చేయరాని పనులు

చేయరాని పనులు

మొదటి భాగము - జారత్వము- వ్యభిచారము

మీరు పరిశుధ్దులగుటయే అనగా జారత్వమునకు దూరంగా పారిపోవుటయే దేవుని చిత్తము -1;
మీలో ప్రతీ వాడును దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక తన ఘటమును కాపాడుకొనుట ఎరిగియుండుటయే దేవుని చిత్తము -2. 1 ధెస్సలో 4: 3,4

ప్రియ సహోదరి/సహోదరులారా - దేవుని చిత్తమును జరిగించుటకే మనలను దేవుడు ఏర్పరచుకొన్నారు,పిలచుకొన్నారు, ప్రత్యేక పరచుకొన్నారు, మహిమపరచుకొన్నారు. అలాంటప్పుడు మనం ఈ జారత్వక్రియలు చేయడం సరియైన పనా? ఎందుకంటే భూమిమీద మనిషి చేసే ప్రతీ పాపం ఒకవ్యక్తి మాత్రమే చేస్తాడు కాని ఈ జారత్వం అనేది ఇద్దరు వ్యక్తులు, రెండు శరీరాలు, రెండు మనస్సులు, రెండు ఆత్మలు కలసి చేసేది వ్యభిచారం. 1 కొరింథీ 6:16. ఇక్కడ శరీరంతో పాటు ఆత్మను కూడా బ్రష్టుపట్టిస్తున్నాం. నీ దేహము దేవునిచే నీకు దానముగా దయచేయబడింది. 19 వచనం. అది విలువపెట్టి కొనబడింది(20), విమోచింపబడింది. పాపానికి ఆశ్రయమైయున్న నీ దేహాన్ని దేవుడు తన స్వరక్తమిచ్చి మిమ్మల్ని కొన్నారు(అపొ 20:28) . ఇప్పుడు నీ దేహము నీదికాదు. దేవునిది. దానిని దేవుడు తన ఆలయముగా మందిరముగా చేశారు (1కొరింథీ 3:16,17; 6:19-20 వచనాలు) మీరు దేవుని ఆలయము. దేవుని ఆత్మ మీలో నివశించుచున్నదని మీకు తెలియదా? ఎవడైననూ దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. ఖభడ్దార్. దేవునిలో వెలిగింపబడి పరిశుద్ధ పరచబడిన మీరు తిరిగి, మీఅవయవాలు,అనగా పవిత్రమైన క్రీస్తురక్తములో కడుగబడి పవిత్ర పరచబడిన మీ అవయవాలు -దేవునిఅలయముగా మలచబడిన మీ దేహాలు వేశ్యలతో లేక పరస్త్రీలతో కలిపి పాపం చేస్తారా?

1 కొరింథీ 6:13-16 , నీ దేహము జారత్వముకొరకు కాదుగాని ప్రభువు నిమిత్తమే, మీ దేహములు క్రీస్తు అవయవములు, క్రీస్తు అవయవములు తీసుకొని వాటిని వేశ్యయొక్క అవయవములతో కలుపుతావా? చేస్తే తప్పించుకొంటావా? ఇటువంటి వారిపై దేవుని ఉగ్రతయను పెనుగాలి రాబోతుంది. 1 కొరింథీ 6:8,9 మోసపోకుడి జారులైననూ.........వ్యభిచారులైననూ.......పురుష సంయోగులైననూ......దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మనకున్నవి రెండే రెండు గమ్యములు. ఒకటి పరలోకం. రెండు నరకం- నిత్య నరకాగ్నిగుండము,అగ్ని ఆరదు పురుగు చావదు.

ఇప్పుడు పై కార్యాలు చేసేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్. జాగ్రత్త.
ప్రకటన 21:8 పిరికివారును,......వ్యభిచారులును,...అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు.
22:15 కుక్కలును,.... వ్యభిచారులును.......వెలుపటనుందురు.

చూశారా లేఖనం ఏమిసెలవిస్తుంది? వ్యభిచారం, జారత్వం దేవునికి అసహ్యమైన క్రియ. పవిత్రగ్రంథం నుండి కొందరు యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకొందాం.
1. యాకోబుగారి ప్రియమైన భార్య పెద్దకుమారుడు, యాకోబు గారిచే ఎక్కువగా ప్రేమింపబడినవాడు యోసేపు. అయితే దైవప్రణాళికలో, అన్నల పాశవిక కక్ష క్రోదాలకు బలై, కొట్టబడి చివరకు ఐగుప్తుదేశంలో బానిసగా అమ్మబడ్డాడు. గాని అతని భక్తి విశ్వాసాలు వలన పోతీఫర్ గృహాధిపతిగా చేయబడ్డాడు. చివరకు యజమాని భార్య ఈ యవ్వనస్తుని మోహించి కామించి ఎంతగా వలపించినా ఏమంటున్నాడో చూడండి, నాయజమానునికి మోసం చేయలేను అనడం లేదు ,దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేయలేను అని చెప్పి జారత్వం నుండి పారిపోయాడు. ఫలితంగా శ్రమలు పడినా జైలు శిక్ష భరించినా చివరకు ఐగుప్తు దేశానికే అధిపతి కాగలిగాడు. సహోదరుడా నీవు పాపం నుండి పారిపోగలవా?

2. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చరవిముక్తి అయిన మీదట మార్గమధ్యంలో మోయాబు ప్రాంతం సమీపిస్తారు. వారితో యుద్ధము చేయలేని బాలాకు రాజు బెయేరు కుమారుడు దేవుని ప్రవక్త, సోదెగాడైన బిలామును పిలిచి శపించమని చెప్పగా దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశారు. చివరకు ధనాశతో ఆ ప్రవక్త మోయాబీయులకి ఒక తప్పుడు సలహా ఇస్తాడు ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో జారత్వం చేస్తారు దేవుని ఉగ్రతమండి తెగులు ప్రారంభమవుతుంది. ఇంతలో ఇశ్రాయేలీయుల ఒక ప్రధాని కుమారుడు మోయాబీయుల ప్రధాని కుమార్తె తో పాపం చేయడాన్ని చూసిన ఒక యవ్వనస్తుడు ఫీనెహాసు అది చూసి ఈటె తీసుకుని ఇద్దరినీ ఒకేపోటుతో పొడుస్తాడు. వెంటనే తెగులు ఆగిపోతుంది. దేవుడు ఏమన్నారు ఫీనెహాసుకోసం (సంఖ్యా 25:10,11లో) నేను ఓర్వలేని దానిని తానును ఓర్వలేకుండుట చూచి.............

దేవుడు ఓర్వలేనిది ఏమైనా ఉందంటే అది వ్యభిచారం దానినే ఫీనేహాసు పొడిచేసాడు. అలా నీవు చేయగలవా?

3. ఇక మరో వ్యక్తి దేవునిచే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పిలవబడిన వ్యక్తి . వసంతకాలంలో రాజులు యుధ్దం చేసేకాలంలో యుద్దానికి పోక ఇంట్లో మేడమీద షికార్లు చేస్తూ, స్నానం చేస్తున్న సైనికుని భార్యను చూసి, మోహించి, ఆమెను తీసుకొని వచ్చి బలవంతంగా వ్యభిచారం చేశాడు. ఆ పాపానికి ప్రతిఫలంగా ఆ స్త్రీ గర్భవతి కాగా, దానిని తనభర్త పై నెట్టడానికి ప్రయత్నం చేశాడు అయితే ఆ స్త్రీ భర్త నీతిమంతుడు కాబట్టి సైనికులు దగ్గరే పడుకొంటాడు. దావీదుగారు తనకంటె ఆ సైనికుడే నీతిమంతుడుగా కనబడడం చూసి ఆ వ్యక్తిని హత్యచేసే ప్రణాళిక చేసి అతనిని చంపించారు. వెంటనే దేవుని వాక్కు ప్రవక్తయైన నాతాను గారి ద్వారా ఏమంటుంది...(2 సమూయేలు 11,12 అధ్యాయాలు) ఒకానొక పట్టణంలో ఇద్దరు మనుష్యులుండిరి... ఈవిధంగా జరిగింది ...ఆ విధంగా జరిగింది ...అని చెప్పిన వెంటనే దావీదు గారు రౌద్రుడై "ఆ మనుష్యడు ఎవడు, యెహోవా జీవంతోడు నిశ్చయంగా ఆ మనుష్యుడు మరణపాత్రుడు" అని చెప్పగా ప్రవక్త గారు ఏమన్నారు "ఆ హంతకుడు, ఆ వ్యభిచారివి నీవే" దేవునికి దేవుని ప్రవక్తలకు తన మన తారతమ్యం లేదు దావీదుగారు చక్రవర్తి యైనా సరే దేవుని వాక్కు సెలవిస్తుంది ఆ మనుష్యుడు నీవే, మనం ఆయన స్థానంలో ఉంటే నీవునాకే చెప్పేటంత వాడవయ్యావా అని ప్రవక్తని హతం చేస్తాం. గాని దావీదుగారు ఉన్నచోటనే సాష్టాంగ పడి, పశ్చతాప్తపడి, కన్నీటితో దేవుని పాదాలు కడిగారు. ఎంతగా విలపించారంటే కన్నీటితో తన పరుపు తేలిపోయేటంతగా. అందుకే ఆయన పాపాన్ని దేవుడు పరిహరించారు.

ప్రియబిడ్డా నీ బ్రతుకు ఎలాఉంది? వ్యభిచారం /జారత్వం దగ్గర ఆగిపోతున్నావా? జారత్వంలో పడిపోతున్నావా? యోసేపులాగ జారత్వానికి దూరంగా పారిపోతున్నావా దావీదుగారి లాగ పాపం లో పడిపోతున్నావా? ఫీనెహాసులాగ పాపాన్ని అంతం చేయగలవా? నీ బ్రతుకు ఇప్పటికైనా మార్చుకో!

(సశేషం)


చేయరాని పనులు

రెండవ భాగము - అక్రమ సంబంధాలు

ఈరోజు దేవుని సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఇది ఒకటి. ఇది సులువుగా చిక్కులు పెట్టు సాతానుగాడి టెక్నిక్. శరీరాశ, నేత్రాశ, జీవపుడంభము వీటినుపయోగించి దేవుని బిడ్డలపై ఎటాక్ చేస్తున్నాడు. నేడు గొప్ప దైవసేవకులు, సంఘ పెద్దలు మరియు విశ్వాసులు కూడా పడిపోతున్నారు.
దేవుడైన యెహోవా మొదటగా పురుషుని చేసి సాటియైన సహాయంగా స్త్రీని చేశారు. వివాహ వ్యవస్థ ఏర్పాటుచేశారు. వివాహం ద్వారా స్త్రీ పురుషులు ఏక శరీరంగా మారి కాపురం చేసుకోడానికి దేవుడే లైసెన్సు ఇచ్చారు. వివాహం కాకుండా మరో స్త్రీ /కన్యకతో శారీరక సంబంధం పెట్టుకోవడం బైబిలు అంగీకరించదు. అది వ్యభిచారం. వివాహం ద్వారా జతపరచబడిన వారు జీవితాంతం కలసిమెలసి ఉండాలి. తన భాగస్వామి బ్రతికి యున్నంతవరకూ మరొకరితో శారీరక సంబంధం కలిగియుండుట వ్యభిచారమే.

మరికొందరు భార్య ఉండగానే మరో స్త్రీని పెళ్ళి చేసుకొంటున్నారు, ఉంచుకొంటున్నారు. (విచారం ఏమిటంటే దైవసేవకులు కూడా). అలాంటి వాళ్ళను సంఘం లోనుంచి వెళివేసేమని పౌలుగారు వ్రాస్తున్నారు. 1 కొరి 5వ అధ్యాయంలో. కాని నేటి సేవకులు వారిచ్చే కానుకలుకి ఆశపడి నోరుమూసుకొని కూర్చొంటున్నారు. "ఖండించుము, గధ్దించుము, బుద్ది చెప్పుము" ( 1తిమోతి 3:16-17; 4: 1-3) అని చెబితే ఖండించడం లేదు బుద్ధి చెప్పడం లేదు. సంఘంలో వ్యభిచారం జారత్వంకోసం మాట్లాడటం లేదు. మరికొందరు సేవకులు కూడ అదే తప్పు చేయడం వలన ఏమీ మాట్లాడటం లేదు. ఎలా చెప్పగలరు? దైవసేవకుడే తప్పు చేస్తే విశ్వాసి చేయడా? సంఘపెద్దే అక్రమ సంబంధం కలిగిఉంటే విశ్వాసులు చేయరా? ఓ స్త్రీ నీవు ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకొంటే నీ పిల్లలు పదిమందితో అక్రమ సంబంధం పెట్టుకోరా? ఒక తండ్రి తాను మధ్యం త్రాగుతూ, సిగరెట్లు త్రాగుతూ కొడుక్కి తాగొద్దురా అని చెప్పగలడా? చెబితే ఏమంటాడు కొడుకు, ముందు నీవు మాను, తర్వాత చెప్పు అంటాడు. ప్రియ సహోదరి / సహోదరుడా! నిన్ను బట్టి దేవుని నామం దూషణ పాలవుతుంది. యేసయ్యని పదే పదే సిలువ వేస్తున్నావు. ఆయన గాయాన్ని రేపుతున్నావు.

ఓసారి మనము ఏదెను తోటలోకి వెళ్దాం. అక్కడ దేవుడు నరునికి సాటియైన సహాయం చేయడం కోసం ఆదాముకి గాఢనిద్ర కలుగజేసి ప్రక్కటెముకలలో ఒకదానిని (ఒకటి మాత్రమే) స్త్రీనిగా చేశారు. (ఆదికాండము 2:21). ఒకవేళ దేవుడు నరునికు ఇద్దరు లేక ముగ్గురు భార్యలుండాలని తలస్తే రెండో మూడో ఎముకలు తీసియుండును. దానర్ధం ఒక పురుషుడికి ఒక భార్య మాత్రమే ఉండాలి. ఒక భార్య ఉండగా మరో స్త్రీతొ అక్రమసంభందం గాని సక్రమ సంబంధం గాని ఉంటే అది వ్యభిచారమే. వివాహము కాకుండా మరో స్త్రీని కూడటం కూడా వ్యభిచారమే.

దేవుడు వేశ్యనైనా క్షమించారు గాని వ్యభిచారాన్ని క్షమించలేదు. వేశ్య అనగా పొట్టకూటికోసం తన శరీరాన్ని పురుషులకి పంచేది. నీకుమార్తెలలో ఎవరూ కూడా వేశ్యలగా ఉండకూడదు అని దేవుని ఆజ్ఞ.

వ్యభిచారి అనగా భర్త ఉండగా తన కామకోరికలు తీర్చుకోవడం కోసం భరితెగించి మరొకరితో శారీరక సంబంధం పెట్టకొనేది వ్యభిచారి. ఇంట్లో భార్య ఉండగా కామతప్తుడై కళ్ళు మూసుకుపోయి మరో స్త్రీతో సంబంధం పెట్టుకొన్నవాడు వ్యభిచారి. అదెవరైనా సరే, విశ్వాసి, పెద్ద, సేవకుడు అనితేడా లేదు. వ్యభిచారులు మాత్రమే. ఎవరూ చూడటం లేదు అనుకొంటున్నావు. కాని దేవుడు చూస్తున్నారు జాగ్రత్త. దావీదుగారు వ్యభిచారం చేసిన వెంటనే దేవుడు ఖండించి బుద్ధి చెప్పారు. మీకుతెలుసా?ప్రపంచంలో జరిగే హత్యలకు నూటికి 80% మూలకారణం అక్రమ సంభందాలే.

యేసయ్య దగ్గరకు ఒకసారి వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని (మాత్రమే, పురుషుడుని వదిలేశారు) తీసుకొస్తారు. బోదకుడా! మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. నీవేమంటావ్? అన్నారు. అందుకు యేసయ్య మీలో పాపం లేనివాడు మొదట ఆమెపై రాయివేయండి అన్నారు. చివరకు యేసయ్య కూడ ఆమెను శిక్షించలేదు. గాని కనికరముతో కూడిన ఒక ఆజ్ఞ ఇచ్చారు " ఇకను పాపము చేయకుము". అన్నారు. ఆయన వేశ్యనైనా క్షమించారు కాని వ్యభిచారిని క్షమించలేదు. అందుకే పత్రికలలో, ప్రకటన గ్రంథంలో పదే పదే చెప్పబడింది వ్యభిచారులెవరూ పరలోకానికి హక్కుదారులు కాదు అని. యాకోబు పత్రికలో 4:4 లో వ్యభిచారిణిలారా! ఈలోక స్నేహం దేవునితో వైరమని తెలియదా? ఎవరు ఈలోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువువగును .దేవునితోవైరమాడి నీవు బ్రతుకగలవా? ఎలా ఉంది నీ బ్రతుకు? 2 కొరొంథీ 5:10. మనుష్యులు జరిగించు ప్రతీ క్రియకు మంచిదైనా చెడ్డవైన సరే దేహముతో చేసిన ప్రతీక్రియకు విమర్శ దినమున లెక్క అప్పగించాల్సిన అవుసరము ఉంది.

దేవుని చిత్తాన్ని చేశ్తావా అంటే జారత్వానికి దూరంగా పారిపోతావా లేక దేవునితో వైరమాడుతావా? ఒకవేళ నీకు ఏమైనా అక్రమ సంబంధం ఉంటే దానిని తెంపేసుకో. ఒక వేళ నీవు పెళ్ళి కాకుండానే మరొకరితో అక్రమసంభందం ఉందా, నీ భర్త/భార్య చనిపోయిన తరువాత ఏదైనా అక్రమ సంబంధం ఉందా? దానిని సక్రమ సంబంధం చేసుకొనే వీలుంటే వెంటనే చేసుకో, ఒకవేళ నీ భాగ్యస్వామికి భార్య/భర్త ఉన్నాడా. ఆ సంబంధం వెంటనే తెంపేసుకో.
దావీదుగారు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని ఇప్పుడే ప్రభుపాదాల దగ్గర కన్నీటితో కుమ్మరించు.
దేవునితో నేడే సమాధానపడు. ఆయన ఉగ్రతకు గురికాకు. ఒప్పుకొన్న తరువాత ఆ పాపపు స్త్రీకి ఇచ్చిన ఆజ్ఞయే నీకు కూడా"ఇకను పాపం చేయకు"
అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక!
ఆమెన్. దైవాశీస్సులు.


చేయరాని పనులు

మూడవ భాగము - మోహపుచూపు


వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట విన్నారు కదా! నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతీ వాడును అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. మత్తయి 5:27,28. యేసు ప్రభులవారు ఇచ్చిన ఆజ్ఞలలో కెల్లా భయంకరమైన కఠినమైన ఆజ్ఞ ఇది. ఒక వ్యక్తి శరీరముతో వ్యభిచారం చేయడమే నేరం కాదు, కనీసం మోహపుచూపుతో, వ్యభిచారపు తలంపుతో ఓ స్త్రీ వైపు చూస్తే అప్పుడే ఆ క్షణంలోనే ఆ వ్యక్తి హృదయంలొ ఆ స్త్రీ తో వ్యభిచారం చేసిన వాడగును.

ఇప్పుడు ఆలోచించండి. మనలో ఎంతమంది ఓ అందమైన స్త్రీని చూసి గాని, అమ్మాయిని చూసి గాని, బిగుతైన బట్టలు వేసుకుని కోరికలు రేపేటట్లు వస్త్రధారణ చేసుకొన్న స్త్రీ లను చూసి వ్యామోహ పడ్డారు , రోడ్డు మీద ఓ స్త్రీ నడుస్తూ వెళ్తే మామూలుగా చూడటం అందరికీ కామన్. మనకి తెలియకుండానే మన కళ్ళు చూస్తా ఉంటాయి. దానిలో తప్పులేదు గాని ఆ స్త్రీని చూసి మనస్సులో కావాలని కోరుకోవడం తప్పు. ఒకసారి చూసిన తరువాత ఆ స్త్రీనే పట్టి పట్టి చూడటం తప్పు. నీ కళ్ళు తోనే ఆమె శరీరపు కొలతలు కొలవడం తప్పు. యేసయ్య ఆజ్ఞ ప్రకారం అది వ్యభిచారం. శారీరకంగా వ్యభిచారం చేయకపోయినా అది ఆత్మీయ వ్యభిచారం అని స్వయంగా యేసు ప్రభులవారే చెప్పారు. ఓ కండలుగల యవ్వనస్తుడు టైట్ టీ షర్ట్ వేసుకుని వెళ్తూఉంటే ఓ స్త్రీ నీవు ఆ యవ్వనస్తుని చూసి వ్యామోహ చూపు చూస్తే అది కూడ వ్యభిచారమే

మరి నీవంటావు, ఆ స్త్రీ అలా వస్త్రధారణ చేసుకొని వెళ్తే కోరికలు కలుగవా అని. ఓసారి చూశావు. పదే పదే చూడమని ఎవరన్నారు? నన్ను మనస్సులో ఊహించుకొని కోరికలు తీర్చుకో అని నీకు చెప్పిందా? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకు దేవుడిచ్చారు అని పవిత్ర గ్రంథం సెలవిస్తుంది. 2 తిమోతి 1:7; ఆ మాత్రం ఇంద్రియ నిగ్రహం లేదా? ఇంకా యేసయ్య ఏమన్నారు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దానిని పెరికి పారవేయుము. రెండు కళ్ళు కలిగి అగ్నిలో మండే కన్నా ఒకే కంటితో పరలోకం చేరడమే మంచిది అని. మత్తయి 5:29,30. దేవుని బిడ్డా! నీవు ఎన్ని సార్లు ఈ ఆత్మీయ వ్యభిచారం చేశావో గుర్తు తెచ్చుకో. సరిచేసుకో. వ్యభిచారిణులారా! ఈలోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా?(యాకోబు 4:4). ఇక్కడ వ్యభిచారిణి అంటే స్త్రీ అనే కాదు పురుషులు కూడా.

ఇక ప్రియమైన చెల్లెల్లారా, అక్కల్లరా! దేవుడు మీకు అందం ఇచ్చారు. దేహం ఇచ్చారు. మీ దేహముతో దేవుని మహిమ పరచడానికే, గాని మీ వస్త్రధారణతో మీ ప్రవర్తనతో ఇతరులను అభ్యంతర పరచడానికి కాదు.(1 కొరింథీ 6:19,20). స్త్రీలు అణుకువయు స్వస్త బుద్ధి గలవారునూ, తగుమాత్రపు వస్త్రాలు వేసుకోవాలి . . . . దైవభక్తి గలవారమను చెప్పుకొని తిరిగే స్త్రీలకు తగినట్లుగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. (1 తిమోతి 2: 9,10.) పరిశుధ్దాత్ముడు పేతురుగారి ద్వారా సెలవిచ్చేది - సాధువైనట్టియు మృదువైనట్టియు అక్షయ అలంకారాలే గాని ఈ లోకపు అలంకారములు వద్దు. (1 పేతురు 3: 3-5). ప్రియమైన చెల్లీ! నీ ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి గాని ఆయనకు అవమానం తెచ్చేదిగా మరియు ఇతరులను అభ్యంతరం కలిగించేదిగా ఉండకూడదు. ఎస్తేరుగారిని చూద్దాం, హేగే ఇచ్చిన వస్తువులే తప్ప మరి యే ఇతర అలంకారములు ఆమె వేసుకోలేదు. తన మృదు స్వభావాన్ని, వినయాన్ని అలంకరణగా ప్రదర్శించినది ఆమె. తద్వారా 127 సంస్థానాలకు మహారాణి కాగలిగారు. దయచేసి ఆలోచించు.

ఒకవేళ దేవుడు ఓ యవ్వనస్తున్ని తీర్పులో నిలబెడితే ఆ యవ్వనస్తుడు ఈ మోహపుచూపు అనే నేరస్తాపన చేయబడితే- తప్పు నాది కాదు ఆ స్త్రీ దే అంటాడు. దేవుడు నీవు మోహపు చూపు చూడకూడదని బైబిల్ నొక్కి వక్కానించినా నీవు చూసేవు కాబట్టి నరకానికి పో అంటారు. అప్పుడు ఓ స్త్రీ! నిన్ను పిలచి ఆ యవ్వనస్తున్ని, నీ వస్త్రధారణ ద్వారా ప్రేరేపించి తన మనస్సులో నీతో వ్యభిచారం చేయడానికి కారణమయ్యావు కాబట్టి నరకానికి పో! అంటే నీ గతి ఏమిటి?
నేను అతనితో వ్యభిచారం చేయలేదు అంటావేమో, ఆ యవ్వనస్తునికి ఇచ్చిన జవాబే నీకు కూడా ఇస్తారేమో. జాగ్రత్త! యెషయా 3వ అధ్యాయంలో సీయోను కుమార్తెలు గర్విష్టురాండ్రై . . . . .కుళుకుచూ నడచుచూ, ఓరచూపులు చూచుచూ . . . . నటిస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నారు బోడిగుండు చేస్తానంటున్నారు. దయచేసి గమనించమని మనవి చేస్తున్నాను.

ప్రియమైన క్రైస్తవ చెల్లీ! నీకు చేతులు జోడించి బ్రతిమాలి చెబుతున్నాను, బిగుతైన బట్టలు వేసుకొని పురుషులని ఆకర్షించడం, పురుషులు లాగ మీరు కూడ వస్త్రధారణ చేయడం పాపం శాపం ( ద్వితీయుప 22:5) స్త్రీ పురుష వేషం వేయరాదు పురుషుడు స్త్రీ వేషం వేయరాదు. అట్టి వస్త్రధారణ మనకు తగదు. దైవభక్తి గల స్త్రీ ల వలె ప్రవర్తించమని మనవి చేస్తున్నాను.

మరికొంతమందికి ధనం మీద మోహపు చూపు ఉంటుంది. అదికూడా పాపమే. బిలాము ప్రవక్త దేవుడు వద్దు అని చెప్పిన ధనాశనాశించి వెళ్తాడు, గాడిద చేత కూడా బుద్ధి చెప్పించాడు. చివరకు నీతిమంతుల మరణం వంటి మరణం కావాలని కోరుకొన్నాడు. దొరికిందా? ధనము దొరకలేదు సరికదా ఇశ్రాయేలీయులు అతనిని ప్రవక్త అని తెలిసినా కత్తి చేత చంపారు.(సంఖ్యా 31:8). దేమా ఇహలోకాన్ని ఆశించి పౌలుగారిని వదలిపోయాడు. మరో దేమా వెండి గనిని ఆశించి పరలోకమార్గం వదలి వెళ్ళిన వెంటనే లోయలో పడి చనిపోయినట్లు యాత్రికునిప్రయాణం పుస్తకంలో చదువుతాము. ఈ మోహపుచూపు కూడా వద్దు సహోదరుడా!

కాబట్టి ప్రియసహోదరీ సహోదరుడా! ఇప్పుడే నీ చూపు సరిచేసుకో. నీ కన్ను నిన్ను అభ్యంతర పరచనీయకు. దానిని నీ స్వాధీనంలో ఉంచుకో. పరలోకాన్ని ఆశ్వాదించు. అట్టి కృప ప్రభువు మనందరికీ దయచేయును గాక! ఆమెన్!


చేయరాని పనులు

నాల్గవ భాగము - హస్త ప్రయోగం- అశ్లీల దృశ్యాలు


ప్రశ్న : అన్నా! హస్త ప్రయోగం చేయడం తప్పా? నేను ఎవరితోనూ వ్యభిచారం చేయడం లేదు కదా!
ప్రశ్న : అన్నా! నేను అన్ని విషయాలలోను perfect గా ఉంటున్నాను. హస్త ప్రయోగం మాత్రం మానలేక పోతున్నాను. ఆ ఒక్కటీ మానేస్తే సాతానుగాడు నన్ను point out చేయడానికి ఏమీ ఉండదు!

పై ప్రశ్నలకు జవాబులు వాక్యపు వెలుగులో చూసుకొందాం.
హస్త ప్రయోగం అంటే ఓ వ్యక్తి, ఒక స్త్రీని గాని /అమ్మాయిని గాని మనస్సులో ఊహించుకొని , తనతో శయనించినట్లు ఊహించుకొంటూ భావప్రాప్తి పొందడం. ఒక స్త్రీ, తనకి నచ్చిన హీరో లేదా బాయ్ ఫ్రెండ్ ని ఊహించుకొని ఆవ్యక్తితో శయనించినట్లు అనుకొంటూ భావప్రాప్తి పొందడాన్ని స్వయంతృప్తి లేదా హస్తప్రయోగం అంటారు.
అయితే మీరంటారు మేము శారీరకంగా వ్యభిచారం చేయలేదు కదా అని. యేసు ప్రభులవారు ఏమన్నారు వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట విన్నారు కదా! నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతీ వాడును అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. మత్తయి 5:27,28. ఓ స్త్రీని మోహపుచూస్తేనే వ్యభిచారం అయితే ఆమెను ఊహించుకొని , ఆమెతో శయనించినట్లు పాపపు ఊహలతో, కామపు కోర్కెలతో ఉండడం, భావప్రాప్తి పొందడం వ్యభిచారం కాదా? ఆత్మీయ వ్యభిచారం.

ఈ కాలంలో యవ్వనస్తులు సినిమాలు సీరియల్స్ చూస్తూ, ఆ హీరోయిన్లు చూపిస్తున్న అంగాంగ ప్రదర్శనలు చూసి, వ్యామోహపడి పాడైపోతున్నారు. ఈనాడు ఇంటర్నెట్ లో విరివిగా అశ్లీల దృశ్యాలను, అశ్లీల వీడియోలు దొరకుతున్నాయి. ప్రతీ ఒక్కరి చేతిలో అండ్రాయిడ్ ఫోన్లు, వాటితో అశ్లీలం కోసం సెర్చింగ్ లు. ఫోన్లు కలిగియుండుట తప్పుకాదు. వాటితో అశ్లీలతకోసం సెర్చి చేసి చూడటం, బూతు కధలు చదివి హస్త ప్రయోగం చేసుకోవడం తప్పు- వ్యభిచారం. ఇది సాతాని గాడి మాస్టర్ ప్లాన్. చాలా వరకు సక్సెస్ అయ్యాడు. "నీవు శారీరకంగా వ్యభిచారం చేయడం లేదు, తప్పులేదు ఇంకా ఎవరూ చూడటం లేదు" అని వాడు చెప్తున్నాడు. ఈ కాలంలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తనకి నచ్చిన వ్యక్తిని ఊహించుకొని స్వయంతృప్తి పొందుతున్నారు మరీ భయంకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో పట్టణాలలో లెస్బియన్స్(స్త్రీ -స్త్రీ) పాపం పెరిగి పోతుంది. బైబిలు దీనిని ఖండిస్తుంది.

మరి దీనిని ఎలా మానుకోవడం? నీ యెదుట పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని యున్నాను. (కీర్తన 119:11). వాక్యము నీ హృదయంలో ఉంటే పాపం చేయలేవు, వాక్యం నిన్ను నడిపిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది, సరిచేస్తుంది. నీ హృదయం దేవునితో అనుసంధానం (synchronise) కావాలి. అప్పుడు ప్రతీ క్షణం నీవు ప్రభువు కోసమే అలోచిస్తావు. పాపంకోసం కాదు. ఉదాహరణకు ఒకబ్బాయి ఒకమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకొందాం. ఆ అబ్బాయి ప్రతీ క్షణం ఆ అమ్మాయి కోసమే ఆలోచిస్తాడు, తను భోజనం చేస్తుంటే ఆ అమ్మాయి తిన్నాదా లేదా అని ఆలోచిస్తాడు, కాలేజీ లోనూ ఇంట్లోనూ అస్తమానూ ఆమె ధ్యాసే. ఎందుకు? తన హృదయం నిండా ఆ అమ్మాయే. అదేవిధంగా నీవు యేసయ్యని ప్రేమిస్తే, నీ హృదయం యేసయ్యతో అనుసంధానం చేస్తే- నీ నోటినిండా, హృదయం నిండా, దేవుని స్తుతియే ఉంటుంది. నిలబడినా స్తుతి, కూర్చొన్నా స్తుతి, బియ్యం ఏరుతున్నా స్తుతి, ఏం చేస్తున్నా దైవస్తుతి చేస్తూ ఉంటావు. ప్రార్థన నీకిష్టమైన క్రియగా మారుతుంది. నీ జీవన విధానమే మారిపోతుంది. అవకాశం దొరికితే అశ్లీలం కోసం సెర్చ్ చేసే నీవు అవకాశం దొరికితే యేసయ్య ప్రేమను చాటుతావు. లేదా నశియించే ఆత్మలకోసం ప్రార్థన చేస్తావు. ఎప్పుడూ? నీహృదయం నిండా ప్రభువు నిండియున్నప్పుడు. ఆయనవాక్యంతో నీ హృదయం నిండిపోయినప్పుడు. దావీదుగారు అస్తమానూ దేవుని ధర్మశాస్త్రం ధ్యానించడానికే ఆశ పడేవారంట అందుకే దేవునికిష్టానుసారుడైన మనుష్యుడు గా మారిపోయారు.

దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని ......(2 తిమోతి 1:7) అట్లా చేయకపోతే నీకు మరో ఆజ్ఞ : 2 పేతురు 2:14-15. వ్యభిచారిని చూసి ఆశించుచూ పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరమైన మనస్సు గలవారును,..... శాపగ్రస్తులై ఉన్నారు. జాగ్రత్త! శాపం కావాలా? దీవెన కావాలా?

ప్రియ సహోదరి/సహోదరుడా! వెండి బంగారు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కాని అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింప బడ్డారని గుర్తు చేసుకో (1 పేతురు 18,19). చీకటినుండి వెలుగులోనికి మిమ్మును పిలచినవాని గుణాతిశయములు ప్రచురము చేయడానికి ఆయన మిమ్మల్ని ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహము గాను, పరిశుద్ధ జనముగా చేసుకొన్నారు (2 పేతురు 2: 9). దయచేసి నీ చూపును, నీ హృదయాన్ని భద్రం చేసుకో! హస్తప్రయోగం, ఆత్మీయ వ్యభిచారం మానేసి ఆత్మీయభావాలు పెంచుకో!
అట్టి కృప మనందరికీ కలుగును గాక! ఆమెన్! దైవాశీస్సులు!


చేయరాని పనులు

ఐదవ భాగము - పోములు- రక్ష రేకులు - తావీదులు కట్టుకోవడం

యెషయా 3:23:- ఆ దినమున యెహోవా నీ రక్షరేకులను,ఉంగరములను,.....తీసివేయును.
మీరు కర్ణపిశాచము గలవారియొద్దకు,చిల్లంగి వారియొద్దకు, మాంత్రికులు యొద్దకు వెళ్ళకూడదు, వారిని అవశ్యముగా వెళ్లగొట్టవలెను. అని ప్రభువు చెప్పియుండగా (ద్వితీ 18:9-13), నేడు అనేకమంది గ్రామాలలో వీరియొద్దకు పోయి పోములు/తావీదులు/రక్షరేకులు కట్టించుకొని దేవుని నామానికి అవమానం తీసుకుని వస్తున్నారు. తద్వారా దేవుని కోపానికి గురైపోతున్నారు. అత్యంత శక్తివంతమైన (యిర్మియా 32:17), బలమైన (యెషయా 6:9), దేవున్ని చేతకాని వానిగా చూస్తున్నారు (యెషయా 59:1-3). నీ రోగాన్ని నయం చేయడానికి దేవునికి శక్తి చాలదని తలస్తున్నావా? అందుకే పనికిమాలిన వ్యక్తుల దగ్గరకు వెళ్లి, పనికిమాలిన దయ్యాలకు పూజచేసిన పనికమాలిన తావీదులు/రక్షరేకులు/పోములు కట్టించుకొంటున్నావా? ఇవి కట్టించుకొని నీ దైవసేవకుని దగ్గరకు పోయి ప్రార్థన చేయించుకొంటున్నావు, ఒకవేళ ఆ దైవసేవకునికి ప్రార్థనా బలం తక్కువైతే ఆ దయ్యాలు ఆయన మీద ఎటాక్ చేస్తున్నాయి.

అసలు నా దేవుని గురించి ఏమనుకొంటున్నావు? మాటమాత్రము చేత సర్వసృష్టిని, సమస్త భూ జల చరాదులను సృష్టించిన వారు నా దేవుడు (ఆది 1,2 అధ్యాయాలు) , కలుగును గాక అంటే వెంటనే అన్నీ కలిగాయి. ఎర్రసముద్రాన్ని మరియు యోర్దాను నదిని పాయలు చేసినవారు నా దేవుడు (నిర్గమ 14:21,22 & యెహోషువ 3:15,16). ఓ సాధారణ వ్యక్తి చేసిన అసాధారణ ప్రార్థన విని సూర్య చంద్ర గమనాగమనాలనే ఆపివేసిన శక్తిమంతుడు (యెహోషువ 10: 12-14), తనబిడ్డల మొరనాలకించి శత్రుసైన్యాలను చెల్లాచెదురు చేసినవారు, ఒక రాత్రిలో ఒకేఒక దూతనంపి 1,85,000 మంది సైనికులను హతమార్చారు (2రాజులు 19:35). మాటమాత్రము సెలవిచ్చి రోగాలను స్వస్తపర్చిన నా దేవుడు, మాటమాత్రము చేత దయ్యాలను వెళ్ళగొట్టిన నా యేసుప్రభుల వారు నీ దయ్యాలను వెళ్ళగొట్టలేరా? ఆయన పేరు వినగానే దయ్యాలు హడలెత్తి పారిపోయాయి, పారిపోతున్నాయి కదా . ఒక దయ్యం ఆవహించిందని మరో దయ్యం దగ్గరకు వెళ్తావా? దేవుని మీద ఆధారపడతావా? దయ్యాలను ఆశ్రయిస్తావా? ఆయన మాటలో శక్తి (లూకా 7వ అధ్యాయం) , ఆయన ఉమ్ములో శక్తి(యోహాను 9: 6,7), ఆయన వస్త్రపు చెంగులో శక్తి(లూకా 8: 41-44), ఆయన చల్లని తాకిడిలో శక్తి! (లూకా 8: 54,55). ఇంత శక్తికలిగిన దేవుడు ఇప్పుడు నీకు చేతకాని వానిలా కనిపించారా? అందుకేనా దయ్యాలని ఆశ్రయించి పోములు రక్షరేకులు కట్టించుకొంటున్నావ్. జాగ్రత్త! జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.(హెబ్రీ 10:31).

అసలు నీకు విశ్వాసం ఉంటేనే కదా నీ రోగము /దయ్యం పోడానికి! క్రీస్తులో సగం / లోకంలో సగం. సగం భక్తి, సగం దుష్టాచారాలు, లోకాచారాలు, భ్రష్టాచారాలు. దేవునిలో ఉంటునే నీ అన్యాచారాలు మానవు. దేవుని బిడ్డనంటావు దయ్యం పనులు చేస్తావు. నులువెచ్చని జీవితం. అందుకే యేసుప్రభులవారు అంటున్నారు- నీవు చల్లగా నైననూ వెచ్చగానైననూ లేక నులువెచ్చగా ఉన్నావ్ కాబట్టి నా నీటినుండి ఉమ్మివేయనుధ్దేశించుచున్నాను. (ప్రకటన 3: 15-17). నీ బ్రతుకు మార్చుకోకపోతే ఇంతవరకూ చేసిన నీ వేషధారణ భక్తి వ్యర్ధం!

నేను ప్రార్థన చేసినా నాకు స్వస్థత కలగడం లేదు. అందుకే పోములు కట్టించుకొంటున్నాను అంటున్నావ్. నీరు ఉపవాసం ఉండి లోకవార్తలు చెప్పుకొంటూ లోక వ్యాపారం చేసుకొంటూ, ప్రార్థన చేస్తున్నావు. అది నాకిష్టంలేదు అంటున్నారు దేవుడు (యెషయా 58). మీరు ఆశిస్తున్నారు గాని దొరకడం లేదు, దేవున్ని అడగటం లేదు అందుకే దొరకడం లేదు, అడిగినా మీ భోగముల నిమిత్తమై అడుగుచున్నారు అని అంటున్నారు దేవుడు (యాకోబు 4: 2-10). ఇలాంటి రెండు తలంపులు గలవారికి దేవుడిచ్చే బిరుదు:- వ్యభిచారిణులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని తెలియదా?
ఎవడు ఈలోకముతో స్నేహించునో వాడు దేవునికు శత్రువగును. ఖబడ్దార్! దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదురించుడి. అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి అప్పుడాయన మీయొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకొనుడి. ఎందుకంటే మీ చేతులనిండా అన్యాయం, అన్యాయపు సొమ్ము, వ్యభిచారపు క్రియలు, వాటినే శుభ్రం చేసుకొనండి అంటున్నారు. ద్విమనస్కులారా! మీ హృదయాలను పరిశుధ్ధ పరచుకోండి .. హృదయంలో సగం దేవుడు - సగం లోకం, సగం భక్తి- సగం వ్యభిచారపు తలంపులు.అందుకే దుఃఖపడుడి వ్యాకులపడుడి మీ ఆనందాన్ని చింతగా మార్చుకొండి ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటున్నారు. అప్పుడు ఆయన మీ దగ్గరకొచ్చి మీ రోగాలను తీసేస్తారు. మీ దయ్యాలను తరిమికొడతారు. అసలు దయ్యాలను తరిమి కొట్టడానికి మీకే ఎప్పుడో అధికారం ఇచ్చారు (మార్కు 16: 15-18). మీ దగ్గర సత్తాలేక వెళ్లగొట్టడం లేదు, సరికదా దయ్యాలను ఆశ్రయిస్తున్నారు. ఎంత విచారము. ఎంత సిగ్గు చేటు! ఇంకా అంటున్నారు రక్షింపకనేరకుండునట్లు యెహోవా హస్తం కురుచకాలేదు విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ పాపములు మీకు దేవునికి అడ్డంగా ఉన్నాయి వాటిని తీసెయ్ (యెషయా 59: 1,2)

కాబట్టి ఇంకెంతకాలం దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తావు? ఈ లోకాన్ని వదలి యేసయ్య దగ్గరకు పరిపూర్ణ విశ్వాసంతో రా! షడ్రక్,మేషాక్, అబెద్నెగోల వలె మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి తప్పించి రక్షించడానికి సమర్ధుడు. ఒకవేళ రక్షించకపోతే చావనైనా చస్తాం గాని నీ బంగారు బొమ్మకు మొక్కం అని ఖరాకండిగా చెప్పగలగాలి (దానియేలు 3: 16-28). ఆ అచంచలమైన విశ్వాసం దేవునిదూత వాళ్ళతోపాటు అగ్నిగుండంలోనికి దూకాల్సి వచ్చింది అగ్ని గుండం A/C Room అయిపోయింది. నీకు కూడా అదే విశ్వాసం కావాలి. అప్పుడే దయ్యాలు నిన్ను చూసి పారిపోతాయి. నీవు ప్రార్థన చేస్తే ఎటువంటి మొండి దయ్యమైనా సరే పేరుచెప్పి పారిపోవల్సిందే. నాయందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్న యేసయ్య మాట నేడే నమ్ము. అవిశ్వాసి కాక విశ్వాసంలో ముందుకు నడు.నీ పాపాలు తీసెయ్. విజయాలు పొందుకో!

కృప మీకు తోడైయుండును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!



చేయరాని పనులు

ఆరవ భాగము - అబద్ధాలు - అబద్ధ ప్రమాణాలు

మీరు నావాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహింతురు.(యోహాను 8:31),
మీరు మీ తండ్రియగు అపవాధి సంబంధులు, మీతండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు- ఆదినుండి వాడు నరహంతకుడు. . . . వానియందు సత్యము లేదు, వాడు అబధ్దికుడు, అబద్ధమునకు జనకుడై(తండ్రి) యున్నాడు (యోహాను 8:44)

ప్రియ సహోదరి/సహోదరుడా! నేడు అబద్ధాలు చెప్పడం మనకు అనగా చిన్నవారికి పెద్దవాళ్ళకు అందరికీ అలవాటైపోయింది. పెద్ద అబద్ధాలు కాకపోయినా చిన్ని చిన్ని అబద్ధాలు ఆడుతూ తప్పులేదు అనుకొంటున్నాం. అబద్ధం చిన్నదైనా పెద్దదైనా అబద్ధమే, పాపం చిన్నదైనా పెద్దదైనా పాపమే. ఉదా- ఒక వ్యక్తి విశాఖపట్నం నుండి రాజమండ్రి ట్రైన్లో వెళ్తున్నాడు అనుకొందాము, ఆ వ్యక్తి తునిదగ్గర ఉండగా మరో వ్యక్తి ఫోన్ చేస్తే ఎక్కడున్నారు ఎప్పుడొస్తారు అని అడిగితే సామర్లకోట దాటేశాను అరగంటలో వచ్చేస్తాను అంటాడు. ఇది అబద్ధం కాదా? సరే, చివరకు ఇక గంటన్నర లేటుగా వెళ్తాడు, వెళ్ళి మరో అబద్ధం చెబుతాడు ట్రాఫిక్ జామ్ అనో, మధ్య దారిలో కారు పాడైపోయింది అనో. ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం, పాపానికి పాపం జత చేస్తున్నావని మర్చిపోకు. దేవుడు ఏమన్నారు? నీ మాట అవునంటే అవును; కాదు అంటే కాదు అని ఉండాలి, వీటికి మించునది దుష్టునినుండి పుట్టింది (మత్తయి 6:37). ప్రియబిడ్డా! ఆలోచించు! ప్రతీ రోజూ మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము. సత్యం చెబితే దేవుని సంభంధివి, అబద్ధాలు చెబుతున్నావు అంటే సాతాను సంభంధివే!

మరికొంతమంది, ఎవరైనా అవుసరానికి చేబదులు (అప్పు) అడిగితే డబ్బులు ఉంచుకొని కూడా డబ్బులు లేవు, జీతాలు రాలేదు ఇలా సాకులు చెబుతారు అతనికి/ఆమెకు ఇవ్వడం ఇష్టం లేక. ఇది అబద్ధం కాదా? అబద్ధం చెప్పి నరకానికి పోవడం కన్నా నిజంచెప్పి నిష్ఠూర పడటమే మంచిది కదా! బైబిలులో ఏమి వ్రాయబడింది నీవు సహాయం చేయగలిగే స్థితిలో ఉండి కూడా సహాయం చేయకపోతే అది నీకు పాపం(సామెతలు 3:27). యోబుగారిని ఒకసారి తలంచుకొందాం. దేవుడే సాతానుదగ్గర సాక్ష్యం చెబుతున్నారు " యోబు యదార్థవర్తనుడు,నీతిమంతుడు ...." అని (యోబు 1:8). నీకోసం దేవుడు కాదు కదా కనీసం పొరుగువారు యధార్ధవంతుడు అని చెప్పగలరా? కనీసం నీ మనస్సాక్షి అయినా సాక్ష్యం చెప్పగలదా?

ఇంకొంతమంది అబద్ధ ప్రమాణాలు చేస్తారు. యాకోబు 3:14 లో ఏమి వ్రాయబడింది : సత్యమునకు విరోధముగా అబధ్ధమాడవద్దు అని ఖండితముగా ఆజ్ఞాపిస్తున్నారు. కొంతమందిని జ్ఞాపకం చేసుకొందాం.
1) యెజెబెలు రాణి అబధ్ధ సాక్షులను ఏర్పాటు చేసి భక్తుడైన నాబోతుగార్ని చంపించింది.(1రాజులు 21వ అధ్యాయం). వెంటనే దేవుడు ఏలియాగారిని పంపించి "ఏ స్థలమందు నాబోతు రక్తము కుక్కలు నాకెనో అదే స్థలమందు నీ రక్తము కుక్కలు నాకును" అని సెలవిచ్చారు. ఆహాబురాజు రక్తం కుక్కలు నాకాయి, అతని భార్య యెజెబెలు రక్తం కూడా కుక్కలు నాకాయి.(1రాజులు 22:28 & 2 రాజులు 9:35-37).జాగ్రత్త! అబద్ద ప్రమాణాలు చేసి నిర్ధోషుల ఆస్తిని, ప్రాణాలను హరిస్తే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి.

2) ఇద్దరు భార్యాభర్తలు అననీయ-సప్పీర. గొప్పకోసం తమ ఆస్తిని అమ్మి దేవునికిచ్చేస్తాం అని చెప్పారు. సగం ఉంచుకొని సగం తీసుకొని వస్తాడు అననీయ. పరిశుధ్ధాత్ముడు పేతురు గారి ద్వారా అంటున్నారు " అననీయా నీ భూమివెలలో కొంత దాచుకొని పరిశుధ్ధాత్మను మోసగిస్తావా" అని, వెంటనే అక్కడే చనిపోతాడు, ఈ విషయం తెలియని సప్పీరా సుమారు మూడు గంటలకి వస్తాది, పేతురు గారు అడుగుతారు సప్పీరా! మీ భూమిని అంతకే అమ్మారా? అని, మరోసారి అబద్ధం, వెంటనే ఆమెకూడా అక్కడే పడి చనిపోయింది. (అపో 5:1-11). నీవు పరిశుధ్ధాత్మని మోసగించలేవు జాగ్రత్త! ఏమైనా మ్రొక్కుకొంటే వెంటనే చెళ్లించు, లేకపోతే అది నీకు శాపము.

3) పేతురుగారు యేసుప్రభు ఎవరో తనకి తెలియదని ముమ్మారు అబద్దమాడుతారు. తన జీవితమంతా దానికోసం సంతాప పడవలసి వచ్చింది (లూకా 23:54-42)

కావున నీ అబద్దాలు అబధ్ద ప్రమాణాలు నేడే విడిచి పెట్టు. అప్పుడు నీవు దేవుని పరిశుధ్ధ పర్వతం మీద నివాసం చేయగలవు. ఎప్పుడూ? నష్టం కలిగినా మాట తప్పనప్పుడు.(కీర్తనలు 15వ అధ్యాయం) . అలా కాకపోతే దేవుని ఉగ్రత, శాపం వస్తుంది. నరకానికి పోతావు. ప్రకటన 21:8 పిరికివారును,. . . . అబధ్ధికులందరునూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు. కుక్కలును, . . . అబధ్ధమును ప్రేమించి జరిగించు ప్రతీవాడును వెలుపటనుందురు (ప్రకటన 22:15). నీ జీవితం సరిచేసుకో ఎందుకంటే మనము దేవుని అవయవాలము కాబట్టి మీరు అబద్ధమాడుట మాని తన పొరుగువానితో సత్యమే పలుకవలెను (ఎఫెసీ 4:25). నేనే మార్గము, నేనే సత్యము అని చెప్పిన సత్యవంతుడైన దేవుని బిడ్డగా సత్యమే పలుకుతావా? లేక అబధ్ధపు జనకుడైన సాతానుగాడి కొడుకుగా/ దయ్యం కూతురుగా అబద్ధాలు చెబుతావా? ఆలోచించుకో! అబద్ధికులు పరలోకం వెళ్ళలేరు.

జీవితాన్ని సరిచేసుకొని ఆయన వెలుగులో, జీవములో, ఆయన మార్గములో నడుద్దాము.
అట్టి కృప మనకు కలుగును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!


చేయరాని పనులు

ఏడవ భాగము - మద్యపానం - ధూమపానము


ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి హేతువులేని గాయములు? ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా! . . . పిమ్మట అది సర్పమువలె కరచును. కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. వెర్రిమాటలు పలుకుదువు. (సామెతలు 23:29-35).

ప్రియ సహోదరి/సహోదరుడా! నేటి దినాలలో త్రాగుడు మరియు ధూమపానం ఎక్కువైపోయింది. ముఖ్యంగా యవ్వనస్తులు చాలా ఘోరంగా వీటికి బానిసైపోయారు. త్రాగి వాహనాలు నడపడం, యాక్సిడెంటులు అవ్వడం జరుగుతుంది. పట్టణాలలో, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో యువకులుతో పోటీగా యువతులు కూడా మద్యపానం ధూమపానం చేస్తున్నారు, సాతానుకి బానిసైపోతున్నారు. అయితే విచారం ఏమిటంటే అన్యులతో పాటు దేవుని బిడ్డలు కూడా అదే పాపం చేస్తున్నారు సరికదా ప్రభురాత్రి సంస్కారం కూడా తీసుకొంటున్నారు. దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడు నేను వ్రాసేది దేవుని బిడ్డలు కోసమే. ఎదుట వారికి తీర్పు తీర్చడం నాకేల? పౌలుగారు అంటున్నారు " ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైననూ- తిట్టుబోతుగాని, త్రాగుబోతుగాని. . . అయితే అట్టివానితో సాంగత్యము చేయరాదు, కలసి భుజింపరాదు. . . సంఘంలో నుండి వెలివేయమని చెబుతున్నారు (1కొరింథీ 5:11-13). ఎందుకంటే అది దేవునికి అసహ్యమైన క్రియ. మోసపోకుడి! జారులైననూ. . . త్రాగుబోతులైననూ, దూషకులైననూ. . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు (1కొరింథీ 6:9,10).

నేటి దినాలలో క్రైస్తవ జనాంగము దీనిని మరచిపోతున్నారు. లోకస్తులతో కలసి లోకస్తులు త్రాగుతున్నట్లు త్రాగుతున్నారు. దానివలన ఏమేమి సంభవిస్తాయో సొలొమోనుగారు వివరించారు. మొదటగా శ్రమ. తన దేహాన్ని తనే శ్రమ పెట్టుకొంటున్నాడు. తమ కుటుంబాన్ని కూడా శ్రమపెడుతున్నారు. దానివలన దుఃఖము అశాంతి, కారణం లేని జగడాలు, ఎందుకంటే త్రాగేసి ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. ఫుల్ గా త్రాగేసి రోడ్డుమీద పడిపోతారు, పందిలా బురదలో , డ్రైనేజీలో దొర్లుతుంటారు. ఫలితంగా హేతువులేని గాయాలు. గమనించండి అన్యులుకూడా ఇలా చేస్తారు కాని ఎవరూ పట్టించుకోరు, అదే దేవుని బిడ్డలు చేస్తే పెద్దరాధ్ధాంతం చేస్తారు దేవుని బిడ్డలు రోడ్డుమీద దొర్లుతున్నారు అంటారు. తద్వారా దేవుని నామం అవమానపరచడుతుంది దూషింపబడుతుంది. ఇంకా ఏమి వస్తాయి? Sugar, BP, Lever పనిచేయదు, ధూమపానం వలన ఊపిరితిత్తుల పాడైపోతాయి, కేన్సర్ ఇంకా అనేక రోగాలు - పిమ్మట అది సర్పము వలె కరచును అంటే ఇదే. కట్లపాము కాటేస్తే వెంటనే చనిపోరు, పక్షవాతము, ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి. ఈ మద్యపానం, ధూమపానం వల్ల కూడా అలాగే ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి. ప్రియ సహోదరుడా! దేవుని పరువు తీస్తున్నావు, నీ ఆరోగ్యం పాడుచేసుకొంటున్నావు. నీ కుటుంబాన్ని కూడా బాధపెడుతున్నావ్. త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని తెలుసుకో!

కొందరంటారు త్రాగకూడదని బైబిలులో ఎక్కడుంది? వారు బైబిల్ చదివితేనే కదా తెలుస్తుంది ఎక్కడ వ్రాయబడిందో తెలుస్తాది. 1కొరింథీ 5:10-13; 6:9,10; 1 పేతురు 4:3; సామెతలు 23:29-35. ఇంకొందరు అంటారు మరి పౌలుగారు తిమోతిగారికి పత్రిక వ్రాస్తూ నీ కడుపు నొప్పి కోసం ద్రాక్షారసం తీసుకోమని వ్రాశారు కదా అని. ప్రియబిడ్డా! దైవ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, కలిపి చెరపకూడదు. నీకు అనుకూలంగా మలచుకోకూడదు.

1. ఇక్కడ ద్రాక్షారసం (wine) అంటే ద్రాక్షపళ్ళునుండి తీసిన రసం డైరెక్టుగా త్రాగమని అర్థం. దానికి ఈస్ట్ కలిపి, పులియబెట్టిన తర్వాత త్రాగమనికాదు. ప్రస్తుతం చాలామంది (RCM) చేస్తున్న పని ఇదే. బైబిల్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు.
2. పూర్వకాలంలో Medicine అభివృద్ధికాని రోజులలో యూరోప్, మధ్య ఆసియా ప్రాంతాలలో ఏదైనా అనారోగ్యం కలిగితే ద్రాక్షరసం, అంజూరపు ఆకులు, ఒలీవ ఆకులు, ఒలీవ నూనె వాడేవారు. (మన దేశంలో నల్లమందు వాడినట్లు 50 సం. ల క్రితం) . ద్రాక్షరసంతో గాయాలు కడిగితే తొందరగా నయమయ్యేది (wine తో కాదు). ఆ ద్రాక్షారసం త్రాగితే కడుపు నొప్పి లాంటివి తగ్గేవి. ఆ ఉద్దేశంతోనే పౌలుగారు చెప్పారు గాని ఈస్ట్ కలిపిన wine త్రాగమని చెప్పలేదు.

ధూమపానం

కొంతమంది సిగరెట్లు త్రాగకూడదు అని బైబిలులో లేదుకదా, త్రాగితే తప్పేంటి అని అడుగుతారు. బైబిలు వ్రాయబడినప్పుడు సిగరెట్లు బీడీలు లేవు ఉంటే వ్రాయబడి ఉండేది. ఒకవేళ దేవుడు ధూమపానాన్ని అనుమతిస్తే నీ తలమీద గాని, మరో ప్రాంతంలో ఒక పొగ గొట్టాన్ని (exhaust pipe) పెట్టి ఉండేవారు కదా! గాలి పీల్చుకోడానికి ముక్కు రంధ్రాలు, మలమూత్ర విసర్జనకు మరో రంధ్రాలును ఏర్పాటుచేసినట్లు. ఎంత ఘోరమంటే ఆ సిగరెట్ పేకట్ మీద ప్రొగత్రాగడం హానికరం అనివ్రాసినా డబ్బు పెట్టి కొని, అగ్గి పెట్టి కాల్చేస్తున్నావు. కొంత కాలానికి అవి నీ ఊపిరితిత్తులను తినేస్తాయి. మరికొందరు మాధక ద్రవ్యాల మత్తులో మూలుగు తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి కాలేజీలలో అడ్మిట్ చేస్తున్నారు తర్వాత వారు ఎలా ప్రవర్తిస్తున్నారో పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా వాళ్ళకోసం మోకాళ్ళ మీద కన్నీటితో దేవునికి ప్రార్థన చెయ్యడం లేదు.ఫలితంగా సాతాను మీ పిల్లలను ఈ లోకాశలమీదకు మళ్ళించి నాశనానికి తీసుకొని పోతున్నాడు.

ఇక పేతురుగారు అంటున్నారు మద్యపానం గాని, త్రాగుబోతుల విందులు గాని చేయగూడదు అని (1 పేతురు 4:3). పౌలుగారు అంటున్నారు త్రాగుబోతులు పరలోకం వెళ్లరని (1 కొరింథీ 6:9,10). యెషయా గ్రంథంలో త్రాగుబోతులకు శ్రమ అంటున్నారు (యెషయా 28:1).
అందుకే యోవేలు గ్రంథంలో దేవుడంటున్నారు "మత్తులారా! మేలుకొని కన్నీరు విడువండి, ద్రాక్షరస పానం చేయువారలారా! రోదనం చేయుడి" (యోవేలు 1:5)

కాబట్టి నేడే నీ మత్తు, మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలు వదలి యేసయ్య పాదాలు దగ్గరకు రా! మానేద్దామని అనుకొంటున్నా మానలేక పోతున్నావా? నీ సిగరెట్ పేకట్లు, మందు బాటిల్లు బయట పారవేసి యేసయ్య పాదాలను నీ కన్నీటితో కడుగు. వెంటనే నీకు దేవుడు వాటిమీద అసహ్యాన్ని కలిగిస్తారు. అప్పుడు నీవు సంతోషిస్తావు. నీతో పాటు నీ కుటుంబం. సమాజంలో మంచి పేరు కూడా వస్తుంది. చివరకు పరలోకాన్ని పొందుకొంటావు.

అట్టి కృప అందరికీ కలుగును గాక!
దైవాశీస్సులు.


చేయరాని పనులు

ఎనిమిదవ భాగము - సంఘంలో అన్యాచారాలు

మనము పోకిరిచేష్టలు. . . చేయకూడని విగ్రహపూజలు మొదలైన వాటియందు నడచుకొనుచూ, అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి గతించిన కాలమే చాలును. (1పేతురు 4:3)

ప్రియ సహోదరి/సహోదరులారా! మనము రక్షింపబడి, బాప్తిస్మము తీసుకుని, క్రమంగా ఆరాధనలో పాల్గొంటున్నా ఇంకా అన్యాచారాలు వదలివేయలేకపోతున్నాం. ధౌర్భాగ్యం ఏమిటంటే అవి సంఘంలో కలసిపోయాయి. అన్యాచారాలు క్రైస్తవాచారాలుగా మారిపోయాయి. దేవున్ని నమ్ముకొని అన్యాచారాలు వదలలేక విగ్రహారాధికులుగా మారిపోతున్నారు, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా విగ్రహారాధన చేస్తున్నారు. వాటిలో కొన్నింటిని చూద్దాం.

1) వివాహ సందర్భంలో జాతకం- ముహూర్తము
ఇప్పుడు దేవుని ఎరిగిన వారును, మరియు దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక, బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయిన మూలపాటముల తట్టు మరళా తిరుగనేల?. . . మీరు మాసములు, ఉత్సవకాలములు, సంవత్సరాలను ఆచరించుచున్నారు (గలతీ 4:8-11). అవన్నీ చేయకూడదని గ్రంథం సెలవిస్తుంది. గాని ఇప్పుడు మన వివాహ సమయాలలో క్రైస్తవులు జాతకాలు చూపించుకొంటున్నారు. జాతకాలు కుదరకపోతే పెళ్ళి జరగడం లేదు. ఆదియందు ఆదాము హవ్వలను చేసినప్పుడు గాని, వారిద్దరిని కలిపినప్పుడు గాని, లేక సృష్టిని చేసినప్పుడు గాని దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ముహూర్తం చూసినట్లు గాని, జాతకాలు చూసినట్లు గాని లేదే! దేవుడు చేసిన ప్రతీ దినము మంచిదే. మరి మనకెందుకు జాతకాలు? ముహూర్తాలు? జాతకాలు చెప్పేవాళ్ళను, సోదెగాళ్ళను, చిల్లంగి వాళ్ళను, కర్ణపిశాచం గలవారిని దేశం నుండి వెళ్ళగొట్టెయ్యమని దేవుడు సెలవిస్తే (ద్వితీయో 18: 9-13) దేవుని బిడ్డలు అని పేరు పెట్టుకొని వీరి దగ్గరకు వెళ్తున్నారు. దేవుని బిడ్డలకు దేవుని మాటలపై కాకుండా వీళ్లే ఎక్కవైపోయారు.

జాతకాలకు, ముహూర్తాలకి మూలం : సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలకు దైవత్వముందని, మనిషి మనుగడ వాటి అనుగ్రహం మీదనే ఆధారపడియుందని, వాటి అనుగ్రహం బాగా లేకపోతే మనిషికి నష్టం కలుగుతుంది అని అన్యులు నమ్ముతారు. వీటి ఆధారంగానే తిధులు, రాహుకాలాలు, అమృతగడియలు నిర్ణయిస్తారు. ఈ సూర్యచంద్రులు నక్షత్రాలు అన్నీ దేవుని సృష్టి అని దైవగ్రంధం సెలవిస్తుంది వీటికి మనుష్యులు దైవత్వాన్ని ఆపాదించి సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధిస్తున్నారు. అందుకే బైబిలులో వ్రాయబడింది " వారు అక్షయుడగు దేవుని మహిమను, క్షయమగు మనుష్యుల యొక్క, పక్షులు యొక్క .... ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు, దేవుని సత్యాన్ని అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. రోమా 1: 23-25.
ఇటువంటి వారిమీదకి దేవుని ఉగ్రతరాబోతుంది (ప్రకటన 21:8; 22:15). దేవుని బిడ్డనని చెప్పుకొనే నీవు ఈ ముహూర్తాలు జాతకాలు చూసుకొంటే మరళా సృష్టికర్తకి ప్రతిగా సృష్టిని పూజించినట్లే కదా! అనగా విగ్రహారాధన చేసినట్లు కదా!



మరికొంతమంది పెళ్ళి పందిరిలో మామిడాకులు కడతారు, ఆక్షిజన్ కోసం అంటారు. మిగతా చెట్ల ఆకులు కూడా ఆక్షిజనే విడుదల చేస్తాయి గాని మామిడాకులే ఎందుకు కట్టాలి? ఇదికూడా విగ్రహారాధనే! పూర్వం శివుడు పార్వతిని వివాహం చేసుకొన్నప్పుడు ఒక మామిడి చెట్టు క్రింద కూర్చొని తాళికట్టి పెళ్ళి చేసుకొన్నారంట! అప్పుడు వారు మామిడిచెట్టుని దీవించారంట ఏ శుభకార్యం జరిగినా నీ ఆకులు తోరణాలుగా ఉంటాయని. అందుకే మన హైందవ సహోదరులు మామిడాకులు కడతారు. మరి నీవుకూడా కడుతున్నావంటే నీవు కూడా దానిని నమ్మి విగ్రహారాధన చేసినట్లు కదా! వివాహ ప్రధానం సమయంలో బొందులు కట్టడం, వచ్చిన ముత్తైదువలుకి గంధం రాయడం ఇవన్నీ అన్యాచారాలు విగ్రహారాధన కాదా? పెళ్ళికి అక్షింతలు వేస్తారు. ధాన్యం భూమిపై పడితే మొలకెత్తుతుంది, అదే బియ్యం పడితే మొలకెత్తదు, అది క్షయం కాకుండా ఉంటుంది కాబట్టి దేవతలు రాసుకొనే పసుపు దానికి రాస్తే అవి పవిత్రమైన అక్షింతలుగా మారి పెద్దల ఆశీర్వాదాలు వస్తాయంట! ఈ అక్షింతలు మన క్రైస్తవ వివాహాలులో పాష్టగారి చేతికిచ్చి ప్రార్థన చేయించి మరీ వేస్తున్నారు. ఎంత అన్యాయం! ఇది విగ్రహారాధన కాదా? దేవుని సంఘంలో విగ్రహారాధన పాతుకుపోయింది.

ప్రజలు పండితుడు దగ్గరకు వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకొని వచ్చి, పాష్టగారు ఫలానా తారీకు మంచిదంట, పెళ్ళి చేయండి అంటే పాష్టగారు వచ్చే కానుకలికి ఆశించి పెళ్ళి చేసేస్తున్నారు గాని అది తప్పు, విగ్రహారాధన అని ఖండించటం లేదు. నీవు విగ్రహారాధన చేస్తున్నావు దీనిలో పాష్టగారిని కూడా భాగస్వామ్యం చేస్తున్నావు. ఇదేనా నీ కాపరికిచ్చే గౌరవం? ఆయన సలహా లేకుండా ముహూర్తం చూసుకొంటావా?

2) తాళి:
ఇదో పెద్ద అన్యాచారం. సంఘంలో దురాచారం. పెళ్ళి రిజిస్ట్రారుగారు భారతదేశ ఆచారం ప్రకారం అని చెప్పి కట్టిస్తున్నాను అంటారు. నిజంగా ఇది మన దేశ ఆచారమా? మన దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు, అందులో ఉత్తర భారతదేశం వారుగాని, తూర్పు పడమర వారు గాని కట్టరు. కేవలం దక్షిణ భారతదేశంలో నాలుగు రాష్ట్రాలకి చెందిన కొంతమంది హైందవులు తాళి కడతారు. , 24 రాష్ట్రాలవారు, ముస్లిములు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఎవరూ కట్టరు. మరి ఇది భారతదేశ ఆచారం ఎలా అయ్యింది? ఆదాముగారు హవ్వమ్మకు తాళి కట్టారా? అబ్రహాం గారు శారాకు కట్టారా? లేదే! మరి బైబిలులో వ్రాయబడని ఆచారం అన్యమతాచారం కాదా?

శివుడు పార్వతిని పెళ్ళి చేసుకొనేటప్పుడు వివాహ సూచనగా మామిడిచెట్టు క్రింద తాళి కట్టినట్లు చెబుతారు. ఈ శతమానంలో ఒకటి శివుడికి, మరొకటి పార్వతికి గుర్తు. దానికోసం త్రిమూర్తుల సాక్షిగా వారికి గుర్తుగా మూడు ముడులు వేసినట్లు చెబుతారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఈ ఆచారాలు విగ్రహారాధన పరిశుధ్ధ వివాహంలో, అపరిశుధ్ధంగా, అన్యాచారంగా తాళి కట్టేస్తున్నారు. సరికదా త్రిమూర్తుల జాగాలో తండ్రి కుమార పరిశుధ్ధాత్మ అంటున్నారు. ఎంత ఘోరం! ఎంత అపచారం! క్రీస్తులో సగం లోకంలో సగం. ఇటువంటి వారిపై దేవుని ఉగ్రతరాదా? మీ సంఘాలలో ఇలా జరుగడం లేదా? దీనినెప్పుడైనా ఖండించావా? ఇలా అక్షింతలు వేసి, తాళి కట్టి, ముహూర్తాలు చూసి పెళ్ళి చేసుకొంటే తాళి కట్టించిన వారిమీదకి, కట్టిన వారిమీదకి దేవుని శాపం రాదా? దేవుని బిడ్డనని చెప్పుకొంటూ మెడలో శివపార్వతులని మోస్తూ, అనగా వారికి పరోక్షంగా పూజచేస్తూ, విగ్రహారాధన చేస్తూ దేవుని బిడ్డనని చెప్పుకొని తిరిగితే నీవు దేవుని బిడ్డవా వేషధారివా? దేవున్ని పూజిస్తున్నావా? దేవతలని పూజిస్తున్నావా?

3) వాస్తు
ఇక మరో దురాచారం వాస్తు. దేవుని బిడ్డలని చెప్పుకొంటూ, దేవుడే సర్వసృష్టిని చేసినవాడని, సర్వలోకాధిపతి అని నమ్ముతారు. గాని వాళ్ళ ఇంటికి మాత్రం వాస్తు చూపించుకొని, అష్ట దిక్పాలకులను కాపలాగా పెట్టుకొంటారు. సర్వలోకాన్ని పాలించే దేవుడు నీ గృహాన్ని నీ హృదయాన్ని పాలించలేరా? కాయలేరా? రక్షించలేరా? మరెందుకు వాస్తుని నమ్ముతావు?

పూర్వ కాలంలో ఒక రాక్షసుడు అందరినీ బాదపెడుతుంటే ఈశ్వరుడు రాక్షసునితో యుద్ధము చేసాడంట, అప్పుడు చెమట క్రింద పడి ఒక భూతం పుట్టిందంట, ఆ భూతమే వాస్తు పురుషుడు. ఆ భూతం అలా పెరిగిపోతుంటే దేవతలు భయపడి వానిమీద పడి భూమిపై నొక్కి పెట్టారంట. అప్పుడు ఆ వాస్తు పురుషుడు నేను ఎవరికీ అన్యాయం చేయకపోయినా నా మీద కూర్చొన్నారు అని బ్రహ్మకి మొర్రపెట్టాడంట. అప్పుడు 8 మందిని మాత్రమే ఉంచి మిగతా వారిని తీసేసి, భూమి మీద ఎవరు ఇల్లు కట్టుకొన్నా నీకు పూజచేయాలని, నాలుగు మూలలు, నాలుగు దిక్కులలో ఉన్న అష్టదిక్పాలకులకు శాంతి చెయ్యాలని దీవించాడంట! అందుకే హైందవ సోదరులు వాస్తుని నమ్మి దానికనుగుణంగా గృహనిర్మాణం చేస్తారు. మరి నీవు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ఈ గృహాధిపతి అని బయట బోర్డు పెట్టినంతమాత్రాన నిజంగా యేసుప్రభులవారు నీ గృహానికి అధిపతికాగలరా? యేసయ్యను లోపలికి రాకుండా నాలుగు దిక్కులో, నాలుగు మూలల్లో ఎనిమిది మంది అన్యదేవతలని కాపలాగా పెట్టావు కదా మరి యేసయ్యను ఎలా లోపలికి రమ్మంటావ్? ఇల్లు East facing ఉండాలంటావు లేదా North facing కావాలంటావు. ఈశాన్యంలో బరువు ఉండకూడదు అంటావు. వంటగది ఆగ్నేయంలోనే ఉండాలంటావు. వాయువ్యం కాళీగా ఉండాలంటావు. దురాచారాలు పాటిస్తావు సరికదా వాస్తుని సైన్స్తో పోలుస్తావు. నీవు చేసేది భక్తా? విగ్రహారాధనా? ఇంట్లోనూ మనసులోనూ శరీరంమీదా విగ్రహాలు పెట్టుకొని చేసేది ఆత్మీయ వ్యభిచారం కాదా? ఈ మద్య కొన్ని చర్చిలు కూడా వాస్తు ప్రకారం కడుతున్నారు.

ప్రకటన 3:15 నీవు చల్లగానైననూ వెచ్చగానైననూ లేవు కాబట్టి నానోట నుండి ఉమ్మివేస్తాను అంటున్నారు దేవుడు. నీకు వాస్తు కావాలంటే తిరిగి అన్యునిగా మారిపో. యేసయ్యే కావాలంటే ఈ అన్యాచారాలు వదిలెయ్! ఈ అన్యాచారాలు అనగా జాతకాలు ముహూర్తాలు చూడటం, పెళ్ళిలో మామిడాకులు కట్టడం, బొందులు కట్టడం, గంధం రాయడం, తాళి కట్టడం (కట్టించడం) , కాళిమెట్లు పెట్టుకోవడం చివరకు వాస్తు పాటించడం ఇవన్నీ విగ్రహారాధనే, వీటిని చేసి దేవుని భాదపెట్టకు. దేవుని ఉగ్రతకు పాలుకాకు. 1 కొరింథీ 10:14 విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటున్నారు, ఇంకా 2 కొరింథీ 6: 14-18 వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నారు. దేవుని బిడ్డా నిన్ను నీవు సరిచేసుకో! ప్రియ సంఘకాపరి! దయచేసి నీ సంఘాన్ని రెండవ రాకడలో ఎత్తబడే వారిలా తయారుచేయు గాని, తీర్పులో పొట్టులా ఎగిరి పోయేవారిగా తయారు చేయకు! విగ్రహారాధికులు (ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని) పరలోకం చేరరని ఖండితముగా చెప్పు!
దేవుని సంఘమా! నేడే పరీక్షించుకొని అలాంటివి అన్నీ విడచిపెట్టు! వాక్యానుసారమైన జీవితం జీవించి పరలోకాన్ని పొందుకో!
కృపమీకు తోడైయుండును గాక! ఆమెన్!
దైవాశీస్సులు!


చేయరాని పనులు

తొమ్మిదవ భాగము - సరిచేసుకొనుట- దిద్దుకొనుట

పితృపారంపర్యమైన మీ ప్రవర్తనను విడచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింప బడలేదు గాని, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్ర్రీస్తురక్తముచేత విమోచింపబడితిరి (1 పేతురు 1:18,19)

ప్రియ సహోదరి/సహోదరులారా! ఇంతవరకూ మనం అనేకమైన చేయరాని పనులు, దురలవాట్లు, అన్యాచారాలు కోసం మాట్లాడుకొన్నాం. ఇవి దేవుని నుండి మనల్ని దూరం చేశాయి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి (1పేతురు 2:25).

మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవి జరిగించుటకు గతించిన కాలమే చాలును (1పేతురు 4:3). దయచేసి ఈ పాపములన్నీ మానివేసి ప్రభువువైపు తిరుగమని బ్రతిమాలుతున్నాను. నీ జారత్వము, వ్యభిచారం నుండి పారిపో, మోహపుచూపును వెలిచూపును వదిలెయ్! హస్తప్రయోగం లాంటి అలవాట్లు మానెయ్! దేవునికి కోపం పుట్టించే పోములు/ రక్షరేకులు/ తావీదులు తీసిపారెయ్! త్రాగుడు, ధూమపానం విసర్జించు! మన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి సమర్ధుడు! నీ అబద్ధాలు అబద్ద ప్రమాణాలు మానెయ్! తాళి కట్టడం, వాస్తు చూడటం లాంటి అన్యాచారాలు విసర్జించు! ఎందుకంటే ఇవన్నీ దేవుని నీతిని నెరవేర్చవు. మనం పరిశుధ్ధులగుట అనగా జారత్వం నుండి పారిపోవుట & తన ఘటమును కాపాడుకొనుట ఎరిగియుండుటయే దేవుని చిత్తము! (1 థెస్స 4:3,4).

ఇంకా చాలా ఉన్నాయి. లంచాలు పుచ్చుకొనేవారు కొందరు. లంచం పుచ్చుకోకూడదు అని బైబిల్ సెలవిస్తుంది (నిర్గమ 23:8). అన్యాయస్తులు దేవుని రాజ్యం చేరరు అని గ్రంథం సెలవిస్తుండగా మరి ఎందుకు నీ సహోదరుని/ స్నేహితుని/ పొరుగువారిని/ తెలిసినవారిని/ తెలియని వారిని మోసం చేస్తావు? నిన్ను ఎవరూ దోచుకొనక పోయిననూ,మోసం చేయకపోయినా మోసం చేసే నీకు శ్రమ! నీవు దోచుకొనుట, మోసగించుట ముగించిన తర్వాత మోసగింపబడతావు అని బైబిల్ సెలవిస్తుంది.(యెషయా 33:1)

ఇక భార్యను కొట్టేవారు కొందరు. అనుమానించేవారు కొందరు. పురుషులారా! మీ భార్యలను ప్రేమించి పోషించమని వ్రాయబడిఉంటే (ఎఫెసీ 5: 23-30) భార్యని హింసిస్తావా? నీవు నీ భార్య ఎంత పవిత్రంగా, పతివ్రతగా ఉండాలని కోరుకొంటున్నావో ఆమె కూడా, నీవు కూడా అలాగే ఉండాలని కోరుకొంటుంది. మరి నీవు అలా ఉంటున్నావా? ఆమెకో రూలు! నీకో రూలా? భార్యమీద భర్తకి, భర్తమీద భార్యకి నమ్మకం ఉండాలి, అప్పుడే కుటుంబం నిలబడతాది. దానిని వమ్ము చేస్తే అది కాపురం కాదు వ్యభిచారం అవుతుంది.

మరికొందరు జూదాలు, రేస్ లు ఆడేవారున్నారు. ఇవన్నీ పాపాలే, చేయకూడని పనులే.
మరికొందరు ఆదివారంనాడు ముఖ్యమైన క్రికెట్ మాచ్ ఉంటే చర్చికి రారు. కొంతమంది పాటగాల్లు వచ్చినా పాటలు అయిపోయిన వెంటనే మాచ్ చూడటానికి పారిపోతారు. దేవుని కన్నా మీకు క్రికెట్ మ్యాచ్ ఎక్కువై పోయిందా మీకు? క్రికెట్ నీకు విగ్రహం గా మారిపోలేదా నీకు? మరికొంతమంది (స్త్రీలు ముఖ్యంగా) TV serials ఉంటే రాత్రిపూట సంఘంలో జరిగే ఆరాధనలకుగాని, ఉపవాస కూటాలకి గాని, గృహకూటములకి గాని రారు. లేదా సీరియల్స్ అయిపోయిన తరువాత వస్తారు. ఇదేనా నీ భక్తి? దేవునికిచ్చే స్థానం ఇదేనా? దేవునికన్నా దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహమే! ఒకవేళ దేవుడు రెండో రాకడలో వచ్చి పిలిస్తే మ్యాచ్ అయిపోయాక వస్తాను, సీరియల్ అయ్యాక వస్తాను అని చెబుతావా? బుద్ధిలేని కన్యకలవలే విడచిపెట్టబడతావ్ జాగ్రత్త! ఒకవేళ మరణదూత వచ్చి పిలిస్తే అవి చూసి వస్తాను అని చెప్పడం కుదురుతుందా? బలవంతంగా నీ ప్రాణాన్ని గుంజి, ఈడ్చుకొంటూ తీసుకొని పోతాడు.

నేటికాలంలో సినిమాలు చూడటం, సీరియల్స్ చూడటం తప్పని బోధించడం మానేసారు. సినిమా అబధ్ధమని, దానిలో మంచికన్నా చెడే ఎక్కువని తెలుసు, వాటిలో జారత్వం కాముకత్వం పెంచే సన్నివేశాలు ఎక్కువని తెలుసు. అయినా చూస్తావు. తప్పించుకొంటావా? వ్యభిచారుణులారా! ఈ లోకస్నేహం దేవునితో వైరమని తెలియదా? అని గ్రంథం సెలవిస్తుంది.(యాకోబు 4:4). పైకి భక్తి గలవాని వలె నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారిలా ఉంటున్నావు (2పేతురు 3:5). నీవు ప్రశస్తమైన దేవుని అమూల్యమైన రక్తంలో కడుగబడిన వాడవని మర్చిపోతున్నావు.

మరి ఇప్పుడు ఏం చెయ్యాలి?

ఇప్పడైననూ మీరు ఉపవాసముండి కన్నీరు విడచుచూ, దుఃఖించుచూ, మనఃపూర్వకముగా (మనస్పూర్తిగా) తిరిగి నాయొద్దకు రండి! ఇదే యెహోవా వాక్కు! (యోవేలు 2:12). ఇశ్రాయేలు! నీవు తిరిగి రానుధ్ధేశించిన యెడల నా దగ్గరకే రావలయును అంటున్నారు తండ్రి! నిజమైన పశ్చాత్తాపంతో కన్నీటితో యేసయ్య పాదాలు కడగాలి ఎందుకంటే మనం చేస్తున్న పాపాలు ఎక్కడ జమ అవుతున్నాయో తెలుసా? నీవు చేసే పాపాలు నీ రక్తము లో కలసి పోతున్నాయి. రక్తమే ప్రాణం, జీవము. మానవుని రక్తంలో 20% రక్తము, 80% నీరు ఉంటాయి. రక్తము మనిషిని బ్రతికిస్తుంటే, ఆ రక్తాన్ని ద్రవరూపంలో ఉంచి మన శరీరభాగాలుకు చేరడానికి నీరు సహాయ పడుతుంది. ఇప్పుడు నీ రక్తం పాపపంకిలమై పోయింది. పాపులెవరూ పరలోకము చేరలేరు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? కన్నీటితో యేసయ్య పాదాలను కడుగు, ఆ కన్నీరు యేసయ్య రక్తాన్ని నీ రక్తము లోకి ప్రవహింప జేసి నీ పాపాలు నీ కన్నీటిలో కొట్టుకుపోడానికి దోహదపడుతుంది. ఎందుకంటే యేసయ్య వచ్చినదే అందుకు. యేసు రక్తము ప్రతీ పాపము నుండి మనలను పవిత్రులనుగా జేయును.(1యోహాను 1:7; మత్తయి 1:2)
కాబట్టి ఇప్పుడే యేసయ్య పాదాలు పట్టుకో!

ఇంకొందరంటారు యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు అని వ్రాయబడింది కదా మేము తప్పిపోవడం సామాన్యమే. మేము భక్తిగా యదార్థంగా ఉండాలనుకొన్నా ఉండలేక పోతున్నాం అంటారు. నిజమే సహోదరుడా నీకు నీవుగా యదార్థంగా ఉండాలన్నా ఉండలేవు. నీకు తోడుగా వాక్యాన్ని తీసుకుని పోతున్నావా? దేవున్ని సహాయం చేయమని అడిగావా?

1. ఆత్మానుసారముగా నడచుకొనుడి, అప్పుడు మీరు శరీరాశలను నెరవేర్చరు (గలతీ 5:16)
2. నీ ఎదుట పాపము చేయకుండునట్లు నాహృదయంలో నీ వాక్యమునుంచుకొందును (కీర్తనలు 119:11) ఎప్పుడైతే వాక్యమును అనుదినం అనుక్షణం ధ్యానిస్తావో పాపం నీ దగ్గర నుండి పారిపోతుంది. పరిశుధ్ధాత్మ ను వేడుకో, నీకు సహాయం చేయమని, నడిపించమని, అప్పుడు నీ మార్గములను సరాళము.చేస్తారు.
ప్రియ దేవుని సంఘమా! ఒకసారి ఆలోచించు, సరిచేసుకో!

ప్రియ దైవసేవకుడా! దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాందించిన సంఘాన్ని కాయుటకు నిన్ను అధ్యక్షునిగా ఉంచారు ఆ సంఘాన్ని జాగ్రత్తగా చూడటం మీ భాధ్యత! ( అపొ 20:28)

సంఘం తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దాల్సిన భాద్యతను దేవుడు నీకు అప్పగించారు. ఖండించుము, గధ్ధించుము, బుద్ది చెప్పుము అని అధికారం ఇచ్చారు (2పేతురు 3:16-17; 4:1-3). వారిని సరిచేయకపోతే దేవుడు ఆ ఆత్మలకు నిన్ను ఉత్తరవాదిగా చేస్తారని మరచిపోకు.(యెహేజ్కేలు 3:16-21).
గాబట్టి మనందరం దేవుని చిత్రాన్ని నెరవేర్చడానికి సిద్దపడదాం! సరిదిద్దుకొందాం. యేసయ్యని బ్రతిమిలాడదాం.
ఆ పరలోకాన్ని పట్టుకొందాం!
అట్టి కృప మనందరికీ కలుగును గాక!
ఆమెన్!
మరణాత!

ప్రియ సహోదరి/ సహోదరులారా! మిమ్మల్ని విమర్శించాలని గాని, కించపరచాలని గాని, మీమీద కోపం తో గాని ఈ విషయాలు వ్రాయలేదు గానీ నేటి యువతను, సంఘాలను, అన్యాచారాలను చూసి హృదయభారంతో కన్నీటితో, పరిశుధ్ధాత్ముని ప్రేరేపణతో వ్రాయడం జరిగింది. మిమ్మల్ని నొప్పించియుంటే క్షమించండి గాని మీరంతా పరలోకం చేరాలని నా ఆశ.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

యూదా 1: 24
తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,

Jude 1: 24
Now unto him that is able to keep you from falling, and to present you faultless before the presence of his glory with exceeding joy,


యూదా 1: 25
మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక. ఆమేన్.

Jude 1: 25
To the only wise God our Saviour, be glory and majesty, dominion and power, both now and ever. Amen.

సమాప్తం

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరీర కార్యములు

క్రిస్మస్

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

విశ్వాసము

పాపము

సమరయ స్త్రీ

విగ్రహారాధన