రోమా పత్రిక - పార్ట్-1

*రోమా పత్రిక*
*మొదటి భాగం- ఉపోద్ఘాతము*
   
రోమా 1:16-17
16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. 
17. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. 

                 దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! యేసుక్రీస్తు ప్రభులవారి ప్రశస్తమైన నామంలో మీ అందరికి శుభాదివందనాలు! ఆధ్యాత్మిక సందేశాలు-7 భాగంగా మరోసారి మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది.
 కొలస్సీపత్రిక ధ్యానం తర్వాత చాలామంది రోమాపత్రిక, గలతీపత్రికల మీద వాఖ్యానం వ్రాయమని కోరారు. రోమా పత్రిక మీద వాఖ్యానం రాసేటంత జ్ఞానం నాకు లేదు. కారణం బైబిల్ గ్రంధంలో ఉన్న వేదాంతంలో నూటికి 85% ఈ రోమా పత్రికలోనే ఉంది. అంతేకాదు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం- రోమాపత్రిక అర్ధమయితే- మొత్తం బైబిల్ అర్ధమైనట్లే!  దేవుని ప్రణాళిక, రక్షణ సిద్ధాంతం, ఆయన దైవత్వం అన్ని ఈ రోమాపత్రికలోనే ఇమిడియున్నాయి.  నేను వేదాంత పండితుడ్ని, వేదాంత కళాశాల అధ్యాపకుడ్ని కూడా కాదు కాబట్టి ఆ వేదాంతం జోలికి పోకుండా, ఈ రోమా పత్రిక ద్వారా దేవుడు / పరిశుద్ధాత్ముడు మనతో ఏమి మాట్లాడుచున్నాడో మాత్రము ధ్యానం చేద్దాం. మనకు ఎంతవరకు అవుసరమో అంతవరకూ మాత్రమే ధ్యానం చేద్దాం! *కారణం నీ వేదాంత డిగ్రీ, వేదాంత విద్య, నీ వేదాంత పటిమ నిన్ను పరలోకం ఎంతమాత్రము చేర్చలేదు. అది కేవలం  దేవునిపట్ల నీ అభిలాషను మాత్రము తీర్చగలదు. దేవుడు ఏమిటి అనేది మాత్రము వేదాంతం చెబుతుంది. అయితే వేదాంతం నీకు ఏమీ రాకపోయినా పర్వాలేదు గాని ఆయన రక్షణ ప్రణాళిక ద్వారా నీవు పాపివని గ్రహించి, పశ్చాత్తాప పడి, యేసు రక్తంలో నీపాపాలు కడిగివేసుకుని, రక్షణ పొంది సాక్షార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం జీవిస్తే చాలు పరలోకం చేరడానికి. వేదాంత విద్య చదివిన వాడికి, వేదాంతం తెలిసిన వాడికి పరలోకంలో ఏవిధమైన ప్రత్యేకస్థానం గాని, ప్రత్యేకహోదా గాని ఎంతమాత్రము లేవు! గాని అనేక ఆత్మలు క్రీస్తుకై సంపాదించిన వానికి, క్రీస్తుకై అనేక శ్రమలు సహించి, క్రీస్తుకై జీవించిన వానికి, జయించిన వానికి వేదాంతవిద్య లేకపోయినా సరే పరలోకంలో ప్రత్యేకస్థానం, ప్రత్యేక బహుమతులు ఉంటాయి. కాబట్టి వేదాంతం జోలికి పోకుండా పరిశుద్ధాత్ముడు ఈ రోమా పత్రిక ద్వారా మనతో ఏమి మాట్లాడుచున్నారో మాత్రమే అవసరమైనంత వరకు ధ్యానం చేద్దాం*!

*పత్రిక రాసింది ఎవరు*?
రోమా 1:17 ప్రకారం అపోస్తలుడైన పౌలుగారు!

*ఎక్కడ రాశారు? ఎప్పుడు రాశారు*?
పౌలుగారు నాలుగు మిషనరీ యాత్రలు చేశారు. మూడో మిషనరీ యాత్ర చివర్లో కొరింథీ పట్టణంలో (గ్రీకుల కోలనీ) మూడు నెలలు ఉన్నారు. (అపో 20:2౩)  కారణం మధ్యధరా సముద్రప్రాంతం మరియు నల్ల సముద్రం  చలికాలం ప్రయాణాలకు , ముఖ్యంగా ఓడ ప్రయాణాలకు అనుకూలించదు. కారణం ఆ సమయంలోనే అనేక తుఫానులు వస్తాయి ఆ ప్రాంతంలో. ఉదాహరణకు అపో 27  ప్రకారం పౌలుగారు వారించినా చలికాలంలో ప్రయాణం చేసి, ఆస్తి నష్టం సంభవించింది.  అందుకే పౌలుగారు ఆ కొరింథీ పట్టణంలో మూడునెలలు ఆగుతారు. అప్పుడు రాసింది ఈ పత్రిక. బహుశా క్రీ.శ. 55-57 ల మధ్య రాసినది. 

*ఎందుకు రాశారు*?
1). అదే సమయంలో అపో 20:2--3; రోమా 15:25--28 ప్రకారం కొన్ని సంఘాల వారు యేరూషలేము లో ఉన్న పరిశుద్ధులకు కానుక/ చందా వసూలు చేసి, పౌలుగారికి ఇస్తారు. దానిని యేరూషలేములో అప్పగించి, స్పెయిను దేశానికి నాలుగవ మిషనరీ ప్రయాణంగా వెళ్దామని పౌలుగారి ఆకాంక్ష. ఆ యాత్ర మార్గమధ్యంలో రోమా పట్టణం మీదుగా వెళ్తుంది కావున రోమా పట్టణం లో సువార్త ప్రకటించాలి అనుకున్నారు పౌలుగారు. ఆ యాత్రకు ముందుగా తననుతాను పరిచయం చేసుకుంటూ వ్రాసిన పత్రిక ఇది.

*తననుతాన పరిచయం చేసుకోవలసిన అవసరం ఎందుకొచ్చింది*?
కారణం కొలస్సీ ప్రాంతం లాగానే పౌలుగారు రోమా పట్టణం క్రీ.శ. 55 వరకు వెళ్ళలేదు. అక్కడ సంఘం ఉంది అని మాత్రమే తెలుసు! సంఘవివరాలు అంతగా తెలియదు. అందుకే పరిచయం చేసుకుంటున్నారు.

2) పౌలుగారు ప్రయాణం చేసి సువార్త చెప్పిన ప్రతీ ప్రాంతంలోనూ ఆయన బోధను అడ్డగించిన వారు ఎక్కువ, మరియు ఆయన చేస్తున్న బోధ ముఖ్యంగా సున్నతికి వ్యతిరేకమైన బోధ, ఈ బోధ చెదరిపోయిన యూదులకు అర్ధమయ్యేది కాదు. అందుకే ఆయన బోధమీద వ్యతిరేఖత ఉండేది. అందుకే అలాంటి వ్యతిరేఖత లేకుండా ముందుగానే తను ఎవరు, తన బోధ సారాంశం ఏమిటి అనేది రాసి పంపుతున్నారు.

౩) ఆ కాలంలో చెదరిపోయిన యూదులు, రక్షించబడిన తర్వాత అన్యులకంటే అతిశయపడేవారు కారణం యేసుప్రభులవారు యూదుడు కాబట్టి. అయితే ఇది తప్పు , యూదుడైన , అన్యుడైన దేవుని దృష్టిలో సమానమే అని చెప్పడానికి వ్రాశారు.  అందుకే ఈ పత్రికలో తనను తానూ అన్యజనులకు అపోస్తలుడిగా పరిచయం చేసుకుంటున్నారు. రోమా 11:13

*గమనిక*: ఈ పత్రికలో ఎక్కడైతే గ్రీకు దేశస్తుడైనా అని వ్రాయబడిందోదానిని కొరింథీ వారు అని అర్ధం చేసుకోగలరు. కారణం అప్పటికి ఈ దేశాలన్నీ రవి అస్తమించని రోమా సామ్రాజ్యం క్రింద ఉండేవి. ఆ రోమనులుకు ముఖ్య జ్ఞాన బండారం గ్రీకు. కొరింథీ కూడా గ్రీకుల కోలనీ!

*ఎవరికీ రాశారు?*
రోమా పట్టణంలో ఉన్న చెదిరిపోయిన యూదులకు, రక్షించబడిన అన్యులకు. అనగా రోమాలో ఉన్న సంఘానికి!

*రోమా సంఘాన్ని ఎవరు స్తాపించారు?*
తెలియదు! పౌలుగారు అక్కడికి వెళ్ళనే లేదు. అందుకే తననుతాను పరిచయం చేసుకుంటున్నారు. అయితే అనేకమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం: అపోస్తలులు కార్యములు 2 ప్రకారం  పెంతుకోస్తు దినాన  ఆది అపోస్తలులు పరిశుద్ధాత్మ భాప్తిస్మము  పొందిన అనంతరం అన్యభాషలు మాట్లాడుతూ దేవుని ఆరాదిస్తుంటే అనేకమంది అనగా సుమారు 28 భాషలు మాట్లాడిన వారు వచ్చి, పేతురుగారి ప్రసంగం వింటారు. అప్పుడు ౩౦౦౦ మంది రక్షణ పొందుతారు. అలా రక్షణ పొందిన యూదులు రోమా పట్టణం వెళ్లి సువార్త ప్రకటించి, సంఘాన్ని స్తాపించారు అని అనేకుల నమ్మకం.  అయితే కొంతమంది యేసుప్రభులవారి మరణం తర్వాత కలిగిన శ్రమలకు చాలామంది రక్షించబడిన యూదులు చెదరిపోయారు అనేక దేశాలకు. వారిలో కొంతమంది రోమా పట్టణం వచ్చి సంఘాన్ని స్తాపించి ఉంటారు అంటారు.
ఏదిఏమైనా పౌలుగారిని వాడుకుని పరిశుద్ధాత్ముడు కొలస్సీపత్రికద్వారా యేసుక్రీస్తు దైవత్వాన్ని అన్యజనులకు అర్ధం అయ్యేలా ఎలా వ్రాయించుకున్నారో అలాగే అదే పౌలుగారిని ఉపయోగించుకుని పరిశుద్ధాత్ముడు సంఘానికి కావలసిన వేదాంతం అంతా ఈ రోమా పత్రిక ద్వారా వ్రాయించారు.  నిజంగా దీనిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం!

*రచనా శైలి*!

*పౌలుగారు ఎందుకు ఇలాంటి వేదాంత దోరణిలో ఈ పత్రిక వ్రాశారు*?
తను ఉన్నది, రాసింది గ్రీకుల కోలనీ అయిన కొరింథీ కాబట్టి, అక్కడినుండే అన్ని ప్రాంతాలకు వేదాంతజ్ఞానం, క్రొత్త క్రొత్త విషయాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి కాబట్టి; గ్రీకులకు, రోమాలో ఉన్న పండితులకు కూడా అర్ధం అయ్యేలా వేదాంత దోరణిలో వ్రాయడం జరిగింది గాని కేవలం తన జ్ఞానం ప్రదర్శించడానికి ఎంతమాత్రమూ కాదు. అంతేకాదు రోమా ప్రపంచానికి అప్పటిలో ముఖ్య పట్టణం కాబట్టి, అక్కడ సంఘాన్ని బలపరిస్తే అక్కడినుండి సువార్త విరివిగా అన్ని దేశాలకు వ్యాపిస్తుంది అనే ఉద్దేశ్యంతో అక్కడ ఉన్న పండితులకు అర్ధం అయ్యేరీతిలో ఈ ఉత్తరం రాశారు. కారణం ఆయన ఉపయోగించిన రచనాశైలి ప్రకారం మహా పండితులు కూడా ఈ ఉత్తరాన్ని తేలికగా తీసిపారేయలేరు.  కాబట్టి తనకు దేవుడు బయలు పరచిన దైవమర్మాలు అన్ని పండితుల భాషలో రాసారు పౌలుగారు~!

*రోమా పత్రిక పౌలుగారు రాసిన మొదటిపత్రికా*?
కాదుకాదు! బహుశా పౌలుగారు రాసిన మొదటి పత్రిక గలతీ పత్రిక గాని, థెస్సలోనికయలుకు రాసిన పత్రిక గాని. ఆ తర్వాత 1,2 కొరింథీ పత్రికలూ రాశారు క్రీ.శ. 55 లో. ఆ తర్వాతనే ఈ రోమా పత్రిక రాశారు.  కాబట్టి బైబిల్ లో ఈ పత్రిక మొదటగా ఉంది అని మొదటిపత్రిక అని అనుకోవద్దు!

  కాబట్టి ప్రియులారా! మీ జ్ఞానం, పాండిత్యం, మీ టైటిల్, మీ కులం (యూదుడు, అన్యుడు), మీ ప్రాంతం మిమ్మల్ని పరలోకం చేర్చదు గాని, రక్షించబడి, వాక్యానుసారమైన జీవితం జీవిస్తేనే పరలోకం వెళ్తావు. ఒకవేళ నీవు అలాంటి అపోహలలో ఉంటే, అనగా నేను సంఘపెద్దను, పాష్టర్ని, పాష్టర్ గారి కొడుకుని, కూతుర్ని, నేను ఎక్కువగా కానుకలు ఇస్తాను, కాబట్టి పరలోకం డైరెక్ట్గా వెళ్తాను అనుకుంటే పొరపాటు పడుతున్నావని మరచిపోకు!
 వాక్యానుసారమయన జీవితం, సాక్షర్ధమైన జీవితం జీవిస్తేనే పరలోకం అని తెలుసుకో!

దైవాశీస్సులు!

*రోమా పత్రిక-రెండవ భాగం*
*ఉపోద్ఘాతము-2*

    రోమా 1:16-17
16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. 
17. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.

                 ప్రియ దైవజనమా! గతభాగంలో పౌలుగారు ఈ పత్రికను ఎందుకు రాశారు, ఎక్కడ రాశారు లాంటి వివరాలు చూసుకున్నాం. ఈ రోజు మరో కొన్ని వివరాలు చూసుకుందాం!

  ప్రియులారా! ఈ పత్రికను ముఖ్యంగా మూడుభాగాలుగా విభజించవచ్చు!

*రోమా 1౩ అధ్యాయాలు*: Doctrine of Justification by Faith in Jesus Christ; విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అనెడి సిద్దాంతము;

*48*: Example of Doctrine of Justification by Faith, using Abraham’s life. And how we can apply this Doctrine in our lives; అబ్రాహాము గారి జీవితం ద్వారా విశ్వాసపు సిద్ధాంతాన్ని వివరించడం. అది మన జీవితాలలో ఎలా అన్వయించుకోవాలి?

*916*: ఇశ్రాయేలీయుల పిలుపు- వారు సువార్తను తిరస్కరించుట- అన్యుల రక్షణ- యూదులు అన్యులు దేవుని దృష్టిలో సమానమే , ముగింపు

*వివరంగా చూసుకుంటే*:
1:17: శుభాదివందనాలు
1:815: పౌలుగారి కృతజ్ఞతాపూర్వక ప్రార్ధన
క్రీస్తులో రక్షణ: 1:168:36
1:1617: దేవుని  నీతి
1:18౩:20 : గద్దింపు,  1:1832: దేవుని తీర్పు , 2:14: వేషధారులకు హెచ్చరిక; ౩:215:11: నీతిమంతులుగా తీర్చబడుట:  రక్షణ సిద్దాంతం- నీతిమంతులుగా తీర్చబడే సిద్దాంతం
511: దేవుని స్తిరమైన రక్షణ ప్రణాళిక
58: క్రీస్తు రక్తము పాపమనే దాస్యమునుండి విడుదల చేయుట, దేవునితో సఖ్యపరచి, దేవునితో ఐక్యము చేయుట, వారి రక్షణను ఏ అన్య శక్తి వేరుచేయలేదు
912: ఇశ్రాయేలీయుల పిలుపు- వారు సువార్తను తిరస్కరించుట- అన్యుల రక్షణ
1215:13  : విశ్వాసుల రూపాంతరం
13:17: విశ్వాసులు తప్పకుండా అధికారులకు, అధికారానికి లోబడి యుండాలి.
1516: ముగింపు మాటలు:

 చివరగా: *ఈ ఉత్తరం ఎవరు రాశారు?* గతభాగంలో చెప్పిన విధముగా పౌలుగారు. అయితే అతి తెలివితేటలు గలవారికి జవాబు: పౌలుగారి చేతివ్రాత బాగోదు. అంతేకాకుండా తనకు సంభవించిన హింసల వలన ఆయన తన చేతితో భాగా వ్రాయలేకపోయేవారు. అందువలన ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై చెబుతూఉంటే ఆయన అనుచరులు వ్రాసేవారు ఆయన పత్రికలు! ఈ పత్రిక పౌలుగారు చెబుతుంటే తెర్తియు అనే వ్యక్తి వ్రాసాడు రోమా 16:22;  అయితే వ్రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే!!!

*ఈ పత్రిక రోమీయులకు తీసుకుని వెళ్ళింది ఎవరు*?
నిజంగా ఈ వ్యక్తి శ్లాఘనీయమైన వ్యక్తి!! కారణం ఆ వ్యక్తి ఒక స్త్రీ!! ఆమె పేరు ఫేబే!  ఆమె మొదటగా కేంక్రేయ సంఘానికి డీకన్! సంఘ పరిచారకురాలు! రోమా 16:12;
   అయితే స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదు అన్న పౌలుగారి మాటను తీసుకుంటారు గాని ఆమెను కేంక్రేయ సంఘానికి డీకన్ గా పెట్టారు పౌలుగారు. మరి ఎందుకు ఒప్పుకున్నారు? జవాబు సింపుల్!  కొరింథీ సంఘ పరిస్తితులు వేరు, అంతేకాకుండా వారు పురుషుల మీద పెత్తనం చేసేవారు ఆ రోజులలో! అందుకే పౌలుగారు అలా ఉన్నారు. పౌలుగారు ఎప్పుడూ స్త్రీని చిన్న చూపు చూడలేదు. అక్క చెల్లి, తల్లి అని సంభోదించే వారు.

 సరే, పౌలుగారు రోమా పత్రిక రాసి ఎవరితో పంపించాలి అనే తర్జన భర్జనలో ఉన్నప్పుడు ఎవరూ ముందుకు రాలేదు ఆ ఉత్తరం తీసుకుని రోమా పట్టణం ఇవ్వడానికి. కారణము 1. ఆ రోజులలో ఎక్కడ చూసిన యుద్ధాలు, అంతర్యుద్ధాలు, రోమా సైనికులతో యుద్ధాలు, 2. మరోప్రక్క బందిపోటు దొంగలు, ౩. సముద్రపు దొంగలు, అందుకే భయపడిపోయారు. 4. రోమా సంఘంలో ఎవరు ఇతరులకు తెలియదు. కారణం అప్పుడు రోమను సంఘం సార్వత్రిక సంఘంతో పొత్తులేనట్టు ఉండేది. కారణం అక్కడికి వెళ్తే రోమనులు చంపేస్తారు అనే భయం కావచ్చు!  ఈ సమయంలో   ఈ డీకన్ ఫేభే అనే స్త్రీ ధైర్యంగా మందుకు వచ్చారు , నేనున్నాను  నన్ను పంపండి పౌలుగారు అని చెప్పారు ఈవిడ! పోలుగారు ఆమె ధైర్యసాహసాలకు ఆశ్చర్యపడ్డారు. ఆమె సామర్ధ్యం మీద పౌలుగారికి ఎటువంటి అనుమానం లేదు, కారణం ఒక స్త్రీయై ఉండికూడా కేంక్రేయ సంఘాన్ని సమర్ధవంతంగా నడిపిస్తూ వస్తున్నారు ఆవిడ! అంతేకాకుండా రోమా సంఘం తో కూడా కొద్దిగా పరిచయం ఉంది ఆమెకు అంటారు. గమనించాలి ఈ కేంక్రేయ అనేది కొరింథీ పట్టణానికి సుమారు 20 కి.మీ దూరంలో ఉంటుంది.  ఈమె కొరింథీ పట్టణం వచ్చి- పౌలుగారి పత్రిక తీసుకుని- సుమారు 15౦౦ కి.మీ. సముద్ర మార్గముగా, రోడ్డు ప్రయాణం గుర్రం మీద లేదా ఒంటె మీద  ప్రయాణం చేసి రోమా పట్టణం వెళ్లి ఆ సంఘానికి ఉత్తరం క్షేమంగా అందించారు. మార్గమధ్యంలో ఆమె ఎలాంటి కష్టాలు పడిందో మనకు తెలియదు, కారణం ముందుగా చెప్పినట్లు అప్పుడు యుద్దాలు విరివిగా జరిగేవి, ఇలాంటి పరిస్తితులలో అన్నింటికీ తెగించి, అన్నింటినీ భరించి ఒక స్త్రీ సుమారు 15౦౦ కి.మీ దూరం ప్రయాణం చేసి ఒక ఉత్తరం చేరవేసింది అంటే నిజంగా ఎంతకష్ట పడిందో కదా ఆవిడ! నేను అనుకుంటాను ఆమెకు దేవుడు తప్పకుండా భళా నమ్మకమైన మంచి దాసురాలా అని తప్పకుండా పిలుస్తారు. ఆమె ఒకవేళ ఆ ఉత్తరాన్ని రోమీయులకు చేరవేయలేకపొతే మనం ఈ రోజు ఇంత ఉత్తమమైన ఉత్తరాన్ని పొందుకుని ఉండలేము కదా!

  కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు స్త్రీవని, పురుషుడవని, చదువులేదు అని ఇలాంటి అభిప్రాయాలు పెట్టుకోవద్దు! గాడిదను వాడుకున్న దేవుడు, చదువురాని చేపలు పట్టుకునే పేతురు యోహాను లను వాడుకున్న దేవుడు, పశువులు మేపుకుంటున్న ఆమోసును వాడుకున్న దేవుడు నిన్నుకూడా వాడుకోడానికి సిద్దముగా ఉన్నారు. మరి నీవు సిద్దమా??!! నీవు చేయవలసింది కేవలం ఆయన మాటకు సంపూర్ణ విధేయత చూపడం, ఆయన చెప్పినట్లు చేయడం మాత్రమే! మరినీవు సిద్ధమా? అయితే ఆయన నిన్నుకూడా వాడుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెన్!
దైవాశీస్సులు!






*రోమా పత్రిక-మూడవ భాగం*
*అపోస్తలుడిగా పిలువబడిన వాడు*
   
      రోమా 1:1-2
1. యేసు క్రీస్తు( క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును, 
2. దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది. 

      ప్రియ దైవజనమా! ఈ మొదటి వచనంలో పౌలుగారు యేసుక్రీస్తు దాసుడను అని తననుతాను పరిచయం చేసుకుంటున్నారు. ఇన్ని ప్రత్యక్షతలు, ఆధిక్యతలు, వరాలు ఫలాలు కలిగిన వ్యక్తి, నేను ఇంతోడ్ని, అంతోడ్ని అని చెప్పుకోకుండా నేను యేసుక్రీస్తు దాసుడను అనగా ఒకరకంగా చెప్పాలంటే క్రీస్తు బానిసను అని పరిచయం చేసుకుంటున్నారు. నేటిరోజులలో చాలామంది ఏ ప్రత్యక్షతలు లేకుండానే, సేవానుభవం లేకుండానే తమ పేరు ముందు అపోస్తలుడు, రెవరెండు- ఇరవైరెండు అని పెట్టుకుంటున్నారు. గాని ఈయన నేను మొదటగా యేసుక్రీస్తు దాసుడను అంటూ, తర్వాత అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడను అని చెప్పుకుంటున్నారు. ఇది నిజమా? అపోస్తలుడిగా పిలువబడ్డారా పౌలుగారు?

  నిజం అది! అపోస్తలులు కార్యములు 9 వ అధ్యాయములో వ్రాయబడింది.  ఇదే విషయాన్ని అననీయ భక్తునికి దేవుడు చెప్పారు..Acts(అపొస్తలుల కార్యములు) 9:5,6,11,12,13,15,16,17
5. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించుచున్న యేసును; 
6. లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. 
11. అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. 
12. అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను. 
13. అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. 
15. అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు(మూలభాషలో-పాత్రయైయున్నాడు) 
16.ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. 
17.అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతనిమీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టిపొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్ల నన్ను పంపియున్నాడని చెప్పెను.  . . . .

 ఇదే విషయాన్ని అపోస్తలుల 13వ అధ్యాయంలో దేవుడు చెప్పారు పౌలుగారిని, బర్నబా గారిని అపోస్తులులుగా ప్రత్యేకించి, వారిని అపోస్తాలులుగా చేయమంటే వారు ప్రార్ధనచేసి- పౌలుగారిని, బర్నబా గారిని ఆర్డినేషన్ చేసారు. Acts(అపొస్తలుల కార్యములు) 13:1,2,3
1. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతో కూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి. 
2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మనేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. 
3. అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.  
ఎప్పుడైతే వీరికి ఆర్డినేషన్ జరిగిందో, వారిని దేవుడు అన్యజనులకు అపోస్తలులుగా చేసినట్లు ఆది అపోస్తలులైన పేతురు, యోహాను, యాకోబు గార్లకు తెలిసిందో, వీరు మరలా యేరూషలేము వచ్చినప్పుడు ఈ ఆది అపోస్తలులు- పౌలుగారికి, బర్నబా గారికి కుడిచేయి ఇచ్చి అనగా షేక్ హాండ్ ఇచ్చి, పౌలుగారు, బర్నబా గారు అన్యజనులకు అపోస్తలులు అని నిర్ధారించారు. అనగా ఒకలాగా చెప్పాలంటే This is to Certify that Mr. Paul and Mr. Barnabas are elected as Apostles to the Gentiles అని ఈ పెద్దలు సర్టిఫికేట్ ఇచ్చారన్నమాట! తనకుతానుగా నేను అపోస్తాలుడను అని పౌలుగారు చెప్పుకోలేదు. అలాగే నేటిరోజులలో డిగ్రీలు కొనుక్కొన్నట్లు ఎక్కడా కొనుక్కోలేదు.

    ఇంతకీ అపోస్తలుడు అంటే ఎవరు- దేవుని సేవకు పిలువబడిన వాడు. అపోస్తలునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మొదట సేవకుడిగా, పరిచారకుడిగా ఉండాలి. ఆ తర్వాత ప్రవచన వరం కలిగి ప్రవచించాలి. కాపరిగా ఉండాలి. ఇవన్నీ జరిగాక అద్భుతాలు చేసే వరం కలిగి అన్ని వరాలు ఫలాలు ఆపరేట్ చేయగలిగి ఉండాలి.. అప్పుడు ఆ వ్యక్తి అపోస్తలుడు అవుతాడు. ఇవన్నీ పౌలుగారు జీవితంలో జరిగాయి. ఈ విషయాన్ని 2 కొరింథీ 12:11 లో పౌలుగారు చెబుతున్నారు. 
సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను. . . .   అయితే దేవుడు మొదటగా అపోస్తలుడిగా ఉండటానికే పిలువబడ్డాడు.

   సరే పిలువబడిన తర్వాత ఏం చేశారు పౌలుగారు? 2 కొరింథీ  11వ అధ్యాయం ప్రకారం ఎన్ని కష్టాలు పడ్డారో మనం చూడవచ్చు. 2328 
23. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని. 
24. యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; 
25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని. 
26. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను,సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని. 
27. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. . . .

   పౌలుగారు అపోస్తలుడిగా ఉండటానికి పిలువబడ్డారు, ఇన్ని శ్రమలు క్రీస్తుకై అనుభవించి కొన్ని వేల ఆత్మలను ప్రభువుకై సంపాదించారు. మరి అపోస్తలుడు, కాపరి, రెవరెండ్ అని పేరు పెట్టుకుంటున్న ప్రియ సహోదరులారా! మీరు దేవునికోసం ఎన్ని శ్రమలు అనుభవించారు? ఎన్ని ఆత్మలను సంపాదించారు?  ఇక ప్రతి విశ్వాసి కూడా దేవుని కొరకు పిలువబడ్డారు! దేవుని సేవ అందరూ చేయాలి, ప్రకటించాలి. మరి దేవుని కొరకు నీవేమి చేశావు? ఎన్ని కష్టాలు పడ్డావు? సుఖం కలిగినప్పుడేనా దేవునికి స్తోత్రం! కష్టాలు వచ్చినప్పుడు లేదా? ఆ సిలువపై నీకోసం అన్ని శ్రమలు పడ్డారు కదా దేవుడు నిన్ను, నన్ను రక్షించడానికి! మరి నీవు ఆయన పడిన శ్రమలలో కొద్దిగానైనా పడలేవా? ఇదేనా దేవునిపై ఉన్న భక్తీ, ప్రేమా!? మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యము ప్రవేశించాలి అని ముందుగానే చెప్పారు కదా! దేవుణ్ణి నమ్ముకుంటే నీకు శ్రమలన్ని, కష్టాలన్నీ పోతాయి అనే తప్పుడు బోధనలను దయచేసి నమ్మవద్దు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీకున్న శ్రమలు ఇంకా పెరుగుతాయి. గాని తట్టుకుంటే, జయిస్తే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తారు. మరి నీవు సిద్దమా? శ్రమలను సహిస్తావా?
అట్టి భాగ్యం కృప దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
*రోమా పత్రిక-నాల్గవ భాగం*
*అపోస్తలుడిగా పిలువబడిన వాడు-2*
   
      రోమా 1:1-2
యేసు క్రీస్తు( క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును, 
2. దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది. 

    ప్రియులారా! గతభాగంలో అపోస్తలుడిగా పిలువబడినవాడు అనే విషయం చూసుకున్నాం. ఈ రోజు రెండో వచనంలో గల మరో రెండు విషయాలు చూసుకుందాం.

1). దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడు
2) దేవుని ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారు

   మొదటగా పౌలుగారు దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడను అని చెప్పుకుంటున్నారు. మరి అది నిజమా అంటే నిజమే! మరలా మనం అపోస్తలుల కార్యములు 9 మరియు 13 అధ్యాయాలు ధ్యానం చేస్తే ఇదే విషయాలు స్పష్టముగా వ్రాయబడి యున్నాయి. వైద్యుడైన లూకా ఏదో పత్రిక రాసెయ్యాలని రాయలేదు గాని, అందరిని ఇంటర్యూ చేసి, ఆ చెప్పిన విషయాలు నిజమా కాదా అని మరికొందరిని అడిగి తెలిసికొని రూఢిచేసుకున్న తర్వాతనే వ్రాసారు. అపోస్తలుల 13 ప్రకారం మీరు పౌలును బర్నబాను నేను పిలిచిన పనికి ప్రత్యేకించుడి అని పరిశుద్ధాత్మ దేవుడే చెబితే వారు వారికి అనగా పౌలుగారికి బర్నబా గారికి ఆర్డినేషన్ చేసారు. ఇక్కడ పౌలుగారు అదే విషయాన్ని చెబుతున్నారు. లేనిపోని గొప్పలు చెప్పడం లేదు. సరే ప్రత్యేకించబడ్డారు కాబట్టే అందరికంటే ఎక్కువ దెబ్బలు తిన్నారు. ఎక్కువగా కష్టపడ్డారు. ఎక్కువ ఆత్మలను క్రీస్తుకై సంపాదించ గలిగారు.

      పౌలుగారే కాదు ప్రియ దైవజనమా నీవునేను కూడా ప్రత్యేకించబడిన జనము. మూర్కులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందమని చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు. అపొస్తలుల 2:40; కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారము కాబట్టి అన్యులు చేసినట్లు మనము చేయకూడదు. అన్యాచారాలు మనం ఎంతమాత్రము చేయకూడదు. అన్యులు ప్రవర్తించినట్లు మనం ఎంతమాత్రము ప్రవర్తించకూడదు! నీ మాట ప్రత్యేకముగా ఉండాలి. నీ చూపు పవిత్రముగా ప్రత్యేకముగా ఉండాలి! నీ చేష్టలు ప్రత్యేకముగా ఉండాలి. అన్యులు త్రాగినట్లు నీవు త్రాగకూడదు! అన్యులు చేసినట్లు నీవు వేషధారణ, వస్త్రధారణ చేయకూడదు. అన్నీ ప్రత్యేకముగా ఉండాలి. దానియేలు, షడ్రాక్, మేషాక్, అబెద్నేగోలు ప్రత్యేకముగా జీవించారు. తద్వారా కష్టాలకు శ్రమలకు గురయ్యారు. అయినా సహించారు. గొప్ప అధికారులు కాగలిగారు. ముఖ్యంగా రాజుచేతనే వీరు పూజిస్తూ, సేవిస్తున్న దేవుడు పూజార్హుడు అని అనిపించగాలిగారు! దానియేలు 3; నీవు ఎప్పుడైనా అలా నీ స్నేహితులతో, అన్యులతో నిజంగా మీ దేవుడు గొప్పవాడుఅని అనిపించగలిగావా??!! పౌలుగారు 2 కొరింథీ 6:17 లో అంటున్నారు 
17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. . . . .  

  కాబట్టి ప్రియ విశ్వాసి! నీవు ప్రత్యేకముగా ఉండుటకు పిలువబడ్డావు కాబట్టి పాపిష్టి పనులు చేయకూడదు.  మీరు రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా ఉండుటకు పిలువబడ్డారు.1పేతురు 2: 9
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
 అంతేకాకుండా వెండి బంగారముల వంటి వెలగాల వస్తువులచేత మీరు విమోచించ బడలేదు గాని క్రీస్తు రక్తముద్వారా విమోచించ బడ్డారు 1పేతురు 1:18; కాబట్టి ప్రత్యేకముగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఇంకా ఎందుకు అంటే:

2) కారణం మనము దేవుని ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారము: మొట్టమొదట దేవునికి ప్రియులుగా ఉండటానికి పిలువబడ్డాము. గత టాపిక్ హనోకు గారి జీవితమును ధ్యానం చేసినప్పుడు మనం దేవునికి ఇష్టులుగా లేక ప్రియులుగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ధ్యానం చేసుకున్నాం. మొదటగా విశ్వాసం కలిగియుండాలని, దేవునిమాటలకు సంపూర్ణ విధేయత కలిగియుండాలని, ఆయనకు లోబడి యుండాలని, మన మాటలు దేవునిని సంతోషపెట్టే విధముగా ఉండాలని, ఆయనకు ఆయాసం కలిగించే విషయాలు చేయకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు అని, దేవునికి నీ ధనము, నీ సమయము ఇచ్చి ఘనపరచాలని, దేవుని పట్ల నమ్మకముగా, ప్రేమగా ఉండాలని, నీ అంతరంగమంతా సౌందర్యముగా ఉండాలని,పరిశుద్దముగా జీవించాలని , ఇంకా యదార్ధమైన ప్రవర్తన కలిగి, నీటిని అనుసరించి, హృదయపూర్వకముగా నిజము పలకాలని ధ్యానం చేసుకున్నాం. అలా అయితేనే దేవినికి ఇష్టులుగా జీవించగలము!  

    ఇక్కడ పౌలుగారు ఇంకా స్పష్టముగా దేవునికి ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడ్డారు అని చెబుతున్నారు. గమనించాలి- దేవుడు చెప్పారు నేను పరిశుద్దుడను కాబట్టి మీరును పరిశుద్దులుగా ఉండుడి అన్నారు. లేవీ 11:44-45; 20:26; 21:8;
 అంతేతప్ప నన్ను కేవలం నమ్ముకో! కేవలం నీటిలో నా పేరున మునిగేయ్, ఆ తరువాత నీవెలా ఉన్నా పర్వాలేదు.  వెంటనే నీకు గోల్డ్ మెడల్, నిత్యజీవము, పరలోక రాజ్యము ఇచ్చేస్తానని దేవుడు చెప్పలేదు. మీరు పరిశుద్దులుగా ఉండాలి అంటున్నారు కారణం నేను పరిశుద్దుడను కనుక మీరును పరిశుద్దులుగా ఉండాలి. అలా చేస్తే నేనుండే చోటున మీరును ఉంటారు. అదే విషయాన్ని దావీదుగారు చెబుతున్నారు కీర్తన 15 లో
1. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు? 
2. యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.  . . . .

 ఇంకా అంటున్నారు ప్రకటన గ్రంధంలో అపవిత్రమైనది ఏదీ ఆయన రాజ్యంలో ప్రవేశించలేదు! కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! దేవుడు నీనుండి ఆశించేది కేవలం పరిశుద్దమైన జీవితం.  నీ డబ్బులు, ఇంకా మరేదో ఆశించడం లేదు. కేవలం పరిశుద్దమైన నీ హృదయం ఆయనకు కావాలి, అది ఆయనకు మందిరమైపోవాలి,. ఆ మందిరములో దేవుడు నిత్యమూ ఉండాలని ఆశిస్తున్నారు.  ఎప్పుడైతే పరిశుద్దమైన జీవితం జీవిస్తావో, అప్పుడే దేవునికి ఇష్టుడుగా మారి, దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు. అంతేకాకుండా దేవుడు పరిశుద్దుడు కాబట్టి నీవు పరిశుద్దముగా జీవిస్తే దేవుడే దిగివచ్చి, హనోకు గారితో దేవుడు ముచ్చటించినట్లు, ఆదాము అవ్వలతో దేవుడు ముచ్చటించినట్లు  దేవుడే దిగివచ్చి నీతో ముచ్చటిస్తూ నీతోనే ఉంటారు. నీతో నిత్యమూ నివాసం చేస్తారు. 
     కాబట్టి ప్రియ దైవజనమా! నీలో ఎటువంటి అపవిత్రత అయినా ఉంటే ఇప్పుడే దానిని విడిచిపెట్టు! ప్రభువా నన్ను క్షమించమని అడిగి దేవుని పాదాలు పట్టుకో! ఇకను పాపము చేయకు! పరిశుద్ధమైన జీవితం జీవించు! సాక్షార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, పేరుకు తగ్గట్టు జీవించు! అప్పుడు దేవుడు నీతో అనునిత్యమూ సహవాసం చేయడానికి ఇష్టపడుచున్నారు! 
మరి నీవు సిద్ధమా?
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-5వ భాగం*
   
      రోమా 1:4
4. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానముచేసెను. ...

    ప్రియులారా! ఈ వచనంలో పౌలుగారు రోమీయులకు చెబుతున్నారు యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియజేశారు. ఇది  క్రొత్త బోధ కాదు! గమనించాలి పౌలుగారు లేఖ రాస్తూ, తననుతాను పరిచయం చేసుకుంటూ, దేవుని సువార్త విషయాలు రోమీయులకు తెలియజేస్తున్నారు ఈ పత్రిక ద్వారా! అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని పౌలుగారు ఎప్పుడూ దర్శించ లేదు. అందుకే కొంచెం వివరంగా రాస్తున్నారు వారికి! బైబిల్ గ్రంధంలో వ్రాయబడినవి కేవలం ఆ ప్రాంతం వారికే అనుకోకూడదు. అవి మనందరికీ మేలు కలుగుటకై సంపూర్ణముగా వ్రాయబడ్డాయి! ఇక్కడ చెబుతున్నారు పౌలుగారు ఇవేమీ క్రొత్త విషయాలు కావు! ఈ విషయాలు ముందుగానే దేవుడు తన ప్రవక్తల ద్వారా బయలు పరిచారు!

   ఏమని చెప్పారు? ఎవరిద్వారా చెప్పారు అని లేఖనాలు పరిశీలిస్తేయూదా పత్రిక ప్రకారం హనోకు గారు ముందుగానే ప్రవచించారు యేసుక్రీస్తు తన వేవేల దూతలతో తీర్పు తీర్చడానికి రాబోతున్నారు అని. (14) ఎందుకు తీర్పు తీర్చబోతున్నారు? కారణం నమ్మి భాప్తిస్మం పొందువాడు రక్షించబడును, నమ్మనివానికి శిక్ష అని చెబితే (మార్కు 16:16) వారు నమ్మలేదు కాబట్టి, నమ్మినా తర్వాత విశ్వాస బ్రష్టులై పోయారు కాబట్టి, మరియు వారి క్రియలు చెడ్డవి కాబట్టి వారిమీదకు దేవుని ఉగ్రత యను పెనుగాలి రాబోతుంది అని దేవుడు ముందుగానే చెప్పారు. మోషే గారు చెప్పారు నావంటి ఒక ప్రవక్తను దేవుడు పంపించబోతున్నారు. ఆయనమాట మీరు వినాలి! అదంతే! ద్వితీయ18:16; ఇక ఇలా బైబిల్ గ్రంధంలో- పాత నిభందన గ్రంధంలో గల ప్రతీ పుస్తకములోనూ క్రీస్తుకోసం, ఆయన సువార్త కోసం వ్రాయబడింది. దావీదు గారు ప్రవచించారు. ఇక దావీదుగోత్రంలో యేసుక్రీస్తు ప్రభులవారు జన్మిస్తారని, యెష్షయి వేరు చిగురు అని, దావీదు గోత్రపు సింహము అని ఇలా చాలా దగ్గర వ్రాయబడియుండి. యెషయా గ్రంధం 9:6 లో ఆయన జన్మం గురించి, ఆయన రక్షకుడు అని వ్రాయబడింది. లోకపాపాలు మోసుకునిపోయేవాడు అనికూడా చెబుతుంది. ఇంకా అదే గ్రంధంలో ప్రభువు ఆత్మ నామీద నున్నది, అది బీదలకు సువార్త ప్రకటించడానికి, నలిగినా వారిని బలపరచడానికి దేవుడు నన్ను పంపించారు అని ఇలా ఎన్నో విషయాలున్నాయి. యెషయా61;  ఇక 53 వ అధ్యాయంలో ఆయన పొందబోయే సిలువ మరణం- తద్వారా పాప క్షమాపణ, రోగ విమోచన జరుగుతుంది అని వ్రాయబడింది. మీకా గారు ప్రవచించారు. ఇలా ఎంతోమంది ముందుగానే ఆయనకోసం ప్రవచించారు. కాబట్టి పౌలుగారు ఇదే విషయాన్ని ఎత్తి రాస్తున్నారు.

      యేసుక్రీస్తు ఈయనెవరో క్రొత్త దేవుడు కాదు! పాత నిభందన వాగ్దానం చేసిన మెస్సయ్య- రక్షకుడు ఈయనే అని చెబుతున్నారు పౌలుగారు. నేటిరోజులలో అనేకమంది మన దేశపు వారు యేసుక్రీస్తు విదేశీయుల దేవుడు అని అపోహ పడుతున్నారు. పౌలుగారు వారి అపోహలు తీర్చినట్లు నేడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభులవారు ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక మతానికి దేవుడు కాదు! ఆయన సర్వమానవాలికి దేవుడు! ఆయన మాత్రమే రక్షకుడు! ఆయన మాత్రమే పరలోకం ఇవ్వగలరు! అని చెప్పాలి! అప్పుడు వారు అనగా అన్యులు ఎలాగో చెప్పు అని తప్పకుండా అడుగుతారు. అప్పుడు నీవు వారికి చెప్పగలగాలి: కారణం ఆయన మాత్రమే మానవాళి పాప విమోచన కోసం పరము విడచి, భువికి వచ్చి, బీదలకు సువార్త ప్రకటించి, రోగులను స్వస్తపరచి, చివరికి మానవాళి పాపాలకోసం తన రక్తాన్ని కార్చి, సిలువ మరణం పొందారు. ఆయనమాత్రమే మానవాళి పాపాల కోసం చనిపోయారు. రక్తాన్ని కార్చారు. అంతేకాకుండా ఆయన మాత్రమే చనిపోయి తిరిగి లేచారు. తిరిగి రాబోతున్నారు. కాబట్టి ఆయన మాత్రమే దేవుడు! దేవుడు అని పిలువబడటానికి, అంగీకరించడానికి గల పూర్తి లక్షణాలు ఎవరి దగ్గరైనా ఉన్నాయంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే అని నీవు చెప్పగలగాలి. ఆయన మనష్యుల హృదయాలను మార్చగలిగే దేవుడు అని చెబుతూ, దేవుడు నిన్ను ఏవిధంగా మార్చారో, నీవు ఎలా ఉండేవాడివో, ఇప్పుడు దేవుడు నిన్ను మార్చిన తర్వాత నీజీవితంలో జరిగిన అద్భుతాలు ప్రజలకు చెప్పాలి. నీ సాక్ష్యం అనేకమందిని మార్చగలదు! ఆయన విదేశీ దేవుడు కాదు అని చెప్పాలి! పౌలుగారు మిగతా పత్రికలలో కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారుఈ సువార్త ముందుగానే చెప్పబడింది. ఇంకా లేఖనముల ప్రకారమే యేసుక్రీస్తు ప్రభులవారు జన్మించారు, లేఖనముల ప్రకారం సిలువ మరణం పొందారు. లేఖనముల ప్రకారం తిరిగిలేచారు.  లేఖనముల ప్రకారం తిరిగి రాబోతున్నారు యేసయ్య అని చాటి చెప్పాలి!
మరి నీవు సిద్ధమా?
అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!

*రోమా పత్రిక-6వ భాగం*

రోమా 1:5.
యేసుక్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.

   ప్రియ దైవజనమా! *ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలున్నాయి. అవి యేసుక్రీస్తు ప్రభులవారి రెండు స్వభావాలు. మొదటిది దైవ స్వభావం; రెండు: మానవ స్వభావం*. ఇంకా చెప్పాలంటే:

1). దావీదు సంతానం మానవ స్వభావం
2). దేవుని కుమారుడు- దైవ స్వభావం

    ఈ వచనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం!
1). శరీరమును బట్టి దావీదు సంతానము గాను . . . .   యేసుక్రీస్తు ప్రభులవారు దావీదు సంతానముగా పిలువబడేవారు. దానికోసం అనేకమైన రిఫరెన్సులు ఉన్నాయి. ఆయన దావీదు సంతానం అని, దావీదు సింహాసనం మీద నిత్యమూ ఆసీనుడై ఉండేవాడని, దావీదుకు వేరు, చిగురు అని, ఇలా ఎన్నో ఉన్నాయి.   యెషయా 9:7, 16:5 ప్రకారం ఎల్లప్పుడూ యేసుప్రభులవారు దావీదు సింహాసనం మీద, దావీదు గుడారములో ఉంటారని వ్రాయబడి యుంది. ఇక యేహెజ్కేలు గ్రంధములో దావీదు వారిమీద అధికారిగా ఉంటాడు అని, ఎల్లకాలము వారికీ దావీదు అధిపతియై ఉంటాడని వ్రాయబడింది. ౩7:24;25. ఆమోసు గ్రంధంలో పడిపోయిన దావీదు గుడారమును కడతాను అంటున్నారు దేవుడు 9:11; కారణం దావీదు సింహాసనం పడద్రోయబడి యూదులు బానిసలుగా అమ్మబడ్డారు .

 ఇక క్రొత్త నిభందనలో ప్రకటన 5:5 లో దావీదుకు చిగురు/ వేరు అని వ్రాయబడింది.అయితే క్రొత్త నిభందన మొదట్లో చాలా ఆసక్తికరమైన విషయాలుంటాయి. మత్తయి 1:1 లో అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభమయ్యింది.  అబ్రాహాము గారినుండి దావీదు గారికి 14 తరములు, గాని దావీదు గారు అబ్రహాము గారి కుమారుడని పిలువబడ్డారు. ఇక దావీదు గారి నుండి యేసుక్రీస్తు ప్రభులవారికి 14 తరములు (1:17) గాని యేసయ్య దావీదు కుమారుడని పిలువబడ్డారు. ఇక భక్తుడు, వైద్యుడు అయిన లూకా గారు దావీదు వంశస్తుడైన యోసేపు అను పురుషునికి ప్రధానం చేయబడిన కన్యకయోద్దకు పంపబడెను, ఆ కన్యక పేరు మరియ అంటారు. దేవదూత గాబ్రియేలు యోసేపుతో అంటున్నాడు దావీడు కుమారుడవైన యోసేపు నీభార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము!  ఇక్కడ దావీదు కుమారుడు యోసేపు.  ఇక అనేకసార్లు యేసుక్రీస్తు ప్రభులవారిని దావీదు కుమారుడా కరుణించు అని పిలిచారు. మత్తయి 15:22 . .20:౩౦; 21:9;22:42; మార్కు 10:47; లూకా 18:8; 
ఇక లూకా 1:32 లో యేసుప్రభుల వారికోసం చెబుతూ గబ్రియేలు దేవదూత అంటున్నాడు:  ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.  ప్రకటన గ్రంధంలో ఆయన దావీదు తాళపు చెవులు కలిగి ఉన్నవాడు అని సెలవిస్తుంది ౩:7;  అందుకే పేతురు గారు మొదలుకొని అందరు అపోస్తలులు, ప్రవక్తలు ఆయన దావీదు కుమారుడని, దావీదు వంశపు వాడని చెప్పడం జరిగింది. అపోస్తలులు 2:2534; కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు వంశాస్తుడని, దావీదు కుమారుడని రోమీయులకు రూఢిగా చెబుతున్నారు పౌలుగారు. 
ఏం ఎందుకు చెప్పాలి అంటే: ఇంకా అనేకమంది యూదులు దావీదు కుమారుడైన మెస్సయ్యకోసం అనేక దేశాలలో ఎదురుచూస్తున్నారు. అందుకే ఆయనకోసం ఎదురు చూడ వద్దు. ఆయన ఈ భూలోకం ఆల్రెడీ వచ్చేశారు. ఆయనే యేసుక్రీస్తు అని చాటిచెబుతున్నారు వారికి!

  ఇది మానవ స్వభావము. ఆయన దావీదు వంశానికి చెందినవాడు. దావీదు కుమారుడు. దావీదు సింహాసనానికి అర్హుడు అని చెబుతున్నారు.

2) *దైవ స్వభావం*: దేవుని కుమారుడు: మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపించబడెను; ఈ విషయాన్ని చదువుకుంటూ పొతే ఏమీ అర్ధం కాదుగాని, ఈ వచనంలో పౌలుగారు చూపించిన తార్కికత చూస్తే చాలా అమోఘంగా ఉంటుంది. యేసుక్రీస్తు దేవుడే గాని ఈ భూలోకంలో  ఆయన పుట్టుక మానవ రూపమైనా,  ఆయన చనిపోయి తిరిగి లేచినందువలననే ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడింది అంటున్నారు. ఎలా నిరూపించబడింది? ప్రభావముతో నిరూపించబడింది! పౌలుగారు కొరింథీ పత్రికలో ఆయన లేచారు అని చెబుతూ, పేతురు గారికి కనబడ్డారు, మగ్ధలేనే మరియకు కనబడ్డారు అని చెబుతూ, అనేకమందికి కనబడ్డారు అని చెబుతూ, ఎవరికో కనబడ్డారు అని చెప్పడమే  కాకుండా కడగొట్టు వాడనైన నాకు కూడా కనబడ్డారు. ఆయన చనిపోయి సమాధిలో ఉండిపోలేదు. ఆయన సమాధి ఖాళీగా ఉంది! ఆయన సజీవుడు! ఎంతోమందికి కనబడ్డారు. చివరికి ప్రధాన పాపినైన నాకు కూడా కనబడ్డారు అని చెబుతున్నారు.  1కొరింథీ 15:1-10; 

   ఇంకా అచ్చమైన భాషలో అందరికీ అర్ధమయ్యేలా చెప్పాలి అంటే: క్రీస్తు దేవుని కుమారుడు అని అనడానికి చివరి రుజువు ఏమిటంటే ఆయన చనిపోయి తిరిగి సజీవంగా లేవడమే! అందుకే ఆయన దేవుని కుమారుడయ్యాడు. కారణం ఈ భూలోకం మీద పుట్టిన ప్రతీ వ్యక్తీ మరణాన్ని జయించలేకపోయారు. మరణపు కోరలలో చిక్కుకు పోయారు. అయితే యేసయ్య మరణాన్ని జయించి, మరణపు అధికారం క్రింద చెరలో నున్న వారికోసమే పరధైసుకి వెళ్లి, చెరను చెరగా తీసుకుపోయారు. ఎఫెసీ 4:8; కేవలం దేవునికి మాత్రమే మరణం మీద అధికారం ఉంది. కాబట్టి ఏసుప్రభువు చనిపోయి లేచారు కాబట్టి ఆయన దైవకుమారుడు అని రూఢిగా చెబుతున్నారు పౌలుగారు!

   ప్రియ స్నేహితుడా! నీకేమైనా అనుమానాలున్నాయా? పౌలుగారు చెబుతున్నారు. ఆయన దేవుడు, దైవకుమారుడు. దైవ మానవుడు! నీవు పడుచున్న ప్రతీ దురవస్తను, ప్రతీ కష్టాన్ని ఆయన అర్ధం చేసుకోగలరు! కారణం ఆయనకు ఈ కష్టాలన్నీ తెలుసు! ఆయనకూడా ఈ భూమిమీద నున్నప్పుడు ఇవన్నీ అనుభవించిన వారే! కాబట్టి నీ ప్రతీ సమస్య, నీ ప్రతీ బాధను ఆయన అర్ధం చేసుకుని నీకు సహాయం చేయగలరు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు కాబట్టి ఆయన యందు మాత్రమే విశ్వాసముంచు. ఆయన నిన్ను ఆదుకోడానికి, రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నీవు ఆయన వద్దకు వస్తావా? నీ భారమును ఆయన మీద మోపుతావా? ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు దేవుడు. మత్తయి11:28; లోబడనొల్లని ప్రజలకోసం దినమెల్ల తనచేతులు చాపి పిలుస్తున్నారు దేవుడు! యెషయా 65:2;
  ఆయన స్వరము వింటావా?
 వస్తావా? 
వస్తే రక్షించబడతావు. 
నేడే రక్షణ దినం! నేడే అనుకూల సమయం!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-7వ భాగం*

రోమీయులకు 1:6,7
6. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. 
7. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు. 

     ప్రియ దైవజనమా! పౌలుగారు చెబుతున్నారు- ఈయన నామము నిమిత్తం అంటున్నారు- ఈయన అనగా యేసుక్రీస్తు ప్రభులవారి నామము నిమిత్తం, సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు -- గమనించాలి కేవలం యూదులే కాకుండా సమస్త జనులు అనగా ఈ భూమి మీద పుట్టిన ప్రతీజాతి వారు కూడా యేసుక్రీస్తు నందలి విశ్వాసమునకు లోబడాలి అని పౌలుగారికి మరియు తక్కిన అపొస్తలులకు మొదటగా కృప, రెండవదిగా అపొస్తలత్వము కలిగింది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నీవు పొందిన కృప గాని, అపొస్తలత్వము గాని ప్రియ సహోదరి/ సహోదరుడా! అది కేవలం దేవుని నామ/రాజ్య వ్యాప్తి కొరకు మాత్రమే అని గమనించాలి. ఆ కృప మరియు అపొస్తలత్వము, పరిచర్య నీ పేరు ప్రతిష్ఠల కోసం గాని, నీవు ఆస్తి సంపాదించుకోడానికి గాని కానేకాదు. కేవలం నీ సువార్త పరిచర్య ద్వారా సమస్త జనులు ఆయన నామమునకు లోబడాలి. ఆయనే నిజమైన దేవుడని, రక్షకుడని ఒప్పుకోవాలి. 

   ఏం? ఎందుకు ఒప్పుకోవాలి? దానికి కారణం మనం పిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా వివరంగా వ్రాయబడింది. ఫిలిప్పీయులకు 2:5,6,7,8,9,10,11,12
5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. 
6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని 
7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. 
8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. 
9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, 
10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, 
11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. 
12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. 

    గమనించారా ఎందువలన లోబడాలి ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి అంటే మొదటగా మానవాళి రక్షణార్ధం పరమును అక్కడ మహిమను వదిలి, మనకోసం రాజులరాజు దాసుడైపోయి తననుతాను తగ్గించుకున్నారు-- ఎంతగా తగ్గించుకున్నారంటే సిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నారు. అనేక హింసలు అనుభవించారు, అవమానాలు, దెబ్బలు భరించారు. ఇన్ని హింసలు పెడుతున్నా సరే వారిని శపించకుండా, తిట్టకుండా , ప్రేమతో, జాలితో క్షమించి, తండ్రికి వ్యతిరేకంగా కూడా వారు పాపం చేశారు కాబట్టి తండ్రిని కూడా క్షమించమని వేడుకొన్నారు! అదీ స్వచ్చమైన నిజమైన ప్రేమ అంటే! అందుకే ఆయన దేవుడయ్యారు. మనం మనుషులుగానే మిగిలి పోతున్నాం! 

   ఆయన ప్రేమించి, సహించి , జయించారు కనుకనే ఆయన నామము అన్ని నామముల కన్నా శ్రేష్టమైన ఉన్నత ఘననామమయ్యింది.

   ఇక పౌలుగారంటున్నారు: సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. దానిని నిర్ధారణ చేసుకోవాలంటే మరలా మనం అపొస్తలుల కార్యములు 9 కి వెళ్లాలి Acts(అపొస్తలుల కార్యములు) 13,14,15,16
13. అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. 
14. ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయువారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చెను. 
15. అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు(మూలభాషలో-పాత్రయైయున్నాడు) 
16. ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. 

     చూశారా అదే విషయాన్ని ఇక్కడ దృవీకరణ చేస్తున్నారు.

  ఈ నామము కొరకు అవసరం కాబట్టి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం! పాత నిబంధన గ్రంథంలో తరతరములకు నా జ్ఞాపకార్ధ నామము ఇదే అని చెబుతూ (నిర్గమ 3:15), నాకు రావలసిన ఘనత వేరొకరికి ఇవ్వను అని చెప్పారు. యెషయా  42:8; అయితే యేసుప్రభులవారు పరలోక ప్రార్థన నేర్పిస్తూ నీనామము పరిశుద్ధ పరచబడును గాక అంటూ, నానామము నిమిత్తం మీరు హింసింపబడతారు వెలివేయ బడతారు అని చెబుతున్నారు. లూకా 21;  మొదట్లో పరలోక మందున్న మా తండ్రి! నీ నామము అన్నారు, ఆ తర్వాత నానామము అంటూ, చివరికి నా నామము పేరిట తండ్రిని ఏమైనా అడగండి, అది మీరు పొందుకుంటారు అని వాగ్ధానం చేశారు. యోహాను 15,16 అధ్యాయాలు; అలా అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగారు అంటే పరలోక మందు తనకున్న మహిమ తనకు తెలుసు కాబట్టి, తండ్రి తను ఏకమై యున్నారు కాబట్టి. సరే ఇది ఇలా ఉండగా, పెంతుకొస్తునాడు ఆది అపొస్తలులు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన వెంటనే మరి ఎవనివలనైననూ రక్షణ కలగదు. అపొ 4:12; యేసు నామము లోనే అని ప్రకటించడం మొదలుపెట్టారు. స్వస్థత పరచినా యేసు నామమే, బాప్తిస్మము ఇచ్చిన యేసునామమే! ఇది ఎవరు బయలు పరిచారు? పరిశుద్ధాత్ముడు! అందుకే ఈ నామము కోసం ఎన్ని శ్రమలైనా పడటానికి సిద్దంగా ఉన్నాము అంటున్నారు అపొస్తలుల కార్యములు .5:41.

   అదే కృప, ఐశ్వర్యము మీరు కూడా పొందుకున్నారు అంటున్నారు పౌలుగారు రోమా సంఘంతో! ప్రియ నేస్తమా! అదే కృప, అదే భాగ్యం నీవు కూడా పొందుకున్నావు. పౌలుగారు పొందుకున్నారు, దానికి తగిన విధంగా నడచుకొన్నారు. క్రీస్తు కోసం క్రొవ్వొత్తిలా కరిగిపోయారు. మరి నీవు క్రీస్తు కోసం ఏం చేస్తున్నావు? ఆయన నామానికి మహిమ తెస్తున్నావా? అవమానం తెస్తున్నావా?
పరిశీలించుకో! కారుకాయలు కాచే చెట్టును నరికేస్తాను అంటున్నారు దేవుడు! సరిచూసుకో!
సరిచేసుకో!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-8వ భాగం*
*పౌలుగారి ప్రార్థన-1*

రోమీయులకు 1:8,9,10
8. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరి నిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
9. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, 
10. మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. 

      ప్రియ దైవజనమా! గతంలో కొలస్సీపత్రిక ధ్యానం చేసేటప్పుడు వివరించడం జరిగింది 
1)పౌలుగారు ఎవరికి ఉత్తరం రాసిన వారికోసం ప్రార్థన చేస్తుంటారు. అంతేకాకుండా దేనికోసం ప్రార్థన చేస్తున్నారో చెబుతారు.
ఎఫెసీయుల కోసం ప్రార్థన చేశారు. 1:16; 3:16; 
 ఫిలిప్పీయుల కోసం ప్రార్థన చేశారు 1:4,9; కొలస్సీ 1:3; 9; 2:1; 
థెస్సలోనికయ వారికోసం చేశారు 1 థెస్సలోనికయ 1:2; 3:10; 5:23; 2 తిమోతి 1:3; ఇలా అందరికోసం అత్యాశక్తితో, పట్టుదలతో, కన్నీటితో ప్రార్థన చేయడం ఆయనకు అలవాటు! 

2) ఇంతకీ దేనికోసం చేసేవారు ప్రార్థన? మనలా Material Blessings కోసం, భూలోక సంభంధమైన వాటికోసం ఎప్పుడూ ప్రార్ధన చేయలేదు గాని ఆత్మ సంభంధమైన విషయాలు కోసమే ప్రార్థన చేసేవారు! ఆత్మలో బలపడాలని, ఆత్మపూర్ణులుగా ఉండాలని, సకల ప్రేమ, విశ్వాసం, ఓర్పు లాంటి ఆత్మఫలముతో దీవించబడాలని ప్రార్థన చేసేవారు. 

   సరే, ఇప్పుడు ఆయన దేనికోసం ప్రార్థన చేస్తున్నారో ధ్యానం చేసుకుందాం. *ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు*, . . .
  చూశారా ఆయన దేనికోసం ప్రార్థన చేస్తున్నారో! ఏవిధమైన ఆటంకాలు లేకుండా రోమా పట్టణం వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేది ఆయన ఆశ! దీనికోసం మొదటి భాగంలో చూసుకున్నాం! 

 రోమా 15:25--28 ప్రకారం కొన్ని సంఘాల వారు యేరూషలేములో ఉన్న పరిశుద్ధులకు కానుక/ చందా వసూలు చేసి, పౌలుగారికి ఇస్తారు. దానిని యేరూషలేములో అప్పగించి, స్పెయిను దేశానికి నాలుగవ మిషనరీ ప్రయాణంగా వెళ్దామని పౌలుగారి ఆకాంక్ష. ఆ యాత్ర మార్గమధ్యంలో రోమా పట్టణం మీదుగా వెళ్తుంది కావున రోమా పట్టణం లో సువార్త ప్రకటించాలి అనుకున్నారు పౌలుగారు. ఆ యాత్రకు ముందుగా తననుతాను పరిచయం చేసుకుంటూ వ్రాసిన పత్రిక ఇది. ఇదే విషయాన్ని రోమా 15 లో చాలా వివరంగా రాశారు. Romans(రోమీయులకు) 15:19,20,21,22,23,24,25,26
19. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను. 
20. నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచార మెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు, 
21. వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని. 
22. ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. 
23. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరముల నుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి, 
24. నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి,మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. 
25. అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను. 
26. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. 

   ఇదీ ఆయన ఉద్దేశం. అందుకే ముందుగా ఉత్తరం రాసి పంపుతున్నారు. ఉత్తరం రాయడమే కాకుండా పట్టుదలతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు.

      ప్రియ సేవకుడా! విశ్వాసి! మీ సేవలో ఆటంకాలు వస్తున్నాయి కదా! అది సర్వసాధారణం! అది సాతాను చేసేది. అయితే వాటిని జయించాలి అంటే పౌలుగారు ప్రార్థన చేసినట్లు ఆటంకాలు పోవాలని నీవుకూడా కన్నీటితో పట్టుదలతో ప్రార్థన చేయ్! ఆటంకాలన్నీ మబ్బు తొలగిపోయినట్లు వీడిపోతాయి! 

   ఇక ముఖ్యమైన మరో విషయం ఏమిటంటే- రోమా సంఘం పౌలుగారు స్థాపించిన సంఘం కాదు. ఎవరో స్థాపించారు. అయినా వారికోసం, వారు బలపడాలని కొన్ని వందల కి.మీ.ల దూరంలో ఉండి కూడా వారికోసం, అక్కడ సేవకోసం ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారు పౌలుగారు. ఎలా చేస్తున్నారు?  ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, . .మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.  చూశారా ఎలాంటి ప్రార్ధనో, ఎలాంటి ఆసక్తో కదా!
 ప్రియ సేవకా! విశ్వాసి! నీ/ మీ సేవకోసమే కాకుండా ఇతర సంఘాల వారికోసం ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘం లో సంపూర్ణసత్యం ప్రకటిస్తూ ఉండవచ్చు గాని ఇతర సంఘాలలో నామకార్ధ జీవితం గలవారు ఉన్నారు. వారి రక్షణ కోసం, మారుమనస్సు కోసం, వారు సత్యాన్ని గ్రహించి, వాక్యానుసారమైన జీవితం జీవించాలని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? పౌలుగారు చేస్తున్నారు. మాదిరిగా జీవించారు. ప్రియ సేవకుడా! నీవుకూడా అదే మాదిరి కలిగి ఉండమని యేసుక్రీస్తు నామంలో బ్రతిమిలాడుతున్నాను. ప్రియ దైవజనమా! కనీసం మీ సంఘం వారికోసం, నామకార్ధ బ్రతుకులు మార్పుకోసం ఈదినము నుండైనా ప్రార్ధించడం మొదలుపెట్టు!
అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!



*రోమా పత్రిక-9వ భాగం*
*పౌలుగారి ప్రార్థన-2*

రోమీయులకు 1:11,12
11. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని 
12. ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. 

     ప్రియులారా! ఈ వచనంలో పౌలుగారి ప్రార్థన ఇంకా స్పష్టంగా అర్ధమవుతుంది మనకు. పౌలుగారు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు?! వారు స్థిరపడాలని. దేనిలో స్థిరపడాలి? విశ్వాసంలో! దీనికోసం గతంలో ధ్యానం చేసుకున్నాము గాని సందర్భోచితంగా మరోసారి క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం.

ఇదే విషయాన్ని కొలస్సీ పత్రిక లో విస్తారంగా రాశారు పౌలుగారు.
కొలస్సీయులకు 1: 23
పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచియుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

  ప్రియులారా! ఈవచనంలో మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. 
1). పునాదిమీద కట్టబడిన వారు;
2) స్థిరముగా ఉండాలి(విశ్వాసంలో)
3) విన్న సువార్తవలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకూడదు!
పై విషయాలు కోసం క్లుప్తంగా ధ్యానం చేసుకందాం!

1). పునాదిమీద కట్టబడిన వారై:  ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే: ఒక ఇల్లు కట్టాలంటే దానికి మొదటగా పునాదివేయాలి!  పునాది ఎంత బలంగా కట్టాలో ఆ ఇంటిని బట్టి ఆధారపడుతుంది. ఎంత పెద్ద ఇల్లు అయితే అంత పెద్ద, బలమైన, లోతైన పునాది వేయాల్సిఉంటుంది. అంతేకాకుండా, ఆ పునాది దేనిమీద లేదా ఎక్కడ వేయబడింది అనేది కూడా అవుసరమే! అందుకే పెద్దబిల్దింగ్ కట్టేటప్పుడు soil టెస్ట్ చేస్తుంటారు. 

  ఇక్కడ పునాది అనేది సుస్థిరత, భద్రత, ధృఢత్వమునకు సూచనగా ఉంది. అలాగే క్రీస్తుయేసునందు మన విశ్వాసము కూడా ఓలిపోకుండా, సోలిపోకుండా సుస్థిరంగా, ధృడంగా ఉండాలి! ఎన్ని ఆటుపోటులు, ఎన్ని కష్టసుఖాలు, కలిమిలేములు వచ్చినా మన విశ్వాసమును కోల్పోకుండా దృడంగా ఉండాలని పౌలుగారి కోరిక! ఇదే పరిశుద్దాత్ముని కోరిక! 
పౌలుగారు తను చనిపోయే ముందు, తిమోతికి లేఖ రాస్తూ గొప్ప అమోఘమైన మాట (remarkable statement) అంటున్నారు: మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని! ఇక నాకు నీతికిరీటము ఉంచబడినది! 2 తిమోతి 4:7-8; చూశారా ఆయన విశ్వాసం! దేనియందు సంతోషిస్తున్నారు? తన విశ్వాసాన్ని కాపాడుకొన్నందుకే ఆయన సంతోషం, ధైర్యం! కారణం ఆయనకోసం నీతికిరీటం, మహిమకిరీటం- తేజోవాసుల స్వాస్థ్యము అన్నీ ఎదురుచూస్తున్నాయి. ఆ విశ్వాసం నీకుందా?!!!

     నిజమైన విశ్వాసం విశ్వాసులను సుస్థిరంగా, ధృడంగా చేస్తుంది.1కోరింథీయులకు 3: 11
వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.
 ఈ పునాది క్రీస్తే!! మరి నీ పునాది విశ్వాసం దేనిమీద?! క్రీస్తుమీదనా? లోకాశల మీదనా? కేవలం material blessings కోసమా? అన్నింటికన్నా మిన్నగా పొందబోయే తేజోవాసుల స్వాస్థ్యము మీదనా? ఇంకా ఎఫెసీయులకు 2: 20
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
 ఈ మూలరాయి క్రీస్తు! ఇంతకుమునుపు పునాది క్రీస్తు అన్నారు. ఇప్పుడు మూలరాయి క్రీస్తే!  అయితే ఆ మూలరాయియైన క్రీస్తును ఆధారం చేసుకొని, అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు. దానిమీద మీరు అనగా సంఘం కట్టబడి ఉన్నది! అనగా యేసయ్యనే ఆధారం చేసుకొని సంఘం ఉండాలి. లోకవిషయాలు గాని, సైన్సుగాని, మీ పాండిత్యం గాని, పిట్టకధలు గాని, మరేదైనా యేసయ్యను substitute చేయకూడదు! అన్నింటికీ యేసయ్యే ప్రధముడై ఉండాలి. ఇక ఆభోధ అపోస్తలుల భోదయై ఉండాలి! గతబాగాలలో అపోస్తలుల బోధకోసం మనము ధ్యానం చేసుకున్నాం! 

అపోస్తలుల భోధ.
 
అపోస్తలుల బోధలో మొదటగా దేవుని ఆత్మ శక్తితో, ఆత్మ అభిషేకముతో ప్రకటింపబడుతుంది. (అపో.కా 2:1-3)
🔺 *దేవుని వాక్యం మాత్రమే ప్రకటింపబడుతుంది.*
 (అపో.కా 2:16-35).
🔺 *సిలువ వేయబడిన యేసుని, పునరుద్ధానుడైన యేసుని గురించి ప్రకటింపబడుతుంది.*
 (అపో.కా 2:22-24).
🔺 *యేసు దేవుని కుమారుడని ప్రకటింపబడుతుంది.*
 (అపో.కా 2:31-36).
🔺  *యేసే-మెసయ్య ; క్రీస్తు అని ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:22-36).
🔺 *ప్రాముఖ్యంగా యేసుక్రీస్తే దేవుడని ,ప్రభువని ప్రకటింపబడుతుంది.*
 (అపో.కా 2:36).
🔺 *పాపక్షమాపణ గురించి ప్రకటింపబడుతుంది.*
 (అపో.కా 2:38).
🔺 *మారుమనస్సు, బాప్తిసము గురించి ప్రకటింపబడుతుంది.*
 (అపో.కా 2:38).
🔺 *పరిశుద్ధాత్మ అను వరమును ఎలా పొందుకోవాలో ప్రకటింపబడుతుంది.*
 (అపో.కా 2:38).
🔺 *ఈ బోధలో అన్వయింపు కూడా ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:38-40).

*ఈ బోధ ఉన్న సంఘం బలముగా కట్టబడుతుంది.* (అపో.కా 2:41)

   ఇంకా పునాదికోసం ధ్యానం చేస్తే, మన పునాది దేనిమీద వేయబడిందో మనం పరిశీలించుకోవాలి! మత్తయి సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయములో మనకు యేసుప్రభులవారు చెప్పిన ఉపమానం కనిపిస్తుంది. అక్కడ మనకు రెండు ఇల్లు కనిపిస్తాయి. ఒకటి ఇసుకమీద కట్టబడింది. దానికంత పునాది లేదు! మరో ఇల్లు బండమీద పునాదితీసి కట్టడం జరిగింది. ఈ రెండు ఇల్లుల మీద గాలి, తుఫాను, వరదలు కొట్టడం జరిగింది. అయితే ఇసుకమీద కట్టిన ఇల్లు, పునాది లేనందువల్ల వరదకు, గాలివానకు తిరుగబడిపోయింది. బండమీద కట్టబడిన ఇల్లు దాని పునాది సుస్థిరంగా, దృడంగా ఉన్నందువలన ఇంకా అది బండమీద కట్టబడినందువలన గాలి,తుఫాను, వరదలు ఏమీ చెయ్యలేకపోయాయి!! ఇక్కడ ఇల్లు నీ విశ్వాసము! గాలి, తుఫాను, వరదలు శ్రమలు, శోధనలు, కష్టాలు. నీ విశ్వాసం దేవునిపై దృడంగా ఉంటే, ఈశ్రమలు, శోధనలు ఏమీ చెయ్యలేవు నిన్ను! 
నీవు కేవలం material blessings కోసమే వస్తే, నీ విశ్వాసపు ఇల్లు కూలిపోకతప్పదు!!!  అయితే నీ విశ్వాసం నిత్యజీవం కోసం, తేజోవాసులస్వాస్థ్యము కోసం అయితే, ఈలోక శోదనలు, శ్రమలు నిన్ను ఏమీ చెయ్యలేవు. 
1తిమోతీ 6:18 ప్రకారం ఈ పునాది ఇప్పటికోసం కాదు, రాబోయేకాలంలో మనం పొందబోయే పరలోకం, తేజోవాసులస్వాస్థ్యము కోసం మన పునాది దృఢపరచుకొంటూ ఉండాలి. అనగా మన విశ్వాసం స్థిరంగా కాపాడుకొంటూ ఉండాలి! షడ్రక్, మేషాక్, అబెద్నెగోలవలే ఎన్ని కష్టాలు ఎదురైనా, చివరికి మరణమే ఎదురైనా విశ్వాసం లో స్థిరంగా నిలబడాలి. పౌలుగారివలే ఎన్ని శ్రమలైనా, హింసలైనా, చెరసాలయైనా తట్టుకోవాలి. అప్పుడే నీకు జీవ కిరీటం, నీతికిరీటం!  1తిమొతీ 2:19 ప్రకారం ఈ పునాదిమీద నిలబడాలి అంటే దుర్నీతినుండి తొలగిపోవాలి! దుర్నీతి, పాపముచేసే వాడు ఎవడూకూడా ఈ పునాదిమీద నిలబడి ఉండలేడు! ఇక 1కొరింథీ 3:12-15 వరకుఈ పునాదిమీద ఎవడైనా వెండి, బంగారం, కొయ్య, కర్ర . . లాంటి వస్తువులతో కడితే, ఆ కట్టబడింది అగ్నితో పరీక్షింపబడుతుంది. ఆ పరీక్షలో నిలబడి తట్టుకొని నిలిస్తే, కట్టినవానికి, తట్టుకొన్నవాడికి ఫలము కలుగుతుంది. ఇక్కడ బంగారం, వెండి .. లాంటి వస్తువులు అనగా మీ బోధ అపోస్తలుల బోధయై యుండాలి గాని మీ సొంతమాటలు, సైన్సు, పిట్టకధలు, వేదాంతము కాదు. అవి ప్రజలను ఆకర్షించవచ్చు గాని,వారిని పరలోకం చేర్చలేవు! మీ బోధలు వారిని కష్టాలు తట్టుకొని, ప్రభుకొరకు నిలబడేలా చేయాలి తప్ప ,ఎప్పుడూ material blessings కోసమో, ప్రభువును నమ్ముకొంటే మీకు కష్టాలు రానేరావు అనే తప్పుడుభోదలు కాకూడదు!! అలాంటి బోధలు విన్నవారు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వెంటనే విశ్వాస బ్రష్టులైపోతారు. అప్పుడు నీ పని ఇసుకమీద ఇల్లు కట్టినట్టే! నీవు కట్టిన వెండి, బంగారం లాంటి వస్తువులు శోధన అనే అగ్నిని తట్టుకోలేక , కరిగిపోతే, కనబడటం లేదు కాబట్టిసోమరివైన చెడ్డదాసుడా! అని పిలువబడతావు!
 కాబట్టి ప్రియ సేవకులారా! సంఘాన్ని అపోస్తలుల బోధపై కట్టండి. 
విశ్వాసులారా! మీ విశ్వాసాన్ని కాపాడుకోండి పౌలుగారిలా! 
అప్పుడే మీకోసం నీతికిరీటం రడీగా ఉంటుంది. 
లేదా ఇసుకమీద కట్టిన ఇంటిలా మీ విశ్వాసం పేకమేడలా కూలిపోయి, రెంటికీ చెడ్డ రేగడి అయిపోతుంది.
 కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో!

దైవాశీస్సులు!
ఆమెన్!
*రోమా పత్రిక-10వ భాగం*
*పౌలుగారి ప్రార్థన-3*

రోమీయులకు 1:11,12
11. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని 
12. ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. 

      ప్రియ దైవజనమా! ఈ 12వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన విషయం కనబడుతుంది. పౌలుగారు రోమా పట్టణం ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు? సువార్త ప్రకటించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని గాని, తద్వారా ధనము సంపాదించుకోవాలని ఎంతమాత్రమూ కాదని ఈ వచనంలో అర్ధమవుతుంది.

 *ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను*

చూశారా ఆత్మ సంబంధమైన కృపావరమేదైనా మీకివ్వాలని ఉంది. అందుకే రావాలని కోరుకుంటున్నాను అంటున్నారు. ఎంత మంచి మనస్సో మనం అర్థం చేసుకోవచ్చు. 
ఇదే వచనాలు కొన్ని ప్రతులలో ఇలా వ్రాయబడింది:
*మీరు స్థిరపడేందుకు ఆధ్యాత్మిక కృపావరంఏదైనా మీకు కలిగించడానికి మిమ్ములను చూడాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాను*.

ఆధ్యాత్మిక కృపావరం లేదా ఆత్మ సంబంధమైన కృపావరం ఎందుకు ఇవ్వాలని కోరుకుంటున్నారు? వారు బలపడాలని, స్థిరపడాలని! అదీ ఆయన ఆశ! 

     ఈ రోజుల్లో కొద్దిగా వాక్యం చెప్పడం, కొన్ని కృపావరాలు ఫలాలు ఉంటే, దైవ రాజ్య వ్యాప్తికి కాకుండా, వారి సామ్రాజ్యం, వారి ఆస్తులను, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కోసం చూస్తున్నారు. మరికొందరు అయ్యగారు ప్రార్థన చేస్తే ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పించు కొంటూ, స్వఘనత కోసం ప్రాకులాడుతున్నారు తప్ప, దేవునికి రావలసిన ఘనతను అపహరిస్తున్నారు అని మరచిపోతున్నారు.

   ప్రియ దైవజనమా! ఈ విషయంలో మనకు పౌలుగారిని ఆదర్శంగా తీసుకోవాలి. కారణం ఈ వచనంలో నేను మీకొరకు ఆత్మ సంబంధమైన కృపావరం తీసుకుని రావాలి అనుకుంటున్నాను అంటున్నారు! కారణం ఆయన ఉద్దేశం చాలాసార్లు మిగతా పత్రికలలో చెప్పారు ఏమని? పిల్లలు తల్లిదండ్రులకు కాదుగాని తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తి సంపాదించి ఇవ్వాలి. 
2కోరింథీయులకు 12: 14
ఇదిగో, యీ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను(మూలభాషలో-వెదుకుచున్నాను) . పిల్లలు తలిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది గదా! 
 అందుకే సకలమైన కృపావరాలు ఆయన పొందుకుని, వాటిని ఎలా పొందుకోవాలో ఎలా అభ్యాసం చెయ్యాలో నేర్పిస్తూ, తద్వారా వారిని ఆధ్యాత్మికంగా ధనవంతులను చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆయన సంఘం మీద వచ్చిన కానుకలను కూడా ఆశించకుండా, తనకోసం తనతోపాటు ఉన్నవారి ఆహారం ఖర్చుల కోసం ఆయన స్వయంగా తన చేతులతో తన వృత్తి అయిన డేరాలు కుట్టుకుంటూ, ప్రతీ సాయంత్రం, ప్రతీ విశ్రాంతి దినం నాడు బోధిస్తూ ఉండేవారు. దీనిని బైబిల్ ఋజువు చేస్తుంది. 

అపొస్తలుల కార్యములు 20:33,34,35
33. ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు; 
34. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును. 
35. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.
 ఇక్కడ నా ఉద్దేశం సంఘ కాపరి, సేవకుడు సంఘం మీద ఆధారపడి ఉండకూడదు, తన ఖర్చులకోసం కానుకలు తీసుకోకూడదు అని ఎంతమాత్రమూ కాదు. ఇదే పౌలుగారు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టరాదు అని చెబుతూ, కాపరి/ సేవకుడు సంఘం మీద బ్రతుకుతాడు అని చెప్పారు. 

1కొరింథీయులకు 9:7,9,10,11,13,15
7. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు? 
9. కళ్లము త్రొక్కుచున్న యెద్దు(నూర్చెడి యెద్దు) మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా? 
10. కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. 
11. మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్పకార్యమా? 
13. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము నొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో(బలిపీఠము మీద అర్పింపబడిన) పాలివారైయున్నారనియు మీరెరుగరా? 
15. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు. 

ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే పౌలుగారు ఇలా చేస్తూ, సంఘం మీద ఆధారపడకుండా, మాదిరిగా ఉండి, ప్రతీ ఒక్కరు పనిచేయాలని చెబుతున్నారు. అంతేకాకుండా ఇతరులకు సహాయం చేయాలి అని చెబుతున్నారు. కాబట్టి ప్రియ సేవకుడా! కాపరీ! వర్తమానికుడా! నీవు ఎవరినైనా సరే, నీకు వస్తున్న రాబడితో కేవలం నీకోసం, నీ కుటుంబం కోసం, నీ ఆస్తుల కోసం మాత్రమే ఉపయోగించు కోకుండా సంఘం కోసం కూడా ఉపయోగించు! ఎంతో మంది విశ్వాసులు కటిక పేదరికంలో రెండు పూటలా తినకుండా పస్తులుంటున్నారు కదా మీ సంఘంలో! అలాంటి వారికి కనీసం ఒకపూట భోజనం పెట్టగలవు కదా! నీ తోటి కాపరి/ సేవకుడు పస్తులుంటూ, కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతుంటే నీకు చేతనైన సహాయం చేయలేవా? నీ సంఘ సభ్యులు అనేక మంది వైద్యానికి డబ్బులు లేక వ్యాధితో మంచం మీద బాధపడుతుంటే నీకు చేతనైన సహాయం చేయలేవా? పైవారికి చేయలేవు గాని నీ సంఘ సభ్యులకు, నీ రక్త సంబందులకు చేయగలవు కదా! మరి నీవు ఎందుకు చేయడం లేదు?! అలా చేయలేని వారికోసం యాకోబు గారు తన పత్రికలో రాశారు. 
యాకోబు 2:15,16,17
15. సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేకయున్నప్పుడు. 
16. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? 
17. ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. .

యోహాను గారు అంటున్నారు నీవు ఈలోకపు జీవనోపాధి కలిగి ఉండికూడా నీ సహోదరునికి సహాయం చేయలేకపోతే నీవు వ్యర్ధుడవు, ప్రేమలేనివాడివి, 
1యోహాను 3:17
ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును? 
1 యోహాను 4:20,21
20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు(ఎట్లు ప్రేమింప గలడు?) 
21. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము.

కాబట్టి నేడే నీవు కాస్తున్న సంఘాన్ని ఆదుకో! వారి కానుకలతో నీవు ధనవంతుడవు కావడం కాకుండా సంఘాన్ని ఆధ్యాత్మికముగా ధనవంతులను చేయు! మాదిరిగా జీవించు! అవసరమైన వారికి నీవంతు సహాయం చేయు! సంఘం నుండి ఆశించడమే కాకుండా సంఘానికి ఇవ్వడం నేర్చుకో!
పౌలుగారు చేశారు. ఎన్నో సంఘాలు కట్టారు. ఏవిధమైన ఆస్తులు లేకుండా, తను మరచిపోయిన బట్టలను తీసుకుని రా అంటున్నారు తన శిష్యునితో! 2 తిమోతి 4:12,13; సంఘాన్ని కానుకలు అడిగి రోజుకో సూటు బూటు మార్చవచ్చు. గాని ఆయన అలా చేయలేదు. మాదిరిగా ఉన్నారు.
నీవుకూడా అలా మాదిరిగా జీవించి పౌలుగారిలా అనేక ఆత్మలను సంపాదించు!

అట్టి కృప, ధన్యత సేవకులకు, కాపరులకు, పరిచారకులకు, సంఘ పెద్దలకు దేవుడు దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్! 

*రోమా పత్రిక-11వ భాగం*
*సువార్త భారం-1*
   
      రోమా 1:13--15
13. (యేసుక్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని) సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిది వరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు 
14. గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను. 
15. కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ...

   ప్రియ దైవజనమా!  పై వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని విషయాలు అర్ధమవుతాయి మనకు.  మొదటగా ఎన్నోసార్లు రోమా పట్టణం వెళ్లి వారికి సువార్త ప్రకటించాలి అనుకుంటే తనకు ఎన్నో ఆటంకాలు కలిగాయి అని చెబుతున్నారు. ఇదే విషయాన్ని 15వ అధ్యాయంలో మరోసారి చెబుతున్నారు. ఈసారి తప్పకుండ వస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. Romans(రోమీయులకు) 15:19,20,21,22,23,24,25,26
19. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను. 
20. నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచార మెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు, 
21. వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని. 
22. ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. 
23. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరముల నుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి, 
24. నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి,మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. 

   ఇక తర్వాత విషయం మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏమిటంటే 
*గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను*  ఇక్కడ ఆయన నేను ఋణస్తుడను అంటున్నారు పౌలుగారు. ఏమయ్యా పౌలుగారు ఎప్పుడైనా ఎవరిదగ్గరైనా అప్పుతీసుకున్నారా? లేనే లేదు! మరి ఋణస్థుడను అంటున్నారేం?  మరి ఎ విషయంలో ఋణం ఉంది ఆయనకు? తర్వాత వచనం చూసుకుంటే: కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. . . . .  అనగా మీకు కూడా సువార్త ప్రకటించాలి అని ఉంది నాకు ఆ విషయంలో నేను మీకు ఋణస్థుడను అంటున్నారు పౌలుగారు. ఆహా ఏమి సువార్త భారమండి నిజంగా ఆయనది, పౌలుగారి తాపత్రయం మనుష్యలందరికి దేవుని సువార్త చాటాలి. అది తన భాద్యతగా తీసుకున్నారు. 
ఒకసారి 1 కొరింథీ 9:1617 చూసుకుందాం.
16. నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ. 
17. ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. . . . ఇక్కడ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నారు. సువార్త ప్రకటించడం అంటే నాకెంతో ఇష్టం! ప్రకటించకపోతే నష్టం! అందుకే ఇష్టపడి ప్రకటిస్తున్నాను. బలవంతంగా కాదు! అలా చేస్తే నాకు బహుమతి కలుగుతుంది. అయితే ఇక్కడ మరోమాట అంటున్నారు పౌలుగారు: *ఇష్టపడి నేను పనిచేసినా, ఇష్టం లేకుండా చేసినా అది అనవసరం గాని,  నాకు సువార్త ప్రకటించడానికి గృహనిర్వాహకత్వము నాకు దేవుని నుండి అప్పగిప్పబడింది కాబట్టి- నాకు ఇష్టమున్నా లేకున్నా నేను సువార్త ప్రకటించవలసినదే*! అందుకే నేను సువార్త ప్రకటిస్తున్నాను అంటున్నారు పౌలుగారు!

   ప్రియ సేవకుడా! విశ్వాసి! సువార్త ప్రకటన అనేది కేవలం పౌలుగారికేనా దేవుడు అప్పగించారు? ప్రియ విశ్వాసి! సువార్త ప్రకటన భారం దేవుడు కేవలం సేవకులకు, కాపరులకు మాత్రమేనా అప్పగించారు? కానేకాదు! ఒకసారి మత్తయి 28:18-19 చూసుకుందాం. 
19. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు 
20. నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.. . . . ఇంకా మార్కు 16:1518 Mark(మార్కు సువార్త) 16:15,16,17,18,20
15. మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. 
16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. 
17. నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును(మూలభాషలో-నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును); ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, 
18. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. 
20. వారు బయలుదేరి వాక్య మంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడైయుండి, వెనువెంట జరుగుచువచ్చిన(మూలభాషలో-వెంబడించుచుండిన) సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్‌.
 ఈ రెండు చోట్ల మీరు అనేమాట కేవలం అక్కడున్న 120 మంది లేక కొద్దిమందికేనా? కాదు కాదు! రక్షించబడిన వారందరికీ దేవుడు ఇస్తున్న ఆజ్న ఇది! యేసుప్రభులవారు ఇచ్చిన చిట్టచివరి ఆజ్ఞను ప్రతీ ఒక్కరు పాటించవలసినదే! నీకు ఇష్టమున్నా లేకపోయినా నీవు పాటించవలసినదే! ఇదే అంటున్నారు పౌలుగారు! ఇష్టపడి చేస్తే నీకు బహుమానం అంటున్నారు. ఇష్టం లేకపోయినా చేయాలి అంతే! నాకు ఇష్టం లేదు నేను చేయను అన్నావా. . . . ఫలించని ప్రతీ తీగెను నరికి అగ్నిలో వేస్తాను అంటున్నారు ప్రభువు! అదంతే! యోహాను 15:2; ఇదిగో గొడ్డలి చేట్టువేరున ఉంచబడింది అంటున్నారు. మత్తయి3:10; లూకా 3:9;  ఇంకా మరో ఉపమానంలో తోటకాపరి- ఈ చెట్టు మూడు సంవత్సరాల నుండి ఫలించడం లేదు, దీనిని నరికేయ్! అంటున్నారు దేవుడు, లూకా 13:6--9; అక్కడున్న తోటకాపరిఈ ఒక్కసారి మరో అవకాశం ఇవ్వండి దయచేసి, మరోసారి తవ్వి, దుక్కుదున్ని, ఎరువు వేస్తాను, ఈ సారి ఫలిస్తే సరి, లేకపోతే నరికేద్దాం ప్లీజ్ అని బ్రతిమిలాడుతున్నాడు. ఆతోటకాపరి మరెవరో కాదు యేసుక్రీస్తు ప్రభులవారు. ఆ తోటకాపరి నీకోసం పాటుపడుతుంటే నీవు ఫలించకుండా ఉంటే అనగా ఎవరికీ సువార్త ప్రకటించకుండా, ఒక్క ఆత్మను కూడా క్రీస్తుకోసం సంపాదించకపోతే, నీవు నరకబడటం ఖాయం! ఎవరైతే క్రీస్తులో అంటుకట్టబడరో, క్రీస్తునుండి వేరౌతారో వారు ఎండిపోతారు! ఒక కొమ్మ చెట్టుతో కలిసి ఉంటేనే దానిలో జీవం ఉంటుంది. అయితే ఆ కొమ్మ ఏ కారణం చేతనైనా చెట్టునుండి వేరైపోతే అది ఎండిపోతుంది.  ఇక్కడ నీవు ఫలాలు ఫలించకపోతే దేవుడు నిన్ను తన నుండి నరికేస్తాను అంటున్నారు. ఎప్పుడైతే నీవు నరకబడతావో, కత్తిరించ బడతావోనీలో క్రీస్తు జీవం పోతుంది. అప్పుడు ఆ కొమ్మ అగ్నిలో కాల్చబడతానికే పనుకొస్తుంది. అనగా క్రీస్తునుండి వేరైనా నీవుకాల్చబడతావు. ఎక్కడ? నరకంలో! అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉండును! మత్తయి 8:12, 13:42; 13:50;. . . అగ్ని ఆరదు, పురుగు చావదు! మార్కు 9:48; యుగయుగములు ఆ నిత్యనరకంలో కాలుతూ ఉంటావు గాని మాడిపోవు! 
*కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! ఇప్పుడు చాయిస్ నీదే! సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదిస్తావా? మంచిది! భళానమ్మకమైన మంచిదాసుడా! అనిపించుకుంటావు! ప్రకటించకుండా ఫలాలు ఫలించవా? మంచిది! నరకంలో త్రోయ బడతావు! ఏదికావాలో కోరుకో! నీకు ఇష్టమున్నా లేకున్నా ప్రకటించాలి అంతే*! నా భాషలో చెప్పాలంటే: ఇష్టమున్నా లేకున్నా మూసుకుని ప్రకటించాలి, అది దేవుని ఆజ్న అదంతే!

   పౌలుగారి భావం కూడా దాదాపు అదే! అందుకే నేను ఋణస్తుడను అంటున్నారు! అందుకే భారముతో ప్రకటిస్తున్నారు! ప్రియ చదువరీ! నీ పరిస్తితి ఏమిటి? సువార్త ప్రకటిస్తున్నావా? ఎక్కడికో పోయి చెప్పడానికి నీకు అవకాశం లేకపోతే కనీసం నీ పొరుగువారికి దేవునికోసం చెబుతున్నావా? వారికోసం భారముతో, ఉపవాసముతో ప్రార్ధన చేస్తున్నావా? నీ పొరుగు వ్యక్తి రక్షించబడకుండా నరకానికి పోతుంటే, నాకెందుకు అని ఊరుకుని, పనికిమాలిన సీరియల్లు చూస్తూ తాపీగా ఉంటున్నావు కదూ! ఆ ఆత్మ నరకానికి పొతే దానికి ఉత్తరవాదివి నీవే అని మరచిపోకు! నీవు ప్రకటించినా సరే, ఆ వ్యక్తి రక్షణ పొందకపోతే నీ భాద్యత లేదు! ఇదే విషయాన్ని యేహెజ్కేలు గారికి దేవుడు చెప్పారు. Ezekiel(యెహెజ్కేలు) 2:4,5,8
4. వారు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై యున్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయు 
5. వారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనునట్లుప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. 
8. వారు తిరుగు బాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. .
Ezekiel(యెహెజ్కేలు) 33:7,8,9
7. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. 
8. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మర ణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మా ర్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని అతని ప్రాణమునుగూర్చి నిన్ను విచారణచేయుదును. 
9. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు.  . . 

 కాబట్టి ప్రియ స్నేహితా! ప్రకటించడం నీ భాద్యత! నీ భాద్యత నీవు నిర్వర్తించు! మిగతాది దేవుని పని! 
నీ పని నీవు చేయు! 
ఇష్టపూర్వకముగా చేయు! 
బహుమానాన్ని పొందుకో! 
ఇష్టం లేకపోయినా సరే, దేవుడు చెప్పారు కాబట్టి తప్పకుండా చేయు అనగా సువార్త ప్రకటించి, నీ భాద్యతను నెరవేర్చి, శిక్షను తప్పించుకో!

 పౌలుగారిలాంటి సమర్పణ, భారం చదువరులందరికి దేవుడు దయచేయును గాక!
ఆమెన్!

*రోమా పత్రిక-12వ భాగం*
*సువార్త భారం-2*
   
      రోమా 1:16.
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. ...

   ప్రియ దైవజనమా!  గతభాగంనుండి పౌలుగారి సువార్త భారం కోసం ధ్యానం చేస్తున్నాం. ఈ వచనంలో పౌలుగారు చెబుతున్నారు నేను సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడే వాడను కాను అంటున్నారు. ఇదే సువార్త ప్రకటించేవారిని కొట్టి, చంపి, హింసించే సౌలు అలియాస్ పౌలుగారు ఇప్పుడు అదే సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటున్నారు. ఏం? కారణం ఆ సువార్తలో గల శక్తిని ఒకసారి రుచిచూసారు కాబట్టి.  దీనికోసం మరింతగా ధ్యానం చేసేముందు ఈరోజు ఎందుకు పౌలుగారు సువార్తను ప్రకటించడానికి సిద్దపద్దారో ధ్యానం చేద్దాం!

   1:16 లో సువార్త ప్రకటించడానికి అతనికున్న ఆత్రుత, ఆశ, ఆకాంక్ష కనిపిస్తుంది మనకు! మీద చెప్పినట్లు సువార్త శక్తిని అతడు రుచి చూసారు కాబట్టి అతనికి సువార్త అనేది ఏదో నీరసమైన, నిరుపయోగమైన విషయంలా కనబడటం లేదు. అది బలమైన శక్తిగా, ఎంతో ప్రాముఖ్యంగా అర్ధం చేసుకున్నారు అందుకే సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటున్నారు. పౌలుగారికి తెలుసు అది అనగా సువార్త మనుష్యుల పాప విముక్తికి ఏకైక మార్గం అని, మనుష్యులను పాప క్షమాపణ కలిగించి, వారిని మార్చి, సన్మార్గంలో నడిపించి చివరికి ముక్తికి మార్గం చూపించి, ముక్తికి చేర్చే ఏకైక మార్గం అని అతనికి తెలుసు! అందుకే అపోస్తలుల కార్యములు 4:12 లో మరి ఎవనివలనను రక్షణ కలుగదు ఈ నామము నందే మనకు రక్షణ అంటున్నారు:
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.  . . . 

జాగ్రత్తగా పరిశీలిస్తే పౌలుగారు రాసిన మరే పత్రికలోను, ఈ పత్రికలో చెప్పినంత వివరంగా చెప్పలేదు! ముక్తికి మార్గం, పాప విముక్తి ఎలా కలుగుతుంది, మారుమనస్సు, రూపాంతరం చెందటం, నీతిమంతులుగా తీర్చబడటం లాంటి విషయాలు  చాలా వివరంగా రాసారు ఈ పత్రికలో! నిర్దోషిగా ఎంచబడటం 3:24; దేవునితో సమాధానపడటం, ఐక్యమవడం 5:1; నూతన జీవితం 68 అధ్యాయాలు; మహిమ పరచబడటం అనగా యేసుప్రభులవారి రూపులోనికి మారడం 8:2930. అపోస్తలులు అందరు చెప్పినట్లు పౌలుగారు కూడా యేసుప్రభులవారి సిలువ మరణం, రక్త ప్రోక్షణ ద్వారా, యేసునామము వలననే రక్షణ అని నొక్కి వక్కానిస్తున్నారు. అందుకే ఇవన్నీ ఆయనకు తెలుసుకాబట్టి ఆయన ధైర్యంగా సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటున్నారు.  రోమా 3:22.  3:21,22,23,24
21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. 
22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. 
23. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. 
24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 
25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని 
26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను. 
27. కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయ బడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టి వేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. 
28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము. 
30.దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.
4:4,5,6
4. పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచబడదు. 
5. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. 
6. ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు.  . . 
5:1 కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.( కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము అని పాఠాంతరము) 
 10:9,10
9. అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. 
10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. . . 
గలతి  2:15,16
15. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వా సము వలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మ శాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచియున్నాము; 
16. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.  .
 ఎఫేసి 2:89
8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. 
9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. ,.. యోహాను 1:12
తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.  , 
3:16 
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. . ..

  ఆయన రుచిచూసారు కాబట్టి ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా నేను సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడేవాడను కాను అంటున్నారు.
ప్రియ చదువరీ! నీవు ఎంతమందికి దేవునికోసం చెప్పావు? ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? లేక సిగ్గుపడుతున్నావా? అనేక అన్యజనులు ఆలోచిస్తున్నట్లు నీవుకూడా ఇది పరాయిదేశ మతం, లేక తక్కువ కులం వారి మతం, ఇలాంటి పిచ్చి తప్పుడు ఆలోచనలతో ఉన్నావా? లేక సువార్త ప్రకటిస్తే నీవు దిగిపోయావా అంటూ నిన్ను చిన్న చూపు చూస్తారు అనుకుంటున్నావా? 
నీవు లేవలేని స్తితిలో, నీకు ఏమీలేక ఎవరూ నిన్ను పలకరించలేని స్తితిలో, నిన్ను ఆదరించి, నిన్ను స్వస్తపరచి, ఈరోజు నీకు గొప్ప పేరు, ఆస్తి, పలుకుబడి అన్నీ ఇచ్చాక ఆయన పేరును బహిరంగంగా ప్రకరించడానికి సిగ్గుపడుతున్నావా? నీకు ఏమీ లేనప్పుడు, నీవు రోగిష్టిగా ఉన్నప్పుడు నిన్ను ఆదుకోలేని వారికోసం, నిన్ను ఆదరించలేని సమాజం కోసం నీవెందుకు ఆలోచించాలి? నీకోసం ప్రాణం పెట్టిన, నీవు మంచివాడివి కాకపోయినా సరే, నిన్ను ప్రేమించిన యేసయ్యకోసం ఆలోచిస్తున్నావా? ఈ రక్షణ వార్త వినకుండా, రక్షించబడకుండా చనిపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు అని తెలుసుకదా! మరి వారి ఆత్మల రక్షణ భారం నీకు లేదా ప్రియ సహోదరి! సహోదరుడా! యేసు ప్రభులవారు అంటున్నారు నన్నుగూర్చి, నాబోదగూర్చి ఎవడైతే సిగ్గుపడతాడో, అనగా ధైర్యంగా ఆయన నామమును ఒప్పుకోకుండా, ఆయనకోసం చెప్పకుండా ఉంటారో, అలాంటి వాడిని ఆయన దూతలతో వచ్చినప్పుడు యితడు నా వ్యక్తి అని దేవుడు చెప్పరంట. 
లూకా 9: 26
నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్యకుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.

 కాబట్టి నీవే తేల్చుకో! ఎవరు కావాలి నీకు? లోకులా? లోకమా? నీకోసం ప్రాణం పెట్టిన నీ దేవుడా? దేవుడే కావాలంటే సువార్త ప్రకటించాలి. సమయం అసమయం అని చూడకుండా, సిగ్గులేకుండా ధైర్యంగా సువార్త ప్రకటించాలి. అలా అయితే నీపాదములు దేవుని పర్వతం మీద, దేవుని పట్టణం, సుందరములుగా కనబడతాయి! కాబట్టి నేడే నిర్ణయించుకో! ఏమి కావాలి? సువార్త? లేక లోకులా?
దైవాశీస్సులు! 
*రోమా పత్రిక-13వ భాగం*
*సువార్త భారం-3*
   
      రోమా 1:16--17
16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. 
17. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచ బడుచున్నది. 

       ప్రియ దైవజనమా! మనం పౌలుగారి సువార్త భారం కోసం ధ్యానం చేసుకుంటున్నాం! గతభాగంలో నేను సువార్తను గూర్చి సిగ్గుపడే వాడను కాను అనడం కోసం వివరంగా చూసుకున్నాం.  ఇంకా వివరంగా చూసుకుంటే, ఎందుకు సిగ్గుపడటం లేదంటేనమ్ము ప్రతీవానికి మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై ఉన్నది!

    కొంచెం ఆగి వివరంగా ఇదే మాటలను ధ్యానం చేసుకుందాం. నమ్మే ప్రతీవానికి అంటూ మొదటగా యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి అంటున్నారు. మొట్టమొదటగా యూదునికి రక్షణ కలిగేలా అది దేవుని శక్తి అంటున్నారు. ఏం మొదటగా యూదులకే దేవుని శక్తి ఎందుకయ్యింది అంటే అది దేవుని ప్రణాళిక! అదంతే! ఎందుకు అలా చెబుతున్నావ్ అంటే మనం మత్తయి సువార్త జాగ్రత్తగా ధ్యానించాలి. మత్తయి 10వ అధ్యాయంలో యేసుప్రభులవారు తన శిష్యులను మొట్టమొదటగా సువార్త ప్రకటించడానికి పంపిస్తూ : 
5. యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించిన దేమనగామీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని 
6. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి.   . . . .. , 
ఇక తర్వాత  సువార్త ప్రకటించడానికి పంపినప్పుడు అందరి దగ్గరకు వెళ్ళమన్నారు. చివరికి చనిపోయి తిరిగిలేచాక అంటున్నారు మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. మత్తయి 28; మార్కు 16:15--16
 మొదటగా యూదులు, ఆ తర్వాతనే మొత్తం అన్యజనులు అనగా మనం. 
లూకా 24:47
యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.
 అపో.కార్యములు 1: 8
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
1౩:46,47
అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు,గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్లుచున్నాము;
ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.

పై వచనాల ప్రకారం మొదటగా సువార్త యూదుల దగ్గరకే పంపబడింది. ఆ తర్వాత ఈ సువార్త అందరికిని లోకమంతటికి ప్రకటించబడింది.  కాబట్టి మొదటగా ఈ సువార్త యూదులకు రక్షణ కలిగించే శక్తి. ఆ తర్వాత సర్వలోకానికి రక్షణ కలిగించే దేవుని శక్తి!

    ఇక ఈ వచనంలోను మిగతా భాగాలలోనూ గ్రీసు దేశస్తులకు అనగా కొరింథీ వారు అని గ్రహించాలి. కారణం ఈ లేఖ కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు పౌలుగారు వ్రాసినది. అయితే ఈ వచనంలో మొదటగా యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి అని వ్రాయబడింది కదా, కనుక రక్షణ అనేది భారతీయులకు లేదు అని అనుకోవద్దు! నమ్మే ప్రతీవానికి అన్నారు అందుకే మొదటగా పౌలుగారు. నమ్మే ప్రతీవాడు, అనగా మొదటగా యూదులు ఆ తర్వాత నమ్మిన వాడు ఎవడైనా సరే, వాడు గ్రీసు దేశస్తుడైనా, భారతీయుడైనా, పాకిస్తాన్ వాడైనా సరే, అది అనగా సువార్త దేవుని శక్తియై ఉన్నది .

   ఇక 17వ వచనంలో .ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచ బడుచున్నది . . .  
ఇక్కడ నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని లేఖనం చెప్పినది చెబుతూ దానిని సువార్తకు అన్వయిస్తున్నారు పౌలుగారు. మన టాపిక్ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని కాదు కాబట్టి దీనికోసం డీప్ గా ధ్యానం చేయడం లేదు గాని రెండు మాటలు చూసుకుందాం.  మొదటగా విశ్వాసుల తండ్రి అని పిలువబడిన అబ్రాహాము గారి విశ్వాసం వలన ఇస్సాకు గారు జీవించారు. ఎలా అంటే: దేవుడు అబ్రాహముగారికి నీ కొడుకుని తీసుకుని మోరియా కొండమీద నాకు బలి ఇచ్చేయ్ అంటే, అక్కడ బలి ఇవ్వడానికి సిద్దమయ్యారు.  ఒకరకంగా చూసుకుంటే అక్కడ దేవునిదూత ప్రత్యక్షం అవకపోతే  100% బలి ఇచ్చేసి ఉండేవారు కదా, కాబట్టి అబ్రాహాము గారి విశ్వాసమూలంగా ఇస్సాకుగారు జీవించారు. 
అలాగే దానియేలు గారిని  సింహాల బోనులో వేశారు. సింహాలు ఆకలితో ఉన్నాయి కాబట్టి దానియేలు బ్రతకడం అసంభవం, గాని దానియేలుగారి విశ్వాసం మూలంగా దేవుడు సింహాలనోళ్లను మూయించి దానియేలు గారిని సజీవముగా ఉంచారు. 
సోదోమ, గోమోర్రా, అద్మా, సెబాయిము ఈ నాలుగు పట్టణాలు అగ్ని గంధకములతో కాల్చబడ్డాయి. గాని నీతిమంతుడైన లోతు అతని కుటుంబం చనిపోలేదు.  ఇలా మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి బైబిల్ లో! నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతకడం ఇదే!  

   సరే, మనం మరలా మన టాపిక్ కి వద్దాం! ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలు పరచబడుచున్నది.  ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు. ఇలా విశ్వాసమూలంగా బ్రతుకుతారు కాబట్టి ఈ విశ్వాసంతో నీవు ఇతరులకు సువార్త ప్రకటిస్తే, వారు విశ్వసించి, రక్షించబడతారు. అంతేకాదు నీవు విశ్వసిస్తే ఇంకా దేవునియందు నీ విశ్వాసం ఇంకా బలపడుతుంది.

  ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం ఉంది. విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడియున్నది అంటున్నారు. అనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారం ఎవరైతే విశ్వాసం కలిగి సువార్త ప్రకటిస్తారో, ఆ సువార్త శక్తి విన్నవారిలో దేవుని నీతిని బయలు పరుస్తుంది అంటున్నారు. దేవుని నీతి ఏమిటి? దీనికోసం తర్వాత భాగాలలో వివరంగా చూసుకుందాం. దేవుని నీతి అనే మాట పౌలుగారి పత్రికలలో చాలాసార్లు వ్రాయబడింది.  దేవుని నీతి అనగా వాడుకభాషలో చెప్పుకోవాలి అంటే: మనం నీతిమంతులం, మంచివారం కాకపోయినా, దేవుడు మనలను ప్రేమించి , మనలను తనతో ఐక్యం చేసుకోడానికి , మన పాపములు తీయడానికి దేవుడే పరలోకం నుండి భూమిమీదకు వచ్చి, మనకోసం తన రక్తాన్ని చిందించి, ఆ రక్తం ద్వారా మన పాపములకు ప్రతిఫలమైన పరిహారమును చెల్లించి, మనలను తనతో సమాధానపరచుకొని, ఈ సువార్త విని, అంగీకరించిన ప్రతీవారిని రక్షించడమే దేవుని నీతి! విలువలేని, నీతిలేని మనకు తన రక్తం ద్వారా విలువ, నీతి కలుగ జేయడమే దేవుని నీతి!  కాబట్టి ఈ సువార్తలో ఇంత మహత్తరమైన శక్తి ఉంది గాబట్టే నేను సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడను అంటున్నారు పౌలుగారు!

  ప్రియ స్నేహితుడా! పౌలుగారు సిగ్గుపడటం లేదు సువార్త చెప్పడానికి! నీవు సిగ్గుపడుతున్నావా? పౌలుగారు సన్హెడ్రిన్ సభలో సభ్యుడు! వాడుకభాషలో చెప్పాలంటేనేటిరోజులలో ఒక MP కి ఎంత హోదా ఉన్నదో ఆ రోజులలో పౌలుగారు అదే హోదాలో ఉండేవారు. ఈ హోదా డబ్బులు ఖర్చుపెట్టి, రిగ్గింగులు చేసి పొందుకున్నది కాదు. తాను చదివిన చదువుకి, తన ప్రావీణ్యానికి దక్కిన ప్రతిఫలం! ఇంతగొప్పవాడు సమస్తాన్ని వదలి క్రీస్తు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. సిగ్గుపడటం లేదు! ఈ నా టాపిక్ చదువుతున్న వారు ఎవరూకూడా పౌలుగారి కంటే గొప్ప పదవిలో లేనివారే అని నా ఉద్దేశ్యం! అంత పెద్దపదవిలో ఉన్న వ్యక్తి సువార్తను సిగ్గులేకుండా ప్రకటించినప్పుడు నీవెంత! 
నీవెందుకు ప్రకటించడం లేదు? 
గర్వమా? సిగ్గా? 
దయచేసి ఆ రెండు వదలివేసి నేడే సువార్తను ప్రకటించడం మొదలుపెట్టు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-14వ భాగం*
*సువార్త భారం-4*
      రోమీయులకు 1:18
దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలు పరచ బడుచున్నది. 

       ప్రియ దైవజనమా! పౌలుగారి సువార్త భారము లో భాగంగా చెబుతున్న మాటలివి. మనం సువార్త ఎందుకు చెప్పాలంటే దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలు పరచ బడుచున్నది కాబట్టి ఆ కోపం, ఉగ్రతనుండి ప్రజలను రక్షించాలి అంటే ఈ సువార్త ప్రకటించబడాలి. దానిని విని వారు రక్షించబడగలరు. రక్షించడానికి నీకు నాకు శక్తి లేదు గాని సువార్తకు ఆ శక్తి ఉంది. నీ భాద్యత సువార్త ప్రకటించడం మాత్రమే! కార్యం జరిపించడం పరిశుద్ధాత్మ కార్యం! నీవు అనుకోవచ్చు వాడు మారడు, వాడు దుర్మార్గుడు! ఇంకొంతమంది వాడు చావాలి! వాడు నరకంలో గిలగిలలాడుతూ కాలిపోవాలి అని కోరుకుంటారు. 
నీనెవే వారి విషయంలో దైవజనుడు యోనా అలాగే కోరుకున్నారు. అందుకు దేవుడన్నారు. 
యోనా 4:2,3,4,9,10,11
2. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవైయుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. 
3. నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను. 
4. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను. 
9. అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. 
10. అందుకు యెహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే; 
11. అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను.. . .

పౌలుగారి విషయంలో దైవజనుడు అననీయ అలాగే కోరుకున్నారు. దేవునికి కంప్లైంట్ ఇస్తున్నారు.Acts(అపొస్తలుల కార్యములు) 9:11,12,13,14,15,16,17,18
11. అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. 
12. అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను. 
13. అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. 
14.ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయువారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చెను. 

అందుకు దేవుడు చెబుతున్నారు. . . .
15. అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు(మూలభాషలో-పాత్రయైయున్నాడు) 
16. ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. 
17. అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతనిమీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టిపొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్ల నన్ను పంపియున్నాడని చెప్పెను. 
18. అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.  . . . 
కాబట్టి దేవుని ఇష్టం నీకు తెలియదు. అంతటా అందరూ మారుమనస్సు పొందాలని దేవుని కోరిక!
2పేతురు 3: 9
కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

 అంతేగాని ప్రజలు అగ్ని గంధకాలలో మండిపోవాలని దేవుని కోరిక ఎంతమాత్రమూ కాదు. ఇదే విషయాన్ని భక్తుడైన యెహేజ్కేలు గారితో దేవుడు చెబుతున్నారు: దుర్మార్గుడు చావాలని నేను కోరుకోవడం లేదు..
Ezekiel(యెహెజ్కేలు) 33:11
.కాగా వారితో ఇట్లనుమునా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతో షము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పు కొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.  . . 
కాబట్టి వారు ఉగ్రతకు గురికాకుండా రక్షించబడేలా నీవు వారికి సువార్త ప్రకటించాలి వారు నీకు వ్యక్తిగతంగా నచ్చినా నచ్చకపోయినా సువార్త చెప్పడం నీ బాధ్యత! 
    మరలా మనం దైవజనుడు అననీయ గారి దగ్గరకు వెళ్దాం! ఎప్పుడైతే దేవుడు నీవు వెళ్ళి నేను చెప్పింది చేయు అంటూ , దేవుని సంకల్పం తెలిసిన తర్వాత, వెంటనే ఆయన పిలుపు మారిపోయింది! ఇంతవరకు ఉన్న కోపం, ఆందోళన అన్నీపోయి దైవికప్రేమ పొంగి పొర్లిపోతుంది ఆయన మాటలలో! సౌలా సహోదరా! వాహ్వా! ఏం పిలుపండి!! విరోధి సహోదరుడయ్యాడు! కన్నీటితో ప్రార్ధించాడు. పౌలుగారి పాపపు పొరలు రాలిపోయాయి. ప్రేమ పుష్పాలు వికసించాయి. సువార్త పంటలు విరివిగా పండాయి. ఆ తర్వాత పౌలుగారు ఎలాంటి సువార్త పరిచర్య చేశారో, ఎలాంటి ప్రేమనాధం వినిపించారో మనందరికీ తెలుసు! కాబట్టి ప్రకటించడం నీ భాద్యత! ఆ పని నీవు చేయు! ఆదిమ సంఘం గాని, అపొస్తలులు గాని, చివరకు అననీయ గాని అనుకోలేదు పౌలుగారు అలాంటి ఘనమైన సేవ చేస్తారని! అలాగే నీవుకూడా తెలుసుకోలేవు ఎవరు ఎలాంటి సేవ చేస్తారో, అది మన CEO దేవునికి మాత్రమే తెలుసు! కనుక నీ పని నీవు చేయు!

   మరలా మనం మన వచనానికి వద్దాం! దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను. . ఈ లోకంలోని దుర్నీతి సత్యాన్ని అడ్డగిస్తుంది. ఆ దుర్నీతి చీకటి! అది సాతాను గాడు చేస్తున్న పని! అందుకే నీవు సత్యవాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తే, నీలోనున్న వెలుగు ఆ చీకటిలో ప్రకాశిస్తుంది. అది అనేకులకు వెలుగునిచ్చి, వెలుగులోకి ఇతరులను నడిపిస్తుంది. అలా జరుగకుండా సాతానుడు చేస్తున్నాడు. 
ఈ తీర్పును గూర్చి, ఉగ్రత కోసం కొద్దిగా ధ్యానం చేద్దాం
 యోహాను 3:18--21
18. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పుతీర్చబడెను. 
19. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 
20. దుష్కార్యము చేయు( లేక, అభ్యసించు) ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు( మూలభాషలో-తన క్రియలుగద్దింపబడకుండునట్లు) వెలుగునొద్దకు రాడు.  .
2 థెస్సలోనికయ 2:10--12
10. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును 
11. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, . . 

అందుకే మనం సువార్తను ప్రకటించాలి. ఈ వచనం నుండి 3:20 వరకూ పౌలుగారు ఒక ప్రాముఖ్యమైన  విషయం వివరిస్తున్నారు. మనష్యులందరూ పాపం చేస్తున్నారు, పాపమునకు వచ్చు జీతం మరణం. రోమా 6:23; అది నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది. అందుకే వీరందరికీ సువార్త ప్రకటించాలి. ఈ విషయాన్ని చాలా వివరంగా రాస్తున్నారు పౌలుగారు. రోమా 3:9,10,12,19,23
9. ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము. 
10. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు 
12. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి.మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. 
19. ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము. 
23. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.  ఎఫెసీ 2:3
వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై(మూలభాషలో-ఉగ్రత పిల్లలమై) యుంటిమి. . కాబట్టి ప్రతీ ఒక్కరు ఉగ్రతకు పాత్రులై ఉన్నారు.

   కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! నీకు నచ్చిన నచ్చకపోయినా సువార్త ప్రకటించు. చీకటిని పారద్రోలు!
ప్రజలను ఆ ఉగ్రతనుండి తప్పించుకోవడానికి సహాయం చేయు!
 క్రీస్తుకు సాక్షిగా ఉండు!
దైవాశీస్సులు! 


*రోమా పత్రిక-15వ భాగం*

      రోమా 1:1920
19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. 
20. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు.  ....

     ప్రియులారా! రెండవభాగంలో చెప్పినట్లు ఈ 18వ వచనం నుండి 3:20 వరకు దేవునియొక్క గద్దింపు కనబడుతుంది మనకు వివిధమైన అంశాల మీద! గత భాగంలో సత్యమును అడ్డగించు సమస్త భక్తిహీనత మీద, దుర్నీతిమీద దేవుని ఉగ్రత వస్తుంది అని సవివరముగా ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మిగతా విషయాలు ధ్యానం చేసుకుందాం!  ప్రియులారా ఈ 19, 20 వచనాలు కలసే ధ్యానం చేసుకోవాలి.  ఇది 18 వ వచనమునకు కొనసాగింపు.

   19వచనంలో దేవుని ఉగ్రత ఇంకా ఎందుకు వస్తుంది అంటే దేవునిగూర్చి తెలియ శక్యము కానిది వారికి విశిధముగా తెలియజేయబడింది. గాని దానిని వారు అంగీకరించలేదు కాబట్టి వారికి దేవుని ఉగ్రత వస్తుంది అంటున్నారు.  ఇక్కడ వారు అనగా ఎవరు? భక్తీ హీనులు!  భక్తిహీనుల మీద ఉగ్రత రావాలా అంటే మనము 20-23 వరకు చదువుకుంటే గాని అర్ధం అవదు . .
20. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు. 
21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. 
22. వారి అవివేక హృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 
23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.  . . . ..

   ప్రియులారా! పై వచనాల ప్రకారం దేవుని గురుంచి వారికి విశిదముగా తెలియజేయబడిన మొదటి గ్రూపు వారు దానిని అర్ధం చేసుకోకుండా దేవుడు లేడు అనడం మొదలుపెట్టారు. ఇక రెండవగ్రూపు వారు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పశుపక్ష్యాదుల యొక్కయు  రూపములోనికి , ప్రతిమా స్వరూపములోనికి మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తున్నారు. అందుకే దేవుని ఉగ్రత వారిమీడకు రాబోతుంది అంటున్నారు పౌలుగారు.  దీనికోసం మనం ఇప్పుడు వివరముగా చూసుకుందాం. ఈరోజు మనం మొదటి గ్రూపువారికోసం చూసుకుందాం.

    ఆయన అదృశ్య లక్షణములు .... మొదటగా పౌలుగారు దేవుని దైవత్వమునకు భయపడాలి అంటూ మొదటగా చెబుతున్న అంశం : ఆయన అదృశ్య లక్షణములు! ఆయన అదృశ్య లక్షణములు ఏవి? చాలా ఉన్నాయి!
For Example:
1). Omnipotence- God is All powerful
2.  Omniscience-  God Knows everything
3.  Omnipresence- God is Everywhere,
ఇవేకాకుండా బైబిల్ లో కోకొల్లలు ఉన్నాయి ఆయన అదృశ్య లక్షణములు! అయితే పౌలుగారు మనం ఎక్కువగా బుర్రబద్దలు కొట్టుకోకుండా ఆయనే రాస్తున్నారు: ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వము!!! ఈ రెండు చాలాచాలా ప్రాముఖ్యమైనవి. అందుకే ఈ రెంటిని మాత్రమే ఉదాహరిస్తున్నారు.  ఆయనది నిత్యశక్తి! Everlasting Power! ఈ లోకంలో ఉన్న శక్తి ఏదైనా ఉంది అంటే అది తాత్కాలికమైనవే! నిరంతరమూ ఉండేవి లేవు! మన ఇంటిలో కరెంటు కూడా మాటిమాటికి పోయి వస్తుంది. ఐతే మనకు కనబడే సూర్యుడు, నక్షత్రాలలో ఉండే శక్తి నిరంతరమూ ఉంటుంది అని మనం తలస్తాము. అయితే శాస్త్రజ్ఞులు అంటున్నారు. సూర్యుడు మరియు నక్షత్రాలలో అనునిత్యమూ రెండు హైడ్రోజన్ పరమాణువులు కలుస్తూ హీలియం గా మారుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలో గొప్ప శక్తి ఉత్పనమౌతుంది. దానివలనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు! ఐతే మరికొన్ని సంవత్సరాలలో (వందల) సూర్యునిలో ఉన్న హైడ్రోజన్ అయిపోతుంది. అప్పుడు సూర్యుడు ప్రకాశించడు అంటున్నారు. అనగా సూర్యుని శక్తి నిత్యశక్తి కాదు! దేవునిలో ఉన్న శక్తిమాత్రమే నిత్యశక్తి! ఆయన కలుగజేసిన సృష్టి కేవలం ఆయన నిత్యశక్తివలన మాత్రమే ఉనికిని కలిగిఉంది. దానికోసం పౌలుగారు చెబుతూ ఆయనే (యేసుక్రీస్తు ప్రభులవారు) ఈ సమస్త సృష్టిని నిర్వహిస్తున్నారు. అంటున్నారు. హెబ్రీయులకు 1: 3
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక. . .
 ఆయనకోసం మాట్లాడుతూ తిమోతి పత్రికలో  . 1 తిమోతి 6:15,16
15. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు. 
16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. . . . .. 
ఇంకా అంటున్నారు ఆకాశం నా సింహాసనం, భూమి నా పాద పీఠం, అపొ 7:48;  ఇంకా మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు, ఆయన చుట్టూ ప్రచండవాయువు విసరుచున్నది. ఆయన ముందర అగ్ని మండుచున్నది అని వ్రాయబడింది. కీర్తనలు50; ఇంత శక్తిగల దేవుణ్ణి వారు తృణీకరిస్తున్నారు కాబట్టి వారి మీదకు ఉగ్రత రాబోతుంది అంటున్నారు పౌలుగారు.

    దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు! వారు చెడిపోయిన వారు, అసహ్యకార్యములు చేయుదురు అని సెలవిస్తుంది బైబిల్. కీర్తనలు 14,53;  దేవుడు లేడు. ఉంటే చూపించు అని చాలెంజ్ చేసే దరిద్రులకు దేవుడు చెబుతున్నారు: మీరు బుద్దిహీనులు!  కరెంట్ తీగలు కేవలం రాగి గాని, అల్యూమినియం తీగలు మాత్రమే! గాని ఒకసారి అవి ట్రాన్స్ఫార్మర్ కి , స్థంబాలకు కలుపబడిన తర్వాత అవి తీగెలు మాత్రమే అని పట్టుకోమని చూడండి ఈ అతితెలివైన వారికి! వెంటనే చచ్చి పడతాడు!  అదేవిధముగా అంత దేవాదిదేవుడ్ని మానవ కన్నులతో చూడటం, మానవ చేతులతో తాకడం అసంభవం! చూస్తే నీ కళ్ళు పేలిపోతాయి ఆ అఖండ తెజస్సుకి, శక్తికి! సూర్యునివేడిమినే తట్టుకోలేని నీవు అంతగొప్ప దేవుణ్ణి తాకగలవా? మాడిమసైపోతావు! అందుకే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. . . . ఇప్పుడు కరెంట్ తీగలో కరెంట్ ఎలా కనబడటం లేదో, అలాగే విశ్వములో మానవనేత్రాలకు దేవుడు కనబడటం లేదు. అలా అని కరెంట్ తీగలలో కరెంట్ లేదు అని చెప్పలేము. అలాగే దేవుడు లేడు అనికూడా చెప్పలేము. ఆయన చాలా శక్తిగలవాడు! ఆయన చేసిన మొసలిని ఎదిరించలేనివాడివి ఆయనను ఎలా ఎదిరించగలవు? ఆయన పంపిన తుఫానులలో ఉద్భవించిన శక్తి, గ్రేడియంట్స్ని , గాలిని ఆపలేనివాడివి, తట్టుకోలేని వాడివి ఆయనను ఆపగలవా? అలాగని లేదు అనగలమా? కాబట్టి ప్రియ స్నేహితుడా! దేవుడు ఉన్నాడు. ఈ సమస్త సృష్టిని, నిన్నునన్ను ఆయనే చేశారు. దానిని ఒప్పుకో! ఇంకా అంటున్నారు ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు.  .... ఈ సృష్టి బిగ్ బాంగ్ ద్వారా ఏర్పడలేదు. కొన్నిపదార్ధములు కలిసి ఇలా రూపింపబడలేదు! నీవు వేసుకున్న షర్ట్ ని ఒక టైలర్ కుట్టినట్లే, నీవు వాడుతున్న ప్రతీవస్తువు ఎవరో ఒకరు చేసినట్లేనిన్ను నన్ను ఒక శక్తి చేసింది. ఆయన దేవుడు! ఆయన సర్వసృష్టికర్త! లయకర్త! ఆయన యేసుక్రీస్తుప్రభులవారు! సత్యాన్ని తెలుసుకో! లేకపోతే పౌలుగారు చెబుతున్నారు: 
ఆయన ఉగ్రత తొందరలో రాబోతుంది! ఉగ్రత తప్పించుకోవాలంటే ఆయనను నీ స్వంత రక్షకునిగా, నీ దేవునిగా అంగీకరించు! 
నీ పాపములు కడిగివేసుకో! 
ఆ నిత్యరాజ్యములో ప్రవేశించు!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-16వ భాగం*
  
        రోమా 1:1920
19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. 
20. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు.  ...

    ప్రియ దైవజనమా! దేవుని ఉగ్రత న్యాయంగా అవిధేయుల మీదకు ఎలా వస్తుందో గతభాగంనుండి ధ్యానం చేసుకుంటున్నాం! గతభాగంలో దేవుడు లేడు అనే గ్రూప్ వారికోసం పౌలుగారి జవాబు చూసుకున్నాం! అదే వచనములో ఇంకా ముందుకుపోతే ఆయన దైవత్వం కోసం జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి అంటున్నారు. అనగా ఓ అతితెలివైన వారలారా! ఈ సృష్టిలో ఉన్న వస్తువులు, సృష్టికోసం ఎప్పుడైనా ఆలోచించారా?  ముందు ఆయన వస్తువులకోసం ఆలోచించమంటున్నారు ఎందుకంటే-  వస్తువు ఏదైనా సరే, ఎవరో ఒకరు ఆ వస్తువును తయారుచేశారు. దానికదే ఏ వస్తువు తయారవలేదు.

   ఒకసారి ఒక వ్యక్తి ఒక ట్రైన్లో బైబిల్ చదువుకుంటున్నారు అట! ఎదురుగా ఉన్న పిల్ల సైంటిస్ట్ ఒకడు ఏమయ్యా! చదువుకున్నవాడిలా ఉన్నావ్, ఎందుకు బైబిల్ చదువుతున్నావ్? దేవుడు లేడు దయ్యము లేదు! ఇలాంటి ట్రాష్ చదవద్దు అన్నాడంట! ఇలా ఎన్నో చెప్పాడంట. చివర్లో నీకేమైనా అనుమానం ఉంటే నన్ను కలువు లేదా ఫోన్ చెయ్ అంటూ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చాడంట! సరే అని ఆ కార్డు ఆ వ్యక్తి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత మర్యాద కోసం మీరెవరో చెప్పలేదు అని ఆ పిల్ల సైంటిస్ట్ అడిగితే, ఈ వ్యక్తి తన కార్డ్ ఇచ్చాడు. ఆ కార్డ్ చూసిన వెంటనే ఆ పిల్ల సైంటిస్ట్ కి కాళ్ళుచేతులు వణకడం మొదలెట్టాయి. కారణం ఆ వ్యక్తి మహా విశ్వవిఖ్యాత సైంటిస్ట్  థామస్ ఆల్వా ఎడిసన్ గారు! సారీ సార్! మీరెవరో తెలియక అనేశాను! దయచేసి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. ఎప్పుడు రమ్మంటారు అని అడిగితే ఫలాని తారీకున రమ్మని చెప్పారు. ఆ తారీకున ఈ పిల్ల సైంటిస్ట్ థామస్ గారి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఆయన ల్యాబ్లో ఏదో పని చేసుకుంటున్నారు. అక్కడ విశ్వం ఎలా ఉంది, సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు ఎలా తిరుగుతున్నాయో ఒక మోడల్ తయారుచేయబడి, అన్నీ తిరుగుతున్నాయి. అది చూసిన వెంటనే ఈ పిల్ల సైంటిస్ట్ అడుగుతున్నాడుసార్ దీనిని ఎలా తయారుచేసారు, ఎప్పుడు తయారుచేసారు? ఎన్నిరోజులు తయారుచేశారు? అని అడిగాడు! థామస్ ఆల్వా ఎడిసన్ గారు అన్నారునాకు తెలియదు బాబు, ఇందాక లేదు, నేను బయటికి వెళ్లి రాబోయేసరికి ఇది ఇక్కడ ఉంది అన్నారంట! సార్ నాతో జోకులు వెయ్యొద్దు! దీనిని మీరే చేసారు అని ఈ విశ్వం మొత్తానికి తెలుసు! దయచేసి చెప్పండి అంటే మరలా అదేమాట చెప్పారంట! పిల్ల సైంటిస్ట్ అన్నాడుసార్ దీనిని ఎవరో తయారుచేయకుండా దానికదే ఎలా వస్తుంది. దీనిని మీరే చేసి నాతో జోకులు వేస్తున్నారు. నన్ను క్షమించి నిజం చెప్పండి అని అడిగాడు! అప్పుడు ఈ థామస్ ఆల్వా ఎడిసన్ గారు అన్నారు: జవాబు నీ జవాబులోనే ఉంది! దీనిని ఎవరో ఒకరు చేశారు అన్నావ్ కదా, అలాగే ఈ విశ్వాన్ని కూడా ఎవరో ఒకరు చేశారు, అలా చేసినప్పుడే ఈ సృష్టి, విశ్వం తయారయ్యింది. ఆ వ్యక్తి, శక్తి దేవుడు! దీనికోసం బైబిల్ లో ఆదికాండం మొదటి అధ్యాయంలో వివరంగా వ్రాయబడియుంది. అలాగే దీనిని కూడా నేనే చేశాను అని చెబితే అతనికి జ్ఞానోదయం అయ్యింది!

   పౌలుగారు కూడా ఇదే చెప్పారురూపింపబడిన వస్తువులను ఎవరో ఒకరు చేశారు. అలాగే ఈ విశ్వాన్ని, నిన్ను నన్ను దేవుడు చేశారు. ఇక మానవ శరీరంలో గల అవయవాలు- వివిధమైన వ్యవస్థలు గురుంచి మనం ఆలోచిస్తేదేవుడు ఎంత సర్వజ్ఞాని అనేది మనకు తెలుస్తుంది.  నోరు పెట్టాల్సిన జాగాలో నోరు పెట్టారు. కళ్ళు పెట్టాల్సిన జాగాలో కళ్ళు పెట్టారు. ఒకసారి ఇమాజిన్ చెయ్యండి (ఆలోచించండి). ఒకవేళ నోరు నెత్తిమీద (తలమీద) ఉంటే నీవు అన్నం ఎలా తింటావు? అది నోట్లోకి వెళ్తుందా లేక ఇంకెక్కడికైనా వెళ్తుందా? లేక కళ్ళు పొరపాటున నెత్తిమీద ఉన్నాయి అనుకో, అప్పుడు నీకు కళ్ళు ఎదురుగా ఉన్నాయి కనబడతాయా? కనబడటం కోసం నీవు వంగి నడవాల్సి ఉంటుంది కదా! అల ఒంగి నడిస్తే, నీకు పశువుకు తేడా ఏమైనా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి! ఇంకా ఇలా చెప్పుకుంటే పొతే చాలా ఉన్నాయి.

   ఒకసారి ఇలాంటి అతితెలివిగలవాడు ఒకడు ఎండలో ఒక మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నాడు అట! అప్పుడు ప్రక్కనే ఒక పాకమీద ఒక ఆనపకాయ పాదుకి పెద్దపెద్ద కాయలు కాచి ఉండటం చూశాడు. అనుకుంటున్నాడు ఈ ఎతిస్ట్: దేవుడు ఎంత మూర్ఖుడు, తెలివితక్కువ వాడు! ఇంత పెద్ద మర్రి చెట్టుకి చిన్న కాయలా? అంత చిన్నపాదుకి అంత పెద్దకాయలా? నేనే దేవుడ్ని అయితే మర్రి చెట్టుకి ఆనపకాయంత కాయలు, ఆనపపాదుకి మర్రికాయంత కాయలు పెట్టి ఉందును అని అనుకుంటున్నాడట! ఈ లోగా వరుసగా నాలుగైదు మర్రిపల్లు వీడి నెత్తిమీద, పొట్టమీద పడ్డాయట! వెంటనే వీడికి  జ్ఞానోదయం అయ్యింది. అవును కదా దేవుడు అనంతజ్ఞాని! నిజంగా ఈ మర్రిపళ్ళు  ఆనపకాయంత పెద్దగా ఉంటే, అవి నామీద ఇప్పుడు పడియుంటే నా నెత్తి మూడుముక్కలు అవి ఉండును గదా! పొట్ట చెక్కలై ఉండును గదా! దేవుడు ఏ చెట్టుకి ఎలాంటి ఫలం పెట్టాలో అలాగే పెట్టాడు. నేనే అజ్ఞానిని, దేవుడు జ్ఞాని అని ఒప్పుకున్నాడు! 
    
     కాబట్టి దేవుడు చేసిన సమస్త సృష్టి, సృష్టిలో గల ప్రతి చెట్టు, జంతువూ, చివరికి గడ్డిపువ్వు కోసం ఆలోచిస్తే దేవుని జ్ఞానం మనకు కనబడుతుంది. దేవుని ఉనికి దానిలో కనబడుతుంది.  నీరు భూమిలో ఉంటుంది. కాని కొబ్బరికాయ చెట్టుమీద ఉంటుంది. ఆ కొబ్బరికాయలోకి నీరు ఎలా వచ్చింది? నీవు ప్రవేశపెట్టగలవా? మనిషి గర్భంలో శిశువు/పిండం మొదట్లో ఒక అణువులా ఉంటుంది. ఈ చిన్న అణువులో కళ్ళు, కాళ్ళు, తల, గుండె, మొండెం ఇవన్నీ దేవుడు ఎలా పెట్టారు? మన శరీర వ్యవస్థ అన్నీ ఇలా సక్రమంగా ఎలా జరుగుచున్నాయి! గుండె ఎలా కొట్టుకుంటుంది. ఇవన్నీ నిజంగా ఆలోచిస్తే భయమును వణకును కలుగుతుంది కదా! అందుకే దావీదు గారు అంటున్నారు . కీర్తనల గ్రంథము 139:4,5,6,7,8,9,10,11,13,14,15,16
4. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. 
5. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నా మీద ఉంచియున్నావు. 
6. ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు. 
7. నీ ఆత్మయొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? 
8. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు 
9. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను 
10. అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును 
11. అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల . . .
13. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. 
14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. 
15. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండ లేదు 
16. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను. . . . .

   ఈ సమస్త సృష్టి దేవునికి, భయపడి వణకుతుంది. దేవునిమాటకు సమస్తము లోబడుచున్నది. గాని దేవునిచేతులతో చేసుకున్న మనిషి మాత్రం దేవునికి భయపడటం లేదు! 
కాబట్టి ప్రియ చదువరీ! దేవుడు ఉన్నారు! ఆయనే ఈ సృష్టిని నిన్ను నన్ను చేశారు! ఇది నిజం!!! 
సత్యం తెలుసుకుని ఆయనను అంగీకరించు! 
పరలోకం చేరుకో!
దైవాశీస్సులు!
       

*రోమా పత్రిక-17వ భాగం*
  
        రోమా 1:1920
19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. 
20. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు.  ...

   ప్రియ దైవజనమా! ఇంతవరకూ మనం మొదటి గ్రూప్ కోసం అనగా దేవుడు లేడు దయ్యం లేదు అనే గ్రూప్ కోసం చూసుకొన్నాం. యేసుక్రీస్తు దైవత్వం కోసం ఇక్కడ నేను రాయడం లేదు కారణం కొలస్సీ పత్రిక ధ్యానం లో మనం చాలా విస్తారంగా చూసుకున్నాం కాబట్టి వదిలేద్దాం!

      ఇక రెండవ గ్రూప్ కోసం ధ్యానం చేసుకుందాం. ఈ గ్రూప్ వారు దేవుడిని నమ్ముతారు, చాలా భక్తి గలవారు. అయితే విచారం ఏమిటంటే సృష్టికర్తను వదలి, సృష్టిని పూజిస్తున్నారు. వీరికోసం చాలా విచారంతో రాస్తున్నారు పౌలుగారు! ఒకసారి పౌలుగారు ఏథెన్స్ పట్టణం వెళ్తే అక్కడ తెలియబడని దేవుడు అనే గుడి కట్టి, బలిపీఠం కట్టి పూజిస్తున్నారు అక్కడ! వాటి ప్రక్కనే సమస్త భూ జలచరాలను దేవతలు గా పూజిస్తున్నారు. అపొ 17:23;

 దీనికోసం తర్వాత మూడు వచనాలలో చాలా వివరంగా రాస్తున్నారు పౌలుగారు.  
రోమీయులకు 1:21,22,23
21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. 
22. వారి అవివేక హృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 
23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. 

     ఇది పౌలుగారి అసలు బాధ! దేవుడ్ని రాతిలోను, ఫొటోలలోను, మనుష్యుల లోను (బాబాలు) వెదుకుతున్నాడు మనిషి! ఇంతకీ దేవుడెవరూ?
             
   ఒకసారి ఆగి ఆలోచిద్దాం! ఇంతకీ దేవునికి ఉండాల్సిన లక్షణాలు, అధికారాలు, అర్హతలు ఏమిటి? మరి మనం పూజించే దేవుడు ఎలాంటివాడై ఉండాలి అనేది తెలుసుకోవలసి యుంది కదా! మన భారతదేశం పూర్వకాలం నుండి ఎంతో సనాతన ధర్మము, ఆచారాలు కలిగిన దేశం! అలాగే ఎన్నో మతపరమైన గ్రంధాలు మనకున్నాయి. వాటిప్రకారము, ఇంకా మిగతా దేశాలవారికి చెందిన మతాలవారి గ్రంథాల ప్రకారం దేవునికి ఉండవలసిన ముఖ్యలక్షణాలు కొన్ని ఉన్నాయి. Someone says God must have Three characteristics, 7 Attributes, 15 qualities like that.  
Characteristics are: God must be 
1. Omnipotence- - God is All Powerful; 
2. OmniscienceGod knows everything; 
3. OmnipresenceGod is Everywhere.
1). దేవుడు సృష్టికర్తయై ఉండాలి, సృజింపబడినవాడు కాకూడదు. 
2). నిరాకారుడు, నిర్గుణుడై ఉండాలి! అనగా ఒక ఆకారం కలిగి ఉండకూడదు, అరిషడ్వర్గాలు అని పిలువబడే క్రామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యము గలవాడై ఉండకూడదు! 
3) నిత్యమూ ఉండేవాడై ఉండాలి! 
4) గురువై ఉండాలి, మాదిరిగా ఉండాలి; 
5) పాపాలు తీయగలిగిన వాడై ఉండాలి! అనగా పాప సంహారకుడై ఉండాలి! 
6) లోక కల్యాణం కోసం పాటుపడినవాడై ఉండాలి! అనగా లోక కల్యాణం కోసం, ప్రజల శ్రేయస్సుకోసం తనను తానూ అర్పించుకోడానికైనా సిద్ధమై ఉండాలి! ; 
7) మంచివాడై యుండాలి. మంచిని కాపాడుతూ చెడును సంహరించేవాడై ఉండాలి!
8) స్వర్గమిచ్చువాడై ఉండాలి.
  ఇలాంటివి చాలా ఉన్నాయి గాని ముఖ్యమైనవి ఇవి! అది ఏ మతమైనా, ఏ దేశమైనా సరే! మరి ఈ లక్షణాలు కల దేవుడు ఎవరు ఉన్నారు? దేవుళ్ళు అని పిలవబడే కొంతమంది ఉన్నారు గాని వారికి వీటిలో ఒకటో రెండో లక్షణాలు ఉన్నాయి గాని, మొత్తమన్నీ ఎవరిలో ఉన్నాయి? *ఇక రెండో లక్షణమైన నిర్ఘుణుడు అనగా అరిషడ్వర్గాలు లేనివాడు- అవి ఉంటే తను కూడా మనలాగ మనిషే తప్ప దేవుడు కాదు*. దేవునికి కామం ఉండి మనలాగే పెళ్లి చేసుకుంటే మనకి దేవునికి తేడా ఏమిటి? 

    కాబట్టి చివరికి ఈ లక్షణాలు అనగా దేవునికి ఉండవలసిన, ఒకటో రెండో కాదు మొత్తము అన్ని లక్షణాలు కలిగిన వాడు యేసుప్రభులవారు మాత్రమే!!!
1). సృష్టికర్త యోహాను 1: 2,3;  2 కొరింథీ 8:6; 
2) నిర్ఘుణుడు- పాపము లేనివాడు యేసుప్రభు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు విసరినవాడు! యోహాను 8:46; 
3) నిత్యమూ ఉండేవాడు: ఆయన నిత్యుడగు తండ్రి, యెషయా 9:6; ఇదిగో సదాకాలము మీతో ఉన్నాను మత్తయి 28:20.
4) గురువైఉండాలి- క్రీస్తు ఒక్కడే మీకు గురువు మత్తయి 23:10; యేసయ్యను అందరూ భోదకుడా, గురువుగారు అని పిలిచేవారు- ఆయనకు 12 మంది ముఖ్య శిష్యులు, వారే కాక అనేకమంది శిష్యులు.5) పాపాలు తీయగలిగిన వాడు: ఆయన బ్రతికిఉండగానే కొందరి పాపములు క్షమించారు. లూకా 5:20-24; చనిపోయి అందరి పాపములు క్షమించారు. ఇదిగో ఇది మీ కొరకు చిందింప బడుచున్న క్రొత్త నిభందన రక్తము అన్నారు, మత్తయి 26:28 యేసురక్తము ప్రతీ పాపము నుండి మనలను కడిగి పవిత్ర పరచును అని గ్రంధం సెలవిస్తుంది. 1 యోహాను 1:7;
6) లోక కల్యాణం కోసం పాటు పడినవాడు: ఆయన ఈలోకానికి వచ్చిందే పేదలకు సువార్త ప్రకటించడానికి, నలిగినవారిని విడిపించడానికి, (లూకా 4:18), తద్వారా అందరిని దేవునిరాజ్యానికి వారసులుగా చేయడానికి యోహాను 1:12; 
7) మంచివాడై యుండాలి: నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచికాపరి తన గొర్రెల కోసం తన ప్రాణం పెట్టును అని చెప్పడమే కాదు చేసి చూపించారు! యోహాను 10:11
8) పరలోకం ఇవ్వగలిగిన వాడై యుండాలి. : యోహాను 14: 2,3
నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.
కాబట్టి కొన్ని కాకుండా అన్ని క్వాలిటీస్ కలిగిన దేవుడు యేసుప్రభులవారు!

కొలస్సీయులకు 2: 9
ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

     యేసుప్రభులవారి దైవత్వాన్ని నిర్ధారించే తిరుగులేని సాటిలేని వచనం ఇది. ఏలయనగా అని ఎందుకు అన్నారంటే: ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అంటూ దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత  . . . . . .. దేవుడు అనడానికి ఏవైనా క్వాలిటీలు, లక్షణాలు, అర్హతలు, అధికారం ఏవైనా ఉన్నాయంటే అవి యేసుప్రభులవారిలోనే ఉన్నాయి అని నొక్కివక్కానిస్తున్నారు!! ఇక అదే క్వాలిటీస్ కలిగి ఏ దేవుడైనా ఎప్పుడైనా శరీరంతో భూమిమీదకు వచ్చారు అంటే అది యేసుప్రభువే అని నిర్ధారించి చెబుతున్నారు!

   ఇక్కడ పౌలుగారు దేవత్వము యొక్క సంపూర్ణత అంటున్నారు. ఇక ఆయన పరిపూర్ణుడు ఎలా కాగలిగారు? దైవత్వం- పరిపూర్ణత ఎప్పుడ అవుతుందో మనకు చక్కగా వివరించగలిగినది యోహాను సువార్త మొదటి అధ్యాయం. మిగిలిన అధ్యాయాలలోను కొద్దిగా ఉన్నాయిగాని ఈ అధ్యాయంలో చాలా ఉన్నాయి. నిజంగా ఇంతటి ప్రత్యక్షత/ Revelation ఏమీ చదువుకోని, ఒక చేపలు పట్టుకొనే జాలరి యైన యోహాను గారికి ఎలా దేవుడు ఇచ్చారో నిజంగా ఆశ్చర్యము! Biblical concept కి పునాది ఇది.  దీనిని మనం జాగ్రత్తగా గమనిస్తే: ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. అంటున్నారు. మొదటి వచనంలో వాక్యము దేవుడు, వాక్యము దేవుని యొద్ద అనగా వాక్యమై ఉన్న కుమారుడు తండ్రియైన దేవుని యొద్ద ఉన్నారు అందుకే రెండవ వచనంలో అనుమానాలు లేకుండా ఆయన ఆదియందు దేవునియెద్ద ఉండెను అనగా కేవలం 2000 క్రితం పుట్టినవాడు కాదు, సృష్టి జరుగకముందే ఆయన దేవునియొద్ద ఉన్నారు. ఇక మూడవ వచనం ప్రకారం ఆయనలేకుండా ఏమీ కలుగులేదు. సమస్తము ఆయనద్వారా కలిగెను! అనగా ఆయనే సృష్టికర్త! ఇంకా క్రిందకు చదివితే ఆయన మిగతా లక్షణాలు కనిపిస్తాయి. ఆయన వెలుగు అని , లోకానికి వెలుగుకు మధ్య వ్యత్యాసం ఉందని, చెబుతూ 12వ వచనంలో తనను ఎందరో అంగీకరిస్తారో వారిని ఆయన దేవుని పిల్లలుగా మార్చగలిగిన అధికారం కలిగిన వాడని వ్రాయబడింది. ఇక 14వ వచనంలో ఆయన శరీరధారిగా భూమిమీదకు వచ్చారని రాశారు! కృపా, సత్య సంపూర్ణునిగా మనమధ్య నివశించెను అని రాస్తున్నారు! 18వ వచనంలో ఎవడూ తండ్రిని చూడలేదు గాని యేసుప్రభులవారే తండ్రిని మానవులకు వెల్లడిచేశారు అంటున్నారు. 29-34 వచనాలలో మనకు పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు! అనగా ఆయనే ఆత్మ, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ- అనగా దేవుడు ఒక్కడే కాని ఆయనకు మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ముగ్గురు దేవుళ్ళు కానేకాదు! బైబిల్ గ్రంధంలో దేవుని మూడు వ్యక్తిత్వాలు ఒకేదగ్గర, ఒకేసారి ప్రత్యక్ష్యం అయ్యింది ఇక్కడే! మత్తయి 3:17, లూకా 3:22 ప్రకారం యేసుప్రభులవారు బాప్తిస్మము తీసుకొని బయటకు వస్తారు, పరిశుద్ధాత్ముడు పావురం వలే ఆయనమీద వ్రాలుతాడు, అప్పుడు పరలోకం నుండి తండ్రి స్వరము అనగా ఆయన వాక్కు సెలవిస్తుంది: ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందిస్తున్నాను. ఇదీ సంపూర్ణత. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ- త్రియేకదేవుడు!!! అందుకే  1 యోహాను 5:7 లో సాక్ష్యమిచ్చువారు ముగ్గురు: అనగా తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్ముడు., 
For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost: and these three are one.
వీరు ముగ్గురు ఒక్కటే! అనగా ముగ్గురు ఒకరే! ఆయన మూడు వ్యక్తిత్వాలుగా ఎందుకు ఉండాల్సివచ్చింది? ఎందుకంటే అది సంపూర్ణం కాబట్టి! కేవలం మూడు సంపూర్ణ సంఖ్య అయినందువలెనే ఆయన సంపూర్ణుడు అయ్యారా కాదుకాదు! సంపూర్ణత అంటే:
1). ఆయన తండ్రి: తండ్రి ప్రేమ చూపించారు. ఒక తండ్రి తన పిల్లలకు ఏమి కావాలో అవన్నీ అమర్చినట్లు ముందు సృష్టిని చేసి, తర్వాత మానవుణ్ణి చేసారు. తండ్రిలా ప్రేమించి, లాలిస్తున్నారు. మాట విననప్పుడు దండించారు, దండిస్తున్నారు. ఆదికాండం 6-8 అధ్యాయాలు, పాత నిబంధన మొత్తం; ఇంకా నిన్ను విడువను ఎడబాయను అంటూ మనల్ని కాస్తున్నారు. యెహోషువ 1:6; యిర్మియా 46:26; యోహాను 14:18; హెబ్రీ 13:5;
2) మరి తండ్రిగానే ఉంటే మానవులు నాశనమైపోతారు. కాబట్టి కుమారునిగా భూమిమీదకు శరీరాకృతిలో వచ్చి, మానవులకు రక్షణసువార్తను అందించి, రక్షణ కార్యక్రమం చేసి, పేదలకు సువార్త ప్రకటించడంతో మొదలుపెట్టి, దేవునిరాజ్యమును స్థాపించారు. చివరకు మన పాపములకోసమై సిలువలో యాగమై, బలియాగమై తనరక్తముద్వారా మన పాపములకు పరిహారం చేసి, మనలను పరలోకానికి హక్కుదారులుగా చేసారు. (యోహాను 1:12)  తిరిగి తండ్రికి మనకి ఒక లింక్ ఏర్పాటు చేసారు. 
3) ఇక తను తండ్రి యొద్దకు వెళ్ళాలి కాబట్టి మనలను అనాదలనుగా వదలడం ఇష్టం లేక తన ఆత్మను మనకు కాపలాగా, నడిపించే నాయకునిగా , సంచకరవు అనగా డిపాజిట్ గా పెట్టి; మీకు స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను, ఎక్కడ? తనుండే చోటు అనగా పరలోకంలో! యోహాను 14:2,3; ఇక్కడ పరిశుద్ధాత్ముడు తన కార్యం జరిగిస్తున్నాడు.

 ఇక్కడ రెండు వచనాలు మీకు గుర్తుచేయాలి అంటుకుంటున్నాను రోమా పత్రిక 8వ అధ్యాయం నుండి. ఈ ముగ్గురు అనగా తండ్రి, కూమార, పరిశుద్ధాత్ముడు ఒక్కరే, ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయి అనడానికి మంచి ఉదాహరణ. 26 వ వచనంలో అటువలె మనకు ఎలా ప్రార్ధనచేయాలో తెలియదు కాబట్టి ఆత్మ మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు, ఎలా ఉచ్చరింపశక్యము కాని మూల్గులతో!! అందుకే పరిశుద్ధాత్మ అనుభవం గల వ్యక్తి ప్రార్ధించడం మొదలుపెడితే కళ్ళంట నీరు వాటికవే కారిపోతాయి. ఈ విషయం ఇంటివారికి అర్ధంకాక, ఇప్పుడు ఎవడు చనిపోయాడని అలా ఏడుస్తున్నావు అంటుంటారు!!!  సరే; ఇక 34 వ వచనంలో శిక్షించువాడు, Judge ఎవరు? ఏసుప్రభువే, అందుకే ముందుగా వారు/మనం తప్పిపోకుండా, యేసయ్య మన పక్ష్యంగా దేవుని కుడిప్రక్కన కూర్చొని మనకోసం విజ్ఞాపనం చేస్తున్నారు! ఇక్కడ అనగా భూమిమీద ఆయన ఆత్మ మనుష్యులను సిద్దపరచి అదే విజ్ఞాపనం చేస్తున్నారు, అక్కడ యేసుప్రభులవారు కూడా ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ అంటూ మనకోసం విజ్ఞాపనం చేస్తున్నారు. ఎందుకంటే తర్వాత జడ్జి స్థానం లోకూర్చుంటే ఇక తనకు క్షమించే అవకాసం ఉండదు కాబట్టి! ఇక్కడ ఒకే దేవుడు మూడు వ్యక్తిత్వాలతో మానవ శ్రేయస్సుకోసం పాటుపడుచున్నారు! ఇదే సంపూర్ణత! అందుకే పౌలుగారు దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివాశం చేస్తున్నది అని ఘంటాపథంగా చెబుతున్నారు. 

   కాబట్టి ఈలోకంలో దేవుడు అని ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుప్రభులవారే! పాపములేని దేవుడు ఆయన! నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించును అని సవాలు విసరిన ఏకైక, అద్వితీయ దేవుడు!! యోహాను 8:46;
 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని చాటి చెప్పగలిగిన సత్తాగాలిగిన ఏకైక సత్యదేవుడు! యోహాను 14:6;
మరి ఆదేవుడు నీకు కావాలా? నిజదైవమెవరో, నీ రక్షకుడు ఎవరో గుర్తెరుగు! 
 నేడే ఆయనను నీ స్వంత రక్షకునిగా అంగీకరించు! 
ఆయన నిన్నుతన స్వంత బిడ్డగా స్వీకరించి, తన రక్తముతో కడిగి, తనరాజ్యానికి వారసునిగా చేస్తారు!యోహాను 1:12;

ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు 'ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవ్వరునూ,ఎన్నడునూ మాట్లాడలేదు' అని సాక్ష్యం పొందారు. అంటే ఆయన మాటలో కూడా 'పరిశుద్ధత' గలవారు.
              మాట,తలంపు, ఆలోచన, నడత,ప్రవర్తన అన్నింటిలోనూ ఆయన ప్రత్యేకమైన విధంగానూ,పరిశుద్ధంగానూ జీవించారు. హెబ్రీ పత్రిక 7:26లో చెప్పినట్లుగా 'పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు'.

మనకు ఒక మాదిరినీ,మార్గాన్నీ చూపిన ఆ ప్రభువు అడుగుజాడలలో నడుద్దాం...
ఆయన అన్ని విషయములలో పరిపూర్ణుడైయున్న ప్రకారము మనము కూడా ఆయన వలే పరిపూర్ణులమయ్యే ఆ స్థితికి పరిశుద్ధాత్ముడు మనలను నడిపించును గాక......
ఆమేన్!!

*రోమా పత్రిక-18వ భాగం*
  
      రోమా 1:2123 
21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. 
22. వారి అవివేక హృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 
23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ....

  ప్రియులారా! దేవుని ఉగ్రత అవిదేయులమీదకు ఎందుకు వస్తుందో ఇంకా వివరముగా చెబుతున్నారు పౌలుగారు!  వారు దేవునినెరిగియు ఆయనను దేవునిగా మహిమ పరచలేదు! నిన్నటిభాగంలో  మనం చూసుకున్నాం దేవునికి ఉండవలసిన లక్షణములు!  ఆ లక్షణాలున్న దేవుణ్ణి కొంతమంది తెలియక అజ్ఞానముతో ఏవోవో ప్రతిమా స్వరూపాలను , బాబాలను పూజిస్తున్నారు. అయితే నిజ దేవుణ్ణి తెలిసుకొన్నవారు కూడా ఇదే పని చేశారు అందుకు గాను ప్రతిఫలం అనుభవించారు! ఇశ్రాయేలీయులు 43౦ సంవత్సరాలు కటినమైన దాస్యం అనుభవిస్తుంటే దేవుడు చూసి మోషేగారిని పంపించి వారిని విడిపించారు. ఐగుప్టు దేశంలో పది అసాధారణమైన అద్భుతాలు చేశారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యులు ఇశ్రాయేలీయులు! అయితే దేవుని ఆజ్ఞ మేరకు మోషేగారు సీనాయి పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటే- ఈ ఇశ్రాయేలీయులు అంటున్నారుమమ్మల్ని రప్పించిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు! మాకో దేవత తయారుచేయమని చెప్పి- అక్కడ ఒక దూడబొమ్మను చేసుకునిఓ ఇశ్రాయేలు: మిమ్మల్ని ఐగుప్టుదేశం నుండి తీసుకుని వచ్చినది ఇదే అని చెప్పి దానికి పూజించడం మొదలుపెట్టారు. నిర్గమ 32; ఆ తర్వాత ఏమయ్యిందో మనకు తెలుసు!  దేవునికి ఇష్టం లేనిది విగ్రహారాధన! నిజదేవుని మహిమను కనులారా చూసిన ఇశ్రాయేలీయులు- ఒక దూడబోమ్మను చేసుకుని దానికి దైవత్వమును ఆపాదించి అంటున్నారు మిమ్మును ఐగుప్టు దేశం నుండి తీసుకుని వచ్చినది ఇదే! నిజం చెప్పండి ఐగుప్తుదేశం నుండి తీసుకుని వచ్చినది యెహోవా దేవుడా లేక దూడ- బొమ్మనా! దేవుని మహిమను ఒక బొమ్మతో పోల్చారు ఇశ్రాయేలీయులుచివరికి అనుభవించారు! ఈ విషయం తెలిసినా గాని యరోబాము ఇదే తప్పును చేశాడు- తను చేయడమే కాకుండా ఇశ్రాయేలు జాతిమొత్తం అవలంభించేలా చేశాడు. చివరకు దాస్యానికి లోను చేశాడు. ఇక యూదా రాజులు కూడా ఇదే చేశారు. యోషియా, హిజ్కియా లాంటి మంచిరాజులు దేవునికి అనుకూలంగా నడిచినా దేవుని ఉగ్రతను ఆపలేక పోయారు కారణం బైబిల్ లో చాలా స్పష్టముగా రాయబడింది- మనస్సే , ఇంకా మరో రాజులు చేసిన విగ్రహారాధన, నిరపరాధ రక్తాన్ని విగ్రాహాలకు అర్పించారు కాబట్టి దేవుడు సహించలేకపోయారు.

  మరోసారి  ఈ వచనాలు చూడండి 
21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. 
22. వారి అవివేక హృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 
23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ....
. . . . .. అందుకే దేవునికోపం మనుష్యుల మీద మండింది!

  పౌలుగారు ఇక్కడ మానవజాతి చరిత్రను తీసుకుని విగ్రహారాధన ఎలా ఆరంభమయ్యిందో చెబుతున్నారు.  మొదట్లో మనుషులకు ఏకైక సత్య, నిత్య దేవుడు తెలుసు! అయినా క్రమేనా వారు దేవుణ్ణి వదలి, దేవతలను పూజించడం మొదలు పెట్టారు. సృష్టికర్తను వదలి సృష్టిని పూజించడం మొదలుపెట్టారు.  దేవుణ్ణి ఆరాదించడం మానేశారు. దేవునికి కృతజ్ఞత చెప్పడం  మానేశారు. అసలు దేవుడు మనిషిని సృష్టించినది కేవలం ప్రజలు తనకు మహిమ తేవాలని, తనను స్తుతించాలని, మహిమ పరచాలని దేవుడు మనిషిని చేస్తే, మనిషి దేవుడ్ని స్తుతించడం, మహిమపరచడం , ఆరాధించడం మానేసి- ఆయన చేసిన సృష్టిని పూజిస్తున్నాడు.  దేవుని దైవత్వాన్ని జంతువులకు, పక్షులకు, పశువులకు, సూర్యచంద్ర నక్షత్రాలకు ఆపాదించారు. మనుషులకు దైవత్వాన్ని ఆపాదించారు. దేవుణ్ణి తెలుసుకోవడం అనే అతిశ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వారు దేవునికి కృతజ్ఞత ప్రకటించడం లేదు! దానికి బదులు వారు ఏవోవో ఊహాగానాలు చేసుకుని, ఏవోవో సిద్ధాంతాలు, వేదాంతాలు కలిపించుకుని దేవుణ్ణి ఆరాధించడం మానేశారు. మత వ్యవస్తలు కల్పించుకున్నారు.  చీకటిలో మొదలై మరింత కటిక చీకటికి అంధకారానికి పోతున్నారు. వారిజీవితమే చీకటిమయమైపోయింది.  అందుకే దేవుడు వీరిమీదకు దేవుని ఉగ్రత రాబోతుంది అంటున్నారు!    

   ఈ గ్రూపులో వారు తెలిసి చేశారు కాబట్టి దేవుడు వీరి మీదకు ఉగ్రతను క్రుమ్మరించారు. ఇక దేవుని మహిమను ఎరుగని అన్యజనులు ఉన్నారు మన గ్రామంలో, మన జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో! వీరికి నిజదేవుడు ఎవరు అన్నది తెలియజేశావా? వీరుకూడా సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజిస్తూ నిజదేవున్ని తెలుసుకోకుండా నిత్య నాశనానికి పోతున్నారు. మరి నీకు చింతలేదా? వారికి రక్షణ సునాదం వినిపించావా? నీ పొరుగువారు రక్షించబడకుండా నాశనానికి పోతుంటే వారికోసం ప్రార్దించావా? వారికి యేసయ్యప్రేమ ప్రకటించావా? చూపించావా? వీరి రక్షణ భాద్యత నీమీద నామీద ఉంది అని మరచిపోవద్దు! కారణం వీరి మీదకు కూడా దేవుని ఉగ్రత న్యాయంగా దిగబోతుంది. వీరు దేవుని దైవత్వాన్ని చెట్టు,పుట్ట, ప్రతిమలు, ఫోటోలు, చివరకు మనుష్యులలో కూడా దేవుని దైవత్వాన్ని ఆపాదిస్తున్నారు.  అందుకే వీరిమీదకు దేవుని ఉగ్రత రాబోతుంది.

    కేవలం ఇశ్రాయేలీయులు, అన్యులు మాత్రమే విగ్రహారాధన చేస్తున్నారా? విగ్రహారాధన అంటే ఏమిటి? కేవలం విగ్రాహాలు పెట్టి, వాటికి పూజచేస్తూ, ఊదొత్తులు, కొబ్బరికాయలు కొట్టడమే విగ్రహారాధనా? బైబిల్ ప్రకారం దేవునికంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాదనే! ఇప్పుడు క్రైస్తవ్యంలో విగ్రహారాధన కూరుకుపోయింది! దేవుని కంటే వారికి వారి మొబైల్ ఎక్కువై పోయింది. దేవునికంటే వారికి వారి అధికారం , ధనాశ, కామకోరికలు,  బార్య ఇలాంటివాటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి, వారికి తెలియకుండా విగ్రహాలుగా పూజిస్తున్నారు. దేవునికంటే ఎక్కువగా దేనికైతే ప్రాధాన్యత ఇస్తావో అదే నీ విగ్రహం! ఒకసారి ఆలోచించు! పరిశీలించుకో! నీ విగ్రహం ఏమిటి? దేవుని మీద నిగ్రహం పెట్టుకున్నావా? లోకం, లోకాశలు నిన్ను ఆకర్షిస్తున్నాయి కదూ! మరికొంతమంది భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు గాని వారు తమ దేవునికంటే దేవుని దాసున్నే ఎక్కువగా అబిమానిస్తున్నారు. మా అయ్యగారు ప్రార్ధన చేస్తే ఇలా అయ్యింది. అలాగయ్యింది అని మనుషులు పోగుడుకోవడమే తప్ప దానిలో దేవునికి మహిమ తెచ్చేది ఏదీ లేదు! ఇప్పుడు క్రైస్తవునికి వారి కాపరి, బోధకుడు .... వ్యక్తి విగ్రహముగా మారిపోయాడు! మరి వీరిమీడకు దేవుని ఉగ్రత రాదా? ప్రియ విశ్వాసి! నీకు దేవుని మహిమ తెలుసు! ఆయన చేసిన గొప్ప కార్యాలు తెలుసు! గాని దేవుని దైవత్వాన్ని మీ నాయకులకు ఆపాదించకండి! ఆయన ఆత్మ గనుక ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అనే సత్యం మరచిపోవద్దు! తెలియని అన్యజనులకు కొంత శిక్ష గాని, తెలిసిన మూర్కులకు రెండితలు శిక్ష! పౌలుగారు మాటిమాటికి ఇదే చెబుతుండేవారునేను తెలియక చేశాను కాబట్టి క్షమించబడితిని. 1తిమోతి 1:13; ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి మరలా ఆ పాపము చేయవద్దు అంటున్నారు. 
కాబట్టి నేడే నీ తప్పులు ఒప్పుకో! సరిచేసుకో! 
దేవునితో సమాధాన పడు! శిక్షను తప్పించుకో!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-19వ భాగం*
*మరణపాత్రులు-1*
  
      రోమా 1:2425 
24. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 
25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్‌. ....

     ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం రెండు గ్రూపులకోసం ధ్యానం చేసుకుంటున్నాం! ఈ రోజుకూడా రెండో గ్రూపుకోసం ఇంకొంచెం విస్తారంగా ఆలోచిద్దాం! ఈ 24 వ వచనంలో ఈ హేతువుచేత అంటున్నారు: ఏ హేతువుచేతవారు దేవుని దైవత్వాన్ని పశుపక్ష్యాదులకు, సృష్టములోకి మార్చేశారు కాబట్టి దేవుడు వారి హృదయ దురాశ లను అనుసరించి ప్రవర్తించేలా వారిని అపవిత్రతకు అప్పగించెను అంటున్నారు. ఈ మొదటి అధ్యాయం జాగ్రత్తగా పరిశీలన చేస్తేఇలాంటి అవిదేయులను, అపనమ్మకస్తులను, దుర్నీతిచేసేవారిని దేవుడు కొన్ని రకాలైన లక్షణాలకు గురిచేసి వారిని అప్పగించెను అని వ్రాస్తున్నారు పౌలుగారు.

మొదటగా ఈ వచనంలో దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అంటున్నారు.

రెండవదిగా 26 వ వచనంలో తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను అంటున్నారు.

మూడవడిగా 28వ వచనంలో దేవుడు వారిని భ్రష్టమనస్సుకు అప్పగించెను అంటున్నారు.

 ఇక ఇలాంటి వారందరూ 32వ వచనం ప్రకారం వీరంతా మరణపాత్రులు, మరణమునకు తగినవారు అంటున్నారు. వీరు ఎలాంటి కేడర్ కి చెందినవారో 2931 వరకు విస్తారంగా వ్రాయబడింది.

     *దేవుడు మానవజాతిని వారు చేసిన పాపముల కోసం శిక్షించే విధానాలలో ఒకటివారిని మరింత పాపము చేయనిచ్చి చివరికి వారిని తీర్పుకు, శిక్షకు పాత్రులనుగా చేయడం! వారిని తీర్పుకు పాత్రులనుగా వదిలెయ్యడం*! మనుషులు కోరుకునే పాపాలకు వారిని వదిలెయ్యడం అనేది శిక్షలలో ఘోరమైన శిక్ష! అందుకే పౌలుగారు కొన్నిసార్లు వానిని సాతానుకి అప్పగించాను అంటున్నారు. 1తిమోతి 1:20; అందుకే యేసుప్రభులవారు ప్రకటన గ్రంధంలో అన్యాయం చేయువాడు ఇంకా అన్యాయం చేయనిమ్ము! మోసం చేయువాడు ఇంకా మోసం చేయనిమ్ము అంటున్నారు (ప్రకటన 22:11) కారణం దేవుడు వారిని ఇలాంటి భ్రష్టమనస్సుకు అప్పగించి వారిని తీర్పుకు, శిక్షకు పాత్రులనుగా చేసేసారు! ద్వితీ 32:1922; న్యాయాధిపతులు 2:1015  వరకు చూసుకుంటే మనకు ఉదాహరణలు కనిపిస్తాయి.

   24 వ వచనం ప్రకారం ఇలా విగ్రహారాధన చేసేవారిని దేవుడు వారి హృదయం లోని చెడ్డకోరికలతో పాటు వారిని కల్మషానికి అనగా తమ శరీరాలను పరస్పరం అవమాన పరచుకొనేటట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అంటున్నారు.  ఎవరైతే ఇలాంటి చెడ్డపనులు చేస్తున్నారో దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారు అన్నమాట! ఇప్పుడు ఎవరైనా అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు అంటే కారణం దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారు. వారి హృదయంలో ఉద్భవించే పాపపు తలంపుల ప్రకారం చేసేలాగా దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశారు. పౌలుగారు రోమా 7లో చెబుతున్నారు: నేను చేయవలసిన మంచిని చేయక చేయకూడని తప్పులను చేస్తున్నాను. నాలో రెండు పరస్పర విరుద్ధమైన ధర్మములు కనిపిస్తున్నాయి. ఇలా నేను చేయగోరని తప్పులు చేసేది నేను కాదు నాలో నివసించే పాపమే అంటూ అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అంటున్నారు. మనలో చాలామంది తప్పుడు పనులు చేయకూడదు అనుకుంటారు గాని చేసేస్తుంటారు. వ్యభిచారం చేయకూడదు అనుకుంటారు గాని చేసేస్తుంటారు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. వీటికి కారణం సాతానుగాడు చేసే ప్రలోభాలకు నీవు లొంగిపోవడం మొదటిది. చివరికి నీవు వాటినుండి వెలుపలికి రాలేకపోతున్నావు అంటే దానికి కారణం దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, తన భక్తులద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించారు. గాని నీవు మారలేదు కాబట్టి దేవుడు నిన్ను అపవిత్రతకు, భ్రష్టమనస్సుకు అప్పగించేశారు. ఇకనీవు మార్పు చెందలేవు!  నీవు ఇక తీర్పుకై దాచబడ్డావు అన్నమాట! సామెతలు 29:1 ప్రకారం ఎన్నిసార్లు గద్ధించినను విననివాడు మరి తిరుగులేకుండా హటాత్తుగా నాశనమగును అంటున్నారు/ కాబట్టి ఇలాంటివారు: అన్ని బాగున్నాయి. నేను తప్పులుచేసిన దేవుడు పట్టించుకోవడం లేదు! దేవునికి అంత తీరిక ఎక్కడుంది? నేను ఎలా ప్రవర్తించినా పరవాలేదు అనుకుంటున్నారు.  వీరికే మరి తిరుగులేకుండా హటాత్తుగా నాశనం వస్తుంది జాగ్రత్త! 25 వీరు దేవుని సత్యాన్ని అసత్య,ముగా మార్చేసి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తున్నారు.

   ఇదే కారణం వలన దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలకు దేవుడు వారిని అప్పగించారు! ఈ తుచ్చమైన అభిలాషలు ఏమిటో 26, 27 వచనాలలో వివరంగా ఉంది/. మొదటిది లెస్బియన్లు! అనగా ఆడదానితో ఆడది కోరికలు తీర్చుకోవడం! స్త్రీలు స్వాభావిక ధర్మమును విడచి స్వాభావిక విరుద్ధమైన ధర్మములు అనుసరించడం మొదలు పెట్టారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇదే పనిని చేస్తున్నారు. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలోను, చివరకు మన దేశంలోనే కూడా  లెస్బియన్లు ఎక్కువై పోతున్నారు. పాశ్చాత్య దేశాలలో లెస్బియన్ వివాహం అనగా ఒక స్త్రీ మరో స్త్రీని పెళ్ళిచేసుకుని వివాహం చేసుకోవచ్చు! ఇది ఇతర దేశాలలో ఇప్పుడు లెస్బియన్ పెళ్లి చట్టబద్దమైపోయాయి. ఇక మనదేశంలో కూడా చట్టబద్ధం అయిపోయింది  ఇలాంటివారిమీదకు దేవుని శాపం పాపం దిగివస్తుంది అంటున్నారు

     ఒకసారి గతం చూసుకుంటే సోదోమ గోమోర్రా అద్మా సెబాయిము ఇదే పాపాలతో పండిపోయినప్పుడు దేవుడు అగ్ని గంధకములతో ఆ పట్టణాలను కాల్చినట్లు చూడగలము! ఆదికాండం 19; ఇలాంటి విపరీతము న్యాయాధిపతుల కాలములో కూడా జరిగింది. తద్వారా బెన్యామీయుల వంశం నాశనమైపోయింది. న్యాయాదిపతులు 19-21; నేడు పాశ్చాత్యదేశాలు దీనిని లీగల్ చేశారు. ఈ వివాహాలను ప్రోత్సహిస్తున్నారు. వీరిమీదకు దేవుని ఉగ్రత ఎలా దిగుతుందో చూడవచ్చు! ఎప్పుడూ లేనివిధంగా అమెరికా పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు కలుగుతున్నాయో మనం చూస్తున్నాం. మన భారతదేశంలో కూడా లెస్బియన్, గే (పురుషుడు-పురుషుడు) వివాహాలు, ఇష్టపూర్వకమైన అక్రమ సంభందాలు తప్పులేదు, చేసుకోవచ్చు అని మన సుప్రీం కోర్టు ఆర్డర్ వేసింది. అనగా మన భారతదేశం కూడా పతనానికి చేరువగా, దేవుని ఉగ్రతకు ఎడ్జ్ లో ఉంది. మన దేశం/ ప్రాంతం నాశనానికి చేరువలో ఉంది! విపరీతమైన ఒరవడులు పెరిగిపోయాయి! భయంకరమైన వ్యభిచారం, త్రాగుడు పెరిగిపోయింది. విచారమేమిటంటే పూర్వకాలంలో పురుషులు మాత్రమే వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా ఉండేవారు. ఇప్పుడు స్త్రీలు పురుషులకు మించి వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా ఉంటున్నారు. చాలా ప్రాంతాలలో మనదేశంలో వావివరుసలు మరచిపోయి విశృంకల వ్యభిచారం చేస్తున్నారు. దీనిని బైబిల్ విపరీతం, అతి అంటుంది!

  ప్రియ సహోదరి/ సహోదరుడా! నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని మరో సోదోమో గోమోర్రాగా నీవు ఊహించుకోగలవా? నీ జనులు అగ్ని గంధకాలతో మండటానికి నీవు సహించగలవా? లోతుగారు ఆ విషయాలు చూస్తూ నీతిగల తన మనస్సును నొప్పించు కున్నారు. నీవు నొప్పించుకున్నంత మాత్రాన సరిపోదు! వారికోసం ప్రార్ధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది! యేహెజ్కేలు గ్రంధంలో దేవుడు భాధపడుతున్నారుపరిస్తితి ఇలా ఉన్నప్పుడు నా ప్రజలు పట్టించుకోవడం లేదు, బద్దలైపోయిన ప్రాకరం దగ్గర కాపలాగా ఎవరు ఉండటం లేదు. యెహేజ్కేలు 13: 5
యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచునట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు.
 అప్పుడు శత్రువు యిట్టె బీటలైపోయిన గోడను పగులగొట్టగలడు! ఆ బ్రద్దలైపోయిన/ బీటలువారిన గోడ దగ్గర కాపలాగా నీవుండగలవా ప్రియ సహోదరి/ సహోదరుడా! బీటలువారిన విశ్వాసపు గోడల దగ్గర నిల్చుని వారికోసం ప్రార్ధించగలవా? శత్రువుతో ప్రార్ధనలో పోరాడగాలవా? నేటిదినాల్లో దేవునికి అలా పట్టుదలతో ప్రార్ధించేవారు కావాలి! ఆ కాలంలో దేవునికి యిర్మియా, యేహెజ్కేలు లాంటివారు దొరికారు. నేటిరోజులలో నీవు ఒక యిర్మియా, ఒక ఏలియా, ఒక యేహెజ్కేలు కాగలవా? అలా అయితే కొద్దిమందిని మాత్రమైనా నీవు ఈ చావునుండి/ ఉగ్రతనుండి కాపాడగలవు! నేడే ఒక తీర్మానం చేసుకో! 
క్రీస్తుకు సాక్షిగా నిలబడు!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-20వ భాగం*
*మరణపాత్రులు-2*
  
      రోమా 1:2932
29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై 
30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును 
31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. 
32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.....

   ప్రియులారా ! ఈ 2932 వచనాలలో కొన్ని రకాలైన మనుష్యులు కనిపిస్తున్నారు. వీరంతా మరణపాత్రులు అంటున్నారు. 29 లో కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ఉంటే మనుష్యులు అనేకరకాలుగా ప్రవర్తిస్తారు. అవి 3031 లో ఉన్నాయి.  ఈ భాగంలో మానవజాతి ప్రస్తుత స్తితికోసం పౌలుగారు మాట్లాడుచున్నారు.  మనుష్యుల దుష్టస్తితిని గురుంచి చెప్పిన ఈ వర్ణన అతిశయోక్తి కానేకాదు. ఈ వచనాలలో ఉదహరించబడిన ప్రతీ పాపాన్ని ప్రతీ మనిషి  జరిగించడు గాని ఈ పాప బీజాలన్నీ మన అందరిలో ఉన్నాయి.
  కారణం దేవుడు చెబుతున్నారు మనిషిలో ఊహలు కేవలం చెడ్డవి. అందుకే నరులను చేసినందుకు దేవుడు సంతాపపడ్డారు. ఆదికాండం 6, 8 అధ్యాయాలు ;  రోమా 3: 4--19 లో దీనికోసం చాలా వివరంగా రాశారు పౌలుగారు.

    ఇక ఈ 29 వ వచనంలో కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి మనకు. వీటిద్వారా మనిషి మరణపాత్రుడు గా మారిపోతున్నాడు. ఆ లక్షణాలను కొద్దిగా ఆలోచన చేద్దాం!  దుర్నీతి, దుష్టత్వం, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము!!! ఈ లక్షణాలుంటే మనిషి అప్పుడు కొండెగాడుగా గాని, అపవాదకులుగా గాని, దేవ ద్వేషులుగా గాని, హింసకులుగా గాని, అహంకారులుగా, బింకములాడు వారిగా, చెడ్డవాటిని కల్పించువారిగా, తల్లిదండ్రులకు అవిదేయులుగా, అవివేకులుగా, మాట తప్పేవారుగా, అనురాగ రహితులుగా, నిర్ధయులుగా తయారవుతున్నారు. వీటికి ముడిసరుకు 29వచనంలో ఉంది! వీరంతా మరణానికి పాత్రులు అని 32వ వచనం చెబుతుంది.

      మొదటి లక్షణం: *సమస్తమైన దుర్నీతి*: ఇక్కడ పౌలుగారు దుర్నీతి అనడం లేదు, సమస్తమైన దుర్నీతి అంటున్నారు అనగా చాలా రకాలైన దుర్నీతులు ఉన్నాయన్నమాట! అది ఏ రకమైన దుర్నీతియైనా సరే అది నిన్ను మరణానికి దారితీస్తుంది. 1:18 లో ఈ కోవకు చెందినవారు ఏం చేస్తున్నారంటే దుర్నీతిచేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు. యేసుప్రభులవారు చెబుతున్నారు: నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నారు. యోహాను 14:6; అనగా దీనిప్రకారం ఇప్పుడు సత్యాన్ని దుర్నీతి చేత అడ్డగిస్తున్నారు అనగా వీరు అనగా దుర్నీతిచేత యేసుప్రభులవారిని అడ్డగిస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులవారు జీవము కాబట్టి, జీవమును అడ్డగిస్తే మరణమే ఎదురవుతుంది కాబట్టి వీరంతా మరణపాత్రులు!  ఒకసారి అపోస్తలులు కార్యములుకి వెళ్దాం! అక్కడ 8వ అధ్యాయంలో పేతురు గారు వాక్యము చెబుతూ ఉంటే సీమోను అనే గారడీ వాడు రక్షింపబడిన తర్వాత దేవుని పరిశుద్దాత్మను ద్రవ్యం అనగా డబ్బిచ్చి కొనాలని ఆశిస్తాడు. అప్పుడు పౌలుగారు చెబుతున్నారు: 8:23 
నీవు ఘోర దుష్టత్వములోను(మూలభాషలో-చేదైన పైత్యములోను) దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను.
అది నిన్ను నిత్య నాశనానికి నడిపిస్తుంది అంటున్నారు. రోమా 6:13లో పౌలుగారు చెబుతున్నారు: 
మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా( లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.
 చూశారా ఎంత శ్రేష్టమైన మాటలో! 2 తిమోతి 2:19 లో పౌలుగారు అంటున్నారు ప్రభువు నామమును ఒప్పుకోనేవాడు తప్పకుండా దుర్నీతి నుండి తొలగిపోవాలి అంటున్నారు. ఇంకా 1 కొరింథీ 13:6 లో  దుర్నీతి విషయంలో సంతోపడక సత్యమునందు సంతోషపడమంటున్నారు పౌలుగారు.  
ఇంతకీ దుర్నీతి అనగా ఏమిటి? అవినీతి అని చెప్పుకోవచ్చు! అది ఎలాంటి దుర్నీతి అయినా సరే అది నిన్ను మరణానికి నడిపిస్తుంది. దుర్నీతి పాపము! పాపమునకు వచ్చు జీతం మరణం! రోమా 6:23; కాబట్టి ఈ దుర్నీతి శారీరకమరణానికి కాకుండా ఆత్మీయ మరణానికి వెంటనే నడిపిస్తుంది! నీవు తీసుకునే లంచాలు అవినీతి, దుర్నీతి, అబద్దాలు చెప్పడం అవినీతి. ఇలాంటివి ఏవైనా సరే నీవు దేవుని న్యాయ సింహాసనం ఎదుట లెక్క అప్పగించాలి అని మరచిపోవద్దు!

 ఇక తర్వాత లక్షణం: *దుష్టత్వం*: మరలా మనం అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయానికి వెళ్తే ఈ సీమోనుతో అపోస్తలుడైన పేతురుగారు అంటున్నారు నీవు సమస్త దుష్టత్వముతోను, దుర్నీతి తోనూ నిండి ఉన్నావు అంటున్నారు. అనగా ఈ దుర్నీతి, దుష్టత్వము అక్కాచెల్లెళ్లు లాంటివి. ఒకటి వస్తే రెండోది ఫ్రీ! దుష్టత్వము అనగా దుష్ట ఆలోచనలు! దేవునికి దుష్టులుదుష్టత్వము అంటే అసహ్యము! హబక్కూకు 1:13లో భక్తుడు చెబుతున్నాడు :
నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?
కాబట్టి దుష్టత్వము, దుర్నీతి దేవునికి అసహ్యమైనది. చివరికి ఇవి మరణానికి దారితీస్తాయి! అందుకే దుష్టులు దవడ పళ్ళు విరుగగోట్టేవాడు దేవుడు అని సెలవిస్తుంది బైబిల్! 
కీర్తనలు 1: 4
దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.
కీర్తనలు 9: 16
దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు.
కీర్తనలు 10: 4
దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు
కీర్తనలు 12: 8
నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్టులై నలుదిక్కుల తిరుగులాడుదురు.
సామెతలు 29: 16
దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచె దరు.

యోబుగారు చెబుతున్నారు వివేకము అంటే దుష్టత్వము విడచిపెట్టడమే! 28:28;  1కొరింథీ 14:20 లో పౌలుగారు చెబుతున్నారు మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి అంటున్నారు.  చిన్న పిల్లలకు దుష్టత్వము అనేది ఉండదు. ఒకవేళ కొట్టుకున్న చిన్నపిల్లలు వెంటనే మరచిపోయి కలసిపోతుంటారు. ఒకవేళ స్త్రీలు పిల్లలకోసం తగవులాడుకుంటే, కాసేపటికి పిల్లలు కలసిపోతారు వారి కోసము తగవులాడుకున్న తల్లులు  సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలకి దుష్టత్వం అనేది ఉండదు.  అందుకే యేసయ్య అంటున్నారు చిన్న పిల్లల వంటి వారిదే పరలోకరాజ్యం! మత్తయి 19:14; ఇక ఎఫెసీ 4:31 లోను, కొలస్సీ 3:8 లోను ఈ దుష్టత్వమును విసర్జించండి అంటున్నారు పౌలుగారు. 
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.

ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.
ఎవరైతే విసర్జిస్తారో వారే పరలోక వాసులుగా దేవుని పిల్లలుగా ఉంటారు. ఎవరైతే దుష్టత్వాన్ని, దుర్నీతిని ప్రాక్టీస్ చేస్తారో, అనుసరిస్తారో వారు ఆధ్యాత్మిక మరణాన్ని, కాలం గడిచేకొద్దీ శారీరక మరణాన్ని చవిచూస్తారు!

   ప్రియ దేవునిబిడ్డా! నీకు ఏది కావాలి? జీవమా లేక మరణమా? జీవం కావాలి అంటే దుష్టత్వాన్ని దుర్నీతిని విసర్జించాలి.  ఏదికావాలో చూసుకో!
దైవాశీస్సులు! 

*రోమా పత్రిక-21వ భాగం*
*మరణపాత్రులు-3*
  
      రోమా 1:2932 
29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై 
30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును 
31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. 
32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు......

      ప్రియులారా! గతభాగంలో దుర్నీతి, దుష్టత్వం కోసం ధ్యానం చేసుకున్నాం! ఈ రోజు మరికొన్ని ధ్యానం చేసుకుందాం! గమనించాలి వీరందరూ మరణపాత్రులు!

తర్వాత లక్షణం: *లోభము*: లోభము అనగా పిసినారితనముతో కలసిన ధనాశ! లేదా ఈ రెండు కలసిఉండటమే లోభం!  ఈ లోభం మరణాన్ని తీసుకుని వస్తుంది అంటున్నారు పౌలుగారు! ఒకసారి ఈ లోభత్వము, లోభి కోసం బైబిల్ లో ఏమని వ్రాయబడిందో చూద్దాం! సామెతలు 15:27 లో లోభి తన ఇంటివారినందరిని బాదపెట్టును అని వ్రాయబడింది. వీడి ధనాశ, పిసినారితనం కుటుంబం మొత్తం భాదపడేలా చేస్తుంది.  కీర్తనలు 10:3 లో లోభులు యెహోవాను తిరస్కరిస్తారు అని వ్రాయబడింది. దేవుణ్ణి తిరస్కరించావు అంటే దయ్యముతో సహవాసం చేస్తున్నావన్నమాట! దేవుడు పరమునందు ఉన్నారు, అంటే ఇప్పుడు దేవుణ్ణి తిరస్కరించావు అంటే పరలోకాన్ని తిరస్కరించావు అన్నమాట, అనగా పరమును తిరస్కరించి నరకాన్ని ముద్దుపెట్టుకుంటన్నా వన్నమాట! 1 కొరింథీ 6:10 లో కొన్ని కేడర్ లు ఉన్నాయి. ఆ కేడర్ లో లోభులు కూడా ఉన్నారు. 
దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 
వీరెవరు దేవునిరాజ్యమునకు వారసులు కాలేరు అని ఖరాఖండిగా చెబుతున్నారు.  కాబట్టి ఎవరికైతే ఈ లోభము ఉంటాదో వారికి పరలోకము లేదు. కనుకనే వారు మరణపాత్రులు అంటున్నారు పౌలుగారు!

*ఈర్ష్య*: ఈర్ష్య అనగా ప్రక్కనోడు బాగుంటే అసూయపడటం, లోలోపల కుళ్ళిపోవడం! వీరు కూడా మరణ పాత్రులే! యోసేపుగారికి తండ్రియైన యాకోబు విచిత్రమైన నిలువటంగీ కుట్టించి ఇస్తే అతని అన్నదమ్ములు ఈర్ష్యపడ్డారు. ఎంతగా ఈర్ష్య పడ్డారు అంటే యోసేపుని చంపడానికి సిద్దపడ్డారు. అందుకే బైబిల్ గ్రంధం సెలవిస్తుంది : ప్రేమ మరణమంత బలీయమైనది. ఈర్ష్య పాతాలమంత కఠోరమైనది! పరమగీతము 8:6; అందుకే యోసేపుగారిని సొంత అన్నదమ్ములే చంపుదామని తయారయ్యారు!  బైబిల్ గ్రంధములో ఈర్ష్య పడినవారు చాలామందున్నారు, గాని వారెవరు బాగుపడలేదు! నిన్నువలె నీపోరుగువారిని ప్రేమించవలెను అని బైబిల్ చెబుతుంటే (లేవీ 19:18; 19:34; మత్తయి 19:19; 22:39; మార్కు 12:31; లూకా 10:27) తోటిసహోదరున్ని ద్వేషించేవారు ఎక్కువయ్యారు. కనీసం నీ తోటి సంఘ విశ్వాసి, నీ పొరుగింటి స్త్రీ మంచి చీర కొనుక్కుంటే ఈర్ష్యపడి ఆ రోజు భోజనం మానేస్తావు, ఎన్నో మాటలంటావు, చేతులు విరిపేసుకుంటావు కదా ప్రియ సహోదరి! నీవిలా ఈర్ష్య పడితే పరలోకం వెళ్తావా? జాగ్రత్త! పౌలుగారు చెబుతున్నారు; ఈర్ష్య ఉంటే మరణపాత్రులు!

*మత్సరము*: ఈర్ష్య ఉంటేనే మత్సరం కలుగుతుంది. ఈర్ష్య ఉన్నవారు అక్కడితో ఆగిపోతారు గాని మత్సరం ఉన్నవారు ఎదుటివారికి ఏదైనా హాని చెయ్యకుండా ఉండలేరు. కారణం ఈ ఈర్ష్య వారిని ఉండనీయదు మత్సరంతో నింపి ఎదుట వారికి హానిచేయ్యకపోతే వారి ఈగో నెమ్మది పడదు! దీనికి కూడా మరల అదే ఉదాహరణ! యోసేపు మీద అన్నలు మత్సరపడి కొట్టి అమ్మివేశారు.  అపో 7:9; ఇదే మత్సరముతో నిండుకున్న యూదులు పౌలుగారు వాక్యం చెబుతుంటే దుష్టులను వెంటబెట్టుకుని వచ్చి వారిని అల్లరిచేశారు. అపో 17:5; ఇదే మత్సరం వలన పేతురుగారు ఇంకా అపోస్తలులు సువార్త ప్రకటిస్తూ స్వస్తతలు చేస్తుంటే మత్సరపడి వారిని బంధించి హింసలపాలు చేసారు. అపో 5:17; పౌలుగారిని, బర్నబా గారిని ఎదురించారు. 1౩:45;  సోలోమోను గారు చెబుతారు ఈ మత్సరము ఎముకలకు కుళ్ళు! సామెతలు 14:30; అందుకే చాలామంది ఎంత తిన్నా వారికి ఒంట పట్టదు! కారణం వారినిండా మత్సరం, కుళ్ళుపైకి చాలాబాగా మాట్లాడతారు గాని హృదయం నిండా కుళ్ళు, మత్సరం! అందుకే వారు ఎంత తిన్నా లావు అవరు! ఎండిపోతారు!  ఈ మత్సరం వారి ఎముకలను తినేస్తుంది. కాబట్టి ఎవరికైతే మత్సరం ఉంటుందో వారికి మొదటగా ఆరోగ్యం ఉండదు; రెండు పరలోకం లేదు; మూడు మరణపాత్రులు!

*నరహత్య*:  బైబిల్ లో జరిగిన మొదటి నరహత్య ఈ ఈర్ష్య, మత్సరంతో నిండుకుని ఉన్నందువలననే! ఎంతగా పగబెట్టాడు అంటే సొంత తమ్ముడ్ని చంపివేశాడు కయీను. మొదటి హత్య! అందుకే దేవుడు కయీనును శపించారు. భూమి శపించబడింది.  దేవుడిచ్చిన పది ఆజ్నలలో ఒకటి నరహత్య చేయకూడదు! నిర్గమ 20:13; ఆజ్ఞ అతిక్రమమే పాపము! హత్య పాపము! దేవుడు సృష్టించిన మనిషిని మరో మనిషి చంపడానికి అధికారం లేదు! అది కేవలం దేవునికి మాత్రమే ఆ అధికారం ఉంది! ఏ కారణం చేతనైనా సరే నరహత్య చేస్తే పాత నిబంధన కాలంలో తిరిగి హత్య చేయాలి. నూతన నిభందన ప్రకారం చేయకూడదు. ఒకవేళ చేస్తే వారు పరలోకమో చేరలేరు. మండుచున్న అగ్ని గుండములో వేయబడతారు; సంఖ్యా 35:౩౩ నరహత్య దేశమును అపవిత్రపరచును! నరహత్య చేయువారు యెహోవాకు అసహ్యులు కీర్తనలు 5:6;  యేసుప్రభులవారు కూడా నరహత్య చేయవద్దు అని చెబుతున్నారు మత్తయి 5:21; మార్కు 10:19; 
ప్రకటన 21:8
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
 .. .. చూడండి వీరంతా అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయ బడతారు. నరహత్య అనేది దేవునికి అసహ్యమైనది. నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెబుతుంది బైబిల్ అంతే తప్ప హత్య చెయ్యమని చెప్పడం లేదు! ఎంతో గొప్ప భక్తుడు నీతిమంతుడు దావీదుగారు ఒక హత్య చేయిస్తే దేవుడు ఓర్వలేక వెంటనే తన ప్రవక్తను పంపించి బుద్ధిచేప్పడమే కాదునీ బ్రతుకు దినములన్నీ నెమ్మది లేకుండా కుటుంబ కలహాలతో జీవిస్తావు అని చెప్పారు దేవుడు!

   ప్రియ చదువరీ! నీలో ఇటువంటి లక్షణాలున్నాయా అయితే నీవు మొదటగా మరణపాత్రుడవని, నీకు నరకంలో సీటు ఖాయమని తెలుస్కో! ఇప్పుడైననూ నీవు ఉపవాసముండి మనస్పూర్తిగా దేవుని పాదాలు పట్టుకో!
యోవేలు 2: 12
ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు!
దేవుని మాట విను!
నరకాన్ని తప్పించుకో!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-22వ భాగం*
*మరణపాత్రులు-4*
  
      రోమా 1:2932 .
29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై 
30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును 
31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. 
32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు....

      ప్రియులారా! గతభాగంలో దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య  కోసం ధ్యానం చేసుకున్నాం! ఈ రోజు మరికొన్ని ధ్యానం చేసుకుందాం! గమనించాలి వీరందరూ మరణపాత్రులు!
ఇక మిగతా లక్షణాలు: కలహము, కపటము, వైరము! ఒకసారి మనం మరలా పౌలుగారి రచనలను గుర్తుచేసుకుందాం! కొలస్సీ పత్రిక ధ్యానములలో వివరించినట్లు పౌలుగారు రాసినవి అన్నీ ఒకదానితో ఒకటి సంభంధం కలిగియుంటాయి. విశ్వాసము- నిరీక్షణ,  ఓర్పు- దీర్ఘశాంతము, మహిమ-శక్తి, విమోచన- పాపక్షమాపణ.....ఇలా ఉంటాయి. 
ఇక్కడ దుర్నీతి- దుష్టత్వం, ఈర్ష్య- మత్సరం, కలహము- కపటము-వైరము ; ఇవి కూడా ఒకదానితో ఇంకొకటి సంభంధం కలిగియుంటాయి. దుర్నీతి ఉంటే దుష్టత్వం ఉంటుంది. ఈర్ష్య వస్తే మత్సరం తోడవుతుంది. అలాగే కలహము వస్తే వైరం వచ్చేస్తుంది. సరే మనం ఒక్కోదానికోసం ధ్యానం చేసుకుందాం!

*కలహము*:  కలహము అనగా తగాదాలు. తగాదాలు ఎందుకు వస్తాయి ప్రేమ లేనందువలన, చెప్పుడుమాటలు వినినందువలన. . . ఇలా చాలాకారణాలు ఉన్నాయి. ఎక్కడైతే కలహాలు ఉంటాయో అక్కడ వైరములు ఉంటాయి. ఎక్కడైతే కలహాలు, వైరాలు ఉంటాయో అక్కడ హత్యలు జరుగుతాయి!  కాబట్టి ఇలాంటివి మరణానికి అనగా శారీరక మరణానికి ఇంకా ఆత్మీయ మరణానికి కూడా దారితీస్తాయి. కాబట్టి వీటిని విసర్జించమని చెబుతున్నారు.  బైబిల్ గ్రంధంలో అబ్రాహాము గారి సేవకులకు, లోతుగారి సేవకులకు కలహము పుట్టెను అని వ్రాయబడింది ఆదికాండం 13:7; తద్వారా ఇద్దరూ విడిపోయారు. చివరికి లోతు కుటుంబం ఎంత ఘోరంగా దిగజారిపోయిందో మనం చూడవచ్చు! కొరింథీ సంఘములో కలహాలున్నాయి వాటిని మానుకోండి అని పౌలుగారు అందుకే హెచ్చరిక చేస్తున్నారు. 1కొరింథీ 1:11;   సామెతలు గ్రంధం ప్రకారం కలహము పుట్టడానికి కోపం కారణం అంటున్నారు. 15:8 కోపోద్రేకియగువాడు కలహాన్ని రేపుతాడు; దీనికి విరుగుడు దీర్ఘశాంతం; కోపిష్టుడు కలహము రేపును 29:22;  కోపము రేపగా కలహము పుట్టును 30:౩౩;  ఇంకా కలహాలు ఎందుకు వస్తాయంటే అదే సామెతలు 16:28 ప్రకారం మూర్ఖుడు కలహము పుట్టించును. కాబట్టి కోపాన్ని అణచుకుంటే కలహములు మానిపోతాయి. మూర్ఖున్ని దూరం చేసుకుంటే కలహములు ఆగిపోతాయి. లేదా కోపం -కలహానికి, కలహము- వైరానికి, వైరము హత్యలకు దారితీస్తాయి. కాబట్టి వీటిని వదిలిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించండి.  గలతీ 5:20 ప్రకారం ఈ కలహము అనేది శరీరకార్యములలో ఒకటి. దీనికోసం చివర్లో ధ్యానం చేసుకుందాం!

*కపటము*: కపటము అంటే మనస్సులో, హృదయంలో పగ-కక్ష్య- క్రోధం ఉంచుకొని ఏమీ ఎరుగనట్టు నటించడం! వీరు చాలా డేంజర్! పైకి చాలా మృదువుగా, ఎక్కడలేని ప్రేమా-ఆపాయతలు ఒలకబోస్తారు. గాని వారి అంతరంగలో ఎంతో పగ, ఈర్ష్య ఉంటాయి. ఇలాంటివారు దేవునికి అసహ్యులు! 2రాజులు 17:9 22 ప్రకారం ఇశ్రాయేలీయులు, వారి రాజులు దుర్భోదలు అనుసరించి కపటం కలిగి, దుర్భోదలు బోధిస్తూ విగ్రాహాలు నిలుపుకుని అన్యజనుల ఆచారాలు జరిగించినందున దేవుడు వారిని దాస్యమునకు అప్పగించారు. కీర్తనలు 5:6 ప్రకారం కపటం చూపి నరహత్య చేయువారు యెహోవాకు అసహ్యులు! పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకోనును సామెతలు 26:24;  ఇలాంటివారి మీదకు దేవుని ఉగ్రత వస్తుంది!

*వైరము*: వైరము అనగా విరోధము. విరోధము ఎందుకు వస్తుంది? వారిమధ్య ప్రేమ లేనందువలన! కలహము ఉన్నందువలన! తగాదాలు ఎందుకు వస్తాయి ప్రేమ లేనందువలన, చెప్పుడుమాటలు వినినందువలన. . . ఇలా చాలాకారణాలు ఉన్నాయి. ఎక్కడైతే కలహాలు ఉంటాయో అక్కడ వైరములు ఉంటాయి. ఎక్కడైతే కలహాలు, వైరాలు ఉంటాయో అక్కడ హత్యలు జరుగుతాయి.  ఇష్మాయేలు ద్వారా ఆరంభమైన కలహము ఇంతవరకు యూదులకు- ఇష్మాయేలీయులకు వైరము పోలేదు. యాకోబు- యాశావుల మధ్య వైరము చిన్నగా మొదలై చివరికి తమ్ముడ్ని హత్యచేయడానికి సిద్ధమయ్యింది. చివరకు ఇంతవరకు కూడా వారిమధ్య వైరము పోకుండా ఇప్పటికీ యుద్ధాలు జరుగుచున్నాయి,. కాబట్టి పగ, వైరము, కలహములు ఎక్కడుంటాయో అక్కడ శాంతిసమాధానాలు పోతాయి. తద్వారా మరణం పొంచి చూస్తుంది.

    ఒకసారి ఆగుదాం! పై వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే పైన చెప్పిన లక్షణాలన్నీ శరీరకార్యముల క్రిందకు వస్తాయి ఒకసారి గలతీ 5:1921 చూసుకుందాం.
19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 
20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, 
21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.  . . . . చూసారా ఇవన్నీ శరీరకార్యములే! 
ఆత్మఫలమేమిటి ?
22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.  . . . 
ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎప్పుడైతే శరీరకార్యములు ఒక మనిషిలో ప్రవేశిస్తాయో వెంటనే ఆత్మఫలము ఒకటొకటి బయటికి పోతాయి. ఉదాహరణకు ఎక్కడైతే కలహము వస్తుందో అక్కడ ప్రేమ అవుట్!  దానితోపాటు సమాధానం అవుట్! సమాధానం, ప్రేమ అవుట్ అయిన వెంటనే సంతోషం అవుట్! వెంటనే వీడిమనస్సులో మంచితనం పోయి కక్ష్య, క్రోధము, బేధము, విమతము ఇవన్నీ ప్రవేశించి చివరికి హత్యలు కూడా చేయడానికి ప్రయతిస్తాడు. వాడి ఆశానిగ్రహము, దీర్ఘశాంతము పోయాయి. కాబట్టి ఎప్పుడైతే శారీరక క్రియలు ఒక మనిషిలో ప్రవేశిస్తాయో ఆత్మఫలం అనగా ఆత్మీయత పోయి, పరిశుద్ధాత్మ క్రియలు పోయి, శారీరక అనగా సాతాను గాడి క్రియలు వచ్చేస్తాయి. ఇంతవరకు పరిశుద్దాత్ముని చేతిలో ఉన్ననీవు- సాతాను గాడి కబంధహస్తాలలోనికి జారిపోతావు! వెంటనే నీవు నరకపాత్రుడవు, మరణపాత్రుడవు అవుతావు. 
కాబట్టి ప్రియ సహోదరి/ సహోదరుడా! ఈ శరీరక్రియలు ఏవైనా ఇప్పుడు నీలో ఉంటే వెంటనే వాటిని విసర్జించు. 
కారణం నీవు నరకానికి అతి చేరువలో ఉన్నావని మరచిపోకు!  
నేడే వాటిని విసర్జించి పరలోకం పట్టు!
అట్టి కృప ధన్యత దేవుడు చదువరులందరికి దయచేయును గాక! ఆమెన్!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-23వ భాగం*
మరణపాత్రులు-5.
  
      రోమా 1:2932
29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై 
30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును 
31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. 
32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.... ....
      ప్రియులారా! ఇంతవరకు దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహము, కపటము, వైరము   కోసం ధ్యానం చేసుకున్నాం! ఈ తొమ్మిది లక్షణాలు ఒక మనిషిలో ప్రవేశించి 12 రకాలైన వ్యక్తులను తయారుచేస్తుంది. ఒక్కో కాంబినేషన్ ఒక్కో రకమైన వ్యక్తులను తయారుచేస్తుంది. గమనించాలి వీరందరూ మరణపాత్రులు!   ఈరోజు కొన్ని రకాలైన మనుష్యులు- వాళ్లకు కలుగబోయే శిక్షలు చూసుకుందాం!

1). *కొండెగాండ్రు*: అనగా చాడీలు చెప్పేవారు, ఇక్కడమాటలు అక్కడ, అక్కడమాటలు ఇక్కడ చెబుతారు. ఇలాంటివారు సాధారణంగా పనీపాటు లేకుండా తిరుగుతారు. ఎక్కువగా స్త్రీలు ఈ కోవకు వస్తారు. పూర్వకాలంలో ఒక సామెత చెప్పేవారు. వీరంటా తమ నాలుక బుజాలమీద వేసుకుని తిరుగుతా ఉంటారంట! బైబిల్ చెబుతుంది ఇలాంటివారు మిత్రభేదం అనగా స్నేహితుల మధ్య చిచ్చులు/ తగాదాలు పెడతారు. సామెతలు 16:28; స్నేహితులు విడిపోయి తన్నుకుంటుంటే వీరికి ఒక రకమైన పైశాచికమైన ఆనందం కలుగుతుంది. ఇలాంటి చీడపురుగులను ముందుగానే గుర్తించి, పెరికి పారివేయాలి. అప్పుడే సమాజం, కుటుంబం, స్నేహము బాగుపడుతుంది.  కీర్తనలు 50:20 
నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు.
 కొండెములు ఎక్కడ ఉంటాయో అక్కడ అపనిందలు, అనగా అపవాదాలు కూడా ఉంటాయి! అందుకే సామెతలు 30:10 లో 
దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు.
  యిర్మియా 9:4 లో దేవుడు అందరి అంతరంగాలు తెలిసిన వాడు కనుక అంటున్నారు: 
మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరు నినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.
 బైబిల్ గ్రంధం ప్రకారం కొండెములు చెప్పేవారు నరహత్య కూడా చేస్తారు. ఉదాహరణకు యేహెజ్కేలు 22:9;  ఇలాంటివారు నేడు మన సమాజంలో నిండుకుని ఉన్నారు. పౌలుగారు తిమోతితో పరిచర్య చేయు స్త్రీలను ఏర్పాటుచేయమని చెబుతూ, ఆ స్త్రీలకూ ఉండవలసిన లక్షణాలు చెప్పారు. వాటిలో ప్రధమ మైనది కొండెములు చెప్పని వారు! 1తిమోతికి 3: 11
అటువలె పరిచర్యచేయు స్త్రీలును మాన్యులై(వారి భార్యలును) కొండెములు చెప్పనివారును,(అపవాదులును) మితాను భవముగలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను.

అందుకే పౌలుగారు 5వ అధ్యాయంలో యవ్వనస్తులైన విధవరాల్లను విధవరాల్ల లెక్కలో వెయ్యొద్దు అంటునారు.  1 Timothy(మొదటి తిమోతికి) 5:11,12,13,14,15
11. యౌవనస్థులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు; 
12. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పుపొందినవారై పెండ్లాడగోరుదురు. 
13. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాండ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చుకొందురు. 
14. కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. 
15. ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగిపోయి సాతానును వెంబడించినవారైరి. . . . . . . కాబట్టి ఈ కొండెములు, చాడీలు చెప్పడం అనేది విశ్వాసి తప్పకుండా విసర్జించాలి. మరచిపోవద్దు 32 వచనం ప్రకారం వీరంతా మరణపాత్రులు! నీవు మరణాన్ని తప్పించుకోవాలి అంటే ఈ కొండెములు వదిలెయ్యాలి!

2. *అపవాదకులు*: మీద చెప్పిన విధముగా కొండెములు ఎక్కడ ఉంటాయో అక్కడ అపవాదములు ఉంటాయి. అపవాదకులు అనగా లేనిపోని నిందలు వేసేవారు. లేనివాటిని కల్పించి చెబుతారు. తద్వారా తమ కడుపులు నింపుకుంటారు.  మరలా కీర్తనలు 50:20 చూసుకుందాం! నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు.
2 తిమోతి 3:15 లో పౌలుగారు అంత్యదినాలలో ప్రజలు ఎలా తయారవుతారో చెబుతున్నారు.
1. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. 
2. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు 
3. అనురాగరహితులు అతిద్వేషులు *అపవాదకులు* అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు 
4. ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు, 
5. పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.  . . . .   భాప్తిస్మమిచ్చు యోహాను గారి దగ్గరకు సైనికులు వచ్చి, మమ్మల్ని ఏమి చెయ్యమంటారు? మేము ఎలా జీవించాలి అని అడిగితే భాప్తిస్మమిచ్చు యోహాను గారు చెబుతున్నారు.  లూకా 3:14 
సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడు ఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.
 . . యేసుప్రభులవారి మీద ఎన్నెన్నో అపనిందలు వేశారు. గాని యేసుప్రభులవారు ఏమీ అనలేదు. చివరకు తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని కోరి క్షమాభిక్ష పెట్టారు. దీనిని చెప్పడానికి కారణం: ప్రజలు అపనిందలు, అపవాదులు వేసేవారు. వారు నిత్య జీవాధిపతియైన యేసయ్యనే వదలలేదు! కావున నిన్నుకూడా వదలరు. అయితే నీవు వారిని శపించకుండా, వారికోసం పట్టుదలతో ప్రార్ధన చెయ్యాలి యేసుప్రభులవారు ప్రార్ధించినట్లు! అపనిందలు చూసి క్రుంగిపోకు ఓలిపోకు! సోలిపోకు! ధైర్యముగా ఉండు! అంతేకాదు నీవు ఎవరిమీద అపవాదులు, అపనిందలు వేయొద్దు! నిన్ను నన్ను చూసేవాడు ఒకాయన ఉన్నారు. ఆయన నిన్ను నరకమునకు , మరణమునకు అప్పగిస్తారు జాగ్రత్త!

3. *దేవద్వేషులు*: దేవద్వేషులు అనగా దేవుడ్ని, దేవుని మహిమలను ద్వేషించేవారు, తిరస్కరించేవారు. ఈ దేవద్వేశులలో మొదటి తెగవారు దేవుడు లేడు అని చెబుతారు. బైబిల్ చెబుతుంది దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొంటారు అయితే వారు చెడిపోయిన వారు, అసహ్యమైన కార్యములు చేసేవారు కీర్తనలు 14:1; 53:1;  ఇక రెండో తెగవారు గతభాగాలలో చెప్పుకున్నట్లు దేవుని మహిమను పశుపక్ష్యాది రూపాలలో మార్చి, నిజదేవుని గూర్చి చెబితే తిరస్కరించేవారు, అపహాసం చేసేవారు. యోహాను 7: 7
లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.; 15:18,24
18. లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. 
24. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.  . .  వీరంతా తీర్పుకు పాత్రులు 2పేతురు 2:10 ప్రకారం, ఇంకా యూదా 1:8 ప్రకారం. Jude(యూదా) 1:8
8.అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్ర పరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను(మూలభాషలో-మహిమలను) దూషించుచు ఉన్నారు. .
2 Peter(రెండవ పేతురు) 2:10,11
10.శి క్షలో ఉంచ బడినవారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను(మహిమలను) దూషింప వెరువకయున్నారు. 
11.దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు.  . . .
     
ప్రియ చదువరీ! ఒకవేళ నీవు పైన చెప్పిన మనుషులలో గల ఏదైనా ఒక కోవకు చెందితే నేడే నీ పాపములు ఒప్పుకుని విడచిపెట్టు! కారణం వీరంతా మరణపాత్రులు! తీర్పుకు పాత్రులు! శిక్షకు పాత్రులు! ఆ తీర్పు, ఉగ్రత, మరణం తప్పించుకోవాలంటే ఒకే మార్గముంది! నీ పాపములు ఒప్పుకుని కడిగివేసుకుని ఆయన బిడ్డగా మారడమే! 
పైన చెప్పిన లక్షణాలను అసహ్యించుకుని ఆయన బిడ్డగా జీవించడమే! 
సాక్షార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం జీవించడం వలన మాత్రమే ఆ ఉగ్రత నుండి మరణం నుండి తప్పించుకోగలవు. 
మరి నీవు సిద్దమా??!! 
అయితే ఇప్పుడు దేవుని శరణువేడు!
ఇదే రక్షణ దినం! నేడే అనుకూల సమయం!
ఆమెన్!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-24వ భాగం*
*మరణపాత్రులు-6*
  
      రోమా 1:2932 
29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై 
30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును 
31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. 
32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు........

  ప్రియులారా! ఇక తర్వాత కేడర్:
4. *హింసకులు*: హింసకులు అనగా హింసించే వారు. వీరు ఒకరకమైన శాడిస్ట్ లు అన్నమాట! ఇతరులను హింసించి, వారు బాధ పడుతుంటే పైశాచిక ఆనందం పొందేవారు! వీరిలో హింసా ప్రవృత్తి పేరుకుపోయి ఉంటుంది. కారణం వీరిలో సాతానుడు ఎల్లప్పుడూ హింసను ప్రేరేపిస్తూ ఉంటాడు. నేటి రోజులలో క్రైస్తవులపై, సంఘాలపై, సేవకులపై హింస పెరిగిపోతుంది. వీరిని ప్రేరేపించేవాడు సైతానుగాడు. దేవుడు ముందుగానే చెప్పారు మిమ్మల్ని హింసించే ప్రతీవాడు తను దేవునికి సేవ చేస్తున్నట్లు ఫీల్ అవుతాడు. అవును నేటిదినాల్లో జిహాద్ పవిత్ర యుద్ధాల పేరుతో ఎంతోమంది అమాయకులు, చిన్నపిల్లల ప్రాణాలు తీస్తూ వారు దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నారు. ఎంతోమంది దైవసేవకులను హింసిస్తూ, చంపుతూ, దేవాలయాలను పడగొడుతూ అనుకుంటున్నారు వారు వారి దేవుడికి నిజమైన భక్తులు, వారి దేవుడి ఋణం తీర్చుకుంటున్నాం అనుకుంటున్నారు. దీనికోసం దేవుడు ముందుగానే చెప్పారు. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి, మీమీద అబద్దసాక్ష్యం పలికినప్పుడు మీరు ధన్యులు! సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పారు దేవుడు! మత్తయి 5:11;  ఈ విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకుండా యేసయ్య ప్రేమతత్వాన్ని అర్ధం చేసుకోని వారు, christian కౌన్సిల్ అని, సంఘాలు అని, ధర్నాలు చేస్తూ వారితో పోరాడుతున్నారు. దేవుడు ఎవరైనా హింసిస్తే ఒక పట్టణం నుండి మరో పట్టణానికి పారి పొమ్మన్నారు గాని ఇలా ధర్నాలు చేసి, కోర్టులను ఆశ్రయించమని చెప్పనే లేదు! 
కీర్తనలు 12: 8
నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్టులై నలుదిక్కుల తిరుగులాడుదురు.
కాబట్టి ప్రియ సహోదరి/ సహోదరుడా! నిన్ను ఎవరినా హింసిస్తున్నారా ? ప్రార్ధనచేయు! దేవుడు ఎక్కడైతే హింసించబడ్డావో అక్కడే నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తారు. వారిమీద దయచేసి కేసులు వేయకు! అది వాక్యానుసారం కానేకాదు! నీవు హింసించ బడుతున్నావంటే పరలోకమందు నీ ఫలం ఎక్కువౌతుంది అన్నమాట! ఎంతగా హింసించబడతావో అంతగా నీ ఫలము పెరిగిపోతుంది. పేతురు గారు చెబుతున్నారు ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమలు, హింసలు పడ్డారా అయితే విచారపడొద్దు అంటున్నారు. 
1 Peter(మొదటి పేతురు) 4:15,16
15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. 
16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. . . .  
పౌలుగారు తన పత్రికలలో మాటిమాటికి ఒప్పుకుంటారు: నేను పూర్వం హింసకుడను, గలతీ 1:13; తెలియక హింసించాను, క్షమించబడ్డాను అంటున్నారు. *భయంకరమైన హింసకుడు సౌలుపౌలుగా మార్చబడ్డారు కదా, నీ నిజమైన ప్రార్ధన ఇప్పుడు హింసిస్తున్న వారు ఎవరైనా సరే, వారు జీహాదీలైనా, లేక బజరంగ్ దళ్,  విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలకు చెందినవారైనా సరే, దేవుడు వారిని మార్చగల సమర్ధుడు! ఎంతోమంది హింసకులను మార్చిన దేవుడు వీరిని కూడా మార్చగలడు! వారు మారకపోవడానికి సగం కారణం మనమే! వారికి క్రీస్తు ప్రేమను చూపించకుండా వారిమీద కేసులు పెట్టి, వారి దేవతలను విమర్శిస్తూ, వారికి కోపం రప్పిస్తున్నామే తప్ప, యేసయ్య చెప్పిన సత్యం ఒక చెంపమీద కొడితే రెండవ చెంపను చూపమన్న యేసయ్య మాట ప్రకారం చేస్తే మన భారతదేశం ఎప్పుడో రక్షణ పొందుకునియుండును*! కాబట్టి శ్రమలు, హింసలు సహిద్దాం! సాక్షులుగా జీవించి అనేకులను క్రీస్తుకై గెలుద్దాం!

5. *అహంకారులు*: అహంకారులు అనగా గర్విష్టులు! గర్వం పెరిగిపోయి కళ్ళునెత్తిమీదకు వచ్చి మాట్లాడేవారు. ఎత్తకుడి, ఎత్తకుగా కొమ్ము ఎత్తకుడి, పొగరుపట్టిన మాటలడకుడి అని సెలవిస్తుంది బైబిల్! కీర్తనలు 75:5; ఇలాంటి గర్విష్టుల, దుష్టుల దవడఎముకమీద కొడతాను అంటున్నారు దేవుడు!  పౌలుగారు ఈ చివరి రోజులలో అహంకారులు పెరిగిపోతారు అని ముందుగానే చెప్పారు 2 తిమోతి 3:2,3
2. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు 
3. అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు  . . ద్వితీ 18:20 ప్రకారం అహంకారం గలవాడు చావాలి. సామెతలు 8:13 ప్రకారం గర్వము,  అహంకారము, కుటిలమైన మాటలు దేవునికి అసహ్యము! 11:12 ప్రకారం అహంకారం వెంబడి అవమానం వస్తుంది.  అందుకే యెషయా గారు ఆత్మావేశుడై అంటున్నారు: అప్పుడు నరుల అహంకారం అణగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గించబడును, యెహోవా మాత్రమే ఘనత వహించును. యెషయా 2:17; ఎప్పుడు? దేవుని రాకడ సమయమందు. ఇంకా శ్రమల కాలంలో! ఇంకా తీర్పు దినమందు;

  అస్సూరు రాజు అహంకారం కలిగి మాట్లాడాడు, నా చేతిలోనుండి మిమ్మల్ని మీ దేవుడైన యెహోవా తప్పించగలడా, ఈ దేవత ఏంచేయగలిగింది, ఆ దేవత ఏంచేయగలిగింది అంటూ హిజ్కియా గారు మారు మాట్లాడకుండా ఆ ఉత్తరాన్ని దేవాలయంలో పరచి దేవునిముండు కన్నీరు విడచాగా దేవుడు ఇకదూతను పంపించి ఒక్కరాత్రిలో లక్షా ఎనబైవేలమందిని హతం చేశారు. వాడి అహంకారము పోయింది, తనరాజ్యం పోయి చంపబడ్డాడు సొంత కొడుకులతో! 2రాజులు 18--19 అధ్యాయాలు; గర్వానికి దేవుడిచ్చే తీర్పు ఇదే! షడ్రాక్, మేషాక్, అబెద్నేగోలతో రాజైన నెబుకద్నేజర్ నాచేతిలోనుండి మిమ్మల్ని విడిపించే దేవుడెవడైనా ఉన్నాడా అని ప్రగల్బాలు పలికాడు. అహంకారమైన మాటలు పలికాడు. దైవ దర్శనం పొందుకుని అంటున్నాడు: ఇవ్విదముగా రక్షించ సమర్ధుడు.  Daniel(దానియేలు) 3:15,26,28,29
15. బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడనున్నాడు? 
26. అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగోయనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి. 
28. నెబుకద్నెజరు *షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి*. 
29. *కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడు వారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను*. . . . ..  

కాబట్టి అహంకారమైన మాటలు వదిలేద్దాం! దేవుడు అహంకారులను , గర్విష్టులను గద్దెదించి బీదలను పైకెత్తుతాను అంటున్నారు. ఈరోజు నీకున్న పలుకుబడి, ఆస్తి, ఐశ్వర్యం ఎల్లకాలము ఉండదు. నీకున్న అందము ఎప్పుడూ నీతో ఉండదు. ఒకరోజు నాడు నీవు ప్రేలిన ప్రేలాపనల వలన నీవు అవమానం పొందుకుంటావు. కాబట్టి దుర్దినములు రాకముందే, ఇప్పుడే నీ గర్వము, అహంకారం వదలి, దీనుడవై దేవుని పాదాలు పట్టుకో! 
మరచిపోకు! 
పైన ఉదాహరించిన వారు మరణపాత్రులు! నీవుకూడా మరణపాత్రుడుగా ఉంటావా? పరలోకవాసిగా ఉంటావా? 
ఏదికావాలో నిర్ణయించుకో!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-25వ భాగం*
*మరణపాత్రులు-7*
  
      రోమా 1:2932 ..
29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై 
30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును 
31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. 
32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు......

           ప్రియులారా! ఇంతవరకు 5 రకాలైన మనుష్యుల కోసం ధ్యానం చేసుకున్నాం!

6. *బింకములాడువారు*: అచ్చమైన తెలుగులో చెప్పాలంటే వీరు బడాయికోరులు లేక బడాయికబుర్లు చెప్పేవారు. వారిదగ్గర లేకపోయినా ఉన్నట్లు ఫోజుకొట్టి కబుర్లు చెప్పేవారు.  నేను ఇంతా అంతా, నాకు ఇదుంది, అదుంది అంటూ కబురులు చెబుతూ, ప్రజలను మోసగిస్తూ, చివరికి అవమానం పొందేవారు. 
కీర్తనలు 12:3 ప్రకారం యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని, బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును! జాగ్రత్త! బింకములాడువారు ఇచ్చకము లాడుతారు. చివరకు వదరబోతులు అనే పేరు తెచ్చుకొంటారు. కీర్తన 94:4 .. . . దోషము చేయువారందరూ బింకములాడుచున్నారు.  అందుకే పూర్వకాలంలో ఒక భక్తుడు పాట రాశారు: మారాలి మారాలి నీ మనస్సే మారాలి, మారిన బ్రతుకు దేవునికిస్తే ఫలితముంటుంది. మారామంటూ మస్కా కొడతారు, క్రీస్తుకోసం పుట్టామంటూ గొప్పలు చెబుతారు, గొప్పలు కాస్తా సాగకపోతే గోతిలో పడతారు/ చతికిల పడతారు. . .. ఇలా వీరికోసం చక్కగా వ్రాయబడింది ఆ పాట! నేటి రోజులలో కూడా చాలామంది బింకములాడుతున్నారు : మాకు ఈ వరాలున్నాయి, ఆ వరాలున్నాయి, నేను ప్రార్ధన చేస్తే ఇలాగయ్యింది అలాగయ్యింది. మా అయ్యగారు ప్రార్ధనచేస్తే అలా జరిగింది అంటూ గొప్పలకు పోతూ అన్యుల దగ్గర నవ్వులపాలు అవుతున్నారు. మరికొంతమంది ఇలా బడాయి కబుర్లు చెబుతూ అనేకులను దోచుకుంటున్నారు. ఇలాంటి వారి నాలుకలు దేవుడు కోసేస్తాను అంటున్నారు.

7. *చెడ్డవాటిని కల్పించువారు*: దీనిని జాగ్రత్తగా పరిశీలించాలి. చెడ్డవాటిని కల్పించు వారు అనగా లేనివాటిని పుట్టించేవారు మరియు చెడ్డవాటిని తయారుచేసేవారు అనికూడా వస్తుంది.  చాలామంది ఎవరైనా అభివృద్ధి చెందుతూ ఉంటే వారిమీద లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. వీరుకూడా ఈ కోవకే చెందినవారు. పెళ్ళికాని అమ్మాయిల మీద, వివాహితుల మీద లేనిపోనివి కల్పించి చెబుతూ, అబాంఢములు వేసినందువలన ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఎంతోమంది ఆడపిల్లల భవిష్యత్ పాడయిపోయింది ఈ చేడ్డవాటిని కల్పించేవారి వలననే!  వీరి మీదకు దేవుని ఉగ్రత రాబోతుంది. యోబు 13:4 లో వీరు అబద్దములు కల్పించువారు, మీరు పనికిమాలిన వైద్యులు అంటున్నారు. సామెతలు 14:22 ఇలాంటివారు తప్పిపోవుదురు అంటున్నారు.  మరికొంతమంది ప్రజలను పాడుచేయడానికి, వారి ఆస్తి పెంచుకోవడానికి చెడ్డ వాటిని తయారు చేస్తుంటారు. అవి చెడ్డవి, ఆరోగ్యానికి హానికరము అని తెలిసికూడా చెడ్డ వాటిని తయారు చేస్తుంటారు. పిల్లలను పాడుచేయడానికి నేటిదినాల్లో అనేకమైన వీడియోగేమ్లు తయారుచేస్తున్నారు. వీటిద్వారా పిల్లలు పాడైపోవడమే కాకుండా అనేకమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు గత నెలలలో! కాబట్టి ఇలాంటివాటిని చేసేవారు తప్పకుండా దేవుని ఉగ్రతకు పాత్రులు, అంతేకాకుండా మరణపాత్రులు!

8. *తల్లిదండ్రులకు అవిదేయులు*: ఈ మాట చెప్పిన వెంటనే మనకు గుర్తుకు వచ్చేది సంసోను. దేవునికి నాజీరు చేయబడిన వాడు, వాగ్ధానపుత్రుడు గాని తల్లిదండ్రుల మాటలు ఆలకించలేదు. నాకు ఆ పిల్లను పెళ్లి చేస్తారా లేదా అని కూర్చొన్నాడు. ఏమయ్యింది? కాపురం కూలిపోయింది. తన వైవాహికజీవితం జీవితంలో ఎప్పుడూ బాగోలేదు. వేశ్యలను ఆశ్రయించి వ్యభిచారి అయ్యాడు. చివరికి కళ్ళు పీకించుకుని కుక్కచావు చచ్చాడు. మరొకరు దీన!  యాకోబుగారికి ఏకైక కుమార్తె! 12మంది అన్నదమ్ములకు ఒకర్తే చెల్లి! ఎంతో గారాబం, ముద్దు!  పరాయిదేశం చూడటానికి వెళ్ళింది. అన్నయ్యలు వస్తారు ఉండమంటే ఆగలేదు. వెళ్ళింది, చూసింది. ఆ రాకుమారుడు పట్టుకుని రేప్ చేసేసాడు. బ్రతుకు బుగ్గిపాలయ్యింది. తల్లిదండ్రుల మాట వినకే ఇది జరిగింది. ఆదికాండం 34; తప్పిపోయి దొరికిన కుమారుడు తండ్రిమాట వినలేదు. నా ఆస్తి పంచి ఇస్తావా చస్తావా అని కూర్చొన్నాడు. వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. పందులపొట్టు కూడా దొరకలేదు. చివరికి బికారివాడిలా తిరిగి వచ్చాడు. లూకా 15; తల్లిదండ్రులమాట విననివారి గతి ఇంతే! ప్రియ తమ్ముల్లారా! చెల్లెల్లారా! మీ తల్లిదండ్రులు మీ క్షేమం కోసం కొన్ని వద్దు అని చెబుతారు. గాని మీరంటున్నారు మేము ఎదిగిపోయాము. మాకు ఏమి కావాలో మేము నిర్ణయించుకోగలం! మాకు చెప్పక్కర్లేదు. ఇస్తారా చస్తారా అంటున్నారు.చివరికి మీ భాగస్వామిని మీరే నిర్ణయించుకుంటున్నారు సంసోను లాగ! చివరికి ఆరు నెలలకు కాపురం కూలిపోయి ఇక తల్లిదండ్రులకు ముఖం చూపించలేక, ఇక బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకునే వారు అనేకమంది. ప్రేమ పెళ్లుల్లు వాక్యానుసారం కాదు! సంసోను ప్రేమించి పెళ్ళిచేసుకుని సర్వనాశనం అయ్యాడు. యాకోబు గారు తల్లిదండ్రుల మాట వినకుండా నీ మేనమామ కూతుర్లలో ఒకతెను పెళ్లి చేసుకో అంటే నలుగురిని చేసుకుని ఎన్ని బాధలు పడ్డారో మనకు తెలుసు! ఇలా తల్లిదండ్రుల మాట వినని వారు చాలామంది ఉన్నారు. వారిజీవితం నిట్టూర్పులు విడుస్తూ బ్రతకడం అయ్యింది. నాకుమారుడా మీ తండ్రి మాట వినుము అని సామెతలు గ్రంధంలో మాటిమాటికి చెబుతుంది. 1:8
8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.  . .
3:1
1. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. . . ;6:20.
20. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.  . .  దేవుడిచ్చిన ఆజ్నలలో ఒకటి నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు! నిర్గమ 20:12; ఇక్కడ సన్మానించు అనగా శాలువా కప్పి, బోకే ఇచ్చి సన్మానించమని కాదు. వారిమాటకు జవదాటకు! వారు చెప్పిన మాటలకు లోబడు. చెప్పినట్లు చెయ్యు! అప్పుడే నీవు ఎక్కువకాలం బ్రతుకుతావు లేదంటే నీ కాలానికి ముందుగానే పోతావు. చాలామంది యవ్వన సోదరీలు వారికి నచ్చిన వస్త్రధారణ, సినీ స్టైల్ వస్త్రధారణ చేసుకుంటూ, ప్రజలతో కామెంట్ చేసేలా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు వారించినా వినడం లేదు. చివరకి చాలా సందర్బాలలో ర్యాగింగ్ చేయించుకుని, చివరికి బలాత్కారాల పాలు అవుతున్నారు. ప్రియ తల్లిదండ్రులారా! మీ పిల్లలు వేసే వస్త్రధారణ వాక్యానుసారమైనదా కాదా అని గమనించి, వారిని వారించవలసిన అవుసరం ఉంది. అన్యులు చేసినట్లు వస్త్రధారణ క్రైస్తవులు చేయడానికి వీలులేదు. స్త్రీ పురుషవేషం, పురుషుడు స్త్రీ వేషం వేయడానికి వీలులేదు.
ద్వితియోపదేశకాండము 22: 5
స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు.
 అనగా స్త్రీలు జీను ఫాంట్లు, టీ-షర్ట్లు వేయడానికి వాక్యం అంగీకరించదు. వీరంతా తప్పకుండా నరకానికి పోతారు జాగ్రత్త!  కాబట్టి మీ తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రులకు అవిదేయులైతే ఈ వచనం ప్రకారం మరణపాత్రుడవని మరచిపోకు! యోసేపులా, దావీదులా,ఎస్తేరులా, యేసయ్యలా తల్లిదండ్రుల మాట విందాం! దైవాశీర్వాదాలు పొండుకుందాం,!
దైవాశీస్సులు!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అబ్రాహాము విశ్వాసయాత్ర

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

పొట్టి జక్కయ్య

శరీర కార్యములు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

సమరయ స్త్రీ

యేసు క్రీస్తు రెండవ రాకడ

పాపము

బాప్తిస్మం