ఒంటరి పిచ్చుక



ఒంటరి పిచ్చుక






రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను. కీర్తనలు 102:7                                                   
శోధనల వెంబడి శోధనలు తరుముకొస్తున్నప్పుడు, నెమ్మది కోల్పోయిన స్థితిలో కీర్తనాకారుని అంతరంగములోనుండి పెల్లుబికివస్తున్న ఆవేదన ఇది. ఆయన స్థితి ఎంతటి దయనీయంగా వుందో ఆయన మాటలనుబట్టి అర్ధం చేసుకోగలము.

1️.
మెలకువగా నుండి
(
అంటే నిద్రలేదు, విశ్రాంతిలేదు )
2️.
ఇంటిమీద
(అంటే భద్రత లేదు)
3️.
ఒంటిగా
(
అంటే, తోడులేరు)
4️.
పిచ్చుక
(
అంటే, విలువలేదు)
ఒక్కసారి ఆయనకు కలిగిన ఈ నాలుగు అనుభవాలను మనం ధ్యానం చెయ్యగలిగినట్లయితే, ఎదో ఒక సందర్భంలో మనంకూడా వీటిగుండా ప్రయాణించినవారమే. అనేకులము నేటికిని ఈ అనుభవాల్లో నిలచియున్నవారమే. అయితే, పరిశుద్దాత్ముని ప్రేరేపణలో వ్రాయబడిన ఈ మాటలు ధ్యానించినప్పుడు, మన జీవితాలకు చెప్పలేనంత సమాధానం, ఆదరణ కలుగకమానదు.

1️. మెలకువగా నుండి. (నిద్రలేదు, విశ్రాంతిలేదు)


కీర్తనాకారుని హృదయంలో రేగిన అలజడికి, నిద్రలేని రాత్రుళ్ళు గడుపుతున్నారు. నిద్రలేని జీవితానికి విశ్రాంతి లేదు. ఇట్లాంటి అనుభవాలకు మన జీవితాలుకూడా అతీతమైనవేమీ కాదు. సమస్యల సుడిగుండంలో పడి తిరుగుతూ, పరిష్కారం లేదనుకునే సమస్యలతో తల్లడిల్లిపోతూ, ఏ రేవుకెళ్ళినా ముండ్లపరిగే అన్నట్లు, అపజయాలతో విసిగి వేసారిపోయి, జీవితంలో అలసిపోయి, కృంగిన స్థితిలో, ఆపత్కాలంలో ఆశ్రయమవుతారు అనుకున్నవారే, నిర్లక్ష్యం చేస్తున్న స్థితిలో, ఆవేదన హద్దులు దాటి, ఆదరించేవారు లేక, ఓదార్చేవారు అసలే లేక, సమాధానం లేని ప్రశ్నలు మనలను వెంటాడుతుంటే? హృదయభారంతో ఇక నిద్రకు స్థానమెక్కడ? లోకమంతా హాయిగా నిద్రపోతున్నాగాని, ఆ నాలుగు గోడల మధ్య, నిరాశా నిస్పృహలతో రాత్రంతా ఒంటరిగా గడిపిన రాత్రుళ్ళు కోకోల్లలుకదా? కళ్ళు పొడిబారి, నిద్రరాక, తెల్లవారడానికి క్షణమొక యుగంలా గడుస్తున్న పరిస్థితులలో మన జీవితాలకు విశ్రాంతి ఎక్కడ?

ప్రభువు కాపరత్వంలోనున్నప్పుడే విశ్రాంతి: నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. (కీర్తనలు 23:3)
విశ్వాసులు ఈలోకంలో ఉన్నంత కాలం అలసట, విషమ పరీక్షలు తప్పవు. అలాంటి కృంగిన స్థితిలో వున్నప్పుడు కాపరి వారి దరిచేరి వారి ఆత్మలకు సేదదీర్చి, ఊరడిస్తాడు. విశ్రాంతిని కలుగజేస్తారు. యిట్టి అనుభవంలోకి నీవు ప్రవేశించగలగాలి అంటే? ఆయన కాపరత్వం లో నీవుండాలి. వేరొక మార్గం లేనేలేదు.
నీ సమస్త భారమును ప్రభువుకు అప్పగించగలిగినప్పుడే నీకు విశ్రాంతి: నీవు మోస్తున్న ప్రతీ భారాన్ని విడిచిపెట్టాలి. నీవు ప్రశ్నించొచ్చు, నాకు పాప భారముంది, ఆర్ధిక భారముంది, కుటుంబ భారముంది ఇట్లా ఏవేవో వున్నాయి వాటన్నిటిని విడచిపెట్టేస్తే వాటిని మోసేదెవరని? అది ఆర్ధిక భారమైనా, పాప భారమైనా, అది ఏ భారమైనా సరే. నీవు విడిచిపెడితే మోసేవారొకాయన వున్నారు. నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును (కీర్తనలు 55:22) నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. (సామెతలు 16:3) మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. (1 పేతురు 5:7) నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును (కీర్తనలు 37:5) ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. (మత్తయి 11:28) నిన్ను పిలిచిన ప్రభువు నీనుండి ఎదో ఆశించేవారు కాదు. నీ కోసం తన రుధిరమంతా చిందించి, తన ప్రాణాన్ని సహితం ధారపోసారు. ఆ ప్రియ రక్షకుని చెంతకు నీవు రాగలిగితే, ఆయన కాపరత్వంలో నీవుండగలిగితే, నీ భారమంతా ఆయనకు అప్పగించగలిగితే, ఆయన నిన్ను నిద్రపుచ్చి, నీకు కావలివుంటారు. ఆత్మ శాంతి, నిజ విశ్రాంతి ప్రభువులోనే సాధ్యం. ఆయన పాదాల చెంత చేరుదాం! నిజ విశ్రాంతిని అనుభవిద్దాం! అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్



రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను. కీర్తనలు 102:7

2. యింటిమీదనున్న పిచ్చుక
రాత్రి వేళలో పిచ్చుక ఇంటిపైన వుంటే, గుడ్లగూబ గాని, పిల్లిగాని మరి ఏదైనా గాని సులభముగా దానిని ఎత్తుకుపోగలవు. అది చిటారు కొమ్మన లేదా తన గూటిలోనో ఉంటేనే దానికి భద్రత. కానీ, ఈ పిచ్చుక రాత్రివేళ ఇంటిపైన గడుపుతుంది. అంటే, దీనికి ఆశ్రయముగాని, భద్రతగాని లేదు. అయితే మన జీవితాలు దీనికి భిన్నంగా వున్నట్లనిపించినాగాని, లోతుల్లోనికి వెళ్తే, దానికి మనకూ ఎట్లాంటి బేధము లేదనిపిస్తుంది. మనము డ్యూప్లెక్స్ బిల్డింగ్స్ లో , పక్కా గృహాలలో నివసిస్తూ, దొంగలుగాని, శత్రువులుగాని ప్రవేశించడానికి వీలులేకుండా మన గృహాలు ఉన్నప్పటికీ, ఇంటిపైన కాకుండా, ఇంటిలోనే జీవిస్తున్నప్పటికీ, ఇంటిపైనున్న పిచ్చుక యొక్క అనుభవాలనే కలిగియున్నట్లుగా వుంది కదా? ఆశ్రయము లేనట్లుగా, అభద్రతా భావంతో కృంగిన సందర్భాలెన్నో కదా? నేటికిని అదే పరిస్థితిలో కొనసాగుతున్న జీవితాలు కోకొల్లలు. వారిలో నీవూ ఉన్నావా? అయితే, ఈ పరిస్థితికి కారణమేమిటి? నీ ఇంటిలో ( హృదయంలో) ఆయన లేకుండా, ఆయన ఇంటిలో (సన్నిధి) లో నీవులేకుండా, ఆయనకు వేరుగా ఇంటిపైన (లోకం) ఉండడమే కావొచ్చేమో?

మన జీవితాలకు భద్రత, క్షేమం ఎక్కడ?
1️
. ప్రభువు మాత్రమే మన నివాసస్థలము కావాలి:
ఆయనకు దూరంగా, మనకు నచ్చినట్లుగా జీవించే జీవితాలకు భద్రత లేదు, క్షేమం లేదు, ఆశ్రయం లేదు. ఇవన్నీ మనకు అనుగ్రహించబడే ఏకైక స్థానం మన ప్రియ రక్షకుడైన ప్రభుయేసు పాదాలచెంత మాత్రమే. అందుకే దైవజనుడైన మోషే ప్రార్థిస్తున్నారు. ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. ( కీర్తనలు 90:1) ఆయననే ఒక నివాస స్థలముగా కలిగియుండి, ఆయన గుడారములో, ఆయన పర్ణశాలలో నివసించే జీవితాలు ధన్యములైనవి. ఈలోకంలో వారు కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ, సమాధానాన్ని మాత్రం కోల్పోరు. తర్వాత దినాలలో నిత్యమైన భద్రత, నిత్యమైన క్షేమం, నిత్య విశ్రాంతిని తప్పక అనుభవిస్తారు.
ఒకానొక దినాన్న మత చాంధసవాదులు నలుగురు అమ్మాయిలను నడిరోడ్డుమీద దారుణముగా అవమానించారు. వారు చేసిన తప్పేమిటి అంటే, వారి చేతుల్లో బైబిల్స్ వుండడమే. అయితే, ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని దేవుని రాజ్యానికి దూరం కాలేక, సమాజంలో సిగ్గుతో తలెత్తుకొని తిరగలేక కొండలకు పారిపోయి ప్రార్ధించడం మొదలుపెట్టారు. వారిని ఒక దైవ సేవకుడు పరామర్శించి, ఇక్కడ మీరేమని ప్రార్ధిస్తున్నారని అడుగగా? వారు చెప్పిన సమాధానం ఏమిటంటే? “ప్రభువైన యేసూ! ఈ లోకంలో మాకు క్షేమం లేదు, భద్రత లేదు. నీ రాజ్యంలోనే మాకు క్షేమం, మా జీవితాలకు భద్రత. ప్రభువైన యేసూ త్వరగా రమ్ము!” అని ప్రార్ధిస్తున్నాము. అవును! ఆయనతోనే, ఆయన రాజ్యంలోనే మనకు భద్రత. మన జీవితాలకు క్షేమం.

2️
. ఆయన రెక్కల క్రింద మాత్రమే మనకు ఆశ్రయము, ఆదరణ: ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. (కీర్తనలు  91:4) ఒక పర్వతం మీద జరిగిన అగ్ని ప్రమాద పరిశీలనకోసం ఒక బృందం అక్కడకి వెళ్తే, రెక్కలు చాచుకొని, కాలిపోయి, మరణించిన పక్షిరాజును చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఎందుకిది ఇట్లా చనిపోవాలి? మంటలు వ్యాపిస్తుంటే ఎగిరిపోవచ్చు కదా! అని. ఎందుకో వాళ్లకి అనుమానం వచ్చి ఆ పక్షిని పైకిలేపితే, దాని రెక్కల క్రింద సజీవంగా వున్నా పక్షి పిల్లలు వున్నాయట. అవును! నీకును ఆయన రెక్కల క్రింద అట్లాంటి కాపుదల, భద్రత, క్షేమం వుంది. నిన్ను సంరక్షించడం కోసం ఆయన ఆహుతి అయ్యాడు.

3️
. ఆయన పర్ణశాలలోనే మనకు భద్రత, క్షేమం: ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. (కీర్తనలు 27:5) ఆయన పర్ణ శాలలో ఎప్పుడు అడుగు పెట్టగలమంటే? ఆపత్కాలంలోనే! మనము ఎదుర్కొంటున్న శ్రమలు, శోధనలు ప్రభునకు మరింత దగ్గరచేసేవిగా వుండగలగాలి. శోధనలద్వారా మనము క్రీస్తుయొక్క సమరూపంలోనికి మారగలగాలి. ఎప్పుడైతే ఆయన పర్ణశాలలో అడుగుపెట్టామో? ప్రభువు మన కన్నీటిని ప్రేమతో తుడుస్తాడు. మన దుఃఖదినాలు సమాప్తమవుతాయి. మన కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది.

4️
. ఆయన గుడారము చాటున మాత్రమే మనకు భద్రత, క్షేమం: ఆపత్కాలమున ఆయన ....... తన గుడారపు మాటున నన్ను దాచును. (కీర్తనలు 27:5) ఆయన గుడారము చాటున ఎప్పుడు దాగి యుండగలమంటే? ఆపత్కాలంలోనే! యెహోవా! నీ ప్రసన్నతను చూచేటట్లు, నీ ఆలయంలో నిన్ను ఆరాధించేటట్లు, నా జీవితమంతా నీసన్నిధిలో నివసించాలి. ఇట్లాంటి ఆశను కలిగి యుండి, దానిని వెదికే వారముగా మనముంటే? ఆపత్కాల సమయంలో ఆయన గుడారంలో మనలను దాస్తాడు. నీవు ఎదుర్కొంటున్న ఆపదలు, శోధనలు, శ్రమలు... యివన్నీ ఆయన గుడారాములోనికి నిన్ను చేర్చగలిగితేనే వాటివలన నీ జీవితానికి క్షేమం, భద్రత. అట్లా కాకుండా నీవెదుర్కొంటున్న పరిస్థితులు దేవునినుండి నిన్ను దూరముగా నెట్టుతూవుంటే, అత్యంత ప్రమాదకరమైన స్థితిలో నీవున్నట్లే. ఆపత్కాలమే ఆయన గుడారములో ప్రవేశించే సమయమని నీవు గ్రహించగలిగితే జీవితం ధన్యమయినట్లే.

ఆయన గుడారంలో నీవుంటే? ఇక శత్రువు నిన్నేమి చెయ్యగలడు? సాతాను సంధించే ఎట్లాంటి అగ్నిబాణాలైనా సరే, ఆయన గుడారాన్ని చేధించగలవా? ఛేదించడం కాదుకదా, దాని దరిదాపుల్లోనికి కూడా చేరలేవు.

5️
. ఆశ్రయ దుర్గమైన దేవునియందే మనకు భద్రత, క్షేమం: ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. (ద్వితి 32:4) నీ ప్రతీ పరిస్థితిని ఆయనకు అప్పగించు. ఆయనయందే నీ జీవితానికి భద్రత, క్షేమం.

6️
. ఆయన చేతుల్లోనే మనకు భద్రత, క్షేమం: నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. (యోహాను 10:28) గర్జించు సింహములా, ఎవరిని మ్రింగుదునా అని తిరుగుతున్నాడు సాతాను. వాడి బారినపడకుండా, తప్పించబడాలి అంటే, ప్రభువు చేతుల్లో మనముండాలి. ఆయన చేతుల్లోనుండి మనలను సాతాను అపహరింపలేడు. వాడివల్ల కానేకాదు. ఆయన చెంతే మన జీవితాలకు భద్రత, క్షేమం. ఆయన పాదాల చెంత చేరుదాం! నిజ విశ్రాంతిని, నిత్యమైన సమాధానాన్ని అనుభవిద్దాం! అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!



రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను. కీర్తనలు 102:7
3. ఒంటిగా (తోడులేదు, ఆదరణ లేదు ) : ఒంటిరి తనం అనేది భయానకమైనది. నా అనుకున్నవారే శత్రువులుగా మారినప్పుడు, దుఃఖం, ఆవేధన ఆవరించినప్పుడు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్ధంకానప్పుడు, ఆ ఒంటరి తనం ఎంత భయానకంగా ఉంటుందో, అది అనుభవించినవారికి మాత్రమే తెలుస్తుంది. అది ఎంత భయంకరమంటే? వందమందితో ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని అనుభవిస్తూనే ఉంటాము. మనుష్యులము కలసివున్నాగాని, మనసులు మాత్రం వారితో కలవవు. అందరూ నవ్వుతున్నా వారికోసం నవ్వడం తప్ప, ఆసమయంలోకూడా ఒంటరితనాన్నే అనుభవిస్తాము. ఒకరకంగా చెప్పాలంటే ఒంటరితనం అనేది శాపగ్రస్తమైనది. మరొకకోణంలో ఆలోచించగలిగితే, యబ్బోకు రేవులో, యాకోబు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, దేవునితో పోరాడి, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఒంటరితనంలో, ప్రభువుతో పెనవేసుకొనే జీవితాలు ధన్యమైనవి. ఒకవేళ ఒంటరిగా, కృంగిన స్థితిలో నీవున్నావేమో? నీవు ఒంటరివి కాదెంత మాత్రము. నీకు తోడుగా ఉంటూ, నిన్ను ఆదరించేవారు ఒకాయన వున్నారు.

నిర్మలమైన నీటిలో ప్రశాంతంగా సాగిపోతుంది నావ. దానికి తోడు, నేను కూడా నీవెంటే అంటూ గాలి కూడా తెరచాపను నెట్టుతూ నావను  మరింత ముందుకు నడిపిస్తుంది. చుక్కానితో పనిలేదన్నంత ప్రశాంతంగా గమ్యం వైపు దూసుకుపోతుంది ఆ చిన్ని నావ. ఇంతలో, పరిస్థితి తారుమారయ్యింది. అంత వరకూ ఆ నావ భారాన్ని మోస్తున్న ఆ నీరే, ఎగిసిపడుతూ ఆ నావను ముంచేసే ప్రయత్నం చేస్తుంది. తెరచాపను నెట్టుతూ ముందుకు నడిపిస్తున్న గాలి, దానికి వ్యతిరేఖమై తెరచాపను విరిచేసి ప్రయత్నం చేస్తుంది. నావ దిశానిర్దేశాలు చేసే ఆ చుక్కాని నావల్ల కాదంటూ, దిక్కుతోచని స్థితిలో పడివుంది? ఇట్లాంటి పరిస్థితులలో ఆ నావ గమ్యం చేరేదెలా?

అవును! ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా సాగిపోతున్న నా జీవితనావలో కూడా ఇట్లాంటి పరిస్థితులే. లెక్కకు మించిన ఆటు పోట్లు. పదిహేను సంవత్సరాల వ్యవధిలో ఇంట్లో వున్న పెద్దవారందరూ, తలిదండ్రులతో సహా ఈ లోకయాత్రను ముగించారు. అసలు ఏమి జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితులు. శోధనలు వెంబడి శోధనలు తరుముకొస్తున్నాయి. అట్లాంటి పరిస్థితులలో నా జీవిత నావ చుక్కానిని, ప్రభువు చేతుల్లో పెట్టాను. ప్రతీ పరిస్థితిని ప్రార్ధనతో ఎదుర్కోవడం ప్రారంభించాను. నన్ను వెంటాడే శోధనలు, దేవునికి మరింత దగ్గరగా, ప్రతీ పరిస్థితికి ఆయనపైనే పూర్తిగా ఆధారపడేలా చేశాయి. సర్వయుగాలకు సజీవుడును, సర్వ కృపానిధియగు నా ప్రభువు, నీవు ఒంటరివికాదు. నేనున్నా నీ తోడంటూ నా చెయ్యిపట్టుకొని తిరిగి ప్రశాంతత వైపు నన్ను నడిపించడం మొదలు పెట్టారు. నీ ఒంటరి సమయంలో ఆయనపై నీవు ఆధారపడగలిగితే, నాకు తోడైయున్న దేవుడు నీకునూ తోడుగావుండి, తప్పక ఆదరిస్తారు.

ఒంటరిదానవైతే, నేనున్నా తోడంటూ నీ జంటగా నిలబడతారు.
అరణ్య యాత్రలో నీవు సాగిపోవుచుండగా, ఆయన నీకు ఆశ్రయమవుతారు.
నీళ్లులేక అల్లాడిపోతుంటే, ఆయనే ఒక ఒయాసిస్సుగా మారతారు.
ఆకలితో అలమటిస్తుంటే, ఆయనే ఒక ఖర్జూర వృక్షమై నీకు తారసపడతారు.
నీడలేక నీరసించిపోతే, ఆయనే ఒక మేఘ స్తంభమవుతారు.
నీవు నడవలేకపోతే, ఆయన భుజాలమీద నిను మోస్తారు.
ఆదరించేవారు, ఓదార్చేవారు లేకపోతే, నీ కన్నీటిని ఆయన ప్రేమతో తుడుస్తారు.
నిన్ను భయపెట్టే ప్రతీపరిస్థితికి, దానికే భయాన్ని పుట్టిస్తారు.

మిమ్మును అనాథలనుగా విడువను, ( యోహాను 14:18) అనే వాగ్ధానమిచ్చి, తానే ఆదరణ కర్తను పంపినారు. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను, (మత్తయి 28:20) అని చెప్పి, ఇమ్మానుయేలుగా మనకు తోడైయున్నారు. ఆయనపై ఆనుకొని యున్నంతకాలము ఆయన మనలను ఆదరిస్తూనే వుంటారు. ఆయనను ఆశ్రయిద్దాం! నిజ విశ్రాంతిని, నిత్యమైన సమాధానాన్ని అనుభవిద్దాం! అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!





రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను. కీర్తనలు 102:7

శోధనల వెంబడి శోధనలు తరుముకొస్తున్నప్పుడు, నెమ్మది కోల్పోయిన స్థితిలో కీర్తనాకారుని అంతరంగములోనుండి పెల్లుబికివస్తున్న ఆవేదన ఇది. ఆయన స్థితి ఎంతటి దయనీయంగా వుందో ఆయన మాటలనుబట్టి అర్ధం చేసుకోగలము.

1️
. మెలకువగా నుండి (అంటే నిద్రలేదు, విశ్రాంతిలేదు )
2️
. ఇంటిమీద (అంటే భద్రత లేదు)
3️
. ఒంటిగా (అంటే, తోడులేరు)
4️
. పిచ్చుక (అంటే, విలువలేదు)

4. పిచ్చుక
రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా (మత్తయి 10:29); అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా ( లూకా 12:6) ఆ దినాలలో మార్కెట్ కి వెళ్లి, ఒక కాసు ఇస్తే రెండు పిచ్చుకలు ఇచ్చేవారని ప్రభువు చెబుతున్నారు. అయితే, రెండు కాసులకు నాలుగు రావాలి కదా? అయితే, ఐదు అంటున్నారేంటి? అంటే, నాలుగు పిచ్చుకలు కొంటే, ఒకటి ఫ్రీ అన్నమాట. ఇప్పుడు ఆ పిచ్చుకకు విలువ ఎంత? విలువలేదు. కీర్తనాకారుడు నేను పిచ్చుకను అని చెప్పడంలో, ఏ విలువలేనివానిగా ఉన్నాను అనే అర్ధం ధ్వనిస్తుంది.

కీర్తనాకారుడు తననుతాను
🔸పొగ (102:3)
🔸ఎండకు వాడిన గడ్డి (4వ)
🔸అడవిలో గూడబాతు (6వ)
🔸పాడైన చోట పగడికంటె (గుడ్లగూబ)(6వ)తో పోల్చుకొంటున్నారు. దీనినిబట్టి ఆయన స్థితి ఎంత దయనీయంగా వుందో అర్ధం చేసుకోగలం. తరుమబడే స్థితిలో, ఒంటరితనంలో, ఎవ్వరి ఆదరణకూ నోచని కీర్తనాకారునివలే, ఇన్ని అనుభవాలమధ్య అది (పిచ్చుక) చివరికి ప్రత్యక్ష గుడారానికి చేరింది. అక్కడ బలిపీఠం మీద బలిపశువు వధించబడుతుంటే, అక్కడనే ఆ పిచ్చుకకు క్షేమకరమైన గూటి స్థలం దొరికింది. దేనివలన? ఆ బలిపీఠముపై అర్పింపబడిన బలిపశువు వలన. అవును! మరణం పొందవలసినది నీవూ, నేనూ కానీ మనకు బదులుగా ఆయన మన స్థానంలో మరణించడంద్వారా ఆ బలిపీఠమువద్ద శ్రేష్ఠ ఆశ్రయం దొరికింది. విలువలేని పిచ్చుకవంటి మనకోసం ఆయన చెల్లించిన మూల్యమెంతో చూడండి. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా (1 పేతురు 1:19) యాత్రా కీర్తనలు పాడుచూ యెరూషలేము చేరగానే, ఆఖరిగా బలిపీఠంవద్దకు వచ్చేటప్పుడు పాడే ఆఖరిపాట 84వ కీర్తన. అందులో వాళ్లంతా ఎలుగెత్తి, బలిపీఠము నొద్ద పిచ్చుకలు నివాస స్థలం దొరికింది. మేము అక్కడకి వచ్చేశాం. నీవే మా ఆశ్రయ స్థలమంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. మరి అన్యులమైన మనం?

అన్యురాలైన రూతుతో బోయజు అంటున్న మాటలివి. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి”; (రూతు 2:12) విశ్రాంతి, భద్రత, ఆదరణ, తోడులేని, విలువలేని మన జీవితాలకు నిజమైన ఆశ్రయ స్థానం “ఆయన రెక్కల నీడలోనే”.
🔹ఆయనే మన దాగుచోటు.
🔹ఆయనే ఆపత్కాలంలో మన ఆశ్రయం.
🔹ఆయనే మన సమాధానము.
🔹ఆయనే మనకు విశ్రాంతి
🔹ఆయనలోనే మన జీవితాలకు భద్రత, క్షేమం.
🔹ఆయనే మనకు తోడు, ఆదరణ.
🔹విలువలేని మన జీవితాలకు విలువనిచ్చింది ఆయన కృప మాత్రమే.
🔹ఏ పరిస్థితికైనా మనకు చాలినవాడు ఆయనే.

యింతవరకూ, నీవు చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసావేమో? సమాధానాన్ని అందుకోలేకపోయావేమో? ఒక్కసారి, ప్రభుపాదాలచెంత నీ హృదయాన్ని క్రుమ్మరించు. చెప్పలేనంత సమాధాన్నాన్ని పొందెదవు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!


మరిన్ని వర్తమానములకై  https://www.facebook.com/NireekshanaDwaram/
మీ యొక్క విలువైన సూచనలు సలహాలు మరియు ప్రార్థనావసరతలకై
                                           krajsudha2@gmail.com
                                                                          - మీ సహోదరుడు


కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పాపము

పొట్టి జక్కయ్య

యేసు క్రీస్తు రెండవ రాకడ

విశ్వాసము

పక్షిరాజు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

శరీర కార్యములు

అబ్రాహాము విశ్వాసయాత్ర

సమరయ స్త్రీ

యెషయా ప్రవచన గ్రంధము -2