తోట యజమాని

తోట యజమాని

మొదటి భాగము- ఉపోద్ఘాతము

తోట యజమాని

Matthew(మత్తయిసువార్త) 20:1 .ఏలాగనగాపరలోకరాజ్యముఒకఇంటియజమానునిపోలియున్నది. అతడుతనద్రాక్షతోటలోపనివారినికూలికిపెట్టుకొనుటకుప్రొద్దునబయలుదేరి. .
దేవునిప్రశస్తనామమునకుమహిమకలుగునుగాక!
ప్రియసహోదరీ/ సహోదరులారా! ఆధ్యాత్మికసందేశాలు-3సిరీస్లోభాగంగామరోఅంశంతోమిమ్మల్నిమరోసారికలుసుకోవడంసంతోషంగాఉంది. అట్టికృపనిచ్చినదేవాదిదేవునకునిండువందనాలు!!!
ప్రియులారా! మనంకొన్నిదినాలుయేసుప్రభులవారుచెప్పినపరలోకరాజ్యవర్తమానాలలోఒకఉపమానంమత్తయిసువార్త 20:1-16 లోచెప్పబడినతోటయజమాని- సేవకులకోసంధ్యానంచేద్దాం!

1. అయితేఈఉపమానాన్నిమామూలుగాఓఉపమానంలాగతేలికగాతీసుకుంటేఏమాత్రముఉపయోగంలేదు. ఈఉపమానంభాగాఅర్ధంకావాలంటేదయచేసిమత్తయి 20:1-16 వరకుకనీసంపదిసార్లుచదవమనిప్రోత్శాహిస్తున్నాను. అప్పుడేఈఉపమానంబాగాఅర్ధంఅవుతుంది.

2. ఈఉపమానంబాగాఅర్ధంచేసుకోడానికిక్రిందనేనుప్రస్తుత- పూర్వకాలంలోపట్టణాలలోపనికి- కూలివారినిఎలాకుదుర్చుకొంటారోమీకుఅర్ధమవ్వాలనేఒకఉదాహరణఇస్తున్నాను. ఇదికేవలం concept మీకుఅర్ధంఅవ్వాలనేతప్ప- వాక్యాన్నికలిపిచెరపడంకాదు.
నేనువిశాఖపట్నంజిల్లాకుచెందినవాడను. విశాఖపట్నంతోనాకుఅవినాభావసంభందంఉంది, అంతేకాకుండాఆపట్టణబౌగోళిక, స్తితిగతులునాకుతెలుసుకాబట్టివిశాఖపట్నంలోపనికికూలివారినిఎలాకుదుర్చుకొంటారో–తద్వారాపట్టణాలలోకూలివారినిఎలాకుదుర్చుకుంటారోమీకుచెబుతున్నాను. అప్పుడుఈఉపమానంమీకుచాలాబాగాఅర్ధంఅవుతుంది.

పల్లెటూర్లుచిన్నగాఉంటాయికాబట్టిఎవరినైనాపనికిపెట్టుకోవాలంటేముందురోజుసాయంత్రంగాని, ఆరోజుఉదయంగానివారిఇంటికివెళ్లిపనికికుదుర్చుకుంటారు! కానిపట్టణాలుపెద్దవికదా! కూలివారుఎక్కడుంటారోతెలియదుకదా! కూలివారికికూడాపనికావాలికదా! అందుకేపట్టణాలలోఇలాంటికర్షకులుకూడుకొనేసెంటర్లుఉంటాయి. అక్కడికేమేస్త్రీలు, యజమానులువచ్చి–పనికికూలిఇంతఅనిమాట్లాడుకొనిపనికితీసుకునివెళ్తుంటారు. విశాఖపట్నంలోఇలాంటిసెంటర్లుచాలాఉన్నాయి, వాటిలోముఖ్యమైనవి NAD కొత్తరోడ్డుజంక్షన్,పాతగాజువాక , మద్దిలపాలెంఇలాచాలాఉన్నాయి. అయితేఇక్కడ (ఉదాహరణ NADలో) సిమెంటుపనివారుఒకదగ్గర, బరువులుమోసేవారుఒకదగ్గర, మట్టిపనివారుఒకదగ్గరఅలాఏకోవకుచెందినవారుఅక్కడఒక్కోగుంపుగాపోగవుతారు. ఉదయం 7 గం.కెక్యారీజుపట్టుకునివచ్చేస్తారు, 8:30 సరికిబేరంకుదురిపనికివెళ్ళిపోతారు. ఒకవేళఎవరికైనా NAD జంక్షన్లోపనిదొరక్కపోతేపాతగాజువాకగాని, గోపాలపట్నంగానిపనికోసంవెళతారు 8:30 లోగా. అక్కడవారికిపనిదొరకవచ్చు! ఇదీపట్టణాలలోపనికికూలివారినిపనికికుదుర్చుకునేవిధానం! ఈవిషయంపల్లెటూర్లలోఉన్నవారికితెలియదు. దయచేసిఇప్పుడునేనుచెప్పినఈఉదాహరణగుర్తుంచుకోండి. రాబోయేభాగాలలోఈఉదాహరణపనికివస్తుంది.

3. ఈభాగాలలోనేనుమధ్యలోకొన్నిప్రశ్నలుఅడుగుతూఉంటాను. దయచేసివాటికిసమాధానంఇవ్వడానికిప్రయత్నించండి. అవిమీఆత్మీయజీవితానికిపనికొస్తాయి. తర్వాతభాగంలోఆప్రశ్నకునేనుజవాబిస్తూఉంటాను.

ఇక*యేసుప్రభులవారుఈఉపమానాన్నిఎందుకుచెప్పారు*?
ఈఉపమానంమత్తయిసువార్త 19వఅధ్యాయానికికొనసాగింపు. యేసుప్రభులవారుపరలోకరాజ్యంఅంటేఏమిటి? ఎవరుంటారు? అనేవిషయంగురుంచిచెబుతుండగామధ్యలోమత్తయి 19:27 లోపేతురుగారుయేసుప్రభులవారినిప్రశ్నలాంటిబేరమాడుతారు. ఇదిగోమేముమాసమస్తాన్నివిడచినిన్నువెంబడిస్తున్నాం, అయితేమాకేటిలాభంఅనిఅడుగుతున్నారుపేతురుగారు. ఇక్కడపేతురుగారుదాదాపుతనజీతంకోసంబేరమాడుతున్నపనివారిలాకనిపిస్తారు. దానికియేసుప్రభులవారుజవాబిచ్చి 30వవచనంలోఅంటున్నారు: పేతురుకడపటివారుమొదటివారౌదురు. మొదటవారుకడపటవారగుదురుజాగ్రత్తఅనిహెచ్చరిస్తున్నారు!!!!
ప్రియదైవసేవకుడా! విశ్వాసి! ఒకవేళనీవుచేసేపనికిదేవునిదగ్గరబేరమాడుతున్నావేమో!!, ఇంతకష్టపడినీసేవచేస్తున్నాను, నన్నుఎందుకుదీవించడంలేదు. ఎందుకింకామాకింకా material blessings ఇవ్వడంలేదుఅనిదేవునితోబేరమాడేవేమో?
నీతోకూడాదేవుడంటున్నారుకడపటవారుమొదటివారగుదురు, మొదటవారుకడపటవారగుదురుజాగ్రత్త! నిన్నుపరిశీలించుకో! సరిదిద్దుకో!
దైవాశీస్సులు!
ఆమెన్!
(ఇంకాఉంది)


తోట యజమాని -రెండవ భాగము

ఉపోద్ఘాతము-2- పరలోక రాజ్యము


Matthew(మత్తయి సువార్త) 20:1
1.ఏలాగనగాపరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి

ఇక్కడ మనం పరలోకరాజ్యము అనే మాట చూస్తున్నాం! సువార్తలలో పరలోకరాజ్యము అని కేవలం మత్తయి సువార్తలోనే వాడబడింది. అయితే మార్కు, సువార్త, లూకాసువార్త, యోహాను సువార్తలలో పరలోకరాజ్యము అనేమాటకు బదులుగా దేవుని రాజ్యము అని వాడబడింది. క్రొత్త నిభందనలో ఈ పరలోక రాజ్యవర్తమానాలు చాలా ప్రాముఖ్యమైనవి. మత్తయి సువార్తలో పరలోకరాజ్యం అనేమాట దాదాపు 50సార్లు వాడబడింది. క్రొత్తనిభందనలో పరలోక రాజ్యం/ దేవుని రాజ్యం అని సుమారు 140 సార్లు కనిపిస్తుంది.

అయితే ఇంతకీ *పరలోక రాజ్యం అంటే ఏమిటి?*

పరలోక రాజ్యం- పరలోకం రెండూ ఒక్కటేనా??!!!
కానేకాదు!!!!
పరలోకరాజ్యం 3 dimentional city/ place కానేకాదు!!.
*పరలోకరాజ్యం అంటే ఆధ్యాత్మిక పరిపాలన*!! *దానికి మూలం దేవుని నివాసమైన పరలోకంలో ఉంది. పరలోకరాజ్యం / దేవుని రాజ్యం అంటే దేవుడే మనుష్యుల హృదయాలను పరిపాలించడం*!!!

*అనగా దేవుని పరిపాలనా భాహ్యరూపమే పరలోకం*!!! ఇంకా దేవుడు విశ్వాసులు హృదయాలలో వారి అంతరంగంలో ఆధ్యాత్మిక పరిపాలన చేయడం అని అర్ధం!!! ఇంకా చెప్పాలంటే *ఇలాంటి ఆధ్యాత్మిక పరిపాలన జరుగుతున్నా వారితో ఏర్పాటైన సామ్రాజ్యం- అనగా విశ్వాసుల సంఘమే పరలోకరాజ్యం*!!! దేవుడు ఈ విశ్వాసుల హృదయాలను పరిపాలిస్తున్నారు. వారిమధ్య తన ఆత్మనుంచి తనకార్యాలు చేస్తున్నారు. *ఈ దేవుని రాజ్యంలో/ సంఘంలో గోదుమల మధ్య గురుగులు ఉన్నాయి. విశ్వాసులు మధ్య పాపులు, సాతాను కార్యాలు కనిపిస్తాయి*. ఈ రాజ్యంలో కొంతమందికి చోటులేదు అని చెప్పారు దేవుడు (ఉదా: ధనవంతులు).

యేసుప్రభులవారు దేవునిరాజ్యాన్ని చేపలపట్టు వలతోను, ఆవాలు గింజతోను, పులిసిన పిండి తోనూ, దాచబడిన ధనముతోను, మంచిముత్యములు కొనే వర్తకునితోను, పెండ్లి విందుతోనూ, దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనే కన్యకలతోనూ, ఎస్టేట్ యజమానితోను, తోట యజమానితోను . . . పోల్చారు!!! వీటన్నిటిలోనూ చాలా అర్ధాలు, పరమార్ధాలు ఉన్నాయి, వాటిని నేను ప్రస్తుతం వివరించాలని అనుకోవడం లేదు.

పరలోకం దేవుని నివాసం! అది పైనుంది అంటాం ఎందుకంటే గలతీ 4:26, మత్తయి 28:2, యోహాను 6:38, ప్రకటన 21:10, 2 సమూయేలు 22;10 , సామెతలు 15:24 ప్రకారం పరలోకం పైన ఉంది. అయితే దేవుని రాజ్యం/ పరలోకరాజ్యం భూమిమీద ఉంది. అది మన హృదయంలో ఉంది.క్రీస్తు మన హృదయాలను పరిపాలిస్తూ ఉంటే మనం పరలోక రాజ్యంలో పాలివారము. *దేవుని ఆధ్యాత్మిక సంఘమే పరలోకరాజ్యం లేదా దేవుని ఆధ్యాత్మిక పరిపాలనే పరలోక రాజ్యం*!!! అందుకే భాప్త్మిస్మమిచ్చు యోహాను గారు, యేసుప్రభులవారు పరలోక రాజ్యం సమీపించి యున్నది , మారుమనస్సు నొంది, రక్షణ పొందుడి అని (మత్తయి 4:17) చెప్పారు! ఎందుకంటే పరలోక రాజ్యానికి రాజు శ్రీ యేసుక్రీస్తు ప్రభులవారు దానిని భూలోకానికి తీసుకుని వచ్చారు. కాబట్టి మారుమనస్సు పొంది రక్షణ పొందితే ఆయన వారి పాపాలు కాడి వారిని శుద్దులుగా చేసి పరలోకరాజ్యాని, పరలోకానికి వారసులుగా చేస్తారు.

పాతనిభందన కాలం నుండి దేవుడు వాగ్దానం చేస్తున్నారు పరలోకరాజ్యాన్ని భూలోకానికి పంపిస్తాను, దానికి రాజుగా యేసయ్య వస్తారు అప్పుడు నీ రాజు భారవాహక పశువైన గాడిదపై ఊరేగుతారు. ఆయన మన హృదయాలను ఏలుతారు, జెకర్యా 9:9; యేసుప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చి అదే ప్రకటించారు.

కాబట్టి ప్రియ విశ్వాసి! యేసు ప్రభులవారు నీ హృదయాన్ని పరిపాలిస్తున్నారా?
లేక మరేదైనా పరిపాలిస్తుందా?
ఏమి పరిపాలిస్తుంది నీ హృదయాన్ని? ధనమా?
అహంకారమా?
కోపమా?
ద్వేషమా?
కామమా?
క్రోధమా?
లోభమా?
మొహమా?
మధమా?
మత్సరమా?
యేసుప్రభులవారు నిన్ను ఆధ్యాత్మికంగా పరిపాలిస్తుంటే నీవు ధన్యుడవు!! నీవు పరలోకరాజ్యంలో ఉన్నావు!!! అయితే నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకో!!!
ఒకవేళ యేసయ్య కాక మరేదైనా నిన్ను పరిపాలిస్తుందా? నేడే మార్పునొంది, ఆయన దగ్గరకు రా!!! ఆయన ప్రేమతో నిన్ను చేర్చుకొని ఆ పరమరాజ్యానికి వారసులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు!
దేవుడు మిమ్మును దీవించును గాక!!
ఆమెన్!
(సశేషం)


తోట యజమాని

మూడవ భాగము


ప్రియ దైవజనమా! మత్తయి సువార్త 20:1-16 లో గల ఉపమానం ఒకసారి టూకీగా గుర్తుచేసుకుందాం. (ఈ భాగం పదిసార్లు చదివారని తలస్తున్నాను). ఒక ఇంటియజమానికి ఒక ద్రాక్షతోట ఉంది. దానిలో పనిచేయడానికి ఉదయాన్నే (6 లేదా 7 గంటలకు కావచ్చు) వీదిలోనికి వెళ్లి ఉన్నవారినందరిని దినమునకు ఒక దేనారము చొప్పున బేరమాడి, తన తోటలోనికి పనికి తీసుకెళ్ళారు. మరలా తొమ్మిది గంటలకు సంతవీధిలో వెళ్లి చూస్తే అక్కడ మరికొంతమంది కాళీగా ఉండటం చూసి, మీరుకూడా వెళ్లి నా ద్రాక్ష తోటలో పని చేయండి, ఏది న్యాయమో అది మీకిస్తాను అని వారిని కూడా తోటలోనికి పంపించారు. మరలా 12 గం.కి, 3 గం.కి కూడా ఇలా పనిలేక కాళీగా ఉన్నవారిని తన ద్రాక్షతోటలోనికి పనికి పంపించారు తోట యజమాని!!! చివరకు 5 గం.కి కూడా సంతవీధిలో చూస్తే కొంతమంది కనబడతారు. అప్పుడు యజమాని ఏమయ్యా! రోజంతా వీధిలో కాళీగా ఉన్నారేమి? అని అడిగితే అయ్యా! మమ్ములను ఎవరూ పనిలోనికి పెట్టుకోలేదు అందుకే ఇక్కడ ఉన్నాం అన్నారు. అయితే మీరు కూడా నాతోటలోనికి వెళ్లి పనిచేయండి అన్నారు. చివరకు పని ముగించిన తర్వాత తోట యజమాని తన గృహనిర్వాహకుని పిలచి, సాయంత్రం 5 గం.కి వచ్చిన వారికి మొదట కూలి ఇచ్చి, తర్వాత అందరికి ఇమ్మంటారు. సాయంత్రం 5 గం.కి వచ్చినవారికి, మొదట వచ్చిన వారికి సమానంగా ఒక దేనారం చొప్పున ఇస్తే, మొదట వచ్చిన వారికి కడుపు మండిపోతుంది. ఇదీ ఉపమానం!!!

గమనిక! భారతదేశానికి, ఇశ్రాయేలు దేశానికి సంస్కృతిలోను, అలవాట్లలోనూ చాలా దగ్గర పోలికలున్నాయి. పూర్వకాలంలో (నా చిన్నప్పుడు కూడా) ప్రజలు ఉదయం నాలుగు గంటలకే లేచి, తమ పనులు చక్కబెట్టుకొని ఉదయం ఆరుగంటలకే పనికి వెళ్ళిపోయే వారు. మరల సాయంత్రం తొందరగా భోజనం చేసి ఎనిమిది గంటలకే నిద్రపోయేవారు. ఇదీ పాత అలవాటు. ఇప్పుడు టీవీ వచ్చాక పరిస్తితి మారిపోయింది.
ఇజ్రాయేలు దేశంలో కూడా ఆ కాలంలో ఆరు గంటలకే పనికి వెళ్ళిపోయేవారు. ఈ ఉపమానంలో కూడా తోట యజమాని తనతోటలోని పనికి ఉదయాన్నే వెళ్లి కూలివారిని దినమునకొక దేనారం చొప్పున బేరమాడి తీసుకుని వెళ్లారు. మత్తయి 20:1-2.

(*ఈరోజు ప్రశ్నలు: 1. తోటయజమాని మరలా 9 గం.లకి, 12 గం.లకు, 3 గం.లకు సంతవీదిలోనికి ఎందుకు వెళ్ళారు? పనివారు అవుసరమై యుండి మాత్రము కాదు. 2. మరలా 5 గంటలకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? దయచేసి మీ జవాబులు పంపించండి. జవాబు రేపటి భాగంలో.*)

ఈఉపమానం ఎందుకు చెప్పారో ఉపోద్ఘాత భాగంలో చెప్పాను కదా, పేతురు గారు మేము సమస్తము విడచి నిన్ను వెంబడించాం. మాకేం దొరుకుతుంది అని బేరమాడితే యేసుప్రభులవారు జవాబు చెప్పి, ఈ ఉపమానం చెప్పారు!

*ఈ ఉపమానం ఎవరికీ వర్తిస్తుంది*???
సేవలోనున్న ప్రతీ దైవసేవకునికి, సువార్త ప్రకటిస్తున్న ప్రతీ విశ్వాసికి, ప్రతీవిధమైన దేవుని పరిచర్య చేస్తున్న (మందిరం కడిగే వారికి, తుడిచేవారికి) అందరికీ వర్తిస్తుంది. దేవుని పిలుపుకి లోబడి వచ్చిన వారికి, పొట్టచేత పట్టుకొని సేవకు వచ్చిన వారికి అందరికీ వర్తిస్తుంది.

మూలార్ధం:
తోట యజమాని: దేవుడు
ద్రాక్షతోట: దేవుని సంఘం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం! అనగా ఆదాముగారి నుండి ఇప్పటివరకు , రాబోయే కాలంలో విశ్వాసులయ్యే వారుకూడా దేవుని సంఘమే!

పనివారు: దైవ సేవకులు, దేవుడు కొంతమంది తన సేవకు పేరుపెట్టి పిలచి, తనసేవకు ప్రత్యేకించుకొన్నట్లు చూస్తాం పాతనిభంధనలోను, క్రొత్త నిభందన లోను. యేసుప్రభులవారు పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొంది రక్షణపొందుడి అని సువార్త ప్రారంభించి, శిష్యులను ఏర్పరచుకొని, వారినికూడా సువార్తకోసం పంపించి, చివరకు ప్రజలు కాపరిలేని గొర్రెలవలె ఉన్నారని చూసి అంటున్నారు: కోత విస్తారము, గాని పనివారు కొద్దిమంది. గనుక కోతకు పనివారిని పంపమని వేడుకొండి అంటున్నారు. (మత్తయి 9:36-38; 21:28).

చివరకు మార్కు 16: 15-18 లో యేసుప్రభులవారి చివరి ఆజ్న ఇచ్చారు: మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. . . . ఈ ఆజ్న రక్షించబడిన ప్రతీ వారికి వర్తిస్తుంది. కాబట్టి దేవుని తోట అనగా సంఘంలో పనివారు చాలామంది కావాలి. ఒక్కొక్కరు ఒకో రకమైన పనిచేయాలి. అందుకే 20:1-2 లో దేవుడు కొందరిని దినమునకొక దేనారం చొప్పున ఒడంబడిక చేసుకుని పంపించారు.

ఇక దేనారం అనేది రోమన్ నాణెం. ఆ రోజులలో అనగా రోమన్ సామ్రాజ్యపాలనలో ఒకరోజు కూలి ఒక దేనారముగా నిర్ణయించారు. అందుకే యేసయ్య దినానికి ఒక దేనారం అన్నారు. కాబట్టి ఉదయం 6 గం.కి వెళ్ళిన వారు కూలి బేరమాడుకొని వెళ్ళారు. వీరు పూర్వకాలంలో ఉన్న ప్రవక్తలు, సేవకులకు సాదృశ్యం!
ఇంకా నేటిదినాల్లో దేవునితో material blessings కోసం బేరమాడుతున్న సేవకులకు సాదృశ్యం! పేతురుగారు యేసయ్యతో బేరమాడుచున్నప్పుడు మత్తయి 19:27-29 లో యేసయ్య జవాబు ఒకసారి చూద్దాం! 28 వ వచనంలో శిష్యులకు కలిగే భాగ్యం కోసం చెప్పబడింది. 29 వచనంలో అందరికీ ఏమి సంభవిస్తుందో, ఏమి ప్రతిఫలమో చెప్పబడింది. నానామము నిమిత్తము అన్నదమ్ములను, అక్కాచెల్లెల్లను, తల్లిదండ్రులను, భూములను , పిల్లలను విడచిపెట్టిన వారు
1. వాటికి వందరెట్లు తిరిగి పొందుతారు.(material blessings)
2. నిత్యజీవమును స్వతంత్రించుకొందురు (Heavenly blessings)
అయితే ఇవేకాకుండా చాలా వాగ్దానాలు చేసారు దేవుడు.
అవి కావాలంటే సేవలో/పరిచర్యలో
(1) పిలువబడిన వారు,
(2) ఏర్పరచబడినవారు,
(3) నమ్మకమైన వారుగా ఉండి జయిస్తే అప్పుడు అవన్నీ వస్తాయి.(ప్రకటన 17:14).

*ఏవేవి వస్తాయి*:
దేవునితో పాటు సింహాసనం మీద కూర్చుండుట,(ప్రకటన 3:2), దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు బుజించుట,(2:7), దేవుని ఆలయములో ఒక స్తంభముగా ఉండుటకై (3:12), దేవుని పేరు కలిగి యుండుట, వాడబారని మహిమ కిరీటం పొందుట, మరుగైయున్న మన్నా , తెల్లని రాయి, జనుల మీద అధికారం 2:26; జీవగ్రందంలో నుండి పేరు తుడచిపెట్ట బడకుండుట!!!!

మత్తయి 19: 29 లో వందరెట్లు వస్తాయి అని వ్రాయబడింది గాని, మార్కు సువార్తలో 10:16 లో దేవునికోసం అన్నీ విడచిపెట్టిన వారికి ఇహమందు హింసలతో పాటు ఇండ్లు, భూములు. . . కలుగును అని వ్రాయబడింది.
ప్రభు సేవలో, విశ్వాసంలో నీకు మొట్టమొదట కలిగే ప్రతిఫలం శ్రమలు, హింసలు అని యేసుప్రభులవారే స్వయంగా చెప్పారు. *ఒకవేళ సహోదరుడా ఎవరైనా యేసుప్రభుని నమ్ముకుంటే నీకు కష్టాలే రావు అని ఏ భోధకుడైన చెప్పాడంటే అట్టివాడు దొంగ/అబద్ద బోధకుడు అన్నమాట*!
పౌలుగారంటారు మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశిస్తాము అని చెప్పారు (అపోస్త 14:22). ఇంకా అంటున్నారు క్రీస్తుయేసు నందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు శ్రమలు పొందుతారు అంటున్నారు 2 తిమోతి 3:12.
ఇరుకుమార్గం సంకుచితము, దానిలో ప్రవేశించువారు కొద్దిమంది అంటున్నారు యేసయ్య. మత్తయి 7:13,14
1 పేతురు 5:9-10 లో పేతురు గారంటారు మీరు శ్రమ పడిన పిమ్మట మీరు పూర్ణులుగా మారుతారు అంటున్నారు.
కాబట్టి ప్రియ దైవసేవకుడా! విశ్వాసి! నీకోసం ఇంత కష్టపడుతున్నాను, సేవ చేస్తున్నాను, మరి నాకెందుకు శ్రమలు అని దేవునికి పిర్యాదు చేయకు!!! అదే ఇరుకు మార్ఘం! It’s a way of Christian life!!! కాబట్టి దేవునిరాజ్యములో/ పరలోకరాజ్యములో ఉన్నవారికి శ్రమలుంటాయి. వాటినే దాటితేనే పరలోకం!!!

కాబట్టి ప్రియదైవసేవకుడా! ఇన్ని గొప్ప వాగ్దానాలు దేవుడు నీకు నాకు ఇచ్చియుండగా ఎందుకు material blessings కోసం దేవుని దగ్గర బేరమాడతావు?
నేను సేవ ప్రారంభించి 20 సం.లు అయ్యింది, నాకు ఇంకా 100 మంది విశ్వాసులే, నాకు ఇల్లు గట్రా ఏమి లేదు, అదిగో ఆ సేవకుడు సేవ ప్రారంభించి 5 సం.లే అయ్యింది, అతనికి ఇప్పుడు 500 మంది సంఘం, ఇల్లు, కారు . . . అన్నీ ఇచ్చావ్, నాకెందుకు ఈయవు అంటూ దేవునితో బేరమాడతావ్, అలుగుతావ్. దేవుడు ఎవరి సామర్ధ్యం చొప్పున వారికి ఇస్తారు. అందుకే దేవుడు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి ఒకటే ఇచ్చారు. మత్తయి 25; లూకా 19. దేవునికి ఎవరు ఎలాంటివారో బాగా తెలుసు. కాబట్టి ఊరికే ప్రక్కవారిని చూసి కుల్లిపోకు! అంతేకాదు మత్తయి 20:15 లో ఇచ్చిన జవాబే నీకు ఇస్తే నీ ముఖం ఎక్కడపెట్టుకుంటావు?
జాగ్రత్త స్నేహితుడా!!!

విశ్వాసులారా! దేవునిసేవలో తోడ్పడుచున్నారు, నమ్మకంగా ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
అయితే ఇంకా material blessings కావాలి అంటూ అడుగుతారు. ఇల్లు లేదని, కొడుక్కి ఉద్యోగం లేదని. ఇదిలేదు, అదీలేదు అని దేవునితో బేరమాడవద్దు! ఇక్కడ నేను అడగొద్దు అని చెప్పడం లేదు. అడుగుడి మీకివ్వబడును అన్నారు యేసయ్య!! మత్తయి7:7; లూకా 11:9; యోహాను 15:7; అయితే అదికూడా పరిశుద్ధాత్మను అడగమన్నారు లూకా 11:13. ఇంకా మొదట ఆయన నీతిని, రాజ్యమును అడగండి, వెదకండి, అప్పుడు మీకు ఏమి కావలెనో దేవుడే ఇస్తారు అన్నారు కదా!. మత్తయి6:33;
మరెందుకు material blessings కోసం వెంపర్లాట! నీ కొడుక్కి ఉద్యోగం కావాలని దేవునికి తెలుసు, నీకు ఇల్లు కావాలని కూడా తెలుసు. అయితే నీవు నమ్మకముగా దేవుని సేవలో సాగిపో, నీకు కావలసినవి అన్నీ దేవుడే ఇస్తారు. తగినకాలమందు ఆయన మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన కాడిక్రిండ దీనమనష్కులై ఉండండి అంటున్నారు. 1 పేతురు 5:6.
మరికొంతమంది 20 సం.ల బట్టి చర్చికి వస్తున్నా, ఇంకా బట్టీ పట్టిన ప్రార్దనే తప్ప, పాటలు రావు, ఆత్మ నడిపింపుకలిగి ప్రార్ధించడం రాదు. క్రొత్తగా రక్షించబడిన విశ్వాసి పాటలు పాడుతుంటే, చక్కగా ప్రార్ధన చేస్తుంటే ఉడికిపోతావు. ఇది మనకు తగదని ప్రేమతో హెచ్చరిస్తున్నాను! నీవు కూడా నేర్చుకోమని ప్రోత్సహిస్తున్నాను!!!

ఈ 6 గం.లకి బేరమాడివచ్చిన వారికి ఎంతకూలి దొరికిందో, 5 గం.లకి వచ్చిన వారికి కూడా అంతే దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవునికి ఇష్టమైతే దేవుని నిర్ణయానికి తలవంచుదాం!!! అంతేతప్ప దేవునితో బేరాలాడి భంగాపడొద్దని మనవి చేస్తున్నాను!!

దైవాశీస్సులు!!

ఆమెన్!
(సశేషం).


తోట యజమాని

నాల్గవ భాగము


దేవుని నామమునకు మహిమ కలుగును గాక!

నిన్నటి ప్రశ్నలకు జవాబులు:
1. ఈ ప్రశ్నకు జవాబుకోసం మనం కొద్దిగా గత చరిత్ర తెలిసికోవలసి ఉంటుంది. క్రీ.పూ. 721-672 లో ఇశ్రాయేలీయులు, BC 598లో యూదులు చెరలోనికి పోయి తిరిగి జెరుబ్బాబెలు, మొర్దుకై, నెహేమ్యా, ఎజ్రా గార్ల ఆద్వర్యంలో BC 538 లో తిరిగి బహు కొద్దిమంది తమ స్వదేశానికి వస్తారు. వచ్చిన వెంటనే తమ సొంత ప్రాంతాలకి వెళ్ళకుండా యెరూషలెం దేవాలయాన్ని కట్టారు, కోటను గట్టి పరిచారు, పట్టణంలో చెత్తను తీసివేసి పట్టణాన్ని కట్టారు(నెహేమ్యా, ఎజ్రా గ్రంధాలు). అది పూర్తయ్యాక నెహేమ్యా 11 వ అధ్యాయం ప్రకారం జనుల అధికారులు యేరూషలేములో ఉండటానికి నిర్ణయించు కొంటారు. మిగిలిన జనులలో పదిమందికి ఒకరు యేరూషలేము నగరంలో మిగిలిన వారు వారి వారి ప్రాంతాలలో తిరిగి నివాసం చేయడానికి నిర్ణయం తీసుకుంటారు. యేరూషలేము నగరంలో ఉండటానికి స్వచ్చందంగా ఒప్పుకున్నవారిని జనులు దీవించిరి అని వ్రాయబడింది. ఎందుకంటే వీరు పట్టణాన్ని కాపలా కాయడానికి, ఆలనా పాలనా చూడటానికి ఉన్నారు. మిగిలిన వారు పంటలు పండించటానికి తమ సొంత ప్రదేశము వెళ్ళారు, యేహెజ్కేలు 47, 48 అధ్యాయాల ప్రకారం భూమిని పంచుకున్నారు. అయితే వెళ్ళేటప్పుడు ఒక ఘనమైన నిర్ణయం తీసుకున్నారు. అది: తమకు ఇంత దురవస్థ కలగటానికి కారణం తమ పితరులు- దేవుణ్ణి విడచి పెట్టినందుకే! తమ పాపములే కారణం! కాబట్టి ప్రతీ విశ్రాంతి దినాన్న ధర్మశాస్త్ర ధ్యానం చేయాలని, వారు వెళ్ళే ప్రతీ స్థలంలో సమాజమందిరాలు కట్టుకొని, ప్రతీ విశ్రాంతి దినము కూడుకొని అందులో ధర్మశాస్తము(అనగా ఆదికాండము నుండి ద్వితీయోపదేశఖండము వరకు), కీర్తనలు, ప్రవక్తల ప్రవచనాలు ధ్యానం చేయాలని నిర్ణయించుకొన్నారు. (లూకా 4:10-21, అపోస్త 13:15). అప్పటి యాజకుడు Yohanan Ben Zaccai గారి అలోచన ప్రకారం సమాజ మందిరం నిర్మాణం మొదలయ్యింది. అయితే భక్తిగల ఏం చేసేవారంటే ప్రతీరోజు ఈ సమాజమందిరానికి వెళ్లి ప్రార్ధన చేసుకునేవారు!!! ప్రతీ ఒక్కరు ఉదయం 9 గం.కి, 12 గం.కి, 3 గం.కి వెళ్లి ప్రార్ధన చేసుకునే వారు. అయితే ఏ సమయం మిస్ అయినా గాని మధ్యాహ్నం మూడు గంటలకు తప్పకుండా వెళ్లి ప్రార్ధన చేసుకునేవారు. ఇది వారి ప్రార్ధనా సమయం!!

మన తోటయజమానికూడా భక్తిపరుడు అందుకే ఈ సమయాలలో తన తోటనుండి ప్రార్ధనకు వెళ్తూ వీరిని పనికి పెట్టారు అని బైబిల్ పండితుల అభిప్రాయం! తోట యజమాని వీరిని చూసి, ఏమయ్యా! ఇక్కడ కాళీగా ఎందుకున్నారు? అని అడిగితే అయ్యా మాకు పని దొరకలేదు అంటే మీరు వెళ్లి నాతోటలో పనిచేయండి, ఏది న్యాయమో అది మీకు ఇస్తాను అని తనతోటలోనికి పనికి పంపించారు 9, 12, 3 గం.లకు..

2. మరి 5 గంటలకు మరలా ఎందుకు వెళ్ళారు?
లేవీ 19:13 ప్రకారం ఏనాటికూలి ఆరోజు చెల్లించాలి, అది ఇశ్రాయేలుదేశం విధి! అయితే ఇక్కడ ఉదయం వచ్చిన వారు కాక మరో మూడుసార్లు కూలివారు పనికి వచ్చారు కాబట్టి వారి కూలి/జీతం తీసుకురావడానికి ఇంటికి వెళ్తూ మరలా సంతవీధిలో కాళీగా ఉన్నవారిని చూసి జాలిపడి వారినికూడా తనతోటలోనికి పనికి పంపించారు!!!

అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు! ఉదయాన్నే తోటయజమాని కావాల్సిన వారినంతా/ దొరికిన వారినంతా తనతోటలోనికి తీసుకుని వెళ్ళారు కదా! మరి ఎవరూ మమ్మల్ని పనిలోనికి పిలవలేదు అని ఎందుకుఅంటున్నారు?
1. బహుశా వీరు ఆలస్యంగా వచ్చియుంటారు.
2. గతంలో వివరించిన విధముగా వారు మొదట వెళ్ళిన సెంటర్ లో పని దొరకలేదు కాబట్టి ఈ సెంటర్ కి వచ్చియుంటారు. అనగా (ఉదా) తోటయజమాని NAD జంక్షన్లో ఉన్నవారిని ఉదయాన్నే వచ్చి పనికి తీసుకుని వెళ్లారు. అయితే గాజువాక, మద్దిలపాలెం లో ఉన్న కూలివారిలో చాలా మందికి కూలి దొరకలేదు.
వారిలో కొంతమంది పని దొరుకుతుంది అని ఆశతో 9 గం.కి NAD జంక్షన్ కి వచ్చారు. ప్రార్ధనా కాలంలో తోటయజమాని వారిని చూసి పనికి పెట్టుకున్నారు.
మరికొంతమంది 12 గం.కి NAD జంక్షన్ కి వచ్చారు. ప్రార్ధనా కాలంలో తోటయజమాని వారిని చూసి పనికి పెట్టుకున్నారు.
మరికొంతమంది తిరిగి తిరిగి 3 గం.కి NAD జంక్షన్ కి వచ్చారు. ప్రార్ధనా కాలంలో తోటయజమాని వారిని చూసి పనికి పెట్టుకున్నారు. ఇలా దొరికిన వారినంతా ఆయన పనిలో పెట్టుకున్నారు. ఆయన తోట అంత పెద్దది.

పరమతండ్రి తోట అనగా దేవుని సంఘం/ దేవుని రాజ్యం అంతపెద్దది!! దానిలో పనిచేయడానికి చాలామంది కావాలి!
చదువుతున్న ప్రియ సహోదరీ/సహోదరుడా! నీకు కూడా దానిలో పనుంది. ఆ పనికి వస్తావా? నీ వ్యర్ధమైన సమయాన్ని టీవీ సీరియల్స్ చూడటంలోనో, social media లో చాటింగ్ చేయడంలోనో , మరి దేనిలోనో గడిపే బదులు సేవలో ముందుకు వెళ్తున్నావా?
సహోదరీ టీవీ సీరియల్స్ చూడటం బదులు నీ పొరుగువారు రక్షింపబడక నశించి పోతున్నారు కదా వారికి నీ సాక్ష్యం చెప్పావా? వారి రక్షణకోసం ప్రార్దిస్తున్నావా? ఒకవేళ సేవలో పాలిభాగస్తుడవు కాలేకపోతే వెళ్ళేవారిని పంపుతున్నావా? వారికి సహాయం చేస్తున్నావా? ప్రార్ధనా సహకారం చేస్తున్నావా?
ఒకటి గుర్తుంచుకో! *5 గం.కి తోట యజమాని ఇంటికి వెళ్లి కూలి/జీతం తీసుకుని వచ్చినట్లు నేడో రేపో దేవుని రాకడ, తోటయజమాని జీతం తీసుకుని రాబోతున్నారు!*!
Revelation(ప్రకటన గ్రంథము) 22:12
12.ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
నీ జీతం సిద్ధంగా ఉంది! కష్టపడి పనిచేస్తే మంచి జీతం! మంచి కిరీటాలు, లేక పొతే సోమరివైన చెడ్డదాసుడా! అని పిలిపించుకుంటావు. ఆరనిఅగ్నిలో త్రోయబడతావు మత్తయి 25:26.

కాబట్టి ప్రియ దేవునిబిడ్డా! నిన్ను నీవు సరిచేసుకో! సిద్దపడు! అట్టి సిద్దపాటు దేవుడు మనందరికీ దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

నేటి ప్రశ్న: *మత్తయి 20: 8-10 ప్రకారం తోటయజమాని సాయంత్రం 5 గం.కి కనబడిన వారిని ఎందుకు పనిలో పెట్టుకున్నారు? ఎందుకు వారికే మొదట కూలి డబ్బులు ఇమ్మన్నారు? ఈ ప్రశ్నకు జవాబు ఆలోచించి పంపడి*.
(జవాబు రేపటి భాగంలో)


తోట యజమాని

ఐదవ భాగము-దయామయుడు


యేసయ్య ప్రశస్త నామంలో ప్రియులైన వారందరికీ శుభాశీస్సులు!!!
నిన్నటి ప్రశ్నలకు జవాబులు:
ప్రియులారా! ఈ ప్రశ్నకు జవాబు రెండు కోణాలలో చూసుకోవచ్చు!
1. మానవీయ కోణం (Humanity Basis)
తోటయజమాని సాయంత్రం 5 గం.లకి వచ్చిన వారి మానసిక పరిస్తితిని చాలాబాగా అర్ధం చేసుకున్నారు. నిజం చెప్పాలంటే వారిని పనిలో పెట్టుకోవాల్సిన అవుసరం లేదు. దానివల్ల ఆయనకు వచ్చే లాభం లేదు ఎందుకంటే కేవలం ఒకగంట పనిమాత్రం మిగిలి ఉంది. అక్కడ తోటయజమాని తన ఇంటికి కూలి వారి జీతం తీసుకుని రావడానికి వెళ్తూ సంతవీధిలో కాళీగా ఉన్న వీరిని చూసారు, వీరి ముఖాలు చాలా విచారంగా అలసిపోయి ఉన్నాయి. అందుకే వీరినిచూసి అడుగుతున్నారు ఏమయ్యా రోజంతా ఎందుకు కాళీగా ఉన్నారు అంటే, అయ్యా మమ్మల్ని ఎవరూ పనికి పెట్టుకోలేదు! అన్నారు. తోట యజమాని 9 గం.కి, 12 గం.కి, ౩గం.కి పనిలో పెట్టుకున్నప్పుడు వీరు లేరు అక్కడ!! అయితే వారి ముఖాల్లో అలజడి, ఆందోళన, అశాంతి, విచారం, అలసట కనిపిస్తుంది. ఎందుకంటే వారు ఉదయం నుండి పనికోసం వెదుకుతూ తిరుగుతూ అలసిపోయారు. బహుశా (ఉదాహరణ) గాజువాక జంక్షన్లో ఉదయం ఆరుగంటలకి నించున్నారు. కాని అక్కడ పని దొరకలేదు, పోనీలే అని మద్దిలపాలెం వెళ్ళారు తొమ్మిది గంటలకు. అక్కడ కూడా పని దొరకలేదు. 12 గం.కి గోపాలపట్నంలో పని దొరుకుతుంది అని వెళ్ళారు. అక్కడ కూడా దొరకలేదు. 3 గంటలకు మరలా గాజువాక వెళ్ళారు. పని దొరకలేదు. ఇంట్లో పిల్లలు గుర్తుకు వస్తున్నారు, రాత్రికి వారికి తినడానికి ఏం పెట్టాలి? వచ్చేటప్పుడు సరుకులు తీసుకుని రండి అంటూ భార్య రాసి ఇచ్చిన సరుకులు లిస్టు గుర్తుకు వస్తుంది. ఇప్పుడు పని దొరకలేదు వాటిని ఎలా తీసుకు వెళ్ళాలి? నా మందులు అయిపోయాయి వచ్చేటప్పుడు తీసుకుని రారా! అంటూ చెప్పిన రోగిష్టి తల్లి గుర్తుకు వస్తుంది. రాత్రికి మందులు ఎలాగైనా తీసుకొని వెళ్ళాలి. ఈ ఆవేదన ఎక్కువైపోయింది!! ఏం చెయ్యాలి? వెళ్ళేటప్పుడు దారిలో NAD జంక్షన్లో ఆగారు. సాయంత్రం 5 గం.కి తోటయజమాని వెళ్తూ వెళ్తూ వీరిని చూసారు. చూసి అడిగారు. వీరి జవాబు విని, వీరి మానసిక ఒత్తిడి అర్ధం చేసుకొని ఆయన కనికరంతో కరిగిపోయారు. మీరుకూడా వెళ్ళండి నా తోటలోనికి అని పంపించారు. ప్రియబిడ్డా నీ మానసిక స్తితి దేవునికి తెలుసు! ఆయన మన అందరి హృదయాలు ఎరిగిన వారు!!
ఎప్పుడైతే తనతోటలోనికి వెళ్లి పనిచేయ్యమన్నారో వీరి ముఖాలు వెలిగిపోయాయి, హృదయాలు తెప్పరిల్లాయి. తోటయజమాని దయామయుడు అని విన్నారు. కనీసం రాత్రికి భోజనం ఖర్చు అయినా దొరకొచ్చు అనుకున్నారు. అయితే ఎంత ఇస్తారు అనే సందేహం, అయినా కొంత ఆదరణ!

ఈలోగా పనిముగిసే సమయం అయ్యింది. తోటయజమాని ఇక లేవండి మీ కూలి తీసుకుపోండి అన్నారు. తన గృహనిర్వాహకుని పిలచి మొదట 5 గం.కి వచ్చిన వారికి కూలి ఇమ్మన్నారు. ఎందుకంటే వారి మానసిక వేదన, అలజడి ఆయన గ్రహించారు కాబట్టి మొదట వారిని ఆదరించాలి అనుకొన్నారు. గృహనిర్వాహకుడు 5 గం.కి వచ్చిన మొదట వాడిని పిలచి ఒక దేనారం చేతిలో పెట్టాడు. వెంటనే ఆయన అంటున్నాడు అయ్యా నా దగ్గర చిల్లర లేదండి! ఎందుకంటే తను ఒక గంట మాత్రమే పనిచేసాడు. ఒక రోజు కూలి ఒక దేనారం. అందుకే చిల్లర లేదు అంటున్నాడు. గృహనిర్వాహకుడు నవ్వి, బుజం మీద చేయివేసి అంటున్నాడు: మా యజమాని నీకు ఒకదేనారం మొత్తం ఇమ్మన్నారు, సమాధానం గలవాడవై ఇంటికి పో! అన్నాడు. కూలివాని మనస్సు ద్రవించింది రెండు చేతులు జోడించి నమస్కరించి తోటయజమానిని దీవిస్తున్నాడు.
ఇది మానవీయ కోణం.

2. ఆత్మీయ కోణం:కొంతమందికి దేవుని సేవ చెయ్యాలి అని ఉంటుంది గాని అవకాశం రాదు. అయితే వీరు దేవునికోసం శ్రమించే జీవితం కలిగియుంటారు. ఇలాంటివారిని దేవుడు వారి జీవితం చాలావరకు గతించిన తర్వాత తన సేవలో వాడుకుంటారు. వారు బహుకొద్దికాలం మాత్రమే వాడబడతారు. గాని బహు ఘనమైన సేవ చేస్తారు. వారు అనుకుంటారు దేవా నీ సేవ చేసే భాగ్యం ఇచ్చావు, మాకదే చాలు అని. జీతం కోసం ఆశించరు. ఇలాంటి లక్షణాలున్నవారికి మొదట వచ్చిన వారితో సమానంగా దేవుడు ప్రతిఫలం ఇచ్చే అవకాశం ఉంది అని ఈ ఉపమానం తేటతెల్లం చేస్తుంది.
మరికొంతమంది చాలా తక్కువ కాలం దేవుని సేవ చేసి అంతమై పోతారు, దేవునికోసం హతస్సాక్షి అయిపోతారు యేసయ్యలా, స్తెఫెనులా. అయితే వీరు పొందే భాగ్యమే వేరు.

*అయితే కొద్దిసేపు చేసినా, రోజంతా/జీవితాంతం చేసినా, సగం చేసినా ఎంతసేపు చేసినా దేవుడు తనకోసం శ్రమించిన వారికి జీతం ఇవ్వకుండా/ ప్రతిఫలం ఇవ్వకుండా ఉండలేడు*. ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రతీవారికి ప్రతిఫలమిస్తారు. మత్తయి 5:12, 10:41-42; 16:27; 1 కొరింథీ 3:8,14; 2 యోహాను పత్రిక 8; ప్రకటన 11:18;
ప్రకటన గ్రంథము) 22:121ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
కాబట్టి ఆయన సేవ నమ్మకంగా చేద్దాం! ఆయనిచ్చే బహుమానం పొందుదాం!
దైవాశీస్సులు!
ఆమెన్!
(ఇంకా ఉంది)


తోట యజమాని

ఆరవ భాగము


దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక! ప్రియదైవజనమా! మనం కొద్దిరోజులుగా తోటయజమాని కోసం ధ్యానం చేస్తున్నాం. మత్తయి 20:10-16 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ఉపమాన సారాంశం వీటిలోనే ఉంది. కాబట్టి ప్రార్ధనాపూర్వకముగా ధ్యానం చేద్దాం!

5 గం.కి వచ్చినవారు ఒకదేనారము తీసుకుని సంతోషముగా వెళ్ళిపోయారు. 3 గం.కి, 12 గం.కి, 9 గం.కి వచ్చినవారు కూడా ఒక దేనారము తీసుకుని సంతోషముగా వెళ్ళిపోయారు. నిజంగా వారు ఒక దేనారము ఆశించలేదు! ఊహించలేదు! అది తోటయజమాని దాతృత్వము, కృప!!!!
మన జీవితాల్లో కూడా నిజంగా మనం మన ప్రస్తుత పరిస్తితిని మన పూర్వస్తితితో పోల్చుకుంటే ఆశ్చర్యంగా, అధ్బుతంగా ఉంటుంది. మనం ఈ స్తితిలో ఉంటామని ఆరోజుల్లో (దేవుని ఎరుగని రోజులలో, కష్టాల తరంగాలు మనల్ని ముంచివేస్తున్న దినాలలో) మనం ఊహించలేదు, అనుకోలేదు. ఈ కష్టం గట్టెక్కితే చాలు అనుకున్నాం! గాని ఆశ్చర్యమైన తన కృపాతిశయము మనయెడల కనపర్చారు దేవుడు. ఎందుకూ పనికిరాని మనల్ని ఇప్పుడు పనికొచ్చే వారిగా రాజులైన యాజక సమూహముగా చేసారు. 1 పేతురు 2:9; కాబట్టి ఈ విషయం మనం జీవితాంతం మరచిపోకూడదు!! కృతజ్ఞత కలిగియుండాలి!

ఇక మొదట వచ్చిన వారు అనగా బహుశా 6 లేక 7 గంటలకు వచ్చినవారు, బేరం కుదుర్చుకొని వచ్చినవారు మాకు ఒక దేనారం కంటే ఎక్కువ దొరుకుతుంది అని అనుకున్నారు ఎందుకంటే 5 గం.కి వచ్చినవారికే ఒక దేనారం ఇచ్చిన తోటయజమాని మాకు అంతకంటే ఎక్కువ ఇస్తారు అనుకున్నారు. గాని వారికి కూడా ఒకదేనారమే దొరికింది. వారికి ఒళ్ళు మండిపోయి, తోటయజమానితో తగవాడుచున్నారు. ఆరోజుల్లో ILO, NMU లాంటి యూనియన్లు లేవు. ఉంటే strike చేసేవారేమో!!
అంటున్నారు: మేము ఉదయమనగా వచ్చి ఎండలో ఇంతకష్టపడి పనిచేశాం కదా! ఇప్పుడే వచ్చిన వారికి మాతో కూడా సమానంగా ఇచ్చావేమి? ఇదేమైనా న్యాయంగా ఉందా అంటున్నారు!

న్యాయంగా మొదట వచ్చినవారు అంతకంటే (ఒక దేనారము) ఎక్కువ ఆశించడానికి హక్కులేదు! ఎందుకంటే 2వ వచనంలో వారు దినమునకు ఒక దేనారం అని బేరం కుదుర్చుకొని వచ్చారు. వారు అడిగినంతే ఇచ్చారు తోటయజమాని.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తన సేవకులందరికీ ఆయన సమానమైన ప్రతిఫలం ఇస్తారని ఈ ఉపమానం చెప్పడం లేదు. లూకా 19:16-19, 1 కొరింథీ 3:10-15 లో కనిపించే సందేశానికి, దీనికి చాలా తేడా కనిపిస్తుంది. *ఈ ఉపమాన సారాంశం ఏమిటంటే: దేవునికిష్టమైతే చక్కగా, మనస్పూర్తిగా, నమ్మకంగా పనిచేసిన వారికి వారు కొద్దికాలం పనిచేసినా దీర్ఘకాలం చేసినా ఒక్కటే/ సమానమైన బహుమానం ఇవ్వవచ్చు!అయితే ఈ బహుమతి రావాలంటే సరైనరీతిలో సరైన ఉద్దేశంతో దేవుని పని చేయాలి*.

ఈ 20:11,12 వచనాల ద్వారా మనం మరో విషయాన్ని నేర్చుకోవచ్చు! యేసయ్య తన శిష్యులకు/సేవకులకు/విశ్వాసులకు ఎలాంటి మనస్సు ఉండకూడదని కోరుకున్నారో, అలాంటి వ్యక్తిత్వమే/ మనస్తత్వమే చూపించారు ఈ ముందు వచ్చినవారు!!!
తనతోటివారికి/ పొరుగువారికి తనకన్నా వెనుక వచ్చిన వారు, తనలాంటి, తనతో సమానమైన ఆశీర్వాదాలు, ఫలాలు పొందుకుంటుంటే కుల్లిపోకూడదు!!!
యజమాని దయతో ఇచ్చిన కానుకను గూర్చి సణుగుకోకూడదు.
ప్రియవిశ్వాసి! సేవకుడా! ఒకవేళ నీవు అలాంటి స్తితిలో ఉంటే ఇప్పుడే సరిచేసుకో! కావాలంటే ఇలా ప్రార్ధన చేయవచ్చు- అయ్యా! నా పొరుగు వానిని/ సహోదరుని/ సేవకుని దీవించావు, నీకు ధన్యవాదాలు! నీ చిత్తమైతే నాకు కూడా మంచి తలాంతులు ఇవ్వమని మనవి చేస్తున్నాను, అయితే నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్దించును గాక! అని ప్రార్ధన చేయు. దేవుడు ఒకవేళ కరుణించి నీకు కూడా మంచి ఆశీర్వాదాలు, తలాంతులు ఇస్తారు, వాటికంటే మంచివి ఇస్తారు!

ఇక్కడ తోటయజమాని చేసిన అన్యాయం ఏమిలేదు. అందుకే 13వ వచనంలో తోటయజమాని జవాబు చూడండి: స్నేహితుడా! ఎంతమంచి పిలుపు!!! తోటయజమాని కూలివానిని తనతో సమానంగా పోల్చుకుని, స్నేహితుడా అంటున్నారు. యేసుప్రభులవారు కూడా అర్హతలేని మనల్ని స్నేహితులు అని పిలుస్తున్నారు. యోహాను15:14; స్నేహితుడా! నీవు ఎంతకైతే ఒడంబడిక చేసుకుని వచ్చావో నీకు అంత ఈయలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము! నీకిచ్చినట్లే వారికివ్వడానికి నాకిష్టమైంది. నా సొమ్ముతో నాకిష్టమైనట్టు చేయడానికి నాకు హక్కులేదా???? నేను మంచివాడనైనందుకు నీకు కడుపుమంటా? అని జవాబు చెప్పారు.

ఈ వచనాలలోని భావం ఏమిటంటే : *దేవుడు తనకిష్టమైనట్టుగా చేస్తారు. అడగటానికి మనకి హక్కులేదు*!!! రోమా 9:18-22, యిర్మియా 18; దేవుని దగ్గర ఉన్నవి దేవునివే! ఆయన తనకిష్టమొచ్చినట్లు దయను, కృపను చూపుతారు. 4వ వచనంలో మీకు ఏదిన్యాయమో అదిస్తాను, వెళ్లి పనిచేయండి అంటే సంతోషముగా వెళ్లి, కష్టపడి పనిచేసిన లాంటివారంటే ఆయనకు ఇష్టం! అలాంటి వారంటే ఆయనకు ప్రేమ, దయ, కనికరం!
అయితే దేవునితో బేరాలాడేవారు, స్వార్ధహృదయులు, అసూయ గలవారు అయన నిర్ణయం మార్చలేరు!
కాబట్టి ప్రియ దైవజనుడా/ విశ్వాసి! ప్రక్కవారిమీద అసూయ పడటం మానేసేయ్!
తోటివారిని ప్రేమించడం నేర్చుకో! *ఆయన సేవ, ఆయన జీతం, రారాజు కొలువు అంటే ఆషామాషీ కాదు!!! ఈ లోకంలో ఘనులైన వారికి లేనట్టి పరిచర్య, కృప; దూతలకు లేనట్టి పరిచర్య దేవుడు నీ కిచ్చారు*!!! కాబట్టి గర్వించక, తగ్గించుకొని, నమ్మకముగా పనిచేయాలని మనవి చేస్తున్నాను!! యేసుప్రభులవారి మాటను గుర్తుకు తెచ్చుకొండి.
Luke(లూకా సువార్త) 17:10
10.అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాతమేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.
అలా తగ్గించుకొని దేవునికి చెబితే తగినకాలమందు ఆయన మిమ్ములను హెచ్చిస్తారు 1 పేతురు 5:6.

చివరగా ఒకమాట: యేసుప్రభులవారు ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు తెచ్చుకోండి! 16వ వచనం: కడపటి వారు మొదటి వారగుదురు. మొదటి వారు కడపటి వారగుదురు!!!! జాగ్రత్త!! ఇంతా చేసి, కష్టపడి చివరకు మొదట వచ్చిన వారికి చివరలో జీతం ముట్టినట్లు, అవికూడా మందలింపుతో కూడిన మాటలతో తిరిగివెళ్ళారు. నీవుకూడా ఇంతా సేవచేసి, దేవునికోసం ఎంతో త్యాగం చేసి, గొప్ప పరిచర్య చేసి, నీ ప్రక్కనున్న సేవకుడు/ విశ్వాసి ఆశీర్వదింపబడటం చూసి , నీకన్నా హెచ్చింపబడటం, లేక నీతో సమానంగా ఉండటం చూసి అసూయపడితే నీవు కడపటి వాడవవుతావు! జాగ్రత్త!!!
కాబట్టి ప్రియ స్నేహితుడా! దయచేసి సరిచేసుకోమని యేసయ్య నామంలో బ్రతిమిలాడుతున్నాను! ఒకసారి రాజైన ఆసాను, రాజైన ఉజ్జియాను గుర్తుకు తెచ్చుకోండి! దేవుని మీద అలగోద్దు! దేవుణ్ణి హత్తుకో! పిలువబడినవారు అనేకులు గాని ఏర్పరచబడిన వారు కొద్దిమందే! (మత్తయి 22:14)
*ఆ ఏర్పరచబడిన వారి గుంపులో, నమ్మకమైన వారి గుంపులో నీవున్నావా*?

అట్టి కృప, భాగ్యం ప్రభువు మనందరికీ దయచేయును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(సమాప్తం)

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్రిస్మస్

శరీర కార్యములు

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

సమరయ స్త్రీ

పాపము

విశ్వాసము

ప్రభువు నేర్పిన ప్రార్ధన - పరలోక ప్రార్ధన