తప్పిపోయి-దొరికిన-కుమారుడు

తప్పిపోయి-దొరికిన-కుమారుడు

మొదటి భాగం
ఉపోద్ఘాతము-1


తప్పిపోయి-దొరికిన-కుమారుడు

Luke(లూకా సువార్త) 15:21
21.అప్పుడు ఆ కుమారుడు అతనితోతండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.

దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా, ఆధ్యాత్మిక సందేశాలు-3 సిరీస్ లో భాగంగా ఇంతవరకూ ఈ సంవత్సరంలో బైబిల్ గ్రంధంలో గల వ్యక్తులు- సంఘటనలను ధ్యానిస్తూ, పొట్టి జక్కయ్య, పేద లాజరు, సమరయ స్త్రీ, రక్తస్రావ స్త్రీ, రూతు, లేయా మొదలైన వారిని ద్యానించాము. ఇప్పుడు తప్పిపోయిన కుమారునికోసం ధ్యానం చేస్తూ మిమ్మల్ని ఈ రకంగా కలుస్తున్నందుకు సంతోషిస్తూ, ఈ ధన్యత, అవకాశం ఇచ్చిన దేవాదిదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను.

ఈ ఉపమానానికి తప్పిపోయిన కుమారుడు అని పేరు పెట్టారు గాని, తండ్రియోద్దకు తిరిగి చేరాడు కాబట్టి తప్పిపోయి దొరికిన కుమారుడు అనడమే సమంజసం అని నా అభిప్రాయం.

యేసుప్రభులవారు తన ప్రసంగాలలో అనేక ఉపమానాలు చెప్పారు. మార్కు 4:33,34 లో ఉపమానం లేక ఆయన వారికి బోధించలేదు అని వ్రాయబడింది. ఆయన ప్రసంగాలన్నీ ఉపమానాలతో నిండి ఉండేవి. వాటిలో బోలెడు నిఘూడ సత్యాలు, పరమరాజ్య రహస్యాలు దాగి ఉండేవి. నేటిదినాల్లో వాడుచున్న ఉపమానాలు ప్రజల్ని నవ్వించడం తప్ప దేవునిరాజ్య ఆత్మీయ మర్మాలు తక్కువ.

లూకాగారు వ్రాసిన సువార్త యొక్క ప్రాముఖ్యత గత భాగాలలో వివరించాను. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో గల ఉపమానాలు మిగతా సువార్తలలో లేవు. ఈ 15వ అధ్యాయం బైబిల్ గ్రంధములోనే చాలా ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఇందులోగల పాత్రలు నేటికీ మనలో ప్రతీ ఒక్కరికి సరిపోతాయి. (These relates each and every one of us). ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానం మనలో ప్రతీ ఒక్కరికి వర్తిస్తుంది. ఈ ఉపమానం నాకు చెందదు అంటే ఆ వ్యక్తీ పచ్చి అబద్ధికుడు. అయితే చిన్న కుమారుని పోలి ఉంటాం. లేదా పెద్ద కుమారుని పోలి యుంటాము. అంతేకాదు క్రైస్తవ భక్తిగల తల్లిదండ్రులకు తమ పిల్లలలో చాలామందికి తప్పిపోయిన కుమారుని అనుభవం ఎదురయ్యి ఉంటుంది.కాబట్టి ఇది ఉపమానమే తప్ప నిజం కాదులే అనుకోవద్దు. నేను ఏ విషయంలోనూ తప్పిపోలేదు కాబట్టి ఈ ఉపమానం నాకు కాదు అనుకోవద్దు. మనందరం ఎప్పుడో ఒకప్పుడు, చాలాసార్లు తప్పిపోయి ఉంటాము మాటలోనో, పవిత్రతలోనో, చూపులోనో, తలంపులోనో, ప్రవర్తనలోనో, ప్రార్ధించుటలోనో, దేవునికిచ్చుట లోనో తప్పిపోయినవారమే!!! మనం మానవ మాత్రులం కనుక మనందరికీ ఈ అనుభవం ఉంది. అయితే ఈ చిన్న కుమారుడు పశ్చాత్తాపపడినట్లు మనం కూడా మరలా దేవునియొద్దకు వచ్చాం కాబట్టి కనికరించబడ్డాము. ఒకవేళ దీని చదువుచున్న ప్రియ సహోదరీ, సహోదరుడా! ఇంకా నీవు సమాధాన పడలేదా? ఇప్పుడే పశ్చాత్తాప పడి దేవుని యొద్దకు మరలి రా! తండ్రి తన చిన్నకుమారుని చేర్చుకొన్నట్లు నిన్నుకూడా చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ 15వ అధ్యాయంలో గల ఉపమానాలలో దేవుని ఉద్దేశ్యం చాలా ప్రస్ఫుటంగా స్పష్టం అవుతుంది. అదేమిటంటే: నీవు తప్పిపోయావా? దేవుణ్ణి విడచి, దేవుని సంఘాన్ని, సహవాసాన్ని విడచిపెట్టి తిరుగుతున్నావా? లోకస్తులతో కలసి వారిపాపంలో పాలివాడవై వారిలో ఒకనిగా ఉంటున్నావా? దేవుడు తన చేయి చాపి నిన్ను పిలుస్తున్నారు. నీవు ఇప్పడు ఎంత ఘోర పాపివైనా సరే! ఇంకా దేవుని బిడ్డవే!!! చిన్న కుమారుడు తన తప్పు తెలిసికొని తండ్రి యొద్దకు వచ్చినట్లు నేడే ఆయన యొద్దకు రా! వెంటనే ఆయన నిన్ను కౌగలించుకొని, ముద్దుపెట్టుకొని (నీవు ఎంత పాపమనే మురికిలో ఉన్నా సరే)తన హక్కున చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు.
వస్తావా?

అట్టి పశ్చాత్తాపం దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)


తప్పిపోయి-దొరికిన-కుమారుడు

రెండవ భాగం
ఉపోద్ఘాతము-2



ప్రియ దైవజనమా! ఈ లూకా సువార్త 15 వ అధ్యాయంలో మూడు ఉపమానాలు చెప్పబడ్డాయి. అయితే ఈ మూడింటి సారాంశం దాదాపు ఒక్కటే.
1. మొదటి ఉపమానం లో నూరు గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. (The Lost Sheep): 1% Lost.
రెండవ ఉపమానం లో పది నాణేలలో ఒక్కటి పోయింది. (The Lost Coin) : 10% Lost.
మూడవ ఉపమానం లో ఇద్దరు కుమారులలో ఒకడు తప్పిపోయాడు. (The Lost Son): 50% Lost.
ఇందులో దేవుని ఉద్దేశ్యం తేటతెల్లం అవుతుంది. దేవునికి ప్రతీ ఒక్కరు కావాలి. 50% కావాలి, 10% కావాలి, చివరకు 1% కూడా కావాలి. నీవు ఎలాంటివాడవైనా, తెలివైనవైనా, మూర్ఖుడివైనా, పరిశుద్దుడివైనా, పాపివైనా, ధనవంతుడివైనా, పేదోడివైనా నీవు ఎవరివైనా సరే! దేవునికి నీవే కావాలి!!!
2. మొదటి ఉపమానం లో గొర్రె -మంద నుండి తప్పిపోయింది.
రెండవ ఉపమానం లో నాణెం -ఇంటిలోనే తప్పిపోయింది.
మూడవ ఉపమానం లో చిన్ని కుమారుడు -తనకు తానే ఉద్దేశ్య పూర్వకంగా తప్పిపోయాడు.
3. మొదటి ఉపమానం లో గొర్రె మూర్ఖత్వం వలన తప్పిపోయింది. యెషయా 53:6 ప్రకారం మనమంతా గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి. *గొర్రెల కాపరి యైన
యేసయ్య* గొర్రెను వెదకి తీసుకుని వచ్చారు.
రెండవ ఉపమానం లో నాణెం ఆ స్త్రీ యొక్క నిర్లక్ష్యం వలన పడిపోయింది. గొర్రె, నాణెం రెండు చెడిపోయిన పాపి లేక దిగజారిపోయిన క్రైస్తవునికి సూచన. (చిన్న కుమారుడు కూడా). అయితే ఈ స్త్రీ *సంఘానికి, సంఘకాపరికి, సంఘపెద్దలకు* సూచనగా ఉన్నారు. చెడిపోయిన వారిని, దిగజారిపోయిన వారిని వెదకి తిరిగి క్రీస్తువద్దకు చేర్చాల్సిన భాద్యత వీరికుంది.
మూడవ ఉపమానం లో తనకుతానుగా తీసుకున్న తప్పుడు నిర్ణయానికి చిన్న కుమారునికి పందుల పొట్టు తినాల్సిన గతి పట్టింది. గాబట్టి తిరిగి తనకు తానుగా తప్పు తెలిసికొని, తిరిగి రావాలి. అప్పుడే చిన్న కుమారునికి రక్షణ వచ్చింది. చిన్న కుమారుని వెదకటానికి ఎవరూ వెళ్ళలేదు. తనకుతానుగా వచ్చాడు.
ఇదే ఈ మూడు ఉపమానాల సారాంశం.
ఈ అధ్యాయం లో ముఖ్య వచనాలు:
a)Luke(లూకా సువార్త) 15:7
7.అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును.
కొన్ని ప్రతులలో ఈ విధముగా తర్జుమా చేయబడి యుంది.
అలాగే పశ్చాత్తాప పడనక్కరలేని• తొంభై తొమ్మిది మంది న్యాయవంతులకంటే పశ్చాత్తాపపడే ఒక్క పాపిని గురించి పరలోకంలో ఎక్కువ ఆనందం కలుగుతుందని మీతో చెపుతున్నాను.
ఒక్కపాపి పశ్చాత్తాప పడి తండ్రిని సమీపిస్తే పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది.

b) Luke(లూకా సువార్త) 15:18
18.నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి-తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;
ఈ రెండువచానాలు చాలా ప్రాముఖ్యమైనవి మరియు ఒకదానితో ఒకట సంభందం కలిగియున్నాయి. అయితే మొదట తన తప్పు తెలిసికొని పశ్చాత్తాపపడి దేవుని వేడుకొంటే- ఆ పాపి రక్షణ పొందుకుంటాడు. అది దేవునికి- దేవుని దూతలకు సంతోషం కలిగిస్తుంది.
అయితే ఆ పాపి/నీవు పశ్చాత్తాప పడకపోతే ఇవేమీ జరుగవు.
ఉదా: దప్పిగొనినవారలారా! నీళ్ళయొద్దకు రండి. యెషయా 55:1అంటూ వ్రాయబడింది. దప్పిగొనిన వారలారా! అక్కడే ఉండండి. నీళ్ళు మీ దగ్గరకు వస్తాయి లేదా నేను మీ దగ్గరకు నీరు తెస్తాను అని వ్రాయబడలేదు. కాబట్టి నీపాపముల విషయమై నీవు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు వస్తే, దేవుడు నీ దగ్గరకు వచ్చి, నీవు ఎంత పాపమనే మురికిలో ఉన్నా సరే, నిన్ను తన రక్తములో కడిగి, శుద్దునిగా చేసి పరలోకవారసునిగా చేస్తారు. నేడే ఆయన యొద్దకు రా!
అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!!
(ఇంకాఉంది)


తప్పిపోయి-దొరికిన-కుమారుడు

మూడవ భాగం


ఎవరికోసం చెప్పబడ్డాయి?
ప్రియ దైవజనమా! ఈ ఉపమానాలు ఎవరికోసం, ఎవరి సమక్షంలో చెప్పబడ్డాయో ఈరోజు ధ్యానం చేద్దాం!

1. లూకా 15:1,2,3 వచనాలలో దీనికి సమాధానం మనకు దొరుకుతుంది. సమస్త సుంకరులు, పాపులు ఆయన భోద వింటుంటే, పవిత్రులము అని తమకుతామే పిలచుకొంటున్న స్వనీతిపరులైన పరిసయ్యులు, శాస్త్రులు ఈయన(యేసుప్రభులవారు) నీతిమంతుడు పరిశుద్దుడు అయితే, పవిత్రులమైన మాతో ఉండాలి గాని పాపులతో ఎందుకు ఉంటున్నాడు? అని సణుగుకొంటున్నారు. అనగా వారు కూడా అక్కడే ఉన్నారు. ఇంతకుముందే యేసుప్రభులవారు వారికి సమాధానం చెప్పారు లూకా సువార్త 5:30-32 లో నేను పాపులనే పిలువవచ్చితిని, రోగులకే వైద్యుడు కావాలి గాని ఆరోగ్యవంతులకు వద్దు. అలాగే మీకు మీరు పవిత్రులు నీతిమంతులు అనుకొంటున్నారు వీరిని పాపులు అంటున్నారు కాబట్టి నేను వారిదగ్గరకే వచ్చాను అని చెప్పారు. మరోసారి ఇక్కడ కూడా నిర్దారిస్తూ పరిసయ్యులు శాస్త్రులతో ఈ ఉపమానం చెప్పారు.

*ఇంకా ఎవరికోసం చెప్పబడ్డాయి?*
2. ఆకాలంలో, ఈకాలంలో ఉన్న ప్రతీ ఒక్కరికోసం చెప్పబడ్డాయి.(For Each and Every individual). అనగా రక్షించబడని వారికి, రక్షించబడిన వారికి, రక్షించబడి దిగజారిపోయినవారికోసం చెప్పబడ్డాయి.
a) రక్షించబడని వారికి యేసయ్య ఇచ్చే ప్రేమ పిలుపు – నీవు ఎలాంటివాడవైనా నాకు(యేసయ్య) నీవు కావాలి. ఉన్నపాటున రా!
b) రక్షించబడిన వారికి నీవు విశ్వాసం లో జారిపోయే అవుకాశం వుంది కాబట్టి జాగ్రత్త! నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో! (ప్రకటన 2:22) అని చెప్పబడింది.
c) విశ్వాసంలో జారిపోయినవారికి నీ తప్పు తెలిసికొని మరలా నా దగ్గరకు రా (3వ ఉపమానం) అని దిగజారిపోయిన వారికి చెప్పబడింది. ( ఓ ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యోద్దకే రావలెను యిర్మియా 4:1)

3. ఎవరైనా విశ్వాసి/సోదరీ/సోదరుడు విశ్వాసం నుండి జారిపోతే వారిని వెదకి తిరిగి దేవుని దగ్గరకు నడిపించాల్సిన భాద్యత సంఘానికి, సంఘకాపరి, సంఘపెద్దలు, భాద్యతగల విశ్వాసికి ఉంది(2వ ఉపమానం ప్రకారం) అని వారికి చెప్పబడ్డింది.

4. క్రైస్తవ తల్లిదండ్రులకోసం చెప్పబడింది. ఈ చిన్నకుమారుని ఉపమానం ప్రకారం ప్రియ క్రైస్తవ తల్లిదండ్రులారా! మీరు మీ పిల్లలను ఎంత భక్తిలో పెంచినా, ప్రార్ధనలో పెంచినా, వాక్యంలో పెంచినా సరే, మీరుకూడా ఎంత భక్తిగా జీవించినా సరే, మీ పిల్లలు మీలాగే భక్తిలో, సత్యములో, ప్రార్ధనలో జీవిస్తారనే గ్యారంటీ లేదు. మీరు వారికోసం ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత ప్రార్ధన చేసినా వారు పడిపోకుండా ఉండరు అని గ్యారంటీ లేదు.దానికి చిన్న కుమారుడే గొప్ప ఉదాహరణ. అందుకే భక్తుడైన యోహాను గారు
3 John(మూడవ యోహాను) 1:4
4.నా పిల్లలు సత్యమును అనుసరించి(సత్యములో) నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు. అని పొంగిపోతున్నారు.
అయితే మీరు చేస్తున్న ప్రార్ధన, మీ భక్తి, మీరు మీ పిల్లలను ప్రార్ధనలోను, భక్తిలోను, వాక్యానుసారంగా పెంచడం వేస్ట్ అని నేను ఎంతమాత్రము చెప్పడం లేదు.
1. బాలుడు నడువ వలసిన మార్గం వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలిగిపోడు అంటున్నారు సోలోమోను గారు. (సామెతలు 22:6 )
2. యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు అని వ్రాయబడింది యెషయా 40:30.ఈ రెండు ఒకదానికి వ్యతిరేకంగా ఉన్నాయి గాని రెండూ కరెక్టే! ఎందుకంటే మీరు మీ పిల్లలను ఎంత భక్తిలో పెంచినా –బాలుని హృదయంలో దుష్టత్వం స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని తొలగించును అని వ్రాయబడింది.(సామెతలు 22:15) కాబట్టి బాలుడు పెద్దవాడైనప్పుడు, శిక్షాదండము తగ్గినప్పుడు, యవ్వన ప్రాయంలో అడుగుపెట్టినప్పుడు, తనమిత్రులతో కలిసి చాలామంది లోకంలో పడిపోతుంటారు(అందరు యవ్వనస్తులు పడిపోతారు అనికాదు). ఎందుకంటే దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును (1 కొరింథీ 15:33) ఇది సహజం!
అయితే మీ పిల్లలు లోకంలో జారిపోయినప్పుడు మీరు మీ ఆశ వదిలివేయ వద్దు. మీరు పెంచిన మంచి పెంపకం అనగా వాక్యంలో, ప్రార్ధనలో పెంచినందువలన వారు పెద్దవారైనప్పుడు, జీవితంలో ఎదురుదెబ్బ తగిలినప్పుడు, వారు తమ తప్పు తాము తెలిసికొని తిరిగి తప్పకుండా యేసయ్య వద్దకు, మీ దగ్గరకి వస్తారు. మీ ప్రార్ధన తప్పకుండా ఒకరోజు వారిని పట్టుకొంటుంది. మీరు చెప్పిన వాక్యాలు వారిని గద్దిస్తూ ఉంటాయి. నీఎదుట పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీవాక్యమును ఉంచుకొంటాను అంటున్నారు దావీదు గారు కీర్తన 119:11. ఒకరోజు కార్యరూపం దాల్చి తప్పకుండా వస్తారు. దానికి చిన్న కుమారుడే ఉదాహరణ. మనం నిశితంగా ఈ ఉపమానం పరిశీలిస్తే చిన్న కుమారునికి ఎవరూ బుద్ధిచెప్పలేదు, ఎవరూ తండ్రియొద్దకు రమ్మని చెప్పలేదు. తనకుతానుగా తప్పుతెలిసికొనిపశ్చాత్తాప పడి అంటున్నాడు: తండ్రి నేను పరలోకమునకు విరోదముగాను, నీ ఎదుటను పాపము చేసాను నన్ను క్షమించు అని అడిగాడు(18). పరలోకంలో ఎవరుంటారు? దేవుడు! అనగా నేను దేవుని వ్యతిరేఖంగా పాపం చేసాను అని తండ్రిదగ్గర, దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని తిరిగి దేవునిరాజ్యములోనికి వచ్చాడు. కాబట్టి మీపిల్లలుకూడా తప్పకుండా తమ తప్పులు తెలిసికొని దేవుని దగ్గరకు, మీ దగ్గరకు వస్తారు.

ఒకవేళ ఓ తల్లీ/తండ్రీ! మీ పిల్లలను భక్తిలో పెంచకుండా, మీరు మాత్రమే ఆరాధనకు వెళ్తూ, మీ పిల్లలను వారికిష్టమొచ్చినట్లు వదిలేశారా? జాగ్రత్త!దుష్టసాంగత్యము మంచినడవడికను చెరిపివేయును. *ఒకవేళ నీ పిల్లలు నిన్ను ఏడిపిస్తున్నారా? నీమాటలు వినడం లేదా? త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, శీలం కోల్పోయినవారిగా పాపులుగా తిరుగుతున్నారా? దానికి కారణం ఓతల్లీ/తండ్రీ! ముమ్మాటికి నీవే*!!!
ఎవరిని ప్రేమించినా పెళ్లి చేసేద్దుము గాని ఒక ముస్లింని ప్రేమించినది అని భాదపడే వారున్నారు, ఒక అన్యుడిని/అన్యురాలిని ప్రేమించి పెళ్ళి చెయ్యమంటున్నారు అని భాదపడే తల్లిదండ్రులు ఉన్నారు. త్రాగిన మైకంలో మాకొడుకు మమ్మల్ని కొడుతున్నాడు అని ఏడ్చేవారున్నారు. డ్రగ్స్ ఎడిక్ట్గా మారిపోయాడు అని కన్నీరుకార్చేవారున్నారు. నా కూతురు/కొడుకు మా పరువు దేవుని పరువు తీసేసింది/తీసేసాడు అని ఏడుస్తున్నారు కదా! మీ పిల్లలు అలా మారడానికి కారణం ముమ్మాటికి నీవే! *ఎందుకంటే వారికోసం మీరు ఏడవాల్సిన సమయంలో, వారి బాగుకోసం ప్రార్ధించాల్సిన సమయంలో మీరు ఏడవలేదు. కావున ఇప్పుడు వారు మిమ్మల్ని ఏడిపిస్తూన్నారు*!!!అందుకే భక్తుడైన యిర్మియా గారు రాస్తున్నారు: స్త్రీలారా! యెహోవా మాట వినుడి,. . . . మీ కుమార్తెలకు రోదనం చేయు విద్య నేర్పుడి, . . .వీదులలో పసిపిల్లలు లేకుండా, వారిని నాశనం చేయుటకు మరణం మన కిటికీలు ఎక్కుచున్నది, ,మన గదులలో ప్రవేశించుచున్నది. యిర్మీయా 9:20,21. మన పిల్లలు ఆత్మీయంగా /శారీరకంగా చనిపోయేలా సాతానుగాడు వాడి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాడు. దానిని ఎదుర్కోవాలంటే : మన కన్నులు కన్నీళ్ళు విడచునట్లు గాను, మన కన్నులనుండి నీళ్ళు ఒలుకునట్లు గాను,త్వరపడి రోదన చేయవలెను. యిర్మియా 9:18. మన దేశంలో ఎంతో మంది యవ్వనస్తులు అకాలమరణం చెందుతున్నారు అతివేగం వలన, త్రాగుడు వలన, అక్రమ సంభందాల వలన, ప్రేమ వైఫల్యాల వలన, సాతాను ప్రేరేపణవలన! వారు క్షేమంగా ఉండాలంటే ప్రియమైన తల్లీ తండ్రీ! *ప్రతీరాత్రి కొన్ని నిమిషాలైనా వారు పడుకున్న తర్వాత వారి పడక దగ్గర మోకరించి ప్రార్ధించాలి. నీ కళ్ళనుండి నీరు వారి పడకల దగ్గర కారాలి*!!!.

భక్తురాలు, తల్లి సూసన్నగారు తనకున్న 13మంది పిల్లల పడక దగ్గర ప్రార్ధన మొదలుపెడితే పదముగ్గురి దగ్గర ప్రార్ధన ముగించేసరికి తెల్లవారిపోయేదంట. ఆమె ప్రార్ధన ఆమె బిడ్డలనందరిని దైవసేవకులను చేసింది. జాన్ వెస్లీ గారు, చార్లెస్ వెస్లీ గారు ఆమె సంతానమే!
నా తల్లి కన్నీటిప్రార్ధనా ప్రవాహంలో దేవునిరాజ్యానికి కొట్టుకొని వచ్చాను అంటున్నారు భక్తుడైన అగస్టీన్. కాబట్టి నీబిడ్డలకోసం ప్రార్దిస్తున్నావా? వారిని వాక్యంలో ప్రార్ధనలో పెంచుతున్నావా?

ఈరోజు నేను, మా అన్నయ్యలు, అక్కలు అందరూ భక్తిలో ఉండటానికి, అనేకమందికి సాక్ష్యార్ధముగా ఉండటానికి మా తల్లిదండ్రుల కన్నీటి ప్రార్దనే!!! రాత్రిళ్ళు మా తల దగ్గర ఏడ్చి ప్రార్ధన చేస్తుంటే *ఇప్పుడు ఎవడు పోయాడంటూ విసుక్కునే వారం*! కాని ఆ ప్రార్ధన మమ్మల్ని పట్టుకొంది, మా ప్రవర్తనను కాచింది. నేడు దేవునికి సాక్ష్యార్ధమైన జీవితానికి కృషి చేసింది.
కావున ప్రియ తల్లిదండ్రులారా!
మీరు ప్రార్దిస్తున్నారా?
అయితే మీ ఆశ వదులుకోవద్దు!
ఇంకా ప్రార్ధించడం లేదా?
నేడే మీ పిల్లలకోసం ప్రార్ధించడం మొదలుపెట్టండి.

అట్టి కృప, ధన్యత మనందరికీ కలుగును
గాక!
ఆమెన్!

దైవాశీస్సులు!
(సశేషం)


తప్పిపోయి-దొరికిన-కుమారుడు-The Prodigal Son

నాల్గవ భాగం-బైబిల్ గ్రంధంలో తప్పిపోయిన కుమారులు
బైబిల్ గ్రంధంలో తప్పిపోయిన కుమారులు

ప్రియ దైవజనమా! మనం తప్పిపోయి దొరికిన చిన్న కుమారుని కోసం ధ్యానిస్తున్నాం! ఈ రోజు బైబిల్ గ్రంధంలో గల తప్పిపోయిన కుమారుల కోసం ధ్యానం చేద్దాం! తెలుగులో తప్పిపోయిన కుమారుడు అంటారు గాని English లో The Prodigal Son అంటారు. Prodigal English కాదు. అది లాటిన్ బాషనుండి వచ్చింది. Pro- అంటే ముందుగా, digal అంటే to drives- it relates to money. English లో దీనిఅర్ధం “The quality of a person who drives forth his money – who wastes it by spending reckless abandon”. అంటే ఒక మనిషి – ముందుచూపు లేకుండా వ్యర్ధంగా తన ధనాన్ని వృధాగా, ఖర్చుపెట్టే గుణాన్ని Prodigal అంటారు. దీనినుండే Prodigal son అని వచ్చింది.

బైబిల్ గ్రంధంలో ఇద్దరు తప్పిపోయిన కుమారులున్నారు. ఒకరు పాతనిభందనలో మరొకరు క్రొత్త నిభందనలో! బైబిల్ పండితులు అంటారు పాత నిభందనలో తప్పిపోయిన కుమారుని ఆధారం చేసుకొని యేసుప్రభులవారు క్రొత్త నిభందనలో ఉపమానం చెప్పారు- అయితే అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు కనుక వారిని పెద్దకుమారునితో పోల్చారు అంటారు. ఏదిఏమైనా పాత నిభందన తప్పిపోయిన కుమారునికి- క్రొత్తనిభంధన తప్పిపోయిన కుమారుని చాలా పోలికలున్నాయి.

1.*పాత నిభందన తప్పిపోయిన కుమారుడు*
ఇశ్రాయేలీయులను పాలించిన రాజులలో కేవలం కొద్దిమంది యూదురాజులు మాత్రం దేవుని హృదయపూర్వకంగా అనుసరించారు. మిగిలిన వారంతా ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి రాజులే కారణమయ్యారు. దేవుని భక్తి నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగని రాజులలో దావీదు, హిజ్కియా, యోషియా లాంటి రాజులున్నారు. రాజైన హిజ్కియా దేవుని హృదయపూర్వకంగా అనుసరించిన వ్యక్తి. అంతేకాదు ప్రజలందరూ దేవునివైపు తిరిగేలా చేసారు. రాజైన సన్హేరీబు యుద్దానికి వస్తే తన సైన్యాన్ని నమ్ముకొనక దేవుని నమ్మి యుద్ధం చేయకుండా గెలిచిన వ్యక్తి. (2 రాజులు, 2 దినవృత్తా) ఆయనకు మంచి గైడ్ గా ప్రవక్తయైన యెషయా గారున్నారు. యెషయా గారు తీసుకొచ్చిన మరణ శాసనాన్ని, ఆయన రాజ ప్రసాదం దాటకుండానే, కేవలం రెండే రెండుమాటలు ప్రార్ధించి , మరణ శాసనాన్ని జీవ శాసనంగా మార్చుకొని, మరి 15 సం.లు ఆయుస్షు పెంచుకొన్న భక్తిగల వాడు. తన కుమారున్ని కూడా భక్తిలోనే పెంచారాయన.

ఇటువంటి భక్తిగల రాజుకు ఒక చీడపురుగు పుట్టాడు. పండిత పుత్రః పరమ శుంటః! అన్నట్లు తయారయ్యాడు. అతని పేరు మనష్షే! తను రాజవ్వబోయే సరికి అతని వయస్సు 12సం.లు.(2రాజులు 18, 2దినవృత్తా 33) అనగా హిజ్కియా గారికి దేవుడు 15 సం.లు ఆయుస్సు పొడిగించిన తర్వాత పుట్టినవాడు. రాజ్యానికి రాజైన వెంటనే బాల్యంలోనే అందరినీ మించి విగ్రహారాధన చేసాడు. అన్యదేవతారాదన చేస్తూ తనతండ్రి పడగొట్టిన అన్యదేవతా విగ్రహాలను మరలా కట్టించాడు. ఆకాశనక్షత్రాలన్నిటికి పూజ చేసాడు. 2 దినవృత్తా 33:1-9. దేవుని మందిరంలో ఆకాశ నక్షత్రాలకు బలిపీటాలు కట్టించాడు. తన పిల్లలను బెన్ హిన్నోము లోయలో అగ్ని గుండాలు దాటించాడు. ముహూర్తాలు, జాతకాలు చూసుకుంటూ, చిల్లంగి వారితోనూ మంత్రగాల్లతోను సాంగత్యం చేసాడు. దేవుడు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా వినలేదు. దేవుడు శపించారు. 2 రాజులు 21:12-16. దేవుడు ఎంతగా విసికిపోయారంటే 2రాజులు, 2 దినవృత్తాంతాలు, ప్రవక్తల గ్రంథాల ప్రకారం ఇశ్రాయేలీయుల ప్రార్ధన వినడం మానేశారు. వారిని అసహ్యించుకొన్నారు. అప్పుడు దేవుడు అస్సూరు రాజును పంపించి అతని గొలుసులతో బంధించి, బబులోనుకు తీసుకొని పోయినట్లు చూస్తాం 2 దినవృత్తాంతాలు 33:10-13. అయితే ఆ బందీఖానాలో తన తండ్రి, తన తండ్రి దేవుడైన యెహోవా గుర్తుకు వచ్చారు. తప్పు తెలుసుకొని ప్రార్ధించడం మొదలుపెట్టాడు. ఎంతగా ఏడ్చి ప్రార్ధన చేసాడో తెలియదు. పశ్చాత్తాప పడ్డాడు. ఈ 33 వ అధ్యాయం ప్రకారం అతని మొరలు వినబడ్డాయి అని వ్రాయబడింది. ఇంతగా విసికిపోయిన దేవుడే కరిగిపోయారు. దేవుని పాదాలను తన కన్నీటితో కడిగాడు. దైవజనుడు ఆరార్కే మూర్తి గారు అంటారు దేవుడు తడచిన పాదాలతో (భక్తుని కన్నీటితో) దాటుకుని వెళ్ళలేడు. దేవుడు కనికరించి తిరిగి మనష్శేని ఇశ్రాయేలు దేశం తీసుకొచ్చి రాజుగా చేసారు. వెంటనే అన్య దేవతా విగ్రహాలు, బలిపీటాలు కూల్చివేసి, అన్యాచారాలు ముహూర్తాలు మానేసి దేవుణ్ణి ఆరాధించాడు. అనేకమంది సాక్షిగా మారాడు.
నీవు ఎంతమూర్కుడివైనా పనికిమాలిన వాడవైనా వ్యభిచారివైనా పాపివైనా తప్పుతెలిసికొని దేవుని దగ్గరకు వస్తే పాత నిభందన తప్పిపోయిన కుమారుని కనికరించిన దేవుడు నిన్ను కూడా కనికరించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇదియే అనుకూల సమయం,
నేడే రక్షణ దినం!
నేడే ఆయన పాదాల యొద్దకు రా!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)


తప్పిపోయి-దొరికిన-కుమారుడు

ఐదవ భాగం
క్రొత్త నిభందన తప్పిపోయిన కుమారుడు



దేవుని ప్రియమైన వారలారా! ఈరోజు మనం క్రొత్త నిభందన లో యేసు ప్రభులవారు చెప్పిన తప్పిపోయిన కుమారుని కోసం ధ్యానం చేద్దాం! అయితే ఈ ఉపమానం అందరికీ బాగా తెలిసినది కాబట్టి మరోసారి దానిని చెప్పుకోకుండా ప్రతీ వచనాన్ని ధ్యానం చేద్దాం!

ఈ ఉపమానం లూకా 15:11-32 వచనాలలో యేసు ప్రభులవారి ద్వారా చెప్పబడింది. యేసయ్య చెప్పిన ఉపమానాలు చాలావరకు నిజ జీవిత సంఘటనలకు ఆధారంగా చెప్పబడ్డాయి. ఇదికూడా అలాగే ఓ కుటుంబ చరిత్రలా చెప్పబడింది.
Luke(లూకా సువార్త) 15:11,12
11.మరియు ఆయన ఇట్లనెనుఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.
12.వారిలో చిన్నవాడుతండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.

ఇది సింపుల్ గా రెండుమాటలలో చెప్పినా అక్కడ చాలా స్టోరీ జరిగింది.
ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తన ఆస్తిలో వాటా అడిగాడు. సాధారణంగా ఒకమనిషికి పుట్టిన సంతానంలో అందరూ ఒకేలా ఉండరు. ఒకరు మంచోడవుతాడు. మరొకడు చెడ్డవాడవుతాడు.
యధాప్రకారం పెద్దోడు మంచోడయ్యాడు. చిన్నోడు గారాభం వలన చెడిపోయాడు. ఆస్తిలో వాటా అడుగుతున్నాడు. 18-22 వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే చివరలో తనతప్పు తెలుసుకొన్నాడు కాబట్టి – తల్లిదండ్రులు ఈ చిన్న కుమారుని భక్తిలో పెంచారు. గాని తుంటరుల సహవాసం చేయువాడు చెడి పోవును అని చెప్పినట్లు చెడు స్నేహితులతో తిరిగి చెడిపోయాడు. మోసపోకుడి! దుష్టసాంగత్యము మంచి నడవడిని చేరిపివేయునూ. (1 కొరింథీ 15:33)
బహుశా చెడు స్నేహితులతో తిరిగి త్రాగుడు జూదం, వ్యభిచారం నేర్చుకొని ఉండొచ్చు! ఆ సమాచారం తెలిసికొని తండ్రి మందలించి ఉండొచ్చు! మన చిన్న కుమారునికి Prestige భంగమై ఉండొచ్చు! బయట తన స్నేహితులతో డిస్కసన్ చేసాడు. లేదా స్నేహితుల సమక్షంలోనే తండ్రి భయం చెప్పి ఉండొచ్చు! స్నేహితులు సలహా ఇచ్చారు: మీ నాన్న దగ్గర ఎంతకాలం ఉన్నా మీ నాన్న అన్నింటికీ అడ్డుచెబుతూ ఉంటాడు. ముసలోడు తను అనుభవించడు నిన్ను అనుభవించనీయడు, ఎప్పుడూ భక్తి, దేవుడూ, ప్రార్ధన అంటాడు. మీ నాన్న దగ్గరనుండి మనం దూరం వెల్లిపోదాం! అక్కడ మనల్ని అడిగేవారుండరు. మన ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేద్దాం అని సలహా ఇచ్చి ఉండొచ్చు! ఇదేదో బాగుంది అనుకొన్నాడు. మరలా అన్నాడు మరి దూర ప్రయాణం చేయడానికి డబ్బులు ఎలా వస్తాయి? అని అడిగాడు. అప్పడు స్నేహితులు అని ఉండొచ్చు:

ఒరేయ్! మీ నాన్న పెద్ద ధనవంతుడు, దానిలో నీకు కూడా వాటా ఉందికదా! ఆస్తిలో నీకు రావాల్సిన వాటా ఇచ్చేయ్ మని అడుగు, తీసుకొని మనం దూరంగా పోదాం. ఇప్పడు ఎన్నో రకాల బిజినెస్ లు వచ్చాయి. దూరదేశంలో ఎదో ఒక బిజినెస్ చేసుకొంటూ అదేవిధంగా మనం ఎంజాయ్ చేసుకొంటూ ఉందాం! అని చెప్పారు. మరలా చిన్న కుమారుడు అడిగాడు: ఆస్తిలో వాటా అడిగితే మా నాన్న ఇస్తాడంటావా?
అంటే: నేను మీతో ఉండలేక పోతున్నాను, ఉండనంటే ఉండను, మీతో విసికిపోయాను అని చెప్పు, వినకపోతే ఆత్మహత్య చేసుకొంటాను అని చెప్పు . . . ఇలాంటివేమో మప్పి పంపించారు. ఆ మాటలు చిన్న కుమారుడు విన్నాడు. చెప్పుడు మాటలకు చాలా ప్రభావం ఉంది.

ఇది చదువుతున్న ప్రియ యవ్వన తమ్ముడా/చెల్లీ! ప్రియ దేవుని బిడ్డా! నీవు కూడా చెడు స్నేహితులతో తిరుగుతున్నావా? చిన్న కుమారుడు చెడు స్నేహితులతో తిరిగి పాడైపోయాడు. మరి నీవు?
6 నెలలు వారితో తిరిగితే వాడే వీడు అంటారు.
నీ స్నేహితులు ఎవరో చెప్పు నీవెలాంటి వాడవో చెబుతాను అంటారు.
కాబట్టి చెడు స్నేహితులతో తిరిగి పాడైపోయి తల్లిదండ్రులను దుఃఖపెడుతున్నావా?
ఎదురు తిరిగి ఎదిరిస్తున్నావా?
నీ బోడి మొఖానికి ఒక మొబైల్ కొనలేవా?
ఒక two wheeler కొనలేవా?
ఆ మోడల్ చుడిదార్, లేక మిడ్డీ కొనలేవా?
ఆ మాత్రం గతిలేనప్పుడు ఎందు కన్నావ్?
నిన్ను ఎవడు పెళ్లి చేసుకోమన్నాడు అని అడుగుతున్నావా? జాగ్రత్త!
తనను పుట్టించిన వానిని, తనను కన్న వారిని అలా అడిగితే శాపం!!! (యెషయా 45:9,10))
ఒక విషయం చెప్పనా. . . . మీ తల్లిదండ్రులు నీ కోసం పరలోకం నుండి పంపబడిన Protecting Angels!
వారిని దుఃఖపెట్టారా?
నీవు వర్దిల్లవు!
నీ తల్లి,తండ్రీ నీకోసం ఎన్ని త్యాగాలు చేసారో నీకు తెలుసా? వారికి మంచి తిండి తినాలని ఉన్నా, మంచి బట్టలు వేసుకోవాలని ఉన్నా, ఈ డబ్బులు నా కొడుకు/కూతురు చదువుకి, బట్టలకి, పుస్తకాలకి పనికొస్తాయి అని వారు తినడం మానేసి నీ కోసం త్యాగం చేస్తే, నేడు చెడు స్నేహితుల ప్రభావంతో ఎందుకు కన్నావ్ అని అడుగుతున్నావా?
*ప్రతీదానికి సూసైడ్ చేసుకొంటాను అని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అలా చేసి నీకు కావలసినవి కొనిపించుకొంటున్నావా?* జాగ్రత్త! సాతానుగాడు నిన్ను నెమ్మదిగా తన ట్రాప్ లోకి లాగుతున్నాడు.

చిన్న కుమారుడు తండ్రి మాటలు వినకుండా దూరదేశం పోయి సమస్తమును పోగొట్టుకొని, చివరకు పందుల పొట్టు తినాల్సిన గతిపట్టింది. నీకు ఆగతి రాకుండా ఉండాలంటే, నీవు కూడా మార్పునోందు! ఒకవేళ నీవు పైనుదహరించిన మాటలు నీ తల్లిదండ్రుల దగ్గర వాడి ఉంటే ఇప్పుడే పోయి క్షమాపణ వేడు!
వారు ఒకవేళ ప్రభువు దగ్గర ఉంటే ప్రభువు దగ్గర క్షమాపణ వేడు! నీ తల్లిదండ్రుల దగ్గర క్షమాపణ వేడటం దేవునికి కూడా ఇష్టమైన పని! నేడే మార్పు పొందుకో! చిన్న కుమారుడు గుణపడినట్లు నీవు కూడా గునపాడు!
అట్టి కృప చదువుతున్న ప్రతీ ఒక్కరికి కలుగును గాక!
ఆమెన్!
(సశేషం)


తప్పిపోయి-దొరికిన-కుమారుడు

ఆరవ భాగం


లూకా 15:11,12 . Luke(లూకా సువార్త)
11.మరియు ఆయన ఇట్లనెనుఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.
12.వారిలో చిన్నవాడుతండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
ప్రియదైవజనమా చెప్పుడుమాటలు విన్న చిన్నకుమారుడు లేచి, మొండి ధైర్యం తెచ్చుకొని, తండ్రీ నాకు న్యాయంగా రావాల్సిన ఆస్తిలో వాటా నాకు ఇప్పుడే పంచి ఇచ్చేయ్ అని అడిగాడు. దానికి తండ్ర్రి చాల షాక్ అయ్యాడు.
ఒరేయ్ నీకు ఏమయింది? ఇలా అంటున్నావేమిటి అంటే నీ దగ్గర నేను ఉండలేను అన్నాడో, నీ టార్చర్ బరించలేకపోతున్నాను అన్నాడో, లేక సూసైడ్ చేసుకుంటానన్నాడో తెలియదు గాని, పేచీ పెట్టాడు, తండ్రి ఎంత బ్రతిమిలాడినా వినలేదు. బహుశా అన్న కూడా చెప్పి ఉంటాడు. వినలేదు. ఇక ఏమీ చెయ్యలేక తండ్రి ఆస్తిలో వాటా పంచిపెట్టి ఇచ్చేసారు ఆయన. ఆస్తి పంచిపెట్టినా కళ్ళముందే ఎక్కడో ఉంటాడనుకొన్నారు గాని ఆస్తిని అమ్మేశాడు, తండ్రితట్టుకోలేకపోయాడు. అమ్మేసి ఆ ధనం పట్టుకొని దూరదేశం పోయాడు. తండ్రికి చాలా వేదన కలిగించాడు.

ఒక నిమిషం ఆగుదాం. చిన్న కుమారుడు ఆస్తిలో వాటా అడిగాడు, తండ్రి సగభాగం ఇచ్చాడా? లేదే! ద్వితీ 21:17 ప్రకారం ఇశ్రాయెలీయులలో జ్యేష్టునికి రెండు భాగాలు ఇవ్వాలి. అంటే ఇక్కడ తండ్రి తన ఆస్తిని మూడు భాగాలు చేసి, దానిలో రెండు వాటాలు అన్నకి ఇవ్వాలి(2/3), మిగిలిన భాగం తమ్ముడికి ఇవ్వాలి(1/3). ఇది తెలిసికూడా చిన్న కుమారుడు తండ్రియొక్క presence ని భరించలేక అనగా దిద్దుబాటుని తట్టుకోలేక విచ్చలవిడిగా జీవించడానికి ఒక భాగం(1/3) పట్టుకోనిపోయాడు.
బాగా ఆలోచిద్దాం! ఒక కుమారునికి తండ్రియొక్క ఆస్తిలో వాటా ఎప్పుడు వస్తుంది? మనదేశంలో గాని, ఆ దేశంలో గాని తండ్రి మరణించాక వస్తుంది. లేదా తండ్రి చావు బ్రతుకులలో ఉంటే, లేక దీర్ఘకాల వ్యాదితో భాదపడుతుంటే తండ్రి ఆస్తిని పంచుతాడు లేదా వీలునామా రాస్తాడు. ఇదీ పద్దతి. అయితే ఇక్కడ చిన్న కుమారుడు తండ్రి బాగా ఉన్నాడని తెలుసు, ఇంకా అనేక సం.లు బ్రతికే బలం ఉందని తెలిసికూడా ఆస్తిలో వాటా అడిగాడు. ఇలా ఎప్పుడైనా నీ తల్లిదండ్రులను బాధపెట్టావా?

మనం కూడా చిన్న కుమారుని లాగే కొన్నిసార్లు పరమతండ్రిని నిందిస్తూ ఉంటాం! నాకు ఈ పని చేస్తావా లేదా? నా ప్రార్ధన వినడం లేదు. వాళ్ళు చేసిన ప్రార్ధనలు వింటావ్. నా ప్రార్ధన వినడం లేదు. నాకు ఈ పని చెయ్, లేదా నన్ను చంపేయ్ మని తప్పుడు ప్రార్ధనలు చేశావా? ఆత్మహత్య నేరం కాబట్టి నీవే నన్ను చంపేయ్ మని దేవునికి తప్పుడు ప్రార్ధనలు చేసావా? తప్పులన్నీ నీలో ఉంచుకొని దేవుణ్ణి నిందిస్తూ ఆయన గాయం రేపుతున్నావా?? దేవుడు ఇలాంటి తప్పుడు ప్రార్ధనలు వినరు. జాగ్రత్త! దేవుడు కూడా నీ ప్రార్ధనలకు, నీ అభాండాలకు ఎంత బాధపడుతున్నారో ఆలోచించావా? అనాలోచితంగా దేవుణ్ణి ఏమీ అనకు, తప్పుడు ప్రార్ధనలు చేయకు. లోబడనొల్లని పిల్లలకోసం దినమంతా చేతులు చాపుతున్నారంట దేవుడు (యేషయా 65:2).

చివరకు తండ్రి తన చిన్న కుమారుని నిర్ణయం తప్పుడు నిర్ణయం అని తెలిసికూడా వాడు వినడం లేదని, వాడు బాగుండాలని, వాడిని సంతోషపరచాలని ఇష్టం లేక పోయినా ఆస్తిని పంచిపెట్టాడు. అదేవిధంగా పరమ దేవుడు కూడా కొన్నిసార్లు నీవు అడిగింది ఇచ్చేస్తుంటారు. దేవునికి తెలుసు దానివల్ల నీకు నష్టం వస్తుందని, గాని నీవు మాటిమాటికి సిగ్గుమాలి అడుగుతున్నావని ఆయన నీకు ఇచ్చేస్తుంటారు(లూకా 18:1-8). ఐతే దేవుడు దానిని అంగీకరించినట్లు తలంచవద్దు. (Don’t Feel as it is granted). ప్రార్ధించి సాధించినట్లు పొంగిపోకు! విర్రవీగకు!
ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్ఘం కలదు. అయితే చివరకు అది నాశనమునకు నడుపును. (సామెతలు 14:12) .సరిగ్గా అదే జరిగింది చిన్నకుమారునికి. దూరదేశంలో బాగుంటాను అనుకుని, తండ్రి పోరు ఉండదు అనుకుని, వాటా తీసుకొని, అమ్ముకొని వెళ్ళిపోయాడు. ఫలితం పందులపొట్టు!!!
అలాగే నీవు అడిగిన వాటిని దేవుడు ఇస్తే, పొందు కొని, దేవుని నుండి దూరమైపోయి, జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని బోర్లా పడ్డావా? నీవు తీసుకొన్న నిర్ణయం అది మంచిదేనా అని ఎప్పుడైనా ఆలోచించావా? అది నీ తండ్రిని సంతోషపెట్టేదా దుఃఖపెట్టేదా అని ఎప్పుడైనా ఆలోచించావా? చిన్నకుమారుడు ఆలోచించక తండ్రిని బాధపెట్టాడు. నీవుకూడా దేవున్ని భాదపెట్టె నిర్ణయాలు తీసుకోన్నావేమో! ఆలోచించు. ప్రార్ధించు!
తండ్రీ! నీకాయాసకరమైన మార్గాలు నాయందు ఉంటే క్షమించు, సరిదిద్దు అని ప్రార్ధన చెయ్!
దేవుడు మిమ్మును దీవించును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)


తప్పిపోయి-దొరికిన-కుమారుడు

ఏడవ భాగం


Luke(లూకా సువార్త) 15:13
13.కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను.

కొన్నిరోజుల తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశం పోయాడు. దూరదేశం పోవాల్సిన అవుసరం ఎందుకొచ్చింది?
తండ్రి అధికారం క్రింద, కాపుదల క్రింద ఉండటానికి ఇష్టపడలేదు. తనకుతాను సొంతంగా తనకిష్టమొచ్చినట్లు జీవించాలని అనుకొన్నాడు. ఎక్కడికి పోతున్నాడు? దూరదేశం! పొరుగుదేశం పోవచ్చుగా! పవిత్ర దేశాన్ని వదిలేసాడు. సంఘాన్ని, సహవాసాన్ని వదిలేసాడు. ప్రార్ధన వాక్యములను వదిలేసాడు. సత్యవాక్యాన్ని, సత్యాన్ని వదిలేసాడు. దూరపుకొండలు నునుపుగా కనిపిస్తాయి కదా అందుకే బాగుపడతాను అనుకుని, దూరదేశం పోయాడు. అయితే ఏం కోల్పోయాడు? తండ్రి కాపుదల (Protection) కోల్పోయాడు. *ఎప్పుడైతే తండ్రి కాపుదల కోల్పోయాడో వెంటనే సాతాను కభంధహస్తాలలోకి పోయాడు*. ఆత్మీయంగా దిగజారిపోయాడు. ఆత్మీయంగా చచ్చిపోయాడు!!

మనలో చాలామంది దేవుడు అనే అడ్డు వాళ్లకి ఉండకూడదు అనుకుంటారు. వీరు కూడా అలాంటివారే! తండ్రి/నాన్న ఎప్పుడూ ఆటలాడొద్దు, చదువుకో! ప్రార్ధన చెయ్, బైబిల్ చదువు అంటూ ఉంటాడు దూరదేశం పొతే అక్కడ ఎవ్వరూ అడిగేవారు ఉండరు, అప్పుడు నా కిష్టమొచ్చినట్లు enjoy చెయ్యొచ్చు అనుకొంటున్నారు.
మొదట ఉపమానంలో గొర్రె కూడా – నా కాపరి ఎప్పుడే పెట్టే మేతే పెడుతున్నాడు. అదే నీరు త్రాగిస్తున్నాడు. ప్రక్కన రుచిగల మేత ఉంది, అంటూ విసుక్కుంటూ ఒకరోజు side అయ్యింది. మందకు/సహవాసానికి/సంఘానికి దూరంగా పోయింది. కొంచెం సేపు బాగా తిన్నాది. ఈ లోపు చీకటి పడ్డాది, నక్కలు పులులు తిరగడం చూసింది, భయపడిపోయింది. ఇటూ అటూ తిరుగుతూ దారితప్పి ముళ్ళ తుప్పలో చిక్కుకు పోయి అరుస్తుంది. సమయానికి కాపరి గొర్రెలు లెక్కపెట్టి, ఒకటి తప్పిపోవడం చూసి, పరుగుపరుగున వచ్చి, వెదకి రక్షించాడు. పరమతండ్రి కూడా నిన్ను వెదకి అలాగే రక్షిస్తున్నారు జాగ్రత్త! నీవు వేరై బాగుపడేదేమి లేదు!!
యోహాను 15:5,6 నాయందు నిలిచి ఫలించుడి, నాకు వేరుగా ఉంటే బయట పారవేయబడతారు.

*దేవుడు కూడా నిన్ను అబద్దమాడవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, త్రాగుడు సినిమాలు వద్దు అని చెబుతుంటే చాలామందికి అది డాక్టర్ చెప్పిన చప్పిడి పథ్యం లా కనిపిస్తుంది. నోరు రుచులు కోరుతుంది. గాని పథ్యం చెయ్యకపోతే చస్తావ్!! అలాగే దేవుడు చెప్పినట్లు చెయ్యకపోతే, లోకానుసారంగా జీవిస్తే చస్తావ్*! ఎలా చస్తావ్? ఆత్మీయంగా చస్తావ్!!! దేవుని కాపుదల కోల్పోతావ్! చిన్నకుమారుడు పవిత్ర జీవితాన్ని వదలి, విచ్చలవిడి జీవితం కోసం ప్రాకులాడాడు.
అయితే ఇలా దేవుణ్ణి విడచి జీవించేవారు ఇహలోక సంపదలను అభివృద్ధి చేసుకోవచ్చు! మేడలు మిద్దెలు సంపాదించుకోవచ్చు! నీవంటావు వారే బాగున్నారు, చప్పిడి పథ్యం చేస్తున్న మాకు ఎన్నో శోధనలు భాధలు రోగాలు . . అని. ప్రియ సహోదరి!సహోదరుడా! నీకు శోధనలు వస్తున్నాయి అంటే నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావన్నమాట! దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్ధం! వీటినన్నిటిని తట్టుకొని, దాటుకొని, ఒకానొకరోజు పరమరాజ్యం చేరి, పరమతండ్రిని కలుసుకొని ఆయన రొమ్మున ఆనుకొనే రోజు ఉంది అని తెలుసుకో! అక్కడ మీ ప్రతీ భాష్పబింధువు ప్రభువు తన స్వహస్తాలతో తుడుస్తారని తెలుసుకో(యెషయా 25:8)! అయితే ఈ materialists ఉన్నారు కదా వారనుకొంటారు: మేము దేవుణ్ణి విడచి సంతోషంగా సుఖంగా ఉంటూ, అభివృద్ధిలోకి వచ్చాము అనుకొంటున్నారు- అయితే దేవుడు వారిని కాలుజారే చోటున ఉంచారు (కీర్తనలు 73:18), ఎప్పుడు జారిపోతారో తెలియదు, అధోపాతాళానికి – నిత్యనరకాగ్నికి పోతారు.

ఇక్కడ మరో విషయం గుర్తు చేయాలనుకొంటున్నాను. ప్రియ సహోదరి/సహోదరుడా! నీకున్న తెలివితేటలూ, తలాంతులు, ఐశ్వర్యం, సమయం, సామర్ధ్యం అన్నీ దేవుడిచ్చినవే కాబట్టి వాటిని దేవుని కోసం ఖర్చుపెట్టాలి, అలాకాకుండా వాటిని నీ సొంతసంపద పెంచుకోడానికి, నీ విచ్చలవిడి జీవితం అనుభవించడానికి, నీ కోరికలు(తీరని కోరికలు) తీర్చుకోడానికి ఉపయోగిస్తే అధోపాతాళానికి పోతావు!!!
ఈ సందర్భంగా రెండు వచనాలు గుర్తుచేస్తున్నాను.

యెషయా 55:1,2 దప్పిగొనిన వారలారా నీల్లయోద్దకు రండి. వచ్చి దాహం తీర్చుకొనండి . . ఆహారం కానిదానికోసం ఎందుకు మీ డబ్బు, వయస్సు ఖర్చు చేస్తారు అని దేవుడంటున్నారు. యవ్వనస్తుడా! ఆలోచించు! అందుకే సోలోమోను గారు అంటున్నారు ప్రసంగి 2:4-11. నేను ఎన్నో ఘనకార్యాలు చేసాను, ఆస్తులు మేడలు సంపాదించాను, నా కన్నులకి ఇష్టమైనదంతా చేసాను . . . దయచేసి చివర వరకు చదవండి. .. చివరలో అంటున్నారు ఆయన 11: ఇదంతా వ్యర్ధం, ఒకడు గాలికోసం శ్రమించినట్లే!!!

కాబట్టి ప్రియ దేవుని బిడ్డా! దూరపుకొండలు చూసి మోసపోకు! లోకాశలను ప్రేమించి తండ్రి కాపుదల కోల్పోకు! సహవాసాన్ని విడచిపెట్టకు! తిప్పలుపడకు!
అట్టి కృప, భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!


తప్పిపోయి-దొరికిన-కుమారుడు

8వ భాగం


Luke(లూకా సువార్త) 15:13
13.కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను.

అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడుచేసెను. చూసారా చెడుస్నేహితుల ప్రభావంలో పడి చిన్నకుమారుడు తన ఆస్తినంతా దుర్వ్యాపారము వలన పాడుచేసాడు. చేసిన వ్యాపారం మంచిది కూడా కాదు. అది లాభకరమైనది ఆరోగ్యవంతమైనది కాదు- దుర్వ్యాపారము అని వ్రాయబడింది.
నేటిదినాల్లో అనేకమంది క్రైస్తవులు అని పేరు పెట్టుకొని దుర్వ్యాపారము చేస్తున్నారు.
దుర్వ్యాపారము అంటే- బ్రాంది షాపు(మద్యం అమ్మే దుకాణాలు), జూదగృహము, Raceలు, video game parlour . . .
ఇవన్నీ కుటుంబాలకు నష్టం కలిగించేవే! దేవునికి వ్యతిరేఖమైనవే!

దేవుని బిడ్డలు మద్యం అమ్మే దుకాణాలు పెట్టకూడదు. బ్రతకటానికి షాప్ పెట్టాం కాని దానిని మేము త్రాగటం లేదు అంటారు. బ్రతకటానికి అది తప్ప మరో వ్యాపారం లేదా? కుటుంబ యజమాని త్రాగుడు వలన ఎంతమంది భార్యలు బాధపడుతున్నారు! ఎన్ని కుటుంబాలు ఆకలితో బాధపడుతున్నారో కదా, తగిన వస్త్రాలు, చదువుకొనే స్తోమత లేక బాధపడుతున్నారు. ఈ కుటుంబ సభ్యుల ఉసురు వారికి తగలదా? మీరు చేసే పని/ వ్యాపారము వాక్యానుసారమైనదో కాదో ఆలోచించారా? అది పరమ తండ్రికి ఆమోఘ్యమైనదో కాదో ఆలోచించారా? దయచేసి సరిచూసుకొని, సరిచేసుకోమని యేసయ్య పేరిట మనవి చేస్తున్నాను.

మన తెలుగు బైబిల్లో దుర్వ్యాపారము అని వ్రాయబడింది. అయితే కొన్ని ప్రతులలో “విచ్చలవిడిగా తన ఆస్తిని దుబారా చేసాడు” అని వ్రాయబడింది. ఇంగ్లీష్లో :There wasted his substances with riotous living, మరికొన్ని ప్రతులలో “there he squandered his property in loose living” అని వ్రాయబడింది.
దీని ప్రకారం ఏం వ్యాపారం చేసాడో తెలియదు గాని తన ఆస్తినంతా స్నేహితులతో దుబారా ఖర్చు చేసి ఆర్పేసాడు. తనకిష్టమైనట్టుగా enjoy చేసాడు.

అయితే 30వ వచనం ప్రకారం తన ఆస్తిని ఎలా ఖర్చుచేసాడో క్లారిటిగా ఉంది. చిన్న కుమారుడు ఇల్లు వదిలేసినా, తన అన్న తన తమ్ముడు ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడోతెలుసుకోవడం మొదలుపెట్టాడు. అది బహుశా తమ్ముడు మీద ప్రేమ కావచ్చు లేదా curiosity కావచ్చు. అది తెలుసుకొనే తండ్రితో అంటున్నాడు నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు. . . . అంటే ఇక్కడ చిన్నకుమారుడు తన ఆస్తిని వేశ్యలకు ఖర్చుపెట్టాడన్నమాట! తను తన స్నేహితులు కంటికి నచ్చిన వేశ్యలతో గడపడడం , విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డారు. ఇది దేవునికి అత్యంత విరోధమైనది. వేశ్యా సాంగత్యం చేస్తే ఏమవుతుందో సామెతల గ్రంధంలో క్షుణ్ణంగా రాసి ఉంది (సామెతలు 2,5,722,23), నీ ఆస్తిని, నీ రక్తాన్ని కోల్పోతావు. చివరకు మరణానికి, నరకానికి పాత్రుడవు అవుతావు (సామెతలు 7). ప్రియ దేవునిబిడ్డా! ఒకవేళ నీవు అలాంటి స్తితిలో ఉంటే నేడే సరిచేసుకోమని మనవి చేస్తున్నాను.

చిన్నకుమారుడు ఎటువంటి కుటుంబంలో పుట్టాడు, ఎలా పెరిగాడు, తన భక్తి, ప్రార్ధన అన్ని వదిలేసి లోకస్తులకంటే భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు.
*పండితపుత్రః పరమ శుంటః* అన్నట్లు తయారయాడు.

నేటిదినాల్లో యవ్వనస్తులు – బాల్యంలో ఎంత భక్తిగా పెరిగినా, యవ్వనంలోనికి వచ్చిన తర్వాత అన్యులకంటే ఘోరంగా జీవిస్తున్నారు. తమ ప్రవర్తన, వస్త్రధారణ అన్ని అన్యులకంటే ఘోరంగా ఉంటున్నాయి. విచారకరమైన విషయం ఏమిటంటే దైవసేవకుల కుమారులు/కుమార్తెలు చాలామంది అన్యులకంటే ఘోరంగా దిగజారి పోయి జీవిస్తున్నారు. వారి వస్త్రధారణ చూసి లోకమే అవాక్కవుతుంది. సినిమా యాక్టర్ లకు తక్కువగాకుండా తయారవుతున్నారు. లోకస్తులులా త్రాగుడు, వ్యభిచార క్రియల్లోమునుగుతున్నారు. (నేను కూడా ఒక పాస్టర్ గారి చిన్నకొడుకుని గనుక అనుభవంతో వ్రాస్తున్నాను)

ప్రియ దైవసేవకుని కుమారుడా/కుమార్తె! ఇది మనకు తగదు! మన మాట ప్రవర్తన, వస్త్రధారణ, అన్నీ దేవునికి మహిమకరంగా ఉండాలి గాని దేవునికి, తల్లిదండ్రులకు సంఘానికి అవమానం కలిగించేలా ఉండరాదు.

దైవసేవకుల పిల్లలు సంఘస్తుల పిల్లలకు మాదిరికరంగా వుండాలి గాని వారిని కలిపి చెరిపేలా ఉండకూడదని దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తున్నాను. మా నాన్నగారు మేము ఏం చేసినా ప్రతీసారి ఏలీ కుమారులను జ్ఞాపకం చేసుకోండి అంటూ ఉండేవారు.ఏలీ కుమారులవలన ఏలీ, ఎలీ కుమారులు, కోడలు చనిపోయారు, మందసం పట్టబడింది. ప్రజలు దేవుడంటే అసహ్యించుకొనేలా చేసారు. చివరకు చచ్చారు. కాబట్టి మాదిరికరమైన జీవితం జీవించమని సేవకుల పిల్లలకు మనవి చేస్తున్నాను.
అట్టి కృప దైవసేవకుల పిల్లలందరికీ, దారి తప్పిన పిల్లలకు కలుగును గాక!

ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)


తప్పిపోయి-దొరికిన-కుమారుడు

9వ భాగం

Luke(లూకా సువార్త) 15:14,15
14.అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి,
15.వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.
అదంతా ఖర్చుచేసిన తర్వాత . . . చిన్న కుమారుడు తండ్రి ఇచ్చిన ఆస్తిమొత్తం ఖర్చుచేసేసాడు, పాడుచేసేసాడు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది.
బహుశా చిన్నకుమారుడు దివాలా తీసేస్తున్నాడు అని తెలిసి స్నేహితులు, వేశ్యలు ఎవరికి కావసినంత వారు నొక్కేసి నెమ్మదిగా జారుకొన్నారు. ఎంతోమంది స్నేహితులతో కలసివచ్చిన చిన్నకుమారుడు డబ్బులేనప్పుడు ఒంటరివాడై పోయాడు. అందుకే పెద్దలంటారు: బెల్లం ఉంటే ఈగలు వ్రాలతాయి. బెల్లం అయిపోతే ఈగలుండవు. నీదగ్గర డబ్బులున్నప్పుడు నీ స్నేహితులు, బంధువులు, వీరు వారు అందరూ పోగవుతారు. నీదగ్గర డబ్బులేకపోతే నిన్ను పలకరించువారే ఉండరు. ఒకవేళ నీవు పలకరించినా ఏదో పని ఉన్నట్లు పారిపోతారు. ఇదే లోకం!!!!

అయితే తర్వాత భాగంలో చూసుకొంటే – అదే ప్రాంతంలో కరవు వచ్చింది. బోడిగుండు మీద తాటికాయ పడినట్లు/ మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు!!!! అసలే డబ్బుల్లేవు. దానికి కరువు తోడయ్యింది. బహుశా తన స్నేహితులను అడిగిఉంటాడు కొంచెం డబ్బులిమ్మని, వారు మాదగ్గర డబ్బులెలా వస్తాయి? మేము నీలాగా భూస్వాములమా? అని ఉండొచ్చు. ఇంతకాలం అతని సొమ్ము పందికొక్కుల్లా తిన్నారని మరచిపోయారు. తనతో గడిపిన వేశ్యలను అడిగిఉండొచ్చు, నీవు డబ్బులిచ్చావు, నేను సుఖమిచ్చాను అంతే మనమధ్య సంభందం, అంతకన్నా ఏమీలేదు. కావాలంటే ఈ పూట భోజనం చేసి పొమ్మని గెంటేసి ఉంటారు.
ఎక్కడికి పోవాలో, ఏం చెయ్యాలో తెలియకుండా పోయింది చిన్నకుమారునికి!!! పెద్ద ధనవంతుని కుమారుడు, రాజ కుమారుడిగా బ్రతికాడు! ఇప్పుడు బికారి అయిపోయాడు!!!!

స్నేహితులను నమ్ముకొంటే అంతే!! అందుకే బైబిల్ గ్రంధంలో స్నేహితులను నమ్మవద్దు, ముఖ్యస్నేహితులను నమ్మవద్దు. . . (మీకా 7:5, యిర్మియా 9:4) ప్రతీవాడు తంత్రగొట్టయి తనసోదరుని కొంప ముంచుతున్నాడు అని వ్రాయబడింది. మరో దగ్గర తుంటరుల సహవాసం చేయువాడు పాడైపోతాడు అని వ్రాయబడింది(సామెతలు 28:7). చిన్నకుమారునికి అదే జరిగింది. ప్రియమైన యవ్వనస్తులారా! గమనించండి తల్లిదండ్రుల మాట వినకుండా స్నేహితుల మాట వింటే చిన్న కుమారునికి పట్టిన గతే మీకూ పడుతుంది.

ఆకలి సిగ్గెరగదంట. నిద్ర సుఖమెరుగదంట! ఇప్పుడు ఆకలికి తట్టుకోలేక ఏం చేసాడో తెలియదు, ఎవడూ భోజనం పెట్టలేదు. చివరకు ఆ దేశస్తులలో ఒకనిచెంత చేరాడు. వాడొక పందుల కాపరి. కొన్నివందలమందికి పనిచెప్పిన వ్యక్తి ఇప్పుడు పనికోసం ఒక పందులకాపరి దగ్గరికి వెళ్ళాడు. పందులుకాయడం మొదలుపెట్టాడు. ఆకలి భరించలేక పందులతో పాటు పందుల పొట్టు తినాలని అనుకొన్నాడు. చూసారా ఏం గతి పట్టిందో!!!

ఒక నిమిషం ఆగి ఆలోచిద్దాం! యూదులకు/ బైబిల్లో పంది అనేది అపవిత్రమైన జంతువు! లేవీ 11:7, ఎవరూ దానిని ముట్టుకోరు, దాని మాంసం తినకూడదు. ఇది దేవుని ఆజ్ఞ!!. ఇప్పుడు చిన్నకుమారునికి వాటిని అనగా అపవిత్రమైన వాటిని మేపాల్సి వచ్చింది, వాటిని కడగాల్సి వచ్చింది. ఆకలికి తట్టుకోలేక పందులతో కలసి ఒక పందిలాగ పొట్టు తినాలనుకున్నాడు గాని 16వ వచనం- అదికూడా దొరకలేదంట!!!!

ఒకమనిషి దేవుని సన్నిది/ సహవాసం వదలి, తండ్రి కాపుదల కోల్పోయాక ఒకమెట్టు ఒకమెట్టు దిగజారిపోయి, ఆత్మీయంగా చనిపోయాడు! అతిహీన స్తితికి దిగజారాడు! పాపాత్ములు, విశ్వాసంలో దిగజారిపోయిన వారు కూడా అంతే! వారు నిరుపయోగమైన అపవిత్రవిషయాల్లో నిమిగ్నమై ఉంటారు గాని పరిశుద్ద క్రియలు చేయరు. యెషయా 64:6; మత్తయి 15:18-20, 23:27; రోమా 1:24 దేవుడు వారి హృదయంలో చెడ్డకోరికలతో పాటు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎఫెసీ 4:17-19 అందుకే దేవుని బిడ్డలు లోకస్తులులా ప్రవర్తించకూడదు! . . . వారు దేవుని జీవం నుండి వేరై . . . కామవికార చేష్టలకు తమ్మునుతాము అప్పగించుకొనిరి! అందుకే పేతురు గారంటారు: మీరు మూర్ఖులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడి (అపొస్తులు 2:40). ఎందుకంటే మీరు వెండి బంగారములవంటి క్షయవస్తువుల చేత విమోచింపబడలేదు గాని, అమూల్యమైన రక్తము చేత విమోచింపబడిరి! 1 పేతురు 1:18,19.

కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! లోకస్తులులా ప్రవర్తించవద్దు! వారినుండి వేరై ప్రత్యేకముగా జీవించమని మనవి చేస్తున్నాను.చిన్నకుమారుడు లోకంలో కలసిపోయి అతిహీన దశకు చేరాడు. మనకు వారిలాంటి వస్త్రధారణ, వారిలాంటి బుద్దులు వద్దు!
ప్రత్యేకంగా ఉందాం! పరమరాజ్యం చేరుదాం!
దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
ఆమెన్!
(ఇంకాఉంది)


తప్పిపోయి-దొరికిన-కుమారుడు

10వ భాగం


Luke(లూకా సువార్త) 15:17
17.అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడునా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను.
ప్రియదైవజనమా చివరకి చిన్నకుమారుడు పందులపొట్టు తిందామని అనుకున్నా ఎవరూ వానికేమియు ఇయ్యలేదు.

నాచిన్నప్పుడు మా అమ్మగారు ఈ సన్నివేశాన్ని ఇలా చెప్పేవారు. (మా అమ్మగారికి మా అమ్మమ్మ చెప్పిందంట): పందులు మేపుకుని వచ్చిన చిన్నకుమారుడు ఆకలేస్తుంది భోజనం పెట్టమని పందులకాపరిని అడిగాడంట. ముందు పందులకు ఆహారం (పొట్టు), నీరు పెట్టు, తర్వాత నీకు పెడతాను అన్నాడు. అయితే పందులకు పొట్టు వేసి, చిన్నకుమారుడు ఆకలికి తట్టుకోలేక పందులతోపాటు ఒకపందిలాగ వాటితో పోటీపడి తినడం మొదలుపెట్టాడు. అప్పుడే వచ్చిన పందులకాపరి ఈ దృశ్యాన్ని చూసి: నా పందులకోసం పెట్టిన ఆహారం నీవు తింటావట్రా! అని చేతిలో ఉన్న దుడ్డుకర్రతో నడ్డిమీద (నడుం) ఒకదెబ్బ వేసాడంట! అసలే నీరసంగా, ఆకలితో ఉన్న చిన్నకుమారుడు ఈదెబ్బతో కళ్ళుబైర్లు కమ్మి పడిపోయాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరచి చూస్తే పైన ఆకాశం కనిపించింది. ఆకాశాన్ని చూసిన చిన్నకుమారునికి ఆకాశంలో ఉన్న దేవుడు, తన తండ్రి గుర్తుకొచ్చారు!
జీవితంలో మొట్టమొదటగా దెబ్బలు తిన్న చిన్నకుమారునికి ఆ దెబ్బతో బుద్ధి వచ్చింది. అప్పుడు అనుకొంటున్నాడు: అయ్యో! నా తండ్రిఇంట అనేకమంది కూలివారు పనిచేస్తున్నారు. వారంతా సమృద్ధిగా భోజనం చేస్తున్నారు, ఎప్పుడూ మానాన్న వారిని కొట్టలేదు. ఇక్కడ నేనైతే ఆకలితో చచ్చేలా ఉన్నాను అనుకొన్నాడు.
(గమనిక: ఇది వాక్యాన్ని కలిపి చెరపడం ఎంతమాత్రము కాదు, చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నాన్నమ్మలు, అమ్మలు వాక్యం అర్ధం అవ్వడానికి ఇలానే వివరించి చెప్పేవారు)

చూశారా చేతిలో డబ్బులున్నప్పుడు గాని, ఆరోగ్యంగా ఉన్నప్పుడు గాని, త్రాగి తందనాలాడి వేశ్యలతో తిరిగినప్పుడు గాని తండ్రిగాని, దేవుడు గాని గుర్తుకు రాలేదు. ఇప్పడు దెబ్బ పడినప్పుడు ఆకలితో చనిపోయేలా ఉన్నప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు తండ్రి- దేవుడు ఇద్దరూ గుర్తుకొచ్చారు.
మనలో చాలామందికి అన్నీ సంక్రమంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు!!!
ప్రార్ధన చేసినా ఏదో మ్రొక్కుబడిగా ఏవో రెండుముక్కలు తప్పనిసరి అన్నట్లు ప్రార్ధన చేసి, ఒకరెండు వచనాలు బైబిల్ చదివి చాలు అన్నట్లు వెళ్ళిపోతారు!!
అదే ఏదైనా కుదరని రోగం వస్తే, ఏదైనా పెద్ద శ్రమ వస్తే, ఇంట్లోవాళ్ళు చావుబ్రతుకులలో ఉంటే చూడాలి- ఎప్పుడూ స్తోత్రం స్తోత్రం,దేవా కనికరించు, నీవుంటే నాకు చాలు యేసయ్య, ఇంకేమీ వద్దయ్యా అంటూ ప్రార్ధన చేస్తూ ఉంటారు. కళ్ళంట నీరు కారిపోతూ ఉంటుంది, కాళీ దొరికితే బైబిల్ చదివేస్తూ ఉంటారు, తీరా దేవుడు కనికరించి ఆ కష్టం నుండి తప్పిస్తే షరామామూలే!!!!

ఇదేనా భక్తి?
ఇదేనా విశ్వాసం తమ్ముడా!!???
కష్టాలు వచ్చినప్పుడేనా ప్రార్ధన?
నష్టాలు వచ్చినప్పుదేనా ప్రార్ధన?
సుఖాలు వచ్చినప్పుడు ప్రార్ధన లేదా చెల్లీ!!!ఆలోచించండి!!!

అందుకే ప్రసంగి ఇలా చెబుతారు: Ecclesiastes(ప్రసంగి) 12:1,2
1.దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,
2.తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.
కాబట్టి ప్రియ సహోదరి/సహోదరుడా! ఇపుడే మార్పునొందు, అనునిత్యము ప్రార్ధిస్తూ , స్తుతిస్తూ ఉండు!!!
15:18 లో బుద్ధి వచ్చాక ఇలా అంటున్నాడు : నేను లేచి తండ్రిదగ్గరకు వెళ్లి తండ్రీ నేను పరలోకమునకు విరోదముగాను, నీ యెదుటను పాపము చేసితిని. .

ఇక్కడ రెండు విషయాలు చెప్పలనుకొంటున్నాను.

1. దేవుణ్ణి విడచి లోకం వైపు తిరిగి దిగజారిపోయినవారు (ఆత్మీయంగా) మతిలేని వారు/ మతి కోల్పోయినవారు. దేవుడు వారికి తిరిగి మతి రప్పించడానికి, ఇంకా దేవుడు అనేవాడు ఉన్నాడు అని గుర్తుచేయడానికి ఇబ్బందుల కొలిమిలో వేస్తారు. అప్పుడు తనకుతానుగా మతి/ బుద్ధి తెచ్చుకొని దేవుని యొద్దకు రావాలి. చిన్నకుమారునికి కూడా ఎవరూ బుద్ధి చెప్పలేదు. పరిస్తితులు పాటం నేర్పిన తర్వాత బుద్ధి తెచ్చుకొని తండ్రియొద్దకు తిరిగి వెల్దాం అనుకొన్నాడు!
ఒకవేళ నీవు దేవుణ్ణి వదలి, సంఘాన్ని సహవాసాన్ని వదలి తిరుగుతున్నావా?
నేడే బుద్ధి తెచ్చుకొని తిరిగి నీవుకూడా దేవునియొద్దకు మరలి రమ్మని మనవి చేస్తున్నాను.

2. చిన్నకుమారుడు ఆస్తిలో వాటా అడిగి, దాన్ని అమ్మివేసి, వేశ్యలతో పాడుచేసి తండ్రిని బాధపెట్టాడు, గాని అంటున్నాడు: తండ్రీ నేను పరలోకమునకు విరోదముగాను నీయెదుటను పాపము చేసితిని. పరలోకంలో ఎవరుంటారు? దేవుడు దేవునిదూతలు. అంటే నేను పాపము చేసింది మొదటగా దేవునికి వ్యతిరేఖంగా, రెండవదిగా నీ ఎదుట అనగా తండ్రికి వ్యతిరేకంగా పాపం చేసాను అంటూ క్షమాపణ వేడుకుంటున్నాడు.
ప్రియ సహోదరీ/సహోదరుడా! నీవుచేసే లోకానుసారమైన పనులు దేవుణ్ణి గాయపరుస్తాయని, ఆయనకు వ్యతిరేకమైనవని ఎప్పుడైనా తలంచావా? అలా తలంచకే మనకిష్టమొచ్చినట్లు జీవిస్తున్నాం! బుద్ధివచ్చాక చిన్నకుమారునికి జ్ఞానోదయం అయింది. వెంటనే తండ్రిని క్షమాపణ అడిగాడు. అలానే నీవుకూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తుంటే బుద్ధి తెచ్చుకొని నేడే క్షమాపణ వేడుకో! ఆయన కరుణావాత్సల్యుడు గనుక వెంటనే నిన్ను క్షమించి, తన హక్కున చేర్చుకొంటారు.

అట్టి కృప మన అందరికి కలుగును గాక!

ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)



















తప్పిపోయి-దొరికిన-కుమారుడు
11వ భాగం- తండ్రి ప్రతిస్పందన
Luke(లూకా సువార్త) 15:19
19.ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.
ఇకమీదట నీకుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాదు అంటున్నాడు. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొంటున్నాడు. తండ్రి బ్రతికుండగానే ఆస్తిని పంచిపెట్టమన్నాడు, తండ్రి బ్రతిమిలాడినా వినకుండా ఆస్తిలో వాటా తీసుకొని, అమ్మి, దానిని పాడుచేసి ఇప్పడు మొత్తం కోల్పోయాడు. ఆ తండ్రికి కుమారుడు అనిపించుకునే నైతిక విలువను కోల్పోయాడు. కేవలం ఇంటిపేరు మాత్రం మిగిలింది.!!
ఇంకా అంటున్నాడు నీకూలివారిలో ఒకనిగా నన్ను చేర్చుకో అంటున్నాడు. ఎందుకంటే అలా అయినా కడుపునిండా ఆహారం దొరుకుతుంది అని. కొంతైనా విలువ దొరుకుతుంది అని.
అలా అనుకుని లేచి బయలుదేరాడు. ఇప్పుడు తండ్రి ప్రతిస్పందన చూడండి. తను ప్రేమించిన చిన్నకుమారుని కోసం ఎన్నిరోజుల నుండి ఎదురుచూస్తున్నాడో తెలియదు, సరిగా భోజనం చేసి ఉండడాయన!! ఎంత ప్రార్ధన చేసాడో తెలియదు! తనకు తెలుసు తన కుమారుడు డబ్బంతా ఖర్చుచేసి, పోగొట్టుకొంటాడు. తిరిగి తనదగ్గరకే వస్తాడని తెలిసి ఎదురుచూస్తున్నాడు. బయట ఎవరు పిలచిన తనకుమారుడే అని అనుకుని వెళ్లి చూడటం, నిరాశ పడడం! కోపమంతా పోయింది. ఆత్రుతతో ఎదురుచూస్తున్నాడు తనకుమారుడు బ్రతికుంటే చాలు అని!!!
ఇదీ తండ్రి ప్రేమ!
ప్రియ సోదరీ/సోదరుడా! నీవు ఎన్నిమాటలాడినా నీ తండ్రి నీ తండ్రే! తండ్రికోపం ఎన్నో రోజులుండదు. తను కోపపడేది మన మేలుకోసమే అని గ్రహిస్తే, ఎందుకు కోపపడ్డారో అలోచించి, సరిదిద్దుకోవచ్చు!
విసుక్కుంటే అదేగతి! అధోగతి!!

దేవుడు కూడా అంతే!! నిన్ను బాగుచేయడానికి, గొప్పచేయడానికి నిన్ను గద్దించి, శిక్షిస్తే Feel అయిపోయి దేవుని నుండి దూరంగా పారిపోకు! దానివల్ల నీకే నష్టం! చివరకు నీవు దేవుణ్ణి నీ ప్రవర్తన ద్వారా, మాటద్వారా ఎంత బాదించిన అనుకుంటారు దేవుడు – ఈరోజైనా ఇప్పుడైనా బుద్దితెచ్సుకొని తిరిగి నాదగ్గరకు వస్తాడు అని ఎదురుచూస్తున్నారు (యెషయా65:2).
అందుకే దేవుడంటున్నారు : ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా దగ్గరకే రావలెను(యిర్మియా 4:1). ఎందుకంటే మిగిలినవారు నీ క్షేమం కోరేవారు కాదు, క్షేమం ఇచ్చేవారు కాదు! నిన్ను కన్నది నీ దేవుడే కాబట్టి నీమీద జాలిపడేవాడు నీ దేవుడే!
ఇంకా అంటున్నారు: ప్రయాసపడి భారము మోసుకోనుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి నేనుమీకు విశ్రాంతిని ఇస్తాను(మత్తయి 11:28).
కాబట్టి నేడే బుద్ధి తెచ్చుకొని తిరిగి దేవునియోద్దకు రమ్మని దేవుని పేరిట మనవి చేస్తున్నాను.

20వ వచనం వాడింకా దూరముగా ఉన్నప్పుడే పరుగెత్తి, మెడమీద పడి, ముద్దుపెట్టుకొనెను! మొట్టమొదట తండ్రి వాడింకా దూరంగా ఉన్నప్పుడే గుర్తుపట్టాడు. బహుశా ఆయన పరుగెత్తుకొంటూ వెళ్తోంటే పనివారు అయ్యా మీరెప్పుడూ పరుగెత్తరే! ఇప్పుడు ఏం వచ్చింది అలా పరుగెత్తుతున్నారు అని అడిగిఉంటారు . అప్పుడు తండ్రి అదిగో నా చిన్నకుమారుడు వస్తున్నాడు. వానిని ఎదుర్కోడానికి వెళ్తున్నాను.
పనివారు అని ఉండొచ్చు ఏమిటి సార్! వాడేంటి మీ కుమారుడేంటి? వాడి చింపిరి జుట్టు, చినిగిపోయిన బట్టలు, ఎవడో పిచ్చివాడో, అడుక్కునే వాడో అయ్యుంటాడు అంటే తండ్రి అంటున్నారు: *వాడు నా కొడుకే! నాకు తెలుసు వాడి ఫైనల్ స్టేజ్ ఇదేనని నాకు తెలుసు* అని పరుగెత్తి, మెడమీద పడి, ఏడ్చి, ముద్దుపెట్టుకొన్నారు. మొదట గుర్తుపట్టారు, రెండు కనికరపడ్డారు, మూడు పరుగెత్తారు, నాలుగు మెడమీద పడి ఏడ్చారు. ఐదు ముద్దు పెట్టుకొన్నారు.

చూసారా తండ్రిప్రేమ! ఇంత బాధపెట్టినా, ఎంత క్షోభపెట్టినా తండ్రి ఎలా చేర్చుకున్నారో!! *అదేవిధంగా నీవు దేవుణ్ణి విడచి దూరంగా పోయినా, తిరిగి తండ్రివద్దకు వచ్చి క్షమాపణ వేడుకుంటే నీవు ఎంత అందవిహీనంగా ఉన్నా, ఎంత పాపమనే మురికితో ఉన్నా సరే నీ మీద జాలిపడి, కనికరపడి, నిన్ను తిరిగి చేర్చుకోడానికి ఆ పరమతండ్రి సిద్ధంగా ఉన్నారు*.!
వస్తావా?!! ఇదే అనుకూల సమయం! నేడే రక్షణ దినం!(2కొరింథీ 6:2)
అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)

తప్పిపోయి-దొరికిన-కుమారుడు
12వ భాగం- తండ్రి ప్రతిస్పందన-2
Luke(లూకా సువార్త) 15:21,22,23
21.అప్పుడు ఆ కుమారుడు అతనితోతండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.
22.అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;
23.క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము;

దేవుని ప్రియమైన జనాంగమా! మనం గత కొద్దిరోజులుగా తప్పిపోయి కుమారుడు ఎలా దొరికాడో ధ్యానం చేస్తున్నాం. ఇంటికివచ్చిన కుమారునితో తండ్రి ప్రతిస్పందన చూస్తున్నాం!

ఇక్కడ మనం చూస్తే కుమారుడు తనతప్పు తెలుసుకొని ఇంటికివచ్చిన వెంటనే, కుమారుడు ఇంకా మాట్లాడక ముందే, తండ్రి కనికరపడి, పరుగెత్తి, మెడమీద పడి ఏడ్చి, ముద్దు పెట్టుకొన్నట్లు చూసాం. అయితే 21వ వచనంలో కుమారుడు అంటున్నాడు తండ్రీ నేను దేవునికి, నీకు వ్యతిరేకముగా పాపము చేసాను నన్ను క్షమించు, అయితే ఇప్పుడు నేను వచ్చింది నీ కుమారుడనని పిలిపించుకోడానికి కాదు. ఆ యోగ్యత నేను కోల్పోయాను కాబట్టి నన్ను కనీసం నీ కూలివారిలో ఒకనిగా చేర్చుకో అని మనవి చేస్తున్నాడు!

ఇదే మనం తండ్రిని బ్రతిమాలుకొనే విధానం! మనం చేసిన తప్పు తెలిసికొని వెంటనే పరమ తండ్రిని, ఇంకా సంబందిత వ్యక్తులను క్షమాపణ వేడుకోవాలి. అప్పుడే మీరు క్షమించబడతారు, రక్షింపబడతారు, కనికరింపబడతారు.

తండ్రి ప్రతిస్పందన చూడండి, కొట్టలేదు, తిట్టలేదు సంతోషపడి తన దాసులతో అంటున్నారు(సంతోషంలో కుమారునితో మాట్లాడటం లేదు): 22,23 వచనాలు: ప్రశస్తవస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, క్రొవ్విన దూడను వధించుడి మనం సంతోషించి . . .
ఇప్పుడు తండ్రి మాటలను మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం!

1.ప్రశస్తవస్త్రములు త్వరగా తెచ్చి, వీనికి కట్టి: ప్రశస్త వస్త్రములను మనం ధరిస్తాం, గాని ఇక్కడ కట్టమంటున్నారు తండ్రి. ఎందుకు? బహుశా తన కుమారుని దీన స్తితి అనగా చినిగిన బట్టలు, మాసిన గడ్డం తండ్రి చూడలేకపోయారు కాబోలు, అందుకే తొందరగా కట్టండి అంటున్నారు. పూర్వకాలంలో లోపల బట్టలు ధరించి, పైన మంచి ప్రశస్త మైన కోటులాంటిది వేసుకునేవారు ధనవంతులు. అలాంటిది వెంటనే వెయ్యమంటున్నారు. కుమారుడు షేవింగ్ చేసుకుని, స్నానం చేసి చాలా రోజులయ్యింది, గాని వెంటనే కట్టమంటున్నారు. బహుశా ఇంటిలోపలికి వెళ్ళేవరకు కూడా తన కుమారుని prestige భంగం కాకూడదనే కాబోలు. ఇదీ తండ్రి ప్రేమ!
లేదా ఆ ప్రశస్త వస్త్రం కట్టుకునే టైపు కావచ్చు!

ఇంతవరకు పాపమనే కూపంలో పడి, పాడైపోయిన చినిగిపోయిన వస్రాలను మార్చమని చెబుతున్నారు. తనకున్న రక్షణ వస్త్రం పోగొట్టుకొన్నాడని తండ్రికి తెలుసు! అందుకే ప్రశస్త వస్త్రం- రక్షణవస్త్రం కట్టమంటున్నారు. ప్రియవిశ్వాసి! ఎప్పుడైతే మార్పునొంది తిరిగి తండ్రిదగ్గరకు వస్తావో , దేవుడు కనికరించి పోగొట్టుకొన్న రక్షణవస్త్రాన్ని తిరిగి ధరింపజేస్తారు తండ్రి! అయితే దానిని మరలా పోగోట్టుకోకు! ప్రతీ ఆరాధనలో పాల్గొని వాక్యపు వెలుగులో, యేసు రక్తంలో ప్రతీ పాపాన్ని, డాగును శుద్ధి చేసుకుంటూ ఉండాలి! ప్రధాన యాజకుడైన యెహోషువా అగ్నిలో నుండి తీసిన కొరవి లా ఉన్నా సరే సాతానుగాడు దేవునికి పిర్యాదు చేసాడు ఆయన మలిన వస్త్రములు వేసుకున్నాడు అని(జెకర్యా 3:1). మరి నీ జీవితంకోసం కూడా వాడు పిర్యాదు చేయడా మలిన వస్త్రాలుంటే!! షూలమ్మితి అజాగ్రత్త గా నడిరేయి వీదుల్లో ప్రియునికోసం తిరుగుతుంటే కావలివారు (సాతాను దూతలు) ఆమె వస్త్రాన్ని (అనగా రక్షణ వస్త్రాన్ని) దోచుకుపోయారు. పరమగీతం 5:7. కాబట్టి ప్రియ సహోదరి/సహోదరుడా! నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకో! (ప్రకటన 3:11)

2. చేతికి ఉంగరం పెట్టి: ఉంగరం నిభందనకు గుర్తు.
చిన్నకుమారుడు ఆస్తితో పాటు ఉంగరాన్ని కూడా ఎప్పుడో పోగొట్టుకున్నాడు. అందుకే క్రొత్త ఉంగరాన్ని పెట్టమంటున్నారు తండ్రి.. తండ్రి తో నిభందనను భగ్నం చేసి, విర్రవీగి, దెబ్బతిని మరలా వచ్చాడు. అందుకే తండ్రి దయతలచి నూతన ఉంగరం , నూతన నిభందన చేస్తున్నారు ఏమని? నీవు నా కుమారుడివి అని!!! తండ్రియైన దేవుడు కూడా ఇశ్రాయేలీయులతో నూతన నిభందన చేసారు. ఆనిభందన మనకు కూడా చేసారు. ప్రియ విశ్వాసి! తండ్రి దగ్గరకు వస్తే ప్రశస్తవస్త్రం, రక్షణ వస్త్రం తో పాటు నీకు ఉంగరం అనే నూతన నిభందన కూడా దేవుడు చేస్తారు. అయితే ఈ నిభందనను దయచేసి మీరకు!!

3. పాదములకు చెప్పులు తొడగండి: దీనిలో రెండు అర్ధాలున్నాయి.
a) ఆకాలంలో కుమారులు/ వారసులు మాత్రమే చెప్పులు తొడుగు కోవాలి గాని పనివారు, బానిసలు చెప్పులు వేసుకునే అధికారం లేదు. అయితే చిన్న కుమారుడు ఆకలితో పందులకాపరి దగ్గర ఎప్పుడైతే పనికి సేవకునిగా చేరాడో, అపుడు చెప్పులు వేసుకునే అధికారం కోల్పోయాడు. చూసారా చిన్నకుమారుడు తన తిరుగు ప్రయాణంలో కొన్ని దేశాలు చెప్పులు లేకుండా నడచుకుంటూ రావాల్సి వచ్చింది. అందుకే చెప్పులు లేకుండా వచ్చిన కుమారుని, తిరిగి కుమారుని అర్హత ఇవ్వడానికి చెప్పులు తొడగండి అని చెబుతున్నారు.

b) చెప్పులు దేవుడిచ్చు సర్వాంగకవచములో ఒక భాగం. – సమాధానసువార్త వలనైన సిద్ధమనస్సు అనే జోడు (ఎఫెసీ 6:15). ఒకవ్యక్తి ఎప్పుడైతే బ్రష్టుడు అవుతాడో, సర్వాంగకవచాన్ని దేవుని కాపుదలని కోల్పోతాడు. *దేవుని కుమారుడు సాతానుకి దాసుడౌతాడు*. (పాపము చేయు ప్రతీవాడు పాపానికి దాసుడు. యోహాను 8:34). అప్పుడు చెప్పులు పోగొట్టుకొంటాడు. సువార్తచెప్పే లక్షణాన్ని వదిలేస్తాడు. గాని ఎప్పుడైతే తిరిగి తండ్రి వద్దకు వస్తాడో దేవుడు ప్రశస్తవస్త్రం, ఉంగరం(నిభందన)తో పాటు కాళ్ళకు కాపుదలగా చెప్పులు (సువార్త చెప్పే గుణం) ఇస్తారు. ప్రియ విశ్వాసి! ఆ చెప్పులు నీకున్నాయా? ఉన్నాయిగాని ఎవరికీ సువార్త చెప్పడం లేదా? ఒకసారి నిన్ను నీవు సరిచూసుకోమని మనవి చేస్తున్నాను!

ఈవిధంగా చిన్నకుమారుడు బుద్ధితెచ్చుకొని, తండ్రి వద్దకు కూలివానిగా బ్రతుకుదామని వస్తే, తండ్రి కుమారునిగా స్వీకరించారు. తండ్రిప్రేమకు నిదర్శనమది. అదేవిధంగా పరమతండ్రి కూడా “తన్ను ఎందరంగీకరించితిరో వారందరినీ కుమారులు చేయుటకు తండ్రి అధికారమిచ్చియున్నాడు” కాబట్టి యేసయ్యను స్వంత రక్షకునిగా అంగీకరించిన నీవు/నేను ఇప్పుడు కూమార/కుమార్తెలము.
ఈ స్వాతంత్ర్యాన్ని, ఆధిక్యతను లోకాశాలలో పడి కోల్పోకు!
ప్రియ యవ్వనజనమా! మీ తల్లిదండ్రులమాట వినండి!
దేవుని మాట వినండి!
దూరమయ్యారా- చిన్నకుమారునికి పట్టిన గతే పడుతుంది.
ఒకవేళ మీరు ప్రస్తుతం దూరంగా ఉన్నారా? చిన్నకుమారునిలా మార్పునొంది తిరిగిరండి!

అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!
(ఇంకాఉంది)











తప్పిపోయి-దొరికిన-కుమారుడు-The Prodigal Son
13వ భాగం*మరో తప్పిపోయిన కుమారుడు*

ప్రియదైవజనమా! మనం ఇంతవరకు తప్పిపోయి దొరికిన కుమారుని కోసం ధ్యానిస్తున్నాం! చిన్నకుమారుడు తిరిగి ఇంటికి వస్తే తండ్రి క్రొవ్విన దూడను వధించి విందుచేసినట్లు చూస్తాం 23వ వచనంలో. అయితే ఇక్కడ రక్షించబడిన విశ్వాసి క్రొవ్వినదూడ మాంసం తినాలని ఎంతమాత్రము కాదు. ఆరోజుల్లో ఏదైనా పెద్దవిందుచేసుకుంటే క్రొవ్విన దూడతో విందు చేసుకునే వారు. ఇక్కడ తండ్రిపెద్ద విందు చేసారు అని చెప్పడానికే యేసుప్రభులవారు క్రొవ్వినదూడ అన్నారు గాని రక్షింపబడిన విశ్వాసి బీఫ్ తినాలి అని ఎంతమాత్రము కాదు.

ఎందుకు విందు చేసుకుందాం అంటున్నారు తండ్రి? 24: నాకుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. అవును చిన్నకుమారుడు ఆత్మీయంగా చనిపోయాడు. ఇంటికి వచ్చి తిరిగి బ్రతికాడు ఆత్మీయంగా. లోకంలో పడిపోయి తిరిగి దొరికాడు. అందుకే విందు.

అయితే మనం 25-32 వరకు మరో తప్పిపోయినకుమారుని చూస్తాం! అతడు పెద్దకుమారుడు. చిన్నకుమారుడు విచ్చలవిడితనానికి అలవాటుపడి లోకంలో పడిపోయి తప్పిపోయాడు, అయితే పెద్ద కుమారుడు తండ్రితో ఇంట్లో ఉంటూనే- అసూయ, ఈర్ష్యతో తప్పిపోయాడు.

25: చిన్నకుమారుడు ఇంటికి వచ్చినప్పుడు పెద్దకుమారుడు పొలంలో ఉన్నాడు. అంటే పెద్దకుమారుడు చాలా భాద్యత కలిగిన వాడు.
29వ వచనం ప్రకారం తమ్ముడు బాగోగులు విచారించినవాడు. తండ్రిమాట జవదాటనివాడు!!
ఇంతమంచివ్యక్తీ కూడా తమ్ముడు వచ్చాడు- క్రొవ్విన దూడ వదించి విందుచేస్తున్నారు అంటే కోప పడి ఈర్ష్యపడ్డాడు.
29: ఇంట్లోకి రాకుండా అలుగుతున్నాడు. తండ్రివచ్చి బ్రతిమిలాడితే అంటున్నాడు ఇన్నిరోజులూ నీతో ఉండి నీ అజ్ఞను ఎప్పుడూ నేను మీరలేదు, నిన్ను సేవిస్తూ వచ్చాను, గాని ఎప్పుడూ నాకు విందు చేసుకోమని మేకనైనా ఇవ్వలేదు.. నీ ఆస్తిని వేశ్యలతో పాడు చేసిన తమ్ముడు వస్తే నీవు వాడికోసం విందుచేసావ్! అంటున్నాడు.

ఒకసారి ఆగుదాం! పెద్దకుమారునికి ఎంత కోపం వచ్చిందో చూసారా!
1)యేసుప్రభులవారు శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశించి వారిని పెద్దకుమారునితో పోల్చారు.
శాస్త్రులు పరిసయ్యులు భక్తిలో ఉంటున్నారు, దశమభాగం ఇస్తున్నారు. పెద్దపెద్ద దీర్ఘ ప్రార్ధనలు చేస్తున్నారు. వీదులలో భక్తిగలవారమని చెప్పుకుంటూ వందనాలు స్వీకరిస్తున్నారు.(మత్తయి, మార్కు, లూకా) అయితే కనికరం, దయ, సహోదరప్రేమ లాంటివి మరచిపోయారు. పుదీనా జీలకర్రలాంటివాటిలో కూడా దశమభాగం ఇస్తున్నారు గాని ప్రేమ, కనికరం, దయ లాంటివి లేవు. యేసుప్రభులవారంటారు వాటిని (దశమభాగం ఇవ్వడం, ప్రార్ధించడం లాంటివి) మానకుండా వీటిని (ప్రేమ, కనికరం, దయ) చేయాలి అని. అందుకే దేవుడు వారిని సున్నం వేసిన సమాదులతో పోల్చారు. వారి వేషదారణను ఎండగట్టి గద్ధిస్తున్నారు.

2)యేసు ప్రభులవారు సుంకరులకు, పాపులకు సువార్త ప్రకటించి వారిని చేర్చుకుంటే పరిసయ్యులు, శాస్త్రులు ఆయనని అపహసించారు, వారిని చేర్చుకోవడం నిరసించారు. అందుకే దేవుడు వారిని పెద్ద కుమారునితో పోల్చి పాపి క్షమాపణ కోరుకుంటే తిరిగి చేర్చకుంటాను అని చెప్పారు.

పెద్దకుమారుడు కూడా ఎంతో జాగ్రత్తగా పనిని నిర్వహిస్తున్నాడు. పొలం- దేవుని సంఘం! కోతెంతో విస్తారం పనివారు కొద్దిగా ఉన్నారని పొలంలో పనిచేయడానికి(మత్తయి9:37-38) దేవుడు మనలో చాలామంది పనికి పెట్టుకున్నారు. అయితే ఈ సంఘంలో పనిచేసే వ్యక్తికీ- తన సహోదరునిమీద అసూయ, కోపం, ద్వేషం!!!

నేటిదినాల్లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘానికి దేవుడు నిన్ను అధ్యక్షునిగా, కాపరిగా, సేవకునిగా చేస్తే(అపొ 20:28)- సంఘాన్ని కాయకుండా, పొలానికి నీరు పెట్టకుండా, సంఘంమీద రాజుగా అధికారిగా అధికారం చెలాయిస్తున్నావు తప్ప సంఘంలో ప్రేమ దయ కనికరం లాంటివి పెంచడం లేదు! దీనినే దేవుడు ఖండిస్తున్నారు. నీవు శాస్తులు పరిసయ్యులు లాగ దీర్ఘప్రార్ధనలు, దీర్ఘ ప్రసంగాలు చేస్తున్నావు, చప్పట్లు కొట్టించుకొంటున్నావు. గాని తోటి కాపరితో సమాధానం లేదు. తోటి సంఘపెద్దతో సమాధానం లేదు. ఈర్ష్య, ద్వేషంతో, కోపంతో రగిలిపోయి తోటి కాపరిమీద/ దైవ జనునిమీద లేనిపోనివి కల్పించి, అవుసరమైతే వీడియో మిక్సింగ్ లు చేసి దుష్ప్రచారం చేస్తున్నావు.
ఓ పెద్దకుమరుడా! దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తారని గుర్తుంచుకో! (రోమా 14:10-13, మత్తయి12:36))తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు(మత్తయి7:1). తీర్పుతీర్చారా మీరు తీర్పుకు గురౌతారు!
దయచేసి గుర్తుచేసుకోమని మనవి చేస్తున్నాను.
నీ తోటి సహా దైవసేవకుని మీద కొండాలు చెప్పకు.
సంఘంలో గొప్పకోసం ఆ భోదకుడు ఇలా, ఈ బోధకుడు అలా అని చెప్పకు!!
social mediaలో, టీవీలలో వీడియొలను పెట్టకు!!!
మొదట నీ కంట్లోనున్న దూలమును తీసుకో! అప్పుడు నీ సహోదరుని కంట్లోనున్న నలుసు నీకు బాగా కనబడుతుంది.(మత్తయి7:3-5) పెద్దకుమారుడు/ శాస్త్రులు/ పరిసయ్యులు ఇలానే తప్పిపోయారు. నీవుకూడా అలాచేయకు.

తండ్రి పెద్దకుమారునితో అంటున్నారు: నావన్నీ నీవే! వాడికి(తమ్మునికి) ఇంటిపేరు తప్ప ఏమిలేదు. వాడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. కాబట్టి మనం సంతోషించాలి గాబట్టి లోపలి రమ్మని పిలుస్తున్నారు.

ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవెలా ఉన్నావు? చిన్నకుమారునిలాగా? పెద్దకుమారునిలాగా? చిన్నకుమారునిలా తప్పిపోయి తిరుగుతున్నావేమో! చిన్నకుమారునిలా బుద్దితెచ్చుకొని (పరమ) తండ్రి వద్దకు మరలా రా!
పెద్దకుమారునిలా తప్పిపోతే, అసూయ-ద్వేషాలతో రగిలిపోతుంటే నీవు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు జాగ్రత్త!
నేడే మార్పునొంది నీ సహోదరుని క్షమించి, దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని తిరిగి నిభందనలోనికి/ నీ గృహములోని రా!

దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

(సమాప్తం)

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరీర కార్యములు

క్రిస్మస్

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

విశ్వాసము

పాపము

సమరయ స్త్రీ

విగ్రహారాధన