విగ్రహారాధన

విగ్రహారాధన

(మొదటి భాగము)

*విగ్రహారాధన దేవునికి అత్యంత అసహ్యమైన చర్య.
*విగ్రహారాధన అంటే?
విగ్రహాలను తయారు చేసుకొని, వాటికి కొబ్బరికాయలు కొట్టి, అరటి పళ్ళు పెట్టి, అగరబత్తీలు వెలిగించి వాటిని దేవునిగా పూజించడం.
అదేనా?
నీవు చెప్తావ్. నేను అట్లా చెయ్యడంలేదు. నేను ఎట్టి పరిస్థితులలోనూ విగ్రహారాధికుడను కాదని.

కాని, ఒక్క విషయం! విగ్రహారాధన అంటే అది మాత్రమే కాదు.
•దేవుని కంటే ఎక్కువగా దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'.
•నీ హృదయం దేనితో నిండి పోయిందో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'.

*దేనికి ప్రాధాన్యత నిస్తున్నావ్?
నీ హృదయం దేనితో నిండిపోయింది?
•గాళ్ ఫ్రెండా? •బాయ్ ఫ్రెండా?
•మోటార్ బైక్సా? •వస్త్రాలా?
•సెల్ ఫోన్సా? •బంగారమా?
•ధనమా? •ఆస్థులా?
•అంతస్తులా? •నీ పిల్లలా?
•అసూయా? •ద్వేషమా? ఏది?
ఇవన్నీ విగ్రహాలే.

ఇప్పుడు చెప్పగలవా?
నేను విగ్రహారాధికుడను కాదని.
ఇట్లా టన్నుల కొద్దీ చెత్త మన హృదయంలో పేరుకుపోయినప్పుడు ఇక దేవునికి స్థానం ఎక్కడ?
ఏదో కాస్త ఖాళీ ఉంచినా? ఆ చెత్త మధ్య పరిశుద్దుడైన దేవుడు నివాసం చెయ్యగలడా?

అందుకే కదా! సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోతున్నా?
ఆయన నీ హృదయమనే తలుపునొద్ద(బయట) మాత్రమే నిలబడిపోవలసి వస్తుంది.
నేడే ఆ విగ్రహాలను తొలగించి నీ ప్రియ రక్షకుని లోనికి ఆహ్వానించగలవా?
*లేకపోతే ఏమవుతుందో తెలుసా?
'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8
వద్దు! ఇది వినడానికే భయంకరం.
సరి చేసుకుందాం. సాగిపోదాం. గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విగ్రహారాధన.

(రెండవ భాగము)


ఉదయం లేచినవెంటనే, యేసు ప్రభువు వారి ఫోటో చూసుకోవడం చాలామందికి ఒక అలవాటు.
ఇంతకీ ఆ ఫోటో యేసు ప్రభువు వారిదేనా? ఎవరు తీసారు?
ఒక్క విషయం ఆలోచించు!
యేసు ప్రభువు వారు జన్మించి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది.
కెమెరా కనిపెట్టి రెండు వందల సంవత్సరాలు కూడా కాలేదు.

లియోనార్డ్ డావెన్సి 'ది లాస్ట్ సప్పర్' అనే అద్భుతమైన చిత్రంలో ఏసుప్రభువు వారు తన శిష్యులతో పస్కా ను భుజిస్తున్నట్లు చిత్రించాడు.
ఆయన యేసు ప్రభువు వారిని చూసాడా అంటే? లేదు. యేసు ప్రభువు పుట్టిన 1400 సంవత్సరాల తర్వాత పుట్టాడు.
యేసు ప్రభువును స్వయంగా చూచిన చిత్రకారుడెవరైనా ఆయన చిత్రాన్ని గీసారా అంటే? అట్లా జరగలేదు.
యేసు ప్రభువుగా చెప్పుకొంటున్న ఆ రూపం ఈలోకంలోనికి ఎట్లా వచ్చింది?
యేసు ప్రభువు వారు సిలువ మీద మరణించిన తర్వాత ఆయన దేహం అరిమతయి యోసేపుకు ఇవ్వబడింది. అప్పుడు ఆయన ముఖాన్ని తెల్లని వస్త్రంతో తుడవగా, ఆయన ముఖస్వరూపం రక్తపు మరకల రూపంలో దాని మీద ముద్రించ బడింది.
తర్వాతి కాలంలో ఆ ముద్రికలను ఆధారం చేసుకొని 'బహుశ' యేసు ప్రభువు రూపం ఇట్లా వుండవచ్చేమో? అని ఒక ఊహా చిత్రం గీసారు. ఆ ఊహా చిత్రమే దేవుడై పోయాడు.
దానినే మందిరాలలోనూ, మన గ్రుహాల్లోనూ పెట్టుకొని ఆరాదిస్తున్నాం.
ఎవరో బొమ్మలను చేసుకొని పూజిస్తున్నారు అని చెప్పేనీవు, నీవు చేస్తున్నదేమిటో?

'దేనిరూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
నిర్గమ 20:4
ఆయన 'ఒక అనిర్వచనీయమైన అధ్వితీయ శక్తి'. ఆయన శక్తిని, ప్రేమను, ఉగ్రతను చిత్ర పటంలోగాని, విగ్రహంలోగాని, చూడలేవు.

దేవునికి చెందాల్సిన మహిమ వాటికి చెందడానికి వీలులేదు. అట్లా చేస్తే నీకంటే విగ్రహారాధికుడు మరెవ్వరూ లేరు.
'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8

వద్దు! ఇది వినడానికే భయంకరం.

సరి చేసుకుందాం. సాగిపోదాం. గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విగ్రహారాధన

(మూడవ భాగము)


'ఆహారము, వస్త్రాలు, గృహము' ఈ మూడు మనిషి యొక్క ప్రాధమిక అవసరాలు.
కాని నేటి దినాల్లో వీటన్నింటిని మించిపోయింది 'సెల్ ఫోన్'.
మన జీవితాల్లో ఒక విగ్రహంగా మారిపోయింది.
దేవునిని ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళిన నీవు, మధ్యలో మొబైల్ పట్టుకొని బయటకి వెళ్లిపోతున్నావంటే?
దాని అర్ధం? దేవుని కంటే, ఆ ఫోన్ చేసిన వ్యక్తే నీకు ముఖ్యమని కదా?
దేవుని కంటే ఎక్కువగా దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'.
ఇప్పుడు చెప్పు! నీవు విగ్రహారాధికుడవు కాదా?
ఆ రెండుగంటలు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే?
నీ ప్రాణం పోదు.
లోకం తలక్రిందులైపోదు.
నీవు అంత తీరికలేని వ్యక్తివి(బిజీ పర్సన్) అయితే? మందిరానికి వచ్చినా దేవునిని ఆరాధించలేవు. నీఅంత బిజీ పర్సన్ ఆయనకు అవసర్లేదు కూడా.
'దేశ ప్రధాని' కూడా గుడిలోకి( వారు ఆరాధించేది ఏ దేవుడైనా కావొచ్చు) వెళ్తే?
సెల్ ఫోన్ జోలికి వెళ్ళరు.
మనం అంతకంటే గొప్పవాళ్ళం అని అర్ధం చేసుకోకూడదు. కనీస జ్ఞానం లేని వాళ్ళమని గ్రహించాలి.
దేవుని మందిరానికి బైబిల్ తో కాకుండా సెల్ ఫోన్ తో వెళ్ళే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆ సెల్ ఫోన్ లో 'బైబిల్' వుండొచ్చు. కాదనను. అది ప్రయాణాల్లో ఉపయోగించుకో.
బైబిల్ చేతిలో వుంటే?అవమానమా?
ఒక్క విషయం గుర్తుంచుకో!
'యవ్వనంలో నీవు బైబిల్ ను మోస్తే? నీ వృద్ధాప్యమందు అది నిన్ను మోస్తుంది.'
నీ చేతిలో సెల్ ఫోన్ వుంటే? అదేమీ అంత గొప్ప విషయంకాదు గాని, నీ చేతిలో బైబిల్ వుంటే మాత్రం నీవు గర్వపడాల్సిన విషయం.
దేవుని మహిమకు అవమానం కలుగని రీతిలో నీ సెల్ ఫోన్ వాడుకో. కాని అదే నీజీవితంలో విగ్రహంలా మారనివ్వకు.
అది విగ్రహంలా మారితే?
నీవు విగ్రహారాధికుడులా మారిపోతావు.

విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8
వద్దు! ఇది వినడానికే భయంకరం.
సరి చేసుకుందాం. సాగిపోదాం. గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విగ్రహారాధన

(నాలుగవ భాగము)


యేసు ప్రభువు వారు మనకు బదులుగా భారమైన సిలువను మోసారు. అవి కరుకైన నిలువు, అడ్డు దుంగలు మాత్రమే. ఇక ఆ సిలువ రూపమును(విగ్రహమును) మనము మెడలో వేసుకొని మోయాల్సిన అవసరం లేదు.

'దేనిరూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
నిర్గమ 20:4

ఆయన సిలువను మోస్తే?
ఆ సిలువకు ఘనత వచ్చింది.
మనము మోస్తూ ఆ సిలువకు అవమానం తెచ్చిపెడుతున్నాం.

ఒక్క విషయం ఆలోచించు!!
సిలువను ధరించిన నీవు మాట్లాడేటప్పుడుగాని, దేవునికి వ్యతిరేఖమైన క్రియలు జరిగించేటప్పుడు గాని,
అయ్యో! నేను సిలువను ధరించానే. ఇట్లా మాట్లాడకూడదు. ఇట్లాంటి పనులు చెయ్య కూడదు అనే తలంపు ఎప్పుడైనా వచ్చిందా? లేదు.

ఏదో భక్తి చేస్తున్నాం అనుకొంటున్నాము గాని, ఆ భక్తి దేవునికి అవమానం తెచ్చి పెట్టేదిగా వుంది?
చేతి మీద సిలువ రూపాన్ని పచ్చాబొట్టు వేయించుకొని అదే చేతితో సిగరెట్టు, మందు గ్లాసు పట్టుకుంటే? ఆ సిలువకు గౌరవమా? అవమానమా?

సిలువను ధరించి, సిలువకు అవమానం తెచ్చేకంటే? ధరించక పోవడమే శ్రేయష్కరం కదా? ఆలోచించు!!
యేసయ్య సిలువ త్యాగాన్ని అర్ధం చేసుకో!
అనుసరించు! అది చాలు.

సిలువ ఒక విగ్రహంలా మారితే?
నీవు విగ్రహారాధికుడులా మారిపోతావు.

విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8

వద్దు! ఇది వినడానికే భయంకరం.

సరి చేసుకుందాం. సాగిపోదాం. గమ్యం చేరేవరకు.

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విగ్రహారాధన

(ఐదవ భాగము)


*అధికారవాంఛ, పదవీ వ్యామోహం ఒక 'విగ్రహం'.
ప్రియ రక్షకుడైన యేసు ప్రభువును ఆత్మతోనూ సత్యముతోను ఆరాధన చెయ్యడానికి 'లోకము నుండి' ప్రత్యేక పరచబడిన విశ్వాసుల సమూహమే 'సంఘము' ఇట్లాంటి సంఘాలు లెక్కలేనన్ని.

సంఘముల ఉద్దేశ్యము మారిపోయింది. దేవునిని ప్రక్కనబెట్టి, మనలను మనమే ఘన పరచుకోవడానికి కొట్టుకుచస్తున్నాం.
సంఘములో రాజకీయం దేశ రాజ కీయాలను మించిపోతుంది.
కారణం?
'అధికారం' ఒక విగ్రహముగా మారిపోయింది.

అధికారం కోసం సంఘాలు, ముక్క చెక్కలవుతున్నాయి.
•ప్రేమకు ప్రతిరూపముగా ఉండాల్సిన మన సంఘాలు కక్షలతో కత్తులు దూస్తున్నాయి.
•సత్యానికి స్తంభాలుగా నిలువాల్సిన సంఘాలు.
సత్యానికి స్థానమే లేకుండా పోతున్నాయి.
సంఘాలలో అధికారం దక్కించుకోవడానికి ధనం, మధ్యం సహితం పంచే స్థితికి దిగజారిపోయారు. పంచేవాడికి సిగ్గులేదు. తీసుకొనే వాడికి అంతకన్నాలేదు. ఇది వినడానికే అసహ్యం.
ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో !
నీవు నిజమైన క్రైస్తవుడవు అయితే? దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడో? ఆ స్థితిలోనేవుండు.

అధికారం కోసం ప్రాకులాడవద్దు.
ప్రాకులాడే వారిని ప్రోత్సహించవద్దు.

'అధికారం' ఒక విగ్రహంలా మారితే?
నీవు విగ్రహారాధికుడులా మారిపోతావు.

విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 21:8

వద్దు! ఇది వినడానికే భయంకరం.
సరి చేసుకుందాం. సాగిపోదాం.
గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విగ్రహారాధన

(ఆరవ భాగము)

నీ దేవుడనైన యెహోవాను నేనే!నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.నిర్గమ 20:2-4
ఈ ఆజ్ఞలు స్వయంగా దేవుడే తన చేతి వ్రాతతో వ్రాసి, సీనాయి పర్వతము మీద మోషేకు ఇచ్చాడు.
మన ఆది పితరుడు ఆదాము మొదలుకొని మనవరకు ఉన్న అలవాటు ఒక్కటే. దేవుడు ఏది చెయ్యవద్దు అన్నాడో అదే చెయ్యడం.
*దేవుడు స్పష్టముగా చెప్పాడు.
1.దేని రూపమును చేసుకోవద్దు.
దూడ రూపమును చేసుకున్నారు.
2.విగ్రహాన్ని చేసుకోవద్దు.
బంగారముతో విగ్రహాన్ని చేసుకున్నారు.
3. వాటిని పూజించవద్దు.
వాటిని పూజించారు.

*విగ్రహారాధన ప్రతిఫలం?
'మరణం'

ఏలయనగా మోషే వారిని చూచినేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారునిమీద పడియేగాని తన సహోదరునిమీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసి కొనుడనెను.
నిర్గమ 32:29

దేవుడు విగ్రహారాధనను ఎంత అసహ్యించుకుంటాడో ఈ మాటలు తెలియ జేస్తున్నాయి.

విగ్రహారాధన చేసిన వాడు నీ కుమారుడైనా కావొచ్చు. నీ సహోదరుడైనా కావొచ్చు. కత్తి దూసి వానిని చంపి వేయమంటున్నాడు.
ఆ రీతిగా ఒకే దినాన్న మూడువేల మంది చంపబడ్డారు.

నీ హృదయంలో పాతుకుపోయిన విగ్రహాలేంటో? బయటకు తీయకపోతే?
అవి నిన్ను నిత్య మరణానికి నడిపిస్తాయి.
విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8

వద్దు! ఇది వినడానికే భయంకరం.
సరి చేసుకుందాం. సాగిపోదాం. గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విగ్రహారాధన

(ఏడవ భాగము)


బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు

నీవు ఐశ్వర్య మును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడ నీకిచ్చుచున్నాను; అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటివాడొకడైనను నుండడు.
1 రాజులు 3:12,13

సోలోమోను
•అత్యంత జ్ఞానవంతుడు.
•అత్యంత ఐశ్వర్యవంతుడు
•మూడువేల సామెతలు చెప్పాడు.
•ఒక వెయ్యి ఐదు కీర్తనలు వ్రాసాడు.
•వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రమును రచించాడు.
•యేరూషలేములో దేవుని మందిరాన్ని కట్టించాడు.

ఇట్లా ఆయన కీర్తిని గురించి చెప్పుకుంటూపోతే లెక్కలేనంత.
చెప్పలేనంత.

అయితే,
సోలోమోను హృదయంలో ఒక 'విగ్రహం' పాతుకుపోయింది.
అదే 'కామం'
దానిలో భాగముగా ( 700 మంది భార్యలు + 300 మంది ఉప పత్నులు) మొత్తం 1000 మందిని చేసుకున్నాడు.

'కామాతురత గలవాడై' వారిని ఉంచుకొనుచు వచ్చెను.
1 రాజులు 11:2

వీరిని సంతోష పెట్టడంకోసం

"సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను."
1 రాజులు 11:7

పరిశుద్ధ పట్టణమైన యేరూషలేములో పరిశుద్ధుడైన దేవునికి మందిరం కట్టించిన సోలోమోను, అదే పట్టణంలో అపవిత్రమైన దేవతలకు బలిపీఠములను కట్టించి దేవుని ఉగ్రతకు గురియై రాజ్యాన్ని కోల్పోయాడు.

దీనికంతటికి కారణం తన హృదయంలో పాతుకు పోయిన 'విగ్రహమే.'

నీ హృదయంలో దాగియున్న విగ్రహాలేమిటి?
బయటకు తియ్యి.

సోలోమోను రాజ్యాన్నే కోల్పోయాడు గాని, నీవయితే ఆ నిత్య రాజాన్నే కోల్పోతావు.

'కామం' ఒక విగ్రహంలా మారితే?
నీవు విగ్రహారాధికుడులా మారతావు.

విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 21:8

వద్దు!
ఇది వినడానికే భయంకరం.

సరి చేసుకుందాం.
సాగిపోదాం.
గమ్యం చేరేవరకు.

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విగ్రహారాధన

(ఎనిమిదవ భాగము)


దేవుడు పెంట కుప్పల మీద నున్న మనలను మింటపైన ఘనులతో కూర్చుండ బెట్టాడు.

కనీస కృతజ్ఞత లేకుండా, మన హృదయాలు గర్వముతో నిండిపోయి దేవునిని సహితం లెక్క చేయని స్థితికి చేరిపోయాము.

'గర్వము' నీ జీవితములో విగ్రహముగా మారితే?
పతనం అంచులలో వున్నావని జ్ఞాపకం చేసుకో!

నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును సామెతలు 16:18

•అను నిత్యమూ దేవుని సన్నిధిలో వుండే లూసిఫర్ తన హృదయమున గర్వించి పాతాళం లోనికి త్రోసివేయ బడ్డాడు.

•రాజైన నెబుకద్నెజరు హృదయమున గర్వించి పశువువలే గడ్డి మేయాల్సి వచ్చింది.

•హిజ్కియా హృదయమున గర్వించినప్పుడు మరణకరమైన రోగము కలిగింది.

ఇట్లా చెప్పుకుంటూపొతే? చెప్పలేనన్ని.

ఒక్క విషయం గుర్తుంచుకో!
దేవుడు నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో వుంచినా? ఎంత అద్భుతమైన నైపుణ్యాలు కలిగియున్నా గాని,
అనుగ్రహించిన ఆయనను స్తుతించు తప్ప, వాటిని బట్టి గర్వించకు.

'గర్వం' ఒక విగ్రహంలా మారితే?
నీ ఈగొ నిన్ను జయిస్తే, నీ మీద అధికారం చేస్తే
నీవు విగ్రహారాధికుడులా మారతావు.

విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 21:8

వద్దు!
ఇది వినడానికే భయంకరం.

సరి చేసుకుందాం. సాగిపోదాం.
గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

విగ్రహారాధన

(తొమ్మిదవ భాగము)

మనము బైక్ మీద వెళ్తుంటే?
వేగంగా దూసుకు పోతున్న కారు వైపు చూస్తాముగాని, మన ప్రక్కనే చెమటలుకక్కుతూ సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని పట్టించుకోము.

మన ఆశలన్నీ మనపైవాటి మీదే వుంటాయి. నేను ఆ స్థితిలో ఎందుకు లేను? అనే తలంపు మన జీవితంలో అసంతృప్తిని, మనకంటే ఉన్నత స్థితిలో వున్నవారిపైన 'అసూయను' కలిగిస్తుంది.

'అసూయ' ఎంత భయంకరమైనది అంటే?
మానవ చరిత్రలో మొట్టమొదటి హత్యకు కారణం 'అసూయ'

అసూయ కలిగిన నీవు సంతోషముగా వుండలేవు. ఎదుట వారిని సంతోషముగా వుండనివ్వవు.

మత్సరము ఎముకలకు కుళ్లు.
సామెతలు 14:30

మత్సరము అంటే?
'అసూయ'

ఒక శవాన్ని పాతిపెడితే?
•మాంసమంతా కుళ్లిపోయి మట్టిలో కలసిపోతుంది. ఎముకలు మాత్రం అట్లానే మిగిలిపోతాయి.
•రాబందులు సహితం ఎముకలను ఏమి చెయ్యలేవు.

కాని, 'అసూయ' అనేది ఎముకలను సహితం కుళ్లిపోయేటట్లు చెయ్యగలదట. అంతటి భయంకరమైనది.

*అంతేకాదు భూమి మీద జరిగే ప్రతీ నీచమైన కార్యానికి మూలము 'అసూయే'.

మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
యాకోబు 3:16

అసూయకు ముఖ్య కారణం •సంతృప్తి లేని జీవితం
•ఇతరుల బాగును సహించుకోలేని జీవితం.
•ఇతరుల నైపుణ్యాలను అభినంధించలేని జీవితం.

అపోస్తలుడైన పౌలు జైలులో ఖైదీగా వున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు మన జీవితాలకు గొప్ప మేల్కొలుపు.

నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను.
ఫిలిప్పి 4:11

•మనమున్న స్థితినిబట్టి సంతృప్తి కలిగియుందాం!
•మన పొరుగువారు ఆశీర్వధించబడుతుంటే అందులనుబట్టి దేవునిని స్తుతిద్దాం!
•ఎవరైనా అభినందనీయమైన జీవితాన్ని జీవిస్తుంటే? వారిని మనస్పూర్తిగా అభినందిద్దాం!

ఇట్లాంటి అనుభవంలోనికి మనమూ చేరగలిగితే? అసూయకు మన జీవితంలో చోటేలేదు.

'అసూయ' ఒక విగ్రహంలా మారితే? నీవు విగ్రహారాధికుడులా మారతావు.
హృదయం దేనితో నిండి వుంటుందో? అదే మన జీవితాల్లో విగ్రహంగా మారుతుంది.
అట్లాంటప్పుడు. అసూయతో నిండి వుంటే? అదే ఒక విగ్రహంగా మారి దానిని నెరవేర్చుకోవడానికి మన హృదయం శరీరాన్ని బలవంతం చేస్తుంది. తద్వారా ఆ క్రియలు జరిగించడం ద్వారా, అసూయతో మన హృదయం నిండడం ద్వారా దేవుడే మన హృదయం నుండి బయటకి వచ్చేస్తాడు. ఇప్పుడు మనం ఆరాదించేది అసూయనే కదా?

విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 21:8

వద్దు!
ఇది వినడానికే భయంకరం.

సరి చేసుకుందాం.
సాగిపోదాం.
గమ్యం చేరేవరకు.

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విగ్రహారాధన

(పదియవ భాగము)


బైబిల్ సారాంశమంతా ఒక్క మాటలో ఇమిడి వుంది.
"నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము".
యేసు ప్రభువు వారు అయితే "నిన్ను వలే నీ శత్రువును కూడా ప్రేమించు" అని చెప్పారు. చెప్పడమే కాదు చేసి చూపించారు కూడా.
మన శత్రువులను ప్రేమించడం మనవల్ల కాదుగాని, మన ప్రధాన శత్రువైన సాతానును మాత్రం ప్రేమిస్తూ వాడి అడుగు జాడల్లోనే నడుస్తున్నాం.
*ఈ లోకంలో అనేకమైన వాటికి మనము పెట్టుకున్న పేరు 'ప్రేమ'.
ఉదా: స్త్రీ పురుషుల మధ్య గల ఆకర్షణకు మనము పెట్టిన పేరు ప్రేమ.

•ప్రేమ పేరుతో ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి నీ హృదయమంతా నిండిపొతే ఆ అబ్బాయే, ఆ అమ్మాయే నీ జీవితంలో ఒక 'విగ్రహం' అని గుర్తించు.
*తలిదండ్రులు పిల్లలపట్ల కలిగియుండేది 'వాత్సల్యం' దీనినీ మనము 'ప్రేమ' అనే పిలుస్తాము.
•నీ హృదయం నీ పిల్లలతో నిండిపోతే నీపిల్లలే నీజీవితంలో ఒక ఒక విగ్రహం అని గుర్తించు.

అదేంటి? ఆయనే నీ పొరుగు వానిని ప్రేమించమన్నాడు కదా అని తెలివిగా సాకుచూపే ప్రయత్నం చెయ్యొద్దు.
నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును.
మత్తయి 19:29

పిల్లలను, కుటుంబాన్ని విడచిపెట్టు అనికాదు గాని,
నీ హృదయంలో ప్రధమ స్థానం ఆయనకే ఇవ్వాలి.

అంటే? రెండో స్థానం దేనికైనా ఇవ్వొచ్చా?
అట్లా అనికాదు.
నీ ప్రియ రక్షకునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు రెండవ స్థానం దేనికిబడితే దానికి ఇవ్వలేవు అనే విషయాన్ని గమనించు.

'ప్రేమ' పరిధులు దాటితే అది విగ్రహంలా మారుతుంది.
అది విగ్రహంలా మారితే? నీవు విగ్రహారాధికుడులా మారతావు.

విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8

వద్దు! ఇది వినడానికే భయంకరం.
సరి చేసుకుందాం. సాగిపోదాం. గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విగ్రహారాధన

(పదకొండవ భాగము)


యెహోవా సెలవిచ్చునదేమనగా
తమ విస్తారమైన విగ్రహములనుబట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని.......తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. యెహెజ్కేలు 14:4,5

నీమనస్సులోనీవు విగ్రహాలను నిలుపుకొంటే?
1. అవి నిన్ను దోషిగా నిలబెడతాయి.
హృదయంలో విగ్రహాలను నిలుపుకోవడమే అన్ని రకాల విగ్రహపూజలకు మూలం.
ఇది ఎట్లాంటిదంటే?
అక్షరాలా బొమ్మలకు మొక్కడంతో సమానమైన, ప్రమాదకరమైన పాపం.

పైకి మనం భక్తిపరులులా కనిపించినా మన హృదయాల్లో దేవుని స్థానంలో వేరేదాన్ని నిలుపుకొని ఉండవచ్చు.
అది ధనం, సుఖభోగాలు, పేరు ప్రతిష్టలు, ఒకవ్యక్తి లేదా ఏదయినా కావొచ్చు.
మన హృదయాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి.
నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతలు 4:23

2. విగ్రహములు మనలను దేవునికి అన్యులనుగా చేస్తాయి.
యేసు ప్రభువు వారు ఆయన సిలువ రక్తము ద్వారా మనలను
• ఏర్పరచబడిన వంశముగా
• రాజులైన యాజకసమూహముగా
• పరిశుద్ధ జనముగా
• దేవుని సొత్తుగా
ఏర్పాటు చేసుకున్నారు.
అయితే, మన హృదయంలో మనము నిలుపుకున్న విగ్రహాలు దేవుని నుండి మనలను దూరం చేస్తాయి.

ఒక్క సారి ఆలోచించు!!!
ఇంకా నీజీవితంలో ఏ విగ్రహాలు నిలిచి వున్నాయో?
దేవునికి చెందాల్సిన మహిమ వాటికి చెందడానికి వీలులేదు.

'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8
వద్దు! ఇది వినడానికే భయంకరం.

సరి చేసుకుందాం. సాగిపోదాం. గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విగ్రహారాధన

(పండ్రెండవ భాగము)

భూమిమీదనున్న మీ అవయవములను, అనగా ........ "విగ్రహారాధనయైన ధనాపేక్షను" చంపి వేయుడి.
కొలస్సీ 3:5

ధనాపేక్ష అనగా?
ధనము పట్ల ప్రేమ

న్యాయమైన రీతిలో ధనము కలిగి యుండుట పాపముకాదు గాని,
ఆ ధనము పట్ల ప్రేమను కలిగియుండడం 'విగ్రహారాధన'

'ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము'
1 తిమోతి 6:10

అవును! సందేహం లేనేలేదు.
కారణం?
జీవం లేని డబ్బును జీవంగలిగిన మనిషి శాషించాలి. కాని,
జీవం లేని డబ్బు జీవంగలిగిన మనిషిని శాషిస్తుంది. డబ్బుకు మనిషి దాసోహం అయిపోయాడు.

అట్లా అని డబ్బును తప్పు పట్టాల్సిన పనిలేదు. తప్పంతా దానిని 'ప్రేమించే' మనదే.

జీవములేని కత్తిలో తప్పేమీ లేదు.
•అది సామాన్యుని చేతిలో వుంటే?
కూరగాయలు కోస్తాడు.
•అదేకత్తి హంతకుని చేతిలో వుంటే? పీకలు కోస్తాడు.
•తప్పంతా దానిని ఉపయోగించే వానిలోనే వుంది. డబ్బు విషయంలోకూడా అంతే.

దేవుడు నీకు సమృద్ధిని యిస్తే?
దేవునిని స్తుతిస్తూ, నీకు కలిగిన దానిలో కొంతయినా దేవుని పరిచర్యలో ఉపయోగించు. పేదలకు సహకరించే ప్రయత్నం చెయ్యి.

కాని రోజురోజుకూ పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు గాని, ఎవరికీ పంచడానికి మాత్రం ఇష్టపడడు. ప్రతీ వ్యక్తి ఆశ ధనవంతుడు కావాలనే.

అయితే ఒక్క విషయం!!
ధన వంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము.
మార్కు 10:25

అట్లా అయితే? ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించనట్లయితే? అబ్రాహాము కూడా దేవుని రాజ్యములో లేనట్లేకదా?

ఆయన ఎందుకు ఇట్లా చెప్పారంటే? ధనము మీద ప్రేమ కలిగినవాని హృదయం ధనము చుట్టూనే తిరుగుతుంటుంది. వాని హృదయమంతా డబ్బుతోనే నిండిపోయి వుంటుంది. ఇక దేవునికి చోటెక్కడిది?
దేవునికి చోటేలేనప్పుడు ఇక దేవుని రాజ్యంలోనికి ఎట్లా ప్రవేశించగలడు?

డబ్బు మీదగల ప్రేమ సమస్తమైన కీడులకు మూలం. అది ఎంతటి ఘోరమైన పనులైనా చేయిస్తుంది.

చివరకు మనలను నిత్య రాజ్యంలోనికి అడుగు పెట్టకుండా చేసేయ్యగలదు.

బిలాము, గేహాజి, ఇష్కరియోతు యూదా .... డబ్బును ప్రేమించిన వీరిజీవితాలు భయంకరం.

'ధనాపేక్ష' ఒక విగ్రహంలా మారితే? నీవు విగ్రహారాధికుడులా మారతావు.

విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 21:8

వద్దు!
ఇది వినడానికే భయంకరం.

సరి చేసుకుందాం.
సాగిపోదాం.
గమ్యం చేరేవరకు.

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


విగ్రహారాధన

(పదమూడవ భాగము)

దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధస్థలములో నుండి నిషిద్ధ వస్తువుల నన్నిటిని బయటికి కొనిపోవుడి
పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధవస్తువులన్నిటిని యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసికొనిరాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి.
2 దిన 29:5,16

25 సంవత్సరాల నిండు యవ్వనంలో హిజ్కియా రాజ్యాధికారాన్ని చేపట్టాడు. రాజైన వెంటనే రాజకుమార్తెలను వెతుక్కొనే ప్రయత్నం చెయ్యలేదు. రాజ్యాన్ని విస్తరించే పనులను ఏమి చేపట్టలేదుగాని, దేవుని మందిర శుద్ధీకరణ ప్రారంభించాడు.

తన తండ్రియైన ఆహాజు దేవుని మందిరాన్ని విగ్రహాలతో నింపి ఆలయ తలుపులు మూసివేస్తే? హిజ్కియా ఆ మందిర తలుపులు తీయించి, మందిరంలోనున్న విగ్రహాలను తొలగిస్తున్నాడు.

కారణం?
దేవుని మందిరంలో విగ్రహాలుంటే?
మనము చేసే ఆరాధన దేవునికి చేరదు. చెందదు.
అందుకే మొట్ట మొదటగా ఆ విగ్రహాలను బయటకు తీయిస్తున్నాడు.

ఆ లేవీయులు వారికి కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటిని బయటకు తీసుకు వస్తున్నారు.

నూతన నిబంధనా కాలంలో "నీవే ఒక దేవుని ఆలయము."

మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.
1 కొరింది 3:16,17

నీవనొచ్చు!
నాకు డబ్బుంది త్రాగుతా.
బలముంది తిరుగుతానని.

అయితే ఒక్క విషయం గుర్తు పెట్టుకో!!
నీ దేహం దేవుని ఆలయం. దానిని నీవు పాడు చేస్తే? వ్యర్ధమైన విగ్రహాలతో నీవు దానిని నింపివేస్తే? దేవుడు నిన్ను పాడు చేస్తాడు.

దేవుడే పాడుచేస్తే?
ఇంకెవరు బాగుచేయగలరు?

ఆలోచించు!!!
నీ హృదయంలో విగ్రహాలను (దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అంశాలు) అట్లానే వుంచుకొని నీవు చేసే ఆరాధన దేవుని సన్నిధికి చేరుతుంది అనుకొంటున్నావా?
అది ఎప్పటికీ సాధ్యం కాదు.

నీ విగ్రహాలను బయటకు తీయకుండా నీవు చేసే భక్తి (పాటలు, ప్రార్ధనలు, ఆరాధన, ప్రసంగాలు, ఉపవాసం, మొదలైనవి)అంతా అర్ధం లేనిది. వ్యర్ధమైనది.

మొదట నీ జీవితంలో పాతుకుపోయిన విగ్రహాలను దేవుని వాక్యపు వెలుగులో నీకు కనబడిన ప్రతీ విగ్రహాన్ని, ఏ ఒక్కటీ వదలకుండా బయటకు తీయాలి. అప్పుడు నీహృదయం పరిశుద్ధ పరచబడుతుంది. పరిశుద్ధ పరచబడిన హృదయంలోనికి పరిశుద్ధుడైన నీ దేవుడు ప్రవేశిస్తాడు.

లేకపోతే?
ఆ విగ్రహాలు నీ హృదయంలోనే వుంటే? ఆయన నీ హృదయం బయటే ఉంటాడు.
ఆ విగ్రహాలను నీలో పెట్టుకొని విగ్రహారాధికుడుగానే నీ జీవితాన్ని చాలించవలసి వస్తుందేమో?

అట్లా అయితే?
విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 21:8

వద్దు!
ఇది వినడానికే భయంకరం.

సరి చేసుకుందాం.
సాగిపోదాం.
గమ్యం చేరేవరకు.

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!



విగ్రహారాధన

(పదునాలుగవ భాగము)

"విగ్రహారాధికుడై యున్నలోభి" క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
ఎఫెస్సి 5:5

లోభి అంటే?
అత్యాశాపరుడు, పిసినారి

లోభత్వము కలిగినవాడు
'విగ్రహారాధికుడు.'

కారణం?
ఒక వ్యక్తికి దేనిపైన అత్యాశవుందో? దానిని అతడు ఆరాధిస్తున్నట్లే.

'ఆశ' కలిగి వుండాలి. దానిలో తప్పులేదు. ఆశలేకపోతే మనిషి జీవించలేడు.

ఒక సైన్స్ పత్రిక ఇచ్చిన నివేదిక ఇది.
•ఒక వ్యక్తి ఆహారం లేకుండా 54 రోజులు, నీరు లేకుండా 3 రోజులు, ఆక్సిజన్ లేకుండా 8 నిమిషాలు జీవించగలడు.
కాని, ఆశ లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేడు. ఆశను కోల్పోయిన వ్యక్తి ఆత్మహత్యకు సిద్ధపడతాడు.

అవును!
నీ ఆశ సమర్ధనీయమైనది అయితే?
ఆశగల నీ ప్రాణమును తప్పక ఆయన తృప్తి పరుస్తాడు.

ఒకవేళ నీ ఆశకు అంతేలేకుండా పోతే?
ఆశ అత్యాశగా మారితే?
నీవు విగ్రహారాధికుడుగా మారతావు.

నీ ఆశ హద్దులుమీరినప్పుడు, దానిని నెరవేర్చుకోవడానికి ఎట్లాంటి పని చెయ్యడానికైనా వెనుకాడవు.

కారణం?
నీ హృదయం అత్యాశతో నిండిపోయింది.



•నీవు లోభివి అయితే?
నీ కుటుంబ కనీస అవసరాలు కూడా తీర్చలేవు.

'లోభి తన యింటివారిని బాధపెట్టును' సామెతలు 15:27

•నీవు లోభివి అయితే నీ స్నేహాన్ని ఎవ్వరూ కోరుకోరు.

లోభితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదు. 1 కొరింది 5:11

•నీవు లోభివి అయితే?
దేవుని రాజ్యమునకు హక్కుదారుడవు కాదు. ఎఫెస్సి 5:5

•నీవు లోభివి అయితే?
'లోభి శాపగ్రస్తుడు' 2పేతురు 2:14

నీవు శాపగ్రస్తుడవైతే?
ఆయన అంటున్నాడు.
'శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి'.
మత్తయి 25:41

అంటే, లోభత్వము యొక్క గమ్యము?
"నిత్యాగ్ని"
'లోభత్వము' ఒక విగ్రహంలా మారితే? నీవు విగ్రహారాధికుడులా మారతావు.

విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8

వద్దు!
ఇది వినడానికే భయంకరం.

సరి చేసుకుందాం.
సాగిపోదాం.
గమ్యం చేరేవరకు.

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరీర కార్యములు

క్రిస్మస్

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

విశ్వాసము

పాపము

సమరయ స్త్రీ