రక్తస్రావ స్త్రీ
రక్తస్రావ స్త్రీ –మొదటి భాగం
దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియదైవజనమా! పండ్రెండేండ్ల రక్తస్రావ స్త్రీ కోసం ద్యానిస్తూ మిమ్మల్ని మరోసారి కలసుకోవడం ఆనందంగా ఉంది. యేసుప్రభులవారు చేసిన అద్భుతాలు సువార్తలలో వ్రాయబడ్డాయి కదా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ మూడింటిలో కూడా వ్రాయబడిన అద్భుతాలు కొన్ని మాత్రమే! వాటిలో ఒకటి పండ్రెండేండ్ల నుండి రక్తస్రావ రోగముతో- తద్వారా రక్తలేమి (ఎనిమియా) వ్యాధిచే బాధపడుచున్న ఒక స్త్రీ, తన ఆస్తినంతా తన వ్యాది బాగుచేయించుకోడానికి ఖర్చుచేసినా బాగుపడక, వైద్యులవల్ల నయం కాక, నిరాశలో ఉండగా, యేసయ్య గురించి విని, ఆయన వస్త్రము మాత్రము ముట్టిన యెడల బాగుపడతానని విశ్వసించి, ముట్టి, సంపూర్ణ స్వస్తత పొందినట్టు చూస్తాం! ఈ స్వస్తత ద్వారా మనం కొన్ని ఆత్మీయ విషయాలు తెలుసుకోవచ్చు.
ఆమె కోసం మత్తయి 9:20-23; మార్కు 5: 25-34; లూకా 8: 43-48 లో వ్రాయబడి ఉంది. మూడు సువార్తలలోనూ దీనిని ప్రస్తావించారు అంటే ఇది ఖచ్చితమైన సంఘటన! ఆమె పేరు మూడు సువార్తలలోనూ వ్రాయబడలేదు! అయితే ఆమె పేరు తెలుసుకోవడానికి కొంచెం చరిత్రను తెలుసుకోవాలి. బైబిల్ లో ఆమె పేరు లేదు. ఇక్కడ ఆమెపేరు కోసం చరిత్ర చెప్పడం- నాకు చరిత్ర తెలుసు అని చెప్పడం ఎంతమాత్రం కాదు. ఆమె ఎంత ఆస్తిగలదో, ఎంత కష్టపడిందో, ఆమె స్తితిగతులు చెప్పడానికి మాత్రం చరిత్రను గుర్తుచేస్తున్నాను. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఆమె పేరు Fasielis. ఫసిఏలిస్.
హేరోదు-1 లేదా హేరోదు అంతిపత్రి(Herod Antipater)(BC 73- AD.4) ఇశ్రాయేలు ప్రాంతాన్ని పాలిస్తూ, పదవీ బ్రష్టుడై, అతికష్టం మీద రెండవసారి అధికారం సంపాందించుకొని, తద్వారా ఏర్పడిన తిరుగుబాటు, అశాంతిని పోగొట్టడానికి యూదా మతాన్ని అవలంభించి, యూదురాలిని పెళ్లి చేసుకొని, యేరూశాలెం దేవాలయం కట్టినట్టు చూస్తాం. ఇది కేవలం అధికారం కోసం ఆడిన డ్రామా! యేసు ప్రభులవారిని బాల్యంలో చంపాలని ప్రయత్నించినది ఇతడే! ఇతనికి ముగ్గురు కుమారులు. హేరోదు అంతిఫస్, ఫిలిప్. రెండవ వాడు హేరోదు అంతిఫస్ (BC 20- AD 39)(Reign 4 BC- 39 AD). ఇతడు గలలియ ప్రాంతానికి గవర్నర్ అవుతాడు. ఇతనికి గల మరో పేర్లు హేరోదు రాజు, చతుర్దాదిపతియైన హేరోదు. ఇతనికి ఇద్దరు భార్యలు . పెద్ద బార్యపేరుFasielis. ఫసిఏలిస్. ఈమె అరెతాస్ -4 రాజుగారి కుమార్తె. హేరోదు అంతిఫస్ కూడా తన తండ్రిలాగే యూదులను సంతోషపెట్టడానికి డ్రామాలాడాడు గాని గొప్ప హంతకుడు. అందుకే తన మొదటి భార్య అన్యురాలు కాబట్టి ఆమెకు విడాకులిచ్చాడు! ఆమెకు విడాకులివ్వడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే తన వివాహమైన పిదప కొంతకాలానికి ఆమెకు రక్తస్రావ (ఋతుస్రావ) వ్యాది వచ్చి ఎంత ప్రయత్నించినా వ్యాది తగ్గకపోతే ఆమెను వదిలించుకోడానికి, అన్యురాలు అని చెప్పి విడాకులు ఇచ్చాడు. అంతేకాకుండా ఆమెకు స్రావ రోగం కాబట్టి స్రావము గలవారు ప్రత్యేకముగా ఉండాలి(లేవీ 15వ అధ్యాయం) కాబట్టి ఆమెను వదిలేస్తున్నాను అన్నాడు. అదే సమయంలో తన తమ్ముడు బార్యతో అక్రమ సంభందం పెట్టుకొని, తర్వాత ఆమెను ఉంచుకొన్నాడు! ఇది ఖండించినందుకే భాప్తిస్మమిచ్చు యోహాను గారిని మొదట జైలులో పెట్టి తర్వాత శిరచ్చేధనం చేశాడు. యేసుప్రభుల వారి మరణ తీర్పు సమయంలో, ఇంకా శిష్యుడైన యాకోబు గారిని శిరచ్చేధనం చేసినది కూడా ఇతగాడే! ఇతని బార్యయే రక్తస్రావపు స్త్రీ అని బైబిల్ పండితుల అభిప్రాయం!
మరికొంతమంది ఆమె పేరు వెరోనిక, ఆమె కైసరియ ఫిలిప్పు ప్రాంతానికి చెందిన ధనిక స్త్రీ అని అభిప్రాయపడతారు.
సరే! ఏది ఏమైనా ధనికురాలు కాబట్టి ఆమె యూదయ గలలియ సమరయ ప్రాంతాలలో ఉన్న వైద్యులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది.ఎందుకంటే ఆరోజుల్లో ఈవ్యాదికి మందు లేదు. కుదరని వ్యాది. ఈమె డబ్బంతా వైద్యులకే ఖర్చుపెట్టింది గాని వ్యాది నయం కాలేదు. చివరకు యేసయ్య మాటలో శక్తి, యేసయ్య తాకిడిలో శక్తి ఉంది అని విన్నాది. వెంటనే విశ్వశించి ఆయన వస్త్రపుచెంగును ముట్టిన బాగుపడతానని అనుకొని, ఆయన వస్త్రాన్ని తాకింది, స్వస్తత పొందింది.
నేడు నీవుకూడా ప్రియ చదువరీ! అలాంటి వ్యాదితో, దీర్ఘకాలిక వ్యాదితో భాదపడుచూ, మందు కనుగోనలేని జబ్బుతో యాతనపడుచూ నాకు స్వస్తత లేదే అని బాధపడుచున్నావా? నాకు నిరీక్షణ లేదు, ఈవ్యాధితో నేను చావాల్సిందేనా అని భాదపడుచున్నావా? నీ జీవిత వ్యధలందు ఏసే జవాబు!!!
యేసయ్య బాగు చేయలేని రోగం గాని, యేసయ్య పరిష్కరించలేని సమస్య గాని లేదు!!!
నేడే ఆయన యొద్దకు రా! ఆయన నిన్ను ముట్టడానికి, నిన్ను హక్కున చేర్చుకోడానికి ఇష్టపడుతున్నారు!
దేవుడు నిన్ను దీవించును గాక!!!
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
రక్తస్రావ స్త్రీ –రెండవ భాగం
ప్రియులారా! గత భాగంలో చెప్పుకోన్నట్లు మత్తయి, మార్కు, లూకా సువార్తలలో ఈ స్త్రీ సంఘటన వ్రాయబడి ఉంది. అయితే మార్కు సువార్తికుడు మిగతా ఇద్దరికంటే వివరముగా వ్రాసియున్నాడు కనుక మనం మార్కు సువార్తనుండి దీనిని ధ్యానిద్దాం!
మార్కు సువార్త 5:25-34 వరకు చూస్తే మూడు సువార్తల ప్రకారం యేసుప్రభులవారు రాజ్యసువార్త ప్రకటించుటకై యూదయ, సమరయ, గలలియ ప్రాంతాలను సంచరిస్తూ మార్గమధ్యంలో గలలియ సముద్ర తూర్పు తీరముననున్న గేరాసేనీయుల/గదరేనీయుల ప్రదేశం వస్తారు. అక్కడ సేన దయ్యాలు పట్టిన వానిని స్వస్తపరిస్తే, ఆ ప్రాంతం వారు యేసయ్యను మాంత్రికుడని తలంచి, భయపడి తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపొమ్మని వేడుకొంటారు. అప్పుడు ఆయన గలలియ తీరం పశ్చిమప్రాంతానికి వస్తారు. అప్పుడు ఆ ప్రాంతపు అధికారి యాయీరు తన కుమార్తె చావసిద్దంగా ఉంది దయచేసి తనతో వచ్చి, తన కుమార్తెను బాగుచెయ్యమని బ్రతిమిలాడితే, యేసయ్య తనతో పాటు ఆ ప్రాంతానికి వెళ్ళుచుండగా- మార్గమధ్యంలో ఈ రక్తస్రావపు స్త్రీ తారసపడింది. అప్పుడు జరిగిన సంఘటన ఇది.
అయితే చరిత్ర ప్రకారం ఆమె చాలా తిప్పలు పడుతూ తిరుగుతూ ఉంటే, ప్రజలు ఆమెను అసహ్యపడుతూ వస్తారు. అందుకు ఆమె ఊరూరా తిరుగుతూ తలదాచుకొనేది. ఈ విషయం మిగతా వారికి తెలియదుగానీ ఆమె హృదయ భారం తెలిసిన సృష్టికర్తకు తెలుసు. అందుకె యేసుప్రభులవారు అదే మార్గంలో నడుచుకుంటూ వస్తున్నారు. యేసయ్యకు మన అందరి హృదయాలు తెలుసు. కాబట్టి ప్రియదైవజనమా సోమ్మసిల్లు పోకు!
ఇక్కడ ఫసిఏలిస్ (రక్తస్రావపు స్త్రీ) యొక్క వయస్సు మనకు తెలియదు గాని, ఆమె వ్యాదియొక్క వయస్సు 12 సం.లు. నిజంగా ఇది చాలా భయంకరమైన అనుభవం. సాధారణంగా ఇంట్లో స్త్రీలు 3 లేదా 4 రోజులకె ఎంతో ఇబ్బందులు పడటం మనం చూస్తాం! అట్లాంటిది ఆమె 12 సం.లు ఎంత నరకం అనుభవించిందోకదా! ఆ భాద పడిన ఆస్త్రీకే తెలుసు! మార్కు 5:25,26 ప్రకారం ఆమె చాలా వైద్యులను సంప్రదించింది. అనేక దేశాలు తిరిగింది స్వస్తతకోసం. అయితే యేసయ్య కాలంలో అది నయం కాని రోగం. మందులేని రోగం. చూసి చూసి అట్లాంటివారిని భయటకు పంపించేసే వారు. ఈమె కూడా అదే స్తితిలో ఉంది. ఇదే వచనంలో వ్రాయబడిఉంది. వైద్యులను సంప్రదించాక ఎంతమాత్రము ప్రయోజనములేక మరింత సంకట పడెను. అనగా రోగం మరీ ఎక్కువైపోయింది. పోలీసుల రికార్డుల ప్రకారంప్రపంచంలో స్త్రీలు చేసిన హత్యలలో 80% హత్యలు ఈ ఋతుస్రావ సమయంలో గాని, అవి వచ్చేముందు రోజులలో గాని జరిగినవే! అంటే ఆ సమయంలో చాలా ఎమోషనల్ గా, మానసిక ఒత్తిడి పాలవుతారు. ఎక్కడలేని కోపం, చిరాకు, ద్వేషం, అసహనం పెరిగి పిల్లలను కొడుతూ ఉంటారు. కసురుకొంటారు. ఈమె కూడా ఎంత ఒత్తిడికి గురై ఉంటుందో ఏమో! ఆత్మహత్యకు కూడా ప్రయత్నించి ఉండొచ్చు, గాని దేవుని భయం వలన , దేవునిమీద నమ్మకం వలన చేసి ఉండకపోవచ్చు!
27 వచనం- ఆమె యేసుని గూర్చి విని—నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడేదననుకొని, వచ్చి, ముట్టి, స్వస్తత పొందింది.
వినుటవలన విశ్వాసము కలుగును. వినుట దేవుని వాక్యము వలన కలుగును. ఎప్పుడైతే యేసయ్య స్వస్తత శక్తి, ఆయన ప్రేమ గురించి విన్నాదో, విశ్వసించి వచ్చి ముట్టి స్వస్తత పొందింది.
నేడు నిరాశ, నిస్పృహలతో బాధపడుచున్న ప్రియ దేవుని బిడ్డా! కృంగిపోకు! యేసయ్య నిన్ను స్వస్తపరచగలరు. నీ సమస్య పరిష్కరించగలరు. ఆ స్త్రీ విశ్వసించినట్లు నీవు కూడా దేవునిపై విశ్వాసం ఉంచు. స్వస్తత పొందుకో!!!
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
రక్తస్రావ స్త్రీ –మూడవ భాగం
27వచనం: ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని . . .
ఈ వచనంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు.
1.యేసుని గూర్చి విని. . .: ఈమె ఇంత దౌర్భాగ్యమైన స్తితిలో ఉన్నా సరే, అందరూ తనను అసహ్యించుకుంటున్నా సరే, కొంతమంది ఆమెకు యేసయ్య ప్రేమ గురించి, ఆయన శక్తిని గురించి చెప్పారు. తద్వారా ఆమె వినుట వల్ల విశ్వాసం కలిగింది. అది ఆమె స్వస్తతకు, అనేకుల నిరీక్షణకు కారణమయ్యింది. ప్రియ విశ్వాసీ! దేవుడు నీకు చేసిన ఉపకారాలు, పదిమందికి , పొరుగువారికి చెబుతున్నావా? వారు ప్రకటించకపోతే ఎట్లు విందురు? వినకపోతే ఎలా విశ్వాసం ఉంచుతారు? గాబట్టి ఆ భాద్యత నీ మీద లేదా? ఇదే అధ్యాయంలో 19వచనంలో సేన దయ్యాలను పోగొట్టిన తర్వాత యేసుప్రభులవారు వానితో ఏమన్నారో చూడండి: నీ ఇంటివారి యొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకుచేసిన కార్యములన్నిటిని, వారికి చెప్పుమనేను. అందుకు ఆ వ్యక్తి ప్రకటించాడు. సాక్ష్యం చెప్పాడు. అందుకే 6:53-56 వచనాలు చూసుకొంటే, ఆవ్యక్తీ చేసిన సువార్తకు ఆ ప్రాంతం వారు యేసయ్యను గుర్తుపట్టి, ఆయనను చేర్చుకొనిరి. ఎవ్వరైతే మాప్రాంతం వదలిపోమ్మన్నారో వారే ఉండమని ఆహ్వానించారు. ఆయనను చేర్చుకొన్నారు. తద్వారా ఆ ప్రాంతమంతా రక్షింపబడింది ఆ వ్యక్తీ చెప్పిన సాక్ష్యానికి. మరి నీవు కూడా సాక్ష్యం చెబుతున్నావా? లేదా?
2. నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన ముట్టిన బాగుపడేదననుకొని ... ఎంతగొప్ప విశ్వాసం ఆమెది. ఇలాంటి విశ్వాసం గలవారు మరొకరు ఉన్నారు, ఆయనే శతాధిపతి, యేసయ్య స్వయముగా ఇశ్రాయెలీయులలో సహితము ఇంత విశ్వాసం గలవానిని చూడలేదు అన్నారు. ఈమె కూడా అంతవిశ్వాసం కనపరిచింది. వస్త్రాన్ని తాకుతాను అని అనుకోడానికి రెండు కారణాలు ఉండొచ్చు.
a. యేసయ్య తనను స్వస్త పరచ గలరని పరిపూర్ణ విశ్వాసం ఉంచింది. విశ్వాసం అనునది నిరీక్షించబడువాటి నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం విశ్వాస వీరుల పట్టిక చూడొచ్చు. వారు విశ్వసించి ఎన్ని గొప్ప కార్యాలు చేశారో మనం చూడగలము. విశ్వాసం ఉంచినప్పుడు అది జరుగుతుంది అని నమ్మాలి. సందేహపడే వారికి ఏమీ దొరకదు అని గ్రంధం సెలవిస్తుంది. కావున ఆయనమీద పరిపూర్ణ విశ్వాసం ఉంచాలి. అప్పుడే నీవు ఏమైనా పొందగలవు.
b. ఈమె వస్త్రపు చెంగు ముడతానని అనుకోవడానికి మరో కారణం: ఆమెకున్న వ్యాది అందరితోను చెప్పుకోలేనిది. 24వచనం ప్రకారం బహుజనసమూహము ఆయనను వెంబడించినట్లు చూడగలం. కాబట్టి ఇంతమంది ముందుకొచ్చి, ఆమె తన వ్యాది గురించి చెప్పి, బాగు చెయ్యమని ఎలా అడుగగలదు? సిగ్గుపడి ఉండొచ్చు!
అంతమందిని ముట్టుకొని వచ్చింది కాబట్టి, ప్రజలు తనను కొట్టవచ్చు అని భయపడి ఉండొచ్చు. (ఆ రోజులలో స్రావము గలవానిని ఎవరు ముట్టుకున్న, తను ఎవరిని ముట్టినా వారు సాయంత్రం వరకు అపవిత్రులవుతారు. లేవీ 15వ అధ్యాయం).
అందుకే ఆమె ఆయన వస్త్రము మాత్రం ముట్టిన బాగుపడతానని విశ్వసించి, నమ్మి, ముట్టి, స్వస్తత పొందింది.
ఈరోజు నీకు కలిగిన రోగం ఎవరికీ చెప్పుకోలేనిది కావచ్చు! అది మందులేనిది కావచ్చు. నీ కుటుంభ సమస్య ఎవరికీ చెప్పుకోలేనిది కావచ్చు! మన సమస్యను పరిష్కరించేవారు ఎవరూ లేకపోవచ్చు! సమస్యను విని పరిహసించేవారు ఉండొచ్చు! అయితే ఒకాయన ఉన్నారు! ఆయన ఏ సమస్యనైనా, ఎట్టి వ్యాదినైనా బాగుచేయగలరు! ఆయన వైద్యులకు వైద్యుడు! పరమ వైద్యుడు!!! ఆయన యేసుప్రభులవారు!! ఆయనపొందిన గాయముల ద్వారా, ఆయన కార్చిన రక్తముద్వారా సంపూర్ణ స్వస్తత, నీ పాపములకు విడుదల, క్షమాపణ ఉంది.
నేడే రక్తస్రావపు స్త్రీ వచ్చినట్లు ఆయనవద్దకు రా!
ఆయన నిన్ను తన హక్కున చేర్చుకోడానికి ఇష్టపడుతున్నారు!
దేవుడు మిమ్మను దీవించును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
రక్తస్రావ స్త్రీ –నాల్గవ భాగం
మార్కు 5: 28,29
ఆమె పరిస్తితి గూర్చి మనం గతభాగంలో తెలుసుకొన్నాం కదా! అందుకే ఆమె వెనుకనుండి, జనసమూహాన్ని తప్పించుకొని, యేసయ్య వస్త్రపు చెంగును విశ్వాసంతో ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టింది/ఆగిపోయింది. తన వ్యాది, బాధ నివారణ అయ్యిందని నిర్దారణ చేసుకున్నది.
ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరచే దేవుడు ఆయన! తనయొద్దకు వచ్చు వారిని ఆయన ఎంతమాత్రమును త్రోసివేయడు!! తనకు మొర్రపెట్టువారికి, తనకు నిజముగా మొర్రపెట్టువారికి సమీపముగా ఉన్నారు. ఈ బిడ్డ 12 సం.లుగా చేస్తున్న ఆర్తనాదం ఆయన విన్నారు. ఆమె స్వస్తతకు కారణమయ్యారు! నేడు దేవుడు నిన్ను కూడా తాకబోతున్నారు! స్వస్తపరచబోతున్నారు! ఆమెన్!
30వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం కనబడుతుంది. ఈ స్త్రీ తనను ముట్టినవెంటనే ప్రభావం తననుండి బయటికి వెళ్ళినట్లు యేసయ్య గుర్తించారు. యేసయ్యకు సమస్తము తెలుసు. తన ప్రభావం గురించి తెలుసు. సువార్తలలో చూసుకొంటే ఆయనలోనుండి ప్రభావము బయలుదేరి అనేకులను స్వస్తాపరచెను అని వ్రాయబడింది. కాబట్టి ఆయనను ముట్టవలేనని ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. లూకా 6:19. యేసయ్య లో అంత శక్తి ఉంది.
అయితే యేసుప్రభులవారు వెనుకకు తిరిగి నన్ను ముట్టినది ఎవరూ అని అడిగారు. అయితే 31వచనంలో శిష్యులు(లూకా సువార్త ప్రకారం పేతురు గారు) అయ్యా! ఇంతమంది మీమీద పడుచున్నారు కదా! ఎవరు నన్ను ముట్టారు అని అడిగుతారేమిటి? అని అడిగినట్లు చూస్తాం. అయితే యేసయ్య అలా ఎందుకు అడిగారు? ఆయనకు తెలియదా? దానికి జవాబు 32వచనంలో ఉంది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన అలా అన్నారు.
ఇందులో మర్మమేమిటంటే: స్వస్తత పొందాక తప్పకుండా సాక్ష్యం చెప్పాలి!! చెప్పకుండా తప్పించుకు పోదామని అనుకొంది ఈ స్త్రీ! అయితే యేసయ్య పోనివ్వలేదు.33కాచనం ప్రకారం ఆస్త్రీ తనకి జరిగినది ఎరిగి, వణకుచూ వచ్చి, సాగిలపడి, తనసంగతి తెలియచేప్పెను. చూసారా ఆయన ప్రభావానికి భయపడి, ఒకరాజుగారి భార్య, ఒకరాజు కుమార్తె భయపడి, వణకుచూ వచ్చి సాగిలపడింది. దేవుని ప్రభావం ముందు అందరూ సాగిలపడాల్సిందే!!! నేటి దినాల్లో క్రైస్తవులకు భక్తి ఉంది గాని భయం లేకుండా పోయింది. అందుకే దేవుడు వారిని దీవించలేక పోతున్నారు!! ఈమె సాగిలపడింది. అందరి ముందు సాక్ష్యం చెప్పింది.
వెంటనే యేసయ్య! కుమారీ! నీ విశ్వాసము గొప్పది, సమాధానము గలదానివై పొమ్ము! అని చెప్పారు! ఇక్కడ రెండు విషయాలు మనకు అర్ధం అవుతాయి.
1.నేను నిన్ను స్వస్తపరిచాను అని అనలేదు యేసుప్రభులవారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్తపరచింది అని అన్నారు. అవును ! నీ విశ్వాసానికి అంత శక్తి కలదు, అటువంటి విశ్వాసం నీవుకూడా పొందుకోవాలి!!
2. యేసయ్య ఆమెను ప్రత్యక్ష పరచడానికి కారణం: ఇంతవరకు ఆమెకు సమాధానం లేదు, శాంతి లేదు. వేదనతో నిండియుంది. ఆమె అలా వెళ్ళిపోతే కేవలం స్వస్తత మాత్రం పొందుకొంతుంది తప్ప శాంతి కలుగదు. అది ఇవ్వడానికే ఆమెను ప్రత్యక్షపరచి, కుమారీ! నీ విశ్వాసమే నిన్ను స్వస్తపరచింది అని చెప్పి, సమాధానము గలదానివై పొమ్ము అని దీవించారు!!! ఆయన ఎంత దయగలవారు?!!! ఆయన అంటున్నారు: శాంతిని మీకిచ్చుచున్నాను. నా శాంతిని మీకిచ్చుచున్నాను! లోకము అనుగ్రహించినట్లు కాదు.
అటువంటి నిజమైన శాంతి, సమాధానం మీకు కావాలా? అయితే అది యేసయ్య వద్ద మాత్రమె నిజమైన శాంతి దొరుకుతుంది.
ఆ యేసయ్యను నీ స్వంత రక్షకునిగా అంగీకరించు. నీ హృదయపు ద్వారము తెరచి ఆయనను ఆహ్వానించు. ఆయన నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుచున్నారు.
నిన్ను స్వస్తపరచాలని, నీకు పరలోకం ఇవ్వాలని ఆశిస్తున్నారు.
వస్తావా? నేడే రా!
దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్!
దైవాశీస్సులు!
(సమాప్తం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి