లేయా

లేయా –మొదటి భాగం


లేయా

Genesis(ఆదికాండము) 30:20
20.అప్పుడు లేయాదేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.

ప్రియ దైవజనమా! యేసుప్రభులవారి దివ్యనామంలో మీ అందరికి శుభాది వందనములు. ఈసారి ఒక త్రోసివేయబడిన, ప్రేమకు నోచుకోలేకపోయిన స్త్రీకోసం ధ్యానం చేస్తూ, ఆమె పాత్ర ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేద్దాం! మరోసారి మీకు ఈ వచనాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను.
1కొరింథీ 10:11 ఈ సంగతులు వారికి సంభవించి, ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడియున్నవి.
చూశారా బైబిల్ గ్రంధం మొత్తం ఇశ్రాయేలీయుల కోసమో, లేక BCలో ఉన్నవారికోసమో లేక యేసుప్రభులవారు ఈలోకం లో ఉన్నప్పుడు ఉన్న వారికోసమో వ్రాయబడలేదు గాని, ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడియున్నది.

ఈ స్త్రీ పాత్ర ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న కోట్లాదిమంది స్త్రీలకు అతికినట్లు సరిపోతుంది. ఆమె తన జీవితకాలమంతా, తన భర్తతో కాపురం చేసినంత కాలం ఏమీ కోరుకోలేదు. మణులు మాణిక్యాలు, చీరలు ఆభరణాలు కోరుకోలేదు. గాని కేవలం తన భర్తనుండి ప్రేమను కొరుకొంది. తన భర్త తనతో ప్రేమగా మాట్లాడితే చాలు, తనతో కాపురం చేస్తే చాలు. తనని హత్తుకొంటే చాలు అనుకొంది అంతే!! ఇదేమీ పెద్ద కోరిక కాదు. సాటిస్త్రీ ఆశించే కనీస కోరిక! హక్కు! దీనికి కూడా నోచుకోలేక పోయిన ఓ దురదృష్టవంతురాలు ఈమె!

ఇంతకీ ఆమె భర్త ఎవరు? ఓ త్రాగుబోతా? శాడిస్టా? మోనార్కా? దేవుడంటే తెలియని వాడా?
కాదు! కాదు! కాదు!
ఓ గొప్ప దైవభక్తుడు!!! ఓ గొప్ప ప్రార్ధనాపరుడు! దర్శనాలు చూసి, దేవునితోనే మాట్లాడిన అనుభవం కలవాడు! ఓ గొప్ప దైవజనుని కుమారుడు. ఓ గొప్ప ప్రార్ధనాపరురాలి కుమారుడు. ఓ గొప్ప విశ్వాస వీరుడి మనవడు. ఆతని భక్తికి మెచ్చి దేవునిసేన (దేవుని దూతలు) ఎదురెల్లి అతనిసేనతో కలసి మహనయీము దగ్గర నాట్యం చేసాయి. అవ్వ! ఇంత గొప్ప భక్తుడు, దర్శన అనుభవం కలవాడు చేయవలసిన పనేనా ఇది? దేవుడెప్పుడు అతనిని గద్ధించలేదా? కనీసం అతని మనస్శాక్షి గద్ధించలేదా? ఇంతకీ అతని పేరేమిటి?
అతని పేరు *యాకోబు అనే ఇశ్రాయేలు*!! ఆమె పేరు *లేయా*!!
మరి లేయా చేసిన ద్రోహమేమిటి? పాపమేమిటి? ఎందుకు తనభర్త లేయాను ప్రేమించలేదు?
లేయా ఏమైనా చెడు తిరుగులు తిరిగేదా? వ్యభిచారా? కోపిష్టా? భర్తని సాధించే గయ్యాలా?
కాదు! కానేకాదు! మరి ఆమె చేసిన నేరమేమిటి? ఆమె చేసిన నేరం ఆమె అందవిహీనంగా పుట్టడమే! బలహీనమైన కన్నులు కలిగి ఉండడం! అంటే మన వాడుక బాషలో చెప్పాలంటే పుసికల్లు కలది. (కంట్లో ఎప్పుడూ పుసులు కారుతుంటాయి) .

లేయా నన్ను పెళ్లి చేసుకోమని యాకోబుగారిని అడగలేదు. తన తండ్రి చేసిన మోసానికి యాకోబుగారితో పాటు తను కూడా మోసపోయింది. తనచెల్లి పెళ్లి జరుగవలసి యుండగా, తన చెల్లిని పంపక, చీకట్లో ముసుకువేసి, చెల్లికి బదులుగా లేయాను పెళ్లి చేసాడు.(ఆ దేశంలో ఇప్పుడు కూడా స్త్రీకి పెల్లయినంత వరకు ముసుకు తీయరు. భర్త పెళ్లి జరిగేటప్పుడు ముసుకు తీయాలి) దీనిని మనస్సులో ఉంచుకొని ఇంత భక్తిపరుడు కూడా తన భార్యకు అన్యాయం చేసాడు. మొక్కుబడిగా అప్పుడప్పుడు కాపురం చేసాడు. ప్రేమతో చేయలేదు. లేయా తన జీవితంలో ఎంత భాద పడిందో మీద వచనం ప్రకారం చూడొచ్చు!
దేవుడు నాకు మంచి బహుమతిని ఇచ్చాడు! నా భర్తకు నేను ఆరుగురు కుమారులను కంటిని కనుక అతడికను నాతో కాపురం చేయును అని అనుకొంటుంది. ఎంతఘోరమో చూడండి. ఆరుగురు సంతానం కన్న తర్వాత కూడా ఇంకా నా భర్త నాతో కాపురం చేస్తాడో లేదో అన్న అనుమానం! భయం! నేటిరోజుల్లో మన దేశంలో చాలామంది స్త్రీలు ఇలానే భాదపడుచున్నారు. నా భర్త నన్ను ప్రేమగా చూసుకొంటే చాలు అని అనుకొంటున్నారు. విదేశీ సంస్కృతిలో తన భర్త ప్రేమగా చూడకపోతే మరొకరిని చూసుకొంటుంది గాని మన సంస్కృతి, ఇశ్రాయేలీ సంస్కృతి అది కాదు. జీవితాంతం భర్తతో జీవించాల్సిందే!

మరి దీంట్లో లేయా తప్పేముంది? ఓ త్రాగుబోతు భాషలో చెప్పాలంటే అది దేవుడు చేసిన తప్పు! విధాత రాసిన గీత! మన భారతీయ భాషలో అది ఆమె కర్మ! మన క్రైస్తవ భాషలో అది దేవుని ప్రణాళిక! దానిని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు! అది దేవుని చిత్తం! మరలా ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకొందాం! 1కొరింథీ 10:11 వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి.

ప్రియ విశ్వాసి! ఒకవేళ నీవుకూడా అలాగే భర్తప్రేమకు నోచుకోలేక, పిల్లల ప్రేమ నోచుకోలేక భాదపడుతున్నావా? దయచేసి విచారించకు! ఒక విషయం చెప్పనా దేవుడు ఆమెను దీవించి ఆమె గర్భం నుండి గొప్ప గొప్ప వారు వచ్చేలా చేసారు. ఆమె గర్భం నుండే ఇశ్రాయేలీయులకు ముఖ్యమైన రాజరికం, యాజకత్వం రెండూ వచ్చాయి. బైబిల్ గ్రంధంలో వ్రాయబడిన అనేక గొప్ప వ్యక్తులు ఆమె గర్భం నుండే వచ్చారు. కాబట్టి తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన కాడిక్రింద దీన మనస్కులై యుండిడి 1 పేతురు 5:6.

అట్టి దీనమనస్సు, తగ్గింపు, నిరీక్షణ మనందరికీ మెండుగా కలుగును గాక! ఆమెన్!

దైవాశీస్సులు!

(సశేషం)


లేయా –రెండవ భాగం



*ఎప్పుడు జరిగింది*:
బైబిల్ ప్రకారం- ఆదాముగారి నుండి అబ్రహాముగారికి 2000 సం.లు. అబ్రహాముగారినుండి యేసుప్రభులవారి వరకు 2000 సం.లు.
క్రీ.పూ. 2000 లో అబ్రహాం గారు పుట్టారు. అబ్రహాం గారికి 100 సం.ల వయస్సులో ఇస్సాకు గారు పుట్టారు అనగా BC 1900 లో పుట్టారు. ఇస్సాకు గారికి సుమారు 60 సం.ల వయస్సులో యాకోబుగారు పుట్టారు. అనగా BC 1840లో. యాకోబుగారు సుమారు 40సం.ల వయస్సులో పద్దనరాము కి బయలుదేరి వెళ్ళారు.

చరిత్ర ప్రకారం ఆదికాండం 29-34 అధ్యాయాలు BC 1790-1704 వరకు జరిగినవి. ఈ సం.లలోనే యాకోబుగారు లేయాను, రాహేలుని వివాహం చేసుకోవడం, వారిద్వారా 12మంది కుమారులను, ఒక కుమార్తెను కనడం, ఆస్తి సంపాదించుకొని తిరిగి తన తండ్రియొద్దకు రావడం జరిగింది.

*అదే సమయంలో మిగతా దేశాలలో ఏం జరుగుతుంది*:

లేయా చరిత్ర జరిగే రోజులలో- - చైనాలో యు-చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఈజిప్టు దేశంలో మధ్యంతర రాజ్యాలు పుట్టుకొచ్చి వాటిపాలన సాగుతుంది. అస్సీరియా ప్రాంతం రమ్మన్ పరిపాలనలో ఉంది. టర్కీని హిత్తీయులు ఆక్రమించుకొని పాలిస్తున్నారు. బబులోను ప్రాంతం అనగా నేటి ఇరాక్ హమ్మురబి బబులోను సామ్రాజ్య నిర్మాణం చేయడం జరిగింది.

పేర్లకు అర్ధాలు:

లేయా- పాడి ఆవు, దివాలాతీయడం
యాకోబు- మడిమెను పట్టుకొనువాడు, మోసగాడు
రాహేలు- పాడి గొర్రె, (అభివృద్దికి సాదృశ్యం)
లాబాను- తెల్లని, (తెల్లని కుష్టు కలవాడు అని కూడా అర్ధం)

ముఖ్య ఉద్దేశం:

1. మనిషి యొక్క (నిజమైన) విలువ తెలుసుకోవాలి. యాకోబుగారు లేయా విలువ, గొప్పతనం, వ్యక్తిత్వం తెలుసుకోలేక జీవితాంతం భాదపెట్టారు. అయితే దేవుడు ఆమె బాధ, తపన హృదయాలనెరిగిన వాడు గనుక ఆమె హృదయం తెలుసుకొన్నారు. అంతేకాకుండా యాకోబు బాహ్య సౌందర్యం కోసం తాపత్రయ పడితే దేవుడు ఆమె అంతరంగ, ఆత్మ సౌందర్యాన్ని ఇష్టపడి ఆమె ద్వేషింపబడుతున్నా సరే, ఆమెను 6గురు కుమారులకు, ఒక కుమార్తెకు తల్లిగా చేసారు. అంతేకాకుండా ఇశ్రాయేలీయులకు రాజరికాన్ని, యాజకత్వాన్ని ఆమె గర్భమునుండే వచ్చేలా చేసారు.

2. దేవుని (చివరి) ప్రణాళిక మీద విశ్వాసము ఉంచాలి. నీపట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఒక ఉద్దేశ్యం ఉంది. అది నీకు ఇప్పుడు తెలియక పోయినా , అర్ధం కాకపోయినా సరే, దేవుని ప్రణాళిక మీద సంపూర్ణ విశ్వాసం కలిగియుండు. లేయాకు దేవుని ప్రణాళిక ఆనాడు తెలియదు. గాని దేవునిపై విశ్వాసముంచినప్పుడు ఆమె ఎంత ఆశీర్వదింపబడిందో ఈ రోజు మనందరికీ తెలుసు.

లేయా జీవితం ద్వారా ఏమి నేర్చుకోవచ్చు:

1. లేయా తల్లిదండ్రులు యెహోవా దేవుణ్ణి అనుసరించేవారు కాదు గాని లేయా యాకోబుగారిని వివాహం చేసుకొన్న తర్వాత ఆమె దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచి (ఆమె చెల్లి రాహేలుకి ఆ విశ్వాసం లేక గృహ దేవతలను ఆశ్రయించింది)- లేయా ఎన్నో ఆశీర్వాదాలు పొంది ఒక ఉదాహరణగా మారింది.

2. లేయా తను చేయని తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవించింది. తన తండ్రి తనను, తన భర్తను మోసగించి పెళ్లి చేసాడు. ఆ మోసంలో లేయాకు కూడా భాగముంది అనుకొని యాకోబు జీవితాంతం లేయాకు దూరంగా ఉన్నాడు. అయినా సరే లేయా ఎప్పుడూ తన భర్తను, తన తండ్రిని, పుట్టించిన దేవున్ని నిందించలేదు. ఎప్పుడూ నిరాశ, నైరాశ్యం లో మునిగి పోలేదు. నీవుకూడా నీకు కలిగిన బాధలను బట్టి నీ తల్లిదండ్రులను, భర్తను నిందించవద్దు. అందువల్ల ఒరిగేదేమీ లేదు. లేయా ముగ్గురుని కన్న తర్వాత పరిస్తితులకు సర్దుకుపోయి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. అంతే ఆమె జీవితం ఆశీర్వదించబడటం మొదలయ్యింది. తన భర్త తనను ప్రేమించకపోయినా తనతో దేవుడున్నాడు అనే భరోసాతో సంతోషంగా గడిపింది. కాబట్టి దేవుని మీద నమ్మకం పెట్టుకొని, నీ పట్ల ఆయనకు ఏదో ప్రణాళిక ఉంది అని నమ్మి, సాగిపో! దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించి, నిన్ను అందరికి ఆశీర్వాదకరంగా వాడుకొంటారు!

ఆమెన్!

దైవాశీస్సులు!

(సశేషం)


లేయా –మూడవ భాగం



యాకోబు flashback-1
లేయా సంఘటన పూర్తిగా అర్ధం కావాలంటే మనం యాకోబుగారి flashback తెలుసుకోవాలి. శారమ్మ చనిపోయిన తర్వాత ఆదికాండం 24వ అధ్యాయంలో విశ్వాసులకు తండ్రియైన అబ్రహాము గారు విశ్వాసంతో ఎలియాజరును ఇస్సాకుకి భార్యను వెదకి తీసుకురమ్మని పంపించగా –*ఇస్సాకుగారు తన భార్యకోసం కలలు కనలేదు గాని పొలంలో ధ్యానించమొదలుపెట్టారు*. (24:63). దేవుడు అప్పుడు రిబ్కాను ఇస్సాకుకి భార్యగా ఎంపికచేసి పంపించారు. ఇస్సాకు గారు రిబ్కాను పెళ్ళిచేసుకొన్నప్పుడు ఆమె వయస్సు 13సం.లు. (యాశారు గ్రంధం). ఇక ఇస్సాకు గారికి 40 సం.లు. (ఆది 25:20) అనగా BC 1860లో జరిగింది. ఇస్సాకు గారు తన తండ్రికంటే ఎక్కువ ఆశీర్వదింపబడిన వ్యక్తి. బైబిల్ గ్రంధంలో 100%కి 100% ఆశీర్వదింపబడిన వ్యక్తి ఇస్సాకు తప్ప ఇంకెవరూ లేరు(ఆది 26:12). ఇంతటి విశ్వాస వీరుడు, ఆశీర్వదింపబడిన వ్యక్తికి పుట్టినవాడు యాకోబు. క్రీ.పూ. 1860లో ఇస్సాకు-రిబ్కా ల వివాహం జరిగినా BC 1840 వరకు వారికి పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఇస్సాకుగారు రిబ్కా విషయమై దేవుని వేడుకొనగా ఆమె గర్భం ధరించింది. (25:21). ఇస్సాకు అబ్రాహాముగారిలా ఎక్కువకాలం పిల్లలకోసం ఎదురుచూడలేదు. ఒక్కసారి విశ్వాసంతో వేడుకొన్న వెంటనే దేవుడు అతని మొర్రవిన్నారు.(25:21)

సాధారణంగా శిశువు గర్భంలో ఉన్నప్పుడు 5నెలలు నిండాకా 6,7 నెలలలో బిడ్డ కదలిక తల్లికి తెలుస్తుంది. బిడ్డతల తల్లికడుపుకి తగిలినప్పుడు తల్లులు మురిసిపోతుంటారు. అయితే రిబ్కా మురిసిపోలేదు. ఎందుకంటే తనబిడ్డలు ఇంకా గర్భంలో ఉన్నప్పుడే ఒరేయ్ నేను ముందు వెళ్తాను అంటే కాదు నేను ముందు వెళ్తానురా అంటూ పెనుగులాట మొదలుపెడతారు. అది తల్లికి విచిత్రంగా, ఎంతో నొప్పిగా అనిపించింది. వారు తగవులాట తల్లికి అర్ధం అయ్యింది. ఆకాలంలో డాక్టర్లు చాలా అరుదు గాబట్టి ఈ సంగతి పరమ డాక్టర్ దేవుని దగ్గరే తేల్చుకొందాం అని ప్రార్ధించడం మొదలుపెట్టింది. వెంటనే జవాబు పొందుకొంది.

ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే రిబ్కాతండ్రి బెతూయేలు గాని, సోదరుడు లాబాను గాని యెహోవాను సేవించే వారు కాదు. వారి పూర్వికులు లాగే విగ్రాహారాధికులు. అయితే వారికి యెహోవా అనేదేవుడు అబ్రాముకి ప్రత్యక్షం అయినట్లుగా, ఆయన అబ్రహాముని ఎంతో ఆశీర్వదించినట్లు తెలుసు అంతే! అయితే ఎప్పుడైతే రిబ్కా ఇస్సాకుని పెళ్ళిచేసుకోడానికి నిర్ణయించుకొందో వెంటనే తమ విగ్రహారాధనను వదలివేసింది. ప్రార్ధనాపరుడైన ఇస్సాకు గారికి ప్రార్ధనాపరురాలైన భార్యగా మారిపోయింది. ఎంతటి ప్రార్ధనా పరురాలు అంటే విశ్వాసంతో ఒక్కసారి ప్రార్ధించిన వెంటనే జవాబుపొందుకోంది. (ఆది 25:23) రెండు జనపదములు నీ గర్భంలో పుడతాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడై పోతాడని తన బిడ్డల భవిష్యత్తు, దేవుని ప్రణాళిక సినిమా స్క్రీన్ పై చూపించినట్లు దేవుడు చెప్పారు వెంటనే! (రాహేలు కూడా అన్యురాలే, అయితే రాహేలు తనతో పాటు గృహదేవతను తెచ్చుకొని దేవుని శాపానికి గురై చనిపోయింది, అయితే రిబ్కా సమస్త విగ్రాహారాధన వదలి దైవాశీర్వాదం పొందుకోంది)

ఇక పుట్టేటప్పుడు కూడా తన అన్న మడిమెను పట్టుకొని పుట్టాడు యాకోబు. అక్కడ footnote లో మడిమెను పట్టుకొనువాడు అంటే మోసగాడు అని వ్రాయబడింది.(25:25-26). పెద్దవాడు వేటగాడు అయ్యాడు, చిన్నవాడు తల్లిచాటు బిడ్డగా వంటగాడు అయ్యాడు. 25:29-34 ప్రకారం యాశావు ,యాకోబుకి చిక్కుడుకాయల కూర కోసం తన జ్యేష్టత్వం అమ్మివేసాడు.

27వ అధ్యాయంలో తన తల్లి తప్పుడుబోధన అనుసరించి తన తండ్రిని, అన్నను మోసగించి ఆశీర్వాదాలు కొట్టేశాడు. అది అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది, చరిత్రప్రకారం, యాశారు గ్రంధం ప్రకారం, Book of Chronicles ప్రకారం యాకోబు యాశావుల మధ్య శత్రుత్వం వారు చనిపోయే వరకే కాదు వారి కుమారులు కూడా శత్రువులుగానే ఉన్నారు. చూశారా తల్లిదండ్రులు తన బిడ్డలనందరిని సమానంగా చూడాలి. అప్పుడు శత్రుత్వం రాదు. రిబ్కా చేసిన తప్పువల్ల వీరిద్దరూ జీవితాంతం శత్రువులుగానే మిగిలిపోయారు. నేటికి కూడా వీరి సంతానం శత్రువులుగానే ఉన్నారు. యాకోబు యోసేపుని మాత్రం ఎక్కువగా ప్రేమించడం వలన సహోదరులచే ద్వేశించబడి ఎన్నో తిప్పలుపడ్డాడు.
(ఐతే రిబ్కా అలా ప్రవర్తించడానికి మరో కారణం ఉంది. వారిద్దరూ గర్భంలో ఉండగా దేవుడిచ్చిన వాగ్దానం గుర్తుంచుకొని- పెద్దవాడు చిన్నవానికి దాసుడు అనేమాట పట్టుకొని- చిన్నవాడు ఆశీర్వదింప బడినవాడు కనుక చిన్నవానినే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టింది. అయితే వారిద్దరిని ఆమె కన్నాది కనుక ఇద్దరినీ సమానంగా ప్రేమిచాల్సింది.)
ప్రియ తల్లిదండ్రులారా! దయచేసి మీ బిడ్డలనందరిని సమానంగా చూడమని మనవి చేస్తున్నాను. యాకోబు చేసిన ఈ మోసం వళ్ళ తల్లిదండ్రులను వదలి పరాయిదేశం పారిపోవలసి వచ్చింది. మీ బిడ్డలకు కూడా అటువంటి స్తితి రాకూడదు అంటే అందరిని సమానంగా చూడమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను.
దైవాశీస్సులు!
((సశేషం)


లేయా –నాల్గవ భాగం

యాకోబు flashback-2


ప్రియ దైవజనమా! లేయా చరిత్ర పూర్తిగా అవగాహన చేసుకోడానికి యాకోబుగారి flashback ధ్యానం చేస్తున్నాం. ఎప్పుడైతే మోసం చేసి తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబు కొట్టివేశాడో అన్న యాకోబుని చంపాలని నిర్ణయించుకొన్నాడు. అయితే తండ్రి బ్రతికి ఉండగా కాదు ఆయన చనిపోయాక తమ్మున్ని చంపాలని అనుకొన్నాడు. (ఆది 27:41-42). ఈ విషయం తెలుసుకొన్న రిబ్కా తన కుమారుని పిలచి, నీ అన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు కనుక నీ అన్న కోపం తగ్గేవరకు నీ మేనమామ ఇంటికి పోయి కొన్నాళ్ళు ఉండు అని చెప్పింది. (27:42-45)

ఇక 28వ అధ్యాయంలో ఇస్సాకుగారు యాకోబుని పిలచి రెండు ఆజ్ఞలు- ఒక అమోఘమైన దీవెన ఇచ్చి పంపించారు. ఆజ్ఞలు ఏమిటంటే: నీవు కనాను దేశపు స్త్రీలను ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. పద్దనరాములో ఉంటున్న నీ మేనమామ ఇంటికి వెళ్లి లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకో అని చెప్పారు. 1. నీవు కనాను దేశపు స్త్రీలలో ఎవతెను పెళ్లి చేసుకోకూడదు. (నిజం చెప్పాలంటే ధర్మశాస్త్రం యాకోబుగారితో ప్రారంభమైంది. మోషేగారి సమయానికి పుస్తకరూపంలో వచ్చింది). అదేవిధంగా రక్షింపబడిన వారు ఎవరూ అన్యులను పెళ్లి చేసుకోకూడదు.

2. నీవు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకో! ఇదే బైబిల్ విధానం!!! ఒకవ్యక్తి ఒకదానినే వివాహం చేసుకోవాలి. ఆ భాగస్వామి చనిపోతే మరొకరిని పెళ్లి చేసుకోవచ్చు గాని బ్రతికి ఉండగా మరొకతెను చేసుకూకూదదు. అయితే యాకోబుగారు ఈ అజ్ఞను మీరి లాబాను ఇద్దరి కూతుర్లను పెళ్ళిచేసుకొని, నలుగురితో కాపురం చేసాడు! జీవితాంతం అశాంతితో గడిపి భార్యను ప్రేమించని వాడు అనే మచ్చను తెచ్చుకొన్నాడు! ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటిస్తే అతనికి, ఇంకా ఎవరికీ ఏ ఇబ్బంది రాదు. ఉదా: రోడ్డు నియమ నిభందన లను పాటిస్తే మన రోడ్లపై ప్రమాదాలే జరుగవు.

ఇక దీవెన:Genesis(ఆదికాండము) 28:3,4
3.సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభి వృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశ మును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసి కొనునట్లు
4.ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి

బాగా ఆలోచిద్దాం!
నిన్ను ఆశీర్వదించి-నిజంగా యాకోబు ఒంటరిగా హారాను వెళ్ళినా తిరిగివచ్చేటప్పుడు విస్తారమైన సంపదతో, పశు సంపదతో, పనివారితో తిరిగివచ్చినట్లు చూస్తాం!

నీవు అనేక జనములగునట్లు-ఒంటరిగా వెళ్ళిన యాకోబు ఇద్దరు భార్యలు, ఇద్దరు ఉప పత్నులు, 12మంది పిల్లలతో తిరిగి వచ్చాడు.

నిన్ను విస్తరింపజేసి- నిజంగా యాకోబు సంతానం 450 సం.ల తర్వాత ఒక దేశంగానే మారిపోయింది.

నీవు పరవాసియైన దేశమును నీకు స్వాస్త్యముగా, నీ సంతానముకి ఇచ్చును.ఇది అక్షరాలా నెరవేరింది యాకోబు జీవితంలో!!!

ఈవిధంగా ఆశీర్వాదాలు పొందు కొన్న యాకోబుగారు జీవితంలో మొట్టమొదటిసారిగా తన తల్లిదండ్రులను వదలి ఒంటరిగా పద్దనరాముకి పారిపోవలసి వచ్చింది. బెయేర్షేబా నుండి పద్దనరాముకి 500 మైళ్ళు అనగా 825 కి.మీ.లు. మనం ఆ ప్రాంత బౌగోళిక స్వరూపం చూస్తే బెయేర్షేబా ఫిలిస్తియా ప్రాంతానికి చెందింది. దానిని ఆనుకొని కనాను ప్రాంతం ఉంది. బెయేర్షేబా కు ఎడమప్రక్కన ఫిలిస్తియా, దాని ప్రక్కన మధ్యధరా సముద్రం, బెయేర్షేబా కు కుడి ప్రక్కన కనాను దేశం, యోర్దాను లోయ, dead sea ఉన్నాయి. Dead sea చివరలో యోర్దాను నది ప్రారంభం అవుతుంది. అయితే ఈ రెండు కలసి లేవు. ఈ నదీ పరీవాహక ప్రాంతంలోనే అనగా యోర్దాను లోయ ప్రాంతంలోనే కనాను దేశం ఉంది. ఫిలిస్తియాను ఆనుకొని ఫెనూకియ ఉంది అనగా తూరు, సీదోను ప్రాంతం. దానిని ఆనుకొని లేబానోను, హమాతు తర్వాత సిరియా. ఈ సిరియా ప్రాంతాన్ని పూర్వకాలంలో మెసపటోమియా అనేవారు. మెసపటోమియా నాగరికత (mesapatomian civilization) ఇక్కడే ప్రారంభం అయ్యింది. ఈ సిరియాలోనే హారాను ఉంది. హారాను అనేది – సామాన్యుల వాడుక భాష. దీనినే యాజకుల భాషలో, పండితుల భాషలో పద్దనరాము అనేవారు. ఈ హారాను డమాస్కస్ కి 10 మైళ్ళు దూరంలో ఉంది. అయితే యాకోబుగారు ఈ మార్గంలో కాకుండా బెయేర్షేబా, హేబ్రోను, బెత్లెహేము మీదుగా బెతేలు వెళ్లి, యోర్దాను నది దాటి, సుక్కోతు, మహానయీము, మిజ్పా మీదుగా హారాను వెళ్ళారు. ఈప్రాంతమంతా యాకోబుగారు ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది.

మార్గమధ్యంలో బేతేలు చేరుకొని అక్కడ దైవదర్శనం పొందుకొన్నారు. యాకోబుగారు తల్లిదగ్గర వంటలే కాకుండా తనతల్లి లాగే ప్రార్ధనా జీవితం నేర్చుకొన్నారు. అందుకే అక్కడ దేవుని దర్శనం పొందుకొన్నారు. ఇక్కడ దేవుడు అబ్రాహాముకి చేసిన ప్రమాణం, ఇస్సాకుకి చేసిన వాగ్దానం మరోసారి యాకోబుతో చేసారు. ఈ భూమిని నీ సంతానంకి ఇస్తాను అని చెప్పారు. (అంటే నీకు సంతానం కలుగుతుంది అని ముందే చెప్పారు). నీ సంతానం లెక్కకి ఇసుకరేణువుల వలే అవుతుంది అని చెప్పారు. మరో ప్రాముఖ్యమైన వాగ్దానం ఏమిటంటే భూమిమీద నున్న సమస్త జనములు నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడతాయి అని చెప్పారు. హల్లెలూయ!!! నేడు మన దేశాలన్నీ ఇశ్రాయేలు దేశం వలన ఆశీర్వదించ బడుతున్నాయి. అంతేకాకుండా నీవు వెళ్ళు ప్రతీ స్తలములోను నీకు తోడుగా ఉంటాను అని ప్రమాణం చేసారు. ఆది 28:10-22.

వెంటనే యాకోబు అక్కడే దేవునికి మ్రొక్కి, ఆ స్థలానికి బేతేలు అనగా దేవుని మందిరం అని పేరుపెట్టాడు. అంతేకాకుండా నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తే నాకు కలిగిన దాంట్లో పదోవంతు చెల్లిస్తాను అని మ్రొక్కుకున్నాడు. (గతంలో చెప్పిన విధముగా ధర్మశాస్త్రం యాకోబు గారితో ప్రారంభమయ్యింది) ఇంకా ఆ ప్రాంతంలో దేవుని మందిరం కడతాను అని మ్రొక్కుకున్నాడు.

ఈరకంగా యాకోబు ఎటువంటి ఆశలేకుండా, బిక్కుబిక్కుమంటూ, భయంతో ప్రయాణం చేసేటప్పుడు దేవుడే అతనికి ప్రత్యక్షమై దర్శనం ఇచ్చి, భయపడకు- నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తాను అని దీవించి పంపారు!!! వాగ్దానం చేయడమే కాదు హారాను చేరేవరకు యాకోబుతో తోడుగా ఉన్నారు. కావున ప్రియ సహోదరీ/సహోదరుడా! భయపడకు! దిగులుపడకు! నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా! ఆయన వాగ్దానాలను నమ్మి ముందుకు సాగిపో!

God Bless You!!!

Amen!

(సశేషం)


లేయా –5వ భాగం

యాకోబు –లేయా- రాహేలు


ప్రియులారా! ఆదికాండం 29వ అధ్యాయంలో మనం యాకోబుగారు హారాను అనగా పద్దనరాము చేరుకోవడం, లేయాను, రాహేలుని పెండ్లి చేసుకోవడం, ఇంతవరకు ప్రజలను మోసగించిన యాకోబు మొదటిసారిగా తనమామ చేతిలో మోసపోవడం, లేయా పిల్లలు కనడం చూడొచ్చు!

యాకోబు 500 మైళ్ళు నడచి చివరకు హారాను చేరుకొని, ఒక బావిని చూసి, బావి దగ్గర కూర్చున్నవారిని అడుగుతాడు అన్నలారా! ఇది ఏ ఊరు? వారు అన్నారు ఇది హారాను, అయితే మీకు నాహోరు కుమారుడగు లాబాను తెలుసా? అతడు క్షేమంగా ఉన్నాడా? అని అడిగాడు.
నిజంగా లాబాను నాహోరు యొక్క కుమారుడు కాదు, మనవడు! నాహోరు కుమారుడు బెతూయేలు, బెతూయేలు కుమారుడు లాబాను. అయితే ఆకాలంలో ఆకుటుంభంలో ఎవరైతే ఘనత వహిస్తారో వారి కుమారుడుగా పిలువబడటం వాడుక! ఉదాహరణకు దావీదు కుమారుడు- యేసుప్రభువు!!!
సరే! హారాను వారు లాబాను బాగానే ఉన్నాడు, అతని చిన్న కుమార్తె రాహేలు తమ తండ్రి మందను మేపుకుంటూ ఇక్కడకే వస్తుంది చూడు! అని ఆమెను చూపించారు.
పూర్వకాలంలో ఆ దేశాల్లో ఆ కుటుంబానికి చిన్నవారికి మందలు మేపే భాద్యత ఇచ్చేవారు. పెద్దవారు మిగతా పనులు చేసేవారు. అందుకే దావీదుగారు తమ తండ్రి మందలు మేపారు. అందుకే రాహేలు తమ తండ్రి మంద మేపుతుంది. గాని అక్కడ పెద్ద భావి, భావికి మూతగా పెద్దరాయి! ఆ రాయి తీయడం అంత తేలిక కాదు. యాకోబుగారు రాహేలుని చూసిన వెంటనే Hero అయిపోయి, రాతిని తొలగించి, మందకు నీరు పెట్టారు. రాహేలుపై పడి ఏడ్చాడు. నేను నీ మేనత్త కుమారుడిని అని చెప్పాడు! రాహేలుని చూసి ప్రేమించాడు. Love At First Sight అన్నమాట! లాబాను పరుగెత్తుకొంటూ వచ్చి యాకోబుని ముద్దుపెట్టుకొన్నాడు! నెలరోజులు గడిచాక ఊరకయే నా దగ్గర కొలువు చేస్తావా? నీకు ఏం కావాలో చెప్పు అన్నాడు.

ఇక్కడ ఒకసారి ఆగుదాం! అబ్రాహాముగారు గొప్ప ఐశ్వర్యవంతుడు ఆది 13:5,6. అతని కుమారుడు ఇస్సాకు ఆగర్భ శ్రీమంతుడు ఆది 26:12,13,14. మరి అతని కుమారుడు యాకోబు కూడా చాలా ధనవంతుడే! ఇట్టి ధనవంతుడైన యాకోబు ప్రజలను, అన్నను మోసగించినందువలన కుటుంబానికి దూరంగా పారిపోవలసి వచ్చింది. ఎందరికో పనిచెప్పే యాకోబు మరొకరి దగ్గర పనిచేయాల్సి వచ్చింది. తనక్రింద ఎందరో కూలివాల్లుండగా యాకోబు తనే ఒక కూలివానిగా మారాల్సి వచ్చింది. ఎండలో వానలో మందలవెనుక తిరగాల్సి వచ్చింది.

యాకోబు-రాహేలుది Love At First Sight కాబట్టి నీ చిన్న కుమార్తె కోసం 7 సం.లు కొలువుచేస్తాను అన్నాడు. లాబాను సరే అన్నాడు. ఇది బాగుంది అనుకొన్నాడు లాబాను. ఏడు సం.లు ఏడు రోజులులాగా గడచిపోయాయి యాకోబుగారికి. మరి ప్రేమ అలాంటిది. 7 సం.లు గడచిన తర్వాత నీ చిన్నకూతురుని నాకు పెళ్లి చేయు అంటే, చీకట్లో ముసుకు వేసి పెద్ద కుమార్తె ఐన లేయాను ఇచ్చి పెళ్లి చేసాడు లాబాను. ఇక్కడ లేయా పేరు మొట్టమొదటగా కనబడుతుంది మనకు. ఇలా జరుగుతుంది అని లేయాకు, రాహేలుకి కూడా చివరి క్షణం వరకు తెలియదు. ఇది యాకోబుకి అంతుచిక్కలేదు. చరిత్ర ప్రకారం యాకోబుగారు రాహేలుని ఒక మనిషిలా కూడా ఎప్పుడూ చూడలేదు.

ప్రజల్ని మోసగించిన యాకోబు మొదటిసారిగా మామ చేతిలో మోసపోయాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది ఎవరూ నిన్ను మోసగించకపోయినా ప్రజల్ని మోసగిస్తున్న నీవు, నీవు మోసగించడం ముగించిన తర్వాత మోసగించబడతావు యెషయా 33:1, గలతి 6:7యాకోబు మోసపోయాడు గాని ఆకోపాన్ని లేయా మీద చూపించాడు. ప్రార్ధనా పరుడే! భక్తిపరుడే! గాని భార్యను ప్రేమించలేదు! ఆమెతో సరిగా కాపురం చేయలేదు.

మోసపోయి తర్వాత మామను నిలదీస్తాడు నీవు చేసిన పని ఏమిటి? నీ చిన్నకూతురు కోసం ఏడేళ్ళు కొలువుచేస్తే పెద్దకూతురుని ఎందుకు పెల్లిచేసావ్? ఇదెక్కడి న్యాయం! లాబాను మా ఊరు న్యాయం ప్రకారం పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి చేయకూడదు. చిన్నదానిని కూడా నీకే ఇస్తాను, మరో ఏడేళ్ళు సేవ చేయమంటాడు. ఇలా మరో ఏడేళ్ళు కొలువుచేసాడు రాహేలుకోసం!

ఆది 29:31 లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరచెను! రాహేలు గొడ్రాలై యుండెను. హృదయాలు అంతరంగాలు ఎరిగినవాడు మనదేవుడు!! అందరిని చూస్తున్నాడు! అందుకే దేవుడు లేయాను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భవతి అయ్యేలా చేసారు. అందుకే 29:32 లో అంటుంది యెహోవా నా శ్రమను చూసి యున్నాడు! గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. యెహోవా నాశ్రమను చూశాడు అంటుంది. నిజంగా ఎవరూ లేయాను శ్రమ పెట్టలేదు. అయితే యాకోబుగారు రాహేలునే ప్రేమిస్తూ, లేయాను పట్టించుకోక పోవడం, అప్పుడప్పుడు మొక్కుబడిగా లేయాతో కాపురం చేయడం నిజంగా అది ఒక mental torture. ఇదే గొప్పశ్రమ! అందుకే దేవుడు ఆమె శ్రమను చూసి ఆమెకు కుమారుడిని అనుగ్రహించారు.

ప్రియ సహోదరీ! అందరూ నిన్ను వదలివేసారా? నీ భర్త నిన్ను ప్రేమించడం లేదా? ప్రజలు నిన్ను పట్టించుకోవడం లేదా? భాదపడకు!! భయపడకు!! ఆయన మీకోరకు చింతించుచున్నాడు(1 పేతురు 5:7)!! మీ చింత యావత్తు ఆయనపై వేయు. ఆయనే నీ హృదయవాంచలు తీర్చుతారు. లేయాను ఆదరించిన దేవుడు నిన్నుకూడా ఆదరించగలరు!! కేవలం ఆయనపై ఆధారపడు!

దైవాశీస్సులు!

(సశేషం)


లేయా –6వ భాగం

లేయా సంతానం-1


ప్రియ దైవజనమా! మనం ఆదికాండం 29వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. లేయా తన కుమారులకి పేర్లు ఏ రకంగా పెడుతుందో చూద్దాం!

1. యెహోవా నాశ్రమను చూచియున్నాడు అని చెప్పి మొదటి కుమారునికి రూబేను అనిపేరు పెట్టెను! ఆది: 29:32

2. నేను ద్వేషించబతినని యెహోవా విన్నాడు కనుక ఇతనిని నాకు దయచేశాడు అని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. 29:33

3. తుదకు నాపెనిమిటి నన్ను హత్తుకొనును, నేను అతనికి ముగ్గురు కుమారులను కంటిని అని అతనికి లేవి అని పేరు పెట్టెను. 29:34.

4. ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అని పేరు పెట్టెను. 29:35

ఇక్కడ కొద్దిగా ఆలోచిద్దాం! లేయా తన పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు మొదటగా యెహోవాను సంభోదిస్తుంది. గతంలో చెప్పిన విధముగా ఆమెగాని, ఆమె తల్లిదండ్రులు గాని యెహోవాను అనుసరించేవారు కాదు,గాని ఎప్పుడైతే లేయా యాకోబుగారిని పెళ్లి చేసుకుందో, వెంటనే తన సమస్త విగ్రహారాధన వదలి యెహోవాను అనుసరించడం మొదలుపెట్టింది. తన్ను నిజముగా మొర్రపెట్టువారికి ఆయన సమీపముగా ఉన్నాడు అను వాగ్దానం ఆమె జీవితంలో అక్షరాలా నెరవేరింది. తన భర్త తనను ప్రేమించకపోయినా, మొక్కుబడిగా అప్పుడప్పుడు కాపురం చేస్తున్నా, దేవుడు ఆమెను కనికరించి ఆమె గర్భం తెరచి, ఆమె వెంటవెంటనే నలుగురు కుమారులను కనేలాగా చేసారు. అందుకు ప్రతిఫలంగా ఆమె దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. దేవుని నుండి ఉపకారాలు పొందుకున్న ప్రతీ విశ్వాసి తప్పకుండా దేవుణ్ణి స్తుతించాలి.

మరో ముఖ్యమైన విషయం మనం లేయానుండి నేర్చుకోవచ్చు! అదేమిటంటేలేయాభర్తతో ద్వేషింపబడి, తన చెల్లి తనతో శత్రుత్వం పెంచుకుంటున్నా సరే, ఆమె దేవుణ్ణి గాని, తన భర్తను గాని, తన తండ్రిని గాని నిందించడం లేదు, పరిస్తితిలకు సర్దుకుపోవడం మొదలు పెట్టింది. దేవునిపై ఆనుకోవడం మొదలుపెట్టింది. పొందిన ఉపకారాలకు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. యూదాపుట్టుకతోఆమెదేవుణ్ణిస్తుతించడంఎక్కువచేసింది. ప్రతిఫలంఏమిటంటేఆమెకానుపుఉడుగుపోయినాసరే, మరో ఇద్దరు కుమారులను, ఒక కుమార్తెను కనగలిగింది. తన దాసీ ద్వారా మరో ఇద్దరినీ సంపాదించుకోగలిగింది. కాబట్టి ప్రియవిశ్వాసి! నీకు కలిగిన కష్టాలకు దేవుణ్ణి నిందించకు!! నీ తల్లిదండ్రులను, నీ భర్తను నిందించకు! పరిస్తితులకు సర్దుకుపోయి, లేయా వలే స్తుతించడం మొదలుపెట్టు. దేవుడునీజీవితంలోఆశ్చర్యకార్యాలుచేయడానికిసిద్ధముగాఉన్నారు.

ఆదికాండం 30వ అధ్యాయంలో రాహేలు-లేయా-యాకోబుల సంభాషణ చూడొచ్చు! రాహేలు గొడ్రాలై పోయింది. దేవునిదగ్గర మొర్రపెట్టకుండా భర్తను నిలదీస్తుంది, సాదిస్తుంది, గొడవాడుతుంది నాకు గర్భఫలమిమ్ము అంటుంది. లేకపోతే నేను చస్తాను అంటుంది. 30:1-2. ఈ రోజు ప్రియవిశ్వాసి! నీవుకూడా నీ భర్తను ఇలా భాదపెడుతున్నావా? frustrationలో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియకుండా మాట్లాడుతున్నావా? యాకోబుగారు అంటున్నారు నీకు గర్భఫలం ఇయ్యడానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? అది దేవుడే నీకు ఇవ్వాలి అంటున్నారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్త్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అంటున్నాడు భక్తుడైన సోలోమోను కీర్తనలు 127:3. గర్భఫలం ఇయ్యడం అది దేవుని చిత్తం!
స్త్రీలు frustration లో తొందరపడి నిర్ణయం తీసుకొంటారు. నోరు పారేసుకొంటారు. శారమ్మ లాగ రాహేలుకూడా తొందరపడి నిర్ణయం తీసుకుంది నా దాసితో పో, ఆమెద్వారా పిల్లలను కను అన్నది. యాకోబు బిల్హా తో సంసారం చేసాడు. గమనించండి. తండ్రియైన ఇస్సాకు లాబాను కుమార్తెలలో ఒకదానిని పెళ్లి చేసుకో అని స్తిరమైన ఆజ్న ఇస్తే , లాబాను ఇద్దరి కుమార్తెలను పెళ్లి చేసుకోవడమే కాకుండా, ఇప్పుడు భార్య మాటలాలకించి, దాసితో కూడా కాపురం చేస్తున్నాడు.

5. బిల్హా కుమారుని కంటే రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నామొర్ర వినెను అని అతనికి దాను అని పేరు పెట్టెను. 30:6

6. మరో కుమారుని కంటే దేవుని కృపవిషయమై నా అక్కతో పోరాడి గెలిచితినని నఫ్తాలి అని పేరుపెట్టింది.

ఇక్కడ కొన్నివిషయాలు ఆలోచిద్దాం! లేయా పిల్లలు కన్నప్పుడు యెహోవా నాకు ఇది చేసాడు, అది చేసాడు, నా మొర్ర విన్నాడు అని చెబితే రాహేలు దేవుడు అంటుంది. లేయాకు తన దేవుడెవరో క్లారిటీగా తెలుసు, తమ దేవుడు యెహోవా అని ప్రగాడంగా విశ్వసించింది.. గాని రాహేలు రెండు పడవల మధ్య కాలు వేసి తచ్చాడుతుంది. రాహేలుకి లేయాకు ఉన్న పరిపక్వత లేక విగ్రహాలు మీద మోజుపెట్టుకోంది.

మరో విషయమం పిల్లలకు రాహేలు, లేయా పేర్లు పెడుతుంటే యాకోబుగారు ఏం చేస్తున్నారు? పూర్వకాలంలో ఆ దేశాలలో తల్లులే పిల్లలకు పేర్లు పెట్టేవారు. ఎందుకంటే నవమాసాలు కని, వారిని సాకేది వారే కాబట్టి పూర్వికులు పేరు పెట్టే అధికారం వారికే ఇచ్చారు.

మరో ప్రాముఖ్యమైన సంగతి: యాకోబుగారు ఎప్పుడూ రాహేలు ప్రక్కలో పడుకొనేవారు కదా, రాహేలునే ప్రేమించేవారు, గాని ఆశ్చర్యంగా దేవుడు నాకు తీర్పు తీర్చాడు అంటుంది. దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను అంటుంది. ఇదికూడా frustration లో అనే మాటే!

మరో విషయం ఆమెకు క్షుణ్ణంగా అర్ధమయ్యింది ఏమిటంటే: దేవుని కృపలేకుండా సంతానం కలుగదు అని. అందుకే దేవుని కృప విషయంలో అని అంటుంది.

ప్రియ విశ్వాసి! నీవుకూడా గ్రహించు దేవుని కృపలేకుండా నీవు ఏమి చేయలేవు, ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేవు. ఆ విషయం గ్రహించనంతకాలం రాహేలుకి పిల్లలు కలుగలేదు. గ్రహించిన తర్వాత సంతానం పొందుకోంది. లేయాకు తన దేవుడెవరో తెలుసు. నిజ దేవుడెవరో తెలుసుకొని పరిస్తితులకు సర్దుకుపోయి, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టి, దైవాశీర్వాదాలు పొందుకోంది. అట్టి ఆశీర్వాదాలు నీకు కావాలంటే నీవుకూడా దేవునిపై ఆనుకోవడం మొదలుపెట్టు!

అట్టి కృప మనందరికీ కలుగును గాక!

ఆమెన్!

(సశేషం)


లేయా –7వ భాగం

లేయా సంతానం-2


ఆదికాండం 30:10-24 వరకు చూసుకొంటే రాహేలు తనదాసియైన బిల్హాను యాకోబుకి ఇవ్వడం , తద్వారా ఇద్దరిని కనడం చూసిన లేయా, తనుకూడా తనదాసియైన జిల్ఫాను యాకోబుకి ఇచ్చింది. మరలా ఇదికూడా యాకోబు తన తండ్రి ఆజ్ఞను ధిక్కరించినట్లయింది. జిల్ఫా ద్వారా మరో ఇద్దరు కుమారులు కలిగారు యాకోబుకి.

7. లేయా- ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టింది. 30:11

8. స్త్రీలు నన్ను భాగ్యవంతురాలు అంటారు అనుకుని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.30:13

ఒకసారి కొద్దిగా ఆగి ఆలోచిద్దాం! లేయా ఇంతవరకు పిల్లలు పుడితే యెహోవా నాకు ఇది చేసాడు, అది చేసాడు, నా మొర్రవినెను అంటూ దేవుణ్ణి పొగడే లేయా ఇప్పుడు దేవుని మాట మరచిపోయి తనకు తానూ పొగడుకోవడం మొదలుపెట్టింది. తనకు తనే శభాస్! అనుకొంటుంది. Seniority పెరిగితే Sincerity తగ్గడం అంటే ఇదే! నాకు అదృష్టం పట్టింది, నేను భాగ్యవంతురాలను అనడం ప్రారంభించింది, విశ్వాస జీవితంలో ఎప్పుడైతే *నేను* అనే అహంభావం మొదలవుతుందో, అది పతనానికి నాంది పలుకుతుంది, ప్రియ విశ్వాసి! ఒకవేళ నీవు కూడా అదే స్తితిలో ఉన్నావేమో సరిచూసుకో! సరిచేసుకో!

14-16 వచనాలలో పుత్రదాత వృక్షపు పండ్లకోసం(Mandrakes) వ్రాయబడింది. ఈ పుత్రదాత వృక్షపు పండ్లు తింటే గొడ్రాలు కూడా గర్భవతి అవుతుంది అనే అపోహ ఆ రోజులలో ఉండేది. ఇవి మనదేశంలో ఉండే ముల్లంగి దుంప లాగ ఉంటాయి. వీటిని మాంత్రికులు ఎక్కువగా వాడేవారు. మనుష్యులకు చెడుపు పెట్టడానికి, మనుష్యులను మాత్రిక విద్యలతో చంపడానికి ఎక్కువగా వాడేవారు. ఓ రకంగా చెప్పాలంటే ఇవి సాతాను సాధనం!

సరే! రూబేనుకి దొరికిన ఈ Mandrakes కోసం లేయా- రాహేలు తగవులాడుకొని, చివరకు యాకోబుని చాలా రోజుల తర్వాత తన దగ్గరకు ఆ రాత్రికి రప్పించుకొంటుంది లేయా! 17వ వచనంలో దేవుడు లేయా మొరవినెను అని వ్రాయబడింది. 13వ వచనానికి, 17వ వచనానికి మధ్య చాలా జరిగిందన్నమాట! తనను తానూ పొగడుకోవడం మొదలుపెట్టిన లేయాకు మరలా కష్టాలు ఎదురయ్యాయి. ఇప్పుడు యాకోబు- లేయాతో మాట్లాడటం కాని, కాపురం చేయడం గాని మానేసాడు. లేయా చాలా నిరాశ నిస్పృహలో మునిగిపోయింది. అందుకే తన తప్పు తను తెలిసికొని, దేవునికి ప్రార్ధించడం మొదలుపెట్టింది. దేవుడు ఆమె మొరవిని, అద్భుతం చేసారు. ఆమె తిరిగి గర్భవతి అయ్యింది. గమనించండి: 29:35లో ఆమె కానుపు ఉడిగెను అని వ్రాయబడింది. 30:17 లో ఆమె తిరిగి గర్భవతి అయ్యింది. ఇది చరిత్రలో అసాధ్యం, అసంభవం!!! గాని అసాధ్యాలను సుసాధ్యం చేయడమే దేవుని ప్రత్యేకత. అంత శక్తి, అధికారం ఆయనకుంది. ఆయనకు సమస్తము సాధ్యమే!

9. అందుకే లేయా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని అతనికి ఇశ్శాకారు అని పేరు పెట్టింది.

10. మరో కుమారుని కని దేవుడు నాకు మంచి బహుమతిని ఇచ్చాడు అని జెబూలూను అని పేరు పెట్టింది.

తర్వాత ఒక కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టింది. దీనా అనగా న్యాయము, ప్రతీకారం తీర్చుకొనుట, పగతీర్చుకొనుట అనే అర్ధాలు వస్తాయి. దేవుణ్ణి హత్తుకొనిఉంటే కలిగే ప్రతిఫలమే ఇది.

ఇక మనం ఇప్పుడు యాకోబుగారి గురించి ఆలోచిద్దాం! గొప్ప దైవభక్తుల కుమారుడు! భక్తిలో పెరిగిన వ్యక్తి! దేవుని దర్శనాలు పొందుకొని, దేవునితో మాట్లాడిన వ్యక్తి! మొదటగా తన తండ్రి ఆజ్ఞను మీరినట్లు చూసాం! తర్వాత తన సొంత పెద్ద భార్యను ప్రేమించలేదు. మ్రొక్కుబడిగా అప్పుడప్పుడు ఆమెతో కాపురం చేసినట్లు చూసాం! పేరుకి దైవ భక్తుడే! బయట గొప్ప పేరు! గాని ఇంట్లో మంచి సాక్ష్యం లేదు! ప్రియ దేవుని బిడ్డా! నీకు కూడా పై ఊర్లో మంచి పేరు సాక్ష్యం ఉండొచ్చు! నీ సొంత ఇంట్లో ఒక త్రాగుబోతుగా, భార్యను కొట్టేవానిగా, తిట్టుబోతుగా, నీ ఆఫీస్లో లంచగొండిగా ఉంటే విలువ ఏముంది? సొంత ఊర్లో మంచి సాక్ష్యం లేకపోతే నీ బ్రతుకికి అర్ధం ఏముంది? కాబట్టి నీ సాక్ష్యమును కాపాడుకోమని దేవునిపేరిట మనవి చేస్తున్నాను!

యాకోబు గారు తన భార్యను ప్రేమించకపోవడానికి కారణం ఆమె అందంగా లేకపోవడం, తనను మోసగించి పెళ్ళిచేసుకొంది అని అపోహపడటం! నేటి దినాల్లో చాలా మంది ఇలాగే అపోహలు పడి, తన భార్య- తన స్నేహితుని భార్యకంటే బాగోలేదనుకొని, స్నేహితుని భార్యతో పోల్చుకోవడం, మరికొంతమంది చెప్పుడు మాటలువిని భార్యమీద అనుమానపడటం, భార్యను ప్రేమించకపోవడం చేస్తున్నారు. మరికొంతమంది భార్య ఓ మరబొమ్మ అని, తనింట్లో ఓ పనిమనిషిగా చూసేవారు కొంతమంది, భార్య ఓ పిల్లలను కనే యంత్రంగా చూసేవారు కొంతమంది, కేవలం తనకు పడక సుఖం ఇచ్చే ఓ సాధనంలా భావించే ప్రభుద్దులు కొంతమంది. భార్యకూడా తనలాగే ఓ మనిషని, దేవుడిచ్చిన బహుమతి అని, తనలో అర్ధభాగమని మరచిపోతున్నారు!! ఆవేశంలో , కోపంలో భార్యను కొట్టే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. ఒకసారి ఎఫెసీ 5:22-33, కొలస్సి 3:18-19 వరకు చదవమని మనవి చేస్తున్నాను. దయచేసి భార్యను ఆటబొమ్మగా చూడొద్దు! యాకోబు దైవభక్తుడే, ప్రార్ధనాపరుడే గాని, భార్యను ప్రేమించకపోవడం అతని జీవితంలో ఒక మాయని మచ్చలాగా మిగిలిపోయింది. చివరకు యబ్బోకు రేవుదగ్గర యాకోబు దేవుని పాదాలు పట్టుకొని తన తప్పు ఒప్పుకొని, దేవునితో సమాధానపడడం జరిగింది. ఆది 32:22-32. నీవు కూడా ఆ స్తితిలో ఉంటే, తప్పుతెలుసుకొని, దేవునిపాదాలను ఆశ్రయించి, తప్పులు సరిదిద్దుకోమని మనవి చేస్తున్నాను! అంతేకాకుండా భార్యతో సమాధాన పడమని, భార్యను ప్రేమించడం మొదలుపెట్టమని యేసయ్య పేరిట మనవి చేస్తున్నాను!

అట్టి కృప ఆనందరికి కలుగును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

(సశేషం)


లేయా –8వ భాగం

లేయా-రాహేలు


ప్రియులారా! ఇంతవరకు మనం యాకోబుగారి గతం, లేయా సంతానం, చివరకు రాహేలు దేవున్ని ఆశ్రయించి నందువల్ల రాహేలు కూడా గర్భవతి అవ్వడం చూసాం. ఈరోజు మనం లేయా- రాహేలుల గురించి ఆలోచిద్దాం!

లేయా పెద్దది. రాహేలు లేయాకు చెల్లి. లేయా అందగత్తె కాదు సరికదా జబ్బుకల్లది. రాహేలు చాలా అందగత్తె! ఎంత అందగత్తె అంటే ఆగర్భశ్రీమంతుడు ఐన యాకోబుగారిని ఒకేఒక కంటిచూపుతో ఆకర్షించుకోంది. Love At First Sight అన్నమాట!

అయితే చిన్నప్పుడు అక్కచెల్లెళ్ళు తగవులాడుకొని కొట్టుకొన్నా, పెద్దయ్యాక అనగా వివాహాలు అయ్యాక కలసిపోతారు. ఇది సర్వసాధారణం! అయితే రాహేలు-లేయాలు పెద్దయ్యాక కలవక శత్రువులుగా మారిపోయారు. కారణాలు: రాహేలు తన అందాన్ని చూసి గర్వించడం మొదలుపెట్టి, తన అక్క తనకంటే అందంగా లేకపోవడం చూసి, అక్కను చిన్నచూపు చూడటం మొదలుపెట్టింది. నిజానికి అక్కమీద జాలి పడాల్సింది పోయి, అసహ్యించుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు తండ్రి చేసిన తప్పుకి, అనగా ఇద్దరినీ యాకోబుకే ఇచ్చి పెళ్ళిచేయడం వళ్ళ, వారిమధ్యలో అనుభందం తెగిపోయి, శత్రువులుగా మారిపోయారు. పెద్దకూతురుకి మేలుచేద్దాం అనే అతని ఆలోచన:

1. రాహేలుని-లేయాకు శత్రువుగా చేసింది.

2. బైబిల్ ప్రకారం యాకోబుగారు రాహేలునే ప్రేమించారు. ఆమె కోసమే 14సం.లు కొలువుచేసారు. వీరిద్దరి మద్య ప్రేమ అంకురించింది. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్యకు లేయాను తీసుకురావడం వలన, లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యాయి. యాకోబు తనకే సొంతమనుకొన్న రాహేలు, ఇప్పుడు యాకోబుని మరొకరితో పంచుకోవడం, అదికూడా తను ఎవరినైతే ఇష్టపడటం లేదో ఆమెతో తనభర్తను, తనతో సమానంగా పంచుకోవడం అసలు జీర్ణించుకోలేక పోయింది. తండ్రి చేసిన మోసంలో తన అక్కకి కూడా భాగం ఉంది అనుకోని అక్కని మరింత ద్వేషించడం మొదలుపెట్టింది. యాకోబుకి లేనిపోనివి నూరిపోసింది. ఎంతగా యాకోబుని కట్టడ చేసింది అంటే లేయా పెద్ద భార్య ఐనా సరే లేయా దగ్గరకి వెళ్ళకుండా, అప్పుడప్పుడు మొక్కుబడిగా వెళ్ళేలా చేసింది. లేయాతో మనస్పూర్తిగా కాపురం చేయకుండా చేసింది. ఎంతఘోరం అంటే 30:14-16 లో చూస్తే రూబేను తెచ్చిన పుత్రధాత వృక్షపు పల్లుకోసం యాకోబుని ఒక్కరాత్రి లేయాతో పడుకోవడం కోసం బేరమాడుకున్నారు.

3. లేయా భర్తతోను, చెల్లితోను ద్వేశించబడటం చూసిన దేవుడు ఆమె వెంటవెంటనే కుమారులను కనే లాగ చేసారు. రాహేలైతే గొడ్రాలుగా మిగిలిపోయింది. ఇది చూసి రాహేలు మరింత కుల్లుపోవడం జరిగింది. ఈర్ష్య ఎముకలకి కుళ్ళు అని వ్రాయబడింది. ఆమె అక్కపై కుల్లుపోయే కొలది, మరింత దేవునిప్రేమకు దూరమై, మనశ్శాంతి లేక తిప్పలు పడింది. చివరకి దేవుడే సంతానమిచ్చువాడు అని గ్రహించి తప్పు తెలిసికొన్నపుడు రాహేలు కూడా పిల్లలను కన్నది.

లేయా యాకోబుగారితో వివాహం జరిగిన మరుక్షణం తన విగ్రహారాధనను మానేసి, యెహోవా దేవుణ్ణి సంపూర్ణంగా సేవించడం మొదలుపెట్టింది. ఎంతగా దేవునిపై ఆనుకొంది అంటే- తను ద్వేశించబడుతున్నా సరే, పరిస్తితిలకు సర్దుకుపోయి, దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టింది. అబ్రహాము- శారమ్మలకు దేవుడు చేసిన అత్యద్భుతం తను తెలుసుకోంది కాబట్టి, యెహోవాయే నిజమైన దేవుడు అని నమ్మింది. రాహేలుకి అటువంటి భక్తిలేదు!! తనకి గృహదేవతలు అంటే ప్రాణం! యాకోబుని సంతోషపెట్టాలని యెహోవాను మొక్కుబడిగా పూజించేది తప్ప ఆయనపై నమ్మిక ఉంచి కాదు! అందుకే యాకోబుగారి తిరుగు ప్రయాణంలో తనతో పాటు, తమ గృహదేవతను మోసుకుపోయింది. శాపాన్నితెచ్చుకొని చనిపోయింది. ఇక అదే విగ్రహం కోసం తన తండ్రితో అబద్దమాడింది. (31:35). అనగా జీవితంలో యధార్దత లేదు రాహేలుకి.

అయితే ఇంతగా తగవులాడుకొన్న రాహేలుకూడా గర్భం ధరించి, యోసేపుని కన్న తర్వాత వారిలో మార్పు వచ్చింది. యాకోబుగారు దేవుడు తనను తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళమన్నారు అని అంటే వెంటనే యాకోబుతో అన్నారు ఇద్దరూ ఏకస్వరంతో మేముకూడా నీతోనే వస్తాం అన్నారు. ఇద్దరు ఏకీభవించింది ఇక్కడే! ఇద్దరూ అడ్డుచెప్పలేదు. తమ తండ్రిని- తమ దేవుళ్ళను వదలడానికి సిద్దమయ్యారు. రాహేలుకి సంపూర్ణ సమర్పణ లేక గృహదేవతను తెచ్చుకొని ప్రాణహాని తెచ్చుకొంది.

సహోదరులు ఐక్యత కలిగి నివశించుట ఎంతమేలు! ఎంత మనోహరము! కీర్తనలు 133:1. ఇక్కడ సహోదరులు అంటే కేవలం అన్నదమ్ములు అని మాత్రమే అనుకోవద్దు! అక్కచెల్లెళ్ళు అని కూడా అర్ధం! యాకోబు పత్రికలో వ్యభిచారినులారా! అని పిలిచినందుకు కేవలం స్తీలే అనుకోన్నారేమో! వ్యభిచారం చేసే పురుషులకోసం కూడా వ్రాయబడింది. కాబట్టి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నచెల్లెల్లు అందరూ ఐక్యమత్యంగా ఉంటే దేవదీవెనలు పొందుకోగలరు.
ప్రియ సహోదరీ/ సహోదరుడా!
నీవుకూడా అలాంటి స్తితిలో ఉన్నావా?
నీ సహోదరుని/ సోదరిని ప్రేమించలేని స్తితిలో ఉన్నావా?
నీ సోదరుని/ సోదరిని బాగున్నావా అని అడిగి ఎంతకాలమయ్యింది?
నీ సోదరుని/ సోదరిని ప్రేమించలేని వాడవు/దానవు దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు?
అందుకే 1 John(మొదటి యోహాను) 4:20,21
20.ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు(ఎట్లు ప్రేమింప గలడు?)
21.దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము..
.. కాబట్టి సోదరుని/సోదరిని ప్రేమించలేని వాడు అబద్దికుడు! అంతేకాదు తన సోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని వ్రాయబడింది. 1 యోహాను 3:15. కాబట్టి ప్రియ సహోదరి/సహోదరుడా! సహోదర ప్రేమ మీలో నిలువరముగా నిలువనీయుడని యేసయ్య పేరిట మనవి చేస్తున్నాను.

God Bless You

ఆమెన్

(సశేషం)


లేయా –9వ భాగం

లేయా-యాకోబు


ప్రియదైవజనమా! ఈరకంగా లేయా ద్వేషింపబడినా సరే- దేవునిపై ఆనుకొని యున్నందువల్ల దేవుడు ఆమెను హెచ్చించారు. తగినకాలమందు ఆయన మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన కాడి క్రింద దీన మనష్కులై యుండిడి. 1 పేతురు 5:6-7.అంతేకాదు ఆయన మనకోసం చింతిస్తున్నారు అని సెలవిస్తుంది. నిజంగా లేయా చాలా దీనురాలు. తనకు కలిగిన దౌర్భాగ్యం కొరకు ఎవరిని నిందించలేదు. ఆమెభాద మనుష్యులకు అర్ధం కాకపోయినా దేవునికి అర్ధం అయ్యింది, అందుకే ఆమెకు ఆరుగురు కుమారులను, ఒక కుమార్తెను అనుగ్రహించారు. దేవుడు నా శ్రమను చూశాడు, నా మొర్రవినెను, దేవునికి స్తోత్రం అని తన పిల్లలకు పేర్లు పెట్టింది. మోషే, ఆహారోను, సమూయేలు, ఎజ్రా, ఆసాపు లాంటివారు ఆమె గర్భం నుండి పుట్టిన లేవీ వంశస్తులే! దావీదు, సోలోమోను, హిజ్కియా, యోషియా లాంటి రాజులు రాజవంశము ఆమె గర్భమునుండి వచ్చినవారే!అట్టి ఆధిక్యత దేవుడు ఆమెకు ఇచ్చారు. లేయా తను జీవించినంతకాలం –తన భర్త తనను ప్రేమించకపోయిన సరే- తన భర్తకు విధేయతగ ఉంటూ భర్తను ప్రేమిస్తూ వచ్చింది. లేయా నేటి మన భారతదేశంలో స్త్రీలందరికీ, ఇంకా అందరికీ మార్ఘదర్శిగా, ఉదాహరణగా చేసారు దేవుడు. ప్రియ విశ్వాసి! ఆమెను చూసి నేర్చుకోమని, కష్టాలలో కృంగిపోక, ఎవరిని నిందించక, నిష్టూరాలు వేయకుండా, సర్దుకుపోతూ, ప్రభువును స్తుతించడం నేర్చుకొంటే, నీ జీవితం అత్యద్బుతంగా అమోఘంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారు.

ఇక ఒంటరిగా వెళ్ళిన యాకోబుగారు ఇద్దరు భార్యలు, ఇద్దరు ఉప పత్నులు, 12గురు కుమారులు, ఒక కుమార్తె కలిగి, అత్యంత పశు సంపద, సేవకులు కలిగి తిరిగి వచ్చారు. యాకోబుగారు హారానులో తన మామతో 20సం.లు ఉన్నారు అంటారు. అయితే బైబిల్ పండితులు 20సం.లు కాదు 20+20 నలబై సం.లు ఉన్నారు అంటారు. లాబాను కుమార్తెల కోసం 14సం.లు, ఆస్తికోసం 6 సం.లు, (ఆది 31:40). 20సం.లు ఉన్నారు. తర్వాత తన తండ్రి ఇంటికి పోతాను అని అడిగితే లాబాను నా దగ్గరే ఉండు, నీ ద్వారా దేవుడు నన్ను దీవించినట్లు నాకు తెలిసింది అని లాబానుకి ఒక స్నేహితునిగా మరో 20 సం.లు ఉంచేసాడు. ఆది 30:25-43, 31:38-40. ఇది బైబిల్ పండితుల అభిప్రాయం. దీనికి చాలా కారణాలున్నాయి, గాని కొన్ని మాత్రం చెబుతాను.

1. ఆది 37:3. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు. . . ఆది 30:20-24 ప్రకారం యోసేపు దీనా కంటే చిన్నవాడు. మరి ఇక్కడ వృద్ధాప్యమందు పుట్టిన వాడు అని వ్రాయబడింది. ఆ కాలంలో అక్కడ మనిషి సగటు వయస్సు 120 సం.లు. మరి వృద్దాప్యమంటే 80+ అన్నమాట. మరి కేవలం 20సంలు మాత్రమె అక్కడ ఉంటే, యాకోబుగారి 40 సం.లు వయస్సులో వెళ్ళినప్పుడు 40+20=60 అవుతుంది, అది వృద్దాప్యం కాదు. 40+40=80 వృద్ధాప్యం మొదలయ్యింది.

2. ఆది 29:35 ప్రకారం లేయా యూదాను కన్న తర్వాత ఆమె కానుపు ఉడిగెను అంటే ఆమె menopausal కి వచ్చింది. ఇంక పిల్లలు కనలేరు. లేయాకు సుమారు 15 సం.ల వయస్సులో యాకోబు హారాను వెళ్తే, ఏడు సం.ల తర్వాత అనగా 22 సం.ల వయస్సులో యాకోబు- లేయాల వివాహం జరిగింది. ఆకాలంలో menopause వయస్సు 60+. మరి 20సం.లే ఉంటే 22+20=42. 40 సం.లు ఉంటే 22+40=62. ఒకవేళ ఆమెకు తొందరగా menopause కి వచ్చింది అనుకొన్నా 55కి వస్తే మరలా దేవుడు కరుణించి ఆమెకు పిల్లలను దయచేశారు.

3. యాకోబుగారి తిరుగు ప్రయాణంలో దీనాను షెకెము అనే రాజకుమారుడు బలాత్కరించడం జరిగింది. అప్పుడు దీనా సోదరులు షిమ్యోను, లేవీలు ఆ ఊరివారిని, షెకెమును, అతని తండ్రిని కత్తితో చంపినట్లు చూస్తాం. ఒకవేళ యాకోబుగారు హారానులో 20 సం.లు మాత్రమె ఉంటే, షిమ్యోను, లేవీల వయస్సు కేవలం 12/13 సం.లు మాత్రమే. ఆ వయస్సులో గ్రామస్తులను చంపడం, చంపాలనే క్రూరమైన ఆలోచన రావడం అసంభవం. 40 సం.లు ఉంటె 12+20=32 ,ఈ వయస్సులో చంపడానికి అవకాశాలు ఉన్నాయి.

ఇంకా చాలా ఉన్నాయి గాని యాకోబుగారు 40 సం.లు ఉన్నారు అనడానికి కొన్ని ఉదహరించడం జరిగింది. ఏదిఏమైనా దేవుని వాగ్దానం ప్రకారం, తండ్రి దీవెన ప్రకారం యాకోబు దీవించబడి విస్తారమైన ఆస్తితో తిరిగివస్తూ, దారిలో యబ్బోకు రేవు దగ్గర దైవ దర్శనంతో లేయాపై ఉన్న ద్వేషం పోయింది. ఆమెను ప్రేమించడం మొదలు పెట్టాడు అంటారు బైబిల్ పండితులు. రాహేలు మరణం తర్వాత లేయా జీవితం బాగుపడింది.

ఇక యాకోబు-లేయాల జీవితంలో మరో విషాదకరమైన సంఘటన ఏమిటంటే దీనా చెరపబడటం. దానికి ఓ రకంగా లేయా పెంపకం కావచ్చు లేదా తల్లిదండ్రులు, పిన్ని, అన్నదమ్ముల విస్తారమైన ప్రేమవళ్ళ గారాబం వలన కావచ్చు. ఒక్కతే కూతురు, ఒక్కతే చెల్లి అని కావచ్చు.
ప్రియ తల్లిదండ్రులారా! మీరు మీ పిల్లలను ప్రేమించడం మంచిదే గాని, దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వారు అడిగిన ప్రతీ వస్తువు కొని ఇస్తే,చివరకి మనకు దుఃఖం మిగులుతుంది. వారి వయస్సు తక్కువ కాబట్టి వారు అడుగుతారు. దేవుడు మీకు వివేచన ఇచ్చారు కాబట్టి, అది ఈ వయస్సులో అవుసరమా, వారు అడిగిన డ్రెస్ వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని వివేచించే భాద్యత మీదే! 15 సం.లకే బండి కొనివ్వడం, వారు కంట్రోల్ చేయక యాక్సిడెంట్లో చనిపోవడం, లేక గాయపడటం ఎవరికీ భాద? కాబట్టి మీ పిల్లలను వాక్యానుసారంగా పెంచి, వారు అడిగినవి మంచివో కాదో వివేచించి ఇమ్మని యేసయ్య పేరిట మనవి చేస్తున్నాను.

ఇక దీనా, యాకోబు, లేయా- దీనా జీవితం కోసం విలపిస్తుంటే షిమ్యోను దీనాను పెళ్లి చేసుకొని వారి దుఃఖానికి విముక్తి చేసినట్లు యాశారు గ్రంధం చెబుతుంది.

ఏదిఏమైనా లేయా జీవితం మనందరికీ ఒక కనువిప్పు, ఆదర్శం! లేయాల ప్రార్ధించు, లేయాలా జీవించు! ఆమెలో ఉన్న ఓర్పు, సహనం, కష్టాలలో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో!

అట్టి ధన్యత మనందరికీ మెండుగా కలుగునుగాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

(సమాప్తం)

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరీర కార్యములు

క్రిస్మస్

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

విశ్వాసము

పాపము

సమరయ స్త్రీ

విగ్రహారాధన