నేను ప్రవక్తను కాను

నేను ప్రవక్తను కాను

*ఉపోద్ఘాతం*

Amos


నేను ప్రవక్తను కాను

*ఉపోద్ఘాతం*

*అది క్రీ.పూ. 755. ఒక వ్యక్తి అక్కడ ఒక ప్రవచనం చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఈలోగా మరొకడు వచ్చి అంటున్నాడు: "ఓ దీర్ఘదర్శి! నీవు ఇక్కడ ఆ వార్తలు చెప్పకూడదు. నీ దేశంలో చెప్పుకో! అక్కడే నీ బత్తెము సంపాదించుకో! ఇక్కడ చెప్పడానికి వీలులేదు. ఈ మందిరాలకు నేనే ప్రధానపూజారిని! మరల ఇక్కడకు వస్తే బాగోదు" అన్నాడు. వెంటనే ఇతనికి మండిపోయింది: "రేయ్! నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కొడుకుని కాదు. ప్రవక్తల శిష్యుడను కాదు. నేనో పశువులు కాసుకునే వాడిని. పశువులు కాచుకుంటుంటే, దేవుడు నా దగ్గరకు వచ్చి: కొడుకా! ఇశ్రాయేలు దేశం వెళ్లి ఈ మాటలు చెప్పమన్నాడు. అంతేకాని ఎవడో ఏదో ఎంగిలిమెతుకులు పడేస్తాడు అని నేను ఈ మాటలు చెప్పడం లేదు. దేవుడు చెప్పమన్నాడు—నేను చెప్పాను, చెబుతాను! ఏం చేసుకుంటే చేసుకో!" అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. కొంతదూరం వెళ్లి ఆగి మరలా అంటున్నాడు ఈ ప్రధాన పూజిరితో: "దేవుడు చెప్పే మాట విను: ఇశ్రాయేలు గూర్చి ప్రవచించకూడదు, ఇస్సాకు సంతతికి నీ మాట చెప్పొద్దు అంటున్నావు కదా, దేవుడు చెప్పే మాట ఏమిటంటే; నీ పెళ్ళాం ఇదే పట్టణంలో తిండిలేక వేశ్యగా మారిపోతాది. నీ కొడుకులు, కూతుర్లు కత్తితో చంపబడతారు. నీవు మరో దేశంలో కుక్కచావు చస్తావు. నీమాటలు వినే ఈ ప్రజలు మరో దేశంలో బానిసలుగా బ్రతుకుతారు". అని చెప్పి వెళ్లిపోతుంటే, ఈ పూజారి లాగిలెంపకాయ కొట్టాడు. చిత్రహింసలు చేస్తున్నారు. కాని ఒకటే అంటున్నాడు ఈ దీర్ఘదర్శి: "నీవు కొట్టినా తిట్టినా దేవుడు చెప్ప మన్న విషయం చెబుతాను. నన్ను బ్రతుకనిస్తే మరలా వచ్చి చెబుతాను. ప్రాణం ఉన్నంతవరకు చెబుతూనే ఉంటాను". ఈలోగా ఈ ప్రవక్తను కొట్టి చంపేస్తున్నారు అని రాజుకి తెలిసింది. ఆయన ఇతనిని కాపాడాడు.*

ఈ ప్రవక్త పేరు ఆమోసు. అది బేతేలు అనే పట్టణం. ఆ మందిరం/బలిపీఠం యరోబాము-1 కట్టించిన బలిపీఠం. ఈ రాజు యరోబాము-2 . యితడు యూదా రాజైన యెహోయాసు కొడుకు. ఆ పూజారి- ఈ బలి పీఠానికి బలులు అర్పించే ప్రధాన పూజారి. పేరు: అమజ్యా; ఊరిపేరు బేతేలు: అనగా దైవ మందిరం! కాని అక్కడ విగ్రహాలు స్థాపించి యావత్ ఇశ్రాయేలు దేశాన్ని తప్పుడుదారి నడిపించాడు యరోబాము-1. దానితోపాటు అక్కడే ఇంకా అన్యుల విగ్రహాలు, మందిరాలు వెలిసాయి. దేవుని మందిరం- దయ్యాల మందిరం, దయ్యాల హెడ్ క్వార్టర్ అయ్యింది.

ప్రియ దైవజనమా! దేవుని ప్రశస్త నామంలో మీ అందరికి వందనములు. ఆధ్యాత్మిక సందేశాలు-6 సిరీస్ లో భాగంగా ప్రవక్తయైన ఆమోసు జీవితమునుండి ధ్యానం చేయడానికి కృపనిచ్చిన దేవాదిదేవునికి హృదయపూర్వక వందనములు. ఈ సవాలుకరమైన ప్రవక్త జీవితం నుండి కొన్నిరోజులు మన ఆత్మీయజీవితానికి పనికొచ్చే మాటలను ధ్యానం చేద్దాం!

*పేరు*: ఆమోసు
*పేరుకు అర్ధం*: మోసేవాడు
*తల్లి* : తెలియదు
*తండ్రి*: తెలియదు
*ఊరు*: తెకోవ, ఇది ఇశ్రాయేలు దేశం కాదు, యూదా సామ్రాజ్యం. యెరూషలేము కి 11 కి.మీ. దూరంలో, బెత్లెహేముకి 6 కి.మీ.ల దూరంలో ఉంది
*వృత్తి*: పశుల కాపరి. చాలా ప్రతులలో గొర్రెలకాపరి అని వ్రాయబడింది. అంతేకాకుండా మేడిచేట్లు (మన దేశంలో మేడిచేట్లు కాదు, ఇవి ఒకరకంగా అంజూరపు పళ్ళులా ఉంటాయి. ఇశ్రాయేలు దేశంలో బాగా తింటారు వీటిని. యేసయ్య కాలంలో జక్కయి ఇలాంటి మేడిచెట్టే ఎక్కాడు) మేడి చెట్లు పెంచడంలో యితడు expert. బైబిల్ పండితులు ప్రకారం ఇతనికి సొంత మంద లేదు. రోజుకూలి.

*పుట్టిన రోజు*: తెలియదు. కాని సుమారుగా క్రీ.పూ. 780 కావచ్చు. ఎలీషాగారు చనిపోయిన తర్వాత సేవకు వచ్చారు ఈయన!
*సమకాలీకులు*: ప్రవక్తయైన హోషేయ. యెషయా (పెద్ద ప్రవక్తయైన యెషయాగారు కూడా ఈయన ప్రవచనాలలో కొన్ని వాడారు). యోనా. వీరంతా ఈయన కాలంలోనే ఉన్నారు.

*రాజుల కాలం*: ఇశ్రాయేలు దేశాన్ని యరోబాము-2 (BC 793-753) పాలిస్తున్నాడు. యూదా రాజ్యాన్ని రాజైన ఉజ్జియా (BC 792-740) పాలిస్తున్నాడు.

*సేవ ప్రారంభం*: భూకంపానికి రెండు సంవత్సరాల ముందు. చరిత్ర ప్రకారం రాజైన ఉజ్జియా దినాలలో భూకంపం కలిగింది అది సుమారు క్రీ.పూ. 762 లో కలిగింది. అనగా ఈయన సేవ ప్రారంభం క్రీపూ 764 అన్నమాట!

*చేసిన కాలం*: బైబిల్ పండితుల ప్రకారం BC 760-75౦ మధ్యలో ఎక్కువగా సేవచేశారు. ఉండేది తెకోవ , యూదా రాజ్యం, గాని ఇశ్రాయేలులో గల బేతేలులోనే ఎక్కువగా పరిచర్య చేశారు. అంతేకాకుండా రాజధాని సమరయలో కూడా సేవచేశారు.

*శ్రమలు*: బైబిల్ లో వ్రాయబడలేదు గాని ఈ ఇశ్రాయేలు దేశంలో చాలా పరిచర్య చేశారు. అక్కడున్న అన్యాయాలు, అక్రమాలు చూసి చలించిపోయి దేవునిమాటలు చెబుతుంటే ఎంతగానో కొట్టారు. తిట్టారు. చిత్రహింసలు పెట్టారు. అయినా సేవ మానలేదు. అమజ్యా, వాడికొడుకు అనేక బాధలు పెట్టారు. మరి ఎందుకు బైబిల్ లో వ్రాయబడలేదు? యిర్మియా లాంటి వారు చెప్పుకున్నారు, ఈయన చెప్పుకోలేదు. అంతే!

*రచనారంభం*: ఇశ్రాయేలు దేశంలో ఈయన చేస్తున్న పరిచర్య తెలిసిన యూదా పెద్దలు, భక్తిగల మనుష్యులు ఎప్పుడూ ఆయన ఇంటిముందు ఉండేవారు. వారికి దేవుడు తనతోచేప్పిన మాటలు చెబుతుండేవారు. అప్పుడు వీరు అన్నారు: ఈమాటలు మాతో అంతమవకూడదు. దయచేసి ఈ మాటలు అన్నీ ఒక పుస్తకంలో వ్రాయండి అని బ్రతిమిలాడితే ఆయన – తనపేరు మీదుగా ఈ గ్రంధాన్ని వ్రాసుకున్నారు. బైబిల్ పండితులు మొత్తం అంగీకరించేది ఏమిటంటే: తనపేరు మీద రాసుకున్న మొట్టమొదటి ప్రవక్తల గ్రంధం ఈ ఆమోసు గ్రంధమే! యోవేలు గ్రంధం క్రీ.పూ 835 లో వ్రాయబడ్డాది. గాని మొదట్లో దానిని తనపేరు మీదుగా వ్రాయలేదు బహుశా! గాని మొదటగా తనపేరు మీదుగా వ్రాసింది మాత్రం ఆమోసే! దీనిని చూసే హోషేయగారు, ప్రవక్తయైన యెషయా గారు తమ పేర్లుతో పుస్తకం వ్రాసారు. దానినే యిర్మియా గారు, యేహెజ్కేలు గారు అనుసరించారు.

*మరణం*: పై ప్రవచనం చెప్పిన విధముగానే ఈ అమజ్యా పరాయిదేశంలో మరణిస్తాడు. కుటుంబం చిన్నాబిన్నం అవుతుంది. అమజ్యా, వాడి కొడుకు ఎన్నో సార్లు ప్రవక్త ను చంపుదామనుకొన్నా రాజు కాపాడుతుంటాడు కాబట్టి చంపలేదు. BC 753 లో రాజు చనిపోతాడు. అప్పుడు మరోసారి దేవుని వర్తమానములు చెప్పడానికి బేతేలు వచ్చిన ప్రవక్తను చూసి, ఈ అమజ్యా కొడుకు- క్రీ.పూ. 750 లో గునపంతో తలమీద కొట్టగా తలబ్రద్ధలైపోతుంది. అయితే వెంటనే చనిపోలేదు. ఆ రక్తపు మడుగులతోనే తన సొంతూరు తెకోవ చేరుకున్నారు. అక్కడ కొంతకాలమైన తర్వాత అదే గాయాలతో బాధపడుతూ చనిపోయారు. అక్కడే సమాధి చేయబడ్డారు. ఈ రకంగా దేవునికోసం హతస్సాక్షి అయ్యారు.

ఈరకంగా ఒక పశువుల కాపరి నమ్మకముగా భక్తిగా ఉంటే, అయన యాజకుడు కాకపోయినా, ప్రవక్తల శిష్యుడు కాకపోయినా, ప్రవక్తల పాఠశాలలో (ప్రవక్తల శిష్యుల ఆశ్రమం) చదువకపోయినా, దేవుడే పిలిచి ప్రవక్తను చేశారు.

ప్రియ స్నేహితుడా! నీవు ఎవరివైనా సరే , దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నారు. దేవుడికి కష్టపడి, నమ్మకముగా పనిచేసేవారు కావాలి. అప్పుడు నీవు ఎలాంటి వాడవైనా, చదువుకొన్నా, చదువుకోకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ధనవంతుడవైనా, ఆమోసులాగ రోజు కూలివైనా దేవుడు నిన్ను వాడుకొంటారు.
మరి నీవు సిద్దమా!?
దైవాశీస్సులు!


నేను ప్రవక్తను కాను

*రెండవ భాగం*.

ప్రియ దైవజనమా! గతభాగంలో ఆమోసుగారి చరిత్ర చూసుకున్నాం. ఈరోజు ఆయన రాసిన గ్రంధంలోనూ, ఆయన ప్రవచానలలోను ముఖ్య విషయాలు ధ్యానం చేసుకుందాం.

ముఖ్య ఉద్దేశం:
*1) దేవుడు తన ప్రజలపట్ల నమ్మకముగా ఉంటారు. అలాగే ప్రజలుకూడా దేవునిపట్ల నమ్మకముగా ఉండాలి. అనగా ఆయన కట్టడలను, విధులను తప్పకుండా పాటించాలి*.

2)*సామాజిక న్యాయాన్ని పాటించాలి. సామాజిక న్యాయం లేకపోతే ప్రజలకు అనగా సామాన్యులకు దేవునిమీద కూడా నమ్మకం పోతుంది. ఇన్ని కష్టాలు పడుతుంటే దేవుడు చూడటం లేదా? ఏం చేస్తున్నాడు అంటారు. అంతేకాకుండా, సామాన్యులకు రక్షణ లేకపోతే, వారికి రాజు మీద, రాజ్యం మీద కూడా నమ్మకం పోతుంది*.

౩) *దేవుడు ఈ భూమి అంతటికి అధిపతి. ఆయన దుష్టులను శిక్షిస్తారు. అది సొంత ప్రజలైన ఇశ్రాయేలు వారైనా, అన్యులైనా ఒకటే!*

4) *ఇశ్రాయేలీయులు చేసిన పాపాలకు, అపనమ్మకత్వానికి బదులుగా దేవుడు ఇశ్రాయేలీయులను పరాయిదేశానికి చెదరగొట్టబోతున్నారు*.

ఇక ఆయన ప్రవచనాలలో మొదటి రెండు అధ్యాయాలలో ఎక్కువగా ఇతర దేశాలమీద దేవుడిచ్చిన తీర్పులను చూసుకోవచ్చు. గమనించ వలసిన విషయం ఏమిటంటే: ఈ తీర్పులు దేవుడు నియంతలాగ తీర్పులు ఇవ్వడం లేదు. ఇతర దేశాలవారిని శిక్షిస్తాను అని చెబుతూ, శిక్షించటానికి గల న్యాయమైన కారణాలు రెండు-మూడు చెబుతున్నారు. దేవునికి మనకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అయినా దేవుడు ఎందుకు ప్రజలను శిక్షించబోతున్నారో వివరణ ఇవ్వడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవునికి ప్రజలందరూ సమానమే! ఈ రెండు అధ్యాయాలలో ఇతర దేశాల వారు, ఆ పరాయిదేశస్తులను ఎలా దండించారోచెబుతూ, అది తన దృష్టిలో నేరము అని చెబుతూ, అందుకే వారిని శిక్షించబోతున్నాను అని చెబుతున్నారు.

మొదటగా: *దమస్కు వారికోసం దేవుని తీర్పులు*: ఆమోసు 1:౩—5; దమస్కు ఆ కాలంలోనూ, ఇప్పుడు కూడా సిరియా రాజధాని. అందుకే దానిమీద దేవుని తీర్పులు చెబుతున్నారు.
*నేరాలు*: వీరు గిలాదు వారిని (గిలాదు అనగా ఇశ్రాయేలు దేశంలో యోర్దాను తూర్పు ప్రాంతం, సిరియా బోర్డర్) ఇనుప పళ్ళున్న యంత్రాలతో చిత్రహింసలు చేశారు. ఇంకా హజాయేలు, అతని కొడుకు బెన్హదదు ఇద్దరు ఇశ్రాయేలు దేశాన్ని, యూదులను సర్వనాశనం చేసారు. గర్బిణీ స్త్రీల కడుపులు చింపేశారు. బెత్-ఏదోన్, కీర్ అనే ప్రాంతాలు ప్రస్తుతం ఇరాన్ దేశంలో గల కొన్ని ప్రాంతాలు. దమస్కు మీదకు ఇతరదేశాల వారిని రప్పించి, వారిని మరో దేశానికి బానిసలుగా అమ్మేస్తాను అని దేవుని తీర్పు.

తర్వాత తీర్పు: *గాజా వారిమీద*: 6—8; గాజా అనేది ఫిలిస్తీయుల ముఖ్య పట్టణం. యూదా దేశాన్ని అనుకుని, మధ్యధరా సముద్ర తీరంలో ఉంది.
*నేరాలు*: అనేకసార్లు ఇశ్రాయేలీయులను , యూదులను బందీలుగా తీసుకుపోయి, ఎదోము వారికి బానిసలుగా అమ్మేశారు. అందుకే గాజా ప్రాకరాలను అగ్నితో కాల్చేస్తాను. ఆష్డోదు వారిని నాశనం చేస్తాను. 1 సమూయేలు గ్రంధంలో మనకు ఫిలిష్తీయుల 5 గురు సర్దారులు కనిపిస్తారు. వీరిలో ఒకరు ఆష్డోదు . 8వ వచనంలో ఇలాచేసి, తక్కినవారు నశించేవరకు ఎక్రోనును దెబ్బతీస్తాను అంటున్నారు. ఎక్రోను అనేది మరో ఫిలిష్తియ నగరం. గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ప్రవచనం చెప్పిన విధముగానే నేడు ఆ ఫిలిష్తీయులలో ఎవరు లేరు. జాతిమొత్తం నశించిపోయింది. నేడు ఉన్న పాలస్తీనా దేశం అంతా సంకరజాతి.

తర్వాత తీర్పు: *తూరు*: 9—10; తూరు ఇశ్రాయేలు దేశానికి ఉత్తరంలో ఉంది. బోర్డర్. ఇది ఓడలరేవు. ఇక్కడనుండి ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా తీసుకుని వచ్చి పరాయి దేశస్తులకు అమ్మేసేవారు. ఎవరికీ అమ్మేశారు అంటే ఎదోము వారికి అమ్మేశారు అని సెలవిస్తుంది తొమ్మిదో వచనం. అందుకే తూరుని అగ్నితో కాల్చేస్తాను అంటున్నారు.

తర్వాత *ఎదోము*: 11—12; ఎదోము అనగా ప్రస్తుతం జోర్డాన్..
*నేరాలు*: జాలిలేకుండా బంధువులను శిక్షించారు. బందువులు ఎవరు? ఇశ్రాయేలీయులు- ఎదోమీయులు అన్నదమ్ములే కదా! ఎదోము అనగా ఏశావు. మరి బందువులే కదా! వీరు జాలి లేకుండా బంధువులను తరుముతూ, చీల్చుతూ వచ్చారు కాబట్టి తేమాను, బొస్రా అగ్నితో కాల్చేస్తాను. ఇది ఎప్పుడో జరిగిపోయింది.

తర్వాత: *అమ్మోను*: ఇది ఇశ్రాయేలు దేశానికి తూర్పున ఉంది. 13—15; జోర్డాన్ రాజధాని.
*నేరాలు*: సరిహద్దులు విశాలం చేయాలి అనే దుష్ట ఆలోచనతో గిలాదులో ఉన్న గర్భిణి స్త్రీల కడుపులు చింపారు. అందుకే రబ్బా పట్టణాన్ని కాల్చేస్తాను అంటున్నారు. ఆష్షూరు వారు(ఇరాక్) దీనిని ఎప్పుడో ద్వంసం చేసేసారు. అమ్మోను అనగా నేటి జోర్డాన్. దానికి ముఖ్య పట్టణం అమ్మాన్.

తర్వాత: *మోయాబు*: 2:1—౩; యూదాకి మీదన 100 మైళ్ళు, మృతసముద్రంకి తూర్పుగా ఉంది. భయంకరమైన విగ్రహారాధన, పిల్లలను బలి ఇవ్వడం, భయంకరమైన వ్యభిచారం గల దేశం.
*నేరాలు*: ఈ మోయాబీయులు ఎదోము రాజుని జయించి, ఆ రాజుని చంపి, అతని ఎముకలును కాల్చి సున్నంలో కలిపారు. అప్పట్లో ఇది భయంకరమైన నేరం! అందుకే వారిని శిక్షిస్తాను అంటున్నారు. ఎదోము వారు అన్యులు అయినా, వారికోసం నేను మోయాబుని శిక్షిస్తాను అంటున్నారు. కేరీయోతు అనగా మోయాబు రాజధాని. దీనినే కీర్-మోయాబ్, కీర్-హశరేట్ అనేవారూ. ఈ పట్టణాలను ప్రజలను శిక్షిస్తాను అంటున్నారు .

చూసారా, దేవునికి బందుప్రీతి లేదు. నేరం చేసినవాడు ఎవడైనా దేవుని దృష్టిలో ఒక్కటే, ఒక్కటే తీర్పు. చరిత్ర ప్రకారం పై చెప్పిన అన్ని దేశాల వారి మీదకు దేవుని తీర్పులు వెళ్ళాయి. అందరిని శిక్షించడం జరిగింది. మొదటగా అస్సూరీయుల ద్వారా. అనగా ఉత్తర ఇరాక్ ద్వారా,. తర్వాత బబులోను ద్వారా అనగా దక్షిణ ఇరాక్ ద్వారా! ఒక
పశువుల కాపరిద్వారా దేవుడు సెలవిచ్చిన మాటలను అన్నీ నెరవేర్చారు. నీవు తప్పుచేస్తే దేవుడు నిన్నుకూడా శిక్షిస్తారు జాగ్రత్త!

ఇంతవరకు మనం ఆమోసు గారికి అన్యదేశాల వారి మీదకు వచ్చిన ప్రవచనాలు ధ్యానం చేసాము. రేపు సొంత ప్రజలమీద ప్రవచనాలను ధ్యానం చేద్దాం!

దైవాశీస్సులు!


నేను ప్రవక్తను కాను

*మూడవ భాగం*

ప్రియ దైవజనమా! గతభాగంలో ఆమోసుగారి ద్వారాదేవుడు ఇశ్రాయేలు దేశానికి చుట్టుప్రక్కల ఉన్న దేశాలమీదకు దేవుని తీర్పును చూసుకున్నాం. ఇక ఆ తర్వాత ఈ గ్రంధం చివరివరకు తన ప్రజలైన యూదులు, ఇశ్రాయేలు వారిమీదకు దేవుడు ప్రకటించిన తీర్పులు చూడవచ్చు. అనగా ఇతర ప్రజలకంటే తన సొంతప్రజల పాపాలనే ఎక్కువగా రాస్తున్నారు దేవుడు. కారణం మిగిలిన ప్రజలకు దేవుని ధర్మశాస్త్రం, దేవుని ప్రత్యక్షతలు లేవు. వీరికి దేవుని ధర్మశాస్త్రం- ప్రత్యక్షతలు- ప్రవక్తలు ఉన్నారు. గాని వీరు దేవునిమాట వినక- తిరుగబడుతున్నారు కాబట్టి తనసొంత ప్రజలకోసమే ఎక్కువ తీర్పులు కనబడుతున్నాయి. దానికి కారణం ఆయన నోటిమాటల లోనే చూడండి. ఆమోసు 3: 2
*అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును*.

సొంతప్రజలలో మొదటగా *యూదులకోసం* చెబుతున్నారు. ఆమోసు 2:4—5
*చేసిన నేరాలు*: దేవుని ధర్మశాస్త్రాన్ని, చట్టాలను పాటించక త్రోసివేశారు. వారి పూర్వికులు చేసిన తప్పులనే వీరుకూడా అనుసరించారు. అందుకే నేను యూదా జనాంగం మీద అగ్ని రప్పిస్తాను. అవి యెరూషలేమును దహిస్తుంది. మనకు తెలుసు BC 586లో నెబుకద్నెజరు ద్వారా యేరూషలేము దేవాలయం, నగరం కాల్చబడింది. ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు ఆమోసు.

ఆమోసు 1:౩—2:౩ వరకు ఇతర ప్రజలు ఇశ్రాయేలీయులకు విరోధముగా చేసినవి. అయితే 2:౩ నుండి చివరివరకు ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేఖముగా చేసినవి అందుకే ఇంత భయంకరమైన తీర్పులు. అందుకే బైబిల్ సెలవిస్తుంది: తీర్పు దేవుని ఇంటినుండే ప్రారంభమవుతుంది. .1 పేతురు 4:17; .
దేవుడు చెబుతున్నారు
యిర్మియా 6:19
భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను.
యేహెజ్కేలు 20:23—24
23. మరియు వారు నా విధుల ననుసరింపక నా కట్టడలను తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినములను అపవిత్ర పరచి,
24. తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా, అన్యజనులలో వారిని చెదరగొట్టి సకలదేశముల లోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని;

ఇక సొంత ప్రజలే తనమాటలు వినకపోతే దేవుడు ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ఎవరికీ చెప్పుకోలేక—ఆకాశమా ఆలకించుము! భూమి చెవియొగ్గుము! నేను పిల్లలను పెంచి పెద్దచేశాను. వారు నామీద తిరుగబడి యున్నారు అని తన వేదనను భూమి-ఆకాశములతో చెప్పుకొంటున్నారు. యెషయా 1:2--4;

ప్రియ చదువరీ! ఇతర ప్రజలకు తీర్పు చెప్పిన దేవుడు తన సొంతప్రజలు పాపము చేస్తే ఊరుకొంటారా? ఊరుకోరు. అందుకే యూదులు, ఇశ్రాయేలీయులు ఎంతగానో, ఎప్పటినుండో భాదలు అనుభవించారు. వారుకదా అనుభవించారు – నాకు ఏమీ ఉండదు కదా అనకు. వారిని మొదటగా తన స్వకీయమైన ప్రజగా ఏర్పరచుకొన్నారు. వారు వినలేదు కాబట్టి ఆ రక్షణభాగ్యం, ఆ స్వకీయజనాంగముగా దేవుడు మనలను- ఆయన కుమారుని రక్తముద్వారా ఏర్పాటుచేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నీవు ఆయన సొంత బిడ్డవు. ఇప్పుడు నీవు కూడా దేవునిమాటను వినకపోతే—ఇంతగొప్ప రక్షణను నిర్లక్షము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందువు? .హెబ్రీ 2:3; ఇంకా వివరముగా చెబుతున్నారు పౌలుగారు రోమా 11:7, 8, 12, 13, 15, 17—26. ఇంకా 29—31
7. ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కిన వారు కఠినచిత్తులైరి.
8. ఇందువిషయమైనేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును,చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.
11. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు.
12. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!
15. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?
16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.
17. *అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన*
18. *నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు*.
19. *అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు*.
20. *మంచిది; వారు అవి శ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము*;
21. *దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు*.
22. *కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు*.
23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.
24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత లీవచెట్టున అంటు కట్టబడరా?
25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

30. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి.
31. అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు

ఇంకా అంటున్నారు 12:1—2
1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
2. మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

కాబట్టి భయమునొంది పాపము చేయకుండా ఉందాము. కీర్తనలు 4:4;
లేదా ప్రియ స్నేహితుడా! స్వాభావిక కొమ్మలైన యూదులు, ఇశ్రాయేలీయులు నరుకబడినట్లు/ కత్తిరింపబడినట్లు నీవుకూడా దేవునినుండి నరకబడి/కత్తిరించబడి పారవేయబడతావు. యేసుప్రభులవారు అంటున్నారు—మీరు నానుండి వేరుపడితే ఫలించలేరు. యోహాను 15:1—2, 4—6.
1. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.
2. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.
4. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.
5. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.
6. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును. . . ..

కాబట్టి మనలని మనం సరిచూసుకుని, మనకు మనమే సరిచేసుకుందాం. ఫలింపని ప్రతీ తీగెను నరికి అగ్నిలో వేస్తాను అంటున్నారు ప్రభువు. ఇదిగో గొడ్డలి వేరున పదును పెట్టబడి యుంది అని మరచిపోవద్దు. మత్తయి 3:10; లూకా 3:9;
మారుమనస్సుకి తగిన ఫలాలు ఫలిద్దాం. దేవుని పేరు పెట్టుకుని, ఆ పేరుకు తగ్గట్టుగా జీవిద్దాం! మత్తయి 3:7; నరకాన్ని తప్పించుకొందాం. లేదా లవొదొకయ సంఘం వలె ఉమ్మివేయబడి- వెలుపట చీకటిలో భాదపడాలి జాగ్రత్త!

దేవుని మాటకు లోబడి ఆయనకు ప్రియులైన పిల్లల వలె ఉందుము గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!


నేను ప్రవక్తను కాను

*నాల్గవ భాగం*

ఆమోసు 2:6—8
6. యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మి వేయుదురు.
7. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు;
8. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలి పీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. . . .

గతభాగంలో యూదులమీద తీర్పులు విన్నాము. ఈ రోజు ఇశ్రాయేలు మీద తీర్పులు- వారుచేసిన నేరాలు చూసుకుందాం. దానికి ముందుగా అసలు ఈ ప్రవచనాలు చెప్పేటప్పటికి ఇశ్రాయేలు దేశం ఎలాఉంది? యూదా సామ్రాజ్యం ఎలా ఉంది అనేది చరిత్ర ఆధారముగా చూసుకుందాం.

As Per chabad and Oca : ఆమోసు గారు ప్రవచన పరిచర్య ప్రారంభించబోయేసరికి మొదటి రెండు వచనాలలో చెప్పినట్లు యూదా సామ్రాజ్యాన్ని రాజైన ఉజ్జియా పాలిస్తున్నాడు. ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని రాజైన యెహోయాసు కుమారుడైన యరోబాము-2 పాలిస్తున్నాడు. సొలోమోను తర్వాత ఇశ్రాయేలు సామ్రాజ్యానికి స్వర్ణయుగం లేదా సకలమైన ఆస్తి ఐశ్వర్యముతో ఆనందించిన రోజులు ఉన్నాయి అంటే అది ఈ యరోబాము-2 సమయంలోనే. యితడు యుద్దాలు చేసి- దేశాన్ని శాంతి సౌభాగ్యాలతో నింపడమే కాకుండా, ప్రజలను ఐశ్వర్యవంతులుగా చేసాడు. మోయాబును, సిరియాను, ఇంకా పక్క రాజ్యాలను జయించి, ఆ ఆస్తిని ఇశ్రాయేలు దేశం తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత యుద్దాలమీద కాకుండా వ్యాపారం మీద దృష్టి పెట్టాడు. ఈరకంగా అనేక రాజ్యాలతో వ్యాపారం చేసి- ఆస్తిఅంతస్తు సంపాదించిపెట్టాడు. ఇలా చేసినప్పుడు ప్రక్కనున్న తూరు-సీదోనులతో కూడా వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ తూరు రేవు పట్టణం కాబట్టి ఓడలమీద వ్యాపారం మొదలుపెట్టాడు. అప్పుడు దేశంలో లగ్జరీ ని తీసుకుని వచ్చాడు ఈ తూరు-సీదోనులతో. విలాసవంతమైన జీవితానికి ప్రజలు అలవాటు పడటం మొదలైంది. తూరు సీదోనుల నుండి సప్లై అయ్యే- అందమైన విదేశీ యువతులు రావడం జరిగింది. వారితో పాపం మొదలైంది. లగ్జరీతో పాటు విదేశీ అలవాట్లు కూడా అలవాటు అయ్యింది. దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారు ఇశ్రాయేలు దేశంలో. ఇక యూదా సామ్రాజ్యం రాజైన ఉజ్జియా కొంచెం భక్తిగా ఉండేవాడు. మొదట్లో ఇశ్రాయేలు రాజు యరోబాము-2 యూదా రాజుతో విరోధం పెంచుకుని, వారిని జయించి, ఉజ్జియా బంధువులను కూడా చెరలోకి తీసుకునిపోయి, కష్టాలు పెట్టాడు. దానిద్వారా రాజ్యంలో ఆశాంతి, అల్లర్లు మొదలయ్యాయి. యరోబాముది బిజినెస్ మైండ్ కాబట్టి- యూదాతో సమాధానం పెట్టుకుని, వీరిని విడిపించి వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. తద్వారా అల్లర్లు పోవడమే కాకుండా రెండు రాజ్యాలలో వ్యాపారం చాలాబాగా సాగింది. అనేకమైన లాభాలు కలిగాయి ఇశ్రాయేలు రాజుకి. నెమ్మదిగా ఈ అభివృద్ధితో పాటు విదేశీ దేవుళ్ళు యూదా సామ్రాజ్యంలో కూడా వెలిసాయి. బేతెలులో అన్యాచారాలు- అన్య దేవతా విగ్రహాలు విచ్చలవిడిగా వెలిసాయి. కారణం విదేశీ-వ్యాపారులను ఆకర్షించుకోడానికి. ఈ విదేశీయులతో విదేశీ అలవాట్లుగా- సామాజిక న్యాయం పోయింది. బీదలను హింసించడం. కేవలం చెప్పులకోసం మనుష్యులను అమ్మేసేవారు. డబ్బున్నవాడిదే రాజ్యం. డబ్బులేని వారి పరిస్తితి ఘోరంగా మారిపోయింది. సామాజిక స్పృహ ఎవరికీ లేదు. దేవుడంటే భక్తీ లేదు. వావివరుసలు లేని వ్యభిచారం. తండ్రి-కొడుకు ఒకే స్త్రీతో పాపం. విచ్చలవిడి పెరిగిపోయింది. ఈ పరిష్టితులలో దేవుడు వారికి బుద్ధిచెప్పడానికి ఇశ్రాయేలులో ఎవరూ లేకపోతే- ఈ గొర్రెల కాపరిని పిలుచుకొని ఆ దేశానికి పంపించారు.
ఇప్పుడు ఇశ్రాయేలు దేశం చేసిన నేరాల లిస్టు చూద్దాం.

మొదటగా నిర్దోషులను డబ్బుకి అమ్మివేస్తున్నారు. గమనించాలి ఆరోజులలో మనుష్యులను బానిసలుగా అమ్మే వ్యాపారం విరివిగా సాగేది. ఇప్పుడు వీరు నిర్దోషులను, డబ్బులేని వారిని పట్టుకొని అమ్మేస్తున్నారు. దేవుడు చెప్పారు—మీరు సహోదరులను అమ్మకూడదు అంతే. వీరు అమ్మేస్తున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే: బీదలను పాదరక్షలకోసం అమ్మేస్తున్నారు. ఈ రోజులలో విదేశీవస్తువులంటే మనకు ఎలా మోజు ఉన్నదో—ఆరోజులలో కూడా విదేశీ వస్తువులపై మోజుతో, బీదలను పట్టుకొని, అనగా ఎవరైనా వారిదగ్గర అప్పుచేస్తే, ఆ అప్పుకు ప్రతిగా వీరు ఇతరులకు అమ్మేసేవారు. అంత ఘోరంగా ఉంది సామాజిక న్యాయం అక్కడ! ఇంకా 7 వ వచనం ప్రకారం నేలమీద మట్టిని కుమ్మరి తొక్కినట్లు, వీరు దీనులను, దిక్కులేని వారిని, ఏ విధమైన సపోర్టు లేనివారిని తోక్కేస్తున్నారు. దీనులను అవతలికి గెంటివేస్తున్నారు. కారణం వీరు లంచాలకు అలవాటు పడి- నీతిన్యాయాలు వదిలేశారు. సత్యం- సంతలోకి వెళ్ళిపోయింది. న్యాయం అనేది లేకుండా పోయింది.

తర్వాత ఒక తండ్రి- తన కొడుకు ఒకే స్త్రీతో పాపం చేస్తున్నారు. మరలా మీకు ఒకసారి గుర్తుచేస్తున్నాను- విదేశీ స్త్రీలు అక్కడికి చాలామంది వచ్చేవారు. వారితో అలాచేయడం మొదలు పెట్టారు. చివరికి వారు ఇశ్రాయేలీయులతో కూడా అదే పాపాన్ని కొనసాగించేవారు. ఇది బైబిల్ ఖండిస్తుంది. ఒకసారి లేవీకాండం చూసుకుంటే ఇది ఎంత ఘోరమైన పాపమో తెలుస్తుంది మనకు. ఇలా చేసి నా పవిత్రమైన పేరుని అపవిత్రం చేస్తున్నారు అని దేవుడు భాధపడుతున్నారు. లేవీ 18:21; 19:12; 21:6; యిర్మియా ౩4:16; యేహెజ్కేలు 20:9.

ఇక తాకట్టుగా ఉంచిన వస్త్రాన్ని తిరిగి అప్పగించకుండా వాటిని ప్రతీ బలిపీటం దగ్గర పరచి దానిమీద పడుకుంటున్నారు. అనగా ప్రతీ బలిపీటం అనగా అక్కడ బోలెడన్ని విదేశీ దేవుళ్ళ గుడులు, బలి పీఠాలు వెలిసాయి. అక్కడ వారి దేవుళ్ళను పూజించడం, అది అయిపోయిన తర్వాత తాగి తందనాలు ఆడడం! వీటికోసం ధర్మశాస్త్రం ఏమి సెలవిస్తుంది. నిర్గమ 22:26-27
26. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్ప గించుము.
27. వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహమునకు వస్త్రము; వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొఱపెట్టిన యెడల నేను విందును.; ద్వితీ 24:12—13; 17. ఇంకా జుల్మానా డబ్బుతో మందు కొనుక్కుని త్రాగి, దేవుని మందిరంలోనే త్రాగుతారు. ఎంత ఘోరమండి ఇది! ఇలాంటివి చేస్తే దేవుడు క్షమిస్తారా? ఎత్తి పరిస్తితిలోనూ క్షమించరు. అందుకే ఆమోసుని పంపించారు.

నేటి రోజులలో చాలామంది ఇలాగే చేస్తున్నారు. దేవుని మందిరాలలోనే తాగితందనాలు ఆడుతున్నారు. ముఖ్యంగా ఈ లెంట్ రోజులలో కొన్ని సంఘాలు (RCM) గుడ్ ఫ్రైడే వరకు లెంట్ చేసి, గుడ్ ఫ్రైడే సాయంత్రం వారికి పార్టీ ఉంటుంది చర్చి ఆవరణంలో. ఆ రోజు ఫుల్ గా మందు కొడతారు బొంబాయ్, గోవాలలో. ఇది నిజంగా క్షమించదగినదా? వారే కాదు ప్రస్తుతం చాలామంది Protestant చర్చిలలో కూడా మందుకొట్టేవారున్నారు. ఆరాధన అయిపోయిన వెంటనే మందు కొట్టేవారు, ప్రసంగానికి ముందు మందు కొట్టేవారు ఉన్నారు. వీరిమీదకు దేవుని న్యాయమైన ఉగ్రత రాదా?!! తప్పకుండా వస్తుంది. యెహోవా దినం వస్తుంది. అది పెల్లుమని వస్తుంది అని సెలవిస్తుంది బైబిల్! యెషయా 2;
కాబట్టి ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపంతో ఉపవాసముండి ప్రార్ధన చేస్తే దేవుడు కనికరిస్తారు. ;లేకపోతే ప్రియ దైవజనమా! నీమీద నామీద కూడా దేవుని ఉగ్రత అనే పెనుగాలి వచ్చి సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త!

దైవాశీస్సులు!


నేను ప్రవక్తను కాను

*5వ భాగం*

ఆమోసు 2:11—12
11. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను(వ్రతము పట్టినవారుగాను) నియమించితిని. ఇశ్రాయేలీయులారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే యెహోవా వాక్కు.
12. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.

ప్రియులారా! గత భాగంనుండి మనం ఇశ్రాయేలీయులు చేసిన పాపాల చిట్టా/ లిస్టు చూస్తున్నాం. ఈ గ్రంధం చివరివరకు వారి పాపాల చిట్టానే కనిపిస్తుంది మనకు. దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన అమోఘమైన పనులు – దానికి ప్రతికూలంగా వారు చేసిన పాపిష్టి పనులు మనకు కనిపిస్తాయి.

9 వ వచనంలో దేవుడు చెబుతున్నారు; వీరిని అక్కడ స్థాపించాలి అని నేను అమోరీయులను వెల్లగొట్టాను. ఆ దేశాన్ని/ ప్రాంతాలను స్వాధీనం చేద్దాము అని నేను మిమ్మును ఐగుప్టు దేశం నుండి తీసుకుని వచ్చి, మిమ్మును ఇక్కడ నాటాను. మీకోసం మీ సంతానంలో నుండే ప్రవక్తలను నియమించాను. మీ యువకులలో కొందరిని నాజీరులుగా ఎన్నుకొన్నాను. ఇక్కడ గమనించవలసిన విషయాలు—దేవునికి ప్రవక్తలు అంటే – దేవుని మాటలను ప్రజలకు తెలిపేవారు. ఇలా దేవుడు తనకొరకు ప్రవక్తలను ఏర్పరచుకోవడం కేవలం ఇశ్రాయేలు దేశానికి మాత్రం చెల్లింది. లోకంలో విగ్రహాలకు ప్రవక్తలు ఉన్నారు గాని దేవునికి ప్రవక్తలు మొట్టమొదటిగా ఇశ్రాయేలులో మాత్రమే ఉన్నారు. ఇక నాజీరులు అని సంఖ్యాకాండము 6:1--21లో ఇలాంటివారికోసం వ్రాయబడియుంది. వీరు ద్రాక్షారసం త్రాగకూడదు, చచ్చినది ముట్టకూడదు. తల కత్తిరించుకోకూడదు. ఇలా చాలా పవిత్రంగా ఉండాలి. అయితే 12 వ వచనం గమనించండి. ..అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.
. . . చూసారా ఎంత ఘోరమో!!! నాజీరుల చేత ద్రాక్షారసం / మధ్యము త్రాగించారు. గమనించాలి ఎప్పుడైతే ఈ నాజీరు మద్యము/ ద్రాక్షారసం త్రాగుతాడో వాని నాజీరు అనే వ్రతం భంగమైనట్టే!! అనగా వారిని బ్రష్టులుగా, భక్తిహీనులుగా మార్చేస్తున్నారు. అంతేనా? ప్రవక్తలతో చెబుతున్నారు—మీరు దేవునిపేరిట పలకొద్దు అంటున్నారు. నిజంగా దేవునిమాటలను ప్రవచించే ఆమోసుగారి లాంటివారిని బలవంతం చేస్తున్నారు మీరు దేవునిమాటలు పలకొద్దు. అలా చేస్తే ఆహాబుకాలం నుండి చంపేస్తున్నారు.

ఇక్కడ గమనించాలి దేవుడిచ్చిన ఈ గొప్ప ఉచిత వరాలు అనగా దేవునికోసం ప్రవక్తగా, నాజీరులుగా దేవునిసేవ చేసే భాగ్యం మనుషులకు దేవుడు కలిపించారు. అయితే దీనిని ఇశ్రాయేలీయులు తిరస్కరిస్తున్నారు. దేవుని సేవకుల పట్ల తిరస్కారభావం, చిన్నచూపు చూపిస్తున్నారు. తద్వారా దేవుని సేవకులను/ప్రవక్తలను/ నాజీరులనే కాదు దేవున్నే తిరస్కరిస్తున్నారు. కారణం ఈ సేవకులను పంపించింది దేవుడే!! దేవుడే ఈమాట చెబుతున్నారు 1 సమూయేలు 8:7 అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా-జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు.

ఒక నాజీరు మద్యం తాగితే తన ప్రతిష్టత కోల్పోతాడు. కాబట్టి దేవునికోసం దేవునిసేవలో పూర్తిగా అంకితమైన వ్యక్తులు దేవుని సత్యం ఉన్నది ఉన్నట్లు చెబుతుంటే వీరు తట్టుకోలేక పోతున్నారు. వారి ఉనికిని సహించలేకపోతున్నారు. కారణం వీరు వారి నేరాలు/ పాపాలు/ ఘోరాలు ఎత్తి చూపిస్తున్నారు. వీరికి గద్దింపు అనేది పడటం లేదు. అందుకే


2 తిమోతీ 4:౩—4 చూసుకుంటే:
3. ఎందుకనగా జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
4.సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును. . . .

అందుకే ఆమోసు 7:12—13 లో ఆమోసుగారిని అడ్డగించారు.
12. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను దీర్ఘదర్శీ, తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము; అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము;
13. బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమైయున్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. . . .
యెషయా కూడా దీనినే ద్రువీకరిస్తున్నారు 30:10,11
10. దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయా దర్శనములను కనుడి
11. అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట ఎత్తకుడి అని భవిష్యద్ జ్ఞానులతో పలుకువారునై యున్నారు. . . . .
యిర్మియా గారితోనూ అన్నారు 11:21
కావున నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు . . . .
మీకా గారితోనూ అన్నారు 2:6
మీరు దీని ప్రవచింప వద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపనియెడల అవమానము కలుగక మానదు. . . .

కొంతమంది ఇంకా ముందుకెళ్ళి వారికోసం అబద్దప్రవక్తలను ఏర్పాటుచేసుకున్నారు.
మరి ఇలాంటివి చేస్తే దేవుడు ఊరుకుంటారా? ఒక తండ్రి—తన బిడ్డ తనమాట వినకపోతే చెంపచెల్లుమనిపించిన విధముగానే ఇక్కడ వీరికి తీర్పులు ప్రకటిస్తున్నారు. 13—15
13. ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.
14. అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును.
15. విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించు కొనలేకపోవును, గుఱ్ఱము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. . ..
ఇక 16 చూడండి
మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యము గలవాడు దిగంబరియై పారిపోవును; ఇదే యెహోవా వాక్కు.. . . .
ఇక్కడ ఆరోజు అనగా అస్సూరీయులు వారిమీదకు వచ్చి వారిని చెరలోనికి తీసుకొని పోయే రోజు! వారిని నిర్దాక్షిణ్యంగా ఖడ్గముతో చంపే రోజు! ఒకసారి 2 రాజులు 17:5—23 చూడండి.2 Kings(రెండవ రాజులు) 17:5,6,7,8,9,10,11,12,20,23
5. అష్షూరురాజు దేశమంతటిమీదికిని షోమ్రోనుమీదికిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రో నును ముట్టడించెను.
6. హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను.
7. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములో నుండియు, ఐగుప్తురాజైన ఫరో యొక్క బలముక్రింద నుండియు, తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపముచేసి యితర దేవతలయందు భయభక్తులు నిలిపి
8. తమయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలురాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి.
9. మరియు ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములు గల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని
10. యెత్తయిన కొండలన్నిటిమీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి
11. తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులవాడుక చొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి
12. చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటిని చేసి పూజించు చుండిరి.
20. అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖము నుండి వెళ్లగొట్టెను.
23. తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములో నుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశములోనికి చెరగొని పోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు. .. . .

దేవుని తీర్పులు అలాగే ఉంటాయి. ఎన్నిమారులు గద్దించినను విననివాడు- మరి తిరుగులేకుండా- హటాత్తుగా నాశనమగును. సామెతలు 29:1;

సరేలే ఈ ప్రవచన భాగం ఇశ్రాయేలీయులకే కదా నాకు కాదు కదా అనుకోవద్దు ! గమనించవలసిన విషయం ఏమిటంటే: ఆకాలంలో దేవుడు ప్రవక్తలను—నాజీరులను ఎన్నుకొన్నారు. ఈరోజు క్రొత్త నిభందన కాలంలో ఎఫెసీయులకు 4:13
పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

కాబట్టి మొదటగా ఈ fivefold ministry లో ఉన్నవారి మాటలు నీవు వినాలి. వినకపోతే ఇశ్రాయేలుకు పట్టిన గతే నీకు పడుతుంది.
ఇక .1కోరింథీయులకు 12: 28
మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.
ఈ Tenfold ministry లో నీవుకూడా ఉన్నావు. ఉండాలి. అలాకాకపోతే దేవునికి లెక్క అప్పగించాలి. ఫలాలు లేని క్రైస్తవుడిగా దేవునిచేత కత్తిరించబడతావు. కాబట్టి ఈ ప్రవచనాలు నాకు కాదు అనుకోకు,. ఈ భాగం నీతోకూడా మాట్లాడుతుంది. ఒకవేళ నీవు మీ సంఘకాపరి, సేవకుడు, సంఘ నాయకుల మాటలు వినడం లేదా, మీ సంఘ కాపరిని మీరు మీ సంఘ కమిటీ హింసలు పెడుతున్నారా/ ఆయనను శాసిస్తున్నారా జాగ్రత్త! ఇశ్రాయేలీయులు అలా చేసే నాశనాన్ని కోరి తెచ్చుకున్నారు. వారు అనగా దేవుని స్వకీయజనమే తప్పించుకోలేకపోయారు. నీవు తప్పించుకోగలవా ప్రియ నాయకుడా/ విశ్వాసి!!?
పరిశీలించుకో! సరిదిద్దుకో!
దైవాశీస్సులు!


నేను ప్రవక్తను కాను

*6వ భాగం*

ఆమోసు 3: 2
అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును.

ప్రియులారా! మనం ఇశ్రాయేలు చేసిన పాపాల చిట్టా/ లిస్టు చూస్తున్నాం. ఈ గ్రంధం చివరివరకు వారి పాపాల చిట్టానే కనిపిస్తుంది మనకు.
పై వచనంలో చూసుకుంటే దేవుడు నేను మిమ్మును అనగా ఇశ్రాయేలీయులనే ఎరిగాను అంటున్నారు. అనగా మొత్తం ప్రపంచ దేశాలలోని ప్రజలందరికంటే అబ్రాహాముగారిని ప్రేమించి తనకు స్వకీయజనముగా ఉండటానికి ఒక జనము కావాలని అతని సంతానమైన యాకోబు సంతానాన్ని దేవుడు తనకు సొంత ప్రజగా చేసుకుని వారికి ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, విధులు, మేలులు- దీవెనలు- తెలివితేటలూ ఇస్తే, ప్రజలు దానిని పాడుచేసుకున్నారు. దేవుడిచ్చిన ఫ్రీడమ్ ను దుర్వినియోగం చేసుకున్నారు. ఈ ప్రపంచం మొత్తం మీద మీరే నాకు ప్రత్యేకప్రజ అని దేవుడు సెలవిస్తే, మేము ప్రత్యేకప్రజ కాబట్టి మేము ఏది చేసినా దేవుడు క్షమించేస్తాడు కదా అని విర్రవీగి మరీ పాపము చేశారు బహుశా! అయితే వాస్తవం దీనికి వ్యతిరేఖముగా జరిగింది. తండ్రి తను ప్రేమించే కుమారున్ని శిక్షిస్తాడు కాబట్టి ఎక్కువగా ప్రేమించేవారినే ఎక్కువుగా శిక్షిస్తారు కాబట్టి ఇశ్రాయేలునే ఎక్కువగా శిక్షించారు. సామెతలు 3: 12
తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.

ఇక మూడో వచనంలో మనకు రెండు భిన్నమైన అర్ధాలుకనిపిస్తాయి. ఇద్దరి సమ్మతిలేకుండా వారు కలసి నడుస్తారా? మొదటి ఆధ్యాత్మిక అర్ధం ఏమిటంటే: దేవుడు చేసిన ధర్మశాస్త్రం/ దేవుని ఆజ్ఞలు/ శాసనాలు ప్రజలు పాటిస్తే దేవునికి ఆనందం. కారణం వారు దానిని పాటిస్తేనే నెమ్మదిగా జీవించగలరు. పరిశుద్ద జీవితం జీవించగలరు. దేవుడు పరిశుద్దుడు కాబట్టి వారుకూడా పరిశుద్దులుగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. ఇప్పుడు వారు దేవునిమాటను వినకపోతే, దేవునిమాటను ధిక్కరించినట్టే కదా! కాబట్టి అలాచేస్తే వారు దేవునితో సమ్మతించలేనట్టే, దేవునితో నడవనట్లే! ఆయన రాజు/ తండ్రి కాబట్టి తనమాట విననివానిని శిక్షించేహక్కు సృష్టికర్తకు ఉంది.
మరో అర్ధం ఏమిటంటే: రాజు తప్పుచేస్తున్నాడు. ప్రజలు కూడా తప్పుచేస్తున్నారు. వీరిద్దరూ కలిసి సమ్మతించి తప్పులు చేస్తున్నారు కాబట్టి అందరూ శిక్షించబడతారు.

ఇక దీనినే మనం మరో రకంగా అన్వయించుకోవచ్చు. భార్యభర్తలు సఖ్యతతో ఉంటేనే ఆకాపురం సక్రమంగా నడుస్తుంది. ఇద్దరిమధ్య మనఃస్పర్ధాలు వస్తే ఆ కాపురం ఎక్కువకాలం నిలువదు. కాబట్టి ఇద్దరిలో ఒకరు వెంటనే సమ్మతించాలి. లేకపోతే సమస్యలు. అలాగే దేవుడు నీ యజమాని కాబట్టి ఆయన మాటలకు నీవు సమ్మతించాలి. పవిత్రంగా ఉండాలి. అలా కాకుండా పరపురుషునితో/ పరస్త్రీతో సంభందం పెట్టుకుంటే, కాపురం కూలిపోతుంది. అలాగే నీవుకూడా దేవునిమాట వినకపోతే దేవునితో సంభందం కోల్పోయి నిత్యనాశనానికి పోతావు.

ఇక తర్వాత వచనాలు దానికి కొనసాగింపు. 4—5
4. ఏమియు పట్టు కొనకుండనే కొదమ సింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా?
5. భూమిమీద ఒకడును ఎరపెట్టకుండ పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియు పట్టుబడకుండ ఉరి పెట్టువాడు వదలిలేచునా? .. అనగా కారణం లేకుండా దేవుడు నిన్ను శిక్షించడు కదా, నీవు ఏదో తప్పు చేశావు కాబట్టి నీకీ శిక్ష!

ఇక 6—8 వచనాలలో దేవుడు చెబుతున్నారు మొదటగా దేవుడు తన ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయరు. ముందు చెప్పి తర్వాత చేస్తారు. దేవుడు తన సేవకులైన ప్రవక్తలను సింహాలుగా చేశారు. సింహానికి జంతువులూ భయపడినట్టే, ప్రజలు తప్పులు చేస్తే తన సేవకులు సింహాలు వలె గర్జిస్తారు. అప్పుడు భయపడి పాపం చేయడం మానేయాలి ప్రజలు. ఇక ఈ వచనాలలోను, యోవేలు 2:1 ప్రకారం, యేహెజ్కేలు 33 ప్రకారం దేవుడు తన సేవకులను/ ప్రవక్తలను ప్రజలకు బూరలుగా/ కాపలాదారులుగా పెట్టారు. వారి తప్పులు ఖండించడమే కాకుండా రాబోయే విపత్తులను ముందుగా చెప్పడం వీరి పని. ప్రజలు ఈ భూరధ్వని విని భయపడి జాగ్రత్తపడాలి. అలా కాకపోతే వారి నాశనానికి వారే పాత్రులు! కాబట్టి దేవుడు ఇక్కడ ఆమోసుగారిని సింహంలా గర్జించి- కాపలాదారుడులా వారిని హెచ్చరించడానికి పంపించారు. అయితే ప్రజలు ఆయన మాట వినకుండా శిక్షించారు.

ఇక తొమ్మిదో వచనం విచిత్రంగా ఉంటుంది. ఆష్డోడు భవనాలలో, ఐగుప్టు దేశంలో ఉన్న భవనాలలో ఉన్నవారికి చాటి చెప్పమంటున్నారు ఏమని—షోమ్రోను కొండలమీద జరిగే అపవిత్రమైన పనులు/విగ్రహారాధన/ వ్యభిచారాలు/ హత్యలు/ మానభంగాలు/ పేదలకు జరిగే దోపిడీలు. గమనించండి: ఆష్డోదు ఫిలిస్తీయుల పట్టణం. ఐగుప్తు శత్రురాజ్యం! వీరికి దేవుడు ఎందుకు చాటిచెప్పమంటున్నారు? దేవుడు వీరిలోనుండి ప్రత్యేకించి వారిని పవిత్రులనుగా చేశారు అని ఈ పొరుగుదేశాలకు తెలుసు! ఇప్పుడు దేవుడు వీరిని నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులను నాశనం చేయడానికి దేవునికి గల న్యాయమైన కారణాలు అన్యులు తెలుసుకోవాలి. దేవుని ప్రజలకంటే అన్యులే నీతిమంతులు అని చాటిచెప్పడానికి!

ఇంకా అంటున్నారు దేవుడు: ఇశ్రాయేలీయులు సొంతప్రజలను దోచుకుంటున్నారు. పేదలను దోచుకుంటున్నారు. అన్యాయం చేస్తున్నారు. అందుకే పరాయిదేశం వారు వచ్చి—ఈ ధనవంతులను దోచుకుంటారు. మీరు దోచుకుని, దాచుకున్న ధనాన్ని , ఆ పరాయి దేశస్తులు దోచుకొంటారు.
ఇక 14వ వచనంలో
ఇశ్రాయేలువారు చేసిన దోషములనుబట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును; ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును.
బేతెలు నాశనమైపోతుంది. ఈ బలిపీటాలు కూలిపోతాయి అని సెలవిస్తున్నారు దేవుడు. ఈ ప్రవచనం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలకు ముందే 1 రాజులు 1౩ అధ్యాయంలో దేవుడు చెప్పారు. అసలు బేతేలు ఎందుకు అలా తయారయ్యింది ఒకసారి చూసుకుందాం. 1 రాజులు 12:27,28,29,30,32,33
27. యరొబాము తన హృదయమందు తలంచి
28. ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;
29. ఇశ్రాయేలువారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.
30.దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.
32. మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.
33. ఈ ప్రకారము అతడు యోచించినదానిని బట్టి యెనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను; మరియు ఇశ్రాయేలువారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయు టకై తానే బలిపీఠము ఎక్కెను. . . ..
అందుకే 13 అధ్యాయంలో తీర్పులు వచ్చాయి.
1. అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవు నొంది యూదాదేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి యుండగా
2. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటనచేసెను- బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా- దావీదు సంతతిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.
3. ఈ బలిపీఠము బద్దలై పోయి దానిమీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన యొకటి యిచ్చెను.
ఈ రాజైన యోషియాకోసం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పారు. యోషియా రాజయ్యింది BC 640 లో ఎనిమిది సంవత్సరాల వయస్సులో. BC 620 లో దానిని 2రాజులు 22 అధ్యాయంలో యోషియా చేశారు.
ఆ తర్వాత అస్సూరీయులు ఈ పట్టణాన్ని, దేవతలను సర్వనాశనం చేశారు.

దేవుడు చెప్పిన ప్రతీ ప్రవచనం నెరవేరుతుంది.
తప్పుచేసిన వారిని దేవుడు క్షమించడు. తెలియక తప్పుచేస్తే క్షమిస్తారు గాని మాటిమాటికి తప్పులుచేసి, దేవుడా క్షమించేయ్ అంటే కుదరదు. ప్రతిఫలం అనుభవించవలసినదే!
కాబట్టి భయము నొంది పాపము చేయడం మానేద్దాం!
దేవునికి ఇష్టులుగా జీవిద్దాం!

దైవాశీస్సులు!


నేను ప్రవక్తను కాను

*7వ భాగం*

ఆమోసు 4:1—3
1. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా
2. ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతను, మీలో శేషించినవారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు.
3. ఇటు అటు తొలగకుండ మీరందరు ప్రాకారపు గండ్లద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలి వేయబడుదురు; ఇదే యెహోవా వాక్కు.

ప్రియులారా! మనం ఇశ్రాయేలు చేసిన పాపాల చిట్టా/ లిస్టు చూస్తున్నాం. ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం ఇశ్రాయేలు దేశంలో పేదలను అణగద్రొక్కేవారు, పేదలను మ్రింగేవారు, పేదలను దోచుకునేవారు అని చూసుకున్నాము. అయితే వారు ఎవరు? వారు పురుషులు మాత్రమే అనుకుంటే మీరు తప్పులోను, పప్పులోనూ కాలు వేసినట్టే! పై వచనాలలో ఎవరో అంత స్పష్టముగా లేదు గాని, చాలా ప్రతులలో దిక్కులేనివారిని బాధిస్తూ, బీదలను అణగద్రొక్కే స్త్రీలారా! అని వ్రాయబడింది. ఉదాహరణ ఒక తర్జుమా చూసుకుందాం! . .. .
.షోమ్రోను కొండమీద ఉన్న బాషాను•ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ బీదలను•అణగద్రొక్కుతూ ఉన్న స్త్రీలారా! “మద్యపానం•తీసుకురా” అని మీ భర్తలతో చెప్పేవారలారా!. . .

పై వచనాలు చూసుకుంటే పురుషులను మించి- పేదలపై దౌర్జన్యం చేసేది ఆరోజులలో స్త్రీలే! నేనుకాదు చెప్పేది—బైబిల్ గ్రంధము మరియు ప్రవక్తలు! వారు ఎంతఘోరముగా ఉన్నారో ఒకసారి ప్రవక్తల మాటలలో చూసుకుందాం.

మొదటి వచనం చూడండి: షోమ్రోను కొండమీద ఉన్న భాషాను ఆవులారా! బాషాను ఆవులు బొద్దుగా ఉంటాయి. ఇశ్రాయేలు పచ్చిక మైదానాలలో మేస్తుంటాయి. బాగా పాలు ఇస్తాయి. అయితే ఇక్కడ ప్రవక్త భాషాను ఆవులు అని ఎవరిని గూర్చి అన్నారంటే: ఇశ్రాయేలు దేశంలో గల ధనిక స్త్రీలు కోసం ఈమాట అంటున్నారు. భాషాను ఆవులను-- ధనిక స్త్రీలతో పోలుస్తున్నారు . వీరు ఏమిచేస్తున్నారు—దిక్కులేని వారిని భాదిస్తూ, బీదలను అణగద్రొక్కుతూ ఉన్న స్త్రీలారా! చూసారా—ఇక్కడ దిక్కులేని వారిని భాదించేది, బీదలను అణగద్రొక్కేది స్త్రీలే అట! ఒకసారి మరలా మనం 2:6—7 చూసుకుందాం ఇక్కడ నిర్దోషులను అమ్మేసేవారు , బీదలను ఫారిన్ పాదరక్షలకోసం అమ్మేసింది, నేలమట్టిని త్రొక్కినట్లు దిక్కులేనివారి తలలను త్రొక్కింది ఎవరు? స్త్రీలే! పురుషులు కంటే ఎక్కువగా పేదలను భాదించినది స్త్రీలే! ఎంత ఘోరమండి!! స్త్రీలలో సహజముగా జాలి, దయ కరుణ, ఓర్పు అనేది దేవుడు పెట్టారు. అయితే వీరు వాటిని త్రొక్కేసి- పేదలను త్రొక్కేస్తున్నారు. ఆమోసుగారికి స్త్రీలంటే పడదా? ఇలా చెప్పటానికి? కాదు కాదు! ఆయన కంటితో చూసినదే వ్రాస్తున్నారు. దేవుడు చెప్పమన్నదే చెబుతున్నారు. ఆమోసుగారికి మీరు అనుకున్నట్లు స్త్రీలు అంటే ఈర్ష అందుకే ఇలా వ్రాసారు అనుకుంటే మరి మిగతా ప్రవక్తలు ఏమన్నారో చూద్దాం—ఆకాలంలో ఉన్న ప్రవక్తలు: యెషయా, యిర్మియా, యేహెజ్కేలు వీరంతా వీరికోసం/ స్త్రీలకోసం వ్రాసారు. అప్పటి స్త్రీలు ఎలా ఉండేవారో ఆమోసుగారి తర్వాత వచ్చిన యేహెజ్కేలుగారి మాటలలో విందాము:
Ezekiel(యెహెజ్కేలు) 13:17,18,19,20
17. మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెలమీద కఠినదృష్టియుంచి వారికి విరోధముగా ఈలాగు ప్రవచింపుము
18. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మనుష్యులను వేటాడ వలెనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలుకుట్టి, యెవరి యెత్తు చొప్పున వారి తలలకు ముసుకులుచేయు స్త్రీలారా, మీకు శ్రమ; మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు.
19. అబద్ధపు మాటల నంగీకరించు నా జనులతో అబద్ధఫు మాటలు చెప్పుచు, చేరెడు యవలకును రొట్టెముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు, బ్రదుకుటకు అపాత్రులైన వారిని బ్రదికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు.
20. కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధములచేత మీరు దుఃఖింపజేయుదురు, దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించు కొనకుండ మీరు వారిని ధైర్యపరతురు గనుక . . .
చూసారా ఎంతఘోరంగా ఉన్నారో!! అందుకే దేవుడు వారికిస్తున్న తీర్పులు చూడండి: 21—23
21. మనుష్యులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను, మీ కౌగిటిలోనుండి వారిని ఊడ బెరికి, మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొననిచ్చెదను.
22. మరియు నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలోనుండి నా జనులను విడిపించెదను, వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు.
23. మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పక యుందురు; నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు నా జనులను మీ వశమునుండి విడిపించెదను.....
ఇవి యేహెజ్కేలుగారి మాటలు.

ఇక ఆమోసుగారి సమకాలికుడు పెద్దప్రవక్త అయిన యెషయాగారు ఏమన్నారో / ఏమి రాసారో చూద్దాం! ౩:12
12. నా ప్రజలవిషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించు వారు ....
చూసారా స్త్రీలు వారిని ఏలుతున్నారు అట. ఇంకా ముందుకు చూద్దాం 16—24.
16. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;
17. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.
18. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను
19. కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకులను
20. కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను
21. రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను
22. ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను
23. చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.
24. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును.
ఇంకాఉంది చూడండి: 32:9—10
9. సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.
10. నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.
దీని అర్ధం ఏమిటంటే: వారికి అనగా స్త్రీలకూ సుఖం మరియు లగ్జరీలు కావాలి. దానికి అలవాటు పడిపోయారు. కాబట్టి లగ్జరీలు కావాలంటే డబ్బులు కావాలి. అందుకే వీరు పేదలను శ్రమ పెట్టి డబ్బులు గుంజి- వీరు సుఖిస్తున్నారు.

యిర్మియా గారి మాటలు తర్వాత చూసుకుందాం. ఇక ఆమోసుగారు స్త్రీలకోసం ఏమన్నారో చూసుకుందాం! మద్యపానం తీసుకురా అని తమ భర్తలతో చెప్పు స్త్రీలారా! చూసారా ఇక్కడ వీరంతా మద్యపానం/ త్రాగుడికి అలవాటుపడిపోయారు. ఇక్కడే కాదు సమూయేలు గారికాలంలోనే అలవాటు పడిపోయారు. అందుకే సమూయేలుగారి తల్లిగారు అయిన హన్నాని ఆమె త్రాగుబోతు అని దైవజనుడైన ఏలీ పొరపాటుపడ్డారు. కాబట్టి అప్పటినుండే అది ఫాషన్ అయిపోయింది. అప్పుడే గాని నేడు లేదా??!! ఇప్పుడు విచ్చలవిడిగా భయంకరంగా ఉంది స్త్రీలు మరీ ఘోరంగా త్రాగేసి అల్లర్లు చేస్తున్నారు పట్టణాలలో! మరీ ఎక్కువగా కాలేజి అమ్మాయిలూ మందుకొడుతున్నారు. ముఖ్యంగా హాష్టల్ లో ఉన్న అమ్మాయిలు. ఇక పార్టీలు పేరు చెప్పి మందుకొట్టేవారు ఒకప్పుడు పురుషులు, యువకులు ఇప్పుడు వారికి పోటీగా, అంతకంటే ఎక్కువగా అమ్మాయిలే మందు కొడుతున్నారు. బొంబాయ్, డిల్లీ లాంటి పట్టణాలలో ఎప్పుడో ఉంది గాని, ఇప్పుడు పల్లెటూర్లలో కూడా అలాగే తయారవుతున్నారు. ప్రజలు పాడైపోతున్నారు. డబ్బుకోసం ఏమైనా చేస్తున్నారు. వారికి త్రాగుడు, మరియు సుఖం కావాలి. లగ్జరీ కావాలి. వారి కామకోరికలు తీరాలి. దానికోసం దేనికైనా తెగిస్తున్నారు. అది అప్పట్లోను ఉంది అనగా ఆమోసుగారి సమయంలో కూడా ఉంది. అప్పుడు అది పీక్ కి(అంచుకి) వెళ్ళిపోయింది. అందుకే పరితాపంతో రాస్తున్నారు. అందుకే దేవుడు చెప్పిన తీర్పులు చెబుతున్నారు 2వ వచనం . . . . చూడండి ఒక కాలం వస్తుంది అనగా అస్శూరు రాజు వచ్చేరోజు వస్తుంది. అతడు మిమ్ములను కొంకులచేత, గాలముల చేత పట్టుకుని లాగుతారు. ఇది మీకు బాగా అర్ధం కావాలంటే -- అస్సూరు వారు నిజంగానే యుద్ధంలో పట్టుబడిన వారిని వారి పెదవులకు గాని వారి ముక్కులకు గాని కొంకులు/ గాలములు వేసి, ఆ గాలములకు తాడుకట్టి లాగుకుంటూ వారి దేశానికి తీసుకునిపోయేవారు. వారిలో ఎవరైనా పారిపోదామని చూస్తే, మొత్తం అందరి ముక్కులు/ పెదవులు చీలిపోతాయి అందుకే ఎవరు పరుగెత్తడానికి ధైర్యం చేసేవారు కాదు. ఇప్పుడు అదే చెబుతున్నారు ఆమోసుగారు. అది 2 దినవృత్తాంతం గ్రంధంలో నెరవేరింది.

చూసారా తమ సౌకర్యం కోసం, స్త్రీలు తమలగ్జరీలు, సుఖం కోసం , త్రాగుడు కోసం చేసిన నేరాలకోసం ఎంతటి ఘోరమైన తీర్పులు పొందారో!!! అందుకే యిర్మియాగారు అంటున్నారు 9:17,18,20,21
17. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.
18. మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.
20. స్త్రీలారా, యెహోవా మాట వినుడిమీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.
21. వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో యౌవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.
యోవేలు గారు అంటున్నారు:
2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు

ప్రియమైన స్త్రీలారా! అక్కలారా! చెల్లెల్లారా! దేవుడు మిమ్మును కోరేది, మీనుండి ఆశించేది అణుకువ కలిగిన బుద్ధి, దైవభక్తికలిగిన స్త్రీలకూ సరిపోయే బుద్ధి మాత్రమే! లగ్జరీల కోసం పాటుపడితే- పరుగెడితే—తిప్పలు తప్పవు. ఇంట్లో అప్పులు తప్పవు. పౌలుగారు పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం!
1 తిమోతి 2:9—10
9. మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
10. దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ..
1పేతురు ౩:1—5
1. అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;
2. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.
3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము(అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
5. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.

ఎందుకు స్త్రీలకోసమే ఎక్కువగా చెబుతున్నారు అంటే అప్పుడు గాని, ఇప్పుడు గాని ఎక్కువగా భక్తి చేసేది స్త్రీలే! ఇక వీరే చెడిపోతే, తల్లులే చెడిపోతే పిల్లలు చెడిపోరా???!! అందుకే వీరంతా బాగుండాలి అంటే స్త్రీ ముందు తను మాదిరిగా ఉండి, పిల్లలకు నేర్పించాలి. వారికోసం ప్రార్ధించాలి. అప్పుడు వారు మారుతారు. లేదంటే తల్లులతో పాటుగా పిల్లలు, భర్తలు మొత్తం నిత్యనరకానికి, నిత్య నాశనానికి పోతారు. కాబట్టే యిర్మియాగారు స్త్రీలకు చెబుతున్నారు రోదనం చేయండి. మీ పిల్లలకు రోదనం చేసే విద్య నేర్పించండి.

కాబట్టి ప్రియ తల్లులారా! అక్కచెల్లెల్లారా! దయచేసి ప్రార్ధన చేయండి. పై చెప్పిన అలవాట్లు ఏమైనా ఒకవేళ మీకు ఉంటే దయచేసి విడచిపెట్టండి.
లగ్జరీల కోసం, కనబడిన చీరలు, నగలకోసం లేనిపోని అప్పులు చేసి- తిప్పలు పడకండి. అవన్నీ గతించిపోయేవి. స్తిరమైనది ఒక్కటే—అదే పరలోకరాజ్యం!! దానికి మొదటగా మీరు సిద్దపడి, మీ భర్తలను పిల్లలను సిద్ధం చేయండి.
దేవుడు మిమ్మును దీవించును గాక!
ఆమెన్!


నేను ప్రవక్తను కాను

*8వ భాగం*
ఆమోసు 4:6—8
6. మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండ చేసినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.
7. మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వానలేకుండ చేసితిని; ఒక పట్టణముమీద కురపించి మరియొక పట్టణముమీద కురిపింపకపోతిని; ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేనిచోటు ఎండిపోయెను.
8. రెండు మూడు పట్టణములవారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.
ప్రియులారా! గతబాగాలలో ఇశ్రాయేలీయుల పాపాల చిట్టా చూసుకున్నాం. ఇంకా బోలెడున్నాయి అయితే మధ్యలో దేవుడు చెబుతున్నారు—వారు చేసిన పాపాలకోసం తాను వారిని దండించిన విధానం—అయినా మీరు మారలేదు అంటున్నారు.

మీరున్న పట్టణాలలో మీకు దంత శుద్ధి కలుగజేసినను. . . . ఇక్కడ దంతశుద్ధి అనగా రెండు అర్ధాలు ఉన్నాయి. మొదటగా పళ్ళు రాలగొట్టాను అని అర్ధం. ఎందుకంటే మీ మాటలు మంచివి కాక, శత్రువులతో మీ పళ్ళు రాలగొట్టాను. ఇక రెండవ అర్ధం ఏమిటంటే: మీకు తినడానికి ఏమీలేక పళ్ళు శుద్ధిగా ఉన్నాయి. మీ పళ్లకు చేయడానికి పని ఏమీలేదు. మీరున్న పట్టణాలలో, మీరున్న స్థలాలలో మీకు తినడానికి ఏమీ లేకుండాచేశాను. అయినా మీరు మారలేదు. నా తట్టు తిరుగలేదు అంటున్నారు. దేవుడు ఇలా చేస్తానని ముందుగానే చెప్పారు. 7—8
మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వానలేకుండ చేసితిని; ఒక పట్టణముమీద కురపించి మరియొక పట్టణముమీద కురిపింపకపోతిని; ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేనిచోటు ఎండిపోయెను.
రెండు మూడు పట్టణములవారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు. . . . . దేవుడు ప్రజలను శిక్షించే విధానాలలో ఇదొకటి!! ఇప్పుడు కూడా చాలా ప్రాంతాలలో మనకు కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన సర్వాధికారి! ఆది సంభూతుడు! ఏమైనా చేయగలరు. 1 రాజులు 17 వ అధ్యాయంలో వర్షముగాని, మంచుగాని మూడున్నర సంవత్సరాలు పడకుండా చేశారని చూస్తున్నాం. ఇంకా చాలా చోట్ల వర్షాలు, మంచు పడకుండా దేవుడు చేసినట్లు చూస్తాం.
యిర్మియా ౩:౩
కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి యున్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యమువంటి ధైర్యము గలదు, సిగ్గు పడనొల్ల కున్నావు.

ఆయన మాట వినకపోతే
లేవీయకాండము 26: 19
మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను అంటున్నారు.

4:9. మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతను కాటుకచేతను నేను పాడుచేసితిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపు చెట్లను ఒలీవచెట్లను తినివేసెను, అయినను మీరు నాతట్టు తిరిగిన వారు కారు; ఇదే యెహోవా వాక్కు. . . . . చూసారా.
ద్వితీయోప 28:22,23,24 లో ముందుగానే చెప్పారు
22. యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.
23. నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును.
24. యెహోవా నీ దేశపు వర్ష మును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును.. . . . .,

యోవేలు 1:4,7,9,10,11,12
4. గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి. పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి.
7. అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసియున్నవి నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను
9. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి పోయెను. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చుచున్నారు.
10. పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను.
11. భూమిమీది పైరు చెడిపోయెను గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్యగాండ్లారా, సిగ్గునొందుడి.ద్రాక్షతోట కాపరులారా, రోదనము చేయుడి.
12. ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడి పోయెను దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట చెట్లన్నియు వాడిపోయినవి నరులకు సంతోషమేమియు లేకపోయెను. . . .

చూడండి ఇన్ని చేసినా మీరు మారలేదు నా తట్టు తిరగలేదు అంటున్నారు దేవుడు.
ఇక 4:13 లో అంటున్నారు దేవుడు - పర్వతాలను పుట్టించిన వాడిని, గాలిని రప్పించేవాడిని నేనే. ఆయన తన ఆలోచనలను మనుషులకు ముందుగానే వెల్లడిచేస్తారు. మరోసారి ౩:7 లో చెప్పినదానిని మరలా చెబుతున్నారు. .
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.

దానియేలు 2:28
అయితే మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరు నకు తెలియజేసెను.

ఇంతకీ ఆయన క్రూరుడా!!? దుర్మార్గుడా!? దుష్టుడా!!?? కరుణ, జాలి లేనివాడా?? కాదుకాదు! జాలిగల దేవుడు! గాని నరుల ప్రవర్తన వలన, నరులు గర్వించి, తనతోటివారిని ప్రేమించమని చెబితే, వీరి దుష్ట కోరికలను తీర్చుకోడానికి, పేదలను, దీనులను అనగా ద్రోక్కుతుంటే దేవుడు సహించలేక ఈ తీర్పులు పంపుతున్నారు.
5వ అధ్యాయంలో అంటున్నారు వెయ్యిమంది బయలుదేరి వెళ్తే, కేవలం వందమంది మాత్రం తప్పించుకొని వెళ్తారు. మిగిలిన వారు సర్వనాశనం అవుతారు అని చెబుతున్నారు. 5:౩
ఇక 5:4 లో స్పష్టముగా చెబుతున్నారు; నన్ను వెదకండి—బ్రతకండి!!! నన్నాశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. 5:4,14
4. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున దేమనగా నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.
14. మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును. . . .

నన్ను కాకుండా బేతేలును, గిల్గాలును, బెయేర్షేబా ను ఆశ్రయిస్తే మీరు పోతారు అంటున్నారు. 5:5,6
5. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును.
6. యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకు దురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పి వేయలేకుండ అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాన్ని నాశనముచేయును. . . . చూసారా
ఇంతకీ బేతేలు, గిల్గాలు, బెయేర్షేబా లో ఏమున్నాయి. బేతెలు- దేవుని మందిరం; ఆదికాండం 28:10—19 లో చూడండి. గాని యరోబాము-1 దానిని విగ్రహాల నిలయముగా చేసేశాడు. 1 రాజులు 12,13 అధ్యాయాలు, గిల్గాలు – అంటే నింద/ దోషాలు దొరిలించబడుట. యెహోషువా 5:9; దానిలో కూడా విగ్రాహాలు పెట్టేశారు. బెయేర్షేబా అనగా అనగా సాక్షార్ధమైనది, సాక్షార్ధమైన బావి అనికూడా అర్ధమిస్తుంది. దీనిలో కూడా విగ్రహాల నిలయంగా చేసేసారు ఇశ్రాయేలు రాజులు! అందుకే దేవుడు కోపించి అంటున్నారు ఆమోసు 8:14 లో
షోమ్రోనుయొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు, దానూ, నీ దేవుని జీవముతోడనియు, బెయేర్షెబా మార్గ జీవముతోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండ కూలుదురు. . . .

యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికి శ్రమలు విస్తరించును . కీర్తనలు 16:4. . .
నయోమి దేవుణ్ణి విడచి వెళ్లి- సమస్తము పోగొట్టుకుని తిప్పలు పడింది. బైబిల్ లో చాలామంది దేవుణ్ణి విడచి తిరిగితే తిప్పలు పడ్డారు.
ప్రియ సహోదరీ/ సహోదరుడా! దేవుణ్ణి విడచిపెట్టకు! లోకాశల వైపు మళ్లకు! అలా చేస్తే ఇశ్రాయేలుకి జరిగినదే మనకు కూడా జరుగుతుంది.
పేరుకు క్రైస్తవుడిగా జీవిస్తూ, నామకార్ధ బ్రతుకు బ్రతుకుతూ నాకేమి ఆశీర్వాదాలు రావడం లేదు. ఎందుకు దేవుణ్ణి నేను అనుసరించాలి అని అనుకునే వారున్నారు. అలాంటి వారికి దేవునినుండి ఏమీ దొరకదు! ఆయనను మనస్పూర్తిగా నమ్మాలి. అనుసరించాలి. కష్టాలు ఎదురైనా, నష్టాలు వచ్చినా!!
అంత్యము వరకు నమ్మకముగా ఉండుము. అప్పుడు దేవుడు నీకు జీవ కిరీటమిచ్చును!
యెహోవాను వెదకండి! బ్రతకండి!
దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్!


నేను ప్రవక్తను కాను

*9వ భాగం*

ఆమోసు 5:24
నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింపనియ్యుడి.

ప్రియులారా! గతబాగాలలో ఇశ్రాయేలీయుల పాపాల చిట్టా చూసుకున్నాం. ఆమోసు గ్రంధం చివరివరకు పాపాలచిట్టా ఉంది. అయితే ఇక వాటిని ముగించి ప్రవక్త రెండో పరిచర్య ధ్యానం చేసేముందు ఈ గ్రంధంలో గల ఆసక్తికరమైన కొన్ని విషయాలున్నాయి. వాటిని కొద్దిగా ధ్యానం చేద్దాం!

ఆమోసు 5: 8
ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.

ఈ వచనం వినడానికి అప్పట్లో వారికి ఎంతో వింతగా ఉండవచ్చు కాని ఇప్పుడు మన పరిస్తితులు చూస్తే సరిగ్గా సరిపోతుంది. మొదటగా సప్తఋషీ నక్షత్రాలను, మృగశీర్షిక నక్షత్రాలను సృజించినవాడు. ఈ మాట ఆమోసుగారు చెప్పడానికి కారణం ఏమిటంటే: ముందు భాగాలలో చెప్పినట్లు ఇశ్రాయేలు రాజు విదేశీయులతో వ్యాపారం మొదలుపెట్టాడు కాబట్టి పై దేశాలనుండి ఎన్నో క్రొత్త వార్తలు వచ్చేవి.ఆ రోజులలో గ్రీసుదేశం నుండి ఇంకా చుట్టుప్రక్కల దేశాలనుండి ఖగోళశాస్త్రం ఆవిర్బవించడం మొదలుపెట్టింది. దానికి కొందరు ఈ సప్తఋషీ నక్షత్రాలు అనగా భూమికి దగ్గరగా ఉన్న, ప్రకాశవంతమైన ఏడు నక్షత్రాలుకు దేవత్వం ఆపాదించి, అవి మనుష్యుల గమనాలను ప్రభావితము చేస్తాయి గాబట్టి వాటిని పూజించాలి అని నక్షత్రాలకు పూజలు చేయడం మొదలుపెట్టారు. గుడులు కట్టారు. అందుకే ఆమోసుగారు అంటున్నారు—వెర్రోల్లారా! వీటికెందుకు పూజిస్తారు? వీటిని చేసిన దేవుడు మీ దేవుడు. మీ దేవుణ్ణి పూజించండి అని ముఖ్యఉద్దేశం!

ఇక రెండవదిగా పగటిని చీకటిగా, రాత్రిని వెలుగుగా చేస్తారు అంటే అర్ధం-మీకు తెలుసు అణుబాంబులు ప్రయోగించిన తర్వాత ఆ దూళికి కొన్ని దేశాలలో కొన్ని రోజులు పగలు కూడా చీకటిగా, మబ్బుగా ఉండేది.
ఇక నేటిరోజులలో రాత్రుళ్ళు ప్రజలు పెట్టే లైటింగ్ చీకటిని ఉదయముగా మార్చినట్లుగా ఉంటుంది.

ఇక మూడవదిగా సముద్రంలో నీళ్ళను పిలిచి భూమిమీద పొర్లి పారజేయువాడు! దీనినే మరొక్కసారి మరలా చెబుతున్నారు 9:6 లో
ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండలమునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద ప్రవహింపజేయువాడును ఆయనే; ఆయన పేరు యెహోవా.
ఈ మాట ఆరోజులలో విని వేర్రోడు అని అనిఉండవచ్చు. గాని మనకు తెలుసు 2004 లో వచ్చిన సునామి అనుభవం! సముద్రపు నీరు భూమిమీదకు వచ్చి అనేక లక్షలమంది చావుకు కారణం అయ్యింది. అంతకుముందు కూడా వచ్చేవి- వాటిని Tidal Waves అని పిలిచేవారము. అవి కేవలం తుఫానులు వచ్చినప్పుడు, అప్పుడప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు మాత్రము వచ్చేవి. వాటి ప్రభావం సునామి అంతగా ఉండేది కాదు. మనకు కూడా అప్పుడప్పుడు ఉప్పెన వస్తుంది మన దేశంలో . కేవలం తుఫాను భూమిమీద తాకినప్పుడు మాత్రం! దీనిని ముందుగానే చెప్పారు ఆమోసు.

ఇంకా చూడండి ఆకాశమందు తనకొరకు మేడగదులు కట్టుకొన్నారు అంట దేవుడు, ఇక ఆకాశానికి పునాది భూమిమీద వేశాను అని చెబుతున్నారు దేవుడు. శాస్త్రజ్ఞులకు అప్పుడు అర్ధం కాని విషయాలు ఆమోసుగారికి దేవుడు ఎప్పుడో చెప్పారు! ఒక పశులకాపరికి ఎన్ని ప్రత్యక్షతలో చూసారా! దేవుడు ఎవరినైనా వాడుకొంటారు—వారు కేవలం నమ్మకంగా ఉంటే!!!

ఇక 5:25,26 లలో ఘోరమైన వచనాలు కనిపిస్తాయి.
25. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా?
26. మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా. . . .

బైబిల్ గ్రంధంలో గల వచనాలు, భావాలు కొంత అచ్చట, కొంత ఇచ్చట ఉంటాయి అని మనం యెషయా గ్రంధంలో 28:10,13; చూడవచ్చు! మనకు నాలుగు గ్రంధాలలో (నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు) మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేశారు అని మాత్రమే వ్రాయబడింది గాని ఇక్కడ అప్పటి రహస్యాన్ని బట్టబయలు చేస్తున్నారు దేవుడు. అలాగే బిలాము చేసిన తప్పుడు బోధనలను గురించి ఈ నాలుగుగ్రంధాలలో లేదు గాని దేవుడు ప్రకటన గ్రంధంలో దానిని బయలుపరచారు. 2:14; ఇక్కడ ఇశ్రాయేలీయులు అరణ్యంలో మోషేకు, యెహోవాదేవునికి భయపడినట్లు, పూజిస్తున్నట్లు యాక్షన్ చేశారు గాని వారిలో అనేకులు మోలేకు దేవత విగ్రహాలను, బలిపీటాలను మోసుకుని వెళ్ళారు, వాటికే బలులు అర్పించేవారు. అందుకే మోషేగారి మీద మాటిమాటికి తిరుగుబాటు చేసేవారు. ఇక్కడ దానిని ఎందుకు చెబుతున్నారు అంటే ఒరేయ్! మీ బ్రతుకులు మారలేదురా! ఐగుప్తు దేశంనుండి వచ్చినప్పటి నుండి కూడా మీరు మారలేదు. మారినట్లు నటిస్తున్నారు అని చెప్పడానికి!

చదువుతున్న ప్రియ సహోదరి/ సహోదరుడా! నీవుకూడా అలాగే నటిస్తున్నావా? వారే తప్పించుకోలేకపోయారు! నీవు తప్పించుకోగలవా? దేవుని కన్ను కప్పగలవా??!! జాగ్రత్త!

ఇక ఆరవఅధ్యాయంలో వీరు అనగా ఇశ్రాయేలీయులు చెరలోకి పోతారు అని ఖరాఖండిగా చెబుతూ అది ఎంత భయంకరముగా ఉండబోతోందో కళ్ళకు కనిపించినట్లుగా చూపిస్తున్నారు:6:9-10
9. ఒక కుటుంబమందు పదిమంది మనుష్యులుండినను వారు చత్తురు.
10. ఒకని దాయాది కాల్చబోవు వానితోకూడ ఎముకలను ఇంటిలోనుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకనిచూచి యింటిలో మరి ఎవరైన మిగిలియున్నారా? యని అడుగగా అతడు ఇంకెవరును లేరనును; అంతట దాయాదిట్లనును నీవిక నేమియు పలుకక ఊరకుండుము, యెహోవా నామము స్మరించకూడదు; . . .

చూసారా, ఇదంతా ఎందుకు? అంటే వారు దేవునిమాటను విననందున! బీదలను, పేదలను అణగద్రొక్కుతున్నందున! ఒక విషయం చెప్పనీయండి. దేవునికి పేదలు, దీనులు అంటే చాలా ఇష్టము. కారణం వారే దేవుణ్ణి అనుక్షణం తలస్తుంటారు, దేవునికి భయపడుతుంటారు. అదంతా ఎందుకు—యేసయ్య వచ్చిన వెంటనే ఆయన ఏమన్నారు? లూకా 4: 18
ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును . . .
ఎవరికీ ఇస్తున్నారు ఇక్కడ సువార్త. పేదలకు, దీనులకు, నలిగినవారికి! మరి ధనవంతులకు లేదా? లేదు. ఒక విషయం అర్ధం చేసుకోవాలి. ధనవంతులంటే దేవునికి ఇష్టం లేదా? ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం- సూదిబెజ్జములో ఒంటె దూరడంతో పోల్చారు దేవుడు... అంటే – దేవుడికి ధనవంతులంటే ఇష్టం లేదని ఎంతమాత్రము కాదు. అబ్రాహాముగారు ధనవంతుడు, యోబు ధనవంతుడు, ఇలా ఎంతోమంది ధనవంతులను దేవుడు వాడుకున్నారు. కాబట్టి ధనము కలిగి విర్రవీగే వారిని, పేదలను బాధపెట్టేవారిని దేవుడు ద్వేషిస్తారు కాని ధనము కలిగిఉన్నా, దేవుడంటే భయభక్తులతో ఉండి, దీనమనస్సు కలిగిన వారిని, పేదలను ప్రేమించే వారిని, మనిషిని మనిషిగా చూసేవారిని, పిలిచేవారిని దేవుడు వారు ధనవంతులైనా ప్రేమిస్తారు.

అదే ఈ ఆమోసు గ్రంధంలో ముఖ్య వచనం కూడా: 5:24 నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింపనియ్యుడి...... చూసారా, దేవునికి కావలసినది నీతి, న్యాయములు మాత్రమే! వాటిని ఇశ్రాయేలీయులు తుంగలో త్రొక్కేశారు. పేదలను, దీనులను పురుషులే కాదు స్త్రీలుకూడా బాధపెట్టారు అందుకే దేవుడు ఉగ్రుడైపోయారు. కొన్ని ప్రతులలో సామాజిక న్యాయము అనేది ఇశ్రాయేలు దేశంలో కనుమరుగైపోయింది అని వ్రాయబడింది. పేదలు, దీనులకు రక్షణ లేకుండా పోయింది. విలువలేకుండా పోయింది. ప్రజలు భయాక్రాంతులయ్యారు దేవునికి మొర్రపెట్టారు. భూమికూడా తాను చూస్తున్న ఆక్రోషాలు, చూసి దేవునికి మొర్రపెట్టింది. దేవుడు వెంటనే ఆమోసుగారిని పిలిచి సింహంలా గర్జించమని చెప్పారు.

ప్రియ స్నేహితుడా! దయచేసి నీతిన్యాయములను పాటించు. న్యాయాన్నిజరిగించు! అప్పుడు దేవుని సన్నిధిలో, దేవునిముందు నీవు ధన్యుడవు, నీతిమంతుడవుగా తీర్చబడతావు. లేకపోతే ఇశ్రాయేలీయులకు పట్టిన గతే పడుతుంది!

దైవాశీస్సులు!


నేను ప్రవక్తను కాను

*10వ భాగం*

ఆమోసు 7:1—3
1. కడవరి గడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనుపరచెను; ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది.
2. నేలను మొలిచిన పచ్చికయంతయు ఆ మిడుతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనముగల వాడు, అతడేలాగు నిలుచును? అని నేను మనవిచేయగా
3. యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చెను.

ప్రియులారా! ఇంతవరకు మనం ఇశ్రాయేలీయుల పాపాల చిట్టా, దేవుని తీర్పులు ధ్యానం చేసుకున్నాం. ఇది ఆమోసుగారి పరిచర్యలో ఒక ఎపిసోడ్. ఆయన జీవితంలో చివరి రోజులలో మరో ఎపిసోడ్ ఆరంభమయ్యింది. అది దర్శన పరిచర్య! దర్శనాల ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడగా ఆ దర్శనాలు వ్రాసి పంపుతూ, కొన్నిసార్లు ఆయనే స్వయంగా వెళ్లి చెబుతూ ఉండేవారు. గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ దర్శనాలు చూసే కాలంలోనే యూదా నాయకులు, ప్రజలు ఆయనను బ్రతిమిలాడితే ఆయన ఈ గ్రంధము వ్రాయడం మొదలుపెట్టారు. ఇంకా ఆయన ఈ దర్శనాలు రాసి ఇశ్రాయేలు దేశం పంపడం ఎందుకు మొదలుపెట్టారు అంటే- అబద్దయాజకుడు అమజ్యా, వాడి కొడుకు ఆయనను దేశంలోనికి రాకుండా నిర్భందించడం, వచ్చిన వెంటనే ఆయనను చిత్రహింసలు పెట్టడం ఎక్కువయ్యింది. అందుకే కొన్నిరోజులు ఇశ్రాయేలు దేశం వెళ్ళడం మానడం జరిగింది. అయితే ఆత్మ పరితాపం తట్టుకోలేక శ్రమ పడటానికే సిద్ధమయ్యారు గాని వెళ్ళడం ఆపలేదు.

సరే ఆయన దర్శనాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం! 7:1—౩ లో గడ్డిని మిడతలు తినివేయడం మొదలుపెట్టాయి. వెంటనే దాని భావం ఇట్టే తెలిసిపోయింది ప్రవక్తకు వివేచనా వరం ద్వారా! దాని అర్ధం ఏమిటంటే గడ్డి – ఇశ్రాయేలు జనం అయితే, మిడతలు శత్రువులు. ఇలాంటి మిడతలు కోసం యోవేలు 1:4 నుండి మనం చూసుకోవచ్చు! ఈ దర్శనం కలిగిన వెంటనే ఎలుగెత్తి గోజాడుతున్నాడు ఈ ప్రవక్త! అయ్యా యాకోబు కొద్ది జనాంగమే దయచేసి నాశనం చేయొద్దు అని మొర్రపెడుతున్నారు. వెంటనే దేవుడు జాలిపడి అలా జరుగదు అంటున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే: ఒక సేవకునికి, పరిచారకునికి, అపోస్తలునికి, ప్రవక్తకు, కాపరికి ఉండవలసిన ముఖ్య లక్షణం ఇదే! దర్శనం కలిగిన వెంటనే వారికి చెప్పేసి, భలేగా అవ్వబోతుంది- చావనీ వీళ్ళు! అనుకోలేదు యోనాప్రవక్తలా! అలా జరుగకూడదని కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నారు. అబ్రాహాముగారు చేశారు – సొదోమ, గోమోర్రా కోసం, కారణం తన తమ్ముని కొడుకు రక్షించబడాలని. ఆదికాండం 18:23-౩౩; మోషేగారు చేశారు ఇశ్రాయేలీయులు దూడబొమ్మతో ఓ ఇశ్రాయేలు – నిన్ను ఐగుప్తు నుండి తీసుకొచ్చింది ఇదే అనినప్పుడు, దేవుడు కోపపడి వారిని దహించివేస్తాను అంటే దేవుడికే నీ తీర్పుకోసం సంతాప పడమన్నారు, మొర్రపెట్టార్రు. నిర్గమ 32:11-౩౩; ఇంకా యిర్మియాగారు మొర్రపెడుతున్నారు, యేహెజ్కేలు మొర్రపెట్టారు. ఇప్పుడు ఆమోసుగారు మొర్రపెడుతున్నారు. ప్రియ దైవ సేవకుడా! నీవుకూడా మొర్ర పెడుతున్నావా?

ఇక 7:4—6 వరకు దేవుని అగ్ని వచ్చి మహా అగాధజలములను సైతం దహించాలని చూసింది. వెంటనే మొర్రపెడుతున్నారు వద్దు ప్రభువా! యాకోబు కొద్ది జనము గలవాడు అని!

ఇక 7:7-9 లో దేవుడు ఒక గోడమీద నిలబడి యున్నారు. దేవుడు దానిని మట్టపు గుండుతో సరిచేస్తున్నారు. దీని అర్ధం దేవుడు చక్కగా కట్టబడిన గోడలాగా ప్రజలు ఉండాలని ఆశిస్తే, వీరు వంకరటింకరగా ఉన్నారు. అందుకే మట్టపుగుండులాగ బోతున్నాను. వంకరగా ఉన్నవన్నీ పడగోట్టబోతున్నాను అని దర్శనరీతిగా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మొదటి రెండు దర్శనాలు ఆయన రాసి పంపించినా, ఈ మూడవ దర్శనాన్ని చెప్పడానికి తనే స్వయముగా వెళ్ళారు. అప్పుడు మొదటిభాగంలో చెప్పిన విధముగా అమజ్యా అనే యాజకుడు నీవు ఇక్కడ నీ ప్రవచనాలు చెప్పకూడదు. మీ దేశంలో అనగా యూదా దేశంలో చెప్పుకో, ఇక్కడ చెబితే బాగుండదు అని చెబుతాడు. వెంటనే (7:10-17) అంటారు ప్రవక్త: నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కొడుకుని కాదు, ప్రవక్త శిష్యుడను కాదు. నేను పశులకాపరినై మేడిపళ్ళు ఎరుకొంటుంటే దేవుడు పిలిచి చెప్పమన్నారు. కాబట్టి నేను చెబుతాను. ఏం చేసుకొంటావో చేసుకో అన్నారు. తర్వాత విషయం మొదటి బాగంలో చూసుకున్నాం. ఈ సంఘటన బహుశా BC 760-755 కి మధ్య జరిగింది.

ఇక తర్వాత దర్శనం 8:1-14 వరకు. దీనిలో వేసవికాలం పండ్లగంప కనిపిస్తుంది. అనగా వేసవికాలమో పండ్లు పండిపోతాయి. దానిని వెంటనే మనం కోసివేస్తాం. అలాగే ఇశ్రాయేలీయులు పాపంలో పండిపోయారు. నేను వారిని కోసి గంపలో వేసి- దూరదేశం పంపించి వేస్తాను అంటున్నారు. ఇక్కడ 8:4—6
4. దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,
5. తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకొను వారలారా,
6. దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి. వరకు వచనాలు ఒకసారి చూద్దాం. . . . .
ఇది ఇశ్రాయేలీయులు చేసే అక్రమాలకూ, దుర్మార్గాలకు పరాకాష్ట! అందుకే ఈ తీర్పులు!

ఇక 11,12 వచనాలు చూద్దాం
11. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.
12. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు; . . . .
దేశంలో దేవునిమాట వినబడని రోజులు వస్తాయి. దేవుని మాటలకు క్షామం/కరువు వస్తుంది. అప్పుడు దేశంలో ఈ చివరినుండి- ఆ చివరి వరకు వెతికినా దొరకదు దేవునిమాట అంటున్నారు. నిజంగా ఈ ప్రవచనం అక్షరాలా జరిగింది. బెరక్యా కుమారుడైన జెకర్యాను బలిపీటానికి, అవరణానికి మధ్యలో అతి ఘోరంగా చంపుతారు ఆయనను, అప్పుడు దేవుడు కోపగిస్తారు, హగ్గయి, మలాకి ప్రవక్తలే చివరి వారు. ఆ తర్వాత బాప్మిస్మమిచ్చు యోహాను తండ్రిగారైన జెకర్యా వరకు దేవుడు సుమారుగా 42౦ సంవత్సరాలు ఇశ్రాయేలీయులతో మాట్లాడటం మానేశారు. అదే ఈ క్షామం. చీకటిరోజులు అంటారు ఈ కాలాన్ని. దేవుడు మాట్లాడని రోజులు.

ప్రియ సహోదరీ/ సహోదరుడా! అదే రోజులు మరలా రాబోతున్నాయి. అవి దేవుడు, యేసయ్య మరలా వచ్చే రెండో రాకడలో, సంఘం ఎత్తబడిన తర్వాత వాక్యం విందామని నీవు భూమిమీద ఈ చివరనుండి ఆ చివర వరకు వెదకినా నీకు దొరకని రోజు రాబోతోంది. అంతేకాదు- సంఘం ఎత్తబడక ముందు కూడా తొందరలో దేవుని వాక్యాని సర్వనాశనం చేద్దామని, వాక్యం చెప్పేవారు లేకుండా చేసే రోజులు రాబోతున్నాయి. బైబిల్లను కాల్చే రోజులు రాబోతున్నాయి. అప్పుడు వాక్యం నీ గుండెలలో ఉండాలి గాని చదువుదామంటే దొరకని రోజులు రాబోతున్నాయి.
కాబట్టి దుర్దినములు రాకముందే ఇప్పుడే వాక్యాన్ని నీ గుండెలలో ఉంచుకో!
ఎత్తబడే గుంపులో నీ పేరు ఉండేలాగా నీ బ్రతుకు సరిచేసుకో!

దైవాశీస్సులు!


నేను ప్రవక్తను కాను

*11వ భాగం*
ఆమోసు 9:11
పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు

ప్రియులారా! మనం గతభాగము నుండి ఆమోసు ప్రవక్త రెండవ ఎపిసోడ్ – దర్శనాల పరిచర్యకోసం ధ్యానం చేసుకుంటున్నాం.

ఈ 9:1 లో యెహోవా బలిపీటమునకు పైగా నిలిచియుండుట చూచితిని అంటున్నారు. అయితే ఇక్కడ ఏ బలిపీఠమో స్పష్టముగా వ్రాయబడి లేదు. ఇక్కడ రెండు భిన్నమైన అభిప్రాయములున్నాయి. కొందరు దేవుని బలిపీఠం అంటారు. కారణం యెషయా, యేహెజ్కేలు లాంటి వారికి బలిపీఠం దగ్గరే దేవుడు కనిపించారు కాబట్టి దేవుని బలిపీఠం అంటారు,. అయితే ఈ వచనం చివరలో దానిని పడగొట్టమని చెబుతున్నారు కాబట్టి అది యరోభాము-1 చేసిన బేతేలులో ఉన్న దూడ బలిపీఠం , దానినే పడగొట్టమని దేవుడు చెబుతున్నారు, కారణం అది జరిగాక రాజైన యోషియా దానిని పడగొట్టాడు అంటారు. ఏదిఏమైనా ఆ దూడ బలిపీఠం పడగొట్టడం ఖాయం. ఇక తర్వాత వచనాలలో అందరిని దండిస్తాను. సంహరిస్తాను అని చెబుతున్నారు. వారు ఎక్కడ దాక్కొన్నా నానుండి తప్పించుకోలేరు అని చెబుతున్నారు దేవుడు.

ఇక 7వ వచనములో దేవుని ప్రేమ అర్ధమౌతుంది.
ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను, కఫ్తోరు దేశములో నుండి ఫిలిష్తీయులను, కీరు దేశములోనుండి సిరియనులను రప్పించితిని.
చూసారా, దేవునికి భూమిపైనున్న ప్రజలందరూ సమానమే! వారు ఏ దేశమైనా గాని. నాకు అందరూ సమానమే అని దేవుడే చెబుతున్నారు. అందుకు ఆయన ఇచ్చిన ఉపమానం- చరిత్ర చూడండి. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశమునుండి తీసుకుని వచ్చినట్లు మన అందరికి తెలుసు. అయితే ఇక్కడ మరో విషయం తనే చెబుతున్నారు దేవుడు. ఇశ్రాయేలీయులు ఎలా పరాయి దేశంనుండి వచ్చి వాగ్ధానదేశం స్వతంత్రించుకొన్నారో అలాగే కఫ్తోరు (ఇది కూడా ఈజిప్ట్ కి చెందినదే Northeast of Egypt, క్రేతు ప్రదేశం) దేశంనుండి పిలిష్తీయులను , కీరు దేశం (మోయాబు దేశం) నుండి సిరియనులను తీసుకుని వచ్చి అక్కడ నాటాను అంటున్నారు. ఇక్కడ దేవుడు పిలిష్తీయులను, సిరియనులను కూడా మీలాగే పరాయిదేశంనుండి తీసుకుని వచ్చి నాటాను అని తనే చెబుతూ మీలాగే వారు సమానమే అంటున్నారు. వారు తప్పు చేశారు కాబటి వారిని ఎలా దండించబోతున్నానో అలాగే మిమ్ములను కూడా దండించబోతున్నాను అంటున్నారు.

ఇక 8వ వచనం నుండి చివరి వరకు ఆదరణ వచనాలు. దేవుడు ఇంతవరకు చంపేస్తాను, నాశనం చేసేస్తాను, నరికేస్తాను అని చెప్పి, తీర్పు తర్వాత నేను తిరిగి నా ప్రజలను ఇశ్రాయేలు దేశం తీసుకుని వచ్చి వారిని బలంగా నాటుతాను అని వాగ్దానం చేస్తున్నారు. చూడండి 8వ వచనం. ప్రభువైన యెహోవా కన్నులు ఈ పాపిష్టి దేశం మీద ఉన్నది. దేవుని కన్నులు పాపిష్టి రాజ్యం మీద ఉన్నాయి అంటున్నారు. చదువరులు గమనించాలి యెహోవా కన్నులు పాపిష్టి రాజ్యం మీద ఎలా ఉన్నాయో అలాగే నీమీద నామీద కూడా ఆయన కన్నులు ఉన్నాయి, చూస్తున్నాయి. జాగ్రత్త!
అయితే 8 వ అధ్యాయంలో యెహోవా దినం వస్తుంది- అయితే అది మేలు కాదు, కీడుకే, కారణం ఈ దేశంలో నీతిమంతులు ఎవరూ లేరు కాబట్టి నేను దానిని శిక్షిస్తాను అంటున్నారు. ఇక్కడ యెహోవా కన్నులు ఈ పాపిష్టి రాజ్యం మీద నున్నది అని చెబుతూ ఆ రాజ్యం భూమిమీద ఉండకుండా నాశనం చేస్తాను అని చెప్పారు. అయితే యాకోబు సంతతివారిని సర్వనాశనం చేయకుండా విడిచిపెడతాను అంటున్నారు. ఇక 11-15 వరకు వారిని తిరిగి తీసుకుని వచ్చి నాటుతాను అని సెలవిస్తున్నారు.

గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ వాగ్దానం మాటిమాటికి నెరవేరుతుంది. ఆ రాజ్యాన్ని భూమిమీద ఉండకుండా చేస్తాను అని దేవుడు సెలవిచ్చిన వాగ్దానం ఇప్పటికి రెండుసార్లు జరిగింది. మొదటగా క్రీ.పూ. 7వ శతాబ్దంలో ఇశ్రాయేలీయులు అనగా 10 గోత్రముల వారు, క్రీ.పూ. 5వ శతాబ్దంలో యూదులు చెరలోనికి పోయి, ఇశ్రాయేలు దేశం అన్నది లేకుండా పోయింది. దాని తర్వాత దేవుడు మరలా 70సంవత్సరాల (యూదుల చెర) తర్వాత మరలా దేవుడు జెరుబ్బాబెలు, మొర్దేకై, ఎజ్రా, నేహేమ్యా లాంటి వారిద్వారా ఇశ్రాయేలు దేశం తీసుకుని వచ్చి నాటారు. 14 వచనంలో సెలవిచ్చినట్లు మరలా పట్టణం కట్టబడింది, మందిరం కట్టబడింది. తోటలు నాటబడ్డాయి.
మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి వాటి పండ్లను తిందురు.
... . అయితే యేసుప్రభులవారు పిలాతు ముందు తీర్పులో ఉండగా ఈ పాపం మామీద మా పిల్లలమీద ఉండునుగాక అనడం ద్వారా, నీరో కాలంలో మరలా ఇశ్రాయేలు దేశం రాజ్యం కాకుండా పోయింది. 1900 సంవత్సరాలు కనుమరుగైపోయింది ఇశ్రాయేలు దేశం. మరలా మన దేశం లాగానే 1947లో రాజ్యంగా చేయబడి, అప్పటి నుండి వారు మరలా తమ స్వదేశానికి రావడం జరుగుతుంది. ఇది దేవుడిచ్చిన వాగ్దానం , అది తప్పకుండా జరుగుతుంది. యెషయా 11:10—16 లో ఇదే వ్రాయబడియుండి. యిర్మియా 29:14, ౩౩:7 లో కూడా ఇదే వ్రాయబడియుంది.

ఇప్పుడు మనం 11వ వచనాన్ని మరలా ధ్యానం చేసుకుందాము. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు....... పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా కడతాను. పైన చెప్పినట్లు రెండుసార్లు కట్టబడింది. అయితే యాకోబుగారు కూడా దీనిని ఎత్తిచెబుతున్నారు అపోస్తలుల కార్యములు లో. దానికన్నా ముందు దీనినే యేహెజ్కేలు ౩4:23—24 ఇక్కడ కూడా అదే వ్రాయబడియుంది.
ఇప్పుడు కట్టబడిన తర్వాత ఇక యాకోబుగారు మరల దానిని ఎందుకు చెబుతున్నారు? అపోస్తలులు 15:15—18. 15. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా
16. ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనొ ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువును వెదకునట్లు
17. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాదికాలమునుండి ఈ సంగతులను తెలియ
18. పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది. ..
ఇక్కడ 11,12 వచనాలను ఎత్తి చెబుతున్నారు. దీని ప్రకారం పరిశుద్దాత్ముని ఉద్దేశ్యం: కేవలం ఇశ్రాయేలీయులను నాటి, మందిరాన్ని కడతాను, వారందరిమీద దావీదు సంతతివాడు రాజుగా ఉంటాడు అని మాత్రమే కాదు. ఆమోసు 9:11 ప్రకారం అనగా ఇశ్రాయేలీయులను నాటిన తర్వాత, *నానామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా మరల కడతాను* ఇక్కడ ముందుగానే- ఆమోసుగారి ద్వారా దేవుడు చెబుతున్నారు: కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే నా ప్రజలుగా ఉండరు గాని నా నామము- అనగా యేసునామమును ధరించిన వారిని, యేసుక్రీస్తును స్వంతరక్షకునిగా అంగీకరించిన అన్యజనులు కూడా నా దావీదు గుడారంలో ఉంటారు. ఇక మనందరికీ తెలుసు యేసయ్యను దావీదు కుమారుడు అంటారు, కారణం దావీదు సంతానం నుండి వచ్చారు కాబట్టి. కాబట్టి అన్యజనులమైన మనలను కూడా తనకు జనముగా చేసుకోవాలి అనే దేవుని ప్రణాళిక ఆదినుండి ఉంది దేవునికి. ఈ విషయాన్ని పశులకాపరి అయిన ఆమోసుగారికి ఎప్పుడో దేవుడు చెప్పారు. అందుకే నాకు అందరూ సమానమే అని మాటిమాటికి చెప్పుకుని వచ్చారు.

ఇక 13-15 లో వ్రాయబడిన పంట- కోత అది ఈ కడవరి దినములలో జరుగుచున్న పరిశుద్దాత్ముని కార్యములు! సంఘం కట్టబడటం, సంఘంలో జరిగే ఆత్మ కార్యముల కోసం గూడార్ధంగా చెప్పబడింది.

కాబట్టి ప్రియ దైవజనమా! దేవునికి అందరూ సమానమే! ఇశ్రాయేలీయులు వాగ్ధనప్రజలు! వారు తమ స్వతంత్రాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దేవుడు వద్దు అని చెప్పిన పనులనే మాటిమాటికి చేసి, మాటిమాటికి చెరలోకి పోయారు. సర్వ నాశనం అయిపోయారు. గాని దేవుని మహా కృప వలన మరల తమ దేశానికి వచ్చారు. గాని దేవుని ఆత్మీయ నిత్యరాజ్యంలో ఇంతవరకు చోటు కల్పించుకోలేకపోయారు. కారణం వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని మెస్సయ్యగా, తమ రక్షకునిగా అంగీకరించడం లేదు. అందుకే ఆ భాగ్యం మనకు కల్పించబడింది. అయితే అది దేవుని అనాదిసంకల్పం. అన్యులమైన మన లెక్క పూర్తికాగానే రోమా పత్రిక 11 ప్రకారం వారు కూడా రక్షణ పొందుతారు. అయితే నేను చెప్పే విషయం ఏమిటంటే, ఈ ఆమోసుగ్రంధం ద్వారా దేవుడు మనతో చెప్పే ముఖ్యమైన మాటలు ఏమిటంటే: వాగ్ధాన జనం తమ రక్షణను కోల్పోయి- పాపంలో పడినందున దేవుడు వారిని తృణీకరించి, చెరలోనికి పంపినట్లు, అంటుకట్టబడిన నీవు, నేను కూడా దేవునిలో, దేవునితో కలసి ఉండకపోతే నీవునేను కూడా కత్తిరించబడతాము జాగ్రత్త! కాబట్టి నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని దేవునిపేరిట బ్రతిమిలాడుతూ హెచ్చరిస్తున్నాను. అంతేకాదు 5:24 లో వ్రాయబడినట్లు నీళ్ళు పారినట్లు నీతిని పారనీయండి అంటున్నారు. అనగా మనందరం నీతిన్యాయములు అనుసరించి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిని వదిలితే ఇశ్రాయేలీయులకు సంభవించినదే మనకుకూడా కలుగుతుంది. కాబట్టి భయమునోంది పాపం చేయడం మానేద్దాం!

మనకు కలిగిన రక్షణ భాగ్యాన్ని గట్టిగా పట్టుకొందాం!
క్షణికమైన కోరికలు కోసం దానిని విడిచిపెట్టొద్దు!
దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*************************************

ప్రియ దైవజనమా! ఆమోసు గారి జీవితం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు అని నమ్ముతున్నాను. మీ అభిప్రాయాలు నాకు తెలుపండి. నాకోసం ప్రార్ధన చేయండి. ప్రభువు చిత్తమైతే మరో భక్తుని జీవిత చరిత్రతో మరలా కలుసుకొందాం!
దైవాశీస్సులు!
ఇట్లు
మీ ఆత్మీయ సహోదరుడు
రాజకుమార్ దోనె



కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరీర కార్యములు

క్రిస్మస్

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

విశ్వాసము

పాపము

సమరయ స్త్రీ

విగ్రహారాధన