శ్రేష్టమైన శిష్యుడు




*The Best Disciple*
*శ్రేష్టమైన శిష్యుడు-1*

1 రాజులు 19:16,17.
16. ఇశ్రాయేలు వారి మీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.
17. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యెహూ హతముచేయును; యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని ఎలీషా హతము చేయును. . .

    ప్రియమైన సహోదరీ/ సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభులవారి ప్రశస్త నామంలో శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక సందేశాలు-6 లో భాగంగా మరో ప్రవక్త యొక్క జీవిత సంఘటనలతో మరలా మిమ్ములను కలవడం ఆనందంగా ఉంది. మంటిపురుగునైన నాకు అట్టి కృపనిచ్చిన దేవాదిదేవునికి నిండు వందనములు!  కొద్దిరోజుల క్రితం మనం *పౌరుషం గల ప్రవక్త* శీర్షికతో దైవజనుడైన ఏలియాగారి జీవితం జరిగిన సంఘటనల ద్వారా మనం ఏం నేర్చుకోగలమో ధ్యానించుకున్నాం. దానికి కొనసాగింపుగా ఆయన శిష్యుడు, దేవుడు ఏర్పరచుకొనిన వాడైన శిష్యుడు, *The Best* అని ఎవరికోసమైన చెప్పగలిగిన స్తితిలో ఉన్న బెస్ట్ disciple ఎలీషాగారికోసం కొద్దిరోజులు ధ్యానం చేసుకుని, దానిద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడు తున్నారో చూసుకుందాం.

   బైబిల్ గ్రంధంలో గల ప్రవక్తలలో ఒక విశిష్టమైన ప్రవక్త ఎలీషాగారు. కారణం మొదటగా ఈయన ప్రఖ్యాత ప్రవక్త ఏలియాగారి శిష్యుడు! రెండవదిగా ఒక ప్రవక్తకు రావలసిన సంపూర్ణ మర్యాద, భయము భక్తి లభించిన ప్రవక్తలలో- మోషేగారు, సమూయేలు గారు, యెషయాగారి తర్వాత కేవలం ఎలీషాగారికే ఈ మర్యాద దక్కింది. మిగిలిన వారు మంచిరాజుల సమయంలో గౌరవింపబడ్డారు. చెడ్డరాజుల/ దేవుని భయభక్తులు లేని రాజుల కాలంలో ఇబ్బందులు, అవమానాలు పొందారు.  ఇక మరో విషయం ఏమిటంటే కింగ్ మేకర్ అని చెప్పబడిన ప్రవక్తలు బైబిల్ లో ఇద్దరే ఉన్నారు. ఒకరు సమూయేలు గారు,(సౌలు, దావీదు ఇద్దరు రాజులను అభిషేకించడమే కాక, రాజ్యాంగాన్ని రాసి ఇచ్చారు). రెండవ ప్రవక్త ఎలీషాగారే. ఇశ్రాయేలు మీద నిమ్షీ కుమారుడైన యెహూని అభిషేకించడం కాకుండా, సిరియనులు మీద హజాయేలు ని పట్టాభిషేకం చేశారు. అంతేకాకుండా ముగ్గురు రాజుల సమయంలో రాజుల చేత గౌరవించబడి , ఆ రాజులను శాశించగలిగిన ప్రవక్త ఈయన! కేవలం ఇశ్రాయేలు దేశమే కాకుండా ప్రక్కనున్న సిరియా దేశాన్ని కూడా శాసించిన వ్యక్తి! అందుకే ఒకసారి ఘనురాలైన స్త్రీతో అంటున్నారు నీకు ఏం కావాలి? రాజుతో గాని, గవర్నర్ తో గాని ఏమైనా మాట్లాడి ఇప్పించాలా అని అడిగారు. 2 రాజులు 4:13; అంత కెపాసిటి గల ప్రవక్త! కింగ్ మేకర్!

   ఇక ఎన్నో అద్భుతాలు చేసిన ప్రవక్త! తన గురువు గారు కొన్ని అద్భుతాలు చేస్తే, ఈయన రెండింతల అద్భుతాలు చేసారు. కారణం గురువు గారు పొందిన ఆత్మకు రెండింతలు పొందారు కదా! చివరికి యేసుప్రభులవారు చేసిన అద్భుతాలు వంటి అద్భుతాలు ఆకాలంలోనే చేశారు. ఇక్కడ నా ఉద్దేశ్యము యేసుప్రభులవారితో ఎలీషాగారు సమానం అని కానేకాదు. ఆయన చేసిన వంటి అద్భుతాలు చేశారు అంటున్నాను. యేసయ్య కోసమైతే యోహాను గారు ఆయన చేసిన అద్భుతాలు- కార్యాలు వివరించాలి అంటే ఈ భూలోకమైన చాలదు అని చెబుతున్నారు. ఇక్కడ ఎలీషా గారు కేవలం కొన్ని అద్భుతాలు మాత్రమే చేసారు. కొన్ని రొట్టెలు అనేకమందికి సరిపోయేలా పంచి పెట్టడం, ఇంకా మిగలడం; యెరికో నీళ్ళను మధురముగా/ జబ్బులేనిదిగా మార్చడం; యేసుప్రభులవారు అంజూరపు చెట్టును శపించినట్లు తుంటరి పిల్లలను శపిస్తే వారు ఎలుగుబంటి చేతులలో చనిపోవడం... ఇల్లాంటి అద్భుతాలు యేసుప్రభులవారు వలె చేశారు.

  ఇక గురువు గారివలె చాలా పౌరుషం గల వ్యక్తి! అదేవిధంగా సౌమ్యుడు కూడా!
ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటేఏలియాగారు సేవకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఘోరమైన భ్రష్టత్వంలో ఉన్నారు. ఏలియాగారు కర్మెలు అనుభవం ద్వారా, ఇంకా మరికొన్ని అద్భుతాల ద్వారా వారిని తిరిగి దేవుని దగ్గరకు తీసుకుని రాగలిగారు. *దేవుని ప్రవక్త అని చెబితే ఎక్కడ పడితే అక్కడ ఖడ్గముతో చంపే స్తితిలో ఉన్న ఇశ్రాయేలు దేశంలో ఏలియా గారి సమయంలో ప్రవక్తల శిష్యులు ఏర్పడేటట్లు చేయగలిగారు ఏలియాగారు. అయితే ఎలీషాగారు ఆ ఉజ్జీవపు జ్వాలలను ఇశ్రాయేలు దేశమంతా ప్రాకేలా చేశారు. కేవలం ఒక దగ్గర ఉండకుండా దేశమంతా సంచారం చేస్తూ ప్రజలను రేపుతూ ఉండేవారు. ఆ ఉజ్జీవం ఇంకా ఉండేలా అక్కడ ఉన్న ప్రవక్తల శిష్యులకు తర్ఫీదునిస్తూ, వారిని వాక్యంలో గాని, ధర్మశాస్త్రం లోగాని తర్ఫీదు నిస్తూ ప్రార్ధనా పూర్వకంగా భక్తిగా జీవించేలా చేస్తూ, ఈ ప్రవక్తల శిష్యుల ద్వారా ఆ ప్రాంతమంతా దేవునియందు భయభక్తులతో జీవించేలా చేసారు ఎలీషాగారు. హోదా వచ్చాక ప్రజలను తన కాలి దగ్గరకు రప్పించుకోలేదు గాని, తనే అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకున్నారు.*  అందుకే ఆయన ముందుగా ఆయన మంచి శ్రేష్టమైన శిష్యునిగా జీవించి, తర్వాత మంచి గురువుగా మారి, మాదిరి కరమైన శిష్యునిగా జీవించారు.

   మరి ఇంత శ్రేష్టమైన వ్యక్తిత్వం, భక్తి, ఆత్మ ఎలా పొందుకోగలిగారు ఆయన! కేవలం ఏలియాగారి పాదాల దగ్గర నేర్చుకున్నారు. 1 రాజులు 19 వ అధ్యాయం ప్రకారం ఆయన గొప్ప భూస్వామి. గాని దేవుని పిలుపు అందుకుని, ఓ అనామికునికి, విద్యలేని పామరునికి శిష్యునిగా చేశారు.2 రాజులు 3:11 ప్రకారం ఏలియాగారి చేతులమీద నీరు పోశారు అనగా ఆయనకు సేవ చేశారు అనగా బహుశా ఆయన బట్టలు ఉతికారు. ఆయనకు కావలసిన వేడినీరు మోసి, కాచి పెట్టారు. ఆయనకు వండి పెట్టారు. ఆయనకు అన్ని సేవలు చేశాక, చివరగా ఏలియాగారు వెళ్ళిపోయేటప్పుడు ఎలీషా నీకు ఏమి కావాలి అంటే మీరు పొందుకున్న ఆత్మకు రెండుపాళ్ళు కావాలి అని అడిగితే అది నాచేతులలో లేదు గాని దేవుని చేతులలో ఉంది. అయినా నేను వెళ్ళేటప్పుడు నీకు కనిపిస్తే అది నీకు దొరుకుతుంది అని చెప్పారు. ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన వేసుకున్న గొంగళి/ రగ్గు దొరికింది. దానితో గొప్ప అద్భుతాలు చేశారు. గొంగళి ద్వారా అద్భుతాలు చేశారని ఇక్కడ అర్ధం కాదు గాని, ఆ గొంగళి పొందుకున్న విధానం ద్వారా ఆయనకు రుజువైంది ఏలియాగారు పొందుకున్న ఆత్మకు రెండింతలు తను పొందుకున్నట్లు.

ప్రియ దైవజనమా! ఇంతగొప్ప భూస్వామి దేవుడు పిలిచినప్పుడు తగ్గించుకొని, ఎంతగా పరిచర్య చేసారో చూసుకున్నాం. అందుకే అంత గొప్ప ప్రవక్తగా దేవుడు చేశారు. మరి నీకు అలాంటి తగ్గింపు జీవితం ఉందా? ఎలీషా గారిలాంటి నమ్మకం, విధేయత నీకుందా? ఒక సేవకునికి/ శిష్యునికి కావలసిన లక్షణం ఇదే! అది నీకు కూడా ఉంటే, ఎలీషాను వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోడానికి సిద్దంగా ఉన్నారు.
మరి నీవు సిద్దమా?

దైవాశీస్సులు!

*The Best Disciple-2*
*శ్రేష్టమైన శిష్యుడు-2; ఉపోద్ఘాతము-2*

1 రాజులు 19:16,17
16. ఇశ్రాయేలు వారి మీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.
17. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యెహూ హతముచేయును; యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని ఎలీషా హతము చేయును. . .

    ప్రియమైన దైవజనాంగమా! ఎలీషాగారి జీవితచర్యలు కోసం ధ్యానం మొదలుపెట్టాము గతభాగం నుండి. ఆయనకోసం ఇంకొంచెం వివరాలు తెలుసుకుందాం ఈరోజు.

పేరు: ఎలీషా
పేరుకు అర్ధం: దేవుడే నా రక్షణ. God is My Salvation.
జననం: బహుశా BC 900 కావచ్చు.
తండ్రి పేరు: షాపాతు
తల్లి పేరు: తెలియదు
గోత్రం: తెలియదు
ఊరు: ఆబెల్-మెహోలా. ఇది ఏలియాగారి జన్మస్తలమైన తిష్బీయెజ్రెయేలు కి మధ్యలో ఉంది. అనగా ఏలియాగారి జన్మస్థలం నుండి కేవలం 10 కి.మీ.ల దూరంలో ఉంది.
వృత్తి: వ్యవసాయం. పెద్ద భూస్వామి. 12 అరకలతో దున్నాల్సినంత భూమి గలవాడు. కష్టజీవి.
గురువు: ఏలియాగారు.
సేవకు పిలువబడుట: BC 860-850 కి మధ్యలో దేవుని ఏర్పాటు ద్వారా, ఏలియాగారు తన దుప్పటిని ఎలీషామీద వేయడం ద్వారా (అదే అభిషేకం కావచ్చు). అప్పటి ఆయన వయస్సు సుమారు 35 సం.లు.
సేవ:  ఇశ్రాయేలు దేశమంతా తిరిగుతూ సేవ చేశారు సుమారు 65 సం.లు.
మరణం: సమరయలో. సుమారు BC 800.
విద్యాభ్యాసం : చదువుకున్న వాడు అంటారు. ఎక్కడ చదివారో తెలియదు. బహుశా ధర్మశాస్త్రాన్ని చదివి అర్ధం చేసుకునేటంత చదివి ఉంటారు.
వివాహం: బహుశా పెళ్లి చేసుకోలేదు తన గురువుగారి లాగ. కారణం బైబిల్ లో గాని, చరిత్రలో గాని తనకు తల్లిదండ్రులు ఉన్నట్లు వ్రాయబడింది గాని భార్య-పిల్లలు ఉన్నట్లు వ్రాయబడలేదు.

సేవకు పిలుచుకున్న సందర్బము: ఏలియా గారు వైరాగ్యంతో చనిపోవాలనుకొని చెత్త ప్రార్ధన చేస్తారునేను నా పితరుల కంటే గోప్పోడ్ని కాను, నీకోసం నేను ఒక్కడినే పౌరుషం కలిగి బ్రతుకుతుండగా ఇశ్రాయేలీయులు , ఆహాబు, యెజెబెలు నన్ను చంపాలని చూస్తున్నారు. ఇక చాలు. నన్ను నీవే చంపేయ్ అని పిచ్చి ప్రార్ధన చేస్తేబహుశా దేవునికి ఒళ్ళుమండి షాపాతు కుమారుడైన ఎలీషాను నీకు బదులుగా ప్రవక్తగా అభిషేకం చెయ్యమంటారు.

విశిష్టతలు:   బైబిల్ గ్రంధంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గార్ల తర్వాత, మోషేగారు, యెహోషువా కోసం ఎక్కువగా వ్రాయబడింది. తర్వాత సమూయేలు గారు, దావీదు గారు, సొలోమోను కోసం విస్తారంగా వ్రాయబడింది. దానితర్వాత క్రొత్త నిభంధనకు ముందు ఎవరికోసమైనా ఎక్కువగా వ్రాయబడింది అంటే అది ఎలీషాగారి కోసమే! (గమనిక: యెషయా, యిర్మియా లాంటివి ప్రవచన గ్రంధాలు తప్ప వ్యక్తి జీవిత చర్యలు కావు).
2 రాజుల గ్రంధం 25 అధ్యాయాలు. దానిలో 9 అధ్యాయాలు ఎలీషాగారికోసమే వ్రాయబడ్డాయి. ఏలియాగారి కోసం కేవలం 5 అధ్యాయాలు మాత్రమే వ్రాయబడ్డాయి. ఇక 2 రాజులు గ్రంధం మిగిలిన 16 అధ్యాయాలు కలిపి 13 ఇశ్రాయేలు రాజులు కోసం (సుమారు 132 సం.లు చరిత్ర, వారు బాబులోను దేశానికి BC722 లో చెరలోనికి పోయేవరకు), మరియు 17 యూదా రాజుల కోసం (సుమారుగా 289 సం.ల చరిత్ర, వారు BC586 లో బబులోనుకి చెరలోనికి పోయేవరకు) వ్రాయబడింది.  కాబట్టి ఇంత విస్తారంగా ఒక ప్రవక్త కోసం ఎందుకు వ్రాయబడింది? కారణం ఆయన ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలు. రెండవదిగా ఆయన కింగ్ మేకర్ అని నిన్నటి భాగంలో చూసుకున్నాం కాబట్టి. రాజులను, అధికారులను శాసించిన విధానం కోసం వ్రాయబడింది విస్తారంగా!

చూడండి ఒక కుగ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న ఒక యవ్వనస్తున్ని, చిన్నప్పుడే బట్టతల అయిపోయిన, అందం లేని యవ్వనస్తుడుఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకుంటుంటే దేవుడు ఏర్పాటుచేసుకున్నారు., ఆయన నమ్మకముగా ఏలియాగారికి పరిచర్య చేస్తే, దేవుడు రెట్టింపు ఆత్మనిచ్చి బలంగా వాడుకున్నారు.  దేవుడు వాడుకున్నకొద్దీ ఇంకా ఒదిగిపోయి, నమ్మకముగా పనిచేస్తున్నందుకు దేవుడు రాజులనే, అధికారులనే శాసించగలిగిన స్తితికి తీసుకుపోయారు. ఇక్కడ నాకు ఒక వచనం గుర్తుకు వస్తుంది. జ్ఞానియైన సొలోమోను ఒకమాట అంటారు: తన పనియందు నమ్మకముగలవానిని,నిపుణత గలవానిని చూచితివా, వాడు రాజుల దగ్గరకు కొనిపోబడతాడు. సామెతలు 22:29;
అంత నమ్మకముగా దేవునిదగ్గర ఉన్నారు కాబట్టే దేవుడు అంత గొప్ప స్తితికి తీసుకుని వచ్చారు. మరో వచనం కూడా చెప్పనీయండి. ప్రకటన గ్రంధంలో యేసయ్య సైనికులకుసాతాను సైనికులకు యుద్ధం జరుగగా యేసయ్య సైనికులు గెలుస్తారు. దానికి కారణం ఎంతో చక్కగా వ్రాయబడియుంది చూడండి. ప్రకటన గ్రంథం 17: 14
వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

కాబట్టి ప్రియ చదువరీ! నీవు ఏ స్తితిలో ఉన్నా సరే, నీవు నమ్మకముగా పనిచేస్తున్నావా? వ్యవసాయమైన, ఉద్యోగమైనా, సేవ అయినా, గృహిణి అయినా, నీవు ఏమి చేస్తున్నా నమ్మకముగా దేవునిదగ్గర పనిచేయాలి. అలా పనిచేస్తే ఎలీషాగారిని దీవించిన దేవుడు నిన్నుకూడా దీవించగలరు!
మరి నీవు సిద్ధమా?
దైవాశీస్సులు!



*The Best Disciple-3*
*శ్రేష్టమైన శిష్యుడు-; ఎలీషాగారిని పిలిచిన విధానం*


   1 రాజులు 19:1920
19. ఏలీయా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేర బోయి తన దుప్పటి అతని మీద వేయగా
20. అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తి-నేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు-పోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను.

   ప్రియ దైవజనమా! ఇంతకుముందు ఏలియాగారి జీవితాన్ని ధ్యానం చేసేటప్పుడు ఒకసారి చూసుకున్నాము ఎలీషాగారు పిలువబడిన విధానం. ఇప్పుడు సందర్బం కాబట్టి మరోసారి చూసుకుందాము.

   ఇక 19వ వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను అని వ్రాయబడింది అనగా అతనికి మార్గమధ్యంలో ఎలీషాగారు కనబడ్డారు. బహుశా అందుకే ఏలియాగారికి అప్పగింపబడిన మూడు పనులలో మొదటిగా మూడవ పనిని చేస్తున్నారు.

 ఇక ఈ వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏలియాగారు ఎలీషాగారిని చూసినప్పుడు ఆయన దుక్కు దున్నుతున్నారు తనపొలంలో! ఎలా? తన ముందర పండ్రెండు అరకల ఎడ్లచేత దుక్కి దున్నిస్తూ, పన్నెండో అరక తను దున్నుతున్నారు. జాగ్రత్తగా గమనిస్తే మొదటగా ఎలీషాగారు భూస్వామి అని అర్ధం అవుతుంది. నేనుకూడా వ్యవసాయదారుడను కాబట్టి అనుభవం చేత చెప్పేది, అర్ధం అయ్యేది ఏమిటంటే చిన్న రైతులు/ చిన్న భూస్వాములు మూడు, నాలుగు అరకరలతో  దున్నిస్తారు మరి ఆకాలంలో ట్రాక్టర్లు లేవుకదా! 12 అరకలతో దున్నిస్తున్నారు అనగా ఆయనకు చాలా భూమి ఉంది ఉంటుంది. అప్పుడే 12 అరకలు అవసరం అవుతాయి. మామూలుగా 12 అరకలు కన్నా ఎక్కువగా ఎవరు ఉపయోగించరు. దీనిని బట్టి మనకు అర్ధం అవుతుందిఎలీషాగారు ఏలియాగారిలాంటి అనామకుడు/ పేదవాడు కాదు. చాలా ఆస్తి గలవాడు.

  ఇక మరో గమనించవలసిన విషయం ఏమిటంటే ఏలియాగారు చూడబోయేసరికి ఎలీషాగారు దుక్కు దున్నుతున్నారు. 11  అరకలు ముందు దున్నుతుంటే తాను 12వ అరక తనే స్వయముగా దున్నుతున్నారు. అనగా ఆయన ఎంత భూస్వామి అయినా తన పని తాను చేయడానికి సిగ్గు పడటం లేదు. నేటి దినాల్లో కొద్దిగా ఆస్తి/ డబ్బు ఉంటే వారిపనులు వారు చేయకుండా ఇతరులతో పనిచేయిస్తుంటారు. కాని ఈయన సోమరి కాదు, పనిచేయడానికి సిగ్గు పడటం కూడా లేదు.  ఇక ఈయన పనిచేస్తూ కనిపించారు ఏలియాగారికి. అనగా పైన చెప్పినట్లు సోమరిపోతు కానేకాదు. *బైబిల్ గ్రంధాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తేదేవుడు ఎక్కడైనా ఎవరినైనా పిలిస్తేవారు ఏదైనా పని చేస్తున్నప్పుడే పిలిచారుఅనగా పనిచేసే వారినే పిలిచారు గాని సోమరిపోతులను పిలువనే పిలువలేదు.  ప్రవక్త ఆమోసు గారిని పశువులు కాసుకుంటూ మేడిపళ్ళు ఏరుకుంటూ ఉంటే పిలిచారు. గిద్యోను గానుగ ప్రక్కన కళ్ళం దుల్లగోడుతుంటే పిలిచారు. పేతురు, యోహాను, అంద్రేయ, యాకోబుగార్లు చేపలు పట్టుకుంటూ, వలలు బాగుచేసుకుంటూ ఉంటే అప్పుడు పిలిచారు. మత్తయి గారు సుంకం వసూలు చేస్తూ ఉంటే పిలిచారు. పౌలుగారు దేవుని భక్తులను చంపడానికి వెళ్తూ ఉంటే పిలిచారు. ఇలా ఎవరైనా పని చేసుకునే వారినే పిలిచారు తప్ప పనీపాటు లేకుండా ఖాళీగా తిరుగుతూ, పనికిరాని కబుర్లు చెప్పుకునే వారిని ఎవరినీ పిలువలేదు దేవుడు*.

ప్రియ యువతీయువకులులారా! ఈ భాగం ద్వారా నేను  మీతో చెప్పేదేమిటంటే  మీ చదువు పూరి అయ్యిందా? అయితే ఖాలీగా ఉండకు! ఏదో ఒకపని చేయడానికి సిద్దపడు. అది ఎంత చిన్నపని అయినా సరే , చేయడానికి సిద్దపడు. ఖాలీగా ఉండకు. పర్మినెంట్ ఉద్యోగం వచ్చేవరకు వేచి ఉండకు. పనిచేస్తూ, పర్మినెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయు. 2 రాజులు ౩:11 ప్రకారం ఎలీషాగారు ఇంత పెద్ద భూకామందు కూడా ఏలియాగారి చేతులమీద నీరు పోస్తూ ఆయనకు పరిచారం చేయడానికి సిద్దపడ్డారు. అందుకే దేవుడు ఎలీషాగారిని ఏర్పాటుచేసుకున్నారు. కొంతమందికి పెద్ద ఉద్యోగం వచ్చేవరకు నేను చెయ్యను. లక్ష రూపాయలు జీతం ఇస్తేనే గాని చేయను ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అవే వారిని వారి జీవితాన్ని పాడుజేస్తాయి. కాబట్టి అందిన పనిని చేయడానికి ప్రయత్నించండి. పౌలుగారు కూడా అదే అంటున్నారుపనిచేయకుండా భోజనం చెయ్యొద్దు. 2 థెస్సలోనికయులు 3:11-12; చేతికి అందిన పని చెయ్యండి అంటున్నారు.

  మరికొంతమంది నేను దేవుని సేవచేస్తాను అని అనుకొంటూ దేవుని పిలుపు కోసం ఎదురుచూసేవారున్నారు. మంచిది. కాని దేవుని పిలుపు వచ్చేవరకు దయచేసి ఊరుకోవద్దు. దేవుడు పిలిచేవరకు ఏదైనా ఒకపని చేస్తూ, మీ తల్లిదండ్రులకు సహాయపడమని మనవి చేస్తున్నాను. మీ తల్లిదండ్రులమీద నీ ప్రతీ అవసరానికి ఆధారపడకు. అలా పనిచేసుకుంటూ పోతుంటేదేవుడు అప్పుడు నిన్ను తనసేవకు పిలుచుకోగలరు గాని ఖాళీగా కూర్చుంటే, నీలాంటి సోమరిపోతులను దేవుడు పిలువడు, అలాంటివారు దేవునికి అక్కరలేదు అని తెలుసుకోమని దేవుని పేరిట హెచ్చరిస్తున్నాను. దేవునికి కష్టపడేవారే కావాలి.

     సరే, ఇలాంటి స్తితిలో ఏలియాగారు ఎలీషాగారి దగ్గరకు వచ్చి, పన్నెండో అరక దున్నుతున్న ఆయన మీద తన దుప్పటి వేశారు. వెంటనే ఆయన అనగా ఎలీషాగారు తన ఎడ్లను వదలిపెట్టి నేను నాతల్లిదండ్రులకు ముద్దుపెట్టి వచ్చి నిన్ను అనుసరిస్తాను అని చెప్పారు. చూడండి- మొదటగా ఏలియాగారు యేసుప్రభులవారు చెప్పినట్లు మీరు నన్ను వెంబడించండి అని ఎలీషాతో నన్ను వెంబడించుదేవుడు నిన్ను ఏర్పరచుకొన్నారు అని చెప్పలేదు. కేవలం తన దుప్పటిని ఎలీషాగారిమీద వేస్తే ఆయనకు కధ అర్ధమైపోయింది. దేవుడు నన్ను తన సేవకు పిలుస్తున్నారు అని. వెంటనే నేను మొదట వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దుపెట్టుకుని వస్తాను అని చెప్పారు.  

   ఇక మరో గమనించవలసిన విషయం ఏమిటంటేఇక్కడ ఆయన ఎలీషాగారిని అభిషేకించలేదు. అభిషేకించడానికి ఆయనదగ్గర ఏమీలేదు కూడా! గాని బహుశా ఏలియాగారు తన దుప్పటితోనే ఎలీషాగారిని అభిషేకించి ఉండొచ్చు. కారణం ఆయన దుప్పటిలో గల శక్తి మనకు 2 రాజులు గ్రంధంలో తెలుస్తుంది. అనగా ఆయన దేవుని ఆత్మ గలవాడు/ ఆత్మపూర్ణుడు కాబట్టి డైరెక్టుగా తన దుప్పటితో అనగా దేవుని ఆత్మతోనే డైరెక్టుగా అభిషేకం చేసారు ఏ విధమైన నూనె వాడకుండా! అందుకే వెంటనే ఆ ఆత్మ శక్తిద్వారా ఎలీషాగారికి అర్ధమైపోయింది దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నారు అని.

     ఎలీషాగారు నేను వెళ్లి మా తల్లిదండ్రులకు ముద్దుపెట్టి వస్తాను అంటే ఏలియాగారు అడ్డుచెప్పలేదు. ఇక్కడ ఎలీషాగారు తల్లిదండ్రులమీద ప్రేమ అభిమానం, భయభక్తులు గలవారని అర్ధమౌతుంది. వెంటనే ఎలీషాగారు తన దున్నుతున్న కాడి ఎడ్లను వధించి అక్కడున్నవారికి విందుచేసి తన తల్లిదండ్రులకు ముద్దుపెట్టి ఏలియాగారిని వెంబడించారు.

ప్రియ చదువరీ! దేవునిసేవ చేయాలి అంటే నీకు కావలసిన లక్షణాలు మొదటగా నీకు పనిచేయడానికి ఆసక్తి కావాలి. పనిచేస్తుండాలి. అది ఎంత చిన్న పని, ఎలాంటి పని చేయడానికైనా సిద్దపడాలి. ఇంత ధనవంతుడైన ఎలీషాగారు ఏలియాగారి చేతులమీద నీరుపోస్తూ అతనికి ఉపచారం చేసారు. ఇక్కడ ఆయన ఏలియాగారికి ఉపచారం చేస్తున్నాను అనుకోలేదు గాని, దేవుని ప్రవక్తకు ఉపచారం చేస్తే దేవునికి పరిచర్య చేస్తున్నట్లు భావించి ఇష్టపడి పనిచేసారు. అందుకే ఏలియాగారు పొందుకున్న ఆత్మకు రెండింతలుగా ఆత్మను పొందుకున్నారు. నీవుకూడా దేవునిసేవలో వాడబడాలంటే నీవుకూడా పనిచేయడం మొదలుపెట్టు. దేవా ఏ పని ఇచ్చినా నేను చేయడానికి సిద్దమే అని చెప్పు. నీ గర్వాన్ని, నీ అంతస్తుని ప్రక్కన పెట్టి దేవునిసేవ చేయడానికి సిద్దమైన మనస్సు కలిగియుండు. బహుశా ఎలీషాగారు ప్రార్ధన చేసి ఉండొచ్చుదేవా నన్ను నీసేవలో వాడుకో! అందుకే ఆయన మనస్సు చూసి ఎలీషాగారిని పిలుచుకొన్నారు దేవుడు! మరి నీవుకూడా అలా సిద్దపడితే దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతునారు. సేవ అనగా సంచిలో బైబిల్ వేసుకుని సువార్త చెప్పడమే కాదు ఆయన పరిచర్యలో వాడబడటం కూడా దేవుని సేవయే! దేవుని మందిరము యొక్క పనిచేయడం, సువార్త కార్యక్రమంలో పాల్గొనడం అన్నీ సేవయే!

  కాబట్టి అట్టి సువార్త వలనైన సిద్దమనస్సు అనే జోడు తొడుగుకొని ఆయన సేవలో సాగిపోదుము గాక!
ఆమెన్!
*The Best Disciple-4*
*శ్రేష్టమైన శిష్యుడు-4; ఎలీషాగారి తర్ఫీదు*

ప్రియ దైవజనమా! గతభాగంలో ఎలీషాగారు పిలువబడిన విధానం చూసుకున్నాం. పిలిచిన వెంటనే ఇంటికిపోయి తల్లిదండ్రులకు ముద్దుపెట్టి, విందుచేసి ఏలియాగారికి పరిచర్య చేయడం మొదలుపెట్టారు.

అయితే మరల ఎలీషా గారి గురించి 2 రాజులు 2 అధ్యాయం వరకు ఏమీ వ్రాయబడలేదు. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? ఎంతకాలం ఏలియాగారికి శిష్యరికం చేశారు ఎలీషా అనేది మనకు స్పష్టముగా తెలియదు. అయితే చరిత్ర ప్రకారం సుమారు 4 సం.ల నుండి ఆరున్నర సం.లు కావచ్చు. ఈ సమయంలో ఏలియాగారితో ముఖ్యమైన రెండు సంఘటనలకు బహుశా ప్రత్యక్ష సాక్షి ఎలీషాగారు. మొదటిది నాబోతుగారిని చంపించినప్పుడు దేవుడు ఏలియాగారితో పంపించిన తీర్పు. దానికి ఆహాబు మారుమనస్సు పొంది దేవుణ్ణి క్షమాపణ వేడుకుంటే దేవుడు తిరిగి అదే ఏలియాగారితో పంపించిన వర్తమానంఏలియాగారు స్పందించిన తీరు జాగ్రత్తగా పరిశీలించారు. ఇక రెండవది ఆహాజు ఎక్రోను దేవత బయెల్జెబూబు దగ్గరకు తను బాగుపడతాడో లేదో తెలుసుకోడానికి దూతలను పంపితే ఏలియాగారితో దేవుడు పంపించిన సందేశం, ఆ తర్వాత 102 మంది సజీవదహనం. ఇవన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలించారు ఎలీషాగారు. ఇక్కడ నాబోతు విషయంలో స్పందించినప్పుడు ఒక ప్రవక్త ఎవరికీ భయపడకూడదుదేవుని మాటలు ఉన్నవి ఉన్నట్లు చెప్పాలి అనేది నేర్చుకొంటేతర్వాత ఆహాబు గుణపడిన తర్వాత ఎంత కోపమున్నా ఏలియా గారుఅవన్నీ పక్కన పెట్టి దేవునిప్రేమ చూపుతున్నారు ఆహాబు మీద. ఈ విషయంద్వారా దైవసేవకునికి, ప్రవక్తకు స్వంత కోపతాపాలు ఉంచుకోకూడదు. దేవుడు క్షమిస్తే మనం కూడా క్షమించాలి అనేది నేర్చుకున్నారు. ఇక ఆహాజు దేవతలను ఆశ్రయించిన విషయంలో దేవునికి విగ్రహాలు అంటే ఎంతకోపమోఅదే దేవునిమనస్సు ఎరిగి స్పందించాల్సిన విధానం నేర్చుకున్నారు. ఇలా బోలెడు అనుభవాలు నేర్చుకున్నారు ఎలీషాగారు ఏలియా గారి దగ్గర!

ఐతే ఇంకా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే: మరి ఈ ఆరున్నర సంవత్సరాలలో కేవలం ఇదేనా నేర్చుకున్నది. అంటే చాలా నేర్చుకున్నారు ఎలీషాగారు. పౌరుషం గల ప్రవక్త అనే అంశం ధ్యానం చేసేటప్పుడు ఏలియాగారు ప్రార్ధనాపరుడని, ఆత్మపూర్ణుడని, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని అనుభవించేవారని తెలుసుకున్నాం. కాబట్టి అదే దైవభక్తి విధానం, ప్రార్ధనాజీవితం, ఆత్మీయత అన్నీ ఏలియాగారు ఎలీషాకు నేర్పించారు. ఎలీషాగారు కూడా అదేబాటలో నడవడం ప్రారంభించారు. అందుకే ఏలియాగారు ఎలీషా! నేను ఎత్తబడక మునుపు నీకు ఏమికావాలో కోరుకో అంటే- ధనం, బోగభాగ్యాలు లాంటివి అడుగలేదు. కేవలం రెట్టింపు ఆత్మ కావాలని అడిగారు. కారణం ఎలీషాకు తెలుసు ఇంతటి గొప్పకార్యాలు ఏలియాగారు చేస్తున్నారు అంటే అది కేవలం దేవునిఆత్మతో నింపబడి ఉండటం వల్లనే. ఇప్పుడు ఆ ఆత్మ ఉంటే- విశ్వాసం ఉంటుంది. ఆత్మ ఉంటే ధైర్యం కలుగుతుంది. ఆ ఆత్మ కలిగిఉంటేప్రార్ధనా జీవితం అబ్బుతుంది. కాబట్టి ఆత్మపూర్ణులుగా ఉంటే శరీరరీతిలో ప్రవర్తించకుండా, ఆత్మీయంగా ప్రవర్తించడమే కాక, ఏలియాగారిలాంటి అసాధారణ క్రియలు కూడా చేయవచ్చు. అందుకే కేవలం ఆత్మకోసం అడిగారు ఎలీషా! అందుకే పౌలుగారు అంటున్నారు ఆత్మపూర్ణులై ఉండుడి. అప్పుడు శరీరరీతిలో ప్రవర్తించరు. గలతి 5:6; ఇంకా అంటున్నారు మీ పెద్దలను అనుసరించి నడచుకొనుడి. హెబ్రీయులకు 13: 7
మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును(లేక, వారు అంతమువరకు నడుచుకొనిన రీతిని) శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.
ఎలీషాగారు అదే చేసారు. ఏలియాగారిని అనుసరించారు.
ప్రియ చదువరీ! నీవు కూడా నిన్ను కాస్తున్న నీ దైవసేవకుని అనుసరించమని ఆయన అడుగుజాడలలో నడవమని మనవి చేస్తున్నాను. యేసయ్య కాలంలో శాస్త్రులు- పరిసయ్యులు అనేవారంట- మేము చెప్పేవన్ని చేయండి గాని మేము చేసేవి మాత్రం చేయొద్దు అని కారణం వారు చెప్పేవారే గానిదాని ప్రకారం చేసేవారు కాదు. ప్రియ సేవకుడా! నీవు కేవలం చెప్పేవాడిగా మాత్రమే కాకుండా దాని ప్రకారం చేసేవాడిగా ఉండమని యేసయ్య పేరిట బ్రతిమిలాడుతున్నాను. కారణం మీ సంఘం మొత్తము, ఇంకా అన్యులు నిన్ను చూసున్నారు అని మరచిపోవద్దు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే: చరిత్ర ప్రకారం ఈ రోజులలో అనగా మోరియాసీనాయి పర్వత అనుభవం తర్వాత ఏలియాగారు ప్రవక్తల శిష్యులను ఏర్పరచి, బలపరచడం మొదలుపెట్టారు. ప్రవక్త అనే మాట వింటేనే ఖడ్గముతో చంపే స్తితినుండిప్రవక్తలకు శిష్యులు కూడా ఏర్పడే ఆత్మీయ స్తితికి తీసుకుని వచ్చారు ఏలియాగారు. వీరికి ఎలీషాగారే పెద్దగా వ్యవహరించేవారు. ఇక్కడ ప్రవక్తల శిష్యులు అనగా మన పూర్వకాలంలో గురుకులాలు (రెసిడెన్షియల్ స్కూళ్ళు) ఎలా నడిచేవో , ఇవి కూడా అలాగే నడిచేవి. మోతుబరులు వీటికి సహాయం చేసేవారు. వీరందరినీ చాల బాగా నిర్వహించేవారు ఎలీషాగారు. ఇంతటి భాద్యత అలియకుండా ఎంతో సమర్ధవంతంగా నిర్వహించేవారు. నిజం చెప్పాలంటే ఈ ప్రవక్తల శిష్యులు అనేదానికి మూలకర్తదైవజనుడైన సమూయేలు గారు. బైబిల్ ని ధ్యానం చేసినా, చరిత్ర తిరగేసినా ఈ విషయం తెలుస్తుంది. ఏలియాగారికి పెద్దలంటే, ధర్మశాస్త్రం అంటే ఎనలేని గౌరవం గాబట్టి దానిని ఇంకా ముందుకు నడిపించారు. కొన్ని వందల సం.ల క్రితం మూతబడిన ప్రవక్తల శిష్యుల కేంద్రాలు మరలా తెరువబడ్డాయి. అంతటి విప్లవాన్ని తీసుకుని రాగలిగారు ఏలియాగారు. దానిని ఇంకా బాగా అభివృద్ధి చెందించారు ఎలీషాగారు ఆయన ఆరోహణం అయ్యాక!
కాబట్టి ఈ విధంగా ఎన్నో రకాలుగా తర్ఫీదు పొందారు ఎలీషాగారు ఏలియాపాదాల దగ్గర! ఆయనకు సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ, ఎన్నోరకాలుగా సేవలో గడిపారు. ఒక అనామికునికి సేవ చేస్తున్నాను అని ఎప్పుడూ భావించకదేవునికే చేస్తున్నట్లు భావించారు. అందుకే అంత దీవెన పొందగలిగారు. అందుకే పౌలుగారు చెబుతున్నారు కొలస్సీ లో . .కొలస్సీయులకు 3: 24
మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు.

కాబట్టి ప్రియ విశ్వాసి! ఎలీషాగారి బాటలో నడువు. మీ కాపరిని/ సేవకుని అనుసరించు. వాక్యానుసారంగా జీవించు. నీవు ఏమిచేస్తున్నా అది దేవునికి చేస్తున్నావు అని నిండు మనస్సుతో, ఇష్టపూర్వకముగా చేయు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తారు. ఎలీషాగారు అదే చేశారు. దీవించబడ్డారు. నీవుకూడా అలా చేయు. దేవుని దీవెనలు పొందుకో!
దైవాశీస్సులు!
*The Best Disciple-5*
*శ్రేష్టమైన శిష్యుడు-5- ఏలీయాగారి ఆరోహణం*
2 రాజులు 2:12
1. యెహోవా సుడిగాలి చేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీషాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా
2. ఏలీయా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి యున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా-యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.

ప్రియులారా! ఎలీషాగారు ఏలియా గారి దగ్గర ఎంతోభక్తి శ్రద్ధలు నేర్చుకున్నట్లు గతభాగములో చూసుకున్నాం. ఇక ఏలియాగారు ఆరోహణమయ్యే సమయం వచ్చింది. దీనికోసం గతంలో ధ్యానం చేసుకున్నాం. ఐతే ఈ విషయం ఎలీషాగారిని నిజంగా భాదించింది. గాని దేవుని నిర్ణయం కదా అందుకే ఏమీ అనలేకపోయారు ఎలీషా! అందుకే ఈ వచనాలలో చూసుకుంటే ఏలియాగారు ఎలీషా నన్ను దేవుడు అక్కడికి వెల్లమంటున్నారు నీవు ఇక్కడ ఉండిపో అంటే అనేవారు- యెహోవా జీవముతోడు నీజీవముతోడూ నేను నిన్ను విడువను. అంతేకాకుండా బహుశా ఏలియాగారు ఎలీషాగారిని పరీక్షించడానికి ఈమాట అని ఉండవచ్చు. లేకపోతే సరే, ఇకచాలు, నీవు ఇక్కడ ఉండిపో! నేను ప్రభువు దగ్గరకు వెళ్ళిపోతాను అనే ఉద్దేశ్యంతో అని ఉండవచ్చు. సరే, ఇప్పుడు వీరిద్దరూ చేసిన మజిలీలలో ఎన్నో ఆత్మీయ మర్మాలున్నాయి. దీనికోసం గతంలో చాలాసార్లు వివరించడం జరిగింది. కాబట్టి సందర్భం కాబట్టి చాలా క్లుప్తంగా చూసుకుందాం.

బైబిల్ గ్రంధంలో వ్రాయబడిన/జరిగిన ప్రతీ సంఘటన ఎన్నో వర్తమానాలు-ఆత్మీయ మర్మాలతో నిండిఉన్నాయి. అందుకే 1కొరింథీ 10:11 లో “*ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను*” అని వ్రాయబడింది, కాబట్టి అది ఒక చరిత్ర మాత్రమే అని అనుకోవద్దు. వాటిలో ఎన్నో అర్ధాలు-పరమార్ధాలు దాగియున్నాయి.
ఇక్కడ వీరి మజిలీలో 1. గిల్గాలు, 2) బేతేలు, 3) యెరికో, 4) యోర్దాను అనేవాటిని దాటివెళ్ళాల్సి వచ్చింది. అంతేకాదు ప్రవక్తల శిష్యులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. పై మూడు మజిలీలలో ఏలియాగారు నీవు ఉండిపో అనినా, యెహోవా జీవంతోడూ నేను నిన్ను విడువను అనే అన్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా ఏలియాగారిని విడవడానికి ఈయనకు ఇష్టం లేదు. అలాగే విశ్వాసి దేవునితో సహవాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడువకూడదు.

నేడు రక్షింపబడిన విశ్వాసి కూడా ఈ అన్ని మజిలీలు దాటాల్సిందే! వీటిని దాటకుండా, ఎదుర్కోకుండా పరలోకానికి చేరడం అసంభవం. వీటిని సంక్షిప్తంగా చూద్దాం.

1.*గిల్గాలు-దొరలింపబడుట* : వీరిద్దరూ మొట్టమొదటగా గిల్గాలు మీదుగా పోవాల్సి వచ్చింది. గిల్గాలు అనుమాటకు దొరలింపబడుట అని అర్ధం. ఇశ్రాయేలీయులు వారి ఐగుప్తు యాత్రలో యోర్దాను నదిని దాటిన వెంటనే దేవుడు సున్నతిని పొందమని సెలవిస్తారు. అది జరిగిన వెంటనే దేవుడు చెప్పారు నేటితో ఐగుప్తు అవమానాన్ని నేను తీసివేస్తున్నాను అన్నారు. అందుకే ఆ ప్రాంతానికి గిల్గాలు అన్నారు. యెహోషువా 5:9
అదేవిధంగా ఒకవ్యక్తి మారుమనస్సు, పశ్చాత్తాపం పొంది తను పాపినని గ్రహించి , యేసే రక్షకుడని గ్రహించి భాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు పాపాలన్నీ దొరలిపోతాయి. ఇది మొదటి మెట్టు.

2. *బేతేలు-దైవమందిరం*: ఏలీయాగారు, ఎలీషాగారు బేతేలు అనే ప్రాంతం చేరుకొంటారు. మనం బేతేలు గురించి చూసుకొంటే యాకోబుగారి జీవితంలో ఈ బేతేలు అనుభవం ఎదురైంది. ఆదికాండము 28:13-22 . తన అన్న ఏశావుకి భయపడి తన మావయ్య ఇంటికి ఒంటరిగా పారిపోతుండగా ఆరాత్రి దేవుడు యాకోబును దర్శించి ఆశీర్వదించారు. అందుకే యాకోబుగారు ఆప్రాంతానికి బేతేలు అని పేరుపెట్టారు.

అదేవిధంగా రక్షింపబడిన విశ్వాసి తనజీవితంలో బేతేలు అనుభవం కలిగియుండాలి. ఎప్పుడు ఆ అనుభవానికి చేరుకోగలరు? క్రమం తప్పకుండా దైవ సన్నిధికి వెళ్తున్నప్పుడు, దైవసన్నిధిని అనుభవించినప్పుడు. దానిద్వారా దేవుని బిడ్డల సహవాసం దొరుకుతుంది. అంతేకాక దైవ దర్శనం కలుగుతుంది. దేవుడు నీతో మాట్లాడుతారు ఏదోవిధంగా! ఇదే బేతేలుఅనుభవం.

3. *ప్రవక్తల శిష్యులు-సాతాను ఏజెంట్స్*: వీరిద్దరూ బేతేలుకు చేరుకొన్నప్పుడు ఇంకా ప్రతీ స్థలంలో కూడా ఈప్రవక్తల శిష్యులు ఎలీషాగారిని నిరాశపరుస్తారు. మీగురువుగారిని ఈరోజు దేవుడు పరలోకానికి తీసుకోనిపోతున్నారు తెలుసా అంటూ. అందుకు ఎలీషా గారు ఏమన్నారు? అదినాకు తెలుసుగాని మీరు నోరుమూసుకోండి.

ఇక్కడ ప్రవక్తల శిష్యులు సాతానుగాడి ఏజెంట్స్ లాగ ప్రవర్తిస్తున్నారు . వీరు నిజంగా ఎలీషాగారిని బలపరచడం మానేసి నిరాశపరుస్తున్నారు. అలాగే కొందరు మనవిశ్వాస జీవితాన్ని ఇలాగే నిరాశపరుస్తారు. అప్పుడు మనం సరియైన సమాధానం వాక్యాదారంగా ఇవ్వాలి. వీళ్ళు తప్పుడు బోధలు, తప్పుడు ఆచారాల ద్వారా మనలను సందిగ్ధంలో పడేస్తుంటారు. కొందరు ఏడువారాలు గుడికొస్తే చాలు అని, కొందరు 40రోజుల దీక్ష అని అంటుంటారు. ఈమధ్య కొందరు పెద్ద పెద్ద పాపాలు చేస్తే తప్పుకాని చిన్న చిన్న పాపాలు పర్వాలేదు అని భోదిస్తున్నారు. పాపం అది చిన్నదైనా పెద్దదైనా అది పాపమే. వీటిని వాక్యంతో ఎదుర్కోవావాలి. కొన్నిసార్లు సాతానుగాడే సూటిగా మనతో మాట్లాడుతుంటాడు మనకి నిరాశ నిస్పృహ కలిగిస్తుంటాడు. అప్పుడు యేసుప్రభులవారు జవాబిచ్చినట్లు వాక్యంతో వాడికి జవాబివ్వాలి. అప్పుడు వాడు మనదగ్గరనుండి పారిపోతాడు. ప్రతీ నిజవిశ్వాసి ఈ అనుభవంగుండా వెళ్ళాల్సిందే!

4. *యెరికో*: మనప్రవక్తల తర్వాత మజిలీ యెరికో. ఇది ఒక పాపపు పట్టణం! ఈ పట్టణ వివరాలు యెహోషువా గ్రంధంలో చూడొచ్చు. ఇది జూదములకు, హత్యలకు, మానభంగాలకు, దొంగతనాలకు, వ్యభిచారాలకు, అవమానాలకు, మోసాలకు ఇంకా అన్యాచారాలకు ప్రసిద్ధి మరియు గుర్తుగా ఉంది. రక్షింపబడిన విశ్వాసిని తిరిగి లోకంలోనికి లాగడానికి సాతానుగాడు ఇవన్నీ చూపించి విశ్వాసబ్రష్టుడిగా చేయాలని చూస్తాడు. విశ్వాసి వీటిని తప్పకుండా జయించాలి. వాక్యంతో తిప్పికొట్టాలి. అందుకే పౌలుగారు 2కొరింథీ 6:14-18 లో చెబుతారు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు.......వెలుగుకి చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంభంధం? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక? మనము దేవుని ఆలయమై ఉన్నామని సెలవిచ్చారు.

5. *యోర్దాను*: అనగా 1) అడ్డము, 2) మరణము. . దాటుట
ఏలియా మరియు ఎలీషాగార్లయొక్క తదుపరి మజిలీకి ముందు యోర్దాను నదిని దాటివెళ్ళాలి.
ప్రతీవిశ్వాసి ఈ యోర్దాను అనుభవం దాటకుండా పైకెత్తబడలేరు. అనగా సాతాను కలిగించే ప్రతీ అడ్డు ఆటంకాలను దాటుకొని వెళ్ళాలి. మరియు మరణం ద్వారా వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏలీయాగారు దీనిని విశ్వాసం అనే దుప్పటిని ఉపయోగించి నదిని పాయలుగా చేసి ఎంతో సునాయాసంగా దాటేసారు. ఇక ఎలీషాగారు కూడా తన తిరుగు ప్రయాణంలో అదే విశ్వాసం అనే దుప్పటిని ఉపయోగించి యోర్దాను నదిని ఎంతో అవలీలగా దాటేసారు. ప్రతీవిశ్వాసి కూడా ఇదే విశ్వాసం అనే దుప్పటిని ఉపయోగించి యేసునామంలో ప్రతీ అడ్డంకిని పాయలుచేసి అవతలి ఒడ్డుకి చేరుకోవాలి.

సరే ఇక్కడ ఒకసారి ఆగుదాం! ఇంతవరకు ఎలీషాగారు యెహోవాజీవము తోడూ, నీ జీవముతోడు నేను నిన్ను విడువను అన్న వ్యక్తి, ఎందుకు రెండింతలు ఆత్మ కావాలని అడిగారంటే బహుశా, ఇక్కడ ఏలియాగారు తన దుప్పటితో యోర్దాను నదిని కొట్టగా అది రెండుభాగాలుగా విడిపోయింది. బహుశా ఈ అధ్బుతాన్ని చూసి, తనుకూడా ఇలాంటి అద్భుతాలు చేయాలి అంటే తనకు కూడా ఆత్మకావాలి అని దీనిని చూసి ఆశపడియుండవచ్చు. సరే *ఈ యోర్దాను నదిని దాటితే అప్పుడు ఏం జరుగుతుంది*?
అగ్నిరధములు, అగ్నిగుఱ్ఱములు, సుడిగాలి ద్వారా ఏలీయా గారు పైకెత్తబడ్డారు. అదేవిధముగా రక్షింపబడిన విశ్వాసి కూడా యోర్దాను అనుభవం దాటినప్పుడు ఒకరోజు అనగా యేసయ్య రెండో రాకడలో వచ్చినప్పుడు రెప్పపాటులో కడభూర మ్రోగగానే పైకెత్తబడతారు!!!
ఎప్పుడూ?
1. విశ్వాస జీవితాన్ని జీవించినప్పుడు
2. వాక్యాదారంగా జీవించినప్పుడు
3. పైనుదహరించిన అన్ని అనుభవాలను వీరోచితంగా దాటినప్పుడు.

ప్రియ విశ్వాసి! నేడో రేపో యేసయ్య రాబోతున్నారు. (1 థెస్సలోనికయులు 4:16,17; 1 కొరింథీ 15:50-52; మత్తయి 24:31)
నీవు సిద్ధంగా ఉన్నావా?
సిద్ధంగా ఉంటే ఎత్తబడతావు!
అట్టి కృప, ధన్యత, ఎత్తబడే అనుభవం నీకు, నాకు కలుగును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*The Best Disciple-6*
*శ్రేష్టమైన శిష్యుడు- ఎలీషా పరిచర్య -1*

2 రాజులు 2:14
ఒంటి మీది నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలీయా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలియొడ్డునకు నడిచిపోయెను.

ప్రియులారా! ఏలియాగారు ఆరోహణమైనప్పుడు ఎలీషాగారు ఏడుస్తున్నారుఏమని? నా తండ్రి ఇశ్రాయేలీయులకు రధములును రౌతులును నీవే! అనగా ఇక్కడ ఇశ్రాయేలు దేశం సురక్షితంగా ఉన్నది అంటే అది రాజు వలన కాదుగాని, మీ ప్రార్ధనవలన, మీరు నేర్పిస్తున్న భక్తివిధానం వలన అని ఎలీషాగారి ఉద్దేశం. అయితే అప్పుడు ఏలియాగారు తన బట్టలు చింపుకుని ఎలుగెత్తి మొర్రపెడుతున్నారు. వెంటనే ఏలియాగారి దుప్పటి క్రింద పడ్డాది. దానిని తీసుకుని వెళ్ళిపోతున్నారు.
ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే దుప్పటి ఎప్పుడు పడ్డది క్రింద? ఎలీషాగారు తన బట్టలు చింపుకుని ఎలుగెత్తి మొర్రపెట్టినప్పుడు. అదేవిధంగా నీ ప్రార్ధనకు జవాబు రావాలంటే మీ బట్టలు కాదుగాని మీ హృదయాలు చింపుకుని , దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని క్రుమ్మరించి అడిగితే అప్పుడు అద్భుతకార్యాలు జరుగుతాయి .అందుకే బైబిల్ గ్రంధంలో వ్రాయబడింది. విలాపవాక్యములు 2: 19
నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయ మును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు

యోవేలు 2: 13
మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.

ఇప్పుడు ఎలీషాగారు ఆ దుప్పటి పట్టుకుని వెళ్ళిపోతున్నారు మరలా యోర్దాను దగ్గరకు. ఎలీషాగారు ఏమడిగారు? రెండింతల ఆత్మ! ఇప్పుడు ఆయనకు ఒకరకమైన నిశ్చింత కలిగింది. బహుశా ఎప్పుడైతే ఏలియాగారి దుప్పటి క్రింద పడిందో, దేవుడు తను రెండింతల ఆత్మపొందుకోవడాన్ని ఆమోదించినట్లు భావించారు. దేవుడు ఇలాంటి ప్రార్ధనలు వింటారు. గతంలో చెప్పిన విధముగా యేసుప్రభులవారు ఎంతో స్పష్టముగా చెప్పారులూకా 11: 13
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.
నిజంగా ఎలీషాగారు అదే అడిగారు. పొందుకున్నారు.
ప్రియ చదువరీ! నీ ప్రార్ధన దేనిమీద? మెటీరియల్ బ్లెస్సింగ్స్ మీద లేక ఆత్మీయ వరాలు ఫలాలు మీదనా? ఎలీషాగారు శ్రేష్టమైనవి అడిగారు. దేవుడు ఇచ్చారు. నీవుకూడా అలాంటి ఆత్మీయ సంగతులు కావాలని అడిగి పొందుకో!

      ఇప్పుడు ఒంటి మీది నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలీయా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలియొడ్డునకు నడిచిపోయెను.. . . .   చూసారా  దుప్పటితో కొట్టిన వెంటనే మరలా యోర్దాను నది విడిపోయింది . *ఇది గురువుగారు చేసిన చివరి అద్భుతం! శిష్యుడు చేసిన మొదటి అద్భుతం*! అయితే ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నారు అని అడగటానికి కారణం ఏమిటి? ఏలియాగారి దుప్పటి క్రింద పడడం వలన తను రెండింతలు ఆత్మ పొందుకున్నట్లు నమ్మారు. అయితే దానిని రుజువుచేసుకోడానికి ఏలియాదేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నారు అని అంటూ దుప్పటితో కొట్టారు. ఇక్కడ అధ్బుతాలు చేసే శక్తి ఆ దుప్పటిలోనే ఉందా? లేదు లేదు! ఆ దుప్పటి పొందుకోవడంలో ఎలీషాగారికి నిర్ధారణ అయ్యింది అంతేతను రెండింతల ఆత్మను పొందుకున్నట్లు. అంతేకాకుండా  ఎప్పుడైతే యోర్దాను నది పాయలుగా చేయబడి ఆరిననేల మీద నడిచిరావడం ప్రవక్తల శిష్యులు చూసారో వారందరికీ అర్ధమయ్యింది ఏలియాగారి ఆత్మఎలీషాగారిమీద ఉన్నది అని గుర్తెరిగి ఆయనకు సాష్టాంగనమస్కారం చేస్తున్నారు.
  ఇక్కడ మీకు మరో విషయం మరలా గుర్తుచేయనీయండి. యోర్దాను నది వెడల్పు అయినది కాదు. బహుశా కొన్ని చోట్ల 20 మీటర్ల వెడల్పు ఉంటే కొన్నిచోట్ల 50100 మీటర్లు ఉంటుంది అంతే! కాబట్టి ప్రవక్తల శిష్యులు ఆ ఒడ్డునుండి ఏలియాగారు ఆరోహణం అవ్వడం చూసారు. ఎలీషాగారు నదిని కొట్టినవెంటనే నది పాయలు కావడం చూసారు. అందుకే సాష్టాంగనమస్కారం చేశారు.
     చూసారా! ఒక భూస్వామి, తనకు కలిగిన సమస్తముచివరకు తల్లిదండ్రులను సహితము వదలిఒక ఏమీలేని ప్రవక్తకు పరిచర్య చేసినందువలనఆ ప్రవక్త పొందు కున్న ఆత్మకు రెండితలు ఆత్మ పొందుకున్నారు. అంతేనా! ఆ ప్రవక్త చేసిన అద్భుతాలు వంటి అద్భుతాలు ఎన్నో చేశారు. ఇదంతా కేవలం నమ్మకముగా చేయడం వలన!  తన ఈగో, ఆస్తి, అంతస్తును లెక్కచేయకుండా తను చేసేపని దేవునికోసం చేస్తున్నట్లు మనసావాచా- కర్మేనా నమ్మారు. అలా నమ్మకముగా పరిచర్య చేసారు. అందుకే దేవుని నుండి అంత బలమైన అభిషేకం పొందుకున్నారు.

 ఇక 1618 వచనాలలో కొన్ని ఆశక్తికరమైన విషయాలు కనబడతాయి. మొదటగా యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు. వారు అంటున్నారు మా దగ్గర 50మంది బలాడ్యులు ఉన్నారు. వారు వెళ్లి ఏలియాగారిని వెదకనీయండి. బహుశా యెహోవాఆత్మ మీ గురువుగారిని ఎత్తుకుని ఎక్కడైనా వేసిందేమో, లేక ఆత్మ పరలోకం పోయినా, అతని శరీరం మధ్యలో ఎక్కడైనా రాలిపోయిందేమో మేము వెదుకుతాము అంటున్నారు.  ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసినది ఏమిటంటే ప్రతీ పట్టణంలోను ప్రవక్తల శిష్యులు తయారయ్యారు. వారిని తయారుచేసింది ఏలియాగారే అని గతబాగాలలో చెప్పడం జరిగింది. ఇక్కడ వారంటున్నారు బలాడ్యులే 50 మంది, మరి బలహీనమైన ప్రవక్తల శిష్యులు ఎందఱో తెలియదు. అంత విస్తారంగా ప్రవక్తల శిష్యులను తయారుచేశారు.

    ఇక వీరు అంటున్నారు మేము మీ గురువుగారిని వెదుకుతాము అంటే ఎలీషాగారు వద్దు అన్నారు. కారణం తనకు తెలుసు దేవుడు ఆయనను శరీరముతోనే పరలోకమునకు తీసుకుని పోయారు. అయితే వీరికి ఒక పనికిమాలిన అనుమానంఆయన శరీరాన్ని దేవుడు ఎక్కడైనా ఏ పర్వతం మీదనైనా పారేశారేమో అని. ఆయన వద్దు అన్న, బలవంతంగా ఒప్పించి, వెదకి వేశారిపోయారు. ఇదీ మానవుని బలహీనం! దేవుడు చెప్పిన మాటలు సంపూర్ణంగా నమ్మకపోవడం, అవిశ్వాసంఇదే నేటి విశ్వాసుల బలహీనత! చిన్న అనుమానుమున్నా సాతానుగాడు దానిని వందరెట్లు చేస్తాడు. అందుకే ఇలాంటి అపనమ్మకము వలెనే నేటి విశ్వాసులుసంఘము గొప్ప కార్యాలు చేయలేక/పొందలేక పోతున్నారు. అందుకే యేసుప్రభులవారు నమ్మువారికి సమస్తము సాధ్యమే అంటేఆ రోగిష్టికుమారుని తండ్రి అంటున్నాడునమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయుము. మార్కు 9:23,24;
 నేడు నీవునేను చేయల్స్సిన ప్రార్ధన ఇదే! ఆయనను సంపూర్ణముగా నమ్ముదాం. ఎలీషాగారిలా శ్రేష్టమైనవి కోరుకుని, విశ్వసించి పొందుకుందాము.

ఆమెన్!
దైవాశీస్సులు!
*The Best Disciple-7*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-2*

2 రాజులు 2:1922
19. అంతట ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై యున్నదని ఎలీషాతో అనగా
20. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా
21. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ నీటిని నేను బాగు చేసియున్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.
22. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైయున్నది.

   ప్రియ దైవజనాంగమా! గతభాగం నుండి మనం ఎలీషాగారి పరిచర్యను ధ్యానం చేసుకుంటున్నాం.  మొదటగా ఒక విషయం చెప్పనీయండి. ఆధ్యాత్మిక సందేశాలు-1 నుండి మీకు చెబుతున్నానుఎలీషాగారు చేసిన ప్రతీ అద్భుతములోను ఎన్నో ఆత్మీయమర్మాలు ఉంటాయి. ప్రతీ అద్భుతము ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు మనం. గతంలో ఈ భాగాలు ధ్యానం చేసుకున్నాం.  వాటితోపాటుగా ఇంకా మరికొన్ని ఈ సారి ధ్యానం చేసుకుందాం.

   పై వచనాలలో గల భాగంలో మనకు యెరికో పట్టణం గురించి వ్రాయబడింది. ఇది మామూలుగా చదువుకుంటూ పోతే  ఎలీషా అనే ప్రవక్త చేసిన అద్భుతములాగ కనిపిస్తుంది. అయితే మన ఆత్మీయ కన్నులు తెరిచి చక్కగా ధ్యానం చేస్తే ఎన్నో గూఢమైన వర్తమానాలు చూడవచ్చు మనం.  ఎలీషా గారు యెరికో పట్టణం వెళ్తారు. కారణం యోర్దాను అవతల యెరికో పట్టణమే ఉంది . వారు వచ్చి బ్రతిమిలాడుతున్నారు ఎలీషా గారిని అయ్యా! ఈ పట్టణం చూడటానికి బాగానే ఉంది గాని ఇక్కడ నీరు మంచివి కావు అందువలన భూమి నిస్సారమై ఎందుకు పనికిరాకుండా పోయింది అన్నారు. ఇక 21 వ వచనం ప్రకారం , ఆ నీరు వలన ప్రజలకు జబ్బు కలగడమే కాకుండా మరణమును కూడా కలిగిస్తుంది. అప్పుడు ఎలీషా గారు ఒక క్రొత్త కుండలో ఉప్పు తెమ్మని చెప్పి, యెహోవా సెలవిచ్చునదేమనగా నేను ఈ నీటిని బాగుచేశాను కాబట్టి ఇక జబ్బుగాని, మరణం గాని కలుగదు అన్నారు. వెంటనే నీరు, భూమి బాగుపడింది. ఇదీ జరిగిన విషయం.

  అయితే దీనిలో గల భావాలు ఏమిటంటే: మొదటగా ఆ పట్టణం యెరికో. యెరికో అనగా పాపపు పట్టణం. అది శపించబడినట్లు మనం యెహోషువా గ్రంధమందు చూసుకోవచ్చు. అంతేకాకుండాయేసుప్రభులవారు కూడా ఆ పట్టణం కోసం ఉటంకిస్తూ అది పాపుల పట్టణమని , అక్కడ దొంగలు దోచుకొను వారు ఉంటున్నట్లు మంచి సమరయుని ఉపమానములో చూడవచ్చు.  ఇలాంటి పాపభూయిష్టమైన ప్రాంతంలో పుట్టినవారు వచ్చి అంటున్నారు అయ్యా! ఈ పట్టణం చూడటానికి బాగానే ఉంది గాని ఈ నీరు మంచిది కాదు. అందువలన భూమి నిస్సారంగా ఉంది.  ఈరోజు ప్రజలు పాపపు లోకంలో పాపులై ఉంటున్నారు. కళ్ళు తెరిస్తే మనకు పాపమే కనిపిస్తుంది. చెవులతో ఎన్నో పాపపు మాటలు వినవలసి వస్తుంది.  కళ్ళు, చెవులతో పాపాన్ని చూస్తూ, వినడం వలన హృదయంలో కూడా పాపపు ఆలోచనలు వస్తున్నాయి. ఇక మొత్తానికి అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన నడకలు, అపవిత్రమైన పనులు మాత్రమే చేయగలుగుతున్నారు ప్రజలు. గాని నిజదేవున్ని ఎరుగడం లేదు. ఫలితం నిస్సారమైన జీవితాలు.  మనిషి దేవుణ్ణి చేరలేకపోతున్నాడు.  అందుకే కొంతమంది భయము కలిగి అడుగుతున్నారు ప్రవక్తనుమా జబ్బును బాగుచేయు. ఈ మరణాన్ని తప్పించండి అని.  ఈరోజు ప్రజలు నిజదేవున్ని ఎరుగక పాపరోగంతో బాధపడుతూ నరకానికి పోతున్నారు. వారికున్న పాపరోగానికి మందుకావాలి!  ఆ పాపరోగానికి మందు యేసురక్తము! యేసునామము! మరి అప్పుడు ఆ మందు ఇవ్వడానికి ఎలీషా గారు ఉన్నారు. ఇప్పుడు ఆ మందు నీవు ఇవ్వగలవా? ఆ మందు ఎంతో విరివిగా, ఉచితముగా దొరుకుతుంది గాని అది నీవు ఇచ్చే స్థితిలో ఉన్నావా? ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా?

   ఇక మరో అర్ధమేమిటంటే: కొంతమంది మనుష్యులు పైకి బాగా కనిపిస్తుంటారు. పైకి పటారం! లోన లొటారం అంటుంటారు కదా! ముందు పర్సనాలిటీ! వెనుకాల మున్సిపాలిటీ! అలాగుంది చాలామంది బ్రతుకులు!  ప్రజలు చూడటానికి బాగానే కనిపిస్తున్నారు. గాని వారిలో ఎన్నో జబ్బులు! ఎన్నో అప్పులు! ఎన్నో సమస్యలు!  పైకిమాత్రం బాగా కనిపిస్తూ నవ్వుతున్నారు గాని వారి అంతరంగమంతా తీవ్రమైన కలవరాలు. మనస్సాంతి లేదు. ప్రజలు చర్చికి వస్తున్నారు. కానుకలు ఇస్తున్నారు. కాని వారు నిసారమైన జీవితాలు జీవిస్తున్నారు. కారణం పాపపులోకంలో పాపులై బ్రతుకున్నారు. ఎదుగుబొదుగూ లేనిజీవితాలు.  రక్షింపబడి ఇన్నేళ్ళయినా ఒక్క ఆత్మను కూడా రక్షించ లేని గొడ్డు బ్రతుకులు! కొంతమంది అయితే కేవలం పండుగ క్రైస్తవులు. మరికొంతమంది  మొదటి ఆదివారం బల్లారాధన క్రైస్తవులు. పేరుకు క్రైస్తవులు గాని బ్రతుకు మాత్రం Same to Same అన్యులు!  బ్రతుకులు ఏమీ మారలేదు. పేరు మాత్రం మారింది. ఇలాంటి చెత్త సరుకు దేవునికి అక్కరలేదు.  అయితే ఇలాంటి వారికి నేడు కావాలి రక్షణ! వారికి కూడా కావాలి పాపరోగానికి మందు!  ఐతే గమనించవలసినది ఏమిటంటే: ఎలీషా గారు అడుగకుండా ఆ వ్యాధికోసం ప్రార్థన చేయలేదు. ఈరోజు నీవుకూడా నీ పాప వ్యాధి పోవాలంటేరక్షించబడి వెనుకడువేసిన విశ్వాసి/పడిపోయిన విశ్వాసి/ వెనకడుగు వేసిన సహోదరి/ సహోదరుడా! తిరిగి క్షమాపణ వేడి అడుగు యేసయ్యనునా జబ్బు ఇది! నా పాపరోగానికి మందుకోవాలి. అదే పాపరోగం వలన నా బ్రతుకు నిస్సారంగా ఉంది. ఇక ఈ నిస్సారమైన బ్రతుకు నాకు వద్దు! ఈ వ్యాధిగల బ్రతుకు , మరణపాత్రమైన బ్రతుకు నాకు వద్దు అని ప్రార్థించు( నాకెక్కడ మరణం, రోగం అనుకొంటున్నావేమో, నీకు రోగం లేదని అనుకొంటున్నావేమో, పాపానికి వచ్చు జీతం మరణం. అది నిత్య నరకం అని మరచిపోకు; రోమా 6:23). అప్పుడు నిన్ను స్వస్తపరచటానికి దేవుడు ఇష్టపడుతున్నారు. కారణం లోబడనొల్లని ప్రజలకొరకు దినమంతా ఆయన చేతులు చాపి పిలుస్తున్నారు. యెషయా 65:2; ప్రయాసపడి భారము (పాపభారము) మోసుకునుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి మీకు విశ్రాంతిని కలుగజేతును అని దేవదేవుడు చేతులు చాపి పిలుస్తున్నారు. మత్తయి 11:28; కాబట్టి వెంటనే ఒప్పుకుని రా యేసయ్య వద్దకు!

   ఈ విషయం విన్న ఎలీషా గారు మీరు పాపులు! మీకోసం ప్రార్థన చేయను అనలేదు. ఎంతో ప్రేమతో స్పందిస్తున్నారు. నేడు ప్రియవిశ్వాసి/ సేవకుడా! నేడు కూడా నీవు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారు ఎలాంటివారైనా, నీకు అక్కరలేదేమో గాని ఆ సృష్టికర్తకు ప్రతీ ఒక్కరు కావాలి. వారికి రక్షణ సువార్తను ప్రకటించి,  దేవుని దగ్గరకు నడిపించవలసిన భాద్యత నీకుంది. కాబట్టి మనస్సులో వారిపై ఎటువంటి కక్షలు, క్రోధాలు పెట్టుకోకుండా క్షమించి, మత్సరములేని నిండు మనస్సుతో నీవు ప్రార్థిస్తే దేవుడు వారి జబ్బును (పాపరోగాన్ని) క్షమించి- రక్షిస్తారు. కారణం యేసురక్తము ప్రతిపాపమునుండి కడిగి పవిత్రులనుగా చేస్తుంది. 1 యోహాను 1:7;

  ఇక ఎలీషా గారు క్రొత్త కుండలో ఉప్పువేసి తెమ్మని చెప్పారు. క్రొత్త కుండ ఎందుకు కావాలి? పాతకుండ పనికిరాదా? అవును పనికిరాదు! కారణం ఇంతవరకు నీ బ్రతుకు పాపపు బ్రతుకు! నీ పాపపుకుండ/ మారుమనస్సు లేని కుండను సమరయ స్త్రీ విడిచిపెట్టి నట్లు నీవుకూడా నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తే నీకు దేవుడురాతిగుండెను తీసి మాంసపు గుండె ఇస్తాను అంటున్నారు. నీకు క్రొత్తమనస్సును / మారిన మంచి హృదయాన్ని పొందుకుంటావు. ఇప్పుడు ఆ క్రొత్త కుండలో ఉప్పు- అనగా మారిన జీవితం గల సారవంతమైన జీవితాలు ప్రార్ధనావిశ్వాసాలతో ఈ జబ్బునీటిలో వేస్తే ఆ జబ్బుపోయి, మరణము పోయి జీవము కలుగుతుంది. అప్పుడు భూమి సారవంతంగా మారతుంది.
 
 ఇక్కడ ఉప్పునే ఎందుకు వేశారు? పంచదార వేయవచ్చు కదా/ లేదా అప్పుడు పంచదార లేదు కాబట్టి బెల్లం వేయవచ్చు కదా??!!!  కారణం  దీనిలో మరో ఆత్మీయ అర్ధం కూడా ఉంది.  లేవీయకాండము 2:13 లో .
నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను.
   ఇక్కడ ఉప్పు అనేది ఒక నూతన నిబంధనకు సాదృశ్యంగా ఉంది. ఇంతవరకు నీవు ఎలా పాపపుజీవితం జీవించినా గాని, ఇకముందుకు నీవు ఆ పాపపు బ్రతుకు వదిలిదేవునితో నిభందన చేసి సారవంతమైన జీవితం జీవించాలి. అందుకే ఇకను పాపము చేయకుము అని చెప్పారు యేసయ్య; యోహాను 5:14; అప్పుడు నీ బ్రతుకు ఎన్నో ఆత్మలను క్రీస్తుకోసం గెలువగలదు. మారిన నీజీవితమే గొప్ప సాక్ష్యం/ కరపత్రికగా మారగలదు. ఒకనాడు దొంగవు, వ్యభిచారివి, త్రాగుబోతువు, లంచగొండువి! ఇప్పుడు ఎలా మారావు అంటే నీవు చెప్పకపోయినా మారిన నీజీవితం సాక్ష్యం చెబుతుందియేసు ఆ వ్యక్తిని మార్చారు. ఆ వ్యక్తి ఇప్పుడు యేసురక్తములో కడుగబడ్డాడు. ఇప్పుడు నూతన జీవితం/ నూతన కుండగా ఉన్నాడు.

   ఎలీషా గారు ప్రార్థించిన వెంటనే యెరికో నీరు మారిపోయింది. మరి చదువుచున్న ప్రియ సహోదరీ/సహోదరుడా! నీ బ్రతుకు ఎలా ఉంది?
మారడానికి సిద్దంగా ఉన్నావా?
ప్రజలను మార్చడానికి సిద్ధంగా ఉన్నావా? లేక యెరికో నీరు లాగ/ భూమి లాగా ఉన్నావా?
నేడే సరిచూసుకో!
సరిచేసుకో!
దేవుడు నీకోసం తనచేతులు చాపి పిలుస్తున్నారు!
దైవాశీస్సులు!
*The Best Disciple-8*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-౩*

   2 రాజులు 2: 2324
23. అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా
24. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చి వేసెను. . . . .

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! మనం ఎలీషా గారు చేసిన అద్భుతాల నుండి ఏమి నేర్చుకోవచ్చో మనం ధ్యానం చేసుకుంటున్నాం! ఇక తర్వాత భాగం ధ్యానం చేద్దాం. మరోసారి మీకు మొదటిభాగంలో చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎలీషాగారు కూడా యేసుప్రభులవారు చేసిన అద్భుతాల వంటి అద్భుతాలు ఆ కాలంలోనే చేశారు.
  గతభాగంలో ఎలీషాగారు యెరికో నీటిని బాగుచేసినట్లు చూసుకున్నాం. అలాగే యేసయ్య కూడా నీటిని ద్రాక్షారసముగా చేశారు. ఇక ఈ భాగంలో మనం యేసుప్రభులవారు అంజూరపు చెట్టును శపించగా చెట్టు మాడిపోయినట్లు  ఎలీషా గారు తనను వెక్కిరిస్తున్న తుంటరి కుర్రవాళ్లను శపిస్తున్నారు. దీనికోసం లోతుగా పరిశీలన చేద్దాం!

    ఎలీషాగారు యెరికో నీటిని బాగుచేసి, ప్రవక్తల శిష్యులను బలపరచి యెరికోనుండి బేతేలు కు వెళ్తున్నారు. అక్కడ ఎక్కి వెళ్తున్నట్లు చూడగలం. కారణం యెరికోనుండి బేతేలు కి సుమారుగా 15 కి.మీ ఉంటుంది.  అయితే యెరికో పట్టణం యోర్దాను లోయలో ఉంటుంది. అయితే బేతేలు అన్నది ఎగువగా ఉంటుంది.  గమనించాలి ఇశ్రాయేలు దేశం కొండలు లోయలు గలదేశం. కావున లోయ నుండి కొండమీదకు ఎక్కిపోతున్నారు ఎలీషాగారు. కారణం మొదటి అధ్యాయం ప్రకారం బేతేలు లోను ప్రవక్తల శిష్యులున్నారు. యెరికోలోను కూడా ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఇక బేతేలు లో ఉన్న ప్రవక్తల శిష్యులను బలపరచడానికి కాబోలు ఆయన బేతేలు వెళ్తున్నారు. అలా వెళ్తుండగా అక్కడ ఉన్న తుంటరి/ అల్లరి పిల్లలు ఎలీషాగారిని హేళన చేసున్నారు కారణం ఆయనది బట్టబుర్ర! బోడివాడా! బోడివాడా! ఎక్కిపో! అంటూ హేళన చేస్తున్నారు. గమనించాలి ఇక్కడ. ఎలీషాగారు -ఏలియా గారి శిష్యుడని తెలుసు. ఏలియాగారివలె ఎలీషాగారు కూడా యోర్దాను నదిని పాయలు చేసినట్లు అందరికి తెలిసిపోయింది. అయినా సరే ఇక్కడ ఒక ప్రవక్తకు కనీస మర్యాద ఇవ్వడం లేదు సరికదాహేళన /అవమానం చేస్తున్నారు. అసలే ఏలియాగారి శిష్యుడు. దానిలో  ఎండ, దానిమీద బట్టబుర్ర , ఎలీషాగారికి మండింది. వెంటనే శపించారు.

Fact behind the Scene:  చరిత్ర ప్రకారం అసలు ఈ పిల్లలు ఎలీషాగారిని హేళన చేయడానికి మరో కారణం ఉంది అంటారు చరిత్రకార్లు, ముఖ్యంగా shimon backon.  యెరికో నీరు బాగోలేనందు వలన ఆ నీటిని ఎవరూ త్రాగేవారు కాదు. యోర్దాను నది నీటిని త్రాగేవారు. అయితే అది ఎప్పుడూ వరద ఉదృతివలన నీరు ఎర్రగా ఉండేది. అందుకే  వీరు మీదనుండి నీరు తెచ్చుకొనే వారంట! ఇదిచూసిన బేతేలు వ్యాపారస్తులు బేతేలు ప్రాంతం నుండి నీరుతీసుకొని వచ్చి వీరికి వస్తుమార్పిడి విధానంలో ఎక్కువ రేటుకు అమ్మేవారు. అయితే ఎప్పుడైతే ఎలీషాగారు యెరికో నీటిని బాగుచేశారో, వీరి వ్యాపారం పడిపోయింది. అందుకే ఈ గ్రామస్తులు, వ్యాపారస్తులు వీరిని పురికొల్పారు. ఫలితం పిల్లల చావును తీసుకొని వచ్చింది.  ఇక్కడ ఎలీషాగారు దేవుని ప్రవక్త అని మరచిపోయారు. ఫలితం అనుభవించారు.

       ఒక రకంగా చూస్తే ఇది తల్లిదండ్రులు పెంపకం బాగోలేదు అనికూడా అనుకోవచ్చు! కారణం పిల్లలకు మంచిచెడులు నేర్పవలసినది తల్లిదండ్రులే! బాలుని హృదయంలో మూడత్వము స్వాభావికముగా పుట్టుచుండును. శిక్షాదండం దానిని తోలివేయును అని చెబుతున్నారు జ్ఞానియైన సోలోమోను. సామెతలు 22:15; కాబట్టి ఈ మూడత్వాన్ని సరిచేయవలసిన భాద్యత తల్లిదండ్రులకు ఉంది. అయితే ఇక్కడ  ఈ తల్లిదండ్రులు పిల్లలు ఏమిచేసినా సరిచేయకుండా గారాబంతో వదిలేశారు.  మొదట్లోనే వారిని సరిచేస్తే బాగుణ్ణు. కాని వీరు సరిచేయలేదు. గాలికి /ఊరిమీద వదిలేశారు. ఏమయ్యింది? ప్రవక్త శపించారు. వెంటనే రెండు ఆడ ఎలుగుబంట్లు వచ్చి 42 పిల్లలను చీల్చివేసెను అని వ్రాయబడింది. వారు బ్రతికారో పోయారో తెలియదు గాని చీల్చివేశాయి అంట వారిని. చూసారా, తల్లిదండ్రుల గారాబము  చివరకు పిల్లల చావుకు వచ్చింది. అందుకే సోలోమోను గారు అంటున్నారుబాలుడు నడువవలసిన మార్గము వానికి నేర్పుము. వాడు పెద్దవాడయ్యాక దాని నుండి తొలగిపోడు! 22:6; బాలున్ని శిక్షించమని కూడా చెబుతున్నారు. అలా చేయకపోతే ఇలానే అవుతుంది.

   నేటిరోజులలో తల్లిదండ్రులు పిల్లలకు మంచిబుద్దులు/ సంస్కారం నేర్పడం లేదు. ఇంటికి వచ్చిన అతిధులకు/ పెద్దలకు నమస్కారం చెప్పడం, మంచినీరు ఇవ్వడం లాంటి పనులు చేయడం లేదు. సరికదా కనీసం పలకరించడం లేదు. కారణం తల్లిదండ్రులు వారికి నేర్పడం లేదు. పిల్లలను చదివించడం చేస్తున్నారు గాని అదే పిల్లలకు వచ్చిన వారికి నమస్కరించాలి, సంస్కారంతో వారికి మంచినీరు లాంటివి ఇచ్చి వారిని గౌరవించాలి అనే ఇంగితజ్ఞానం పిల్లలకు నేర్పడం లేదు. పిల్లల సంగతి తర్వాత పెద్దలు కూడా వచ్చిన వారితో మాట్లాడటం మానేసి సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ హా, ఊ అంటున్నారు. ఇదేనా మంచి మర్యాద! వచ్చిన వారి తంతు కూడా అలాగే ఉంది.  ఇక మన విద్యావ్యవస్థ కూడా పిల్లలకు చదువు నేర్పుతుంది గాని సంస్కారం నేర్పడం లేదు.  పూర్వకాలంలో విద్య అంటే అర్ధముజ్ఞానము, తెలివి నేర్పుతూ, సంస్కారం నేర్పిస్తూ, బ్రతుకు తెరువు చూపిస్తూ, చివరికి ముక్తికి మార్గము చూపించేదే విద్య!  దురదృష్టవశాత్తూ నేటిరోజులలో సంస్కారం, ముక్తికి మార్గము రెండు కూడా విధ్యలోనుండి తొలగిపోయాయి.  ప్రియ తల్లిదండ్రులారా! దయచేసి మీ పిల్లలకు చదువుతోపాటు సంస్కారం కూడా నేర్పించండి. ప్రవక్త/ దైవజనుడు ఏలీ గారు ఒక్కసారి క్రమము/మర్యాద నేర్పించారు సమూయేలు భక్తునికి. అంతే, బ్రతికినంతకాలము దానినుండి తొలిగిపోలేదు భక్తుడు. కాబట్టి మీరుకూడా మీ పిల్లలను భక్తిలోను, క్రమములోను, వాక్యములోను పెంచితే, వారికి సంస్కారం పుష్కలంగా అబ్బుతుంది.  అప్పుడు మీ పిల్లలు అకాలమరణం చెందరు. వీరికి అది లోపించింది. అందుకే ఆ పిల్లలు మరణించారు.
   
   కాబట్టి మన పిల్లలను క్రమంగా, భక్తిగా పెంచుదాం!
వారిని పరలోక రాజ్య వారసులుగా చేద్దాం! దైవసేవకున్ని/ కాపరులను గౌరవిద్దాం!
దైవాశీస్సులు!
*The Best Disciple-9*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-4*

2 రాజులు ౩:11
11. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను. అంతట ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలీయా చేతులమీద నీళ్లుపోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా . . .

   ప్రియులారా!  ఎలీషా ప్రవక్త ద్వారా జరిగిన అద్భుతాల గురుంచి మనం ధ్యానం చేస్తున్నాము.  ఇంతవరకు మనం మూడు అద్భుతాలు చూసుకున్నాం. ఈరోజు 4& 5 చూసుకుందాం.

   ఈ భాగంలో కొంత చరిత్ర కనబడుతుంది మనకు. ఏమిటంటే ఆహాబురాజు చనిపోయిన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలురాజు మీద తిరుగబడి కప్పం/ పన్ను ఇవ్వడం మానేశారు. అందుకు ఆహాబురాజు కొడుకు, యూదారాజైన యెహోషాపాతుకు కబురుపెట్టి నాతోకూడా యుద్ధానికి వస్తావా? కారణం మోయాబీయులు మా మీద తిరుగబడ్డారు . మనం వెళ్లి వారి గర్వాన్ని అణచుదాం అన్నాడు. వెంటనే యూదా రాజు ఏమనాలి? నీవు భయము భక్తిలేనివాడివి. నేను యెహోవా భక్తుణ్ణి నీకు నాకు కుదరదు అని చెప్పాలి. గాని అలా చెప్పకుండా ఇశ్రాయేలు రాజుతో పాటు యుద్ధానికి వెళ్ళాడు. కారణం యెహోషాపాతు కొడుక్కిఆహాబురాజు కూతురు అతల్యాను ఇచ్చి పెళ్ళిచేసియూదా రాజుల చరిత్రలో పెద్ద తప్పుచేశాడు.  నేటిరోజులలో అనేకమంది క్రైస్తవులు ఇదే పనిచేస్తున్నారు. దేవుడు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి అని ఖరాఖండిగా చెబితేవిశ్వాసులు వారితోనే తినితాగుతున్నారు. కారణం దేవునిమార్గం వారికి బారమైపోయింది. చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్లు ఆ తర్వాత దేవుని శాపం పొంది ఏడుస్తున్నారు.  అందుకే పౌలుగారు అంటున్నారు2 కొరింథీ 6:
14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.
17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
ప్రియచదువరీ! ఒకవేళ నీవును అదే స్తితిలో ఉంటే నేడే సరిదిద్దుకో!

    సరే, ఇప్పుడు యూదా రాజు, ఇశ్రాయేలు రాజు, వారితోపాటు ఎదోము రాజు ఈ ముగ్గురు రాజులు, వారి సైన్యాలు, వారి పశువులు అన్నీ కలిపి ఎదోము మార్గమున మోయోబీయులతో యుద్ధము చేయడానికి వెళ్ళారు. అయితే ఈ ముగ్గురు సైన్యానికి సరిపడే నీరు ఆ ప్రాంతంలో లేక దాహంతో మలమలలాడిపోయారు. చచ్చేలాగున్నారు.  ఎదోము రాజు అంటున్నాడుకటకటా: ముగ్గురు రాజులను చంపడానికి యెహోవా మనలను ఇక్కడికి తీసుని వచ్చారు. చూశారా ఒక బ్రష్టుడైన రాజు చేసిన పనుల వలన యెహోవానామము ఇక్కడ హేళన పొందుతుంది. తప్పుచేసింది ఇశ్రాయేలు రాజు గాని  ఇక్కడ చెప్పేది ముగ్గురు రాజులను వారి సైన్యాలను చంపడానికి యెహోవా ఇక్కడికి తీసుకుని వచ్చారు అంటున్నాడు ఇక్కడ! అప్పుడు యెహోషాపాతు రాజు అంటున్నాడుఇక్కడ  యెహోవా నామమును బట్టి మనకు ప్రవచనాలు చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా  అని అడుగుతున్నాడు. చూడండి భక్తికలిగిన రాజు  కాబట్టి యెహోవా దగ్గర విచారణ చేద్దాం అంటున్నారు ఇప్పుడు ఏమిచేయాలో అని!  కారణం ఇంతకుముందు ఆహాబురాజు కాలంలో యెహోషాపాతు ఇదే విషయం అడిగాడు. ఆహాబు అబద్ద బోధకులను ఆశ్రయిస్తే ఇప్పుడు  ఈ రాజు దేవుని నిజ ప్రవక్తల కోసం అడుగుచున్నాడు.  సైన్యంలో ఉన్న ఒకడు అతనున్నాడుషాపాతు  కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు. అతను  ఏలియాచేతులమీద నీరు పోసినవాడు. అనగా ఏలియా భక్తునికి పరిచారం చేసినవాడు.

   ఇక తర్వాత వచనాలలో ఈ ముగ్గురు రాజులు ఎలీషాప్రవక్త దగ్గరకు బయలుదేరి వెళ్ళారు.  జాగ్రత్తగా గమనించాలి. ప్రవక్త ముగ్గురు రాజులు దగ్గరకు వెళ్ళలేదు. ముగ్గురు రాజులు కలిసి ఎలీషాప్రవక్త దగ్గరకు వెళ్ళారు. చూశారా  నమ్మకముగా ఉండడం వలన దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చారో ఎలీషాకు.  ముగ్గురు రాజులే ఆయన దర్శనానికి వచ్చారు,. సరే, ముగ్గురు రాజులు వచ్చారు అని వారికేమైనా శాలువాలు కప్పి సన్మానం చేశారా? (నేటిరోజులలో  క్రైస్తవ సభల స్టేజిల మీద  రాజకీయ నాయకులకు సన్మానం చేస్తున్నట్లు).  ఇశ్రాయేలు రాజును చూసి  నా దగ్గరకు ఎందుకు వచ్చావ్? నీ అమ్మబాబు పెట్టుకొన్న ప్రవక్తల దగ్గరికే పో! అని ఖరాకండిగా చెప్పేశారు. ఇక్కడ ఎలీషాగారు అలా అనడానికి ఆయనకు ఏమైనా గర్వమా? అహంకారమా? కానేకాదు. కారణం ఈ రాజు నిజదేవున్ని అనుసరించిన వాడు కానేకాదు. ఎప్పుడూ అన్యుల దేవతలా చుట్టూ తిరగడమే తప్పతన తండ్రిలా పెళ్ళాం చెప్పినట్లు బయలుదేవతలను, ఇతరదేవతలను కొలవడమే తప్ప నిజదేవుడైన యెహోవాను ఆశ్రయించినవాడు కాదు. కాబట్టి వీడికి ఎందుకు యెహోవాదేవుని దగ్గర విచారణ చేయాలి వీడికోసం? ఇదీ ఆయన ఉద్దేశ్యం! అయితే తర్వాత అంటున్నారు: యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతు లేకపోతే నిన్ను చూసేవాడిని కూడా కాదు అంటున్నారు. కారణం యెహోషాపాతు కోసం అందరికి తెలుసు. అతడు దేవుణ్ణి నిండు మనస్సుతో అనుసరించినవాడు. అందుకే ఆయనను గౌరవిస్తున్నారు. ఒక వాయిద్యకారుడను పిలువమని చెబుతున్నారు. ఆ వాయిద్యకారుడు వాయిద్యము వాయిస్తే దేవుని వాక్కు అతనికి ప్రత్యక్ష్యమయ్యింది.

  ఇక్కడ ఒకసారి ఆగుదాం. ఎందుకు వాయిద్యకారుడు వాయిద్యం వాయించవలసి వచ్చింది.  అనగా వాయిద్యాలు వాయిస్తేనే పరిశుద్దాత్ముడు వస్తాడా? లేకపోతే ఆయన రాడా??!! కానేకాదు.  సౌలురాజుకి దురాత్మ పట్టినప్పుడెల్ల దావీదు గారు సితారా వాయిస్తే- ఆ దయ్యం వదిలిపోయేది అని మనం సమూయేలు గ్రంధంలో చూస్తాం. అనగా దయ్యాలు వెళ్లగొట్టే శక్తి వాయిద్యాలలో ఉందా? లేదు.  సంగీతం అనేది మనిషిని ఉత్తేజపరుస్తుంది.  ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మన మనస్సును ఇతరమైన ఆలోచనలనుండి వేరుచేసి, సంగీతం మీద లక్షముంచేలా చేసి, మన భాదలను, విచారాలను తాత్కాలికంగా మరచిపోయేలా చేస్తుంది. అదే దేవుని గురించిన సంగీతం అయితే మన మనస్సును దేవునివైపు తిప్పడానికి కొద్దిగా దోహదం చేస్తుంది. అంతేతప్పసంగీతమే- వర్షిప్ కాదు. సంగీతమే ఆరాధన కానేకాదు.  దురదృష్టవశాత్తూ నేటి దినాలలో చాలా సంఘాలలో సంగీతమే వినబడుతుంది గాని ఆరాధనా వినబడటం లేదు. మరికొన్ని సంఘాలలో  సంగీతం ఆగిపోతే ఆత్మ ఆగిపోతుంది. వారి ఆవేశం తగ్గిపోతుంది,. నేను విమర్శిస్తున్నాను అని దయచేసి నన్ను అనుకోవద్దు. నేనుకూడా పెంతుకోస్తు వాడినే. నేను చెప్పేదేమిటంటే నీ సంగీత వాయిద్యాల ధ్వని నీ ఆరాధనను మించకూడదు.  నీ ఆరాధన, నీ పరిశుద్ధాత్మ తాకిడి కేవలం ఆదివారం స్తుతి-ఆరాధనకే పరిమితం కాకుండా , ప్రతీరోజు నీ ప్రార్ధనలో ఆత్మతో సంధించబడాలి. అక్కడ సంగీత వాయిద్యాలు లేకపోయినా సరే దేవుని తాకిడిని పొందుకొంటూ ఉండాలి.  సంగీతం / డ్రమ్స్ ఆగిపోయిన వెంటనే నీ భాషలు, ఆత్మ ఆగిపోకూడదు అంటున్నాను. మరికొన్ని సంఘాలలో  కేవలం రిధం తప్ప పాటలు, మ్యూజిక్ లేదు. నేటి సినీ సంగీతంలో మన క్రైస్తవ సంగీతం కలసిపోతుంది. ఇదే వద్దు, కూడదు అంటున్నాను.  ఒకడు అంటున్నాడు మనం కూడా అప్డేట్ అవ్వాలంట! ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరమూ ఒక్కరీతిగానే ఉన్నాడు అని బైబిల్ చెబుతుంటే వీడు అప్డేట్ అవ్వమంటున్నాడు.  

   సరే, మరి ఇక్కడ ఎలీషాగారు వాయిద్యకారున్ని ఎందుకు పిలిపించుకొన్నారు? ఏలియాగారికంటే రెండింతలు ఆత్మను పొండుకున్నవాడు కదా అని అడగొచ్చు! నా ఉద్దేశం ఏమిటంటే: ఇశ్రాయేలు రాజును చూసిన వెంటనే అతడు చేసిన విగ్రహారాధన, హత్యలు , దేవుణ్ణి విడచి అన్యదేవతల తట్టు ప్రజలను మరలుకొల్పడం జ్ఞాపకం వచ్చి ఆయన మనస్సు upset  అయి ఉండవచ్చు. అందుకే తన మనస్సుని దేవునివైపు లఘ్నం చేయడానికి సంగీతకారున్ని/ వాయిద్యకారున్ని పిలిపించుకొని ఉంటారు.  ఇక ఆ తర్వాత అంటున్నారు  16 18
16. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి;
17. యెహోవా సెలవిచ్చునదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును.
18. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. 

మొదటగా ప్రజల దాహాన్ని తీరుస్తున్నారు దేవుడు ఇక్కడ. కారణం ముందు చూసుకున్నట్లు ప్రజలు, పశువులు దాహంతో చచ్చేలాగున్నారు. అందుకే దేవదేవుడు ముందుగా ప్రజల దాహాన్ని తీరుస్తున్నారు. ఈరోజు నీవు కూడా వేడుకుంటే నీ దాహాన్ని/ ఆత్మదాహాన్ని తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు . దానికి వారు చేసింది లోతుగా కందకం త్రవ్వారు. నీవుకూడా నీ హృదయపులోతులలోనుండి దేవుణ్ణి అడుగు, దేవా! నా ఆత్మదాహాన్ని తీర్చవా అని! తప్పకుండా తీరుస్తారు దేవుడు.
ఇక తర్వాత అద్భుతం 20-23
20. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను.
21. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని, అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరిని సమకూర్చు కొని దేశపు సరిహద్దునందు నిలిచిరి.
22. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా, అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తమువలె కనబడెను
23. గనుక వారు అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి.  . . .
  అదీ దేవుని శక్తి! 
24. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారి యెదుట నిలువలేక పారిపోయిరి; ఇశ్రాయేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి.

ఇక్కడ దేవుడు రాజు ఎంతటి మూర్కుడైనా , తన ప్రజలు దేవునియందు భయభక్తులు నిలపడం మొదలుపెట్టారు కాబట్టి వారికి సహాయం చేసారు దేవుడు. ప్రజలు దేవుని వైపు తిరగటానికి కారణం ఎలీషాభక్తుని పరిచర్య!  ప్రియ సేవకుడా! నీవు నమ్మకముగా దేవుని పని చేసుకుంటూ పోతే, దేవుడు ఒకరోజు ప్రతిఫలం ఇస్తారు.  అంతేకాదు అన్యులతో వియ్యము, సహవాసము మానేయ్! లేకపోతే దీనాలాగ చెడిపోతావు. తప్పిపోయి దొరికిన కుమారునిలా ఎందుకు పనికిరాకుండా పోతావు.

  అంతేకాదు, ఇక్కడ సైనికులు, రాజులు దేవుని భక్తుడు చెప్పినట్లు చేశారు. విజయాన్ని పొందారు. నీవుకూడా ఆయన వాక్యం చెప్పినట్లు, సేవకులు చెప్పినట్లు చేసి విజయాన్ని పొందుకో!
దైవాశీస్సులు!
*The Best Disciple-10*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-5*
*భక్తిగలవాడే గాని. . .*

     ప్రియులారా! ఇంతవరకు మనం ఎలీషాగారి ద్వారా జరిగిన 5 అద్భుతాలు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరొకటి ధ్యానం చేసుకుందాం.   

             2 రాజులు 4:1-7 లో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన మనం చూస్తే ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషా గారి వద్దకు వచ్చి “నీదాసుడైన నా భర్త అప్పుచేసి చనిపోయాడు. ఇప్పుడు అప్పులవాడు వచ్చి నా పిల్లలనిద్దరిని వెట్టిచాకిరి చేయించుకోడానికి తీసుకోనిపోవుచున్నాడు, ఇప్పుడు తమరు ఏమైనా చేయండి అని బ్రతిమాలుతుంది". అప్పుడు ఎలీషా గారు అడిగారు అమ్మా మీ ఇంట్లో ఏముంది. ఆవిడ నిజం చెప్పింది, ఒక నూనెకుండ తప్ప ఏమిలేదు అని. ఆయన వట్టికుండలు ఎరవు తెచ్చుకొని ఈ నూనె ఆ వట్టి పాత్రలలో వేయు. ఆ ప్రవక్త శిష్యుని భార్య అలాచేసి తన సమస్య పరిష్కరించుకున్నది.

   ఇక్కడ మనకు విశ్వాసజీవితానికి కావాల్సిన అనేక విషయాలున్నాయి.
1. *భక్తిగలవాడే- గాని అప్పులు చేసి చనిపోయాడు*.
మనం పూర్వచరిత్ర చూసుకొంటే ప్రవక్త- ప్రవక్త శిష్యులు మధ్య ఒక గురుకుల వ్యవస్థ ఉండేది. ప్రవక్తల శిష్యుల జీవనం అంతా గురువుగారిమీద ఆధారపడి ఉండేది. ఇట్టి పరిస్తితులలో ఈ శిష్యునికి అప్పు చేయాల్సిన అవుసరం ఏమొచ్చిందో తెలియదు! నేటిదినాల్లో కూడా చాలామందికి అప్పులు చేయడం అలవాటు, ఇంకా ఫేషన్ అయిపోయింది. అట్టహాసాలకోసం, షోకులకోసం, పార్టీలకోసం అవుసరానికి మించి అప్పులు చేస్తున్నారు. ఫైనాన్స్ తీసుకోవడం, కట్టలేక ముఖం చాటేయడం లేదా దాక్కోవడం!! మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం! ఇవి అవుసరమా? స్తోమతకు మించి హంగులు, ఆర్భాటాలు, పార్టీలు, షోకులు అవుసరమా? వీటిద్వారా జబ్బులు, చెడు అలవాట్లు, అవమానాలు , కుటుంభంలో అశాంతి! ఒకవేళ ఆ కుటుంబ యజమాని అప్పులుచేసి చనిపోతే కుటుంబ పరిస్థితి ఏమిటి? భార్యాబిడ్డలు ఎలా బ్రతకాలి ఆలోచించారా? ఈ మధ్య యవ్వనస్తులు చేతిలో బండి ఉందికదా అని ఫుల్ స్పీడ్ లో బండి నడుపుతూ వేగాన్ని అదుపు చేయలేక ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. వారు పోయారు గాని వాని భార్య, తల్లిదండ్రులు పరిస్తితి ఏమిటి?

   అందుకే విలాపవాక్యములు గ్రంధంలో 5:7 మాతండ్రులు పాపముచేసి గతించిపోయిరి వారి దోషశిక్షను మేమనుభావిస్తున్నాము అని ఏడుస్తున్నారు.  దయచేసి స్తోమతకి మించి,అవుసరానికి మించి అప్పులు చెయ్యొద్దని ప్రేమతో మనవిచేస్తున్నాను.

      చరిత్ర:  *ప్రియులారా ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పలనుకొంటున్నాను. ఈ ప్రవక్తల శిష్యుడు ఎవరో కాదు, ప్రవక్తయైన ఓబధ్యా అంటారు. (Chabad). ఏమో మరితెలియదు. అలా అనుమానించవలసిన అవుసరం ఏముంది అంటే: మనకు 1 రాజులు 18 వ అధ్యాయం ప్రకారం ఓబధ్యా గారు ఆహాబు రాజ్యంలో- మంత్రిమండలిలో మంచి పోస్ట్ లో ఉన్నారు. ధనవంతుడు కూడా! కారణం యెజెబెలు దేవుని ప్రవక్త అనేమాట విని అందరిని చంపేస్తుంటే మన ఓబధ్యా గారు నూరుమందిని దాచి, వారిని ఎన్నో సం.లు పెంచి పోషించారు. పదిమందికి ఒక పదిరోజులు వండిపెట్టాలి అంటే మనకు తలప్రాణం తోకకి వస్తుంది కదా అలాంటిది వందమందిని ఎన్నోరోజులు పోషించారు అంటే నిజంగా ధనవంతుడు, భక్తిపరుడు. అలాంటివాడు అప్పులు ఎందుకు చేస్తాడు? అయితే కొంతమంది అంటారు ఏలియాగారి కర్మెలు అనుభవం తర్వాత ఓబధ్యాగారు ఆహాబు రాజు కొలువు వదలివేసిఏలియాగారు ప్రారంభించిన ప్రవక్తల శిష్యుల సమూహంలో చేరి- ఏలియాగారికి శిష్యుడు అవుతారు. అప్పుడు ఎలీషాగారు- ఓబధ్యాగారు మంచి మిత్రులు అవుతారు అంటారు.  ఆ తర్వాత కొన్ని పరిస్తితులవలన అప్పులు చేయాల్సి వచ్చింది అంటారు.  ఇదీ చరిత్ర*!!

2. *తండ్రి- సంరక్షకుడు*
కుటుంభానికి సంరక్షకుడు లేకపోతే ఏమవుతుంది? పిల్లలకి సరియైన ఆహారం దొరకదు. చెడుతిరుగుల్లుకు అలవాటుపడి పాడైపోతారు. ఇక భార్య, భర్త లేక ఎన్నో అవహేలనలకు, అవమానాలకు గురి కావాల్సి వస్తుంది. ఎప్పుడైనా దీనిని ఆలోచించావా?

3. *అప్పులవాడు-సాతానుడు*:
ఎప్పుడైతే సంరక్షకుడు లేక తండ్రి లేడో సంరక్షణ లేక అప్పులవాడు అనగా సాతానుడు/ లోకం-- కుటుంబం పై దాడి చేస్తుంది. అందుకే మెలకువగా ఉండి ప్రార్ధనచేయుడి, మీ విరోధియైన సాతానుడు గర్జించు సింహములాగ ఎవని మింగుదునా అని చూస్తున్నాడు. అని వ్రాయబడింది. 1 పేతురు 5:8

    ప్రియవిశ్వాసి! దేవునితో సరియైన సంభందాన్ని కలిగియున్నావా? ఒకవేళ లేకపోతే నీకు సంరక్షణ లేదు. నేడే పరమతండ్రి యొద్దకు రమ్మని మనవి చేస్తున్నాను.

4. *ఆధారం లేనప్పుడు మానవరీతిగా ఆలోచిస్తే* ఎలా బ్రతుకుతారు పై పరిస్తితులలో? అప్పులు తీర్చడానికి తల్లిదండ్రులు యొద్దకు, లేక స్నేహితులయొద్దకు లేక బంధువుల యొద్దకు వెళతారు. వారు నిజంగా సహాయం చేస్తారా? ఎగతాళి చేస్తారా? సహాయం చేసేవారు నేటి దినాల్లో చాలాతక్కువ. భర్త చనిపోతే కుటుంబపోషణకు వ్యభిచారం చేసిన స్త్రీలుకూడా ఉన్నారు. ప్రియవిశ్వాసి! నీ భార్యాబిడ్డలను ఈపరిస్తితులలో ఉహించుకోగలవా?

    ఐతే ఇక్కడ ఈ ప్రవక్త శిష్యుడు తన భార్యకి దేవునిపై ఆనుకోవడం నేర్పించాడు. కావున ఈ స్త్రీ సరియైన పని చేసింది. తల్లిదండ్ర్రుల యొద్దకు గాని, బంధువుల యొద్దకుగాని, స్నేహితుల యొద్దకుగాని వెళ్ళకుండా గురువుగారి దగ్గరకు వచ్చి అడుగుతుంది సహాయం చేయమని. తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధి వచ్చినప్పుడు తండ్రియొద్దకు వచ్చినప్పుడే తనకి ఆదరణ, పోషణ, రక్షణ కలిగింది. ఇశ్రాయేలు! నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావాలి అంటున్నారు దేవుడు. యిర్మియా 4:1, దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలరు. కావున నేడే ఆయన యొద్దకు రా!

5. *ఉన్నది ఉన్నట్లే నిజం చెప్పాలి*:
ఇక్కడ ఈ స్త్రీ కూడా ఎలీషా గారి దగ్గరకు వచ్చి సహాయం అడిగినప్పుడు గురువుగారు అడిగారు నీదగ్గర ఏముంది. ఆమె నిజం చెప్పింది ఒక నూనెకుండ తప్ప నాదగ్గర ఏమి లేదు అని. నీవుకూడా ప్రభువు దగ్గర ఉన్నది ఉన్నట్లు నిజం ఒప్పుకో! ఆయన పరమతండ్రి కాబట్టి నిన్ను అర్ధం చేసుకొని, నిన్ను క్షమించి, దీవిస్తారు.

6. *కుండ- నీహృదయం*
    *నూనె- పరిశుద్ధాత్మ*:
ఎప్పుడైతే నీహృదయాన్ని దేవునిదగ్గర కుమ్మరిస్తావో అప్పుడు దేవుడు ప్రతీ కళంకాన్ని, కల్మషాన్ని కడుగుతారు, యేసు రక్తం ప్రతిపాపమునుండి నిన్నుకడిగి పవిత్రునిగా చేస్తుంది. ఇప్పుడు కళంకం లేని నీహృదయంలో యేసయ్య పరిశుద్ధాత్మతో నింపుతారు. నీ గిన్ని నిండి పరిశుద్దాత్మతో పొంగి పొర్లిపారుతుంది.

7. *అవుసరం తీరాక కూడా దేవునియందు నమ్మిక కలిగియుండాలి*:
ఎప్పుడైతే ఊరిలో వట్టికుండలన్నీ నూనెతో నిండిపోయాయో ఆమె గుట్టుచప్పుడు కాకుండా నూనెను అమ్ముకోలేదు. జరిగిన అద్భుతాన్ని గురువుగారి దగ్గరచెప్పి అయ్యా ఇప్పుడు నేను ఏంచెయ్యను అని అడిగింది. గురువుగారు కూడా సగం నాకిచ్చి మిగతావి అమ్ముకో అనలేదు. మొత్తం అమ్మి నీ అప్పులు తీర్చుకొని సుఖంగా జీవించు అని ఆశీర్వదించారు. నీవు నేను కూడా దేవునికి ప్రధమ స్థానాన్ని ఇచ్చినప్పుడు అద్భుతాలు ఆశీర్వాదాలు కలుగుతాయి. జరిగాక నమ్మకముగా కృతజ్ఞతతో జీవిస్తే దేవుడు నిన్ను అత్యధికముగా దీవిస్తారు. అంతేకాక నీ జీవితములో జరిగిన ఆశ్చర్యక్రియలు, మేలులు అందరికి పంచాలి, అప్పుడు నీలో ఉన్న పరిశుద్దాత్మతో ఊరంతా నింపబడుతుంది.

నీవలా జీవించగలవా?
అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*The Best Disciple-11*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-6*
*ఘనురాలు*
2 రాజులు 4:811
8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.
9. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.
10. కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.
11. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.

     ప్రియులారా! ఇక తర్వాత అద్భుతం ధ్యానం చేసుకుందాం. ఈ భాగంలో మనకు ఘనురాలైన ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈ సందర్భంగా మీకోమాట గుర్తుచేయాలని అనుకుంటున్నాను. బైబిల్ గ్రంధం గాని, యూదా/ఇశ్రాయేలు చరిత్ర/సాహిత్యము గాని తొందరగా ఎవరిని వారి స్వభావాన్ని డిక్లేర్ చెయ్యదు.  ఒకమాట డిక్లేర్ చెయ్యడానికి చాలా క్వాలిటీలు కావాలి. ఉదా:  యేసుప్రభులవారికి ఈ భూలోకంలో తండ్రిగా పరిగణించే యోసేపు గారిని నీతిమంతుడు అని డిక్లేర్ చేశారు.  నీతిమంతుడు అనగా భక్తిగా, యదార్ధంగా ఉన్నవాడు అనిమాత్రము కాదు హెబ్రీ సాహిత్యంలో/ చరిత్రలో. వాటితోపాటు తన సంపాదనను మూడుభాగాలుగా చేసి, మొదటిభాగాన్ని దేవునికి, రెండవ భాగాన్ని దిక్కులేనివారికి, పరదేశులకు, అనాదలకు, విధవరాల్లకు ఖర్చుపెడుతూ, మూడవ భాగం తన కుటుంబానికి ఖర్చుపెట్టేవారిని అప్పటి ఆలయపెద్దలు ఈయన నీతిమంతుడు అని డిక్లేర్ చేసేవారు.   అదేవిధంగా ఇక్కడ ఈమెను ఘనురాలు అని డిక్లేర్ చశారు. అచ్చమైన తెలుగులో గొప్ప స్త్రీ అని డిక్లేర్ చేశారు. ఘనురాలు అనగా హెబ్రీ సాహిత్యం/ చరిత్ర ప్రకారం: ఏవిధంగానైనావయసులో, రూపంలో, పేరుప్రతిష్టలలో, ధనంలో, వంశంలో గొప్పది అని అర్ధం. 

    ఇక ఈ స్త్రీ గొప్ప ధనికురాలు అని తర్వాత వచనాలలో అర్ధం అవుతుంది. అంతేకాకకుండా ఆమె దేవునిసేవకులకు సహాయం చేసే గుణం ఉంది అని మనకు 810 వచనాలలో అర్ధం అవుతుంది.  9వ వచనం ప్రకారం ఆమెకు ఆత్మ సంభంధమైన వివేకం, వివేచనా ఉన్నది అని అర్ధం అవుతుంది. ఎంతో వినయ స్వభావం గలది అనియు, ఏదైనా బలవంతంగా అడిగి తీసుకొనే స్వభావం లేదు అని 13 వ వచనం ప్రకారం అర్ధం అవుతుంది. మొత్తానికి ఆమె ఎంతో శ్రేష్టమైన లక్షణాలు కలది కాబట్టి బైబిల్ గ్రంధం గాని, హీబ్రు సాహిత్యం గాని ఆమె ఘనురాలు అని డిక్లేర్ చేసింది.

    సరే, ఎలీషాగారు ఒక ప్రాంతంలో ఉండకుండా ఇశ్రాయేలు దేశం మొత్తం తిరుగుతూ, అక్కడ ప్రజలను దర్శిస్తూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ, అక్కడ ప్రవక్తల శిష్యులను ఏర్పరచి వారిని బలపరుస్తూ ఉండేవారు అని గతంలో చూసుకున్నాం.  పౌలుగారు సంఘాలు స్తాపించి పెద్దలను ఏర్పరచి వారికి సంఘం అప్పగించి, మరో ప్రాంతం వెళ్ళడం ఎలాగో అలాగే ఆకాలంలోనే ఏలియాగారు, ఎలీషాగారు, సమూయేలుగారు మొదలుపెట్టారు.  ఇలా వెళ్ళేటపుడు మార్గమధ్యంలో షూనేము అనే ప్రాంతం ధర్శిస్తున్నారు. అక్కడ పరిచర్య అయిపోయిన తర్వాత ఈ స్త్రీ చూసి, దయచేసి మా ఇంట్లో భోజనం చెయ్యండి అని బలవంతం చేసింది . నిజంగా ఇలాంటి వారు నేటి మన సంఘాలలో , ముఖ్యంగా పల్లెటూళ్ళలో చాలామంది ఉన్నారు. అలా చేయాలి కూడా! అందుకే అందుకే పౌలుగారు ఆతిధ్యము చేయ మరవవద్దు. అలాచేసి ఎంతోమంది ఎన్నో మేలులు పొందుకున్నారు అంటున్నారు. హెబ్రీయులకు 13: 2
ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.

 అబ్రాహాము గారు కుమారుని పొందుకున్నారు. మనోహా అతని భార్య సంసోనుని పొందుకున్నారు. లోతుగారు నాశనాన్ని తప్పించుకున్నారు ఈ ఆతిధ్య-మర్యాదల వలననే! అందుకే ఈ స్త్రీ ఇలా ఆతిధ్యం చేయడమే కాదు, ఒకరోజు తన భర్తతో చెబుతుంది- మన దగ్గరకు వస్తూ పోతూ ఉన్న వ్యక్తీభక్తిగల దైవజనుడు! చూసారాఎలీషాగారికి ఉన్న బిరుదు, గుర్తింపు!! ప్రియ సేవకుడా! నిన్నుగూర్చి నీ సంఘం ఏమని అనుకొంటుంది? భక్తిగల వాడివనా? లేక ప్రార్ధనాపరుడవనా? అభిషేకం గలవాడివనా? లేక కానుకలు ఇచ్చేవారి దగ్గరకే వెళ్తాడు అనా? లేక గర్విష్టి అనా? త్రాగుబోతు/ తిట్టుబోతు/ వ్యభిచారి అనా? ఎలీషాగారి కోసం వారు అనుకొంటున్న మాట భక్తిగల దైవజనుడు! ఇంత శ్రేష్టమైన పేరు నీవు కలిగియుండాలి ప్రియ సేవకుడా!  అప్పుడు దేవుడు కూడా భళా నమ్మకమైన మంచిదాసుడా! అని పిలువగలరు! ఆ పేరు రాడానికి ఎలీషాగారు చేస్తున్న నిరంతర, స్వలాభం అపేక్షించని పరిచర్య దోహదపడింది. మరి నీ పరిచర్య ఎలాగుంది?

    ఇలా చెప్పడమే కాకుండా, తన భర్తతో మాట్లాడి, ఒప్పించి , మేడమీద దైవసేవకునికోసం ప్రత్యేకంగా ఒక గది కట్టి, దానిలో మంచం, బల్ల, దీపం అన్ని ఏర్పాటుచేసింది.  నిజంగా దేవునిపట్ల, దైవసేవకుల పట్ల ఎంత త్యాగం కలిగిందో చూడండి ఈ ఘనురాలు. ప్రియ విశ్వాసి! నీ సంఘకాపరి పట్ల, నీకు అలాంటి ఆశక్తి, అభిరుచి, మంచి-మర్యాద ఉన్నాయా? లేక  ఎందుకు వచ్చాడురా బాబు అని అనుకొంటున్నావా? ఆ స్త్రీ అలాంటి పరిచర్య చేసింది కనుకనే ఘనురాలు అని అభివర్ణించబడటమే కాకుండా తనకు లేమిగా ఉన్నది పొందుకున్నది.

    ఒకరోజు ఎలీషాగారు మరలా షూనేము పట్టణం రావడం ఆ ఇంట్లో బసచేయడం చేశారు. ఆ గది, మంచం, బల్ల చూసి, తన పరిచారకుడైన గేహాజీని పిలిచి ఆ ఘనురాలను పిలువమని చెప్పి అంటున్నారు ఘనురాలుతో: అమ్మా నీకేమి కావాలి? మాకోసం ఇంత కేర్ తీసుకున్తున్నావు. నీకోసం రాజుతోనైనా, అధికారి అనగా అప్పట్లో గవర్నర్ అని అర్ధం అతనితో మాట్లాడాలా అంటే అన్నది ఆమె , అయ్యా నాకు అన్నీ ఉన్నాయి, అంతేకాకుండా నేను నాస్వజనుల మధ్యనే కాపురముంటున్నాను, నాకు ఏమీవద్దు.  అడిగినందుకు ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోయింది. అయితే ఈ గేహాజీ అన్నాడు అయ్యా! అన్నీ బాగున్నాయి గాని ఆమెకు పిల్లలు లేరు. అంతేకాకుండా ఆమె భర్త ముసలోడు అని చెబుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ఘనురాలు ఆమె తనకు పిల్లలు లేరు, కావాలి అని దైవజనున్ని ఎంతమాత్రము అడగలేదు. ఈ గేహాజీయే చెప్పాడు. అందుకు ఎలీషాగారు ఆమెను పిలిచి , వచ్చే సంవత్సరం ఈ రోజులలో నీకు కొడుకు పుడతాడు అని దీవించిపోతున్నారు. వెంటనే ఆ స్త్రీ అంటుందినాతో అబద్దమాదవద్దు. అంటుంది. గురువుగారు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు.
     అయితే దేవుడు ఆమెను దర్శించారు. ఆమె భర్త ముసలివాడైనా సరే, వారిద్దరిని దేవుడు దీవించి ఒక మగ బిడ్డను దయచేశారు. అబ్రాహాము గారికి 100 సం.ల వయస్సులో ఇస్సాకును దయచేశారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న మనోహా కు దేవుడు సంసోను ని ఇచ్చారు. అలాగే నిండు వృద్ధాప్యంలో ఉన్న జెకర్యాఎలీషబెతులకు బాప్తిస్మమిచ్చు యోహాను ను దయచేశారు. ఇక్కడ ఈ ఘనురాలుకి పండంటి మగబిడ్డను దయచేశారు.  బహుశా చదువుతున్న ప్రియ చెల్లీ/ తమ్ముడా నీకుకూడా బిడ్డలు లేరు అని భాధపడుతున్నావేమో! బాధపడకు. దేవుడు నిన్నుకూడా దర్శించబోతున్నారు. నీ నిబ్బరాన్ని, ధైర్యాన్ని విడువవద్దు. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నారు. ప్రియ చదువరీ! నీవు కూడా ఉపకారమును ధర్మమును చేయడం మరచిపోవద్దు! హెబ్రీ 13:16; దేవుని సేవకులను సన్మానించడం మరచిపోకు! తద్వారా దేవుడు నిన్ను దీవిస్తారు.
   అట్టి కృప మన అందరికీ దేవుడు దయచేయును గాక!
ఆమెన్!





*The Best Disciple-12*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-7*
*ఘనురాలు-2*

2 రాజులు 4:2830  
28. అప్పుడు ఆమె కుమారుడు కావలెనని నేను నా యేలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్ట వద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవి చేయగా
29. అతడునీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడిన యెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించిన యెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను.
30. తల్లి ఆ మాట విని యెహోవా జీవము తోడు నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడ పోయెను.

     ప్రియులారా!   మనం ఘనురాలైన స్త్రీ  ప్రవక్తకు మర్యాద చేసితద్వారా అడగకుండానే కుమారుని సంపాదించు కొనినట్లు ధ్యానం చేసుకున్నాం.  అయితే ఇక్కడ 17, 18 వచనాల మధ్య సుమారు 810 సం.ల విరామం ఉంది ఉండవచ్చు.
   ఇప్పుడు ఆ పుట్టిన బాలుడు పెరిగాడు ఆడుకుంటున్నాడు. ఒకరోజు తండ్రితో పాటు పొలంలోకి వెళ్ళాడు. అక్కడ ఆ బాలుడికి తలనొప్పి వచ్చింది. అయితే ఆ తర్వాత వచనాలలో అదే తలనొప్పి చేత చనిపోయినట్లు చూస్తున్నాం గనుక ఏమి వ్యాధి వచ్చిందో మనకు తెలియదు. తలలో నరాలు చిట్లిపోయి తలనొప్పి వచ్చి ఉండవచ్చు. లేదా మెదడువాపు వ్యాధి వచ్చి చనిపోయి ఉండవచ్చు. ఏమయ్యిందో మనకు తెలియదు గాని ఆ బిడ్డ నా తలపోయేనే నా తలపోయేనే అని ఏడవడం మొదలుపెట్టాడు. సరేలే, బిడ్డకు తలనొప్పి వస్తుందేమో అని తండ్రి బిడ్డను తన భార్య అనగా ఘనురాలైన స్త్రీ వద్దకు పంపించేశారు. అయితే ఆ బిడ్డ ఆమెతొడమీద పరుండి- చనిపోయాడు.  నిజంగా ఇది చాలా దుర్భరమైన సంఘటన! కారణం లేక లేక కొడుకు పుట్టాడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ, ఆ పిల్లవాడితో ఆడుకుంటూ ఉంటే ఇప్పుడు బిడ్డ హటాత్తుగా చనిపోయాడు. నిజంగా ఆ తల్లిశోకాన్ని వివరించలేము.

 అయితే ఆమెను ఘనురాలు అని ఎందుకు అన్నారో ఈ తర్వాత వచనాలలో బాగా అర్ధం అవుతుంది. కారణం సొంత బిడ్డ చనిపోతే భర్తకు చెప్పలేదు. సామాన్య స్త్రీలు ఏడ్చి ప్రలాపించి, గగ్గోలు పెట్టినట్లు ఏమీచేయలేదు.  ఎంతో పరిణితితో ఆ బిడ్డను దైవజనుడి గదిలోగల మంచం మీద పరుండబెట్టి, తన భర్తకు కబురుపెట్టింది ఏమని? బిడ్డ చనిపోయాడు రమ్మనా? కాదుకాదు. తను దైవజనుడి దగ్గరకు వెళ్ళాలి. ఒక పనివాడ్ని గాడిదతో పాటు పంపమని. వెంటనే ఆ భర్త ఈ విషయం తెలియక ఈరోజు పండగ కాదు, అమావాస్య కాదు బలి అర్పించటానికి ఎందుకు వెళ్ళడం అని అడిగాడు. అలా అనడానికి కారణం సంఖ్యా 10:10 ప్రకారం, 28:9, 11 ప్రకారం, 1 దినవృత్తాంతములు 23:31  ప్రకారం పర్వదినాలలో, అమావాస్యనాడు బలులు అర్పించాలి. కాబట్టి ఈరోజు పండగ కాదుఅమావాస్య కాదు అంటున్నారు ఆయన! నిజంగా ఆమె జవాబు చాలా పరిణితి చెందిన సమాధానం! నేను వెళ్ళుట మంచిది. నిజంగా ఏమి సమాధానం చెప్పింది చూడండి.  ఇక ఆ బిడ్డను ఆమె ప్రవక్తగారి గదిలో అతనికోసం వారు ఏర్పాటుచేసిన మంచం మీద పెట్టింది. కారణం ఆమెకు ఒక స్తిరమైన విశ్వాసం! బిడ్డ చనిపోయినా సరే,  దైవజనుడు ప్రార్దన చేస్తే ఒక అధ్బుతం జరుగుతుంది. నా కుమారుడు బ్రతుకుతాడు. కారణం దేవుడు జీవముగల దేవుడు అని ఆమె ప్రగాడవిశ్వాసం. అందుకే అలా చేసింది.

   ఇప్పుడు పనివాడుతో అంటుందిఎక్కడా ఆపకు అని. తిన్నగా కర్మెలు పర్వతం మీదకు వెళ్ళిపోతుంది. దీనిని పనివాడు కంటే ముందుగా దైవజనుడే చూసారు. అంటున్నారు గేహాజీతో అదుగో, షూనేమీయురాలు, వెళ్ళు ఆమెను అడుగు, అందరూ క్షేమంగా ఉన్నారా అని!! చూశారా ఆమె దైవజనుడి యోగక్షేమాల కోసం ఆలోచించేది కాబట్టి దైవజనుడు కూడా ఆమె యోగక్షేమాల కోసం అడగమని పనివాన్ని పంపిస్తున్నారు. ఇలా దైవజనుడు ఎక్కడా చేయలేదు. ముగ్గురు రాజులు వచ్చినా పట్టించుకోలేదు గాని ఈ ఘనురాలు, భక్తిగల స్త్రీ వస్తే, ఆమె యోగక్షేమాల కోసం పనివాడ్ని ఎదురు పంపిస్తున్నారు.   నేటిరోజులలో చాలామంది దైవసేవకుడు మా ఇంటికి రావడం లేదు అని నిష్టూరాలు వేస్తుంటారు గాని మీ ఇంటికి వచ్చిన దైవసేవకునికి కనీస మర్యాద ఎప్పుడైనా చేస్తున్నావా? నీవు చేయవు కాబట్టే ఆయన అంతగా రారు. దైవసేవకుడు వచ్చినా ఎందుకొచ్చాడురా బాబు, ఎప్పుడు పోతాడు, నేనెప్పుడు నా సీరియల్ చూడాలి అనే మనస్తత్వమే ఉంటుంది. అందుకే అంతగా వస్తుండరు. ఈమె అలా కాదు, ఎప్పుడు ప్రవక్త వచ్చినా, కడుపునిండా ఆహారం పెట్టి, విశ్రాంతి తీసుకోడానికి ఏర్పాట్లు అన్ని చేసింది. అందుకే ఆయన అంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నారు.

  ఇప్పుడు గేహాజీ వచ్చి అడుగుతున్నాడుఅమ్మా ఎలా ఉన్నారు? క్షేమమేనా? అని. అందుకు ఆమె ఏమనాలి? ఏమి క్షేమం బాబు. నా ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోతే క్షేమం ఏమిటి అని అడగాలి.  కాని ఆమె అలా అనలేదు. అంతా క్షేమమే! ఆమె ఇలా అనడానికి ఎంత ఘట్స్ కావాలి? ఎంత గుండె నిబ్బరం కావాలి!!! అందుకే ఆమె ఘనురాలు అని పేరు తెచ్చుకోండి. ఆడది అబల, బేల ఇలాంటి పేరులు/ బిరుదులు ఈమెకు ఎట్టిపరిస్తితిలోను సరిపోదు. ఈమె నిజంగా చాలా గుండె నిబ్బరం గల ధీమంతురాలు!   నేటి  సంఘంలో ప్రతీ మహిళా ఇలా ఉంటే ఎంత బాగున్నో కదా! పురుషులకు ఎంత రిలీఫ్ గా ఉంటుందో కదా!  చాలామంది స్త్రీలు వీరు కంగారుపడికుటుంబమంతటిని ఆందోళనకు గురిచేస్తుంటారు.

   ఈమె వచ్చి గురువుగారు పాదాలు పట్టుకొని అడుగుతుందినేను పిల్లలు కావాలని మిమ్మల్ని అడిగానా? నన్ను భ్రమ పెట్టవద్దు అని ముందుగానే చెప్పాను కదా!!! చూసారా ఆమె సూటి ప్రశ్న! నిజంగా ఆమె పిల్లలు కావాలి నాకు అని ప్రవక్తను అడగలేదు. ఆయనే వరమిచ్చారు. అందుకే అలా అడిగింది. వెంటనే  గురువుగారికి కధ మొత్తం అర్ధమయ్యింది.

    వెంటనే  గేహాజిని పిలిచి అంటున్నారుగేహాజి నా దండము పట్టుకుపోయి ఇలా చేయు, అలా చేయు అని చెప్పారు. వాడు వెంటనే పారిపోయాడు. గాని ఆమె అంటుందియెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నీవు వస్తేనే గాని నేను కదలను అంటుంది,. అప్పుడు ఆమెతోపాతు ప్రవక్త కూడా బయలుదేరారు.   గేహాజీ వెళ్లి దండము పెట్టినా ఆ బిడ్డ కదలలేదుకారణం వాడిలో సరుకు/భక్తి ఉంటే కదా! ఎప్పుడైనా దేవుడా అని ప్రార్ధిస్తే కదా! ఎప్పుడు ఏం దొరుకుతుందా? ఏమి తిందామా అనే ధ్యాసే తప్పా భక్తి , విశ్వాసం నేర్చుకుందామని లేదు వీడికి!!  ఎలీషాగారి పూరి విరుద్ధమైన మనస్తత్వం వీడిది. ఇలానే పౌలుగారి సమయంలో  స్కెవ అనే ఒక యాజకుని కుమారులు ఏడుగురు పౌలు ఉచ్చరించు దేవుని పేరిట దయ్యాలు వెల్లగొడుతుంటే, ఒక దయ్యం వీరి గుడ్డలు ఊడగొట్టి పంపించింది. నేటి దినాలలో చాలామంది సంచి- బైబిల్ పట్టుకొని సేవకు వెళ్తున్నారు గాని వీరిలో ప్రార్ధనా జీవితం లేనందువలన వారి సేవ నిష్ఫలంగా ఉంటుంది. కేవలం పొట్ట పోషించుకోడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

   ఇప్పుడు దైవజనుడు వెళ్లి రెండుసార్లు ఆ బిడ్డమీద పారచాచుకొని పడుకొని ప్రార్ధిస్తే ఆ బిడ్డ లేచి, బ్రతికాడు. ఇదీ దేవుడు ఆయనకు ఇచ్చిన ఆధిక్యత!

    ఇక్కడ కొన్ని పనులు  గతంలో జరిగినట్లే జరిగాయి. మొదటగా: ఏలియాగారు సారెపతు ఊరిలో ఉన్నప్పుడు ఆ విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఇక్కడకూడా ఈ బిడ్డ చనిపోయాడు.
   అనగా ఇక్కడ వీరిద్దరిని దేవుడు పరీక్షించటానికి అలా చేసి ఉండవచ్చు. ఈ పరీక్షలో ఈ ఘనురాలు ఉత్తీర్ణత చెందింది. బిడ్డను తీసుకుని ఏలియాగారు కూడా మేడగది లోనికి పోయి, తలుపులు వేసి ప్రార్ధన చేశారు. ఇక్కడ ఎలీషాగారు కూడా అలా చేశారు.  కారణం యేసయ్య చెప్పారు  మీరు ప్రార్ధన చేసేటప్పుడు మీ గదిలోనికి పోయి తలుపులు వేసుకుని మీ పరమందున్న దేవునికి వినబడేటట్లు ప్రార్ధన చేయమన్నారు. మత్తయి 6:6; అంతేకాదు ఆయనకూడా, యాయీరు అనే సమాజమందిరపు అధికారి కుమార్తెను బ్రతికించేముందుయేసయ్య కూడా తలుపులు వేసి ప్రార్ధన చేశారు. ఇక పేతురు గారు కూడా భక్తురాలైన తబిత ను లేపినప్పుడు అలాగే మేడ గదిలో తలుపులు వేసి ప్రార్ధన చేశారు. కాబట్టి మీరుకూడా ఏదైనా ఇబ్బందులలో ఉన్నప్పుడు మీ గదిలోనికి పోయి, తలుపులు వేసికొని ప్రార్ధన చేస్తే తప్పకుండా జవాబు దొరుకుతుంది. ఇక  ఏలియాగారు ప్రార్ధన చేసి చనిపోయిన బిడ్డను బ్రతికించారు. ఎలీషాగారు చనిపోయిన బిడ్డను ప్రార్ధించి బ్రతికించారు. అలాగే యేసుప్రభులవారు కూడా చనిపోయిన వ్యక్తులను బ్రతికించారు. అలాగే పేతురుగారు, పౌలుగారు కూడా చనిపోయిన వ్యక్తులను బ్రతికించారు.

   కాబట్టి గేహాజిలా పేరుకు క్రైస్తవుడు లా జీవిస్తే ప్రయోజనం లేదు. పేరుకు తగ్గట్టు జీవిస్తే దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తారు.  అంతేకాదు ఘనురాలైన స్త్రీ విశ్వాసంలో స్తిరంగా నిలిచినట్లు నీవుకూడా స్తిరంగా ఉంటేఅసాధ్యమైన కార్యాలు కూడా ఎంతో సునాయాసంగా జరిగించుకోవచ్చు!
నీవునేను అలా జీవిద్దాం.
దైవాశీస్సులు!




*The Best Disciple-13*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-8*

2 రాజులు 4:3841
38. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షము నందు కూర్చుండి యుండగా అతడు తన పని వానిని పిలిచి పెద్దకుండ పొయి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూరవంట చేయుమని సెలవిచ్చెను.
39. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్ష చెట్టును చూచి, దాని గుణ మెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొని వచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను.
40. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినకమానిరి.
41. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాని వేసి, జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను.

     ప్రియులారా ఇంతవరకు మనం ఎలీషాగారు చేసిన ఎనిమిది అద్భుతాలను ధ్యానం చేసుకున్నాం. ఇక ఈరోజు మరో అద్భుతముతో కూడిన పరిచర్య చూసుకుందాం.

   ఈ భాగంలో మనం ఎలీషాగారు మరలా గిల్గాలు వచ్చారు. గిల్గాలు అనగా దొరలించబడుట. అనగా దేవుడు ఐగుప్టు అవమానాన్ని ఆ గిల్గాలు దగ్గర సున్నతి పొందడం ద్వారా దొరిలించారు. అనగా తీసివేశారు. ఈ గిల్గాలు యోర్దాను నది ఒడ్డున ఉన్నట్లుగా చూసుకోగలం మనం యెహోషువా గ్రంధం ప్రకారం. ఈ గిల్గాలులో మహా క్షామము వచ్చింది అంటక్షామం అనగా భయంకరమైన కరువు.  వర్షాలు పడలేదు. గిల్గాలుకు క్షామం ఎప్పుడు వస్తుంది? యోర్దాను నది పారకపోతే/ ఎండిపోతే అప్పుడు కరవు వస్తుంది. కాబట్టి ఇక్కడ యోర్దాను నది ఎండి పోయినట్లు గమనించాలి.

     ఎందుకు క్షామం/ కరువు వచ్చింది? వర్షాలు కురువక!! వర్షాలు ఎందుకు కురువలేదు? యోర్దాను ఎందుకు ఎండిపోయింది? దానికి కారణం: దేవుడు ముందుగానే చెప్పారు బైబిల్ లో! చూద్దాం!  లేవీకాండము  26 : 1820
18. ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.
19. మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.
20. మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫల మియ్యకుండును.
  ద్వితీ 28:15,23,24
15. నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.
23.​​ నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును.
24. యెహోవా నీ దేశపు వర్ష మును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును.
ఇంకా 1 రాజులు  8: 3539;  
కాబట్టి ఈ పై వచనాల వలన అర్ధం అవుతుంది వారు తిరుగుబాటు/ పాపం చేశారు కాబట్టి దేవుడు ఆకాశాన్ని మూసేశారు. అందుకే ఈ కరువుకాటకాలు!!  ప్రియ చదువరీ! నీకు కూడా ఆత్మీయ కరువుతో బాధపడుతున్నావా? దేవుని నుండి ఏ మేలులు పొందలేక పోతున్నావా? దానికి కారణం నీవే! నీవుచేసిన పాపాలే కారణం!  ఇప్పుడు మరి నీ సమస్యకు పరిష్కారం ఏమిటి?  చూద్దాం!

   అయితే ఈ క్షామకాలంలో దైవజనుడు ప్రవక్తల శిష్యులను బలపరచడానికి మరలా గిల్గాలు వచ్చారు. మధ్యలో తన పనివాడిని పిలిచి అన్నారుపెద్ద కుండతీసుకుని  మొత్తం అందరికి వంట వండమన్నారు.  వీడు బహుశా గేహాజి కాకపోవచ్చు. కారణం గేహాజి ఎక్కడైతే పరిచర్య చేసాడో అక్కడ గేహాజి అని బైబిల్ స్పష్టముగా చెబుతుంది. కాబట్టి వీడు కొత్త పనివాడు కావచ్చును.  ఇక మరో గమనించవలసిన విషయం ఏమంటే  పెద్ద కుండ తీసుకుని అందరికి వండమంటున్నారు. అనగా అక్కడ ప్రవక్తల శిష్యులు చాలామంది ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం వందమంది కంటే ఎక్కువగా ఉండవచ్చు. అందుకే పెద్దకుండలో వండమంటున్నారు.  ఒకసారి 43 వచనం  చూసుకుంటే అక్కడ 100 మందికంటే ఎక్కువగా ఉన్నారు. సరే, ఈ పనివాడు వెళ్లి ద్రాక్ష ఆకులు అనుకుని వెర్రి ద్రాక్ష ఆకులు కోసి కూర వండేశాడు. సగం తెలిసి- సగం తెలియని వాళ్ళను పంపిస్తే ఇలాగే ఉంటుంది. వాడు కూర వండెయ్యడం, అందరికీ వడ్డించడం జరిగింది. ఆ కూర రుచి చూసిన వెంటనే వారు కేకలు వెయ్యడం మొదలుపెట్టారుదైవజనుడా! కూరలో విషమున్నది. బహుశా చేదుగా ఉండి ఉండవచ్చు!

   మరి ఇప్పుడు అసలే కరవు. తినడానికి ఏమీలేదు. మనుష్యులు బోలెడు మంది! ఏమి చెయ్యాలి? మనం అయితే చాలా కంగారు పడతాము. అయితే దైవజనుడు అసలు కంగారు పడలేదు. కారణం తనకు తెలుసు అసాధారణ రీతిలో అద్భుతాలు చేసే దేవుడు తనతో నిత్యమూ ఉన్నారు. ఇప్పుడు మరో అద్భుతం చేయబోతున్నారు దేవుడు. అందుకే కంగారు పడకుండా కొంచెం పిండి తెమ్మన్నారు. దయచేసి అడగొద్దుఅది ఏమి పిండి అని?!! బైబిల్ లో వ్రాయబడలేదు. మనం కూడా ఎక్కువగా ఆలోచించవద్దు.  హోటల్ వాళ్లకు తెలుసు ఏం కూరలో ఏ పిండి కలిపవచ్చో!  మరి ఏం పిండి తెచ్చారో తెలియదు గాని దైవసేవకుడు  ప్రార్ధన చేసి ఆ పిండిని  కూరలో వేసిన వెంటనే ఆ విషం/ చెడు పోయింది. అందరూ తృప్తిగా తిన్నారు. ఇది వినడానికి ఒక అద్భుతం లాగ ఉంది  గాని దీనిలో చాలా ఆత్మీయ విషయాలున్నాయి.

     ఒక విశ్వాసి జీవితంలో కరవు ఎందుకు వస్తుంది అంటే ఆ వ్యక్తి దేవునికి దూరమైపోయినప్ప్పుడు దేవుడు ఇలాగే బుద్ధి చెబుతూ ఉంటారు. ఎవరికి బుద్ధి చెబుతారు? దేవుడు తను ప్రేమించే వారికి బుద్ధి చెప్పి, సరిచేసి తిరిగి తన మందలోనికి చేర్చుతారు. సామెతలు 3: 12
తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.
అయితే  ఎన్నిసార్లు చెప్పినా వినని వాడు మరి తిరుగులేకుండా హటాత్తుగా నాశనమైపోతాడు. సామెతలు 29:1; ఈ కేటగిరి వేరు.  అయితే బుద్ధిచెప్పి సరిచేసే కేటగిరి ఉందికదా,  వారికి దేవుడు బుద్ధి చెప్పినప్పుడు వినాలి. విని మారుమనస్సు పొందాలి. ఎలా?!!  వారు దేవునినుండి దూరమైపోయినప్ప్పుడు వారి జీవితాలు అలా చేదుగా, ఎందుకు పనికిరాకుండా నిస్సారంగా ఉంటాయి.  తప్పు తెలిసికొని తండ్రిని క్షమాపణ వేడుకుంటే అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు.

  ఇక్కడ ఎలీషాగారు పిండినే ఎందుకు తెమ్మన్నారు? ఏ బెల్లమో,  మరో ఏదైనా తెమ్మని చెప్పవచ్చు కదా! కారణం ఈ సంగతులు వారికి సంభవించిఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిఉన్నవి అని 1 కొరింథీ 10:11 వ్రాయబడియుంది.  ఇక్కడ పిండి ఎలా తయారవుతుంది? ఒక భక్తుడు మన తెలుగులో మంచి పాట రాశారు. ఆరాదింతు ఆత్మరూపా . . . దంచి విసరి నలిపి కాల్చగారొట్టె ఆయెను గోదుమలు!  గోదుమలు పిండి అవ్వాలంటే, ముందుగా వాటిని దంచాలి. పూర్వకాలములో పిండిమిల్లులు లేవు కదా! అందుకే దంచేవారు. అలా దంచగా దంచగా అప్పుడు మెత్తటి పిండిగా రూపాంతరం చెందుతాయి గోదుమలు. అలాగే  ఈ శోధనల ద్వారా నీ హృదయాన్ని మెత్తగా కరిగించాలి. నీ హృదయం విరగాలి దేవుని సన్నిధిలో! దేవా పాపినైన నన్ను కనికరించు అని మొర్రపెట్టాలి. నీలో గట్టితనం ఏమీ ఉండకూడదు. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు నీకు కూడా రావాలి. నీ మాటలు, చేతలు, ప్రవర్తన అన్ని మారిపోవాలి. యేసయ్యలాగ  మొత్తం నీవు మారిపోవాలి. అప్పుడు నీ పాపాలన్నీ కడుగబడి  పిండిగా మార్చబడి దేవునికి అనుకూలమైన రొట్టెగా, దేవునికి ఇష్టమైన పాత్రగా మార్చబడతావు. విరిగినలిగిన హృదయమే దేవునికి కావాలి. అదే దేవునికి ఇష్టమైన బలి!

    మరినీవు ఆ విధంగా మార్చబడతావా? అయితే దేవుడు నీ బ్రతుకులో కూడా అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
దైవాశీస్సులు!  
*The Best Disciple-14*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-9*

2 రాజులు 4: 4244
42. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను.
43. అయితే అతని పనివాడు నూరుమందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను.
44. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను.

     ప్రియులారా ఇంతవరకు మనం ఎలీషాగారు చేసిన తొమ్మిది  అద్భుతాలను ధ్యానం చేసుకున్నాం. ఇక ఈరోజు మరో అద్భుతముతో కూడిన పరిచర్య చూసుకుందాం.  ఈ అద్భుతం కూడా యేసుప్రభులవారు చేసిన అద్భుతం లాంటిదే. అయితే ఈ అద్భుతం యేసుప్రభులవారి కన్నా సుమారు  8౩0  వందల సం.ల పూర్వమే ఎలీషాగారి ద్వారా జరిగింది.  

     కూరలో విషాన్ని ప్రార్ధన చేసి, పిండివేసి బాగుచేసిన తర్వాత ఎలీషాగారు ఇంకా అక్కడే కొద్దిరోజులు ఉన్నారు గిల్గాలులో.  అప్పుడు బయల్-షాలిశా  అనే గ్రామం నుండి ఒకాయన ప్రధమ ఫల అర్పణ తెచ్చారు. దానినే మొదట పంటబాపతు అన్నారు.  ప్రధమ ఫలము దేవునిది కాబట్టివారి గ్రామము ప్రక్కనే ప్రవక్త ఉన్నారు కాబట్టి 20 యవల రొట్టెలుయవలు అనగా బార్లీ , కాబట్టి బార్లీ రొట్టెలు, కొన్ని గోధుమ వెన్నులు,  కొన్ని పండ్లు కానుకగా తీసుకుని వచ్చి దైవజనుడికి  ఇచ్చారు.  అయితే అక్కడ  గతభాగంలో చెప్పిన విధముగా ప్రవక్తల శిష్యులకు చాలారోజుల నుండి సెమినరీ జరుగుతుంది. అంతేకాకుండా భయంకరమైన క్షామం/ కరువు ఉంది అక్కడ! ఇప్పుడు ఈ భాగంలో దేవుడు తన ప్రజలను పోషించే మరో విధానం చూసుకోవచ్చు.  ఈ రొట్టెలు/ పళ్ళు చూసి దైవజనుడు అందరికీ ఇవి వడ్డించే అన్నారు. నేను అనుకొంటానుబహుశా వీరు కొన్నిరోజులనుండి బహుశా ఆకలితో ఉండి ఉండవచ్చు. అందుకే వచ్చిన వెంటనే వడ్డించేమన్నారు ఎలీషాగారు.

   ఇలా అనుకోడానికి మరో కారణం కూడా ఉంది. యేసుప్రభులవారు చేసిన అద్భుతములో కూడా మత్తయి  14: 1321 లో కూడా జనులు మూడురోజులనుండి ఏమీ తినలేదు అందుకే యేసుప్రభులవారు జాలిపడి  మీరే వారికి ఏమైనా పెట్టండి అని శిష్యులకు చెప్పారు. అక్కడ కూడా కొన్ని రొట్టెలు, కొన్ని చిన్న చేపలు. ఇక్కడ 20 బార్లీ రొట్టెలు కొన్ని పళ్ళు.  ఎలీషాగారు ఇలాంటి అద్భుతం ఒకసారే చేశారు గాని యేసుప్రభులవారు ఒకేలాంటి అద్భుతం రెండుసార్లు చేసి తన మహిమను అందరికీ చాటారు. ముఖ్యంగా శిష్యులకు విశ్వాసం దృఢపరచేవిధంగా ఆయన అద్భుతాలు చేశారు. 

     సరే, ఎప్పుడైతే ఆ రొట్టెలు/ పళ్ళు అందరికీ వడ్డించమంటే ఆ పనివాడు అంటున్నాడు- వందమందికి ఈ రొట్టెలు ఎలా సరిపోతాయి అని అడుగుతున్నాడు.  శిష్యులుకూడా ఇలాంటి ప్రశ్నే యేసయ్యను వేశారు! అందుకే యేసయ్య వారిని వరుసలలో కూర్చోబెట్టమన్నారు.  ఇక్కడ ఎలీషాగారన్నారు: ఇవి వారందరూ తినగా ఇంకా మిగిలి పోతాయి అని యెహోవా చెబుతున్నారు అన్నారు. అయితే అక్కడ యేసయ్య అలా అనలేదు. కారణం ఆయనే  సర్వ సృష్టికర్త/ ఆశ్చర్యకరుడు/ ఆలోచన కర్త, మహిమ గలవాడు కాబట్టి ఆయనకు తెలుసు తను చేయగలరు అని. అందుకే ఇంకా మిగిలిపోతాయి అని యేసుప్రభులవారు అనలేదు. అయితే ఇక్కడ ఎలీషాగారు ప్రవక్త కాబట్టి దేవునిమాటను చెబుతున్నారు.

    వెంటనే పనివాడు అందరికీ వడ్డించగా ఇంకా కొన్ని రొట్టెలు/ పళ్ళు మిగిలిపోయాయి. దేవునికి సమస్తము సాధ్యమే! మనం సమస్యను మన కన్నులతో చూసి కంగారు/ బెంబేలు పడిపోతాము. అయితే గొప్పదేవుడు నీతో ఉన్నారని గ్రహించి, దేవుని కన్నులతో ఆ సమస్యను చూసుకుంటే/ మన సమస్య దేవుని సమస్య అని దేవునిపై భారం వేసి, దేవునికోణం నుండి మనం ఆ సమస్యను చూస్తే- ఆ సమస్య గడ్డిపరకలా కనిపిస్తుంది.  ఇక్కడ ఈ పనివాడు, అక్కడ  యేసయ్య శిష్యులు సమస్యను చూసి భయపడిపోయి ఇంతమందికి ఈ రొట్టెలు ఎలా సరిపోతాయి అన్నారు. ఇంకా ముందుకు పోయి ఇన్నూరు దేనారాల కంటే ఎక్కువగా సొమ్ము ఖర్చుచేస్తేనే గాని వీరందరికీ చాలినన్ని రొట్టెలు కొనలేము అన్నారు. ఇది మానవుల ఊహలు/ లెక్కలు. అయితే దేవాదిదేవుని లెక్కలు/ కార్యాలు వేరు. అయిదు రొట్టెలు, రెండు చిన్నచేపలు 50౦౦ మంది కంటే ఎక్కువమంది తినగా ఇంకా మిగిలిపోయాయి. ఏడురొట్టెలు/ కొన్ని చిన్నచేపలు 4000 మందికంటే ఎక్కువ మంది తినగా ఇంకా మిగిలిపోయాయి. ఇక్కడ 20 రొట్టెలు, కొన్ని పళ్ళు 100 మంది తినగా మిగిలిపోయాయి.
    
      ప్రియ చదువరీ! నీవుకూడా నాకు ఇంట్లో ఏమీ లేవు. ఉన్నవి అందరికీ చాలవు అనుకొంటున్నావేమో!! నేను ఇది కొనడానికి చాలను. నాకు సామర్ధ్యము చాలదు. ఈ సమస్యను నేను పరిష్కరించుకోలేను. నా పని అయిపోయింది అనుకొంటున్నావేమో: కంగారు పడకు. కేవలం విశ్వాసం మాత్రము ఉంచు. మిగతాపని దేవుడే చూసుకుంటారు. దేవుడు తన పని చూసుకొనేటట్లు దేవునికి అవకాశం ఇవ్వు! ఆయబ పనిచేసేవరకు కనిపెట్టు. నీ సొంతనిర్ణయాలు, నీ సొంత ఆలోచనలతో నీవు చేస్తే ఆ పని అట్టర్ఫ్లాప్ అయిపోతుంది. సమస్య తీరినా అది తాత్కాలికమే! దేవుడు చేసిన ఏ  పని అయినా అది పర్మినెంట్ సొల్యుషన్.

   కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! దేవునిమీద సంపూర్ణ విశ్వాసముంచు. ఆయన కార్యము జరిగిస్తారు.
ఓబధ్యాగారి భార్య సంపూర్ణ విశ్వాసముంచింది. ఒక పాత్ర నూనె- ఆ ఊరిలో ఉన్న ఖాళీ పాత్రలనన్నిటిని నింపగలిగింది.
యేసయ్య సమయంలో 5 రొట్టెలు, రెండు చిన్న చేపలు 5౦౦౦ మందికి ఆహారం పెట్టాయి.
ఒక చిన్న అరచేయి అంత- మేఘమే గాని  ఇశ్రాయేలు దేశం మొత్తానికి సరిపోయే వర్షం కురిపించగలిగింది. 
ఆయనపై సంపూర్ణంగా ఆనుకో!
గొప్ప ఆశీర్వాదాలు పొందుకో!

ఆమెన్!
దైవాశీస్సులు!                        
*The Best Disciple-15*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-10*
*నయమానుఇశ్రాయేలు చిన్నది*.

2 రాజులు 5: 1
1. సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయెను. అతడు మహా పరాక్రమశాలియై యుండెను గాని అతడు కుష్ఠరోగి.
2. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశముమీదికి పోయి యుండిరి. వారచ్చట నుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను.
3. అది-షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను.

     ప్రియులారా ఇంతవరకు మనం ఎలీషాగారు చేసిన పది  అద్భుతాలను ధ్యానం చేసుకున్నాం. ఇక ఈరోజు మరో అద్భుతముతో కూడిన పరిచర్య చూసుకుందాం.  ఈ అద్భుతం కూడా యేసుప్రభులవారు చేసిన అద్భుతం లాంటిదే. అయితే ఈ అద్భుతం యేసుప్రభులవారి కన్నా సుమారు  8౩0  వందల సం.ల పూర్వమే ఎలీషాగారిద్వారా జరిగింది.  యేసుప్రభులవారు కుష్టువ్యాది గలవారిని కొందరిని బాగుచేశారు. ఇక్కడ ఎలీషాగారు కూడా చేశారు.

   ఈ భాగంలో మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనబడతాయి. అదేమిటంటే; మొదటిగా సిరియా సైన్యాధికారి నయమాను. వీరుడు శూరుడు. అయితే బైబిల్ చెబుతుంది దేవుడే అతనిని వాడుకుని అతనికి/ సిరియారాజ్యానికి విజయం దయచేశారు.  సిరియనులు దేవుడు ఏర్పాటుచేసుకున్నవారు కాదు . అన్యులు. విగ్రహారాదికులు. ఇంకా ఇశ్రాయేలీయులకు అనగా దేవుని బిడ్డలకు పరమ శత్రువులు. మరి అలాంటి సైన్యాదికారికి దేవుడే విజయం చేకూర్చడమేమిటి?  అది నీకు నాకు అనవసరం! అది దేవుడి ఇష్టం అంతే! అంతకన్నా మనం ఎక్కువగా ఆలోచించకూడదు. అది దేవుడికి ఇష్టం అయ్యింది.  ఎందుకంటే అతడు దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి దేవుడు అతనిద్వారా సిరియనులకు విజయం దయచేసి అతనిని హీరో చేశారు దేవుడు. వివరంగా చెప్పాలంటే: నిర్గమకాండంలో వ్రాయబడిందిదేవునికి మహిమ తెచ్చుకోడానికే దేవుడు ఫారో హృదయాన్ని కఠినపరచారు. అందుకే ఫరోను ఏర్పరచుకొన్నారు. అక్కడ దేవునికి మహిమ రావాలంటే ఫారో మనస్సు కఠినమవ్వాలి. నిర్గమ 2--15 అద్యాయాలు. ఇంకా చెప్పాలంటే ఒకసారి యేసయ్యను శిష్యులు పుట్టుగుడ్డివాడిని చూపించివీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడా లేక వీని తల్లిదండ్రులా కారణం అని అడిగితేయేసుప్రభులవారు చెప్పారువీడైననూ, వీని తల్లిదండ్రులైనను కారణం కాదు గాని దేవునికార్యాలు మహిమ పరచడానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు. యోహాను 9; ఇక్కడ నయమాను విషయంలో కూడా అంతే! దేవుని మహిమార్ధమై నయమాను అన్యుడైననూ వానిద్వారా దేవుడు విజయాలు కూర్చారు సిరియారాజ్యానికి.

      నయమాను వీరుడు/ శూరుడు అని చెప్పుకున్నాము అయితే/ కానీ ..... అతడు కుష్టరోగి. ఉదయమంతా యుద్దాలు చేయడం, సాయంత్రం ఇంటికి వచ్చి బట్టలు విప్పిన వెంటనే తన  శరీరాన్ని చూసి ఎంతో భాధపడేవాడు. బహుశా సిరియా దేశంలో గల డాక్టర్లు అందరి దగ్గరకు వెళ్లి ఉంటాడు. గాని ఫలితం లేదు.  తను గెలిచిన ఉత్సాహం/ ఆనందం ఇంటికి వచ్చిన వెంటనే నీరుకారిపోయేది. ఇలా ఉండగా ఒకసారి వీరు ఇశ్రాయేలుదేశం పోయి అక్కడవారిని గెలిచి కొందరిని చెరపట్టారు. వారిలో ఒక చిన్నది ఉన్నది. ఇక్కడ చిన్నదాని వయస్సు వ్రాయబడలేదు. గాని బహుశా  712  సం.లు ఉండి ఉండవచ్చు. కారణం చిన్నది అని వ్రాయబడిఉంది అంతేకాకుండా ఇశ్రాయేలు దేశంలో 13 సం.లు వచ్చేస్తే చాలావరకు ప్రధానం అయిపోతుంది. అప్పుడు కన్యక అని వాడుతారు. కాబట్టి ఆమె 12 సం.లకు లోపుగా ఉండి ఉండవచ్చు.  ఈ చిన్నది ఎంతో దేవుని భయభక్తులు కలది అని అర్ధమవుతుంది తర్వాత వచనాల ప్రకారం. అంతేకాదు తల్లిదండ్రులు కూడా చాలా భక్తిపరులు. ఎలాగో చూసుకుందాం!

     ఈ నయమాను తతంగం ఈ ఇశ్రాయేలు చిన్నది ప్రతీరోజు చూస్తుంది. అయితే చూసిచూసి ఒకరోజు ధైర్యం చేసి చెబుతుంది- నయమాను భార్యకు చెబుతుంది కారణం ఇంతగొప్ప సైన్యాధిపతికి చెప్పే వయస్సు తనకి లేదు, అంత ధైర్యం కూడా బహుశా లేదు అని నా ఉద్దేశ్యం. అందుకే నయమాను భార్యతో అంటుంది నాయజమానుడు మా ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త- ఎలీషాగారి దగ్గరకి వెళ్తే బాగుణ్ణు. ఆయన చాలా ఆత్మపూర్ణుడు. ఆయన దగ్గరకు వెళ్తే ఆయన ప్రార్ధన చేస్తే ఈ రోగం ఇట్టే పోతుంది. అప్పుడు నయమాను భార్య అని ఉండవచ్చుమా దేశంలో అలాంటివారు లేరా అని. అప్పుడు బహుశా ఈ చిన్నది ఎలీషాగారి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలలో కొన్ని చెప్పి ఉండవచ్చు. ఇంతకముందు చూసుకున్నాం ఆమె వయస్సు బహుశా 12 సం.ల కంటే తక్కువకాబట్టి ఆమెకు ఇవన్నీ ఎలా తెలుసు? అంటే ఆమె తల్లిదండ్రులు కధలుకధలుగా చెప్పారు. ఆమె విన్నాది. ఇక్కడ సాక్ష్యం చెబుతుంది.

   ప్రియ తల్లిదండ్రులారా! మీ పిల్లలకు ఇలాంటివి ఆత్మీయసంగతులు దేవుని కధలు చెబుతున్నారా? ఈ చిన్నదాని తల్లిదండ్రులు ఈమెకు నేర్పించారు. అందుకే అంతపెద్ద సైన్యాధిపతి ఇంట్లో సాక్ష్యం చెబుతుంది. బాలుడు నడువవలసిన  మార్గం వానికి నేర్పించుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు అని బైబిల్ చెబుతుంది. సామెతలు 22:6;  కాబట్టి మీ పిల్లలు చిన్నవారై ఉండగానే ఇలాంటి బైబిల్ స్టోరీలు, ప్రార్ధించడం, వాక్యం చదవడం నేర్పించండి అనగా భక్తి నేర్పించండి. పెద్దయ్యాక  వారు భక్తిగా ఉండటమే కాదు ఇలా సాక్షార్ధమైన జీవితం జీవించగలరు. చివరకు ఏమి చెప్పిందో తెలియదు గాని నయమాను భార్యకు విశ్వాసం కలిగి ఈ విషయం నయమానుకు చెప్పడమే కాదుఆయనకు కూడా విశ్వాసం కలిగేలా చేసింది. బహుశా అప్పుడు నయమాను కూడా అడిగి ఉంటాడు ప్రవక్తకోసం ఈ చిన్నదానిని. అప్పుడు మొదటసారిగా ధైర్యంగా చెప్పి ఉంటుంది దేవునికోసం!

   ప్రియ సహోదరి/ సహోదరుడా! నీవు రక్షించబడి ఎంతకాలం అయ్యింది? ఎంతమందికి దేవునికోసం చెప్పావు? ఎంతమందికి నీ సాక్ష్యం చెప్పావు? ఎంతమందికి యేసయ్య జనన,మరణ పునరుత్థానం కోసం చెప్పావు?  ఈ చిన్నది పరాయి దేశంలో బందీగా ఉంటూ దేవునికోసం అధికారుల ముందు సాక్ష్యం చెప్పింది కదా, నీవు వయస్సులో, అనుభవంలో పెద్దవాడివి/పెద్దదానివి కదా, మరి నీవు చెబుతున్నావా? మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసుప్రభులవారు ఇచ్చిన చివరి ఆజ్ఞను మరచిపోయావా? మార్కు 16:15;
 ఆ చిన్నదాని కున్న తెగింపు నీకుందా?
నీ పొరుగువారు విగ్రహారాధనలో/ పాపములో మగ్గిపోతుంటే నీవు ఏమీ పట్టనట్లు టీవీ దగ్గర తాపీగా కూర్చొని సీరియల్ లు చూస్తున్నావు కదా, దేవుడు నీ పొరుగువారికోసం లెక్క నిన్ను అడగరా??!!! జాగ్రత్త!
నీ పిల్లలకు దేవుని కోసం చెబుతూ వారికి ప్రార్ధనా, వాక్యం నేర్పిస్తున్నావా? *దేవుడిచ్చిన పిల్లలను దేవునికోసం పెంచుతున్నావా లేక నీ స్వార్ధం కోసం పెంచుతూ లోకానుసారంగా పెంచుతున్నావా*? జాగ్రత్త!
ప్రతీదానికి దేవుని న్యాయపీఠం దగ్గర లెక్క అప్పగించాలి అని మరచిపోవద్దు!
ఆ చిన్నదానిలా మనం కూడా దేవునికోసం చెబుదాం!
అనేకులను దేవుకోసం గెలుద్దాం!
ఆమెన్!
దైవాశీస్సులు!
*The Best Disciple-16*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-11*
*నయమానుఎలీషాగారు*
2 రాజులు 5: 810
8. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడునీ వస్త్రములు నీ వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను.
9. నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలిచియుండగా
10. ఎలీషా-నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను.

     ప్రియులారా ఇంతవరకు మనం ఎలీషాగారు చేసిన పది  అద్భుతాలను ధ్యానం చేసుకున్నాం. ఇక ఈరోజు మరో అద్భుతముతో కూడిన పరిచర్య చూసుకుందాం.  ఈ అద్భుతం కూడా యేసుప్రభులవారు చేసిన అద్భుతం లాంటిదే. అయితే ఈ అద్భుతం యేసుప్రభులవారి కన్నా సుమారు  8౩0 సం.లకు పూర్వమే ఎలీషాగారిద్వారా జరిగింది.  యేసుప్రభులవారు కుష్టువ్యాది గలవారిని కొందరిని బాగుచేశారు. ఇక్కడ ఎలీషాగారు కూడా చేశారు.

     ప్రియులారా!  ఎప్పుడైతే ఇశ్రాయేలు చిన్నది దేవుని అద్బుతశక్తి కోసం, ప్రవక్త కోసం చెప్పిందోనయమానుకు కూడా నమ్మకం కలిగి రాజుతో అంటున్నాడు- ఇశ్రాయేలుదేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట. ఆయన దగ్గరకు వెళ్తే నా రోగం పోతుందట. కాబట్టి నాకు ఇశ్రాయేలు దేశం వెళ్ళడానికి అనుమతిని ఇవ్వు అన్నాడు. వెంటనే రాజు అనుమతిని ఇవ్వడమే కాదుఇశ్రాయేలు రాజుకి ఒక లేఖ రాశాడు. అంతేకాకుండా కొన్ని కానుకలు పంపించాడు.  *ఒకసారి సిరియా రాజు ఇచ్చిన కానుకలు చూసుకుందాము.  20 మణుగుల వెండి- అనగా సుమారు 340 కేజీల వెండి. ఇంకా ఆ కాలంలో లక్షా ఇరవైవేల రూపాయల బంగారం- అనగా ఆ కాలంలో  6౦౦౦ తులాల బంగారం. అనగా నేటి బంగారం విలువ దృష్ట్యా సుమారు 21కోట్లు రూపాయల విలువ చేస్తుంది. ఇంకా బట్టలు. చూడండి. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నయమాను అంటే రాజుకు అంత ఇష్టం. కారణం నయమాను వల్లనే సిరియారాజుకి అన్ని విజయాలు వచ్చాయి. అందుకే అంత విలువైన కానుకలు పంపిస్తున్నారు. మరో విషయం చెప్పనీయండి.  ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము  తాత అయిన ఒమ్రీ షోమ్రోను కొండను 70 కేజీల వెండికి కొని షోమ్రోను పట్టణం కట్టించాడు. ఇక్కడ ఈ రాజు ప్రవక్తకు పంపిన వెండి 340 కేజీలు. అనగా సుమారుగా ఆ కాలంలో విశాఖపట్నం లాంటి సిటీ మొత్తానికి కోనేవచ్చు. అంత విలువైన కానుకలు పంపించాడు.*

    సరే, ఈ ఉత్తరాన్ని, ఈ కానుకలను పట్టుకవెదుకుతున్నాడోరాయేలు దేశం వచ్చి- రాజైన యెహోరాముకి ఇచ్చాడు. ఈ ఉత్తరం చదివి వెంటనే బట్టలు చింపుకుంటున్నాడు ఈ పనికిమాలిన రాజు. మరల అంటున్నాడు: చూడండి సిరియా రాజు నాతో యుద్ధం చేయడానికి ఎలా సాకులు వెదుకుతున్నాడో, నేను ఎవరినైనా బాగుచేయడానికి నేను దేవుడునా అంటున్నాడు. *ఇక్కడ సమస్యను మానవీయ కోణంలో చూడకుండా రాజకీయ కోణంలో చూస్తున్నాడు ఈ పనికిమాలిన రాజు. నిజానికి ఆ ఇశ్రాయేలు చిన్నదానికున్న విశ్వాసం, దేవునిమీద భయభక్తులు వీడికి లేవు. ఆ చిన్నదానికున్న కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ కూడా వీడికి లేదు. ఆ చిన్నదానికి తెలుసువారి దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దైవజనుడు. ఆయన ప్రార్ధన చేస్తే దేవుడు అద్భుతాలను చేస్తున్నారు. ఇక్కడ వీడు రాజు అయినా సరే వీడి రాజ్యంలో ఏం జరుగుతుందో / కరెంట్ అఫైర్స్ వీడికి బొత్తిగా తెలియడం లేదు*. 

   కాని ఈ విషయం ఈ నోట, ఆనోటా ప్రవక్తకు తెలిసింది వెంటనే రాజుకి కబుటుపెట్టారు ప్రవక్త. నీ బట్టలు ఎందుకు చింపుకొన్నావ్? ఇశ్రాయేలులో ప్రవక్త అనేవాడు ఒకడు ఉన్నాడని అతడు తెలుసుకొనే లాగా అతనిని నా దగ్గరకు పంపించు అని చెప్పారు. వెంటనే ఈ రాజు బ్రతుకు జీవుడా అని ఎలీషాగారి దగ్గరకు పంపించాడు.  మనం కూడా మన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలతో సతమతమైపోతుంటాం. అయితే మనకాలగతులను తన వశంలో ఉంచుకొన్న సర్వోన్నతుడైన దేవునిబిడ్డలం మనం అని మరచిపోయిమనం కూడా మానవరీతిలో ఆలోచించి కంగారు పడుతుంటాం. అయితే ఆ దేవునికి నీ సమస్య అప్పగిస్తే దేవుడు గొప్పకార్యాలు చేస్తారు.

    ఇప్పుడు నయమాను ప్రవక్త దగ్గరకు వెళ్ళాడు. ప్రవక్త కనీసం నయమానును చూడలేదు. విష్ చెయ్యలేదు. వెళ్లి యోర్దాను నదిలో ఏడుసార్లు మునగమని ఒక పనివానితో కబురుపెట్టారు. ఇక్కడ వెంటనే ఈ నయమానుకి చాలా కోపం వచ్చేసింది. ఈగో దెబ్బ తింది. కారణం ఇంతగొప్ప అధికారిని, వీరుడను, శూరుడను కదా, కనీసం నా దగ్గరకు వచ్చి తన దేవుడి పేరిట ఏదో మంత్రం వేస్తాడు అనుకుంటే, ఎవడో పనివాడుచేత కబురుపెట్టాడు. మా దేశంలో ఉన్న నదులలో స్నానం చేసి శుద్దుడను కాలేనా అని తిరిగి వెళ్ళిపోతున్నాడు. అయితే అక్కడున్న నమ్మకమైన పనివాడు నచ్చచెబుతున్నాడు. అయ్యా మీరు ఇంతవరకు ఎక్కడెక్కడో తిరిగారు. ఎన్నో మందులు వాడారు. అయినా స్వస్తత కలుగలేదు కదా. ఇన్ని చేశారుఇదికూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు. కేవలము స్నానం కదా చేయ్యమన్నారు అని నచ్చచెప్పారు. అందుకే మృదువైన మాటలు క్రోధాన్ని చల్లార్చుతాయి అన్నారు. సామెతలు 15:1; వెంటనే నయమాను యోర్దాను నదికి వెళ్లి స్నానం చేస్తున్నాడు,. ఒకటి- చూసుకున్నాడు. ఏం లాభం లేదు. రెండు  ఏమీ కాలేదు. మూడుఏమీ కాలేదు. నాలుగుఏమీ కాలేదు. చెబ్తాను ఆ ప్రవక్త పని ఏడుసార్లు మునిగాక అవ్వకపోవాలి అనుకొన్నాడేమో?!! లేదా, ఇన్ని ప్రయత్నాలు చేశాను. ఓ యెహోవా దేవుడా! నీవైనా నన్ను బాగుచేయు అని దీనంగా ప్రార్దించాడేమో! మనకు తెలియదు. ఏడోసారి మునిగి లేచి చూసాడు అంతే! తన దేహం చిన్నపిల్లవాని దేహములా శుద్దిగా ఉంది. తన కుష్టరోగం మటుమాయం అయ్యింది. ఇక్కడ  తను స్వస్తత పొందటానికి ఈ యోర్దాను నదిలో ఏమైనా మహిమలు ఉన్నాయా? లేనేలేవు. మరి ఎలా బాగుపడ్డాడు? కేవలం విధేయత! తను ఎన్నోచేశాడు కాని శుద్ధి కాలేదు,. కేవలం ప్రవక్త చెప్పినమాట విని స్నానం చేసాడు. అంతే. సంపూర్ణంగా శుద్ధిపొందాడు.

   ప్రియ దైవజనమా! నీవుకూడా స్వస్తత పొందలేక పోవడానికి కారణం నీ సంఘకాపరికి స్వస్తత వరం లేకపోవడం కానేకాదు. నీకు విశ్వాసం లేకపోవడం మరియు నీవు దేవునికి విధేయత చూపించకపోవడమే కారణం. దేవుణ్ణి సంపూర్తిగా నమ్ము. ఆయన చేతులకు నిన్ను నీవు సంపూర్తిగా అప్పగించుకో! వెంటనే దేవుడు నిన్ను స్వస్త పరుస్తారు. అద్భుత కార్యాలు చేస్తారు. నయమాను నమ్మాడు. స్వస్థత పొందాడు. నీవు నమ్ము! స్వస్తత పొందు.
ఆమెన్!
దైవాశీస్సులు!
*The Best Disciple-17*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-12*
*Best Disciple’s Worst Disciple*

2 రాజులు 5: 1516
15. అప్పుడతడు తన పరివారముతో కూడ దైవజనునిదగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి-చిత్తగించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును; ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసికొన వలసినదని అతనితో చెప్పగా
16. ఎలీషా-ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసికొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పక పోయెను. ..

   ప్రియులారా! గతభాగంలో నయమాను ఎలీషా గారి మాటమేరకు యోర్దాను నదిలో ఏడుసార్లు మునిగినందున స్వస్తత పొందినట్లు చూసుకున్నాం. ఇప్పుడు నయమాను తిన్నగా ఎలీషా గారి ఇంటికి వచ్చి నమస్కరించి అంటున్నాడు: దేవుళ్లలో యెహోవాయే దేవుడు ఇంకా ఈ భూమిమీద మరో దేవుడు లేడు!  ఇది ఎవరు చెబుతున్న స్టేట్మెంట్?? ఒక అన్యుడు/ విగ్రహరాదికుడు/ ఇశ్రాయేలు దేశానికి శత్రువు వచ్చి చెబుతున్నాడు: యెహోవాయే దేవుడు! దీనికోసమే దేవుడు ఇతనిని ఏర్పాటుచేసుకున్నారు.  ఇది ఒక నిమిషంలో కలిగిన ఉద్రేకపూర్వకమైన డైలాగు కాదు. తను ఎన్నో దేవుళ్ళకు మ్రోక్కాడు. ఎంతోమంది డాక్టర్లకు చూపించుకున్నాడు కాని ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇశ్రాయేలు చిన్నది చెప్పిన సాక్ష్యం విని- లోబడి వచ్చాడు. స్వస్తత పొందుకున్నాడు. అనుభవపూర్వకమైన మాటలు ఏమిటంటే: భూమిమీద దేవుడు అంటే ఎవరైనా ఉంటే అది యెహోవాదేవుడే! చూశారా ఒక అన్యుడు ఇంతమంచి సాక్ష్యం చెబుతున్నాడు,. పుట్టుకతోనే క్రైస్తవులుగా ఉన్నవారు బోలెడుమంది ఉన్నారు. రక్షించబడి- బోలెడు సంవత్సరాలుగా దేవునిలో ఉన్నవారు లక్షలమంది ఉన్నారు గాని ఇలా సాక్ష్యం చెప్పలేక పోతున్నారు. గాని ఇక్కడ ఒక అన్యుడు దేవునికోసం సాక్ష్యం చెబుతున్నాడు. ప్రియ చదువరీ! నీవెప్పుడైనా ఇలా సాక్ష్యం చెప్పావా?

    ఇంకా అంటున్నాడు నయమాను ఎలీషాగారితో- దయచేసి ఈ చిన్న కానుకను స్వీకరించండి. గతభాగంలో అది ఎంతపెద్ద కానుకో చూసుకున్నాం. ఒకవేళ ఎలీషాగారు గాని ఆ కానుకను స్వీకరిస్తే ఈ భూలోకం అంతటిలో ధనవంతమైన ప్రవక్త/ దైవ సేవకుడు అయి ఉండేవారు.  ఒక నగరాన్నే కొనేటంత విలువైన కానుకలు. అయితే దైవసేవకుడు అంటున్నారుఎవని సన్నిధిని నిలువబడి ఉన్నానో ఆ యెహోవాజీవం తోడు నేను ఏమీ తీసుకొను!!! ఎవని సన్నిధి అనే డైలాగ్ తన గురువుగారిది. ఆయన చెప్పినట్లే ఎలీషాగారు కూడా చెబుతున్నారు. అంతేకాకుండా ఏలియాగారు అనుక్షణం దేవుని సన్నిధిని అనుభవించినట్లు ఇక్కడ ఎలీషాగారు కూడా అనుక్షణం దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారన్నమాట!! అందుకే గురువుగారి బాటలో శిష్యుడు కూడా నడుస్తున్నారు. గురువుకు తగ్గ శిష్యుడు!

   అంతేకాదు ఇక్కడ నయమానును బాగుచేస్తే తనకు ఏమైనా బహుమతులు దొరుకుతాయి. తను ధనవంతుడైపోతాడు అని తను ఎప్పుడూ ఆశించలేదు.  దేవునినామమునకు మహిమ తేవడమే తన లక్ష్యం! అందుకే నయమాను ఇచ్చిన కానుకలు ఆశించలేదు.  ఇక్కడ మనకు బిలాముఎలీషాగార్లకు ఎంతో భేదం కనిపిస్తుంది. బహుమానం కావాలి అని బిలాము తప్పుడు దారిలో ప్రయాణం చేసి, నోరులేని గాడిద తోటి, దూతతో బుద్ధి చెప్పించుకొనిచివరకు ఖడ్గముతో హతుడైపోయాడు. యూదా 1:11; సంఖ్యా 22, 23, 24, 31; 2 పేతురు 2:15-16; మోయాబీయులకు తప్పుడు సలహా ఇచ్చి అనేకమంది ఇశ్రాయేలీయులు మరణానికి కారణం అయ్యాడు. ఇక్కడ ఎలీషాగారు ఆ ధనమే నాకొద్దు అని తృణప్రాయంగా వదిలేశారు. అందుకే ఎలీషాగారిని దేవుడు అంతగా వాడుకొన్నారు. రాజులకంటే ఎక్కువ ఘనత ఎలీషాకు ఇచ్చారు దేవుడు.  అందుకే పౌలుగారు తిమోతిని హెచ్చరిస్తున్నారు: 1 తిమోతి 6:611
6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైయున్నది.
7.మన మీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలో నుండి ఏమియు తీసికొనిపోలేము.
8. కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము.
9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.
10. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
11. దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి(విడిచి పారిపొమ్ము), నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము(వెంటాడుము). . .  

ఈ విషయంగా మరోసారి మీకు ఒకమాటను గుర్తుచేస్తాను. దేవుని మహాకృప వలన, మా తండ్రిగారి సేవా పరిచర్య ద్వారా  మన తెలుగురాష్టాల్లో సేవచేస్తున్న అనేకమంది దైవజనులతో నాకు పరిచయం ఉంది. వారు నాకు చెప్పిన వారి జీవిత అనుభవాలనుండి, ఇంకా మా సేవా పరిచర్యలో దేవుడు మాకిచ్చిన అనుభవాల ద్వారా చెబుతున్నాను: నువ్వుధనం వెనుక (కానుకలు ఇచ్చేవారి వెనుక) పరుగెడితేధనం నిన్ను విడిచి పారిపోతుంది. నువ్వు కేవలం సువార్తకోసం- సేవాభారంతో సంఘవ్యాప్తి కోసం ధనాన్ని లెక్కచేయకుండా ముందుకు వెళ్లిపోతుంటే  ధనం నీ వెనుక పెంపుడు కుక్కలా పరుగెత్తుకుంటూ వస్తుంది. ఇది మా స్వానుభవం కూడా!  ప్రియ దైవసేవకుల్లారా! దయచేసి ధనం వెనుక పరుగెత్తవద్దు!  ఆత్మల సంపాదన కోసం సేవచెయ్యండి. ధనం దానికదే వస్తుంది. ధనసంపాదన  కోసం చేస్తే ఎప్పటికీ మీరు ఆశీర్వదించ బడలేరు. ఇక్కడ ఎలీషాగారు గొప్ప బహుమానాన్ని తృణీకరించారు.  రాజులను జయించివచ్చిన అబ్రాహాము గారితో సోదొమ రాజు మొత్తం ఆస్తి నీవు తీసుకొని కేవలం ప్రజలను నాకు అప్పగించేయ్ అని చెబితే అబ్రాహాము గారు కూడా ఇలానే చెప్పారునేనే అబ్రాహామును ధనవంతునిగా చేశాను అని నీవు చెప్పకుండా ఉండాలంటే నేను ఈ ధనాన్ని చిల్లిగవ్వ కూడా తీసుకోను! ఆదికాండం 15: 21-25; ఈ గొప్ప సాక్ష్యి సమూహము అలా చేశారు కాబట్టే- నేడు వారిపేర్లు చిరస్తాయిగా నిలచిపోయాయి. నేడు అనేకమంది దైవసేవకులు ధనం వెనుక పరుగెత్తుతూ- ఆత్మలసంపాదన మానేసిprosperity gospel చెబుతూవారి property ని పెంచుకుంటున్నారు. పేదలకోసం పంపిన డబ్బు వారి ఆస్తిని పెంచుకోడానికి వాడుకుంటున్నారు. తద్వారా దేవునినామం ఎంతగానో అవమానం చెందుతుంది. నేడు మన ఆంధ్రప్రదేశ్లో ఒక దైవసేవకుడు సేవను వదిలి- రాజకీయాలలో అడుగుపెట్టి- అధికార కాంక్షతో తిరుగుతుండగా దేవునినామం ఎంతగా అవమానం చెందుతుందో మనందరికీ తెలుసు.  ఇలాంటివారు చాలామంది ఉన్నారు. ఇలాంటివారికి ఎలీషాగారి జీవితం ఆదర్శం కావాలి. వారి ధనకాంక్షను, అధికార కాంక్షను వదిలెయ్యాలి. ప్రియ చదువరులా! ఇలాంటి వారిని చూసి మనం వ్యసనపడటం, ద్వేషించడం మానేసి- ప్రేమతో వారికోసం ప్రార్ధించాలి. అప్పుడు దేవుడే వారితో మాట్లాడతారు.

     తర్వాత వచనం మనకు కొంచెం వివాదాస్పదముగా ఉంటుంది. అది ఏమిటంటే: ఎలీషాగారు కానుకను స్వీకరించక పోతే అంటున్నాడు నయమాను
17. అప్పుడు-యెహో వాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను; రెండు కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించ కూడదా?
18. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా  . . . . 
చూడండిఒక అన్యుడు అంటున్నాడు ఇకనుండి నేను విగ్రహారాధన మానేసిఇతర దేవతలను(అనగా ఇంతవరకు తను పూజించిన దేవతలను వదలి) యెహోవా దేవున్నే పూజిస్తాను అయితే-నాకు రెండు కంచరగాడిదలు మోసేటంత మట్టి  ఈ భూభాగంనుండి నాకివ్వండి- అంటున్నాడు.  నేను రాజుతో మా రిమ్మోను దేవత గుడిలో వంగితే అది నేను రిమ్మోను దేవతకు కాకుండా యెహోవాకే చేసినట్లు అంటున్నాడు. ఇక్కడ మట్టిని తీసుకుని పొమ్మని ఎలీషాగారు ఎందుకు అనుమతి ఇచ్చారు? అ మట్టితో విగ్రహాలు చేసుకోడానికా?  కాదు కాదు.  ఇక్కడ అంత స్పష్టముగా ఆ మట్టి ఎందుకో వ్రాయబడలేదు గాని బైబిల్ పండితులు చరిత్రకారుల ప్రకారం  ఆ మట్టితో ఒక యెహోవాకు ఒక బలిపీఠం కట్టి, దానిమీద యెహోవా బలులు అర్పించడానికి. అంతేతప్ప మరోదానికి కాదు. అందుకే ఎలీషాగారు సమాధానముగా పోయి రమ్మని సెలవిచ్చారు.

   ప్రియ విశ్వాసి/ సేవకుడా! నీ ఆశ దేనిమీద ఉంది? ధనం మీదనా? అధికారం మీదనా? అయితే నీవు చాలా భాదలు పడాల్సివస్తుంది అని పౌలుగారు చెప్పిన మాటలు గుర్తుచేసుకో!

    ఇక తర్వాత భాగంలో మనకు గేహాజి కనిపిస్తాడు. గురువుగారు నయమాను తెచ్చిన ఘనమైన కానుకను తీసుకోకుండా పంపించి వేస్తే, గేహాజి హృదయం కుతకుతలాడిపోయింది. గురువుగారికి పెళ్లి- పిల్లలు లేరు. మాకున్నారు. మా చేతిక్రింద అనేకమంది ప్రవక్తల శిష్యులున్నారు. వారిపోషణకు ఈ డబ్బులు పనికొచ్చును. గాని ఈయన తీసుకోలేదు. సరే, గురువుగారు తీసుకోకపోయినా, నేను వెళ్లి ఏదైనా సంపాదించుకొంటాను, అనుకుని, పరుగెత్తి, అబద్దాలు చెప్పికొంత ధనం సంపాదించు కొన్నాడు. మరలా గురువుగారి దగ్గరకు వచ్చి బొంకుతున్నాడు.
25. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరనిలువగా ఎలీషా వానిని చూచి-గేహజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు-నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనెను.
26. అంతట ఎలీషా వానితో-ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?
27. కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్లెను.. . . .   చూసారా ఏమి జరిగిందో! ఏదైనా సంపాదించుకొంటాను అని వెళ్ళాడుతను తన కుటుంబానికి నయమానుకి పోయిన కుష్టువ్యాదిని సంపాదించాడు. మీరు అనొచ్చు గేహాజి ఒక్కడే పాపం చేసాడు  మరి కుటుంబానికి మొత్తం ఎందుకు శిక్ష?అది దేవుడు నిర్ణయం అంతే! ఆకాను పాపం చేసినప్పుడు దేవుడు ఆకానుని- తన కుటుంబం మొత్తం రాళ్ళతో చంపమన్నారు. అలాగే చేసారు. కోరహు, దోతాను, అబీరాములు ముగ్గురే పాపం చేసారు, గాని దేవుడు వారి కుటుంబాలతో సహితం నాశనం చేసారు. అది దేవుని నిర్ణయం! ద్వితీ 15; ఎలీషా గారు గురువుకి తగ్గ శిష్యుడు అయితే గేహాజీ పనికిమాలిన శిష్యుడు!

   గేహాజీ నేడు ధన సంపాధనకై పరుగులు పెడుతున్న ప్రతీ సేవకుని/ విశ్వాసి ఒక గుణపాటం! ఒకవేళ మీరింకా దేవునిసేవను వదలి ధనసంపాదనే లక్ష్యంగా పరుగెడితే మీకుకూడా ఆత్మీయ కుష్టుతో బాధపడుతున్నారు అని మరచిపోవద్దు. ఈరోజు దేవుడు మీతో కూడా చెబుతున్నారు *ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?*  ధనాశ వదిలేద్దాం! దైవరాజ్య వ్యాప్తికి పరుగెడదాం!

దైవాశీస్సులు!
ఆమెన్!  

*The Best Disciple-18*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-13*
*ఎరవుతెచ్చిన గొడ్డలి*

          దేవునినామమునకు మహిమ కలుగునుగాక! ప్రియులారా గతకోద్దిరోజులుగా మనం ఎలీషాగారి ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలతో కూడిన పరిచర్య కోసం ధ్యానం చేసుకుంటున్నాం . ఇంతవరకు మనం 12 అద్భుతాలను చూసుకున్నాం. ఈ రోజు మరొకటి- అసాదారమైన అద్భుతం ధ్యానం చేసుకుందాం.    

  2 రాజులు 6:1-7లో మరో సంఘటన మన ఆత్మీయజీవితాభివృద్ధికోసం జరిగింది. ఇక్కడ మనంచూస్తే ప్రవక్తల శిష్యులు ఎలీషా గారియొద్దకు వచ్చి అయ్యా! ఇక్కడ స్థలం ఇరుకుగా ఉంది, అడవికిపోయి కొన్ని మ్రానులుతెచ్చి మరో నివాసం కట్టుకొంటాము అన్నారు. అందుకు గురువుగారు మంచిది వెళ్ళిరండి అన్నారు. అయితే ఒకడు దయచేసి మాతో మీరు రావాలి అని మనవిచేసాడు. సరే వస్తాను అని వాళ్లతో బయలుదేరి వెళ్లారు. అక్కడ ఒక శిష్యుడి గొడ్డలి యోర్దాను నదిలో పడిపోతుంది అప్పుడు ఒక చెట్టుకొమ్మ నరికి వేయగా గొడ్డలి తేలింది. ఇదీ జరిగిన సంఘటన.

     అయితే దీనిలో నేర్చుకోవలసినవి చాలా వున్నాయి,

1). *ఈ సంఘటన ద్వారా మనకేం అర్ధమవుతుంది?*
 దేవుడు మనతోఉంటే మనం ఏమైనా సాధించగలము.అది ఎంతటి అసాధ్యమైనదైనా సరే- ఎంతో సునాయాసంగా సాధిస్తాము. అయితే ఒకవిషయం గమనించాలి. *దేవుడు మనతోఉంటే కష్టాలు రావు అనుకోవద్దు. ఆయన కష్టాలు తప్పించరు కాని కష్టాలు తట్టుకొనే శక్తి, ఉపాయం ఇచ్చి, నీవింకా ముందుకు దూసుకుపోయే విధంగా నిన్ను తయారుచేస్తారు.*
*యేసయ్య పడవలో ఉన్నప్పుడు తుఫాను రాకుండా ఆపలేదు గాని తుఫానును ఏరకంగా ఆపాలో నేర్పిచారు.*
*దానియేలును సింహపుబోనులోకి పోకుండా అడ్డుకోలేదు గాని సింహాలబోనులో కూడా నేనే నీతో ఉంటాను అని చెప్పడానికి దానియేలుతో పాటు  సింహాలబోనులోనికి వెళ్ళారు.*
*షడ్రక్, మేషకు, అబెద్నేగోలని అగ్నిగుండములో పడకుండా తప్పించలేదు గాని అగ్ని గుండములోనైనా సరే నాభక్తులను కాపాడుతాను అని చెప్పడానికి వాళ్ళతోపాటు అగ్ని గుండములోనికి వెళ్లారు*. కాబట్టి ధైర్యంగా దేవునితో కలసి సాగిపో.

2. *గొడ్డలి- విశ్వాసం*:   హెబ్రీపత్రికలో ముఖ్యంగా 11వ అధ్యాయంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడిగా ఉండలేవు, దేవునిని చూడలేము అని వ్రాయబడింది.
*విశ్వాసాన్ని మనం కొనలేము- అమ్మలేము*
విశ్వాసం అంటే నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు! దేవుణ్ణి సంపూర్తిగా నమ్మడం, ఆరాధించడం  ఎటువంటి షరతులు పెట్టకుండా!        ప్రభువా! ఏంచేసినా నీదే భారం అని ఆయనమీద పూర్తిగా ఆధారపడడం. ఆయన నన్ను ఎన్నడూ సిగ్గుపరచడు అనే స్థిరమైన విశ్వాసాన్ని కలిగియుండడం!
హబక్కూకు ప్రవక్తలా చెట్లు ఫలించకపోయినా, పూయకపోయినా, గొర్రెలు పశువులు లేకపోయినా, ఏమి లేకపోయినా ప్రభువునందు ఆనందించాలి. 3:17-18
అయితే విశ్వాసం ఎలా కలుగుతుంది? 
11:6 వినుటవల్ల విశ్వాసం కలుగుతుంది.
ఏం వినాలి?
ఆయన వాక్యం, ఆయన చేసిన గొప్పకార్యాలు, ఆయన ప్రేమ, ఆయన మహత్తర బలియాగం. ఎఫెసీ 2:8,9 లో మీవిశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు.
విశ్వాసం ఎందుకు కావాలి?
ఆయనకీ ఇష్టులుగా ఉండడానికి,
దేవునిని చూడడానికి,
అద్భుతాలు పొందుకోడానికి,
పరలోకం చేరడానికి,
సైతానుని జయించడానికి ----హెబ్రీ 11వ అధ్యాయం, ఎఫెసీ 6:16

అందుకే యేసయ్య అంటున్నారు- నీ విశ్వాసమే నిన్ను స్వస్తపరచింది అన్నారు. మరోసారి నీవు నమ్ముచున్నావా? అని అడిగితే ఆవ్యక్తి అన్నాడు నాకు అపనమ్మకముండకుండా సహాయం చేయుము అని వేడుకొన్నాడు. అట్టి పరిపూర్ణ విశ్వాసం నీవు నేను కలిగియుండాలి.
*విశ్వాసం దేవునితో నీకున్న సంభదాన్ని గట్టిపరుస్తుంది.*

3. *ఎరవు తెచ్చిన గొడ్డలి*:
ఇక్కడ ఈశిష్యుడు తనగొడ్డలి ఎవరిదగ్గరనుండో ఎరవు తెచ్చుకొన్నాడు. అయితే ప్రతీ వ్యక్తికీ సొంతవిశ్వాసం ఉండాలి. యేసయ్యకి రికమండేషన్ అవుసరం లేదు. ఆయన ప్రతీ మొర వినే దేవుడు. ప్రాముఖ్యంగా దీనుల మొర తప్పక వింటారు. కేవలం పాష్టర్ గారి ప్రార్ధనో దైవసేవకుడి ప్రార్ధనో వింటారు అనుకోవద్దు. నీ ప్రార్ధన-విశ్వాసం ద్వారా తప్పకుండా నీకు సహాయం చేస్తారు.

    అయితే ఇక్కడ ఈ గొడ్డలి జారి పడిపోయింది. నీవునేను కొన్నిసార్లు విశ్వాసంలో జారిపడిపోతాం, లోకంలో కలసిపోతుంటాం ధనాశవలన, లోకాశలవలన, అక్రమసంభంధాలువలన (సంసోను, దావీదు, సోలోమోను).
కొన్నిసార్లు దేవుడు జవాబివ్వడం ఆలస్యమైతే దిగజారిపోతాం.

4. *కొమ్మ- యేసయ్య*:
ఒకవేళ నీవు విశ్వాసంలో జారిపోయావా? తిరిగి యేసయ్య వద్దకు కన్నీటితో రా! ఆ ప్రవక్తల శిష్యుడు రోదించినట్లు రోదించు. అప్పుడు యెస్సయికి/ దావీదుకి చిగురైన యేసయ్య నీజీవితంలో అద్భుతాలు చేస్తారు. అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తారు. ఇనుపగొడ్డలి నీటిలో మునిగిపోతుంది గాని ఆశ్చర్యంగా కొమ్మ నీటిలో వేసినవెంటనే అది తేలింది.

కాబట్టి ప్రియవిశ్వాసి! పోగుట్టుకొన్న విశ్వాసాన్ని తిరిగి పొందుకో. యేసయ్య పాదాలు దగ్గరికి రా!
దేవుని సన్నిధిని మరచిపోయావేమో? తిరిగి దేవుని మందిరానికి రా!
వాక్యాన్ని పట్టుదలగా చదువు.
అప్పుడు అన్నీ నీకు సాధ్యమవుతాయి.
అట్టి కృప మనందరికీ కలుగును గాక!
దైవాశీస్సులు!
ఆమెన్!
*The Best Disciple-19*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-14*

   2 రాజులు 6:1112
11. సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి-మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారి నడుగగా
12. అతని సేవకులలో ఒకడు-రాజవైన నా యేలినవాడా, ఇశ్రాయేలురాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలురాజునకు తెలియజేయుననెను. . .

     దేవునినామమునకు మహిమ కలుగును గాక!ప్రియులారా గతకొద్దిరోజులుగా మనం ఎలీషాగారి ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలతో కూడిన పరిచర్య కోసం ధ్యానం చేసుకుంటున్నాం . ఇంతవరకు మనం 13 అద్భుతాలను చూసుకున్నాం. ఈ రోజు మరొకటి- అసాధారణమైన అద్భుతం ధ్యానం చేసుకుందాం.   
  
      ప్రియులారా పై వచనాలలో సిరియారాజు మరలా ఇశ్రాయేలుదేశం మీద దండెత్తిన్తట్లు చూస్తున్నాం. అయితే ఎలీషాగారు వారు ఏ మార్గమున వస్తున్నారో ముందుగానే వివేచించి, ఫలాని చోటుకు వెళ్ళవద్దు, అక్కడనుండి సిరియనులు నీపై దండెత్తుతున్నారు అని ఇశ్రాయేలు రాజుకి కబురు పెడుతుండగా రాజు తన సైన్యాన్ని అప్రమత్తం చేసి రక్షించుకొన్నాడు. ఇలా చాలా సార్లు జరిగింది. అయితే ఇక్కడ ఆగి ఆలోచించాల్సింది ఏమిటంటే: ఇంతవరకు ప్రవక్తతో మాట్లాడని రాజు, ప్రవక్తతో కొంత సన్నిహితసంభంధం కలిగియున్నట్లు గమనించవచ్చు. బహుశా నయమాను స్వస్తత పొందిన విధానం తెలిసి- రాజుకి కూడా దైవజనుడిమీద, దేవునిమీద విశ్వాసం కలిగియుండవచ్చు. ఈ రకంగా వారిద్దరి మధ్య కొంత సయోధ్య కుదిరిఉండవచ్చు. అందుకే ఎలీషాగారు వివేచించి ముందుగానే రాజును హెచ్చరించడం జరిగింది.

   సరే, ఈ విషయం సిరియారాజుకి అర్ధం కాక చాలా పరేషాన్ అయ్యాడు. మనలో ఎవరైనా దేశద్రోహి ఉన్నారా? ఎవరు మన రహష్యాలు ఇశ్రాయేలు రాజుకి చెబుతున్నారు అని అడిగాడు తన సైన్యాన్ని.  వారిలో ఒకడు చెప్పాడుఅయ్యా మనలో ఎవడూ దేశద్రోహి/ రాజద్రోహి లేడు గాని ఆ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దేవుని మనిషి. ఆయన జరుగబోయేవి ముందుగానే పసిగెట్టి- రాజుకి చెబుతున్నాడు. వెంటనే సిరియారాజు అంటున్నాడు అయితే ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని అతనిని పట్టుకుని రండి అని చెప్పాడు. వేగులవారు సమాచారం తీసుకుని వచ్చారు ఎలీషాగారు దోతానులో ఉన్నారు.  దీనిప్రకారం ప్రవక్తల శిష్యులు దోతానులో కూడా ఉన్నారు, వారిని బలపరచటానికి ఎలీషాగారు అక్కడికి వెళ్ళినట్లు మనం గమనించవచ్చు.

   సరే, సిరియనులు రాత్రికి రాత్రి వచ్చి, ఆ దోతాను పట్టణం చుట్టూ కాసేసారు. ఉదయాన్నే ఎలీషాగారి పనివాడు లేచి చూస్తేపట్టణం చుట్టూ సిరియనుల సైన్యం , చాలా కంగారు పడి కేకలు వేస్తున్నాడు. ఇక్కడ పనివాడు కోసం వ్రాయబడి ఉందిదైవజనుడైన అతని పనివాడు. అనగా ఈ పనివాడు గేహాజి లాంటి పనికిమాలిన వాడు కాదు గాని- ఇతనికోసం వ్రాయబడి ఉంది ఈ పనివాడు దైవజనుడు!!! ప్రియ విశ్వాసి/ సేవకుడా! నీకు అలాంటి మంచిపేరు ఉన్నదా??!!!
ఈ పనివాడు కేకలు వేస్తున్నాడుగురువుగారు!  మనం అపాయంలో ఉన్నాము. మన చుట్టూ శత్రుసైన్యం చుట్టేసింది. ఇక్కడ ఆగుదాం! *ఈ దైవజనుడైన అతని పనివాడు ఒకవిషయం మరచిపోతున్నాడుసిరియనులు రాకముందే ఫలాని చోటుకి సిరియనులు వస్తున్నారు, అక్కడనుండి నీ సైనికులను తప్పించు అని కబురుపెట్టిన ఎలీషా గారికి ఇప్పుడు దోతానులో తనను పట్టుకోడానికి శత్రువులు వస్తున్నారు అని తెలియదా? ముందే దీనిని కూడా వివేచించి ఉండవచ్చు. గాని దేవుని నామమునకు మహిమ కలిగేలా చెప్పి ఉండకపోవచ్చు*! అందుకే చాల ప్రశాంతంగా చెబుతున్నారు. కంగారుపడకు! వారికంటే మనకు ఎక్కువ సైన్యం ఉన్నది. వెంటనే యితడు చాలా ఆశ్చర్యపడ్డాడు. దైవజనుడా మనకెక్కడిది సైన్యం? అప్పుడు ఎలీషాగారు దేవునికి ప్రార్ధన చేశారుప్రభువా దయచేసి వీని కన్నులు (ఆత్మీయ కన్నులు) తెరువమని ప్రార్ధనచేశారు. దేవుడు వాని కన్నులు తెరచి చూస్తే,  ఆ కొండ చుట్టూ అగ్ని రధములు, అగ్ని గుర్రములు కనబడ్డాయి ఇప్పుడు అంటున్నాడు బహుశాగురువుగారు వారికంటే మనకే ఎక్కువమంది సైన్యం ఉన్నారు. అవును నేడు నీ కన్నులు / ఆత్మీయ కన్నులు మూయబడి ఉన్నందున నీ చుట్టూ ఎవరున్నారో, నీ పక్ష్యంగా ఎవరున్నారో మరచిపోతున్నావు. కొంతమంది కళ్ళుమూసుకుపోయి దేవుని బిడ్డల మీదకు వస్తున్నారు. వారితో ఎవరున్నారో వారికి తెలియడం లేదు.  ప్రియ చదువరీ! నేడు నీ కన్నులు తెరువబడేలా దేవునికి ప్రార్ధన చేయు! దేవుని బిడ్డల చుట్టూ ఎప్పుడు దేవుడు తన దూతలను కాపలాగా ఉంచుతారు. కీర్తనలు 91:11; దేవుడు తన బిడ్డలను కాపాడే విధానాలలో ఇదొకటి. ఏలియాగారి చుట్టూ అగ్నిరధాలున్నట్లు - ఎలీషాగారి చుట్టూ కూడా అగ్నిరదాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయి. వారిచుట్టూనే కాదు, నమ్మిన యెడల నీచుట్టూ, నా చుట్టూ కూడా ఆయన అగ్ని రధాలతో మనలను కాస్తున్నారు. వారికంటే ఎక్కువమంది సైన్యం మనకు ఉన్నారు. 2 దినవృత్తాంతములు 32:78; కీర్తనలు 18:1618; 34:7; 55:1619; 68:17;91:11; అందుకే యేసుప్రభులవారు అంటున్నారు మత్తయి 26:53
ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె (వ్యూహమొకటింటికి 6,000 యోథులు) ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?
  రోమా 8:31; హెబ్రీ 1:14; పై వచనాలు ప్రకారం మనకు వారికంటే ఎక్కువగా సైన్యం ఉంది అయితే మొదట నీవు దానిని నమ్మాలి.

   ఇప్పుడు ప్రవక్త ప్రార్ధన చేశారు యెహోవా ఈ ప్రజలకు గుడ్డితనం కలిగించు.  వెంటనే వారికి ఒక రకమైన మబ్బు కలిగింది. ఇలా బైబిల్ లో రెండుసారులు జరిగింది. ఆదికాండం 19:11 లో సొదొమా గోమోర్రా ప్రజలు వావివరుసలు వదలి- కామంతో దేవదూతలతోనే పాపం చేద్దామని వస్తేదేవదూతలు వారికి గుడ్డితనం కలిగించారు. అలాగే ఎలుమ అనే గారడీ వాడు ప్రజలను పౌలుగారు బోధలను వినకుండా చేస్తే పౌలుగారు చెప్పినవెంటనే వీడికి గుడ్డితనం కలిగింది. అపొస్తలుల 13:5-12; దేవుని బిడ్డలను పాడుచేయాలని అనుకుంటే ఇలానే జరుగుతుంది.  వీరికి గుడ్డితనం(ఒక రకమైన మసక) కలిగిన తర్వాత ఎలీషాగారు వీరిని షోమ్రోను నగరానికి, రాజ ప్రసాదానికి నడిపించిఅక్కడ వారి కన్నులు తెరువబడేలా ప్రార్ధన చేయగా వారు షోమ్రోను నడిబొడ్డున ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే రాజు అంటున్నాడు : నాయనా! వీరిని కొట్టి- చంపెయ్యనా?!! ఇతనికి బొత్తిగా కామన్సెన్స్ / రాజనీతి తెలియదు. ఎలీషాగారు అంటున్నారు , నీ కత్తితో చెరపట్టిన వారిని చంపేస్తావా? అనగా వీరు POR.(Prisoners of War), యుద్ధ ఖైదీలు. యుద్ధ ఖైదీలను జెనీవా ఒప్పందానికి కొన్ని వందల సంవత్సరాలకు ముందునుండి వారిని చంపక, హింసపెట్టకుండా ఉండాలని నిభందన ఉంది. గాని ఈ రాజుకి తెలియదు. మరేం చెయ్యాలి అని అడిగాడు. వీరికి కడుపునిండా అన్నం పెట్టి వారిని సమాధానంగా ఇంటికి పంపేయ్! అందుకే బైబిల్ సెలవిస్తుంది: రోమీయులకు 12: 20
కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.
 అవును ప్రియ స్నేహితులారా! మీ శత్రువులపై నిప్పులు చెరగొద్దు! వారికోసం ప్రార్ధన చేయు! శత్రుత్వం పోయే ప్రయత్నాలు చేయు! అలాకాకుండా వారిమీద మనం, మనం మీద వారు బురద జల్లుకుంటూకేసులు పెట్టుకుంటూ పోతేదేవుని ప్రేమ ఎలా తెలుసుకుంటారు? ఎప్పుడు తెలుసుకుంటారు? 
ఎలీషాగారి బోధవిని రాజు అలా విందు చేసినందుకు కొన్ని సంవత్సరాలు సిరియనులు సిగ్గుపడి ఇశ్రాయేలు దేశం మీద యుద్ధానికి రాలేదు.
నీవుకూడా లా చేసి శత్రువులను మిత్రులనుగా చేసుకో!
వారినికూడా దైవరాజ్యానికి పరిచయం చేయు!

దైవాశీస్సులు!
ఆమెన్!
*The Best Disciple-20*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-15*

   2 రాజులు 6:2729 
27. యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్లములో నుండి యైనను ద్రాక్షగానుగలో నుండియైనను దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పి
28. నీ విచారమునకు కారణమేమని యడుగగా అది- ఈ స్త్రీ నన్ను చూచి-నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు
29. మేము నా బిడ్డను వంటచేసికొని తింటిమి. అయితే మరునాటియందు నేను దాని చూచి-నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను.  .

    దేవునినామమునకు మహిమ కలుగును గాక!ప్రియులారా గతకొద్దిరోజులుగా మనం ఎలీషాగారి ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలతో కూడిన పరిచర్య కోసం ధ్యానం చేసుకుంటున్నాం . ఈరోజు ఎలీషాగారికి ఘనతతో పాటు ఏ రకమైన సవాళ్లు ఎదురయ్యాయి,  ఎవరు ఎలీషాగారిని హత్య చేద్దాం అనుకున్నారో ధ్యానం చేసుకుందాం.

     గతభాగంలో ఎలీషాగారిని బందించడానికి వచ్చిన వారిని క్షమించి- విందుభోజనం పెట్టగా సిగ్గుపడి, కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుదేశం మీద యుద్దానికి వెళ్ళడం మానినట్లు చూసుకున్నాం. ఇలా కొన్ని సంవత్సరాలు గడచిన తర్వాత సిరియారాజైన బెన్హదదు మరలా ఇశ్రాయేలు దేశం మీదకు దండెత్తడమే కాకుండా ముట్టడిదిబ్బ కట్టాడు. అందువలన భయంకరమైన క్షామం ఎదురయ్యింది ఇశ్రాయేలీయులకు. ఒక విషయం గమనించాలికొన్ని సంవత్సరాలుగా ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన కరవుతో బాధపడుతున్నారుఇప్పుడు దీనికితోడు శత్రురాజు ఈ విషయం తెలిసి ముట్టడిదిబ్బ కట్టాడు. అప్పుడు కరవు మరీ భయంకరంగా మారింది ఎంతగా మారిందో 25 వ వచనంలో ఉంది.
అప్పుడు షోమ్రోనులో గొప్పక్షామము కలిగియుండగా గాడిద యొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మబడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.  . . . . చూడండి గాడిద తల 80 తులాల వెండి. (ఆ కాలములో తులం వెండి ఒక రూపాయి) గమనించాలి 70 కేజీల వెండితో ఒక గొప్ప పట్టణాన్నే కొనొచ్చు ఆ దినాలలో, ఇప్పుడు గాడిద తల 80 తులాలు అంటే ఇది చాలా పెద్ద మొత్తం.  ఇంకా పావు కేజీ / పావు లీటర్ పావురం రెట్ట అయిదు తులాల వెండి అట! ఎంతఘోరమో కదా! ఈరోజులలో కూడా కొంతమంది కరవు రోజులలో సామానులు బిగబెట్టి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి లాభాలు సంపాడుస్తున్నారు, ఇదొక పిశాఛి లక్షణం!  ఇంకా ఎంత ఘోరంగా ఉందొ 26-29 వచనాలలో ఉంది
26. అంతట ఇశ్రాయేలురాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి- రాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని
27. యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్లములో నుండి యైనను ద్రాక్షగానుగలో నుండియైనను దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పి
28. నీ విచారమునకు కారణమేమని యడుగగా అది- ఈ స్త్రీ నన్ను చూచి-నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు
29. మేము నా బిడ్డను వంటచేసికొని తింటిమి. అయితే మరునాటియందు నేను దాని చూచి-నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను. . . . . .   *చూసారా ఎంత ఘోరం! తల్లులు పిల్లలను కోసుకుని తింటున్నారు*. ఏం దేవుడు రక్షించరా?  అవును దేవుడు ముందే చెప్పారు ఇలా ఎందుకు జరుగుతుందో!!! తనకు లోబడకపోతే ఇలాగే జరుగుతుంది అని దేవుడు ముందుగానే చెప్పారు. లేవీ 26:2729
27. నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల
28. నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.
29.​​ మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.  . . 
ద్వితీ 28:5257
52. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటి లోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు.
53. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు.
54. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్య యెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున
55. అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామము లన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలిన దేమియు ఉండదు.
56.నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును
57. అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమారము చేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తెయెడల నైనను కటాక్షము చూపకపోవును.  . . . 
విలాప వాక్యాలు 4:10
వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి.  . . .
ఇక్కడ అదే జరుగుతుంది. దేవుడు చెప్పి చేస్తారు. చెప్పకుండా చేయరు. ప్రజలు దేవుణ్ణి విడచి తిరిగితే అంతే!
ఈ భాగం చదువుతున్న ప్రియ చదువరీ! నీవు కూడా గొప్పోడివి/ గొప్పదానివి కాదు! నీవుకూడా వినకపోతే నీకు ఇదే గతి పట్టగలదు జాగ్రత్త!

   ఇక ౩౦వ వచనంలో రాజైన యెహోరాము గోనెబట్ట కట్టుకున్నట్లు చూస్తాం. గోనెబట్ట కట్టుకోవడం అంటే తననుతాను దేవునిఎదుట తగ్గించుకోవడం!! ఇంతవరకు బాగుంది. గాని తర్వాత వచనం చూసుకుందాం.
31. తరువాత రాజు-షాపాతు కుమారుడైన ఎలీషాయొక్క తల యీ దినమున అతనిపైన నిలిచియున్నయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. . . . . ఇదేమిటి విచిత్రం??!!! పాపము చేసింది ప్రజలు. చేయించింది రాజు. ఇప్పుడు చంపాలని చూస్తుంది ప్రవక్తను! ఎంతఘోరమండి!!! అన్యాయం కదా! ఇంతవరకు ప్రవక్తద్వారా ఎన్నో మేలులు పొందాడు ఈ పనికిమాలిన రాజు! ఇప్పుడు ప్రవక్తను చంపమని మనుషిని పంపిస్తున్నాడు.
32. అయితే ఎలీషా తన యింట కూర్చునియుండగా పెద్దలును అతనితోకూడ కూర్చుండి యున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంప బడినవాడు ఎలీషాదగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్ద లను చూచి-ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టి వేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి యుండి, ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండ తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసి వేయుడి; వాని యజమానుని కాళ్లచప్పుడు వానివెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా
33. ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతట రాజు-ఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవాకొరకు కనిపెట్టి యుండవలెననెను. . .. చూసారా!
ఇక ౩౩ వ వచనంలో నిజం చెబుతున్నాడుఇది యెహోవా వలన జరిగిన విపత్తు! ఇక నేను యెహోవాకోసం కనిపెట్టడం ఎందుకు?  ఎందుకు అంటే నీకు మరో ఆప్షన్ లేదు. ఇశ్రాయేలు నీవు తిరిగిరానుద్దేశించిన ఎదల నాయోద్దకే రావలెను అని దేవుడు సెలవిస్తున్నాడు. యిర్మియా 4:1; వీడంటున్నాడు నేనెందుకు యెహోవా కోసం ఎదురుచూడాలి?2 రాజులు ౩:1-౩ చూసుకుంటే వీడు ఎంత దుర్మార్గుడో తెలుస్తుంది.  వీడు దేవునికోసం కనిపెడ్డడం మానేసి ఒక గొప్ప దైవజనుడ్ని చంపాలని చూస్తున్నాడు. 

    కానీ 7వ అధ్యాయం చూసుకుంటే ఎలీషాగారు అంటున్నారు 7:1-2
1. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను-యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా-రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.
2. అందుకు ఎవరిచేతి మీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి-యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు-నీవు కన్నులార దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. . . .

 అదీ దేవుని ప్రేమ! మనిషి నమ్మదగిన వాడు కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి తెలుసు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు అని. అందుకే తన భక్తుని వాడుకుని అద్భుతం చేయడానికి సిద్దపడ్డారు. ప్రియ స్నేహితుడా! నీవు నమ్మదిగిన వాడవు కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన గుణలక్షణాలకు అతీతంగా ఆయన ఏమీ చేయరు. కాబట్టి నీవు ఆయనను నమ్ముకో! ఆయనను వదలి తిరిగావో ఇశ్రాయేలీయులకు పట్టిన గతే నీకు పడుతుంది.
నయోమికి జరిగినట్లే జరుగుతుంది. కాబట్టి నేడే గుణపడు!
దేవుడు నీకు తోడై ఉండును గాక!
ఆమెన్!
*The Best Disciple-21*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-16*

   2 రాజులు 7:1--2 
1. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను-యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా-రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.
2. అందుకు ఎవరిచేతి మీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి-యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు-నీవు కన్నులార దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. . .

       ప్రియ దైవ జనమా! గత కొద్ది రోజులుగా మనం ఎలీషాగారి పరిచర్యలో దేవుడు జరిగించిన అద్భుతాలు ధ్యానం చేస్తున్నాం. ఈ రోజు 15వ అద్బుతం ధ్యానం చేద్దాం!  గతభాగంలో ఎలీషాగారు రాజుతో చెప్పారు-- యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా-రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును. . . . . అందుకు ఎవరిచేతి మీద రాజు ఆనుకొంటాడో వాడు అన్నాడు: యెహోవా ఆకాశపు కిటికీలు తెరచినా ఇది జరుగుతుందా? అని అన్నాడు. చూసారా  వీడికి ఎంత వెటకారమో దేవుని వాక్కు అంటే!! అందుకే దైవజనుడు అన్నారు: నీవు కన్నులారా చూస్తావ్ గాని నీవు తినవు!!!  దేవుని మాటలంటే వెటకారం చేసేవారికి పట్టే గతి ఇదే! ఏమి జరిగిందో చివరలో చూసుకుందాము.

 ఈ తర్వాతి వచనాలలో అక్కడ కొంతమంది కుష్టురోగులను చూసుకుంటాం. వారు పట్టణం వెలుపల ఉన్నారు కారణం లేవీ 13:46 , సంఖ్యా 5:2౩ ప్రకారం కుష్టురోగులు పట్టణంలో/ పాలెంలో ఉండటానికి వీలులేదు. వారు పట్టణం బయటనే నివశించాలి.
3. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి-మనము చచ్చిపోవువరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను?
4. పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము; ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము; పదండి, సిరియనుల దండుపేట లోనికి, పోవుదము రండి, వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని ...  అలా అనుకుని సిరియనుల దండుదగ్గరకు వచ్చి చూస్తే అక్కడ ఎవరూ కనబడలేదు. ఏం జరిగింది?
6. యెహోవా రథముల ధ్వనియు గుఱ్ఱముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా వారు-మనమీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి యున్నాడని సిరియనులు ఒకరితో నొకరు చెప్పుకొని
7. లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని, సందె చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి.

  చూశారా దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఎన్నో విధానాలు ఉపయోగిస్తారు. ఈ రోజు రధములు, గుర్రముల ధ్వని వినిపించి, శత్రువులకు భయం కలిగించి, తన ప్రజలను రక్షించారు.  ఇదో మహా అద్భుతం!  దేవుణ్ణి మనిషి సంపూర్తిగా నమ్మడం లేదు. నమ్మితే ఇంకా మహా అద్భుతమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తారు.

   ఇప్పుడు ఈ నలుగురు కుష్టురోగులు కడుపునిండా తిన్నారు. ఒక గుడారాన్ని దోచుకున్నారు. మరో గుడారాన్ని దోచుకున్నారు. అయితే ఒకడు అంటున్నాడు: మనం చేస్తున్న పని మంచిది కాదు. మన సహోదరులు ఆకలితో అలమటించిపోతున్నారు. తమ సొంత పిల్లలను కోసుకుని తింటున్నారు. ఇది శుభవర్తమానం గల దినం. మనం వెళ్లి చెబుదాం అనుకొన్నారు. చెప్పారు.  *ఈరోజు అదే వర్తమానం దేవుడు నీకు నాకు ఇస్తున్నారు. మీరు చేస్తున్న పని మంచిది కాదు. ఏ పని మంచిది కాదు?దేవుని రక్షణ సువార్త నీకు వినబడింది అంగీకరించావు. మంచిది. దేవుడు నిన్ను దీవించును గాక! అయితే కేవలం ఆ శుభవార్త నీతోనే అంతమైపోవాలా/ ఆ శుభవర్తమానం ఇతరులకు చెప్పకపోతేనీవు చేస్తున్న పని మంచిది కాదు.  మీరు సర్వ లోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి భాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష అని సెలవిస్తుంది బైబిల్ మార్కు 16:15-16. ప్రియ దైవజనమా! మరి నీవు చేసే పని మంచిదా? నీవు ప్రకటిస్తున్నావా? నీవు ప్రకటించకపొతే ఒకానొక దినాన్న నీవు దేవుని దగ్గర లెక్క అప్పగించాలి అని తెలుసుకో!!!!  నలుగురు కుష్టురోగులు శుభవర్తమానం ప్రకటిస్తే పట్టణం మొత్తం కడుపునిండా తిన్నారు. వారు కుష్టురోగులు అని మరచిపోయి వర్తమానం అందజేశారు. నేను కుష్టుతోగిని, నేనెందుకు ఈ కబురు చెప్పాలి అని అనుకోలేదు. వెళ్లి చెప్పారు.  మరి నీవెందుకు చెప్పడం లేదు నీ పొరుగువారికి, నీ ఇంటివారికి*???

   ఎప్పుడైతే నలుగురు చెప్పారో, వెళ్లి చూస్తే ఎవరూ లేరు. వెంటనే ప్రజలు, సైన్యం ఆ గుడారాలు దోచుకున్నారు.  ప్రజలు కడుపునిండా తిన్నారు. అయితే ఎవడైతే యెహోవా ఆకాశపు కిటికీలు తెరచినా ఇలా జరుగుతుందా అని అన్నాడో- వాడ్ని ఇశ్రాయేలీయుల రాజు నగర ద్వారం దగ్గర ప్రజలను కంట్రోల్ చేసే డ్యూటీ వేస్తే, ప్రజలకు ఆకలితో అలమటిస్తున్నందు వలన అక్కడ త్రొక్కిసలాట జరిగింది. వీడుకూడా అదే గుమ్మం దగ్గర డ్యూటీ చేస్తుంటే ప్రజలు వీడని తోశేశారు. ఆ తోపులాటలో వీడని కూడా తొక్కేశారు. వీడు ఆన్ ది స్పాట్ చచ్చాడు.  దేవునిమాటలు వెటకారం చేస్తే అంతే!  యెహోవా ఆకాశపు వాకిళ్ళు/ కిటికీలు తెరచినా ఇలా జరుగదు అన్నాడు.  నమ్మలేదు  చచ్చాడు.

ప్రియ చదువరీ! దేవుణ్ణి గాని, ఆయన శక్తిసామర్ధ్యాలు గాని తక్కువగా అంచనా వేయకు. చేసి భంగపడకు!
గౌరవించడం నేర్చుకో!
బ్రతికి- దేవుణ్ణి మహిమ పరచు!

ఆమెన్!
దైవాశీస్సులు!
*The Best Disciple-22*
*శ్రేష్ఠమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య-17*

         2 రాజులు 8:12
1. ఒకనాడు ఎలీషా తాను బ్రదికించిన బిడ్డకు తల్లియైన ఆమెను పిలిచి-యెహోవా క్షామకాలము రప్పింప బోవుచున్నాడు; ఏడు సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి-నీవు లేచి, నీవును నీ యింటివారును ఎచ్చటనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా
2. ఆ స్త్రీ లేచి దైవజనుని మాటచొప్పున చేసి, తన యింటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి యేడు సంవత్సరములు అక్కడ వాసముచేసెను.

  ప్రియమైన దైవజనమా! మనం కొద్దివారాలుగా ఎలీషాగారిని దేవుడు వాడుకుని తనద్వారా చేయించిన అద్భుతాలతో కూడిన పరిచర్య కోసం ధ్యానం చేస్తున్నాము.  ఈరోజు మరో అద్భుతం కోసం ధ్యానం చేసుకుందాం.

   మొదటి వచనంలో ఎలీషాగారికి దేవుడు బయలుపరచింది ఏమిటంటే ఇశ్రాయేలు దేశం మీద దేవుడు గొప్ప కరువు పంపించబోతున్నారు. గమనించాలి ఏలియా సమయం నుండి ప్రారంభమైన కరవులు అలా రావడం ఇశ్రాయేలీయులు గుణపడటం- మరల పాపం చేయడం  మరలా దేవుడు కరువులు పంపడం జరిగిపోతుంది. ఎలీషాగారి సమయంలో ఇలా చాలా కరువులు కలిగాయి.  అయితే ఈసారి దేవుడు ముందుగానే ఈ విషయం ఎలీషాగారికి బయలు పరచగాతనను ఎల్లప్పుడూ కనిపెడుతూ, వారి అవసరాలను ఎల్లప్పుడూ తీర్చే సహోదరి- ఘనురాలైన షూనేమీ స్త్రీకి కబురుపెట్టారుఇశ్రాయేలు దేశం మీదకు చాలా పెద్దకరవు రాబోతుంది. అది ఏడు నిండు సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి నీవు ఈ దేశం వదలి నీకు ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళు అని చెప్పారు. వెంటనే ఈమె ఆయన మాటలు నమ్మి ఫిలిష్తీయుల దేశం వెళ్ళింది.

    ఇక్కడ నయోమికిఈ ఘనురాలుకి చాలా తేడాలున్నాయి.  నయోమి దేవుడు చెప్పకపోయినా చిన్న కరవు వస్తే పారిపోయింది. ఘనురాలు దేవుడు చెబితే పరాయి దేశం వెళ్ళింది. నయోమి పాపభూయిష్టమైన మోయాబు దేశానికి, వ్యభిచారంలో మునిగితేలే దేశానికి తరలిపోయింది. ఘనురాలు అన్యుల దేశమైనా కొంచెం పాపం తక్కువగా ఉండే దేశానికి వెళ్ళింది.  నయోమి అక్కడ సుమారు పది సంవత్సరాలుంది. ఘనురాలు దేవుడు చెప్పిన ఏడుసంవత్సరాలు ఉండి వెంటనే తన దేశం పరుగెత్తుకొని వచ్చేసింది. నయోమి సమస్తము పోగొట్టుకుని, తన భర్తను, కుమారులను ఇద్దరినీ కోల్పోయి వచ్చింది. ఘనురాలు ఏమీ పోగొట్టుకోకుండా సజీవంగా ఆనందంగా తిరిగి వచ్చింది. నయోమి సమృద్ధిగలదిగా వెళ్లి రిక్తహస్తాలతో వచ్చింది. ఘనురాలు సమృద్ధిగా వెళ్లి- సమృద్ధిగా వచ్చింది. ఎందుకు ఈ ఇద్దరి మధ్య తేడా??!!  ఘనురాలు దేవుడు వెళ్ళమంటే వెళ్ళింది. సంతోషంగా వచ్చింది. నయోమి పుకారు విని పారిపోయింది. దేవుని దగ్గర విచారణ చేయలేదు,. సొంతనిర్ణయాలు తీసుకుంది. సర్వమూ కోల్పోయి వట్టిచేతులతో వచ్చింది. కాబట్టి ప్రియ చదువరీ! నీ సొంతనిర్ణయాలు తీసుకోవద్దు! దేవుణ్ణి నీ బదులుగా పని చేయనీయు. దేవునికి అవకాశం ఇవ్వు! నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని బైబిల్ సెలవిస్తుంది. సామెతలు 3:6; ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గం కలదు. గాని అది చివరకు మరణానికి/ నాశనానికి దారితీస్తుంది అని తెలుసుకో! సామెతలు 14:12;

      దేవుడు చెప్పినట్లు ఘనురాలు చేసి క్షేమంగా తన దేశం తిరిగి వచ్చి- ఈ ఏడు సంవత్సరాలు తన భూమికోసం, తన ఇంటికోసం రాజు దగ్గర మనవి చేయడం కోసం వచ్చింది. నేను అనుకుంటాను బహుశా ఆమె ఇల్లు ఎవరైనా ఆక్రమించుకొని ఉండవచ్చు!  లేదా ఆ ఇంట్లో ఎవరూ లేరుకదా అని ఎవరైనా నివాసం చేస్తూ ఉండవచ్చు. ఇప్పుడు వారిని ఖాళీ చేయించడానికి బహుశా రాజు దగ్గర మనవిచేయడానికి రాజు దగ్గరకు వెళ్ళింది. అయితే అక్కడ అదృష్టవశాత్తు గేహాజీ రాజు దగ్గర ఉండి- అక్కడ ఎలీషాగారి ద్వారా దేవుడు జరిగించిన గొప్ప కార్యాలు రాజుకి- గేహాజి వివరిస్తున్నాడు. 
ఇక్కడ ఆగి ఆలోచించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. మొదటగా లేవీ 13:46 , సంఖ్యా 5:2౩ ప్రకారం కుష్టురోగులు పాలెము బయట/ నగరం బయట ఉండాలి గాని పట్టణం లోనికి రాడానికి అర్హత లేదు. అయితే ఈ గేహాజి తిన్నగా రాజమందిరానికే ఎలా వచ్చాడు? రాజు పిలిపించాడు కాబట్టి. గాని కుష్టురోగిని వాడు ఎలాంటివాడైన రాజు పిలిపించడు కదా! అనగా బహుశా- గేహాజికి, గేహాజి కుటుంబానికి నయమానుకి కలిగిన కుష్టు ప్రాప్తించిన తరువాతనా ఉద్దేశ్యం ఏమిటంటే బహుశా వీడు పశ్చాత్తాపపడి దేవుని పాదాలు పట్టుకుని ఉంటాడు. కారణం వీడు కనీసం  25 సంవత్సరాలకు పైగా ఎలీషాగారి దగ్గర శిష్యరికం చేశాడు కాబట్టి బహుశా గురువుగారి మీద భయంతోనైనా ప్రార్ధించడం నేర్చుకుని ఉంటాడు. ఇప్పుడు రోగం కలిగాక దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడి ఏడ్చి ఉంటాడు. దేవుడు కరుణించి వాడి కుష్టు రోగాన్ని బాగు చేసి ఉంటాడు అందుకే వీడు రాజు దగ్గరికి రాగలిగాడు అని నా ఉద్దేశం. (నా ఉద్దేశమే సుమా).

46 వచనాలు చూసుకుంటే .
4. రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాటలాడి-ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి యుండెను.
5. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీ-నా యేలినవాడవైన రాజా ఆ స్త్రీ యిదే; మరియు ఎలీషా తిరిగి బ్రదికించిన యీమెబిడ్డ వీడే అని చెప్పగా
6. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను. . . . 

 చూశారా దేవుడు చేసే పని అలాగే ఉంటుంది. గేహాజి చనిపోయిన బిడ్డను ఎలీషాగారు ప్రార్ధన చేసి లేపిన వృత్తాంతమును చెబుతున్నప్పుడే ఈ ఘనురాలు కూడా అక్కడికే వెళ్ళింది. ఇది దేవుడు మన కొరకు దాచిన మేలు. అవి మన కన్నులకు అఘోచరమైనవి. మన ఊహలకు అందనివి. రోమీయులకు 8: 28
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము అంటే ఇదే! వెంటనే రాజు ఈ విషయం తెలుస్కుని ఆశ్చర్యపడి ఆమె భూమిపంట మరియు ఆమె ఇల్లు తిరిగి వడ్డీతో సహా మరల ఇప్పించాడు.

    ఇక రెండవ విషయం ఏమిటంటే: చరిత్రకారులు/ బైబిల్ పండితులు ఈ రాజు బహుశా యెహోరాము కాదు అంటారు. ఎందుకంటే రాజుకి ఎలీషాగారు చేసిన అద్భుతాలు అన్నీ తెలుసు అంటారు. యెహోరాము తర్వాత రాజైన యెహూ కావచ్చు అంటారు. అయితే బహుశా యెహోరామే కావచ్చు.  చివర్లో మారుమనస్సు పొందిదేవునికోసం ప్రవక్త కోసం విచారింప పూనుకొని ఉండవచ్చు. అదే క్రమంలో ఎలీషాగారి శిష్యుడైన గేహాజిని పిలిచి ఉండవచ్చు. ఏదిఏమైనా  ఘనురాలైన స్త్రీ కరువునుండి తప్పించుకుంది. కరువులో నష్టపోయిన ఆస్తి, పంట తిరిగి దక్కించుకుంది.

ప్రియ సహోదరీ! సహోదరుడా! ఆమెకు ఇవన్నీ కలగడానికి కారణం నమ్మకమైన పరిచర్య! దైవసేవకులకు ఉపచారం చేయడం! దైవసేవకులకు ఉపచారం చేసినట్లు భావించక, వారికి చేస్తేదేవునికే చేసినట్లు చేసింది. అందుకే అన్ని మేలులు పొందుకుంది. అంతేకాకుండా గేహాజి కూడా బహుశా మార్పు చెంది ఉండవచ్చు. కాబట్టి ప్రియ స్నేహితుడా! నీవు ఎలాంటి పరిస్తితిలో ఉన్నా, నీవు ఎంత శిధిలమై, పతనమైపోయిన స్తితిలో ఉన్నా సరే, దేవుడు నిన్ను కనికరించటానికి ఇష్టపడుతున్నారు.

 మరి నీవు వస్తావా? వస్తే నీకు రక్షణ!
ఏదికావాలో కోరుకో!
దైవాశీస్సులు!
*The Best Disciple-23*
*శ్రేష్టమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య -18*

2 రాజులు 8:78
7. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగియై యుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలిసికొని
8. హజాయేలును పిలిచి-నీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొన బోయి-ఈ రోగముపోయి నేను బాగుపడుదునా లేదా అని అతనిద్వారా యెహోవాయొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చిపంపెను.

   ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం ఎలీషాగారి పరిచర్య-- స్వదేశంలో చూసుకున్నాం. పై వచనాలలో ఎలీషాగారు విదేశీ పర్యటన చేస్తున్నట్లు చూస్తున్నాం. ఎలీషాగారు దమస్కు పట్టణం వెళ్ళారు. అది సిరియారాజు యొక్క ముఖ్యపట్టణం. అక్కడికి ఎలీషాగారు ఎందుకు వెళ్లారు? అది శత్రురాజ్యం కదా, అక్కడ ప్రవక్తల శిష్యులు లేరు కదా!!! బహుశా నయమానుని దర్శించడానికి వెళ్లి ఉండవచ్చు. లేదా నయమాను పిలిచి ఉండవచ్చు. ఏదిఏమైనా నయమాను స్వస్తత పొందడం, సిరియా సైన్యం భంగపడి అవమాన పడటం లాంటి అద్భుతాలు చూసి, ఇశ్రాయేలు దేశంలోనే కాకుండా సిరియా దేశంలో కూడా దైవజనుడికి పేరు ప్రఖ్యాతలు కలిగాయి.

     అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎలీషాగారి విధేశి పర్యటన అది దేవుని సమయం. ఏలియాగారికి దేవుడు మూడు పనులు అప్పగించారు 1 రాజులూ 19వ అధ్యాయంలో. గాని ఆయన మూడవ పని అనగా ఎలీషాగారిని అభిషేకించడం మాత్రమే చేశారు గాని, సిరియామీద హజాయేలుని రాజుగా చేయడం, నింషీ కుమారుడైన యెహూని ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకించడం చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు అని ఏలియాగారిని మనం నిందించలేము కారణం అప్పుడు అది దేవుని సమయం కాదు. ఇప్పుడు ఇది దేవుని సమయం. కాబట్టే బహుశా ఎలీషాగారు దమస్కు పర్యటన చేశారు. మరి దమస్కు పర్యటన చేసినప్పుడు తిన్నగా హజాయేలు దగ్గరకు వెళ్ళొచ్చు కదా!! నీవు నేను అలా చేస్తాము. ఎలీషాగారు అనుక్షణం ఆత్మతో నడిపించబడుతున్న దైవజనుడు. ఆత్మ నడిపింపు ద్వారా ఆయన ప్రయాణాలు చేస్తారు గాని తన స్వంత ఆలోచనలతో ఎంతమాత్రమూ కాదు. బహుశా నయమానుని పలకరించాక ఇంకా అక్కడే ఉన్నారు. వెంటనే ఈ విషయం రాజైన బెన్హదదు కి తెలిసింది. ఆ రోజులలో ఈ రాజు చాలా జబ్బుతో బాధపడుతున్నాడు. వెంటనే తన ముఖ్య సేవకుడు, నాయకుడైన హజాయేలుని పిలిచి, మన పట్టణం ఇశ్రాయేలు దైవజనుడు వచ్చాడంట. ఈ కానుకలు తీసుకుని ఆయనకు ఇచ్చి, నేను బాగుపడతానో లేదో కనుక్కో అని పంపించాడు.

     ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే: ఒక అన్య రాజు, ఇశ్రాయేలు దేవుని దగ్గర విచారించమని తన సేవకున్ని పంపిస్తున్నాడు. అనగా ఈయనకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవామీద విశ్వాసం ఉంది. అదే ఆహాబు కొడుకైన ఆహాజు ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడు అనుకుని ఎక్రోను దేవత అయిన బయెల్జేబూబు దగ్గరకు దూతలను పంపించాడు. ఎక్కిన మంచం దిగకుండా చచ్చాడు, 2 రాజులు 1; అన్యులకు ఉన్న విశ్వాసం దేవుడిబిడ్డ అని పేరుపెట్టుకున్న వారికి ఉండటం లేదు. ఈరోజులలో కూడా పేరుకు క్రైస్తవులే గాని వారు చేసే ప్రతీ పని అన్యుల ఆచారాలే. అన్యుల ఆచారాలు చేయొద్దు అని బైబిల్ ఖరాఖండిగా చెబుతున్న వీరికి దేవునిమాట కంటే, అన్యుల ఆచారాలే ఎక్కువ అయ్యాయి. చింత చచ్చినా పులుపు చావడం లేదు.

   ఒకసారి మరలా ఈ సారి సిరియా రాజు పంపించిన కానుకలు చూద్దాం. దమస్కు పట్టణం సిరియా ముఖ్యపట్టణం అని చూసుకున్నాం. కాబట్టి కాపిటల్ లో ఎన్నో రకాలైన మంచి వస్తువులు దొరుకుతాయి డబ్బు ఉండాలే గాని అన్నీ కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ 40 ఒంటెలు మీద, ఆ దేశంలో గల మంచి వస్తువులు అన్నీ పంపించాడు. ఈ సారి వెండిబంగారాలు పంపలేదు. కారణం అతనికి తెలుసునయమాను ద్వారా జరిగిన విషయాలు. అప్పుడు దైవజనుడు ఏమీ తీసుకోలేదు గనుక ఈయనకు ధనం మీద ఆశలేదు కనుక వస్తువులు ఇస్తున్నారు. మరి వాటిని ఎలీషాగారు తీసుకున్నారా? లేదా? మనకి తెలియదు. తీసుకుని ఉండొచ్చు, తీసుకోకపోవచ్చు కూడా. కారణం ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఆ యెహోవా జీవం తోడూ ఏమీ తీసుకొను అని చెప్పారు 5 వ అధ్యాయంలో .

    హజాయేలు వచ్చాడు. అడిగాడు. ఎలీషాగారు అంటున్నారు: బాగుపడతాడు అని చెప్పమన్నారు. గాని తప్పకుండా కొద్దిరోజులలోనే చనిపోతాడని దేవుడు చెబుతున్నారు అన్నారు ఎలీషాగారు. గానీ తర్వాత ఏడుస్తున్నారు హజాయేలును చూస్తూ. 1112
11. హజాయేలు ముఖము చిన్నబోవునంతవరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను.
12. హజాయేలు-నా యేలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెను- ఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు; వారి యౌవనస్థులను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపి వేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నే నెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను. . .
. చూశారా! ఎంతటి ఘోరాలు జరుగబోతున్నాయో! అలాంటప్పుడు ఎలీషాగారు హజాయేలుని శపించి చంపెయ్యవచ్చు కదా! అలా చేయరు కారణం ఇశ్రాయేలు దేశం మీదకు దేవుడు పంపించిన తీర్పులు నెరవేర్చడానికి ఎలీషాగారు ఎలా ఎన్నుకోబడ్డారో, అలాగే హజాయేలు కూడా అదే దేవునిచే ఎన్నుకోబడిన సాధనం! అందుకే మాటద్వారా హజాయేలుని రాజుగా అభిషేకించారు సిరియామీద! ఇక 15 వ వచనంలో హజాయేలు బెన్హదదుని చంపి రాజైనట్లు చూస్తున్నాం. దేవుడు చెప్పిన ప్రతీమాట నెరవేరుతుంది. దేవుడు ఏలియాగారితో ఎప్పుడో చెప్పారు. అయితే ఇది సుమారు ౩౦ సంవత్సరాల తర్వాత నెరవేరుతుంది. కాబట్టి ప్రియ స్నేహితుడా! దేవుడు నీకు ఏమైనా వాగ్దానం చేశారా? అయితే కనిపెట్టు! తప్పకుండా అది నెరవేరుతుంది. ఇంకా బైబిల్ లో ఉన్న అనేక వాగ్దానాలు నీవు దేవునియందు నమ్మకముగా ఉంటే నీ పట్ల కూడా నెరవేరుతాయి. ఆ వాగ్దానాలు విశ్వాసంతో స్వాధీనం చేసుకో!

   ఇంకా దేవునిమీద సంపూర్ణ విశ్వాసం లేకుండా, క్రీస్తులో సగంలోకంలో సగం గా ఉన్న ప్రియ చదువరీ! నేడే మార్పుచెందు. ఒక అన్యుడికి దేవునిమీద విశ్వాసం ఉంది గాని దేవునిపేరు పెట్టుకున్న నీకు లేకపోతే లవొదొకాయ సంఘానికి చెప్పిన మాటయే నీకు చెబుతున్నారు ఈరోజు. ప్రకటన గ్రంథం 3: 15,16
నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.
నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.. . ...
ఆయనమీద సంపూర్ణ విశ్వాసం ఉంచుదాం. మేలులు పొందుకుందాం.
దైవాశీస్సులు!
*The Best Disciple-24*
*శ్రేష్టమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య -19*

2 రాజులు 9:13
1. అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను-నీవు నడుము బిగించుకొని యీ తైలపుగిన్నె చేత పట్టుకొని రామోత్గిలాదునకు పోయి
2. అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెక్కడ నున్నాడని తెలిసికొని అతనిని దర్శించి, అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి, లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి
3. తైలపుగిన్నె తీసికొని అతని తల మీద తైలము పోసి-నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపుతీసి పారి పొమ్ము. 

   ప్రియ దైవజనమా! గతభాగంలో ఏలియాగారికి దేవుడు చెప్పిన మూడు పనులలో ఒక పనిని ఎలీషాగారు దమస్కుపోయి నెరవేర్చినట్లుగా చూసుకున్నాం. ఈరోజు దేవుడు ఏలియాగారికి అప్పగించిన మరోపనిని ఎలీషాగారు చేయించిన విధానం కోసం ధ్యానం చేసుకుందాం. గతభాగంలో ఏలియాగారు ఆ పనులు ఎందుకు చేయలేదో చూస్కున్నాం. *దేవుని పని దేవుని సమయంలోదేవుని విధానంలో జరుగుతుంది. మనం అనుకున్నట్లు జరుగదు*. కాబట్టి ఏలియాగారికి దేవుడు చెప్పిన మూడు పనులలో మూడవ పని వెంటనే ఏలియాగారు చేసేశారు. గాని సుమారు ముప్పై సంవత్సరాలు జరిగాక మిగిలిన పనులు ఎలీషాగారి ద్వారా జరుగుతున్నాయి.

   ఈ మొదటి వచనంలో ఎలీషాగారు ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలిచారు. గమనించవలసిన విషయం ఏమిటంటే: ఈ ప్రవక్తల శిష్యులు ఎక్కడివారో వ్రాయబడలేదు. గాని గతభాగాలలో వివరించినట్లుఎలీషాగారి పరిచర్యలో ఒక భాగం ప్రవక్తల శిష్యులను బలపరచడం. గతభాగాలలో చెప్పడం జరిగిందిఈ ప్రవక్తల శిష్యులను ప్రారంభించింది దైవజనుడైన సమూయేలు గారు. మరలా ఏలియాగారు హోరేబు అనుభవం తర్వాత ఈ ప్రవక్తల శిష్యులను ఏర్పాటుచేసే విధానాన్ని పునరుద్ధరించారు. దానిని ఎలీషాగారు మొత్తం ఇశ్రాయేలు దేశం అంతటియందు వ్యాపించేలా చేశారు. తద్వారా ఉజ్జీవజ్వాలలు దేశం మొత్తం మీద రగిలించారు. ఇప్పుడు వారిలో ఒకరిని పిలిచారు ఎలీషాగారు. బహుశా నమ్మకమైన వాడు, ఆత్మపూర్ణుడు అయిఉండవచ్చుకారణం ఆ రోజులలో కూడా ప్రవక్తగా నటించేవాళ్ళు, పొట్టకూటికోసం వేషం వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఐతే ఇక్కడ నిజమైన ప్రవక్తల శిష్యుడినే ఎలీషాగారు పంపించారు. ఇలా అనడానికి కారణం తర్వాత వచనాలలో మనం చూసుకోవచ్చును. 

            ఈ ప్రవక్తల శిష్యులలో ఒకన్ని పిలిచినీవు నడుము భిగించుకొని: గమనించాలిఒక సేవకుడు తన సేవ ప్రారంభించేముందు దేవుడు చెప్పే మాట నడుము బిగించుకో! ఏలియాగారికి దేవుడు చెప్పారు. ఇంకా కొంతమందికి దేవుడు చెప్పారు ఇలానే. నిర్గమ 12:11; 1 రాజులు 18:46; 2 రాజులు 4:29; యోబు 38:3, 40:7; సామెతలు 31:17; నహూము 2:1; లూకా 12:37; అపో 12:9; నడుము బిగించుకోవడం అనగా సువార్తకు సిద్దమవడం/ దేవుని పనికి సిద్దమవడం అని అర్ధం!! తర్వాత : ఈ తైలపుగిన్నె చేత పట్టుకొని: తైలపుగిన్నెలో తైలం లేక నూనె ఉంటుంది. నూనె ఎందుకు అంటే: దేవుడు నాయకులను/ రాజులను అభిషేకించే విధానం ఇదే! 1 సమూయేలు 10:1 లో సమూయేలుగారు నూనెతో రాజైన సౌలుని అభిషేకించారు. 16:1 లో దేవుడు అదే నూనెతో దావీదుగారిని అభిషేకించమని అదే సమూయేలుగారితో చెప్పారు. అదే నూనెతో సమూయేలుగారు దావీదు గారిని అభిషేకించారు.  1 రాజులు 1:39 లో సొలోమోనును కూడా ఇదేవిధంగా నూనెతో రాజుగా అభిషేకించారు. కాబట్టి ఇక్కడ యెహూ ని రాజుగా అభిషేకించటానికి తైలపుగిన్నె తీసుకుని పొమ్మని చెబుతున్నారు ఎలీషాగారు. తర్వాత: రామోత్-గిలాదుకి పోయి: ఈ రామోత్-గిలాదు యోర్దాను నదికి తూర్పుగాషోమ్రోను పట్టణానికి సుమారు 100 కి.మీ దూరంలో ఉంది. అందుకే నడుముబిగించుకొని దూర ప్రయాణం చేయమంటున్నారు. తర్వాత: అక్కడ నింషీ కొడుకైన యెహోషాపాతు కుమారుడైన యెహూ కోసం అడుగు అంటున్నారు. ఇక్కడ యెహూ తండ్రి యెహోషాపాతు రాజైన యెహోషాపాతు కాదు. అంతేకాకుండా మనకు 1 రాజులు 16 అధ్యాయంలో కనపడే యెహూ కాదు. ఆ యెహూ ప్రవక్త! ఈ యెహూ సైన్యాదిపతిదేవునిచేత ఏర్పాటు చేయబడిన వాడు.

  తర్వాత: అతనిని అధికారుల నుండి ప్రత్యేకంగా పిలు అంటున్నారు. ఇక్కడ ఎలీషాగారు ముందుగానే వివేచించి చెబుతున్నారు: ఈ ప్రవక్తల  శిష్యుడు అక్కడికి వెళ్ళినప్పుడు అతడు ఒక్కడే ఉండడు. అనేకమందితో ఉంటాడు కాబట్టి ప్రత్యేకంగా లోపలి గదిలోనికి తీసుకొని పొమ్మని చెబుతున్నారు. తర్వాత : ఈ తైలపు సీసాలో ఉన్న నూనెను అతని తలమీద పోసి (మీదన చెప్పుకున్నాం- నాయకులను అభిషేకించే విధానం ఇదే) యెహోవా సెలవిచ్చున దేమనగా-  ఇశ్రాయేలు దేశం మీద నిన్ను రాజుగా అభిషేకించాను” అని చెప్పి తలుపు తీసుకొని పారిపో అంటున్నారు. ఇక్కడ పారిపో అంటున్నారు కారణం అది రాజుకి తెలిస్తే ఇక్కడ ప్రవక్తల శిష్యుడి ప్రాణం పోతుంది అందుకే పారిపో అంటున్నారు. ఇంతవరకు బాగుంది.

   ప్రవక్తల శిష్యుడు నడుము బిగించుకొనితైలపుగిన్నె పట్టుకొని సుమారుగా 100 కి.మీ ప్రయాణం చేసి- ఆ పట్టణంలో ప్రవేశిస్తే అక్కడ బోలెడుమంది అధిపతులు కనబడ్డారు- ఐతే యితడు (ప్రవక్తల శిష్యుడు) భక్తిగలవాడు, ఆత్మపూర్ణుడు అని ఎందుకు చెప్పానంటే: ఇతనికి తెలిసిపోయింది యెహూ ఎవరోఅందుకే అంటున్నాడు : అధిపతీ! నీకో సమాచారం ఉంది అని చెప్పాడు. యెహూ అంటున్నాడు- ఇంతమంది అధిపతులలో అది ఎవరికోసం అంటే అది నీకోసమే అన్నాడు. వెంటనే లోపలి గదిలోనికి పోయారు ఇద్దరు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే: ఈ ప్రవక్తల శిష్యుడు అక్కడికి వెళ్ళిన వెంటనే వారికి అతడు ప్రవక్తల శిష్యుడు అని వెంటనే అర్ధం అయిపోయింది. కారణం అప్పట్లో వీరి వేషభాషలు వేరుగా ఉండేవి కాబట్టి వారు ప్రవక్తల శిష్యులు అని ఇట్టే అర్ధమయ్యేది. ఇప్పుడు ఒకసారి 610 వచనాలు గమనించండి.
6. అప్పుడు ఆ యౌవనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెను-ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా-యెహోవా జనులైన ఇశ్రాయేలు వారిమీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను.
7. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసినదానిని బట్టియు, యెహోవా సేవకులందరిని హతము చేసిన దానిని బట్టియు, యెజెబెలునకు ప్రతికారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతివారిని హతము చేయుము.
8. అహాబు సంతతివారందరును నశింతురు; అల్పులలోనేమి ఘనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండ అందరిని నిర్మూలము చేయుము.
9. నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబికులను అహీయా కుమారుడైన బయెషా కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబికులను నేను అప్పగించుదును.
10.​​ యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కలచేత తినివేయబడును. ఆ యౌవనుడు ఈ మాటలు చెప్పి తలుపుతీసి పారిపోయెను.  . . . ..
 దైవజనుడుయెహోవా సెలవిచ్చున దేమనగా నేను నిన్ను ఇశ్రాయేలు దేశం మీద రాజుగా అభిషేకించాను అని చెప్పమన్నారు. అయితే ఇక్కడ ఈ మూడు వచనాలలో గల వర్తమానం ఎవరు చెప్పారుఅంటెర దేవుడే! అందుకే ఆత్మపూర్ణుడు అన్నాను. దేవుని ఆత్మాభిషేకంతో ఇక్కడ ఈ ప్రవక్తల శిష్యుడు చెబుతున్నారు. ఆహాబు సంతానం మొత్తాన్ని చంపెయ్యమంటున్నారు. ఇంకా యెజెబెలు కోసం దేవుడు నాబోతుని చంపించినప్పుడు దేవుడిచ్చిన తీర్పును మరోసారి గుర్తు చేస్తున్నారు యెహూకి. కారణం క్రింది వచనాలలో చూసుకుంటేఏలియాగారు ఈ తీర్పు ప్రకటించినప్పుడు ఈ యెహూ ప్రత్యక్ష సాక్షి!! ఇలా ప్రవచనం చెప్పి పారిపోయాడు ఆ ప్రవక్తల శిష్యుడు!

   ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే: ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు ఒకవ్యక్తి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొంటే దేవుడు అతనిని బలంగా వాడుకుంటారు. ఇక్కడ ప్రవక్తల శిష్యునికి ఈ తీర్పుల కోసం ఏమీ తెలియదు. గాని దేవుడు ఇతనిని ఆత్మతో అభిషేకించి పలికించారు. అలా ప్రియ చదువరీ! నీవు కూడా దేవుని హస్తాలకు నిన్ను నీవు సంపూర్ణముగా సమర్పించుకొంటే- దేవుని హస్తాలలోనికి నీవు వస్తేదేవుడు నిన్ను అత్యద్భుతముగా వాడుకొంటారు.
నీవు ఊహించలేని విధంగా దేవుడు నిన్ను వాడుకొంటారు.
దేవుడు నిన్ను అలా వాడుకొనేటప్పుడు నీవు పరిశీలన చేసుకుంటేఇది నేనేనా? ఎందుకు పనికిరాని నేను ఇంతగా ఎలా వాడబడుచున్నాను అని నీకు నీవే ఆశ్చర్యపడతావు.
 కాబట్టి నిన్ను నీవు దేవునికి సంపూర్ణముగా నేడే అప్పగించుకో!
దేవునిచేత వాడబడు!

దైవాశీస్సులు!
ఆమెన్!
*The Best Disciple-25*
*శ్రేష్టమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య -20*

2 రాజులు 13:14
14. అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడైయుండగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు-నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.

   ప్రియ దైవజనమా! గతభాగంలో ఎలీషా గారు ప్రవక్తల శిశ్యులలో ఒకనిని పంపి, యెహూకి అభిషేకం చేసినట్లు ధ్యానం చేసుకున్నాం.
  
   తొమ్మిదో అధ్యాయంలో యెహూకి అభిషేకం జరిగాక తనతోటి అధిపతులు యెహూని రాజుగా చేస్తారు. అక్కడ దేవుని తీర్పు ప్రకారం ఇశ్రాయేలు రాజును చంపడం, అంతేకాదు యూదా రాజైన ఆహాజ్యా కూడా అక్కడే మరణమవడం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు రాజుని చంపమన్నారు గాని యూదా రాజుని ఎందుకు చంపాడు యెహూ? కారణం అతని తల్లి. ఆహాజ్యా తల్లి అతల్యా. ఆమె యెజేబెలు కూతురు అనగా ఆహాబు కూతురు. ఆహాబు సంభందికులను దేవుడు నాశనం చేయమని తీర్పు ఇచ్చారు కాబట్టిఒక భక్తిగల రాజు తనకుమారునికి ఒక అత్యంత పనికిమాలిన భ్రష్ట రాజు/రాణి కూతురికి ఇచ్చి పెళ్ళి చేసినందున యూదా రాజ్యం కూడా చెడిపోయింది. అందుకే అవిశ్వాసులతో మీరు విజ్జోడిగా ఉండకుడి అని సెలవిస్తుంది బైబిల్. 2 కొరింథీ 6:14;  కాబట్టి ఆహాబు కుటుంబీకులతో యూదా రాజుకూడా కలిశాడు కాబట్టి అతడుకూడా మరణమయ్యాడు.  ఇక ఇదే అధ్యాయంలో దేవుడు యెజేబెలు మీద నిర్ణయించిన తీర్పును యెహూ అమలుచేశాడు. కుక్కలు యెజెబెలుని తినేశాయి. కేవలం దుమ్ములు మాత్రం మిగిలాయి. ఇక పదో అధ్యాయంలో ఆహాబు కుటుంబీకులను మొత్తం నాశనం చేసినట్లు, అంతేకాకుండా బయలుకి పూజ చేసే ప్రతీ ఒక్కరిని నాశనం చేసినట్లు చూస్తాం.

         ఇక 13వ అధ్యాయం వరకు ఎలీషాగారి గురుంచి వ్రాయబడలేదు. ఆయన తన పరిచర్యలో బిజీగా ఉండటమే కాదు వృద్ధాప్యం కూడా సంభవించింది. ఇక 13:4 చూసుకుంటే .అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడైయుండగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు-నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.  . . . . .   చూడండి ఇంతగొప్ప దైవజనుడికి మరణకరమైన రోగం కలిగింది అంట! చదువరులు ఒకసారి గమనించాలి ఈ 13వ అధ్యాయం రాబోయేసరికి ఎలీషాగారి వయస్సు బైబిల్ పండితుల ప్రకారం, చరిత్రకారుల ప్రకారం సుమారు వంద సంవత్సరాలు. మామూలుగా ఈ వయస్సులో శరీర అవయవాలు సహకరించడం మానేస్తాయి. పాత ఇంజనులు మొరాయించినట్లు ఆ వయస్సులో శరీర అవయవాలు కూడా మొరాయిస్తాయి. అయితే ఇక్కడ మరణకరమైన రోగం కలిగినట్లు చూసుకోవచ్చు. చాలామందికి అనుమానం వస్తుందిఇంతగొప్ప భక్తునికి/ దైవజనునికి/ దేవునిచే పిలువబడిన వాడు, అభిషేకించబడిన వాడు/ రెండింతల ఆత్మపూర్ణుడుకి ఇలాంటి రోగం సంభవించవచ్చా???!!!  ఇన్ని అద్భుతాలు చేసిన దైవజనునికి తను మరణపడకమీద ఉన్నప్పుడు ఏమీ అద్భుతం జరుగలేదు. దేవుడు వదిలేశారా? వయస్సు ఉన్నంతవరకు వాడుకొని, వయస్సుమీరిన తర్వాత వదిలేశారా? కాదు కాదు! 1 తిమోతి 5:23 ప్రకారం దైవసేవకుడైన తిమోతికి రోగం కలిగింది. 2 తిమోతి 4:20 ప్రకారం సేవకుడైన ఎరస్తుకి జబ్బుచేసింది. ఫిలిప్పీ 2:26-27 ప్రకారం ఎఫఫ్రోదితుకి మరణకరమైన రోగం కలిగింది.
చివరికి పౌలుగారిలో కూడా భయంకరమైన ముళ్ళు ఉంది. అది ..అపోస్తలుడైన పౌలు గారు మూడు మిషనరీ యాత్రలు చేసారని తెలుసు. మొదటి మిషనరియాత్రలో అపో.బర్నబా గారితో పాటు సువార్త చేసుకొంటూ ఈకోనియా అనేప్రాంతం వెళ్తారు. అదేప్రాంతంలో లుస్త్ర అనే పట్టణంలో సువార్త చెబుతూ ఒక బలహీనమైన పాదాలు కలవ్యక్తిని స్వస్తపరుస్తారు. ఆ తర్వాత వారు పౌలుగార్ని రాళ్ళురువ్వి చనిపోయేటంతగా కొట్టారు. చనిపోయారని తలంచి పట్టణం వెలుపలికి ఈడ్చిపారేస్తారు. కొంతసేపటికి పౌలుగారు లేచి మరో ప్రాంతం వెళతారు. అయితే చరిత్రకారులు ఏమంటారంటే అలా కొట్టినప్పుడు పౌలుగారి ప్రక్కటెముకలు కొన్ని విరిగిపోయాయి, దానివలన పౌలుగారికి చనిపోయేవరకు భరించలేనంత ప్రక్కలో నొప్పి మరియు కడుపునొప్పితో భాదపడ్డారని, దానినే పౌలుగారు ముళ్ళు అన్నారని చెబుతారు.(8వ వచనం)...  ఇలాంటి దైవజనులకే ఏ జబ్బులు తగ్గలేదు. కాని వీరు ప్రార్ధించినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. చనిపోయిన వారు కూడా బ్రతికారు. గాని వీరికి మాత్రం అద్భుతాలు జరుగలేదు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఘనమైన సేవచేసిన దైవజనులు ఎంతోమంది చనిపోయేటప్పుడు భయంకరమైన వ్యాధితో మరణించడం జరిగింది. ఉదా: అపో. PM సామ్యేలు గారు, అపో పరంజ్యోతి గారు, దైవజనులు  KR డేవిడ్ గారు వీరంతా మరణించే టప్పుడు వ్యాధితో భాదపడినవారే! వీరు సుమారు 40 సం.ల క్రితం మన ఆంధ్రప్రదేశ్లో  ఎంతో అగ్ని పరిచర్య చేశారు. ఆ మధ్య దైవజనులు బెన్ హిన్న్ గారు హార్ట్ ఎట్టాక్ తో బాధపడి హాస్పిటల్ లో జాయినయితే క్రైస్తవ వ్యతిరేకులు అనేక లక్షలమందిని ప్రార్ధన చేసి స్వస్తపరచిన బెన్ హిన్న్ ఇప్పుడు తనే హాస్పిటల్ ఉన్నాడు అని ఎన్నో భయంకరమైన కామెంట్లు చేశారు.

    దీనికి జవాబు కొన్నిసార్లు దేవుడు ఇలాంటివి అనుమతిస్తారు. మొదటగా: దైవజనులు DGS దినకరన్ గారి సాక్ష్యం ప్రకారం దైవజనులకు రోగం కలిగించి ఆ రోగం యొక్క నొప్పి, బాధద్వారా దైవజనున్ని నడిపించి, తర్వాత స్వస్తపరచి ఇలాంటి వారికోసం కన్నీటితో ప్రార్ధించి స్వస్తపరచేలా చేస్తారు. ఇక రెండవదిగా: బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం: ఒక దైవసేవకుడు ఘనమైన సేవ చేస్తున్నప్పుడు, అద్భుతాలు జరుగుతున్నప్పుడు దయ్యాలు పారిపోతాయి. అయితే ఆ దైవజనునికి ప్రార్ధనా బలం ఉన్నంతవరకు ఏ దయ్యాలు/ అపవిత్ర శక్తులు ఆయనను తాకలేవు. గాని పగబెడతాయి అంటారు. ఇవి దైవజనుడు ముసలివాడు అయినప్పుడు ముఖ్యంగా ప్రార్ధించలేని స్తితిలో ఉన్నప్పుడు ఇటువంటి దయ్యాలు అన్నీ కలిపి ఆ దైవజనుడిపై ఎట్టాక్ చేస్తాయి. అవే ఇలాంటి మరణకరమైన రోగాలు కలుగుజేస్తాయి అంటారు. మరి దేవుడు ఎందుకు సహాయం చేయడం లేదు అని అనుమానం వస్తే, ఏమో మనకు తెలియదు. దేవుణ్ణి ప్రశ్నించకూడదు!! అంతే!!

      కాబట్టి ప్రియ చదువరీ! కొన్ని రోగాలు దేవుని మహిమకోసం, కొన్ని రోగాలు నీకు బుద్ధిచెప్పడం కోసం వస్తాయి. కొన్ని రోగాలు దేవుడు నిన్ను అత్యధికముగా వాడుకోవడం కోసం వస్తాయి. కాబట్టి దేవుణ్ణి అనుమానించకు! ఆయనపై సంపూర్ణముగా ఆనుకో! నిన్ను నడిపించేవాడు దరిచేర్చే వాడు ఆయనే!
దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్!
*The Best Disciple-26*
*శ్రేష్టమైన శిష్యుడు; ఎలీషా పరిచర్య -21*

2 రాజులు 13:14
14. అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడైయుండగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు-నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.

     ప్రియులారా! గతభాగంలో ఎలీషా గారు మరణకరమైన రోగముచేత బాధపడుతున్నట్లు చూసుకున్నాం. కొన్ని ఇంగ్లీషు ప్రతులలో ఆ వ్యాధి చేతనే మరణించెను అని వ్రాయబడింది. గతభాగంలో చెప్పాను అప్పటికే ఆయన సుమారు వంద సంవత్సరాల వయస్సులో ఉన్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఇశ్రాయేలు రాజు యెహోయాషు అతని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నట్లుగా పై వచనం లో చూస్తున్నాం. ఏమని ఏడుస్తున్నాడు? నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను. గమనించాలి ఏలీయా గారు ఆరోహణమైనప్పుడు ఎలీషా గారు కూడా ఇలాగే ఏడ్చారు. అనగా ఇశ్రాయేలు దేశం ఈనాడు సురక్షితంగా ఉంది అంటే సైన్యం, రాజు కాదు కానీ కేవలం ప్రవక్త ప్రార్థన/పరిచర్య వలననే అని ఒప్పుకుంటునట్లు ఇక్కడ!
 
    సరే, ఏడుస్తున్న రాజుని చూసి కనికరించి ఎలీషా గారు అంటున్నారు ఇంత బాధలో ఉన్నా కూడా:
2 రాజులు 13:15,16,17
15. అందుకు ఎలీషా-నీవు వింటిని బాణములను తీసికొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసికొనెను.
16. నీ చెయ్యి వింటి మీద ఉంచు మని అతడు ఇశ్రాయేలురాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటిమీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి
17. తూర్పువైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా-బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు-ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము; సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువని చెప్పి,
 ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే తూర్పు కిటికీ తీయమని ఎందుకు చెప్పారంటే- తూర్పున యోర్దాను దగ్గర గల కొంతప్రాంతాన్ని తూర్పున ఉన్న సిరియనులు అప్పటికే ఆక్రమించడం జరిగింది. అందుకే వారిమీద జయమొందేలాగ తూర్పున కిటికీ తీసుకుని బాణం కొట్టమని చెబుతున్నారు. ఇక మొదటి బాణం- యెహోవా రక్షణ బాణం.
 2 రాజులు 13:18,19
18. బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతట అతడు ఇశ్రాయేలురాజుతో-నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను.
19. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి-నీవు అయిదు మారులైన ఆరుమారులైన కొట్టిన యెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.

    దైవజనుని ఉద్దేశం ఈ రాజుకి అర్థం కాలేదు. బహుశా అర్దమైతే ఇంకా ఎక్కువ సార్లు కొట్టి ఉండేవాడు. 25వ వచనం చదివితే మూడు సార్లు సిరియనుల మీద యుద్ధం చేసి జయిస్తాడు ఇశ్రాయేలు రాజు.

   అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవలసినది 20వ వచనం లో అదే వ్యాధి చేత ఎలీషా గారు 100 సంవత్సరాల వయసులో చనిపోయారు.

  దీనితో ఆయన అద్భుతాల లిస్ట్ అయిపోలేదు. 2 రాజులు 13:20,21
20. తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు
21. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.
  చూశారా, సంవత్సరం గడచిన తర్వాత కూడా ఆయన ఎముకలకు తగిలిన శవము బ్రతికింది. మరి మీకు అనుమానం రావచ్చు- ఆయన ఎముకలకు తగిలిన శవము లేచింది గాని ఆయన ఎందుకు లేవలేదు? కారణం ఆయన సమయం అయిపోయింది. అది అంతే! ఇక్కడ ఆ శవాన్ని లేపింది ఎలీషా గారి ఎముకలు కాదు అని నా ఉద్దేశం. కారణం ఎముకలకు అంత శక్తి లేదు. అయితే ఈ అద్భుతం ద్వారా యెహోవా దేవుని నామంలో గల శక్తిని ప్రజలకు మరొకసారి గుర్తు చేయడానికి ఈ అద్భుతం జరిగింది. గమనించాలి మోషేగారి చేతిలో కర్ర, ఎలీషా గారి చేతిలో దండము, పేతురు గారి రుమాలు, అపొస్తలుల నీడ-- వీటన్నిటి ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. కారణం వీటిలో శక్తి కాదు. వాటిని పట్టుకున్న వారిలో శక్తి/ పరిశుద్ధాత్ముడు ఆ కార్యాలు చేశారు.
  ఈ అధ్యాయం లో గల రెండు అద్బుతాలతో ఆయన పరిచర్య ముగిసింది.

  ఎలీషా గారు 100 సంవత్సరాల వయసులో చనిపోయారు. మొదటి బాగంలో చెప్పినట్లు సుమారుగా 35 సంవత్సరాల వయస్సులో సేవకు పిలువబడి, సుమారుగా 6.5 సంవత్సరాలు ఏలియాగారికి పరిచర్య చేసి, ఆ తర్వాత సుమారుగా 65 సంవత్సరాలు ఘనమైన సేవచేశారు. రాజులనే శాసించారు. సిరియా రాజు కొన్ని కోట్లు విలువ చేసే వెండి బంగా రాలు ఇచ్చిన, తీసుకోకుండా నమ్మకమైన సేవ చేశారు. పౌరుషం గల ప్రవక్తకు, నమ్మకమైన ప్రవక్తకు, నమ్మకమైన/ శ్రేష్టమైన శిష్యుడుగా, అనేక వందలమందికి మాదిరి కరమైన గురువుగా చిరస్థాయిగా నిలిచిపోయారు.

    ప్రియ స్నేహితుడా! యేసుక్రీస్తు ప్రభులవారు కూడా నీకు నాకు గురువు! ఆయన పాదాల దగ్గర నేర్చుకోగలవా? నేర్చుకున్న నీవు నమ్మకముగా ఉండగలవా?
నమ్మకముగా ఉంటే భళా నమ్మకమైన మంచిదాసుడా! అని పిలువబడతావు. మత్తయి 25:23; నమ్మకముగా లేకుండా తుఛ్ఛమైన కోరికలకు ఆయనను అమ్మకం చేస్తే, వెలుపల చీకటిలో ఉంటావు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. మత్తయి 8:12; 13:12,50; 22:13; 24:51; 25:30; మరి నీకేమి కావాలో కోరుకో!

ఎలీషా గారిలా నమ్మకమైన పనివానిగా, శ్రేష్టమైన శిష్యులుగా జీవిద్దాం. గేహాజీలాంటి బ్రష్ట జీవితం వదిలేద్దాం!
పరలోక రాజ్యాన్ని పట్టేద్దాం!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దేవుడు మిమ్మల్ని దీవించును గాక!


************************************
ప్రియ దేవుని బిడ్డలారా! ఈ శ్రేష్టమైన శిష్యుడు శీర్షిక ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నమ్ముచున్నాను. ఎలీషా గారి లాంటి జీవితం చదువరులకు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నాకోసం ప్రార్ధించండి. మరో భక్తుని జీవిత విషయాలతో మరల కలుసుకొందాం!
దైవాశీస్సులు!

ఇట్లు మీ ఆత్మీయ సహోదరుడు

బ్రదర్ రాజకుమార్ దోనె




కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరీర కార్యములు

క్రిస్మస్

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

విశ్వాసము

పాపము

సమరయ స్త్రీ

విగ్రహారాధన