నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను?

నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను?

మత్తయి 19:16-22(మొదటి భాగము)

*ఇది ప్రశ్నలన్నింటిలోకెల్లా
అత్యుత్తమమైన ప్రశ్న.
*ప్రతీ మనిషి ప్రశ్నించాల్సిన ప్రశ్న.
*ఈ ప్రశ్నలో ఒక అత్యుత్తమమైన ఆశ దాగి వుంది.
*ఆ ఆశే మన జీవితగమ్యమై యుండాలి.

*అత్యుత్తమమైన ప్రశ్నకు
అత్యుత్తమమైన సమాధానం.
"నీవు నిత్యజీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుము".

అంటే?
'మంచి కార్యములు' మనలను సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు తీసుకు వస్తాయితప్ప, 'నిత్య రాజ్యం' చేర్చలేవన్నమాట.

అవును! 'రక్షణ' లేకుండా 'మంచి కార్యములు' ఎట్టి పరిస్థితులలోనూ నిత్యజీవానికి చేర్చలేవు.

రక్షించబడిన నీవు "ఆజ్ఞలను" గైకొనాలి.

ఆజ్ఞ అంటే?
'ఎందుకు?' అని ప్రశ్నించకుండా చెప్పినది చెప్పినట్లే చెయ్యవలసినది.

ఆజ్ఞలు అనగానే ?
వెంటనే నిర్గమ 20వ అధ్యాయంలో నున్న 10 ఆజ్ఞలు గుర్తుకువస్తాయి. కాని అవి ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించిన ధర్మశాస్త్ర ఆజ్ఞలు.
వాటితో మనకు సంబంధం లేదు.

మనము క్రైస్తవులుగా యేసు ప్రభువు వారు చెప్పిన నూతన నిబంధన ఆజ్ఞలను గైకొనాలి.

1. నరహత్య చేయవద్దు.
మత్తయి 19:18

నరహత్య అంటే?
మనిషిని చంపడమే.

మనము ఈపని ఎప్పుడూ చెయ్యలేదు కాబట్టి ఈ ఆజ్ఞలో మనము తప్పిపోలేదన్నమాట.

కాని,
నరహంతకుడు అంటే ఏమిటో బైబిల్ యేమని చెప్తుందో తెలుసా?

"తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు;
ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు."
1 యోహాను 3:15

మనం మనిషిని చంపాలంటే కత్తులే అవసర్లేదు. ద్వేషంతో నిండిన మన మాటలనే కత్తులుగా మలచి చంపేస్తాం.

ఇప్పుడు చెప్పండి. మనమెన్ని నరహత్యలు చేసామో? మన లెక్కకుకూడా అందదు కదా?
మన హృదయమంతా ద్వేషమే కదా?

అయితే, ఒక్క విషయం!
"ఏ నరహంతకునియందును నిత్యజీవము లేదు."
అట్లా అయితే??
మన సంగతేమిటి?

వద్దు!
ద్వేషాన్ని విడచి, ప్రేమను పెంచుకుందాం.
ఆ నిత్య జీవానికి వారసులవుదాం.

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను?

(రెండవ భాగము)

వ్యభిచరింప వద్దు. మత్తయి 19:18
పరిశుద్ధ గ్రంధం వ్యభిచారమనే పాపమును అన్ని పాపముల కంటే ఘోరమైన పాపముగా పేర్కొన్నది.
కారణం?
ఏ పాపమైనా ఒక్కరి వల్లనే జరుగుతుంది. కాని వ్యభిచారము మాత్రము ఒక వ్యక్తి పాపము చేస్తూ మరొకరిని పాపములోనికి లాగుతుంది.
ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
మత్తయి 5:28
(ఒక పురుషుని మోహపుచూపుతో చూచు ప్రతిస్త్రీ అప్పుడే తనహృదయమందు అతనితో వ్యభిచారము చేసినదగును.)
అంటే.....!!
చేసినా? చూచినా? రెండూ ఒక్కటేనా?
కానే కాదు.
చేసినదానికీ, చూచినదానికీ శిక్ష ఒక్కటేనా? కానే కాదు.
మరెందుకిలా?
మోహపు చూపుతో చూస్తే, అది హృదయంలో ముద్రించబడి, ఆతప్పుచెయ్యడానికి శరీరాన్ని బలవంతం చెయ్యొచ్చు.
అట్లాంటి చూపులే లేకపోతే? ఆ తప్పు చేసే అవకాశమే లేదు. అందుకే ఆయన వేళ్ళతోసహా ఆ పాపమును పెకిలించి వెయ్యాలని అట్లా చెప్పారు.
అంతేగాని, చేసిన వాడు, చూచినవాడు ఇద్దరూ ఒక్కటే అని మాత్రం తలంచకూడదు.
చేసినవాడికి చేసినంత శిక్ష.
చూచినవాడికి చూచినంత.
వ్యభిచారము రెండు రకాలు
1. శారీరికమైనది: అక్రమమైన శారీరిక సంబంధాలు.
2.ఆత్మీయమైనది: ప్రియుడైన యేసుతో కాకుండా సాతానుతో కొనసాగించే సంబంధాలు.
మనము ఈరెండింటిలో ఏ వ్యభిచారములో నున్ననూ అగ్నిగుండమే శరణ్యం.
'వ్యభిచారులు'....అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8

వద్దు! అది ఊహలకే భయంకరం.
మన జీవితాలను సరిచేసుకుందాం! నిత్య జీవంలో ప్రవేశిద్దాం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను?

(మూడవ భాగము)


దొంగిల వద్దు. మత్తయి 19:18
మనము అనుకోవచ్చు. ఎవ్వరి దగ్గర ఏమీ దొంగిలించలేదని. కాని మనము దేవుని దగ్గరే దొంగిలిస్తున్నామన్న మాట.
అంటే? మనము మామూలు దొంగలము కాదన్నమాట.
మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. మలాకి 3:8
'దశమ భాగము'చెల్లించుట ధర్మ శాస్త్రమునకు సంబందించినది అని వాదించేవారున్నారు.
అయితే ఒక్క విషయం!
ధర్మ శాస్త్రము రాకముందే అబ్రాహాము మెల్ఖిసెదకుకు దశమ భాగమును చెల్లించాడు.
నూతన నిబంధన ప్రకారమయితే?
దశమ భాగమునే కాదు.
•సజీవయాగాముగా మనకుమనమే దేవునికి సమర్పించుకోవాలి.
• శక్తికొలదీ ఇచ్చారు.
• శక్తికిమించి ఇచ్చారు.
• జీవనమంతా ఇచ్చారు.
*ఇస్సాకును దేవుడు ఎందుకు బలిగాకోరాడు?
అబ్రాహామును పరీక్షించడానికే.
*మనలను దశమ భాగములను చెల్లించమని ఎందుకు కోరుతున్నాడు?
మనలను పరీక్షించడానికే.
అబ్రాహాము దేవుడు పెట్టిన పరీక్షలో విజయం సాధించాడు. మరి మన సంగతేమిటి?
ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునే యున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు. మలాకి 3:9
శాపగ్రస్తులైన వారికి దేవుడు విధించే శిక్ష ఏమిటో తెలుసా?
శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
మత్తయి 25:41
వద్దు! దేవుని దగ్గర దొంగిలించేవారిమిగా మనముండవద్దు.

దేవుడు మన కిచ్చిన సమయంలో
కూడా దశమభాగము ఆయనతో గడిపే విధంగా మనలను మనము సిద్ద పరచుకొందాం!
ఆ నిత్య జీవానికి వారసులవుదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను?

(నాలుగవ భాగము)


అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. మత్తయి 19:18
అబద్ధము అంటే?
లేని వార్తను పుట్టించడము.
దీనికి కారకుడెవడు?
సాతాను. వీడు అబద్ధములకు జనకుడు (తండ్రి) ......అబద్ధములాడేవారంతా వీడి పిల్లలే.
ఇంతకీ మనమెవరి పిల్లలము?
మనము నోరుతెరిస్తే అబద్ధమే కదా?
కొన్నిసార్లయితే అబద్ధం చెప్తున్నామనే విషయంకుడా మనకు తెలియదు.
ఎందుకంటే? అబద్ధాలు చెప్పడం మనకు అంతగా అలవాటయిపోయింది.

ఇక సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ అబద్ధాల సంఖ్య నూరంతలుగా పెరిగిపోయింది.
ఎక్కడో వున్నవాడు నీ ప్రక్కనే వున్నాను అంటున్నాడు. నీ ప్రక్కనే వున్నవాడు ఎక్కడో వున్నాను అంటున్నాడు.
ఇట్లా........లెక్కలేనన్ని.
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది.మత్తయి 5:37

ఒక చిన్న అబద్ధం ఎంత ప్రభావాన్ని చూపుతుందంటే?
యేసు ప్రభువు వారు సమాధి నుండి లేచిన తర్వాత, ఆయన లేవలేదు.మేము నిద్రపోతుంటే, ఆయన శవాన్ని ఎవరో వచ్చి ఎత్తుకుపోయారని కావలి వారిచేత అబద్ధం చెప్పించారు. ఆ చిన్న అబద్ధం 2000సంవత్సరాలు గతించినా, యూదులకు రక్షణ లేకుండా చేసింది.

రక్షించబడిన నీకు నిత్యజీవం లేకుండా చేస్తుంది.
'అబద్ధికులందరును' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8

వద్దు!
అది ఊహలకే భయంకరం.
మన జీవితాలను సరిచేసుకుందాం!
నిత్య జీవంలో ప్రవేశిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను?

(ఐదవ భాగము)


తలిదండ్రులను సన్మానింపుము మత్తయి 19:18
తలిదండ్రులు సన్మానించడం అంటే?
వారున్నపరిస్థితులలో వారి కనీస అవసరాలను గుర్తించి వాటిని తీర్చగలగడం.
వారు మననుండి ఆశించేదికూడా అదే.

నేటి దినాల్లో అట్లాంటి పరిస్థితులు కరువయ్యాయి అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
పిల్లలుండీ, అనాధలుగామారి వృద్ధాశ్రమంలో కాలం గడపుచున్న తల్లిదండ్రులెందరో?
దీనికి కారణం?
తలిదంద్రులుగా వారి భాద్యతను వారు నిర్వర్తించారుగాని, పిల్లలముగా మన భాద్యతను మనము నిర్వర్తించలేక పోవడమే.
ఒకానొక దినాన్న మనమూ ఆ స్థితిలోనికి చేరుకున్నప్పుడు మన పిల్లలచేత అట్లాంటి పరిస్థితులే అనుభవించాల్సి వస్తుందేమోననే కనీస గ్రహింపు లేకపోవడం.,
నైతిక, ఆధ్యాత్మిక విలువలు లేకపోవడం కూడా దీనికొక కారణం కావచ్చు.
కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి!!
మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7

కొబ్బరిచెట్టు నుండి ---------ఖర్జూరాలు ఆశించకు.
యేసు ప్రభువు వారు సహితం, సిలువలో చిత్ర హింసలు అనుభవిస్తూ కూడా ఆయన భాద్యతను నెరవేర్చగలిగారు.
పరిశుద్ధ గ్రంధం కూడా తల్లిదండ్రులకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేసింది.
పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధే యులైయుండుడి. ఎఫెస్సి 6:1
తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును. సామెతలు 20:20
నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. సామెతలు 23:25
ఒకవేళ మన తలిదండ్రులను మనము నిర్లక్ష్యము చేసినవారిగా వుంటే?
ఒకానొక దినాన మనము చేసినది మన నెత్తి మీదకే రాబోతుంది.

ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే? అప్పుడు నిర్లక్ష్యం చెయ్యబడతాం!
సందేహం లేనేలేదు.
యెహోవాదినము అన్యజనులందరిమీదికి వచ్చు చున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును. ఒబెద్యా 1:15

వద్దు! మన జీవితాలను సరిచేసుకుందాం!
తలిదండ్రులను సన్మానిద్దాం! నిత్య జీవంలో ప్రవేశిద్దాం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను?

(ఆరవ భాగము)


నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. మత్తయి 19:18
యేసు ప్రభువు వారు చెప్పినi ఆజ్ఞలలో ఇది చివరిది. అన్ని ఆజ్ఞలు ఈఆజ్ఞలోనే అంతర్భాగంగా వున్నాయి.

పరిశుద్ధ గ్రంధ సారాంశమంతా ఈమాటలోనే ఇమిడివుంది.
కంటికి కనిపించే మనుష్యులను ప్రేమించలేని మనము, కంటికి కనిపించని దేవునిని ఎంతమాత్రమూ ప్రేమించలేము.
నిన్నునీవు ఎట్లా ప్రేమించు కొంటున్నావో? అట్లానే ఇతరులను ప్రేమించు. వారు నీకు శత్రువులైనాసరే.

*అట్లా మనము చెయ్యగలిగితే?
•నరహత్య చెయ్యగలమా?
•దొంగిలింప గలమా?
•అబద్ధ సాక్ష్యము చెప్పగలమా?
•తలిదండ్రులను ప్రేమించకుండా ఉండగలమా?
అంటే?
మనము దీనిలోనే పూర్తిగా తప్పిపోయాము.

ఆయన ప్రేమకు అర్ధాన్ని చెప్పాడు.
చెప్పిన దానిని చేసి చూపించాడు.
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5:44

ఆయన చెప్పడమే కాదు. చేసి చూపించాడు కూడా.
మనము శత్రువులుగామారి సిలువలో ఆయనను హింసించు చున్నప్పుడు మనలను ప్రేమించి, మన నిమిత్తం ప్రార్ధించాడు.
మనమయితే, పరలోకమందున్న తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి ఇష్టపడతాం. కాని, శత్రువులను ప్రేమించలేము. మనలను హింసించే వారికొరకు ప్రార్ధించలేము గాని, పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాము.

వద్దు!ఆయన పిల్లలుగా ఆయనలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం!
నిత్య జీవంలో ప్రవేశిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్రిస్మస్

శరీర కార్యములు

విశ్వాసము

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

పక్షిరాజు

సమరయ స్త్రీ

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పాపము

విగ్రహారాధన