హబక్కూకు


భక్తుడైన హబక్కూకు

*ఉపోద్ఘాతము*

ఒకవ్యక్తి తన పనివారికి సాయంత్రం వేళ భోజనం తీసుకుని వెళ్తున్నాడు. చాలా విచారంగా నడచుకుంటూ వెళ్తున్నాడు. తమకు కలిగిన ఈ దుస్తితిని తలంచుకుంటూ వేదనతో వెళ్తున్నాడు. కారణం ఒకానొకప్పుడు తనకు బోలెడన్ని ఎస్టేట్ లు ఉండేవి. మందిరంలో వాయిధ్యకారుడుగా ఎంతోపేరు తెచ్చుకున్నాడు. మంచి గాయకుడు! ప్రవక్తల స్కూల్లో చదువుకొన్నాడు. ఎన్నో పొలాలు, ఎన్నో తోటలు! ఇప్పుడు ఏమీలేవు. చిన్న ఎస్టేట్ తప్ప! ఇలా విచారంగా నడుస్తూ తన ఎస్టేట్ చేరుకుంటున్నాడు. ఇంతలో ఒక దేవదూత కనిపించాడు. *నీవు భోజనం తీసుకుని దానియేలుకి ఇవ్వు! ఆయన సింహాల గుహలో ఆకలితో ఉన్నాడు*! అన్నాడు. *దానియేలా??!! ఆయన బబులోను (సౌత్ ఇరాక్) లో ఉన్నారు. నేను కొన్నివందల మైళ్ళ దూరంలో ఉన్నాను. అది ఎలా సాధ్యం*?
*చెప్పింది చేయు! సరిపడిన రొట్టెలు తీసుకో* అన్నాడు దూత!
ఆశ్చర్యపడుతూ ఓ ఇద్దరికీ సరిపడే ఆహారం సిద్ధం చేసాడు. ఇంతలో తనకు తెలియకుండానే ఆకాశంలో ఎగిరిపోతున్నాడు. చూస్తే ఆ దూత తనను ఎత్తిపట్టుకొని మేఘాలలో తీసుకుని పోతున్నాడు. చాలా ఆశ్చర్యపోతున్నాడు. కలా? నిజమా? ఎన్నోసార్లు దేవదూతలను చూసిన అనుభవం ఉంది తనకు గాని ఎప్పుడూ దూత తనను ఎత్తుకుని పోలేదు! ఇంతలో దూత ఒక గుహలోనికి తీసుకునివెళ్లాడు , దానికి ఒక ద్వారం ఉంది గాని ఎలా తెరచుకొందో ఆ ద్వారం తెలియదు గాని లోపలికి ఆహారంతోపాటు వెళ్ళిపోయాడు. చూస్తే కొన్ని వందల సింహాలు! వాటిమధ్య దానియేలు గారు మోకరించి ప్రార్ధిస్తున్నారు. ఆయన చుట్టూ సింహాలు మోకరించి ఉన్నాయి. చాలా ఆకలితో ఉన్నాయి. ఇంతలో ఇంత చిమ్మచీకటిలో ఇంత కాంతి ఏమిటి అని దానియేలు గారు ప్రార్ధన ముగించి పైకి చూశారు. ఎవరో ఎగురుకుంటూ వస్తున్నారు. వచ్చి తనముందు నిలబడ్డాడు ఆ వ్యక్తి! ఆ వ్యక్తిని ఎప్పుడో చిన్నప్పుడు చూసిన గుర్తు! *హే! ఏమిటి ఇలా వచ్చావు? ఎలా వచ్చావు*? అడిగారు దానియేలు. *అదిగో చూస్తున్నారు కదా, ఆ దూత తీసుకుని వచ్చాడు. మీరు ఎప్పటినుండో భోజనం చేయలేదంట కదా! నా పనివారికి ఆహారం తీసుకుని వెళ్తుండగా, మీకు తీసుకుని రమ్మనాడు దూత!*
*సరే, ఇంతకీ మన దేవాలయం ఎలా ఉంది? మన పట్టణం ఎలా ఉంది? మన వారు ఎలా ఉన్నారు? సంగతులు చెప్పు!* అడిగారు దానియేలు.
కన్నీరు ఆపుకోలేకపోయాడు ఈ వ్యక్తి! బోరున ఏడుస్తున్నాడు. *ఏం చెప్పమంటారు? దేవాలయం అగ్నితో కాల్చబడింది. పట్టణం కాల్చబడింది. కొన్ని లక్షలమంది కత్తితో చంపబడ్డారు. మనవారంతా చంపబడ్డారు. మన మందిరంలో పాటలు లేవు, వాయిద్యాలు లేవు, అర్పణ, బలిద్రవ్యాలు లేవు! పట్టణం నక్కలపాలు అయ్యింది. ఇప్పుడు ఎవరూ లేరు. అతిబీదలైన కొంతమంది ఉన్నారు. నా ఎస్టేట్ లు అన్నీ పోయాయి*. విషయం విన్న దానియేలు కి కన్నీరు ఆగలేదు! *మరి నీవు ఎలా తప్పించుకున్నావు? అడిగారు దానియేలు! దేవుడు ముందుగానే చెప్పారు కదా, కల్దీయులు వచ్చి ముట్టడిస్తారు అని, అందుకే ముందుగానే అరేబియా దేశం పారిపోయాను. నా వారినందరినీ కోల్పోయాను.*
ఇద్దరు కష్టసుఖాలు మాట్లాడుకొన్నారు. ఇంతలో గుర్తుకు వచ్చింది దానియేలు ఎప్పటినుండో భోజనం చేయలేదు. ఆకలితో ఉన్నాడు అని. వెంటనే *మాటలు తర్వాత, ముందు భోజనం చేయండి* అన్నాడు ఈ వ్యక్తి! బలవంతం మీద దానియేలు గారితో భోజనం తినపించడానికి ప్రయత్నం చేశాడు. సరే, ఇద్దరం తిందాం అని చెప్పి- ఆ కంపులోనే ఇద్దరు బోజనానికి కూర్చొన్నారు. ఇద్దరు ఆశ్చర్యపడుతూ కన్నీరుకార్చుతూ భోజనం చేసారు. *ఇంతకీ నీవు ఏదో తర్జనబర్జనలో ఉన్నావ్. ఎంతో సందిగ్ధంలో ఉన్నట్టున్నావ్? ఏమిటి సంగతి*?

*ఏమిటి మన పరిస్తితి దానియేలు గారు? మనకు ఇన్ని కష్టాలు ఏమిటి? మీరు ఇంత భక్తిగా ఉండేవారు, ఉన్నారు, ఇప్పుడు పెద్దమంత్రి పదవిలో ఉన్నారు అయినా మీరు సింహాల గుహలోకి త్రోయబడ్డారు. దేవుడు ఏం చేస్తున్నారు? ఎందుకు సహాయం చేయడం లేదు*? మొదటి ప్రశ్న ఇది.
వెంటనే అడిగారు దానియేలు: *సింహాల గుహలో ఉన్నాము మనిద్దరం. మరి సింహాలు మనల్ని తినేశాయా*? లేదు. *ఎక్కడో ఆకలితో ఉన్న నాకు భోజనం తీసుకుని వచ్చావు కదా నీవు. మరి దేవుడు చూడడం లేదా? సహాయం చేయడం లేదా*? !!!
*సరే, మరి దేవుడు అత్యంత పరిశుద్ధుడు కదా, వీరు అనగా కల్దీయులు, మాదీయులు పాపులు, క్రూరులు కదా, మరి ఎందుకు దేవుడు వారిని వాడుకుని మనమీద, ఇంకా ప్రజలందరికి తీర్పు తీరుస్తున్నారు?* దానియేలు చెప్పారు: *అది దేవుని ప్రణాళిక! సుమారు 40 సంవత్సారాలు క్రితం కల్దీయ రాజు నెబుకద్నేజరు కి ఒక కల చూపించి, జరుగబోయేది ముందుగానే చూపించారు. ఆ కలకు అర్ధం చెప్పే భాగ్యం నాకు కలిగింది. ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఇంకా జరుగబోతుంది అంతా దేవుని ప్రణాళిక! దేవుడు వాడుకున్న సాధనమే కల్దీయులు, మాదీయులు. దేవున్ని మనం ప్రశ్నించకూడదు*.!

ఇంకా తన అనుమానాలు అన్నీ అడిగేశాడు ఈ వ్యక్తి. దానియేలు గారు అన్నింటికీ సమాధానం చెప్పారు. *సరే ఇప్పుడు మీ విషయం చెప్పండి అడిగాడు ఈ వ్యక్తి. ఏం చెప్పమంటావు! ఇక్కడ జ్ఞానులు , ముఖ్యంగా ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన జ్ఞానులకు ఈ మధ్య చాలా కష్టాలు వస్తున్నాయి. నీవు పెద్ద ప్రవక్తవు కదా! దయచేసి ప్రార్ధన చేయవా మాకోసం* అడిగారు దానియేలు. తప్పకుండా చేస్తాను. అని వారిద్దరూ వారికి కలిగిన కష్టాల కోసం కన్నీటితో ప్రార్ధన చేశారు. ఉదయం నాలుగు గంటలు అయ్యింది- దూత అన్నాడు *సమయం అయిపోయింది చాలు! వెళ్దాం* అని చెప్పి ఎలా తీసుకుని వచ్చాడో, అలాగే తీసుకుని పోయి- ఆ వ్యక్తిని మరలా యూదయలో తన ఎస్టేట్ లో విడిచిపెట్టేశాడు దూత! అప్పుడు రాస్తున్నాడు ఈ పాట 17—19
17. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను
18. నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను.
19. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును......

అవును ఒకానొకప్పుడు బోలెడు తోటలు, అంజూరపు పళ్ళు, బోలెడు మందలు, గొర్రెలు, బోలెడు ఆస్తి! ఇప్పుడు ఏమీ లేవు. అయినా ప్రభువా! మమ్మల్ని పట్టించుకొనే నీవు నాకున్నావు, అది చాలు! నీవుంటే నాకు చాలయ్యా! ఇప్పుడు ఏవిధమైన తొందరలు లేవు! దేవుడు నాకు ఉన్నాడు అనే ఒక ప్రశాంతమైన వదనం! ఆత్మీయ నిశ్చింత! ఆత్మీయ పరిపక్వత! ఈజీవితానికి నీవు చాలు నాకు అనుకుని ఇంటికి బయల్దేరాడు ఈ వ్యక్తి!

ప్రియ దైవజనమా! నీకు నాకు అలాంటి పరిపక్వత, నిశ్చయం, నిర్ణయం కావాలి. ఒకవేళ కలిగి ఉంటే ఎలాంటి పరిస్తితులలో నీవు ఒణకవు, బెణకవు!

ఈ వ్యక్తిపేరు హబక్కూకు! స్వతహాగా లక్షాదికారి. గాని యేరూషలేము పట్టబడినప్పుడు సమస్తము కోల్పోయాడు. అంతేకాదు మందిరంలో మంచి వాయిద్యకారుడు! అంతేకాదు ప్రవక్తల శిష్యుల స్కూల్లో చదువుకుని- మందిరపు ప్రవక్తగా ఉద్యోగం చేసేవాడు. ఇప్పుడు ఏమీ లేకుండా తనకున్న చిన్న పొలంలో పంట పండించుకుంటున్నాడు.

ప్రియ స్నేహితుడా! నీవుకూడా అనుకోవచ్చు! ఏమిటీ మనిషికి ఇన్ని కష్టాలు? దేవుడు చూస్తున్నాడా? దేవుడు పట్టించుకొంటున్నారా? భక్తిలేని వారికి కష్టాలు లేవు! భక్తిగా ఉన్నవారికి రెట్టింపు కష్టాలు! ఎందుకు లోకంలో ఇన్ని అన్యాయాలు? అక్రమాలు? హత్యలు? పవక్త హబక్కూకుకి కూడా ఇవే అనుమానాలు కలిగాయి. దేవుడు అవన్నీ తనే తన మాటలద్వారా జవాబు చెప్పారు. అవన్నీ ఈ గ్రంధపుధ్యానంలో ధ్యానం చేద్దాం!
దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
ఆమెన్!

(Note: *Above story is taken from chabad, oca (orthodox church in America), catholic encyclopedia, Google encyclopedia, Antioch patriachate. Chabad derived above story from Oral Torah and Bel and the Dragon book; Others got it from Bel and the dragon; Daniel chapter 14:33-37*)

గమనిక: ఈ జరిగిన కధ బైబిల్ లో లేదు కాని ఇక్కడ ప్రస్తావించడానికి కారణం నాకు చరిత్ర తెలుసు అని చెప్పడానికి ఎంతమాత్రమూ కాదు. అప్పటి పరిస్తితులు బాగా అర్థం చేసుకోవచ్చు అనే ఉద్దేశం తో మాత్రమే ఈ వివరాలు, చరిత్ర ఉదాహరించడం జరుగుతుంది.



భక్తుడైన హబక్కూకు

*రెండవ భాగం*

దేవునినామమునకు మహిమ కలుగును గాక! యేసయ్య ప్రశస్త నామములో అందరికి వందనములు. ఆధ్యాత్మిక సందేశాలు-6 లో భాగంగా మరోసారి మరో భక్తుని జీవిత విశేషాల ద్వారా మీ అందరిని కలుసుకోడానికి కృపనిచ్చిన దేవునికి నిండు వందనములు. ప్రియులారా! భక్తుడైన హబక్కూకు గారు చాలా విశిష్టమైన వ్యక్తి! ముఖ్యంగా సామాన్య మానవునికి వచ్చే అనుమానాలు ఈయనకు వచ్చి- దేవునితో ముఖాముఖిగా మాట్లాడటమే ఈయన రాసిన గ్రంధానికి ప్రత్యేకత! మన సామాన్య జీవితములో ఎప్పుడో ఒకసారి దేవునిమీద చిరాకుపడి మనముకూడా అన్నమాటలే అవి. అవన్నీ ధ్యానం చేసుకుందాం మనము. ముందుగా ప్రవక్త కోసం తెలుసుకుందాం.

గతభాగంలో చెప్పుకున్న ఘటన ప్రకారం మనం ఆయన ఒక ప్రవక్తల శిష్యుల స్కూల్లో చదువుకుని, ఆస్థాన/ దేవాలయ ప్రవక్తగా ఉద్యోగం చేసుకుంటూ, అదేవిధంగా దేవాలయంలో వాయిధ్యకారుడుగా చేసేవాడు అని తెలుసుకున్నాం. అంతేకాదు తండ్రి బహు ఆస్తిపరుడు. ఎన్నో ఎస్టేట్ లు ఉండేవి అయితే యేరూషలేము పట్టబడినప్పుడు అన్ని కోల్పోయినట్లు కూడా చూసుకున్నాం. మిగిలిన వివరాలు ఇప్పుడు చూసుకుందాం.

పేరు: హబక్కూకు
పేరుకు అర్ధం: హత్తుకొనుట/ హత్తుకొనేవాడు
తండ్రి: తెలియదు
తల్లి: తెలియదు
ఊరు: తెలియదు
పుట్టిన తేది: తెలియదు
వృత్తి: ప్రవక్త (హబక్కూకు 1:1 ప్రకారం), వాయిద్యకారుడు (౩వ అధ్యాయం టైటిల్ ప్రకారం) కారణం అనేక ఇంగ్లీసు తర్జుమాలలో To the chief of Quior, of my stringed instrument అని వ్రాయబడింది. కాబట్టి దేవాలయంలో ఒక వాయిధ్యకారుడుగా పనిచేసేవాడు అని అర్ధమవుతుంది అనేది బైబిల్ పండితుల అభిప్రాయం!

కధనాలు: చాలా భిన్నమైన కధనాలు ఈయనకోసం ఉన్నాయి.
అసలు ఎందుకు ఇన్ని భిన్నమైన కధనాలు??
కారణం: ప్రతీ ప్రవక్త తన గ్రంధం ప్రారంభంలో తన తండ్రిపేరు, ఊరిపేరు, ఇంకా గోత్రం పేరు చెబుతూ, ఏఏ రాజులకాలంలో తను పరిచర్య చేసేడో, లేదా ఏఏ రాజుల కాలంలో తనకు దర్శనాలు, ప్రవచనాలు, దేవునిమాటలు కలిగాయో చెప్పడం ఆనవాయితీ. తద్వారా సులువుగా అతనిని గుర్తుపడతారు. అయితే వీటికి భిన్నంగా ఈ ప్రవక్త తండ్రిపేరు గాని, ఊరిపేరు గారి, గోత్రం గాని, రాజులకాలం గాని తెలియజేయ లేనందువలన ఇన్ని భిన్నమైన కధనాలు మనకు కనబడుతున్నాయి. అయితే కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏమిటంటే తన కాలంలో ఏదైనా రాజు పరిపాలిస్తే రాసి ఉండేవారు, గాని ఆయన కాలంలో ఏ రాజు లేడు. ఇశ్రాయేలు దేశమే లేదు.

As per chabad : ఈ భక్తుడు యూదా రాజైన యోకాన్యా చెర పట్టబడినప్పుడు ఈయన పరిచర్య మొదలుపెట్టారు అంటారు. మరియు యెరూషలేము పట్టబడటానికి ముందు అనగా భూమిపుట్టిన ౩౩28 సం.ము. అనగా క్రీస్తు పూర్వం 597కి ముందు పరిచర్య ప్రారంభించి ఉండొచ్చు. అంతేకాదు వీరికి బోలెడు ఎస్టేట్ లు, పొలాలు, తోటలు ఉండేవి. అయితే యేరూషలేము చెర పట్టబడినప్పుడు ఎక్కడున్నారో చెప్పడం లేదు గాని, చెర పట్టబడిన తర్వాత మరలా యూదా దేశం వచ్చి అక్కడ చిన్న ఎస్టేట్ కలిగిఉన్నాడు అంటారు. ఈ ఎస్టేట్ లో తన పనివారికి భోజనం తీసుకుని వెళ్ళేటప్పుడు దేవునిదూత కనపడి దానియేలుగారికి భోజనం తీసుకుని వెళ్ళేటట్లు చేశాడు అంటారు.

అయితే As per oca, catholic encyclopedia ఇంకా చాలామంది బైబిల్ పండితుల ప్రకారం బబులోను రాజు యేరూషలేమును ముట్టడివేసే ముందుగా అరేబియా దేశానికి పారిపోయినట్లు చెబుతారు. ముట్టడి తర్వాత దేవాలయం కాల్చబడిన తర్వాత, ప్రవక్తయైన యిర్మియా గారు ప్రజలతో బలవంతంగా ఐగుప్తు దేశం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సారాలుకి మరలా తన దేశానికి వచ్చి తన ఎస్టేట్ ని బాగుచేసుకోడానికి ప్రయత్నం చేశారు.

As per Google encyclopedia: తల్లి ఘనురాలైన స్త్రీ, షూనేమీయురాలు. ఎలీషా ప్రవక్త ప్రార్ధించగా పుట్టినవాడు హబక్కూకు. కాని దీనికి ఆధారాలు తక్కువ!

అయితే ఈయనకు మూడు సమాధులున్నాయి. ఒకటి ఇజ్రాయేలు దేశంలో గలలియ ప్రాంతంలో. మరొకటి ఇరాన్ దేశంలో . అయితే ఇరాన్ దేశంలో ఉండటానికి కారణం యేరూషలేము పట్టబడినప్పుడు ఈయన కూడా చెరలోనికి ఇరాక్ పోయి, అనేక సంవత్సారాలు చెరలో ఉన్నాడు. తర్వాత రాజైన కౌరసు విడుదల చేసినా తన సొంత దేశం వెళ్ళకుండా ప్రక్కనున్న ఇరాన్ దేశంలో ఎగ్బతానా అనే ప్రాంతంలో నివాసం చేసాడు. సమాధి మీద తండ్రి పేరు సివో లోవిట్ అని, తల్లి పేరు లేషో నమిట్ అని వ్రాయబడింది అట .

ఏదిఏమైనా అనేకమంది చరిత్రకారులు, బైబిల్ పండితులు ఒప్పుకొనేది యెరూషలేము పట్టబడిన తర్వాత మరల తన దేశం తిరిగొచ్చి, తన దేశంలో నివసిస్తూ ప్రార్ధించేవాడు అంటారు.
*గ్రంధ వివరణ*:
హబక్కూకు దేవునికి సంధించిన మొదటి ప్రశ్న: 1:1-4; లోకంలో ఇన్ని అన్యాయాలు, ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. నీవెందుకు పట్టించుకోవడం లేదు?
దేవుని జవాబు : 1:5—11 , వారందరినీ బబులోను రప్పిస్తున్నాను. అందరికి తీర్పు తీర్చుతున్నాను.
రెండవ ప్రశ్న: 1:12—17 దుష్టులైన బబులోను వారిని, వారికంటే కొంచెం నీతిమంతులైన యూదులను దండించడానికి ఎందుకు వాడుకొంటున్నావ్?
దేవుని జవాబు: అది దేవుని సంకల్పం 2:1—4 ప్రజలందరికి తీర్పు విధించిన తర్వాత బబులోను వారికి కూడా తీర్పు ఉంది. వారుకూడా దండించబడతారు.
దుర్మార్గులకు శిక్ష: 2:5—11
రక్తపాతం చిందించేవారికి శిక్ష: 2:12—14
వంచన, దౌర్జన్యం చేసేవారికి శిక్ష: 2:15—17
విగ్రహారాధన చేసేవారికి శిక్ష: 2:18—20
౩ వ అధ్యాయం- దానికి సంతృప్తి పడి దేవుణ్ణి స్తుతించడం
(ఇంకాఉంది).


భక్తుడైన హబక్కూకు

*మూడవ భాగం-మొదటి ప్రశ్న*

హబక్కూకు 1:1—4
1. ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.
2. యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపకయున్నావు.
3. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.
4. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.

ప్రియు దైవజనమా! పైన భక్తుడు – దేవుణ్ణి అడుగుచున్న ప్రశ్నలే మనం కూడా చాలాసార్లు అడిగాము కదా! ఇన్ని ఘోరాలు, నేరాలు, హత్యలు, అన్యాయం జరుగుతుంటే దేవుడు చూడటం లేదా? ఎందుకు న్యాయం జరిగించడం లేదు అని మనము కూడా ఏదో ఒకప్పుడు తప్పకుండా అని ఉంటాము. భక్తుడు తిన్నగా దేవున్నే అడుగుచున్నాడు ఇక్కడ! యెహోవా ఎన్నాళ్ళు నా మొర్ర వినకుండా ఉంటావు? ఇంకా ఎంతకాలం రక్షించకుండా ఉంటావు? అంటున్నాడు భక్తుడు!! కారణం ప్రవక్తకు తన ప్రార్ధనలకు జవాబు రావడం లేదు. ఈ భక్తుడే కాదు బైబిల్ గ్రంధంలో చాలామంది ఇలాగే అడిగారు దేవుణ్ణి!

భక్తుడైన దావీదు ఎన్నోసార్లు దేవుణ్ణి ఇదే ప్రశ్న అడిగారు. కీర్తనలు 6:౩,4
3.నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు? ....
13:1—4
1. యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు?
2. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును? ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?
10:1—12
1. యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీ వెందుకు దాగి యున్నావు?
2. దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక
4. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు ;

భక్తుడైన ఆసాపు కూడా ఇలాగే అనుకున్నాడు: 73: 2—12; 74:10-11
1.దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొఱ్ఱెలమీద నీ కోపము పొగరాజు చున్నదేమి?
10.దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా?
11.నీ హస్తమును నీ దక్షిణహస్తమును నీవెందుకు ముడుచుకొని యున్నావు? నీ రొమ్ములో నుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము. ;

ఏతాము కూడా ఇలాగే అన్నాడు 89:46-49;
46. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?
49. ప్రభువా, నీ విశ్వాస్యతతోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడ?
యోబు గారు కూడా అన్నారు.
ప్రవక్తయిన యిర్మియా: విలాపవాక్యములు 5:20-22
20. నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల?
22. నీవు మమ్మును బొత్తిగా విసర్జించి యున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది....
జ్ఞానియైన సొలోమోను ప్రసంగి ౩:16—17
16. మరియు లోకమునందు విమర్శస్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను.

బలిపీఠము దగ్గరనున్న ఆత్మలు కూడా ఇలాగే దేవునికి మొర్ర పెడుతున్నాయి ప్రకటన గ్రంథం 6: 10
వారునాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.

వీరందరికీ వేదిస్తున్న ప్రశ్నలు ఏమిటంటే: ఎక్కడచూసినా అన్యాయం, దౌర్జన్యం, హింసలు, అల్లర్లు, ఘోరాలు, నేరాలు, హత్యలు జరుగుతున్నాయి . దేవుడు సర్వాంతర్యామి కదా! దేవునికి అన్నీ తెలుసు, అన్నీ చూస్తున్నారు కదా, మరి ఎందుకు ప్రతీకారం చేయడం లేదు??!!! దేవుడు ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త కదా, సర్వ శక్తిమంతుడు కదా, మరి ఈ నేరాలను, ఘోరాలను ఎందుకు అణచడం లేదు? లోకంలో నీతిమంతులు, మంచివారు బాధపడుతున్నారు! దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు , ఏమిటి ఇది? మంచివారికి న్యాయం జరగడం లేదు ఎందుకు? దేవుడు ఏం చేస్తున్నారు? ఇది చాలామందికి కలుగుతున్న ప్రశ్న?!!!

ఇక ఎతిస్ట్ లు, దేవుడు లేదు అని చెప్పేవారు ఇంకా ముందుకు వెళ్లి- దేవుడన్న వాడు లేడు, ఉంటే ఈ అన్యాయాలు, అక్రమాలు ఎందుకు జరుగుచున్నాయి, ఒకడు ధనవంతుడు, ఒకడు బీదవాడు, ధనవంతుడు బీదవాడిని బాదిస్తున్నాడు, ఒకవేళ దేవుడన్నవాడు ఉంటే, ఆయన మంచివాడు అయితే, సర్వ శక్తిమంతుడు అయితే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు? కాబట్టి దేవుడు లేడు అంటున్నారు. బైబిల్ సెలవిస్తుంది- దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. కీర్తనలు 14;53;

భక్తుడైన ఆసాపు దేవుణ్ణి ఇలాగే అడిగాడు చాలాసార్లు. ఒకసారి చూసుకుందాం.7౩:౩-14 .
3. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారిని బట్టి నేను మత్సరపడితిని.
4. మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు.
5. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.
11. దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు.
12. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.
13. నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే
14. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. . . .
ఇక ఆగలేక మందిరానికి వెళ్లి దేవునితో తగవాడుతూ ప్రార్ధనలో కనిపెట్టారు ఈ భక్తుడు 7౩:17
నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.
అప్పుడు దేవుడు ఆయనకు బయలుపరచిన సత్యము: 18,19
18. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు
19. క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు. . . .

అదీ జరుగబోతుంది. మనం కూడా ఇలాగే దేవుణ్ణి అనేకసార్లు నిందించాము కదా! పొరపాటు పడ్డాము కదా. అందుకే భక్తుడు క్షమించమని అడిగాడు పరిశుద్ధాత్ముడు సత్యాన్ని బయలుపరచిన తర్వాత!

ప్రియ దైవజనమా! దయచేసి మత్సరపడకు. దేవుని మీద అలగకు. చెడ్డవారిని చూసి మత్సరపడొద్దు. వారు కాలుజారే స్థలములో ఉన్నారు. వారు ఇక తిరుగులేకుండా హటాత్తుగా నాశనమయ్యే రోజు దగ్గర పడింది. నేనెందుకు న్యాయంగా ఉండాలి? అన్యాయం చేసే వారే బాగున్నారు, భక్తి చేయని వారే బాగుంటున్నారు, వారే అభివృద్ధి చెందుతున్నారు, నేను ప్రతీరోజు ప్రార్ధన చేస్తూ, ఉపవాసం చేస్తూ ఉంటే, నాకే అన్ని కష్టాలు, మా ఇంటిలోనే రోగాలు అని భాధపడకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. అది మరచిపోకు! దేవుడు నిన్ను ఇబ్బంది అనే కొలిమిలో, కష్టాలు అనే కొలిమిలో వేసి శోధించి, నీవు జయించిన తర్వాత నిన్ను శుద్ధ సువర్ణము వలే తయారుచేయబోతున్నారు. ఇది గ్రహించమని మనవి చేస్తున్నాను.

ఒక విషయం చెప్పనీయండి: నీవు చేస్తున భక్తి నిన్ను మాత్రమే పరలోకం తీసుకుని వెళ్తుంది. చివరికి నీ కొడుకుని, కూతురుని కూడా పరలోకం తీసుకుని వెళ్ళలేదు. వారు దేవునియొద్దకు తిరిగేలా మాత్రమే పనిచేస్తుంది తప్ప వారిని పరలోకం తీసుకుని పోలేదు నీ భక్తి. కాబట్టి ఎవరి భక్తి వారినే పరలోకం తీసుకుని పోతుంది. కాబట్టి నీవు- దేవునితో సమాధానంగా ఉన్నావా లేదా, నీ అంతఃకరణం శుద్ధిగా- దేవునితో సమాధానంగా ఉందా లేదా, అనేది మాత్రం నీవు చూసుకో! ఎవడు ఎలా పోతే నీకు అనవసరం! అలాగని వారి కోసం ప్రార్ధన చేయడం మానకూడదు. నీవు చెడ్డవాడిని, అన్యాయం చేసేవారిని చూసి కుల్లిపోకు, మత్సరపడకు. తప్పకుండా వాడు చేస్తున్న దుర్మార్గాలు వారిని నాశనానికి, నరకానికి తీసుకుని వెళ్తున్నాయి. వారు సంతోషపడేది ఇక్కడే, కొంతకాలమే! కాని నిత్య నాశనంలో, నిత్య నరకంలో నిత్యమూ బాధపడే రోజులున్నాయి. కాబట్టి అన్యాయం చేసేవారిని, దుర్మార్గాలు చేసేవారిని చూసి మత్సరపడకు, జాలిపడు! వారికి కలుగబోయే శిక్షావిధి చూసి. అవుసరమైతే వారి రక్షణకోసం ప్రార్ధన చేయు!

హబక్కూకు లాగ ప్రశ్నలు సంధించడమే కాదు, భక్తుడైన ఆసాపులా సత్యము గ్రహించి, దేవుణ్ణి క్షమించమని అడిగి మన అంతఃకరణములు శుద్ధిచేసుకుందాము.

దేవుడు మిమ్మును దీవించును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!

భక్తుడైన హబక్కూకు

*నాల్గవ భాగం-మొదటి ప్రశ్నకు జవాబు*

హబక్కూకు 1:5—7
5. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు.
6. ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను.
7. వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.

ప్రియు దైవజనమా! గతభాగంలో భక్తుడు – దేవుణ్ణి అడిగాడు- ఇన్ని ఘోరాలు, నేరాలు, హత్యలు, అన్యాయం జరుగుతుంటే చూడటం లేదా? యెహోవా ఎన్నాళ్ళు నా మొర్ర వినకుండా ఉంటావు? ఇంకా ఎంతకాలం రక్షించకుండా ఉంటావు? అని అడిగితే దేవుడు జవాబు చెబుతున్నారు.

ఈ వచనాలలో దేవుడు హబక్కూకుకి చెబుతున్నారు: యూదాలో భ్రష్టమైన స్తితి నేను చూస్తున్నాను. అందుకే కల్దీయులను పిలిపించి వారిని అనగా యూదులను శిక్షించబోతున్నాను అని సెలవిస్తున్నారు దేవుడు.
అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. . . . ఇక్కడ కేవలం విస్మయమొందుడి – అలా జరుగుతుంది అని చెప్పినా మీరు నమ్మరు అని చెప్పడానికి కారణం – యూదులకు ఒక నమ్మకం ఏమిటంటే: లోకంలో ఉన్న జాతులందరికంటే తాము ప్రత్యేకం, కారణం వారిని దేవుడు తనకొరకు ప్రత్యేక జనముగా ఏర్పాటుచేసుకున్నారు. ద్వితీయోప 10:15; కీర్తనలు 135 :4; అలాంటి ప్రజలను దేవుడు ఇతరదేశాల ప్రజలను, ఇంకా ఇశ్రాయేలు ప్రజలను శిక్షించినట్లు వారిని శిక్షించరు అని వారి ప్రగాఢమైన నమ్మకం! ఇశ్రాయేలు ఉత్తర భాగాన్ని దండించటానికి దేవుడు ఇరాక్ ఉత్తరభాగంలో ఉన్న అస్సూరు వారిని వాడుకున్నాడు; క్రీ.పూ 722-721 లో ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం పూర్తిగా నాశనం చేయబడింది. ఇప్పుడు అలాగే ఇశ్రాయేలు దక్షిణభాగాన్ని అనగా యూదాజాతిని దండించటానికి దేవుడు- ఇరాక్ దక్షిణభాగానికి చెందిన కల్దీయులు అనగా బబులోనీయులను వాడుకొనబోతున్నారు అంటే వారు నమ్మడం లేదు- ఇక మీరు విస్మయపడబోతున్నారు అంటున్నారు దేవుడు! ఇక 6—11 వరకు కల్దీయులు ఎలాంటి వారో దేవుడే చెబుతున్నారు. ఈ కల్దీయులు క్రీ.పూ 615 సంవత్సరానికి ప్రపంచంలో గొప్ప సైన్యంగా అవతరించింది. BC 612-605 మధ్య అనేకసార్లు అస్సూరు అనగా తమ ఉత్తర రాజ్యము మీద దండెత్తి చివరికి వారిని నాశనం చేసినట్లు చరిత్ర చెబుతుంది. దానితో ప్రారంభం అయిన వారి ప్రస్తానం ఒక్కో దేశం ప్రాకుతూ ఇప్పుడు ఇశ్రాయేలు- దక్షిణ భాగమైన యూదా ప్రాంతం కూడా వారు జయించబోతున్నారు కారణం యూదుల యొక్క బ్రష్టజీవితం!
6. ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. ..... ఇక్కడ దేవుడే అంటున్నారు తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించుకోవాలి అనే స్వభావం గల కల్దీయులను నేనే రేపుచున్నాను అంటున్నారు దేవుడు! అనగా ఈ బబులోను సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని యావత్ ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నారు దేవుడు అని ముందుగానే చెబుతున్నారు ప్రవక్తయైన హబక్కూకుతో! ఇలా చెబుతుంటే వారు నమ్మడం లేదు కాబట్టి విస్మయమొందుడి అంటున్నారు. 7-11
7. వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.
8. వారి గుఱ్ఱములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రియందు తిరుగులాడు తోడేళ్లకంటెను అవి చురుకైనవి; వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడుదురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు.
9. వెనుక చూడకుండ బలాత్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగావారు జనులను చెరపట్టుకొందురు.
10. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు.
11. తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు. . ..

పై వచనాల ప్రకారం వీరికి దయాదాక్షిణ్యాలు లేవు. దేవుడు అంటే భయం లేదు. వారి బలమే వారి దేవుడు అని సెలవిస్తున్నారు దేవుడు. మరొకటి స్పష్టముగా అర్ధం అయ్యేది ఏమిటంటే వారికి ఆ బలం, ఆ చురుకుతునం, విజయం కలిగించేది కేవలం దేవుడు మాత్రమే! వారు ఇప్పుడు దేవుని ఉగ్రతను నెరవేర్చే ఒక సాధనం. దేవుని వలననే వారికి ఇన్ని విజయాలు కలుగుబోతున్నాయి.
ఒకసారి 1 దినవృత్తాంతములు 5:26; 2 దినవృత్తాంతములు 21:16; యెషయా 13:17; యిర్మియా 51:1; ఆమోసు 6:14 చూసుకుంటే ఈరీతిగా ప్రజలను రేపేది దేవుడే! ఏ జాతియైనా ఈ భూమిమీద అధికారానికి వచ్చింది అంటే దానికి కారణం దేవుడే! ఏ జాతి యైనా శిధిలమైపోయింది అంటే దానికి కూడా కారణం దేవుడే! పౌలుగారు అంటున్నారు ఈ భూమిమీద కలిగియున్న అధికారం దేవుని వలననే కలిగింది కాబట్టి అధికారులకు లోబడియుండిడి. రోమా 13:1;
చివరికి మనిషిని మంటికి మార్చేది కూడా దేవుడే! కీర్తనలు 90:3;
బబులోను రాజైన నెబుకద్నేజరు తన నోటితో స్వయముగా అంటున్నాడు బుద్ధివచ్చాక: దానియేలు 4:౩4--35,37
34. ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవ బుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకునున్నవి.
35. భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.
37. ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునైయున్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచునున్నాను. .....

ఈ విషయం ప్రజలు గుర్తించాలి. యెషయా 40:15, 22—25;
15. జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి.
22. ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.
23. రాజులను ఆయన లేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపు లుగా చేయును.
24. వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.
25. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.
అందుకే దేవుడు చెబుతున్నారు హబక్కూకుకి—ఈ భూమియంతటిని నేనే కంట్రోల్ చేస్తున్నాను. ప్రతీ ఒక్కరికి తీర్పు తీర్చబోతున్నాను. ముందుగ యూదులకు తీర్పు తీర్చబోతున్నాను.

ప్రియ చదువరీ! నీవు చేసే ప్రతీ క్రియకు, నీవు మాట్లాడే వ్యర్ధమైన ప్రతీమాటకు దేవుని విమర్శదినమందు లెక్క అప్పగించాలి (మత్తయి 12:36) అని గుర్తుంచి, దేవునికి లోబడి- ఆయన ఆజ్ఞల ప్రకారం నడవమని దేవునిపేరిట మనవి చేస్తున్నాను.

దేవుడు మిమ్మును దీవించును గాక!
ఆమెన్!


భక్తుడైన హబక్కూకు

*ఐదవ భాగం-రెండవ ప్రశ్న*

హబక్కూకు 1:12—13
12. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.
13. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?

ప్రియు దైవజనమా! గతభాగంలో హబక్కూకు భక్తుడు అడిగిన ప్రశ్నకు దేవుడు శాంతంగా జవాబు చెప్పినట్టు చూశాము అయితే ఇక్కడ ఆ జవాబుతో బహుశా సంతృప్తి పడినట్లు కనబడటం లేదు భక్తుడు. దేవుడు ఏదో ఒకటి చెయ్యమని కోరుకున్నాడు గాని తనకు నచ్చిన విధముగా చేయడం లేదు అందుకే మరో ప్రశ్న సంధిస్తున్నాడు. అంతేకాకుండా బబులోను వారికంటే యూదులే నీతిమంతులు కొద్దిగా అని వాదిస్తున్నాడు ఇక్కడ భక్తుడు. తను జీర్ణించుకోలేకపోతున్న విషయం ఏమిటంటే దేవుడే తన నోటితో బబులోనువారు క్రూరులు, దుష్టులు అని చెబుతున్నారు కాబట్టి ఆ క్ర్రూరులను, దుష్టులను ఉపయోగించుకొని తన సొంత జనాంగమునకు తీర్పు తీర్చడమేమిటి? ఇది కూడా ఒక దుష్టత్వమే కదా అనగా బబులోను వారు క్రూరంగా ఇప్పుడు యూదులను హతం చేయడం, చెరలోనికి తీసుకునిపోవడం అన్యాయమే కదా! మరి దీనిని నీవెలా సహించగలవు అని అడుగుతున్నాడు భక్తుడు!

మనలో చాలామంది దేవుడు తమకు అనుకూలంగా తీర్పు తీర్చాలని కోరుకుంటారు హబక్కూకు వలె ఇంకా యోనా గారి లాగ. అది మంచిది కాదు.

సరే ఇప్పుడు ఒక్కో వచనం బాగా ధ్యానం చేద్దాం!
12 వచనంలో నీవు పవిత్రుడవు. నీవు ఆదినుండి ఉన్నవాడవు అంటూ, మాకు తీర్పుతీర్చడానికి బబులోనువారిని సాధనముగా వాడుకుంటున్నావు . మమ్మల్ని దండించమని నీవే వారికి చెప్పావు అని అంగీకరిస్తున్నాను. అయితే 13వ వచనం: నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంక మైనది కదా అంటూ అంటున్నారు ప్రవక్త వారు అనగా బబులోనువారు తమకంటే నీతిమంతులను నాశనము చేయగా నీవెందుకు ఊరకున్నావు? ఇది అసలు ప్రశ్న!!! నీ సొంతజనులు పాపము చేశారు అని ఒప్పుకుంటున్నాను అయితే యూదులు బబులోనువారికంటే నీతిపరులు. కాబట్టి నీతివంతమైన జనము పాపము చేసినప్పుడు వారిని అన్యాయవంతమైన జనముతో ఎందుకు శిక్షిస్తున్నావు? ఇంకా ముందుకుపోతే అడుగుచున్నారు ప్రవక్త- ఇలా ఎంతకాలం వారు అనగా బబులోనువారు ప్రజలను హింసిస్తారు. చెరపడతారు? ఇదీ ప్రవక్త రెండవ ప్రశ్న. దీనికి దేవుడు రెండో అధ్యాయంలో తాపీగా జవాబు చెప్పారు. అయితే ఈరోజు ప్రవక్త అడిగిన ప్రశ్నలోంచి దేవుని గుణగణాలు కొద్దిగా ధ్యానం చేద్దాం!

మొదటగా 12వ వచనం ప్రకారం దేవుడు పరిశుద్దుడు, పవిత్రుడు; పాపం చేసేవారిని దండించే స్వభావం గలవాడు కారణం ఆయన సర్వాధిపతి, సర్వ సృష్టికర్త! ఇక 13వ వచనం ప్రకారం ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేదు. అవును దేవుడు దుష్టత్వమును, చెడుగును, తప్పును చూసి ఊరుకునే దేవుడు కాదు! వెంటనే దండించే దేవుడు! అయితే భక్తుల ప్రశ్న, నీతిమంతుల భాద ఏమిటంటే: దుష్టులు తప్పుచేస్తే వెంటనే వారిని దండించడం లేదు. ఎప్పుడో చివర్లో దండిస్తున్నావు. వెంటనే దండిస్తే/ బుద్ది చెబితే వారు గుణపడతారు కదా! దేవుని ఉద్దేశం వారికి బుద్ధిచెప్పి వారు గుణపడటం కన్నా, ఆ బుద్ధిచెప్పడం ద్వారా నీతిమంతులు గుణపడాలని, తప్పుచేస్తే ఇలా జరుగుతుంది అని భయపడాలని! దేవుడు మనిషికి మంచి చెడ్డలు గ్రహించే బుద్ధి, తెలివితేటలూ ఇచ్చారు. మనిషి తన ఇష్టానుసారంగా ప్రవర్తించే స్వేచ్చ/ ఫ్రీడం ఇచ్చారు దేవుడు,. అయితే దానిని ఉపయోగించి అనగా తన బుద్ధి ఉపయోగించి చేసే పనులే తనను పరలోకానికి గాని నరకానికి గాని తీసుకుని పోతాయి. దేనిని ఎన్నుకోవడం అనేది మనిషి చేతిలో ఉంది. తప్పుచేస్తే దేవుడు దండిస్తాడు అనే భయం మనిషి కలిగి చెడుగు చేయకుండా ఉండాలి.

మొదటగా కయీను తమ్ముడైన హేబెలును హత్యచేస్తే దేవుని కన్నులు చూసి ఊరుకోలేదు. శపించినట్లు చూస్తున్నాం. అడికాండం 4:10-13;. అదేవిధముగా దేవునిచేతనే నా స్నేహితుడు అనిపించుకున్న అబ్రాహాముగారిని, విశ్వాసులకు తండ్రి అనిపించుకున్న అబ్రాహముగారిని అంటున్నారు దేవుడు: అబ్రాహామా! నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అని హెచ్చరిస్తున్నారు. ఆదికాండం 17:1; కారణం దేవుడు చెప్పని పని, దేవుని అనుమతి లేకుండా చెయ్యడం. దేవుడు ఎంతో ఆస్తి ఇచ్చారు కాని పిల్లలు లేరు అని భార్య చెప్పిన మాట విని దాసితో సంసారం చేసారు. నిజంగా అబ్రాహాముగారు ఎంతో భక్తిపరుడు! చనిపోయేవరకు తన భక్తీ-విశ్వాసాలను విడచిపెట్టలేదు. విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నారు. ఇక తన భార్యకూడా మంచి సాధ్వీమణి! గుణవంతురాలు. గాని పిల్లలు పుట్టలేదు అని తన దాసితో పొమ్మన్నది. దేవుని దృష్టిలో ఇది విపరీతం! అయితే ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే అబ్రాహాముగారు కోరుకుంటే ఈ పని ఎప్పుడో చేసేవారు, కారణం తనకున్న పనివారు ఆ రోజులలో సుమారు ౩౦౦౦ మంది. ఇప్పుడు ముఖేష్ అంభాని ఇంట్లో పనిచేసేవారు కేవలం 1600 మాత్రమే! గాని అబ్రాహాము గారింట్లో పనిచేసే వారు ౩౦౦౦ మంది. వీరిలో ఎంతోమంది స్త్రీలు కూడా ఉన్నారు. వీరితో ఎప్పుడూ పాపం చేయలేదు ఆయన! గాని భార్య చెప్పింది అని మొదటిసారిగా దాసితో సంసారం చేశారు. దేవుడు దానికి ప్రతిఫలంగా సుమారు 13 సంవత్సరాలు అబ్రాహాముగారిని దర్శించడం, మాట్లాడటం మానేశారు. దేవుడు దుష్టత్వమును, చెడుగును, అపవిత్రతను చూడలేడు. అందుకే అంటున్నారు- అబ్రాహామా! నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు!
దేవునితోనే నా ఇష్టానుసారుడైన మనిషి అని పిలువబడిన దావీదుగారిని పాపం చేసినప్పుడు- తన ప్రవక్తను పంపించి—ఆ మనిషివి, హంతకుడవు నీవే! నీవే దోషివి అని చెప్పి దండించినట్లు చూస్తాం! 2 సమూయేలు 12;
1రాజులు 4 వ అధ్యాయంలో దేవుడు సొలోమోను ను ఎంతో పొగుడుతారు. అదే 11వ అధ్యాయంలో సొలోమోను తప్పు చేస్తున్నప్పుడు- కామాతురత గలవాడై ఉంచుకోనుచు వచ్చెను అని సిగ్గు తీస్తున్నారు. అది దేవుని తీర్పులు! మంచిగా పవిత్రంగా ఉంటే దేవుడు ఎంతైనా దీవించేవారు, ఆశీర్వదించేదేవుడు. అదే తప్పుచేస్తే వెంటనే ఖండించేదేవుడు. దేవునికి మొగమాటం లేదు! పక్షపాతం ఎంతైనా లేదు. ప్రియ సహోదరి/ సహోదరుడా! దేవునిచేతనే శభాస్ అనిపించుకున్నవారినే తప్పుచేస్తే దండించిన దేవుడు- నిన్ను నన్ను దండించరా? జాగ్రత్త! దేవుడు పరిశుద్ధుడు! నీవు చేస్తున్న అపవిత్రమైన పనులు చూసి సహిస్తారా? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్దులుగా ఉండాలి అని చెప్పిన దేవుని ఆజ్ఞా మరచిపోతున్నావా? లేవీ 11:44,45; పరిశుద్దులుగా ఉండటానికే దేవుడు మనలను ఎన్నుకొన్నారు అని మరచిపోయావా? రోమా 1:2; 1కొరింథీ 1:2;
యాకోబు పత్రిక 1:27 లో భక్తికి నిర్వచనం చెబుతూ అంటున్నారు: ఇహలోకమాలిన్యము తన ఘటముకు అంటకుండా చూసుకోవాలి. అదే నిజమిన భక్తి. అపవిత్రము అంటే మీ దృష్టిలో వ్యభిచారము, హత్యలు లాంటివే కాదు- పౌలుగారు మాటలలో చూద్దాం- అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు- 1 తిమోతి 4:7; ఇవికూడా అపవిత్రమే ప్రియ సహోదరీ/ సహొదరులారా! ఎవరూ లేరుకదా అని నీవు మొబైల్ లో ఎవరితో చాట్ చేస్తున్నావు. పనిలేదు కదా అని నీవు పొరుగింటివారితో కలిసి ఏమి సోది చెబుతున్నావు. ముసలమ్మ ముచ్చట్లు చెబుతున్నావు? ఇది అపవిత్రమైన పని అని బైబిల్ సెలవిస్తుంది. అపవిత్రమైన సీరియల్లు, అపవిత్రమైన సినిమాలు, సెల్ ఫోన్లో భూతు సినిమాలు, ఫోటోలు చూసి నిన్నునీవు అపవిత్రం చేసుకోవద్దు ప్రియ చదువరీ! దేవుని కన్నులు ఇలాంటి వాటిని సహించలేవు!!
ప్రకటన గ్రంధంలో ఇలా అసహ్యకరమైన పనులు చేసేవారు దేవునిరాజ్యములో ప్రవేశించరు అని ఖరాఖండిగా చెబుతున్నారు. కాబట్టి భయమునొంది ఇలాంటి అపవిత్రమిన పనులు మానేద్దాం!
దేవునికి ఆయాసకరమైన ఏమైనా ఉంటే అన్నిటిని వదిలేద్దాం!

దైవాశీస్సులు!


భక్తుడైన హబక్కూకు

*ఆరవ భాగం-రెండవ ప్రశ్నకు జవాబు*

హబక్కూకు 2:1—2
1. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలముమీదను గోపురముమీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా
2. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము.

ప్రియులారా! గతభాగంలో ప్రవక్త దేవునికి రెండో ప్రశ్న సంధించాడు. అంతేకాకుండా మొదటి వచనం ప్రకారం నేను కావలి స్తలమున గోపురము మీద కనిపెట్టి ఉన్నాడంట. ఇక్కడ ఒకసారి ఆగుదాం!

అనేకసార్లు మీకు గుర్తు చెయ్యడం జరిగింది. దేవుని సేవకుడు, కాపరి, ప్రవక్త దేవుని తరుపున మనుషులకు కావలిగా ఉన్నాడు. యెషయా 21:8, యేహెజ్కేలు ౩:17; యేహెజ్కేలు మూడవ అధ్యాయం మొత్తం చదివితే అర్ధం అవుతుంది దేవుని సేవకుడు సంఘానికి కావలి వాడు! రాబోయే ఆపదలు ముందుగానే పసిగట్టి, ప్రజలను హెచ్చరించడం కావలి వాని పని! అంతేకాకుండా తప్పు చేస్తుంటే దానికి వచ్చే ప్రతిఫలం ముందుగానే తన సంఘానికి చెబుతూ వారిని 2 తిమోతి ౩,4 అధ్యాయాల ప్రకారం ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ ఉండాలి. ఇది మరచిపోయి- సంఘానికి, విశ్వాసులకు అనువైన వర్తమానాలు చెబుతూ, ఎప్పుడూ బ్లెస్సింగ్స్ కోసమో, prosperity వర్తమానాలు చెబుతూ, దేవుని రాకడకు ప్రజలను ఆయత్త పరచకపోతే, అదే యేహెజ్కేలు మూడవ అధ్యాయం ప్రకారం దేవుడు కాపరిని, ప్రవక్తను, సేవకుడిని లెక్క అడుగుతారు జాగ్రత్త!

ఇప్పుడు ప్రార్ధనలో కనిపెడుతున్న ప్రవక్తకు దేవుడు దర్శనరీతిగా జవాబిస్తూ రెండో ప్రశ్నకు చాలా వివరంగా/ దీర్ఘంగా జవాబు చెప్పారు. ఈ జవాబులో కేవలం బబులోను వారికి కలిగే తీర్పులే కాదు, దానితోపాటు త్రాగుబోతులకు కలిగే తీర్పులు, అహంకారులకు, వ్యభిచారులకు, అన్యాయం చేసేవారికి, విగ్రహారాధన చేసేవారికి కలిగే తీర్పులు చెబుతున్నారు. సరే దేవుని జవాబు చూద్దాం బబులోను వారికి కలిగే తీర్పులు:

2. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము.
3. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.
4. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; *అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ(తన విశ్వాస్యతచేత) బ్రదుకును*.
5. మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును.
6. తనదికాని దానినాక్రమించి అభివృద్ధినొందిన వానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా.
7. వడ్డికిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు.
8. బహు జనముల ఆస్తిని నీవు కొల్ల పెట్టియున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యనుబట్టియు బలాత్కారమును బట్టియు నిన్ను కొల్ల పెట్టుదురు. . . .

చూసారా దేవుని తీర్పు!
మూడవ వచనంలో ఇది తప్పకుండా జరుగును అని సెలవిస్తున్నారు దేవుడు. ఎప్పుడు? నెరవేరే కాలంలో అది జరుగుతుంది. క్రీ.పూ. 539 లో బబులోను సామ్రాజ్యం పూర్తిగా ద్వంసం చేయబడి మాదీయ రాజ్యం వచ్చింది. అనగా భక్తుడు ప్రవచించిన 65 సంవత్సారాలు తర్వాత ఈ ప్రవచనం/ దర్శనం నెరవేరింది. భక్తుడు బ్రతికి ఉండగానే ఈ ప్రవచనం నెరవేరింది. ఇక 4వ వచనంలో ఉదాహరించబడ్డ అతిశయించేవాడు, గర్విష్టుడు ఎవరంటే బబులోను వారు. ఇక 5వ వచనం ప్రకారం వాడు మద్యం త్రాగి వదరుతూ అన్ని దేశాల వారిని వశపరచుకొంటున్నాడు, అనగా జయిస్తున్నాడు. ఇక మొదటి అధ్యాయంలో చెప్పినట్లు తనవికాని ఉనికిపట్లను వశపరచుకోడానికి బయలుదేరిన వాడు, ఈ 2:6 లో సామెత చెబుతున్నారు:.తనదికాని దానినాక్రమించి అభివృద్ధినొందిన వానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా. . . . . . . సామెతకు కారణం వాడు అనగా బబులోను పతనమైపోయింది.
7వ వచనం ప్రకారం వడ్డికిచ్చువాడు వడ్డీ అసలు కట్టకపోతే ఎలా వచ్చి హటాత్తుగా పడి మొత్తం ఇల్లంతా దోచుకుపోతాడో అలాగే బబులోనుకి కూడా జరుగుతుంది అని సెలవిస్తున్నారు దేవుడు!
8 . బహు జనముల ఆస్తిని నీవు కొల్ల పెట్టియున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యనుబట్టియు బలాత్కారమును బట్టియు నిన్ను కొల్ల పెట్టుదురు. . . .

ఇది దేవుని తీర్పులు! దేవుని తీర్పులు అలాగే ఉంటాయి. దోచుకోనకపోయినను దోచుకొను నీవు- దోచుకొనుట ముగించిన తర్వాత దోచుకొనబడుడువు అని సెలవిస్తుంది బైబిల్! యెషయా 33: 1
దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొన బడెదవు నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచించెదరు.
అలాగే జరిగింది బబులోనుకి! బబులోనుకే కాదు ఎవరైనా సరే, ఇప్పుడు దోచుకుంటున్నారా, అయితే ఒకరోజు వస్తుంది- ఆరోజు నీవు దోచుకుని, ఇకచాలులే అన్నంతవరకు దోచుకుంటావు. అయితే ఆరోజు నీవు మొత్తంగా దోచుకొనబడతావు. నీవు చేసిందే నీ నెత్తిమీదకు వస్తుంది.

ఇక ఈ వచనాలలో ముఖ్యమైన మంచి వర్తమానం ఏమిటంటే: నీతిమంతుడు విశ్వాసమూలగా బ్రతుకును! 2:4; అవును! అబ్రహాముగారు విశ్వాసమూలముగా తన కుమారునికోసం కనిపెట్టి పొందుకున్నారు. దానియేలు గారిని సింహాల బోనులో వేసేశారు గాని ఆయన విశ్వాసం సింహాల నోళ్లను మూయించి- తన దూతనంపి దానియేలుకి ఏ విధమైన హాని కలుగనీయలేదు. విశ్వాసమూలముగా బ్రతకడం అంటే ఇదే!
నీతిమంతుడు, యధార్ధపరుడు అయిన యోబుగారు సర్వాన్ని కోల్పోయినా- తిరిగి తన యధార్ధత, నీతి వలన రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నారు. యోసేపు నీతి తనకు హాని తీసుకుని వచ్చింది. అన్నలతో ద్వేషించబడి- కొట్టబడి- అమ్మబడ్డాడు. అదే నీతి- ఐగుప్తులో చెరశాల పాలు చేసింది అయినా యధార్ధత, నీతిని వదలలేదు- అప్పుడు అదే నీతి ఆయనను ఐగుప్తుకు గవర్నర్ గా చేసింది.

కాబట్టి ప్రియ సహోదరి/ సహోదరుడా! నీతిని, విశ్వాసమును, యదార్ధతను వదలవద్దు!
గట్టిగా పట్టుకో!
పరలోకం పట్టుకో!

దైవాశీస్సులు!


భక్తుడైన హబక్కూకు

*7వ భాగం-రెండవ ప్రశ్నకు జవాబు*
*త్రాగుబోతులకు-దుర్మార్గులకు వచ్చు తీర్పు*

హబక్కూకు 2:5—8
5. మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును.
6. తనదికాని దానినాక్రమించి అభివృద్ధినొందిన వానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా.
7. వడ్డికిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు.
8. బహు జనముల ఆస్తిని నీవు కొల్ల పెట్టియున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యనుబట్టియు బలాత్కారమునుబట్టియు నిన్ను కొల్ల పెట్టుదురు.

ప్రియులారా! గతభాగంలో ప్రవక్త రెండో ప్రశ్నకు దేవుని జవాబు ధ్యానం చేసుకున్నాం. అయితే ఆ జవాబు అయిపోలేదు. ఈ అధ్యాయమంతా ఆ ప్రశ్నకు జవాబే! దేవుడు బబులోను యొక్క లక్షణాలు వివరిస్తూ, అలాంటి లక్షణాలు గలవారికి తాను ఇచ్చే తీర్పులే ఈ అధ్యాయం! గతభాగంలో దేవుడు బబులోను వారిని శిక్షిస్తాను అని సెలవిచ్చినట్లు చూసుకున్నాం.
5వ వచనం .మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. . . .. చూసారా, మధ్యము కోసం ఏమని వ్రాయబడిందో! ఈ త్రాగుడుకోసం చివర్లో ధ్యానం చేసుకుందాం. త్రాగుబోతుకి పాతాలమంత ఆశ ఉంటుంది అట! త్రాగుబోతుకి- దుర్మార్గపు ఆలోచనలు కూడా వస్తాయి. ఆ తర్వాత వాడు 6వ వచనం ప్రకారం సామెతల పాలు లేక వెక్కిరింతల పాలు అవుతాడు. చివరకు ఈ త్రాగుడు వానిని వెక్కిరింతల పాలు చేయడమే కాదు, దారిద్ర్యమును కూడా తీసుకుని వస్తుంది. తన ఆస్తిమొత్తం పోగొట్టుకుంటాడు. ఇది మనం ఎప్పుడూ చూస్తున్నవే! బైబిల్ కూడా దీనినే బాగా వివరించింది.

ఒక విషయం చరిత్రనుండి ఇంకా బైబిల్ నుండి చెప్పనీయండి. చరిత్ర ప్రకారం నెబుకద్నేజరు కొడుకు బెల్షస్సర్ ఇదే త్రాగుబోతు విందులో ఉన్నప్పుడే మాదీయులు, మాదీయ రాజు కోరేసు బబులోను మీద దండెత్తి బబులోను సామ్యాజ్యాన్ని ఆక్రమించుకున్నట్లు దానియేలు గ్రంధం 5వ అధ్యాయం ప్రకారం చూసుకోవచ్చు. దానికంటే ముందుగా బెల్షస్శరు తెలివికోల్పోయి మహా దేవుని ఆలయానికి చెందిన ఉపకరణములలో వాడు, వాని అధికారులు, భార్యలు, ఉంపుడుగత్తెలు మందువేసుకుని త్రాగుతుంటే దేవుని హస్తము వచ్చి మినే మినే టేకేల్ ఒఫార్సిన్ అని రాసి వెళ్ళిపోయింది. త్రాగుబోతులకు కలుగు తీర్పులు ఇలాగే ఉంటాయి. ఇక త్రాగుడుకోసం ఆధ్యాత్మిక సందేశాలు-1 లో చేయరాని పనులు శీర్షికలో విస్తారంగా వ్రాయడం జరిగింది. దానిలో కొన్ని మరలా మీకు గుర్తుచేస్తున్నాను సందర్బానుసారంగా.

ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి హేతువులేని గాయములు? ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా! . . . పిమ్మట అది సర్పమువలె కరచును. కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. వెర్రిమాటలు పలుకుదువు. (సామెతలు 23:29-35).
ప్రియ సహోదరి/సహోదరుడా! నేటి దినాలలో త్రాగుడు మరియు ధూమపానం ఎక్కువైపోయింది. ముఖ్యంగా యవ్వనస్తులు చాలా ఘోరంగా వీటికి బానిసైపోయారు. త్రాగి వాహనాలు నడపడం, యాక్సిడెంటులు అవ్వడం జరుగుతుంది. పట్టణాలలో, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో యువకులుతో పోటీగా యువతులు కూడా మద్యపానం ధూమపానం చేస్తున్నారు, సాతానుకి బానిసైపోతున్నారు. అయితే విచారం ఏమిటంటే అన్యులతో పాటు దేవుని బిడ్డలు కూడా అదే పాపం చేస్తున్నారు సరికదా ప్రభురాత్రి సంస్కారం కూడా తీసుకొంటున్నారు. దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడు నేను వ్రాసేది దేవుని బిడ్డలు కోసమే. ఎదుట వారికి తీర్పు తీర్చడం నాకేల? పౌలుగారు అంటున్నారు " ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైననూ- తిట్టుబోతుగాని, త్రాగుబోతుగాని. . . అయితే అట్టివానితో సాంగత్యము చేయరాదు, కలసి భుజింపరాదు. . . సంఘంలో నుండి వెలివేయమని చెబుతున్నారు (1కొరింథీ 5:11-13). ఎందుకంటే అది దేవునికి అసహ్యమైన క్రియ. మోసపోకుడి! జారులైననూ. . . త్రాగుబోతులైననూ, దూషకులైననూ. . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు (1కొరింథీ 6:9,10).
నేటి దినాలలో క్రైస్తవ జనాంగము దీనిని మరచిపోతున్నారు. లోకస్తులతో కలసి లోకస్తులు త్రాగుతున్నట్లు త్రాగుతున్నారు. దానివలన ఏమేమి సంభవిస్తాయో సొలొమోనుగారు వివరించారు. మొదటగా శ్రమ. తన దేహాన్ని తనే శ్రమ పెట్టుకొంటున్నాడు. తమ కుటుంబాన్ని కూడా శ్రమపెడుతున్నారు. దానివలన దుఃఖము అశాంతి, కారణం లేని జగడాలు, ఎందుకంటే త్రాగేసి ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. ఫుల్ గా త్రాగేసి రోడ్డుమీద పడిపోతారు, పందిలా బురదలో , డ్రైనేజీలో దొర్లుతుంటారు. ఫలితంగా హేతువులేని గాయాలు. గమనించండి అన్యులుకూడా ఇలా చేస్తారు కాని ఎవరూ పట్టించుకోరు, అదే దేవుని బిడ్డలు చేస్తే పెద్దరాధ్ధాంతం చేస్తారు దేవుని బిడ్డలు రోడ్డుమీద దొర్లుతున్నారు అంటారు. తద్వారా దేవుని నామం అవమానపరచడుతుంది దూషింపబడుతుంది. ఇంకా ఏమి వస్తాయి? Sugar, BP, Lever పనిచేయదు, ధూమపానం వలన ఊపిరితిత్తుల పాడైపోతాయి, కేన్సర్ ఇంకా అనేక రోగాలు - పిమ్మట అది సర్పము వలె కరచును అంటే ఇదే. కట్లపాము కాటేస్తే వెంటనే చనిపోరు, పక్షవాతము, ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి. ఈ మద్యపానం, ధూమపానం వల్ల కూడా అలాగే ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి. ప్రియ సహోదరుడా! దేవుని పరువు తీస్తున్నావు, నీ ఆరోగ్యం పాడుచేసుకొంటున్నావు. నీ కుటుంబాన్ని కూడా బాధపెడుతున్నావ్. త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని తెలుసుకో!
కొందరంటారు త్రాగకూడదని బైబిలులో ఎక్కడుంది? వారు బైబిల్ చదివితేనే కదా తెలుస్తుంది ఎక్కడ వ్రాయబడిందో తెలుస్తాది. 1కొరింథీ 5:10-13; 6:9,10; 1 పేతురు 4:3; సామెతలు 23:29-35. ఇంకొందరు అంటారు మరి పౌలుగారు తిమోతిగారికి పత్రిక వ్రాస్తూ నీ కడుపు నొప్పి కోసం ద్రాక్షారసం తీసుకోమని వ్రాశారు కదా అని. ప్రియబిడ్డా! దైవ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, కలిపి చెరపకూడదు. నీకు అనుకూలంగా మలచుకోకూడదు.
1. ఇక్కడ ద్రాక్షారసం (wine) అంటే ద్రాక్షపళ్ళునుండి తీసిన రసం డైరెక్టుగా త్రాగమని అర్థం. దానికి ఈస్ట్ కలిపి, పులియబెట్టిన తర్వాత త్రాగమనికాదు. ప్రస్తుతం చాలామంది (RCM) చేస్తున్న పని ఇదే. బైబిల్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు.
2. పూర్వకాలంలో Medicine అభివృద్ధికాని రోజులలో యూరోప్, మధ్య ఆసియా ప్రాంతాలలో ఏదైనా అనారోగ్యం కలిగితే ద్రాక్షరసం, అంజూరపు ఆకులు, ఒలీవ ఆకులు, ఒలీవ నూనె వాడేవారు. (మన దేశంలో నల్లమందు వాడినట్లు 50 సం. ల క్రితం) . ద్రాక్షరసంతో గాయాలు కడిగితే తొందరగా నయమయ్యేది (wine తో కాదు). ఆ ద్రాక్షారసం త్రాగితే కడుపు నొప్పి లాంటివి తగ్గేవి. ఆ ఉద్దేశంతోనే పౌలుగారు చెప్పారు గాని ఈస్ట్ కలిపిన wine త్రాగమని చెప్పలేదు.
ధూమపానం
కొంతమంది సిగరెట్లు త్రాగకూడదు అని బైబిలులో లేదుకదా, త్రాగితే తప్పేంటి అని అడుగుతారు. బైబిలు వ్రాయబడినప్పుడు సిగరెట్లు బీడీలు లేవు ఉంటే వ్రాయబడి ఉండేది. ఒకవేళ దేవుడు ధూమపానాన్ని అనుమతిస్తే నీ తలమీద గాని, మరో ప్రాంతంలో ఒక పొగ గొట్టాన్ని (exhaust pipe) పెట్టి ఉండేవారు కదా! గాలి పీల్చుకోడానికి ముక్కు రంధ్రాలు, మలమూత్ర విసర్జనకు మరో రంధ్రాలును ఏర్పాటుచేసినట్లు. ఎంత ఘోరమంటే ఆ సిగరెట్ పేకట్ మీద ప్రొగత్రాగడం హానికరం అనివ్రాసినా డబ్బు పెట్టి కొని, అగ్గి పెట్టి కాల్చేస్తున్నావు. కొంత కాలానికి అవి నీ ఊపిరితిత్తులను తినేస్తాయి. మరికొందరు మాధక ద్రవ్యాల మత్తులో మూలుగు తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి కాలేజీలలో అడ్మిట్ చేస్తున్నారు తర్వాత వారు ఎలా ప్రవర్తిస్తున్నారో పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా వాళ్ళకోసం మోకాళ్ళ మీద కన్నీటితో దేవునికి ప్రార్థన చెయ్యడం లేదు.ఫలితంగా సాతాను మీ పిల్లలను ఈ లోకాశలమీదకు మళ్ళించి నాశనానికి తీసుకొని పోతున్నాడు.
ఇక పేతురుగారు అంటున్నారు మద్యపానం గాని, త్రాగుబోతుల విందులు గాని చేయగూడదు అని (1 పేతురు 4:3). పౌలుగారు అంటున్నారు త్రాగుబోతులు పరలోకం వెళ్లరని (1 కొరింథీ 6:9,10). యెషయా గ్రంథంలో త్రాగుబోతులకు శ్రమ అంటున్నారు (యెషయా 28:1).
అందుకే యోవేలు గ్రంథంలో దేవుడంటున్నారు "మత్తులారా! మేలుకొని కన్నీరు విడువండి, ద్రాక్షరస పానం చేయువారలారా! రోదనం చేయుడి" (యోవేలు 1:5)
కాబట్టి నేడే నీ మత్తు, మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలు వదలి యేసయ్య పాదాలు దగ్గరకు రా! మానేద్దామని అనుకొంటున్నా మానలేక పోతున్నావా? నీ సిగరెట్ పేకట్లు, మందు బాటిల్లు బయట పారవేసి యేసయ్య పాదాలను నీ కన్నీటితో కడుగు. వెంటనే నీకు దేవుడు వాటిమీద అసహ్యాన్ని కలిగిస్తారు. అప్పుడు నీవు సంతోషిస్తావు. నీతో పాటు నీ కుటుంబం. సమాజంలో మంచి పేరు కూడా వస్తుంది. చివరకు పరలోకాన్ని పొందుకొంటావు.
అట్టి కృప అందరికీ కలుగును గాక!
దైవాశీస్సులు.




భక్తుడైన హబక్కూకు

*8వ భాగం-రెండవ ప్రశ్నకు జవాబు*
*నరహత్యచేసేవారికి కలుగు తీర్పు*.

హబక్కూకు 2:12—14
12. నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించువారికి శ్రమ; దుష్టత్వము జరిగించుటచేత కోటను స్థాపించువారికి శ్రమ.
13. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు; వ్యర్థమైనదానికొరకు కష్టపడి జనులు క్షీణించుదురు; ఇది సైన్యముల కధిపతియగు యెహోవా చేతనే యగునుగదా.
14. *ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును*.

ప్రియ దైవజనమా! గతభాగంలో రెండో ప్రశ్నకు జవాబుగా త్రాగుబోతులకు వచ్చే తీర్పు ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు నరహత్యలు- మానభంగాలు చేసే వారికి తీర్పులు చూసుకుందాం.
గమనించాలి – ఇది కూడా బబులోను వారియొక్క ఒక లక్షణమే! అందుకే బబులోను రాజు నరహత్యలు చేస్తూ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు కాబట్టి అట్టివానికి కలుగు తీర్పులు ఇవి. నేటికాలంలో కూడా విదేశాలలోనే కాదు మన దేశంలో కూడా ధనం కోసం, అక్రమ సంభందాలకోసం అనేకమైన హత్యలు జరుగుతుండడం మనం చూస్తున్నాం. అలాంటివారికి శ్రమ అని చెబుతున్నారు దేవుడు. దేవుడిచ్చిన ఆజ్నలలో ఒకటి నరహత్య చేయకూడదు. నిర్గమ 20:13; ద్వితీయ 5:17; అయితే వీడు హత్యలతోనే సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. అలాంటివారికి శ్రమ! దేవుని ఉగ్రత వస్తుంది. కొంతమంది అంటారు మేము హత్యలు చేయడం లేదు అయితే కత్తిపోటువంటి మాటలు పలుకు వారు కలరు. ఇదికూడా బైబిల్ లోనే ఉంది- సామెతలు 12:18;
కత్తిపోటువంటి మాటలు పలికి- ప్రజలను మానసికంగా హత్యచేసేవారు మనలోనే చాలామంది ఉన్నారు. పైకి బాగా మాట్లాడతారు- గంటలు గంటలు ప్రార్ధన చేస్తారు గాని వారి బ్రతుకు బాగుండదు. బయటవారిని మాటలతో హింసిస్తారు ఇక ఇంట్లో వారిని చెప్పలేము. ముఖ్యంగా బార్య- భర్త మీద, అత్త-కోడలు మీద, కోడలు- అత్తమీద కత్తిపోటు వంటి మాటలు పలికి మానసికంగా హింస చేస్తుంటారు. వీరికి కూడా తీర్పు ఉంది జాగ్రత్త!
13వ వచనం సెలవిస్తుంది- వీరు అగ్ని పాలవుదురు. ఇక్కడ కాకపోయినా అక్కడ అనగా నరకములో నిత్యాగ్ని గుండములో ఒకరోజు కాదు, రెండురోజులు కాదు, సంవత్సరాలు కాదు యుగయుగాలు కాలుతూ ఉంటారు జాగ్రత్త! అందుకే ప్రకటన గ్రంధంలో హత్యలు చేసేవారు అగ్నిగుండంలో పాలుపొందుతారు అని వ్రాయబడింది. ప్రకటన 21:8 22:15; యేసయ్య అంటున్నారు- అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు! మార్కు 9:48;

కయీను తమ్మున్ని హత్య చేశాడు- శాపం పొందాడు. కయీనును మరొకడు చంపాడు—వీడు కయీను కంటే ఏడంతలు శాపం పొందాడు.
బైబిల్ గ్రంధంలో రాజులు- దినవృత్తాంతముల గ్రంధాలలో అనేకమంది హత్యలు చేసి- ప్రతిఫలం పొందినట్లు చూస్తున్నాం.
ఇక రాజైన దావీదు- ఊరియాను హత్యచేయించారు- ఏం జరిగింది? దేవునిచేత శపించబడి- జీవితాంతం మనశ్శాంతి కోల్పోయారు- కుటుంబంలోనే భయంకరమైన తగాదాలతో తన జీవితం గడచిపోయింది. కాబట్టి నరహత్యలు చేయడం దేవునికి ఇష్టం లేని పని!

ఇక గతభాగంలో దేవునితీర్పుల మధ్య అమూల్యమైన మాట చెప్పినట్లు ఇక్కడ కూడా మరో అమూల్యమైన మాట కనబడుతుంది మనకు 14వ వచనంలో! ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును*. . . . . . .
భూమి యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. అవును ఆయన చేసిన సృష్టిని ధ్యానం చేస్తే- అది చాలా అద్భుతమైనది. ఆయన మనిషిని చేసిన విధానమే అద్భుతమైనది. మానవుని శరీరంలో జరిగే వివిధరకాల వ్యవస్తలు- ప్రక్రియలు ఆలోచిస్తే- దేవుని తెలివితేటలకు నిజంగా జోహార్లు అర్పించాలి. ఇదే విషయాన్ని సంఖ్యాకాండము లో దేవుడు చెబుతున్నారు 14:21
అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును.

ఇక ఇదే విషయాన్ని యెషయా గారు ఎత్తి రాస్తున్నారు. 11:9
నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.

అయితే ఇది రెండవరాకడ తర్వాత సంభవిస్తుంది. ఈ భూలోక రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యాలైనప్పుడు ఇది జరుగుతుంది. ప్రకటన 11:15 లో ఇది మనకు కనబడుతుంది.
ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములుఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

అలాగే దానియేలు గ్రంధంలో 2వ అధ్యాయంలో ఇదే బబులోను రాజైన నెబుకద్నేజరుకి దేవుడు ఈ విషయం ఎప్పుడో చూపించారు. దాని అర్ధం కూడా దానియేలు గారితో చెప్పించారు. 2:34—35; 44;

ఆ నిత్య రాజ్యములో స్థానం కావాలి అంటే ఇలాంటి నరహత్యలు మానేయాలి. అలాగే కత్తిపోటువంటి మాటలు కూడా మానెయ్యాలి.
అప్పుడు ఆ నిత్యరజ్యాన్ని స్వాధీనం చేసుకోగలవు! కాబట్టి అలాంటి మాటలు- చేష్టలు వదిలేద్దాం!
దేవుని రాజ్య పౌరులం అవుదాం!
ఆమెన్!
దైవాశీస్సులు!



భక్తుడైన హబక్కూకు

*9వ భాగం-రెండవ ప్రశ్నకు జవాబు*
*వంచకులకు కలుగు తీర్పు*

హబక్కూకు 2:15—17
15. తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ.
16. ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు; నీవును త్రాగి నీ మానము కనుపరచు కొందువు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీకియ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనతమీదపడును.
17. లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీమీదికే వచ్చును,పశువులను బెదరించిన బెదరు నీమీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యనుబట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును.

ప్రియ దైవజనమా! గతభాగము నుండి రెండో ప్రశ్నకు దేవుని జవాబును ధ్యానం చేసుకుంటున్నాం. నేడు వంచకులకు కలిగే శిక్ష చూసుకుందాం. అయితే ఈ వంచకులకు కలిగే తీర్పులో మధ్యం తాగేవారికి కలిగే తీర్పుకూడా ఇమిడి యుంటుంది కారణం ఈ వంచనలో భాగంగా వారు మద్యాన్ని ఉపయోగిస్తున్నారు.

ఈ 15వ వచనంలో వీరు మద్యం త్రాగించి- ఎదుటివారి మానం చూడాలని కోరుకుంటున్నట్లుగా చూసుకోవచ్చు!
తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ.
మరల మీకు మరోసారి గుర్తుకు చేస్తున్నాను—ఇలాంటి పనికిమాలిన టెక్నిక్ లు ఉపయోగించి బబులోను వారు ఇతర రాజ్యాలు ఆక్రమించు కున్నారు. పొరుగురాజ్యాల వారికి మందు తాగించి వారి గుట్టులు తెలుసుకుని, వారు మత్తులో ఉన్నప్పుడే వీరు ఎటాక్ చేసేవారు. 16:ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు; నీవును త్రాగి నీ మానము కనుపరచు కొందువు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీకియ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనతమీదపడును. . . . .
దేవుని తీర్పు చూడండి. నీ పాత్రలోనిది నీవే త్రాగుతావు అంటున్నారు అనగా నీవు చేసినట్లే నీకు కలుగుతుంది. బబులోను ఇతరులకు చేసినట్లే దేవుడు బబులోనుకి చేస్తాను అన్నారు! చేశారు కూడా! గతభాగంలో చెప్పినట్లు ఈ నెబుకద్నేజర్ కొడుకు బెల్షస్సర్ త్రాగి మత్తులో ఉన్నప్పుడే మాదీయ రాజు కోరెషు (Cyrus) ఎటాక్ చేసి గెలిచాడు. ఎవరు చేసింది వాడి నెత్తిమీదకు వస్తుంది. ఎవడు త్రవ్విన గుంటలో వాడే పడతాడు.
కీర్తనలు 18:25—26
25.దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు
26.సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు . . .

ఇప్పుడు దేవుడు త్రాగడానికి ఒకపాత్రను ఇవ్వబోతున్నారు బబులోనుకి. అది త్రాగినప్పుడు వాని బలం, సిరిసంపదలు, వైభవం, అంతా పూర్తిగా కోల్పోయి, నగ్నంగా అవమానంలో పడిపోతాడు అంటున్నారు దేవుడు!

యిర్మియా 25:15—16, 27—28
15. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనము లన్నిటికి దాని త్రాగింపుము.
16. వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు.
17. అంతట యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని.
27. నీవు వారితో ఈలాగు చెప్పుముఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీమీదికి పంపబోవు యుద్ధముచేత త్రాగి మత్తిల్లి కక్కు కొనినవారివలెనే యుండి మీరు మరల లేవకుండ పడు దురు.
28. మేము త్రాగమని వారు నీ చేతిలోనుండి ఆ పాత్రను తీసికొననొల్లని యెడల నీవు వారితో ఇట్లనుముమీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకధి పతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. . . .
ఇదీ వంచకులకు వచ్చే తీర్పు! వంచన చేసే ప్రతీవారికి ఇదే తీర్పు!
అందుకే యెషయా గ్రంధంలో నిన్ను ఎవరూ దోచుకోనకపోయినా దోచుకుంటున్న నీకు శ్రమ అంటున్నారు దేవుడు. .
యెషయా 33: 1
దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొన బడెదవు నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచించెదరు. .. .

బైబిల్ లో ఒక నీతిమంతుడు ఉన్నాడు. లోకాన్ని ప్రేమించాడు. బైబిల్ సెలవిస్తుంది అతడు నీతిమంతుడు అని—గాని అతనికి ఇద్దరు పనికిమాలిన, విలువలు లేని కుమార్తెలు ఉన్నారు. దేవుడు సొదోమ-గోమోర్రా—అద్మా-- సెబాయిములను అగ్ని గంధకాలతో కాల్చితే ఇక లోకంలో మగాడే లేడు అనుకొన్నారు. వారికి తెలుసు అబ్రాహాముగారు ఉన్నారు, ఆయనకు పిల్లలు పుట్టి ఉండచ్చు అనుకోలేదు, నాహోరుకు మగ సంతానం ఉంది; లేకపోతే అబ్రాహాము గారి పనివారిలో అనేకమంది మగవారున్నారు అని తెలుసు! కాని ఈ ఇద్దరు మీదన 15వ వచనంలో చెప్పిన విధముగానే వీరు తండ్రికి పూర్తిగా మద్యం త్రాగించి, అతడు మత్తులో ఉన్నప్పుడు తండ్రితోనే పాపం చేసి పిల్లలు కని శపించబడ్డారు. అవమానం పొందారు. నీతిమంతుడైన తండ్రి లోతుకు అవమానం తీసుకుని వచ్చారు.

యాకోబు వంచన చేసి అన్నను మోసగించి అతని ఆశీర్వాదాలు రెండుసార్లు కొట్టేశాడు. చివరికి లాబాను చేతిలో వంచనకు గురయ్యాడు. లాబాను వంచన చేసి- యాకోబుగారికి లేయాను ఇచ్చి పెళ్లి చేశాడు. తద్వారా లేయా జీవితాంతము యాకోబుతో ద్వేషించబడింది చేయని నేరానికి జీవితాంతం శిక్ష అనుభవించింది. ఈ వంచనకు ప్రతిఫలం ఏమిటంటే—బైబిల్ ప్రకారం వారు అనగా అన్నదమ్ములు మధ్య తగాదాలు ఉన్నాయి గాని యాషారు గ్రంధం ప్రకారం తండ్రులతో ఈ తగవులు పోలేదు. పిల్లల పిల్లలు కూడా తగవులాడి చచ్చారు. చివరికి ఈ రోజుకి కూడా అదే తగవులతో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి వంచన అనేది చేయనేకూడదు! బైబిల్ లో ఇంకా అనేక రిఫరెన్సులు ఉన్నాయి వంచన చేస్తే ప్రతిఫలం దేవుడు వారి వంచనకు వారి నెత్తిమీదకే శాపం తీసుకుని వచ్చారు.

ఇక 18—20 వరకు విగ్రహారాధన చేసేవారికి తీర్పులు ఉన్నాయి. వీటికోసం మనం ఇంకా వివరంగా చూసుకోవచ్చు కీర్తనలు 115:4—8; యెషయా 40:18—22; 41:29; 44:9—20; ఈ విగ్రహాలకోసం దేవుడు తీర్పులు ఇవ్వడానికి కారణం బబులోను విగ్రహాలు ఎక్కువగా పెట్టి వాటికి పూజ చేసేవాడు. దానియేలు ౩వ అధ్యాయం ప్రకారం ఒక బంగారు బొమ్మను చేసి దేవుని బిడ్డలైన షడ్రక్, మేషాక్, అబెద్నేగోలను శోధించినట్లు- చివరికి దేవుడే అగ్ని గుండములోనికి వచ్చి వారిని రక్షించినట్లు చూడగలం! కాబట్టి దేవునికి అసహ్యమైన క్రియ విగ్రహారాధన!
కేవలం విగ్రహాలు పెట్టుకుని వాటికి కొబ్బరికాయలు, అగరుబత్తి పెట్టడం విగ్రహారాధన అనుకున్నావేమో—దేవునికంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అదే నీకు విగ్రహం! అది నీ భార్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పిల్లలు కావచ్చు, నీ అహం, ధనం, కామం, అధికారం ఎవరైనా ఏదైనా కావచ్చు! చివరకు నీ మొబైల్ ఫోన్లు కావచ్చు! దేవునికి ఇచ్చే మహిమ, దేవునికి చెందవలసిన స్తుతి, దేవునికి ఇవ్వవలసిన సమయం, importance, దేవునికే చెందాలి తప్ప మరొకరికి చెందకూడదు. అలా చేస్తే అది విగ్రహారాధన, అప్పుడు దేవునికి కోపం వస్తుంది!

కాబట్టి ప్రియ చదువరీ! నిన్ను నీవు సరిచూసుకో! సరిచేసుకో! దేవునికన్నా దేనినైన ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో!!
అది విగ్రహారాధన సుమా!
మనల్ని మనం సరి చేసుకుందాం! వంచనలకు దూరంగా ఉందాం!
దేవుని రాజ్య వారసులమవుదాం!
దైవాశీస్సులు!


భక్తుడైన హబక్కూకు

*10వ భాగం*

హబక్కూకు ౩:17—19
17. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను
18. నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను.
19. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును. . . .

ప్రియులారా! మరోసారి మీకు గుర్తు చెయ్యాలని అనుకుంటున్నాను- మొదటిభాగంలో చెప్పిన విధముగా ఈ మూడవ అధ్యాయం ఇశ్రాయేలీయులు చెరపట్ట బడిన తర్వాత, యేరూషలేము కాల్చబడిన తర్వాత, ప్రవక్త తన దేశానికి తిరిగి వచ్చి, ఒక చిన్న ఎస్టేట్ లో ఉన్నప్పుడు దేవుని దూత ఆయనను దానియేలు గారి దగ్గరకు తీసుకుని వెళ్లి- ఆయనతో మాట్లాడి, ఆయన అనుమానాలన్నీ తీర్చబడిన తర్వాత దేవుణ్ణి కీర్తిస్తూ, నీవుంటే నాకు చాలు అనే సంతృప్తితో వ్రాస్తున్న పాట! అంతేకాదు ఆయన ఒక వాధ్యకారుడని కూడా చెప్పుకున్నాము. కారణం ఈ అధ్యాయం యొక్క టైటిల్ ప్రధాన గాయకునికి నా తంతి వాద్యములతో పాడదగినది అని చెప్పారు అనేక తర్జుమాలలో! మొదటి అధ్యాయంలో ఉన్న అనుమానాలు అడగబోయేసరికి ఇంకా యెరూషలేము పట్టబడలేదు. ఈ మూడో అధ్యాయం రాబోయేసరికి అన్నీ అయిపోయాయి. పట్టణం కాల్చబడింది. చివరికి ఈయనకున్న ఎస్టేట్ లు అన్నీ పోయాయి, అంజూరపు తోటలు పోయాయి. తనకున్న పశుసంపద మొత్తం పోయింది. తనకున్న దేవాలయ ప్రవక్త ఉద్యోగం పోయింది. మందిరమే కాల్చబడి- దేశంలో మనుషులే లేనప్పుడు తనకున్న దేవాలయ వాద్యకారుడు ఉద్యోగం పోయింది. తనకున్న తంతివాద్యములు మూగబోయాయి! తిరిగి ఈమూడో అధ్యాయంలో- దేవుని ప్రత్యక్ష్యత తర్వాత తంతివాధ్యం మ్రోగడం మొదలుపెట్టింది గొప్ప దైవికమైన సంతృప్తితో!

అంటున్నారు ప్రవక్త యెహోవా నిన్నుగూర్చిన వార్త విని నాకు మరలా భయభక్తులు కలుగుతున్నాయి. నీ కోసం, నీవు చేసిన అద్భుతకార్యాల కోసం చాలాసార్లు విన్నాను. దానిని మరలా వినిపించు. అవన్నీ పాతవి అంటున్నారు ప్రజలు—అయితే ఇప్పుడు అదేకార్యాలు- అనగా నీవు చేసిన అద్భుతాలు- ఐగుప్తులో నీవు చేసిన మహా గొప్ప కార్యాలు మరల నూతన పరచు అనగా భక్తుని ఉద్దేశం మరలా వాటిని నీ నామ మహిమార్ధం మరలా చేయండి అని అడుగుతున్నాడు భక్తుడు! పాత అద్భుతాలు కాదు ఇప్పుడు మరలా నూతనముగా చేయండి. మాకున్న భక్తి విశ్వాసాలు మెండుగా పెరగాలంటే ఇవి మాకు కావాలి ప్రభువా! నీ కోపంలో కరుణను చూపించండి. నీవు కోపించుచునే వాత్సల్యము చూపించే దేవుడవు అంటున్నారు భక్తుడు! అవును నిజంగా దేవుడు మనఎడల వాత్సల్యత చూపించక పోతే ఎప్పుడో మనం మసి అయిపోయి ఉండేవారము. ప్రజలు మనలని ఇప్పటికి ఎప్పుడో మరచిపోయి ఉండేవారు. అందుకే యిర్మియా భక్తుడు రాస్తున్నాడు—అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును!! విలాపవాక్యములు 3: 23
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
నిజమే కదా!

ఇక 4—13 వరకు దేవుని మహిమ కోసం వ్రాయబడింది. ఇక్కడ 5వ వచనంలో ఆయన ముందర తెగుళ్ళు నడుస్తున్నాయి అంటున్నారు కారణం అప్పుడు మొత్తం అన్ని దేశాలమీదకు దేవుని ఉగ్రత కలుగుతుంది కాబట్టి ఆయన ముందర తెగుళ్ళు నడుస్తున్నాయి అంటున్నారు భక్తుడు. అయితే కీర్తనలు గ్రంథం ప్రకారం ఆయన ముందర అగ్ని మండుచున్నది. కీర్తనలు 50: 3
మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టు ప్రచండ వాయువు విసరుచున్నది.

యేహెజ్కేలు గ్రంధంలో దేవుని ప్రభావ దర్శనాలు కలిగిన అధ్యాయాలలో కూడా మనకు దేవుని ముందర అగ్ని కనిపిస్తుంది.
10 వచనంలో నిన్ను చూసి పర్వతాలు కంపిస్తున్నాయి అంటున్నారు ఇదేమాట చాలాసార్లు వ్రాయబడింది. చివరకు ఏలియాగారికి హోరేబుకొండమీద ప్రత్యక్షం అయినప్పుడు కూడా పర్వతాలు కంపించాయి. 1రాజులు 19:11;

ఇక ఇంతవరకు దేవుణ్ణి పొగడుతూ, ఆయన ఆశ్చర్యకార్యాలు ధ్యానం చేసి- ఇక పరవశుడై అంటున్న అమూల్యమైన విశ్వాసపు మాటలు :17—19
*అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను*
18. *నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను*.

17 వ వచనంలో ఉన్నవన్నీ ఇంతవరకు ఉండేవి తనకు, గాని ఇప్పుడు ఏమీలేవు. ఏమీలేవు అని చింతపడుతూ ఉండేవారు ఆయన ఎప్పుడూ. మొదటి భాగంలో ఈ విషయం వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు దేవుని ప్రత్యక్షత- దానియేలు గారితో ముఖాముఖి జరిగాక- దేవునిమీద భక్తిపారవశ్యాలు పొంగిపొర్లాయి! అయ్యా నాకు ఏమీ లేకున్నా నీవుంటే చాలు అంటున్నారు.
*నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను*.

*ప్రియ సహోదరీ/సహోదరుడా! నీకు అలాంటి విశ్వాసం ఉందా? నీకు ఉద్యోగమున్నా, లేకున్నా, నీకు ఆరోగ్యమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా దేవునియందు ఆనందించగలవా? ఆనదించ గలుగుతున్నావా? ఒకరోజు రాబోతుంది- ఆరోజు యేసుప్రభులవారిని నమ్ముకుంటే నీ రేషన్ కార్డు కేన్సిల్ చేస్తాము, నీ ఉద్యోగం తీసేస్తాము*, *యేసుప్రభులవారిని నమ్ముకున్నావు కాబట్టి నీకున్న రిజర్వేషన్ కేన్సిల్ చేసేసాము, యేసుప్రభులవారి నమ్ముకున్నావు కాబట్టి నీ ATM కార్డు, నీ బాంకు అకౌంట్ చెల్లదు, నీకు ఏమీ ఇవ్వము, ఏసుప్రభుని విడచిపెట్టు అంటారు. అప్పడు నీవు దేవునికోసం సాక్షిగా ఉండగలవా? ఆకలిదప్పులకు సహించగలవా*? *యేసుప్రభుని వదిలేస్తావా లేక చస్తావా అని అడిగితే ఆయనకోసం హతస్సాక్షి కాగలవా? దేవునివాక్యం కోసం ప్రాణత్యాగం చేయగలవా? సహోదరీ/ సహోదరుడా! ఈరోజులు అతి తొందరలో రాబోతున్నాయి. అనేక దేశాలలో అప్పుడే వచ్చేశాయి. మనదేశంలో కూడా రాబోతుంది*!

అన్నీ ఉన్నప్పుడు ప్రజలు Praise the Lord; దేవుడు నాకు ఏమీ లేనప్పుడు అన్ని ఇచ్చాడు అని చెబుతారు. అన్నీ పోయినా సరే, దేవునికి స్తోత్రం చెయ్యగలవా? హబక్కూకు భక్తుడు నిండు మనస్సాక్షితో మనస్పూర్తిగా చెబుతున్నాడు—అయ్యా ఏమీ లేకున్నా నీవుంటే నాకు చాలు అంటున్నాడు, నీవు అలా చెప్పగలవా? భక్తుడైన యోబుగారు తన భార్యతో చెబుతున్నారు
2:9. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.
10. అందుకతడు మూర్ఖురాలు మాటలాడు నట్లు నీవు మాటలాడు చున్నావు; మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. .. ... .. ..
నీవు కూడా అలా చెప్పగలవా? మేలులు పొందినప్పుడే దేవుణ్ణి స్తుతిస్తూ, మేలులు కలుగకపోతే కష్టాలు/ శ్రమలు/శోధనలు కలిగితే దేవుణ్ణి నిందిస్తావా లేక దేవుణ్ణి స్తుతిస్తావా? ఎవరైతే కష్టాలలోను, లేమిలోను, చివరికి మరణాపాయంలోను దేవుణ్ణి స్తుతించే అనుభవం కలిగి ఉంటారో వారినే దేవుడు భళా నమ్మకమైన మంచిదాసుడా అని తన ఒడికి చేర్చుకుంటారు. నీ రిజర్వేషన్ ల కోసం, నీ రేషన్ కార్డుల కోసం, నీ ఉద్యోగం కోసం, నీ ఎన్నికల కోసం దేవుణ్ణి అమ్మేసుకుంటే, నేను క్రైస్తవుడిని కాదు అని చెబితే దేవుడు ఒకరోజు ఆయన మహిమలో వచ్చినప్పుడు—ఆ దివ్య సింహాసనం ఎదుట యేసుప్రభులవారు చెప్పబోతున్నారు—అక్రమము చేయువారలారా! మీరెవరో నాకు తెలియదు. మత్తయి 7:21-23; లూకా 13:25-27;
అప్పుడు నీవు చేసిన ప్రార్ధనలు, అద్భుతాలు, ప్రవచనాలు, గొప్పగొప్ప కార్యాలు అన్ని సున్నాగా మారిపోతాయి. కాబట్టి ఆయన యందు విశ్వాసం విడువకు. మేలులు పొందినా స్తోత్రం-- పొందక పోయినా స్తోత్రం అని చెప్పగలిగే స్తితిలో ఉండు! అప్పుడు ఆయన నీ ప్రతీ భాష్పబిందువును తన చేతితో తుడిచి, నిన్ను ఎత్తుకొంటారు. ప్రకటన గ్రంథం 7: 17
ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.

ఏదికావాలో నిర్ణయించుకో!
హబక్కూకులాంటి తెగింపు, యోబుగారి లాంటి విశ్వాసం దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(సమాప్తం)
************************************
ప్రియ దైవజనమా! హబక్కూకు గారి జీవితం మీతో మాట్లాడిందని నమ్ముచున్నాను. చదువరులంతా అలాంటి భక్తీ విశ్వాసాలు కలిగి ఉండాలని ప్రార్ధిస్తున్నాను. మరో భక్తుని చరిత్రతో మరలా కలుసుకుందాం. నాకోసం ప్రార్ధించండి.

ఇట్లు మీ సహోదరుడు
రాజకుమార్ దోనె

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్రిస్మస్

శరీర కార్యములు

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

సమరయ స్త్రీ

పాపము

విశ్వాసము

ప్రభువు నేర్పిన ప్రార్ధన - పరలోక ప్రార్ధన