క్రిస్మస్

క్రిస్మస్

( మొదటి భాగము)

దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.
లూకా 2:11
...........................

క్రిస్మస్ అంటే?
క్రీస్తును ఆరాధించడం.
క్రైస్ట్ అంటే క్రీస్తు
మాస్ అంటే ఆరాధన

కాని నేటి,
"క్రైస్ట్ మాస్ లో
క్రైస్ట్ మిస్" అయిపోతున్నాడు.

కారణం?
నేటి క్రిస్మస్!!
"ఇంటి పైన స్టార్
ఇంట్లో బార్" లా
మారిపోయింది.

నేటి క్రిస్మస్
1. ఇంటి క్రిస్మస్:
ఇంటి శుభ్రం

2. ఒంటి క్రిస్మస్:
క్రొత్త బట్టలు

3. పంటి క్రిస్మస్:
వండుకొని తినడం
వీటికే పరిమితం.

క్రీస్తుఆరాధనా కాస్త
క్రిస్మస్ సెలబ్రేషన్స్లా మారిపోయాయి.
వాటిలో వేసే డాన్సులు రికార్డింగ్ డాన్స్ కి ఎంతమాత్రం తీసిపోవు.

అదేంటి అంటే?
దావీదు నాట్యం చెయ్యలేదా?
అంటూ క్లారిఫికేషన్.

దావీదు నాట్యం చేసిన
సందర్భం వేరు.
నాట్యం చేసినా?
ఆయన ఒక గ్రూపు తయారుచేసి స్టెప్పులు నేర్చుకొని నాట్యం చెయ్యలేదు.

క్రిస్మస్ ఎందుకింత
వికృత రూపం దాల్చుతుంది?
కారణం ఒక్కటే?
ఆయన జన్మించి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా?
నేటికీ మన హృదయాల్లో జన్మించక పోవడమే.

ఒకరేమో క్రిస్మస్ చెయ్యకూడదంటారు.
మరొకరేమో చేసి తీరాలంటారు.

కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకో!
దేవునికి దగ్గరయ్యే పని ఏదయినా చెయ్యి.
దేవునికి దూరమయ్యే పని ఏదీచెయ్యొద్దు.

ఇంతకీ ఈ క్రిస్మస్ నిన్ను దేవునికి దగ్గర చేస్తుందా? దూరం చేస్తుందా?

నీ జీవితంలో అనేక క్రిస్మస్ లు దొర్లిపోయాయేమో? కనీసం ఈసారి అయినా నిజమైన క్రిస్మస్ ను ఆరాధన చెయ్యగలవా?

నేడే ప్రియరక్షకుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం!
క్రిస్మస్ తెచ్చే శాంతిని, సమాధానాన్ని అనుభవిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!

శుభోదయం



క్రిస్మస్

( రెండవ భాగము)


దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.
లూకా 2:11
...........................

క్రిస్మస్ అంటే?
క్రీస్తు పేరుతో వ్యాపారమా?

అట్లానేవుంది కదా?

*ప్రపంచ చరిత్రలో ఎక్కువ వ్యాపారం జరిగేది క్రిస్మస్ దినాల్లోనేనట.
*ఎక్కువ మద్యం అమ్ముడుపోయేది
క్రిస్మస్ దినాల్లోనేనట.
*క్లబ్ లు , ఫబ్ లు, రెస్టారెంట్లు రద్దీగా వుండేది
క్రిస్మస్ దినాల్లోనేనట.

క్రిస్మస్ పేరుతో క్రీస్తుని ఆరాధించడం మాని, క్రీస్తునే అమ్మేసుకొంటున్నాము.

ఇస్కరియోతు యూదా క్రీస్తుని
30 వెండి నాణెములకు అమ్ముకున్నాడు గాని, మనమయితే 3 నాణెములకే అమ్మేస్తాము.

*పేరుకు మాత్రమే క్రిస్మస్ ఆరాధించు కొనేది మాత్రం
"మనకు మనమే".
*మన టేలంట్ చూపించుకోవడానికి క్రిస్మస్ ను వేదికగా మలచుకొంటున్నాం.
*క్రిస్మస్ ఆరాధనలో సినిమా పాటలకుసహితం డాన్స్ చేసే భయంకరమైన స్థితికి దిగజారిపోయాం.

ఒక్కమాటలో చెప్పాలంటే?

*క్రిస్మస్ లో, కనీసం క్రిస్మస్ ట్రీ కి, క్రిస్మస్ తాతకిచ్చిన ప్రాధాన్యత కూడా క్రీస్తుకు ఇవ్వలేక పోతున్నాం.
*ఆరాధించాల్సిన దేవుని సంగతే మరచిపోతున్నాం.

దీనికేనా మనం క్రిస్మస్ అని పేరు పెట్టుకున్నది?

ఆరాధించే మనసులేకపోతే?
ఆరాధించడం చేతకాకపోతే?
చేతులు కట్టుకొని కూర్చోవడం శ్రేయస్కరం.


అంతేగాని,
క్రిస్మస్ పేరుతో ఆయన అద్భుతమైన త్యాగాన్ని లోకంలో నవ్వులుపాలు చేసే ప్రయత్నం చెయ్యొద్దు.

అందుకే ఆయన అంటున్నాడు.
మిమ్మును బట్టియే కదా నా నామం అన్య జనుల మధ్య దూషించ బడుచున్నది?

అవును!
మన ఆరాధన ఆయనను దూషణ పాలుచేసేదిగా కాకుండా, ఆయనకు మహిమ తెచ్చేదిగా వుండి, అనేక మంది అన్య జనులను రక్షణ లోనికి నడిపించేదిగా వుండాలి.

ఇదెప్పుడు సాధ్యం?
ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే.

*నీ హృదయం ఆయనకింకా దూరంగానుందా?
నేడే ఆయనను చేర్చుకో!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!

శుభోదయం


క్రిస్మస్

( మూడవ భాగము)


యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
మత్తయి 2:2
...........................

స్టార్ (నక్షత్రం):
(స్వయంగా ప్రకాశించేది)

ఈలోకంలో చాలా స్టార్స్ వున్నాయ్.
*సూపర్ స్టార్
*టెరా స్టార్
*మెగా స్టార్
*ఈ స్టార్స్ గా పిలువబడే వారిని వెంబడించేవారు లోకంలో కోకొల్లలు.
*ఈ స్టార్స్ వెలుగులో ఉన్నవారిని చీకటిలోనికి తీసుకెళ్తారు తప్ప, చీకటిలోనున్న వారిని వెలుగు లోనికి నడిపించలేరు.

అయితే, ప్రకాశ మానమైన నక్షత్రం ఒకటుంది. అది,
*ప్రకాశించింది.
*అత్యానందాన్నిచ్చింది
*దారి చూపించింది.
*గమ్యం చేర్చగలిగింది.

యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువచుక్కయునై యున్నాను.
ప్రకటన 22:16

ఆ స్టార్ మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు.

* ఈ స్టార్ కున్న 5 కోణాలు,
ప్రియ రక్షకుని 5 గుణగణాలను తెలియజేస్తున్నాయి.
1.ఆశ్చర్యకరుడు
2.ఆలోచనకర్త
3.బలవంతుడైన దేవుడు
4.నిత్యుడగు తండ్రి
5.సమాధానకర్త
యెషయా 9:6

ఇంతకీ నీ గమ్యమేమిటి?
ఏ స్టార్ ని వెంబడిస్తున్నావ్?

* ఈ లోకంలో స్టార్స్ ని నీవు కలవాలంటే? నీకు ఎప్పటికీ అనుమతి దొరకక పోవచ్చు.
కాని, ఈ స్టార్ నిన్ను కలసుకోడానికి దివి నుండి భువికి దిగి వచ్చింది.

*ఈ లోకంలో స్టార్స్ నిన్ను
నలిపేస్తారు.
కాని, ఈ స్టార్ నీకోసం నలిగిపోయింది.

దివి నుండి దిగి వచ్చిన స్టార్ ను వెంబడించ గలిగితే?
*ఆశ్చర్య క్రియలు నీ జీవితంలో అనుభవిస్తావ్.
*నీ ప్రతీ పరిస్థితిని పరిష్కరించుకోగల ఆలోచన దొరుకుతుంది.
*నీ బలహీన సమయాల్లో ఆయనే నీ బలం.
*నిత్యమూ నీకు తండ్రిగా ఉంటాడు.
*నీ జీవితమంతా సమాధానమే.

ఇదెప్పుడు సాధ్యం?
*ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే.
*ఆ స్టార్ ను వెంబడించినప్పుడు మాత్రమే.

*నీ హృదయం ఆయనకింకా దూరంగానుందా?
నేడే ఆయనను చేర్చుకో!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!

శుభోదయం



క్రిస్మస్

( నాలుగవ భాగము)


క్రిస్మస్ తాత.

క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడో లేదో తెలియదు గాని, క్రిస్మస్ లో
క్రిస్మస్ తాత లేకపోతే అది క్రిస్మస్సే కాదు.

క్రిస్మస్ లో క్రిస్మస్ తాత క్రీస్తునే మించిపోయాడు.

క్రిస్మస్ ను చాలామంది x-mas
(ఎక్స్ మాస్ )అని పిలుస్తుంటారు. అది నిజమే అనిపిస్తుంది కూడా.

లెక్కలు మాస్టారు
"తెలియని దానిని"
x (ఎక్స్ )అనుకోండి అని చెప్తారు.
లెక్క చివర్లో ఆ "x" (ఎక్స్ )విలువ ఎంతో చెప్తారు.

x-mas
"x"అంటే? తెలియబడనిది
"mas"అంటే? ఆరాధన
x-mas పేరుతో "తెలియని దానినే ఆరాధిస్తున్నాం." ఆ "x" (ఎక్స్ ) ఏంటో నేటికీ కనుగొనలేని పరిస్థితిలోనే ఉన్నాము.

4 వ శతాబ్ధంలో, టర్కీ దేశంలో నికోలస్(శాంతా క్లాజ్) అనే వ్యక్తి ఉండేవాడు. సంపన్న కుటుంబములో పుట్టి పెరిగి, చిన్నప్పుడే తలిదండ్రులు కోల్పోయాడు. ఇతడు చాలా జాలిగల హృదయం కలిగిన వాడు. ప్రజల అవసరాలు తెలుసుకొని రహస్యముగా వెళ్లి కొంత సొమ్ము వారింట్లో వేసి వస్తుండేవాడు.

చిన్న పిల్లల విషయంలో కూడా అట్లా జరిగేది, పెద్ద వాళ్ళు చెప్పడంవల్ల డిసెంబర్ 24 రాత్రి క్రిస్మస్ తాత వచ్చి రహస్యంగా బహుమతులు ఇచ్చి వెళ్తాడని వాళ్ళు నమ్మేవారు.

తర్వాత కాలంలో ఆయన సెయింట్ గా పిలువబడి , బిషప్ గా కూడా పని చేసినట్లు చరిత్ర చెబుతుంది.

క్రిస్మస్ అంటే? బహుమతుల పండుగని, యేసు క్రీస్తు ఈ లోకానికి బహుమానంగా అనుగ్రహించ బడ్డాడని, క్రిస్మస్ సందర్భముగా ఒకరికొకరు బహుమతులిచ్చు కోవడం, గ్రీటింగ్స్ పంపుకోవడం చేస్తుంటారు.
ఫేస్ బుక్, వాట్సాప్ వంటివి వచ్చాక వీటికి అంతేలేదు.

నికోలస్(శాంతా క్లాజ్) కూడా ఇట్లా బహుమానాలు ఇచ్చేవాడని
తీసుకొచ్చి క్రిస్మస్ లో అంతర్భాగం చేసేసారు.

అది ఎంత వరకూ వచ్చిందంటే? పిల్లలకు క్రీస్తు అంటే తెలియకపోయినా గాని,
క్రిస్మస్ తాత అంటే మాత్రం తెలియకుండా వుండదు.

క్రిస్మస్ తాత వస్త్రాలు, అలంకరణ వస్తువుల పేరుతో కోట్ల బిజినెస్ జరుగుతుంది.

క్రీస్తు జననానికి, క్రిస్మస్ తాతకు ఎక్కడైనా సంబంధం ఉందా అంటే? లేనే లేదు.
ఆచారాల ముసుగులోపడి, దేవుని ఆరాధించలేక పోతున్నాం. దేవునికి చెందవలసిన మహిమ వేటికో అర్పిస్తున్నాం.

ఇది "సృష్టికర్తను మరచి
సృష్టిని పూజించడం" కాదంటారా?

దేవుని యొక్క స్థానాన్ని మరొకటి తీసేసుకుంటే? అది విగ్రహారాధన కాదంటారా?

పది నిమిషాల పిల్లల సంతోషం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు ప్రోత్సహించే మనం నిజరక్షకుని ఎట్లా ఆరాధించాలో వారికి తెలియజేయగలిగితే? వారి జీవితమంతా సంతోషమే కదా!

ఈ క్రిస్మస్ లో మనమెందుకు ప్రత్నించ కూడదు?

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!

శుభోదయం



క్రిస్మస్

( ఐదవ భాగము)


క్రిస్మస్ ట్రీ:
క్రిస్మస్ ఆరాధనకు వెళ్తే పిల్లలు మొదలుకొని పెద్దలు వరకు అందరి కళ్ళు మనకు తెలియకుండానే క్రిస్మస్ ట్రీ మీదకు వెళ్లిపోతాయి.
క్రిస్మస్ లో క్రిస్మస్ ట్రీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ.

వాస్తవానికి పరిశుద్ద గ్రంధములో క్రిస్మస్ చేసినట్లు గాని, చెయ్యాలని గాని, వాటిలో ఇట్లాంటివి వుండాలని గాని ఎక్కడా ప్రస్తావించబడలేదు.
ఇవన్నీ మనుష్యులు కల్పించుకున్నవే. శతాబ్దాలు గడచిపోతున్నా వాటిని మాత్రం అట్లానే ఆచరిస్తున్నాం. యేసు ప్రభువు వారు ఆచరించమని చెప్పిన "ప్రభు రాత్రి భోజనం" జోలికి మాత్రం వెళ్ళం.

క్రిస్మస్ ట్రీ ని క్రిస్మస్ లో ఎందుకు పెట్టారో? దానికి లెక్కలేనన్ని ఊహలు. జీవ వృక్షానికి గుర్తు అని కొందరు, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షానికి గుర్తని, పచ్చదనం ఆయన నీతికి గుర్తని, నిత్యత్వానికి గుర్తని, జీవమునకు గుర్తని మరికొందరు. ఎవరి ఊహలు వారివే తప్ప, బైబిల్ మాత్రం దీని గురించి ఒక్క మాటకూడా మాట్లాడదు.

క్రిస్మస్ ట్రీ కి అంతఅందం తనపైనున్న మిరుమిట్లు గొలిపే ఆ కాంతియే.

మనమొక ఆధ్యాత్మికమైన విషయం నేర్చుకోవడానికి ఒక కల్పిత కథ చెప్తాను.

ఒక సరుగుడు చెట్టు వంటి చెట్టు ఏడుస్తూ వుందట , నా పువ్వులకు వాసన లేదు. నా కాయలు తినడానికి పనికి రావు. నన్నెవరూ పట్టించుకోరని.

దాని ఏడుపు చూసి నక్షత్రాలు ఆకాశం నుండి దిగివచ్చి, ఏడవకు మేము నీతో ఉంటామని దాని మీద వ్రాలాయట. అంతే! ప్రపంచములో ఏ చెట్టుకు లేని ఆధిక్యత, ఘనత దానికి వచ్చేసిందట.

*ఆ చెట్టుకు ఘనత ఆ చెట్టునుబట్టి కాదు. దాని మీద కూర్చున్న నక్షత్రాలను బట్టి.
*గాడిదకు ఘనత ఆ గాడిదనుబట్టి కాదు. దాని మీద కూర్చున్న యేసయ్యను బట్టి.

*నీకు కలిగిన ఘనత నిన్నుబట్టి కాదు. నీకోసం ప్రాణం పెట్టడానికి దిగివచ్చిన యేసయ్యను బట్టే.

*ఏ పాపము ఎరుగని ఆయన నీ కోసం శాపముగా మారడానికి ఇష్టపడ్డాడు.
*నీకోసం ఆయన సింహాసనాన్ని విడచి పెట్టుకున్నాడు. అంతగా నీకోసం తగ్గించుకున్నాడు.

కనీసం ఆ క్రిస్మస్ ట్రీ ను చూసినప్పుడు ఈ విషయం గుర్తొచ్చినా? నిజమైన క్రిస్మస్ ను ఆరాధన చెయ్యగలవేమో?

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!


క్రిస్మస్

( ఆరవ భాగము)


దూతలు - దూత పాటలు

పరలోకంలో ముగ్గురు ప్రధాన దూతలు వుండేవారు.

1. లూసీఫరు
(దేవుని స్తుతించడానికి. కాని,తన గర్వముతో దేవునిమీద ఎదురు తిరిగి పరలోకం నుండి త్రోసివేయ బడ్డాడు.)

2.మిఖాయేలు
( దేవుని పక్షముగా యుద్దాలు చెయ్యడానికి)

3.గాబ్రియేలు:
(దేవుని వర్తమానం ప్రజలకు తెలియజేయడానికి)

*దేవదూతలలో కొన్ని రకాలున్నాయి.
1. కెరూబులు
2. సెరాపులు
ఇట్లా....

*కొన్ని దూతలకు రెండు రెక్కలు, కొన్నింటికి నాలుగు రెక్కలు, మరి కొన్నింటికి ఆరు రెక్కలు వున్నాయి.

*దేవ దూతలు గురించి మాట్లాడేటప్పుడు స్త్రీ లింగమును వాడకూడదు. ( చెప్పింది అనకూడదు. చెప్పాడు అనాలి.) పరిశుద్దాత్ముని విషయంలో కూడా ఇట్లానే మాట్లాడాలి.

దూత పాటలు:
*బైబిల్ గ్రంధములో దూతలు పాటలు పాడిన సందర్భాలు రెండు.

1. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు:

ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
యోబు 38:7

ఉదయనక్షత్రము అంటే?
వేకువ చుక్క.

వేకువ చుక్క అంటే?
సూర్యుని కంటే ముందుగా వస్తుంది. అంటే కొద్ది సేపట్లో సూర్యుడు రాబోతున్నాడు అని తెలియజేస్తుంది.

వీటితో పాటు దేవదూతలు జయద్వనులు చేస్తుండగా దేవుడు భూమికి పునాధిని వేసాడట.

2. ప్రియ రక్షకుడు ఈలోకంలో జన్మించినప్పుడు:

వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి, సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
లూకా 2:13,14

ఈ మాటలు చదువుతుంటేనే, హృదయమంతా పులకరించిపోతుంది. ఆ దూతలు పాడితే మరెట్లావుందో కదా?

(దేవునిచిత్తం అయితే ఈ దూత పాటను రేపటి దినమున ధ్యానిద్దాం)

చివరిగా ఒక్క ప్రశ్న!
దూత ఈ సమాధానం ప్రకటించి సుమారు రెండువేల సంవత్సరాలు దాటిపోయింది. ఈ సమాధానం నీ జీవితంలో ఉందా?

లేకుంటే? నేడే నీ పాప భారాన్ని ఆయనకు అప్పగించి ఆ సమాధానాన్ని పొందుకో!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!



క్రిస్మస్

( ఏడవ భాగము)


దూత పాట:

వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి, సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
లూకా 2:13,14

ప్రియ రక్షకుడు ఈలోకంలో జన్మించినప్పుడు దూత సమూహం చేసిన స్తుతి స్తోత్ర గీతాలాపన ఇది.

ఈ మాటలు చదువుతుంటేనే, హృదయమంతా పులకరించిపోతుంది. ఆ దూతలు పాడితే మరెట్లావుందో కదా?

ప్రపంచములోని ఏ సంగీతం కూడా వారి పాటకు సాటిరాదు కదా!

యేసు క్రీస్తు జననం
*పరలోకంలోనున్న దేవునికి మహిమను తీసుకు వచ్చింది.

అందుకే యేసు ప్రభువు అంటున్నారు.

చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.
యోహాను 17:4

యేసు క్రీస్తు జననం
*భూమిమీదనున్న మనకు సమాధానంను తీసుకు వచ్చింది.

ఆయన జన్మించి, ఈ సమాధానం చాటింపబడి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది.
అయిననూ, నేటికి ఈ సమాధానాన్ని అనుభవించలేకపోతున్నాము.

కారణమేమిటి?
"ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము."

ఆ సమాధానాన్ని నేటికీ అనుభవించ లేకపోతున్నాము అంటే? ఆయనకు ఇష్టులైన మనుష్యులుగా మనము లేమేమో?


*ఎవరు ఆయనకు ఇష్టులు?
ఆ సమాధానం మనకు ఎట్లా లభిస్తుంది?

యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి, పాపమునుండి ఎవరైతే విమోచన పొందుతారో? వారే ఆయనకు ఇష్టులు. వారికే సమాధానం.

*ఏ పాపం నిన్ను వెంటాడుతుందో?
*ఏ పాపం నిన్ను బంధించేసిందో?

శారీరాశా?
నేత్రాశా?
జీవపుడంబమా?
అది ఏదయినా సరే!

నేడే నీప్రియ రక్షకుని పాదాలచెంత విడచిపెట్టి, ఆ సమాధానాన్ని అనుభవించు.

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!

శుభోదయం





క్రిస్మస్

( ఎనిమిదవ భాగము)


గొర్రెల కాపరులు:

*అత్యంత అనాగరికులు,
కాని, ప్రప్రధమంగా రక్షకుని
చూచిన ధన్య జీవులు.
*దూతలు తరువాత, యేసును చాటిన ప్రప్రధమ సువార్తికులు.

*లోకజ్ఞానం లేనివారు.
(నేను నేటి దినాలలో వుండే గొర్రెల కాపరులను గురించి మాట్లాడడం లేదు. నేడు వారు అత్యంత జ్ఞానము కలిగినవారే.)
*గొర్రెలే వారికి సర్వస్వం.
*గొర్రెలను ఎట్లా మేపాలి?
*ఎట్లా కాయాలి?
*వాటికి ఎదురయ్యే సమస్యలు ఏంటి ?
వాటిని గురించిన పరిపూర్ణమైన అవగాహన తప్ప, ఇక వేరే విషయాలేమి వీరికి తెలియదు.
*వారి జీవితం వాటితోనే ప్రారంభమవుతుంది. వాటితోనే ముగిసిపోతుంది.
*వారి ఆటలు, పాటలు, సంతోషం, దుఖం అన్నీ పొలాల్లోనే. ఆ గొర్రెలతోనే.
*సమాజంలో లోని వ్యక్తులతో వీరికి పరిచయాలు కూడా చాలా తక్కువ. కారణం? వీరు ఎక్కువ సమయం గడిపేది గొర్రెలతోనే.

అయితే,
*ఈలోకంలో ఎంతో మంది జ్ఞానులు, రాజులు , గొప్పవారు వుండగా, రక్షకుని జననవార్త వీరికే తెలియజేయబడింది.
అట్లా అని, ఇశ్రాయేలు దేశంలో నున్న గొర్రెల కాపరులందరికి కాదు. కొందరికే.

దూత చెప్పిన
"రక్షకుడు పుట్టాడు" అనే,
ఒక చిన్న సువార్తమానమునకు వారియొక్క ప్రతిస్పందన,
బండబారిన మన రాతిహృదయాలకు గొప్ప
ఆధ్యాత్మిక పాటం.

ఆ గొఱ్ఱలకాపరులు జరిగిన యీకార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు
లూకా 2:15

*దూతలు పైనుండి వెళ్తూ పొలంలో మనం కనబడ్డాము కాబట్టి, మనకు చెప్పారు అని కాకుండా, దేవుడే స్వయంగా ఈవర్తమానమును మన దగ్గరకు పంపించాడు అని వారు నమ్ముతున్నారు.

ఈ చిన్న వర్తమానం నీదగ్గరకు తీసుకు రాబడుతుంది అంటే? ఎవరో పనీ పాటులేక చేసే పనికాదు గాని, ప్రభువే ఈ వర్తమానం నీకు తెలియజేస్తున్నాడు. ఆయన ప్రణాళికలో నీవున్నావు. అనే విషయాన్ని నీవు గ్రహించగలగాలి.

అట్టి గ్రహింపు నీకు లేకపోతే నీ హృదయం ఎప్పటికీ స్పందించదు.

దేవుని మాటలు అంటే మనకెంత నిర్లక్ష్యం అంటే?
హాయ్! అని మెసేజ్ పెడితే ఒక్క క్షణంలో హాయ్! అని సమాధానం వచ్చేస్తుంది. గంటలు తరబడి ఆ చాటింగ్ అట్లానే సాగిపోతుంది.

కాని, ఎవరన్నా ఒక చిన్న దేవుని వర్తమానం పంపిస్తే? కనీసం "ఆమెన్" అనే చిన్న మాట టైపు చెయ్యడానికి కూడా మన చేతులు ఒప్పుకోవు.

కారణం?
దేవుడన్నా, దేవుని మాటలన్నా మనకంత నిర్లక్ష్యం.

ఆమెన్ అంటున్నావు అంటే? నీ దగ్గరకు తీసుకు రాబడిన వర్తమానం నీ జీవితంలో నెరవేరాలని కోరుకొంటున్నట్లే!

*అనాగరికులైన గొర్రెల కాపరుల ప్రతిస్పందన నీనా జీవితాలకు గొప్ప మేలుకొలుపు.

ఆయన మాటకు ప్రతిస్పందిద్దాం!
ఆయన పాదాల చెంతచేరి ఆరాధిద్దాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!

శుభోదయం



క్రిస్మస్

( తొమ్మిదవ భాగము)


గొర్రెల కాపరులు:
దూత చెప్పిన
"రక్షకుడు పుట్టాడు" అనే, ఒక చిన్న సువార్తమానమునకు వారియొక్క ప్రతిస్పందన,బండబారిన మన రాతిహృదయాలకు గొప్ప
ఆధ్యాత్మిక పాటం.

"మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని" లూకా 2:15
"ఐకమత్యమే మహా బలం" అంటూ చిన్నప్పుడు నేర్చుకున్న పాటాలు లెక్కలేనన్ని.
*గడ్డి పరకలు అన్నీ కలిస్తే బలమైన ఏనుగునే బంధించేస్తాయి.
*చలి చీమలన్నీ కలిస్తే విష సర్పాన్నే చంపేస్తాయి.
*గొర్రెల కాపరులు సమాజములో బలహీనులే. కాని వారిబలం వారి ఐకమత్యమే.

బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొనినప్పుడు, వారిలో ఒక్కరు కూడా వ్యతిరేకించినట్లు చూడము.
వారిదంతా ఒకే మాట. ఒకే బాట.
అందుకే దూత చాటించిన సమాధానాన్ని పొందుకోగలిగారు.

*షోమ్రోను పట్టణం శత్రువుల ముట్టడి వల్ల, పిల్లలను సహితం వండుకుతినే భయంకరమైన కరవుతో అల్లాడుతున్న సమయంలో,
సిరియా దండు పేటకు వెళ్దామని నలుగురు కుష్టు రోగులు ఒకరితో నొకరు చెప్పుకొంటున్నప్పుడు, వారిలో ఒక్కరుకూడా వ్యతిరేకించ లేదు. వారిదంతా ఒకే నిర్ణయం. వారు బ్రతకనిస్తే బ్రతుకుదాం! చంపేస్తే చచ్చిపోదాం! ఒకే మాట, ఒకే బాట.
ఆ నలుగురు కుష్టురోగుల ఐక్యత షోమ్రోను పట్టణమునకు సమృద్దియైన ఆహారం పెట్టగలిగింది.

*ఇట్లాంటి పరిస్థితులు మన జీవితాల్లో లోపించాయి. ప్రతీ ఒక్కరూ నేను అనుకున్నట్లే జరగాలంటూ ఇతరులతో ఏకీభవించలేని పరిస్థితి.

అందుకే, మన సంఘాలను, మన కుటుంబాలను సాతాను చీల్చి చెండాడుతున్నాడు.
వాడి ఆటలు సాగుతున్నాయంటే?
కారణం? మనలో ఐక్యత లోపించింది.
ఐక్యత లోపించింది కాబట్టే, సమాధానం లోపించింది.

వద్దు!
ఒకరినొకరు అర్ధం చేసుకుందాం!
ఒకరితోనొకరు ఏకీభవిద్దాం!
కలసి కట్టుగా దేవునికోసం జీవిద్దాం!
సమాధానాన్ని అనుభవిద్దాం!

అట్టి కృప, ధన్యత ,దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


క్రిస్మస్

( పదియవ భాగము)


గొర్రెల కాపరులు:
దూత చెప్పిన "రక్షకుడు పుట్టాడు" అనే,
ఒక చిన్న సువార్తమానమునకు గొర్రెల కాపరుల యొక్క ప్రతిస్పందన.

త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. లూకా 2:16

నిదానమే ప్రధానం అనికాకుండా,
ఆలస్యమైతే అమృతం సహితం విషమవుతుంది అన్నట్లుగా......
వర్తమానము వారికందిన వెంటనే ప్రతిస్పందించారు. వెళ్ళిపోయారు.
*ప్రాణముగా ప్రేమించే గొర్రెలను ఏమి చేసారు? ఎవరికి అప్పగించారు?
లోక పాపములు మోసే గొర్రెపిల్లె ఈ లోకానికే వస్తే? ఇక ఈ గొర్రెలకోసం ఆలోచించలేదేమో?

*నిజమైన గొర్రెల కాపరి, ప్రధానకాపరి యొక్క తలంపులతో వారి గొర్రెలు గుర్తురాకుండా పోయాయేమో?
* మా కంటేముందు ఆయనను మరెవ్వరూ చూడకూడదు, ఆరాధించకూడదు అనుకున్నారేమో?

ఎక్కడి వాటిని అక్కడ విడచిపెట్టి పరుగులు తీసారు. కారణం? వారి ఆశ ఒక్కటే?
ఆయన్ని చూడాలి. ఆయన్ని ఆరాధించాలి.
గొర్రెల కాపరుల జీవితాలు నీ, నా జీవితానికి గొప్ప ఆధ్యాత్మిక పాటం.

దేవుడన్నా, దేవుని మాటలన్నా? దేవుని మందిరమన్నా? ఇట్లాంటి ఆశ మనలో లోపించింది కదా?
ఎందుకో? దేవుని విషయాలంటే అంత వేగంగా స్పందించలేకపోతున్నాం కదా?

కారణం ఏమయ్యుంటుంది?
ఆ ప్రియరక్షకుని గొప్పతనం మనకింకా అర్ధం కాలేదా?
ఆయన త్యాగం మనకు చులకనయ్యిందా?
ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని అప్పగించడానికి రోమా సైన్యముతో కలసి వచ్చినప్పుడు, యేసయ్య అంటున్నారు. యూదా నీవు చేయబోవునదేదో త్వరగా చెయ్యి.

అంటే?
యేసయ్య మనకోసం ప్రాణం పెట్టడానికి త్వరపడుతున్నాడు.
కాని, మనం ఆయనకోసం త్వరపడలేకపోతున్నాం.
ఇప్పుడైనా మన జీవితాలను సరిచేసుకుందాం.

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


క్రిస్మస్

( పదకొండవ భాగము)


గొర్రెల కాపరులు:
*అత్యంత అనాగరికులు,
కాని, ప్రప్రధమంగా రక్షకుని
చూచిన ధన్య జీవులు.
*దూతలు తరువాత, యేసును చాటిన ప్రప్రధమ సువార్తికులు.

దూత చెప్పిన
"రక్షకుడు పుట్టాడు" అనే,
ఒక చిన్న సువార్తమానమునకు వారియొక్క ప్రతిస్పందన,
బండబారిన మన రాతిహృదయాలకు గొప్ప
ఆధ్యాత్మిక పాటం.

వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి.
లూకా 2:17

గొర్రెల కాపరులు సువార్తికులుగా మారిపోయారు.

ఏ బైబిల్ కాలేజ్ లో తర్ఫీదు పొందారు?
అసలు అప్పటికి బైబిలే లేదు. ఇక బైబిల్ కాలేజ్ ఎక్కడ?

అట్లా అని వీళ్ళకు చట్ట సభలలో మాట్లాడిని అనుభవం ఉందా? అదీ లేదే?

వారు పొందుకున్న సమాధానం ఆయనను ప్రకటించకుండా వుండనీయలేక పోయింది.

దూత ఏ విషయమైతే చెప్పాడో?
వారు వెళ్లి ఏమయితే చూసారో వాటిని గురించి ప్రచురించడం మొదలు పెట్టారు.

మనమయితే దేనిగురించి అయినా ధారాళంగా మాట్లాడతాం. దేవుని గురించి తప్ప.

దేవునిని గురించి మాట్లాడడానికి నాకు ప్రసంగించడం రాదనీ, పాటలు పాడడం రాదనీ... ఇట్లా అనేకమైన సాకులు చెప్తాము.
మన దృష్టిలో వారే సువార్త చాటేవారు.

కాని ఒక్క విషయం!
ఈ చిన్న వర్తమానం నీ స్నేహితులకు పంపించే
నీవుకూడా ఒక సువార్తికుడవే.

ప్రసంగించేవారు, పాడేవారు కోకొల్లలు. వీరిలో చాలా ఎక్కువ మంది ప్రసంగించే వారుగా, పాడే వారుగా మాత్రమే వుంటారు తప్ప, అనుసరించేవారుగా మాత్రం వుండరు.

నీ మాటలు, నీ ప్రసంగాలు, నీ పాటల కంటే నీ జీవితమే (క్రియలు) ఒక సువార్త కావాలి.

డి.యల్. మూడి అనే దైవజనుడు ఇట్లా చెప్పారు.
"ప్రతీ వంద మందిలో ఒకరు బైబిల్ చదివితే, మిగిలిన తొంబై తొమ్మిది మంది బైబిల్ చదివే వారిని చదువుతారు."

అంటే నీ జీవితమే ఒక బైబిల్ కావాలి. నీ జీవితాన్ని చదివితే క్రీస్తు గురించి తెలియాలి.

"యేసు" అనే పేరు తెలియని వారు ఈలోకంలో ఎందరో వున్నారు. వారికి ప్రకటించ వలసిన భాద్యత నీమీద వుంది.

నీవు వెళ్ళ లేకపోతే?
వెళ్ళే వారికొరకు ప్రార్ధించు.
వారికి సహకరించు.

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


క్రిస్మస్

( పన్నెండవ భాగము)


గొర్రెల కాపరులు:
*అత్యంత అనాగరికులు,
కాని, ప్రప్రధమంగా రక్షకుని
చూచిన ధన్య జీవులు.
*దూతలు తరువాత, యేసును చాటిన ప్రప్రధమ సువార్తికులు.

దూత చెప్పిన
"రక్షకుడు పుట్టాడు" అనే,
ఒక చిన్న సువార్తమానమునకు వారియొక్క ప్రతిస్పందన,

1.దూత తెచ్చిన వర్తమానం ప్రభువే తెలియజేశాడు అని నమ్మారు.
2. రక్షకుని చూడడానికి వెళ్దామని ఒకరితో నొకరు చెప్పుకున్నారు.
3. ఆలస్యం చెయ్యక త్వరగా వెళ్ళారు.
4. యేసును చూచి, ఆయనను గూర్చి ప్రకటించారు.
5. ఆయనను స్తుతించి, మహిమ పరిచారు.

అంతట ఆ గొఱ్ఱల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి.
లూకా 2:20

స్తుతి అంటే?
దేవుడు మనకొరకు ఏమి చేసాడో దానిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం స్తుతి.

ఎవరు స్తుతించ గలరు?
ఎవరి హృదయం సంతృప్తితో, సమాధానంతో నిండిపోయిందో? వారు మాత్రమే స్తుతించ గలరు.

ఇంతకీ ఆ చిన్న శిశువు వీరికేమి చేసాడని స్తుతిస్తున్నారు?

వారి పాపముల నుండి వారిని రక్షించడానికి, తన సింహాసనాన్ని విడచి పెట్టి, రిక్త హస్తాలతో దివి నుండి భువికి వచ్చాడని స్తుతిస్తున్నారు.


ఆయన కేవలం గొర్రెల కాపరుల గురించి మాత్రమే వచ్చాడా?
కానే కాదు. నీకోసం, నాకోసం సర్వ మానవాళి కోసం వచ్చాడు..

అయితే, ఆ కాపరులు చేసిన స్తుతి మనం చెయ్యలేకపోతున్నాం.
వారికున్న కృతజ్ఞత మనకు లేకుండా పోయింది.

ఎంతసేపూ, నాకు అది కావాలి, ఇది కావాలి అని అడుక్కొనే వారిగానే ఉన్నాము తప్ప, ఆయన చేసిన దానికి ఆయనను స్తుతించే అనుభవం లేని వారముగా ఉన్నాము.

సమాధానం తో నిండిన జీవితాలు ఆయనను స్తుతించకుండా వుండలేవు.
మనం స్తుతించ లేకపోతున్నాం అంటే సమాధానం కరువయ్యిందేమో?

ఎందుకు సమాధానం కరువయ్యుంటుంది?
సమాధానానికి కర్త అయిన యేసు ప్రభువు ఇంకా మన హృదయంలో జన్మించలేదేమో?

ఎన్నో క్రిస్మస్ లు మన జీవితంలో దొర్లిపోయాయి. లెక్కలేనన్ని వర్తమానాలు విన్నాము. సమాధానం మాత్రం పొందలేకపోయాము.

మరొకసారి ఈ దినాన్న ఆ సమాధాన సువార్తమానమును దూత నీదగ్గరకు తీసుకొని వచ్చింది. ఆ గొర్రెల కాపరులులా మనం స్పందించ గలిగితే?
వారు పొందుకున్న ధన్యతను, సమాధానాన్ని, సంతోషాన్ని మనమూ పొందుకోగలము.

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


క్రిస్మస్

( పదమూడవ భాగము)


క్యాండిల్ లైట్ సర్వీసు:
క్రిస్మస్ ఆరాధనలో మనలను ఆకర్షించే కార్యక్రమాలలో ఇదొకటి.
అందరూ చీకట్లో క్యాండిల్స్ వెలిగించు కుంటారు. మనమయితే మిరుమిట్లు గొలిపే కాంతిని ఆపేసి, చీకటిని సృష్టించుకొని దానిలో క్యాండిల్స్ వెలిగిస్తాము.
అద్భుతమైన సంగీతంతో, పాడుతూ, అందరూ వెలిగించిన క్యాండిల్స్ పట్టుకుంటే చూడడానికి చాల అందముగా వుంటుంది కదా! . కాని, దీని వలన ఆయనకు మహిమ గాని, మన జీవితాలకు ఆశీర్వాదం గాని ఏదయినా ఉందా?
అసలు దీని ఆంతర్యమేమిటి?
"పెద్ద అడవిని తగులబెట్టడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు."
ప్రపంచాన్ని వెలిగించడానికి, వెలుగు చున్న ఒక్క క్రొవ్వొత్తి చాలు.
ఆయన తాను ఒక క్రొవ్వొత్తిలా నీకోసం నాకోసం కరిగిపోయి నీకు నాకు వెలుగిచ్చాడు.
క్యాండిల్ సర్వీస్ లో ఒక్క క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ ద్వారా కొన్ని నిమిషాల్లో సభలో నున్న వారందరి క్యాండిల్స్ వెలిగించ బడతాయి.

అంటే?
*వెలిగించ బడిన నీవు ---మరొకరిని వెలిగించాలి.
*రక్షించ బడిన నీవు ---మరొకరిని రక్షించాలి.
*సమాధానం పొందుకున్న నీవు--- ఆ సమాధానాన్ని మరొకరికి పంచాలి.

ఇదే జరిగితే?
*లోకంలో ఇంకా అంధకారం మిగిలి ఉండేదా?
*రక్షించబడనివారంటూ వుండేవారా?
* సమాధానంలేకుండా ఉండేదా?
క్యాండిల్ సర్వీస్ పేరుతో ఏదో పది నిమిషాలు అట్లా సంతోష పడుతున్నాంగాని, దానిలోని ఆంతర్యాన్ని గ్రహించి, అనుసరించలేక పోతున్నాం.
కాదంటారా?

సందర్భం కాకపోయినా, క్యాండిల్ అనే సరికి మరొక విషయం గుర్తొచ్చింది. గత సంవత్సరము బెత్లెహేము వెళ్ళినప్పుడు మన వాళ్ళంతా క్యాండిల్స్ పట్టుకొని క్యూ లో వున్నారు.
వీళ్ళంతా ఎందుకు వెలిగిస్తున్నారు? అది వారికే తెలియదు. అందరూ వెలిగిస్తున్నారు కాబట్టి వీళ్ళూ చేస్తున్నారంతే.!
ఇదే హైందవ సహోదరులు చేస్తే? దీపారాధన, విగ్రహారాధన అంటాము. మరి మనము చేసేది ఏంటో?
అంధకారంలో ఉన్నవాడికి క్యాండిల్ వెలిగించి దారి చూపావు అంటే అర్ధముంది.
కాని, లోకానికే వెలుగై యుండి, కోటి సూర్యులకు మించిన తెజోమయునికా? నీవు ఈపని చేసేది. ఇంతకంటే విగ్రహారాధన మరొకటి ఉందా?
వద్దు! సరిచేసుకుందాం! నిజమైన ఆరాధన చేద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


క్రిస్మస్

( పద్నాల్గవ భాగము)


క్రిస్మస్ లో ప్రధానమైన అంశాలలో "విధేయత" ఒకటి.

*ఇద్దరు యవ్వనుల యొక్క
విధేయతే క్రిస్మస్.
*విధేయత లేని నీవు క్రిస్మస్ ఆరాధన చేయలేవు.

మరియ:

ఆమె కన్యక.
లూకా 1:27

*లోక మాలిన్యము తనకు అంటకుండా జీవించిన పరిశుద్దురాలు.
దానిలో ఎట్టిసందేహం లేదు.

ఆమెను పరిశుద్దమైన స్త్రీగా మనము గౌరవించాలి. తన జీవితాన్ని మన జీవితాలకు ఆదర్శప్రాయంగా మలచుకోవాలి.

కాని, ఆరాధించడానికి వీల్లేదు.
కారణం? మనుష్యులు గాని, దేవదూతలు గాని ఆరాధనకు యోగ్యులుకారు. దేవుడొక్కడే ఆరాధనకు పాత్రుడు.

*జ్ఞాలులు కుడా యేసును మాత్రమే ఆరాధించారుగాని, మరియను గాని, యోసేపును గాని కాదు.

*ఎట్లాంటి పరిస్థితులలో ఆమె యేసు ప్రభువుకు తల్లి అయ్యే ధన్యతను పొందుకోగలిగింది?

*మరియ హృదయంలో అద్భుతమైన సంఘర్షణ.
ఒక వైపు రక్షకునికే తల్లి అయ్యే ధన్యత.
మరొక పైపు వివాహం కాకుండా తల్లి అయితే?
లోకంలోఎట్లా జీవించగలగడం?

చివరకి ఒక నిర్ణయానికి వచ్చేసింది. నిందలు, అవమానం భరించడానికే సిద్దపడింది. దేవుడు పంపిన, దూత చెప్పిన వర్తమానముకే విధేయురాలయ్యింది.

*తాను అనుకున్నట్లే జరిగింది.
*లోకం సూటిపోటి మాటలతో ఆమెను హేళన చెయ్యడం ప్రారంభించింది.
*మరియ పరిశుద్దత ఏంటో ఇప్పుడు బయటపడిందని, లోకం కోడై కూస్తుంది.
*చివరకి కొంతకాలం ఇంట్లోనుండి వెళ్ళిపోవలసి వచ్చింది.
*అన్నిటిని భరించింది.

కాబట్టే!
లోక రక్షకునికి తల్లి అయ్యింది.

*దేవుని మాటకు గొర్రెల కాపరులు విధేయులయ్యారు.
*దేవుని మాటకు మరియ విధేయురాలయ్యింది.

*మన సంగతేంటి?
ఇంకనూ ఎదురాడు వారిగానే జీవిస్తున్నామా?
*అవిధేయులుగానే బ్రతుకుతున్నామా?

*ఇంకెంత కాలం?
ఆయనను ఇంకనూ పశువుల తొట్టెలోనున్న శిశువు గానే చూస్తున్నామా?
గొర్రెపిల్ల గానే చూస్తున్నామా?

వద్దు!
ఆయన గర్జించు కొదమ సింహమువలే రాబోతున్నాడు.
ఇంకనూ, విధేయత చూపకుంటే. తప్పించుకోలేము.

విధేయులవుదాం!
శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


క్రిస్మస్

( పదిహేనవ భాగము)


క్రిస్మస్ లో ప్రధానమైన అంశాలలో "విధేయత" ఒకటి.

*ఇద్దరు యవ్వనుల యొక్క
విధేయతే క్రిస్మస్.
*విధేయత లేని నీవు క్రిస్మస్ ఆరాధన చేయలేవు.

యోసేపు:

అతడు నీతిమంతుడు.
మత్తయి 1:19

పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడిన నీతిమంతులలో యోసేపు ఒకడు.

*నీతి అంటే?
ఆయనను నమ్మడమే నీతి.
*నీతిమంతుడు అంటే?
ఆయనను నమ్మినవాడు.
*నీతిమంతుని లక్షణం?
ఇతరులను అవమాన పరచకపోవడం.

*అందుకే నీతిమంతుడైన యోసేపు ఒక తీర్మానమునకు వస్తున్నాడు. మరియను అవమాన పరచకుండా రహస్యముగా విడచి పెట్టాలని.

*వివాహం కాక మునుపే తాను ప్రధానం చేసుకున్న మరియ గర్భం ధరించిందని ఊరంతా తెలిసింది. అది యోసేపుకు గొప్ప అవమానం. కాని, ఆ అవమానాన్ని తానే భరించడానికి నిర్ణయించుకున్నాడు గాని, ఇతరులను అవమాన పరచడానికి ఇష్టపడినవాడు కాదు.

*యోసేపు విధేయుడు:

దూత వర్తమానం తెచ్చాడు. మరియ పరిశుద్దాత్మ వలన గర్భంధరించింది. ఆమెను చేర్చుకోవడానికి వెనుకాడవద్దని.

దేవుని మాటకు విధేయుడయ్యాడు.
ఆమెను చేర్చుకున్నాడు.
గర్భం ధరించిన స్త్రీని చేర్చుకుంటే లోకం ఊరుకుంటుందా?
వాటన్నిటిని భరించాడు.

అందుకే,
ఈ లోకంలో లోకరక్షకునికి తండ్రిగా పిలవబడుచున్నాడు.

*దేవుని మాటకు గొర్రెల కాపరులు విధేయులయ్యారు.
*దేవుని మాటకు మరియ విధేయురాలయ్యింది.
*దేవుని మాటకు యోసేపు విధేయుడయ్యాడు.

*మన సంగతేంటి?
ఇంకనూ ఎదురాడు వారిగానే జీవిస్తున్నామా?
*అవిధేయులుగానే బ్రతుకుతున్నామా?

*ఇంకెంత కాలం?
ఆయనను ఇంకనూ పశువుల తొట్టెలోనున్న శిశువు గానే చూస్తున్నామా?
గొర్రెపిల్ల గానే చూస్తున్నామా?

వద్దు!
ఆయన గర్జించు కొదమ సింహమువలే రాబోతున్నాడు.
ఇంకనూ, విధేయత చూపకుంటే. తప్పించుకోలేము.

విధేయులవుదాం!
శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


క్రిస్మస్

(పదహారవ భాగము)


జ్ఞానులు:
వీరు తూర్పు దేశానికి చెందిన వారు.

వారు ఎంతమంది?
ఏయే దేశాలకు చెందిన వారు?

వీటి గురించి అనేక అభిప్రాయములున్ననూ, బైబిల్ మాత్రం వీటి గురించి ప్రస్తావించ లేదు.

బైబిల్ మాట్లాడని దాని గురించి మనం మాట్లాడుకున్నా ప్రయోజనం శూన్యం.

రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి

యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
మత్తయి 2:1,2

*తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారట.

*రావడానికి గల కారణం?
•ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూచారు.
•అది అన్ని నక్షత్రాలవంటిది కాదు.
•గ్రంధాలు వెదకితే వారికర్ధమయ్యింది.
ఒక రాజు పుట్టాడని.
•ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ యెరూషలేములో హేరోదు రాజు ఇంటికి చేరుకున్నారు.
•ఆ నక్షత్రం అక్కడ ఆగిపోలేదు. వీరే అక్కడ ఆగిపోయారు.

*ఈ రోజు జ్ఞానుల జీవితం నుండి నేర్చు కోవలసిన ఆత్మీయపాటం:

• దేవుడు మా తూర్పు దేశంలో పుడితేనే మేము ఆయనను ఆరాధిస్తాం అని అనుకోలేదు.
•ఇశ్రాయేలు దేశంలో పుడితే ఆయన "విదేశీ దేవుడు" అని తలంచలేదు.

•మన వాళ్ళు ఫేస్ బుక్ లో మెసేజ్ పెడతారు. యేసు క్రీస్తు విదేశీ దేవుడు. మనకొద్దని.

*అయితే ఒక్క విషయం!
ఈ ఫేస్ బుక్ కనిపెట్టింది ఎవరు?
సెల్ ఫోన్ కనిపెట్టింది ఎవరు?
విదేశీయుడు కనిపెట్టింది ఏదీ నాకొద్దు అని, ఒక్క రోజు జీవించగలవా?

వీటికి లేని విదేశీయత,
నీ కోసం ప్రాణం పెట్టిన దేవునికి అంటగడతావా?

జ్ఞానులు అట్లా తలంచలేదు.
కారణం? వారు జ్ఞానులు.
మనం అట్లా తలంచు చున్నామంటే?
కారణం? మనం .......???
(మీరే చెప్పండి)

వద్దు!
మన తలంపులు మార్చుకుందాం!
ఆయనను మన హృదయంలో చేర్చుకుందాం!
నిజమైన క్రిస్మస్ ను ఆరాధిద్దాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


క్రిస్మస్

( పదిహేడవ భాగము)


జ్ఞానులు:
వీరు తూర్పు దేశానికి చెందిన వారు.

రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి

యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. మత్తయి 2:1,2

మన తలంపులు జ్ఞానమునకు అందవు. దానికి జ్ఞానులే ప్రత్యక్ష సాక్షులు.
తూర్పు దేశమునుండి బయలుదేరిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

ఎడారులు, కొండలు, లోయలు, గుట్టలగుండా వారి ప్రయాణం సాగిపోతుంది. రోజులు, వారములు, నెలలు గడచిపోతున్నాయి, ఇంకా ఎంత కాలం? ఎంత దూరం ప్రయాణం చెయ్యాలో?

ఈలోపు వారు యెరూషలేము చేరుకున్నారు. ఒక పెద్ద రాజభవనం వారి కంటపడింది. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

కారణం?
ఈ లోక జ్ఞానం ప్రకారం రాజు, రాజు కుటుంబంలోనే జన్మిస్తాడు.

అంతవరకు నడిపించిన నక్షత్రాన్ని ప్రక్కనబెట్టి, స్వంత నిర్ణయంతో రాజ భవనంలోనికి ప్రవేశించారు.
జ్ఞానులు తీసుకున్న స్వంత నిర్ణయం ఎంత మూల్యం చెల్లించిందంటే?
ఆ దినాలలో రెండు సంవత్సరముల లోపు వయస్సుగల మగ పిల్లలందరినీ హేరోదు చంపించడానికి కారణమయ్యింది.

దేవుని మార్గాన్ని విడచి మనం తీసుకున్న ఎట్లాంటి నిర్ణయాలైనా? మనతో పాటు మన కుటుంబం, సంఘం, సమాజం కూడా భారీమూల్యం చెల్లించాల్సిందే?

కాని, వారు మార్గంతప్పినా, తిరిగి మరళా ఆనక్షత్రాన్ని అనుసరించి గమ్యం చేరుకోగలిగారు.

మన జీవిత ప్రయాణంలో ఎక్కడ తప్పిపోయామో?
దేనికి ఆకర్షించబడి దేవునికి దూరమయ్యామో?

ఈ క్రిస్మస్ దినాలలో ఒక్కసారి మనకు మనమే పరిశీలన చేసుకుందాం!
సరి చేసుకొని, మన గమ్యమైన నిత్యరాజ్యం వైపు సాగిపోదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


క్రిస్మస్

( పద్దెనిమిదవ భాగము)


జ్ఞానులు:
వీరు తూర్పు దేశానికి చెందిన వారు.

రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. మత్తయి 2:1,2

తూర్పు దేశమునుండి బయలుదేరిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
ఎడారులు, కొండలు, లోయలు, గుట్టలగుండా వారి ప్రయాణం సాగిపోతుంది. రోజులు, వారములు, నెలలు గడచిపోతున్నాయి.

దేనికోసం వారి అన్వేషణ?
యూదుల రాజును చూడాలి.

ఎందుకు?
మేము లోక రక్షకుని చూసామని లోకమంతా గొప్పలు చెప్పుకోవడానికా? కానే కాదు. ఆయనను ఆరాధించడానికి.

అందుకే, సూటిగా ప్రశ్నిస్తున్నారు. యూదుల రాజు దగ్గరకే వెళ్లి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయనను పూజించడానికి వచ్చామని.

జ్ఞానులు అర్ధం చేసుకోగలిగారు. ఈ లోకంలో చాలామంది రాజులున్నారు గాని, ఇప్పుడు పుట్టిన రాజు వారివంటి వాడు కాదని.

ఈ లోకంలో దేవుళ్ళు అని పిలువబడే వారు కోకొల్లలు. వారంతా మన కోసం ప్రాణం పెట్టిన వారు కాదని. వారు మనలను నిర్మించలేదని, మనమే వారిని నిర్మించామని మనకూ అర్ధం కావాలి.

అందుకే వారు ఆయనను వెదకుతూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

కాని ఒక్కవిషయం!!!
ఆరాధించే మనసు నీకుంటే?
నీవు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పనిలేదు.

కారణం?
ఆయన నిన్నే వెతుక్కుంటూ వచ్చాడు. నీకోసం వచ్చిన ఆయనను నీ హృదయంలో చేర్చుకుంటేచాలు.
నీ హృదయమనే తలుపు నొద్దనుండి తట్టు చున్నాడు. కనీసం ఈ రోజయినా ఆయనను ఆహ్వానిద్దామా? ఆరాధిద్దామా?

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


క్రిస్మస్

( పంతొమ్మిదవ భాగము)


తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
మత్తయి 2:11
............................

జ్ఞానులు వచ్చి తల్లియైన మరియను ఆ శిశువును చూచారు.

కాని, సాగిలపడి పూజించింది (ఆరాధించింది) "యేసయ్యను మాత్రమే". మరియను కాదు.

నీ హృదయం దేవునితో నిండిపోయినప్పుడు నీ హృదయంలోనుండి వచ్చే చిన్న మూలుగు కూడా ఆరాధనే.

నేటి దినాల్లో ఆరాధనకు
అర్ధం మారిపోయింది.
ఆరాధించే మనసు దూరమయ్యింది.

చెవులు దద్దరిల్లే సౌండ్స్ తో మ్యూజిక్ తో డాన్స్ చేస్తూ , అన్ని పాటలు కలిపిపాడేస్తే దానికి "ఆరాధన" అని పేరు. డ్రమ్స్ ఆగిపోతే ఆరాధన కూడా ఆగిపోతుంది.

ఆరాధన అనేది పదినిమిషాలకు పరిమితమైనది కాదు. ఇది నిరంతర ప్రక్రియ.

మద్యలో ఈ డాన్స్ ఏంటి అంటే? మరళా దావీదు దగ్గరకు వెళ్లి పోతారు. డాన్స్ కి మాత్రం దావీదును వాడుకుంటారుతప్ప, దావీదు కలిగియున్న పశ్చాత్తాపంలో లేస మాత్రమైనా వీరి జీవితాల్లో కనిపించదు.

ఈలోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాధించిన వారు, జ్ఞానులుగా పిలువబడినవారు
మేమెందుకు? ఆ శిశువు ముందు సాష్టాంగపడాలి? అని అనుకోలేదు. కారణం? ఆయన ఎమైయున్నాడో వారు అర్ధం చేసుకోగలిగారు.

ఆయన ఏమయ్యున్నాడో దానిని బట్టి ఆయనను గొప్పచెయ్యడమే నిజమైన "ఆరాధన."

సంవత్సరాలు మన జీవితంలో దొర్లిపోతున్నాయి గాని, మనమింకా ఇట్లాంటి అనుభవంలోనికి ప్రవేశించలేదేమో?

కనీసం ఈ క్రిస్మస్ దినాల నుండి అయినా, నిజమైన ఆరాధన చెయ్యడానికి మన హృదయాలను సిద్ద పరచుకుందాం.

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


క్రిస్మస్

( ఇరువదవ భాగము)


తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
మత్తయి 2:11
............................

జ్ఞానులు తమ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించిరి.

మనమునూ మన హృదయమనే పెట్టెలు విప్పి, మన హృదయాన్ని ఆయన పాదాల చెంత క్రుమ్మరించి కానుకలు సమర్పించాలి.

జ్ఞానులు సమర్పించిన కానుకలలో మొదటిది "బంగారము".

*పక్షులలో పావురము
*జంతువులలో గొర్రెపిల్ల
*రంగులలో తెలుపు
*లోహములలో బంగారము "పరిశుద్దతకు" గుర్తు.

*జ్ఞానులు బంగారము సమర్పించడము ద్వారా ఆయన "పరిశుద్ధుడు" అనియు, ఆయనను ఆరాధించు వారు "పరిశుద్దతతో" ఆరాధించాలని తెలియజేస్తున్నారు.

అయితే?
మన క్రిస్మస్ ఆరాధనలో పరిశుద్దత ఎంత?

•ఎప్పుడూ త్రాగని వాడు సహితం సంవత్సరానికి ఒక్కసారి అన్నట్లు క్రిస్మస్ రోజే త్రాగుతున్నాడు.

• ఇక మనం ధరించే వస్త్రాల గురించి మాట్లాడకపోవడమే మేలు. (అట్లా అని అందరూ కాదు. ఆ కొందరే అందరిమీద ప్రభావం చూపుతున్నారు)

•మనం పాడే పాట ఎవ్వరికీ అర్ధం కాదు. కారణం?
హద్దులు మీరిన సంగీతం.
వీటిలో కూడా పరిశుద్దత లోపించింది.

జీవంలేని సంగీత పరికరాలు దేవుని స్తుతించలేవు. ఆరాధించలేవు.
ఏదయినా చెయ్యాలంటే? జీవం కలిగిన నీవేచెయ్యాలి. నీ సంగీతం దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి గాని నీ సంగీత ప్రతిభ చూపించేదిగా ఉండకూడదు మరియు ఇతరులకు విపరీత ధ్వనితో అభ్యంతరంగా ఉండకూడదు

కాని, మనమేమో? జీవించు చున్నామన్న పేరుమాత్రం వుందిగాని జీవచ్చవాలలానే బ్రతుకుతున్నాం.

• ఇక డాన్స్ లు గురించి చెప్పనవసర్లేదు. డాన్స్ లు ద్వారా మనం సమాజానికి ఇచ్చే వర్తమానం ఏంటో? క్రీస్తు జన్మించినప్పుడు ఎవ్వరూ డాన్సు చేసినట్లు బైబిల్ లో కనిపించదు.

ఇదేనా? క్రిస్మస్ ఆరాధన పేరుతో మనం సమర్పించే
"బంగారు కానుక".

వద్దు!
ఆయన పరిశుద్దుడై యున్నలాగున మనము కూడా పరిశుద్దులమై యుండి, పరిశుద్దతతో ఆయనను ఆరాదిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!



క్రిస్మస్

( ఇరువైయొకటో భాగము)


తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 2:11

జ్ఞానులు సమర్పించిన కానుకలలో మొదటిది "బంగారము".

*బంగారము సమర్పించడము ద్వారా ఆయన "పరిశుద్ధుడు" అనియు, ఆయనను ఆరాధించు వారు "పరిశుద్దతతో" ఆరాధించాలని తెలియజేస్తున్నారు.

*బంగారము రాజ్యాధికారమును సూచిస్తుంది.
అందుకే ఒకరాజు మరొకరాజును దర్శించేటప్పుడు బంగారమును కానుకలుగా తీసుకువెళ్ళేవారు.
షేబా దేశపు రాణి కూడా రాజయిన సొలోమోనును దర్శించడానికి వెళ్ళినప్పుడు అట్లానేచేసింది.

జ్ఞానులు బంగారమును సమర్పించారు అంటే? ఆయనను రాజుగా గుర్తించారు.

అందుకే ఎట్లాంటి సందేహం లేకుండా రాజైన హేరోదు దగ్గరకే వెళ్లి అడుగుతున్నారు.
యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అని.

అట్లాంటి అనుభవం మన జీవితాల్లో లోపించింది.
ఆయన రాజు అని చెప్తున్నాము. కేవలం అది మాటలకే పరిమితం.
మన హృదయాన్ని పరిపాలించే రాజుగా ఆయనని అంగీకరించ లేకపోతున్నాం.

మన మీద మనమే రాజుగా వుండాలని కోరుకొంటున్నాము తప్ప, మన జీవితంలో ఆయన రాజుగా ఉండడానికి ఇష్టపడలేక పోతున్నాం.

కారణం?
మన జీవితంలో ఆయన రాజుగా వుంటే? మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కుదరదని.

ఇంకెంత కాలం ఇట్లా?

నీ జీవితంలో ఆయన రాజుగా లేకపోతే?
నీ జీవితానికి సార్ధకత లేనేలేదు.

సాతాను చెరలో మ్రగ్గిపోతున్న మనం, కనీసం ఇప్పటికైనా మన జీవితంలో ఆయనను రాజును చేద్దాం!
ఆయన రాజరికంలో యువరాజులుగా జీవిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత ,దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


క్రిస్మస్

( ఇరువైరెండో భాగము)


తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 2:11

జ్ఞానులు సమర్పించిన కానుకలలో మొదటిది "బంగారము".
*బంగారము సమర్పించడము ద్వారా ఆయన "పరిశుద్ధుడు" అనియు, ఆయనను ఆరాధించు వారు "పరిశుద్దతతో" ఆరాధించాలని తెలియజేస్తున్నారు.

*బంగారము రాజ్యాధికారమును సూచిస్తుంది. ఆయన రాజు అనియు, ఆయన రాజరికంలో మనముండాలని తెలియజేస్తుంది.
*జ్ఞానులు బంగారం సమర్పించడంద్వారా మనపట్ల దేవుడు ఎట్లాంటి అధ్బుతమైన ప్రణాళికను కలిగియున్నాడో అర్ధమవుతుంది.

హేరోదు యేసును చంపించే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా యోసేపు కుటుంబ సమేతముగా ఐగుప్తుకు వెళ్లి కొంతకాలం అక్కడ జీవించ వలసివస్తుంది.
అటువంటి పరిస్థితులలో వారి జీవనాధారం ఎట్లా?
అందుకే, జ్ఞానులు సమర్పించిన బంగారం వారి అవసరాలు తీర్చేదిగావుంది.

అవును!
కొన్ని సందర్భాలలో నీకు సమస్య రాకముందే పరిష్కారాన్ని ఆయన సిద్దం చేస్తాడు. మరి కొన్ని సందర్భాలలో సమస్య వచ్చిన తర్వాత ఆయన పరిష్కరిస్తాడు.

ఆయనకు అసాధ్యమైనది ఏదీలేదు. అన్నీ సుసాధ్యమే.

ఇదెప్పుడు సాధ్యం?
ఆయనను రాజుగా నీ జీవితములో అంగీకరించి, చేర్చుకొని, నీపై రాజ్యాధికారాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించినప్పుడు.

జ్ఞానులు వెతుక్కొంటూ ఆయన కోసం వెళ్ళారుగాని, ఆయనే వెతుక్కొంటూ నీకోసం వచ్చాడు.

ఆయన నీ హృదయమనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఆయన మర్యాదస్థుడు. త్రోసుకొని లోనికి వచ్చేవాడుకాదు.
ఆయన మెల్లనైన స్వరాన్ని వినడానికి ప్రయత్నం చెయ్యి.
ప్రశాంతమైన మనస్సుతో తట్టుచున్న శబ్దాన్ని వినడానికి నీ హృదయాన్ని సిద్ద పరచుకో!

ఈ సంవత్సరాన్ని దాటిపోవడానికి ఒక్క దినమే నీమధ్యలో వుంది.
కనీసం, ఈదినమైనా ఆయనను చేర్చుకో!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత ,దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పాపము

పొట్టి జక్కయ్య

పక్షిరాజు

యేసు క్రీస్తు రెండవ రాకడ

శరీర కార్యములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

సమరయ స్త్రీ

అబ్రాహాము విశ్వాసయాత్ర

విశ్వాసము