ఆధ్యాత్మిక సందేశాలు-2-కొన్ని కీర్తనల ధ్యానం- part-4

ఆధ్యాత్మిక సందేశాలు-2-కొన్ని కీర్తనల ధ్యానం


                                                       42 వ కీర్తనా ధ్యానము
                                             (మొదటి భాగము)
దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
          కీర్తనలు 42:1
      ..........................

దుప్పి తన దప్పిక తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్నం ఎట్లాంటిది అంటే?
తన ప్రాణముణే ఫణముగాపెట్టి, ప్రాణమును రక్షించుకోవడం వంటిది.

ఎండమావులే నీటి మడుగులుగా భ్రమించి, ఆశతో అంతులేని వేగముతో సాగిపోతున్న దుప్పికి ఎంత దూరం ప్రయాణించినా, దాని ఆశలు అడియాశలే.

కాని నీటి మడుగును చేరేవరకు దాని ఆశ చావదు. తన పయనం ఆగదు.

 నీటి మడుగు కోసం తాను చేసే ప్రయాణంలో ఎన్నో ఆపదలు.
పొదల చాటున పొంచివుండే పులులు, సింహాలు.
  అయినా వేటిని లెక్కచెయ్యకుండా సాగిపోతుంది గమ్యం చేరేవరకు. ఆ నీటి మడుగును చేరగానే, తాను చేసిన ప్రయాణం, అలసట ఏమి గుర్తుండదు. ఆనందంతో కేరింతలు కొడుతుంది.

దాని ఆశ దాని గమ్యం చేర్చుతుంది.
మరి నీ ఆశ ఏమిటి?
నీ గమ్యమేమిటి?

శారీరాశా?
నేత్రాశా?
జీవపు డంబమా?
దాని కోసమేనా నీ పోరాటం?
అయితే, గమ్యం భయంకరం.

కాని, ఈ కీర్తనా రచయితలు అయిన కోరహు కుమారుల ఆశ మాత్రం
"
యేసయ్య నిన్ను చేరాలన్నది మా ఆశ."
ఎందుకు?
కృంగిన జీవితాలకు ఆదరణ,
నలిగిన వారికి ఓదార్పు,
బహీనులకు బలం,
ఆపదలో ఉన్నవారికి విడుదల.
ఆయన చెంతే సాధ్యం.

జీవిత పరుగు పందెములో అలసిపోయావా?
ఆయన చెంత చేరు.
నీ కన్నీటిని ఆయన ప్రేమతో తుడుస్తాడు.

ఈమాట చెప్పగలవా?
"
యేసయ్యా నిన్ను చేరాలన్నదే నా ఆశ"
చెప్పగలిగితే ఆయనే నీకు ఎదురొస్తాడు.
నిన్నెత్తుకుంటాడు. ఎప్పటివరకు? ముదిమి వరకు.

కాని ఆయన్ని చేరే మార్గంలో కొన్ని ఇబ్బందికర పరిస్తితులు వుంటాయి.
క్రూర మృగం(సాతాను) పొంచివుంటుంది.
భయపడకు సాగిపో.
ఆయన చెంత చేరు వరకు.

అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!

42 కీర్తనా ధ్యానము
(రెండవ భాగము)

నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?
               కీర్తనలు 42:2
      ..................................
మన తృష్ణ ఏమిటి?
" తృష్ణ" అంటే మామూలు "కోరిక" కాదు. కోరిక కంటే వెయ్యి రెట్లు అధికమయినది.
మన తృష్ణ!  సంపదలు, అధికారం, పేరు ప్రతిష్టలు కోసమేనా?
కేవలం ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసమేనా?
కాదు. ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుని కోసమే అయ్యుండాలి.

ఆశీర్వాదాలకు కర్త మనతో వుంటే, ఇక ఆశీర్వాదాలతో పనేముంది?

దేవుళ్ళు అని చెప్పుకొనే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కాని "జీవముగల దేవుడు" ఒక్కడే.
ఆయన పైనే  తృష్ణ కలిగి వుండాలి.
నీ దాహం తీరాలంటే ఆయన చెంతే.
ఆయనే ఒక "సజీవ జీవజల నది"
 ( అది ఎల్లప్పుడు ప్రవహించేది)

ఎడారిలో సహితం 30 లక్షల మంది దాహార్తిని తీర్చగలిగింది జీవజల నది.

దావీదు అంటున్నాడు
"ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశ పడుచున్నది."
               కీర్తనలు 143:6

నీజీవితం ఎడారిలా మారి, ఒక్క నీటిబొట్టు కనిపించని స్తితిలో, ఎండిపోయిన భూమివలె నీవుంటే, ఆయన ఎడారిలో ఒక నదిలా ప్రత్యక్షమవుతాడు. ఎండిన భూమి వంటి నీ జీవితానికి నీరుకట్టి ఫలవంతం చేస్తాడు.
ఎప్పుడు?
ఆయన కొరకు నీవు తృష్ణ కలిగివున్నప్పుడు.

దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా? అని వారి ప్రాణం తహతహ లాడుతుందట.
కాని మనమంటాము. దేవుడు ఇంట్లో లేడా? అని. వున్నాడు. మరెందుకు దేవుని సన్నిధికి?
* అక్కడ దేవుడు వున్నాడు.
* దేవుని బిడ్డల సహవాసం వుంది.
* దేవుని వాక్యం ప్రకటించే          సేవకులున్నారు.

సహవాసం తప్పనిసరి.
నీవు ఒక్కడివే మండితే కొంతసమయానికి ఆరిపోతావు. అదే సహవాసంలో వుంటే, ఒకవేళ
నీవు ఆరిపోతున్నా, నీప్రక్కన వున్న కట్టెలు (విశ్వాసులు )నిన్ను మండిస్తాయి. తిరిగి మండడం ప్రారంభిస్తావు.

దేవునిని గాని, దేవుని సన్నిధినిగాని
నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే, అగ్నితో ఆటలాడుతున్నట్లే ! అది నీకు క్షేమం కాదు.

సరిచేసుకుందాం!
సాగిపోదాం!

జీవజల బుగ్గ అయిన యేసయ్య కొరకు తృష్ణ కలిగియుందాం!
ఆయన సన్నిధిని చేరి ఆరాధిద్దాం!

అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!

42 వ కీర్తనా ధ్యానము
(మూడవ భాగము)

"నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను."
                   కీర్తనలు 42:3
         ...........................

హృదయం కృంగిన సమయంలో,
ఏమార్గము కానరాని పరిస్తితుల్లో, 
*ఆర్ధిక ఇబ్బందులు 
*శారీరిక ఇబ్బందులు
*కుటుంబంలో సమాధానం లేని స్టితి
*మానసిక ఒత్తిడి .... 
ఇట్లా ఒకదాని వెంబడి మరొకటి వేధిస్తున్న సమయంలో .......

ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితుల్లో.....
ఓదార్చేవారు లేరు.
ఆదరించేవారు అంతకన్నాలేరు.


క్రుంగిపోయినా, ఆయన పైనే ఆశతో సాగిపోతున్న తరుణంలో.....
ఒక ప్రక్క లోకం 
*నీప్రార్ధన ఏమయ్యింది?
*నీ విశ్వాసం ఏమయ్యింది?
* నీ దేవుడు ఏమయ్యాడు? అంటూ అనేక ప్రశ్నలు సంధిస్తూ ....


*నీ ప్రార్ధన సరయినది కాదని ఒకరు.
*నీ దేవుడు సమర్ధుడు కాదని మరొకరు.

ఇట్లా... లోకం దాడి తట్టుకోలేక, ఏది వాస్తవమో తేల్చుకోలేక హృదయం మరింత క్రుంగిపోతుంది.


కోరహు కుమారులు లోకస్టుల దాడి తట్టుకోలేక, వారి కన్నీళ్ళే వారికి ఆహారం, పానముగా మారాయట. 

ఇట్లాంటి అనుభవాలు నీజీవితంలో ఎదురయితే క్రుంగిపొవలసిన పనిలేదు. నీ ప్రియ రక్షకుడు అయిన యేసయ్య సహితం, గేళిచేయబడ్డాడు.
నీకంటే ముందుగానే ఇవన్ని ఆయన అనుభవించాడు. 


నీవు యేసయ్యను చేరాలని ఆశగలిగి, అటువైపు ప్రయాణం చేస్తున్న సమయంలో ఒకవైపు సాతాను, మరొకవైపు లోకం నీపైన దాడి చెయ్యడం సహజం.


క్రుంగిపోవద్దు!
కళ్ళల్లో కన్నీరెందుకు ?
గుండెల్లో దిగులెందుకు?
నీవు కలత చెందకు. 
నెమ్మది లేకున్నదా?
గుండెల్లో గాయమయినదా?
ఇక వుండబోదుగ.
యేసే నీ రక్షణ
యేసే నీ నిరీక్షణ 


నీరసించిపొకు, నిరీక్షించు.
మారా( చేదు) వంటి నీజీవితాన్ని
మధురముగా మార్చుతాడు. 
మారని నీ దేవుడు. 

అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                      42 వ కీర్తనా ధ్యానము 
                                         (నాలుగవ భాగము)
జనసమూహముతో పండుగచేయుచున్న సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.      కీర్తనలు 42:4
గతకాల స్మృతులు కొందరిని 
ఆనందంలో ముంచెత్తితే,
కొందరిని విషాదంలో పడేస్తాయ్.

ఈ కీర్తనా రచయితలైన కోరహు కుమారుల గతకాల జ్ఞాపకాలు వారి కృంగిన జీవితాలను మరింత కృంగదీస్తున్నాయ్.
గతకాలంలో....
*
దేవుని మందిరానికి వెళ్ళారు. 
*
వాళ్ళే కాదు. వారితో పాటు అనేకమందిని దేవుని సన్నిధికి నడిపించారు.
*
దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతీసారి వారి ఆనందం పండుగను తలపించేది. 
*
దేవుని సన్నిధిలో అద్భుతంగా పాడి,సంతోషంతోఆయనను స్తుతించేవారు.

కాని ఇప్పుడయితే,
*
దేవుని సన్నిధి దూరమయ్యింది. 
 
దానికోసం  ఆరాటపడుతున్నారు.
*
వాళ్ళు దేవుని సన్నిధికి నడిపించినవారే వాళ్ళపై తిరగబడిన పరిస్టితులు.
అప్పుడయితే దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతీసారి పండుగే. కాని ఇప్పుడయితే
 "
పండుగే     పండుగగాలేదు."
*
హృదయమంతా వేదనే. ఇంకెక్కడి పాటలు.

మన పరిస్టితి ఏమిటి? 
మన జీవితాలు ఆధ్యాత్మికంగా నానాటికి దిగజారుతున్నాయా? 
*
ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే ఆశక్తి. మరిప్పుడు? 
*
ఒకప్పుడు క్రమం తప్పని వాక్య ధ్యానం, ప్రార్ధన.మరిప్పుడు?
*
మనం దేనికి బానిస అయ్యామో, అవి దేవునినుండి దూరంచేస్తున్నాయి 
అని తెలిసినా ,మన మనఃసాక్షిని పీక నులిమి చంపేసి మనం బ్రతుకుతున్నమా? 

దేవునిని గురించి, దేవుని సన్నిధిని గురించి వారికున్న ఆశ, తాపత్రయం చూడండి. 
అట్టి ఆశను కలిగివుందాం!

కోల్పోయిన ఆస్టితిని పొందడానికి ప్రయత్నం చేద్దాం!
తిరిగి ఆయన సన్నిధిలో, ఆయనతో కలసి నిజముగా ఆనందించే అనుభవంలోనికి ప్రవేశిద్దాం!
అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                                                  42 వ కీర్తనా ధ్యానము
(ఐదవ భాగము)
నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.
            కీర్తనలు 42:5
   .........................................

"నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? .......దేవునియందు నిరీక్షణ యుంచుము"

ఈమాటలు 
*ఎవరు చెప్పగలరు?
ఒక విశ్వాసి చెప్పగలడు.

*ఎప్పుడు చెప్పగలరు?  
విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే.


* విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయి ఏమిటి?
ఈ ప్రపంచంలో నేను, దేవుడు ఇద్దరం మాత్రమే ఉన్నాము. ఇంకెవ్వరులేరు అనుకున్నప్పుడు, పూర్తిగా ఆయనపైనే ఆధారపడే స్టితి.


అందుకే కీర్తనాకారుడు ఇట్లా చెప్పగలుగుతున్నాడు. తన బాధలు చెప్పుకోవడానికి ఇంకెవ్వరూ కనిపించలేదు. అందుకే తనే తన ప్రాణంతో చెప్పుకొంటున్నాడు. 


*ఒంటరితనమా?
*సమస్యల సుడిగుండమా?
*చెలరేగే తుఫానా?
*ఆప్తులంతా దూరమైన పరిస్టితా?
*ఆధ్యాత్మిక, ఆర్ధిక, ఆరోగ్య, కుటుంబ, మానసిక 
సమస్యలా?
*శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములా? 
సమాధానం లేదనుకొంటున్న ప్రశ్నలా?
పరిష్కారం లేదనుకొంటున్న సమస్యలా? 
*గమ్యం తెలియని పయనమా? 


అయితే, నీ ప్రతీ పరిస్టితికి పరిష్కారం. 
1. నీలో నీవు తొందర పడొద్దు.
   బస్సులో ప్రయాణం చేస్తున్న నీవు ప్రమాదం ముందుందని నీలోనీవు కంగారుపడితే ఏమి ప్రయోజనం? ఆ బస్సు నడిపేది నీవు కాదుకదా? బస్సు....డ్రైవర్ చేతిలో వుంది.
    అట్లానే, నీ సమస్యల్లో నీవు కంగారు పడినా ఏమి ప్రయోజనం? నీ జీవితం యేసయ్య చేతిలో వున్నప్పుడు. ఆయనే ప్రతీ పరిస్టితి గుండా నడిపిస్తూ గమ్యం చేర్చుతాడు. 


2.దేవుని యందు నిరీక్షించు:
ఇప్పటికే ఒక నిర్ణయానికి  వచ్చేసావేమో? 
ఇక ఇది నా జీవితంలో సాధ్యం కాదని. 
నీకు కాకపోవచ్చు. కాని, నీ దేవునికి సమస్తము సాధ్యమే. 


అబ్రహాము "నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను."        రోమా 4:18            
( ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు.)
నీవు నిరీక్షించగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు. 


3.శ్రమలలో దేవుని స్తుతించు:
నీ సమస్యలు ఎంత ఎక్కువగా వుంటే అంత ఎక్కువగా దేవుని స్తుతించు. 
ఆ స్తుతుల మధ్య సాతాను నిలువలేక పారిపోతాడు. సమస్యల సృష్టికర్త సాతాను పారిపోతుంటే, నీ సమస్యలన్నీ వాడి వెంటే పరుగులు తీస్తాయి. 
ఇక శాంతి, సమాధానమే నీ దగ్గర మిగులుతుంది. 


ప్రయత్నించి చూడు!
విజయం నీదే! 


అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 



42 వ కీర్తనా ధ్యానము
(ఆరవ భాగము)
నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది కావున యొర్దాను ప్రదేశమునుండియు హెర్మోను పర్వతమునుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను.       కీర్తనలు 42:6

1. యొర్దాను నది 
2. హెర్మోను పర్వతము
3. మిసారు కొండ

ఈలోక యాత్రలో,    మన జీవిత పయనంలో, 
ఎప్పుడో ఒకప్పుడు ఈ అనుభవాలు తప్పకుండా తారస పడతాయి. 

1. యొర్దాను నది:
లేబానోనులో పుట్టి మృతసముద్రంలో కలుస్తుంది. యోర్దాను మరణమునకు సాదృశ్యము.
   కొన్ని సందర్భాలలో ఈ సమస్యల నుండి విడుదల పొందలేము. ఇక మరణమే శరణ్యం అనే పరిస్తితులలో హృదయం కృంగిపోయిన స్టితి.

2. హెర్మోను పర్వతము: హెర్మొనుయొక్క "మంచు "  ఆ తెలుపు పరిశుద్దతకు, ప్రశాంతతకు సాద్రుశ్యముగా ఉన్నప్పటికీ, అక్కడ శీతోష్ణ పరిస్టితులు జీవనానికి ఏమాత్రం అనుకూలించవు.
   ఈ లోకంలో ప్రత్యేకముగా, పరిశుద్దముగా  జీవించడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో, మనకు అనుకూలించని పరిస్టితులు పర్వతములా అడ్డుపడిన సందర్భాలు కోకొల్లలు. అటువంటి పరిస్తితులలో హృదయం కృంగిన స్టితి.

3. మిసారు కొండ:
"మిసారు" అనగా "చిన్నది" అని అర్ధం. ఇది చిన్నదే కావొచ్చు. కాని ఇది సృష్టించే గందరగోళం చాలా పెద్దది. 
  అబ్షాలోము తన తండ్రి "రాజైన దావీదును" చంపడానికి తరుముతున్న సమయంలో దావీదు తప్పించుకొని పారిపోయిన కొండ ఇది. 
మన కుటుంబస్తులే మన మీద తిరుగబడి, మన మీద కాలుదువ్వుతున్న సందర్భములో హృదయం కృంగిన స్టితి.

ఏ స్తితిలో నీ హృదయం క్రుంగిపోయిందో?
ఆ పరిస్తితితో సంబందం లేకుండా నిన్ను విడిపించగల సమర్ధుడు నీ దేవుడు. 

అయితే నీవు చెయ్య చెయ్యవలసింది ఒక్కటే. నీ సమస్యలలో ఆయనను జ్ఞాపకం చేసుకోవడం. 
ప్రార్ధించు! 
ప్రతిఫలాన్ని అనుభవించు!
అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

42 వ కీర్తనా ధ్యానము
( ఏడవ భాగము)
"నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి."        కీర్తనలు 42:7

కరడు అంటే "అల"
ఒక అల, మరొక అలను పిలిచి, ఆ అల ఇంకొక అలను పిలచి ..... ఇట్లా ఇవన్ని కలసి ఒక పెద్దతరంగమై లేస్తే? ఇక దాని దాడికి ఎవరు నిలువగలరు? అవసరమయితే సునామిగా మారి భూమినే జలసమాధి చెయ్యగలవు.

మన జీవిత యాత్రలోకుడా ఇది సర్వ సాధారణం. ఒక సమస్య మరొక సమస్యను పిలచినట్లుగా ఈ సమస్యలన్నీ ఒక సుడిగుండమై మనలను ఊపిరాడకుండా చేసే పరిస్తితులు అనేకం.
అయినప్పటికీ, 

"నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు."         యెషయా 43:2

జలములు చూచి భయపడి ఆగిపోతే అప్పుడు దేవుడు నీకు తోడుగా వుండడు.
ఆ జలములలో అడుగుపెట్టాలి. ముందుకు నడవాలి. అప్పుడు ఆయన తోడుగా ఉంటాడు. 
ఆ జలాలు నీమీద పోర్లిపారకుండా అడ్డగిస్తాడు. 
(నీరు "పరిశుద్దాత్మకు" సాదృశ్యము. కాని ఇక్కడ జలములు "శోధనలు, శ్రమలకు" సాదృశ్యముగ వున్నవి)

సమస్య రాకముందే దేవుడు దానిని రాకుండా ఆపివేయవచ్చు కదా! అని   అనుకోవద్దు. అట్లా చేస్తే "దేవుని తోడు "ఎట్లా వుంటుందో నీకేమి తెలుస్తుంది? 
నీవు ఒక సమస్యగుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క తోడ్పాటును, ఆయన కృపను అనుభవించ గలవు.

సమస్యలన్నీ సుడిగుండమై నిన్ను చుట్టినను, అవి నీ మీద పొర్లిపారినను వాటన్నిటి నుండి  తప్పించగల సమర్ధుడు నీ దేవుడు. 

అగ్ని గుండములోనుండి ఆ యువకులను తప్పించగలిగిన దేవుడు, 
సమస్యల సుడిగుండంలో నుండి నిన్నునూ తప్పించగలడు. 
విశ్వసించు!
విజయం నీదే! 

అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
42 వ కీర్తనా ధ్యానము
(ఎనిమిదవ భాగము)
అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.     కీర్తనలు 42:8
ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో తిరిగినా, వారి చెప్పులు అరిగిపోలేదు. వారి వస్త్రాలు చినిగిపోలేదట. 
అంటే, వారు ధరించిన చెప్పులుగాని, వస్త్రాలుగాని అంత శ్రేష్టమైనవా? 
కానే కాదు. 
అంత శ్రేష్టమైన వస్తువులు వాళ్లకి వుండే అవకాశంలేదు. ఎందుకంటే గతించిన 430 సంవత్సరాలనుండి వారి తరాలన్నీ బానిస బ్రతుకులే. 
మరి వారికి అది ఎట్లా సాధ్యం అయ్యింది? 
" అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగల దేవుడు వారికి తోడుగా వున్నాడు."
తన బిడ్డలపట్ల ఆయన అంత శ్రద్ధ తీసుకుంటాడు. అది ఎట్లా వుంటుంది అంటే మన ఊహలకు అందనంతగా వుంటుంది. 
ఆ అరణ్యంలో మండుటెండలో వారికోసం గొడుగులు, రాత్రివేళ వెలుగు కోసం దీపాలను సిద్దపరిస్తే వారు వాటిని మోయడం కష్టం అనుకున్నాడెమో ఆయన. 
అందుకే, పగటివేళ మేఘ స్తంభాన్ని, రాత్రివేళ అగ్ని స్తంభాన్ని సిద్దం చేసాడు.

ఎందుకోసం ఆయనకు మన మీద అంత శ్రద్ధ?
మనము పరిశుద్దులమనా?
నీతిమంతులమనా?
కానే కాదు.
ఎందుకంటే ఆయన మన "జీవదాత"
మనకు జీవమును  దానముగా ఇచ్చినది ఆయనే. 
మనకోసం తన ప్రాణం ఇచ్చింది కూడా  ఆయనే. 
మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.
 అపొ.. కార్యములు 3:15

నీ జీవదాత నేటికి జీవించే వున్నాడు. ఇక తరతరములు జీవించే ఉంటాడు.
నీవు పాడే కీర్తన, నీవు చేసే ప్రార్ధన 
ఆ జీవదాత నీకు తోడుగా ఉండేటట్లు చేస్తాయి.
ఆయనే జీవన దాత!
ఆయనే ముక్తి దాత!
ఆయనే శక్తి ప్రదాత!
నీలో నీవు క్రుంగిపోవద్దు!నిరీక్షణతో సాగిపో! 
అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
42 వ కీర్తనా ధ్యానము
( తొమ్మిదవ భాగము)
"నీవేల నన్ను మరచి యున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను."      కీర్తనలు 42:9

ఈలోక జీవన యాత్రలో అనేకమైన సమస్యలు మనకు శత్రువులుగామారి, సమాధానం లేకుండా చేసినప్పుడు మన హృదయంలో పుట్టే మొట్టమొదటి తలంపు ఇదే. 
"నీవేల నన్ను మరచి యున్నావు? అని.

కాని ఒక్క విషయం, ఆయనే మనలను మరచిపోతే, అసలు ఆ మాట అనడానికి కూడా మనము బ్రతికి ఉంటామా? 
ఆయన నిన్ను మరువడు. తల్లి తన బిడ్డలను ఎట్టిపరిస్తితులలోను మరచిపోయే అవకాశం లేదు. ఒకవేళ అట్లా జరిగినా జరగవచ్చేమోగాని, ఆయన మాత్రం నిన్ను మరువడు. 

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.       యెషయ 49:15
ఒకవేళ నీవు ఆయనను మరచిపోయినా గాని, ఆయన నిన్ను మరచేవాడు కాడు. నీవు హాయిగా నిద్రపోతున్నా, ఆయన మాత్రం మేల్కొని నిన్ను కావలి కాస్తున్నాడు. 

ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు.     కీర్తనలు 121:4

శోధనలు నిన్ను చుట్టిముట్టి నప్పుడు "ఆశ్రయదుర్గమైన" నీ దేవుని ప్రార్ధించు.

"దుర్గము" అంటే  శిల, రాయి,
 కొండ, బండ 
పాత నిబంధనలో 30 సార్లు దేవునిని బండతో పోల్చడం జరిగింది. 
నూతన నిబంధనలో కూడా యేసయ్య బండతో పోల్చబడ్డారు ( 1 కొరింది 10:4)

"బండ" బలం, ఆశ్రయం, మార్పులేని గుణం, స్థిరత్వం మొదలగు మొదలగు వాటికి సాద్రుశ్యముగా వుంది. 

ఆయన ఆశ్రయ దుర్గము     కీర్తనలు 94:22
ఆయన రక్షణ దుర్గము     కీర్తనలు 95:1
నీ సమస్యలలో ఆయనను ఆశ్రయించ గలిగితే (ప్రార్ధించగలిగితే), వాటినుండి రక్షించబడతావు. 
శాంతి, సమాధానం నీ స్వంతమవుతుంది.

అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                           42 వ కీర్తనా ధ్యానము 
                                            ( పదియవ  భాగము)
నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచు చున్నారు.     కీర్తనలు 42:10
జీవిత నావ ప్రశాంతముగా ఏ అలజడి లేకుండా సాగిపోతున్న సమయంలో ..... ఏదో ఒక క్షణమున చిన్నగా తుఫాను ప్రారంభమై గొప్ప విద్వంసం సృష్టిస్తుంది.

*
తెరచాప   చినిగిపోయి ఆ నావను ఎటువైపు తీసుకెల్తుందో అర్ధంకాని పరిస్తితి.
*
చుక్కాని ఆ తుఫాను దాడికి తట్టుకోలేక విరిగిపోయే పరిస్తితులు. 
*
అంతవరకు ఆ నావ బరువును మోసిన ఆ నీరే కెరటాలుగా లేచి ఆ నావను బ్రద్దలగోట్టే పరిస్తితి. 
*
మరొక వైపు చీకటి పడుతూ అద్దరి కానరాని పరిస్తితులు. 
ఎటుపోతుందో ఈ నావ?
దీని గమ్యం ఎక్కడికో? 

*
అవును! శోధనల గుండా నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు, 
మిత్రులు సహితం, శత్రువులుగా మారి కృంగిన జీవితాన్ని మరింత క్రుంగదీసే పరిస్తితి. 
*
ఆదరిస్తారు అనుకున్నావారే మనమీద ఎదురు తిరిగిన సందర్భాలు.
*
వారు ప్రవర్తించిన తీరు, మాట్లాడే విధానం ఎముకలు విరిగినప్పుడు పడే బాధకంటే అధికం.

యోబు శోధనల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు  ఆయన ముగ్గురు స్నేహితులు వ్యవహరించిన తీరే దీనికి గొప్ప ఉదాహరణ.
పేతురు నీటి మీద నడుస్తున్నప్పుడు, యేసు వైపు కాకుండా, వీస్తున్న గాలులవైపు చూచి మునిగిపోసాగాడు. 

నీవు మాత్రం లోక రక్షకుడైన యేసు వైపే చూడాలి తప్ప, గాలులు అనే లోకం వైపు చూడొద్దు. వారి మాటలకు క్రుంగిపోవద్దు. 
ఆశ్రయదుర్గమును, రక్షణ దుర్గమును అయిన దేవుడు నీతో వున్నాడు. 
సోమ్మసిల్లిన నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు. 

స్థిర విశ్వాసంతో ఈ మాట చెప్పు. 
"నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను."         కీర్తనలు 42:11

అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
(42
వ కీర్తనా ధ్యానం సమాప్తం)

    46వ కీర్తనా ధ్యానం 
       (
మొదటి  భాగం) 

రచయిత: కోరహు కుమారులు 

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
             
కీర్తనలు 46:1
     ...............................

మన బలం, మన , మన ప్రాకారాలు, మన కోటలు కాదు గాని, 
దేవుడే తన ప్రజలకు ఆశ్రయం,
దేవుడే తన ప్రజలకు సహాయం, 
దేవుడే తన ప్రజలకు బలం. 

అందుకే, కోరహు కుమారులు చెప్పిన విషయాన్నే దావీదు కూడా చెప్తున్నాడు. 

యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమి్మకయుంచెన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.

యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము
             
కీర్తనలు  28:7,8

అన్నీ వున్నప్పుడు అందరూ నీవెంటే వుంటారు. 
నీ ఆపత్కాలంలో, శోధనలగుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవ్వరూ నీ దరి చేరరు.
 
ఎవ్వరూ నిన్ను అద్దరి చేర్చరు. 

ఒక్క విషయం గుర్తుంచుకో! 
*
అందరూ నిన్ను విడచి పెట్టేసినా? 
నీవెంటే నీకాశ్రయమై వున్నాడు, నీ ప్రియ రక్షకుడు. 
*
నీ బలహీనతలో ఆయనే నీ బలం. 
*
నీ నిస్సహాయ స్థితిలో ఆయనే సహాయం 

నీవు ఆయనను నమ్మగలిగితే? 
నీ నమ్మకాన్ని వమ్ముచెయ్యడు.

ఆశ్రయిద్దాం!
అనుభవిద్దాం!!

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

     46
వ కీర్తనా ధ్యానం 
       (
రెండవ  భాగం) 

కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను
వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.
               
కీర్తనలు 46:2,3
       ..................................

మనకు ఆశ్రయమై వున్న దేవునిని మనము ఆశ్రయముగా కలిగియుంటే? 
ఏ పరిస్థితికి మనం భయపడ నవసరం లేదు. 

ఇక్కడ చెప్పబడిన ప్రకృతి వైపరీత్యములు మన జీవితంలో ఎదుర్కొనే శోధనలకు సాదృశ్యం.

పర్వతములు 
సముద్రాలు 
వరదలు 
ఇవన్ని మన విశ్వాస యాత్రలో ఎదురవుతూనే వుంటాయి. 

ఆయనే నీ ఆశ్రయమైతే?
ఆయనే నీ బలమైతే? 
ఆయనే నీ సహాయకుడైతే?
వాటికి భయపడనవసరం లేదు. 

*
పర్వతములా అడ్డుగావున్న నీ ప్రతీ సమస్యను చదును భూమిగా మార్చగల సమర్ధుడు నీ దేవుడు. 

*
సముద్రమువలే నీకు అడ్డుగావున్న నీ ప్రతీ సమస్యను పాయలు చేసి, విడిపించి, నడిపించగల సమర్ధుడు నీ దేవుడు. 

వరదవలే శోధనలు నిన్ను ముంచెత్తే పరిస్థితులు ఎదురయినా, అవి నీమీద ప్రవహించకుండా ఆపగల సమర్ధుడు నీ దేవుడు. 

నీవు చెయ్యవలసినదెల్లా ఒక్కటే. 
ఆయన యందు నమ్మిక మాత్రం వుంచు. 
ఆయన సమర్ధతను తక్కువ చెయ్యొద్దు. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 


      46
వ కీర్తనా ధ్యానం 
        (
మూడవ భాగం) 

ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి.

దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయు చున్నాడు.
     
కీర్తనలు 46:4,5
      ..............................

ఒక నది కలదు. అది జీవజలముల నది. 
అంటే నిత్యమూ ప్రవహించేది. అది ఎప్పుడూ ఎండిపోదు. అది జీవకోటికి ఆధారం. 
ఆ నది గొర్రెపిల్ల సింహాసనం నుండి బయలు వెళ్ళు చున్నది. 

స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహా సనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను.
       
ప్రకటన 22:1,2

ఆ జీవనది "నీ ప్రియ రక్షకుడైన యేసయ్యే"
ఆ నదీ ప్రవాహం, ఆయన నీ కోసం కల్వరిలో చిందించిన రుధిరధారలే.

నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు చున్నావు.
                 
కీర్తనలు 36:8

నీ ఆనందానికి కారణం కల్వరి నుండి ఏరులై ప్రవహిస్తున్న ఆ రుధిరధారలే. 

అప్పుడు ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయుల పట్టణమైన యెరుషలేములో వున్నాడు. ఇప్పుడు పరలోక యెరుషలేములో, ఆయన సంఘములో, నీతోకూడా వున్నాడు. 

సూర్యోదయముననే నీ నీతి సూర్యుడైన యేసు ప్రభువు నీకు సహాయముగా నున్నాడు. 

నీవు చెయ్యవలసినదెల్లా ఒక్కటే. 
ఆయన యందు నమ్మిక మాత్రం వుంచు. ఆ సహాయాన్ని అనుభవించు. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

      46
వ కీర్తనా ధ్యానం 
        (
నాలుగవ  భాగం) 

జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలు చున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి పోవుచున్నది.

సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు. యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.
           
కీర్తనలు 46:6,7
       ...............................

ప్రజలలో అల్లకల్లోలం చెలరేగుతుంది. రాజ్యములు కదిలే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. కాని ప్రతీ పరిస్థితి ఆయన ఆధీనంలోనే వుంటుంది. అన్నీఆయనకు లోబడే జరుగుతాయి. 

*
నీ జీవితనావ చెలరేగే తుఫానులో చిక్కిందా?  
*
సుడిగుండంలోపడి తిరుగుతుందా? 
*
సముద్ర కెరటాలచేత కొట్టబడుతుండా? 
*
చుక్కాని విరిగిపోయే పరిస్తితులా? 
*
అద్దరి కానరాకుండా పోతుందా?
*
ఆ నావను దరిచేర్చలేక శారీరికంగా, మానసికంగా కృంగి పోతున్నావా? 
*
నీకంటూ సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరా? 

భయపడొద్దు! 
దిగులు చెందొద్దు!!
ఆశను వీడొద్దు !!!

*
నీ ఆశను తీర్చగలవాడు ఒకాయన వున్నాడు.
*
నీ గమ్యం చేర్చగల సమర్దుడు ఆయన మాత్రమే. 

సైన్యముల కధిపతియగు యెహోవా  నీకు తోడై యున్నాడు. 
యాకోబుయొక్క దేవుడు నీకు ఆశ్రయమై యున్నాడు.

*
బేతేలులో యాకోబుకు....
 
ఆశ్రయమైన దేవుడు,
 
విడిపించిన దేవుడు,
 
ఆశీర్వదించిన దేవుడు,
 
తోడైవున్న దేవుడు,

నీకూ... 
ఆశ్రయముగా వుండబోతున్నాడు. 
విడిపించ బోతున్నాడు. 
ఆశీర్వదించ బోతున్నాడు.
తోడుగా వుండబోతున్నాడు. 

ఆయన ఇమ్మానుయేలైన దేవుడు. 
(
ఇమ్మానియేలు అనగా "దేవుడు మనకు తోడు")
ఎల్లవేళలా నీకు తోడుగావుండే దేవుడు. 

అయితే
నీవు చెయ్యవలసినదెల్లా, ఆయనపై ఆధారపడు, ఆయనను నమ్ము, ఆయనను ఆశ్రయముగా కలిగియుండు. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

     46 కీర్తనా ధ్యానం 
        ( ఐదవ భాగం) 


యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు.


ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.
             కీర్తనలు 46:8,9
          ............................

పురాతన కాలంలో ఎంతో వైభవాన్ని గడించిన నినేవే, బబులోను, ఐగుప్తు, గ్రీసు, హరప్పా మొదలగు నాగరికతలు నేడు శిధిలాలు గానే మిగిలాయి. 

దానికి కారణం ఎవరు?
వర్దిల్లజేయువాడు ఆయనే. 
నాశనం కలుగజేయువాడు ఆయనే. 


యుద్దములు మాన్పి సమాధానము అనుగ్రహించు వాడు ఆయనే. 


 "షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.
అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను."
             కీర్తనలు 76:2,3

ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
              యెషయ 2:4 

నేటి పరిస్థితులను చూస్తుంటే యెషయ చెప్పిన ఈ ప్రవచన నెరవేర్పు కనుచూపు మేరాల్లో కూడా కనిపించదు. 

క్షణాలలో ప్రపంచాన్ని నాశనం చేసే విధ్వంసకరమైన ఆయుధాలకోసం మనిషి అనుక్షణం కష్టపడుతున్నాడు. 

అయితే యెషయ అంటున్నాడు " యుద్ధం చేయుట నేర్చుకొనరు" నేర్చుకోకపోతే ఇక యుద్దాలే వుండవుకదా


ఈ పరిస్థితులు ఇప్పుడు కాదుగాని, యేసు ప్రభువే రాజై పరిపాలించబోవు వెయ్యేండ్లపాలనలో ఈ సమాధానకరమైన పరిస్థితులు వుంటాయి. 


ఆ రాజ్యంలో నీవుండాలంటే???
ఈ లోకంలో ఆయన కోసం జీవించాలి. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 



     46వ కీర్తనా ధ్యానం 
        (
ఆరవ భాగం) 

ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును

సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.
             
కీర్తనలు 46:10,11
          ..............................

దేవుడే ఇక్కడ రచయిత ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 

ఊరకుండుడి!
మీ పెనుగులాటలు మానండి. 
స్థిరముగా కూర్చొని ధ్యానిస్తే మీకే అర్ధమవుతుంది. అన్యజనులలోనూ, భూమి మీద మహోన్నతుడను నేనేనని.

నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును
         
యెషయ  2:11

యెహోవా సర్వలోక మునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియ బడును.
             
జెకర్యా 14:9

యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు.
             
కీర్తనలు 47:2

సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.

ఒక్క విషయం గుర్తుంచుకో! 
*
అందరూ నిన్ను విడచి పెట్టేసినా? 
నీవెంటే నీకాశ్రయమై వున్నాడు, నీ ప్రియ రక్షకుడు. 
*
నీ బలహీనతలో ఆయనే నీ బలం. 
*
నీ నిస్సహాయ స్థితిలో ఆయనే సహాయం 

నీవు చెయ్యవలసినదెల్లా, ఆయనపై ఆధారపడు, ఆయనను నమ్ము, ఆయనను ఆశ్రయముగా కలిగియుండు. 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
 (46
వ కీర్తనాధ్యానం సమాప్తం)




కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అబ్రాహాము విశ్వాసయాత్ర

పాపము

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పక్షిరాజు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

విశ్వాసము

సమరయ స్త్రీ

శరీర కార్యములు

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు