన శక్తి మేరకే వరాలను ఇస్తాడు. (Ref: మత్తయి 25:15; 1 కొరింథీయులకు 12:11).

వరాల వైవిధ్యం: ఇక్కడ తలాంతు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు; మన సమయం, జ్ఞానం, సువార్త ప్రకటించే వరం, పరిచర్య చేసే వరం.. ఇవన్నీ దేవుడు మనకు ఇచ్చిన ఆస్తి. (Ref: రోమీయులకు 12:6-8).

 

2. నమ్మకత్వం - రెట్టింపు ఫలం

వెంటనే స్పందించుట: ఐదు తలాంతులు, రెండు తలాంతులు పొందిన వారు వెంటనే వెళ్లి వ్యాపారం చేసి వాటిని రెట్టింపు (Double) చేశారు. (Ref: మత్తయి 25:16-17).

ఫలితమే ప్రామాణికం: దేవుడు ఫలితాన్ని చూస్తాడు కానీ, సంఖ్యను చూడడు. ఐదుని పది చేసిన వానికి, రెండుని నాలుగు చేసిన వానికి ఆయన ఇచ్చిన బహుమానం ఒక్కటే: "భళా నమ్మకమైన మంచి దాసుడా!". (Ref: మత్తయి 25:21, 23).

👉నీకు తక్కువ వరం ఉందని బాధపడకు, ఉన్నదానిని దేవుని మహిమ కోసం వాడితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. (Ref: లూకా 16:10).

 

3. భయం మరియు సోమరితనం - శిక్షకు కారణం

తప్పుడు అవగాహన: ఒక తలాంతు పొందినవాడు తన తలాంతును భూమిలో దాచిపెట్టాడు. ఆయనకు యజమాని మీద ప్రేమతో కూడిన భయం లేదు, కేవలం 'కఠినత్వపు భయం' మాత్రమే ఉంది. (Ref: మత్తయి 25:24-25).

నిష్క్రియత పాపం: యజమాని అతడిని "దుష్టుడైన సోమరి దాసుడా" అని పిలిచాడు. దేవుడు ఇచ్చిన వరాలను వాడకపోవడం కూడా పాపమే. (Ref: యాకోబు 4:17).

👉సూత్రం: "కలిగియున్న ప్రతివానికి ఇయ్యబడును... లేనివాని యొద్దనుండి వానికి కలిగియున్నదియు తీసివేయబడును." (Ref: మత్తయి 25:29).

 

4. తీర్పు మరియు బహుమానం

నిత్య సంతోషం: నమ్మకమైన వారు "యజమాని సంతోషంలో" పాలుపంచుకుంటారు. (Ref: మత్తయి 25:21; ప్రకటన 22:12).

కఠిన శిక్ష: సోమరి దాసుడు వెలుపలి చీకటిలోకి త్రోసివేయబడతాడు. ఇది మనల్ని మనం సిద్ధపరచుకోవాలని హెచ్చరిస్తోంది. (Ref: మత్తయి 25:30).

 

ముగింపు సందేశం:

దేవుడు నీకు ఇచ్చిన తలాంతును భూమిలో (లోకంలో) దాచిపెడుతున్నావా? లేక పరలోకపు రాజ్య విస్తరణ కోసం వాడుతున్నావా?

దైవాశీస్సులు!!!

 

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(పదహారవ  భాగము)

గొర్రెలు - మేకలు

విశ్వాసికి నిత్యజీవ పరీక్ష

 

గొర్రెలు vs మేకలు: ఆత్మీయ స్వభావాల విశ్లేషణ

 🐑🆚🐐——-

 

బైబిల్ కాలంలో కాపరులు పగలు గొర్రెలను, మేకలను కలిపి మేపినప్పటికీ, సాయంత్రం వేళ వాటిని వేరు చేసేవారు. అదేవిధంగా, ఈ లోకంలో అందరూ కలిసి ఉన్నా, అంత్య దినాన ప్రభువు మన స్వభావాన్ని బట్టి వేరు చేస్తారు.

 

1. స్వభావంలో వ్యత్యాసం (Nature)

🐑 గొర్రెలు (విశ్వాస విధేయత): గొర్రె స్వతహాగా సాధు జంతువు. అది తన కాపరి స్వరాన్ని గుర్తిస్తుంది మరియు ఆయనను వెంబడిస్తుంది. అది తన కాపరి మీద పూర్తిగా ఆధారపడుతుంది. (Ref: యోహాను 10:27).

🐐 మేకలు (స్వతంత్ర భావం): మేకలు మొండివి. అవి కాపరి చెప్పినట్లు వినడం కంటే, తమకు నచ్చిన చోటికి వెళ్లడానికి ఇష్టపడతాయి. అవి స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటాయి.

👉విశ్వాసిగా మనం దేవుని వాక్యానికి లోబడుతున్నామా (గొర్రె వలె)? లేక మన ఇష్టానుసారంగా జీవిస్తూ భక్తి ముసుగు వేసుకుంటున్నామా (మేక వలె)?

 

2. ఆహారపు అలవాట్లు (Diet)

🐑 గొర్రెలు: గొర్రెలు నేల మీద ఉన్న పచ్చికను మాత్రమే తింటాయి. అంటే అవి కాపరి చూపిన క్షేమకరమైన మార్గంలో నడుస్తాయి.

🐐 మేకలు: మేకలు చెట్లు, పొదలు, చివరకు పనికిరాని వస్తువులను కూడా తింటాయి.

👉గొర్రె వంటి విశ్వాసి దేవుని వాక్యం అనే శుద్ధమైన పాలను కోరుకుంటాడు. మేక వంటి విశ్వాసి లోకపు పోకడలను, అనవసరమైన సిద్ధాంతాలను కూడా స్వీకరిస్తాడు.

 

3. గుంపు మనస్తత్వం (Community)

🐑 గొర్రెలు: ఇవి ఎప్పుడూ గుంపుగా ఉండటానికి ఇష్టపడతాయి. కాపరి రక్షణలో ఉండటాన్ని క్షేమంగా భావిస్తాయి.

🐐 మేకలు: ఇవి గుంపు నుండి విడిపోయి, ఎత్తులకు (కొండల మీదికి) వెళ్లాలని చూస్తాయి. ఇది గర్వానికి సాదృశ్యం.

👉సంఘ సహవాసంలో అణకువగా ఉండటం గొర్రె లక్షణం. తనకంటే ఎవరూ ఎక్కువ కాదనుకోవడం మేక లక్షణం.

 

గొర్రెలు - మేకలు: విశ్వాసికి నిత్యజీవ పరీక్ష 🐑

 

ఈ ఉపమానం ఒక విశ్వాసి యొక్క భక్తి కేవలం ప్రార్థన గదికే పరిమితం కాకూడదని, అది సమాజంలో క్రియల ద్వారా కనబడాలని బోధిస్తుంది.

 

1. అంతరంగ స్వభావం: గొర్రెయా? మేకయా?

ప్రభువు మనుష్యులను వారి బాహ్య రూపం లేదా వారు చెప్పే మాటలను బట్టి కాక, వారి హృదయ స్వభావాన్ని బట్టి వేరు చేస్తారు. (Ref: మత్తయి 25:32).

విశ్వాసికి పాఠం: గొర్రె అనగా వినే గుణం, విధేయత మరియు సాత్వికం కలిగినది. మేక అనగా మొండితనం మరియు సొంత ఇష్టానుసారంగా నడిచేది. మనం కేవలం పేరుకే విశ్వాసులమా లేక నిజంగా క్రీస్తు స్వరాన్ని విని లోబడే గొర్రెలమా అని పరీక్షించుకోవాలి.

 

2. అజ్ఞాత సేవ (Spontaneous Service)

నీతిమంతులు (గొర్రెలు) చేసిన మేలు వారు ఏదో బహుమానం వస్తుందని చేయలేదు. వారు సహాయం చేస్తున్నప్పుడు అది క్రీస్తుకే చేస్తున్నామని కూడా వారికి తెలియదు. (Ref: మత్తయి 25:37-39).

విశ్వాసికి పాఠం: ఒక విశ్వాసి యొక్క దాతృత్వం సహజంగా ఉండాలి. ఎవరూ చూడనప్పుడు, ప్రతిఫలం రానప్పుడు మనం చేసే చిన్న సహాయమే మన నిజమైన ఆత్మీయతకు నిదర్శనం.

 

3. ప్రతి వ్యక్తిలో క్రీస్తును దర్శించుట

️"మిక్కిలి అల్పులైన నా ఈ సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక అది నాకే చేసితిరి" అని ప్రభువు చెప్పారు. (Ref: మత్తయి 25:40).

లోతైన మర్మం: మనం చర్చిలో దేవునిని ఆరాధిస్తాం, కానీ బయట ఆకలితో ఉన్నవారిలో, కష్టాల్లో ఉన్నవారిలో కూడా దేవుడు ఉన్నాడని ఈ వాక్యం చెప్తోంది. ఒక విశ్వాసి తన తోటి మనిషిని గౌరవించినప్పుడు, అది నేరుగా దేవునిని గౌరవించినట్లే.

 

4. నిర్లక్ష్యం - ఒక భయంకరమైన పాపం

ఎడమ వైపున ఉన్న వారు (మేకలు) దేవునిని నమ్మని వారు కాదు, కానీ వారు 'అవకాశాన్ని' వాడుకోని వారు. వారు చెడు చేయలేదు, కానీ మంచి చేసే అవకాశం ఉన్నప్పుడు మౌనంగా ఉండిపోయారు. (Ref: మత్తయి 25:42-45).

హెచ్చరిక: "మేలు చేయనెరిగియు అలాగు చేయనివానికి పాపము కలుగును." (Ref: యాకోబు 4:17). దేవుడు మనకిచ్చిన వనరులను (డబ్బు, సమయం, శక్తి) ఇతరుల కోసం వాడకపోవడం తీర్పుకు దారితీస్తుంది.

 

ముగింపు: మనకు మిగిలేది ఏమిటి?

ఈ ఉపమానం ముగింపులో నీతిమంతులు నిత్యజీవమునకు, ఇతరులు నిత్యశిక్షకు వెళ్తారు. (Ref: మత్తయి 25:46). ఒక విశ్వాసిగా మనం పరలోకానికి వెళ్ళేది కేవలం మన జ్ఞానం వల్ల కాదు, క్రీస్తు ప్రేమను మన క్రియల ద్వారా ఎంతవరకు పంచాము అనే దానిని బట్టే మన స్థానం నిర్ణయించబడుతుంది.

దైవాశీస్సులు!!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(పదిహేడవ  భాగము)

 

ఎదిగే విత్తనం (మార్కు 4:26-29)

దేవుని రాజ్యపు నిశ్శబ్ద వృద్ధి

 

ఈ ఉపమానం కేవలం మార్కు సువార్తలో (మార్కు 4:26-29)మాత్రమే రాయబడింది. విత్తువాడు విత్తనం చల్లిన తర్వాత, దాని పెరుగుదల పట్ల అతనికి నియంత్రణ ఉండదు. ఇది దేవుని వాక్యానికి ఉన్న "అంతర్గత శక్తిని" తెలియజేస్తుంది.

 

1. భూమి స్వభావం - హృదయ సిద్ధపాటు

విత్తనం తనంతట తాను పెరగాలంటే నేల (భూమి) అనుకూలంగా ఉండాలి. మన హృదయం అనే భూమి లోతుగా, ఫలవంతంగా ఉన్నప్పుడు వాక్యం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది.

పాఠం: మనం వాక్యాన్ని విత్తడమే కాదు, మన హృదయాలను ప్రార్థనతో సాగు చేసుకోవాలి.

Ref: హోషేయ 10:12 (మీ హృదయమును దున్నుడి).

 

2. నిశ్శబ్ద విప్లవం (Silent Work of Spirit)

విత్తనం నేల లోపల ఉన్నప్పుడు ఎవరికీ కనిపించదు, కానీ అది లోపల చచ్చి, కొత్త జీవానికి పురుడు పోసుకుంటుంది.

ఆత్మీయ మర్మం: దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు, బయటకు వెంటనే మార్పు కనిపించకపోవచ్చు. కానీ లోపల పాపపు స్వభావం చనిపోయి, క్రీస్తు స్వభావం ఎదుగుతూ ఉంటుంది.

️Ref: యోహాను 12:24 (గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే ఒంటరిగానే ఉంటుంది.. చచ్చిన యెడల బహుగా ఫలించును).

 

3. దేవుని సమయపాలన (God's Timing)

రైతు విత్తనం వేసి పడుకుంటాడు, అంటే అతను దేవుని మీద "విశ్రాంతి" తీసుకుంటున్నాడు. తొందరపడి నేలను తవ్వి విత్తనం ఎంత పెరిగిందో చూడడు.

పాఠం: ఆత్మీయ ఎదుగుదలలో 'ఓపిక' ముఖ్యం. దేవుడు తన నిర్ణీత కాలంలోనే ఫలాన్ని ఇస్తాడు.

️Ref: యాకోబు 5:7 (రైతు భూమి యొక్క అమూల్యమైన ఫలము కోసము ఓపికతో కనిపెట్టును).

 

4. విత్తనం చల్లడం - విశ్వాసి బాధ్యత

ఒక మనుష్యుడు భూమిలో విత్తనం చల్లుతాడు. ఆ తర్వాత అతను నిద్రపోయినా, మేల్కొన్నా ఆ విత్తనం పెరుగుతూనే ఉంటుంది. (Ref: మార్కు 4:26-27).

పాఠం: మన బాధ్యత కేవలం వాక్యం అనే విత్తనాన్ని చల్లడం (చెప్పడం) మాత్రమే. అది ఎప్పుడు మొలకెత్తాలి, ఎలా ఎదగాలి అనేది దేవుని చేతుల్లో ఉంటుంది. సేవలో లేదా వ్యక్తిగత జీవితంలో మనం అతిగా ఆందోళన చెందకూడదని ఇది నేర్పుతుంది.

5. దైవిక శక్తి (The Mysterious Growth)

విత్తనం ఎలా మొలకెత్తి పెరుగుతుందో ఆ మనుష్యునికి తెలియదు. అది "తనంతట తానే" (Automatically) పెరుగుతుంది. (Ref: మార్కు 4:27-28).

ఆత్మీయ మర్మం: మనిషి హృదయంలో వాక్యాన్ని పనిచేయించేది పరిశుద్ధాత్మ శక్తి. మనుష్యుల ప్రయత్నం కంటే దేవుని కృప వల్లే ఆత్మీయ ఎదుగుదల సాధ్యమవుతుంది. (Ref: 1 కొరింథీయులకు 3:6).

 

6. క్రమబద్ధమైన ఎదుగుదల (Orderly Growth)

భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, ఆ తర్వాత వెన్నులో నిండు గింజలను ఇస్తుంది. (Ref: మార్కు 4:28).

👉పాఠం: ఆత్మీయ జీవితంలో ఎదుగుదల రాత్రికి రాత్రే జరగదు. ఇది ఒక ప్రక్రియ.

1. మొలక: మారుమనస్సు పొందిన ప్రారంభ దశ.

2. వెన్ను: విశ్వాసంలో బలపడే దశ.

3. నిండు గింజలు: క్రీస్తు స్వరూపంలోకి మారి ఫలించే దశ.

 

7. కోత కాలం (The Harvest)

పంట పండినప్పుడు, కోత కాలం వచ్చినదని గ్రహించి వెంటనే కొడవలి వేస్తాడు. (Ref: మార్కు 4:29).

హెచ్చరిక: ప్రతి విత్తనం ఫలించాలి. ప్రభువు కోత కాలం (అంత్య దినం) కోసం ఎదురుచూస్తున్నారు. మనం ఆత్మీయంగా ఎదిగి ఫలించినప్పుడే ఆయన రాజ్యానికి వారసులమవుతాము.

 

ముగింపు సందేశం:

ఈ ఉపమానం మనకు ఇచ్చే గొప్ప ధైర్యం ఏమిటంటేవాక్యం ఎప్పుడూ వ్యర్థం కాదు. మీరు మీ పిల్లలకు, స్నేహితులకు లేదా సంఘానికి వాక్యం చెప్పినప్పుడు వారు వెంటనే మారలేదని దిగులు పడకండి. ఆ విత్తనం వారి హృదయంలో ఉంది. దేవుని శక్తి దానిని నిశ్శబ్దంగా పెంచుతుంది.

దైవాశీస్సులు!!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(పద్దెనిమిదవ   భాగము)

 

💴 ఇద్దరు అప్పులవారి ఉపమానం

️/——————-

కృప మరియు కృతజ్ఞత (లూకా 7:41-43)

 

1. నేపథ్యం (The Context)

ఒక పరిసయ్యుడైన సీమోను యేసును భోజనానికి పిలిచాడు. అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి, యేసు పాదాలను తన కన్నీళ్లతో కడిగి, తలవెంట్రుకలతో తుడిచి, అత్తరు పూసింది. సీమోను తన మనస్సులో ఆమెను అసహ్యించుకున్నప్పుడు, యేసు అతని హృదయాన్ని ఎరిగి ఈ ఉపమానాన్ని చెప్పారు.

👉యేసు మన బాహ్య క్రియల కంటే అంతరంగ ఆలోచనలను చూస్తారు.

 

2. ఉపమానంలోని పాత్రలు - అప్పుల మొత్తం

️"ఒక అప్పులవానికి ఇద్దరు అప్పులవారుండిరి; ఒకడు ఐదువందల దేనారములును, మరియొకడు ఏబది దేనారములును అప్పుపడియుండిరి." (లూకా 7:41)

దేనారము: ఆ కాలంలో ఒక దేనారము అంటే ఒక కూలివాని ఒక రోజు వేతనము.

ఐదువందల దేనారములు: సుమారు ఒకటిన్నర సంవత్సరాల కష్టం (పెద్ద అప్పు).

ఏబది దేనారములు: సుమారు రెండు నెలల కష్టం (చిన్న అప్పు).

👉ఇక్కడ 'అప్పు' అంటే "పాపము". ప్రతి మనిషీ దేవునికి అప్పుపడి ఉన్నాడు. ఒకరు ఎక్కువ పాపం చేసి ఉండవచ్చు (ఆ స్త్రీ వలె), మరొకరు తక్కువ పాపం చేసి ఉండవచ్చు (సీమోను వలె). కానీ ఇద్దరూ అప్పులవారే. Ref: రోమీయులకు 3:23 (అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు).

 

3. చెల్లించలేని స్థితి (Inability to Pay)

️"వారి అప్పు తీర్చుటకు వారికి శక్తి లేనందున..." (లూకా 7:42)

ఈ ఉపమానంలోని కీలకమైన పాయింట్ ఇది. అప్పు 500 అయినా, 50 అయినాతీర్చడానికి వారి వద్ద ఏమీ లేదు.

వివరణ: మనం చేసే చిన్న పాపమైనా, పెద్ద పాపమైనా మన స్వంత పుణ్యక్రియల ద్వారా దానిని కడగలేము. రక్షణ విషయంలో మనిషి సంపూర్ణంగా నిస్సహాయుడు.

️Ref: ఎఫెసీయులకు 2:8-9 (కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు... అది మీ వల్ల కలిగినది కాదు).

 

4. దైవిక క్షమాపణ - ఉచిత కృప (Forgiveness of Grace)

️"ఆయన ఇద్దరిని ఉచితముగా క్షమించెను." (లూకా 7:42)

గ్రీకు పదం: ఇక్కడ 'క్షమించెను' అనే పదానికి గ్రీకులో Charizomai అని అర్థం. అంటే "కృపతో (Grace) విడుదల చేయడం".

👉దేవుడు మన అప్పును (పాపాన్ని) డిస్కౌంట్‌ చేయలేదు, సంపూర్ణంగా రద్దు చేశారు. ఇది ఆయన ఉచిత కృపకు నిదర్శనం.

 

5. ప్రేమ యొక్క కొలమానం (The Measure of Love)

️"కాబట్టి వారిలో ఎవడు ఆయనను ఎక్కువగా ప్రేమించును?" (లూకా 7:42) "సీమోనుఎక్కువగా క్షమింపబడినవాడే అని నాకనిపించుచున్నదనెను; అందుకు ఆయననీవు సరిగా తీర్పు తీర్చితివని చెప్పెను." (లూకా 7:43)

ఎవరికి ఎక్కువ క్షమాపణ లభించిందని వారు భావిస్తారో, వారు దేవునిని అంత ఎక్కువగా ప్రేమిస్తారు.

సీమోను సమస్య: సీమోను తనను తాను నీతిమంతుడిగా భావించుకున్నాడు (అప్పు తక్కువ అనుకున్నాడు), అందుకే యేసు పట్ల ప్రేమ చూపలేదు.

స్త్రీ స్పందన: ఆ స్త్రీ తన పాపభారం ఎంత పెద్దదో ఎరిగింది, అందుకే కన్నీళ్లతో పాదాలు కడిగి తన ప్రేమను కుమ్మరించింది. Ref: 1 యోహాను 4:19 (ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము).

 

ముగింపు:

1. పాపపు ఒప్పుకోలు: మన పాపం ఎంత భయంకరమైనదో మనం గ్రహించినప్పుడే, దేవుని క్షమాపణలోని మాధుర్యం మనకు తెలుస్తుంది.

2. అహంకారం vs వినయం: పరిసయ్యుడైన సీమోను వలె మనం "పైపైన నీతిమంతులము" అని భ్రమపడితే, దేవుని ప్రేమను ఆస్వాదించలేము.

3. సేవ మరియు కృతజ్ఞత: మన సేవ దేవుని మీద ఉన్న ప్రేమతో చేయాలి తప్ప, అప్పు తీర్చడానికి చేసే ప్రయత్నంలా ఉండకూడదు. ఎందుకంటే అప్పు అప్పటికే క్రీస్తు రక్తము ద్వారా రద్దు చేయబడింది.

 

'ఇద్దరు అప్పులవారి' ఉపమానం క్షమాపణ గురించిన అత్యంత లోతైన పాఠం. సీమోను తన అతిథికి ఇవ్వాల్సిన కనీస మర్యాదలు (నీళ్లు, ముద్దు, నూనె) ఇవ్వలేదు, కానీ ఆ స్త్రీ తన సర్వస్వాన్ని అర్పించింది.

దైవాశీస్సులు!!!!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(పంతొమ్మిదవ  భాగము)

 మంచి సమరయుడు:

🫏/—————

ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను

మరునాడతడు  రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి ఇతని  పరామర్శించుము, నీవింకే మైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ  ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు--అతనిమీద జాలిపడినవాడే అనెను. అందుకు యేసునీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను. లూకా 10 : 30-37

 

యెరూషలేము మహారాజు పట్టణము (మత్తయి 5 :35)

యెరికో శాపగ్రస్తమైన పట్టణము (యెహోషువ 6:36)

 

సాదృశ్యాలు:

 

యెరూషలేము - సమాధానం

యెరికో - శ్రమలు

యెరూషలేము - పవిత్రత

యెరికో - పాపము

యెరూషలేము - ఆశీర్వాదము

యెరికో - శాపము

యెరూషలేము - జీవము

యెరికో - మరణము

యెరూషలేము - ఉన్నతమైన అనుభవం

యెరికో - పతనమైన అనుభవం

యెరూషలేము - పరసంబంధమైనది

యెరికో - భూసంబంధమైనది

 

ఒక మనుష్యుడు ఉన్నతమైన అనుభవాలనుండి దిగిపతనమైన అనుభవాలవైపు పయనిస్తూ దొంగల చేతికి చిక్కి, కొట్టబడి, దోచుకోబడ్డాడు. అంటే, దురాత్మల సమూహాలు అతనిని కొన ఊపిరిమాత్రమే ఉండేటంతగా దాడిచేసాయి. భౌతికంగా బ్రతికియున్నప్పటికీ, ఆత్మీయంగా చచ్చిన స్థితి. అతని రక్షణ, నీతి వస్త్రాలు దోచుకోబడ్డాయి. జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే (ప్రకటన 3:1) అన్నట్లు కొరప్రాణంతో, జీవచ్ఛవంలా పడియున్న స్థితి.

శారీరికంగా బ్రతికియున్నా, ఆత్మీయంగా చచ్చిన స్థితి.

పైకి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నామంటున్నా, ఆత్మ నడిపింపులేని స్థితి.

విశ్వాసినంటూనే, క్రియలులేని జీవితం.

పైకి భక్తిగలవారమని చెప్పుకొంటున్నాగాని, ఆయన శక్తిని ఆశ్రయించలేని స్థితి.

దేవునిని మహిమ పరుస్తున్నామంటూనే, తననుతాను ఘనపరచుకొనే స్థితి.

విశ్వాసులమంటూనే, దేవుని వాక్యానికి లోబడలేని స్థితి.

పేరుకు మాత్రం ప్రాణముంది. జీవితం మాత్రం జీవచ్ఛవం.

ఒక్క మాటలో చెప్పాలంటే? వేషధారణ.

 

సహాయం చేయలేని యాజకుడు మరియు లేవీయుడు.

 

కొరప్రాణముతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తివైపు యాజకుడు మరియు లేవీయుడు కూడా అటువైపు వచ్చారు. తప్పించుకొనిపోయారు. ఎందుకట్లా? వీరు ధర్మ శాస్త్రానికి ప్రతినిధులుగానున్నారు. అయితే, ఆ ధర్మశాస్త్రము సాతానుచేత దోచుకోబడి, చావుదెబ్బలు తినిన, ఆ మనుష్యునికి ఎట్లాంటి సహాయం చెయ్యలేకపోయింది. బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవము నైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును”. (సంఖ్యా 19:16)

ధర్మ శాస్త్రము నీవు పాపవి అంటూ వేలెత్తి చూపుతూ, శిక్ష ఖరారు చేస్తూ వచ్చింది గాని, ఆ శిక్ష నుండి మనిషిని విడిపించలేకపోయింది.

 

Note:

యాజకుడు: ధర్మశాస్త్ర కర్మకాండలకు సాదృశ్యం.

లేవీయుడు: ధర్మశాస్త్ర కట్టడలకు సాదృశ్యం.

👉వీరిద్దరూ ఆ మనిషిని చూసి అవతలి ప్రక్కగా వెళ్ళిపోయారు. ఎందుకంటే ధర్మశాస్త్రం మనిషిని పాపిగా చూపిస్తుంది కానీ, పాపం నుండి రక్షించలేదు. అది మన గాయాలను కట్టలేదు.

* Ref: రోమీయులకు 8:3 (శరీరమును బట్టి బలహీనమైన ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయెనో దానిని దేవుడు చేసెను).

 

సమరయుని ప్రతిస్పందన

 

🔹అతడు పడియున్నచోటికి వచ్చాడు.

🔹అతనిని చూచాడు

🔹అతనిమీద జాలి పడ్డాడు.

🔹దగ్గరకు వెళ్ళాడు.

🔹గాయములను కట్టాడు.

🔹తన వాహనముమీద ఎక్కించాడు.

🔹పూటకూళ్లవాని యింటికి అప్పగించాడు.

 

🔸ఆ సమరయుడు మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువుకు సాదృశ్యముగా నున్నాడు.

🔸క్రీస్తును సమరయవాడు అని కొందరు పిలిచారు కూడా ( యోహాను 8:48,49) దిక్కులేని పాపులు తమకుతాము చేసుకొనలేనిదానిని ప్రభువైన యేసు క్రీస్తు వారికి చేస్తారు (లూకా 19:10; యోహాను 3:16,17; 10:27,28 )

 

ప్రభువు చెప్పిన ఉపమానంలో ప్రతీ అక్షరంలోనూ ఆత్మీయ అర్ధాన్ని వెదకడం వివేకం కాదేమో? అట్లా చెయ్యాలనుకుంటే?  సమరయుడు తన వాహనం మీద ఎక్కించుటను, ప్రభువు తన సింహాసనం మీద కూర్చుండబెట్టుటకు, ద్రాక్షారసం ఆయన రక్తమునకు, నూనె పరిశుద్దాత్మకు, పూటకూళ్లవాని యిల్లు సంఘమునకు, పూటకూళ్లవాడు సేవకునికి, రెండు దినములు పాతనిబంధన, క్రొత్తనిబంధనా గ్రంధాలకు, ఆయనిచ్చే జీతం ప్రభువు అనుగ్రహించబోయే కిరీటాలు, నిత్యరాజ్యమునకు సాదృశ్యముగా సందర్భాలనుబట్టి వీటిని అన్వయించుకోవచ్చు.

 

ముగింపు పాఠాలు (Deep Takeaways):

1. పొరుగువాడు ఎవరు?: అవసరంలో ఉన్న ప్రతివాడూ మన పొరుగువాడే. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రేమించడమే క్రీస్తు మార్గం.

2. మనం ఎవరిమి?: ఈ కథలో మనం ఆ గాయపడిన వ్యక్తిమి. యేసుప్రభువు ఆ మంచి సమరయుడు. మనం రక్షించబడ్డాం కాబట్టి, ఇప్పుడు ఇతరుల గాయాలను కట్టే సత్రపు యజమానులుగా (పరిచారకులుగా) ఉండాలి.

3. క్రియల ద్వారా ప్రేమ: ప్రేమ అనేది మాటల్లో కాదు, చేతల్లో (నూనె, ద్రాక్షారసం, డబ్బు, సమయం) ఉండాలి.

 

ఈ ఉపమానం ద్వారా నీ పొరుగువారు ఆపదలోనున్నప్పుడు, తప్పించుకొనిపోయే ప్రయత్నంకాదుగాని, వారికి మనము చేయగలిగిన సహకారం ఏదైనా వుంటే తప్పక చేసితీరాలని జ్ఞాపకం చేస్తున్నారు. ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(ఇరువదియవ  భాగము)

 

అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడు

              (లూకా 11:5-8)

 

ఈ ఉపమానాన్ని యేసుప్రభువు "ప్రభువా, మాకు ప్రార్థన చేయనేర్పుము" అని శిష్యులు అడిగినప్పుడు, పరలోక ప్రార్థన నేర్పిన తర్వాత చెప్పారు.

 

1. సమయము మరియు అవసరము (The Crisis)

అర్ధరాత్రి: యూదుల సంస్కృతిలో పగటిపూట ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణీకులు రాత్రిపూట ప్రయాణం చేసేవారు. అర్ధరాత్రి రావడం ఆ కాలంలో అసాధారణం ఏమీ కాదు.

అతిథి మర్యాద: ఇశ్రాయేలీయులకు అతిథిని ఆదరించడం ఒక పవిత్రమైన బాధ్యత. ఇంట్లో ఆహారం లేకపోవడం ఆ యజమానికి అవమానకరం. అందుకే తన స్నేహితుని దగ్గరకు వెళ్ళాడు.

 

2. సిగ్గులేని పట్టుదల (Shameless Persistence)

అడ్డంకులు: తలుపు వేసి ఉంది, పిల్లలు పక్కన పడుకొని ఉన్నారు, లేవడం ఇష్టం లేదు.

హేతువు (Importunity): ఇక్కడ వాడబడిన గ్రీకు పదం "Anaideia". దీని అర్థం 'సిగ్గులేకపోవడం' లేదా 'మొండి పట్టుదల'. స్నేహితుడైనందుకు కాకపోయినా, అతని పట్టుదల (మొండితనం) చూసి అయినా లేచి ఇస్తాడు.

ఆత్మీయ పాఠం: ప్రార్థనలో మనం విసుకక, దేవుని సన్నిధిలో పట్టుబట్టాలి.

 

3. దేవుని స్వభావం:

స్నేహితుని కంటే గొప్పవాడు

ఈ ఉపమానం దేవునిని ఆ నిద్రపోతున్న స్నేహితునితో పోల్చడం లేదు, కానీ వ్యత్యాసాన్ని (Contrast) చూపిస్తోంది:

ఆ స్నేహితుడు విసుగు చెందాడు, కానీ దేవుడు ఎన్నడూ నిద్రపోడు, కునుకడు.

ఆ స్నేహితుడు బలవంతం మీద ఇచ్చాడు, కానీ దేవుడు అడిగే వారికి కృపతో ఇచ్చే తండ్రి.

👉అసంపూర్ణమైన మనుషులే పట్టుబడితే సహాయం చేసినప్పుడు, సంపూర్ణ ప్రేమామయుడైన దేవుడు ఇంకెంతగా సహాయం చేస్తాడు!

 

4. అడుగుడి - వెదకుడి - తట్టుడి (The Action Plan)

ఈ ఉపమానం ముగిస్తూ యేసు మూడు ఆజ్ఞలు ఇచ్చారు:

1. అడుగుడి (Ask): మన అవసరాన్ని నోరు తెరిచి అడగాలి.

2. వెదకుడి (Seek): దేవుని చిత్తం కోసం అన్వేషించాలి.

3. తట్టుడి (Knock): జవాబు వచ్చేవరకు పట్టుదలతో ఉండాలి.

 

లోతైన సత్యాలు (Deep Insights):

1. మధ్యవర్తిత్వం (Intercession): ఆ స్నేహితుడు తన కోసం రొట్టెలు అడగలేదు, తన దగ్గరకు వచ్చిన 'మరొకరి' కోసం అడిగాడు. ఇతరుల కోసం ప్రార్థించడం (Intercessory Prayer) దేవునికి ఎంతో ఇష్టం.

2. అవసరత గుర్తించడం: మన దగ్గర ఏమీ లేదని (Inadequacy) ఒప్పుకున్నప్పుడే మనం దేవుని దగ్గరకు వెళ్తాము. ఆ స్నేహితుడు "నా దగ్గర పెట్టడానికి ఏమీ లేదు" అని ఒప్పుకున్నాడు.

 

5. "ముగ్గురు స్నేహితులు" - ఒక గొప్ప పాఠం

ఈ ఉపమానంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు:

1. ప్రయాణీకుడు: ఆకలితో ఉన్న లోకానికి సాదృశ్యం.

2. మధ్యవర్తి (Host): ప్రార్థించే విశ్వాసికి సాదృశ్యం.

3. యజమాని: సమస్తము కలిగిన దేవునికి సాదృశ్యం.

👉మనం కేవలం మన కోసం మాత్రమే కాదు, లోకంలో ఆకలితో (ఆత్మీయ ఆకలి) ఉన్న వారి కోసం దేవుని తలుపు తట్టే మధ్యవర్తులుగా ఉండాలి (యెహెజ్కేలు 22:30; 1 తిమోతి 2:1).

 

6. మూడు రొట్టెలు: త్రిత్వ దేవుని సంపూర్ణత (Deep Insights)

లూకా 11:5లో ఆ స్నేహితుడు "నాకు మూడు రొట్టెలు అప్పుగా ఇమ్ము" అని అడుగుతాడు. బైబిల్ పండితుల విశ్లేషణ ప్రకారం, 'మూడు' అనే సంఖ్య దేవుని సంపూర్ణతకు సాదృశ్యం.

️A. మూడు రొట్టెలు - తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ

మనం ప్రార్థనలో దేవుని తలుపు తట్టినప్పుడు, మనకు కేవలం ఒక చిన్న సహాయం మాత్రమే కాదు, త్రిత్వ దేవుని సంపూర్ణమైన తోడ్పాటు లభిస్తుంది:

తండ్రి అయిన దేవుడు: ఆయనే సమస్త ఆశీర్వాదాలకు మూలం. మన అవసరాలను తీర్చే యెహోవా ఈరే (ఆదికాండము 22:14).

కుమారుడైన యేసుక్రీస్తు: ఆయనే పరలోకము నుండి దిగివచ్చిన 'జీవాహారము'. ఆయన ద్వారానే మనకు నిత్యజీవం లభిస్తుంది (యోహాను 6:35).

పరిశుద్ధాత్ముడు: మన బలహీనతలలో సహాయం చేస్తూ, మనల్ని ఆదరించే ఆదరణకర్త (యోహాను 14:26).

️B. దేహం, ప్రాణం, ఆత్మ (Holistic Sustenance)

మనిషి కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు (మత్తయి 4:4).

మనకు శరీరానికి ఆహారం కావాలి, ప్రాణానికి శాంతి కావాలి, ఆత్మకు రక్షణ కావాలి. ఈ మూడు రొట్టెలు మనిషి యొక్క సంపూర్ణ తృప్తిని సూచిస్తాయి (1 థెస్సలొనీకయులకు 5:23).

️C. సిగ్గులేని పట్టుదల వల్ల కలిగే ఫలితం

ఈ ఉపమానంలో "అతడు లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును" అని ఉంది (లూకా 11:8).

దేవుడు మనల్ని వట్టి చేతులతో పంపడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు (ఎఫెసీయులకు 3:20).

 

7. అత్యున్నతమైన బహుమతి: పరిశుద్ధాత్మ అనుగ్రహం (లూకా 11:13)

ప్రార్థన గురించి చెప్పిన "అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడు" ఉపమానాన్ని యేసుప్రభువు ఒక గొప్ప వాగ్దానంతో ముగించారు.

️a. తండ్రి యొక్క కనికరం (The Father's Compassion)

పోలిక: భూలోకంలో ఉన్న తండ్రులు తమ పిల్లలకు అడిగినప్పుడు చేపకు బదులుగా పామును, గుడ్డుకు బదులుగా తేలును ఇవ్వరు కదా! (లూకా 11:11-12).

👉మనుషులమైన మనకే మన పిల్లల పట్ల అంత ప్రేమ ఉంటే, పరలోకపు తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుంది! ఆయన మనకు హాని చేసేవి ఏవీ ఇవ్వడు (మత్తయి 7:11).

️b. శ్రేష్ఠమైన ఈవి (The Best Gift)

పరిశుద్ధాత్మ: మత్తయి సువార్తలో "శ్రేష్ఠమైన ఈవులు" అని ఉన్న చోట, లూకా సువార్తలో "పరిశుద్ధాత్మ" అని వ్రాయబడింది (లూకా 11:13).

👉రొట్టెలు, చేపలు మన శరీర ఆకలిని తీరుస్తాయి, కానీ పరిశుద్ధాత్ముడు మన ఆత్మను తృప్తి పరుస్తాడు. ఆయన మనకు లభించే అన్ని ఆశీర్వాదాల కంటే గొప్పవాడు (యోహాను 14:16-17).

️c. ప్రార్థన - పరిశుద్ధాత్మ - సంబంధం

మనం ప్రార్థనలో పట్టుబట్టాలి (అర్ధరాత్రి స్నేహితుడి వలె) అని యేసు ఎందుకు చెప్పారు? ఎందుకంటే:

అభిషేకం: మనం అడిగే కొద్దీ పరిశుద్ధాత్మ అభిషేకం మనపై పెరుగుతుంది.

మధ్యవర్తిత్వం: మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు, పరిశుద్ధాత్ముడే మనలో ఉండి ప్రార్థన చేయిస్తాడు (రోమీయులకు 8:26).

శక్తి: ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, మనం లోకాన్ని జయించే శక్తిని పొందుతాము (అపొస్తలుల కార్యములు 1:8).

️d. అడిగే వారికి మాత్రమే (To those who ask)

షరతు: దేవుడు పరిశుద్ధాత్మను ఎవరికి ఇస్తాడు? "తన్ను అడుగువారికి" మాత్రమే ఇస్తాడు (లూకా 11:13).

👉మనం ఆత్మీయ ఆకలి కలిగి ఉంటేనే దేవుడు ఆ 'జీవజలాన్ని' మనకు అనుగ్రహిస్తాడు (యోహాను 7:37-39).

దైవాశీస్సులు!!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(21వ  భాగము)

 

"ధనవంతుడైన మూర్ఖుడు" (The Rich Fool)

 

నేపథ్యం: లూకా 12:13-21

ఒక వ్యక్తి తన ఆస్తి పంపకం గురించి యేసు వద్దకు వచ్చినప్పుడు, యేసు "లోభత్వమునకు (Greed) దూరంగా ఉండమని" హెచ్చరిస్తూ ఈ ఉపమానాన్ని చెప్పారు.

 

I. దేవుడు ఇచ్చిన సమృద్ధి (God’s Provision)

ఉపమానంలోని ధనవంతుడు కష్టపడి సంపాదించినట్లు లేదా అన్యాయం చేసినట్లు బైబిల్ చెప్పడం లేదు.

భూమి పండటం: "ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను". పంట పండటం అనేది దేవుని ఆశీర్వాదం మరియు ప్రకృతి సహకారం.

విషాదం: ఆశీర్వాదం పెరిగినప్పుడు, అతను ఆశీర్వదించిన దేవునిని మరిచిపోయాడు. కృతజ్ఞతకు బదులు స్వార్థం పెరిగింది.

 

II. "నా" అనే రోగం - స్వార్థపూరిత ఆలోచన (The 'I' Syndrome)

ఈ చిన్న ఉపమానంలో అతను "నేను", "నా", "నావి" అని దాదాపు 11 సార్లు (మూల భాషలో) అనుకుంటాడు.

నా ధాన్యము, నా కొట్లు, నా ఆస్తి: అతను తన సంపదను తన సొంత శక్తితో వచ్చినట్లుగా భావించాడు.

పరుల పట్ల నిర్లక్ష్యం: తన ధాన్యం పట్టడానికి చోటు లేనప్పుడు, అతను పేదలకు పంచాలని ఆలోచించలేదు. ఉన్న కొట్లను పడగొట్టి ఇంకా పెద్దవి కట్టాలనుకున్నాడు. ఇది సామాజిక బాధ్యత లేని ధనవంతుని మనస్తత్వం.

 

III. ఆత్మను వంచించుకోవడం (Self-Deception)

అతను తన ఆత్మతో ఇలా అనుకున్నాడు: "నా ప్రాణమా... తినుము, త్రాగుము, సుఖించుము".

పెద్ద పొరపాటు: భౌతికమైన వస్తువులతో (ధాన్యం, ఆస్తి) ఆత్మీయమైన 'ప్రాణాన్ని' తృప్తి పరచలేమని అతను మర్చిపోయాడు. ఆత్మకు కావలసింది దేవుని వాక్యం, కానీ అతను ధాన్యంతో తృప్తి పరచాలనుకున్నాడు .

రేపటి భ్రమ: "అనేక సంవత్సరములకు" సరిపడా ఆస్తి ఉందని ధీమాగా ఉన్నాడు, కానీ అతని దగ్గర "నేటి రాత్రి" గ్యారెంటీ లేదని గ్రహించలేదు.

 

IV. దేవుని తీర్పు - "వెర్రివాడా!" (The Divine Verdict)

లోకం అతన్ని "సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్" అని పిలిచి ఉండవచ్చు, కానీ దేవుడు అతన్ని "మూర్ఖుడా / వెర్రివాడా" (Fool) అని పిలిచాడు.

మూర్ఖత్వానికి కారణం: దేవుడు లేడని తన జీవితం ద్వారా నిరూపించినవాడే మూర్ఖుడు.

👉ప్రశ్న: "ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగును?" మరణం తర్వాత మన ఆస్తి మనతో రాదు.

 

V.  ముఖ్య అంశములు::

1. ఆస్తి మనిషికి జీవము కాదు: ఒకని ఆస్తి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. నిజమైన జీవం క్రీస్తులో ఉంది.

2. దేవుని యెడల ధనవంతుడు కావడం: లోకసంబంధంగా ధనవంతులై ఉండి, దేవుని దృష్టిలో పేదవారిగా ఉండటం అత్యంత ప్రమాదకరం.

3. పరలోకంలో ఆస్తిని కూర్చుకోవడం: భూమి మీద కొట్లు కట్టడం కంటే, పరలోకంలో ధనమును కూర్చుకోవడం శ్రేష్ఠం.

 

ముఖ్యమైన రిఫరెన్సుల జాబితా (Reference List):

లూకా 12:16-21: మూల ఉపమానం.

సామెతలు 11:28: "తన ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును."

కీర్తనలు 49:10: "జ్ఞానులు చనిపోదురు... తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టి పోదురు."

1 తిమోతి 6:10: "ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము."

మత్తయి 16:26: "ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే లాభమేమి?"

 

ముగింపు ప్రార్థన:

"ప్రభువా, ఈ లోకపు సిరిసంపదలను చూసి మా హృదయాలు కఠినం కాకుండా కాపాడుము. మాకు ఉన్నదానిలో కృతజ్ఞత కలిగి ఉండటం, ఇతరులకు సహాయం చేయడం మాకు నేర్పించుము. మరణం నిశ్చయమని, నీ తీర్పు సత్యమని గ్రహించి, నీ దృష్టిలో ధనవంతులుగా ఉండేలా మా ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకోమని వేడుకుంటున్నాము. ఆమెన్!" ✨🙏

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(22వ  భాగము)

 

"మెలకువగా ఉన్న దాసులు"

 

1. నిరీక్షణగల  ఇల్లు

ఒక ఊరిలో ఒక యజమాని తన పనివారందరికీ బాధ్యతలు అప్పగించి ఒక వివాహ విందుకు వెళ్ళాడు. ఆ విందు ఎప్పుడు ముగుస్తుందో, ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదు. అది అర్థరాత్రి కావచ్చు లేదా తెల్లవారుజాము కావచ్చు [లూకా 12:38]. పనివారందరూ నిద్రపోవచ్చు, కానీ కొందరు నమ్మకమైన దాసులు మాత్రం తమ నడుములకు కట్టుకట్టుకుని, దీపాలు వెలిగించి, కిటికీ గుండా యజమాని రాక కోసం ఎదురుచూస్తున్నారు. యజమాని వచ్చి తలుపు తట్టగానే ఆలస్యం చేయకుండా తీయాలని వారు సిద్ధంగా ఉన్నారు [లూకా 12:36]. ఈ చిత్రం పరలోకపు యజమాని అయిన యేసుక్రీస్తు రాకడ కోసం వేచి చూస్తున్న సంఘానికి ప్రతీక.

 

2. సిద్ధపాటులో ఉన్న రెండు ముఖ్య లక్షణాలు [లూకా 12:35]

యేసుప్రభువు ఈ ఉపమానంలో సిద్ధపాటును రెండు పనుల ద్వారా వివరించారు:

నడుము కట్టుకొనుట: ప్రాచీన కాలంలో ప్రజలు పొడవైన అంగీలు ధరించేవారు. ఏదైనా పని చేయాలన్నా లేదా వేగంగా నడవాలన్నా ఆ అంగీని పైకి మడిచి నడుముకు కట్టుకోవాలి. అంటే, ఇది "సేవకు సిద్ధంగా ఉండటం" మరియు "లోక సంబంధమైన ఆటంకాలను పక్కన పెట్టడం" అని అర్థం [1 పేతురు 1:13].

దీపములు వెలుగుచుండనిచ్చుట: చీకటిలో యజమాని వచ్చినప్పుడు మార్గం కనిపించడానికి, అలాగే దాసులు నిద్రపోకుండా ఉండటానికి దీపాలు అవసరం. ఆత్మీయంగా ఇది "దేవుని వాక్యం" మరియు "పరిశుద్ధాత్మ అభిషేకం" కలిగి ఉండటాన్ని సూచిస్తుంది [కీర్తన 119:105; మత్తయి 25:1-13].

 

3. ఆశ్చర్యకరమైన బహుమానం: యజమానే దాసుడవుట [లూకా 12:37]

ఈ ఉపమానంలో అత్యంత అద్భుతమైన మలుపు ఇక్కడే ఉంది. సాధారణంగా దాసులు యజమానికి పరిచర్య చేస్తారు. కానీ, మెలకువగా ఉన్న దాసులను చూసి సంతోషించిన యజమాని:

తానే నడుము కట్టుకుంటాడు.

వారిని భోజన పంక్తిలో కూర్చుండబెడతాడు.

తానే స్వయంగా వారికి పరిచర్య చేస్తాడు.

👉ఇది పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు తన నమ్మకమైన దాసులకు చేసే ఘనతను సూచిస్తుంది. ఆయన ఇప్పటికే మన కోసం దాసుని రూపం ధరించారు, రేపు పరలోకంలో మనల్ని ఘనపరుస్తారు [ఫిలిప్పీ 2:7; యోహాను 13:4-5].

 

4. దొంగ వలె వచ్చే రాకడ [లూకా 12:39-40]

యేసు తన రాకడను దొంగతో పోల్చారు. దొంగ ఎప్పుడు వస్తాడో ఇంటి యజమానికి తెలిస్తే, ఆయన కచ్చితంగా మెలకువగా ఉంటాడు.

హెచ్చరిక: మనుష్యకుమారుడు మీరు అనుకోని గడియలో వస్తాడు [లూకా 12:40]. కాబట్టి, ఆత్మీయ నిద్ర (పాపం లేదా అశ్రద్ధ) లో ఉండకుండా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి [రోమీయులకు 13:11].

 

ఆత్మీయ పాఠాలు (Summary):

1. నిరంతర మెలకువ: భక్తి అనేది ఆదివారం మాత్రమే కాదు, ప్రతి క్షణం ప్రభువు వస్తారనే స్పృహతో బ్రతకడం [1 థెస్సలొనీకయులకు 5:6].

2. బాధ్యతాయుతమైన సేవ: యజమాని లేనప్పుడు కూడా నమ్మకంగా ఉండటమే నిజమైన దాసుని లక్షణం.

3. నిరీక్షణ: మన మెలకువకు లభించే బహుమానం స్వయంగా ప్రభువు చేసే పరిచర్య.

ముగింపు ప్రార్థన:

"పరలోకపు తండ్రీ, నీ రాకడ సమయము మాకు తెలియదు. మేము లోక ఆశలనే నిద్రలో జోగకుండా, ఎల్లప్పుడూ వాక్యమనే దీపాన్ని వెలిగించుకుని, నీ సేవలో నిమగ్నమై ఉండే కృపను మాకు దయచేయండి. ఆమెన్."

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(23వ  భాగము)

 

ఫలించని అంజూరపు చెట్టు:

దేవుని కనికరం మరియు కడపటి అవకాశం

ఆధారిత లేఖనం: లూకా 13:6-9

 

ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ఒక ప్రత్యేక సందర్భంలో చెప్పారు. గలిలయుల మీద పీలాతు చేసిన క్రూరత్వం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నప్పుడు, "మీరు పశ్చాత్తాపపడకపోతే మీరంతా అలాగే నాశనమవుతారు" అని హెచ్చరిస్తూ ఈ ఉపమానాన్ని వివరించారు [లూకా 13:1-5].

 

1. ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు (The Strategic Placement)

ఒక మనిషి తన ద్రాక్షతోటలో ఒక అంజూరపు చెట్టును నాటించాడు [లూకా 13:6].

మర్మం: సాధారణంగా అంజూరపు చెట్లు రోడ్డు పక్కన లేదా పొలాల్లో పెరుగుతాయి. కానీ ఇక్కడ యజమాని దానిని తన ద్రాక్షతోటలో నాటించాడు. అంటే దానికి ప్రత్యేకమైన రక్షణ, మంచి నీరు, మరియు ఎరువులు అందేలా చూశాడు.

ఆత్మీయ పాఠం: ద్రాక్షతోట అంటే 'దేవుని రాజ్యము' లేదా 'సంఘము'. మనం లోకంలో కాకుండా దేవుని సన్నిధిలో నాటబడ్డాము. దేవుడు మనకు అపారమైన కృపను, వాక్యాన్ని ఇచ్చాడు [కీర్తనలు 92:13]

 

2. ఫలాల కోసం అన్వేషణ (The Expectation)

యజమాని వచ్చి దాని మీద ఫలములేమైనా దొరుకునని వెదికెను గాని ఏమియు దొరకలేదు [లూకా 13:6].

మూడేళ్లు: ఆయన వరుసగా మూడేళ్లు వచ్చి వెదికాడు [లూకా 13:7]. ఇది దేవుని ఓర్పుకు నిదర్శనం. ఆయన మనకు తగినంత సమయం ఇస్తాడు.

ఆత్మీయ పాఠం: దేవుడు మన నుండి కేవలం "ఆకులు" (భక్తి వేషధారణ) కోరుకోవడం లేదు, ఆయన "ఫలాలను" (ఆత్మ ఫలము) కోరుకుంటున్నాడు [గలతీయులకు 5:22-23]. దేవుడు మన ఆత్మీయ ఎదుగుదలను నిశితంగా గమనిస్తుంటాడు.

 

3. తీర్పు - "దానిని నరికివేయుము" (The Judgment)

️"మూడేళ్ల నుండి నేను వచ్చి వెతుకుతున్నాను, ఫలము లేదు... నేలను ఎందుకు వ్యర్థపరచాలి?" అని తోటమాలితో అన్నాడు [లూకా 13:7].

నేలను వ్యర్థపరచుట: ఒక చెట్టు ఫలించకపోతే, అది కేవలం తాను ఫలించకపోవడమే కాదు, ఇతర మొక్కలకు అందవలసిన సారాన్ని కూడా వృధా చేస్తుంది.

హెచ్చరిక: దేవుడు ఇచ్చిన కృపను, సమయాన్ని మనం ఉపయోగించుకోకపోతే, మన ఆత్మీయ స్థానాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది [మత్తయి 3:10].

 

4. తోటమాలి విన్నపం - మధ్యవర్తిత్వం (The Intercession)

తోటమాలి, "అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు; నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను" అని బ్రతిమాలాడు [లూకా 13:8].

ప్రభువైన యేసు: ఇక్కడ తోటమాలి మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకు గుర్తు. ఆయన మన కోసం తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు [హెబ్రీయులకు 7:25].

త్రవ్వుట మరియు ఎరువు వేయుట: దేవుడు మనల్ని ఫలించేలా చేయడానికి కొన్నిసార్లు మన జీవితాల్లో "త్రవ్వుతాడు" (శోధనలు/గద్దింపులు). ఎరువు వేయడం అంటే తన వాక్యంతో మనల్ని బలపరచడం.

 

5. కడపటి అవకాశం (The Final Chance)

️"వచ్చే ఏడాది ఫలించినా సరే, లేకపోతే దానిని నరికివేయి" అన్నాడు తోటమాలి [లూకా 13:9].

మర్మం: దేవుని కనికరం అంతులేనిది కావచ్చు, కానీ ఆయన ఇచ్చే సమయానికి ఒక పరిమితి ఉంది. పశ్చాత్తాపపడటానికి ఇచ్చే సమయం ఎప్పుడో ఒకప్పుడు ముగుస్తుంది.

పాఠం: నేడు మనకు దొరికిన ఈ సమయం ఒక "Bonus Year" (అదనపు కాలం) వంటిది.

 

లోతైన సారాంశం (Summary Points):

1. దేవుని పెట్టుబడి: యజమాని చెట్టు మీద పెట్టిన పెట్టుబడి (నీరు, ఎరువు) వృధా కాకూడదు. దేవుడు మన మీద పెట్టిన కృప వృధా కాకూడదు [2 కొరింథీ 6:1]

2. పశ్చాత్తాపం: ఫలించకపోవడం అంటే ఆత్మీయంగా మృతప్రాయంగా ఉండటం. మారుమనస్సుకు తగిన ఫలాలను మనం చూపాలి [మత్తయి 3:8].

3. కాలం గడచిపోతోంది: దేవుడు ఓర్పు చూపిస్తున్నాడు అంటే మనం పాపం చేస్తూనే ఉండాలని కాదు, మనం మారుతామని ఆయన నిరీక్షిస్తున్నాడు [రోమీయులకు 2:4].

దైవాశీస్సులు!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(24వ  భాగము)

 🥘 🍲 🍽️ గొప్ప విందు

             (లూకా 14:15-24)

ఒక గొప్ప రాజు తన రాజ్యంలో అందరికీ విందు ఇచ్చాడు. కానీ ధనవంతులు, పలుకుబడి ఉన్నవారు తమ పనుల్లో మునిగిపోయి "మాకు టైమ్ లేదు" అన్నారు. అప్పుడు ఆ రాజు, "సరే, వీధుల్లో ఉన్న అనాథలను, బిచ్చగాళ్లను తీసుకురండి, నా కోట నిండాలి" అన్నాడు.

ఈ ఉపమానంలో యజమానిదేవుడు, విందురక్షణ/నిత్యజీవం, సాకులు చెప్పేవారులోక ఆశల్లో మునిగిపోయిన వారు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం చెప్పే "చిన్న సాకులు" మనల్ని "గొప్ప ఆశీర్వాదానికి" దూరం చేస్తాయి. మన హృదయాల్లో దేవునికి మొదటి స్థానం ఉందా లేదా అనేది ప్రశ్న.

 

ఉపమానం దేవుని పిలుపును, మానవ సాకులను మరియు దేవుని అనంతమైన కృపను వివరించే అత్యంత లోతైన పాఠం.

 

ఈ ఉపమానం యేసుప్రభువు ఒక పరిసయ్యుని ఇంట్లో భోజనానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక వ్యక్తి "దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు" అని పలికిన మాటకు జవాబుగా చెప్పారు [లూకా 14:15].

 

1. ఆహ్వానం మరియు తిరస్కరణ (The Invitation & Rejection)

విందు సిద్ధమైనప్పుడు యజమాని తన దాసుని పంపి పిలిచాడు. కానీ పిలవబడిన వారందరూ ఏకగ్రీవంగా సాకులు చెప్పడం ప్రారంభించారు:

మొదటి సాకు (ఆస్తి): "నేను ఒక పొలము కొన్నాను." ఇది జీవనోపాధి/వ్యాపారం పట్ల ఉన్న వ్యామోహం.

రెండవ సాకు (వృత్తి): "నేను ఐదు జతల ఎడ్లను కొన్నాను." ఇది పని/ప్రయాస పట్ల ఉన్న ఆసక్తి.

మూడవ సాకు (బంధం): "నేను పెండ్లి చేసుకున్నాను." ఇది కుటుంబ సంబంధాల పట్ల ఉన్న ప్రాధాన్యత.

👉ఈ మూడు సాకులు చెడ్డవి కావు, కానీ దేవుని పిలుపు కంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పాపం [మత్తయి 10:37].

 

2. దేవుని కోపం మరియు కృప (God's Anger & Grace)

పిలవబడిన వారు రానప్పుడు యజమాని కోపగించుకున్నాడు, కానీ విందును రద్దు చేయలేదు. బదులుగా:

మొదటి దశ: పట్టణపు వీధుల్లో ఉన్న బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని తీసుకురమ్మన్నాడు [లూకా 14:21]. ఇది ఇశ్రాయేలీయులలో తృణీకరించబడిన పాపులకు దేవుడు ఇచ్చిన అవకాశం.

రెండవ దశ: పొలిమేరల్లో ఉన్నవారిని "బలవంతముగా" తీసుకురమ్మన్నాడు. ఇది యూదేతరులకు (అన్యజనులకు) మనకు కలిగిన రక్షణ భాగ్యం [రోమీయులకు 11:11].

 

3. "నా ఇల్లు నిండునట్లు" (That My House May Be Filled)

దేవుని హృదయం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదని కోరుకుంటుంది. ఆయన కృప విస్తారమైనది.

హెచ్చరిక: "ముందు పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడు" [లూకా 14:24]. అంటే, దేవుని అవకాశాన్ని తృణీకరించిన వారు నిత్యజీవానికి దూరమవుతారు [హెబ్రీయులకు 2:3].

 

ముఖ్యమైన రిఫరెన్సులు:

యెషయా 55:1: "దప్పిగొన్నవారలారా, నీళ్లయొద్దకు రండి... రూకలు లేనివారలారా, మీరు వచ్చి కొని భుజించుడి."

మత్తయి 22:1-14: పెండ్లి విందు ఉపమానం (దీనికి సమాంతరమైన పాఠం).

ప్రకటన 19:9: "గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు."

సామెతలు 1:24: "నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవడును లక్ష్యపెట్టలేదు."

 

ముగింపు ప్రార్థన:

"పరలోకపు తండ్రీ, నీవు మాకు సిద్ధపరిచిన గొప్ప రక్షణ విందు కోసం వందనాలు. లోక సంబంధమైన ఆశల వల్ల, సాకుల వల్ల నీ పిలుపును మేము నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి. నీ సన్నిధిలో పాలిభాగస్తులయ్యే ధన్యతను మాకు, మా విద్యార్థులకు దయచేయండి. ఆమెన్!" ✨🙏

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(25వ  భాగము)

 

గోపురము కట్టువాడు మరియు యుద్ధానికి వెళ్లే రాజు 👑

(లూకా సువార్త 14:28-33)

 

ఒక గొప్ప భవనం నిలబడాలంటే దాని పునాది ఎంత బలమో, ప్లానింగ్ కూడా అంతే ముఖ్యం. శిష్యత్వం అనేది భావోద్వేగంతో మొదలుపెట్టేది కాదు, అది తెలివైన నిర్ణయం. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్లేముందు తన ఆయుధాలను, సామర్థ్యాన్ని ఎలా పరీక్షించుకుంటాడో, అలాగే మనం క్రీస్తును వెంబడించేటప్పుడు వచ్చే శ్రమలను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మధ్యలో వెనక్కి వెళ్లేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు [లూకా 9:62]. యేసు మనకు ఇచ్చే పిలుపు ఉచితమే, కానీ దానిని కాపాడుకోవడానికి మనం సమస్తాన్ని ఆయనకు అప్పగించాలి.

 

చారిత్రక విశ్లేషణ (Context):

ఆ రోజుల్లో తోటల్లో లేదా పొలాల్లో దొంగల నుండి, జంతువుల నుండి రక్షణ కోసం ఎత్తైన 'గోపురాలు' కట్టేవారు. అవి అసంపూర్తిగా ఉంటే తోట యజమానికి అది అవమానం. అలాగే రాజుల యుద్ధాలు ఆ కాలంలో సాధారణం. యేసు ఈ సామాన్య ఉదాహరణల ద్వారా పరలోక రాజ్యపు గంభీరతను వివరించారు .

 

శిష్యత్వపు వెల: గోపురము కట్టువాడు మరియు యుద్ధానికి వెళ్లే రాజు

 

1. గోపురము కట్టువాడు:

ప్రణాళిక మరియు వ్యయం (The Tower Builder) ఒక వ్యక్తి మేడను (గోపురము) కట్టాలనుకున్నప్పుడు, అతడు మొదట కూర్చుని దానికి అయ్యే ఖర్చును లెక్కించుకుంటాడు.

వ్యయ ప్రయాసలు: "అది పూర్తి చేయుటకు తగినంత సొమ్ము తనయొద్ద ఉన్నదో లేదో కూర్చుండి మొదట లెక్కచూచుకొనడా?" [లూకా 14:28].

అపహాస్యం: పునాది వేసి, ఖర్చు చాలక మధ్యలో వదిలేస్తే, చూసేవారు "వీడు కట్ట మొదలుపెట్టెను గాని పూర్తి చేయలేకపోయెను" అని పరిహసిస్తారు [లూకా 14:29-30].

ఆత్మీయ పాఠం: క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడం సులభం, కానీ దానిని చివరి వరకు కొనసాగించడం ముఖ్యం. దేవునిని వెంబడించేటప్పుడు లోకాన్ని విడవడానికి సిద్ధపడాలని ఈ ఉపమానం హెచ్చరిస్తుంది [మత్తయి 10:22].

 

2. యుద్ధానికి వెళ్లే రాజు: శక్తి మరియు సంధి (The King at War)

ఒక రాజు మరొక రాజుతో యుద్ధానికి వెళ్లేటప్పుడు తనకున్న సైన్యం సరిపోతుందో లేదో ఆలోచిస్తాడు.

సంఖ్యా బలం: తన దగ్గర పదివేల మంది ఉండి, ఇరవై వేల మందితో వచ్చే శత్రువును ఎదిరించగలనా అని ఆలోచిస్తాడు [లూకా 14:31].

సంధి చేసుకోవడం: సాధ్యం కాదనిపిస్తే, శత్రువు దూరం ఉండగానే రాయబారిని పంపి సంధి చేసుకుంటాడు [లూకా 14:32].

ఆత్మీయ పాఠం: మన పాపపు స్థితిలో దేవుని తీర్పును మనం ఎదుర్కోలేము. కాబట్టి మనం ఆయనతో సంధి (సమాధానము) చేసుకోవాలి. ఈ సమాధానము కేవలం క్రీస్తు ద్వారానే కలుగుతుంది [రోమీయులకు 5:1].

 

3. శిష్యత్వపు నిబంధన: సమస్తాన్ని విడిచిపెట్టడం (The Cost of Discipleship)

ఈ రెండు ఉపమానాల ముగింపులో యేసు ఒక కఠినమైన సత్యాన్ని చెప్పాడు:

సమర్పణ: "మీలో తనకున్నదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కాలేడు" [లూకా 14:33].

ప్రవచనం: పరలోకపు రాజ్యాన్ని చేరాలంటే లోకపు ఆశలను, స్వార్థాన్ని 'సిలువ' వేయాలని దీని అర్థం [లూకా 9:23].

 

ముఖ్యమైన రిఫరెన్సులు:

లూకా 14:28-33: ప్రధాన వాక్య భాగం.

మత్తయి 16:24-25: ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు, క్రీస్తు నిమిత్తం పోగొట్టుకునేవాడు కాపాడుకుంటాడు.

2 తిమోతి 2:3-4: క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించడం.

ఫిలిప్పీయులకు 3:7-8: క్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్న పౌలు అనుభవం.

 

ముగింపు ప్రార్థన:

"పరిశుద్ధుడైన తండ్రీ, నీవు మాకు ఇచ్చిన శిష్యత్వపు పిలుపును బట్టి వందనాలు. అసంపూర్తిగా మిగిలిపోయే గోపురాల వలె మేము కాకుండా, చివరి వరకు నిన్ను వెంబడించే స్థిరత్వం మాకు దయచేయండి. మాకున్న సమస్తాన్ని నీ చిత్తానికి అప్పగించి, నీ నమ్మకమైన సైనికులుగా పోరాడే కృపను ప్రసాదించండి. ఆమెన్!" ✨🙏

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(26వ  భాగము)

 

తప్పిపోయిన గొర్రె (The Lost Sheep)

🐑 /————-లూకా 15:3-7

 

ఒక గొర్రెల కాపరి వద్ద వంద గొర్రెలు ఉన్నాయి. అతడు వాటిని ఎంతో ప్రేమగా, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చేవాడు. ఒకరోజు సాయంత్రం గొర్రెలను లెక్కిస్తుండగా, ఒకటి తక్కువైందని గ్రహించాడు. మిగిలిన తొంభై తొమ్మిది సురక్షితంగానే ఉన్నా, ఆ ఒక్క గొర్రె క్షేమం గురించి అతని హృదయం తల్లడిల్లిపోయింది. అడవిలో క్రూర మృగాలు ఉంటాయని, అది ఎక్కడైనా లోయలో పడిపోయి ఉంటుందని భయపడి, వెంటనే ఆ 99 గొర్రెలను అరణ్యంలో వదిలిపెట్టి, తప్పిపోయిన ఆ ఒక్క దాని కోసం వెతకడం ప్రారంభించాడు. అది దొరికే వరకు అతడు విశ్రమించలేదు. చివరకు అది దొరికినప్పుడు, అతడు దానిని కొట్టలేదు సరే కదా, ఎంతో వాత్సల్యంతో తన భుజాల మీద ఎక్కించుకుని, సంతోషంతో ఇంటికి వచ్చి స్నేహితులతో పండుగ చేసుకున్నాడు [లూకా 15:3-6].

 

చారిత్రక నేపథ్యం: తప్పిపోయిన గొర్రె (Historical Context of the First Century)

 

1. గొర్రెల కాపరి సామాజిక హోదా (Social Status of Shepherds)

మొదటి శతాబ్దపు యూదు సమాజంలో గొర్రెల కాపరుల పరిస్థితి మనం అనుకున్నంత గౌరవప్రదంగా ఉండేది కాదు.

చరిత్ర: ఆ కాలంలో గొర్రెల కాపరులను "అశుద్ధులు"గా (Ceremonially Unclean) పరిగణించేవారు. వారు నిరంతరం జంతువులతో ఉండటం వల్ల ధర్మశాస్త్ర పరమైన శుద్ధీకరణ క్రియలు పాటించలేకపోయేవారు.

👉యేసు ఒక గొర్రెల కాపరిని ఉదాహరణగా తీసుకోవడం ద్వారా, సమాజం ఎవరినైతే తక్కువగా చూస్తుందో (సుంకరులు, పాపులు), దేవుడు వారిని వెదకడానికి ఇష్టపడతాడని నిరూపించారు [మత్తయి 9:12-13].

 

2. గొర్రెల మందల నిర్వహణ (Management of the Flock)

వంద గొర్రెలు ఉన్నాయంటే ఆ కాపరి ఆర్థికంగా మధ్యతరగతికి చెందినవాడని అర్థం.

చరిత్ర: సాధారణంగా ఒక గ్రామంలోని గొర్రెల కాపరులందరూ కలిసి ఒకే మందగా వెళ్లేవారు. ఒకవేళ ఒక గొర్రె తప్పిపోతే, మిగిలిన 99 గొర్రెలను అరణ్యంలో (Open Pasture) ఉన్న ఇతర కాపరుల రక్షణలో వదిలివేసి ఈ కాపరి వెళ్లేవాడు.

👉"అరణ్యంలో విడిచిపెట్టి" అంటే వాటిని గాలికి వదిలేయడం కాదు, సురక్షితమైన సామూహిక మందలో ఉంచడం అని అర్థం [లూకా 15:4].

 

3. గొర్రెను భుజాల మీద మోయడం (The Technique of Carrying)

కాపరి గొర్రెను ఎందుకు భుజాల మీద మోస్తాడో వెనుక ఒక లోతైన చారిత్రక కారణం ఉంది.

చరిత్ర: గొర్రె ఒకసారి మందను విడిచిపెట్టి ఒంటరిగా ఉంటే, అది భయంతో గడ్డకట్టుకుపోతుంది (State of Shock). అది తన కాళ్ల మీద తాను నిలబడలేదు. అప్పుడు కాపరి దానిని కొట్టకుండా, దాని నాలుగు కాళ్లను తన మెడ చుట్టూ వేసుకుని, దాని బరువునంతటినీ తన భుజాలపై వేసుకుంటాడు.

👉మనం పాపంలో పడిపోయినప్పుడు పూర్తిగా బలహీనపడతాము. అప్పుడు దేవుడు మనల్ని నడవమని అడగడు, ఆయనే మనల్ని తన భుజాలపై మోస్తాడు [యెషయా 40:11].

 

4. ప్రాచీన గొర్రెల దొడ్డి మరియు కాపరి (The Door of the Sheepfold)

రాత్రి సమయంలో గొర్రెలను గుహలలో లేదా రాళ్లతో కట్టిన దొడ్డిలో ఉంచేవారు.

చరిత్ర: ఆ దొడ్డికి తలుపు ఉండేది కాదు. కాపరే ఆ ద్వారం వద్ద పడుకునేవాడు. గొర్రె బయటకు వెళ్లాలన్నా, పులి లోపలికి రావాలన్నా కాపరి మీద నుండే వెళ్లాలి.

👉"గొర్రెలకు ద్వారమును నేనే" అని యేసు అన్న మాటలకు ఇదే చారిత్రక ఆధారం [యోహాను 10:7].

 

5. మందను లెక్కించే విధానం (The Counting Ritual)

ప్రతిరోజూ సాయంత్రం కాపరి గొర్రెలను తన చేతికర్ర కింద నుండి పంపిస్తూ లెక్కించేవాడు (Tithing of the flock)

చరిత్ర: దీనిని "Passing under the rod" అంటారు. దీనివల్ల ప్రతి గొర్రె ఆరోగ్యాన్ని కాపరి నిశితంగా పరిశీలిస్తాడు.

👉"నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును" [కీర్తన 23:4]. కాపరి కర్ర గొర్రెను శిక్షించడానికి కాదు, దానిని లెక్కించి భద్రతను ఇవ్వడానికి.

 

🐑 అంశం: దేవుని అన్వేషణ మరియు పాపి పట్ల ఆయన వాత్సల్యం.

 

1. నేపథ్యం మరియు సందర్భం:

ఈ ఉపమానాన్ని యేసు ఎందుకు చెప్పారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

సందర్భం: సుంకరులు, పాపులు యేసు మాటలు వినడానికి ఆయన దగ్గరకు వస్తున్నారు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు "ఈయన పాపులను చేర్చుకొని వారితో భోజనం చేస్తున్నాడు" అని సణుగుకున్నారు [లూకా 15:1-2].

మతపరమైన గర్వం ఉన్నవారికి (పరిసయ్యులు), దేవుని హృదయం పాపుల పట్ల ఎలా ఉంటుందో వివరించడానికి యేసు ఈ కథను చెప్పారు.

👉ప్రశ్న: మనం పాపులను చూసినప్పుడు విమర్శిస్తామా లేక యేసులా వారిని చేర్చుకుంటామా?

 

2. గొర్రె స్వభావం - మన ఆత్మీయ స్థితి (The Nature of the Sheep)

దారి తప్పడం: గొర్రె ఇతర జంతువుల వలె దారిని గుర్తుపెట్టుకోలేదు. అది మేత మేస్తూ మేస్తూ తెలియకుండానే మందకు దూరమైపోతుంది.

👉ఆత్మీయ అన్వయం: "మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి" [యెషయా 53:6]. పాపం అనేది ఒకేసారి జరగదు, లోకపు ఆశలనే మేత మేస్తూ నెమ్మదిగా దేవునికి దూరమైపోతాము.

బలహీనత: గొర్రెకు తనను తాను రక్షించుకునే గోళ్లు గానీ, పళ్లు గానీ లేవు. కాపరి లేకపోతే అది క్రూర మృగాలకు సులభమైన ఎర [1 పేతురు 5:8].

 

3. కాపరి త్యాగపూరిత నిర్ణయం:

99 వర్సెస్ 1: లోకపు లెక్క ప్రకారం 99 గొర్రెలు ఉంటే 1 గొర్రె పోయినా పెద్ద నష్టం లేదు. కానీ దేవుని లెక్క వేరు.

అరణ్యంలో వదిలి: కాపరి 99 గొర్రెలను అరణ్యంలో (సురక్షితమైన చోట) విడిచిపెట్టి వెళ్ళాడు. అంటే దేవుడు రక్షించబడిన వారిని నిర్లక్ష్యం చేస్తాడని కాదు, కానీ ప్రమాదంలో ఉన్న ఆ ఒక్క ఆత్మ మీద ఆయన దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది.

 

4. అన్వేషణలో పట్టుదల:

దొరకువరకు: బైబిల్ చెబుతోంది "అది దొరకువరకు" వెతికాడు అని. దీనికి కాలపరిమితి లేదు.

👉యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చింది "నశించినదానిని వెదకి రక్షించుటకే" [లూకా 19:10]. ఆయన గెత్సెమనే నుండి గొల్గొత్తా వరకు వెతికిన అన్వేషణే మన రక్షణ.

️"నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును" [యెహెజ్కేలు 34:11].

 

5. శిక్ష లేని కృప (Grace without Scolding)

ప్రేమపూర్వక స్పందన: గొర్రె దొరికినప్పుడు కాపరి దానిని కొట్టలేదు, ఎందుకు వెళ్ళావు అని అడగలేదు.

భుజము మీద: అది అలసిపోయి నడవలేని స్థితిలో ఉందని గ్రహించి, దానిని తన భుజాల మీద ఎక్కించుకున్నాడు.

👉మన పాపపు స్థితిలో మనం దేవుని దగ్గరకు రాలేము. ఆయనే వంగి మనల్ని ఎత్తుకోవాలి. "ముసలితనం వచ్చువరకు... నేనే మిమ్మును ఎత్తికొందును" [యెషయా 46:4].

 

6. సామాజిక ఆనందం (Shared Joy)

ఇంటికి వచ్చి: కాపరి ఒంటరిగా సంతోషించలేదు. స్నేహితులను, పొరుగువారిని పిలిచి పండుగ చేసుకున్నాడు.

పరలోకపు స్పందన: భూమి మీద ఒక పాపి మారుమనస్సు పొందితే, పరలోకంలో దేవదూతల ఎదుట మహా సంతోషం కలుగుతుంది [లూకా 15:7].

👉ఒక ఆత్మ రక్షించబడినప్పుడు మనం ఎంతగా సంతోషిస్తున్నాం?

 

7. ముగింపు మరియు చర్చాంశాలు (Conclusion & Discussion)

మంచి కాపరి లక్షణాలు: ఆయన మన స్వరాన్ని గుర్తుపడతాడు, మన పేరు పెట్టి పిలుస్తాడు [యోహాను 10:3-4].

తీర్మానం: మనం ఆ 99 లో ఉన్నామా లేక ఆ ఒక్క గొర్రెలా దారి తప్పి ఉన్నామా? కాపరి భుజాల మీద విశ్రమించడానికి మనం సిద్ధమేనా?

దైవాశీస్సులు!!!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(27వ  భాగము)

 

పోగొట్టుకున్న వెండినాణెం

🪙/——————————

ఏ స్త్రీకైనను పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణము దొరకినదని వారితో చెప్పును గదా. అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను. (లూకా 15:8-10)

 

యేసు ప్రభువు చెప్పిన ఈ ఉపమానంలో ఒక స్త్రీ ఒక వెండి నాణెం పోగొట్టుకున్నది. ఇంకా తొమ్మిది వున్నాయి కదా? అయినప్పటికీ జాగ్రత్తగా వెదకి, పొందుకున్నది. దానిని జాగ్రత్తగా దాచుకుంటే చాలుకదా? కానీ, ఆమె అట్లా చెయ్యకుండా మన స్నేహితులను, పొరుగువారిని పిలిచి సంతోషిస్తున్నది. ఒక్క వెండినాణెం ( బంగారు నాణెం కూడా కాదు) దానికి యింత హడావిడి చెయ్యాలా? అంటే, ఆ నాణెం చాలా ప్రత్యేకమైనదే అయ్యుండాలి. అవును!

 

యేసు ప్రభువు శరీరధారిగా జీవించిన రోజులలో ఆ ప్రాంతములో ఒక ఆచారం ఉండేది. ఒక అమ్మాయికి యుక్త వయస్సు వచ్చాక ఆమె చెంగుకు పది వెండి నాణెములను కట్టేవారు. వాటిని ఆమె తన వివాహసమయం వరకూ జాగ్రత్తగా కాపాడుకొని, తాను వివాహం చేసుకోబోయే అబ్బాయికి ఆ పది వెండి నాణెములను అప్పగించాలి. అట్లా కాకుండా వివాహానికిముందు ఎవరితోనైనా ఆమె వ్యభిచారంలో పట్టబడితే, పంచాయితీ పెద్దలు ఆమె దగ్గరనుండి ఒక నాణెంను జరిమానాగా తీసుకుంటారు. ఒక నాణెం తగ్గిందంటే ఆమె వ్యభిచారిణుల లెక్కలోకి వెళ్తుంది. ఇప్పుడు అర్ధమయ్యింది కదా, ఆ నాణెం విలువ ఎంతో? ఒకవేళ ఆ నాణెం దొరకకపోతే ఆమె మీద ఒక వ్యభిచారిణి అనే ముద్రపడేదేమో? అయితే, దొరికే వరకూ వెదకింది. ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఇక్కడ ఈ పరిస్థితికి కారణం? నాణెం ది తప్పుకాదు. ఆమె అజాగ్రత్తవల్లనే ఆ నాణెం కోల్పోయింది.

 

1. ఆత్మీయ శీలము - పది ఆజ్ఞల సాదృశ్యం (Spiritual Integrity):

పరిశుద్ధ గ్రంధములో ఆజ్ఞలు అనే సరికి ధర్మశాస్త్రపు పది ఆజ్ఞలు గుర్తుకొస్తాయి. అట్లా కాకుండా నూతన నిబంధనలో అనేకమైన ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. వీటన్నిటిని పది నాణెములుగా భావించగలిగితే, వాటిలో ఏ ఒక్కటి తప్పిపోయినప్పటికీ ( ఒక్క నాణెం కోల్పోయినప్పటికీ) పరిశుద్ధులముగా ప్రియుడైన యేసు ముందు నిలబడలేము.

ఆ స్త్రీ తన శీలమును నిరూపించుకోవడానికి ఆ పది నాణేలు ఎలాగైతే అవసరమో, దేవుని ఎదుట మనం నిందారహితులుగా నిలబడటానికి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు (ప్రేమ, పరిశుద్ధత, విధేయత) అంతే అవసరం.

ఆ స్త్రీ దగ్గర 9 నాణేలు ఉన్నా ఆమె "వ్యభిచారిణి" అనే నింద నుండి తప్పించుకోలేదు. అలాగే మనం 9 ఆజ్ఞలు పాటించి, ఒక్క విషయంలో (ఉదాహరణకు: లోక స్నేహం) తప్పిపోయినా, దేవుని దృష్టిలో మనం ఆత్మీయ వ్యభిచారులమే అవుతాము [యాకోబు 2:10; 4:4].

 

2. నాణెము యొక్క విలువ (Value of Identity):

ఆ పది నాణేలు ఆమె కేవలం ధనవంతురాలు అని చెప్పడానికి కాదు, ఆమె "కన్యక/పావని" అని నిరూపించడానికి చిహ్నాలు.

లోతు: ఒక్క నాణెము పోయినా ఆమె సమాజం దృష్టిలో "చీత్కారానికి" గురవుతుంది. ఆమెకు పెళ్లి కాకపోవచ్చు లేదా వ్యభిచారిణి అనే ముద్ర పడవచ్చు.

ఆత్మీయ మర్మం: దేవుడు మన ఆత్మకు ఒక విలువైన ముద్ర వేశాడు. మనం పాపమనే అజాగ్రత్త వల్ల ఆ ముద్రను (విలువను) కోల్పోతే, సాతాను మన మీద "నేరస్థుడు" అనే ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంటాడు [ప్రకటన 12:10].

 

3. దీపము మరియు ఇల్లు ఊడ్చడం (The Lamp and the Sweeping):

️"నాణెముది తప్పు కాదు, ఆమె అజాగ్రత్తే కారణం". నాణెము దానంతట అది దొర్లిపోలేదు. అది ఆ స్త్రీ నిర్లక్ష్యం వల్లే పడిపోయింది. చీకటిలో ఉన్న నాణెము తనను తాను బయటకు తెచ్చుకోలేదు. అది మట్టిలో కలిసిపోయి ఉంటుంది.

మన హృదయము అనే ఇల్లు లోకపు ఆశలనే దుమ్ముతో నిండిపోయినప్పుడు, దేవుని వాక్యమనే "దీపము" (Lamp) వెలగాలి [కీర్తన 119:105]. పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరాత్మను "ఊడ్చినప్పుడు" (Conviction of sin), మనలో పోగొట్టుకున్న దైవిక విలువలు తిరిగి కనిపిస్తాయి [యోహాను 16:8].

 

4. దొరికే వరకు వెదకడం (The Desperate Search):

ఆమె ఎందుకు అంత కంగారుగా వెతికిందంటే, అది కేవలం ఒక నాణెము కాదు, అది ఆమె జీవితం.

మర్మం: యేసుప్రభువు కూడా మనల్ని కేవలం ఒక "సంఖ్య" లాగా చూడలేదు. ఆయన దృష్టిలో మనము ఆయన "వధువు" (Church). తన వధువు మీద ఎటువంటి మచ్చా, ముడత ఉండకూడదని ఆయన రక్తము కార్చి వెతికారు [ఎఫెసీయులకు 5:27].

 

ప్రియుడైన యేసును సిగ్గులేని ముఖంతో స్త్రీ కు సాదృశ్యముగానున్న సంఘము లేదా మనము, ఆయనను ఎదుర్కోవాలంటే? మనము కోల్పోయిన నాణెమును లేదా నాణెములను, వాక్యము అనే దీపపు వెలుగులో ( నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. కీర్తనలు 119:105) దొరికే వరకు వెదకి, సరిచేసుకొని, కోల్పోయినవాటిని పొందుకొని, ఎత్తబడే సంఘములో క్రీస్తుని ఎదుర్కోవడానికి సిద్దపడియుండగలిగే జీవితాలు ధన్యమైనవి. అట్లాంటి వారిని గురించి, పరలోకంలో అధికమైన సంతోషము కలుగును. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత, ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!

 

స్టడీ చర్చా అంశాలు (Expanded Discussion):

ప్రశ్న: మన అజాగ్రత్త వల్ల మన ఇంట్లో లేదా మన పరిచర్యలో ఏవైనా "నాణేలు" (ఆత్మలు) పోయాయా?

ప్రశ్న: ఒక ఆత్మ తప్పిపోయినప్పుడు మనం కేవలం ఒక సంఖ్య తగ్గింది అనుకుంటున్నామా లేక ఒకరి జీవితమే ప్రమాదంలో ఉందని భారపడుతున్నామా?

 

ముఖ్యమైన రిఫరెన్సులు (Contextual References)

సామెతలు 31:10: "గుణవతియైన భార్య దొరుకుట అరుదు, అట్టిది పగడములకంటె ఎంతో వెలగలది." (స్త్రీ యొక్క విలువ).

1 కొరింథీయులకు 6:20: "మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి."

లూకా 15:10: "మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల యెదుట సంతోషము కలుగును."

దైవాశీస్సులు!!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(28వ  భాగము)

 

"తప్పిపోయిన కుమారుడు" (The Prodigal Son)

(లూకా 15:11-32 )

 

అంశం: పతనమైన మనిషి పట్ల దేవుని కనికరం మరియు పునరుద్ధరణ.

 

1. చారిత్రక నేపథ్యం: ఆస్తి పంపకం మరియు అవమానం (Historical Context)

చిన్న కుమారుడు "నాకు రావలసిన ఆస్తి భాగం ఇమ్మని" అడగడం ఆ కాలంలో ఒక పెద్ద నేరం.

తండ్రి మరణానికి సమానం: యూదుల సంప్రదాయం ప్రకారం, తండ్రి బ్రతికి ఉండగా ఆస్తి అడగడం అంటే "నువ్వు త్వరగా చనిపోతే బాగుండు" అని శపించడంతో సమానం. ఇది తండ్రికి జరిగే అతిపెద్ద సామాజిక అవమానం [ద్వితీయోపదేశకాండము 21:17].

దూరదేశం: యూదుడు అన్యదేశానికి వెళ్లడం అంటే దేవుని నిబంధన నుండి బయటకు వెళ్లడం. అక్కడ అతను పందులను మేపడం అనేది ఒక యూదునికి అత్యంత హేయమైన, అపవిత్రమైన పని [లేవీయకాండము 11:7].

👉ఆత్మీయ మర్మం: మనిషి దేవుని కంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలనే (ఆస్తి) ప్రేమిస్తూ, స్వతంత్రంగా బ్రతకాలని కోరుకోవడం పాపానికి మూలం.

 

2. బుద్ధి వచ్చినప్పుడు - పశ్చాత్తాపం (Self-Realization)

️"అతనికి బుద్ధి వచ్చినప్పుడు..." (When he came to himself) అన్న మాట చాలా కీలకం.

ఆత్మీయ స్థితి: పాపంలో ఉన్న మనిషి తన అసలు స్థితిని (నిజమైన బుద్ధిని) కోల్పోతాడు. ఆకలి, అవమానం కలిగినప్పుడే అతనికి తండ్రి ఇంటి విలువ తెలిసింది.

నిర్ణయం: "నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి..."మారుమనస్సు అంటే కేవలం ఏడవడం కాదు, పాపపు మార్గాన్ని విడిచి దేవుని వైపుకు అడుగులు వేయడం [2 కొరింథీయులకు 7:10].

తగ్గింపు: "కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను" అనుకోవడం నిజమైన వినయానికి గుర్తు.

 

3. పరుగు తీసిన తండ్రి - ఒక చారిత్రక వింత (The Running Father)

కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి అతడిని చూసి, కనికరపడి, పరుగెత్తి అతడి మెడమీద పడి ముద్దు పెట్టుకున్నాడు.

చారిత్రక మర్మం: ఆ కాలంలో మధ్యప్రాచ్య దేశాల్లో వయసు మళ్లిన, గౌరవప్రదమైన పురుషులు ఎప్పుడూ పరుగెత్తరు. అలా పరుగెత్తడం వారి గౌరవానికి భంగం. కానీ తండ్రి తన గౌరవాన్ని పక్కన పెట్టి పరుగెత్తాడు.

కారణం (Kezazah Ceremony): ఒక యూదు కుమారుడు తన ఆస్తిని అన్యుల మధ్య పోగొట్టుకొని తిరిగి వస్తే, గ్రామంలోని వారు ఒక మట్టి పాత్రను పగలగొట్టి అతడిని బహిష్కరిస్తారు. దీనిని 'కెజాజా' అంటారు. గ్రామస్థులు ఆ కుమారుడిని అవమానించక ముందే, తండ్రి పరుగెళ్లి అతడిని కౌగిలించుకుని తన రక్షణ కవచంలోకి తీసుకున్నాడు.

👉ఆత్మీయ సత్యం: మనం దేవుని దగ్గరకు రాకముందే, ఆయన మనకోసం ఎదురుచూస్తూ, మన శిక్షను తాను భరించడానికి సిద్ధంగా ఉన్నారు [రోమీయులకు 5:8].

 

4. పునరుద్ధరణ గుర్తులు (Symbols of Restoration)

తండ్రి తన సేవకులతో మూడు వస్తువులను తీసుకురమ్మన్నాడు:

1. శ్రేష్ఠమైన వస్త్రము: ఇది కోల్పోయిన నీతికి సాదృశ్యం. గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వస్త్రం [యెషయా 61:10].

2. ఉంగరము: ఇది అధికారం మరియు పుత్రత్వానికి (Authority) గుర్తు. అతను ఇక బానిస కాదు, కుమారుడు.

3. చెప్పులు: ఆ కాలంలో బానిసలకు చెప్పులు ఉండేవి కావు. కుమారుని కాళ్లకు చెప్పులు వేయడం అంటే అతనికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం.

 

5. పెద్ద కుమారుడు - నేటి పరిసయ్యత్వం (The Elder Brother)

ఈ కథలో పెద్ద కుమారుడు కూడా తప్పిపోయిన వాడే. అతను ఇంటిలోనే ఉన్నాడు కానీ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేదు.

విశ్లేషణ: అతను తన నీతిని (Self-righteousness) నమ్ముకున్నాడు. తమ్ముడు వచ్చినందుకు సంతోషించకుండా, తండ్రిని విమర్శించాడు.

👉హెచ్చరిక: సంఘంలో ఉంటూ, సేవ చేస్తూ, ఇతరుల రక్షణ పట్ల కనికరం లేని "పరిసయ్యులకు" ఇతరులను తీర్పు తీర్చే గుణం ఉంటుందని యేసు హెచ్చరిస్తున్నారు [మత్తయి 23:23].

తండ్రి స్పందన: "నీ తమ్ముడు చనిపోయి మరల బ్రతికెను"ఒక ఆత్మ రక్షణను తండ్రి ప్రాణదానంగా భావిస్తాడు.

 

స్టడీ చర్చా అంశాలు:

1. చిన్న కుమారుడు 'దూరదేశం'లో పోతే, పెద్ద కుమారుడు 'ఇంటిలోనే' ఎలా తప్పిపోయాడు?

2. తండ్రి పరుగెత్తడం ద్వారా దేవుని స్వభావం గురించి మనం ఏం నేర్చుకోవచ్చు?

3. మన జీవితంలో 'ఉంగరము, వస్త్రము, చెప్పులు' అంటే మనకు లభించిన ఆత్మీయ ఆధిక్యతలను మనం కాపాడుకుంటున్నామా?

 

ముఖ్యమైన రిఫరెన్సులు (Key References):

యెషయా 55:7: "దుష్టుడు తన మార్గమును విడిచిపెట్టవలెను... అతడు యెహోవా వైపు తిరిగినయెడల ఆయన అతనిని కరుణించును."

ఎఫెసీయులకు 2:4-5: "దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యున్నప్పుడు మనలను క్రీస్తుతోకూడ బ్రతికించెను."

మీకా 7:18: "తన స్వాస్థ్యములోని శేషించినవారి దోషమును పరిహరించి, అతిక్రమములను క్షమించు దేవుడవు నీవంటివాడెవడు?"

 

ఆత్మీయ ముగింపు (Summary & Depth):

చిన్న కుమారుడు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, కానీ తండ్రి తన కుమారుడిని తిరిగి సంపాదించుకున్నాడు. ఆ కుమారుడు "దాసుడిగా" ఉండాలని కోరుకున్నాడు, కానీ తండ్రి అతడిని "వారసుడిగా" నిలబెట్టాడు [రోమీయులకు 8:17]. తండ్రి పెట్టిన విందు కేవలం కుమారుని రాక కోసమే కాదు, మరణించిన వాడు తిరిగి బ్రతికినందుకు కలిగిన పరలోకపు ఉత్సాహం. మనము కూడా మన జీవితాల్లో దేవుని నుండి ఎంత దూరము వెళ్ళినా, ఆయన ప్రేమ మనల్ని కౌగిలించుకోవడానికి ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉంది [యెషయా 30:18]. అది తన గుండెలకు హత్తుకునే నీ తండ్రి ప్రేమ!

దైవాశీస్సులు!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(29వ  భాగము)

 

"అన్యాయస్థుడైన గృహనిర్వాహకుడు" (The Unjust Steward)

 

అన్యాయస్థుడైన గృహనిర్వాహకుడుఉపమానం బైబిల్లో అత్యంత కష్టమైన మరియు లోతైన అర్థాలు కలిగిన ఉపమానాలలో ఒకటి. లోకసంబంధమైన ధనాన్ని పరలోక సంబంధమైన లాభం కోసం ఎలా వాడుకోవాలో యేసుప్రభువు ఇక్కడ అద్భుతంగా బోధించారు.

 

అన్యాయస్థుడైన గృహనిర్వాహకుడు (The Unjust Steward)

(లేఖన భాగం: లూకా 16:1-13)

 

ఈ కథలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు: యజమాని (దేవుడు), గృహనిర్వాహకుడు (మనం), మరియు రుణస్థులు (లోకం).

 

1. గృహనిర్వాహకుని వైఫల్యం (The Failure of Stewardship)

గృహనిర్వాహకుడు అంటే తన యజమాని ఆస్తిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాడు. కానీ ఇతను యజమాని ఆస్తిని "దుర్వినియోగం" చేశాడు [లూకా 16:1].

లోతైన విశ్లేషణ: మనకు ఉన్న సమయం, ధనం, తలాంతులు అన్నీ దేవుని ఆస్తి. మనం వాటిని కేవలం మన స్వార్థం కోసం వాడుకుంటే, మనం కూడా అన్యాయస్థులమైన గృహనిర్వాహకులమే.

లెక్క అప్పగించుట: "నీవు చేసిన గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము" అని యజమాని అడిగినప్పుడు, ఆ గృహనిర్వాహకుడు తన ఉద్యోగం పోతుందని గ్రహించాడు. ఇది మన 'మరణం' లేదా 'తీర్పు' రోజుకు సాదృశ్యం [హెబ్రీయులకు 9:27].

 

2. వివేకవంతమైన నిర్ణయం (The Shrewd Strategy)

ఇక్కడ ఒక వింత జరుగుతుంది. గృహనిర్వాహకుడు తన యజమాని దగ్గర అప్పు ఉన్న వారిని పిలిచి, వారి అప్పులను తగ్గించేశాడు. ఉదాహరణకు, 100 మణుగుల నూనె ఉన్నవానిని 50 అని వ్రాయమన్నాడు [లూకా 16:6].

ఎందుకు అలా చేశాడు?: తన ఉద్యోగం పోయిన తర్వాత, ఆ రుణస్థులు తనను తమ ఇళ్లలో చేర్చుకోవాలని అతను ఈ ప్లాన్ వేశాడు.

యజమాని మెచ్చుకోలు: యజమాని అతని 'అన్యాయాన్ని' మెచ్చుకోలేదు, కానీ అతని 'వివేకాన్ని' (Shrewdness) మెచ్చుకున్నాడు [లూకా 16:8]. అంటే, రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం తన దగ్గర ఉన్న దానిని ఉపయోగించుకున్నాడు.

 

3. ఆత్మీయ మర్మం: అన్యాయపు సిరి (The Mammon of Unrighteousness)

యేసు ఈ ఉపమానాన్ని ముగిస్తూ, "అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి" అని చెప్పారు [లూకా 16:9].

దీని అర్థం ఏమిటి?: లోకసంబంధమైన ధనం (Mammon) శాశ్వతం కాదు. అది ఒకరోజు అంతమైపోతుంది. ఆ ధనం మన దగ్గర ఉన్నప్పుడే, దానిని దేవుని పని కోసం, పేదల కోసం (అంటే స్నేహితుల కోసం) వాడితే, అది మనకు 'పరలోకంలో' ఫలాన్ని ఇస్తుంది.

👉మనం ధనానికి దాసులం కాకూడదు, ధనాన్ని మన దాసునిగా మార్చుకుని పరలోక నిధిని కూర్చుకోవాలి.

 

4. నమ్మకత్వం మరియు ఇద్దరు యజమానులు (Faithfulness)

చివరగా యేసు రెండు ముఖ్యమైన సూత్రాలు చెప్పారు:

1. అల్పమైన దానిలో నమ్మకత్వం: ఈ లోకపు ధనం 'అల్పమైనది'. ఇందులో మనం నమ్మకంగా ఉంటేనే, దేవుడు మనకు పరలోకపు 'నిజమైన భాగ్యము'ను ఇస్తాడు [లూకా 16:11].

2. ఇద్దరు యజమానులు: ఒకే సమయంలో దేవునికి మరియు ధనానికి (Mammon) దాసులుగా ఉండటం అసాధ్యం [లూకా 16:13].

 

ముగింపు (Conclusion ):

నేర్చుకోవాల్సిన 3 పాఠాలు:

1. ముందుచూపు: లోకస్థులు తమ భవిష్యత్తు కోసం (Retirement) ఎంతో ప్లాన్ చేస్తారు. మరి విశ్వాసులమైన మనం మన పరలోక భవిష్యత్తు కోసం ఎంత ప్లాన్ చేస్తున్నాం?

2. నిర్వహణ: ధనం మనది కాదు, దేవుడు మనకు ఇచ్చిన బాధ్యత మాత్రమే. దానిని దైవ ప్రణాళిక కోసం వాడాలి.

3. ప్రాముఖ్యత: ధనాన్ని ప్రేమించడం విగ్రహారాధనతో సమానం. దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి.

 

ముఖ్యమైన రిఫరెన్సులు:

మత్తయి 6:19-20: "భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు... పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి."

1 తిమోతి 6:17-19: "ధనవంతులు గర్విష్టులు కాక... సత్‌క్రియలు చేయుటయందు ధనవంతులై ఉండవలెను."

లూకా 16:10: "మిక్కిలి అల్పమైన విషయములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును."

దైవాశీస్సులు!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(30వ  భాగము)

 

ధనవంతుడు - లాజరు

(మరణం తర్వాత మర్మాల విశ్లేషణ)

లేఖన భాగం: లూకా 16:19-31

 

1. మరణం తర్వాత తక్షణ స్థితి (Immediate State after Death)

చాలామంది మరణం తర్వాత ఆత్మ నిద్రపోతుందని అనుకుంటారు, కానీ ఇక్కడ యేసుప్రభువు స్పష్టంగా మూడు విషయాలు చెప్పారు:

స్పృహ (Consciousness): ధనవంతుడు మరణించిన తర్వాత పాతాళంలో స్పృహతో ఉన్నాడు. అతను వేదనను అనుభవించగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు మరియు గుర్తుపట్టగలుగుతున్నాడు.

గుర్తింపు (Recognition): ధనవంతుడు అబ్రాహామును మరియు లాజరును గుర్తుపట్టాడు. అంటే మరణం తర్వాత కూడా మన వ్యక్తిత్వం (Identity) అలాగే ఉంటుంది.

మార్పు లేని స్థితి: మరణించిన తర్వాత ఆత్మ యొక్క స్థితి మారదు. లాజరు ఉన్న చోటుకు ధనవంతుడు వెళ్లలేడు, ధనవంతుడు ఉన్న చోటుకు లాజరు రాలేడు.

 

2. అగాధము - మార్చలేని సరిహద్దు (The Great Gulf)

అబ్రాహాము రొమ్ము (పరదైసు) మరియు పాతాళము (వేదన గల చోటు) మధ్య ఒక "మహా అగాధము" ఉందని బైబిలు చెబుతోంది.

మర్మం: ఈ అగాధము దేవుని న్యాయతీర్పుకు సాదృశ్యం. బ్రతికి ఉన్నప్పుడే రక్షణ పొందితే పరదైసు, లేదంటే వేదన గల చోటు. మరణం తర్వాత ప్రార్థనలు చేసినా, ధర్మకార్యాలు చేసినా ఆ అగాధాన్ని ఎవరూ దాటలేరు.

️Depth Analysis: "అబ్రాహాము రొమ్ము" అనేది యూదుల సంప్రదాయంలో దేవుని సన్నిధిలో ఉండే విశ్రాంతికి గుర్తు. లాజరు భూమి మీద పొందని నెమ్మదిని అక్కడ పొందుతున్నాడు.

 

3. ఐదుగురు సహోదరులు - జీవించి ఉన్నవారి బాధ్యత

ధనవంతుడు తన ఐదుగురు సహోదరుల గురించి చింతించాడు. తనలాగే వారు కూడా ఈ వేదన గల చోటుకు రాకూడదని ఆశపడ్డాడు.

సువార్త ప్రాముఖ్యత: "మోషేయు ప్రవక్తలును వారి యొద్ద ఉన్నారు; వారు వారి మాటలు వినవలెను" అని అబ్రాహాము చెప్పాడు. అంటే, అద్భుతాలు చూసి రక్షణ పొందడం కంటే, దేవుని వాక్యం (The Word) విని రక్షణ పొందడం మిన్న.

మర్మం: చనిపోయిన వారు తిరిగి వచ్చి చెప్పినా, హృదయం కఠినంగా ఉంటే మనుషులు నమ్మరు. అందుకే బ్రతికి ఉన్నప్పుడే వాక్యాన్ని అంగీకరించాలి.

 

4. Depth Insights:

Not a Parable, but a Real Account:

యేసుప్రభువు ఇతర ఉపమానాల్లో పేర్లు వాడలేదు. కానీ ఇక్కడ "లాజరు" అనే పేరు వాడారు. అంటే ఇది జరిగిన యదార్థ సంఘటన అని చాలామంది వేదాంతుల అభిప్రాయం.

️Reversal of Fortunes: భూమి మీద ధనవంతుడు 'అజ్ఞాతంగా' (పేరు లేకుండా) మిగిలిపోయాడు, కానీ దరిద్రుడైన లాజరు పేరు పరలోకంలో రికార్డు చేయబడింది. లోకం దృష్టిలో గొప్పవారైన వారు దేవుని దృష్టిలో అల్పులుగా ఉండవచ్చు.

️The Sufficiency of Scripture: రక్షణకు వాక్యం సరిపోతుంది. చనిపోయిన వారు తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యం ద్వారా మారని హృదయం అద్భుతాల ద్వారా కూడా మారదు.

 

ముగింపు:

ఈ వృత్తాంతం మనకు ఇచ్చే గొప్ప హెచ్చరిక ఏమిటంటేమరణం అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త లోకానికి ప్రారంభం. భూమి మీద మనం తీసుకునే నిర్ణయమే (Decision) నిత్యత్వంలో మన స్థానాన్ని (Destination) నిర్ణయిస్తుంది.

 

ముఖ్యమైన రిఫరెన్సు:

హెబ్రీయులకు 9:27: "మనుష్యులు ఒక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును."

దైవాశీస్సులు!!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(31వ  భాగము)

 

అన్యాయస్థుడైన న్యాయాధిపతి మరియు విధవరాలు" (లూకా సువార్త 18:1-8)

 

విడవక ప్రార్థించుటలోని మర్మం

ప్రధాన లేఖనం: "వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను." [లూకా 18:1]

 

1. ఇద్దరు విభిన్న వ్యక్తులు (Two Contrasting Characters)

ఈ ఉపమానంలో ఇద్దరు ప్రధాన వ్యక్తులు ఉన్నారు. వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం మనకు ప్రార్థన విలువను నేర్పిస్తుంది.

అన్యాయస్థుడైన న్యాయాధిపతి: ఇతను దేవునికి భయపడడు, మనుషులను లక్ష్యం చేయడు. ఇతను స్వార్థపరుడు మరియు కఠిన హృదయుడు.

విధవరాలు: బైబిలు కాలంలో విధవరాలు అత్యంత బలహీనమైన వర్గానికి చెందినవారు. ఆమెకు ఎటువంటి సిఫార్సు లేదు, ధనం లేదు. ఆమెకు ఉన్న ఏకైక ఆయుధం "నిలకడ"

 

2. విసుకక ప్రార్థించడం అంటే ఏమిటి? (Praying without giving up)

ఆ విధవరాలు న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళి "నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుము" అని పదే పదే అడుగుతోంది.

లోతైన విశ్లేషణ: ఆమె తన అభ్యర్థనలో మార్పు చేయలేదు, వెనక్కి తగ్గలేదు. ప్రార్థనలో జవాబు రానప్పుడు మనం విసుగు చెందుతాం (Fainting). కానీ ఈమె విసుగక పోరాడింది.

మర్మం: ప్రార్థన అనేది దేవునికి మన అవసరాలు గుర్తు చేయడం కాదు, అది మన విశ్వాసాన్ని పరీక్షించే సమయం. మనం ఎంత కాలం వేచి ఉండగలమో, దేవుడు మన హృదయ కాంక్షను చూస్తారు.

 

3. న్యాయాధిపతి ఎందుకు విన్నాడు? (The Turning Point)

ఆ అన్యాయస్థుడు ఇలా అనుకున్నాడు: "ఈ విధవరాలు నన్ను విసిగించుచున్నది గనుక ఆమె నాకు నిత్యము వచ్చి శ్రమ కలుగకుండ ఆమెకు న్యాయము తీర్చెదను."

ఆత్మీయ మర్మం: ఒక కఠిన హృదయుడైన మనిషే విసిగించడం వల్ల వింటే, ప్రేమ స్వరూపియైన దేవుడు తన పిల్లల మొరను ఎందుకు ఆలకించడు? [లూకా 18:7].

వ్యత్యాసం (Contrast): దేవుడు ఆ అన్యాయస్థుని వంటివాడు కాదు. ఆయన న్యాయవంతుడు. ఆయన మనల్ని ప్రేమించే తండ్రి. మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, అయితే మనం ఆ విధవరాలి వలె నిలకడగా అడుగుతున్నామా లేదా అని చూస్తారు.

 

4. మర్మయుక్తమైన ముగింపు - "విశ్వాసము కనుగొనునా?"

ఈ ఉపమానం ముగిస్తూ యేసు ఒక గంభీరమైన ప్రశ్న వేశారు: "మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?" [లూకా 18:8].

విశ్లేషణ: ఇక్కడ 'విశ్వాసం' అంటే కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం కాదు. జవాబు రానప్పుడు కూడా విసుగక ప్రార్థించే గుణం (Persistent Faith).

ప్రశ్న: లోకము ముగింపు సమయంలో, ప్రార్థనలో పోరాడే వారు తక్కువైపోతారని యేసు హెచ్చరిస్తున్నారు.

 

సాధారణ విశ్వాసికి ఈ పాఠం ద్వారా వచ్చే 3 సందేశాలు:

1. విసుగు చెందవద్దు: ప్రార్థనకు జవాబు ఆలస్యమైతే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని అర్థం కాదు. ఆయన మీ నిలకడను చూస్తున్నారు.

2. అధైర్యపడవద్దు: ఆ విధవరాలికి ఎవరూ లేరు, కానీ మీకు యేసుక్రీస్తు అనే గొప్ప ప్రధానయాజకుడు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు.

3. పోరాడండి: సాతాను మీ ప్రార్థనలు ఆపాలని చూస్తాడు. కానీ మీరు పట్టువదలక ప్రార్థిస్తే, అసాధ్యమైన తలుపులు కూడా తెరవబడతాయి.

 

ముగింపు:

ఈ ఉపమానం మనకు ఇచ్చే గొప్ప నిరీక్షణ ఏమిటంటేన్యాయవంతుడైన దేవుడు తన ప్రజలకు "త్వరగా న్యాయము తీర్చును". మనం చేయవలసిందల్లా విసుగక ప్రార్థించడమే.

 

ముఖ్యమైన రిఫరెన్సు:

రోమీయులకు 12:12: "నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి."

దైవాశీస్సులు!!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(32వ  భాగము)

 

"పరిసయ్యుడు మరియు సుంకరి"

           (లూకా 18:9-14)

 

ఉపమానం క్రైస్తవ జీవితంలో 'ప్రార్థన' మరియు 'దీనత్వము' గురించి నేర్పే అత్యంత లోతైన పాఠం.

 

హృదయాల అంతరంగము: నీతిమంతుడెవరు?

 

ప్రధాన లేఖనం: "తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడుననియు మీతో చెప్పుచున్నాను." [లూకా 18:14]

 

1. నేపథ్యం: ఎవరి కోసం ఈ ఉపమానం?

యేసుప్రభువు ఈ ఉపమానాన్ని అందరికీ చెప్పలేదు. "తమరే నీతిమంతులమని తమను నమ్ముకొని, ఇతరులను తృణీకరించువారిని" ఉద్దేశించి చెప్పారు [లూకా 18:9].

మర్మం: ఇక్కడ సమస్య ప్రార్థన కాదు, హృదయ స్థితి. ఒక వ్యక్తి దేవుని కంటే తన 'నీతి'నే ఎక్కువగా నమ్ముకున్నప్పుడు, అతను దేవునికి దూరమవుతాడు.

 

2. పరిసయ్యుని ప్రార్థన: స్వనీతి ప్రదర్శన

పరిసయ్యుడు ధర్మశాస్త్రాన్ని అక్షరాలా పాటించేవాడు. అతని ప్రార్థనలో లోపాలు ఇవే:

️"తనలో తాను" ప్రార్థించుకొనుట: అతను దేవునితో మాట్లాడటం లేదు, తన గొప్పలు తనే చెప్పుకుంటున్నాడు [లూకా 18:11].

పట్టిక (Checklist) భక్తి: "నేను దొంగను కాను, అన్యాయస్థుడను కాను, వ్యభిచారిని కాను..." అని చెబుతూ, తాను 'చేయని' పాపాలను బట్టి అతిశయపడ్డాడు.

అధిక భక్తి: ధర్మశాస్త్రం ప్రకారం సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉండాలి, కానీ అతను "వారమునకు రెండుమార్లు" ఉన్నాడు. ఆదాయమంతటిలో "పదియవ వంతు" ఇచ్చాడు [లూకా 18:12].

లోతైన విశ్లేషణ: పరిసయ్యుని ప్రార్థనలో "నేను" (I) అనే పదం ఐదుసార్లు వస్తుంది. అతని దృష్టిలో దేవుడు ఒక 'న్యాయాధిపతి' మాత్రమే, కానీ 'కృపామయుడు' కాదు.

 

3. సుంకరి ప్రార్థన: పశ్చాత్తాపం మరియు కృప

సుంకరి ఆ కాలంలో సమాజం చేత అసహ్యించుకోబడినవాడు. అతని ప్రార్థన దేవుని హృదయాన్ని తాకింది.

దూరముగా నిలుచుట: దేవుని పరిశుద్ధత ముందు తాను అపవిత్రుడనని గ్రహించి, ధైర్యము చాలక దూరంగా నిలబడ్డాడు [లూకా 18:13].

కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక: ఇది 'దైవభీతి'కి గుర్తు.

రొమ్ము కొట్టుకొనుట: హీబ్రూ సంస్కృతిలో రొమ్ము కొట్టుకోవడం అంటే తీవ్రమైన దుఃఖం మరియు పశ్చాత్తాపం.

ప్రార్థన సారాంశం: "దేవా, పాపినైన నన్ను కరుణించుము."

👉గ్రీకు మర్మం: ఇక్కడ 'కరుణించుము' అనే పదానికి గ్రీకులో 'Hilaskomai' అని అర్థం. దీనికి "నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేయి" లేదా "నన్ను నీ కృపతో కప్పుము" అని అర్థం. అంటే అతను దేవుని 'కృపాసనము' (Mercy Seat/Thrown of Grace) వైపు చూస్తున్నాడు.

 

4. తీర్పు: ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు?

ప్రజల దృష్టిలో పరిసయ్యుడు నీతిమంతుడు, సుంకరి పాపి. కానీ దేవుని తీర్పు రివర్స్‌లో ఉంది:

తీర్పు: సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు.

కారణం: పరిసయ్యుడు దేవుని కృప అవసరం లేనంత 'నీతిమంతుడిగా' తనను తాను భావించుకున్నాడు. సుంకరి మాత్రం తన ఏకైక ఆశ్రయం 'దేవుని కృప' మాత్రమే అని నమ్మాడు.

ఆత్మీయ సత్యం: దేవుడు విరిగిన హృదయాన్నే కోరుకుంటారు [కీర్తనలు 51:17]. గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తారు, దీనులకు కృపను అనుగ్రహిస్తారు [యాకోబు 4:6].

 

ఈ ఉపమానం నుండి 3 కీలకమైన సందేహాలు - సమాధానాలు:

1. మంచి పనులు చేయడం తప్పా? కాదు, కానీ ఆ పనులే మనల్ని పరలోకానికి తీసుకెళ్తాయని నమ్మడం తప్పు. రక్షణ కేవలం కృప వల్లనే వస్తుంది [ఎఫెసీయులకు 2:8-9].

2. సుంకరి నీతిమంతుడిగా ఎలా మారాడు? అతని పాపం వల్ల కాదు, తన పాపాన్ని ఒప్పుకొని దేవుని వైపు తిరగడం వల్ల.

3. పరిసయ్యుని తప్పు ఏమిటి? ఇతరులను తృణీకరించడం. భక్తి పెరిగే కొద్దీ ప్రేమ పెరగాలి, కానీ అతనిలో గర్వం పెరిగింది.

 

ముగింపు:

ఈ ఉపమానం మనకు నేర్పే పెద్ద పాఠం ఏంటంటేదేవుని సన్నిధిలో మన 'ర్యాంక్' లేదా 'స్థాయి' ముఖ్యం కాదు, మన 'హృదయ స్థితి' ముఖ్యం. దేవునికి దగ్గరవ్వాలంటే, మనం సుంకరి లాగా మనల్ని మనం తగ్గించుకోవాలి.

 

ముఖ్యమైన రిఫరెన్సులు:

️"అపహాసకులను ఆయన అపహసించును, దీనులయందు ఆయనకు కృప పుట్టును." (సామెతలు 3:34)

ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. (యెషయా 66:2)

దైవాశీస్సులు!!!

యేసు ప్రభువు ఉపమానముల ధ్యానం

(Parables of Jesus)

పరలోక మర్మముల తాళపు చెవి 🔑

(33వ  భాగము)

 

"పదివరహాల ఉపమానం" (The Parable of the Ten Minas)  (లూకా 19:11-27)

 

ఈ ఉపమానాన్ని యేసుప్రభువు యెరుషలేముకు సమీపంలో ఉన్నప్పుడు చెప్పారు. ప్రజలు దేవుని రాజ్యం వెంటనే ప్రత్యక్షమౌతుందని భ్రమపడుతున్న వేళ, ఆయన పరలోకానికి వెళ్లి తిరిగి రావడానికి సమయం పడుతుందని వివరించడానికి దీనిని చెప్పారు [లూకా 19:11].

 

1. నేపథ్యం మరియు చారిత్రక మర్మం:

ఈ కథలో ఒక "రాజకుమారుడు" రాజ్యమును సంపాదించుకోవడానికి దూరదేశమునకు వెళ్లడం మనం చూస్తాం [లూకా 19:12].

చారిత్రక కనెక్షన్: ఆ కాలంలో హేరోదు అర్కిలాయు అనే రాజు తన రాజ్యాన్ని రోమ్ నుండి ధృవీకరించుకోవడానికి ఇలాగే వెళ్ళాడు. యూదులు అతన్ని ఇష్టపడక రాయబారులను పంపారు. యేసు ఈ చారిత్రక నేపథ్యాన్ని వాడుకుంటూ తన స్వంత 'రాజ్య ఆరోహణ' గురించి చెప్పారు.

ఆత్మీయ అర్థం: రాజకుమారుడు అంటే యేసుక్రీస్తు. దూరదేశం అంటే పరలోకం. ఆయన తిరిగి రావడం అంటే రెండవ రాకడ.

 

2. మినా (Mina) అంటే ఏమిటి?

రాజు తన దాసులకు తలా ఒక 'మినా' (వరహా) ఇచ్చాడు.

విలువ: ఒక మినా అంటే సుమారు ఒక కూలీ యొక్క 100 రోజుల వేతనం.

తలాంతులకు, మినాలకు తేడా: 'తలాంతుల' ఉపమానంలో (మత్తయి 25) ఒక్కొక్కరికి వారి సామర్థ్యం బట్టి వేర్వేరుగా ఇచ్చారు. కానీ ఇక్కడ అందరికీ సమానంగా ఒక్కొక్కటే ఇచ్చారు.

మర్మం: 'మినా' అనేది దేవుడు మనందరికీ సమానంగా ఇచ్చిన "సువార్త" లేదా "జీవితం" లేదా "కృప" కు సాదృశ్యం. దీనిని ఎలా ఉపయోగిస్తాం అనేది మన బాధ్యత.

 

3. ముగ్గురు దాసులు - మూడు రకాల ఫలితాలు

రాజు తిరిగి వచ్చి లెక్క అడిగినప్పుడు:

1. మొదటివాడు: "నీ మినా ద్వారా పది మినాలు సంపాదించాను" అన్నాడు. అతనికి 10 పట్టణాల మీద అధికారం లభించింది [లూకా 19:16-17].

2. రెండవవాడు: "ఐదు మినాలు సంపాదించాను" అన్నాడు. అతనికి 5 పట్టణాల మీద అధికారం లభించింది [లూకా 19:18-19].

3. మూడవవాడు: "నీ మినాను గుడ్డలో కట్టి పెట్టాను" అన్నాడు. అతను రాజును "కఠినుడవు" అని విమర్శించాడు [లూకా 19:20-21].

విశ్లేషణ: మూడవ దాసుడు రాజును ప్రేమించలేదు, కేవలం భయపడ్డాడు. పని చేయకపోవడానికి దేవుని స్వభావాన్ని వంకగా వాడాడు. అందుకే అతని దగ్గర ఉన్నది కూడా తీసివేయబడింది.

 

4. "లేనివాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడును"

ఇది చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ దీని అంతరార్థం ఏమిటంటే:

దేవుడు మనకిచ్చిన కృపను మనం వాడకపోతే, ఆ కృప మన దగ్గర పని చేయదు.

రాజ్య పరిపాలనలో (Millennium Reign) మనకు లభించే హోదా, మనం భూమి మీద దేవుని కోసం ఎంత నమ్మకంగా పనిచేశామనే దానిపై ఆధారపడి ఉంటుంది.

 

5. శత్రువుల అంతం

️"మేము ఇతనిని రాజుగా ఒప్పుకోము" అన్న శత్రువులను తన ఎదుట సంహరించమని రాజు ఆజ్ఞాపించాడు [లూకా 19:27]. ఇది క్రీస్తును తిరస్కరించేవారికి వచ్చే అంతిమ తీర్పుకు సాదృశ్యం.

 

ఆత్మీయ సారాంశం (Key Takeaways):

నమ్మకత్వం: దేవుడు మనకు చిన్న విషయాలు ఇచ్చినా, వాటిలో నమ్మకంగా ఉంటేనే పెద్ద వాటిని ఇస్తారు.

సమయం: యేసు తిరిగి వచ్చే వరకు మనం "వ్యాపారం" చేయాలి (అంటే ఆత్మలను సంపాదించాలి, వాక్యాన్ని ప్రకటించాలి) [లూకా 19:13].

తీర్పు: క్రియలను బట్టి విశ్వాసులకు బహుమానాలు, అవిశ్వాసులకు శిక్ష ఉంటాయి.

 

మత్తయి 25:14-30 (తలాంతుల ఉపమానం - పోలిక కోసం).

1 కొరింథీ 3:12-15 (క్రియలను బట్టి బహుమానాలు).

2 కొరింథీ 5:10 (క్రీస్తు న్యాయపీఠం).

 

NOTE:  బైబిల్ లో యేసు ప్రభువు చెప్పిన 32 ఉపమానముల వివరణ నేటితో పూర్తిచెయ్యబడినది. దేవునికే మహిమ! ఆమెన్!

 

 

🧎‍️/————

 

ప్రభువు చిన్ని పరిచర్యలో

బ్రదర్. సుధాకర్ బాబు కోన

📧 Email: krajsudha2@gmail.com

 

📢 గమనిక: ఈ సందేశం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాముకంటెంట్ లో ఎట్లాంటి మార్పులు చెయ్యకుండా షేర్ చేసి, మీరునూ ప్రభువు పరిచర్యలో పాలిభాగస్తులుకాగలరు. వందనములు!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు

సప్త సూక్తులు - యేసు ప్రభువు వారు సిలువలో పలికిన ఏడు మాటలు

పాపము

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

శరీర కార్యములు

సమరయ స్త్రీ

శిలువ శ్రమలు

బాప్తిస్మం

అబ్రాహాము విశ్వాసయాత్ర

విశ్వాసము