భయపడకుము-నమ్మిక మాత్రముంచుము

భయపడకుము-నమ్మిక మాత్రముంచుము

FEAR NOT – ONLY BELIEVE

లూకా 8:50 యేసు ఆమాట విని “భయపడకుము- నమ్మిక మాత్రముంచుము” ఆమె స్వస్తపరచబడుననిచెప్పెను.
యేసుప్రభుల వారు గలలియ ప్రాంతంలో రాజ్యసువార్త ప్రకటిస్తూ ఉండగా యాయీరు అనే సమాజమందిరపు అధికారి యేసయ్య వద్దకు వచ్చి నాకుమార్తె చావసిద్ధంగా ఉన్నది దయచేసి వచ్చి స్వస్తపరచుము అని వేడుకొన్నాడు. యేసుప్రభులవారు ఆయనతోపాటూ వెళ్ళుచుండగా ఒకడు వచ్చి యాయీరుతో అయ్యా భోధకుడిని శ్రమపెట్టొద్దు, నీకుమార్తె చనిపోయింది అని చెప్పాడు. అందుకు యేసయ్య అంటున్నారు భయపడకు- నమ్మికమాత్రముంచుము.

ఈరోజు యేసయ్య నీతో నాతో అంటున్న మాట భయపడకు. నమ్మిక మాత్రముంచుము. నీసమస్య ఏదైనా సరే ప్రభుపాదాల దగ్గర ఉంచి ఆయనపై భారం వేసి ముందుకుపో! నీ సమస్య సునాయాసంగా ఉహించనివిధంగా యేసయ్య తీరుస్తారు.

అయితే ఇక్కడ యాయీరుతో నీ కుమార్తె చనిపోయింది, ఇక వదిలేయ్ అని ఎలా కబురు చెప్పాడో, అదేవిదముగా సాతానుడు కూడా మనిషికి మూడు విషాలు (Poisons) ఇంజక్షన్ చేస్తాడు.

1.భయం, 2. పాపం, 3. అనుమానం

ఈ మూడింటికి విరుగుడు- Antidote , antibiotic, anti-fear, anti-doubt, anti-sin ఏమిటంటే – అది దేవుని వాక్యమే!!!

హవ్వదగ్గరకు సాతానుగాడు వచ్చి అనుమానాన్ని పాపాన్ని ఇంజెక్ట్ చేసాడు. ఏమని? అవునా! ఇది నిజమా? అని. (ఆదికాండము 3వ అధ్యాయం) దానితో పాటు నేత్రాశ, శరీరాశ, జీవపుడంభము ఈ మూడు కాంబినేషన్ లో స్ట్రాంగ్ ఇంజక్షన్ చేసాడు. అంతే హవ్వమ్మ పాపంలో పడిపోయింది. ఆ స్త్రీ, ఆ వృక్షము ఆహారానికి మంచిదనియు (శరీరాశ), కన్నులకు అందమైనదనియు (నేత్రాశ), వివేకమిచ్చు రమ్యమైనదనియు(జీవపు డంభము) చూసింది.
ప్రియ విశ్వాసి! జాగ్రత్త! పై మూడు విషాలు సాతానుడు నీపై వేసి నిన్ను భయపెడతాడు, పాపిగా మారుస్తాడు.

ఇశ్రాయేలీయులు చెరవిముక్తిపొంది, ఐగుప్తు నుండి కనాను దేశం వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీయులను తరుముకొంటూ ఐగుప్తు సైన్యం వస్తుంది. ముందు ఎర్ర సముద్రం, వెనుక సైన్యం. అప్పుడు ఇశ్రాయేలీయులు భయపడి- ఐగుప్తులో మాకు సమాధులు లేవా? అని మోషే గారితో తగాదా పడతారు. అప్పుడు మోషేగారు అంటున్నారు “భయపడకుడి! యెహోవా అనుగ్రహించు రక్షణను మీరు ఊరకయే నిలుచుండిచూడుడి. అనిచెప్పారు. అంత ధైర్యంగా ఎలా చెప్పారు? దేవుడే ముందే చెప్పారు మోషేతో ఇలా జరుగుందని.

యెషయా గ్రంధంలో దేవుడు చాలాసార్లు భయపడొద్దు అనిచెప్పారు. మొత్తం బైబిల్ గ్రంధంలో 366 సార్లు భయపడకుడి అని వ్రాయబడింది. అంటే సంవత్సరం మొత్తానికి దేవుడు చెబుతున్నారు “*భయపడకుడి*”
41:9-10:- భయపడకుము నేను నీకు సహాయము చేసెదను
43: 1-28:- నేను నిన్ను పేరుపెట్టి పిలచియున్నాను,
నిన్ను విమోచించియున్నాను
నీవు జలములలో బడి దాటునప్పుడు, నడులలోబడి వెళ్ళినప్పుడు అవి నీమీద పొర్లి పారవు.
(నేను కూడా సముద్రాలలోను, మహాసముద్రాలలోను వెళ్ళినప్పుడు తుఫానులు వచ్చినప్పుడు దేవుడు ఎన్నోసార్లు నాతో మాట్లాడారు భయపడకు అని)
నీకు బదులుగా అన్యులను అప్పగిస్తాను
44:1-2 :- నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను.
46:23:- నిన్ను చంకబెట్టుకొని, ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొని రక్షించేవాడను
48:10,12; 49:1-3:- స్త్రీ తనగర్భమున పుట్టిన చంటిబిడ్డను మరచునా? నేను నిన్ను మరువను! నా అరచేతిలో చేక్కుకోన్నాను
49:8:- అనుకూలసమయమందు నీమొర్ర ఆలకించెదను
కాబట్టి దేనికోసం భయపడడం? ఒకవేళ నీవు నీ పిల్లలకోసం భయపడుతున్నావా?
యెషయా 43:5, 49:25:- నీపిల్లలను నేనే రక్షించెదను.
కావున భయపడకు. నమ్మిక మాత్రముంచుము.

ఇక ఎవరికీ భయము?

బైబిల్ చెబుతుంది పాపము చేసినవారు చాలా భయపడుదురు! నీవు నీపని సక్రమంగా చేస్తే ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. ఎక్కడా తలదించుకోవాల్సిన పనిలేదు.
అయితే పాపం చేయకుండా ఎలా ఉండగలము?
నీయెదుట నేను పాపము చేయకుండునట్లు నాహృదయంలో నీవాక్యమునుంచుకొందును. కీర్తన 119:11. నీహృదయంలో వాక్యముంటే నీవు పాపము చెయ్యలేవు.
ఒకవేళ మరణభయం వేదిస్తుందా? కీర్తనాకారుడదంటారు నాకాలగతులు నీవశమందున్నవి. కీర్తన 31:15, మరి అలాంటప్పుడు భయమెందుకు? 31:5 లో దావీదుగారు తన ఆత్మను దేవుని చేతికి అప్పగించి ముందుకుపోయినట్లు నీవు కూడా ముందుకుపో!!

ఒకవేళ పాపబంధకాలలో ఉన్నావా? 32:5 నా పాపాన్ని కప్పుకొనక అయన సన్నిధిలో ఒప్పుకొందును అని అయన ఒప్పుకొన్నారు వెంటనే దేవుడు పాపాన్ని పరిహరించారు, నీవు కూడా నేడు అదే పని చెయ్యమని బ్రతిమిలాడుచున్నాను.
సామెతలు 28:13:- అతిక్రమములు చేయువాడు వర్దిల్లడు కాని దానిని ఒప్పుకొని విడచిపెట్టువాడు కనికరము పొందును. పాపాన్ని అందరూ ఒప్పుకొంటారు గాని దానిని ఒప్పుకొని విడచిపెట్టు వాడు మాత్రం కనికరం పొంది, క్షమించబడతాడు. అప్పుడు నీవు ధైర్యంగా జీవించగలవు.
అప్పుడు నీవు ఆయన సహాయంతో సాతానుతో ధైర్యంగా యుద్ధం చెయ్యగలవు.

కాబట్టి భయపడకు. నమ్మిక మాత్రముంచుము.
అట్టి కృప, ధన్యత దేవుడు అందరికీ దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరీర కార్యములు

క్రిస్మస్

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

విశ్వాసము

పాపము

సమరయ స్త్రీ

విగ్రహారాధన