పావురం



పావురము


పావురము పక్షులలో అత్యంత తెలివైన పక్షి. యుద్దాలలోనూ, మెసెంజర్ గా కూడా పావురాలు పనిచేసినట్లు చరిత్రనుబట్టి తెలుసుకోగలం.

సాధారణ లక్షణాలు:
అత్యంత సాదు స్వభావం గలది. స్వరము కూడా మూలిగే తప్ప, ఆరవదు. పరిశుభ్రత గలది. శ్రేష్టమైన ఆహారం (క్రుళ్ళినవాటిని తినదు). తాను జతకట్టిన పావురము చనిపోతే, ఇక ఎప్పటికి, మరొక పావురముతో జతకట్టదు.

ఆత్మీయముగా.... “పావురము”
నిర్దోషత్వానికి, ప్రేమకు, శాంతికి, త్యాగమునకు, పరిశుద్ధాత్మకు, సంఘమునకు సాదృశ్యం
1️. పావురము నిష్కపటమైనది:
ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును “పావురములవలె నిష్కపటులునై యుండుడి”. (మత్తయి 10:16) ఆ దినాలలో తోడేళ్ళవంటి స్వభావముగలిగిన శాస్త్రులు, పరిసయ్యుల వంటివారి యొద్దకు మిమ్ములను పంపుచున్నాను. వారు మిమ్మును ప్రశ్నించడానికి వీలులేకుండునట్లు పావురమువలే నిష్కపటులై యుండండని ప్రభువు, తన శిష్యులతో చెప్పిన సందర్భమిది.

నిష్కపటత్వం లేదా నిర్దోషత్వము (హృదయ స్థితి సరిగా ఉండాలి)
నిష్కపటత్వము: (కపటము లేకుండుట). హృదయము నిండినదానినిబట్టి నోరు మాట్లాడుతుంది. అట్లాకాకుండా, హృదయంలో ఒకటి, పైకి మాట్లాడేది మరొకటి అయితే, అవి కపటపు మాటలు.
కపటము గలవారు: లేవి, షిమ్యోను కపటము గలవారు ( ఆది 34:13) యెహోనాదాబు బహు కపటముగలవాడు. (2సమూ 13:3) పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. (సామెతలు 26:24)
నిష్కపటులు: ప్రభువును గురించి వ్రాయబడినమాటలు చూడండి. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు”. (1 పేతురు 2:22) ఈయనయందు ఏ కపటమును లేదని, పిలాతు ప్రభువును గురించి సాక్ష్యమిచ్చాడు. ( యోహాను 19:4,6)
నతనియేలును గూర్చి ప్రభువిచ్చిన సాక్ష్యం:ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను”.(యోహాను 1:47) ఇట్లాంటి ధన్యకరమైన సాక్ష్యాన్ని మనమునూ పొందగలగాలి.
ధన్యులెవరు? యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు. (కీర్తనలు 32:2)
యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. (కీర్తనలు 24:3,4) బోధలోనూ, భక్తిలోనూ, మాటలోనూ, క్రియలోనూ పావురమువలె నిష్కపటంగా జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకొని, ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదములను స్వతంత్రించుకొందము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!



పావుర స్వరము : (మూలుగు)
బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము
పరమగీతము 2:14

పావురము అత్యంత సాధువైనది. ఎవ్వరికి ఎటువంటి హాని చెయ్యదు. దాని స్వరం కూడా గంభీరంగా ఉండదు. ఎప్పుడూ మెల్లగా మూలుగుతూ ఉంటుంది. కోయిల స్వరాన్ని ఇష్టపడతాము గాని, పావురము (గువ్వ) మూలుగును యిష్టపడము. అయితే, పరమ గీతములో ప్రియుడు అంటున్నమాట “పావుర స్వరము మధురము”

మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని “గువ్వవలె మూల్గితిని” ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను (యెషయా 38:14) వారిలో ఎవ రైనను తప్పించుకొనిన యెడల వారందరును లోయలోనిగువ్వలవలె పర్వతములమీదనుండి తమ దోషములనుబట్టి మూల్గులిడుదురు”. ( యెహేజ్కేలు 7:16) “లోయలలోని గువ్వలు అనగా” కష్టసమయాలు, శోధన, వేధన సమయంలో మూల్గులు సహజం. అయితే, పావురముల (గువ్వల) వలే మూలుగుచూ ప్రార్ధించే అనుభవం తప్పక కలిగియుండాలి.
పావుర స్వరము (మూలుగు) మనలను రెండు విషయాలకు ప్రేరేపిస్తుంది.

1️ స్తుతి : పావురము అనునిత్యమూ ఏ రీతిగా మూలుగుతుందో, అట్టిరీతిగా ప్రభువును స్తుతించే జీవితాలను మనము కలిగియుండాలి. స్తుతి మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలి.

2️. ప్రార్ధన ( మూలుగు): ప్రార్ధన సామాన్యమైనదైతే, “మూలుగు” ప్రార్ధనలో అత్యున్నతమైన దశ. ఇది ఆత్మతో ప్రార్ధించే అనుభవం. మన ప్రార్ధన పెదవులకే పరిమితమవుతుంది గాని, పౌలుగారు అంటున్నారు. "ఆత్మతో ప్రార్థన చేతును" (1కొరింథీ 14:15)

ఆత్మతో ప్రార్ధించే అనుభవం ప్రార్ధించడంలో అత్యున్నతమైన దశ. ఆత్మతో ప్రార్ధించాలి అంటే? మొదట పరిశుద్ధాత్మను కలిగియుండాలి. పరిశుద్ధాత్మను పొందడం ఎట్లా? "మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. (అపో. కార్యములు 2:38) మన పాప జీవితాన్ని విడచిపెట్టి, నూతనమైన మనసుతో రక్షణలోనికి ప్రవేశించిన మనము, నీటి బాప్తిస్మం ద్వారా మనము తీసుకున్న రక్షణ తీర్మానమును సంఘమంతటికి తెలియజేయాలి. ఆ బాప్తీస్మం ద్వారా పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేయడం ప్రారంభిస్తాడు. ఇట్లాంటి అనుభవంలోనికి ప్రవేశించినవారు ఆత్మతో ప్రార్ధించగలరు. "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. (రోమా 8:26) కొన్ని సందర్భాలలో హృదయమంతా వేధనతో నిండిపోతుంది. మాట్లాడడానికి మాటలురావు. దుఖం తప్ప మాట్లాడలేని స్థితి. దేవుని సన్నిధిలో మోకరిల్లినా ప్రార్ధించడానికి మాటలురావు. ఇటువంటి పరిస్థితులలో మన బలహీనత, దుఖమును బట్టి మనలోనున్న ఆత్మ మనపక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఆత్మ విజ్ఞాపన చేస్తూవుంటే? మన నోరు దానితో ఏకీభవించినప్పుడు ఉచ్చరింప సఖ్యముకాని మూలుగులు వెలువడుతాయి. మనము అనుకోవచ్చు. అంతటి భారము కలిగి ప్రార్ధించడానికి అట్లాంటి సమస్యలేమీలేవు. జీవితం సాఫీగా సాగిపోతుందని. అవును! అది నిజమే కావొచ్చు. కాని, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి!!

నీ కుటుంబము, సంఘము, దేశ రక్షణకోసం భారముకలిగి ప్రార్ధించాలి.
క్రీస్తుకోసం చిత్రహింసలు అనుభవిస్తూ  వారి రక్తముతో సముద్రాలు సహితం ఎర్రగా మారుతున్నాయి,
భగభగ మండే మంటల్లో సజీవదహనమై పోతున్న దేవుని బిడ్డలు లేక్కలేనంతమంది.
వారి కుటుంబాలకోసం, వారు విడచివెళ్ళిన పరిచర్యకోసం ప్రార్ధించాల్సిన భారం మనమీద వుంది.
యేసు క్రీస్తు పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎందరో వున్నారు. ఆయన నామమును ప్రకటించడానికి ఎందరో తమ కుటుంబాలను సహితం విడచి, సువార్తను మోసుకొని వెళ్తున్నారు. వారి నినిత్తం ప్రార్ధించాల్సిన భారం మనమీద వుంది.

జాన్ హైడ్ ఇంగ్లాండు నుండి ఇండియా కు మిషనెరిగా వచ్చి ప్రసవ వేధనతో ఇండియా రక్షణ కొరకు ప్రార్ధించేవాడట. అతని మోకాళ్ళ ప్రార్ధనతో ఆయన వేసుకున్న ప్యాంటుకు రంధ్రాలు పడేవట. అతని భార భరితమైన ప్రార్థనకు, ఎడమ ప్రక్కన వుండాల్సిన  గుండె సహితం, మధ్యలోకి చేరిందట. ప్రభువా! ఆత్మలనివ్వు. లేకుంటే, నా ఆత్మను తీసుకో! అంటూ రోధించేవాడట. ఆయనకే అంత భారముంటే? ఒక భారతీయునిగా మనకెంత వుండాలి? ఆ భారము నీకుందా? క్రీస్తుని చేరాలనే, ఒక్కరినైనా చేర్చాలనే లక్ష్యం నీకుందా? పావురమువలే మూలిగే అనుభవాలు కలిగియుండాలి. ఆ స్వరమే ప్రభుకు మధురమైమది. అది ఆయనను పరవశింపజేసి, నిత్యమైన ఆశీర్వాదాలను తీసుకొనిరాగలుగుతుంది. అట్టిరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!





3. పరిశుభ్రత :
నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము. పరమగీతము 5:2

పావురము, తన నోటినుండి స్రవించే “పావుర క్షీరం” అనే పదార్ధము ద్వారా, తన ముక్కుతో, శరీరమునకు అంటిన మురికిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొంటుంది. అశుభ్రతకు తనలో స్థానం లేదు. అంతేకాకుండా, తాను జతకట్టిన పక్షి చనిపోతే, మరెన్నటికి వేరొక పక్షితో జతకట్టదట. లోకంలోనున్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండాకూడా పాపం అంటవచ్చు. అయితే దానిలో నిలచియుండకుండా, ఎప్పటికప్పుడు మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే? పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. (1 థెస్స 4:7) ఆయన ఎట్లా వున్నాడో, ఆయన పిల్లలముగా మనమునూ అట్లానే వుండాలని కోరుతున్నాడు.

దేవుడు కలిగియున్న లక్షణాలను గురించి మనము ధ్యానించాల్సివస్తే, మొట్టమొదటిది “పరిశుద్ధత”. దేవుడే తన పరిశుద్ధతను గూర్చి ప్రకటిస్తున్నారు: నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. (లేవీ 11:44,45) యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును (యెషయా 43:15). ప్రభువు తన పరిశుద్ధత విషయంలో లోకానికే సవాలు విసిరారు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? (యోహాను 8:46) దూతలు దేవుని పరిశుద్ధతను గానం చేస్తున్నారు. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. (యెషయా 6:3)
ఆయన పరిశుద్ధుడని ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు: అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. (యెషయా 53:9) ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. (1పేతురు 2:22)
ఆయన పరిశుద్ధుడని అపోస్తలులు సాక్ష్యమిస్తున్నారు: పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. (హెబ్రీ 7:26) ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను. (2 కొరింథీ 5:21) ఇట్లా, చెప్పుకుంటూపొతే, లెక్కలేనన్ని. మనుష్యులే కాదు, చివరికి దయ్యాలు సహితం ఆయన పరిశుద్ధుడని సాక్ష్యమిచ్చాయి. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి (1 పేతురు 1:14)
ఆయన పరిశుద్ధుడు కాబట్టే, ఆయన పిల్లలముగా మనమునూ పరిశుద్ధులుగా వుండడానికే ఆయన పిలిచారు. ఆయనవలే, పరిశుద్ధులముగా జీవించడం మనకు సాధ్యమవుతుందా? సాధ్యంకాకపోతే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథములో ఈ విషయాన్ని వ్రాయించియుండేవాడు కాదు. మనకు అసాధ్యమైన భారమేది మనమీద పెట్టేవాడు కాదు మన ప్రభువు. పాపము చేయకముందు ఆదాము హవ్వలు, దేవుడంతటి పరిశుద్ధంగానే వున్నారు. ఇప్పుడు అట్లాంటి పరిశుద్ధులముగా నుండడానికి ప్రభువు మనలను పిలిచారుగాని, అపవిత్రులుగా వుండడానికి పిలువలేదు. అయితే, మనము జీవించే లోకం అపవిత్రమైనదయినప్పటికీ, ప్రభువు మనము పవిత్రులముగా జీవించాలని కోరుతున్నారు. అదెట్లా సాధ్యం? ఆయన పాపుల కోసమే ఈ లోకానికి వచ్చికూడా, పాపులలో చేరినవాడు కాదు. (హెబ్రీ 7:26)
పాపపు లోకంలో జీవిస్తున్న మనము, లోకము నుండి ప్రత్యేకించబడాలి. ఎట్లా అంటే? తామరాకు తన జీవితాంతం నీటిలోనే ఉన్నప్పటికీ, ఒక్క నీటిబొట్టు కూడా దాని మీద ఉండనివ్వదు. అట్లాంటి జీవితం జీవించగలగాలి. పాపపులోకంలో వున్నాముకాబట్టి, ఒకవేళ పాపము అంటినా, దానిలో స్థిరంగా నిలచియుండడానికి వీల్లేదు. పావురమువలే అనుక్షణము మనలను పరిశుద్ధపరచుకొంటూ వుండాలి. కానీ, దేవుని పిల్లలముగా మన జీవితాలు ఎట్లా వున్నాయంటే? పాపము చూయింగ్ గమ్ లా అంటుకొంది. ఎంతలాగినా, ఎంతోకొంత అట్లానే వుండిపోతుంది. దేవునికి కావలసింది 99.99 శాతము పరిశుద్ధత కాదు. 100 శాతము పరిశుద్ధత. పాపులమైన మనలను ఆయన ప్రేమిస్తాడు గాని, మనము చేసే పాపాన్ని ఎంతమాత్రం కాదు. అదెట్లా అంటే, రోగంతోనున్నవారిని ప్రేమిస్తాము. కానీ, వారికొచ్చిన రోగాన్ని ప్రేమించము. అట్లానే మన పాపంతో ఆయన రాజీ పడేవాడేంత మాత్రమూ కాదు. ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది (హబక్కూకు 1:13) ఆయన పిల్లలముగా అట్లాంటి పవిత్ర జీవించాలని ఆయన కోరుతున్నాడు. అందుకోసమే మనలను పిలచి ప్రతేకపరచుకున్నాడు. ఆయన పిలుపుకు లోబడలేక అపవిత్రులుగానే నేటికిని జీవిస్తున్నామంటే? ఆయన పిలుపును వ్యర్ధంచేసి, మన పట్ల ఆయన ప్రణాళిక నెరవేరకుండా మనమే అడ్డుబండలముగా మారేమేమో? పరిశీలన చేసుకొని, పరిశుద్ధ జీవితం జీవించగలిగితే, జీవితం ధన్యమవుతుంది. అట్టిరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందాము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!




4.శ్రేష్టమైన ఆహారం
పావురము నూకలు, గింజలు వంటి శ్రేష్టమైన ఆహారం మాత్రమే తింటుంది గాని, అపరిశుభ్రమైన, క్రుళ్ళినవాటిని ముట్టదు. జల ప్రళయ కాలంలో, నోవహు ఓడలోనుండి కాకిని బయటకు పంపిస్తే, అది కుళ్ళిన శవాలను ఎంజాయ్ చేస్తూ అక్కడే ఉండిపోయింది. కానీ, పావురమును పంపిస్తే, దాని కాలుమోపడానికి కూడా ఇష్టంలేక తిరిగి ఓడలోకి తిరిగివచ్చింది.

విశ్వాసులముగా ఎట్లాంటి ఆహారాన్ని భుజించగలుగుతున్నాము? ఎట్లాంటి ఆత్మీయ బలాన్ని పొందగలుగుతున్నాము? సంవత్సరాలు దొర్లిపోతున్నాగాని, ఆత్మీయ పసిపిల్లలుగా ఉయ్యాల ఊగే స్థితిలోనే, మరగుజ్జులుగా జీవించడానికి గల కారణం ఏమిటి? మేతభూమిగా ఉండాల్సిన షారోను అనబడే సంఘం, వాక్య సమృద్ధిలేక మోడుబారుటకు గల కారణం ఏమిటి? దేవుడు మారిపోయాడా? లేక ఆయన చట్టం మారిపోయిందా? అదెన్నటికి జరుగదు. తరాలు మారినా యుగాలుమారినా మార్పులేని దేవుడాయన. ఆయన మారరు, ఆయన చట్టం మారదు. కానీ, మార్పెక్కడ? వాక్యానికి అనుకూలంగా వారిజీవితాలను మార్చుకోలేని అనేకులైన బోధకులు, వాక్యాన్ని వారి జీవితాలకు అనుకూలంగా మార్చుకొని, దేవుని మహిమను దొంగిలిస్తూ, వారినివారే ఘనపరచుకొంటూ, షారోనును పాడు దిబ్బగా మార్చేస్తున్నారు.

🔸మీటింగ్స్ లో షూటింగ్స్, చాటింగ్స్ తప్ప, సువార్తకు స్థానం లోపిస్తుంది.
🔸మ్యూజిక్కులు, మ్యాజిక్కులు, జిమ్మిక్కులకు యిచ్చే ప్రాధాన్యతలో పదిశాతం కూడా దేవుని వాక్యానికి లేదు.
🔸కేకలు, అరుపులు, హంగులు, ఆర్భాటాలు తప్ప, సత్యవాక్య ప్రకటన లోపించింది.
🔸శాలువాలు, సన్మానాలు, అంతర్జాతీయ సేవకుల గొప్పలు, కటౌట్లు ... తప్ప, సువార్త భారం లేదు.
🔸ప్రత్యేక ఆకర్షణ అంటూ, రికార్డింగ్ డాన్స్ కి మనము పెట్టుకున్న ముద్దుపేరు “కొరియోగ్రఫీ”. దీని గురించి ఒక్కమాట మాట్లాడితే, పరిగెత్తుకుని దావీదు దగ్గరకి వెళ్ళిపోతారు.
🔸నేటి ప్రసంగాలు, రక్షణ, పాప క్షమాపణ, పశ్చాత్తాపము, మారుమనస్సు వంటివాటిని గూర్చిన ప్రస్తావన లేదు. కేవలం ఆశీర్వాదాలు, శారీరిక స్వస్థతలకు మాత్రమే పరిమితం.
🔸దేవునిని, దేవుని వాక్యానిని, వారి వ్యాపారంలో ఒక పెట్టుబడిగా మార్చేసినవారు కోకొల్లలు.
🔸ఆత్మలపట్ల భారంలేక, వారికివ్వబడిన సమయాన్ని, ఎవరో వారికి నచ్చని వ్యక్తుల కొరకు ఖర్చుచేసి, కక్ష తీర్చుకొనే బోధకులు అనేకులు. ఇట్లా చెప్పుకొంటూ పొతే లెక్కలేనన్ని.

అయితే. వీటన్నిటిని ప్రక్కనపెట్టుకొని, పరిశుద్ధగ్రంధం తెరిచి, భూతద్దం పెట్టుకొని వెదకినాగాని వీటిలో మచ్చుకు ఒక్కటైనా కనబడదు. మరి ఈ పోకడలెందుకో? అది అర్ధంకాని, సమాధానంలేని, మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది. కాలాలు మారాయి కదా అంటారా? అయితే కావొచ్చు. ఆ కాలాలను నిర్ణయించిన దేవుడు గాని, ఆయన వాక్యముగాని మార్పులేనిదనేది సుస్పష్టం. చిన్న సమస్యను సహితం తట్టుకోలేకపోతున్నాము దానికిగల కారణమేమిటి? శారీరికంగా బలవంతులైనప్పటికీ, ఆత్మీయంగా మాత్రం బలహీనులం. సరియైన ఆత్మీయ ఆహారం తీసుకోకపోవడం వలన. అంతరంగ పురుషుడు బక్కచిక్కిపోతున్నాడు. తద్వారా సాతాను సృష్ఠించే సమస్యలకు తట్టుకోలేడు. వాక్యమనే జీవాహారం ద్వారా ఆత్మను బలపరచాలి. శరీరానికి ఆహారం ఎంత ప్రాముఖ్యమో? ఆత్మకు జీవాహారం అంతకంటే ప్రాముఖ్యం. మనకు దగ్గరగా వుందని కాకుండా, మనలను వాక్యముద్వారా దేవునికి మరింత దగ్గరగా నడిపించే మందిరాలకు వెళ్లడం శ్రేయస్కరం. అలవాటయ్యింది కదా అని మనం సర్దుకుపోయినా గాని, అపోస్తలుల బోధకు కట్టుబడకపోతే, ఆయన సర్దుకుపోయేవారు కాదనే గ్రహింపు మనము కలిగియుండాలి.

1️
. అపొస్తలుల బోధ ( సత్య వాక్యమును సరిగా విభజించి, ప్రకటించే బోధ)
2️
. ప్రార్ధన
3️
. సహవాసము
4️
.రొట్టెవిరచుట
ఈ నాలుగు ప్రాధమిక అంశాలు గలిగిన సంఘాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ విడచిపెట్టొద్దు. పావురము శ్రేష్టమైన ఆహారం మాత్రమే తింటుంది. ఆపవిత్రమైనది తినదు. అట్లానే అబద్ధబోధలవైపు ఆకర్షితులము కాకుండా, బెరయ సంఘస్థులవలే వాక్యాన్ని పరిశీలించి, వాక్యానుసారముగా జీవించగలగాలి.

సత్యవాక్య విరుద్ధమైన బోధలలో కొన్ని :
🔹 బేయిజం
🔹 యెహోవా సాక్షులు
🔹 మొర్మాన్స్
🔹 బ్రెన్హ మైట్స్
🔹 జాంగిల్ జా (పరలోకపు తల్లి)
🔹 సబ్బాత్ ఆచరించకపోతే పరలోకం లేదు.
🔹 సున్నతి లేకుండా గమ్యం లేదు.
🔹 శరీరంతో పాపం చేస్తే తప్పేమీలేదు. ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి.
ఇట్లా లెక్కలేనన్ని దుర్భోధలు. ఇట్లాంటి ఆహారం తీసుకొంటే, నిత్యమరణమే శరణ్యం. వద్దు. పావురమువలే శ్రేష్టమైన జీవ వాక్యాన్ని మాత్రమే భుజిద్దాం!

జీవవాక్యం:
🔸నీ నడతను శుద్ధీకరిస్తుంది ( కీర్తన 119:9)
🔸నిన్ను వెలిగిస్తుంది (119:105 )
🔸నిన్ను బ్రతికిస్తుంది. (119:50 )
🔸నిత్య రాజ్యానికి చేర్చుతుంది. జీవవాక్యాన్ని భుజిద్దాం! బలవంతులవుదాం! సాతానును ఎదిరించి, నిత్యరాజ్యాన్ని చేరుదాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!




5. బలి అర్పణ:
అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షి జాతిలోనిదైనయెడల తెల్ల గువ్వలలో నుండిగాని పావురపు పిల్లలలో నుండిగాని తేవలెను. లేవీకాండము 1:14

దేవునికి బలిగా అర్పించుటకు పావురము యోగ్యమైనది. నాటి దినాలలో ఇశ్రాయేలీయులలో పేదలైనవారు పావురమునుగాని, పావురపు పిల్లనుగాని, బలిగా అర్పించాలి. యేసు ప్రభువు పుట్టిన నలభై రోజులకు యోసేపు, మరియలు యెరూషలేమునకు వెళ్లారు. దానికి రెండు కారణములు:

1️
. యేసు ప్రభువును ప్రతిష్టించడానికి: (లూకా 2:22)
యూదుల ధర్మ శాస్త్రము ప్రకారం మనుష్యులలోగాని, జంతువులలోగాని ప్రధమ సంతానాన్ని బలిగా అర్పించేవారు. అయితే, మనుష్యుల ప్రధమ సంతతిని బలి యివ్వకుండా, నెలరాగానే డబ్బులిచ్చి విడిపించేవారు.
( నిర్గమ 13:2, 12-13 ; సంఖ్యా 18:15,16 )

2️
. యోసేపు, మరియలు మోషే ధర్మశాస్త్రం ప్రకారం తమ్మును శుద్ధిచేసుకొని బలి అర్పించడానికి.
ధర్మశాస్త్రము ప్రకారము ప్రసవం తరువాత, తల్లీ బిడ్డలు నలభైదినాలు అపవిత్రమైనవారుగా ఎంచబడతారు. వారు పవిత్రులవ్వడానికి బలి అర్పించాలి. పేదవారు రెండు గువ్వలుగాని, రెండు పావురపు పిల్లలుగాని అర్పించాలి. (లేవి 12:1-8 ) మరియ అర్పించిన అర్పణ ఆమె పేదరికాన్ని తెలియజేస్తుంది. ఆకాలంలో సంతానం పుట్టినప్పుడు పాపాల కోసం బలి అర్పించాలి. అంటే, పిల్లలను కనడం పాపం కాదుగాని, బిడ్డను కనిన స్త్రీ స్వభావసిద్ధముగా పుట్టిన ప్రతీ శిశువు పాపి. అయితే, యేసు ప్రభువు స్వభావ సిద్ధముగా పుట్టలేదు. స్వభావ సిద్ధముగా తండ్రి ఎవరూ లేరు. ఆయన పరిశుద్ధాత్మద్వారా కన్యమరియ గర్భాన జన్మించారు. ఆయనలో పాపం ఏకోశానాలేదు. ( లూకా 1:34,35 ) మరియ అర్పించిన బలి యేసుకోసం కాదు. తన కోసమే. ఆయన పాపమేలేని పవిత్రుడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపు లలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడు (హెబ్రీ 7:26) పాపులమైన మనకొరకు, మనకు బదులుగా, కల్వరి కొండమీద, పావురమువలే బలి అయ్యారు. ఆయన అర్పించిన ఒకే ఒక బలి సంపూర్ణమైనది కాబట్టి, ఇక బలుల అవసరం ఎంతమాత్రమూ లేకుండా పోయింది.

అయితే బలులు అర్పించవలసిన అవసరం లేదుగాని, పావురమువలే నిష్కపటమైన, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ, మనకు మనమే సజీవయాగముగా మన శరీరాలను ప్రభువుకు సమర్పించాలి (రోమా 12:1) ఇది ఆత్మీయ బలి. సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకోవడం అంటే? మన శరీర అవయవాలను ప్రభువు కొరకు సమర్పించుకోవడం. సమర్పణ అంటే? “చనిపోవడం కొరకు బ్రతకడం”. మన శరీరేచ్ఛలను చంపుకొని ప్రభువుకొరకు జీవించడమే సమర్పణ. సజీవయాగముగా మన శరీరాలను సమర్పించినప్పుడు, మనకాళ్లు పాపం చెయ్యడానికి పరుగులు తీయవు. చేతులు పాపపు పనులు చెయ్యవు. మన కళ్ళు అపవిత్రమైన వాటిని చూడవు. మన నోరు చెడ్డవాటిని పలుకవు. మన తలంపులు మలినం కావు. మనమేమి చేసినా ప్రభువు మహిమార్థమే చేస్తాము. అట్టి బల్యర్పణగా మారడానికి మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!


6. సంఘము
బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము. పరమగీతము 2:14
🔹బండ సంధులు: యేసు క్రీస్తు శరీరమందలి గాయములు.
🔹పేటు బీటలు: దున్నబడిన ఆయన శరీరం.
🔹పావురము: సంఘము

క్రీస్తుయొక్క శరీరమందలి గాయాలు, దున్నబడిన శరీరమునుండి ప్రవహిస్తున్న రక్తములోనుండి పుట్టినదే “సంఘం”. సంఘము అనేది క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాధించిన సంపాద్యము.

పావుర స్వరము మధురము:

1️. స్తుతి : పావురము అనునిత్యమూ ఏ రీతిగా మూలుగుతుందో, అట్టిరీతిగా ప్రభువును స్తుతించే జీవితాలను మనము కలిగియుండాలి. స్తుతి మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలి.
2️. ప్రార్ధన ( మూలుగు): ప్రార్ధన సామాన్యమైనదైతే, “మూలుగు” ప్రార్ధనలో అత్యున్నతమైన దశ. ఇది ఆత్మతో ప్రార్ధించే అనుభవం. మన ప్రార్ధన పెదవులకే పరిమితమవుతుంది గాని, పౌలుగారు అంటున్నారు. "ఆత్మతో ప్రార్థన చేతును" (1కొరింథీ 14:15) "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. (రోమా 8:26) కొన్ని సందర్భాలలో హృదయమంతా వేధనతో నిండిపోతుంది. మాట్లాడడానికి మాటలురావు. దుఖం తప్ప మాట్లాడలేని స్థితి. దేవుని సన్నిధిలో మోకరిల్లినా ప్రార్ధించడానికి మాటలురావు. ఇటువంటి పరిస్థితులలో మన బలహీనత, దుఖమును బట్టి మనలోనున్న ఆత్మ మనపక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఆత్మ విజ్ఞాపన చేస్తూవుంటే? మన నోరు దానితో ఏకీభవించినప్పుడు ఉచ్చరింప సఖ్యముకాని మూలుగులు వెలువడుతాయి. నశించిపోతున్న ఆత్మలపట్ల ఇట్లాంటి భారం కావాలి.

3️. సంఘ సాక్ష్యజీవితం: సంఘము అంటే? లోకములోనుండి పిలువబడిన సమూహమే “సంఘం”. సంఘ సాక్ష్యజీవితం అంటే? విశ్వాసుల జీవితాలే. అవి సత్యానికి స్థంభాలుగాను, ఆధారముగాను ఉండాలి.

పావుర ముఖము మనోహరము:
సంఘము మనోహరముగానుండాలని ప్రియుడైన యేసు కాంక్షిస్తున్నారు. సంఘము యొక్క మనోహరము “పరిశుద్ధతయే”. పావురము ఒక్కదానితోనే జతకడుతుందట. తాను జతకట్టిన పావురం చనిపోతే, ఎప్పటికి మరొక దానితో జతకట్టదట. సంఘముకూడా అట్లాంటి సౌందర్యాన్ని కలిగియుండాలని ప్రభువు కోరుతున్నారు. ప్రియుడైన యేసు, పావురము అనబడే వధువు సంఘముతోతప్ప, మరిదేనితోను జతకట్టరు. “జతకట్టుట” అనేమాట క్రీస్తునకు, సంఘమునకునూ మధ్యగల శాశ్వతమైన సంబంధాన్ని సూచిస్తుంది. సంఘముకూడా, ప్రియుడైన యేసుని విడచి, సాతానుతో జతకట్టడానికి వీలులేదు. అయితే, మనోహరమైన సంఘము, నేటి దినాన్న వికారమవుతుంది. లోకాన్ని స్నేహించి, వ్యభిచారిణిలు అనే ముద్ర వేయించుకొంటుంది. వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? (యాకోబు 4:4) శరీరాశ, నేత్రాశ, జీవపుడంబముతో, విశ్వాసులు వారి సౌందర్యాన్ని కోల్పోతున్నారు. అట్లాఅయితే, ఎత్తబడే సంఘములో వుండలేము. లేకపోతే ఈ జీవితానికి అర్ధమేలేదు. పావురమువలే, నిష్కపటమైన, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ, వధువు సంఘముగా ప్రియుడైన యేసును ఎదుర్కొనుటకు మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!


7. పరిశుద్ధాత్మ:
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. (మత్తయి 3:16) పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను ( లూకా 3:22)

రక్షించబడిన ప్రతీ విశ్వాసి ఆత్మతో ముద్రించబడ్డాడు. గనుక ఆత్మలో నడవాలి. క్రీస్తు ఎప్పుడు మనలో వుంటాడో, అప్పుడు క్రీస్తుతోపాటు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. క్రీస్తు లేకుండా పరిశుద్ధాత్మను పొందాలని ఆశించడానికి వీల్లేదు. పావురము ఆత్మకు సాదృశ్యం.
🔹అది జగడమాడదు
🔹ఎక్కువ శబ్దం చేయదు (అల్లరి)
🔹అసహ్యమైన స్థలాలలో నిలువదు.
🔹నిష్కపటమైనది
🔹పరిశుభ్రమైనది
🔹పరిశుద్ధమైనది

Note:
పరిశుభ్రత శరీరానికి సంబంధించినది. పరిశుద్ధత అంతరంగానికి సంబంధించినది. పరిశుభ్రత కలిగినవారు పరిశుద్ధంగా ఉంటారని చెప్పలేముగాని, పరిశుద్ధత కలిగినవారు, చాలావరకు పరిశుభ్రంగానే వుంటారు.

పావురము కలిగియుండే లక్షణాలకు విరుద్ధమైన లక్షణాలు కలిగియుండడం ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారమవుతాము (ఎఫెసీ 4:29,32) పావురము పక్షులన్నింటిలో అతివేగంగా గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలను చేస్తాయి. గుడ్లుపొదగడానికి ఆడపక్షితోపాటు మగ పక్షికూడా సహకరిస్తుంది. 14 నుండి 16 రోజులలలో పిల్లలను పొదుగుతాయి. ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే పెట్టినప్పటికీ, సంవత్సరానికి ఆరు సార్లు పిల్లలను చేస్తాయి. ప్రభువు పిల్లలముగా మనము బహుగా ఫలించాలి. (యోహాను 15:8), నశించిపోతున్న ఆత్మలపట్ల భారముకలిగి ప్రార్ధించి, వారిని ప్రభువులోనికి నడిపించాలి. అయితే, మనజీవితాలు దీనికి విరుద్ధంగా వున్నాయి. పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడు వాని పీకనొక్కేసి, మనకు నచ్చినట్లుగా జీవిస్తున్నాము. పరిశుద్ధజీవితాన్ని జీవించాల్సిన మనము, అపవిత్రతలో కొట్టిమిట్టాడుతున్నాము. ఇది మన జీవితాలకు ఎంతమాత్రమూ శ్రేయస్కరము కాదు. సరి చేసుకొని, పావురమువలే పరిశుద్ధజీవితం జీవించుటకు మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!

మరిన్ని వర్తమానములకై  https://www.facebook.com/NireekshanaDwaram/
మీ యొక్క విలువైన సూచనలు సలహాలు మరియు ప్రార్థనావసరతలకై
                                           krajsudha2@gmail.com
                                                                          - మీ సహోదరుడు


కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్రిస్మస్

శరీర కార్యములు

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

సమరయ స్త్రీ

పాపము

విశ్వాసము

ప్రభువు నేర్పిన ప్రార్ధన - పరలోక ప్రార్ధన