సప్త సంఘములు
💒 *సప్త సంఘములు* 💒
(మొదటి భాగము)⭕ *ఎఫెస్సీ సంఘము :* ⭕
(Part-1)
ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును. అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేనుకూడ వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
ప్రకటన 2:1-7
🔅 *ఎఫెసు అనగా?*
🔹 సంపూర్ణ ఉద్దేశ్యము కలది అని అర్ధము.
🔅 *ఎఫెసు యొక్క ప్రస్తుత నామము?*
🔹 సలూక్
🔅 *ప్రసంశ:*
🔹 క్రియలు చేయువాడవు.
🔹 కష్టపడువాడవు.
🔹 సహనము కలిగియున్నావు.
🔹 దుష్టులను సహింపలేవు.
🔹 అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి, వారు అబద్ధికులని కనుగొన్నావు.
🔹 భారము భరించావు.
🔹 అలసిపోలేదు.
🔹 నికోలాయితుల క్రియలను ద్వేషిస్తున్నావు.
🔅 *తప్పు:*
🔹 మొదట నీకుండిన ప్రేమను వదిలివేసావు.
🔅 *పురికొల్పు:*
🔹 నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము
🔅 *హెచ్చరిక:*
🔹 నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.
🔅*ప్రతిఫలము:*
🔹 జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింపనిత్తును.
🏨 *ఎఫెస్సీ:* 🏨
🔹 ఎఫెస్సీ పట్టణము ఏడు పట్టణాలలో అతి ప్రాముఖ్యమైన పట్టణం.
🔹 దీనికి “ఆసియా వెలుగు” అనే పేరు.
🔹 రోమా పరిపాలనలో ఇది ఆసియా కేంద్ర స్థానం.
🔹 పూర్వకాలమందలి ప్రపంచ ఏడు వింతలలో ఒకటి అయిన ఆర్తిమిదేవి ఆలయం ఇక్కడ ఉండెను.
🔹 ఇది ఒక మత కేంద్రం. (అపో 19:24)
🔹 మా౦త్రికులయొక్క ముఖ్య స్థానం. (అపో 19:19)
🔹 25,000 మంది కూర్చోడానికి వీలుగల పెద్ద స్టేడియం ఇక్కడ ఉండెను.
🔹 అపొస్తలుడైన పౌలు మూడు సంవత్సరములు ఇక్కడ పరిచర్య చేసెను.
🔹 యోహాను శిష్యుడైన అపొల్లో ఇక్కడ సువార్త ప్రకటించెను.
🔹 ఆకుల, ప్రిస్కిల్ల యిక్కడ ఉండిరి.
🔹 పౌలు పరిచర్య అనంతరము తిమోతి యిక్కడ సేవ చేసెను.
🔹 అపొస్తలుడైన యోహాను వృద్ధాప్యంలో ఇక్కడే జీవించెననెడి అభిప్రాయం కలదు.
🔺 *ఎఫెస్సీ సంఘమునకు ప్రభువు తనను తాను చేసుకొంటున్న పరిచయము:*
ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు:
యోహాను గారి ద్వారా వర్తమానం పంపబడుచున్న సంఘాలు ఏడు. ఇవి దేవుడు అంగీకరించిన సంఘములు అని భావించవచ్చు. అయితే, వాటికి వ్రాయబడిన విషయాలు మనమెందుకు ధ్యానించాలి? “ఆత్మ సంఘముతో చెప్పు సంగతులు చెవిగలవాడు వినునుగాక!” అనే మాట సార్వత్రిక సంఘానికి సంబంధించినది. అందుచే ఈ వర్తమానం మనకునూ అవసరమే. ఎందుకంటే? ఈ ఏడు సంఘాలలోనున్న లోపములే, ప్రపంచ వ్యాప్తంగానున్న అన్ని సంఘాలలోనూ వున్నాయి. సంఘ జన్మదినమైన పెంతెకోస్తు నుండి ప్రభువు రాకడ వచ్చేవరకు మధ్యకాలము, ఏడు సంఘ కాలములకు సాదృశ్యముగా వున్నాయి. ఇప్పుడు మనము కృపాయుగములో, ఏడవ సంఘకాలమైన లవొదికయ సంఘకాలంలో నున్నాము.
🔺 *పరిశుద్ధ గ్రంధములో ఏడు అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యం.*
🔹 దేవుడు తన పనిని పూర్తిచేసి ఏడవ దినమును విశ్రమించెను.
🔹 ఏడవ దినమును దేవుడు ఆశీర్వదించును. (ఆది 2:2)
🔹 ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరించాలి. (నిర్గమ 12:15; సంఖ్యా 29:12)
🔹 బలి పశువు రక్తము యాజకుడు యెహోవా సన్నిధిలో ఏడు సార్లు జల్లవలెను.
(లేవీ 14:16)
🔹 కుష్టు శుద్ధీకరణ కొరకు ఏడు మారులు జల్లాలి. (లేవీ 14:7)
🔹 నయమాను కుష్టు పోవాలంటే, ఏడు సార్లు యొర్దానులో మునగాలి. (రాజులు 5:10)
🔹 యెరికో పట్టణం కూలాలంటే, యాజకులు ఏడుమారులు తిరగాలి. (యెహోషువా 6:4)
🔹 ప్రభువైన క్రీస్తు సిలువలో పలికిన మాటలు ఏడు.
🔹 ప్రారంభ సంఘములో పరిచర్యకొరకు ఏర్పాటు చేయబడినవారు ఏడుగురు.
🔹 ఏడు దీప స్తంభములు
🔹 ఏడు సువర్ణ దీపములు
🔹 ఏడు నక్షత్రములు
🔹 ఏడు ఆత్మలు
🔹 ఏడు కన్నులు
🔹 ఏడు ముద్రలు
🔹 ఏడు బూరలు
🔹 ఏడు పాత్రలు .... ఇట్లా ఒక్క ప్రకటన గ్రంధములోనే ఏడు అనే సంఖ్య 54 సార్లు ప్రస్తావించబడింది.
*ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు: ప్రభువైన యేసు క్రీస్తు*
ఏడు నక్షత్రములు అనగా “ఏడు సంఘములకు దూతలు” (అనగా కాపరులు). ఏడు దీప స్తంభములు అనగా “ఏడు సంఘములు.”
ప్రకటన 1:20
*సంచరించువాడు అనగా?* సంఘము తన సన్నిధిలో కలదని అర్ధము. సంఘమును కట్టువాడు సంఘాలలో సంచారము చేయు చున్నాడు.
నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువు లను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించు చుండును
ద్వితీ 23:14
*ప్రియ నేస్తమా!*
పరిపూర్ణుడైన దేవుడు, మన మధ్య సంచరిస్తున్నప్పుడే ఆయనను చేర్చుకోగలగాలి. ఆయన దాటిపోతే? మన జీవితాలకు సార్ధకత లేదు. ఆయనను మన హృదయాల్లో చేర్చుకొని, ఆయనకోసం, ఆయనతో అనునిత్యమూ జీవిద్దాం!
*అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
💒 *సప్త సంఘములు* 💒
(రెండవ భాగము)*ఎఫెస్సీ సంఘము :* 🕊
(Part- 2)
నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొ స్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.
అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేనుకూడ వీటిని ద్వేషించుచున్నాను.
ప్రకటన 2:2,3,6
🔅*ఎఫెస్సీ సంఘానికి ప్రభువిచ్చిన ప్రశంస :*
🔹 క్రియలు చేయువాడవు.
🔹 కష్టపడువాడవు.
🔹 సహనము కలిగియున్నావు.
🔹 దుష్టులను సహింపలేవు.
🔹 అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొన్నావు.
🔹 భారము భరించావు.
🔹 అలసిపోలేదు.
🔹 నికోలాయితుల క్రియలను ద్వేషిస్తున్నావు.
ఎఫెస్సీ సంఘం కష్టాలను అనుభవించింది. కష్టాలను సహించింది. శ్రమలలో వారి క్రియలను కాపాడుకుంది.
*ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను.* అపొ. కార్యములు 19:23
🔅 అల్లరికి కారణం ఎవరు?
🔹 దేమేత్రి అనే కంసాలి.
🔅 అల్లరి ఎందుకు?
🔹 అతని ఆదాయం తగ్గినందుకు.
🔅 ఆదాయం తగ్గడానికి గల కారణం?
🔹 ప్రజలు విగ్రహాలకు వెండి గుళ్లను సమర్పించడం మానివేశారు.
🔅 అట్లా జరగడానికి కారకులెవరు?
🔹 అపొస్తలుడైన పౌలు
*అసలేమీ జరిగింది?*
ఎఫెస్సీ పట్టణంలో ఆర్తిమిదేవి ఆలయముంది. ఆ దేవతకు, దేమేత్రి అనే కంసాలి దగ్గర, ప్రజలు వెండి గుళ్లనుచేయించి దేవతకు సమర్పించడం ద్వారా, అతనికి చాలా లాభం వచ్చేది. ఆ కాలమందు, చేతులతో చేయబడేవి దేవతలు కాదని, పౌలు గారు ప్రకటించడంతో, ప్రజలు విశ్వసించి, ఆర్తిమిదేవికి వెండిగుళ్ళను అర్పించడం మానేశారు. దేమేత్రికి రాబడి లేకుండా పోయింది. దేమేత్రి తన స్వంత లాభాన్ని, దేవతకు ముడిపెట్టి, ఆర్తిమిదేవికి అవమానం అంటూ తనవారందరిని రెచ్చగొట్టి పట్టణంలో గలిబిలి సృష్టించాడు. దానితో అపొస్తలులతో పాటు, సంఘం కూడా చాలా కష్టాలను చవిచూడాల్సి వచ్చింది. (అపొ. కార్యములు 19:23-41)
*నేటి క్రైస్తవ సంఘాలలో స్వంత ప్రయోజనాన్ని, దేవునితో ముడిపెట్టి, రాజకీయాలు కొనసాగించే దేమేత్రిలు కోకొల్లలు.* ప్రభువు కావలసింది వీరు కాదుగాని, కష్టమైనా, నష్టమైనా, చివరకు మరణమైనా ప్రభువుకొరకు నమ్మకంగా జీవించేవారు కావాలి. అట్టి జీవితాన్ని ఎఫెస్సీ సంఘం జీవించగలిగింది. ప్రభువుచే ప్రశంసించబడింది.
*అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి.*
🔅 *అపొస్తలుడు అంటే?*
🔹 *“ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం దేవునిచేత పంపబడిన వాడు”* అని అర్ధం.
(నేటి దినాల్లో దాని అర్ధం మార్చుకున్నారు కాబోలు. నాకు తెలియదు. ఇప్పుడైతే సూటు, బూటు వేసుకొని ఏసీ కార్లలో తిరిగేవాళ్ళే అపొస్తలులు.)
బహుశా ఇట్లాంటోళ్లు అప్పుడు కూడా వున్నారు కాబోలు. మనమైతే, దేవునిని కూడా ప్రక్కనపెట్టేసి, వీరినే దేవునిలా గౌరవిస్తాము. కానీ, ఎఫెస్సీ సంఘస్థులు అట్లాంటివారు కాదు. దొంగ అపొస్తలులందరిని పట్టుకొని, ప్రక్కనబెట్టారు.
నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.
అపొ. కార్యములు 20:29
ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
1 యోహాను 4:1
ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
2 కొరింథీయులకు 11:13
🔅 *నేటి దినాల్లో దుర్భోధ దావానంలా వ్యాపిస్తుంది. ఏది వాస్తవమో తేల్చుకోలేక సతమతమవుతున్న విశ్వాసులు కోకొల్లలు.*
🔹 యెహోవా సాక్షులు
🔹 మొర్మాన్స్
🔹 బ్రెన్హ మైట్స్
🔹 జాంగిల్ జా
🔹 సబ్బాత్ ఆచరించకపోతే పరలోకం లేదు.
🔹 సున్నతి లేకుండా గమ్యం లేదు.
🔹 శరీరంతో పాపం చేస్తే తప్పేమీలేదు. ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి.
ఇట్లా లెక్కలేనన్ని దుర్భోధలు.
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; (మత్తయి 24:11)
నేటి దినాలలో పరిశుద్ధ గ్రంధాన్ని వక్రీకరించి బోధించే బోధకులను గుర్తించి, మన సంఘాలలో ప్రవేశించకుండా జాగ్రత్తపడడం మన ఆత్మీయ జీవితాలకు శ్రేయస్కరం. తద్వారా మనమునూ ప్రభుచే ప్రశంసలందుకోగలము.
🔅 *ఎఫెస్సీ సంఘము, ప్రభువు నిమిత్తము భారము భరించింది తప్ప, అలసిపోలేదు.*
తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడైయెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను.
1 రాజులు 19:4
అషేరా దేవి ప్రవక్తలకు, బయలు ప్రవక్తలకు ఎదురు నిలిచి, ఆకాశమునుండి అగ్నిని దింపిన, విశ్వాసవీరుడైన ఏలీయా అంటున్న మాటలివి. *“ఇంత మట్టుకు చాలును. నా ప్రాణమును తీసుకో”.* కారణమేమిటి?
యెజెబెలు తన ప్రాణం తీస్తానని కబురుపంపినప్పుడు, ఏలీయా దేవునితో అంటున్న మాటలివి. ఇంత మట్టుకు చాలు. అలసిపోయాను. ఇక పోరాటం చెయ్యలేను.
అయితే, విశ్వాస వీరుడైన ఏలియా సహితం అలసిపోయారేమో గాని, ఎఫెస్సీ సంఘస్థులు అలసిపోలేదట. అంతము వరకు సహించారు. ఇది ప్రభువే వారిని గురించి యిస్తున్న సాక్ష్యం.
మన గురించి ప్రభువు సాక్ష్యమియ్యాల్సి వస్తే, ఏమని చెప్తారు? అసలు చెప్పడానికి ఏముందని? ప్రభువు కొరకు ఏమి చేశామని? ఒక్కసారి మనలను మనమే పరిశీలన చేసుకొనే ప్రయత్నం చేద్దాం.
🔅 *ఎఫెస్సీ సంఘము నీకొలాయితుల క్రియలను ద్వేషించెను:*
“నికొలాయితులు” అనే గ్రీకు మాట, రెండు పదముల కలయిక.
నికొ - లోబరచుట
లావోస్ - ప్రజలు
*“నికొలాయితులు” అనగా ప్రజలను లోబరచుకొని పరిపాలించువారు అని అర్ధము.* ప్రజలను “యాజకులు, ప్రజలు” అనే రెండు గుంపులుగా విభజించి పరిపాలించేవారు. దీనికి ఆద్యుడు, సంఘ పరిచర్య కొరకు ఏర్పాటుచేయబడిన ఏడుగురు పరిచారకులలో ఒకడైన నికోలాసు అనే అభిప్రాయం వుంది.
అయితే, సంఘము మీద అధికారం ఎవ్వరికీ లేదు. సంఘములో పరిచర్య చెయ్యాలే తప్ప, పెత్తనం చెయ్యడానికి వీలులేదు. ఎందుకంటే? రక్షించబడిన వారంతా యాజకులే. (1పేతురు 2:4,9) రక్షించ బడినవారే సంఘములో సభ్యులు. కానీ, విచారమేమిటంటే? రక్షించబడడం మాట తర్వాత, అసలు రక్షణ అంటే, ఏమిటో కూడా తెలియని వారు, సంఘ కమిటీలలో చేరి, సంఘం మీద అధికారాన్ని చెలాయిస్తున్నారు. అట్లాంటివారినే సంఘ విశ్వాసులు ప్రోత్సహించడం బాధాకరం. అసలు దేవుని విధానం ఇది కానేకాదు.
ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?
1 తిమోతికి 3:5
అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములై యున్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుత ములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.
1కొరింధీ 12:27,28
సంఘమును పరిపాలించేవారముగా కాదుగాని, మన కుటుంబాలను క్రీస్తుకు అనుకూలమైన కుటుంబాలుగా సిద్ధపరుస్తూ, సంఘములో పరిచర్య చేసే జీవితాలను కలిగియుందము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(మూడవ భాగము)*ఎఫెస్సీ సంఘము :* 🕊
(Part- 3)
*అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.*
ప్రకటన 2:4
🔹 క్రియలు ఉన్నాయి.
🔹 కష్టపడుతున్నారు.
🔹 సహనము కలిగివున్నారు.
🔹 దుష్టులను సహించడం లేదు.
🔹 అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొంటున్నారు.
🔹 భారము భరించారు.
🔹 అలసిపోలేదు.
🔹 నికోలాయితుల క్రియలను ద్వేషిస్తున్నారు.
అయిననూ, ఒకటి కొదువగా వుంది. అన్ని బానే వున్నాయి కాబట్టి, ఆ ఒక్క విషయంలో సర్దుకుపోతానని ప్రభువు చెప్పడం లేదు. వారిమీద తప్పు ఒకటి మోపుతున్నారు.
అవును! 99.9 శాతం కాదు. 100 శాతము ఆయన కోరుతున్నాడు. మోషే గురించి దేవుడిచ్చిన సాక్ష్యమేమిటో చూడండి.
మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడుకాడు. అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును.
సంఖ్యా 12:3-8
దేవుని చేత ఇట్లాంటి సాక్ష్యము పొందిన మోషే, ఒక దినాన్న, బండతో మాట్లాడమని దేవుడతనితో చెప్తే, బండను కొట్టాడు. ఏమి జరిగిందో తెలుసుకదా? దేవుడు సర్దుకుపోయాడా? లేదు. మోషే కనానును చూడగలిగాడు గాని, దానిలో అడుగు పెట్టలేకపోయాడు. ఆయన సర్దుకుపోయేవాడు కాదు. ఎందుకంటే? ఆయన ఏమైయున్నాడో, ఆయన బిడ్డలుకూడా అట్లానే వుండాలని కోరుతున్నాడు.
నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి.
1 పేతురు 1:14
🔅*తప్పు:*
💕 *మొదట నీకుండిన ప్రేమను వదిలివేసావు.*
ఎఫెస్సీ సంఘములో ప్రేమలేదు అని ప్రభువు చెప్పడం లేదు గాని, సంఘ ఆరభంలో వున్నంతటి ప్రేమ ఇప్పుడు లేదని వారి మీద తప్పు ఒకటి మోపుతున్నారు. అంటే? ప్రేమలో పరిపూర్ణత లోపించింది. మొదటి ప్రేమ ప్రాణములర్పించడానికి కూడా సిద్దమే అన్నట్లుండేది.
క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి.
రోమా 16:3,4
అయితే, ఇప్పుడేమయ్యింది? చల్లారిపోయింది. కారణం? అక్రమమము విస్తరిస్తుంది. ప్రేమ స్థానంలో, ద్వేషం, కక్షలు కార్పణ్యాలు వచ్చి చేరాయి. “అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును (మత్తయి 24:12).
పరిశుద్ధ గ్రంధమంతా ఒక్క ప్రేమ అనుమాటలోనే, పరిపూర్ణమై యిన్నది.
నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను (మత్తయి 19:19). ధర్మశాస్త్ర మంతయునిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలోసంపూర్ణమైయున్నది.
(గలతీ 5:14)
కనిపించే మన పొరుగువానిని ప్రేమించలేని మనము, కనిపించని దేవునిని ఎట్లా ప్రేమించగలము? ప్రేమ లోపించడమేకాకుండా ఆ ప్రేమకు వక్రభాష్యం చెప్పింది లోకం. మనిషి తన శరీర కోర్కెలు తీర్చుకోవడానికి పెట్టుకున్న ఒక అందమైన పేరు “ప్రేమ”.
💕లోకం దృష్టిలో ప్రేమంటే?
మూడవ తరగతి చదివే అబ్బాయి, అదే తరగతి చదివే అమ్మాయికి ' l LOVE U' అని వ్రాసి ఆ అమ్మాయి బుక్ లో పెట్టేసాడు. అంటే? ప్రైమరీ నుండే ప్రారంభ మయిపోయింది ప్రేమ. ఒక టీనేజర్ ప్రేమంటూ తిరిగీ, తిరిగీ, పరీక్షల ఫలితాలు వచ్చాక తెలిసింది ప్రేమంటే ఏమిటో? Loss Of Valuable Education అని. మరొకడేమో రాత్రంతా చాటింగ్. నిద్రలేక నీరసం వచ్చాక వాడికి అర్ధమయ్యింది ప్రేమంటే? Loss Of Valuable Energy.అని
ఒక అబ్బాయికి ఒక అనుమానం. నా గర్ల్ ఫ్రెండ్ నా పేరును తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకుందో అని. మొత్తానికి తెలుసుకున్నాడు. ' షాక్ అయ్యాడు. 'టైం పాస్ 20' అంటే? వీడి క్రింద ఇంకో 19 మంది. వీడిపైన ఎంత మందో? ఇప్పుడు వీడికి అర్ధమయ్యింది ప్రేమంటే? 'టైం పాస్' అని. మరొకడికి కూడా ఇదే అనుమానం. వాడూ కన్ఫర్మ్ చేసుకున్నాడు. “ఎటిఎం 18” అని. వాడికర్ధమయ్యింది. లవ్ అంటే? జేబులు ఖాళి చేసుకోవడమని.
ఒకడేమో రక్తంతో వ్రాసేస్తాడు ( అది కోడి రక్తమో? వాడి రక్తమో? వేరే సంగతి) ఒకడేమో కత్తితో పొడిచేస్తాడు. మరొకడేమో యాసిడ్ పోసి చంపేస్తాడు. ఏమిటిది? అని అడిగితే నాకు దక్కనిది ఇంకెవ్వరకూ దక్కకూడదు. ప్రేమంటే ఇదే అంటాడు. 'ప్రేమికుల రోజు' (వాలెంటైన్స్ డే) ఇదొకటి.ఆ రోజు 'నా హృదయంలో నీకుతప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదు' అంటూ వ్రాసి 'అందరికీ' పంచుతాడు. అదేంటి అంటే? ప్రేమ అంటే అంతే అంటాడు.
ఇక తల్లి ప్రేమ! ఆ ప్రేమను వర్ణించడం ఎవ్వరి తరమూకాదు. కాని వారి అక్రమమైన జీవితాలను కొనసాగించడానికి కన్న బిడ్డలను సహితం కర్కషంగా చంపేసే తల్లులెందరో? ఆ తల్లి ప్రేమకూడా కలుషితమవుతుంది. ఇక అందరికీ తల్లి 'మదర్ థెరీసా' ఆమె ప్రేమ స్వచ్చమైనది. ఎవ్వరూ కాదనలేనిది. కాని, పరిపూర్ణమైనది కాదు. ఆ ప్రేమ కొందరికే పరిమితం, కొంత కాలమే పరిమితం. శారీరికమైన స్వస్థత చేకూర్చ గలిగిందిగాని, పాప రోగం నుండి మనిషిని విడిపించ లేకపోయింది.
💕ఇంతకీ, నిజమైన ప్రేమ అంటే ఏమిటి?
ఈ లోకంలో 'నిజమైన ప్రేమకు' అర్ధాన్ని, నిర్వచనాన్ని చెప్పిన వారు ఒకే ఒక్కరు.
నిజమైన ప్రేమకు అర్ధం, నిర్వచనం 'నీ ప్రియ రక్షకుడే'. ఆయన ప్రేమాస్వరూపి ( ఆయనే ప్రేమయై వున్నాడు)
1 యోహాను 4:8,16
ఆయన ప్రేమతత్వం:
శత్రువులను కూడా ప్రేమించు. (మత్తయి 5:44) మాటలకే పరిమితం కాదు. చేసి చూపించారు కూడా. మనము శత్రువులమై వున్నప్పుడు మన కోసం తన ప్రాణమును పెట్టారు. (రోమా 5:10)
💕ప్రేమంటే?
చంపేసేది కాదు. చచ్చిపోయేది. “ తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.”
యోహాను 15:13
అది ఆయనకే సాధ్యమయ్యింది.
కారణం?
ఆయన ప్రేమ, అద్వితీయమైన ప్రేమ.
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును.
1 కొరింథీ 13:4-8
ఇది అగాపే లవ్, ఇది దివ్యమైన ప్రేమ, నీ దేవునికే సాధ్యమైన ప్రేమ.
నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటో నాకు తెలియదుగాని, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తావని. కనీసం తలిదండ్రుల ప్రేమలో కూడా అంతర్గతంగా ఒక ఆశ వుంటుంది. పిల్లలు పెద్దవారై వారిని కూడా ప్రేమగా చూస్తారని.
కాని, ఆయన ప్రేమ
🔹 బదులాశించనిది.
🔹 అది అమరం,
🔹 అతిమధురం,
🔹 అపురూపం.
🔹 అవధులులేనిది
🔹 అద్వితీయమైనది
🔹 సింహాసనము నుండి సిలువకు దిగివచ్చినది.
🔹 మరణము కంటే బలీయమైనది.
🔹సజీవ మైనది,
🔹 శాశ్వతమైనది.
అట్టి ప్రేమను అనుభవిస్తున్న నీవు ఆ ప్రేమకు మాదిరిగా జీవించాలి.
మన ప్రేమ ఏరీతిగా వుండాలంటే? పవిత్రురాలైన కన్యక, తన ప్రియునితో ఎట్టి ప్రేమను కలిగివుంటుందో, సంఘము అనబడే కన్యక, ప్రియుడైన యేసునితో అట్టి ప్రేమను కలిగియుండాలి.
దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని.
2 కొరింథీ 11:2
ప్రధానము చేయబడిన మనము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వరకు, ప్రియుడైన యేసు పట్లను, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముపట్లను నిజమైన ప్రేమను కలిగియుందము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
( నాలుగవ భాగము)🌐 ఎఫెస్సీ సంఘము :🌐 🕊
(Part- 4)
నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును. అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేనుకూడ వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
ప్రకటన 2:5-7
ఎఫెస్సీ సంఘమును ప్రశంసలతో ముంచెత్తిన ప్రభువు, వారిలోనున్న లోపమేమిటో ఎత్తి చూపి, వారికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు.
మనము ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కాషన్ బోర్డ్స్ కనిపిస్తాయి. అవి మనలను హెచ్చరిస్తూ ఉంటాయి. “గో స్లో” ఇట్లా... వాటిని చూచినా వెంటనే, అక్కడున్న హెచ్చరికను బట్టి, మనలను మనము నియంత్రించు కోవాలి. స్పీడ్ గా వెళ్తున్న మనము, స్లో గా ప్రయాణించాలి. అట్లా కాకుండా, దానిని నిర్లక్ష్యం చేస్తే, ప్రమాదం తప్పదు. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. హెచ్చరిక బోర్డు, నిన్ను హెచ్చరిస్తుందే తప్ప, నీవు వినకుండా వెళ్లిపోతుంటే, అది వచ్చి నీకు అడ్డుగా మాత్రం నిలబడదు.
ప్రభువు ఎఫెస్సీ సంఘం ద్వారా నీకొక హెచ్చరిక చేస్తున్నారు. దానికి లోబడతావో? లేక నీకు నచ్చినట్లుగా జీవిస్తావో అది నీ యిష్టం. నీవు జీవించిన జీవితాన్ని బట్టే తీర్పు వుందనే విషయం మాత్రం మరచిపోవద్దు.
🔻 హెచ్చరిక:
1. జ్ఞాపకము చేసుకో
2. మారు మనస్సుపొందు.
3. మొదటి క్రియలను చెయ్యి.
ప్రకటన 2:5
🔹1. *జ్ఞాపకము చేసుకో :*
జ్ఞాపకం చేసుకోవలసిందేమిటి?
ఏ స్థితిలో నీవు పడిపోయావో? నీ ప్రేమను కోల్పోవడానికి గల కారణాలేమిటో? దానికి దారితీసిన పరిస్థితులేమిటో?
ఒకదినాన్న చిన్న కుమారుడు తన ఆస్థినంతటిని తీసుకొని, తండ్రికి దూరంగా పారిపోయి, వేశ్యలతో తన ఆస్థినంతా దుర్వ్యాపారము చేసి, సమస్తాన్ని కోల్పోయి, ఆకలి బాధ తట్టుకోలేక, పందుల కాపరిగా కుదిరి, పందులుతినే పొట్టును తినడానికి ప్రయత్నించి, యజమానికి దొరికిపోయి, గెంటివేయబడినప్పుడు. అప్పుడు అతడు ఆలోచించడం మొదలుపెట్టాడు. నేనే స్థితిలో తప్పిపోయానని? ఏ స్థితిలో తప్పిపోయాడో జ్ఞాపకం చేసుకోగలిగాడు.
లూకా 15: 11-32
అయితే, నీవనొచ్చు! నేను ఆ స్థితికి చేరలేదుకదా అని? నీ పరమతండ్రికి దూరమయ్యవంటే? ఆ చిన్నకుమారునికి నీకు, ఏమాత్రం తేడాలేదని గ్రహించు. నీ ప్రియరక్షకుని ప్రేమనుండి నిన్ను దూరం చేసిన పరిస్థితులేమిటి? నీ కుటుంబస్థులు, నీ స్నేహితులు, బంధువులు, పొరుగువారు వీరంతా నీకు దూరంకాడానికి దారి తీసిన సందర్భాలేమిటి? వీటన్నిటి జ్ఞాపకం చేసుకో.
🔹 2. మారు మనస్సుపొందు.
నీవు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకుంటే సరిపోలేదుగాని, మారుమనస్సు పొందాలి. ఆ చిన్న కుమారుడు అదే చేసాడు. పాపము చేసాను అనే గ్రహింపులోనికి వచ్చినప్పుడు, మనలో కలిగే పశ్చాత్తాపం, మారుమనస్సుకు దారితీస్తుంది.
తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని.
లూకా 15: 18
🔹 3. మొదటి క్రియలను చెయ్యి.
మారుమనస్సు పొందిన చిన్న కుమారుడు “లేచి తండ్రి దగ్గరకు వెళ్లెను.” ఏ స్థితిలో పడిపోయాడో, ఎక్కడ పోగొట్టుకున్నాడో? తిరిగి అక్కడకే వెళ్తున్నాడు. అవును! రక్షించబడి, ప్రేమలో చల్లారిపోయిన నీ జీవితంలో ఈ మూడు అనుభవాలు తప్పక వుండితీరాలి. తిరిగి తండ్రి దగ్గరకు చేరిన నీవు, కోల్పోయిన మొదటి ప్రేమను కొనసాగించాలి.
ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.
లూకా 15: 18
దావీదును చంపాలని తిరుగుతున్న సౌలు రాజుకు, సౌలునే చంపే అవకాశం వచ్చినప్పుడు దావీదుకు వచ్చినప్పుడు, అతడు అభిషక్తుడని ఎరిగి చంపకుండా అతనికి మేలు చేసినప్పుడు, సౌలు అంటున్న మాటలు.
అందుకు సౌలు నేను పాపము చేసితిని, ఈ దినమున నాప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దానిబట్టి నేను నీకిక కీడుచేయను. దావీదా నాయనా, నాయొద్దకు తిరిగిరమ్ము; వెఱ్ఱి వాడనై నేను బహు తప్పు చేసితిననగా
1 సమూయేలు 26:21
🔻 అట్లుచేసి నీవు “మారు మనస్సు పొందితేనే సరి”:
అట్లా మారుమనస్సు పొందడానికి ప్రయత్నం చెయ్యి అని ప్రభువు చెప్పడం లేదుగాని, “పొందితేనే సరి” అంటే? తప్పక మారు మనస్సు పొందితీరాలి. మరొక ఆప్షన్ లేదు. ఇది ఒక ఆజ్ఞ. తప్పక చేసి తీరాల్సిందే. ఎందుకు? అని ప్రశ్నించడానికి వీల్లేదు.
🔻 *లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును:*
ఎఫెస్సీ సంఘం ప్రభువు మాటలను పెడచెవిని పెట్టిందేమో? ఆయన చేసిన హెచ్చరికను నిర్లక్ష్యం చేసిందేమో? పలు శతాబ్దములు ప్రభువు కొరకు అత్యాసక్తితో పని చేసిన ఆ సంఘం, దాని వెలుగు తీసివేయబడింది. 5 వ శతాబ్ధంనాటికి ఎఫెస్సీ పట్టణం నశించిపోయింది. అపొస్తలుడైన పౌలు జ్ఞాపకార్ధం అక్కడ ఒక దేవాలయము నిర్మించబడెను. నేటి దినాన్న ఎఫెస్సీ పట్టణంలో క్రైస్తవ మందిరాలు లేవు. వాటి స్థానంలో కొన్ని ముస్లిం ల దేవాలయాలు వెలిశాయి.
🔻 *అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేనుకూడ వీటిని ద్వేషించుచున్నాను.*
నీకొలాయితుల క్రియల కొరకు “రెండవ భాగము” చదువగలరు.
🔻 *చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక.*
ప్రభువు మాటే ఆత్మ యొక్క మాటయై యున్నది. “చెవి గలవాడు” అనే మాట, ఈ వర్తమానం కేవలం ఎఫెస్సీ సంఘమునకు మాత్రమే కాదు. చెవులున్న వారందరికీ, వారు ఏ కాలంలో జీవించినప్పటికి. అని అర్ధం చేసుకోగలం.
🔻 ప్రతిఫలము:
*జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.*
ప్రకటన 2:7
ఏదేనులో జీవ వృక్ష ఫలములుండెను. (ఆది 2:9) అయితే, ఆదాము హవ్వ వాటిని భుజించిన ఆధారాలు లేవు. జలప్రళయంలో ఈ వృక్షం నశించియుండవచ్చు. పాపఫలితంగా జీవ వృక్షం దగ్గరకు గల మార్గము మూయబడెను. యేసు క్రీస్తు సిలువ మరణము ద్వారా మూయబడిన మార్గము తిరిగి తెరవబడెను. జయించువాడు అనగా అంతమువరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు ఈ జీవవృక్ష ఫలము భుజింపగలడు.
పరదైసు అను మాటకు “దేవుని తోట” అని అర్ధము. పరదైసు నేడు భూలోకంలో లేదు. ఇప్పుడది మూడవ ఆకాశంలో వున్నది.
(2 కొరింథీ 12:2,3)
ప్రియ నేస్తమా!
కోల్పోయిన ప్రేమను తిరిగి పొందుకుందాం! పరదైసులోనున్న జీవ వృక్షఫలాలను భుజించే ధన్యత కలిగియుందాం!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(ఐదవ భాగము)🌐 *2. స్ముర్న సంఘము*:🌐
(Part- 1)
స్ముర్నలోఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము మొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నే నెరుగుదును. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను. సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక.జయిం చువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.
ప్రకటన 2:8-11
🔅 *స్ముర్న అనగా?*
🔹బోళము, చేదు, శ్రమల వాసన.
🔅 *ప్రస్తుత నామము:*
🔹ఇస్మీర్
🔅 *ప్రశంస:*
🔹శ్రమ పడినవాడవు
🔹దరిద్రతను అనుభవించినవాడవు.
🔹సాతాను సమాజపు వారివలన దూషించబడ్డావు.
🔅 *తప్పు:*
🔹ఏ ఒక్క తప్పు కూడా ఈ సంఘం మీద మోపబడలేదు.
🔅 *పురికొల్పు:*
🔹పొందబోవు శ్రమలకు భయపడకుము.
🔅 *హెచ్చరిక:*
🔹మరణం వరకు నమ్మకముగా ఉండుము.
🔅 *ప్రతి ఫలము:*
🔹జీవకిరీట మిచ్చెదను.
🔹రెండవ మరణమువలన ఏ హానిచెందవు.
💒 *స్ముర్న* 💒
ఆసియా మైనర్ లో ఇది అతి మనోహరమైన పట్టణము.దీనికి ఆసియా కిరీటము, ఆభరణము, పుష్పము అనే వివిధమైన పేర్లున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవి హోమర్ జన్మ స్థలము ఇదే. రోమా దేవతలకు మొట్టమొదటిగా క్షేత్రము నిర్మించినది ఈ పట్టణంలోనే. ప్రస్తుతకాలంలో ఈ పట్టణము గొప్ప జనాభా కలిగిన పట్టణముగా వుంది. పౌలు యొక్క మొదటి మిషనేరి ప్రయాణంలో ఈ సంఘమును స్థాపించియుండవచ్చు ( అపో. 19:10). ఈ సంఘము మహా శ్రమలు అనుభవించెను. ఎఫెస్సీ సంఘ అధ్యక్షుడైన యోహాను, తన శిష్యుడైన పోలికార్ప్ ను ఇక్కడ సంఘ అధ్యక్షునిగా నియమించెను. నేడు ఈ పట్టణము ఇస్మిర్ అనే పేరుతో పిలువ బడుతుంది. ఇది లోపరహితమైన సంఘము. ప్రభువు, ఒక్క తప్పును కూడా ఈ సంఘముపై మోపలేదు.
🔺 *స్ముర్న సంఘమునకు ప్రభువు తనను తాను చేసుకొంటున్న పరిచయము:*
మొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు
ప్రకటన 2:8
మొదటివాడను, కడపటివాడను అంటే? గతించిన కాలంలో నున్నవాడను, రాబోవు కాలంలో వుండువాడునైయున్న దేవుడు. మహా శ్రమలు అనుభవిస్తున్న సంఘానికి అనుకూలమైన రీతిలో ప్రభువు ప్రత్యక్షమయ్యెను. చనిపోయినవారిని గురించి దుఃఖించుచున్న వారికి, ఓదార్పుగా మరణమును గెలిచిన ప్రభువు మాటలు వారికి ఆదరణయు, మరణమును ఎదురించుటకు గల శక్తిని కలిగించెను. “తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు”. (హెబ్రీ 2:18) తను జయించునట్లు, వారును జయించగలరని ధైర్యము కలిగించును.
🔅 *ప్రశంస:*
🔹 *శ్రమ పడినవాడవు:*
దీనిని *“శ్రమల సంఘం”* అని పిలవొచ్చు. స్ముర్న అనగా బోళము, రుచికి చేదుగా ఉంటుంది. చేదు శ్రమలకు సాదృశ్యం. ఎన్ని శ్రమలొచ్చినా, శ్రమల మధ్యలో నమ్మకస్థులై యున్నారు.
అంతియొకయు, నికొన్యా, లుస్త్ర మొదలైన సంఘములకు కలిగిన రీతిగానే, ఈ సంఘమునకు యూదులవలన శ్రమ కలిగింది. స్ముర్నలో యూదులు బలవంతులైయుండిరి. ప్రతీ సంవత్సరము పట్టణము యొక్క అవసర నిమిత్తము పది వేల వెండి నాణెములు విరాళముగా ఇచ్చుచుండిరి. వీరు సంఘమును అనేక శ్రమలకు గురిచేసెను. క్రైస్తవులు నరమాంసము తిన్నవారని నిందమోపిరి. కారణం? ప్రభువు బల్లలో రొట్టి శరీరమనియు, ద్రాక్షారసము ప్రభువు రక్తమనియు చెప్పుచున్నారు గనుక. విగ్రహారాధన లేదుగనుక, రాజనిబంధనలను పాటించనివారని చెప్పి, మరి ఎక్కువగా శ్రమపెట్టిరి.
అయితే, శ్రమానుభవములోనే స్థిరమైన సంఘం పుడుతుంది. దానికి స్ముర్న సంఘమే గొప్ప ఉదాహరణ. శ్రమలు సంపూర్ణతలోనికి నడిపిస్తాయి. దేవునికి మనలను మరింత సన్నిహితముగా చేసేవి శ్రమలే. సువర్ణం శుద్ధీకరించబడాలి అంటే? కొలిమిలో మండాల్సిందే. దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించాలంటే? శ్రమలగుండా ప్రయాణించాల్సిందే.
ఈ విషయం మనకు అర్ధమైతే? శోధన సమయంలో కృంగిపోకుండా ఆయనపైనే పూర్తిగా ఆధారపడి ఆయనకు మరింత సామీప్యముగా చేరగలము.
నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా?
వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించు చున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కన బడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
హెబ్రీ 12:5-11
పౌలు 40 రకాలైన శ్రమలను అనుభవిస్తూ కూడా ఆనందించాడు. అతని నోట ఒక్క ఆయాసకరమైన మాట కూడా రాలేదు. శ్రమయే ఒక ధన్యతగా, దీవెనకరంగా భావించాడు.
అవును! శ్రమలలో ఆనందించడం దేవుని పిల్లలకు మాత్రమే సాధ్యం. శ్రమలయందే అతిశయిద్దాం. శ్రమల ద్వారా పరిపూర్ణతలోనికి ప్రవేశించి, ప్రభువిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(ఆరవ భాగము)🌐 *2. స్ముర్న సంఘము*:🌐
(Part- 2)
*నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును.*
ప్రకటన 2:9
🔅 *ప్రశంస:*
🔹శ్రమ పడినవాడవు
🔹దరిద్రతను అనుభవించినవాడవు.
🔹సాతాను సమాజపు వారివలన దూషించబడ్డావు.
🔺 1. *శ్రమ పడినవాడవు:*
(వివరణకై *మొదటి భాగం* చదువగలరు.)
🔺2. *దరిద్రతను అనుభవించినవాడవు*.
*స్ముర్న సంఘస్థులు దారిద్ర్యమును అనుభవించడానికి గల కారణం ఏమిటి?*
వాస్తవానికి స్ముర్న సంఘము ఐశ్వర్యవంతమైనదే. కానీ, శ్రమలలో వారు దోచుకోబడ్డారు. అయిననూ ఆ పేదరికంలో కూడా దేవుని కొరకు స్థిరంగా నిలబడగలిగారు.
దీనికి పూర్తి విరుద్ధంగా మన జీవితాలున్నాయి. పెంట కుప్పల మీద జీవించాల్సిన మనలను, మింటపైన ఘనులతో కూర్చుండబెడితే, మనలను ఘనపరచిన దేవునినే మరచిపోయే స్థితికి చేరుకున్నాము. ఐశ్వర్యవంతులమని ఆనందపడుతున్నాము గాని, ఆధ్యాత్మిక అనాధలమనే గ్రహింపులేకుండా జీవిస్తున్నాము. మనము కట్టుకున్న చర్చ్ లు చూసి గర్వపడుతున్నాము. అభివృద్ధి అంటే, ఇదే అని పొంగిపోతున్నాము. అన్ని వుండి, ఆధ్యాత్మికంగా మాత్రం బక్కచిక్కిపోతున్నాం.
దేవుడు ఆర్ధికంగా ఎంతటి ఉన్నతమైన స్థితిలో వుంచినా, ఇంకా సంపాధించడానికే ప్రాకులాడుతున్నాముతప్ప, ప్రభువు పనిలే మనకు కలిగిన దానిని ఖర్చు చేసిన సందర్భాలు శూన్యం. స్ముర్న సంఘస్థులైతే, వారికి కలిగినవన్నీ పోగొట్టుకోవడాని సిద్ధపడ్డారు. దారిద్ర్యము వారికి దారిద్ర్యముగా అనిపించలేదు. ఎందుకంటే వారు ప్రభువును కలిగియుండుట శాశ్వతమైన ధనముగా భావించారు. ప్రభువు కూడా అట్టి వాగ్ధానమునే వారికిచ్చారు.
*నీ దారిద్రతను నేనెరుగుదును. అయిననూ, నీవు ధనవంతుడవే.*
*మనలను ధనవంతులను చేయడానికి ప్రభువే దరిద్రుడయ్యాడు.* ఇది ఈ లోకానికి సంబంధించిన ధనముకాదు. ఇది పరలోక సంబంధమైనది, శాశ్వతమైనది.
మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
2 కొరింథీ 8:9
*క్రీస్తును కలిగియున్నవారే నిజమైన ధనవంతులు:*
దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
2 కొరింథీ 6:10
ఈ లోకంలో సమస్తాన్ని కలిగియుండి, క్రీస్తుకు నీ హృదయంలో స్థానం లేకుంటే, నీ జీవితమే ఒక పెద్ద జీరో. నీకంటూ ఏమిలేకున్నా, నీ హృదిలో ప్రభువుంటే నీవే ఒక పెద్ద హీరో.
🔺 3. *సాతాను సమాజపు వారివలన దూషించబడ్డావు.*
ఎవరీ సాతాను సమాజపు వారు?
విగ్రహారాధన లేదు గనుక రాజనిబంధనలను పాటించనివారని చెప్పి, సంఘాన్ని మరి ఎక్కువగా హింసించారు. యూదులు అధికారులకు ప్రేరణ కలిగించి, క్రైస్తవులను హింసించారు. ఇట్లాంటి యూదులనే ప్రభువు *సాతాను సమాజపువారని* పిలిచారు.
వీరు, స్ముర్న సంఘ అధ్యక్షుడైన పోలికర్ప్ ను, హతము చేయునిమిత్తం, మంటలు వేసి చంపు నిమిత్తం, సబ్బాతు దినమును కూడా పాటించక కట్టెలు పోగుచేసిరి.
బబులోను చెర తరువాత, యూదులు కొన్ని స్థలాలలో సునగోగులను నిర్మించారు. వాటిని సమాజ మందిరములని పిలిచేవారు. దేవాలయమును యూదులు అపవిత్ర పరచినప్పుడు, దానిని దొంగల గుహ అని ప్రభువు పిలిచెను. ఇప్పుడు వారికే సాతాను సమాజపువారని ప్రభువు పేరు పెట్టారు.
వీరి ద్వారా సంఘం దూషించబడింది. అన్నింటిని ఎదుర్కొన్నారు. మచ్చలేని సంఘముగా వారిని వారు కాపాడుకోగిలిగారు. వారి జీవితాలు, మన ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప సవాలు. సరిచేసుకుందాం. ప్రభువు కొరకు నమ్మకంగా జీవించడానికి మన హృదయాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(ఏడవ భాగము)2. స్ముర్న సంఘము :🌐
(Part- 3)
ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను. సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.
ప్రకటన 2: 10,11
మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. పది దినములు శ్రమ కలుగును.
పది దినములు అంటే? అక్షరాలా పది దినములుగా తలంచకూడదు. నీరో చక్రవర్తి మొదలుకొని, డయోక్లేషియాన్ వరకు, వారి పరిపాలనా కాలంలో పది భయంకరమైన శ్రమలు సంభవించాయని కొందరి అభిప్రాయం. అట్లాకాకుండా, డయోక్లేషియాన్ నాయకత్వంలోనే పది సంవత్సరాలు శ్రమ జరిగిందని మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా కేవలం పదిరోజుల్లోనే వారి శ్రమ ముగిసిపోయిందని తలంచలేము.
🔅 హెచ్చరిక:
మరణమువరకు నమ్మకముగా ఉండుము.
స్ముర్న సంఘము శ్రమలను, దారిద్ర్యమును అనుభవించింది. దూషణలు భరించింది. పరిస్థితులేవైనా ప్రభువు కొరకు స్థిరంగా నిలబడగలిగింది. సంఘాధ్యక్షుడను మంటల్లో కాల్చేసినా వారి విశ్వాసం సడలలేదు. శోధనలలో వారి పరిశుద్ధతను, శ్రమలలో వారి విశ్వాసాన్ని కాపాడుకోగలిగారు. శ్రమల ద్వారా ప్రభువు యొక్క సమరూపంలోనికి మారిపోయారేమో? ప్రభువు వారిని తప్పుపట్టడానికంటూ ఏమీ లేకపోయింది. అయినప్పటికీ, ఏ క్షణంలోనైనా తొలిగిపోయే అవకాశం వుంది కాబట్టి, ఇప్పుడు కలిగియున్న విశ్వాసాన్నే అంతము వరకూ కలిగియుండండని వారిని హెచ్చరిస్తున్నారు.
మన జీవితాలెట్లా వున్నాయి? రక్షించబడిన దినాలలోనున్న పరిస్థితి నేటిదినాన ఉందా? అప్పుడు గంటల తరబడి, వాక్య ధ్యానం. ఇప్పుడు బైబిల్ చదివి ఎన్ని రోజులయ్యింది? అప్పుడు గంటల తరబడి ప్రార్ధన. ఇప్పుడు ప్రభువుతో నీ సమయాన్ని గడిపి ఎంతకాలమయ్యింది? అప్పుడు ఎవ్వరితో మాట్లాడినా, దేవుని మాటలే. ఇప్పుడైతే అసలు దేవుని ప్రస్తావనే లేదెందుకు? మనుష్యులు దగ్గరలేకపోయినా, స్మార్ట్ ఫోన్లు చేతిలో వున్నాయి కదా? ముసలమ్మ ముచ్చట్లతోనే కాలం గడచిపోతుందా?
నాతో నీవెందుకు గడపలేకపోతున్నావ్ అని ప్రభువు అడిగితే? నాకు శక్తి సామర్ద్యాలిచ్చి, సంపాదించుకోవడానికి అవకాశమిచ్చావ్. ఇక నీతో గడిపే సమయం నాకెక్కడిది అంటూ దేవునికే కౌంటర్ వేసే స్థితికి చేరిపోయావా? ఇప్పటికే, భుక్తి దొరికేసరికి, వున్న భక్తి కాస్తా పోయింది. అంతము వరకూ కాపాడుకోవడానికంటూ మనదగ్గరేముంది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, మన జీవితాలను సరిచేసుకొని, కోల్పోయిన పరిశుద్ధ జీవితాన్ని తిరిగిపొందుకొని, దానిని మరణమువరకూ కాపాడుకొని, ప్రభువిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయాసపడదాం.
🔅 ప్రతి ఫలము:
1. జీవకిరీట మిచ్చెదను.
2. రెండవ మరణమువలన ఏ హానిచెందవు.
🔹 జీవకిరీట మిచ్చెదను:
శ్రమలను సహించిన సంఘానికి జీవ కిరీటము వాగ్ధానము చేయబడింది.
శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
యాకోబు 1:12
♦నూతన నిబంధనయందు ప్రస్తావించబడిన కిరీటములు:
🔸 *జీవ కిరీటము:*
శోధనలు జయించినవానికి, శ్రమలు సహించినవానికి ( యాకోబు1:12; ప్రకటన2:10)
🔸 *మహిమ కిరీటం:*
మందను నమ్మకంగా కాయువారికి (సంఘ కాపరులకు) 1పేతురు 5:2-4
🔸 *అతిశయ కిరీటం:*
ఆత్మలను రక్షించువానికి (సువార్తికులకు) 1థెస్స 2:19
🔸 *నీతి కిరీటం:*
తన పరిశుద్ధతను కాపాడుకొనుచు, తనకు అప్పగించు పనిని పూర్తిచేయు వానికి.
2తిమోతి 4:8
🔸 *అక్షయ కిరీటం:*
భక్తిలో విజయం సాధించేవారికి
1కొరింధీ 9:25-27
🔸 సువర్ణ కిరీటము
ప్రకటన 4:4
🔹 *రెండవ మరణమువలన ఏ హానిచెందవు.*
జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు. వేటిని జయించాలి? సంఘమును లోబరచుకొనుటకు సాతాను ప్రయోగించిన ఆయుధములు శ్రమలు, కరవులు, నిందలు, చెరసాల, మొదలైన వాటన్నిటిని వారు జయించారు.
మొదటి పునరుత్థానములో పాల్గొనువారు పరిశుద్ధులును, ధన్యులునై యున్నారు. రక్షణ పొందిన ప్రతీ విశ్వాసికి రెండవ మరణము నుండి విడుదల కలుగును.
ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.
ప్రకటన 20:6
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 21:8
రెండవ మరణము వుందని ఎవరికి తెలుసు? అంటూ అతితెలివిగా వాధించే ప్రయత్నం చెయ్యొద్దు. అగ్నిగుండం ఊహలకే భయంకరం. అనుభవించాల్సి వస్తే, ఆ బాధ వర్ణనాతీతం. అగ్నిగుండం, కట్టెలు కాలిస్తే వచ్చే మంటల్లా ఉండదట. అది ఒక ద్రవ పదార్థంలా మరుగుతూ వుంటుందట. మరుగుతున్న తారు డబ్బాలో ఒక్క వ్రేలు పెడితే, ఆ బాధను ఊహించగలమా? అట్లా కాకుండా, ఇక దానిలోనే ఈతకొట్టాల్సి వస్తే? దానిని వర్ణించడానికి ఈ ప్రపంచములోనున్న ఏ భాష కూడా చాలదు.
అయితే, నీవనుకోవచ్చు. పరలోకం, నరకముందని ఎవరికి తెలుసని? నీవు పుట్టకముందు భూలోకం అంటూ ఒకటుందని నీకు తెలియదుకదా? పుట్టాకే తెలిసింది. నరకమూ అంతే. నీవు ఈ భూలోకాన్నైనా విడవాలి, ఆయన రాకడైనా రావాలి. అప్పుడుగాని, అర్ధంకాదు. పరలోకం, నరకం ఉన్నాయని. అప్పుడర్ధమయినా, ఫలితం శూన్యం. నీవు ఈలోకంలో జీవించిన సమయంలోనే నీకర్ధం కావాలి. అట్లా అని, బలముంది కదా? వయస్సుంది కదా అని వాయిదాలేస్తే? ఏ క్షణాన వాడిపోతామో, ఎప్పుడు రాలిపోతామో? ఎవరికి తెలుసు? వాయిదాలొద్దు. నీవు జీవించిన జీవితానికి గతించిన కాలమే చాలు. నేడే అనుకూల సమయం. ఆయనను నీ హృదయంలో చేర్చుకో!
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, రెండవ మరణం నుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం! రెండవ మరణం నుండి తప్పించబడి, జీవ కిరీటాన్ని పొందుకోవడానికి ప్రయాసపడదాం!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(స్ముర్న సంఘ ధ్యానం సమాప్తం)
💒 *సప్త సంఘములు* 💒
(ఎనిమిదవ భాగము)♻*3. పెర్గము సంఘము* :♻
(Part- 1)
పెర్గములోఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడును మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు.
అటువలెనే నీకొలాయితుల బోధననుసరించు వారును నీలో ఉన్నారు.
కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను. సంఘ ములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
ప్రకటన 2:12-17
🔅 పెర్గము అనగా?
గోపురము, దుర్గము అని అర్ధము.
పెర్గము యొక్క ప్రస్తుత నామము?
🔹 బర్గము
🔅*ప్రశంస :*
🔹 సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడును మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.
🔅*తప్పు:*
🔹 విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట.
🔹 జారత్వము జరిగించుట.
🔹 బిలాము బోధలు,
🔹 నికోలాయితుల బోధలు అనుసరించుట
🔅*పురికొల్పు:*
🔹 మారుమనస్సు పొందుము.
🔅*హెచ్చరిక:*
🔹 నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను.
🔅*ప్రతిఫలము:*
🔹 మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును.
🔹 తెల్లరాతినిత్తును
🔹 క్రొత్త పేరు.
♻ పెర్గము ♻
స్ముర్న నుండి దాదాపు 55 మైళ్ళ ఉత్తర తూర్పున, కైకస్ నది ప్రక్కగల ఒక కొండపైన నిర్మింపబడిన పట్టణము పెర్గమోస్. దీని ముందర 40 అడుగుల ఎత్తుగల గొప్ప బలిపీఠం నిర్మింపబడి యుండెను. దినమంతా దానిలోనుండి బలి ధూపము పైకి వచ్చు చుండెను. ఇది మొట్టమొదటి చక్రవర్తి పూజాకేంద్రము. పెర్గమో దేవుడు అని పిలవబడుచున్న ఎస్కలోఫియోస్ ను ఆరాధించు పట్టణము. రోగ స్వస్థత నిమిత్తం ప్రపంచం యొక్క నలుమూలలనుండి ప్రజలు ఈ దేవతా సన్నిధికి వచ్చుచుండెను. ఎస్కలోఫియోస్ అనగా “రక్షకుడు” అని అర్ధము. గనుక, యేసు క్రీస్తు తప్ప మరియొక రక్షకుడు లేడని ప్రకటించిన సంఘమునకు ఇబ్బందులు తప్పలేదు. ఆదేవత యొక్క రూపము సర్ప రూపమై యుండెను. ఆ దేవతను ఆరాధించకుండా, ప్రభువును అంగీకరించినవారికి మరణ శిక్ష విధించుట ఇక్కడే ప్రారంభమయ్యెను.
🔅 వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు:
రోమా ప్రభుత్వంలో రెండు రకాల అధికారులు ఉండేవారు.
1. ఖడ్గం యొక్క అధికారము గలవారు.
2. ఖడ్గం యొక్క అధికారం లేనివారు.
అయితే, ఇక్కడున్న రోమా గవర్నర్ ఖడ్గం యొక్క అధికారము కలిగినవాడు. అంటే? ఏ సమయంలోనైనా విశ్వాసులకు వ్యతిరేకంగా ఖడ్గం ప్రయోగించడానికి అవకాశం వుంది. అందుచే సంఘాన్ని ధైర్యపరచడానికి, ఆయన రెండంచులగల ఖడ్గముగలవాడుగా తన్ను తాను, ప్రత్యక్ష పరచుకొంటున్నాడు.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
హెబ్రీ 4:12
సంఘమును ధైర్యపరచడమే కాకుండా, సంఘములో ప్రవేశించిన దుర్భోధతో పోరాడి, సరిదిద్దడానికి ప్రభువు రెండంచులగల ఖడ్గముగలవాడుగా తన్ను తాను, ప్రత్యక్ష పరచుకొంటున్నాడు.
వాక్యము రెండంచులగల ఖడ్గమే కాదు గాని, రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణమును, ఆత్మను విభజించేటంత శక్తిగలది. ప్రాణాత్మలను విభజింపజేసే శక్తి వాక్యానికి మాత్రమే వుంది. అది కీళ్లు, మూలుగుల్లోకి కూడా చొచ్చుకొనిపోయి నీ హృదయతలంపులను సహితము శోధించగలదు.
ప్రాణము ఆత్మ రెండూ కలసే ఉంటాయి. వాటిని విడగొట్టలేము. శరీరమునుండి ప్రాణంపొతే, ఆత్మ వానిలో నిలచియుండదు. అయితే, నిజమైన విశ్వాసిగా నీవు జీవించాలంటే? ప్రాణం, ఆత్మ విభజింపబడి వానిమధ్యలో వాక్యం చేరాలి. ఎందుకంటే? దేవుని విషయంలో ఆత్మ సిద్దమే గాని, శరీరం బలహీనం. అట్లాంటి సందర్భంలో ఆత్మ శరీరానికి లోబడకుండా, వాక్యము బలపరచగలదు.
ప్రాణాత్మలు:
ప్రాణం: శరీరం కలిగియున్నప్పుడు జీవించిన జీవితానికి సాదృశ్యం.
ఆత్మ: ప్రాణం, శరీరం విడచి వెళ్లిపోయిన తర్వాత జీవించవలసిన జీవితానికి సాదృశ్యం.
ప్రాణం స్వల్పకాలమైతే, ఆత్మ శాశ్వత కాలము. అయితే, మరణం తర్వాత నీ ఆత్మ నిత్యమరణంలో ఉండాలా? నిత్యజీవంలో ఉండాలా? అనేది ఎట్లా నిర్ణయింపబడుతుందంటే? నీవు శరీరంతో, ప్రాణంతోనున్నప్పుడు జీవించిన జీవితం. నీ జీవితాన్ని సరిచేయగలిగేది ఏదైనా ఉందంటే? అది రెండంచులు గలిగిన ఖడ్గమే. అదే దేవుని వాక్యం.
దేవుని వాక్యముచేత నీవు పొడవబడుతూ వుంటే? నీ జీవితాన్ని సరిచేసుకోతప్ప, వాక్యం ప్రకటించేవారిమీద కక్ష సాధించొద్దు. విచిత్రం ఏమిటంటే? ఈ వాక్యం నాకోసమే అంటాము. కానీ, సరిచేసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యము. రెండంచుల వాడిగల ఖడ్గము నరుకుతూ పోతున్నప్పుడు సరిచేసుకోగలిగితే, మన జీవితం ధన్యమవుతుంది. అట్టిరీతిగా జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకొందాము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(తొమ్మిదవ భాగము)♻ *3. పెర్గము సంఘము* :♻
(Part- 2)
సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడును మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.
ప్రకటన 2: 13
🔅 *ప్రశంస :*
🔺 *సాతాను సింహాసనమున్న స్థలములో కాపురముండి, విశ్వాసంలో తొలగిపోలేదు:*
*సాతాను సింహాసనమున్న స్థలము*: అంటే? సైతానుకు సింహాసనముందా? అవును. వుంది. అది పరలోకంలోనూ లేదు. నరకంలోనూ లేదు. అది భూమి మీదే వుంది.
*స్ముర్నలో “సాతాను సమాజమందిరం” వుంటే, పెర్గములో “సాతాను సింహాసనం” వున్నది.*
🔹 *సాతాను ఈ లోక అధికారి: *
ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;
యోహాను 12:31
🔹 *ఈ యుగ సంబంధమైన దేవత:*
దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.
2 కొరింథీ 4:4
🔹 *లోక నాథుడు:*
ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
ఎఫెసీ 6:12
🔹 *గర్జించు సింహము:*
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
1 పేతురు 5 :8
సాతాను సింహాసనం, ఆ కాలంలో పెర్గములో వుంది. అంటే అర్ధం చేసుకోవచ్చు. పెర్గములోనున్న పరిస్థితులు వాడికి ఎంత అనుకూలంగా ఉన్నాయో? అట్లాంటి పరిస్థితులలోకూడా సంఘము తన విశ్వాసాన్ని కాపాడుకొందట. అంతియప (అంతిపస్) అనే విశ్వాసిని, సంఘము ఎదుటనే, హత్య గావించినప్పటికీ, సంఘము దాని విశ్వాసాన్ని కోల్పోలేదు. మేము కూడా సిద్దమే అంటూ విశ్వాసంలో స్థిరులై నిలబడ్డారు. అందులను బట్టి ప్రభువు ఆ సంఘాన్ని ప్రశంసిస్తున్నారు.
నేటి మన పరిస్థితులు ఎట్లా వున్నాయి? లోకంనుండి ప్రత్యేకించబడ్డాము అంటూనే, లోకాన్ని స్నేహిస్తున్నాము. లోకంలో ఉండాల్సిన సంఘము, లోకాన్నే సంఘంలోని తెచ్చుకుంది. ఇక ప్రత్యేకతకు చోటెక్కడిది? సంఘం వెలుపలివారి నుండి మనము ఎదుర్కొంటున్న సమస్యలకంటే, సంఘంలోనున్న వారితోనే మనకు సమస్యలెక్కువ? అంతర్గత కొట్లాటలతోనే సరిపోతుంది. ఇక దురాత్మల సమూహాలతో మనమేమి పోరాడగలము. పోరాటం చెయ్యలేకే కదా? వాడితో రాజీ పడుతున్నాము. వాడి సింహాసనాన్ని సంఘంలోని తీసుకువస్తున్నాము. అయితే, పెర్గము సంఘము మన ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప సవాలు. సాతాను సింహాసనమున్న స్థలములో, వారు కాపురముండి కూడా వారి విశ్వాసాన్ని కాపాడుకోగలిగారు.
🔺 *నీవు నా నామమును గట్టిగా చేపట్టావు:*
ప్రభువైన యేసు నామమును గట్టిగా పట్టుకొనుట అనగా ఆయన రక్షకుడు గాను, ప్రభువుగాను సంపూర్ణ మనసుతో అంగీకరించబడుటయే.
ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. (హెబ్రీ 3:15) మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును. (మత్తయి 10:22) నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. (మత్తయి 19:29)
ఆయనకు చాలా మంది సాక్ష్యులు వుండొచ్చు. కానీ, *ప్రభువు కోరుకొనేది నమ్మకమైన సాక్షిని.* అంతిపస్ గురించి ప్రభువు మాట్లాడుతూ, “నమ్మకమైన సాక్షి” అని సంబోధిస్తున్నారు. అట్లాంటి సాక్ష్యమును మనమునూ పొందుటకు ప్రయాసపడుదము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(పదియవ భాగము)♻ *3. పెర్గము సంఘము* :♻
(Part- 3)
అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు.
అటువలెనే నీకొలాయితుల బోధననుసరించు వారును నీలో ఉన్నారు.
ప్రకటన 2: 14,15
🔅 *తప్పు:*
🔹 విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట.
🔹 జారత్వము జరిగించుట.
🔹 బిలాము బోధలు,
🔹 నికోలాయితుల బోధలు అనుసరించుట
*విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట.*
పెర్గము పట్టణము దేవుళ్ళతోను, దేవతలతోను నిండియుండడం వలన, విగ్రహారాధనలో ప్రజలు మునిగి తెలియాడుతున్నారు. క్రైస్తవ సంఘం వారితో కలసి విగ్రహాలకు అర్పించినవాటిని తినడం ప్రారంభించారు. సంఘం లోకంలో కలిసిపోయింది. అన్యాచారాలు సంఘములో ప్రవేశించాయి.
*విగ్రహార్పితములు తినడం వలన మనస్సాక్షి బలహీనమై, అపవిత్రమవుతుంది:*
విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. అయితే అందరియందు ఈజ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహ మును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు. అయినను మీకు కలిగియున్న యీస్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా? అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీను డైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు.
1 కొరింథీ 4:8-12
లోకమునుండి ప్రత్యేకింపబడిన నీవు, ప్రత్యేకంగానే జీవించాలి. అవిశ్వాసులతో సంబంధం అత్యంత ప్రమాదం. అట్లా అని వారితో మాట్లాడ కూడదనికాదు. దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలలో వారితో పాలుపంపులు వద్దు. *అవిశ్వాసులతో సాంగత్యం నీ జీవితానికి క్షేమకరం కాదు. అవిశ్వాసిని ప్రేమించి, పెళ్లయ్యాక మార్చుకుంటానన్న వాళ్ళెందురో మారిపోయి, విశ్వాస బ్రష్టులయ్యారు. లోకంతో స్నేహం దేవునితో వైరం.*
మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయ మునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
2 కొరింథీ 6:14-18
పెర్గము సంఘము, విశ్వాసములో పట్టుసడలని సంఘమే, విగ్రహారాధనకు ఎదురునిలచిన సంఘమే. కానీ, విగ్రహాలకు అర్పించినవాటిని తిని, దేవుని యెదుట దోషిగా నిలబడ్డారు.
ప్రియవిశ్వాసి! దేవుని మందిరానికి క్రమంగానే వెళ్తున్నావు. కానుకలిస్తున్నావు. ప్రార్ధన,వాక్య ధ్యానం అంతా బానే వుంది. కానీ, *ప్రభువు మెచ్చనిది ఎదో నీజీవితంలో వుంది. అదేంటో నీకు తెలియనికాదు. నీకు తెలిసికూడా, ఇంకెవ్వరికీ తెలియదన్నట్లు నటిస్తున్నావు. ప్రజల దగ్గర నటించగలవేమో? అదైనా కొంతకాలమే. కానీ, దేవుని దగ్గర సాధ్యమా? నటించిన జీవితానికి గతించిన కాలమే చాలు*. నీ జీవితాన్ని ప్రభువు మెచ్చేవిధంగా సరిచేసుకోవడాని నీ హృదయాన్ని సిద్ధపరచుకో!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(పదకొండవ భాగము)♻ *3. పెర్గము సంఘము* :♻
(Part- 4)
అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు.
అటువలెనే నీకొలాయితుల బోధననుసరించు వారును నీలో ఉన్నారు.
ప్రకటన 2: 14,15
🔅 *తప్పు:*
*బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు.*
బిలాము ప్రారంభములో మంచి ప్రవక్తే. ధనానికి ఆశించి వచ్చినప్పటికీ, దేవుడు చెప్పినట్లే ప్రవచించాడు. తర్వాత దినాలలో దానిని నిలుపుకోలేకపోయాడు.
బిలాము ఉపమానరీతిగా నిట్లనెను బాలాకూ, లేచి వినుము సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను; నేను దాని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు. రాజుయొక్క జయధ్వని వారిలో నున్నది దేవుడు ఐగుప్తులోనుండి వారిని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇశ్రాయేలులో శకునము లేదు ఆయాకాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును. ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును అది సింహమువలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు.
సంఖ్యా 23:18-24
*బిలాము ధనాశాపరుడు. కావున, తిన్నని మార్గం విడచినవాడు:*
తిన్ననిమార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహు మానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.
2 పేతురు 2:15,16
ధనవ్యామోహంలో పడిన బిలాముతో గాడిద మాట్లాడినను గ్రహించినవాడుకాదు. బహుమానము పొందగోరి, తప్పు మార్గంలో ప్రయాణించినవాడు. (యూదా 11)
ఇశ్రాయేలీయులను శపించుటకు మోయాబు రాజైన బాలాకు, ప్రవక్తయైన బిలామును తీసుకువచ్చాడు. ధన వ్యామోహంచేత అతడు మూడుసార్లు ఇశ్రాయేలీయులను శపించుటకు ప్రయత్నించాడు. అయితే, దేవునిచేత అడ్డగింపబడి, చివరికి దేవుని ప్రజలను నశింపజేయడానికి ప్రణాళికను సిద్ధంచేసి, ఇశ్రాయేలీయులలోని పురుషులను ఆకర్షించు నిమిత్తం మోయాబు స్త్రీలకు ప్రేరణ ఇవ్వవలెనని బిలాము బోధించెను. ఆ ప్రయత్నం ఫలించింది.
ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి.
సంఖ్యా 25:1,2
*లోకంతో స్నేహం దేవునితో వైరం.*
దేవుని ప్రవక్త దయ్యంతో జతకట్టాడు. దేవుని ప్రజలు, అన్యజనాంగముతో కలసిపోయారు.
వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
యాకోబు 4:4
దేవుడే శత్రువుగా మారితే ఇక, రక్షించేదెవరు? అందుకే, ఒకే దినాన్న 23 వేలమంది చనిపోయారు. (1కొరింథీ 10:8). బిలాము ఇశ్రాయేలీయులను పాడు చేయడమే కాకుండా, అతడును అన్యజనులైన మిద్యానీయులతోపాటు ఖడ్గము చేత వధించబడ్డాడు.
ప్రియ విశ్వాసి! నేటి సంఘాలలో ధనవ్యామోహంతో, దేవుని వాక్యాన్ని సహితం వక్రీకరించగలిగే బిలాములు కోకొల్లలు. వారి బోధలు నీకు అనుకూలంగానే, రుచికరంగానే ఉండొచ్చు. చివరకు మాత్రం నీకు బాధలు తెచ్చిపెడతాయి. ఈ బోధ అనుసరించతగినదో, ఏ బోధకు దూరంగా వుండాలో వాక్యపు వెలుగులో నీకు నీవే పరిశీలన చేసుకో!
ప్రియసేవకా! ఇస్కరియోతు యూదా ధనాన్ని ఆశించి, పరలోకంలో అతని పేరును తన చేతులతోనే చెరిపేసుకొని, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. గేహాజి తన వంశమంతటికి కుష్టురోగాన్ని కొనితెచ్చుకున్నాడు. బిలాము చరిత్రహీనుడై ఖడ్గముచేత చంపబడ్డాడు. ఇహలోక సంబంధమైన ధనముకాదుగాని, శాశ్వతమైన పరలోక నిధిని స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడు. నీ జీవితాన్ని ప్రభువు మెచ్చేవిధంగా సరిచేసుకోవడాని నీ హృదయాన్ని సిద్ధపరచుకో!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(పండ్రెండవ భాగము)♻ *3. పెర్గము సంఘము* :♻
(Part- 5)
అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు.
అటువలెనే నీకొలాయితుల బోధననుసరించు వారును నీలో ఉన్నారు.
ప్రకటన 2: 14,15
🔅 *తప్పు:*
*నీకొలాయితుల బోధననుసరించు వారును నీలో ఉన్నారు.*
వివరణకై “సప్త సంఘములు- రెండవ భాగము” చదువగలరు. ఎఫెస్సీ సంఘము నీకొలాయితుల క్రియలను ద్వేషించి, ప్రభువుచేత ప్రశంసించబడగా, పెర్గము సంఘము వాటిని అనుసరించి, తప్పు మోపబడింది.
🔅 *హెచ్చరిక:*
మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధము చేసెదను.
ప్రకటన 2: 16
*ఏ విషయంలో మారుమనస్సు పొందాలి?*
విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు. జారత్వము జరిగించ కూడదు. బిలాము బోధలు, నికోలాయితుల బోధలు అనుసరించుట మానాలి.
అట్లా చేయకపోతే, ఖడ్గముతో యుద్ధం చేస్తాడు. బిలాము కూడా ఖడ్గం చేతనే చంపబడ్డాడు.
ప్రియ విశ్వాసి! ఒక్కసారి నీలో నీవు చూచుకో! మార్చుకోవలసింది ఏముందో? సంఘముతో రాజీ పడుతున్నావా? వాక్య విధానాలు కాదని తెలిసినా సమర్ధించి, నీ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ, ఈ రంగుల ప్రపంచంలో కలసిపోయి, ఆ రంగుల ప్రపంచాన్ని సంఘంలోని తీసుకురావడానికి అహర్నిశలూ నీవంతుగా కృషిచేస్తున్నావా?
దుర్భోధలు, కలిపిచెరిపెడు బోధలు, వాక్య విరుద్ధమైన బోధలు దావానంలా వ్యాపిస్తూ వుంటే? కొంచెమైనా భారం గాని, భాద్యతగాని లేదా? నీ సంఘములో జరుగుతున్న క్రమాన్ని ఎవరికో ముడిపెడతావుగాని, వాక్యపు వెలుగులో నీవెందుకు పరిశీలించవు? నవీన బిలాములు, నీకొలాయితులతో జాగ్రత్త. వారి క్రియలలో పాలుపొందకు.
నీ ప్రియుడైన యేసుని విడచి, సాతానుతో జతకట్టి నీవు జరిగించేదేదైనా అది ఆత్మీయ జారత్వమే. దేవునికంటే, దేనికెక్కువ ప్రాధాన్యత ఇచ్చావో అది నీజీవితంలో ఒక విగ్రహమే. వీటన్నింటిని ఒక్కసారి దృష్టించి, మారుమనస్సు పొందాలి. విడచి పెట్టినదాని తిరిగి హత్తుకోకుండా జాగ్రత్తపడాలి.
🔅 *ప్రతిఫలము:*
జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
ప్రకటన 2: 17
*మరుగైయున్న మన్నా:*
ఇశ్రాయేలీయలు మన్నా బంగారు పాత్రలోవుంచి దేవాలయములో భద్రపరచి యుండెను. (నిర్గమ 16:33,34 హెబ్రీ 9:4) దేవాలయ నాశన సమయంలో యిర్మియా ఈ పాత్ర సీనాయి కొండలో ఒక గుహలో భద్రపరచెననియు మెస్సయ వచ్చినప్పుడు అవి మరలా లభించుననియు యూదులు నమ్ముచున్నారు.
మన్నా పరలోకమునుండి దిగివచ్చిన ప్రభువునకు సూచనయై యున్నది. (నిర్గమ. యోహాను ) మరుగు చేయబడిన మన్నా భుజించుట అనగా మెస్సయా పరిపాలించుకాలములో ఇశ్రాయేలీయులు ప్రత్యేక ఆశీర్వాదములు అనుభవించునని అర్ధమైయున్నది. ప్రభువుతోగల సహవాసము ద్వారా విశ్వాసికి లభించుచున్న ఆత్మీయమైన బలమునకు ఇవి సూచనలై యున్నవి.
*తెల్లరాతినిత్తును:*
పురాతన కాలంలో యుద్దములో జయముపొందిన వ్యక్తులకు తెల్లరాయి నిచ్చేవారు. అట్లానే మనము జయవీరులమైతే, తెల్లరాయి నివ్వబడును.
“తెలుపు” పరిశుద్ధ గ్రంధములో పరిశుద్ధతకు, పరలోకానికి సాదృశ్యము. తెల్లని బట్టలు( ప్రకటన 3:5), తెల్లని వస్త్రములు( 7:9), నిర్మలమైన నారబట్ట(19:7), తెల్లని గుఱ్ఱము( 19:11,14) తెల్లని సింహాసనము (20:17).
ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
పూర్వకాలంలో విందుకు ఎవరినైనా పిలిస్తే, అతని పేరు తెల్లరాయిమీద చెక్కి మరీ పంపేవారట. ఇప్పుడు జయించినవారికైతే, “ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరుపెట్టుదును.” (రోమా 9:25) పరలోకంలో ప్రభువు ప్రతీవానికిని ఒక కొత్తపేరుపెట్టి, ఆ పేరుతో పిలుస్తారని గ్రహించవచ్చు.
ఆ ధన్యకరమైన రాజ్యంలో మనముండాలంటే? నమ్మకమైన సాక్షి “అంతిపస్” వలే సజీవ సాక్ష్యులుగా జీవిస్తూ, దుర్భోధలకు దూరంగా వుంటూ, మారుమనస్సు కలిగిన జీవితాలు కలిగియుందము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(పదమూడవ భాగము)🔅 *4. తుయతైర సంఘము* :🔅
(Part- 1)
తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజిని పోలిన పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును. అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచు చున్నది.
మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టు కొనుడి. నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు; మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
ప్రకటన 2:18-29
🔅 *తుయతైర అనగా?*
🔹 “లోకంతో ఐక్యం”
🔅 *తుయతైర యొక్క ప్రస్తుత నామము?*
🔹 ఆకిస్సార్
🔅 *ప్రశంస :*
🔹 క్రియలు
🔹 విశ్వాసము
🔹 ప్రేమ
🔹 సహనము కలిగియుండుట.
🔅 *తప్పు:*
🔹 విగ్రహార్పితములు తినుట.
🔅 *పురికొల్పు:*
🔹 మీ పైని భారము పెట్టను.
🔅 *హెచ్చరిక:*
🔹 మారుమనస్సు పొందకుంటే, శ్రమల పాలుజేసెదను.
🔅 *ప్రతిఫలము:*
🔹 జనులను ఏలుట.
🏥 *తుయతైర* 🏥
పారసీక సామ్రాజ్య పతనానంతరము మహా చక్రవర్తి అలెగ్జాన్డరు ఒక మాసిదోనియా కోలనిగా ఈ పట్టణాన్ని స్థాపించెను. ఈ పట్టణము గొప్ప వ్యాపారకేంద్రమై యుండెను. తెల్లని నారబట్టలు, ఉన్నితో చేయబడిన వస్త్రములు మరియు వస్త్రములకు రంగులు వేయుట, తోలు పరిశ్రమ, మట్టి పాత్రలు, తెల్లని పెంకులు, ఊదారంగు వస్త్రములు, మొదలైన వ్యాపారాలకు ప్రసిద్ధి. ఊదారంగు పొడి అమ్మే లూదియా, తుయతైర పట్టణస్థురాలు. (అపో. కా. 16 అ.) ఈమె ద్వారానే అక్కడ సంఘము స్థాపించబడెనని కొందరి అభిప్రాయము కాగా, అపొస్తలుడైన పౌలు ఎఫెస్సీలో సేవ చేసిన కాలములో ఈ ప్రాంతములో సంఘము స్థాపించెనని మరికొందరు అభిప్రాయ పడుచున్నారు. ఏది ఏమైనా ప్రారంభ కాలములోనే యిక్కడ సంఘము స్థాపించబడి యుండెను. (అపో. 19:10)
🔺 *తుయతైర సంఘమునకు ప్రభువు తనను తాను చేసుకొంటున్న పరిచయము:*
“అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములునుగల దేవుని కుమారుడు.”
“అగ్నిజ్వాలవంటి కన్నులు” అనగా సమస్తమును చూచువాడును, గ్రహించువాడును అని అర్ధము.
తనయెడల యథార్థహృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది;
(2 దిన 16:9) ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. (1 పేతురు 3:12) యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది. ( కీర్తనలు 33:19)
*అపరంజినిపోలిన పాదములు:*
ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; (ప్రకటన 1:15)
అపరంజిని పోలిన పాదములు “పరిశుద్ధతకు” సూచనగా వున్నాయి. అపవిత్రమైన నడతలను గద్దించుటకు, శత్రువులను అణచివేయుటకు సూచన. “సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుకత్రొక్కించును (రోమా 16:20).
ఈయన దేవుని కుమారుడు గనుక, తనయొద్దకు వచ్చువారికి దేవుని కుమారులగుటకు, అధికారమిచ్చుటకు ఈయన దేవుని కుమారునిగా ప్రత్యక్ష పరచుకొంటున్నాడు. “దేవుని కుమారుడు” అని ప్రకటన గ్రంథమందు ఇక్కడమాత్రమే ప్రస్తావించబడింది.
ఆయన సమస్తమును గ్రహించగలవాడు. ఆయనకు మరుగైయున్న సృష్టము ఏదిలేదు. ఆయన పరిశుద్ధుడును, దేవుని కుమారుడునై యున్నాడు. నిన్ను నీవు కప్పుకొని, ఆయన నుండి తప్పించుకోలేవుగాని, ఒప్పుకొని ఆయన కుమారులముగా, కుమార్తెలముగా తీర్చబడడానికి మన హృదయాలను సిద్ధపరచుకొందాం!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(పదునాలుగవ భాగము)🔅 *4. తుయతైర సంఘము* :🔅
(Part- 2)
నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.
ప్రకటన 2: 19
🔅 *ప్రశంస :*
🔹 క్రియలు
🔹 ప్రేమ
🔹 విశ్వాసము
🔹 పరిచర్య
🔹 సహనము కలిగియుండుట.
🔹 క్రియలు :
తుయతైర సంఘ క్రియలు ప్రభువు ప్రశంసించే విధంగా వున్నాయి. మొదటి క్రియలకంటే, కడపటి క్రియలు మరీ ఎక్కువగా వున్నాయి. ప్రభువు మననుండి కూడా వీటిని ఆశిస్తున్నారు. అయితే, రక్షణ లేకుండా, మనము చేసే క్రియలు దేవుని దృష్టికి నీతిమంతమైనవిగా వుండవు. సామాజిక, ధర్మ కార్యాలు తప్పక చెయ్యాలి. కానీ, అవి మనలను రక్షణలోనికి నడిపించలేవు. కొర్నేలి జీవితంలో చాలా మంచి లక్షణాలున్నాయి. అసలైన రక్షణ తప్ప, ఆ మంచి కార్యాలేవి, అతనిని నీతిమంతునిగా తీర్చలేకపోయాయి. దేవుని వాక్యం తప్ప. (అపో 10 వ అధ్యాయం)
ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు;
రోమా 3:20
“రక్షణ” రైలు ఇంజన్ అయితే, నీవు చేసే “సత్క్రియలు” రైలు బోగీలు కావాలి.
రక్షణ లేకుండా, సత్క్రియలు చేస్తానంటే? ఇంజన్ లేకుండా బోగీలు ఎక్కడకి పోగలవు?
“రక్షణ” నీ కోసం, రుధిరాన్నంతా ధారపోసిన నీ ప్రియ రక్షకుని ద్వారా మాత్రమే సాధ్యం. అంతేగాని, నీ సత్క్రియలు నిన్ను రక్షించలేవు. అయితే, రక్షించబడిన నీవు, నీ రక్షణకు కొనసాగింపుగా సత్క్రియలు చెయ్యాలి.
🔹 ప్రేమ:
పరిశుద్ధ గ్రంధమంతా ఒక్క ప్రేమ అనుమాటలోనే, పరిపూర్ణమై యిన్నది.
నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను (మత్తయి 19:19). ధర్మశాస్త్ర మంతయునిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలోసంపూర్ణమైయున్నది. (గలతీ 5:14)
కనిపించే మన పొరుగువానిని ప్రేమించలేని మనము, కనిపించని దేవునిని ఎట్లా ప్రేమించగలము? ఈ సత్యాన్ని గ్రహించగలిగింది ఈ సంఘము. ఎఫెస్సీ సంఘము మొదటి ప్రేమను వదిపెట్టగా, తుయతైర సంఘము మాత్రము ఆ ప్రేమను కొనసాగించి ప్రభువు మెప్పును పొందగలిగింది.
ఆయన ప్రేమతత్వం:
శత్రువులను కూడా ప్రేమించు. (మత్తయి 5:44) మాటలకే పరిమితం కాదు. చేసి చూపించారు కూడా. మనము శత్రువులమై వున్నప్పుడు మన కోసం తన ప్రాణమును పెట్టారు. (రోమా 5:10)
ప్రేమంటే? చంపేసేది కాదు. చచ్చిపోయేది. “తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. యోహాను 15:13
అది ఆయనకే సాధ్యమయ్యింది. కారణం?
ఆయన ప్రేమ, అద్వితీయమైన ప్రేమ.
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;
అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.ప్రేమ శాశ్వతకాలముండును.
1 కొరింది 13:4-8
ఇది అగాపే లవ్, ఇది దివ్యమైన ప్రేమ, నీ దేవునికే సాధ్యమైన ప్రేమ.
నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటో నాకు తెలియదుగాని, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తావని. కనీసం తలిదండ్రుల ప్రేమలో కూడా అంతర్గతంగా ఒక ఆశ వుంటుంది. పిల్లలు పెద్దవారై వారిని కూడా ప్రేమగా చూస్తారని.
కాని, ఆయన ప్రేమ బదులాశించనిది, అది అమరం, అతిమధురం,అపురూపం, అవధులులేనిది, అద్వితీయమైనది, సింహాసనము నుండి సిలువకు దిగివచ్చినది, మరణము కంటే బలీయమైనది, సజీవమైనది, శాశ్వతమైనది. అట్టి ప్రేమను అనుభవిస్తున్న నీవు ఆ ప్రేమకు మాదిరిగా జీవించాలి.
🔹 విశ్వాసము:
విశ్వాసము అంటే? నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు.
హెబ్రీ 11:1
విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది. 1. దేనికొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో? దానిని ఒక దినాన్న చూస్తాను అనే నమ్మకము. 2. కంటికి కనిపించనిది ఒకదినాన్న ప్రత్యక్ష మవుతుంది అనే నమ్మకం.
విశ్వాసం అంటే?
🔹 చీకటిలోనికి దూకడం కాదు.
🔹 గాలిలో మేడలు కట్టడం కాదు.
🔹 దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి వుంది.
🔹 నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుష్యులు చెప్పే ప్రతీ మాటను నమ్మదు.
🔹 దేవుడు వెల్లడించాడు అని మనుష్యులు అనుకునే ప్రతీదానినీ స్వీకరించదు.
🔹 పరిశుద్ధ గ్రంధంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది.
*నమ్మిక, విశ్వాసం ఒక్కటి కాదు. నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం. నమ్మిక అనేది విశ్వాసంలోనికి నడిపించాలి.*
ఇట్టి అనుభవం తుయతైర సంఘమునకు వుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు అనుభవములు దేవుని బిడ్డల యందు నిలకడగావుండి, ఎదుగుచున్నప్పుడు ప్రభువు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకలవారము కాగలము. థెస్సలొనీకయ సంఘమందు ఈ మూడు అనుభవాలు చూడగలిగెను. “విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవు నికి కృతజ్ఞతాస్తు తులు చెల్లించుచున్నాము”
(1 థెస్స 1:3). అట్టి అనుభవాలు మనజీవితంలో వుండగలగాలి.
🔹 పరిచర్య:
తుయతైర సంఘము పరిచర్య గల సంఘము అని ప్రభువు ప్రశంసిస్తున్నారు. మాటలు కన్నా, చేతలు శ్రేష్టం. పరిచర్య అంటే? కేవలం దేవుని వాక్యం ప్రకటించడం ఒక్కటే కాదు. పరిచర్య పలువిధాలు. అది దేవుని వాక్యాన్ని ప్రకటించేదే కావొచ్చు. మందిరం ఊడ్చే పరిచర్యే కావొచ్చు. అది ఏదైనా నీకు అప్పగించిన భాధ్యతను నమ్మకంగా, అనింద్యముగా నెరవేర్చవలసి వుంది.
🔹 సహనము:
తుయతైర సంఘము సహనము కలిగిన సంఘముగా ప్రభువు మెప్పును పొందుకోగలిగింది. సహించడం అంటే? అదొక బలహీనతగా భావిస్తాం. కానీ అదే మన మనోబలం.
*సహించినవారే ధన్యులు.*
సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు. (యాకోబు 5:11)
*శోధన సమయంలో నీవు కలిగియున్న సహనమును బట్టి, నీవు దేవుని బిడ్డవని, సకల జనులు గ్రహించాలి.*
మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. (ఫిలిప్పీ 4:5)
*నీ ప్రార్థనకు సమాధానం రావాలంటే? సహనం కలిగియుండాలి.*
యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. (కీర్తనలు 40:1 )
*విశ్వాస యాత్రలో విజయం సాధించాలంటే? సహనం కావాలి.*
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.
హెబ్రీ 12:1,2
నేటి దినాల్లో కుటుంబాలుగాని, సంఘాలుగాని విచ్చిన్నమవుతున్నాయంటే? ప్రధాన కారణం సహనం కోల్పోవడమే. ఆత్మీయ యాత్రలో అంతము వరకు సహించాలి. లేకపోతే, బహుమానం పొందలేము. తుయతైర సంఘమువలే క్రియలు, ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనము కలిగియుండుటకు ప్రయాసపడుదము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(పదిహేనవ భాగము)🔅 *4. తుయతైర సంఘము* :🔅
(Part- 3)
నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచు చున్నది.
ప్రకటన 2:20
🔅 *తప్పు:*
🔹 యెజెబెలు అనే స్త్రీని, తన బోధలను వుండనిచ్చుట.
ఈమె పాతనిబంధనా కాలమందుగల అహాబు భార్య యైన యెజెబెలుకు సూచనగావుంది. యెజెబెలు అను పేరుకు శీలవతి అని అర్ధం. కానీ, తన పేరుకు, జీవితానికి ఎక్కడా పొంతన లేదు. ఈమె ఒక దుర్మార్గపు రాణి.
*యెజెబెలు ఎవరు?*
సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె. అహాబు యొక్క భార్య. (1రాజులు 16:31)
🔹 a) *దేవతా ప్రవక్తలను పోషించేది.*
యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి ప్రవక్తలైన నాలుగువందల మంది
1రాజులు 18:19
🔹 b) *పగ తీర్చుకొను స్వభావము గలది. *
యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెనురేపు ఈ వేళకు నేను నీ ప్రాణ మును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక.
1రాజులు 19:2
🔹 c) *హంతకురాలు:*
అందు కతని భార్యయైన యెజెబెలుఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము; నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి.... అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండినాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొని పోయి రాళ్లతో చావగొట్టిరి.
1రాజులు 21:7,13
🔹 d) *జారత్వమును, చిల్లంగితనమును ప్రోత్సహించేది: *
అంతట యెహోరాముయెహూను చూచియెహూ సమాధానమా? అని అడు గగా యెహూనీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమా ధాన మెక్కడనుండి వచ్చుననెను.
2రాజులు 9:22
🔹 e) *గర్విష్టురాలు:*
యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజె బెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మముద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచినీ యజమానుని చంపినవాడా, జిమీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా
2రాజులు 9:30,31
🔹 f) *భర్తను కీడుకు ప్రేరేపించేది:*
తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబువంటి వాడు ఎవ్వడును లేడు.
1 రాజులు 21:25
ఇట్లా తన జీవితమంతా అవలక్షణాలే. ఇట్లాంటి లక్షణాలుగలిగిన స్త్రీని, ఆమె బోధలు సంఘములో ఉండనిచ్చారు. తుయతైర సంఘములో స్త్రీ బోధిస్తుంది. ఆమెను ప్రభువు కూడా యెజెబెలు అని పిలచుచున్నారు.
అయితే, సంఘములో స్త్రీ మౌనముగా వుండాలేతప్ప, బోధించకూడదని వాక్యము సెలవిస్తోంది. స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధే యతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధి కారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. (1 తిమోతికి 2:11,12) స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘ ములో స్త్రీ మాటలాడుట అవమానము.
1 కొరింథీ 14: 33,34
తుయతైర అనే సంఘములోనున్న ఈ యెజెబెలు అనే స్త్రీ , జారత్వము జరిగించుట, విగ్రహములకు బలి అర్పించినవాటిని తినుట తప్పేమీకాదని మోసపూరితమైన బోధచేస్తుంది.
🔹 *జారత్వము:*
జారత్వము జరిగించువారు క్రీస్తు యొక్క అవయవములను, వేశ్య యొక్క అవయవములుగా చేసినవారగుదురు.
మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు.
1 కొరింథీ 6:15
*జారత్వమును విసర్జించాలి.*
విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. (అపొ 15:28)
🔹 *విగ్రహార్పితములు తినడం*
*విగ్రహార్పితములు తినడం వలన మనస్సాక్షి బలహీనమై, అపవిత్రమవుతుంది:*
కొరింధీ 4:8-12
లోకమునుండి ప్రత్యేకింపబడిన నీవు, ప్రత్యేకంగానే జీవించాలి. అవిశ్వాసులతో సంబంధం అత్యంత ప్రమాదం. అట్లా అని వారితో మాట్లాడ కూడదనికాదు. దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలలో వారితో పాలుపంపులు వద్దు. *అవిశ్వాసులతో సాంగత్యం నీ జీవితానికి క్షేమకరం కాదు. సరిచేసుకొని, ఆయనకిష్టమైన జీవితాన్ని జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(పదహారవ భాగము)🔅 *4. తుయతైర సంఘము* :🔅
(Part- 4)
మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.
ప్రకటన 2:21-23
🔹మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.
యెజెబెలు ఒక అవలక్షణాల పుట్ట. ఆమె పేరుకు “శీలవతి” అనేకాకుండా, “పెంటకుప్ప” అనే మరో అర్ధం కూడా వుంది. ఈ రీతిగా చూస్తే ఆమె వ్యక్తిత్వానికి ఇది తిరుగులేని పేరు. సార్ధక నామధేయం. అయినప్పటికీ, కృపగలిగిన దేవుడు ఆమె మారు మనస్సుపొందడానికి సమయమిచ్చినప్పటికీ, అది మారుమనస్సు పొందకున్నది.
కావున, ప్రభువు తన తీర్పును వెల్లడి చేయుచున్నాడు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. దానితో వ్యభిచరించినవారు, దాని పిల్లలు అనగా? యెజెబెలు బోధలు అనుసరించి నడిచేవారు.
మన జీవితాల్లో కూడా ప్రభువు మారుమనస్సు పొందడానికి లెక్కలేనన్ని అవకాశాలిచ్చినప్పటికీ, ఆయన కృపను నిర్లక్ష్యం చేసిన సందర్భాలెన్నో? ఆయన కృపామయుడు కదా, తప్పక కృప చూపుతాడు. సిలువలో దొంగవలే ఒక్క చిన్న మాటతో పరలోకం చేరిపోవచ్చు అంటూ వ్యర్ధమైన ఆలోచనలతో, ఆయన కృపను చులకనచేసే ప్రయత్నం చెయ్యొద్దు. ఆయన అనుగ్రహము, సహనము, దీర్ఘశాంతము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది గ్రహించకుంటే, దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేవు.
దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు. (రోమా 2:4,5)
అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. (2 పేతురు 3:9)
ఇటీవల కాలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు బెన్ హీమ్ గారు, ఆయనకు కలిగిన అనుభవాన్ని గురించి విన్నాము. ప్రపంచములో అనేకులను ప్రభువు చెంతకు నడిపించినవాడే. పరలోక ద్వారం దగ్గరకు వెళ్లేసరికి, ప్రేవేశానికి అనుమతిలేకుండా పోయిందట. అయితే, ఆయనకు మరొక అవకాశం ఇవ్వబడింది. కానీ, మనకు అట్లాంటి అవకాశం ఇవ్వబడదు. నీవు భాషలు మాటాడొచ్చు, ఉపవాసాలు చెయ్యొచ్చు, ప్రసంగాలు చెయ్యొచ్చు, పాటలు పాడొచ్చు, అయితే, పరలోకంలో ప్రవేశించకుండా నిన్ను అడ్డగించేది నీలో ఏముందో, ఏ విషయంలో మారుమనస్సు పొందాల్సివుందో? పరిశీలన చేసుకో. నాలో పాపంలేదు. నేను పాపం చెయ్యను, నేను పరిశుద్ధుడనే అంటూ నీకు నీవే మోసం చేసుకొనే ప్రయత్నం చెయ్యొద్దు. దేవుడు నీకు మరొక అవకాశం యిస్తుండగా మారు మనస్సుపొందు. ఆయన అనుగ్రహమును, సహనమును, దీర్ఘశాంతమును నిర్లక్ష్యము చెయ్యొద్దు.
🔅*అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే:*🔅
ఈలోకంలో నటించడంలో మనకు మనమే సాటి. ఈ లోకంలో ఎంత నటించినా, ఎంతమందిని మోసం చెయ్యగలిగినా, దేవుని చేతిలో మాత్రం అడ్డంగా దొరికిపోతావు. నీకు తలంపు పుట్టకముందే, అది దేవునికి తెలుసు. నీ మనస్సులో ఏముందో? నీ భార్యకుగాని, భర్తకుగాని, నీ ప్రాణ స్నేహితుడు అని చెప్పుకొంటున్నవానికిగాని తెలియకపోవచ్చు. అయితే, నీ అంతరింద్రియములను పరిశోధించగలిగిన దేవునినుండి, తప్పించుకోలేవనే గ్రహింపులోనికి నీవురావాలి.
మనుష్యులు పై వేషమును లక్ష్యపెడతారు గాని, ప్రభువు అంతరంగమును లక్ష్యపెట్టువాడు. (అట్లా అని, పై వేషమును లక్షపెట్టడని నీకు నచ్చినట్లుగా అలంకరించుకోవడానికి లేదు. ఇతరులను పాపమునకు ప్రేరేపించే వస్త్రధారణ గాని, అలంకరణ గాని, అసలొద్దు. దేవుడు పై వేషాన్ని చూడడు ఎట్లా అయినా ఉండొచ్చు అనేది దుర్భోధ. ఈ విషయంలో జాగ్రత్త. నీ డ్రెస్సింగ్ చూస్తేనే అర్ధంకావాలి. నీవు దేవుని బిడ్డవని)
అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు;
1 సమూయేలు 16:7
🔹 అంతరింద్రియములను కలుగజేసినవాడు దేవుడే.*
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.
కీర్తనలు 139:13
🔹 *అంతరింద్రియములను పరిశీలించగలిగినవాడు దేవుడే:*
ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీ క్షించువాడను.
(యిర్మియా 17:10 )
🔹 రాజైన దావీదు, ప్రవక్తయైన యిర్మీయా కూడా, అంతరింద్రియములను పరిశోధించువాడవు నీవే అంటూ ప్రార్థిస్తున్నారు.
హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, (కీర్తనలు 7:9)
యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షిం చుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. (కీర్తనలు 26:2) సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశో ధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక (యిర్మియా 20:12)
🔹 ఆయన అంతరింద్రియములను గ్రహించగలవాడని సంఘములన్నియూ గ్రహించగలగాలి.
ఆయన అంతరింద్రియములను గ్రహించగలవాడని గ్రహించగలిగితే, ఆ తలంపు నీవు రహస్యపాపాలను కొనసాగిస్తున్నప్పుడు, నీకు భయం పుట్టించి, దానినుండి దూరం చేస్తుంది. తద్వారా నీ జీవితం సరిచేయబడుతుంది.
🔹 *మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.
ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. (రోమా 2:6,7)
చెడ్డ క్రియలకు నిత్యమరణము, సత్క్రియలకు నిత్యజీవము కాబట్టి, మారుమనస్సు పొంది, సత్క్రియలు చేస్తూ ఆ నిత్య రాజ్యములో ప్రవేశించుదము. ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(పదిహేడవ భాగము)🔅 *4. తుయతైర సంఘము* :🔅
(Part- 5)
అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టు కొనుడి. నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు; మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
ప్రకటన 2:24-29
క్రియలు, ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనము కలిగియున్న తుయతైర సంఘములో, యెజెబెలు తన బోధలచేత అనేకులను మోసపరచింది. జారత్వము చేయడానికి, విగ్రహార్పితములను తినడానికి ప్రేరేపించి, వారిని విశ్వాసమునుండి తొలగించింది. అయితే, కొందరు యెజెబెలు బోధలను అంగీకరింపక, సాతాను కార్యకలాపాలలో పాల్గొనినవారు కాదు. అట్లా శేషించినవారికి ప్రభువు సెలవిచ్చేదేమనగా
*మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టు కొనుడి.*
శేషించిన సంఘముపై ఎట్లాంటి భారాన్ని ప్రభువు పెట్టడం లేదు. వారేదైతే కలిగియున్నారో? దాని నుండి తొలగిపోకుండా గట్టిగా పట్టుకొనండిని ప్రభువు తెలియజేస్తున్నారు.
వారు కలిగియున్నదేమిటి?
🔹 క్రియలు
🔹 ప్రేమ
🔹 విశ్వాసము
🔹 పరిచర్య
🔹 సహనము
నేటి దినాల్లోకూడా దుర్భోధ దావానంలా వ్యాపిస్తుండగా, మనకు కలిగినదానికి మనమునూ పట్టుకోగలిగితేనే, దుర్భోధను ఎదిరించి ప్రభువుకొరకు స్థిరముగా నిలబడగలము. ఇంతకీ, మనకు కలిగియున్నదేమిటి? సువార్త.
*సువార్తను గట్టిగా పట్టుకోవాలి:*
సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వా సము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.
1 కొరింథీ 15:1,2
*మొదటి విశ్వాసమును, అంతమువరకు గట్టిగా పట్టుకోవాలి:*
పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచ బడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.
హెబ్రీ 3:14,15
*మనము ఒప్పుకొనినదానిని గట్టిగా పట్టుకోవాలి: *
మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము.
హెబ్రీ 4:13,14
🔅 *ప్రతిఫలము:*
నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు; మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.
*అధికారము ఎవరికి?*
అంతమువరకు ఆయన క్రియలు జాగ్రత్తగా చేయువానికి. అంటే? ఆయనయందు విశ్వాసముంచితేనే సరిపోదు. ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి.
ప్రభువు చివరి ఆజ్ఞను కూడా “చేయుడి” అని బోధించారు. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు (మత్తయి 28:19)
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. (మత్తయి 7:24) అనగా సంపూర్ణముగా ప్రభువు మాటలు గైకొనబడాలి. అట్లాంటి వారికి రెండు ప్రతిఫలాలు లభించనున్నాయి.
1. *జనుల మీద అధికారం:*
a) ఇశ్రాయేలీయుల మీద (మత్తయి 19:28)
b) సర్వలోకమును పరిపాలించే అధికారం (1కొరింధీ 6:2)
c) దేవదూతలు న్యాయము తీర్చే అధికారం
(1కొరింధీ 6:3)
2. *వేగుచుక్క :*
ఇది ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన మాట.( ప్రకటన 22:16)
బిలాము ప్రభువును గూర్చి ఈరీతిగా ప్రవచించాడు. “ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును”
సంఖ్యా 24:17
మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు. (2 పేతురు 1:19) ఆయన యందు లక్ష్యముంచగలిగితే, ఆయనతో కలసి పరిపాలింతుము.
క్రియలు, ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనము కలిగి, దుర్భోధలకుదూరంగా వుంటూ, మారుమనస్సుపొంది, ప్రభువిచ్చే ప్రతిఫలాలు పొందుకుందాం!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
💒 *సప్త సంఘములు* 💒
(పద్దెనిమిదవ భాగము)🔅 *5. సార్దీస్ సంఘము* :🔅
(Part- 1)
సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు. జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
ప్రకటన 3:1-6
🔅 * సార్దీస్ అనగా?*
🔹 ఉజ్జీవము, రహస్యముగా పారిపోయినది, ఎర్రనిది
🔅 * ప్రస్తుత నామము?*
🔹 సార్ట్
🔅*ప్రశంస :*
🔹 వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీయొద్దఉన్నారు
🔅*తప్పు:*
🔹 అసంపూర్ణమైన క్రియలు
🔅*పురికొల్పు:*
🔹 చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము.
🔅*హెచ్చరిక:*
🔹 నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను
🔅*ప్రతిఫలము:*
🔹 జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
⛪ *సార్దీస్* ⛪
ఈ పట్టణము ధన సమృద్ధి గల పట్టణము. పట్టణ మధ్య భాగము నుండి పాక్టోస్ అను నది ప్రవహించు చుండెను. ఈనది ఇసుకలో బంగారు పొడి ఉండెనని చెప్పబడుచున్నది. అందుచే ఇది సమృద్ధిగలిగి యుండెను. ఇది గొప్ప వ్యాపార కేంద్రముగా నుండెను. కంబళి వస్త్రాలకు రంగు వేయుట ఇక్కడే ప్రారంభించబడెనని చెప్పనడుచున్నది. వెండి, బంగారముతో నాణెములు చేయడం ఇక్కడే ప్రారంభమయ్యెను. ఆ ప్రాంతముందుండే సమాధులలోనుండే బంగారమును బట్టి, ఆ ప్రాంతమెంతటి సమృద్ధిగలదో అర్థంచేసుకోవచ్చు.
🔅 *సార్దీస్ సంఘమునకు ప్రభువు తనను తాను చేసుకొంటున్న పరిచయము:*
🔹 ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు
ఏడు నక్షత్రములు, ఏడు సంఘముల యొక్క దూతలు ( ప్రకటన 1:20). దేవుని ఏడు ఆత్మలు అనగా? ఆత్మలు ఏడు కాదుగాని, ఆత్మ ఒక్కటే. ఏడు ఆత్మలు అనగా? ఆత్మచేయు ఏడు కార్యములుగా గ్రహించగలము.
1. జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ
2. వివేకమునకు ఆధారమగు ఆత్మ
3. ఆలోచనకు ఆధారమగు ఆత్మ
4. బలముకు ఆధారమగు ఆత్మ
5. తెలివిని పుట్టించు ఆత్మ
6. భయమును పుట్టించు ఆత్మ
7. భక్తిని పుట్టించు ఆత్మ
యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును. (యెషయా 11:2). ఆత్మ దేవునిలోనుండి వచ్చి, క్రీస్తులో నివసించెను. ఈ ఏడురకాల ఆత్మ కార్యాలను పరిశుద్ధాత్ముడు మాత్రమే జరిగించగలడు. దురాత్మకు సాద్యం కానేకాదు. వాడు వినాశనకారి. దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగా, ఈ వాక్యము మన తలంపులను, ఆలోచనలను ప్రభువువైపు నడిపించుచున్నది. ఆ రీతిగా మనమునూ నడిపించబడుదము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
⛪ *సప్త సంఘములు* ⛪
(పంతొమ్మిదవ భాగము)🔅 *5. సార్దీస్ సంఘము* :🔅
(Part- 2)
*జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే.*
ప్రకటన 3:1
▪శారీరికంగా బ్రతికియున్నా, ఆత్మీయంగా చచ్చిన స్థితి.
▪ పైకి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నామంటున్నా, ఆత్మ నడిపింపులేని స్థితి.
▪విశ్వాసినంటూనే, క్రియలులేని జీవితం.
▪ పైకి భక్తిగలవారమని చెప్పుకొంటున్నాగాని, ఆయన శక్తిని ఆశ్రయించలేని స్థితి.
▪ దేవునిని మహిమ పరుస్తున్నామంటూనే, తననుతాను ఘనపరచుకొనే స్థితి.
▪ విశ్వాసులమంటూనే, దేవుని వాక్యానికి లోబడలేని స్థితి.
▪ పేరుకు మాత్రం ప్రాణముంది. జీవితం మాత్రం జీవచ్ఛవం.
▪ ఒక్క మాటలో చెప్పాలంటే? వేషధారణ.
ప్రేమ పెదవులకు మాత్రమే పరిమితమయ్యింది. హృదయం మాత్రం చెడిపోయింది. అయితే, హృదయం నిండినదానిని బట్టే నోరు మాట్లాడుతుంది. కానీ, విచిత్రమేమిటంటే? హృదయంలో వున్నది వేరైనా, పైకి మాత్రం నటించేది ప్రేమ. నటించడంలో మనకు మనమే సాటి. హృదయమంతా, కక్షలు కార్పణ్యాలతో నిండియున్నాగాని, వందనాలు, ప్రయిజ్ ది లార్డ్ లు, షాక్ హ్యాండ్ లకు లోటులేదు. మనుష్యులముందు నీవు ఎంతబాగా నటించినా, అవతలివాడు నీకంటే ఇంకా బాగా నటిస్తాడు. కానీ, ప్రభువుకు కావలసింది నీ నటన, ప్రదర్శన కాదు. నీ జీవితం.
అందుకాయన వారితో ఈలాగు చెప్పెను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. (మార్కు 7:6)
చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము. (సామెతలు 26:23).
దేవుడు యెహేజ్కెలుతో సెలవిస్తున్నారు. నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు. నా ప్రజలవలే నటిస్తారు. కానీ, నా మాట వినరు.
నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించు చున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు.
యెహేజ్కేలు 33:31,32
మన పితరులకు, మనకు ఎట్లాంటితేడా లేదేమో? మన జీవితాలు అంతేకదా? విని, విడచిపెట్టేవారముగానే వున్నాము తప్ప, అనుసరణీయమైన జీవితం లేకుండాపోతుంది కదా? ఒక్కసారి ఆలోచించు! నీ జీవితంలో నీవెన్ని ప్రసంగాలు వినివుంటావు? ఎంతమంది సేవకుల ద్వారా ప్రభువు నీతో మాట్లాడియుంటారు? నీ జీవితంలో మాత్రం మార్పు లేదు కదా? కారణమేమయ్యుంటుంది? విని, విడచి పెట్టేస్తున్నావ్. నీ భక్తి నాలుగు గోడలకు పరిమితమయ్యింది. మందిరంలో నున్నప్పుడు అక్కడ ఏ రీతిగా ఉండాలో, ఆరీతిగానే నటిస్తున్నావు. బయటకి వచ్చాక లోకంతో కలసిపోయి, లోకస్థునివలెనే జీవిస్తున్నావు. ప్రత్యేకించబడిన జీవితం లేనేలేదు. అయితే, నీకు బలమున్నా, ధనమున్నా, ఈ లోకంలో సర్వస్వం కలిగియున్నాగాని, ప్రభువు మాత్రం జీవచ్ఛవం అంటున్నారు. జాగ్రత్త!
ప్రజల దగ్గర భక్తిపరులమని చెప్పుకోవడానికి భక్తిని నటిస్తారు. కానీ, దేవుని శక్తిని మాత్రం ఆశ్రయించరు. అసలు ఆయన శక్తి ఏంటో వీరికి తెలిస్తేకదా? ఆశ్రయించడానికి. నటించడానికి అలవాటుపడి, జీవించడం మరచిపోయిన జీవితాలు. అవే జీవచ్ఛవాలు.
*పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.*
2 తిమోతికి 3:5
పెంటకుప్పలమీద జీవించాల్సిన మనలను, మింటపైన ఘనులతో కూర్చుండబెట్టారు ప్రభువు. అయితే, సుఖభోగాలకు అలవాటు పడిన మనము, జీవితం అంటే ఇదేనని, జీవించడమే దీనికోసమని, దాని కోసమే ప్రయాసపడుతున్నాము. సుఖభోగాలకు అలవాటుపడి, అప్పులు చేసి, తిప్పలు పడుతున్నాము. అంతే తప్ప, శాశ్వత జీవితాన్ని గురించిన తలంపే లేకుండా జీవిస్తున్నాము. అయితే, ప్రభువంటున్నారు నీవు బ్రతికియున్ననూ, చచ్చినవానితో సమానమని.
*సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకుచుండియు చచ్చినదైయుండును.*
1 తిమోతికి 5:6
ప్రియ విశ్వాసి! నీ నటించిన జీవితానికి, గతించిన కాలమే చాలు. ప్రభువుకు కావాల్సింది నీ నటన, ప్రదర్శన కాదు. నీ జీవితం. నిద్రమత్తులోనుండి మేలుకో. సుఖభోగాలనుండి బయటకురా. ప్రభువు కొరకు జీవించడానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకో!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
⛪ *సప్త సంఘములు* ⛪
(ఇరువదియవ భాగము)🔅 *5. సార్దీస్ సంఘము* 🔅
(Part- 3)
*జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.*
ప్రకటన 3:2
సార్దీస్ సంఘ క్రియలు దేవునికి సంపూర్ణమైనవిగా కనిపించలేదు. అసలు లేకుండా పోలేదుగాని, సంపూర్ణత లోపించింది. వున్న ఆ క్రియలుకూడా చావడానికి సిద్ధంగా వున్నాయి. అందుచే ప్రభువు సెలవిస్తున్నారు. నీవు మేల్కోవాలి. చావడానికి సిద్ధంగానున్న ఆ క్రియలను బలపరచాలని.
*జాగరూకుడవై యుండాలి. అనగా మెలకువగా వుండాలి.*
ఎక్కడ నిద్రపోతున్నావ్?
సంసోను దెలీలా తొడమీద పండుకొని నిద్రపోతున్నాడట. (న్యాయాధి 16:19)
సంసోను దేవుని కోసం ప్రతిష్ట చేయబడిన వాడు. బైబిల్ గ్రంధములోనే అత్యంత బలవంతుడు. కొదమ సింహాన్ని సహితం అవలీలగా చీల్చివేసిన బలశాలి. 300 నక్కలను పట్టుకొని ఫిలిష్తీయుల పంట పొలాలను నాశనం చేసిన ధీరుడు. పట్టణానికి కావలిగా నున్న ఇనుప గేటును సహితం ఊడబెరికి కొండ మీదకు విసిరి వేయగలిగిన వీరుడు. గాడిద పచ్చి దవడ ఎముకచేత వెయ్యి మంది శత్రువులను చంపిన శూరుడు. ఇట్లా ఎన్నో...! ఇట్లాంటి సంసోను, దెలీలా తొడమీద పండుకొని నిద్రపోతున్నాడట. ఏమయ్యింది? శత్రువుల చేతిలోబంధీగా మారాడు. తల వెంట్రుకలు గొరిగించబడి, రెండు కళ్ళూ పెరికి వేయబడి, దాగోను దేవతకు బలిగా మారాడు. నీలోనికి నీవు ఒక్కసారి చూచుకొనే ప్రయత్నం చెయ్యి. ఏ మత్తులోనున్నావో? దేనికి బానిసవయ్యావో? ఆ స్థితిలోనుండి నీవు లేవాలి.
*నిద్రించుచున్న నీవు లేవాలి.*
“నిద్ర” మరణమునకు సాదృశ్యంగా వుంది. నిద్రించుచున్నవాడు తప్పక లేస్తాడని మనకు తెలుసు. అట్లానే, మరణించిన తర్వాత మనము లేస్తామనే సజీవమైన నిరీక్షణ మనకుంది. తప్పక లేస్తాము కూడా. అయితే, ఇదెప్పుడు సాధ్యమంటే? ఈ లోకంలో నీవు శరీరముతో జీవిస్తున్నప్పుడే, ఆధ్యాత్మిక అంధకారంలోనుండి లేచి, మృతతుల్యమైన నీ జీవితాన్ని చక్కబరచుకున్నప్పుడే.
నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
ఎఫెసీ 5:14
*లేచిన నీవు మెలకువగా వుండాలి:*
మెలకువగా వుండాలి. అంటే, నిద్రపోకుండా గుడ్లప్పగించి చూస్తుండాలనికాదు గాని, ఆధ్యాత్మిక మత్తు నుండి నీవు లేవాలి. లేచి, నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. నీ జీవితాన్ని చక్కబరచుకోవాలి. ఇది నిద్రపోయే సమయంకాదు. నిద్ర మేల్కోవాల్సిన సమయం. కాలము పరిపూర్ణం కాబోతుంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. నీవు ఆధ్యాత్మిక గుర్రులో వుంటే, విడచిపెట్టబడతావు.
మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి.
రోమా 13:11
*ఎందుకు మెలకువగా వుండాలి?*
a) *సాతాను ఎప్పుడు దాడిచేస్తాడో తెలియదు గనుక:*
మన విరోధియైన అపవాది గర్జించుసింహమువలే, ఎవరిని మ్రింగుదునా అని తిరుగుతున్నాడు. నమిలితే ఆలస్యమవుతుందేమో, అందుకే దొరికినవారిని దొరికినట్లుగా మ్రింగే ప్రయత్నంలోనున్నాడు. ఒకవేళ నీవు ఆధ్యాత్మిక మత్తులో జోగుతూ వుంటే? వాడికి ఎరగా మారాల్సిందే. జాగ్రత్త, నీవు మేల్కోవాలి.
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
1 పేతురు 5:8
b) *ప్రభువు ఎప్పుడు వస్తారో తెలియదుగనుక.*
అవును ఆయన రాకడెప్పుడో? మన ప్రాణం పోకడెప్పుడో? తెలియదు గనుక, మనలను మనము సరిచేసుకొని, సిద్దపడి, మెలకువగా వుండాలి.
ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
మత్తయి 25:13
*మెలకువ కలిగి కలిగియున్నవారికి చేయబడిన వాగ్ధానము:*
మెలకువ కలిగియున్నవారు ధన్యులు. ఎందుకంటే? ప్రభువే వారికి ఉపచారము చేస్తారట. ఆయనే వడ్డిస్తారట.
ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
లూకా 12:37
*వెలుగు సంబంధులు నిద్రపోరు:*
మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము. కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.
1 థెస్స 5:5,6
ప్రియ విశ్వాసి! వెలుగు సంబంధులవలే, మెలకువగావుండి, చావడానికి సిద్ధంగానున్న క్రియలేమిటో? పరిశీలన చేసుకోవాలి. ఏమిటది? ప్రేమా? సమాధానమా? విశ్వాసమా? పరిచర్యనా? ఇంకా ఏది చావడానికి సిద్ధంగా వుందో, వాక్యపు వెలుగులో పరిశీలనచేసుకొని, చావనైయున్న వాటిని, బలపరచి, స్థిరపరచి, ప్రభువుచేత ఆతిధ్యం పొందే గొప్ప ధన్యతలోనికి ప్రవేశించుదము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
⛪ *సప్త సంఘములు* ⛪
( 22వ భాగము)🔅 *5. సార్దీస్ సంఘము* 🔅
(Part- 5)
అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు. జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
ప్రకటన 3:4-6
సార్దీస్ సంఘ క్రియలు అసంపూర్ణముగా నున్నాయనే తప్పు మోపబడినప్పటికీ, ఒక విషయం లో ప్రభువు ఆ సంఘాన్ని ప్రశంసిస్తున్నారు. తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో ఉన్నారు. పాపపుడాగులు వారికంటకుండా, వారిని వారు కాపాడుకొని, నీతిమంతమైన జీవితాన్ని జీవించగలిగారు.
🔅 *నీతిమంతులకు ప్రభువిచ్చే వాగ్ధానములు:* 🔅
🔹సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. అంటే వారు, రాజులు.
నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు. (యోబు 36:7)
🔹సహజంగా మనము ప్రార్ధించి, దేవుని సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. కానీ, నీతిమంతులు ఎప్పుడు ప్రార్థిస్తారా? అని సమాధానం ఇవ్వడానికి ప్రభువే ఎదురుచూస్తుంటారట.
యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. (కీర్తనలు 34:15)
🔹రాజైన దావీదు నీతిమంతులకొరకు ఇచ్చే సాక్ష్యం వింటే, శరీరం జలదరిస్తుంది.
నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు. ( కీర్తనలు 37:25)
🔹ఖర్జూరాలు ఎడారుల్లోనున్నా ఫలించగలవు. దేవదారు వృక్షాలు కనీసం నేలకూడా కనిపించని, మంచు పర్వతాలమీద సహితం ఫలించగలవు. అట్లానే, నీతిమంతులు ఏ పరిస్థితులలోనైనా ఫలించగలరు.
నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయుదురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు
( కీర్తనలు 92:12)
🔹నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. ఇంతకు మించిన ధన్యత ఇంకేముంది?
నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.
(మత్తయి 13:43)
🔹నీతిమంతులు, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు, తెల్లని వస్త్రములు ధరించుకొని ప్రభువుతో కూడ సంచరించెదరు.
ఏమిటా తెల్లని వస్త్రములు?
పరిశుద్ధుల నీతి క్రియలు.
ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మల ములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు. (ప్రకటన 19:8)
🔅 *పరిశుద్ధతను కాపాడుకున్నవారికి ప్రభువిచ్చే వాగ్ధానములు:* 🔅
1. *జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టను.*
రక్షింపబడి, పేరు జీవ గ్రంధములో వ్రాయబడిన తర్వాత, ఆ పేరు శాశ్వతకాలం ఉంటుంది అనే అపోహలకు తావేలేదు. జీవగ్రంధములో పేరు వ్రాయబడిన తర్వాత, తిరిగి పాపము చేస్తే? వ్రాయబడినపేరు తుడచిపెట్టబడుతుంది. వ్రాసినవానికి, తుడిచిపెట్టే అధికారంకూడా వుంది. తమ వస్త్రములు పాపపు దాడులు అంటకుండా కాపాడుకున్నవారికి ప్రభువిచ్చే వాగ్ధానం, వారి పేరు జీవగ్రంధమునుండి ఎప్పటికి తుడిచి పెట్టబడదు.
2. *నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.*
ఐదుగురు కన్యకలు సిద్ధపడినవారివలే నున్నారు. కానీ, సిద్దెలలో మాత్రం నూనెలేదు. విందుశాల తలుపు మూయబడింది. ఎంతరోధించినా, వారి రోదన అరణ్య రోధనే.
అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా *అతడుమిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగాచెప్పుచున్నాననెను.* (మత్తయి 25:11,12)
🔹 *ప్రభువు ప్రేమింపక, శపించబడిన వారితో ఆయన చెప్పేమాట. నన్ను విడచిపొండి.*
అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచిశపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. (మత్తయి 25:41)
🔹 *అక్రమముచేయువారితో ప్రభువు చెప్తున్నా మాట, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను.*
ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమముచేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును. (మత్తయి 7:22,23)
అయితే, తమ రక్షణ, నీతి, వస్త్రములను కాపాడుకొనినవారిని గూర్చి ప్రభువు చెప్పేమాట, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును. (లూకా 9:26) మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. ( మత్తయి 10:32)
*సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.*
ప్రియవిశ్వాసి! మన క్రియలు సంపూర్ణముగా వుండేటట్లు సరిచేసుకొని, మన రక్షణ, నీతి, వస్త్రాలను కాపాడుకొంటూ, ప్రభువిచ్చే ధన్యతలోనికి ప్రవేశించుదము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
⛪ *సప్త సంఘములు* ⛪
( 21వ భాగము)🔅 *5. సార్దీస్ సంఘము* 🔅
(Part- 4)
నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.
ప్రకటన 3:3
కృప గలిగిన దేవుడు, పలుమార్లు మారుమనస్సు పొందుటకు హెచ్చరిస్తూ, తగిన సమయాన్నిస్తున్నారు.
a) ఎఫెస్సీ సంఘమునకు :
నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.
ప్రకటన 2:5
b) పెర్గము సంఘమునకు
కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను.
ప్రకటన 2:16
c) తుయతైర సంఘమునకు
మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ప్రకటన 2:21
d) సార్దీస్ సంఘమునకు
నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము.
ప్రకటన 3:3
జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక, ఆధ్యాత్మిక మత్తునుండి లేచి, మారు మనస్సు పొంది, చావనైయున్న ఆ క్రియలను బలపరచి, స్థిరపరచు. అట్లా చేయకుంటే?
*నేను దొంగవలే వచ్చుచున్నాను.*
నోవహు దినాలలో కూడా, లోకులంతా నెమ్మదిగానే వుంది అనుకొని, పెండ్లి చేసుకొంటూ, ఇండ్లు కట్టుకుంటూ, సువార్తను ఎగతాళి చేస్తూ జీవించారు. ప్రళయం రానే వచ్చింది. ప్రస్తుత పరిస్థితులు కూడా అట్లానే వున్నాయి. రాత్రి వేళ దొంగవచ్చినట్లుగా ప్రభువు రాబోతున్నాడు. మన ఇంటికి దొంగ వస్తే? ఫోన్ చేసి రాడుకదా? తెలియకుండా వస్తాడు. తనపని తానూ చేసుకొనిపోతాడు. ఏడ్పు తప్ప ఇంకేమి మిగలదు మనకు. ప్రభువు కూడా అట్టి రీతిగానే రాబోతున్నాడు. మెలకువ, సిద్ధపాటు లేకుండా నీవుంటే? ఉగ్రతనుండి తప్పించుకోలేవు.
రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.
1 థెస్స 5:2,3
*ప్రభువు రాకడ తండ్రికి మాత్రమే తెలియును.*
అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.
మత్తయి 24:36
ఈ వచనంను ఆధారము చేసుకొని, అనేకమంది ఆయన దేవుడైతే? ఆయనెప్పుడు వస్తాడో, ఆయనకు తెలియదా అంటూ అనేక విమర్శలు చేస్తున్నారు. అయితే, ఆయనకు ఎందుకు తెలియదు? ఆయన అప్పటికి శరీరధారిగా నున్నాడు ( యోహాను 1:1,14) ఆయన సర్వశక్తి గలవాడైనప్పటికీ, తన స్వంత బలప్రభావాలు, అధికారం చేత ఏ పనియూ చేయకూడదని నిశ్చయించుకున్నాడు. (నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. యోహాను 5:30)(యోహాను 6:38; అపో. 10:38; ఫిలిప్పి 2:7,8) ఏది ఏమైనా, ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించిన దేవుడు తన జ్ఞానాన్ని పరిమితం చేసుకొనే స్వేశ్చ వుంది. అట్లా లేదని వాదించడం అజ్ఞానమే అవుతుంది. (ఆది 18: 20,21)
*మీరనుకొనని గడియలో ప్రభువు రాబోతున్నాడు.*
వాక్యం సంపూర్ణముగా ప్రత్యక్ష పరచబడింది. ఈ బోధ ఒక్కసారే అప్పగింప బడింది. అయితే, లేదు, దేవుడు నాకు మాత్రమే తన రాకడను ప్రత్యక్ష పరిచాడంటూ, ప్రభువు పలానా తారీఖున రాబోతున్నాడంటూ ప్రకటించి, సిగ్గుతో తలదించుకున్న ప్రముఖులెందరో వున్నారు. నేటికిని ఎట్లాంటి ప్రవచనాలు నమ్మేవారు కోకొల్లలు. అయితే, ఒక్క విషయం అర్ధంకావాలి. ఏ మనిషి కూడా లేఖనాలకు అతీతుడు కాదు. ఆయన ఎవ్వరూ ఊహించని గడియలో రాబోతున్నాడు.
మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. (మత్తయి 24:44: లూకా 12:40)
మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.
(మత్తయి 24:27)
ప్రియ విశ్వాసి! కృపాకాలం గతించిపోతుంది. ప్రభువు రాకడ ఆసన్నమవుతుంది. ఆధ్యాత్మిక మత్తునుండి మేల్కొని, చావనైయున్న క్రియలను బలపరచి, స్థిరపరచు. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
⛪ *సప్త సంఘములు* ⛪
( 23వ భాగము)🔅 *6. ఫిలదెల్ఫియ సంఘము* 🔅
(Part- 1)
ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతు లేవనగా నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
ప్రకటన 3:7-13
🔅 * ఫిలదెల్ఫియా అనగా?*
🔹 సహోదర ప్రేమ
🔅 * ప్రస్తుత నామము?*
🔹 షహర్
🔅*ప్రశంస :*
🔹 నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు.
🔹 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి
🔅*తప్పు:*
🔹 .......
🔅*పురికొల్పు:*
🔹 నేను నిన్ను ప్రేమించు చున్నాను.
🔅*హెచ్చరిక:*
🔹 ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.
🔅*ప్రతిఫలము:*
🔹 లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.
🔹 దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను.
🔹 నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
🔅*ఫిలదెల్ఫియ:*🔅
ఫిలదెల్ఫియ అనగా సహోదర ప్రేమ అని అర్ధము. ఇది కొండలమీద నిర్మించబడిన నగరము. పెర్గేమోస్ లోని అటలాస్ రెండవ వాడైన ఫిలడెల్పస్ ఈ పట్టణము స్థాపించబడెను. కావున, దీనికి ఫిలడెల్పియా అనే పేరు కలిగెను. ఇక్కడ విస్తారమైన ద్రాక్షారసం దొరుకుతుందని ప్రతీతి. భూకంపం వలన పట్టణము నాశనమైనప్పుడు, తిరిగి నూతనపరచబడి “షహర్” అను పేరు పెట్టబడెను. దీనికి “దేవుని నగరం” అని అర్ధము.
🔅 *ఫిలదెల్ఫియా సంఘమునకు ప్రభువు తనను తాను చేసుకొంటున్న పరిచయము:*
🔹 దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు
🔹 a) దావీదు తాళపుచెవి కలిగిన వాడు.
🔹 b) సత్యస్వరూపి
🔹 c) పరిశుద్ధుడు
🔺 a) *దావీదు తాళపుచెవి కలిగిన వాడు.*
దావీదు తాళపు చెవి “అధికారాన్ని” సూచిస్తుంది. దావీదు కలిగియున్న తాళపుచెవి అతని రాజ్యాధికారమే.
యేసు క్రీస్తు, దావీదు కుమారుడుగా, దావీదు వంశీయుడుగా, దావీదు చిగురుగా పిలవబడ్డాడు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. (లూకా 1:31,32)అట్లానే, మరణము మీద, పాతాళము మీద అధికారమును కలిగియున్నారు. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు *మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.* (ప్రకటన 1:18)
🔺 b) *సత్యస్వరూపి:*
ఆయన సత్యస్వరూపి, ఆయన ఎవరిలోనికి ప్రవేశిస్తారో వారు సర్వ సత్యములోనికి పయనిస్తారు. ఆయన ఎందుకు సత్యస్వరూపి అనబడ్డారో ఈ క్రింది లేఖనాలను ధ్యానించడం ద్వారా అర్ధముచేసుకోగలము.
వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; (యోహాను 1:14) ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను. (యోహాను 1:17)యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. (యోహాను 14:6) అందుకు పిలాతునీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్య సంబంధియైన ప్రతీవాడును నా మాట వినుననెను. (యోహాను 18:37) మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు. (1యోహాను 5:20).
🔺 c) *పరిశుద్ధుడు:*
దేవుడు కలిగియున్న లక్షణాలను గురించి మనము ధ్యానించాల్సివస్తే, మొట్టమొదటిది “పరిశుద్ధత”.
👉 *దేవుడే తన పరిశుద్ధతను గూర్చి ప్రకటిస్తున్నారు:*
నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. (లేవీ 11:44,45) యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును.(యెషయా 43:15)
👉 *ప్రభువు తన పరిశుద్ధత విషయంలో లోకానికే సవాలు విసిరారు:*
నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? (యోహాను 8:46)
👉 *దూతలు దేవుని పరిశుద్ధతను గానం చేస్తున్నారు:*
వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. (యెషయా 6:3)
👉 *ఆయన పరిశుద్ధుడని ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు:*
అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. (యెషయా 53:9) ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. (1పేతురు 2:22)
👉 *ఆయన పరిశుద్ధుడని అపోస్తలులు సాక్ష్యమిస్తున్నారు:*
పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. (హెబ్రీ 7:26)
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను. (2 కొరింథీ 5:21)
ఇట్లా, చెప్పుకుంటూపొతే, లెక్కలేనన్ని. మనుష్యులే కాదు, చివరికి దయ్యాలు సహితం ఆయన పరిశుద్ధుడని సాక్ష్యమిచ్చాయి.
అవును! ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై యున్నలాగున, ఆయన పిల్లలముగా మనమునూ పరిశుద్ధులముగా జీవించుటకు మన హృదయాలను సిద్ధపరచుకొందము.
ఆమెన్!
ఆమెన్!
ఆమెన్!
⛪ *సప్త సంఘములు* ⛪
( 24వ భాగము)🔅 *6. ఫిలదెల్ఫియ సంఘము* 🔅
(Part- 2)
నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.
ప్రకటన 3:8-10
🔅 *నీ క్రియలను నేనెరుగుదును*.🔅
యేసు అందరిని, అందరి అంతరంగాన్ని ఎరిగినవాడు. ప్రతీవాని క్రియలు, తలంపులు అన్ని ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైయున్న సృష్టము ఏదియూ లేదు. “యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు.” (యోహాను 2:24)
🔅 *నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు.*
శక్తి కొంచెముగా వుందట. అంటే, ఆత్మీయ శక్తికాదు. సంఖ్యాపరంగా ఆది బలహీనమైన సంఘముకావొచ్చు. కానీ, ఆత్మీయంగా శక్తిమంతులు. ఈ సంఘము వాక్యాన్ని గైకొనిన సంఘము. అందుకే వారు ఆత్మీయ శక్తిమంతులయ్యారు. ఆయన వాక్యానికి లోబడి జీవించే ప్రజలు బలశూరులు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. (కీర్తనలు 103:20)
నేటి మన జీవితాలు విని విడచిపెట్టేవారముగా, చదివి మరచిపోయావారముగానే వున్నాముతప్ప, వాక్యానుసారమైన జీవితాలు జీవించే పరిస్థితి లోపించింది. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాము అని తలంచుచున్నవారు సహితం, వాక్యాన్ని, వారికి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారేతప్ప, వాక్యానికి అనుకూలంగా వారిజీవితాలను మలచుకునే ప్రయత్నం లేనేలేదు. వాక్యము ఎంత చదివావు అనేదానికంటే, ఎంత గ్రహించావు అనేది ముఖ్యం. ఎంత గ్రహించావు అనేదానికంటే ఎంత అనుసరించగలుగుతున్నావు అనేది మరీ ముఖ్యం. అయితే, అసలైనదే మన జీవితాల్లో లేకుండా పోతుంది. ప్రకటన గ్రంధము మొదటి అధ్యాయములో వాక్యము చదివేవారికి, వినేవారికి, గైకొనేవారికి ముగ్గురికీ ధన్యత ఆపాధించబడింది. కానీ, చివరి అధ్యాయం వచ్చేసరికి ఆ ధన్యత “గైకొనేవారికి మాత్రమే” పరిమితం చేయబడింది. ఫిలదెల్ఫియ సంఘము వాక్యమును గైకొనిన సంఘము. అందుకే ప్రభువు ఒక్క తప్పుకూడా వారి మీద మోపలేదు.
👉 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.
ఓర్పు విషయంలో, వాక్యానికి తగినట్లుగానే జరిగించారు. పరిస్థితులు ఎట్లా వున్నా సహించగలిగారు. అందుచే, భూలోక నివాసులందరిమీదికి రాబోవు శోధనకాలంలో నిన్నును కాపాడెదను అని ప్రభువు వారికి వాగ్దానమిస్తున్నారు. భూలోకమంతటి మీదికి రాబోయే శోధన గడియ ఏది? అది ఏడేండ్ల శ్రమకాలమే. ప్రకటన గ్రంధం 6 నుండి 19 వ అధ్యాయము వరకు మహా శ్రమలను గూర్చి వ్రాయబడ్డాయి. ఈ శ్రమలలో సంఘము ఎక్కడా కనబడదు. దీనిని బట్టి, శ్రమలకు ముందుగానే సంఘము ఎత్తబడుతుందని గ్రహించగలము. ఆ రీతిగా ప్రభువుయొక్క వాగ్ధానము నెరవబోతుంది. అయితే, ఓర్పు అనేది కొంతకాలానికి పరిమితం కాకూడదు. అంతమువరకూ సహించాలి. అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.(మత్తయి 24:12) నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును. (మార్కు 13:13)
మనము శ్రమ పడుటకే పిలువబడ్డాము. ప్రభువునే హింసించారు. ఆయన పిల్లలముగా మనలను ఎట్లా ఊరుకొంటుంది లోకం? కొన్ని సందర్భాలలో క్రైస్తవులముగా పిలువబడుతున్నందుకేనా ఈ శ్రమలు అనే పరిస్థితి కలుగవచ్చు. ప్రస్తుతానికి మనకు అట్లాంటి పరిస్థితిలేదులెండి. ఎందుకంటే? లోకంతోనే కలసి ప్రయాణం చేస్తున్నాముకదా! లోకం నుండి ప్రత్యేకింపబడినవారికి మాత్రమే శ్రమలు. ఒక్క కత్తివేటుతో తల, మొండెం వేరయిపోతుంది. బ్రతికున్నవారినే మంటల్లో విసిరేస్తున్నారు. హత సాక్ష్యులు రక్తంతో సముద్రపు నీరుకూడా రక్తంలా మారుతుంది. ఎందుకంటే? వారు క్రైస్తవులైనందుకు బాధపడలేదు. సిగ్గుపడలేదు. దానినిబట్టే వారు అతిశయించారు. నేటి దినాలలో బైబిల్ తో మందిరానికి వెళ్ళడానికి సిగ్గుపడి, సెల్ ఫోన్ తో వెళ్లేవారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇక క్రైస్తవులమని చెప్పుకొనే ధైర్యమెక్కడుంటుంది? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. (1 పేతురు 4:16). సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఈ మాట నమ్మదగినది, ఏదనగామన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును. (2తిమోతి 2:11,12)
👉 ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు.
సువార్త ద్వారములు తెరువబడెను. ఈ సంఘము యొక్క సాక్ష్యము అనేక వందల సంవత్సరాలు నిలకడగానుండును.
👉 యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.
యూదులు కాకయే యూదులమని చెప్పుకొనువారిని “ సాతాను సమాజము” అని పిలుస్తున్నారు ప్రభువు . వీరు రక్షణ పొందుట ఒక్కటే చాలదని, సున్నతి చేయించుకొని, ధర్మ శాస్త్రాన్ని కూడా ఆచరించాలనే, ఒక దుర్భోధను ప్రవేశపెట్టి విశ్వాసులను, వారి సమాజమువైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు. వారందరూ నీ ఎదుట సాగిలపడి, నీకు నమస్కరించేలా, నేను సంఘమును ఏ రీతిగా ప్రేమిస్తున్నానో వారికి అర్ధమయ్యేలా చేస్తానని ప్రభువు సెలవిస్తున్నారు.
ప్రియ విశ్వాసి!
ప్రభువు నిమిత్తం సహనం కలిగియుండి, వాక్యానుసారమైన జీవితాలను జీవించడానికి హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
⛪ *సప్త సంఘములు* ⛪
( 25వ భాగము)💮 *6. ఫిలదెల్ఫియ సంఘము* 💮
(Part- 3)
*నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.*
ప్రకటన 3:11
🔸 *ఎఫెసు సంఘముతో:*
నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల *నేను నీయొద్దకు వచ్చి* నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును. (ప్రకటన 2:5)
🔸 *పెర్గము సంఘముతో :*
కావున మారుమనస్సు పొందుము; లేనియెడల *నేను నీయొద్దకు త్వరగా వచ్చి* నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధము చేసెదను. (ప్రకటన 2:16)
🔸 *సార్దీస్ సంఘముతో:*
నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల *నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.*
ప్రకటన 3:3
పై మూడు సంఘాలకు “నేను త్వరగా వచ్చుచున్నాను” మారు మనస్సు పొందకపోతే, శిక్షతప్పదు అంటూ ప్రభువు హెచ్చరిస్తున్నారు. కానీ, ఫిలడెల్ఫియా సంఘమునకు వాగ్ధానముతో కూడిన హెచ్చరిక చేస్తున్నారు.
*నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.* ప్రకటన 3:11
🔹 *మన కిరీటాలను అపహరించేదెవరు? ఎట్లా?*
సంఘము ఎత్తబడిన తరువాత, క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పులో అనేక కిరీటములు బహుకరింపబడతాయి.
*కిరీటములలో కొన్ని:*
🔸 *జీవ కిరీటము:*
శోధనలు జయించినవానికి, శ్రమలు సహించినవానికి ( యాకోబు1:12; ప్రకటన2:10)
🔸 *మహిమ కిరీటం:*
మందను నమ్మకంగా కాయువారికి (సంఘ కాపరులకు) 1పేతురు 5:2-4
🔸 *అతిశయ కిరీటం:*
ఆత్మలను రక్షించువానికి (సువార్తికులకు) 1థెస్స 2:19
🔸 *నీతి కిరీటం:*
తన పరిశుద్ధతను కాపాడుకొనుచు, తనకు అప్పగించు పనిని పూర్తిచేయు వానికి.
2తిమోతి 4:7,8
🔸 *అక్షయ కిరీటం:*
భక్తిలో విజయం సాధించేవారికి
1కొరింధీ 9:25-27
ఉదాహరణకు:
మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది
(2 తిమోతికి 4:7,8) ఇది విశ్వాస యాత్రలో వాక్యానుసారమైన జీవితం జీవించినవారికి వాగ్ధానం చేయబడిన కిరీటం. అయితే, అంతమువరకూ అట్లా జీవించగలగాలి. ఎక్కడ తప్పిపోయిన మన కిరీటం మనకు దక్కకుండాపోతుంది. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. (యాకోబు 1:12) అంతమువరకూ సహించాలి. ఎక్కడతప్పిపోయినా ఆ కిరీటం మనకు దక్కదు. సాతానుగాడు వాటిని దక్కించుకోలేడుగాని, మనకు దక్కకుండా చెయ్యడానికి, వాడు చెయ్యని ప్రయత్నమంటూ వుండదు. వాడికి చిక్కకుండా, మనలను మనము కాపాడుకోగలగాలి.
ఈ దినమే ప్రభురాకడ వస్తే? ఎత్తబడే సంఘములో మనముంటామా? ఏ కిరీటం మన కొరకు సిద్ధపరచబడి ఉంటుంది? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుందా? అయితే, నీవు అత్యంత ప్రమాదంలోనున్నావని గుర్తించు. ఈ కృపా కాలంలోనే, ప్రభువురాకడో, నీ ప్రాణం పోకడో ఎదో ఒకటి జరగకముందే, నీ జీవిత గమ్యమేమిటో నీకర్ధం కావాలి. ఆలోచించే సమయంలేదు. వాయిదాలు వేసే సమయమిదికాదు. ప్రభువు త్వరగా రాబోతున్నాడు. (ప్రకటన 22:7) త్వరగా అంటే? అది ఏ క్షణాన్నైనా కావొచ్చు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును (హెబ్రీ 10:37). చిన్నప్పటినుండి వింటూనే వున్నామని నిర్లక్ష్యం చెయ్యొద్దు. నీవు నశించిపోకూడదనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.(2 పేతురు 3:9)
ప్రియ విశ్వాసి! ఆయన దీర్ఘ శాంతము, నీకు చులకనయ్యిందా? ఇంకనూ నిర్లక్ష్యం చేస్తే, నిన్ను తప్పించేవారెవ్వరూ లేరు. చాచిన చేతులతో దినమెల్ల ప్రభువు నీ కొరకు ఎదురుచూస్తున్నారు. సమయముండగానే, ప్రభువు సమీపముగానుండగానే ఆయన చెంత చేరు. నీ జీవితాన్ని చక్కబరచుకో. ప్రభురాకడకై సిద్దపడు. అట్టిరీతిగా నీ జీవితాన్ని సిద్ధపరచుకో!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
⛪ *సప్త సంఘములు* ⛪
( 26వ భాగము)💮 *6. ఫిలదెల్ఫియ సంఘము* 💮
(Part- 4)
*జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.*
ప్రకటన 3: 12,13
*జయించేవారికి యివ్వబడిన వాగ్ధానములు: *
1. అతడు దేవుని మందిరంలో స్తంభముగా ఉంటాడు:
2. జయించేవారి మీద వ్రాయబడే పేర్లు:
a) దేవుని పేరు
b) దేవుని పట్టణపు పేరు
c) ప్రభువు క్రొత్త పేరు
*అతడు దేవుని మందిరంలో స్తంభముగా ఉంటాడు:*
స్తంభము బలమునకు, సుస్థిరతకు సూచనగా వుంది. సొలోమోను కట్టించిన మందిరమునకు రెండు స్తంభములున్నాయి. 1. యాకీను 2. బోయజు అనువారు. ( 1రాజులు 7:21) యెరూషలేము సంఘానికి యాకోబు( ప్రభువు సహోదరుడు) పేతురు స్తంభాలుగా నున్నారు. (గలతి 2:9). యిర్మియాతో, నీవు ఎక్కడికెళ్లినా భయపడక ప్రకటించు. నిన్ను ఇనుపస్తంభముగా చేస్తానని ప్రభువు ధైర్యపరుస్తున్నారు.
యూదా రాజుల యొద్దకు గాని ప్రధానులయొద్దకు గాని యాజకులయొద్దకు గాని దేశనివాసులయొద్దకు గాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, vప్రాకారముగల పట్టణముగాను ఇనుపస్తంభముగాను ఇత్తడి గోడలు గాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను. (యిర్మియా 1:18) ఈ రీతిగా జయించినవారికి దేవుని సన్నిధిలో శాశ్వతమైన స్థానమునిస్తానని ప్రభువు వాగ్ధానం చేయుచున్నారు. అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. (కీర్తనలు 23:6) జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టబడదు. (ప్రకటన 3:5) ఇట్టి రీతిగా క్రీస్తుతో కూడా దేవునియందు భద్రము చేయబడతారు.
*జయించేవారి మీద వ్రాయబడే పేర్లు:*
a) దేవుని పేరు
b) దేవుని పట్టణపు పేరు
c) ప్రభువు క్రొత్త పేరు
a) *దేవుని పేరు:*
పాతనిబంధనలో దేవునిపేరు యెహోవా. ఉన్నవాడు, అనువాడు అన్న పేరుతో ప్రజలకు ప్రత్యక్ష పరచుకున్నారు. (నిర్గమ 3:14) జయించినవారు పరలోకంలో వారి నొసళ్లయందు దేవునిపేరును కలిగియుంటారు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును. (ప్రకటన 22:4)
b) *దేవుని పట్టణపు పేరు:*
ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.(ప్రకటన 21:10)
ఈ నూతన యెరూషలేము భవిష్యత్తులో పరిశుద్ధుల నివాసముగా వుండబోతోంది. ఆ నూతన యెరూషలేము పేరును, జయించినవారిమీద ప్రభువు వ్రాయబోతున్నాడు.
c) *ప్రభువు క్రొత్త పేరు:*
వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు; (ప్రకటన 19:12) మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి. (ప్రకటన 14:1) రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది. (ప్రకటన 19:16) దీనిని బట్టి, ప్రభువు యొక్క క్రొత్తపేరు జయించినవారిమీద వ్రాయబోతున్నాడు. పరలోకంలో ప్రభువు మనమీద ఏమి పేరు వ్రాయబోతున్నారో మనకు తెలియదు గాని, ఇక్కడ మాత్రం క్రైస్తవుడు అని పిలవబడుట, దానికంటే ముఖ్యముగా క్రీస్తువలే జీవించడం ధన్యకరము.
ప్రియవిశ్వాసి! ఫిలడెల్ఫియా సంఘస్థులు వాక్యాన్ని గైకొన్నారు, పరిస్థితులు ఏవైనా ప్రభువు నామాన్ని ఎరుగమని చెప్పలేదు. వాక్యము విషయములో సహనాన్ని కలిగియున్నారు. ఎట్లాంటి తప్పు వారిమీద మోపబడలేదు. అద్భుతమైన వాగ్ధానాలు పొందుకోగలిగారు.అట్టిరీతిగా మన జీవితాలను సరిచేసుకుందాము. ప్రభువిచ్చే వాగ్ధానాలు స్వతంత్రించు కొందము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
⛪ *సప్త సంఘములు* ⛪
( 27వ భాగము)💮 *7. లవొదికయ సంఘము* 💮
(Part- 1)
లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మి వేయ నుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగకనేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నాసింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
ప్రకటన 3:14-21
🔅 *లవొదికయ అనగా?*
🔹 నులివెచ్చనిది.
🔅 *ప్రస్తుత నామము?*
🔹 ఎస్కి హిస్సార్
🔅 *ప్రశంస :*
🔹 ప్రసంశలు లేని సంఘము.
🔅 *తప్పు:*
🔹 నులివెచ్చని స్థితి
🔹 దౌర్భాగ్యుడవు
🔹దిక్కుమాలిన వాడవు
🔹దరిద్రుడవు
🔹గ్రుడ్డివాడవు
🔹దిగంబరుడవు
🔅 *పురికొల్పు:*
🔹 నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.
🔅 *హెచ్చరిక:*
🔹 నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
🔅 *ప్రతిఫలము:*
🔹 నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
🔅 *లవొదికయ:* 🔅
సిరియాలోని అంతియోక్యాస్ రెండవవాడు తన భార్యయైన లెవోడీస్ పేరుతో ఈ నగగాన్ని కట్టించాడు. ఈ పట్టణము ధన సమృద్ధి కలిగియుండెను. ఈ సంఘమునకు దీర్ఘకాల చరిత్ర కలదు. AD 361 లో ఇక్కడ జరిగిన కౌంట్స్ లో క్రొత్త నిబంధన గ్రంధమును “కానోను” అనగా దైవ గ్రంధముగా అంగీకరించెను. లవొదికయ ఒక బ్యాంకింగ్ పట్టణమై యుండెను. ప్రపంచములో ధన సంవృద్ధి కలిగిన నగరాలలో ఇదొకటి. ఇక్కడ లభించే గొఱ్ఱెబొచ్చు ద్వారా ఎరుపు, నలుపు రంగులుగల మనోహరమైన కంబళి తయారుచేయు చుండెను. ఆ పట్టణం వస్త్రోత్పత్తికి కేంద్రమై యుండెను. త్రిమిడ అని పిలువబడిన పై వస్త్రము ఈ పట్టణంలో అమ్మబడెను. వారు నిర్మించిన వస్త్రములతో అలంకరింపబడినవారై సంతృప్తి కలిగియుండిరిగాని, దేవుని దృష్టిలో వారు దిగంబరులని తెలుసుకోలేకపోయారు. ఈ పట్టణము మెడికల్ కేంద్రముగా నుండెను. కంటిలోను, చెవిలోను వేసే తైలము ఇక్కడ ఉత్పత్తి చేసియుండెను. ఇది ప్రపంచవ్యాప్తముగా అమ్మబడినది. కంటి వైద్యమునకు సంబంధించిన ఔషధము వ్యాపార కేంద్రముగా వున్ననూ, వీరియొక్క ఆత్మీయ అంధకారమును గుర్తించలేకపోయిరి.
🔅 *లవొదికయ సంఘమునకు ప్రభువు తనను తాను చేసుకొంటున్న పరిచయము:*
🔹 ఆమేన్ అనువాడును
🔹 నమ్మకమైన సత్యసాక్షియు
🔹 దేవుని సృష్టికి ఆదియునైనవాడు
*ఆమేన్ అనువాడు:*
ప్రభువు పేర్లలో ఒకటి “ఆమెన్” అది ఆయన బిరుదు. “ఆమెన్” అనగా “అట్లాగే జరుగునుగాక” అని అర్ధం. ప్రభువు తననుతాను “ఆమెన్ అనువాడు”గా పరిచయం చేసుకొంటున్నారంటే?ఆయన చెప్పబోయేది అట్లానే జరుగుతుంది అని గ్రహించగలము. “ఆమెన్” అనుమాట పాతనిబంధనలో (దిన 16:36; నెహెమ్యా 8:6 )లలో కూడా ప్రస్తావించబడింది.
*నమ్మకమైన సత్యసాక్షి*
ప్రభువే సత్యమైయున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్య మివ్వడానికే ఆయన పుట్టాడు.
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. (యోహాను 14:6) అందుకు పిలాతునీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; (యోహాను 18:37).
*దేవుని సృష్టికి ఆదియునైనవాడు*
ఆయన ప్రారంభములో సృష్టించబడిన వాడు కాదు. సమస్తమూ ఆయన మూలంగానే కలిగింది. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. (యోహాను 1:2,3) ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. (కొలస్సి 1:15) నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. (ప్రకటన 22:13)
ఆయన పరిచయంలోనే కనిపిస్తుంది, ఆయన ఏమైయున్నాడో? నేడైనా ఆయన ఏమైయున్నాడో గ్రహించగలిగి, ఆయన మాటలు శ్రద్ధగావిని, జీవితాన్ని సరిచేసుకోగలిగితే, జీవితం ధన్యమవుతుంది. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
⛪ *సప్త సంఘములు* ⛪
( 28వ భాగము)💮 *7. లవొదికయ సంఘము* 💮
(Part- 2)
నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మి వేయ నుద్దేశించుచున్నాను.
ప్రకటన 3:15,16
నేడు మనము లవొదికయ సంఘకాలంలో జీవిస్తున్నాము. ఒక్క ప్రశంశ కూడాలేదు సరికదా, వాంతి కలిగించే స్థితిలోవుంది. ఇది చల్లగానూ లేదు. అంటే మారుమనస్సులేని సంఘము కాదు. అట్లా అని వెచ్చగానూ లేదు. అంటే, ఉజ్జీవింపబడిన స్థితిలోనూ లేదు. దేనికి చెందకుండా మధ్యలో నిలబడినట్లుగా వుంది. అంటే. నిలువెచ్చని స్థితిలోవుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. అతి చల్లని నీళ్లలో గాని, అతి వేడి నీళ్లలోగాని సూక్ష్మజీవులు జీవించలేవు. వాటి అభివృద్ధి ఎక్కడ ఎక్కువ అంటే? నులి వెచ్చని నీళ్లలోనే. యుద్ధంలో నీవు ఎదో పక్షానికి చెందియుండాలి. అట్లాకాకుండా ఎవ్వరికి చెందకుండా మధ్యలో నీవుంటే? ఇరుపక్షాలు కలసి నీమీద దాడి చేస్తాయి. నేటిదినాన్న ఇదే పరిస్థితిలో నీవున్నావేమో పరిశీలన చేసుకోవలసిన సమయమిది. అటు దేవుని పక్షమో, ఇటు దయ్యము పక్షమో తేల్చుకోవాల్సిన సమయమిది. ఎదో ఒక పడవలో ప్రయాణిస్తే, గమ్యం చేరతావు. రెండుకాళ్లు రెండు పడవలలో వేస్తే? నీటిలో మునిగి మరణిస్తావు. జంటపడవలు అంటూ అతి తెలివిగా సమాధానం చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు. దేవుడు, దయ్యమూ కలసి ఎప్పుడూ ప్రయాణం చెయ్యరు. ఇద్దరినీ ఏకకాలంలో సంతృప్తి పరచడానికి నీ జీవితం చాలదు. ఎదో ఒకటి తేల్చుకోవలసిందే.
*ఇద్దరి యజమానులకు దాసుడుగా నుండుట సాధ్యం కాదు: *
ఏ సేవకుడును ఇద్దరు యజమాను లను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమిం చును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింప లేరని చెప్పెను.
లూకా 16:13
*ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది త్రాగడానికి వీల్లేదు.*
మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.
1 కొరింథీ 10:21
*రెండు మనసులు కలిగిన స్థితిలో నీవుండకూడదు.*
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు. (యాకోబు 1:5-8)
*నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.*
*చల్లగా వుంటే మేలు:*
చల్లగా అంటే? మారు మనస్సు లేని స్థితి. అదేంటి? మారు మనసు లేకుండా వుంటే, మేలేమిటి? ఎప్పుడైనా వేడెక్కే అవకాశం ఉండొచ్చు. దేవుని వాక్యం సంధించినపుడు మారుమనస్సు పొందే అవకాశం, అట్లాంటి ఆశ వుంది. అదే సమయంలో చల్లగా వుండే వ్యక్తి వలన దేవునికి కలిగే అవమానం చాలాతక్కువ. దేవుడన్నా, దేవుని మందిరమన్నా, పట్టించుకోనివాడు త్రాగి తందనాలాడినా, వారికి నచ్చిన విధానంలో జీవించినా, వారివలన దేవుని నామమునకు కలిగే దూషణ తక్కువే.
*వెచ్చగా వుంటే మేలు:*
వెచ్చగా అంటే? ఉజ్జీవింపబడిన స్థితి. ఇది ధన్యకరము. ఉజ్జీవింపబడిన వాడు ఊరకుండలేడు. మరొకరిని ఉజ్జీవింపజేస్తాడు. వెలుగుతున్నవాడు మరొకరికి వెలుగునిస్తాడు, మరొకరిని వేలిగిస్తాడు. మన కుటుంబాలలో, సంఘాలలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా నిత్య నాశనంవైపు సాగిపోతుండగా, ఉజ్జీవింపబడినవాడు ఆత్మల భారంలేకుండా ఊరకనే కూర్చోలేడు. ఇట్టి స్థితిలో నీవు, నేను వుండాలని కోరుతున్నారు. వెచ్చగా వుండిన జీవితాలు ధన్యమైనవి.
*నులివెచ్చని స్థితి, వాంతి కలిగించే స్థితి:*
నులివెచ్చనివారెవరంటే? వారమంతా లోకంలో, లోకాశాలతో, వారికి నచ్చినట్లుగా జీవిస్తూ, దేవుని సన్నిధిలో మాత్రం ప్రసంగాలు చేస్తూ , పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, ప్రార్ధనలు చేస్తూ, సాక్ష్యాలు చెప్తూ, పెద్దలుగా చెలామణి అవుతూ పెత్తనాలు చేసేవారు. వీరే సంఘానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు. వీరివల్లనే దేవునికి చెప్పలేనంత అవమానం. వీరు సంఘము వెలుపల జరిగించే అసహ్యమైన కార్యాలవలన, అన్యజనులు సహితం వీరిని చూచి, వీడేనా ఆ ప్రసంగాలు చేసేది? వీడేనా ఆ పెద్దరికం చేసేది? ఈమేనా ఆ పాటలు పాడేది అంటూ గేళి చేస్తావుంటే, దేవునికి ఇంతకుమించిన అవమానం ఇంకేముంది? మిమ్మును బట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడు చున్నది? (రోమా 2:24)
ప్రియవిశ్వాసి! ప్రభువు నామమునకు అవమానమును, నీ నామమునకు ఘనతను తెచ్చుకొనుటకు ప్రాకులాడవద్దు. నిలువెచ్చని స్థితినుండి బయటకిరా! దేవునికి ఆయాసకరమైన జీవితం నీలో ఏముందో సరిచేసుకొని, వేషధారులవలే కాకుండా, ఉజ్జీవింపబడిన జీవితం జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
⛪ *సప్త సంఘములు* ⛪
( 29వ భాగము)💮 *7. లవొదికయ సంఘము* 💮
(Part- 3)
నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగకనేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.
ప్రకటన 3: 17
*దౌర్భాగ్యుడవు:*
లవొదికయ సంఘపరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో వుందంటే? కుక్కతన వాంతికి తిరిగినట్లుగా వుంది. కుక్క వెక్కసమయ్యేవరకు తిని, కక్కేస్తుంది. మరలా ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే, కక్కినదానినే తింటుంది. ఇది వినడానికే అసహ్యంగావున్నాగాని, వాస్తవం. నేటి మన జీవితాలు దీనికి తగ్గట్టుగానే వున్నాయి. మారుమనస్సు పొంది, రోతజీవితాన్ని విడిచిపెట్టిన మనము, తిరిగి ఆ రొచ్చులోనికేవెళ్ళి, ఆ రోతజీవితాన్నే జీవిస్తున్నామంటే? ఇక దానికి, మనకు తేడా ఏముంది?
పందికి స్నానం చేయించి, సెంటు పూసి, పట్టు వస్త్రాలు తొడిగి, సింహాసనం మీద కూర్చుండబెట్టినాగాని, అది బురదలోనికే పరుగెడుతోంది తప్ప, ఒక్క నిమిషం అక్కడుండలేదు. మన జీవితాలు అట్లానే వున్నాయి కదా? ఆయన సింహాసనంపై మనలను కూర్చుండబెడతానని ఆయన వాగ్ధానమిస్తే, మనమేమో ఈ బురదలోనే బాగుంది. బయటకు రామంటున్నాము. ఇంతకుమించిన, దౌర్భాగ్యం మరొకటుంటుందా?
కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లి నట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను. (2 పేతురు 2:22)
*దిక్కుమాలిన వాడవు:*
ధనముంది, బలముంది, బలగముంది. అన్నీ వుండి, దేవునిని కలిగియుండని స్థితి, దిక్కులేని స్థితి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను. (ఎఫెసీ 2:12-14). ప్రభువు మనకొరకు యింతచేస్తే, ఆయనను విడచిపెట్టి, దిక్కుమాలినవారముగా జీవిస్తున్నామేమో? మనలను మనము పరిశీలన చేసుకోవలసిన సమయమిది.
*దరిద్రుడవు:*
ప్రపంచములోని ధన సమృద్ధి కలిగిన నగరములలో ఇదొకటి. AD 61 లో భూకంపం ద్వారా ఈ పట్టణం నాశనమైనప్పుడు, ఇతరుల సహాయం లేకుండగానే వారే ఈ పట్టణమును పునః నిర్మాణము చేసుకున్నారు. కానీ ఆర్ధికంగా ఉన్నత స్థితిలోనున్ననూ ఆధ్యాత్మిక దరిద్రులని గుర్తించని స్థితిలోనున్నారు. నిజమైన ధననిధి క్రీస్తే. పెంటకుప్పలమీద జీవించాల్సిన మనలను మింటపైన ఘనులతో కూర్చుండబెట్టారు ప్రభువు. వాటన్నిటిని అనుభవిస్తూ, అనుగ్రహించినవానిని మరచిపోయి, ఆధ్యాత్మిక దారిద్రంలో కొట్టిమిట్టాడుతున్నామేమో? పరిశీలన చేసుకోగలగాలి. రాబోవు దినము లందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు. (ఆమోసు 8:11)
*గ్రుడ్డివాడవు:*
లవొదికయ పట్టణంలో కంటిలో వేసే తైలము తయారు చేయబడేది. అది ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. కానీ, వారు ఆధ్యాత్మిక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారని, ఆధ్యాత్మిక అంధులని గుర్తించలేకపోయారు. ఆత్మీయ దర్శనం లేని జీవితాలు జీవిస్తున్నారు. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను. ( 2 కొరింథీ 4:4)
*దిగంబరుడవు:*
నేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది ఈ పట్టణం. విలువగల వస్త్రాలున్నాయి. కానీ, ఆత్మీయ వస్త్రాలైన నీతి, రక్షణ వస్త్రాలు లేని స్థితి. శరీరాన్ని అలంకరించు కోవడానికే ప్రాకులాట. ఆత్మీయ అలంకరణ కొరకు మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతిగాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది (యెషయా 61:10)
*ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.*
నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగకనేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఒకానొక దినాన్న ఒక ధనవంతుడు ఇట్లానే అనుకున్నాడు.
“అప్పుడతడు నాపంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినిసమకూర్చుకొని నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.
(లూకా 12:17-20)
ఆత్మీయ ధనాన్ని మనము సమకూర్చుకొనివుంటే? ఈ రోజే మన ప్రాణం పోయినా, ఆయన రాకడ వచ్చినా నిత్యత్వంలో ఉంటాము. ఈలోక సంబంధమైన ధనాన్ని సంపాధించడమే గురిగా పెట్టుకొని, ఆత్మీయ దిగంబరులముగా మిగిలిపోతే, గమ్యం అతి భయంకరం. వద్దు! సరిచేసుకుందాం! సాగిపోదాం ఆగిపోకుండా ! ఆ గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
⛪ *సప్త సంఘములు* ⛪
( 30వ భాగము)💮 *7. లవొదికయ సంఘము* 💮
(Part- 4)
నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నాసింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
ప్రకటన 3:18-22
*అగ్నిలో పుటమువేయబడిన బంగారము:*
అగ్నిలో పుటమువేయబడిన బంగారము అగ్ని జ్వాలల ద్వారా వెళ్లిన, అనగా సిలువ మరణం ద్వారా వెళ్లిన ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యముగానున్నది. ఆయనే నిజమైన బంగారము. నిజమైన ధనము.
*ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు:*
తెల్లని వస్త్రాలు ప్రభువు యొక్క పరిశుద్ధతకు సూచనగా వున్నాయి. తెల్లని వస్త్రాలు “పరిశుద్ధుల నీతి క్రియలు” (ప్రకటన 19:8)
*దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుక:*
ఆధ్యాత్మిక అంధత్వంలో నున్నవారికి కాటుక కావాలి. “కాటుక” కొన్ని తర్జుమాలలో “తైలము” అని వాడబడింది. తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యముగానున్నది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన లేఖనాలను అర్ధం చేసుకోవాలంటే, పరిశుద్ధాత్మును సహాయం తప్పక కావాలి.
*నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.*
నులివెచ్చని స్థితిలోనున్ననూ ప్రభువు ప్రేమిస్తున్నారు. గనుకనే శిక్షించుచున్నారు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును. (సామెతలు 3:12) నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి. (హెబ్రీ 12:5,6) వారు మారుమనస్సు పొందాలి. ఎఫెస్సీ(2:5) పెర్గేము(2:16) తుయతైర(2:22) సార్దీస్ (3:3) సంఘాలకు చెప్పినమాదిరిగానే లవొదికయ సంఘానికి(3:19) మారుమనస్సు పొందుమని హెచ్చరిక చేస్తున్నారు.
*ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.*
హృదయమనే తలుపునొద్ద నిలిచివుండి ఆయన తట్టుతూవున్నాడు, పిలుస్తూవున్నాడు. ఆయన మర్యాదస్తుడు, లోనికి త్రోసుకొని వచ్చేవాడు కాదు. ధన సమృద్ధిలోపడి, ప్రభువు స్వరము వినే స్థితిలోవారులేరు. నేటి దినాన్న నీ స్థితి ఎట్లావుంది? ఆయన మెల్లనైన స్వరము నీకు వినబడక పోవడానికిగల కారణమేమిటి? నీహృదయంలోగల గందరగోళమేమిటి?పరమగీతములో ప్రియుడు తలుపు తీయడం ఆలస్యమయ్యిందని వెళ్ళిపోయాడు (5:6) కానీ, సంవత్సరాల తరబడి ఈ ప్రియుడు నిలబడే వున్నాడు. ఎందుకంటే, నిన్ను స్వరక్తమిచ్చి కొన్నాడు. నీ హృదయంలో ఆయనకు చోటిస్తావేమోనని ఎదురు చూస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతమును ఇంకనూ నిర్లక్ష్యం చేస్తావా? అది నీ జీవితానికి ఎంతమాత్రమూ క్షేమకరం కాదు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. (2కొరింధీ 6:2) నీ హృదయంలోకి ఆహ్వానించ గలిగినట్లయితే? ఆయన నీతో కలసి భోజనం చెయ్యడానికి, అనగా నీతో సహవాసం చెయ్యడానికి, నీలో నివసించడానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. నీవు ఆయనను చేర్చుకోగలవా?
*జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.*
దౌర్భాగ్యుడైన వ్యక్తికి కలిగే అత్యున్నత స్థితి ఇది. అహష్వేరోషు మొర్దెకై ను, ఫరో యోసేపును గౌరవించారు. కానీ వారి సింహాసనములమీద కూర్చుండబెట్టలేదు. ప్రభువైతే ఆయన సింహాసనము మీద కూర్చోబెడతానని వాగ్ధానమిస్తున్నాడు. (మత్తయి 19:27,28; ప్రకటన 7:15) నేటి సంఘాలు విచ్చిన్నానికి కారణం కూర్చీలకోసం (పెత్తనం, అధికారం) ప్రాకులాటల వలననే కదా? వీటికొరకు కాదు నీ పాలిటిక్స్, ప్రభువిచ్చే ఆ సింహాసనం కొరకు ప్రయాసపడు. అది శాశ్వతమైనది. ప్రయాసపడదాం! ప్రభువిచ్చే వాగ్ధానాలను స్వతంత్రించుకొందము.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(సప్తసంఘముల ధ్యానము సమాప్తం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి