త్రిత్వము

త్రిత్వము(Trinity)

 (మొదటి భాగము)

 

త్రిత్వం క్రైస్తవ్యానికి ప్రాణం. ఈ మాటలు మీలో కొందరు అంగీకరించక పోవచ్చు. త్రిత్వం అనే పదము బైబిల్ లో చూపించు నేను అంగీకరిస్తాను అనే వారు కూడా కొందరుండవచ్చు. మీ లాజిక్ హర్షించదగినదే. అయితే నాదొక చిన్ని ప్రశ్న బైబిల్ అనే పదము బైబిల్ చూపించగలరా? అంటే మీ లాజిక్ ప్రశ్నార్థకమే కదా? బైబిల్ అనే పదము లేనంత మాత్రాన అది బైబిల్ కాదనలేము కదా? దాని మూలాల్లోనికి వెళ్తే ఆ పదం మనకు కనబడుతుంది.

 

అక్షరం ప్రాముఖ్యమైనదే కాదనను. కానీ, అంతరార్ధం, ఆత్మీయత అత్యంత ప్రాముఖ్యమైనది. 

త్రిత్వముఅనే పదము బైబిల్ లో ప్రత్యక్షంగా  లేకపోవచ్చు గాని, త్రిత్వము యొక్క concept మాత్రం స్పష్టముగా చూడవచ్చు. ఉదా: అబ్రాహాము గారికి యాకోబు గారు మనుమడుఅవుతారు. కానీ, బైబిల్ లో మనుమడుఅనేపదం లేదు. Concept మాత్రం వుంది.

 

త్రిత్వమును గూర్చిన మీ అభిప్రాయములు, మీ వాదనలు మీకు ఉండొచ్చు. నేను మీతో వాదించే ప్రయత్నం ఎంత మాత్రమూ చెయ్యను. వాస్తవికతను తెలియజేసే ప్రయత్నం మాత్రమే చేస్తాను. కలసి ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తే మాత్రం, మీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దని మాత్రం ప్రేమ పూర్వకంగా తెలియజేస్తున్నాను.

 

త్రిత్వము అంటే ముగ్గురు దేవుళ్ళని ఎంతమాత్రం కాదు. త్రిత్వము అంటే ఏకత్వం. దేవుడు ఒక్కడే”. దానిని తిరస్కరించే ఏ బోధయైనా దుర్భోదే అవుతుంది. ఈ అంశము పూర్తయ్యేలోపు తప్పక అట్టి అవగాహనకు మనము రాగలమని విశ్వసిస్తున్నాను. ఒక్క పార్ట్ చదివి ఒక నిర్ణయానికి రావొద్దుగాని, ఈ అంశము పూర్తయ్యేవరకు క్రమముగా చదివి, ఒక నిర్ణయానికి రాగలరు. ఈ అంశము అర్ధం చేసుకోవడానికి కొంత కష్టముగానే ఉంటుంది. కానీ, పరిశుద్ధాత్ముని సహాయంతో ధ్యానించగలిగితే, ఆయనే మనలను సర్వసత్యములోనికి నడిపిస్తారు.

 

ఇప్పటికే మీకు త్రిత్వమును గూర్చిన అవగాహన వుంది. మరికొంత లోతుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం! సాధారణంగా సేవకులు త్రిత్వమును వివరించడానికి

సూర్యుడు ( సూర్యుడు, కాంతి, వెలుగు)

ఐస్ క్యూబ్ ( ఘన, ద్రవ, వాయు స్థితులు)

నీటి అణువు ( ఆక్సిజన్, హైడ్రోజన్ లు)

బిల్డర్, అర్చిటెక్ట్, తాపీ మేస్త్రి

ఇట్లా అనేకరకాలైన విషయాలతో త్రిత్వమును గురించిన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి, సమయాన్ని వృధాచేయకుండా నేరుగా వాక్యములోనికి వెళ్ళిపోదాం!

 

"దేవుడు ఒక్కడే - త్రిత్వమునకు పునాది"

క్రైస్తవ విశ్వాసానికి ప్రాణవాయువు వంటిది

'త్రిత్వము' (The Trinity). త్రిత్వమును గూర్చిన ఈ ధ్యాన క్రమంలో మొదటిగా మనం దేవుని 'ఏకత్వము' గురించి అర్థం చేసుకుందాం.

 

1. బైబిల్ పునాది - దేవుడు ఒక్కడే:

బైబిల్ గ్రంథము మొదటి నుండి చివరి వరకు దేవుడు ఒక్కడే అనే సత్యానికే కట్టుబడి ఉంది. ఈ సత్యాన్ని తిరస్కరించే ఏ బోధ అయినా వాక్య విరుద్ధమని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి.

పాత నిబంధన సాక్ష్యం: "నేనే దేవుడను; నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు" (నిర్గమకాండము 20:3).

యేసుక్రీస్తు సాక్ష్యం: "ఓ ఇశ్రాయేలూ వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయుడగు ప్రభువు" (మార్కు 12:29).

అపోస్తలుల బోధ: "దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు; ఆలాగు నమ్ముట మంచిదే" (యాకోబు 2:19).

 

2. ఏకత్వములో బహుళత్వం:

దేవుడు ఒక్కడే అని చెబుతూనే, ఆయనలో ఒక అద్భుతమైన బహుళత్వం (Plurality) ఉందని లేఖనాలు నిరూపిస్తున్నాయి.

ఎలోహీమ్ (Elohim): హీబ్రూ భాషలో దేవునికి వాడిన ఈ పదం బహువచనాన్ని సూచిస్తుంది.

ఎహాద్ (Echad): ద్వితీయోపదేశకాండము 6:4లో "అద్వితీయుడు" అనే మాటకు 'ఎహాద్' అనే పదం వాడబడింది. దీని అర్థం 'సమిష్టి ఏకత్వం' (Compound Unity). ఉదాహరణకు: భార్యాభర్తలు ఇద్దరు కలిసి "ఏకశరీరము" అన్నట్లుగా, దేవుడు ఒక్కడే కానీ ఆయనలో ముగ్గురు వ్యక్తులు కలరు.

 

3. సృష్టిలో త్రిత్వపు ఛాయలు:

నరుని సృజించేటప్పుడు దేవుడు తనతో తాను సంభాషించుకోవడం మనం గమనించవచ్చు.

️"మన పోలికచొప్పున మన స్వరూపమందు నరుని చేయుదము రండని పలికెను" (ఆదికాండము 1:26).

ఇక్కడ "మన" అనే మాట తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల మధ్య ఉన్న నిత్య సహవాసాన్ని మరియు సృష్టిలో వారి ముగ్గురి ప్రమేయాన్ని స్పష్టం చేస్తోంది.

 

ధ్యాన అన్వయం (Application):

దేవుడు ఒక్కడే అని నమ్మడం ఎంత ముఖ్యమో, ఆ ఒక్క దేవుడే మన రక్షణ కోసం తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా తనను తాను బయలుపరచుకున్నారని గ్రహించడం అంతకంటే ముఖ్యం. ఆయన ఏకత్వము మన ఐక్యతకు మాదిరి!

 

ప్రస్తావనలు (References):

యెషయా 43:10: "నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు."

మలాకీ 2:10: "మనకందరికి తండ్రి ఒక్కడు కాడా?"

రోమా 3:30: "దేవుడొక్కడే గనుక..."

️1 తిమోతి 2:5: "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే."

 

ప్రియ విశ్వాసి!

ఇంతవరకు మన ధ్యాన సారాంశం దేవుడు ఒక్కడే”. (దేవుళ్ళు ముగ్గురు కానేకాదు) ఇట్టి గ్రహింపునకు మీరు వచ్చియున్నారని విశ్వసిస్తున్నాను. ప్రార్ధనా పూర్వకంగా కొనసాగింపుకొరకు కనిపెట్టుదము. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!

 

త్రిత్వము (Trinity)

రెండవ భాగము

 

దేవుని (ఎలోహిం) లో బహుళత్వం:

బైబిల్ గ్రంథము దేవుడు ఒక్కడే అని ఎంత స్పష్టంగా చెబుతుందో, అదే దేవునిలో ఒక అద్భుతమైన బహుళత్వం (Plurality) ఉందని కూడా అంతే స్పష్టంగా ప్రకటిస్తోంది. త్రిత్వము అంటే ముగ్గురు దేవుళ్లు కాదు, అలాగే ముగ్గురూ కలిసి ఒకే వ్యక్తి అని కూడా కాదు. ఒక వ్యక్తి ఒక్క మనిషిగానే ఉండాలనే నియమం, దేవునికి కూడా వర్తించవలసిన అవసరం లేదు. ఆయన అస్థిత్వాన్ని దేనితోనూ పోల్చడం సాధ్యం కాదు.

తండ్రి - కుమారుడు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు

కుమారుడు - తండ్రి కాదు, పరిశుద్ధాత్ముడు కాదు

పరిశుద్ధ్ముడు - తండ్రి కాదు, కుమారుడు కాదు

👉ఒకే దైవత్వంలో ముగ్గురు ప్రత్యేక వ్యక్తులు నిత్యము ఏకమై ఉన్నారు.

 

1. నామములోనే మర్మము (The Name of God)

"మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు

(Echad) యెహోవా."  ద్వితీ 6:4:

ఇక్కడ వాడబడిన 'ఎహాద్' (Echad) అనే మాటకు మూల భాషలో 'సమిష్టి ఏకత్వం' అని అర్థం. అంటే అనేకులు కలిసి ఒకటిగా ఉండటం (ఉదా: ఆది 2:24లో భార్యాభర్తలు ఏక శరీరమగుట) మత్తయి సువార్త 19:6 కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీర ముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను) కేవలం ఒక్కరినే సూచించే 'యెహీద్' (Yachid) అనే పదాన్ని దేవుని విషయంలో వాక్యం వాడలేదు

 

    2. ముగ్గురు వ్యక్తులు - ఒకే సృష్టికర్త (Trinity in Creation)

సృష్టి కార్యంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురూ ఏకముగా పాలుపంచుకున్నారు:

* తండ్రి: "సమస్తమును సృష్టించిన దేవుడు" (ఎఫెసీ 3:9).

* కుమారుడు: "ఆదియందు వాక్యము ఉండెను... సమస్తమును ఆయన ద్వారా కలిగెను" (యోహాను 1:1-3).

* పరిశుద్ధాత్మ: "దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని శ్వాసము నాకు జీవమిచ్చెను" (యోబు 33:4).

 

3. దేవుని స్వయం సంభాషణ:

దేవుడు తన గురించి ప్రస్తావించుకున్నప్పుడు "మనము" అని సంబోధించుకున్నారు:

️"మన పోలికచొప్పున మన స్వరూపమందు నరుని చేయుదము రండని పలికెను." ( ఆది 1:26)

️"ఇదిగో నరుడు మనలో ఒకనివంటి వాడాయెను."(ఆది3:22)

️"మనము దిగిపోయి, వారి భాషను తారుమారు చేయుదము రండని పలికెను."(ఆది 11:7)

 

4. ముగ్గురు వ్యక్తులు - ప్రత్యేక పాత్రలు (Distinct Personalities):

త్రిత్వము అంటే ముగ్గురూ ఒక్కరే అని కాదు, వారు ఒకే ఉనికి కలిగిన ముగ్గురు వేర్వేరు వ్యక్తులు.

తండ్రి: రక్షణను సంకల్పించి, తన సొంత కుమారుని మనకోసం అప్పగించిన ప్రేమమయుడు (రోమీయులకు 8:32).

కుమారుడు: మన పాపముల నిమిత్తం శరీరధారియై వచ్చి, ఆ పాపమునకు శిక్షను భరించిన మృత్యుంజయుడు (రోమీయులకు 8:4).

పరిశుద్ధాత్ముడు: సృష్టిలో పాలుపంచుకుంటూ (యోబు 33:4), మనల్ని సత్యములోనికి నడిపించే దేవుడు.

 

5. ముగ్గురు వ్యక్తులు - ప్రత్యేకత:

తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురూ వేర్వేరు వ్యక్తులుగా కార్యము చేస్తారు:

️"నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను." (కీర్తనలు 2:7) (ఇక్కడ తండ్రి సంబోధించే వ్యక్తిగా, కుమారుడు స్వీకరించే వ్యక్తిగా కనిపిస్తున్నారు).

️"అంతమునందు ఆయన (కుమారుడు) తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును." 1 కొరింథీ 15:24

(అప్పగించేవారు, స్వీకరించేవారు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు).

️"తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి."(1 యోహాను 2:22)

 

6. రక్షణలో త్రిత్వపు పాత్రలు (Roles in Salvation)

వ్యక్తులు వేరైనా వారి ఉనికి ఒక్కటే అని నిరూపించే వచనాలు:

️"తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు (తండ్రి)..." (రోమీయులకు 8:32)

️"శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను (కుమారుడు)...". (రోమీయులకు 8:4)

️"అటుతరువాత ఆయన (కుమారుడు) సమస్తమైన ఆధిపత్యమును... కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును." (1 కొరింథీ 15:24)

 

7. యెహోవా దూత (Christophany)

పాత నిబంధనలో దేవుని దూతగా ప్రత్యక్షమైన వ్యక్తికి దేవుని నామము, అధికారము కలవు. ఈయనే శరీరధారి కాకముందు ఉన్న యేసుక్రీస్తు:

️ "ఆయన నామము నా యందున్నది. (నిర్గమ 23:20-21)

నిర్ధారణ: ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపించిన ఆ బండ క్రీస్తే (1 కొరింథీ 10:4-9).

 

ప్రియ విశ్వాసి!

త్రిత్వమును వివరించడానికి మనం వాడే లోక సంబంధమైన ఉదాహరణలు కేవలం పరిమితమైన అవగాహన కోసమే. ఏ పోలిక కూడా దేవుని సంపూర్ణ తత్వాన్ని వివరించలేదు. వాక్యము ద్వారా దేవుడు తనను తాను బయలుపరచుకున్న సత్యమే మనకు అంతిమ ప్రామాణికం! ఇంతవరకు మన ధ్యాన సారాంశం దేవుడు ఒక్కడే”. (దేవుళ్ళు ముగ్గురు కానేకాదు), ఒకే దైవత్వంలో ముగ్గురు ప్రత్యేక వ్యక్తులు నిత్యము ఏకమై ఉన్నారనే గ్రహింపునకు మీరు వచ్చియున్నారని విశ్వసిస్తున్నాను. ప్రార్ధనా పూర్వకంగా కొనసాగింపుకొరకు కనిపెట్టుదము. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!

త్రిత్వము (Trinity)

మూడవ భాగము

 

అంశం: దైవత్వపు ఏకత్వము మరియు వ్యక్తుల మధ్య వ్యత్యాసం

 

పరిచయం: దేవుడు ఒక్కడే అని నమ్ముతూనే, ముగ్గురు వ్యక్తుల ఉనికిని అంగీకరించడం క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభం. దీనిని అర్థం చేసుకోవడానికి ఈ క్రింది లేఖనాలు మనకు సహాయపడతాయి.

 

సాధారణ వివరణ:

 

దైవత్వపు ఏకత్వము (Unity of Essence)

దేవుడు ఒక్కడే అన్నప్పుడు, ఆయన ముగ్గురు దేవుళ్లు కాదు, కానీ ఒకే 'దైవ స్వభావం' కలిగిన ముగ్గురు వ్యక్తులు. దీనిని "సారాంశంలో ఏకత్వం" అంటాము.

ఒకే అధికారం: తండ్రికి ఎంత అధికారం ఉందో, కుమారునికి, పరిశుద్ధాత్మునికి కూడా అంతే అధికారం ఉంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.

ఒకే గుణగణాలు: తండ్రి ప్రేమగలవాడు, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు కూడా అదే ప్రేమను కలిగి ఉంటారు. దేవునిలోని పరిశుద్ధత, శక్తి, జ్ఞానం ఈ ముగ్గురిలోనూ సమానంగా, సంపూర్ణంగా ఉంటాయి.

విడదీయలేని బంధం: ఒక వ్యక్తిని ఆయనలోని మనస్సు, ఆత్మ నుండి ఎలాగైతే వేరు చేయలేమో, దైవత్వంలోని ముగ్గురిని అలాగే వేరు చేయలేము. వారు నిత్యము ఒకరితో ఒకరు కలిసి ఉంటారు.

 

వ్యక్తుల మధ్య వ్యత్యాసం (Distinction of Persons)

వీరు ముగ్గురూ ఒక్కరే అయినప్పటికీ, వారి "వ్యక్తిత్వాలు" (Personalities) మరియు వారు చేసే "పనులు" (Roles) వేర్వేరుగా ఉంటాయి.

పాత్రల్లో తేడా: తండ్రి ఎప్పుడూ 'పంపేవాడు'గా ఉంటాడు, కుమారుడు 'పంపబడినవాడు'గా లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనలను 'నడిపించేవాడు'గా ఉన్నాడు. ఒకే నాటకంలో వేర్వేరు పాత్రలు పోషించే వారిలా కాకుండా, వీరు ముగ్గురు నిత్యత్వంలో నిలిచి ఉండే వేర్వేరు వ్యక్తులు.

సంబంధం: తండ్రి కుమారుని ప్రేమిస్తాడు, కుమారుడు తండ్రికి లోబడతాడు. అంటే వారి మధ్య ఒక 'సంబంధం' (Relationship) ఉంది. ఒక వ్యక్తి తనలో తాను మాట్లాడుకుంటే అది సంభాషణ అవ్వదు, కానీ ఇక్కడ తండ్రి కుమారునితో, కుమారుడు తండ్రిని ప్రార్థించడం ద్వారా వారిద్దరూ వేర్వేరు వ్యక్తులని మనకు అర్థమవుతుంది.

ప్రత్యక్షత: ఒకే సమయంలో ముగ్గురూ వేర్వేరుగా కనిపించగలరు. ఉదాహరణకు, యేసు బాప్తిస్మం పొందే సమయంలో ముగ్గురూ ఒకేసారి మూడు రకాలుగా తమ ఉనికిని చాటారు.

 

సరళమైన ఉదాహరణ:

 

Note: దేవుని అస్థిత్వాన్ని , మహిమను దేనితోనూ పోల్చలేము. ఈ పోలిక కొంత అవగాహన కొరకు మాత్రమే!

సూర్యుడిని తీసుకోండి. సూర్యుడు ఒకటే, కానీ దాని నుండి వెలుగు వస్తుంది, వేడి వస్తుంది.

వెలుగు వేడి కాదు, వేడి వెలుగు కాదు. కానీ ఇవి రెండూ సూర్యుని నుండి వేరు చేయలేనివి.

సూర్యుడు లేకుండా వెలుగు ఉండదు, వెలుగు లేకుండా సూర్యుడు మనకు కనబడడు.

అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురూ ఒకే దేవుడు కానీ వారి ఉనికి, పనితీరు వేర్వేరు.

 

లేఖనముల వివరణ:

 

1. దేవుని అద్వితీయత (The Unity of God)

బైబిల్ దేవుడు ఒక్కడే అని నొక్కి చెబుతోంది, అయితే ఆ ఏకత్వం "సమిష్టి ఏకత్వం".

షెమా (Shema): "మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా" (ద్వితీ 6:4). ఇక్కడ ఎహాద్' (Echad) అంటే అనేక భాగాలు కలిసి ఒకటిగా ఉండటం.

ఏక మనస్సు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకే సంకల్పంతో పనిచేస్తారు. "నేనును తండ్రియును ఏకమై యున్నాము" (యోహాను 10:30).

 

అదనపు రిఫరెన్సెస్

యోహాను 5:30; మత్తయి 3:16-17; 28:19; 2 కొరింథీ 13:14; ఎఫెసీ 4:6

 

2. సృష్టిలో త్రిత్వపు ఉనికి (Trinity in Creation)

సృష్టి కార్యంలో ముగ్గురు వ్యక్తుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తుంది:

తండ్రి సంకల్పం: దేవుడు ఆకాశమును భూమిని సృజించెను (ఆది 1:1).

పరిశుద్ధాత్మ కదలిక: దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను (ఆది 1:2).

కుమారుని ద్వారా: సమస్తమును ఆయన ద్వారా కలిగెను (యోహాను 1:3; కొలస్సయి 1:16).

బహువచన సంబోధన: దేవుడు "మన పోలిక చొప్పున మన స్వరూపమందు..." అని మాట్లాడుకున్నారు (ఆది 1:26).

 

3. ముగ్గురు వ్యక్తులు - ఒకే దైవత్వం (Co-Equality)

దైవత్వంలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు. ముగ్గురూ దేవుడే:

తండ్రి దేవుడు: "మన తండ్రియైన దేవుడు..." (1 కొరింథీ 1:3).

కుమారుడు దేవుడు: "వాక్యము దేవుడై యుండెను" (యోహాను 1:1). "ఆయనే నిజమైన దేవుడు" (1 యోహాను 5:20).

పరిశుద్ధాత్ముడు దేవుడు: పేతురు అననీయతో మాట్లాడుతూ, నీవు పరిశుద్ధాత్మను మోసపుచ్చావు... నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు అని చెప్పాడు (అపొ.కా 5:3-4).

 

4. వ్యక్తుల మధ్య భేదం (Distinction of Persons)

వీరు ముగ్గురూ ఒక్కరే అయితే, ఒకరు మరొకరితో ఎలా మాట్లాడుకుంటారు?

యేసు బాప్తిస్మం: కుమారుడు నీళ్లలో ఉన్నాడు, తండ్రి ఆకాశము నుండి మాట్లాడాడు, పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగివచ్చాడు (మత్తయి 3:16-17). ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా కనిపిస్తున్నారు.

యేసు ప్రార్థన: యేసు తండ్రికి ప్రార్థన చేశాడు. ఆయన తండ్రే అయితే ఆయన తనలో తాను ప్రార్థన చేసుకోడు కదా! (యోహాను 17:1).

ఆదరణకర్త: "నేను తండ్రిని వేడుకొందును, ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును" (యోహాను 14:16). ఇక్కడ యేసు (1), తండ్రి (2), ఆదరణకర్త (3) ముగ్గురు వ్యక్తులుగా సూచించబడ్డారు.

 

ముగింపు (Sermon Summary):

దేవుడు ఒక్కడే (Nature), కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా (Persons) ఉన్నాడు. ఇది మన రక్షణ ప్రణాళికలో అత్యంత ముఖ్యం. తండ్రి ప్రేమించి, కుమారుని పంపి, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని శుద్ధి చేస్తున్నాడు.

ఆమెన్!

త్రిత్వము (Trinity)

(నాలుగవ భాగము)

 

పాత నిబంధనలో త్రిత్వపు ప్రత్యక్షతలు:

🧚‍యెహోవా దూత

 

పరిచయం: పాత నిబంధనలో అనేక చోట్ల "యెహోవా దూత" అనే ప్రస్తావన వస్తుంది. ఈ దూత సామాన్యమైన దేవదూత కాదు. ఎందుకంటే సామాన్య దేవదూతలు తమకు తాముగా ఆరాధన తీసుకోరు, కానీ ఈ దూత దేవునిగా మాట్లాడారు మరియు ఆరాధనను స్వీకరించారు.

 

1️    మండుచున్న పొద

 

1. మండుచున్న పొద - ఒక అద్భుత మర్మం (నిర్గమ 3:1-6)

మోషే గారు హోరేబు కొండ దగ్గర మండుచున్న పొదను చూసినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ గమనించండి:

లేఖనం: "యెహోవా దూత పొద నడిమిని అగ్నిజ్వాలలో ఆయనకు కనబడెను" (నిర్గమ 3:2).

ట్విస్ట్: పొదలో ఉన్నది "దూత" అయితే, అదే పొద నడిమినుండి మాట్లాడింది ఎవరు? "దేవుడు ఆ పొద నడిమినుండి మోషేను పిలిచి..." అని వ్రాయబడింది (నిర్గమ 3:4).

👉 విశ్లేషణ: ఇక్కడ దూత మరియు దేవుడు ఒకే వ్యక్తిగా కనిపిస్తున్నారు. తండ్రి అయిన దేవుని ద్వారా పంపబడిన వారు (దూతగా), అదే సమయంలో స్వయంగా దేవుడై ఉన్నవారు (దేవునిగా). ఇది కుమారుడైన దేవుని ప్రత్యక్షత (Christophany) తప్ప వేరొకటి కాదు.

 

2️   గిద్యోను గారి అనుభవం

 

2. గిద్యోను గారి అనుభవం (న్యాయాధిపతులు 6:11-23):

యెహోవా దూత గిద్యోను గారికి ప్రత్యక్షమైనప్పుడు:

మొదట "యెహోవా దూత" అని పిలవబడ్డారు (న్యాయాధి 6:11).

ఆ తర్వాత వచనంలో "యెహోవా ఆయనను చూచి... నీ బలముతో వెళ్లుము" అని సెలవిచ్చారు (న్యాయాధి 6:14).

👉 విశ్లేషణ: ఇక్కడ కూడా దూత మరియు యెహోవా పదాలు ఒకరికే వాడబడ్డాయి. దేవుని ప్రత్యక్షత మానవ రూపంలో లేదా దూత రూపంలో వచ్చినప్పుడు, అది త్రిత్వంలోని రెండవ వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి.

 

ప్రియ నేస్తమా!

లోకంలో రాయబారి (Ambassador) అనే వ్యక్తి రాజు పంపితే వస్తాడు, కానీ తనే రాజు అవ్వడు. అయితే పరలోక రాజ్యంలో, తండ్రి పంపిన "దూత" స్వయంగా దేవుడై ఉన్నారు.

పొద కాలిపోకుండా మండుతున్నట్లుగా, దేవుని కృప మనల్ని దహించదు కానీ పవిత్రపరుస్తుంది.

మోషే గారు పొద దగ్గర చెప్పులు విడిచినట్లుగా, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన లోకపు ఆలోచనలను, అపవిత్రతను విడిచిపెట్టాలి.

👉దేవుడు ఏకాకి కాదు, ఆయన ఆదినుండి తన కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తనను తాను బయలుపరచుకుంటున్నారు. పాత నిబంధనలోని ఈ ఛాయలు కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా పరిపూర్ణమయ్యాయి.

 

3️     అబ్రాహాము గారికి ముగ్గురు వ్యక్తుల దర్శనం:

 

అబ్రాహాము గారు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో కూర్చున్నప్పుడు, ఆయనకు ముగ్గురు వ్యక్తులు ఎదురుగా నిలబడి కనిపించారు. ఇది కేవలం దేవదూతల సందర్శనం మాత్రమే కాదు, ఇందులో త్రిత్వపు మర్మం దాగి ఉంది.

 

1. ముగ్గురు వ్యక్తులు - ఏకవచన సంబోధన:

అబ్రాహాము గారు ఆ ముగ్గురు వ్యక్తులను చూసినప్పుడు, ఆయన చేసిన ప్రార్థన చాలా విచిత్రంగా, ఆలోచింపజేసేలా ఉంటుంది.

లేఖనం: "ఆయన కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు ఆయన ఎదుట నిలిచియుండిరి... ఆయన వారిని చూచి... నేలమట్టుకు వంగి నమస్కారము చేసిప్రభువా, నీ కటాక్షము నామీద ఉన్నయెడల..." (ఆదికాండము 18:2-3).

👉 విశ్లేషణ: అక్కడ ఉన్నది ముగ్గురు వ్యక్తులు (Plural), కానీ అబ్రాహాము గారు వారిని "ప్రభువా" (Lord - Singular) అని ఏకవచనంతో సంబోధించారు. "ప్రభువులారా" అని అనలేదు. అంటే అబ్రాహాము గారు ఆ ముగ్గురిలో ఉన్న "దేవుని ఏకత్వాన్ని" ఆత్మలో గుర్తించారు.

2. యెహోవా అని సంబోధించబడటం:

ఆ ముగ్గురిలో ఒకరు ప్రత్యేకంగా "యెహోవా" గానే మాట్లాడారు.

అబ్రాహాము గారితో మాట్లాడుతూ"వచ్చే ఏడాది ఈ కాలానికి నేను నిశ్చయముగా నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడు" అని చెప్పారు (ఆదికాండము 18:10).

ఆ తర్వాత వచనాల్లో"యెహోవా అబ్రాహాముతో ఇట్లనెను..." అని స్పష్టంగా వ్రాయబడింది (ఆదికాండము 18:13).

👉 విశ్లేషణ: వీరిలో ఒకరు యెహోవా (కుమారుడైన దేవుని ప్రత్యక్షత), మిగిలిన ఇద్దరు దేవదూతల రూపంలో ఉన్న ఆత్మ స్వరూపులు అని పండితులు వివరిస్తారు. ఆ ముగ్గురి కలయిక దేవుని సాన్నిధ్యాన్ని సూచిస్తుంది.

3. తీర్పు తీర్చే అధికారం:

సొదొమ గొమొర్రాల పాపాన్ని విచారించడానికి వెళ్ళేటప్పుడు కూడా, ఆ ముగ్గురిలో ఒకరు అక్కడే ఉండి అబ్రాహాము గారితో సంభాషించారు.

️ "సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?" అని అబ్రాహాము గారు ఆ వ్యక్తిని ప్రశ్నించారు (ఆదికాండము 18:25).

👉 తీర్పు తీర్చే అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంది. ఆ ముగ్గురిలో ఒకరుగా దేవుడే అబ్రాహాము గారి అతిథ్యాన్ని స్వీకరించి, తన ప్రణాళికను స్నేహితుడితో పంచుకున్నారు.

 

ప్రియ నేస్తమా!

అబ్రాహాము గారు ఆ ముగ్గురు వ్యక్తులను చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆతిథ్యం ఇచ్చారు.

దేవుడు మన ఇంటికి వస్తే: మనం దేవుని గుర్తించగలుగుతున్నామా? అబ్రాహాము గారు ముగ్గురిని చూసినా, దేవుని స్వరాన్ని ఒక్కటిగానే విన్నారు.

విశ్వాసం: కంటికి ముగ్గురు కనిపించినా, హృదయం ఒక్క దేవుడినే ఆరాధించాలి. ఇదే త్రిత్వపు సత్యంముగ్గురు వ్యక్తులు, కానీ ఒక్కరే దేవుడు.

 

ముగింపు:

అబ్రాహాము గారికి కలిగిన ఈ దర్శనం త్రిత్వ సిద్ధాంతానికి పాత నిబంధనలోనే ఒక బలమైన సాక్ష్యం. దేవుడు తన ప్రజలతో సహవాసం చేయడానికి ఇష్టపడే త్రియేక దేవుడు.

ఆమెన్!

త్రిత్వము (Trinity)

ఐదవ  భాగము

 

యేసుక్రీస్తు వారి బాప్తిస్మము: త్రియేక దేవుని ప్రత్యక్షత🕊️

 

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. (మత్తయి 3:16,17)

 

త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు (తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ) ఒకే దేవుడైనప్పుడు, వారి మధ్య సంభాషణ లేదా సంబంధం ఎలా ఉంటుంది?

 

సాధారణ వివరణ:

 

త్రిత్వము అనేది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే కాదు, అది ఒక "ప్రేమపూర్వక సహవాసం". దేవుడు ఏకాకి కాదు; ఆయనలో ఆయనే నిత్యము సహవాసం చేస్తూ ఉంటారు. దీనిని అర్థం చేసుకోవడానికి ఈ క్రింది విషయాలు  సహాయపడతాయి:

 

1. నిరంతర ప్రేమ సంభాషణ (Eternal Fellowship)

దేవుడు ప్రేమాస్వరూపి అని మనం చదువుతాము. ప్రేమ అనేది ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తమవ్వదు; ప్రేమించడానికి ఒకరు ఉండాలి. లోకం పుట్టకముందే తండ్రి కుమారుడిని ప్రేమిస్తూ, కుమారుడు తండ్రిని ఘనపరుస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రేమ ప్రవహిస్తూ ఉండేది. వారి మధ్య జరిగే సంభాషణ మనలాంటి మాటల కంటే ఎక్కువగా "సంకల్పం మరియు చిత్తం" (Divine Will) ద్వారా జరుగుతుంది.

2. మనస్సుల ఐక్యత (Unity of Mind)

త్రిత్వములోని ముగ్గురు వ్యక్తుల మధ్య ఎప్పుడూ విభేదాలు ఉండవు. తండ్రి ఏది ఆలోచిస్తారో, కుమారుడు దానిని నెరవేరుస్తారు, పరిశుద్ధాత్మ దానిని స్థిరపరుస్తారు.

👉ఉదాహరణకు: ఒకే శరీరంలోని మన కళ్లు, చేతులు, మెదడు వేర్వేరు పనులు చేసినా, అవన్నీ ఒకే ఆలోచనతో ఎలా పనిచేస్తాయో, త్రియేక దేవునిలో ముగ్గురు వ్యక్తులు అలా ఒకే చిత్తంతో మాట్లాడుకుంటారు.

 

3. కార్య విభజనలో సంభాషణ:

రక్షణ ప్రణాళికలో వారు ఎలా మాట్లాడుకున్నారో గమనిస్తే:

సృష్టిలో: "మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము" అని వారు చర్చించుకున్నారు. అంటే సృష్టి అనేది వారి ఉమ్మడి నిర్ణయం.

యేసు భూమి మీద ఉన్నప్పుడు: యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేసేవారు. అక్కడ తండ్రి వేరుగా, కుమారుడు వేరుగా ఉన్నట్లు మనకు అనిపించినా, అది కేవలం మన రక్షణ కోసం ఆయన తీసుకున్న మానవ రూపం వల్ల జరిగిన సంభాషణ. కానీ ఆత్మలో వారు ఎప్పుడూ ఒకటే.

 

4. ఒకరిని ఒకరు ఘనపరుచుకోవడం:

వారి సంభాషణలో ముఖ్యమైన లక్షణం "హెచ్చించుకోవడం":

తండ్రి కుమారుడిని హెచ్చిస్తారు ("ఈయన నా ప్రియ కుమారుడు").

కుమారుడు తండ్రిని మహిమపరుస్తారు ("నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక").

పరిశుద్ధాత్మ క్రీస్తును చూపిస్తారు.

 

👉ఉదాహరణ: సూర్యుడు, సూర్యరశ్మి, మరియు వేడి (Heat) మూడూ వేర్వేరుగా అనిపించినా అవి సూర్యుని నుండి వేరు చేయలేము. సూర్యుడు ప్రకాశించినప్పుడు, వేడి మరియు వెలుగు రెండూ కలిసి పని చేస్తాయి. అలాగే త్రియేక దేవునిలో సంభాషణ అనేది ఒక అద్భుతమైన, విడదీయలేని ఐక్యత.

 

త్రిత్వంలోని సంభాషణ అనేది మనుష్యుల మధ్య ఉండే శబ్దం కంటే, ఒకే ఆత్మలో ఉండే అగాధమైన అవగాహన. వారిలో వారు ఎప్పుడూ సంపూర్ణ ఆనందంతో, ప్రేమతో సహవాసం చేస్తూనే ఉంటారు.

 

లేఖనముల వివరణ:

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.(మత్తయి సువార్త 3:16,17)

 

పరిచయం: పాత నిబంధనలో త్రిత్వపు ఛాయలు (Shadows) చూశాము, కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు యొర్దాను నదిలో బాప్తిస్మము పొందినప్పుడు, త్రిత్వము ఒకే సమయంలో "ప్రత్యక్షము" (Manifestation) అయ్యింది. ఇది క్రైస్తవ విశ్వాసానికి అతిపెద్ద పునాది.

 

1. ముగ్గురు వ్యక్తులు - ఒకే సందర్భం:

మత్తయి సువార్తలో ఈ అద్భుత దృశ్యాన్ని మనం చూడవచ్చు. అక్కడ త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు వేర్వేరు రూపాల్లో, వేర్వేరు పనులలో కనిపిస్తారు:

కుమారుడైన దేవుడు: యేసుక్రీస్తు వారు స్వయంగా నదిలో బాప్తిస్మము పొందుతున్నారు.

పరిశుద్ధాత్మ దేవుడు: దేవుని ఆత్మ పావురం వలె దిగి ఆయన మీదకు వచ్చారు.

తండ్రి అయిన దేవుడు: "ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను" అని ఆకాశము నుండి వాణి వినబడింది.

 

2. ఈ ప్రత్యక్షత ప్రాముఖ్యత:

👉 విశ్లేషణ: కొందరు దేవుడు ఒక్కరే అని, ఆయనే ఒక్కోసారి ఒక్కో వేషంలో కనిపిస్తారని పొరబడతారు (Modalism). కానీ ఇక్కడ:

కుమారుడు భూమి మీద ఉన్నారు.

ఆత్మ ఆకాశము నుండి దిగి వస్తున్నారు.

తండ్రి ఆకాశము నుండి మాట్లాడుతున్నారు.

దీనిని బట్టి త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు వేర్వేరు వ్యక్తులని, కానీ ఒక్కరే దేవుడని మనకు స్పష్టమవుతోంది.

 

3. బాప్తిస్మము - ఆజ్ఞ:

యేసుక్రీస్తు వారు తన పరిచర్య ముగింపులో కూడా ఈ త్రిత్వ నామములోనే బాప్తిస్మము ఇవ్వమని ఆజ్ఞాపించారు:

లేఖనం: "మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు..." (మత్తయి 28:19).

👉 గమనిక: ఇక్కడ "నామములలోనికి" (Names - Plural) అనలేదు, "నామములోనికి" (Name - Singular) అని ఏకవచనం వాడబడింది. అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నా, వారి అధికారం మరియు నామం ఒక్కటే.

 

ఆత్మీయ సారాంశం:

యేసుక్రీస్తు వారి బాప్తిస్మము త్రిత్వ సత్యానికి అతిపెద్ద నిదర్శనం. తండ్రి సాక్ష్యం ఇస్తున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకిస్తున్నారు, కుమారుడు లోక రక్షణ కోసం తన్ను తాను సమర్పించుకుంటున్నారు.

 

 

త్రిత్వము (The Trinity)

ఆరవ భాగము

 

పరిచయం: త్రిత్వ మర్మాన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిత్వాన్ని లేదా దైవత్వాన్ని తక్కువగా అంచనా వేస్తుంటారు. కానీ బైబిల్ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి మరియు కుమారుడితో సమానమైన అధికారం, ఉనికి కలిగిన దేవుడని ప్రకటిస్తోంది. ఈ భాగంలో ఆ అద్భుత సత్యాలను ధ్యానిద్దాం.

 

1. పరిశుద్ధాత్మ దేవుడు - ఒక శక్తి మాత్రమే కాదు, ఒక వ్యక్తి:

చాలామంది పరిశుద్ధాత్మను కేవలం ఒక విద్యుత్ శక్తి (Power) లాగానో లేదా గాలి లాగానో భావిస్తారు. కానీ ఆయన ఒక దైవిక వ్యక్తి (Divine Person). ఎందుకంటే ఆయనకు మనసు, చిత్తం మరియు భావోద్వేగాలు ఉన్నాయి:

జ్ఞానం (Mind): ఆత్మ దేవుని మర్మములను ఎరుగును.

చిత్తం (Will): ఆయన తన చిత్తానుసారంగా ఒక్కొక్కరికి కృపావరములను పంచుతారు.

దుఃఖము (Emotions): "దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి".

👉 గమనిక: ఒక శక్తికి దుఃఖం ఉండదు, కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన మనతో మాట్లాడే, మనల్ని ప్రేమించే దేవుడు.

 

2. సృష్టిలో త్రిత్వపు సమ్మేళనం:

సృష్టి కార్యంలో ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేశారు. ఇది వారి ఐక్యతకు నిదర్శనం:

తండ్రి: ప్లాన్ చేసిన వారు (The Architect).

కుమారుడు: ఆయన మాట (వాక్కు) ద్వారానే సమస్తము కలిగెను.

పరిశుద్ధాత్మ: సృష్టిని క్రమబద్ధం చేసి, జీవాన్ని పోశారు. "దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను".

👉 "మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము" అని దేవుడు అన్నప్పుడు, అక్కడ త్రిత్వము ఒకే నిర్ణయంతో పనిచేశారని అర్థమవుతోంది.

 

3. ముగ్గురు వ్యక్తులు - ఒకే దైవత్వం (Co-Equality):

త్రిత్వంలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు. ముగ్గురూ సమానమైన దైవత్వం కలిగిన వారు:

తండ్రి దేవుడు:.

కుమారుడు దేవుడు: "ఆ వాక్యము దేవుడై ఉండెను".

పరిశుద్ధాత్మ దేవుడు: అపొస్తలుల కార్యములు 5:3-4 లో అననీయ పరిశుద్ధాత్మతో అబద్ధమాడినప్పుడు, పేతురు గారు "నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి" అని స్పష్టం చేశారు.

 

4. రక్షణ ప్రణాళికలో ముగ్గురి కార్యాలు:

మనం రక్షించబడటం వెనుక త్రిత్వపు అద్భుతమైన టీమ్ వర్క్ ఉంది:

️1. తండ్రి: మనల్ని ముందుగా ఎరిగి, రక్షణ కోసం ఎన్నుకున్నారు.

️2. కుమారుడు: సిలువలో బలియాగమై మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశారు.

️3. పరిశుద్ధాత్మ: వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించి, మారుమనస్సు కలిగించి, మనల్ని దేవుని బిడ్డలుగా ముద్రించారు.

 

5. అపొస్తలుల ఆశీర్వాదం - త్రిత్వ ముద్ర:

క్రైస్తవ సంఘాల్లో ఆరాధన ముగింపులో ఇచ్చే దీవెన కేవలం ఒక సాంప్రదాయం కాదు, అది త్రిత్వపు సంపూర్ణతను ప్రకటించడం.

లేఖనం: "ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేముయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికిని తోడైయుండును గాక." (2 కొరింథీ 13:14).

👉 విశ్లేషణ: ఇక్కడ అపొస్తలుడైన పౌలు ముగ్గురు వ్యక్తుల నుండి వచ్చే మూడు వేర్వేరు ఆశీర్వాదాలను ఒకే ప్రార్థనలో కోరుతున్నారు. ఈ మూడు లేకపోతే మన ఆత్మీయ జీవితం పరిపూర్ణం కాదు.

 

6. మన ప్రార్థనలో త్రిత్వ పాత్ర:

మనం ప్రార్థించే విధానంలో కూడా త్రిత్వము ఇమిడి ఉంది:

️1. మనం ప్రార్థన చేసేది తండ్రి అయిన దేవునికి.

️2. మనం ప్రార్థన చేసేది కుమారుడైన యేసుక్రీస్తు నామములో.

️3. మనల్ని ప్రార్థించమని ప్రేరేపించి, నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు.

 

7. నిత్యత్వంలో త్రిత్వము:

దేవుడు ఆదిలో ఎలా త్రిత్వంగా ఉన్నారో, నిత్యత్వంలో కూడా అలాగే ఉంటారు. ప్రకటన గ్రంథంలో పరలోకపు ఆరాధనను గమనిస్తే, సింహాసనం మీద తండ్రి, గొర్రెపిల్లగా యేసుక్రీస్తు, మరియు ఏడు ఆత్మలుగా పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తారు. పరలోక సైన్యం "పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు" అని మూడుసార్లు కొనియాడటం వారి త్రియేక స్వభావాన్ని నిరంతరం ఘనపరచడమే.

 

8. మన జీవితానికి అన్వయం:

దేవుడు తనలో తాను ఎంత ఐక్యతగా ఉన్నారో, మన సంఘాలు మరియు కుటుంబాలు కూడా అంత ఐక్యతగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. త్రిత్వము అంటే ఐక్యతలో వైవిధ్యం (Unity in Diversity). వ్యక్తులు వేరైనా లక్ష్యం ఒక్కటే.

 

ముగింపు:

దేవుడు మనుష్యులకు అర్థం కావడానికి అందని పరమ రహస్యం కాదు, మనల్ని ప్రేమించి తనను తాను బయలుపరచుకున్న ప్రేమామయి. సృష్టించిన తండ్రికి, రక్షించిన కుమారునికి, పరిశుద్ధపరిచే ఆత్మ దేవునికి సదాకాలము మహిమ కలుగును గాక! ఆమెన్!

త్రిత్వము (The Trinity)

ఏడవ భాగము

1. అద్వితీయ దేవునిలో ముగ్గురు వ్యక్తులు (The Mystery of Oneness):

దేవుడు ఒక్కడే అని లేఖనాలు ఖచ్చితంగా చెబుతున్నాయి (ద్వితీయోపదేశకాండము 6:4). అయితే ఆ ఒక్క దేవునిలోనే ముగ్గురు వ్యక్తులు నిత్యత్వము నుండి సహవాసము కలిగి ఉన్నారు. దీనిని మనం మూడు ముఖ్యమైన సత్యాల ద్వారా అర్థం చేసుకోవాలి:

 

సమానత్వము (Equality): తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురూ దైవత్వంలో సమానులు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.

వైవిధ్యము (Distinction): తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు. ముగ్గురి బాధ్యతలు వేర్వేరు.

ఏకత్వము (Unity): వారు ముగ్గురు వేర్వేరు దేవుళ్ళు కాదు, కానీ ఒకే స్వభావము కలిగిన ఏకైక దేవుడు.

 

2. రక్షణ కార్యంలో త్రిత్వము (Trinity in Salvation):

మన రక్షణ అనేది కేవలం ఒక వ్యక్తి చేసిన పని కాదు, అది త్రిత్వ దేవుని సమిష్టి కార్యం:

తండ్రి అయిన దేవుడు: లోకాన్ని ప్రేమించి, తన కుమారుని పంపాలని సంకల్పించారు (Plan).

కుమారుడైన దేవుడు: తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనిషిగా వచ్చి, సిలువలో రక్తాన్ని చిందించారు (Purchase).

పరిశుద్ధాత్మ దేవుడు: క్రీస్తు చేసిన ఆ రక్షణ కార్యాన్ని మన హృదయాలలో ముద్రించి, మనల్ని నూతనంగా జన్మింపజేస్తున్నారు (Apply).

 

3. త్రిత్వము యొక్క ప్రాముఖ్యత (Why it Matters?):

దేవుడు ప్రేమ స్వరూపి: దేవుడు సృష్టిని నిర్మించక ముందే ఆయనలో ప్రేమ ఉంది. ఎందుకంటే తండ్రి కుమారుని ప్రేమిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమను పంచుకుంటూ ఉండేవారు.

మన ప్రార్థన జీవితం: మనం తండ్రికి ప్రార్థిస్తాము, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాము, పరిశుద్ధాత్మ మనలో ఉండి ప్రార్థన చేయిస్తారు.

దేవుని వాక్కు: ఆదిలో వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇది క్రీస్తు దైవత్వానికి అతిపెద్ద రుజువు.

 

4. ప్రాముఖ్యమైన లేఖన ఆధారాలు (Final Evidence):

యేసు బాప్తిస్మము: కుమారుడు నీళ్లలో ఉన్నారు, తండ్రి ఆకాశము నుండి మాట్లాడారు, పరిశుద్ధాత్మ పావురము వలె దిగివచ్చారు. ముగ్గురు వ్యక్తులు ఒకేచోట ప్రత్యక్షమయ్యారు.

మహా ఆజ్ఞ (The Great Commission): "తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు..." అని యేసు చెప్పారు. ఇక్కడ 'నామములు' (Plural) అనలేదు, 'నామము' (Singular) అన్నారు. అంటే ముగ్గురిది ఒకే పేరు, ఒకే అధికారం.

 

ముగింపు (The Conclusion):

త్రిత్వము అనేది ఒక సిద్ధాంతం మాత్రమే కాదు, అది దేవునితో మనకు ఉన్న "సహవాసం". తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ ఆదరణ మనల్ని నిత్యత్వం వైపు నడిపిస్తాయి.

 

My Dear Brothers & Sisters!

ఇంతవరకు త్రిత్వమును గూర్చిన కొన్ని తలంపులు కలసి ధ్యానించడానికి ప్రభువు కృపజూపారు. మరింత ప్రార్ధన పూర్వకంగా ధ్యానించగలిగితే పరిశుద్ధాత్ముడు మనలను సర్వ సత్యములోనికి నడిపించగలరు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!

 

                   - THE END -

 

రచన: [బ్రదర్. సుధాకర్ బాబు కోన / ప్రభువుతో ప్రాతఃకాల సమయం”, “నిరీక్షణ ద్వారంపరిచర్యలు ]

 

📢 గమనిక: ఈ సందేశం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాము. కంటెంట్ లో ఎట్లాంటి మార్పులు చెయ్యకుండా షేర్ చేసి, మీరునూ ప్రభువు పరిచర్యలో పాలిభాగస్తులుకాగలరు. వందనములు!

Email:       krajsudha2@gmail.com

https://www.facebook.com/share/p/1M7UhnTtxj/?mibextid=wwXIfr


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు

సప్త సూక్తులు - యేసు ప్రభువు వారు సిలువలో పలికిన ఏడు మాటలు

పాపము

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

శరీర కార్యములు

సమరయ స్త్రీ

శిలువ శ్రమలు

బాప్తిస్మం

అబ్రాహాము విశ్వాసయాత్ర

విశ్వాసము