హనోకు: దేవునికిష్టుడైనవాడు



హనోకు: దేవునికిష్టుడైనవాడు

*ఉపోద్ఘాతం*

ఈ లోకంలో మంచివారు రెండు రకాలు. మంచివారు, మంచివారుగా నటించేవారు. మరోరకంగా చెప్పాలంటే మంచివారుగా పిలువబడేవారు రెండు రకాలు. అవకాశాలు లేక మంచివారుగా మిగిలిపోయిన వారు. అవకాశాలు ఉన్నా చెడిపోకుండా తమ శీలాన్ని, గుణాన్ని, కేరక్టర్ ని కాపాడుకొన్నవారు. ఈ రకానికి చెందిన వారు ఇప్పుడు మనం ధ్యానం చేయబోయే వ్యక్తి.

ఆదికాండము 5:22--24
22. హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తె లను కనెను.
23. హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.
24. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.

హెబ్రీయులకు 11: 5
విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.

Jude(యూదా) 1:14,15
14. ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు,
15. భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.

ప్రియమైన దైవజనమా! పై వచనాలు ప్రకారం మొదటగా ఆయన దేవునితో నడచిన వాడని, రెండవది గా ఆయన విశ్వాసవీరుడని, మూడవది గా ఆయన దేవునికి ఇష్టుడు అని, నాల్గవది గా ఆయన ప్రవక్త అని అర్థం అవుతుంది. మరి ఒక వ్యక్తి ఇన్ని గొప్ప లక్షణాలు కలిగి ఉండడం సామాన్య విషయమా!! అదికూడా చెడిపోయిన జనాల మద్య, చెడిపోయిన రోజుల్లో దేవునికి ఒక సాక్షి గా నిలబడాలంటే మామూలు విషయం కాదు.

ప్రియ దైవజనమా! దేవుని నామము నకు మహిమ కలుగును గాక! యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనములు! ఆధ్యాత్మిక సందేశాలు-6 సిరీస్ భాగంగా మిమ్మల్ని మరోసారి కలుసుకోవడం ఆనందంగా ఉంది. అటువంటి కృపనిచ్చిన దేవాదిదేవునికి నిండు వందనములు! ప్రియులారా ఈసారి మనం భక్తుడైన హనోకు గారి జీవితం కోసం క్లుప్తంగా ధ్యానం చేద్దాం! క్లుప్తంగానే ధ్యానం చేయడానికి గల కారణం ఆయన కోసం చాలా క్లుప్తంగా వ్రాయబడింది కాబట్టి క్లుప్తంగా ధ్యానం చేద్దాం!

మీద చెప్పిన ప్రకారం ఆయన దేవునితో నడచిన వాడు, దేవునికిష్టుడు, విశ్వాస వీరుడు, ప్రవక్త! అంతేకాకుండా మరణం చూడకుండా పరమునకు వెళ్ళిన ఇద్దరు వ్యక్తులలో ప్రధముడు హనోకు గారు! అయితే మామూలు రోజులలో ఆయన అలా జీవించారు అంటే గొప్ప విషయం కాదు గాని మానవజాతి పూర్తిగా పతనమైన రోజుల్లో దేవునికి ఇష్టుడుగా జీవించడం అంటే మామాలు విషయం కాదు. దీనికోసం బాగా అర్థం చేసుకోవడానికి అప్పటి పరిస్థితులు ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం!

మొదటగా బైబిల్ నుండి: ఆదికాండం 4,5 అధ్యాయాలలో మనకు రెండు వంశచక్రాలు కనిపిస్తాయి. ఒకటి కయీను, రెండవది షేతు. ఒక వంశము శపించబడింది కారణం సహోదర హత్య! అవిశ్వాసం! అన్యాయం! అక్రమం విస్తరించింది. కయీను సొంత తమ్ముడుని హత్య చేస్తే, కయీను ను తన సొంత మునిమనుమడు యొక్క మనుమడు హత్య చేశాడు సరికదా పశ్చాత్తాప పడకుండా గర్వంగా విర్రవీగి తనకుతానే అంటున్నాడు నన్ను చంపిన వాడికి 77రెట్లు శాపము వస్తుంది అని. ఈ రకంగా దేవుని భయములేకుండా విస్తారంగా పాపం చేస్తున్న వంశము ఒకటి.

ఇక మరో వంశం దేవునికి భయపడి, ఆరాధన ప్రారంభించిన వంశం. యాదృచ్ఛికంగా ఆదాము గారి నుండి ఏడవ వాడు హనోకు గారు (షేతు ద్వారా); ఆదాము గారి నుండి ఏడవ వాడు లెమెకు (కయీను ద్వారా)! ఒకరు విశ్వాస వీరుడు, దేవునికి ఇష్టుడు అయితే మరొకడు హంతకుడు, పొగరుబోతు, అక్రమకారుడు!
హనోకు గారి రోజుల్లో పాపం ఎంతగా విస్తరించింది అంటే ఆదికాండం ఆరో అధ్యాయం ప్రకారం దేవుడే నరులను చేసినందుకు సంతాప పడవలసి వచ్చింది.
ఆదికాండము 6:5,6,7
5. నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి
6. తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.
7. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది యున్నాననెను. . . అంత ఘోరంగా తయారయ్యింది మానవజాతి అప్పుడు! హత్యలు, మానభంగాలు, లూటీలు, దోపిడీ లు. భూలోకమే సహించలేక పోయింది.

ఇక హనోకు గ్రంథం, యాషారు గ్రంథం ప్రకారం నరజాతి చాలా అవినీతితో, దేవునికి వ్యతిరేకంగా ఉంది ఆ రోజుల్లో. ఇప్పుడు నేను చెప్పే విషయం కేవలం నరజాతి అక్రమం ఎంతగా విస్తరించిందో చెప్పడానికి మాత్రమే చెబుతున్నాను. హనోకు గ్రంథం ప్రకారం నరులకు దేవుడంటే భయం లేకుండా, వావి వరుసలు లేకుండా పాపం చేస్తూ, హత్యలు చేసేవారు. దానికి కారణం సాతాను. వాడే ఆదాము హవ్వలను పాపం చేయడానికి ప్రేరేపించింది, వాడే తమ్ముడు హేబెలుని హత్య చెయ్యమని చెప్పింది. ఇలా అన్ని వాడే చేయిస్తున్నాడు కారణం సాతాను, వాడి దూతలను దేవుడు పరమునుండి వెళ్ళగొట్టారు కాబట్టి తనచేతితో దేవుడు చేసుకున్న నరులను పాడుచేసి దేవున్ని భాధపెట్టాలని వాడి ప్లాన్! అందుకే వాడి అనుచరురులైన దూతలతో చెప్పి మనుషులతో పాపం చేసి దేవునికి వ్యతిరేక మైన జనాలను సృష్టించాడు. వారే రెఫీయిలు అంటారు కొంతమంది బైబిల్ పండితులు. ఇంకా ఆ దూతలు జంతువులతో పాపం చేసి పెద్ద పెద్ద జంతువులను సృష్టించాడు అంటారు. ఆ జంతువులే డైనోసార్లు, రైనోసార్, డ్రాగన్లు అని అభిప్రాయ పడతారు. ఇలా అటువైపు మానవుల ద్వారా, ఇటువైపు జంతువుల ద్వారా అక్రమాలు అన్యాయాలను జరిగించి సృష్టిని కలుషితం చేసింది కాబట్టి దేవుడు నోవహుగారి కాలంలో మనుషులతో పాటుగా జంతువుల ను కూడా నాశనం చెయ్యాల్సి వచ్చింది. ఇంతకన్నా ఆ గ్రంథం లో వ్రాయబడింది మనకు అనవసరం. I just want to stop where the Bible stops. పరిస్థితులు కొద్దిగా అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ విషయాలు ఉదాహరించడం జరిగింది.

కాబట్టి ఇలాంటి పాపభూయిష్టమైన రోజులలో ఒకవ్యక్తి దేవునికోసం రోషంగా నిలబడి, మీరు చేస్తున్నవాటికోసం పశ్చాత్తాప పడండి. లేదంటే దేవుని తీర్పు వస్తుంది అని చెప్పడం మొదలుపెట్టారు. అంతేకాకుండా హనోకు గ్రంథం ప్రకారం ప్రళయం వచ్చి సమస్త సృష్టి నాశనము అయిపోతుంది అని ముందుగానే చెప్పారట హనోకు గారు. కాబట్టి చాలామంది అంటారు దేవుడు చెప్పినట్లు చెయ్యాలంటే భార్యా బిడ్డలను వదిలేసి అరణ్యం లో తపస్సు చేసుకోవాలి అని. అది చాలా తప్పు! హనోకు గారు దేవునితో నడుస్తూనే, భార్యతో కాపురం చేశారు. పిల్లలను కన్నారు. కాబట్టి పెళ్ళి, సంసారం దేవుని భక్తి కి, ముక్తికి ఆటంకం కానే కావు. నీవు నిజంగా దేవునికి భయపడి జీవిస్తే, దేవుని వారసుడవౌతావు. దేవునికి ఇష్టుడుగా జీవిస్తావు.

అట్టి భక్తి పరిశుధ్ధత దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!





హనోకు: దేవునికిష్టుడైనవాడు

*రెండవ భాగం*

ఆదికాండము 5:22--24
22. హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తె లను కనెను.
23. హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.
24. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.

ప్రియ దైవజనమా! పై వచనాలలో మనకు మూడు ప్రాముఖ్యమైన విషయాలు కనబడతాయి.
1) దేవునితో నడవడం
2) కుమారులను కుమార్తెలను కనడం
3) దేవుడు ప్రాణాంతోనే పరముకు తీసుకుని పోవడం!

మొదటగా కుమారులను కుమార్తె లను కనడం కోసం కొద్దిగా ఆలోచన చేద్దాం! దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తె లను కనడం చాలా గొప్ప విషయం! మామూలుగా చదువుకుంటూ పోతే అంతగా అర్థం కాదు మనకు. ఆ రోజుల్లో మనిషి సగటు ఆయుష్షు సుమారు 920 సంవత్సరాలు. సుమారుగా 30-50 సంవత్సరాలకు పిల్లలను కనడం ప్రారంభించేవారు. ఈ వయసులో మొదలుపెట్టి చనిపోయేవరకు పిల్లలను కంటూ ఉండేవారు కారణం ఆ రోజుల్లో ఇప్పటిలా కు.ని, వేసక్టమీ ఆపరేషన్ లు లేవు కదా! కాబట్టి సంతానోత్పత్తి జరుగుతూనే ఉండేది. ఇప్పుడు ఆలోచించండి ఒక మనిషి సుమారు యాబై సంవత్సరాల వయస్సులో పిల్లలు కనడం ప్రారంభించి సుమారు 800 సంవత్సరాలు పిల్లలు కంటే ఎంతమంది పుట్టి ఉంటారు!! పది సంవత్సరాల కు ఇద్దరి చొప్పున చూసుకున్నా ఒక వ్యక్తి ఒక భార్య ద్వారా సుమారుగా 100 మందిని కని ఉంటాడు. ఆ రోజుల్లో బహుభార్యాత్వం ఉండేది కాబట్టి ఎంతమంది పుట్టేవారో మనకు తెలియదు. ఈ విషయం చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఆదికాండం అయిదో అధ్యాయం ప్రకారం ఆదాము గారికి కేవలం కయీను, హేబెలు, షేతు మాత్రమే పుట్టలేదు, ఇంకా చాలామంది పుట్టారు. అలాగే ఇతరులకు కూడా చాలామంది పుట్టారు. కాబట్టి కుమారులను కుమార్తెలను కనడం అనగా ఉదాహరించిన వారేకాకుండా ఇంకా అనేకమంది పుట్టారు అని అర్థం.

2) *దేవునితో నడచుట*:
దేవునితో నడవడం అంటే ఏమిటి? దేవునితో సహవాసం చెయ్యడం అని అర్థం. కొన్ని తర్జుమాలలో ఇలాగే వ్రాయబడింది
22 మెతూషెల జన్మించిన తరువాత హనోకు మూడు వందల ఏళ్ళు దేవుని సహవాసంలో నడిచాడు• . అతనికింకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు.
23 హనోకు జీవించిన కాలం మూడు వందల అరవై అయిదేళ్ళు.
24 హనోకు దేవుని సహవాసంలో నడిచిన తరువాత దేవుడు అతణ్ణి తీసుకుపోయాడు, గనుక అతడు లేకుండా పోయాడు.

ఇలా దేవునితో సహవాసం చెయ్యడం నిజంగా ఎంతో భాగ్యం. ఇలాంటి అవకాశం కొద్దిమందికే కలిగింది. అలా దేవునితో సహవాసం చెయ్యడానికి వారు చాలా మూల్యం చెళ్ళించారు. మామూలు మనుషులు ప్రవర్తించినట్లు ప్రవర్తించక దేవునికి ఎలాంటి ప్రవర్తన ఇష్టమైనదో అలాగే వారి ప్రవర్తనను మార్చుకున్నారు. దేవునికి ఆయాసకరమైన విషయాలు వారికిష్టమైన సరే, దేవునికి ఇష్టం లేదు కాబట్టి వాటిని పరిత్యజించి దేవునికి సాక్షులై నిలిచారు. వారిలో ఘనుడు మన హనోకు గారు. హనోకు గారు మిగిలిన ప్రజలు చేస్తున్న చెడుతనం చూసి ఓర్చుకోలేక పోయేవారు. హనోకు గ్రంథం ప్రకారం అందుకే ఒక పాఠశాల ప్రారంభించి ప్రజలకు దేవుని ఇష్టయిష్టాలు చెప్పేవారు. గమనించాలి ఆ రోజుల్లో ధర్మశాస్త్ర లేదు, రాజు లేడు. ప్రజలు ఎవరికి నచ్చినట్లు వారు జీవించేవారు. దేవుని భయము లేదు పెద్దల భయము ఇంకా లేదు. అలాంటి రోజుల్లో ఈ వ్యక్తి దేవున్ని నిండుమనస్సుతో వెదికారు. అలాంటి వ్యక్తి ఎవరు, ఎప్పుడు దొరుకుతాడు అని దేవుడు ఎదురు చూస్తున్న సమయంలో హనోకు గారు నేనున్నాను అని దేవునితో సహవాసం చెయ్యడం మొదలుపెట్టారు. ఆదికాండం మూడవ అధ్యాయం ప్రకారం దేవుడు చల్లటి పూట ఆదాము తో కలిసి నడిచేవారు. బహుశా ఇప్పుడు తనకిష్టమైన రీతిలో నడిచే వ్యక్తి దొరికాడు గనుక ఆదాముతో ఆగిపోయిన సాయంత్రపు నడక హనోకు గారితో మరలా మొదలైంది. ఇలా నడిచేటప్పుడు దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నారు హనోకు గారు. దేవుని హృదయంతో హనోకు గారి హృదయం ఐక్యమైపోయింది. Synchronize అయిపోయింది. దేవుడు తన దగ్గర ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉండేవారు, దేవుడు తన దగ్గర Physical గా లేనప్పుడు పరలోకములో ఉన్నపుడు కూడా దేవునితోనే మాట్లాడుతూ ఉండేవారు. అందుకే దేవుడు అతనిని ఎక్కువగా ప్రేమించాడు. హనోకు దేవునికి ఇష్టుడైపోయాడు. ఇక కొంచెం సమయం విరామం కూడా దేవుడు భరించలేక బహుశా నా కొడుకా! ఇక్కడ ఉండకు, నాతోపాటూ వచ్చెయ్ అని తనతో ప్రాణము ఉండగానే తీసుకుని పోయారు. ఎంత ధన్యకరమైన జీవితమో కదా నిజంగా ఆయనది.

ఇలా దేవునితో నడచిన వారు అనగా దేవునితో సహవాసం చేసిన వారు చాలామంది ఉన్నారు వారిలో కొందరిని మాత్రమే ధ్యానం చేసుకుందాం. హనోకు నడచిన బాటలో తన కుమారుడు మెతూషెల నడిచాడు. ఈ విషయం హనోకు గ్రంథంలో ఉంది. అదే భక్తి మెతూషెల మనుమడు నోవహు గారికి వచ్చింది. దీనిని బైబిల్ చెబుతుంది ఆదికాండం 6:9; నోవహు గారు ఆ భక్తి ని పిల్లలకు నేర్పిన అంతగా నేర్చు కోలేదు కానీ హనోకు, యాషారు గ్రంథాలు ప్రకారం అబ్రాహాం గారు నేర్చుకున్నారు ఆ భక్తిని. అబ్రాహాము గారి 53వ సంవత్సరంలో నోవహు గారు చనిపోయారు ఆదికాండం 11; కాబట్టి ఆ నేర్చుకున్న భక్తితో అబ్రాహాము గారు దేవునితో సహవాసం చేశారు. ఆ భక్తిని ఇస్సాకు గారు నేర్చుకున్నారు. (ఆదికాండము 24: 40
అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు);
అదే సహవాసం యాకోబు గారు చేశారు (ఆదికాండము 48: 15
అతడు యోసేపును దీవించినా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,)
ఇక ఏలీయా గారు, ఎలీషా గారు అదేచేశారు. 1రాజులు 17:1; 18:15; 2రాజులు 3:14; 5:16;

ఒక విషయం చెప్పనీయండి ఆమోసు 3:3 ప్రకారం ఒక వ్యక్తి దేవునితో సహవాసం చెయ్యాలి అంటే దేవునితో సమ్మతి పడాలి. దేవుడు చెప్పిందే చెయ్యాలి. అప్పుడే ఇద్దరూ కలిసి ప్రయాణం చేయొచ్చు. కాబట్టి మనిషి ముందుగా దేవుడు చెప్పింది మాత్రమే చేయడం నేర్చుకోవాలి. అప్పుడే దేవునితో సహవాసం చెయ్యగలడు.

ఇంతకీ దేవుడు మనిషి నుండి ఏం కోరుకుంటున్నారు? ఏం ఆశిస్తున్నారు? ఒకసారి మీకా 6:6-8 చూద్దాం
6. ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా?
7. వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా?
8. మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.

దేవుడు కోరుకొనేది నీ ఆస్తి, అంతస్తు, బంగారం, బలి అర్పణలు, నీ ప్రాణం కాదు. నీ హృదయం కావాలి. నీవు ఆయన మాట వినడం కావాలి, విని న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు కావాలి. ఇంతే!

ప్రియ సహోదరి/ సహోదరుడా! దేవునితో నడవాలని ఉందా!? అయితే ముందుగా ఆయనతో సమాధానపడు! ఆయన ఏం చెప్పారో అది మాత్రమే చేయడానికి ప్రయత్నించు. ఆయన నరులను చేసింది నరులతో సహవాసం చెయ్యడానికి మాత్రమే! కాబట్టి ఆయనకు లోబడి, ఆయనకు ఇష్టమైనది చేయడం నేడే ప్రారంబించు! అయనకు ఆయాసకరమైనది నీలో ఏమైనా ఉంటే ఇప్పుడే వాటిని వదిలెయ్! ఆయన పాదాల దగ్గరకు, సిలువ వద్దకు రా! ఆయన నిన్ను చేర్చుకోడానికి సిద్దంగా ఉన్నారు. ఆయన నీతో కూడా సహవాసం చేయడానికి, నీతో నడవడానికి ఇష్టపడుతున్నారు. మరి నీవు సిధ్దమా?
ఆ రీతిగా దేవుడు మనదరినీ నడిపించును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!



హనోకు: దేవునికిష్టుడైనవాడు

*మూడవ భాగం*
*దేవునికి ఇష్టుడుగా జీవించడం ఎలా?-1*

హెబ్రీయులకు 11: 5
విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.

ప్రియ దైవజనమా! హనోకు గారు దేవునికి ఇష్టుడుగా జీవించినట్లు ధ్యానం చేసుకున్నాము. అయితే దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే ఏమేమి లక్షణాలు కలిగి ఉండాలి? అనేది ధ్యానం చేసుకుందాం.

దేవునికి ఇష్టుడుగా జీవించడానికి ఏం చెయ్యాలి? పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. తర్వాత వచనంలో ఉంది
హెబ్రీయులకు 11: 6
*విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా*.
పై వచనాలు ప్రకారం దేవునికి ఇష్టుడుగా జీవించడానికి ఏం చెయ్యాలంటే మొట్టమొదటి లక్షణం: విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము అని చెబుతుంది బైబిల్! అవును ముందుగా దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం లేకుండా ఆయనను నమ్మలేము. నమ్మకం ద్వారా ఆయన మీద ఆధారపడటం నేర్చుకోగలం. అదే విశ్వాసానికి నాంది! దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి. లేకపోతే నీ విశ్వాసం, భక్తి వ్యర్ధము.
ప్రియ విశ్వాసి! నీవు కూడా ఆయన ఉన్నాడని, ఆయనే నిజమైన దేవుడని, నీకోసం నాకోసం ప్రాణం పెట్టాడని, నిన్ను నన్ను తిరిగి వచ్చి తనతోపాటు తీసుకుని పోతాడు అని నమ్మాలి. ఆ నమ్మకం లేకుండా నిజానికి ఆయనే దేవుడా? లేక ఆయన దేవుల్లలో ఒకరా? తీరా యేసుక్రీస్తు ప్రభులవారిని నమ్ముకుని వెంబడిస్తున్న తరువాత నిజంగా ఆయన దేవుడు కాకపోతే ఇప్పుడు ఎలా! ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు అనుమానాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఆయనను పరిపూర్ణంగా నమ్మాలి. పూర్తిగా లోబడాలి. ఆయన చెప్పినట్లు చేయాలి. ఆయన ఇష్టాలు నీ ఇష్టాలు గా మారిపోవాలి. ఆయనకు ఆయాసకరమైనవి నీకు వెక్కసమవ్వాలి. అప్పుడు నీవు దేవునికి ఇష్టుడుగా జీవించగలవు! హనోకు గారు అదే చేశారు.

దేవునికి అసహ్యకరమైనది విగ్రహారాధన! గతంలో చెప్పినట్లు అబ్రాహాము గారు విగ్రహారాధికుడు కాదు గాని ఆయన తండ్రి తెరహు, తమ్ములు నాహోరు, హారానులు, చెళ్ళెలు శారాయి విగ్రహారాధికులు. తన పూర్వికుడు నోవహు గారి దగ్గర పెరిగి, భక్తి నేర్చుకున్నారు కాబట్టి దేవునికి విగ్రహారాధన ఇష్టం లేదు అని తెలుసుకుని, తండ్రి ని ఎదిరించి విగ్రహారాధన మానేశారు చరిత్ర ప్రకారం, యాషారు గ్రంథం ప్రకారం! దానికోసం మరణపుటంచుల వరకూ వెళ్లారు ఎన్నో సార్లు! కారణం అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆదికాండం 15:6; రోమా 4:3; గలతీ 3:6; ఇంకా ఆయనకు పిల్లలు లేనప్పుడు దేవుడు తమకు సంతానం ఇస్తారు అని గట్టిగా విశ్వసించారు. ఎటువంటి పరిస్థితులలో? నిరీక్షణ కు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి జీవించారు. రోమా 4:18; అంతేకాకుండా వాగ్ధానం పొందిన తరువాత వాగ్ధానం చేసిన వాడు దానిని నెరవేర్చడానికి శక్తి గలవాడు అని, నిరీక్షణ కలిగి నమ్మారు కాబట్టి విశ్వాసవీరుడయ్యారు, 4:21; విశ్వాసులందరికీ తండ్రి అని పిలువబడ్డారు. అదీ విశ్వాసం! అదే విశ్వాసం ఇస్సాకుని బ్రతికించింది. అందుకే అబ్రాహాము గారు దేవునికి స్నేహితుడు అయ్యారు. (యాకోబు 2:23); దేవునితో నడిచారు. అదే విశ్వాసం మోషే గారు కలిగి, దేవునితో ముఖాముఖి గా మాట్లాడేవారు. దేవునితో సహవాసం లేకుండా ఇలా దేవునితో మాట్లాడలేరు. ఇందుకోసం వీరంతా తమ అలవాట్లు మార్చుకున్నారు. దేవునికి ఇష్టమైన రీతిలో తమ ప్రవర్తన కాచుకొన్నారు. విశ్వాస వీరులయ్యారు.

హనోకు గారు కూడా అలా చేయడం ద్వారా దేవునికి ఇష్టుడుగా మారిపోయారు. మొదటి భాగంలో వివరించిన విధంగా లోకులంతా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే, హనోకు గారు నొచ్చుకుని తను దేవునికి ఇష్టుడుగా జీవిస్తూ, తన సంతానం కూడా అదేబాటలో నడిచేలా చేశారు. అందుకే మరణాన్ని రుచిచూడకుండా పరమునకు వెళ్ళిపోయారు. ఆదికాండం 5:22-24 లో స్పష్టంగా రాయలేదు కాని ఇక్కడ ఈ వచనం లో మరణాన్ని చూడకుండా కొనిపోబడెను అని వ్రాయబడింది. అయితే ఈరెండు వచనాలు ఆధారంగా బైబిల్ పండితులు అభిప్రాయ పడేది ఏమిటంటే బహుశా దేవుడు హనోకు గారికి నిన్ను తనతోపాటు తీసుకుని పోతాను అని వాగ్ధానం చేసి ఉంటారు, ఆ వాగ్దానాన్ని హనోకు గారు నమ్మారు. అందుకే దేవుడు తనతోపాటు తీసుకుని పోయారు అంటారు. ఏదిఏమైనా దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే మొట్టమొదటి గా దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అనగా . హెబ్రీయులకు 11: 1
విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.

హనోకు గారికి ఆ విశ్వాసం ఉంది అందుకే విశ్వాసవీరుల పట్టీలో రెండవ పేరుగా ఉన్నారు. మరి నీవు ఆ వరుసలో ఉండగలవా? విశ్వాసం కలిగి ఉండగలవా? శ్రమలొచ్చినా, భాధలొచ్చినా, హింసలొచ్చినా చివరకు మరణమొచ్చినా షడ్రక్, మేషాకు అబేద్నెగో వలె సాక్షిగా జీవించగలవా? నీ విశ్వాసాన్ని వదులుతావా లేక చస్తావా అని అడిగితే చావడానికే సిద్దపడతావా లేక భయపడి విశ్వాసాన్ని వదులుకుంటావా? క్షణికమైన కోరికలు కోసం, ఉద్యోగం కోసం, రేషన్ కార్డు కోసం, డబ్బు పేరు సమాజం కోసం నీ విశ్వాసాన్ని, నీ రక్షణను తాకట్టు పెట్టేస్తావా లేక వాటికోసం (విశ్వాసం) నీ ప్రాణాన్ని వదులుతావా? ఏదికావాలో నిర్ణయించుకో!!
విశ్వాసం, దేవుడు మాత్రమే కావాలి అని శ్రమలకు ఓర్చుకుని క్రీస్తు కోసం జీవిస్తే, ఆయనకు ఇష్టుడుగా జీవించడం మాత్రమే కాకుండా భళా నమ్మకమైన మంచిదాసుడా అని పిలిపించుకుని జీవ కిరీటం, వాడబారని మహిమ కిరీటం, పొందుకోగలవు!
ఆమెన్!
దైవాశీస్సులు!



హనోకు: దేవునికిష్టుడైనవాడు

*నాల్గవ భాగం*
*దేవునికి ఇష్టుడుగా జీవించడం ఎలా?-2*

హెబ్రీయులకు 11: 5
విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు

ప్రియ దైవజనమా! గతభాగంలో దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి అని ధ్యానం చేసుకున్నాము. ఈ రోజు మరికొన్ని చూసుకుందాం. మామూలుగా మానవ సంభందాలు నుండి కొన్ని లక్షణాలు అలోచిద్దాం.

ఒక తండ్రి లేదా తల్లి తన కుమారులు/ కుమార్తెలలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు?
జవాబు సింపుల్! ఎవరైతే వారి మాటలు వింటారో లేదా వారి మాటలకు లోబడి ప్రవర్తిస్తారో వారినే ఎక్కువగా ప్రేమిస్తారు, ఇష్టపడతారు. మాట విననివారికి కూడా వారి అవసరాలను తల్లిదండ్రులు గా తీరుస్తారు గాని వారిని ఎక్కువగా ప్రేమించరు. ఇష్టపడరు. ఈలోక తల్లిదండ్రులు అలా ఉన్నప్పుడు మన పరమ తండ్రి కూడా మన నుండి అదే రకమైన ప్రేమాభిమానాలు అనగా దేవుని మాటకు లోబడుతున్నామా లేదా అని ఆలోచిస్తారు. కొందరు అతి తెలివి గలవారు అనొచ్చు దేవుని దృష్టిలో మానవులంతా సమానమే కదా, దేవుని మాట వినకపోతే ప్రేమించరా అని! గమనించాల్సిన విషయం ఏమిటంటే నీవు రక్షణ పొందనంతవరకు నీవు ఎలాంటి వాడవైనా దేవుడు నిన్ను ప్రేమించి, నీకు తన రక్షణ భాగ్యం దయచేస్తారు. ఒకసారి నీవు రక్షించబడిన తరువాత నీవు ఆయన రాజ్య పౌరుడవు మరియు వారసుడవు! ఒక పౌరుడికి / వారసుడికి హక్కులతో పాటుగా విధులు కూడా ఉంటాయి. వాటిని పాటించాలి. కాబట్టి నీవు రక్షణ పొందిన తరువాత తప్పకుండా ఆయన మాటకు విధేయత చూపించాలి. ఆయనకు లోబడాలి. ఇవీ దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే ఉండవలసిన తరువాత ముఖ్య లక్షణాలు. విధేయత! లోబడుట!

అలా చేసిన వారినే బైబిల్ లో దేవుడు చాలా ఎలా ప్రేమించారు, ఇష్టపడ్డారు. వారిలో కొద్దిమందిని జ్ఞాపకం చేసుకుందాం! నీ తండ్రి ఇంటినుండియు, నీ స్వజనుల యొద్దనుండియు లేచి నేను చూపించబోయే దేశానికి వెళ్లు అన్నారు దేవుడు అబ్రాహాము గారితో! ఆదికాండం 12:1; అబ్రాహాము గారు ఆ మాటకు లోబడి అరణ్యాలు గుండా ప్రయాణమై పోయారు. ఎక్కడకు వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? అడ్రసు ఏమిటి? ఎన్ని రోజులు ఉండాలి? వెళ్తే నాకు ఏమి వస్తుంది ఇలాంటి సంగతులు ఆయన అసలు అడగనే లేదు. మూటముళ్ళు సర్దుకుని చేసుకుని బయలుదేరిపోయారు. అదీ విధేయత? విధేయత ప్రశ్నించదు!
బహుశా భార్య శారమ్మ గారు అడిగిఉంటారు మనం ఎక్కడికి వెల్తున్నాము? అబ్రాహాము గారు అన్నారు *I Don't know, God said me to go!* *దేవుడు చూపిస్తాను నడిపిస్తాను అన్నారు, అందుకే వెల్తున్నాం.* తండ్రి అడిగాడు అదే ప్రశ్న, అదే జవాబు! కొన్ని రోజులకు ఇస్సాకు పుడితే వెళ్ళి బలి ఇచ్చెయ్యమన్నారు దేవుడు! *ఇదేమీ ప్రభువా ఇచ్చింది నీవే , మరల బలి అడుగుతావా! నీకేమైనా న్యాయంగా ఉందా? బలి ఇచ్చేస్తే నీవు ఇచ్చిన వాగ్ధానాలు ఏమవుతాయి* . . . ఇలాంటి ప్రశ్నలు అడగలేదు. *Yes Sir అన్నారు*. బలి అర్పింపడానికి వెళ్ళి పోయారు. అదీ విధేయత అంటే. God wants complete obedience, in all things. కొన్నింటికి లోబడి కొన్నింటికి లోబడకపోవడం కాదు. అన్ని విషయాలలో ఆయనకు లోబడాలి. అన్ని విషయాలలో ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అప్పుడు అలాంటి వ్యక్తిని ఉపయోగించుకుని దేవుడు అసాధారణమైన అద్భుతాలు చేస్తారు.

ఇక్కడ మోషేగారికి అబ్రాహాము గారికి తేడా ఒకసారి ఆలోచిద్దాం! దేవుడు అబ్రాహాము గారిని నేను చూపించే దేశానికి వెళ్ళమంటే అడ్డు చెప్పకుండా వెంటనే వెళ్ళి పోయారు. అదే దేవుడు మోషే నీవు ఐగుప్తు దేశం వెళ్ళమని చెబితే నేను నత్తివాడిని, మాట్లాడటం రాదు ఇలాంటి సాకులు ఎన్నో చెప్పారు. తరువాత లోబడి వెళ్ళారు గాని మొదట్లో తటపాయించారు. నిర్గమ 1-3; అది దేవునికి కోపం తెప్పించింది. మరోసారి బండతో మాట్లాడు అని చెబితే, ప్రజలు తనకు పెట్టే టార్చర్ భరించలేక బండను కొట్టారు. సంఖ్యా 20:11; మాటకు సంపూర్తిగా లోబడలేదు. తద్వారా వాగ్ధాన దేశంలో అడుగుపెట్ట లేకపోయారు. అబ్రాహాము గారు లోబడి ఆ వాగ్ధానాలు పొందు కున్నారు అంతేకాకుండా ఈ భూలోకంలో ఉన్న ప్రతీ జనాంగము ఆయన ద్వారా ఆశీర్వదించబడింది. ఆదికాండం 18:18; అదే అబ్రాహాము గారు విశ్వసించిన మనందరకి తండ్రి అయ్యారు. అంత ధన్యత అబ్రాహాము గారికి ఎలా వచ్చింది? కేవలం విధేయత, లోబడుట వలన!

ఇక్కడ హనోకు గారు దేవుడు చెప్పిన మాటలకు విధేయత చూపించారు. అందుకే దేవునికి ఇష్టుడుగా మారారు. అబ్రాహాము గారు విధేయత చూపి ఇష్టుడుగా మారారు. బైబిల్ గ్రంథం లో ఎంతో మంది దేవుని మాటలకు విధేయత చూపించారు. ఆశీర్వాదాలు పొందుకున్నారు.

ఆదాముహవ్వలు విధేయత చూపించలేదు. వద్దు అన్న పనిచేశారు. మనందరికీ శాపాన్ని కొనితెచ్చారు. లోతు భార్య విధేయత చూపలేదు. ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే విధేయత చూపించాలి. లోబడాలి. కొన్నింటిలో కాదు. అన్నింటిలోనూ. అప్పుడు నీవు దేవునికి ఇష్టుడుగా మారతావు. అలా ఇష్టుడుగా జీవిస్తే, హనోకుని దీవించిన దేవుడు, అబ్రాహాము గారిని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తారు. నిన్ను కూడా వాడుకుంటారు. మరి నీవు సిద్దమా?
దైవాశీస్సులు!



హనోకు: దేవునికిష్టుడైనవాడు

*ఐదవ భాగం*
*దేవునికి ఇష్టుడుగా జీవించడం ఎలా?-3*

హెబ్రీయులకు 11: 5
విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.

ప్రియులారా ఇంతవరకు మనం దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే మొదటగా విశ్వాసం కలిగి ఉండాలి, తర్వాత విధేయత చూపించాలి అని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరికొన్ని చూసుకుందాం.

మరల మనం మానవ సంభందాల నుండే అలోచిద్దాం. చిన్న పిల్లలు చిన్నచిన్న మాటలు, క్రొత్తగా నేర్చుకున్న మాటలు మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు మురిసిపోతుంటారు కదా! అలాగే మన పరమ తండ్రికి మనము చిన్నపిల్లల లాంటి వారము. దేవుడు మనము మాట్లాడే చిన్న చిన్న మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు. మన నుండి వినాలని ఆశిస్తున్నారు. అయితే ఆమాటలు దేవునికి ప్రీతికరంగా ఉన్నాయా లేదా!! మన మాటలు దేవున్ని సంతోషపెడుతున్నాయా లేక దుఃఖ పెడుతున్నాయా!!
మోషే గారు పెద్ద ప్రవక్త, భూమిమీద నున్నవారిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుని చేతనే పొగడబడిన వాడు. సంఖ్యా 12:3; కాని ప్రజలమాటలు భరించలేక కానిమాట పలికారు. ద్రోహులారా అన్నారు. 20:10; అంతే, వాగ్ధాన దేశం చేరలేక పోయారు. దేవునికి ఇష్టుడు, పిలువబడిన వాడు, ఏర్పాటు చేయబడిన వాడు, నమ్మకమైన వాడు, ఎన్నో అసాధారణ అద్భుతాలు చేసిన వాడే గాని చిన్న మాట వలన వాగ్ధానదేశాన్ని పోగొట్టుకున్నాడు. అంత గొప్ప వ్యక్తే పొందుకోలేకపోతే నీవునేను ఎంత?!! కాబట్టి మనమాటలు కాచుకోవలసిన అవసరం ఉంది అప్పుడే దేవునికి ఇష్టులుగా జీవించగలము.

మనమాటలు ఎలా ఉండాలో బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది.

1. మృదువుగా ఉండాలి:
మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును." సామెతలు 15:1

2) ఉప్పు వేసినట్లు ఉండాలి కొలస్సీ 4:6

3. కృపాసహితంగా ఉండాలి:
ఉప్పు రుచిని కలిగిస్తుంది. అట్లానే మన మాటలు కూడా రుచికరంగా వుండాలి. ఉప్పు తక్కువైనా రుచించక పోవచ్చు. ఎక్కువైనా తినడానికి పనికి రాకుండా పోవచ్చు. మన మాటలు సమపాళ్ళలో ఉంటూ దేవుని కృపను గురించి మాత్రమే ఎక్కువ ప్రస్తావించే విధంగా వుండాలి.

"ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి." కొలస్సి 4:6

4) . క్షేమకరంగా ఉండాలి:
వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి."
ఎఫెసి 4:29

5) కృతజ్ఞతతో కూడినవై ఉండాలి:
బూతులుగాని, డబుల్ మీనింగ్ డైలాగ్స్ గాని, అపార్ధమునకు తావిచ్చే మాటలుగాని, పాపమునకు ప్రేరేపించే మాటలుగాని మనము మాట్లాడడానికి వీల్లేదు. కృతజ్ఞతతో నిండిన మాటలై ఉండాలి. అట్టి మాటలు హృదయ పూర్వకమైనవి కాబట్టి, ఎటువంటి అపార్ధాలకు తావిచ్చే అవకాశం ఉండదు.

"కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు." ఎఫెసి 5:4

6) ఆలోచించి మాట్లాడేవిగా ఉండాలి:
మాటలాడుటకు నిదానించువాడునై యుండవలెను." యాకోబు 1:19
7) కొద్దిగా ఉండాలి:
"దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను." ప్రసంగి 5:2

దేవుని పిల్లలముగా మనమాటలు ఎట్లా వున్నాయి? మనలను తృణీకరింపచేసేవిగా ఉన్నాయా? దేవునికి ఇష్టుడుగా చేసేవిగా ఉన్నాయా లేక కోపం తెచ్చేలా ఉన్నయా? ఒకసారి అలోచిద్దాం! సరిచేసుకొందాం!

దేవుడు ప్రతీరోజు పరమును విడిచి హనోకు గారితో మాట్లాడటానికి వచ్చేవారంటే హనోకు గారి మాటలు ఎంత మృదువుగా, దేవునికి అనుకూల మైనవిగా ఉండేవో కదా!
అట్టి విధంగా మనలను మలచుకొందాం!
ఆయన స్నేహానికి, ప్రేమకు పాత్రులమవుదాం!
దైవాశీస్సులు!



హనోకు: దేవునికిష్టుడైనవాడు

*6వ భాగం*
*దేవునికి ఇష్టుడుగా జీవించడం ఎలా?-4*

హెబ్రీయులకు 11: 5
విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.

ప్రియులారా ఇంతవరకు మనం దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే మొదటగా విశ్వాసం కలిగి ఉండాలి, తర్వాత విధేయత చూపించాలి, మన మాటలు దేవునికి మహిమకరంగా ఉండాలి అని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరికొన్ని చూసుకుందాం.

మరలా మానవ సంభందాల నుండే చూసుకుందాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదయినా కొనిచ్చి వారు తింటున్నప్పుడు నాకు పెట్టవా అని అడుగుతారు. అది తినాలని వారి కోరిక కాదు. పిల్లల గుణం తెలుసుకోవాలి అని, ఆ కొద్దిలోనే కొద్దిగా పెడితే తిని మురిసిపోతారు. ఇది మానవనైజం. కష్టపడి డబ్బులు సంపాదించి, కొని తెచ్చేది తల్లిదండ్రులు, అయినా పిల్లల నుండి కొద్దిగా ఆశిస్తారు అది వారి ప్రేమకు గుర్తుగా!
ఈ తల్లిదండ్రులు ఇలా ఉంటే పరమతండ్రి కూడా నీకు సమస్తము ఇచ్చి, మంచి ఆరోగ్యం, చేసుకోవడానికి పని, ఉద్యోగం, ఇల్లు, మంచి గాలి, నీరు సమస్తము ఇచ్చి, నీ నుండి మొదటగా స్తుతులు తరువాత ప్రార్థన ఆ తర్వాత దశమ భాగం, అర్పణలు కోరుతున్నారు.
(లేవీయకాండము 27: 30
భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును). అవి అన్నీ ఇచ్చింది దేవుడే. కానీ నీనుండి ఇవి కోరుకుంటారు. నీకు ఇచ్చిన దానితో పోల్చినప్పుడు దేవుడు అడిగేది చాలా చాలా తక్కువ! గాని నీ గుణాలను తెలుసుకోవడానికి, పరీక్షించడానికి దేవుడు అవి కోరుకుంటున్నారు.

ఒక ఉదాహరణ చెప్పనీయండి గతసారి నేను షిప్ నుండి ఇంటికి సెలవులకు వచ్చినప్పుడు నా పెద్ద కుమారుడు జార్జ్ విట్ ఫీల్డ్ (10 సం.లు), నాకు ఒక T-shirt ఇచ్చాడు. ఇది ఏమిట్రా అంటే నా భార్య చెప్పింది- డాడీ నాకోసం అన్ని కొంటున్నారు కదా, అందుకే నేను దాచుకున్న డబ్బులతో డాడీ రాబోయేసరికి ఒక T-shirt కొంటాను అని చెప్పి, నా భార్యను షాపుకి తీసుకుని వెళ్ళి కొన్నాడు. నిజానికి నాకు వాడు కొనాల్సిన అవసరం లేదు. నేను ఆశించడం లేదు కూడా. గాని వాడు నాకు అది ఇచ్చినప్పుడు నా మనసు భావాలు వర్ణనాతీతం. నాకోసం వాడు ఆలోచిస్తున్నాడు అనే ఆలోచన ఎంతో తృప్తి నిచ్చింది. ఈ చిన్నదానికే నేను ఇంతగా ఫీల్ అవుతుంటే నిన్ను నన్ను సృష్టించిన దేవునికి మన ధనము, మన స్తుతులు, మన ప్రార్థన ముఖ్యంగా మన సమయం దేవునికి ఇస్తే ఎంత పొంగిపోతారు దేవుడు!!
కాబట్టి దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే నీ ధనంతో పాటు నీ సమయం దేవునికి ఇవ్వాలి!

ప్రియ స్నేహితులారా! మీ ముసలి తల్లిదండ్రులు మీనుండి ఈ వయసులో ఏం కోరుకుంటారో తెలుసా! మీ ధనము ఎంత మాత్రము కాదు. మీ సమయాన్ని కోరుకుంటారు. మీరు వారితో రోజుకు కనీసం ఒక అరగంట వారి ప్రక్కన కూర్చుని కబుర్లు చెబితే ఎంతో పొంగిపోతారు. నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నా కొడుకు కోడలు అని అనుకుంటారు. మీరు అలా చేస్తున్నారా?! దేవుడు కూడా అదే కోరుకుంటున్నారు. ప్రతీరోజు నీతో మాట్లాడాలి అని, నీవు చెప్పేది వినాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆకాశం సింహాసనం, భూమి పాదపీఠంగా చేసుకున్న దేవాదిదేవుడు (యెషయా 66:1), ఎందుకు కొరగాని నీవు నేను ప్రార్థన చేయాలని మోకరిస్తే, ఇంతగొప్ప దేవుడు పరమును వదలి, నీ ముందుకు వచ్చి నీ ప్రార్థన వినాలని వచ్చేస్తారు. నీవంటే అంత పిచ్చి ప్రేమ ఆయనకు. మరి నీ సమయం దేవునికి ఇస్తున్నావా?!! రోజుకు ఎంత సమయం దేవునికి కేటాయిస్తున్నావు? ఎంత సమయం ప్రార్ధిస్తున్నావు! ఎంతసేపు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నావు? దేవుని సమయాన్ని దేవునికి ఇస్తున్నావా లేదా?

దేవుడు చల్లనిపూట ఆదాము హవ్వలతో మాట్లాడటానికి ప్రతీరోజూ ఏదెను తోటకు వచ్చేవారు. (ఆదికాండం 3:8) అలాగే దేవుడు హనోకు గారితో ముచ్చటించడానికి ప్రతీరోజు హనోకు దగ్గరకు వచ్చేవారు. అప్పుడు వీరు అనగా ఆదాము అవ్వలు, హనోకు వారి పనులన్నీ వదిలేసి దేవునితో మాట్లాడటం మొదలుపెట్టేవారు. అదీ దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. మరి నీవు అలా చేస్తున్నావా? నీ పనులు నీకు ఎంత ముఖ్యమో అలాగే నీ అంతరంగ పురుషుడు కి దేవునితో ముచ్చటించడం అంతే అవసరం! కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికే ఇవ్వు. ఆ సమయం నీ మొబైల్ ఫోన్ కి, నీ పనికిమాలిన సీరియల్ కి, లేదా మరోదానికి ఇవ్వకు!

మరికొందరు దేవుని ధనాన్ని దొంగలిస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం, స్వేచ్చార్పణ, ప్రధమ ఫలాలు దేవునికి ఇవ్వక దొంగిలిస్తున్నారు.
మలాకీ 3:8,9,10
8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేని విషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.
9. ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునేయున్నారు, మీరు శాపగ్రస్తులైయున్నారు.
10. నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. . . . .
మరి నీవు దశమ భాగం, అర్పణలు ఇస్తున్నావా దేవునికి?

అననీయ సప్పీర మ్రొక్కుకుని సగం ఇచ్చి సగం దాచుకున్నారు. దేవుని సన్నిధిలోనే మరణించారు. అపొస్తలుల 5:1--5;

కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! దేవున్ని ప్రేమించు! లోకాన్ని కాదు. దేవుని సమయాన్ని, దేవుని ధనాన్ని దేవునికి ఇవ్వు!
దేవ దీవెనలు పొందు!

దైవాశీస్సులు!





హనోకు: దేవునికిష్టుడైనవాడు

*7వ భాగం*
*దేవునికి ఇష్టుడుగా జీవించడం ఎలా?-5*

హెబ్రీయులకు 11: 5
విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.

ప్రియులారా ఇంతవరకూ మానవ సంభందాల నుండి ముఖ్యంగా తల్లిదండ్రులు- పిల్లల మద్య అనుబందాల నుండి దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే కావలసిన లక్షణాలు ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు భార్యాభర్తలు మద్య గల అనుబంధాల నుండి చూసుకుందాం! ఒక భర్త తన భార్య తనతో నమ్మకం గా ఉండాలి అని కోరుకుంటాడు. అలాగే భార్యకూడా భర్త తనయెడల నమ్మకం గా ఉండాలి, పరస్త్రీని తాకకూడదు అని కోరుకుంటుంది.
మరికొందరు తమ భార్య/ భర్త అందంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉంటే బాగా ఇష్టపడతారు. అదేవిధంగా దేవుడు మనం తనతో నమ్మకంగా ఉండాలి అని కోరుకుంటున్నారు.

మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని బైబిల్ చెబుతుంది. హెబ్రీ 3:2,5; చూశారా ఒక వ్యక్తి కోసం దేవుడు ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తున్నారో! అలాగే ఆదికాండం లో యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఫోతీఫరు ఇంట్లో నమ్మకం గా ఉన్నట్లు చూసుకుంటాం. ఆ నమ్మకమే యోసేపును మొదటగా ఆ గృహానికి గృహనిర్వాహకుడిగా చేసింది. చెరసాలలో చెరశాల నిర్వాహకుడిగా చేసింది. చివరికి ఆ నమ్మకమే ఆ దేశానికి గవర్నర్ గా చేసింది. కాబట్టి అలాంటి నమ్మకాన్ని దేవుడు మననుండి ఆశిస్తున్నారు.

అలాగే భార్య భర్తపట్ల నమ్మకంగా ఉండాలి, ఒకవేళ భర్త ఉన్నప్పుడు ఒకలా, భర్త పనికి వెళ్ళినప్పుడు మరోకరితో చనువుగా ఉంటే సామెతలు 6: 34
భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికర పడడు.
భార్యాభర్తల సంభంధం రిజిస్టర్ మేరేజ్ మీద గాని, తాళిబొట్టులో గాని, లేక మరోదానిమీద ఆధారపడి లేదు. కేవలం నమ్మకం మీదనే ఆ బంధం నిలిచి ఉంటుంది. ఒకవేళ ఏ పరిస్థితులలో గాని నమ్మకం కోల్పోతే బంధం చీలిపోతుంది. అలాగే దేవుడు తన స్వరక్తమిచ్చి, నిన్ను విమోచించి, బాప్తిస్మము అనే ఒడంబడిక ద్వారా ప్రధానము చేసుకున్నారు. (అపొస్తలులు 20:28) ఆ భంధంలో మరొకరు రాకూడదు. ఈ పవిత్ర బంధం లో అపవిత్రమైన కార్యాలు చేస్తే దేవునికి నీకు ఉన్న బంధము, సంభందం తెగిపోతుంది. ఒక వ్యక్తి తను ప్రధానం చేసుకున్న అమ్మాయి పవిత్రంగా, ఏ రకమైన అక్రమ సంబంధం లేకుండా ఉండాలని ఆశిస్తాడు. అలాగే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కూడా ఆశిస్తున్నారు. బాప్తిస్మము అనే ప్రధానం చేసుకున్న మనము దేవునికోసమే బ్రతకాలి తప్ప లోకము మనలోనికి రాకూడదు. లోకాశలు అసలు మనలో కనబడకూడదు. శరీర కార్యాలు కనబడకూడదు. శరీర కార్యాలు అంటే:
గలతీయులకు 5:19,20,21
19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,
20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. .

ఇవి దేవుని వలన కలిగినవి కావు. అవి సాతానువి. ఒకవేళ నీలో ఈ శరీరకార్యాలు కనబడ్డాయి అంటే నీవు సాతానుతో అక్రమ సంబంధం కలిగి ఉన్నావు అని అర్థం. నీలో కోపము, క్రోధం, అసూయ, ద్వేషం, అపవిత్రత, జారత్వము, వ్యభిచారం, దూషణలు. . ఇలాంటివి కనబడితే నీవు దేవుని బిడ్డవు అనేది పేరుకే! నిజానికి నీవు సాతానుతో అక్రమ సంబంధం కలిగిఉన్నావని తెలుసుకో! దయచేసి నా భాషను క్షమించండి! నీ భార్య/ భర్త మరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు/ ఉన్నది అని తెలిస్తే నీవు కాపురం చేయలేవు కదా, మరి సాతానుతో / లోకంతో, తైతిక్కలేస్తే దేవుడు నిన్ను చేరదీస్తారా ప్రియ సహోదరి/ సహోదరుడా???!!! ఒకసారి నీవు దేవునిపట్ల నమ్మకం గా ఉన్నావా లేదా పరిశీలించుకో! దేవుని సైన్యం పిలువబడినవారు, ఏర్పాటు చేయబడిన వారు, ఇంకా ముఖ్యంగా నమ్మకమైన వారు. ప్రకటన 17:14; ఆ సైన్యం లో నీవున్నావా!?? ఈ లోకంలో తప్పుచేయని వారు లేరు. ఒకవేళ నీవు పాపంలో కొట్టిమిట్టాడు తుంటే, నీకు పాపం చేయకూడదు అనే ఆశ ఉంటే, నీవు ఎంత పాపివైవా దేవుడు క్షమిస్తారు. నీవు చేయాల్సిన పని నిజమైన పశ్చాత్తాపంతో ఆయన పాదాలను/ సిలువను సమీపించడమే! యిర్మియా 3: 1
మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతనియొద్దనుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమెయొద్దకు తిరిగిచేరునా? ఆలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా; అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నాయొద్దకు తిరిగిరమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
దేవుడు నిన్ను పిలుస్తున్నారు. ద్వారం దగ్గర నిలిచి తట్టుతున్నారు. మరి నీవు తలుపు, నీ హృదయం అనే తలుపు తీసి ఆయనను ఆహ్వానించు! ప్రకటన గ్రంథం 3: 20
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. కాబట్టి ఆయన స్వరము విని, నీ హృదయపు ద్వారములు తెరచి నేడే ఆయనను చేర్చుకో!

ఇక తర్వాత లక్షణం అందం! అందం అంటే దేవుడు నీ బాహ్య సౌందర్యాన్ని కోరడం లేదు. నీ అంతరంగంలో సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. బైబిల్ ప్రకారం పరిశుద్దుల నీతిక్రియలే ఆభరణాలు. ప్రకటన 19:8; పరిశుద్దులగు తన సంఘానికి, తన పిల్లలకు నీతి క్రియలే అందం, ఆభరణం. మరి నీకు ఆ క్రియలు ఉన్నాయా ప్రియ సహోదరి/ సహోదరుడా?! ఈ లోక అందం కాదు దేవుడు కోరేది- 1పేతురు 3: 4
సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము(అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.

. ఇలాంటి గుణాలను అందము, ఆభరణాలుగా పెట్టుకోమంటున్నారు గాని పనికిమాలిన బంగారం, వెండి, రోల్డ్ గోల్డ్, మెటల్ ఆభరణాలు కాదు. నీ అంతరంగంలో పరిశుద్దతయే నీకు అసలు సిసలైన అందం. ఆ అందం నీకుందా ? ఒకసారి పరిశీలించుకోమని మనవి చేస్తున్నాను. అప్పుడే నీవు దేవునికి ఇష్టుడుగా, ఇష్టురాలుగా ఉండగలవు!

అట్టి నమ్మకం, సౌందర్యం దేవుడు చదువరులకు దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!



హనోకు: దేవునికిష్టుడైనవాడు

*8వ భాగం*
*దేవునికి ఇష్టుడుగా జీవించడం ఎలా?-6*

హెబ్రీయులకు 11: 5
విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.

ప్రియ దైవజనమా! దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలో మానవ సంభందాల నుండి ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఆత్మీయ సంభందమైన విషయాల నుండి క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం.

మొదటగా దేవుడు పరిశుద్దుడు, మనల్ని కూడా పరిశుద్ధముగా ఉండాలి అని ఆజ్ఞాపించారు. లేవీయకాండము 11: 44,45
నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ద పరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.
నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.

అంతేకాకుండా దూతలు, కెరూబులు, సెరాపులు నిత్యము ఆయనను పరిశుద్దుడు పరిశుద్దుడు పరిశుద్దుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నారు. యెషయా 6:3; ఇంత పరిశుద్దుడైన దేవుడు, అపవిత్రులమైన మనల్ని ఎన్నుకుని, మనకోసం తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి, ఆయన సిలువ రక్తం ద్వారా మన పాపములు కడిగి, పవిత్రులుగా చేసి, తన రాజ్యవారసులుగా, తేజో వాసులైన పరిశుద్దుల స్వాస్థ్యమునకు హక్కుదారులనుగా చేసిన తరువాత, అపవిత్రమైన పనులు చేస్తే దేవునికి ఇష్టుడుగా ఉండగలవా? దేవుడు సహిస్తారా?!!

ప్రియ సహోదరి/ సహోదరుడా! దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే పరిశుద్దముగా జీవించాలి. అవును మనం పాప లోకములో పాపులమద్య నివాసం చేస్తున్నాము. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన మాటలు వింటూ చూస్తున్నాము. అయితే ఈ అపవిత్రత మనకు అంటకుండా చూసుకోవాలి. అదే భక్తి. దేవుడు మననుండి ఆశిస్తుంది అదే! యాకోబు 1:27 లో భక్తికి నిర్వచనం చెబుతూ అదే చెప్పారు.
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవాలి. ఎలా? సాధ్యమా?! సాధ్యం కాని పనులు దేవుడు ఎప్పుడూ చెప్పరు మనకు! చేప సముద్రంలో ఉప్పునీటిలో ఉంటుంది తన జీవితాంతం. అయితే అది ఉప్పునీటిలో ఉన్నా కూడా ఉప్పు దానికి ఎక్కదు! ఆ ఉప్పునీటిని కేవలం జీవించడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. అలాగే మనము పాప లోకంలో ఉన్నా పాపము మనకు అంటకుండా చూసుకోవాలి. ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను.

మొదటగా యోసేపు యవ్వనస్తుడు. అందగాడు. పాపమే తన దగ్గరకు వస్తే పాపము నుండి పారిపోయాడు. అందుకోసం నిందలు, అవమానాలు, చెరసాల ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు తప్ప పాపములో పడిపోలేదు. పాపము నుండి పారిపోయాడు. ఆదికాండం 39;

దావీదు గారు పెద్ద భక్తుడు, రాజు, ప్రార్థనా పరుడు, విశ్వాసి. ఒకరోజు చూడకూడని దృశ్యం చూసి, పాపాన్ని ఆహ్వానించారు, చివరకు హత్య చేయించారు. శపించబడి, జీవితాంతం అశాంతి, కుటుంబ తగాధాలతో జీవించవలసి వచ్చింది. పాపం దగ్గర ఆగి పోయాడు ఈ భక్తుడు! 2సమూయేలు 11;

సమ్సోను కూడా యవ్వనస్తుడే, అందగాడు, బలవంతుడు, గొప్ప పేరున్నవాడు, నాజీరు చేయబడిన వాడు, దేవునితో మాట్లాడి మేలులు పొందిన వాడు, వాగ్ధాన పుత్రుడు. పాపాన్ని వెదకుకొన్ని, పాపములో పడిపోయాడు. కళ్ళు పీకించుకున్నాడు. న్యాయాధిపతులు 13-16 అధ్యాయాలు;

అందరూ ఈ యవ్వనస్తులకోసమే చెబుతారు అయితే యేసుక్రీస్తు ప్రభులవారు, నవ యవ్వనుడు, అందగాడు, ఎంతో ఫాలోయింగ్ ఉన్నవారు, మగ్ధలేని మరియలాంటి యవ్వన స్త్రీలు అనునిత్యమూ ఆయన వెంట ఉండి ఆయనకు వారి ఆస్తులతో పరిచర్య చేశారు. అయితే యేసుప్రభులవారు ఎప్పుడూ పాపములో పడిపోలేదు. అంతేకాకుండా నాలో పాపమున్నది అని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాలు విసిరారు. యోహాను 8:46; ఆయనే మనకు నిజమైన మాదిరి. ఆయన దేవుడు కాబట్టి అలా ఉన్నారు మనము ఉండలేము అంటారా, మీద ఉదాహరించిన యోసేపు గారు, మోషే, హనోకు గారు, షడ్రక్ మేషాకు అబేద్నెగో, దానియేలు గారు వీరంతా తమ ఘటములు పాపము అంటకుండా కాపాడుకోలేదా?! వీరు కాపాడుకొన్నారు కాబట్టే దేవునికి ఇష్టులుగా ఉన్నారు.

ఇక్కడ పాపము అంటే కేవలం వ్యభిచారం మాత్రమే కాదు, అన్నిరకాల అపవిత్రత పాపమే! దానియేలు షడ్రక్ మేషాకు అబేద్నెగో లు రాజు భుజించే భోజనం పానము త్రాగి అపవిత్రులు కాకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే జీవించారు. ఆ నిర్ణయం వారికి ఇబ్బందులు కలిగించిన సరే, పవిత్రులుగా ఉండాలనుకున్నారు. గొప్ప పదవులు చేపట్టారు. సింహాల నోళ్ళను మూయించారు. అగ్నిలో నడిచారు. దేవున్ని పరమునుండి భూమికి అగ్ని మద్యలోనికి తీసుకుని వచ్చారు. అదీ భక్తి! అదీ పవిత్రత! అలాంటి భక్తి, పవిత్రత నీకుందా ప్రియ సహోదరి/ సహోదరుడా!

కీర్తనలు 93: 5
నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము అంటున్నారు కీర్తనాకారుడు!

గమనించాలి 1 కొరింథీయులకు 6:9,10,19,20
9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను
10. దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

ప్రకటన గ్రంథం 22: 15
కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

ప్రకటన గ్రంథం 21: 8
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

కాబట్టి ఇలాంటివి విసర్జించాలి. శరీరకార్యాలు అన్నింటినీ విసర్జించాలి. .గలతీయులకు 5:19,20,21
19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,
20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. . .
చివరకు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు కూడా విసర్జించాలి. 1తిమోతి 4:7;
వాటితోపాటుగా పాపాన్ని ప్రోత్సాహించే పనికిమాలిన సినిమాలు సీరియల్లు విసర్జించాలి. ప్రార్థనలో గడపాలి, వాక్య పఠనలో గడపాలి. సువార్త ప్రకటించాలి. సాక్షార్ధమైన జీవితం జీవించాలి. పరిశుద్ద జీవితం జీవించాలి. అప్పుడే నీవు దేవునికి ఇష్టుడుగా ఉండగలవు.
ఇష్టుడుగా ఉంటేనే ఆయన పరిశుద్ద పర్వతం మీద నివాసం చేయగలవు. కీర్తనలు 15; అనగా ఆయన పరలోకంలో జీవించగలవు.

హనోకు గారు అలా జీవించారు. ప్రాణంతోనే పరలోకము వెళ్ళారు. నీవు కూడా అలా జీవించగలిగితే ఖచ్చితంగా నీవుకూడా ఒకరోజు పరలోకంలో ఉండగలవు.
మరి నీవు సిద్దమా?!!

దైవాశీస్సులు!






హనోకు: దేవునికిష్టుడైనవాడు

*9వ భాగం*
*హనోకు గ్రంథం*

హెబ్రీయులకు 11: 5
విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.

కీర్తనలు 15: 1-2
యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?
యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.

ప్రియ దైవజనమా! ఇంతవరకు మనము దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే ఎలా ఉండాలో ధ్యానం చేసుకున్నాము. విశ్వాసం కలిగి ఉండాలని, విధేయత కలిగి ఉండాలని, మనమాటలు దేవునికి మహిమ తెచ్చేవిధంగా, దేవునికి అనుకూలంగా ఉండాలని, దేవుని పట్ల నమ్మకం గా ఉండాలి అని, పరిశుద్దమైన జీవితం జీవించాలని ధ్యానం చేసుకున్నాం.

చివరిగా దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే
1) యధార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి
2) నీతిని అనుసరించాలి
3) హృదయ పూర్వకంగా నిజం పలకాలి.

యధార్థమైన ప్రవర్తన అని చెప్పిన వెంటనే మనకు యోబుగారు గుర్తుకొస్తారు. అన్నీ పోయినా చివరకు ఆరోగ్యం పోయినా, దేవునియందు భయభక్తులు వదలలేదు, తన యధార్ధత వదలలేదు. అందుకే రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నారు. యోబు 1,2,42 అధ్యాయాలు

అబ్రాహాము గారు నీతిమంతుడు అని, లోతుగారు నీతిమంతుడు అని, దావీదు గారు నీతిమంతుడని బైబిల్ చెబుతుంది. శత్రువుని చంపే అవకాశమొచ్చినా యెహోవా చేత అభిషేకించ బడినవాడని చంపడం మానేశారు దావీదు గారు. అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి నీతి నిజాయితీ కావాలి దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే!

చివరగా హృదయపూర్వకముగా నిజము చెప్పాలి. అబద్దమాడు వారిని దేవుడు దండిస్తాను అంటున్నారు. హోషేయ 7:13; జెకర్యా 8:17 . . అబద్దమును ప్రేమించి జరిగించువారు వెలుపల ఉంటారు అని వ్రాయబడింది. ప్రకటన 22:15; 21:8; కాబట్టి హృదయపూర్వకముగా నిజము చెప్పాలి.

ఇంతవరకు మనం హనోకు గారి కోసం ధ్యానం చేసుకున్నాం. ఆయన నీతిమంతుడని, దేవునితో నడచిన వాడని, ప్రాణం తోనే దేవుడు ఆయనను తీసుకుని పోయారు అని ధ్యానం చేసుకున్నాము. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు. అయితే అది బైబిల్ గ్రంథంలో చేర్చ బడలేదు. ఎందుకు చేర్చబడలేదు అంటే ముఖ్యంగా అది పరిశుధ్దాత్మునికి ఇష్టం లేదు అంతే! హనోకు గ్రంథం మూడు రకాలైన ప్రతులు, తర్జుమాలు ఉన్నాయి. దేనిని నమ్మాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అందుకే ఆదరించ బడలేదు. ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఇది ఐదు భాగాలు కలిగి ఉంది. దేవుని దర్శనాలు, దేవుని తీర్పు, దేవుడు బయలు పరచిన విషయాలు లాంటివి ఉంటాయి.

దేవదూతలు పాపము చేసినందుకు దేవుడు వారిని వెళ్ళగొట్టాక, దేవుడు హనోకు గారితో ఎక్కువగా మాట్లాడుతున్నారు అని తెలుసుకుని, దేవదూతలు హనోకు గారిని రాయభారం చేయమన్నాయని, అందుకు దేవుడు ఒప్పుకోలేదు అనికూడా వ్రాయబడింది. ఏమో మనకు తెలియదు.
మరో ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఒక భాగంలో పూర్తిగా ఖగోళశాస్త్రం గురించి వ్రాయబడింది, భూమి, నక్షత్రాలు ఎలా శూన్యంలో (Space) వ్రేలాడుతున్నాయి, ఋతువులు ఎలా ఏర్పడుతున్నాయి, సంవత్సరానికి రోజులు, నెలలు, కేలండరు ఇవన్నీ సుమారుగా 5000 సంవత్సరాల ముందే హనోకు గారు తన గ్రంథంలో రాశారు. దేవుడు ఎన్నో దర్శనాలు ఇచ్చారు భక్తునికి.

హనోకు గారి హృదయం- దేవుని హృదయంతో, మనస్సుతో ఐక్యమైపోయింది. Synchronized totally. అందుకే అతడు దేవునికి ఇష్టుడుగా మారిపోయాడు. చివరకు దేవుడు ఉండలేక తనతోపాటు తీసుకుని వెళ్ళి పోయారు. అలాంటి జీవితం నీవు జీవిస్తే దేవుడు నిన్ను కూడా అలా వాడుకోగలరు. మరి నీవు దేవునితో వాడబడటానికి ఇష్టపడుతున్నావా? సిధ్దముగా ఉన్నావా?
అట్టి జీవితం నీకుంటే ఎంతో ధన్యుడవు!

అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(సమాప్తం)
**********************************
మరో భక్తుని జీవితం తో మరలా కలుసుకుందాం.
ఇట్లు
ప్రభువునందు మీ ఆత్మీయ సహోదరుడు
రాజకుమార్ దోనె


కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరీర కార్యములు

క్రిస్మస్

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

విశ్వాసము

పాపము

సమరయ స్త్రీ

విగ్రహారాధన