రోమా పత్రిక - పార్ట్-2

*రోమా పత్రిక-26వ భాగం*
*మరణపాత్రులు-8*
  
      రోమా 1:2932 .
29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై 
30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును 
31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. 
32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు..

    ప్రియులారా! తర్వాత కేడర్:
9. *అవివేకులు*: అనగా తెలివితక్కువ వారు. వివేకం లేని వారు. ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియకుండా మాట్లాడేవారు. తల్లితో ఏంమాట్లాడాలో, చెల్లితో ఎలా మాట్లాడాలో, పిల్లలతో ఏం మాట్లాడాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రవర్తించేవారు.  కీర్తనలు 74:22 ప్రకారం అవివేకులు దినమెల్ల నిందిస్తూ ఉంటారు. కీర్తనలు 92:6
పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు.;  యిర్మియా 4:22 ప్రకారం దేవుణ్ణి ఎరుగని వారు, అనగా దేవుని మహిమను, ఆయన ప్రేమను అర్ధం చేసుకొని వారు అవివేకులు!  యిర్మియా 10:8: జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు!  ఇక ఎఫెసీ 5:17 ప్రకారం దేవుని చిత్తమేమిటో గ్రహించని వారు అవివేకులు! కీర్తన 74:18 అవివేక ప్రజలు దేవుని నామమును దూషిస్తారు. సామెతలు 12:23 
వివేకియైనవాడు తన విద్యను దాచి పెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు.
యేహెజ్కేలు 13:3
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దర్శనమేమియు కలుగ కున్నను స్వబుద్ధి ననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ.
ఈ అవివేకులు కూడా మరణపాత్రులు అని గ్రహించాలి!

10. *మాట తప్పువారు*: మాట ఇచ్చి తప్పిపోయే వారు, మాటను నిలబెట్టు కోలేకపోయిన వారు. బహుశా మనమంతా ఈ కోవకు వస్తాము. బాప్తిస్మం తీసుకున్నప్పుడు గాని, లేక ఏదైనా రోగం వస్తే దేవునికి మాటిస్తాము: ప్రభువా! ఈ ఒక్క కార్యము చేయు ప్రభువా! జీవితాంతం నీ సన్నిధి మానము, దశమ భాగం క్రమంగా ఇస్తాము.  ప్రతీకూటముకి వెళ్తాము. ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పేస్తావు. ఆ రోగం పోయాక లేక ఆ మేలు పొందుకున్నాక, లేక ఉద్యోగం వచ్చాక దేవుని సన్నిధి మరచిపోతావు. దశమభాగాలు మరచిపోతావు. ప్రార్ధన ఏదో మొక్కుబడిగా చేసి అయిపొయింది అనిపించుకుంటావు. మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం పోయింది. మరి ఇది మాట తప్పడం కాదా??!!! మాట తప్పేవారు నరకపాత్రులు, మరణపాత్రులు అని మరచిపోవద్దు! కీర్తనల గ్రంధం నష్టము కలిగినను అతడు మాట తప్పడు!!! 15:4; అది జీవితం, పౌరుషం అంటే! అలా ఉండాలి నీ బ్రతుకు! యాకోబుగారు తన మామ దగ్గరకు వెళ్ళేటప్పుడు మాట ఇచ్చారు దేవుడికినాకు అన్నవస్త్రాలు ఇస్తేనేను మరల వచ్చినప్పుడు ఈ రాయి నీ మందిరం అవుతుంది. ఇది చేస్తాను అది చేస్తాను అని. ఆదికాండం 28:20--22; గాని మరచిపోయారు. చివరకు దీన రేప్ చేయబడి అవమానించబడ్డాక దేవుడు గుర్తుచేస్తే అప్పుడు చేశారు ఆయన! మనం ఆలాగుండకూడదు. పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోయాడు! ఆదికాండం 42; యోఫ్తా మాట ఇచ్చాడు: నేను గెలిస్తే నా ఇంతనుంది నాకు ఎదురుగా వచ్చినదానిని నీకు బలి ఇస్తాను. గెలిచాక తన కూతురు ఎదురొస్తే, బాధపడ్డా, గాని వెళ్లి కూతురుని బలి ఇచ్చేశాడు. న్యాయాధిపతులు 11; అదీ మాట తప్పకపోవడం! పేతురుగారు యేసయ్యకు మాట ఇచ్చారు: నీకోసం అవసరమైతే చావనైనా చస్తాను గాని నిన్ను నేను ఎరుగను అనను! గాని అదేరోజు ముమ్మారు యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకారు. లూకా 23; యోహాను 13;. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. నీ పరిస్తితుల బట్టి నీ మాట మారిపోకూడదు. దేవుడు కూడా అలా మాట మార్చితే నీ బ్రతుకు ఏమవుతుంది??!!  అననీయ సప్పీర వారికి కలిగిన భూమి అమ్మి దేవుడికి ఇస్తాము అని మాట ఇచ్చారు. అమ్మాక సగం దాచుకుని సగం తెచ్చారు. దేవుని మందిరంలోనే చచ్చారు. ఇదే మరణపాత్రులు అంటే! అపొస్తలుల 5;

11. *అనురాగ రహితులు*: అనగా జాలి చూపని వారు, దయచూపని వారు అనే అర్ధం వస్తుంది. నిర్దయులు కూడా ఇదే అర్ధం! దేవునికున్న గుణగణాలలో ఒకటి జాలి! గాని నేడు జనాలు జాలి దయ అనేది మరచిపోతున్నారు. 2తిమోతి 3:15 
1. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. 
2. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు 
3. *అనురాగరహితులు* అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు 
4. ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు, 
5. పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము. . . . ఈ చివరి రోజులలో ప్రజలు ఇలాగే మారుతున్నారు. ఇతరులమీద జాలి చూపడం లేదు సరికదా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. జాలిపడటం లేదు! సరికదా ముసలి తల్లిదండ్రులను కొట్టేవారు కూడా నేటిదినాల్లో బయలుదేరారు. వీరిమీదకు దేవుని ఉగ్రత అనే పెనుగాలి రాబోతుంది. దేవుడు ఒకమాట చెబుతున్నారు. దయగల వారికి ఆయన దయచూపించును. కటినుల యెడల విముఖత చూపించును. కీర్తనలు 18:25; కాబట్టి ఎవరైతే జాలి, కనికరం, దయ చూపిస్తారో అట్టివారియెడల దేవుడు కూడా జాలి, దయ కనికరం చూపిస్తారు. దేవుడు అంటున్నారు నీవు చేసినట్టే నీకు కూడా జరుగుతుంది. యెహేజ్కేలు 16:59; ఓబద్యా 1:15; నీవు జాలి చూపిస్తే జాలి చూపించబడుతుంది. నీవు చూపించకపొతే నీకు కూడా జాలి చూపించబడదు! అంతే!! పెద్ద కబుర్లు చెప్పే యాజకుడు గాని, లేవీయుడు గాని దొంగలతో దెబ్బలు తిన్న వ్యక్తిని ఆదరించలేదు గాని ఒక మంచి సమరయుడు ఆ వ్యక్తిమీద జాలి చూపించి, పొరుగువాడయ్యాడు! లూకా 10; దేవుని దృష్టిలో నీతిమంతుడు కాగలిగాడు. నీవుకూడా అదే జాలి,దయ కనికరం చూపించ బద్దుడవై ఉన్నావు. మనం మంచివారం కాదు, దేవుని దృష్టిలో ఎన్నికలేని వారం. మాటిమాటికి దేవునికి కోపం పుట్టిస్తున్నాం మన పనుల ద్వారా! గాని దేవుడు కరుణామయుడు కాబట్టి జాలిపడి మనలను క్షమిస్తూ వస్తున్నారు. దేవుడు ఒకవేళ జాలిపడకపోతే మన గతి ఏమవుతుంది??!! కాబట్టి దేవుని గుణలక్షణమైన జాలి, దయను అలవరచుకుందాం! లేకపోతే మరణపాత్రుడవు అని మరచిపోవద్దు!

  కాబట్టి ప్రియ సహోదరి/ సహోదరుడా! నీవు ఏ గుంపులో ఉన్నావు? బహుశా పైన ఉదాహరించిన గ్రూపులో ఉంటే మరచిపోకు నీవు మరణపాత్రుడవు! మనుష్యుల బ్రష్ట స్తితికి ఖచ్చితమైన నిదర్శనం ఏమిటంటే: వారికి మంచిచెడుల గురించి తెలిసినా, పాపానికి దేవుడు శిక్ష విధిస్తారు అని తెలిసినా వారి పాపము నుండి, బయటకు రాకుండా చివరికి తీర్పుకు పోవడం! తమ పాపాలలో వారు కొనసాగుతూ, చివరకు ఆ పాపాలలోనే ఆనందిస్తూ, ఆత్మీయ దృష్టి కోల్పోయి, ఆత్మీయ మరణం పొందుతారు. చివరికి నిత్య నాశనానికి పోతారు. వారికి ఇక రక్షణ లేదు! 
  ప్రియ స్నేహితుడా! మరి వీరంతా నరకానికి పోవలసినదేనా? ఎంతమాత్రము కాదు! మరి ఎలా? 
1.  వారికోసం  కన్నీటితో ప్రార్ధించాలి. 
2. వారికి సువార్త చెప్పాలి. మార్పు చెందమని బోధించాలి. నీకు ఎన్ని అవమానాలు ఎదురైనా లెక్కచేయకుండా నీ పని నీవు చేయు! హెబ్రీయులకు 4: 12
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.
 మరినీవు చేస్తావా? వారి రక్షణకోసం పాటు పడతావా? ఒకవేళ నీవే ఈ స్తితిలో ఉంటే అనగా పైన ఉదాహరించిన లక్షణాలతో ఉంటే మరణపాత్రుడవు కాబట్టి మార్పునోంది, పాపములు ఒప్పుకుని, విడచిపెట్టు! 
సిలువను ఆశ్రయించు! 
ఆయన నీ పాపములను క్షమించడానికి ఇష్టపడుతున్నారు. 
మరి వస్తావా?
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-27వ భాగం*
*దేవుని తీర్పు-1*
      రోమా 2:12
1. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? 
2. అట్టికార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము. 
  ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం రోమా పత్రిక మొదటి అధ్యాయం నుండి ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనం రెండో అధ్యాయం కొన్ని దినాలు ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయమంతా సాధారణంగా దేవుని తీర్పులతో నిండి ఉంటుంది. 2:116 వరకు దేవుని రాబోయే తీర్పులు చూసుకోవచ్చు! వివరంగా చూసుకుంటే 2:14 : వేషదారులకు దేవుని తీర్పు రాబోతుంది.  సరే వివరంగా చూసుకుందాము!

    ఈ వచనాలు జాగ్రత్తగా చూసుకుంటే తీర్పుతీర్చు మనుష్యుడా అంటున్నారు. తీర్పుతీర్చు మనుష్యుడా నీవు తీర్పు తీరుస్తున్నావు కాబట్టి నిరుత్తరుడవై యున్నావు, అనగా సాకు చెప్పలేనివాడవై యున్నావు. లేక తప్పించుకోలేని వాడవై యున్నావు, ఎందుకు? కారణం తీర్పుతీర్చే నీవుకూడా అదే పని చేస్తున్నావు కాబట్టి మొదటగా నీవు కూడా తప్పించుకోలేవు; రెండు: తీర్పుతీర్చుతున్నావు కాబట్టి నీవుకూడా అదే తప్పుచేస్తున్నావు కాబట్టి ఆ తీర్పు నీకే చెందుతుంది, అనగా నీకునీవే తీర్పు తీర్చుకుంటున్నావు. మూడవదిగా తీర్పు తీర్చడం దేవుని పని అని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు నీవు తీర్పుతీర్చుతున్నావు అంటే దేవుని స్థానం లోకి నిన్నునీవు కూర్చో బెట్టుకుంటున్నావు అన్నమాట!

    ఇతరులకు తీర్పు తీర్చడం ద్వారా తమకు మంచిచెడులు తెలుసు అని మనుష్యులు కనబరచుకొంటారు. మనలో చాలామంది అలా చేస్తారు.  నీకు ఇతరులు చేసేది తప్పుగా కనిపిస్తే , ఇప్పుడు అది నీవు తీర్పుతీర్చితే అది నీవుకూడా చేస్తున్నావు అది నీలోకూడా తప్పే! కనుక వారికితీర్పు తీర్చడం ద్వారా మనకు మనమే తీర్పుతీర్చుకుంటున్నాం! అందుకే యేసుక్రీస్తు ప్రభులవారు చెబుతున్నారు:Matthew(మత్తయి సువార్త) 7:1,2,3,4,5
1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. 
2. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. 
3. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? 
4. నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల? 
5. వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. 

    తీర్పుకోసం బైబిల్ ఏమని చెబుతుంది? మొదటగా: పాత నిభందన గ్రంధం నుండి: దేవుడు ఆబ్రాహాముగారితో నిబంధన చేస్తూ నీ సంతానం 4౦౦ సంవత్సరాలు బానిసలుగా ఉంటారు.  వారు ఎవరికి దాసులవుతారో వారికి నేనే తీర్పు తీర్చుతాను అని సెలవిచ్చారు ఆదికాండం 15:14 లో. ఈ వాగ్దానం 50౦ సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఆయన నిజంగా తీర్పుతీర్చారు 10 రకాలైన తెగుళ్లచేత వారిని మొత్తారు, నిర్గమ 314 అధ్యాయాలు. అనగా మొదటగా తీర్పు తీర్చుట అనేది దేవుడే చేశారు.  
కయీను హేబెలును చంపినప్పుడు రక్తం ప్రార్ధన చేసింది : అయ్యా! నాకు న్యాయం తీర్చవా అని! దేవుడే వెంటనే ఆకాశం నుండి దిగివచ్చి- కయీనుకు తీర్పు తీర్చారు అనగా శపించారు, ఆదికాండం 4;.
 దేవుడు నీతిన్యాయాలు కలిగిన దేవుడు! దేవుడు ధర్మశాస్త్రమిచ్చేటప్పుడు నిర్గమ 23:6 దరిద్రుని వ్యాజ్యెములో న్యాయము విడచి తీర్పు తీర్చకూడదు అంటున్నారు.
 లేవీ 19:35
తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.
 ద్వితీ 27:19
పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
 తీర్పు తీర్చడానికి న్యాయాదిపతులను నియమించి రాజు అంటున్నాడు:  
2 దిన 19:67
6. మీరు యెహోవా నియమమునుబట్టియే గాని మనుష్యుల నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతో కూడ నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. 
7. యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు,ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. . .. . . యోబు 21:22 పరలోకవాసులకు ఆయన న్యాయము తీర్చును.  కీర్తనలు 7:8,11 .యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. 
11. న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. . . . ; 9:3; 67:8; 9:8
8. యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.  . 75:2.
 75:7 దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును . . . ., 82:1,2
1. దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. 
2. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపుదురు?(సెలా.) . . .; 96::13; 98:9. వీటన్నిటి ప్రకారం దేవుడు ప్రతీ ఒక్కరిని నాయపు తీర్పు తీర్చుతారు. ఇంకా ఎన్నో వచనాలున్నాయి. మొదటగా దేవుడే తీర్పుతీర్చువాడు. రెండవదిగా ఒకవేళ తీర్పు తీర్చడానికి ప్రభుత్వం ద్వారా అధికారం పొందిఉంటే న్యాయమును, నీతిని అనుసరించి తీర్పు తీర్చాలి. కారణం నీవుకూడా అదే శిక్షావిధిలో ఉన్నావు!!

    అయితే క్రొత్త నిభందనలో యేసుక్రీస్తు ప్రభులవారు చెబుతున్నారు: మత్తయి 7:12  మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. 
2. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.   . . .,; 
లూకా 6:37
తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు;., లూకా 19:22 చెడ్డదాసుడా నీనోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చెదను! రోమా 2:12 
ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.; 14:34,10,13
3. తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను. 
4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. 
10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము. 
13. కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి.  . .; 
1 కొరింథీ 4:5
5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.; 
6:23
2. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసి యుండగా, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? 
3. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరిముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?; 11:32
31. అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. 
32. మనము తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము., కొలస్సీ 2:16 
16. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. యాకోబు 2:13 
13. కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును. ; 3:1
1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ...

   కాబట్టి ప్రియ సహోదరి/ సహోదరులారా! ఇతరులకు తీర్పు తీర్చడం అనగా విమర్శించడం మానేద్దాం! అలాచేసి అంత్యతీర్పును తప్పించుకుందాం! కారణం అంత్య తీర్పు ఉంది అని బైబిల్ ఎన్నోసార్లు చెప్పింది    యెషయా 2; దానియేలు 7:22; 8:14; యోవేలు 3:12,14; మీకా 4:3; ఇక యేసుప్రభులవారు గొర్రెలు మేకలు ఉపమానం ద్వారా తీర్పు ఉంటుంది అని సెలవిచ్చారు. మత్తయి 25; 2 తిమోతి 4:1; ప్రకటన 11:18; 20:12
మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.
12. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

   కాబట్టి మనలను మనం సరిచేసుకుందాం! మనలో దేవునికి ఆయాసం కలిగించేవి మనలోనుండి తీసేద్దాం! ఇతరులకు తీర్పుతీర్చడం, ఇతరులను విమర్శించడం మానేద్దాం!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-28వ భాగం*
*దేవునితీర్పు-2*
  
      రోమా 2:23
2. అట్టికార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము. 
3. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అను కొందువా? 

  ప్రియ దైవజనమా! గతభాగం నుండి 116 వచనాలలో గల దేవుని న్యాయమైన తీర్పుకోసం ధ్యానం చేసుకుంటున్నాం.  ఇక్కడనుండి పౌలుగారు ఈ తీర్పుకోసమైన 7 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నారు.

1). ఆ తీర్పు మనుష్యులు అనుకున్నట్లుగా కాకుండా దేవుని సంగతుల ద్వారా వాస్తవాలపై ఆధారపడి యుంటుంది. (2వ వచనం)
2) అది న్యాయ సమ్మతమైన తీర్పు. అది దేవుని నిభందనలు అనుసరించి ఆ తీర్పు ఉంటుంది. కారణం తీర్పులు తీర్చే నీవే ఆ పని చేస్తున్నావు కాబట్టి దేవుని తీర్పు నీవు తప్పించుకోగలవా? (3)
3) దేవుని అనుగ్రహము నిన్ను మారుమనస్సు పొందే అవకాశం ఇస్తే దానిని దేవుని చేతకానితనంగా తలస్తున్నావా? (4,5)
4) మనుష్యులు చేసే క్రియలను బట్టే ఆ తీర్పు ఉంటుంది. ప్రతీవానికి వానివాని క్రియలను బట్టి ఆ తీర్పు ఉంటుంది. (6) దేవునికి పక్షపాతం లేదు. తెల్లోడా, నల్లోడా, యూదుడా, గ్రీసు దేశస్తుడా అనేది దేవుడు చూడరు. (611)
5) ధర్మశాస్త్రం కలిగి అనగా ధర్మశాస్త్రం తెలిసి పాపం చేస్తే ధర్మ శాస్త్రప్రకారమే తీర్పు ఉంటుంది. ధర్మశాస్త్రం తెలియకుండా పాపం చేస్తే ధర్మశాస్త్రం లేకుండానే వారి హృదయ తీర్పులను బట్టి, మనస్సాక్షి గద్దింపును బట్టి తీర్పు ఉంటుంది. (12-14)
6) ఆ తీర్పు పౌలుగారు నొక్కివక్కానించే సువార్తకు అనుగుణంగా ఉంటుంది తీర్పు. అనగా సువార్తను అంగీకరించువారికి ఒకలా, సువార్తను అంగీకరించకుండా తృణీకరించువారికి గాడాంధకారం , అగ్ని మయమైన నరకంలో యాతన!(15,16)
7). ఈ తీర్పు దేవుని తీర్పు దినమందు అనగా అంత్యకాలమందు జరుగుతుంది.

       ఇప్పుడు మనం ఈ ఏడు విషయాల కోసం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం!
1). *ఈ తీర్పులు మనుష్యులు అనుకున్నట్లుగా కాకుండా దేవుని సంగతులద్వారా వాస్తవాలపై ఆధారపడి ఉంటాయి*. రెండోవచనంలో అవిచేసే వారికి వ్యతిరేఖంగా దేవుని తీర్పు రావడం న్యాయబద్దమైనదే అంటున్నారు. కారణం ఏమిటంటే దేవుడు ముందుగానే వారించారు. తన వాక్యం ద్వారా, ధర్మ శాస్త్రం ద్వారా, తన ప్రవక్తలద్వారా, సేవకుల ద్వారా వారికి మాటిమాటికి చెబుతున్నా సరే, వారు వినడం లేదు కాబట్టి వారి మీదకు తీర్పు వస్తుంది. అంతేకాకుండా వీరే నీతిమంతులు అయినట్లు ఇతరులకు తీర్పుతీర్చుతూ, వారిని విమర్శిస్తున్నారు కాబట్టి వారి మీదకు వచ్చే దేవుని తీర్పు న్యాయబద్దమైనదే!

2) *అది న్యాయ సమ్మతమైన తీర్పు. అది దేవుని నిభంధనలను అనుసరించి ఉంటుంది. ఇతరులకు తీర్పు తీర్చునీవు అదేపని చేస్తూ, దేవునితీర్పు తప్పించుకోగలవా*? అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవునితీర్పు తప్పించుకొందువా?(3)  ఇతరులకు తీర్పు తీర్చడం ఎంతో సులువు. నీదాకా వస్తే తెలుస్తుంది.  కొంతమంది ఇతరులు తప్పుచేస్తున్నారు అంటూ చెబుతూ తమదృష్టికి తామే నీతిమంతులమని వారికివారే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటారు. ఇది చాలా పొరపాటు.  ఇతరులకు తీర్పు తీరుస్తున్న నీవు నీకునీవే తీర్పు తీర్చుకుంటున్నావు అని మరచిపోకు కారణం నీవుకూడా అదే తప్పులు చేస్తున్నావు. అంతేకాకుండా నీకు, అందరికీ తీర్పు తీర్చే సర్వలోక న్యాయాధిపతి ఉన్నారని, ఆయన తొందరలో నీకు నాకు అందరికీ తీర్పుతీర్చ బోతున్నారని మరచిపోకు! 
 అపో.కార్యములు 17: 31
ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
 2కొరింథీ 5:10
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
 ప్రకటన 20:1112 
11. మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను. 
12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి. . . .

   కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చుచున్న నీవు తప్పించుకోలేవు. నీవుకూడా తీర్పుతీర్చబడతావు!! ఒకసారి బైబిలులో కొందరు వ్యక్తులను గుర్తుకుచేసుకుందాం! సౌలురాజు నీతిమంతుడైన దావీదుగారిమీద కక్ష్య కట్టి ఎంతగానో తరిమాడు. చంపాలని అనుకున్నాడు. చివరకు పరాయి వారిద్వారా చంపబడ్డాడు. సౌలురాజు తప్పించుకోలేకపోయాడు. సంసోను తప్పించుకోలేకపోయాడు. యరోబాముని దేవుడు రాజుగా చేస్తే, దేవుణ్ణి వదలి విగ్రహాలను ఆశ్రయించి, ఇశ్రాయేలు వారిని కూడా త్రోవ తప్పించాడు. దేవుడు చెప్పినా వినలేదు. కుక్కచావు చస్తావని దేవుడు చెప్పారు. కుక్కచావు చచ్చాడు. యరోబాము తప్పించుకోలేకపోయాడు.  ఆహాబురాజు తప్పించుకోలేకపోయాడు. ఉజ్జియా రాజు చాలా మంచోడు. కాని తర్వాత మనసున గర్వించి చెడిపోయాడు. యాజకుల సేవ పరిచర్య కూడా తనేచేయాలని అనుకున్నాడు. కుష్టరోగం పాలయ్యాడు. మంచోడే కాని తప్పించుకోలేకపోయాడు!!  నెబుకద్నేజర్ విర్రవీగాడు. దేవుడు దర్శనం ద్వారా హెచ్చరించారు. అయినా వినలేదు. మనస్సున గర్వించాడు. పశువులా ఏడు సంవత్సరాలు గడ్డిమేశాడు. నెబుకద్నేజర్ తప్పించుకోలేకపోయాడు. ఇంతమంది తప్పించుకోలేకపోయారు. ఆఫ్టరాల్ నీవు తప్పించుకోగలవా???!!! ఇదీ పౌలుగారి ప్రశ్న! 

ప్రియ స్నేహితుడా! ఒకవేళ ఈకోవలో నీవుంటే దయచేసి అర్ధం చేసుకో! నీవుకూడా తప్పించుకోలేవు ఆ న్యాయమైన తీర్పు! ఆ తీర్పు నీగృహాన్ని తాకకముందే నేడే మార్పునొంది, పాపమును విడచి, పశ్చాత్తాపపడి దేవుని పాదాలు పట్టుకో! నీ గర్వాన్ని, బడాయిని, ఈగోని వదిలేసెయ్! అయ్యా పాపిని అని చెప్పి దేవుని పాదాలను, దేవుని సిలువను ఆశ్రయించు! దేవుడు నిన్ను చేర్చుకోడానికి సిద్దంగా ఉన్నారు. లోబడనొల్లని పిల్లలకోసం దినమెల్ల ఆయనచేతులు చాపి పిలుస్తున్నారు. యెషయా 65: 2
తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను.
 ఆయన స్వరం వింటావా? 
ఆయనకు నీ హృదయంలో చోటిస్తావా?
 నిన్ను తగ్గించుకొంటావా? 
అయితే నీవు ధన్యుడవు!

అట్టి తగ్గింపు దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!
*రోమా పత్రిక-29వ భాగం*
*తీర్పు-3*
  
      రోమా 2:4--5
4. లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా? 
5. నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. 

  ప్రియ దైవజనమా! గతభాగం నుండి 116 వచనాలలో గల దేవుని న్యాయమైన తీర్పుకోసం ధ్యానం చేసుకుంటున్నాం.  ఇక్కడనుండి పౌలుగారు ఈ తీర్పుకోసమైన 7 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నారు.

3) *దేవుని అనుగ్రహము నిన్ను/నీకు మారుమనస్సు పొందే అవకాశం ఇస్తే దానిని దేవుని చేతకాని తనంగా తలస్తున్నావా*? (4,5)

            ప్రియులారా! ఇక్కడ పౌలుగారు చెప్పే మూడవ ప్రాముఖ్యమైన విషయం చూడండి. దేవుని అనుగ్రహము  నీకు మారుమనస్సు పొందే అవకాశం నీకిస్తే ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? *అవును నీకు నాకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చారు మారుతాడు కదా అని దేవుడు సహిస్తూ ఉంటే, మన దేవుడే కదా, మనం ఏం చేసినా క్షమించేస్తాడు. పాపాలు అన్ని చేసి, దేవుడా క్షమించేయ్ అని ఒక మొక్కు మొక్కేస్తే కరిగిపోయి క్షమించేస్తాడు అని ఆయన ప్రేమను సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తక్కువ చూపు చూస్తున్నావ్ కదూ*!  లేకపోతే ఈ పాదిర్లు, సేవకులు, కాపరులు అలాగే అంటారు ఏమీ జరుగదు. మనం మనకు నచ్చినట్లు ఉంటే ఏమీ పర్వాలేదు అని అనుకొంటున్నావేమో?!! 
మొదటగా అంతటా అందరూ మారుమనస్సు పొందాలని ఇంకా ఇంతవరకు సహనముతో ఎదురుచూస్తున్నారు అని తెలుసుకో!2పేతురు 3: 9
కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.
 తర్వాత , ఎన్నిమార్లు గద్ధించిననూ విననివాడు మరితిరుగు లేకుండా హటాత్తుగా నాశనమవుతాడు అని మర్చిపోకు! సామెతలు 29:1;

    దేవుని దయను, ఆయన రక్షణ పిలుపుని ప్రణాలికను ప్రజలు ఎలా చిన్నచూపు చూస్తున్నారో యేసుప్రభులవారు తన ఉపమానంలో చెప్పారు. ఈ ఉపమానం ద్వారా మనుష్యులు ఆయన పిలుపును అశ్రద్ధ చేస్తూ ఆయన సువార్తనూ, ఆయన కుమారున్ని తిరస్కరించడం ద్వారా ఎలా నరకపాత్రులు, మరణపాత్రులు, శిక్షకు పాత్రులు అవుతారో ఆయన తన ఉపమానంలో ముందే చెప్పారు. మత్తయి 22:113; లూకా 14:1624 లో ఇది వ్రాయబడింది. 
మత్తయి సువార్త 22:2--14
2. పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది. 
3. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. 
4. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దులును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని 
5. వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి. 
6. తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. 
7. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను. 
8. అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు. 
9. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడువారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. 
10. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడినవారి నందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లిశాల నిండెను. 
11. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి 
12. స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియై యుండెను. 
13. అంతట రాజువీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. 
14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.  . . . . . 
ఈ ఉపమానంలో మొదటగా ఆయన పిలుపును, విందును నిర్లక్ష్యం చేశారు. అనగా దేవుని సువార్తను, రక్షణ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేశారు. వీరు ఎవరు? రాజు గారి ముఖ్య స్నేహితులు! పరాయివారు, ఆయనకోసం తెలియనివారు కారు! అలాగే ఈ ఉపమానంలో ఉదహరించబడినవారు దేవునికోసం తెలియని వారు కాదు. దేవుడు తెలుసు, ఆయన అద్భుతాలు తెలుసు! ఆయనతో సహవాసం చేసిన వారే! ఆయన పరలోకం ఇచ్చేవాడు అని తెలుసు! పరలోకానికి ఆయన ఒక్కడే మార్గం అని తెలుసు గాని నిర్లక్ష్యం, గీర, మన దేవుడే కదా, ఏమీ అనడులే అనే ధీమా, గర్వం! అందుకే వారు దేవుని సువార్తను రక్షణ ప్రణాలికను గౌరవించక సాకులు చెబుతున్నారు. దేవుని విందుకు రండి అంటే ఈ లోక విషయాలలో నిమగ్నమైయున్నారు. ఒకడు భూసంభందమైన వస్తువాహనాలు, ఆస్తి అంతస్తులపై లక్ష్యముంచాడు. మరొకడు పెళ్లి చేసుకుని శారీరక సుఖం కోసం దేవుని పిలుపును నిర్లక్ష్యం చేశాడు. మరొకడు వ్యాపారం కోసం చూసుకున్నాడు.   ఇక ఈ ఉపమానంలో కొంతమంది దాసులను కొట్టినట్లు చూస్తాం అనగా దేవుని పిలుపును హెచ్చరికను, ఉన్నది ఉన్నట్లుగా భోధించే తన దాసులను హేలనచేసి కొట్టి అవమానించే వారు ఉంటారని దేవుడు ముందుగానే చెప్పారు.  ఈ రెండు విన్న రాజుకి కోపం వచ్చింది. అందుకే దండును పంపి వారిని సంహరించమని చెప్పారు. మొదటగా దేవుని పిలుపును, రక్షణను నిర్లఖ్యం చేసారు, రెండవదిగా తనదాసులను కొట్టారు. అందుకే దండును పంపి దుర్మార్గులను హతం చేశారు. అలాగే నేటిరోజులలో సువార్తను, ఆయన పిలుపును నిర్లక్షం చేసేవారు ఎవరైనా సరే, దేవుని తీర్పు ఏంటంటే వారి మీదకు దేవుని ఉగ్రత రాబోతుంది. వారిని దేవుడు దండించబోతున్నారు సరికదా పరలోకరాజ్యం కోల్పోయి నరకపాత్రులు కాబోతున్నారు.  అందుకే పౌలుగారు చెబుతున్నారు ఇంతగొప్ప రక్షణను నిర్లక్షం చేసిన యెడల ఎలాగు తప్పించుకొందువు? హెబ్రీ 2:3;  గమనించు! నీవు నిర్లక్షం చేస్తే దేవుని ఉగ్రతను, తీర్పును తప్పించుకోలేవు!  ఒకసారి దేవుని గుణగణాలు గుర్తుకు తెచ్చుకుందాం! 
నిర్గమ 34:67 
6. అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. 
7. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను.  . . . .
ఆయన ప్రేమను,  జాలిని ఎలాగు గుర్తుకు తెచ్చుకుంటున్నావో ఆయన ఉగ్రతను కూడా మరచిపోకు!

   అందుకే దేవుడు/ యేసుక్రీస్తు ప్రభులవారు మాటిమాటికి పరలోక రాజ్యం సమీపించియున్నది మారుమనస్సు లేక పశ్చాత్తాప పడండి అంటూ బోధించేవారు! మత్తయి 3:2; 8; లూకా 13:15 లో చెప్పిన ఉపమానం సరిగ్గా సరిపోతుంది. 
2. ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారా? 
3. కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు. 
4. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్న వారందరికంటె అపరాధులని తలంచుచున్నారా? 
5. కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.  .

    కాబట్టి ప్రియ సహోదరి/సహోదరుడా! దేవుని న్యాయమైన తీర్పు రాబోతుంది. ఆయన ప్రేమను సహనాన్ని నిర్లక్షం చేయకు!
 దేవుని న్యాయమైన తీర్పు దినం ఒకటుంది.  ఒకవేళ నీవు పశ్చాత్తాప పడకపోతే, మార్పు చెందకపోతే  ఆ తీర్పుదినం కోసం నీకునీవే ఉగ్రతను పోగుచేసుకుంటున్నావు అని తెలుసుకో! కాబట్టి నేడే పశ్చాత్తాపపడు!  
యేసయ్య పాదాలు పట్టుకో! 
కోరహు కుమారులు తమ కుటుంబం మీదకు వచ్చిన ఉగ్రతను తప్పించుకోడానికి బలిపీటపు కొమ్ములను పట్టుకొన్నట్లు నేడు నీవు నీ ప్రార్ధనా బలిపీటాన్ని కట్టి అ బలిపీటపు కొమ్ములు అనగా యేసయ్య సిలువను ఆశ్రయించు! ఇదే అనుకూల సమయం! 
నేడే రక్షణ దినం!

ఆమెన్!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-30వ భాగం*
*దేవునితీర్పు-4*

      రోమా 2:6
ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.
  ప్రియ దైవజనమా! గతభాగం నుండి 116 వచనాలలో గల దేవుని న్యాయమైన తీర్పుకోసం ధ్యానం చేసుకుంటున్నాం.  ఇక్కడనుండి పౌలుగారు ఈ తీర్పుకోసమైన 7 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నారు.

4) నాల్గవ విషయం: *మనుష్యులు చేసే క్రియలను బట్టి దేవుని తీర్పు ఉంటుంది.  వానివాని క్రియలను బట్టి తీర్పు ఉంటుంది*

            ప్రియులారా! ఇది  పౌలుగారు చెప్పిన 4వ ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈ మాట ఆయన సొంతమాట ఎంతమాత్రమూ కాదు. అనేక సార్లు మీకు గుర్తుచేయడం జరిగింది. పౌలుగారు Sanhedrin సభలో సభ్యుడు! అనగా మన దేశ పార్లమెంటరీ వ్యవస్థ ఎలాగో, ఆ దేశంలో ఈ వ్యవస్థ అలాంటిది. దానిలో సభ్యత్వం పొందాలి అంటే ధర్మశాస్త్ర పండితుడై ఉండాలి. కాబట్టి పౌలుగారికి ధర్మశాస్త్రం మీద, లేఖనాల మీద సంపూర్ణ పట్టు ఉంది. దానితోనే ఆయన ఈమాట అంత ధైర్యంగా వ్రాస్తున్నారు.  ఆయన ప్రతీవానికి వానివాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును! ఇదే విషయాన్ని బైబిల్ ముందే చెప్పింది: మొట్టమొదటగా కీర్తనలు 62:12 లో ఈ మాట వ్రాయబడింది.
ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.
సామెతలు 24:12 
ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహిం చును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.

 ఒకవిషయం గుర్తుచేస్తాను మీకు. బైబిల్ గ్రంధంలో గల లేఖనాలు గాని ఏ విధమైన వచనాలు గాని పరిశీలించవలసిన విధానం ఏమిటంటే ఒక వచనాన్ని మరో వచనం సపోర్ట్ చెయ్యాలి. అప్పుడే అది నిజమైన స్తిరమైన వచనం. బైబిల్ లో అన్ని అలాగే ఉంటాయి. కీర్తనలు 62:12 కి ఈ వచనము సపోర్టింగ్ వచనం అన్నమాట! అందుకే ఈ రెండు వచనాలు దృష్టిలో పెట్టుకునే పౌలుగారు కొన్నిసార్లు ఇదేమాట వ్రాసారు ఈ 6వ వచనంలోనే కాకుండా ఇంకా చాలాచోట్ల ప్రస్తావించారు. గలతీ 6:78
7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. 
8.ఏ లాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును,ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.  . .; 
పరిశుద్ధాత్ముడు కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కానిస్తున్నారు ప్రకటన 22:12 
12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.  .. 

    కాబట్టి ప్రియ స్నేహితుడా! నీవు ఏం చేస్తున్నావో, దానికి దేవుడు ప్రతిఫలమిస్తారు జాగ్రత్త!  ఇదే విషయాన్ని మరిన్ని కోణాలలో బైబిల్ సెలవిస్తుంది. ఉదా: మనుష్యులు జరిగించే ప్రతీవిషయంలో కూడా దేవుని విమర్శ దినమందు లెక్క అప్పగించాలి. 
2 కొరింథీ 5:10 
10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. 
 మరోదగ్గర మనుష్యులు పలుకు వ్యర్ధమైన ప్రతీమాటకు విమర్శ దినమందు లెక్క అప్పగించవలెను. మత్తయి 12:36; అనగా చేసే ప్రతీపనికి, పలికే ప్రతీమాటకు కూడా ప్రతిఫలం ఉంటుంది అన్నమాట!

   ఒకసారి రూతు గ్రంధంలో చూసుకుంటే బోయజు గారు రూతుతో మాట్లాడినప్పుడు అంటున్నారు: నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలమిచ్చును! 2:12
యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను. . . .
ఇలా చాలా కోణాల్లో దేవుడు మాట్లాడుచున్నారు. కాబట్టి నీవు ఎలా చేస్తావో నీకుకూడా అలాగే చేయబడుతుంది. దీనికి బిన్నంగా ఒక అమూల్యమైన మాట ఉంది బైబిల్ లో! నాకు నచ్చిన వచనం: 
సామెతలు 25:2122 .
21. నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము 
22. అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును.  . . ..

 ఒకవేళ నీవు అలా చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడమే కాదు, శత్రువులను మిత్రులుగా మార్చుకోగలవు! అనగా నీవు బ్రతికి ఉన్నప్పుడే మనశ్శాంతితో బ్రతకగలవు కారణం శత్రువుల వలన వచ్చు శోధనలు తగ్గిపోతాయి. ఇరుగుపొరుగు వారితో శాంతి సమాదానములతో ఉండటం నిజంగా పెద్ద బ్లెస్సింగ్ అది. అది నీకే ఆశీర్వాదం కాదు, నీవు అలా ఉంటే పొరుగువారికే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు.  ఇంకా 
సామెతలు 12:14 
ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలుపొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును.
  యెషయా 3:10,11
10. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. 
11. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. . . . 
యిర్మియా 17:10
ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయ మును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.
 21:14 
మీ క్రియల ఫలములనుబట్టి మిమ్మును దండించెదను, నేను దాని అరణ్యములో అగ్నిరగుల బెట్టెదను, అది దాని చుట్టునున్న ప్రాంతములన్నిటిని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.
 ప్రకటన 2:23 అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.
 18:6
అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.;
20:13 సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

  కాబట్టి ప్రియ స్నేహితుడా! నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఒకసారి సరిచూసుకో! లవోదోకాయ సంఘంతో దేవుడు చెబుతున్నారు నీక్రియలు నాయెదుట సరిగాలేవు అందుకే నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించు చున్నాను అంటున్నారు. ప్రకటన 3:15--20; నీవుకూడా అలా ఉమ్మివేయించుకునే స్తితిలో ఉన్నావా లేక భళా నమ్మకమైన మంచిదాసుడా అనిపించు కొనే స్తితిలో ఉన్నావా? 
రాజైన నెబుకద్నేజర్ కొడుకు బెల్శాషర్ తో దేవుడు చెబుతున్నారు మినె మినె టేకేల్ ఒఫార్శిన్.  అనగా దేవుడు నీ విషయమై లెక్క చూసి ముగించారు. ఆయన దృష్టిలో నీ నడతలు విపరీతంగా ఉన్నాయి. దానియేలు 5; ప్రియ స్నేహితుడా! దేవుడు నీవిషయంలో కూడా లెక్కలు చూస్తున్నారు. పొరపాటున దానిని ముగించారా ఖభాడ్ధార్! అంతే నీ గతి! 
బెల్శాషర్ కి లెక్క చూసి ముగిస్తే ఉదయానికి చచ్చాడు! మరి నీవు వాడికన్నా గొప్పవాడివా? జాగ్రత్త! 
చివరగా ప్రసంగీ 11:9,10
9. యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము; 
10.లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.

 ప్రియ స్నేహితుడా ఇప్పుడు నీ ఇష్టం ! నీ ఇష్టమొచ్చినట్లు చేయు! కాని దేవుడు ఒకరోజు నిన్ను దానికి లెక్క అడుగుతారు అని గుర్తుకు తెచ్చుకో! అప్పుడు నీ నడతలు విపరీతంగా ఉంటే నరకాన్ని తప్పించుకోలేవు! ఒకవేళ ఇప్పుడు నీ మనస్సాక్షి నీమీద తప్పుమోపుతుంటే ఇప్పుడే ఉన్నపాటుననే మోకరించు! కన్నీటితో దేవునికి ప్రార్ధించు! ఈ చిన్న ప్రార్ధన చేయు! 
*ప్రభువా నేను పాపిని! తెలిసినా సరే, నేను నీ దృష్టికి ఆయాసకరమైన తప్పులు ఎన్నో చేశాను. దయచేసి ఈ సారికి నన్ను క్షమించు! ఇకను పాపము, తప్పులు చేయను ప్రభువా! ప్రియ పరిశుద్దాత్ముడా! నా నడకలను కావలిగా ఉంటూ నన్ను నడిపించవా!! యేసు నామమున అడుగుచున్నాము తండ్రి! ఆమెన్*!

 ఈ చిన్న ప్రార్ధన నాతోపాటు చేసి ఉంటే నీవు ధన్యుడవు! దేవుడు నిన్ను క్షమించడానికి సిద్దంగా ఉన్నారు.
ఆమెన్! 
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-31వ భాగం*
*దేవునితీర్పు-5*

      రోమా 2:7,87. సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. 
8. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. 

  ప్రియ దైవజనమా! గతభాగం నుండి 116 వచనాలలో గల దేవుని న్యాయమైన తీర్పుకోసం ధ్యానం చేసుకుంటున్నాం.  ఇక్కడనుండి పౌలుగారు ఈ తీర్పుకోసమైన 7 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నారు.

4) నాల్గవ విషయం: *మనుష్యులు చేసే క్రియలను బట్టి దేవుని తీర్పు ఉంటుంది.  వానివాని క్రియలను బట్టి తీర్పు ఉంటుంది*.  

 ప్రియులారా!  పౌలుగారు చెప్పిన ఏడు ప్రాముఖ్యమైన విషయాలలో ఈ రెండు వచనాలు 4 & 5 కొనసాగింపు. గతభాగంలో ఆయన ప్రతీవానికి వానివాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును అనే విషయం గురుంచి ధ్యానం చేసుకున్నాం! అదే విషయాన్ని ఇంకా విస్తారంగా వివరంగా చెబుతున్నారు ఆ చేసిన క్రియ సత్క్రియ ఓపికగా చేయుచు, మహిమను, ఘనతను అక్ష్యయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును! అయితే బేదములు పుట్టించి, సత్యానికి లోబడక దుర్నీతికి లోబడేవారికి దేవుని ఉగ్రతయు, రౌద్రమును వచ్చును అంటున్నారు. ఇక 5వ విషయము ఏం చెబుతున్నారంటే ఇలా దుష్కార్యం చేసేవాడు వాడు యూదుడైన గ్రీసు దేశస్తుడైనా, ఎవరైనా సరే దుష్కార్యం చేసేవాడికి శ్రమ వేదన కలుగుతుంది. సత్కార్యాలు చేసే వాడికి వాడెవడైనా సరే మహిమ ఘనత సమాధానము కలుగుతుంది అంటున్నారు.

   ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు జాగ్రత్తగా పరిశీలిస్తే సత్క్రియ ఓపికగా చేయాలి అంటున్నారు. కారణం సత్క్రియ చేసేవారికి ఎన్నో ఆటంకాలు కలుగుతాయి. చెడుచేసే వాడికి బోలెడుమంది స్నేహితులు.  మంచిచేసే వాడికి అందరూ శత్రువులే! అందుకే పౌలుగారు తిమోతికి ఉత్తరం రాస్తూ కారణం జనులు 
రెండవ తిమోతి 3:2
2. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు 
3. అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు 
4. ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు, 
5. పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము. .

కాబట్టి మంచి చేస్తే విరోధులు ఎదురవుతారు అలాంటప్పుడు సత్క్రియలు ఓపికగా చేయాలంట. అలా ప్రతికూల పరిస్తితులలో ఓపికగా సత్క్రియలు చేస్తే అప్పుడు దేవుని నుండి ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయి. ఓపిక కోసం యాకోబు గారు అంటున్నారు 5:78 
7. సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగియుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా 
8. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. . . అదీ ఓపిక!  ఇది ఒక భాగము!

    ఇక తర్వాత ప్రాముఖ్యమైన విషయము.  7వ వచనం ప్రకారం మహిమను, ఘనతను, అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును అంటున్నారు. వెదకవలసినది, కనిపెట్టవలసినది, ప్రాకులాడవలసినది మొదటగా మహిమ కొరకు, ఘనత కొరకు, అక్షయత కొరకు!! కొలస్సీ పత్రిక ధ్యానములనుండి మాటిమాటికి మీకు గుర్తుచేస్తున్నానుపౌలుగారి ప్రార్ధనగాని ఆయన బోధ గాని ఎప్పుడూ ఈ లోక సంభందమైన వాటికోసం కాకుండా ఆత్మీయ సంభంధమైన మరియు పరలోక సంభంధమైన విషయాల కోసమే ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఇప్పుడు కూడా మీరు కష్టపడవలసినది మహిమకోసం, ఘనతకోసం, అక్షయత కోసం పాటుపడాలి అంటున్నారు.  ఇక్కడ ఒక విషయం గుర్తుచేయాలి అనుకుంటున్నాను. పౌలుగారు నీ క్రియల ద్వారా మోక్షము/ ముక్తి కలుగుతుంది అని ఎప్పుడూ బోధించలేదు. ఇక్కడకూడా నీ క్రియలద్వారా నీకు మోక్షం వస్తుంది అని ఎంతమాత్రమూ చెప్పడం లేదు. నీవు మహిమకోసం, ఘనతకోసం అక్షయతకోసం పాటుపడితే నీకు నిత్యజీవం కలుగుతుంది అని చెబుతున్నారు. అనగా  ముక్తికి మార్గం లేదా నిత్యజీవం పొందాలి అంటే ఏమి చెయ్యాలి అనే ప్రశ్నకు యేసుప్రభులవారు ఒక మార్గము చూపించారు సువార్తలలో! మత్తయి సువార్త 19:16,17,18,19,20,21,22,27,28,29
16. ఇదిగో ఒకడు ఆయనయొద్దకు వచ్చిబోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. 
17. అందుకాయనమంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా 
18. యేసునరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రులను సన్మానింపుము, 
19. నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. 
20. అందుకు ఆ యౌవనుడు ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. 
21. అందుకు యేసునీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.
22. అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లి పోయెను. 
27. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా 
28. యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు(లేక, పునఃస్థితిస్థాపనమందు) మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు. 
29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.  
ఇది యేసుక్రీస్తు ప్రభులవారు చెప్పిన సిద్ధాంతం.

ఇక్కడ పౌలుగారు రెండో సిద్ధాంతం చెబుతున్నారు. అదేమిటంటే మహిమకోసం, ఘనతకోసం, అక్షయతకోసం పాటుపడితే నిత్యజీవం కలుగుతుంది అని చెబుతున్నారు. అయితే యేసయ్య చెప్పినదానికి దీనికి తేడా ఉంది కదా అని అతి తెలివైనవారు అంటారు. వారికి జవాబు ఏమిటంటే అతితెలివైన వారలారా! యేసుక్రీస్తు ప్రభులవారికి- ధనవంతుడైన యువకుడికి మధ్య జరిగిన సంభాషణ మొత్తం అర్ధం చేసుకుంటేఈ భూలోక ఆస్తులన్నీ అమ్మి, అనగా భూలోక సంభంధమైన విషయాలమీద నీ చూపు, ఆశ ఉండకూదు అంటే నీ ఆస్తిని అమ్మి దేవుడ్ని వెంబడిస్తే, అప్పుడు నీవు పరలోక సంభంధమైన మహిమకోసం, ఘనతకోసం, అక్షయతకోసం చూడగలవు అని దేవుని ఉద్దేశ్యం! కాబట్టి ఈ రెండు సిద్ధాంతాలు ఒకటే బాగా అర్ధం చేసుకుంటే!!

   అయితే ఇక్కడ పౌలుగారు దేవుని తీర్పుకోసం చెబుతూ దానిలోనే తీర్పు నియమం లేక తీర్పు సిద్ధాంతం చెబుతున్నారు. మనుష్యులు వారు చేసిన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తారు. సత్క్రియలు చేస్తే మహిమ ఘనత అక్షయత దొరుకుతుంది. ఒకసారి 10వ వచనం చూడండి. 
సత్‌ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.
  7వ వచనంలో మహిమ ఘనత అక్షయత కోసం పాటుపడితే నిత్యజీవం కలుగుతుంది అని చెప్పిన తర్వాత, ఎవరైతే సత్క్రియలు చేస్తారో వారికే మహిమ ఘనత సమాధానం కలుగుతుంది అని చెబుతున్నారు. ఈ రెండు వచనాల ప్రకారం మనకు అర్ధమయ్యే దేమిటంటే నీకు నిత్యజీవం కావాలా? అయితే మహిమకోసం ఘనత కోసం, అక్షయత కోసం కష్టపడు. మరి మహిమ ఘనత అక్షయత ఎక్కడ దొరుకుతాయి? ఎలా దొరుకుతాయి? అంటే సత్క్రియ చేయాలి. అప్పుడు మహిమ ఘనత సమాధానం కలుగుతుంది.

   ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పదో వచనంలో నీకు మహిమ ఘనత సమాధానం కలుగుతుంది అని చెప్పారు గాని అక్షయత కోసం ఏమీ చెప్పలేదు కారణం కేవలం వాటిని చేసినంత మాత్రాన అక్షయత రాదు. వాక్యానుసారమైన జీవితం, అత్మానుసారమైన ప్రవర్తన కలిగి నిత్యమూ పరిశుద్దాత్ముని సన్నిధిని అనుభవిస్తేనే నీకు అక్షయతకు మార్గం సుగమము అవుతుంది. ఇంకా చెప్పాలంటే తనకృప ద్వారా దేవుడు ఎవరికి పాపవిముక్తిని ఇస్తారో, వారిని తన శక్తిచేత మారుస్తారు. అప్పుడు వారు నూతన సృష్టి! ఈ నూతన సృష్టిగా మారిన ఆయన పిల్లలు సత్క్రియలు చేస్తూ, ఆయన మహిమను, ఘనతను అక్షయతను వెదుకుతారు. ఎప్పుడైతే ఇలా వెదకడం ప్రారంబిస్తారో అప్పుడు దేవుడు వారికి నిత్యజీవము లేక శాశ్వత జీవమనే అనుభవంలోకి తీసుకుని వస్తారు దేవుడు! ఇది వారు మొదట క్రీస్తులో నమ్మకం ఉంచినప్పుడు ప్రారంభమవుతుంది ఈ నిత్యజీవంఈ నమ్మకం ఉంచామని చెబుతూ కొంతకాలమైన తర్వాత పై చెప్పినవాటికోసం ఎదురుచూడకుండా ఆత్మవంచన చేసుకుంటూ, దుష్క్రియలు చేస్తే దేవుడిచ్చే పాపవిముక్తిని గాని, నిత్యజీవాన్ని గాని, సమాధానాన్ని గాని అనుభవించలేరు.  కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నిన్ను నీవు పరిశీలించుకుని, ఎలా ఉన్నావో చూసుకో! 
మహిమను వెదకుచున్నావా, ఘనతను అక్షయతను వెదకుతున్నావా లేక లోక విషయాలను వెదకుతున్నావా?
 పైనున్నవాటిని వెదకితే నీకు పైనున్న పరలోకం! 
భూలోక సంభంధమైన వాటిని వెదకితే నీకు క్రిందనున్న పాతాళం! 
ఏదికావాలో కోరుకో!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*రోమా పత్రిక-32వ భాగం*
*దేవునితీర్పు-6*
రోమా 2:7,8
7. సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. 
8. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. 

  ప్రియ దైవజనమా! 116 వచనాలలో గల దేవుని న్యాయమైన తీర్పుకోసం ధ్యానం చేసుకుంటున్నాం.  ఇక్కడనుండి పౌలుగారు ఈ తీర్పుకోసమైన 7 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నారు.
4) నాల్గవ విషయం: మనుష్యులు చేసే క్రియలను బట్టి దేవుని తీర్పు ఉంటుంది.  వానివాని క్రియలను బట్టి తీర్పు ఉంటుంది.  
 ప్రియులారా!  పౌలుగారు చెప్పిన ఏడు ప్రాముఖ్యమైన విషయాలలో ఈ రెండు వచనాలు 4 & 5 కొనసాగింపు.

   ఇక దుష్క్రియలు చేసేవారి గురించి వారికోసం చూసుకుందాం! బేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేవారిమీదకు దేవుని ఉగ్రత మరియు రౌద్రము వచ్చును! ఇక్కడ రెండు రకాలైన వారున్నారు. మొదటగా సత్యానికి లోబడేవారు. వీరు నిత్యజీవమునకు పాత్రులు! ఇక రెండో గ్రూపువారు సత్యానికి లోబడక మొదటగా బేదములు పుట్టిస్తూ, రెండవదిగా దుర్నీతికి లోబడతారు. వీరంతా దేవుని ఉగ్రతకు రౌద్రమునకు పాత్రులు అంటున్నారు పౌలుగారు. ఒకసారి యోహాను 3:6 చూసుకుందాం  
కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.; 
అనగా క్రీస్తును నిరాకరించు వాడు కూడా దేవునికోపానికి పాత్రుడు ఎందుకు? యేసయ్య అంటున్నారు : నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. యోహాను 14:6; కాబట్టి వీరు ఇప్పుడు సత్యమైయున్న యేసయ్యను తిరస్కరించారు కాబట్టి వీరుకూడా నరకపాత్రులు! దేవుని ఉగ్రతకు పాత్రులు!  ఎఫెసీ 5:6
వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి(మూలభాషలో-అవిధేయత కుమారుల మీదికి) వచ్చును.
2థెస్సలోనికయలు 1:510 2 
5. దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది. 
6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, 
7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు 
8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. 
9. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు 
10. ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. . . . 
కాబట్టి దేవుని సత్య మార్గమునకు ఎదురు తిరిగితే వారి మీదకు దేవుని ఉగ్రత వస్త్తుంది.  అనగా దుష్క్రియలు చేస్తే దేవుని ఉగ్రత వస్తుంది. యెషయా 1,2 అధ్యాయాలలో దేవుడు చెబుతున్నారు: దుష్టుల మీదకు,అవిశ్వాసుల మీదకు దేవుని ఉగ్రత అనే పెనుగాలి వస్తుంది.  మొదటగా వీరు బేదములు పుట్టిస్తున్నారు. అనగా మనలోమనకే తగాదాలు పుట్టిస్తున్నారు. నేటిరోజులలో సాతానుడు విశ్వాసులను గెలుద్దామని, సంఘాన్ని పాడుచేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోయాడు కాబట్టి, విశ్వాసులలో వారిమధ్య బేదములు పుట్టిస్తున్నాడు. ఎలా ? ఒకడు ఆదివారం ఆరాధన చేయకూడదు, శనివారమే చెయ్యాలని ఒకడు! తండ్రికుమారా పరిశుద్ధాత్మ భాప్తిస్మం చెల్లదు యేసునామంలో లోనే బాప్తిస్మం తీసుకోవాలని ఒకడు! యషూవమెస్సీయ అనే పేరుతోనే ప్రార్ధన చేయాలి తప్ప యేసయ్య అనికాని, యేసు అని కాని ప్రార్ధన చేయకూడదు. అలాచేస్తే పాపమని కొందరు. ఇలా ఒక్కొక్కడు ఒక్కో బోధ చేస్తూ ప్రజలమధ్య బేదములు పుట్టించి, ప్రజలను అయోమయం చేస్తున్నారు. ఇలాంటివారి మీదకే దేవుని ఉగ్రత వస్తుంది.  

   నిజం చెప్పాలంటే ఇలా బేదములు పుట్టించేవాడు సాతానుగాడు. సాతానుగాడి ఉచ్చులో పడి వీరుకూడా తప్పుడుమాటలు ప్రచారం చేసి, వీరుకూడా దేవుని ఉగ్రతకు గురవుతున్నారు. మీరనవచ్చు- మరి వీరి తప్పులేదు కదా సాతాను గాదె ఇలా వారిచే తప్పులు చేయిస్తునాడు కదా! అయితే దేవుడు మనిషికి మంచిచెడ్డలు తెలుసుకొనే జ్ఞానం ఇచ్చారు,. అంతేకాకుండా సత్యాన్ని ముందుగానే బైబిల్లో సంపూర్ణంగా రాసి ఉంచారు. ఇప్పుడు మనిషి బైబిల్ ని అనుసరించకుండా, పూర్తిగా అర్ధం చేసుకోకుండా ఎవడో ఏదో చెబితే, బెరయ సంఘస్తులలా అవి నిజముగా అలా లేఖనము ఉందోయ లేదో పరిశీలించకుండా గుడ్డిగా నమ్మేస్తూ, ఇతరులనుకూడా మోసం చేస్తున్నారు కాబట్టి వీరు తప్పుకుండా ఉగ్రతకు పాత్రులే! కాబట్టి దుష్క్రియలు చేసేవారు దేవుని ఉగ్రతకు పాత్రులు! ఒకసారి కయీనుతో దేవుడు ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకుందాం! నీవు సత్క్రియలు చేసినయెడల తలను ఎత్తుకొనవా? దుస్క్రియలు చేస్తే వాకిట్లో పాపం పొంచి ఉంటుంది.  కాబట్టి సత్క్రియలు చేస్తే మహిమ ఘనత అక్షయత లాంటి పరలోక/ ఆత్మీయ దీవెనలు, దుష్క్రియలు చేస్తే రోమీయులకు 2: 9
దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.
 ఈరోజు నీకు శ్రమ వేదన ఎందుకు కలుగుతుంది అంటే నీవు సత్క్రియలు చేయకుండా దుష్క్రియలు చేస్తున్నావన్న మాట!  కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నిన్ను నీవు పరిశీలించుకుని, ఎలా ఉన్నావో చూసుకో! మహిమను వెదకుతున్నావా, ఘనతను అక్షయతను వెదకు తున్నావా లేక లోక విషయాలను వెదకుతున్నావా? పైనున్న వాటిని వెదకితే నీకు పైనున్న పరలోకం! భూలోక సంభంధమైన వాటిని వెదకితే నీకు క్రిందనున్న పాతాళం! ఏదికావాలో కోరుకో! ఒక విషయం గుర్తుకు తెచ్చుకో! 1కొరింథీ 15:50 . .53,54, 
50. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. 
51.ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము. 
53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. 
54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఇలా అక్షయత పొందుకోవాలంటే నీకు ఏకైక మార్గం భూలోక సంభంధమైన వాటికోసం కాకుండా ఆత్మీయ సంభంధమైన వాటికోసం అనగా ఆయన మహిమ ఘనత ఎలా సంపాదించుకోవాలో వాటికి ప్రయత్నం చేయు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-33వ భాగం*
*దేవునితీర్పు-7*

రోమా 2:11--15
11. దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; 
12. ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. 
13. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. 
14. ధర్మ శాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 
15. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. 
      ప్రియులారా! రోమా 2:1--16 వచనాలలో పౌలుగారు చెప్పిన ఏడు ప్రాముఖ్యమైన విషయాలలో ఇంతవరకు అయిదు విషయాలను చూసుకున్నాం. 

ఇక ఆరవ విషయం: *ధర్మశాస్త్రం కలిగి అనగా ధర్మశాస్త్రం తెలిసి పాపం చేస్తే ధర్మ శాస్త్రప్రకారమే తీర్పు ఉంటుంది. ధర్మశాస్త్రం తెలియకుండా పాపం చేస్తే ధర్మశాస్త్రం లేకుండానే వారి హృదయ తీర్పులను బట్టి, మనస్సాక్షి గద్దింపును బట్టి తీర్పు ఉంటుంది*

    పౌలుగారు ముందుగానే అనేకమంది అనుమానాలు నివృత్తి చేయడానికి ఈ విషయం చెబుతున్నారు. ధర్మశాస్త్రం తెలిసి పాపం చేస్తే ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చబడుతుంది. మోషేగారి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది సీనాయి పర్వతం మీద.  ధర్మశాస్త్రంలో  పాపము అంటే ఏమిటో అనేది చాలా స్పష్టంగా వ్రాయబడింది. 
రోమీయులకు 7:7,8,9
7. కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. 
8. అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని( లేక, ఆజ్ఞద్వారా) సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. 
9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.  . . 
ఏది తప్పు, ఏది కరెక్ట్, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు ఇలాంటి విషయాలు ధర్మశాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలు తెలిసి కూడా పాపము చేస్తే శిక్ష అధికంగా ఉంటుంది. కారణం దేవుడు చెప్పారు తీర్పు దేవుని ఇంటినుండి ప్రారంభం అవుతుంది. 1 పేతురు 4:17; పౌలుగారు చెబుతుంటారు నేను తెలియక చేశాను కాబట్టి క్షమించబడితిని. గాని ఒకసారి వెలిగింప బడిన తర్వాత బుధ్ధి పూర్వకముగా పాపం చేస్తే మొదటి గతి కంటే చివరి గతి దయనీయంగా ఉంటుంది.1పేతురు 2:20--22. 

   11వ వచనంలో చెబుతున్నారు దేవునికి పక్షపాతం లేదు. యూదుడని, క్రైస్తవులని, ముస్లింలు అని, భారతీయులు అని, పాకిస్తాన్ వారు అని, తెల్లోడని, నల్లోడని దేవునికి తేడాలు ఏమీలేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే! ఇతడు క్రైస్తవుడు కదా! నా కుమారుడు కదా, చూసి చూడనట్లు వదిలేద్దాం అని దేవుడు ఎంతమాత్రమూ అనుకోవడం లేదు. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే! ఇంకా ధర్మశాస్త్రం, బైబిల్ తెలిసి తప్పు చేస్తే రెండింతల తీర్పు! ఇప్పుడు ధర్మశాస్త్రం తెలిసి పాపం చేస్తే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ధిక్కరించిన పాపులు! కాబట్టి వారికి తీర్పు ఎక్కువ! అందుకే రోమా 1:18-20,28 లో
18. దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచ బడుచున్నది. 
19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. 
20. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు. 
28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. 

  చూశారా దేవుడు ఎంత స్పష్టంగా చెబుతున్నారో! మారుమనస్సు పొందే అవకాశం ఇచ్చినా వారు ఉపయోగించుకోలేదు గనుక దేవుడు వారిని బ్రష్ట మనస్సుకి, తీర్పుకు అప్పగించేశారు. ఇక వారికి మారుమనస్సు పొందే అవకాశం, రక్షణ పొందే అవకాశం లేనేలేదు. 

     కాబట్టి నీవు ఒకసారి వెలిగింపబడిన తర్వాత అనగా నీవు రక్షణ పొందినతర్వాత మరలా పాపం చేయకూడదు. నీవు ఎవరివైనా సరే, క్రైస్తవుడవైనా ఎవరివైనా సరే!

  ఇక్కడ ఒక విషయం చెప్పనీయండి. ధర్మశాస్త్రం లేదా బైబిల్ తెలిసినందువలన, వినడం వలన, చదువుతున్నందు వలన  వారు పరలోకంలో సీటు సంపాదించినట్లు కాదు. ధర్మశాస్త్రం ప్రకారం జీవించినప్పుడే పరలోకం! ఇంకో విషయం చెప్పనీయండి. ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం అసాధ్యం! యేసుక్రీస్తు తప్ప మరెవరూ పూర్తిగా అలా జీవించలేక పోయారు. కారణం యాకోబు 2:10James(యాకోబు) 2:10,11
10. ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయినయెడల(తొట్రిల్లిన యెడల), ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును; 
11. వ్యభిచరింప వద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపక పోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్ర విషయములో నపరాధి వైతివి. . . . అందుకే దేవుడు మరలా తన కుమారుని ఈ లోకానికి పంపి క్రొత్త నిబంధన ఇవ్వవలసి వచ్చింది. 

  కాబట్టి ఇప్పుడు బైబిల్ తెలిసిన మనందరం నీతిమంతులమా? గొప్ప వారమా? రోమా 3:9,10,11,12
9. ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము. 
10. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు 
11. గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు 
12. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి.మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. . . . 
ఇంకా ఏ భేదం లేదు అందరునూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేక పోతున్నారు. 3:23; . కాబట్టి అందరూ పాపులే! కాబట్టి ఇప్పుడు రక్షణ పొందుకుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తే పరలోకం లభిస్తుంది! 

   ఇక ధర్మశాస్త్రం మరియు బైబిల్ గురించి తెలియని వారి సంగతి ఏమిటి? రోమీయులకు 2:14,15
14. ధర్మ శాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్ర మైనట్టున్నారు. 
15. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. 

  దీని ప్రకారం ధర్మశాస్త్రం తెలియకుండా, బైబిల్ తెలియకుండా మరణించిన వారికి, జీవిస్తున్న వారికి, వారి మనస్సాక్షి లేక అంతరంగం వారికి ధర్మశాస్త్రంలా పనిచేసి, వారి మీద నేరారోపణ చేస్తుంది. ఈ రకంగా వారు తీర్పు పొందుతారు. నిజానికి మన మనస్సాక్షికి మించిన జడ్జి లేదు! మన మనస్సాక్షి ప్రతీ విషయంలో కూడా మనలను హెచ్చరిస్తూ ఉంటుంది. 

    కాబట్టి ప్రియ సహోదరి/ సహోదరుడా! నీవు రక్షించబడిన తర్వాత ఇకను‌ పాపము చేయవద్దు! తెలియక చేస్తే క్షమించబడతావు గాని తెలిసి చేస్తే రెట్టింపు శిక్ష అని మరచిపోవద్దు! గనుక భయమునొంది పాపము చేయవద్దు!

దైవాశీస్సులు!
*రోమా పత్రిక-34వ భాగం*
*దేవునితీర్పు-8*

      రోమా 2:16
  దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మను ష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.

  ప్రియ దైవజనమా! 116 వచనాలలో గల దేవుని న్యాయమైన తీర్పుకోసం ధ్యానం చేసుకుంటున్నాం.  ఇక్కడనుండి పౌలుగారు ఈ తీర్పుకోసమైన 7 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నారు.
7) ప్రియులారా! ఈరోజు చివరి ఏడవ ప్రాముఖ్యమైన విషయం కోసం ధ్యానం చేసుకుందాం! *నాసువార్త ప్రకారం యేసుక్రీస్తు మనుష్యుల రహస్యములను విమర్శించు దినమున ఈ తీర్పు జరుగుతుంది*.  

   గమనించాలి. ఇక్కడ రెండు విషయాలు కనిపిస్తాయి మనకు!  ఇంతవరకు మనం దేవుని తీర్పు జరుగుతుంది అని చూసుకున్నాం. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని తీర్పు దినమందు జరుగుతుంది. ఎలా పౌలుగారు ప్రకటించిన  సువార్త ప్రకారం జరుగుతుంది.

   మొదటగా పౌలుగారు ప్రకటించిన సువార్త ఏమిటి? పౌలుగారు మాటిమాటికి నా సువార్తప్రకారం అని చెబుతారు తన పత్రికలలో! 16:25; 1తిమోతి 1:8; 2:8;
   ఆయనకంటూ ప్రత్యేకమైన సువార్త ఏమైనా ఉందా? లేదు! ఇంతకీ ఆయన ప్రకటించిన సువార్త ఏమిటి? యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానములు! 
1కొరింథీ 15:34
3. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, 
4. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. 
5. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. 
6. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. 
8.అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను; . . ఇదీ ఆయన ప్రకటించే సువార్త! 
అపో.కార్యము 14:15 లో కూడా ఇదే విషయాన్ని మరో కోణంలో చెబుతున్నారు.
15. అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేముకూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.  . . .

    సరే, ఈ సువార్త కొంతమంది విన్నారు, విని అంగీకరించి, తర్వాత వారి పూర్వ పాపములలోనికి మరలిపోయారు కనుక వారికి ఘోరమైన తీర్పు ఉన్నది.

  కొంతమంది వినికూడా అంగీకరించలేదు కాబట్టి వారికికూడా తీర్పు ఉన్నది. నిజదేవుని కోసరమైన నిజం తెలుసుకుని కూడా దానిని అంగీకరించలేదు కనుకనే వారికి తీర్పు!  

    ఇక ఈ తీర్పుకు అంటూ ఒకరోజు నిర్ణయింపబడింది. దీనికోసం ఎప్పటినుండో దేవుడు తన ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూ వచ్చారు! యెషయా 13:6
యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.; 13:9
యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును.;6౩:4;
  యిర్మియా 46:10
ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహో వాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండనచేయును ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసునదియొద్ద ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా బలి జరి గింప బోవుచున్నాడు.
 యేహెజ్కేలు 30:3
యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము.
 యోవేలు 1:15
ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.
  2:12, 11
1. సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకుదురుగాక. 
2. ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు. 
11. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు? ....;  
జేఫన్యా 1:14--15
14. యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. 
15. ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉప ద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము.  . .; 
మలాకి 4:1
ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును;గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.; 

ఇక క్రొత్త నిబంధన భక్తులు చెప్పేది వినండి. మొదటగా యేసుక్రీస్తు ప్రభులవారి మాటలు . లూకా 21:35
ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.
 1థెస్సలోనికయ 5:2,4
2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. 
4. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు. . . . 
ఇంకా వివరంగా 2 థెస్సలోనికయ 2:3 
3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు(నాశనపుత్రుడు) పాపపురుషుడు(ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు. 
4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి. .. .
2 పేతురు 3:10,11,12
10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును. 
11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు, 
12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు(త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.  . . .   

ఇక ప్రకటన గ్రంధంలో దీనికోసం చాలా విస్తారంగా వ్రాయబడి యుంది. కాబట్టి యేసుక్రీస్తు / యెహోవా దినము అనేది ఉంది. అది నెమ్మది గల దినము /వెలుగు దినము కానేకాదు. భయంకరమైన దినము/ అంధకార దినము. కాబట్టి ఆరోజు రాకముందే దేవునితో సమాధాన పడు! పశ్చాత్తాపపడి దేవుని పాదాలు కడిగితే నిన్ను క్షమించి, పవిత్రునిగా చేసి, నీమీద నున్న ఉగ్రతను తొలగించి ఆయన రాజ్యమునకు వారసునిగా దేవుడు నిన్ను చేస్తారు. కాబట్టి జెఫన్యా గారు అంటున్నారు: 2:1,2,3
1. సిగ్గుమాలిన జనులారా, కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. 
2. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. 
3. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. . . . ఆయన దగ్గరకు వద్దాం,  
2కొరింథీ 6:3
ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.

ఆమెన్!
దైవాశీస్సులు!  
  


*రోమా పత్రిక-35వ భాగం*
      రోమా 2:17--24
17. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా? 
18. ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్ఠమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? 
19. జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి-నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను, 
20. చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనైయున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? 
21. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? 
22. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా? 
23. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా? 
24. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది? 

  ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం దేవునితీర్పు కోసం పౌలుగారు చెప్పిన ఏడు ప్రాముఖ్యమైన అంశాలు కోసం ధ్యానం చేసుకున్నాం. ఇక ఈ రోమా 2:1729 వరకు మనకు రెండు విషయాలు కనిపిస్తాయి. మొదటిది: యూదులు కూడా పాపులే! రెండవది: ధర్మశాస్త్రం తెలిసుకున్నందున ఏమీలేదు! మొదట ధర్మశాస్త్రం నీకు నీవే బోధించుకుని ఇతరులకు బోధించు! 
ఈ వచనాలలో చెప్పబడిన విషయాలు సామాన్య ప్రజానీకానికి కాదు. ఎవరైతే బోధకులు, ఉపదేశకులు, ధర్మశాస్త్ర/ బైబిల్ పండితులు అని చెప్పుకుంటున్నారో ఇలాంటి వారికొరకు చెప్పబడింది. కారణం వారు ఇతరులకు బోధిస్తున్నారు కాని దాని ప్రకారం వారు చేయడం లేదు. చెప్పడం మాత్రము చెబుతున్నారు గాని అలా చేయడం లేదు.  బోధలు కోటలు దాటుతున్నాయి కాని వారి ప్రవర్తన గాని, జీవితం గాని వాకిలి దాటడం లేదు! చెప్పేదొకటి చేసేదొకటి! వారిజీవితాలు పూర్వకాలంలో సామెత చెప్పినట్లు ఉంటుంది. చెప్పేది శ్రీరంగనీతులు ....... అన్నట్లు ఉంది. ముందు పర్సనాలిటీ, వెనుక మున్సిపాలిటి!!  ఇలాంటివారి కోసమే ఈ వచనాలు నొక్కివక్కానింఛి చెబుతున్నారు పౌలుగారు!

   17వ వచనం చూసుకుంటే: నీవు యూదుడవని పేరుపెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించు చున్నావు కావా?? ఈ వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే  మొదటగా యూదుడవని పేరు పెట్టుకున్నావు. మంచిది! ధర్మశాస్త్రమును ఆశ్రయిస్తున్నావు!! చాలా చాలా మంచిది. దేవుడు నిన్ను దీవించును గాక! చాలామంది దేవుని పేరుపెట్టు కుంటారు గాని దేవుణ్ణి ఆశ్రయించరు! అయితే ఇక్కడ వీరు పేరు పెట్టుకోవడమే కాదు ధర్మశాస్త్రంను ఆశ్రయించు చున్నారు అనగా దేవుని మీదనే ఆనుకొన్నారు. లోకం మీద కాదు. దేవున్నే ఆశ్రయించు చున్నారు. ఇది చాలా మంచి పని! శుభ పరిణామం! ప్రియ చదువరీ! నీవు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడమే కాకుండా/ చదవడమే కాకుండా దానిని ఆశ్రయిస్తున్నావా? దేవుని వాక్యం మీద ఆనుకుంటున్నావా? కేవలం చదువుకుంటూ పోతున్నావా? ఇక్కడ వీరు ధర్మశాస్త్రమును ఆశ్రయించు చున్నారు. అంతేనాధర్మశాస్త్రమును ఆశ్రయించి- దేవునియందు అతిశయించుచున్నారు. ఎంతగొప్ప మాట! ఎంతగొప్ప ధన్యతండి ఇది!! చాలాచాలా బాగుంది! దావీదుగారు చెబుతున్నారు 
కీర్తనలు 20:7 
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.

 పౌలుగారు చెబుతున్నారు  2కొరింథీ 11:30
అతిశయ పడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును.
 12:1,5,6,7
1. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. 
5. అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను. 
6. అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిసయించుట మానుకొనుచున్నాను. 
7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను. . . . ఇక్కడ ఆయనకు కలిగిన ప్రత్యక్షతలు వలననే పౌలుగారు అతిశయిస్తున్నారు. ఇక ఆయనకు కలిగిన శ్రమలకోసం, విశ్వాసులకు కలిగిన శ్రమలు కోసం వారు విశ్వాసములో నిలిచి ఉన్నందుకు అతిశయ పడుచున్నారు పౌలుగారు. 
2 థెస్సలోనికయ 1:4 
4. అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము.  . .
   అయితే ఇంకా కిందికి చూసుకుంటే పోతే ఇన్ని చేస్తున్నావు కాని నీవు చెప్పినట్లు నీవు చేస్తున్నావా అని పౌలుగారు ప్రశ్నిస్తున్నారు! ఈ వచనాలు: మతనిష్ట, స్వనీతి గల యూదులు/ క్రైస్తవులు ఇతరులకు తీర్పుతీర్చుతూ ఉంటారు. అలాంటి వారికోసమే ఈ భాగము! ఇలాంటివారికోసం దేవుడు ముందుగానే తన ఉపమాన రూపంలో చెప్పారు దేవుడు 
లూకా 18:912
9. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. 
10. ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. 
11. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
12. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను. 
13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. 
14. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.  . . సుంకరి హేచ్చించుకున్నాడు! తగ్గించబడ్డాడు! సుంకరి తగ్గించుకుని గుండెలు బాదుకుంటున్నాడు పాపినైన నన్ను క్షమించు అని! క్షమించబడి నీతిమంతుడుగా తీర్చబడి సమాధానముగా పోతున్నాడు! అతిశయించే వారికి ఇలానే జరుగుతుంది.!!
  మరికొంతమంది మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా తమకు ముక్తి, రక్షణ కలుగుతుంది అని వారను కుంటున్నారు. యోహాను 5:39;45; వీరు తాము మాత్రమే దేవుని ప్రజలని, ఆయన చెప్పినట్లే చేస్తునామని బ్రమపడుతూ అతిశయపడుచుంటారు. అయితే అదికాదు! వాక్యానుసారంగా నడచిన వాడే దేవునికుమారుడు కాని, వాక్యాన్ని చదివినంత మాత్రాన దేవుని బిడ్డలు కాలేరు.  18 దేవుని చిత్తాన్ని తెలుసుకుని ధర్మశాస్త్రంలో ఉపదేశం పొంది ఉత్తమమైన వాటిని ఒప్పుకుని మెచ్చు కుంటున్నావు కదా చాలాచాలా మంచిది. ఇతరులకు బోదిస్తున్న నీవు నీకు నీవు ఎందుకు బోధించుకోవడం లేదు!!!??? ఇలా తమకు తాము బోధించుకోవడం మానేసి,  ఇతరులకు బోధిస్తున్నావు అంటే నీవే దేవుని ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని మీరావు! ఈరోజులలో చాలామంది క్రైస్తవుల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. వారికి యేసుప్రభులవారి బోధ మొత్తం తెలుసు! వారి ప్రసంగాలు చూస్తుంటే, వింటుంటే పరలోకంలో దేవునిదూతలతో పాటు వీరు గడిపి యేసయ్య పాదాలు దగ్గర నేర్చుకుని బోధిస్తున్నారు అన్నట్లు ఉంటుంది. పరలోకాన్నే భూలోకానికి దింపేస్తారు వీరి బోధలలో! అయితే ఇతరులకు వీరు బోధిస్తారు గాని వీరు మాత్రం పాటించరు. అందుకే వీరు వేషదారులని, సున్నము కొట్టిన సమాధులని యేసయ్య చెప్పారు. ప్రియ చదువరీ!  దీనివలనే దేవునినామం అవమానం  పొందుకొంటుందని మరచిపోవద్దు! 
అందుకే కన్నీటితో దావీదుగారు అంటున్నారు 
కీర్తనలు 51:3,4,5,6,7
3. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది. 
4. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు. 
5. నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. 
6. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. 
7. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. .. . .  
ఉత్తమమైన వాటిని మెచ్చుకోవడమే కాకుండా దానిప్రకారం జీవించడం నేర్చుకుందాం! 
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-36వ భాగం*
           
రోమా 2:1724
17. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా? 
18. ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్ఠమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? 
19. జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి-నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను, 
20. చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనైయున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? 
21. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? 
22. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా? 
23. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా? 
24. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది? 

      ప్రియులారా గతభాగంలో ధర్మశాస్త్రమెరిగినందుకు గర్వపడే, దానిని ఆశ్రయిస్తున్న నీవే దాని ప్రకారం నడచుకోకపోవడం తప్పు అనే పౌలుగారి మాటలను ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా దానినే కొనసాగిద్దాం!

   19వ వచనంలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉన్నావు అంటున్నారు. గమనించండి ధర్మశాస్త్రము మొదట జ్ఞానము గలది, రెండవదిగా సత్యమైనది. మూడవది ఈ రెంటికి ప్రతిరూపం అనగా జ్ఞాన సత్యములకు ప్రతిరూపమే ధర్మశాస్త్రము.  మోషేగారు తను చనిపోయే ముందు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఈ ధర్మశాస్త్ర మాటలు వినుచున్న మీరు, దానిప్రకారం జీవిస్తే , వినే అన్యజనులకు ఈ ధర్మశాస్త్రమే జ్ఞానము అంటున్నారు. కాబట్టి ఎవరికైనా జ్ఞానం తక్కువ అయితే ధర్మశాస్త్రమును పటించాలి! 

   సరే, ఇక్కడ ఒకసారి ఆగుదాం! పౌలుగారు ఒకసారి చెబుతున్నారు ధర్మశాస్త్రం నీతిమంతులకోసం గాని, భక్తిపరులకోసం గాని ఇవ్వబడలేదు గాని కొన్ని కేటగిరి వారున్నారు వారికోసమే ఇవ్వబడింది అంటున్నారు. ఒకసారి దానిని జ్ఞాపకం చేసుకుందాం! 
1తిమోతి 1:911
9. ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును(భ్రష్టులకును) పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును, 
10. హితబోధకు(ఆరోగ్యకరమైన బోధకు) విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని, 
11. నీతిమంతునికి నియమింపబడలేదని యెవడైనను ఎరిగి, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినయెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము.  . . . . 
గమనించారా ధర్మశాస్త్రం ఎవరికొరకు ఈయబడిందో! అవిదేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదూషకులకు, మరికొన్ని ప్రతులలో మతబ్రష్టులకు, బ్రష్టులకు అనగా విశ్వాస బ్రష్టులకు, మాతృహంతకులకు అనగా తల్లిని గాని తండ్రినిగాని చంపినవారికి, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులు అనగా GAY, (కేవలం Gay ల కొరకు కాకుండా లెస్బియన్ లకు కూడా); మనుష్య చోరులు అనగా పూర్వకాలంలో మనుష్యులను బలవంతంగా ఎత్తుకుపోయి వారిని బానిసలుగా అమ్మేవారు, వారికోసం, నేటిదినాల్లో మనుష్యులను కిడ్నాప్ చేసి ఆస్తిని సంపాదించేవారు ఈకోవలోకే వస్తారు అలాగే నైజీరియా, కాంగో లాంటి ఆఫ్రికా దేశాలలో మనుష్యులను బలవంతంగా ఎత్తుకుపోయి, వారి శరీరభాగాలు కోసి అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారు కదా వారికోసం వ్రాయబడింది., ఇంకా అబద్దికులకు, అప్రమానికులకు అనగా దనం కోసం గాని మరిదేనికోసమైన తప్పుడు ప్రమాణాలు చేసేవారికి, హితబోధకు విరోధియైన వాడు మరి ఎవడైనా ఉంటే అట్టివానికోసమే ధర్మశాస్త్రం నియమించబడింది గాని నీతిమంతులకు కాదు అని నొక్కివక్కానిస్తున్నారు పౌలుగారు. మరి ఇప్పుడు చెప్పండిపౌలుగారి స్టేట్మెంట్లో ఏది నిజం? ధర్మశాస్త్రం జ్ఞాన సత్య స్వరూపమైనదా లేక పైనుదహరించిన కేడర్ వారికి వ్రాయబదినదా? పౌలుగారే కాదు కీర్తనాకారుడు 119 వ కీర్తనలో మాటిమాటికి నీ ధర్మశాస్త్రం , నీ న్యాయము ఎంతో సత్యమైనది, న్యాయమైనది, అది బుద్ధిలేనివారికి బుద్ధి, చీకటిలో ఉన్నవారికి వెలుగు, అజ్ఞానులకు జ్ఞానం ఇలా ఎన్నెన్నో ఇస్తుంది అని certify చేస్తున్నారు. కాబట్టి మొదటి statement నిజమైనది. మరి రెండవ statement అబద్దమా? కానేకాదు! మరి పౌలుగారి ఉద్దేశ్యం ఏమిటి? ఎందుకు ఇలాంటి భిన్నమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే: ఆయన భక్తిహీనులకు, అవిదేయులకు, హంతకులకు ఇలాంటి వారికే ధర్మశాస్త్రం వ్రాయబడింది అని ఎందుకు అంటున్నారు అంటే ధర్మశాస్త్రం రాకముందు పాపము అంటే ఏమిటి అనే దానికి నిర్వచనం, ధర్మశాస్త్రం లోనే ఉంది. ధర్మశాస్త్రం లేకపోతే పాపము అంటే ఏమిటి/. ఆజ్ఞాతిక్రమము అంటే ఏమిటి? అనేది తెలియదు. పాపాలలో గల రకాలు ఏమిటి అనేది ధర్మశాస్త్రంలో క్షుణ్ణంగా వ్రాయబడిఉన్నాయి. ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేది ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి వీరిలో చాలామంది దానిని అతిక్రమించి భక్తిహీనులు గాను, హంతకులుగాను, ధర్మవిరోదులు గాను, అబద్ధికులుగాను ఇలాంటి కేడర్లు గా తయారయ్యారు కాబట్టి ఈ ధర్మశాస్త్రం అలాంటి వారికే గాని నీతిమంతులకు కాదు అంటున్నారు పౌలుగారు! అంతేకాదు అదే 11వ వచనంలో అంటున్నారు: ధర్మానుకూలంగా దానిని ఉపయోగిస్తే ధర్మశాస్త్రము మేలైనది అనికూడా అంటున్నారు పౌలుగారు! సరే, మనం తిరిగి మన భాగానికి వద్దాం! సరే, ఇలాంటి అమోఘమైన అమూల్యమైన ధర్మశాస్త్రం కలిగియున్న నీవు, బోధిస్తున్న నీవు అనుకుంటున్నావు: నేను గ్రుడ్డివారికి  త్రోవచూపువాడను(వెరీగుడ్), చీకటిలో ఉండువారికి  వెలుగును (షెభాస్), బుద్ధిహీనులకు శిక్షకుడను (ఎక్షలెంట్), బాలురకు ఉపాధ్యాడను(ఆహా), అని నీ అంతట నీవే చెప్పుకుంటున్నావు కదా!! చాలా మంచిది!  మరి ఎదుటివానికి భోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా??? (21) చూడండి పౌలుగారి డైరెక్ట్ ప్రశ్న! ఇక్కడ ఇలాంటి బోధకులను, పండితులను, కాపరులను, ప్రసంగీకులను పౌలుగారు ఎండగడుతున్నారు? 
గొప్పగొప్ప ప్రసంగాలు చేస్తున్న ఓ పెద్దమనిషి! ఎదుటివానికి బోధించు నీవు లేక ఎదుటవారికి గొప్పగా పెద్ద పెద్ద ప్రసంగాలు రాస్తున్న నాలాంటి పెద్దమనుషులకు పౌలుగారు ఆడుగుచున్న  ప్రశ్న: ఎదుటివానికి బోధిస్తున్న నీవు ఒకసారి నీ బ్రతుకు ఎలా ఉందో ఆలోచించుకున్నావా? నీవు బోధిస్తున్న నీ బోధ కనీసం ఒకసారైన నిన్ను తాకింది కదా! హా ఇది చెప్పడం కోసం మాత్రమే, చేయడానికి కాదని అనుకుంటున్నావా? నీ అంతరాత్మప్రభోధాన్ని, నీ మనస్సాక్షిని నోక్కేస్తున్నావా? ఎదుటవానివైపు ఒకవ్రేలు చూపిస్తే నీవైపు మిగతా నాలుగు వ్రేళ్ళు చూపిస్తున్నాయి అని మరచిపోతున్నావా? అందుకే ఇలాంటి వారికి యేసయ్య గుడ్డిపరిసయ్యుడా, సున్నం కొట్టిన సమాధి అంటూ ప్రబోధించారు!

    ఇంకా అంటున్నారు: దొంగిల వద్దు అని ప్రకటించే నీవే దొంగతనం చేస్తావా? చూడండి ఎంతోమంది అంటారు ఇలాగే, గాని వారి జీవితంలో దేవునికిచ్చే ధనాన్ని, దేవునికిచ్చే సమయాన్ని దొంగతనం చేస్తున్నారు. దేవుని దశమ భాగం ఇవ్వండి- దొంగతనం చేయవద్దు అని బోధించే కాపరులు, బోధకులు, సేవకులు ఎంతమంది వారి ధశమభాగంలో దశామాంశం తీసి తమకంటే పెద్ద దైవజనులకు గాని లేక అక్కరలో ఉన్న సేవకులకు ఇస్తున్నారు? ఇది మరి దొంగిలడం కాదా ప్రియ దైవజనుడా! ఒకసారి గమనించమని యేసయ్య పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను! ఇంకా వ్యభిచరించవద్దు అని చెప్పు నీవు వ్యభిచారం చేస్తావా అని అడుగుచున్నారు. నేడు కొంతమంది ఇలాంటి తప్పుడు బోధకుల వలన, వారి కేరెక్టర్ మంచిది కానందున, దాని బట్టి నేడు సోషల్ మీడియాలో గాని, ఊరిలో గాని చాలాచోట్ల క్రైస్తవ సమాజం తలఎత్తుకొలేని పరిస్తితి ఏర్పడింది. మా ఊరిప్రక్కన వమ్మవరం అనే గ్రామముంది. మా తండ్రిగారు సేవ ప్రారంభంలో ఎంతో కష్టపడి ఆ గ్రామంలో సువార్త ప్రకటించి సంఘాన్ని కట్టారు. నేడు ఆ గ్రామంలో 11 దేవుని మందిరాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం! గాని గత 5 సంవత్సరాలుగా ప్రతీ సంఘంలోనూ నూతన విశ్వాసులు రావడం లేదు. ఆ ఊరిలో ఏ సంఘము అభివృద్ధి చెందటం లేదు. కారణం: సేవకులు/ పాదిర్లు! ఒక కాపరి- దైవసేవకుడు అని చెప్పుకుని ఒక పెళ్లయిన స్త్రీని తీసుకుని పోయాడు. రెండు నెలలకు మరొకడు పెళ్ళికాని స్త్రీని తీసుకునిపోయాడు. నేడు ఆ ఊర్లో పాదిరి అని చెబితే అసహ్యించుకుంటున్నారు. మా నాన్నగారి వలన మాకు ఆ ఊరిలో ఎంతోమంచి పేరున్నా గాని అంటున్నారు: అయ్యా మీ క్రైస్తవుల బోధలు చాలా చాలా బాగుంటాయి. దేవుడు కూడా చాలా మంచివాడేనండి. గాని మీ సేవకులున్నారు కదండీ వారు దొంగబోధకులు అందుకే మేమే మీ దేవుడ్ని నమ్మమండి అని చెబుతున్నారు. ఈరోజు అక్కడ తల ఎత్తుకోవడం కష్టంగా ఉంది మాకు! 
ప్రియ సేవకుడా! సేవకు ముఖ్యమైనది సాక్ష్యం! అదికూడా నీ సాక్ష్యం! నీ సాక్ష్యం నీ కేరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి నీవు సాక్ష్యాన్ని పోగొట్టుకొన్నావా, మరలా ఆ గ్రామంలో సేవ చేయడం కష్టం! కారణం నీబోదను ఎవడూ నమ్మడు! చివరికి దేవుడు కూడా నమ్మడం కష్టం! కాబట్టి నీ శీలాన్ని, నీ కేరెక్టర్ ని, సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దని మనవి చేస్తున్నాను.

  ఇక తర్వాత మాట చూడండి: విగ్రహాలను అసహ్యించుకొనే నీవు గుళ్ళను దోస్తావా? అనగా విగ్రహారాధనను అసహ్యించుకొనే నీవు గుడిని, గుడిలో లింగాన్ని/ విగ్రహాన్ని , ఆ దేవాలయంలో ఉండే చందాపెట్టెను కూడా దోచేస్తావా అని అడుగుచున్నారు. ఇది విగ్రహారాదికులకు చెప్పడం లేదు! మన బోధకులకు చెబుతున్నారు. నేడు కొంచెం పరిచర్యను దేవుడు దీవిస్తే- సేవ పెరిగితే- మేము ప్రార్ధన చేస్తే ఇలా, అలా అని చెప్పి- ఇది పంపండి అది పంపండి అని చెబుతూ, స్థానిక సంఘాలకు వెల్లవలసిన కానుకలను ఎంతోమంది సేవకులు టీవీలలోను, ఇంకా మరో సాధనాలలోను చెబుతూ స్థానిక సంఘాలను దోచుకోవడం లేదా? *మీ దశమభాగాలను, కృతజ్ఞతార్పణలు, మ్రొక్కబల్లు తప్పకుండా మీ స్థానిక సంఘానికే పంపండి, మీకు ప్రేరేపణ కలిగితే మీ ప్రత్యేక కానుకలను మాత్రమే మాకు పంపించండి  అని ఖచ్చితంగా చెప్పేవారు కేవలం ఒకరో ఇద్దరో కనిపిస్తున్నారు*. మిగతా వారందరూ మాకు పంపిచేయ్యండి అని అడుక్కుంటన్నారు. ఇదే అంటున్నారు పౌలుగారు! ఇది కూడదు అంటున్నారు. అంతేకాదు మరోమాట చెబుతున్నారు: మీ వలననే దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది! అందుకే దేవుడు దానికి ప్రతీకారం చేస్తాను అంటున్నారు. . . . యెషయా 52:5
నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించు చున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది . .; యేహెజ్కేలు 36:21,22,23
21. కాగా ఇశ్రాయేలీయులు పోయిన యెల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని. 
22. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటనచేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును. 
23. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి యెదుట మీయందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.  . .. 
కాబట్టి శిష్యుడను, బోధకుడను అని పేరుచెప్పుకుని తమ ప్రవర్తన వలన దేవునికి అపకీర్తి తెచ్చేవారు దేవుడ్ని తెలుసుకోకపోయి ఉండటమే శ్రేష్టము! కారణం వారిమీదకు దేవుని ఉగ్రత పెల్లుమని దిగుతుంది.
 ప్రియ సేవకుడా! దయచేసి నీవు ఇలాంటి కేడర్ లో ఉంటే ఇప్పుడే దానిని విడిచిపెట్టేయ్! 
దేవుని దగ్గర క్షమాపణ వేడి ఆయన పాదాలు పట్టుకో! 
సాక్ష్యాన్ని కోల్పోవద్దు! 
కేరెక్టర్ కోల్పోవద్దు! 
తద్వారా దేవునికి అవమానం తేవొద్దు! తద్వారా నరకానికి పోవొద్దు!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-37వ భాగం*
*సున్నతి-1*

రోమా 2:2526 
25. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మ శాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును. 
26. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా?

   ప్రియులారా! ఈ రోమా పత్రికలో మనకు ఎక్కువగా కనబడే రెండు పదాలు 1. ధర్మశాస్త్రం; 2. సున్నతి! గతభాగంలో ధర్మశాస్త్రం కోసం ఎన్నో విప్లవాత్మకమైన విషయాలు చెప్పిన పౌలుగారు ఆత్మావేశంతో ఇప్పుడు సున్నతికోసం చెబుతున్నారు. గమనించండి పౌలుగారుకి ధర్మశాస్త్రం తెలియక మాట్లాడటం లేదు. సగం సగం తెలిసి అంతకంటే మాట్లాడటం లేదు. ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు, అంతకంటే దేవుని ప్రత్యక్షత కలిగి ఆత్మానుభావంతో వ్రాస్తున్నారు ఇది!
సరే ఇంతకీ సున్నతి అంటే ఏమిటి? ఎలా వచ్చింది . . . .

 కొలస్సీయులకు 2: 11
మీరును, క్రీస్తు సున్నతియందు, శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి.

ఇక్కడ మనకు క్రీస్తు సున్నతి అనేమాట కనిపిస్తుంది. ఇంతకీ సున్నతి అనేమాట ఎలా వచ్చింది? అది ఏమిటి అనేది చూసుకొందాం! ఆదికాండం 17వ అధ్యాయంలో తండ్రియైన దేవుడైన యెహోవా అబ్రహాముగారిని స్వకీయ జనంగా చేసుకుంటూ, అబ్రహాముగారితో నిభందన చేస్తూ మీలో ప్రతీపురుషుడు సున్నతి చేసుకోవాలి అనగా గోప్యాంగచర్మము కోయబడాలి అని ఆజ్న ఇచ్చారు! అబ్రహాముగారు, అతని కుమారుడైన ఇష్మాయేలు ఒకేరోజున సున్నతి పొందారు! అది ఇశ్రాయేలీయులకు, ఇష్మాయేలీయులకు తరతరాలకు ఒక కట్టడగా ఉంది! 

ఇప్పుడు అంటున్నారు ధర్మశాస్త్ర ప్రకారం ప్రవర్తిస్తే, జీవిస్తే సున్నతి వలన నీకు ఉపయోగం ఉంది గాని ధర్మశాస్త్రమును అతిక్రమిస్తే అది సున్నతి కాదు అంటున్నారు. ఇక 2729 
27. మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? 
28. బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. 
29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును. . .  కాబట్టి సున్నతి శరీర సంభంధమైనది కాదుగాని ఆత్మ సంభంధమైనది.  . . ..

  అందుకే పౌలుగారు ఈ శరీర సంభంధమైన సున్నతి ఆచారమే తప్ప దానిలో ఆత్మీయ సంభంధమైనది కాదు గనుక దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు.

     అయితే ఇక్కడ పౌలుగారు మరో సున్నతి కోసం విరివిగా చెప్పేవారు. అది క్రీస్తు సున్నతి! మరి యేసుప్రభులవారు ఎప్పుడూ ఈ క్రీస్తు సున్నతికోసం మాట్లాడలేదు/ చెప్పలేదు! మరి ఈ క్రీస్తు సున్నతి ఏమిటి? 
పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు! అదే వచనంలో ఆ తర్వాత మాటలలో క్షుణ్ణంగా చెబుతున్నారు *శరీరేచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి, ఆయనయందు (క్రీస్తునందు) చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి*!! 
ఒకపాపి పశ్చాత్తాపపడి, తన పాప ప్రక్షాళన కోసం యేసయ్య సిలువను ఆశ్రయించి, యేసురక్తంలో తనపాపములను కడిగివేసుకుని, భాప్తిస్మము పొందుట ద్వారా రక్షణ పొందుతాడు!! అయితే ఇలా రక్షింపబడిన విశ్వాసి తన పాత పాపపు అలవాట్లు, శరీరకోరికలు, శరీరఆశలు, అన్నీ వదలివేసి పవిత్రంగా క్రీస్తు కోసం సాక్షిగా జీవిస్తాడో అప్పుడు ఆ విశ్వాసి క్రీస్తు సున్నతిని పొందుకుంటాడు!! ఇదే పౌలుగారు చెబుతున్న క్రీస్తు సున్నతి! ఒక ఇశ్రాయేలీయుడు సున్నతి పొందుకోకపొతే ఏ రకంగా ఇశ్రాయేలీయుడు కాలేడో, ఇశ్రాయేలీ సమాజంలో చేరలేడో, అలాగే ఒక విశ్వాసి ఈ ఆత్మసంభందమైన సున్నతి, చేతులతో చేయబడని సున్నతి, హృదయానికి సంభందించిన పవిత్రమైన క్రీస్తు సున్నతిని పొందుకోలేకపొతే, ఆ వ్యక్తి మందలో (సంఘంలో) చేరుతాడు గాని, దేవుని మందలో, ఆధ్యాత్మిక/ సార్వత్రిక సంఘంలో సభ్యుడు కాలేడు!!!!

 *రక్షింపబడిన తర్వాత ఓ విశ్వాసి చేరుకోవాల్సిన రెండవ మెట్టు ఇది!* తన పాత శరీరాశలు, శరీరేచ్చలు,  అన్నీ వదులుకోవాలి! ఎప్పుడైతే వదులుకొంటాడో, అప్పుడు పాపములేని హృదయంలో పరిశుద్ధాత్ముడు ప్రవేశించి, ఆ వ్యక్తిని తన ఆత్మద్వారా, వాక్యం ద్వారా, నిత్యమూ కడుగుతూ, నడిపిస్తూ, దేవుని వాక్యం అనే పచ్చిక గల చోట్ల నడిపిస్తూ, ఆశీర్వాదకరమైన శాంతికరమైన జలముల యొద్దకు నడిపించి, పుష్టిగా పోషిస్తారు!! అప్పుడు నీవు సర్వతోముఖాభివృద్ధి చెందుతావు! కేవలం భాప్తిస్మం పొందినంత మాత్రాన పరలోకానికి ఎగిరిపోవు!!! పేరుకు తగ్గ జీవితం జీవించాలి!

    ఓ రక్షింపబడిన విశ్వాసి రోడ్డుమీద బైబిల్ పట్టుకుని, నడుచుకుంటూ, మందిరానికి వెళ్తున్నప్పుడు,  దేవుని బిడ్డ వెళ్ళిపోతుందిరోయ్ అంటూ హేళనచేస్తుంటారు మా పల్లెటూర్లలో! ఇక్కడ మనల్ని వారు దేవుని బిడ్డలు అని ఒప్పుకొని, indirect గా వారు దయ్యం బిడ్డలని ఒప్పుకుంటున్నారన్నమాట! మరి ఇప్పుడు దేవుని బిడ్డ అని పేరు పెట్టు కొన్న నీవుఆ పేరుకి తగ్గ జీవితం జీవించాలి! అప్పుడే నీవు క్రీస్తు సున్నతి పొందుకున్నట్లు!!!

      భాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా, నీ పాపపు పాత అలవాట్లు , పాత రోత స్వభావం, కోపం, తిట్లు, వ్యభిచారం, త్రాగుడు, అమ్మాయిలకు లైన్ వెయ్యడం, బీట్లు కొట్టడం, సినిమాలు, షికార్లు, జూదం, అబద్దాలు . . . ఇలాంటి పాపస్వభావాలు కనిపిస్తే నీవు భాప్తిస్మం తీసుకున్నావు గాని క్రీస్తు సున్నతిని పొందనట్లే!!! 

ఇది చదువుతున్న ప్రియ చదువరీ! దయచేసి ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో! ఇంకా నీకు ఆ పాతస్వభావం ఉంటే, క్రీస్తు సున్నతి పొందనట్లే! 
ఎవడైతే క్రీస్తు ఆత్మలేనివాడో, వాడు ఆయన వాడు ఆడు. ఆయనవాడు కాదు అంటే వాడు సాతానుగాడి పార్టీ అన్నమాట! పాపపు అలవాట్లు, బుద్దులు ఉంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉండలేడు!! 
గనుక ఇప్పుడే మారుమనస్సు పొంది, పశ్చాత్తాపపడి, అయన కృపాసనం/ సిలువనొద్దకు రా! 
ఆయన నిన్ను తిరిగి చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు!

ఆమెన్!
దైవాశీస్సులు!!
(సశేషం)
*రోమా పత్రిక-38వ భాగం*
*సున్నతి-2*

రోమా 2:28-29 
బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు.
అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.

ప్రియ దైవజనమా! మనం గతభాగం నుండి క్రీస్తు సున్నతి అనే విషయాన్ని ధ్యానం చేస్తున్నాము. అక్షరార్ధమైన/ భాహ్యమైన సున్నతి అంటే ఏమిటి? క్రీస్తు సున్నతి అంటే ఏమిటో వివరంగా తెలుసుకున్నాం!! రక్షింపబడిన వ్యక్తి, తన పాత రోత పాప జీవితాన్ని విసర్జించి, క్రీస్తుకై సాక్షిగా, నూతన వ్యక్తిగా మారినవ జీవనం జీవించడమే, పవిత్రముగా జీవించడమే క్రీస్తు సున్నతి అని తెలుసుకున్నాం! ఈరోజు ఎందుకు ఆ రకంగా పవిత్రమైన జీవితం జీవించాలో తెలుసుకుందాము!

    పాతనిభందనలో చెప్పబడిన సున్నతి, ఇశ్రాయేలీయులు పాటిస్తున్న సున్నతి- కేవలం ఒక మతాచారం మాత్రమే! మనిషి బాహ్య చర్మం కోయబడినా- మనిషి అంతరంగం/ పాపపు స్వభావం- బుద్ధులు, అలవాట్లు కోయబడటంలేదు!! అయితే పౌలుగారు చెబుతున్న క్రీస్తు సున్నతి ఆధ్యాత్మికమైనది. అంతరంగ పరివర్తనకు చెందినది! అందుకే రోమా 2:28-29 లో చూసుకుంటే ..
బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు.
అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.
 . . . 
అంతరంగమందు, హృదయమందు యూదుడైన వాడే యూదుడు అంటున్నారు. ఇంకా క్రీస్తు సున్నతి శరీరమందు కాకుండా, హృదయ సంభంధమైనదై ఆత్మయందు జరుగుతుంది అంటున్నారు! ఈరకంగా క్రీస్తు సున్నతి పొందినవారికి మనుష్యుల వలన కాకుండా, దేవునినుండి మెప్పు కలుగుతుంది. అందుకే యిర్మియా 4:4 లో మీ శరీరాలు కాదు మీ హృదయాలకు సున్నతి చేయండి అంటున్నారు దేవుడు! 
కాబట్టి *అంతరంగమందు/ హృదయమందు సున్నతి పొందినవాడే నిజమైన యూదుడు ఎలాగయ్యాడో, అలాగే ఒక విశ్వాసి బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అవ్వడు గాని, హృదయ సంబంధమైన సున్నతిని పొందితేనే నిజమైన క్రైస్తవుడు! ఇక్కడ బాప్తిస్మంతో పాటు హృదయంలో దేవుని ఆత్మకార్యాలు పనిచేయాలి. అలా చేయాలంటే హృదయంలో ఉన్న గలీజు పాపపు తలంపులు, అలవాట్లు బయట పారవేయాలి*! 

 ఇక్కడ బాప్తిస్మము గురుంచి మనం జాగ్రత్తగా పరిశీలనచేస్తే, మత్తయి 3:6 లో వారు తమ పాపములు ఒప్పుకుని, యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుకున్నారు! పాపాలను ఒప్పుకోకుండా బాప్తిస్మము తీసుకోలేదు! నేటిదినాల్లో పాపాలకు క్షమాపణ కోరకుండానే, పాపాలు ఒప్పుకోకుండానే చాలామంది బాప్తిస్మము తీసుకుంటున్నారు. ఉదా: పెళ్ళికి బాప్తిస్మము తీసుకోవడం, ఉద్యోగం వచ్చినదని, రోగం పోయిందని. . . 
గాని నిజమైన బాప్తిస్మము తను పాపినని గ్రహించి, పశ్చాత్తాపంతో దేవుని కృపాసనం దగ్గరకు వచ్చి, క్షమాపణ వేడి, బాప్తిస్మము తీసుకుంటే అది నిజమైన బాప్తిస్మము!!
 ఇంకా అపోస్తలుల కార్యములు 2:38 లో పేతురుగారు  
పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

    కాబట్టి పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాపం లేకుండా తీసుకునే బాప్తిస్మము ఉత్తుత్తి బాప్తిస్మము! ఎప్పుడైతే పశ్చాత్తాపపడి, పాపాన్ని కన్నీటితో ఒప్పుకుంటావో, బాప్తిస్మము తీసుకుంటావో, అంతరంగంలో సున్నతి పొంది, - పరిశుద్ధాత్మను పొందుకొని, ఆత్మానుసారంగా జీవించగలవు!!! అలాకాకపోతే నీవు పొందిన బాప్తిస్మము అక్షరార్ధమైనదే గాని ఆత్మానుసారమైనది కాదు!

   ఇక సున్నతి కోసం చూసుకుంటే, గ్రేట్ స్కాలర్, ఫిలాసిఫర్, థియాలజిస్ట్ పౌలుగారు చాలా చక్కగా వివరించారు. రోమా 2:28-29 లో. ఇంకా  ఫిలిప్పీయులకు 3: 3
ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవుని యొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.

ఈ భాగంలో శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా, ఎవడైతే దేవుణ్ణి ఆత్మతోను, సత్యముతోను ఆరాధన చేస్తారో వారే నిజమైన సున్నతిని పొందుకున్న వారు అంటున్నారు. అలా ఆత్మతోను, సత్యముతోను ఆరాధన చేసే మనమే నిజమైన యూదులము, నిజమైన క్రీస్తు సున్నతిని పొందినవారము!! 
అందుకే యేసుప్రభులవారు దేవుడు ఆత్మ గనుక, ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి అని సెలవిస్తున్నారు! యోహాను 4:23-24; అలా చేసే ఆరాధనే క్రీస్తు సున్నతి అంటున్నారు పౌలుగారు! 

   ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీకు అటువంటి ఆరాధన- అటువంటి హృదయ సంభంధమైన/ ఆత్మ సంబంధమైన సున్నతిని నీవు కలిగియున్నావా? 
లేకపోతే నీవు వేషధారివి తప్ప నిజమైన క్రైస్తవుడివి కాదు!

దైవాశీస్సులు!
(ఇంకా ఉంది)
*రోమా పత్రిక-39వ భాగం*
*సున్నతి-3*

రోమా 2:28-29 
బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు.
అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.

ప్రియులారా మనం సున్నతికోసం ధ్యానం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా లోతుగా పరిశీలిస్తే:
కొలస్సీయులకు 2: 13
మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులైయుండగా,
దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి,

    ప్రియులారా! ఈ వచనాలు కూడా  సున్నతికి కొనసాగింపుగా వ్రాయబడినవే! ఈ వచనాలలో
 a) మనము ఏ కారణాల వలన మృతులమో; 
b) ఆ శిక్షను యేసయ్య ఏ రకంగా తప్పించారో చాలా వివరంగా వ్రాయబడింది!

1). మనము ఏ కారణాల వలన మృతులము??!!
a). అపరాధముల వలన. . .: ప్రియులారా! గతంలో చెప్పిన విధముగా లేఖనాలను లేఖనాలతోనే పరిశీలించాలి. అప్పుడే అది సరియైనది. ఒక వచనానికి supporting verse కనీసం మరొకటి ఉండాలి మనకు. ఇక్కడ ఈ వచనంలో మన అపరాధముల వలన మనము మృతులము అని వ్రాయబడింది. Supporting reference ఎఫెసీ 2:1 & 4.
1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. 
4. అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను. . . . .

ఇంకా ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వ్రాయబడింది. అపరాధము,  పాపముద్వారానును 3:4 అందుకే పెనాల్టీ కడతాము. అయితే పాపమునకు వచ్చు జీతం మరణం. రోమా 6:23. కాబట్టి పాపము చేసినందువలన మనం చావ వలసినదే! అంటే మనమందరమూ మృతులమే!!

b) శరీరమందు సున్నతి పొందకయుండుట బట్టి మృతులము!!: గతంలో చెప్పిన విధముగా ఆదికాండము 17వ అధ్యాయములో దేవుడు అబ్రాహాము గారి ద్వారా ఇశ్రాయేలీయులను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేయుటకు గాను, వారికి సున్నతి అనే ప్రక్రియ చేయాలి అని ఆజ్న ఇచ్చారు. అక్షరార్ధమైన, శారీరిక సున్నతిద్వారా ఇశ్రాయేలీయులు దేవునితో నిబంధనలోనికి వెళ్ళారు. అయితే అన్యజనాంగమునుండి రక్షణ పొందిన మనకు అటువంటి కట్టుబాట్లు లేవు! కాబట్టి మనమందరమూ ధర్మశాస్త్రమును బట్టి మృతులము. అంతేకాకుండా మనం సున్నతి కూడా పొందలేదు.

   ఒక రాజు శాసనం చేస్తే, దానిని మార్చే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ అదే రాజు దానిని మారిస్తే పిచ్చి తుగ్లక్ అంటారు. ఆలోచన లేని బలహీనమైన రాజు అంటారు. అలాంటిది దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు చేసిన శాసనాన్ని మార్చడం ఎలా??? అందుకే ఇది మానవులకు సాధ్యం కాదు కాబట్టి- ఆ దేవాదిదేవుడే ప్రణాళిక చేసి- ఆయనే దీనుడై- కుమారునిగా శరీరరీతిగా భూలోకానికి వచ్చి- ఆ రాతను, శాసనాన్ని గౌరవిస్తూ- ఆ పెనాల్టీ (Penalty) తనే తన స్వరక్తముతో కట్టి- ఆ రాతను చెరిపివేశారు. 
14. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి,  . . . .

    ** దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలనఅనగా ధర్మశాస్త్రము వలన కారణం ధర్మశాస్త్రం ఏ తప్పిదానికి ఏం చేయాలి, ప్రాయశ్చిత్తమేమిటో వ్రాయబడి యుంది.- ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం మనము పాపులము, చావుకు లోనైన వారము.

** మనకు విరోధముగాను, ఋణముగాను ఉన్న పత్రమును ధర్మశాస్త్రము వలన నిర్ధారించబడిన మన పాపము- పాపమునకు శిక్ష- Death Penalty/ Death sentense or Judgement ను

** మేకులతో కొట్టిమనస్థానంలో ఆయన ఉండి- మన చేతులతో మనం చేసిన పాపమునకు ఆయన చేతులలో మేకులు కొట్టించుకొన్నారు, నడకలతో చేసిన పాపాలకు కాళ్ళలో మేకులు కొట్టారు, తలంపులతో చేసిన పాపాలకు తలమీద ముళ్ళ కిరీటం ధరించారు. శరీరంతో చేసిన పాపాలకు కొరడా దెబ్బలు తిన్నారు. ఈ రకంగా మనమీద పడవలసిన శిక్షను ఆయనే భరించి, మనమీద నున్న judgement పూర్తిచేసి- ఇక ఆ శాసనాన్ని సిలువకు కొట్టి-

** దాని చేవ్రాతను చెరిపివేసి Once the Penalty paid, it’s over. అంతేకాకుండా చేసిన నేరానికి/ పాపానికి already శిక్ష అనుభవించారు కాబట్టి ఇక ఆ శాసనానికి విలువ లేదు. అందుకే దాని చేవ్రాతను తుడిచివేశారు.

** మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసిధర్మశాస్త్రము వలన పడిన శిక్షను ఆయన కేన్సిల్ చేసేశారు.
** అపరాధములను క్షమించిమన శిక్షను తానే భరించారు కారణం అది ఆయన మనపై చూపించిన ప్రేమ- అందుకే శిక్షను తానే భరించి, మన అపరాధములను జాలితో క్షమించారు.
** ఆయనతోపాటు జీవింపజేసెను.అనగా మొదట ఆయనతో పాటు మనం చనిపోయాముఆయన మృత్యుంజయుడు / పునరుత్థానుడు కాబట్టి ఆయనతోపాటు మనలని కూడా తనతోపాటు జీవింపజేశారు.

   ఇదీ రక్షణ కార్యము! ఈ రక్షణ మనకు ఉచితముగా రాలేదు. ఆయన గొప్ప వెల చెల్లించారు. ప్రియ చదువరీ! ఇంత అమూల్యమైన రక్షణ కార్యాన్ని చేసారు కదా దేవుడు, మరి ఆయనకోసం నీవు నీ ప్రాచీన పాత రోత జీవితాన్ని విడచిపెట్టలేవా?? ఆయనకోసం సాక్షిగా జీవించలేవా??

  ఇంతగొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందువు??? హెబ్రీ 2:3
కాబట్టి మన పాత అలవాట్లు / ప్రాచీన స్వభావము వదలివేసి ఆయనకోసం సాక్షిగా జీవిద్దాం! ఇదిగో ఇదే రక్షణ దినం! నేడే అనుకూల సమయం!
దైవాశీస్సులు!
ఆమెన్!
*రోమా పత్రిక-40వ భాగం*
      రోమా 3:12
1. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతివలన ప్రయోజనమేమి? 
2. ప్రతివిషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. 

  ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం సున్నతి కోసం పౌలుగారి మాటలలో ధ్యానం చేసుకున్నాం. ఇక ఈ రోమా 3:12  వరకు మనకు రెండు విషయాలు కనిపిస్తాయి. మొదటిది: యూదుల గొప్పతనం ఏమిటి! రెండవది: సున్నతివలన కలుగు ప్రయోజనం ఏమిటి!

 చదువరులు గమనించాలి: కొన్ని తెలుగు తర్జుమాలలో మొదటి వచనంలో సున్నతివలన ప్రయోజనం ఏమిటి అనే వచనపూర్వక పదాలు లేవు. ఇంగ్లీష్‌లో కొన్ని తర్జుమాలలోనే ఉన్నాయి. ఒరిజినల్ గా అయితే సున్నతివలన కలుగు ప్రయోజనం ఏమిటి అని వ్రాయబడింది.  సరే, ఇప్పుడు ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలిద్దాం!

   ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే: ఈ వచనాలు 2వ అధ్యాయం లో గల సున్నతి, ధర్మశాస్త్రం కోసరం పౌలుగారి చెప్పిన విషయాలకు కొనసాగింపుఅనగా యూదుడు ఇతరజాతి వారికన్నా గొప్పవాడు కాదు, యూదులు కూడా పాపం చేసి దేవుని దృష్టిలో దోషులైపోయారు.  యూదులకు తమ జాతివలన గాని, తమ మతం వలన గాని, తమ ఆచారాల వలన గాని పాపవిముక్తి, రక్షణ కలగడం అసాధ్యమని చెబుతూ, యూదులు కాని అన్యజనులను దేవుడు వారు పాపముచేసినప్పుడు శిక్షిస్తున్నట్లే, యూదుల పాపములను కూడా దేవుడు శిక్షించబోతున్నారు. దేవునికి పక్షపాతం లేదు అని చెబుతూ చెప్పిన మాటలు ఇవి! వెంటనే మనకు ఒక ప్రశ్న మదిలోకి వస్తుందిఅలాగైతే యూదులను దేవుడు ప్రత్యేకపరచి, వారికీ ప్రత్యేక కట్టడలు, ధర్మశాస్త్రం, శాసనాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది?  అని అడగవచ్చు! అందుకే ఆ ప్రశ్న అడగకుండానే పౌలుగారు ముందుగానే సమాధానం చెబుతున్నారు.

   ఒకసారి మీకు ఒక అనుమానం నివృత్తి చేయనీయండి:  ఇక్కడ ఇంకా చాలా చోట్ల పౌలుగారు ఇంకా ఇతర అపోస్తలులు యూదులు యూదులు అంటున్నారు. అనగా కేవలం యూదా గోత్రం కోసమే చెబుతున్నారా లేక మొత్తం ఇశ్రాయేలు 12 గోత్రాల కోసమే చెబుతున్నారా? జవాబు సింపుల్: మొత్తం 12గోత్రాల కోసం చెబుతున్నారు. దీనికోసం వివరంగా చెప్పాలంటే కొద్దిగా చరిత్ర జ్ఞాపకం చేసుకోవాలి!
BC 17 century లో హెబ్రీయులు అనే పేరు వచ్చింది అబ్రాహాము గారి సమయము నుండి కారణం వీరు మాట్లాడే భాష హెబ్రీ!
క్రీ.పూ. 13,12 శతాబ్దాలలో వారు అనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం లో ఉన్నప్పుడు ఐగుప్తీయులు వీరిని హెబ్రీయులు అని పిలిచేవారు. గాని ఇశ్రాయేలీయులు మేము ఇశ్రాయేలీయులము అని చెప్పుకొనే వారు. ఈ రకంగా ఇశ్రాయేలీయులు అని యాకోబు గారికి దేవుడిచ్చిన పేరుతో పిలువబడే వారు. క్రీ.పూ. 1020 లో సౌలు రాజరికంతో వీరు 12గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగా ఉండేది. క్రీ.పూ. 93౦ లో రెహబాము కాలంలో అతని అజ్ఞానం ద్వారా ఈ ఇశ్రాయేలు సామ్రాజ్యం యూదులు, ఇశ్రాయేలీయులు అనే రెండు భాగాలుగా విడిపోయారు. యూదా గోత్రం, బెన్యామీను గోత్రం కలసి యూదులుగా పిలువబడే వారు!  క్రీ.పూ. 72272౦ లో ఇశ్రాయేలీయులు, 586లో యూదులు చెరలోనికి పోయారు.  ఆ తర్వాత యిర్మియా గారిద్వారా, యేహెజ్కేలు గారి ద్వారా ఇంకా ఇతర ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పిన విధముగా వారు చెరనుండి మరలా తమ దేశం వచ్చిన తర్వాత అనగా క్రీ.పూ. 538515 మధ్యాకాలంలో వారు వచ్చాక వీరిని యూదులు అనే పిలిచేవారు గాని ఇశ్రాయేలీయులు అని పిలిచేవారు కాదు. ఇక అప్పటినుండి నేటివరకు వారిని యూదులు అనే పిలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ పౌలుగారు యూదులు అని వ్రాసారు కాబట్టి యూదా గోత్రికులు మాత్రమే అని భావించకూడదు!

   సరే, ఇక్కడ పౌలుగారు అంటున్నారు! అలాగయితే యూదునికి కలిగిన గొప్పతనమేమిటి? సున్నతివలన ప్రయోజనమేమిటి?  ఎక్కువగా ఆలోచించకుండా జవాబుకూడా పౌలుగారు చెబుతున్నారు: ప్రతీ విషయమందు అధికమే! అంటూ కొని న్యాయమైన రుజువులు చూపిస్తున్నారు. మొదటిది: దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. ఇక్కడ దేవోక్తులు అంటున్నారు, గాని మిగతా చోట్ల ధర్మశాస్త్రం యూదులకు ఇవ్వబడింది అని చెబుతున్నారు.  దేవుని వాక్కులను అప్పగించినది వీరికే! అందుకే ఆదికాండం 17వ అధ్యాయం నుండి వీరిని ప్రత్యేకించుకోవడం మొదలుపెట్టారు దేవుడు! ఇంకా వివరంగా 9:45 లో వ్రాస్తున్నారు పౌలుగారు
4. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. 
5. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.  . . . . .    
కాబట్టి ఇంతటి విశిష్టిత ఉంది యూదులకు.  అయినా సరే, తప్పు చేస్తే, పాపం చేస్తే దేవుని దృష్టికి ఎవరైనా ఒకటే అని పౌలుగారి స్థిరమైన అభిప్రాయం! కారణం ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా ఏ ఇతర ప్రజలకంటే ఎక్కువగా యూదులకు దేవుని సత్యాన్ని వినేందుకు, ఆయనను రుచిచూడటానికి నిజదేవున్ని తెలుసుకునేటందుకు, సేవించేటందుకు మిగతా ప్రజకంటే అద్భుతమైన అవకాశాలు యూదులకే ఉన్నాయి కాబట్టిచాలా ప్రాముఖ్యత ఉంది అంతేకాకుండా, ఇన్ని అవకాశాలు ఉన్నా గాని నమ్మటం లేదు కాబట్టి ఎక్కువ శిక్ష వీరికే !

   ఇక తర్వాత వచనాలలో అందరికీ వచ్చే అనుమానం కోసం వ్రాస్తున్నారు: మరి యూదులలో అనేకమంది దేవునికి అవిశ్వాసులై తిరిగుతున్నారు కదా, మరి వారెలా ప్రత్యేకజనంగా ఉంటారు. దేవుడు చెప్పిన వాగ్దానాలు, ఇచ్చిన ఆశీర్వాదాలు నిలిచిపోయినట్లే కదా!  3:3,4
3. కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా?( లేక,వారి అవిశ్వాసము దేవుని విశ్వస్యతను వ్యర్ధముచేయునా?) అట్లనరాదు. 
4. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును. అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.  . . . అందుకే అంటున్నారు పౌలుగారు వారిలో కొందరు అవిశ్వాసులైనంత మాత్రాన వారి అవిశ్వాసం వలన దేవుని విశ్వసనీయత రద్దు అవదు. ప్రతీ మనిషి అబద్ధికుడైనంత మాత్రాన దేవుడు కూడా అబద్దమాడరు కదా, దీనికి సమ్మతంగా ఏమని వ్రాయబడింది అంటే: నీవు నీ మాటలలో న్యాయవంతుడుగా కనబడుదువు, తీర్పు చెప్పేటప్పుడు నీవే గెలుస్తావు.  
కాబట్టి తమకున్న అవకాశాలను యూదులు దుర్వినియోగం చేసుకున్నారు కాబట్టి, అవిదేయులై, అవిశ్వాసులై ఉండడం అనేది దేవుని తప్పుకాదు, మనుష్యుల బుద్ధి వారి బాల్యము నుండి చెడ్డది (ఆదికాండం 8:21) కాబట్టి వారు అలా ప్రవర్తిస్తున్నారు. గాని మనిషి దేవుని పట్ల నమ్మకంగా లేకపోయినా దేవుడు మాత్రం ఎప్పుడూ నమ్మకంగానే ఉంటారు. ఆయన ఎప్పుడు ప్రేమ చూపుతూనే ఉంటారు. 2 తిమోతి 2:13 
మనము నమ్మదగని వారమైనను(నమ్మకపోయినను), ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు(ఆయన తన్ను తానెరుగననలేడు).
 ఇశ్రాయేలు జాతికి ఆయన చేసిన వాగ్దానాలను మాత్రం తప్పకుండా నెరవేరుస్తారు.

  కాబట్టి ప్రియ స్నేహితుడా! వాగ్దానాలు ధర్మశాస్త్రం అన్నీ ఇచ్చిన ఇశ్రాయేలీయులు తమ విశ్వాసాన్ని దేవునిపై ఉంచకుండా భూలోకసంభంధమైన విషయాలపై ఉంచారు, దేవుని నుండి దూరమై పోయారు. నీవుకూడా దేవునినుండి దూరమై పోతే నేడే తిరుగు! ఇశ్రాయేలు వారిని దండించిన దేవుడు నిన్నుకూడా దండిస్తారు. అలాగే ఇశ్రాయేలు జాతి అపనమ్మకస్తులైన దేవుడు నమ్మకస్తుడైనట్టు, నీవు అప్పనమ్మకస్తుడవైనా దేవుడు నీ పట్ల కూడా నమ్మకంగా ఉంటారు. 
నీయందు జాలిపడే దేవుడు ఆయన! కాబట్టి నేడే దేవునితో సమాధాన పడు! విశ్వాసాన్ని వదలివేసిన నీవు తిరిగి రా! పశ్చాత్తాపంతో సిలువనొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకో! 
దేవుడు నిన్ని క్షమించటానికి సిద్దంగా ఉన్నారు.
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-41వ భాగం*
      రోమా 3:56
5. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా? నేను మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; 
6. అట్లనరాదు. అట్లయిన యెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? 

   ప్రియులారా! ఈ వచనాలు ఏమైనా అర్ధంయ్యాయా? మీకు అర్ధం అవడానికి stuby bible  వారి తర్జుమా చదువుకుందాం!  
అయితే మన అన్యాయ ప్రవర్తన దేవుని న్యాయాన్ని నిరూపిస్తూ ఉంటే మనం ఏమనాలి? తన కోపాన్ని కుమ్మరించే దేవుడు అన్యాయస్థుడా? (నేను మనుషుల వ్యవహార రీతిగా మాట్లాడుతున్నాను.)
6 అలా కానే కాదు. అలా ఉంటే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు?

. . . .   చూసారా మన అన్యాయ ప్రవర్తన దేవుని న్యాయాన్ని నిరూపిస్తూ ఉంటే మనం ఏమనాలి? కోపాన్ని కుమ్మరించే దేవుడు అన్యాయస్తుడా?  ఒకసారి ఆగి ఆలోచిద్దాం! పౌలుగారు ఈమాట ఎందుకు అన్నారు? మన అన్యాయ ప్రవర్తన దేవుని న్యాయాన్ని నిరూపిస్తూ ఉంటే .... మనం చేసే అన్యాయపు పనులు అనగా దేవునికి ఆయాసం కలిగించే పని ఏదైనా సరే, ఉదా: త్రాగుడు, లంచాలు, వ్యభిచారం . . . వగైరాలు .. ఇవి దేవుని న్యాయాన్ని నిరూపిస్తున్నాయి అట! అది ఎలా? ఉదాహరణ:  నీవు త్రాగే త్రాగుడు, చేసే వ్యభిచారమునకు దేవుడు తీర్పు తీర్చి నిన్ను దండించారు అనుకుందాం! క్రైస్తవుడు అని పేరుపెట్టుకుని అన్యులకంటే పనికిమాలిన స్తితిలో ఉండగా దేవుడు నిన్ను శిక్షించారు అనుకుందాం. వెంటనే ప్రజలు అనుకుంటారువీడు చేసిన తప్పులకు దేవుడు తగిన శాస్తి చేశారు అంటారు. అనగా ఇక్కడ తప్పులు, నేరాలు, ఘోరాలు, పాపాలు చేస్తే దేవుని ఉగ్రత రావడం అనే దేవుని తీర్పు లేదా దేవుని న్యాయం బయలుపడుతుంది.  అనగా దేవుని న్యాయం ఇక్కడ నిరూపితమయ్యింది! ఎవరివలన? నీ వలన నిరూపితమయ్యింది!

    కొంతమంది తమ అపనమ్మకం, చెడు మార్గాలు దేవుని విశ్వసనీయతను, నీతి న్యాయాలను మరింత ఘనమైనవిగా కనిపించేలా చేశాయి కాబట్టి ఒకరకంగా మేము చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, పాపాలు దేవుని నీటిని/ న్యాయాన్ని నిరూపితం చేస్తున్నాయి కాబట్టి మా పాపాలు/ అన్యాయాల ద్వారా దేవునికి సహాయపడుతున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని శిక్షించకూడదు అనే పెద్ద మనుష్యులు కూడా ఉన్నారు. గనుక ఇలాంటి వారిమీదకు వచ్చే దేవుని ఉగ్రత ఎంతో న్యాయమైనది. సరియైనది!  మరి దేవుడు ఇలా చేయడం అనగా పాపాత్ములను శిక్షించడ అనేది దేవుణ్ణి అన్యాయస్తుడిగా చేస్తున్నాయా? ఆయన చేసేది న్యాయమా కాదా? ముమ్మాటికీ న్యాయమే! ఆయన పూర్వమే చెప్పారు! ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేది దేవుడు తన ధర్మశాస్త్రం ద్వారా, తన భక్తుల ద్వారా, ఇంకా నరులలో ఉంచబడిన దేవుని ఊపిరి ద్వారా కలిగే అంతరాత్మ ప్రభోదాల ద్వారా/ గద్దింపుల ద్వారా చెబుతూనే ఉన్నారు. అది తప్పు, పాపము అని తెలిసి చేస్తున్నాడు కాబట్టి దానికి రెండింతల శిక్ష అనుభవించాల్సిందే! కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కానేరడు! 
 యోబు 34:10  దేవుడు అన్యాయం చేయడం అసంభవం! సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం!

  ఇక తర్వాత వచనాలు ధ్యానం చేద్దాం! 7-8
7. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల? 
8. మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే. ....   ఇంకా బాగా అర్ధం చేసుకోవాలి అంటే: నా అసత్యం వలన దేవుని సత్యం వృద్ది అయి, ఆయనకు మహిమ కలిగిస్తుంది అనుకోండి అలాంటప్పుడు నేను పాపిని అని తీర్పు పొందడం ఎందుకు? 
  నిజం చెప్పాలంటే ఈ మాట ప్రచురం చేసింది పౌలుగారు అంటే కిట్టని వారు ఆయనమీద చెడు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. కారణం ఆయన వేషదారులను, సున్నతి వర్గం చెందినవారిని, బహిరంగంగాను, సమాజమందిరాలలోను ఎండగట్టడం మొదలుపెట్టారు. వీరు క్రొత్తక్రొత్త తప్పుడు బోధలు బోదిస్తూ పబ్బం గడుపుకోవడం మొదలుపెట్టారు. వారికి పౌలుగారు కౌంటర్ ఇవ్వడమే కాకుండా సంఘాన్ని ఆ తప్పుడుబోధలు నుండి విడిపించడం మొదలుపెట్టారు. అందుకనే ఆయనమీద ఈ క్రైస్తవులకు ఒల్లుమంట! వీరు కేవలం తమ దోషాన్ని తక్కువ చేసుకొనేందుకు లేక తమ దోషాలు దోషాలే కాదు అని సమర్ధించుకోడానికి పౌలుగారిమీద నిందలు వేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు పౌలుగారు చెబుతున్న తీర్పు, ఉగ్రత అనే అంశాలకు వీరు భయపడటం మొదలయ్యింది. కాబట్టి దానినుండి వీరు తప్పించుకోడానికి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, నేరం పౌలుగారిమీడకు తోస్తున్నారు.  అందుకే పౌలుగారు చెబుతున్నారు: ఇలాంటివారిమీద దేవుడు తన ఉగ్రతను పంపడం సరైనదే! దేవుడు న్యాయవంతుడే!

   ఈ రోజులలో అనేకమంది దేవుని ఉగ్రతకోసం, రాకడ, మార్పు, పశ్చాత్తాపం, పవిత్రజీవితం కోసం చెప్పడం లేదు! అస్తమాను దేవుడు కరుణామయుడు, నీకు ఏ ఆపద రానీయడు లాంటి ప్రసంగాలు చేయడం, చెప్పడం జరుగుతుంది గాని దేవుడు త్వరలో రాబోతున్నారు. నీక్రియలు మార్చుకోకపొతే, ఆయన చెప్పినట్లు చేయకపోతే ఉగ్రత, నరకం వస్తుంది అని బోధించడం లేదు! రాకడకు తమ గొర్రెలను మందను ఆయత్తం చేయడం లేదు! ఎవరైనా ఖండితముగా ఉన్నది ఉన్నట్లు చెబితే వారిని వక్రీకరించి, వారిమీద బురుదచేల్లడం మొదలయ్యింది.  

ప్రియ కాపరీ! నేవేలా ఉన్నావు? సంఘాన్ని రాకడకు సిద్దపరుస్తున్నవా? నెలలు, సంవత్సరాలు తరబడి అదే ప్రసంగం చేస్తున్నావా? నీ మందకోసం నీవు లెక్క అప్పగించాలి అని మరచిపోవద్దు! మందను పాడు చేస్తున్న గుంట నక్కలకు పౌలుగారు కొరడా జులిపించి సంఘాన్ని ఆయత్తపరచి సంఘాన్ని సరిచేశారు. మరి నీవు సరిచేస్తున్నావా దేవుడు నీకు అప్పగించిన సంఘాన్ని, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని దేవునిరాకడకై సిద్ధం చేస్తున్నావా?
దేవుడు ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతులు ఇచ్చి, కొన్ని రోజుల తర్వాత ఎలా లెక్క అడిగారో (మత్తయి 25), అదేవిధముగా నిన్నుకూడా దేవుడు లెక్క అడుగుతారు. నీ లెక్కలు సిధ్ధంగా ఉన్నాయా? జాగ్రత్త!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-42వ భాగం*
      రోమా 3:910
9. ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము. 
10. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు 

  ప్రియ దైవజనమా!  9వ వచనంలో  అలాగైనా ఏమందుము అంటున్నారు పౌలుగారు! అనగా యూదులు తమ అవకాశాలు, ఆదిక్యతలు, దేవుడిచ్చిన చట్టాలు, విధులు, ధర్మశాస్త్రం .. ఇన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఇవి లేనివారికంటే గొప్పవారా?! మంచివారా? శ్రేష్టులా?!! అంటే దీనికి ఆయనే సమాధానం చెబుతున్నారు: ఎంతమాత్రమూ కాదు!  చూడండి పౌలుగారు ఏమి చెబుతున్నారో! యూదులేమి, గ్రీసు దేశస్తులేమి (అనగా ఇక్కడ కొరింథీ వారు) అందరునూ పాపమునకు లోనైయున్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే అది ఎవరైనా కావచ్చు ప్రతీ ఒక్కరు పాపులే! ఏ బేధమును లేదు అందరునూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేక పోతున్నారు. (23). .

    ఇప్పుడు మనం ఇలా చెప్పుకోవచ్చు: స్వభావరీత్యా క్రైస్తవులు అన్యులకంటే గొప్పవారా? శ్రేష్టులా? నీతిమంతులా? మంచివారా? కాదుకాదు! క్రైస్తవుడు అని పెరుపెట్టుకొన్నవాడు కూడా పాపే!  యూదులు, అన్యజనులు, ఇండియన్లు, పాకిస్తాన్ వారు, అమెరికా వారు అంతా పాపులే!  ఆ వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినా, ఏ కులానికి చెందినా ఆ వ్యక్తి క్రైస్తవుడైనంత మాత్రాన పుణ్యవంతుడు, నీతిమంతుడు అయిపోడు! కేవలం మతాచారాలు పాటించినంత మాత్రాన సరిపోదు! బైబిల్ ప్రకారం అనగా వాక్యానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం జీవిస్తేనే దేవుని దృష్టిలో నీతిమంతుడు అవుతాడు! లేకపోతే నీవు మతాచారారాలు, సంఘాచారాలు, సంఘ నియమావళి లేదా ఆరాధన క్రమాలు పాటించినంత మాత్రాన నీతిమంతుడు అవడు పాపి-పాపే!

    పౌలుగారు ఇలాచెబుతూ కొన్ని ఉదాహరణలు లేఖనాలనుండి చెబుతున్నారు.  1012
10. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు 
11. గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు 
12. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి.మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.  . . . . . 
ఈ వచనాలు కీర్తనలు 14:13; 53:13 నుండి సేకరించబడినవి. 
Psalms(కీర్తనల గ్రంథము) 53:1,2,3
1.దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయువాడొకడును లేడు. 
2.వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. 
3.వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు మేలు చేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు. . . . . .  అంతేకాకుండా ప్రసంగి 7:20
 పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.  . .  ఇక్కడ యూదులు కూడా పాపులు అంతేకాకుండా అన్యజనులు కూడా పాపులే అని చెప్పడానికి ఈ ఉదాహరణలు/ లేఖనాలు ఎత్తి చూపుతున్నారు పౌలుగారు.  

  ఇక 13వ వచనం 
వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది
   వీటికి మూలాధారం కీర్తన 5:9 ;
వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు.
 14౦:3
పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)

14. వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.
    దీనికి సంభందించిన వచనాలు  కీర్తన 10:7 
వారి నోరు శాపముతోను కపటముతోను వంచన తోను నిండియున్నది వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.
 1517
15. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి. 
16. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. 
17. శాంతిమార్గము వారెరుగరు.  . . . . .  దీనికి మూలం  యెషయా 59:78 
7. వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి 
8. శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.  . . .

18.  వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
   కీర్తన 36:1 
భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు.

   ప్రియులారా! అసలు వీరు అనగా యూదులేమి, క్రైస్తవులేమి, అన్యులేమి ఎవరైనా ఇలా తయారవడానికి కారణం ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు. *అది దేవుడంటే భయం లేకపోవడం*!!! *అవును నేటిరోజులలో పేరుకు క్రైస్తవుడే గాని దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయం ఉంటే ఆ వ్యక్తి ఆరాధనకు ఆలస్యంగా రాదు/రాదు! ఆఫీసుకి అరగంట లేటు అయితే బాస్ తిడతాడు అనే భయం ఉంది,  టైం ప్రకారం ఫింగర్ ప్రింట్ వేయకపోతే అటెండెన్స్ పోతాది అనే భయం ఉంది గాని దేవాదిదేవుడు, రాజాదిరాజు, ప్రభువులకు ప్రభువు మన దేవుడు అనే భయం, భక్తి ఉంటే ఏ పనికిమాలిన వాడు ఆరాధనకు లేట్ గా రారు! భయం ఉంటే సమయానికే వస్తారు. దేవుడంటే భయం ఉంటే ఆరాధనలో సెల్ ఫోన్లు చూడరు. దేవుడంటే భయం ఉంటే చర్చికి వచ్చి సొల్లు కబురులు చెప్పుకోరు. దేవుడంటే భయం ఉంటే , దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు అనే భయం ఉంటే చర్చికి వచ్చి బీట్లు కొట్టరు! అసహ్యమైన పనికిమాలిన మాలిన వస్త్రధారణ చేసుకుని మందిరానికి రారు! వాక్యాన్ని సావధానంగా భయంతో భక్తితో ఉంటారు. దేవుడంటే భయం ఉంటే అబద్దాలు చెప్పరు, వ్యభిచారం చేయరు, అన్యులు చేసే ఆచారాలు చేయరు, త్రాగుడు తాగరు, లంచాలు తీసుకోరు! ఇవన్నీ చేస్తున్నారు అంటే దేవుడంటే భయం లేదు*!  ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే అంత జాగ్రత్తగా భయంతో ఉంటావు కదా దేవాదిదేవుని దగ్గరకు వచ్చినప్పుడు మరెంత జాగ్రత్తగా ఉండాలి?!!!!  

  ఒకసారి అబ్రాహాము గారంటారు ఈ స్థలంలో దైవభక్తి అసలు ఏమీ లేదు  ఆదికాండం 20:11; కీర్తనలు 34:1114 . . .  ,  నీకు జ్ఞానం లేకపోవడానికి కారణం దేవుడంటే భయం లేకపోవడమే! 111:10
యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివే కము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.. . . ; 
సామెతలు 1:7 
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలి వికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.  . .

  పైన వివరించిన దుష్ప్రవర్తన ప్రతీ ఒక్కరు చేస్తారని కాదు, వాటిలో ఏదో ఒకటో రెండో చేస్తారు. కారణం ప్రతీ ఒక్కరిలోనూ ఈభ్రష్టస్వభావం ఉంది. ఆ స్వభావము వలననే మనుష్యులు ఇలాంటివి చేస్తారు.  మరి ఎలా వీటిని తప్పించుకోవడం? ఎలా మారడం? పైన వివరించినట్లు అనగా కీర్తనలు 34:1114; 111:10.; సామెతలు 1:7 దేవుడంటే భయభక్తులు కలిగి ఆయన నీ దేవుడు అని తెలుసుకుని, ఆయనెవరో నీకు నీవే తెలుసుకుని, ఆయనంటే భయపడి ఆయనను ఆరాదిస్తే నీకు అలాంటి బ్రష్ట స్వభావం పోయి దేవుడంటే నిజమైన భయభక్తులు కలిగి జీవించగలవు! ప్రియ చదువరీ! ఒక్కసారి నిన్ను నీవే పరిక్షించుకో! 
నీలో ఎలాంటి స్వభావం ఉందో! 
ఒకవేళ దేవుడంటే భయము, భక్తి లేని జీవితం అయితే నేడే సరిచేసుకో!
దైవాశీస్సులు! 
*రోమా పత్రిక-43వ భాగం*

      రోమా 3:1920
19. ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము. 
20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. 

  ప్రియ దైవజనమా!  ఇక్కడ ధర్మశాస్త్రము అనగా పై వచనాలను పౌలుగారు ఎత్తి రాశారు కదా అది మొత్తం, ఇంకా దేవుడు సీనాయి పర్వతము మీద మోషేగారికి చెప్పిన ధర్మశాస్త్రం మొత్తం అని అర్ధమిస్తుంది! లోకమంతా దేవుని తీర్పు క్రిందకు రావాలి. కాబట్టి ధర్మశాస్త్రం చెప్పేది ధర్మశాస్త్రానికి లోబడే వారందరికీ అనగా యూదులందరికీ చెబుతున్నట్లు అంటున్నారు పౌలుగారు.

మొదటిభాగాలలో చెప్పిన విధముగా రోమా 1:18 నుండి మొదలు పెట్టిన పౌలుగారు ఈ3: 19-20 వచనాలతో ముగిస్తున్నారు. ప్రపంచంలో పుట్టిన ప్రతీ మనిషి పాపి అని, దేవుని ఎదుట నేరస్తుడు అని రుజువు చేశారు ఇంతవరకు పౌలుగారు! 
1:1820 ప్రకారం ప్రకృతి, సృష్టిని దేవుడు చేసిన విధానమును బట్టి మనిషి దేవుని ప్రభావాన్ని, దైవత్వాన్ని గుర్తించనందు వలన నేరస్తుడు అనియు, 
1:2128 ప్రకారం:  మానవ చరిత్ర ప్రకారం మనిషి మొదటినుండి దేవుణ్ణి వదలి- దేవుడు కానివాటిని, సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను మరచిపోయారు కాబట్టి నేరస్తులు అనియు, 
1:2932 ప్రకారం మానవజాతి ప్రస్తుతస్తితిలో కూడా పాపులుగానే జీవిస్తున్నారు కాబట్టి వీరుకూడా నేరస్తులు అనియు, 
2:15 ప్రకారం వారి అంతరాత్మ / మనస్సాక్షి గద్దిస్తున్నా మనిషి ఇంకా విర్రవీగి పాపాలు చేస్తున్నాడు కాబట్టి నేరస్తుడు అనియు, 
ఇక 3:1018 వరకు పాత నిభందనలో వ్రాసిన వాక్యాలు ప్రకారం కూడా మనిషి పాపి అని రుజువుచేస్తుంది అని నొక్కివక్కానిస్తున్నారు పౌలుగారు.  మనుష్య జాతి మొత్తం దోషులే తమ దోషాల వలన! తమ పాపాలకు తామే భాధ్యులు! దేవుని న్యాయమైన తీర్పుకు పాత్రులు! ఉగ్రతకు పాత్రులు!ఎవరు దేవుని ఎదుట సాకులు చెప్పే అవకాశం లేదు. ఇది తెలుసుకున్నవారు ధన్యులు! ఎవడైతే తమ నోటినీ, మనస్సును, ప్రవర్తనను అదుపులో పెట్టుకుని, ప్రభువా పాపినైన నన్ను క్షమించు అని మొర్రపెడుతూ దేవుని సన్నిధిలో విరిగినలిగిన హృదయముతో కనిపెడతాడో వాడు పాపవిముక్తికి, దేవుని పరలోక రాజ్యానికి అనగా దేవునికి సమీపముగా ఉన్నాడు. అలా కాకుండా నేను నీతిమంతుడను, పాపము లేనివాడను, నాకు ఏ పాపము తెలియదు అనే డప్పాలు కొట్టుకునే వాడు లూకా 18:914 లో యేసుప్రభులవారు వివరించిన ఉపమానం ప్రకారం ఉన్నవాడే!
9. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. 
10. ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. 
11. పరిసయ్యుడు నిలువబడి దేవా!, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
12. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను. 
13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. 
14. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.  . . . 
 ఇతరుల కన్నా మేమే మంచివారం, వాళ్ళకన్నా మేమే బెటర్ అని మురిసిపోయేవాడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారో ఈ ఉపమానం కళ్ళకు అద్దినట్లు చెబుతుంది. తామేమిటో అర్ధం చేసుకుని, సుంకరిలా పాపిని ప్రభువా క్షమించు అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఏడ్చే వాడు పాప క్షమాపణ పొంది, పాపాలు కడుగుకుని, నీతిమంతుడిగా తీర్చబడతాడు.

     ఇక 20వ వచనాన్ని క్లుప్తంగా ధ్యానం చేద్దాం!
ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
    ధర్మశాస్త్ర సంభంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఇది మొదటిది. ఇక రెండవది: ధర్మశాస్త్రం వలననే పాపము అంటే ఏమిటో తెలిసింది అంటున్నారు పౌలుగారు.  ఇక్కడ పౌలుగారు ధర్మశాస్త్ర సంభంధమైన క్రియలు చేయడం ద్వారా అనగా ధర్మశాస్త్రం లో ఇవ్వబడిన ఆజ్ఞలు, ఆచారాలు కట్టడలు పాటించేందుకు ప్రయత్నించడం ద్వారా పాప విముక్తిని పొందడు అనగా నీతిమంతుడుగా తీర్చబడడు అంటున్నారు. కారణం మనిషి అన్నవాడు ఎవడూ దానిని సంపూర్తిగా నెరవేర్చలేడు పాటించలేడు!. బ్రష్ట స్వభావం గల మనిషి ఈ పవిత్ర మైన సూత్రాలను నియమాలను పాటించడం అసంభవం! అందుకే యాకోబుగారు చెబుతున్నారు  2:10 లో  ఎవరైనా ధర్మశాస్త్రమంతా పాటిస్తూ కేవలం ఒక్క విషయంలో తప్పిపోతే ఆ వ్యక్తి ధర్మశాస్త్రమంతటిలో అపరాది అవుతాడు.  ఇంతవరకు కేవలం యేసుక్రీస్తు ప్రభులవారు మాత్రమే పాటించగలిగారు. ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడుట అనే విషయాన్ని ఈ రోమా పత్రికలో చాలా గట్టిగా ఉద్ఘాటిస్తూ చెబుతున్నారు పౌలుగారు. కారణం కేవలము నీతిమంతులు మాత్రమే పరలోకం చేరగలరు. నీవు పుట్టుకతో పాపివైనా క్రీస్తు రక్తంలో కడుగబడి నీతిమంతుడుగా తీర్చబడితేనే నీకు పరలోకం! కేవలం క్రైస్తవుడుగా పుట్టినంత మాత్రాన, భాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోకం రాదు. నీ పాపాలు కడుగుకుని, పవిత్రమైన జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. అప్పుడే నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు!  సువార్తకు నాంది ప్రస్తావనం ఇదే! 

   ఇక పౌలుగారు చెప్పే రెండోమాట ఈ వచనంలో కేవలం ధర్మశాస్త్రం వలననే పాపం అంటే ఏమిటో మనకు తెలిసింది. బైబిల్ పాపమునకు నిర్వచనం చెబుతుంది: ఆజ్ఞాతిక్రమమే పాపం!1యోహాను 3: 4
పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.
 చేయవద్దు అని చెప్పిన పని చేయడమే పాపము! ధర్మశాస్త్రం మొత్తం మీద ఎన్నో విధివిధానాలు ఉన్నాయి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు!! ఎలా ఉండాలి? ఏం తినాలి? ఏం త్రాగకూడదు ఇలాంటివి ముందుగానే రాసి ఉంచారు దేవుడు! వీటిలో ఏమి తప్పినా దోషమే! పాపమే! కాబట్టి అవి అనగా ఆ విధివిధానాలు దేవుడు మనతో చెప్పకపోతే మనకు పాపము అంటే ఏమిటో తెలియదు! విధివిధానాలు తెలుసుకుని కూడా నీవు కావాలనే తప్పుచేస్తున్నావు కాబట్టి అది నీమీద దోషారాపన చేస్తుంది.  కాబట్టి ధర్మశాస్త్రం తెలుసుకున్న నీవు దానిని అతిక్రమిస్తే దోషివి పాపివి!

   అదేవిధముగా దేవుణ్ణి తెలిసికొనకపొతే పర్వాలేదు గాని నిజ దేవుణ్ణి తెలిసికొని, బైబిల్ గ్రంధం చదివి కూడా నీవు తప్పులు చేస్తుంటే నీ దోషం ఘోరమైనది. రెండింతల శిక్ష అని మరచిపోకు! శిక్షకు పాత్రుడవు!  అయితే నీమీదకు రావలసిన శిక్షను ఆయన భరించి నిన్ను విడుదల చేసి తన రాజ్య మహిమకు, వాడబారని మహిమ కిరీటానికి, తేజోవాసుల స్వాస్త్యమునకు నిన్ను పిలుచుకున్న తర్వాత, దేవుని మహిమను కొంతకాలము అనుభవించిన తర్వాత కుక్క తనవాంతికి మరలినట్లు, కడుగబడిన పంది బురదకు మరలినట్లు (2పేతురు 2:22) నీవు మారక పాపము అనే దాస్యపు కాడిలో చిక్కుకుంటే నీవు దేవునితీర్పును తప్పించుకోలేవు సుమా! హెబ్రీయులకు 6:4,5,6
4. ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై 
5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన(మూలభాషలో-రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు, 
6. తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము. . . . .

  కాబట్టి నేడే నీ బ్రతుకు మార్చుకో!
ఆయన పేరుకు తగ్గట్టుగా జీవించు!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-44వ భాగం*
*దేవుని రక్షణ సిద్ధాంతం-1*

      రోమా 3:2123
21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. 
22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. 
23. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. 

  ప్రియ దైవజనమా! ఇంతవరకు పౌలుగారు అనేక లేఖనాలను చూపించి మనుష్యులంతా మరణపాత్రులే, నరకపాత్రులే, శిక్షకు పాత్రులే అని చెప్పారు పౌలుగారు. అయితే ఈ 3:215:11 వరకు దేవుని రక్షణ ప్రణాళిక ఏమిటి అనేది చెబుతున్నారు.  ఇంతవరకు మీరు శిక్షకు పాత్రులు అని నొక్కివక్కానించిన పౌలుగారు ఇప్పుడు వారికి రావలసిన శిక్షను తప్పించుకునే మార్గమును, దేవుని రక్షణ ప్రణాళిక సిద్దాంతాన్ని వివరిస్తున్నారు పౌలుగారు.

   'ఇట్లుండగా' అంటున్నారు. అనగా ఇలా మరణపాత్రులమైన మనం, నరకపాత్రులమైన మనం, శిక్షకు పాత్రులమైన మనం ఇలాంటి పరిస్తితులలో దేవుడు కనికరించి ఆయన రక్షణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ రక్షణ సిద్దాంతం/ ప్రణాళిక అది ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడి అందరికీ చేరింది. అది నీవు విశ్వాసం ద్వారా మాత్రమే, ఆయనను నమ్మి తద్వారా నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు అని చెబుతున్నారు పౌలుగారు ఈ వచనాలలో!

   దేవునికి మనుష్యులలో కావలసినది నీతి- నిజాయితీ- నిర్దోషత్వంయధార్ధతన్యాయము. అయితే వీటిని ఎలా పొందుకోవడం అనేది ఇక్కడ దేవుడు పౌలుగారి ద్వారా తెలియజేస్తున్నారు. ఈ పత్రికలో నిర్దోషత్వం లేక నీతిన్యాయాలు జరిగించుట అనగా దేవుని న్యాయ పీఠము ఎదుట తీర్పుకై నిలబడినప్పుడు ఏ మచ్చ, ముడత, కళంకము లేకుండా ధైర్యముగా నిలబడటమే! ఇదే నిర్దోషత్వం అంటే! యేసు ప్రభులవారు ధైర్యముగా సవాలు విసరినట్లునాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించును అని సవాలు విసరినట్లు (యోహాను 8:46)--  ఒక మనిషి ధైర్యముగా దేవుని న్యాయ పీఠము వద్ద నిల్చోవాలి!! ఏ లోపం లేకుండా, కల్తీలేని నిర్దోషత్వముతో దేవుడు ఆమోదించే విధముగా ఉండాలి.

  ఇక ఈ నీతిన్యాయాలు లేక  దేవుని నీతి అనేదానికోసం పౌలుగారు విస్తారంగా వ్రాసారు ఈ వచనాలలో! 21వ వచనం ప్రకారం ఈ దేవునినీతి దేవుని నుండి వస్తుంది. అది మనుష్యుల ద్వారా లేక మంచి పనుల ద్వారా రాదు.  అంతేకాకుండా ఇది లోప రహితమైనది, కళంకం లేనిది, అంతేకాకుండా దీనికి ధర్మశాస్త్రంతో పనిలేదు! అనగా దేవుని ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను, ఆచారాలను పాటించేందుకు ప్రయత్నించడం ద్వారా లభించేది ఎంతమాత్రము కాదు ఈ దేవుని నీతి! (21) అంతేకాదు దీనికి సాక్ష్యం దేవుని ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలు! అనగా ఇదేదో కొత్తది, వింతైనది కాదు.  అది కేవలం విశ్వాసం ద్వారా లేక నమ్మకం ద్వారా వస్తుంది. ఉదాహరణలు ఆదికాండం 15:6 
అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
హబక్కూకు 2:4
వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ(తన విశ్వాస్యతచేత) బ్రదుకును.

 22,24 వచనాల ప్రకారం దానిని అనగా దేవుని నీతిని స్వీకరించడానికి ఇష్టపడే వారికందరికీ దేవుడు దానిని ఉచితంగా ఇస్తారు.  ఇది *అపాత్రులైన పాపులకు దేవుడు తన ఉచిత కృప వలన ఉచితముగా ఇచ్చేది* దీనిని కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే పొందుకోగలం! (22,24, 1:17) ; ఇక మన మంచి క్రియలద్వారా దీనిని సంపాదించుకునే ప్రయత్నం చేసినా దొరకదు. కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే ఇది దొరుకుతుంది.  దానికోసం కేవలం దేవునిపైనే ఆధారపడాలి! నిజం చెప్పాలంటే ఈ దేవునినీతికి పరిపూర్ణుడు యేసుక్రీస్తు ప్రభులవారే (1కొరింథీ 1:29; 2కొరింథీ 5:21).  కాబట్టి ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారికి దేవునినీతి, నిర్దోషత్వాలు ఉంటాయి. కేవలం విశ్వాసం ద్వారా లేక నమ్మకం ద్వారా మాత్రమే క్రీస్తును మనం స్వీకరించగలం! యోహాను 1:12; 3:16;36;  పాతనిభంధనలో ఇదే దేవుని నీతిని శుభ్రమైన తెల్లని వస్త్రంతో పోల్చారు అనేకచోట్ల! యెషయా 64:6లో ఇది మనకు ఎంత అవసరమో రాసి ఉంది. మనం క్రీస్తులో నమ్మకం పెట్టుకున్నప్పుడు దేవుడు మనకు క్రీస్తు యొక్క నిష్కల్మసమైన దేవుని నీతి అనే నీతిన్యాయాలను వస్త్రముగా మనకు తొడుగుతారు!  మనుష్యులను ఈ విధంగా న్యాయవంతులుగా నిర్దోషులుగా చేయడం అనేదానికి యేసుక్రీస్తు ప్రభులవారి సిలువమరణం తో ముడిపడి ఉంది. (24,25).  న్యాయవంతుడైన దేవుడు తానే మనుషుల పాపాలకై బలిగా చేయబడి వారిపాపాలకు తానే ప్రాయశ్చిత్తం చేసి, మనుష్యుల పాపాలను విమోచించి, వారిని నిర్దోషులుగా చేయడం అనేదే దేవుని రక్షణసిద్ధాంతం లేక దేవుని రక్షణప్రణాళిక!  దేవుని ధర్మశాస్త్రం అయితే మనల్ని నేరస్తులుగా పరిగణిస్తేదేవుని నీతి మనలను విముక్తికి మార్గం చూపించి, విముక్తి చేస్తుంది.  

*ఇప్పుడు మీరనొచ్చు యేసుక్రీస్తు సిలువ మరణం పొందాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన దేవుడు కదా! మరో మార్గం ఉండేది కదా , దేవుడు సర్వశక్తుడు కదా! గాని నిజం చెప్పాలంటే మరో మార్గం లేదు! ఇదే మార్గం! ఇది మాత్రమే మార్గం! కారణం దేవుడు తానె ఇచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేరు! ధర్మశాస్త్రం మనలను నేరస్తులుగా పరిగణించి, తీర్పు తీర్చినట్లు ఇంతవరకు మనం చూసుకున్నాం! మరి మనకు శిక్షనుండి తప్పించుకొనే మార్గం ఏది? మనలను నిర్దోషులుగా తీర్చడం ఎలా? ఎలా? ఎలా?* ఎలాగంటే దేవుడేయేసుప్రభులవారే మన స్థానంలో ఉంది మనకు రావాల్సిన శిక్షను భరించి, మన శిస్ఖను తానూ అనుభవించి, తానే మరణమైపోయారు. ఇక్కడ పాపం పోవాలి అంటే రక్తం చిందించబడాలి, రక్తం చిందించకుండా పాపము పోదు అని మన ధర్మశాస్త్రం మరియు ఇతర మత గ్రంధాలు కూడా సెలవిస్తున్నాయి. అందుకే దేవుడే  తానే మరకొరకు చనిపోయి, తన రక్తం చిందించి మనలను పాప విముక్తులుగా చేశారు. 25, యోహాను 1:29; మత్తయి 26:2728; 1యోహాను 2:2; యెషయా 53:56,10; 
తనను విశ్వసించిన వారందరి మీదకు రావలసిన దేవుని కోపాన్ని, ఉగ్రతను తానే భరించి, పాపాలను తీయడం ద్వారా దేవుని కోపాగ్నిని మళ్ళించారు యేసయ్య!

  అయితే ఇది అనగా ఈ పాప విమోచనమును, దేవుని నీతిని ఎలా పొందుకొంటాము? కేవలం ఆయనయందు విశ్వాసం, నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే! అబ్రాహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను (రోమా 4:3; గలతీ 3:6; యాకోబు 2:23; అని చెప్పబడిన విధముగా మనం కూడా ఆయన జనన మరణ పునరుత్థానములను నమ్మి, విశ్వసిస్తే మనము కూడా పాప విముక్తులుగా మారి, దేవునినీతిని పొందుకుని, నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చబడతాము! గమనించండి. మనం స్వాభావికముగా అనీతిమంతులం. అయితే ఎప్పుడైతే దేవునియందు విశ్వాసముంచుతామో అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాము! ఇది కేవలం విశ్వాసం మూలముగానే జరుగుతుంది. ఇదే రక్షణ సిద్ధాంతం!

  ప్రియ చదువరీ! దీనిని నీవు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తే నీవు ధన్యుడవు! నీతిమంతుడవు! అంగీకరించపోతే నీవు ఇంకా తీర్పులో ఉన్నావని మరచిపోకు! 
నేడే రక్షణ దినం! 
ఇదే అనుకూల సమయం!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-45వ భాగం*
*దేవుని రక్షణ సిద్ధాంతం-2*

     రోమా 3:2526. 
25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని 
26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను. . .

      ప్రియ దైవజనమా! ఈ వచనాలు రోమా పత్రికకు ముఖ్యమైన వచనాలు. దేవుని రక్షణ సిద్ధాంతము/ ప్రణాళికకు ముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తు రక్తము నందలి విశ్వాసం!  ఎవరైతే యేసురక్తమందు విశ్వాసముంచుతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తారు. ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలన చేద్దాం!

     24వ వచనం ప్రకారం నమ్మువాడు కృపచేతనే క్రీస్తుయేసు నందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇది రక్షణ సిద్ధాంతానికి నాంది. గమనించండి: ఆయన రక్షణ అయితే ఉచితముగా ఇస్తున్నారు దేవుడు. గాని అది ఉచితముగా రాలేదు. ఈ విమోచనము కలగటానికి ఆ దేవాదిదేవుడే మూల్యం చెల్లించారు. ఆయన తనకుతానుగా మనకొరకు క్రయధనముగా అర్పణమయ్యారు. మత్తయి 20:28
ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
ఎఫెసీ 1:7; 1పేతురు 1:1819 
18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని 
19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా .. ..

   ఇక 25-26 వచనాలలో అంటున్నారు: గతంలో చేసిన పాపాలను తన ఓరిమిద్వారా సహనంతో సహించి, దాటిపోయాడు. వారిని ఓరిమితో ఉపేక్షించారు అంటున్నారు పౌలుగారు, ఎందుకు ఉపేక్షించారు దేవుడు? కారణం అప్పటికి శాశ్వత పరిష్కారమైన శాశ్వత బలియాగం జరగలేదు. అందుకే దేవుడు వారిని ఉపేక్షించారు.  కాబట్టి ఆ శాశ్వత బలియాగం కోసం లేక దేవుడు తన కోపాగ్ని తొలగించే రక్తబలిగా యేసుక్రీస్తు ప్రభులవారిని భూమిమీద అర్పించారు. ఇందులో దేవుని ఉద్దేశ్యం ఏమిటంటే తన న్యాయాన్ని లేక దేవుని నీతిని ప్రజలకు చూపించడం కోసం! 

   క్రీస్తువచ్చి తనను తాను బలిగా అర్పించి పాపాన్ని తీసివేయక మునుపు  ఎవరైతే పశ్చాత్తాపపడి దేవునియందు విశ్వాసముంచారో దేవుడు వారిని క్షమించారు.  కారణం క్రీస్తుద్వారా ఆయన తాను రాబోయేకాలం చేయబోయే రక్షణ కార్యం దేవునికి తెలుసు కాబట్టి వీరిని అనగా దేవునియందు విశ్వాస ముంచిన వారిని నరకానికి త్రోసివేయలేదు. వారిని దేవాదిదేవుడు క్షమించారు. అలా చేయడంలో అనగా మనుష్యులను శిక్షంచకుండా క్షమించడంలో దేవుడు న్యాయవంతుడుగా కనబడటం లేదు కారణం తానే ఇచ్చిన ధర్మశాస్త్రం వీరిని దోషులుగాను, పాపులుగాను నిర్ణయించింది. శిక్ష విధించింది. అయినా దేవుడు వీరిని పోనిచ్చారు. మరి దీనికి శాశ్వత పరిష్కారం కోసం అనగా పాప విముక్తి/ ధర్మశాస్త్రం నుండి విముక్తి కోసం తన సొంత కుమారున్ని బలిగా చేసి తన న్యాయాన్ని సంపూర్ణంగా దేవుడు కనబరిచారు.  ఐతే ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తుతుందిఅది ఇతరులకు చెందవలసిన శిక్ష తన సొంత కుమారుని మీద మోపి, వారి స్థానంలో తనకుమారుని బాధలకు గురిచేయడం, మరణించే లాగా లేక బల్యర్పణగా చేయడం న్యాయ సమ్మతమేనా?   దానికి జవాబు అవును! న్యాయ సమ్మతమే! కారణం ఆయన దేవుడు.  రోమా 1:4; 9:5; యోహాను 1:1; 14; ఫిలిప్పీ 2:6 ప్రకారం అది సమ్మతమే! ఆయన తన ఇష్టపూర్వకముగా మనకోసం బాధలు అనుభవించారు, మరణించారు. యోహాను 10:1718
17. నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 
18. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. . . . .  
 క్రీస్తు మరణంలో దేవుడు తానే మనుషుల పాపాలను తనపైనే వేసుకుని వారి కోసం బలిగా చేయబడి బాధలను అనుభవించారు.  హెబ్రీ 10:1 ప్రకారం ధర్మశాస్త్రం రాబోయే వాటి నీడ మాత్రమే. కాబట్టి క్రీస్తుద్వారా జరుగబోయే బల్యర్పణ కు నీడ ధర్మశాస్త్రంలో చెప్పబడిన పాప పరిహారార్ధ బలి. దేవుడు తానే దానిని నెరవేర్చారు. తద్వారా ధర్మశాస్త్రం ద్వారా ఆపాదించబడిన / నిరూపించబడిన దేవుని తీర్పును, ఉగ్రతను మళ్ళించాడు దేవుడు! 

  కాబట్టి ఇపుడైతే బలి చెల్లించబడింది కాబట్టి పెనాల్టి చెల్లించబడింది కాబట్టి పాపానికి / ధర్మశాస్త్రానికి మనిషిమీద అధికారం లేదు. అలా చేసి దేవుడు తాను న్యాయవంతుడయ్యారు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం నమ్మకం ఉంచుతారో వారినికూడా దేవుడు నీతిమంతులుగా చేయడానికి దేవుడే తన నీతిని ప్రదర్శించారు. అదే దేవుని నీతి. 

  అయితే ఇట్టి మహోన్నతమైన దేవుని నీతిని పొందుకున్న నీవు తిరిగి పాపం చేస్తే తప్పించుకోలేవు. కారణం 1పేతురు 1:1819 ప్రకారం నీవు విమోచించబడింది వెండి బంగారం వంటి వెలగల వస్తువుల ద్వారా కాదు అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారా! దానిని చులకన చేసి తిరిగి పాపంలో చిక్కుకుంటే తప్పించుకోలేవు జాగ్రత్త!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-46వ భాగం*
*దేవుని రక్షణ సిద్ధాంతం-3*

     రోమా 3:2728. 
27. కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయ బడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టి వేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. 
28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము. . .

ప్రియులారా!  27వ వచనలో అంటున్నారు అయితే అతిశయకారణమెక్కడ? అది కొట్టివేయబడెను అంటున్నారు! ఇంతకీ అతిశయకారణం ఏమిటి?  గతంలో చెప్పిన విధముగా ధర్మశాస్త్రమే యూదులకు అతిశయ కారణం! 3:1--2; 9:4--5;.  కాబట్టి ఈ విధమైన ఆజ్ఞలు, కట్టడలూ  గల యూదులు తమకున్న ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించేవారు. అయితే ఇప్పుడు పౌలుగారు చెబుతున్నారు అది కొట్టివేయబడెను! ఎప్పుడు ఎక్కడ కొట్టివేయబడెను? సిలువలో కొట్టివేయబడింది .
కొలొస్సయులకు 2:13,14,15,17
13. మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులైయుండగా, 
14. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, 
15. ఆయనతో కూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. 
17. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము(మూలభాషలో-శరీరము) క్రీస్తులో ఉన్నది  . .. . .

 సరే, ఇప్పుడు అది ఏ న్యాయమును బట్టి కొట్టివేయబడింది? క్రియా న్యాయమును బట్టా లేక విశ్వాస న్యాయమును బట్టియా? విశ్వాస న్యాయమును బట్టి మాత్రమే కొట్టివేయబడింది.  కాబట్టి 28వ వచనం ప్రకారం ధర్మశాస్త్ర సంభంధమైన క్రియ లేకుండా కేవలం విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు! 

   అయితే చాలామంది తాము చేస్తున్న, చేసిన దాన కార్యాలు, గొప్ప కార్యాలు, మంచికార్యాలు ద్వారా పాప విముక్తి, రక్షణ  వస్తుంది అనుకుంటున్నారు. అయితే మంచిపనుల ద్వారా విముక్తి, రక్షణ, మోక్షం కలిగితే పరలోకం మొత్తం ఎవరిగొప్పలు వారు చెప్పుకునే ఢాంభికులతో నిండిపోతుంది. 
 ఎఫెసీ 2:810 
8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. 
9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. 
10. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. . . . .

         కాబట్టి ఎవడూ తను చేసిన గొప్ప/ మంచి కార్యాలను బట్టి అతిశయించకూడదు! అంతేకాదు నీజాతిని బట్టి కూడా అతిశయపడకూడదు. నీవు యూదుడవైనా అతిశయ పడకూడదు, పాష్టర్ వైనా, పాష్టర్ కొడుకువైనా/కూతురువైనా అతిశయపడకూడదు. అందరూ పాపులే! 2:17 . అలా అతిశయ పడితే లూకా 18:1112 లో యేసయ్య చెప్పినట్లు పరిసయ్యుడు అతిశయ పడినట్లు నీవుకూడా చేస్తే వేషదారిగా తీర్చబడతావు జాగ్రత్త! 
సరే, ఇప్పుడు పరలోకములో ఉండేవారు ఎవరిని స్తుతిస్తూ ఉంటారు? కేవలం దేవుణ్ణి మాత్రమే! తమకుతాము పొగుడుకోరు అంతేకాకుండా మరొకరిని పొగడరు/ స్తుతించారు కేవలం దేవుణ్ణి మాత్రమే నిత్యమూ పరిశుద్దుడూ పరిశుద్దుడూ పరిశుద్దుడూ అంటూ గానప్రతిగానములు చేస్తుంటారు.
యెషయా 6;   1 కొరింథీ 1:2931 
29. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. 
30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు. 
31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను. . . . కాబట్టి అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి! అంతే తప్ప నేను ప్రార్థన చేస్తే ఇంతయ్యింది అంతయ్యింది. మా అయ్యగారి ప్రార్థన చేస్తే ఇలా అయ్యింది అలా జరిగింది... ఇలాంటి గొప్పలు, సొంత డబ్బాలు చెప్పుకున్నా, చెప్పించుకున్నా వేషదారులు అవుతారు!
దేవుడు మనల్ని చేసింది ఆయనను పొగడటానికి. Ephesians(ఎఫెసీయులకు) 1:6,12
6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 
12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను(లేక,మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. 
 కాబట్టి ఆయనకు మాత్రమే మహిమ రావాలి/ తేవాలి! 
ప్రకటన 7:910 
9.అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్తృములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి. 
10.సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. . .  కాబట్టి ఇదీ మన పని అక్కడ, ఇక్కడ కూడా. కాబట్టి అదే చేద్దాం!
  
   కాబట్టి 28వ వచనం ప్రకారం ధర్మశాస్త్ర క్రియలు లేకుండా కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము! దీనికి సాద్రుష్యముగా చాలా చోట్ల ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు పౌలుగారు! 1:16--17 
16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. 
17. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. . .; 
5:1.
1. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.( కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము అని పాఠాంతరము)  . .;
 10:10 Romans(రోమీయులకు) 10:8,9,10
8. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. 
9. అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. 
10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. . . .;  
గలతీ 2:16
ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.
 3:24 
కాబట్టి మనము విశ్వాసమూలమున నీతి మంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.
5:4 
మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృపలో నుండి తొలగిపోయియున్నారు.

ఇక యాకోబుగారు చెప్పినట్లు విశ్వాసం ఉండాలి గాని క్రియలు లేని విశ్వాసం మృతం! 2:17; కాబట్టి మంచిపనులు ఉండాలి, వాటితోపాటు విశ్వాసం ఉండాలి. ఈ రెండు సమపాళ్ళలో ఉన్నప్పుడే నీవు నీతిమంతుడవు, పరలోకం! ఒకటి ఉండి మరొకటి  లేకపోతే వేషదారివే!

ప్రియ చదువరీ! నీవు ఎలా ఉన్నావు? కేవలం నీకు కలిగిన ఈవులను బట్టి అతిశయించేవాడుగా ఉన్నావా? లేక విశ్వాస న్యాయాన్ని బట్టి జీవిస్తూ, క్రియలతో కూడిన విశ్వాసపు జీవితం జీవిస్తున్నావా? కేవలం నీవు చేస్తున్న మంచికార్యాలు గురించి డప్పాలు కొట్టుకుంటే వేషదారిగా మిగిలిపోతావు జాగ్రత్త! 
వేషదారులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అని మరచిపోకు! 
కాబట్టి నేడే నీ జీవితాన్ని సరిదిద్దుకో! పరలోకాన్ని చేరుకో!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-47వ భాగం*
*దేవుని రక్షణ సిద్ధాంతం-4*

     రోమా 3:2931
29. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. 
30. దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును. 
31. విశ్వాసముద్వారా ధర్మశాస్త్ర మును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మ శాస్త్రమును స్థిరపరచుచున్నాము.. . .
   ప్రియ దైవజనమా! ఈ 29వ వచనంలో పౌలుగారు మరో ధర్మ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదేమిటంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదా?!! జవాబు కూడా ఆయనే చెబుతున్నారు: దేవుడు అందరికీ దేవుడే! అపోస్తలుల కార్యములలో ఆది అపోస్తలులు సువార్త ఆరంభంలో చెబుతున్నారు: యేసుక్రీస్తు అందరికీ ప్రభువు! 10:36;  పౌలుగారు ఇదే 3:23 లో ఏ బేధమును లేదు అందరునూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ అందరును, అందరికీ అనగా యూదులకే కాదు, గ్రీసు దేశస్తులకు, ఆఫ్రికా వారికి, అమెరికా వారికి, ఇండియా వారికి, పాకిస్తాన్ వారికి కూడా దేవుడే! ఈ నిజమైన దేవుడు అందరికీ దేవుడే!

   ఇక 30వచనం ప్రకారం దేవుడు ఒక్కడే! అనగా ఇండియాకి ఒక దేవుడు, అమెరికాకు ఒక దేవుడు, పాకిస్తాన్ కి మరో దేవుడు, యూదులకు ఇంకో దేవుడు లేడు! మొత్తం ప్రపంచానికి అంతటికీ ఒక్కడే దేవుడే!  ఇక దేవుడు ఒక్కడే అనడానికి ఎన్నోసార్లు వ్రాయబడింది. 1కొరింథీ 8:4 
కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.; 12:6.; 
ఎఫెసీ 4:6
అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి (మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు.
  అంతేకాదు మరోచోట్ల దేవుడు అద్వితీయ దేవుడు అని చెబుతున్నారు. అద్వితీయుడు అనగా మరో రెండో వాడు లేడు! కాబట్టి దేవుడు ఒక్కడే! ఇక బైబిలే కాకుండా అనేక మత గ్రంధాలు కూడా దేవుడు ఒక్కడే అని ఘంటాపథంగా చెబుతున్నాయి! కాబట్టి ఇప్పుడు యూదులకు సున్నతి అనే ప్రక్రియ ద్వారా వారు నీతిమంతులుగా అవుతాము అని బావిస్తున్నారు. అయితే యూదులకు తప్పించి అనేక ఇతర దేశాలకు సున్నతి లేదు. మరి వారు నీతిమంతులుగా తీర్చబడటం ఎలా? కారణం యూదులకు యెహోవా దేవుడు ఉన్నారు. మరి మిగతా దేశాల వారు వారికి మరో దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు/. మరి వారు ఎలా నీతిమంతులుగా అవుతారు? ఇది మరో ధర్మ సందేహం!!!

   దానికి కూడా పౌలుగారు జవాబు చెబుతున్నారు! మొదటగా దేవుడు ఒక్కడే! అందరికీ దేవుడు ఒక్కడే! కాబట్టి ఒక్కడైయున్న ఈ నిజమైన దేవుడు సున్నతిగలవారికి విశ్వాస మూలముగా, సున్నతిలేనివారికి అదే విశ్వాసమూలముగా నీతిమంతులుగా తీర్చబడతారు! 30వ వచనం! ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే సున్నతిగల వారికి సున్నతిని బట్టి నీతిమంతులుగా తీర్చబడతారు అనడం లేదు. సున్నతిగల వారికి విశ్వాసం ద్వారానే, అలాగే సున్నతి లేనివారికి కూడా విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు!  కాబట్టి ఒక్కడే దేవుడు యూదులకు ఒకరకంగా , మరో దేశస్తులకు మరోవిధంగాను విముక్తులను చేయరు. అందరినీ ఒకేవిధంగా రక్షిస్తారు, అదే విశ్వాస న్యాయాన్ని బట్టి. అదే దేవుని రక్షణ సిద్ధాంతం!

          ఇప్పుడు 31వ వచనంలో మరో ధర్మ సందేహమును వ్యక్తం చేస్తున్నారు పౌలుగారు! మరి ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం లేదు కాబట్టి మరి విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నామా? అంటే కాదుకాదు! దానిని రుజువు చేస్తున్నాం అంటున్నారు. మరి అదెలా? ధర్మశాస్త్రాన్ని పాటించడం అనే దానివలన ఎవరి పాపములు పోవు అని చెప్పడం ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడం కానేకాదు!  కాని దానిని సరైన స్థానం లో ఉంచడం అవుతుంది. ధర్మశాస్త్రం పని పాపం అంటే ఏమిటి? నీవు ధర్మశాస్త్రం ప్రకారం ఏవిధముగా పాపివో తీర్పు తీర్చడం వరకు దాని పని! అయితే పాపవిముక్తి కోసం తిరిగి విశ్వాస నియమానికి/ న్యాయానికి/మార్గానికి రావలసిందే! అందుకే మత్తయి 5:1718 లో యేసుప్రబుల వారు చెబుతున్నారు .
17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. 
18. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.  . . ..  
కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా నీవు పాపివి అని తీర్చబడ్డావు కాబట్టి ఇప్పుడు విశ్వాస నియమాన్ని పాటించవలసినదే!
ధర్మశాస్త్రం నిన్ను విముక్తి చేయలేదు కేవలం యేసు రక్తము మాత్రమేనిన్ను విముక్తి చేస్తుంది! 1యోహాను 1:7; ఎప్పుడు ఎలా? నీవు పాపివి అని గ్రహించి, క్షమాపణ వేడుకుని, యేసురక్తంలో నీ పాపం కడుగుకుని- ఆ ఏసే ముక్తికి మార్గమని నమ్మి, విశ్వసించి నప్పుడు ఆయన తన రక్తము ద్వారా నీ పాపాలు కడిగి నిన్ను పవిత్రునిగా చేస్తారు. 
మరి నీవు సిద్దమా?
దైవాశీస్సులు!




*రోమా పత్రిక-48వ భాగం*
*దేవుని రక్షణ సిద్ధాంతం-5*
     రోమా 4:13 
1. కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము. 
2. అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు. 
3. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను  . .

      ప్రియులారా! మనం గత కొన్నిరోజులుగా దేవుని రక్షణ సిద్ధాంతం లేక రక్షణ ప్రణాళిక కోసం పౌలుగారు ఎలా వర్ణించారో ధ్యానం చేసుకుంటున్నాం!  ఇక గతంలో చెప్పిన విధముగా 4-8 అధ్యాయాలలో ఈ రక్షణ సిద్ధాంతాన్ని పౌలుగారు అబ్రాహాము గారి జీవిత వృత్తాంతము నుండి మనకు వివరిస్తున్నారు. అంతేకాదు ఈ రక్షణ సిద్ధాంతాన్ని మన జీవితాలలో ఎలా అప్లై చెయ్యాలో (అన్వయించుకోవచ్చు) అనేది చాలా చక్కగా వివరిస్తున్నారు. ఈ 4వ అధ్యాయం మొత్తం అబ్రాహాముగారి జీవితం నుండి దేవుని రక్షణ ప్రణాళిక సిద్దాంతాన్ని వివరిస్తున్నారు పౌలుగారు.

      1వ వచనంలో శరీరమును బట్టి మన మూల పురుషుడగు అబ్రాహామునకేమి దొరికెను అంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి! మొదటిది :  శరీరం, రెండవది: మన అంటున్నారు. మన అనడానికి కారణం  ఈ పత్రిక పౌలుగారు రోమా లో చెదిరిపోయి, అక్కడున్న యూదులకోసం రాస్తున్నారు. కాబట్టి ఇక్కడ పౌలుగారు యూదుడు. ఇంతకమునుపు మీకు వివరించినట్లు యూదులు /ఇశ్రాయేలీయులు బబులోను/ అస్శూరు చెర విముక్తి పొందాక వారు ఏ గోత్రమునకు చెందిన వారైనా యూదులు గానే పిలువబడే వారు. ఇక్కడ పౌలుగారు బెన్యామీను గోత్రానికి చెందినవారు, గాని యూదులు గానే పరిగణింపబడేవారు కాబట్టి ఇక్కడ ఈ యూదుడు రోమాలో ఉన్న యూదులకు, వారి మూల పురుషుడగు అబ్రాహము గారి గురుంచి మన అని సంభోదిస్తున్నారు. ఇక శరీరమును బట్టి అని ఎందుకు అన్నారంటే మనందరికీ తెలుసు యూదులకు మూల పురుషుడు అబ్రాహాము గారు. ఆదికాండము 1225 అధ్యాయాలు. అందుకే వారు మేము అబ్రాహాము సంతానం అని గర్వపడే వారు. మత్తయి 3:9; యోహాను 8:33,39; యూదులకు/ ఇశ్రాయేలీయులకు తండ్రి యాకోబు గారు, ఆయనకు తండ్రి ఇస్సాకు గారు, ఆయనకు తండ్రి అబ్రాహాము గారు. కాబట్టి వీరికి మూల పురుషుడు అబ్రాహాము గారు! ఇంతకీ ఇక్కడ అబ్రాహముగారిని ఎందుకు ఈ రక్షణ సిద్దాంతములోకి  తీసుకుని వచ్చారు పౌలుగారు?? కారణం అబ్రాహాము గారితోనే దేవుడు ప్రత్యేక రక్షణ ప్రణాళిక ప్రారంభించారు కాబట్టి, ఆయననే ముందుగా ఉదాహరిస్తున్నారు.

   ఇక మొదటి వచనంలో అడుగుచున్నారు పౌలుగారు శరీరమును బట్టి అబ్రాహామునకేమి దొరికెను?  మొదటగా శరీరమును బట్టి యూదులందరికీ అబ్రాహాముగారు తండ్రి. (విశ్వాస నియమం ప్రకారం అబ్రాహాము గారు మనకు కూడా తండ్రి; మనకు అనగా విశ్వాసులకు తండ్రి).  అయితే ఇక్కడ శరీరమును బట్టి అంటున్నారు పౌలుగారు. శరీరమును బట్టి అబ్రాహాము గారికి ఏమి దొరికింది? మనందరికీ తెలుసు శరీరమును బట్టి అబ్రాహాము గారికి దేవుడు సున్నతి అనే నూతన నిభందన ఇచ్చారు తన వారిగా చేసుకోడానికి! ఆదికాండం 17.  ఇక ఇశ్రాయేలీయుడు అనిపించుకోవాలన్నా, వారితో కలవాలన్నా ప్రతీ ఒక్కడు సున్నతి పొందుకోవలసినదే! దీనిని ధర్మశాస్త్రం నిర్ధారిస్తుంది. సున్నతికి పూర్తి బలం ఇచ్చింది ధర్మశాస్త్రం. అయితే ధర్మశాస్త్రం వలన ఏవిధముగాను మనుష్యుడు మోక్షం చేరడని, నీతిమంతుడుగా మారడని మూడవ అధ్యాయంలో విస్తారంగా ధ్యానం చేసుకున్నాం!  అయితే ఇక్కడ అనగా ఆదికాండం 15:6 లో అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడింది. అబ్రాహముగారు ఊరికినే తనకుతాను ఈ మాట రాసుకోలేదు. పరిశుద్ధాత్ముడు మోషేగారిని ఉపయోగించుకుని వ్రాయించిన మాట ఇది!  అది అతనికి నీతిగా ఎంచబడెను. 4:3;  ఇదేమాట క్రొత్త నిభందనలో అనేక చోట్ల ఉంది. 22; గలతీ 3:6;అయ్యారు 2:23;  కాబట్టి నీతిగా ఎంచబడెను అనగా దేవుడు అబ్రాహాము గారిని నీతిమంతుడుగా తీర్చారు. ఎప్పుడు నీతిమంతుడుగా తీర్చబడ్డారు? సున్నతిపొందిన తర్వాత లేక పొందకమునుపా? అబ్రాహాముగారు అతని కుమారుడైన ఇష్మాయేలు, అతని పనివారు మొత్తం సున్నతి పొందినది 17 వ అధ్యాయంలో. ఇక్కడ 15 వ అధ్యాయంలోనే దేవుడు అబ్రాహాము గారిని నీతిమంతుడుగా చేసేసారు. కాబట్టి సున్నతి పొందుకోక మునుపే నీతిమంతుడుగా చేయబడ్డారు. ఎలా చేయబడ్డారు. అబ్రాహాము గారు దేవుణ్ణి నమ్మినందువలన! అనగా ఇక్కడ అబ్రాహాముగారికి విశ్వాస నియమం వలననే నీతిమంతుడుగా తీర్చబడ్డారు. ఇదే విషయాన్ని 4:2 లో వివరిస్తున్నారు పౌలుగారు.  అబ్రాహాముగారి క్రియల వలన అతనికి అతిశయం కలుగలేదు కేవలము దేవుణ్ణి నమ్మినందు వలననే నీతిమంతుడుగా అయ్యారు అంటున్నారు. ఇక్కడ క్రియలు అనగా ఆయన పొందిన సున్నతి, దేవుడు చెప్పిన మాట విని ప్రయాణం చేయడం, ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్దపడటం ... మొత్తం అన్ని వస్తాయి. అయితే ఇవన్నీ చేయకుండానే కేవలం దేవుణ్ణి నమ్మి, ఆయనే జీవము గలదేవుడు అని విశ్వసించినందువలన దేవుడు అబ్రాహాముని నీతిమంతుడుగా తీర్చారు. అబ్రాహాముగారికి ఆ విశ్వాసం ఎలా వచ్చిందో గతించిన టాపిక్ లలో మీకు బాగా వివరించడం జరిగింది.(యాషారు గ్రంధం ప్రకారం, హనోకు గ్రంధం ప్రకారం, book of Chronicles ప్రకారం అబ్రాహము గారు పెరిగింది నోవాహు గారిదగ్గర, అబ్రాహాము గారి 56 వ సంవత్సరం లో నోవాహు గారు చనిపోయారు, అంతవరకూ అబ్రాహాము గారు నోవాహు గారి దగ్గర దేవునికోసం సంపూర్తిగా తెలుసుకున్నారు).

    కాబట్టి ఇక్కడ అబ్రాహాము గారు సున్నతి పొందక మునుపే నిజ దేవుణ్ణి తెలుసుకుని ఎంత కష్టమునకైనా తెగించి, తన తల్లిదండ్రులను, తన బంధువులను వదలి, దేవుడు అడ్రస్ చెప్పని దేశానికి అడ్రస్ లేకుండా, అనుమానాలు లేకుండా ప్రయాణమై వచ్చేశారు కాబట్టి ఆ విశ్వాసానికి ముగ్దుడై దేవుడు అబ్రాహాము గారిని నీతిమంతుడుగా తీర్చారు.  అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. 

                   ప్రియ విశ్వాసి/ చదువరీ/ స్నేహితుడా! ఎంతకాలం నుండి నీవు వింటున్నావ్ ఆయనే నిజమైన దేవుడని! మరి నీకు అలాంటి విశ్వాసం ఉందా? కేవలం నీ విశ్వాసం నమ్మకం ద్వారానే నీవు పరలోకం చేరుకోగలవు! అవి లేకపోతే నీవు పరలోకం అంచులకు కూడా చేరుకోలేవు! అబ్రాహాము గారు అదే విశ్వాసంతో అన్నింటిని వదులుకోడానికి సిద్దమయ్యారు. తన గ్రామంలో ఆయనకున్న ఆస్తి ప్రకారం ఒక జమిందారు లేక రాజులా బ్రతకగలరు ఆయన! కాని దేవుని పిలుపు విని, ఆయనను నమ్మి, అరణ్యాలు, కొండలు తిరిగారు ఆయన! ఎండా వాన చలి మంచు అనేది లేకుండా 75 సంవత్సరాల నుండి తను చనిపోయేంత వరకు అనగా సుమారు 100 సంవత్సరాలు కొండలు, గుట్టలు, ఎడారులు (ఐగుప్తు) అలా తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిజమైన సత్య దేవుడని! అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి నీవు అలాంటి విశ్వాసం కలిగిఉన్నావా? ఎంతమంది అడిగిఉంటారో ఎక్కడికి పోతున్నావ్? ఎందుకు పోతున్నావ్? అంటే ఒకటే సమాధానం నిజమైన దేవుడు నాకు కనబడి నేను చూపించే దేశం వెళ్ళమన్నారు. నేను వెళ్తున్నాను. అంతే! ప్రియ స్నేహితుడా! నీకు కూడా అలాంటి దృఢమైన విశ్వాసం ఉంటేనే పరలోకం చేరగలవు! మరి నీకు ఉందా?
అట్టి విశ్వాసం దృఢ భక్తి దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అబ్రాహాము విశ్వాసయాత్ర

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

పొట్టి జక్కయ్య

శరీర కార్యములు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

సమరయ స్త్రీ

యేసు క్రీస్తు రెండవ రాకడ

పాపము

బాప్తిస్మం