ఇశ్రాయేలు దేశంలోగల కొండలు పర్వతాలు
ఇశ్రాయేలు దేశము...1
(వివిధమైన పేర్లు )1. కనాను దేశము:
నోవాహు మనుమడు అనగా హాము కుమారుడైన కనాను సంతతి వారే దీనిలోని మొదటి పౌరులు అందుచే ఈ దేశము 'కనాను దేశము' అని పిలువ బడింది.
ఆది 10: 6,18,24,37
2. హేబ్రీయుల దేశము:
హేబ్రీయుడు అనగా నది అవతల నుండి వచ్చినవాడని అర్ధము
హేబ్రీయులైన అబ్రాహాము, లోతు గొప్ప మందలతోను, దాస జనముతోను ప్రభువులుగా ఇక్కడ జీవించుటచేత 'హేబ్రీయుల దేశము' అని పిలువ బడింది.
ఆది 40:15
3. ఇశ్రాయేలు దేశము:
ఇశ్రాయేలీయులు జీవించిన కారణముగా ఇశ్రాయేలు దేశము అని పిలువబడింది.
1 సమూ 11:3
4. వాగ్ధాన దేశము:
అబ్రాహాముకు వాగ్ధానము చేయబడిన స్థలమగుటచే 'వాగ్ధాన దేశము' లేదా 'వాగ్ధాన భూమి' అని పిలువ బడింది.
హెబ్రీ 11:9
5. యూదా దేశము:
యూదా రాజులచే పరిపాలించబడుటచే 'యూదా దేశము' అని పిలువ బడింది.
ఎజ్రా 1:3
6. పరిశుద్ధ దేశము:
(హోలీ ల్యాండ్)
పరిశుద్ధ నగరమైన యెరూషలేము గల దేశము అగుటచే 'పరిశుద్ధ దేశము' అని పిలువ బడింది.
మత్తయి 27:53
7. పాలస్తీనా దేశము:
పిలుష్తీయుల పాలన ఎక్కువ కాలము ఇక్కడ నున్నందున పాలస్తీనా గా పిలువబడింది.
(ప్రస్తుతము కొన్ని రాజకీయ పరిస్థితుల కారణముగా కొంత ప్రాంతము మాత్రమే పాలస్తీనా దేశముగా పిలువ బడుతుంది)
దావీదు, యేసు క్రీస్తు జన్మ స్థలమైన 'బెత్లెహేము' పాలస్తీనాలోనే వుంది.
( హీబ్రు లో బైత్ అంటే? ఇల్లు, లెహెమ్ అంటే? రొట్టెలు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు)
ప్రపంచ పటములో బెత్లెహేము మధ్య (కేంద్ర స్థానం)లో వుంది. ఈ విషయం యేసు క్రీస్తే ఈ ప్రపంచానికి కేంద్ర బిందువని స్పష్టం చేస్తుంది.
యేసు ప్రభువు వారు జన్మించి, సిలువ వేయబడి, మరణించి, పునరుద్ధానము చెంది, తిరిగిరానై యున్న దేశము కాబట్టి ఇశ్రాయేలు దేశము క్రైస్తవులకు కేంద్రబిందువయ్యింది.
అందుచే అనేక మంది ఈ కనానులో అడుగు పెట్టాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. వారి ఆశలతో అనేక మంది వ్యాపారం చేసుకొంటున్నారు. ఇక్కడ నుండి మట్టి, రాళ్ళు, నీళ్ళు సహితం తీసుకొని వెళ్లి అమ్మేసుకొంటున్నారు. యూదులు యేసుప్రభువు వారిని చంపేసి శవాన్ని అప్పగించేసారుగాని, అదే మనవాళ్ళయితే? ఆ శవాన్ని ముక్కలు కోసి గ్రాముల లెక్కన అమ్మేసేవారేమో?
ఒక్కవిషయం!
మనము ప్రయాస పడాల్సింది
•ఈ కనానులో అడుగు పెట్టడానికి కాదు. పరమ కనానులో అడుగు పెట్టడానికి.
•ఈ యెరూషలేములో అడుగు పెట్టడానికి కాదు. నూతన యెరూషలేములో అడుగు పెట్టడానికి.
మన భక్తి దేవునిని అపహాస్యం పాలుచేసి, మనలను నిత్య మరణంనకు నడిపించే విధంగా వుండకూడదు. వాక్యానుసారమై, నిత్య జీవానికి నడిపించేదిగా వుండాలి. ఆరీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకుందాము!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ఇశ్రాయేలు దేశము
(కొండలు-పర్వతములు - 2)ఒలీవల కొండ:
యెరూషలేముకు తూర్పున రెండు కిలోమీటర్ల దూరములో వుంది.
సీనాయి పర్వతమునే హోరేబు పర్వతము అనియు, దేవుని పర్వతము అనియు, పరిశుద్ధ పర్వతము అనియు పిలుస్తారు. కాని, యేసు ప్రభువు వారు ఒక్కసారి కూడా ఆ పర్వతానికి వెళ్ళినట్లు కనిపించదు. ఆయనకు ఒలీవల కొండతోనే అత్యంత సాన్నిహిత్యం వుంది.
కారణమేమిటి?
సొలోమోను కట్టించిన దేవాలయములో నుండి దేవుని మహిమ ఒలీవల కొండ మీదికి వెళ్ళిపోయింది. మరళా తిరిగి ఆయన రెండవ రాకడలో అదే కొండ మీద అడుగుపెట్టినప్పుడు, దేవుని మహిమ తిరిగి అప్పటికి కట్టబడి యుండిన మహిమ దేవాలయములోనికి ప్రవేశిస్తుంది. అంత వరకు దేవుని మహిమ ఒలీవల కొండమీద నిలిచివుంటుంది. అందుచే యేసు ప్రభువు వారు ఒలీవల కొండతోనే ప్రత్యక్షమైన సంబంధం కలిగియున్నారు.
అంతేకాకుండా ఆ కొండమీద దేవుని ఆరాదించు స్థలం అనగా ప్రార్థన చేసే స్థలం ఉన్నది (2 సమూయేలు 15:32). కాబట్టి యేసయ్య ఆ కొండతో అవినాభావసంబంధం కలిగియున్నారు.
1. ఒలీవల కొండకు వెళ్ళడం ఆయనకు అలవాటు.
దేవుని మహిమ అక్కడ నిలిచియుంది. అనునిత్యం తండ్రితో సహవాసాన్ని కలిగియుండడం ఆయనకు ఒక అలవాటుగా మారింది.
అయితే, మనకున్న అలవాటు ఏమిటి?
ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి. లూకా 22:39
2. ఒలీవ కొండ మీద ప్రార్ధించే అనుభవం.
ఆయన చివరి దినాలలో పగటి సమయం ఆయన రాజ్య సువార్తను ప్రకటించడం, రాత్రి సమయంలో తండ్రితో ఏకాంతముగా గడిపేవారు.
జగత్త్రక్షకుడైన యేసుప్రభుల వారే ప్రార్ధిస్తుండగా ప్రార్ధించే అనుభవం ఉందా మనకు?
ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను. లూకా 21:37
ఆయనతో ఏకాంతముగా గడిపే అనుభవం మనకుందా?
3. ఒలీవ కొండ మీదనే ఆయన రెండవ రాకడకు సంబంధించిన మర్మాలను తన శిష్యులకు తెలియజేసారు.
ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చిఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా మత్తయి 24:13
4. పస్కా విందు అనంతరం ఒలీవల కొండకు వెళ్ళారు.
పస్కా విందు ముగించుకొని పాటపాడుతూ ( ఇశ్రాయేలీయులు పస్కా సమయంలో 118 వ కీర్తన పాడుతారు) వెళ్ళారు (ఒలీవల కొండకు పశ్చిమాన గేత్సేమనే వనము వుంది. అది ఒలీవ వృక్షాలతో నిండి వుంటుంది.)
అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి మత్తయి 26:30
5. ఒలీవల కొండ మీద నుండే ఆయన ఆరోహణమయ్యారు.
అపో.కార్యములు 1: 11
గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అపో.కార్యములు 1: 12
అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది.
6. ఒలీవల కొండమీదనే ఆయన రెండవ రాకడలో అడుగుపెట్టనై యున్నారు.
ఆ దిన మున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టు నకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును. జెకర్యా 14:4
7. దావీదును తన కుమారుడే తరుముతున్నప్పుడు అతను పారిపోయింది ఒలీవల కొండమీదికే.
అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి. 2 సమూ 15:30-32.
గమనించారా? దావీదు రాజు గారు ఇంతకష్టంలో కూడా ఎక్కడికో పోయి తలదాచుకోవడమో, యుద్దానికి పోవడమో చేయకుండా ప్రార్థన చేయడానికి ఒలీవల కొండకు వెళ్ళినట్లు చూస్తున్నాం. ఇదే దావీదుగారి జీవిత విజయ రహస్యం.
పర్వతానుభవము ఐహిక సుఖాల నుండి మనలను దూరపరచి దేవునికి మరింత దగ్గర చేస్తుంది.
ఆరీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకుందాం.
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ఇశ్రాయేలు దేశము
(కొండలు-పర్వతములు - 3)మోరియా పర్వతం:
యెరూషలేములో వుంది.
మోరియా పర్వతం 'బలి అర్పించి, ఆయనను ఆరాధించే' అనుభవాలను జ్ఞాపకము లోనికి తీసుకువస్తుంది.
1. మోరియా పర్వతం మీదనే సొలోమోను దేవాలయము కట్టించెను.
తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి యైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను.
2 దిన 3:1
సొలోమోనుచేత కట్టబడిన మందిరం, కూల్చి వేయబడింది. తర్వాత హేరోదు కట్టిన మందిరం కూడా కూల్చి వేయబడింది. ఇప్పుడు మరొక మందిరం కావాలని అనునిత్యం యూదులు అక్కడ ఏడ్పులగోడ దగ్గర మొర్రపెట్టుతూ వుంటారు. ఆరాధించడానికి ఒక మందిరం ఇస్తే? తిరిగి బలులు అర్పించడం ప్రారంభించాలని ఆశతో ఎదురు చూస్తున్నారు.
వారి కొరకు, వారే ఒక గొర్రెపిల్లను (యేసు క్రీస్తు) వధించారు. ఇక బలులతో సంబంధంలేదు అనే విషయాన్ని ఎంత మాత్రమూ అంగీకరించరు.
కారణం?
యుగసంబంధమైన దేవత వారి కన్నులకు గ్రుడ్డితనమును కలుగజేసింది.
2. మోరియా పర్వతం మీదనే ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు.
ఆది 22: 2-14
అబ్రహాము తన కుమారునికి ప్రాధాన్యతనిస్తాడా? లేక ఆ కుమారునినిచ్చిన నాకు ప్రాధాన్యతనిస్తాడా? అనే విషయం దేవుడు తేల్చుకోవడానికి మోరియా పర్వతం వేదిక అయ్యింది.
అబ్రహాము విశ్వాసము, ఇస్సాకు విధేయత ఆవిష్కరించబడడానికి మోరియా పర్వతమే సాక్షిగా నిలవబడ బోతుంది.
అబ్రాహాము విశ్వాసము:
దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే? తప్పకుండా ఇస్సాకు బ్రతికి వుండాలి. అందుచే, ఇస్సాకును దేవుడు చంపడు. ఒకవేళ చనిపోయినా ఆయన మరళా బ్రతికించ గలడు.
ఇస్సాకు విధేయత:
అబ్రాహాము బలిపీఠమును సిద్ధం చేస్తున్నాడు. ఒకవేళ ఇస్సాకు కూడా కట్టెలను అందిస్తూ సహాయం చేస్తున్నాడేమో? బలిపీఠము పూర్తయ్యింది. తన కుమారుని బందిస్తున్నాడు. అట్లాంటప్పుడు ఇస్సాకు పారిపోవచ్చు కదా? అతను చిన్న పిల్లవాడా? కాదు. కట్టెల మోపు ఎత్తుకొని మోరియా పర్వతం ఎక్కుతున్నాడు
(ఆది 22:6)
వృద్ధాప్యం లో నున్న తన తండ్రిని కూడా చంపగలిగే శక్తిమంతుడు. అయినా, తన విధేయతకు కారణం? తండ్రికి లోబడాలి, తద్వారా తన పరమ తండ్రికి అర్పణగా అంగీకరించ బడాలి.
తండ్రి విశ్వాసము, కుమారుని విధేయత రెండూకలసి శరీరం జలదరించే భయంకరమైన సంఘటన మోరియా పర్వతం మీద ఆవిష్కరించింది. కత్తి పైకిలేచింది గాని, ఇస్సాకు మెడమీదకు దిగలేదు. అబ్రహాము చెప్పినట్లుగానే బలి పశువును దేవుడే చూచుకున్నాడు.
విశ్వాస పరీక్షలో విజేయుడయ్యాడు అబ్రాహాము.
అవును! మనము కూడా ఇస్సాకు వలే, సజీవ యాగముగా మన శరీరములను సమర్పించడానికి సిద్ధపడాలి. (రోమా 12:1)
మోరియా పర్వతానుభవము ప్రియరక్షకుడే మన కోసం బలిగా వధించబడ్డాడు అనే విషయం మనలను ఆరాధన లోనికి నడిపించగలగాలి.
ఆరీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకుందాం.
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ఇశ్రాయేలు దేశము
(కొండలు-పర్వతములు - 4)కర్మెలు పర్వతము:
మధ్యధరా సముద్ర తీరములో వుంది.
కర్మెలు పర్వతము సర్వోన్నతమైన దేవుని శక్తిని జ్ఞాపకము లోనికి తీసుకువస్తుంది.
1. ఏలియా కర్మెలు పర్వతము మీదికి ఆకాశము నుండి అగ్ని రప్పించెను. 1 రాజులు 18: 19-40
450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అషేరాదేవి ప్రవక్తలు మొత్తంగా దేవత పక్షాననున్న వాళ్ళు 850 మంది. దేవుని పక్షాన నున్నవాడు ఒకే ఒక్కడు.
850 మంది కలసి ఒకని మీద సవాలు విసరడం గొప్ప విషయమేమీకాదు. కాని ఒకే ఒక్కడు 850 మంది మీద సవాలు విడరడం సామాన్యమైన విషయంకాదు. అందులోనూ, వారెవరంటే? ఆ దేశపురాణి అయిన యెజెబెలు పోషించే ప్రవక్తలు.
దేవతా ప్రవక్తల ప్రయాస వ్యర్ధమయ్యింది. ఏలియా కట్టిన బలిపీఠము మీదకు అగ్ని దిగివచ్చింది. సర్వశక్తుని మహిమను కర్మెలుపర్వతం కళ్ళారా చూసింది. ఏలియా విసిరిన సవాలుకు ఎవరి దేవుడు శక్తిమంతుడో కర్మెలుపర్వతం ఒక ప్రత్యక్షసాక్షి అయ్యింది.
2. ఏలియా కర్మెలు పర్వతము నుండి ఆకాశమును వర్షింపజేసెను.
ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను. 1 రాజులు 18:42
అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను; మోపైన వాన కురిసెను
3. షూనేమియురాలు వెళ్లి ప్రవక్తయైన ఎలీషాను పిలుచుకొని వచ్చింది
తన కుమారుడు చనిపోయినప్పుడు కర్మెలు పర్వతమందున్న దైవ జనుడైన ఎలీషా దగ్గరకు వెళ్ళింది.
ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనునియొద్దకు వచ్చెను. 2 రాజులు 4:25
4. ఏలియా ఆహాజ్యా సైన్యమును నాశనము చేసెను. 2 రాజులు 1: 8-11
దైవజనులైన ఏలియా, ఎలీషా వంటివారు కర్మెలుతో ప్రత్యక్షమైన సంబంధాన్ని కలిగివున్నారు. సర్వోన్నతుని మహిమను అనుభవించ గలిగారు.
అట్లాంటి అనుభవంలోనికి మనమూ మారగలిగితే? ఎట్లాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొనడానికి శక్తిని పొందగలము.
ఆరీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకుందాం.
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ఇశ్రాయేలు దేశము
(కొండలు-పర్వతములు - 5)తాబోరు కొండ:
గలిలయలో వున్నది.
1. బారాకు సైన్యమును పోగుచేసి బయలు దేరిన స్థలము.
దెబోర ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా వున్నప్పుడు ఆమె
రాజైన బారాకును పిలువనంపించి శత్రువుల మీద యుద్ధం చెయ్యడానికి మనుష్యులను తాబోరు కొండకు పిలిపించమని చెప్పెను.
ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెనునీవువెళ్లి నఫ్తాలీయుల లోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము;
న్యాయాధిపతులు 4:6
2. గిద్యోను సహోదరులు చంపబడిన స్థలము.
అతడుమీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారునీవంటివారే, వారందరును రాజకుమారు లను పోలియుండిరనగా అతడువారు నా తల్లి కుమారులు నా సహోదరులు--న్యాయాధిపతులు 8:18,19
అని గిద్యోను వారికి తెలియజేసెను.
3. యేసు ప్రభువు వారు రూపాంతరము పొందినది ఈ కొండ మీదనే అని విశ్వసింప బడుతున్నది.
మత్తయి 17:1-8
యేసు పేతురును,యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను.
ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.
మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట లాడుచుండిరి.
ప్రకాశమాన మైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘము లోనుండి పుట్టెను.
అవును! మనము కూడా ఆయన సమరూపములోనికి రూపాంతరం చెందాలి. ఆయన మాట వినాలి.
ఆరీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకుందాం.
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ఇశ్రాయేలు దేశము
(కొండలు-పర్వతములు - 6)సీయోను పర్వతము:
యెరూషలేములో వుంది.
సీయోను పర్వతము, మోరియా పర్వతము, యెరూషలేము, దావీదు నగరము, దేవాలయము మొదలగునవన్నియు 'సీయోను' అను పేరుతో పిలువబడు చున్నవి.
దావీదు యెబూసీయులను జయించి సీయోనును స్వాధీనము చేసుకున్నాడు.
యెబూసీయులు దేశములో నివాసులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూషలేమునకు వచ్చిరి.
యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచినీవు వచ్చినయెడల ఇచ్చటి గ్రుడ్డి వారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పురమనబడిన సీయోను కోటను దావీదు స్వాధీన పరచుకొనెను.
2సమూ 5:6,7
1. సీయోను దేవుని యొక్క పరిశుద్ద పర్వతము.
నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను
కీర్తనలు 2:6
2. సీయోను దేవుడు నివసించే స్థలము.
సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడి
కీర్తనలు 9:11
3. సీయోను మహారాజు పట్టణము
ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వ తము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది.
కీర్తనలు 48:2
4. సీయోను పరిపూర్ణ సౌందర్యము గలది.
పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులోనుండి దేవుడు ప్రకాశించుచున్నాడు
కీర్తనలు 50:2
5. సీయోనులో యెహోవా నిబంధనా మందసం వుంది.
అప్పుడు సీయోను అను దావీదు పురములోనుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసికొని వచ్చుటకు యెరూషలేములోనుండు రాజైన సొలొమోను ఇశ్రా యేలీయుల పెద్దలను గోత్రప్రధానులను, అనగా ఇశ్రా యేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తనయొద్దకు సమకూర్చెను.
1రాజులు 8:1
6. సీయోనులో నుండే ఇశ్రాయెలీయులకు రక్షణ.
సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణకలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును.
కీర్తనలు 53:6
7. విమోచకుడు సీయోనులో నుండే వచ్చును.
అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.
వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
రోమా 11:25,26
8. యేసు ప్రభువు వారు నిలిచే స్థలము.
నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను
ప్రకటన 14:1
అవును! ఆయన చెంతకు, ఆ సీయోనుకు మనము చేరగలగాలి.
ఆరీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకుందాం.
ఆమెన్!ఆమెన్! ఆమెన్!
ఇశ్రాయేలు దేశము
(కొండలు-పర్వతములు)1. లెబానోను పర్వతము
ఇశ్రాయేలుకు ఉత్తర సరిహద్దులో వుంది.
•సొలోమోను లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. 1రాజులు 7:2
•సొలోమోను దేవాలయము కట్టుటకు ఇక్కడ నుండియే మ్రానులను తెప్పించెను. 1రాజులు 5:14
2. ఏబాలుకొండ
షెకెముకు దగ్గరగా వుంది.
ధర్మ శాస్త్ర శాపములు ప్రకటింప బడిన స్థలము.
కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను. ద్వితి 11:29
3. గెరిజీము కొండ:
షెకెముకు దగ్గరగా వుంది.
•ఇశ్రాయెలీయులను ఆశీర్వదించిన స్థలము
అప్పుడు ఇశ్రా యేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలెనని, పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రా యేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులును వారి న్యాయాధిపతులును యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగముమంది గెరిజీము కొండయెదుటను సగము మంది ఏబాలు కొండయెదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్ల లును వారి మధ్యనుండు పరదేశులును విను చుండగా యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్క టియు లేదు. యెహోషువా 8:33-35
•గిద్యోను కుమారుడు షేకేమీయులతో మాట్లాడెను.
అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి యెలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెనుషెకెము యజమానులారా, మీరు నా మాట వినిన యెడల దేవుడు మీ మాట వినును. న్యాయా 9:7
పర్వతానుభవము ఐహిక సుఖాల నుండి మనలను దూరపరచి దేవునికి మరింత దగ్గర చేస్తుంది.
ఆరీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకుందాం.
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ఇశ్రాయేలు దేశము
(కొండలు-పర్వతములు-8)1.గిల్బోవ పర్వతము
గలిలయ భాగమున వుంది.
ఫిలిష్తీయుల యొద్ద అపజయము పొందిన సౌలును, అతని కుమారులును మరణించిన స్థలము.
ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా, సౌలు ఇశ్రాయేలీయులందరిని సమకూర్చెను; వారు గిల్బోవలో దిగిరి.
1 సమూ 28:4
అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీ యులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుటనుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతమువరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.
1 సమూ 31:1-7
ఇక్కడ మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఇదొక శాపగ్రస్తమైన పర్వతం. దావీదుగారు ఈ కొండను శపించినట్లు చూస్తాం
2సమూయేలు 1: 21
గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైననులేకపోవును గాక. బలాఢ్యులడాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను.
అందువలన నేటివరకు ఈ గిల్బోవ పర్వతం మీద పచ్చదనం అనేది లేకుండా పోయింది. కాని ప్రక్కనున్న పర్వతములు చాలా పచ్చదనంతోను, ఫలభరితంగానూ ఉంటాయి.
ఇంతకీ సౌలు మరణించడానికి కారణం?
1దినవృత్తాంతములు 10: 13
ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచముల యొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హత మాయెను.
అందుకోసం దావీదుగారు ఆ కొండను శపించారు. గిల్బోవ పర్వతం పచ్చదనం కోల్పోయి శపింపబడినట్లుగా చూస్తున్నాం.
మనం కూడా యెహోవాను అనుసరింపక లోకాశల్ని అనుసరిస్తే సహోదరి/సహోదరుడా గిల్బోవా పర్వతానుభవములో ఉన్నావని గుర్తుంచుకో! పచ్చదనం అనగా ఆశీర్వాదం కోల్పోయి ఆత్మీయ జీవచ్చవంగా మారిపోయావని తెలుసుకో!
2. హెర్మోను కొండ
లెబానోనులో వుంది.
షిర్యోననియు, శెనీరనియు మారుపేర్లు కలవు.
సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమో రీయులు దానిని శెనీరని అందురు.
ద్వితి 3:9
హెర్మొను మంచు పరిశుద్ధతను సూచిస్తుంది.
సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.
కీర్తనలు 133:3
మనష్షే అర్ధగోత్రమువారును ఆ
దేశమందు కాపుర ముండి వర్ధిల్లుచు, బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును శెనీరువరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి.
1 దిన 5:23
పర్వతానుభవము ఐహిక సుఖాల నుండి మనలను దూరపరచి దేవునికి మరింత దగ్గర చేస్తుంది.
ఆరీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకుందాం.
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ఇశ్రాయేలు దేశమునకు వెలుపల గల కొండలు- పర్వతములు - 9
(కొండలు-పర్వతములు)సీనాయి, హోరేబు:
మిద్యాను(ఐగుప్తు)
సీనాయి ప్రదేశపు రెండు శిఖరాలలో ఒక శిఖరము సీనాయి అనియు, రెండవ శిఖరము హోరేబు అనియు పిలువబడు చున్నప్పటికీ, రెండింటిని కలిపి సీనాయి లేదా హోరేబు అని పిలువవచ్చు.
హోరేబు:
ఇది దేవుని పర్వతము.
•మోషే ధర్మ శాస్త్రము పొందెను.
హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరికొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర మును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి.
మలాకి 4:4
సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.
నిర్గమ 31:18
•మోషే దేవుని ప్రత్యక్షతను పొందినది హోరేబు పర్వతమునందే.
మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.
ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను.
నిర్గమ 3:2
నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను.
అపో 7:30
•మోషే బండను కొట్టగా నీళ్లిచ్చిన స్థలము హోరేబు.
హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.
నిర్గమ 17:6
•అహారోను బంగారముతో దూడను పోతపోసిన స్థలము హోరేబు.
హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి
కీర్తనలు 106:19
అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారుఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.
నిర్గమ 32:4
•మొట్టమొదటి ప్రత్యక్ష గుడారము నిర్మించ బడినది హోరేబులోనే:
కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి.
అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి, దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను.
నిర్గమ 33:6,7
•ప్రవక్తయైన ఏలియా దాగిన స్థలము హోరేబు:
అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక గుహలోచేరి బసచేసెను.
1 రాజులు 19:8,9
2. హోరు
ఎదోములో వుంది.
•ఆహారోను మరణించిన స్థలము:
యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి.
మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండశిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగివచ్చిరి.
సంఖ్యా 20:27,28
3. అరారాతు
ఆర్మేనియాలో వుంది.
•నోవాహు ఓడ నిలచిన స్థలము.
ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.
ఆది 8:4
4. నెబో
మోయాబులో వుంది.
•మోషే పిస్గా పర్వత శిఖరమును అధిరోహించి, కనాను చూచి, ఇక్కడే మరణించెను.
మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను.
...యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాటచొప్పున మోయాబు దేశములో మృతినొందెను.
34:1-5
• 'పిస్గా' నెబో పర్వతము యొక్క శిఖరము
•'అబారీము'నెబో పర్వత సమతల ప్రదేశము.
(బైబిల్ గ్రంథములోని పర్వతములు, కొండలు సమాప్తం)
దేవుని కృప మీకు తోడుగా నుండును గాక! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి