రోమా పత్రిక - పార్ట్- 5
*రోమా పత్రిక-95వ భాగం*
*ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక-6*
రోమా 10:1—౩..
1. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొంద వలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునైయున్నవి.
2. వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.
3. ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.
ప్రియ దైవజనమా! గత కొన్నిరోజులుగా మనం ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి అనేది ధ్యానం చేసుకుంటున్నాం! ఇక ఈ అధ్యాయం మొదటి మూడు వచనాలు 9వ అధ్యాయం మొదటి మూడు వచనాలను పోలి, వాటితో సంభంధం కలిగిఉన్నాయి. .... 9:1—౩: ఇశ్రాయేలు వారు పాపవిముక్తి పొందాలని నా ఆశ. అందుకోసం ప్రార్ధన చేస్తున్నారు అంటున్నారు. వారికి దేవుడంటే చాలా ఆశక్తి ఉంది అయితే వారి ఆశక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే దేవుని నీతిని తెలుసుకోకుండా తమ స్వనీతిని ఉపయోగించి దేవుని నీటికి లోబడక పాప విమోచన, విముక్తి, సంపూర్ణత పొందాలని ఆశపడి భంగపడ్డారు.
2-3 వచనాల ప్రకారం: మొత్తంమీద యూదులు నాస్తికులు కాదు, ఎవర్నీ లెక్కచేయని పాపులు కారు (2:17-20). వారి మతాసక్తిని చూచి పౌలుగారు చలించి వారిని జాలి తలిచాడు. ఆధ్యాత్మిక జ్ఞానం, అవగాహనల మీద ఆధారపడకుండా తనను తప్పుదారి పట్టించిన ఒకప్పటి తన తీవ్రమైన మతాసక్తి అతనికింకా గుర్తుంది (అపొ కా 8:1-3; 9:1-2; 22:3-4; 26:9-11; ఫిలిప్పీ 3:6). మతంలో వారికి తీవ్రమైన ఆసక్తి ఉంది గాని వారు నశించిన స్థితిలో ఉన్నారు. దేవుని విషయంలో తీవ్ర ఆసక్తి ఉన్నవారంతా ఏ దేవుని విషయంలో వారికాసక్తి ఉన్నదో ఆయన వారికి తెలుసని గానీ ఆయనకు వారు ఇష్టులని గానీ తప్పనిసరిగా అనుకోనవసరం లేదు. అనేకమంది అన్యజనుల్లాగే యూదులు కూడా దేవుడు తనను నమ్మినవారికి ఉచితంగా నీతిన్యాయాలను ఇస్తాడన్న సంగతి అర్థం చేసుకోలేదు (3:24; 4:4-5, 13). తమ పాత క్రియల సహాయంతో, ధర్మశాస్ర సంబంధమైన క్రియలతో, తమ సొంత నీతితో దాన్ని సంపాదించు కోవాలనుకున్నారు. దేవుడు తమ సొంత లేఖనాల్లో తమకు వెల్లడి చేసిన సత్యాన్ని వారు నేర్చుకోలేదు. అందువల్ల దేవుని నీతిన్యాయాల మార్గానికి అంటే క్రీస్తుపై నమ్మకం అనే మార్గానికి/ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు అనే సత్యానికి వారు లోబడలేదు. ఏ మాత్రమైనా మతాసక్తి ఉంటే ఎవరైనా సహజంగా ఏమి చేస్తారో వారూ అదే చేశారు – తమ సొంత నీతిన్యాయాల్ని స్థాపించుకోవాలని చూశారు, తమ సొంత ప్రయత్నాలవల్ల నిర్దోషులు కావాలని చూశారు. చూసి బంగాపడ్డారు.
ప్రియులారా! ఈ 4వ వచనం నుండి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఎలా తీర్చబడతారు అనేది వివరంగా రాస్తున్నారు. రోమీయులకు 10:4
విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు. ........ విశ్వసించే వ్యక్తికి క్రీస్తు ధర్మశాస్త్ర సమాప్తి అని నొక్కి వక్కానిస్తున్నారు. ధర్మశాస్త్రం అంటే “ధర్మశాస్త్రం”– 3:20,31
20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
31. విశ్వాసముద్వారా ధర్మశాస్త్ర మును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మ శాస్త్రమును స్థిరపరచుచున్నాము.; 4:15
ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేకపోవును. ;
5:20; 6:14; 7:4, 7, 12, 14; 8:3-4; గలతీ 3:19, 23-25.
ఇక 5—6 వచనాలలో మరో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు: రోమీయులకు 10:5,6
5. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెర వేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు.
6. అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కి పోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు; లేవీ 18:5 లో మోషేగారి ద్వారా చెప్పబడిన మాట మరోసారి రాస్తున్నారు పౌలుగారు:
మీరు నాకట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.
..... ఇది ధర్మశాస్త్ర మూలమగు నీతి చెబుతుంది,. అయితే విశ్వాస సంబంధమైన నీతి ఏమి చెబుతుంది? ఇది 6—7 వచనాలలో గల మాటలు. రోమీయులకు 10:6,7
6. అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కి పోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;
7. లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. ....
అర్ధం కాలేదు కదా! వీటిని కూడా మోషేగారు చెప్పినవే మరలా పౌలుగారు ఉదాహరిస్తున్నారు.
ద్వితీ ౩౦:12—14
12. మనము దానిని విని గైకొనునట్లు, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మనయొద్దకు దాని తెచ్చును? అని నీ వను కొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు;
13. మనము దాని విని గైకొనునట్లు, ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవను కొననేల? అది సము ద్రపు అద్దరి మించునది కాదు.
14. నీవు దాని ననుసరించు టకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృద యమున నీ నోట నున్నది. ..
మరి ఈ వచనాలు/ ప్రవచనం మోషే గారు యేసుక్రీస్తు ప్రభులవారు పుట్టకముందు 14౦౦ సంవత్సరాల క్రితం పలికినవి,. మరి ఇప్పుడు అవి యేసుక్రీస్తు పభులవారికి వర్తింపజేయడం న్యాయమా? అవును న్యాయమే! ఎలా అంటే: మోషేగారి పలుకులలో గల ఆధ్యాత్మిక అర్ధాన్ని పరిశుద్ధాత్ముడు పౌలుగారికి విశదపరచి మనకు వివరించారు.
ఇక్కడ “అగాధం”– అనే పదం వాడారు. ఈ గ్రీకు పదానికి అర్థం చనిపోయిన వారుండే లోకం. ప్రకటన 9:1-2
1. అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను.
2. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ,
11;
11:7. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును. ; 17:8; 20:1, 3 చూడండి.
(ఇంకాఉంది)
*రోమా పత్రిక-96వ భాగం*
*ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక-7*
రోమా 10:8—11..
8. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.
9. అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
ఇక్కడ ఈ 8వ వచనం కూడా పౌలుగారు ద్వితీ ౩౦:14 లో చెప్పిన మాటనే చెబుతున్నారు. నీవు దాని ననుసరించు టకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృదయమున నీ నోట నున్నది. ..
9-10 పౌలు ఉపదేశించిన “విశ్వాససంబంధమైన వాక్కు” ఇది (వ 8). క్రీస్తు పరలోకంనుంచి అంతకుముందే దిగివచ్చారు. దేవుడు ఆయన్ను అంతకుముందే మరణ లోకంలోనుంచి సజీవంగా లేపారు. (1:3-4; 4:24-25; 8:32, 34). ఇప్పుడిక దేవుడు ఉచితంగా ఇచ్చే నీతిన్యాయాలనూ నిర్దోషత్వాన్నీ స్వీకరించేందుకు మనుషులు చేయవలసినదల్లా క్రీస్తులో నమ్మకముంచి ఆయన్ను ఒప్పుకోవడమే. యేసుక్రీస్తు శరీరధారిగా మరణంనుంచి సజీవంగా లేచారని నమ్మడం పాపవిముక్తికి, రక్షణకు అవసరమని గమనించండి. 4:24-25
24. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయబడెను.
25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.;
1 కొరింతు 15:1-8చూడండి. ఇది సువార్తలో ప్రాముఖ్యమైన మౌలిక సత్యం. అపొ కా గ్రంథంలో ఈ సత్యాన్ని ఎంత ప్రాముఖ్యంగా నొక్కి చెప్పడం జరిగిందో గమనించండి –
1:3 ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను(లేక, రుజువులను) చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.
; 2:24
మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.మొ।।.
ఈ సత్యాన్ని మనం నమ్మకపోతే దేవుడు తన కుమారుణ్ణి గురించి రాయించిన సంగతిని నమ్మడం లేదన్నమాట. క్రీస్తుపై నమ్మకం ఉంచడమంటే, మరణంనుంచి సజీవంగా లేచిన ఆయనమీద నమ్మకముంచడమే. అంతేగాక *యేసు “ప్రభువు” అన్న నమ్మకం కూడా అవసరమే*. యోహాను 8:24;
అపొ కా 2:36
మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
1 కొరింతు 8:6
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.;
12:3; ఎఫెసీ 4:5 కూడాచూడండి.
*యేసుక్రీస్తు అనేకమంది ప్రభువుల్లో ఒక ప్రభువు కాదు, ఉన్న ఒకే ఒక ప్రభువు ఆయనే. పూర్తి అధికారం ఉన్నవాడు, అందరికీ యజమాని, స్వంతదారుడు* క్రీస్తేనని పౌలుగారి ఉద్దేశం.
*యేసే ప్రభువు అని చెప్పడమంటే ఆయన పాత నిబంధన గ్రంథంలోని యెహోవాదేవుని అవతారమని చెప్పడమే* (వ 13; లూకా 2:11; యోహాను 8:24, 58. నిర్గమ 3:14-15 చూడండి).
ఒప్పుకోవడం అన్నది దేవునికి మనపై జాలి కలిగించి, మనల్ని రక్షించేలా చేసే మంచి పని కాదు. పాపవిముక్తి పొందేందుకు మనుషులకు ఉండవలసిన నమ్మకానికి జోడించవలసిన మరో అంశం కాదది. ఆ నమ్మకం వాస్తవమైనది అనేందుకు అది సాక్ష్యాధారం, రుజువు. హృదయంలో పని చేస్తున్న నమ్మకం నోటితో క్రీస్తును ఒప్పుకునేలా చేస్తుంది. మత్తయి 10:32-33
32. మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.
33. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.. క్రీస్తును ఒప్పుకొనేందుకు సిగ్గు, భయం ఉన్నవారి నమ్మకం గురించి మనమెప్పుడూ సందేహంతో ఉండాలి. ఒప్పుకోవడం లేకుండా ఉన్న నమ్మకం లోపంతో కూడినది. నమ్మకం లేకుండా ఒప్పుకోవడం వ్యర్థమైనది. ఒక విశ్వాసి మనస్ఫూర్తిగా “యేసే ప్రభువు” అని చెప్పడం యేసును అతడు తన జీవితానికి ప్రభువుగా స్వీకరించి ఆయనకు లోబడాలన్న సమ్మతికి గుర్తు (14:9; మత్తయి 7:21; యోహాను 3:36; అపొ కా 5:32; యోహాను 2:3-4; 3:24; హెబ్రీ 5:9).
అపొ కా 22:10
అప్పుడు నేనుప్రభువా, నే నేమి చేయవలెనని అడుగగా, ప్రభువునీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను.
ఒక విశ్వాసి యేసు ప్రభువే గానీ నా ప్రభువు కాదు అని అనగలగడం ఎలా సాధ్యం! మనుషులు క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు వారు పశ్చాత్తాప పడవలసిన విషయాల్లో ఒకటి తమ జీవితాలకు తామే యజమానులుగా ఉండాలన్న మనస్తత్వం, క్రీస్తు ప్రభుత్వానికి లోబడని ధోరణి.
అది పాపం.
నిర్దోషత్వాన్ని, నీతిన్యాయాలను గురించి ఈ లేఖలో పౌలుగారు చెప్పినది చాలావరకు వ 10లో ముగింపుకు వస్తున్నది. పౌలుగారు దేవుని ఆత్మావేశం మూలంగా తెలియజేసినది ఏమంటే, మనుషులకు నిర్దోషత్వం, నీతి ఏ మాత్రం లేదు (1:18—3:19)
దేవుడు దాన్ని మనుషులకు ఇచ్చే విధానం వారికి తెలియదు (వ 2)
తెలియదు కాబట్టి తమ సొంతగా నిర్దోషత్వాన్ని స్థాపించుకునే ప్రయత్నం వారు చేస్తారు (వ 3)
అది అసాధ్యం (3:20, 28; 8:3)
దేవుని దృష్టిలో నిర్దోషులు కావాలంటే ఏకైక మార్గం క్రీస్తు నిర్దోషత్వాన్ని లేదా క్రీస్తు నీతిని కలిగి ఉండడమే (3:22-26) ఆయనలో నమ్మకం మూలంగా మాత్రమే ఇది సాధ్యం (1:16; 4:5; 5:1) ఆ విధంగా నిర్దోషులుగా తీర్చబడినవారు నీతిన్యాయాలతో కూడిన జీవితం ఆరంభిస్తారు (6:17-18; 8:4).
ప్రియదైవజనమా! ఆ విశ్వాసం నీకుందా? కేవలం పెదాలతోనే నమ్ముతున్నావా? నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఎక్కడ ఎప్పుడు? అన్నిచోట్లా , ఎల్లప్పుడూ!
అదే సువార్త!
మరినీవు ప్రకటిస్తున్నావా? *నీకు నీతికావాలా?* అయితే నీవు హృదయంలో విశ్వసించి, నోటితో ఒప్పుకోవాలి! ఇదే నీతి కలిగే మార్గం మరియు సిద్దాంతం! గొప్ప సిద్దాంతాన్ని పౌలుగారు చిన్న మాటలలో చెబుతున్నారు.
నీవు ఒప్పుకుంటేనే, ప్రకటిస్తేనే నీవు నీతిమంతుడవు!
ఒకవేళ సమాజానికి జడిసి, కుటుంబాల తిరస్కారానికి జడిసి ఊరుకున్నావా? అయితే నీవు దేవుని దృష్టిలో వేషదారివి అని యోబుగారు చెబుతున్నారు. 31:33,34;
నేడే యేసుక్రీస్తు ప్రభులవారు నీ ప్రభువు అని ఒప్పుకో!
విశ్వసించు!
నీతిమంతుడవుగా తీర్చబడు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక – 97వ భాగం*
*అపోహ- వివరణ*
రోమా 10:9&13
9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
13. ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును.
ప్రియ దైవజనమా! పై రెండు వచనాలను ఆధారం చేసుకుని చాలామంది క్రైస్తవులలో కొన్ని అపోహలున్నాయి. ఏమిటంటే: యేసు ప్రభువు అని నీనోటితో ఒప్పుకుంటే చాలు, అలా నమ్మి విశ్వసిస్తే చాలు నీవు రక్షింపబడతావు. తిన్నగా పరలోకం పోతావు, ఇంకా 13వ వచనం ప్రకారం ప్రభువు నామం బట్టి ప్రార్ధన చేస్తే చాలు పరలోకం పోతావు తిన్నగా అని మరొక అపోహలున్నాయి!
*ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు ఎందుకు అపోహా అంటున్నావు. అది బైబిల్ లో వ్రాయబడి ఉందికదా! అవును ఉంది. బైబిల్ మాటను కొట్టివేసే అధికారం నాకు లేదు! ఆ రెండు వచనాలు 100% కరెక్ట్! గాని అంతటితో ఆగిపోతే బాధ! చాలామంది విశ్వాసులు, ముఖ్యంగా కొన్ని సంఘాల వారు యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటే, నీ రక్షకుడు అని ఒప్పుకుంటే చాలు, ఆయన నామమున ప్రార్ధన చేస్తే చాలు పరలోకం నీది అయిపోతుంది అని అనుకుంటున్నారు. అయితే తప్పు వారిది కాదు. వారికి బోదిస్తున్న కాపరులది! కాపరులు, వారి ఉపదేశకులు సగం చెప్పి సగం వదిలేస్తున్నారు కారణం ఏదైనా గాని! దీనికి తోడుగా మార్కు 16:16 ప్రకారం నమ్మి బాప్తిస్మం తీసుకుంటే రక్షింపబడతావు అని ఉంది. కాబట్టి నమ్మి బాప్తిస్మం తీసుకుంటే చాలు! పరలోకానికి టిక్కెట్ వచ్చేసింది. ఇంకా కొంతమంది నమ్మి బాప్తిస్మం తీసుకుంటే చాలు, నీకు పరిశుద్దాత్మ అభిషేకం కూడా వచ్చేసినట్లే, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు నీతోనే ఉంటాడు. నీవు ఎన్ని పాపాలు చేసినా దుఃఖపడతాడు గాని నిన్ను వదలడు. నీవు పరలోకం పోవడం ఖాయం! కాబట్టి మనిషికి కావలసింది యేసు –ప్రభువు అని ఒప్పుకుంటే చాలు! బాప్తిస్మం తీసుకుంటే చాలు! నీవు రక్షణ పొందినట్లే! తర్వాత నీవు ఏమి చేసినా అది, అనగా నీవు చేసే పాపాలు నీ దేహానికే తప్ప నీ ఆత్మకు అంటుకోవు కాబట్టి ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు అని అపోహ పడుతున్నారు*.
ప్రియ దైవజనమా! ఈ అపోహ తప్పు! ఆ కాన్సెప్టే తప్పు! ప్రకటన గ్రంధం ౩:5 లో అతనిపేరు జీవ గ్రంథమునుండి ఎంతమాత్రము తుడుపు పెట్టక ..... అంటూ రాస్తున్నారు. అంటే తుడుపు పెట్టే అవకాశం ఉంది అని అర్ధం! మరిఎప్పుడు, ఏఏ పరిస్తితులలో తుడుపు పెడతారు అంటే అదే ప్రకటన గ్రంధం ౩వ అధ్యాయంలో 14-21 వరకు లవోదొకాయ సంఘం కోసం రాస్తూ, నీక్రియలు బాగో లేవు. నీవు వెచ్చగా లేవు, చల్లగా లేవు. అనగా క్రీస్తులో సగం లోకంలో సగం! . పేరుకు మాత్రం క్రైస్తవుడువు గాని నీ బ్రతుకు same to same అన్యులులాగానే ఉంది. అన్యాచారాలు, అన్యపద్దతులు, లోకాన్ని ఆశ్రయించి, లోకస్తులు బ్రతికినట్లు బ్రతుకుతున్నావ్ కాబట్టి నా నోటనుండి నిన్ను ఉమ్మివేస్తాను జాగ్రత్త! ఖబడ్దార్ అని హెచ్చరించారు. కాబట్టి దీని ప్రకారం ఎవరైతే కేవళం బాప్తిస్మం తీసుకుని, ఆ తర్వాత లోకస్తులులా జీవిస్తే, అనగా సాక్ష్యార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, ఆత్మపూర్ణతలేని నులివెచ్చని జీవితం జీవిస్తే, దేవుడు బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఎంత శ్రద్ధతో జీవ గ్రంథ మందు పేరు రాసేరో, బ్రతుకు బాగోలేకపోతే, పేరుకు తగ్గజీవితం జీవించక పోతే, పవిత్రత కాపాడుకోలేకపోతే అనగా నీ సాక్ష్యాన్ని, శీలాన్ని కాపాడుకోలేకపోతే అంతే శ్రద్ధతో అసహ్యంతో నీపేరు జీవగ్రంధం నుండి తుడిచేస్తారు జాగ్రత్త! కాబట్టి ఈ అపోహ తొలగించుకుని సాక్ష్యార్ధమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం, ప్రార్ధనానుభావం గల జీవితం జీవించి, భళా నమ్మకమైన మంచి దాసుడా! దాసురాలా! అనిపించుకో!
*ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం చెప్పాలని ఉంది. ఈ 10:13 వ వచనం పౌలుగారు యోవేలు ప్రవక్త రాసిన మాటను ఎత్తి రాస్తున్నారు. 2:32... ఆదినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్ధనచేయువారందరూ రక్షించబడుదురు. అనివ్రాయబడింది. ఇదేమాట పౌలుగారు కూడా రాస్తున్నారు. పౌలుగారు రాసిన మాటను క్రొత్త నిబంధన లో యెహోవా అనేమాటను ప్రభువు అని తర్జుమా చేశారు. ఈ విషయం ఇంగ్లీష్- తెలుగు బైబిల్ చదివే వారందరికీ తెలుసు! అంతేకాకుండా ప్రభువు అనేమాటకు హెబ్రీబాషలో అర్ధం యెహోవా! అనగా ఇక్కడ పౌలుగారు యేసుక్రీస్తుప్రభులవారిని యెహోవా అవతారం అని చెబుతున్నారు. అందుకే పౌలుగారు రాసిన మాటను ప్రభువు నామము బట్టి ప్రార్ధన చేయువారందరూ రక్షించబడుదురు అని తర్జుమా చేయబడింది. కాబట్టి ఇప్పుడు దయచేసి ఎక్కడైతే క్రొత్త నిబంధనలో ప్రభువు అని రాయబడిందో అక్కడ యెహోవా అని అప్లై చేసి ఒకసారి చదవమని నా వినయపూర్వక మనవి! అప్పుడు యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అనే పాపాత్ములకు మీరే జవాబు చెప్పవచ్చు! లూకా 2:11లో దూతలుచెబుతున్నారు ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. అనిచెప్పారు. ఇంకా బోలెడు రిఫరెన్సులు ఉన్నాయి యేసు- ప్రభువు అనియు, యేసుక్రీస్టు – యెహోవా అవతారమని నిర్దారించేవి. అందుకే ఆయన పేరు యేసుక్రీస్తు అనగా అభిషక్తుడైన రక్షకుడు*!
*ఇప్పుడు మరలా మనం రోమా 10:9 లో ప్రభువు అనేచోట యెహోవా అని అప్లై చేసి చదువుకుందాం! ఇది కలిపి చెరపడం ఎంతమాత్రమూ కాదు- ముందుగా చెప్పినట్లుగా క్రొత్త నిబంధన లో యెహోవా అన్న పదం-- ప్రభువు అని తర్జుమా చేయడం జరిగింది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపేనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు!*
అప్లై చేద్దాం!
యేసు- యెహోవా అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను- యేసుక్రీస్తుని లేపెనని ......... యేసు- ప్రభువు అనగా యేసు- యెహోవా అని నీ నోటితో ఒప్పుకుంటే నీహృదయంలో విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. దీనిమొత్తం అర్ధం ఏమిటంటే: యేసు దేవుడు మరియు సర్వసృష్టికి ప్రభువు/ ఏలేవాడు/ రాజు అని నీ హృదయంలో ఒప్పుకుని, విశ్వసిస్తే అప్పుడు నీవు రక్షించబడతావు. అందుకే తోమా నా ప్రభువా! నా దేవా!అనిచెప్పారు యేసయ్యతో! ఆయన యేసు దేవుడు మరియు ప్రభువు అని విశ్వసించారు*.
ప్రియ చదువరీ! నీకు కూడా యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి, ఒప్పుకుని ప్రార్థన చేస్తే చాలు, రక్షించబడిపోతావు తర్వాత ఎలా బ్రతికిన పర్వాలేదు అని అపోహ పడుతున్నావా?
నరకానికి పోతావు జాగ్రత్త!
ఆయన చెప్పినట్లు చేయు!
వాక్యానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం, ప్రార్థనాపూర్వకమైన జీవితం కలిగి ఆయనకు విధేయుడవై, సాక్షిగా జీవించు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక – 98వ భాగం*
*ఇశ్రాయేలీయుల దేవుని ప్రణాళిక-8*
రోమా 10:14—17
14. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?
15. ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారిపాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది
16. అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?
17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
ప్రియ దైవజనమా! ఈ వచనాలలో సువార్త చెప్పాల్సిన అవుసరత కోసం పౌలుగారు చెబుతున్నారు. ఇది కేవలం ఇశ్రాయేలీయుల కోసమే కాకుండా సర్వసృష్టికి సువార్త ప్రకటించాల్సిన అవసరం నొక్కివక్కానిస్తున్నారు .
మనుషులను విముక్తుల్ని చేసి వారిని నిర్దోషులుగా తీర్చే శుభవార్తను/సువార్త గురించి వివరించడం పౌలుగారు చెబుతున్నారు. ఇది నిజంగా శుభవార్తే. కానీ మనుషులు దాన్ని విని, నమ్మకం ఉంచకపోతే మంచి వార్త వల్ల మంచి ఏముంది? కాబట్టి సువార్తను ప్రకటించడంలోనూ దేవుడు తన సేవకుల్ని పంపడంలోనూ ఉన్న ప్రాముఖ్యతను అతడు నొక్కి చెప్తున్నారు.
అపొ కా 1:8
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
; యోహాను 20:21; లూకా సువార్త 24:47
యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ; మార్కు 16:15
మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
మత్తయి 28:18-20....
ఇక పౌలుగారు చెబ్తున్నారు-విశ్వసించక పోతే ఎలా ప్రార్ధన చేస్తారు? వినని వాడు ఎలా విశ్వసిస్తాడు? ప్రకటించువారు లేకపోతే వారు ఎలా వింటారు? ప్రకటించువారు పంపబడకపోతే ఎట్లు ప్రకటిస్తారు?...
అలా అంటూ ప్రవక్తయైన యెషయాగారు, నహూము గారు ప్రవచించిన ప్రవచనాలను ఇక్కడ ఎత్తి రాస్తున్నారు. సువార్త ప్రకటించువారి పాదములు పర్వతముల మీదెంతో సుందరములు...
యెషయా 52:7. ఆ పాదాలు శుభవార్త ప్రకటనకోసం అనేక మైళ్ళ నడకమూలంగా గరుకుగా, పగుళ్ళతో,కొట్టుకుపోయి, మురికిగా వికారంగా ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో అవి లోకమంతటిలోకీ అతి సుందరమైన పాదాలు. ఎందుకంటే అవి అత్యద్భుతమైన, ప్రాముఖ్యమైన పనిమీద వెళ్తున్నాయి.
మరలా 15వ వచనానికి వద్దాం. ప్రకటించువారు పంపబడక పోతే ఎట్లు ప్రకటించుదురు? ఏది ప్రకటించాలి? యేసయ్య సువార్త! దేవుడే మానవుడిగా భూలోకానికి వచ్చి అందరి పాపక్షమాపణ చేసి పరిహారం చెల్లించారు. ఇది కేవలం ఉచితం అని ప్రకటించడం సువార్త! ఇప్పుడు 17వవచనం కి వద్దాం! వినుటవలన విశ్వాసం కలుగును. అయితే ఏది వినాలి? క్రీస్తును గూర్చిన మాటలను వినాలి? పనికిమాలిన చెత్త కబుర్లు, సినిమాలు సీరియల్ స్టోరీలు , అదిఇలాగా, వాడు అలాగా అని ఎవరైనా పనిలేని వారు చెబితే చెవులు చేటలంతా చేసుకుని వినడం కాదు! నిరంతరం దేవుని మాటలు వింటూ ఉండాలి.
ఇక 16—21 వరకు పౌలుగారు మరలా ఇశ్రాయేలీయుల పట్ల దేవుని రక్షణ ప్రణాళిక ఏమిటి- వారు తిరస్కరించినందువలన మనకు ఎలా రక్షణ కలిగిందో పౌలుగారు చెబుతున్నారు.
ఇజ్రాయేల్ జాతి క్రీస్తును నిరాకరించేందుకూ దేవుడు వారిని నిరాకరించేందుకూ కారణం వారిలోనే ఉందని ఇక్కడ పౌలు చూపుతున్నారు. వారి నిరాకరణకు కారణం ఏదో రహస్యమైన దైవ నిర్ణయమని వారు చెప్పలేరు.
16. అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?
అయినను అందరు సువార్తకు లోబడలేదు అని చెబుతూ యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనం గుర్తుచేస్తున్నారు 53:1
మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
ఇశ్రాయేలువారి పాపమూ, వారిని తిరస్కరించడం లోని కారణమూ ఇదే. క్రీస్తు వచ్చినప్పుడు వారు ఆయన్ను స్వీకరించలేదు (యోహాను 1:11). ఇది వారి లేఖనాలకు అనుగుణంగానే జరిగింది – యెషయా 53:1.
ఇక 18వ వచనం నుండి వారు అనగా ఇశ్రాయేలీయులు వినలేదా? విన్నారు కదా అంటున్నారు. ఎవరు చెప్పారు? మొదటగా బాప్తిస్మమిచ్చు యోహాను భక్తుడు చెప్పారు. దానిని యేసుప్రభులవారు మూడున్నర సంవత్సారాలు కొనసాగించారు. అదే సువార్త ఆది అపోస్తలులు చెప్పారు. గాని వీరందరూ చెప్పినా ఆ బోధను ఇశ్రాయేలీయులు తిరస్కరించారు. అందుకే 19వ వచనం ప్రకారం జనము కానివారి వలన మీకు అనగా ఇశ్రాయేలీయులకు రోషం పుట్టించెదను అంటున్నారు ఇది మోషేగారు చెప్పిన ప్రవచనం! యూదులు శుభవార్తను అర్థం చేసుకోలేదని వారు దాన్ని తృణీకరించడంలోని పాపాన్ని దేవుడు చూచీ చూడనట్టు ఉండగలడా? ఎంత మాత్రం కాదు. సువార్తను స్వీకరించిన అన్యజనులకన్నా యూదులు చాలా ఎక్కువగా అర్థం చేసుకున్నారని చూపించడానికి పాత నిబంధన గ్రంథంలోని మూడు వచనాలను ఎత్తి రాస్తున్నారు పౌలుగారు.
ద్వితీ 32:21.
వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టిం చిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.
ఏమీ తెలియని జనానికీ (ఇతర ప్రజలకూ), కనీసం కొంత తెలిసిన యూదులకూ మధ్య ఉన్న తేడా ఇక్కడ చెప్తున్నారు.
ఇక 20—21 ప్రకారం యెషయా గారి మరో ప్రవచనం ఎత్తి రాస్తున్నారు...
20. మరియు యెషయా తెగించి నన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు.
21. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు......
యెషయా 65:1-2.
1. నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.
2. తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను.
అన్యజనులకు నిజ దేవుణ్ణి వెదికేందుకు కావలసిన కనీసమైన గ్రహింపైనా లేదు. ఇజ్రాయేల్ నకు ఆ జ్ఞానం ఉంది గానీ వారు దేవుణ్ణి కనుగొనలేదు. దీనికి కారణం ఇజ్రాయేల్ వారి మొండి అవిధేయత. దేవుడు ప్రేమపూర్వకంగా తన చేతులు చాపి తన ప్రజల ఎదుట నిలుచుండి వారికి గొప్ప మేళ్ళను ఇవ్వజూపుతూ సహనంతో, జాలితో వారి పాపవిముక్తిని ఆశిస్తూ ఉన్న చిత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మత్తయి 23:37; న్యాయాధి 2:10-19; హోషేయ 11:8.
ప్రియ సహోదరీ/ సహోదరుడా! ఇశ్రాయేలీయులు దేవుణ్ణి తిరస్కరించారు. నేను అలా చేయను అనుకుంటున్నావు కదా. వారు అలచేయబట్టే కత్తిరించబడ్డారు. ఒకవేళ నీ బ్రతుకును/ శీలాన్ని/ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతే నీ బ్రతుకు కూడా అంతే! కాబట్టి దేవునికి భయపడు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక – 99వ భాగం*
*ఇశ్రాయేలీయుల దేవుని ప్రణాళిక-9*
రోమా 11:1—5
1. ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తనప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేను కూడ ఇశ్రాయేలీ యుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.
2. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?
3. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠము లను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు.
4. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది?బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.
5. ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృప యొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది. ….
ప్రియ దైవజనమా! ఇశ్రాయేలీయుల పట్ల దేవుని రక్షణ ప్రణాళిక కోసం గత కొన్ని వారాలుగా ధ్యానం చేసుకుంటున్నాం. గతంలో వివరించిన విధంగా 9,10,11అధ్యాయాలు ఒక ప్రత్యేక భాగం. ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక కోసం వ్రాయబడింది. 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల పతనం. 10వ అధ్యాయంలో వారలా పడిపోవడం వారి తప్పే గాని దేవుని తప్పు కాదని పౌలుగారుచూపించారు. వారికి అపనమ్మకం, హృదయ కాఠిన్యం ఉన్నా కూడా దేవునికి వారిపట్ల ఇంకా కృప గల ఉద్దేశం ఉందనీ, ఆ జాతిని చివరికి తన చెంతకు తెచ్చుకుంటారనీ ఈ 11వ అధ్యాయంలో వివరిస్తున్నారు.
ఈ మొదటి వచనంలో అడిగిన ప్రశ్నకు ఈ అధ్యాయమంతా జవాబు.
1.ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తనప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేను కూడ ఇశ్రాయేలీ యుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.....
“దేవుడు తన ప్రజలను త్రోసివేశారా?” “కాదు” అంటున్నారు పౌలుగారు. పౌలుగారు ఇశ్రాయేలీయుడు. దేవుడు యూదులను త్రోసివేయలేదనడానికి పౌలుగారు రుజువు. ప్రథమ రాయబారులందరూ, జెరూసలెంలో ఆది సంఘంలో ఉన్నవారందరూ యూదులేనని కూడా పౌలుగారు చెప్పి ఉండవచ్చు. మొత్తంగా యూదా జాతి బండబారిపోయిన హృదయంతో అవిధేయతతో ఉండిపోయినప్పటికీ రోమన్ సామ్రాజ్యమంతా ఉన్న సంఘాల్లో క్రీస్తును నమ్మిన యూదులు ఉన్నారు. దేవుణ్ణి నమ్మి ఆయనకు లోబడిన యూదులు కొందరు ఉన్నారన్నమాట. అలా చెబుతూ నేను కూడా ఇశ్రాయేలీయుడనే, నాది బెన్యామీనుగోత్రం అని చెబుతున్నారు. కాబట్టి ఒక ఇశ్రాయేలీయుడుగా చెబుతున్నాను దేవుడు ఇశ్రాయేలీయులను వదిలెయ్యలేదు. తిరస్కరించలేదు. దానికి నేనే సాక్ష్యం అని చెబుతూ ఇక్కడ ఏలియాగారిని గుర్తుచేస్తున్నారు. నా ఉద్దేశ్యం ప్రకారం ఇక్కడ పౌలు గారు ఈ క్రొత్త కోణంలో చెప్పేవరకు అది ఏలియాగారు దేవునికి చేసిన కంప్లైంట్ అని ఎవరికీ తోచలేదు! ఈమాట పౌలుగారు చెప్పడానికి కారణం ఈ పత్రిక రాసినప్పటికే వారి ప్రవర్తన /పరిస్థితి ఏలీయా దినాలను పోలి ఉంది (850సంవత్సరాల క్రితం నాటి కాలం). 1 రాజులు 19:14-18
13. ఏలీయా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో-ఏలీయా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని యొకడు పలికిన మాట అతనికి వినబడెను.
14. అందుకతడు-ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్య ములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచు చున్నారని చెప్పెను.
16. ఇశ్రాయేలు వారి మీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.
18. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయునుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు. ....
ఇక్కడ పౌలుగారు ౩వ వచనంలో ఏలియాగారు దేవునికి ఇశ్రాయేలీయులకు వ్యతిరేఖంగా పిర్యాదు చేసారు. అయితే దేవుడు చెప్పారు- నాకు ఇంకా బయలుకు మోకాళ్ళు వేయని 70౦౦ మంది నాకు ఇంకా ఉన్నారు అనిచెప్పారు అంటున్నారు. కాబట్టి అప్పుడు కూడా అనగా దేవుణ్ణి ప్రజలు కావాలనే వదిలేసి, దూరంగా వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఎంతోమంది నాకోసం ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా దేవుడు కొంతమందిని తనకోసం ప్రత్యేక పరచుకున్నారు అంటున్నారు.
5 ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృప యొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది...... కృపయొక్క ఏర్పాటు—కారణం మనం అనర్హులమైన ఆయన కృపద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాము. కృప పునాదిపై ఆధారపడి దేవుడు ఆ జాతి మొత్తంలోనుంచి నమ్మకం ఉంచినవారిని ఎన్నుకొన్నారు. వారి యోగ్యతపై, లేక యోగ్యత లేకపోవడంపై ఆయన ఎన్నిక ఆధారపడలేదు – 3:24
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.
11: 6 అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.
4:5. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. 6 ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు.
... కాబట్టి దీని ప్రకారం మనం చేసే ప్రయత్నాలు మనలను విముక్తి చేయలేదు గాని మరింత పాపులుగా మార్చింది. అయితే దేవుని మహాకృప వలన , మనం ఆయనను విశ్వసించి నమ్మినందువలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం! కాబట్టి ఇది మన క్రియల వలన కాలేదు కాబట్టి కేవలం ఆయన కృపద్వారానే జరిగింది. అలాకాకుండా అది క్రియల మూలంగా జరిగితే అది కృప కాకపోను.
ఇక 7వ వచనంలో
ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కిన వారు కఠినచిత్తులైరి.
ఇశ్రాయేలు వారు ఏది వెదుకుతున్నారో అది వారికి దొరకలేదు. అది కేవలం ఏర్పాటునొందిన వారికి మాత్రం అది అనగా విముక్తి దొరికింది. తక్కినవారు కఠినచిత్తులైరి అంటున్నారు.
9:30-32
30. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్య జనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి;
31. అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు,
32. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. . ఇశ్రాయేల్‌లో అనేకమంది కఠినులై పోయారు. మొదట దేవునికి వ్యతిరేకంగా తమను తాము కఠినం చేసుకున్నారు. తరువాత వారినింకా కఠినం చెయ్యడం ద్వారా దేవుడు వారిని శిక్షించారు. దేవుడు కఠినపరచడం గురించి చూసుకుంటే ...
నిర్గమ 4:21
అప్పుడు యెహోవామోషేతో ఇట్లనెనునీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యము లన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ అయితే నేను అతని హృదయమును కఠిన పరచెదను,అతడు ఈ జనులను పోనియ్యడు.
యెషయా 6:9-10
9. ఆయననీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.
10. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.
ఇంకా 8—10 వచనాల వరకూ చూసుకుంటే
8. ఇందువిషయమై నేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును,చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.
9. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంక ముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక.
10. వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. ...
ప్రియ దేవుని జనమా! ఈ వచనాలు కేవలం ఇశ్రాయేలీయులకే చెందుతాయి, నాకు కాదు అనుకుంటున్నావా? జాగ్రత్త! నేటికాలంలో కూడా చాలామంది మన ఇరుగుపొరుగు వారుకూడా అలాగే కఠినంగా ఉంటున్నారు. నిజదేవున్ని తెలుసుకోలేకపోతున్నారు. మరి నీ బాధ్యత ఏమిటి?
వారికోసం కన్నీటితో ప్రార్ధన చేస్తున్నావా?
వారికి రక్షణ సువార్త ప్రకటిస్తున్నావా లేదా?
కొంతమంది రక్షించబడి కూడా మూర్కులుగా, దేవునికి దూరంగా తిరుగుతున్నారు.
మరి వారిని సరిచేస్తున్నావా?
వారికోసంప్రార్ధన చేస్తున్నావా లేదా?
ఆ భారం ప్రతీ ఒక్కరిమీద ఉంది అని మరచిపోకు!
దానియేలు 12: 3
బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.
ఆమెన్!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక –100వ భాగం*
*ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక-9*
రోమా 11:11—15
11. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు.
12. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!
13. అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,
14. వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను.
15. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?
ప్రియ దైవజనమా! మనం ఇశ్రాయేలీయులపట్ల దేవుని ప్రణాళికను ధ్యానం చేసుకుంటున్నాం.
11వవచనం. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు...
ఇక్కడినుంచి 32వ వచనం వరకు ఇశ్రాయేలు జాతిలో కఠినమైపోయి, తొట్రుపడి, కూలిపోయిన అధిక భాగం గురించి పౌలుగారు మాట్లాడుతున్నారు (9:32-33 వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి.
33. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.).
మరి ఆ జాతి అలాగే కూలిపోయి ఉంటుందా, తిరిగి లేవదా?
క్రొత్తనిబంధన సంఘంతో, సంఘంలో ఇప్పుడు దేవుడు పని చేస్తున్నాడు కాబట్టి ఇక ఒక జనంగా ఇజ్రాయేల్ విషయంలో చేతులు కడిగేసుకున్నారా? దేవుడు ఇజ్రాయేల్ జాతిని అలా విడిచి పెట్టెయ్యలేదని పౌలుగారు అతి స్పష్టంగా చెప్తున్నారు. దాని పట్ల ఆయనకింకా కృప గల ఉద్దేశాలున్నాయి. తిరిగి దాన్ని తన చెంత చేర్చుకునేందుకే ఆయన చూస్తున్నాడు.
వారు పతనం కావడంలో కూడా దేవునికి మంచి ఉద్దేశం ఉందని చెప్పడంతో ఈ వివరణ ఆరంభిస్తున్నారు పౌలుగారు. వారు అవిధేయులై కఠినమైపోయి, దేవుని కుమారుణ్ణి తిరస్కరించి సిలువ వేశారు. కానీ ఇదంతా లోకమంతటి మేలుకే పని చేసింది (అపొ కా 2:22-24
22. ఇశ్రాయేలువారలారా, యీ మాటలువినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు.
23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత(లేక, అక్రమకారులచేత) సిలువ వేయించి చంపితిరి.
24. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.)
దేవుడు వారి దుర్మార్గ క్రియల ద్వారా పని చేసి అందరికీ సువార్తను తయారు చేశారు. వారు తరువాతి కాలంలో సువార్తను తిరస్కరించినప్పుడు దేవుడు అన్య జనులవైపుకు తిరిగారు (1:16; అపొ కా 13:46; మత్తయి 21:42-43).
12 .వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!
..... పౌలుగారు మాటల్లోని తర్కం స్పష్టంగానే కనిపిస్తుంది. యూదుల పాపంవల్ల సువార్తలోని ఐశ్వర్యాలు, మేలులు లోకమంతటికీ అందుబాటులోకి వచ్చాయి. మరి వారి “సమృద్ధి/ఐశ్వర్యం” తప్పకుండా మరింత ఐశ్వర్యవంతమే అవుతుంది. వారికి సమృద్ధి గనుక కలిగితే ఇంకా ఎక్కువ ఐశ్వర్యం అనడం లేదు పౌలు. వారికి భవిష్యత్తులో సమృద్ధి చేకూరుతుందన్న సత్యాన్ని మాత్రమే చెప్తున్నాడు. వారి సమృద్ధి అంటే ఒక జాతిగా వారు పూర్తిగా దేవునివైపుకు తిరగడం, దేవుడు వారిపట్ల తన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చడం అన్నమాట (యెషయా 2:1-5
1. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి
2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు
3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.
4. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
5. యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము. ; 11:1-9; యిర్మీయా 23:5-8; యెహె 37:21-28; జెకర్యా 14:9, 16, 21). “ఐశ్వర్యం” గురించి 2:4; 10:12; 2 కొరింతు 8:9; ఎఫెసు 1:7, 18; 2:7; 3:8, 16; ఫిలిప్పీ 4:19; కొలస్సయి 1:27)
ఇక 13—14 వచనాలలో అన్యజనులైన మనతో డైరెక్ట్ గా మాట్లాడుటున్నారు పౌలుగారు.
13. అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,
14. వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. ..... ఈ వచనాలలో నేను అన్యజనులకు అపోస్తలుడను అని చెప్పుకుంటున్నారు పౌలుగారు! అవును. ఆయన యూదులకు అంతగా సువార్త చెప్పలేదు గాని అన్యజనులకే సువార్త ఎక్కువగా చెప్పి ఎన్నో తాపులు తిని, శ్రమలు అనుభవించారు.
అపో.కార్యములు 13: 47
ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.
గలతీ 2:8
అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,...
*నేటి సేవకులు పౌలుగారిని చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. నేటి బోధకులు సేవకులు అన్యజనుల యొద్దకు వెళ్ళడం లేదు గాని రక్షించబడిన విశ్వాసుల యొద్దకు వెళ్లి మేము మంచిబోధ చెబుతాం, సంపూర్ణ సువార్త చెబుతాం, సరియైన బోధ కావాలంటే మా దగ్గరకే రండి అని ప్రకటించుకుంటూ పిట్టకధలు, సైన్సు లాంటివి చెబుతూ విశ్వాసులనే ఆకర్షిస్తున్నారు. అద్భుతాలు జరిగిపోతాయి అంటూ చెబుతున్నారు. ఎన్నో జిమ్మిక్కులు చేసి సంఘాలను దోచుకుంటున్నారు గాని సువార్త అందని చోట్ల దేవుని రక్షణ సువార్తను ప్రకటిస్తూ అన్యజనులను శిష్యులుగా చేయడం లేదు! సముద్రంలో/ నదిలో వలవేయడం లేదు గాని చేపలుగల తట్టకి/ బుట్టకి/ వలకు వలవేసి ఇతరులు పట్టిన చేపలను/ ఇతరులు కష్టపడి, ఉపవాసం ఉండి, దెబ్బలు తిని రక్షించిన ఆత్మలను దొంగల్లా దోచుకుంటున్నారు. దీనికి తప్పకుండా ఒకరోజు తీర్పులో నిలబడాల్సి ఉంది*. అందుకే పౌలుగారు చెబుతున్నారు ..రోమీయులకు 15:20,21 .నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచార మెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు,
21.వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని.
ప్రియ సేవకుడా!కాపరీ! నీవు ఎవరిని అనుకరిస్తున్నావు? పౌలుగారినా? లేక దొంగబోధకులనా? దేవుని త్రాసులో నీవు తేలిపోతావేమో జాగ్రత్తపడు!
ఇంకా 14వ వచనంలో ఎలాగైనా సరే, వారిలో కొందరినైనా రక్షించుకోవాలని నా పరిచర్యను ఘనపరుస్తున్నాను అంటున్నారు పౌలుగారు! అందుకే మరోచోట కక్షచేత గాని..సువార్త ప్రకటింప బడుతుంది! స్తోత్రం.. అంటున్నారు. ఫిలిప్పీ 1:16-18;
ప్రియ సేవకుడా! నీ సంఘాన్ని ఎవరైనా దోచుకుంటున్నారా? మరో సేవకుడు సువార్త అందనిచోట ప్రకటించకుండా నీవు కష్టపడి సంపాదించుకున్న ఆత్మలకు దగ్గరలో మరోసంఘం ప్రారంబించాడా? కంగారుపడకు!
ప్రతీవాని జీతం ప్రభువు దగ్గర ఉంది అని మరచిపోకు!
ఏదోరకంగా సువార్త ప్రకటించబడుతుంది అని పౌలుగారు సంతోషించినట్లు నీవు కూడా సంతోషించి సంతృప్తి పడు!
పరలోకమందు నీ ఫలం అధికమవుతుంది.
ఆమెన్!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక –101వ భాగం*
*ఇశ్రాయేలీయుల పట్ల దేవునిప్రణాళిక-10*
రోమా 11:15—18
15. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?
16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.
17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన
18. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు. ….
ప్రియ దైవజనమా! మనం ఇశ్రాయేలీయులపట్ల దేవుని ప్రణాళిక ను ధ్యానం చేసుకుంటున్నాం. ఇక ఈ 15—31 వరకు అన్యజనులైన మనకు గొప్ప హెచ్చరిక ఇస్తున్నారు పౌలుగారు. అదేవిధంగా ఇశ్రాయేలీయులు ఎప్పుడు రక్షించబడతారో చెబుతున్నారు.
15.. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా? .. చూడండి పౌలుగారు ఏమంటున్నారో. వారిని అనగా ఇశ్రాయేలీయులను విసర్జించడం లోకాన్ని దేవునితో సమాధాన పరచడం అయితే , అదే ఇశ్రాయేలీయులు తిరిగి చేర్చబడితే చనిపోయిన వారు లేచినట్లే కదా అంటున్నారు. అనగా ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఆత్మీయంగా చచ్చిన స్తితిలో ఉన్నారు. వారు దేవుని దగ్గరకు వస్తే చనిపోయి తిరిగిలేచినట్లే అని అభిప్రాయ పడుతున్నారు పౌలుగారు. దేవుడు భవిష్యత్తులో ఇశ్రాయేలు జాతిని మొత్తంగా తిరిగి స్వీకరించినప్పటి పరిస్థితి గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అది చనిపోయినవారు సజీవంగా కావడం వంటిది. ఇది అక్షరాలా చనిపోయినవారు బ్రతికి లేవడం గురించి చెప్తున్నదని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు (యోహాను 5:28-29
28. దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని
29. మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు). మరికొందరేమో ఇశ్రాయేల్ వారు ఇలా మార్పు చెందడం లోకం మొత్తానికీ అద్భుతమైన ఆధ్యాత్మిక జీవానికీ దీవెనలకూ కారణమౌతుందని అభిప్రాయపడ్డారు.
16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే. .. “మొదటి పిడికెడు”– సంఖ్యా 15:17-21. ఇక్కడ మొదటి పిడికెడు అంటే యూదుల్లోనుంచి దేవుడు మొదట ఎన్నుకున్న కొద్దిమంది (క్రీస్తును స్వీకరించినవారు –వ 5), లేక ఆ జాతి పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు. ఎలా చూసుకున్నా పౌలు చెప్తున్నమాట ఒకటే. వారి పతనమైన అపనమ్మకమైన స్థితిలో కూడా ఇజ్రాయేలు జనమునకు జాతి అంతా ఇంకా “పవిత్రమే”. ఇక్కడ పవిత్రం అంటే దేవుని సదుద్దేశం కోసం ప్రత్యేకించబడినదని అర్థం. లేవీ 20:7-8
7. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహోవాను.
8. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను.
చెట్టుయొక్క వేరంటే దాదాపు ఖచ్చితంగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను, లేదా బహుశా అబ్రాహాము ఒక్కణ్ణే సూచిస్తూ ఉంది (4:1). వారిలో నుంచి వచ్చిన జాతి దేవుని ప్రత్యేక ప్రజలు, పవిత్ర జాతి (ద్వితీ 7:6; 14:2). ఆ జాతి ఇంకా అలానే ఉందని పౌలుగారు అంటున్నారు.
17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన .....
ఇక్కడ నుండి కొత్త కోణంలో మాట్లాడుతున్నారు పౌలుగారు. కొమ్మలలో కొన్ని విరిచివేయ బడ్డాయి అంటున్నారు. ఆ కొమ్మలు ఇశ్రాయేలీయులు! ఇక నీవు వారిమధ్య అంటుకట్టబడ్డావు అని గుర్తుచేస్తున్నారు. అనగా నిజం చెప్పాలంటే రక్షణ భాగ్యం, రక్షణ కార్యం ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులకోసం ఏర్పాటుచేయబడినది. గాని వారు తిరస్కరించినందువలన ఆ సువార్త- రక్షణభాగ్యం మనకు కలిగింది. అలా ఆ సువార్తను నమ్మి మనం దేవునితో అంటు కట్టబడ్డాము.
17—24.
17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన
18. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు.
19. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.
20. మంచిది; వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;
21. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.
22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.
23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటు కట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.
24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత లీవచెట్టున అంటు కట్టబడరా? ....
17-24 యూదులు క్రీస్తును తిరస్కరించకముందు ఒలీవచెట్టు అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనే “వేరు”లో నుంచి పెరిగిన ఇజ్రాయేల్ జాతి. ఆ జాతిలోని కొన్ని కొమ్మలు (నిజానికి ఆ జాతిలో ఎక్కువ భాగం) అపనమ్మకం మూలంగా విరిగిపోయాయి (వ 17,20). వారి స్థానంలో అన్యజనుల్లోని క్రైస్తవులను అంటుకట్టడం జరిగింది (వ 17,19; మత్తయి 21:43). అన్యజనులు అడవి ఒలీవ చెట్టులాంటి వారు (వ 24). సహజంగా వారికి అబ్రాహాము, ఇస్సాకు యాకోబులతో, లేక వారినుంచి వచ్చిన ఒలీవచెట్టుతో ఎలాంటి సంబంధమూ లేదు. ఇప్పుడు క్రీస్తు మూలంగా అబ్రాహాముతో వారికి సంబంధం కలిగింది (“మంచి ఒలీవ చెట్టులో” అసహజంగా అంటు కట్టడం జరిగింది – వ 24).
కాబట్టి ఇక్కడ ఈ అన్యజనుల్లోని క్రైస్తవులకు పౌలుగారు ఒక హెచ్చరిక ఇస్తున్నారు (వ 13).
పతనమైన ఇజ్రాయేల్ జాతిని చూచి వారు తమ గొప్పతనాన్ని చెప్పుకోకూడదు (వ 18),
గర్వంగా కాదు, భయంతో ఉండాలి (వ 20).
దేవుడు ఇజ్రాయేల్ కొమ్మల్ని విరిచేసి అన్యజనుల కొమ్మల్ని అంటుకట్టాడంటే, అన్యజనుల కొమ్మల్ని విరిచి ఇజ్రాయేల్ కొమ్మల్ని కూడా అంటుకట్టగలడు. ఇలా విరిచెయ్యడం అన్నది రక్షణ పొందిన వ్యక్తులు తమ రక్షణను కోల్పోయే అవకాశాన్ని సూచిస్తున్నదా? కావచ్చు. ఒలీవ చెట్టు అంటే క్రీస్తుయొక్క అధ్యాత్మిక శరీరం. అయితే. పాత నిబంధనలోను, క్రీస్తు ఈ లోకంలో ఉన్న దినాల్లోనూ ఒలీవచెట్టు అంటే విశ్వాసులు అవిశ్వాసులతో కూడిన ఇజ్రాయేల్ జాతి అంతటికీ సూచన. అవిశ్వాసులను మాత్రమే విరిచివేయడం జరిగింది. జాతి మొత్తంగా ఇప్పటివరకు ఆ స్థితిలో నిలిచి ఉంటుంది. దేవుడు ఈ యుగం కోసం దాన్ని అలా పక్కన పెట్టి ఉంచారు, తన చెట్టులోకి/ తన జనాంగానికి ఇతర ప్రజలను అంటుకట్టారు, లోకంలో తన ఉద్దేశాలను వారిద్వారా నెరవేర్చు కుంటున్నారు దేవుడు. కానీ యూదుల్లాగానే అన్యజనులతో ఉన్న క్రైస్తవ సంఘాలు కూడా అహంకారంలోను, అవిశ్వాసంలోను పడిపోయే అవకాశం లేకపోలేదు. పడిపోయిన ఇజ్రాయేల్ వారి దారిలోనే తామూ పడిపోతామేమోనన్న భయంతో వారు ఉండాలి. ఇజ్రాయేల్ జాతి నమ్మకంతో క్రీస్తువైపు తిరిగితే దాని సొంత ఒలీవచెట్టుకు తిరిగి అంటుకట్టబడతారు (వ 24. అపొ కా 1:6).
ప్రియ చదువరీ! స్నేహితుడా! ఇశ్రాయేలీయులను కత్తిరించిన దేవుడు నిన్నుకూడా కత్తిరించేగలరు. గనుక భయమునోంది పాపం చేయకు! గర్వించావా? నెబుకద్నేజరు లాగ గడ్డి మేస్తావు లేదా కత్తిరించబడతావు. కొమ్మ చెట్టుతో కలసి ఉంటేనే అది ఫలిస్తుంది గానివేరుచేయబడితే మాడిపోతుంది..
యోహాను 15: 4-6
4. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.
5. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.
6. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును. . .
కాబట్టి నీ అవిదేయతను వదిలి దేవునిమాటకు లోబడి ఆయన త్రోవలలో నడుచుకో!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక –102వ భాగం*
*ఇశ్రాయేలీయుల పట్ల దేవునిప్రణాళిక-11*
రోమా 11:25—29…
25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.
26. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.
28. సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటు విషయమైతే పితరులనుబట్టి ప్రియులైయున్నారు.
29. ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.
ప్రియ దైవజనమా! మనం ఇశ్రాయేలీయులపట్ల దేవుని ప్రణాళికను ధ్యానం చేసుకుంటున్నాం. ఇక ఈ 25—29 వరకు ఇశ్రాయేలీయులు ఎప్పుడు రక్షణ పొందుతారో మర్మం చెబుతున్నారు పౌలుగారు.
25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. ..
అన్యజనాంగానికి చెందిన క్రైస్తవులు అజ్ఞానంలో, దురహంకారంలో ఉండడం పౌలుగారికి ఇష్టం లేదు. దేవుడు ఇక ఇజ్రాయేల్ జాతిని పూర్తిగా వదిలేసి చేతులు దులిపేసుకున్నాడనీ, ఇజ్రాయేల్ నకు ఆయన చేసిన వాగ్దానాలన్నీ ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘానికి చెందుతాయనీ, వారు గనుక తమను తాము నమ్మించుకుంటే అలా అయిపోగలరని పౌలుగారికి తెలుసు. ఇజ్రాయేల్ గురించి కొన్ని స్పష్టమైన మాటలు చెప్పడంద్వారా ఇలాంటి అవకాశం లేకుండా చెయ్యాలని పౌలుగారు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఉపదేశానికి అతడు పెట్టిన పేరు “మర్మం”– అంటే దేవుడు తానే వెల్లడి చేయకపోతే గనుక మనుషులు తెలుసుకోలేనిది.
“ఇతర ప్రజల సంఖ్య పూర్తి అయ్యేవరకు” మాత్రమే ఇజ్రాయేల్ జాతికి మొద్దుబారిపోయిన హృదయం ఉంటుంది. ఆ తరువాత వారి హృదయ కాఠిన్యం తొలగిపోతుందని ఆత్మద్వారా పౌలుగారు సూచిస్తున్నారు.
26—27 .వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.
“ఇశ్రాయేలు ప్రజ అంతటికీ”– అన్య జనులలో రక్షింపబడవలసిన సంఖ్య పూర్తి అయిన తరువాత ఉనికిలో ఉన్న ఇజ్రాయేల్ జాతి మొత్తం పాపవిముక్తి పొందుతుందని పౌలుగారు ఉపదేశిస్తున్నారు (ఈ సమయం ఇంకా రాలేదు). ఈ మాటలకు రుజువుగా పౌలుగారు యెషయా 59:20-21; 27:9 ప్రవచనాలను చూపుతున్నారు.
యెషయా గ్రంథము 59:20,21
20. సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు.
21. నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సీయోను అంటే యెరూషలేం. యాకోబు అంటే ఇజ్రాయేల్ ప్రజ. నిబంధన అంటే తాను ఇజ్రాయేల్ జాతితో చేస్తానని దేవుడు చెప్పిన క్రొత్త నిబంధన –
యిర్మీయా 31:31-34
31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.
32. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.
33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.
28—29
28. సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటు విషయమైతే పితరులనుబట్టి ప్రియులైయున్నారు.
29. ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.
చూశారా ఇక్కడ పౌలుగారు ఏమి చెబుతున్నారో- ఇశ్రాయేలీయులు సువార్త విషయం శత్రువులు గాని, దేవుని ఏర్పాటు విషయంలో మాత్రం పితరులను బట్టి దేవునికి ఎంతో ప్రియులు అంటున్నారు.
“విరోధులు”– అవిశ్వాసులైన యూదులు సువార్త ప్రచారానికి విరోధంగా తమ శక్తికొలది పోరాడారు. అన్యజనులు క్రీస్తు చెంతకు రాకుండా శాయశక్తులా అడ్డుకున్నారు (1 థెస్స 2:14-16).
“ప్రియులు”– ఇజ్రాయేల్ జాతి అపనమ్మకంలో ఉన్నా, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నా దేవుడు దానిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు. వారి పూర్వీకులను (అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గార్లు) బట్టే ఆయన అలా ప్రేమిస్తున్నారు.
ఇక 29 ప్రకారం మలాకీ 3:6 పోలికగా ఉంటుంది.
యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.
ఈ యుగంలో దేవుడు ఇజ్రాయేల్ వారిని పక్కన పెట్టినప్పటికీ ఆ ప్రజ గురించి తన మనస్సు మాత్రం మార్చుకోలేదు. ఆ జాతినింకా తన ప్రజగానే పరిగణిస్తున్నాడు. ఆయన వారికిచ్చిన ఉచిత వరాల్లో కొన్నిటిని 9:4-5లో చూడండి.
4. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.
5. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
౩౦—31
30. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి.
31. అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు ......
ప్రస్తుతం యూదుల్లాగానే ఒకప్పుడు ఇతర ప్రజలు నమ్మకం లేకుండా నశించిన స్థితిలో ఉన్నవారే. వారిపట్ల దేవుడు కృప చూపినట్టుగానే, పడిపోయిన తన సొంత ప్రజల పట్ల కూడా ఆయన కృప చూపుతాడు.
32. అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.
..దేవుని కరుణ చూడండి అందరియెడల దేవుడు కరుణ చూపాలని కోరుకుంటున్నారు దేవుడు.
గలతీ 3:23-24 పోల్చి చూడండి. దేవుడు తన న్యాయమైన తీర్పు ప్రకారం అన్యజనులను వారి సొంత హృదయాల్లోని దుష్టత్వానికి వదిలిపెట్టారు (1:24-32). యూదులను కఠినుల్ని చేయడం ద్వారా శిక్షించాడు (11:7-8). దానికి ఫలితంగా వారు దేవుని కుమారుణ్ణి సిలువ వేశారు. మనుషులంతా పాపం, అవిధేయతల్లో బందీలైపోయారు. ఈ విధంగా యూదుడైనా ఇతర జాతీయుడైనా ఎవరికైనా తన కృపే ఆశాభావానికి –నిరీక్షణకు ఆధారమని ఆయన వెల్లడి చేశారు. యూదాజాతి విషయంలో దేవుడు చేసిన నిగూఢమైన పనులన్నిటి వెనుకా ప్రేమ, కృప గల ఉద్దేశం ఆయనకు ఉన్నదని ఈ వచనంలో చూస్తున్నాం. అదేమిటంటే అందరిపట్లా కరుణ చూపాలని. మనుషులను కఠినపరచి శిక్షించడంలో ఆనందించే దేవుడు కాడాయన. కరుణ చూపడమే ఆయనకు ఆనందం. కానీ ఈ వచనాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. మనుషులందరికీ చివరికి పాపవిముక్తి లభిస్తుందని బైబిలు ఎక్కడా చెప్పడం లేదు. క్రీస్తును నిరాకరించి వారి పాపాల్లో చనిపోయినవారు శాశ్వతంగా నశించిపోతారు (2:5-6; 6:23; యోహాను 3:36; ప్రకటన 21:6). ఇక్కడ “అందరిమీదా” అంటే యూదులు, ఇతరులని తేడా లేకుండా జాతులన్నిటిమీదా అని అర్థం కావచ్చు. కరుణ చూపడంలో దేవుడు వారి మధ్య ఏమీ తేడా చూపడన్నమాట; యూదులు, ఇతరులు ఇద్దరి విముక్తీ దేవుని ఏర్పాటు ముడిపడివుంది.
౩౩లో దేవుని కృపాబాహుళ్యమును వర్ణిస్తున్నారు పౌలుగారు. .33-36 పౌలు సువార్త అంటే అర్థాన్నీ, యూదులతో, ఇతరులతో దేవుడు వ్యవహరించే తీరునూ వివరించి ముగించాడు. అంతా వివరంగా తాను చెప్పలేదని అతనికి బాగా తెలుసు. తన ఊహకు కూడా అందని రహస్య సత్యాలు, మానవ మేధస్సు గుర్తించలేని దేవుని జ్ఞానం లోతులు ఉన్నాయి. ఇప్పుడు దేవుణ్ణి దేవుడుగా ఉంచి ఆయన్ను స్తుతిస్తున్నారు.... దేవుని వాక్కును ఎంతగా నేర్చుకుంటే, ఆయన తన గురించి వెల్లడించిన సత్యాలను ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా ఆయన జ్ఞానంలోను, మిగతా అన్నింటిలోనూ మనందరికన్నా ఎంత ఉన్నతుడో అర్థం అవుతుంది. లోకంలో తాను చేస్తున్నదంతా ఆయనకు తెలుసు. ఆయన వెల్లడించిన కొంచెమే మనం తెలుసుకోగలం. ఆయన మార్గాలను విమర్శిస్తూ, ఆయన మనకు, ఇతరులకు చేస్తున్న వాటిని గురించి సణుక్కుంటూ ఉండడం అవివేకం (అనేకులు అలా చేస్తారు గదా). ఆయన మీద నమ్మకం ఉంచుతూ ఆయన్ను స్తుతిస్తూ మన అల్పమైన మనస్సులను ఆయన అనంత జ్ఞానానికి అప్పగించడం మనం నేర్చుకోవాలి. యోబు 40:3-5; 42:1-6 చూడండి
౩4-36.
34. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
35. ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?
36. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.... యెషయా 40:13
యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?
. ఈ వచనం సందర్భాన్ని గమనించండి (యెషయా 40:12-26). దేవుని గొప్పతనం గురించిన అద్భుతమైన చిత్రాన్ని ఇది మన కళ్ళముందు ఉంచుతున్నది. సృష్టిలోను, ఈ ప్రపంచాన్ని నిర్వహించడంలోను దేవునికి ఏ మనిషి సలహా అవసరం లేదు.
యోబు 41: 11
నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశ వైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా
దేవుడు మనుషులకు రుణస్థుడు కాదు. ఎవరికీ పాపవిముక్తి, రక్షణ గానీ మరేదైనా గానీ ఆయన బాకీ పడలేదు. మనుషులతో ఆయన చేసే వ్యవహారాలన్నిటికీ ఆధారం ఆయన కరుణ, కృప మాత్రమే. "ఆయనకే”– ఈ ప్రపంచంలోని వన్నీ ఆయన ఉద్దేశాలనే నెరవేరుస్తున్నాయి. అవన్నీ తమకోసం కాక ఆయనకోసమే ఉన్నాయి. పౌలుగారితో కలిసి సమస్తమహిమ దేవునికి మాత్రమే ఆపాదించడం నేర్చుకుందాం. ఎందుకంటే ఆయన మాత్రమే అందుకు అర్హుడు.
మాట వినని వారందరూ ఆయనపట్ల అవిధేయులే కాబట్టి ఆయన ఎవరికీ కూడా జీవితావసరాలు అందకుండా చేసినా, అందరినీ నరకానికి పంపినా అది న్యాయమే.
కాబట్టి ప్రియ చదువరీ! ఇశ్రాయేలీయులు కూడా రక్షించబడతారు ఎప్పుడు? అన్యజనులలో రక్షింపబడవలసిన సంఖ్య పూర్తి అయినప్పుడు!
అంతేకాదు రక్షించబడిన నీవు వాక్యానుసారమైన జీవితం, ప్రార్ధనానుభావం ఆత్మానుసారమైన జీవితం లేకపోతే నీవుకూడా కత్తిరించబడతావు జాగ్రత్త!
కాబట్టి భయమునోంది పాపము చేయకు!
పేరుకు తగ్గ జీవితం జీవించు!
ఆమెన్!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక –103వ భాగం*
రోమా 12:1—2…
1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
2. మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. .
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం ఇశ్రాయేలీయులపట్ల దేవుని ప్రణాళికను ధ్యానం చేసుకున్నాం. ఇక ఈ అద్యాయంలో విశ్వాసి ఇంత గొప్ప రక్షణ పొందుకున్నాడు కాబట్టి సంఘంలో, లోకంలో ఎలా ఉండాలి అనేది చెబుతూ, మనం సార్వత్రిక సంఘంలో ఒక భాగమై, సంఘంతో ఏకమై ఉన్నాము కాబట్టి ఎలా ఉండాలి? ఇంకా వివిధరకాల పరిచర్యల కోసం రాస్తున్నారు పౌలుగారు. పౌలుగారు తన పత్రికలోని దేవుని రక్షణసిద్ధాంత భాగాన్ని 11 అధ్యాయంతో పూర్తి చేశారు. అందరూ పాపులేననీ దేవుని కోపానికి తప్ప మరి దేనికీ తగినవారు కాదనీ చూపించారు. దేవుని కరుణలోని గొప్పతనం కొంతవరకు వివరించారు. ఇక్కడినుంచి ఈ పత్రిక చివరివరకు విశ్వాసుల పట్ల దేవుడు కరుణ చూపినందుచేత వారు ఆచరణలో అనుదినం కనపరచవలసిన జీవిత విధానం గురించి రాస్తున్నారు. 1–11 అధ్యాయాల్లో వెల్లడైన అద్భుత సత్యాలను చదివి, ఏమీ మారకుండా వాటికి లోబడకుండా ఉండేవారికి వాటివల్ల లాభమేముంది?
ఈ మొదటి వచనం చూసుకుంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అంటున్నారు పౌలుగారు. ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సజీవయాగముగా మీ ఆత్మలను, మనస్సును సమర్పించుకోండి అనడం లేదు పౌలుగారు ఇక్కడ; సజీవయాగముగా మీ శరీరములను సమర్పించుకొండి అంటున్నారు. ఏలాగు? సజీవయాగముగా.. అనగా బ్రతికి ఉండగానే మీశరీరాలను దేవుని యాగంగా అనగా దహనబలి ఇచ్చెయ్యాలి!! దీని అర్ధం ఏమిటంటే మీ శరీరాలను దేవునికి కానుకగా ఇచ్చెయ్యండి. దేవునికి సమర్పించుకోండి. ఎందుకు అంటే అలాచేస్తే పాపమును మీరు ఆ యాగంలో దహించి వేస్తున్నారు! మనందరం చేయవలసిన మొదటి పని ఏమిటంటే మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా ఇచ్చివేసుకోవాలి. పాత నిబంధన దినాల్లో ఇజ్రాయేల్ లోని యాజకులు జంతు బలులు అర్పించేవారు. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన శకంలో విశ్వాసులందరూ యాజకులే- రాజులైన యాజకులు. (ప్రకటన 1:6
మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి(అనేక ప్రాచీనప్రతులలో-కడిగినవానికి అని పాఠాంతరము) మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
1 పేతురు 2:5,9
5.యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
9.అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
9:1;
హీబ్రూ 13:15-16).
బలి అర్పించవలసినది జంతువుల్ని కాదు గాని తమ సొంత శరీరాల్ని. అవి సజీవమైన యజ్ఞంగా మహిమార్థంగా ఉంటాయి (6:13, 19; 1 కొరింతు 6:13, 19, 20).
దేవుడు కోరే ఆరాధన ఇదే, కేవలం నోటి మాటలు కాదు. ఇలాంటి అర్పణ దేవునికి పవిత్రం, అంగీకారం.
ఇక రెండవ మాట ఏమిటంటే: ఆ యాగం పవిత్రమైనదిగా ఉండాలి అంటున్నారు. అపవిత్రంగా ఉండకూడదు. అవును దేవునికిచ్చే యాగం ఏదైనా తప్పకుండా పవిత్రంగా ఉండాలి గాని అపవిత్రమైనదేది దేవుని సన్నిదిలోనికి రావడానికి వీలులేదని దేవుడు చెబుతున్నారు. అనగా ఎట్టి పరిస్తితిలోనూ మీ దేహాలను పాపానికి దాసుడిగా ఉండనీయకూడదు. పాపాన్ని మీమీద ఏలనివ్వకూడదు. ఎప్పుడైతే అలాచేస్తారో అలాంటి సేవ, మచ్చలేని సేవ, దేవునికి ఎంతో ఇష్టమైంది. యుక్తమైనది.
పౌలుగారుఇలా వ్రాయడానికి మరో కారణం కూడా ఉంది. ఈ పత్రిక ప్రారంభించినప్పుడు ఆరోపించారు—1:21—32
21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.
22. వారి అవివేక హృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.
23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమా స్వరూపముగా మార్చిరి.
24. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.
25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్.
26. అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి.
27. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి
28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై
30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును
31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.
32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు...
మనుష్యులు ఎలా ప్రవర్తించి తమ శరీరములను, మనస్సులను పాడుచేసుకున్నారో ఎటువంటి నీచమైన కార్యాలు చేశారో వివరంగా చెప్పారు.. 1:24,28 ప్రకారం ఇదంతా చూసి దేవుడే వారి శరీరములు పాడుచేసుకోడానికి అపవిత్రతకు అప్పగించేశారు. వారి మనస్సులను బ్రష్టమనస్సుకు అప్పగించేశారు. కాబట్టి ఈ కారణాలవలన మీ శరీరములను సజీవయాగముగా అప్పగించుకొనండి అంటున్నారు పౌలుగారు. ఎప్పుడైతే మీరు మీ శరీరములను యాగం చేస్తారో పాపం చస్తుంది. అనగా మీ వ్యభిచారం చస్తుంది, మీ అనధికార కామాభిలాష చస్తుంది. మీ త్రాగుడు, మీనోట బూతులు, అపనమ్మకం, అవిశ్వాసం, విగ్రహారాధన, దురాశ.... ఇవన్నీ చస్తాయి. చావాలి. అప్పుడే మీ శరీరాలు, మీ మనస్సులు దేవునికి ఇష్టమైన యాగముగా మారుతాయి. ఎప్పుడైతే చంపుతారో లేక యాగం చేస్తారో 8:11 ప్రకారం చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివశించున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీశరీరము దేవునికి యాగముగా చేశావా లేక లోకానికి/ సైతానుకి యాగం చేశావా? పాపం ఏలుతుందా నిన్ను లేక దేవుని నీతి పరిపాలన చేస్తుందా?
పాపానికి బానిసవైతే ఆధ్యాత్మిక మరణం చివరకి నరకం అని మరచిపోకు!
నీతికి / పవిత్రతకు అప్పగించుకుంటే దాని ఫలితం నిత్యజీవం అని తెలుసుకో!
నీలో బూతులు కనబడ్డాయి అంటే నీలో సాతానుడు ఉన్నాడు,
వ్యభిచారం చేస్తున్నావు అంటే నీవు పాపానికియాగం చేస్తున్నావు జాగ్రత్త!
నేడే సరిచూసుకో!
సరిచేసుకో!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*రోమా పత్రిక – 104వ భాగం*
రోమా 12:1—2…
1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
2. మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ..
ప్రియ దైవజనమా! ఇక రెండో వచనంలో ఇంకా వివరంగా రాస్తున్నారు పౌలుగారు. ఈలోక మర్యాదను అనుసరించవద్దు అంటున్నారు. అనగా లోక మర్యాద అనగా లోకాచారాలు, అన్యాచారాలు చేయవద్దు అంటున్నారు. అవి మనకు కూడదు. అన్యులు మద్యపానం చేస్తూ, నీవు త్రాగుతూ ఉంటే నీకు అన్యుడికి తేడా ఏమిటి? అన్యులు వ్యభిచారం చేస్తూ, నీవు వ్యభిచారం చేస్తే నీకు వారికి తేడా ఏమిటి? నీవు విగ్రహారాధన చేస్తూ అనగా యేసయ్య సిలువ మేడలో వేసుకుని, యేసయ్య ఫోటో లాకర్ పెట్టుకుని, లేదా RCM వారివలె మరియమ్మ, యేసయ్య ఫోటోలకు మ్రోక్కుతూ, కొబ్బరికాయలు, ఊదొత్తులు పెడుతూ పూజ చేస్తే, నీకు అన్యులకు తేడా ఏమిటి? రెండూ సమానమే కదా!
నీవు పెండ్లికి తాళికట్టి, పందిరివేసి, మామిడాకులు కట్టి, గంధం పూసుకుంటూ, పసుపురాసుకుంటే అది అన్యాచారం లోకాచారం కాదా? అప్పుడు నీకు వారికి తేడా ఏమిటి? నీవు మెచ్చూర్ ఫంక్షన్ చేసి, వారుకూడా చేస్తే తేడా ఏమిటి? వారిలాగా నీవుకూడా ముహూర్తాలు చూస్తూ, వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే ఇక దేవునికి ఎక్కడ విలువిస్తున్నావు? క్రైస్తవ వేషంలో ఉన్న అన్యుడివి లేక పగటి వేషగాడివి. అంతే!!!
క్రొత్త నిబంధన గ్రంథంలో లోకం గురించి అనేక సంగతులు రాసి ఉన్నాయి. లోకం దేవుణ్ణి ఎరగదు (యోహాను 1:10)
ఆత్మ సంబంధమైన అంధకారమంటే దానికి ఇష్టం (యోహాను 3:19)
క్రీస్తునూ, ఆయన్ను అనుసరించేవారినీ అది ద్వేషిస్తుంది (యోహాను 7:7; 15:19)
దాని పరిపాలకుడు, దేవుడు సాతాను గాడు (యోహాను 12:31; 2 కొరింతు 4:4)
అది దేవుని ఆత్మను పొందడం అసాధ్యం (యోహాను 14:17)
దాని జ్ఞానం తెలివి తక్కువతనంగా ఉంది (1 కొరింతు 1:20; 3:19)
అది క్షణికమైనది (1 కొరింతు 7:31; 2 కొరింతు 4:18)
అది దేవుడు లేకుండా, నిరీక్షణకు సరైన కారణం లేకుండా ఉంది (ఎఫెసు 2:12)
దానితో స్నేహమంటే దేవునితో వైరం (యాకోబు 4:4)
అది చెడిపోయినది (2 పేతురు 1:4)
అది గర్వంతో, చెడు కోరికలతో నిండి ఉంది (1 యోహాను 2:15-17)
అది పూర్తిగా దుర్మార్గతలో మునిగి ఉంది (1 యోహాను 5:19)
కాబట్టి లోకంతో రాజీపడి దాని తీరుకు లొంగవద్దని పౌలుగారు చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. అందులోని ప్రజలను మలచి, చెడు మార్గాల్లో ప్రవర్తించేలా చేసే బలమైన శక్తులు లోకంలో ఉన్నాయి. విశ్వాసులు క్రీస్తు పోలికలోకి మార్పు చెందాలి. ఇలా మార్పు చెందడం అన్నది వారి అంతరంగాల్లో దేవుని ఆత్మ నెరవేర్చే కార్యం. విశ్వాసులు వేరుగా ఈ లోకం తీరుకు దూరంగా ఉండడమే కాదు, వారి అంతరంగ జీవితం కూడా పూర్తిగా వేరుగా ఉండాలి. వారి మనసు కొత్తది కావడం మూలంగా ఇది జరుగుతుంది (ఎఫెసు 4:22-23).
అయితే మన తలంపులు చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాసుల ప్రవర్తనను చాలా వరకు అవే నిర్ణయిస్తాయి. మార్పు చెందిన జీవితానికి ఏకైక మార్గం మన తలంపులను అదుపులో ఉంచుకొంటూ దేవుని సత్యంతో మన మనస్సులను నింపుకొంటూ ఉండడమే (8:5-6; 2; కొరింతు 10:5; కొలస్సయి 3:16; కీర్తన 1:1-3; ఫిలిప్పీ 2:5; 4:8; హీబ్రూ 8:10).
మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించాలి (మత్తయి 22:37).
మనకు అవసరమైన కొత్తదనం ఇదే. దేవునికి తమను తాము ఇచ్చివేసుకోనివారు, అంతరంగంలోని మార్పుకు దేవుని ఆత్మతో సహకరించనివారు, తమ విషయంలో దేవుని సంకల్పమేమిటో తెలుసుకోలేరు. మనం తెలుసుకుని ఆ లోపరహితమైన సంకల్పాన్ని అనుసరించ దలచుకుంటే ఇక్కడ మనకు చెప్పినట్టు చేయాలి.
ఇదే రెండో వచనంలో అంటున్నారు పౌలుగారు అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే మీ మనస్సుమారి నూతనమైపోవాలి. అలాజరిగితే రూపాంతరం జరుగుతుంది. ఎలా ? క్రీస్తు పోలికలోనికి మారిపోతావు.
నీపట్ల దేవుని చిత్తమేదో తెలుసుకున్నావా ప్రియ చదువరీ? మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోమని భక్తుడు రాస్తున్నారు. 2 పేతురు 1:10; మరి ఎప్పుడైనా దేవుని చిత్తమేదో తెలుసుకున్నావా?
1థెస్స 4:౩ ప్రకారం: పరిశుద్దులుగా ఉండడమే అనగా జారత్వానికి దూరంగా ఉండటమే ఆయన చిత్తము.
1థెస్స 4:5 ప్రకారం: తన ఘటమును ఎట్లు కాపాడుకోవడం ఎరిగిఉండటమే ఆయన చిత్తము.
1థెస్స 5:18 ప్రకారం: ప్రతీ విషయమందు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పడమే దేవుని చిత్తము.
1పేతురు 2:15 ప్రకారం: అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోర్లు మూయించడమే దేవుని చిత్తము!
ఈ చిత్తములు అందరికీ! మరి నీ పట్ల దేవునికి ఏదో చిత్తము ఉంది. మరి అది ఏమిటో ఎప్పుడైనా దేవుని అడిగావా? నీవు చేసే పని ముందు అది దేవుని చిత్తమా కాదా అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా ప్రియ చదువరీ?!!
అలా చేయగలిగితే నీవు ధన్యుడవు!
నేడే సమర్పించుకో నీ శరీరమును దేవునికి సజీవయాగముగా!
పాపాన్ని తరిమికొట్టు!
క్రీస్తుకు జైకొట్టు!
పరలోకం పట్టు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక –105వ భాగం*
రోమా 12:౩…
తన్నుతాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.
ప్రియ దైవజనమా! గతభాగంలో విశ్వాసి సంఘంలో, లోకంలో ఎలా ప్రవర్తించాలి అనేది ధ్యానంచేసుకున్నాం! ఈరోజు ప్రతీ విశ్వాసి తననుతాను ఎంచుకోదగిన కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం స్వస్తబుద్ధి గలవాడగుటకు తగిన రీతిగా నడుచుకోవాలి అంటున్నారు.
ఈరోజులలో కొంతమంది విశ్వాసులు సేవకులు చాలా అతిశయిస్తున్నారు. రెండు పాటలు రాసి, పాటలు పాడితే, ప్రార్ధించడం వస్తే, ప్రసంగాలు చేయడం వస్తే తామేదో గొప్పోడు అయిపోయినట్లు, లోకంలో విజ్ఞానం అంతా తమ దగ్గరే ఉన్నట్లు ఫోజు కొడుతున్నారు. ఇది మంచిపని కాదు అంటున్నారు. ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అంటున్నారు పౌలుగారు.
బైబిల్ గ్రంధంలో ఇలాగే అతిశయపడినవారు గడ్డిమేశారు. ఘోరంగా చంపబడ్డారు. గర్వం అణచబడి తగ్గింపబడ్డారు.
2 కొరింతు 10:12
తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచు కొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నిక చేసికొని యొకరితోనొకరు సరిచూచు కొనుచున్నందున, గ్రహింపులేక యున్నారు.
గలతీ 6:3
ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచుకొనును.
విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితాల గురించి పౌలుగారు ఇక్కడ మాట్లాడుతున్నారు. వారి మనసులతో, ముఖ్యంగా వారి గురించి వారిలో ఉండే తలంపులతో ఆయన ఆరంభిస్తున్న విషయం గమనించండి. దేవుడు కొందరికి ఇతరులకన్న ఎక్కువ నమ్మకం ఇవ్వవచ్చన్న సంగతిని కూడా గమనించండి (1 కొరింతు 12:9).
పౌలుగారి మాటలను గమనిస్తే అతిశయం అనేది ఆయన దరిదాపులలోనికి ఎప్పుడూ రానియ్యలేదు. అతిశయం పడవలసి వస్తే తను పొందిన ప్రత్యక్షతల విషయంలో అతిశయపడను గాని తను క్రీస్తుకై పడిన శ్రమలవిషయంలో అతిశయపడతాను అంటున్నారు. నా బలహీనతల యందు అతిశయపడుతున్నాను అంటున్నారు. 2కొరింథీ 11:౩౦; ఇతరులకు బోధించాక నేను తప్పిపోతానేమో అని భయం కలిగి జీవితమంతా జాగ్రత్తగా బ్రతికారు. 1కొరింథీ 9:27; ఇంకా మూడు ప్రపంచ సువార్త దండయాత్రలు చేసి, అనేక లక్షలమందికి సువార్త చెప్పి, అనేక సంఘాలు స్తాపించినా, ఎన్నో ప్రత్యక్షతలు కలిగియున్నా గాని, నేను ఇంకా పరిపూర్ణుడను కాలేదు. నేనేమి సాధించలేదు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అంటున్నారు ఫిలిప్పీ పత్రికలో ౩:12—16..
12. ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను.
13. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి(లక్ష్యపెట్టక) ముందున్న వాటికొరకై వేగిరపడుచు
14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.
15. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేని గూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును.
16. అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము. ....
అందుకే ఆతర్వాత వచనంలో మీరు నన్నుపోలి నడచుకోనుడి అంటున్నారు.
ఇక దీనికోసమే 2కొరింథీ 10వ అధ్యాయంలో చాలా వివరంగా రాశారు. దయచేసి ఆ అధ్యాయం మొత్తం చదివి గ్రహించమని మనవి చేస్తున్నాను. పౌలుగారు చెబుతున్నారు నేను మీ ఎదుట ఉన్నప్పుడు ఎలా ఉన్నానో, మీరు ఎదుట లేకపోయినా అలాగే ఉన్నాను అని చెబుతూ, తన యుద్దోపకరణాలు ఏమిటో చెబుతూ, మేము మాటద్వారా క్రియద్వారా అన్నివిధాల ఒకేలాగా ఉంటున్నాను అని చెబుతూ, 10:12 లో తమ్మునుతామే మెచ్చుకుంటున్నారు కొందరు, అలాంటి వారు కొందరితో సరిచూసుకుంటున్నారు. అలా మేము చేయడం లేదు అలాచేస్తే వారు ఏమి చేస్తున్నారో అది వారు గ్రహించలేరు, 13—15 వచనాలు చదవండి.
13. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము.
14. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు, మీవరకును వచ్చియుంటిమి గనుక మీయొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్లుచున్నవారముకాము.
15. మేము మేరకు మించి యితరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధియైన కొలది మాకనుగ్ర హింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు, ,.....
17, 18 వచనాలు అతిశయించు వాడు ప్రభువునందే అతిశయించాలి కారణం ప్రభువు మెచ్చుకోనేవాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొను వాడుయోగ్యుడు కాదు అంటున్నారు.
కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! ఏ విషయంలో నీవు అతిశయిస్తున్నావు? నీకు కలిగిన తలాంతులు విషయంలోనా? నీకు కలిగిన సంఘం విషయంలోనా? నీకున్న ధనము, ఆస్తి, అంతస్తు విషయంలోనా? లేక నీకున్న అందం విషయం లోనా? జాగ్రత్త! అతిశయించే వారికి దేవుడు గట్టిగా బుద్ధిచేబుతారు. దేని విషయంలోనూ అతిశయ పడవద్దు అనేదేవుని మాటను మీద గుర్తుకు చేసుకున్నాం. అతిశయపడకు!
పౌలుగారి వలే ఇంకా ఎంతో సాధించాల్సింది ఉంది అని గురియోద్దకే పరుగెత్తు!
బహుమానం పొందుకో!
ఆమెన్!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక –106వ భాగం*
రోమా 12:4—8 ….
4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో,
5. ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.
6. మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమైయున్నాము గనుక,
7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,
8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.
ప్రియ దైవజనమా! ఈ వచనాలలో రెండు ప్రాముఖ్యమైన సంగతులున్నాయి .
1. విశ్వాసులందరూ ఐక్యమై- దేవునితో ఏకంగా ఉన్నారు. సార్వత్రిక సంఘంతో!
2. దేవుడు వారి విశ్వాస పరిమాణం చొప్పున అనేక కృపావరములు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. వాటిని ఉపయోగించి విశ్వాసి ఆయన సంఘ వ్యాప్తికి కష్ట పడాలి.
దేవుని ఆత్మద్వారా విశ్వాసులంతా ఒకే ఆధ్యాత్మిక శరీరంగా ఐక్యమయ్యారు. యోహాను 17:21-23; 1 కొరింతు 12:12-13; ఎఫెసు 4:15-16; 5:23 చూడండి. ఈ ఆధ్యాత్మిక శరీరంలో ప్రతి విశ్వాసీ ఇతరులందరికీ చెందినవాడు (వ 5). దేవుడు ప్రతి ఒక్కరికీ కనీసం ఒక సామర్థ్యాన్ని ఇచ్చారు. ఆ శరీరంలో ప్రతి ఒక్కరూ ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని ఇలా ఇచ్చారు. ప్రతి వ్యక్తీ తన సమర్థత ఏమిటో గుర్తించి దాన్ని దేవుని ఘనతకోసం, ఇతరుల మేలుకోసం ఉపయోగించాలి. 1 కొరింతు 12:7-11, 27-31; ఎఫెసు 4:11-13 కూడా చూడండి.
ఒక్క శరీరంలో ఎలా ఎన్నో అవయవాలున్నాయో అలాగే విశ్వాసులంతా క్రీస్తుసంఘము అనే శరీరంలో భాగాలు. ఒక్కో అవయవానికి ఒక్కో ప్రత్యేకమైన పని ఎలాగుందో అలాగే ఒక్కో విశ్వాసి సంఘంలో పనిచేయాలి. కాబట్టి అదే పనిని దేవుడు వారివారి విశ్వాస సామర్ధ్యాన్ని బట్టి దేవుడు వేరువేరు విశ్వాసులకు వివిధమైన కృపావరాలు ఇచ్చారు. కొందరికి ప్రవచన వరం, కొందరికి బోధించే వరం, కొందరికి హెచ్చరించే వరం, కొందరు పరిచర్య చేసేవరం, ఇలా వివిధమైన వరాలు ఫలాలు ఇచ్చారు దేవుడు. కాబట్టి ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,
8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను అంటున్నారు పౌలుగారు!
దీనికోసం గతంలో ఆధ్యాత్మిక సందేశాలు-5 లో బాగంగా దేవుని సేవ-పరిచర్య అనే శీర్షికలో Tenfold Ministry –Fivefold Ministry ని వివరించడం జరిగింది. దానిని ఇప్పుడు కొద్దిగా అవసరమైనంత వరకు చూసుకుందాం.
*దేవుని సేవ-పరిచర్య రకములు-1*
Ephesians(ఎఫెసీయులకు) 4:13,15
13. _పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను_.
15. _ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము_.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:4,5,6,7,8,9,10,11
4. _కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే_.
5. _మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే_.
6. _నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే_.
7. _అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది_.
8. _ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును_,
9. _మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను_
10. _మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి_.
11. _అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు_.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:28,29,30
28. _మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను_.
29. _అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా_?
30. _అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా_?
సంఘం అభివృద్ధి చెందడానికి దేవుడు , సంఘంలో ప్రతీ ఒక్కరికి వారి వారి విశ్వాస పరిమాణం ప్రకారం, కొన్ని వరాలు-ఫలాలు ఇస్తారు!
కొందరిని ప్రత్యేకమైన సేవకోసం ఎన్నుకొంటారు!
వారు అనేక రకాలుగా ఉన్నారు.
వీరిని రెండు వర్గాలు చేసారు.
1. Fivefold Ministry- ఐదు మడతల/ఐదు మెట్ల సేవ,
2. Tenfold Ministry- పదిమెట్ల / పది మడతల సేవ .
Fivefold ministry is a part of Tenfold Ministry.
ఈ Fivefold ministry లో సేవ చేసేవారు చాలా వరకు fulltime minstry(సంపూర్ణ సేవ) చేస్తారు.
మిగతా ఐదు భాగాల వారు, తమ తమ పనులు చేసుకొంటూనే part time Ministry చేస్తారు.
ఈరోజు Fivefold ministry కోసం ధ్యానిద్దాం!
వీరు 1. అపోస్తలులు, 2. ప్రవక్తలు, 3. భోదకులు, 4. కాపరులు, 5. సువార్తికులు/ఉపదేశకులు,
మిగతా ఐదు భాగాలు : 6. అద్భుతాలు చేసేవారు, 7. భాషలు మాట్లాడువారు/భాషలకు అర్ధం చెప్పేవారు, 8. ఉపకారాలు చేసేవారు, 9. పరిచర్య చేసేవారు, 10. ప్రభుత్వాలు చేసేవారు.
రక్షించబడిన ప్రతీ విశ్వాసి, వీటిలో ఏదో ఒకటి తప్పకుండా చేయాలి. లేకపోతే ఆ విశ్వాసి నులివెచ్చగా ఉన్నట్లు లెక్క!
ఈ Fivefold ministry లో మొదటగా *ఉపదేశకులు*: సువార్తికులు/ఇవాంజిలిస్టులు, బైబిల్ టీచర్లు, మిషనరీలు ఈ లెక్కలోకి వస్తారు. సువార్త ప్రకటించడం, విశ్వాసులను బలపరచడం వీరిపని.
తర్వాత *కాపరులు*: ఈ Fivefold ministry లో చాల ముఖ్యమైన వారు. సువార్తికుని పనిచేస్తూనే సంఘకాపరిగా భాద్యత నిర్వహించాలి.
తర్వాత *బోధకులు*: సంఘకాపరిగా చేస్తూనే సంఘాన్ని హెచ్చరిస్తూ-సరిచేస్తూ దేవుని సందేశాలు అందించడం వీరి పని.
తర్వాత *ప్రవక్తలు*: వీరు పరిశుద్ధాత్మ పూర్ణులై, దేవుని దగ్గర అనునిత్యం కనిపెడుతూ, దేవుని ప్రవచనాలు- వర్తమానాలు ప్రజలకి తెలియజేస్తూ సంఘాన్ని సరిదిద్దే వారు.
పై నాలుగు వరాలు కలవారు లేక నాలుగు భాగాలులో భాగస్తులై, ఆ ఆధిక్యత గలవారిని అపోస్తలులు అంటారు. అనగా సువార్త ప్రకటిస్తూ, సంఘాలలో భోదిస్తూ, అద్భుతాలు చేయగలిగే వరాన్ని కలిగి, ప్రవచన వరం కలిగి సంఘాన్ని ముందుకు నడిపించేవారే అపోస్తులులు.
ఇది అత్యంత గొప్పవిషయం!
ఈ Fivefold ministry లో అపోస్తలులు, ప్రవక్తలు top ఎఫెసీ 2:20 ప్రకారం. Ephesians(ఎఫెసీయులకు) 2:20
20. _క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు_.
ప్రియ దైవసేవకుడా! నీవు సువార్తికుడివా? కాపరిగా మారుటకు ప్రయత్నం చేయు.
కాపరివా- ప్రవచనవరం కోసం, అద్భుతాలు చేసే వరం కోసం ప్రయత్నం చేయు.
ప్రవక్తగా, అపోస్తులుడిగా మారడానికి ప్రయత్నం చేయమని ప్రభుప్రేమతో ప్రోత్సాహపరుస్తున్నాను.
అయితే దానికోసం గొప్ప ప్రార్ధనా శక్తి అవుసరం. పరిశుద్దాత్ముని అభిషేకం పొందుకొని అద్భుతాలు చేసే శక్తిని వాడుతూఉండాలి.(operate చెయ్యాలి) అప్పుడు దేవుడు నీసేవను ఆశీర్వదిస్తారు. నిన్ను ఒక లైట్ హౌస్ లా వాడుకొంటారు!
అట్టి కృప ధన్యత దైవ సేవకులందరికి కలుగును గాక!
ఆమెన్!
(ఇంకాఉంది)
*రోమా పత్రిక – 107వ భాగం*
*దేవుని సేవ-పరిచర్య రకములు-2*
రోమా 12:4—8 ….
4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో,
5. ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.
6. మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమైయున్నాము గనుక,
7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,
8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:28,29,30
28. _మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను_.
29. _అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా_?
30. _అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా_?
ప్రియ దైవ జనాంగమా!ఇంతవరకు మనం Fivefold ministry కోసం ధ్యానించాము. ఇక మిగతా భాగాలు కోసం ధ్యానం చేద్దాము.
అందరూ ప్రవక్తలు, అపోస్తలులు, అద్భుతాలు చేసేవారు, భోదకులు, సువార్తికులు అయితే సంఘంలో పరిచర్య చేసేవారు ఎవరు? సంఘాన్ని నడిపించే వారు, హెచ్చరించేవారు, ప్రార్దించేవారు ఎవరు? అందుకే పౌలు గారు అంటున్నారు కృపావరములు ఎన్నో ఉన్నాయిగాని, ఆత్మ ఒక్కడే, పరిచర్యలు ఎన్నో ఉన్నాయి గాని జరిగించువాడు ఒక్కడే, సంఘానికి శిరస్సు క్రీస్తు! మనమంతా ఆ సంఘానికి అవయవాలు. సంఘాభివృద్ధికోసం, పెండ్లికుమార్తె సంఘం అందంగా అలంకరించబడటం కోసం దేవుడు కొందరిని ప్రవక్తలుగా, అపోస్తలులుగా, కాపరులుగా వాడుకొంటూ, మిగిలిన వారిని మరో పనికి వారి విశ్వాస పరిమాణం ప్రకారం వాడుకొంటున్నారు!
గొప్ప ఇంటిలో వెండిపాత్రలు, బంగారం పాత్రలు- ప్రస్తుతం అయితే స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు అన్నీ ఉంటాయి. అయితే వాటిని వాడేవిధానం, వాడబడే విధానం వేరు. వేరువేరు పనులకోసం వేరువేరు పాత్రలు వాడతాము. అలాగే దేవుడు సంఘంలో వేరువేరు పరిచర్యలు కోసం ఒక్కో వ్యక్తిని ఒక్కో విధానంలో వాడుకొంటారు. దేవుడు మన CEO. ఆయన ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.
*అయితే ఇక్కడ మనం దేవుని పనికై వాడబడుతున్నామా లేదా?*
Fivefold ministry తర్వాత విభాగం వారు *అద్భుతాలు చేసేవారు*. అయితే దీనిని చేయడానికి పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్ధనా శక్తి, అచంచలమైన విశ్వాసం అవసరం. అయితే మార్కు 16:16 ప్రకారం ఈశక్తి అధికారం అందరికి ఇవ్వబడింది. దానిని వాడుకొనే శక్తి, విశ్వాసం లేక, వాడే విధానం తెలియక ఇటుఅటు తిరుగులాడుతున్నాం! నాయందు విశ్వాసముంచువాడు నాకంటే ఎక్కువ కార్యాలు చేయును. అన్న యేసయ్య మాట ద్వారా మనం అద్భుతాలు చేయగలము.
తర్వాత విభాగం *భాషలు మాట్లాడువారు-అర్ధం చెప్పువారు*. పెంతుకోస్తు పండుగనాడు దేవుడు పరిశుద్ధాత్మను పంపించి భాషలు మాట్లాడే వరాన్ని ఇచ్చారు. పౌలు గారు అంటున్నారు- మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను, మరి విశేషముగా ప్రవచింపవలెనని కోరుచున్నాను. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు గ్రహింపడు గాని ఆత్మవలన మర్మములు మాట్లాడుచున్నాడు అని పౌలు గారు చెబుతున్నారు. అయితే మరో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు- భాషలకు అర్ధం చెప్పేవారు లేకపోతే సంఘంలో భాషలు మాట్లాడువారు మౌనంగా ఉండాలి అని వ్రాయబడి ఉంది. కాబట్టి భాషలకు అర్ధం చెప్పే వరం కోసం ప్రార్ధించాలి.
తర్వాత విభాగం వారు *ఉపకారాలు చేసేవారు*. మరల మనం మత్తయి 25:31కి వెళ్ళాలి. ఆపదలో ఉన్నవారికి, నిరుపేదలకి, దిక్కులేనివారికి సహాయం చేయాలి. ఇది దేవుడు మెచ్చే సేవ!! అదే నిజమైన భక్తి అని బైబిల్ సెలవిస్తుంది. యాకోబు 1:27; యెషయా 58
తర్వాత విభాగం *పరిచర్య చేసేవారు*. సంఘంలో ఇది ప్రాముఖ్యమైనది. దీనికి ట్రైనింగ్, చదువు అవసరం లేదు. చేయాలనే ఆశ, తగ్గింపు, commitment (స్తిరమైన ఒడంబడిక) ఉండాలి.
ఈరోజుల్లో కుర్చీల్లో కూర్చోడానికి చూస్తున్నారు గాని కుర్చీలు, చాపలు ఎత్తడానికి ఇష్టపడటం లేదు. ఆలయాన్ని తుడవటానికి, కడగటానికి ఎవరు సిద్దపడటం లేదు.
కారణం ప్రిస్టేజ్, ఇగో, అయితే వీటిని పక్కన పెట్టి ఎవరైతే ఈ పరిచర్యలు చేస్తారో దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదిస్తారు.
దానికి ఉదాహరణ నేనే! నా చిన్నతనములో ప్రతీరోజు ఆలయం తుడిచేవాడిని, ఆరాధనకు చాపలు వేయడం,తీయడం, ఎంగిలాకులు ఎత్తడం, నీరు మోయడం ఇవన్నీ చేసేవాడిని. ఇప్పుడు కూడా చేస్తాను. ఫలితం- ఆశ్చర్యంగా దేవుడు నన్ను ఆత్మీయంగా, ఆర్దికముగా దీవించారు. నీకు ఆశీర్వాదాలు కావాలంటే ఇలాంటివి చెయ్యాలి.
చివరగా *ప్రభుత్వాలు చేసేవారు*. అనగా సంఘంలో సంఘపెద్దగా సంఘంలో పనులు నిర్వహించే వారు. నిస్వార్ధముగా పనిచేసి సంఘాన్ని ముందుకు నడిపేవారు. అయితే ఈరోజుల్లో పదవులు, పేరు ఆశించేవారే తప్ప ప్రభువుకోసం పనిచేసే వారు తక్కువ. ఓ సంఘపెద్ద! నీవు అలా ఉంటే నేడే నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువు పరిచర్యకై పాటుపడమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నారు.
చివరగా రక్షింపబడిన విశ్వాసి అది ఎవరైనా సరే ఈ Tenfold Ministry లో ఏదో ఒక పని చెయ్యాలి. దేవుడు దీవించి ఆశీర్వదిస్తే ఒకటే కాకుండా నాలుగైదు విభాగాలలో భాగస్తులై ఉండాలి. అయితే వీటిలో ఏదీ చెయ్యడం లేదా, అలా అయితే నీవు నులివెచ్చగా ఉన్నావన్నమాట!!! అందుకే యేసయ్య నీవు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు కాబట్టి నానోట నుండి నిన్ను ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను అంటున్నారు. (ప్రకటన 3:15-16)
ఒకవేళ నీకు సువార్త ప్రకటించడం వీలు కాదా- అయితే వెళ్ళేవారిని పంపండి. మీ ప్రవర్తన ద్వారా సువార్త చెయ్యండి. మరీ ముఖ్యముగా భారముతో కన్నీటితో ప్రార్ధన చెయ్యాలి. అట్లు జరిగించిన నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇంకా తనసేవలో వాడుకొంటారు. లేదంటే విడువబడే గుంపులో ఉంటావు.
దయచేసి ఇప్పుడే నిన్ను నీవు సరిచేసుకో/సరిదిద్దుకో!
అయితే ఇప్పటికే కొన్ని వరాలు-ఫలాలు ఉన్నాయా? అయితే మరో మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయు.
అట్టి కృప ధన్యత మనందరికీ మెండుగా కలుగును గాక!
ఆమెన్! దైవాశీస్సులు!
*రోమా పత్రిక –108వ భాగం*
రోమా 12:9—10
9. మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి. .
ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితం ఏమిటో ఇక్కడ చక్కగా కనిపిస్తున్నది. ఇతర విశ్వాసులపట్ల ఎలాంటి ప్రేమగల జీవితం గడపాలి (వ 9,10,13,15,16), క్రీస్తు పట్ల ఎలా ఉండాలి (వ 11,12), శత్రువుల పట్ల (వ 14,19-21) ఎలా ప్రేమ చూపించాలి అనేదో ఆ జీవితం.
ప్రియులారా! ఈ 9వ వచనంలో మీ ప్రేమ నిష్కపటమైనది ఉండాలి, ఇంకా చెడ్డదానిని అసహ్యించుకోవాలి, మంచిదానిని హత్తుకోవాలి అనిచెబుతున్నారు. పౌలుగారి అన్ని పత్రికలలోనూ ఈ ప్రేమతత్వము స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. పౌలుగారి తర్వాత ఇలాంటి ప్రేమతత్త్వం యోహానుగారి రచనలలో కనిపిస్తాయి. పౌలుగారు ప్రేమకోసం ఎన్నో ఘనమైన మాటలు రాశారు. అంతేకాకుండా పాత నిబంధనలో దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించు అనే ఆజ్ఞలో మిళితమై ఉన్నాయి అనికూడా చెప్పారు. రోమా 13:9; గలతీ 5:14; ఇంకా 1కొరింథీ 1౩వ అధ్యాయం మొత్తం ప్రేమ కోసమే వ్రాయబడింది...1 Corinthians(మొదటి కొరింథీయులకు) 13:1,2,3,4,5,6,7,8,13
1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.
2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.
3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు(అనేక ప్రాచీన ప్రతులలో-అతిశయించు నమిత్తము అని పాఠాంతరము) నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.
4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;
5. అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
7. అన్ని టికి తాళుకొనును(లేక,అన్నిటిని కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
8. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;
13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.
ఇంకా 1&2 యోహాను పత్రికలు ప్రేమకోసమే వ్రాయబడినవి. *క్రీస్తు సామ్రాజ్యం కట్టబడింది ఈ ప్రేమ తత్త్వం మీదనే!*
సరే, ఇక్కడ పౌలుగారు మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను అంటున్నారు. అనగా కల్లాకపటం లేని ప్రేమ కలిగియుండాలి. ఇతరులను ప్రేమించినట్టు నటిస్తే ఏదో లాభం కలగవచ్చుననుకొనే అవకాశం ఉంది. మన ప్రేమ అలా ఉండకూడదు. అందరినీ సమానంగా ప్రేమించాలి.
ఇంకా మంచిదానిని హత్తుకొని చెడ్డదానిని అసహ్యించుకోవాలి అనికూడా చెబుతున్నారు.
"అసహ్యించుకోండి”– దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ఆయన్ను ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకమైన వాటన్నిటినీ అసహ్యించుకోవడం నేర్చుకుంటాం – కీర్తన 97:10.
యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలో నుండి ఆయన వారిని విడిపించును.
క్రీస్తు ప్రేమించిన రీతిగా మనం మనుషులను ప్రేమించాలి గానీ వారిలోని దుర్మార్గతను అసహ్యించుకోవాలి.
ఇంకా 10వ వచనంలో చెబుతున్నారు సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకనికంటే మరొకని గొప్పవానిగా ఎంచుకోవాలి అని హితవుపలుకుతున్నారు. మీద చెప్పినట్లు పౌలుగారు ప్రేమకోసం ఎన్నో చెప్పారు. సహోదర ప్రేమకోసం పేతురు గారు కూడా చెప్పారు 1పేతురు 1:21—22..
21. మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,
22. మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి. ... చూసారా!
ఎందుకు అలా చెప్పారంటే 23—24 లో ..
23. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
24. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. ..
కాబట్టి ఈ క్షయమైన శరీరం ఎంతోకాలం ఉండదు కాబట్టి ఎందుకు ఈ కక్షలు, ఎందుకు ఈ క్రోధములు? నీవు ఎవరినైతే ద్వేషిస్తున్నావో అతగాడు/ఆమె ఒకరోజు పైకిపోతుంది. నీవు కూడా ఒకరోజు చచ్చిపోతావు. ఇద్దరూ పోయేది మంటిలోకే! కాబట్టి ఇలాంటివి ఎందుకు? బ్రతికినన్నాళ్ళు ఇతరులతో ప్రేమతో కలిసిమెలిసి మెలగమని పేతురుగారు వివరంగా చెబుతున్నారు.
ఇంకా చెబుతూ ౩:8 లో కూడా ఇదే చెబుతున్నారు.
8. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. ....
నీవు పొరుగువానికి కీడుచేస్తున్నావ్ అంటే నీకు ప్రేమ లేదు. ప్రేమ పొరుగువానికి కీడుచేయదు అంటున్నారు రోమా 13:10
ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు ప్రేమకలిగి ఉన్నావా? యోహాను గారు చెబుతున్నారు కనబడే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? 1యోహాను 4:20; అలా ఎవరైనా తోటి సహోదరున్ని ప్రేమించకుండా నేను ప్రేమ కలిగియున్నాను అని చెబితే వాడు అబద్దికుడు అంటున్నారు. ప్రేమలేని వాడు దేవుణ్ణి చూడలేడు. ప్రేమ అనేకమైన దోషములు కప్పును అనికూడా సెలవిస్తున్నారు. సామెతలు 10:12; మరి నీకు ప్రేమ ఉందా? సహోదర ప్రేమ ఉందా? లోకంలో ఉండే శారీరక, కామాభిలాష కామాతురత, కలిగించే క్షణికమైన ప్రేమ గురుంచి చెప్పడం లేదు గాని కల్లాకపటం లేని దైవిక ప్రేమను అందరూ కలిగియుండాలి. అదేప్రేమ నీ ఇరుగుపొరుగు వారికి పంచాలి. నీకు కనబడే దరిద్రుడికి, భిక్షగాల్లకు, అనాధలకు, విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేనివారికి పంచాలి. ఇదే నిజమైన భక్తి అని యాకోబుగారు కూడా మొదటి అధ్యాయం చివరి వచనంలో చెబుతున్నారు.
మరి దేవుడు మెచ్చిన, దేవుడు ఇష్టపడే ఆ ప్రేమ, సహోదర ప్రేమను కలిగి యున్నావా ప్రియ సహోదరుడా/ సహోదరి! అది లేకపోతే నీవు మ్రోగెడుకంచు, గణగణలాడు తాళము అనికూడా చెబుతున్నారు పౌలుగారు. దేవుని ప్రేమ నీలో లేకపోతే నీవు విడువబడతావు జాగ్రత్త! కారణం ప్రేమ కలిగియుంటే దేవుని ఆజ్ఞలను పాటించినట్లే!
ప్రేమలేక పోతే నీ ప్రార్ధన, భాషలు, అధ్బుతాలు, ప్రసంగాలు, అన్నీ వ్యర్ధం!
ప్రేమను పొందుకో!
ప్రేమను పంచు!
పేరుకు తగ్గ జీవితం జీవించు!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక –109వ భాగం*
రోమా 12:11—12 …
11. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.
12. నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. .
ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితం ఏమిటో ఇక్కడ చక్కగా కనిపిస్తున్నది. ఇతర విశ్వాసుల పట్ల ఎలాంటి ప్రేమగల జీవితం గడపాలి (వ 9,10,13,15,16), క్రీస్తు పట్ల ఎలా ఉండాలి (వ 11,12), శత్రువుల పట్ల (వ 14,19-21) ఎలా ప్రేమ చూపించాలి అనేదే ఆ జీవితం.
ప్రియులారా! గతభాగంలో ప్రేమకోసం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరికొన్ని Essential Requirements , అవసరమైన గుణాలు చూసుకుందాం!
11వ వచనంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత కలిగి ఉండమంటున్నారు. దేనిమీద ఆసక్తి కలిగియుండాలి? దేవునిసువార్త మీద, ఆయన వాక్యము మీద, ఆయన కార్యాల మీద, ఆసక్తి కలిగి ఉండమని చెబుతున్నారు.
1 కొరింతు 15:58;1
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.
తీతు 2:14.
దేవుణ్ణి ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తే ఆయన సేవలో మనకు ఆసక్తి ఉంటుంది. నిజానికి ఆయనపట్ల మన ప్రేమ మన మాటల్లో గాక ఆయనకోసం మనం చేసేదానిలోనే వెల్లడి అవుతుంది. ప్రియ చదువరీ! దేవుని కార్యాల మీద సువార్త మీద నీకు ఆసక్తి ఉందా? గమనించండి యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని చెబుతుంది వాక్యం! యిర్మియా 48:10;
ఇక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండమని చెబుతున్నారు. అంటే దేవుణ్ణి నిజంగా బలంగా సేవించాలి అంటే ఆత్మపూర్ణులై ఉండాలి. ఎలా తీవ్రత కలిగి ఉండాలి. ప్రతీరోజు ఆయన ఆత్మతో నింపబడాలి. ఎప్పుడో ఆదివారం వర్షిప్ లోనే కాదు. లేక మ్యూజిక్ వస్తున్నప్పుడు ఊగిపోవడం కాదు, ఎల్లప్పుడూ సమయం దొరికినప్పుడెల్లా ఆయన ఆత్మతో, ఆత్మ తాకిడిని అనుభవిస్తూ గడపాలి. నీవు ఎప్పుడైతే ఆత్మలో ఆనందిస్తావో అప్పుడే ఆయన ఆత్మకార్యాలు, ఆత్మీయ వరాలు, ఫలాలు పొందుకుంటావు. భాషలవరమే కాదు, ప్రవచన వరం, వివేచనా వరం, అద్భుతాలు చేయగల శక్తి! అన్నీ పొందుకుంటావు! ఎప్పుడూ? అనుదినం ఆయన ఆత్మతో సందించబడు తున్నప్పుడే! అందుకే ఆత్మను ఆర్పకుడి! ప్రవచించుటను నిర్లక్షం చేయవద్దు అని చెబుతున్నారు దేవుడు! 1 థెస్స 5:19,20;
ప్రియ దైవజనమా! ఇక 12వ వచనంలో నిరీక్షణగలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై, ప్రార్ధనయందు పట్టుదల కలిగియుండుడి అంటున్నారు. ఈ వచనంలో ప్రతీ మాటలోనూ ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలున్నాయి.
వివరించాలి అంటే చాలా రోజులు పడుతుంది. గాని నేను ఈ రోమా పత్రిక తొందరగా ముగించాలి అని ఆశిస్తున్నాను. అందుకే చాలా చాలా క్లుప్తంగా చూసుకుందాం. మొదటగా నిరీక్షణ గలవారై యుండమని చెబుతున్నారు. ఈనిరీక్షణ కోసం ఈ పత్రిక ధ్యానంలోను, కొలస్సీ పత్రిక ధ్యానం లోను విస్తారంగా చూసుకున్నాం కనుక ఎక్కువగా మాట్లాడుకోవద్దు. నిరీక్షణ అనగా మన దగ్గర లేనిదానిని పొందుకుంటామని ఒకరకమైన ఆశ, ఎదురుచూపు. అయితే మనకో నిరీక్షణ ఉంది. దానిపేరు శుభప్రదమైన నిరీక్షణ. అది ఒకరోజు మనం బూరమ్రోగిన వెంటనే రూపాంతరం చెంది, ఎత్తబడి, మేఘముల మీద కొనిపోబడి, మన దేవాదిదేవుడిని కలుసుకోడానికి వెళ్తాం. ఆరోజు యేసుక్రీస్తు ప్రభులవారిని చూస్తాం! తండ్రియైనదేవున్ని చూస్తాం! అబ్రాహాము గారిని పలకరిస్తాం! హనోకు గారికి హాయ్ చెబుతాం! దానియేలు గారిని ఇంటర్యూ చేస్తాం సింహాల్ల నోళ్లను ఎలా మూయించారు అని! యోనా గారితో ముఖాముఖిగా మాట్లాడతాం చేప కడుపులో మూడురోజులు ఎలా ఉండగలిగారు అని! ఆది అపోస్తులను కలుస్తాం! రాజులైన యాజక సమూహముతో, జ్యేష్టుల సంఘానికి జరుగబోయే విందులో వారితోపాటు పాల్గొంటాం!. ఇక కన్నీరు, దుఃఖం ఉండవు! ఇదే ఆ శుభప్రదమైన నిరీక్షణ! ఆనిరీక్షణ నాకుంది! ప్రియ స్నేహితుడా! చెల్లీ! నీకుందా!!!??
ఇక శ్రమయందు ఓర్పు కలిగియుండాలి అంటున్నారు. పరిశుద్దాత్ముడు రాయించిన సంగతులు ఒకదానితో ఒకటి సంబంధం కలిగియుంటాయి. శ్రమయందు ఓర్పు అంటున్నారు. శ్రమలలో ఓర్పు లేకపోతే, నీవు కృంగిపోతే నీవు చేతకాని వాడవు అని సామెతల గ్రంధకర్త రాస్తున్నారు. 24:10; ఇవేకాదు బైబిల్ గ్రంధంలో ఇలాంటి inter-relation ఉన్నవి చాలా ఉన్నాయి. రోమా 5:౩.
అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను( శీలము) కలుగజేయునని యెరిగి.... చూసారా!!
పేతురు గారు కూడా రాశారు 2 పేతురు 1:5—7..
5. ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,
6. జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని,
7. భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను(ప్రేమను) అమర్చుకొనుడి. ...
ఎప్పుడైతే ఇవి ఉంటాయో 8--9
8. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును.
9. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును.
ప్రియులారా! ఈ ఒకదానితో నొకదానికి అవినాభావ సంబంధం ఉన్న వాటిని పొందుకుని అనుసరిస్తేనే నీ విశ్వాసపు పరుగులో జయజీవితాన్ని పొందుకోగలవు!
ఇక చివరగా ఈ వచనంలో ప్రార్ధనయందు పట్టుదల కలిగియుండుడి అంటున్నారు. ప్రార్ధనకోసం మా ఆధ్యాత్మిక సందేశాలు అన్నింటిలో, విస్తారంగా వ్రాయడం జరిగింది కాబట్టి మరోసారి గుర్తు చేయడం లేదు! ప్రార్ధన మనిషికి- బండిలో ఇందనం లాంటిది. ప్రార్ధన అనగా దేవునితో సంభాషించడం! దేవుని మనిషి దగ్గరకు తీసుకుని వచ్చే సాధనం ప్రార్ధన! ప్రార్ధన లేని జీవితం నూనెలేని దీపం లాంటిది. దిక్సూచి లేని ఓడలాంటిది. ప్రార్ధన మనిషిని దేవుని దగ్గరకు తీసుకుని వస్తుంది. మనిషిని బ్రతికిస్తుంది. ఓదార్పునిస్తుంది. మనస్సును తేలిక చేస్తుంది. నా బాదలు దేవుడువిన్నారు అనే భరోశా ఇస్తుంది. శ్రమనుండి విడుదల కలిగించడమే కాకుండా శ్రమలను జయించే శక్తి ప్రార్ధనలోనే కలుగుతుంది. అయితే ఆ ప్రార్ధన పెదాలతో చేసినది అయి ఉండకూడదు. హృదయపు లోతులనుండి నిజాయితీగా చేసే ప్రార్ధనై ఉండాలి. మోకాళ్ళు వేస్తే యాకోబుగారిలా , దానియేలు గారిలాగా జవాబును పొందుకునే ప్రార్ధనై ఉండాలి. దానినే పట్టుదల కలిగిన ప్రార్ధన అంటారు. అపోస్తలులు కార్యము 12లో పేతురుగారిని హేరోదు చంపుదామని చెరలో వేస్తే సంఘం నిద్రపోకుండా పట్టుదల గలిగి అత్యాశక్తితో ప్రార్ధన చేస్తే పరలోకం కదిలిపోయింది. పరలోకం దిగివచ్చింది. దేవుడే తనదూతను పంపించి విడుదల చేయాల్సి వచ్చింది. అది పట్టుదల గల ప్రార్ధన! ఇలాంటి ప్రార్ధనావీరులు బైబిల్లో అనేకమంది ఉన్నారు.
ప్రియ సహోదరీ! సహోదరుడా! అలాంటి పట్టుదల గల ప్రార్ధన నీకుందా? ఆ నిరీక్షణ ఉందా? ఆ ఆసక్తి ఉందా? లేకపోతే నేడే పొందుకో! ప్రభువుకి ఇష్టమైన వ్యక్తిగా మారిపో!
ఆమెన్!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక –110వ భాగం*
రోమా 12:1౩—14 …
13. పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.
14. మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు. .
ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ, లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితం ఏమిటో ఇక్కడ చక్కగా కనిపిస్తున్నది. ఇతర విశ్వాసులపట్ల ఎలాంటి ప్రేమగల జీవితం గడపాలి (వ 9,10,13,15,16), క్రీస్తు పట్ల ఎలా ఉండాలి (వ 11,12), శత్రువుల పట్ల (వ 14,19-21) ఎలా ప్రేమ చూపించాలి అనేదో ఆ జీవితం.
ఇక 13వ వచనంలో పరిశుద్దుల అవుసరములలో పాలుపొందుచూ అంటున్నారు... పౌలుగారు ఈ విషయాన్ని తను ఎక్కడెక్కడ సేవ చేశారో అందరికి నేర్పించారు. పరిశుద్దుల అవసరాలలో పాలుపుచ్చుకోవడం అంటే సేవ చేస్తున్న సేవకులకు ఆర్ధికంగా సహాయం చేయడం, దేవుని నామం కోసం హింస పడుతున్న సంఘం యొక్క అవసరాలు తీర్చడం. వారిని వస్తురూపంగా, ఆర్ధికంగా ఆదుకోవడం! పౌలుగారు ఇలా అందరికీ నేర్పించిన అవసరం ఏమిటంటే: అది అపోస్తలులు ఇంకా ఆదిమ సంఘకాలంలో భయంకరమైన శ్రమలు విస్తరించాయి. ఇలాంటి సమయంలో సంఘం చెదిరిపోయింది. అపోస్తలుల కార్యములు ప్రకారం చెదిరిపోయిన సంఘం నిద్రపోకుండా భయపడకుండా ఎక్కడైతే చెదిరిపోయారో ఆ ప్రాంతాలలో దేవుని సేవ చేసారు. అయితే మరి యూదయలో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సంఘం పరిస్తితి ఏమిటి? అందుకే వారికి దన్నుగా నాటి సార్వత్రిక సంఘం ఆర్ధికంగా సహాయం చేసింది/ వారు ఎక్కడికి చెదిరిపోయారో అక్కడనుండి సంఘానికి సహాయం చేశారు. కారణం అక్కడినుండే సంఘం కట్టబడింది కాబట్టి వీరు వారికి ఋణస్తులు అంటున్నారు పౌలుగారు. 2కొరింథీ 8:౩;2
3. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు,
4. వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. 9:1,12
1. పరిశుద్ధుల కొరకైన యీ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకగత్యములేదు.
12. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఫిలిప్పీ 4:16
ఏలయనగా థెస్సలొనీకలో కూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి.
ఇక శ్రద్ధగా ఆతిధ్యమివ్వ మంటున్నారు. భక్తుడైన ఫిలేమాను గారి గురించి సర్టిఫికేట్ ఇస్తున్నారు పౌలుగారు: పరిశుద్దుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందాయి కారణం నీవిచ్చిన ఆతిధ్యం! 1:7; పౌలుగారు తిమోతిగారికి చార్జి అప్పగిస్తున్నప్పుడు రాస్తున్నారు 1తిమోతి 5:10 లో విధవరాళ్ళు పరదేశులకు ఆతిధ్యమివ్వాలి, పరిశుద్దులకు పరిచర్యచేయాలి. అందుకే అంటున్నారు ఆతిధ్యం చేయ మరువవద్దు. హెబ్రీ 13:2..
ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.
పేతురుగారు కూడా చెబుతున్నారు 1పేతురు 4:9...
సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.
కాబట్టి ప్రియ చదువరీ! నీవు ఆతిథ్యము చేస్తున్నావా లేక తలుపులు మూసివేసి కుంటున్నావా?
ప్రేమ మన ప్రవర్తనలో వెల్లడి కావాలి. కొన్ని సార్లు దానిమూలంగా మనం నష్టం కూడా భరించాలి – 1 యోహాను 3:16-18; మత్తయి 25:34-40.
ఇంకా "సహాయపడుతూ”– “ఇవ్వడం” గురించి 2 కొరింతు 9:15చూడండి.
ఇంకా 14వ వచనంలో మిమ్మును హింసించు వారిని దీవించుడి , దీవించుడి గాని ఎట్టి పరిస్తితిలో కూడా శపించవద్దు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభులవారు చెప్పిన ప్రేమతత్వమే పౌలుగారు విని, నేర్చుకుని దానిని వివరంగా చెబుతున్నారు. మత్తయి 5వ అధ్యాయంలో గల అతి ప్రాముఖ్యమైన విశిష్టమైన కొండమీది ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభులవారు ఆ ప్రేమామయుడు ఏమని చెప్పారు అంటే మత్తయి సువార్త 5:10,11,12
10. నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
12. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ..... చూసారా! మీరు ధన్యులు అన్నారు. శ్రమలు శోధనలు, భరించమన్నారు గాని తిరుగబడండి కోర్టులకు వెళ్ళండి. స్ట్రైక్ చెయ్యండి. సంఘాలు/ యూనియన్లు ఏర్పాటు చేసి ప్రొటెస్ట్ చెయ్యమని చెప్పలేదు. ఒక చెంపమీద కొడితే రెండవచెంప చూపమని చెప్పారు. లూకా 6:29; ఒక గ్రామంలో/ పట్టణంలో హింసిస్తే వేరే పట్టణం/ గ్రామానికి పారిపోమన్నారు గాని తిరుగబడమని చెప్పలేదు. శ్రమలను సహించమని చెప్పారు,. మిమ్మును హింసించేవారిని దీవించండి గాని శపించవద్దు అని ఖరాఖండిగా యేసయ్య చెబితే నేటి అతి భక్తులు, అతి విజ్ఞాన క్రైస్తవులు క్రిస్టియన్ ఫోరంలు పెట్టి, ప్రొటెస్ట్ చేసి సాధించుకుందాం అని ప్రయత్నాలు చేస్తూ సంఘం వ్యాపించకుండా అడ్డుపడుతున్నారు. కారణం Where there is Persecution, there is rapid development of the Church. ఎక్కడైతే హింసలు ఉన్నాయో అక్కడ సంఘం అతి విస్తారంగా వ్యాపించడం జరిగింది. ఆ హింసలను ఇప్పుడున్న మోడరన్ క్రైస్తవులు, సేవకులు – లగ్జరీలకు, సుఖాలకు అలవాటు పడి హింసలను తిరస్కరిస్తున్నారు. ఆదిమ సంఘాలు శ్రమలు, హింసలలో సంతోషించి స్వాగతించారు కాబట్టి ఈ సువార్త మన భారతదేశం రాగలిగింది. ఆదిమ సంఘం కూడా సుఖాలు- లగ్జరీల కోసం చూసి ఉంటే నేడు మనం రక్షించబడి ఉండకపోదుము!
ప్రియస్నేహితుడా! శ్రమలను, హింసలను ఆహ్వానిస్తున్నావా? లేక వద్దు అని ప్రొటెస్ట్ చేస్తున్నావా?
మిమ్మల్ని హింసించే వారిని దీవిస్తున్నావా? లేక శపిస్తున్నావా?
యేసయ్యా! వాడు సంఘాన్ని హింసిస్తున్నాడు. వాడిని లేపేయ్!
వాడి కాళ్ళు పడిపోవాలి!
దేవా! నన్ను ఎన్నో మాటలు అన్నాడు ప్రభువా! వాడు వెళ్తుంటే వాడి బండి యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు విరిగిపోవాలి లేదా చచ్చిపోవాలి!
ఇలాంటి పనికిమాలిన, ప్రతీకార ప్రార్ధనలు చేస్తున్నావా? అయితే దేవుడు ఇలాంటి ప్రార్ధనలు వినరు అని గుర్తుంచుకో! ఇన్ని హింసలు పెడుతున్న వారికోసం-ఆ ప్రేమామయుడు- కరుణామయుడు : *తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము* అని క్షమాభిక్ష పెట్టారు!
ఆయనే మన రోల్ మోడల్!
ఆయనే మన ఆదర్శం!
యేసుక్రీస్తు ప్రభులవారు ఎవరిని అనగా ఆయనను హింసించే వారిని క్షమించుము అన్నారు గాని అంజూరపుచెట్టును శపించినట్లు శపించలేదు. ఆ ప్రేమ, ఆ క్షమాపణ, ఆ ఓర్పు నీకుందా సహోదరీ/సహోదరుడా!
లేకపోతే పరలోకం పోలేవుసుమీ!
నేడే ఆ ప్రేమ జాలి కరుణ, క్షమాపణ అలవరచుకొని దైవరాజ్యవారసుడివి కా!
దైవాశీస్సులు!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి