ఆధ్యాత్మిక సందేశాలు-2- కొన్ని కీర్తనల ధ్యానం- part-9

ఆధ్యాత్మిక సందేశాలు-2- కొన్ని కీర్తనల ధ్యానం

*119 కీర్తనా ధ్యానం*
( మొదటి భాగము)

యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు
         కీర్తనలు 119:1

రచయిత: రాజైన దావీదు

ఇది పరిశుద్ధ గ్రంథములోని అతి పెద్ద అధ్యాయము (కీర్తన).
హీబ్రూ అక్షరమాలలో గల 22 అక్షరములతో కీర్తనను 22 భాగములుగా విభజించడం జరిగింది.

దేవుని వాక్యము యొక్క గొప్పతనాన్ని, వాక్యమును ధ్యానించి, అనుసరించుట ద్వారా, మనము పొందుకోగల ధన్యతలను గూర్చి కీర్తన తెలియజేస్తుంది.

దేవుని వాక్యం పట్ల ప్రేమ మనలో పెరుగుతున్నప్పుడు, యేసు ప్రభువు పట్ల కూడా మన ప్రేమ అధికమౌతుంది.
ఎందుకంటే? దేవుని వాక్యాన్ని, యేసు ప్రభువును వేరు చెయ్యడం సాధ్యం కాదు.

రచయిత ఈకీర్తనలో పరిశుద్ధ గ్రంధానికి అనేక పర్యాయ పదములు ఉపయోగించడం జరిగింది.
ధర్మ శాస్త్రము
శాసనములు
మార్గములు
ఆజ్ఞలు
కట్టడలు
న్యాయ విధులు
      కీర్తనలు 119:1-8

కీర్తనా ప్రారంభంలోనే కీర్తనాకారుడు ధన్యతను పొందుకొనేందుకు గల రహస్యాన్ని తెలియజేస్తున్నాడు.

ధన్యుడు అంటే అర్థమేమిటి?
ఆశీర్వదించ బడినవాడు

ఆశీర్వాదం అంటే
పూర్వ కాలములోఎక్కువమంది  పిల్లలు, ఎక్కువ పశుసంపద  వుంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. అదే ఆశీర్వాదం.

కాలములో కార్లు, భవనాలు, బ్యాంక్ బ్యాలెన్సు వుంటే? వారు ఆశీర్వధించ బడినవారు  అంటున్నాము

ఇదేనా ఆశీర్వాదం ?
అయితే, యాకోబుకి  11 మంది పిల్లలు వున్నారు. (అప్పటికి ఇంకా బెన్యమీను పుట్టలేదు) లెక్కలేనంత పశుసంపద వుంది. కాని, యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. దేని కోసం?

"నీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యననెను."
            ఆది  32:26

అంటే? యాకోబుకు అవేమి ఆశీర్వాదాలవలే కనిపించలేదు. నిజమే. ఆయనను కలిగి యుండడమే ఆశీర్వాదం. ఆశీర్వాదాలకు కర్తయైన దేవునిని కలిగియుంటే? ఇక ఆశీర్వాధాలతో  పనిలేదు.

క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
                 ఎఫెస్సి 1:3

అసలు ఆశీర్వాధం అంటే? అది ఆత్మ సంబంధమైనదే నిత్య రాజ్యాన్ని చేరడమే నిజమైన ఆశీర్వాధం. అట్లాంటి ధన్యతను పొందడమే మన జీవిత లక్ష్యమై యుండాలి. దాని కోసమే పోరాడాలి.

అదెట్లా సాధ్యం?
పరిశుద్ధ గ్రంధాన్ని మోయడం, చదవడం, ధ్యానించడం, ప్రకటించడం ద్వారా సాధ్యం కాదు గాని, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలగాలి.

అందుకే  ప్రభువు అంటున్నారు..
"ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును."
             మత్తయి  7:21

ఆయన చిత్తమేమిటో తెలుసుకొని, నిర్దోషముగా జీవించాలంటే? పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించాలి.

దివారాత్రము పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని అనుసరిస్తూ, నిర్దోషముగా జీవిస్తూ ధన్యతలోనికి ప్రవేశిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

*119 కీర్తనా ధ్యానం*
(రెండవ భాగము)
ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.    కీర్తనలు 119:2
*ధన్యులెవరు?*
ఆయనను వెదకువారు ధన్యులు.
*ఎట్లా వెదకాలి?*
పూర్ణ హృదయంతో
ఆయన శాసనములను గైకొనుచూ వెదకాలి.
*ఎందుకంటే?*
ఆయన సన్నిధిని వెదకకుండా ఆయన త్రోవలో నడవలేము.
ఎంత ఎక్కువగా ఆయన సన్నిధిని  వెదకగలమో? అంత ఎక్కువగా ఆయనను అనుభవించగలము.
ఎంత ఎక్కువగా ఆయనను అనుభవించగలమో ? అంత ఎక్కువగా ఆయనకు విధేయులము కాగలము.
ఎంత ఎక్కువగా ఆయనకు  విధేయులము కాగలమో? అంత ఎక్కువ  ధన్యతను పొందగలము.
*ఎప్పుడూ ఆయనను  వెదకుతూ, కనుగొంటూ వుండాలి.*
యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడిఆయన సన్నిధి నిత్యము వెదకుడి.    1దిన 16:11
వెదకుడి మీకు దొరకును       మత్తయి 7:7
మనము వేటిని వెదకుతాము?
పోగొట్టుకున్న వాటిని వెదకుతాము.
అయితే,
దేవునిని ఎందుకు అట్లా వెదకాలి?
మనము అనునిత్యమూ మన చూపుల వలన, తలంపుల వలన, మాటల వలన, క్రియల వలన ఆయనను పోగుట్టుకుంటూనే ఉంటున్నాము.
అందుచే, అనుదినము మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఆయనను వెదకి పట్టుకోవాలి.
వెదకడం అనేది, హృదయపూర్వకంగా, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో వెదకాలి. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను అర్ధం చేసుకొని వెదకాలి.
నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మ తోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.       ద్వితి 4:29
మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు,    యిర్మియా 29:13

*ఆయనను ఎప్పుడు వెదకాలి?*
యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి.    యెషయా  55:6

అంటే? ఆయనను వెదకినా దొరకని కాలము రాబోతుందన్న మాట.
అవును! కృపా కాలం గతించిపోతుంది. సువార్త ద్వారాలు మూయబడే కాలం దగ్గరవుతుంది. ఆయన దూరమయ్యే సమయం ఆసన్నమవుతుంది.
అట్లాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొనక ముందే,
ఆయనను పూర్ణ హృదయంతో వెదకుదాం! హృదయంలో చేర్చుకుందాం!
వాక్యానుసారమైన జీవితాన్ని జీవిద్దాం!
ధన్యత లోనికి ప్రవేశిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(మూడవ భాగము)
వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు పాపమును చేయరుకీర్తనలు 119:3

*వారు అనగా ఎవరంటే?*
యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనేవారు.
ఆయన శాసనములను గైకొనేవారు.
 • పూర్ణహృదయముతో ఆయనను వెదికేవారు.
          కీర్తనలు 119:1,2

వీరంతా దేవుని మార్గంలో నడుస్తూ వుంటారు కాబట్టి, ఇక పాపం చేసే అవకాశమే లేదు.
అయితే, నేటికిని మనము పాపములో కొట్టిమిట్టాడు తున్నామంటే? వీటిలో అన్నింటిలో, లేదా కొన్నింటిలో తప్పిపోయామేమో?
ధర్మ శాస్త్రము (పరిశుద్ధ గ్రంధము)ను అనుసరించాలంటే? మొట్ట మొదట దానిని ధ్యానించాలి.

*ధ్యానిస్తే? ఏమి జరుగుతుందంటే?*

దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.     హెబ్రీ 4:12

తద్వారా, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి అవకాశముంది.
కానీ, మనము పరిశుద్ధ గ్రంధాన్ని చదివేవారముగానే వున్నాము తప్ప, ధ్యానించే అనుభవం కొరవడింది. చదివితే? విషయ జ్ఞానం మాత్రమే కలుగుతుంది. ధ్యానిస్తే? దేవునితో సన్నిహిత సంబంధ మేర్పడుతుంది.

పరిశుద్ధ గ్రంథ ధ్యానము, మన జీవితాన్ని సరిచేసుకోవడానికినిర్దోషముగా జీవించడానికి, ఆయన మార్గంలో నడవడానికి, మార్గాన్ని సిద్ధ పరుస్తుంది.
అయితే, మన జీవితాల్లో పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించే అనుభవం లోపించింది కాబట్టి, ఆయన శాసనాలను గైకొనలేక పోతున్నాము. పూర్ణాత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ ఆయనను వెదకలేకపోతున్నాము, ఆయనను కనుగొనలేకపోతున్నాము.

*మనము పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించ  లేకపోవడానికి గల కారణమేమిటి?*

మనలో పాపము నిలిచియుంటే? పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించ లేము. పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే? మనలోపాపము నిలచి యుండలేదు.

అయితే, మనకు మనముగా పాపముపై విజయాన్ని సాధించలేము.
ఎందుకంటే? పాపము దేవుని ప్రియకుమారునినే బలిగా తీసుకోగలిగింది. అంతటి శక్తివంత మైనది.

*పాపముపై విజయం మనకెట్లా సాధ్యం?*
పరిశుద్ధ జీవితం జీవించడానికి ధృడ మైన నిర్ణయం చేసుకోగలిగితే? పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. పాపముపై విజయాన్నిస్తాడు.
అయితే, *పరిశుద్ధ జీవితం జీవించడానికి నిర్ణయం తీసుకోవలసింది మాత్రం నీవే!*
అట్టి తీర్మానంతో సాగిపోదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(నాలుగవ భాగము)
నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.     కీర్తనలు 119:4
ఆజ్ఞలు అంటే?
తప్పకుండా చేసి తీరాల్సినవి.

బ్రిటీషు వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు "Do or die. Don't say why? అనే వారట. అవును! ఆజ్ఞ అనేది ప్రశ్నించడానికి వీల్లేదు.

*దేవుడు మనకు ఆజ్ఞలను ఎందుకు ఇచ్చాడంటే?*
మనలను నిర్బంధించడానికి కానేకాదు. మనలను సక్రమమైన మార్గములో నడిపించడానికి మాత్రమే.

*ఆయన మనలను నిర్బంధించియుంటే?* మనకిష్టమొచ్చినట్లు జీవించేవారమే కాదుగదా? ఆయన మనకు పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛలోనే మనము పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆజ్ఞలనిచ్చాడు.
ఆయనిచ్చిన స్వేచ్ఛను అనుభవిస్తూనే, ఆయన ఆజ్ఞలను అనుసరించ గలగాలి.

ఆజ్ఞలు అంటే ఏవి?
ధర్మ శాస్త్రములో నున్న పది ఆజ్ఞలలో, *విశ్రాంతి దినమును గురించిన ఆజ్ఞ తప్ప*, మిగిలినవన్నీ నూతన నిబంధనా గ్రంధములో పునః స్థాపన చెయ్యబడ్డాయి. వీటితో పాటు, నూతన నిబంధనా గ్రంధాన్ని ధ్యానం చేస్తే? అనేకమైన ఆజ్ఞలు కనిపిస్తాయి. వాటన్నిటిలో ఒక్కటైనా తొలగిపోకుండా అనుసరించ గలగాలి.
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.    మత్తయి 7:21

తండ్రి చిత్త ప్రకారము అంటే? ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును.
ఒక దినాన్న యేసు ప్రభువు వారు బోధించుచుండగా, వినుచున్న సమూహంలోనున్న ఒక స్త్రీ ఈరీతిగా కేకలు వేస్తుంది.

నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా
*ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.*   లూకా 11:27,28

మనము ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించగలిగితే? పరిశుద్ధురాలైన మరియ కంటే, ధన్యులము.
*మనము ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించడం ద్వారా, ఆయన ప్రేమయందు నిలచియుండ గలము.*

నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు.    యోహాను 15:10
ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.
*మనము ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా ఆయనను ప్రేమించిన వారమౌతాము.*
మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.   1యోహాను 5:3

పరిశుద్ధ జీవితం జీవించడానికి ఒక నిర్ణయం తీసుకొని, ఆయన ఆజ్ఞలను గైకొనడం ప్రారంభిస్తే? అవి మనకు చెప్పలేనంత సంతృప్తిని, తద్వారా గొప్ప సమాధానాన్ని అనుగ్రహిస్తాయి.
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*119 కీర్తనా ధ్యానం*
(ఐదవ భాగము)

ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు.
నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు.   కీర్తనలు 119:5,6

దావీదు తాను వర్ణించిన ధన్యకరమైన జీవితాన్ని అనుభవించలేక పోతున్నాను అనేది అతని భావము. అట్లా జరుగక పోవడానికి కారణం, అతని బలహీనతలు, అతని హృదయంలో గూడుకట్టుకుని యున్న పాపమని అతనికి తెలుసు.

అయినప్పటికీ, ధన్యతలోనికి ప్రవేశించాలని పరితపిస్తున్నాడు. తన ప్రవర్తన, అంటే? చూపులు, తలంపులు, క్రియలు, మాటలు ఇవన్నీ స్థిరపరచ బడాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాడు.

అవును! ఇట్లాంటి ఆశ మనమునూ, కలిగి యుండాలి. అంతేగాని, అల్పమైన ఆధ్యాత్మిక ప్రమాణాలు, అనుభవాలతో మనం తృప్తి చెంది ఊరుకుంటే, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని సాధించలేము. ధన్యకరమైన జీవితాన్ని జీవించలేము.

దావీదు ఒక పరిపూర్ణమైన గ్రహింపులోనికి వస్తున్నాడు. తన సిగ్గుకు, అవమానమునకు కారణము దేవుని ఆజ్ఞలను గైకొనకపోవడమే అని. ఇక మీదట నిర్దోషమైన జీవితాన్ని జీవించడానికి స్థిర నిశ్చయత లోనికి వస్తున్నాడు.

నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక.     కీర్తనలు 119:80

అవును కదా! పాపమునకు మొట్టమొదటి ప్రతిఫలము *సిగ్గు, అవమానము.*
ఆదాము, హవ్వలు ఏదెనులో దేవుని ఆజ్ఞను  మీరినప్పుడు, *వారికి సిగ్గు కలిగింది.* అందుకే అంజూరపు ఆకులతో కచ్చడములను చేసుకొని కప్పుకున్నారు.     ఆది కాండము 3:7

*దేవుని ఆజ్ఞలకు విధేయులము కాకపొతే, దాని ప్రతిఫలము సిగ్గు, అవమానమే.*

కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట *సిగ్గుపడక* ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి.   1 యోహాను 2:28

నీవు ఇప్పుడు దేవుని ఆజ్ఞలు గైకొని జీవించిన విధానమే, ఆరోజు ఆయన ప్రత్యక్షమగునప్పుడు, నీవు సిగ్గుపడక, ధైర్యముతో ఆయనను ఎదుర్కొని, ఆయన ముందు నిలబడేటట్లు చేస్తుంది.
ఒకవేళ, ఆయన ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితే వస్తే. అది ఊహలకే భయంకరం.
*ఆయన ఆజ్ఞలకు విధేయత చూపకున్నా, జీవితం సాఫీగానే సాగిపోతుందని నీవనుకున్నా, దినాన్న మాత్రం తప్పించుకోలేవు.*

వద్దు!
ఆయన ఆజ్ఞలను గైకొంటూ, పరిశుద్ధ జీవితం జీవిద్దాం! ప్రత్యక్షతలో ఆయనను ధైర్యముతో ఎదుర్కొని, శాశ్వత కాలము ఆయనతో జీవిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(ఆరవ భాగము)
నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చెదను.
నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము.     కీర్తనలు 119:7,8

*దేవుడు మనుష్యులకు ప్రసాధించిన అత్యంత అమూల్యమైన ఈవులలో  పరిశుద్ధ గ్రంధము ఒకటి.*

దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా అర్ధం చేసుకుంటే? అంత ఎక్కువగా దేవునికి కృతజ్ఞత కలిగి యుండాలి.

దావీదు దేవుని వాక్యాన్ని గైకొనడానికి స్థిర నిశ్చయం చేసుకొని, నన్ను బొత్తిగా విడనాడకుమని ప్రాధేయ పడుతున్నాడు.

అదేంటి? దేవుని వాక్యాన్ని గైకొనడానికి తీర్మానం చేసుకుంటే, దేవుడు విడచి పెట్టేస్తాడా?

అట్లా అని ఎంతమాత్రమూ కాదు. ఎందుకట్లా మాట్లాడుతున్నాడంటే? గతంలో ఎన్నో మంచి తీర్మానాలు చేసాడు. అయినప్పటికీ దారి తప్పిపోయాడు. ఇప్పుడు చేసిన తీర్మానంలో కూడా అట్లా జరిగే అవకాశముందని అతనికి తెలుసు.

దేవుడు తన పవిత్రత, న్యాయం చొప్పున తన పాపములను పరిగణిస్తే? అతనిని దేవుడు పూర్తిగా వదిలేస్తాడని గ్రహించాడు. అందుకే దేవుని పాదాలచెంత చేరి, ప్రాధేయ పడుతున్నాడు.

మనమూ అంతే కదా! ప్రతీ సంవత్సరము డిసెంబర్ 1 చేసిన తీర్మానాలెన్నో కదా? వాటిని నెరవేర్చడం కాదు కదా, అసలు మనము తీసుకున్న తీర్మానాలేమిటో కూడా గుర్తులేకుండా పోయాయి సరికదా, కనీసం దావీదుకు కలిగిన భయంలో లేసు మాత్రమైనా మన జీవితాల్లో లేదు.

అయినప్పటికీ, ఆయన కృప గలవాడు. అందుచే, మనము నిర్మూలముకాలేదు

ఆయన కృపలో ప్రశస్తమైన వాగ్ధానాలిచ్చి, మనలను జీవింపజేస్తున్నాడు.

నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనము చేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.        ద్వితి 4:31
ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు.      ద్వితి 31:6

కొన్ని సందర్భాలలో ఆయన మనలను విడచి పెట్టేసినట్లు అనిపించినా, అది తాత్కాలికమే తప్ప, పూర్తిగా ఆయన ఎన్నడూ విడచిపెట్టడు. ఒకవేళ, ఆయన శాశ్వతంగా మనలను విడచిపెట్టేస్తే? ఇక మనము సజీవుల లెక్కలోనుండి కొట్టివేయబడినట్లే.

అట్లా అని, ఆయనకు కృపను, ప్రేమను నిర్లక్ష్యం చేస్తే? అనుభవించాల్సిన ఫలితం అత్యంత ఘోరం.

ప్రభువు పాదాల చెంత చేరి ప్రాధేయపడదాం! నీతిగల ఆయన న్యాయవిధులను నేర్చుకొని, యదార్ధ హృదయంతో ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(ఏడవ భాగము)     
*యవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?*
           కీర్తనలు 119:9

ఒక యవ్వనుడు అడగదగిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలలో ఇదొకటి. అతనికి వుండవలసిన ఆశయాలతో ఇదొకటి.
*యవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు?*

*జీవిత శుద్ధి ఎట్లా సాధ్యమంటే?*

1. *దేవుని వాక్యాన్ని ధ్యానం చెయ్యడం ద్వారా, అభ్యాసం చెయ్యడం ద్వారా జీవితాన్ని శుద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది.*
నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?*  కీర్తనలు 119:9

2. *అట్లా చేసేందుకు దేవుని కృపను, ఆయన బలమును వెదుకుతూ వుండాలి.*
నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.   కీర్తనలు 119:10

3. *మన ఆలోచనలకు, ఆశలకు దేవుని వాక్యమునే కేంద్రముగా చేసుకోవాలి.*
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.   కీర్తనలు  119:11

4. *దేవుని సహాయం మూలముగా ఆయన వాక్యమును అర్ధం చేసుకోవాలి.*
యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము.    కీర్తనలు 119:12

5. *మనము నేర్చుకున్న వాక్యమును గురించి మాట్లాడుతూ వుండాలి.*
నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును.   కీర్తనలు 119:13

6. *వాక్యములోనే ఆనందిస్తూ, సంతోషముగా వుండాలి.*
సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను.
         కీర్తనలు 119:14

7. *వాక్యమునే ధ్యానిస్తూ , ఆయన త్రోవలలో నడవాలి.*
నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను.
          కీర్తనలు 119:15

8. *ధ్యానించిన వాక్యమును బట్టి ఆనందిస్తూ, వాటిని మరువక యుండాలి.*
నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.
        కీర్తనలు  119:16
ఇట్టి రీతిగా దేవుని వాక్యమును ధ్యానిస్తూ, జీవించగలిగితే? మన ప్రవర్తన (నడత) సరిచేయబడుతుంది. తద్వారా నిత్య రాజ్యానికి వారసులం కాగలం.

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(ఎనిమిదవ భాగము)

నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.
      కీర్తనలు 119:10,

*నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగ నియ్యకుము.* అంటూ, కీర్తనా కారుడు దేవుని సన్నిధిలో బ్రతిమాలాడుతున్నాడు.

ఎందుకంటే?
దేవుని ఆజ్ఞల నుండి తొలగిపోవడం చాలా తేలిక. అది అనాది కాలము నుండి వస్తున్న మనిషి యొక్క , భ్రష్టమైన సహజ  స్వభావం.

అయితే, ఇట్లాంటి సహజ స్వభావాన్ని ఎదిరించి, ఆయన కోసం జీవించగలిగితే? ధన్యత లోనికి ప్రవేశించ గలము.

ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.
            కీర్తనలు 119:2

పాపముతో మనమెంత పోరాటం చేసినా, మనకు మనమే విజయం సాధించలేము. గాని, దేవుని వాక్యాన్ని ( ఆయన మాటలను) హృదయంలో వుంచుకోవడం ద్వారా, పాపముపై విజయాన్ని సాధించవచ్చు.

అందుకే దావీదు ఇట్లా అంటున్నాడు.
*నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.*

అవును!
*దేవుని మాటలు మనలను పవిత్రులునుగా చేయును:*

నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు.
          యోహాను 15:3

*దేవుని వాక్యము ఆత్మఖడ్గమై యుండి సాతానుపై విజయాన్నిచ్చును.*

దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
              ఎఫెసి 6:17

*దేవుని వాక్యము సమస్త విధములైన జ్ఞానమునిచ్చును.*

సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
             కొలస్సి 3:16

అందుచే, మన తలంపులలో, ఆశల్లో, ఆశయాల్లో, కోరికలలో, ధ్యానములో వాక్యమే కేంద్ర స్థానమై యుండాలి.

అది ఎక్కడ వుండాలి అంటే?
మన క్రియల ఉత్పత్తి స్థానం దగ్గర వుండాలి. అంటే ఎక్కడ?
హృదయంలో.

దురాలోచనలు నరహత్యలు వ్యభి చారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును
          మత్తయి 15:19

కావున, హృదయంలో దేవుని వాక్యాన్ని వుంచుకోగలిగితే? అది పాపము నుండి మనలను దూరం చేస్తుంది.

అంటే? కేవలం వాక్యాన్ని కంఠస్థం చెయ్యడానికే పరిమితం కాకుండా, హృదయస్థం చెయ్యాలి.

నేడు నేను నీకాజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండవలెను.
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును   వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.
అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను.
          ద్వితి 6:6-8

అంటే?
మన ప్రతీ కదలికలోను, వాక్యము మనకు తోడుగా వుండాలి. అప్పుడు మాత్రమే పాపముపై విజయము సాధించి, నిత్య రాజ్యంలో ప్రవేశించగలము.

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*


*119 కీర్తనా ధ్యానం*
(తొమ్మిదవ భాగము)

యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము.   కీర్తనలు 119:12

మనము పాపమునుండి దూరముగా వుండగలిగితే? అది మన గొప్ప అని, మనలను మనము ఘనపరచుకొనే ప్రయత్నం చెయ్యకుండా, పాపము నుండి మనలను దూరపరచిన దేవునినే స్తుతించ గలగాలి.

అందుకే కీర్తనాకారుడు 
యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు అని స్తుతిస్తూ , నీ కట్టడలను నాకు బోధించుమని కృతజ్ఞతతో కూడిన ప్రార్ధన చేస్తున్నాడు.

ఒక్క కీర్తనలోనే నాకు బోధించు, నాకు నేర్పించు అంటూ తొమ్మిది సార్లు ప్రస్తావిస్తున్నాడు. అంటే? ఆయన బోధలు వినడానికి, ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.

నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము    కీర్తనలు 119: 26
యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము.                   కీర్తనలు 119: 33
యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము.     కీర్తనలు 119: 64
నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.   కీర్తనలు 119: 66
నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము.       కీర్తనలు 119: 68
యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము    కీర్తనలు 119:108
నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము నీ కట్టడలను నాకు బోధింపుము    కీర్తనలు 119: 124
నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము.    కీర్తనలు 119: 135

అంతేకాదు,

యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.
నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము.    కీర్తనలు 25:4,5
నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము. కీర్తనలు 143: 8
నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము కీర్తనలు 143:10

దావీదు ఇట్లా ప్రార్ధించాడు కాబట్టే, పడిపోయినా తిరిగి లేవగలిగాడు. దేవుని చేత *నా హృదయానుసారుడు* అనే సాక్ష్యాన్ని పొందగలిగాడు.

ఇట్లా ప్రార్ధించిన అనుభవాలు మన జీవితంలో ఎప్పుడైనా ఉన్నాయా?
ఆయన చిత్తం కోసం ఎదురు చూచిన అనుభవం నీకుందా?
నీ కట్టడలు నేర్పించమని అడిగిన సందర్భముందా? నేర్పినా నేర్చుకొనే సిద్ధపాటు నీకుందా?

కనీసం ఇప్పుడైనా అట్లాంటి అనుభవం లోనికి ప్రవేశిద్దాం! ఆయన కట్టడలు (పరిశుద్ధ గ్రంధం) నీ చేతికిచ్చాడు. వాటి ద్వారా మన జీవితాలను సరిచేసుకోవడానికి ప్రయాసపడదాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(పదియవ భాగము)
నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదునుకీర్తనలు 119:13

దేవుని న్యాయవిధులను గురించి మాట్లాడడం, కీర్తనాకారునికి చెప్పలేనంత ఆనందం.
ఎందుకంటే?
అవి అక్షరాలా దేవుని నోటనుండి వెలువడిన మాటలు.

*దేవుని మాటలను దావీదు ఎంత ఘనముగా ఎంచుతున్నాడంటే?*
వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలుకీర్తనలు 119:72

ధర్మశాస్త్రము యొక్క విలువను గ్రహించగలిగాడు కాబట్టే, నాకు బోధించు, నేర్పించు అంటూ దేవునిని బ్రతిమాలాడు తున్నాడు.

ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల అరణ్యయాత్రలో, వారి చెప్పులు  అరిగిపోకుండా, వారి వస్త్రాలు చెమట వాసన రాకుండా చెయ్యగలిగిన దేవుడు, వారికి ఆకలి లేకుండా చెయ్యలేడా? ఆకలి వేసినా భూమి మీదవున్న ఆహారంతో పోషించలేడా? మన్నాను ఎందుకు కురిపించాలి? ఆకాశ పక్షులను ఎందుకు రప్పించాలి?

మనుష్యుడు ఆహారం వలన మాత్రమే కాదుగాని,
*యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన* నరులు బ్రదుకుదురని తెలియజేయుటకు, మన పితరులను అట్లా పోషించెను.

యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.      ద్వితి 8:3

యేసు ప్రభువు వారు 40  దినాలు సాతాను చేత శోధించబడుటకు అరణ్యములోనికి కొనిపోబడునప్పుడు, ఆయన ఆకలితో వున్నాడని గమనించి, నీవు దేవుని కుమారుడవైతే రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను

అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని *దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను* జీవించును అని వ్రాయబడియున్నదనెను.   మత్తయి 4:4

అవును!
క్షయమైన శరీరాన్ని జీవింపజేసేది ఈలోక సంబంధమైన ఆహారమైతే?
అక్షయమైన ఆత్మను జీవింపజేసేది జీవాహారమే ( దేవుని మాటలే).

అయితే, ఒక్క విషయం!
మన మాటలలో *దేవుని మాటల గురించిన ప్రస్తావన* ఎంత? గంటల తరబడి, గుక్క తిరగకుండా మాట్లాడతాము. దానిలో ఒక్క ముక్క కూడా దేవునిని గూర్చిన ప్రస్తావన వుండదు.

కారణం? దేవుడన్నా, దేవుని మాటలన్నా మనకంత చులకన. దేవుని మాటలను గూర్చిన గ్రహింపు నేటికీ మన జీవితాల్లో లేదు.
ఆయన మాటలే నిన్ను జీవింపజేసేవి. ఆయన మాటలే నిన్ను నిత్య జీవానికి నడిపించేవి.

అట్టి గ్రహింపులోనికి మనము వచ్చి, ఆయన మాటలయందు ఆనందించే వారముగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(పదకొండవ భాగము)

సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను.    కీర్తనలు 119:14

* లోకంలో మనము ఎప్పుడు సంపూర్ణమైన ఆనందాన్ని పొందగలమంటే?*
దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టి, వాక్యానుసారమైన జీవితం జీవించగలిగినప్పుడే  మన ఆనందం పరిపూర్ణమౌతుంది.

ఆనందం ఎట్లా ఉంటుంది అంటే? లోకంలో మనము విలువైన వస్తువులుగా ఎంచబడే వెండి, బంగారము కంటే, మించిన విలువైనదవుతుంది.

వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలుకీర్తనలు  119:72

మనము కోరుకోవలసినవి వెండి బంగారాలు కాదుగాని, ఆయన న్యాయ విధులను.

ఎందుకంటే?
అవి సత్యమైనవి.
కేవలం న్యాయమైనవి.

యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనె ధారలకంటెను మధురమైనవికీర్తనలు  119:9,10

*దేవుని మాటల గూర్చిన జ్ఞానము నీకు లభించాలంటే?*

నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన యెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.    సామెతలు 2:1-5

దేవుని మాటల గూర్చిన జ్ఞానము నీకు లభించాలంటే?

ఆయన మాటలు ఆలకించాలి.
అంగీకరించాలి.
వెదకాలి.
దాచుకోవాలి.
అభ్యసించాలి.
ప్రార్ధించాలి.

ఇట్లాంటి అనుభవాలన్నీ మన జీవితంలో వుండాలి.

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(పండ్రెండవ భాగము)

నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను.
నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.   కీర్తనలు 119:15,16

నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గములను నేను గౌరవిస్తాను. నీ కట్టడలను బట్టి సంతోషిస్తాను. నీ వాక్యమును నేను ఎన్నటికీ మరచిపోను అంటూనే, నీ ధర్మ శాస్త్రము నాకెంతో ప్రియమైనది. దినమెల్ల నేను ధ్యానిస్తున్నాను అంటున్నాడు కీర్తనాకారుడైన దావీదు.

నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.       కీర్తనలు 119:97

అయితే, నీవంటావు. వాక్యాన్ని ధ్యానించడానికి సమయమెక్కడిది?
అవునా? ఇంతకీ దావీదు ఎవరో తెలుసా? సువిశాల సామ్రాజ్యానికి రాజు. రాజు అంటే? తినిహాయిగా నిద్రపోయేవాడా? కానే కాదుఅతనికెన్నో భాద్యతలు.

అట్లాంటి రాజు, తన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహిస్తూనే, దినమెల్ల వాక్యాన్ని ధ్యానిస్తున్నాడట.

ఇదెట్లా సాధ్యం?
దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే? బైబిల్ చదువుతూ కూర్చోవడం అని అర్ధం కాదు. మన పనులలో సహితం ఆయన మాటలను మననం చేసుకోగలగడం. ఇట్లా చెయ్యడం వలన మన తలంపులు కూడా పరిశుద్ధముగా ఉంటాయి. ఆయన మాటలను తలపోసుకుంటూ వుంటే? అంతకంతకు ఆయన ఆధ్యాత్మిక లోతుల్లోనికి మనలను నడిపిస్తూవుంటాడు.

దావీదు ఎంత లోతుల్లోనికి వెళ్లాడంటే? దేవుని చేత నా హృదయానుసారుడు అని అనిపించు కొనేటంత.

కారణం? తన హృదయమంతా ఆయన ధ్యానంతో నిండిపోయింది.

దావీదు అంటున్నాడు *నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను.*
కారణం? అట్లా జీవించగలిగిన వాడు ధన్యుడు.

యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.   కీర్తనలు 112:1

మనమైతే? లోకంలో మనకు కలిగిన యోగ్యతలను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి హర్షించే వారముగా, అతిశయించే వారముగా వున్నాము.

కానీ, మనకు కలిగిన ఇట్టి యోగ్యత ఆయనను బట్టే అనే గ్రహింపు లేకుండా జీవిస్తున్నాము.

ఒక్క విషయం!!
ఆయన మాటలే నిన్ను జీవింపజేసేవి. ఆయన మాటలే నిన్ను నిత్య జీవానికి నడిపించేవి.

అట్టి గ్రహింపులోనికి మనము వచ్చి, ఆయన మాటలయందు ఆనందించే వారముగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(పదమూడవ భాగము)

నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును.
       కీర్తనలు 119:17

దావీదు కష్టం, నిందలు, శ్రమలు, వేదనలో ఉన్నట్లు మాటలను బట్టి మనకు అర్ధమవుతుంది. అయినప్పటికీ, వచ్చిన కష్టాలను బట్టి కృంగిపోయే స్వభావం ఆయనది కాదు. శ్రమ వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో ఆయనకు బాగా తెలుసు.

శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుని మాటలను తలపోసుకొంటూ ఆయనపైనే ఆధారపడడం దావీదు యొక్క లక్షణం. అది మన జీవితాలకు గొప్ప ఆధ్యాత్మిక పాఠం.

మనమైతే? శ్రమ కలిగినప్పుడు ఆయన చెంతకు చేరతాము. ఆయన దయ చూపించి మనలను శ్రమ నుండి విడిపించినప్పుడు, ఇక ఆయననే మరచిపోతాము.

రాజైన దావీదు అయితే, శ్రమ నుండి నేను విడిపింప బడినప్పుడు, ఆయన వాక్యమును బట్టి నడచుకొంటాను అంటున్నాడు.

ఆయన వాక్యమును అనుసరించగలిగితే? నిందల నుండి మనలను తప్పిస్తాడు.

నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొలగింపుము.
        కీర్తనలు 119:22

ఆధికారులు తనని ఎట్లా నాశనం చెయ్యాలా అని మీటింగులు పెట్టి మాట్లాడుకుంటుంటే? ఈయన మాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడట.

అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడు కొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.
         కీర్తనలు 119:23

దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, అనుసరించగలిగితే?
నీ ప్రతీ ప్రశ్నకు ఆయనే సమాధానం.
నీ ప్రతీ సమస్యకూ ఆయనే పరిష్కారం.

అందుకే దావీదు ఒక నిశ్చయతలోనికి వస్తున్నాడు. శ్రమ కలిగినప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి.

అట్లా చెయ్యడం ద్వారా దుఃఖం ఆనందముగా మలచబడుతుంది. అది ఆయన వ్యక్తిగత అనుభవం.

ఒక్క విషయం!!
ఆయన మాటలే నిన్ను జీవింపజేసేవి. ఆయన మాటలే నిన్ను నిత్య జీవానికి నడిపించేవి.

అట్టి గ్రహింపులోనికి మనము వచ్చి, ఆయన మాటలయందు ఆనందించే వారముగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(పదునాల్గవ భాగము)
నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.    కీర్తనలు 119:18
లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ * పరిశుద్ధ గ్రంధము* అని పిలువబడేది బైబిల్ ఒక్కటే. అట్లాంటి గ్రంధాన్ని ఒక సామాన్యమైన పుస్తకమువలె, న్యూస్ పేపర్ లా చదివితే అర్ధం కాదు. లోకంలో ఎంత విద్య అభ్యసించినా? ఎన్ని డిగ్రీలు తీసుకున్నా, జ్ఞానం పరిశుద్ధ గ్రంధాన్ని అర్ధం చేసుకోవడానికి ఏమాత్రం సరిపోదు.
మన మనో నేత్రాలు తెరువబడితేనే గాని, పరిశుద్ధ గ్రంథములోని ఆశర్యకరమైన సంగతులను గ్రహించలేము.

అదెట్లా సాధ్యం?
పరిశుద్ధ గ్రంధములో ఏముందో? తెలుసుకోవాలనే తృష్ణ కలిగి యుండాలి.
తెలుసు కోవడానికి పరిశుద్ధాత్ముని సహాయం కొరకు ప్రార్ధించాలి.
అప్పుడు మనో నేత్రములు తెరువబడి, ఆశర్య కరమైన సంగతులను చూడగలము.

ఇంతకీ, పరిశుద్ధ గ్రంధంలో ఏముంది?
ఆయన పిలుపు
దాని నిరీక్షణ
పరిశుద్ధులకు స్వాస్థ్యము
ఆయన మహిమైశ్వర్యము
ఆయన బలము
ఆయన అపరిమితమైన శక్తి
ఆయన మాహాత్మ్యము
ఇవి కొన్ని మాత్రమే. పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే లెక్కకు మించిన సంగతులు నీకు బోధించబడతాయి.

మీ మనో నేత్రములు వెలిగింప బడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో,
ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.     ఎఫెసీ 1:17-19

అయితే, పరిశుద్ధ గ్రంధములో విషయాలు మనకెందుకు అర్ధంకావట్లేదు?
సమాధానం ఒక్కటే.
దావీదు వలే అట్లాంటి తృష్ణ మనకులేదు. అట్లా ప్రార్ధించిన సందర్భమూ లేదు.
అందుకే, దివ్య గ్రంథములోని దివ్యమైన సంగతులు మనము తెలుసుకోలేక పోతున్నాము. అసలు తెలుసుకోలేని మనము వాటిని ఇంకెక్కడ అనుసరించగలము? సాధ్యం కానేకాదు.
దావీదువలే నాట్యం చేస్తాను అని పాడే నీవు, ఆయన కలిగిన తృష్ణను కలిగియుండు. ఆయనలా ప్రార్ధించు.

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(పదిహేనవ భాగము)
నేను భూమిమీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము.
నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.
     కీర్తనలు 119:19,20

దావీదు తాను ఒక యాత్రికుడని, పరదేశి అని, భూమి తన శాశ్వత నివాసంకాదని, తన కొరకు నిత్య స్వాస్థ్యము ఒకటుందని, దానిని చేరుకోవాలంటే? ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారానే సాధ్యమనే గ్రహింపులోనికి వచ్చాడు. అందుచే, నిత్యమైన ఉనికిపట్టుకు చేర్చే ఆజ్ఞలను నాకు మరుగుచేయక, తెలియజేయమని దేవునిని ప్రార్ధిస్తున్నాడు.

వాటికోసం ఎడతెగని ఆశను కలిగియున్నాడు. ఆశ ఎంతగా ఉందంటే? దాని వలన అతనిని ప్రాణం క్షీణించి పోతుందట.

మనమైతే, భూమే శాశ్వతమన్నట్లుగా దీని కోసమే ప్రయాస పడుతున్నాము తప్ప, శాశ్వత రాజ్యమును గురించిన తలంపు లేకుండా జీవిస్తున్నాము.

నిత్య జీవము, నిత్య మరణము వుందని ఎవరికి తెలుసు? అంటూ అతితెలివిగా వాధించే ప్రయత్నం చెయ్యొద్దు. నీవు పుట్టకముందు భూమి వుందనే విషయం నీకు తెలియదని గుర్తుపెట్టుకో. అట్లానే, జీవితం ముగించాకగాని, నిత్య జీవము, నిత్య మరణము వున్నాయనే విషయం తెలియదని అర్ధంచేసుకో. నిత్యస్వాస్థ్యము పొందుకోవాలనే తృష్ణను కలిగియుండు. దానికోసం ప్రయాసపడు.

 కోరహు కుమారుల ఆశ చూడండి.

నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది
          కీర్తనలు 42:2

యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయు చున్నవి.
           కీర్తనలు 84:2

మనకైతేదేవుని సన్నిధికి వెళ్లాలన్నా, ఆయనను ఆరాధించాలన్నా , హృదయం సహకరిస్తే? శరీరం సహకరించదు. శరీరం సహకరిస్తే? హృదయం సహకరించదు.
వారికైతే? హృదయం, శరీరం రెండూ కలసి  ఆనందముతో కేకలు వేస్తున్నాయట.

ఇట్లాంటి అనుభవాలు మన జీవితంలో లోపిస్తున్నాయి కదా?
 కారణం?
మన ఆశలన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము చుట్టూ తిరుగుతున్నాయి. లోకాశాలతో నిండిన హృదయంలో, ఇక దేవునికి చోటెక్కడిది?

వద్దు! క్షయమైన వాటికోసం, అక్షయమైన శాశ్వత రాజ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు.

దావీదు, కోరహు కుమారుల వంటి వారు కలిగియున్న తృష్ణను కలిగియుందాం! అట్టి రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచు కుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(పదహారవ భాగము)

గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు.
         కీర్తనలు 119:20

దేవుని వాక్యాన్ని అనుసరించేవారికి గర్వము వుండదు. ఎందుకంటే? వారి అతిశయం ఏదైనా వుందంటే? అది దేవునియందే.

నీవు ఈలోక యోగ్యతలను బట్టి అతిశయిస్తున్నావంటే? గర్విస్తున్నావంటే? వాక్యానుసారమైన జీవితం నీలో లేనట్లే.

గర్విష్ఠులను ఆయన గద్దిస్తాడు. నీ హృదయం గర్వముతో నిండివుంటే? పతనం అంచుల్లో వున్నావని జ్ఞాపకము చేసుకో.

*గర్విష్ఠులు తొట్రిల్లి కూలిపోతారు*:

నాశనమునకు ముందు గర్వము నడచును.
       సామెతలు 16:18

గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపట్టులన్నిటిని కాల్చివేయును.
       యిర్మియా 50:32

 నెబుకద్నెజరు హృదయము గర్వముతో నిండిపోయినప్పుడు ఏడు సంవత్సరాలు గాడిదవలే గడ్డి మేయాల్సి వచ్చింది.

నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్య ములును, ఆయన మార్గములు న్యాయములునై యున్న వనియు, *గర్వముతో నటించువారిని* ఆయన అణపశక్తు డనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను.
        దానియేలు 4:37

*దేవుని ఆజ్ఞలు విడచి తిరిగేవారు ఆయన సన్నిధిలో నిలవలేరు*:

న్యాయవిమర్శలో దుష్టులునునీతిమంతుల సభలో పాపులును నిలువరు.
            కీర్తనలు 1:5
డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు
            కీర్తనలు 5:5

గర్విష్ఠులు, డాంబికులు ( గొప్పలు చెప్పుకొనేవారు) దేవుని సన్నిధిలో నిలవలేరు. వారు పొందే ప్రతి ఫలం శాపము.

శాపాన్ని పొందుకుంటే?
ఆయన అంటున్నాడు...

శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
        మత్తయి 25: 41

వద్దు! అది ఊహలకే భయంకరం!
ఆయన ఆజ్ఞలను అనుసరిద్దాం! నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*

*119 కీర్తనా ధ్యానం*
(పదిహేడవ భాగము)

నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొలగింపుము.
       కీర్తనలు 119:22

ఆయన శాసనములు అనుసరించేవారికి నిందలూ, తిరస్కారము తప్పకుండా ఎదురవుతాయి.

చాలా మంది అంటూ వుంటారు, వాళ్ళు అంత భక్తిగా వుంటారు. అయినా, అన్నీ వారికే వస్తాయేంటి? అంటే, వారు చేసే భక్తిలోనే లోపం వుంది. అంటూ నిందించడం మనము వింటూనే వుంటాము.
కానీ, వీరికి అర్ధంకాదు. శోధనలు ద్వారా వారిని దేవుడు ఆయనకు మరింత సన్నిహితం చేసుకొంటున్నాడని. శోధించబడిన మీదట వారు సువర్ణముగా మారతారని.

దేవుని ప్రణాళిక అర్ధంకాక, దేవుని పిల్లలను నిందించేవారు, తిరస్కరించేవారు కోకొల్లలు. అయితే, నేను అట్లాంటి నిందలకు, తిరస్కారమునకు గురికాకుండా నన్ను కాపాడుము అంటూ కీర్తనాకారుడు ప్రార్ధిస్తున్నాడు.

అనేక సందర్భాలలో మనము  నిందించ బడడానికి, తిరస్కారానికి గురికావడానికి కారణం మన అతిక్రమములే కావొచ్చు. అందుకే, వాటి నుండి నన్ను విడిపించి, నీ నామమును ఎరుగనివారిచే నేను నిందించబడకుండా కాపాడుము అంటూ దావీదు ప్రార్ధిస్తున్నాడు.

నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము.
             కీర్తనలు 39:8

దానియేలు కూడా యెరూషలేము నింద పాలగుటకు కారణము, మా యొక్క, మా పితరుల యొక్క దోషములే కారణము. అంటూ దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు.

ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు, యెరూషలేము నీ జనులచుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యము లన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.
       దానియేలు  9:16

వాక్యాను సారమైన జీవితాన్ని జీవించుచున్నప్పటికీ, అన్యాయముగా నిందలూ, తిరస్కారమునకు గురవుతున్నామంటే? ఆయనలో మరింత బలాన్ని పొందుకుందాం!

ఒకవేళ, మనము నిందలు, తిరస్కారము అనుభవించడానికి మన అతిక్రమములే కారణమైతే? సరిచేసుకొని సాగిపోదాం!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(పద్దెనిమిదవ భాగము)
అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడు కొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.
నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.     కీర్తనలు 119:23,24
దావీదు కష్టంలో ఉన్నట్లు మాటలను బట్టి మనకు అర్ధమవుతుంది. అయినప్పటికీ, వచ్చిన కష్టాలను బట్టి కృంగిపోయే స్వభావం ఆయనది కాదు. శ్రమ వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో ఆయనకు బాగా తెలుసు.
శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుని మాటలను తలపోసుకొంటూ ఆయనపైనే ఆధారపడడం దావీదు యొక్క లక్షణం. అది మన జీవితాలకు గొప్ప ఆధ్యాత్మిక పాఠం.
అధికారులు రాజుకు వ్యతిరేకముగా గుంపుగూడే పరిస్థితులు. అయిననూ రాజు మాత్రం అవేమి పట్టనట్లు దేవుని యొక్క కట్టడలను ధ్యానిస్తున్నాడు.
ఎందుకంటే?
ఆయన కట్టడలు ధ్యానించడం ద్వారా, శత్రువులను ఎదుర్కొనే జ్ఞానం పొందుకోగలము.
నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.     కీర్తనలు 119:24

*దేవుని మాటలు మన సంతోషానికి  కారణము.*
లోకములో మనిషి సంతోషం  కోసం ఆరాట పడుతున్నాడు . అనేక విధాలుగా ప్రయత్నించి తన పాపాన్ని రెట్టింపు చేసుకొంటున్నారు గాని, సంతోషము లేకపోగా, చివరికి  విషాదమే మిగులుతుంది.

పరిపూర్ణమయిన, శాశ్వతమయిన  సంతోషం మనకు ఎక్కడ  దొరుకుతుంది?
"పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడం  ద్వారా సంతోషాన్ని  పొందగలము.
"నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నకు ఆనందమును కలుగజేయుచున్నవి."  యిర్మియా 15:16

*దేవుని మాటలు మనకు ఆలోచన కర్తలు.*
దేవునికి విరోధముగా జీవిస్తున్న  ప్రజల మధ్య జీవిస్తున్న మనము  ఎట్లా జీవించాలో ? పరిశుద్ధ  గ్రంధము మనకు ఆలోచన  ఇస్తుంది.
సమస్యల సుడి గుండంలో  కొట్టి మిట్టాడుతున్న మన జీవితాలకు  దేవుని వాక్యం ఆలోచన ఇచ్చి  ముందుకు నడిపిస్తుంది.
ముందు గొయ్యి - వెనుక నుయ్యి  అట్లాంటి పరిస్థితుల్లో ... ఏమి  చెయ్యాలో అర్ధం కానప్పుడు, దేవుని వాక్యాన్ని  ధ్యానం చేసి  చూడు. వాక్యం నిన్ను ఆదరించి, ఆలోచననిచ్చి, నీ సమస్యకు  పరిష్కారాన్ని ఇస్తుంది.

దొంగతనాలు జరుగుతున్న  ఊరిలో, విశ్వాసి అయిన ఒక  పోలీస్ ఆఫీసర్ కి వారిని పట్టుకొనే భాద్యత అప్పగించారు. ఒక రాత్రి  దొంగలు వారు ఉపయోగించే గాడిదను విడచి పారిపోయారు.
దేవుని వాక్యాన్ని చదివే పోలీస్ ఆఫీసర్ కి బైబిల్ ఒక ఆలోచననిచ్చింది.
"గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును"      యెషయా 1:3
గాడిదను చెట్టుకు కట్టి 3 రోజులు ఏమి పెట్టకుండా, తర్వాత విడచి పెట్టాడట. పరిగెత్తుకుంటూ  వెళ్తున్న గాడిదను వెంబడించగా, అది వెళ్లి  దొంగల గుహదగ్గర ఆగింది. అట్లా  దేవుని వాక్యం ఆధారంతో   దొంగల ముఠాను పట్టుకోగలిగాడు.

అవును!
దేవుని మాటలు మనకు ఆలోచననిస్తాయి. తద్వారా మన సమస్యలు పరిష్కారమవుతాయి. తద్వారా మన జీవితాలకు సంతోషం.
దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం! అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*119 కీర్తనా ధ్యానం*
(పంతొమ్మిదవ భాగము)
నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుముకీర్తనలు 119:25

కీర్తనాకారుడు బ్రతికించమని ప్రార్ధిస్తున్నాడంటే? దాదాపు అతడు మరణ స్థితిలోనున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. అది ఆధ్యాత్మిక మరణమో? శారీరిక మరణమో? తెలియదుగానిఅది ఎట్లాంటి పరిస్థితియైన ఆయన శరణు వేడడం ఎంత ముఖ్యమో అతడు అర్ధం చేసుకోగలిగాడు.
అందుకే, ఒక్క కీర్తనలోనే తొమ్మిదిసార్లు ఇట్లాంటి ప్రార్ధననే ప్రార్ధిస్తున్నాడు.

వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికిం పుముకీర్తనలు 119:37

 నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.     కీర్తనలు 119:40

నీవు నియమించిన శాసనమును నేను అనుసరించు నట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము.    కీర్తనలు 119:88

యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము.   కీర్తనలు 119:107

నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. కీర్తనలు 119:149

నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుముకీర్తనలు 119:154

యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.   కీర్తనలు 119:156

యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము.కీర్తనలు 119:159

మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది.
మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.కీర్తనలు 45:25,26

అవును!
ఆయన మాటలు మనలను బ్రతికిస్తాయి.

శారీరికంగా ఆరోగ్యవంతముగానే నున్నా, ఆత్మీయంగా మరణానికి దగ్గరలో నున్నామేమో? ఒక్క సారి మనలను మనమే పరిశీలన చేసుకోవాలి.
కీర్తనాకారుడు ఎట్లా దేవుని పాదాలచెంత చేరి బ్రతిమాలాడుతున్నాడో అట్లాంటి అనుభవాన్ని మనము కలిగి యుండాలి.

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*

NOTE
119 కీర్తన ఎవరు వ్రాసారు అనే విషయం స్పష్టత లేదు. కొందరు దావీదు అని, మరి కొందరు ఎజ్రా అని అభిప్రాయ పడుతున్నారువ్రాసినది ఎవరైనా వ్రాయించిన వాడు దేవుడే అనే విషయం గ్రహించగలము.
*119 కీర్తనా ధ్యానం*
(ఇరువదియవ భాగము)

నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము.
         కీర్తనలు 119:26

కీర్తనాకారుడు తాను చేస్తున్నదేమిటో దేవునికి తెలియజేస్తున్నాడు. మనము దేవునితో మనసు విప్పి, వున్నది వున్నట్లుగా, ఒక చిన్న పిల్లవాడు ప్రేమగల తండ్రితో మాట్లాడినట్లుగా మాట్లాడాలని దేవుడు కోరుతున్నాడు.

తాను ఎలుగెత్తి దేవునిని బ్రతిమాలాడు చున్నాడు. బహువినయముగా దేవునిని ప్రార్ధిస్తున్నాడు. తనకు కలిగిన బాధ అంతయు దేవుని సన్నిధిలో తెలియజెప్పు కొంటున్నాడు.

నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను.
బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొను చున్నాను.
      కీర్తనలు 142:1,2

ప్రార్ధించి, పొందుకొని, ఇంకా అడుగుతున్నాడు. నీ కట్టడలను నాకు బోధించమని.

ఎందుకంటే? ఒక రహస్యాన్ని ఇక్కడ అర్ధం చేసుకోగలిగాడు. తాను దేవుని కట్టడలను అనుసరిస్తే? తన ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందని. అందుకే, కట్టడలను బోధించమని ప్రార్ధిస్తున్నాడు.

యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము.
       కీర్తనలు 119:12

యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.
       కీర్తనలు 27:11

ఇక్కడ దావీదు ఒకమాట చెప్తున్నాడు. ఆయన కట్టడలను అనుసరించ గలగాలంటే? ఇక దృష్టి కలిగియుండాలి

అంటే? మన ప్రతీ కదలికలోనూ ఆయనను ముందు పెట్టుకోవాలి. అట్లాంటప్పుడు, సత్యమును అనుసరించి జీవించగలము.

యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు కొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.
          కీర్తనలు 86:11

ఇట్టి రీతిగా మనమునూ ప్రార్ధించి, ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆయనకోసం జీవించగలగాలి.

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*

*119వ కీర్తనా ధ్యానం*
(21వ భాగము)
నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను.
వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము.   కీర్తనలు 119:27,28
నీటికి స్థిరత్వము ఉండదు. అది ఎటు పల్లముగా ఉంటే, అటువైపు ప్రయాణిస్తుంది. ఇక్కడ కీర్తనాకారుని యొక్క ప్రాణము కూడా నీరువలే, స్థిరత్వం లేకుండా వుంది.

దానికి గల కారణమేమిటో కూడా తెలుసుకోగలిగాడు.
దానికి గల కారణం అతని వ్యసనాలే.

వాటి ఫలితం ?
విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవినాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.   కీర్తనలు 6:7
మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.
         కీర్తనలు 116:3

దానికి గల పరిష్కారాన్ని కూడా కనుక్కోగలిగాడు. అదేమిటంటే? తన అస్థిరమైన జీవితాన్ని స్థిరపరచ గలిగేది దేవుని వాక్యమేనని.
ఇప్పుడు ఆయన ఆశ్చర్య కార్యములను గురించి ధ్యానించడానికి ఒక తీర్మానములోనికి వచ్చాడు.
మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను   కీర్తనలు 145:5

అట్లా చెయ్యగలిగినప్పుడు,
వారు విమోచింప బడతారు.
సంగీతనాదముతో సీయోనునకు (దేవుని నివాసమునకు) తిరిగి వచ్చెదరు
నిత్యసంతోషము వారి తలలమీద ఉండును
వారు సంతోషానందము గలవారగుదురు
దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.

యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.    యెషయా  51:11

ఇట్లాంటి అనుభవాలు మన జీవితంలో పొందాలంటే?
మన వ్యసనముల వలన అస్థిరులమై పోయామని, స్థిరపరచ బడాలంటే? దేవుని వాక్యమే మనలను స్థిర పరచగలదనే గ్రహింపులోనికి రావాలి.
ఆయన ఉపదేశాలకోసం ప్రార్ధించాలి.
ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానించాలి.
తద్వారా, ఆ నిత్య సంతోషాన్ని అనుభవించగలము.

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

సమరయ స్త్రీ

పేతురు వ్రాసిన పత్రికలు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

అబ్రాహాము విశ్వాసయాత్ర

యేసు క్రీస్తు రెండవ రాకడ

పక్షిరాజు

శరీర కార్యములు

పాపము