మాదిరి

మాదిరి

మొదటి భాగము - మాటలలో మాదిరి

నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12

మనము మాట్లాడే విధానమే మనకు మిత్రులనుగాని, శత్రువులనుగాని తెచ్చి పెడుతుంది.
హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి, మాటలను బట్టి ఒకని వ్యక్తిత్వమేమిటో? చాలా వరకూ అంచనావేయవచ్చు.

హృదయంలో నున్నదొకటి పైకి మాట్లాడేది మరొకటి. వాటినే 'కపటపు మాటలు' అంటాము. మన మాటలలో ఎక్కువ శాతం వీటికే పరిమితం. కాని, ఎక్కువ కాలం నటించడం సాధ్యం కాదు. క్రియల్లో తప్పకుండా దొరికిపొతాము.

అయితే, మన మాటలు ఎట్లా వుండాలి?
వ్యభిచారిణిని సహితం అమ్మా...! అంటూ పిలువగలిగిన మన ప్రియరక్షకుడే మనకు గొప్ప ఆదర్శం. ఆయన పిల్లలముగా మాటలలోనూ ఆయనను అనుసరించ గలగాలి.

1. మృదువుగా ఉండాలి:
కోపాన్ని రెట్టింపు చెయ్యాలన్నా? చల్లార్చాలన్నా? మన మాటలే కారణం.
ఒక గోల్డ్ షాప్ లో ఒక బోర్డ్ చూసాను. "మిమ్ములను సిసి కెమరాలు రికార్డ్ చేస్తున్నాయి. దయచేసి నవ్వుతూ ఆభరణములను చూడండి" అని వ్రాసి వుంది. దానికి నేను ఆశ్చర్య పోయాను. దానిలో కటిన మైన హెచ్చరిక వుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడండి. ఏదయినా పర్స్ లో వేసుకుంటే మీ పరువు కాస్త పోలీస్ స్టేషన్ లో కలసి పోతుందని. కాని, వారు చెప్పే విధానం మాత్రం చాలా మృదువుగా వుంది.
కటినమైన మాటలు కూడా మనము మృదువుగా మాట్లాడ గలగాలి.
"మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును." సామెతలు 15:1

2. కృపాసహితంగా ఉండాలి:
ఉప్పు రుచిని కలిగిస్తుంది. అట్లానే మన మాటలు కూడా రుచికరంగా వుండాలి. ఉప్పు తక్కువైనా రుచించక పోవచ్చు. ఎక్కువైనా తినడానికి పనికి రాకుండా పోవచ్చు. మన మాటలు సమపాళ్ళలో ఉంటూ దేవుని కృపను గురించి మాత్రమే ఎక్కువ ప్రస్తావించే విధంగా వుండాలి.
"ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి." కొలస్సి 4:6

3. క్షేమకరంగా ఉండాలి:
దుర్భాషలు మాట్లాడడానికి వీల్లేదు. అట్లాంటి మాటలు కత్తులతో పనిలేకుండానే ఎదుటి వారిని హత్య చేసి మనలను నరహంతకుల జాబితాలో చేర్చేస్తాయి. ( తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు 1యోహాను 3:15 ) మన మాటలు వినే వారికి క్షేమమును, ఆదరణను కలిగించాలి.

"వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి." ఎఫెసి 4:29

4. కృతజ్ఞతతో కూడినవై ఉండాలి:
బూతులుగాని, డబుల్ మీనింగ్ డైలాగ్స్ గాని, అపార్ధమునకు తావిచ్చే మాటలుగాని, పాపమునకు ప్రేరేపించే మాటలుగాని మనము మాట్లాడడానికి వీల్లేదు. కృతజ్ఞతతో నిండిన మాటలై ఉండాలి. అట్టి మాటలు హృదయ పూర్వకమైనవి కాబట్టి, ఎటువంటి అపార్ధాలకు తావిచ్చే అవకాశం ఉండదు.

"కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు." ఎఫెసి 5:4

5. ఆలోచించి మాట్లాడేవిగా ఉండాలి:
ఎక్కువ మాట్లాడే వాళ్ళు తప్పకుండా అనవసరమైన మాటలు, తప్పు మాటలు, ఇతరులకు హాని కలిగించే మాటలు మాట్లాడుటకు చాల ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.( విస్తారమైన మాటలలో దోషముండక మానదు సామెతలు 10:19) అదే సమయంలో వినవలసినది వారు వినలేక, విషయం అర్ధంకాక సమస్యలుకొని తెచ్చుకుంటారు.
అందుచే,
"మాటలాడుటకు నిదానించువాడునై యుండవలెను." యాకోబు 1:19

6. కొద్దిగా ఉండాలి:
మన మాటలు మనలను మనమే హెచ్చించుకొనే స్థితిలో వుంటాయి. వద్దు! తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
ఆయనను హెచ్చించాలి. మనము తగ్గించబడాలి.
"దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను." ప్రసంగి 5:2

దేవుని పిల్లలముగా మనమాటలు ఎట్లా వున్నాయి? మనలను తృణీకరింపచేసేవిగా ఉన్నాయా?

లోకము నుండి ప్రత్యేక పరచబడిన మనము, 'మన మాటలు' అనేకులకు మాదిరికరంగా ఉండాలి.

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్

మాదిరి

రెండవ భాగము - నడతలో మాదిరి


నీ నడత నిన్నెక్కడికి నడిపిస్తుంది?

ప్రవర్తన (నడత) అంటే? చూపులు, తలంపులు,మాటలు, క్రియలు అన్నింటి సమూహమే ప్రవర్తన.

చూపులలో పరిశుద్ధతను కోల్పోతే?
తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాము.
తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే? మాటలలోనూ, క్రియలలోనూ పరిశుద్ధతను కోల్పోతాము. తద్వారా మన ప్రవర్తన మలినమై, పాపమునకు మరింత దగ్గరై, దేవునికి దూరమై పోతాము.

తన ప్రవర్తన విషయమై అజాగ్రతగా నుండువాడు చచ్చును.
సామెతలు 19:16

ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే? శారీరికముగా బ్రతికియున్నా, ఆత్మీయముగా చచ్చినవారమే. సందేహం లేనేలేదు. దీనికి ప్రత్యక్ష సాక్షి, రాజైన దావీదే.
చూపులలో, తలంపులలో, క్రియలలో పరిశుద్ధతను కోల్పోయి వ్యభిచారుల, నరహంతకుల జాబితాలో చేరిపోయాడు.

దేవుని చేత
"నా హృదయానుసారుడు" అని సాక్ష్యము పొందినవాడు.
తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా వుండడం వల్ల ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది?

•పుట్టిన బిడ్డ చనిపోయాడు.
•పిల్లలు వ్యభిచారులు,
హంతకులయ్యారు.
•కన్నకొడుకే దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు.
•కనీసం చెప్పులు లేకుండా రాజైన దావీదు కొండలకు పారిపోవలసి వచ్చింది.
•కుక్క వంటి "షిమి " ఓ దుర్మార్గుడా, నరహంతకుడా! ఛీ! ఫో ...అంటూ దూషిస్తూ, శపిస్తూ వుంటే, మౌనముగా తల వంచాల్సి వచ్చింది.
•దేవుని పక్షంగా యుద్దాలు చెయ్యడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్దాలు చెయ్యొద్దని ప్రమాణం చేయించారు.
ఇట్లా... ఎన్నో! ఎన్నెన్నో!

నీ సంగతేమిటి?
ఇంటర్ నెట్ లో చూడకూడనివి చూస్తూ, చూపులలో పరిశుద్ధతను కోల్పోయి, తద్వారా హృదయ తలంపులను పాడుచేసుకొని, పాపం చెయ్యడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నావా?
అయితే ఒక్క విషయం!!
'హృదయానుసారుడే' తప్పించుకోలేక పోయాడు. ఇక నీకెట్లా సాధ్యం?

నీ ప్రవర్తన సరిచేయబడాలి అంటే? ఒక్కటే మార్గం. వాక్యమైయున్న దేవునిని నీ హృదయంలో వుంచుకొని, నీ ప్రతీ కదలికలోనూ ఆయనను ముందు పెట్టుకోవాలి.

యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?
కీర్తనలు 119:9

అవును!
యౌవనుడైన యోసేపును పాపం పట్టుకోవాలని, బంధించాలని ప్రయత్నం చేస్తుంటే? దానికి చిక్కకుండా పారిపోతున్నాడు.
ఇంటిలో పాపముందని, యోసేపు ఇంటి బయట ఉంటున్నాడు.
అందుకే గదా! బానిసగా బ్రతకాల్సిన వాడు రాజుతో సమానుడయ్యాడు. దేశ ప్రధాని అయ్యాడు.

నీ జీవితం ఎట్లా వుంది?
పాపమును పట్టుకోవడానికి దాని వెంటబడి పరుగులు తీస్తున్నావా?
దాని చేతిలో బంధీగా మారిపోయావా?
అందుకే గదా! రాజులుగా బ్రతకాల్సిన మనము ఇంకా సాతానుకు బానిసలుగానే జీవిస్తున్నాము?

నీ దుష్ట ప్రవర్తన నీకు బాధను తీసుకొస్తుంది.
'బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు.'
కీర్తనలు 107:17

నీ మూర్ఖ ప్రవర్తన నీకు నాశనాన్ని తీసుకొస్తుంది.
'మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.'
సామెతలు 28:18

అట్లా కాకుండా!
నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి
1 కొరింది 15:34

నీ యథార్థమైన ప్రవర్తన
దేవుని ఇంటిలో నీకు ఆతిధ్యాన్నిస్తుంది.

యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?
యథార్థమైన ప్రవర్తన గలిగి
నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.
కీర్తనలు 15:1,2

నీ ప్రవర్తన దేవునికి యిష్టమైనదైతే? ఆయన నీ శత్రువులనుసహా నీకు మిత్రులుగా చేస్తాడు.
సామెతలు 16:7

నీ ప్రవర్తన దేవుని అధికారానికి తలవంచేదిగా వుంటే?
'ఆయన నీ త్రోవలను సరాళము చేస్తాడు.
సామెతలు 3:6

నీ,యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
1తిమోతి 4:12

ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం ఎటువైపు సాగిపోతుందో? దేవుని పిల్లలముగా మన ప్రవర్తన మనలను తృణీకరింపచేసేదిగా ఉందా?

లోకము నుండి ప్రత్యేక పరచబడిన మనమూ, మన ప్రవర్తన అనేకులకు మాదిరికరంగా ఉండాలి.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


మాదిరి

మూడవ భాగము - ప్రేమలో మాదిరి


'ప్రేమ' ప్రపంచ భాషల్లో అత్యంత శక్తివంత మైన పదం. నేటికినీ మనిషి ప్రేమను నిర్వచించడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. దాని అర్ధమేమిటో తెలియకున్నా అది చేసేపనులు లెక్కలేనన్ని.

లోకం దృష్టిలో ప్రేమంటే?
మూడవ తరగతి చదివే అబ్బాయి, అదే తరగతి చదివే అమ్మాయికి
' l LOVE U' అని వ్రాసి ఆ అమ్మాయి బుక్ లో పెట్టేసాడు. అంటే? ప్రైమరీ నుండే ప్రారంభ మయిపోయింది ప్రేమ.

ఒక టీనేజర్ ప్రేమంటూ తిరిగీ, తిరిగీ, పరీక్షల ఫలితాలు వచ్చాక తెలిసింది ప్రేమంటే ఏమిటో? Loss Of Valuable Education అని. మరొకడేమో రాత్రంతా చాటింగ్. నిద్రలేక నీరసం వచ్చాక వాడికి అర్ధమయ్యింది ప్రేమంటే? Loss Of Valuable Energy.అని

ఒక అబ్బాయికి ఒక అనుమానం. నా గర్ల్ ఫ్రెండ్ నా పేరును తన మొబైల్ ఏమని సేవ్ చేసుకుందో అని. మొత్తానికి తెలుసుకున్నాడు. ' 'టైం పాస్ 20' అని. అంటే? వీడి క్రింద ఇంకో 19 మంది. వీడిపైన ఎంత మందో? ఇప్పుడు వీడికి అర్ధమయ్యింది ప్రేమంటే? 'టైం పాస్' అని.

ఒకడేమో రక్తంతో వ్రాసేస్తాడు ( అది కోడి రక్తమో? వాడి రక్తమో? వేరే సంగతి) ఒకడేమో కత్తితో పొడిచి, మరొకడేమో యాసిడ్ పోసి చంపేస్తాడు. ఏమిటిది? అని అడిగితే నాకు దక్కనిది ఇంకెవ్వరకూ దక్కకూడదు. ప్రేమంటే ఇదే అంటాడు.

'ప్రేమికుల రోజు' (వాలెంటైన్స్ డే) ఇదొకటి.ఆ రోజు 'నా హృదయంలో నీకుతప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదు' అంటూ వ్రాసి 'అందరికీ' పంచుతాడు. అదేంటి అంటే? ప్రేమ అంటే అంతే అంటాడు.

ఇక తల్లి ప్రేమ! ఆ ప్రేమను వర్ణించడం ఎవ్వరి తరమూకాదు. కాని వారి అక్రమమైన జీవితాలను కొనసాగించడానికి కన్న బిడ్డలను సహితం కర్కషంగా చంపేసే తల్లులెందరో? ఆ తల్లి ప్రేమకూడా కలుషితమవుతుంది.

ఇక అందరికీ తల్లి 'మదర్ థెరీసా' ఆమె ప్రేమ స్వచ్చమైనది. ఎవ్వరూ కాదనలేనిది. కాని, పరిపూర్ణమైనది కాదు. ఆ ప్రేమ కొందరికే పరిమితం, కొంత కాలమే పరిమితం. శారీరికమైన స్వస్థత చేకూర్చ గలిగిందిగాని, పాప రోగం నుండి మనిషిని విడిపించ లేకపోయింది.

ఇంతకీ, నిజమైన ప్రేమ అంటే ఏమిటి?

ఈ లోకంలో 'నిజమైన ప్రేమకు' అర్ధాన్ని, నిర్వచనాన్ని చెప్పిన వాడు ఒకే ఒక్కడు.

ప్రేమకు అర్ధం, నిర్వచనం?
నిజమైన ప్రేమకు అర్ధం, నిర్వచనం 'నీ ప్రియ రక్షకుడే'. ఆయన ప్రేమాస్వరూపి ( ఆయనే ప్రేమయై వున్నాడు)
1 యోహాను 4:8,16

ఆయన ప్రేమతత్వం:
శత్రువులను కూడా ప్రేమించు. (మత్తయి 5:44) మాటలకే పరిమితం కాదు. చేసి చూపించారు కూడా. మనము శత్రువులమై వున్నప్పుడు మన కోసం తన ప్రాణమును పెట్టారు. (రోమా 5:10)

ఆ ప్రేమ యొక్క లక్షణాలు:
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;
అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.ప్రేమ శాశ్వతకాలముండును.
1 కొరింది 13:4-8

నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటో నాకు తెలియదుగాని, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తావని. కనీసం తలిదండ్రుల ప్రేమలో కూడా అంతర్గతంగా ఒక ఆశ వుంటుంది. పిల్లలు పెద్దవారై వారిని కూడా ప్రేమగా చూస్తారని.

కాని, ఆయన ప్రేమ బదులాశించనిది.
అది అమరం, అతిమధురం,అపురూపం. అవధులులేనిది అద్వితీయమైనది. సింహాసనము నుండి సిలువకు దిగివచ్చినది.
మరణము కంటే బలీయమైనది. సజీవ మైనది, శాశ్వతమైనది.

అట్టి ప్రేమను అనుభవిస్తున్న నీవు ఆ ప్రేమకు మాదిరిగా జీవించాలి.

నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
1తిమోతి 4:12

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


మాదిరి

నాలుగవ భాగము - విశ్వాసంలో మాదిరి విశ్వాసమే నీ విజయం

జార్జ్ ముల్లర్ గారి అనాధ ఆశ్రమంలో ఒకరోజు వంటవాడు
ఈరాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమి లేదని చెప్పాడు. సరే అని చెప్పి ప్రార్ధించడం ప్రారంభించారు ముల్లర్ గారు. రాత్రి 7 గంటలు అయ్యింది. వార్డెన్ వచ్చాడు. అయ్యగారు ఏమి చెయ్యమంటారు? పిల్లలను ప్లేట్స్ పట్టుకొని డైనింగ్ హాల్ లో కూర్చోమని చెప్పండి. ముల్లర్ గారి మాటలకు వంటవాడు, వార్డెన్ ఆశ్చర్యపోయారు ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అనుకొని, ఆయన చెప్పినట్లే చేసారు. ఈలోపు ఒక పెద్ద లారి ఆశ్రమంలోనికి ప్రవేశించింది. వాళ్ళు ఇట్లా చెప్తున్నారు. అయ్యగారు ఈ రోజు పట్టణంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చెయ్యబడింది. హటాత్తుగా పిలువబడిన ముఖ్య అతిధులలో ఒకరు చనిపోయారు. మీటింగ్ రద్దు చేసారు.సిద్ధ పరచిన ఆహార పదార్ధాలు మీ ఆశ్రమానికి అందజేయమన్నారు. ఆహార పదార్ధాలు లారీ నుండి దించుతూ వుండగానే, వెలుపల పాలు తీసుకెళ్తున్న లారి పంచర్ అయ్యింది. ఆ లారీ డ్రైవర్ ఆ విషయాన్ని వాళ్ళ బాస్ కి చెప్తున్నాడు. అవతల నుండి వాళ్ళ బాస్ 'నీవెక్కడున్నావ్?' ముల్లర్ గారి ఆశ్రమం దగ్గర. అయితే, ఆ మిల్క్ ప్యాకెట్స్ ఆశ్రమలో ఇచ్చేసి, లారి ప్రక్కన పెట్టు. ఆప్యాకెట్స్ 15 రోజుల వరకు పిల్లలకు సరిపోయాయట

విశ్వాసం అంటే?
పరిస్థితులు ఎట్లావున్నా సరే, దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చ గలడని ఆయనపైనే పూర్తిగా ఆధారపడ గలగడం.

విశ్వాసము అంటే?
నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు.
హెబ్రీ 11:1

నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
రోమా 4:18
అప్పటికే అబ్రాహాముకు నూరేళ్ళు, శారమ్మకు తొంబై ఏళ్ళు.వారి శరీరం మృతతుల్య మయ్యింది. ఇక బిడ్డలకోసం నిరిక్షించడానికి వారికున్న ఆధారమేదీలేదు.
అయితే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచ లేదు.

విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.
హెబ్రీ 11:7

నోవహు అప్పటి వరకు తన జీవితంలో భూమి మీద ఒక్క వర్షపు చినుకుపడడం చూడలేదు.
అయితే, దేవుడు అంటున్నాడు. ఏకరీతిగా నలభై రాత్రులు, పగళ్ళు ఆకాశం నుండివర్షం కురుస్తుందని.
కాని, నోవహు అదెట్లా సాధ్యమని దేవుని ప్రశ్నించలేదు. విశ్వసించాడు. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు.

విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.
హెబ్రీ 11:31
అంతే కాదు యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది.

మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,
ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.
హెబ్రీ 11:24-26
ప్రతిఫలం కనానులో అడుగు పెట్టలేకపోయినా, పరమ కనానులో మాత్రం అడుగు పెట్టగలిగాడు.

కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
సంఖ్యా 13:30
అందుకే 30 లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరగా కనానుచేరి వాగ్ధాన భూమిని స్వతంత్రించుకున్న ఇద్దరిలో కాలేబు ఒకడు. మిగిలినవాడు యెహోషువా.

మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు దానియేలు 3:17
ఆ విశ్వాసమే షడ్రకు, మేషకు, అబెద్నేగోలు అనువారికి అగ్నిగుండంను ఆహ్లాదకరంగా మార్చింది.

వీళ్ళెవరూ సమస్యను చూచి భయపడినవారు కాదు, ఆ సమస్యను పరిష్కరించగల దేవునిపైన విశ్వాసముంచిన వారు.

నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
1తిమోతి 4:12

ఇట్లాంటి విశ్వాస వీరులను ఆదర్శముగా తీసుకొని, మనము కూడా విశ్వాసములో విశ్వాసులకు మాదిరిగా జీవిద్దాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


మాదిరి

ఐదవ భాగము - పవిత్రతలో మాదిరి


నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
1తిమోతి 4:12

*దేవుడే స్వయంగా తెలియజేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడని.

నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను.
లేవీ 11:44

*యేసు ప్రభువు వారు లోకానికి సవాలు విసిరారు. నేను పరిశుద్ధుడను. కాదని ఎవరైనా రుజువు చెయ్యండని. ఆ సవాలును స్వీకరించేవారు లేకపోయారు.

నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును?
యోహాను 8:46

*దేవుని దూతలు కూడా ఆయన పరిశుద్ధుడు అని స్తుతిగానములు ఆలపిస్తున్నారు.

వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
యెషయా 6:3

*కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. దేవా! ఎప్పటికైనాసరే పరిశుద్ధతయే నీ 'మందిరము'నకు అనుకూలమని.

యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము.
కీర్తనలు 93:5

*మందిరము అంటే ఏమిటో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు.

మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.
1 కొరింది 3:16,17

నీ దేహమే దేవుని మందిరం.
నాకు డబ్బుంది త్రాగుతా!
బలముంది తిరుగుతా! అంటే? కుదరదు. నీవు వ్యర్ధమైన క్రియలచే నీ శరీరాన్ని పాడు చేసుకుంటే, దేవుడు నిన్ను పాడు చేస్తాడు.
ఆయనే పాడు చెయ్యాల్సివస్తే ఇక విడిపించేదెవరు?

గొర్రె పిల్లను బలవంతముగా బురదలోనికి త్రోసినా వెళ్ళడానికి ఎంత మాత్రమూ ఇష్ట పడదు.
పంది పిల్లను బలవంతముగా బురదలోనుండి బయటకు లాగినా రావడానికి ఇష్టపడదు.
వీటిలో మన జీవితాలు దేనిని పోలి వున్నాయో? మనలను మనమే పరిశీలన చేసుకుందాం!

నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి
1 పేతురు 1:14

ఈ ప్రకారము మనమునూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ విశ్వాసులకు మాదిరికరంగా జీవిద్దాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్రిస్మస్

శరీర కార్యములు

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

సమరయ స్త్రీ

పాపము

విశ్వాసము

ప్రభువు నేర్పిన ప్రార్ధన - పరలోక ప్రార్ధన