కాకి



కాకి



కాకుల సంగతి విచారించి చూడుడి. లూకా 12:24

కాకులను గురించి విచారించడానికేముంది. ఇది అతి సామాన్యమైన పక్షి. పల్లెటూర్లలో జీవనం చేసేవారికి అత్యంత సుపరిచితం. దాని రంగు గాని, రూపం గాని ఆకర్షణీయంగా వుండవు. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. అవును! ఇంకేమి వాటిని ముద్దు చెయ్యవు. దాని స్వరం కర్ణకఠోరం. ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే కాకిగోల అంటూ తిడతారు. స్వరము ఇంపుగా లేకపోతే గానకాకి అంటారు. నడక వంకర టింకర, ఇట్లా లెక్కలేనన్ని. ఎవ్వరూ దీనిని ఇష్టపడరు. పెంచుకోరు. ( ఈ మధ్యకాలంలో పిండాలను తినడం కోసం కాకిని పెంచుతున్నట్లు వింటున్నాము. అతని జీవనాధారం కోసం తప్ప, దానిమీద ప్రేమ మాత్రం కాదు.) దానిని ప్రసంశించేవారెవ్వరూ వుండరు. చెట్ల కొమ్మలమీద, యిండ్లమీద నివసిస్తూ ఉంటుంది. కాకులలో చాలా రకాలు ఉన్నాయి. నల్లకాకి, తెల్లకాకి, నీటికాకి, బొంతకాకి, లోయకాకి, చెవుడు కాకి, ఇంటికాకి, అడవికాకి మొదలైనవి.

కాకి యొక్క సాధారణ లక్షణాలు

రంగు నలుపు
దొంగ బుద్ధి
ఐక్యత గలిగి ఉంటాయి
మలినమైన ఆహారం తింటాయి
స్నానం చేస్తాయి.
అటూ ఇటూ తిరుగుతుంటాయి
కాకి హేయమైనది

కాకి రంగు నలుపు:
నలుపుకు సాదృశ్యములు: పాపము, చీకటి, శ్రమలు, అజ్ఞానము, మరణము

నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను (పరమ 1:5) అంటున్నది షూలమ్మీతీ. “షూలమ్మితి” అనగా సంపూర్ణురాలు లేదా పరిపూర్ణురాలు. ఒకానొకప్పుడు నలుపు అనే లోపం ఉండేది. ఎప్పుడైతే తన ప్రియుని చెంతకు చేరిందో, సౌందర్యవంతురాలను అంటుంది. అంటే తనలోని లోపాన్ని జయించగలిగింది.

ఇదే విధంగా విశ్వాసి ఒక పాపములో ఎల్లకాలము నిలిచి వుండకూడదు. ప్రభువుతో సంబంధం ఏర్పడినతర్వాత లోపాలన్నింటిని జయించాలి. షూలమ్మితివలే పరిపూర్ణత చెందాలి. పాపమనే ఎండ వేడిమి తగిలి నల్లగామారిని మన జీవితాలను, హిమమువలే తెల్లగా చెయ్యడానికి, ప్రభువు తనయొక్క పరిశుద్ధ రక్తాన్ని ధారపోసారు. ఆ పరిశుద్ధ రక్తములో మనలోనున్న నల్లని (పాపపు డాగులను) కడుగుకొని, సంపూర్ణత (పరిశుద్ధత) లోనికి ప్రవేశించగలిగితే, జీవితం ధన్యమవుతుంది. ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!





కాకుల సంగతి విచారించి చూడుడి. లూకా 12:24

కాకి బుద్ధి - దొంగ బుద్ది :
పిల్లల చేతిలో బిస్కెట్స్, తినుబండారాలు తన్నుకుపోయాయంటే ఒక అర్థముంది. వాటి ఆకలి తీర్చుకొంటాయి. కానీ, స్పూన్లు, గ్లాసులు ఇట్లా మొదలైన వాటిని కూడా ఎత్తుకుపోతాయి. అవేమి చేసుకుంటాయి? దానికి పనికిరావు. మనకు రాకుండా చేస్తాయి. ఎందుకట్లా అంటే? దాని బుద్ధే దొంగ బుద్ధి. దొరికిందెల్లా ఎత్తుకు పోవడమే.

మనలో కూడా తమ చేతివాటం ప్రదర్శించేవారు కోకొల్లలు. ప్రక్కవారి పెరట్లో కాయలు, పువ్వులు, ప్రక్కింట్లో వస్తువులు, మరికొందరైతే షాప్ కి వెళ్లినాగాని ఎదో ఒకటి దొంగిలిస్తేనేగాని వారికి సంతోషం అనిపించదు. మరికొందరైతే దానినే ఒక వృత్తిగా చేపట్టేసారు. ఎవరో కష్టపడి సంపాధించుకున్నదాన్ని, వీరు కష్టపడకుండా అనుభవించడం. దొంగతనం అనేది కొందరికి వినోదం, మరికొందరికి విలాసం. కొందరైతే వారి దొంగ బుద్ధిని ప్రదర్శించి, వారేదో గొప్ప టేలెంట్ (నైపుణ్యం) కలిగియున్నట్లు గర్వపడుతుంటారు. అది గర్వపడాల్సిన విషయం కానేకాదు. సిగ్గుపడాల్సిన విషయం. సరిచేసుకోవలసిన విషయం. ఏది ఏమైనా దోచుకొనేవారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ( 1కొరింథీ 6:10)

నీవు దొంగవా? గజదొంగవా? కొందరు దొంగలైతే, మరికొందరు గజదొంగలు. వీరు దేవుని దగ్గరే దొంగిలించేస్తారు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. (మలాకి 3:8)

నీకు నీవే పరిశీలన చేసుకో! నీవు దొంగవో? గజదొంగవో?
నీ సంపాదనలో, దేవుని పరిచర్యకు ఖర్చు చేసేదెంత?
నీకివ్వబడిన సమయంలో, నీవు దేవునితో గడిపే సమయమెంత?
దేవుని మందిరంలో గడపాల్సిన సమయాన్ని, నీ స్వంతపనులకోసం వాడుకొంటున్నావా?
నిన్ను నీవు ఘనపరచుకోవడం కోసం, దేవునికి చెందాల్సిన మహిమను దొంగిలిస్తున్నావా?
దేవుని పేరుతో నీ సంపదను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నావా?
నీవు ప్రార్ధించినప్పుడు ఎవరైనా మేళ్లను పొందుకొంటున్నప్పుడు, దేవునిని ప్రక్కనబెట్టి, నా ప్రార్ధనే కారణమంటూ పబ్లిసిటీ పెంచుకొంటున్నావా?
ఆయనను నీ అవసరాలకు వాడుకొని, నీవు మాత్రం ఆయనకు ఉపయోగపడకుండా పోతున్నావా?

ఇప్పటికే నీకర్థమయ్యింది కదా! దొంగవో? గజదొంగవో? నీవు ఏ దొంగవైనా సరే, దొంగ బుద్ధి మార్చుకోవడానికి నీవిష్టపడితే? ఏలీయాను పోషించడానికి కాకులను తన పరిచర్యలో వాడుకొనిని ప్రభువు, నిన్నునూ ఒక విలువైన పాత్రగా తన పరిచర్యలో వాడుకొనుటకు ఆయన యిష్టపడుతున్నారు.

దొంగిల వద్దు: నిత్య జీవాన్ని చేరుకోవడానికి నేనేమి చెయ్యాలనే ఒక యౌవనస్థుని ప్రశ్నకు ప్రభువిచ్చిన సమాధానం. దొంగిల వద్దు. (మత్తయి 19:18) దొంగిలించి నిత్యరాజ్యాన్ని దూరం చేసుకోవద్దు. దొంగబుద్ధి మార్చుకొని నిత్యరాజ్యానికి చేరువవుదాం! కాకి బుద్ధిని మార్చుకొని, ప్రభువుతో కలకాలం జీవిద్దాం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!





కాకుల సంగతి విచారించి చూడుడి. లూకా 12:24

3️ కాకులు ఐక్యతకలిగి వుంటాయి:
కాకులకు చిన్న ఆహారం కనిపించినా చాలు, వాటి స్వార్ధం కోసం చూచుకోకుండా, కావ్ కావ్... అంటూ మిగిలిన కాకులన్నింటిని పిలుస్తాయి. ఒకకాకికి నష్టం వాటిల్లితే, మిగిలిన కాకులన్నీ వచ్చిచేరుతాయి. మనము ఒక కాకికి హానితలపెట్టినాగాని, కాకులన్నీ గుంపుగూడి మనవెంటబడి తరుముతాయి. కావ్ కావ్ మంటూ పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తాయి. దీనినిబట్టి మనకు అర్ధమవుతుంది అవెంత ఐక్యంగా వుంటాయో! కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నానని చెప్పుకొనే మనిషి ఎంతటి దయనీయమైన స్థితికి దిగజారిపోయాడంటే? ప్రాణాపాయస్థితిలోనున్న మనిషిని సెల్ ఫోన్ లో చిత్రీకరించి పేస్ బుక్ లో పోస్ట్ చెయ్యడానికి ఆరాటపడుతున్నాడుగాని, సాటిమనిషిని పట్టించుకొనే స్థితిలో లేడు.

చిన్నప్పుడు మనమంతా పాఠ్య పుస్తకాలలో చదివినవాళ్ళమే. చలి చీమలన్నీ కలిస్తే సర్పాన్ని చంపేస్తాయి. గడ్డి పరకలన్నీ కలసి తాడుగా ఏర్పడితే, బలమైన ఏనుగును సహితం బంధించేస్తాయి. ఇట్లా కోకొల్లలు. పరిశుద్ధ గ్రంధములో కూడా ఐక్యతను గూర్చిన అనేకమైన అంశాలున్నాయి. నలుగురు కుష్టు రోగుల ఐక్యత, షోమ్రోను పట్టణానికి ఆహారం పెట్టడానికి కారణమయ్యింది.

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! కీర్తనలు 133:1
ఐక్యత లేదంటే? (అది కుటుంబమైనా లేదా సంఘమైనా లేదా సమాజమైనా ఏదైనా కావొచ్చు! )
ప్రేమ లేదు
సమాధానం లేదు
తగ్గింపులేదు
క్షమించే మనస్సు లేదు
ఒకరిపట్ల మరొకరికి గౌరవం లేదు
ప్రేమ స్థానాన్ని అసూయ, ద్వేషాలు ఆక్రమించాయి.
కక్ష్యలు కార్పణ్యాలు రాజ్యమేలుతున్నాయి.

అయితే,
దేవుని పిల్లల్లో ఐక్యత వుండి తీరాలి.
అది మంచిది
మనోహరమైనది
అది దేవుని ప్రేమ ఫలితం
అది దేవుని సంకల్పం

ఐక్యతను జాగ్రత్తగా కాపాడుకోవాలి:
మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎఫెసి 4:1-3

ఐక్యత అనేది అహరోనును అభిషేకించిన తైలముతో పోల్చబడినది:
అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును. కీర్తనలు 133 : 2
ప్రప్రథమమైన ప్రధాన యాజకునినిగా అహరోను అభిషేకింపబడిన నూనె
🔸ప్రత్యేకమైనది
🔸పవిత్రమైనది
🔸పరిమళభరితమైనది
ఇట్లాంటివాటితో ఐకమత్యము పోల్చబడుతుందంటే? మన ఐక్యత క్రీస్తు ప్రేమలో ప్రత్యేకమైనదిగాను, పవిత్రమైనదిగాను, అనేకులకు పరిమళ వాసనగాను వుండగలగాలి. అనగా అనేకులను క్రీస్తువైపుకు ఆకర్షించాలి. అనేకులను సంతోషభరితులను చెయ్యాలి.
ఐక్యతనున్నచోట ఆశీర్వాదము: సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు. కీర్తనలు 133:3
సీయోను - ప్రేమ, సత్యాలలో ఐక్యమైన దేవుని ప్రజల మధ్య దేవుని దీవెనలు ఉంటాయి. అక్కడ దేవుడు శాశ్వత జీవాన్నిచ్చే తన కృపా ప్రవాహాలను ఉంచుతారు. ఎక్కడంటే? ఐక్యతనున్న చోట. అశాశ్వతమైన లోకంలో జీవిస్తూ, కక్ష్యలు, కార్పణ్యాలతో ఐక్యతను కోల్పోయి, నిత్యమైన ఆశీర్వాదాలు కోల్పోవద్దు. ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!


కాకుల సంగతి విచారించి చూడుడి. లూకా 12:24
ఎండవేడిమికి తట్టుకోలేక, లేదా వాటికంటిన బురదను శుభ్రం చేసుకొనేవాటిలో భాగంగా ఒంటరిగా లేదా, గుంపులుగా కలసి స్నానం చేస్తాయి. బురదను వదిలించుకొని మరలా బురదలోనికే పరిగెడతాయి. మన జీవితాలు కూడా ఇట్లానే వున్నాయి కదా? అట్లాలేదులెండి. బంక జలగలా పట్టిపీడిస్తోంది. కొంచెం స్టైలిష్ గా చెప్పాలంటే, చూయింగ్ గమ్ లా, ఎంత లాగిన ఎంతోకొంత మిగిలిపోతూనే వుంది కదా?

కొన్ని సార్లు మనము బురదలో దిగకపోయినా, దానికి దూరంగా తప్పించుకొనే ప్రయత్నం చేసినాగాని, మన ప్రమేయం లేకుండానే బురదవచ్చి మనమీద పడుతుంది. ఇట్లా జరిగేది చాలా చాలా తక్కువే. ఎక్కువ శాతం మనం బురదలోకి అడుపెట్టేదే. అడుగు పెట్టడం కాదులెండి. దానిలో పడి లా పొర్లు తున్నాము.

సాధారణముగా వర్షాకాలంలో మనము బురద అంటకుండా జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ, మనప్రక్కనే వేగంగా కారు దూసుకుపోవడంతో, రోడ్డు మీదనున్న బురద మన మీదవచ్చి పడుతుంది. మనము జాగ్రత్తగానే వున్నాము, దానిలో మన ప్రమేయమేమి లేదు. అయినప్పటికీ బురద వచ్చిపడింది. అవును! మనము జీవించేలోకమే పాపపు లోకం, మనము దానిలోనికి దిగడం వలన అంటింది కొంత, మన ప్రమేయం లేకుండా అంటింది కొంత. ఏదిఏమైనా పాపపుబురద అట్టలా పేరుకుపోయింది. చూయింగ్ గమ్ లా విడవనంతగా అంటుకుపోయింది. దీన్ని స్నానమాచరించడం ద్వారా శుభ్రపరచుకోవాలి.

స్నానమాచరించడం ద్వారా శరీరాన్ని పరిశుభ్ర పరచుకోవచ్చు. మరి అంతరంగాన్ని పరిశుద్ధ పరచుకోవడం ఎట్లా? అదెట్లా అంటే? నిర్మలమైన ఉదకము చేత, “ఉదకము అనగా ? నీరు” నీటికి సాదృశ్యమైయున్న “వాక్యముచేత” మన శరీరానికిని, అంతరంగానికిని అంటిన పాపాన్ని శుద్ధీకరించుకోవాలి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హెబ్రీ 10:22

అవును! మన నడతను శుద్ధీకరించేది వాక్యమే! యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటచేతనే గదా? కీర్తనలు 119:9

జీవిత శుద్ధి ఎట్లా సాధ్యమంటే?*
🔸దేవుని వాక్యాన్ని ధ్యానం చెయ్యడం ద్వారా, అభ్యాసం చెయ్యడం ద్వారా జీవితాన్ని శుద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది. (కీర్తనలు 119:9)
🔸అట్లా చేసేందుకు దేవుని కృపను, ఆయన బలమును వెదుకుతూ వుండాలి.(కీర్తనలు 119:10)
🔸మన ఆలోచనలకు, ఆశలకు దేవుని వాక్యమునే కేంద్రముగా చేసుకోవాలి.(కీర్తనలు 119:11)
🔸దేవుని సహాయం మూలముగా ఆయన వాక్యమును అర్ధం చేసుకోవాలి. (కీర్తనలు 119:12)
🔸మనము నేర్చుకున్న వాక్యమును గురించి మాట్లాడుతూ వుండాలి. (కీర్తనలు 119:13)
🔸వాక్యములోనే ఆనందిస్తూ, సంతోషముగా వుండాలి. (కీర్తనలు 119:14)
🔸వాక్యమునే ధ్యానిస్తూ , ఆయన త్రోవలలో నడవాలి. (కీర్తనలు 119:15)
🔸ధ్యానించిన వాక్యమును బట్టి ఆనందిస్తూ, వాటిని మరువక యుండాలి. (కీర్తనలు 119:16)
ఇట్టి రీతిగా దేవుని వాక్యమును ధ్యానిస్తూ, జీవించగలిగితే? మన ప్రవర్తన (నడత) సరిచేయబడుతుంది. తద్వారా ఆ నిత్య రాజ్యానికి వారసులం కాగలం. ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!




కాకుల సంగతి విచారించి చూడుడి. లూకా 12:24


5️. మాలిన్యమైన ఆహారం

పావురము శ్రేష్టమైన ఆహారం తింటే, కాకి మాత్రం, చచ్చిన, కుళ్ళిన, కలుషితమైన ఆహారం తింటుంది. వాటియందే ఆనందిస్తుంది. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును (మత్తయి 24:28)
గద్దలేకాదు, వాటితోపాటు కాకులు కూడా అక్కడే ఉంటాయి. మనిషి కూడా మాలిన్యమైనవాటిని, నిషిద్ధమైన వాటిని తినడానికి, త్రాగడానికి అలవాటు పడ్డాడు. సిగరెట్లు, చుట్ట, బీడి, పాన్ పరాగ్, ఖైనీలు, గుట్కాలు, కల్లు, సారా, మాదక ద్రవ్యాలు మొదలగువాటికి అలవాటుపడ్డాడు, తద్వారా వారి ఆరోగ్యం క్షీణించిపోయి, కుటుంబాలు బజారునపడే స్థితికి చేరుకొంటున్నాయి. దేవుని పిల్లలముగా నిషిద్ధమైనవాటి జోలికిపోకూడదు. తద్వారా మన శారీరిక ఆరోగ్యంతో పాటు, ఆత్మీయ జీవితాన్ని రక్షించుకున్న వారమవుతాము.

6️. అటూ ఇటూ తిరిగే స్వభావం:
జల ప్రళయం తర్వాత, నోవహు ఒక కాకిని ఓడలోనుండి బయటకు విడచినప్పుడు, అది అటూ ఇటూ తిరుగుతుంది తప్ప, తిరిగి ఓడలోకి ప్రవేశించినదికాదు. “ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను” (ఆది 8:7) అటూ ఇటూ తిరిగే స్వభావం ఎవరిదంటే? అది సాతాను స్వభావం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. (యోబు 1:6,7)

అవును! వాడు అటూ ఇటూ తిరగడమే కాదు, దేవునిపిల్లలను వాడివైపుకు త్రిప్పుకొని, వారిని కూడా అటూ ఇటూ త్రిప్పుతూనే వున్నాడు. తద్వారా దేవునికి దూరమై అస్థిరమైన జీవితాలను, పతనమైన జీవితాలను జీవిస్తున్నారు. అయితే, అట్లాంటివారికి దేవుడిచ్చే ఆహ్వానం, “ఇదే యెహోవా వాక్కు ఇశ్రాయేలూ, నీవు తిరిగి రానుద్దేశించినయెడల నా యొద్దకే రావలెను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధినుండి తొలగించి సత్యమునుబట్టియు న్యాయమును బట్టియు నీతినిబట్టియు యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన యెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వా దము కలుగుననుకొందురు, ఆయనయందే అతిశయపడుదురు”. (యిర్మియా 4:1,2). నీవు ఏ స్థితిలోనున్నాసరే ప్రభువు పిలుపుకు ప్రతిస్పందించగలిగితే, నీ జీవితం ధన్యమవుతుంది.

కాకి హేయమైనది:
ప్రతీ విధమైన కాకి, ఆహారమునకు అపవిత్రమైనదని, వాటిని హేయముగా ఎంచాలని లేఖనాలు సెలవిస్తున్నాయి ( లేవి 11:13-15; ద్వితీ 14:11-20) కొన్ని పక్షులు పవిత్రం, మరికొన్ని అపవిత్రం. మనుష్యులలో ఇశ్రాయేలు జనాంగాన్ని పవిత్రముగా, ప్రత్యేకముగా ఉండాలనే ఆయన కోరుకున్నారు (నిర్గమ 19:5,6; ద్వితీ 7:6; 14:2) కాకులవంటి జీవితాన్ని కలిగిన మనలను, ఆయన రక్తమిచ్చి, శుద్ధీకరించి, ప్రత్యేకపరిచారు. పరిశుద్ధంగా, ప్రత్యేకంగా ప్రభువుకొరకు జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!



కాకుల సంగతి విచారించి చూడుడి. లూకా 12:24


ప్రార్ధించే కాకులు : తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? యోబు 38:41

పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. కీర్తనలు 147:9. కాకులు దేవునికి మొర్రపెడుతున్నాయి. మనము ప్రార్ధించాలనే విషయాన్ని బోధిస్తున్నాయి. ఎందుకంటే? మనకు అన్నింటికీ సమయం వుంది. ప్రార్ధించడానికి తప్ప. ప్రార్ధించే సమయం మన ప్రభువుతో మాట్లాడే సమయం. మన సమస్యలు పరిష్కరింపబడే సమయం. మన జీవితాలు సమాధానంతో నింపబడే సమయం. ప్రార్ధించి, నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకొందము!

పోషించే కాకులు: కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను.1 రాజులు 17:6

ఏలియాతో దేవుడు చెప్తున్నారు. నీవు కేరీతు వాగుదగ్గర దాగియుండు. అవును! దేశంలో మూడున్నర సంవత్సరముల వరకూ వర్షం పడదు. త్రాగడానికి సహితం నీళ్ళు దొరకవు, పంటలు పండవు. కరవుతో అల్లాడిపోవలసిన పరిస్థితులు రాబోతున్నాయి. అయితే దేవుడు తన సేవకునిని సమృద్దియైన జలాల యొద్దకు నడిపిస్తున్నాడు. ఆయన నడిపిస్తున్నప్పుడు సాగిపోతున్నాడు.అంతేగాని, అయ్యో! అక్కడ నేను ఎట్లా ఒంటిరిగా వుండగలను? నాకు ఆహారం ఎట్లా? ఇట్లాంటి ప్రశ్నలేమీలేవు. కెరీతుకు చేరారు. ఒంటరితనం
త్రాగడానికి కేరీతు నీళ్ళున్నాయి. మరి తినడానికి ఎట్లా? ఆకలితో ఎదురు చూస్తున్నాడు. అటు వైపుగా ఒక కాకుల గుంపు ఎగురుకొంటూ వస్తుంది. కాకులు అరుస్తూ వస్తాయి. కాని ఇవి నిశ్శబ్దంగా వస్తున్నాయి. ఏలియా చూస్తుండగానే ఆ గుంపు అతని ముందు దిగింది. ఆశ్చర్యం! వాటి ముక్కున రొట్టెలున్నాయ్, మాంసపు ముక్కలున్నాయ్. చేతుల్లోనుండి తన్నుకుపోయే కాకులా ఆహారం తెచ్చేది? అవును! ఆయనకు సమస్తమూ లోబడతాయి. నీవూ నేనూ తప్ప.

పీకే కాకులు (లోయకాకులు)
తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. (సామెతలు 30:17) ఒక తల్లి పదిమంది పిల్లలను పెంచి పోషిస్తుంది. ఆ పదిమంది పిల్లలు కలసి ఆఒక్క తల్లిని పెంచలేక అనాధనుచేసి విడచి పెట్టేసిన పిల్లలెందరో? అనాధ ఆశ్రమాలలో, వృద్ధ ఆశ్రమాలలో తలదాచుకొంటున్న తల్లులెందరో? అట్లాఅని, వారి ఆర్ధికస్థితి తల్లిని పోషించ గలిగేదిగా లేదా అంటే? కానేకాదు. అన్నీ సమృద్ధిగా కలిగినవారే. లేదంటే, వారు తమ భాద్యతను, దేవుని ఆజ్ఞను మరచినవారు. వారి జాబితాలో మనమూ వున్నామా? అయితే ఒక్క మాట! యేసుప్రభువు వారు కల్వరి గిరిలో ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో మూడు మేకులతో వ్రేలాడుతున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఒక కుమారునిగా తన భాద్యతను నెరవేర్చుతూ ఆయన తల్లిని 'యేసు ప్రభువు రొమ్మును ఆనుకొనియున్న శిష్యుడు'గా పేరొందిన యోహానుకు అప్పగిస్తూ "అమ్మా,యిదిగో నీ కుమారుడు ......యిదిగో నీ తల్లి" (యోహాను 19:26) పలికిన ఈ మాట మన జీవితాలకు గొప్ప మేల్కొలుపు. పరిశుద్ధ గ్రంధం తలిదండ్రులకు చెప్పలేనంత ప్రాధాన్యత ఇచ్చింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి తలిదండ్రుల కోసమే. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతు డవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. (నిర్గమ 20:12)

సన్మానించడం అంటే? శాలువాలు కప్పి, పూల బొకేలు ఇవ్వాలని కాదుగాని, వారి అవసానదశలో వారి అవసరాలు గుర్తెరిగి వాటిని తీర్చగలగడం. తలిదండ్రులకు విధేయత చూపాలి. వారిని సన్మానించాలి. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలొ మొదటిది. “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీతండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. (ఎఫెస్సి 6:1-3) నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను." (సామెతలు 23:25) అట్లా కాకుండా వారిని నిర్లక్ష్యం చేసి, వారిని దూషించినట్లయితే? "తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును." (సామెతలు 20:20) తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. (సామెతలు 30:17)

ఇక్కడ అక్షరార్ధంగా, వారి కన్ను లోయ కాకులు పీకుతాయని కాదుగాని, నిత్యమైన శిక్షకు గురియవుతారనేది ఆత్మీయ అర్ధమైయున్నది. శిక్షకు గురియవుతామనే భయంతో కాకుండా, పిల్లలుగా తలిదండ్రులపట్ల మన భాధ్యతను నెరవేర్చి, నిత్యమైన ఆశీర్వాదములు స్వతంత్రించుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

మరిన్ని వర్తమానములకై https://www.facebook.com/NireekshanaDwaram/
మీ యొక్క విలువైన సూచనలు సలహాలు మరియు ప్రార్థనావసరతలకై
krajsudha2@gmail.com
- మీ సహోదరుడు



కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరీర కార్యములు

క్రిస్మస్

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

విశ్వాసము

పాపము

సమరయ స్త్రీ

విగ్రహారాధన