ఆదరించు మాటలు
ఆదరించు మాటలు-1
కెరీతు వాగుదగ్గర దాగియుండుము 1 రాజులు 17:3
ఏలియా తో దేవుడు చెప్తున్నాడు. నీవు కేరీతు వాగుదగ్గర దాగియుండు.
అవును! దేశంలో మూడున్నర సంవత్సరముల వరకూ వర్షం పడదు. త్రాగడానికి సహితం నీళ్ళు దొరకవు, పంటలు పండవు. కరవుతో అల్లాడిపోవలసిన పరిస్థితులు రాబోతున్నాయి. అయితే దేవుడు తన సేవకుని సమృద్దియైన జలాల యొద్దకు నడిపిస్తున్నాడు.
ఆయన నడిపిస్తున్నప్పుడు సాగిపోతున్నాడు.అంతేగాని, అయ్యో! అక్కడ నేను ఎట్లా ఒంటిరిగా వుండగలను? నాకు ఆహారం ఎట్లా? ఇట్లాంటి ప్రశ్నలేమీలేవు.
త్రాగడానికి కేరీతు నీళ్ళున్నాయి. మరి తినడానికి ఎట్లా? ఆకలితో ఎదురు చూస్తున్నాడు. అటు వైపుగా ఒక కాకుల గుంపు ఎగురుకొంటూ వస్తుంది. కాకులు అరుస్తూ వస్తాయి. కాని ఇవి నిశ్శబ్దంగా వస్తున్నాయి. ఏలియా చూస్తుండగానే ఆ గుంపు అతని ముందు దిగింది. ఆశ్చర్యం! వాటి ముక్కున రొట్టెలు, మాంసపు ముక్కలున్నాయ్. చేతుల్లోనుండి తన్నుకుపోయే కాకులా ఆహారం తెచ్చేది? అవును! ఆయనకు సమస్తమూ సాధ్యమే.
ఒంటరితనము అనే కెరీతువాగు దగ్గర, సమస్యల సుడిగుండం అనే కెరీతువాగు దగ్గర దేవుడు నిన్నుంచితే? అక్కడే వుండు. భయపడకు. ఏలియాకు తోడైయున్న దేవుడు నీకునూ తోడుగా ఉంటాడు. ఏలియాను పోషించిన దేవుడు నిన్నునూ పోషించగలడు.
సృష్టిని సహితం తన చేతుల్లోనికి తీసుకోగలిగిన సృష్టికర్త ఆయన.
నీకెట్లా తోడైవుంటాడో?
నిన్నెట్లా ఆదరిస్తాడో?
నిన్నెట్లా పోషిస్తాడో?
నీకు తెలియదు.
కెరీతు వాగు ఎండిపోయింది. ఇప్పుడెలా? దేవుడు మరొక మార్గాన్ని సిద్దం చేసాడు. నీఆశలన్నీ అడి ఆశలయ్యాయేమో? నీ మార్గాలన్నీ మూసుకుపోయాయేమో?భయపడవలసినది లేదు. ఆయన మరొక మార్గాన్ని నీకోసం సిద్ధం చేస్తాడు. ఆ మార్గమేమిటో అనుభవించే వరకూ, నీ ఊహలకు సహితం అందదు.
దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పి 4:19
నీ అవసరాలలో కొన్నింటిని మాత్రమే కాదు. నీ ప్రతీ అవసరమును ఆయన తీర్చబోతున్నాడు.
నీవు చెయ్యవలసినదెల్లా ఒక్కటే!
ఆయన చాటున దాగియుండు.
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్
ఆదరించు మాటలు-2
నా కృప నీకు చాలును.
2 కొరింది 12:9
కృప అంటే?
"అర్హత లేనివాడు అర్హునిగా ఎంచ బడడమే కృప."
దొంగ దోచుకోవడానికి వచ్చి దొరికిపోయాడు. అతనిని ఏమి అనకుండా క్షమించి విడచి పెట్టేస్తే అది జాలి, దయ అని చెప్పొచ్చు. అట్లా కాకుండా అతనికి భోజనం పెట్టి, బస్ చార్జీలు ఇచ్చి పంపిస్తే? అది కృప.
ప్రభువా అని పిలువడానికి కూడా అర్హతలేని మనకు తండ్రీ అని పిలిచే యోగ్యత నిచ్చింది ఆయన కృప.
వ్యక్తిగత, కుటుంబ, మానసిక, ఆర్ధిక, సామాజిక సమస్యలతో అల్లాడిపోతున్న పరిస్థితులా?
ఏ రేవుకెళ్ళినా ముండ్ల పరిగే అన్నట్లుగా సాగిపోతుందా జీవితం?
భయపడవద్దు. దిగులు చెందవద్దు. నీ ప్రియ రక్షకుడు నీకిస్తున్న వాగ్దానం 'నా కృప నీకు చాలు'
అవును! అవి ఎట్లాంటి పరిస్థితులైనాసరే. చివరకు అది అగ్నిగుండమైనా సరే. ఆయన కృప నీకు తోడుగా వుండబోతుంది. ఆయన కృప నీకు తోడుగా వుంటే? అగ్నిగుండం సహితం నిన్నేమి చేయగలదు?
పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు
యెషయా 54:10
అట్టి కృపను నిర్లక్ష్యం చెయ్యొద్దు. చులకన చెయ్యొద్దు. శోధనలగుండా సాగిపోతున్న నీవు ఈ ఒక్క మాట హృదయ పూర్వకంగా చెప్పగలిగితే? చెప్పలేనంత సమాధానాన్ని పొందుకోగలవు.
ఒక్కసారి ప్రయత్నించి చూడు!
ప్రభువా! నీ కృప నాకు చాలును.
ఆమెన్! ఆమెన్! ఆమెన్
ఆదరించు మాటలు-3
ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును.
కీర్తనలు 27:5
ఆయన పర్ణ శాలలో ఎప్పుడు అడుగు పెట్టగలమంటే?
ఆపత్కాలంలోనే?
కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మనలను ఆయన పర్ణశాలకు చేర్చే మార్గాలు.
శోధన, వేదన లేకుండా ఆయన పర్ణశాలలో అడుగుపెట్టలేవు.
ఆపదలు వచ్చినప్పుడు కృంగిపోయి దేవుని నుండి దూరంగా పారిపోవడం కాదుగాని, ఆపదలు వచ్చినప్పుడే ప్రార్ధనా బలిపీటం కట్టి ఆయనకు అత్యంత సన్నిహితమై, ఆయనపైనే ఆధారపడుతూ ఆయన పర్ణశాలలో అడుగుపెట్టాలి.
ఆయన పర్ణ శాలలో నీవుంటే?
ఇక శత్రువు నిన్నేమి చెయ్యగలడు?
సాతాను సంధించేవి ఎంతటి వాడిగల బాణాలైనాసరే? కనీసం నీ దరిదాపుల్లోకి కూడా రాలేవు.
శోధనల గుండా సాగిపోతున్నావా?
సమస్యల సుడిగుండంలో పడి తిరుగుతున్నావా? ఆదరించేవారు లేక, ఓదార్చేవారే లేక, తల్లడిల్లి పోతున్నావా? శోధనలలో నీ విశ్వాసాన్ని కాపాడుకో గలిగితే? ఇక పర్ణశాల ఎంతో దూరంలో లేదు.
పర్ణశాలలో అడుగు పెట్టగలిగితే?
నీ కన్నీటిని ఆయన ప్రేమతో తుడుస్తాడు. నీ కన్నీరు నాట్యముగా మారుతుంది. నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి.
ఒక్క చిన్నమాట ఆయనను అడుగుదామా?
ప్రభువా! శోధనలగుండా సాగిపోతున్నాను. విడిపించి, నీ పర్ణశాలలో దాచిపెట్టు.
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ఆదరించు మాటలు-4
నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము.
కీర్తనలు 42:5
"నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? .......దేవునియందు నిరీక్షణ యుంచుము"
ఈమాటలు
*ఎవరు చెప్పగలరు?
ఒక విశ్వాసి చెప్పగలడు.
*ఎప్పుడు చెప్పగలరు?
విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే.
* విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయి ఏమిటి?
ఈ ప్రపంచంలో నేను, దేవుడు ఇద్దరం మాత్రమే ఉన్నాము. ఇంకెవ్వరులేరు అనుకున్నప్పుడు, పూర్తిగా ఆయనపైనే ఆధారపడే స్టితి.
అందుకే కీర్తనాకారుడు ఇట్లా చెప్పగలుగుతున్నాడు. తన బాధలు చెప్పుకోవడానికి ఇంకెవ్వరూ కనిపించలేదు. అందుకే తనే తన ప్రాణంతో చెప్పుకొంటున్నాడు.
*ఒంటరితనమా?
*సమస్యల సుడిగుండమా?
*చెలరేగే తుఫానా?
*ఆప్తులంతా దూరమైనపరిస్థితా?
*ఆధ్యాత్మిక, ఆర్ధిక, ఆరోగ్య, కుటుంబ, మానసిక
సమస్యలా?
*శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములా?
సమాధానం లేదనుకొంటున్న ప్రశ్నలా?
పరిష్కారం లేదనుకొంటున్న సమస్యలా?
*గమ్యం తెలియని పయనమా?
అయితే, నీ ప్రతీ పరిస్టితికి పరిష్కారం.
1. నీలో నీవు తొందర పడొద్దు.
బస్సులో ప్రయాణం చేస్తున్న నీవు ప్రమాదం ముందుందని నీలోనీవు కంగారుపడితే ఏమి ప్రయోజనం? ఆ బస్సు నడిపేది నీవు కాదుకదా? బస్సు....డ్రైవర్ చేతిలో వుంది.
అట్లానే, నీ సమస్యల్లో నీవు కంగారు పడినా ఏమి ప్రయోజనం? నీ జీవితం యేసయ్య చేతిలో వున్నప్పుడు. ఆయనే ప్రతీ పరిస్టితి గుండా నడిపిస్తూ గమ్యం చేర్చుతాడు.
2.దేవుని యందు నిరీక్షించు:
ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసావేమో?
ఇక ఇది నా జీవితంలో సాధ్యం కాదని.
నీకు కాకపోవచ్చు. కాని, నీ దేవునికి సమస్తము సాధ్యమే.
అబ్రహాము "నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను." రోమా 4:18
( ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు.)
నీవు నిరీక్షించగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు.
3.శ్రమలలో దేవుని స్తుతించు:
నీ సమస్యలు ఎంత ఎక్కువగా వుంటే అంత ఎక్కువగా దేవుని స్తుతించు.
ఆ స్తుతుల మధ్య సాతాను నిలువలేక పారిపోతాడు. సమస్యల సృష్టికర్త సాతాను పారిపోతుంటే, నీ సమస్యలన్నీ వాడి వెంటే పరుగులు తీస్తాయి.
ఇక శాంతి, సమాధానమే నీ దగ్గర మిగులుతుంది.
ప్రయత్నించి చూడు!
విజయం నీదే!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ఆదరించు మాటలు-5
"ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు."
కీర్తనలు 73:25
ఆసాపు లేవీ గోత్రమునకు చెందినవాడు.
లేవీయులకు స్వాస్థ్యము లేదు. ఎందుకంటే,
"యెహోవాయే వారికి స్వాస్థ్యము"
ఇప్పటికి ఆసాపు తనకు తగిన ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నాడు.
అందుకే అనగలుగుతున్నాడు.
*నీవు తప్ప నాకెవరున్నారు?
ఈ మాట ఎవరు చెప్పగలరు?
ఆయన మీద పూర్తిగా ఆధారపడినవారు మాత్రమే.
"నీవు నాకు (స్వాస్థ్యముగ) వుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు."
ఎంత ఉన్నతమైన దశకు చేరుకుంటే ఆసాపు ఈ మాట చెప్పగలడు?
ఇంత వరకూ నాకు అదిలేదు ఇదిలేదు అని మాట్లాడిన ఆసాపు, ఇప్పుడు అంటున్నాడు. నాకు ఏదీ వద్దు. "నీవుంటే చాలు".
"అవును! ఆయన వుంటే చాలు"
*ఆశీర్వాదాలకు కర్త మనతో వుంటే, ఇక ఆశీర్వాదాలతో పనేముంది?
*యాకోబుతో దేవుడు అంటున్నాడు "నీతో పాటు నేను ఐగుప్తుకు వస్తాను" అని. ఆయనే వస్తే ఇక భయమేంటి?
*హెబ్రీ యువకులతో దేవుడు వున్నప్పుడు, అగ్ని గుండం ఏమి చెయ్యగలిగింది?
* సింహాల బోనులో దానియేలుతో దేవుడు వున్నప్పుడు సింహాలు ఏమిచెయ్య గలిగాయి?
సమస్యల సుడిగుండమా?
ఆర్ధిక సమస్యలా?
ఆరోగ్య సమస్యలా?
కుటుంబ సమస్యలా?
ఉద్యోగ సమస్యలా?
అవి ఎట్లాంటి పరిస్తితులు అయినా కానివ్వండి.
ఈ మాట నీవు చెప్పగలగాలి
"యేసయ్యా! నీవుంటే నాకు చాలు"
ఇది పెదవులకే పరిమితం కాకూడదు.
నీ హృదయంతరంగం లోనుండి రావాలి.
అదెప్పుడు సాధ్యం?
ఆసాపు చేరుకున్న ఆ పరిపూర్ణమైన అనుభవం లోనికి మనమూ చేరుకున్నప్పుడు.
ఆరీతిగా మన జీవితాలను సరిచేసుకుందాం!
ఆశీర్వదించబడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి