పౌరుషం గల ప్రవక్త - ఏలీయా

పౌరుషం గల ప్రవక్త—మొదటి భాగము

ఉపోద్ఘాతము

ఏలీయా

యాకోబు 5: 17
ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమి మీద వర్షింపలేదు.

ప్రియమైన దైవజనమా! పౌరుషం గల ప్రవక్త శీర్షికతో మరల మిమ్మును కలుసుకోవడానికి ఆనందంగా ఉంది. ఇట్టి కృపనిచ్చిన దేవాదిదేవునికి హృదయపూర్వక వందనాలు. ఈసారి ఏలియా గారి జీవితం నుండి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం.

బైబిల్ గ్రంధంలో కొంతమంది విశిష్టమైన ప్రవక్తలున్నారు. వారిలో అగ్రగణ్యులు ఏలీయగారు దేవునికోసం పౌరుషం గల ప్రవక్త! అంతేకాకుండా చాల కోపం ఉన్న ప్రవక్త! బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం మోషేగారితో సమాన హోదా గలవారు. కారణం రూపాంతర కొండపై యేసుప్రభులవారితో మాట్లాడిన వారు మోషేగారు మరియు ఏలీయాగారు. లూకా 9:30;
బైబిల్ గ్రంధంలో గల ప్రవక్తలు ప్రజల రక్షణకోసం ప్రార్థించిన వారే తప్ప వారి చావు కోరుకున్నవారు చాలా అరుదు! మొదటగా మోషే గారు. భూమిమీద నున్నవారిలో అత్యంత సాత్వికుడు అని దేవునిచే పిలువబడిన వారు కూడా, ఇశ్రాయేలీ ప్రజల తిరుగుబాటు వలన అసాధారణ చావు కోరుకున్నారు. సంఖ్యా 16; తర్వాత వ్యక్తి ఏలీయా గారే. 102 మంది వారి మాటలు బాగోలేనందువలన, వారు దేవుడైన యెహోవాకు, ఆయన ప్రవక్తకు భయపడనందువలన వారి సజీవ దహనాన్ని కోరుకున్న ప్రవక్త!

మరో విశిష్టత ఏమిటంటే: భూమిమీద పుట్టిన ప్రతి ఒక్కరు మరణించిన వారే! ఐతే ఇద్దరు వ్యక్తులు పుట్టారు గాని చావలేదు. ఒకరు హనోకుగారు, రెండు ఏలీయా గారు. హనోకుగారు ౩౦౦ సం.లు దేవునితో నడిచారు. దేవునితో సహవాసం చేసారు. ఆదికాండం 5:22; దేవునికి ఎంత సన్నిహితుడయ్యారంటే కొన్ని గంటల ఎడబాటు కూడా దేవుడే తట్టుకోలేక, కొడుకా వచ్చేయ్ అని, జీవంతోనే తీసుకునిపోయారు తనతో! అటువంటి ఆత్మీయుడు హనోకు గారు. ఆ తర్వాత మన ఏలీయా గారే! బైబిల్ గ్రంధంలో ఆయన పౌరుషం, కోపం, ప్రార్థన, విగ్రహారాధన పట్ల అసహ్యమే చూసాము గాని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏలీయాగారిని దేవుడు తనతోపాటు తీసుకుని పోయారు అంటే ఆయన దేవునికి ఎంత సన్నిహితుడో, ఎంతటి ప్రార్ధనాపరుడో, ఎంతటి విశ్వాస వీరుడో కదా! ఇంకా ఆలోచిస్తే హనోకు గారి నుండి ఏలీయాగారి వరకు చాలామంది గొప్ప భక్తులు పుట్టారు. అబ్రాహాము, ఇస్సాకు, మోషే, సమూయేలు, దావీదు లాంటి మహా గొప్ప భక్తులున్నారు గాని వీరెవరిని దేవుడు తనతో పాటు తీసుకుని పోలేదు. ఏలీయాగారిని మాత్రం తీసుకుని పోయారు అంటే ఏలీయగారు ఎంతటి గొప్ప భక్తుడై ఉంటారో కదా!!! అలా తీసుకుని పోవడానికి గల కారణం నా ఉద్దేశ్యం ప్రకారం ఏలీయా గారు లేచినా దేవుడే, పడుకున్నా దేవుడే, మాట్లాడిన దేవుని మాటలే, ఏం చేసినా సరే దేవుడు దేవుడు దేవుడు. ఎప్పుడు దేవునితోనే సంభాషణ చేసేవారు. ఏలీయా గారి తనువూ—మనస్సు- ఆత్మ—హృదయం దేవునితో ఐక్యమైపోయింది. Synchronise అయిపోయింది. అందుకే దేవుడు ఆయనను సుడిగాలి చేత తీసుకుని పోయారు.

మరి ఆయనకోసం పూర్తిగా తెలుసుకోవాలంటే ఆయన చరిత్ర తెలుసుకోవాలి మనం.

*పేరుకు అర్ధం*: 1. యెహోవాయే నా దేవుడు; 2. యెహోవాయే నా బలము;

*జననం*: తెలియదు; (బహుశా BC 900 కావచ్చు)

*తండ్రి*: తెలియదు

*తల్లి*: తెలియదు

*మరణం*: లేదు

*ఊరు*: గిలాదు సంభంధమైన తిష్బీ! 1 రాజులు 17:1; ఇది గలలియ ప్రాంతానికి చెందినది. ఎక్కడో పారేసినట్టు ఉంటుంది ఈ ఊరు. రిమోట్ ఏరియా! గలలియులు స్వాభావికంగా చదువు సంధ్యలు లేనివారు. అనాగరికులు! ఈ తిష్బీ ఊరు ఉన్నట్లే చాలామందికి తెలియదు. ఐతే ఈ గిలాదు ప్రాంతం మాత్రం అందరికీ తెలుసు కారణం అక్కడ గుగ్గిలం విరివిగా దొరికేది కారణం గిలాదు అంతా పర్వత ప్రాంతం. ఈ గుగ్గిలముతో మందులు తయారు చేసి గాయాలకు కట్టేవారు. ఈ తిష్బీ కోసం ఇంకా చెప్పాలంటే ఈ గిలాదు పర్వతాల మీదన, యోర్దాను నది ప్రక్కన ఉంది. ఇంకా అర్ధం చేసుకోవాలంటే లూక 8:36—39; మత్తయి, మార్కు సువార్తలలో చెప్పబడిన గేరాసేనీయుల (గెదరేనీయులు) దేశానికి ప్రక్కనే ఉంది ఈ ఊరు.

*కాలం*: ఆహాబు రాజు కాలం (BC 874—853), అహాజ్యా (BC 853—852)., యెహోషాపాతు (BC 873—848) . అనగా సుమారు 24 సం.లు ప్రవచన పరిచర్య చేశారు.

*కధనాలు*: 1)(As per ocarm—carmelites) ఏలియా గారి తండ్రిపేరు సాదోకు. సాధారణంగా ఈ పేరు లేవీయులకు , యాజకులకు ఉంటుంది కాబట్టి ఈయన లేవీయుడు- యాజకుడు కావచ్చు! కాబట్టి ధర్మశాస్త్రం తండ్రి దగ్గర నేర్చుకుని ఉండవచ్చు! ఐతే ఎటువంటి విధ్యాభాసము చేయలేదు ఏలీయా గారు. చదువు సంధ్యలు లేనివారు.

2) As per oca—ఆర్థోడాక్స్ christians & RCM :- తండ్రిపేరు సాబికు. ఏలీయాగారు పుట్టినప్పుడు అగ్నిరధాలు, అగ్ని గుర్రాలు బాలుని చుట్టూ తిరుగుతూ కనిపించాయట. దేవునికోసం అగ్నిలా వాడబడతాడు అని చెప్పారట.

*నమ్మకం*: యూదులకు ఒక నమ్మకం ఉంది. ఏలీయాగారు అప్పుడపుడు ప్రత్యక్షం అవుతుంటారు, ఎప్పుడంటే తోరా (ధర్మశాస్త్రం) లో ఏదైనా అనుమానాలు ఉంటే, దేవునికి ప్రార్థిస్తే ఏలీయా గారు వచ్చి అనుమానం తీర్చి వెళుతుంటారు అంటారు. మరో నమ్మకం కూడా ఉంది, తొలిచూలి బాలుడు సున్నతి పొందేటప్పుడు ఏలీయాగారు అక్కడ ఉంటారు అంటారు.

*పరిచర్య ప్రారంభించినప్పటి పరిస్థితులు*: రాజైన ఒమ్రి కుమారుడైన ఆహాబు, తూరు సీదోనుల రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలు (పేడగుట్ట/ పెంటమ్మ) ను వివాహం చేసుకుంటాడు. ఆమె వచ్చేటప్పుడు తనతోపాటు బయలు దేవతను, 850 మంది ప్రవక్తలను తీసుకుని వచ్చింది. రాజైన ఆహాబును కీలుబొమ్మను చేసి రాజ్యాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకొని, యెహోవా దేవుణ్ణి విసర్జించి, బయలు దేవతనే పూజించమని చెప్పారు. దేవుని బలిపీటాలు పడగొట్టారు. ప్రవక్తలను చంపారు. బయలు దేవతారాదనే అధికారిక ఆరాధనగా అధికారికంగా ప్రకటించింది. ప్రజలందరూ యెహోవా దేవుణ్ణి వదలి—బయలు దేవతనే పూజించడం మొదలుపెట్టారు. 1 రాజులు 19:14 ప్రకారం ఇశ్రాయేలీయులే దేవుని నిభందనను త్రోసివేసి, బలిపీటాలు పడగ్రోట్టి, దేవుని ప్రవక్తలను ఖడ్ఘముతో చంపివేశారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దేవుని ప్రవక్తలను యెజెబెలు చంపించింది తక్కువ, ఇశ్రాయేలీయులు చంపినది ఎక్కువ. కారణం వారికి ఈ చప్పిడి పథ్యం ఇష్టం లేదు. యెహోవా దేవుణ్ణి వదలి బయలును పూజిస్తుంటే చూసిన ప్రవక్తలు వానిని హెచ్చరించడం మొదలుపెట్టారు. ప్రజలకు ధర్మశాస్త్రం ప్రకారం జీవించటానికి చాలా కష్టంగా బావించారు , గాని ఎప్పుడైతే ఈ యెజెబెలు యెహోవా దేవుణ్ణి వదలి బయలును పూజించామన్నాదో వెంటనే దారి తొలిగి పోయారు. కారణం వారికి లోకంలో జీవించడమే ఇష్టం. ఎవరైనా అడిగితే సాకులు చెప్పడం మొదలు పెట్టారు. రాణి అధికారికంగా పూజించామన్నది కాబట్టి బయలునే పూజిస్తున్నామని. కాని వారికి ఈ విగ్రాహారాధన చేయడానికే ఇష్టంగా బావించారు. నిజం చెప్పాలంటే: ఒక వ్యక్తి మనస్సులో, హృదయంలో తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అని నిర్ణయం తీసుకుంటే, ఎవ్వరూ అతనిని పాడు చేయలేదు, ఆ వ్యక్తి పాపభూయిష్టమైన ప్రాంతంలో నివసించినా గాని ఎవడూ అతనిని మార్చలేరు. (దానికి నిదర్శనం ఇలాంటి పరిష్టితులలో కూడా 7000 మంది బయలుకు మ్రోక్కలేదు. 1 రాజులు 19:18) . అదే చెడిపోవాలని అనుకుంటే అతడు పల్లెటూర్లలో నివసించినా చెడిపోతారు. ఇశ్రాయేలీయులకు ఈలోక పాపం అంటే ఇష్టం కాబట్టి వెంటనే విగ్రాహారాధనకు, పాపానికి బానిసలైపోయారు. దేవునిని త్రోసివేసి—బయలును మ్రోక్కడం మొదలుపెట్టారు.

ఇలాంటి పరిస్థితులలో దేవుడు తనకోసం ఒకనిని లేపుకున్నారు. ఆయనే ఏలీయా!! పాపాన్ని ద్వేషిస్తూ , దేవున్నే ప్రేమిస్తూ, లోకాశలకు లొంగకుండా, దేవునికోసమే జీవించాలి అనే ఒక రకమైన ఆశ- jeel – ఆసక్తి కలవ్యక్తి. అందుకే దేవుడు ఆయనను కోరుకున్నారు.

*వస్త్రధారణ*: ఒంటెరోమములతో చేసిన గొంగళి, ఒంటె చర్మంతో చేసిన తోలుదట్టి , ఒక దుప్పటి. ఒక రకంగా చెప్పాలంటే ఇది బహుశా తిష్బీ ప్రాంతం వారి Traditional dress అన్నమాట! ఆ కాలంలో ప్రజలు రకరకాలైన బట్టలు వేసుకుంటుంటే ఈయన మాత్రం దేవుడు ఆయనను సేవకు పిలిచి, రాజుల దగ్గరకు, అధిపతుల దగ్గరకు పంపిస్తున్నా సరే, తన స్వరూపం , వస్త్రధారణ మార్చలేదు. వేషం మార్చలేదు. నేటిదినాల్లో కొంతమంది కొద్దిగా ఆశీర్వాదం పొందితే చాలు వారి వేషం మారిపోతుంది. సూటు, బూటు, కార్లు. గాని దేవుడు ఏలీయాగారిని ఇంతగా వాడుకుంటున్నా తన రూపం మార్చడం లేదు. కారణం ఆ వస్త్రధారణ తన ఐడెంటిటీ ని చెబుతుంది. నేను ఒక కొండజాతి వాడిని, చదువు సంధ్యలులేని వాడిని. గాని దేవుడు నన్ను వాడుకుంటున్నారు అని ఆయన చేప్పకుండానే ప్రజలు తెలుసుకుంటున్నారు.

ప్రియ దేవుని బిడ్డా! ఏలియా గారు ఒక రిమోట్ ఏరియా కు చెందినవారు, చదువుసంధ్యలు లేనివారు. ఏ రకమైన టాలెంట్లు లేనివారు. అయినా దేవుడు అత్యధికముగా వాడుకున్నారు. కారణం ఏలీయాగారికి దేవుడంటే పిచ్చిప్రేమ! చెక్కుచెదరని విశ్వాసం! అందుకే దేవుడు ఆయనను వాడుకున్నారు. నీవు కూడా , నీవు ఎవరివైనా సరే, దేవునికి నీవు కావాలి! నీవు చదువుకున్నా, చదువురాకపోయినా, ఆస్తిగలవాడవైనా, బీదవాడివైనా, పట్టణానికి చెందినా, పల్లెటూరి వాడివైనా , నీవెవరివైనా సరే, దేవునికి నీవు కావాలి. ఆయన నిన్నుకూడా వాడుకోగలరు! ఒక అనాగరికున్ని వాడుకున్న దేవుడు, నిన్నుకూడా వాడుకోగలరు. మరి నీవు దేవునికోసం జీవించగలవా? కష్టమైనా, నష్టమైనా, చివరికి మరణమే ఎదురైనా క్రీస్తుకోసం జీవించగలవా? ఐతే దేవుడు నిన్నుకూడా వాడుకోడానికి ఇష్టపడుతున్నారు.
ఆమెన్!

పౌరుషం గల ప్రవక్త—రెండవ భాగము

ఏలియా వ్యక్తిత్వము—1

1 రాజులు 17: 1
అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి-ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిం చెను.

ప్రియ దైవజనమా! ఐతే గతభాగంలో చెప్పుకొన్నట్లు ఇశ్రాయేలీయులంతా యెజెబెలుతో కలిసి బ్రష్టులైపోయి, యెహోవా దేవుణ్ణి వదిలి, బయలును పూజిస్తూ, లోకానుసారంగా జీవిస్తుంటే అకస్మాత్తుగా ఏలియాగారు వచ్చారు. 1 రాజులు 17 వరకు ఆయన ప్రసక్తే లేదు. ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏమీ లేకుండా హటాత్తుగా ఆకాశం నుండి ఊడిపడినట్లు వచ్చి, ఒక భ్రష్టుడైన రాజుకు—ఒక అనామికుడు, అనాగరికుడు వచ్చి డైరెక్టుగా ఎటాక్ ఇస్తున్నారు. 1 రాజులు 17:1.
అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి-ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిం చెను.

ఇక్కడ ప్రతీ పదం జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా లోతైన విషయాలు అర్ధం అవుతాయి మనకు! *గిలాదు సంభందికుడు* . . . గిలాదుకోసం గత భాగంలో కొద్దిగా చూసుకున్నాం. అక్కడ గుగ్గిలం దొరుకుతుంది. ఐతే అక్కడ నుండి బలమైన న్యాయాధిపతులు కూడా వచ్చారు. కాని ఈ గిలాదులో తిష్బీ అనేది ఎవరికీ తెలియదు.

తర్వాత మాట: *ఏలియా – ఆహాబు నొద్దకు వచ్చి*: చూడండి ఎందుకూ కొరగాని ఒక వ్యక్తి రాజునొద్దకు వచ్చి డైరెక్టుగా ఎటాక్ ఇస్తున్నాడు అంటే ఏలియాగారు ఎవరికిని భయపడని వ్యక్తి. ఎంతో ధైర్యవంతుడు, పౌరుషం గలవాడు.

*ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో*: ఇది చాలా జాగ్రత్త గా పరిశీలించవలసిన మాట! ఆహాబు – యెజ్రేయేలులోగాని, షోమ్రోనులో గాని ఉంటాడు. ఎక్కడ—రాజమహల్ లో. మరి అది దేవుని మందిరం కాదు, యేరూషలేము కూడా కాదు. సరే ఇంతకీ ఆహాబు ఎలాంటి వాడు అంటే భ్రష్టుడు. గాని ఇక్కడ ఏలియా గారు ఎవని సన్నిధిని నేను నిలువబడి యున్నానో అంటున్నారు-- అంటే ఈ దైవజనుడు అనునిత్యమూ, అనుక్షణము దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు అన్నమాట! ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దైవనామ స్మరణ చేస్తూ ఉండేవారు అంతే! 1 రాజులు, 2 రాజులు గ్రంధం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఏలియా గారు ఎక్కడా ఎప్పుడూ ప్రసంగాలు చేయలేదు. కేవలం ఒకేఒక చిన్న మాట చెప్పారు కర్మెలు పర్వతం దగ్గర! ఎప్పుడూ ప్రార్ధనలో గడిపేవారు. ఎవరితోనూ మాట్లాడినట్లు మనం చూడము. కేవలం ఎప్పుడైనా దేవుడు ఫలానా వ్యక్తికి ఈ మాట చెప్పు అంటే వెళ్లి చెప్పడమే! అంటే ఎప్పుడూ ఏలియా గారు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండేవారు. కాబట్టి ఏలియాగారితో పాటు దేవుని సన్నిధి కూడా ఉన్నదన్నమాట! ఉదా: గేహాజి ఏదైనా సంపాదించుకుని వస్తాను అని నయమాను వెనకాల వెళ్లి ఆస్తి సంపాదించుకుని వచ్చాక ఎలీషా గారు ఏమన్నారంటే: నీవు నయమాను రథము వెనుక వెళ్లి వచ్చినప్పుడు నీతోపాటు నా మనస్సు రాలేదా? అంటే దేవుని పిల్లల చుట్టూ దేవుని సన్నిధి ఎప్పుడూ ఉంటుంది, ఐతే ఆ వ్యక్తి దేవునితో సత్సంబంధం కలిగియుంటే దేవుని సన్నిధి ఎప్పుడూ ఆ వ్యక్తితో ఉంటూ ఆయనను నడిపిస్తుంది. అదే జరిగింది ఇక్కడ! అందుకే ఇంత ధైర్యంగా చెబుతున్నారు ఏలియా గారు, నేను ఎవని సన్నిధిని నిలువబడి యున్నానో అంటూ.

ప్రియ చదువరీ! నీకు ఇలాంటి అనుభవం ఉందా? దేవుని సన్నిధిని అనుభవించ గలుగుతున్నావా? అనుక్షణం కాకపోయినా రోజుకు ఒక్కసారైనా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావా? దేవుని సన్నిధి నీతోపాటు వస్తుందా? దేవుని మెల్లని చల్లని స్వరం ఎపుడైనా విన్నావా? ఆయన ఆత్మ తాకిడిని ఎప్పుడైనా అనుభవించావా? అయన వాక్యమ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా ఆయన మెల్లని చల్లని స్వరం నీతో మాట్లాడిందా? లేక ఏదో మ్రోక్కుబడిగా దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? ఏలియాగారు అనుక్షణం దేవుని సన్నిధిని అనుభవించేవారు కనుకనే ఆయనను ప్రాణంతోనే సుడిగాలి చేత దేవుడు తీసుకుని పోయారు.

ప్రియ దేవుని బిడ్డా! ఇంతవరకు నీవు దేవుని సన్నిధిని అనుభవించలేదు అంటే నీలో ఉన్న పాపమే కావచ్చు. కాబట్టి నేడే నీలో ఉన్న పాపములు, తప్పులు దేవుని సన్నిధిలో కన్నీటితో ఒప్పుకుని , నీ హృదయాన్ని దేవుని ముందు క్రుమ్మరించి- దేవునితో సమాధాన పడు! నీ హృదయాన్ని—ఆయన హృదయంతో ఐక్యం చేయు- synchronise చేయు! అప్పుడు నీవు ఆయన సన్నిధిని అనుభవించగలవు!
ఆమెన్!


పౌరుషం గల ప్రవక్త—మూడవ భాగము

ఏలియా వ్యక్తిత్వము—2

1 రాజులు 17:1
అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి-ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిం చెను.

యాకోబు 5: 17
ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమి మీద వర్షింపలేదు.

*ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు—నామాట ప్రకారం గాక* -- ఈ మాట అనడానికి చాలా gut’s – ధైర్యం కావాలి. ఇందులో చాలా గూడార్ధం ఉంది.

చూడండి ఏలియాగారు ఏమంటున్నారో—ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు-- ఇక్కడ దేవుడు మీద ఒట్టు పెడుతున్నారు... ఏమని? నా మాట ప్రకారం గాక! అంటే దేవునితోడు- నేను చెప్పిందే జరుగుతుంది అని నమ్మకంగా చెబుతూ చాలెంజ్ చేస్తున్నారు... ఇలా చేయడానికి కారణం ఏమిటి? అంత కోపం, ధైర్యం, పౌరుషం, ఉక్రోషం ఎందుకు వచ్చాయి ఆయనకు? దేవుడు చెప్పమన్నారా? అయి ఉండొచ్చు! గాని మరో మహత్తర కారణం ఉంది. అది ఆయన మాటలలోనే తెలుస్తుంది. ఏమిటంటే *ఇశ్రాయేలు దేవుడైన యెహోవా*!!! ఇశ్రాయేలీయులందరికి, ఇంకా ఈ జగత్తుకే ఏకైక దేవుడు యెహోవా దేవుడు, గాని తన భార్య యెజెబెలు ప్రేరేపణతో యెహోవా దేవుణ్ణి ప్రక్కన పెట్టి తూరు సీదోనుల దేవతయైన బయలును పూజించటం మొదలుపెట్టారు. అంతేనా ఇశ్రాయేలీయులందరిని పూజించమన్నారు. ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా కాని ఇక్కడ మరో దేవుణ్ణి తీసుకుని వచ్చారు. ఇక బయలు అనగా యజమాని. ఈ సర్వాలోకానికి ప్రభువు, రాజు, సైన్యములకు అధిపతి , యజమానుడు యెహోవా దేవుడు గాని బయలు అనే మరో యజమానిని పరిచయం చేసి మీ దేవుడు, యజమాని వీడే అని పరిచయం చేసి, బయలునే పూజించేలా చేసారు. బయలు దేవతారాధన అధికారిక మతంగా మార్చేసింది. ఒక్కడే దేవుడైన యెహోవాను—దేవుళ్లలో ఒక దేవుడుగా చేసేసింది. తట్టుకోలేకపోయింది ఈ పౌరుషం గల హృదయం. గుండెల్లో లావాలా గుబగుబలాడటం మొదలయ్యింది ఈ నీతిగల హృదయంలో! అంతేనా! 1 రాజులు 19:14 ప్రకారం అవకాశం దొరికింది కదా అని ఇశ్రాయేలీయులే దేవుని బలిపీటాలు పడగొట్టారు, దేవుని నిభందనను త్రోసివేశారు. చివరకు దేవుని ప్రవక్త అని తెలిస్తే ఖడ్గముతో చంపడం మొదలుపెట్టారు, కారణం దేవుని ప్రవక్తలు ఇశ్రాయేలీయులు యెహోవా దేవుణ్ణి వదలి బయలును పూజిస్తుంటే ఇది తప్పు అని ఖండించడం, దేవుని శాపం వస్తుంది అని హెచ్చరిస్తుంటే ఉడికిపోయి వారిని హతం చేశారు. ఇలాంటి పరిస్థితులకు తట్టుకోలేక ఈ నీతిగల హృదయం దేవుని దగ్గర తన ఆక్రోశాన్ని వెళ్లబోశారు. అయ్యా ఏమిటి ఈ పరిస్థితులు అని దేవుని దగ్గర ఏడవటం మొదలుపెట్టారు ఏలియా గారు తర్వాత ఏం జరిగిందో ఇక్కడ లేదు గాని యాకోబు 5:17 లో చాలా బాగా వ్రాయబడింది. ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమి మీద వర్షింపలేదు.. . . . . ఏం, ఇలానే ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకంటే తనకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. లేఖనం అదే చెబుతుంది గాబట్టి ఆ ప్రార్దనే చేసారు ఆయన. ద్వితీ 28:23—24
23. నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును.
24. యెహోవా నీ దేశపు వర్ష మును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును. . . . . . అందుకే ఈ ప్రార్థన చేసారు. మరి ఎన్నిరోజులు చేసారో తెలియదు వెంటనే దేవుడు చెప్పారు ఒకరోజు, వెళ్లి ఆహబుకి చెప్పు -వర్షం గాని మంచుగాని పడదు అని.

ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. దేవుడు ఏలియా గారినే ఎందుకు ఎన్నుకొన్నారు? మిగతావారిని ఎందుకు ఎన్నుకోలేదు? కారణం ఏలియా గారికి దేవుని హృదయం ఉంది. ఇంకా బాగా అర్ధం అవ్వాలి అంటే—ఇశ్రాయేలీయులు ఐగుప్టు నుండి వస్తున్నప్పుడు బిలాము బోధవలన బాలాకు ఎత్తుగడ వలన మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలీయులు వ్యభిచారం చేస్తారు. దేవుని ఉగ్రత, కోపం మండుతుంది, అప్పుడు ఫీనేహాసు పరిహారం చేసినప్పుడు దేవుడు చెప్పినమాట: నేను ఓర్వలేనిది—ఫీనేహాసు కూడా ఓర్వలేదు.

సంఖ్యాకాండము 25: 11
వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.

ఇక్కడ ఫీనేహాసు దేవుని హృదయాన్ని బాగా అర్ధం చేసుకున్నాడు కాబట్టి తగినట్టుగా పరిహారం చేసాడు. అలాగే ఇక్కడ ఏలియాగారు దేవుడు ఓర్వలేనిది తను కూడా ఓర్వలేక అనగా దేవుని హృదయాన్ని అర్ధం చేసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉండగా, ఈ హృదయాన్ని చూసి దేవుడు స్పందించారు. అందుకే ఏలియాగారినే పంపించారు దేవుడు.

ఇక్కడ ధైర్యంగా వచ్చి ఆహాబుకు ఎటాక్ ఇస్తున్నారు. యెహోవా జీవం తోడు నామాట ప్రకారం గాక, నేను మరలా చెప్పే వరకు ఈ దేశంలో వర్షంగాని, మంచుగాని పడదు. చూసారా, నేను మరలా చెప్పేవరకు పడదంటే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. నీవు ఎన్ని ఎత్తులు వేసినా నేను చెప్తేనే వర్షం పడుతుంది అంతే అన్నారు!! ఆహా ఏమి ధైర్యం!! ఎంత విశ్వాసం!!

ఇలా అనడానికి మరో కారణం కూడా ఉందని నా ఉద్దేశ్యం! ఏమిటంటే—ఏలియా గారికి ప్రార్ధనలో గల శక్తి బాగా తెలుసు! యెహోషువాగారు చేసిన అసాధారణ ప్రార్ధనకు సూర్యచంద్రుల గమనం ఒకరోజంతా ఆగిపోయినట్లు తెలుసు! కధలుకధలుగా విన్నారాయన! అందుకే ఇంత దైర్యంగా చెబుతున్నారు. చూసారా ఎంత పౌరుషం గలవాడో ఆయన!

అందుకే యాకోబుగారు అంటున్నారు ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే గాని వర్షం పడకూడని ఆసక్తితో ప్రార్థన చేస్తే మూడున్నర ఏళ్ళు వర్షం పడలేదు. ఇక్కడ *ఆసక్తి* అనేమాట గుర్తు పెట్టుకోవాలి. ఆయన మామూలుగా ప్రార్థన చేయలేదు. ఆసక్తిగా చేసారు. ఇక్కడ ఆయన ఉపయోగించిన ఆయుధం చాలా మహత్తరమైనది, చాలా శక్తి గలది. అది ప్రార్థన అనే ఆయుధం! ఆయనకూడా మనలాంటి వాడే, మనలాగా ఆకలిదప్పులుతో అలమటించినవాడే, మనలాగే శోధన అనుభవించిన వాడే. ఆకాశం నుండి ఊడిపడలేదు. గాని చాలా అద్భుతమైన, మహత్తరమైన, ఘోరమైన కార్యాలు చేసారు. కారణం కేవలం ప్రార్థన! ఆయనకు ప్రార్ధనలో గల శక్తి పరిపూర్ణంగా తెలుసు. అందులో ఎటువంటి అనుమానం లేదు ఆయనకు. దేవుడంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. గతబాగాలలో చెప్పినట్లు దేవుని హృదయంతో తన హృదయం ఐక్యం—synchronise అయిపోయింది. అందుకే ఇన్ని గొప్ప కార్యాలు చేసారాయన! అందుకే దేవునికి ఎలాంటి ప్రార్థన కావాలో అలా చేసి, సరియైన సమయమ్లో సరిగా స్పందించి, లేఖనాల ప్రకారం ప్రార్థన చేసి—దేవుని తీర్పు ప్రకటించారు. ప్రియ చదువరీ! ఆ ప్రార్ధనాయుధం దేవుడు మనకు కూడా ఇచ్చారు. ఏమీ చదువుకోని, ఒక ఆనాగకరికుడు దానిని వాడి ఇన్ని గొప్ప కార్యాలు చేసారు కదా! మరి నీవు చదువుకొన్నవాడివి/దానవు – నాగరికుడవు, మరి నీవు ఎందుకు దానిని వాడి దేవునికోసం గొప్ప కార్యాలు చేయలేకపోతున్నావు? కారణం – ఏలియా గారు కూడా ఇదే పాపలోకంలో ఉంటూ పాపాన్ని ద్వేషిస్తూ, దేవున్నే ప్రేమిస్తూ, దేవునికోసం ఒక అగ్నిలా ప్రజ్వరిల్లాయాన! మనం మాత్రం పాపలోకం- పాపులతో పాటు కలిసిపోయి – పాపులుగా జీవిస్తున్నాం. అందుకే మనం ఆ ప్రార్ధనాయుదాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోతున్నాము.

*ప్రియ దైవసేవకుడా! సేవ ప్రారంభించావ్, సంఘం కట్టబడాలంటావు, అద్భుతాలు జరగాలంటావ్, ప్రవచన వరం కావాలంటావ్, గొప్ప ప్రసంగీకుడిగా మారిపోవాలంటావ్! మంచిదే, గాని దానికోసం నీవేమి చేస్తున్నావు? ఈలోకంలో ఏదీ ఉచితంగా రాదు. చివరకు నీవు ఉచితంగా పొందుకున్న రక్షణ కూడా ఉచితంగా రాలేదు. దానికోసం ఒకాయన వెల చెల్లించారు కల్వరి సిలువలో! నీకు కూడా పై వరాలు ఫలాలు కావాలంటే నీవుకూడా వెల చెల్లించాలి. ఆ వెల--కన్నీటి ప్రార్థన! మోకాళ్ళ ప్రార్థన! ఉపవాస ప్రార్థన! ఏకాంత ప్రార్థన! ఇవేమీ చేయకుండా ఇచ్చెయ్ ఇచ్చెయ్ అని ప్రార్ధిస్తే నీకిచ్చెయ్యడానికి దేవుడేమి విలువ తెలియని వాడు కాదు. ఆయన నీ యొక్క ఎబిలిటీ- చూసి నీకిస్తారు. అవన్నీ కావాలంటే ఇవన్నీ నీవు చేయాలి*.

ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే యాకోబు 5:16.
మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.
. . ఇక్కడ యాకోబు గారు అంటున్నారు ఏలియా గారు నీతిమంతుడు. ఆ ప్రార్ధనలో శక్తి ఉంది. నీ ప్రార్ధనలో శక్తి లేక పోవడానికి నీలో నీతి లేనందువలన. నీవుకూడా నీతిమంతుడుగా, నీతిగల ప్రార్థన చేస్తే నీవు కూడా అలాంటి గొప్ప కార్యాలు చేయగలవు! మరి నీవు సిద్ధమా??!!!

అట్టి పౌరుషం, ధైర్యం, నీతిగల ప్రార్థన దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

పౌరుషం గల ప్రవక్త—నాల్గవ భాగము

యెహోవా యీరే-1

1 రాజులు 17:2—4
2. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై
3. నీవు ఇచ్చట నుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;
4. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా

ఏలియాగారు ఎంత ధైర్యవంతుడూ, పౌరుషం గలవాడో ఆయన వ్యక్తిత్వం కోసం మరో కొన్ని ఉదాహరణలు చూద్దాం. యెజెబెలు మరియు ఇశ్రాయేలీయులు- ఫలాని వ్యక్తి యెహోవా దేవుని ప్రవక్త అని తెలిస్తే చాలు ఉన్నపాటున ఖడ్గంతో చంపేస్తున్నారు. (1 రాజులు 19:14) ఇలాంటి పరిస్థితిలో రాజు దగ్గరికి వెళ్లి , దేవుని పేరిట ప్రవచిస్తే – ఆత్మహత్యయత్నమే అవుతుంది కదా! కోరిచావును తెచ్చుకొన్నట్లే! కాని ఇక్కడ ఏలియాగారు చావును కూడా లెక్కచేయకుండా ధైర్యంగా వెళ్లి చెబుతున్నారు ఆహబుకు! మరో విషయం ఏమిటంటే—భయపడి ఎవరినో ఒక వ్యక్తిని పిలిచి—ఏలియాప్రవక్త ఇలా చెప్పమన్నాడు—యెహోవా వాక్కు ఇదే – అని ఎవరో థర్డ్ personతో కబురుచెప్పడం లేదు. లేదా, యోనా గారి లాగా ఊరి మధ్యలో నిలబడి ప్రకటించడం లేదు! ధైర్యంగా , సరాసరి- పట్టణం లోనికి వెళ్లి, రాజమహల్ లో ప్రవేశించి, ఆహాబును పిలిచి face to face మరీ చెబుతున్నారు. – నేను ఎవని సన్నిధిని నిలువబడియున్నానో ఆ ఇశ్రాయేలీయుల దేవుడైన- యెహోవా జీవము తోడు- నేను చెప్పిందే జరుగుతుంది, ఈ సం.లలో వర్షం గాని, మంచు గాని పడదు అని తెగేసి చెప్పారాయన!

ఐతే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే—ఏలియాగారు తన ప్రాణం కోసం/ తన చావుకోసం గాని , ఒకవేళ వర్షం , మంచు పడకపోతే తను ఏం త్రాగుతాడు, ఏం తింటాడు అనేది ఎట్టి పరిస్తితులలోను ఆలోచించలేదు! ఐతే ఏదో ఉద్రేకంలో చెప్పేశారా? లేదు లేదు!!! దేవుడు చెప్పమన్నారు—చేసారు అంతే!! ఇక తన తిండా? దేవుడే చూసుకుంటారు. యెహోవా యీరే!!! God Is My Provider! అబ్రాహాము గారికున్న విశ్వాసం ఏలియాగారికి కూడా ఉంది! అంతేకాదు ఆకులు అలములు తినడం కొండజాతివారికి అలవాటే కాబట్టి, దేవుడు తనకు ఏదైనా పెట్టకపోతే ఆకులు అలములు అయినా తింటాను గాని దేవునిమాట చెప్పాలి, దేవుని ఉగ్రత ప్రకటించాల్సిందే—ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పాల్సిందే- కాబట్టి చెప్పేశారు. తర్వాత పరిణామాలకోసం ఏ మాత్రం ఆలోచించకుండా దైర్యంగా చెప్పేశారు.

ఐతే ఏలియాగారు ఆలోచించలేదు, పట్టించుకోలేదు గాని – పైన చెప్పిన యెహోవాయీరే అనబడే దేవుడు పట్టించుకున్నారు. అందుకే దేవుడు – నీవు ఇక్కడనుండి (అనగా యెజ్రెయేలు) తూర్పు వైపుకి పోయి, కెరీతు వాగు దగ్గర దాగియుండుము!
ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే: *దేవుడు దాగియుండుము* అంటున్నారు ఏలియాగారితో కారణం
1) దేవుని ప్రవక్తలను చంపుదామని యెజెబెలు –ఇశ్రాయేలీయులు వెదుకుతున్నారు కాబట్టి దేవుడు ఏలియాగారిని పోయి దాగుకో అంటున్నారు.
2) చరిత్ర ప్రకారం—ఏలియాగారు అలా ఆహాబుకు చెప్పినప్పుడు యెజెబెలు అక్కడలేదు. ఇప్పుడు వర్షము-మంచు ఆగిపోయింది. ఈవార్త దావానంలా వ్యాపించింది. దీనిని అనగా వర్షం, మంచు ఆగిపోవడం అనేది—దేవుడైన యెహోవాతీర్పు అని బావించకుండా – ఎవడో కొండజాతివాడు—ఏలియాఅనేవాడు – శపించేశాడు—అందుకే వర్షం, మంచు ఆగిపోయింది – అనుకుని ఇప్పుడు వాడు దొరికితే పట్టుకుని చంపితే ఈ శాపం విరిగిపోతుంది – మరల వర్షాలు, మంచు వస్తాయి అని భావించడం మొదలుపెట్టారు గాని ఇశ్రాయేలీయులు తగ్గించుకొని, పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు రాలేదు. కాబట్టి ఈ కారణాల వలన దేవుడు తన భక్తుణ్ణి దాగుకో అంటున్నారు.

మరి కెరీతు వాగు ఎక్కడుంది? తిష్బీ ప్రక్కన ఉంది. కెరీతు అన్నది యోర్దాను నది—యర్మూతు నదిని రెంటినీ కలిపే చిన్న పిల్లకాలువ. వర్షాలు పడితే పారుతుంది. పడకపోతే వాగు ఎండిపోతుంది. యెజ్రెయేలు నుండి సుమారుగా 35 కి.మీ దూరంలో ఉంది. గాని ఇది కొండ చరియల వలన ఎవరికీ తెలియదు ఇది ఎక్కడుందో!

చూసారా! నీవు దేవుని పని చేస్తే, దేవుడు మీ పని చేస్తారు. All You Need To Do Is Just Obey Him & Stand Still!!! మిగిలిన పని ఆయనే చూసుకుంటారు. నీవు దేవుని పని చేస్తే—నీకు కావలసిన సమస్తము ఆయనే సమకూరుస్తారు. ఆయన నీ కోసం చింతించుచున్నాడు అని వ్రాయబడియుంది. 1పేతురు 5: 7
ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు(లక్ష్యముచేయుచున్నాడు) గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
ప్రియ దైవజనమా! కంగారు పడకు! దిగులుపడకు! నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. నీకు కావలసిన సమస్తము దేవుడే సమకూరుస్తారు. ఎప్పుడు? నీవు దేవుని నమ్మినప్పుడు, దేవుని పని చేసినప్పుడు!! నీకున్న సమస్యను చూసి పారిపోవద్దు! నీ సమస్యను నీ కన్నులతో చూడకు! నీ సమస్యను నీతో పోల్చుకోకు! భయపడకు! నీ సమస్యను భూతద్దములో ఎట్టి పరిస్తితిలోను చూడకు! నీ సమస్య—దేవుని సమస్య అనుకోని—దేవుని కళ్ళతో చూడు. అప్పుడు అది ఒక గడ్డిపరకలా కనిపిస్తుంది. ఏలియా గారు తన సమస్తాన్ని దేవుని చేతులకు సమర్పించుకున్నారు. దేవునికి కావలసిఉంది కూడా అదే! అప్పుడు ఏలియాగారికి కావలసిన సమస్తము దేవుడే సమకూర్చారు. దేవుడు నీకోసం కూడా కేర్ తీసుకోడానికి ఇష్టపడుతున్నారు. మరి ఆయన చేతులలోకి నీవు వస్తావా?
దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త—5వ భాగము

యెహోవా యీరే-2

1 రాజులు 17:౩—4
3. నీవు ఇచ్చట నుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;
4. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా . . .

ప్రియ దైవజనమా! మనం యెహోవా ఈరే కోసం ఇంకా ధ్యానం చేసుకుందాం. 1) *ఆ వాగు నీరు నీవు త్రాగుదువు*. వెంటనే ఏలియాగారికి అనుమానం రావాలి—వర్షం , మంచు పడకపోతే వాగు ఎండిపోతాది కదా! అప్పుడు నీరు ఎలా త్రాగాలి? ఇంకా ఎన్ని రోజుల వరకు నేను ఆ వాగుదగ్గర ఉండాలి? ఇలాంటి అనుమానాలు రావాలి! గాని ఏలియాగారు ఏమీ అనలేదు. కారణం ఏలియాగారికి బాగా తెలుసు—యెహోవా యీరే అని! అబ్రాహాముగారికి మోరియా పర్వతము మీద చూసుకున్న దేవుడు – ఇప్పుడు కెరీతు వాగుడు దగ్గర చూసుకుంటారు అని తెలుసు!

ఇక తర్వాత: అచ్చటికి—ఎచ్చటికీ? కెరీతు వాగు దగ్గరకి – *నీకు ఆహారం తెచ్చునట్లుగా నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని చెప్పెను*. ఇది చూడండి కాకోలము అనగా కాకుల గుంపు. ఎక్కడైనా కాకులు—మనుష్యులకు ఆహారం తీసుకుని వస్తాయా? ఇది సాధ్యమయ్యే పనేనా? కాకులు ఎప్పుడూ చిన్నపిల్లల దగ్గరున్న తినుబండారాలు ఎత్తుకునిపోవడానికే ప్రయత్నం చేస్తాయి. వాటి బుద్ధి= ఎత్తుకుపోతాన్—ఎగిరిపోతాన్ ! ఇదే ధ్యాస వాటికి. కాని దేవుడు అంటున్నారు నీకు ఆహారము తెచ్చునట్లుగా నేను కాకోలమునకు ఆజ్ఞాపించితినని. ఆ మాట విని—1 Kings(మొదటి రాజులు) 17:5
5. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.
చూశారా, ఇదేమాట నీకు నాకు చెబితే నమ్మము మనం! ఇది సాధ్యమా అని దేవునికి సవాలక్ష ప్రశ్నలు అడుగుతాము. ఐతే ఏలియాగారు ఇలాంటి ప్రశ్నలు అడుగకుండా వెళ్ళిపోయారు. దేవుడు చెప్పిన మాటకు 100% విధేయత చూపించారు. అందుకే ఆయన గొప్ప ప్రవక్త అయ్యారు. మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఉన్నాము. ఇది ఏలియాగారి వ్యక్తిత్వమలో గల మరో కోణము – సంపూర్ణ విధేయత!! ఒక దైవసేవకునికి/ విశ్వాసికి కావలసినది ఈ విధేయతే!!

ఇక 6వ వచనం:
అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. . . . చూసారా- ఉదయమందు రొట్టె-మాంసం, సాయంకాలం రొట్టె, మాంసం! నేను అనుకుంటాను బహుశా ఏలియాగారు ఇలాంటి రొట్టె- మాంసం ఎప్పుడూ తిని ఉండరు. ఎందుకంటే రాజుల భోజనం కదా! సరే ఇప్పుడు భోజనం ఎవరు తీసుకుని వస్తున్నారు? కాకులు!! ఎంత గొప్ప విషయమో కదా! మానవులకైతే అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే! ఇక్కడ దేవుడు కాకులను ఉపయోగించుకుని ఏలియాగారి అవుసరాలు మానవాతీతమైన రీతిలో తీర్చారు దేవుడు. ఇక్కడ మరికొన్ని విషయాలు అర్థమవుతాయి మనకు! మొదటగా—దేవుడు ఈ సృష్టిమీద సర్వాదిపత్యాన్ని కలిగియున్నారు. ఈ సమస్తసృష్టి ఆయనమాట వింటుంది. ఇక్కడ కాకులు దేవుని మాట విన్నాయి. బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదను వాడుకున్నారు. ఎగతాళి చేసినవారికి బుద్ధి చెప్పడానికి ఎలుగుబంట్లను వాడుకున్నారు. తిరుగుబాటు చేసిన ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి సింహాన్ని వాడుకున్నారు. ఎన్నోసార్లు తన బిడ్డలను రక్షించుకోడానికి, శత్రువులకు బుద్ధి చెప్పడానికి వడగండ్లు, ఉరుములు, మెరుపులు, పిడుగులు, జోరీగలు, మిడతలు, తేనేటీగలు .. ఇలా ఉపయోగించుకున్నారు.

ఇక్కడే కాదు మానవాతీతంగా చాలాచోట్ల దేవుని పని జరిగింది. ఉదా: నిర్గమ 16:4 లో సుమారు ౩౦లక్షల మందికి ఆకలి తీర్చడానికి ఆకాశం నుండి మన్నాను కురిపించారు. ఒకరోజా, రెండురోజులా? 40 సుదీర్ఘ సం.లు. అసాధారణ రీతిలో పూరేల్లు/పిట్టలు కురిపించి ఇశ్రాయేలీయుల మాంసాపేక్షను తీర్చారు. నిర్గమ 16:13—18 , బండనుండి నీల్లిచ్చారు. నిర్గమ 17:1—7; ఇలా ఎన్నో అద్భుతాలు చేసారు దేవుడు! ఇక్కడ కాకిని వాడుకున్నారు. ఐతే ఈ సృష్టంతా దేవుని మాట వింటుంది గాని దేవుని స్వరూపంలో , దేవుని చేతితో చేసుకున్న మానవుడు మాత్రం దేవుని మాట వినడం లేదు సరికదా- ఏవి వద్దన్నారో అదే పని చేస్తున్నాడు.

ప్రియ చదువరీ! కాకిని వాడుకున్న దేవుడు నిన్నుకూడా వాడుకోడానికి ఇష్టపడుతున్నారు. కాకులు దేవునికి విధేయత చూపించాయి. ఇప్పుడు నీవు కూడా విధేయత చూపిస్తే నిన్ను కూడా వాడుకోగలరు దేవుడు! మొదట కాకి నోవాహుకి/ దేవునికి విధేయత చూపించక లోకంలో కలిసిపోయింది. అయితే బహుశా ఈ కాకులు మరో అవకాశం కొరకు దేవునికి మొర్రపెట్టి ఉంటాయి—మమ్మును కూడా వాడుకో—మరో అవకాశం ఇవ్వు అని. అందుకే దేవుడు ఇక్కడ కాకులకు మరో అవకాశం ఇచ్చి- కాకులను వాడుకున్నారు. ప్రియ చదువరీ! ఇంతవరకు ఆయన సేవలో/ పనిలో, దేవునికోసం వాడబడలేదా? నీకు కూడా మరో అవకాశం ఇవ్వాలని తలస్తున్నారు దేవుడు! మరి ఈ అవకాశం ఉపయోగించుకుంటావా? అవకాశాన్ని సద్వినియోగపరచుకో! దేవునికోసం వాడబడు!
ఆమెన్!


పౌరుషం గల ప్రవక్త—6వ భాగము

యెహోవా యీరే-౩


1రాజులు 17: 6
అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.

ప్రియ దైవజనమా! ఏలియాగారిని అసాధారణరీతిలో కాకులను ఉపయోగించి పోషించినట్లు గతబాగంలో చూస్కున్నాం. ఇది నిజమా అనే అనుమానం వస్తే—చరిత్ర ప్రకారం, బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఇది సత్యమే అంటున్నారు. As per Chabad దేవుడు కాకులను వాడుకున్నారు. ఆహాబు కోసం తయారు చేసిన రొట్టె-మాంసం ఆయన తినబోయే ముందు కాకులు గుంపు ఎక్కడనుండి వచ్చేదో తెలియదు గాని వచ్చి ఆ రొట్టె-మాంసమును ఎత్తుకుని పోయేవంట! ఇలా ఒక్కరోజా, రెండు రోజులా!! సుమారు ఆరు నెలలు ఇలాగే జరిగింది అంటారు. అందుకే ఆ వంటవారు, ఇంకా ఆహాబు రాజు కూడా చాలా పరేషాన్ అయ్యేవారంటా! ఐతే మరికొంతమంది బైబిల్ పండితులు ఈ కాకులు ఇలా దైవజనునికి ఆహారం తెచ్చి అవి చచ్చిపోయేవి అంటారు. ఎందుకంటే—కాకులు సాధారణంగా దూర ప్రయాణం చేయవు. దూరానికి ఎగరవు. మహా అయితే ఒక కి.మీ. ఎగురుతాయి. అవి కూడా సమానంగా ఉన్న నేలమీదనే. ఎత్తులకు అవి ఎగరవు. ఐతే ఇక్కడ ఈ కాకులు సుమారు 35 కి.మీం, కొండమీదకు ఎగిరి వచ్చేవి అవికూడా కాలిగా కాదు, రొట్టె-మాంసం నోటితో కరుచుకుని ఎగిరివచ్చి, ఏలియాగారికి ఇచ్చి అవి మరణించేవి అంటారు. ఏమో తెలియదు!! ఐతే నా ఉద్దేశ్యం ఏమిటంటే అవి చనిపోయి ఉండవు! కారణం అరచు పిల్లకాకులకు ఆహారం తానిచ్చును అని వ్రాయబడి యుండగా, (కీర్తనలు 147: 9 పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.)
తన పని చేసిన కాకులను దేవుడు చంపుతారా? ఖచ్చితంగా పోషించి ఉంటారు. కాబట్టి దేవుడు అసాధ్యాలు—సుసాధ్యాలు చేస్తారు. ఏలియా గారిని పోషించిన దేవుడు నిన్నుకూడా పోషించగలరు! ఎప్పుడు?—మొదట నీవు దేవుని మాటవిని, దేవుని పని చేసినప్పుడు.! మరి నీవు సిద్ధమా??!!!

కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. 1రాజులు 17: 7
మరి వర్షం-మంచు లేదుకదా, కేరీతు వాగు ఎండిపోయింది.
1రాజులు 17: 8
అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను-నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము;

చూడండి. యెహోవా యీరే—యెహోవా యీరేగా మరొక్కసారి ప్రత్యక్షం అవుతున్నారు. ఇప్పుడు నీరు ఎండిపోయింది కదా, మరి తనభక్తున్ని ఎలా పోషించడం? ఇప్పుడు ఆయనను పోషించటానికి ఒక అన్యురాలిని ఏర్పాటుచేసుకున్నారు దేవుడు! అది సారేపతు. అది మధ్యధరా సముద్రానికి(Meditarian Sea) ఆనుకొని ఉంది. ఇది తూరు సీదోనుల ప్రాంతానికి చెందినది. ఈ తూరు—సీదోను—సారేపతు ఈ ప్రాంతమంతా కలిసి ఫెనేకియ ప్రాంతం అనేవారు అప్పట్లో! ఇంకా బాగా అర్ధం కావాలంటే: యేసయ్య దగ్గరకు ఒక స్త్రీ- తన దయ్యం పట్టిన కుమార్తె స్వస్థత కోసం వస్తే, ఆమెను యేసయ్య కుక్కతో పోల్చినా బాధపడక—యేసయ్య హృదయాన్నే కదిలించి తన కుమార్తెను బాగుచేసుకుంది కదా సురేఫెనేకియ దేశానికి చెందినా స్త్రీ, ఆమెది ఈ ప్రాంతమే! సారేపతు పక్క గ్రామమే అది. చరిత్ర ప్రకారం ఈ సురేఫెనేకియా ప్రాంతంలో దేవుడంటే విశ్వాసం కలగటానికి ఏలియాగారు అప్పట్లో అక్కడ నివసించినప్పుడు చేసిన పరిచర్యే కారణం అంటారు.

సరే, ఇప్పుడు దేవుని మాట విని ఏలియాగారు సుమారు 100 కి.మీ. లు ప్రయాణం చేసి ఈ సారేపతు కు వెళ్తున్నారు. ఐతే ఈ 8,9 వచనాల ప్రకారం ఏలియాగారికి మరికొన్ని అనుమానాలు రావాలి. దేవుడు సీదోను పట్టణ సంభంధమగు సారేపతుకు పొమ్మన్నారు. ఇదే సీదోనీయుల రాజకుమార్తె వల్లనే దేవుని ప్రవక్తలు హతమవుతున్నారు. ఇశ్రాయేలీయులు బయలును పూజిస్తున్నారు. ఐతే దేవుడు అక్కడికే వెళ్ళమంటన్నారు - -- ఏమిటి సార్! అక్కడికి వెల్లమంటున్నారేమిటి అని అడగాలి, తోమాగారు యేసయ్యను అడిగినట్లుగా!! గాని ఏలియాగారు అలా అడగలేదు.
2) ఇక మరో విషయం నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి ఆజ్ఞాపించితిని అంటున్నారు. మొదట అన్యుల పట్టణం వెళ్ళమన్నారు—ఇప్పుడు విధవరాలికి ఆజ్ఞాపించితిని అంటున్నారు. ఆ గ్రామంలో ఎంతోమంది గొప్పవారు, ధనికులు ఉండగా కేవలం విధవరాలి దగ్గరికి వెల్లమంటున్నావు—ఇదేమిటి బాబు అని అడగడం లేదు! ఏమీ అడగకుండా దేవునిమాటకు లోబడి వెళ్లిపోతున్నారు. వెళ్ళిపోవడం సాధ్యమా? తనను చంపాలని మొత్తం దేశమంతా వెదుకుతున్నారు అలాంటిది, దేశం దాటి పరాయి దేశం వెళ్ళాలి. ఏమిటి ప్రభువా అని కూడా అనలేదు! యెహోవాయీరే మీద నమ్మకముంచి. తనకు తెలుసు శత్రువులు ఎదురైనా తనను ఏమీ చేయలేరని! కారణం God is My Provider! God Is My Strenth! And God Is my Protector!!! అందుకే ధైర్యంగా సాగిపోతున్నారు ఏలియాగారు.

ప్రియ చదువరీ! నీకు అలాంటి దృఢమైన విశ్వాసము, భక్తి ఉందా? ఏలియాగారికి అంతటి విశిష్టమైన భక్తిశ్రద్ధలు ఉన్నాయి కాబట్టే అంతగొప్పగా వాడుకున్నారు. మరి నీవుకూడా వాడబడతావా? ఐతే నీవు కూడా అటువంటి ధృడబక్తి, వ్యక్తిత్వం పొందుకో!
దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త—7వ భాగము

యెహోవా యీరే-4


1రాజులు 17: 10
అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి - త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.

ప్రియ దైవజనమా! మనం కొద్దిరోజులుగా ఏలియాగారి జీవితంలో యెహోవాయీరేను ధ్యానం చేసుకుంటున్నాము.

ఏలియాగారు కేరీతువాగునుండి బయలుదేరి సారేపతు గ్రామానికి చేరుకొని, ఆ ఊరి గవినె దగ్గర ఆగారు. గవినె అనగా గేటు. ధ్వజస్తంభ ద్వారము! మరి ఏలియాగారు ఇక్కడికి రావడానికి ఎన్నిరోజులు పట్టిందో తెలియదు. కారణం
1 రాజులు, 2 రాజులు గ్రంధాల ప్రకారం ఏలియాగారి దగ్గర గాడిదలు గాని, ఒంటెలు కాని, గుర్రాలు గాని లేవు. ఆయన పేదవాడు కదా! అందుకే ఎక్కడికి వెళ్ళినా నడచిగాని, పరుగెత్తి గాని వెళ్ళేవారు. 1 రాజులు 18,19 ల ప్రకారం!! ఈ గేటు దగ్గర ఆయనకు ఒక విధవరాలు- పుల్లలు ఏరుకుంటూ కనిపించింది. మరి పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ లు, కరెంటు కుక్కర్ లు లేవు కదా, పుల్లను వంటచెరకుగా ఉపయోగించుకుని వంట చేసుకునేవారు.

ఇక్కడ ఆమెను చూసిన వెంటనే ఏలియాగారికి దేవుడు చెప్పిన స్త్రీ, విధవరాలు ఈమెనే అని అర్ధం అయిపోయింది. ఎలా తెలిసిపోయింది? ఇంతకుముందు ఎప్పుడూ ఆమెను ఏలియా గారు చూడలేదు కదా!!?? కారణం ఏలియా గారు ఆత్మపూర్ణుడు! ఆ ఆత్మద్వారా ఆయనకు వివేచన వరం వలన ఇట్టే గ్రహించిఉండొచ్చు దేవుడు నాపోషణకోసం ఏర్పాటు చేసిన విధవరాలు ఈమెనే అని! లేదా పరిశుద్ధాత్ముడు చెప్పి ఉంటారు. ఏదిఏమైనా ఆమెకోసం ఏలియాగారు ఊరంతా తిరుగకుండా ఆమెనే గేటు దగ్గరక తీసుకొని వచ్చారు. ఒకవేళ ఊరిలోనికి పోయి వెదుకుదామంటే, ఆ ఊర్లో ఎంతోమంది విధవరాళ్లు ఉండవచ్చు. ఆమె పేరు కూడా తెలియదు ఏలియాగారికి, దీనికోసం యేసుప్రభులవారు కూడా ఒకసారి తన ఉపమానాన్ని చెప్పారు. లూకా 4:24—25; అందుకే దేవుడు యెహోవాయీరే అయ్యారు. ప్రియ దేవుని బిడ్డా! నీవు కూడా ఆయనను మనసా-వాచా-కర్మేనా నమ్మితే దేవుడు నీకుకూడా సహాయం చేస్తారు. అందుకే బైబిల్ గ్రంధం సెలవిస్తుంది. రోమీయులకు 8: 28
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
ఇది ఏలియాగారి పట్ల 100% నెరవేరింది.

దేవుడు తన ప్రజల అవసరాలు తీర్చేందుకు, తన సంకల్పము, నెరవేర్చేందుకు , మానవ హృదయాలను వారికి తెలియకుండానే కదిలించగలరు! ఇక్కడ విధవరాలినే గేటు వద్దకు నడిపించారు దేవుడు! అక్కడ ఇస్సాకు వివాహం కోసం బావియొద్ద ఎలియాజరు ప్రార్థించగా—బావియొద్దకే తీసుకుని వచ్చారు రిబ్కాను దేవుడు! (ఆదికాండం 24:15); మందిరం కాల్చబడింది అని విన్న నేహెమ్యా గారు దేవునికి ప్రార్థించగా, నేహెమ్యా ఏమీ చెప్పకుండానే, రాజైన అర్తహసస్త హృదయాన్ని కదిలించారు దేవుడు! (నెహెమ్యా 1); అదీ ఆయన ప్రత్యేకత! ఆయన స్టైల్!! ఇది మానవులకు అసాధ్యమే గాని, దేవునికి సమస్తము సాధ్యమే! అందుకే దేవుడు యెహోవాయీరే అయ్యారు! అలనాడు అబ్రాహాముగారు ఇస్సాకుని బలిగా అర్పించడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు – పనివారికి, ఇస్సాకుకి అబ్రాహాము గారు ఏమని చెప్పారు? కొండమీద దేవుడే చూసుకుంటారు. యెహోవాయీరే అని!!! నిజంగా దానిని నెరవేర్చటానికి , తన భక్తులను కాపాడటానికి—దేవదేవుడే- బలికి పోట్టేలుగా దిగి వచ్చి—ఇస్సాకు స్థానంలో బలిదానం అయ్యారు. నిజంగా ఆరోజు యెహోవాయీరే అంటే ఏమిటో చూపించారు. (ఆదికాండం 22); అలాగే 2000 సం.ల క్రితం , మానవాళి పాపకూపంలో మ్రగ్గిపోతూ , నాశనానికి జోగుపడుతుండగా, ఆ దేవదేవుడే—సశరీరుడుగా – ఈ భూలోకానికి వచ్చి—తనసొంత రక్తముతో – పాప ప్రక్షాళన చేశారు. యెహోవాయీరే ఆయనే!

ప్రియ చదువరీ! నాకు ఇదిలేదు,, అదీలేదు! నాకొడుక్కి ఉద్యోగం లేదు! పిల్లలు లేరు, మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, మాకు ఇల్లులేదు! ఎప్పుడూ లేదు లేదు లేదు అంటూ ఏడవడమే తప్ప, ఆయన యెహోవా యీరే అని ఎప్పుడైనా నమ్మావా? కాగా ఆయన క్రీస్తుయేసు మహిమలో మీ ప్రతీ అవుసరమును తీర్చును అనేమాట మరచిపోయావా? (ఫిలిప్పీ 4:19); అందుకే యేసయ్య అంటున్నారు: మత్తయి 6: 25
అందువలన నేను మీతో చెప్పునదేమనగాఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణము,వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?
మరి ఎందుకు దిగులు? నీచింత యావత్తు దేవుని మీదనే వేసెయ్! మత్తయి 6: 33
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
అప్పుడు నీ అవుసరాలు అన్నీ దేవుడే చూసుకుంటారు.

మరి నీవు సిద్ధమా??!!
దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త—8వ భాగము

యెహోవా యీరే-5

1 Kings(మొదటి రాజులు) 17:10,11,12
10. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి - త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.
11. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచి-నాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.
12. అందుకామె-నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.

ప్రియదైవజమా!. ఏలియాగారు ఇప్పుడు ఆమెను చూసి ఆమెతో సంభాషణ చేస్తున్నారు ఏలియా గారు. ఇక్కడ ఆయన చేసిన సంభాషణలో మనం నేర్చుకోవలసినవి ఉన్నాయి.

మొదటగా పదవ వచనం చివర్లో చూడండి *వేడుకొనెను* అనే పదం కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఏలియా గారు గొప్ప ప్రవక్త, పౌరుషం గల ప్రవక్త. గాని ఇక్కడ తన హోదా, స్థితి ఏమీ చూపించడం లేదు. ఎంతో మర్యాదగా అడుగుతున్నారు. మన వాడుక భాషలో చెప్పాలంటే: అమ్మా దయచేసి నాకు త్రాగడానికి కొంచెం నీరు తెచ్చి మీరు ఇవ్వగలరా? అని అడిగారు. చూడండి ఎంత మర్యాదగా అడుగుచున్నారో! ఓ స్త్రీ! యెహోవా దేవుని పేరిట చెబుతున్నాను, నేను ఆయన ప్రవక్త ను. నాకు నీరు తీసుకుని రా అని ఆర్డర్లు వేయలేదు. చాలా మర్యాదగా అడిగారు. ఈయన చదువుకోలేక పోయినా సంస్కారం పుష్కలంగా ఉంది. ప్రియ చదువరీ/ విశ్వాసి/ సేవకుడా! ఇలా మర్యాదగా మాట్లాడుతున్నావా లేక దేవుడు నీకిచ్చిన హోదాతో విర్రవీగి, పొగరుగా మాట్లాడుతున్నావా? దేవుడు అంటున్నారు మీరు మర్యాదగా మాట్లాడాలి. కృతజ్ఞత కలిగి మాట్లాడాలి. పొగరుగా మాట్లాడవద్దు అని చెబుతున్నారు.
మన మాటలు ఏ రీతిగా వుండాలో లేఖనాలు సెలవిస్తున్నాయి.

1. మృదువుగా ఉండాలి:
"మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును."
(సామెతలు 15:1).

2. కృపాసహితంగా ఉండాలి: "ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి."
(కొలస్సి 4:6).
3. క్షేమకరంగా ఉండాలి: "వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి."(ఎఫెసి 4:29‬). ‬‬‬‬‬‬
4. కృతజ్ఞతతో కూడినవై ఉండాలి: "కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు." (ఎఫెసి 5:4 )
5. ఆలోచించి మాట్లాడేవిగా ఉండాలి: "మాటలాడుటకు నిదానించువాడునై యుండవలెను."
(యాకోబు 1:19)‬ 6. కొద్దిగా ఉండాలి: "దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను." (ప్రసంగి 5:2 )‬‬‬‬‬‬

కాబట్టి ప్రియ చదువరీ! మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి.
కారణం మీ మాటలే మీకు మిత్రులను/ శత్రువులను చేస్తాయి.

మనము మరల మన పాఠ్యభాగానికి వద్దాము. ఆమెను పిలిచి ఎంతో మర్యాదగా అమ్మా దయచేసి నాకు త్రాగటానికి నీరు ఒక పాత్రతో తీసుకుని వస్తారా అని అడిగారు. వెంటనే ఆమె పుల్లలు ఏరుకోవడం ఆపి ఏలియా గారికి నీరు తీసుకుని రాడానికి బయలుదేరింది. ఇక్కడ ఒక విషయం గుర్తు చెయ్యనీయండి. పూర్వకాలంలో అది ఏ దేశమైన సరే, ఇలాంటి నీరు, ఆహారం విషయంలో అతిధులను అలాగే సత్కరించేవారు. అతిధి దేవోభవ అనేమాట అప్పుడే వచ్చింది. నేటి దినాలలో ఇలాంటి సత్కారాలు కనుమరుగై పోతున్నాయి. ప్రియ విశ్వాసి అతిధులను సత్కరించడం, పరదేశులను ఆదరించడం మరచిపోకు. బైబిల్ సెలవిస్తుంది ఇలా చేసి అనేకమంది తెలియకుండానే ఆతిధ్యము ఇచ్చి ఎన్నో దీవెనలు పొందారు. హెబ్రీ 13:2;

ఇప్పుడు ఈ విధవరాలు వెల్తుండగా ఏలియా గారు మరలా ఆమెను పిలిచి : నాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.
అందుకామె-నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.
ఇంకా బాగా అర్థం కావాలంటే అయ్యా నా దగ్గర కాల్చిన రొట్టె ఒకటి కూడా లేదు. నీ దేవుడైన యెహోవాజీవము తోడు తొట్టిలో కొంచెం పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప, రొట్టె కాల్చడానికి సరిపోయే పిండి, నూనె నా దగ్గర లేవు అని దీన స్థితిని యదార్ధంగా చెప్పేసింది.
ఇక్కడ మరో విషయం పరిశీలించాలి. విధవరాలు సీదోను దేశానికి చెందినది. ఈమె ఎప్పుడూ ఏలియా గారిని చూడలేదు మరి నీ దేవుడైన యెహోవా జీవముతోడు అని ఎలా చెబుతుంది? మొదటగా ఆయన మాట్లాడే విధానం వలన కావచ్చు.
ఇంకా ఆయన వేష భాష వలన కావచ్చు. కొందరు మాట్లాడుతుంటే దేవదూత మాట్లాడుతున్నట్లు ఉంటుంది. పెట్టాలనిపిస్తుంది. అదే కొందరు మాట్లాడుతుంటే కొట్టాలనిపిస్తుంది. ఇక్కడ ఈయన మాటలు ఇట్టే అర్ధమైపోయాయి ఆయన దైవజనుడని. ప్రియ విశ్వాసి/సేవకుడా! నీ మాటలు/ వేషధారణ ఎలా ఉన్నాయి? నీ మాటలలో, చేతలలో, వస్త్రధారణలో క్రీస్తు కనిపిస్తున్నారా లేక నీ హంగు ఆర్భాటాలు కనిపిస్తున్నాయా? ఒకవేళ క్రీస్తుని మాత్రమే చూపిస్తూ ఉంటే నీవు ధన్యుడవు! నీ మాటలు, నీ ప్రవర్తన, నీ జీవితమే ఒక పత్రికగా మారిపోవాలి. ఏలియా గారి జీవితం కరపత్రికగా మారిపోయింది. చదువులేని విధవరాలుకి ఏలియాలో దేవుడు కనిపించారు. మరి నీ జీవితం/ ప్రవర్తన ద్వారా యేసయ్య కనిపిస్తున్నారా?

చూడండి, దానికి ఏలియా గారి సమాధానం:
1 Kings(మొదటి రాజులు) 17:13,14,15
13. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను-భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.
14. భూమి మీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని
15. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పినమాటచొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె యింటి వారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి.
చూశారా ఏం జరిగిందో, యెహోవా యీరే మరొక్కసారి ప్రత్యక్షమయ్యారు ఇక్కడ! గాని ఎప్పుడూ? దేవుని కార్యాలు జరగాలంటే సంపూర్ణ విధేయత కావాలి. ఎందుకు ఏమిటి ఎలా? ఇలాంటివి అడగకూడదు. నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూస్తావు అని మార్తతో అన్నారు యేసుక్రీస్తు. యోహాను 11:40; నీవు నమ్ము, విశ్వసించు అంతే!
ఇక్కడ కార్యం జరిగింది అంటే మొదటగా ఆమె నమ్మింది. రెండవదిగా ప్రధమ ఫలము దేవునికి ఇవ్వు. మూడవదిగా దేవునిపని మొదటచేసి తర్వాత నీవు అనుభవించు. విధవరాలు ఇంకా అన్యురాలు నమ్మింది. ఏలియా గారికి అప్పము చేసి తీసుకుని వచ్చి ఇచ్చేసింది. ఇంటికి వెళ్ళి చూసుకొంది. తొట్టెలో పిండి అయిపోలేదు. బుడ్డిలో నూనె అయిపోలేదు. సుమారుగా మూడు కరవు సంవత్సరాలలో ఏ కొరత లేకుండా తను తనబిడ్డా జీవించింది. ఇశ్రాయేలు దేశంలో, తూరు సీదోనులలో కరువు ఉంది గాని నమ్మిన విధవరాలుకి, ఏలియా గారికి లోటు లేదు. తర్వాత వచనాలు ప్రకారం ఆమె ఏలియా గారిని ఇంటికి తీసుకుని వచ్చి మేడగది ఇచ్చింది.

ప్రియదైవజనమా! ఒక అన్యురాలు నమ్మి కరువునుండి తప్పించుకుని రక్షింపబడింది కదా! రక్షణ పొంది ఇన్నేళ్ళు అయ్యింది కదా! నీవెందుకు నమ్మలేక పోతున్నావు. నీ గృహంలో అద్భుతాలు జరగడం లేదు అంటే నీ అపనమ్మకమే, అవిశ్వాసమే! నీవుకూడా నమ్ము! నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే! మార్కు 9:23,24; చాంద్రరోగం పట్టిన కుమారుని తండ్రిలా వేడుకో! నమ్ముచున్నాను నాకు అపనమ్మకముండకుండా సహాయం చేయుము అని దేవున్ని వేడుకో! అద్భుతాలు పొందుకో!

ఆమెన్!

పౌరుషం గల ప్రవక్త – 9వ భాగం


1రాజులు 17: 17
అటుతరువాత ఆ యింటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువ జాలనంత వ్యాధిగలవాడాయెను.

ప్రియులారా! ఈ భాగంలో మనకు ఆ విధవరాలి కుమారుడు చాలా జబ్బుపడి చనిపోయాడు. 17వ వచనంలో చనిపోయేంత వ్యాధిగల వాడాయెను అని ఉంది గాని 22 వ వచనం ప్రకారం చనిపోయాడు. ఇది అనుకోని పరిస్తితి! సుమారు ౩ సం.లు దైవజనుడు ఆ గృహంలో ఉన్నారు. అంతా సాఫీగా జరిగిపోతోంది అంటూంటే ఇలా జరిగింది.

సరే! ఇంతకీ ఈ మూడు సం.లు ఏలియాగారు ఏం చేశారు అక్కడ! అంచక్కా తినేసి ఎంజాయ్ చేసేవారా? మరి ఏం చేశారు? గతభాగాలలో చెప్పినట్లు ఆయన చాలా ప్రార్ధనాపరుడని, విశ్వాస వీరుడని మనం చూసుకున్నాం కదా! మరి అలాంటి దైవసేవకుడు తినేసి పడుకుంటారా? ఒకవేళ నిజంగా అలాగే తినేసి పడుకొందామని ఉన్నా, అతనిలో ఉన్న సువార్త భారం అతనిని పడుకోనిస్తుందా? ఖచ్చితంగా అలాచేసి ఉండకపోవచ్చు అని నా ఉద్దేశ్యం! మరి ఏం చేశారు?

ఇశ్రాయేలీయుల రక్షణ కోసం, వారి మారుమనస్సు కోసం, వారిలో ఉన్న అవిశ్వాసం పోయేలాగా ప్రార్ధించి ఉంటారు. తనకి ఆశ్రయం ఇచ్చిన గృహస్తుల రక్షణ కోసం ప్రార్దించి ఉంటారు. ఒకసారి చరిత్ర చూసుకుంటే అది నిజమే! గతభాగంలో చెప్పినట్లు సురేఫెనేకియా గ్రామపు స్త్రీ యేసయ్య దగ్గరకు తన కుమార్తె స్వస్తత కోసం వచ్చింది కదా, ఆమెకు ఆ విశ్వాసం ఎలా వచ్చింది? అది ఏలియాగారి పరిచర్య వలననే అంటారు బైబిల్ పండితులు! ఆయన కాళీగా కూర్చుని తినలేదంట! ఆ గ్రామస్తులకు సువార్త చెబుతూ ఉండేవారు. ఐతే చరిత్ర ప్రకారం ఆయన సువార్త చెప్పడానికి ఎక్కడికి వెళ్ళలేదు, వారే వారి ఇంటికి వచ్చేవారు కారణం—ఊరు మొత్తం తిండిలేక పస్తులుంటే—ఈ గృహంలో మాత్రం పొయ్యి ఆరలేదు! ఏమిటి అని అందరూ ఆరా తీస్తే, ఆమె దాచుకోకుండా చెప్పేసింది. ఒక ఇశ్రాయేలీయుల దైవజనుడు వచ్చాడు మా ఇంటికి, ఆయన చెప్పిన మాటల ప్రకారం మా ఇంట్లో తొట్టె, బుడ్డి పొంగిపోతుంది. ఇక చూసుకోండి, ఈమెకు ఏమీ లేనప్పుడు పలకరించిన దిక్కు లేదు గాని, ఇప్పుడు ఆమెకు లేనిపోని చుట్టరికం కలుపుకొని ఎంతమంది చుట్టాలు వచ్చి ఫ్రీగా తినేసి పోతున్నారో తెలియదు! సరే, ఇలాంటి వాళ్లకు ఏలియాగారు సువార్త చెబుతున్నారు. దేవునికోసం , ఆయన మహాత్కార్యాలు కోసం చెబుతున్నారు.

*ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం! దేవుడు ఈ మూడున్నర సంవత్సరాలు ఏలియాగారిని ఎందుకు దాగుకోమన్నారు? బహుశా ఇశ్రాయేలీయులు మారుతారేమో, పశ్చాత్తాప పడతారేమో అనిఎదురు చూడటానికి కావచ్చు! ఐతే మరొక మహత్తర ఘట్టం కోసం ఏలియాగారిని దేవుడు దాగుకోమని చెప్పి ఉండవచ్చు—అదేమిటంటే ఈ రహస్య పరిచర్య తరువాత గొప్ప బహిరంగ పరిచర్య ఏలియాగారికోసం ఎదురుచూస్తుంది. దానికోసం పూర్తిగా తయారవడానికి , ప్రార్ధనలో పూర్తిగా రీచార్జ్ అవడానికే దేవుడు ఇలా చేసి ఉండవచ్చు. తన బహిరంగ పరిచర్యకు తర్ఫీదును ఇవ్వడానికి కావచ్చు. అంతేకాకుండా అన్యుల రక్షణ కోసం కూడా కావచ్చు! అందుకే ఇక్కడ ఉండి ఆయన ప్రార్ధన చేస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నారు*.

ఇలా సువార్త ప్రకటించేటప్పుడు ఒకరోజు హటాత్తుగా ఈ విధవరాలి కుమారుడు చనిపోయాడు. వెంటనే ఈమె అంటుంది—నేను చేసిన పాపాలు నాకు గుర్తుకుచేయడానికి ఇలా చేసావా అంటుంది. 18వ వచనం.
ఆమె ఏలీయాతో - దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా
ఇలాంటి సంఘటన ఎలీషాగారికి కూడా ఎదురైంది. ఘనురాలైన స్త్రీ కుమారుడు హటాత్తుగా చనిపోయాడు. ఈ దైవజనులు ఇలా ఆశ్చర్యపడటానికి కారణం దేవుడు జరుగబోయే కార్యాలు ముందుగా తన భక్తులకు చెప్పకుండా ఏమీ చేయరు. ఇక్కడ ఏలియాగారికి చెప్పలేదు, అక్కడ ఎలీషాగారికి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అది దేవుని ఇష్టం! మనకు అడిగే హక్కు లేదు. ఐతే ఇలాంటి విషమ పరిస్తితులలో కూడా తన భక్తులను వాడుకుని ఎన్నో కార్యాలు చేస్తారు. అందుకే ఆ బిడ్డను తీసుకుని ప్రార్ధిస్తున్నారు ఏలియా గారు ఇక్కడ! ఈ 19 వ వచనంలో ఒక విషయం మనకు అర్ధం అవుతుంది. ఈ విధవరాలు ఏలియాగారికి పై అంతస్తు గది ఇచ్చింది దైవజనుడికి, అనగా తనకున్న గదులలో అత్యంత శ్రేష్టమైన గది, ఆయన ప్రార్ధన చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరూ ఆయనని డిస్టర్బ్ చేయని గదిని ఇచ్చింది ఆమె! ప్రియ చదువరీ! ఒక అన్యురాలు ఒక దైవజనునికి ఉన్నదానిలో అత్యంత శ్రేష్టమైనవి ఇస్తే, నీవు నీ దేవునికి, నీ దైవసేవకునికి ఏమి ఇస్తున్నావో ఒకసారి పరిశీలించుకో! కయీను ఏవో కొన్ని ఇచ్చాడు, అర్పణ అంగీకరించబడలేదు. హేబెలు దేవునికి ఏవి కావాలో తెలుసుకొని, వాటిలో శ్రేష్టమైనవి ఇచ్చాడు అందుకే ఆయన అర్పణ అంగీకరించబడింది. మరి నీవు అర్పించేవి దేవునిచే అంగీకరించ బడుతున్నాయా? ఏవి అర్పిస్తున్నావు?

ఇక 20వ వచనంలో
యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహో వాకు మొఱ్ఱపెట్టి. .
ఇక్కడ ఏలియా గారు ప్రార్ధిస్తున్నారు అయ్యా ఏమిటి ప్రభువా నాకు ఆశ్రయం ఇచ్చిన ఈమెకు ఇలాంటి అపాయం కలుగాజేస్తావా అని విలపిస్తున్నారు. ఒక దైవసేవకునికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఇక్కడ కనిపిస్తుంది. తనకు అప్పగింప బడిన పిల్లలు అనగా విశ్వాసుల కోసం కన్నీటితో ప్రార్ధన చేయడం! మనలో ఎంతమంది విశ్వాసుల కొరకు, వారి అవసరాల కొరకు, వారి ఇరుకులు ఇబ్బందుల కొరకు కన్నీటితో ప్రార్ధన చేస్తున్నాము? ఏలియాగారు కన్నీటితో మొర్రపెట్టారు. 22
యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.
ఇప్పుడు ఆ బిడ్డ బ్రతికాడు అందుకు ఆమె అంటుంది: 24
ఆ స్త్రీ ఏలీయాతో-నీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందు చేత నేనెరుగుదు ననెను.
నీవు దైవ జనుడవై యున్నావనియు, నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును అంటుంది. గమనించండి ఈ మూడు సం.లు ఆమె ఫ్రీగా తింటుంది కదా! మరి అప్పుడు ఏమని అనుకొంది? ఏదైనా మాయామంత్రం అనుకొందా? కాని ఏదిఏమైనా ఇప్పుడు ఈ అద్భుతం ద్వారా అనగా చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతకడం ద్వారా మొదటగా ఆమె విశ్వాసం దృఢమైంది, రెండు: ఆ గ్రామస్తులలో యెహోవాయే నిజమైన దేవుడు అని తెలిసింది! మూడు: ఏలియాగారి విశ్వాసం, ఆత్మీయస్తితి ప్రజ్వరిల్లింది.

ప్రియ చదువరీ! ఈ భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడారా? కాళీగా ఉన్నప్పుడు దేవుని సువార్త ప్రకటించావా? పొరుగువారి రక్షణ కోసం, నీ తోటి విశ్వాసుల కోసం భారంతో ప్రార్ధన చేస్తున్నావా? ప్రియ దేవునిబిడ్డా! దేవుడు అద్భుతాలు చేస్తారు, నీవు కన్నీటితో విశ్వాసంతో ప్రార్ధన చేసినప్పుడు. నీవు ప్రార్ధించకపోతే, విశ్వసించకపోతే ఆ కార్యాలు జరుగవు! నేడే అసాధ్యాలు- సుసాధ్యాలు చేసే దేవునికి, అధ్భుతకార్యాలు చేసే దేవునికి మొర్రపెట్టి గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టు!
దైవాశీస్సులు!

పౌరుషం గల ప్రవక్త - 10వ భాగం


1రాజులు 18: 1
అనేకదినములైన తరువాత మూడవ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై-నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను; నీవు వెళ్లి అహాబును దర్శించుమని సెలవియ్యగా,

ప్రియ దైవజనమా! 17వ అధ్యాయం మొదట్లో దేవుని తీర్పు/ ఉగ్రతను ప్రకటించారు ఏలియాగారు. అప్పటినుండి ఆ దేశంలో వర్షం గాని, కురవడం మానేసింది అని చూసుకున్నాము.

ఇప్పుడు ఈ 18:1 లో దేవుడు చెబుతున్నారు, ఎప్పుడు మూడవ సం.రమందు అని వ్రాయబడియుంది గమనించాలి- ఆయన సుమారు ఆరు నెలలు కీషోను వాగు దగ్గర ఉన్నారు. ఇక్కడ మూడు సం.లు ఉన్నారు. ఇదే విషయాన్నీ యేసుప్రభులవారు (లూకా 4:25), ఇంకా యాకోబు గారు కూడా ద్రువీకరిస్తున్నారు. (యాకోబు 5:17) మూడున్నర సం.లు వర్షంగాని, మంచుగాని పడలేదు అని. సరే , ఈ సం.లు గడచినా తర్వాత దేవుడు చెబుతున్నారు – నేను భూమిమీద వర్షం కురిపింపబోవుచున్నాను. కాబట్టి నీవు వెళ్లి ఆహాబును దర్శించుము!

ప్రియులారా! ఇక్కడ ఒక్కోమాట పరిశీలించవలసిన అవసరం ఉంది. మొదటగా: దేవుడు అంటున్నారు—నేను భూమిమీద వర్షమును కురిపింపబోవుచున్నాచు. ఓహో! చాలా మంచిది. దానికోసమే ఇశ్రాయేలీయులు, ఇంకా పరిసర దేశస్తులు కూడా ఎంతో ఆశక్తితో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ దేవుడు భూమిమీద వర్షం కురిపించాలి అనే నిర్ణయం తీసుకోడానికి కారణం ఏమిటి? వారు అనగా ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడ్డారా? దేవునికి మొర్రపెట్టారా? లేదు లేదు లేదు!! అయ్యో! మరి ఎందుకు కురిపించాలి అనుకుంటున్నారు దేవుడు? కారణం తన ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు గాని వారు ఆకలిభాదలతో, కరువుకాటకాలతో, ఈతిభాదలతో కృశించిపోవాలని ఆ దేవుడు ఎప్పుడూ అనుకోలేదు. అన్ని విషయాలలో సౌక్యముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మరి ఎందుకు వర్షం ఆపేశారు? తన భక్తుడు చెప్పేడనా? కాదు , దేవుని తీర్పునే భక్తుడు ప్రకటించారు గాని తన సొంత పలుకులు కాదు. సొంత పలుకులకు, చిలక పలుకులకు అంత శక్తి లేదు! దేవుని ఆజ్ఞమేరకు, వాగ్దానం మేరకు పలికిన పలుకబడిన వాక్యానికి, మాటలకు అత్యంత శక్తి ఉంది. ఆ పలుకబడిన మాట మూడున్నర సంవత్సరాలు వర్షాన్ని, మంచును ఆపేసింది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు మంచివారు, నీతిమంతులు కాకపోయినా, దేవుడు మంచివాడు, నీతిమంతుడు, దయామయుడు, కరుణామయుడు కాబట్టి ఇశ్రాయేలీయులు నమ్మదగిన వారు కాకపోయినా ఆయన నమ్మదగినవాడు, కరుణావాత్సల్యుడు కాబట్టి జాలిపడి, తన ప్రజలు పడే వేదన చూసి ఇక్కడ దేవుడే ఏలియాగారిని పిలిచి—కొడుకా! నేను భూమిమీద వర్షాన్ని కురిపించబోతున్నాను. వెళ్లి ఆహాబును దర్శించు అంటున్నారు.

సరే! ఇంతకీ వెళ్లి ఆహాబును దర్శించు అంటున్నారు ఏమిటి దేవుడు? ఇప్పడు ఇశ్రాయేలు దేశం వెళ్లి ప్రార్ధించు, లేదా ఇశ్రాయేలు దేశం వెళ్లి చెప్పు నేను భూమిమీద వర్షాన్ని కురిపిస్తున్నాను అని చెప్పొచ్చుగా, ఆహాబును దర్శించడం ఎందుకు? కారణం: గతంలో చెప్పిన విధముగా దేవుడు వర్షాన్ని ఆపేసిన తర్వాత—అది దేవుని తీర్పు/ శాపమని గ్రహించకుండా—ఎవడో ఒక కొండజాతివాడు ఏలియా అంట—వాడు వచ్చి శపించేశాడు వర్షం మంచు పడకుండా—ఇప్పుడు వాడిని పట్టుకొని చంపేస్తే—ఈ శాపం విరిగిపోతుంది- వర్షం పడుతుంది అని అనుకోవడం మొదలుపెట్టారు, గాని ఇది దైవ నిర్ణయం కాబట్టి పశ్చాత్తాప పడుదాం, దేవునికి కన్నీటితో ప్రార్ధన చేద్దాం అనేది లేదు వాళ్లకు. అందుకే ఇప్పుడు ఈ పని దేవుని వలనే కలిగింది అనిఇశ్రాయేలీయులందరికి తెలియజేయాలని దేవుడు అనుకొన్నారు. అందుకే ఇప్పుడు వెళ్లి ఆహాబును దర్శించు అంటున్నారు దేవుడు! ఇక ఆహబును దర్శించడానికి మరొక ముఖ్య ఉద్దేశ్యము, ఏలియాగారి పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే: ఆహాబు బార్య యెజెబెలు/పెంటమ్మ వల్ల ఇశ్రాయేలీయులందరూ దేవుణ్ణి విడచి బయలును పూజించడం మొదలు పెట్టారు. దేవుని నుండి దూరమైపోయారు. ఇప్పుడు వారిని తిరిగి దేవుని దగ్గరకు తీసుకుని రావడమే ఏలియాగారి మిషన్! అందుకే దేవుడు ఏలియాగారిని ఏర్పాటుచేసుకున్నారు / పిలచుకొన్నారు. ఇంతవరకు రహస్యముగా చేసిన పరిచర్య ఇప్పుడు బహిరంగముగా చేయాలి. అందుకే దేవుడు వెళ్లి ఆహాబును దర్శించు అంటున్నారు.

ఇక మరో ముఖ్యమైన విషయం: దేవుడు ఆహాబును వెళ్లి దర్శించమంటే—ఏలియాగారు మారుమాట్లాడకుండా ఎస్ సార్! అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఆహాబు- యెజెబెలు—ప్రవక్తలు ఈ దుష్టత్రయం ఏలియాగారిని పట్టుకొని చంపాలని, దేశమంతా తిరుగుతూ , ఏలియా అక్కడ లేడని అందరితో ప్రమాణాలు చేయిస్తున్నారు. ఇంతటి గడ్డు పరిస్తితులలో కూడా ఏలియాగారు భయపడక ధైర్యంగా శత్రువునే ఎదుర్కోడానికి వెల్లిపోతున్నారేమిటి? తనకు తెలుసు , ఆహాబును దర్శిస్తే మరణం తప్పదు, గాని జీవాధిపతి, మరణాధిపతి అయిన దేవుడు తనతో ఉన్నప్పుడు ఈ ఆహాబుగాని, ఆ పెంటమ్మ గాని ఏమీ చేయలేరు అని ఏలియా గారికి చాలా బాగా తెలుసు! అంతేకాకుండా దేవునికోసం చావడానికి గాని చంపటానికి గాని ఏలియాగారు ఎప్పుడో సిద్దమై పోయి (డిసైడ్ అయిపోయి) సేవకు వచ్చారు. నిండా మునిగిన వాడికి చలి ఏమిటి? అందుకే ధైర్యంగా దేవుడు చెప్పిన వెంటనే వెళ్ళిపోతున్నారు ఏలియాగారు. ఇంతవరకు రహస్యంగా చేసిన పరిచర్య ముగించి, ఎప్పుడు బహిరంగ పరిచర్య చేద్దామా అని ఆలోచిస్తున్నారు—ఇంతలో దేవుడు వెళ్లి చేయమంటే—భయపడకుండా సంభరపడుతున్నారు! మరో విషయం ఏమిటంటే: ఇశ్రాయేలీయులు నిజ దేవుణ్ణి వదలి బయలును పూజిస్తుంటే ఈ నీతిగల హృదయం తట్టుకోలేకపోతుంది ఎప్పటినుండో, ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి దేవుని సత్తాను/శక్తిని అందరికీ చూపించాలి అని తహతహలాడుతున్నారు ఎప్పటినుండో- అందుకే వెంటనే వెళ్ళిపోతున్నారు.

ప్రియ దేవునిబిడ్డా! దైవసేవకుడా! ఏలియా లాంటి తహతహ, పౌరుషం, విశ్వాసం నీకుందా? మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన వాడుకదా, మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా ఆయనే మనలను ప్రేమించారు కదా,మరి ఇంత ప్రేమించిన దేవునికి తిరిగి నీవు ఏమిస్తున్నావు? నీకోసం తన ప్రాణాన్నే, తన రక్తాన్నే చిందించారు కదా! మరి నీవు దేవునికి ఏమిస్తున్నావు? ఆయనకోసం జీవించలేవా? ఆయన ప్రేమను చాటలేవా? ప్రార్ధించలేవా? నీకోసం మరణించిన యేసయ్యకోసం మరణించడానికి సిద్ధమేనా నీవు??? అలా అయితే నీవు ధన్యుడవు! అలా కాకపొతే నీవు కృతఘ్నుడవు! దేవుని చేత భలానమ్మకమైన మంచిదాసుడా! అనిపించుకొంటావా? సోమరివైన చెడ్డదాసుడా అని పించుకొంటావా నిర్ణయించుకో!
*పౌరుషం గల ప్రవక్త- 11 వ భాగం*
*ఓబద్యా*

1 రాజులు 18:౩,4
3. అహాబు తన గృహనిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవాయందు బహు భయ భక్తులుగలవాడై
4. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. .

ప్రియ దైవజనమా! రెండవ వచనంలో ఆహాబును దర్శించటానికి ఏలియా వెళ్ళిపోయెను అని వ్రాయబడింది. చూసారా ఏదిఏమైనా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సరే, ఎదుర్కోడానికి ఏలియాగారు సారేపతు నుండి షోమ్రోనుకు బయలుదేరారు.

ఈ అధ్యాయంలో మనకు రెండు ఆసక్తికరమైన వ్యక్తిత్వాలు కనబడతాయి. మొదటగా ఆహాబు ఎంతటి మూర్కుడైనా కాని, 5వ వచనం ప్రకారం దేశంలో నదులు కాలువలలో నీరు చూడటానికి పశువులను కాపాడటానికి వాటికి నీరు గడ్డి కోసం దేశమంతా తిరగాలి అనుకున్నాడు. పూర్వకాలములో పశువులే ఆస్తి!! ఇప్పుడైతే మనకు అన్నీ ఉన్నాయి గాని పూర్వకాలములో పశువులు వారికి చాలా విధాలుగా ఉపయోగపడేవి. మొదటగా పాడి అనగా పాలుకోసం, రెండవదిగా పశువుల బొచ్చుతో ఉన్ని కోసం, అదే వారి వ్యాపారం కూడా, ఇంకా పశువులను అమ్మేవారు మాంసం కోసం, ఇంకా వారి ఆహారం కోసం కూడా, ఇంకా ఇప్పటిలా అప్పుడు ట్రాక్టర్లు లేవు కదా, వ్యవసాయానికి పశువులనే వాడేవారు. కాబట్టి వారి జీవితాలు పశువులతో మమేకమై ఉండేవి. కాబట్టి ఇప్పుడు వాటిని పోగొట్టుకోకూడదు అని ఆహాబు బయలుదేరాడు.

ఇక మరో క్యారెక్టర్ ఓబధ్యా . ఈయన ఆహాబు యొక్క గృహనిర్వాహకుడు! అనగా ఆహాబు ఇంటికి గవర్నర్. ఐతే ౩,4 వచనాలలో ఆయనకోసం వ్రాయబడింది. మొదటగా ఈయన దేవునియందు భయభక్తులు గలవాడు. అంతేనా? యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపిస్తుంటే ఈయన 100మంది ప్రవక్తలను రెండు గుహలలో యాబై యాబై మందిగా దాచి, వారిని పోషించాడు. ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే—రాణికి వ్యతిరేఖంగా పనిచేస్తున్నాడు. దేనికోసం? తన దేవుడైన యెహోవాకోసం! తనకు తెలుసు ఈ విషయం రాణికి తెలిస్తే తనను కూడా చంపించేస్తాది అని. అయినా భయపడలేదు. దేవుని ప్రవక్తలు భక్తులు చావకూడదు. అందరిని తను రక్షించలేడు గాని, తనకు చేతనైనంత మట్టుకు 100 మందిని రక్షించాడు. గమనించండి. ఇలాంటి వ్యక్తిత్వం ప్రతి విశ్వాసికి ఉండాలి. ప్రియ విశ్వాసి! నీవు లోకములో ఉన్న అందరికి సహాయం చేయలేవు, పోషించలేవు. కాని నీకు చేతనైనంత చేయగలవు కదా!! కాని నీవు ఎప్పుడైనా ఒక దైవసేవకునికి ఆయన సేవలో నీ వంతుగా సహాయం చేసావా? ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టావా? సేవా పరిచర్యలో ఎప్పుడైనా ఆర్ధిక సహాయం చేశావా? సరే నీ దగ్గర డబ్బులేదు, కనీసం వెళ్లి పనిచేసావా? ఆలయం తుడిచావా? పరదాలు, చాపలు, కుర్చీలు ఎప్పుడైనా ఎత్తావా? లేదు కదా! అందుకే నీకు ఆశీర్వాదం లేదు! దేవునిపనిలో, పరిచర్యలో పాలుపొందు. పరిచర్య అంటే బేగులో బైబిల్ వేసుకుని సువార్త చెప్పడమే కేవలం పరిచర్య కాదు—పరిశుద్దుల పాదాలు కడగడం, వారికి సపర్యలు చేయడం, మందిరం తుడవడం, కడగటం లాంటివి కూడా పరిచర్యయే! కాబట్టి ఇలాంటివి ఎప్పుడైనా చేసావా? ఇక నీ చేతనైనంత మట్టుకు నీ పొరుగువారికి, ఆకలిగొన్నవారికి, అవసరాల్లో ఉన్నవారికి సహాయమ చేసావా? ఓబధ్యా గారు చేసారు. దేవునిచేత వాడబడ్డారు.

ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే, 100 మంది ప్రవక్తలను దాయడమే కాదు వారిని పోషించారంట ఈయన! ఏమండి 100 మందిని పోషించడం అంటే మామూలు విషయమా? అదికూడా కరువు సమయంలో!! వారికి నీరు ఎక్కడ నుండి తేవాలి? ఆహారం ఎక్కడనుండి తేవాలి?!! కాని ఈయన చేశారు. మన ఇంటికి 10మంది చుట్టాలు వచ్చి పదిరోజులు ఉంటే వారికి వండి వడ్డించటానికి తలప్రాణం తోకకి వస్తుంది కదా! అలాంటిది 100 మందిని పోషించారు అదీకూడా రహస్యంగా! అందుకే తర్వాత దేవుడు ఈయనను గొప్పగా వాడుకున్నారు.

ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. ఈ ఓబద్యా , చిన్న ప్రవక్తలలో కనిపించే ఓబద్యా ఇద్దరు ఒక్కరేనా? ఐతే చాలామంది బైబిల్ పండితులు కాదు అంటారు. కారణం దానికి చారిత్రిక ఆధారాలు లేవు! ఐతే సగం మంది ఒక్కరే అంటారు. ముఖ్యంగా chabad. దానికి కారణం ఈ ఓబద్యా గ్రంధం క్రీ.పూ. 845 లో వ్రాయబడింది. ఏలియాగారు క్రీ.పూ. 9౦౦ లో పుట్టారు. సుమారుగా క్రీ.పూ. 850లో సుడిగాలిచేత కొనిపోబడ్డారు. కాబట్టి ఏలియాగారు ఆరోహణమైన తర్వాత దేవుడు ఇదే ఓబధ్యాగారిని ప్రవక్తగా లేపుకుని ఎదోమీయులకోసం ఒక పత్రికను రాసి పంపించారు అంటారు.

సరే మనం మన పాఠ్యభాగానికి వద్దాం! కాబట్టి ఇప్పుడు సగం మందలను తీసుకుని ఆహాబు రాజు ఒక ప్రక్క వెళ్ళాడు. మరో సగం మందను తీసుకుని ఓబధ్యా గారు మరో ప్రక్కకు వెళ్ళారు. ఈ సమయంలో హటాత్తుగా ఏలియా గారు ఓబధ్యాను ఎదుర్కొన్నారు.
7. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా యితని నెరిగి నమస్కారము చేసి-నా యేలినవాడవైన ఏలీయావు నీవే గదా యని అడుగగా . . . చూడండి ఓబద్యాకు ఏలియాగారు ఎవరో తెలిసిపోయింది ఎలా? ఎందుకంటే బహుశా మూడున్నర సం.ల క్రితం దేవుని తీర్పును ప్రకటించేటప్పుడు ఓబద్యా అక్కడే ఉండి ఉంటారు. ఇంకా ఎప్పుడైతే వర్షాలు పడటం మానేసాయో ఇప్పుడు ఏలియా గారు చాలా ఫేమస్ అయ్యారు. ఇంకా ఆయన వస్త్రధారణ మారలేదు కదా! అందుకే వెంటనే గుర్తుపట్టేశారు ఈయన! ఇప్పుడు వీరి సంభాషణ చూద్దాం! 8—15 వచనాలు.
8. అతడు-నేనేయని చెప్పి, నీవు నీ యేలిన వాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని తెలియ జేయుమనెను.
9. అందుకు ఓబద్యా-నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను అహాబుచేతికి నీవు అప్పగింప నేల? నేను చేసిన పాపమేమి?
10. నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలిన వాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్య మొకటైనను లేదు; అతడు ఇక్కడ లేడనియు, అతని చూడలేదనియు, వారు ఆయా జనములచేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి.
11. నీవు-నీ యేలినవానిచెంతకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే;
12. అయితే నేను నీయొద్ద నుండి పోవుక్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును, అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని యెడల అతడు నన్ను చంపి వేయును, ఆలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు, నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను.
13. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా యేలినవాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రక్తలలో నూరు మందిని గుహకు ఏబదేసి మందిచొప్పున దాచి, అన్న పానములిచ్చి వారిని పోషించితిని.
14. ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగా-నీ యేలినవాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవిచేయగా
15. ఏలీయా-ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాననెను. . . .
10 వ వచనం ప్రకారం ఈ ఆహాబు, పెంటమ్మ ఇద్దరు కలిసి ఏలియాగారిని చంపించటానికి ఎంతగా ప్రయత్నం చేసారో మనకు తెలుస్తుంది. ఏలియా గారు అక్కడ లేరు అని ప్రమాణాలు చేయించేవారు. ఎవరిచేత? జనముల చేతను, రాజ్యముల చేతను!! అంటే కేవలం ఇశ్రాయేలీయుల దేశమే కాదు చుట్టుప్రక్కల రాజ్యాలు అన్నీ గాలించారు కాని దేవుడే ఆయనను కాచి కాపాడారు.

ఇక 12 వ వచనంలో మరో ఆశ్చర్యకరమైన విషయం మనకు కనబడుతుంది. దేవుని ఆత్మ ఏలియాగారిని ఒకచోటనుండి మరో చోటుకి తీసుకుని పోయేవాడంట. చూసారా ఎంతగొప్పగా పరిశుద్ధాత్మ శక్తితో కదిలించబడేవారో, ఇలా ఆయనగురుంచి ప్రజలు కధలుకధలుగా చెప్పుకోవడం మొదలైంది. దేవుడు ఆయనను ఎంతో బలంగా వాడుకోవడం మొదలుపెట్టారు.

సరే ఇప్పుడు ఓబధ్యాను కలసిన తర్వాత చెబుతున్నారు—ఇంతవరకు జరిగింది వేరు , ఇప్పుడు జరుగబోయేది వేరు—అని ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో , ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమందే నేను ఆహాబును ధర్శిస్తాను అని నొక్కివక్కానిస్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి. 17వ అధ్యాయంలో ఆహాబుతో ఏలియాగారు ఏమన్నారో అదేమాట ఓబధ్యాతో కూడా అంటున్నారు. మొదటగా ఎవని సన్నిధిని నేను నిలువబడి యున్నానో. . . దీనికోసం గతభాగాలలో విపులంగా చూసుకున్నాం. ఏలియాగారు అనుక్షణం దేవుని సన్నిధిని అనుభవించేవారిగా చూసుకున్నాం. ఇక ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు ... చెబుతున్నారు . ఎప్పుడైతే ఏలియాగారు యెహోవాజీవముతోడు అని చెప్పారో ఇక మారుమాట్లాడటం లేదు ఓబద్యాగారు కారణం యెహోవాజీవముతోడు అన్నమాట ఇక తిరుగులేదు. వెంటనే ఓబద్యాగారు ఆహాబును పిలవడానికి వెళ్ళిపోయారు.

ప్రియ దేవుని బిడ్డా! నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి అని యేసయ్య చెప్పారు. కాబట్టి నిన్ను నీవు సరిచేసుకో! ఏలియా గారిలా దేవునికోసం పౌరుషంగా నిలబడు! ఓబద్యాలాగ మరణానికైనా సిద్దపడి దేవుని పని చేయు!
దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త- 12 వ భాగం
ఆహాబుతో ముఖాముఖి


1 రాజులు 18:17-- 18
17. అహాబు ఏలీయాను చూచి-ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా
18. అతడు-నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు. . . .

ప్రియ దైవజనమా! గతభాగంలో ఏలియాగారు ఓబధ్యాతో నేను ఈరోజు ఆహాబును కలుస్తాను పిలవమని కబురు పంపినట్లు చూసుకున్నాం! అలాగే ఓబద్యాగారు ఆహాబుకు కబురుపెట్టినవెంటనే ఆహాబు బయలుదేరి ఏలియాగారిని కలుసుకున్నాడు. కారణం మొత్తం దేశం ఎండిపోతుంది ఇప్పుడు. సమస్యకు పరిష్కారం చేసి వర్షాలు కురిపించాలి కదా! అందుకే హుటాహుటిన బయలుదేరి వచ్చాడు.

ఇప్పుడు ఏలియాగారు—ఆహాబు మధ్య సంభాషణ చాలా ఆసక్తి కరంగా ఉంటుంది! 17 వచనంలో ఆహాబు ఏలియా గారిని చూసి అంటున్నాడు: ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టు వాడవు నీవే కావా?!!! చూడండి ఇక్కడ ఆహాబు అక్కసు అంతా కక్కేస్తున్నాడు! ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టేవాడు అంటున్నారు. తన పాపపు పనుల వలన అని గ్రహించడం లేదు. తప్పు దైవజనుడి మీద తోసేస్తున్నాడు ఇక్కడ! 18వ వచనంలో ఏలియాగారు చాలా ఘాటుగా సమాధానం చెబుతున్నారు. . . . చూసారా ఏమన్నారో!!! మన భాషలో చెప్పాలంటే: (దయచేసి నా భాషకు క్షమించాలి. ఇక్కడ అర్ధమవ్వడానికి చెబుతున్నాను) : పనికిమాలిన వాడా! నేను కాదు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టేది నీవు, నీ పెళ్ళాం! నీ బాబు, నీ ఇంటివాళ్ళు. దేవుడు చెప్పిన మాటలు, ఆజ్ఞలు వినకుండా ఆయనకు వ్యతిరేఖమైన పనులు చేస్తూ, ఆయనకు కోపం పుట్టించింది కాకుండా, దేవుణ్ణి వదలి బయలు దేవతను పూజిస్తూ , దేవుని ప్రవక్తలను చంపిస్తూ, ఆయన కోపాన్ని న్యాయంగా రేపుతూ ఉన్నారు మీరు. రాజుగా ఉండి అందరిని సన్మార్గంలో నడపాల్సిన నీవే, తప్పుడుపనులు చేస్తుంటే మిగిలిన వారు చేయరా!! అందుకే ఈ శ్రమ! ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టింది నీవే!!! నేను కాదు. అని సమాధానం చెప్పారాయన! ఇక్కడ ఆహాబు రాజు అనిగాని, అతను తనను చంపాలని చూస్తున్నాడు అనిగాని ఏమాత్రం భయపడటం లేదు. నేటి దినాల్లో మన సంఘనాయకులు, సేవకులు రాజకీయ నాయకులకు వంగివంగి సలాంలు చేస్తూ, స్టేజీల మీద వారిని పొగుడుతున్నట్లు ఏలియాగారు చేయడం లేదు! అతని హోదాను ఖాతరు చేయడం లేదు! ఆహాబు ఇప్పుడు ఒక దోషి! పాపి! దేవుని కోపాన్ని మిక్కిలి న్యాయంగా రేపినవాడు అంతే! అందుకే ఇంత ఘాటైన సమాధానం! ఒక రాజు ప్రజలను మంచి దారిలో నడిపించాలి గాని యితడు ప్రజల్ని తప్పుడు దారిలో నడిపించాడు. 1 రాజులు 16వ అధ్యాయంలో (30-33) ఇతడు ఎంతప్రముఖుడో, ఎంత చండాలుడో చాలా వివరంగా వ్రాయబడింది!

ఒక ప్రవక్త/ సేవకుని పని ఇదే! తప్పు చేస్తున్నప్పుడు వెంటనే ఖండించాలి! తప్పుచేసినోడు- వాడు ఎవడైనా సరే! దేవుని దృష్టికి పాపి -పాపే! దొంగ- దొంగే! వాడు చిన్నదొంగ, పెద్దదొంగ అని లేదు దేవునికి! ఉదాహరణకు దావీదుగారు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తను పంపించారు దేవుడు. ఈవిధంగా జరిగింది ఆ విధంగా జరిగింది అని ఒక చక్కని కధను చెప్పి—దావీదు కోపం రేగిన తర్వాత దావీదు గారితో ప్రవక్త ఏమన్నారు? ఆ దోషివి, ఆ పాపివి నీవే! ప్రవక్త రాజుకి భయపడలేదు! మేగ లేదు. బహుశా మీరు చేసింది తప్పు అనిపిస్తుందండి నాకు. మీకు చెప్పేటంత పెద్దోడిని కాదు గాని నేను.. ఇలా అనలేదు. ఇలా చెప్పినందుకు నన్ను క్షమించండి అనికూడా అనలేదు. ఉన్నదిఉన్నట్లు కుండబద్దలుగొట్టి చెప్పారు. ఇదే దేవుడు ఒక ప్రవక్తనుండి/ సేవకుని నుండి ఆశిస్తుంది. దేవుని నోరు ప్రవక్త/ సేవకుడు! అలాంటి నోరు మూసుకుంటే ఎలా?!!! కాబట్టి ప్రియ దైవజనుడా! ఉన్నది ఉన్నట్లు బోధించు! దేవుడు చెప్పమన్నది ధైర్యంగా చెబుతారు చెప్పేయ్! పర్యవసానం కోసం ఆలోచించకు. దేవుడు చూసుకుంటారు. ఏలియా గారు అదే చేశారు. మరి నీవు సిద్ధమా?

ఇక తర్వాత వచనంలో
19. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతము నకు పిలువనంపుమని చెప్పెను. . . . చూసారా ఇప్పుడు సవాలుకి సిద్దంగా ఉండమంటున్నారు ఇక్కడ! నీ భార్య పెంచి పోషిస్తున్న 45౦ మంది బయలు ప్రవక్తలు అనడం లేదు ఇక్కడ! యెజెబెలు అంటున్నారు ఏలియాగారు. ఆమె రాణి అయినా సరే! భయపడటం లేదు. గౌరవం ఇవ్వడం లేదు. ఎందుకు అనేది మనం తర్వాత భాగాలలో చూసుకుందాం! యెజెబెలు పెంచి పోషిస్తున్న 45౦ మంది బయలు ప్రవక్తలను, అషేరా దేవి ప్రవక్తలు 40౦ మందిని అందరిని కర్మెలు పర్వతానికి రమ్మని పిలుస్తున్నారు. సవాలుకు సిద్దంగా ఉండమని సవాలు విసరుతున్నారు. వారితోపాటు మొత్తం ఇశ్రాయేలు వారినందరినీ పిలువమంటున్నారు. కారణం అందరూ దారితప్పిపోయారు కదా! అందరినీ ప్రత్యేకంగా కలవడం అవదు కదా! అందుకే అందరిని పిలువమంటున్నారు. మరో విషయం ప్రవక్త పిలిస్తే అందరూ రారు. అదే రాజు పిలిస్తే అందరూ రావాలి కదా! అందుకే ఆహాబునే పిలువమంటున్నారు ఏలియాగారు.

చూసారా ఏలియాగారికి ఎంతధైర్యమో! ఎంతపౌరుషమో! ఎంత తెగింపో! తాడో పేడో తేల్చేసుకుందాం అంటున్నారు . ప్రియ చదువరీ! దేవునికోసం అటువంటి పౌరుషం, తెగింపు, ధైర్యం నీకుందా! ఇంత భక్తి, విశ్వాసం, పౌరుషం, తెగింపు అన్నీ ఉన్నాయి గాబట్టే ఏలియాగారు సుడిగాలి చేత పరమునకు కొనిపోబడ్డారు. నీవు నేను కూడా ఒకరోజు మేఘాలమీద పరమునకు ఎత్తబడబోతున్నాం! దానికోసం పౌరుషమైన, నీతిగల, విశ్వాసం గల జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉంది! నులివెచ్చని, నామకార్ధ జీవితం జీవిస్తే—లవొదొకయ సంఘాన్ని ఛీ అని ఉమ్మి వేసినట్లు నీమీద ఉమ్మివేస్తారు జాగ్రత్త! పౌలుగారిలాగా మంచి పోరాటం పోరాడితే, భళా నమ్మకమైన మంచిదాసుడా! అని పిలువబడి దేవునిచేత బహుమానాలు పొందుతావు! ఏవి కావాలి నీకు!

దైవాశీస్సులు!


పౌరుషంగల ప్రవక్త- 1౩ వ భాగం

సవాలు-1

1 రాజులు 18:21
ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి-యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి. . . .

ఇప్పుడు కర్మెలు పర్వతం దగ్గర ఆహాబు రాజు—850 మంది అబద్ద/సాతాను ప్రవక్తలు—ఇశ్రాయేలీయులు హాజరయ్యారు. ఇక్కడ 850 మందితో ఒక్కడే పోరాటానికి /సవాలుకి సిద్ధమయ్యారు ఏలియాగారు. ఇది చాలా క్లిష్టమైన పరిస్తితి కదా! 850 మంది, రాజు , ఇంకా మొత్తం ఇశ్రాయేలీయులు అంతా ఒక సైడ్, యెహోవాదేవుని పక్ష్యంగా కేవలం ఒక్కడే మిగిలారు. ఈరోజు నీ పరిస్తితి కూడా అలాగే ఉందా? మీ గ్రామమంతా, కుటుంబమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నారా? అంతమందిని నీవు ఒక్కడివే/ ఒక్కదానివే ఎదుర్కొంటున్నావా? భయపడకు! ఈ అనుభవం నీకంటే ముందుగా చాలా మందికి ఎదురయ్యింది. నీవు ఒక్కడివే/ ఒక్కదానివే అని చింతించకు! చూసావా ఏలియాగారు ఒక్కరు- వారు అనేకమంది. ఇదే అనుభవం మోషేగారికి కూడా ఎదురయ్యింది—మోషేగారు ఒక్కరు—ఐగుప్తు దేశ మాంత్రికులు, గారడీవిధ్యగలవారు అనేకులు! ఒక్క మోషేగారు—ఐగుప్టు సైన్యమంతటినీ ఎదిరించారు. సంసోను ఒక్కడు—శత్రువులు వెయ్యిమంది. సంసోను ఒక్కడు, కన్నులు కోల్పోయాడు—అయినా ౩౦౦౦ మందిని చంపాడు. దానియేలు గారు ఒక్కరే—సింహాలు అనేకం. అయినా సింహాల నోర్లు మూయించారు. యోనా ఒక్కడు—నీనేవే పట్టణాన్ని రక్షించగలిగారు. సమరయ స్త్రీ ఒక్కతే—గ్రామాన్ని మార్చుకోగలిగింది. యేసుప్రభులవారు ఒక్కరు సువార్త ప్రారంభించారు—ఈనాడు అనేకమంది రక్షణకు కారకమయ్యారు. కాబట్టి ప్రియ సహోదరీ/సహోదరుడా! నీవు ఒక్కడివే/ఒక్కదానివే అని చింతపడకు! లోకంలో ఎవరికీ రాని కష్టాలు నీకే వచ్చేస్తున్నాయి అని ఎత్తి పరిష్టితిలోను అనుకోకు! నీకు నాకు ముందుగా ఉన్నవారు ఈ పరిస్తితులగుండా వెళ్ళిన వారే! వారేవారిని దేవుడు విడిచిపెట్టలేదు! బలంగా వాడుకున్నారు. నిన్నుకూడా ఆయన వాడుకోగలరు! మరి నీవు ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకోగలవా?

ఇక్కడ చూడండి 21 వ వచనం
ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి-యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి. . . .
ఇక్కడ బహిరంగంగా సవాలు విసరుతున్నారు ఏలియాగారు. చూడండి ఎంత పౌరుషమో/ ఎంత దైర్యమో! దేవునికి కూడా ఇలాంటి సవాలుకరమైన జీవితాలు, మనుషులే కావాలి. నులివెచ్చని/ చచ్చు బ్రతుకులు దేవునికి వద్దు, ఇక అవి సాతానుగాడికి కూడా అవసరం లేదు! యెహోవా దేవుడైతే యెహోవాను పూజించండి! బయలు దేవుడైతే బయలును పూజించండి! మొదటగా ఎవరు నిజమైన దేవుడో ఇప్పుడే తేల్చేసుకుందాం అంటున్నారు. ఎంతకాలం రెండు తలంపుల మధ్య తడబాటులాడుతారు అంటున్నారు!! ఇదేమాట మోషేగారు కూడా ఒకసారి అన్నారు—యెహోవా పక్ష్యంగా ఉన్నవారంతా నాదగ్గరకు రండి అని పిలిస్తే లేవీయులందరూ మోషేగారి దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు నీవు ఎవరి పక్షంగా ఉన్నావు? దేవుని పక్ష్యమా లేక లోకం పక్షమా? లోకం పక్షము అనగా సాతాను పక్షంగా ఉన్నావు. నీకు దేవుడు కావాలా? లోకం కావాలా? ఇప్పడు ఇశ్రాయేలీయులు ఏది కావాలో నిర్ణయం చేసుకోవలసిన సమయం, అవుసరం వచ్చింది. అలాగే నీవుకూడా నేడు ఎవరు కావాలో తేల్చుకోవలసిన సమయం వచ్చింది. మనుషులు ఏది సత్యమో, తాము దేనిని అనుసరించాలో ప్రజలు నిర్ణయించుకోవాలి!! ఇక్కడ ఒక విషయం చెప్పనీయండి. ప్రజలంటారు—జీవితం గురుంచి అన్నిరకాల దృక్పదాలును అభిప్రాయలాను అంగీకరించడం అనేది విశాలహృదయం గాను, పరమత సహనం గాను అనేకమంది ఎంచుతారు. మరికొంతమంది అంటారు మతాలన్నీ మంచివే, దేవుళ్ళంతా ఒక్కటే అంటారు. కాని దేవుడు అనేవాడు ఒక్కరే కదా! ఎవరు నిజమైన దేవుడో తెలుసుకోవాలి. బైబిల్ కు, ఏలియాగారికి పైన చెప్పిన సంగతి పనికిరాదు. ఏకైక, నిజమైన, సత్యమైన సజీవమైన దేవుణ్ణి మాత్రమే పూజించాలి గాని ఎవరిని పడితే వారిని, దేనిని పడితే దానిని పూజించకూడదు. ఇక్కడ బయలును పూజించడం అంటే నిజమైన సత్యదేవున్ని నెట్టివేయడమే! ఈ రెంటినీ కూడా పూజిద్దాం అనే ఇశ్రాయేలీయుల అభిప్రాయాన్ని దేవుడు గాని, బైబిల్ గాని ఒప్పుకోదు! ఇప్పుడు కూడా మన దేశంలో పరిస్తితి అలాగే ఉంది. దేవుళ్ళందరూ ఒక్కటే అంటారు. అదెలా కుదురుతుంది. వారిలో ఎవరైనా మనిషికోసం ప్రాణం పెట్టారా? లేదు కదా! కాబట్టి ఎవరైతే నిజదైవమయిన యేసుక్రీస్తును పూజించాలి అనుకుంటారో వారు ఇతర దేవతలను పూజించకూడదు. అంతే!! నీకు ఐతే దేవుడు కావాలి లేకపోతే దయ్యం/ లోకం కావాలి. రెండూ కలువవు, ఇమడవు. యెహోషువా 24:14—15 లో యెహోషువా గారు చెప్పినది ఒకసారి చూద్దాం!
14. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యము గాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి.
15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను. . . . .. . దేవుడంటున్నారు: యెషయా 42:8
యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.
కాబట్టి ఆయనను మాత్రమే పూజించాలి. యేసయ్య అంటున్నారు మత్తయి 6:24 లో
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
. . .. కాబట్టి దేవుణ్ణి మాత్రమే సేవించాలి గాని లోకాన్ని స్నేహించకూడదు! అందుకే ఏలియాగారు ఇంత పౌరుషముగా మాట్లాడుతున్నారు.

ప్రియ చదువరీ! మరి నీ ఉద్దేశ్యం ఏమిటి? రెండు పడవల మధ్య కాలేస్తున్నావా? దేవుడు దయ్యం ఇద్దరూ కావాలా? అది కుదరదు అని బైబిల్ సెలవిస్తుంది. ఎవడు ఈ లోకాన్ని స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అని బైబిల్ సెలవిస్తుంది. యాకోబు 4:4; దేవునితో శత్రుత్వం పెంచుకుని నీవు బ్రతకగలవా? ఒకసారి ఆలోచించుకో! లోకాన్ని వదిలివేసి దేవునితో సమాధాన పడు! ప్ర్రియ సేవకుడా! విశ్వాసి! ఏలియాగారిలాంటి సవాలుకరమైన జీవితం నీవుకూడా జీవించు!
దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త- 14 వ భాగం


సవాలు-2

1 రాజులు 18:22--24
22. అప్పుడు ఏలీయా-యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి యున్నాను; అయితే బయలునకు ప్రవక్తలు నాలుగువందల ఏబదిమంది యున్నారు.
23. మాకు రెండు ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెల మీద ఉంచవలెను, రెండవ యెద్దును నేను సిద్ధము చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచుదును.
24. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా జనులందరును-ఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి. . . .


చూడండి ఈ వచనాలలో ఏలియాగారు సవాలు ఏదో చెబుతున్నారు. ఎద్దులు వదించి, క్రింద అగ్ని వేయకుండా, కేవలం ప్రార్ధన చేసినందువలన ఆ బలి దహనమైపోవాలి. ఏ దేవుడు అలా ప్రార్ధించిన వెంటనే బలిని మండచేస్తాడో ఆయనే దేవుడు! ప్రజలందరికీ ఈ సవాలు చాలా బాగా నచ్చింది. వారికికూడా నిజమైన దేవుడెవరో తెలుసుకోవాలని ఉంది.

ఇంతకీ అగ్నిద్వారా పరీక్షించాలి అని ఏలియాగారు ఎందుకు అనుకున్నారు? తను పుట్టిన వెంటనే అగ్ని రధాలు, గుర్రాలు తన చుట్టూ ఉన్నట్లు తన తండ్రికి దర్శనం వచ్చినందువలనా? కాదు. ఇంతకీ ఈ సవాలు/ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? *దేవుడు ఎవరు? ఆయన యొక్క శక్తి సామర్ధ్యాలు ఏమిటి? ఆయన జీవముగలవాడని, నిత్యమూ ఉండేవాడని, మాట్లాడే వాడని, ప్రార్ధనకు జవాబిచ్చేవాడని రుజువు చేయడానికి*. అందుకే అసాధారణ రీతిలో దేవుడు సమాధానం ఇవ్వాలి. *ఇక మరో ఉద్దేశం ఏమిటంటే: ఇక్కడ అర్పించేది ఏమిటి? బలి! కాబట్టి బలికి సమాధానం ఇలాగే వచ్చేది*. అగ్ని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యాలు క్లుప్తంగా చూసుకుందాం.

1). బలి దగ్గర అగ్ని అనేది దేవుడు అక్కడ ఉన్నారని, అనగా దేవుని సన్నిధి అక్కడ ఉంది అని అర్ధమిస్తుంది. ఉదా: మండుచున్న పొద నిర్గమ ౩:2; అగ్ని స్తంభము 13:21—22;

2) అగ్ని వచ్చి బలిని దహిస్తే, దేవుడు ఆ బలిని అంగీకరించినట్లు! మొదటగా హేబెలు అర్పణమును దేవుడు లక్ష్యపెట్టెను అనగా అంగీకరించెను. దీని అర్ధం అగ్ని వచ్చి దహించినది. ఆదికాండం 4; అబ్రాహాము గారి బలిని దేవుడు అగ్ని ద్వారా అంగీకరించారు. ఆదికాండం 15:17; న్యాయాదిపతి గిద్యోను (న్యాయాధిపతులు 6:21); వీరి బలిని దేవుడు అంగీకరించారు. సంసోను తల్లిదండ్రుల బలిని దేవుడు అగ్నిద్వారా అంగీకరించారు 13:20. ఇలా పాత నిబంధనలో దేవుడు బలిని అంగీకరించేపద్దతి ఇదే! అందుకే అగ్నిద్వారా దేవుడు జవాబు ఇవ్వాలి అని కోరుకున్నారు ఏలియాగారు.

ఇంకా మరికొన్ని ఉన్నాయి గాని వాటిని అర్ధం చేసుకోవడం కష్టం. ఉదా: అగ్ని పాప పరిహారం చేస్తుంది, మనుష్యులను వారి మలినముల నుండి శుద్ధి చేస్తుంది. మరో అర్ధం అగ్ని దేవుని ఉగ్రతను తెలియజేస్తుంది.

సరే, ఈ కారణాల వలన ఏలియాగారు అగ్నిద్వారానే పరీక్షించబడాలి అని కోరుకున్నారు. మరో ముఖ్య కారణం ఉంది. అది ఏమిటంటే నిజమైన దేవుడు, జీవముగల దేవుడు మాత్రమే ఇలాంటివి చేయగలరు గాని వారు పూజించే బయలుకు ఎటువంటి శక్తి సామార్ధ్యాలు లేవు అని ఏలియాగారికి ముందే తెలుసు. అందుకే ఈ విషయాన్ని బట్టబయలు చేయాలి, నిజమైన దేవుడెవరో వారికి తెలియజేయాలి అనే ఉద్దేశ్యంతో అగ్ని పరీక్ష ను కోరుకున్నారు.

ప్రజలందరూ , ఆహబురాజు కూడా ఈ సవాలుకి అంగీకరించారు. నా ఉద్దేశ్యం ప్రకారం బయలుకి ఇంత శక్తిలేదని ఆహాబుకి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఈ సవాలుకి అంగీకరించాడు. ఆహాబుకి యెజెబెలు ఏమిచెప్పిన తందానా అనడం తెలుసు గాని, మంచిచెడులు గ్రహించే విచక్షణా జ్ఞానం ఎప్పుడో కోల్పోయాడు. ఇప్పుడు 25వ వచనంలో ఏలియాగారు బయలు ప్రవక్తలను పిలిచి, మీరు ఎక్కువమంది ఉన్నారు గాబట్టి మీరే ముందుగా ఎద్దును సిద్దం చేసి ప్రార్ధన చేయండి. అయితే క్రింద అగ్ని ఎంతమాత్రము వేయవద్దు అని చెప్పారు. వెంటనే ఈ బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు 850 మంది ఎద్దును సిద్ధం చేసి బయలుకి ప్రార్ధన చేయడం మొదలుపెట్టారు. 26వ వచనం చూసుకుంటే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్ధన వినుమని బయలు పేరుని బట్టి ప్రార్ధన చేసిరి గాని ఒకమాటయైనను ప్రత్యుత్తరము ఇచ్చువాడు లేకపోగా. . . . చూడండి.. వాడు జీవం గలవాడు, నిజమైన వాడు అయితే మాట్లాడును, అగ్ని కురిపించి ఉండును గాని ఎంతమాత్రము జవాబివ్వలేదు. కారణం వారు చేసిన ప్రార్ధన బయలు పేరు/నామము బట్టి. అందుకే పేతురు, యోహానులు అంటున్నారు: అపో.కార్యములు 4: 12
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అవును నీకు రక్షణ, విడుదల, పరలోకం కావాలి అంటే నీకు కావలసిననది యేసునామము మాత్రమే! ఆ రోజులలో వారికి తెలియనట్లు—ఈరోజులలో కూడా చాలామందికి తెలియడం లేదు. అది తెలియజెప్పటానికే ఏలియాగారు ఈ బహిరంగ సవాలు విసిరారు. నేడు నీవు ఇలాంటి బహిరంగ సవాలు విసరవలసిన అవసరం లేదు గాని, నీవో సవాలుకరమైన జీవితం జీవిస్తే, నీవే – నీ జీవితమే ఒక యేసయ్య పత్రికగా మారిపోతే—అప్పుడు ప్రజలు నీ జీవితం చూసి నేర్చుకుంటారు.

ప్రియ స్నేహితుడా! నీ జీవితం ఎలా ఉంది? క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నావా? నిన్నుచూసి క్రైస్తవులు అంతేనని అసహ్యపడేవిధంగా జీవిస్తున్నావా? క్రీస్తుకు మహిమకరంగా జీవిస్తున్నావా? అవమానకరంగా జీవిస్తున్నావా? ఏలియాగారు ఒక సవాలుకరమైన, మహిమకరమైన జీవితం జీవించి వెలిగిపోయారు. నీవుకూడా అటువంటి జీవితం కలిగి, దేవునికి మహిమకరముగా జీవించు!

దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త- 15 వ భాగం

సవాలు-3


1 రాజులు 18:25,26
25. అప్పుడు ఏలీయా బయలు ప్రవక్తలను పిలిచి-మీరు అనేకులైయున్నారు గనుక మీరే మొదట ఒక యెద్దును కోరుకొని సిద్ధముచేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి; అయితే మీరు అగ్నియేమియు క్రింద వేయవద్దని చెప్పగా
26. వారు తమకు ఇయ్యబడిన యెద్దును తీసికొని సిద్ధము చేసి, ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరి గాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చు వాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి. . .

సరే, ఎప్పుడైతే వారు (బయలు ప్రవక్తలు) బయలా బయలా అని ప్రార్ధించినా జవాబు రాలేదో, వెంటనే వారు గంతులు వేయడం మొదలుపెట్టారు. (26వ వచనం). ఇక మధ్యాహ్నం తర్వాత ఏలియాగారు వారిని హేళన చేయడం, కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి—అది పాతనిబంధన కాలంలో అలాగుండేది గాని యేసుప్రభులవారు ప్రేమతో మాట్లాడమన్నారు. మనలో చాలామంది ఇతర దేవుళ్ళను, వారి పూజలను కామెంట్ చేస్తూ, అపహాస్యం చేస్తుంటారు. యేసుప్రభులవారు గాని, పౌలుగారుగాని, ఇక మరే అపోస్తలుడు కూడా వారి విగ్రహాలను దూషించలేదు. అపహసించలేదు. కేవలం యేసుప్రభులవారు చేసిన గొప్ప కార్యాలు మాత్రమే చాటారు. మనం కూడా అదేబాటలో నడవాలి. వారి దేవుళ్ళు ఎలాంటివారైతే మనకు అనవసవరం. వారికి ఎంతమంది భార్యలుంటే మనకు అనవసరం. మనకు యేసయ్యకోసం చెప్పడానికి, ఆయన ప్రేమను, సిలువమరణం కోసం చెప్పడానికి బోలెడుంది. అది చెబితే చాలు. లేదా యేసయ్య నిన్ను ఎలా మార్చారు, నీవు ఎలా రక్షణ పొందావో చెప్పు చాలు! నీ సాక్ష్యం ఇతరులను పట్టుకొంటుంది.
సరే, ఆయన ఏమని హేళన చేస్తున్నారో చూడండి. 27 .మధ్యాహ్నము కాగా ఏలీయా-వాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి యున్నదేమో అని అపహాస్యము చేయగా .. . . ఎప్పుడైతే ఇలా అపహాస్యం చేసారో వారు ఇంకా కేకలు వేస్తూ రక్తాలు కారేటంతమట్టుకు వారు తమ మర్యాద చొప్పున కత్తులతో కోసుకున్నారంట. అయినా బయలు వారికి సమాధానం ఇవ్వలేదు. ఆ బలిని దహించలేదు. కారణం వానిలో జీవముంటే కదా! నేటిదినాల్లో కూడా అనేకమంది ఎన్నో రకాలైన పూజలతో, విగ్రహారాధనతో బ్రతుకుతున్నారు, వారిని రక్షించాల్సిన భాద్యత, వారికి సువార్త చెప్పాల్సిన భాద్యత మనందరి మీద ఉంది. గాని మనం యేసయ్య ప్రేమను వారికి సరియైన రీతిలో చెప్పలేక పోతున్నాము. దానికి ముఖ్యకారణం మన జీవితాలు బాగోలేకనే! మన జీవితం బాగా ఉంటే, మనల్ని చూసి వారు మార్పుచెంది ఉందురు. కారణం లోకం ప్రతీక్షణం మనలను చదువుతుంది. కాబట్టి మన నడక, పడక, మాట, ప్రవర్తన అన్నీ క్రైస్తవ పేరుకు తగ్గట్టుగాను, యేసయ్య ప్రేమను చాటిచెప్పేటట్టుగాను ఉండాలి. అలా కాకుండా, పొరుగు వారిని ప్రేమించలేక, వారితో అస్తమాను తగాదాలడుతూ, బూతులాడుతూ ఉంటే, ఎలా రక్షించబడతారు? అసహ్యించుకుంటారు తప్ప! మరికొంతమంది మీద చెప్పిన విధంగా వారి దేవుళ్ళను తిడుతుంటారు. అప్పుడు వారు మనలను ఎలా ప్రేమిస్తారు? ద్వేషిస్తారు తప్ప! మనం మనిషిని, మనిషి హృదయాన్ని ప్రేమతోనే గెలవగలం గాని, ఈర్ష్య, ద్వేషాలతో కాదు. వారిని మనమాటలతో, ఓడించి అసలేకాదు! కాబట్టి ప్రియ చదువరీ! పొరుగు వారిని ప్రేమించు, వారితో సమాధానంగా ఉంటూనే, వారికి దేవుని ప్రేమను పంచు! నీవే ఒక క్రీస్తు పత్రికగా మారి దేవుని ప్రేమను పంచు!

సరే, బయలు ప్రవక్తలు ఎంత గింజుకున్నా వారి వల్లకాకపోయింది. ఇంతలోగా సాయంత్రం నైవేద్యం అర్పించే సమయము అయ్యింది. అప్పుడు ఏలియాగారు ప్రజలనందరినీ నా దగ్గరకు రండి అని పిలుస్తున్నారు. ఈ ౩౦ వ వచనం మొదటినుండి ప్రతీ పదాన్ని జాగ్రత్తగా గమనించ వలసియుంది. ఏలియాగారు నా దగ్గరకు రండి అనడానికి కారణం—కేవలం వారు ఇంతవరకు బయలు ప్రవక్తల అర్పణం దగ్గర ఉన్నారు కాబట్టి వారిని తన దగ్గరికి పిలుస్తున్నారు అనుకోకూడదు. కారణం వారు ఇంతవరకు దేవుణ్ణి విడచి, అన్య దేవతలను, బయలును, అషేరాదేవిని ఇంకా కనబడిన ప్రతీదాన్ని పూజించడం మొదలు పెట్టారు. సృష్టికర్తను వదలి సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వారి ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. వారి దేవతలు వారికి వర్షం కురిపింపలేకపోయాయి. సరికదా, నిత్య, సత్యదేవుడైన యెహోవానుండి దూరముగా లోకము వైపుకి తీసుకుని పోయాయి. అందుకే నా దగ్గరకు రండి అంటున్నారు. అందుకే భక్తుడు అంటున్నారు:
దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి. యాకోబు 4: 8

. అందుకే ఏలియాగారు మొదటగా నా యొద్దకు రండి అంటున్నారు. నా యొద్దకే రండి అని ఎందుకు అంటున్నారు?! ఆయన మాటలలో అస్తమాను అంటుంటారు: ఎవని సన్నిధిని నేను నిలువబడి యున్నానో... ఇశ్రాయేలుదేవుడైన యెహోవా జీవముతోడు. . . . కదా! అంటే ఇప్పుడు ఏలియాగారితో ఎవరున్నారు? యెహోవా దేవుడు. ఆయన సన్నిధి ఉంది. కాబట్టి నా దగ్గరకు రండి అనగా నిజదేవుడైన యెహోవా దగ్గరకు రండి అంటున్నారు.

ప్రియ చదువరీ! నీవుకూడా దేవునికి దూరంగా పోయి, లోకాశలతో మునిగిపోయి, దేవుని బిడ్డవు—సాతాను బిడ్డగా మారిపోయి, ఎందుకు పనికిరాకుండా, నులివెచ్చనగా ఉంటూ, జీవితంలో దెబ్బతినేసి, నా బ్రతుకు ఇలా అయిపోయింది అని భాదపడుతున్నావా? ఇప్పుడు నీవు చేయాల్సింది తిరిగి దేవుని దగ్గరకు రావాలి. పశ్చాత్తాప పడాలి. నిజమైన పశ్చాత్తాపంతో యేసయ్య పాదాలు కడగాలి. అప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేయగలరు. దేవుడు అంటున్నారు: ఇశ్రాయేలు నీవు రానుద్దేసించిన యెడల తిరిగి నా యోద్దకే రావాలి అంటున్నారు. .యిర్మియా 4:1; . కాబట్టి నేడే యేసునొద్దకు రా! ఆయన నీ బ్రతుకును సరిచేయదానికి సిద్ధంగా ఉన్నారు.
ఆమెన్!
దైవాశీస్సులు!

పౌరుషం గల ప్రవక్త- 16 వ భాగం

సవాలు-4

1 రాజులు 18:౩౦--౩౩
30. అప్పుడు ఏలీయా-నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడియున్న యెహోవా బలిపీఠమును బాగుచేసి,
31. యెహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని
32. ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి
33. కట్టెలను క్రమముగా పేర్చి యెద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి, జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహనబలి పశుమాంసముమీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను . . .

చూడండి వారు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన చేసిన పనులు చాలా ముఖ్యమైనవి. ఏలియాగారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మొదటగా నిజమైన దేవుడెవరో ప్రజలకు నిరూపించటానికి, తర్వాత దేవుడు చెప్పిన పని చేయడానికి. దేవుడెందుకు పంపించారు ఇక్కడికి? నేను భూమిమీద వర్షం కురిపించబోతున్నాను కాబట్టి వెళ్లి ఆహాబుని కలవమని చెప్పారు. అందుకే వచ్చారు ఏలియాగారు. కాబట్టి వర్షం పడాలంటే ముందుగా ఇవన్నీ కావాలి. దీనికోసం తర్వాత ధ్యానం చేద్దాం!

ఏలియా గారు మొదటగా చేసిన పని: క్రింద పడద్రోయబడియున్న యెహోవా బలిపీటమును బాగుచేసెను. చూసారా—ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వదిలేయడమే కాదు, ఆయన బలిపీటమును పడద్రోశారు. ఇక్కడ బలిపీటము యొక్క నిజమైన అర్ధం ఏమిటంటే: Draw near to God, come Forth, enjoying presence of God with thanksgiving or with offerings. ఇది బలిపీటము యొక్క అర్ధము. దేవుని దగ్గరకు రావడం, ఆయన సన్నిధిలో అర్పణలు అర్పించటం! ఇశ్రాయేలీయులు ఎప్పుడో దీనిని వదిలేశారు. ఆయనకు బలి అర్పించటం మానేసి, బయలు దేవతకు, అషేరాదేవతకు బలులు అర్పిస్తున్నారు. దేవుని బలిపీటాన్ని పడద్రోశేసారు. అందుకే ఇప్పుడు పడద్రోయ బడిన బలిపీటాన్ని బాగుచేశారు. ఈరోజు నీ బ్రతుకు బాగుండాలంటే, నీ బ్రతుకులో ఉజ్జీవం రావాలంటే, నీ సంఘంలో ఉజ్జీవం రావాలంటే, నీమీద వర్షం కురువాలంటే, అనగా దేవుని ఆత్మాభిషేకం మరలా రావాలంటే నీవు రావాల్సింది బలిపీఠం దగ్గరకు. అది మోకాళ్ళపై నీవు చేసే కన్నీటి ప్రార్ధన! నీ ప్రార్ధనా బలిపీటం పడద్రోయబడింది. దానిని సాతాను ప్రోద్బలంతో నీవే త్రోసివేశావు. బ్రతుకులో శాంతి సమాధానాలు కోల్పోయావు. ఏదో సాధిద్దాం అనుకున్నావు గాని నీవు సాధించింది సున్నా! ఈ భౌతికమైన వస్తువాహనాలు సంపాదించావు గాని ఆధ్యాత్మికంగా చెడిపోయి బ్రష్టుడవైపోయావు. నిత్యత్వాన్ని కోల్పోయావు. దైవసన్నిధిని, ఆశీర్వాదాలు కోల్పోయావు. ఆత్మాభిషేకాన్ని కోల్పోయావు. అవి తిరిగిరావాలంటే నీవు రావాల్సింది బలిపీటం! ప్రార్ధనా బలిపీటం! ప్రియ చదువరీ! నీవు సిద్ధంగా ఉన్నావా? మారుమనస్సుతో పశ్చాత్తాపంతో, కన్నీటితో ఆయన ప్రార్ధనా బలిపీటంతో ఆయన కృపాసనాన్ని సమీపిస్తావా?

ఆ తర్వాత దేవుని వాగ్దానం ప్రకారం 12 రాళ్ళతో దానిమీద బలిపీటం కట్టించారు. చరిత్ర గమనిస్తే రెహబాము కాలంలో ఇశ్రాయేలీయులు రెండుగా విడిపోయారు. ఒకటి ఉత్తరరాజ్యం—10 గోత్రాల వారు. దక్షిణ రాజ్యం—యూదా, బెన్యామీను గోత్రాలు. ఐతే ఇక్కడ వీరు పదిగోత్రాలే ఉన్నా, ఏలియాగారు 12 రాళ్ళు ఎందుకు తీసుకున్నారు? కారణం వీరు భౌతికంగా విడిపోయినా, దేవుని దృష్టిలో వారు కలిసే ఉన్నారు, కలిసే ఉండాలి. దేవునికి అందరూ సమానులే! మనుష్యుల మధ్య భేదాలున్నా, దేవునికి లేదు. అందుకే క్రమ ప్రకారం, వాగ్దానం ప్రకారం 12 రాళ్ళతో బలిపీటం కట్టారు. ఈ 12 అనేది—మొదటగా 12 గోత్రాలు ను సూచిస్తుంది, తర్వాత 12గురు శిష్యులను సూచిస్తుంది. మరొకటి సంవత్సరంలో 12 నెలలు దేవుని బలిపీటమును ఆశ్రయించాలి అనికూడా సూచిస్తుంది.

ఇక ఇక్కడ మరో విషయం గమనించాలి. ఈ 32వ వచనంలో ఏలియాగారు 12 రాళ్ళతో యెహోవా నామమున ఒక బలిపీటం కట్టించారు. ఆహాబురాజు, యెజెబెలు బయలు నామమున బలిపీటాలు కట్టారు గాని ఏలియాగారు యెహోవానామమున కట్టారు. ఆ యెహోవాదేవుని నామమే యేసు. యేసునామము! ఈ రోజు నీవు కట్టాల్సిన బలిపీటం యేసునామమున కట్టాలి. నీ ప్రార్ధనా బలిపీటం యేసునామములో ఉండాలి గాని మరో నామమున ఉండకూడదు. అందుకే మన ప్రార్ధన చివరలో యేసునామమున అడుగుచున్నాము తండ్రి అంటాము. దేవుడు/యేసుప్రభులవారు నేర్పించిన క్రమంలోనే మన ప్రార్ధన ఉండాలి.

ఇక రెండు మానికలు గింజలు పట్టునంతగా లోతుగా కందకం త్రవ్వించారు. నీప్రార్ధన గుండెలోతుల్లో నుండి రావాలి గాని పెదాలమీద ప్రార్ధన కాకూడదు. అందుకే దేవుడంటున్నారు వీరు పెదాలతోనే నన్ను స్తుతిస్తున్నారు గాని వీరి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. (యెషయా 29:13; మత్తయి 15:8; మార్కు 7:6); ఈ కందకం ఎందుకంటే దాని తర్వాత వారు నీరు పోయబోతున్నారు. ఆ నీరు క్రిందకు పోకుండా నిలిచియుండటానికి కందకం త్రవ్వించారు. అలాగే దేవుని వాక్యం నీ గుండెల్లో ఉండాలి గాని ఈ చెవితో విని, ఆ చెవితో వదిలెయ్యకూడదు! ఇక్కడ రెండు మానికలు అనగా పాతనిబంధన—క్రొత్తనిబంధన రెండు వస్తాయి. ఈ రెండింటిని విని వదిలెయ్యడం కాకుండా హృదయపు లోతులలో గుర్తుంచుకోవాలి!

ఏలియాగారు తర్వాత చేసిన పని కట్టెలు క్రమముగా పేర్చి. . . మామూలుగా కట్టెలు పేర్చి దానిమీద బలియర్పణ పెట్టి అగ్ని ముట్టిస్తారు . అప్పుడు ఈ కట్టెలు మంది మీదనున్న అర్పణం కాలిపోతుంది. ఇది జరిగే క్రియ! ఐతే ఇక్కడ ఏలియా గారు కట్టెలను క్రమముగా పేర్చారు. క్రమము పాటించకపోతే అక్రమకారులు అంటారు. అక్రమము చేయువారలారా నాయొద్దనుండి తొలిగిపొండి అంటున్నారు దేవుడు! (లూకా 13:27); కాబట్టి ఏలియాగారు చేసినట్లు క్రమమైన జీవితం మనకు ఉండాలి. మనలో క్రమముగా లేని వాటిని సరిచేసుకోవాలి. మన నడక, ప్రవర్తన, మాటలు అన్నీ క్రమపరచుకోవాలి. దేవుని దృష్టిలో మనలో ఏదైతే క్రమంగా లేదో అన్నింటిని క్రమపరచుకోవాలి. అప్పుడే ఉజ్జీవం, ఆత్మాభిషేకం కలుగుతుంది. క్రమములేని జీవితాలు, బ్రతుకు దేవునికి ఇష్టం ఉండదు. ఒకసారి మహాపెద్ద ప్రవక్త బిలాము ప్రవర్తన బాగోలేకపోతే దూసినకత్తి చేతపట్టుకొని వచ్చి అంటున్నాడు దూత: నీ నడత చాలా విపరీతంగా ఉన్నది. అందుకే నేను నీకు వ్యతిరేకంగా వచ్చాను అని చెప్పాడు. సంఖ్యా 22:32; కాబట్టి ఏవైతే క్రమంగా లేవో దేవుని ఎదుట అన్నింటిని క్రమపరచుకోవాలి.

ప్రియ దైవజనమా! మన పరిస్తితి ఎలా ఉంది ఒకసారి పరిశీలించుకొందాం! నీ ప్రార్ధనా బలిపీటం పడద్రోయబడిందా? ప్రార్ధన లేదా నీ జీవితంలో! నిస్సారమైన జీవితం జీవిస్తున్నావా? లవోదోకాయ సంఘంలా నులివెచ్చన జీవితం జీవిస్తున్నావా? ఆశీర్వాదాలు కోల్పోయావా? ఈలోకపు ఆశలలో పడి వాక్యమును, ప్రార్ధనను, ఆరాధనకు హాజరవడం మానేశావా? ఐతే ఇప్పుడే పశ్చాత్తాపంతో ప్రార్ధించు! అదికూడా నీ గుండెలోతులలోనుండి నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్దించవలసిన అవసరం ఉంది. విన్నవాక్యం నీ గుండెలో చొచ్చుకుపోవాలి. వినేసి వదిలేయడం కాదు. ఏలియాగారు కట్టెలు క్రమంగా పేర్చినట్లు నీ జీవితంలో ఏవైతే క్రమంగా లేవో వాటిని క్రమపరచుకో! దేవునికి ఆయాసకరమైనవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడే వదిలేయ్! అప్పుడు దేవుడు నీ మొర్ర వింటారు. నీకు జవాబిస్తారు. మరి నీవు సిద్ధమా?

దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త- 17 వ భాగం

సవాలు-5

1 రాజులు 18:౩౩--౩4
33. కట్టెలను క్రమముగా పేర్చి యెద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి, జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహనబలి పశుమాంసముమీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను
34. అదియైన తరువాత-రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును ఆలాగు చేసిరి; - మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి; అప్పుడు . . .

ప్రియ దైవజనమా! మనం ఏలియాగారు అర్పించిన బలియొక్క క్రమం—దానిద్వారా మనమేమి నేర్చుకోవచ్చో ధ్యానం చేస్తున్నాము.

ఏలియాగారు తర్వాత చేసిన పని ఎద్దును తునకలుగా కోసి, ఆ కట్టెలమీద ఉంచారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పనీయండి. ఏలియాగారు ఈ పనంతా ఒక్కరే చేస్తున్నారు. బయలు ప్రవక్తలైతే అందరూ కలిసికట్టుగా చేసారు. ఇక్కడ ఆయనకు సహాయం చేయడానికి ఎవరినీ పిలువలేదు. ఆయన ఒక్కరే చేసుకున్నారు. కారణం బలిపీటం కట్టడం, ఎద్దును సిద్దపరచడం లాంటి పనులు కేవలం లేవీయులు యాజకులు మాత్రమే చేయాలి. అందుకే స్వయంగా ఆయనే చేస్తున్నారు. అంతా పరిశుద్ధంగా లేవీకాండంలో ఉన్న క్రమం ప్రకారం చేస్తున్నారు. అలాగే నీ ప్రార్థనా బలిపీఠాన్ని నీవే కట్టుకోవాలి.

సరే! ఇక్కడ ఎద్దును తునకలుగా కోసి, కట్టెలు మీద ఉంచారు. అనగా నీ హృదయాన్నే తునకలుగా కోసి, నీ హృదయాన్ని దేవునిముందు పరచాలి. హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించాలి. పగిలిన హృదయంతో దేవునిని ఆశ్రయించినప్పుడు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. (కీర్తనలు 51:18); నీ ప్రార్ధనను లక్ష్యం చేసి, నీ మొర్ర ఆలకించి, నీకు జవాబిచ్చి, ఆయన దీవెనలతో నిపుతారు. ఆయన యొక్క సంపూర్ణశాంతి ఇస్తారు. మరి నీవు నీ హృదయాన్ని కుమ్మరిస్తావా?

ఇక తర్వాత పని నాలుగు తొట్టెల నిండా నీటిని తీసుకుని వచ్చి, ఆ పశుమాంసం మీదన, కట్టెలమీదనా పోయమని జనులకు చెప్పారాయన! చూడండి. ఇంతవరకు పనులన్నీ ఆయనే చేసుకున్నారు గాని ఇక్కడ ఈ నీరు పోసే పనికి కొంతమందిని అప్పాయింట్ చేస్తున్నారు. ఇందులో కొన్ని అర్ధాలున్నాయి. మొదటగా ప్రజలచేత నీరు తెప్పించి, వారిచేతనే నీరు పోయిస్తే, అప్పుడు ఆకాశం నుండి నీరు అగ్ని వచ్చి దహిస్తే, వారు బాగా నమ్ముతారు. కారణం వీరెవరికి తెలియకుండా ఎవరిచేతనైన క్రింద అగ్ని పెట్టించేసారేమో అని అనుమానం పడతారు కదా! అందుకే మాంసం మీద, కట్టెలమీద నీరు పోయమన్నారు . ఇక మరో కారణం ఏమిటంటే—దేవుని పనిలో ప్రజలను భాగస్వాములుగా చేస్తున్నారు. సేవకుడు కూడా సంఘంలో తనుచేసే పనులు తనుచేస్తూ మిగతా పనులు విశ్వాసులతో చేయించాలి. దేవుని పనిలో/ పరిచర్యలో వారినికూడా భాగస్వాములుగా చేయాలి.

ఇంకా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏలియాగారు నాలుగేసి తొట్లతో నీరును మూడు సార్లు పోయమన్నారు. అప్పుడు మొత్తం మాంసం, కట్టెలు, రాళ్ళూ అన్ని తడిచిపోయి, కందకం కూడా నీటితో నిండి నీళ్ళు క్రిందకు పారాయి. ఇది అందరూ చూస్తుండగానే జరిగింది. ఇక్కడ మూడుసార్లు ఎందుకు నీరు పోయమన్నారంటే ఏలియాగారు ప్రతీది క్రమంగా చేస్తున్నారు. నాలుగేసి తొట్టెలు మూడుసార్లు పోయడం అంటే మొత్తం 12 తొట్టెల కుమ్మరించారు అక్కడ! ఇక్కడ కూడా 12 గోత్రాలకు సరిపడే నీరు అనగా వాక్యంతో ఆ బలిని కుమ్మరించారు. అలాగే విశ్వాసి కూడా వాక్యముతో ఉదకస్నానం చేయాలి. నోటినిండా, మనస్సునిండా, హృదయం నిండా వాక్యం నిండిపోవాలి. దావీదుగారు చెప్పినట్లు మన గిన్నె వాక్యంతో నిండిపోవాలి, పొంగి పొర్లిపోవాలి.

ఇప్పుడు ఈ క్రియలన్నీ జరిగాక, అప్పుడు చిన్న ప్రార్ధన చేస్తున్నారు ఏలియాగారు. చూడండి. దేవుని అగ్ని రావాలంటే, అభిషేకం రావాలంటే, ఉజ్జీవం రావాలంటే ఈ ప్ర్రక్రియలు అన్ని జరిగితేనే గాని రాదు. ఊరికినే ఉజ్జీవం కావాలి, ఆత్మాభిషేకం పొందుకోవాలి. అద్భుతాలు జరగాలి అంటే జరుగవు! ఇవన్నీ జరిగాక అప్పుడు ఏలియా గారు ప్రార్ధన చేశారు. ప్రియ సేవకుడా! నీ సంఘంలో ఉజ్జీవం, ఆత్మాభిషేకం కావాలంటే ఇవన్నీ జరిగేలా చూడమని ప్రభువుపేరిట తెలియజేస్తున్నాను.

సరే ఇప్పుడు చిన్న ప్రార్ధన, సవాలుకరమైన, ఉజ్జీవకరమైన ప్రార్దన చేస్తున్నారు. ఇంగ్లీస్ లో కేవలం 53 పదాలున్నాయి. తెలుగులో కేవలం 37 పదాలున్నాయి అంతే ఈ ప్రార్ధనలో! చిన్న ప్రార్ధన—గొప్ప ప్రతిఫలం! దీని అర్ధం ఏమిటంటే అద్భుతాలు కోసం, దేవుడు జవాబివ్వడం కోసం పెద్దపెద్ద ప్రార్ధనలు అవుసరం లేదు. క్రమబద్ధమైన జీవితాలు కలిగి, హృదయపు లోతుల్లోంచి, దేవునికి మహిమను తెచ్చేవిధంగా చిన్న ప్రార్ధన చాలు గొప్ప విజయాలు పొందుకోవచ్చు! నీవు ఎంత పెద్ద ప్రార్ధన చేసావు అన్నది కాదు, హృదయ పూర్వకముగా చేసావా? గుండెలోతులలోనుండి చేసావా, దేవునికి మహిమను తెచ్చేవిధంగా చేసావా అనేది ముఖ్యం!

ప్రియ చదువరీ! నీ ప్రార్ధన ఎలా ఉంది? నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్దిస్తున్నావా? వేషదారణ ప్రార్ధన చేస్తున్నావా? అందుకే యేసుప్రభులవారు మీరు వేషదారుల వలే విస్తరించి ప్రార్ధన చేయొద్దు అని చెప్పారు. అంతేకాకుండా ఎలా ప్రార్ధన చేయాలో చెప్పారో. మత్తయి 5:6; అంతేకాకుండా ఎలా ప్రార్ధన చేయకూడదో చెబుతూ సుంకరి, పరిసయ్యుడి ప్రార్ధన కోసం ఉపమానం చెప్పారు. లూకా 18: 10-14; కాబట్టి సుంకరి వలె తగ్గించుకొని ప్రార్దించు! అప్పుడు దేవునిచేత క్షమించబడతావు. పరిసయ్యునిలాగ హెచ్చించుకొని ప్రార్ధిస్తే ఎందుకూ పనికిరాకుండా పోతావు. అందుకే తననుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును . హెచ్చించుకొనువాడు తగ్గించబడును అని చెప్పారు యేసయ్య! మత్తయి 23:12; లూకా 14:11;
కాబట్టి ప్రియ దేవుని బిడ్డా! నీ ప్రార్ధనను ఒకసారి సరిచూసుకో! సరిచేసుకో!

దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త- 18 వ భాగం

సవాలు-6 (ఏలియా ప్రార్ధన-1)

1 రాజులు 18:౩6
36. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను-యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. . . .

ప్రియ దైవజనమా! ఏలియా గారి చిన్న ప్రార్ధనలో గల అంశాలు ఒకసారి ధ్యానం చేద్దాం! యెహోవా! అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా! ఈమాట జాగ్రత్తగా గమనిద్దాం! ఇక్కడ అబ్రాహాము –ఇస్సాకు—యాకోబులను జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆయన! కారణం ఇశ్రాయేలీయులకు మూలం అక్కడనే ఉంది. దీనిని వీరు అనగా ఇశ్రాయేలీయులు మరచిపోయి బయలును పూజిస్తున్నారు. దేవుడు అబ్రాహాము –ఇస్సాకు—యాకోబులతో ప్రమాణం చేసి వారిని ఏర్పరచుకొని తనకొరకు స్వంత స్వాస్త్యముగా సొంత జనముగా ఉండటానికి ఏర్పరచుకొని, వారితో నిబంధన చేస్తే—ఆ నిబంధనను కాలదన్ని, దేవుడు నిర్ణయించని క్రొత్త అలవాట్లు, ఆచారాలతో దేవునికి ఆయాసం కలిగిస్తునారు. దీనినే ఎత్తి ప్రార్ధిస్తున్నారు. ఆ మూలాలని మరల వీరికి గుర్తుకు చేస్తున్నారు ఏలియాగారు.

ఒకసారి వీరిని ఏర్పరచుకొన్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడో విగ్రహాలను అమ్ముకొంటున్న కుటుంబం నుండి ఆబ్రాహాము గారిని పిలిచారు. ఇక్కడ సందర్బము కాదుగాని ఇక్కడ గమనించాల్సినది ఏమిటంటే అబ్రాహాముగారు ఎప్పుడూ విగ్రహారాధాన చేయలేదు. విగ్రహాలు అమ్ముకొనే కుటుంబం. తనతండ్రి తెరహు విగ్రహారాధన చేసేవాడు, తన తమ్ముళ్ళు నాహోరు, హారాను; చెల్లెళ్ళు శారా. . . విగ్రహారాధన చేసేవారు. కారణం యాషారు గ్రంధం ప్రకారం అబ్రాహము గారు పుట్టింది మెసపటోమియా గాని, పెరిగింది—వాక్యం నేర్చుకున్నది నోవాహు గారి దగ్గరనే! బైబిల్ ప్రకారం ఆదికాండం 11:10—26 వరకు పరిశీలిస్తే నోవాహు గారి 897 వ సంవత్సరంలో అబ్రాహాము గారు పుట్టారు. కేవలం కొద్దిరోజులు మాత్రమే తండ్రి దగ్గర పెరిగారు ఆ తర్వాత తండ్రి ఆచార వ్యవహారాలు నచ్చక తన పితరుడైన నోవాహు గారి దగ్గరనే ఎక్కువగా ఉండేవారు. చివరకు విగ్రహారాధన నచ్చక- తండ్రితో తగువుపడి, ఆ ఊరు అనే ఊరు వారితో తగవుపడి నోవాహు గారి దగ్గర సెటిల్ అయిపోయారు. అబ్రాహాము గారి 53వ ఏటను నోవాహు గారు చనిపోయారు. అంతవరకూ యెహోవాదేవుని యందలి భయభక్తులు నేర్చుకున్నారు అబ్రాహాము గారు. ఆయన మాట్లాడేవాడని, తనతో మాట్లాడాడని, తన పితరుడైన హనోకుగారితో మాట్లాడి పరమునకు తీసుకునిపోయారని తెలుసుకుని దేవునిమీద భయభక్తులతో గడిపేవారు. ఐతే నోవాహుగారి మరణంతో తిరిగి ఊరు చేరుకున్నారు. మరల కొంతకాలానికి ఊరివారితో తండ్రితో విగ్రహారాధన కోసం తగవు మొదలయ్యింది. తన తండ్రికి సహాయం చేసేవాడు కాని విగ్రహారాధన చేసేవారు కాదు అబ్రాహాము. ఇక ఊరు అనే ఊరివారంతా అబ్రాహము గారిని చంపడానికి ప్రయత్నం చేస్తే, దూరప్రాంతనికి పోయి బ్రతకమని పంపించేసారు తండ్రి తెరహు. ఇట్టి దైవభక్తి గలవాడు కనుకనే దేవుడు అబ్రాహాముగారిని పిలుచుకున్నారు. అబ్రాహాము గారి 75 వ యేట దేవుడు తనకొరకు పిలుచుకొని నిభంధన చేస్తారు ఆదికాండం 12; అప్పటినుండి దేవుని ప్రణాళిక ప్రారంభమయ్యింది. అదే వాగ్దానాన్ని ఇస్సాకుతో, యాకోబు అనే ఇశ్రాయేలుతో పునరుద్ఘాటించారు. ఐతే ఇప్పుడు ఇంతచరిత్ర, ఔన్నత్యం గల మూలాల్ని మరచిపోయి అన్యుల దేవుళ్ళను పూజిస్తే దేవునికి, ఏలియాకు ఒళ్ళు మండింది. అందుకే ఈ మూలాల్ని గుర్తుకుచేయడానికి ప్రార్ధన చేస్తున్నారు అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా అంటూ! ప్రియ చదువరీ! నీ మూలాన్ని నీవు మరచిపోయావా? నీ మొదటి ప్రేమ, మొదటి సమర్పణ, మొదటి విశ్వాసం, మొదటి ప్రార్ధనానుభావం, ఉపవాసం, సహవాసం, అభిషేకం మరచిపోయావా? ఐతే జాగ్రత్త! ఇశ్రాయేలీయులకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది జాగ్రత్త! వర్షం అనే దేవుని దేవుని ఆత్మ, ఆత్మీయ వరాలు, అభిషేకాన్ని కోల్పోతావు!

తర్వాత అంశము: ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు. . . దేవుడు తాను నిజమైన దేవుడని, మాట్లాడే దేవుడని ఎన్నోసార్లు రుజువుచేశారు. అయితే వారికి ఈ విషయం తెలిసినా అన్య దేవతలను పూజిస్తున్నారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం ద్వారా, ఐగుప్తులో అనేకమైన అద్భుతాలు చేయడం ద్వారా, అగ్నిస్థంభం, మేఘ స్తంభం ద్వారా ఇంకా ఎన్నోన్నో విధాలు తానూ వారి మధ్య ఉన్నారని రుజువుచేశారు అయినా వారు దేవుణ్ణి విడచి తిరుగుతున్నారు. అందుకే మరొక్కసారి ఈ అగ్నిద్వారా ప్రత్యుత్తరమిచ్చి మరొక్కసారి ఆయన వారిమధ్య ఉన్నారని తెలియజేయమంటున్నారు ఏలియాగారు! ప్రియ విశ్వాసి! నీవు కూడా అదే స్తితిలో ఉన్నావా? దేవుడు నీకు ఇన్ని అద్భుతాలు చేస్తూ, నిన్ను పోషిస్తూ, నడిపిస్తూ ఉండగా, చిన్న శ్రమ, శోధన, జబ్బులకే అయ్యో మాయదారి దేవుడా! ఎక్కడున్నావ్ అంటున్నావ్ కదా! దేవుడు ఇంతకాలము నీ యెడల చేసిన కార్యాలు సహాయాలు మరచిపోయావా? నీవు సజీవంగా ఉన్నావంటే, ఆరోగ్యంగా ఉన్నావంటే అది దేవుని కృపయే గదా! నీ తోటివారు ఎంతమంది చనిపోయారు! ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారు!!?? కాని నీవు ఇంతవరకు ఉన్నావంటే అది దేవుని దయే కదా! కాబట్టి ఎప్పుడూ ఆయన నీతోనే, నీ దగ్గరే ఉంటున్నారు అని మరచిపోవద్దు!

నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేతనే చేసితినని ఈ దినమున కనపరచుము! అవును ఆయన ఎవరో కొండజాతి వాడు, దేవుడు పిలుచుకొని, ఆయనను ఏర్పరచుకొని పంపించారు.. ఇశ్రాయేలీయులు, ఆహాబు అనుకొంటున్నట్లుగా ఏలియా గారు కావాలని మాటలు చెప్పలేదు, దేవుడే చెబితే చేసారు. కాబట్టి ఇప్పుడు కూడా, దేవుడే మరల వర్షం కురిపించటం కోసం దేవుడు పంపించారని, ఏలియాగారితో పాటు దేవుడున్నాడని, ఏలియాగారు దేవుని ప్రవక్త అని అందరికీ తెలియడానికి తన ప్రార్ధన వినమని ప్రార్ధిస్తున్నారు. ప్రియ చదువరీ! నీ సేవకుడు/ కాపరి తన సొంతమాటలు కాదు, దేవుని గ్రంధంలో వ్రాయబడినవి, దేవుడు చెప్పమన్నవే చెబుతారు గాని నిన్ను బాధపెట్టదానికి, శ్రమ పెట్టడానికి, ఏడిపించటానికి కానేకాదు. నీవు తప్పు చేసినప్పుడు ఖండించుము, గద్దించుము బుద్ధిచేప్పుము అని దేవుడు అధికారం ఇచ్చారు (2 తిమోతి 3,4) కాబట్టి ఆయన నిన్ను ప్రేమించి నీవు నరకానికి పోకుండా ఈమాటలు చెబుతున్నారు. కాబట్టి విని మార్పుచెందితే పరలోకం పోతావు. అలిగి మరో గుడికి పోతే నరకానికి పోతావ్! కాబట్టి ప్రియ చదువరీ! మొదట నీవు పోగొట్టుకొనిన రక్షణ, ప్రార్ధన, అభిషేకం, మొదట ప్రేమ, విశ్వాసం మరల పొందుకో! కేవలం నీవు దేవుని దయవలనే ఇంతవరకు క్షేమంగా ఉన్నావని, ఆయన నీతో ఉన్నారని తెలుసుకో! ఆయనను ఆయన సేవకులను గౌరవించు!

దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త—19వ భాగము

సవాలు—7 (ఏలియా ప్రార్థన-2)



1 రాజులు 18:37—38
37. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.
38. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. . .

ప్రియ దైవజనమా! గతభాగం నుండి ఏలియా గారు చేస్తున్న ప్రార్థనకోసం ధ్యానం చేస్తున్నాము. ఇక ఈ 37 వ వచనంలో ఏలియాగారి ప్రార్థన ముఖ్య ఉద్దేశ్యం మనకు స్పష్టముగా తెలుస్తుంది. 1. *యెహోవా నీవే దేవుడవై ఉన్నావనియు,* 2) *నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగజేయుదవనియు ఈ జనులకు తెలియ జేయుము.*

గమనించండి ఇక్కడ ఏలియాగారి ముఖ్య ఉద్దేశ్యం:మొదటగా యెహోవాయే దేవుడు అని తెలియజేయడమే తప్ప—తనకు ఈ అగ్ని సాక్షాత్కారము వలన పేరు ప్రతిష్టలు రావాలని గాని, ఆహాబు రాజు అవమానం పొందాలని కాని ఎంతమాత్రము కాదు. మొదటగా యెహోవా దేవుడు అని ప్రజలందరూ తెలుసుకోవాలి. కారణం వారు నిజ దేవున్ని వదలివేసి బయలును పూజిస్తున్నారు. సృష్టికర్తను వదలి సృష్టిని పూజిస్తున్నారు. ఒక ప్రవక్తగా వారిని సన్మార్గంలో నడపవలసిన భాద్యత ఏలియా గారి మీద ఉంది కాబట్టి, ప్రాణాలకు కూడా తెగించి ఈ పని చేస్తున్నారు.

ఇక రెండవ కారణం , దీనిలోనే ఏలియాగారి హృదయభారం, నిజమైన కోరిక బట్టబయలు అవుతుంది. నీవు వారి హృదయాలను నీ తట్టు తిరుగజేయుదవనియు .... అవును ఏలియాగారి ప్రగాఢకోరిక, దేవుని ఆశ ఏమిటంటే ఇశ్రాయేలీయులంతా ఈ విగ్రహారాధన వదలివేసి, నిజదేవుడైన యెహోవా దేవుణ్ణి అనుసరించాలి. ఆయనను మాత్రమే పూజించాలి. ఈ విగ్రహాలను , బయలు అషేరా దేవతలను విడచి పెట్టాలి అనేది ఆయన ప్రగాడమైన కోరిక! అంతే తప్ప మీద చెప్పినట్లు తనకు పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి ఏమాత్రము కాదు. కారణం పూర్వకాలం నుండి ఇలాంటి అసాధారణ అద్భుతాలే ప్రజలను మార్చాయి. ఇలాంటి అద్భుతాలు ప్రజల్ని బొమ్మపూజనుండి నిజమైన దేవుని ఆరాధనకు మల్ల్లించాయి! అందుకే ఇక్కడ అసాధారణ అద్భుతం కోసం ప్రార్ధన చేస్తున్నారు.

*చూడండి ఎప్పుడైతే ఏలియాగారు ఈ చిన్న గొప్ప ప్రార్థన చేశారో ఇంకా ప్రార్థన ముగించి కళ్ళు తెరువక ముందే యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని కూడా దహించి వేసింది*. ఆ పోసిన నీరు మొత్తం ఆరిపోయింది. 18:38; చూసారా దేవుని అద్భుతం!! ఇంకా ప్రార్థన ముగించక ముందే జవాబిచ్చారు దేవుడు! బయలు ప్రవక్తలు, అషేరా దేవి ప్రవక్తలు ఎంత ప్రార్థించిన జవాబివ్వలేదు. కారణం వాడిలో శక్తిలేదు కాబట్టి. దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త కాబట్టి వెంటనే అగ్నిద్వారా సాక్షాత్కరించారు. అది దేవుని స్టైల్!! మనిషి నిజముగా దేవునికి ప్రార్థన చేస్తే, నిజముగా ఆరాధన చేస్తే దేవుడు జవాబివ్వకుండా ఉండలేరు. ఇక్కడ ఏలియాగారి ప్రార్ధనకు జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్ధనకు కూడా జవాబివ్వగలరు! మరి నీ ప్రార్ధనకు జవాబివ్వడం లేదు అంటే కారణం మీ పాపములు మీకును దేవునికిని అడ్డుగా వస్తునాయి. యెషయా 59:1--3, ఆ పాపములు నీనుండి తొలగించు కొంటె దేవుడు నీకు తప్పకుండా జవాబివ్వగలరు! ఐతే నీవు చేస్తున్న ప్రార్థన, ఆ ఆరాధన మనస్ఫూర్తిగా చేస్తున్నావా? గుండె గదుల్లోనుండి వస్తుందా ఆ ప్రార్థన, ఆరాధన??!! అది లేదు కాబట్టే నీ ప్రార్ధనకు జవాబు రావడం లేదు. నీ ఆరాధన కూడా ఏదో పెదాలమీద ఆరాధనే గాని నిజమైన ఆరాధన కాదు.

ఇక్కడ ఒక విషయమా చెప్పనీయండి. చాలామంది ఆరాధనా అంటే కేవలం 4 లేదా 5 పాటలు కలిపి పాడటం ఆరాధన అనుకుంటారు. అదే ఆరాధనా కాదు. ఆరాధన అనేది కేవలం పాటలు పాడటమే కాదు ఆరాధన! ప్రార్థిస్తూ స్తుతించడం కూడా ఆరాధనే! దేవుడు మనిషిని చేసింది ఆయనను స్తుతించడానికే! కాబట్టి మనిషి దేవుణ్ణి స్తుతించాలి. ఐతే దేవుడు ఆత్మగనుక ఆయనను ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి అని యేసుప్రభులవారే చెప్పారు. కాబట్టి నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ స్తుతి ఆత్మతోనూ సత్యముతోను చేస్తున్నావా? కేవలం పెదాలతోనే చేస్తున్నావా? మనిషిని మెప్పించటానికి చేస్తున్నావా? లేక నీ టాలెంట్ లు చూపించటానికి చేస్తున్నావా? ఒకవేళ నీవు ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేస్తుంటే నీవు ధన్యుడవు! కేవలము పెదాలతో చేస్తుంటే నీవు మోస పోతున్నావు. దేవుడు వెక్కిరింప బడడు. ఆయన నుండి నీవు ఏవిధమైన ఫలాలు పొందుకోలేవు. ఏలియా గారు చేసిన హృదయపూర్వకమైన ప్రార్థన ద్వారా అసాధారణ రీతిలో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. మరి నీవు ప్రార్థన చేస్తుంటే దేవుని అగ్ని దిగి నీ పాపములను, దోషములను ఎందుకు కాల్చివేయడం లేదు. సాతాను శక్తులు ఎందుకు లయమవడం లేదు? కారణ నీ ప్రార్థన ఆరాధన అంతా పెదాలతో చేస్తున్నావు కాబట్టి.

కాబట్టి ప్రియ చదువరీ! ప్రార్థించు ఆత్మతోను, సత్యముతోను! ఆరాధించు—ఆత్మతోను సత్యముతోను! అప్పుడు దేవుడు నీవు పిలిస్తే పలుకుతారు. ప్రార్థిస్తే జవాబిస్తారు. మరి నీవు సిద్దమా?
దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త—20వ భాగము

సవాలు—8

1 రాజులు 18:39—40.
39. అంతట జనులందరును దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.
40. అప్పుడు ఏలీయా-ఒకనినైన తప్పించు కొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. . .

ప్రియ దైవజనమా! ఏలియాగారు ప్రార్థించిన వెంటనే అగ్ని ఆకాశము నుండి దిగి బలి పశువును, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని, నీటిని దహించినట్లు చూసుకున్నాం. ఎప్పుడైతే ప్రజలు ఈ అగ్ని సాక్షాత్కారము లేక కర్మెలు అనుభవం కలిగిందో వెంటనే సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేయడం మొదలు పెట్టారు.

గమనించారా!! ఇక్కడ మొదటగా: ఏలియాగారి ప్రయాస/ ఆశ/ జిజ్ఞాశ నెరవేరింది. ఇశ్రాయేలీయులను తిరిగి యెహోవా దేవుని దగ్గరకు నడిపించడమే తన మిషన్!! ఇదే పని మీద దేవుడు అతనిని ఏర్పరచుకున్నారు. ఇందుకు ఆయన ఉపయోగించిన సాధనాలు లేఖనాలు, అతి సాధారణ మైన విషయాలు. కాని అన్నీ క్రమప్రకారంగా చేసి, ధర్మశాస్త్రానుసారంగా చేస్తూ, తనకు గొప్ప/మహిమ అనేది లేకుండా చేస్తూ—దేవునికే మహిమ కలిగేలా చేసారు. అందుకే వెంటనే వారు సాగిలపడి మొక్కారు దేవుణ్ణి. నిజమైన దేవుడెవరో అందరికీ తెలియజెప్పారు.
ఇక రెండవదిగా: తను చేసిన సవాలును నెరవేర్చు కొన్నారు. దేవునికోసం పౌరుషమైన సవాలు/ అసాధారణ సవాలు చేసారు. దానిని చిన్న ప్రార్థన మూలంగా నెరవేర్చుకోగలిగారు. ప్రియ చదువరీ! అటువంటి క్రీస్తుకోసం పౌరుషం నీకుందా?ఆదిమ భక్తులు అలాగా ప్రార్థన చేసి ఎంతోమందిని రక్షించుకోగలిగారు. ఈ పట్టణాన్ని నాకిస్తావా(క్రీస్తుకోసం) లేదా అని ప్రార్థించి పట్టణాన్ని మార్చుకున్నవారెందరో!! రోజుకో ఆత్మ నాకిస్తావా లేదా, అని ప్రార్థించి రోజుకొకరిని మార్చుకోగలిగారు భక్తులు! ఇలా ప్రార్థించి, ప్రార్థించి ఎంతోమందిని క్రీస్తుకై గెలువగలిగారు; కొంతమంది ఆ ప్రార్ధనలోనే మరణించారు. క్రీస్తుకోసం చావడం క్రీస్తు శ్రమానుభవంలో పాలుపొందడమే! లోకంలో చచ్చి—పరలోకంలో బ్రతకటమే! అటువంటి వారు బలిపీటం దగ్గర నివాసం చేస్తారు. పూర్వకాలములో అనేవారు యుద్ధంలో చస్తే వీర స్వర్గం! అలా క్రీస్తుకోసం మరణించిన వారి ఆత్మలకున్న ప్రత్యేక స్థానం కోసం ప్రకటన గ్రంధంలో వ్రాయబడింది. అదే ప్రకటన గ్రంధంలో క్రీస్తుకోసం చెప్పకుండా భయపడితే—నరకానికి పోయే వారిలో మొదట స్థానం పిరికివారికే ఇయ్యబడింది. ప్రియ చదువరీ! నీ పరిస్థితి ఎలా ఉంది? క్రీస్తుకోసం పౌరుషంగా బ్రతుకుతావా? లేక లోకంలో కలిసిపోయి నులివెచ్చనగా బ్రతికి లవోదోకాయ సంఘానికి దేవుడు ఉమ్మివేసినట్లు నీవుకూడా ఉమ్మివేయించుకుంటావా??!!! ఆలోచించుకో!! మరలా చెబుతున్నాను—క్రీస్తుకు ఇలాంటి సవాలుకరమైన జీవితాలే కావాలి గాని చచ్చు బ్రతుకులు/ చెత్త బ్రతుకులు వద్దు! క్రీస్తుకే కాదు, సాతానుగాడికి కూడా ఇలాంటి చెత్త బ్రతుకులు అవుసరం లేదు. ఉదా: గవర్నమెంటు వారుకి గాని, నక్షలైట్లు/ మిలిటెంట్లు లాంటి వారికి యవ్వనస్తులే కావాలి గాని పళ్ళూడిపోయిన ముసల్లోల్లు వద్దు! అలాగే క్రీస్తుకోసం ఎల్లప్పుడూ నవ యవ్వనుడిలా ఆయన పనిలో సాగే వాడు కావాలి దేవునికి వాని వయస్సుతో నిమిత్తము లేకుండా! మరి నీవు అలా జీవించగలవా? యోబుగారు అంటారు కుటుంబముల తిరస్కారానికి జడిసి, ద్వారం దాటకుండా ఉంటే/ రొమ్ములో నాపాపం దాచుకుంటే/ అనగా ద్వారం దాటి క్రీస్తుకోసం చెప్పకుండా ఇంట్లోనే ఉండిపోతే—పరముననున్న దేవుని దృష్టికి వేషదారిని అవుతాను అంటున్నారు. యోబు 31:33--34; మరి నీవో!!!!!

ఇక తర్వాత వచనంలో ఏలియాగారు ఒకరిని తప్పించుకోకుండా బయలు ప్రవక్తలను అందరినీ పట్టుకొనమని చెప్పి వారందరినీ కీషోను వాగు దగ్గర వధించారు అని వ్రాయబడింది!! ఏం? ఎందుకు అలా వధించారు? చట్టాన్ని తన చేతులలోనికి తీసుకున్నారు కదా!! అదీ కూడా ఒక రాజు సమక్షంలో!! అదీకూడా రాజు భార్యకు అతి ఇష్టమైన వారిని చంపేశారు!! ఒకరినా ఇద్దరినా??!! 850 మందిని!! ఎందుకు అలా చేశారు? కారణం గతంలో చెప్పిన విధముగా ఏలియాగారు తన సొంత ఊహాలను బట్టి తనసొంత ఆలోచనలను బట్టి ఏమి చేసేవారు కాదు! అంతా లేఖనాల ప్రకారం! దేవుడు చెప్పిన విధానం ప్రకారం! ఒకసారి ద్వితీ 13: 5; 18; 18:20 చూడండి. ఎవరైనా యెహోవా దేవుణ్ణి విడచి మరో దేవతను / ఆత్మను పూజించినా, పూజించాలని చెప్పిన వారికి ఇలాగే చేయాలని ధర్మశాస్త్రము చెబుతుంది. ఇక్కడ ఏలియాగారు ధర్మశాస్త్రాన్ని తు.చ. తప్పకుండా చేశారు అంతే! దాని పర్యవసానం కోసం ఏమాత్రం ఆలోచించలేదు! తర్వాత అధ్యాయంలో ఆయన ఎన్ని బాధలు పడ్డారో మనం చూడవచ్చు! కానీ ఆయన వెనుతిరుగలేదు! ఉన్నది ఉన్నట్లు చేశారు. ప్రియ చదువరీ! నీకు అలాంటి స్థిర నిర్ణయం ఉందా? క్రీస్తుకోసం ఎన్ని శ్రమలొచ్చినా పర్వాలేదు, క్రీస్తుకోసం పౌరుషం కలిగి జీవిస్తాను అనే నిర్ణయం నీకుందా?!! షడ్రక్, మేషాక్, అబెద్నేగో అనేవారు అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. చావనైనా చస్తాము గాని వాడి బంగారమ్మ బొమ్మను మ్రొక్కము అని, చావుకు తెగించారు. వారి విశ్వాసానికి దేవుడే పరమును విడచి భూమికి వచ్చి వారిని తప్పించారు. అలాంటి పౌరుషం, స్థిర నిర్ణయం నీకుందా? మరలా చెబుతున్నాను క్రీస్తుకు అలాంటి వారే కావాలి! ఆ గుంపులో నీవుండగలవా?

అట్టి త్యాగం, పౌరుషం, విశ్వాసం దేవుడు మనందరికీ దయచేయును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త—21వ భాగము

ఏలియాగారి ప్రార్థన—3


1 రాజులు 18:41—42
41. పిమ్మట ఏలీయా-విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా
42. అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను. . .

ప్రియ దైవజనమా! కర్మెలు అనుభవం తర్వాత బయలు ప్రవక్తలను అందరిని కీషోను వాగు దగ్గర వధించినట్లు మనం చూసుకున్నాం. ఇక తర్వాత ఏలియాగారు ఆహాబుతో అంటున్నారు: విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది కాబట్టి నీవు వెళ్లి భోజనం చేయమని చెప్పారు. ఇక్కడ ఒకసారి ఆగుదాం! ఏలియాగారు విస్తారమైన వర్షం వచ్చునట్లుగా ధ్వని వస్తుంది అంటున్నారు—గాని 43వ వచనం ప్రకారం అక్కడ మబ్బులే లేవు, గాలే లేదు. మరి వర్షం ఎక్కడనుండి పడుతుంది? రాజుకి గాని, సైనికులకు గాని, పనివాడికి గాని ధ్వని వినబడలేదు. మేఘము కనబడలేదు. అంటే ఇది విశ్వాస పరిభాష!!! ఏలియాగారి దర్శనంలో గొప్ప వర్షం పడుతున్నట్లుగా కనిపిస్తుంది. దానికోసం ప్రార్థిస్తున్నారు. ప్రతీ విశ్వాసికి ఇలాంటి దర్శనం ఉండాలి. దేవునికోసం గొప్పగొప్ప పనులు చేసేలాగా దేవునికోసమైన దర్శనాలు ఉండాలి. అందుకే విలియం కేరీ భక్తుడు అంటున్నారు: దేవుని కోసం గొప్పపనులు యోచించు! దేవునికోసం గొప్ప పనులు చేయు! Expect Great Things For God, Attempt Great things For God!!!.ఆ భక్తుడు అలా యోచించి, చేసి, క్రీస్తుకోసం క్రొవ్వొత్తిలా కరిగిపోయారు మన దేశంలో! మనం కూడా ఏలియాగారికున్న దర్శనం, కేరీ గారికున్న దర్శనం కలిగి ఉండాలి.

ఇక మరొక ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే: ఆహాబు రాజు వెళ్లి భోజనం చేయమంటే భోజనం చేయడానికి వెళ్ళిపోయాడు. అక్కడ బయలు ప్రవక్తలందరినీ చంపేస్తున్నా ఏమీ అనలేదు. వద్దు అనలేదు, చంపమని అనలేదు. కారణం బహుశా షాక్ లో ఉండి ఉండవచ్చు. లేదా ఇక్కడ ప్రజలు అందరు బయలు ప్రవక్తలు వారిని మభ్యపెట్టి మోసం చేసారు కాబట్టి శిరచ్చేదం సరియైన తీర్పు అని కేకలు వేస్తున్నప్పుడు ప్రజల్ని మెప్పించటానికి నిశ్శభ్దంగా ఉంది ఉండవచ్చు! ఐతే గమనించాల్సింది ఏమిటంటే—ప్రజలు ఆ మహా అద్భుతం చూసి మారారు గాని ఈ పనికిమాలిన రాజు మాత్రం ఏమాత్రం మారలేదు. సరికదా తన భార్యతో కలిసి ఏలియాగారిని చంపడానికి చూసాడు. కాబట్టి పాపిష్టి మనుష్యుల హృదయాలను కేవలం అద్భుతాలు మాత్రమే మార్చలేవు. వారి ప్రాణాలమీదకు వస్తే తప్ప మారరు!

ఇక 42వ వచనం ప్రకారం ఆహాబురాజైతే భోజనము చేయడానికి వెళ్ళిపోయాడు గాని ప్రవక్త మాత్రం భోజనం చేయడానికి వెళ్ళలేదు గాని ప్రార్థన చేయడానికి వెళ్ళినట్లు చూస్తున్నాం. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ తనను చంపడానికి చూసే వారు ఉన్నారు గాని తనకు భోజనం పెట్టేవారు ఎవరూ లేరు. ఐతే తనకు తెలుసు తనతోపాటు యెహోవాయీరే ఉన్నారని!! అయితే ఇక్కడ ఏలియాగారి ఆలోచన అంతా భోజనం మీద లేదుగాని వర్షం మీద ఉంది. కారణం దేవుడు చెప్పమంటే వెళ్లి చెప్పేశారు ఏలియా—నేను మరలా చెప్పేవరకు వర్షం గాని, మంచుగాని పడదు అని. దానివలన ఇంతవరకు ఆ దేశంలో మంచుగాని, వర్షం గాని లేక—ప్రజలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. పశువులకు త్రాగడానికి నీరులేదు, తినడానికి పచ్చిక లేదు! ఇలా వారు మాడిపోవాలని ఏలియాగారి ఉద్దేశం ఎంతమాత్రము కాదు. వారు మారాలి. దేవుడు వర్షం పంపించాలి. ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ఇది ఆయన ఉద్దేశ్యం! అందుకే ఇక్కడ ఆహాబుతో చెప్పారు విస్తారమైన వర్షం కురువబోతుంది అని కారణం.... అదే ఆహాబుతో నేను చెప్పేవరకు వర్షం పడదు అని చెప్పేరు కాబట్టి అదే ఆహాబుతో దేవుడు వర్షం పంపించబోతున్నారు అని చెప్పేశారు. చెప్పడం అయితే చెప్పారు గాని వర్షం కురాలి కదా! అందుకే వర్షం పడేలా ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు—నేలమీద పడి, ముఖము మోకాళ్లమద్య ఉంచుకొని ప్రార్థన చేస్తున్నారు. చూసారా ఆయన తగ్గింపు! ముఖం మోకాళ్ల మీద ఉంచుకుని ప్రార్థన చేయడం అంటే—సిగ్గుతో తలవంచుకొని ప్రార్థన చేస్తున్నారు. ఏం? అంత సిగ్గులేని పని ఎప్పుడు చేశారు ఏలియాగారు?!! ఆయన చేయలేదు ! మరి ఎవరు చేశారు? ఇశ్రాయేలీయులు!! వారు చేసినపనికి తానూ వారి పక్షంగా సిగ్గుపడి, విజ్ఞాపన చేస్తున్నారు. దయచేసి క్షమించి వర్షం కురిపించమని!!!
ఇదీ ఒక సేవకునికి/ నాయకునికి/ కాపరికి ఉండవలసిన లక్షణం! ఇలా ప్రజల పక్షమున తప్పులు ఒప్పుకుని ప్రార్థన చేసిన వారు బైబిల్ లో చాలామంది ఉన్నారు. మోషేగారు, దావీదు గారు, సమూయేలు గారు, నేహెమ్యా, ఎజ్రా,యెషయా, యిర్మియా ఇలా ఎందఱో ప్రవక్తలు చేసారు. వారు అలా ప్రార్థన చేసి మన పాపములకోసం ప్రార్థన చేసారు కాబట్టి మనం ఇంతవరకు దేవుని ఉగ్రత తగలకుండా సజీవంగా ఉన్నాం. వారు అలా చేసి ఉండకపోతే మనం దేవుని న్యాయమైన ఉగ్రతలో మాడి మసైపోయి ఉందుము! ప్రియ చదువరీ! నీవు ఇలా ఉన్నావంటే నీకోసం ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. నీ రక్షణకోసం నీ తల్లి చేసిన ఉపవాస ప్రార్థన, లేకపోతే నీ సహోదరి/ భార్య/ మరో విశ్వాసి చేసిన ప్రార్థన వలనే నీవు ఇంతవరకు సజీవముగా ఉన్నావు. లేకపోతే నీవు ఎప్పుడో నశించిపోయి ఉందువు. కాబట్టి నేడే మారుమనస్సు పొంది, రక్షణ పొందుము!

ప్రియ సేవకుడా! విశ్వాసి! నీకు అటువంటి కన్నీటి ప్రార్థన ఉందా? అలా కన్నీటిప్రార్ధన ఉంటే నీవు నీ గ్రామాన్ని, నీ సంఘాన్ని నీవారిని రక్షించుకుంటావు. లేకపోతే నీవు చేసే ప్రయత్నాలు ఇసుకమీద ఇల్లు కట్టినట్లే! ఒకసారి పరిశీలించుకో!

అట్టి కృప, ప్రార్ధనాభారం దేవుడు మనందరికీ దయచేయును గాక! ఆమెన్!
దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త—22వ భాగము

ఏలియాగారి ప్రార్థన—4

1 రాజులు 18:42—44
42. అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.
43. తరువాత అతడు తన దాసుని పిలిచి-నీవు పైకిపోయి సముద్రమువైపు చూడుమనగా వాడు మెరకయెక్కి పారజూచి ఏమియు కనబడలేదనగా అతడు-ఇంక ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను.
44. ఏడవ మారు అతడు చూచి-అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయా-నీవు అహాబు దగ్గరకు పోయి-నీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధ పరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను.

అయితే ఈ భాగంలో దేనికోసం అంతగా ప్రార్ధించారో వ్రాయబడలేదు కాని యాకోబు పత్రికలో చాలా విశిదముగా వ్రాయబడియుండి. 5:17—18: ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమి మీద వర్షింపలేదు.
అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. . . . . .
ఇక్కడ చూసుకుంటే మరలా వర్షం పడేలాగా ఎంతో ఆసక్తితో, కన్నీటితో పట్టుదలగా ప్రార్థన చేసారు ఏలియాగారు. ఆయన ఎంతో పట్టుదలగా ప్రార్థన చేసారు అని చెప్పడానికి మనకో గట్టి ఆధారం ఉంది అది ఏమిటంటే: తర్వాత వచనాలలో అనగా 43 లో తన పనివానిని పిలిచి నీవు పోయి సముద్రమువైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి చూసి, ఏమి కనబడలేదు అని చెప్పినట్లు చూస్తున్నాం. తన పనివానిని పిలిచి మేఘం వచ్చిందా అని చూడమంటే వాడు చూసి అలాంటి మేఘాలు లేవు అని చెప్పాడు. నీవు నేను అయితే ఈ మాట విని ఎంతో నిరాశపడతాం! ప్రార్థన ఆపేస్తాం! కారణం ఇంత ప్రార్థన చేసినా మేఘం కూడా రాలేదు. కాని ఆయన నిరాశ పడలేదు. ఇంకా ఏడుమార్లు పోయి చూడు అని చెప్పారు. కారణం వాగ్దానం చేసిన దేవుడు—దానిని నెరవేర్చుటకు శక్తిమంతుడని అబ్రాహాము గారు ఎలాగా నమ్మారో,, అలాగే ఏలియాగారు కూడా మనసా—వాచా—కర్మేనా నమ్మారు. అందుకే ఏమాత్రం నిరాశపడకుండా పనివానితో చెబుతున్నారు పోయి ఇంకా ఏడుమార్లు చూడమని చెబుతున్నారు పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు.

(ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది: ఇంతవరకు ఎక్కడ తనకు ఒక పనిమనిషి ఉన్నాడు అని కనపడదు! గాని మనకు ఇక్కడ పనివాడు ఎక్కడనుండి వచ్చాడు? పనివాడికి జీతం కూడా ఇచ్చే స్తోమత లో లేరు కదా ఏలియాగారు!! అయితే బహుశా మొదట ఆయనకు పనివాళ్లు లేకపోయినా, ఏలియాగారి భక్తిశ్రద్ధలు చూసి ఆ ప్రాంతపు వారు ఎవరో ఆయనకు శిష్యుడిగా చేరి ఉంటారు. లేదా విధవరాలు ఆయనకు పనివాడిని ఇచ్చి ఉంటుంది. లేదా ఆయన సవాలు చేసిన వెంటనే దేవునిమీద భక్తిగలవాడు స్వచ్ఛందంగా తనే సేవకునిగా చేరి ఉంటాడు. )

సరే ఇక్కడ పనివాడు చెప్పినా నిరాశపడకుండా పట్టుదలగా ప్రార్ధన చేసున్నట్లు చూసుకున్నాం. చివరికి ఏడోసారి పనివాడు వచ్చి చెబుతున్నాడు అరచేయి అంత మేఘం సముద్రం నుండి ఎక్కి వస్తుంది. హల్లెలూయ! అంతవరకూ ఆయన ప్రార్థన మానలేదు. అందుకే దేవుడు పట్టుదలగా ప్రార్థన చేయమంటున్నారు. విసుగక ప్రార్థన చేయమంటున్నారు. ఆసక్తితో ప్రార్థన చేయమంటున్నారు. యెహోవా జ్ఞాపక కర్తలారా మీరు విశ్రమించకుడి అని సెలవిస్తుంది బైబిల్. యెషయా 62: 7
యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి.
కాబట్టి ప్రియ దేవునిబిడ్డా! నీ ప్రార్థన మానొద్దు! దేవుడు నీ ప్రార్ధనకు జవాబు ఇచ్చేవరకు విసుక్కోవద్దు. కనిపెట్టు! ప్రార్థించు! ప్రార్ధనకు జవాబు లేట్ అయ్యిందంటే ఆయన నిన్ను పరీక్షిస్తున్నారేమో!! లేక నీ పాపములు నీ ప్రార్థన దేవునికి చేరకుండా అడ్డగిస్తున్నాయేమో!! యెషయా 59:1-2; అట్లాగయితే నీ పాపములు ఒప్పుకుని కడిగివేసుకో! దేవునితో సమాధాన పడు! ఏలియాగారి ప్రార్ధనకు జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్ధనకు కూడా జవాబిస్తారు. బైబిల్ గ్రంధం మొదట నుండి చివర వరకు అనేకమంది ప్రార్థించి—దేవుని నుండి జవాబులు పొందుకున్నారు.

సరే 44వ వచనం చూసుకుంటే .ఏడవ మారు అతడు చూచి-అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయా-నీవు అహాబు దగ్గరకు పోయి-నీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధ పరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. . . . వర్షం నీకు అడ్డురాకుండా రథము మీద పారిపో అంటే వెంటనే ఆహాబు రథము మీద పోయాడు గాని 46వ వచనం చూసుకుంటే .
యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబుకంటె ముందుగా పరుగెత్తికొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. . . . . చూసారా యెహోవా హస్తము ఏలియాగారిని బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగ యెజ్రేయేలు పట్టణానికి పోయినట్లు చూస్తున్నాం. అదీ దేవుని శక్తి! దేవుని హస్తానికి ఉన్న బలం! యెహోవా హస్తము కోసం చూడండి నిర్గమ 15:6; 1 సమూయేలు 5:6; 7:13; 2 రాజులు 3:15; ఎజ్రా 7:6; ఇలా చూసుకుంటూ పోతే యెషయా, యెహేజ్కేలులో చాలా విస్తారంగా రాయబడింది. . . . ...

ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది: అదేమిటంటే: అరచేయి అంత మేఘం వచ్చింది గాని మోపైన వర్షం కురిసింది. కారణం విశ్వాసం!! అది అరచేయంత మేఘమే గాని గొప్ప వర్షం కురిసింది. ప్రియ విశ్వాసి! నీకు నీ బలము/ విశ్వాసం/ ప్రార్థన చాలా చిన్నదిగా కనబడవచ్చు! గాని అవి దుర్గములను పడద్రోయజాలినంత శక్తి గలవి. 2 కొరింథీ 10:4; వాటిని వాడు. కేవలం ఒక చిన్న కర్రముక్క మోషేగారి చేతిలో—ఎన్నో గొప్ప కార్యాలు చేసింది. కేవలం చచ్చిపోయిన గాడిద దవడ ఎముక ముక్క—వెయ్యిమందిని చంపింది. చిన్న వడిసెలు—ఆరుమూర్ల జానెడు ఎత్తుమనిషిని చంపింది. ఇశ్రాయేలు దేశపు చిన్నదే—గాని నయమాను కుష్టరోగం పోవడానికి కారణం అయ్యింది. దావీదు చిన్నవాడే—గాని గోల్యాతును చంపి ఇశ్రాయేలుకి జయం కలుగజేశాడు.
అయిదు రొట్టెలు రెండే చిన్న చేపలు- 5000 మంది ఆకలిని తీర్చాయి. నీ ప్రార్థన చిన్నదే—గాని గొప్ప- పెద్ద- మహత్తర కార్యములు చేయగలదు! నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని (ప్రార్థన) తక్కువగా అంచనా వేయకు! ఎలిషా గారి శిష్యుడు దేవుని శక్తిని తక్కువగా అంచనా వేశాడు. ఎలిషా గారు ప్రార్థించారు—వీడి కన్నులు తెరువజేయు ప్రభువా అని—ఆత్మీయ నేత్రాలు తెరువబడి నపుడు శత్రువుల కంటే ఎక్కువ సైన్యం కనబడింది. అలాగే నీ ఆత్మీయనేత్రాలు తెరువబడే వరకు నీ సమస్యలను చూసి నీవు బెదిరిపోతూ ఉంటావు. అయితే నీ ఆత్మీయనేత్రాలు తెరువబడితే నీకు తెలుస్తుంది నీతో ఉన్నవాడు/ నీలో ఉన్నవాడు ఎంత బలాడ్యుడో . కాబట్టి దయచేసి సమస్యలను చూసి బెదిరి పోవద్దు! నాకు మంది బలం లేదు, ధన బలం లేదు! మాటకారిని కాను! బలవంతుడ్ని కాను అనుకోకు! నీవు ఒక్కడివే అని చింతించకు! నీతో పాటు నీ సృష్టికర్తయైన దేవుడు ఉన్నారు. ఆయన కోటివేల సైన్యం నీ చుట్టూ ఉంది!
అయన శక్తిని, బలాన్ని నమ్ముకో!
ప్రార్ధనాశక్తి ఎంతటిదో తెలుసుకో!
అద్భుతాలు పొందుకో!
ఆమెన్!


పౌరుషం గల ప్రవక్త—23వ భాగము



1 రాజులు 19.1--2.
1. ఏలీయా చేసినదంతయును అతడు ఖడ్గముచేత ప్రవక్తల నందరిని చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా
2. యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను-రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. .

ప్రియ దైవజనమా! గతభాగంలో ఏలియాగారు కన్నీటితో, ఆసక్తితో, పట్టుదలగా ప్రార్థించిన తర్వాత వర్షం కురిసినట్లు ధ్యానం చేసుకున్నాం. ఈ సందర్భముగా మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను. వర్షము అనగా ఆత్మాభిషేకం, ఉజ్జీవము ఎప్పుడు వస్తుంది అంటే ఏలియాగారు చేసినట్లు పనులన్నీ క్రమ ప్రకారంగా చేసినప్పుడే. ఏలియా గారు మొదట పడిపోయిన/ పడద్రోయబడిన బలిపీటాన్ని తిరిగి కట్టినట్లు నీవుకూడా కట్టాలి. అనగా నీ క్రియల ద్వారా నిర్లక్ష్యపెటిన ప్రార్ధనా బలిపీటం మరల కట్టాలి. కన్నీటితో నిజమైన పశ్చాత్తాపంతో దేవుని కృపాసనాన్ని సమీపించాలి. లేఖనాల ప్రకారం 12 రాళ్ళతో బలిపీటం కట్టారు ఏలియాగారు—అలాగే లేఖనాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. బలిపీటం చుట్టూ రెండు మానికలు పట్టునంత కందకం త్రవ్వారు—అనగా దేవుని వాక్యాన్ని లోతుగా అర్ధం చేసుకోవాలి. విత్తబడిన వాక్యం ఒకచెవితో విని, ఒక చెవితో వదిలేయకుండా వాక్యాన్ని హృదయపు లోతులలో భద్రము చేసుకుంటూ, ధ్యానం చేస్తూ ఉండాలి. కట్టెలను క్రమంగా పేర్చినట్లు—నీ జీవితంలో క్రమంగా లేనివాటిని, దేవునికి ఆయాసం పుట్టించే వాటిని తీసివేసి, నీ బ్రతుకును క్రమ పరచుకొని దేవుని సన్నిధిని సమీపించాలి. బలి పశువును ముక్కలుగా కోసి బలిపీటం మీదను పెట్టినట్లు—నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో క్రుమ్మరించాలి. విరిగి నలిగిన హృదయముతో దేవుని కృపాసనాన్ని సమీపించాలి. 12 తొట్ల నీరు పోసినట్లు దేవుని వాక్యముతో నీ గిన్నె నిండి పొంగి పొర్లిపోవాలి. అప్పుడు నీవు చేసే చిన్న ప్రార్థన మొదటగా దేవుని ఆత్మాభిషేకాన్ని తీసుకుని వస్తుంది. తర్వాత ఉజ్జీవం కలుగుతుంది. ఒకవేళ నీవు పోగొట్టుకుంటే తిరిగి పొందుకొనే క్రమం ఇదే!

ఇక తర్వాత అధ్యాయం మొదట రెండు వచనాలలో పెంటమ్మ/ యెజెబెలు కబురు పెడుతుంది ఏలియాగారికి – రేపు ఈ వేళకు నీవు చంపించిన వారి ప్రాణాల వలే నీ ప్రాణం కూడా పోతుంది అని. చూడండి ఇంత ఉజ్జీవం , ఇంత అభిషేకం, ఇంత గొప్ప మహాద్భుతం జరిగినా ఈ స్త్రీకి మార్పులేదు సరికదా సైతాను ప్రోద్భలంతో దైవజనున్ని చంపుదామని చూస్తుంది. నిజమే ఈ లోకంలో దేవుని సేవ నిస్వార్ధంగా చేసే వారికి చాలా శ్రమలు వస్తాయి. ఐతే అవి ఒక్కోసారి బయటవారినుండి తక్కువగా వస్తాయి గాని దురదృష్టం ఏమిటంటే దేవుని బిడ్డలతో ఎక్కువగా వస్తుంటాయి.

ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే ఉజ్జీవం తర్వాత, ఆత్మాభిషేకాన్ని పొందుకున్న తర్వాత వెనువెంటనే సాతాను శోదన కలుగుతుంది. అది సర్వ సాధారణం. కారణం సాతానుగాడు దేవుని పనిని చూసి తన కోపాన్ని చూపిస్తాడు. బలహీన మైన విశ్వాసులను—విశ్వాస హీనులుగా చేయడానికి సాతాను వేసే మొదటి స్టెప్ ఇదే! అధిక శోధన! మహా దైవజనుడైన ఏలియాగారే ఆ శోధన తప్పించుకోలేకపోయారు. అనేకమంది భక్తులకు ఇలాంటి శోధనలు ఎదురయ్యాయి. చివరికి యేసుప్రభులవారికి కూడా ఈ శోధనలు ఎదురయ్యాయి. కాబట్టి ప్రియ విశ్వాసి! నీవు ఉజ్జీవం పొందుకున్న తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, లేదా రెండు మూడు రోజుల ఉపవాసం, 40 రోజులు ఉపవాసం ముగించిన తర్వాత, లేదా ఏదైనా సభలకు వెళ్ళి పోగొట్టుకున్న ఉజ్జీవం తిరిగి పొందుకున్న తర్వాత శోధనలు కలిగాయి అంటే ఆశ్చర్యపడకు! అపోస్తలులు, ప్రవక్తలు చివరికి యేసయ్యకే తప్పలేదు. నీకు కలిగాయి అంటే ఆశ్చర్యపడొద్దు! ఐతే దేవుడు ఈ శోధనలలో నీకు తోడుగా ఉంటారు. నీవు తట్టుకోలేనంతగా నిన్ను శోధింపబడనీయరు. అంతేకాదు శోధన తప్పించుకునే ఉపాయం కూడా చూపిస్తారు. 1 కొరింథీ 10:13; అంతేగాని శ్రమలు రాకుండా తప్పించరు . యేసుక్రీస్తుని నమ్ముకుంటే అన్నీ నీకు సుఖాలే గాని కష్టాలు రావు. జబ్బులు రావు, ఇలాంటి భోధ ఎవరైనా చేస్తే ఆ వ్యక్తి అబద్ద బోధకుడని అర్ధం! శోధనలు సహించిన తర్వాతే నీకు పరలోకం అని యేసయ్య, అపోస్తలులు ముందుగానే చెప్పి వెళ్ళారు. అందుకే శోధన సహించువాడు ధన్యుడు అని బైబిల్ చెబుతుంది. యాకోబు 1:12; అంతేకాకుండా శ్రమ దినమందు నీవు కృంగినయెడల చేతకాని వాడివి అనికూడా ఎద్దేవా చేస్తుంది. సామెతలు 24:10; కాబట్టి ప్రియ సంఘమా! ఇలాంటి ఉజ్జీవం, ఆత్మాభిషేకం పొందుకున్న తర్వాత శోధనలు కలుగుతాయి కాబట్టి సిద్ధంగా ఉండు. కలవరపడకు! లోకమును జయించిన విజయం నీ విశ్వాసమే! 1 యోహాను 5:4;
జయము నీదే! నీతోకూడా వచ్చువాడు, నీ తరుపుగా యుద్ధము చేయువాడు నీ దేవుడైన యెహోవాయే! ద్వితీ 31:6;

కాబట్టి ధైర్యంగా ఉండు! భయపడకు! సిద్దపడు!
దైవాశీస్సులు!

పౌరుషం గల ప్రవక్త—24వ భాగము
ఏలియాగారి వైరాగ్యము/నైరాశ్యం—1



1 రాజులు 19.౩--4
3. కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడు కొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి
4. తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షము క్రింద కూర్చుండి, మరణాపేక్షగలవాడై- యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను. . . .

ప్రియ దైవజనమా! గతభాగంలో యెజెబెలు ఏలియాగారికి వర్తమానం పంపినట్లు చూసుకున్నాం—రేపు ఇంతవేళకు నీ ప్రాణము కూడా తీసివేస్తాము అని,. చూడండి ఈ వర్తమానం విని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన పారిపోతున్నారు. ఐతే తన సేవకుని పిలిచి నీవు యూదా సంభంధమైన బెయేర్షేబా వెళ్లి నీ ప్రాణాన్ని రక్షించుకోమని పంపించేవారు. చూసారా తనవలన తన సేవకుడు మరణించడానికి ఆయన ఒప్పుకోలేదు. అందుకే సేవకుడ్ని పంపించేసారు ఎక్కడికి ఇశ్రాయేలీయులు దేశం సురక్షితం కాదని, యూదా దేశం పంపించేసారు.

సరే ఇప్పుడు ఏలియాగారు ఒకరోజు ప్రయాణం అరణ్యం లోనికి పోయి ఒక బదరీవృక్షము క్రింద కూర్చొన్నారు. బదరీవృక్షము అనగా ఒకరకమైన చెట్టు. శూరేచ్చేది చెట్టు అంటారు తెలుగులో. అచ్చ తెలుగు లో రేగు చెట్టు. అయితే మన దేశంలో గల రేగుచెట్లు కావు ఇవి.. ఆ వృక్షము క్రింద కూర్చొని అంటున్నారు దేవునితో—అనగా దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నారు—ఎలా చేస్తున్నారు?!! *మరణాపేక్షగలవాడై* అనగా చచ్చిపోవాలని కోరిక గలవాడై ప్రార్థన చేస్తున్నారు: యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అంటున్నారు. చూశారా ఎలాంటి ప్రార్థన చేస్తున్నారో!! ఇంతగొప్ప ప్రవక్త, దైవజనుడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారో!! ఎంత వైరాగ్యమూ! ఎంత నైరాశ్యమూ!!! ఏం ఎందుకంత వైరాగ్యం? ప్రార్థన చేస్తే వర్షము, మంచు ఆపివేసిన గొప్ప వ్యక్తి కదా! ప్రార్ధన చేసిన వెంటనే ఆకాశం నుండి అగ్నిని కురిపించి బలిని, కట్టెలు, రాళ్లు అన్నిటిని కాల్చివేసిన మహాగొప్ప ప్రవక్త కదా ఏమిటి ఇలా ప్రార్థన చేస్తున్నారేమిటి? ఇక 2 రాజులు గ్రంధానికి ఒకసారి జంప్ చేసి, మొదటి అధ్యాయం చదివితే *నేనే దైవజనుడ్ని అయితే, నిన్నును నీ 50 మందిని అగ్ని వచ్చి దహించివేయును గాక* అంటే రెండుసార్లు ఆకాశం నుండి అగ్ని వచ్చి మొత్తం 102 మందిని సజీవ దహనం చేసింది కదా! మరి ఇంతటి ప్రవక్త ఎందుకు అలా చేసారు? ఒకసారి మనం మానవ రీతిలో ఆలోచిద్దాం; *నన్ను చంపుదామని అనుకుంటున్నావా పెంటమ్మ! యెహోవా నామంలో నీవు రక్తం కక్కుకుని చస్తావు, లేదా నీవు కాళ్లుచేతులు చచ్చుపడి జీవితమంతా ఉంటావు, లేకపోతే ఆహాబు కొడుకుని అన్నట్లు నీవు ఎక్కిన మంచం దిగకుండా చస్తావు అని అంటే—నిజంగా ఆ యెజెబెలు అలియాస్ పెంటమ్మ అప్పుడే చచ్చిపడును కదా*! మరి ఎందుకు అలా భయపడి పారిపోవడం? ఎందుకు చావాలని కోరుకోవడం?

మనము కూడా ఇలా చాలా సార్లు ప్రార్థించి ఉంటాము కదా! ఈ భాదలు పడలేక, కష్టాలు తట్టుకోలేక, పేదరికం చూడలేక అనేకసార్లు మనం కూడా చాలాసార్లు ఇలా ప్రార్థించి ఉంటాము. అయితే దేవుడు ఇలాంటి చెత్త ప్రార్ధనలు వినరు! ఇలాంటి చెత్త ప్రార్ధనకు పర్యవసానం మనం తర్వాత చూసుకుందాం!

ఐతే ఇప్పుడు ఎందుకు ఆయన అలా ప్రార్థన చేసారో ఒకసారి ఆలోచన చేద్దాం! మొదటగా ఆయన కూడా నీలాగా, నాలాగా మానవుడే! ఆయన ఆకాశం నుండి ఊడిపడలేదు. అయితే యధార్ధత, భక్తిశ్రద్ధలు, విశ్వాసం, దేవునికోసమైన పౌరుషమును చూసి దేవుడు ఆయనను ఏర్పాటుచేసుకున్నారు. కాబట్టి ఆయనలో ఎన్ని మానవాతీతమైన శక్తులు ఉన్నా, కొన్నిసార్లు మనిషిగా ఆలోచిస్తుంటారు. మనం క్రొత్త నిబంధనలో చూసుకుంటే దేవాది దేవుడైన యేసుప్రభులవారు కూడా అలసినరీతిలో కూర్చొన్నారు అనియు, మరో దగ్గర దాహముగొన్నారనియు, మరోచోట ఆకలిగొన్నారనియు వ్రాయబడి యుంది. కాబట్టి ఈ భూలోకంలో పుట్టారు కాబట్టి మానవ రీతిలో ఆలోచన చేసి ఉంటారు. ఇంతవరకు యెహోవా యీరేమీద 100% ఆనుకున్న ప్రవక్త, ఇప్పుడు యెహోవా యీరేను మరచిపోయారు. తన పేరులో ఉన్న అర్ధము *యెహోవాయే బలము* అనేమాట కూడా మరచిపోయారు.

మరో కారణం ఏమిటంటే ప్రతీ వ్యక్తి జీవితంలో ఒక మబ్భు సమయం వస్తుంది. ఆవ్యక్తి సామాన్యుడైనా, ప్రవక్త అయినా, కాపరి అయినా, ఎలాంటి వాడైనా ఈ మబ్బును ఎదుర్కోవలసింది. యేసుప్రభులవారు కూడా ఈ మబ్బు సమయాన్ని ఎదుర్కొన్నారు. 40 రోజుల ఉపవాసం తర్వాత సాతానుతో శోధించబడ్డారు. యోసేపు జీవితంలో మబ్బు వచ్చింది. దావీదు గారి జీవితలో ఎన్నో మబ్బు దినాలు. దానియేలు గారి జీవితంలో మబ్బు దినాలు. ఇలా అపోస్తలులు, ప్రవక్తలు జీవితంలో ఎన్నోన్నో మబ్బుదినాలు వచ్చాయి. ఈ భూమిమీద పుట్టిన ప్రతీ వ్యక్తికి ఒక మబ్బుదినం వస్తుంది. అయితే ఆ మబ్బుదినం పోయిన వెంటనే, అనగా దైవశక్తి కలిగి, గాలి వీచిన వెంటనే ఈ మబ్బులన్నీ పటాపంచలవుతాయి. అప్పుడు ఈ మబ్బులు ఎలా వచ్చాయో అలా పోతాయి. అప్పుడు పూర్తి వెలుగు వస్తుంది. యోసేపు మబ్బు దినాలు పోయిన వెంటనే ఐగుప్తుకు గవర్నర్ అయ్యారు. దావీదు గారు చక్రవర్తి అయ్యారు. ఇలా దైవసేవకులు అందరు శ్రమలు తీరిన వెంటనే వెలిగిపోయారు. కాబట్టి అలాగే ఏలియాగారు కూడా మబ్బు దినాల్లో ఉన్నారు. అందుకే ఇలా మాట్లాడి ఉంటారు.

ఇక్కడ మరో విషయం చెప్పనీయండి. *కష్టాలు వచ్చినప్పుడు ఒక్కటే రాదు. అన్నీ ఒక్కసారే వస్తాయి. అలాంటి పరిస్థితిలో సాతానుగాడు అంటాడు నీ పని అయిపోయింది. దేవుడు నీ చేయి విడిచేశాడు. ఇక నీవు లేవలేవు. అని చెబుతూ ఉంటాడు. అప్పుడు నీవు క్రీస్తులో బలం తెచ్చుకోవాలి. సాతానుకు లొంగిపోయావో అదోఃపాతాలమే నీ గతి!* 2కోరింథీయులకు 12: 9
అందుకు నాకృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము(లేక,నన్ను కప్పునిమిత్తము) , విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.
కాబట్టి అలాటి స్థితిలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి సాతానుగాడికి లోబడిపోయావో వాడు నీ మదినిండా నెగిటివ్ ఆలోచనలు పుట్టిస్తాడు. ఇంకెందుకు నీ బ్రతుకు చచ్చిపో అని సలహాలిస్తాడు సాతానుగాడు.*
*నాకు చాలాసార్లు చెప్పాడు ముంబై లోకల్ ట్రైన్ క్రింద మనుషులు పడి చనిపోవడం సర్వసాధారణం. కాబట్టి నీవు కూడా అక్కడ పడి చచ్చిపో అన్నాడు. నిద్రమాత్రలు మింగి చచ్చిపో అన్నాడు. (ఒకసారి మింగినా చావలేదు అనుకోండి. కారణం నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను గాబట్టి కనికరింపబడ్డాను). కొన్నిసార్లు షిప్ లోనుండి దూకి చచ్చిపో అన్నాడు. కొండలలో సువార్తకి వెళ్ళినప్పుడు బండితో అక్కడనుండి రోడ్డువదిలి కొండ క్రిందికి బండితోపాటు పో! వెంటనే చచ్చిపోతావు అన్నాడు. అయితే దేవుడు బలవంతుడు. మంచివాడు. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. కాబట్టి ఆయన నన్ను కాచారు. ఆరోజు సాతానుగాడి మాటలు నేను విని ఉంటే ఈరోజు ఇలా ధైర్యంగా దేవునికోసం చెప్పిఉండేవాడిని కాదు.* ఎన్నోసార్లు మా పెద్దక్కకి సాతానుగాడు నీవు నిజంగా మీ తండ్రిని ప్రేమిస్తే-- లారీక్రింద పడి చచ్చిపో, కొన్ని లక్షల ధనం వస్తుంది. అప్పుడు మీ తండ్రి కష్టాలు తీరిపోతాయి. *ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు సాతాను గాడే కలిగిస్తుంటాడు. అప్పుడు యేసునామంలో వాడ్ని గద్దించి, యేసయ్య—యెహోవాయీరే, యెహోవారాఫా (నిన్ను స్వస్థపరచు దేవుడు) నీతోనే ఉన్నారని చెప్పాలి. వెంటనే వాడు పారిపోతాడు*.

ఎప్పుడైతే నిరాశలో, నిస్పృహ లలో ఉన్నారో ఏలియాగారు, బహుశా సాతానుగాడు ఇంకా ఎందుకు బ్రతుకుతావు చచ్చిపో అని చెప్పి ఉండొచ్చు! యోబు గారికి కూడా సాతానుగాడు తన భార్యతో అదే సలహా ఇప్పించాడు.
అయితే తనకుతాను ఏ హాని చేసుకోకూడదు కాబట్టి దేవుణ్ణి చంపేమంటున్నారు ఏలియాగారు. బాధ తప్పుతుంది, నరకం తప్పుతుంది. ఆత్మహత్య చేసుకున్నాడు అని చెడ్డపేరు పోతుంది అని ఆశ! గాని దురదృష్టవశాత్తూ దేవుడు ఇలాంటి తప్పుడు ప్రార్ధనలు, చెత్త ప్రార్ధనలు వినరు. మనలో చాలామంది ఇలాంటి ప్రార్ధనలు చేసి ఉండొచ్చు! నేనుకూడా చేసాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. నేను నిన్ను ఒక ఉద్దేశ్యం కోసం చేసాను. అది నీవు నెరవేర్చాలి అని. ఆ తర్వాత దేవుణ్ణి కోరకూడనివి/ అడగరానివి అడగలేదు. క్షమాపణ కోరుకున్నాను. దయచేసి ప్రియ దేవునిబిడ్డా! నీవుకూడా ఇలాంటి చెత్త ప్రార్ధనలు చేసేవేమో! నీకున్న కష్టాలు అలాంటివి కావచ్చు! అయితే నీవు తట్టుకోలేనంతగా ఆయన నిన్ను శ్రమలకు/ శోధనలకు గురికానివ్వరు. ఇది గుర్తు పెట్టుకో! ఆయన యెహోవాయీరే, యెహోవా రాఫా అని, గొప్ప దేవుడని, ఆశ్చర్యకరుడని, ఆలోచన కర్త యని, బలవంతుడైన దేవుడని మరచిపోవద్దు! నిన్ను తప్పకుండా రక్షించగల సమర్ధుడు! ఒకవేళ నీవు అలాంటి ప్రార్థన చేసివుంటే ఇప్పుడే దేవుని క్షమాపణ వేడుకో! ఆయన పాదాలు పట్టుకో! ఆయన నిన్ను క్షమించి, నీకు తోడుగా నిలబడతారు.
ఆమెన్!
దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త—25వ భాగము

ఏలియాగారి వైరాగ్యం-2, యెహోవాయీరే—6

1 రాజులు 19.4--6
4. తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణాపేక్షగలవాడై- యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను.
5. అతడు బదరీవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి-నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను.
6. అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసి తిరిగి పరుండెను. . .

ప్రియ దేవుని బిడ్డలారా! గతభాగంలో ఏలియాగారు వైరాగ్యంతో నన్ను ఇంక చంపెయ్యమని దేవునికి ప్రార్థన చేసినట్లు చూసుకున్నాం. ఇలాంటి ప్రార్దనే మోషేగారు చేసారు. సంఖ్యా 11:15; యోనాగారు చేశారు 4:౩; ఇప్పుడు ఏలియాగారు కూడా చేశారు. అయితే గమనించవలనినది ఏమిటంటే ఆయన ప్రార్ధనలో ఒకమాట ఉంది అదేమిటంటే నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంతమట్టుకు చాలును, నన్ను చంపేయ్ అంటున్నారు. కొంతమంది సేవకులు—మిగతా సేవకులను చూసి వారికంటే నేను చాలా బాగా సేవచేస్తున్నాను. వారికంటే నాకే పెద్ద సంఘముంది. వారికంటే మంచి చర్చి బిల్డింగ్ ఉంది. మా సంఘంలో వారికంటే మంచి క్వయిర్ ఉంది. వారికంటే—వారికంటే—వారికంటే .. ఇలాంటి అభిప్రాయాలలో ఉంటారు. ఇది తప్పు! బహుశా ఏలియాగారు కూడా ఇంతవరకు అలాంటి భావంలో ఉండిఉంటారు. కారణం యెహోవా ప్రవక్తలను అందరిని చంపేశారు కదా, మిగిలిన ప్రజలకంటే భక్తిగా ఉంటున్నాను అని అనుకుని ఉండవచ్చు! ఇలాంటి భావం తప్పు అని గ్రహించి, మొదటగా దేవునితో అంటున్నారు—నేను వారికంటే గొప్పోడ్ని కాదు గాని—ఇకచాలు చంపేయ్ అంటున్నారు. .

సరే, ఇలా ప్రార్థన చేసి ఆ బదరీ వ్రక్షము క్రింద, అనగా అచ్చమైన తెలుగులో రేగు చెట్టు క్రింద పడుకున్నారు. అప్పుడు 5వ వచనం . .అతడు బదరీవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి-నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. . . . చూసారా ఇలాంటి నిరాశానిశ్ప్రుహ ఆవరించినప్పుడు దేవుడు తన ప్రజలను ఆదరించటానికి పాత నిబంధనలోను, క్రొత్త నిభంధనలోను తన దూతలను పంపించి, ఆదరించి, బలపరచడం అలవాటు. ఇక్కడ ఆయన ఎన్నిరోజులనుండి భోజనం చేయలేదో తెలియదు అందుకే మొదటగా అతని తట్టిలేపి, భోజనం చెయ్యమని భోజనం పెట్టినట్లు చూస్తాం. పేతురుగారిని బంధించి, తర్వాత రోజు హత్య చేద్దామని తలస్తుండగా ఆ రాత్రి సంఘమంతా నిరుత్శాహంగా ఉన్నా సరే, అత్యాసక్తితో ప్రార్థన చేయగా, పరలోకం కదిలి, దేవుడే తన దూతను పంపించగా అక్కడ దూతకూడా నిద్రిస్తున్న పేతురు గారిని తట్టిలేపి, బట్టలు వేసుకుని, కండువా కప్పుకోమని చెప్పి, సంకెళ్ళు తెంపి, మొదటి కావలి, రెండవ కావలి, మొత్తం గేట్లు అన్ని దాటించి బంధ విముక్తునిగా చేసి పంపించినట్లు చూస్తాం అపోస్తలులు కార్యం 12 వ అధ్యాయం. ఇక్కడ కూడా ఏలియాగారికి ఎటువంటి ఆదరణ, ప్రోత్సాహం కలుగుతుందో చూడండి.

ఇక్కడ 6వ వచనం జాగ్రత్తగా గమనిస్తే అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పులమీద కాల్చబడిన వేడివేడి అప్పము, నీళ్ళబుడ్డి అనగా నీరు కలిగిన సీసా ఉందట! ఈ అరణ్యంలో ఆయనకు వేడి అప్పము ఎలా వచ్చింది. నీళ్ళ బుడ్డి ఎలా వచ్చింది? చూడండి దేవుడు అసాధారణం క్రియలు చేయగలరు అనడానికి సాక్ష్యము ఇది. అక్కడ కాకోలముల ద్వారా పోషించారు. సారేపతు లో విధవరాలి ద్వారా పోషించారు. ఇక్కడ అరణ్యంలోకి వేడి అప్పము, నీల్లబుడ్డి తీసుకొని వచ్చి ఆయన ఆకలి తీర్చారు దేవుడు. ఆయన యెహోవాయీరే! ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. తన బిడ్డలకు ఏమి కావాలో—అడగకుండానే దయచేసే దేవుడు! ఇక్కడ ఏలియాగారికి కూడా ఏమి కావాలో దేవుడే ఏర్పాటు చేసారు.

ఐతే ఇక్కడ ఆయన భోజనం చేసి మరల నిద్రపోయినట్లు చూస్తున్నాం. ఒక్కోసారి తీవ్రమైన దుఃఖంతో ఉన్నప్పుడు గాని, తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు గాని భయంకరమైన నిద్ర ముంచుకొస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేయాలనిపించదు. ప్రేరేపణ రాదు, ఇలాంటి పరిస్తితిలోనే ఉన్నారు ఏలియాగారు. తినేసి మరలా నిద్రపోతున్నారు. అప్పుడు దేవుని దూత మరలా తట్టిలేపి లేచి భోజనం చెయ్యు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెబుతున్నాడు. గమనించారా! మరోసారి భోజనం చెయ్యమంటున్నాడు దేవుని దూత. కారణం బహుశా మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రివరకు నిద్రపోయి ఉంటారు ఏలియాగారు. అందుకే మరోసారి భోజనం చెయ్యమంటున్నారు. చూసారా దేవుని ప్రేమ, ప్రణాళిక! లేపి మరలా భోజనం పెట్టారు. అదీ తండ్రి ప్రేమ!

ప్రియ దేవుని బిడ్డా! దేవుని ప్రణాళిక నీకు తెలియదు. ఊరికినే సొమ్మసిల్లిపోకు! దేవుని చిత్తముకోసం కనిపెట్టు! ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే ఏలియాగారు యెజెబెలు పంపిన వర్తమానం వినిన వెంటనే ప్రాణం రక్షించుకోడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు తప్ప—దేవా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని దేవునిని అడగలేదు. ఇక్కడకు వచ్చి తీరికగా నిద్ర పోతూ దేవుడా చంపేయ్ అంటున్నారు. అడగకుండానే కెరీతు వాగు దగ్గరకు పో, నిన్ను కాకులతో పోషిస్తాను చెప్పారు కదా దేవుడు. అడగకుండానే సారేపతు వెళ్ళు. అక్కడ నిన్ను పోషిస్తాను అని చెప్పారు కదా దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమి చెప్పకుండానే చిన్న కాకి కబురు విని పారిపోయారు!! మనం కూడా చిన్న శ్రమ కలుగుగానే దేవుని సంప్రదించకుండా మన సొంతనిర్ణయం తీసుకుని బొక్కబోర్లాపడతాము. ఇది తప్పు. అందుకే దేవుడు నీ ప్రవర్తన అంతటియందు దేవుని అధికారమునకు ఒప్పుకోమంటున్నారు. మనం లోబడక ఇబ్బందులు పడుతున్నాం. ఐతే ఏలియాగారి పట్ల దేవుని ప్రణాళిక అమోఘమైనది కాబట్టి కరుణించి, మరో మార్ఘంలో పంపిస్తున్నారు. ప్రియ విశ్వాసి! నీకు నాకు అలాంటి చాన్స్ ఉండదేమో! నయోమి సొంత నిర్ణయం తీసుకొని తన కుటుంబాన్ని మొత్తం కోల్పోయింది. కాబట్టి నీ సొంత నిర్ణయం తీసుకోకు! సమస్యలొస్తే పారిపోకు! నీకు అన్నీ సమకూర్చగల దేవుడు మనతో ఉన్నారు. ఆయనను నమ్మి, ముందుకు సాగిపో!

దైవాశీస్సులు!

పౌరుషం గల ప్రవక్త—26వ భాగము

ఏలియాగారి వైరాగ్యం—3


1 రాజులు 19.8,9
8. అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి
9. అచ్చట ఉన్న యొక గుహలోచేరి బసచేసెను. యెహోవావాక్కు అతనికి ప్రత్యక్షమైఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా . .
ప్రియ దేవుని బిడ్డలారా! ఏలియాగారు ఇప్పుడు లేచి ఆ బలముచేత 40 రాత్రులు, 40 పగళ్ళు ప్రయాణం చేసి, దేవుని పర్వతం అని పిలువబడే హోరేబు పర్వతానికి చేరుకొని అక్కడ ఒక గుహలో బసచేసెను అని వ్రాయబడింది.

ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన కొన్ని విషయాలున్నాయి. మొదటగా దేవుడు పెట్టిన బోజన బలముచేత 40 రోజులు ప్రయాణం చేశారు. గతభాగాలలో చెప్పిన విధముగా ఏలియాగారి దగ్గర గాడిద గాని, గుర్రం గాని అలాంటివి ఏవి లేవు. ఆయన పేదవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా నడచి గాని, పరుగెత్తుకొని కాని వెళ్ళేవారు. కాబట్టి బహుశా ఈయన ఇక్కడ నడచుకొని గాని, పరుగెత్తుకొని గాని వెళ్ళారు. ఆగకుండా !! ఎన్నిరోజులు? 40 రోజులు!!! చూసారా ఒక్కరోజు భోజనం చేసి 40 రోజులు ఆగకుండా, విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణం చేయగలిగారు. అది కూడా ఇశ్రాయేలు దేశం మనలాగా సమతల ప్రాంతం, పీఠభూమి కాదు. కొండలుగుట్టలు గల ప్రదేశం. ఇవన్నీ ఎక్కి అక్కడికి చేరారు. అదీ దేవుని ఆహారం యొక్క శక్తి. అందుకే మనుష్యుడు రొట్టె వలన కాదుగాని, దేవుని నోట నుండి వచ్చే ప్రతీమాట వలన జీవించును అని వ్రాయబడింది. మత్తయి 4:4; లూకా 4:4;
ఇక మరో విషయం ఏమిటంటే ఆయన ఎంతదూరం ప్రయాణం చేసారు? సుమారు 380 కి.మీ. కావచ్చును. ఎక్కడికి? హోరేబు పర్వతానికి! హోరేబు పర్వతం బెయేర్షేబా కు 400 కి.మీ. దూరంలో దక్షిణముగా ఉంది ఈ హోరేబు పర్వతం! ఈ హోరేబునే సీనాయి పర్వతమని అంటారు. దేవుని పర్వతం అనికూడా అంటారు. ఇదే పర్వతం మీద మోషేగారికి మొదటగా దేవుడు మండుచున్న పొదలో కనబడ్డారు. నిర్గమ ౩:1, 12; అంతేకాకుండా ధర్మశాస్త్రం పొందుకున్నది కూడా ఇక్కడే! నిర్గమ 19:1—౩; ఇప్పుడు ఏలియా గారు కూడా ఇదే పర్వతానికి చేరుకున్నారు. మరో విషయం చెప్పనీయండి. యేసుప్రభులవారికి రూపాంతర కొండమీద కనబడి బలపరచింది ఎవరు? ఇదే కొండమీద దేవుని ప్రత్యక్షతలు పొందుకున్న మోషేగారు, ఏలియాగారే!!

సరే, హోరేబు పర్వతం చేరుకున్నారు ఏలియాగారు. ఇంతకీ హోరేబు పర్వతం వెళ్ళమని ఎవరు చెప్పారు?? దూత మాత్రం చెప్పలేదు! శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పినప్పుడు తినేసి బయలుదేరారు అంతే! అనగా తినేసి బయలుదేరిన తర్వాత ఏలియాగారు అడిగి ఉంటారు ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి అని. అప్పుడు దేవుడు నడిపించి ఉంటారు. లేదా తనకుతానుగా వచ్చేసి ఉండవచ్చు, కారణం దేవుడు అక్కడికి వచ్చి రెండుసార్లు అడుగుతున్నారు—ఏలియా నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? అని. కాబట్టి ఎందుకు అక్కడికి వచ్చారో మనకు స్పష్టముగా లేదు. అయితే దేవుడు మోషేగారికి తనసేవకు పిలుచుకొని చేయాల్సిన పని చెప్పినది ఈ కొండమీదనే! అలాగే ఇక్కడ ఏలియాగారు చచ్చిపోదామనుకుంటే వద్దురా అని చెప్పి, రెండో ఎపిసోడ్ అప్పగిస్తున్నది ఈ పర్వతం మీదనే! అంతటి విశిష్టమైన పర్వతం ఇది.

సరే , హోరేబు పర్వతం మీదకు వచ్చిన తర్వాత ఏం చేసారు? ఒక గుహను చూసుకుని అక్కడ బసచేసారు. మనం జాగ్రత్తగా గమనించాలి ఈమాట! అక్కడ బస చేసెను. అనగా అక్కడికి వచ్చి ఎన్నిరోజులు అక్కడ ఉన్నారో తెలియదు. ఇలా ఎన్నిరోజులు గడిచాయో తెలియదు గాని అప్పుడు ఆ స్థితిలో దేవుడు మాట్లాడుచున్నారు: ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అడిగారు. అందుకు ఆయన అంటున్నారు
10. అతడు-ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసి వేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒకడనుమాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారని మనవిచేసెను. . . . . . చూసారా ఇక్కడ ఆయన చెప్పేది దేవునికి ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు/ అభియోగాలు చేసినట్లుంది. అంటున్నారు ఇశ్రాయేలీయులు నీ నిబంధనను త్రోసివేశారు. నీ బలిపీఠములను పడగొట్టారు. నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతం చేశారు. ఇప్పుడు నీ కోసం రోషము గలవాడనై నేనొక్కడినే మిగిలితే వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. ఇది నిజంగా దేవునికి వాస్తవాలు చెబుతున్నట్లు ఉంటుంది ఒకప్రక్క! మరో ప్రక్క తను ఎంత గొప్పవాడో దేవుడికే చెప్పి, తనకుతానుగా సెభాస్ కొట్టేసుకుంటున్నారు. అలాగే కదా మనకు అనిపిస్తుంది. ఐతే ఇది మనకు ఇలా అనిపించినా దేవుని దృష్టికి అది కంప్లైంట్ గా కనిపించింది అని మనకు ఈ వచనం చదివేవరకు అర్ధం కాదు.
2. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?
3. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు. Romans(రోమీయులకు) 11:2,3,4
4. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.
ప్రియ దేవుని బిడ్డలారా! ఇది ఎప్పటికీ చేయకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మనం దేవుని బిడ్డలమీద కంప్లైంట్ ఇవ్వకూడదు. మోషేగారిని కూడా దేవుడు మందలించారు. అందుకే రెండోసారి ఇదే కంప్లైంట్ చెబితే దేవుడు ఏమన్నారు:
18. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయునుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు. . . . . . నేవు ఒక్కడివే అని పెద్ద గొప్పలు చెబుతున్నావు గాని నాకు 70౦౦ మంది ఉన్నారురా కొడుకా అని దేవుడు చెబుతున్నారు.

కాబట్టి దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొందాము. సమస్యలకు పారిపోవద్దు. దేవుని బిడ్డలమీద కంప్లైంట్ ఇవ్వడం మానేయ్! అప్పుడు దేవుడు నీతో కూడా మాట్లాడుతారు.
అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!


పౌరుషం గల ప్రవక్త—27వ భాగము

దేవుని ప్రత్యక్షత

ప్రియ దైవజనమా! గతభాగంలో ఏలియాగారు దేవుని పర్వతమైన హోరేబుకి వచ్చి అక్కడ ఒక గుహలో బసచేసినట్లు , అప్పుడు దేవుడు అతనితో మాట్లాడినట్లు చూసుకున్నాము. అప్పుడు ఏలియాగారు ఇశ్రాయేలీయులపై ఫిర్యాదు చేసినట్లు చూస్కున్నాం. కంప్లైంట్ చేసిన వెంటనే దేవుడు అంటున్నారు.
11. అందుకాయన-నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నా భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు.
12. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. . . ..

ఈరెండు వచనాలలో దేవుడు ఏలియాగారికి ప్రత్యక్షమైన విధానం కనిపిస్తుంది. మొదటగా గుహలో ఉన్న నీవు పర్వతం మీదకు వెల్లమంటున్నారు. దేవునికి కంప్లైంట్ ఇస్తూ, చిన్న దానికే భయపడి, పారిపోయిన స్థితిలో, ఆధ్యాత్మికంగా పడిపోయిన/ దిగజారిన పోయిన స్థితిలో/ విశ్వాసం క్షీణించిన స్తితిలో ఉండగా దేవుడు అంటున్నారు—పర్వతము మీదకు వెళ్ళు. ఈరోజు ఆత్మీయ స్థితిలో పడియున్న నీవు, దేవుడు నీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. దానికి నీవు చేయాల్సినది కొండమీదకు వెళ్ళాలి. పడిపోయిన స్తితినుండి లేవాలి. లేచి మీదకు వెళ్ళాలి. నీ పాపమును, ద్వేషమును అన్నింటిని అక్కడే వదిలెయ్యాలి. నీ ఈర్ష, కంప్లైంట్లు, అన్నింటిని వదిలెయ్యాలి. ఖాళీ హృదయముతో వెళ్ళాలి దేవుని సన్నిధికి. ఏలియాగారు లోబడి వెళ్లారు. అప్పుడు దేవుని ప్రత్యక్షత కలిగింది ఏలియాగారికి!

ఇప్పుడు దేవుడు ఏలియాగారికి ప్రత్యక్షమైన విధానం చూడండి. యెహోవా ఆ వైపు సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. కొన్నిసార్లు దేవుడు ప్రజలను ఒళ్ళు గగుర్బాటు కలిగించే విధానాల్లో కనబడి దర్శించారు—పెనుగాలి, సుడిగాలి, భూకంపం, అగ్నిజ్వాలలు ఇలా వివిధమైన రీతులలో దేవుడు కనిపించి మాట్లాడారు. నిర్గమ 19:16—19 ఇక్కడ ఇశ్రాయేలీయులు మొత్తం చూశారు. యోబు భక్తుడితో దేవుడు అలాగే మాట్లాడారు. 38:1; కీర్తనలు 18:6—15; యెషయా 29:6; ఇక్కడ ఏలియా గారు కూడా ఇట్లాంటి బోలెడు చూసారు. ఇక యెహోవా భయమునకు పర్వతాలు బ్రద్ధలయ్యాయి. శిలలు చిన్నాభిన్నమాయెను. గాని ఆ గాలి దెబ్బలో దేవుడు ప్రత్యక్షము కాలేదు. తర్వాత భూకంపము కలిగింది. గాని ఆ భూకంపము నందు కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. భూకంపం తర్వాత మెరుపు పుట్టింది. దానిలో కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. దాని తర్వాత మిక్కిలి నిమ్మళముగా మాట్లాడే ఒక స్వరము వినబడింది. చూసారా దేవుని స్వరము ఎప్పుడు వినబడిందో!! ఇంతకీ ఆ పెనుగాలిలో, భూకంపంలో, మెరుపులో దేవుడు ఎందుకు ప్రత్యక్షం కాలేదు ఏలియాగారికి? కారణం ఇలాంటివి ఆయన ఎన్నోసార్లు చూసారు. ఐతే ఇప్పుడు ఏలియాగారికి నెమ్మది, శాంతి అవసరం. ఏలియాగారి మనసు నిండా అలజడి. దానిని తీర్చడానికి దేవుడు మాట్లాడే విధానమే వేరు!

అవును దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాలో దేవునికి బాగా తెలుసు! ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలుసు! మోషేగారితో మండుచున్న పొదలో నుండి మాట్లాడారు. అది అవసరం, అక్కడ. బిలాముతో గాడిదద్వారా బుద్ధిచెప్పారు. అది అవసరం అక్కడ! జ్ఞానులతో నక్షత్రం ద్వారా మాట్లాడారు. అయితే గొల్లలకు తన దూతలను పంపించి మాట్లాడారు. దేవుడు వారివారి సామర్ధ్యం బట్టి మాట్లాడతారు. ఇక్కడ ఏలియాగారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎరిగి, ఆయనతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నారు.

ప్రియ దేవుని బిడ్డా! నాకు పలానా రీతిలో కనబడి మాట్లాడు అని ప్రార్ధించకు! నీతో ఎలా మాట్లాడాలో దేవునికి బాగా తెలుసు! కొంతమంది ప్రవచనాల ద్వారా మాట్లాడతారు. కొంతమందికి తన స్వరము ద్వారా మాట్లాడతారు. కొంతమందికి దేవుని వాక్యము ధ్యానించేటప్పుడు వాక్యము ద్వారా మాట్లాడతారు. మరికొంతమందికి వాక్యం వినేటప్పుడు మాట్లాడుతారు ఆయనకు తెలుసు—ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో! కాబట్టి ఆయన మెల్లని చల్లని స్వరము కోసం కనిపెట్టు! ఏలియా గారితో మాట్లాడిన దేవుడు నీతోకూడా మాట్లాడుతారు. దేవుడు ఏలియాగారితో మాట్లాడిన తర్వాత ఆయనలో గల అలజడి, కోపం అన్నీ పోయాయి. ప్రశాంతంగా జీవించగలిగారు. నీవు కూడా శాంతిసమాధానాలతో జీవించాలి అంటే నీవుకూడా దేవుని స్వరం వినాలి. ఏలియాగారు దేవునిస్వరం ఎప్పుడు విన్నారు? పర్వతం మీదన! అలాగే నీవు కూడా నీలో ఉన్న కోపతాపాలు, కక్ష్యలు, కలహాలు, పాపాలు అన్ని వదిలేసి—దేవుని పర్వతము మీదకు వెళ్ళు. అక్కడ ఆయన నీతో మాట్లాడతారు. మరి నీవు సిద్ధమా?

పౌరుషం గల ప్రవక్త—28వ భాగము



1 రాజులు 19:15—18
15. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చిన దేమనగా-నీవు మరలి అరణ్యమార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము;
16. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.
17. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యెహూ హతముచేయును; యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని ఎలీషా హతము చేయును.
18. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయునుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.

ఇక్కడ మూడ వచనాలలోను దేవుడు మూడు ముఖ్యమైన పనులు అప్పగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే—ఈయన పరిచర్య సమాప్తికి వచ్చేసింది అని చెప్పకనే చెప్పేస్తూ, తనకు బదులుగా ఉండడానికి ఒక ప్రవక్తను ఏర్పాటుచేస్తూ, ఇశ్రాయేలీయులమీద ఏలియాగారు మోపిన అభియోగాలకు దేవుడు చెబుతున్నారు—నేను కూడా చూస్తున్నాను అందుకే వారిని ఎలా శిక్షించబోతున్నారో చెబుతున్నారు. మొదటగా అంటున్నారు—నీవు ఎలా వచ్చావో అలా వెళ్ళిపో—నీవు మరలి అరణ్య మార్గమున పోయి దమస్కులో ప్రవేశించి సిరియాదేశము మీద హజాయేలు కి రాజుగా అభిషేకం చేయు. ఇక రెండవ పని ఇశ్రాయేలీయుల మీద నింషీ కుమారుడైన యెహూకి అభిషేకం చేయు. అనగా ఇక్కడ ఈ విగ్రహారాదికుడు, దేవుని ప్రవక్తలను చంపించిన హంతకుడు ఆహాబు రాజుని త్రోసివేసారన్నమాట దేవుడు. ఇక మూడవది—ముఖ్యమైనది – నీకు బదులుగా ప్రవక్తగా ఉండటానికి అబెల్మోహోలావాడైన షాపాతు కుమారుడైన ఎలిషాకు అభిషేకం చేయుము! చూసారా దేవుడు చెప్పిన మాటలు.

మూడవ పని చూసుకుంటే—కొడుకా, నీ పని అయిపోయింది—నీకు బదులుగా షాపాతు కుమారుడైన ఎలిషాకు అభిషేకం చెయ్యమంటున్నారు. అప్పటికి ఆయన వయస్సు బైబిల్ పండితుల ప్రకారం సుమారు 50 సం.లు. 50 సం.ల కంటే తక్కువగా ఉండొచ్చు కూడా! మరి అప్పుడే ఎందుకు దేవుడు ప్రవక్తగా రిటైర్ మెంట్ ఇచ్చేస్తున్నారు ఏలియాగారికి? సమూయేలుగారిని నిండు వృద్ధాప్యం వరకు వాడుకున్నారు కదా! ఇలా ముసలి ప్రవక్తలు బైబిల్ లో ఎంతోమంది ఉన్నారు గాని దేవుడు ఏలియాగారిని ముందుగానే ప్రవక్తగా విరమణ ఇచ్చేస్తున్నారు? కారణం ఏలియాగారు చేసిన చెత్త ప్రార్థన అని నా ఉద్దేశం. చిన్న శోధన కబురు విని దేవునిని అడగకుండా, తన ప్రాణ రక్షణ కోసం పారిపోయారు. పారిపోవడమే కాదు నన్ను చంపేయ్ అని చెత్త ప్రార్థన చేసారు. దేవునికి ఇలాంటి ప్రార్ధనలు ఇష్టం ఉండదు. ఇలాంటి మాటలు అసలే ఇష్టం ఉండవు. ఒకసారి నిర్గమకాండం ౩, 4 అధ్యాయాలు జాగ్రత్తగా పరిశీలిస్తే మోషేగారు కూడా చాలా సాకులు చెప్పారు, దేవుని పనికి వెళ్ళమంటే! చివరకు నన్నుకాదు మరొకరిని పంపమంటే దేవుడు కోపపడ్డారు అని వ్రాయబడింది. కోపంతో చెప్పారు—మీ అన్న నీకు సహాయం చేస్తాడు. ఆ మాట అనకపొతే దేవుడు మోషేగారిని ఇంకా బలంగా వాడుకుని ఉంటారేమో! పేతురు నీకు కనబడుతున్న జీవులను చంపుకు తిను—అంటే నిషిద్ధమైనవి నేనెప్పుడు తినలేదు అని దేవునికే తన భక్తికోసం సర్టిఫికేట్ ఇచ్చుకొని దేవునికి ఆయాసం కలిగించారు పేతురు గారు. ఒకవేళ అలా అని ఉండకపోతే దేవుడు పౌలుగారు కంటే గొప్పగా పేతురుగారిని వాడుకుని ఉండేవారేమో అని నా ఉద్దేశ్యం. (ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే సుమా). దేవునికి ఇలా తిరిగు సమాధానాలు చెప్పకూడదు. ఇక్కడ ఏలియాగారు చెప్పారు. అందుకే దేవుడు తన ప్రవక్త – ప్రవచన పరిచర్యనుండి తొందరగా రిటైర్మెంట్ ఇచ్చేసారు. నీకు బదులుగా ఎలిషాను అభిషేకం చేసేయ్ అంటునారు.

ప్రియ చదువరీ! నీవు కూడా ఇలా చెత్త ప్రార్ధనలు—దేవునికి ఆయాసం కలిగించే మాటలు అని ఉంటే జాగ్రత్త! కోరకూడనివి/ అడగరానివి అడిగేవేమో జాగ్రత్త! ఏలియాగారినే దేవుడు ఊరుకోలేదు. నిన్ను కూడా ఊరుకోరు జాగ్రత్త. నేడే క్షమాపణ వేడుకో!

ఇక్కడ మరో విషయం / మరో అనుమానాన్ని క్లియర్ చేయనీయండి. దేవుడు ఏలియాగారికి మూడు పనులు అప్పగిస్తే ఏలియాగారు కేవలం ఒక్కపనే చేసారు 1 & 2 రాజులు గ్రంధాలను జాగ్రత్తగా పరిశీలిస్తే. మరి ఏలియాగారు ఎందుకె చేయలేదు ఆ పనులు? ఆజ్ఞ ధిక్కారమా? కానేకాదు! దేవుడు చెప్పిన ప్రతీమాట ఉన్నది ఉన్నట్లుగా చేసారాయన! మరి ఎందుకు చేయలేదు? ఏమో మనకు తెలియదు! లేదా ఆ సమయం ఇంకా రాలేదు. ఉండమని చెప్పి దేవుని ఆత్మ మొదటగా మూడవ పని చేయించారు. అది షాపాతు కుమారుడైన ఎలీషాను ప్రవక్తగా అభిషేకించడం! అయితే 2 రాజులు గ్రంధం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ మొదటి రెండు పనులను ఎలీషాగారు జరిగించినట్లు చూస్తున్నాం. హజాయేలుని ఎలీషాగారు అభిషేకించారు. 2 రాజులు 8:8—15; యెహూని అభిషేకించడానికి మరో ప్రవక్తల శిష్యుణ్ణి పంపించారు. 2 రాజులు 9:1—10; ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు నీకు బదులుగా ప్రవక్తగా ఉండటానికి ఎలీషాను అభిషేకించు అని చెబితే—ఏలియాగారు వెళ్ళినట్లు కనిపిస్తుంది. ప్రవక్తగా అభిషేకించినట్లుగా కనబడదు! మరి అభిషేకించారా లేదా? మనకు తెలియదు. Better To Stop Where Bible Stops. ఎక్కువగా ఆలోచించకూడదు. ఏలియాగారు హజాయేలుని, యెహూని ఎందుకు అభిషేకించలేదు అనేది పరిశుద్దాత్ముడి వశం. అది దేవునికి తెలుసు. మనం కామెంట్ చేయకూడదు కాని ఒక్క విషయం అర్థమవుతుంది. ఈ రెండు విషయాలు ఏలియాగారు 100% చెప్పి ఉంటారు ఎలీషాతో – దేవుడు నన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా యెహూని, సిరియనుల మీద రాజుగా హజాయేలుని అభిషేకం చెయ్యమన్నారు. దేవుని మాటకోసం ఎదురుచూస్తున్నాను, ఒకవేళ నేను చెయ్యలేకపొతే నీవు చెయ్యాలి—కారణం నా టైం అయిపోయింది అని దేవుడు చెప్పారు అని చెప్పి ఉంటారు ఎలీషాగారితో ఏలియాగారు!!
కాబట్టి ప్రియ విశ్వాసి! అడగకూడనివి దేవుణ్ణి అడగకు/ కోరకూడనివి కొరకు! చెత్త ప్రార్ధనలు చేయకు! దేవుని కోపానికి గురికాకు!


పౌరుషం గల ప్రవక్త- 29 వ భాగం

ఎలీషా పిలుపు


1 రాజులు 19:19—20
19. ఏలీయా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేర బోయి తన దుప్పటి అతని మీద వేయగా
20. అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తి-నేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు-పోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను.

ప్రియ దైవజనమా! గత భాగంలో దేవుడు ఏలీయాగారికి మూడు పనులు అప్పగించారని చూసుకున్నాం. గనుక ఏలియా గారు అక్కడనుండి అనగా దేవుని పర్వతమైన హోరేబునుండి బయలుదేరి వెళ్ళారు.

ఇక 19వ వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను అని వ్రాయబడింది అనగా అతనికి మార్గమధ్యంలో ఎలీషాగారు కనబడ్డారు. బహుశా అందుకే మూడు పనులలో మొదటిగా మూడవ పనిని చేస్తున్నారు.

ఇక ఈ వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏలియాగారు ఎలీషాగారిని చూసినప్పుడు ఆయన దుక్కు దున్నుతున్నారు తనపొలంలో! ఎలా? తన ముందర పండ్రెండు అరకల ఎడ్లచేత దుక్కి దున్నిస్తూ, పన్నెండో అరక తను దున్నుతున్నారు. జాగ్రత్తగా గమనిస్తే మొదటగా ఎలీషాగారు భూకామందు అని అర్ధం అవుతుంది. నేనుకూడా వ్యవసాయదారుడను కాబట్టి అనుభవం చేత చెప్పేది, అర్ధం అయ్యేది ఏమిటంటే చిన్న రైతులు/ చిన్న భూస్వాములు మూడు, నాలుగు అరకరలతో దున్నిస్తారు మరి ఆకాలంలో ట్రాక్టర్లు లేవుకదా! 12 అరకలతో దున్నిస్తున్నారు అనగా ఆయనకు చాలా భూమి ఉంది ఉంటుంది. అప్పుడే 12 అరకలు అవసరం అవుతాయి. మామూలుగా 12 అరకలు కన్నా ఎక్కువగా ఎవరు ఉపయోగించరు. దీనిని బట్టి మనకు అర్ధం అవుతుంది—ఎలీషాగారు ఏలియాగారిలాంటి అనామకుడు/ పేదవాడు కాదు. చాలా ఆస్తి గలవాడు.

ఇక మరో గమనించవలసిన విషయం ఏమిటంటే ఏలియాగారు చూడబోయేసరికి ఎలీషాగారు దుక్కు దున్నుతున్నారు. 11 అరకలు ముందు దున్నుతుంటే తాను 12వ అరక తనే స్వయముగా దున్నుతున్నారు. అనగా ఆయన ఎంత భూస్వామి అయినా తన పని తాను చేయడానికి సిగ్గు పడటం లేదు. నేటి దినాల్లో కొద్దిగా ఆస్తి/ డబ్బు ఉంటే వారిపనులు వారు చేయకుండా ఇతరులతో పనిచేయిస్తుంటారు. కాని ఈయన సోమరి కాదు, పనిచేయడానికి సిగ్గు పడటం కూడా లేదు. ఇక ఈయన పనిచేస్తూ కనిపించారు ఏలియాగారికి. అనగా పైన చెప్పినట్లు సోమరిపోతు కానేకాదు. *బైబిల్ గ్రంధాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే—దేవుడు ఎక్కడైనా ఎవరినైనా పిలిస్తే—వారు ఏదైనా పని చేస్తున్నప్పుడే పిలిచారు—అనగా పనిచేసే వారినే పిలిచారు గాని సోమరిపోతులను పిలువనే పిలువలేదు. ప్రవక్త ఆమోసు గారిని పశువులు కాసుకుంటూ మేడిపళ్ళు ఏరుకుంటూ ఉంటే పిలిచారు. గిద్యోను గానుగ ప్రక్కన కళ్ళం దుల్లగోడుతుంటే పిలిచారు. పేతురు, యోహాను, అంద్రేయ, యాకోబుగార్లు చేపలు పట్టుకుంటూ, వలలు బాగుచేసుకుంటూ ఉంటే అప్పుడు పిలిచారు. మత్తయి గారు సుంకం వసూలు చేస్తూ ఉంటే పిలిచారు. పౌలుగారు దేవుని భక్తులను చంపడానికి వెళ్తూ ఉంటే పిలిచారు. ఇలా ఎవరైనా పని చేసుకునే వారినే పిలిచారు తప్ప పనీపాటు లేకుండా ఖాళీగా తిరుగుతూ, పనికిరాని కబుర్లు చెప్పుకునే వారిని ఎవరినీ పిలువలేదు దేవుడు*.

ప్రియ యువతీయువకులులారా! ఈ భాగం ద్వారా నేను మీతో చెప్పేదేమిటంటే మీ చదువు పూరి అయ్యిందా? అయితే ఖాలీగా ఉండకు! ఏదో ఒకపని చేయడానికి సిద్దపడు. అది ఎంత చిన్నపని అయినా సరే , చేయడానికి సిద్దపడు. ఖాలీగా ఉండకు. పర్మినెంట్ ఉద్యోగం వచ్చేవరకు వేచి ఉండకు. పనిచేస్తూ, పర్మినెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయు. 2 రాజులు ౩:11 ప్రకారం ఎలీషాగారు ఇంత పెద్ద భూకామందు కూడా ఏలియాగారి చేతులమీద నీరు పోస్తూ ఆయనకు పరిచారం చేయడానికి సిద్దపడ్డారు. అందుకే దేవుడు ఎలీషాగారిని ఏర్పాటుచేసుకున్నారు. కొంతమందికి పెద్ద ఉద్యోగం వచ్చేవరకు నేను చెయ్యను. లక్ష రూపాయలు జీతం ఇస్తేనే గాని చేయను ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అవే వారిని వారి జీవితాన్ని పాడుజేస్తాయి. కాబట్టి అందిన పనిని చేయడానికి ప్రయత్నించండి. పౌలుగారు కూడా అదే అంటున్నారు—పనిచేయకుండా భోజనం చెయ్యొద్దు. 2 థెస్సలోనికయులు 3:11-12; చేతికి అందిన పని చెయ్యండి అంటున్నారు.

మరికొంతమంది నేను దేవుని సేవచేస్తాను అని అనుకొంటూ దేవుని పిలుపు కోసం ఎదురుచూసేవారున్నారు. మంచిది. కాని దేవుని పిలుపు వచ్చేవరకు దయచేసి ఊరుకోవద్దు. దేవుడు పిలిచేవరకు ఏదైనా ఒకపని చేస్తూ, మీ తల్లిదండ్రులకు సహాయపడమని మనవి చేస్తున్నాను. మీ తల్లిదండ్రులమీద నీ ప్రతీ అవసరానికి ఆధారపడకు. అలా పనిచేసుకుంటూ పోతుంటే—దేవుడు అప్పుడు నిన్ను తనసేవకు పిలుచుకోగలరు గాని ఖాళీగా కూర్చుంటే, నీలాంటి సోమరిపోతులను దేవుడు పిలువడు, అలాంటివారు దేవునికి అక్కరలేదు అని తెలుసుకోమని దేవుని పేరిట హెచ్చరిస్తున్నాను. దేవునికి కష్టపడేవారే కావాలి.

సరే, ఇలాంటి స్తితిలో ఏలియాగారు ఎలీషాగారి దగ్గరకు వచ్చి, పన్నెండో అరక దున్నుతున్న ఆయన మీద తన దుప్పటి వేశారు. వెంటనే ఆయన అనగా ఎలీషాగారు తన ఎడ్లను వదలిపెట్టి నేను నాతల్లిదండ్రులకు ముద్దుపెట్టి వచ్చి నిన్ను అనుసరిస్తాను అని చెప్పారు. చూడండి- మొదటగా ఏలియాగారు యేసుప్రభులవారు చెప్పినట్లు మీరు నన్ను వెంబడించండి అని ఎలీషాతో నన్ను వెంబడించు—దేవుడు నిన్ను ఏర్పరచుకొన్నారు అని చెప్పలేదు. కేవలం తన దుప్పటిని ఎలీషాగారిమీద వేస్తే ఆయనకు కధ అర్ధమైపోయింది. దేవుడు నన్ను తన సేవకు పిలుస్తున్నారు అని. వెంటనే నేను మొదట వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దుపెట్టుకుని వస్తాను అని చెప్పారు.

ఇక మరో గమనించవలసిన విషయం ఏమిటంటే—ఇక్కడ ఆయన ఎలీషాగారిని అభిషేకించలేదు. అభిషేకించడానికి ఆయనదగ్గర ఏమీలేదు కూడా! గాని బహుశా ఏలియాగారు తన దుప్పటితోనే ఎలీషాగారిని అభిషేకించి ఉండొచ్చు. కారణం ఆయన దుప్పటిలో గల శక్తి మనకు 2 రాజులు గ్రంధంలో తెలుస్తుంది. అనగా ఆయన దేవుని ఆత్మ గలవాడు/ ఆత్మపూర్ణుడు కాబట్టి డైరెక్టుగా తన దుప్పటితో అనగా దేవుని ఆత్మతోనే డైరెక్టుగా అభిషేకం చేసారు ఏ విధమైన నూనె వాడకుండా! అందుకే వెంటనే ఆ ఆత్మ శక్తిద్వారా ఎలీషాగారికి అర్ధమైపోయింది దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నారు అని.

ఎలీషాగారు నేను వెళ్లి మా తల్లిదండ్రులకు ముద్దుపెట్టి వస్తాను అంటే ఏలియాగారు అడ్డుచెప్పలేదు. ఇక్కడ ఎలీషాగారు తల్లిదండ్రులమీద ప్రేమ అభిమానం, భయభక్తులు గలవారని అర్ధమౌతుంది. వెంటనే ఎలీషాగారు తన దున్నుతున్న కాడి ఎడ్లను వధించి అక్కడున్నవారికి విందుచేసి తన తల్లిదండ్రులకు ముద్దుపెట్టి ఏలియాగారిని వెంబడించారు.

ప్రియ చదువరీ! దేవునిసేవ చేయాలి అంటే నీకు కావలసిన లక్షణాలు మొదటగా నీకు పనిచేయడానికి ఆసక్తి కావాలి. పనిచేస్తుండాలి. అది ఎంత చిన్న పని, ఎలాంటి పని చేయడానికైనా సిద్దపడాలి. ఇంత ధనవంతుడైన ఎలీషాగారు ఏలియాగారి చేతులమీద నీరుపోస్తూ అతనికి ఉపచారం చేసారు. ఇక్కడ ఆయన ఏలియాగారికి ఉపచారం చేస్తున్నాను అనుకోలేదు గాని, దేవుని ప్రవక్తకు ఉపచారం చేస్తే దేవునికి పరిచర్య చేస్తున్నట్లు భావించి ఇష్టపడి పనిచేసారు. అందుకే ఏలియాగారు పొందుకున్న ఆత్మకు రెండింతలుగా ఆత్మను పొందుకున్నారు. నీవుకూడా దేవునిసేవలో వాడబడాలంటే నీవుకూడా పనిచేయడం మొదలుపెట్టు. దేవా ఏ పని ఇచ్చినా నేను చేయడానికి సిద్దమే అని చెప్పు. నీ గర్వాన్ని, నీ అంతస్తుని ప్రక్కన పెట్టి దేవునిసేవ చేయడానికి సిద్దమైన మనస్సు కలిగియుండు. బహుశా ఎలీషాగారు ప్రార్ధన చేసి ఉండొచ్చు—దేవా నన్ను నీసేవలో వాడుకో! అందుకే ఆయన మనస్సు చూసి ఎలీషాగారిని పిలుచుకొన్నారు దేవుడు! మరి నీవుకూడా అలా సిద్దపడితే దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతునారు. సేవ అనగా సంచిలో బైబిల్ వేసుకుని సువార్త చెప్పడమే కాదు ఆయన పరిచర్యలో వాడబడటం కూడా దేవుని సేవయే! దేవుని మందిరము యొక్క పనిచేయడం, సువార్త కార్యక్రమంలో పాల్గొనడం అన్నీ సేవయే!

కాబట్టి అట్టి సువార్త వలనైన సిద్దమనస్సు అనే జోడు తొడుగుకొని ఆయన సేవలో సాగిపోదుము గాక!
ఆమెన్!


పౌరుషం గల ప్రవక్త- 30వ భాగం

నాబోతు— ఆహాబు—యేజెబెలు—ఏలియా-1


1. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలువాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగియుండగా
2. అహాబు నాబోతును పిలిపించి-నీ ద్రాక్షతోట నా నగరును ఆనుకొని యున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను.
3. అందుకు నాబోతు-నా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా
4. నా పిత్రార్జితమును నీ కియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పినదానిని బట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. . . 1 రాజులు 21:1—4

ప్రియులారా! 20 వ అధ్యాయంలో ఏలియాగారి కోసం గాని, ఎలీషాగారికోసం ఏమి వ్రాయబడలేదు గాని, ఆహాబు మీదకు సిరియారాజైన బెన్హదదు దండెత్తినట్లు అప్పుడు దేవుని సహాయంతో ఆ సైన్యాన్ని ఓడించినట్లు, అయితే దేవుడు ఆ రాజుని చంపమంటే చంపకుండా సిరియా రాజుని సమాధానముగా పంపించినట్లు చూస్తాం. అప్పుడు దేవుడు అతనిమీదకు తీర్పు ప్రకటించగా కోపంతో వెళ్లిపోయినట్లు చూస్తాము.

మరి ఆ అధ్యాయంలో రెండుసార్లు మరో ఇద్దరు దైవజనులు ఆహాబుతో మాట్లాడినట్లు చూస్తున్నాం. అప్పుడు మరి ఏలియా, ఎలీషాగార్లు ఎక్కడున్నారు? ఏమో తెలియదు!!!! ఇక్కడ మరో విషయం ఏమిటంటే – ఏలియాగారు దేవునికోసం నేనొక్కడినే పౌరుషం గలవాడిగా ఉన్నాను మిగతా అందరిని చంపేశారు అని చెప్పారు కదా! మరి ఈ ఇద్దరు దైవజనులు ఎక్కడనుండి వచ్చారు??!! అందుకే దేవుడు ఏలియాతో అన్నారు : కొడుకా! నీవే ఉన్నావని అతిశయపడకు. ఇంకా 7000మంది ఉన్నారు అన్నారు. ఆ 7000 మందిలోనే ఉన్నారు వీరిద్దరూ.
మరో అనుమానం రావచ్చు మనకు—ఆ ఇద్దరు దైవజనులను దేవుడు ఎందుకు పంపించారు? ఏలియా, ఎలీషాలు ఉన్నారు కదా!! ఎందుకంటే అది దేవుని ఇష్టం! ఎవరిని పంపాలని అనుకుంటే వారిని పంపుతారు, ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు!
మరొక విషయం ఏమిటంటే: యెజెబెలు ఏలియాగారిని చంపాలని ఎంతో తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి దేవుడు ఏలియాగారిని కాపాడటానికి వీరిని పంపి ఉంటారు.
*మరి ఆ రోజులలో ఎలీషాగారు ఏం చేస్తున్నారు? బహుశా దేవుడు ఏలియాగారిద్వారా ఎలీషాకు ట్రైనింగ్ ఇస్తుండవచ్చు*!

సరే మనం 21 అధ్యాయానికి వస్తే, మనకు ఇక్కడ నలుగురు ముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తారు. నాబోతు, ఆహాబు, యెజెబెలు మరియు ఏలియా . మొదటగా షోమ్రోను రాజైన ఆహాబు – యెజ్రెయేలు అనేది చూస్తాము. ఇశ్రాయేలు సామ్రాజ్యం అనగా ఉత్తర సామ్రాజ్యానికి రాజు ఆహాబు. అతని ముఖ్య పట్టణం—షోమ్రోను. మరి యెజ్రెయేలు ఏమిటి? ఆహాబుకి, ఇంకా కొంతమంది రాజులకు యెజ్రెయేలు లో కూడా రాజ ప్రసాదం ఉన్నది. మన దేశంలో జమ్మూ-కాశ్మీర్ కి వేసవికాలానికి ఒకటి, శీతలకాలానికి ఒకటి రాజధాని లాగ.. ఇది సుమారుగా 40 కి.మీ దూరం ఉంటుంది. ఐతే గతభాగాలలో చూసుకున్నట్లు ఆహాబుకి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి యెజ్రెయేలులో కూడా వ్యవసాయం చేసేవాడు. ఐతే తన యెజ్రెయేలులో గల రాజప్రసాధానికి ఆనుకొని అదే ఊరువాడైన, భక్తిపరుడు, నీతిమంతుడైన నాబోతుకి ఒక ద్రాక్షతోట ఉన్నది. ఆహాబు నాబోతుని పిలిపించి—నీ ద్రాక్షతోట నా నగరుకి ఆనుకొని ఉంది కాబట్టి అది నాకు ఇచ్చేయ్! నేను దానిలో కూరలు పెంచుకుంటాను. నీ ద్రాక్షతోటకు బదులుగా నీకు అంతకంటే మంచి ద్రాక్షతోట ఇస్తాను. లేకపోతే దాని ఖరీదు ఎంతో చెప్పు, ఇచ్చేస్తాను అన్నాడు. ఇది నీకు నాకు వినడానికి సబబుగా ఉంది కదా! ఐతే నాబోతు గారికి సబబుగా లేదు. ఎందుకంటే అది అతని పిత్రార్జితం! అనగా అది వారి తాతతండ్రుల నుండి అనుభవంలో ఉంది. అది వారి పితరుల గుర్తుగా ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే: నాబోతు గారు భక్తిపరుడు, లేఖనాలమీద మంచి పట్టున్నవాడు. ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది అంటే: సంఖ్యాకాండము ౩6:7
ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను.
కాబట్టి నేను నా భూమిని నీకు అమ్మను అని చెప్పేశారు. ఒక విషయం గమనిస్తే ఆహాబు గోత్రం ఏమిటో బైబిల్ లో వ్రాయబడలేదు. యూదా, బెన్యామీను, లేవీ గోత్రాలు తప్పించి మరో గోత్రం కావచ్చు! ఇక నాబోతు గోత్రం కూడా ఏమిటో వ్రాయబడలేదు. ఏదిఏమైనా నాబోతుగారు ఒప్పుకోకపోవడానికి కారణాలు మొదటగా అది అతని పిత్రార్జితం. అది మరో గోత్రానికి అమ్మకూడదు. కాబట్టి వీరిద్దరిది వేర్వేరు గోత్రాలు కాబట్టి నేను అమ్మనంటే అమ్మను అని చెబితే మూతి ముడుచుకొని కోపంతో పోయి నగరులో పడుకున్నాడంట అలిగి!! చూసారా, చిన్నపిల్లల చేష్టలు! ఒక రాజై ఉండి ఇలా ప్రవర్తించవచ్చా? మరో విషయం ఏమిటంటే ఆహాబు నాబోతు గారి ద్రాక్షతోట ఆశించి ధర్మశాస్త్రం లో ఒక ముఖ్యమైన ఆజ్ఞను మీరాడు, అది ఏమిటంటే నీ పొరుగువానిది ఏదీ కూడా ఆశించకూడదు. ఇక్కడ ఆ ఆజ్ఞను మీరి పాపం చేసాడు. ఈ సన్నివేశం ద్వారా ఆహాబు వ్యక్తిత్వం మనకు అర్ధమవుతుంది.

ఇక తర్వాత వ్యక్తి యెజెబెలు. మహాఘోరమైన వ్యక్తిత్వం! రాజులు 17,18,19 లో ఆమె మనకు బాగా అర్ధమవుతుంది. బైబిల్ ఈమెను వ్యభిచారిని గాను, వేశ్యతోను పోల్చుతుంది ప్రకటన గ్రంధం 2:20—23 బాగా ధ్యానం చేస్తే అర్ధమవుతుంది మనకు. జారత్వం చేయడానికి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినమని తప్పుడు బోధను చేస్తుంది. ఈ 1 రాజులు 21 వ అధ్యాయంలో నాబోతుని ఏ విధంగా చంపించిందో చూడవచ్చు! 6—15 వచనాలలో ఎంత కుయుక్తిగా ప్రజలతో చంపించిందో చూడండి. పనికిమాలిన ఇద్దరు మనుష్యులను పెట్టి, అబద్ద సాక్ష్యం చెప్పమని, ఉపవాస దినం ప్రకటించి, ఆ ఉపవాసకూటాలలో తప్పుడు సాక్ష్యులుతో తప్పుడు సాక్ష్యాలు చెప్పించి, అన్యాయంగా రాళ్ళతో కొట్టి చంపించింది. ఎందుకు? తన ద్రాక్షతోటను రాజుకు ఇవ్వనందుకు!! అందుకే ఆమెను వ్యభిచారినిగా దేవుడు వర్ణించారు. బైబిల్ భోధకులు ఈ యెజెబెలును ప్రస్తుత RCM సంఘంతో పోలుస్తారు. కారణం అదికూడా విగ్రహారాధనకు ప్రోత్సహిస్తుంది, ఇంకా మూడవ శతాభ్దం నుండి 17వ శతాభ్దం వరకు కొన్ని లక్షలమంది దైవసేవకులను చంపారు. యెజెబెలు చేసిన క్రియలు అన్నీ ఈ సంఘము చేసింది కాబట్టి దానిని యెజెబెలుతో పోలుస్తారు.

ఈ రకంగా నాబోతుగారు అన్యాయంగా చనిపోయారు. అయితే 2 రాజులు 9 అధ్యాయం ప్రకారం కేవలం నాబోతు గారే కాదు, అతని కుమారులను అందరినీ రాళ్ళతో కొట్టి చంపారని యెహూ చెబుతున్నాడు. 2 రాజులు 9:25,26
25. కాగా యెహూ తన అధిపతియైన బిద్కరును పిలిచి యిట్లనెను-అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము; మనమిద్దరమును అతని తండ్రియైన అహాబు వెనుక గుఱ్ఱములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్షమోపిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.
26. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా *నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని* గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతికారము చేయుదును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి యీ భూభాగమందు పడవేయుము అనెను. దానికి సాక్ష్యం—యెహూ మరియు ఆహాబు రధసారధి!
కారణం లేవీ 24:15-16 ప్రకారం దేవుణ్ణి దూషిస్తే మరణ శిక్ష/ రాళ్ళు రువ్వి చంపాలి. అయితే ఆకాను చంపినట్లు కుటుంబాన్ని మొత్తం చంపేశారు ఇక్కడ, కారణం ఆ ఆస్తికి ఇక వారసులు లేకుండా అందరిని చంపించింది యెజెబెలు. అయితే నేను రాణిని కదా, నాకు తిరుగులేదు కదా అనుకొంది యెజెబెలు—ఈ మాట విని అనగా రాళ్ళదెబ్బలచేత నాబోతు చనిపోయాడని విని ఆ పొలాన్ని స్వాధీనం చేసుకోబోయాడు ఆహాబు. ఎవరూ అడగలేరు అనుకొన్నారు ఈ ఇద్దరు! ఐతే అడిగేవాడు, చూసేవాడు ఒకరున్నారని మరచిపోయారు. వెంటనే దేవుడు ఏలియాగారికి తీర్పుతో పంపుతున్నారు.

ప్రియ విశ్వాసి/ సేవకుడా!! నీవుకూడా నాబోతులా ఆకారణముగా , నీ తప్పులేకపోయినా కష్టాలు పడుతున్నావా? నీ వారిని అన్యాయంగా చంపేశారా? న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడని మరచిపోకు! ఈ విషయాన్ని చూసిన దేవుడు చలించిపోయి ఏలియాను పంపించారు. తమ్ముడ్ని చంపి ఎవరూ చూడలేదు అనుకొన్నాడు కయీను. హేబెలు రక్తం భూమిలోనుండి మొర్రపెట్టిన వెంటనే దేవుడే దిగి వచ్చి అడిగాడు కయీనుతో.
కాబట్టి నీ తరుపున అడిగేవాడు దేవుడున్నారని మరచిపోకు! తగినకాలమందు తప్పకుండా ఆయన నీకు న్యాయం తీరుస్తారు.
ఆమెన్!


పౌరుషం గల ప్రవక్త- 31వ భాగం

నాబోతు— ఆహాబు—యెజెబెలు—ఏలియా -2

1 రాజులు 21:17—19
17. అప్పుడు యెహోవావాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
18. నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలురాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము, అతడు నాబోతు యొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు; అతడు దానిని స్వాధీనపరచు కొనబోయెను.
19. నీవు అతని చూచి యీలాగు ప్రకటించుము యెహోవా సెలవిచ్చునదేమనగా- దీని స్వాధీన పరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగా- ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.

ప్రియులారా గతభాగంలో యెజెబెలు నాబోతుగారిని అబద్దసాక్షులను పెట్టి చంపించినట్లు చూసుకున్నాం. వెంటనే దేవుడు ఏలియాగారితో ఆహాబుకి కబురుపెట్టారు.

దీనిని సంపాదించుకోడానికి నాబోతుని చంపించితివి కదా ఏ స్థలమందు నాబోతు రక్తమును కుక్కలు నాకాయో, అదే స్థలమందు కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి. ఇది దేవుని తీర్పు. ఆ తీర్పు తీసుకుని ఏలియాగారే స్వయముగా వచ్చి నాబోతుగారి ద్రాక్షతోటలో చెబుతున్నారు. గమనించండి—నిజానికి నాబోతుని చంపించింది ఎవరు? యెజెబెలు , గాని దేవుడు అంటున్నారు నీవే చంపించావు అంటున్నారు ఆహాబుతో. అనగా యెజెబెలు నాబోతుని చంపడానికి స్కెచ్ గీసింది అని ఆహాబుకి తెలిసింది గాని దానిని ఆపడానికి ప్రయత్నించలేదు అని అర్ధం—సరికదా అడ్డు తొలగిపోతుంది అని సంబరపడ్డాడు. అందుకే దేవుడు అంటున్నారు—నీవు నాబోతుని చంపించావు. ఇక్కడ దేవుని తీర్పు చూడండి—ఏ స్థలమందు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలమందు నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. దేవుని తీర్పులు అలాగే ఉంటాయి. అనగా నీవు కూడా తొందరలో చంపబడబోతున్నావు. నీ రక్తం కారబోతుంది ఆ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని దేవుడు తీర్పు చెప్పారు. *ఇక్కడ యెజెబెలు – ఆహాబు ఏలియాగారిని చంపాలని చూస్తున్నారు అని ఏలియాగారికి తెలిసినా ధైర్యంగా ఎందుకొచ్చి చెబుతున్నారు అంటే—కర్మెలు అనుభవం తర్వాత పిరికితనం వచ్చినా, హోరేబు అనుభవంతో తన విశ్వాసాన్ని, నిరీక్షణను, పౌరుషాన్ని రెట్టింపు చేసుకున్నారు ఏలియాగారు. అందుకే ధైర్యంగా చెబుతున్నారు*.

దానికి సమాధానంగా ఆహాబు రాజు ఏమంటున్నాడో చూడండి:
20. అంతట అహాబు ఏలీయాను చూచి-నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెను-యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని యున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి.
నా పగవాడా! నీ చేతికే చిక్కబడితినా అంటున్నాడు. ఒకరాజు ఒక అనామికుడు దగ్గర చిక్కుకు పోయాడంట. అవును తప్పుచేసినప్పుడు దేవుని వాక్యానికి, దేవునికి, దేవునిసేవకునికి ఎవరైనా చిక్కుకుపోవలసినదే! దానికి ఏలియా గారి సమాధానం చూడండి 20—22
20. . . . .అని పలుకగా ఏలీయా ఇట్లనెను-యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని యున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి.
21. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను-నేను నీ మీదికి అపాయము రప్పించెదను; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతును.
22. ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. . . . . .
చూసారా ఆహాబు చేసిన తప్పుకు మొత్తం కుటుంబం దుంపనాశనం అయిపోతుంది అని చెబుతున్నారు దేవుడు.

మరి తీర్పు అయిపోయిందా? లేదు ఇంకా ఉంది. ఆ తీర్పు—ఆపాపపు స్త్రీ యెజెబెలు కి ఇచ్చారు దేవుడు. 23—24
23. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా-యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును.
24. పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును; బయటి భూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను . . . చూసారా ఇక్కడ యెజెబెలు మాంసాన్ని కుక్కలు తింటాయి. ఆహాబుకి నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అన్నారు గాని, యెజెబెలు కోసమైతే దాని మాంసాన్ని కుక్కలు తింటాయి అన్నారు దేవుడు. ఎంతఘోరమైన తీర్పో కదా!! అవును నిజంగా ఇవన్నీ జరిగాయి కదా! ఇంకా ఉంది తీర్పు—పట్టణమందు చచ్చు ఆహాబు సంబందికులను కుక్కలు తినివేయును. బయట భూములలో చచ్చిన వారిని ఆకాశపక్షులు తినివేయును. చూసారా దేవుని తీర్పులు ఎంత భయంకరమో!!!

ఎవరూ నన్ను అడిగేవారు లేరు అని అనుకొంటున్నావేమో!! అడిగేవాడు అడిగితే—పుట్టగతులుండవు జాగ్రత్త! ఆహాబు—యెజెబెలు ఇద్దరే పాపము చేసారు. గాని మొత్తం కుటుంబం సర్వనాశనం అయ్యింది. అకాను ఒక్కడే పాపం చేసాడు. మొత్తం కుటుంబం సర్వనాశనం అయ్యింది. ఇలా బైబిల్ లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నప్పుడు ఏడుస్తున్నారు: మా తండ్రులు పాపముచేసి గతించిపోయిరి. వారి దోషశిక్షను మేము అనుభవిస్తున్నాము. విలాపవాక్యములు 5:7; కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా! పెద్దలారా! జాగ్రత్త! మీరు పాపముచేసి దాని ప్రతిఫలాన్ని పిల్లలపై రానీయకండి.

ఇక తర్వాత వచనాలలో చూసుకుంటే దేవుడు ఆహాబుకోసం చాలా కఠినంగా చెప్పారు. సిగ్గు తీసేశారు. అయితే జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే 27—29 వచనాలలో చాలా ఆసక్తికరమైన సంగతులు కనబడతాయి.
27. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి, గోనెపట్టమీద పరుండి వ్యాకులపడుచుండగా
28. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
29. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండ ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికులమీదికి నేను దాని రప్పించెదను.

ఇంత చెండాలుడు కూడా, దేవుని తీర్పు విని, తన వస్త్రాలు చింపుకొని .... చూసారా, ఇక్కడ గమనించాల్ససిన విషయం ఏమిటంటే: *ఇక్కడ ఆహాబు ఏలియాగారిని చంపెయ్యగలడు అక్కడే! (on the spot!) గాని చంపలేదు. తన జీవితంలో మొట్టమొదటిగా ఆ తీర్పు మనిషి నుండి వచ్చింది కాదు అని గ్రహించి, దానిని త్రిప్పగల దేవునికి మొర్రపెడుతున్నాడు.* ఇక్కడ ఇంతకూ ముందటిలా మూతి ముడిచుకోలేదు. గోనెబట్ట కట్టుకొని ఉపవాసముండి ఏడుస్తున్నాడు—*ఎంతవరకు? దేవుడు జవాబిచ్చేవరకు!*

అవును ఈలోకంలో ప్రతివ్రతలు, తప్పుచేయని వారు ఎవరూ లేరు. అయితే ఆ తప్పుని తెలుసుకొని దేవుణ్ణి క్షమాపణ కోరుకోవడమే తండ్రి మన నుండి ఆశిస్తున్నది. తప్పుచేసి సర్వనాశనం కావాలని ఈ లోకపు తండ్రులు ఎలా కోరుకోవడం లేదో, అలాగే పరమతండ్రి కూడా మననుండి అలాగే ఆశిస్తున్నారు. ప్రియ చదువరీ! మరి నీవు వస్తావా దేవుని దగ్గరకు!! ఆ పరమతండ్రి నీవు ఎప్పుడు వస్తావా అని తన చేతులు చాచి పిలుస్తున్నారు. నీకోసం ఎదురు చూస్తున్నారు. నీ హృదయపు వాకిలి తట్టుచున్నారు. మరి వస్తావా? నీ హృదయపు వాకిలి తీస్తావా? ఆయనను అంగీకరిస్తావా? ఐతే వెంటనే నిన్ను క్షమించి చేర్చుకోగలరు దేవుడు. దుర్మార్గుడైన ఆహాబునే క్షమించారు దేవుడు. నిన్నుకూడా క్షమించగలరు. చూడండి. ఎవరిద్వారా దేవుడు ఈ తీర్పులు పంపించారో అదే వ్యక్తిద్వారా మరో వర్తమానం పంపిస్తున్నారు. చూసారా దేవుడు ఎంత ప్రేమగలవారో!

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే: *ఏలియాగారికి ఆహాబుమీద పీకలదాకా కోపం ఉంది గాని ఎప్పుడైతే దేవుడు అతనిని క్షమించి, దయగలమాటలు చెప్పారో—వెంటనే ఏలియాగారు కూడా ఆహాబుని క్షమించి వెంటనే ప్రేమతో ఆ కబురు చెబుతున్నారు. ఇదీ ఒక దైవసేవకునికి ఉండాల్సిన లక్షణం.* ఏలియాగారు ఆహాబు సర్వనాశనం అయిపోవాలి అని కోరుకోలేదు గాని, మార్పు చెందాలి అని కోరుకున్నారు. ఎప్పుడైతే మార్పు చెందాడో వెంటనే సంతోషించారు ఏలియా గారు. అదే యోనా మూతిముడిచికొని దేవుని మీద అలిగి చచ్చిపోవాలి అనుకొన్నాడు. ప్రియసేవకుడా! మీ సంఘస్తులు ఎవరైనా తిరుగుబాటు చేసినప్పుడు నీవుకూడా వారి మరణాన్ని, సర్వనాశానాన్ని కోరుకోకు. వారు మారాలని ప్రార్ధించు. ఆశించు! దేవుడు క్షమించాలని ఆశిస్తే, వద్దు ప్రభువా, వాడ్ని మొత్తేయ్! చంపేయ్! వాడి కాళ్ళుచేతులు పడిపోనియ్ ! ఇలాంటి ప్రార్ధనలు చేయవద్దు దయచేసి. ఏలియాగారు క్షమించినట్లు నీవు కూడా క్షమించేయ్! అప్పుడు దేవుడు ఏలియాగారిలా నిన్ను కూడా వాడుకొంటారు.

ప్రియ చదువరీ! ఆహాబు గుణపడినట్లు నీవుకూడా గుణపడు!
దేవుని రాజ్యాన్ని పొందుకో!

ఆమెన్!
దైవాశీస్సులు!


పౌరుషం గల ప్రవక్త- 32వ భాగం

ఏలియా ప్రవచనాల నెరవేర్పు-1


1 రాజులు 22:38
వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను.

ప్రియులారా! 22వ అధ్యాయంలో ఆహాబు మరణాన్ని మనం చూడవచ్చు. ఈ అధ్యాయంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి మనకు.

మొదటిది ఆహాబు మరణం కోసం వాడబడిన ఆత్మ—అది ప్రవక్తల నోట అబద్దమాడు ఆత్మ! 1 రాజులు 22:19—24 లో వివరంగా వ్రాయబడియుంది.
1 రాజులు 22:21,22
21. అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి-నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా-ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.
22. అందుకతడు-నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన-నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.

ఆ విధంగా ఆ ఆత్మ అక్కడున్న అబద్దబోధకులను/ప్రవక్తలను ప్రేరేపించి ఆహాబు మరణానికి కారణమయ్యింది. నేటిదినాల్లో కూడా ఇలాంటి అబద్ద ప్రవక్తలు/ అబద్ద బోధకులు ఎక్కువయ్యారు. వారుకూడా నేడు ప్రజలను తప్పుడు త్రోవలు పట్టిస్తున్నారు. మరి నిజ బోధకులు/ప్రవక్తలు ఎవరు ఎలా తెలుస్తుంది? మొదటగా మీరు ప్రార్ధనాపరులు ఆత్మపూర్ణులు అయితే, వారు ఏ ఆత్మతో భోదిస్తున్నారు అనేది ఇట్టే వివేచించి తెలుసుకోవచ్చు! ఇంకా వారు భోదించేది అది ఏమైనా సరే, అది వాక్యానుసారంగా ఉన్నదా, లేక లోకానుసారంగా ఉన్నదా అని ఆలోచించాలి. వాక్యంతో సరిచూడాలి. అప్పుడు వారిబోధ నిజమైనదో, సొంతమాటలో అర్ధమవుతుంది. కాబట్టి ఆహాబు మోసపోయినట్లు ప్రియ చదువరులారా! మీరుకూడా మోసపోవద్దు!

ఇక రెండవ విషయం—ఏలియా గారు ఏమని ప్రవచించారో అలాగే ఆహాబు మరణమయ్యాక అతని రక్తాన్ని కుక్కలు నాకాయి. దైవజనుడు చెప్పిన మాట అనగా—దైవజనుడి ద్వారా దేవుడు పలికించిన మాట అక్షరాలా నెరవేరింది. ౩4,35,38 వచనాలు జాగ్రతగా పరిశీలించాలి. ఇక 38 వ వచనం చాలా ఆసక్తిగా ఉంటుంది.
వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను.
ఆహాబు రధాన్ని కడుగుతుంటే కుక్కలు ఆహాబు రక్తాన్ని నాకాయి అని ఉంది. ఇది దేవునిమాట నెరవేర్పు.
అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే: వేశ్యలు స్నానం చేస్తుండగా ఆ రధాన్ని కడిగారు. మీరనవచ్చు ఇదేమైనా గొప్ప విషయమా? అవును! ఇది చాలా అపరాధము! ధర్మశాస్త్రములో చాలా స్పష్టంగా చెప్పబడియుండి. నీ కుమార్తెను వేశ్యగా చెయ్యొద్దు.
లేవీయకాండము 19: 29: మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణియగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు.
అలాగే నీవు వ్యభిచారం చెయ్యొద్దు. నిర్గమకాండము 20: 14
వ్యభిచరింపకూడదు.
అలా చేస్తే రాళ్ళతో చంపాలి. ద్వితియోపదేశకాండము 17: 4
ఆ చెడ్డ కార్యము చేసిన పురుషునిగాని స్త్రీనిగాని నీ గ్రామముల వెలుపలికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్ట వలెను.

అది ధర్మశాస్త్రం చెబుతుంది. అయితే ఇక్కడ ఇశ్రాయేలు దేశం నడిబొడ్డున, అదికూడా రాజులు స్నానం చేసే కొలనులో – వేశ్యలు ధైర్యంగా స్నానం చేస్తున్నారు. అంటే దాని అర్ధం—యెజెబెలు వ్యభిచారాన్ని, వేశ్యరికాన్ని తప్పులేదని చెప్పి, దానిని పాపాల లిస్టునుండి, తప్పుల లిస్టునుండి తప్పించి- ప్రజలు ధైర్యంగా ఆ వేశ్యలతో వ్యభిచారం చేసేలా చేసింది. అందుకే 2 రాజులు 9:22 లో యెహూ ఏమన్నారో చూడండి.
అంతట యెహోరాము యెహూను చూచి - యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ-నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమాధాన మెక్కడ నుండి వచ్చుననెను. . . . . చూసారా ఇక్కడ జారత్వములు, చిల్లంగితనములు అపరిమితంగా చేస్తుంది అంటున్నారు ఎవరికోసం?! యెజెబెలు కోసం. అనగా తానే జారత్వం, చిల్లంగితనము /చెడుపులు చేస్తూ, ప్రజలను కూడా చేయమని ప్రోత్సహిస్తుంది. ఈ రెండు దేవునికి అసహ్యము. వీరిని దేశం నుండి వెళ్ళగొట్టమని దేవుడు చెప్పారు. ఎంతగా పతనమైపోయిందో చూశారా ఆహాబు-యెజెబెలు పాలనలో!! అందుకే దీనిని సమూలద్వంశం చేద్దామని దేవుడు అనుకొని ఈ తీర్పులు ప్రకటించారు, చేశారు. అందుకే దానికి అనుగుణంగా దేవుని మనస్సుని ఎరిగిన ఏలియాను అతని తర్వాత అదే రోషం—పౌరుషం ఉన్న ఎలీషాను దేవుడు ఎన్నుకొన్నారు. ఇక యెజెబెలు కి దేవుడు ఏ విధమైన శిక్ష వేశారో గతభాగంలో చూసుకున్నాం. అది ఏవిధంగా నెరవేరిందో తర్వాత భాగాలలో చూసుకుందాం.

దేవుడు చెప్పిన ప్రతీమాట నెరవేరి తీరుతుంది. అయితే అనుకుంటారు—దేవుడు ఎన్నో చెప్పారు బైబిల్ లో. అన్ని ఎలా పాటించగలము? ఎంతమంది వాటినుండి తప్పిపోలేదు. వారికీ ఏమీ జరగడం లేదు. నాకు కూడా ఏమీ జరుగదు అనుకొంటున్నావేమో!!! దేవుడు వారిని కాలుజారే స్థలములో ఉంచారు. కీర్తనలు 73: 18
నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు
ఒకసారి జారితే ఇక సర్వనాశానమే! నిత్యనరకమే వారి అంతం!
ప్రియ చదువరీ! నేను ఎన్నిచేసినా దేవుడు పట్టించుకోవడం లేదు అనుకోవద్దు! అంతటా అందరూ మారుమనస్సు పొందాలని ఇంకా దేవుడు దీర్ఘశాంతముతో ఎదురుచూస్తున్నారు. 2పేతురు 3: 9
కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

దేవుని దీర్ఘశాంతాన్ని చేతకానితనముగా ఎంచవద్దు. ఆయనకోపాన్ని నీవు తట్టుకోలేవు సుమీ! ఆహబుకి పట్టిన గతే నీకు కూడా పట్టగలదు!
నేడే నీ తప్పులు వదలి, ఆ కరుణామాయుని క్షమాపణ కోరుకో!
ఆయన నీకోసం చేతులు చాపి పిలుస్తున్నారు. ప్రయాసపడి భారము మోసుకోనుచున్న సమస్త జనులారా! నాయోద్దకు రండి మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు. మత్తయి 11:28;
మరి నీవు వస్తావా?
వస్తే—రక్షించబడి పరలోకం వెళ్తావు.
రాకపోతే—ఇంతగొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందుము? హెబ్రీ 2:3;
ఆహాబు తప్పించుకోలేక పోయినట్లు నీవు కూడా తప్పించుకోలేక నిత్యనాశనము పొందుతావు,
ఏది కావాలో కోరుకో!

ఇదే రక్షణ దినం!
నేడే అనుకూల దినము!

ఆమెన్!


పౌరుషం గల ప్రవక్త- 33వ భాగం

రౌద్రుడైన ఏలియా -1

2 రాజులు 1:3—42
3. యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను నీవు లేచి షోమ్రోనురాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా?
4. కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్లిపోయెను.

ప్రియులారా! ఇప్పుడు ఆహాబు మరణమయ్యాక జరిగిన సంగతులను చూసుకుందాం. ఆహాబు కుమారుడు ఆహజ్యా రాజయ్యాడు. ఆహాబు మార్గం లోనే నడిచాడు. మరి ఏమైందో గాని, కిటికీ మీదనుండి పడిపోయాడు, రోగి అయ్యాడు. ఇంతవరకు బాగుంది గాని, అయితే ఆ తర్వాత తన తల్లినడిచిన మార్గంలో నడుస్తున్నాడు. ఏమిటంటే తను బాగుపడతాడో లేదో అని తెలుసుకోడానికి ఎక్రోను దేవతయైన బయెల్జెబూలు దగ్గర విచారణ చేయడానికి మనుష్యులను పంపించాడు. అనగా సోది చెప్పించుకోడానికి పంపించాడు. గతభాగం లో చూసుకున్నాము తన తల్లి చిల్లంగితనములు ఎక్కువగా చేసింది.

ఒకసారి ఆగి పరిశీలించవలసినవి ఉన్నాయి. ఎక్రోను ఎక్కడుంది? అది ఫిలిష్తీయుల దేశంలో ఉంది. అనగా వారి విరోధుల దేశంలో గల ఒక దేవత దగ్గరకు పంపించాడు. ఆ దేవత పేరు ఏమిటి? బయెల్జెబూలు . అంటే ఈగలదేవుడు అని అర్ధం. అసలు పేరు బయల్ జెబూలు జెబూలు అనగా రాజకుమారుడు, బయలు అనగా యజమాని. అంటే రాకుమారుడైన బయలు లేక రాకుమారుడైన యజమాని అని ఆర్ధం. గాని యూదా రచయతలు వీడని హేళన చేయడానికి బయెల్జెబూబు అంటారు. యేసుప్రభువును శోదిస్తూ వీడు బయెల్జెబూలు వలన దయ్యాలను వెల్లగోడుతున్నారు అన్నారు. మార్కు ౩:22 లో. ఇంకా వీడికోసం చూసుకుంటే: మత్తయి, లూకా సువార్తలలో వీడికోసం వ్రాయబడింది. లూకా 11:15 లో వీడు దయ్యములకు అధిపతి అని వ్రాయబడింది. అనగా దేవాదిదేవుడు నిజదేవుడైన యెహోవా దేవుడ్ని వదిలేసి ఈ రాజు, దయ్యాల అధిపతి దగ్గరకు సోదికోసం పంపిస్తున్నాడు. ఈ రోజులలో కూడా చాలామంది క్రైస్తవులు అని పేరుపెట్టుకుని కూడా, సోదె చెప్పించుకోవడం, జ్యోతిష్యాలు చూపించుకోవడం, పోములు కట్టించుకోవడం చేస్తున్నారు. గాలిని ఆపగలిగిన, ఎర్ర సముద్రాన్ని, యోర్దాను నదిని పాయలు చేయగలిగిన దేవుడ్ని, సూర్యచంద్రులను ఆపిన దేవుణ్ణి, సర్వ సృష్టికర్తను చేతకానివానిలా పరిగణించి, దయ్యాల దగ్గరకు వెళితే దేవునికి కోపం రాదా? ప్రియ సహోదరి/ సహోదరులారా! ఈ ఆహాజ్యా వెళ్ళిన వెంటనే దేవుడు ఏలియా గారిని పంపిస్తున్నారు. ఒకవేళ నీవు కూడా వెళితే నీ గతి అదో గతే అని తెలుకోమని మనవి చేస్తున్నాను.

సరే, వెంటనే యెహోవాదూత ఏలియాగారికి ప్రత్యక్షమై చెబుతున్నారు యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను నీవు లేచి షోమ్రోనురాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా?

ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి దేవదూతలు బైబిల్ లో సుమారు ౩౦౦ సార్లు కనిపిస్తున్నారు. వీరు శరీరులకు కనిపించని ఆత్మరూపులు. గాని దేవుని మాటలను చెప్పడానికి అప్పుడప్పుడు మానవరూపంలో కనిపించి దేవుని వర్తమానం చెప్పారు. దేవదూత అనగా పంపబడిన వాడు. దీనికోసం చాలా రిఫరెన్సులు ఉన్నాయి గాని ఇక్కడ మనం ముఖ్యముగా గమనించవలసినది బైబిల్ లో ఎక్కడైనా యెహోవా దూత అని వ్రాయబడితే అది యేసుప్రభులవారు అని గుర్తించాలి. ఎందుకంటే ఎక్కడైతే యెహోవాదూత అని వ్రాయబడి కనిపించారో, ఆ తర్వాత మాటలలో తానే దేవుడైనట్లు అనగా యెహోవా అయినట్లు మాట్లాడటం గమనించగలము. నిర్గమ ౩:2—6, ఆదికాండం 31:11-13; దేవునికి ఉండే గుణాలన్నీ ఈ యెహోవాదూతకు ఉన్నాయి. (ఆదికాండం 16:10; , 48:16) ఈయనే యెహోవా! న్యాయాధిపతులు 2:1—౩;6:12; 14;16;23; ఇంకా చాలా చెప్పగలము గాని చివరగా చెప్పేది ఏమిటంటే ఆయనే కుమారుడైన యేసుప్రభులవారు.

కాబట్టి దేవుడు ప్రత్యక్షమై చెబుతున్నారు ఏలియా! ఆహాజురాజు ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడు అనుకొని ఎక్రోను దేవతగు బయల్జెబూబునొద్దకు మనష్యులను పంపిస్తున్నాడు కనుక వాడు ఎక్కిన మంచం దిగకుండా చస్తాడని ఆ మనుష్యులకు చెప్పమంటే--
ఏలియాగారు తిన్నగా వెళ్లి ఆ విషయం చెప్పేసారు.

చూసారా, దేవుడిచ్చిన తీర్పు! దేవుణ్ణి విడచి తిరిగిన ఆహబుకు దేవుడిచ్చిన తీర్పు తెలుసు ఈ రాజుకు. అయినా దేవుని దగ్గరకు రాకుండా తన తల్లి నడిచిన త్రోవలో నడుస్తున్నాడు.

ప్రియ తల్లిదండ్రులారా! మీ పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తుంటారు అని మరచిపోవద్దు. మీరు ప్రతీవారం ఆరాధనకు దేవుని మందిరానికి వెళ్తే, మీ పిల్లలు కూడా మీతోపాటు వెళ్తారు. ఆరోజే మీరు షికార్లకు వెళితే వారు సినిమాలకు వెళ్తారు. మీరు త్రాగితే వారు త్రాగుతారు. మీ ఎదుట సిగరెట్లు, మద్యపానం చేయకపోయినా, బయటికి పోయి చేస్తారు. ఆహాబు, తన భార్య దేవుణ్ణి విడచి దెయ్యాల వెనుక తిరిగారు. కొడుకు కూడా అదే మార్గంలో నడుస్తున్నాడు. కాబట్టి ప్రియ తల్లిదండ్రులారారా! మీరు మీ పిల్లల దగ్గర మంచి నడవడిక కలిగి జీవిస్తే వారుకూడా మిమ్మును చూసి నేర్చుకుంటారు.

కాబట్టి మనం మార్గములను సరిచూసుకుందాం.
సోదె, జ్యోతిష్యాలు విసర్జించి నడుద్దాం. పిల్లలకు మాదిరిగా ఉందాం.
దైవాశీస్సులు!

పౌరుషం గల ప్రవక్త- 34వ భాగం
రౌద్రుడైన ఏలియా -2


2 రాజులు 1:6—8
6. వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజు నొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలులో దేవుడన్న వాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే; నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా
7. మిమ్మును ఎదుర్కొన వచ్చి యీ మాట చెప్పిన వాడు ఏలాటి వాడని రాజు అడిగెను.
8. అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమియ్యగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను.

ప్రియులారా! గత భాగంలో రాజు పంపిన మనుష్యులతో ఏలియాగారు రాజుకి కబురు పంపించినట్లు చూసాము. ఎప్పుడైతే వారు ఫిలిస్తీయుల దేశం వెళ్ళకుండా తిరిగి వచ్చేసారో రాజు అడిగాడు ఏం ఎందుకు వచ్చేశారు అని, వెంటనే వారు చెప్పారు—ఒకమనుష్యుడు మాకు కనబడి ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడు అనుకొని నీవు ఎక్రోను దేవతయైన బయెల్జెబూబు దగ్గరకు మనుష్యులను పంపించావు కాబట్టి నీవు ఎక్కిన మంచం దిగకుండా చస్తావ్ అని చెప్పమన్నారు. అందుకే వచ్చేసాము అన్నారు. వెంటనే అడిగాడు ఆ మనిషి ఎలా ఉన్నాడు అని! అతడు గొంగళి ధరించుకొని (ఒక రకమైన రగ్గు), నడుముకి తోలుదట్టి కట్టుకున్నాడు అని చెప్పారు. వెంటనే ఈ రాజుకు తెలిసిపోయింది ఆయన ఏలియాగారు అని.

ఇక్కడ ఏలియాగారి వేషధారణ ఎలా మిచ్చు క్రొత్త నిభందనలో భాప్తిస్మమిచ్చు యోహాను గారి వస్త్రధారణ కూడా అలాగే ఉంటుంది. సరే, ఇక్కడ ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని వారితో చెప్పాడు. తర్వాత ఉగ్రుడవుతున్నాడు.
9. వెంటనే రాజు ఏబది మందికి అధిపతియైన యొకనిని వాని యేబది మందితో కూడ ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్బుని యుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడా, నీవు దిగి రావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. . . . . చూసారా, మనుష్యులను పంపించి బెదిరించి అయినా తన దగ్గరకు పిలిపించుకొని బెదిరించి, దేవుని ప్రవచనాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకొన్నాడేమో! ఈ రాజుకి ఏలియా గారి శక్తి తెలుసు , ఆయన దైవజనుడని తెలుసు.. తన తండ్రి, తల్లి ఆయనను చంపుదామని చాలా ప్రయత్నాలు చేసి ఏమి చేయలేక చేతకాని వారిలా ఉండిపోయారని కూడా తెలుసు వీడికి అయినా సరే, ఆయనను ఎందుకు పిలిపించుకొంటున్నాడో తెలియదు. బహుశా, తన ఈగో దెబ్బ తిని ఉంటుంది. అది కూడా తన పంపిన పనివారిముందు అంత కటినమైన మాటలు విని నిశ్చేష్టుడై ఉంటాడు. అందుకే ఏలియాగారిని పిలిపిస్తున్నాడు. ఎలా? మంది మార్బలముతో!
ఇక ఈ యాబై మందికి అధిపతి కూడా ఒక పనికిమాలిన వాడు. ఏలియా గారు మహా గొప్ప దైవజనుడని వారందరూ కర్మెలు పర్వతము మీద చూసారు. ఆయన శక్తిని చూశారు. అయినా ఇక్కడ వీడు తన అధికారాన్ని చెలాయిద్దామనుకున్నాడు ఏమో! పిలవడం దైవజనుడా! అని పిలిచాడు. నీవు దిగి రావలెనని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని దర్పంగా చెబుతున్నాడు. Instead of Passing the Message, here he is giving Command. వర్తమానాన్ని చెప్పేదానికి బదులుగా ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. మాట్లాడే విధానం వీడికి తెలియదు. ఫలితం ఏలియాగారు అన్నారు—నేనే దైవజనుడనైతే అగ్ని వచ్చి, నిన్ను నీ యాబై మందిని దహించును గాక! అన్నారు. అనడమే తరువాయి ఆకాశం నుండి అగ్ని రావడం ఈ 51 మంది బూడిద/ సజీవదహనం అయిపోవడం జరిగిపోయింది. నోటిదురుసు తననానికి ఇదే ప్రతిఫలం! చాలామంది కొన్ని సంఘాలలో కాపరికి/ దైవజనుడికి ఇలాగే దురుసుగా మాట్లాడి వారి మనస్సు నొప్పిస్తుంటారు. ఫలితం తర్వాత అనుభవిస్తుంటారు. ఆ సంఘాలలో కాపరి జీతానికి పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఏమీ అనలేని స్తితిలో ఉంటారు. గాని దేవుడు చూస్తున్నారు అని మరచిపోతూ ఉంటారు. ఫలితం అనుభవిస్తూ ఉంటారు. ప్రియ దైవజనమా! మీ కాపరికి/దైవజనుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వమని మనవి చేస్తున్నాను.

ఐతే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏలియా గారు అంతఘోరంగా ఆ మాట ఎలా అనగలిగారు? దైవజనుడు కదా! ప్రేమ కలిగియుండాలి కదా! జవాబు సింపుల్! ఇది చూడటానికి మానవత్వం మంటగలిసినట్లు కనిపిస్తుంది గాని నిజంగా ఇది ఒక అబద్ద దేవుణ్ణి అనుసరించే ఒక అవిశ్వాసియైన రాజుకి—ఒక నిజదేవుని పౌరుషం గల ప్రవక్త పెట్టుకున్న పోటీ! ఆ పోటీలో అధికారాన్ని చూపి దేవుణ్ణి, దైవజనుని లొంగదీసుకోవాలని అనుకున్నాడు ఈ రాజు. ఇలాంటి పరిస్తితులలో దేవుడు తను ఉన్నాడు అని నిరూపించటానికి ఇలాంటి పనులే చేస్తుంటారు. ఉదాహరణకు: ఫరోను లొంగదీసుకోడానికి ఫరో, మోషేగారి మధ్య పోటీ జరిగింది. దానివలన ఫారో సర్వనాశనం అయిపోయాడు. నెబుకద్నేజర్—షడ్రక్, మేషాక్, అబెద్నేగో ల మధ్య జరిగింది. తన భక్తులే గెలిచారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఆమాట అన్నది ఏలియాగారు కాదు అని నా ఉద్దేశ్యము: కారణం ఆత్మ పూర్ణుడైన ప్రవక్తలో దేవుడు ఉండి పలికిస్తున్న మాటలు ఇవి. అలా అనడానికి కారణం 15 వ వచనంలో మూడో యాబైమంది అధికారి వచ్చినప్పుడు దేవుని దూత చెప్పాడు కదా, వీనికి భయపడక వీనితోపాటు వెళ్ళు! అంటే ఈ మొదటి యాబై మందికి అధికారి గాని, లేక రాజుగాని ఏలియాగారికి హానిచేద్దామని అనుకొని ఉంటారు. అందుకే ఏలియాగారిలో ప్రజ్వరిల్లుచున్న ఆత్మ ఈ మాట అన్నారు. ఇక్కడ మరో విషయం అలోచించాలి. ఏలియాగారు అగ్నినే ఎందుకు ఎన్నుకున్నారు? కారణం ఏలియాగారికి లేఖనాలు - ధర్మశాస్త్రం బాగా తెలుసు కాబట్టి. దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తే దేవుడు ఇలాగే బుద్ది చెప్పారు. ఉదాహరణకు సంఖ్యా 16:35; ఇక్కడ వీరు మోషే గారిమీద తిరగబడ్డారు. ప్రకటన 11:5, 20:9; ఇక్కడ కూడా అదే జరగనుంది. అందుకే ఏలియా గారు అగ్నిని ఎన్నుకొన్నారు.
సరే, ఇక తర్వాత మరొకడు వచ్చాడు మరో యాబై మందితో. వాడు, వాడి సైనికులు మాడిపోయారు. అనగా ఈ విషయాలు కొంతమంది చూసి రాజుకి కబురు చెబుతున్నారన్నమాట!

నిజ దేవునితో పెట్టుకుంటే మాడిమసై పోవలసిందే! ఇంతమంది చచ్చినా ఈ రాజుకి బుద్ధి రాలేదు. అయినా చచ్చింది వాడు కాదు కదా, వాడి కుటుంబం కాదు కదా! అందుకే మూడో పంచ ధశాదిపతిని పంపించాడు. వాడైతే మోకాళ్ళూని ఎంతో వినయంతో అంటున్నాడు—
13. ఇంకను రాజు ఏబది మందికి అధిపతియైన యొకనిని వాని ఏబదిమందితో కూడ పంపగా ఏబది మంది మీద అధిపతియైన ఆ మూడవ వాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్లూని దైవజనుడా, దయ చేసి నా ప్రాణమును నీదాసులైన యీ యేబది మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము.
14. చిత్తగించుము; ఆకాశమునుండి అగ్ని దిగి వెనుకటి పంచ దశాధిపతులను ఇద్దరిని వాని వాని యేబది మందితో కూడ దహించెను; అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా
చూశారా ఎంత వినయమో! అందుకే ఘనతకు ముందు వినయము, పడిపోవడానికి ముందు ఘర్వము ఉంటాయి అన్నారు జ్ఞానియైన సొలొమోను‌. సామెతలు 15:33; 18:12; 16:18; మనిషి నోరే తమకు దీవెనలు, శాపాన్ని తీసుకుని వస్తుంది. నాలుక అగ్ని అన్నారు యాకోబు గారు 3:6;
వెంటనే యెహోవా దూత అనగా యేసుక్రీస్తు.
15. యెహోవా దూత వానికి భయపడక వానితో కూడ దిగిపొమ్మని ఏలీయాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితో కూడ రాజునొద్దకు వచ్చెను. . . .
సరే, వానితోపాటు ఏలియాగారు వెళ్లి ఏమన్నారు? పూర్వం ఏమన్నారో, అదే అన్నారు. ఎక్కిన మంచం దిగకుండా చస్తావ్ అన్నారు. చచ్చాడు! ఇక్కడ వీడు పంతం పెట్టి ఏం సాదించాడు? దేవునితీర్పు ఏమైనా మారిందా అంటే మారలేదు. కేవలం బుద్ధిశూన్యుడు వీడు! వీడికి—వీని తండ్రికి తేడా ఏమిటంటే ఆహాబు దేవునితీర్పు విని పశ్చాత్తాపంతో దేవుని క్షమాపణ వేడుకున్నాడు. దేవుడు కరుణించాడు. వీడు విర్రవీగాడు. చచ్చాడు.

ప్రియ దైవజనాంగమా! మీమాటలు, ప్రవర్తన కాచుకోవాలని మనవి చేస్తున్నాను. నీవుకూడా దేవునితో పెట్టుకోకు! దేవుని కృపతో చెలగాటమాడకు! మాడి మసైపోతావు .
ఆహాబు గుణపడినట్లు గుణపుడు! దేవుడు నిన్ను క్షమిస్తారు.
ఆమెన్!

పౌరుషం గల ప్రవక్త- 35వ భాగం
ఏలియాగారి ఆరోహణం-1

2 రాజులు 2:1—2
1. యెహోవా సుడిగాలి చేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీషాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా
2. ఏలీయా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి యున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా-యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.

ప్రియులారా! ఇంతవరకు ఏలియాగారి జీవితములో జరిగిన సంఘటనలు చూసుకున్నాము, ఒక అనామికుడు, అనాగరికుడు అయిన ఏలియా గారు ఎంతగా దేవుని సేవలో ప్రజ్వరిల్లారో మనం చూసుకున్నాం. ఈరోజు ఆయన ఆరోహణమైన విధానం, ఆరోహణం కాకముందు జరిగిన ముఖ్యమైన సంఘటనలు ధ్యానం చేసుకుందాం.

ప్రియులారా! యెహోవా సుడిగాలిచేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోతున్నారు అని అందరికి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది అందరికీ? బహుశా దేవుడే ఏలియాగారికి చెప్పి ఉండవచ్చు! లేదా ఎలీషాగారికి చెప్పి ఉండొచ్చు దేవుడు. ఏదిఏమైనా ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. కారణం ౩, 5 వచనాలు గమనిస్తే అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. బహుశా 102 మంది సజీవ దహనం అయ్యాక ఏలియాగారి విషయం అందరికీ తెలిసిపోయి, చాలా పాపులర్ అయ్యి ఉండవచ్చు. ఎప్పుడైతే ఈ ఆరోహణ విషయం తెలిసిందో ఇంకా ప్రజలు సంభ్రమాశ్చర్యాలలో ఉండవచ్చు. అప్పుడు ఏలియాగారు, ఎలీషాగారు ఇద్దరూ బయలుదేరారు. ఇంతవరకు ఎలీషాగారు, ఏలియాగారి దగ్గర ట్రైనింగ్ పొందారు. బహుశా ఆ ట్రైనింగ్ పూర్తి అయిపోయింది. అందుకే ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు వెళ్ళేటప్పుడు వారు చేసిన ప్రతీ మజిలీలో ఎన్నో ఆత్మీయమర్మాలతో దాగిఉన్నాయి . దీనికోసం గతంలో ఆధ్యాత్మిక సందేశాలు-1 లో వివరించడం జరిగింది. దేవునితో సహవాసం—ఎడబాయకుండుట అనే శీర్షికతో! సందర్బము గాబట్టి మరోసారి దానిని చూసుకుందాం.

బైబిల్ గ్రంధంలో వ్రాయబడిన/జరిగిన ప్రతీ సంఘటన ఎన్నో వర్తమానాలు-ఆత్మీయ మర్మాలతో నిండిఉన్నాయి. అందుకే 1కొరింథీ 10:11 లో “*ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను*” అని వ్రాయబడింది, కాబట్టి అది ఒక చరిత్ర మాత్రమే అని అనుకోవద్దు. వాటిలో ఎన్నో అర్ధాలు-పరమార్ధాలు దాగియున్నాయి.

ఈభాగంలో ఏలియాగారు సుడిగాలి చేత పరలోకానికి ప్రాణంతోనే ఎగిరిపోయే సమయంలో ఏలియాగారు ఎలీషాగారితో అంటున్నారు- దేవుడు నన్ను పరమునకు తీసుకోనిపోతున్నారు దయచేసి నీవిక్కడే ఉండిపో. అందుకు ఎలీషాగారి సమాధానం “*యెహోవా జీవముతోడు, నీజీవముతోడు నేను నిన్నువిడువను*” అనిచెప్పారు మాటిమాటికి. బహుశా ఏలియాగారు ఎలీషాగారిని పరీక్షించడానికి ఈమాట అని ఉండవచ్చు. లేకపోతే సరే, ఇకచాలు, నీవు ఇక్కడ ఉండిపో! నేను ప్రభువు దగ్గరకు వెళ్ళిపోతాను అనే ఉద్దేశ్యంతో అని ఉండవచ్చు.
వారి మజిలీలో 1. గిల్గాలు, 2) బేతేలు, 3) యెరికో, 4) యోర్దాను అనేవాటిని దాటివెళ్ళాల్సి వచ్చింది. అంతేకాదు ప్రవక్తల శిష్యులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. పై మూడు మజిలీలలో ఏలియాగారు నీవు ఉండిపో అనినా, యెహోవా జీవంతోడూ నేను నిన్ను విడువను అనే అన్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా ఏలియాగారిని విడవడానికి ఈయనకు ఇష్టం లేదు. అలాగే విశ్వాసి దేవునితో సహవాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడువకూడదు.

నేడు రక్షింపబడిన విశ్వాసి కూడా ఈ అన్ని మజిలీలు దాటాల్సిందే! వీటిని దాటకుండా, ఎదుర్కోకుండా పరలోకానికి చేరడం అసంభవం. వీటిని సంక్షిప్తంగా చూద్దాం.

1.*గిల్గాలు-దొరలింపబడుట* : వీరిద్దరూ మొట్టమొదటగా గిల్గాలు మీదుగా పోవాల్సి వచ్చింది. గిల్గాలు అనుమాటకు దొరలింపబడుట అని అర్ధం. ఇశ్రాయేలీయులు వారి ఐగుప్తు యాత్రలో యోర్దాను నదిని దాటిన వెంటనే దేవుడు సున్నతిని పొందమని సెలవిస్తారు. అది జరిగిన వెంటనే దేవుడు చెప్పారు నేటితో ఐగుప్తు అవమానాన్ని నేను తీసివేస్తున్నాను అన్నారు. అందుకే ఆ ప్రాంతానికి గిల్గాలు అన్నారు. యెహోషువా 5:9
అదేవిధంగా ఒకవ్యక్తి మారుమనస్సు, పశ్చాత్తాపం పొంది తను పాపినని గ్రహించి , యేసే రక్షకుడని గ్రహించి భాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు పాపాలన్నీ దొరలిపోతాయి. ఇది మొదటి మెట్టు.

2. *బేతేలు- దైవమందిరం*: ఏలీయాగారు, ఎలీషాగారు బేతేలు అనే ప్రాంతం చేరుకొంటారు. మనం బేతేలు గురించి చూసుకొంటే యాకోబుగారి జీవితంలో ఈ బేతేలు అనుభవం ఎదురైంది. ఆదికాండము 28:13-22 . తన అన్న ఏశావుకి భయపడి తన మావయ్య ఇంటికి ఒంటరిగా పారిపోతుండగా ఆరాత్రి దేవుడు యాకోబును దర్శించి ఆశీర్వదించారు. అందుకే యాకోబుగారు ఆప్రాంతానికి బేతేలు అని పేరుపెట్టారు.

అదేవిధంగా రక్షింపబడిన విశ్వాసి తనజీవితంలో బేతేలు అనుభవం కలిగియుండాలి. ఎప్పుడు ఆ అనుభవానికి చేరుకోగలరు? క్రమం తప్పకుండా దైవ సన్నిధికి వెళ్తున్నప్పుడు, దైవసన్నిధిని అనుభవించినప్పుడు. దానిద్వారా దేవుని బిడ్డల సహవాసం దొరుకుతుంది. అంతేకాక దైవ దర్శనం కలుగుతుంది. దేవుడు నీతో మాట్లాడుతారు ఏదోవిధంగా! ఇదే బేతేలుఅనుభవం.

3. *ప్రవక్తల శిష్యులు-సాతాను ఏజెంట్స్*: వీరిద్దరూ బేతేలుకు చేరుకొన్నప్పుడు ఇంకా ప్రతీ స్థలంలో కూడా ఈప్రవక్తల శిష్యులు ఎలీషాగారిని నిరాశపరుస్తారు. మీగురువుగారిని ఈరోజు దేవుడు పరలోకానికి తీసుకోనిపోతున్నారు తెలుసా అంటూ. అందుకు ఎలీషా గారు ఏమన్నారు? అదినాకు తెలుసుగాని మీరు నోరుముసుకోండి.

ఇక్కడ ప్రవక్తల శిష్యులు సాతానుగాడి ఏజెంట్స్ లాగ ప్రవర్తిస్తున్నారు. మనవిశ్వాస జీవితాన్ని నిరాశపరుస్తారు. అప్పుడు మనం సరియైన సమాధానం వాక్యాదారంగా ఇవ్వాలి. వీళ్ళు తప్పుడు బోధలు, తప్పుడు ఆచారాల ద్వారా మనలను సందిగ్ధంలో పడేస్తుంటారు. కొందరు ఏడువారాలు గుడికొస్తే చాలు అని, కొందరు 40రోజుల దీక్ష అని అంటుంటారు. ఈమధ్య కొందరు పెద్ద పెద్ద పాపాలు చేస్తే తప్పుకాని చిన్న చిన్న పాపాలు పర్వాలేదు అని భోదిస్తున్నారు. పాపం అది చిన్నదైనా పెద్దదైనా అది పాపమే. వీటిని వాక్యంతో ఎదుర్కోవావాలి. కొన్నిసార్లు సాతానుగాడే సూటిగా మనతో మాట్లాడుతుంటాడు మనకి నిరాశ నిస్పృహ కలిగిస్తుంటాడు. అప్పుడు యేసుప్రభులవారు జవాబిచ్చినట్లు వాక్యంతో వాడికి జవాబివ్వాలి. అప్పుడు వాడు మనదగ్గరనుండి పారిపోతాడు. ప్రతీ నిజవిశ్వాసి ఈ అనుభవంగుండా వెళ్ళాల్సిందే!

4. *యెరికో*: మనప్రవక్తల తర్వాత మజిలీ యెరికో. ఇది ఒక పాపపు పట్టణం! ఈ పట్టణ వివరాలు యెహోషువా గ్రంధంలో చూడొచ్చు. ఇది జూదములకు, హత్యలకు, మానభంగాలకు, దొంగతనాలకు, వ్యభిచారాలకు, అవమానాలకు, మోసాలకు ఇంకా అన్యాచారాలకు ప్రసిద్ధి మరియు గుర్తుగా ఉంది. రక్షింపబడిన విశ్వాసిని తిరిగి లోకంలోనికి లాగడానికి సాతానుగాడు ఇవన్నీ చూపించి విశ్వాసబ్రష్టుడిగా చేయాలని చూస్తాడు. విశ్వాసి వీటిని తప్పకుండా జయించాలి. వాక్యంతో తిప్పికొట్టాలి. అందుకే పౌలుగారు 2కొరింథీ 6:14-18 లో చెబుతారు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు.......వెలుగుకి చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంభంధం? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక? మనము దేవుని ఆలయమై ఉన్నామని సెలవిచ్చారు.

5. *యోర్దాను*: అనగా 1) అడ్డము, 2) మరణము. ౩. దాటుట
ఏలియా మరియు ఎలీషాగార్లయొక్క తదుపరి మజిలీకి ముందు యోర్దాను నదిని దాటివెళ్ళాలి.
ప్రతీవిశ్వాసి ఈ యోర్దాను అనుభవం దాటకుండా పైకెత్తబడలేరు. అనగా సాతాను కలిగించే ప్రతీ అడ్డు ఆటంకాలను దాటుకొని వెళ్ళాలి. మరియు మరణం ద్వారా వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏలీయాగారు దీనిని విశ్వాసం అనే దుప్పటిని ఉపయోగించి నదిని పాయలుగా చేసి ఎంతో సునాయాసంగా దాటేసారు. ఇక ఎలీషాగారు కూడా తన తిరుగు ప్రయాణంలో అదే విశ్వాసం అనే దుప్పటిని ఉపయోగించి యోర్దాను నదిని ఎంతో అవలీలగా దాటేసారు. ప్రతీవిశ్వాసి కూడా ఇదే విశ్వాసం అనే దుప్పటిని ఉపయోగించి యేసునామంలో ప్రతీ అడ్డంకిని పాయలుచేసి అవతలి ఒడ్డుకి చేరుకోవాలి.

*అప్పుడు ఏం జరుగుతుంది?*
అగ్నిరధములు, అగ్నిగుఱ్ఱములు, సుడిగాలి ద్వారా ఏలీయా గారు పైకెత్తబడ్డారు. అదేవిధముగా రక్షింపబడిన విశ్వాసి కూడా యోర్దాను అనుభవం దాటినప్పుడు ఒకరోజు అనగా యేసయ్య రెండో రాకడలో వచ్చినప్పుడు రెప్పపాటులో కడభూర మ్రోగగానే పైకెత్తబడతారు!!!

ఎప్పుడూ?
1. విశ్వాస జీవితాన్ని జీవించినప్పుడు
2. వాక్యాదారంగా జీవించినప్పుడు
3. పైనుదహరించిన అన్ని అనుభవాలను వీరోచితంగా దాటినప్పుడు.

ప్రియ విశ్వాసి! నేడో రేపో యేసయ్య రాబోతున్నారు. (1 థెస్సలోనికయులు 4:16,17; 1 కొరింథీ 15:50-52; మత్తయి 24:31)
నీవు సిద్ధంగా ఉన్నావా?
సిద్ధంగా ఉంటే ఎత్తబడతావు!
అట్టి కృప, ధన్యత, ఎత్తబడే అనుభవం నీకు, నాకు కలుగును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

పౌరుషం గల ప్రవక్త- 36వ భాగం
ఏలియాగారి ఆరోహణం-2


2 రాజులు 2: 9—10
9. వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను.
10. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన యెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని యెడల అది కాకపోవునని చెప్పెను.

ప్రియులారా! ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన రెండు విషయాలున్నాయి. మొదటగా ఎలీషాగారి కోరిక. రెండు ఏలియాగారి ఆరోహణం.

ఈ అధ్యాయం లో మూడుసార్లు ఏలియాగారు ఎలీషాను నీవు ఇక్కడ ఉండిపో నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు అంటూ చెప్పిన మూడుసార్లు ఎలీషాగారు యెహోవాజీవము తోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని చెప్పారు. కారణం ఏలీయా గారిని విడవడం ఎలీషాకు ఇష్టం లేదు. కాని గురువుగారు ఎప్పుడైతే దుప్పటితో యోర్దాను కొట్టి పాయలుచేసి యోర్దాను దాటారో అప్పుడు ఏలియాగారు అడిగారు—నేను వెళ్లకముందు నీకు ఏం కావాలో కోరుకో! ఇంతవరకు ఎలీషాగారు ఏమీ కోరుకోలేదు కేవలం ఏలియాగారిని మాత్రమే! ఒకవైపు ఆయనను విడువడం ఇష్టం లేదు. మరోవైపు తనకు తెలుసు దేవుడు ఏలియాగారి తర్వాత ప్రవక్తగా తన్ను ఏర్పాటుచేసుకున్నారు కనుక తన ఇక్కడ ఉండిపోవలసినదే, అందుకే గురువుగారి నోట నుండి మాట వచ్చిన తర్వాతనే అడిగారు నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు అనగా నీవు పొందిన ఆత్మకు రెండింతలు కావాలి అని.

ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, మనకు ఎలీషాగారికి తేడా కనిపిస్తుంది. మనం ఎప్పుడూ ఇది కావాలి, అదికావాలి అంటూ అడగడమే చేస్తుంటాం. అయితే ఎలీషాగారి నోట నుండి నీకు ఏం కావాలి అనేమాట వచ్చేవరకు ఇది కావాలి అని అడగలేదు. అడిగిన తర్వాత తనకు కావలసినది చెప్పారు. ఇక ఎలీషాగారు రెండింతలు పాలు ఎందుకు కావాలి అన్నారు? ఏలియాగారు పొందుకున్న ఆత్మను చూసా? కావచ్చు! లేదా, తను ఏలియాగారికంటే ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా బలహీనుడను అని తలంచి ఉండవచ్చు, ఇప్పుడు ఆయనకు ఉన్న ఆత్మకు రెండితలు ఆత్మ లేకపోతే ఈ ప్రజలను దారిలో నడిపించలేను అని అనుకొని ఉండవచ్చు. అందుకే రెండింతలు పాలు అడిగారు.

ఇక మరో విషయం: ఇంతకూ ఏం కోరుకున్నారు? ఆత్మ!! అందుకు ఏలియాగారు అన్నారు అది నాచేతిలో లేదు. అయినా నేను వెళ్ళేటప్పుడు నీకు కనిపిస్తే నీకు దొరుకుతుంది. నేను కనబడకపోతే నీకు దొరకదు అన్నారు. ఇక్కడ ఏలియాగారు సరే, నీకిచ్చాసాను అనలేదు. అది దేవునికే అప్పగించారు. మరి దేవుడు ఇచ్చారా? ఇచ్చారు కదా! ఎందుకు దేవుడు ఇచ్చారు? ఒకసారి సోలోమోను కోసం ఆలోచన చేస్తే దేవుడు సోలోమోనుకి అంత జ్ఞానం, తెలివితేటలు ఎందుకు ఇచ్చారు? దేవుడు అన్నారు—నీవు వెండి బంగారాలు గాని, శత్రువుల ప్రాణాలు అడగలేదు గాని నా ప్రజలను పరి పాలించడానికి జ్ఞానం అడిగావు కాబట్టి నీకు రెండు ఇస్తాను అన్నారు. 1 రాజులు 3:9-13; ఇక్కడ గొంతెమ్మ కోరికలు కోరకుండా సమయోచితంగా, ఉత్తమమైనది అడిగారు కాబట్టి పొందారు. ఇక యేసుప్రభులవారు చెప్పింది అడుగుడి మీకివ్వబడును అంటూ, తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా దయచేయును అన్నారు. లూకా 11:9--13; మరి ఇప్పుడు ఎలీషాగారు ఏమి అడిగారు? పరిశుద్ధాత్మను! అందుకే ఇచ్చారు దేవుడు! ప్రియ చదువరీ! నీవు ఏం అడుగుతున్నావు? అస్తమాను ఇది ఇచ్చేయ్! అది ఇచ్చేయ్! బాగు చేసేయ్! ఇదే తప్ప దేవా నన్ను నీ ఆత్మ పూర్ణునిగా చేయు . ఏలియాగారిని, ఎలీషాగారిని అభిషేకించినట్లు నన్ను కూడా అభిషేకించు. నన్ను నీ సేవలో ఒక శ్ర్రేష్టమైన పాత్రగా వాడుకోమని ఎప్పుడైనా ప్రార్ధించావా? పౌలుగారు తన పత్రికలలో ఎప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక మైన వాటినే కోరుకోమని తన పత్రికలలో వ్రాసారు. కాబట్టి దయచేసి బౌతిక మైన వాటికోసం కాకుండా ఇటువంటి ఆధ్యాత్మిక వరాలను ఆశించి ప్రార్ధిద్దాం.

ఇక ఏలియా గారి ఆరోహణం కోసం జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది.
11. వారు ఇంక వెళ్లుచు మాటలాడు చుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ మాయెను .. చూసారా అగ్ని రధాలు వేరుచేస్తే, సుడిగాలి చేత పరమునకు వెళ్ళిపోయారు. బైబిల్ లో చనిపోకుండా పరమునకు ఎత్తబడిన వారు కేవలం ఇద్దరే. ఒకరు హనోకు గారు.ఆదికాండం 5:24; మరొకరు ఏలియాగారు. ఎందుకు దేవుడు కేవలం వీరిద్దరిని మాత్రమే బ్రతికి ఉండగానే పరమునకు తీసుకుని పోయారు? మొదటిబాగాలలో చెప్పినట్లు వీరిద్దరూ అస్తమాను దేవునితోనే గడిపేవారు. ఎం చేస్తున్నా, దేవుడు దేవుడు దేవుడు అంతే వీరికి. వీరి హృదయం దేవుని హృదయంతో synchronise అయిపోయింది. అతికిపోయింది. అందుకే వీరిద్దరిని దేవుడు బ్రతికి ఉండగానే పరమునకు తీసుకొని పోయారు. మరొక విషయం వీరిద్దరూ మనందరికీ సాదృష్యంగా ఉన్నారు. ఎలాగంటే రాబోయే రాకడలో మనము కూడా ఇలానే ఎత్తబడబోతున్నాము. దానికి ఉదాహరణ వీరిద్దరూ.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:50,51,52,53,54
50. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.
51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము.
52. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము.
53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.
54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 4:13,14,15,16,17
13. సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.
14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.
15. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.
16. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద(మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

కాబట్టి వీరెలా ఆరోహణం అయ్యారో అలాగే మనం కూడా ఎత్తబడతాం ఎప్పుడు? విశ్వాస జీవితం జీవించినప్పుడు!. వాక్యానుసారంగా నడచినప్పుడు.! అనుక్షణం దేవునితో నడచినప్పుడు.!
మరినీవు సిద్దమా ప్రియ సహదరీ/ సహోదరుడా! ఆయన తొందరలో రాబోతున్నారు. నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడి లేకపోతే బుద్ధిలేని కన్యకలు విడువబడినట్లు విడువబడతావు జాగ్రత్త! విడువబడితే మొదటగా శ్రమలు, తర్వాత నరకంలో అగ్నిఆరదు పురుగు చావదు. ఆ వేదనలు పడలేవు ప్రియచదువరీ ! నేడే మార్పు నొంది సిద్దపడు!

ఏలియా గారు ఎత్తబడితే ఎలీషా గారు గుండెలు పగిలినట్లు ఏడ్చారు. బట్టలు చింపుకున్నారు. అప్పుడు ఏలియా గారి దుప్పటి క్రింద పడింది. రెండింతలు ఆత్మను పొందుకున్నారు ఎలీషాగారు. నీవుకూడా దేవుడు నిన్ను క్షమించే వరకు, దేవుడు నిన్ను తన ఆత్మతో సందించే వరకు, నిన్ను తన ఆత్మతో అభిషేకం చేసేవరకు విలపించు. రోదించు ! అలా చేసి నీవు రక్షణ పొందు. రోదించి నీ కుటుంబాన్ని రక్షించుకో! ఆత్మపూర్ణుడవుగా మారు!
ఆ నరకాన్ని తప్పించుకో!
ఎత్తబడే గుంపులో ఉండు!

అట్టి కృప ధన్యత దేవుడు మన అందరికీ దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


పౌరుషం గల ప్రవక్త- 37వ భాగం

రాబోయే ఏలియా-1


మలాకి 4: 5,6
5. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.
6. నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.

ప్రియులారా! ఈభాగంలో దేవుడు మలాకి ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు ఏలియా మరలా ఈ భూలోకానికి వస్తారు. ఎందుకు వస్తారు తండ్రులహృదయం పిల్లల తట్టుకు , పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు త్రిప్పడానికి. ఇక్కడ రెండు అర్ధాలు స్పరిస్తాయి. మొదటగా నేటి దినాల్లో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అవగాహన లోపించి, కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. కాబట్టి వారిని తిరిగి కుటుంబంగా కూర్చాలంటే దేవుడు మాత్రమే చేయగలరు. అందుకు గాను అనగా తిరిగి వారి హృదయాలు కట్టి తిరిగి కుటుంబాలను కట్టి, దేవుని దగ్గరకు తీసుకుని రావడానికి దేవుడు మరలా ఏలియాగారిని ఉపయోగించబోతున్నారు . కారణం కుటుంబాలు బలంగా, స్థిరంగా ఉంటేనే సంఘం స్థిరంగా ఉంటుంది, బలపడి అభివృద్ధి చెందుతుంది. అందుకే సాతానుగాడు కుటుంబాలను పాడుచేసి, తద్వారా సంఘాలను పాడుచేస్తున్నాడు . అందుకే కుటుంబాలను కట్టి, సంఘాన్ని కట్టి, తద్వారా తిరిగి ప్రజలను ఆ పరమతండ్రి తట్టుకు త్రిప్పటానికి ఏలియాగారిని వాడుకోబోతున్నారు మరల!!!

మంచిది! మరి ఈ రాబోయే ఏలియా ఎవరు??? యేసయ్య చెప్పారు రాబోయే ఏలియా బాప్తిస్మమిచ్చుయోహాను గారు అని. మత్తయి 11:14;17:10—13; మార్కు 8:28; 9:11—14,
ఒకసారి చూద్దాం ఈ వచనాలు మత్తయి సువార్త 11:10,11,12,13,14

10. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధ పరచును. అవి యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను
11. స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు.
12. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.
13. యోహాను కాలమువరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను.
14. ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.

మత్తయి సువార్త 17:10,11,12,13
10. అప్పు డాయన శిష్యులు ఈలాగైతే ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి.
11. అందుకాయన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే;
12. అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారిచేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను.
13. అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. . . .

అయితే నేటిరోజులలో కొంతమంది బాప్తిస్మమిచ్చు యోహానే కాదు, విలియం మారియన్ బ్రెన్హాం గారు కూడా ఏలియానే అంటారు. అందుకు వారు చూపించే రిఫరెన్స్ లూకా 1:17; . వీరంటారు యోహాను గారు తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకే తిప్పారు గాని, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు తిప్పలేదు. అందుకే మరల యోహాను గారు విల్లియం బ్రెన్హాంగా వచ్చారు అంటారు. ఇంకా ప్రకటన 2,౩ అధ్యాయాలలో గల ఏడు సంఘాలకు ఏడుగురు దూతలున్నారు. ఏడు సంఘాలు- ఏడు సంఘకాలాలు అని చెబుతూ, ప్రతీ సంఘానికి ఒక కాలం నిర్ణయించి, ఆ కాలంలో గల గొప్ప దైవజనున్ని చూపించి ఆ కాలానికి సంఘకాలపు దూత ఆ దైవజనుడు అని చెబుతూ, ఏడో సంఘమైన లవొదొకాయ సంఘానికి దూత అనగా నేటి సంఘకాలపు దూత విలియం బ్రేన్హాం అంటారు. అంతటితో ఆగితే పర్వాలేదు, ఆయనను చివరి ప్రవక్తగా, సంఘకాలపు దూతగా అంగీకరించాలి అంటారు. మరికొంతమంది ఇంకా ముందుకుపోయి అలా దూతగా ఎవరైతే అంగీకరించరో, ఎవరైతే ఆయన వర్తమానములను అంగీకరించరో వారంతా నరకానికి పోతారు అంటారు. అయ్యా! బ్రెన్హమైట్లారా బైబిల్ లో ఎక్కడైనా దీనికోసం వ్రాయబడిందా? బ్రెన్హాంని దూతగా అంగీకరించకపోతే నరకం అని. బైబిల్ మొత్తంలో యేసును ప్రభువుగాను, రక్షకుని గాను అంగీకరించి, నోటితో ఆయనను ప్రభువు అని ఒప్పుకొంటే రక్షణ, మోక్షం అని వ్రాయబడింది గాని బ్రేన్హాం గారికోసం ఎక్కడా వ్రాయబడలేదు కదా!
రోమీయులకు 10: 9
అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

మరి ఎందుకు ఈ తప్పుడుబోదలు. అదంతా ఎందుకు *యేసుప్రభులవారే తన నోటితో స్వయముగా రాబోయే ఏలియా ఈ బాప్తిస్మమిచ్చు యోహాను గారే అని చెబితే, మీరు యోహానుతోపాటు బ్రెన్హాం అని ఎందుకు చెబుతారు? మీరు యేసుప్రబులవారి కంటే గొప్పవారా!!!?? లేక యేసుప్రభులవారికంటే మీకే ఎక్కువ తెలుసా? యేసుప్రభులవారే ఈ ప్రస్తావనను ముగించేశాక మరల ఈ ప్రస్తావన ఎందుకు???!!! సరే, ఒకవేళ వీరు చెబుతున్నట్లు ఏలియాగారు అయిదు సార్లు రావలంట భూమిమీదకు. మొదటగా యోహాను రూపంలో, రెండవదిగా యేసయ్య రూపాంతరం కొండమీద, ఇలా చెబుతూ బ్రెన్హాం రూపంలో మరలా వచ్చారు అంటారు. ఒకవేళ ఏలియా గారు అయిదుసార్లు, ఆరుసార్లు ఇలా భూమిమీదకు రావలసియుంటే అదే మలాకి ప్రవక్త గారిద్వారా నేను ఆ మహాదినం రాకముందు ఏలియాను ఆరుసార్లు, లేక తొమ్మిదిసార్లు పంపుతాను అని వ్రాసియుండును కదా*!!! కాబట్టి ప్రియ సహోదరీ! సహోదరుడా! దయచేసి వీరి తప్పుడుబోధలను నమ్మవద్దు! బ్రెన్హాం గారిని ఈ సంఘకాలపు దూతగా అంగీకరించవలసిన అవుసరం లేనేలేదు. ఆయన ఏలియా కానేకాదు.

ఒకవేళ ఎవరైనా బ్రెన్హమైట్లు ఈ వర్తమానం చదువుతుంటే—దయచేసి మీకు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఆయన వర్తమానాలే కాదు, బైబిల్ కూడా చదవండి. సత్యము బైబిల్ లో ఉంది. దేవునికి ప్రార్ధించండి. ఆయనే మీకు నిజాన్ని తెలియజేస్తారు. ( నా భార్యకూడా ఈ బ్రెన్హమైట్ల సంఘం నుండి వచ్చినదే కాబట్టి ఇంత విపులముగా రాస్తున్నాను). చదువరులారా! బ్రెన్హాం గారిని ద్వేషించ వలసిన అవసరం లేదు గాని, ఆయన అనుచరులు ఎక్కువగా కలిపిచెరిపారు. ఏదిఏమైనా ఆయన గొప్ప దైవజనుడు, ప్రవక్త! గొప్పగా వాడబడ్డారు! ఇక ఈ సంఘకాలపు దూత అనేమాట ప్రక్కన పెడితే, వారిబోధ/ ఆయన బోద మొత్తం వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవించాలి, మన ఘటాన్ని పాపం అంటకుండా ప్రత్యేకంగా జీవించాలి. ప్రార్ధనా జీవితం కలిగియుండాలి అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ బ్రెన్హాం గారి బోధలు వినేవారికి ప్రేమతో సత్యాన్ని చెప్పమని మనవిచేస్తున్నాను. వారిని ద్వేషించడం వలన పగలు, కక్షలు తప్ప ప్రేమకు చోటు ఉండదు కాబట్టి ప్రేమతో వారికీ సత్యం చెబుదాం!


పౌరుషం గల ప్రవక్త- 38వ భాగం
రాబోయే ఏలియా-2
*మరిన్ని కధనాలు*

ప్రకటన గ్రంథము 11:3,4
3. నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.
4. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.

ప్రియులారా ఇంకా మరికొన్ని కధనాలు ఉన్నాయి ఏలియాగారు మరలా వస్తారు అని బైబిల్ పండితులు అభిప్రాయపడతారు. దానికి కొన్ని రిఫరెన్సులు రుజువులు చూపిస్తారు.

ప్రకటన 11:౩—12 లో మనకు ఇద్దరు సాక్షులు కనిపిస్తారు. వారు గోనెబట్ట కట్టుకొని మూడున్నర సంవత్సరాలు ప్రజలందరికీ సువార్త ప్రకటిస్తారు. అది భూ ప్రపంచం మొత్తం చూస్తారు. ఎలా సాధ్యము అని అప్పటి రోజులలో అనుకోవచ్చు. ఇప్పుడు టీవీ ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా సాధ్యమే! అంతే కాదు వారిని చంపినప్పుడు ప్రపంచమంతా కానుకలు పంచుకొంటారు వెంటవెంటనే! ఎలా సాధ్యం? online Transfer/ online transaction ! సరే, వీరిలో ఒకరిని ఏలియా అంటారు. అయితే వీరు దేవుని ముందర నిలుచు రెండు ఒలీవచెట్లు అనియు, రెండు దీప స్తంభాలు అనియు వ్రాయబడింది. అయితే జెకర్యా 4:౩—14 ప్రకారం ఒలీవచెట్లు అనగా అభిషక్తులైన ఇద్దరిని సూచిస్తుంది అని వ్రాయబడింది కాబట్టి వీరు ఇద్దరు అభిషక్తులైన దైవజనులు అంటారు. వీరు ఒకరు హనోకుగారు, ఒకరు ఏలియా గారు అని కొందరు, మరికొందరు ఒకరు మోషేగారు, మరొకరు ఏలియాగారు అంటారు. దానికి కారణాలు వారు చూపించేది ఏమిటంటే కేవలం హనోకుగారు, ఏలియాగారు ఇద్దరే మరణం చూడకుండా పరలోకం వెళ్ళిపోయారు కాబట్టి , పుట్టిన వారు తప్పకుండా చనిపోవాలి కాబట్టి దేవుడు వీరిద్దరిని మరల పంపించి, తన సువార్తను వినిపిస్తారు అంటారు. ఈ రెండు గ్రూప్ లు వారిద్దరిలో ఒకరు ఏలియాగారు అని రూడిగా నమ్ముతారు. దానికి కారణాలు ప్రకటన 11:5,6 వచనాలు.
5. ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.
6. తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.

వీరికి ఎవరైనా హాని కలిగించాలి అనుకుంటే వారినోట నుండి అగ్ని వచ్చి దహించి వేస్తుంది. ఏలియాగారికి కూడా హాని కలిగించాలి అనుకుంటే, గతభాగాలలో చూసుకున్నట్లు ఏలియాగారి మాట ద్వారా అగ్ని వచ్చి 102 మందిని సజీవ దహనం చేసినట్లు ధ్యానం చేసుకున్నాం. ఇక ఆరవ వచనం ప్రకారం వారు ప్రవచించు దినములలో వర్షం కురువకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు అని వ్రాయబడిన ప్రకారం—ఏలియాగారు ప్రార్ధన చేయగా / చెప్పగా మూడున్నర సంవత్సరాలు వర్షముగాని, మంచుగాని పడలేనట్లు మొదటిభాగాలలో ధ్యానం చేసుకున్నాం . కాబట్టి ఏలియాగారు ఎలా చేశారో వీరుకూడా అలా చేస్తారు కాబట్టి అట్టి ఆత్మను పొందుకున్న వారు కేవలం ఏలియాగారు కాబట్టి వీరిలో ఒకరు ఏలియాగారు అంటారు. ఇక అదే ఆరవ వచనం ప్రకారం నీళ్ళు రక్తముగాను, నానా రకాలైన తెగుళ్ళతో బాదించడానికి వారికి అధికారం కలదు అని వ్రాయబడిన ప్రకారం నిర్గమకాండం లో మనం మోషేగారు నీళ్ళను రక్తముగా చేయడం లాంటి పది రకాలైన తెగుళ్ళతో ఐగుప్తు దేశస్తులను బాధించి, దేవుని బాహుబలముతో ఇశ్రాయేలీయులను విడిపించినట్లు చూడగలం. కాబట్టి వీరిలో ఒకరు మోషేగారు అంటారు. అయితే మోషే గారు చనిపోయినట్లు మనం ద్వితీయోపదేశకాండంలో చూడగలం. అంతేకాకుండా మోషేగారు తిరిగి వస్తారు అని బైబిల్ లో ఎక్కడా లేదు.

ఐతే ఏలియాగారు, మోషేగారు యేసుప్రభులవారు సిలువ మరణానికి ముందుగా వచ్చి ఆయనతో మాట్లాడినట్లు మనం చూస్తాము రూపాంతర కొండమీద. ఇది ఏలియాగారు భూలోకానికి రెండోసారి వచ్చినట్లు లేఖనాలు చెబుతున్నాయి. మత్తయి 17:3; మార్కు 9:4; లూకా 9:30; మొదటగా శరీరరూపంలో, ఇప్పుడు ఆత్మరూపంగా వచ్చారు. కొందరు వీరిద్దరూ వచ్చి ఆయన నిర్గమము కోసం మాట్లాడి, బలపరిచారు అంటారు. కాబట్టి ఏలియా గారు మనకు రెండుసార్లు వచ్చినట్లు మనకు కనిపిస్తుంది.

అయితే ఇక్కడ ప్రకటన గ్రంధంలో కనిపించే ఇద్దరు వ్యక్తులలో ఒకరు ఏలియాగారా కాదా మనకు తెలియదు. అది కొంతమంది బైబిల్ పండితుల ఊహాగానాలు మాత్రమే! *అయితే ఏలియా గారు ఎట్టి పరిస్తితులలో వస్తారు అంటారంటే: అక్కడ దుష్టత్రయం ఉండాలి. ఒకరాజు—అనగా అధికారం, యెజెబెలు అనే పాపాన్ని, విగ్రహారాధనను, వ్యభిచారాన్ని ప్రోత్సహించే స్త్రీ, వారి శిష్యులు / ప్రవక్తలు వచ్చినప్పుడు*.

యోహాను గారు వచ్చినప్పుడు ఏలియాగారివలె వస్త్రధారణ, పాపాన్ని ఖండించడం చేసారు. చివరికి ఈ దుష్టత్రయం చేతిలో చనిపోయారు. అలాగే ఈ దుష్టత్రయం కలిసినప్పుడెల్లా దేవుని ప్రవక్తలు చంపబడుతూ ఉంటారు . వీరే దేవుని ఏలియాలు. పూర్వకాలంలో కొన్ని లక్షలమంది RCM సంఘాల చేతిలో, చంపబడ్డారు, కాల్చబడ్డారు సజీవంగా! ఈ దుష్టత్రయం అప్పుడు కూడా ఉంది. అపుడు ఏలియాలు లేచారు-- చంపబడ్డారు. *ఈరోజులలో కూడా అదేపరిస్తితులు ఉన్నాయి. లోకంలో విగ్రహారాధన విస్తరిస్తుంది. లోకం దేవుని నుండి వేరైపోయింది/పోతుంది. ఇక సంఘంలో అన్యాచారాలు విజృంభిస్తున్నాయి. అన్యాచారాలు క్రైస్తవాచారాలుగా మారిపోతున్నాయి. లోకం వేసే వేషాలు, వస్త్రదారణలు, పోకడలు, డేన్స్ లు సంఘం లోనికి వచ్చేసేయ్! పాపపు స్త్రీ యెజెబెలు సంఘం లోనికే వచ్చేసింది. పూర్వకాలంలో ఒక సంఘాన్నే యెజెబెలుగా వాక్యానిస్తూ ఉన్న మనం , నేటి సంఘంలో మనకు తెలియకుండానే యెజెబెలు నిండియుండగా ప్రియ సహోదరుడా/ సహోదరీ/ సేవకుడా/ కాపరీ/ విశ్వాసి! నేడు నీవో ఏలియావు కాగలవా? ఈ తప్పుడు భోధలు, సిద్దాంతాలు, ఆచార వ్యవహారాలు ఖండించి క్రీస్తుకోసం సాక్షిగా నిలువగలవా? అవుసరమైతే బాప్తిస్మమిచ్చు యోహానులా, స్తెఫెనులా హతస్సాక్షివి కాగలవా? ఒక గ్రాహెం స్టెయిన్ కాగలవా? దేవునికోసం నీ ప్రాణాలను అర్పించటానికి సిద్దపడగలవా?? పాపం పేట్రేగిపోతున్న నేటిరోజులలో దేవుడు ఏలియాల కోసం చూస్తున్నారు. ఆ ఏలియావు నీవే కాగలవా? మీ సంఘానికి, మీ గ్రామానికి నీవే దేవుడు ఆశించే ఏలియావు కాగలవా? నేను సిద్ధం! నీవు సిద్ధమా*!!??

ఉన్నది ఉన్నట్లు చెబుదాం! క్రీస్టు రక్షణను చాటిద్దాం! దేవునికోసం కొవ్విత్తిలా కరిగిపోదాం! ఏలియా, భాప్తిస్మమిచ్చు యోహాను, స్తెఫెను లా జీవిద్దాం.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(సమాప్తం)

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్రిస్మస్

శరీర కార్యములు

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

సమరయ స్త్రీ

పాపము

విశ్వాసము

ప్రభువు నేర్పిన ప్రార్ధన - పరలోక ప్రార్ధన