రూతు
రూతు- మొదటి భాగం
*ఉపోద్ఘాతము*అమ్మోనీయుడే గాని, మోయాబీయుడే గాని, యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవతరము వారైనను ఎన్నడునూ సమాజములో చేరకూడదు. ద్వితీ 23: 3-6.
Matthew(మత్తయి సువార్త) 1:5
5.నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను; శల్మాను కనెను, ...ఒబేదు యెస్సయి ని కనెను.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియదైవజనమా! పైన చెప్పిన వచనాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి.
ద్వితీ 23:3 లో మోయాబీయులు యెహోవా సమాజములో చేరకూడదు ఎందుకంటే:
1. వారి జననం చాలా అసహ్యమైనది, దేవునికి వ్యతిరేకమైనది. ఆదికాండము 19:31-38;
2. ఇశ్రాయేలీయులను శపించడానికి సోదెగాడైన, ప్రవక్తయైన బిలామును పిలిపిస్తే, దేవుడు శాపాన్ని దీవెనగా మార్చుతారు. తర్వాత బిలాము చేసిన తప్పుడు భోదతో ఇశ్రాయేలీయులు పాపము చేసేటట్లు, వ్యభిచారం చేసేటట్లు చేసి, ఇశ్రాయేలీయులమీద ఉగ్రత వచ్చేలా చేస్తారు మోయాబీయులు. అందుకే వీరు సమాజంలో చేరకూడదు అన్నారు దేవుడు.
అయితే మత్తయి 1:5 లో యేసుప్రభులవారి వంశావలిలో బోయజు రూతుద్వారా ఓబేదును కనెను అని వ్రాయబడింది. ఈ ఓబేదు దావీదు గారి తాతగారు. రూతు మోయాబీయురాలు. మరి మోయాబీయులు దేవుని సమాజములో చేరకూడదు అని ఖండితముగా వ్రాయబడియుండగా ఈమె తిన్నగా యేసయ్య వంశావళిలోనే చేరిపోయిందే ఇది ఎలా జరిగింది.
దేవుడు దీనిని ఎలా అనుమతించారు? దేవుడు మనస్సు మార్చుకొన్నారా? లేదా బోయజు హద్దు మీరాడా?
దేవునికి అన్ని తెలుసు కదా! సమస్తానికి కర్త, కర్మ, క్రియ, కధానాయకుడు, నడిపించేవాడు ఆయనే కదా!
మనందరం ఆయన ప్రణాళికలోనే ఉన్నాం కదా!
మరి దీనిని దేవుడు ఎలా అనుమతించారు?
రూతు అర్హురాలా? 100% అర్హురాలు.
ఆమె ఎందుకు అర్హురాలో, ఆమెద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చో, రూతు గ్రంధం ద్వారా పరిశుధ్దాత్ముడు మనతో ఏం చెబుతున్నారో కొన్నిరోజులు ధ్యానిద్దాం!
రూతుకోసం ధ్యానించాలి ఆమెను బాగా అర్ధం చేసుకోవాలి అంటే తప్పకుండా మనం కొద్దిగానైనా ఆమె గత చరిత్ర తెలుసుకోవాలి. అయితే బైబిల్ గ్రంధంలో అది వ్రాయబడలేదు, కావున మనం చరిత్రను ఎక్కువగా కాకుండా కొద్దిగా తెలుసుకొని, రూతు గ్రంధంలో వ్రాయబడిన మర్మాలు, సత్యాలనే ఎక్కువగా ధ్యానిద్దాం.
రూతు యొక్క కాలం సుమారు క్రీ.పూ. 13౦౦. అప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని న్యాయాధిపతులు పాలిస్తున్నారు. రూతు 1:1. ఖచ్చితంగా చెప్పాలంటే ఏహూదు న్యాయాధిపతిగా ఉన్నాడు. చరిత్రకారులు మరియు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం రూతు మోయాబు రాజు యొక్క కుమార్తె. ఆ కాలంలో మోయబుదేశంలో రాజరికము, యాజకత్వము ఒకరి చేతిక్రిందనే ఉండేవి. కనుక రాజు ఆమెను ప్రధానపూజారినిగా చేస్తాడు. వీరు కెమోసు దేవతను పూజిస్తారు. దానికి సం.కి ఒకసారి మరియు పర్వదినాల్లో మోయబు దేశ రక్షణకోసం, కెమోస్ దేవతకు చంటిపిల్లలను బలి ఇచ్చి, ఆ విగ్రహం చేతులలో దహనం చేసేవారు. ఈ ప్రక్రియ మొత్తం ప్రధానపూజారినియైన రూతు ఆధ్వర్యంలో జరిగేవి. అప్పుడు ఆమె ప్రజలను దీవించేది. ఇట్లుండగా ఎలీమెలెకు కుమారుడైన మహ్లోను ఒకసారి ఆమందిరంలో పనికి వచినప్పుడు మహ్లోను మెడలో ఉన్న లాకెట్, ఇంకా ఆ లాకెట్ మీద దేవుని పది ఆజ్ఞలు చూసి మహ్లోనును ప్రశ్నిస్తుంది. అప్పుడు మహ్లోను దేవునికోసం, ఆయన ఆజ్ఞలుకోసం వివరిస్తాడు.
వాటిలో ముఖ్యంగా నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు అన్న ఆజ్ఞలకు ముచ్చటపడి, కొన్ని రోజులకు నిజం తెలుసుకొని తన ప్రధాన పూజారి పదవిని వదిలేస్తుంది.
తద్వారా బహిష్కరణకు గురై, కొన్నిరోజుల తర్వాత మహ్లోనును వివాహం చేసుకొంటుంది. ఆ తర్వాత చాలా బాధలు పడుతుంది. ఎన్ని బాధలు పడిన దేవుని యొక్క దైవత్వం, నిష్కళంకతనం కు ముగ్దురాలై మోయాబు దేశం వదిలి నయోమితో ఇశ్రాయేలు దేశం వస్తుంది. ఇదీ చరిత్ర.
రూతు మొదటి అధ్యాయంలో రూతు దేవునిమీద, అత్తయిన నయోమి మీద చూపిన మక్కువ, ఆ సమర్పణ చూసి దేవుడే ముగ్దుడై, ఆయన వంశావలిలో రూతు పేరును చేర్పించారు. తనని నిజంగా అనుసరించేవారిని, ఆశ్రయించే వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. రూతు మోయాబురాలే గాని దేవుణ్ణి ఆశ్రయించి వచ్చినందుకు ఆమెను త్రోసివేయక గొప్పస్థానాన్ని ఇచ్చారు.
నేడు నీజాతి ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా సరే దేవుడు నిన్ను పిలుస్తున్నారు!
అంతటా అందరూ మారుమనస్సు పొందాలని కోరుకొంటున్నారు.
నేడే దేవునియొద్దకు రా!
ఆయన రెక్కలక్రింద ఆశ్రయం పొందు! పాపక్షమాపణ పొందుకొని, పరలోకం పొందుకో!
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- రెండవ భాగం
రూతుగ్రంధ వివరణ*రూతు గ్రంధకర్త*:
తెలియదు; అయితే కొంతమంది సమూయేలు అని, కొంతమంది సోలోమోను అని , ఒక స్త్రీ రాసింది అంటారు
ఏది ఏమైనా రాయించింది పరిశుద్ధాత్ముడే!!! ఆయనకే స్తుతి మహిమ!!
*ఎప్పుడు జరిగింది*:
న్యాయాధిపతుల సమయంలో; రూతు 1:1;
ఖచ్చితంగా చెప్పాలంటే రెండవ న్యాయాదిపతి ఏహూదు కాలంలో. అంటే BC 1300 సుమారు
*ఎప్పుడు వ్రాసారు*:
కొంతమంది దావీదు-సోలోమోను కాలంలో 1021-924 BC మధ్య అని అభిప్రాయం.
కొంతమంది ఎజ్రా-నెహేమ్యా కాలంలో 450-250 BC మధ్య
*ఉద్దేశం*:
1. దేవుని ప్రణాళిక
2. దేవునికి అంటరానివారు ఎవరూ లేరు
3. రూతుయొక్క సమర్పణ, విశ్వాసం, నమ్మకం ద్వారా ఆమె నుండి రాజరికం ఎలా వచ్చిందో
4. ఇది ప్రేమ కద ఎంతమాత్రమూ కాదు; అయితే దేవునిప్రేమ మానవులపై ఎలా ఉంది చెబుతుంది
5. చివరకు యేసయ్యనే ప్రత్యక్షం చేస్తుంది. దేవుడు- దేవుని దైవత్వం- దేవుని వ్యక్తిత్వం
*అంశాలు*:
1.ఖాళీతనం నుండి సంపూర్ణతకు, జీవము నుండి – మరణానికి; మరణం నుండి జీవానికి; ఎండిపోయిన జీవితం నుండి ఫలభరితమైన జీవితానికి;
గొడ్డుతనం నుండి అనేక జనాలకు తల్లిగా మారడం
2. ఒకమనిషి దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొంటే దేవుడు ఆ వ్యక్తితో చేసే నిభందన, ఆ వ్యక్తిద్వారా జరిగించే ఆశ్చర్యకార్యాలు/దీవించే విధానం
*నేర్చుకోదగిన పాటాలు*:
1. ఒకవ్యక్తి చిన్ని చిన్ని శ్రమలుకు భయపడి, లోకాన్ని ప్రేమించి దేవునికి దూరమైతే –పరాయి దేశంలో / సాతాను అధికారం క్రింద పడే పాట్లు- బుద్ధి వచ్చినప్పుడు దేవుడు మొదట పెట్టె పరీక్ష- తరువాత దీవించే విధానం
2. ఒక వ్యక్తీ దేవునికి- సంఘానికి ఎలా లోబడియుండాలి అనేది రూతుని బట్టి నేర్చుకోవచ్చు
3. దేవుణ్ణి ఆశ్రయించి నప్పుడు దేవుడు ఎట్టిపరిస్తితులలోను- ఎన్ని కష్టాలు ఎదురైనా నిన్ను వదలడు అనే సత్యం రూతుగ్రంధం చెబుతుంది.
*పేర్లకు అర్దాలు*:
ఎలీమెలెకు: దేవుడే రాజు
నయోమి: మధురం, మనోహరం, ఆకాంక్షింపదగినది
మారా : చేదు
రూతు: స్నేహం(friendship)
ఓర్పా: స్తిరమైనది
మహ్లోను: బలహీనుడు, బలహీనమయ్యేవాడు
కిల్యోను: పరిపూర్ణుడు
ఓబేదు: సేవకుడు/పనివాడు
బెత్లెహేము: రొట్టెల ఇల్లు
*ముఖ్య ఉద్దేశం*: *Kinsman Redeemer- సమీపబంధువు- విమోచకుడు*
రూతును సమీపబంధువు బోయజు విమోచించి, వివాహం చేసుకున్న విధానం. అలాగే *నీవు నేను, మనమందరం శరీరాశలకు స్వలోభానికి లోబడి – దేవునినుండి దూరమైపోయి, సమస్తమును కోల్పోయి, సాతానుకి బంధీయై- దేవా కరుణించు అని మొర్ర పెట్టినప్పుడు – దేవుడే మన సమీపబంధువై, మన విమోచకుడై సాతానువిధించిన మన భంధకాలనుండి విముక్తి చేసారు.
అంతేకాదు నయోమి పాత్రలో పరిశుద్ధాత్ముడు – సంఘకాపరితో కలసి నిన్ను ఒప్పించి, నీటి భాప్తిస్మము ద్వారా- పెండ్లి కుమారుడైన యేసయ్యకు ఎలా ప్రధానం చేసారో – ఏవిధంగా నిన్ను దేవునితో ఐక్యం చేసే అద్భుతమైన సంఘటన* .
కాబట్టి నీవు లోకాశలకు గురై, దేవునికి దూరమై – మోడుబారిపోయిన జీవిగా, గొడ్డుతనంలో జీవిస్తున్నావా?
తిరిగి యేసయ్య వద్దకురా!
ఆయన నిన్ను చిగురింప చేయగలరు, నిన్ను పునఃస్థాపన చేయగలరు.
అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చగలరు.
ఇదే అనుకూల సమయం!
నేడే రక్షణ దినం!!
ఆమెన్!
దైవాశీస్సులు
(సశేషం)
రూతు- మూడవ భాగం
రూతు 1:1 న్యాయాధిపతులు ఏలినదినములలో/ దేశములో కరువు కలుగగా/ యూదాబెత్లెహేమునుండి/ ఒక మనుష్యుడు తన బార్యయు, తన ఇద్దరు కుమారులనువెంటబెట్టుకొని మోయాబు దేశమునకు వెళ్ళెను.
ప్రియులారా! ఈ మొదటి వచనములోనే చాలా విషయాలున్నాయి.
1.న్యాయాధిపతులు ఏలిన దినములయందు అనగా ఈ సంఘటన క్రీ.పూ. 1350-1024మధ్యకాలమునకు చెందింది. ముందు చెప్పిన విధముగా రెండవ న్యాయాదిపతియైనఎహూదు దినములలో జరిగినది.అప్పటికి ప్రజలు ఎలా ఉండేవారో న్యాయాధిపతులు 2:16-25 లో వ్రాయబడియుంది. వారు దేవుణ్ణి మరచిపోయి అన్యాచారాలలోమునిగిపోయినప్పుడు, దేవుని ఉగ్రత వారిమీద మండి, వారిని శత్రువుల చేతికిఅప్పగించేవారు, అప్పుడు వారు దేవా మమ్ములను కరుణించు, మేము పాపులము అనిమొర్రపెట్టినప్పుడు దేవుడు న్యాయాదిపతులను పంపించేవారు. న్యాయాధిపతి ఉన్నప్పుడు బాగా ఉండేవారు కొన్ని రోజులు. ఆ తర్వాత మరలా దేవుణ్ణి వదిలేసేవారు. దేవుడు మరలా వారిని శత్రువుల చేతికి అప్పగించే వారు. ఇదే జరిగేది.ఇలాంటి స్తితిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది.
2. దేశములో కరువు కలుగగా: న్యాయాధిపతుల కాలంలో ఇంత పెద్ద కరువు వచ్చినట్లు అనగా మూట ముళ్ళు సర్దుకొని పరాయి దేశము పోయేటంత పెద్ద కరువుకోసం న్యాయాధిపతుల గ్రంధంలో వ్రాయబడలేదు. అయితే కరువులు వచ్చాయా అంటే కలిగేవి. దేవుడు వారిని కరువులతో మొత్తేవారు. శత్రువుల చేతికి అప్పగించేవారు దేవుడు వారి అవిశ్వాసం, అవినీతిని తట్టుకోలేక!
ద్వితీ 11:13-17 దేవుని మాట వింటే సకాలంలో వర్షాలు కురిపిస్తాను మాట వినకపోతే ఆకాశాన్నిమూసివేస్తాను, వాన కురియదు, భూమి పండదు అని వ్రాయబడియుంది.
లేవీ 26:19-20; ద్వితీ 28:23-24 లో ఆకాశాన్ని ఇనుము వలెను, భూమిని ఇత్తడివలెను చేసెదను అని చెప్పినట్లుగా ఆయన ఈ కరువులు పంపించేవారు. అందుకే ఈపెద్దకరువు వారిమీదకు వచ్చింది.
ప్రియ చదువరీ! యేసుక్రీస్తు నిన్న నేడుఏకరీతిగా ఉన్నాడు!
ఇప్పుడు కూడా నీవు నీకు కలిగిన ధనగర్వంతో మదించి,గర్వించి దేవునిని వదిలేస్తే నీగతి కూడా అంతే! కరవు కాటకాలతో ఇబ్బందులు
పడకతప్పదు.
3. యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు ............
బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. ఇది యేరూషలేమునకు దక్షిణముగా 6 మైళ్ళు
అనగా సుమారు 10 కి.మీ. దూరంలో ఉంది. ఇది చాల ఫలభరితమైన నేల. గోదుమలు,బార్లీ, ఒలీవచెట్లు, బాదం, ద్రాక్ష విస్తారముగా పండుతాయి. ఇటువంటిఫలభరితమైన ప్రాంతంలో కరువు వచ్చిందని, మరో ప్రాంతం వెళ్ళిపోయారు! ఎంతఫలవంతమైన ప్రాంతమైన దేవుణ్ణి మరచిపోతే అంతే!
యెహోవాను విడచి వేరొకనిఅనుసరించువానికి శ్రమలు విస్తరించును. కీర్తనలు 16:4;అవును. ఇదే వీరిజీవితములోసంభవించింది.
4. మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. మోయాబు దేశం శత్రుదేశం. అదివిగ్రహారాధన గల దేశం. భయంకరమైన వ్యభిచారములో మునిగిన ప్రాంతం. మొలెకు, కెమోసు దేవతా మందిరాలలో దేవదాసీలుఉండేవారు, పూజ అనంతరం అక్కడ పూజకోసం వచ్చినవారు ఈదేవదాసీలతో వ్యభిచారం చేసేవారు. ఈ రెండు దేవుని అత్యంత అసహ్యమైన క్రియలు అనగా వ్యభిచారం, విగ్రహారాధన దేవునికి కిట్టదు. ఇంతటి పాపభూయిష్టమైన ప్రాంతానికి సకుటంబ సమేతముగా ఎందుకు వెళ్ళాలి? ఎల్లప్పుడూ దైవ నామ స్మరణలో మునిగియుండే కుటుంబం ఇప్పుడు పాప దేశానికి ప్రయాణమై పోతుంది.
దూరపుకొండలు నునుపు అంటే ఇదే! అందుకే యాకోబు భక్తుడు James(యాకోబు) 4:13,14
13.నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువార లారా,
14.రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
కరవు వచ్చిందని మోయాబు దేశంపోయారు కదా! మోయాబు దేశం ఎంత దూరం? బెత్లెహేమునుండి కేవలం 50 మైళ్ళు- అంటే 82.6 కి.మీ. అంటే అంత దూరం కాదన్నమాట! ఈకరవు అక్కడ కూడా కొద్దిగా ఉండే ఉంటుంది. మోయాబీయులు ఎంత శత్రువులో సంఖ్యాకాండము 22-25 అధ్యాయాలలో మనం చూడగలం. అటువంటి శత్రువుల మధ్యకు వీరి
వెళ్ళాలా?
ఒక కుటుంబం జీవము నుండి మరణం వైపు, వెలుగునుండి చీకటికి , పతనం వైపుకిఎంత తేలికగా ప్రయాణం చేస్తున్నారో గమనించండి.
ఒకనిఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. సామె 14:12.
సరిగ్గా ఇదే జరిగింది. ఫలితం ఏమిటో 3,5 వచనాలలో చూస్తాం. తన పెనిమిటి
మరియు ఇద్దరు కుమారులను కోల్పోవాల్సి వచ్చింది ఆమెకు. దేవుణ్ణి విడచితిరిగితే ఇంతే!
ప్రియ చదువరీ! ఈ భాగము ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడా?
దేవుని నుండి దూరమై పోయావా?
నేడే తిరిగి రమ్మని దేవుని పేరిట మనవిచేస్తున్నాను!!
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- నాల్గవ భాగం
రూతు 1:2-4 వచనాలు
2వ వచనంలో వారి పేర్లున్నాయి. వీటి అర్దాలు గతభాగంలో చూసుకొన్నాం!
మరోసారి ఈ వచనంలో మోయాబు దేశంలో కాపురముండిరి అని వ్రాయబడింది. అనగా
పాపభూయిష్టమైన ప్రాంతంలో వారు సర్దుకుపోయి/ ఆ పరిస్తితులతో కలసి జీవించడంమొదలుపెట్టారు!
3వ వచనంలో ఒక విషాదకరమైన విషయం ఉంది. నయోమి పెనిమిటియైన ఎలీమేలేకు చనిపోయిన తర్వాత ఆమెయు, ఆమె ఇద్దరు కుమాళ్ళును నిలిచియుండిరి.
ఇక్కడరెండు ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి.
a. 5వ వచనం ప్రకారం వారు 10సం.లు మాత్రమే అక్కడ ఉన్నారు. ఈ 10సం.లు
మొదట్లోనే ఎలీమెలెకు/ కుటుంబ యజమాని చనిపోయాడు. ఎంత ఘోరమైన విషయం! బహుశా
దేవుడే మొత్తియుండొచ్చు!
యెహోవాను విడచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరించును. కీర్తనలు 16:4;ఎప్పుడైతే దేవుణ్ణి విడచి లోకస్తులతో కలసి జీవించడం మొదలుపెట్టారో దేవుని మొదటి శాపానికి గురయ్యారు! కుటుంబ యజమానిని కోల్పోయారు అనగా వారిమీద దేవుని ఆధిపత్యాన్ని కోల్పోయారు.
b. నయోమి పెనిమిటి చనిపోయాక ఆమెయు, ఆమె ఇద్దరు కుమారులును నిలిచియుండిరి. గమనించాల్సినది ఏమిటంటే – నయోమికి బుద్ధి వచ్చి వెంటనే తమ దేశానికిప్రయాణం చేయాలి, గాని వారు ఇంకను అక్కడే ఉన్నారు. ఎందుకంటే చరిత్ర
ప్రకారం వీరు మోయాబు ప్రాంతం ఎన్నుకోడానికి కారణం
1. దగ్గరగా ఉంది,
2. ఎలీమెలెకు మంచి కళాకారుడు. రాతి బొమ్మలు చెక్కడంలో, లోహంతో వస్తువులు/విగ్రహాలు చెక్కడంలో దిట్ట! ఆ పనిలో తన కుమారులకు కూడా మంచి ప్రావీణ్యం కలిగేలా చేసాడు. అందుకే ఈ దేశంలో ఆ పని చేయడానికి వచ్చి, బాగాసంపాదించాడు! కాబట్టి డబ్బురుచి మరిగాక వారు కుటుంబ యజమానిని పోగొట్టుకున్నాబుద్ధి రాక, ఇంకా అక్కడనే నిలిచియున్నారు! పరిస్తితులతో రాజీ పడిపోయారు!
ప్రియ విశ్వాసీ! దేవుణ్ణి మరచిపోతే, దేవుడు నీమీద అధికారిగా/ యజమానిగాఉండడం మానేస్తారు. కుటుంబానికి సాతానుడు ఆత్మీయ కన్నులకు అంధత్వంకలుగజేసి – లోకాన్ని మురిపిస్తాడు. నేత్రాశ, శరీరాస, జీవపు డంబాన్నినింపుతాడు. కాబట్టి గమనించమని మనవి చేస్తున్నాను.
ఇక 4వ వచనంలో మరో దిగ్బ్రాంతికరమైన విషయం ఉంది. వారు మోయాబు స్త్రీలనువివాహం చేసుకొన్నారు.
ఎంత విచారకరమైన విషయం! ధర్మశాస్త్రాన్ని నిత్యమూ కంఠోపాటం చేస్తున్న వీరికి, ఇశ్రాయేలీయులు అన్యులను పెళ్లి చేసుకోకూడదు అని తెలియదా? యూదా బెత్లెహేము కేవలం 82.6 కి.మీ. దూరంలో ఉన్నప్పుడు అక్కడి నుండి వీరికోసం బార్యలను తీసుకొని రావచ్చు. ఈ యుగ సంభందమైన దేవతవారి కన్నులకు గ్రుడ్డితనం కలిగించింది. పాపంలోనే ఆగిపోయేటట్టు చేసింది.
పాపానికి పాపం పోగుచేసుకొన్నారు. ఫలితం 5వ వచనం తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు! ఎంత భయంకరమైన శాపం/ ఉగ్రత!!
ఒకవేళ నీవుకూడా అదే స్తితిలో ఉన్నావా?
ధనాన్ని ప్రేమించి, దూరదేశాలకుపోయి, పరాయి దేశంలో వారి అలవాట్లు నేర్చుకొని, వారితో కలిసిపోయి వారితో
తిని త్రాగుచున్నావా?
మహ్లోను, కిల్యోను లకు జరిగినది సంభవించగలదుజాగ్రత్త!
తప్పిపోయిన కుమారునికి కలిగిన అనుభవమే నీకు కూడా కలుగుతుందిజాగ్రత్త!
మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అని సెలవిస్తుంది బైబిల్
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 6:14-18
14.మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
కాబట్టి అన్యులకు, అన్యస్త్రీలకు, అన్యాచారాలకు దూరముగా ఉండమనిప్రభువు చెబుతున్నారు!
ఇంకా అన్య స్త్రీలకూ మీ కుమారులని ఇవ్వొద్దు!
అన్య పురుషులకు మీ కుమార్తెలను ఇవ్వొద్దు అని గ్రంధం సెలవిస్తుంది.
మా కుమారులు మార్చేసుకొంటారు కోడల్లును అంటూ ఉంటారు కొంతమంది. మీ కోడళ్ళు మారరు గాని మీ కుమారులే మారిపోయి భార్యలవెనుక అన్యాచారాలలో తిరుగుతారు.
ఉదా: సోలోమోను!
కాబట్టి ప్రియ దైవజనమా! అన్య స్త్రీలకూ, అన్యాచారాలకు దూరముగా ఉండమని, అన్యులను ఎంతమాత్రము పెండ్లి చేసుకోవద్దని ప్రభువు పేరిటమనవి చేస్తున్నాను!!
అట్టి కృప ధన్యత మనందరికీ మెండుగా కలుగును గాక!
దైవాశీస్సులు
(సశేషం)
రూతు- ఐదవభాగం
*నయోమి-రూతు*ప్రియ దైవజనమా! మనం రూతుగ్రంధంలో వ్రాయబడిన వ్యక్తులు- సంఘటనలకోసం ధ్యానిస్తున్నాం! రూతు 1:5 వారు ఇంచుమించు 10 సం.లు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను- కిల్యోను ఇద్దరు కుమారులు చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన తన ఇద్దరు కుమారులు, తన పెనిమిటియు లేనిదాయెను.
ఎంతఘోరమో చూడండి. వారు 10 సం.లు మాత్రమే ఉన్నారు. ఈ 10 సం.ల మొదట్లోనే తన భర్త ఎలీమెలెకు చనిపోయాడు. తర్వాత *నయోమి* తన కుమారులకు వివాహం చేసింది. వారు కూడా కొద్దిరోజులలోనే చనిపోయారు. ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఇలాంటి అనుభవం నిజంగా పగవానికి కూడా రాకూడదు. మొదటగా చిన్న పొరపాటు చేసారు- దానితో పాపానికి పాపం జతచేయడంతో తీవ్రమైన నష్టం కలిగింది. ఇప్పుడు వీరి గృహంలో ముగ్గురు విధవరాళ్ళు మిగిలిపోయారు. ఇద్దరు యవ్వన విధవరాళ్ళు.
దేవుని విడచి తిరిగితే ఇంతే! దేవుడులేని గ్రహంలో వేదన, కష్టాలు, దుఃఖం, మరణం!!!
అయితే దేవుడు ఉన్న గృహాల్లో కష్టాలు, కన్నీరు ఉండవా అని అడగొచ్చు!దేవుడు ఉన్న గృహంలో కూడా కష్టాలు ఉంటాయి- వాటితోపాటు నోటినిండా నవ్వు ఉంటుంది. ఎందుకంటే శోదన తట్టుకునే శక్తిని, శోదన తప్పించుకొనే ఉపాయాన్ని దేవుడు కలుగజేస్తారు కాబట్టి కష్టాలలో కూడా సంతోషంగా జీవించగలం మనం!!! ఇంకా దేవుని సన్నిధిలోనూ, దేవుని వాక్యంలోనూ ఎప్పుడూ ఆదరణ కలుగుతుంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జయిస్తూ ముందుకు సాగిపోగలం!
ఇప్పుడు నయోమికి లేనిది ఇదే! దేవుని సన్నిదిలేదు, దేవుని కాపుదల లేదు! సహవాసం లేదు! పరాయిదేశంలో ఓదార్చేవారు లేరు. మోడుబారిపోయిన జీవితంగా, గొడ్డు జీవితంగా మారిపోయింది నయోమి జీవితం!!!
*రూతు*: ఇప్పుడు మనం రూతు- రూతుకు కలిగిన ఒత్తిడిని ఆలోచిద్దాం! దానికోసం మరలా కొద్దిగా చరిత్రను జ్ఞాపకం చేసుకొందాం!
దేవుని కరుణ- గుణ లక్షణాలకు ముగ్దురాలై యూదురాలిగా మారింది. తర్వాత మహ్లోనును వివాహం చేసుకొంది. మహ్లోను దేవుడు గొప్పవాడని, కాపాడతాడని, కరుణామయుడని ఎన్నో చెప్పాడు దేవునికోసం! అయితే బైబిల్ మరియు చరిత్ర ప్రకారం రూతు-మహ్లోనుల దాంపత్యం ఎన్నోరోజులు నిలవలేదు! కారణం వివాహం జరిగిన కొద్ది రోజులలోనే మహ్లోను చనిపోయాడు. చరిత్ర ప్రకారం రూతు కారణంగా ఎలీమెలెకు కుటుంబం చాల ఇబ్బందులు పడింది. రూతు యెహోవా దేవుణ్ణి అంగీకరించి, మహ్లోనును పెండ్లి చేసుకొన్నందుకు, రూతుకూడా చాలా భాదలను అనుభవించింది మోయాబు దేశంలో. ఎప్పుడైతే మహ్లోను, కిల్యోను , తన మామగారు చనిపోయారో ఆమె చాలా నిరాశలో మునిగిపోయింది. *అప్పుడు మోయాబీయులు వచ్చి, చూశావా కెమోస్ దేవతా శక్తి! నీవు ప్రధాన పూజారిని పదవిని వదలినందుకు, తన్ను సేవించనందుకు మన దేవతయే ఈ ఉగ్రత మీ కుటుంబం మీద చూపించాడు! ఇప్పుడైనా మించిపోయింది లేదు, మరలా ప్రధాన పూజారిని పదవిని పొందుకో, కెమోసును సేవించు అంటారు. దానికి ఆమె ఇచ్చిన జవాబు చరిత్రకారులు చక్కగా వ్రాసారు*: *నేను యెహోవా దేవుణ్ణి అనుసరిస్తున్నది ఆయన నాకు మేలులు చేస్తాడనో, నేనెంతో గొప్పదానిని అయిపోతాననో కాదు, కేవలం ఆయనలో ఉన్న దైవత్వం, నరహత్యను, వ్యభిచారాన్ని ఆయన అసహ్యించుకొనే విధానాన్ని తెలుసుకొని ఆయనను స్వీకరించాను. మానవులలో ప్రేమ- ఆప్యాయత కోసం చూసే దేవుడు నాకు కావాలి గాని, తన సంతృప్తి కోసం మానవులను బలికోరే దేవుడు నాకొద్దు అని ఖండితంగా చెప్పింది*!!! శభాస్ రూతు! నిజంగా ఈమాట పలకటానికి ఎంత ఆత్మీయ, విశ్వాస పరిమాణం కావాలి?!!! దేవుని నుండి ఎన్నో మేలులు అనుభవిస్తున్న మనమే ఇంతటి విశ్వాసం, సాక్ష్యం ఇవ్వలేక పోతున్నాం గాని ఒక అన్యురాలు, ఇంతటి గొప్ప సాక్ష్యం ఇచ్చిందంటే ఎంత గొప్ప విషయం!! ఈ సమర్పణే, ఈ తెగింపే మోయాబురాలైన రూతును యూదా సమాజంలోనికి, ఇంకా యేసయ్య వంశావళి క్రమంలో చేర్చగలిగింది!!!
నేడు ప్రియ సహోదరీ! సహోదరుడా! రూతులాంటి తెగింపు, విశ్వాసం నీకుందా? చిన్న చిన్న శోదనలకు భయపడి ఎలీమెలెకు నయోమిలా దేవునినుండి దూరమైపోతున్నావా? దేవునికి దూరమై నయోమి- ఎలీమెలెకుల జీవితం ఏమైందో చూసావు కదా! శోదన సహించువాడు ధన్యుడు అనియు (యాకోబు 1:12), శ్రమ దినమందు నీవు కృంగినయెడల చేతకానివాడవౌదువు (సామెతలు 24:10) అనియు బైబిల్ సెలవిస్తుంది.
కాబట్టి రూతుకు కలిగిన ఆ సమర్పణ –విశ్వాసం కలిగి ముందుకే సాగిపోవాలని దేవుని పేరిట ప్రోత్సాహిస్తున్నాను!
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- ఆరవభాగం
దేవుని ప్రేమ-తండ్రి ఇంటికి చేరుట-అత్తాకోడళ్ళుRuth(రూతు) 1:6,7
6.వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి.
7.అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతోకూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్లు చుండగా
ఇక్కడ మనంఆగి, కొద్దిగా లోతుగా ఆలోచిద్దాం! వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను- ఇందులో పరమతండ్రి ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది. తండ్రియొక్క కోపం పిల్లలమీద ఎంతకాలం ఉంటుంది? కొన్నిరోజులు లేదా నెలలు అంతే! తర్వాత తనబిడ్డలతో మాట్లాడాలని తండ్రి తహతహలాడుతాడు! మన తండ్రులకే అంత ప్రేముంటే, వారిని చేసిన మన పరమతండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుంది! పరమతండ్రికూడా అంతే! ఇశ్రాయేలీయులు దేవునిని విడచి, వేరొకని ఆశ్రయించినందుకు వారి మీదకు కరువు పంపిస్తే, వారు తిరిగి దేవా నీవే మాకు దిక్కు అని మొర్రపెడితే, దేవుడు కరుణావాత్స్యల్యుడు కనుక వారిని దర్శించారు!
ఈ మాటలు మనం జాగ్రత్తగా చూస్తే- వారికి ఆహారమిచ్చుటకు యెహోవా వారిని దర్శించెను అంటే వారికి ఆహారం మరలా దొరికింది. ఆహరం దొరికింది అంటే పంటలు పండాయన్న మాట! పంటలు పండాయి అంటే వర్షాలు కురిసాయన్న మాట!చివరకు ఎఫ్రాతా ప్రాంతం గాడిలో పడింది. దేవుని ప్రేమ అమోఘమైనది,
కీర్తనలు 30: 5ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.
ఈవిషయం ఆనోటా ఈనోటా నలిగి, చివరకు నయోమి వరకు చేరింది. ముందు చెప్పినట్లుగా కేవలం 50 మైళ్ళు అనగా 82.6 కి.మీ. మాత్రమే వారి గ్రామం. కాబట్టి తొందరగానే ఈ విషయం నయోమికి చేరింది. వెంటనే ఆమెకు బుద్ధి వచ్చి, బెత్లెహేము కి ప్రయాణమై పోదాము. బయలు దేరండి అన్నది తన కోడల్లతో!! తనకు బుద్ధి వచ్చిన వెంటనే తండ్రియొద్దకు పోదాం అనుకొంది. ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించినయెడల నాయొద్దకె రావలెను అని (యిర్మీయా 4:1) గ్రంధంలో వ్రాయబడియుంది. ఈమెకు బుద్ధి వచ్చి తిరిగి బెత్లెహేముకు బయలుదేరింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు తన తండ్రి యొద్దకు వెళ్లాలని నిర్ణయించుకొని, వెళ్లి క్షేమం పొందుకొన్నాడు! నీవు కూడా దేవుణ్ణి వదలివేశావా? క్షేమం కోల్పోయావా? నేడే దేవుని యొద్దకురా! క్షేమం పొందుకో!
ఈవచనంలో మరియు 7వవచనంలో కూడా ఆమె, ఆమె కోడళ్ళు ప్రయాణమైరి, బయలుదేరి వెల్లుచుండిరి అని వ్రాయబడి ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే నయోమి తన కోడళ్ళు ఇద్దరినీ తన కూతుళ్ళులాగ చూసుకొని ఉంటుంది. అందుకే తమ భర్తలు చనిపోయినా ఇంకా తమ అత్తగారినే హత్తుకొని ఉన్నారు. చివరకు బెత్లెహేము వెళ్దాం అంటే వెంటనే ఆమెతోపాటు పరాయిదేశం బయలుదేరారు! ఎంతమంచి అత్త! ఎంతమంచి కోడళ్ళు! నేడు అత్తాకోడళ్ళు నిజంగా వీరిలాగే ఉంటే కుటుంబాల్లో కలతలే ఉండవు! అత్త తన కోడలిని కూతురిలా చూసుకొంటే, ఏ కోడలు కూడా అత్తమీద తిరగబడదు, లోబడే ఉంటుంది. (కోడలు పనికిమాలినదైతే కూతురిలా చూసుకొంటున్నా తిరగబడుతుంది); కోడలు కూడా అత్తగారిలో తనతల్లిని చూసుకొంటే, తల్లిలా గౌరవిస్తే అత్త ఎంతమాత్రము కోడలిని సాధించదు! (అత్త గయ్యాలిదైతే మంచి కోడలిని కూడా సాధిస్తుంది.)
నేడు క్రైస్తవ సమాజంలో ఇలాంటి అన్యోన్య సంభందం కావాలి! అప్పుడే కుటుంభం పటిష్టంగా ఉంటుంది. కుటుంభం పటిష్టంగా ఉంటే సంఘం పటిష్టంగా ఉండి, త్వరత్వరగా కట్టబడుతుంది. దైవరాజ్య వ్యాప్తి జరుగుతుంది.
ఓ అత్తా! నీవెలా ఉన్నావు? నయోమిలా కోడలిని ఆదరిస్తున్నావా? సాధిస్తున్నావా? ఓ కోడలా! నీవెలా ఉన్నావు? రూతులా, ఓర్పాలా అత్తగారిని హత్తుకొంటున్నావా, రూతు అత్తగారిని హత్తుకొని గొప్పమేలులు పొందుకోంది. అది దేవునికి ఆమోఘ్యంగా మారింది.
అట్టి మార్పు నీకు లేకపోతె నేడే పరివర్తన చెందు! సాదువైనట్టియు, మృదువైనట్టియు అక్షయాలంకారాలు పొందుకోమని అత్తాకోడల్లును యేసయ్యపేరిట బ్రతిమిలాడుతున్నాను!
అట్టి కృప- ధన్యత ప్రతీ అత్తా-కోడలుకు కలుగును గాక!!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(సశేషం)
రూతు- ఏడవభాగం
దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియులారా! రూతు 1:8,9 వచనాలు చూస్తే వారు అనగా నయోమి, ఓర్పా, రూతు ముగ్గురు విధవరాళ్ళు కలసి బెత్లెహేముకు బయలుదేరారు. కొంతదూరం ప్రయాణం చేశాక, నయోమి ఆగమని చెప్పి, కొన్ని దీవెనకరమైన మాటలు చెప్పినట్లు చూస్తాం!
మీరు మీ తల్లుల ఇంటికి వెళ్ళుడి అని వారిని పంపించేస్తుంది. ఎందుకంటే వారు యవ్వనంలో ఉన్నారు, తన భవిష్యత్తు ఏమవుతుందో తనకి తెలియదు- ఇంకా యవ్వన కోడళ్ళు, అదీ విధవరాల్లను తీసుకొని వెళ్తే ఏమవుతుందో తెలియదు అని అలోచించి ఉంటుంది. అసలేవారు మోయాబీయులు. మోయాబీయులు యూదా/ఇశ్రాయెలీసమాజంలో చేరకూడదు అని ధర్మశాస్త్రం ఖండితంగా ఆజ్ఞాపించింది. ఒకవేళ తనతోపాటు తీసుకొని వెళ్తే వారిని ఎవరూ వివాహం చేసుకోరు/చేసుకోకూడదు! వారి యవ్వనం, భవిష్యత్తు ఇశ్రాయేలు దేశంలో అగమ్యగోచరంగా మారబోతుంది. ఇవన్నీ ముందుచూపుతో ఆలోచించి తనకోడల్లను తిరిగి వెల్లిపోమంటుంది. వెళ్లేముందు రెండు దీవెనలు ఇస్తుంది.
1.చనిపోయిన వారి యెడలను, నా యెడలను మీరు దయచూపినట్లు, యెహోవా మీకు దయ చూపును గాక!
2. మీలో ఒక్కొక్కరు మీ గృహానికి వెళ్లి తిరిగి వివాహం చేసుకొని, మీ ఇంట్లో నెమ్మదిగా/ విశ్రాంతిగా/ సుఖంగా ఉండేలా యెహోవా దయచేయును గాక! అని దీవిస్తుంది.
1.చనిపోయిన వారియెడల అనగా మీ భర్తల యెడల, నా యెడల మీరు ఎంతో దయ చూపించారు. మీ భర్తలు చనిపోయినా సరే నాతోనే ఉన్నారు! మీరు ఏం చేసారో నాకు- దానికి ప్రతిఫలంగా నేనైతే ఏమి ఇవ్వలేను గాని, దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చును గాక! అని దీవించింది. అందుకే యేసుప్రభులవారు మత్తయి 5:7 లో కనికరం గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు! అన్నారు (కనికరించని మీకు కనికరం చూపబడదు అనికూడా వస్తుంది).
మత్తయి 7:2 మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకును అదే కొలతతో కొలువబడుతుంది అన్నారు.
కీర్తనలు 18:25,26 దయగలవారియెడల దయచూపించేదవు. కటినుల యెడల వికటముగా నుందువు.
ఇంకా మోసపోకుడి! దేవుడు వెక్కిరింపబడడు!! మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును! గలతీ 6:7.
కాబట్టి ప్రియ విశ్వాసి! జాగ్రత్త! నీవు కనికరం చూపిస్తేనే నీకు కూడా కనికరం/ దయ చూపించబడుతుంది.
ఇంకా ప్రభువు నేర్పిన ప్రార్ధనలో మరో ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. *మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం, మా అపరాధములను క్షమించుడి*! అంటే మీరు ఇతరుల అపరాధములను క్షమిస్తేనే మీ అపరాధములు కూడా దేవుడు క్షమిస్తారు! కాబట్టి ప్రతీ విశ్వాసి దయ, కరుణ, కనికరం, క్షమాపణా గుణాలు కలిగియుండాలి.అవి మీకున్నాయా ప్రియ చదువరీ!!!???
2. రెండవ దీవెన మీరు మీ తల్లుల గృహాలకు వెళ్లి, వివాహం చేసుకొని సుఖపడేలా యెహోవా దయచూపును గాక! ఇప్పుడు నయోమి తల్లి స్తానం లో ఉంది దీవిస్తుంది.
ఓ అత్తా! నీవు నీ కోడలిని దీవిస్తున్నావా? సాధిస్తున్నావా? శపిస్తున్నావా? మీద చెప్పిన వచనాలు దీనికి అన్వయిస్తే మీరు మీ కోడళ్ళను, ఇతరులను దీవిస్తేనే, మీరుకూడా దీవింపబడతారు! ఆశీర్వాదకారణంగా ఉంటారు.
మీరు దీవించకపొతే మీకు దీవెన లేదు. మరీ ముఖ్యంగా మీరు మీ కోడళ్ళను దీవిస్తూ, ఆదరిస్తూ ఉంటే- మీ కుటుంబం నెమ్మదిగా ఉంటూ, సంతోషంగా ఉంటుంది. ఇంకా కుటుంభం అంతా కలసిమెలసి ఉంటుంది. లేకపోతె విడిపోతుంది. ఒకవేళ మీకుమారుని బలవంతం మీద కలసి ఉన్నా ఎడముఖం-పెదముఖంగా ఉంటారు!!!
ఇది దేవునికి నచ్చని విషయం!!!
కాబట్టి ఎవరైనా మీలో అలా ఉంటే ఇప్పుడే సరిచేసుకోండి!
మీరంతా కలసి మెలసి ఉండేలా ప్రభువు కృప చూపును గాక!!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- 8వభాగం
రూతు 1:10 అంతట వారు ఎలిగెత్తి ఏడ్చి- నీ ప్రజలయొద్దకు నీతో కూడా వచ్చెదమని చెప్పగా- -- ఇక్కడ వారు నిజంగా ఏడుస్తున్నారు!
దొంగ ఏడ్పులు/ దొంగ కన్నీరు కాదు! హృదయం బద్దలైపోయి నిజంగా విలపిస్తున్నారు!
అంటే ఇక్కడ అత్తాకోడల్ల హృదయం ఒకరితో ఒకరు పెనవేసుకుపోయింది అన్నమాట! అందుకే అనగా ఏడుస్తున్నారు! ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, రూతు, ఓర్పా మనస్పూర్తిగా, నిజాయితీగా అంటున్నారు ఓ అత్తా! అలా అనొద్దు, నీతోపాటు మేము వస్తాము అని.
11-13 వచనాలలో దానికి జవాబుగా నయోమి తనతోపాటు ఎందుకురావద్దు అంటుందో చెబుతుంది.
నాకుమార్తెలారా! ఎంత చక్కటి పిలుపు!! ఇలాంటి పిలుపు ప్రియ చదువరీ! నీకుందా? నోరు మంచిదైతే ఊరంతా మంచిదంటారు అందుకే!
నాకుమార్తెలారా మీరు వెళ్ళిపొండి. మీరు నాతో రానేల? ఇంకా మిమ్మల్ని పెళ్ళిచేసుకోడానికి నా కడుపునా ఇంకా కుమారులు లేరు, పుట్టరు! ఒకవేళ నేను పెళ్ళిచేసుకొని పిల్లలను కన్నా వారు పెద్దవారు అయ్యేవరకు మీరు ఉండలేరు! అంటే వీరికి ధర్మశాస్త్రవిధులు ముందే వివరించి యుంటుంది నయోమి!
Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 25:5,6
5.సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.
6.చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను.
ఇదీ ధర్మశాస్త్రం చెబుతుంది. దీనికి ఉదా: ఆదికాండం 38: 6-11 లో యూదా యొక్క కుమారులు జరిగించారు. ఈ కారణాలు వారికి చెప్పి –నా కుమార్తెలారా! ఇది మా ఆచారం! మీరు నాతో కూడా వచ్చినా ప్రయోజనం లేదు! నాకైతే ఇంక కుమారులు లేరు. అంటూ వివరిస్తుంది. ఇక సమీపబందువు వారిని విడిపిస్తాడో లేదో అది కూడా తెలియదు అందుకే వెళ్ళిపొండి అంటుంది.
చివరగా ఒకమాట అంటుంది, యెహోవా నాకు విరోధియాయెను అది మిమ్ములను నొప్పించినంతకంటే మరి ఎక్కువగా నన్ను నొప్పించినదని చెప్పెను!!!! నయోమి అంటుంది యెహోవా నాకు శత్రువాయెను! ఎందుకు?
1.ఆమె యెహోవాను విడచి లోకంతో స్నేహం చేసింది. యెహోవాని విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును!!కీర్తనలు16:4;
2. వ్యభిచారిణిలారా ! ఈలోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా? ఎవడు ఈలోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. యాకోబు 4:4. నయోమి కుటుంబానికి జరిగినది ఇదే! చిన్న శోదన వస్తే దూరదేశం పోయి, ధన సంపాదనలో పడ్డారు దేవుని సన్నిధి నుండి దూరమై పోయారు. అప్పుడు వీరికి తెలియదు ఈ లోక స్నేహం దేవునినుంది దూరం చేస్తుందని.
పరాయిదేశం వెళ్ళినా మా భక్తిని మేము కాపాడుకొంటాము అనుకొన్నారు! కొన్నిరోజులకు వారితోపాటు కలసి పోయారు. తమ కుమారులిద్దరికి విదేశీ అమ్మాయిలతో పెళ్లి చేసేతంట దేవునికి దూరమైపోయారు. లోకంతో స్నేహం చేసింది- దేవునికి శత్రువుగా మారింది నయోమి!
యాకోబు 1:27 . . . . . . ఇహలోక మాలిన్యము తనకంటకుండా తననుతాను కాపాడుకోవడమే భక్తి అంటే! అదిపోయింది నయోమిలో!
లోకంతో స్నేహం చేసింది,
దేవునితో వైరం తెచ్చుకొంది,
తన భర్తను, కుమారులను పోగొట్టుకొంది! ఇప్పుడు అది నన్ను భాదిస్తుంది అంటుంది! ప్రియ విశ్వాసీ! నయోమిలాగా లోకంతో స్నేహం చేస్తున్నావా? అయితే దేవునితో వైరం పెంచుకొంటున్నావని తెలుసుకొని, సరిదిద్దుకోమని దేవుని పేరిట గుర్తు చేస్తున్నాను!!
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- 9వభాగం
రూతు-ఓర్పారూతు 1:14 వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను!!
నయోమి తన కోడళ్ళను తనతోపాటు ఎందుకు రావద్దంటుందో వివరించి చెప్పాక- ఓర్పా అత్తని ముద్దు పెట్టుకొనెను అనగా ముద్దుతో వీడ్కోలు పలికింది. దీని అర్ధం ఓర్పా చెడ్డదని కాదు! తన అత్త తన తల్లిదండ్రులయొద్దకు తిరిగిపొమ్మంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో తనకు నిరీక్షణ లేదని చెబుతుంది. అందుకే ముద్దుపెట్టుకొని వెళ్ళిపోయింది ఓర్పా! అయితే ఒర్పాను అర్ధం చేసుకోవాలి అంటే మనం తిరిగి చరిత్రను తెలుసుకోవాలి.
1. మహ్లోను రూతును పెళ్ళిచేసుకొన్నందున నయోమి కుటుంభం మోయాబు దేశంలో చాలా కష్టాలు అనుభవించింది. అయితే రూతు ఒకే ప్రాంతంలో ఉండటానికి వీలు లేక అనేక ప్రాంతాలు తిరగవలసి వచ్చింది. ఈ సమయంలో ఓర్పా తన అత్తను తన సొంత తల్లిలా ఆదరించి, ఆమె ఆలనాపాలన చేసేది. ఎందుకంటే ఆమె ఎప్పుడూ తన భర్తకోసం, తన కుమారులకోసం ఆలోచిస్తూ విచారంగా ఉండేది.
2. రూతు ఎప్పుడూ పనులు చేసేది కాదు. ఎందుకంటే చేత కాక! ఎందుకంటే తను రాజకుమార్తె! ప్రధాన పూజారిని. అందరితో పనులు చేయించేదే తప్ప చేయడం చేతకాదు. కాబట్టి అత్తగారింటికి వచ్చినా పనులు చేయడం రాక చేయలేకపోయేది. అప్పుడు మొత్తం పనులన్నీ ఓర్పానే చక్కబెట్టేదట! చివరకి నయోమి హితోపదేశంతో ఓర్పా తన అత్తని ముద్దుపెట్టుకొని విడవలేక విడవలేక విచారిస్తూ వెళ్ళిపోయింది.
రూతు ఆమెను హత్తుకొనెను! ఇది చాలా మహోన్నత మైన మాట! ఓర్పా వెళ్ళిపోయినా రూతు నయోమిని విడచిపెట్టక ఆమెను హత్తుకొంది.! ఎంతమంచిది ఈ బిడ్డ! బైబిల్ లో హత్తుకొనుట కోసం చాలాసార్లు వ్రాయబడింది. న్యాయాధిపతులు, 1&2 రాజులు, 1&2 దినవృత్తాంతములు ---- ఇంకా ప్రవక్తల గ్రంథాల ప్రకారం కేవలం కొంతమంది రాజులు మాత్రం యెహోవాను హత్తుకొన్నారు! హిజ్కియా యెహోవాను హత్తుకొని కుడికిగాని, ఎడమకు గాని తిరగలేదు, యోషియా యెహోవాను హత్తుకొనెను, దావీదు దేవుణ్ణి హత్తుకొనెను. యెహోషాపాతు హత్తుకొన్నాడు. ఈ రాజులు యెహోవాను హత్తుకొన్నప్పుడు ఎన్నో అధ్బుతకార్యాలు పొందుకొన్నారు. యుద్దాలు జయించారు. కత్తిపట్టకుండా, యుద్ధం చేయకుండా యుద్దాలలో జయం పొందారు! శత్రువులను అణచగలిగారు. సింహాల్ల నోళ్లను మూయగలిగారు భక్తులు! ఎప్పుడూ? యెహోవాను హత్తుకొన్నప్పుడు!!!
అయితే అదే గ్రంథాల ప్రకారం ఇశ్రాయేలీయులు యెహోవాను హత్తుకొనక, ఇతర దేవతలను హత్తుకొని, వాటిని పూజించినప్పుడు దేవుని ఉగ్రతకు పాలయ్యారు. కరువుకాటకాలకు బలయ్యారు. శత్రువుల చేతికి చిక్కారు. కటిన దాస్యత్వం అనుభవించారు. గర్భిణీ స్త్రీల కడుపులు చింపబడ్డాయి. వీదులలో యవ్వనుల శవాలు పారవేయబడ్డాయి వాటిని పాతిపెట్టే వారు కూడా లేకపోయారు. అయితే వారు తిరిగి మొర్రపెట్టి యెహోవాను హత్తుకొన్నప్పుడు, యెహోవాను సేవించినప్పుడు దేవుడు మరలా క్షేమం కలుగజేసి ఆశ్చర్యకార్యాలు చేసారు.
ప్రియ చదువరీ! నీవు ఎవరిని హత్తుకొన్నావు? రూతు తన అత్తను హత్తుకొని, యెహోవాదేవుణ్ణి హత్తుకొని ఘనులారిగా/ ఆశీర్వదింపబడిన తల్లిగా మారింది. మరి నీవు దేవుణ్ణి హత్తుకొన్నావా? లోకాన్ని హత్తుకొంటున్నావా? లోకాన్ని హత్తుకొంటే నీకు శ్రమ!!
దేవుణ్ణి హత్తుకొంటే నీకు ఆశీర్వాదం/ఆనందం/పరలోకం!!!
ఇదిగో నీముందు రెండు మార్గాలున్నాయి. లోకం- - దేవుడు!
ఏది కావాలో నిర్ణయించుకో!
రూతులా దేవుణ్ణి హత్తుకొని ఆశీర్వదింపబడుదువు గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- 10వభాగం
నయోమిప్రియదైవజనమా! మనం రూతు గ్రంధంలో గల వ్యక్తులు- సంఘటనలకోసం గత కొద్దిరోజులుగా ధ్యానిస్తున్నాం! నయోమి తన తిరుగు ప్రయాణంలో తన కోడళ్ళను తిరిగి తమ స్వగృహాలకు వెళ్ళిపొమ్మని చెబితే, ఓర్పా –నయోమిని ముద్దుపెట్టుకొని తన తల్లి ఇంటికి వెళ్ళినట్లు చూసాం. గాని రూతు తన అత్తను హత్తుకొంది అని ఇంతవరకు ధ్యానించాం. రూతు 1:15 ఆమె (నయోమి) ఇదిగో నీ తోటికోడలు తన జనుల యొద్దకును, తమ దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోటికోడలు వెంబడి వెల్లుమనెను.
ఈ వచనాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే మనకు కొన్ని విషయాలు అర్ధమవుతాయి. నయోమి –రూతుతో నీ తోటికోడలు తన స్వజనుల యొద్దకు వెళ్ళిపోతుంది నీవు ఆమెను వెంబడించు అంటే బాగుణ్ణు, గాని ఆమె తన స్వజనుల యొద్దకు, తమ దేవుని యొద్దకు వెళ్తుంది, నీవు కూడా అలాగే వెళ్ళు అంటుంది. కొన్ని ప్రతులలో తమ దేవుళ్ళు అని వ్రాయబడి యుంది, ఒక విశ్వాసి, నిజదేవున్ని తెలుసుకొన్న వ్యక్తీ, గుణపాఠం నేర్చుకొన్న వ్యక్తి అనవలసిన మాటేనా అది? తిరిగిపోయి మీ తల్లిదండ్రులతో పాటు మీ దేవుళ్ళను పూజించు అంటుంది. మోయాబీయులు కెమోషు అనే దేవతను పూజిస్తారు.(1రాజులు 11:7; 2రాజులు 23:13). ఆ దేవతకు ఎలా చంటి పిల్లలను బలి ఇచ్చేవారో, ఎంతటి వ్యభిచారం జరిగించేవారో గత భాగాలలో చూసుకొన్నాం. అంతటి దౌర్భార్యమైన పనిని నీవు తిరిగి వెళ్లి నీ తల్లిదండ్రులతో కలసి చెయ్ అంటుంది. ఒక విశ్వాసి అనవలసిన మాటేనా ఇది? నీ తల్లిదండ్రుల యొద్దకు తిరిగి వెళ్ళు, అక్కడికి వెళ్ళినా దేవుణ్ణి మరచిపోకు, విగ్రహారాధన చేయకు అని చెప్పవలసింది గాని అలా అనడం లేదు. పరోక్షంగా యెహోవా దేవుణ్ణి వదలి నీ పూర్వపు పూజ చేసుకో అంటుంది. ఎంత దౌర్భార్యం!!!
ప్రియ విశ్వాసి! నీ స్తితి ఎలా ఉంది? నీవు నీతోటి విశ్వాసుల విశ్వాసాన్ని బలపరిచేలా ఉన్నావా? లేక దిగజారుస్తున్నావా? అగ్నిలోనుండి లాగినట్లు కొంతమందిని లాగండి యూదా 1:23 లో లేఖనం సెలవిస్తుంది. అనగా విగ్రహారాధన నుండి ప్రజలను నిజ దేవుని వైపుకు ఆకర్షించాలి.మరి నీవేం చేస్తున్నావు?
మా పల్లెటూర్లలో కొంతమంది అన్యులనుండి రక్షణ పొందిన వారు –ఎవరైనా అన్యులు వచ్చి అమ్మా ఈ పూజ ఎలా చేయాలి/ ఈ కార్యక్రమం ఎలా చేయాలి అంటే ఆ పూజాక్రమాన్ని వివరించేవారు కొంతమంది, దగ్గరుండి జరిగించేవారు కొంతమంది ఉన్నారు. అట్లాంటివి మరలా చేయను ఎలా చేయాలో కూడా నేను చెప్పను అని ఖండితంగా చెప్పగలగాలి. గాని-- నీవు లేకపోతె ఈ కార్యక్రమం జరగదు, నీవే పెద్దవు అంటే పొంగి పోయి వారికి డైరెక్షన్స్ ఇస్తే నీ డైరెక్షన్ తిన్నగా నరకానికి అని మరచిపోకు!! నీవు విగ్రహారాధన చేయకపోయినా వాటిని ప్రోత్సాహిస్తున్నావు. ఆ ఆచారాలను సమర్దిస్తున్నావు, గాబట్టి చేసేవారికి ఎంతశిక్షో—దానికి రెట్టింపు శిక్ష నీకు తప్పదని గుర్తించుకో! కారణం వారికి పూర్తిగా తెలియదు గాని నీకు తెలిసి కూడా తప్పు చేస్తే తప్పించుకోలేవు.
మరికొంతమంది రక్షణ పొందినా సరే అన్యాచారాలు వదలరు. ముఖ్యంగా వివాహ సమయాలలో ముహూర్తాలు చూడటం, మామిడాకులు కట్టడం, తాళి కట్టడం అన్నీ హైందవ సోదరుల ఆచారాలే చేస్తారు ఒక్క బొట్టు పెట్టుకోవడం తప్పించి అన్నీ వాళ్ళ లాగేనే చేస్తారు. ఇంకొంత మంది గృహాలు కట్టేటప్పుడు, గృహంలో దిగేటప్పుడు –వాస్తు అంటారు, ముహూర్తాలు అంటారు. ఇంకా వారిలాగే అన్యాచారాలు చేస్తే వారికి నీకు తేడా ఏమిటి? మూర్కులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడి అని అపోస్తలుల కార్యం 2:40లో వ్రాయబడి యుంది. దేవుని రక్షణ ఓడలో ఉన్న నీవు- రక్షణ నుండి వైదొలగి తిరిగి విగ్రహారాధన అనే ఓడ ఎక్కి ప్రయాణం చేస్తే అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది జాగ్రత్త!
దయచేసి ప్రియ విశ్వాసి! ఒకసారి నిన్ను నీవు సరిచూసుకో! నీవు కూడా అలాంటి పనులు చేస్తున్నావా? వాటిని సమర్దిస్తున్నావా? అవి చేసేవారికి సలహాలు/సంప్రదింపులు చేస్తున్నావా? అయితే నీ రక్షణను కోల్పోయావు అని గుర్తుంచుకో! అదృష్టవశాత్తు రూతు దానికి ఒప్పుకోక, యెహోవా దేవుణ్ణి, నయోమిని హత్తుకొని, రక్షణ ఓడలో ప్రయాణించి పరలోకాన్ని/ఆశీర్వాదాన్ని పొందుకుంది. నీవుకూడా నీ రక్షణను కోల్పోకు!
నీ తోటివారిని కూడా రక్షణను కోల్పోనీయకు!
తోటి విశ్వాసుల విశ్వాసాన్ని దిగాజార్చకు! నీ బందువులకు, ఇరుగుపొరుగువారికి యేసయ్య మహిమను, రక్షణ కార్యక్రమాన్ని ప్రకటించి, రక్షించు!
అట్టి కృప ధన్యత నీకు నాకు కలుగును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- 11వభాగం
రూతు సమర్పణ- త్యాగం- ఒడంబడికRuth(రూతు) 1:16,17
16.అందుకు రూతు:నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;
17. నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.
ప్రియదైవజనమా! రూతు గ్రంధానికే మూలవాక్యాలు, ముఖ్యవచనాలు ఇవి!! ఒక అన్యురాలు దేవునిప్రేమను తెలుసుకొని భయంకరమైన ఆటుపోటులగుండా, శ్రమలగుండా, అవమానాలగుండా ప్రయాణం చేస్తున్నా సరే- మనస్పూర్తిగా అంటున్న మాటలివి. నయోమి నీ తోటికోడలులాగ నీవుకూడా నీ తల్లి ఇంటికిని, నీ పాత దేవుళ్ల యొద్దకు తిరిగి వెళ్ళిపో అంటే దానికి జవాబుగా రూతు అంటున్న మాటలు చూడండి:
1. నా వెంబడి రావద్దని, నన్ను విడచిపెట్టు అనియు నన్ను బ్రతిమిలాడవద్దు. ఎందువల్ల- - ఆమె నిర్ణయం, ఒడంబడిక- సమర్పణ- త్యాగం చూడండి.
2. నీవు వెళ్ళు చోటికే నేనుకూడా వస్తాను
3. నీవు నివశించు చోటనే నేనును నివశించెదను.2,3ప్రకారం ఇంకా ఇలా అనుకోవచ్చు: నీవు ఏం తింటావో నేనుకూడా అదే తింటాను. నీవు పస్తులుంటే నేను పస్తులుంటాను. నీకు ఎటువంటి కష్టమొచ్చినా అది నీతో పాటు నేనుకూడా భరిస్తాను! అంటుంది.
4. నీ జనమే –నా జనము: ఎంత గొప్ప మాట ఇది!! తన సొంత జనాన్ని, తన సొత తల్లిదండ్రులను కూడా దేవునికోసం త్యాగం చేసింది. ఇప్పుడు అంటుంది నీ జనమే నాజనం, నీ దేవుడే నాదేవుడు!
5. నీ దేవుడే –నా దేవుడు: ఇంతవరకు కెమోష్ ను పూజించిన తను, నిజ దేవుణ్ణి తెలిసికొని, ఆ నామం కోసం ఎన్నో ఇబ్బందులు పడినా సరే అంటుంది: నీ దేవుడే- నాదేవుడు.
6. నీవు మృతి పొందు చోటనే నేనును మృతినొందెదను. ఎంత తెగింపు?!! దీనర్ధం ఏమిటంటే కేవలం కొన్ని రోజులు మాత్రమే తను అక్కడ ఉండాలని అనుకోవడం లేదు. నీవు మృతి పొందు చోటనే నేను కూడా చనిపోతాను అంటే తను చచ్చే వరకు అక్కడే ఉంటాదంట!
బహుశా ఈ మాట అనేసరికి నయోమి వయస్సు 50-60 మధ్య ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజులలో ఇశ్రాయేలీయుల అమ్మాయిలకు 12 సం.లకే ప్రధానం జరిగిపోయేది. 15 సం.లకే వివాహం జరిగిపోయేది. ఇక రూతు వయస్సు 30 సం.లు కన్నా తక్కువే ఉండొచ్చు.
వయస్సు ప్రకారం మొదట నయోమి చనిపోతుంది, ఆ తర్వాతనే రూతు చనిపోతుంది. ఇప్పుడు అంటుంది తను చనిపోయే వరకు కూడా నయోమిని గాని, ఇశ్రాయేలు దేశాన్ని గాని, దేవునిని గాని వదలను అంటుంది. ఎంత తెగింపు? ఎంత త్యాగం?
7. అక్కడనే పాతిపెట్టబడెదను. అంటే ఇక తన స్వగ్రామం తిరిగి వెళ్ళను అంటుంది. చివరగా
8. మరణం తప్ప మరేదైనా నిన్ను- నన్ను వేరు చేసిన యెడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయును గాక! ఇక ఇది తిరుగులేని మాట! ఎంతో గొప్ప త్యాగాన్ని ప్రదర్శిస్తుంది. దేవుని పేరిట శపథం చేస్తుంది! నిన్ను, నీ దేవుణ్ణి నేను వదలను అంటుంది!
ఇక ఈ మాటకు నయోమికి ఏం చెప్పాలో మాట రాలేదు! ఆశ్చర్యపోయి ఉంటుంది. నిజంగా ఇంత త్యాగమా ఈ అమ్మాయికి! ఇంత ప్రేమా నామీదా? ఇంత నమ్మకమా నా దేవుని మీద అని అనుకుని ఉంటుంది. ఇక ఏమీ చెప్పలేకపోయింది. ఇక్కడ మనం ఆగి పరిశీలన చేద్దాం!
I. రూతు ఇంత శ్రద్ధాభక్తులు నయోమిపై చూపించడానికి కారణం ఏమై ఉంటుంది?
a. నయోమి రూతును తన సొంత కూతురులా చూసుకొనియుంటుంది.
b. రూతు నీ దేవుడే నాదేవుడు అనడానికి కారణం బహుశా నయోమి దేవునికోసం, దేవుని ప్రేమ కోసం ఎన్నో నేర్పించి యుంటుంది, అందుకే తన భర్త, తన మామ గారు పోయినా సరే, మోయాబు దేశంలో ఎన్నో శ్రమలు ఆ నామం కోసంపడినా సరే నీ దేవుడే నా దేవుడు అంటుంది.
ప్రియ విశ్వాసి! నీ కుమారులకు, నీ కుమార్తెలకు, నీ కోడల్లుకు దేవుని గొప్పతనం కోసం చెబుతున్నావా?
బహుశా నయోమి తన ప్రవర్తనలో కూడా బాగా ఉంది ఉండవచ్చు. ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయి, మారి, నీ దేవుడే నాదేవుడు అని అని ఉండవచ్చు.
II. ఒక పాపి రక్షణ పొందితే దేవుడు తన దేవదూతలతో కలసి ఎంతో సంతోషిస్తారు అని లేఖనం సెలవిస్తుంది. (లూకా 15:10);ఇక్కడ రూతు రక్షణ పొందడమే కాకుండా తన సాక్ష్యాన్ని నిలుపుకొని, నేను చచ్చేవరకు నిన్ను, దేవుణ్ణి వదలను అని ప్రమాణం చేస్తే- నేను అనుకొంటాను- బహుశా దేవుడు పులకించిపోయి దేవదూతలందరికి పెద్ద పార్టీ ఇచ్చి ఉండొచ్చు!!!!
నా పిల్లలు సత్యముననుసరించి నడుచుకొనుచున్నారు అని వినడం కంటే నాకు మరి ఎక్కువ సంతోషం లేదు అని యోహాను భక్తుడు మురిసిపోయాడు(3యోహాను 4). ఇక్కడ దేవుడు కూడా మురిసిపోయి ఉండొచ్చు!!
షడ్రాక్, మేషాక్, అబెద్నేగోలు మేము చావనైనా చస్తాం గాని, నీ బంగారం బొమ్మకు మొక్కం అని రాజుకు సమాధానం చెబితే, దేవుడు దేవుడు పొంగిపోయి షడ్రాక్, మేశాక్, అబెద్నేగోలతో అగ్నిలోనికి దూకేసి, వారిని రక్షించారు(దానియేలు 3వ అధ్యాయం).
మీరు ఎవరిని సేవించినా సరే, నేనును, నా ఇంటివారును యెహోవాను సేవిస్తాం అని యెహోషువా గారు చెబితే ఆ నిర్ణయానికి దేవుడు పులకించిపోయారు(యెహోషువ 24:15). ఆ నిర్ణయాన్ని కడవరకు నిలబెట్టుకొన్నారు యెహోషువా!
ఆ నామం కోసమే సింహాల బోనులో త్రోయబడ్డారు దానియేలు! దేవుడు సింహాల్ల నోళ్లను మూయించేసారు(దానియేలు 6వ అధ్యాయం).
నీవు నీవు కత్తి ఈటె బల్లెము తీసుకొని వస్తున్నావు గాని నేను యెహోవాపేరిట నీ మీదకు వస్తున్నాను అని దావీదు గారంటే దేవుడే దావీదు పక్ష్యంగా యుద్ధం చేసి గెలుపునిచ్చారు(1 సమూయేలు 17: 42-50).
అదే నామం కోసం భక్తులు ఎన్నో కష్టాలు పడ్డారు. కొరడా దెబ్బలు తిన్నారు. బంధకాలు- ఖైదును అనుభవించారు. రాళ్ళతో కొట్ట బడ్డారు. రంపములతో కోయబడ్డారు. ఖడ్గముతో చంపబడ్డారు. ... . . . . . ఆకలిదప్పులు అనుభవించారు. దేవుడు వారిపట్ల ఎన్నో మేలులు చేసారు. (హెబ్రీ 11 )
ప్రియ విశ్వాసి! రూతుకు ఉన్న విశ్వాసం, త్యాగం, సమర్పణ, తెగింపు చూసి దేవుడే ముగ్దుడై, తన వంశావలిలో రూతును చేర్చారు.
మరి నీ విశ్వాసం, నీ త్యాగం, నీ పట్టుదల ఎలా ఉంది?
దేనిమీద ఉంది?
లోకాన్ని ప్రేమిస్తున్నావా?
దేవుణ్ణి ప్రేమిస్తున్నావా?
భక్తులు ఎన్ని శ్రమలొచ్చినా, నిందలోచ్చినా దేవుణ్ణి వదలక హత్తుకొన్నారు!
నయోమి చిన్న కష్టానికి దేవునికి దూరమై ఎన్నో తిప్పలు పడింది. రూతు తీసుకొన్న నిర్ణయం కడవరకు కొనసాగించింది. మరి నీవు తీసుకొన్న నిర్ణయాన్ని కడవరకు నిలబెట్టుకొంటున్నావా?
భాప్తిస్మం తీసుకొన్నప్పుడు నీవు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకొంటున్నావా? అంత్యము వరకు నమ్మకముగా ఉండుము అప్పుడు దేవుడు నీకు జీవకిరీటమిచ్చును అంటే దానికి అలాగే అని ప్రమాణం చేసావు కదా! అది నిలబెట్టుకొంటున్నావా?
ఆ మొదటి సమర్పణ, విశ్వాసం, నిరీక్షణ, ఇప్పుడు నీకున్నాయా?
శ్రమలకు తట్టుకోలేక లోకంలో కలసిపోయి తిరుగుతున్నావా?
పడిపోయావా?
ఒకసారి సరిచూసుకో! సరిచేసుకో! రూతులాంటి త్యాగం, సమర్పణ, తెగింపు నీకు కావాలి!
అట్టి కృప, త్యాగం, నిరీక్షణ మనందరికీ కలుగును గాక!
ఆమెన్!
(సశేషం).
రూతు- 12వభాగం
ప్రియులారా గత భాగంలో రూతుయొక్క సమర్పణ, త్యాగం, విశ్వాసం, తెగింపు గురించి మనం ధ్యానించాం!
ఎప్పుడైతే రూతుయొక్క నిర్ణయాన్ని విన్నదో నయోమి- 18వ వచనం ప్రకారం వారు బెత్లెహేము చేరేవరకు ఆ విషయం మాట్లాదలేదంట. గతంలో చెప్పినట్లు బెత్లెహేము నుండి మోయాబు దేశం 50మైళ్ళు లేదా 82.6 కి.మీ. వారిద్దరూ కలసి ప్రయాణం చేసి క్షేమంగా బెత్లెహేము చేరుకొన్నారు. రూతు ఇంకా దేవుని కోసం తెలుసుకొని యుంటుంది మార్గమధ్యంలో.
రూతు 1:19 ఎప్పుడైతే నయోమి తన కోడలితో కలసి తనసొంత ఊరు వచ్చిందో ఆ ఊరు వారు గుంపుకూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకోనుచుండగా. . . .
ఇక్కడ ఆగి కొంచెం పరిశీలన చేస్తే , బెత్లెహేం గ్రామస్తులు ఈమె నయోమి అని అనుకొంటున్నారు -అంటే వెంటనే గుర్తు పట్టలేదు. గుర్తుపట్టడానికి సమయం పట్టింది. ఎందుకు? ఆమె బెత్లెహేము విడచి 10 సం.లు అయ్యింది కదా అందుకనా? కాకపోవచ్చు! కారణం
1. ఆమె కుటుంబం మొత్తం 4గురు వెళ్ళారు మోయాబు దేశం ,అయితే వారు ఇద్దరే తిరిగి వచ్చారు. నయోమి భర్త, తన ఇద్దరు కుమారులు లేరు. మరో మోయాబు స్త్రీతో కలసి వచ్చింది.
2. 10 సం.లు మోయాబు ప్రాంతంలో ఉన్నాసరే ఆమె ఎప్పుడూ ఆనందంగా లేదు. తన భర్త పోయిన విచారం, తన కుమారులు చనిపోయిన విచారం, రూతు వలన పడిన కష్టాలు, ఇవన్నీ కలసి విచారం వలన ఆమె రూపురేఖలు మారిపోయి ఉంటాయి. అందుకే ఆమెను గుర్తు పట్టడానికి సమయం పట్టింది. దానితోపాటు మరో మోయాబు స్త్రీ కూడా ఉంది. ఆస్త్రీ ఎవరో తెలియదు. ఇదో పెద్ద ప్రశ్న. అందుకే ఈమె నయోమి కదా అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తర్వాత ఒక్కొక్కరూ వచ్చి పలకరించడం మొదలుపెట్టారు.
మామూలుగా గ్రామాల్లో ఉన్న ప్రేమ, ఆప్యాయత, పలకరింపు మనం పట్టణాలలో చూడలేము. బెత్లెహేము చిన్న గ్రామం. అందుకే అందరూ పలకరించడానికి వచ్చారు గ్రామమంతా! ప్రజలు ఎప్పుడైతే తనను నయోమి అని పిలవడం మొదలుపెట్టారో- వెంటనే ఆమె నుండి ప్రతి స్తంభన వచ్చింది. అమ్మలారా! నన్ను నయోమి- అనగా మధురం, మనోహరం అని పిలువవద్దు!!!
మరి ఏమని పిలవాలి? మారా- అనగా చేదు అని పిలవమంటుంది. ఈ మారా మనకు ఇశ్రాయేలీయుల నిర్గమములో కనిపిస్తుంది. నీరు చేదుగా ఉన్నందున వారు మోషేగారి మీద సణుగుకొంటారు. అప్పుడు దేవుడు అధ్బుతం చేస్తారు. నిర్గమ 15:22-26. అదేవిధంగా ఎలీషా గారి సమయంలో కూడా చేదు నీళ్ళను మధురంగా మారుస్తారు. అయితే దీనికిభిన్నంగా ఈమె జవాబు చెబుతుంది. మీరు నన్ను మధురం అని పిలవొద్దు గాని మారా అని పిలవండి. ఎందుకు?
1. సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేసెను. ఎందుకు కలుగజేసెను? యెహోవా దేవుణ్ణి వదలి- చిన్న శ్రమకు తట్ట్లుకోలేక- ధనాశతో- మోయాబుదేశం పోయింది. యెహోవాను విడచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరించును అని (కీర్తన 16:4) వ్రాయబడినట్లు వీరికి శ్రమలు వచ్చాయి.
2. సమృద్ధి గలదాననై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా చేసెను. ఒకసారి ఆలోచిద్దాం ఈ మాటలు.
సమృద్ధి గలదాననై వెళ్ళితిని. ఆమె తన నోటితోనే అంటుంది సమృద్ధి గలదాననై వెళ్ళితిని- అంటే ఆ ప్రాంతంలో కరవు వచ్చినా సరే ఈమెకు ఏ లోటు లేదన్న మాట. తిండికి, బట్టకు లోటు లేదన్న మాట! నేను కాదు తనే అంటుంది సమృద్ధి గలదాననై వెళ్ళితిని అని. మరి అంత సమృద్ధి ఉన్నప్పుడు చిన్న కరవు వస్తే తనకు ఏమి సమస్య?
కంగారుపడకుండా హాయిగా జీవించవచ్చు! మరి ఈమె ఆ గ్రామాన్ని , చివరకి దేశాన్నే వదలి వేల్లిపోయేటందుకు ఆమెకు ఏం సంభవించింది. మిగతా గ్రామస్తులు నయోమిలా మూట ముళ్ళు సర్దుకొని మరో ప్రాంతం పోలేదే?
దీనర్ధం ఏమిటంటే ఈమె ధనాశతో పరాయి దేశం వెళ్ళిపోయింది అంతే! మిగతా గ్రామస్తులు యెహోవాపై భారముంచి అక్కడే ఉండిపోయారు.
ఈమె కన్నులకు ఈ యుగ సంభంధమైన దేవత మరో ప్రపంచం చూపించింది. అందుకే పరాయి దేశం పోయింది.
ఇప్పుడు అంటుంది సమృద్ధి గలదాననై వెళ్ళితిని. యెహోవా నన్ను రిక్తురాలిగా చేసెను. ధనం పోగొట్టుకొంది, తన భర్తను, పిల్లలను పోగొట్టుకొంది, మనశ్శాంతిని పోగొట్టుకొంది. సహవాసం పోగొట్టుకొంది. ఏమీలేక తిరిగి , బుద్ధిలేని కుమారుడు తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చినట్లుగా బెత్లెహేము చేరుకొంది. తీరా దేవుని మీద అభాండాలు వేస్తుంది. తన తప్పువల్లె తమకు ఇన్ని కష్టాలు వచ్చాయి అనడం లేదు. యెహోవా నామీద విరోధియై సాక్ష్యము పలికెను అంటుంది.
ప్రియ విశ్వాసి! నీ స్తితి ఎలా ఉంది? నయోమిని చూసి కొంచెమైనా నేర్చుకోన్నావా? యెహోవాను విడచి తిరిగితే అంతే! నీకు కలిగిన కష్టాలకు, దుఃఖాలకు కారణం నీ స్వకీయ దురాశలే గాని దేవుడు కాదు(యాకోబు 1:12-14)! దేవుణ్ణి నిందించకు!
ఇప్పుడైనా బుద్ది తెచ్చుకొని, తప్పుతెలిసికొని, నయోమి చేరినట్లు తండ్రి ఇంటికి మరలా రా! ఆయన బుద్ధిలేని కుమారున్ని తన హక్కున చేర్చుకొన్నట్లు నిన్ను కూడా చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు.
వస్తావా?
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- 13వభాగం
ఈరకంగా నయోమి- తన కోడలు రూతు బెత్లెహేము చేరుకొన్నారు. బహుశా 1283 BC లో వారు బెత్లెహేము వచ్చారు. 1:22 ప్రకారం వారు యవల కోత ఆరంభంలో వచ్చారు. ఈ యవల కోత ఇశ్రాయేలు దేశంలో ఏప్రిల్ నెలలో ప్రారంభం చేస్తారు. కావున ఏప్రిల్, 1283 BC లో వారు తిరిగి వచ్చారు. అప్పుడు కూడా ఎహూదు న్యాయాధిపతిగా ఉన్నాడు.
2:1 లో బోయజుకోసం వ్రాయబడి ఉంది. అతడు చాలా ఆస్తి పరుడు అని మన తెలుగులో ఉంది. అయితే ఇంగ్లిస్లో A Mighty man In Wealth అని వ్రాయబడి ఉంది. యితడు ఎలీమేలేకుకు బంధువు, మరియు మన రూతుకి కూడా Kinsman redeemer. ఇతని కోసం మనం తర్వాత భాగంలో చూసుకొందాం.
అయితే నయోమి –రూతుకోసం ఆలోచిద్దాం. బెత్లెహేం అయితే వచ్చారు గాని వారి బ్రతుకు తెరువు ప్రశ్నార్ధకంగా మారింది. వారికి భూమి ఉంది గాని పండించే వారు లేరు. ఎందుకంటే ఎలీమెలెకు, మహ్లోను, కిల్యోను ఆ ఇంటి మగవాళ్ళంతా చనిపోయారు. అంతేకాక బహుశా వారి భూమి మరెవరో పండించుకుంటూ ఉండొచ్చు. సరే పండిద్దా మనుకొంటే వారు వచ్చింది కోత కాలంలో . తిరిగి నాట్లు వేయడానికి సుమారు సం.ము రోజులు ఆగాలి. అయితే చరిత్ర కారులు చెబుతారు- వారిని సుమారు ఒకటి రెండు సం.లు వారి బంధువులు పోషించారంట. కాని ఎల్లకాలము ఒకరి దయా దాక్షిణ్యలామీద ఆధారపడలేరు కదా. రూతు ఈలోపుగా యూదుల పరంపర, ఆచారాలు, ధర్మశాస్త్రము బాగా చదివింది. అందుకే 2:2 లో నయోమితో అంటుంది- నీ సెలవైనయెడల నేను పొలము లోనికి పోయి, ఎవని కటాక్షము పొందుదునో, వాని వెనుక పరిగె ఏరుకొందునని చెప్పగా, ఆమె నా కుమారి- పొమ్మనెను. ఇది జరిగింది సుమారు 1281 BC కావచ్చు. ఇక్కడ మనకు రెండు విషయాలు అర్ధం అవుతాయి.
1.నీ సెలవైన యెడల . . . :చూశారా రూతుయొక్క వినయం,విధేయత!!! ఒకప్పుడు రాజకుమార్తె, ప్రధాన పూజారిని, ఇప్పుడు తన అత్తగారిని పనిచేయడం కోసం అనుమతిని కోరుతుంది. పనికి వెళ్తానని చెప్పడం లేదు. పనిచెయ్యడం కోసం పర్మిషన్ అడుగుతుంది. ఈరోజుల్లో నేటి కోడళ్ళు కు ఇలాంటి వినయం, విధేయత ఉంటే కుటుంబంలో కలతలు తగాదాలు ఉండవేమో! రూతు ఆశీర్వదింపబడటానికి ముఖ్యకారం ఈ వినయమే! రక్షింపబడిన ప్రతి విశ్వాసికి ఈ వినయం ఎంతో అవుసరం.
2. నేను ఎవరి పొలములో నైనా పరిగె ఏరుకొంటాను అంటుంది. ఈ పరిగె చరిత్ర ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీయులు తమ ఐగుప్తు నిర్గమములో దేవుడు ద్వితీ: 24:19-21 లో ఇలా చెబుతున్నారు, మీరు పొలం పంట కోసేటప్పుడు పూర్తిగా గట్టు వరకు కోయకూడదు. చివరలు వదిలెయ్యాలి. పడిపోయిన పనలు వదిలెయ్యాలి. మరచిపోయినవి వదిలెయ్యాలి. రాలిన పళ్ళు ఏరుకోకూడదు.అవి పేదలకు, పరదేశులకు, దిక్కులేనివారికోసం వదిలెయ్యాలి. అని వ్రాయబడి ఉంది. ఇడి ధర్మశాస్త్ర విధి. పరిగె అంటే ఇదే!
ఈ విషయం తెలిసిన రూతు పరిగె ఏరుకోడానికి వెళ్తుంది. ఎందుకంటే వారికి తినడానికి ఏమిలేదు. పరిగె ఏరుకోవడం అంటే ఒకరి దయమీద అధారపడటమే! ఒక రాజు కుమార్తె ఇంతవరకు ఒకరిని ఆదేశించడం, ఒకరికి దయ చూపించడమే తప్ప ఎప్పుడూ ఇలా మరొకరి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడలేదు. పరిగె ఏరుకోవడం అంటే ఒకరకంగా యాచించడంతో సమానమే! ఇదంతా దేవుణ్ణి ఆశ్రయించినందుకే. తను మోయాబు దేశంలో ఉంటే తనకు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావు. ఇప్పుడు తనను తగ్గించుకొని తను- తన అత్తా బ్రతకడం కోసం పరిగె కోసం వెళ్తుంది. మరో విషయం తన అత్తను పంపడం లేదు. అత్తను కూర్చోబెట్టి తను ఎండలో పనిచేయడానికి వెళ్తుంది. తను ఎప్పుడూ ఎండలో పనిచేయలేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్తితి తనను ఎండలో పనిచేసేలా చేస్తుంది. చివరకు బోయజు గారి పొలంలో పరిగె ఏరుకోవడం మొదలు పెట్టింది.
నేటి యువతకు రూతు ఒక role మోడల్. ఒక కనువిప్పు. ఉద్యోగం తన కాల్ల దగ్గరికి రావాలి అనుకొంటున్నారు తప్ప, మంచి ఉద్యోగం వచ్చేవరకు దొరికిన ఉద్యోగం చేయడం లేదు. వృద్దులైన తల్లిదండ్రులు కష్టపడుతుంటే చూస్తున్నారు, వీరు తమ చదువుకి తగిన ఉద్యోగం రాలేదని ఇంట్లో కూర్చోంటున్నారు. లేదా ఊరుమీద తిరుగుతున్నారు. రూతులా చేతికి అందిన పనిని చేత పట్టుకొని- అత్తను లేదా తల్లిదండ్రులను పోషించేవారు కరువయ్యారు. ప్రియ యవ్వనుడా! యవ్వన స్త్రీ! దయచేసి రూతుని చూసి నేర్చుకొండి!.
ప్రియమైన స్త్రీలారా! ఇంటికోడల్లారా! అత్తా-మామలను గౌరవించి వారికి లోబడి, సన్మానించి, రూతులా దీవెనలు పొందుకోమని మనవి చేస్తున్నాను.
అట్టి దీవెన మనందరికీ మెండుగా కలుగును గాక!
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- 14వభాగం
బోయజుRuth(రూతు) 2:3
3.కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది.
రూతుపొలంలో పనిచేసేవారితోపాటు పెందలకడలేచి, వారితోపాటు పొలంలోకి వెళ్లి, పని వారి వెనుక పరిగె ఏరుకోవడం మొదలుపెట్టింది. తన pride, proud అన్ని పక్కన పెట్టింది. జీవితంలో మొట్టమొదటిసారిగా తగ్గించుకొని (యాచించేటంత) పరిగె ఏరుకొంటుంది. ఆ పొలం బోయజుది.
ఇక్కడ గమనించండి. 1:8,9లో నయోమి- కోడళ్ళను దీవించింది. మీరు నాయెడల చనిపోయినవారియెడల దయచూపినట్లుగా, యెహోవా మీకు దయచూపును గాక అని. అది ఇప్పుడు నెరవేరడం మొదలుపెట్టింది. ఎలా?!! ఆ పొలం తన సమీపబందువుది. దేవుడు ఆమె యధార్ధత, భక్తి, సమర్పణ మెచ్చుకొని ఆమెను సరియైన పొలానికి నడిపించారు. తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును-(సామెతలు _2:8) -- వారిని నడిపించును- - - వారు వెళ్ళవలసిన త్రోవను ఆయన చూపించును అని వ్రాయబడింది. అది రూతు జీవితంలో అక్షరాలా నెరవేరింది.
ఇప్పుడు మనం బోయజు కోసం ధ్యానిద్దాం!Ruth(రూతు) 2:4
4.బోయజు బేత్లెహేమునుండి వచ్చియెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారుయెహోవా నిన్ను ఆశీర్వ దించును గాకనిరి. బెత్లెహేము నుండి వచ్చి అనగా గమనించవలసిన విషయం ఏమిటంటే- బోయజు చాలా ఆస్తిపరుడు. A Mighty man In Wealth. తనకి చాలా భూములు ఉన్నాయి. కొన్ని వందల ఎకరాలు ఉండొచ్చు. మరి బెత్లెహేము నుండి ఈ భూమికి రావడానికి కొన్ని కి.మీ. ఉండొచ్చు. 2:8-10 ప్రకారం నీవు ఇంకా ఏ పొలం లోనికి వెళ్ళకు అని చెబుతున్నాడు అంటే వారి కోత ఒక రెండు రోజులు లేక వారం రోజులలో పూర్తి అయ్యేది కాదు. ఆ కోతకాలమంతా సరిపోతుంది కోయడానికి. అంత పెద్ద ఆస్తిపరుడు. అందుకే బెత్లెహేము నుండి వచ్చి అని వ్రాయబడింది.
బోయజు వచ్చి వారిని ఎట్లా పలకరిస్తున్నాడో చూడండి.
1. యెహోవా మీకు తోడైయుండును గాక! అని వారిని దీవిస్తున్నాడు. ఆగి పరిశీలన చేద్దాం! ఇక్క ఎవరిని విష్ చేస్తున్నాడు? పనివారిని. ఏమని? యెహోవా మీకు తోడై యుండును గాక!
మనం మామూలుగా Good Morning/evening అని పలకరిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలు Praise the Lord అనియు, వందనాలు అంటూ పలకరిస్తుంటాం. గాని వారి పలకరింపు యెహోవా మీకు తోడై యుండును గాక! ఇలాంటి పలకరింపు ఉంటుంది. బోయజు కూడా అలాగే పలకరిస్తున్నాడు. ఇక్కడ మనకు చాల విషయాలు అర్ధమవుతాయి.
అ) బోయజు రాహాబు అనే వేశ్యకు పుట్టినవాడు. తండ్రి పేరు శల్మా. యెరికో పట్టణాన్ని యెహోషువా గారు జయించినప్పుడు పట్టణాన్ని కాల్చివేసి అందరిని చంపివేస్తారు, గాని రాహాబు అనే వేశ్య వేగులవారిని దాచినందుకు, వేగులవారు ఆమెతో నిభందన చేసినందుకు గాను ఆమెను మాత్రం చంపరు. తర్వాత ఆమెను శల్మా పెళ్ళిచేసుకొంటాడు. వారికీ పుట్టినవాడు ఈ బోయజు.
ఆ) బోయజు నివసించిన కాలం న్యాయాధిపతుల కాలం. అప్పుడు ప్రజలు ఎలా ఉండేవారో నాయాధిపతులు 2:16-19 వరకు వ్రాయబడింది. వారు తరచుగా పాపంలో, అపజయంలో, భ్రష్టత్వంలో మునిగిపోయేవారు. ఇలాంటి భ్రష్టకాలంలో ఈ బోయజుగారు ఎల్లప్పుడూ దైవ నామ స్మరణ వస్తుంది అంటే ఈయన నిజంగా చాల భక్తి పరుడు. తన తండ్రి భక్తిని పుణికి పుచ్చుకున్న వాడు. ప్రజలంతా అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే ఈయన ఒక వెలుగు రేఖలా ప్రకాశించారు. పైగా గొప్ప ధనవంతుడు, భూస్వామీ, కావున ప్రజలంతా ఈయనకు లోబడి ఉండేవారు. అప్పుడు ఈయన వారికి మార్గదర్శిగా ఉంటూ ప్రజలను దేవుని దగ్గరికి నడిపించేవారు. నిజంగా ప్రతీ విశ్వాసి బోయజు లాగుండాలి. ఈరోజులలో ప్రజలు కొద్దిగా డబ్బులు సంపాదిస్తే చాలు కన్నుమిన్ను కానకుండా త్రాగుతూ తిరిగుతూ- దేవుడెవడ్రా అంటున్నాడు. ఐతే ఈయన ఇంత ధనవంతుడై యుండి కూడా అను నిత్యమూ దైవనామస్మరణ చేస్తున్నాడు. ప్రియ విశ్వాసీ! నీవుకూడా ధనం కలిగినప్పుడు విర్రవీగకుండా దానిని ఇచ్చింది దేవుడేనని, దానిని అనుభవించడానికి కృపచూపి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుస్సు ఇచ్చినందుకు దేవునికి నమ్మకముగుగా, విశ్వాసంగా ఉండాలని గుర్తుచేస్తున్నాను.
ఇ) బోయజు తన పనివారితో కూడా చాల ఆప్యాతతతో పలకరిస్తున్నాడు. తన అధికారం, హోదా, ఠీవి చూపించడం లేదు సరికదా వారిని దీవిస్తున్నాడు. ఏమని? యెహోవా మీకు తోడుగా నుండును గాక! ఇలా అనడానికి మరో కారణం ఉంది. ఇశ్రాయేలు దేశం మనలాగా సమాంతర భూమి కాదు. అది కొండలు లోయలు గల దేశం. కాబట్టి ఆ భూముల్లొ పనిచేయడం అంత తేలిక కాదు. ప్రమాదాలతో ఉంటుంది. అందుకే వారిని దీవిస్తున్నాడు. యెహోవా మీకు తోడైయుండును గాక! ఎందుకంటే ఆయన తోడుగా ఉంటే వారికి ఏ అపాయము కలుగదు. అందుకే పనివారు మనఃస్పూర్తిగా అంటున్నారు యెహోవా నిన్ను దీవించును గాక!
ప్రియ విశ్వాసి! నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ మాటలు ద్వారానే ప్రజలు నీకు గౌరవం ఇస్తారు. నీ మాట ఉప్పు వేసినట్లు ఉండాలని(కొలస్సీ 4:6) దేవుడు అంటున్నారు. నీనోట పోకిరిమాటలు సరసోక్తులు కాక , ఆశీర్వచనమే ఉండాలని లేఖనం సెలవిస్తుంది(ఎఫెసీ 5:3-4).మరి నీవు ప్రజలచేత దీవింపబడేలా ఉన్నావా? యేసయ్యను నీ ప్రవర్తనలో, మాటలలో చూపిస్తున్నావా? అందుకే దేవుడు బోయజుని దీవించి తన వంశావలిలో ఆయనకు కలుపుకొన్నారు.
అట్టి దయార్ద హృదయం, భక్తి, విశ్వాసం మనందరికీ కలుగును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- 15వభాగం
ప్రియదైవజనమా ఇంతవరకు మనం రూతు గ్రంధంలో గల వ్యక్తులు- సంఘటనలకోసం గత కొద్దిరోజులుగా ధ్యానిస్తున్నాం. ఈరోజు రూతు 2:5 నుండి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం! ఈ అధ్యాయంలో మనకు బోయజు-రూతు మధ్య జరిగిన సంభాషణ కనిపిస్తుంది. రూతు యొక్క వినయం, విధేయత కూడా మనం చూడొచ్చు.
బోయజు తన పనివారిని దీవించిన తర్వాత అక్కడ పరిగె ఏరుకొంటున్న రూతు కనిపిస్తుంది. వెంటనే బోయజు తన supervisor- కార్యనిర్వాహకుడుని పిలచి ఈ చిన్నది ఎవరు అని అడుగగా. . .(5వ వచనం); అతడు ఈమె మోయాబు దేశంనుండి నయోమితో వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు అంటున్నాడు(6వ వచనం). చూడండి బోయజు చిన్నది ఎవరు అంటే supervisor ఆమె యవ్వనురాలు అంటున్నాడు. దీనర్ధం ఏమిటంటే – చరిత్ర ప్రకారం అప్పటికి రూతు వయస్సు 25-30 సం.లు. అయితే బోయజు వయస్సు కనీసం 50సం.లు. కాబట్టి తన వయస్సులో సగం కంటే తక్కువగా ఉంది కాబట్టి బోయజు గారు చిన్నది అన్నారు. ఆమె యవ్వనంలో ఉంది కాబట్టి supervisor యవ్వనురాలు అన్నాడు.
7వ వచనం ప్రకారం- దీనికంటే ముందు ఏం జరిగింది అంటే- ఆమె బోయజుగారి తోటలోనికి వచ్చిన వెంటనే supervisor దగ్గరికి వెళ్లి, ఎంతో వినయంతో అయ్యా! ఈ తోటలో నేను కోయువారి వెనుక పరిగె ఏరుకోవచ్చా అని అనుమతిని కోరింది. వెంటనే supervisor సరే అన్నాడు.
బహుశా supervisor ఎవరు నీవు అని అడిగి ఉండడు. ఎందుకంటే అప్పటికే ఆమె గురుంచి అందరికీ తెలిసిపోయింది.
ఈమె యొక్క సంస్కారం పద్దతి చూడండి. ఆమె తోటలోనికి పోయి జబర్దస్త్ గా ఏరుకోవడం లేదు. అనుమతిని కోరింది. నేటి దినాల్లో ఇలాంటి కనీస విచక్షణ, సంస్కారం ప్రతిబిడ్డకు కావాలి.
సరే- ఎప్పుడైతే బోయజు ఆమె ఎవరు అంటే సమాధానంగా supervisor- ఆమె నయోమితో పాటు వచ్చిన మోయాబురాలైన రూతు అని చెప్పి ఇంకా అంటున్నాడు- ఆమె నన్ను పరిగె ఏరుకోడానికి అనుమతిని కోరితే నేను ఇచ్చాను. అప్పటినుండి ఆమె ఇంతవరకూ పరిగె ఏరుకొంటుది. కేవలం కొద్ది సేపు మాత్రమె ఇంటిదగ్గర కూర్చోంది అని చెప్పాడు. కొన్నిప్రతులలో ఇంట కూర్చోంది అని వ్రాయక- నీడలో కూర్చోంది అని వ్రాయబడింది. తను ఎప్పుడూ ఎండలో కష్టబడలేదు. పనిచేయలేదు కాబట్టి కొంచెం సేపు నీడలో కూర్చొని ఉండొచ్చు. తర్వాత వెంటనే తిరిగి ఏరుకోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఎంత ఎక్కువ ఏరుకొంటే తను- తన అత్తా అన్ని రోజులు బ్రతకోచ్చు. చూసారా ఆకలి ఆమెతో పని చేయిస్తుంది.
ఆమెనే కాదు ఆకలి మనతోకూడా చాలాసార్లు పని చేయిస్తుంది.
నేటి రోజులలో యువతకు ఆకలి అంటే ఏమిటో- దాని విలువ తెలియక బలాదూర్ గా తిరుగుతున్నారు. ఒకసారి దానిని అనుభవిస్తే ఆకలి అంటే ఏమిటి, డబ్బు విలువ అంటే ఏమిటి, తల్లిదండ్రుల విలువ ఏమిటో తెలుస్తుంది. (ఇక్కడ ఆకలి అంటే తల్లిదండ్రుల మీద/ భర్త మీద అలిగి చేసేది , ఉపవాసం ఉండి చేసేది కాదు; తినడానికి ఆహారం లేక, ఆహారం కొనడానికి డబ్బులు లేక పస్తులుండడం; బిడ్డ ఆకలికి ఏడుస్తుంటే బిడ్డకు పెట్టడానికి ఏమిలేక తల్లి/తండ్రి పడే వేదనే ఆకలి))
8వ వచనంలో మొదటసారిగా బోయజుగారు రూతుతో సంభాషిస్తున్నారు- నా కుమారీ! ఎంత మంచి పిలుపు!!! రూతు తమ శత్రు దేశానికి చెందినది. ఆ కాలంలో ఎగ్లోను రాజు వారిని ఆక్రమించుకున్న ప్పుడు ఏహూదు ద్వారా దేవుడు వారిని రక్షిస్తారు. ఇలాంటి శత్రువుని కూడా- నా కుమారీ! అని పిలుస్తున్నారు ఈయన! మరో విషయం; ఈమె మోయాబీయురాలు. వీరికి వ్యభిచారం తప్పుకాదు. కాబట్టి రూతును బోయజు అటువంటి పాపపు దృష్టితో చూడకుండా నా కుమారీ అంటున్నారు. ఎంతమంచి వ్యక్తీ ఈయన! యోబుగారు కూడా అలానే పిలిచేవారంట! అందుకే యోబు 31:1,2 లో ఇలా అంటున్నారు- కన్యకను నేనేలాగు చూచెదను? నేను నా కన్నులతో నిభందన చేసుకొంటిని- ఏమని? కన్యకను తదేకంగా పాపపు దృష్టితో, కామపు చూపుతో చూడను. అలా చేస్తే నేను పరమందున్న దేవుని దృష్టికి వేషదారిని అవుతాను అంటున్నారు.
అదే యేసుప్రభుల వారైతే మత్తయి 6:27-28 లో వ్యభిచారం చేస్తేనే తప్పుకాదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆ క్షణంలోనే ఆమెతో వ్యభిచారం చేసినవాడగును అంటున్నారు.
అందుకే పేతురు గారు 2పేతురు 2:14లో - వ్యభిచారని చూసి ఆశించుచు- పాపం మానలేని కన్నులు గలవాడు. . . . అంటున్నారు. ఇక్కడ పాపం చేసేవారు అనడం లేదు, అటువంటి దృష్టిని మానలేని కన్నులు గలవాడు అంటున్నారు.
కాబట్టి ప్రియ విశ్వాసి! నీ పిలుపు ఎలా ఉంది? నీ చూపు ఎలా ఉంది? నీ ఉహాలు ఎలా ఉన్నాయి?జ్ఞానముతో నీవు నాకు అక్కవని/ చెల్లెవని చెప్పమంటున్నాడు జ్ఞానియైన సోలోమోను సామెతలు 7:4 లో. నీకంటే పెద్దవారిని అక్క అని, తల్లి అని, చిన్నవారిని చెల్లి అని సంభోదించమంటున్నారు పౌలు గారు. 1 తిమోతీ 5:2;
ఇవన్నీ ఎవరూ బోధించక పోయినా స్వాభావికముగా పాటించిన బోయజు గారు దేవుని దృష్టికి గొప్పవానిగా మారారు.
నీవు కూడా అంట్లాంటి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను.
అట్టి ధన్యత మనందరికీ కలుగును గాక!
ఆమెన్!
(సశేషం).
రూతు- 16వభాగం
రూతు- బోయజుల సంభాషణ-1Ruth(రూతు) 2:8,9 8.అప్పుడు బోయజు రూతుతో నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.
9. వారు కోయుచేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహ మగునప్పుడు కుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను.
ఎంత ఆధరణకరమైన మాటలో చూడండి. ఈ మాట అనకముండు, అనగా 8,9 వచనాల ముందు – బోయజుగారు రెండు పనులు చేసి, తర్వాతనే ఈ సంభాషణ చేసారు. 9వ వచనం ప్రకారం
1) నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించితిని.
2) పనివారిని వారు చేదిన నీటిని త్రాగనివ్వండి అని ఆజ్ఞాపించెను.
ఇక్కడ ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం కలుగుతుంది ఆమెకు. 1:8,9నయోమి ఇచ్చిన దీవెనకు ప్రతిఫలం కలుగుతుంది ఇక్కడ.
మొదటగా నిన్ను ముట్టవద్దని యవ్వనులకు ఆజ్ఞాపించితిని- అనగా మనదేశం లాగానే అక్కడ కూడా యవ్వన స్త్రీలను ఏడిపించడం, ర్యాగింగ్ చెయ్యడం ఉండేవన్న మాట! బలాత్కరించడం బహుశా లేకపోవచ్చు- ఎందుకంటే దానికి భయంకరమైన శిక్ష అక్కడ, అంతేకాక ఆమెతో ఆ పురుషునికి పెళ్లి చేసేసేవారు. ఈ కారణాల వాళ్ళ రూతు అల్లరిపాలు కాకూడదు అని, రూతుతో మాట్లాడక ముందే యవ్వనస్తులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఒక వ్యక్తి దేవుని ఆశ్రయం క్రిందకు వస్తే- దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తే, దేవుని శరణువేడుకొంటే రక్షించాల్సిన భాద్యత దేవునిదే కదా! అందుకే ఇప్పుడు యవ్వనస్తులు అనగా సాతాను నుండి కాపాడటం కోసం – ఈమె నా ఆశ్రయంలో ఉంది, ఏదైనా అంటే ఖబడ్దార్ అని గట్టిగా అంటున్నారు దేవుడు. బోయజు చేసింది అదే!
ప్రియదైవజనమా! లోకాన్ని, యవ్వనస్తులను చూడకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన రెక్కలనీడలో నీకు ఆశ్రయం కలుగుతుంది. లోకం నుండి/సాతాను నుండి నీకు రక్షణ కలుగుతుంది.
2. పనివారు చేదిన నీరు త్రాగుట- పూర్వకాలంలో ఆ దేశంలో బావులు చాలా లోతైనవి. అంతేకాకుండా వాటిమీద రాతిమూతలు ఉండేవి. ఆ మూట తీయడం ఒక స్త్రీ శక్తికి మించినది. అందుకే పనివారు త్రోడిన నీరు త్రాగమని చెబుతున్నారాయన! చూశారా ఆమె మీద ఎంత శ్రద్ధ- కేర్ తీసుకొంటున్నారాయన!
ఈ మాటలు పలుకక ముందు అనగా 8వ వచనంలో ఇలా అంటున్నారు- ఈ పొలాన్ని విడచి మరో పొలానికి పోవద్దు. వారు కోయు చేను కనిపెట్టి, వారివెంట వెళ్ళు అని చెబుతున్నారు. గత భాగాలలో చెప్పిన విధంగా బోయజుగారు చాలాపెద్ద భూస్వామి! కాబట్టి ఆయనకు ఆ కోతకాలానికి సరిపడా భూమి ఉంది. 2:23 ప్రకారం యవలు(బార్లీ), గోదుమలు కోత అయ్యేవరకు ఆమె ఆ పొలంలోనే ఉందంట. అంటే సుమారు 3నెలలు ఆయన భూమిలోనే ఉంది. అందుకే ఈ పొలం విడచి మరో పొలం లోనికి వెళ్ళకు అంటున్నారు.
ఇక్కడ బోయజు ద్వారా- రూతుకు కొన్ని మాటలు చెప్పబడ్డాయి- అలాగే దేవుని ద్వారా రూతు అనగా సంఘానికి చెప్పబడ్డాయి. పొలము దేవుని రాజ్యము- సంఘము అని అర్ధాలు వస్తాయి. ఈ సంఘంలో, పరిశుద్దుల సంఘంలో, విలువపెట్టి కొనబడిన సంఘంలో నిన్నుకూడా అదే వెల చెల్లించి యేసయ్య కొన్నారు కాబట్టి- దయచేసి ఈ పొలాన్ని వదలివెల్లకు అని ఆజ్ఞాపిస్తున్నారు దేవుడు! నయోమి ఈ సంఘాన్ని/ పొలాన్ని వదలి విడచిపోయి, బోలెడు తిప్పలు పడింది. సమస్తాన్ని పోగొట్టుకొని-రిక్త హస్తాలతో తిరిగి వచ్చింది. ప్రియ విశ్వాసి నీవు కూడా దేవుణ్ణి విడచి, అన్యుల పొలంలోనికి అనగా లోకం లోనికి, లోకాశలకు లొంగిపోయి తిప్పలు తెచ్చుకోవద్దు!
ఇక రక్షింపబడిన విశ్వాసులు కూడా సొంత సంఘాన్ని/ తల్లి సంఘాన్ని వదలి – ఎవరో ఏదో వాక్చాతుర్యంతో వాక్యం చెబుతున్నారని, అద్భుతాలు చేస్తున్నారని తన సొంత సంఘాన్ని వదలి, పరాయి సంఘానికి వెళ్లి- కొంత కాలానికి భంగపడుతున్నారు. ప్రియ విశ్వాసి- అలా చేయకూడదు అని బోయజు గారంటున్నారు! నీ సొంత సంఘం వాక్యానికి విరుద్ధంగా భోదిస్తుందా? భిన్నమైన బోధలు బోధిస్తున్నారా? అప్పుడు ఒకటిరెండు సార్లు వాక్యం చూపించి సరిచేయడానికి ప్రయత్నించు! అప్పుడు కూడా వినకపోతే ఆ సంఘాన్ని వదలి పారిపో! అలా కాకుండా వాక్చాతుర్యం కోసం, అధ్భుతాలకోసం నీ సొంత సంఘాన్ని వదలిపోవద్దు అని యేసయ్య నామంలో మనవి చేస్తున్నాను.
అట్టి కృప మనందరికీ కలుగును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం).
రూతు- 17వభాగం
రూతు- బోయజుల సంభాషణ-2ప్రియులారా! మనం రూతు-బోయజుల సంభాషణ ధ్యానిస్తున్నాం! ఈపొలాన్ని విడచిపోకు, నిన్ను ముట్టవద్దని యవ్వనస్తులకు ఆజ్ఞాపించితిని అని బోయజుగారు చెబితే- 10వ వచనం- అందుకు ఆమె సాగిలపడి- తలవంచుకొని . . . చూడండి!
ఎంత విధేయత, వినయం! ఒక రాజకుమార్తె పనిచేయడానికి వచ్చింది, తర్వాత పొలం యజమానికి సాగిలపడి నమస్కరిస్తుంది. నిజంగా పరిగె ఏరుకోడానికి సాగిలపడాల్సిన అవుసరం లేదు. గాని బోయజు చూపించిన జాలి, కరుణ, కటాక్ష్యం mercy చూసి,సాగిలపడి నమస్కరిస్తుంది. ఆ వినయమే బోయజుకు, యావత్ బెత్లెహేముకు ఆమెను దగ్గరకు చేర్చింది.
రూతు 2:10 అందుకు రూతు సాగిలపడి, తలవంచి, ఏమి తెలిసి పరదేశి నైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా- - అయ్యా ఎందుకయ్యా నా మీద ఇంత జాలి శ్రద్ధ చూపిస్తున్నావ్? నేను పరదేశిని, కదా అంటే- ఆయన సమాధానం చూడండి- 2:10-12 బోయజు: నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు, నాకు తెలియబడెను, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మ భూమిని విడచి ఇంతకు ముందు ఎరుగని జనముయొద్దకు వచ్చితివి. చూడండి ఆమె చేసిన పరిచర్య, మంచి పనులు, త్యాగం అన్నీ ఆ ఊరులో ఎంతో గొప్పగా చెప్పుకొంటున్నారు. అవి బోయజువరకు చేరాయి!
ఇక్కడ మరోసారి మనం చరిత్రను కొద్దిగా జ్ఞాపకం చేసుకొందాం! రూతు- నయోమిలు చేరుకొన్న తర్వాత రూతును అంత తొందరగా వారు సమాజంలో చేర్చుకోలేదు. ఆమె అంటే ఎవరకి వ్యక్తిగతమైన ద్వేషం లేకపోయినప్పటికీ- ఆమె మోయాబురాలు గాబట్టి, మోయాబీయులు సమాజంలో చేరకూడదని ధర్మశాస్త్రం సెలవిస్తుంది ద్వితి 23:3, కాబట్టి ప్రజలు ఆమెను చేర్చుకోక చాలా వ్యతిరేఖత చూపించారంట. అక్కడ చాల బాధలు పడుతుంది రూతు. కనీసం మంచినీటి బావి దగ్గర కూడా ఆమెకు అవమానాలు ఎదురయ్యేవి. నయోమితో కొంతమంది వాదం కూడా పెట్టుకొంటారు నీవు మోయాబీయురాలను ఎందుకు కోడలుగా చేసుకొన్నావు? మోయాబీయులు మన సమాజంలో చేరకూడదు కదా! ఇప్పుడైతే ఆమెను సరాసరి మన దేశమే తీసుకోచ్చేశావ్! తిరిగి ఆమెను పంపించేసేయ్ అని చెబితే- నయోమి రూతు పక్ష్యంగా నిలబడి- రూతు గొప్పతనం, ఆమె దేవున్ని ఎందుకు నమ్ముకొందో, ఆమె త్యాగం కోసం- ఒడంబడిక కోసం చెప్పి ఆమెకు దన్నుగా నిలబడిందట. ఇదే సమయంలో బోయజుగారు కూడా ఆమెకు సపోర్టు చేసారని చరిత్రకారుల అభిప్రాయం. ఆ తర్వాత క్రమక్రమంగా బెత్లెహేము గ్రామస్తులు ఆమెను చేర్చుకోవడం మొదలు పెడతారు. రూతు యొక్క వినయం, విధేయతతో ఆమె చివరకు బెత్లెహేము ప్రజల మనస్సులను ఆకట్టుకొంటుంది. లేఖనాలలో కూడా ఆమె ఎంతో ప్రావీణ్యం చూపించేదట.
ఇవన్నీ బోయజుకు తెలుసు- అందుకే నీవు చేసినవన్నీ విన్నాను. నీ తల్లిదండ్రులను, నీ రాజరికాన్ని, ప్రధాన పూజారిని పదవిని వదలి నీకు తెలియని ప్రాంతం వచ్చావు. యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును! యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు గాబట్టి ఆయన నీకు సంపూర్ణమైన ప్రతిఫలమిచ్చును. అని దీవిస్తున్నారు.
చూసారా బోయజుగారు కూడా నయోమి ఇచ్చిన దీవెనయె ఇస్తున్నారు. ఓరకంగా ఒకే ప్రవచనాన్ని వేరు వేరు సమయాలలో ఇద్దరు అపరిచితమైన వ్యక్తులు చెప్పడం లాంటిది. నీవు ఎలా పరిచర్య చేసావో, ఎలా ఆదరించావో నీ అత్తను, అలాగే నీకు కూడా దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. నిజంగా రూతు మోయాబు దేశంలోనూ కష్టాలు పడింది, ఇశ్రాయేలు దేశంలోనూ కష్టాలు పడింది. దేవుణ్ణి ఆశ్రయించి స్తిరమైన నిర్ణయం తీసుకోంది. అందుకే బోయజుగారు దీవిస్తున్నారు దేవుడు నీకు బహుమానం ఇచ్చును. ఆ బహుమానమే యేసుప్రభులవారి వంశావలిలో ఒక అన్యురాలు చేరడం!
తన్ను ఆశ్రయించువారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని లేఖనం సెలవిస్తుంది కీర్తనలు 84:11.రూతు ఆశ్రయించింది మేలులు పొందింది. ప్రియదైవజనమా ఆయనను ఆశ్రయించడానికి సిగ్గుపడకు! అనుమానపడకు!
ఆయన నీకు కూడా ప్రత్యేక బహుమానం/రక్షణ/పరలోకం ఇయ్యడానికి ఇష్టపడుతున్నారు.
దేవుడు మీకు తోడై యుండును గాక!ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- 18వభాగం
సమీప బంధువు- kinsmen Redeemer-1దేవునికి మహిమ కలుగును గాక! ఈ విధంగా రూతు-బోయజుల మధ్య సంభాషణ జరిగిన అనంతరం 2:13 లో రూతు అంటుంది నా ఏలినవాడా! నీ పనికత్తెలలో ఒకతెను, నీ దాసులలో ఒకదాన్ని కాకపోయినా సరే నామీద ఇంత జాలి చూపించి, ప్రేమగా మాట్లాడావు. ఇంకా నాయెడల కటాక్షం చూపించు, అని వేడుకొంది. అయితే నాతోపాటు మధ్యాహ్నం భోజనం చెయ్యమని ఆహ్వానించారు బోయజుగారు. నిజానికి బోయజు రూతుయొక్క ఏలినవాడు కాదు, అలాగే రూతు బోయజుయొక్క దాసీ కాదు అయినా సరే రూతు నాఏలినవాడా, నీ దాసురాలిని అంటుంది. ఇదే రూతుయొక్క వినయ విధేయతలకు తార్ఖానం!!
మధ్యాహ్న బోజనానికి బోయజుగారితో కూర్చుంటుంది రూతు, తిన్నాక కొన్ని పేలాలు ఇస్తే అవికూడా తిని, కొన్ని తన అత్తకోసం దాచి ఉంచుతుంది. ఎంత ప్రేమ అత్త మీద! బోయజుగారు మరోసారి తన పనివారికి ఆజ్ఞాపిస్తారు: ఆమెను పనల మధ్య ఏరుకోనీయండి. ఆమె కోసం కొద్దిగా పిడికెల్లు వదిలెయ్యండి అంటూ. ఆమెను గసరవద్దు అంటూ చెబుతారు. నిజంగా బోయజు గారు చాలా దయార్ద హృదయుడు. ధర్మశాస్త్రం అజ్నాపించినంతకంటే ఎక్కవగా బీదలకు, దీనులకు, అభాగ్యులకు ఇస్తున్నారు ఈయన! దయగలవారి యెడల నీవు దయ చూపించెదవు, కటినుల యెడల విముఖముగా నుందువు అంటూ సెలవిస్తుంది బైబిల్. దాతృత్వం కలిగి దీనుల కిచ్చును అని కూడా వ్రాయబడింది. నిజంగా బోయజుగారు అలాగే చేసారు. దీవించబడ్డారు. ప్రియ విశ్వాసీ! నీవలా దీనుల యెడల జరిగిస్తున్నావా? పరలోకంలో/ దేవుని దగ్గర/దేవుని దృష్టిలో ధనవంతులవ్వడం అంటే ఇదే!
రూతు సాయంత్రం వరకు పరిగె ఏరుకొని దుల్లకోడితే ఒక తూమెడు యవలు(బార్లీ) అయ్యాయి. తూమెడు అనగా సుమారు రెండు కి.గ్రా. లు అనగా ఒకవారం రోజులకు వారిద్దరికీ సరిపోయే ఆహారం! ఇంటికి వచ్చిన రూతుని నయోమి అడుగుతుంది: నీవెక్కడ ఏరుకొన్నావ్? ఎక్కడ పనిచేశావ్? నీయందు లక్ష్యముంచినవాడు దీవించబడును గాక! అని దీవిస్తుంది. వెంటనే రూతు అతడు బోయజు అంటే: బ్రతికిన వారికి చనిపోయిన వారికి ఉపకారం చూపుట మానని యితడు నిజముగా యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని ఆశీర్వదిస్తుంది. అంతేకాకుండా రూతుతో ఒక రహస్యం/ ప్రాముఖ్యమైన విషయం చెబుతుంది: బోయజు మన సమీప బంధువుడు అని- kinsmen redeemer. మనలను విమోచించగలిగిన వారిలో ఒకడు అని చెబుతుంది.
ఈ సమీప బంధువు కోసం ధ్యానిద్దాం! సమీపబంధువు అనే మాట – గోయెల్ అనే హీబ్రూ పదం నుండి వచ్చింది- అంటే విడిపింపగలిగే బంధువు, విమోచకుడు, సమీప బందువుడు, ముక్తిదాత, పగతీర్చుకొనేవాడు(మన పక్షంగా), ప్రతీకారం తీర్చేవాడు అని అర్ధాలు. ఈ సమీప బందువికి ముఖ్యంగా నాలుగు భాద్యతలు ఉన్నాయి.
1.లేవీ 25:25-48 ఎవరైనా అవసరముండి భూమి అమ్మితే – సమీపబంధువు విడపించవచ్చు. సమీపబంధువు లేకపోతె సునాద సం.లో అది తిరిగి అతనికి ప్రాప్తించును.
2. లేవీ 25:47-49 నీ సహోదరుడు బీదవాడై తనకుతాను మరొకని అమ్ముకొంటే, సమీపబంధువు విడిపించవచ్చు.
3. సంఖ్యా 35:19-21 ఒకవ్యక్తిని పగపట్టి ఎవ్వరైనా చంపినయెడల, ప్రతీకారంగా సమీపబంధువు- హత్యకు ప్రతిగా హంతకుని చంపి ప్రతీకారం చేయాలి.
4. ద్వితీ 25:5-10 గత భాగాలలో వివరించినట్లు, సహోదరుడు సంతానం లేకుండా మరణిస్తే, అతని సహోదరుడు ఆ విధవరాలిని వివాహం చేసుకొని ఆమెకు సంతానం కలిగించాలి, ఆమెకు ఆహారం, వస్త్రములు, పోషణ ఇవ్వాలి.
ఈరకంగా సమీపబంధువు భూమిని విడిపించేవాడు, భానిసత్వం నుండి విడిపించేవాడు, రక్షించేవాడు, ప్రతీకారం చేసేవాడు, సంతానం కలిగించేవాడు, పోషించేవాడు. ఈనాలుగు భాద్యతలు న్యాయానికి, పవిత్రతకు అనుగుణంగా తన కుటుంభం, బందువుల క్షేమాన్ని చూసుకోవాలి.
యేసుప్రభులవారు కూడా తన రెక్కల క్రింద ఆశ్రయం కోరినవారికి సమీపబందువుడు, విమోచకుడు. అంతేకాకుండా వారిని పాపం అనే దాస్యం నుండి సిలువమరణం ద్వారా, సిలువ రక్తం ద్వారా విమోచించి, వారిని సమకూర్చి తనతో సమాననవారసత్వం వారికి అనుగ్రహించి, వారి శత్రువులపై ప్రతీకారం తీర్చుకొంటారు. విమోచకుడు, రక్షకుడు అనుపేరు కేవలం ఏసుప్రభువు కి మాత్రం ఉంది. అందుకే యోబుగారు : అయితే నా విమోచకుడు సజీవుడు అంటున్నారు. మనందరికీ సమీపబందువుడు ఏసుప్రభువు మాత్రమె! ఆయన రెక్కలనీడను ఆశ్రయిస్తే నిన్ను, నన్ను పవిత్రపరిచి, పరలోకం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి వస్తావా?
నేడే యేసయ్య దగ్గరకు రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను.
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- 19వభాగం
నయోమి-పరిశుద్ధాత్ముడు-సంఘకాపరిరూతు 2:21 ; నయోమితో రూతు అంటుంది- కోత పూర్తిగా ముగిసే వరకు మరో పొలంలోనికి వెళ్లొద్దు అని చెప్పారాయన! అందుకు నయోమి: నా బిడ్డా! వేరే పనివారితో మరో పొలంలో నీవు కనబడటం ప్రమాదం, కాబట్టి నీవు మరో పొలంలోనికి వెళ్ళకు అని హెచ్చరిస్తుంది. ఎందుకంటే గతంలో చెప్పిన విధముగా ఆ కాలంలో కూడా అమ్మాయిలను ర్యాగింగ్ చెయ్యడం, ఏడిపించడం అప్పుడు కూడా ఉన్నాయి. ఇక్కడైతే బోయజుగారు ఆమెకు ఏ ఆపద కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు. యవ్వనులకు, పనివారికి ఆజ్ఞాపించారు. కాబట్టి ఈ పొలంలో పూర్తి భద్రత ఉంది నీకు కనుక మరో పొలంలోనికి వెళ్ళకు అంటుంది.
బైబిల్ గ్రంధంలో ఏదైనా రెండుసార్లు వ్రాయబడింది అంటే అది ఖచ్చితమైనదని అర్ధం! దానిని తప్పకుండా పాటించాలి!ఇక్కడ మరో పొలంలోనికి వెళ్లొద్దు అంటే దేవుణ్ణి విడచి లోకము/పాపము అనే పొలంలోనికి వెళ్లొద్దు అని అర్ధం! దుష్టుల/ తుంటరుల సహవాసం/ సంఘంలోనికి వెళ్లొద్దు! అందుకే ఒకసారి ఇశ్రాయేలీయులను దేవుడు ఆడుగుతారు నీవు త్రోవ విడచి ఐగుప్తు మార్గం త్రొక్కుటకు నీకేమి సంభవించింది? యిర్మియా 2:18 అంటున్నారు. మరొకసారి ఆకాశమా ఆలకించు! భూమి! చెవియొగ్గు! అంటూ వారు నన్ను విసర్జించి యున్నారు, నన్ను విడచి తొలిగిపోయి యున్నారు అంటున్నారు యెషయా 1:2-4; యిర్మియా2:12,13;
బెయోరు కుమారుడైన బిలాము దేవుని తిన్నని మార్గం వదలి లోకం వైపు ధనం వైపు చూసి, ఖడ్గము చేత చంపబడ్డాడు! ఒకసారి విడిపించబడ్డాక దాస్యమనే కాడి క్రింద మరల చిక్కుకొనకుడి అని గ్రంధం సెలవిస్తుంది గలతి 5:1.
ప్రియ విశ్వాసి! మరల లోకం వైపు, లోకాశలవైపు, లోకాచారాలవైపు, పాపం వైపు చూడొద్దు అని ఈ భాగం ద్వారా బైబిల్ మనకు సెలవిస్తుంది. అంతేకాకుండా నీ సొంత సంఘం వదలి మరో సంఘాలవెంట, అధ్బుతాల వెనుక తిరుగు వద్దని మనవి చేస్తున్నాను. రూతు చివర వరకు మరో పొలంలో కనబడక, అదే పొలంలో ఉంది బోయజు మన్నన, ప్రజల మన్నన పొందింది. దైవాశీర్వాదాలు పొందింది. మరి నీవో??!!
ఇక మూడవ అధ్యాయం చాల ప్రాముఖ్యమైనది. దీనిలో ఎన్నో ఆత్మీయ మర్మాలు, ఆత్మీయ మేలులు పొందే విధానాలు చూడొచ్చు! 3:1-4 లో నయోమి కొన్ని హితోపదేశాలు చేస్తుంది రూతుకి. బోయజుగారు పొలంలో పడుకొన్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గర పడుకోమంటుంది. శారీరకంగా ఇది మనకి కొంచెం తప్పుగా కనబడొచ్చు. అయితే మనం తొందరపడి అపార్ధం చేసుకోకూడదు. కేవలం వెళ్లి ఆయన కాళ్ళ దగ్గర పడుకో! ఏమి చెయ్యాలో ఆయన నీకు చెబుతారు అంటుంది. బోయజుగారు చాలా నీతిపరుడు, భక్తిపరుడు. రూతు ఇంతవరకు చూస్తే చాలా నీతిమంతురాలు. కేవలం వ్యభిచారాన్ని నరబలిని అసహ్యించుకొని కష్టాలు పడింది. ఇప్పుడు మరలా వ్యభిచారం చెయ్యడానికి ఇష్టపడదు కదా! ఇద్దరు నీతిమంతులు, భక్తి పరులు ఇలాంటి పని చేయరు కదా! అందుకే కేవలం వెళ్లి కాళ్ళదగ్గర పడుకో! ఏమి చెయ్యాలో తనే చెబుతారు అంటుంది. అంతే తప్ప నయోమి బోయజుని రూతు వలలో వేసుకోమని ఎంతమాత్రము చెప్పడం లేదు. బోయజుగారి ప్రక్కలో పడుకొని పాపం చేయమని చెప్పలేదు.
అంతేకాకుండా భర్త చనిపోయాక మరొక సమీపబంధువు తనను ఆదరించకపోతే, మరో సమీపబందువుని ఆశ్రయించే (approach) అయ్యే విధానం ఆ రోజులలో అదే! పూర్వ UK, బ్రిటన్ చరిత్ర చూసుకొంటే 500-1800 AD వరకు అందమైన అమ్మాయిల ఉన్న తల్లిదండ్రులు జమీందారుల కుమారులను, రాజవంశస్తుల (nobel family) కుమారులను వలలో వేసుకోమని ప్రోత్సాహించేవారు. తద్వారా వారు భయంకరమైన వ్యభిచారంలో మునిగిపోయేవారు. పాపులుగా మారిపోయేవారు. ప్రియ విశ్వాసి! నీ కుమార్తెలకు/ నీ పిల్లలకు అటువంటి తప్పుడు బోధ చెయ్యొద్దని మనవి చేస్తున్నాను.
ఇక్కడ నయోమి పాత్ర 3:1 లో అర్ధం అవుతుంది మనకి. నా కుమారి! నీకు నేను విశ్రాంతి చూడవలసిన దానిని. కాబట్టి నేను చెప్పినట్లు చేయు అంటుంది. నయోమి పరిశుద్దాత్మకు సూచనగా ఉంది. సంఘకాపరిని కూడా సూచిస్తుంది. ఒక విశ్వాసి యేసయ్య రెక్కలనీడను ఆశ్రయించి రక్షించబడినప్పుడు సంఘం ఆ విశ్వాసిని సర్వసత్యములోనికి నడిపించాలి. కేవలం prosperity/ దీవెన ప్రసంగాలే కాకుండా తీర్పు, రాకడ, విశ్వాసాన్ని కాపాడుకోవడం, రక్షణను కాపాడుకోవడం ఇవన్నీ నేర్పించాలి. సంఘకాపరి భాద్యత ఇది. ఇక పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఎట్లా ప్రార్దించాలో, శ్రమలో ఎలా తట్టుకోవాలో అన్నీ నేర్పిస్తారు. అప్పుడు ఆదరణ కర్త వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును అని వ్రాయబడింది యోహాను 16:13. నయోమి అదే చేస్తుంది. రూతుకి ఒక తోడు/ ఆశ్రయం చూపించాలి. నీకు విశ్రాంతి చూడవసిన దానిని నేను. నేను చెప్పేది చేయు అంటుంది. రక్షించబడిన విశ్వాసి కూడా సంఘానికి, సంఘకాపరికి లోబడియుంటే పరిశుద్దాత్ముడు కార్యం చేస్తారు. లోబడక పోతే ఆవిశ్వాసి సర్వ సత్యములోనికి చేరడం జరుగదు! నీవు రక్షణ పొందడం పరిశుద్దాత్ముని క్రియ! అయితే దానిని సంఘకాపరి భాప్తిస్మము ద్వారా దేవుని/ యేసయ్యకు ప్రధానం చేస్తారు. అయితే ఆ రక్షణను కాపాడుకోవడం/ శీలాన్ని కాపాడుకోవడం నీ భాద్యత!!! గొర్రెలను తోడేళ్ళు చీల్చి చెండాడకుండా, గొర్రెలకు కావలసిన మేత వెయ్యడం, నీరు త్రాగించడం, అవుసరమైతే ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పడము సంఘకాపరి/సంఘపెద్దల భాద్యత!! వారికి లోబడాల్సిన అవుసరం విశ్వాసి ఎంతైనా ఉంది. అప్పుడు వీరందరినీ తన ఆధీనంలో ఉంచుకొని పరిశుద్ధాత్ముడు నడిపిస్తారు!
ప్రియ విశ్వాసి! నీవు సంఘానికి లోబడియుంటున్నావా? సంఘకాపరిని గౌరవిస్తున్నావా? నీ సాక్ష్యాన్ని, నీ రక్షణను/ శీలాన్ని కాపాడు కొంటున్నావా?
ఇదిగో గొడ్డలి వేరున పదున పెట్టి యున్నది. మంచి ఫలాలు ఫలించని ప్రతీ చెట్టును, ఫలాలు ఫలంచని ప్రతీ తీగెను యేసయ్య నరికివేస్తారు జాగ్రత్త మత్తయి 3:7,10!రూతు నయోమికి లోబడింది. దీవెనలు పొందింది.
నీవు కూడా అట్లా లోబడి దీవెనలు పొందుదువు గాక!
దైవాశీస్సులు!
(సశేషం)
రూతు- ఇరవయ్యోభాగం
సమీప బంధువు- kinsmen Redeemer-2Ruth(రూతు) 3:2,3,4
2. ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.
3. నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.
4. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా
ప్రియదైవజనమా! పై వచనాలలో ఎన్నో విషయాలు నిఘూడమై ఉన్నాయి.
2వ వచనం: ఇదిగో అతడు ఈ రాత్రి కల్లమును తూర్పార బట్టింపబోవుచున్నాడు. ఎవరైనా కల్లమును ఉదయం పూట తూర్పారబట్టిస్తారు. ఎందుకంటే అప్పుడు బోలెడు వెలుగు ఉంటుంది. అయితే యితడు ఎందుకు రాత్రిళ్లు చేయాలనుకొంటున్నాడు? బహుశా రాత్రిపూట ఎండ ఉండదు కదా చల్లగా ఉంటుంది(ఇజ్రాయేలు 40* max temp). అంతేకాకుండా రాత్రిపూట బోలెడు గాలి వీస్తుంది ఆ ప్రాంతంలో. దానికోసం రాత్రిపూట కళ్ళం దుల్లగొట్టి ఉండొచ్చు.అయితే యేసుప్రభులవారు కూడా కళ్లాన్ని తూర్పారబట్టించబోవుచున్నారు అతి తొందరలో! అది ఈరోజా? రేపా? ఎప్పుడో మనకి తెలియదు! అయితే ఆయన రాకడ గుర్తులు నేరవేరుచున్నాయి గాబట్టి అతి తొందరలో అని మాత్రం చెప్పగలం! ఫలించని ప్రతీ తీగను నరికేస్తాను అంటున్నారు యోహాను 15;2. మంచి ఫలాలు ఫలించని ప్రతీ చెట్టు వేరున గొడ్డలి పదును పెట్టబడి యుంది అంటున్నారు మత్తయి 3:10 గోదుమలను, గురుగులను వేరుచేయడానికి ఆయన చేట ఆయన చేతిలో ఉంది మత్తయి 3:12. మరి పొల్లు గింజలు ఆ గాలికి రెండవ రాకడలో ఎగిరిపోతాయి. మంచిగింజలు మాత్రం కల్లంలో ఉంటాయి. మంచిగింజలను/ఫలాలను యేసయ్య తీసుకొని మధ్యాకాశంలోనికి విందుకు తీసుకొని పోతారు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? పొల్లు గింజవా? మంచి గింజవా? గోదుమవా? గురుగువా? ఫలించేచెట్టువా? నరికివేయబడే చెట్టువా?
అయితే 3వ వచనంలో సిద్దపడే విధానాన్ని నయోమిద్వారా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నారు.
1. నీవు స్నానం చేసి:- పొద్దస్తమాను ఆమె పొలంలో పనిచేసింది గాబట్టి స్నానంచేసి శుబ్రంగా వెళ్ళమని చెబుతుంది. ఇది శారీరిక అర్ధం! దీని ఆత్మీయార్ధం ఏమిటంటే: Acts(అపొస్తలుల కార్యములు) 22:16
16. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను;
అప్పుడు యేసురక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును 1 యోహాను 1:7.
పాపములను ఒప్పుకొని, యేసునామంలో ప్రార్ధన చేసి, ఆయన నామంలో భాప్తిస్మము పొందుకోవాలి. ఇది మొదటి మెట్టు.
2. తైలము రాచుకొని:- జుట్టు ఎగురకుండా, మంచి వాసన రాడానికి తైలము రాసుకో అంటుంది.అయితే తైలము= అభిషేకానికి గుర్తు! సమూయేలు గారు సౌలురాజుకి, దావీదు గారికి ఇలానే తైలము రాచి అభిషేకము చేసినట్లు చూస్తాం! సమూయేలు 10:1, 16:13; అయితే దావీదుగారిని తైలముతో అభిషేకించిన వెంటనే యెహోవా ఆత్మ దావీదుమీదకు బలముగా దిగివచ్చెను 16:13. ఇంకా చాలామందిని తైలముతో అభిషేకించినట్లు మనం చదువగలం. నూతన నిభందనలో దేవుడు పెంతెకోస్తు దినాన్న అభిషేకంతో నింపినట్లు చూస్తాం. అపో 2; కాబట్టి రక్షించబడిన ప్రతీ విశ్వాసి తప్పకుండా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. అప్పుడే ప్రియరక్షకుని/ పెండ్లికుమారుని ఎదుర్కోగలవు.
బుద్దిలేని కన్యకలు తమబుడ్డిలో నూనె తెచ్చుకోలేదు. విడువబడ్డారు. బుద్దిగల కన్యకలు తమ దివిటీల్లో నూనెను నింపు కొన్నందువల్ల పెండ్లికుమారుని ఎదుర్కొని, వివాహం చేసుకొన్నారు మత్తయి 25:8,9,10.
ప్రియ విశ్వాసి! పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొన్నావా? ఆయనాత్మ లేనివాడు ఆయనవాడు కాదని మరచిపోకు రొమా 8:9! ఆత్మలేకపోతే ఎత్తబడరు! ఎప్పుడో పొందుకొన్నావు కాని ఇప్పుడు పోగొట్టుకొన్నావా? సంసోను వ్యభిచార వ్యామోహంలో పడి, ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకొని, ఎప్పటిలా విరజిమ్ముకొందాం అనుకొన్నాడు న్యాయ 16:20,21, గాని పట్టబడి, కళ్ళు పీకించుకొని, అవమానాలు పడ్డాడు. చివరకి దేవుని పాదాలు కన్నీటితో కడిగితే దేవుడు కనికరించి ఆత్మబలం మరల ఇచ్చారు న్యాయ 16:29. అదేవిధముగా ఒకవేళ నీవు పోగొట్టుకొంటే ఇప్పుడే కన్నీటితో దేవుని కృపాసనాన్ని సమీపించు.! పొందుకొన్నవారు మీకు కలిగినదాన్ని గట్టిగా పట్టుకోమని దేవుడు హెచ్చరిస్తున్నారు ప్రకటన 2:25
3. నీ బట్టలు కట్టుకొని:- మంచి బట్టలు కట్టుకొని వెల్లమంటుంది. బట్టలు మన శరీరాన్ని చలినుండి, దుమ్మునుండి, వేడినుండి, వర్షం నుండి కాపాడుతుంది. మన శరీరభాగాలు కప్పి సిగ్గును కప్పుతుంది. అలాగే ప్రతి విశ్వాసి తమ ఆత్మీయజీవితాన్ని/ ఆత్మీయ వస్త్రాన్ని కాపాడుకోవాలి. లేకపోతే షూలమ్మితి వస్త్రాన్ని కాపలాదార్లు దోచుకొన్నట్లు పరమ 5:7 సాతానుగాడు నీ ఆత్మీయవస్త్రాన్ని దోచుకొంటాడు జాగ్రత! యేహెజ్కేలు గ్రంధంలో నీ బ్రతుకు బాగోలేదు కనుక నీ వస్త్రాన్ని చింపివేసి నీ దిసమొలను అందరికి చూపిస్తాను అంటున్నారు యెహెఙ్కేలు 16:37, ప్రకటన 16:16. మరో అర్ధం ఏమిటంటే పరిశుద్దుల నీతిక్రియలు వస్త్రాన్ని సూచిస్తుంది. ప్రతీ విశ్వాసి తప్పకుండా మంచిపనులు చేయాలి. దీనులను దౌర్భాగ్యులను ఆదుకోవాలి.
ఇలా చేసి కల్లమునకు సిద్దపడాలి!
ప్రియ విశ్వాసి! ఈ రకంగా నీవు సిద్ధముగా ఉన్నావా? పాపములను ఒప్పుకొని, పశ్చాతాప పడి దేవుని సన్నిధిలో సమాధాన పడ్డావా? భాప్తిస్మం పొందుకొన్నావా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని, దానిని కాపాడుకొంటున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? అలాగైతే నీవు పెండ్లికుమారుని ఎదుర్కోగలవు!
అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! అమెన్!
(సశేషం)
రూతు- 21వ భాగం
సమీప బంధువు- kinsmen Redeemer-3ప్రియదైవజనమా! గతభాగంలో సమీపబందువును ఎదుర్కొనే సిద్దపాతుకోసం ధ్యానించాము. రూతు 3:4 అతడు పండుకోనిన తర్వాత, పండుకొనిన స్తలము గుర్తెరిగి లోపలి పోయి, అతని కాల్లమీదనున్న బట్ట తీసి, పండుకొనవలెను. నీవు చేయవలసినది అతడు నీకు తెలియజేయునని ఆమెతో ననగా!. . .
నయోమి రూతుతో చెబుతుంది అతడు పండుకొనే స్థలం చాటుగా చూడు, ఆ స్థలాన్ని గుర్తెరగాలి. ఎందుకంటే దీపాలు ఆర్పితే కనబడదు కనుక. అందుకే ఆ స్థలాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రతీ విశ్వాసి నీవుండే స్థలం గుర్తెరిగి, నీవు ఎవరికి చెందిన దానవు/వాడవు? ఎక్కడికి పోవలసినదానవు/ వాడవు? ఏం చేస్తున్నావని గుర్తెరిగి జీవించాలి. యేసయ్య మార్గాన్ని పరిశీలించి దానిని వెంబడించాలి! అందుకే దేవుడంటున్నారు మీరు చేరబోయే ప్రదేశం ఇంతకు ముందు మీరు చూసినది కాదు, దానిని మీరు గుర్తు పట్టాలి. మరి నీ గమ్యాన్ని గుర్తించావా? పరమగీతం 1:7-8 లో షూలమ్మితి/పెండ్లికుమార్తె సంఘం అంటుంది నా ప్రాణప్రియుడా! నీ మందలు ఎక్కడ మేపుదువు? ఎక్కడ ఉంటావు అని అడిగితే సొలోమోను/ పెండ్లికుమారుడు/ యేసుప్రభులవారు అంటున్నారు మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము! మంద కాపరులు గుడారాల యెద్ద నీ మేకపిల్లలు మేపు! గమనించారా! మందల అడుగుజాడలను బట్టి వాటిని అనుసరించాలి. సంఘానికి క్రమంగా వెళ్ళాలి. ప్రభుని ఆరాదించాలి. అక్కడ నీ రహస్య పాపాలు అనుదినము కడుగబడాలి. నూతననూనెతో/ ఆత్మాభిషేకంతో నింపబడుతుండాలి! ఇక మంద కాపరులు అనగా సంఘకాపరులు- వారి సందేశాన్ని విని, వారి జీవితాలు పరిశీలించి, యేసయ్య బాటలో సాగిపోతుండాలి. నీ సంఘకాపరితో మంచి సంభందం కలిగియుండాలి. నీ సొంత కాపరి మాత్రమె నీతో ప్రేమగా మాట్లాడగలిగి, నీకోసం ప్రార్ధన చేయగలడు. నీకుటుంబ స్తితిగతులు నీ కాపరికి మాత్రమె తెలుసు. గాని పరాయి కాపరికి తెలియదు. జీతగాడు ప్రమాదం వస్తే పారిపోతాడు. గాబట్టి ప్రియ విశ్వాసి! నీ జీవిత గమ్యాన్ని గుర్తెరుగు! సంఘాన్ని అనుసరించు! సంఘకాపరికి లోబడు! ప్రియరక్షకుని అడుగుజాడల్లో నడచిపో!.
తర్వాత కాళ్ళదగ్గర బట్టతీసి, కాళ్ళదగ్గర పడుకో అని చెబుతుంది నయోమి! 19వ భాగంలో చెప్పిన విధముగా నయోమి రూతుతో బోయజుగారి కాళ్ళదగ్గర పడుకో అంటుంది గాని ప్రక్కలో పడుకొని పాపం చెయ్యమని చెప్పలేదు. కాళ్ళదగ్గర పడుకొంటే నీవు ఏం చెయ్యాలో ఆయన చెబుతారు అంటుంది. ఆవిధంగానే రూతు బోయజుగారి కాళ్ళ దగ్గర పడుకుంది. దీనిలో కొన్ని అర్దాలు ఉన్నాయి.
1.ఇది వాళ్ళ సాంప్రదాయం. సమీపబందువుని ఆశ్రయించి, తన భర్త చనిపోయాడు కనుక ఇప్పుడు నీవు నాతో బంధువు/భర్త ధర్మాన్ని ధర్మశాస్త్రం ప్రకారం జరిగించు అని వేడుకోవడం! 9వ వచనం ప్రకారం రూతు కాళ్ళదగ్గర పడుకొని అయ్యా! నీవు నా సమీపబందువు కాబట్టి నీ దాసురాలిమీద నీ కొంగు కప్పుమని అడిగింది. ఈ రకంగా నాకు బంధువు ధర్మ జరుపమని అడిగిన తర్వాత ఆ వ్యక్తి కొంగు కప్పితే, ఆవ్యక్తి ఇష్టపడి వివాహం చేసుకుంటాడు. లేకపోతే ఆమె మరో సమీపబందువుని ఆశ్రయిస్తుంది. ఇక్కడ రూతు ఎంత సాంప్రదాయబద్ధంగా అడుగుందో చూసారా! నయోమిని నమ్ముకొని వచ్చింది గాబట్టి నయోమి అడ్డదారిని ప్రయాణించ మని చెప్పకుండా సంప్రదాయబద్దంగా ఒక పద్దతిలో కార్యం చేయడానికి, ఒక స్తిరమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. పరిశుద్దాత్ముని కార్యాలు temparary కాదు అవి స్తిరమైనవి. రూతు చాలా అందగత్తె! రాజ కుమార్తె! నయోమి- నీవు అందగత్తెవు కదా బోయజు చాలా ఆస్తిపరుడు, అతన్ని కవ్వించి, లాలించి, మభ్యపెట్టి అతనిని నీ వలలో వేసుకొని పెళ్లి చేసుకో అని చెప్పడం లేదు! క్రమ పద్దతిలో చేసింది గాబట్టి 13వ వచనంలో బోయజుగారు యెహోవా నామమున ప్రమాణం చేస్తున్నారు నాకంటే సమీప బంధువు మరొకరు ఉన్నారు నీకు, అతడు విడిపించని ఎడల నేను విడిపిస్తాను. యెహోవా రెక్కలను ఆశ్రయించి వచ్చింది గనుక ఒక శాశ్వతమైన నివాసం, ఆశ్రయం ఆమెకు కలగటానికి దేవుడు అవకాసం ఇచ్చారు. దేవుని బిడ్డలు ఎంతమాత్రము అడ్డదారులు తొక్క కూడదు! అలా అడ్డదారులు తొక్కి, కవ్వించి, లాలించి చేసుకొన్న వివాహాలు మోజు తీరాక ముక్కలై పోతాయి. అలాంటి వివాహాలు సాధారణముగా ధనార్జనకోసం జరుగుతాయి. అందం హరించిపోతే మరొకరిని చూసుకొంటారు. లేదా అతగాడి ధనం హరించిపోతే ఆమె మరొకరిని చూసుకొంటుంది. ఇవి దేవునికి అసహ్యమైనవి. కాబట్టి ఇట్లాంటివి దేవుని బిడ్డలు చేయడానికి వీలులేదు!
2. కాళ్ళమీద బట్టతీసి కొంగు కప్పమంటే- అయ్యా నేను నీ దాసురాలిని, నిన్ను వివాహమాడాలని అనుకొంటున్నాను.దయచేసి నన్ను పెళ్ళిచేసుకో అని అర్ధం!
3. ఇది తగ్గింపుకి సాదృశ్యం! రాజకుమార్తె, అందగత్తె, ప్రధానపూజారిని కూడా తగ్గించుకొని బోయజుగారి పాదాల దగర పడుకుంది. ఎంత తగ్గింపు! తననుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. హెచ్చించుకొనువాడు తగ్గించబడును లూకా 14:11. రూతు తగ్గించుకోంది ఘనురాలుగా మారింది. ప్రియబిడ్డా! నీవు గొప్ప పాట గాడివా? గొప్పగా వాయిద్యాలు వాయిస్తావా? గొప్ప ప్రసంగీకుడివా? ఎన్నో తలాంతులు ఉన్నాయా? దేవునికి స్తోత్రం! గాని ఆ తలాంతులు బట్టి విర్రవీగావా? అధోఃపాతాళానికి వెల్లిపోయావే!
ఘనతకు ముందు వినయం, పడిపోయేముందు గర్వం వస్తుంది అని సామెతలు గ్రంధంలో వ్రాయబడి ఉంది. కాబట్టి నీకున్న తలాంతులను బట్టి విర్రవీగక , తగ్గించుకొని అయ్యా! ఇవన్నీ నీవిచ్చినవే ! అర్హత లేని నాకు అర్హత, గుర్తింపులేని నాకు గుర్తింపు కలిగాయి అంటే అది నీవలనే ప్రభువా అని తగ్గించుకొని ప్రార్ధన చేయు. యేసుప్రభులవారే స్వయముగా అన్నారు: ఇవన్నీ చేసి అయ్యా మేము నిస్ప్రయోజనమైన దాసులం, మేము చేయవలసినవే చేసియున్నామని తగ్గించుకొని చెప్పమన్నారు లూకా 17:10; అట్లా నీవు తగ్గించుకొంటే దేవుడు నిన్ను ఇంకా అత్యధికముగా , నీవు ఉహించలేనంతగా, నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కి స్తారు, హెచ్చిస్తారు. రూతు తననుతాను తగ్గించుకొని ఘనత పొందింది. నీకు నాకు కూడా ఆ తగ్గింపు ఎంతైనా అవుసరం!
అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!
దైవాసీస్సులు!
(సశేషం)
రూతు- 22వ భాగం
సమీప బంధువు- kinsmen Redeemer-4ఈ రకంగా నయోమి రూతుతో చెప్పినప్పుడు రూతు నేను నీవు చెప్పినది చేస్తాను అని లోబడి , బోయజుగారు ఆరాత్రి అన్నపానములు పుచ్చుకొని నిద్రపోయిన తర్వాత ఆయన కాళ్ళ మీదున్న బట్టతీసి, ఆయన కాళ్ళ దగ్గర పడుకుంది. (3:5-7). మధ్య రాత్రి అతడు ఉలుక్కిపడి చూస్తే, ఒక స్త్రీ తన కాల్ల యొద్ద పండుకొని ఉంది. (8వ వచనం). బోయజుగారు పండుకొని ఉంటారు గాని బహుశా రూతు నిద్రపోయి ఉండదు! ఎందుకంటే ఏం జరుగుతుందో అని ఆత్రుత, ఆందోళన! బోయజుగారు ఉలుక్కిపడి లేచి ఎవరు నీవు అని అడిగారు. వెంటనే రూతు: నేను రూతు అను నీ దాసురాలను. మీరు నాకు సమీపబంధువు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం(ద్వితీ 25:5-10) నా మీద కొంగు కప్పి బంధువు ధర్మం చెయ్యమని ఆర్జించింది.ఈ పరిస్తితిలో ఒకవేళ ఆ వ్యక్తి కొంగు కప్పితే, ఎప్పుడైతే కొంగు కప్పుతారో వెంటనే ఆ స్త్రీ కొంగుకప్పిన వారి సంరక్షణ లోనికి తత్క్షణమే వెళుతుంది. అందుకే నాకు మీ కొంగుకప్పి నన్ను మీ సంరక్షణ లోకి తీసుకోండి అని వేడుకొంటుంది. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తి పరచును! ఇంతవరకు లోకంలో సంరక్షణ లేక,స్థిరమైన ఆశ్రయం లేక, సాతాను శోదనలలో, నలిగిపోయి, అలసిపోయి, సొలసిపోయి ఉంటే యేసయ్యని ఇప్పుడే ఆశ్రయించు! ఆయనంటున్నారు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగజేతును మత్తయి 11:28. యేసయ్యా! నీవు నాకు నీ కొంగుకప్పుమని, గతంలో వివరించినట్లు సిద్దపడి ఆయన యొద్దకు చేరి అడుగు! ఆయన నీకు నాకు మనందరికీ సమీపబంధువు! కాబట్టి ఆయన తనకొంగు కప్పి వెంటనే నిన్ను తన సంరక్షణ లోనికి తీసుకొంటారు. నీవు ఏ స్తితిలో ఉన్నా సరే, ఆ స్తితిలోనే ఉన్నపాటున ఆయన యొద్దకు రా!
వ్యభిచారివా?
రోగిష్టివా?
అప్పుల బాధా?
శాంతిలేదా?
దురలవాట్లా?
దొంగవా?
హంతకుడివా?
నీవు ఎవరివైనా సరే!
నేడే యేసయ్య వద్దకు రా!
ఈ వ్యభిచారాన్ని, త్రాగుడు . . . మానేసి వస్తాను అనుకొంటున్నావేమో! ప్రియనేస్తమా! నీకు నీవుగా మానలేవు! అది నీవల్ల కాదు. అది నీవల్ల నయితే ఎప్పుడో మానేద్దువు!
నీ రోగాన్ని నీకునీవుగా బాగుచేసుకోలేవు!
యేసయ్య రెక్కలనీడను ఆశ్రయిస్తే వెంటనే ఆయన పరమ వైద్యుడు కాబట్టి నిన్ను స్వస్త పరచి, నీ పరిస్తితిని చక్కపరచగలరు! నేడే తడవు చేయక ఆయన యొద్దకు ఉన్నపళంగా రా!
రూతు బోయజుగారిని నీకొంగుకప్పమని ఎప్పుడు అడిగిందో ఆయన చిరాకు పడలేదు! కోపపడలేదు! నా కుమారీ! అంటున్నారు. నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన దానవు! దీనర్ధం ఏమిటంటే రూతు ఇప్పటికే ఆశీర్వదించబడింది. ఇట్టి ధన్యత, ఇలా పిలువబడటం బైబిల్ లో కొద్దిమందికి మాత్రమె కలిగింది. ఉదా: యెహోవాచేత ఆశీర్వదించ బడినవాడా! లోపలి రా! బయట నిలువనేల? (ఎలియాజరు)అది 24:31; దయాప్రాప్తురాలా! నీకు శుభము! దేవునివలన నీవు కృప పొందితివి! (గబ్రియేలు దూత మరియమ్మతో)లూకా:1:28; స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదానవు! (ఎలీషబేతు- మరియమ్మ తో)(లూకా 1:42 వ, అధ్యాయం) ఇప్పుడు ఈ లిస్టులో రూతుకూడా చేరిపోయింది. ఎంత ధన్యత!
ఇంకా ఏమన్నారో చూడండి: నీవు గొప్పవారిని గాని, కొద్దివారిని గాని, యవ్వనస్తులను గాని వెంబడించనందువలన , నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైంది. చూసారా ఆయనమాటలు! నీ మునుపటి సత్ప్రవర్తన అంటే 2:11-12 లో ఉదహరించినవి. నీవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని, యవ్వనస్తులనే గాని వెంబడించలేదు. (యవ్వనస్తులను వెంబడించలేదు అనడానికి కారణం అప్పటికి బోయజుగారి వయస్సు చరితప్రకారం 50-60 సం.లు. గాబట్టి రూతు తన సమానవయస్సు గలవారి వెనుక పరుగెత్తలేదు గాని బోయజు వయస్సు పెద్దదైనా సరే నయోమి మాటకు సమ్మతించి బోయజుగారి దగ్గరకు వచ్చింది).
రూతు రాజ కుమార్తె, అందగత్తె, యవ్వనురాలు గాని విధవరాలు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంది. బెత్లెహేములో చాలామంది యవ్వనస్తులు, అందమైన వారు ఉన్నారు. తనతోపాటు పనిచేసే యువకులు ఉన్నారు. డబ్బున్నవారు, పేదవారు ఉన్నారు గాని వీరిలో ఎవరివెంబడి కూడా పోలేదు. ఎవరితోనూ ఏ విధమైన అక్రమసంభందం పెట్టుకోలేదు! దేవునిపై ఆనుకొంది. అందుకే 11వ వచనంలో నీవు యోగ్యురాలివి అని అందరికీ తెలుసు అంటున్నారు బోయజుగారు. కొన్ని ప్రతులలో నీవు గుణవతివి అని అందరికీ తెలుసు అని వ్రాయబడింది. ఈ యోగ్యమైన గుణమే ఆమెను యేసుప్రభుల వారి వంశావలిలో చేర్చింది.
నేటి యువత తమ life partner ను కాలేజిలోనే వెతుక్కోవడం ప్రారంభిస్తున్నారు. facebook, social mediaలో ఇలా వెదుక్కొంటున్నారు. ఇలాంటి వివాహాలు కొన్నైనా నిలుస్తాయా అన్న నమ్మకం లేదు. ఎన్నో వివాహాలు కూలిపోతున్నాయి. facebook, social media లో పెట్టిన fake information నిజమని అనుకోని, తల్లిదండ్రులను ఎదిరించి, తర్వాత మోసపోయి, ఏడుస్తున్నారు. తల్లిదండ్రులను చేరలేక, భాగస్వామితో ఉండలేక ఆత్మహత్యలు చేసుకొంటూన్నారు. దేవుని నుండి దూరమై పోతున్నారు. రూతు ఎవరిని ఆశ్రయించలేదు. నయోమిని, దేవుణ్ణి నమ్ముకొంది. నీవు ఏం చెబితే అది చేస్తానని నయోమికి మాట ఇచ్చింది.
అలాగే నీ జీవిత భాగస్వామికోసం నయోమికి- అనగా పరిశుద్ధాత్మునికి సంపూర్ణ అధికారం ఇవ్వు! అయ్యా! మీరు ఏం చెబితే అది చేస్తాను. ఎవర్ని చూపిస్తే వారిని చేసుకొంటాను అను!
దేవుడు తగిన కాలమందు నీకు తగిన సరిపోయే భర్తను/ భార్యను దయచేస్తారు! అంతేకాని అందంగా కనబడింది అని, బోలెడు డబ్బున్న వారు అని చేసుకొంటే (శరీరాశ, నేత్రాశ, జీవపు ఢంభం) నీవు శాంతికి దూరమై, జీవితమంతా అశాంతితో జీవించాల్సి వస్తుంది జాగ్రత్త!
(ఇంకాఉంది)
రూతు- 23వ భాగం
సమీప బంధువు- kinsmen Redeemer-5(ప్రియులారా మనం రూతు తన జీవిత భాగస్వామిని, సమీపబందువుని ఆశ్రయించిన విధానం గురుంచి ధ్యానిస్తున్నాం)
ఈ సందర్భముగా నేను రెండు విషయాలు చెప్పాలనుకొంటున్నాను.
1. దైవజనులు శ్రీ పాల్ యాంగిచో గారు రాసిన నాల్గవ కోణంలో ఒక సాక్ష్యం చెబుతారు. ఒకసారి ఎన్నో సం.రాల్నుండి పెండ్లికాని ఒక యవ్వనస్తురాలు పాల్ గారి దగ్గరకి వచ్చి తన వివాహం కోసం ప్రార్ధించమంటుంది. ఆయన ఎన్ని సం.ల నుండి ప్రార్ధనచేస్తున్నావ్, ఎదురుచూస్తున్నావ్ అంటే అయ్యా 10 సం.ల కన్నా ఎక్కువే అయ్యింది అని జవాబు చెబుతుంది. అయితే ఆయన ఒక పేపరు, పెన్ను తీసుకుని నీకు ఎటువంటి గుణలక్షణాలు గల అబ్బాయి కావాలో దాని మీద వ్రాయు అంటారు. ఆమె రాసిన తర్వాత గట్టిగా పదిసార్లు చదవమంటారు. ఇప్పుడు అలాంటి గుణలక్షణాలు గల వ్యక్తి కోసం, దొరికాడని విశ్వాసంతో ప్రార్ధన చెయ్యమంటారు. కొన్నిరోజుల తర్వాత ఆ ప్రాంతం దర్శిస్తే ఆమె తనభర్తతో కలసి వస్తుంది ఆయన దగ్గరకు. కాబట్టి నీకు ఎలాంటి భర్త కావాలో నీకు నీవు వెదుక్కోకుండా దేవుని దగ్గర నీకు కావాల్సిన లక్షణాలు గల వ్యక్తి కోసం స్పష్టముగా అడుగు. దేవుడు తప్పకుండా దయచేస్తారు.
2. నా ఇంటర్మీడియట్ అయ్యాక ఒకసారి ఒక సభల్లో దైవజనులు రాజశేఖర్ గారు(మదనపల్లి) యవ్వనస్తులకోసం చెబుతూ మీరు గుణవతియైన భార్యకోసం మాత్రం ప్రార్ధన చెయ్యండి. దేవుడు మీకు తగిన భాగస్వామిని ఇస్తారు అని చెప్పారు. నేను అప్పటినుండి ప్రార్ధించడం ప్రారంభించాను. నాకు కేవలం గుణవతియైన భార్య కావాలి- తగిన సమయంలో దయచేయమని. తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, డబ్బుండాలి ఇలాంటివి ఎంత మాత్రము చెయ్యలేదు. 12 సం.లు తర్వాత దేవుడు నాకు గుణవతియైన భార్యను, సేవకు సహకరించే భార్యను, తల్లిదండ్రులకు, సేవకులకు పరిచర్య చేసే భార్యను దేవుడు నాకు ఇచ్చారు.
ప్రియ యవ్వనస్తుడా! నాకు తగిన బార్యను ఇచ్చిన దేవుడు నీకు కూడా తగిన కాలంలో తగిన భార్యను ఇస్తారు.కేవలం గుణవతియైన భార్య కావాలని అడుగు. ప్రియ యవ్వన చెల్లీ! దేవునికి భయపడే, మోకాళ్ళ అనుభవం కలిగి, సమర్ధుడైన భర్తకోసం మాత్రం ప్రార్ధన చేయు. నీకు తగిన సమయంలో తగిన భర్తను ఇస్తారు.
కావున facebook, social media లో కాకుండా, ఏ మీడియం కూడా లేకుండా లోకస్తులందరినీ చూస్తున్న, ప్రార్ధనలకు జవాబిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని దగ్గర అడుగు! పొందుకో! నీ తల్లిదండ్రులకు లోబడు రూతు నయోమికి లోబడి నట్లు! నేను జ్ఞానిని కదా అని నీవనుకోవద్దు సామెతలు 3:7! నాకు వయస్సు వచ్చింది, నా భర్తను/భార్యను నేనే నిర్ణయించుకొంటాను అనుకోవద్దు! నీ నిర్ణయాలు ఎందుకూ పనికిరావు.
ఇక రూతుకి ఆ భాగ్యం కలగటానికి మరో కారణం! ఆమె సత్ప్రవర్తన! తన మాటల్లో చేతల్లో ఎప్పుడూ పరుషంగా మాట్లాడలేదు! పెద్దలను గౌరవించింది. గ్రామస్తులను గౌరవించింది. ప్రాముఖ్యంగా తన శీలాన్ని కాపాడు కుంది!!! నేటి క్రైస్తవ బిడ్డలకు శీలాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం! శీలాన్ని కాపాడుకోవాలంటే అది అమ్మాయిలకే పరిమితం అని ఎంతమాత్రము అనుకోవద్దు! పురుషులు కూడా శీలాన్ని కాపాడుకోవాలి! యోసేపు గారు తన శీలాన్ని కాపాడుకొన్నారు ఆది 39:12. అందుకు ప్రతిఫలంగా జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. అయినా చివరకు ఐగుప్తు దేశానికే అధిపతి అవ్వగలిగారు ఆది 41:41!
ఒక విషయం చెప్పనా?! అవకాశాలు లేక శీలాన్ని కాపాడుకోవడం గొప్ప ఏం కాదు! అవకాశం ఉండి కూడా తమ శీలాన్ని కాపాడుకోవడం గొప్ప! వారే దేవుని సన్నిధిలో/ దేవుని దృష్టిలో భళా నమ్మక మైన మంచి దాసులు! ఆ కోవకు చెందిన వారే యోసేపు, రూతు, దానియేలు. . . .; శీలాన్ని కోల్పోయి అప్రతిష్ట పాలయ్యారు దీన(యాకోబు గారి కుమార్తె) ఆది 34:2, సంసోను న్యాయ 16:1, దావీదు రాజుగారు 2సమూయేలు 11:4.
కాబట్టి నీ సత్ప్రవర్తన దేవునికి కావాలి! దావీదు గారు బత్షెబ విషయంలో తప్ప ఎప్పుడూ తప్పటడుగు వేయలేదు. అందుకే అబ్నేరు! ఈ యవ్వ్వనుడు ఎవని కుమారుడు! అని అనిపించుకొన్నాడు సౌలురాజుతో 1సమూయేలు 17:54,55! రూతు ఈ చిన్నది ఎవరు అని అనిపించుకుంది! నీవుకూడా అట్టి సత్ప్రవర్తన కలిగియుంటే ఈ అబ్బాయి/అమ్మాయి ఎవరి కమారుడు/కుమార్తె అనిపించుకొంటావు! లేకపోతె వీడు ఎవడికి పుట్టాడ్రా/ ఎవడికి /ఎవర్తికి పుట్టిందిరా అంటారు! నీ ద్వారా నీ తల్లిదండ్రులకు చెడ్డపేరు! చివరకు నీ సంఘానికి చెడ్డపేరు! చిట్టచివరకు నీకోసం ప్రాణం పెట్టిన నీ దేవునికి చెడ్డపేరు! కాబట్టి నీ ప్రవర్తన చక్కపరచుకోమని యేసయ్య పేరిట మనవిచేస్తున్నాను!
ఇదే భాగంలో మరో ఆదరణ కరమైన మాటలు చెబుతున్నారు బోయజు గారు! నాకుమారీ! భయపడకుము! (11వ వచనం). నీవు చెప్పినదంతా నేను చేస్తాను! అంటున్నారు. రూతు మనస్సులో గొప్ప ఆందోళన,భయం ఏం జరుగుతుందో, దేవుణ్ణి ఆశ్రయించి వచ్చాను, ఇప్పుడు ఈ బోయజు గారు ఏమంటారో అనే భయం! అందుకే దేవుని ప్రేరేపణతో బోయజుగారు చెబుతున్నారు నా కుమారీ! భయపడకుము!
బైబిల్ లో భయపడకుము అని 365 సార్లు వ్రాయబడి ఉంది.అంటే సం.లో రోజుకోసారి దేవుడు నీకు చెబుతున్నారు నా కుమారీ/నాకుమారుడా భయపడకు!
నీకు కావాల్సింది నేను చేస్తాను! నేనున్నాను అంటున్నారు! నీవు చేయవలసింది కేవలం ఆయన రెక్కల క్రిందకు వచ్చి, ఆయన కొంగును కప్పమని కన్నీటితో వేడుకో! మిగతాది ఆయనే చూసుకొంటారు!
కాబట్టి భయపడకు! వెరువకు! ఆయనపై సంపూర్ణంగా ఆధారపడు!
అట్టి కృప భాగ్యం మనందరికీ కలుగును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(సశేషం)
రూతు- 24వ భాగం
సమీప బంధువు- kinsmen Redeemer-6ప్రియదైవజనమా! మనం రూతు బోయజుగారిని బంధువు ధర్మము జరుపమని అడిగేటప్పుడు జరిగిన సంభాషణను ధ్యానిస్తున్నాం.
నా కుమారీ! తప్పకుండా నీవు చెప్పినట్లే చేస్తాను. భయపడకు అని చెప్పి, అయితే నాకంటే నీకు మరొక సమీపబంధువు ఉన్నాడు, ఆయన జరిగించనియెడల నేనే నీకు బంధువు ధర్మం చేస్తాను అని యెహోవా నామమున వాగ్ధానం చేసారు. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళకు! వేకువజాము వరకు పడుకో! అని చెప్పి వేకువజామున ఆమెను తన అత్త ఇంటికి పంపిస్తారు. అయితే వెళ్ళేటప్పుడు 3:15,17 వచనాల ప్రకారం బోయజుగారు అంటున్నారు : నీవు వెళ్ళేటప్పుడు వట్టిచేతులతో వెళ్లొద్దు! అనిచెప్పి ఆరుకొలల యవలు(భార్లీ) ఇచ్చినట్లు చూస్తాం!
ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలున్నాయి.
1. మీరు యెహోవా సన్నిధిని వట్టిచేతులతో కనబడకూడదు! అని చెప్పారు దేవుడు. ఒక వ్యక్తి దేవుని మందిరము నకు వెళ్ళినప్పుడు తప్పకుండా కృతజ్ఞతగా కానుక ఇవ్వాలి ఆయన ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. గనుక సణుగుకొనకయు, బలవంతముగా కాకయు ప్రతివారు వారు నిర్నయించుకొన్నది ఇవ్వాలి అని వ్రాయబడింది 2 కొరింథీ 9:7.
అప్పుడు
Philippians(ఫిలిప్పీయులకు) 4:19
19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
అయితే ఈ అవుసరం తీర్చడానికి సమయం పడుతుంది. గాని ఒకవ్యక్తి దైవసన్నిధికి వచ్చి తన హృదయాన్ని దేవుని వాక్యానికి తెరచి, దైవసన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తే, ఆయన నిన్ను వట్టిచేతులతో పంపివేసే దేవుడు కాదు. material blessings ఎలాగూ ఇస్తారు, దానికంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో నీకు ఆశీర్వాదం, దేవుని వాగ్దానం , దైవిక స్వస్థత, మనశ్శాంతి దొరుకుతుంది. ఎంతో భారబరితమైన హృదయంతో అడుగుపెట్టిన నీవు ఎంతో మనశ్శాంతితో తేలికపాటి హృదయంతో, నా దేవుడు నాతో ఉన్నాడు ఎన్ని భాధలైన ఇట్టే గట్టెక్కేస్తాను అనే ధీమాతో భరోశాతో వెళ్తావు. వారమంతా సంతోషంగా గడుపగలవు!
దైవజనుడు రిచర్డ్ ఉర్మబ్రాండ్ గారు ఒకమాట అంటూ ఉండేవారు. నేను యూదుడను. ఏసుప్రభువు కూడా యూదుడు. ఆయన business man కూడా. Jesus Christ is a very kind gentle business man. తనకి గాని, తన partners కి గాని నష్టం వచ్చే పని ఎప్పుడూ చెయ్యరు. నీవు ఏమైనా ఇస్తే వెంటనే ఆయన నీకు ఏదైనా ఇచ్చేవరకు ఊరుకోరు. బోయజుగారు చేసినట్లు ఆయన నిన్నుకూడా వట్టిచేతులతో పంపకుండా నిండార దీవెనలతో పంపిస్తారు.
2. ఆరుకొలల యవలు ఇచ్చినట్లు చూస్తాం. ఆరు బైబిల్ గ్రంధంలో ముగింపునకు గుర్తు. దేవుడు ఆరు రోజులు పనిచేసి ఏడవదినమున విశ్రాంతి తీసుకొన్నట్లు మనం చూస్తాం ఆదికాండం మొదటి అధ్యాయంలో. ఏసుప్రభువు ఆరు రాతిబానల నీటిని ద్రాక్షారసముగా మార్చారు. ఇంకా ఆరుకోసం కొన్ని ఉదహరించబడ్డాయి.
ఇక్కడ రూతు తను చేయవలసినది చేసేసింది. ఇక చేయవలసినది బోయజుగారు. అందుకే ఆరుకొలల యవలు ఇచ్చి, ఏడవదిగా భయపడకు, యెహోవా జీవముతోడు వేరొక వ్యక్తి నీకు బంధువు ధర్మం జరుపక పోతే నేనే బంధువుధర్మం జరుపుతానని వాగ్దానం చేసి, ఏడు సంపూర్ణ సంఖ్య పూర్తిచేసారు.
రూతు తన అత్త నయోమితో ఇదంతా వివరించి చెప్పింది. అంతేకాకుండా వట్టిచేతులతో వెళ్లొద్దు అని చెప్పి తను వాగ్దానానికి గుర్తుగా ఇచ్చిన ఆరుకొలల యవలు చూపించింది. అప్పుడు నయోమి- నాకుమారీ! ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనేగాని ఆ మనుష్యుడు ఊరకుండడు అంటుంది.
వాగ్దానం చేసిన దేవుడు దానిని నెరవేర్చుటకు సమర్ధుడు, శక్తిమంతుడు
రోమీయులకు 4:21
గాబట్టి ప్రియదైవజనమా ఎందుకు తొందర? ఎందుకు వేదన? ఎందుకు కంగారు? దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసారు నీకు. బైబిల్ గ్రంధంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు పూర్వకాలంలో ఉన్నవారికోసం అనుకోకుండా, ఆ వాగ్దానాలు అన్నీ నాకోసమే అని విశ్వసించి, ప్రార్ధించు! ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. తనకు నిజముగా మొరపెట్టువారికి ఆయన ఏ మేలు చేయకుండా ఉండలేరు! ఆయన వాగ్దానాలు నమ్మి ఊరుకో.
(నిర్గమకాండము) 14:13,14
13. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.
14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.
ఆ వాగ్దానం నీకోసం కూడా చేసారు కాబట్టి Just trust Him and Wait for Him.
God Bless You.
Amen!
రూతు- 25వ భాగం
సమీప బంధువు-kinsmen Redeemer-7ప్రియ దైవజనమా! గతకొన్ని రోజులుగా రూతు గ్రంధంలో గల వ్యక్తులు- సంఘటనలకోసం ధ్యానిస్తూ, మూడు అధ్యాయాలు ధ్యానించాము. ఈరోజు మనం నాల్గవ అధ్యాయం ధ్యానం చేద్దాము.
ఆ ఉదయాన్నే ఏం జరిగిందంటే బోయజుగారు ఆ గ్రామ పుర ద్వారం దగ్గర కోర్చోంటారు. ఇంతలో మరో సమీప బందువుడు ఆ త్రోవను వెళ్తూ ఉండగా బోయజుగారు అతనిని పిలచి, ద్వారం దగ్గర కూర్చోమని చెప్పి, (పూర్వకాలంలో ఏదైనా పంచాయితీ జరిగిన, క్రయవిక్రయ నిర్ధారణ జరిగిన ఆ గ్రామ పురద్వారం దగ్గర పరచబడిన రాళ్ళపై కూర్చుని జరిగించేవారు. వీరుకూడా అక్కడే చేస్తున్నారు) ఆ గ్రామ పెద్దలలో పదిమంది పిలిచి వారి సమక్షంలో ఆ సమీపబందువునికి చెబుతున్నారు: మోయాబు దేశం నుండి తిరిగివచ్చిన నయోమి తన భూమిని అమ్మివేస్తుంది. నీవు సమీపబందువుడివి కనుక నీవు విడిపించు. ఒకవేళ నీవు విడిపించకపోతే నీ తర్వాతవాడిని నేనే కనుక నేను విడిపిస్తాను అని చెప్పారు... ఇక్కడ మరలా ధర్మశాష్ట్ర విధిని జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో వివరించినట్లుగా సహోదరుడు చనిపోతే, లేక భూమిని అమ్మివేస్తే దానిని సహోదరుడు లేక సమీపబంధువు విడిపించాలి. ఆ చనిపోయిన వాని భార్యను వివాహం చేసుకొని ఆమెను పోషించి, ఆమెకు సంతానం కలిగించి, ఆ పుట్టిన సంతానము సహోదరుని సంతానముగా పరిగణించాలి.. ఈ విధముగా సహోదరుని పేరు తుడుపు పెట్టకుండా ఉంచాలి. ఇది ధర్మ శాస్త్రవిధి. (లేవీ 25:25-28; 47-49; సంఖ్యా 35: 19-21; ద్వితీ 25:5-10) అంతేకాకుండా ఒక గోత్రపు స్వాస్త్యము మరొకరికి చెందకుండా ఆమె మరొక గోత్రపువారిని వివాహం చేసుకోకుండా ఆ గోత్రములోనే వాని సహోదరుని వివాహం చేసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతుంది.
ఎప్పుడైతే బోయజుగారు నీవు కొనుక్కో నయోమి భూమిని అంటే నేను కొనుక్కొంటాను అని చెప్పాడు. అయితే నీవు ఆ భూమిని కొనేటప్పుడు చనిపోయిన వాని భార్య మోయాబీయురాలైన రూతునుండి కొనుక్కోవాలి అని చెప్పగా: నేను దానిని విడిపించలేను. నేను నా నా స్వాస్త్యమును పోగొట్టుకొందునేమో, నీవే విడిపించు, నాకు బదులుగా నీవే బంధువు ధర్మం జరిగించు అని చెబుతాడు ఆ సమీపబందువుడు. ఇలా అనడానికి నాలుగు కారణాలు కావచ్చు!
1. రూతు మోయాబీయురాలు. మోయాబీయులు దేవుని సమాజములో చేరకూడదు అని ధర్మశాస్త్రము చెబుతుంది. (ద్వితీ 23:3-6). కాబట్టి ప్రజలు ఏమనుకొంటారో? ధర్మశాస్త్రానికి వ్యతిరేఖముగా చేస్తున్నాను కాబట్టి నాకేం జరుగుతుందో అని భయపడి ఉండొచ్చు!
2. 4:6 ప్రకారం నేను నా స్వాస్త్యమును పోగొట్టుకొందునేమో అంటున్నాడు. అంటే ఒకరమైన సెంటిమెంటు కావచ్చును. మహ్లోను రూతుని పెండ్లి చేసుకొన్న కొద్దిరోజులకే మహ్లోను చనిపోయాడు. బహుశా అది దేవుని ఉగ్రతో, లేక రూతు యొక్క శాపమో తెలియదు. ఇప్పుడు నేను ఆమెను వివాహం చేసుకుంటే నాకేమవుతుందో, నయోమిలా నేను కూడా కూడా రిక్తుడిగా అయిపోతానేమో అని సెంటిమెంటుకి భయపడి ఉండొచ్చు.
3. వయస్సు తేడా కూడా కావచ్చు. ఇతనివయస్సు కూడా దాదాపు బోయజు వయస్సు ఉండి ఉండవచ్చు. చిన్నపిల్లను ఏం పెళ్ళిచేసుకొంటాను అని అనుకుని ఉండొచ్చు!
4. దైవ ప్రణాళిక/ దైవ నిర్ణయం!!! రూతు- బోయజుల వివాహం జరగాలి అన్నది దేవుని ప్రణాళిక! రూతు నీతిమంతురాలు(ఆమె మోయాబీయురాలైన సరే) మరో నీతిమంతుని భార్యగా మారి నీతిమంతమైన సంతానం కనాలని దేవుని చిత్తము! అందుకే బోయజుగారు రూతు వయస్సుకి రెట్టింపు అయినా సరే దేవుడు వీరిద్దరినీ జత చేసారు. దేవుడు మన సృష్టికర్త! నిన్ను నన్ను చేసి, ఈ సృష్టిని నడిపించే మన CEO. ఎవర్ని ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. రూతు నీతికి ప్రతిఫలంగా మరో నీతిమంతుడైన వానిని భర్తగా ఇచ్చాడు దేవుడు.
వెంటనే వారి ఆచారం ప్రకారం నేను పెళ్లి చేసుకోను- నీవే పెళ్ళిచేసుకో అంటూ తన చెప్పు తీసి, బోయజుగారికి ఇస్తారు. ఈ రకముగా బోయజుగారు రూతుని వివాహం చేసుకొన్నారు. ఇది BC 1279లో జరిగింది. రూతు దేవునికోసం ఎన్నో కష్టాలు పడింది. శ్రమలు ఓర్చింది. నిందలు అవమానాలు ఓర్చుకొంది. ఆకలిబాధ అనుభవించింది. రాజకుమార్తె ఎండలో కష్టపడాల్సి వచ్చింది. అయితే దేవుడు ఆమె నీతికి ప్రతిఫలంగా ఒక రాణిలా బ్రతికేలా చేసారు దేవుడు.
వివాహం జరిగేటప్పుడు వారు నీ ఇంటికి వచ్చిన స్త్రీని దేవుడు రాహేలుని పోలినదానిలా, లేయాను పోలిన దానిలా చేయును గాక అని దీవించారు. రాహేలు సంతానం యోసేపు, బెన్యామీను. యోసేపు సంతానం ఎఫ్రాయిము, మనష్షేలు. ఎఫ్రాయిం, బెన్యామీనుల సంతానం ఎంతగా విస్తరించిందో సంఖ్యాకాండము లో మనం చూస్తాం. ఇంకా తామారు యూదాకు కన్న సంతానం లాగ అవ్వాలని దీవించారు. తామారు యూదా భార్యకాదు. కోడలు. వీరికి పుట్టిన సంతానం పెరెసు. పెరేసు సంతానం ఎంతగా విస్తరించిందో మనం చూడొచ్చు. మిగతా గోత్రికులందరికంటే యూదా గోత్రికులు ఎక్కువ. నిజంగా వీరి దీవెన రూతు జీవితంలో ఫలించింది. ఆమె గర్బం నుండి ఓబేదు, యెష్షయి , దావీదు గారు వచ్చారు. యేసు ప్రభులవారిని దావీదు కుమారుడా అని పిలుస్తారు. వీరంతా ఆమె గర్భము నుండే వచ్చే ఘనతకు దేవుడు ఆమెకు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను పాలించిన రాజవంశం ఆమె కడుపునుంది వచ్చినదే!
4:13 ప్రకారం రూతు గర్భవతిగా అవ్వడానికి దేవుడు చేసారు అని వ్రాయబడిఉంది. అయితే Biblical Archealogy అనే బైబిల్ పండితుల అబిప్రాయం ప్రకారం BC 1279లో రూతు బోయజుల వివాహం జరిగినా వారికి ఓబేదు 1207 లో అనగా రూతుకి 90 సం.లు, బోయజుకి 110 సం.లు, నయోమికి 120 సం.లు వయస్సులో రూతు ఓబెదుని కన్నది అంటారు. అయితే బైబిల్ ఈ విషయం దృవీకరించలేదు. 90 సం.ల శారమ్మ, 100సం.ల అబ్రహాము గారి గురుంచి వ్రాయబడినప్పుడు, వృద్దులైన జెకర్యా, ఎలీషబెతు కోసం వ్రాయబడినప్పుడు వీరికోసం కూడా వ్రాయబడాలి కదా! అందుకే మిగతా బైబిల్ పండితులు దీనిని అంగీకరించరు. ఏదిఏమైనా వీరిద్దరికీ ఓబేదు పుట్టినట్లు బైబిల్ మరియు చరిత్ర చెబుతుంది. ఈ ఓబేదు దావీదు గారి తాతగారు. ఈ విధముగా మోయాబీయురాలైన రూతు, దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి హత్తుకొని ఉండడం వల్ల ఆమె ఆశీర్వదించబడి, యేసుప్రభులవారి వంశావళిలోనే ఆమె పేరు వ్రాయించి ఆమెకు అత్యంత ఘనత కలిగించారు.
ముగింపు: దేవుణ్ణి విడచి తిరిగితే –నయోమిలా రిక్తురాలిగా మారిపోతావ్! నయోమిలా తిరిగి బుద్ధితెచ్చుకొంటే (తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొన్నట్లు) దేవునితో తిరిగి అంటుకట్టబడతావు. అప్పుడు దేవునిలో స్థిరంగా ఉంటె దేవుడు అత్యధికముగా దీవిస్తారు రూతులా! దేవుని రెక్కల క్రింద ఆశ్రయం కోరిన వారిని దేవుడు ఎంతమాత్రము త్రోసివేయరు. యేసు ప్రభులవారు నీకు నాకు సమీపబంధువు. నీ సంఘకాపరి, పరిశుద్ధాత్మ చెప్పినట్లు చేస్తూ, యేసుప్రభులవారి దగ్గరికి వచ్చి, అయ్యా! నీకొంగు నాకు కప్పి నాకు సమీపబంధువై నన్ను మీ సంరక్షణలోనికి తీసుకోండి అని వేడుకుంటే వెంటనే యేసయ్య నిన్ను చేర్చుకొని తన రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తారు. రూతులాంటి భాగ్యము నీవు కూడా పొందుకోగలవు. రూతు జీవితం మనందరికీ గొప్ప పాటం.
నీవెవరివైనా సరే! యేసయ్యకి నీవు కావాలి. ఏజాతి వాడవైనా, ఏమతం వాడవైనా యేసయ్య నిన్ను త్రోసివేయరు. కష్టాలు తట్టుకొంటే రూతు ఆశీర్వదించబడినట్లు నీవును ఆశీర్వదించబడతావు. నేడే ఉన్నపాటున యేసయ్య దగ్గరికి రా!
అట్టి కృప భాగ్యం మనందరికీ కలుగును గాక!
ఆమెన్!
(సమాప్తం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి