కొండమీద ప్రసంగం - యేసు ప్రభువువారు కొండమీద చేసిన ధన్యతల ప్రసంగధ్యానం
యేసు ప్రభువువారు కొండమీద చేసిన ధన్యతల ప్రసంగధ్యానం
( మొదటి భాగం )ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. మత్తయి 5:3
ధన్యులు అంటే?
ఆశీర్వధించ బడినవారు.
ఈ లోకంలో ధన్యులు అంటే? ఆస్థిపాస్తులు, మేడ మిద్దెలు, కార్లు, బ్యాంకు బాలెన్సు వున్న వారిని ఆశీర్వధించ బడినవారు అంటాము.
యేసు ప్రభువు వారి మాటల్లో... ఎవరు ధన్యులు?
దీనత్వము కలిగిన వారు -----వారు ఎంతగా ఆశీర్వధించ బడినవారంటే?
పరలోక రాజ్యమే వారిది.
*సామాన్యముగా మనిషి యొక్క స్వభావము గర్వం, అహంకారముతో నిండి వుంటుంది.
*తగ్గింపు, దీనత్వములేని జీవితం, నిత్య రాజ్యానికి ఎంత మాత్రమూ అర్హమైనదికాదు.
*మనము తగ్గించుకొంటే ఆయన ఎంతగా హెచ్చిస్తాడంటే?
పరలోక రాజ్యానికే వారసునిగా చేస్తాడట.
ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును. యాకోబు 4:10
ఎందుకు మనముతగ్గించుకోవాలి? ఎందుకు మనము దీనులుగా వుండాలి?
ఎందుకంటే?
దీన మనస్సు, వినయము గలవారి వద్ద మాత్రమే ఆయన నివసిస్తాడు గనుక.
దీనత్వము కలిగి నీవుంటే?
నలిగిన నీ ప్రాణమును ఆయన తిరిగి ఉజ్జీవింపజేసి, జీవింపజేస్తాడు.
మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను. యెషయా 57:15
ఆయనే మన మధ్య నివసిస్తే?
ఇక అంతకు మించిన ధన్యత ఏముంది?
దీనత్వానికి యేసు ప్రభువు వారికంటే గొప్ప ఉదాహరణ మనకెవ్వరూ కనిపించరు.
*దేవుని కుమారుడైయుండి ----దాసుని రూపం ధరించుకున్నాడు.
*సకల యుగాలకు రాజైయుండి, -----పశుల తొట్టెలో పరుండ బెట్టబడ్డాడు.
అవును!
ఆయన పిల్లలుగా మనమునూ దీనులుగా జీవిద్దాం!
పరలోక రాజ్యానికి వారసులవుదాం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు ప్రభువువారు కొండమీద చేసిన ధన్యతల ప్రసంగధ్యానం
( రెండవ భాగం )దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
మత్తయి 5:4
............................
ధన్యులు అంటే?
ఆశీర్వధించ బడినవారు.
దుఖించడానికి ఇష్టపడే మనిషి ఈ లోకంలో కనిపించడు. ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అట్లా జీవించడానికే ప్రయత్నిస్తుంటారు.
మనము కూడా దుఃఖిస్తున్న వారిని సంతోషంగా వుండాలని చెప్తాము గాని, సంతోషంగానున్న వారిని దుఖించమని చెప్పము.
కాని, దీనికి వ్యతిరేఖముగా యేసు ప్రభువు వారు బోధిస్తున్నారు.
అంటే? మనము దుఃఖముతో వుంటే, చూచి ఆనందించేవాడా ఆయన?
అట్లా కానేకాదు.
ఆయన శారీరికమైన దుఃఖము గురించి మాట్లాడడంలేదు.
మనోదుఖం గురించి మాట్లాడుతున్నాడు.
మన పాపముల నిమిత్తం పశ్చాత్తాపముతో కూడిన దుఖం కలిగివుంటే?
మనం ధన్యులవుతాం.
దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.
2 కొరింది 7:10
"దైవచిత్తాను సారమైన
దుఃఖము " దుఃఖమును పుట్టించదు. ఆనందంతో ముంచెత్తుతుంది.
*ఈ దుఃఖము మన హృదయాన్ని కృంగదీయదు. కృంగిన హృదయాన్ని ఉజ్జీవింపజేస్తుంది.
*ఈ దుఃఖము భారమైనది కాదు. భారమైన హృదయాన్ని తేలిక చేస్తుంది.
అయితే, లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.
మరణం నుండి, అంటే నిత్య మరణం నుండి, తప్పించబడాలి అంటే?
దైవ చిత్తానుసారమైన దుఖం మనం కలిగియుండాలి.
ఇట్లాంటి దుఖం మనము కలిగియుంటే? ఆయనే మనలను ఆదరిస్తాడు. ఓదార్చుతాడు.
దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించు చున్నాడు.
2 కొరింది 1:4
ఇట్టి ఆదరణ, ఓదార్పు మనమునూ పొందాలంటే?
*మన పాపముల నిమిత్తము దుఃఖించే వారముగా వుండాలి.
*ఆ దుఃఖము మనలను పశ్చాత్తాపములోనికి నడిపించేదిగా వుండాలి.
*ఆ పశ్చాత్తాపము, మనలను ఆయన యొక్క సమరూపంలోనికి మార్చేదిగా వుండాలి.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు ప్రభువువారు కొండమీద చేసిన ధన్యతల ప్రసంగధ్యానం
( మూడవ భాగం )సాత్వికులు ధన్యులు ?
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
మత్తయి 5:5
............................
*సాత్వీకము అంటే? సాధుగుణం,సహించే మనసు.
థామస్ ఆల్వా అడిసన్ "బల్బ్" ను కనిపెట్టడానికి చేసిన ప్రయోగాలలో 1000వ సారి తన ప్రయోగం ఫలించి, బల్బ్ ని తయారు చేసి తన పనివానికిచ్చి, మేడ గదిలో పెట్టమంటే, తను ఆ మెట్లు ఎక్కుతూ బల్బ్ ని జార విడచి పగుల గొట్టేస్తాడు.
ప్రపంచ చరిత్రలో చిరఃస్థాయిగా నిలిచి పోవలసిన ఆ బల్బ్ పగిలిపోతే?
సాత్వీకం కలిగిన అడిసన్ అతనిని ఒక్కమాట కూడా అనకుండా, మరొక బల్బ్ ని తయారు చేసి, అదే పనివానిని పిలిచి మేడగదిలోపెట్టమంటాడు.
*సాత్వీకము అంటే?
ఇదొక బలహీనత కాదు.
గొప్ప ఆత్మబలం.
*సైతానుకు, పాపానికి వ్యతిరేకంగా సత్యం పక్షాన బహుబలంగా పోరాడే ఆధ్యాత్మిక యోధుడి వ్యక్తిత్వానికి అనుగుణమైన లక్షణమే సాత్వీకం
*దేవుడు తనను ఎట్లాంటి పరిస్థితులలోనికి నడిపించాడో వాటిని వినయంతో అంగీకరించడమే సాత్వీకం.
*దేవుని కోసం బాధలను అనుభవించడానికి సిద్దపడే మనస్సు కలిగి, హేళన, తిరస్కారం పాలైనా కోపం, ప్రతీకారం చూపకుండా ఉండడానికి సిద్దపడడమే సాత్వీకం.
ఈ లోకంలో ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటిగా వుండవు. అట్లాంటి పరిస్థితులలో సుమారుగా 30 లక్షలమంది ప్రజలను ఏకత్రాటి మీద నడిపించాలి అంటే? అది సాధ్యమా?
అది ఊహలకే అందదు కదా?
అందుకే మోషేను గురించి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు.
మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
సంఖ్యా 12:3
సాత్వీకం ఎక్కడ, ఎట్లా నేర్చుకోవాలి?
మోషే కంటే శ్రేష్టుడు, మోషే కంటే మిక్కిలి సాత్వీకుడునైన యేసయ్య పాదాల చెంతచేరి నేర్చుకోవాలి.
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
మత్తయి 11:29
నేడు సాత్వీకులు ఆధ్యాత్మికంగా అత్యంత బలిష్టులు. రాబోయే కాలంలో లోకమంతటిని వారసత్వంగా పొందబోయేవారు.
మనము ఆయన పిల్లలముగా ఆయన ఎట్లాంటి సాత్వీకమును కలిగియున్నాడో? మనమునూ అట్లాంటి సాత్వీకమును కలిగియుండి ఆయనిచ్చే ఆశీర్వాదాలను స్వతంత్రించుకొందాం!
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు ప్రభువువారు కొండమీద చేసిన ధన్యతల ప్రసంగధ్యానం
( నాలుగవ భాగం )నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు;వారుతృప్తిపరచబడుదురు మత్తయి 5:6
*ఒక వ్యక్తికి ఆకలి, దాహం లేదంటే? మనకర్ధమవుతుంది. ఆ పరిస్థితి అట్లానే కొనసాగితే తాను మరణానికి దగ్గరవుతున్నాడని.
*నీతి నిమిత్తం మనకు ఆకలి, దాహం లేదంటే?
ఆధ్యాత్మికంగా మరణానికి దగ్గర పడుతున్నామని వేరే చెప్పనవసర్లేదు.
నీతి అంటే? ఆయనను నమ్మడమే నీతి.
అబ్రాహాము యెహోవాను నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను.
*ఆకలి,దప్పిక కలిగిన వ్యక్తి వాటిని తీర్చుకోవడానికి సర్వ శక్తులా ప్రయత్నిస్తాడు. చివరికి తీర్చుకొని తృప్తి చెందుతాడు.
*ఆధాత్మిక ఆకలి దప్పిక గలిగిన వ్యక్తి విషయంలో కూడా అదే జరుగుతుంది.
కాని, ఆయన్ని చూడాలని గాని, ఆయన్ని చేరాలని గాని, ఆయన కోసం జీవించాలని గాని అట్లాంటి ఆధ్యాత్మిక ఆకలిదప్పులు మన జీవితాల్లో లేకుండా పోతున్నాయి.
దేవుని కోసం కోరహు కుమారుల యొక్క దప్పిక చూడండి.
దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది కీర్తనలు 42:1,2
ఎండమావులే నీటి మడుగులుగా భ్రమించి, ఆశతో అంతులేని వేగముతో సాగిపోతున్న దుప్పికి ఎంత దూరం ప్రయాణించినా, దాని ఆశలు అడియాశలే.
కాని, నీటి మడుగును చేరేవరకు, దాని దప్పిక తీరేవరకు, దాని ఆశ చావదు. తన పయనం ఆగదు.
*మన ఆశలన్నీ లోకం చుట్టూనే తిరుగుతాయి. వాటిని సంతృప్తి పరచడానికే ప్రయాసపడుతున్నాము.
నీతిని గురించిన ఆశగాని, ఆలోచనగాని, లేకుండా పోతుంది.
*మనకసలు నీతి కొరకు ఆకలిదప్పులే లేకపోతే? తృప్తిచెందే అవకాశమే లేదు.
*తృప్తి చెందకపోతే? ధన్యత లోనికి ప్రవేశించలేము.
*ధన్యత లోనికి ప్రవేశించకపోతే? నిత్య రాజ్యానికి వారసులంకాలేము.
నీతి, నిజాయితీ, న్యాయం కోసం ఆకలిదప్పులు కలిగి, వాటిని అందుకోవడానికి ప్రయాసపడదాం!
నీతి మంతులుగా తీర్చబడదాం!
నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు ప్రభువువారు కొండమీద చేసిన ధన్యతల ప్రసంగధ్యానం
( ఐదవ భాగం )కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. మత్తయి 5:7
సాధారణముగా మానవ స్వభావం కనికరము లేనిది. అందుకే ఆయన కనికరమును గురించి భోధించి, మాదిరి చూపించ గలిగాడు.
బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తనలు 41:1
మనము ఇతరుల పట్ల కనికరం చూపితే, దేవుడు మనపట్ల కనికరం చూపిస్తాడు అనే ఉద్దేశ్యం మనలో వుండకూడదు.
ఎందుకంటే?
ఆయనే మనపట్ల కనికరం చూపి మనలను మన పాపములనుండి విముక్తి చేసాడు. కాబట్టి, మనం ఆయన పిల్లలముగా అట్లాంటి కనికరాన్ని ఇతరులపట్ల చూపగలగాలి.
మనము ఇతరులపట్ల కనికరమును చూపనివారమైతే? మనమునూ దేవుని కనికరము కోసం ఎదురుచూచే అర్హతగాని, పొందే అర్హతగాని మనకు లేదు.
మరొక్క విషయం మనం గుర్తుంచుకోవాలి!!
మనం ఇతరుల పట్ల కనికరం చూపుతున్నాం అంటే? అది దేవునిపట్లే జరిగిస్తున్నామని యోచించి, ఆకనికరం హృదయ పూర్వకంగా వుండాలి.
నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి;
దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి,
పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;
దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి;
రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి;
చెర సాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని ..... యేసు ప్రభువు వారు చెప్తూవుంటే,
నీతిమంతులు అడుగుతున్నారు. ప్రభువా ఇవన్నీ నీకు మేమెప్పుడు చేసామని?
.............. అందుకు రాజు మిక్కిలి అల్పులైన యీ నా సహోదరు లలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మత్తయి 25: 35-40
ఇట్టి కనికరాన్ని మనము ఎక్కడ నేర్చుకోవాలి?
ఆయన పాదాలచెంతే.
కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.
క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. ఎఫెస్సి 5:1,2
మనము క్రీస్తులా ప్రేమించలేముగాని, కనీసం మనము చెయ్యగలిగినంతలోనైనా ఇతరులపట్ల ప్రేమ, కనికరం గలిగిజీవిద్దాం!
ధన్యులలో చేర్చబడదాం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు ప్రభువువారు కొండమీద చేసిన ధన్యతల ప్రసంగధ్యానం
(ఆరవ భాగం )హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. మత్తయి 5:8
పవిత్రమైన కన్నులు గలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. అని వుండాలి. కాని ఇక్కడేంటి ఇట్లా వుంది?
"పవిత్ర హృదయం గలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు."
అవును!
*హృదయం నిండిన దానినిబట్టే మన చూపులు వుంటాయి.
*హృదయం నిండిన దానినిబట్టే మన నోరు మాట్లాడుతుంది.
*హృదయం నిండిన దానినిబట్టే మన క్రియలు వుంటాయి.
హృదయశుద్ధిగలవారు అంటే?
ఈ లోకంలో పాపమేమీ లేనివారు అని అర్ధమా?
ఇదే వాస్తవమైతే ఈ లోకంలో నున్న వారు ఎవ్వరూ దేవునిని చూడలేరు.
అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ.....
నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. రోమా 7:18
అంతరంగంలో కోరిక వుంది. మంచిగా, పరిశుద్ధంగా జీవించాలని. కాని, శరీరం దీనికి పూర్తి వ్యతిరేకం. శరీరం కలుషితం కావడం ద్వారా హృదయమూ కలుషితమై పోతుంది.
హృదయం కలుషితమైపోతే ఇక ఆయనను ఎట్లా చూడగలము?
చూడలేము.
ఇప్పుడు మనము దావీదువలే ప్రార్ధించాలి. అది పశ్చాత్తాపముతో కూడినదై వుండాలి.
దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము. కీర్తనలు 51:10
అవును!
ప్రభువు పాదాల చెంత మన పాపాలను క్రుమ్మరించడం ద్వారా క్షమించబడిన మనము తిరిగి విడచిపెట్టిన పాపముల జోలికి పోకుండా మనలను మనము పరిశుద్ధంగా కాపాడుకోవాలి.
ఆయన పరిశుద్దుడు కాబట్టి మనమునూ పరిశుద్దంగా జీవించగలగాలి.
అట్టి పరిశుద్దతను కాపాడుకోగలిగితే నిత్య రాజ్యంలో ముఖా ముఖీగా ఆయనను చూస్తాము. సదా కాలము ఆయనతోనే ఉంటాము.
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు ప్రభువువారు కొండమీద చేసిన ధన్యతల ప్రసంగధ్యానం
( ఏడవ భాగం )సమాధానపరచువారు ధన్యులు? వారు దేవుని కుమారులనబడుదురు. మత్తయి 5:9
సమాధానం చేకూర్చే వారుఅంటే ఎవరు?
సత్యాన్ని , నీతి నిజాయితీలను ప్రక్కన బెట్టి శాంతి కోసం పాటుపడేవారు కాదు.
దేవుని విధానంలో శాంతిని కోరి దానికొరకు పాటుపడే వారు.
ఇట్లాంటి వారు ధన్యులు.
వీరు సమాధానంగా వుంటారు. ఇతరులకు సమాధానం చేకూర్చుతారు.
నిజమైన సమాధానం పూర్తిగా నీతి న్యాయాలపైనే ఆధారపడి వుంటుంది.
*దుర్మార్గులకు సమాధానం వుండదు.
"దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు చున్నాడు." యెషయా 48:22
సమాధానం లేకపోవడానికి గల కారణం ఏమిటి?
మన శరీరకార్యములే. మన పాపములే.
శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. గలతీ 5:19-21
వీటివల్ల సమాధానంతో పాటు నిత్య రాజ్యమూ దూరమయిపోతుంది.
సమాధానమును చేకూర్చేది ఏది?
మనలను మన పాప స్వభావం నుండి విడిపించేదేదయినా సమాధానం చేకూర్చుతుంది.
అంటే? మనము దేవుని సత్యాన్ని నేర్చుకోవడం. నేర్చుకున్న సత్యానికి సమ్మతించి ఆరీతిగా జీవించగలిగితే సమాధానాన్ని పొందుకోగలము.
దేవునితో సమాధానమును కలిగియుంటే?
మనుష్యులతోనూ సమాధానము కలిగి యుండగలము.
అట్టి సమాధానముతో దేవుని పిల్లలముగా పిలువబడి సదా కాలము ఆయనతో జీవించే ధన్యతను పొందుకోగలము.
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యేసు ప్రభువువారు కొండమీద చేసిన ధన్యతల ప్రసంగధ్యానం
( ఎనిమిదో భాగం )నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.మత్తయి 5:10
యేసు ప్రభువువారు కొండమీద చేసిన ధన్యతల ప్రసంగం.
పరలోకరాజ్య ధన్యతతోనే ప్రారంభమై, పరలోకరాజ్య ధన్యతతోనే ముగించబడింది
*ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
*నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
అంటే నిజమైన ఆశీర్వాదము లేదా నిజమైన ధన్యత ఏమిటంటే? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే.
ప్రపంచం చెడు కోరికలు, గర్వం, సత్యం గురించిన ద్వేషంతో నిండి వుంది. పాపంలోనున్న వారికి నీతి న్యాయములు అంటే ఇష్టం వుండవు.
అందుచే వీరు నీతి న్యాయాలకోసం జీవించే వారితో పోరాటం చేస్తారు. న్యాయవంతుడైన దేవునిని సహితం ఎదిరిస్తారు. తద్వారా నీతి మంతులు హింసను ఎదుర్కోవలసి వస్తుంది.
సజీవ దహనాలు, మాన భంగములు, ఊరి వేలివేతలు ఇట్లా... లెక్కలేనన్ని. ఆ హింస కొన్ని సార్లు చూస్తే మన శరీరం జలదరించేదిగా వుంది. మనిషి మెడ ఒక్క కత్తి వేటుతో తెగి, క్రిందపడి, బంతులులా ఎగురుతున్నాయి.
నీతిమంతులు ఆదిమసంఘము నుండికూడా హింసించబడుతూనే వున్నారు. స్తెఫనుతో ప్రారంభమైన ఈవధ నేటికి కొనసాగుతుంది. నానాటికి పెచ్చుమీరు పోతుంది.
యేసు ప్రభువు శిష్యులలో యోహాను తప్ప మిగిలిన వారంతా కొరడాలతోను, రాళ్ళ తోను కొట్టబడి, చెరసాలపాలై, తల క్రిందులుగా సిలువ వేయబడి చంపబడ్డారు.
*వీరు చేసిన తప్పు ఏంటి? తప్పు చేసినందుకు కాదు.
తప్పు చెయ్యొద్దని చెప్పినందుకు. నీతి కోసం నిలచినందుకు.
అయినప్పటికీ ఈ లోకంలో ధన్యులు వారే. పరలోకరాజ్యం వారిదే.
వారి భాదలు, హింసలు కొద్దికాలమే ఉండేవి. కాని, వారి ధన్య స్థితి శాశ్వత కాలం.
మన జీవితానికి సార్ధకత ఏదయినా వుందంటే? అది పరలోకరాజ్యం చేరడమే.
ఆ రాజ్యం చేరాలంటే? హింసలగుండానే ప్రయాణం చెయ్యాలి.
క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు. 2 తిమోతి 3:12
ఆ రాజ్యాన్ని చేరే మార్గంలో ఎట్లాంటి శోధనలు, హింసలు, బాధలు ఎదురైనా?
ఆగిపోక ముందుకు సాగిపోదాం!
ఆ నిత్యరాజ్యాన్ని చేరేవరకు!ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి