దేవునికి రగిలే కోపం
దేవునికి రగిలే కోపం
(మొదటి బాగం)* దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు నిరాకరించినప్పుడు.
...........................
భాద్యతనుండి తప్పించుకోవడానికి సాకులుచెప్పడంలో మనకు మనమే సాటి.
దేవుడు అప్పగించే భాద్యతనుండి తప్పించుకోవడానికి ప్రయత్నంచేస్తే? ఆయనకే సహాలిచ్చే ప్రయత్నంచేస్తే?
ఆయన కోపం రగులుకొంటుంది.
ఆయన మోషేమీద కోపపడి లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును
నిర్గమ 4:14
430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యత్వములో మ్రగ్గిపోతున్న తన ప్రజలను విడిపించి వాగ్ధాన భూమిలోనికి ప్రవేశపెట్టడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు.
కాని, ఐగుప్తుకు వెళ్ళడానికి మోషేకు ఎంతమాత్రం ఇష్టంలేదు. తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.
*మోషే: నేను ఫరో యొద్దకు వెళ్లుటకు ఎంతటివాడను?
*దేవుడు: నిశ్చయముగా నేనునీకు తోడైయుందును,
*మోషే: ఇశ్రాయేలీయులు నిన్నుపంపిన దేవునిపెరేమని అడిగితే?
*దేవుడు: నేను ఉన్నవాడను అనువాడనని చెప్పు.
*మోషే: వారు నామాట వినరు.
*దేవుడు: వారు నీ మాట వింటారు. అని చెప్పి అద్భుతాలు చేసే శక్తిని కూడా ఇచ్చాడు.
అయినప్పటికీ, ఇంకనూ సాకులు చెప్పే ప్రయత్నం చేస్తూనే వున్నాడు.
*మోషే: నేను మాట నేర్పరినికాను.
*దేవుడు: నేను నీనోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధిస్తాను.
ఇక మోషే తప్పించుకోవడానికి ఏమి లేదు. అయినప్పటికీ, అయ్యో ప్రభువా, నన్ను విడచిపెట్టేసి ఇంకెవరినైనా చూడు అన్నట్లుగా దేవునికే సలహా ఇచ్చే ప్రయత్నం చేయగా, దేవుని కోపం మోషే మీద రగులుకుంది.
అవును!
దేవుని కోసం ఏదయినా చెయ్యాలంటే?
సాకులు చెప్తాము, ఆయనకే సలహాలిస్తాము.
నాకు ప్రసంగాలు చెయ్యడం రాదు, పాటలు పాడడం రాదు అంటూ.... నేనేమి చెయ్యగలనని తప్పించుకొనే
ప్రయత్నం చేస్తాము. అన్నింటికంటే గొప్ప పరిచర్య 'ప్రార్ధించడం' చెయ్యగలిగికూడా ఆ పని మాత్రం చెయ్యం.
దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన సామర్ధ్యం ఇచ్చి, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నిన్ను నిర్మించాడు అనే విషయాన్ని మరచిపోవద్దు.
నేను చేతకాని వాడినని, నేనేమి చెయ్యలేనని ఆయన నీకిచ్చిన భాద్యతలను ప్రక్కనబెట్టే ప్రయత్నం చెయ్యొద్దు.
ఒకవేళ నీజీవితంలోదేవునికి ఆయాసకరమైనదేదైనా వుంటే? ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన చిత్తానికి తలవంచు.
అంతేగాని, నీ చిత్తం నెరవేర్చుకోవడానికి ఆయనకే సలహాలిచ్చి దేవుని కోపానికి గురికావొద్దు.
ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దేవునికి రగిలే కోపం
(రెండవ బాగం)*దేవుని సామర్ధ్యముపై విశ్వాసముంచలేనప్పుడు.
*ఆయన శక్తిని చులకన చేసినప్పుడు.
.......................
ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా యనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి.
కీర్తనలు 78:19
ఈ మాటలు అంటున్నది ఎవరోకాదు.
దేవుని అద్భుతాలను కళ్ళారా చూచిన వారే.
ఐగుప్తీయులను శ్రమపెడుతూ, వారి మధ్యలోనే నివసిస్తున్న తమను దేవుడు ఏరీతిగా ప్రత్యేక పరచి, వారిని సంరక్షించాడో? , వాటిని అనుభవించినవారే.
అయినప్పటికీ, వారెందుకిలా మాట్లాడు తున్నారు?
వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు.
కీర్తనలు 78:22
అవును!
ఆయనపై ఆధారపడలేక పోయారు. అనునిత్యమూ ఆయన శక్తిని శంకిస్తూనే వున్నారు.
తత్ఫలితంగా దేవుని కోపం వారిమీద రగులుకొంది.
•నలభై దినాల ప్రయాణాన్ని
నలభై సంవత్సరాలకు పొడిగించాడు దేవుడు.
•అరణ్యంలో పిట్టల్లా రాలిపోయారు.
అవును!
దేవుని ఆశీర్వాధాలు మనవరకూ వచ్చి, మనకు దక్కకుండా పోతున్నాయంటే ఒక్కటే కారణం?
ఆశీర్వధించే దేవునిశక్తిని చులకన చెయ్యడం.
సమస్యను చూచి భయపడి, ఆ సమస్యను పరిష్కరించగల దేవునిశక్తిని తక్కువగా అంచనావేసి, ఆయనపైన అధారపడలేకపోవడం.
ఒకవేళ ఆధారపడినా, మనము చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ
చేసేసి , చివరకి గత్యంతరం లేక ఆయనపైన ఆధారపడుతున్నాము.
ఫలితముగా,
•దేవుని కోపానికి గురియై,
శాపాన్ని పొందుకుంటున్నాం.
•ఆశీర్వాధాలకు బదులు, అవమానాన్ని కొనితెచ్చుకొంటున్నాం.
*ఆయన సామర్ధ్యాన్ని శంకిస్తే?
•ఆశీర్వాధాలు నీ దరిచేరవు
•దేవుని కోపం నీమీద రగులుకొంటుంది.
*ఆయన సామర్ధ్యాన్ని గుర్తించి ఆయనపై ఆధారపడ గలిగితే?
• నీవు చేసేది ఏదయినా సఫలమవుతుంది.
• దేవుని కోపం నుండి తప్పించబడతావు.
ఆయనపైనే ఆనుకుందాం!
ఆశీర్వధించబడదాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దేవునికి రగిలే కోపం
(మూడవ బాగం)*దేవుని మందిరమును, ఆరాధనను నిర్లక్ష్యం చేసినప్పుడు.
.......................
మన పితరులు ద్రోహులైమన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడచి ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యముచేసిరి.
వారు మంటపముయొక్క ద్వారములను మూసివేసి దీప ములను ఆర్పివేసి, పరిశుద్ధస్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహనబలులను అర్పింపకయు ఉండిరి.
కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడిరి; మన కుమారులును కుమార్తెలును భార్యలును చెరలోనికి కొనపోబడిరి.
2దిన 29:6-9
•మనకు దేవుని మందిరము అంటే లెక్కేలేదు.
•అది పరిశుద్ధ దేవుని మందిరం అనే తలంపే లేదు.
•ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలనే గ్రహింపే లేదు.
అలవాటుగా మందిరానికి వెళ్తున్నాము తప్ప, ఆరాధించే హృదయం దూరమయ్యింది.
కారణం?
మన పితరులు ద్రోహులైమన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడచి ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసారో? మనమూ అదే బాటలో నడుస్తున్నాము.
మన దుష్టప్రవర్తన దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను, పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధతను గుర్తించకుండా చేసేస్తుంది.
తద్వారా దేవుని సన్నిధికి దూరమవుతున్నాం.
పరిశుద్దుడైన దేవునితో సాన్నిహిత్యాన్ని, సహవాసాన్ని కోల్పోతున్నాము.
మన జీవితాలు ఇట్లానే కొనసాగితే ఫలితం ఏంటో తెలుసా?
దేవుని ఉగ్రత మన మీద రగులుకొంటుంది.
మన పితరులు దేవుని మందిరమును,ఆరాధనను నిర్లక్ష్యం చేసినప్పుడు
మన తండ్రులు కత్తిచేత పడిరి; వారి కుమారులును కుమార్తెలును భార్యలును చెరలోనికి కొనపోబడిరి.
అవును!
మనము దేవుని మందిరమును,ఆరాధనను నిర్లక్ష్యం చేసినప్పుడు
ఆ ఫలితాన్ని మనతోపాటు మన కుటుంబం కూడా అనుభవించ వలసి వస్తుంది.
అట్లా అని,
వారమునకు ఒకసారి మందిరానికి వెళ్లి ఆరాధన చేసి వస్తున్నాను. నేను మందిరాన్ని నిర్లక్ష్యం చేయడంలేదని నీకునీవే సర్దిచెప్పుకొని సంతృప్తి చెందే ప్రయత్నం చెయ్యొద్దు.
నీ 'దేహమే' దేవుని మందిరం అనే విషయాన్ని మాత్రం మరచిపోవద్దు. నీ మందిరాన్ని సక్రమముగా కాపాడుకోగలిగితేనే పరిశుద్ధుడైన దేవునిని పరిశుద్ధముగా ఆరాధన చెయ్యగలవని గుర్తుంచుకో!
అప్పుడు నీవు చేసే ఆరాధన, దేవునికి మహిమను, నీ జీవితానికి, నీతోపాటు నీ కుటుంబానికిని ఆశీర్వాధాలను తీసుకువస్తుంది. దేవుని ఉగ్రతనుండి తప్పిస్తుంది.
ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దేవునికి రగిలే కోపం
(నాలుగవ బాగం)*రహస్య పాపములు
..........................
నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.
మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.
కీర్తనలు 90:7,8
*దేవుని కోపం, ఉగ్రత మన మీద నిలిచి ఉండడానికి గల కారణమేమిటి?
మన రహస్య పాపములే.
ఆస్ట్రిచ్ (నిప్పుకోడి, ఉష్ణ పక్షి)
•అన్ని పక్షులలోకెల్లా పెద్దది. దీని గుడ్డు కూడా పెద్దది.
•ఇది చాల బలమయినది. దీని కాలితో తన్నితే మన తొడఎముక కూడా విరిగిపోతుంది.
•ఎడారిలో దీని పరుగును మనము అందుకోలేము.
•వేటగాళ్ళు మాత్రం దీనిని సులభంగానే పట్టుకుంటారు.
•ఎట్లా అంటే?
ఇది వేటగాళ్ళను చూచి కొంతదూరం పరుగుపెట్టి, తన తలను ఇసుకలో దూర్చి కాళ్ళు పైకెత్తి ఉంటుంది.
•అంటే దీని ఉద్దేశ్యం?
దీని తల ఇసుకలో వుండడం వలన దానికేమి కనిపించదు. ఇదేమి అనుకొంటుంది అంటే? నేనెవరికి కనిపించనని.
అవును!
మన జీవితాలు అట్లానే వున్నాయి.
మనము సాగించే చీకటి కార్యాలు, దేవునికి సహితం కనబడవులే అనుకొని, మనలను మనమే మోసం చేసుకొని, మరణానికి అప్పగించు కొంటున్నాము.
*మన రహస్య పాపములు దేవునికి కనబడకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి?
ఒక్కటే మార్గం. వాటిని చెయ్యకుండా ఉండాలంతే.
ఆయనకు తెలియకుండా చెయ్యగలుగుతున్నాను అనుకోవడం
అవివేకం. సంఘమును, సమాజమును, కుటుంబమును ,తలిదండ్రులను, స్నేహితులను అందరిని మోసం చెయ్యగలిగినా, దేవుని చేతిలో మాత్రం అడ్డంగా దొరకిపోతావు.
బహిరంగంగా అందరికి తెలిసేటట్లు చేసే అపరాధములు కొందరికి తెలిసినా, రహస్య పాపములుమాత్రం ఎవ్వరికీ తెలియకపోవచ్చు.
కాని మన రహస్య పాపములు
ఆయన ముఖకాంతిలో స్పష్టముగా కనిపిస్తాయి.
పాపం జోలికి వెళ్ళకుండా మనలను మనము ఎట్లా నియంత్రించుకోగలం?
ఒక్కటే మార్గం. మన ప్రతీ కదలికలోను ఆయన్ని ముందు పెట్టుకోగలగడం.
ఆయన మనతో వున్నాడు, ఆయన చూస్తున్నాడు అనే తలంపు మనలను పాపం జోలికిపోకుండా నియంత్రిచగలదు.
అవి మన చూపులు!
తలంపులు! క్రియలు!
అవేవైనా కావొచ్చు.
సరిచేసుకుందాం!
పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం!
దేవుని ఉగ్రత నుండి తప్పించబడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దేవునికి రగిలే కోపం
(ఐదవ బాగం)దేవుడు చెయ్యమని చెప్పింది చెయ్యనప్పుడు. చెయ్యవద్దని చెప్పింది చేసినప్పుడు.
.........................
యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను....
"ఆ బండతో మాటలాడుము". అది నీళ్లనిచ్చును..........
మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ "బండను కొట్టగా" నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను.
అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను.
సంఖ్యా 20:7,8,11,12
దేవుడు చెప్పినది ఒకటి. మోషే చేసినది మరొకటి.
ముందు ఒకసారి బండను కొట్టాడు. అదిచాలు. మరళా కొట్టాల్సినపనిలేదు.
యేసుప్రభువు వారు ఒకసారి సిలువ వేయబడ్డారు అదిచాలు. మరళా సిలువ వేయవలసినపనిలేదు.
ధర్మశాస్త్రాన్ని తీసుకు వచ్చిన మోషే. ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు.
ధర్మ శాస్త్రం మోషేను కనాను వరకు తీసుకొని వెళ్ళగలిగింది గాని, కనానులో అడుగు పెట్టేలా చెయ్యలేకపోయింది.
అనేక సందర్భాలలో మనిషి యొక్క కోపం దేవుని క్రమాన్ని లెక్క చెయ్యకుండా చేసి, శాపాన్ని తీసుకువస్తుంది.
ఇంతకీ మోషే కొట్టిన ఆ బండ ఏమిటి?
అది నిర్జీవమైనది కాదు.
సజీవమైనది
ఆ బండ 'క్రీస్తే'
1 కొరింది 10:4
•అరణ్యములో ఆ బండ ఒక నదిగామారి సుమారు 30 లక్షల మంది శారీరికదాహాన్ని తీర్చగలిగింది.
•అదే బండ కల్వరిగిరిలో తన రక్తాన్నికార్చి, ప్రపంచ మానవాళి ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగింది.
•నీకు బదులుగా నాకు బదులుగా మరణించింది.
•నిన్నూ నన్ను మరణంలోనుండి జీవములోనికి దాటించగలిగింది.
•పరమ కనానుకు మార్గం సిద్ధం చేయగలిగింది.
ఇక్కడ దేవునిప్రేమను మనం అర్ధం చేసుకోగలగాలి.
•మోషే బండను కొట్టినా? నీళ్ళిచ్చి వారిని జీవింప చేసాడు.
•అనుక్షణం మనము ఆయన గాయాలు రేపినాగాని, ఆయనను మరళా మరళా సిలువ వేస్తున్నాగాని ఆయన ప్రేమతో మనలను జీవింప చేస్తున్నాడు.
అట్లా అని,
ఆయన ప్రేమను చులకనచేస్తే?
ఆయన ఉగ్రతను చూడాల్సివస్తుంది.
వద్దు!
సరి చేసుకుందాం.
సాగిపోదాం.
గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దేవునికి రగిలే కోపం
(ఆరవ బాగం)•దేవుడు ప్రత్యేక పరచుకున్న వాని మీద తిరుగుబాటు చేసినప్పుడు.
•నీ వ్యక్తిగత పేరు ప్రతిష్టలకోసం ప్రాకులాడినప్పుడు.
యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను.
మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదనుండి ఎత్త బడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను. సంఖ్యా 12:9,10
మోషే గురించి దేవుడే ప్రత్యక్షముగా చెప్పుతున్న సాక్ష్యం.
•మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
•అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.
•నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; •అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును.
ఇట్లాంటి వ్యక్తి మీద తన సహోదరి(మిర్యాము),
సహోదరుడు(ఆహారోను) తిరుగుబాటు చేసారు. వారికున్న పదవులు వారిని సంతృప్తి పరచలేకపోయాయి. మోషే నాయకత్వం వారికి ఇష్టం లేకపోయింది.
సాత్వీకము గలిగిన మోషే ఒక్కమాటకూడా మాట్లాడకుండా మిన్నకుండి పోయాడు. అయితే దేవుడు కలుగుజేసుకున్నాడు.
దేవునికోపం వారిమీద రగిలింది. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు.
దేవుని కోపానికి ప్రతిఫలం మిర్యాముకు 'హిమమువంటి తెల్లని కుష్ఠు'
తన సంఘంలో దేవుడు మనకు ఏ స్థానం ఇచ్చాడో దానిని అంగీకరించడం నేర్చుకోవాలి.
పదవుల కోసము, పేరుప్రతిష్టల కోసం ప్రాకులాడడం ఇది క్రీస్తు నేర్పిన మార్గం కాదు.
మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను;
మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండ వలెను. మత్తయి 20:26,27
దేవుడు హెచ్చించిన వానిని నీవు తగ్గించలేవు. ఆయన తగ్గించిన వానిని నీవు హెచ్చించలేవు. ఒకవేళ అట్లాంటి ప్రయత్నమేదయినా నీవు చేస్తుంటే? దేవుని ఉగ్రత చవిచూడాల్సింది నీవే.
దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును కీర్తనలు 75:7
ఆయనకు నీవు ఎదురు తిరిగితే?
ఉగ్రతను నీవు తట్టుకోలేవు.
దేవుని చిత్తానికి తలవంచు. ఆయన నిన్ను ఏ స్థితిలో వుంచాడో? ఆ స్థితిలోనే వుండి, ఆయన కోసం నమ్మకముగా జీవించు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దేవునికి రగిలే కోపం
(ఏడవ బాగం)నీ హృదయాన్ని కాఠిన్యము చేసుకొని, మార్పులేని జీవితం జీవిస్తున్నప్పుడు.
......................
నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.
రోమా 2:5
•భక్తి పరులం అంటూ ఆయన శక్తిని ఆశ్రయించకుండా జీవిస్తున్నాం!
•భక్తి చేస్తూ భయం లేకుండా బ్రతికేస్తున్నాం!
•లోకంనుండి ప్రత్యేక పరచబడ్డామంటూ, లోకంతోనే స్నేహిస్తున్నాం!
•క్రీస్తును ఎరిగిన వారమంటూనే, ఆయనచేత ఎరుగని వారముగా జీవిస్తున్నాము.
•ఒక్కమాటలో చెప్పాలంటే?
మనకిష్టమొచ్చినట్లు , నచ్చినట్లు
జీవిస్తున్నాం!
అయినప్పటికీ,
కొన్ని ఆటుపోట్లు వున్నా, జీవితనావ సవ్యంగానే సాగిపోతుంది.
పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు.
యెషయా 54:10
అనే వాగ్ధానం అనునిత్యమూ మనలను వెంటాడుతూనే వుంది. కృప వెంబడి కృప తరుముకొస్తూనే వుంది.
అయితే,
ఆయన కృపను అపార్ధం చేసుకుంటూ, మనలను మనమే మోసం చేసుకొంటున్నాం!
కొందరయితే, దీనికంతటికీ కారణం నా నీతి, పరిశుద్ధతయే అంటూ గర్వపడుతుంటే?
మరికొందరేమో, మనమెట్లా జీవించినా పర్వాలేదు. ఆయన ప్రేమామయుడు కాబట్టి ప్రేమిస్తూనే ఉంటాడు. కృపామయుడు కాబట్టి కృపజూపుతూనే ఉంటాడు. అంటూ మార్పులేని జీవితాన్నే జీవిస్తున్నారు.
కాని వాస్తవం ఏమిటంటే?
"దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా?"
రోమా 2:4
నీ ఆశీర్వాదాలకు కారణం నీ నీతి,పరిశుద్దత కాదుగాని, ఆ ఆశీర్వాదాలు నీ జీవితంలో మార్పును తీసుకొని రావాలన్నది దేవుని ఉద్దేశ్యం. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వాధిస్తున్నాడు.
దేవుని ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకోకుండా,
ఆయన సహనాన్ని, దీర్ఘశాంతమును
తృణీకరిస్తే?
ఆయన ఉగ్రత నీమీద రగులుకొంటుంది.
ఆ దినాన్న న్యాయాధిపతియైన దేవుడు నిను తీర్పుతీర్చే సమయంలో ఆయన మందలోనుండి నిన్ను వేరుచేస్తాడు. అది అతిభయంకరం.
వద్దు!
మన జీవితాన్ని మార్చుకుందాం!
ఉగ్రత నుండి తప్పించబడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి