పేదలాజరు
పేదలాజరు- మొదటి భాగం
ఉపోద్ఘాతందేవునికి స్తోత్రం. ప్రియదైవజనమా! ఈసారి పేదలాజరు కోసం ధ్యానిస్తూ మిమ్మల్ని కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవునికి వందనాలు.
*ఉపోద్ఘాతము*: బైబిల్ గ్రంధం పరిశుద్ధాత్మ ప్రేరణతో 40మంది ద్వారా వ్రాయబడింది. దీనిలో 39మంది యూదులే! అయితే మరో వ్యక్తి రాసిన రెండుపుస్తకాలు కూడా బైబిల్ గ్రంధంలో చేర్చబడ్డాయి. అయితే ఆయన యూదుడు కాదు, ప్రవక్తా? కాదు. ధర్మశాస్త్ర ఉపదేశకుడా? కానేకాదు! కాపరి అంతకంటే కాదు. అయినా సరే ఆయనద్వారా పరిశుద్దాత్ముడు రెండు గ్రంధాలు వ్రాయించారు.
ఆయన ఒక వైద్యుడు!! అపోస్తలుడైన పౌలు గారి మిషనరీ యాత్రలలో మార్పునొంది, ఆయన టీం లో ఒక సభ్యునిగా ఉంటూ అపోస్తలుల అనుదిన కార్యములు ముద్రిస్తూ(డైరీ వ్రాస్తూ) ఉండేవారు. *యేసు ప్రభులవారి కోసం ఖచ్చితమైన వివరాలు వ్రాయాలని నిర్ణయించుకొని, ఆయన జనన మరణం కోసం తెలుసుకోవాలని ఆయన తల్లియైన మరియమ్మతో కొంతకాలం గడిపి, అపోస్తులలతో గడిపి, ఇంటర్యూ చేస్తూ, యేసయ్య చేసిన అద్భుతాలు ఎక్కడెక్కడ చేశారో, ఆప్రాంతం వెళ్లి వారిని కలుసుకొని, ఇంటర్యూ చేసి ఖచ్చితమైన వివరాలు చరిత్ర ఆధారంగా వ్రాసారు ఆయన*. దీనికోసం చాలా కష్టపడ్డారు. ఆయన *వైద్యుడైన లూకా*!!
మొదటిపుస్తకంలో యేసయ్య ఎవరు? ఆయన దైవత్వం, పేదలను ప్రేమించే విధానాన్ని చరిత్ర ఆధారంగా తనపేరు మీదుగా లూకా సువార్తగా పరిచయం చేస్తే, రెండవ పుస్తకంలో పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన కార్యాలు ఏమిటి అని పరిచయం చేశారు. కాబట్టి ఆయన రాసిన రెండు పుస్తకాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి కట్టుకదలు కాదు!
లూకా సువార్త- సువార్తలలో చాలా ముఖ్యమైనది. దీనులను యేసయ్య ఎంతగా ప్రేమించారో చాలా బాగా వివరించారు. ఉదా: గొల్లలకు దూతలు సువార్త చెప్పడం, చివరకు గొల్లలు ప్రజలకు యేసయ్య పుట్టాడని సాక్ష్యం చెప్పడం! మొదట సువార్తికులు గొల్లలే అని లోకానికి చాటిచెప్పారు. ఇంకా ధనవంతులు- పేదలు కోసం చాలా బాగా వివరించారు.
ఇక మనకధకు వస్తే: పేదలాజరు కోసం లూకా సువార్త 16:19-31 వరకు వ్రాయబడి ఉంది. ఇందులో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఈ ఉపమానంలో. *ఈ ఉపమానం ప్రతీ వ్యక్తికీ వర్తిస్తుంది. తాను క్రైస్తవుడైనా, హైందవుడైనా, మరెవరైనా సరే! ఇది కేవలం పేదలకోసమో లేక ధనవంతులకోసమో కాకుండా అందరికి వర్తిస్తుంది*. దీనినే మనం కొన్ని రోజులు ధ్యానం చేయబోతున్నాం.
1. ఇది ఉపమానం మాత్రమే. నిజంగా జరగలేదు. అలాగని వదిలెయ్యడానికి వీలు లేదు. కాబట్టి చరిత్ర వ్రాయడానికి ఏమిలేదు. అయితే దేవుడు పేదలను, దీనులను ఎంతగా ప్రేమిస్తున్నారో వ్రాయబడి ఉంది.
2. ఇక యేసయ్య లాజరు పేరునే ఎందుకు ఉపయోగించుకొన్నారు అని ఆలోచిద్దాం!
మొదటగా లాజరు అనే పేరు ఎలియాజరు అనే పేరునుండి వచ్చింది. ఎలియాజరు అంటే దేవుడే సహాయము, Whom God Helps, దేవుడు సహాయం చేసే వ్యక్తి-అని అర్ధము.
విశ్వాసులకు తండ్రియైన అబ్రహాముగారు విశ్వసించిన ఏకైక వ్యక్తి- ఎలియాజరు. అనగా ఈ ఉపమానం యూదులకోసం చెప్పబడింది.
యేసు ప్రభుల వారు ఈలోకంలో జీవించినప్పుడు ఆయనకు దగ్గరైన వ్యక్తులు చాల తక్కువ. ఆయనంటే ప్రజలకు భయంతో కూడిన భక్తి- అందువల్ల ఆయనకు దగ్గర కాలేక పోయారు. మరి ఆయనకు దగ్గరైన వ్యక్తులు
1) *యోహాను*: ఆయన రొమ్మున ఆనుకొనే వ్యక్తి.
2) *పేతురు*: అయితే పేతురుగారు యేసయ్యను మెస్సయ్యగా భావిస్తూ తన పరిధులలో తను ఉండేవాడు తప్ప దగ్గర కాలేదు.
3) *మగ్ధలేనే మరియ*: ఏడుదయ్యాలు యేసయ్య వదిలించిన తర్వాత మరణం వరకు నమ్మకముగా జీవించింది. ఎప్పుడూ యేసయ్య పాదాల దగ్గరే ఉండి పరిచర్య చేసేది. శిష్యులమీద అధికారం చేసేది. అందుకే శిష్యులకు మగ్ధలేనే మరియ అంటే ఇష్టముండేది కాదు అని చరిత్ర చెబుతుంది.
4) *లాజరు*: బేతనియకు చెందిన మరియ మార్తల యొక్క సోదరుడు. యేసయ్య స్వయముగా మన స్నేహితుడైన లాజరు అన్నారు. లాజరు చనిపోతే మరియ మార్తలతో పాటు కన్నీరు విడిచారు. ఒకే ఈడువారు. యేసయ్యకు మంచి స్నేహుతుడు. పేదవాడు.
*బహుశా ఈ పైనుదహరించిన కారణాల వలన యేసుప్రభులవారు తన ఉపమానంలో లాజరు పేరును ఉపయోగించి ఉండొచ్చు*. నిజముగా బేతనియ లాజరుకి దేవుడు సహాయం చేసి చనిపోయినా సరే తిరిగి బ్రతికించారు.
యేసుప్రభులవారు కేవలం లాజరుకు మాత్రమే కాదు. ఎవరికైనా సరే సహాయం చేసే దేవుడు. తనకు మొర్ర పెట్టువారికి, తనకు నిజముగా మొర్రపెట్టువారికి ఆయన ఎప్పుడూ సహాయం చేసే దేవుడు. ఈరోజు నీకు కూడా సహాయం చెయ్యడానికి ఆయన సిద్దముగా ఉన్నారు. ఆయన దగ్గరకు నేడే రా!
దైవాశీస్సులు!!!
(సశేషం)
పేదలాజరు- రెండవ భాగం
ఉపోద్ఘాతం-2మనం పేదలాజరు యొక్క ఉపోద్ఘాతములో ఉన్నాము.
3) ఈ ఉపమానంలో ఉన్న అతిప్రాముఖ్యమైన విషయం: *మరణానికి ముందు-మరణానికి తర్వాత జీవితం* ఏమిటో తెలియజేస్తుంది. మనిషి జీవితానికి చావు చివరి మజిలీ కాదని, చావు తర్వాత జీవితం ఉందని,ఖచ్చితంగా నొక్కి వక్కానిస్తుంది. అంతే కాకుండా చావు తర్వాత రెండు గమ్యాలు ఉన్నాయని, నీతిగా భక్తిగా జీవిస్తే పరలోకంలో తండ్రితో ఉంటారని, తనకు ఇష్టమొచ్చినట్లు జీవిస్తే నరకం అని, అది భయంకరమైనదని దేవుడే ముందే మానవులందరికీ చెప్పడానికి ఈ వర్తమానం చెప్పారు. కాబట్టి ఇది కట్టుకధ కానేకాదు.
బైబిల్ గ్రంధంలో నరకం కోసం 162 సార్లు వ్రాయబడి ఉంది. దానిలో యేసుప్రభులవారి నోటినుండి నరకం కోసం 73 సార్లు నరకం/పాతాళం అని వచ్చింది. నరకం అనేది ఉంది అని, అది అత్యంత భయంకరమైనది అని తెలియజేయడానికి యేసయ్య ఎంతో ప్రయత్నించారు. అందుకే అన్నిసార్లు చెప్పారు. ఈ ఉపమానంలో నరకం కోసం చాలా స్పష్టముగా చెప్పారు. నరకం అనేది సాతానుకి వాని దూతలకోసమే చేయబడింది గాని (మత్తయి 25:4) మానవులకోసం కాదు, అక్కడికి నరులారా మీరు వెళ్లొద్దు అని చెప్పడానికి ప్రయత్నించారు. కాబట్టి నరకానికి/పాతాళానికి పోకుండా, పరలోకానికి పోయే మార్గాలను తానే స్వయముగా బోదించి , స్వర్గానికి మార్గం తానై అయ్యారు యేసయ్య. అదే చెప్పారు యేసయ్య: నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము- నాద్వారానే తప్ప ఎవడును తండ్రి(పరలోకం) చేరలేడని అని చాటి చెప్పారు.
4) ముందు చెప్పినట్లుగా ఇది ఉపమానం మాతమే! అలాగని కట్టుకధ కాదు.ఇది చరిత్ర కాదు. గాని నిజమైనది. ఎందుకంటే
1.చెప్పింది యేసయ్య కాబట్టి.
2. ఆయన అబద్దికుడు కాదు కాబట్టి.
నరకం ఎలా ఉంటుంది ఎవరు చూశారు అనొచ్చు.
3. నరకాన్ని చేసింది ఆయనే కాబట్టి, పరలోకంలో ఉండేది, పరలోకం నుండి వచ్చింది ఆయనే కాబట్టి. చూసింది ఆయనే కాబట్టి ఉన్నది ఉన్నట్లు చెప్పారు ఆయన.
4. పరలోకం ఉంది అనేది ఎంత సత్యమో, నరకం ఉన్నది అనేది కూడా అంతే సత్యము అని ప్రజలు తెలుసుకోవాలని ఆయన తాపత్రయ పడ్డారు.
ఒకవేళ ఇది ఉపమానం మాత్రమే అని వదిలేస్తే నీకు కలిగేది నరకం మాత్రమే! నాశనం మాత్రమే! ఈ ఉపమానంలో యేసయ్య పరలోకం కోసం చెప్పలేదు గాని నరకం కోసమే చెప్పారు. అది ఎంత భయంకరమో, ఎంత బాధో వివరించారు. అక్కడకు మనం వెళ్లకూడదని భావించి ముందుగానే హెచ్చరించారు. నశించినదాని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈలోకమునకు వచ్చెను.
అయితే నరకానికి వెళ్తే అక్కడ ఎంతకాలం ఉంటాము అనే ప్రశ్న రావచ్చు!!
నరకం గాని, పరలోకం గాని అనంతం. యుగయుగాలు ఉండాల్సిందే!!
నరకంలో అగ్ని గంధకాలతో బాదపడాల్సిందే!
అగ్ని ఆరదు, పురుగు(ఆత్మ) చావదు! అని మార్కు 9:48 లో వ్రాయబడింది.
అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని మత్తయి 24:51లో వ్రాయబడి ఉంది.
కాబట్టి ప్రియ సహోదరీ!సహోదరుడా! పరలోకం నిజం!
నరకం అంతకంటే నిజం!!!
ఈ ఉపమానంలో వర్తమానం పరమసత్యం!!
పరలోక రహస్యం!!!
నరకం యొక్క నిజ స్వరూపం!!!
కాబట్టి ప్రియ చదువరీ! ఆ నరకానికి వెళ్ళకూడదు అంటే నీపాప జీవితాన్ని వదిలెయ్యాలి! వాక్యానుసారంగా సాక్షార్ధమైన జీవితం జీవించాలి. ఇప్పుడే నిన్ను నీవు సరిదిద్దుకోమని యేసయ్యనామంలో బ్రతిమిలాడుతున్నాను.
పరలోకానికి హక్కుదారుడుకావాలని ఆశిస్తున్నాను.
అట్టి కృప మనందరికీ మెండుగా కలుగును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!!!
(సశేషం)
పేదలాజరు- మూడవ భాగం
ధనవంతుడుప్రియదైవజనమా ఇప్పుడు మనం యేసయ్య చెప్పిన ఉపమానం ధ్యానిద్దాం! లూకా సువార్త 16:19-31 క్లుప్తంగా చూస్తే: ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎప్పుడూ మంచి బట్టలు వేసుకొని, తింటూ త్రాగుతూ ఉండేవాడు. ప్రక్కనే ఒక దరిద్రుడు/పేదవాడున్నాడు. పేరు లాజరు. ఎప్పుడూ ఈధనవంతుడు గేటుదగ్గర ఉండేవాడు ఏమైనా పెడతాడని,గాని ఎప్పుడూ ఏమి పెట్టలేదు. లాజరు చనిపోయి పరలోకంలో తండ్రియైన అబ్రహాం (పరమతండ్రి) రొమ్మున ఉంటాడు. ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడి, నరకంలో యాతనపడుచూ ఉంటాడు. అప్పుడు దేవునికి, ధనవంతునికి జరిగిన సంభాషణే ఈ ఉపమానం. ధనవంతుని పేరు బైబిల్ లో లేదు గాని పేదవానిపేరు వ్రాయబడి ఉంది. యూదుల కధలలో ఈ ధనవంతుని పేరు దివస్ అని వ్రాయబడి ఉంది. అంటే భాగ్యవంతుడు అని అర్ధం తెలుగులో.
మనం పేదలాజరు కోసం ధ్యానించాలి అంటే తప్పకుండా ధనవంతునికోసం ధ్యానించాల్సిందే! కాబట్టి ధనవంతునికోసం కొద్దిగా ఆలోచిద్దాం.
బైబిల్ గ్రంధంలో ధనవంతులకు అనుకూలమైన మాటలు లేవు. చివరకు యేసుప్రభువులవారు కూడా చాలా కఠోరమైన మాటలన్నారు. ఉదా: లూకా 18:24,25 ఆస్తిగలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవునిరాజ్యంలో ప్రవేశించుట కంటే, సూదిబెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పెను.
యేసుప్రభుల వారి మాటలు పేదలకు, దీనులకు అనుకూలంగా ఉంటాయి, ఇంకా లూకా 6:20-26లో బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యం మీది. ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అన్నారు. ధనవంతులకోసమైతే 24: అయ్యో! ధనవంతులారా! మీరుకోరిన సుఖం మీరు పొందుకొన్నారు, ఇప్పుడు నవ్వుచున్న మీరు దుఃఖపడుదురు(నరకంలో). . . .
మరి దేవుడు ధనవంతులను కోరుకోలేదా? మరి ధనవంతులకు ఐశ్వర్యం ఇచ్చింది ఆయనే కదా! ఆలోచిద్దాం!
మొదటగా దేవుడు అబ్రహాము గారిని ఎన్నుకొన్నారు. అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, గిద్యోను, ఎలీషా గారు, ఇంకా ఘనురాలైన స్త్రీ వీరంతా ధనవంతులే! ఇక క్రొత్త నిభందనలో బర్నబా గారు బహు ధనవంతుడు, మార్కు ఇంకా అనేక మంది ధనవంతులను ఆయన ఏర్పరచుకొన్నారు. దీని అర్ధం ఏమిటంటే ధనము కలిగి ఉన్నాసరే దీనమనస్సు కలవారంటే దేవునికి ఇష్టం. పేదలను, దీనులను ఆదరించు వారంటే ఇష్టం ఆయనకు. ధనము కలిగిన తర్వాత విర్రవీగి, దేవునిని, ప్రజలను లెక్కచేయని వారంటే దేవునికి అసహ్యం!!!!
భక్తుడైన లూకా అందుకే వివరణ ఇస్తున్నాడు ధనవంతునికోసం చెప్పబడిన ఉపమానంలో. లూకా 12:16-21 , దేవుని యెడల ధనవంతుడు కాక, తనకొరకే ధనము కూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పెను.
కావున యేసయ్య మాటలలో ధనవంతుడు అంటే : *దేవుడు తమకిచ్చిన వాటిని ఉపయోగించడంలో నమ్మకంగా ఉండలేకపోయినవారు అనియు, దేవునికంటే డబ్బునే ఎక్కువగా ప్రేమిస్తూ డబ్బే సర్వస్వం అని భావించేవారని, డబ్బే వారి దేవుడని తలంచేవారు అనియు, దేవుడిచ్చిన ధనాన్ని తమకోసమే ఉపయోగించుకొని, తింటూ త్రాగుతూ దురుపయోగం చేస్తూ, పేదలకు/దీనులకు సహాయపడని వారు అని అర్ధం*!!! అందుకే ఈ 16వ అధ్యాయం మొత్తం వీరికోసమే చెప్పారు. 16:1-13 లో తమకిచ్చిన ధనంలో నమ్మకంగా ఉండాలని చెప్పారు. 13వ వచనం ప్రకారం : ఎవడూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరు. అయితే దేవునిని ప్రేమిస్తారు లేదా సిరి అనగా ఆస్తిని ప్రేమిస్తారు అని చెప్పారు.
యాకోబు 4:13-17 మరియు 5:1-6 వరకు వ్రాయబడినలాంటి వారైతే దేవునికి అసహ్యం . (నేడైననూ రేపైననూ ఒకానొక పట్టణానికి వెళ్లి వ్యాపారము చేసి లాభం సంపాదించుకోవాలని ఆశిచేవారు)
కాబట్టి ప్రియ సహోదరుడా నీవు ధనవంతుడివా! దేవునికి స్తోత్రం! ఆ ధనాన్ని పేదలకు/దీనులకు, ఆపదలో ఉన్నవారికి, దేవుని పరిచర్యకు ఉపయోగించి, దేవుని దృష్టిలో ధనవంతుడు కావాలని , దేవుడిచ్చిన ఆస్తిని నమ్మకముగా ఉపయోగించాలని దేవుడు కోరుకొంటున్నారు!!!
ఇంకా యేసయ్య ఏమన్నారంటే భూమిమీద మీకొరకు ధనము కూర్చుకొనకుడి.. . . . . . . . . పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి . . . . నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయముండును. మత్తయి 6:19-21.
భూమిమీద ధనం కూర్చుకోవద్దు. పరలోకంలో కూర్చుకోమంటున్నారు. మరి అది ఎలా సాధ్యం?!!!
మత్తయి 25:31-46 వరకు చెప్పబడిన ఉపమానంలో ఎవరైతే తోటివారికి, పొరుగువారికి, సహోదరులకు, అవుసరంలో ఉన్నవారికి, పేదవారికి సహాయం చేస్తారో, వారు దేవునికి చేసినట్లే! అంటే పరలోకంలో ధనం కూర్చుకొన్నట్లే!!!
యాకోబు 1:27 ప్రకారం దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తననుతాను కాపాడుకోవడమే భక్తి అంటే! అటువంటి భక్తి చేస్తే దేవుని దృష్టిలో ధనవంతులవుతారు.
లూకా 18:22 నీకింక ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినది అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును!
కాబట్టి బీదలకిస్తే దేవునికిచ్చినట్లే! బీదలకిచ్చువారు యెహోవాకు అప్పిచ్చువారు అని సామెతలు గ్రంధంలో వ్రాయబడింది.
ఇంకా నువ్వు సేవ చేయలేవు గనుక చేసే వారికి ధన సహకారిగా ఉండు పరిచర్య లో పాలిభాగస్థుడవు కమ్ము, నువ్వు చేయలేనిదానిని చేసే వారికి కుడి చెయ్యిగా ఉండు. భారము మోసుకునే స్తంభముగా పరిచర్యలోను సంఘములోను ఉండుము దేవుడు మెండుగా దీవెనలు కలుగజేస్తాడు.
ఇక్కడ ధనవంతుడు ప్రతీరోజు మంచి ఊదారంగు వస్త్రము అంటే ఘనమైన బట్టలు వేసుకొనేవాడు గాని ప్రక్కనే ఉన్న పేదలాజరు చిరిగిపోయిన బట్టలతో ఉంటె ఎప్పుడూ ఒక్క గుడ్డముక్క కూడా ఇవ్వలేదు. ప్రతీరోజు ధనవంతుడు విందు బోజనాలతో ఎంజాయ్ చేసేవాడు గాని లాజరు ఆకలితో ఉంటే ఎప్పుడూ ఆకలితీర్చలేదు. ఇతనికి పేదలకు/ లాజరుకు సహాయం చేసే అవకాశం ప్రతీరోజు ఉంది గాని చెయ్యలేదు. ఫలితంగా దేవుని దృష్టిలో అల్పముగా కనబడి నరకానికి పోయాడు!!!
మరి నీవెలా ఉన్నావు? నీ ఆస్తి, చదువు, తెలివి దేవునికోసం ఉపయోగిస్తున్నావా లేదా??? లేకపోతె నీగతి కూడా అంతే! కాబట్టి నేడే నిన్ను నీవు సరిదిద్దుకొని పరలోకానికి హక్కుదారుడు కావాలని యేసయ్య పేరిట బ్రతిమిలాడుచున్నాను!
దైవాశీస్సులు!
(సశేషం)
పేదలాజరు- నాల్గవ భాగం
లాజరులూకా 16: 20,21 లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి,
అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను.
ప్రియ దైవజనమా! మనం ఈరోజు పేదలాజరు కోసం ద్యానిద్దాం! లూకా గారు-యేసయ్య మాటలలో ధనవంతుని కోసం కేవలం ఒక వచనం మాత్రమే వాడితే, లాజరు కోసం రెండు వచనాలు వాడారు. ఈవిధంగా పేదలకు పెద్దపీట వేసినట్టయ్యింది.
లాజరు:
1. దరిద్రుడు-పేదవాడు(20వ వచనం);
2. కురుపులతో బాదపడేవాడు, అనగా రోగిష్టి(20);
3. నిస్సహాయ స్తితిలో ఉన్నాడు(21);
4. 22వచనం ప్రకారం భక్తిగలవాడు, నీతిమంతుడు. అందుకే దేవదూతలచేత పరమునకు ఎత్తబడ్డాడు!!!
ఈ ఉపమానంలో లాజరుకు కుటుంబం ఉన్నట్లు లేదు. ఒక్కడే యాతన పడుచున్నాడు. దానిలోనూ కటిక పేదరికం! దానికితోడు కురుపులు! బహుశా ఈ వ్యాదివలనే కుటుంబం వదిలివేసి త్రోసివేసిందేమో!! కష్టాలన్నీ ఒకేసారి వస్తుంటాయి సాధారణంగా! ఇప్పుడు ధనవంతుని ఇంటివాకిట నిస్సహాయంగా పడియున్నాడు! పడియున్నాడు అంటే లేవడానికి కూడా ఒపికలేదేమో! అందుకే స్పష్టముగా పడియున్నాడు అని వ్రాయబడింది. తర్వాత ధనవంతుని భోజనం బల్లనుండి పడిపోయే రొట్టెముక్కలు తినాలని ఆశపడ్డాడు! అంటే ధనవంతుడు తినగా మిగిలిన రొట్టెలైన తినాలని ఆశపడ్డాడు! అంటే ధనవంతుడు ఎప్పుడూ ఏమి పెట్టలేదు అని అర్ధం! ధనవంతుడు సహాయం చేస్తే పడిపోయే ముక్కలకోసం ఆశించి ఉండడు! బల్లనుండి పడిపోయే రొట్టెముక్కల కోసం కుక్కలతో పోరాటం చేసియుండడు! ఇట్లాంటి భయంకరమైన దీనావస్తలో ఉన్నాడు మన పేదలాజరు.
తర్వాత భాగంలో చూసుకొంటే కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను అని వ్రాయబడియుంది. పేదలాజరు కురుపులను కుక్కలు వచ్చి నాకుతుంటే, వాటిని తోలడానికి లాజరు దగ్గర శక్తిలేకపోయి ఉండొచ్చు, లేదా మూగజీవులమీద జాలితో తన కురుపులు నాకనిచ్చి ఉండొచ్చు!!
ఏదీఏమైనా దిక్కులేనివారికి దేవుడే దిక్కు ! అందుకే దేవుడే కుక్కలను పంపి వాని కురుపులను నాకనిచ్చారు!! ఎందుకంటే- కుక్క నాలుకనుండి కారే లాలాజలంలో Antiboitic శక్తి ఉంటుంది. కుక్కనాకిన కురుపుగాని, గాయం గాని తొందరలో నయమై పోతుంది. లాజరుకి తినడానికే తిండిలేదు. ఇంకా కురుపులకు మందు ఎక్కడనుండి వస్తుంది? అందుకే దేవుడే కుక్కలను పంపించారు! లాజరుకి కుటుంభం లేదు, ఇల్లులేదు, కట్టుకోడానికి సరియైన బట్టలు లేవు, ఎండకు ఎండి, వర్షంలో తడుస్తూ, చలికి భాదపడుతున్నాడు!! ఇటువంటి నిస్సహాయ స్తితిలో ఉన్నవ్యక్తిని ఆదుకోవాల్సిన ధనవంతుడు చూస్తున్నాడే గాని ఎప్పుడూ సహాయం చేయలేదు! అందుకే ధనవంతుడు నరకానికి పోయాడు! లాజరు పరలోకం వెళ్ళాడు.
సాధారణంగా ధనవంతులు ధనానికి- ధనం కూర్చుకోడానికి, విందుబోజనాలతో సంతుష్టి చెందడానికి చూస్తారు గాని, తోటివారికి సహాయం చెయ్యడం చాలా అరుదు! గాని పేదలకోసం చూస్తే తనకున్నదానిలో పొరుగువారికి అన్నం పెడతారు, మూగజీవులను తమకున్న కొద్దిలో వాటి ఆకలి తీరుస్తారు! ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు! పేదలలో ఆ ప్రేమ ఆప్యాయత ఉంటుంది. ధనవంతులలో అవి ఉండవు. అందుకే దేవునికి పేదలంటే ఇష్టం, అవిలేని ధనవంతులంటే అసహ్యం! ప్రియదైవజనమా! నీవుకూడా పేదవానిలాగా స్పందిస్తున్నావా? నిస్సహాయులకు నీకున్నదానిలో సహాయం చేస్తున్నావా? ఒకసారి పరిశీలించుకో!!
ఇక ప్రియ దీన జనమా! పేదరికంలో మ్రగ్గుతున్నావా? రోగాలతో యాతనపడుచున్నావా? లాజరును అందరూ వదలివేసినట్లు నిన్ను – నీకుటుంభం, బంధువులు, వదలివేసారా? భయపడొద్దు!!!
*లాజరుకి సహాయం చెయ్యడానికి దేవుడు కుక్కలను పంపించాడు! ఏలియాను పోషించడానికి కాకులను పంపించాడు! బిలాముకు బుద్ధిచెప్పడానికి గాడిదను వాడుకొన్నాడు! నిన్ను పోషించడానికి, ఆదరించడానికి అసాధారణ మార్గాలలో దేవుడు నీకు సహాయం చేస్తారు*!!
ఇన్ని భాదలలో ఉన్నా కూడా లాజరు ఎప్పుడూ దేవునిని నిందించలేదు! నీవుకూడా నీ భాదలలో కృంగిపోక దేవునిమీద భారంవేసి స్తుతిస్తూ ఉండు!! దేవుడు అద్భుతాలు చేస్తారు!
ప్రాముఖ్యంగా పేదలాజరు చనిపోయి
1. దేవుని దూతలచే కొనిపోబడ్డాడు!
2. పరలోకంలో తండ్రి రొమ్మున ఆనుకొన్నాడు!
ఆ భాగ్యం నీకు కావాలంటే దేవుని మీద సంపూర్ణంగా ఆనుకో!
అట్టి కృప, ధన్యత మనందరికీ కలుగును గాక!!!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(సశేషం)
పేదలాజరు- 5వ భాగం
జీవితగమ్యం-1ప్రియులారా!ఈరోజు మనం పేదలాజరు ఉపమానంలో 22,23 వచనాలను ధ్యానిద్దాం!
Luke(లూకా సువార్త) 16:22,23
22.ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.
23. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి ....
ఈరెండు వచనాలలో మనకు ఆరు ప్రాముఖ్యమైన సంగతులు కనబడతాయి. అవి ధ్యానిద్దాం!
1. *దరిద్రుడు-అనగా పేదలాజరు చనిపోయి దేవదూతలచేత పరమునకు కొనిపోబడి తండ్రియైన అబ్రహాము (పరమతండ్రి) రొమ్మున ఆనుకొనబడతాడు*!
ఇది నిజంగా పరమభాగ్యం! జీవితమంతా కష్టాలతో, కురుపులతో, ఆకలితో భాదపడుతూ ఉన్నాడు. ధనవంతుని గుమ్మం దగ్గర పడియుండి అతని బల్లనుండి పడే రొట్టెముక్కలకోసం ఎదురుచూసేవాడు!
*ఇన్ని భాదలలో కూడా తన విశ్వాశాన్ని గాని, నీతినిగాని, భక్తిని విడువలేదు*! ఇదంతా చూస్తున్న పరమతండ్రి ఒకరోజు కరుణించి దూతలను పంపించి తనదగ్గరకు పిలచుకొన్నారు!
బైబిల్ గ్రంధంలో చాలా తక్కువమందికే దూతలు ఉపయోగపడ్డారు. ఉదాహరణ: అబ్రాహాముగారికి, లోతు, మోషే, యెహోషువా, గిద్యోను, సంసోను తల్లిదండ్రులకు, . . . . తల్లియైన మరియ, జెకర్యా, కోర్నేలి, పేతురు .... ఈగొప్పవ్యక్తుల లిస్టులో లాజరు కూడా చేరిపోయాడు. లాజరు ఈలోకంలో భాదలనుభవించిన పరలోకంలో నిత్యసుఖం, నిత్యజీవం పొందుకోడానికి కొనిపోబడ్డాడు. నిజంగా అట్టిస్తితి అనగా దేవదూతలచే కోనిపోబడిన వారు ధన్యులు!! ఆతి స్తితి నీకుందా???
2. ధనవంతుడు కూడా చనిపోయాడు. అయితే అతనిని పాతిపెట్టారు అని స్పష్టముగా వ్రాయబడియుంది. అధికారలాంచనాలతో సమాధిచేసారు! అయితే లాజరును బహుశా మున్సిపాలిటీవారు బయటికి ఈడ్చివేసి, ఎక్కడో దహనం చేసారో, ఏం చేసారో తెలియదు! *సమాధిచేయబడకపోయిన లాజరు పరలోకం పోయాడు*. *సమాదిచేయబడిన ధనవంతుని తీసుకెళ్లడానికి ఏ దేవదూత రాలేదు*. *గాని 23వ వచనం ప్రకారం పాతాళానికి/నరకానికి పోయాడు*! *అతని విచ్చలవిడి జీవితానికి, సుఖేచ్చలు గల జీవితగమ్యం- పాతాళం*! నరకం!
ప్రియ చదువరీ! ఈలోకంలో ఎంత సుఖభోగాలతో జీవించినా సరే ఒకరోజు చనిపోతారని ఈ ఉపమానం ద్వారా యేసయ్య తెలియజేశారు. చావు తర్వాత నీ జీవిత గమ్యం ఏమిటి? సుఖబోగాలు ఆశించిన ధనవంతుడు నరకానికి పోయాడు! మరి నీవో???
3. *మరణమే జీవితానికి చివరిమజిలీ కాదని, మరణం తర్వాత మరోజీవితం ఉందని, రెండు గమ్యాలున్నాయని ఈ భాగం తెలియజేస్తుంది*.
1. *పరలోకం* (లాజరు వెళ్ళిన స్థలం)
2. *పాతాళం/నరకం* (ధనవంతుడు వెళ్ళిన స్థలం) యాతనపడే స్థలం!!!
నీవు ఎవరివైనా సరే చావు తర్వాత వీటిలో ఒకదానికి పోవలసిందే!!!
*ఇదే జీవిత గమ్యం*!!!
మనుష్యులు జరిగించు ప్రతీ పనికీ, మనుష్యులు పలుకు వ్యర్ధమైన ప్రతీమాటకు విమర్శదినమందు లెక్క అప్పగించాలి అని మరచిపోకు!!!
Ecclesiastes(ప్రసంగి) 11:9,10
9.యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటినిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;
10.లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, *నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.*
ఇంకా 12వ అధ్యాయంలో జీవిత చరమాంకంలో (వృద్ధాప్యం) మనిషి మనుగడ ఎలా ఉంటుందో వ్రాయబడియుంది. అందుకే Ecclesiastes(ప్రసంగి) 12:1,2
1.దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,
2.తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటున్నాడు జ్ఞానియైన ప్రసంగి!!
కాబట్టి నీకు కలిగిన ధనసమృద్ధిచేత విర్రవీగక, నీ దేహాన్ని, జీవితాన్ని చేరిపేది ఏదైనా సరే ఇప్పుడే దాని తీసివేసేయ్!!
అది సినిమానా?
త్రాగుడా?
ధూమపానమా?
వ్యభిచారమా?
అక్రమసంభంధమా?
జూదమా?
కోపమా?
ద్వేషమా?
దొంగతనమా?
అది ఏదైనా సరే ఇప్పుడే దానిని తొలగించుకో!
అట్లు చేసి నీవు కూడా లాజరు లాగ పరలోకం పొందుకోవాలని ఆశిస్తున్నాను!!
దైవాశీస్సులు!!
(సశేషం)
పేదలాజరు- 6వ భాగం
జీవితగమ్యం-24. ఇక్కడ 22,23వచనాలు ప్రకారం *దరిద్రుడు/పేదవాడు/లాజరు – పరలోకం వెళ్ళినట్లు చూస్తున్నాం. అంటే పేదలంతా పరలోకం వెళతారా*?
లూకా 6:20లో పేదలైన మీరు ధన్యులు, పరలోకరాజ్యం మీది! ఏడ్చుచున్న మీరు ధన్యులు! మీరు నవ్వెదరు. అని వ్రాయబడి ఉంది. దీని అర్ధం పేదవారంతా పరలోకం పోతారని కాదు. *నీవు పేదవాడివైనా సరే విరిగిన హృదయంతో దేవునిని అనుసరించి, ప్రార్ధన విజ్ఞాపనలతో ఎల్లప్పుడూ దేవునిని స్తుతిస్తూ ఉంటేనే పరలోకం వెళ్తావు తప్ప పేదోడివైనంత మాత్రాన పరలోకానికి పోవు*!!! పేదవానికుండే లక్షణాలు అనగా
1. పొరుగువారంటే ప్రేమ- తనకున్నది తోటివారితో పంచుకొనే లక్షణం.
2. మూగజీవులమీద ప్రేమ,
3. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం చెయ్యాలి. ఇవి కలిగియుంటేనే పరలోకం!!!
5. *ధనవంతుడు నరకానికి పోయాడు. అంటే ధనవంతులంతా నరకానికి పోతారా*?? కానేకాదు! యేసుప్రభుల వారు విశ్వాసులకు తండ్రియైన ఏ అబ్రహాముగారిని పరమతండ్రితో పోల్చారో ఆ అబ్రహాము- అగర్బ శ్రీమంతుడు! అంతేకాదు దేవుడు ఇంకా ఆశీర్వదించారు. మరి అబ్రహాము గారు నరకానికి పోయారా??? లేదే!! దీని అర్ధం ఏమిటంటే *ధనవంతులంతా నరకానికి పోరు గాని, ధనంతో విర్రవీగకుండా, తనకున్న ధనాన్ని, సుఖభోగాలకు కాకుండా , పొరుగువారికోసం, దిక్కులేనివారికోసం, తండ్రిలేని వారికి, విధవరాళ్ళకు , దేవుడిచ్చిన ధనాన్ని నమ్మకముగా దేవునికోసం ఖర్చు చేస్తే పరలోకం వెళతారు*!
అయితే యాకోబు 5:1-5 లో ఉదహరింపబడినవారంటే దేవునికి అసహ్యం!
James(యాకోబు) 5:1,3,4
1.ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి యేడువుడి.
3.మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి.
4.ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. తప్పకుండా దేవుడు వీరిని శిక్షిస్తారు.
మత్తయి 25: 41-46 లాంటి వారిని తప్పకుండా శిక్షిస్తారు. 1 తిమోతి 6:9-10 . వీరిని కూడా దేవుడు శిక్షిస్తారు.
కాబట్టి ఓ ధనవంతుడా! నిన్ను నీవు సరిచేసుకోమని యేసయ్యపేరిట మనవిచేస్తున్నాను!
6. *అబ్రహాము ఆగర్భశ్రీమంతుడు అయినా దేవుడు అతనిని తన ఉపమానంలో ఎందుకు వాడుకొన్నారు*? చూద్దాం!
ఒక సామాన్య మానవునికి ఇంత ఆధిక్యత ఎలా వచ్చింది? అబ్రాహాము గారి జీవితం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధిక్యతకు కారణాలు కనిపిస్తాయి:
a. నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడచి, నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని దేవుడు చెబితే (ఆది 12, హెబ్రీ 11:8)- ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? నేను నిన్ను ఎందుకు నమ్మాలి? అక్కడ ఏముంటాయి? ఇలాంటివి ఏమీ అడగకుండా దేవునిని నమ్మి తనకున్నదంతా తీసుకొని కల్దీయ దేశం నుండి సుమారు 300 మైళ్ళు నడచి హారాను వెళ్ళిపోయారు. మరలా అక్కడనుండి ఐగుప్తు, కానాను ఇలా దేశాలు తిరుగుతూ ఉన్నారాయన తన జీవితమంతా! ధనవంతుడైన అబ్రాహాము గుడారాలలో జీవిస్తూ, అరణ్యాలలో, ఎడారులలో ఎండకు వానకు తిరుగుతూ జీవిస్తు గడిపారు. గాని ఎప్పుడూ దేవునిని ప్రశ్నించలేదు. ఇది చేస్తాను అది చేస్తాను అన్నావు. ఏదీ? అనలేదు. అదే అతనికి నీతిగా ఎంచబడింది, “అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను”ఆదికాండము 15:6, రోమా 4:3. ఈ అనుకూల ప్రవర్తనే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చింది.
b. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమా 4:17-23. ఎందుకంటే నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అని వాగ్దానం చేసినవాడు దానిని నెరవేర్చుటకు సమర్డుడని విశ్వసించి బలముపొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
c. ఇస్సాకుని బలిగా అర్పించమని దేవుడు చెబితే, ఏ అడ్డంకము చెప్పకుండా బలి అర్పించడానికి సిద్దమయ్యాడు, మృతులను సహితము ఆయన లేపడానికి శక్తిమంతుడని ప్రగాఢ విశ్వాసం కలియుండెను. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసులందరికీ తండ్రిగా మారిపోయారు అబ్రహాము గారు!
పై కారణాల వలన అబ్రహాముగారు ధనవంతుడైనా సరే విశ్వాసులకు తండ్రిగా మారిపోయారు. తన జన్మ చరితార్ధమయ్యింది.
మరి నీబ్రతుకు ఎలా ఉంది?
అబ్రహాముకు కలిగిన ఆధిక్యత, లాజరుకు కలిగిన ధన్యత నీకు కావాలా?
అబ్రాహాముగారిలాంటి విశ్వాసం, దీనత్వము, లాజరుకి కలిగిన అచంచల భక్తి శ్రద్ధలు నీవు పొందుకో!
అట్టి ఆధిక్యత, ధన్యత మనందరికీ మెండుగా కలుగును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
పేదలాజరు- 7వ భాగం
పరలోకం-పాతాళంలూకా 16:23 అప్పుడతడు పాతాలములో భాదపడుచూ కన్నులెత్తి, దూరమునుండి అబ్రహమును, అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి. . .
ఈ 23వ వచనం కొంచెం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు మనకు అర్ధం అవుతాయి.
1 .అప్పుడతడు భాదపడుచూ. . . పాతాళంలో సుఖం లేదు. ఆత్మలు భాదపడే ప్రాంతం పాతాళం మాత్రమే! దీనినే నరకం అని కూడా అంటారు! యేసయ్య మాటలలో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు; మార్కు 9:48;
అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయు ఉండును. మత్తయి 24:51.
ఆరని అగ్నిజ్వాలలు, అగ్ని గంధకాలతో మండు గుండము! ప్రకటన 21:8;
అక్కడ AC ఉండదు, ఫ్యాన్ ఉండదు, fridge ఉండదు; నిత్యమూ అగ్ని జ్వాలలతో మండాల్సిందే!!!
నాకో సంఘటన గుర్తుకొస్తుంది! నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు సువార్తకు వెళ్లి సువార్త చెబుతుంటే ఒకామెతో జరిగిన సంభాషణ:
పాదిరి: అమ్మా! యేసు ప్రభువును నమ్ముకో! పరలోకం ఇస్తారు.
స్త్రీ: ఆ యేసుబాబుని మేం కొలవలేం! ఆయనను నమ్ముకొంటే చుట్టలు మానెయ్యాలి. నేను చుట్ట తాగడం మానలేను.
పాదిరి: మానకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. ఇంకా నరకానికి పోతావు.
స్త్రీ: నరకంలో చుట్టలుంటాయా???
పాదిరి: చుట్టలుండవు గాని బోలెడు అగ్ని!! అక్కడ నీవు కూర్చొని త్రాగొచ్చు! నించొని త్రాగొచ్చు! పడుకొని త్రాగొచ్చు! వంగోని త్రాగొచ్చు!. . . . . .
కాబట్టి అక్కడ ఎక్కడచూసిన అగ్ని మాత్రమే! నీ ఆత్మకు చావులేదు! ఒకసారి నరకానికి వెళ్ళావా? తిరిగి రాలేవు!
Revelation(ప్రకటన గ్రంథము) 20:15
15. ఎవని పేరైనను(మూలభాషలో-ఎవడైనను) జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
కాబట్టి ప్రియ సహోదరి! సహోదరుడా! మరొకసారి నీ జీవితాన్ని బేరీజువేసుకో! ఆబాధలు నీవు పడలేవు! అందుకే యేసుప్రభులవారు తన ఉపమానాలలో పదేపదే నరకం కోసం చెప్పారు! ధనవంతుడు వినలేదు- నరకానికి పోయాడు!
2. కన్నులెత్తి దూరమునుండి అబ్రహామును, అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి.. దూరమునుండి చూచి- పాతాళానికి పరలోకానికి చాలా దూరం అంట! ఎంతదూరమో మనకు తెలియదు! అంతేకాదు, 26వ వచనం ప్రకారం మధ్యలో ఒక అగాధం ఉందంట! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే: *ఎంత దూరం ఉందో- ఒకరినొకరు చూసుకొనేటంత/మాట్లాడుకోనేటంత దగ్గరగా కూడా ఉంది*. అయితే అక్కడివారు ఇక్కడికి- ఇక్కడివారు అక్కడికి పోలేరు! మధ్యలో అగాధం ఉంది. దానిని చేసింది దేవుడే! దేవుడు ఆ అగాధాన్ని ఎవరిని దాటనీయడు!!
3. కన్నులెత్తి దూరమునుండి అబ్రహామును, అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి.. దూరమునుండి చూచి-. . ధనవంతుడైతే యాతనపడుచున్నాడు! లాజరు పరమతండ్రి రొమ్మున ఆనుకోనియున్నాడు! ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే:- పరలోకంలో గాని, పాతాళం/నరకంలో గాని ఒక ఆత్మ మరో ఆత్మను చాలా తేలికగా గుర్తుపెట్టగలదు.
అందుకే ధనవంతుడు పాతాళంలో ఉన్నాసరే , తండ్రియైన అబ్రహామును, లాజరును కూడా చాలా తేలికగా గుర్తుపెట్టగలిగాడు!
ఇంకా తండ్రియైన అబ్రహాముగారితో మాట్లాడగలిగాడు.
అబ్రహాముగారి కాలం వేరు, ధనవంతుని కాలం వేరు!! ఐన గుర్తుపెట్టగలిగాడు. ఎలా? అది ఎలా సాధ్యం అంటే:- ఈ మట్టి దేహానికి/మట్టిబుర్రతో మనం వివేచించి గ్రహించలేము, గాని ఒక ఆత్మ మరో ఆత్మను ఇట్టే గుర్తుపెట్టగలదు!!!
దీనిలో మరో మర్మముంది!! *ఇదే మన శుభప్రదమైన నిరీక్షణ! నీతిగా, భక్తిగా, వాక్యానుసారంగా జీవించిన మనం ఒకరోజు తండ్రి పిలుపును అందుకొని పరమునకు వెళ్తాము!!! అక్కడ విశ్వాసులకు తండ్రియైన అబ్రహాము గారిని చూస్తాం! ఇస్సాకు, యాకోబు, మోషే, సమూయేలు, దావీదు. . . . పేతురు, యోహాను, యాకోబు, పౌలు .. ఇంకా భక్తులైన పరిశుద్ధులను అందరిని చూస్తాము. ప్రాముఖ్యంగా యేసయ్యను చూస్తాం! పరిశుద్ధులతో కలసి, గొప్ప సాక్ష్య సమూహపు విందులో పాల్గొంటాం! అక్కడ యోనాగారిని ఇంటర్యూ చేయొచ్చు చేప కడుపులో 3 రోజులు ఎలా ఉన్నారు అని! సింహపు నోళ్లను ఎలా మూయించగలిగారు అని దానియేలు గారిని అడగొచ్చు*!!
అట్టి నిరీక్షణ నీకుందా??? నీ హృదయాన్ని అడుగు! అదే మన నిరీక్షణ!
అందరిలా మనం జీవించకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ, (చప్పిడి పథ్యం చేస్తున్నట్లు) జీవిస్తున్నాం ఎందుకు? ఆ శుభప్రదమైన నిరీక్షణ కోసమే! అదే మనకు కలిగే ఫలం! అట్టి నిరీక్షణ నీకుందా?
లేకపోతే ప్రమాదం!నేడే నిన్ను నీవు సరిచేసుకో!
అట్టి నిరీక్షణ మనందరికీ కలుగును గాక! ఎత్తబడే సమూహంలో పాల్గొందుము గాక! పరిశుద్దులవిందులో పాల్గొందువు గాక!
ఆమెన్!
(సశేషం)
పేదలాజరు- 8వ భాగం
కన్నులు తెరువబడుటLuke(లూకా సువార్త) 16:23,24
23.అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి
24.తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి చెప్పెను.
ఇక్కడ మరో విషయం కూడా గోచరిస్తుంది! *ధనవంతుడుమొట్టమొదటిసారిగా కన్నులెత్తి పరలోకం వైపు చూశాడు*! ఇంతవరకు ధనమే తన సర్వస్వంగా భావించి, దేవుణ్ణి, మనుష్యులను తిరస్కరించాడు! ఎవరినీ ఖాతరుచేయలేదు!
ఇప్పుడు బాధాకరమైన మంటల్లో యాతనపడుచూ మొదటిసారిగా తలెత్తి చూస్తే పరమతండ్రి కనబడ్డారు! ఆయనతో పాటు ఇంతవరకు ఎవరినైతే తిరస్కరించాడో, ఆ లాజరు అబ్రాహము రొమ్మున ఆనుకోనియున్నాడు!
షాక్ మీద షాక్ ధనవంతుడికి!!!
పైన దేవుడు అనేవాడు ఉన్నాడు అని మొదటిసారిగా గ్రహించాడు! బహుశా అనేకమంది అనేకసార్లు పరలోకం కోసం, దేవునికోసం చెప్పి ఉండే ఉంటారు! గాని నాకు ఖాళీ లేదు పొమ్మని తరిమేసి ఉండొచ్చు! *అగ్ని మంటల సెగ తగిలాక ఇప్పడు దేవుడు కనబడ్డాడు*. కేకలు పెడుతున్నాడు తండ్రివైన అబ్రాహామా! అని. ఇంతవరకు ధనమే తనకుతండ్రి అనుకొన్నాడు. పరమతండ్రి గుర్తుకు రాలేదు.
చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు ఇప్పుడు అరుస్తున్నాడు!
ఈనాడు నీవు కూడా దైవ వర్తమానాలు విని కూడా గర్వంగా, విర్రవీగి నీ త్రాగుడు, జూదం, వ్యభిచారపు మైకంలో దేవుణ్ణి విడచి తిరుగుతున్నావా? జాగ్రత్త! ధనవంతునిలా అగ్నిలో వేదన పడతావ్ జాగ్రత్త!
ధనవంతుడు అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది. లాజరుని పంపి కొన్ని నీటి చుక్కలు పంపితే పిడచగట్టుకుపోయిన నాలుకను తడుపుకొంటాడంట!!!
ఇంతవరకు ఎవరిమీద జాలిపడని/కరుణించని ధనవంతుడు మొదటిసారిగా కనికరం కోసం అరుస్తున్నాడు! అగ్ని జ్వాలలలో నేను యాతనపడుచున్నాను! లాజరుతో నీరు పంపమంటున్నాడు! భాద తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు!
కనికరం కోసం వేడుకొన్నాడు కదా! కనికరం దొరికిందా? లేదే! తండ్రి ఏమంటున్నారు... కుమారుడా! ఎంతగొప్ప మాట!
ఇంతవరకు నన్నుగాని, నా మాటలుగాని వినలేదు, నన్ను పూజించలేదు, ఎవడ్రానీవు ఇప్పుడు నన్ను తండ్రి అంటున్నావ్? ఎవడ్రా నీకు తండ్రి??? అనలేదు!
కుమారుడా అన్నారు తండ్రి! అలా అని కరుణించారా? లేదు. కుమారుడా, నీవు సుఖం అనుభవించావు, లాజరు కష్టం అనుభవించాడు! ఇప్పడు లాజరు సుఖపడుతున్నాడు, నీవు యాతనపడాల్సిందే అని ఖరాఖండిగా చెప్పారు!! ఇదేరా నాకొడుకా నీకు శాస్తి అన్నాడు దేవుడు!!
కనికరం దొరికే కాలంలో దానికోసం ఆలోచించలేదు. సమయం మించిపోయాక అడిగితే ఏం లాభం?
యెహోవా మీకు దొరుకుకాలమందు ఆయనను వెదకుడి! ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి అని లేఖనం సెలవిస్తుంది! ప్రియ చదువరీ! *ఈ లోకంలో ఉన్నప్పుడే దేవునితో సమాధానపడి, ఆయన చెప్పినట్లు జీవించాలి! ఒకసారి చనిపోతే కృప కాలం ముగిసినట్లే! నీవు ప్రాణంతో ఉన్నప్పుడే నీ ప్రార్ధనలు అంగీకరింపబడతాయి. మరణించాక నీ ప్రార్ధనలు అంగీకరింపబడవు*!!!
ఆ ధనవంతుడు ఎవరినీ కరుణించలేదు! ఇప్పుడు తనకు కనికరం దొరకలేదు! మత్తయి 5:7;
మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కొలువబడుతుంది, 7:2;
అంతేకాదు కీర్తనలు 18:25-26 దయగలవారియెడల నీవు దయ చూపించెదవు కటినుల యెడల విముకము చూపించెదవు!
ధనవంతుని జీవితంలో దయ, కనికరం, జాలి వీటికి తావు లేకుండా పోయింది. ఇప్పుడు తనకు కూడా ఈ నరకంలో దయ జాలి, కనికరం దొరకలేదు!! ప్రియ చదువరీ! తస్మాత్! జాగ్రత్త!!
ధవంతుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాదు 26లో అంటున్నాడు అక్కడివారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రాకుండునట్లు మధ్యలో అగాధం ఉంది. దానిని ఎవరూ దాటలేరు.
ఇక్కడ గమనిస్తే ధనవంతునికి చింతచచ్చినా పులుపు చావలేదు. లాజరును పంపించి తన దాహము తీర్చమంటున్నాడు.
1.లాజరు ఇంకా పనోడిలా కనబడుతున్నాడు
2. లాజరు సుఖంగా ఉంటే ఓర్చుకోలేకపోతున్నాడు!! అలాంటి బుద్ధి నీకుందా? నేడే మార్చుకో!
కనికరం, జాలి, కరుణ అనేవి అభ్యాసం చేసుకో!
యెహోవా సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వేడుకో!
ఇదిగో ఇదే అనుకూలసమయం!
నేడే రక్షణ దినం!
యేసయ్య చేతులు చాపి పిలచుచున్నాడు! నీ పాపాలను ఒప్పుకొని, వదలి ఆయనయొద్దకు రా!
ఆయన నిన్ను క్షమించి, నిన్ను శుద్దునిగా చేసి పరలోకం ఇస్తారు!
నరకమనునది నిరతముండునయో!
ఆ ఘోరనరకము నందు పాపులు భాదపడుడురయ్యో!. . .
నెత్తినోరు కొట్టుకొందురయో!
ప్రభుయేసు క్రీస్తును నమ్మనందున భాద పడుదురయో! . . .
ఆ నరకం తప్పించుకొని అందరూ ఆ పరలోకం పొందుకొందురు గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
పేదలాజరు- 9వ భాగం
బైబిల్-సంఘము-సంఘకాపరి ప్రాముఖ్యతLuke(లూకా సువార్త) 16:27,28,29,31
27.అప్పుడతడుతండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు.
28.వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.
29.అందుకు అబ్రాహాము--వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా
31.అందుకతడుమోషేయు ప్రవక్తలును (చెప్పినమాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.
తనకు కనికరం దొరకలేదు గాబట్టి తన సహోదరులు గుర్తొచ్చారు ధనవంతునికి, అలా అయితే తనకు ఐదుగురు సోదరులు ఉన్నారు. వారికి సాక్ష్యం చెప్పడానికి లాజరుని పంపు. నరకం అనేది ఉంది మీ అన్న దానిలో బాధపడుచున్నాడు అని మాసోదరులతో చెప్పడానికి లాజరుని పంపు అంటున్నాడు.
నా సోదరులకి యీగతి రాకూడదు అని వేడుకొంటున్నాడు!
సాక్ష్యం చెప్పడానికి పంపు అంటున్నాడు! అనేకులు తనకి, తన సోదరులకి సాక్ష్యం చెప్పినప్పుడు వినలేదు ఈ ధనవంతుడు! ఇక తన తమ్ముళ్ళు వింటారా?
అందుకు దేవుడు వారియొద్ద మోషేయు, ప్రవక్తలును ఉన్నారు. వారిమాట వినవలెను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం! *1.మోషే- ధర్మశాస్త్రం! అనగా దేవుని గ్రంధంలో/బైబిల్ లో ఉన్న మాటలు.*
2. *ప్రవక్తలు- సంఘకాపరులు, భోదకులు, ప్రవక్తలు, అపోస్తలులు, దైవ వర్తమానికులు*.
వీరి(ధర్మశాస్త్రము, ప్రవక్తలు) మాటలు వింటేనే పరలోకం! లేకపోతె నిత్య నరకం! వీరిమాట తప్పకుండా వినాలని యేసుప్రభులవారే తన నోటితో చెప్పారు!
వీడెంత? వీడి బ్రతుకెంత? వీడి చదువెంత? వీడిమాటలు నేను వినాలా? అనిఅనుకొంటున్నావా? వీల్లకన్న నాకే బైబిల్ బాగా తెలుసు. నాకు తెలియని విషయం బైబిల్ లో లేదు అనుకొంటున్నావా?
ఒకవేళ నీకు బైబిల్ పాండిత్యం ఉందా? దేవునికి స్తోత్రం! అయితే అది నీ జీవితంలో అన్వయిస్తున్నావా?
లేకపోతె నీ పాండిత్యం, నీ బ్రతుకు దండగ!
ప్రతీరోజు TVలో వాక్యం వస్తుంది. గుడికి కానుకలు పంపితే చాలు, చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు- అనుకొంటున్నావా?
నీవు కానుకలిస్తే చాలదు. నీకు సహవాసం కావాలి. రొట్టె విరచుటలో పాల్గొనాలి. చర్చికి రావాలి. ఎందుకు?
దేవుని సమాజంలో దేవుడు నిలచియున్నాడు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు! కీర్తన 82:1;
కాబట్టి ఆరాధనను నిర్లక్ష్యం చేయకు.
ఈ ధనవంతుడు, తన 5గురు సోదరులు ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు! దేవునికోసం విన్నాగాని దేవుణ్ణి గాని , ఆయన భక్తులను గాని ఖాతరు చేయలేదు! అందుకే ముందుగా పెద్దోడు నరకానికి పోయాడు. తన తర్వాత లైన్లో తన తమ్ముళ్ళు ఉన్నారని తనకి తెలుసు. అందుకే వారికోసం వేడుకొంటున్నాడు. అయినా దేవుడు వినలేదు.
ఇంకా అంటున్నాడు: తండ్రివైన అబ్రహమా! అలా అనవద్దు! మృతులలోనుండి ఒకడు లేచి సాక్ష్యం చెబితే వారు విని మారుతారు, వింటారు, అంటున్నాడు. అందుకే మరోసారి దేవుడు బల్లగుద్ది చెబుతున్నారు: *మోషేయు ప్రవక్తల మాట వినని యెడల మృతులలోనుండి ఒకడు లేచిన వారు వినరు*. నేను పంపను అని ఖరాఖండిగా చెప్పేశారు.
ధనవంతుడు అంటున్నాడు- మృతులలోనుండి ఒకడు లేచి చెబితే వింటారంట! అంటే అధ్బుతం జరిగితే వింటారు, మారుతారు, అంటున్నాడు. అయితే దేవుడంటున్నారు- వాక్యం చెప్పినట్లు వింటేనే రక్షణ తప్ప- అధ్బుతాలు చూసి నమ్మిన విశ్వాసం కడవరకూ నిలువదు.
ఎందుకంటే వాక్యం నిన్ను మారుస్తుంది, వాక్యం నిన్ను అనుదినం కడుగుతుంది, వాక్యం నిన్ను వెలిగిస్తుంది.
ఆ మార్పు కలకాలం ఉంటుంది.
అందుకే దేవుడు రెండుసార్లు చెప్పారు- దేవుని వాక్యం మరియు సంఘకాపరి, ప్రవక్తల మాటలు వినాలి.
ప్రియ చదువరీ! నీవు సంఘానికి లోబడి, సంఘకాపరికి లోబడి ఉంటున్నావా? అద్భుతాల వెనుక తిరుగుతున్నావా?
నీ విశ్వాసం దేనిమీద? వాక్యం మీదనా? అద్భుతాల మీదనా?
వాక్యానికి అద్భుతాలు చేసే శక్తి ఉంది. ఎందుకంటే వాక్యమే దేవుడు.
కేవలం అద్భుతాల వెనుక పరుగెత్తకు, వాక్యానికి కట్టుబడు. అప్పుడు అధ్బుతాలు వెంబడిస్తాయి.
ధనవంతుడు అలా చేయలేదు.
అట్లు చేయకపోతే నీవు, నీకుటుంబం, నీ సోదరులు నరకానికి పోతారు అని దేవుడు చెప్పారు ధనవంతునితో!
కాబట్టి ఈ ఉపమానం మనకు ఏమి నేర్పిస్తుంది? ఈలోక భోగాలలో తులత్రూగుతూ విర్రవీగి జీవిస్తున్నావా? దేవుణ్ణి మరచి పోయావా?
అయితే చావు ఉంది అని మరచిపోకు! చావు తర్వాత కూడా జీవితం ఉంది అని తెలిసికో!
చావు తర్వాత రెండు గమ్యాలు: పరలోకం- నరకం/పాతాళం. నీకు ఏమి కావాలి?
నరకం అనేది నిరతం ఉండేది, చాలా భాదగల స్థలం. అది భూమి మీద ఉందా, పైన ఉందా? క్రింద ఉందా? అనేది మనకు తెలియదు. గాని అగ్ని జ్వాలలుంటాయి నిరంతరం. అక్కడికి వెళ్తే తిరిగి బయటకు రాలేవు!
కాబట్టి ఇప్పుడే నీ బ్రతుకును మార్చుకో! వాక్యానుసారమైన జీవితం జీవించు!
ఒకవేళ లాజరులాగ బాధపడుతున్నావా?
శుభప్రదమైన నిరీక్షణ ఉందని, ఆ నిరీక్షణ మనల్ని సిగ్గు పరచదని గుర్తుంచుకో! ఒకరోజు భక్తుల సమూహముతో పరిశుద్దుల విందులో కలసి ఆనందిస్తాము!!!
అట్టి నిరీక్షణ, భాగ్యం మనందరికీ మెండుగా కలుగును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
(సమాప్తం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి