ప్రభువు నేర్పిన ప్రార్ధన - పరలోక ప్రార్ధన

ప్రభువు నేర్పిన ప్రార్ధన

(మొదటి భాగము)

పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక,
మత్తయి 6:9
.....................

దీనినే మనము "పరలోక ప్రార్ధన" అని పిలుస్తుంటాము. భూలోక ప్రార్ధన అంటూ మరొకటి లేదు కదా? ప్రార్ధనలన్నీ పరలోకంలో నున్న తండ్రికే కుమారుని ద్వారా
ప్రార్ధన చేస్తుంటాము.

"పరలోకమందున్న" అనే మాటతో ప్రారంభమయ్యింది కాబట్టి దీనికి "పరలోక ప్రార్ధన" అని పేరు పెట్టేసాము. గాని, "ప్రభువు నేర్పిన ప్రార్ధన" అనడమే సమంజసం.

యేసు ప్రభువు వారు తన శిష్యులకు ఎట్లా భోధించాలో నేర్పించలేదుగాని, ఎట్లా ప్రార్దించాలో నేర్పించి ప్రార్ధన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసారు.

అట్లా అని, కేవలం ఆయన నేర్పించినట్లే ప్రార్ధించేవిధంగా అంతపరిపూర్ణతలోనికి మనమింకా చేరలేదు. ఆయన నేర్పించిన ప్రార్ధనను ఒక మాదిరిగా తీసుకొని మన అవసరతలు జోడించి ప్రార్ధించాలి.

1. పరలోకమందున్న
2. మా తండ్రీ,
3. నీ నామము పరిశుద్దమైనది.

1. 'పరలోకమందున్న' అంటే?
మన ప్రార్ధన వినేవాడు పరలోకంలో వున్నాడు. ఆయన కంటికి కనబడక పోయినా ఆయన పరలోకంలో వున్నాడు అని నమ్ముతున్నాము. ఈమాట మన "విశ్వాస్యతను" తెలియజేస్తుంది.

'పరలోకమందున్న' అనే మాట ఆయన మహానీయతను, ఘనతను, గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి.

అయితే ఒక్క విషయం!!!
పరలోకంలోనున్న ఆయనతో భూలోకంలోనున్న నీవూనేనూ మాట్లాడేటప్పుడు మన పరిస్థితి ఏరీతిగా వుంది?

మట్టిలోనున్న మనము, మహిమలోనున్న ఆయనను సమీపించేటప్పుడు మన హృదయస్థితి యేరీతిగావుంది?

మనపైనున్న ఒక అధికారితో మాట్లాడడానికి భయముతో వణికిపోయే మనము, సర్వసృష్టికర్త, సర్వోన్నతుడునునైన ఆయనను సమీపించేటప్పుడు ఎట్టిరీతిగా మాట్లాడుతున్నాము?


మనము ప్రార్దిన్చేటప్పుడు ఎవరికి ప్రార్ధన చేస్తున్నామో? ఆయన ఏమయ్యున్నాడో? ఎట్లాంటివాడో? ఆలోచిస్తూ ప్రార్ధించగలుగుతున్నామా?

నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచు కొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను.
ప్రసంగి 5:2

మనం అలవాటుగా ప్రార్ధన చేస్తున్నాము.
ఆయన ఔనత్యాన్ని, ప్రభావాన్ని గుర్తించలేక పోతున్నాము.
ఆయనపై ఆధారపడలేక పోతున్నాము.
అందుకే ప్రార్ధనాఫలాలు పొందలేకపోతున్నాము.

ఆయన పరలోకంలోనున్న దేవుడు అని గుర్తించి ఆయన పాదాల చెంత మోకరిల్లుదాం!
ప్రార్ధనాఫలాలు అనుభవిద్దాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


ప్రభువు నేర్పిన ప్రార్ధన

(రెండవ భాగము)


పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, మత్తయి 6:9
1. పరలోకమందున్న
2. మా తండ్రీ,
3. నీ నామము పరిశుద్దమైనది.

1.పరలోకమందున్న అంటే?
మన ప్రార్ధన వినేవాడు పరలోకంలో వున్నాడు. ఆయన కంటికి కనబడక పోయినా ఆయన పరలోకంలో వున్నాడని నమ్ముతున్నాము. ఈమాట మన "విశ్వాస్యతను" తెలియజేస్తుంది.

2. "మా తండ్రీ!"
ఈమాట, పరలోకంలోవుండి, మన ప్రార్ధన ఆలకించి, సమాధానమిచ్చే ఆ దేవునికి మనకును గల వ్యక్తిగత సంబంధాన్ని తెలియజేస్తుంది.
ఆయన మనకు తండ్రి. మనము ఆయనకు కుమారులము, కుమార్తెలము. ఆయనకు మనుమలుగాని , మనుమరాళ్ళుగాని లేరు.
ఆయన మనకు తండ్రిగా, మనము ఆయనకు పిల్లలముగా ఎప్పుడు ఉండగలము?
తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.
యోహాను 1:12,13
యేసు క్రీస్తుని అంగీకరించి, ఆయన యందు విశ్వాసముంచే వారు మాత్రమే దేవునికి పిల్లలుగా వుంటారు.
అట్టి వారికి మాత్రమే ఆయనను తండ్రి అని పిలిచే యోగ్యతవుంది.
*మన ప్రార్ధనలకు ప్రతిఫలం రావడం లేదంటే? ఆయన పిల్లలముగా మార్చబడకుండానే,
'మా తండ్రీ' అనిపిలుస్తున్నామేమో?
ఆయన పిల్లల జాబితాలోమనమింకా చేర్చబడలేదేమో?
వద్దు!!
మన జీవితాలను సరిచేసుకుందాం!
అయన పిల్లలుగా తీర్చబడదాం!
తండ్రీ అని పిలిచే యోగ్యతను పొందుకుందాం!
కుమారుడైన యేసు ప్రభువు వారి ద్వారా తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం!
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


ప్రభువు నేర్పిన ప్రార్ధన

(మూడవ భాగము)


పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, మత్తయి 6:9
1. పరలోకమందున్న
2. మా తండ్రీ,
3. నీ నామము పరిశుద్ధమైనది.

మన ప్రార్ధన విని, ప్రతిఫలమిచ్చే దేవుడు పరలోకంలోనున్నాడు. ఆయన మనకు తండ్రి. మనమాయన పిల్లలం.
ఆయన నామము పరిశుద్ధమైనది.

నీ నామము పరిశుద్ధపరచబడు గాక!
అంటే? నీ నామము అపవిత్రమైనది అది పరిశుద్ద పరచబడాలి అని అర్ధం కాదు.
నీ నామము 'పరిశుద్ధమైనది' లేదా 'పరిశుద్దమైన నామముగా ఎంచబడుతుంది' అని అర్ధం.
అవును!
ఆయనకున్న లక్షణాలలో అత్యంత ప్రప్రధమమైనది 'పరిశుద్ధత'.

అందుకే.
ఆయన పరలోకంలో అనునిత్యమూ "పరిశుద్దుడు,పరిశుద్దుడు, పరిశుద్దుడు" అంటూ స్తుతించబడుతున్నాడు.
అట్లాంటి పరిశుద్ధమైన నామమును ఉచ్చరించే మనము, ప్రార్ధించే మనము, పరిశుద్ధ మైన పెదవులు, పరిశుద్ద మైన హృదయం కలిగియున్నామా?

ఆయన పరిశుద్ధమైన నామమును ఉచ్చరించే అర్హత, అట్టి జీవితం మనకుందా?
ఆయన పరిశుద్దు డైయున్నలాగున మనమునూ పరిశుద్దులముగా వుండాలని ఆయన కోరుతున్నాడు.

అట్టి హృదయంతో చేసే ప్రార్ధన నేరుగా దేవుని సన్నిధికి చేరి, జవాబును తీసుకువస్తుంది.

కాని, మన ప్రార్ధనలకు ప్రతిఫలం రావడం లేదంటే? అట్టి అనుభవం లోనికి మనమింకా ప్రవేశించలేదేమో?

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


ప్రభువు నేర్పిన ప్రార్ధన

(నాలుగవ భాగము)


నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,
మత్తయి 6:10
............................

నీ రాజ్యము వచ్చుగాక!
అని ప్రార్ధించమని చెప్పిన యేసు ప్రభువు వారు దానికి వ్యతిరేఖముగా మరొక విషయం విషయం ప్రకటిస్తున్నారు.

"యేసు పరలోకరాజ్యము సమీపించియున్నది" గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
మత్తయి 4:17

ఆయనతోపాటే పరలోక రాజ్యం భూమి మీదకు వచ్చియుంటే? శిష్యులు ఆరాజ్యంలోనే వుంటే? మరళా ఆయన ఎందుకు
"నీ రాజ్యము వచ్చుగాక!"
అని ప్రార్ధించమని చెప్పారు?

యేసు ప్రభువు వారు చెప్పిన రెండు మాటలు సరియైనవే.

దేవుని రాజ్యము సమీపించింది అన్నది వాస్తవమే. కాని, అది ఆధ్యాత్మికంగా ప్రజల హృదయాలకే పరిమితమయింది.

అది భూమి మీద ప్రత్యక్ష పరచబడాలని నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్ధించమని చెప్పారు.

ఏదో అలవాటుగా కళ్ళుమూసుకొని పరలోక ప్రార్ధన అంటూ చేప్పేస్తున్నాము.
కాని ఒక్క విషయం!!
ఆయన రాజ్యమే వస్తే?
ఆ రాజ్యంలో మనముంటామా?
అటువంటి సిద్ధపాటు మనకుందా?

ఆయన రాజ్యమే వచ్చి, ఆ రాజ్యంలో మనము లేకుంటే?
అది ఊహలకు సహితం
అత్యంత భయంకరం.

ఆ రాజ్యంలో నీవుంటే?
*నీ జీవితం ధన్యం.
*అది రారాజు వెయ్యేండ్ల పాలన.
*పాపమే లేని రాజ్యమది.
*ఆ రాజ్యంలో హింసలు లేవు.
కరవులు లేవు.
*సింహము ఆవు కలసి మేసే రాజ్యమది.
*చిన్న పిల్లవాడు పాములతో కలసి ఆడుకొనే రాజ్యమది.
*ఏ మృగమును హాని చెయ్యని రాజ్యమది.
*శాంతి సమాధానం విరాజిల్లే రాజ్యమది.
*ఆ రాజ్యంలో నీవూ నేనూ తప్పకవుండాలి.

ఆయన రాజ్యంకోసం సిద్దపడుతూ "నీ రాజ్యం వచ్చుగాక" అని ప్రార్ధిద్దాం!
ఆ నీతి రాజ్యంలో ప్రవేశిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


ప్రభువు నేర్పిన ప్రార్ధన

(ఐదవ భాగము)


నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, మత్తయి 6:10
"నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక!"

అంటే?
పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరడం లేదనేకదా అర్ధం?
కారణం ఏమిటి?
దేవుని చిత్తం లేదా ఆయన సంకల్పాన్ని అర్ధం చేసుకోగలిగిన జ్ఞానంగాని, స్థాయిగాని మనిషికి లేదు.

అందుచే ఆయన సంకల్పం మనకు అర్ధంకాక ఆయన మీదే మనము తిరుగుబాటు చేసి దేవుని సంకల్పానికి అడ్డుబండలుగా మారుతున్నాము.

అంటే?
మనిషికి దేవుని సంకల్పాన్ని అడ్డగించే శక్తి ఉందా? లేనే లేదు.
కాని, ఆయన కృపలో జీవిస్తున్నాము కాబట్టి, ఆయన సంకల్పాన్ని కొంతయినా తెలుసుకొని ఆయన చెంతకు వస్తామని ఆయన సహనంతో ఎదురు చూస్తున్నాడంతే.
పూర్తిగా ఆయన చిత్తం భూమిమీద ఎప్పుడు నెరవేరుతుంది అంటే? ఆయన రాజ్యం వచ్చినప్పుడే.

అట్లాఅని, అంతవరకు ఆయనకు భూమి మీద ఏ అధికారం లేదని అర్ధం కాదు. ఆయన సకల యుగాలకు రాజు.
వ్యక్తిగతముగా ఈ ప్రార్ధనచేసే మనము మన జీవితాల్లో దేవుని చిత్తం తెలుసుకొని ఆ ప్రకారం జీవించగలగాలి.

లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
1యోహాను 2:17

మనము లోకమునుండి ప్రత్యేకింపబడి జీవించడమే దేవుని సంకల్పం. అట్లా జీవించేవాడు ఆయన రాజ్యంలో తప్పక ఉంటాడు.
ప్రార్ధించే మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చుతూ, ఆయన రాజ్యం కోసం ఎదురుచూస్తూ ప్రార్ధిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


ప్రభువు నేర్పిన ప్రార్ధన

(ఆరవ భాగము)


మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మత్తయి 6:11
జీవించడానికి కావలసిన ప్రాధమికమైన అవసరాలలో
అతి ముఖ్యమైనది "ఆహారం"
ప్రభువు వారు నేర్పించిన ప్రార్ధనలో సంపదను గూర్చిగాని, అనేక దినాలకు సరిపడే ఆహారం గురించిగాని, ప్రార్ధించమని చెప్పలేదు. ఏ దినమునకు కావలసిన ఆహారం గురించి ఆదినమే ప్రార్ధించమని చెప్పారు.

యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇట్లాంటి ఆజ్ఞనే ఇచ్చాడు. ఏ దినమునకు సరిపడే మన్నాను ఆ దినమే సమకూర్చుకోమని.
"మోషే దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను.

అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను." నిర్గమ 16:19,20
ఎందుకలా?
మన అనుదిన జీవితం పూర్తిగా ఆయన పైనే ఆధారపడి వుంది అని గుర్తించి, మన అవసరాలను తీర్చేందుకు ఆయనపైనే అను నిత్యం ఆధారపడాలని.

అట్లాఅని, ఏపని చెయ్యకుండా, ఆహారంకోసం ఆయనను ప్రార్ధిస్తేచాలని కాదు.
పని చెయ్యాలి.
కాని, మనం పనిచెయ్యడం వల్లనే మన అవసరతలు తీరుతున్నాయి అనికాకుండా, పని చెయ్యడానికి శక్తిని, సామర్ధ్యమును ఇచ్చేది ఆయనే కాబట్టి, దేవుని కృపవల్లనే మన అవసరాలు తీరుతున్నాయి అని మనం గుర్తించగలగాలి.
అదే సమయంలో మన ప్రార్ధనలు కేవలం శరీర ఆహారం కోసం మాత్రమే పరిమితం కాకూడదు.

ఎందుకంటే?
*మనిషి జీవించాలంటే
'ఆహారం' కావాలి.
*ఆత్మ జీవించాలంటే
'జీవాహారం' కావాలి.

అందుచే,
ఆహారంకొరకు, జీవాహారంకొరకు ప్రార్థిస్తూ, పొందుకొంటూ,
గమ్యమైన నిత్యరాజ్యం చేరేవరకు జీవనయాత్ర సాగించాలి.
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


ప్రభువు నేర్పిన ప్రార్ధన

(ఏడవ భాగము)


మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మత్తయి 6:12
ఋణములు అంటే?
అప్పులు అనికాదు గాని.
తప్పులు లేదా పాపములు.
ఇతరుల పాపములు క్షమించే అధికారం మనకు లేదుగాని, ఇతరులు మనపట్ల చేసిన తప్పులను మనము క్షమించి,
మన పాపములను క్షమించమని దేవునిని ప్రార్ధించడం.
ఇది దేవునికి అంగీకారయోగ్యమైన ప్రార్ధన.
కాని, ఇట్లా ప్రార్ధించడం మనకు అలవాటై పోయిందిగాని, మనలను బాధించిన వారిని క్షమించడం మాత్రం మన వల్ల కావట్లేదుకదా?

చిన్న చిన్న మనస్పర్ధలు పెద్దవై సమస్యలుగా మారి, మనము శత్రువులుగా మారిన సందర్భాలెన్నో కదా?
కుటుంబాలు విచ్చిన్నమైనా క్షమించలేక, కక్షలు పెంచుకొనే మనకు అసలు ఇట్లా ప్రార్ధించే అర్హతే లేదు.
ఒకవేళ ప్రార్ధించినా ఆ ప్రార్ధన దేవుని సన్నిధికి చేరదు. ప్రతిఫలము రాదు.
మనలను బాధించిన వారిని క్షమించిన తర్వాతే. మన పాపములను క్షమించమని దేవునిని అడిగే హక్కువుంది.

నీవు క్షమించకపొతే?
క్షమించబడవు.
నీకు అన్యాయము జరిగినాగాని, నీ హృదయం గాయపడినాగాని, నీవు అవమాన పరచబడినప్పటికి దేవుని పిల్లలముగా ఇతరులను క్షమిద్దాం!

మనలను బాధించిన వారిని క్షమించడం వల్ల,
మన హృదయం కూడా తేలికయిపోతుంది. శాంతి సమాధానంతో మన హృదయం నిండిపోతుంది.
అప్పుడు ఇట్లా ప్రార్ధిద్దాం!
దేవా! "మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము."

ఈ ప్రార్ధన యోగ్యమైన ప్రార్ధన.
దేవుని దగ్గరనుండి సమాధానమును
తీసుకొని వచ్చే ప్రార్ధన.
క్షమించావు కాబట్టి, తప్పకుండా క్షమించబడతావు.
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


ప్రభువు నేర్పిన ప్రార్ధన

(ఎనిమిదవ భాగము)


మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము. మత్తయి 6:13
"మమ్మును శోధనలోకి తేక" అంటే?
*ఆయన మనలను శోధనలలోనికి తీసుకొనివెళ్తాడా?
*మనము శోధించబడుచున్నాము అంటే ఆయనే కారణమా?

దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడునేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు. యాకోబు 1:13

*మనము శోధించబడడానికి కారణమేమిటి?
ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. యాకోబు 1:14
అయితే, కొన్ని సందర్భాలలో మన విశ్వాసాన్ని పరీక్షించే నిమిత్తం ఆయన మనపై శోధనలకు అనుమతినిస్తాడు.

యోబు జీవితంలో అదే జరిగింది కదా?
*ఆయన అనుమతించే శోధన మనలను పరిపూర్ణులుగా చేస్తుంది తప్ప, మనకు కీడుచేయదు.
*రెట్టింపు ఆశీర్వాదాలకు పాత్రులను చేస్తుంది తప్ప, కృంగదీయదు.
మన శోధనలకు కారణము మన దురాశలే.
మన శోధనలకు కారకుడు దుష్టుడును, శోధకుడునునైన సాతానే.
శోధన నుండి, శోధకునినుండి తప్పింపబడే మార్గమే లేదా?
మన శోధనలనుండి,
ఆ శోధకుని చెరలోనుండి తప్పించగలవాడు మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారు మాత్రమే.
ఆయన సహాయం లేకుండా శోధననుగాని, శోధకునిగాని జయించలేము.
ఎందుకంటే?
ఆయన మాత్రమే ఆ దుష్టుని జయించగలిగాడు.
నీవూ నేనూ ఆ దుష్టుని జయించాలంటే ఆయన సహాయానికై ప్రార్ధించాలి. అంతకుమించిన మార్గం వేరొకటి లేదు.
ఈ రీతిగా ప్రార్ధించి పొందుకుందాం!
తండ్రీ! మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.
రాజ్యము
బలము
మహిమయు నీవై యున్నవి.
ఆమెన్!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరీర కార్యములు

క్రిస్మస్

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

విశ్వాసము

పాపము

సమరయ స్త్రీ

విగ్రహారాధన