రోమా పత్రిక - పార్ట్ -6

*రోమా పత్రిక 111వ భాగం*

రోమా 12:1516
15. సంతోషించు వారితో సంతోషించుడి; 
16. ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. .

     ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితం ఏమిటో ఇక్కడ చక్కగా కనిపిస్తున్నది. ఇతర విశ్వాసులపట్ల ఎలాంటి ప్రేమగల జీవితం గడపాలి  (9,10,13,15,16), క్రీస్తు పట్ల ఎలా ఉండాలి (వ 11,12), శత్రువుల పట్ల (వ 14,19-21) ఎలా ప్రేమ చూపించాలి అనేదో ఆ జీవితం.

        ఇక 15వ వచనంలో సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చేవారితో ఏడవండి అంటున్నారు పౌలుగారు. దీని సామాన్య అర్ధం ఏమిటంటే ఇతరుల సుఖ దుఃఖాలను పంచుకోమంటున్నారు.  గాని జ్ఞానియైన సొలోమోను గారు అంటున్నారు విందు జరుగుచున్న ఇంటికి పోవుటకంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు అంటున్నారు. ప్రసంగి 7:2;  ఎందుకు వారు ప్రలాపిస్తున్నారు అంటే ఆవచనంలోనే జవాబుంది. మరణం అందరికీ వస్తుంది. మరణించారు కాబట్టి ప్రలాపిస్తున్నారు. కాబట్టి ఈ వచనంలో సంతోషించే వారితో సంతోషించండి అయితే ఏడ్చేవారితో ఏడ్వమని చెప్పారు పౌలుగారు ఆత్మావేశుడై! ఇలా పౌలుగారు రాయడానికి కారణం దేవుని సారత్రిక సంఘంలో , క్రీస్తు శరీరము అనే సంఘంలో విశ్వాసులంతా వివిధ భాగాలు. గాని అందరూ ఒకే శరీరానికి చెందిన వారు.  1 కొరింతు 12:25-27;
25. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు. 
26. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితో కూడ సంతోషించును. 
27. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు  
గలతీ 6:2
ఒకని భారముల నొకడుభరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.

విశ్వాసులు కఠినంగా, సానుభూతి లేకుండా, స్వార్థంగా ఉండకూడదు. ఇతరుల ఆనందంలో, దుఃఖంలో పాలుపంచుకోవాలి.

           16వ వచనంలో ఒకనితోనొకడు మనస్సు కలిసికొని యుండుడి. హెచ్చువాటియందు మనస్సునుంచక తగ్గువాటియందు ఆసక్తి కలిగియుండుడి. అంటున్నారు. మనస్సు కలిసిపోవడం అంటే ఏకమనస్కులై ఉండాలి. ఈ ఏక మనస్సు లేకనే కుటుంబాల్లో సంఘాల్లో తగువులు తగాదాలు వస్తున్నాయి. ఏకమనస్సు ఎందుకు లేదంటే వారి మధ్య ప్రేమలేదు! సమాధాన బంధం లేదు! దేవుడే ప్రేమై యున్నాడు కాబట్టి వీరిమధ్య ప్రేమ లేదు అంటే వీరిమధ్య దేవుడు లేడు అని అర్ధం! బైబిల్ గ్రంధంలో ఏకమనస్సు కలిగి ప్రార్ధించిన వారంతా, ఏకమనస్సు కలిగియుంటే ఎన్నెన్నో అధ్బుతాలు జరిగాయి. న్యాయాధిపతులు 20:1; ఎజ్రా ౩:1; 
అపో 5:12.
ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహత్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి.

అందుకే పేతురుగారు కూడా ౩:8లో 
తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.......  
చూశారా మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఃఖములో మరొకరు పాలుపంచుకుని ,సహోదర ప్రేమ గలవారై , వినయ మనస్కులై యుందండి అంటున్నారు.
 అపొ కా 4:32;  ఎఫెసు 4:2--3.  

గర్వం, దురహంకారం, తనను ఇతరులకంటే హెచ్చించుకోవడం, విశ్వాసుల మధ్య ఉండే మైత్రిని, ఐక్యతను చెరుపుతాయి. ఉన్నత స్థితిలో ఉన్నా తక్కువ స్థితిలో ఉన్నా క్రీస్తులో అందరూ ఒకటే, అలానే ప్రవర్తించాలి అపొ కా 6:1; 1 కొరింతు 12:13;
ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి(లేక,శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.
 గలతీ 3:28
ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

 కులాన్ని బట్టీ, సమాజంలో, లేక క్రైస్తవ సంఘంలోని స్థితి స్థానాలను బట్టీ అహంకారాలు, విభేదాలు, పక్షపాతం దేవునికి అసహ్యం.

     ఇంకా హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తి కలిగి  ఉండమంటున్నారు. లూసిఫర్ హెచ్చువాటియందు మనస్సుంచి గర్వించి దేవునికంటే గొప్పవాడినని తలంచి నప్పుడు దేవుడు పాతాళంలో ఒక మూలకు త్రోసివేశారు. యేసయ్య అంటున్నారు తననుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును  తననుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. మత్తయి 23:12; సుంకరి-పరిసయ్యుడు ఉపమానంలో మనం చూడగలం: పరిసయ్యుడు హెచ్చించుకొన్నాడు- నరకానికి పోయాడు. సుంకరి తగ్గించుకుని గుండెలు బాదుకుంటూ పాపినైన నన్ను క్షమించమని కోరాడు. నీతిమంతుడిగా తీర్చబడి పరలోకం పోయాడు. లూకా 18.
ఇంకా యెషయా 66: 2
అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ..... 

      కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! తగ్గించుకో! హెచ్చించుకోవద్దు!

 ఈ సందర్బంగా మరోసారి యవ్వనస్తులకు గుర్తుచేయాలని తలస్తున్నాను. నేటికాలంలో యవ్వనస్తులు మూడు విషయాలలో హెచ్చువాటియందు మనస్సుంచి లైఫ్ ను పాడుచేసుకుంటున్నారు. 
1. తను చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చేవరకు ఏ పనిచేయకుండా తలిదంద్రులకు భారంగా ఉంటున్నారు. అందుబాటులో ఉన్న చిన్న ఉద్యోగం వస్తే నిరాకరిస్తున్నారు. నాకు అక్షరాల లక్షరూపాయల జీతం వస్తేనే ఉద్యోగం చేస్తాను. ఇలాంటి భావం కలిగియుండి ,తర్వాత ఈ చిన్న ఉద్యోగం కూడా లేక బాధపడుతున్నారు. దేవుడు నిన్ను తగినకాలమందు హెచ్చించు వరకు చిన్న ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులకు తోడుగా ఉంటే ఒకరోజు దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తారు. గతంలో చాలాసార్లు చెప్పానుదేవుడు పనిచేసే వారినే తన సేవకు పిలిచారు తప్ప కాళీగా ఉన్నవారిని బైబిల్ ప్రకారం ఎవరినీ పిలువలేదు. 
2. చాలామంది యవ్వనస్తులకు దేవుని సేవ చెయ్యాలని ఆశిస్తున్నారు. దేవుడు అలాంటి యవ్వనులను దీవించును గాక! అయితే వారు సేవ అనగా ప్రసంగాలు చెయ్యడం, పాటలు పాడటం అనుకుంటున్నారు. రోజు మధ్యాహ్నంలో పెద్ద స్పీకర్లు అయిపోవాలని, పెద్ద పాటగాళ్ళు అయిపోవాలని, వేల విశ్వాసులున్న సంఘానికి పాదిర్లు కావాలని అనుకుంటున్నారు. ఇది తప్పు! దేవుడు మన CEO. ఎవరిని ఎలా వాడుకోవాలో దేవునికి తెలుసు! కాబట్టి దేవా నేను నీ సేవ చెయ్యాలని ఆశ! నన్ను వాడుకో! ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చివరకు సంఘంలో/ చర్చిలో టాయిలెట్లు కడగడానికి కూడా నేను సిద్ధమే! అని ప్రార్ధించు. అక్కడనుండే పని మొదలుపెట్టు! దేవుడు నిన్ను అత్యధికంగా వాడుకోడానికి సిద్ధంగా ఉన్నారు. 
౩. నేటి యవ్వనురాండ్రు పనికిమాలిన సినిమాలు, సీరియల్లు ప్రభావం వలన తమ కలల రాకుమారుడు అమెరికా నుండి ఫ్లైట్ లో వచ్చి, కారుమీద/ గుర్రంమీద తిన్నగా తమ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుని అమెరికా, సింగపూర్ లాంటి దేశాలకు తీసుకునిపోతాడు అని పిచ్చి, పగటి కలలు కంటూ వారికి వస్తున్న సంబంధాలను చెడగొట్టుకుంటున్నారు. దయచేసి ప్రియ చెల్లెల్లారా! అవి సినిమాలు! అబద్దానికి ఫాక్టరీలు! నిజ జీవితంలో అలాంటివి జరుగవు! మీ తల్లిదండ్రుల ఆర్ధిక స్తితి మీకు తెలుసు కదా! కాబట్టి వారు తమ స్తోమతను బట్టి మీకు సిద్దపరచిన సంబంధం చేసుకోవడమే దేవునికి అనుకూలమైన పని! కాబట్టి నిజాన్ని తెలుసుకోండి. యధార్ధతకు రండి. కలలలో కాపురంచేయవద్దు! హెచ్చువాటియందు మనస్సు పెట్టుకోవద్దు!

  ఇక తర్వాత మాట మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు అంటున్నారు. దీనిని కూడా పైన చెప్పిన వాటితో అనుసంధాన పరుద్దాం! మీ వివాహ విషయంలో మీకు మీరే జ్ఞానులం, బుద్ధిమంతులం, వయసు వచ్చిన వారం అనుకోవద్దు! మీ తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలెయ్యండి. ఇస్సాకు గారిని, ఎస్తేరు గారిని మీకు ఆదర్శంగా తీసుకోండి.     
ఇంకా మిగతా విషయాలలో పగ తీర్చుకోవద్దు. దేవుడే ప్రతీదానికి తీర్పు తీరుస్తారు. అందుకే జ్ఞానియైన సొలోమోను గారు అంటున్నారు:
సామెతలు ౩:58
5. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము 
6. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. 
7. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము 
8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును. ...
దేవుడు చెప్పే మాటలు విను! 
ఆయన చెప్పినట్టు చేయుము! 
అప్పుడు నీవు నీ త్రోవలలో తిన్నగా నడువగలవు! 
ఆశీర్వాదాలు పొందుకోగలవు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక 112వ భాగం*
రోమా 12:1720
17. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి యుండుడి. 
18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. 
19. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. 
20. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. 
21. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము..

     ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! ప్రియులారా ఈ 4వచనాలు క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు ప్రభులవారు బోదించిన ప్రేమతత్వాన్ని ప్రతిస్పందించే వచనాలు ఇవి! క్రైస్తవుడు ఇలాగే  ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు- లేదా దేవుడు ఆశించే క్రైస్తవుడు- విశ్వాసి ఇలాగే ఉండాలి.

  కీడుకు ప్రతికీడు ఎవరికిని చేయవద్దు! అందుకే యేసయ్య చెప్పారు ఎవడైనా నీ కుడిచెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా తిప్పమని చెప్పారు దేనికోసం? ఎడమ చెంప మీద కొట్టడానికి వీలుగా! ఇదే ప్రేమతత్వం! కీర్తనాకారుడు కీడుచేయుట మాని మేలు చేయుము! సమాధానమును వెంటాడుము అంటున్నారు కీర్తన 34:14; 37:27; జెకర్యా గారు మీ హృదయాలలో కూడా ఎవరికీ కీడు తలపెట్టవద్దు అంటున్నారు 7:10... ప్రేమ పొరుగువానికి కీడు చేయదు రోమా 13:10;
పేతురుగారు చెబుతున్నారు మొదటి పత్రికలో: కీడుచేసి శ్రమ పడుట కంటే మేలుచేసి శ్రమ పడుట మేలు! ౩:17; ఈ అధ్యాయం చివరి వచనం: కీడు వలనజయింపబడక, మేలుచేత కీడును జయించుము!  ఇదీ ప్రభువు కోరేది.

   ఇక తర్వాత మాట: మనుషులందరికీ యోగ్యమైనవాటికోసం ఆలోచన చేయండి. పదిమందికి పనికొచ్చే పనికోసం ఆలోచించి చెయ్యమంటున్నారు గాని పదిమందిని పాడుచేసే పని చెయ్యొద్దు! నేడుచాలమంది పదిమందిని పాడుచేసే పనులు చేస్తున్నారు. వాటిలో కొన్ని పర్యావరణం దెబ్బతినే పనులు చేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం, చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయడం! రోడ్లమీద పబ్లిక్ ప్రాంతాల్లో సిగరెట్లు తాగి ప్రక్కనున్న వారి ఆరోగ్యం దెబ్బతీయడం! ఇక స్ట్రైక్లు అని చెప్పి ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేయడం. RTC బస్సులు తగలబెట్టడం! ఇలాంటివాటిని దేవుడు క్షమించరు! క్రైస్తవ్యం దీనిని ఆమోదించదు! పదిమందికి పనికొచ్చే పనులు చేయమన్నారు గాని పదిమందిని పాడుచేసే పనులు చేయకూడదు! పదిమంది బ్రతుకులు, పది కాపురాలు కూలిపోయే దుర్వ్యాపారాలు కూడా దేవునికి ఇష్టం కావు! అనగా క్రైస్తవులు బ్రాందీ షాపులు నడుపకూడదు, వాటిలో పనిచేయకూడదు! జూదపుగృహాలు, వ్యభిచార గృహాలు కూడా నడపకూడదు. ఒకరోజు దేవుడు తప్పకుండా నిన్ను లెక్క అడుగుతారు అని మరచిపోవద్దు!

 ఇక 18వ వచనం: శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త జనులతో సక్యంగా ఉండండి అంటున్నారు. సమస్త జనులతోను సక్యంగా సమాధానంగా ఉండమంటున్నారు! మీదన చూసుకున్నట్లు కీర్తన 34:14 లో సమాధానమును వెదకి దానిని వెంటాడుము అంటున్నారు. *అయితే సమాధానం ఎలా కలుగుతుంది*? యోబు గ్రంధం ప్రకారం దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది. 22:21;  
యెషయా 32:17 ప్రకారం: నీతి- సమాధానమును కలుగజేయును, నీతివలన నిమ్మళము, నిబ్బరము కలుగును! 
లూకా 2:14 ప్రకారం: దేవునికి ఇష్టులైన మనుషులకు భూమిమీద సమాధానం కలుగుతుంది. 
యోహాను 16:౩౩ ప్రకారం: యేసయ్య మాటలు విని దాని ప్రకారం చేస్తే సమాధానం కలుగుతుంది. 
యాకోబు ౩:18 ప్రకారం: నీతిఫలము సమాధానము చేసేవారికి సమాధానం కలుగుతుంది.

ప్రియ సహోదరుడా! నీకు సమాధానం లేదు అంటే బహుశా దేవునితో సహవాసం లేదన్నమాట! నీకు నీతిలేదు అన్నమాట! నీవు దేవునికి ఇష్టుడిగా జీవించటం లేదన్నమాట! కాబట్టి సమాధానాన్ని వెదకి నేడే వెంటాడు.

           ఇక్కడ శక్యమైతే అనేమాట ఎందుకు అన్నారంటే: క్రైస్తవుడు అందరితోను సమాధానంగా ఉండాలి. అదంతే! అయితే కొంతమంది ఉంటారు, కీర్తనలు 12౦:7 లో వ్రాయబడిన ప్రకారం చాలామంది మనం సమాధానం కోరుకున్నా, మాట మన నోట వస్తే చాలు! పూర్తిగా వినకుండా యుద్ధానికి కయ్యానికి సిద్దమౌతుంటారు. కాబట్టి ఇలాంటి వారితో సమాధానంగా ఉండటం కష్టం! అందుకే శక్యమైతే అనే మాటను బహుశా వాడి ఉంటారు పౌలుగారు! యూదులను ఎంతగానో ప్రేమించేవారు పౌలుగారు! గాని ఆయనమాట వింటే చాలు ఆయనను అపహసించేవారు, హింసించేవారు యూదులు! ఈ అనుభవంతోనే బహుశా ఈ మాట అని ఉంటారు పౌలుగారు.

    మరి ఇలాంటి తిరుగబడే వారితో సఖ్యంగా సమాధానంగా ఉండటం సాధ్యమేనా! అవును! సాధ్యమే క్రైస్తవ విశ్వాసికి!! ఎట్లా? దానికి సమాధానం రోమీయులకు 12:20
కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. ...   
నీవు ఎప్పుడైతే అలా చేస్తావో వాడిలో ఉన్న మూర్ఖత్వం అన్నీ విరిగిపోతాయి. ఒకరోజు వానికి తెలియకుండా వానిలో పశ్చాత్తాపం కలుగుతుంది. వాడు మారుతాడు. నీతో సమాధానపడతాడు. దేవుడు మన శత్రువులను సహితం మిత్రులుగా చేయగలరు! ఎప్పుడు? ఒకని ప్రవర్తన ,మాట మంచిది అయితే శత్రువులు సహా మిత్రులుగా మారుతారు అని బైబిల్ చెబుతుంది.  సామెతలు 16: 7
ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.
ఒకవేళ నీశత్రువు నీకు మిత్రుడుగా మారకపోయినా నీవు, మీద చెప్పినట్టు చేస్తే ఇక నీకు కీడుచేయడం ఆపేస్తాడు. మరీ ముఖ్యంగా దేవుడు కోరేది అదే కాబట్టి దేవుని దీవెనలు పొందుకుంటావు,.

    ఇక చివరిగా 19వ వచనం:.ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.......  మీకు మీరే పగతీర్చుకోవద్దు! పగతీర్చుట నా పని అంటున్నారు. మీకుమీరుగా తొందరపడొద్దు! అసలు ఎవరు చేసే పని వారే చెయ్యాలి. గాడిద చేసే పని గాడిదే చెయ్యాలి! గుఱ్ఱం చేసే పని గుర్రమే చెయ్యాలి!. అలా కాకపొతే తేడాలు జరిగిపోతాయి. మనం చేయాల్సిన పని అందరితో సమాధానంగా ఉండాలి. అయితే పగతీర్చుకోవడం అనేది దేవుడి పని అని స్పష్టంగా వ్రాయబడింది ఇక్కడ! మరి నీవు నీ పనిచేయు! దేవుడు చెయ్యాల్సిన పనిలో తగుదునమ్మా అని వేలు పెట్టకు! బొక్కబోర్లా పడకు! దేవుని పని దేవుణ్ణి చేయనీయు! దేవునికంటే నీవు బలవంతుడవు కావుగోప్పోడివి కావు! ద్వితీ 32:35. పగతీర్చుకోవాలన్న కోరిక వ్యక్తుల, కుటుంబాల, జాతుల మధ్య గొప్ప అల్లకల్లోలాలకు మూలాల్లో ఒకటి. క్రీస్తు ప్రజల హృదయాల్లో దీనికి తావుండకూడదు. మత్తయి 5:44; 2 థెస్స 1:6-9; కీర్తన 94:1; సంఖ్యా 31:1-3; నహూము 1:2, 7.
ఇంకా 21వ వచనం కీడు చేత విజయం పొందవద్దు అనగా కీడుచేసి విజయాన్ని పొంద వద్దు గాని మేలుచేత కీడును జయించు అంటున్నారు.  సామెత 25:21-22; లూకా 6:27-28; 1 పేతురు 2:21-23. 
మనల్ని గాయపరిచే వారిని గాయపరచడమంటే దుర్మార్గతను దుర్మార్గతతోనే జయించేందుకు ప్రయత్నించడం. అంటే అది దేవుని స్పష్టమైన ఆదేశాలను మనం మీరి, చెడుగా ప్రవర్తించేలా చేయడానికి ఇతరుల చెడు ప్రవర్తన చేయనివ్వడ మన్నమాట!

    కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నేడే కీడుచేయాలి అనే తాత్పర్యం మానుకో! శత్రువుకు కూడా మేలుచేసి మేలుచేత కీడును, శత్రువును జయించు! అందుకే యేసు ప్రభులవారు తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని మనకోసం క్షమాభిక్ష అడిగారు. లూకా 23:34; ఈమాట విన్న బందిపోటు దొంగ హృదయం అక్కడే బ్రద్దలైపోయింది. వెంటనే మార్పునోంది తండ్రి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసయ్యని శరణువేడాడు. యేసయ్య చేసి చూపించారు.
నీవుకూడా అలాచేసి అనేకాత్మలు ప్రభుకోసం గెలుచుదువు గాక!

ఆమెన్!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక 113వ భాగం*

రోమా 13:17 .
1. ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. 
2. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. 
3. ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పుపొందుదువు. 
4. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు. 
5. కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. 
6. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు. 
7. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.  

     ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! అయితే ఈ 13వ అధ్యాయం రోమా పత్రికలో చిన్నది అయినా గాని  ప్రాముఖ్యంగా మూడు భాగాలుగా చూసుకోవచ్చు! 1-7 వచనాలలో ప్రతీ ఒక్కరు వారివారి ప్రభుత్వాలకు, అధికారులకు, చట్టాలకు లోబడిఉండాలి అనియు,  అక్కడ స్థానిక నియమ నిబంధనలు (Rules and Regulations) పాటించాలి అని చెబుతున్నారు.  ఇక 81౦ వచనాల వరకు 12వ అధ్యాయంలో మొదలుపెట్టిన ప్రేమతత్వాన్ని కొనసాగించారు. ఇక 1114 వరకు విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలో కొనసాగిస్తున్నారు.

   ఈరోజు మనం మొదటి భాగం చూసుకుందాం. ప్రతీ విశ్వాసి ప్రతీ ఒక్కరు వారివారి ప్రభుత్వాలకు, అధికారులకు, చట్టాలకు లోబడిఉండాలి అనియు,  అక్కడ స్థానిక నియమ నిబంధనలు (Rules and Regulations) పాటించాలి!

 1..ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.... క్రీస్తులో విశ్వాసులు దేవుని రాజ్యంలోకి వచ్చారు. రారాజు యేసు క్రీస్తు పట్ల వారికి మొదటగా భక్తి ఉండాలి. అయితే వారింకా లోకంలోనే ఉన్నారు కనుక ఏదో ఒక మానవ రాజ్యంలోనే ఉన్నారు కనుక ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారుల పట్ల ఎలా ప్రవర్తించాలో ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. 

       13:1 ప్రకారం పాలకులంతా, ప్రభుత్వాధికారులంతా మంచివారేనని, దేవునికి విధేయులేననీ దీని ఉద్దేశం కాదు (పౌలుగారు ఈ మాటలు రాసిన సమయంలో రోమన్ చక్రవర్తులందరిలోకీ అధముడు నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు). కానీ వాటిలో తప్పులు, పాపాలు, అన్యాయాలు ఎన్ని ఉన్నా ప్రభుత్వాలను నియమించినది దేవుడే (కీర్తన 75:2-7; దాని 4:34-35). కొన్నిసార్లు ప్రజల పాపాలకు శిక్షగా దుర్మార్గులైన పాలకులు అధికారంలోకి వచ్చేందుకు దేవుడు అనుమతిస్తారు. అసలు ప్రభుత్వమే లేకపోవడం కంటే కనీసం చెడ్డ ప్రభుత్వమన్నా ఉండడం మంచిది. అరాచకం, ప్రభుత్వం దానికి ఎవరూ లోబడకపోయేటంత బలహీనమైపోవడం అనేది ఏ దేశానికైనా, ఏ రాజ్యానికైనా రాగల ఘోరమైన  పరిస్థితి, ఎందుకంటే అప్పుడు దుర్మార్గతను, Law and Order ను  అదుపులో ఉంచడానికి ఏదీ ఉండదు. దేవుడు ప్రభుత్వాన్ని నియమించారు కాబట్టి దానికి లోబడి నడుచుకోవడం క్రైస్తవుల బాధ్యత (వ 2,5,7). ఒక విషయంలో మాత్రమే ఈ నియమం చెల్లదు ఒక దేశంలోని చట్టాలు, లేక అధికారుల ఆజ్ఞలు దేవుని వాక్కుకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం విశ్వాసులు ఆ మనుషుల మాటలు లెక్క చెయ్యకుండా దేవునికే లోబడాలి. అపొ కా 4:18-20; 5:28-29. 

  అందుకే ప్రతీవాడు తమ పై అధికారులకు లోబడియుండాలి అంటున్నారు. ఎందుకు అంటే కలిగిఉన్న అధికారం ఏదైనా సరే, అది దేవుని నుండే కలిగింది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్రభుత్వం కూడా దేవుని నుండే కలిగింది కాబట్టి ప్రభుత్వానికి లోబడటమే కాదు వారు చేసిన చట్టాలకు కూడా లోబడి ఉండాలి బైబిల్ ప్రకారం! అదంతే! ఆ చట్టాలు మంచివి అయినా చెడ్డవి అయినా! క్రైస్తవులను బాదించేవి అయినా బాగుచేసేవి అయినా , చట్టాలకు లోబడాల్సిందే గాని ప్రొటెస్ట్ చేయడానికి వీలులేదు! ఇది నేను చెప్పడం లేదు! బైబిల్ చెబుతుంది.

   2వ వచనం ప్రకారం ఎవడైనా ఇలా ప్రొటెస్ట్ చేస్తే లేదా ఎదిరిస్తే  ఆ అధికారానికి, ఆ చట్టాలకు, వాడు దేవుడు చేసిన నియమాన్ని ఎదిరిస్తున్నారు అని ఘంటాపదంగా చెబుతున్నారు ఆత్మావేశుడై పౌలుగారు! ఇంకా ఇలా ఎదిరించేవాడు తమ మీదకు తామే శిక్షను తెచ్చుకుంటున్నాడు అనికూడా చెబుతున్నారు. ఈవిషయంలో నేటి మోడరన్ క్రైస్తవులు అపవాదిని ఎదురించుడి అన్నారు కదా ఎదిరిస్తే తప్పేంటి అని అంటున్నారు. దేవుడు అపవాదిని ఎదిరించమన్నారు గాని అధికారాన్ని, అధికారులను కానేకాదు. అతితెలివి చూపించి దేవుని వాక్యాన్ని కలిపి చెరపకు! ఆదిమ భక్తులు ఎవరూ అలా ఎదిరించలేదు. లోబడ్డారు. నీవుకూడా లోబడే ఉండాలి!

    ౩వ వచనం: ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పుపొందుదువు. ......  సింపుల్ గా చెప్పాలంటే అధికారులు తప్పులు, చెడుకార్యాలు చేసేవారినే శిక్షిస్తారు తప్ప మంచి చేసేవారిని, నీతిగా బ్రతికేవారిని ఎప్పుడూ శిక్షించరు!  4వ వచనం కూడా ఇదే చెబుతుంది. నీవు మేలు/ మంచి చేస్తే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు! తప్పుచేసినా, తప్పుడు పనులు చేసినా లోకానికి భయపడాలి, అధికారులకు కూడా భయపడాలి. దేవుడు కయీనుతో ఏమంటున్నారు? నీవు సత్క్రియ చేస్తే తలనెత్తుకొనవా? తప్పు చేశావు కాబట్టి తలదించుకుని నిలబడ్డావు అన్నారు తన తమ్ముడైన హేబెలును చంపినప్పుడు! ఆదికాండం 4:6--7;  ఇక ఇక్కడ దేవుని పరిచారకుడు అంటే పరిపాలకులు ఉద్దేశపూర్వకంగా, తెలిసి తెలిసి దేవునికి సేవ చేస్తున్నారని కాదు (కొందరు అలా చెయవచ్చు, అది వేరే విషయం). ఈ భూమిపై దేవుడు సాగిస్తున్న పరిపాలనలో వారు ఆయన చేతిలో సాధనాలు మాత్రమే. కాబట్టి వారు దేవుని సేవకులు కాబట్టి లోబడి ఉండాలి అంటున్నారు. 

     ఇక 5వ వచనం ప్రకారం: కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. ..... వారు దండిస్తారు అని కాదుగాని నీ మనస్సాక్షిని బట్టి లోబడియుండమని అంటున్నారు, ఎందుకు మనస్సాక్షి అంటున్నారు అంటే: ఇంత వివరంగా అధికారులకు లోబడియుండమని బైబిల్ చెప్పినప్పుడు నీ అధికారులను, అధికారిని ఎదిరిస్తే, Rules and Regulations పాటించకపోతే, ఉదాహరణ రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోతే, హెల్మెట్ పెట్టుకోకపోతే నీ మనస్సాక్షి గద్దించదా నిన్ను! అందుకే నీ మనస్సాక్షి నిమిత్తం లోబడియుండాలి అంటున్నారు.

     ఇక 67 ప్రకారం:
6. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు. 
7. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.  ....  
ఎవరికీ పన్ను చెల్లించాలో వారికి పన్ను చెల్లించండి! ఎవరికీ సుంకం చెల్లించాలో వారికి సుంకం చెల్లించండి. ఎవరికీ భయపడాలో వారికి భయపడండి. ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించండి అంటున్నారు. అంతేకాదు మత్తయి 22:21; 1 పేతురు 2:17 ప్రకారం పన్నులు చెల్లించడం మొదలైన విషయాల్లో ఏ విశ్వాసి అయినా నమ్మకంగా లేకపోతే అతడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడన్న మాట. ఎవరైనా Income Tax ఎగ్గోడుతున్నారు అంటే ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడు అన్నమాట! ఇంటిపన్ను కట్టడం లేదు అంటే పాపి అన్నమాట! అందరికీ వారివారి ఋణములు తీర్చండి అంటున్నారు.

       ప్రియ చదువరీ! నీవు పన్నులు సక్రమంగా కడుతున్నావా? అధికారులు అధికారానికి, చట్టాలకు లోబడి ఉంటున్నావా? పరీక్షించుకో! 
అలాకాకపోతే నీవు నేరస్తుడవు, దేవుని దృష్టిలో దోషివి అని గుర్తుపెట్టుకో!

దైవాశీస్సులు!

*రోమా పత్రిక 114వ భాగం*

రోమా 13:8 10
8. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. 
9. ఏలా గనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. 
10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. . 

     ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! గత భాగంలో ఈ అధ్యాయానికి మొదటి భాగమైన ప్రతీఒక్కరు అధికారులకు, అధికారానికి లోబడిఉండాలి అనే విషయం ధ్యానం చేసుకున్నాం! ఇక ఈరోజు రెండవ భాగం ప్రేమతత్వాన్ని ధ్యానం చేద్దాం. 

    ఒకనికొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరే విషయంలో కూడా ఎవరికీ అప్పు ఉండవద్దు అంటున్నారు. ఒకరకంగా చూసుకుంటే అప్పులు కూడా చేయకూడదు అన్నమాట! అప్పు చేయడానికి దూరంగా ఉండాలి. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉన్నవారిని చిక్కించుకునే బోను అది. దాని మూలంగా కట్లు, దాస్యం, కష్టం, దురవస్థ కలగవచ్చు. పెళ్ళిళ్ళు మొదలైన విశేష సందర్భాల్లోనూ, లేక ఏవైనా కొనుక్కునేందుకూ అప్పు చేయడం విశ్వాసులకు తగదు. విశ్వాసులకు ఉండవలసిన జీవిత సూత్రమేమంటే తమకు ఉన్నదానితో తృప్తి చెందడం (ఫిలిప్పీ 4:12; 1 తిమోతి 6:6-8; హీబ్రూ 13:5), 
దేవుడే అవసరాన్ని తీరుస్తాడన్న నమ్మకం (మత్తయి 6:33; ఫిలిప్పీ 4:19). 
అప్పు తీర్చగలిగిన స్థితి ఉండి కూడా అలా తీర్చనివారు దొంగలకన్నా మంచివారేమీ కాదు వారిది కానిదాన్ని కాజేసి వాడుకుంటున్నారు. అయితే ఇక్కడ విశ్వాసులందరూ ఒకరకమైన అప్పులో ఉన్నారు. దాన్ని తీర్చేందుకు వారు అస్తమానం ప్రయత్నిస్తూ ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకోవడమే ఆ ఋణం! (12:9-10; యోహాను 13:34).

   ఇంకా 9వ వచనం ప్రకారం పొరుగువాని ప్రేమించేవాడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు అంటున్నారు. అది ఎలాగో వివరిస్తున్నారు: 9.ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ...  ఈ విషయాన్ని శాస్త్రియైన నీకోదేము కూడా ఒప్పుకున్నారు మార్కు 12:32౩౩ లో. కారణం నీవు పొరుగువానిని ప్రేమిస్తే ఎలా నరహత్య చేయగలవు? ఎలా మరొకని భార్యమీద వ్యామోహం పెంచుకోగలవు? ఎలా పరులసొమ్ము దొంగిలించగలవు? ఎలా లంచం పుచ్చుకోగలవు? కాబట్టి కేవలం ప్రేమ విషయంలో రుణపడి ఉండాలి గాని మరే విషయంలోనూ ఎవరికీ ఋణపడి ఉండరాదు. అందరినీ ప్రేమించాలి. నీ శత్రువును ప్రేమించుడి అంటున్నారు.  ఎందుకంటే 10వ వచనంలో సెలవిస్తున్నారు: ప్రేమ పోరుగువారికి కీడు చేయదు కాబట్టి ఎవడైతే ప్రేమకలిగి ఉంటాడో వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుతున్నాడు అంటున్నారు. 

   కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు ప్రేమ కలిగియున్నావా? ప్రేమలేకపోతే దేవునికి ఇష్టుడిగా ఉండలేవు కారణం దేవుడు ప్రేమై ఉన్నారు. దేవుడు ప్రేమా స్వరూపి! ఆ ప్రేమను నీవు పొందుకోకపోతే, యేసయ్య చెప్పిన ప్రేమతత్వం, పౌలుగారు బోధించిన ప్రేమతత్వం అలవరచుకోలేకపోతే నీవు విడచిపెట్ట బడతావు సుమీ! నీ సహోదరుని ప్రేమించాలి. ఇరుగుపొరుగు వారిని ప్రేమించాలి. యోహాను గారు కూడా ఇదే ప్రేమతత్వాన్ని బోధించారు. వారు చెప్పిన ప్రేమతత్వాన్ని పుష్కలంగా అలవరచుకొని దేవునిరాజ్య వారసులుగా, ఆయన పుత్రులుగా వారసులుగా మారుదురు గాక!

ఆమెన్!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక 115వ భాగం*

రోమా 13:11 14.
11. మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. 
12. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము. 
13. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము
14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి. 

     ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! గత భాగాలలో ఈ అధ్యాయానికి మొదటి భాగములో ప్రతీఒక్కరు అధికారులకు, అధికారానికి లోబడిఉండాలి, రెండవదిగా ప్రేమ కలిగియుండాలి అనే విషయాలు ధ్యానం చేసుకున్నాం! ఇక ఈరోజు మూడవ భాగం విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే దానినే కొనసాగిద్దాం! 

       ఈ భాగంలో కాలమునెరిగి నిద్రమేలుకొనే సమయమయ్యింది అని తెలుసుకుని ఆలాగు చెయ్యండి అంటున్నారు. ఇంకా విశ్వాసుల మైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉంది అంటున్నారు. 
ఆధ్యాత్మికంగా చూస్తే లోకం చీకటిమయం (యోహాను 3:19-20). అయితే విశ్వాసులు వెలుగు సంతానం (మత్తయి 5:14; యోహాను 12:36; ఎఫెసు 5:8). దేవుడు వారిని ఇలానే ప్రవర్తించాలని చెప్పారు . ఇక్కడ రక్షణ అంటే మామూలుగా మనం పొందుకున్న రక్షణ కాకపోవచ్చు. పౌలుగారికి గానీ ఇతర అపోస్తలులకు గానీ క్రీస్తు రెండో రాకడ ఎప్పుడో తెలియదు. పౌలుగారు చాలా ఆశతో దానికోసం ఎదురుచూస్తున్నాడు. తనలాగా విశ్వాసులంతా ఆయన రాకకోసం ఆసక్తితో ఎదురు చూడాలని కోరుతున్నారు. అన్ని తరాల విశ్వాసులకూ సరిపోయిన మాటలను పరిశుద్ధాత్ముడు పౌలుగారిచేత పలికించాడు. మత్తయి 24:36, 42, 44 పోల్చి చూడండి. ఇక్కడ మోక్షం/రక్షణ” (11) అంటే విశ్వాసులకున్న విముక్తి, రక్షణ పూర్తి కావడం. 8:23; 1 పేతురు 1:9.

 కాబట్టి ఇంకా మనం చీకటి పనులు చేయకూడదు. ఎందుకంటే నిద్రమేలుకొనే సమయమయ్యింది. లోకంలో బ్రతకటానికి లోకపు/చీకటి పనులు చేయడానికి గతించిన కాలమే చాలు అంటున్నారు భక్తుడు!.1పేతురు 4: 3
మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును,
....... ఇంతవరకు చేసిన పాపాలు చాలు! ఇక వాటి విముక్తికై పాటుపడండి అంటున్నారు. రాత్రి చాలా గడచిపోయింది గనుక అంధకార సంభంధమైన క్రియలను విసర్జించాలి అనగా పాప సంబంధమైన విషయాలు అన్నీ విసర్జించాలి.  అనగా గలతీ 5:1921 వరకు ఉన్న శారీరక క్రియలు అన్నీ విసర్జించాలి.
19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 
20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, 
21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.   
వీటిని విసర్జించి తేజస్సంబంధమైన అనగా వెలుగు సంబంధమైన యుద్దోపకరణాలు ధరించుకోవాలి. ఎఫెసీ పత్రికలో ఇంకా వివరంగా రాస్తున్నారు ఈ చీకటి సంబంధమైన క్రియలను ఎలా ఎదుర్కోవాలో!!! 6:1118 
11. మీరు అపవాది(అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. 
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు(దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి 
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని 
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి. 
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. 
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి. 
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి. ..

 12వ వచనం చూసారా? మనం పోరాడేది శరీరులతో కాదుగాని ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాదులతో, ఇంకా ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో! అందుకే ఈ సర్వాంగకవచం ధరించుకోవాలి. ఇదే వెలుగుసంబంధమైన కవచం!
వెలుగు...కవచం సత్యాన్ని విశ్వాసులు తమ జీవితాల్లో పాటించినప్పుడు అది సైతాను నుంచి, పాపం నుంచి కాపాడేదిగా పని చేస్తుంది.  దాన్ని ధరించడమంటే దాన్ని అర్థం చేసుకుని మత్తయి 4:1-11లో క్రీస్తు ఉపయోగించినట్టు దాన్ని ఉపయోగించడం.  

    ప్రియ చదువరీ! ఈ కవచాన్ని నీవు పొందుకున్నావా? ఈ యుద్దోపకరణాలు లేకపోతే సాతాను నీమీద దాడిచేసినప్పుడు ఇట్టే ఓడిపోతావు. ఎప్పుడైతే ప్రార్ధనలో, విశ్వాసం లో సాగుతావో దేవుడు ఈ యుద్దోపకరణాలు నీకుధరింప జేస్తారు. 

   అయిత ఈ యుద్దోపకరణాలు ధరించుకున్నప్పుడు చీకటి సంబంధమైన క్రియలు అనగా ఈ 13వ వచనంలో వివరించిన చీకటి పనులు విసర్జించాలి. వీటికోసం చేయరాని పనులు అనే శీర్షిక లోను, కొలస్సీ పత్రిక ధ్యానంలోను విస్తారంగా ధ్యానం చేసుకున్నాం గనుక క్లుప్తంగా చూసుకుందాం.  
అల్లరితోకూడిన ఆటపాటలు! చాలామంది సినిమాలు, సీరియల్లు చూడకూడదు అని బైబిల్ లో ఎక్కడుంది అంటారు. ఓ అతితెలివి గలవాడా! బైబిల్ వ్రాయబోయే సరికి సినిమాలు, సీరియల్లు, సిగరెట్లు లేవు! అందుకే బైబిల్ లో వాటి పేర్లు లేవు గాని అందుబోలిన విషయాలున్నాయి. అల్లరితోకూడిన ఆట మరియు పాట! ఇవి సినిమాలలో సీరియళ్ళలో కాక మరెక్కడా ఉన్నాయి? క్లబ్ లలో, జూదపు శాలలలో, వ్యభిచార గృహాలలో, బార్ లలో ఈ అల్లరితో కూడిన ఆట మరియు పాటలు లేవా? అందుకే వీటిని విసర్జించాలి అంటున్నారు. 
మత్తు లేకుండా ఉండాలి. మత్తు ఎలా వస్తుంది? మద్యపానం, మాదకద్రవ్యాల అనగా డ్రగ్స్ తీసుకుంటే మత్తువస్తుంది. ఇలాంటివి కూడదు. త్రాగుబోతుల విందులలో మీరు పాలుపొందకూడదు అని బైబిల్ చెబుతుంది.  
ఇక కామవిలాసము ఉండకూడదు. అనగా వేశ్యాగృహాలకు వెల్లిగాని లేక పరస్త్రీలతో, కామ క్రియలు చేయకూడదు. బైబిల్ కేవలం నీ పెండ్లి భార్యతోనే సంసారం చేయడానికి లైసెన్స్ ఇచ్చింది గాని పెండ్లి కాకుండా గాని, లేక పరస్త్రీలతో సంసారం చేస్తే అది వ్యభిచారం క్రిందకు వచ్చి నరకానికి పోయే వారి లిస్టులో చేర్చుతారు జాగ్రత్త!.1 కొరింథీయులకు 6:9,10
9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను 
10. దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. .....

ఇక విడచిపెట్టాల్సింది పోకిరి చేష్టలు : అవి ఎక్కడైనా ఎప్పుడైనా పోకిరి మాటలు గాని పోకిరి చేష్టలు గాని విశ్వాసికి తగవు! అమ్మాయిలను కామెంట్ చెయ్యడం, వరసైన వారితో సరసాలు ఆడటం లాంటి పనులు చెయ్యకూడదు! 
ఇంకా ఎవరితోనూ కలహాలు పెట్టుకోకూడదు. ఎవరిమీద మత్సరపడకూడదు. ఇవన్నీ గలతీ పత్రిక 5:1921వరకు శరీరకార్యాల లిస్టులో చూడగలం! వీటిని గలవాడు నరకపాత్రుడు! 
వీటిని జయించిన వాడు పరలోక పాత్రుడు! కారణం ఇవి లేకపోతే వానిలో ఆత్మఫలం ఫలిస్తుంది. ఆత్మకార్యాలు చేస్తాడు.

         కాబట్టి ప్రియ విశ్వాసి! వీటిని విడిచిపెట్టావా లేదా? 14వ వచనంలో యేసుక్రీస్తును ధరించుకొని శరీరేచ్చలను నేరవేర్చవద్దు. వాటి ఆలోచనలు కూడా వద్దు అంటున్నారు. యేసుప్రభువు విశ్వాసుల్లో ఉన్నారు. (8:9; 2 కొరింతు 13:5). ధరించుకోవడం అంటే బయటి జీవితం ఉపస్థితి గురించిన మాట. విశ్వాసుల ప్రవర్తన వారిలో ఉన్న క్రీస్తు మార్గాలకు అనుగుణంగా ఉండాలి. ఎఫెసు 4:22-24. ఈ సత్యాన్ని మన ప్రవర్తనకు వర్తించేలా చేసుకోవాలి. భ్రష్ట స్వభావం దాని కోరికలతో సహా ఇంకా విశ్వాసుల్లో ఉన్నదని పౌలుగారు గుర్తించిన సంగతి గమనించబడింది. 7:18; 8:13; గలతీ 5:16-17 చూడండి. భ్రష్ట స్వభావంపై విజయం సాధించడంలో ఆలోచనలకున్న ప్రాధాన్యత చూడండి. 8:5; 12:2 చూడండి

   కాబట్టి ప్రియ విశ్వాసి! శరీరక్రియలపై విజయం సాదిస్తావా? లేక వాటిని చేసి పతనమౌతావా? తేల్చుకో! .ప్రకటన గ్రంథం 22: 15
కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
వీటిని చేస్తే పరలోకం దొరకదని తెలుసుకో!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక 116వ భాగం*
రోమా 14:1 4. 
1. విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు 
2. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు. 
3. తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను. 
4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. 

     ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! ఇక 14వ అధ్యాయం ధ్యానం చేద్దాం! ఈ అధ్యాయం మొత్తం ఒకే విషయం కోసం వివరిస్తున్నారు పౌలుగారు. అది మనిషి తినే తిండికోసం ఎవరిని నిందించవద్దు, తీర్పు తీర్చవద్దు! ఇదే విషయం మొత్తం అధ్యాయం కనిపిస్తుంది. పౌలుగారు ఈ విషయం రాయడానికి నేపధ్యం ఏమిటంటే: కొంతమంది దుర్భోధకులు, అబద్దబోధకులు, తమ కడుపుకోసం దుర్భోదలు చెయ్యడం మొదలుపెట్టారు. వీరు యేరూషలేము నుండి బయలుదేరి మొత్తం ప్రపంచంలో చెదిరియున్న సంఘాలకు వెళ్లి బోధించడం మొదలు పెట్టారు. 
వీరి బోధలలో మొదటిది: విశ్రాంతిదినం పాటించాలి. 
రెండవది సున్నతి పొందాలి. 
మూడవది: లేవీయకాండం 11వ అధ్యాయంలో గల తినదగిన జంతువులూ పక్షులనే తినాలి గాని అపవిత్ర జంతువులను తినకూడదు. మీరు యేసునామంలో బాప్తిస్మం పొందినా, ఈ ఆచారాలు కూడా పాటిస్తేనే పరలోకం! లేకపోతే నీవు దోషివి అని బోధించడం మొదలుపెట్టారు.  దీనివలననే పౌలుగారు ఈ లేఖలో ఈ విషయాన్ని వివరిస్తున్నారు.

    ప్రియులారా! ఈ అధ్యాయంలో మొదటి వచనం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం విషయంలో బలహీనుడైన వానిని చేర్చుకొనుడి! ఎవరైతే విశ్వాసంలో బలహీనంగా ఉన్నారో వారిని చేర్చుకుని, వారి విశ్వాసాన్ని పెంచేలా చెయ్యాలి గాని మరో రెండుమూడు అనుమానాలు వ్యక్తం చేసి ఆ వ్యక్తిని విశ్వాస బ్రష్టులు చేయనే కూడదు!  ఇక రెండో పాదంలో అయినను సంశయములు తీర్చడానికి వాదములు పెట్టుకోవద్దు! ఈ విషయాన్ని చాలామందికి వివిధమైన కోణాలలో చెప్పారు పౌలుగారు! తిమోతి, తీతుకు వీరందరికీ చెప్పారు.
2 తిమోతి 2:14
వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని, ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము.
 1 తిమోతి 1:4..
3. నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును, 
4. విశ్వాస సంబంధమైన దేవుని యేర్పా టుతో(మూలభాషలో-గృహనిర్వాహకత్వముతో) కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. .; 
తీతుకు ౩:9; 
అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునైయున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.

 కాబట్టి ఎవరితోనూ వాదములు పెట్టుకోవద్దు. ముఖ్యంగా అనుమానాలు నివృత్తి చేసుకునే క్రమంలో! 
*BETTER TO STOP WHERE THE BIBLE STOPS. DON’T GO BEYOND THE BIBLE*! 
  2౩..ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు. 
3. తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను. ...  చూడండి ఒకరు కాయగూరలనే తింటున్నాడు మరొకరు మాంసాహారం కాయగూరలు తింటున్నాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒకడు బీఫ్, పోర్క్ (ఎద్దు మాంసం, పందిమాంసం) తింటున్నాడు. చాలామంది వాటిని తినరు. అయితే తినేవాడు తినని వానికి తీర్పు తీర్చకూడదు. తిననివాడు తినేవానికి తీర్పుతీర్చకూడదు! వాడు ఏ మాంసం తింటే నీకెందుకు? 
పౌలుగారు నేర్పిస్తున్న సాధారణ సూత్రం ఇది. 2-6 వచనాల్లో అతడు రెండు ఉదాహరణలు ఇస్తున్నారు. ఈ రెండు విషయాల గురించి విశ్వాసులు సమ్మతించకపోవచ్చు. క్రైస్తవులు ఒకరినొకరు సహాయం చేసుకోవాలి గానీ తీర్పు తీర్చకూడదు (మత్తయి 7:1-5). విశ్వాసులంతా క్రీస్తుకోసం జీవించడానికి ప్రయత్నించే ఇతర విశ్వాసులందరినీ స్వీకరించాలి (కానీ 1 కొరింతు 5:9-13; 2 థెస్స 3:6). విశ్వాసులు చెడు ప్రవర్తన తప్పని ఖచ్చితంగా ఎంచాలి గానీ అంత ప్రాముఖ్యం కాని విషయాల్లో తమతో సమ్మతించని ఇతర విశ్వాసులను విమర్శించకూడదు. ఇలాంటి విషయాలపై ఆధారపడి ఇతర విశ్వాసులనుంచి వేరైపోవడం ఎంతో పొరపాటు (12:16; ఎఫెసు 4:3). విశ్వాసానికి సంబంధించిన ప్రాథమిక సత్యాలు కొన్ని ఉన్నాయి. వాటిని ప్రకటిస్తూ, వాటి పక్షంగా వాదించడంలో ఇతర క్రైస్తవులెవరైనా వాటిని వ్యతిరేకిస్తే వారినుంచి వేరైపోవడానికైనా సిద్ధపడాలి. కానీ ఈ అధ్యాయంలో ఆ విషయాల గురించి పౌలుగారు మాట్లాడ్డం లేదు.

        యేసుక్రీస్తు ప్రభులవారు ధర్మశాస్త్రానికి ముగింపు పలికారు కాబట్టి ధర్మశాస్త్రములో వ్రాయబడిన తినకూడని జంతువులూ, పక్షులు ఏవీలేవు అని పౌలుగారు అభిప్రాయం! లేవీకాండం 11వ అధ్యాయంలో కొన్నింటిని తినవద్దు అన్నారు. అయితే పౌలుగారు కృతజ్ఞత స్తుతులు చెల్లించి తింటే ఏదైనా పవిత్రం అయిపోతుంది అని వ్రాశారు. అన్ని మాంసాలు తినేవచ్చు అన్నారు....
1తిమోథి 4:45;
4. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు; 
5. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనవలనను పవిత్ర పరచబడుచున్నది.    
1కొరింథీ 10:25;
మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.

  అయితే పాత నిబంధన గ్రంధంలో ముఖ్యంగా పందిమాంసం తినడం హేయం! లేవీకాండం 11లోనే కాక యెషయా 65:4 లో కూడా ఇది అసహ్యపాకము అని వ్రాయబడింది. క్రొత్తనిబంధనలో వ్రాయబడిన నాశనకరమైన హేయవస్తువు పంది అని బైబిల్ పండితులు వాదన! దానికి కారణం ఒకసారి యేసయ్య పునరుత్థాన అనంతరం పందిని బలిపీఠం మీద వదించడం జరిగింది. పంది దేవునికి అసహ్యమైనది. ఏదిఏమైనా మాంసం కోసం ఎవరికీ తీర్పుతీర్చవద్దు అని ఈ అధ్యాయం మొత్తంలో వ్రాయబడింది.

   ఈ కృప యుగంలో విశ్వాసులు దేన్నైనా తినవచ్చు. వారు ఆహార సంబంధమైన ఏ చట్టాల కిందా లేరు (వ 14; మార్కు 7:18-19; అపొ కా 10:9-16; 1 తిమోతి 4:3-5). కానీ కొందరు విశ్వాసులింకా దీన్ని అర్థం చేసుకోలేదు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం తప్పని అనుకుంటున్నారు. వారు పాత నిబంధనలోని ఆహార నియమాలపై ఆధారపడి అభిప్రాయపడవచ్చు (లేవీ 11వ అధ్యాయం), గానీ ఇప్పుడు క్రైస్తవులకు ఆ చట్టాలు చెల్లవు.

    ఈ మూడవ వచనంలో ఎవరికీ తీర్పు తీర్చొద్దు కారణం దేవుడు అతనిని చేర్చుకొనెను అంటున్నారు. అనగా నా ఉద్దేశ్యం ప్రకారం దేవుడు ఆవ్యక్తిని ఎలాంటి మాంసం తిన్నా అంగీకరించినప్పుడు దేవుడికి లేని నొప్పి, దేవునిలేని సమస్య నీకెందుకు వచ్చింది అని అర్ధం! ఇదొక ప్రధాన నియమం. విశ్వాసులు ఒకరినొకరు చేర్చుకొని ప్రేమించాలి. దేవుని వాక్కును ఎక్కువగా గ్రహించిన వారు తాము ఇతరులకన్నా అధికులమని అనుకోకూడదు; వ్యక్తిగతంగా ఎవరైనా పెట్టుకున్న నియమాలను ఇతరులు మీరితే అలాంటివారిని దోషులుగా ఎంచకూడదు. విశ్వాసులందరూ యేసుప్రభువుకు చెందిన పరిచారకులే. తీర్పు తీర్చే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. దేవుడు స్వీకరించినవారెవరినీ విశ్వాసులు త్రోసిపుచ్చకూడదు!
(ఇంకాఉంది)

*రోమా పత్రిక 117వ భాగం*

 4... పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. 
    
కాబట్టి ఇతరులకు తీర్పుతీర్చడానికి నీవెవడవు? అని డైరెక్ట్గా అడుగుతున్నారు పౌలుగారు! పరుని సేవకుడు అనగా నీ సహోదరుడు, నీ పొరుగువాడు, తోటివిశ్వాసి నీ సేవకుడు కాదు ఆర్డర్లు వేయడానికి! నీవు దేవుని దాసుడవు! నీ పొరుగువాడు, తోటి విశ్వాసి కూడా దేవునికి దాసులే. కాబట్టి ఇద్దరూ దాసులే! కాబట్టి పరుని సేవకునికి నీవెందుకు తీర్పు తీరుస్తున్నావ్ అంటున్నారు. దేవుడు ఇద్దరికీ యజమానే! యజమాని తన ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. అడగడానికి నీవెవడవు? దేవుడే ఆ వ్యక్తి ఆ మాంసాలు తిన్నా ఆ వ్యక్తిని తిరస్కరించడం లేదు! నీవెవడవు తిరస్కరించడానికి అని ఇక్కడ భావం!
     56 వచనాలు... 14:5,6
5. ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను. 
6. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ... పౌలుగారు ఈ వచనాలు వ్రాయడానికి కారణం పైన చెప్పిన విధంగా కొందరు యూదులైన విశ్వాసులు దేవుడు ఇజ్రాయేల్ జాతికి పాత నిబంధనలో నియమించిన విశ్రాంతి దినాలు, ప్రత్యేక దినాలు ఆచరిస్తూనే ఉండాలని అనుకున్నారు. మరికొందరు విశ్వాసులు అలాంటి చట్టాలు క్రైస్తవులకు వర్తించవని గ్రహించారు. 3,4 వచనాల్లోని సూత్రం దీని విషయంలో కూడా నిజమే. 

  ఇక్కడ తినువాడు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి తింటున్నాడు కాబట్టి ప్రభువు కోసమే తింటున్నాడు అంటున్నారు పౌలుగారు. తినని వాడు ప్రభువుకోసమే తినడం మానేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటున్నారు. అసలు తినేముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిండడం అనేది యేసుక్రీస్తు ప్రభులవారే చేసారు. మత్తయి 14:19 చూడండి. అయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాతనే ఆ రొట్టెలు విరచి అందరికి పంచిపెట్టారు శిష్యులు! ఇంతకీ ప్రియ విశ్వాసి! నీవు తినేముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవునికి ప్రార్ధన చేయకుండా ఆహారం తినేవారు బుద్ధిహీనులు, తెలివిలేని వారు కీర్తనలు 14 మరియు 53వ అధ్యాయాలు ప్రకారం!

79 వచనాలు....
7. మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. 
8. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము. 
9. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను. . 
చూశారా ఈ మూడు వచనాలు ఏమి చెబుతున్నాయి? మనం బ్రతికినా ప్రభువు కోసమే బ్రతకాలి! చనిపోయినా ప్రభువు కోసమే చనిపోవాలి! దీనికి కూడా యేసయ్యనే ఉదాహరణగా చెబుతున్నారు పౌలుగారు! యేసుక్రీస్తు ప్రభులవారు కూడా తనకోసం బ్రతకలేదు!తనకోసం చనిపోలేదు! మనకోసం పుట్టి, మనకోసమే బ్రతికి, మనకోసమే చనిపోయారు! అలాగే మనం కూడా ప్రభువుకోసమే జీవిస్తూ, ప్రభువు కోసమే చనిపోయేటందుకు సిద్దమైయుండాలి. 

   ప్రియ చదువరీ! నీవు ఎవరికోసం బ్రతుకుతున్నావు? దేవునికోసమా? లేక నీ కోసం, నీ ధన సంపాదన కోసం, నీ కామవిలాస కోరికలు తీర్చుకోడానికా? ఎవరికోసం? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినది, నిన్ను రక్షించినది, నీ కోర్కెలు తీర్చుకోడానికి, నీ కోసం బ్రతకటానికి కాదు! దేవుని మాహిమార్ధమై జీవించటానికి! సత్యవాక్యాన్ని చేతబట్టి ఆయనకోసం జ్యోతిలా ప్రకాశించడానికే తప్ప అంధకార, శరీర క్రియలు చేస్తూ ఈ పాపపు చీకటి జీవితం జీవించటానికి కానేకాదు! ఇప్పటినుండైనా ప్రభువుకోసం జీవించటానికి తీర్మానం చేసుకో!

10వ వచనంలో మరోసారి రెట్టిస్తున్నారు పౌలుగారు ఇతరులకు తీర్పు తీర్చడానికి నీవెవరవు? మనమందరం దేవుని న్యాయపీఠం యెదుట నిలబడాల్సిన రోజు ఒకటుంది! 
11. నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు .. ప్రతీవాని మోకాళ్ళు నా ఎదుట వంగును, ప్రతీవాని నాలుక దేవుణ్ణి స్తుతించును అంటున్నారు అనగా ప్రతీవాడు ... ఈ ప్రతీవాడు లో నీవు ఉన్నావు, నీవు తీర్పు తీర్చే వ్యక్తికూడా ఉన్నాడు. కాబట్టి మనలో ప్రతీవాడు తన్నుగురుంచి దేవునికి లెక్క అప్పగించాలి అని మరోసారి గుర్తుచేస్తున్నారు. 
2కొరింథీ 5:10..
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
 ప్రసంగీ 11:9-10
9. యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము; 
10. లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము....

ప్రతి విశ్వాసీ దేవుని పరిచారకుడు. దేవునికి మాత్రమే అతడు జవాబు చెప్పుకోవలసి వస్తుంది. అతడు ప్రభువుకు చెందినవాడు (వ 7,8; 1 కొరింతు 6:19-20). ఈ లోకంలో తనకున్న వెలుగును బట్టి ప్రతి వ్యక్తీ నడుచుకోవాలి. ప్రతి వ్యక్తీ పరలోకంలో న్యాయమూర్తి ఎదుట నిలబడవలసి ఉంది (వ 10,12; 2 కొరింతు 5:10; ప్రకటన 22:12). ఇతరులెవరికీ విశ్వాసుల జీవితాలను అదుపు చేసే అధికారం, విమర్శించే హక్కు లేవు.

1316 ...
13. కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. 
14. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే. 
15. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖంచిన యెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము. 
16. మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి. ..

      ప్రియులారా ఈ 13-21 వరకు ఏదీ నిషిద్ధం కాదుగాని ఎవరైనా అది నిషిద్దం అని ఎంచుకుంటే అతని మనస్శాక్షిని బట్టి అది నిషిద్దం అవుతుంది అంటున్నారు. 13-21 ఈ వచనాల్లో మరో ముఖ్య సూత్రం ఉంది. ప్రతి విశ్వాసీ ఇతరుల మేలుకోసమే గాని తనను సంతోష పెట్టుకోవడం కోసం జీవించకూడదు (15:1-3; 1 కొరింతు 10:24, 33; 9:19-23; 8:9-12). ఇది తినడం, అది తినడం, ఫలానాది తినకపోవడం అనేది చాలా అల్పమైన సంగతి. అయితే అది ఇతరులకు దుఃఖం కలిగిస్తే అభ్యంతరంగా ఉంటే అది స్వల్ప విషయం కాదు. మనం చేసేది ఇతర విశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదో గమనించకుండా మనకిష్టమైనదే చేసుకుంటూ పోవాలని పట్టుదలగా ఉండకూడదు. యేసు క్రీస్తు ఆ విశ్వాసులకోసం చనిపోయాడు గదా. వారి నమ్మకానికి హాని చేసే అలవాటు మనకేదన్నా ఉంటే ఆ అలవాటును మానేలా చేసే ప్రేమ, లేక శ్రద్ధ మనకు లేదా? దేవుని రాజ్యంలో ముఖ్యమైన సంగతి మనకు కావలసినది తినడం, త్రాగడం కాదు, లేక వివాదాస్పదమైన సంగతుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ కలిగి ఉండడం కాదు (వ 1). దేవుని రాజ్యంలో ప్రధాన లక్షణాలను, అంటే నీతిన్యాయాలు, శాంతి, ఆనందం విస్తరించేలా ప్రవర్తించడమే ముఖ్యమైన సంగతి. మన ఇష్టప్రకారం ప్రవర్తించడం వీటిలో దేన్నీ వృద్ధి చేయదు. 1 కొరింతు 8:13లో పౌలుగారి మనస్తత్వాన్ని గమనించండి. 1 కొరింతు 10:31లో మనం అనుసరించదగిన మంచి సూత్రం ఉంది. రోమా పత్రికలో దేవుని రాజ్యంఅనే మాటను పౌలుగారు వాడినది ఇక్కడొక్క చోటే. మత్తయి 4:17.
(ఇంకాఉంది)
*రోమా పత్రిక 118వ భాగం*

16వ వచనంలో మీకున్న మేలైనది కేవలం భోజనం కోసం గాని మరేదైనా దానికోసం దూషణ పాలు చేసుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే 17...  దేవుని రాజ్యం బోజనము, పానము కాదుగాని నీతియు, సమాధానమును పరిశుద్దాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యానికి మరో నిర్వచనం ఇక్కడ పౌలుగారు రాస్తున్నారు. దేవునిరాజ్యం అంటే బోజన పానాలు కాదు, నీతియు సమాధానం కలిగి, పరిశుద్ధాత్మతో ఆనందించడం! ఇదే దేవుని రాజ్యం! 

    18వ వచనంలో ఎవడైనా క్రీస్తుకి దాసుడిగా ఉంటే వాడు దేవునికి ఇష్టుడు ఇంకా మనుష్యుల దృష్టికి యోగ్యుడిగా ఉంటాడు అని చెబుతున్నారు. ఇదెలా సాధ్యమవుతుంది! క్రీస్తుకు దాసుడిగా ఉంటే దేవునికి ఇష్టుడుగా ఉండవచ్చు గాని మనుష్యుల దృష్టికి ఎలా యోగ్యుడిగా ఉంటాడు?  జవాబు సింపుల్! వాడు పెదాలతో కాకుండా దేవుడు చెప్పినట్లు, క్రీస్తు దాసుడిగా ఉండటానికి మనసా వాచా కర్మేనా చేస్తూ, దేవుని ఆజ్ఞలను ఒకటికూడా తప్పకుండా చేస్తూ, వాక్యానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం జీవిస్తూ మచ్చలేని జీవితం జీవిస్తూ ఉంటే అప్పుడు వాడు మనుష్యుల దృష్టికి యోగ్యుడిగా ఉంటాడు! అందుకే 19వ వచనంలో సమాధానమును ఇతరులకు పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేసే పనులను మాత్రమే చేస్తూ వాటిని ఆసక్తితో అనుసరిద్దాం అంటున్నారు పౌలుగారు!

   ఇక ఈ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన Statements ఉన్నాయి!
 ౩వ వచనంలో తిననివాడు తినేవాడికి తీర్పుతీర్చకూడదు! 
16వ వచనంలో :మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి. ....   
 ఇక 17వచనం.: దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది. ..
ఇక 20వ వచనం: భోజనం నిమిత్తం దేవుని పనిని పాడుచేయవద్దు అంటున్నారు. చాలామంది సంఘాల్లో కూడా బోజనాల దగ్గర తగాదాలు వస్తాయి. తగాదా వచ్చింది అనే దేవుని పని పాడయినట్లే కదా! కాబట్టి ఇలాంటి తగాదాలు రాకూడదు. 
ఇదే వచనంలో మరో statement ఉంది సమస్త పదార్ధాలు పవిత్రాలే గాని అనుమానంతో తింటే అది దోషము!

ఇక 21వచనంలో కూడా మరో statement ఉంది: మాంసం తినడం గాని, ద్రాక్షారసం త్రాగడం గాని, లేకపోతే నీ సహోదరునికి అడ్డం కలిగించే లేక సహోదరుని విశ్వాసానికి ఎఫెక్ట్ చేసే పని ఏదైనా మానివేసేయ్ అంటున్నారు.  ఒకవేళ నీ సహోదరుడు శాకాహారి అయితే అతనితో వెళ్ళేటప్పుడు మాంసాహారం తినడం మానెయ్! ఒకవేళ నీ తోటి విశ్వాసికి మాంసాహారం తినడం ఇష్టం లేదు, గాని నీ పొరుగున నివసిస్తున్నాడు. అలాంటప్పుడు నీ సహోదరుని మనసాక్షి కోసం నీవు మాంసాహారం మానేయ్! అంటున్నారు పౌలుగారు. కారణం భోజనం నిమిత్తం దేవుని పనిని పాడుచెయ్యోద్దు, నీ సహోదరుని విశ్వాసాన్ని కూడా పాడుచెయ్యోద్దు!  దీనినే 1కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో కూడా వివరంగా రాస్తున్నారు. 
    2223 
22. నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. 
23. అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషి యని తీర్పునొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.. 

నీ అంతరాత్మను నిర్మలంగా, ఎలాంటి నేరారోపణ లేకుండా ఉంచుకోవడం ప్రాముఖ్యం. అంతరాత్మ హెచ్చరికకు వ్యతిరేకంగా మనమేదన్నా చేస్తే మనం పాపం చేస్తున్నామన్న మాట. మనల్ని మనం అపరిశుభ్రంగా చేసుకుంటున్నా మన్నమాట. ఒకటి పని చేద్దాం అని నిర్ణయించుకొని, దానిని మనం చెయ్యలేని పక్షంలో దాన్ని అసలు చెయ్యకూడదు.
 1 తిమోతి 1:19 చూడండి. 
 ఈ అధ్యాయం విషయం క్లుప్తంగా చెప్పాలంటే, మనం ప్రభువుకోసం జీవించాలి, మన చర్యలపై ఆయన తీర్పుకు లోబడాలి (వ 8,10,12). అందువల్ల మన ముఖ్య ఆశయం ఆయనకు సంతోషం కలిగించడమే అయి ఉండాలి. ఈ భూమిపై క్రీస్తులో మన సహోదర సోదరీలతో జీవించాలి గనుక వారందరిపట్ల మన ముఖ్యోద్దేశం వారి నమ్మకాన్ని వృద్ధి చేయడం, వారిని అనవసరంగా నొప్పించే పని ఏదీ చెయ్యకపోవడం అయి ఉండాలి (వ 15,19,21). మనం మనతో జీవిస్తున్నాం గనుక మన సొంత హృదయం, అంతరాత్మ మనపై నేరాలు మోపకుండా జాగ్రత్తగా ప్రవర్తించాలి.

   ఇక చివరగా అనుమానిచువాడు తింటే, అదీకూడా విశ్వాసం లేకుండా తింటే దోషి అంటున్నారు.

చివరలో మరో గొప్ప Statement & Definition ఉంది: విశ్వాసమూలం కానిదేదో అది పాపము! యోహాను గారు పాపానికి ఇచ్చిన నిర్వచనం: ఆజ్ఞాతిక్రమమే పాపము! పౌలుగారు ఇచ్చిన నిర్వచనం: విశ్వాసమూలము కానిది ఏదైనా సరే అదిపాపము! 

 ప్రియ చదువరీ! ఒకసారి నిన్నునీవు పరీక్షించుకో! నీవు చేసే పని అది వాక్యానుసారమా? విశ్వాసమూలమైనదా కాదా? లేక అది నిన్ను విశ్వాసం నుండి తప్పించేదా? సరిచూసుకో! సరిచేసుకో! భోజనం కోసం, ఏవో పదార్ధాల కోసం నీ సహోదరున్ని ద్వేశించకు! తీర్పు తీర్చకు! తీర్పు తీర్చకండి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు అని యేసుప్రభుల వారు చెప్పారు. మత్తయి 7:1; లూకా 6:37; 1కొరింథీ 4:5;
 భోజనం కోసం ప్రభువు పనిని పాడుచెయ్యోద్దు! దేవునికోసమే బ్రతుకు! లోకం కోసం బ్రతుకుతూ లోకాచారాలు అన్యాచారాలు చెయ్యకు! 
నిజమైన దేవుని బిడ్డగా జీవించి అవసరమైతే ఆయనకోసం చనిపోదాం!

అట్టి ఘనత, ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!

ఆమెన్!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక 119వ భాగం*
రోమా 15:1 4
1. కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరిం చుటకు బద్ధులమై యున్నాము. 
2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. 
3. క్రీస్తుకూడ తన్నుతాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను. 
4. ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి. . 

     ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! ఇక 15వ అధ్యాయం ధ్యానం చేద్దాం! ఈ అధ్యాయంలో కూడా అదే విషయం వివరిస్తున్నారు పౌలుగారు.  దానితోపాటు పరిశుద్ధాత్మ యొక్క అవసరతను జ్ఞాపకం చేస్తున్నారు. 

  1. కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము... 
ఇక్కడ బలవంతులమైన మనం, మనలను మనమే సంతోషపెట్టుకోకుండా బలహీనులను భరించి ఆదుకోమంటూన్నారు. అయితే పౌలుగారు శారీరకంగా బలహీనులను ఆడుకోమంటున్నారా? 14:1 ప్రకారం అయితే కాదు అని అర్ధం అవుతుంది. 14:1 లో విశ్వాసమందు బలహీనులను చేర్చుకుని ఆదుకోమని మనలను ప్రోత్సహిస్తున్నారు. దానినే ఇక్కడ కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ నా ఉద్దేశ్యం నిజంగా శారీరకంగా బలహీనులను చూడాల్సిన అవుసరం లేదు అని ఎంతమాత్రము కాదు. కేవలము నేపధ్యం మాత్రము చెబుతున్నాను. కాబట్టి విశ్వసమందు బలంగా ఉన్న మనము విశ్వాసంలో కొంచెం బలహీనులుగా ఉన్నవారిని బలపరచవలసిన అవసరం ప్రతీ విశ్వాసికి, ప్రతీ పెద్దకు ఎంతైనా ఉంది అని మరచిపోవద్దు! 
అలాగే యేసయ్య నేర్పించిన ప్రేమతత్వం ప్రకారం, పౌలుగారు, యోహాను గారు చెబుతున్న అదే ప్రేమతత్వం ప్రకారం నిజంగా శారీరకంగా బలహీనంగా, అనారోగ్యంగా ఉన్నవారిని కూడా మనం ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అలా ఆదరించలేక పోతే 1కొరింథీ 13వ అధ్యాయం ప్రకారం మ్రోగెడు కంచును, గణగణలాడు తాళము అన్నారు. నీ విశ్వాసం, భక్తి వ్యర్ధము అన్నారు యాకోబుగారు.  గనుక నిజంగా శారీరకంగా బలహీనులుగా ఉన్నవారిని కూడా ప్రతీవిశ్వాసి ఆదరించి ఆదుకోవాలి! 

   ఎందుకంటే 2వ వచనం ప్రకారం విశ్వాసి యైనవాడు తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు చూడాలి, అతనిని సంతోషపరచాలి అంటున్నారు పౌలుగారు. ప్రతి ఒక్కరు తమను తామే బలపరచుకోడానికి, సంతోష పరచుకోడానికి ఆలోచిస్తారు గాని ఎదుటవారి మేలుకోసం కూడా చూడాల్సిన అవసరం ఉంది. *దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ....సొంతలాభం కొంతమాని, పోరుగువారికై పాటుపడరోయ్! అన్నారు మా ఊరిలో పుట్టిన గురజాడ అప్పారావుగారు!* కాబట్టి పొరుగువారి క్షేమాభివృద్ధికోసం క్రైస్తవుడు పాటుపడాలి. కారణం క్రీస్తు మనల్ని పిలిచినది మనం మనల్ని అన్ని విధాలా సంతోషపెట్టడం, సంతృప్తి చేసుకోవడం కోసం కాదు. నేనుఅనేదాన్ని చంపివేయాలి మనం. మన హైందవ గ్రంధాలు కూడా ఇదే చెబుతున్నాయి. అహంఅనేదానిని కాల్చివేయాలి. ఇక్కడ అహం అంటే గర్వం కాదు, సంస్కృతంలో అహం అనగా నేను అనే భావాన్ని చంపివేయాలి. నెబుకద్నేజర్ రాజు నేను అని విర్రవీగి 7 సంవత్సరాలు గడ్డి మేశాడు. కాబట్టి నీవుకూడా "నేను" అనే భావాన్ని చంపుకుని, మనం అనేభావనలోకి రావాలి.
 14:1, 19-21; 1 కొరింతు 12:25; గలతీ 6:1-2. లూకా 9:23 చూడండి.   

            ఇదే విషయానికి దృష్టాంతం కూడా చూపిస్తున్నారు ౩వ వచనంలో: ఎవరిని దృష్టాంతంగా చూపుతున్నారు? పౌలుగారు ప్రతీసారి కేవలం యేసుక్రీస్తు ప్రభులవారినే అన్నింటికీ ఉదాహరణగా చెబుతున్నారు. కారణం మన రోల్ మోడల్ యేసయ్యే! ౩..క్రీస్తుకూడ తన్నుతాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను. ....... క్రీస్తు ఈ భూమిపై తండ్రియైన దేవునికి ప్రతినిధిగా ఉండడం చేత ఆయన తిరస్కారం, హేళన, నింద భరించవలసివచ్చింది. ఆయన తననే సంతోష పెట్టుకోదలిస్తే దానంతటినుంచి తప్పించుకోగలిగి ఉండేవాడు. అయితే జీవితంలో ఆయన ఏకైక లక్ష్యం, ఏమి జరిగినప్పటికీ, దేవునికి సంతోషం కలిగించడమే. ఆయనే మన ఆదర్శం. కీర్తన 69:9; యోహాను 8:29
కాబట్టి క్రీస్తుయేసు చూపిన బాటలోనే మనం కూడా నడవాలి! క్రీస్తుయేసునకు కలిగిన మనస్సు మనం కూడా ఆయుధంగా ధరించుకోవాలి అంటున్నారు పేతురుగారు! 1పేతురు 4:1;  కాబట్టి మనకోసమే మనం జీవించకుండా ఇతరులకోసం కూడా జీవిస్తూ, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని ప్రణాలికను నెరవేర్చాలి మనం!

   ఇక 4వ వచనం చాలాచాలా ప్రాముఖ్యమైనది.
ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి. . ...... ఇక్కడ మనకు నిరీక్షణ ఎలా కలుగుతుంది అనేది మరోసారి చూపిస్తున్నారు. ఓర్పు వలన నిరీక్షణ కలుగుతుంది అని మరోసారి ఎత్తిరాస్తున్నారు. ఇంకా లేఖనముల వలన కలుగు ఆదరణ వలన నిరీక్షణ కలుతుతుంది. లేఖనములలో ఏముంది? మన విశ్వాస వీరుల అనుభవాలు ఉన్నాయి. వాటిద్వారా మనకు ఎంతో ఆదరణ కలుగుతుంటుంది. కాబట్టి లేఖనములు ఎప్పుడూ చదువుతూ ఆదరణ పొందుతూ ఉండాలి. లేఖనాలలో (పాత నిబంధన గ్రంథంలో) తమ సంతోషం చూచుకోవడం గాక దేవునికోసం, ఇతరులకోసం జీవించినవారు చాలామంది ఉన్నారు. వారినుంచి మనం నేర్చుకోవాలి. పాత నిబంధన గ్రంథంలోని అన్నీ మన ఉపదేశం కోసమేనని గమనించండి. అందులో ఏ భాగాన్ని మనం చదవకుండా వదిలేసినా, ఏదో ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని ఎరగకుండా ఉండిపోతున్నామన్నమాట. అలాంటప్పుడు మనకు ప్రోత్సాహం కలిగించేవి, విశ్వాసులుగా మనం ఈ లోకంలో ఎదుర్కోవలసినవాటిని భరించేందుకు సహాయం చేసేవి అనేక విషయాలను మనం పోగొట్టుకొంటాం. 2 తిమోతి 3:16-17 

   ఇదే వచనంలో పౌలుగారు మరోసారి రాస్తున్నారు ఈ లేఖనాలు అన్నీ మనకు నిరీక్షణ కలగడానికి పూర్వమందు సంభవించి మనకోసం వ్రాయబడ్డాయి. అంతేకాదు మనకు బోధ కలుగడానికి కూడా వ్రాయబడ్డాయి. ఇదే విషయాన్ని 1కొరింథీ 10 :11 లో కూడా రాస్తున్నారు. ఈ సంగతులు వారికి అనగా మన విశ్వాస వీరులకు మరియు పాతనిబంధన భక్తులకు సంభవించి, ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి! ఈ లేఖనాలు వారికోసం కాదు! కేవలం మనకోసమే! పేతురుగారు కూడా ఇదే వ్రాస్తున్నారు...2 పేతురు 1:20,21
20. ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. 
21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి...

   కాబట్టి ప్రియ సహోదరి/ సహోదరుడా! ఇవి వారికోసం కదా, మనకోసం, నాకోసం కాదుకదా అని అనుకోవద్దు! అవి అనగా ఆ పాత లేఖనాలు అన్నీ నీకోసమే, నాకోసమే వ్రాయబడ్డాయి , ముఖ్యంగా ఈ యుగాంతమందున్న మనకోసమే! కాబట్టి భయమునోంది పాపము చేయకు! దేవుని ఉగ్రతను తప్పించుకోలేవు సుమీ! ఆ లేఖనాలలో సిగరెట్లు,సినిమాలు కోసం లేవుకదా! డ్రగ్స్ కోసం లేవు కదా అనుకోవద్దు! అప్పుడు అవి లేవు అందుకే వ్రాయబడలేదు! అయితే వాటికి సమానార్ధమిచ్చేలాగ వ్రాయబడ్డాయి. అల్లరితోకూడిన ఆటపాటలు, మత్తులై ఉండవద్దు అనికూడా వ్రాయబడ్డాయి. నీ ఆరోగ్యాన్ని పాడుచేసే దానిని నీనుండి తీసివేసుకో అనికూడా వ్రాయబడింది. ప్రసంగీ 11:10;  కాబట్టి వాటిని మానుకో! విశ్వాసమందు బలహీనుని, శారీరకంగా బలహీనుని మరింత బలహీనులను చేయకుండా వారికి అన్నివిధాల ఆదుకుని ఆదరించవలసిన భాద్యత మనందరిమీద ఉన్నది అనికూడా మరచిపోకు! 
వాక్యాన్ని కేవలం వినడం మాత్రమే, చెప్పే వారిలాగా ఉండొద్దు గాని దానిని పాటించి, ఆచరణలో పెట్టే గుంపులో ఉందాము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక 120వ భాగం*
రోమా 15:5 7
5. మీరేకభావము గలవారై యేకగ్రీవముగా( మూలభాషలో-ఒక్కనోటితో) మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము, 
6. క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. 
7. కాబట్టి క్రీస్తు మిమ్మును( కొన్ని ప్రాచీన ప్రతులలో-మనలను అని పాఠాంతరము) చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి. . 

     ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! 
పియదైవజనమా! ఈ మూడు వచనాలలో కూడా ఒకే విషయాన్ని ఎత్తి రాస్తున్నారు పౌలుగారు! మీరు ఏకభావంతో ఉండాలి. ఎందుకు? దానివలన తండ్రియైన దేవుడు మహిమ పరచబడతారు! అంతేకాకుండా అది మన ప్రభువైన క్రీస్తుయేసు చిత్తము/ ఇష్టము కూడా! చూడండి: యేసుక్రీస్తు ప్రభులవారు ఈలోకంలో ఉన్నప్పుడు తను ఏమి చేసినా తండ్రి మహిమార్ధమై చేశారు. తను ఏమి మాట్లాడినా తండ్రిని ఘనపరస్తూ మాట్లాడారు గాని తన పేరుకోసం, తనకోసం ఏమి చెయ్యలేదు. ఆయనే మన రోల్ మోడల్! మనం కూడా తండ్రినే మహిమ పరచాలి! తండ్రినే ఘనపరచాలి. మరి ఎలా ఘనపరచగలం? ఎలా మహిమ పరచగలం అంటే పౌలుగారు చెబుతున్నారు ఏక భావం, ఏక తాత్పర్యం, ఏక మనస్సు కలిగి నడచుకుంటే, దేవుని పనిని సమిష్టిగా చేస్తే దేవుడు , తండ్రియైన దేవుడు మహిమ పరచబడతారు! 
దయచేసి ఏకభావం కోసం ఈ వచనాలు ధ్యానం చెయ్యండి. 12:5, 16; 14:19; యోహాను 17:21-23; ఎఫెసు 4:3.

  ఒకసారి ఫిలిప్పీ సంఘంలో కలహాలు కలిగితే పౌలుగారు చెబుతున్నారు 4:2
ప్రభువునందు ఏక మనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను.; 
ఇంకా 1కొరింథీ ౩:౩..
మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా?.. 

కాబట్టి ఏకమనస్సు లేకపోతే మీరు శరీరసంభందులే గాని ఆత్మ సంబంధులు కానేకాదు! కీర్తన 133లో సహోదరులు ఐక్యత కలిగి నివశించుట ఎంతమేలు! ఎంతమనోహరము అంటూ వర్ణిస్తున్నారు! ఆశీర్వాదం, శాశ్వత జీవం అనగా నిత్యజీవం కావాలి అంటే ఐక్యత, ఏకమనస్సు, ఏకభావం, ఏకాత్మ కలిగియుండాలి. 
          ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు మీ సంఘస్తులతో ఐక్యంగా సమాధానంగా ఉంటున్నావా? లేక గొడవపడుతున్నావా? యోహాను గారు చెబుతున్నట్లు కనబడే సహోదరుని ప్రేమించలేని నీవు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? ఇక్కడే సంఘంలో కలసిమెలసి ఉండలేని నీవు పరలోకంలో అంతమందితో కలసిమెలసి ఉండగలవా? ఉండలేవు గాబట్టి "అమ్మా! అయ్యా! నీవు, నీలాంటి వాడు అక్కడికి వస్తే అందరిని పాడుచేస్తావు, అందరితో తగవులాడుతుంటావు, నీవు అక్కడికి/ పరలోకం రాకు! ఇక్కడే ఉండు అంటారు దేవుడు"!!! 
నీవు ఎప్పుడైతే సమాధానంగా ఏకంగా లేవో, దేవునికి మహిమ రాదు, కారణం సాతానుగాడు మిమ్మల్ని చూసి వికట్టాట్టహాసం చేస్తాడు.
కాబట్టి మీ కలహాలు, కక్షలు అన్నీ ఇక్కడే వదిలేసి 7వ వచనం ప్రకారం క్రీస్తు మనలను చేర్చుకొనిన ప్రకారం మనం కూడా ఇతరులను చేర్చుకుని సమాధానంగా ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది! 

    తమ్ముడి మీద కక్ష్య కట్టిన అన్నలు చివరికి ఎంతవరకు తెగించారు అంటే తమ్ముడ్ని హత్యచేసే వరకు వచ్చారు. యోసేపు చంపేద్దాం అనుకున్నారు గాని దేవుని మహాకృప, దేవుని మహా గొప్ప ప్రణాళిక యోసేపుని కాపాడింది. అందరిపట్ల ఈ కృప ప్రణాళిక లేదు కదా, అలాంటప్పుడు మిమ్మును హంతకులుగా నేరస్తులుగా చేసేది ఈ కక్షలు, కోపాలు, తాపాలు మాత్రమే! మీ యొక్క అక్రమ సంభంధాలు, మీయొక్క ధనాశ మాత్రమే! వాటిని వదిలి అందరితో సమాధానం అనే భంధంతో ఉంటే ఆశీర్వాదమును శాశ్వత జీవమును వస్తాయి. దేవుని అభిషేకం సీయోను కొండలమీద దిగు హెర్మోను మంచులా కురుస్తుంది. 

ప్రియ సహోదరుడా! నీకు ఏమికావాలి?
 ఆశీర్వదమా? శాపమా? 
దీవెనా? తీర్పా?
ఏదికావాలో ఇప్పుడే నిర్ణయించుకో!
1 పేతురు 3:10,11
10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. 
11. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను(అనుసరింపవలెను). 

మేలైనదానిని చేపట్టి కీడును విసర్జించు!
పరలోకం పట్టు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక 121వ భాగం*

రోమా 15:8 13
8. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి( సున్నతి యొక్క) గలవారికి పరిచారకుడాయెను. 
9. అందు విషయమై ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది. 
10. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు 
11. మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది. 
12. మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలో నుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు. 
13. కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.  

     ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! అయితే ఈ వచనాలలో మరల యూదుల యొక్క రక్షణ ప్రణాళిక- అన్యజనుల రక్షణను కొద్దిగా ఎత్తి రాస్తున్నారు! 
పియదైవజనమా! 
8..నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి( సున్నతి యొక్క) గలవారికి పరిచారకుడాయెను. ... చూడండి పితరులకు చేయబడిన వాగ్దానముల విషయమై దేవుడు సత్యవంతుడు అని స్థాపించడానికి అంతేకాకుండా అన్యజనులు కూడా ఆయన కనికరమును గూర్చి దేవుణ్ణి మహిమ పరచాలి అనే ఉద్దేశ్యంతో యేసుక్రీస్తు ప్రభులవారు సున్నతి గలవారికి అనగా యూదులకు పరిచారకుడు అయ్యారు అంటున్నారు. సేవకుడు మత్తయి 15:27;  20:28;  లూకా 22:27; యోహాను 13:4-5; ఫిలిప్పీ 2:7; యెషయా 42:1. 
సున్నతి గలవారికిఅంటే యూదులకు. వారికి సేవకుడుగా క్రీస్తు పాత నిబంధనలో దేవుడు వారికి చేసిన వాగ్దానాలను రద్దు చెయ్యలేదు. వాటిని సుస్థిరం చేశారు. 9:4-5; 11:26-27 చూడండి. వాగ్దానాలను సుస్థిరం చేయడమంటే అవి తప్పక నెరవేరేలా ఏర్పాటు చేయడం. ఆయన మరణం, పునరుత్తానం మూలంగా దేవుని వాగ్దానాలన్నీ నెరవేరడానికి క్రీస్తు పునాది వేశాడు. 

   పితరులకు చేసిన వాగ్దానాలు అంటే మచ్చుకు ఒకటి చూద్దాం! అబ్రాహాము గారితో నీ ద్వారా, నీ సంతానం ద్వారా సర్వజనులు దీవించబడతారు.... ఇది వాగ్దానం. ఆదికాండం 18:18; _26:4;  అయితే క్రీస్తుయేసు ఈ భూలోకానికి అబ్రాహాము సంతానం లోనే వాగ్ధాన ఫలంగా జన్మించారు. మత్తయి 1 ప్రకారం, లూకా 2 ప్రకారం వంశావళి పరిశీలిస్తే అబ్రాహాము- యాకోబు- దావీదు  ... వీరిక్రమంలో యేసయ్య జన్మించి అందరికీ ఆశీర్వాదం కలిగేలా సమస్త ప్రజలందరికీ విమోచనా క్రయధనంగాతన ప్రాణాన్ని రక్తాన్ని చిందించి సమస్తజనులను దేవునితో ఐక్యం చేశారు. ఇది కేవలం యూదులు- ఇశ్రాయేలు వారికోసమేనా ఈబలియాగం, ఈ విమోచన క్రయధనం? కాదు సమస్త మానవాళికోసం కూడా! 

    అందుకే 9వ వచనం ప్రకారం అన్యజనులలో నేను నిన్ను స్తుతిస్తాను, నీ నామ సంకీర్తనం చేస్తాను అనే లేఖనాన్ని ఎత్తి రాస్తున్నారు. 
అయితే అన్యజనులు కూడా క్రీస్తు మనసులో ముందునుంచీ ఉన్నారు. పాత నిబంధన వాగ్ధానాలు కొన్నిటిని ఎత్తి చెప్పడం ద్వారా పౌలుగారు దీన్ని చూపిస్తున్నారు. ఈ మొదటి వాగ్ధానం కీర్తన 18:49. క్రీస్తు ఇతర జనాలమధ్య దేవుణ్ణి స్తుతించడం అక్కడ కనిపిస్తున్నది. 

  ఇక 10వ వచనంలో ఉన్న మాట అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనేది చాలా చోట్ల కనిపిస్తుంది మనకు బైబిల్ లో! కీర్తన 117:2; యిర్మియా 6:18; యోవేలు ౩:11; మత్తయి 12:21;  ద్వితీ 32:43. అన్యజనులు యూదులతో (ఆయన ప్రజలు”) కలిసి సంతోష సహవాసం చేస్తారు. ఇంకా 11లో చెప్పినట్లు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించండి అని కీర్తనలు గ్రంధంలో చాలాసార్లు వ్రాయబడింది.

    ఇక 12వ వచనంలో మరోసారి యెషయా భక్తుని ప్రవచనాన్ని గుర్తుకుచేస్తున్నారు. యెష్షయి నుండి వేరు చిగురు, అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును. ఆయనయందే అన్యజనులు నిరీక్షించుదురు.  ఇది యెషయా 11:10 లో ఉంది...
ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.

కాబట్టి క్రీస్తుయేసులో సమస్త అన్యజనులకు నిరీక్షణ, విడుదల, రక్షణ ఉంది. మరి ఏ నామమున రక్షణ కలుగదు గాని ఈ నామమునే రక్షణ కలుగుతుంది అని ఆది అపోస్తలులు సువార్త ప్రకటించారు. 4:12;

  అయితే ఈ నిరీక్షణ విస్తారంగా కలగాలి అంటే ఏమి చెయ్యాలి? 13..కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.  ..  
మొదటగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొవాలి. అనుదినం ఆయన ఆత్మతాకిడిని అనుభవించి, అత్మపూర్ణులు కావాలి. తర్వాత విశ్వాసం కావాలి. నిరీక్షణకు/ విశ్వాసమునకు కర్త అయిన దేవుడుఅంటే తన ప్రజల్లో నిరీక్షణ/ ఆశాభావాన్ని కలిగించి, దాన్ని నెరవేర్చే దేవుడు అని అర్థం. ఈ నిరీక్షణ అంతిమ విముక్తి గురించినది (5:2-5; 8:23-25). విశ్వాసుల హృదయాల్లో పరిశుద్దాత్మ దీన్ని కలిగిస్తాడు. శాంతి, ఆనందం కూడా దేవుని ఆత్మ మూలంగా కలిగేవే (గలతీ 5:22). 
అవి దేవుని రాజ్యంలో సహజంగా ఉండేవి (14:17). 
క్రీస్తుకు విధేయులైన శిష్యులకు ఆయన ఈ రెంటినీ వాగ్దానం చేశారు (యోహాను 14:27; 15:11). 
విశ్వాసులు వీటితో నిండి ఉండాలని దేవుని కోరిక. అప్పుడే వారు ఇతరుల పట్ల ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తిస్తారు. దేవుణ్ణి స్తుతించవలసిన రీతిలో స్తుతిస్తూ ఆయన ఘనతకోసం జీవిస్తారు. విశ్వాసులు తమ శాంతి సంతోషాలను దోచుకుని తమ నిరీక్షణ/ ఆశాభావాన్ని మసకపరిచే దేన్నైనా సరే తిరస్కరించడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డా! ఆయన ఆత్మను శక్తిని పొందుకున్నావా? విశ్వాసం నీకుందా? అప్పుడే విస్తారమైన నిరీక్షణ కలుగుతుంది నీకు!

  ఇక 14...  మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులును ఒకరికి ఒకరికి ఒకరుబుద్ధి చెప్పువారలై ఉన్నారు అంటున్నారు. దేవుని ఆత్మఫలములో మొదటి ఫలం మంచితనం (గలతీ 5:22). ఒకరికొకరు నేర్పించుకొనే సామర్థ్యం విశ్వాసులందరికీ ఉండాలి (హెబ్రీ 5:11-14; 1 థెస్స 5:14). ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు ఆత్మఫలమైన మంచితనం తప్పకుండ ఉంటుంది. ఇక కొలస్సీ పత్రిక ప్రకారం ఎవరైతే యేసుక్రీస్తు పభువు వారిని తమ సొంతరక్షకునిగా స్వీకరించి ఆయనను సేవిస్తారో వారిని సమస్తజ్ఞాన సంపూర్ణులుగా చేస్తారు దేవుడు!!  అప్పుడు మీకు మీరే ఒకరికొకరు బుద్ధిచేప్పుకునే స్తితికి చేరుకోగలరు.  

   కాబట్టి ప్రియ దైవజనమా! పితరులకు చేయబడిన వాగ్దానాలు నమ్మావా? అన్యజనులలో ఆయన కీర్తిని ప్రకటిస్తున్నావా? 
ఆత్మానుసారంగా ప్రవర్తిస్తూ, ఆత్మపూర్ణత కలిగియున్నావా? 
అప్పుడే నీకు సంపూర్ణ నిరీక్షణ, పరిపూర్ణ ఆనందం కలుగుతుంది. 

దేవుడు వాటిని చదువరులందరికీ మెండుగా దయచేయును గాక!
ఆమెన్!
*రోమా పత్రిక 122వ భాగం*
రోమా 15:15 18
15. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికర మగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింప బడిన కృపను బట్టీ,అన్యజనులనిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని.
16. ఇది హేతువు చేసికొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. 
17. కాగా, క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకారణము కలదు. 
18. ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను. . 

     ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! 
15వ వచనంలో పౌలుగారు అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ పరచబడి, ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మమూ జరిగించుచు........ అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతిని అంటున్నారు. ఈ వచనంలో రెండు ప్రాముఖమైన మాటలు కనబడుతున్నాయి మనకు:  అన్యజనులు అనే అర్పణ , సువార్త విషయమై యాజక ధర్మము!  అన్యజనులు అనే అర్పణ! అనగా దేవునికి అన్యజనులను సువార్తద్వారా రక్షించి, వారిని దేవునితో ఏకం చేయడం లేదా దేవునితో సమాధాన పరచడమే బహుశా అన్యజనులు అనే అర్పణ అని ఉండొచ్చు పౌలుగారు. 

      ఇక యాజక ధర్మము--- దీని విషయంలో యాజక ధర్మము అంటే సువార్త విషయమై యాజక ధర్మము అంటున్నారు. ఒకసారి యాజకులు ఏమి చేస్తారు? యాజక ధర్మము అంటే ఏమిటో గుర్తుకు తెచ్చుకుందాం. జనులు తీసుకువచ్చిన బలులను, అది పాప పరిహారార్ధ బలి కావచ్చు, అపరాధ పరిహార బలి కావచ్చు, ఇంకా లేవీయకాండంలో ఉదాహరించిన  ఏ బలియైన - యాజకుడు ఆ పశువును వధించి, దాని రక్తంలో కొంచెం బలిపీఠం కొమ్ముల మీద చమిరి, మిగిలిన మాంసం బలిపీఠం మీద దహించడం గాని, వండటం గాని చేస్తారు. మరి ఇక్కడ పౌలుగారు ఏ బలి అర్పిస్తున్నారు? అపొ కా 22:21; గలతీ 2:7; ఎఫెసు 3:8. పౌలుకున్న గొప్ప పని సువార్త ప్రకటన (1:1). ఇది అతని యాజకసేవ. సామాన్య విశ్వాసులు కాదు తానే యాజకుడు అని పౌలుగారు అనడం లేదు (విశ్వాసులంతా యాజకులేరాజులైన యాజక సమూహము- 1 పేతురు 2:5, 9; ప్రకటన 1:6; 5:10; 20:6; హీబ్రూ 10:19-22). పౌలుగారు (యాజకులు చేసినట్టు) ఎలాంటి బలి, అర్పణ ఇతర ప్రజలకోసం అర్పించలేదు. అన్యజనులే ఆ అర్పణ. సువార్తను నమ్మినవారు దేవునికి అంగీకారమైన అర్పణ అయ్యారు. ఎందుకంటే వారిని పరిశుద్దాత్మ పవిత్రం చేశారు (12:1). అంటే వారిని దేవుని ప్రజలుగా చేసేందుకు ఆయన వారిని ప్రత్యేకించుకున్నాడని అర్థం. పవిత్ర పరచడం గురించి  యోహాను 17:17-19. ఈ విషయంలో నేను అన్యజనుల నిమిత్తం యేసుకీస్తు పరిచారకుడను అయ్యాను అంటున్నారు. 16వ వచనంలో ఇదే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు అంటున్నారు. 
ఆధ్యాత్మిక సత్యాలు చేజారిపోవడం, వాటిని మరచిపోవడం చాలా తేలిక. మనందరికీ అస్తమానం వాటి గురించి గుర్తు చేస్తుండడం అవసరం. 1:8. 2 పేతురు 1:12; 3:1; యూదా 5; 2 తిమోతి 2:14. 

      ఇక 1718 వచనాలు చూసుకుంటే...కాగా, క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకారణము కలదు. 
18. ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను. .. 
పౌలుగారు తన గురించి తాను అతిశయించలేదు, డంబాలు పలకలేదు. అతని సేవ క్రీస్తులో, అతని అతిశయం క్రీస్తులో ఉంది. తన శక్తిసామర్థ్యాల వల్ల తన పరిచర్య జరిగిందని అతడు అనుకోలేదు. తన గురించి చెప్పుకున్నప్పుడు పౌలుగారు వేరే భాష మాట్లాడారు 7:18; ఎఫెసు 3:8; 1 తిమోతి 1:15. ఇక్కడ పౌలుగారు అతిశయించి గర్వించడం లేదు. తన ద్వారా దేవుడు జరిగించిన విస్తారమైన సేవ పరిచర్య, వలన అనేకులు విధేయులు అయ్యారు- దేనికి? సువార్తకు! యేసుక్రీస్తు ప్రభులవారికి! దేవుడు ఆయనను వాక్యం చేత, క్రియ చేత, మహాత్కార్యములు అనగా అద్భుతకార్యాలు ద్వారా, పరిశుద్దాత్మ బలం చేత దేవుడు ఎన్నో ఘనమైన కార్యాలు చేయించారు పౌలుగారి ద్వారా! దానికోసం మాట్లాడుతున్నారు పౌలుగారు.

  19వచనం చూడండి..
కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను. .... చూసారా యేరూషలేము మొదలుకొని ఇల్లూరి వరకు క్రీస్తు సువార్తను సంపూర్ణముగా ప్రకటించాను అంటున్నారు. యెరూసలేం నుంచి ఇల్లూరి (మాసిదోనియాకు వాయువ్య దిక్కున ఉన్న ప్రాంతం) వరకు అంటే సిరియా, టర్కీ పశ్చిమ, మధ్య భాగాలు, గ్రీసు, మాసిదోనియా ప్రాంతాలు ఉన్న చాలా విశాలమైన ప్రాంతం.  చూశారా ఎన్ని దేశాలలో దేవుని సేవ జరిగించారో పౌలుగారు.. అపొ కా 14:8-9;  16:18,  25, 26;  19:11-12; 2 కొరింథీ 12:11-12.

ప్రియ సేవకుడా! విశ్వాసి! అలాంటి ఘనమైన సేవ కొంచమైన చేసావా నీవు? అంతఘనమైన సేవ చేస్తారనే  దేవుడు పౌలుగారినే ఎన్నుకున్నారు. 

   ఇక 2021 చాలా ప్రాముఖ్యమైనవి ..
20. నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచార మెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు, 
21. వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని. ....
పౌలు గారికి అతని పరిచర్యలో మార్గదర్శకంగా ఉన్న సూత్రం ఇది. ఈ వాక్యభాగం యెషయా 52:15 లోనిది. సాధారణంగా పౌలుగారు ప్రయాణాల్లో ఉండేవారు. క్రీస్తు సువార్త విననివారికి వినిపించాలనీ, తన తరంలో మనుషులందరికీ శుభవార్త వినే అవకాశం కలిగించాలనీ అతని ఆశయం. ఇందులో అతడు మనందరికీ ఆదర్శం. మత్తయి 28:18-20; మార్కు 16:15; లూకా 24:46-47; అపొ కా 1:8.  

   *నేటి సేవకులు పౌలుగారిని చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. నేటి బోధకులు సేవకులు అన్యజనుల యొద్దకు వెళ్ళడం లేదు గాని రక్షించబడిన విశ్వాసుల యొద్దకు వెళ్లి మేము మంచిబోధ చెబుతాం, సంపూర్ణ సువార్త చెబుతాం, సరియైన బోధ కావాలంటే మా దగ్గరకే రండి అని ప్రకటించుకుంటూ పిట్టకధలు, సైన్సు లాంటివి చెబుతూ విశ్వాసులనే ఆకర్షిస్తున్నారు. అద్భుతాలు జరిగిపోతాయి అంటూ చెబుతున్నారు. ఎన్నో జిమ్మిక్కులు చేసి సంఘాలను దోచుకుంటున్నారు గాని సువార్త అందని చోట్ల దేవుని రక్షణ సువార్తను ప్రకటిస్తూ అన్యజనులను శిష్యులుగా చేయడం లేదు! సముద్రంలో/ నదిలో వలవేయడం లేదు గాని చేపలుగల తట్టకి/ బుట్టకి/ వలకు వలవేసి ఇతరులు పట్టిన చేపలను/ ఇతరులు కష్టపడి, ఉపవాసం ఉండి, దెబ్బలు తిని రక్షించిన ఆత్మలను దొంగల్లా దోచుకుంటున్నారు. దీనికి తప్పకుండా ఒకరోజు తీర్పులో నిలబడాల్సి ఉంది*.  అందుకే పౌలుగారు చెబుతున్నారు ..రోమీయులకు 15:20,21
20.నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచార మెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు, 
21.వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని. 
   ప్రియ సేవకుడా!కాపరీ! నీవు ఎవరిని అనుకరిస్తున్నావు? పౌలుగారినా? లేక దొంగబోధకులనా? దేవుని త్రాసులో నీవు తేలిపోతావేమో జాగ్రత్తపడు! 
దైవాశీస్సులు!
*రోమా పత్రిక 123వ భాగం*
రోమా 15:22 25
22.ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. 
23. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరముల నుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి, 
24. నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి,మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. 
25. అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను. . 

     ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! 
ప్రియులారా! 22వ వచనంలో ఈ హేతువుచేత మీ యొద్దకు రాకుండా చాలాసార్లు ఆటంకం కలిగింది అంటున్నారు. ఏ హేతువుచేత? 2021 ప్రకారం క్రీస్తునామం ఎరుగని ప్రాంతాల్లో సేవచేయడానికి చాలా ప్రయాసపడి, అనేకదేశాలలో సేవచేసారు. ఈ రోమా పట్టణాన్ని కూడా దర్శించాలని అనేకమార్లు ప్రయత్నం చేశారట పౌలుగారు! గాని సువార్త భారం పని వలన తీరిక లేక ఆ రోమా ప్రాంతాన్ని చూడలేకపోయారు. 23.ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరముల నుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి, 
24. నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి,మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. .

  ఈ వచనాల ప్రకారం పౌలుగారికి రెండు ఆశలున్నాయన్నమాట! మొదటిది రోమా ప్రాంతంలో సేవచేయాలి. తర్వాత స్పెయిన్ లో కూడా దేవుని సేవ చెయ్యాలి. చూసారా పౌలుగారికి ఎంత సువార్తభారమో, ఎంత ఆత్మలపట్ల దేవుని భారమో అర్ధంచేసుకోవచ్చు! మొదటగా రోమా వెళ్లి అక్కడ సువార్త పరిచర్య చేసి అక్కడనుండి స్పెయిన్ వెళ్తాను అంటున్నారు. ఇటలీకి పశ్చిమాన సముద్రం అవతల ఉన్న దేశం స్పెయిన్. ఇక్కడ, 28లో మాత్రమే ఈ దేశం పేరు బైబిల్లో కనిపిస్తుంది. పౌలు గారికి ఇప్పటికి దాదాపు 60 ఏళ్ళ వయసు ఉండవచ్చు. అయితే పరిచర్యకోసం కొత్త అవకాశాల గురించి, కొత్త ప్రాంతాల గురించి తలపోసు కుంటున్నారు. పౌలు ఈ వచనంలో రోమా వారిని ఆర్థిక సహాయం కోసం అడగడం లేదు. డబ్బు కోసం అడగడం అతని విధానం కానే కాదు. ప్రయాణం చేసేవారిని సాగనంపేందుకు అతనితోబాటు ఇద్దరు ముగ్గురు సోదరులను కొంత దూరంవరకు పంపే అలవాటు గురించి రాసిన మాటలివి (అపొ కా 15:3; 20:38; 21:5; 1 కొరింతు 16:6, 11; 2 కొరింతు 1:16).  అయితే బైబిలు గానీ చరిత్ర గానీ పౌలుగారు స్పెయిన్ దేశానికి వెళ్ళారు అనేందుకు ఏ ఆధారాలూ చూపడం లేదు. కారణం ఆయన ఏమని రాశారు? మొదటగా మీ దేశంలో సువార్త ముగించి అప్పుడు స్పెయిన్ దేశం వెళ్తాను అన్నారు పౌలుగారు. అయితే పౌలుగారు ఈ ఉత్తరం ఎక్కడనుండి రాశారు? చలికాలం ప్రయాణాలు చేయడానికి సముద్రం అనువైన ప్రాంతం కాదు కాబట్టి ఆ ప్రాంతంలో చలికాలం లోనే తుఫానులు వస్తాయి కాబట్టి పౌలుగారు కొరింథీ పట్టణం లో ఉండి ఈ పత్రిక రాస్తున్నారు. కాబట్టి ఆయన ఆ తర్వాత 2526 వచనాల ప్రకారం మాసిడోనియా వారు అకయ వారు పరిశుద్ధులకు చందా ఇచ్చారు దానిని యేరూషలేము లో పెద్దలకు అప్పగించి అప్పుడు వస్తాను అన్నారు. అలాగే  అపోస్తలులు గ్రంధం ప్రకారం యేరూషలేము వెళ్ళడం అక్కడ దేవాలయంలో అరెస్ట్ కావడం తర్వాత రోమా పట్టణానికే ఖైదీగా వెళ్ళడం జరిగింది. కాబట్టి పౌలుగారు స్పెయిన్ వెళ్ళినట్లు ఆధారం లేనేలేదు! 

   ఒకసారి 2526 వచనాలు చూసుకుంటే ఇక్కడ పరిశుద్దుల కొరకు పరిచర్య, ఇంకా పరిశుద్దులలో బీధలైన వారికొరకు చందా అంటున్నారు పౌలుగారు. గతంలో వివరించిన విదంగా పరిశుద్దుల కొరకు పరిచర్య అనగా సంఘ అవసరాలకు ఖర్చులకు డబ్బులు, మరియు దైవసేవకుల ఖర్చులు కోసం, అన్నమాట! ఇక పరిశుద్దులలో బీదలైన వారికొరకు చందా అనగా గతంలో వివరించిన విధముగా శ్రమలలో ఉన్న పరిశుద్దులైన పేదలకు మిగిలిన సంఘస్తులు కొంచెం చందా స్వచ్చందంగా విరాళంగా ఇచ్చి, పెద్దలతో పంపించే వారు. ఇక్కడ మాసిదోనియా వారు అకయవారు కూడా చందా ఇచ్చారు దానిని తీసుకుని వెళ్తున్నారు పౌలుగారు.

       ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవెప్పుడైన సేవకోసం దేవునికి కానుకలు ఇచ్చావా? సేవకులను ఎప్పుడైనా సువార్త అందని ప్రాంతాలకు పంపించారా? పేదలకు ఎప్పుడైనా సహాయం చేసావా? యాకోబు 1:27.. ప్రకారం నిజమైన భక్తి ఏదంటే 
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
.... మరి నీవు ఈ పనులు చేస్తున్నావా? ఉపకారమును ధర్మమును చేయడం మరచిపోకుడి అంటున్నారు...హెబ్రీ 13:16..  
27. అవును వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలి వారైయున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరి . వారు అనగా ఈ అకయవారు మాసిదోనియా వారు ఇష్టపడి చేశారు. అవును దేవుని పని ఇష్టంతో చేయాలి. ఏదో పాదిరిగారు అడిగారు కదా అని చేయకూడదు. అందుకే సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో దీవిస్తారు అంటున్నారు భక్తుడు!  ఇంకా వీరు వారికి ఋణస్తులు అంటున్నారు...... 2 కొరింతు 8:1-5. ఈ సూత్రం ఇప్పటికీ అనుసరించవలసినదే. ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందినవారు అలాంటి ప్రయోజనాలు తమకు చేకూరడానికి సాధనాలైన వారికి ఇహలోక సంబంధంగా సహాయం చేయడం ధర్మం. 1 కొరింతు 9:7-14చూడండి.

29.నేను మీయొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తుయొక్క ఆశీర్వాద (సువార్తాశీర్వాదముతో) సంపూర్ణముతో వత్తునని యెరుగుదును. ... చూసారా ఆశీర్వాద సంపూర్ణముతో వత్తును అంటున్నారు. కొన్ని ప్రతులలో సువార్తాశీర్వాదముతో వస్తాను అని ఉంది. ఆ ప్రాంతం వెళ్లాలని పౌలుగారి ప్రగాఢమైన కోరిక!

పౌలుగారు రోమా నగరానికి వెళ్ళారు. రోమా ప్రభుత్వానికి ఖైదీగా వెళ్ళారు (అపొ కా 28:16). కానీ అతని నమ్మకం మాత్రం నెరవేరింది. అతనికి క్రీస్తు దీవెనల సంపూర్ణత అంటే సుఖం, సౌఖ్యం, అన్నీ సమృద్ధిగా ఉండడం, జేబునిండా డబ్బు ఉండడం కాదు గాని హృదయంలో శాంతి, ఆనందం, దేవుని సేవ చేసేందుకూ సువార్త ప్రకటించేందుకూ దేవుని బలప్రభావాలు ఉండడమే. దేవునికి చెందిన ఆ పవిత్ర వ్యక్తికి బయటి పరిస్థితులతో నిమిత్తం లేదు. ఫిలిప్పీ 4:11-13; 2 కొరింతు 12:9-10 చూడండి. మనందరికీ అతడు ఆదర్శం.

ఇక ౩౦౩౩ వరకు నేను ఈ పరిచర్య పూర్తిచేసి మరల మీ యొద్దకు వచ్చేలా నాకోసం ప్రార్ధనచేయ్యమని అడుగుతున్నారు. తనకోసం విశ్వాసులు చేసే ప్రార్థనల విలువ పౌలుకు బాగా తెలుసు 2 కొరింతు 1:11; ఎఫెసు 6:19-20; ఫిలిప్పీ 1:19; 1 థెస్స 5:25; 2 తెస్స 3:1; ఫిలేమోను 22 చూడండి.

  పౌలుగారు ఎంతగా కష్టపడ్డారో చూస్తున్నారు. సువార్తికుని పని అంటే అదే! అందుకే తిమోతికి కూడా పౌలుగారు సువార్తికుని పనిచేయు! సమయమనక అసమయమనక కష్టపడి మని చెబుతున్నారు. ప్రయాసపడాలి 1 కొరింతు 9:25-26; ఎఫెసు 6:12; కొలస్సయి 1:29. 
క్రీస్తుకు సేవ చేయదలచుకుని పవిత్ర జీవితం గడపాలని ప్రయత్నించే వారందరికీ ఈ ప్రయాస ఏమిటో కొంత తెలుసు. ఆత్మ ప్రేమఅంటే బహుశా పరిశుద్ధాత్మకు విశ్వాసులపట్ల ఉన్న ప్రేమ. పరిశుద్ధాత్మకు వ్యక్తిత్వం ఉందని అది సూచిస్తుంది (యోహాను 14:16-17).

ప్రియ చదువరీ! నీవు నేను కూడా పౌలుగారిలా ఇలాగే సువార్త పనిలో కష్టపడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మరి నీవు సిద్దమా?
ఆ భక్తులు అలా కష్టపడి పనిచేసారు కాబట్టి ఇంతవరకు సువార్త వచ్చింది. నీవుకూడా అలాగే సువార్తపని చేసి దైవరాజ్యవ్యాప్తి చేయుదువు గాక!
ఆమెన్!
*రోమా పత్రిక 124వ భాగం*
డీకన్-ఫీబే
రోమా 16:1 2
1. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని, 
2. ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను. .

     ప్రియులారా!  ఇంతవరకు రోమా పత్రికలో ఎన్నో ఆత్మీయసత్యాలు నేర్చుకున్నాము. దేవుని రక్షణ ప్రణాళిక, ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక, సంఘంలో- లోకంలో విశ్వాసులు ఎలా ప్రవర్తించాలి అనేది పౌలుగారిని ఉపయోగించుకుని  పరిశుద్ధాత్ముడు వ్రాయించారు.

          ఇక ఈ అధ్యాయంలో అన్ని పత్రికల మాదిరిగానే చివరి అధ్యాయంలో తనకు సేవకు సహకరిచిన వారికి, అక్కడున్న సంఘపెద్దలకు పేరుపేరున వందనాలు చెప్పడం పౌలుగారి ఆనవాయితీ! ఈ పత్రికలో కూడా పౌలుగారు రోమా సంఘంలో ఉన్న పెద్దలకు తనకు సేవకు సహకరించిన వారికి అందరకు పేరుపేరునా వందనాలు చెబుతున్నారు ఈ అధ్యాయంలో!

   ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు! పౌలుగారు రోమా పత్రిక వ్రాయబోయేసరికి రోమా నగరం వెళ్ళలేదు కదా, మరి పెద్దలకు ఎలా ఉత్తరం రాశారు. పెద్దలను ఎప్పుడూ చూడలేదు కదా! జవాబు: బహుశా ఫీబే సహోదరి చెప్పియుండాలి. లేదా ఈ పత్రికలో 115 అధ్యాయాలు పౌలుగారు రోమా పట్టణానికి ఖైదీగా వెళ్లకముందు కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు రాసి ఉండాలి. ఇక 16వ అధ్యాయం మాత్రం ఖైదీగా ఉన్నప్పుడు రాసి ఉండాలి. అందుకే 16:7 లో నా తోడిఖైదీలు అని సంభోధించారు.

    ఇక మొదటి రెండు వచనాలు చూసుకుందాం! .కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని, 
2. ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను. ........
 మొదటగా  బైబిల్లోని భాగాలన్నీ దేవుడు మనుషులచేత రాయించినవే. ప్రతి భాగంలోనూ మనం నేర్చుకోదగిన పాఠాలున్నాయి. ఈ వచనాల్లో రోమాలో విశ్వాసులపట్ల పౌలుగారు ప్రేమ, శ్రద్ధ (దైవిక ప్రేమ, శ్రద్ధ కూడా) మనం చూడవచ్చు. అతనికి (ప్రభువుక్కూడా) వారిలో నచ్చిన విషయాలను అంటే మన జీవితం, పరిచర్యకు మంచి ఆదర్శాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ రాసివున్న ఈ విషయాలను చూస్తూ మనందరి గురించి పరలోకంలో రాసి ఉన్న విషయాలను కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు (హెబ్రీ 12:23; మలాకీ 3:16; ప్రకటన 20:12; దాని 7:10; లూకా 10:20; ఫిలిప్పీ 4:3).

   ఇక ఈ వచనాలలో సహోదరి ఫీబే అంటున్నారు పౌలుగారు. ఆమె ఆత్మ సంభంధమైన సహోదరే తప్ప రక్త సంభంధమైన సోదరి కాదు. పౌలుగారు తిమోతి గారికి లేఖ రాస్తూ వృద్దులను తల్లులుగా భావించి వారిని అలా పిలువమన్నారు. యవ్వన స్త్రీలను చెల్లెళ్ళు లేదా అక్కలు అని పిలువమన్నారు. 1తిమోతి 5:1-2... 
ఆయన చెప్పారు, అంతేకాకుండా ఆయన కూడా అలానే పిలిచేవారు. అందుకే ఇక్కడ నా సోదరి అంటున్నారు. ఇంకా మరో వచనంలో ఆమె నాకును తల్లి అంటున్నారు. పౌలుగారు మనకు మాదిరిగా ఉన్నారు. మనం కూడా అలాగే మనతోటి సోదరీలను / సంఘ స్త్రీలను అలాగే పిలివ బద్ధులమై యున్నాము అలాగే వారితో అలాగే ప్రవర్తించ వలసి యున్నది.

      ఈ వచనాలలో కేంక్రేయ లో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరి అంటున్నారు. ఇంకా ఆమెను పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను చేర్చుకో అంటున్నారు. ఆమెకు మీ వలన ఏమైనా కావలిస్తే అవి ఆమెకు ఇవ్వండి అంటున్నారు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె కోసం ఈ పత్రిక ధ్యానం రెండో భాగంలో వివరించడం జరిగింది. ఈమె కేంక్రేయ పట్టణానికి పౌలుగారి చేత డీకన్ అనగా సంఘ పరిచారకురాలగా ఏర్పాటుచేయబడింది. .....

.*ఈ పత్రిక రోమీయులకు తీసుకుని వెళ్ళింది ఎవరు*?
ఆమె పేరు ఫీబే!  ఆమె మొదటగా కేంక్రేయ సంఘానికి డీకన్! సంఘ పరిచారకురాలు! రోమా 16:12;

    సరే, పౌలుగారు రోమా పత్రిక రాసి ఎవరితో పంపించాలి అనే తర్జన భర్జనలో ఉన్నప్పుడు ఎవరూ ముందుకు రాలేదు ఆ ఉత్తరం తీసుకుని రోమా పట్టణం ఇవ్వడానికి. కారణము 
1. ఆ రోజులలో ఎక్కడ చూసిన యుద్ధాలు, అంతర్యుద్ధాలు, రోమా సైనికులతో యుద్ధాలు, 
2. మరోప్రక్క బందిపోటు దొంగలు, 
౩. సముద్రపు దొంగలు, అందుకే భయపడిపోయారు. 
4. రోమా సంఘంలో ఎవరు ఇతరులకు తెలియదు. కారణం అప్పుడు రోమా సంఘం సార్వత్రిక సంఘంతో పొత్తులేనట్టు ఉండేది. కారణం అక్కడికి వెళ్తే రోమనులు చంపేస్తారు అనే భయం కావచ్చు!  ఈ సమయంలో   ఈ డీకన్ ఫీభే అనే స్త్రీ ధైర్యంగా మందుకు వచ్చారు , నేనున్నాను  నన్ను పంపండి పౌలుగారు అని చెప్పారు ఈవిడ! పౌలుగారు ఆమె ధైర్యసాహసాలకు ఆశ్చర్యపడ్డారు. ఆమె సామర్ధ్యం మీద పౌలుగారికి ఎటువంటి అనుమానం లేదు, కారణం ఒక స్త్రీయై ఉండికూడా కేంక్రేయ సంఘాన్ని సమర్ధవంతంగా నడిపిస్తూ వస్తున్నారు ఆవిడ! అంతేకాకుండా రోమా సంఘంతో కూడా కొద్దిగా పరిచయం ఉంది ఆమెకు అంటారు. గమనించాలి ఈ కేంక్రేయ అనేది కొరింథీ పట్టణానికి సుమారు 20 కి.మీ దూరంలో ఉంటుంది.  ఈమె కొరింథీ పట్టణం వచ్చి- పౌలుగారి పత్రిక తీసుకుని- సుమారు 15౦౦ కి.మీ. సముద్ర మార్గముగా, రోడ్డు ప్రయాణం గుర్రం మీద లేదా ఒంటె మీద  ప్రయాణం చేసి రోమా పట్టణం వెళ్లి ఆ సంఘానికి ఉత్తరం క్షేమంగా అందించారు. మార్గమధ్యంలో ఆమె ఎలాంటి కష్టాలు పడిందో మనకు తెలియదు, కారణం ముందుగా చెప్పినట్లు అప్పుడు యుద్దాలు విరివిగా జరిగేవి, ఇలాంటి పరిస్తితులలో అన్నింటికీ తెగించి, అన్నింటినీ భరించి ఒక స్త్రీ సుమారు 15౦౦ కి.మీ దూరం ప్రయాణం చేసి ఒక ఉత్తరం చేరవేసింది అంటే నిజంగా ఎంతకష్ట పడిందో కదా ఆవిడ! నేను అనుకుంటాను ఆమెకు దేవుడు తప్పకుండా భళా నమ్మకమైన మంచి దాసురాలా అని తప్పకుండా పిలుస్తారు. ఆమె ఒకవేళ ఆ ఉత్తరాన్ని రోమీయులకు చేరవేయలేకపొతే మనం ఈ రోజు ఇంత ఉత్తమమైన ఉత్తరాన్ని పొందుకుని ఉండలేము కదా! అందుకే ఆమెను పొగడుతున్నారు, ఆమెకు సహాయం చేయమంటున్నారు. సన్మానించమని చెబుతున్నారు పౌలుగారు!

  కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు స్త్రీవని, పురుషుడవని, చదువులేదు అని ఇలాంటి అభిప్రాయాలు పెట్టుకోవద్దు! గాడిదను వాడుకున్న దేవుడు, చదువురాని చేపలు పట్టుకునే పేతురు యోహాను లను వాడుకున్న దేవుడు, పశువులు మేపుకుంటున్న ఆమోసును వాడుకున్న దేవుడు నిన్నుకూడా వాడుకోడానికి సిద్దముగా ఉన్నారు. మరి నీవు సిద్దమా??!! నీవు చేయవలసింది కేవలం ఆయన మాటకు సంపూర్ణ విధేయత చూపడం, ఆయన చెప్పినట్లు చేయడం మాత్రమే! మరినీవు సిద్ధమా? అయితే ఆయన నిన్నుకూడా వాడుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెన్!
దైవాశీస్సులు! 
*రోమా పత్రిక 125వ భాగం*
ప్రిస్కిల్ల-అకుల
రోమా 16:3 4.
3. క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి. 
4. వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు. 

     ప్రియులారా!  మనం రోమా పత్రిక ధ్యానములలో చివరికి వచ్చేసాం. గతభాగంలో దైవ సేవకురాలు ఫీబే కోసం ధ్యానం చేశాం. ఈరోజు మరికొంతమందిని చూద్దాం!
ఈ ౩4 వచనాలలో ఒక జంట లేక దంపతులున్నారు. వారు రక్షించబడి క్రీస్తుకోసం తమ్మునుతాము అప్పగించుకొని దేశదేశాలలో తమ వృత్తి చేసుకుంటూనే సువార్త వ్యాప్తి చేశారు. వీరికోసం నేను కాదు పౌలుగారే ఎంతోగొప్పగా రాస్తున్నారు......... వీరికోసం ఇంకా ఎక్కడ వ్రాయబడి ఉందో చూసుకుందాం. అపొ కా 18:2, 18, 26;  ఇక్కడ దైవజనుడైన అపోల్లోగారికే ఇంకా సత్యమును వివరించారు అంటే వీరి విశ్వాస సామర్ధ్యం, లేఖనములపైగల పట్టు మనకు అర్ధం అవుతుంది. ఇంకా 1 కొరింతు 16:19; 2 తిమోతి 4:19.

సరే, మొదటగా వీరిని నా జతపనివారు అంటున్నారు. కారణం పై బాగాల ప్రకారం పౌలుగారు కూడా అదే వృత్తి అనగా డేరాలు లేక టెంట్లు కుట్టి అమ్మడం, ఒకేవృత్తి వారూ కాబట్టి వీరుకూడా పౌలుగారి కంటే ముందుగానే దేవుణ్ణి అనుసరిస్తూ నామకార్దులుగా కాకుండా విశ్వాస వీరులుగా ఉన్నారు కాబట్టి పౌలుగారు వీరితోనే ఉండిపోవడం మొదలు పెట్టారు. అందుకే నా జతపనివారు అంటున్నారు. ఎంతో ఆధిక్యత ఇస్తున్నారు. కారణం 4వ వచనం..... నాప్రాణం కొరకు వారి ప్రాణములే ఇవ్వడానికి తెగించారు. ఎంత తెగింపు చూడండి. ఇంకా వారి ఇంటిలో సంఘాన్ని కూడా నడుపుతున్నారు. నేను మాత్రమే కాదు అన్యజనులలో సంఘాల వారు వీరికి కృతజ్ఞులై ఉన్నారు అంటున్నారు. నిజంగా వీరెంత దొడ్డవారో చూడండి.

   ఒకసారి ఆగి ఆలోచిద్దాం! మనం ఎలా ఉన్నాము? పౌలుగారు అంత ఘనమైన సేవ చేయడానికి కారణం ఈ ప్రిస్కిల్ల ఆకుల లాంటి విశ్వాసులు యొక్క సపోర్ట్ అని నా ఉద్దేశ్యం! దేవుని మహాకృప వలన ఆయనకు అన్ని సంఘాలలోను ఇలాంటివారు ఇలా ఆయనను ప్రేమించేవారు దొరికారు. నేటి సంఘాలలో ఇలాంటివారు ఉన్నారు కాని చాలాచాలా తక్కువ! చాలామంది విశ్వాసులు తమ సంఘకాపరి బండిమీద వెల్తే అసూయ పడతారు. మంచి బట్టలు వేసుకుంటే మేము ఇచ్చినకానుకలు ఇలా ఉపయోగిస్తున్నాడు అంటారు. కారు కొనుక్కుంటే కారుమీద తిరుగుతున్నారు అని అసూయ పడటం ఎక్కువయ్యింది. అయితే ఒక్క విషయం మరచిపోతున్నారు. నూర్చేడి ఎద్దు మూతికి చిక్కము వేయకుడి అనే లేఖనం గుర్తుచేస్తూ పౌలుగారు ఏమన్నారు? 1కొరింథీ 9:9; 1తిమోతి 5:18; సంఘకాపరి సంఘం యొక్క రాబడి మీద బ్రతుకుతారు అని చెప్పారు. కాని నేటి విశ్వాసులు కాపరులను చూసి ఉడికిపోతున్నారు. ఇది మంచిది కాదు!

    దేవుని మహా కృప వలన పౌలుగారికి పౌలుగారి కోసం ప్రాణం పెట్టే విశ్వాసులు దొరికారు. ఒకసారి దమస్కు పట్టణం వారు చంపాలని చూస్తుంటే గంపలో పెట్టి త్రాళ్ళతో దించారు. ఆ విధంగా ఆయన ప్రాణాలు కాపాడారు. ప్రియ విశ్వాసి నీ కాపరికోసం ప్రార్ధన చేస్తున్నావా? నీ కాపరి ఇంతఘనమైన పరిచర్య చేస్తుండగా నీకాపరికి తోడుగా నిలుస్తావా? అకుల ప్రిస్కిల్ల, ఇంకా అనేక విశ్వాసులు పౌలుగారికి అండగా నిలబడ్డారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆయనకు సపోర్ట్ గా నిలిచారు. గంపలో పెట్టి త్రాళ్ళతో దింపారు. ఆ గంపలో దించిన వ్యక్తిలా నీవుంటావా? ఆ త్రాడు నీవు పట్టుకొంటావా? అనగా నీ కాపరి కోసం ప్రార్ధనలో ఎత్తి పట్టుకొంటావా? సాతాను గాడు సంఘాన్ని పాడుచేద్దామని మొదటగా కాపరి కుటుంబం మీద ఎటాక్ చేద్దామని చూస్తుంటే కాపరికి తోడుగా అండగా ప్రార్ధనా సహకారం చేస్తున్నావా? పౌలుగారికి ఒకసారి ఫిలిప్పీ పట్టణంలో సహకరించేవారు కొరత కలిగినప్పుడు స్త్రీలు సుంటికే, యువొదియలు పౌలుగారికి అండగా నిలబడ్డారు. సహకారులై నిలిచారు. ఫలితం ఫిలిప్పీ పట్టణం మొత్తం క్రీస్తుకోసం గెలిచారు. నీవుకూడా నీ సంఘకాపరికి అండగా నిలబడతావా?అందుకే ఆ సహకారుల పేరులు జీవగ్రంధమందు వ్రాయబడినవి అంటున్నారు పౌలుగారు. నీ పీరు జీవగ్రంధమందు వ్రాయబడాలా? అయితే మరో మార్గం నీకాపరికి సహకరించు! మరినీవు సిద్దమా?

   ఇక దైవసేవకుడా! నిన్ను నీ సంఘం తండ్రిలా భావించి ఆదరించాలి అంటే నీవుకూడా పౌలుగారిలాగా తనకు కలిగిన సమస్తము విశ్వాసుల కోసం ఖర్చు పెట్టాలి. పౌలుగారు తనకు ఇల్లు కట్టుకోవాలి ప్రయాణ సాధనాలు కొనుక్కోవాలి, ఆస్తి సంపాదించాలి అని ఎప్పుడూ చూడలేదు గాని వారికి తన ఆరోగ్యం బాగోలేకపోయినా సరే క్రీస్తుసత్యం సంపూర్ణంగా బోధిస్తూ, గద్దిస్తూ, ఖండిస్తూ వారిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. కానుకలు ఇచ్చేవారిని ఎలా ప్రేమించేవారో ఇవ్వని వారిని కూడా అలాగే ప్రేమించారు. సంఘంలో తన ఉనికికోసం ఎప్పుడూ లాలూచి పడలేదు. అందరిని సమానంగా చూశారు. నీవుకూడా అలా ప్రేమించగలిగితే, కేవలం క్రీస్టు సువార్త కోసం మాత్రమే పాటుపడితే సంఘాభివృద్దికే పాటుపడితే, నీ సంఘం కూడా నిన్ను ప్రేమిస్తుంది. నీకోసం ప్రాణం పెట్టడానికి సిద్దమవుతుంది. 
మరి నీవు సిద్దమా?

అట్టి కృప ప్రతీ దైవసేవకునికి, ప్రతీ విశ్వాసికి మెండుగా కలుగును గాక!
ఆమెన్!
*రోమా పత్రిక 126వ భాగం*
రోమా 16:5 8
5. ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు. 
6. మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. 
7. నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు. 
8. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వంద నములు. .

     ప్రియులారా!  మనం రోమా పత్రిక ధ్యానములలో చివరికి వచ్చేసాం. గతభాగంలో ప్రిస్కిల్ల అకుల  కోసం ధ్యానం చేశాం. ఈరోజు మరికొంతమందిని చూద్దాం!
515 వచనాల వరకు పౌలుగారు కొంతమందిని పేరుపేరునా వందనాలు తెలియజేస్తూ వారియొక్క విశిష్టత కూడా తెలియజేస్తున్నారు. గతభాగంలో చెప్పినట్లు బైబిల్ గ్రంధంలో ఏ వచనంకూడా పనికిరానిది లేదు. అన్ని వచనాలు పరిశుద్ధాత్ముడు ఏదో ఒక ఉద్దేశ్యముతో వ్రాయించినవే! ఇక్కడ ఈ వచనాలు కూడా ఎవరినో ఉద్దేశించి వ్రాసారు. మరి మనకు అనగా సంఘానికి ఇవి ఏ రకంగా పనిచేస్తాయి? నేను అంత బైబిల్ పండితుడను కాదు గాని, అంత ఆత్మపూర్ణుడను కూడా కాను గాని, దేవుడు నాకిచ్చిన చిన్న ఆలోచన ప్రకారం , పరిశుద్దాత్ముని నడిపింపు ప్రకారం నా ఆలోచనలు మీకు కొన్ని పంచుకుంటున్నాను. 
11 వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు కొన్ని మాటలు కనిపిస్తాయి. వాటినే ధ్యానం చేద్దాం!

మొదటగా నా ప్రియుడగు ఎఫైనేటు అంటున్నారు. నా ప్రియుడు అని పౌలుగారు సంబోధించడానికి రెండు కారణాలు కావచ్చు! 1. పౌలుగారి సంభాషణ, మాట్లాడే విధానం ఎంతో మృదువుగా ఉప్పువేసి నట్లు ఉండేది. ఎవరినైనా సంభోదించినప్పుడు ఇలాగే పిలిచేవారు. అది క్రైస్తవుని మాటతీరు విధానం. పౌలుగారు మనకు మాదిరికరమైన జీవితం జీవించి, మనకు మాదిరిని ఇచ్చి వెళ్ళిపోయారు. గనుక మనము కూడా అలాంటి మాటతీరును అనుసరించాలి. అదే క్రైస్తవుని విధానం. కనుక ప్రియ సహోదరి/ సహోదరి నీవుకూడా ఇలాంటి పిలుపును కలిగియుండుము!

ఇక 6వ వచనంలో సంబోధించిన మరియ ఎవరో మనకు తెలియదు. అయితే ఆ రోజులలో మరియ అనేది చాలా విస్తారంగా పెట్టుకునే పేరు. అయితే ఇక్కడ మనం గమనించ వలసిన రెండవ విషయం ఏమిటంటే: మీ కొరకు బహుగా ప్రయాసపడిన అంటున్నారు. ప్రతీ విశ్వాసి క్రీస్తుకోసం పనిచేయాలి. అయితే ఈమె బహుగా ప్రయాసపడింది అని పౌలుగారు సర్టిఫికేట్ ఇస్తున్నారు. మరి నీవు నీ సంఘంలో అలాంటి పేరును కలిగియున్నావా ప్రియ సహోదరి/ సహోదరుడా!?

మూడవది: 7వ వచనం ప్రకారం పౌలుగారి సంబోధన చూడండి. వీరు అపోస్తలులలో పేరు పొందిన వారు, నాకంటే ముందుగా క్రీస్తునందున్న వారు  అంటున్నారు. పౌలుగారు ఏం చేసేవారో అదే రాశారు. మీకంటే ఇతరులను గొప్పగా భావించి సన్మానించమని రాశారు పౌలుగారు. ఆయన అదేచేసి ఇక్కడ ఇతరులని గొప్పగా సంబోదిస్తున్నారు.  ఇలాంటి గొప్ప/ దొడ్డ బుద్ధి క్రైస్తవులమైన మనకు తప్పకుండా ఉండాలి.  ఇక ఈ వచనంలో వీరిద్దరిని నా తోడి ఖైదీలు అని సంభోదిస్తున్నారు పౌలుగారు అనేకసార్లు చెరసాలలో ఉన్నారు (2 కొరింతు 11:23). ఇక్కడ చెప్తున్నది ఏ సందర్భం గురించో తెలియదు. అయితే రోమాలో ఉన్నప్పుడు కూడా కావచ్చును!

నాల్గవది: క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లకు అంటున్నారు. ఏ విశ్వాసికి అయినా ఇది (అనగా యోగ్యుడు అని పిలవడం) గొప్ప పొగడ్త. 1 కొరింతు 9:27; 2 తిమోతి 2:15  పౌలుగారిచేత యోగ్యుడు అని సర్టిఫికేట్ పొందారు అంటే నిజంగా క్రీస్తుకోసం కష్టపడి ఉంటారు ఈయన! మనం కూడా మనకాపరి నుండి ఇంకా దేవునినుండి  ఇలాంటి సర్టిఫికేట్ పొందుకోవాలని ప్రభువు ఆశిస్తున్నారు.  పౌలుగారు ఎప్పుడూ విశ్వాసి ప్రవర్తన కోసం చెబుతూ ఉండేవారు. తీతుకు పత్రిక రాస్తూ పరపక్షమందు ఉండువాడు మనకోసం చెడ్డమాట పలుకకుండా చూసుకో అని చెప్పారు. 2:7; ఇక్కడ యోగ్యుడు అని ఒకరికోసం చెబుతున్నారు. ఇది ప్రతీ విశ్వాసులకు ఇలాంటి మంచి ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన కలిగియుండాలి!!

ఐదవది: 13వ వచనంలో ఆమె నాకును తల్లి అంటున్నారు. ఆయన అందరినీ అమ్మా, అక్కా, చెల్లి అని సంబోధించేవారు అదే విషయాన్నీ పౌలుగారు తిమోతికి వ్రాశారు. ఇక్కడ ఈ పత్రిక రాసినప్పుడు కూడా అదేవిధంగా సంబోధన చేస్తున్నారు. ఇది కూడా ప్రతీ విశ్వాసికి మరీ ముఖ్యంగా యవ్వన సేవకునికి తప్పకుండా ఇలాంటి సంబోధన కలిగియుండాలి. ఒక యవ్వన సేవకుడు సేవ చేసినప్పుడు ఎంతోమంది స్త్రీలకు ప్రార్ధన చెయ్యడం వారి గృహాలు దర్శించడం చేయాలి. అయితే పౌలుగారి బాటలో, ఆయన నేర్పించిన వ్యవహార శైలిని పాటిస్తే యవ్వన సేవకులకు చాలా ఇబ్బందులు తప్పుతాయి. ముఖ్యంగా యవ్వనులకు సాతాను వ్యభిచార ఉరులను తప్పించుకునే అవకాశం ఉంది. ప్రియ సేవ చేస్తున్న యవ్వన తమ్ముడూ! నీవు కూడా ఇలాగే స్త్రీలను సంబోదించమని ప్రభువు ప్రేమను బట్టి సలహా ఇస్తున్నాను.

ఆరవది: 23వ వచనంలో నాకునూ, యావత్సంఘమునకు ఆతిథ్యం ఇచ్చే గాయుకు (గాయస్) అంటున్నారు. ఈమాట వలన మనం నేర్చుకునేది ఏమిటంటే ప్రతీ విశ్వాసి సంఘానికి, పరిశుధ్ధులకు, సేవాపరిచర్య చేసేవారికి ఆతిథ్యం ఇవ్వాలి. ప్రియ విశ్వాసి నీవు ఇస్తున్నావా? ఆతిథ్యం చేయ మరువకుడి అంటున్నారు భక్తుడు!

    ఇక ఈ వచనాలలో ఎంతోమందిని ప్రయాసపడిన, ఎంతో ప్రయాసపడిన అంటున్నారు. కొందరు విశ్వాసులు ప్రయాసపడ్డారు, మరికొందరు అధికంగా ప్రయాసపడ్డారు (వ 6). పౌలుగారు సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా చెప్పారు. మనం దేవుని ముందు నిలబడే రోజున కూడా ఇలానే ఉంటుంది. నిజం కానివేమీ దేవుడు మన గురించి చెప్పడు. మనం చేయనివాటికి మనకు ప్రతిఫలం ఇయ్యడు 2:6; 1 కొరింతు 3:12-15. లూకా 19:12-26.

   కాబట్టి ప్రియ సహోదరి/ సహదరుడా! ఇంతగొప్ప సాక్షి సమూహం అనుసరించిన మార్గాన్ని నీవు అనుసరిస్తావా? ఆ భక్తులు ప్రభువుకోసం ఎంతో ప్రయాసపడ్డారు. యోగ్యమైన జీవితం జీవించారు. మంచి ప్రవర్తన కలిగి ,మంచి సంబోధన కలిగియున్నారు. మనం కూడా అలాంటి మంచి ప్రవర్తన కలిగియుంటే దేవుడు మనలను కూడా తనపనిలో వాడుకోడానికి ఇష్టపడుతున్నారు. 
మరి నీవు సిద్దమా?

దైవాసీస్సులు! 







*రోమా పత్రిక 127వ భాగం*
రోమా 16:16 20
16. పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి. 
17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి యుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి. 
18. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. 
19. మీ విధేయత అందరికిని ప్రచుర మైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను. 
20. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. 

     ప్రియులారా!  ఈ వచనాలు విశ్వాసి సంఘంలోనూ లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనేదానినే మరలా మాట్లాడుతున్నారు. బహుశా ఏదో సడన్ గా గుర్తుకొచ్చి వందన సమర్పణ మధ్యలో చెబుతున్నారు.

   16.   పవిత్రమైన ముద్దుపెట్టుకుని ఒకనికొకడు వందనములు చేసుకోమంటున్నారు. బాగా గమనించవలసిన విషయం: పవిత్రమైన ముద్దుపనికిమాలిన ఇంకా లోకస్తులు, సినిమాలు చూపించే ముద్దులు కాదు. లోకానుసారమైన ముద్దులు కాదు! పవిత్రమైన ముద్దులు! చెక్కిలిపై ముద్దు పెట్టుకోవడం ఆ రోజుల్లో సామాన్యంగా అభివందనం తెలిపే పద్ధతి, గౌరవం చూపే పద్ధతి (లూకా 7:45). “పవిత్రమైన ముద్దుఅంటే అందులో శరీర సంబంధమైనది ఏదీ ఉండకూడదన్నమాట. మనకు అనగా మన దేశంలో రెండు చేతులు జోడించి నమస్కరించడం! ఇంకా పాశ్చాత్య పద్దతి షేక్ హేండ్ ఇవ్వడం చేస్తారు. క్రీస్తులో తోటి విశ్వాసులను గుర్తించి గౌరవించడం మాత్రమే అందులో వెల్లడి కావాలి. ప్రియ స్నేహితుడా! నీవు నీతోటి విశ్వాసికి వందనం చేస్తున్నావా? పవిత్రమైన ముద్దు పెట్టుకుంటున్నావా? లేదా ముఖం ముడుచుకుని పోతున్నావా? పౌలుగారు ఆత్మావేశుడై ఇస్తున్న ఆజ్ఞ పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి. మనం కూడా మన సంఘస్తులందరికీ వందనం చేయడం, ఇంకా నమస్కరించడం లేదా షేక్ హేండ్ ఇవ్వాలి.

  ఇక పౌలుగారు రాస్తున్న మరో ప్రాముఖ్యమైన విషయం: అబద్ద బోధకులు విషయమై జాగ్రత్తపడాలి. వారిని పలకరించడానికి గాని, వారిని ఇంట్లో చేర్చుకోడానికి గాని పౌలుగారు అనుమతించడం లేదు. చివరకు వారితో ఉండొద్దు. వారినుండి తొలగిపొండి అంటున్నారు 1718 వచనాలలో..
సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి యుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి. 
18. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ...

   పౌలుగారు తన లేఖలు చాలా వాటిల్లో కపట బోధకుల గురించి విశ్వాసులను హెచ్చరించాడు (2 కొరింతు11:13-15; గలతీ 1:6-8; కొలస్సయి 2:8, 18; 1 తిమోతి 4:1-3; 2 తిమోతి 3:1-8; 4:2-4). మత్తయి 7:15-16; 24:4-5, 24; అపొ కా 20:29-31; 2 పేతురు 2:1-2; 1 యోహాను 2:18-19; యూదా 4కూడా చూడండి. 
మనుషులకు పాపవిముక్తి కలిగించి విశ్వాసులను స్థిరపరచి అభివృద్ధి చేసే దేవుని సాధనం సత్యం. మనుషులను నాశనం చేసేందుకు సైతాను ప్రయోగించే సాధనం అబద్ధాలు (యోహాను 8:44). 
క్రైస్తవ సంఘాల్లో తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టేందుకు సైతాను కపట బోధకులను ఉపయోగిస్తాడు. వారి ఉపదేశాల ఫలితాలను బట్టి మనం అలాంటివారిని గుర్తించవచ్చు (మత్తయి 7:20). ఫలితాల్లో ఒకటి భేదాలు”. సత్యాన్ని అనుసరించడానికి అడ్డంకులు కలగడం మరో ఫలితం. ఆ భేదాలూ అడ్డంకులూ దేవుడు వెల్లడించిన సత్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఎవరైనా అబద్ధ ఉపదేశాలను క్రైస్తవ సంఘంలోకి తేవడానికి ప్రయత్నిస్తే విశ్వాసులు చేయవలసినది ఒకటే వారికి దూరంగా ఉండాలి”. అలాంటివారిని స్వీకరించకూడదు, వారితో సహవాసం చెయ్యకూడదు, ఉపదేశించడానికి వారికి అనుమతి ఇవ్వకూడదు.
నేటి దినాల్లో మన ప్రాంతాల్లో ఇలాంటి దొంగబోధలు, దొంగబోధకులు పెరిగిపోయారు. కాబట్టి వీరిని కనిపెట్టి ఉండాలి అంటున్నారు. యెహోవా సాక్షులని, సబ్బాతు ఆరాదికులు అని, బ్రేన్హాం అనుచరులు అని, పరిశుద్ధాత్ముడు లేడు, ప్రవచనాలు, అద్భుతాలు లేవు అంటూ, ఇలా భయంకరమైన బోధలు, సత్యమునకు విరోధమైన బోధలు వస్తున్నాయి. ఇలాంటి  అబద్ధ ఉపదేశాలను క్రైస్తవ సంఘంలోకి తేవడానికి ప్రయత్నిస్తే విశ్వాసులు చేయవలసినది ఒకటే వారికి దూరంగా ఉండాలి”. అలాంటివారిని స్వీకరించకూడదు, వారితో సహవాసం చెయ్యకూడదు, ఉపదేశించడానికి వారికి అనుమతి ఇవ్వకూడదు.
  
          దేవుని వాక్కుకు విరుద్ధమైన ఉపదేశం గనుక వారు చేస్తూ ఉంటే వారు క్రీస్తుకు చెందిన నిజమైన సేవకులు కారని స్పష్టంగా ఉంది. వారు తమ సొంత కోరికలను తీర్చుకుంటున్నా రన్నమాట (వారి వెనుక ఉండి వారిని ప్రేరేపించే సైతానుకు సేవ చేస్తున్నా రన్నమాట 2 కొరింతు 11:14-15).  ఫిలిప్పీ 3:18-19; యూదా 13,14వచనాలు చూడండి. లోలోపల వారు పిశాచాలలాంటివారు. బయటికి మాత్రం తియ్యని మాటలు, పొగడ్తలు పలుకుతుంటారు.
కాబట్టి ఇలాంటి వారి విషయమై చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  ఇక 19 వచనం.... మీ విధేయత అందరికీ తెలిసింది కాబట్టి మేలు విషయమై జ్ఞానులు వలె ఉండాలి. కీడు విషయమై నిష్కపటులుగా ఉండాలి అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభులవారు కూడా అన్నారు ఇలాంటి మాట: మత్తయి 10:16 లో పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు గా ఉండండి అని. మనం కూడా ఇలాగే నిష్కపటంగా వివేకంగా జ్ఞానులుగా ఉందుము గాక!

20. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. ... ఆమెన్!ఆమెన్! ఆమెన్! దేవుడు మనకు అలాంటి విజయం దయచేయును గాక! 

సమాధాన కర్త లేక శాంతి ప్రదాత 15:33. అవును దేవుడు మనకు శాంతి సమాధానం ఇచ్చేవారు. అందుకే యోహాను 18లో శాంతిని మీ కిచ్చుచున్నాను. నా శాంతిని మీకిస్తున్నాను అనిచెప్పారు యేసయ్య!  సైతాను గురించి  1 దిన 21:1; మత్తయి 4:1-10; యోహాను 8:44. ఇక్కడ వాడి గురించిన మాటను బట్టి చూస్తే 17,18లోని కపట ఉపదేశకుల వెనుక ఉండి ప్రేరేపించేది వాడే అని అర్థమౌతున్నది. 
కాబట్టి వాడిమీద మనకు విజయం కలుగును గాక!

మనప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడైయుండును గాక!
ఆమెన్!
*రోమా పత్రిక 128వ భాగం*

రోమా 16:25 27
25. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, 
26. యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును 
27. అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి,యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌..

     ప్రియులారా!  ఈ వచనాలు పౌలుగారి రచనా పటిమను వెల్లడి చేస్తున్నాయి.
సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విదేయులగునట్లు అనాదినుండి రహస్యముగా ఉంచబడి, ఇప్పుడు ప్రత్యక్ష పరచబడిన  మర్మము....  
ఇక్కడ విశ్వాసము అనగా క్రీస్తుయేసునందలి విశ్వాసము అనియు, యేసుక్రీస్తే నిజమైన దేవుడని, మెస్సయ్యా అని, ప్రభువని అనాదినుండి రహస్యముగా ఉంచబడింది, అయితే ఇప్పడు ప్రత్యక్ష పరచబడింది , ఇది మర్మము అని చెబుతున్నారు.

  ఇక నేను ప్రకటించే సువార్తఅనగా ఈ పత్రికలోని గొప్ప మూలాంశం (రోమీయులకు 1: 16
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.).......
మర్మము/రహస్య సత్యంఅంటే మనుషులకు గనుక తెలియాలంటే దేవుడు మాత్రమే బయట పెట్టవలసిన సత్యం. మరి ఏ విధంగానూ వారు దాన్ని తెలుసుకోలేరు. సువార్త అనే రహస్య సత్యంలోని ప్రతి అంశం పాత నిబంధన రోజుల్లో వెల్లడి కాలేదు (ఎఫెసు 3:5
ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడియున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు.).... అయితే ఇప్పుడు సువార్తద్వారా అందరికీ తెలుపబడింది.

ఇక 26వ వచనంలో గల ప్రవక్తల లేఖనాలుఅంటే కేవలం పాత నిబంధన లేఖనాలను ఇప్పుడు అపోస్తలలు స్పష్టం చేశారని బహుశా పౌలు భావం కావచ్చు (ఆ లేఖనాలలో అంతటా సువార్తను గురించిన భవిష్యద్వాక్కులు, సాదృశ్యాలు ఉన్నాయి గదా. 3:21; లూకా 24:25-27, 45-47; 1 పేతురు 1:10-12). ఎలా చూసుకున్నా దేవుని ఉద్దేశం ఒకటే. అన్ని జాతుల ప్రజలూ తనలో నమ్మకం ఉంచి విధేయత చూపాలని కోరుతున్నారు 1:5; 11:32; 15:9-12.

    27వ వచనంలో ఏకైక నిజ దేవుడొక్కడే అమిత జ్ఞానమున్నవాడు అంటున్నారు పౌలుగారు.  సమస్తము  ఆయనొక్కనికే తెలుసు. మనుషులకు ఏమి తెలియజేయాలో ఎప్పుడు తెలియజేయాలో ఆయనకు తెలుసు. ఆయనొక్కడే మహిమకు అర్హుడు (11:33-36;  ప్రకటన 4:1;  యెషయా 48:11). 
యేసు క్రీస్తు ద్వారామహిమ అంతా ఆయనకే చెందాలి –  1 పేతురు 4:11;  యూదా 25.

దేవుని పూర్వ నిర్ణయం గురించి... అనగా ముందుగా తనకు తెలిసినవారినిదేవుడు ముందుగానే నిర్ణయించారు (8:29) అనే మాటల గురించి కొందరు పండితులు ఇలా చెప్పారు దేవుడు ప్రపంచాన్ని సృష్టించకముందే ఎవరిని పాపవిముక్తికోసం తాను ఎన్నుకోబోతున్నాడో ఆయనకు తెలుసు. వారు చివరకు తన కుమారునిలాగా కావాలని ఆయన నిర్ణయించారు. వారిని ఎన్నుకున్నది వారు క్రీస్తులో నమ్మకం ఉంచుతారని గానీ తన సంకల్పానికి లోబడతారని గానీ తన భవిష్యత్ జ్ఞానం వల్ల ముందుగానే చూచి కాదు. తన కృప, జ్ఞానం ప్రకారం కొందరిని ఎన్నుకొన్నారు, కొందరిని తిరస్కరించారు. ఎవరిలోనైనా ఫలానా యోగ్యత లేక మంచితనం ఉందని ముందుగానే ఎరిగి వారిని ఎన్నుకోలేదు. ఎందుకంటే వారెవరిలోనూ అలాంటివి లేవు. తాను ఎన్నుకొన్న వారికంటే కొందరు చెడ్డవారుగా ఉంటారని ముందుగానే ఎరిగి వారిని ఎన్నుకోకుండా విడిచిపెట్టడం జరగలేదు. ఇదంతా ఆయన కృప, సర్వాధిపత్యాలకు సంబంధించిన విషయమేనని ఆ పండితుల వర్ణన. ఇది మొదటి వివరణ.  ఈ వివరణ మూలంగా తలెత్తే ఒక సమస్య ఇది మనుషులంతా పాపవిముక్తి పొందాలనే తన కోరికలను దేవుడు ప్రకటించారు కదా (11:32; 1 తిమోతి 2:3-6;  4:10;  2 పేతురు 3:9; యెహె 18:30-32). 
ఆయన తత్వమే ప్రేమ (1 యోహాను 4:8, 16). 
లోకమంతటినీ ప్రేమిస్తున్నానని ఆయన చెప్పారు (యోహాను 3:16). 
తన సృష్టి అంతటిమీదా తన వాత్సల్యం ఉన్నదని చెప్పారు (కీర్తన 145:9).

       మనుషులందరినీ ఆయన ప్రేమిస్తూ ఉంటే, అందరూ పాపవిముక్తి పొందాలని కోరుతూ ఉంటే, వారిని ఎన్నుకోవడం ద్వారా వారికి పాపవిముక్తి ఇవ్వగలిగి ఉంటే సహజంగానే ఈ ప్రశ్న వస్తుంది మరి అందరినీ ఆయన ఎందుకు ఎన్నుకోలేదు?” నిరంకుశ పాలకుడుగా కొందరిని ఎన్నుకొని, మరి కొందరిని వదిలిపెట్టడం ఆయన సర్వాధిపత్యం చక్కగా ప్రదర్శించినట్టు అవుతుంది గానీ ఆయన ప్రేమ, అందరూ పాపవిముక్తి పొందాలన్న ఆయన అభిలాష ఏమవుతాయి? జవాబులు చెప్పరాని ఇలాంటి ప్రశ్నలకు తావిస్తున్నది పైన చెప్పిన వివరణ. కాబట్టి కొందరు పండితులు దీన్ని త్రోసిపుచ్చారు. 

     దేవుని పూర్వ జ్ఞానం, పూర్వ నిర్ణయం అంటే అర్థం ఇది అని వారి అభిప్రాయం మనిషిని సృష్టించకమునుపు మనుషుల్లో ఎవరెవరు పవిత్రాత్మ ప్రభావానికి లొంగి తన కుమారునిలో నమ్మక ముంచుతారో దేవునికి తెలుసు. అలాంటివారు పాపవిముక్తి పొంది చివరికి క్రీస్తువంటి వారు కావాలని దేవుడు నిర్ణయించారు. కొందరు మనుషులకు ఇతరులకన్నా మంచి స్వభావం ఉంటుందని ముందుగా తెలిసి వారిని ఎన్నుకోవడం కాదు. లేక కొందరు కొంత పుణ్యం, యోగ్యత సంపాదించుకొని ముక్తికి అర్హులవుతారని కాదు. ఏమాత్రమూ కాదు 3:9-20, 24, 27; 4:5; ఎఫెసు 2:1-16; తీతు 3:3-7. పరుశుద్ధాత్మ మనుషులకు సమర్థత ఇవ్వకపోతే వారు క్రీస్తులో నమ్మకం ఉంచడమనేది కూడా సాధ్యం కాదు (యోహాను 6:29, 44; అపొ కా 13:48; ఫిలిప్పీ 1:29). కానీ దేవుని ఆత్మ మనుషుల హృదయాల్లో పని చేసినప్పుడు నమ్మకం విషయంలో వారు నిర్ణయించుకునేశక్తి ఇస్తాడు. వారి సంకల్పాలు దేవుని సంకల్పానికి ఎదురౌతాయి. దేవునితో అవునుఅని గానీ కాదుఅని గానీ చెప్పడానికి పరిశుద్ధాత్మ ద్వారా సామర్థ్యం పొందుతారు. అలాంటప్పుడు కొందరు దేవునితో అవునుఅంటారు, కొందరు అలా చెయ్యరు. దేవుని ఆత్మ సహాయం లేకుండా నమ్మడం కూడా సాధ్యం కానప్పుడు అవునుఅని చెప్పడం యోగ్యత క్రిందికి రాదు, యోగ్యత అయివున్నట్టు దేవుడు వారికి పాపవిముక్తిని ప్రతిఫలంగా ఇస్తారు అనుకోవడానికి వీలు లేదు. దేవుడు ఉచితంగా ఇచ్చేదాన్ని తీసుకోవడం యోగ్యత ఎలా అవుతుంది? పైగా దాన్ని తీసుకొనే సామర్థ్యాన్ని కూడా ఆయనే ఇస్తున్నప్పుడు అలా చెప్పగల అవకాశం అసలే లేదు. ఇచ్చినదాన్ని ఎవరైనా తీసుకున్నా అది ఇచ్చినదే గదా. తనను ఎవరు ఎన్నుకుంటారో, తాను ఉచితంగా ఇచ్చేదాన్ని ఎవరు తీసుకుంటారో దేవునికి ముందుగా తెలుసు. వారు క్రీస్తు పోలికలోకి మారాలని పూర్వ నిర్ణయం చేశాడు.  ఇది  రెండో వివరణ

    అయితే బైబిల్లో వెల్లడి అయిన ప్రేమమూర్తి దేవుని వ్యక్తిత్వానికి ఇది మొదటి వివరణ కంటే ఎక్కువ అనుగుణంగా ఉన్నట్టుంది, కాబట్టి రెండవ వివరణ అనేకమంది ఒప్పుకుంటారు.

       చివరికి నాశనానికి వెళ్ళిపోయేవారు దేవుడు పాపవిముక్తి కోసం వారిని ఎన్నుకోలేదు కాబట్టే అలా నశించిపోయారని తలంచడం,  సరిపెట్టుకోవడం కష్టం. తన ఆధిపత్యాన్ని మాత్రమే అనుసరించి వారిని పక్కకు నెట్టి వారిలాగానే పాపులైన మరికొందరిని ఆయన ఎన్నుకున్నాడని అనుకోవడం కష్టమైన సంగతి. కానీ దేవుని సంకల్పం, మానవ సంకల్పం తీరు తెన్నులు నిగూఢమైన విషయం. దాన్ని అర్థం చేసుకోవడం చాలా దుర్లభం. ఈ అంశం గురించి మన అభిప్రాయాలను బల్ల గుద్ది పిడివాదంగా చెప్పడం జ్ఞానం కాదనిపిస్తుంది. కొన్ని విషయాల్లో మనం చెప్పవలసినది 11:33-36లో పౌలుగారు చెప్పినట్లు చెప్పాలి: దేవుని బుద్ధిజ్ఞానాల సమృద్ధి ఎంత లోతైనది! ఆయన న్యాయ నిర్ణయాలు ఎంత అన్వేషించ లేనివి! ఆయన మార్గాలు ఎంత జాడ పట్టలేనివి! ప్రభు మనసు ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు? ఆయన మళ్ళీ ఇవ్వాలని ఆయనకు ముందుగా ఇచ్చినవాడెవడు? సమస్తమూ ఆయననుంచి, ఆయనద్వారా, ఆయనకే. ఆయనకే శాశ్వతంగా మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.

  కాబట్టి ఇంతకంటే ఎక్కువగా మనం ఆలోచించవద్దు! ఎవరిని రక్షించాలి, ఎవరిని వదిలెయ్యాలి అనేది దేవుని చిత్తం!మనపని సువార్త చెయ్యడం, వారికోసం ప్రార్ధించడం అంతే!!

ఈ పత్రికలో దేవుని రక్షణ ప్రణాళిక, దేవుని రక్షణ సిద్దాంతమును పౌలుగారు ఎంతో స్పష్టముగా వివరించారు. దానిని అర్ధం చేసుకుని మనమంతా దేవుని సువార్త వ్యాప్తిని చేద్దాం! సువార్త ప్రకటించక పోతే నాకుశ్రమ అంటున్నారు పౌలుగారు! అనగా సువార్త ప్రకటించకపోతే నీకు నాకు అందరికీ శ్రమ! కాబట్టి యేసుక్రీస్తు ప్రభులవారు ఇచ్చిన చివరి ఆజ్ఞ మీరు సర్వలోకానికి వెళ్లి సమస్త సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడును......
సువార్త ప్రకటిద్దాం! 
అనేకమందిని నాశానమునుండి జీవమునకు లాగుదాం! 
నడిపిద్దాం!

అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక!
*మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక*. 

*అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి,యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక.*
 *ఆమేన్‌!ఆమెన్!ఆమెన్!*
*************** **************************************************************************************
     ప్రియ దైవజనమా! రోమా పత్రిక ధ్యానముల ద్వారా దేవుడు మీతో మాట్లాడారని ఆశిస్తున్నాను. దేవుడు తమతో మాట్లాడారని ఎంతోమంది తెలియపరిచారు. అందుకే దేవునికి స్తోత్రము కలుగును గాక! ఈ పత్రిక వ్యాఖ్యానము, ఇంకా యోబుగ్రంధం గురించి వ్రాయడానికి నేను నిజంగా భయపడ్డాను. కారణం నాకు అంత పాండిత్యం లేదు. నేను బైబిల్ పండితున్ని కాను. అయితే ఒకరోజు పరిశుద్ధాత్ముడు రోమా పత్రిక మీద వ్రాయమని నన్నుబలపరిచారు. అప్పుడు ఇది వ్రాయడం జరిగింది. నేను ఇలా వ్రాయగలిగాను అంటే నా తెలివి పాండిత్యము ఎంతమాత్రము కాదు. అది కేవలం పరిశుద్దాత్ముని తోడ్పాటు అంతే! ఆయన గాడిదను వాడుకుని ప్రవక్తకు బుద్ది చెప్పిన వాడు! అలాగే ఈ మట్టి పురుగును వాడుకుని ఈ పత్రిక ధ్యానం వ్రాయించుకున్నారు. సమస్త మహిమ ఘనత ఆయనకే చెందును గాక! నాకోసం ప్రార్ధిస్తున్న మీ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు! నా కోసం, నా పనికోసం, మా పరిచర్య కోసం, సోషల్ మీడియా పరిచర్య కోసం, వెబ్ సైట్ కోసం ప్రార్దించండి.
"దైవజనుడా" అనే శీర్షికతో మరలా కలుసుకుందాం!
 దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్!
ఇట్లు
ప్రభువునందు మీ ఆత్మీయ సహోదరుడు
రాజకుమార్ దోనే.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అబ్రాహాము విశ్వాసయాత్ర

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

పొట్టి జక్కయ్య

శరీర కార్యములు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

సమరయ స్త్రీ

యేసు క్రీస్తు రెండవ రాకడ

పాపము

బాప్తిస్మం